కౌమారపు తోటలో కొన్ని పూల గుసగుసలు!

mythiliఈ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది ..రహస్యాలు గుసగుసగా వినపడుతూ వుంటాయి..

నీ అడుగు ఎక్కడ పడుతోందో గమనించుకుంటావు కదూ

‘ నా పన్నెండేళ్ల మేనగోడలికి బహుమతి ఇస్తూన్న ‘ ద సీక్రెట్ గార్డెన్ ‘ పుస్తకం మొదటి పుట లో ఈ మాటలు రాశాను.ఈ నవల శీర్షికని దాని అంతర్ధ్వని కోసం ఇష్టపడతాను..

లోపలి తలుపులూ బయటి తలుపులూ తెరుచుకుంటూ కనిపింపచేసే అందమయిన ఆరామంగా ఆ వయసు వుండాలి.అది ఆదర్శమవనీ,స్వప్నమే అవనీ..అక్కడ కొన్నాళ్లు నిలవాలి.

ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది. చందమామ వాళ్లు గొప్ప దయతో ఏర్పరచిన పాత సంచికల భాండాగారాలన్నీ చదివేసుకుంది.ఎనిడ్ బ్లైటన్  పుస్తకాలన్ని అయ్యే పోయాయి. ఇప్పుడు తను తెలుగులో చదవదగిన  కథా సంకలనాలు కొన్ని వున్నా నవలలు ఎన్నో లేవు. మార్క్ ట్వేన్ ని తెలుగులోకి తెచ్చి అంతతో ఆగిపోయారు నండూరి రామమోహనరావు గారు. ముళ్లపూడి వారు భూప్రదక్షిణం ఒక్కటే అనువదించారు. టాం సాయర్ ని తెలుగు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు, ఆవరసలో రావలసిన ఇతర సాహిత్యమేదీ తెలుగులోకి రాలేదు.

బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం బాగా నచ్చి తర్వాతి కథ చదవబోయిన పిల్లలకి ఆశాభంగమవటం నేను చూశాను. శ్రీ  పాద వారి వడ్లగింజలూ,మార్గదర్శీ కౌమార  సాహిత్యం లో చేర్చవచ్చు. సులోచనారాణి గారి మీనా ని కూడా నేను ఈ కోవలో చెప్తాను.mythili3

టాగూర్ అనువాదాలలో పడవ మునక సరళం గా వుంటుంది..కొంతవరకు గోరా కూడా.నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టాగూర్ కథ హోం కమింగ్ ని పిల్లల సాహిత్యం లో చేర్చటం.నా చిన్నప్పుడు నేను కూడా  ఆ అతి విషాద గాథ ని చదవవలసి వచ్చింది.అది పద్నాలుగేళ్ల అబ్బాయి కథ అయినా టాగూర్ దాన్ని పెద్దవాళ్ల కోసం రాసారుగానీ పిల్లలకి కాదు.నా చిన్నప్పుడు శరత్ సాహిత్యాన్ని కూడా ఈ వయసు పిల్లల కోసం అనేవారు.నిష్కృతి ఇ,నవవిధాన,బిందుగారబ్బాయి అలాంటివే కాని అన్నీ కావు.శరత్ చాలా నవలలలో దిగులు పాళ్లు ఎక్కువ.

నేను  ఆ వయసులో వున్నప్పుడు కనపడినవన్నీ చదివేశాను..వాటిలో కొన్ని అప్పుడు చదవకుండా వుండవలసిందని తర్వాత అనిపించింది.నాకు వేరే దారి కూడా అప్పుడు లేదు..ఇన్ని ఆంగ్లపుస్తకాలు నేను గడిపిన పల్లెటూళ్లలో గ్రంథాలయాల్లో కూడా లేవు, వున్నవి చదివేటంత ఆంగ్లం నాకు వచ్చేది కాదు.

ఈ పిల్ల విషయానికి వస్తే తనది విపరీతమయిన పఠనా దాహం.నాకులాగా తనకి పుస్తకాల షాపులు కలలలో వస్తూ వుంటాయి.  తను చిన్న పిల్ల కాదు, యువతీ కాదు.కొంత తెలుసు,చాలాతెలియదు..అంతా తెలుసు అనుకునే ప్రాయం ఇది ఎంత సుకుమారమో,ఎంత సుతిమెత్తగా చూసుకోవాలో! .అదృస్టవశాత్తూ ఆంగ్లం లో ఈ వయసు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు వున్నాయి.

వాటిలో పాత శతాబ్దంలో రాసినవి అన్ని ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుతాయి..నాకయితే Project Gutenberg ఒక అనంతమయిన నిధి నిక్షేపాల నిలయంలాగా అనిపిస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు.ప్రతి గ్రేడ్ లోనూ వాళ్లు చదివి అర్ధం చేసుకోవలసిన పుస్తకాలు వాళ్లకి కేటాయించబడుతూ వుంటాయి.బాధంతా భారత దేశంలోని 12-16 వయసున్న  పిల్లల గురించే.

