తెలుపో… నలుపో… జాన్తానై …

“నల్ల మందు తెలుసు. ఈ నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?

రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్థకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?”

పొద్దస్తమానం అలా వార్తా పత్రికలు ముందేసుకుని జోగుతుంటారు గదా శ్రీవారూ.. ఈ చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా బుద్ధి లేక పొద్దున్నే! ఏ ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు “ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ఓ ముఖ్య సమాచారం మాత్రం చెప్తా విను” అని మాట దాటేశారు. ‘ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా.. ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో ఆ దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా మోదీజీ పంచబోతున్నారనీ’ మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు పంచడం వరకూ సంతోషమే కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ! ఇదేందీ.. ఇందులో ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!

నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న చీటీపాటల డబ్బంతా నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో తల గోడకేసి మోదుకున్నారు. “నన్ను చంపక.. పోయి ఓ కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!” అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి ఆ జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి.

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన చూసే టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే ‘ఈనాడే’ నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం మీదా ఓ సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం తినడం లేదీరోజుల్లో ఈ గడ్డీ గాదం! పన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

blck

ఏనుగు బరువేయబోతే చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడాను. కాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా! దారేదో ఓటి ఉంది కాబట్టే ఆ సంపన్నులంతా తమ సంపాదన్ని దేశం దాటించేస్తున్నారు! ఆ దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి.. ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా! నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి! ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. ఆ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని.. ఈ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు ఈ నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

‘గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు” అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత. తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా మనసులోని ముచ్చట్లను కూడా బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ తీపి. మా చెల్లాయి జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. ‘నల్ల’ అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను పట్టుకుని పద్దస్తమానం ‘నల్ల పొన్ను.. నల్ల పొన్ను’ అని తెగ మెటికలిరిచుకుంటుంది. పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

‘తెలుపో..నలుపో.. జాన్తానై.. ఆ తేడా లిక్కడ లేనే లేవ్’ అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో ఆ నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది నా పాయింటు!

‘ఇప్పుడీ మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!’ అని మీరు విస్తుపోతున్నారని తెలుసు! ఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే ఓ రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి పర్సులో వేసుకోరూ! అసలుమనిషి వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. ఓ సారి ‘మనదీ’ అనుకున్నాక ఏ సొమ్మూ సమ్మంధమూ లేకుండా మధ్యలో సర్కారోడొచ్చి పన్నులూ పాడూ కట్టమంటే.. ఎవరికైనా మనసుక్కంష్టంగానే ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. ఆ పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారు. విడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?

ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా? మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి తాడుతెగి సంపాదనంతా నల్ల ధనమని తేలి చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు. రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని మా ఎదురింటి కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!

దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి పిలవక పోయినా..లోకుల వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా తలా ఓ రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఓట్లడుక్కోడానికని వస్తే అంతటా ‘ఓహో.. ఆహో’ అన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ ఈయనగారు లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో .. పాడో.. వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప .. వాళ్ల ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి పడబోతుందా? నల్లధనంమీద నడిపించే ‘బ్లాక్ మెయిల్’ కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలి? ఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు తెగిస్తే అంత సొమ్ము పోగయుంటుందీ! అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?

నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా పోయి డబ్బలా వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

‘ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద’ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే తూలుడు. వ్యాపారాల్లోనైతే చైనా జపాన్లదే ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ.

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. ఏ సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ తెలుసు. గతపాలకుల కాలంలోనే ఈ జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి కాబట్టి అక్కడి యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? ఈ యావత్ వ్యవహారంతో ఏనాడూ ఏ సంబంధమూ లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!

కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో ఈ నల్లధనం ప్రహసనం ఒహటీ!

‘చిట్టచివరి చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్! కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!’ అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో! సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి తరలివస్తే అదీ మరో అద్బుతమే!

మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*

– గుడ్లదొన సరోజినీదేవి

sarojini

మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు రచనలపై నాకు తోచిన అభిప్రాయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

గోమతి (నవల):

అమ్మానాన్నల అపురూపంగా చూసుకునే గారాలపట్టి గోమతి. ఆకుసంపెంగ తోటల్లో, పెరటి జామచెట్టు నీడల్లో ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మాయి తను.

