కవుల కవి – ఇస్మాయిల్

ismayil painting rainbow

 
ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ. ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.

ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప

అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా

ఒక అడ్డుగీతా

ఒక నిలువు గీతా –

తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ

పైది ఆకాశమూ

కావొచ్చు.

సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది. నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ. తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత. అంతే అంతకు మించేమీ లేదు. ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు “నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం” అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు. కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది. అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది. అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “…… మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని – ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే” అని అంటారు.

చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి ఇస్మాయిల్ కవిత్వం నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు. కవికి అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట

సెలయేరా, సెలయేరా!

గలగలమంటో నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.

పాడకుంటే ఏలా?

లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది. సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి. మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి – మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు. బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత సాధారణమైన అనుభవం. కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది….. ఇలా…..

దాహం

వేసవి గాడ్పులకి

దాహపు ఖర్జూరచెట్టు

యెడారి గొంతులో

అమ్ములపొదిలా

విచ్చుకుని

గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు

గొంతు దిగుతోంటే

ఎంత హాయి//

యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.

ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి. ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం

బరువెక్కిన సూర్యుడు

బతకనీడు భూమిని

ఉదయమ్మొదలు

ఊపిరాడనీడు

సర్వాన్ని అదిమిపట్టి

వీర్యాన్ని విరజిమ్మాడు.

ఆకల్లాడదు.

ఏ కాకీ ఎగరని

ఏకాకి ఆకాశం.

ఇంతలో హటాత్తుగా

ఇలకు కలిగింది మబ్బుకడుపు.

వేవిళ్ళ గాలులు

వృక్షాగ్రాల్ని వూపాయి.

ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.

తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి. అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి. రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడు, మబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో “వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్ని” అంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో….

దినపు రేకలపైన వాలెను

ఇనుని సీతాకోకచిలుక//

గులక రాళ్ళ పిట్టలతో

కులుకు తరుశాఖ ఏరు//

వొంగిన సాయింత్రపు రంగుల ధనసు

విసిరే గాలి బాణం

పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.

వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.

శ్రావణ మంగళవారం

సాయంత్రం

ఒకానొక మబ్బు డస్టరు

అకస్మాత్తుగా ప్రవేశించి

భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ

పూర్తిగా తుడిచేసి,

మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి

వీధుల్లో కళ్ళనీ

రోడ్లపై పడెల్నీ

లోకంలో కాంతినీ

వెయ్యిపెట్టి గుణించేసి

చెయ్యూపి వెళ్ళిపోయింది///

ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!

స్వారీ

కళ్ళెం లేని గుర్రమెక్కి

పళ్ళు గిట్ట కరచి

ఏ శత్రు సంహారం కోసమో

వైచిత్ర సమరంలోకి

స్వారి చేసే యోధురాలామె.

మళ్ళీ, యుద్ధాంతాన

కళ్ళు తేలేసి

నిర్వికల్ప సమాధిలో

సర్వాంగాలూ స్తంభించే

యోగిని కూడాను.

ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం. అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.

చిగిర్చే చెట్లు

నడచివచ్చి నిశ్శబ్దంగా

నా కిటికీ దగ్గిరాగి

హటాత్తుగా

పటేలుమని

వంద వాయిద్యాలతో

వికసించిన బ్యాండుమేళంలా

ఒక రోజు

అకస్మాత్తుగా

చివురించిన చెట్టు

గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///

పై కవితలో చెట్టు చివురించటాన్ని “వందవాయిద్యాల బ్యాండుమేళం” అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి. వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా. అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు. చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.

పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ కవిత్వాన్ని వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు.

-బొల్లోజు బాబా

మూసలకు లొంగని కవి ఇస్మాయిల్

ismayil painting rainbow

ఎందుకో చెప్పలేను గానీ, నాకు కాలేజీ రోజులనుండీ “బెల్ కర్వ్ (నార్మల్ డిస్ట్రిబూషన్)” అంటే మహా ఇష్టం. బహుశా నా ఆలోచనలు అలా ఏకీకృతం(పోలరైజ్డ్) అయిపోవడం వల్లనో ఏమో గానీ, నాకు ఒక కవి కవిత్వం తీసుకున్నా, కొంతమంది కవులని తీసుకున్నా, వాళ్ళ కవిత్వంలో ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. మనిషి జ్ఞానం పరిధి విస్తృతమవుతున్నకొద్దీ అతని ఆలోచనల సారం మన పూర్వీకులూ (దేశకాలపరిధులతో నిమిత్తం లేకుండా), ముందుతరాల మేధావులూ, అందించిన జీవనసారానికి సమీపంగా అతని ఆలోచనలు ప్రయాణిస్తాయని నా నమ్మకం. దీన్ని ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటూంటాను కూడా. అలాంటి నా ప్రగాఢమైన నమ్మకానికి మరింత దోహదం చేసిన కవుల్లో ఇస్మాయిల్ ఒకరు.

ఇస్మాయిల్ కవిత్వం గురించి చాలామంది చాలా విశదంగానే రాసేరు. అతనిది అనుభూతివాద కవిత్వం అని ఒక ముద్రకూడా ఉంది. నాకు ఈ ముద్రలపట్ల నమ్మకం లేదు. అందులోనూ సమకాలీన కవుల్నీ, కథకుల్నీ ఒక మూసలోకి నెట్టి ఊహించుకోవడం నాకు అంతగా నచ్చని విషయం (ఆ కవులూ, రచయితలూ వాళ్ళ దృక్పథాల మేనిఫెస్టోలు చెప్పుకున్నప్పటికీ). ఎందుకంటే, ఒక రచయిత తన ఆదర్శాల సరాసరికి రాయగా రాయగా చేరుకుంటాడు తప్ప రాసిందంతా దాన్నే ప్రతిఫలించదన్నది నా మరో నమ్మకం. వయసూ, అనుభవంతో పాటే, రాస్తూ రాస్తూ కవిగాని రచయితగాని తన ఆలోచనల, విశ్వాసాల సమాహారంనుండి నెమ్మది నెమ్మదిగా తన తార్కికచింతనని రూపుదిద్దుకుంటాడు. మొదటిరచనలోనూ, చివరిరచనలోనూ ఒక్కలాగే ఉంటే రచయితలో పరిణతి లేదని నాకు అనిపిస్తుంది. నిజానికి ఒక కవిని అతని సమకాలీనులకంటే, తర్వాతి తరాలే, నిష్పక్షపాతంగా బేరీజు వేస్తాయి. వాళ్ళకి ఏ రకమైన ప్రలోభాలూ, నిర్భందాలూ ఉండవుగనుక.

ఇస్మాయిల్ లో నాకు నచ్చిన అంశం అతను ఏ భావపరంపర మూసకూ లొంగకపోవడం. కవి అచ్చం గాజుపట్టకంలా ఉండాలి. ఎవరు ఎటునుంచిచూసినా ఏదో ఒక అందం, రంగు కనిపించగలగాలి. ఏకీకృతఆలోచనలుగల కవులకి అది సాధ్యపడదు.