వీళ్ల పాఠ్యప్రణాళిక లో సాహిత్యానికి చాలా తక్కువ చోటు వుంది. ఈమద్య దశాబ్దం నుంచి పట్టిన విద్యా విషజ్వరం  ఏ ‘ ఇతర ‘ పుస్తకాన్ని చదివే వ్యవధి ఇవ్వటం లేదు.ఆర్ధికమయిన వెసులుబాటు ఎక్కువగా వున్న తల్లిదండ్రులు ఎంచుకునే ‘ అంతర్జాతీయ ప్రమాణాలు ‘ గల పాఠశాలలు కూడా సరయిన దారిని చూపించటం లేదు.

ఏతావాతా ఈ కౌమారంలోని పిల్లలు ‘ చిక్’ లిటరేచర్  కి అలవాటు పడుతున్నారు. వీటిలో చాలా వరకు ఏ విలువలనీ పాటించాలని అనుకోరు,కొన్ని మినహాయింపులు వున్నా.ఇబ్బంది పెట్టే ‘ చెడ్డ భాష ‘ ని యధేచ్ఛ గా వుపయోగించే ఈ పుస్తకాలు ఆలోచననీ వ్యక్తీకరణనీ కూడా దెబ్బ తీస్తున్నాయి.

కొంచెం మార్గం చూపించాలి -తల్లిదండ్రులు, దగ్గరివారు,ఉపాధ్యాయులు..ఎవరయినా. మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది.  చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.
అది కాదు.

mythili2వేర్వేరు  సందర్భాలలో వేర్వేరు  మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో -ఎలా లోబడిపోవచ్చో, ఎలా ఎదగవచ్చో -ఎలా నలుగుతారో ఎలా తెప్పరిల్లుతారో-ఈ ప్రయాణమంతా మంచి పుస్తకం అన్యాపదేశంగా మాత్రమే చెప్పాలి.ఇందుకు  ఒకే పుస్తకం సరిపోదు.చాలా,చాలా కావాలి.వాటిని వెదకాలి.

అయితే జీవితపు భయానక వాస్తవికతని ఒక్కసారిగా వీళ్లమీదకి వదలకూడదు.చీకటిని తెలియనివ్వాలి,ఆ తర్వాతి వెలుతురుని తప్పనిసరిగా చూపించాలి.తీవ్రమయిన నిరాశ,అయోమయం కలిగించే అఘాతాలు,దయలేనితనం – ఈ వయసు పిల్లలు తట్టుకోలేరు.

పరస్పరవిరుద్ఢ   భావాలని పెద్దవాళ్లు పిల్లలముందు ఎలా నియంత్రించుకుంటారో ఈ పుస్తకాలూ అలాగే వుండాలి.సంఘర్షణ వుండకుండా వీలవకపోవచ్చు,కాని అది సులభంగా అర్ధమయేలాగే వుండాలి.

ఉండదగినన్ని అనురాగపు ఛాయలు  ,అవీ నిజాయితీగా మాత్రమే వుండాలి.సంక్లిష్టమయిన ప్రేమసంబంధాలను గురించి చర్చించకపోవటం ఉత్తమం.

ఈ షరతులన్నీ వర్తించే పుస్తకాలు నా దృష్టిలోకి చాలా వచ్చాయి.సమకాలీన ఆంగ్ల సాహిత్యం లో యంగ్ అడల్ట్ విభాగం చాలా పెద్దది .అన్ని ఇ మాల్ లలోనూ ఇవి దొరుకుతాయి.చాలా మెచ్చుకోదగినవి కూడా వున్నాయి.అయితే నా దృష్టి లో గుటెంబర్గ్,క్లాసిక్ రీడర్ వంటి చోట్ల ఉచితంగా  దొరికే పుస్తకాలే వీటికన్నా  మంచివి.

వీటిని పాశ్చాత్యదేశాల్లో తొమ్మిదేళ్ల వయసునుంచే  సూచించినా ఇక్కడి పిల్లలకి పదకొండు పన్నెండేళ్ల తర్వాతే బాగుంటాయి.ఇది నా స్వానుభవం.పిల్లలని ఈ మహాతల్లుల, పెద్దమనుషుల  చేతుల్లో పెట్టి కొన్నాళ్లు నిజంగా నిశ్చింతగా వుండవచ్చు.

Frances Eliza Hodgson Burnettరాసిన పుస్తకాలని నేను మొదట వుంచుతాను.A Little Princessలో నిబ్బరం,అభిజాత్యం అబ్బురమనిపిస్తాయి.యేబ్రాసి  పిల్లMary Lennox..The Secret Garden లో ఎలా సున్నితంగా మారుతుందో ఏమెమి కనుక్కుందో ఆసక్తిగా అనిపిస్తుంది.Little Lord Fauntleroy లో చిన్న పిల్లాడు  తనకి కొత్తగా పట్టిన అదృష్టం లో ఎలా గుక్క తిప్పుకోగలిగాడో,కఠినుడయిన  తాతగారిని ఎలా మార్చుకున్నాడో చదవటం  ముచ్చటగా వుంటుంది.