ఊహ తెలిసినప్పటినుండీ పొరుగింటి కుర్రాడు గోవిందుతోనూ, అటుపై బావ గోపాలంతోనూ అల్లరిచిల్లరిగా, నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా గడిచిన చిన్నతనం గోమతి సొంతం.

అటు గోవిందుకి, ఇటు గోపాలానికి ఆరాధన తానై ఎవరి ప్రేమను ఎలా అర్థం చేసుకొవాలో తెలియక ఎంతో మానసిక సంఘర్షణకు గురై చివరకు గోవిందుకి భార్యవుతుంది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. అత్తవారి ఆస్థి మొత్తం కరిగి రోడ్డున పడాల్సి వస్తుంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా భర్తకు అంగవైకల్యం సంప్రాప్తిస్తుంది. అలాంటి నేపథ్యంలో తానే కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతూ జీవిత సమరం సాగిస్తుంది గోమతి.

అనుకోకుండా ఆమె జీవితంలోకి బావ గోపాలం పునరాగమనం, అతని సాన్నిధ్యంలో ఆమె సాంత్వన పొందడం, తప్పు చేస్తునానన్న అపరాధభావంతో బాధ పడడం, గోపాలంతో భార్య చనువుతో పాటుగా అంగవైకల్యంతో గోవిందులో కలిగే ఆత్మన్యూనత, ఇష్టమైన మరదలికి తన ఇష్టాన్ని తెలియచేయలేని తన అశక్తతతో గోపాలం చెందిన వ్యథ, తిరిగి ఆమె కనిపించినప్పుడు అతను పొందిన ఆనందం… ఒకటా రెండా… అత్యంత సహజంగా ఈ కథలో జరిగే సంఘటనల మధ్యలో కథలోని ఈ పాత్రలు పడిన మానసిక క్షోభను కానీ, శారీరక శ్రమను కానీ అత్యంత సహజంగా, ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి విశాలాక్షి.

ముఖ్యంగా గోమతి పాత్రను విశాలాక్షి గారు మలచిన తీరు అత్యద్భుతం. ఆద్యంతం గోమతి పదే యాతనలను తమ యాతనగా పాఠకులు అనుభూతి చెందుతారు. మనసనేది ఎంత దిటవు కలదో అత్యంత సున్నితమైనది. సంఘటనలను బట్టే ఈ రెండు స్వభావాలూ బయటపడతాయి. గోమతి విషయంలో జరిగే ఈ మానసిక పరిణామాలను అత్యంత సహజంగా చిత్రించారు రచయిత్రి. అంతే కాదు- స్త్రీకి ఉద్యోగమనేది ఎంత ఆవశ్యకమో, ఉద్యోగపర్వంలో ఆమె ఎలాంటి రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చాలా బాగా తెలియచేశారు విశాలాక్షి గారు.

గోమతి నవల పూర్తి చేసినా ఆమె మాత్రం మన మనసులను వెంటాడటం మానదు. అదీ ఈ నవల ప్రత్యేకత!

untitled

***

మనస్వి (కథ) :

పరమేశం, కాంతం అల్లారుముద్దుగా చూసుకుంటున్న పాప పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న రోజే రంగస్వామి అనే ఓ వృద్ధుని రూపంలో వారికి ఎదురవుతుందో గండం. ఏడాది క్రితం ఓ తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదానంతరం తనకు దొరికిన పాపను తెచ్చుకున్న పాపను నా మనవరాలేమోనని వెదుక్కుంటూ వచ్చాను అని రంగస్వామి చెప్పినప్పుడు పరమేశం గుండెలో రాయి పడుతుంది.

అంతవరకూ అపురూపంగా చూసుకుంటూ, పిల్లలు లేని తమ ఇంట్లో మహాలక్ష్మి వెలసిల్లిందని ముచ్చటగా తాము పెంచుకుంటున్న ఆ పాప ఎక్కడ దూరమైపోతుందో, రంగస్వామి గుర్తు పట్టి తీసుకుపోతాడేమో అని పరమేశం పడిన మానసిక సంఘర్షణ కానీ రంగస్వామి, పాప ఒకరినొకరు చూసుకున్నప్పుడు జరిగే సన్నివేశాలను కానీ కళ్ళకు కట్టినట్టుగా రచయిత్రి ఈ కథలో చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటాయి. తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదం గురించి కూడా ఎంతో బాగా దృశ్యీకరిస్తారు రచయిత్రి.