ఒక తుఫాను భీభత్సాన్ని చెపుతూ “వర్షంలో ఊగే చెట్లు” కవితలో చెట్లని సముద్రం చేసి (సాగరంలా ఊగుతోంది… పారం కనిపించని తోట), సముద్రాన్ని చెట్టు (సాగరవృక్షాగ్రానికి చేరుకుంటాయట ఓడలు) చేస్తాడు. ఇందులో అందమైన పదబంధాలున్నాయి. అయితే, ఆ కవితలో నాకు వేరే అందమైన అంశాలు కనిపిస్తాయి. హుద్ హుద్ లాంటి భౌతికమైన తుఫానులు జీవితంలో ఎన్నో రావు. కానీ, ఇక్కడ చెప్పిన తుఫాను మన మౌలిక విశ్వాసాలని వేళ్ళతో సహా పెకలించివేసే సందర్భం. కొందరికయినా ఇలాంటి తుఫానులు జీవితంలో అనుభవం అయే ఉంటాయి. అటువంటి సందర్భం ఎదురైనపుడు, అది మన విశ్వాసాల మూలాల్ని ప్రశ్నిస్తుంది. శ్రీ శ్రీ చెప్పినట్టు అంతవరకూ కాళ్ళ క్రింద పదిలంగా ఉందనుకున్న మన విశ్వాసాల నేల, పగుళ్ళిచ్చి నమ్మకాల చెట్లు ఒక్కొక్కటే కూకటివేళ్లతో కూలుతున్నప్పుడు, మన వైయక్తికమైన భావపరంపరే, స్వయంగా తర్కించి ఏర్పరచుకున్న విశ్వాసపు విత్తనాలే చివరకి మిగులుతాయి. అవే ఇప్పుడు కురిసిన వర్షంలోంచి ప్రాణప్రదమైన తేమను తీసుకుని కొత్త ఆశలు, కొత్త మార్గనిర్దేశన చేస్తాయి. పక్షులు మళ్ళీ కొత్తపాటలు అందుకుంటాయి.

ఈ భావపరంపర పాతవాళ్లకంటే భిన్నం కాదు. చెప్పే తీరులోనే కవి ప్రత్యేకత. అక్కడే మానవ మేధస్సు సరాసరికి సమీపంగా ప్రయాణం చెయ్యడం. ఈ దృష్టితో ఒకసారి ఆ కవితని మళ్ళీ చదవండి.

వర్షంలో ఊగే చెట్లు

.

సాగరంలా ఊగుతోంది.

భోరున కురిసే వర్షంలో

పారం కనిపించని తోట

అహర్నిశీధులు క్షోభిస్తుందేం?

మహాసముద్రం చోద్యంగా ?

గుండెల్లో నిత్యం వానలు

కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ

ఎగిరిపడి కసిరేసే

వృక్షతరంగాల్నే

పక్షులాశ్రయిస్తాయేం?

తూర్పున నల్లటి ఉచ్చులు

తుఫాను పన్నుకుంటూ రాగా

చప్పున సాగరవృక్షాగ్రానికి

తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి

కూలుతాయి మహావృక్షాలు,

ఊగుతాయి ఆ శూన్యంలో

ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు

చుట్టుకుపోయిన మహాసముద్రాల

అట్టడుగున మిగుల్తాయి

బలిసిన ప్రశ్నార్థకాలతో

కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా

బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి

కొత్తనీడల్ని పాతుతాయి

కొత్తపాటల్ని మొలకెత్తుతాయి

జలనిధికీ, ఝంఝ కీ

అలజడి పైకే కానీ

హృదయాలతి ప్రశాంతమట

– అదీ ఇస్మాయిల్ కవిత.
.

-నౌడూరి మూర్తి

murthy gaaru

కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది:ఇస్మాయిల్

ismayil painting rainbow

ఈ వారం ప్రత్యేకం: ఇస్మాయిల్ గారి చివరి అముద్రిత ఇంటర్వ్యూ

కవి ఇస్మాయిల్ గారిలో ఒక గొప్ప సాహితీ విమర్శకుడు, నిరంతర అధ్యయన శీలి, దార్శనికుడు, తత్వవేత్త, మారుతున్న ప్రపంచాన్ని మౌనంగా గమనిస్తున్న అలుపెరుగని యాత్రికుడే కాక నిరాడంబర జీవనం గడిపే గొప్ప ప్రేమికుడూ ఉన్నారు. పదిహేనేళ్ళుగా ఆయనను విభిన్న సందర్భాలలో దగ్గరగా గమనించిన నాకు ఏ అంశాన్నయినా ఆయన తన జీవితంలో సాధ్యం చేసుకున్నాకనే కవిత్వంలో అలవోకగా పలికిస్తోన్నట్టు తెలుస్తూ వచ్చింది.  అందుకనే ఆ కవిత్వం అంత శుద్దంగా, గాఢంగా, అడవి పూల గాలి లాగ వ్యాపించి అందరినీ కదిపి ఆలోచింపచేస్తూ ఉంటుంది.

ఇస్మాయిల్ గారు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు.  ఎన్నో అంశాలమీద సూక్ష్మమయిన నిశితమయిన విమర్శ చేసి ఉన్నారు.  కవిత్వ సృష్టికి, కవితాస్వాదనకి ప్రాణ భూతమయిన ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడూ చెప్తూ వచ్చారు.

నిరంతరమూ స్పష్టమయిన అవగాహనతో ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యాన స్థితిలో కవితా సృష్టి  చేస్తున్న, గాఢమయిన అనుభూతి నెరిగిన వ్యక్తిగా, ఇప్పటికీ రాస్తున్నకవి గా, ఆయన కవిత్వం మీదా, కొన్ని సమకాలీన అంశాలమీదా  ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చేసిన సంభాషణ ఇది.

1945 తర్వాత 15 సంవత్సరాలపాటు జీవితాన్ని గురించి తెలుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ గడిపానని అన్నారు మీరు.  ఆ తర్వాత 1960లో మీ నుంచి కొత్త కవిత్వం వచ్చిందని, దీనికి విమర్శకులు ‘అనుభూతి కవిత్వమని’ పేరు పెట్టేరని అన్నారు.  కవి కావలసిన ప్రతి వ్యక్తి కి  ఇంత సుదీర్ఘమయిన ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా అవసరమా ? ఈ వేళ కొత్త తరం కవులకు ఇంత ఓపిక ఉందా ?

– నేను సహజంగా మొద్దు నవటం వల్ల కవిత్వం రాయటానికి  వచ్చేటప్పటికి అంత కాలం పట్టిందనుకుంటున్నాను.  కవి కాదలచుకున్న వాడికి ఏకకాలంలో ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా చాలా అవసరమనేది నిస్సందేహం.

బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోటు నుంచికవిత్వాన్ని ప్రత్యక్షం చేసుకోవలసిన అవసరం కవికి ఉందా ?అది  లేకుండా మంచి కవిత్వం కేవల ప్రతిభతో రాయలేడా ?

-బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా తారసిల్లినప్పుడే కవిత్వపు రవ్వ పుడుతుంది.  ధన రుణ ధృవాల కలయిక వల్ల  విద్యుచ్చక్తి పుట్టినట్లు. ప్రతిభ అంటే అదే.  మిగతావన్నీ వ్యుత్పత్తికి సంబంధించినవి.

మిమ్మల్ని ప్రభావితం చేసిన కృష్ణ శాస్త్రి గారి నుంచి మీరు విడివడి స్వయం కవితా వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి మీ లోపలి సంఘర్షణా, అన్వేషణల  గురించి ఒకచోట చెప్పారు.  అలా చెయ్యడం వల్ల సాహిత్యం మీద మీరు వేసిన ప్రతేక ముద్ర ఏమిటి ?

– నాకు కృష్ణ శాస్త్రి గారంటే ఆరాధన.  ఐతే, కోతిలా కృష్ణ శాస్త్రి గారిని అనుకరిస్తే, ఇక నేనెందుకు ? నా కవిత్వమెందుకు ?  ఆయన్ని అనుకరించటం మా ఇద్దరికీ అన్యాయమే.  అందుకని, నా సొంత మార్గం వెతుక్కున్నాను.  ముందు నేనెవర్నో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  మరి ముద్ర సంగతా, అసలు ముద్ర పడిందో లేదో కాలం నిర్ణయించాలి.