తర్వాత చెప్పవలసిందిLucy Maud Montgomery  గురించి.Anneఅనే విలక్షణమయిన అమ్మాయి గురించి చాలా నవలలు వుంటాయి.ఇంచుమించు అన్నీ హాయిగా వుంటాయి.ఈవిడే రాసినEmily trilogy సూక్ష్మమయిన పరిశీలనతో  నడుస్తుంది.నేను చదివించిన పిల్లలందరూ తమని తాము చూసుకున్నారు ఈ పాత్రలో.
తర్వాతLouisa May Alcott . .ఈవిడ రాసినLittle Women ఎప్పటికీ నచ్చుతూ  వుంటారు..అసలు ఆ పేరే ఎంత బాగుందో చూడంది..ఈవిడ ఇతర రచనలు Eight Cousins,An Old Fashioned Girl,Under the Lilacs కూడా చక్కగా వుంటాయి. Eleanor H. PorterరాసినPollyanna  పుస్తకం ఎంత ప్రసిద్ఢికెక్కినదంటే  నిరంతర ఆశావాదాన్నిPollyannaism అని పిలుస్తారు.ఈ అర్ధం నిఘంటువుకెక్కింది.Pollyanna Grows Up అని దీని తర్వాతి భాగం.పాజిటివ్  థింకింగ్ ఎంతో కొంత  నేర్చుకుని తీరాలి నచ్చితేJust David అనేది  ఇంటిపేరు తెలియని  ఒక అబ్బాయి గురించి.చాలా ఉదాత్తమయిన   నవల.

Edith Nesbit మరీ చిన్నపిల్లల కోసం అనుకుంటారుగానీ ఈవిడ రాసిన అద్భుతకథలు ఈ వయసులోనూ బాగుంటాయిThe House of Arden, The Railway Children ఆరోగ్యకరమయిన రచన లు .తర్వాత Kate Douglas Wiggin రాసిన  Rebecca of Sunnybrook Farm చెప్పుకోదగినది .ఈవిడదే Mother Carey’s Chickens కూడా మంచి నవల .Jules Verne మంచి సైన్స్ ఫిక్షన్  రాసాడు .20,000 Leagues under the Sea ,The Mysterious Island  ప్రసిద్ఢి  వున్న Around the World in Eighty Day బాగున్నంతా బాగుంటాయి .

Johann David Wyss  ది The Swiss Family Robinson  ఎన్నిసార్లు చదివినా బాగుంటుంది .Robert Louis Stevenson, Thomas Hughes మొదలయినవారు ప్రత్యేకించి  అబ్బాయిలకి  నచ్చే పుస్తకాలు రాసారు.

వీళ్లు కొంతమంది మాత్రమే.ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకెన్నో అంతేలేదు ..

“If you look the right way, you can see that the whole world is a garden.”
― Frances Hodgson Burnett, the Secret Garden

‘పురుష’ భారతం మీద స్త్రీ స్వరం నిరసన

kalluri-1మహాభారతం గురించి కొంచెమైనా చెప్పుకోకుండా మహాభారత కథాంశంతో రచించిన ఏ రచన గురించీ చెప్పుకోవడం కుదరదు. ప్రసిద్ధ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ రచించిన ‘యాజ్ఞసేని’కి కూడా ఇదే వర్తిస్తుంది. మహాభారతం భారతదేశమంత విశాలమైనది. భారతదేశ చరిత్ర, సమాజం, సంస్కృతి, విశ్వాసాలంత లోతైనది. వైవిధ్యవంతమైనది. అసలు మహాభారతమంటే భారతదేశమే. మహాభారతంలో లేనిదేదీ భారతదేశంలో లేదు. భారతదేశంలో ఉన్నదేదీ మహాభారతంలో లేకుండా లేదు. ఒక దేశానికీ, ఒక ఇతిహాసానికీ ఒకే పేరు ఉన్న ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?!

మహాభారతం ఈ దేశవాసుల మూలచరిత్ర. ఇప్పటికీ భారతదేశం మహాభారత సమాజంగానే ఉంది ఉంది కనుక మహాభారతం భారతదేశపు నడుస్తున్న చరిత్ర. మహాభారతంలో భారతదేశాన్ని పోల్చుకోలేనివారికీ, భారతదేశంలో మహాభారతాన్ని దర్శించలేనివారికీ భారతదేశమూ, మహాభారతమూ ఎప్పటికీ అర్థంకావు. భారతదేశపు వర్తమానంపై వ్యాఖ్యానించగల సాధికారత ఎప్పటికీ లభించదు. మహాభారతాన్ని సొంతం చేసుకోనివాడు, జీర్ణించుకోనివాడు సంపూర్ణ భారతీయుడు కాలేడు.