విశేషం ఏమిటంటే కథల్లో కానీ నవలల్లో కానీ ఇన్ని వైవిధ్యాలు, మానసిక సంఘర్షణలు, వర్ణనలు ఉన్నా అవి పదాడంబరాలతో పాఠకులను శ్రమ పెట్టవు. తేలికైన పదాలతో, చక్కని మాటతీరుతో ప్రతి పదాన్నీ వదలకుండా చదివింపచేసేలా ఆసక్తికరంగా చదువరులను చదివింపచేస్తాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్న స్త్రీ జీవితాలను కానీ, అనేకానేక సామాజిక సమస్యలను కానీ తన కలం ద్వారా యధాతథంగా చిందించి పాఠకులను ఆలోచింపచేస్తాయి. మనసులను రంజింపచేస్తాయి. మంచి రచనల ప్రధానలక్ష్యం అదే కదా!

***

గ్రహణం విడిచింది (నవల) :

ఓ అందమైన అమ్మాయి, తనను చక్కగా చూసుకునే ఆమె భర్త! హాయిగా ఆనందంగా గడిపేందుకు అంతకంటే కావలసినదేముంది?! కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. అనుకోకుండా ఆ అందమైన అమ్మాయి భారతి భర్త మాధవ్ ప్రమాదంలో మరణించడంతో అప్పటివరకూ సుఖమయంగా సాగిన ఆమె జీవనం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.

భర్త పనిచేసిన సంస్థనుండి రావలసిన పెద్దమొత్తం అతని మరణానంతరం భారతికి అందుతుంది. అంతే! అక్కడినుండి భారతికి ప్రతిచోటా మరో కొత్త లోకం కనిపిస్తూ ఉంటుంది.

ఆత్మీయంగా చూసుకున్న అన్నావదినల్లోనూ, అత్తయ్యా మావయ్యల్లోనూ, ఆప్తుడిగా స్నేహితుడైన జగదీష్ లోనూ, చివరికి వీళ్ళందరినీ కాదనుకుని నమ్మి ఆమె వెళ్ళీన బాబాజీ లోనూ కూడా ఇదివరకు లేని ధనవ్యామోహాన్ని చూస్తుంది భారతి. తన దగ్గర డబ్బు లేనప్పుడు ఉన్న ఆత్మీయత స్థానంలో ఇప్పుడు డబ్బు వలన వచ్చిన తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలనే వారు ప్రదర్శిస్తున్నట్టుగా ఆమెకు తోస్తుంది. అనుకోకుండా ఆమెకు ఎదురైన సంఘటనలు, వ్యక్తుల ప్రవర్తనలు కూడా ఆమె అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

వ్యక్తిలో జరిగే ఓ మానసిక సంఘర్షణను, నిత్యం ఆమెలో జరిగే ఆలోచనాధోరణులను, మానవ బలహీనతలను సమర్థవంతంగా భారతి పాత్ర ద్వారా తెలియజేస్తారు విశాలాక్షి గారు. అంతే కాదు… దశాబ్దాల క్రితమే భర్తను కోల్ఫోయిన స్త్రీలు మరో వ్యక్తితో కొత్తజీవితాన్ని కోరుకోవడం తప్పేమీ కాదని ఎంతో నేర్పుగా భారతి పాత్ర ద్వారా సమర్థవంతంగా చెప్తారు రచయిత్రి.

డబ్బు అనేది ఎవరికైనా అత్యంత ఆవశ్యకమైన వస్తువే. అది అందుబాటులో ఉన్న మనుషులతో డబ్బు కోసం చుట్టూ ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఆ డబ్బు తమకు కూడా చెందాలని ఎంతగా తాపత్రయపడతారో కూడా అత్యంత సహజంగా ఈ పుస్తకంలో చిత్రిస్తారు రచయిత్రి.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ భారతి మనసూ మన మనసూ మమేకమైపోతుంది. తనను విడిగా చూడటం మనకు తెలీకుండానే మరచిపోయి అడుగడుగునా ఆమెను సమర్థిస్తూనే ఉంటాం.