1960 నుంచి ఈ నాటిదాకా శుద్దమయిన కవితాధార మీ నుంచి ఊటలూరుతూనే ఉంది. అమృతం లాంటి శుద్ధ కవిత్వ జలాల మూలాలు ఏమిటి ?

– కవిత్వానికి మూల మేమిటి ? జీవితమూ, అది జీవించిన తీరూ. కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది.

ismail

 కవిత్వంలో క్లుప్తత, సాంద్రత అన్న లక్షణాలు మీరెలా సాధించ గలిగారు ? అంత సంయమనం ఎలా ఒనగూడింది ?

-కవిత్వం తపస్సులాంటిది. తపస్వికి వాచాలత రాణిస్తుందా ? కనుక కవిత్వానికీ మౌనానికీ ఒక అంగుళం మేర తేడా మాత్రమే ఉండాలి.

చెట్టు ఆదర్శంగా మొదలయినా మీ కవిత్వం ధ్యాన (జెన్ మార్గపు హైకూ) స్థితికి చేరుకోగలగడంలోని క్రమ పరిణామపు అంతస్సూత్రం ఏమిటి ? (చెట్టు ఆదర్శంగా భావించడం నుంచి తానే చెట్టుగా తాదాత్మ్యం చెందడం దాకా)

– ఈ తాదాత్మ్యమన్నది జెన్ బౌద్దుల నించి కొత్తగా నేర్చుకున్నది కాదు.  కవిత్వమెప్పుడూ తాదాత్మ్యం నించే ఉద్బవిస్తుంది.  ప్రపంచంలోని వస్తువులతో తాదాత్మ్యం చెండలేనివాడు కవిత్వం రాయలేడు.  ‘చెట్టు నా ఆదర్శ’మనే కవితకు మూలం చెట్టుతో తాదాత్మ్యమే

ఈ వేళ సాహిత్యంలోకి కొత్తగా ప్రవేశ పెట్టబడిన పర్యావరణ స్పృహ వల్ల పర్యావరణానికి గాని, కవికిగాని వచ్చే ప్రయోజనం ఏదయినా ఉందా?

– పర్యావరణ కాలుష్యం వల్ల  జీవజాలం నశించిపోయే ప్రమాదం ఏర్పడిందివాళ. పర్యావరణ స్పృహ కవులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఉండవలసిందే.

ఏడు దశాబ్దాలు దాటిన మీరు జీవితాన్ని కవిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? మనిషిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? రెండూ ఒకదానికి ఒకటి సహాయపడ్డాయా ?

– కవీ, మనిషీ వేరు వేరు కాదు.  రెండూ ఒకటే. కనుక, కవిగా ఒకలాగా, మనిషిగా మరోలాగా అర్ధం చేసుకోవటం ఉండదు.  కవీ, మనిషీ ద్వంద్వాలు కాదు.  ఇద్దరికీ ఒకటే వేరు – మానవత్వం.

 మానవ జీవితంలో చలం గారు చెప్పినట్టు మోహానుభవాలు, ప్రేమానుభవాల కంటే గొప్పవి ఏవీ లేవా ? లేకపోతే ప్రపంచం మరింతగా రోజు రోజుకీ భౌతిక విలువల పరుగుతో సర్వం ఎలా మరిచిపోగలుగుతుంది ? కవులు కుడా దీనికి మినహాయింపు కావట్లేదెందుకు ?

– మానవ జీవితంలో ప్రేమానుభవం కన్నా గొప్పదేదీ లేదు అన్నారు చలం గారు.  నేను దీన్ని కాస్త విశాలం చేసి ‘మానవ సంబంధాల కన్నా గోప్పవేవీ లేవు’ అంటాను.  సాటి మనుషులతో, స్నేహితులతో, భార్యతో, ప్రియులతో, పిల్లలతో, ప్రకృతితో మానవ ప్రేమానుబంధాల కన్నా నిజంగా జీవితంలో గొప్ప విషయాలేమున్నాయి ? వీటిని వదిలిపెట్టి భౌతిక, వ్యాపార విలువల కోసం పరుగు పెట్టేవారెవరూ సుఖపడగా నేను చూడలేదు.  అన్నీ ఉండి, మానవబంధం లేకపోతే ఎందుకా జీవితం ?

ప్రేమా, కరుణా – ఇటువంటి అనుభూతుల్లోంచి కవిత్వం పుడుతుంది.  ద్వేషంలోంచి కవిత్వం రావటం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు.  ప్రపంచ కవిత్వ చరిత్రనంతా గాలించినా ద్వేష కావ్యం వంటిది మీకెక్కడా తగలదు.

ఐతే, ప్రస్తుతం మన కవులు రాస్తున్న రాతలు చాలా వరకు వర్గ ద్వేషాల మీద, కుల ద్వేషాల మీదా, లింగ ద్వేషాల మీద, ప్రాంతీయ ద్వేషాల మీద ఆధారపడ్డవే.  అందుకే, వాటిల్లో కవిత్వాంశ బాగా లోపిస్తుంది. ఇటువంటి సాహిత్య ఉద్యమాల వల్ల తట్టలకొద్దీ అకవిత్వం పుట్టుకొచ్చింది.

కవికీ, రచయితకీ అధ్యయన శీలత అవసరమా ? లేకపోవడం వల్ల  సాహిత్యానికి వచ్చే ప్రమాదం ఏదయినా ఉందా ?

-అధ్యయన శీలత ఒక్కటే కాదు. ఐదు అవసరమన్నారు మనవాళ్ళు.  అందులో వారంగనా సాహచర్యం ఒకటి ! ఆశ్చర్యం కాదూ!

దేశాటనం, పండిత మిత్రతా చ,

వారంగానా, రాజసభా ప్రవేశ:,

అనేక శాస్త్రాన్యవలోడనంచ

చాతుర్యమూలాని భవంతి పంచ.

తెలుగు సాహిత్యానికి మంచి విమర్శ లేదనే పాతబడిన విమర్శ ఒకటి ఉంది. ఉత్తరాధునిక విమర్శనా విధానం ద్వారా కొందరు చేస్తున్న సాహిత్య విమర్శ పట్ల మీ స్పందన ఏమిటి ?

-వెంకటేశానికి సెలవుల్లో చదవాల్సిన పుస్తకాలు లిస్టు చెబుతూ గిరీశం, చివర్న ‘కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫ్ఫికల్ట్’ కుడా రాసుకోమంటాడు.  ఇప్పుడింతమంది కుప్పుస్వామయ్యర్లు పుట్టుకురావటం ఆశ్చర్యంగా ఉంది.

ఉత్తరాధునికత తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిందా ? ఆ అవసరమూ, వీలూ తెలుగు కవిత్వానికి ఉన్నాయా ?

– కవిత్వం నిష్క్రమించింది కనుక, ఉత్తరాధునికత ప్రవేశించిందనే అనుకోవాలి.

వాడుకలో భాష పాతబడి భావ స్ఫురణను కోల్పోతున్నప్పుడు కవి తిరిగి భాషను శుభ్రపరుస్తాడు ? మీరు తెలుగు పదాలను ఎలా శుభ్రపరచి మెరిపించగలుగుతున్నారు ? స్పటిక స్వచ్చంగా ఎలా చెయ్యగలుగుతున్నారు ?