భారతదేశపు నడుస్తున్న చరిత్రను ఏ కోణం నుంచి వ్యాఖ్యానించాలన్నా కనీసం అయిదువేల సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి. భారదేశపు భవిష్యత్తును ఏ కోణం నుంచి అంచనావేయాలన్నా కనీసం వెయ్యి సంవత్సరాలు ముందుకు చూడాలి.

మహాభారతం లాంటి ఒక జాతి మూలచరిత్ర  ప్రతికాలంలోనూ తనను తాను పునః సృజించుకుంటూ ఉంటుంది. పునర్నవీనమవుతూ ఉంటుంది. ప్రతి తరమూ తన సంస్కృతీ, సాహిత్యవారసత్వాన్ని కొత్త అనుభవాలనుంచి దర్శిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది. యవ్వనవంతమైన ప్రతి తరమూ, ప్రతి కాలమూ నూతన వైజ్ఞానిక వనరుల కొత్తరక్తంతో తన వైజ్ఞానిక వారసత్వానికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో నిన్నటి తరంనుంచి, లేదా కాలంలో ఘనీభవించిపోయిన వ్యక్తులు, వ్యవస్థలనుంచి ప్రతిఘటననూ ఎదుర్కొంటూ ఉంటుంది.

విశ్వాసానికీ, విజ్ఞానానికీ ఆజన్మ శత్రుత్వం. మహాభారతం సహా మన పౌరాణిక సంపద అంతా కాలగతిలో విశ్వాసంలో భాగమైపోయింది.  ఈ విశ్వాసపు మూకబలం మహాభారత వైజ్ఞానిక మథనానికి ఏయే కాలాలలో ఏమేరకు అడ్డంకిగా మారిందో, ఆ ప్రయత్నం ఎన్నెన్ని ప్రచ్ఛన్న రూపాలు ధరించిందో-దానికదే ఒక అధ్యయనాంశం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది…కవిత్వం, కథ, నవల, ఇతర కళారూపాలు అన్నీ సత్యాన్ని విశ్వాసపు దాడినుంచి తప్పించడానికి ఉద్దేశించినప్రచ్ఛన్న రూపాలు కావచ్చు నేమోనని!

మహాభారతం మౌలికంగా పురుష భారతం. మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కాలంలో జరిగిన భారీ ప్రయత్నంలో అది కూడా భాగం. ఆ ప్రయత్నం చరిత్రే ఒక ఉద్గ్రంథమవుతుంది. ప్రస్తుతానికి వస్తే, పురుషభారతంగా మహాభారతం ‘సగం’ రచన. అయితే, పురుషస్వామ్యాన్ని స్థాపించే కథకుని ప్రయత్నాన్ని ధిక్కరిస్తూ మరెన్నో అవశేషాలతోపాటు మాతృస్వామ్య అవశేషాలూ మహాభారతంలో ఉండిపోయాయి. కథను నేర్పుగా ‘ఎడిట్’ చేసుకోలేకపోయిన కథకుని వైఫల్యం ఒకవిధంగా మనకు వరం అయింది. కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథలు, కొత్త అన్వయాలు సృజించుకునే అవకాశం కలిగింది.

పురుషభారతంలో స్త్రీపాత్రలు చాలావరకు వ్యక్తిత్వమూ, హృదయమూ వ్యక్తం కాని బుట్టబొమ్మలు. నేను గమనించినంతవరకు ద్రౌపది తన వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్న ఘట్టాలు రెండే: మొదటిది, వస్త్రాపహరణ ఘట్టంలో లేవనెత్తిన ధర్మమీమాంస. రెండవది, ఉపపాండవులను వధించిన అశ్వత్థామపై పగ తీర్చుకోడానికి భర్తలపై ఒత్తిడి తెచ్చిన ఘట్టం. కొడుకులనే కాక, తండ్రి ద్రుపదునీ, సోదరుడు ధృష్టద్యుమ్నునీ, అతని కొడుకులనూ కూడా  కోల్పోయిన పాంచాల రాజపుత్రిగా ఆ ఘట్టంలో ఆమె ‘పుట్టింటి పగ’కు అచ్చమైన ప్రతినిధి.  అశ్వత్థామ శిరసున ఉన్న మణిని తెచ్చి భీమార్జునులు తనకు ఇచ్చినప్పుడు ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకు ఇవ్వడంలో ఆమె నిర్వహించినది అసలు సిసలు రాచకార్యం. తండ్రి ద్రోణుడి ద్వారానే కాక, ధృష్టద్యుమ్నుని చంపినవాడుగా అశ్వత్థామ పాంచాలసింహాసనంపై కనీసం సాంకేతికంగానైనా హక్కును స్థాపించుకునే అవకాశం ఉంది కనుక, అధికార చిహ్నమైన అతని శిరోమణిన ద్రౌపది ధర్మరాజుకు ఇవ్వడం పాంచాలరాజ్యంపై అధికారం ఇవ్వడమే.
కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథ, లేదా కొత్త అన్వయం సృజించడానికి ప్రయత్నించిన రచనలలో నేను చదివినంతవరకు ఇరావతీ కార్వే ‘యుగాంత’ ఒకటి. ఆ రచన పురుషభారత ప్రభావాలకు దూరంగా మహాభారతాన్ని స్త్రీ పరంగా, స్త్రీవాదపరంగా వ్యాఖ్యానించింది. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ మాతృస్వామ్యం, పురా చరిత్ర, పురామానవచరిత్ర కోణాల నుంచి మహాభారతాన్ని పునఃకథనం చేయడానికి ప్రయత్నించింది. ఒక పురుష రచయితగా స్త్రీ హృదయపు లోతును, గాఢతను భైరప్ప పూర్తిగా ప్రతిబింబించగలిగారా అన్న సందేహానికి ఆస్కారం ఎలాగూ ఉంటుంది. అది పురుష రచయితకు సహజంగా ఉండే ఒక పరిమితి.