ఒక అమ్మాయికి వ్యక్తిగతంగా జరిగిన అనుభవాలను చక్కని కథగా మలిచి, ఆమె జీవితం తిరిగి సంతోషమయం కావాలని పాఠకులు కూడా కోరుకునేలా చేసి “గ్రహణం విడిచింది” అనే శీర్షికను కథకు, కథలో సందర్భానికి అన్వయిస్తూ రచయిత్రి నవలను ముగించిన తీరు హృదయాలను ఆకట్టుకుంటుంది.

గుండెను తడిమేసి దానిని తడి చేసే కథలు రాయగలిగే నేర్పూ విశాలాక్షిగారిదే అని నిరూపిస్తుంది “మనస్వి” కథ!

 -రాజేష్ యాళ్ల

rajesh

పోస్టు చెయ్యలేని ప్రేమలేఖ!

నీ కోసం కాదు గానీ నీ గురించే రాస్తున్నాను

నువ్వు కథనుకునైనా చదువుతావో లేదో తెలీదు . ఇది కథ కాదు మన జీవితమని నేను చెప్పినా , ఇందులో నీ పాత్రని నువ్వు పోల్చుకోగలవా .. మనసు గర్భ గుడి లో ప్రతిష్ఠించుకుని  కొన్ని వసంతాలుగా నేను పూజిస్తున్న నీ రూపాన్ని నువ్వు గుర్తుపట్ట గలవా .. ఒకవేళ గుర్తుపట్టినా వరాలిచ్చే శక్తి నీకు ఉండి ఉండదు ఇప్పుడు .

మరి ఎందుకిదంతా రాయడమని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా హృదయాంతరాల్లోంచి వచ్చిన జవాబు ఒక్కటే . ఒకప్పుడు నీ కరుణా కటాక్ష వీక్షణాల్ని వరమడిగి ఓడిపోయిన నేను ఒట్టి పుష్పమై వడిలి పోలేదనీ , వట వృక్షమంత ప్రేమని నాలో నేను నాటుకున్నాననీ  ప్రపంచానికి తెలియజెప్పి మోడువారిన హృదయాల్లో ప్రేమ పైన నమ్మకాన్ని చిరుగింప చేయాలనే ఈ ప్రయత్నం .
మెటీరియలిస్ట్ లకి ఇదంతా పిచ్చిలా అనిపిస్తుందేమో మరి. నా ఈ భావాలకి సరిపోయే పదం పిచ్చి అయితే ప్రేమ పేరుని పిచ్చిగా మార్చేస్తే సరి .
ఈ ఇరవై ఏళ్ళూ  ఇరవై నాలుగ్గంటలూ  నీ గురించిన  ఆలోచనల సుడిగుండం లో పడి  సుళ్ళు తిరుగుతూ కదలనైనా కదలకుండా  తీరం కోసం వెతుకుతున్నానని చెప్పను .  ఎందుకంటే  ఈ క్షణంలో తినకపోతే చచ్చి పోతావని  బెదిరించి భయపెట్టే ఆకలి కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోతే  కాస్సేపు నోరు మూసుకున్నట్టు, నీరసించి నిన్ను మరిచిన క్షణాలు కొన్నున్నాయ్.  ఆ తేలికపాటి  ఒంటరితనం కంటే నీ తలపులతో బరువెక్కే ఏకాంతమే బాగుంటుంది నాకు.
అవునూ …కథ లో ఇంత కవిత్వాన్ని గుమ్మరిస్తున్నానని  చిరాకు పడకు .  ఇన్నేళ్ళ నా మనస్సంఘర్షణ మామూలు మాటల్లో చెప్పడమెలాగో  నాకు తెలీడం లేదు  . సరేలే …. కనురెప్పల గడప దాటి కలల ప్రపంచం లోంచి కాంతి లోకం లోకి వచ్చి పడిన కంటిపాప లా ఈ పిచ్చి ఊహల మాటల్లోంచి  అసలు కథ లోకి వస్తాను .
నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా మీ ఇంటి అరుగు మీద కూర్చుని రెండు జడలు చేతుల్తో పట్టుకుని చెరో పక్కకీ లాగుతూ ఆ చిట్టి ముఖాన్ని ఉయ్యాలలూపుతున్నావు.  ఆ మాయలో పడిన నా మనసు మాత్రం ఇప్పటికీ ఊగుతూనే ఉంది  ఆగకుండా…. భూమి చుట్టూ తిరిగే చందమామ లా నిన్ను చూడాలని ఎన్ని సార్లు మీ వీధి లో చక్కర్లు కొట్టానో సైకిల్ మీద .
చిత్రరచన: శివాజీ