– సామాన్యమైన అచ్చ తెలుగు మాటలు చలంగారి రాతల్లో ప్రాణం పోసుకుని కళ్ళు తెరవటం చూసాను. కృష్ణ శాస్త్రి గారి మాటల అందం వేరు. చలం వాడిన వాడుక భాషలో గొప్ప శక్తి ఉంది. అది నన్ను ఆకర్షించింది.  జీవంలేని కావ్య భాష మీద వెగటు కలిగించింది. ముక్కవాసన కొట్టేవీ, అరిగిపోయినవీ, పాత మాటల్ని సాగనంపి, జనం నాలికలమీద జీవ నృత్యం చేసే మామూలు మాటల్ని ఆహ్వానించాను.

 పద్య కవులు పద్యాన్ని బతికించాలని ఈ మధ్య అయిదారేళ్ళుగా చాలా  శ్రమపడుతున్నారు.  వీరి కృషి ఫలితాల మీద మీ అభిప్రాయం ? ఈ కాలానికి ఛందోబద్ద  పద్యాలు పనికొస్తాయా ?

-పద్య కవులు ఈ మధ్య మంచి పద్యాలే రాస్తున్నారు.  కాని, మంచి కవిత్వం సృష్టించలేక పోతున్నారు.  వాళ్ళ హేండీ కేప్స్ రెండు: గ్రాంధిక భాషా, ఛంద: కాఠిన్యమూ. ఇప్పటి ప్రపంచం చాలా మారింది.  ఈనాటి కొత్త ఆలోచనలూ, అనుభూతులూ, గ్రాంధిక భాషలో ఇమడవు. పద్యం ఎంత చక్కగా రాసినా, ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

పోనీ భాష మార్చి వ్యవహరీకరిద్దామంటే, ఛందస్సు బిగబడుతుంది. ఈ ద్వైత సమస్యని (dilemma) పరిష్కరించుకునేవరకు వాళ్ళ కవితాభివ్యక్తి  సార్థకం కాదు.

భువన విజయాలు, అవధానాల వంటి పండిత (పామర) రంజన ప్రక్రియలు తిరిగి ఆంద్రదేశంలో రాజాదరణ (అధికారాదరణ) లోకి, ప్రాపకంలోకి పోతున్నాయి.  ఇవి సాహిత్యానికి మంచి రోజులా ? చెడ్డ రోజులా ?

– సర్కసులలో రెండు రకాలున్నాయి: శారీరక సర్కసూ, మేధా సర్కసూ. భువన విజయాలూ , అవధానాలూ రెండో జాతికి చెందినవి. సర్కసులంటే ఇష్టపడే జనం సమృద్దిగా ఉన్నారు.  వాళ్ళని మనం ఆపలేం. రెండిట్లో ఏదైతేనేం ? మనో రంజనం కోసమే కదా !

 ఈ వేళ వర్గం స్థానంలోకి కులం, లింగ విభజన, ప్రాంతీయత, మతం అన్నవి వచ్చి చేరి సాహిత్యాన్ని ఆక్రమించుకున్నాయి. దీని వల్ల సాహిత్యం నష్ట పోతుందా?

– చాలా నష్ట పోయింది. ఇంతకు మునుపు చెప్పానుగా, కవిత్వం ప్రేమ నించి పుడుతుంది గాని ద్వేషం నించి కాదనీ, ద్వేషం ప్రాతిపదికమీద ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మంచి కవిత్వం పుట్టలేదనీ.  ఇటీవల తెలుగు వస్తున్న బండ్ల కొద్దీ ఆకవిత్వానికి కారణమిదే.

స్త్రీలు స్వంత వ్యక్తిత్వాల కోసం స్వంత గొంతులు విప్పడం జరిగింది కదా! వ్యక్తిత్వ సాధనలో ప్రేమించగల స్వభావం కోల్పోయే ప్రమాదం ఉందా ? లేదా, మరింత ఎక్కువ ప్రేమించ గలరా ?

-వ్యక్తిత్వ సాధనంటే తన శక్తుల్నీ, చైతన్యాన్నీ పరిపూర్ణంగా వికసింపజేసుకోవటం.  అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవటం.  ఆత్మ జ్ఞానాన్ని సాధించటం.  అటువంటి వాళ్ళల్లో ప్రేమించ గల స్వభావం పెరుగుతుంది కాని తరగదు.

కుటుంబం స్త్రీలపై హింసకు కేంద్రమని స్త్రీవాదులు, కుటుంబం లేకపోతే స్త్రీలకు మనుగడే లేదని ఇతరులూ అభిప్రాయ పడుతున్నారు కదా! విస్తృతమైన మీ జీవితానుభవం నుంచి, చలం అభిమానిగా మీ ఉద్దేశ్యం, అవగాహన ఏమిటి ?

-వివాహబంధం స్త్రీకీ, పురుషుడికీ ఇద్దరికీ ఉరితాడు వంటిదని చలంగారు భావించారు. కుటుంబ వ్యవస్త పనికిరాదని ఆయన చెప్పలేదు. పెళ్లి తతంగం వద్దనుకున్నా ప్రేయసీ ప్రియులు కలిసి సంసారం చేసి పిల్లల్ని సాకాలి గదా. కనుక. కుటుంబ వ్యవస్థ తప్పదనుకుంటాను.

ప్రేమ సూత్రం గురించి పదే  పదే కవిత్వం ద్వారా చెప్పే మీరు, మూకల వల్ల కాక వ్యక్తుల వల్ల ప్రపంచం మారుతుందని  చెప్పే మీరు, మీ అనుభవంలో ఈ అంశాన్ని దర్శించారా ?

– గాంధీ గారినీ, చలంగారినీ, ఇంకా ఎంతో మంది మైనరు మహాత్ములని చూస్తున్నారు కదా!

విషాద కషాయంతో జీవిత జ్వరాన్ని నయంచేసుకోడానికి కవిత్వం సహాయపడుతుందా ?

-కవి కూడా మామూలు మనిషే, ఎటొచ్చీ తనకు ప్రత్యేకమైన చైతన్య దృష్టితో సగటు మనిషికన్నా కాస్త లోతుగా విశాలంగా చూడగలడు. కనుక, జీవితపు ప్రతిరోధాల్ని, నిర్భందాలనీ అధిగమించి, ప్రపంచంతో సమన్వయము సాధించ గలడు. బతుకులోని లోటుపాట్లని పూడ్చుకుని కొంత పరిపూర్ణత సాధించగలడు. కవి తాలూకు ఈ అనుభవం జీవితంతో అసంతృప్తి చెందిన సామాన్య పాఠకుడికి ఒక కొత్త వెలుతురునీ, ఒదార్పునీ, సంతృప్తినీ ప్రసాదించగలదు.  ఈ విధంగా కవిత్వ కషాయం జీవిత జ్వరాన్ని నయంచెయ్యటానికి పనికొస్తుంది.

 ఉగ్రవాదం పేరుతో, మతం పేరుతో కళ్ళ ముందు జరుగుతున్న మారణకాండపట్ల కవుల బాద్యత ఏమిటి ?

కవులుగా కవుల ప్రధాన బాద్యత ఏమిటంటే అకవిత్వం రాయకుండా జాగ్రత్త పడటం! ఉగ్రవాదం పేరా, మతం పేరా జరిగే దారుణకాండల్ని ఖండించవలసిందే.  దానికి అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది రాజకీయచర్య.  వాటికి కవిత్వాభివ్యక్తి ఇవ్వదలచుకున్నప్పుడు ఆ అనుభవాలు తన రక్తంలో జీర్ణమై, అనుభూతి లోనూ అస్తిత్వంలోనూ భాగమైనప్పుడే ఆ పనికి పూనుకోవాలి.