ఎం.టి. వాసుదేవన్ నాయర్ ‘సెకండ్ టర్న్’ బ్రాహ్మణీయతా వ్యతిరేకతను ధ్వనింపజేస్తూ భీముని గిరిజనుడిగా చూపిస్తూ అతని పరంగా చెప్పిన కథ.ఆ విధంగా అది పురుషభారతానికి ఆధునికమైన కొనసాగింపు. వీటికి భిన్నమైన మరాఠీ రచన విష్ణు సఖారామ్ ఖాండేకర్ ‘యయాతి’. మహాభారతంలోని యయాతి కథను ఈ రచన తాత్విక కోణం నుంచి అన్వయిస్తుంది.నేను చదవని రచనలు ఇంకా ఎన్నో ఉండి ఉండచ్చు.

 

pratibha rayఇక ప్రతిభా రాయ్ ‘యాజ్ఞసేని’. ఈ రచన ‘యయాతి’లా తాత్వికంగా ఉంటూనే తాత్వికతను భౌతికతతో సమన్వయించేలా ఉంటుంది. పాఠకుల రుచి భేదాన్ని బట్టి ఈ రచనలో రుచించని అంశాలూ ఉన్నాయి; ఒక తాత్వికమైన, మానవీయమైన లోతుకలిగిన పరిణత రచనగా రుచి భేదాలకు అతీతంగా ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. మొదట, ఆకట్టుకునే అంశాలలోకి వెడదాం. రచయిత్రి ఈ రచనలో మూల భారతంలో లేని కొన్ని సరికొత్త సన్నివేశాలను సృష్టించారు. అలాంటి మూలాతిక్రమణ ఎంతవరకు భావ్యమన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే, ఆ సన్నివేశాల కల్పన ఆశ్చర్యకరంగానే కాక ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఆ కల్పన మనకు తెలిసిన మహాభారతపాత్రలకు కొత్త పుష్టినీ, కొత్త మెరుపునూ ఇచ్చి మహాభారతకథ నుంచి నూతన అనుభూతిని అందుకునే అవకాశమిస్తుంది. చిరపరిచయం వల్ల  కథను అంటిపెట్టుకుని ఉండే  మొనాటనీని తగ్గిస్తుంది.

కృష్ణ (రచయిత్రి ద్రౌపదికి ఈ పేరునే ఎక్కువగా ఉపయోగించారు)-కర్ణుల మధ్య; కొంతవరకు కృష్ణ-కృష్ణుల మధ్య కల్పించిన సన్నివేశాలు అలాంటివే. వివాహమై భర్తలతో కలసి కృష్ణ హస్తినాపురం వచ్చినప్పుడు వారికి స్వాగతం చెప్పడానికి కౌరవులతోపాటు కర్ణుడు కూడా వెడతాడు. అతను తనకు ఇష్టమైన నీలి గులాబీ గుచ్ఛం సమర్పించినప్పుడు కృష్ణ విచిత్రస్పందనలకు లోనవుతుంది. తన భర్తలెవరూ తనకు నీలి గులాబీలు కానుక చేయలేదని అనుకుంటుంది. కర్ణుని తన ‘ధర్మపుత్రు’డిగా చెప్పుకుంటూ మొదటినుంచీ అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ వచ్చిన కుంతి, ఒక రోజు కృష్ణను కూడా కర్ణుని ఇంటికి తీసుకు వెడుతుంది. అతనికి ప్రణామం చేయిస్తుంది. అప్పటినుంచీ అత్త హృదయం నుంచి కర్ణుని అర్థం చేసుకోడానికి, సానుభూతి చూపడానికి కృష్ణ ప్రయత్నిస్తుంది. స్వయంవర పరీక్షలో పాల్గొనడానికి కర్ణుని నిరాకరించిన క్షణం నుంచే కృష్ణ-కర్ణుల మధ్య ఒక విధమైన హృదయ సంబంధం ఏర్పడింది. అప్పుడు కృష్ణలో కలిగిన సానుభూతి మొలక క్రమంగా పెరిగి పెద్దదైనట్టు కనిపిస్తుంది.