చిత్రరచన: శివాజీ

బ్రహ్మ ముహూర్త సమయం అని ఇంట్లో సాకులు చెప్పి  పూర్తిగా తెల్లవారకుండానే టైప్ ఇన్స్టిట్యుట్ కి బయలుదేరేవాడిని నువ్వొస్తావని తెలిసి . ఎనిమిది నిమిషాల్లోనే పద్నాలుగు కోట్ల కిలోమీటర్లు వడివడిగా ప్రయాణించి  పుడమి చెక్కిళ్ళ ని ముద్దాడాలని తపన పడే  ఉషా కిరణాల కన్నా నా తలపులకే  ఎక్కువ తొందరగా  ఉండేది.
టైప్ మాస్టార్ని బ్రతిమాలి నీ పక్కనే ఉన్న మిషన్ నాకివ్వడానికి ఒప్పించి నీ పక్కన కూర్చున్న క్షణం నాకింకేమీ అక్కర్లేదనిపించింది. మాటి మాటికీ నిన్ను చేరిపోతున్న నా చూపుల్ని మిషన్ మీటల మీదికి మళ్ళించడానికి ఎంత కష్ట పడేవాడినో !.  ఎలాగోలా కళ్ళకి నచ్చ చెప్పినా మనసెక్కడ మాట వింటుంది ! చేతి వేళ్ళకి అదేశాలివ్వకుండా అలిగి కూర్చునేది . తప్పనిసరై దాని పని దాన్ని చేసుకోమని వదిలేసేవాడిని .
అప్పటికే ఎందరో స్త్రీ మూర్తుల సౌందర్యాన్ని మరెందరో మహానుభావుల భావుకత్వపు అక్షరాల కళ్ళద్దాల్లోంచి  చూసి అచ్చెరువొందాను.  కానీ ఇంతటి నిర్మలమైన అందాన్ని ఇలా కళ్ళెదురు గా చూడటం ఎంతటి సరి కొత్త అనుభవమో నాకు
ఎన్నేళ్లుంటాయి నీకప్పుడు , పట్టుమని పదహారైనా ఉంటాయా ? ఎంతటి ముగ్ధత్వం!!!
పోత పోసినట్టు పసితనం, ఆ పసితనపు పరదాలతో దోబూచులాడుతున్న చిలిపి పరువం …. సాయం సంధ్య సమయాన సూర్య చంద్రులు ఒకేసారి కనిపించి నీలాకాశానికి అంతులేని ఆకర్షణ అందించినట్టు !!!!
అత్తపత్తి ఆకుని సైతం మించిపోయి, ముట్టుకోకుండానే ముడుచుకుపోయే నీ సౌకుమార్యపు సోయగం వర్ణించడం ఎవరి తరం !! అతి చిన్న శబ్దానికి కూడా అదిరి బెదిరి పరుగులు తీసే చిన్ని చిన్ని లేడి పిల్లల్లా చంచలంగా ఉండే నల్లని నీ కనుపాపలు నన్నసలు  తల తిప్పుకోనిచ్చేవా!
పరికిణీ వోణీ లో నిన్ను చూసినప్పుడు నాలో చెలరేగే భావ సంఘర్షణ అతి పురాతన ప్రకృతి రహస్యం !! తొలి ప్రేమ లోని గాఢత , తొలి వలపు అందించే తన్మయత్వం తొలి తొలి సారిగా తొలకరి చినుకు లా నన్ను తాకిన వేళ, పులకరించిన మనసులో విరబూసిన  ఆనందపు కుసుమాలెన్నో !! వాటి తో పాటు పుట్టి , విరహమై వేదనై తియ్యని గాయాలు సృష్టించిన ఎదురు చూపుల ముళ్ళెన్నో!!
నా ఆరాధనాపుష్పాలు  నీ నయనచరణాల ని తాకేసరికి ఒక ఋతువు కాల గర్భంలో కలిసిపోలేదూ ?  ఎందుకు చదవలేక పోయావు నీ కోసం తెరిచి పెట్టి పట్టుకున్న నా మనసు పుస్తకాన్ని ? చిన్నతనం  వల్లనా ? అవును  అందుకేనేమో, నిండుగా పరవళ్ళు తొక్కే  నా ప్రేమ ప్రవాహాన్ని , వయసు ప్రభావాన పరుగులు పెట్టే వర్షాకాలపు పిల్ల కాలువ పొంగులా భావించి పక్కకి నెట్టావు