తన యెడల, తన పాఠకుల యెడల ఈ బాధ్యతని కవి మరిచిపోకూడదు.

న్యూయార్కు మీద బాంబులు పడగానే అమెరికానీ, బుష్ నీ తిడుతూ తట్టెడు కవితలు వచ్చాయి కాని, బిన్ లాడెన్ నీ, తాలిబాన్ లనీ, వాళ్ళ అమానుష పరిపాలననీ, మత మౌళిక వాదుల్నీ వాళ్ళ మౌడ్యాన్ని, స్త్రీల అణచివేతనూ ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క పద్యం ఈ కవులెవరేనా రాశారా? వీళ్ళు మన కవులు!

గుజరాత్ లో అంత దారుణమైన మారణకాండ, మానవహోమం జరిగింది కదా. గ్లోబల్ ఖడ్గాలూ, అమెరికన్ పిల్లలూ అంటూ గెంతే ఈ కవులెంత మంది గుజరాత్ అమానుషత్వానికి స్పందించారు ? చాలా మంది కవుల హ్రుదయాల్నించి మానవత్వం కారిపోయి, ఆ చోటుని కమ్యునిస్టు, కుల, ప్రాంతీయ రాజకీయ విషాలు ఆక్రమించాయి.

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, మార్కెట్ ఎకానమీల పట్ల స్పందిస్తూ కవులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో విమర్శకులు ఆ కవిత్వాల బలహీనతలను ప్రశ్నించడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి ?

-కవిత్వం బలహీనమైనపుడు ఆ విషయం నిష్పక్ష పాతంగా వెల్లడి చెయ్యటం విమర్శకుల బాధ్యత. విమర్శకులు తాక కూడనివని నిషేధించటానికి ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, అమెరికా ద్వేషం వంటి వస్తువుల్లో పావనత్వమేమీ లేదు.  కవితలో కవిత్వాంశ ఎంత ఉందో బేరీజు వెయ్యటం విమర్శకుల పని.  ఉన్న మాట చెబితే ఉలుకెందుకు వీళ్ళకి!

ఈ వేళ సాహిత్య వాతావరణంలో ఒక స్తబ్దత ఏర్పడిందని పలువురు అంటున్నారు.  ఒక దశాబ్దాన్ని పాలించిన స్త్రీవాద, దళిత వాదాలు కొంత ఉపశమించి, ప్రపంచీకరణ అన్న పెను ముప్పువైపు ఏకోన్ముఖంగా దృష్తి సారించిన ఈ తరుణంలో స్తబ్దత నిజంగా ఉందా?

– రాజకీయ వాదాల వల్ల ఉద్యమాల వల్ల కవిత్వం పుట్టదు. కవిత్వాన్ని కవులు సృష్టిస్తారు. అది వైయక్తిక క్రియ. వ్యక్తి  తాలూకు హృదయ స్పందనకు సంబంధించింది.  వాదాలూ, సిద్దాంతాలూ ఉన్నా ఊడినా, ఉద్యమాలు లేచినా పడుకున్నా ఆర్ద్ర హ్రుదయుడైన కవి రచిస్తూనే ఉంటాడు.  స్తబ్దత అనేది వాదాలకూ ఉద్యమాలకే గాని కవులకు కాదు.

రాజకీయ లేదా ఉద్యమ కవులమని చెప్పుకునే వాళ్ళు ఉద్యమం మందగించగానే వాళ్ళు నీరసపడి పోతారు.  నిజానికి వాళ్ళు కవులూ కారు. వాళ్ళది కవిత్వమూ కాదు.

సాహిత్య వాతావరణంలో స్తబ్దత ఏర్పడిందనే సమస్యని ఐదేళ్ళకోమారు లేవనెత్తి, సాహిత్య పేజీలు  నింపుకోవటం పత్రికల వాళ్లకి అలవాటైనట్లు కనిపిస్తుంది.

 కవిత్వం, కథ ప్రాంతీయతల ఉబిలో చిక్కుకున్నాయా ?

-1972 లో నా ‘చెట్టు నా ఆదర్శం’ ప్రచురితమయాక మరుపూరి కోదండ రామారెడ్డి గారు ‘భారతి’ లో సమీక్ష రాశారు.  ‘ఈ కవి గోదావరి మండల మాండలికాన్ని చక్కగా వాడినారు’ అని.  మనమంతా వాడేది మండలికాల్నే. ఐతే చదువుకున్న వాళ్ళ భాషలో వారే ప్రాంతం వారైనా ఎక్కువ సామ్యం ఉంటుంది. ఒకర్నొకరు సులువుగా అర్థం చేసుకోగలరు. చదువు స్కేల్ లో కిందికి వెళ్ళే కొద్దీ ఒకరి మాండలికం మరొకరికి అర్ధమవటం కష్టమౌతుంది.

మాండలికాన్ని వెలుగులోకి తీసుకురావటం మంచిదే.  కొందరు మాండలిక రచయితల్ని చదువుతుంటే, మన భాషలో ఇంత శక్తీ సౌందర్యమూ ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఐతే ఏక కాలంలో, అన్ని మాండలికాలని సమన్వయించే ఏకీకరణ క్రియ కుడా భాషలో జరుగుతూనే ఉంది.  ఇలా ఏకకాలంలో విభజనా ఏకీకరణ భాషా క్షేత్రంలో జరుగుతుంటాయనుకుంటాను.

మైనారిటీ రచయితల కథల, కవిత్వాల మీద చెలరేగుతున్న వివాదాలు సాహిత్యానికి అవసరమా ?

మైనారిటీ రచయితలే కాదు, ఏ రచయితల గురించి కూడా మంచి సాహిత్య విమర్శా, విశ్లేషణా జరగటం లేదు.  జరుగుతున్నవి చాలావరకు మత కుల ప్రాంతీయ ప్రాతిపదికల మీద రాజకీయ వివాదాలు.

మీ 75 ఏళ్ల జీవితంలో భావ కవిత నుంచి హైకూ దాకా మీరు చేసిన (1942-2002) మీ అరవై ఏళ్ళ కవిత్వ ప్రయాణంలో జీవితం కవిగా మీకు ఏమిచ్చింది ?

– అనిర్వచనీయమైన ఆనందం.  ఆనందో బ్రహ్మ.

హైకూ పద్ధతి మన భాషకు తగదని కొందరు విమర్శకులు అంటున్నారు.  దీనికి హైకూ మార్గదర్శిగా మీ జవాబు ఏమిటి ?

-హైకూ అంటే స్వేచ్చా కవిత్వం.  ఆనందవర్ధన, అభినవగుప్తుల ధ్వని మార్గమే హైకూ మార్గం. ఇది మన భాషకు పనికిరాదన్న పెద్ద మునుషులెవరో కాస్త చెబుతారా ?

 ఇస్మాయిల్ గారి ఇల్లు ఆంద్ర దేశంలో చారిత్రిక స్థలం. అటువంటి స్థలాన్ని మరే దేశంలోనయినా అయితే ప్రభుత్వం మాన్యుమెంట్ గా కాపాడి ఉండేది – అని మీ అభిమానులకు కొండంత చింత.  అరవై ఏళ్ళుగా ఉన్న ఆ ఇల్లు విడిచిపెట్టి రావలసివచ్చినపుడు మీరు చాలా రోజులు ఎంతో సిక్ నెస్ అనుభవించారు.  ఇటువంటి సెన్సిబిలిటీ మనిషికి అవసరమా? కవికి అవసరమా? అది ఆ మనిషికి ఏం ఉపయోగం ?