పాండవులు ఇంద్రప్రస్థంలో సభాభవనం నిర్మించుకున్న సందర్భంలో కౌరవులతోపాటు అతిథిగా వచ్చిన కర్ణునికి భోజనం స్వయంగా తీసుకు వెళ్ళమని కుంతి కృష్ణను పురమాయిస్తుంది.  అప్పుడు కర్ణుడి మాటలు కృష్ణ మనసును గాయపరుస్తాయి. రాజ్యం కోల్పోయి పాండవులు వనవాసం వెడుతున్నప్పుడు, కృష్ణ  ఒంటి మీద ఆభరణాలు ఉంచుకోడానికి దుశ్శాసనుడితో కలసి కర్ణుడు అభ్యంతరం చెబుతాడు.  అవి దుర్యోధనుడి సంపద అంటాడు. కృష్ణ ఆభరణాలు ఒలిచి ఇచ్చేస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్ణుడు భార్య ద్వారా వేరే ఆభరణాలు కృష్ణకు  పంపుతాడు. ఇవి కర్ణుడి ఆస్తి కనుక తీసుకోమని కర్ణుని భార్య అంటుంది. దుర్యోధనుడు ఇచ్చిన ఆస్తే కాని కర్ణుడికి సొంత ఆస్తి ఎక్కడుంది అంటూ కృష్ణ  తిరస్కరిస్తుంది.  వనవాస సమయంలో యమునా నదిలో కొట్టుకుపోతున్న కృష్ణను కర్ణుడు కాపాడతాడు. మరో సమయంలో అడవిలో పాము కాటుకు గురైన కర్ణునికి తన మంత్రప్రయోగంతో కృష్ణ ప్రాణదానం చేస్తుంది.

ఇటువంటి సన్నివేశాల కల్పనద్వారా కృష్ణ-కర్ణుల మధ్యగల అనుకూల-ప్రతికూల స్పందనలను రచయిత్రి అద్భుతంగా చిత్రిస్తారు. కర్ణుడి గురించి పాండవులకు తెలియని కొన్ని రహస్యస్పందనలను అత్తా-కోడళ్ళు ఇద్దరూ పంచుకుంటున్నారనీ, అవి కేవలం స్త్రీ హృదయానికే తెలిసిన రహస్య స్పందనలనే భావన కలిగిస్తారు. తనలానే అయిదుగురి సంబంధంతో సంతానం కన్న అత్తతో కృష్ణ అడుగడుగునా మమేకం అవుతుంది. కుంతి కర్ణునిపట్ల మాతృత్వంతో స్పందిస్తే, కృష్ణ స్పందనలో అత్తతో సహానుభూతే కాక, మరో రకం స్పందన కూడా ఉందా అన్న అనుమానం కలుగుతుంది.

యుద్ధ ప్రారంభఘట్టంలో పాండవులు అందరితోపాటు తన మానసిక దౌర్బల్యాలను కూడా కృష్ణ వెల్లడిస్తూ, నా హృదయ దౌర్బల్యమే కుంతీమాతకు కూడా ఉందనీ,  కుంతీ పుత్రులే తన దౌర్బల్యమనీ అంటుంది. అంతటితో ఆగకుండా, “కుంతి జ్యేష్టపుత్రుడితో ప్రారంభించి కుంతి కనిష్ట పుత్రుడివరకు అందరివైపు నాకు ఆకర్షణ ఉంది” అంటుంది. అప్పటికే కర్ణుడు కుంతి జ్యేష్టపుత్రుడని తనకు తెలుసు కనుక కర్ణుని కూడా కలుపుకునే ఆ మాట అందా అనిపిస్తుంది. అయితే ఆ వెంటనే, “నా మూడవ దౌర్బల్యం నా మూడవ భర్త అర్జునుడు” అనడం ద్వారా పంచ పాండవులనే ఉద్దేశించిందన్న భావన కలిగిస్తుంది. కర్ణుడి పట్ల కృష్ణ విచిత్రస్పందనను రచన పొడవునా సూచిస్తూ వచ్చిన రచయిత్రి  చివరివరకూ అది ఎలాంటి స్పందనో చెప్పకుండా స్పష్టాస్పష్టంగానే  విడిచిపెట్టారు. మరోవైపు, కర్ణుని ఆరవ భర్తగా కృష్ణ కోరుకుందన్న జానపద చిత్రణ నుంచి స్పూర్తి పొంది రచయిత్రి కృష్ణ-కర్ణ పాత్రలను మలచినట్టు అర్థమవుతూనే ఉంటుంది.

పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది.

అయితే,  కర్ణుని పట్ల కృష్ణది ఎలాంటి ఆకర్షణ? అది శారీరక సంబంధమైనది కాదని చెప్పలేం. శారీరక సంబంధమైనదే ననీ చెప్పలేం. శారీరక సంబంధానికి అతీతమైనదీ, అంతకంటే అత్యున్నతమైనదీ కూడా కావచ్చు. ఇక్కడే రచయిత్రి స్త్రీ హృదయమూలాలను అత్యద్భుతంగా ఆవిష్కరించారనిపిస్తుంది.  కృష్ణ దేహసంబంధమైన పరిమితులను దాటి హృదయగతంగా జీవించే స్థాయిని అందుకుంది. పత్నీత్వానికీ, మాతృత్వానికీ మధ్య ఆమెలో ఎల్లలు చెరిగిపోయాయి. ఆమె దృష్టిలో దేహసంబంధం ఒక అనాసక్తయోగం. దేహాన్నీ, ఆత్మనూ ఆమె విభజించుకోగలిగింది. వ్యక్తిత్వాలలో ఎంతో వైవిధ్యమున్న అయిదుగురితో తన దేహాన్ని ఎప్పుడైతే ఆమె పంచుకోవలసివచ్చిందో అప్పుడిక ఆమె దేహ చింతనుంచీ అది విధించే పరిమితులనుంచీ విముక్తురాలైంది. ఆమెలోని స్త్రీ హృదయం కట్టలు తెంచుకుని ప్రవహించింది. శత్రు, మిత్ర భేదం లేకుండా ఎందరినో తనలోకి తీసుకుంది. ఎన్నో అద్భుతాలు చేసింది. కామ్యకవనంలో తల్లిని కోల్పోయి తల్లి పాలు లేక శుష్కించిపోయిన ఇద్దరు ఆటవిక శిశువులకు కృష్ణ స్తన్యమిచ్చి జీవం పోయడం ఆమె మాతృత్వ స్పందనకు ఒక నిదర్శనం. స్త్రీ మగజాతి కంతటికీ తల్లిగా సంరక్షణ బాధ్యత తీసుకున్న మాతృస్వామ్యపు రోజులు కృష్ణ పాత్రలో లీలగా స్ఫురిస్తాయి.

కృష్ణ సతీత్వం, పవిత్రతల నిర్వచనాన్ని విశాలం చేసింది. తనలో ఇలా అనుకుంటుంది: ”నిజానికి పంచపతీగ్రహణం నాకోసమే కాదు, సమగ్రస్త్రీజాతికి ఒక ఆహ్వానం. ఒకే సమయంలో ఒకరి కన్నా ఎక్కువమంది భర్తలను వరించినా స్త్రీ పవిత్రత మలినం కాదు-అన్నదానిని రుజువు చేసే సందర్భం.” మరో సందర్భంలో ఇలా అనుకుంటుంది: “ప్రపంచంలో అధికాంశం స్త్రీలు శరీరపరంగా అసతులు కాకపోయినా మానసికంగా అసతులు. ఒకే భర్తకు భార్యగా ఉన్నా ఇతర పురుషులు వారి మనస్సులో అలజడి రేపుతారు. శరీరాలు వేరైనా మానసికంగా వారు పరపురుషులతో శయనిస్తారు. కానీ నా విషయంలో ఇది జరగదు. యుధిష్టరునితో ఏకాంతంలో ఉన్నప్పుడూ నేను అర్జునుని కోరుకోను. సంయమనం, కట్టుబాటుతో ఉండేందుకు నేను సాధన చేశాను” .

అయిదుగురు భర్తలు ఉన్నా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించిన కృష్ణ జీవన పార్స్వాన్ని కూడా రచయిత్రి కరుణరసాత్మకంగా చిత్రించారు.  స్వయంవరంలో కృష్ణను వాస్తవంగా గెలుచుకున్నది అర్జునుడు. కృష్ణ వరించినది కూడా అర్జునునే. అయితే, కుంతి కోరిక ప్రకారం, అన్నదమ్ముల ఐక్యత కోసం అయిదుగురికీ ఇల్లాలు కావలసివచ్చింది. ఆ పరీక్షా సమయంలో అర్జునుడు తన అసమ్మతిని తెలిపి ఆదుకుంటాడని కృష్ణ అనుకుంది. కృష్ణ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి తనను ఆదుకుంటుందని అర్జునుడు అనుకున్నాడు. అలా జరగలేదన్న అసంతృప్తి ఇరువురిలోనూ ఉండిపోయింది. దాంతో అర్జునుడు ఎక్కువ కాలం కృష్ణను తప్పించుకు తిరుగుతూ ఆమెకు మానసిక క్షోభ కలిగించాడు. హృదయపూర్వకంగా వలచిన అర్జునునితో ఎక్కువ సాంగత్యానికి కృష్ణ  నోచుకోలేకపోయింది. ఇద్దరూ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వియోగమే అనుభవించారు. మిగిలిన నలుగురు భర్తలూ ఎవరి ప్రపంచంలో, ఎవరి ఆసక్తులలో వారు గడిపారు తప్ప కృష్ణ హృదయప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. చివరిలో ఆమె కృష్ణుని ఇలా వేడుకుంటుంది: ”ఎప్పుడూ ఏ స్త్రీకీ ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువమంది భర్తలను ఇవ్వవద్దు. అవిభక్తగా ఉండికూడా తనను తాను విభజించుకునే దుఃఖం నాకు తెలుసు”.