ఎంత గా నీ చెంతకి చేరాలని నేను తపన పడితే అంతగా నాకు అందకుండా దూరంగా తప్పుకుపోయావు . కళ్ళతో పలకరించినా , పెదవులతో పలుకులు చిందినా భయంతో  చిగురుటాకులా వణికిపోయావు. నీకు రక్షణగా , జీవితాంతం తోడుగా నీడగా నిలవాలని తపన పడుతున్న నాకు నీ భయం ఎంతటి తీవ్రమైన వేదనని కలిగించేదో తెలుసా , ఎలా నీకు చెప్పాలి…  నేను కాటేసే కాలనాగుని కాదని, కలకాలం నిన్ను కనురెప్పలా కాచుకునే అవకాశం కోసం అనుక్షణం నిరీక్షిస్తున్నానని !!
అందుకే పెళ్లి చేసుకుంటానని స్నేహితుడితో రాయబారం పంపాను. సనాతన సాంప్రదాయపు కోటలో యువరాణి లా పెరిగిన నీకు అలా చెబితేనే అర్ధమవుతుందనే నా అంచనాని తప్పుదోవ పట్టిస్తూ నీకెప్పుడో పెళ్లి కుదిరిపోయిందని నువ్వు పంపిన సమాధానంలో నీ  అపరిపక్వమైన గడుసుదనం నాకు భలే నవ్వు తెప్పించింది .
ముందుకు వచ్చే కొద్దీ  వేగంగా వెనక్కి పరిగెడుతున్న నిన్ను మరింత కష్ట పెట్టడం ఇష్టం లేక, నువ్వు నువ్వు గా నన్నిష్టపడే రోజు కోసం సహనం గా ఎదురు చూస్తున్న నన్ను విధి తన బలీయమైన హస్తాలతో ఒక్క చరుపు చరిచింది .
మీ నాన్నగారికి ట్రాన్స్ ఫరై నువ్వు మరో ఊరు వెళ్ళిపోతున్నావన్న విషయం తెలిసిన రోజు నాకు దుఃఖం అంటే ఏమిటో తొలిసారి అనుభవం లోకి వచ్చింది . గుండెల్ని మెలిపెడుతూ , గొంతు లో సెగలు పుట్టిస్తూ , కంటిపాపల్ని కన్నీటి లో ముంచేస్తూ , కాళ్ళలో సన్నని వణుకు పుట్టిస్తూ … అసలేమిటి ఈ లక్షణాలు  … విఫల ప్రేమ కి ముందస్తు సూచనలా … నా జీవితంలో అంతమైపోతున్న ప్రమోదాన్ని హెచ్చరించే  ప్రమాద ఘంటికలా … నువ్వు కనిపించని లోకాన్ని అసలు ఎలా ఊహించుకోను
తెగించి అడిగే తెగువ లేక  నిస్సహాయం గా  కొమ్మల మధ్య చిక్కుకుపోయిన గాలి పటమై, చిరుగాలిలా వెళ్ళిపోతున్న నిన్ను చూస్తుండి పోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయాను .
నువ్వు నాతో ఉన్న రోజుల్ని తలుచున్నంత అందంగా నువ్వు లేని రోజుల్ని వర్ణించలేను . అప్పటి ఆవేదన … అప్పటిదేమిటిలే ఇప్పటికీ ఉన్నదే….
పైపై ఉధృతి తగ్గి లోపల్లోపలికి విస్తరించుకు పోయింది అంతే . ఆ వేదనంతా  పదాల్లో పలికించాలనుకుంటే   కొండంత సముద్రాన్ని కుండలో నింపి చూపించినట్టే
 నీతో పాటుగా నన్నొదిలిపోయిన  సంతోషాన్ని తిరిగి సంపాదించుకోవాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు . నువ్వేం చెప్పావో మరి నీ స్నేహితురాళ్ళకి …. నన్ను చూస్తేనే కొండచిలువ ని చూసిన కుందేళ్ళ లా బెదిరి పారిపోయేవారు. ఇక నీ ఎడ్రెస్సేం అడగాలి!! వేరే దారి లేక నువ్వెళ్ళిన  ఊరికి  నీ కొత్త కాలేజీ అడ్రెస్ కి  నేను వ్రాసిన ఉత్తరం గుర్తుండే ఉంటుంది నీకు . ఎందుకంటే నేను వ్రాసింది పెన్ను తో కాదు నా హృదయం తో … .  తప్పక అది నిన్ను అంతో ఇంతో కదిలించే ఉంటుంది. నేను అల్లర చిల్లర అబ్బాయిని కాదని నీకు తెలియజెప్పే ఉంటుంది .