-మనిషికి సెన్సిబిలిటీయే మానవత్వాన్ని ఇచ్చేది.  ఇది కవిలో మరీ నిశితంగా, సున్నితంగా ఉండాలి.  అంటే కవిలో మానవతా గుణం ఎక్కువ పాలులో ఉండాలన్న మాట. ఈ సుకుమార చేతనే కవిత్వానికి మూలం.

అప్పుడు శ్రీనాధుడు పాకనాటి వాడితే ఇప్పుడు నేను వలసపాక నాటి వాడను!

మీరు మీ పుస్తకాలను ఎందరో సాహిత్యేతర వ్యక్తులకు అంకితమిచ్చారు.  మీ స్నేహాలు కుడా ఎక్కువ అటువంటి వారితోనే (పదవులు, ధనం లేనివారే ఎక్కువ అందులో) దానికి కారణం ఏమిటి ? లోకానికి ఇంత వ్యతిరిక్తంగా ఎలా ఉండగలుగుతున్నారు ?

-నా అసలు జిహాద్ (ధర్మ యుద్ధం) కమ్యునిస్టులతో . ఇది నలభై ఏళ్ళుగా సాగుతోంది. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని హైజాక్ చెయ్యటానికి ప్రయత్నించి ఇంచుమించు కృతకృత్యులయారు. కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ పార్టీ రాజకీయ ప్రచారం కోసం పార్టీకి అంగంగా ఉపయోగించుకోమని లెనిన్ తన భటులకు ఆదేశమిచ్చాడు.  అప్పటినించీ ప్రతి దేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికి మాలినదని యువ రచయితలకు నూరి పోసి, వాళ్ళ చేత నినాద ప్రాయమైన శుష్క రచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారు. సాహిత్యంలో ఈ రాజకీయ కాలుష్యాన్ని నేను మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  ఈ కమ్యునిస్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువ రచయితలు జబ్బుపడి, సాహిత్య పరంగా శవ ప్రాయులయారు.  అకవిత్వ కల్మషం దేశమంతా అలుముకుంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్చ కోసమూ, రచయితల వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభై ఏళ్లబట్టి పోరు సాగిస్తున్నాను.  కమ్యునిస్టుల చేత చాలా రొస్టు  పడ్డాను.

తెలుగు కవిత్వానికి, ప్రోజ్ కి ఎక్కువగా అనువాదాలు ఎందువల్ల లేవు ? మీరు తెలుగులోకి చేసారు గాని, తెలుగు నించి ఎందువల్ల చెయ్యలేదు  ?

-ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తెలుగు నించి ఇంగ్లీషుకు గాని, ఇతర భాషలకు గాని అనువాదం చెయ్య గలిగిన సమర్థులు తెలుగు దేశంలో చాలా అరుదు.  ఇతర భారతీయ భాషలనించి ఇంగ్లీషులోనికి అనువాదాలు వస్తున్నాయి.  కాని తెలుగు నించి బహు సక్రుత్తు . తెలుగు సాహిత్యం గురించి ఇతర దేశాల వాళ్లకు చాలా తక్కువ తెలుసు.

అనువాద గ్రందాల విస్తృత అద్యయనం వల్ల నేను గ్రహించిందేమిటంటే, అనువాదకుడి మాతృభాషలోకి అనువదింపబడే గ్రంధం మాత్రమే రాణిస్తుంది.  గ్రందానువాదం అనువాదకుడి మాతృభాష లోకి కాకపోతే, ఆ అనువాదం సమగ్రంగా ఉండదు. ఏదో లోటు కనిపించి తీరుతుంది.

అందుకని, నేను చేసిన అనువాదాలన్నీ తెలుగులోకే.

కవిగా ఎదగడంలోనూ, కేరీరిస్టుగా ఎదగడంలోనూ ఉన్న తేడాను పెద్ద సాహితీ వేత్తలు కూడా ఎందుకు గుర్తించడం లేదు ?

-కేరీరిస్టులుగా ఎదిగి, కవులుగా అణగారి పోయే వాళ్ళని చూస్తే జాలేస్తుంది.

ప్రపంచానికి దూరంగా (కాకినాడకు కాస్త దూరంగా) వలసపాకలలోకి వలస వెళ్ళిన మీరు హైకూతో ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు ? మీ ప్రయాణం నుంచి ప్రపంచానికి మీరు చెప్పే కవితా సందేశం ఇంకా ఎన్ని కొత్త దారులలో ప్రకాశించబోతోంది ?

– రామగిర్యాశ్రమంలో ఉంటూ కాళిదాసకవి మేఘంతో ప్రేయసి జ్ఞాపకాల్లోకి ప్రయాణించినట్లు వలసపాకలలో ఉంటూ హైకూతో కవితా ప్రేయసి సంపూర్ణ సాక్షాత్కారం కలిగే వరకు ప్రయాణిద్దామనుకుంటున్నాను.

ఇస్మాయిల్ గారి 75వ పుట్టినరోజునాడు  జరిగిన సన్మాన సందర్భం ( 2002) లో

వాడ్రేవు వీరలక్ష్మీదేవి చేసిన సంభాషణం

veeralakshmi (2) 

కళ్ళ మీది కటకటాల్ని చెరిపేసే కవిత!

ismayil painting rainbow

” పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పొయెట్రీ, అండ్ పొయెట్రీ ఈజ్ ఎ పెయింటింగ్ దట్ స్పీక్స్ ” అన్నారు. వర్ణ చిత్రం రేఖలు, రంగుల కలబోతతో నిశ్శబ్దంగా పాడే కవిత్వమైతే , కవిత్వమేమో పదాలు , వాటి మధ్య అందంగా పేర్చిన నిశ్శబ్దంతో గుస గుస లాడే వర్ణచిత్రం.

అసలు కవి అనేవాడు ఏం చేస్తాడు? అందులోనూ ఇస్మాయిల్ గారి లాంటి ప్రకృతి సౌందర్యోపాసకుడైన కవి…

ప్రకృతిలోకి తను వేసే ప్రతి అడుగునీ జాగ్రత్తగా అచ్చు వేసి ఎదుటి తరాల వారికి అందిస్తాడు. తను పీల్చే ప్రతి పరిమళాన్నీ పదాల్లోకి తర్జమా చేసి ఎప్పటికీ వాడిపోనీయక దాచి పెడతాడు. అటువంటి కవి , ఏ స్వప్నాల్లోంచి రాలిపడే వర్ణాలతోనో తన ఊహా జగత్తుని అలంకరించుకుని యధాతదంగా ఆ చిత్రాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించే చిత్రకారుడి మీద కవిత రాస్తే అదెలా ఉంటుంది? ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.

488096_10151271931041466_1029829309_n

పికాసో ( చెట్టు నా ఆదర్శం సంకలనం నుంచి )

———

పికాసో చిత్రమైన

అచిత్ర కారుడు

 

అతడు గీసింది కన్నా

చెరిపింది ఎక్కువ

 

మన కళ్ళ మీది కటకటాల్ని

కుంచెతో చెరిపేశాడు

 

అప్పట్నించీ మన కళ్ళు

ఎగరడం నేర్చుకున్నాయి.

 

 

ఒక గొప్ప సత్యాన్ని ఎంత సహజమైన వాడుక భాషలో ఎంత సున్నితమైన , తేలికైన పదాలతో ఎంత గాఢమైన చిత్రాన్ని మన మనసుల్లో చిత్రించిందీ కవిత! ఒక్కసారి ఆ చిత్రం చెప్పే గుస గుసలు వింటే ఎన్ని అర్థాలు అందులోంచి సీతాకోకచిలుకలై ప్రాణం పొంది పైకెగురుతాయ్ !