కృష్ణ-కృష్ణుల సంబంధం మరో ఆసక్తికర చిత్రణ. కృష్ణలోని దేహాంశ పాండవులదైతే, సూక్ష్మాంశ కృష్ణుడిది. అది భక్తురాలికీ, దైవానికీ ఉండే సంబంధం. కృష్ణ మొదట కృష్ణునే వరించింది. కానీ అర్జునుడే నీ భర్త కావాలని కృష్ణుడు చెప్పాడు. నువ్వు నీ తండ్రి శత్రునాశనానికే యాజ్ఞసేనిగా జన్మించావనీ, ప్రపంచంలోని దుర్మార్గుల వినాశనమే నీ పుట్టుక ఉద్దేశమనీ చెప్పాడు. ధర్మస్థాపన కోసం కోరికలను, ఆశలను, మనసును, హృదయాన్ని, బుద్ధికుశలతను త్యజించాలన్నాడు. వెంటనే కృష్ణ మనసులో అర్జునుని స్థాపించుకుంది.

కృష్ణుడు అన్న ఈ మాటలు ఈ రచనను పురుష భారత ప్రభావంలోకి, పురుష భావజాలంలోకి తీసుకువెడుతున్నాయి.  మహాభారతాన్ని విజేతల పక్షాన చెప్పిన కథగా భావించేవారికీ; ధర్మాధర్మాలు ఎవరి పక్షాన ఉన్నాయో, అవి ఎటువంటివో ఇంకా లోతుగా పరిశీలన జరగాలని భావించేవారికీ ఇది రుచించే విషయం కాదు. పాండవులు ధర్మాత్ములు, కౌరవులు అధర్మపరులన్న స్టీరియో టైపును ఈ రచన అనుసరించింది.  విశేషమేమిటంటే, మూల కథ కూడా ఈ స్టీరియో టైపును ఇంతగా గీత గీసినట్టు అనుసరించలేదు. యుద్ధంలో పెద్ద ఎత్తున బంధునాశనం చేసినందుకు ధర్మరాజు, యుద్ధాన్ని తప్పించనందుకు కృష్ణుడు జననిందను ఎదుర్కొన్నారు. కృష్ణుడు గాంధారీ శాపానికి కూడా గురయ్యాడు.

ఈ రచన ఆయా పాత్రలను మరీ ఆదర్శీకరించడం, మోయలేని ఆదర్శాల బరువు కింద అవి అణిగిపోతున్నట్టు, ఆదర్శాల స్వాప్నిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉండడం వాస్తవిక దృష్టిని కోరుకునేవారికి నచ్చదు. పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది. పురుష భారతంలోని అతీంద్రియ లక్షణాలను, విశ్వాసాలను, మహిమలను యథాతథంగా స్వీకరించడం మరో నిరుత్సాహకర అంశం.  గిరిజనులకు, అసురులకు క్షత్రియులతో ఉన్న సహజ వైరాన్ని, వైరుధ్యాలను కప్పి పుచ్చి వారి మధ్య ఆదర్శవంతమైన మైత్రీనీ, శాంతి సామరస్యాలనూ స్థాపించబోవడం కూడా వాస్తవాల నేల విడిచి సాగించే ఆదర్శాల సాము మాత్రమే. ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన పురా చరిత్ర, పురామానవ పరిణామ చరిత్ర వంటి వనరుల స్పృహ ఈ రచనలో లోపించడం ఒక వెలితి. స్త్రీ హృదయాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన రచయిత్రి తన రచనను వాస్తవికతా పునాదుల మీద కాకుండా నిరూపణకు అందని భావజగత్తు పునాదులమీద నిలబెట్టడం పురుష భావజాల ప్రభావఫలితం.

Front Image: Hidimba Reveals their Identity, Scene from the Story of the Marriage of Abhimanyu and Vatsala, Folio from a Mahabharata ([War of the] Great Bharatas), circa 1850, Painting; Watercolor, Opaque watercolor on paper, Wikimedia Commons