నువ్వు పక్కనుంటే, నిలబడటానికి నాలుగడుగుల స్థలం చాలని రవీంద్రుడి కవిత్వం కాగితం మీద పరిచాను . నీ మీద కూడా ఓ కవిత రాసాను కదూ!  నీకు నచ్చిందో లేదో మరి…..  లేకపోతే నవ్వుకున్నావో…..   నీలం రంగు వోణీ లో నిన్ను చూసినప్పుడు నా మనసు మనసులోఉండదన్న నిజం కూడా చెప్పేసాను . చాలా కోప్పడి పోయి ఉంటావు . నీ అందం కంటే అమాయకత్వమే నాకెక్కువ నచ్చిందనీ అనేసాను . నువ్వు నవ్వినా చందమామ నవ్వినా ఒకటే  అన్నాను … వెన్నెలకేసి ఎంత సేపు చూసినా విసుగు రాదనీ , మరి పగలే కాసే వెన్నెల మరింత బాగుంటుందనీ చెప్పి మళ్ళీ కోపం తెప్పించానో , ఎంతో కొంత ఆనందపరిచానో తెలీదు  . ఎన్ని పేజీలు  రాసినా ఇంకా ఏదో చెప్పలేదనే అనిపించింది నాకప్పుడు . నీ అంతట నువ్వు సమాధానం ఇవ్వడానికి మొహమాట పడతావేమో అని రిటర్న్ కవర్ కూడా జత చేసాను .
నా బంగారు కలలన్నీ భద్రం గా మూట గట్టి దానికి పదాల రెక్కలు తొడిగి నీ పాదాల చెంత వాలమని పంపించాను . నువ్వేం చేసావు ….  అవే పదాల్ని అక్షరాలు గా సంధించి నీ తిరస్కార బాణాల్ని ఎంత సూటిగా నా గుండెల్లో దింపావో ….. నేను నిన్ను తప్పు పట్టను.
మనకి నచ్చిన వాళ్లకి మనమూ నచ్చాలని నియమం ఏమీ లేదు గా . కానీ ఏమన్నావు ? నా వల్ల నువ్వు భయం తో చచ్చి పోతున్నానన్నావు . ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ పరువు పోతుందన్నావు .
 నన్ను కాదన్నావన్న వేదన కంటే నిన్ను ఇబ్బంది పెట్టానన్న బాధే మొదట్లో ఎక్కువ గా ఉండేది . తర్వాత్తర్వాత నువ్వు నాకెప్పటికీ దక్కవన్న నిజం నెమ్మదిగా తెలిసొచ్చింది . నాకిక నేను కూడా మిగలలేదని అర్ధమయింది . జీవితం అంధకార బంధురమైపోయింది  .
అప్పుడప్పుడు చందమామ  చిందించే వెన్నెల దరహాసం  , చిన్న గాలిపాటు తో పలకరించే పువ్వుల పరిమళం , ఎప్పుడైనా  కోయిల తీసే తియ్యని కూనిరాగం…  నా పక్కన నువ్వున్న అనుభూతినిస్తాయి . వాటితో పాటు ఎన్నెన్నో జ్ఞాపకాలు నాతో పాటే , నాలోనే నిక్షిప్తమై ఎప్పటికీ ఉంటాయనుకో .
నీ ఆలోచనల్లో నిలువెల్లా మునిగి ఉన్ననన్ను నాకు చూపించలేక ఈ ప్రపంచమనే అద్దం తెగ తికమక పడిపోతుంది . పాపం దానికేం తెలుసు తన తప్పు ఏమీ లేదని … ఈ కథలాంటి, memoir లాంటి  ఉత్తరం రాయడానికి అదొక్కటే కారణం కాదు సుమా …. నా గుండెకి పడిన చిల్లు లోంచి లోపలికి చేరే  వేదనని కొంత ఇలా తోడి పోస్తేనే కదా .. మళ్ళీ మరి కొన్ని జ్ఞాపకాలు లోపలికి చేరేది!  అందుకే ఈ చిన్న ప్రయత్నం ఇలా…….
                     -నువ్విది చూడాలనో చూడకూడదనో … నాలోపల నాకేమనిపిస్తోందో నాకే తెలియని నేను
-సాయికిరణ్