మనల్ని మనమే కాదు, మన కళ్ళని కూడా ఎప్పుడూ కటకటాల్లోనే ఉంచుతున్నాం అన్నది కాదనలేని సత్యం. ఒక పరిధిని దాటి చూడలేకపోతున్నాం. చూపుల్ని ఎక్కడా లోతుగా నాటలేకపోతున్నాం. అంటే మనవన్నీ పై పై చూపులే. అంతర్నేత్రాన్ని కూడా తెరిస్తేనే మనం చూసే వస్తువు నిజంగా మనకు కనపడేది. ఆ సత్యాన్నే ఈ కవిత చెబుతోంది.

కళ్ళ మీది కటకటాల్ని ఆయన కుంచె చెరిపెయ్యగానే కళ్ళు ఎగరడం నేర్చుకోవడం అన్న భావన ఎంత అద్భుతమైన నిజాన్ని మనకి ఆవిష్కరించి పెడుతోందో చూడండి.

సుమారు ఎనిమిదేళ్ళ క్రితం మొదటిసారి నేనీ కవిత చదివినప్పుడు ఒకానొక గాఢమైన నిశ్శబ్దంలోకి నెట్టబడ్డాను. అతి తేలికగా చెప్పబడ్డ ఒక లోతైన భావనని వెతికి పట్టుకునే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ ఈ కవితని చదివాను. జీవితపు నడకకి అన్వయించుకోవాలని ప్రయత్నించాను. కళ్ళతో చూసే ప్రతి దాన్నీ వెంటనే అలాగే మనసులో ముద్రించుకోకుండా అంతర్నేత్రాన్ని కూడా తెరుచుకుని చూడటం మెల్ల మెల్లగా అలవాటు చేసుకున్నాను.

చిత్రకళాభిమానిగా ఆ తరువాత నేను వర్ణ చిత్రాల్ని ఆశ్వాదించే తీరు కూడా పూర్తిగా మారిపోయింది. వడ్డాది పాపయ్య చిత్రాల్ని చూసినా, రాజా రవి వర్మ తైల వర్ణ చిత్రాల్ని చూసినా, ఇప్పుడు కొత్తగా ఆర్ట్ గేలరీల్లో ప్రముఖ చిత్రకారులు జీవన్ గోశిక, ప్రభాకర్ అహోబిలం మొదలైన వారి వర్ణ చిత్రాల్ని చూసినా మనసు ఇస్మాయిల్ గారి కవితని గుర్తు చేసుకుంటుంది. ఎవరో రహస్యంగా ఆ చిత్రాల్లోని అంతరార్ధాన్ని బోధిస్తున్నట్టుగా కళ్ళు పూర్తిగా ఆ చిత్రాల్ని రెప్పల్లో దాచుకుంటున్నాయ్.

ఒక కవిత కేవలం కొన్ని పదాల అల్లికలా మిగిలిపోకుండా, పాఠకుడి ఆలోచనా పరిధిని పెంచి, ఒక వస్తువుని గమనించే తీరుని మార్చి జీవితాంతం గుర్తుండిపోవడం, నిశ్శబ్ద నదిలా మనసులో పారుతూ అతన్ని/ఆమెని ప్రభావితం చేయడం ఎంత గొప్ప విషయం!

 -ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

 

 

 

ఇస్మాయిల్, టాగోర్: ఇద్దరు సదాబాలకులు!

ismayil painting rainbow

ఇస్మాయిల్ గారు రాసిన రాజకీయ కవితలు చాలా వరకు వ్యంగ్యాత్మకమైనవి. వాటిలో ఎక్కువ భాగం మార్క్సిస్టుల మీద కోపంతో రాసినవే ఉన్నప్పటికీ, ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి వారిని అపహాస్యం చేస్తూ రాసినవి (ఈవిడ, గాడిద స్వామ్యం) కూడా లేకపోలేదు. వీటికి భిన్నంగా, ఆయన వేరే ఎక్కడా ప్రస్తావించని అంశాలు – ఆకలి, దారిద్ర్యం, మత ఘర్షణలు, హింస – వంటివాటిని రేఖా మాత్రంగా స్పృశించినా, వాటిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత ఉద్వేగంతో రాసిన ఒకే ఒక కవిత “బోటులో టాగోరు”. అందువల్ల, ఈ కవిత ప్రత్యేకమైనది, ఆయన కవితల్లో ప్రసిద్ధి పొందినది. టాగూరు గురించి ఆయన, ఆయనను గురించి ఆయన అభిమానులు తరచుగా వాడే “సదా బాలకుడు” అన్న పదప్రయోగం ఈ కవిత లోనిదే.

టాగోరంటే ఇస్మాయిల్ గారి కెంత ఇష్టమో ఆయన టాగోరుపై రాసిన వ్యాసం చదివితే తెలుస్తుంది. టాగూర్ గొప్ప సౌందర్యారాధకుడని, సామాన్య విషయాల్లో సంఘటనల్లో దాగి ఉన్న ఆనందాన్ని, ఉజ్జీవాన్ని తన రచనల్లో ఆవిష్కరించాడని ఆయన అంటారు. టాగోర్ కవిగాకన్నా కథకుడుగానే గొప్పవాడని ఆయన అభిప్రాయం. టాగోర్ 1890 నుంచి పదేళ్ళపాటు తమ కుటుంబ ఎస్టేటు చూసుకొంటూ, షిలైదాలో ఉన్నప్పుడు, అక్కడ పద్మానదిని ఎంతో ప్రేమించాడట. కాళిదాసు పర్వత రాజు ఆస్థాన కవి అయితే, టాగోర్ పద్మా నది కవివల్లభుడట. తనకు ప్రియమైన పద్మానదిలో పడవపై తేలుతూ టాగోర్ అనేక దినాలు గడిపేవాడని, ఆయన చాలా కథలకు బీజాలు అక్కడే పడ్డాయని చెబుతారు. ఆ దృశ్యమే ఈ కవితకు మూలం.

బోటులో టాగోరు విన్న కథల గురించి ప్రశ్నిస్తూ ఈ కవిత వాటిలో కొన్నిటిని ప్రస్తావిస్తుంది. అవి సుభా, హోమ్ కమింగ్, కాబూలీవాలా, కేష్ట్ ఎవే. ఇవన్నీ కరుణ రసాత్మకమైన కథలు, చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళు ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు. ముఖ్యంగా హోమ్ కమింగ్ , కాబూలీవాలా కథలు అంతకు ముందే ఇంగ్లీషు పాఠ్యాంశాలుగానో, ఇంట్లో ఉన్న టాగోరు కథల పుస్తకాల్లోనో చదువుకొని ఉండటంవల్ల, ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఎంతో ఎక్సయిటింగ్ గా అనిపించింది. పిల్లల మనస్తత్వాన్ని టాగోరంత బాగా అర్థం చేసుకొన్న రచయిత వేరొకడు కనిపించడని ఆయన అంటారు. ఈ కవితలో వచ్చే నాలుగు కథలూ అందుకు ప్రతీకగా నిలుస్తాయి. సాధారణంగా కవిత్వంలో సెంటిమెంటును ఇష్టపడని ఇస్మాయిల్ గారు టాగోర్ కథల్లో మాత్రం దానిని చాలా అభిమానించినట్టు కనిపిస్తుంది. ఈ కవితలో మబ్బు బెలూన్లు, బిగిసిన జలచర్మంతో నిగనిగలాడే నదిబాజా వంటి విభిన్నమైన పదచిత్రాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఈ కథలతో కవిత పూర్తికాదు. నది గురించిన ప్రస్తావన, తన చిన్నతనం వైపుకి, అప్పట్లో చెరువుల్లో ఈత కొట్టటం వైపుకి మరలుతుంది. నదిపై పడవలో తేలటం, ఈత కొట్టేందుకు బట్టలు విప్పి చెరువులో దూకటం రెండూ జలస్నేహానికి రెండు పార్శ్వాలు. బోటులో టాగోర్ తన తలపోతలో చుట్టూ తను చూసిన అనేకమంది సామాన్య జనుల కష్టసుఖాల్ని కథలుగా ఆవిష్కరిస్తే, చెరువులో ఈతకొట్టే తాము “మాతృగర్భంలోకి మరలిపోచూసే పిల్లల్లాగో, ప్రియురాలి అంతరంగంలోకి లయమవాలనుకునే ప్రేమికుల్లానో“ ఉన్నామనటం ఒక భద్రత కోసం చేసే అన్వేషణను ఆవిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి కాంట్రాస్టుగా కవిత వెంటనే అభద్రత వైపు మళ్ళుతుంది.

పద్మానది ప్రస్తావనకి కొనసాగింపుగా, పార్టిషన్ టైములో పద్మానదిని పంచుకోవటం, అప్పుడు జరిగిన మత ఘర్షణలు, హింస వంటి వాటిని సూచిస్తూ “ఎన్ని వికృత శబ్దాలు, ఎన్ని హాహాకారాలు, ఎంత భీభత్సం” అని రాస్తారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్తితుల్లో కొనసాగుతున్న హింస, దారిద్ర్యం వంటివాటి పట్ల ఆవేదనను సూచిస్తూ పోషకాహార లోపంవల్ల జబ్బుపడిన పిల్లల పొట్టల డోళ్ళ చప్పుళ్ళతో కవిత ముగుస్తుంది.

ఇస్మాయిల్ గారి కవితలలో ఒక కవిత నాలుగు పేజీలు  దాటటం ఇందులోనే చూస్తాం. నిడివిలోనే కాదు, రాయటానికి పట్టిన సమయంలో కూడా దీనికి ప్రత్యేకత ఉంది. ఈ కవిత రూపొందటానికి నవమాసాలూ పట్టింది.(జూన్ 73-మార్చి 74) . బహుశా కొంత వరకు రాసి పక్కనపెట్టి, మళ్ళీ ఎప్పుడో పూర్తిచేసారనుకుంటాను. ఆలోచనా స్రవంతిలో దాని ప్రభావం కొంత వరకు కవితలో కనిపిస్తుంది. అయినప్పటికీ, టాగోర్ కథలు, తన బాల్యం, ప్రస్తుత పరిస్థితుల భీభత్సం ఈ మూడు భాగాలలోనూ , చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళ ప్రస్తావన ఒక ఏక సూత్రంగా సాగిందని చెప్పుకోవచ్చు.

చిలకలు వాలిన చెట్టు వచ్చిన కొత్తలో, ఈ కవితలోని టాగోర్ కథలను గురించిన వాక్యాలే కాకుండా – నది బాజాని మోగించే సదా బాలకుడు టాగోర్, చిరంతనపు లోతుల్లోకి చివాల్న దూకేవాళ్ళం, సరిత్తీర నికుంజాల్లో నిరీక్షించేవి మెరిసే కళ్లు కావు గురితప్పని గుడ్డి తుపాకులు, మోగటం లేదు టాగోర్ ఇవాళ హృదయంగమాలైన బాల్య మృదంగాలు – వంటి వాక్యాలు ఎన్నిసార్లు చదువుకొనే వాడినో లెక్కలేదు. (ఈ కవిత మృత్యు వృక్షం లోదే అయినా, నేను మొదటిసారిగా చదివింది చిలకలు వాలిన చెట్టు మూడు పుస్తకాల సంపుటిగా వచ్చినప్పుడే.) ఇస్మాయిల్ కవిత్వం ఇష్టపడని అభ్యుదయ వాదులైన కొందరు మిత్రులు ఈ కవితను మాత్రం మెచ్చుకొనేవారు. ఒకరిద్దరైతే, ఇస్మాయిల్ జీవితానికి ఈ కవిత ఒక్కటి చాలనేవారు. నేనలా అనుకోనుగాని, ఇస్మాయిల్ గారు రాసిన అనేక చిరస్మరణీయమైన కవితల్లో ఇది తప్పకుండా చేరుతుందని మాత్రం చెప్పగలను. ఈ కవిత చదివితే దాని ద్వారా, ఇస్మాయిల్ గారినే కాకుండా, నోబెల్ ప్రైజు వచ్చిన ఏకైక భారతీయ రచయిత అనే విశిష్ట గౌరవాన్ని శతాబ్దం పైగా పొందుతూ వస్తున్న విశ్వకవి రవీంద్రుణ్ణి కూడా తలుచుకొనే అవకాశము కలుగుతుంది.

 – విన్నకోట రవి శంకర్

vinnakota

(వచ్చే వారం: ప్రసూన రవీంద్రన్ వ్యాసం)

అక్కడితో బాల్యం అంతమైంది!

 ismayil painting rainbow

[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]

 

1

ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.

ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు అయితే చిరునవ్వుతో, కాదంటే వొక పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?

మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని దిగుళ్ళున్నాయి?! ఎన్ని జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!

నమ్మలేకపోతున్నాను!

వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం! చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ – ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!

ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.

2

అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని! ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.” అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.

బహుశా, ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.

ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి: జీవితం చుట్టూ, సాహిత్యం చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం లాంటి metanarrative కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.

కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి. ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల చోట్ల వస్తుంది. బహుశా, గాడిదలకి అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు. కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme). ఆయన బాల్యం గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన పసితనం గురించీ, పసివాళ్ళ గురించీ రాస్తారు.

గుర్రప్పిల్ల కాళ్ళతో

పరిగెత్తుకుంటూ వచ్చాడు

బడి వదిలినట్టున్నారు.

బుర్రనీ, కాళ్ళనీ

బంధించిన సంకెళ్ళు విప్పేయగానే

మధ్యాహ్నపు ఎండ బయళ్ళు

మహోత్సాహంతో ఆహ్వానించాయి

ఎంత స్వేచ్చ! ఎంత హాయి!

అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో కోణంలోంచి చూస్తే, అవి ఇంకో రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-

“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-

తరుచాపము వీడిపోయి

గురిమరచిన బాణంలా

తిరుగాడును పిట్ట

అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి నెమ్మదిగా ఆ ఆధారాల్నీ, ఆ అలంకారాల్నీ వొదిలేసి-

నా కోసం పూర్తిగా

నగ్నవైనపుడు మాత్రమే

నా దానివి

అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన “గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న లోకంలోంచి వొక సంతోషాన్ని, వొక ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన స్థలం చూస్తే ఎంత ఆనందమో, అస్పష్టమైన వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ పరచుకొని వున్న చెట్లనీ, నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే సంతోషం. ముఖ్యంగా, వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.

పిల్లల్ని గురించి, అంత కంటే ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.

4

కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-

అయితే, నా మొండితనం మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి రేడియో ప్రసంగాలు విని, ఇస్మాయిల్ గారు “కౌముదీ, మీలోని నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని రాశారు.

ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!

ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!

(లోగో: సాయి కిరణ్)

 వచ్చే గురువారం: విన్నకోట రవిశంకర్ వ్యాసం “ఆ ఇద్దరూ సదాబాలకులే!”