రవి వర్మ గురించి కొత్తగా…

krishna_helps_draupadi_db47

Art is an evolution. చిత్రాలు వెయ్యటం అనేదే మనిషి తన తోటి వారి కంటే లోతు గా భిన్నం గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికి ప్రతీక. ఇక్కడ ఎవొల్యూషన్ అనేది డార్విన్ సిద్ధాంత పరం గా కాదు. ఒక మనిషి ఎదుగుదల (ఎవొల్యూషన్) అన్నది అతని పైన పడే ప్రభావాల బట్టి ఉంటుంది. ఎంత మందిని కలిశాడు? ఎన్ని దేశాలు తిరిగాడు? ఎంత నేర్చుకోగలిగాడు? ఆ నేర్చుకున్నదాన్ని ఎంత సమర్ధవంతం గా ఇంకొకడికీ నేర్పగలిగాడు. దీని ద్వారా తాను మరొక stage of evolution కి ఎంత తోడ్పడగలిగాడు? ఇదీ ఎవొల్యూషన్ యొక్క స్వరూపం. కనీసం కళ పరం గా. భారతీయ సంప్రదాయ చిత్రకళ ని సమర్ధించే వారికీ, రవి వర్మ అభిమానులకీ క ఒక శతాబ్దం గా నడుస్తున్న వాదాలకీ మళ్లీ “రంగ్ రసియా” తెర తీస్తోంది.

ఈ నేపథ్యం లో ఇద్దరు చిత్రకారులు తాము కలిసి తయారు చేసిన వ్యాసం లో ఆయనను కొత్తగా దుయ్యబట్టారు. కానీ గమనించ వలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతం లో ఈ చిత్రాలని వ్యతిరేకించటానికి అప్పటి స్వాతంత్ర్య స్ఫూర్తి ఒక ముఖ్య కారణం. యురోపియన్ ఐన ప్రతి విషయాన్ని వ్యతిరేకించటం లో వచ్చే kick .. adrenaline rush .. ఆ కాలానికి నా వరకు క్షమార్హం. కానీ దాదాపు వంద ఏళ్లు గడిచాక కూడా అప్పటి తమ భావజాలానికి ఒక సార్ధకత ఆపాదించే ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉండటమే కొంచెం కలవరపరిచింది. భారతీయ చిత్రకళ లో ముఖ్యమైనవి రేఖలు. రేఖలంటే రెండు ప్రదేశాలని విడగొట్టే ఒక సాధనం. ఆ రేఖలు స్ఫుటం గా కనిపించాలి. తప్పదు. దాన్ని మరీ clear గా చూపించేది ఇండియన్ art. గుహాల్లో కుడ్య చిత్రాలు, చిన్న పిల్లల యానిమేషన్ సినిమాలు ,అన్నిటికీ రేఖలే ఆధారం. ఎందుకంటే, వాటిని perceive చెయ్యటం తేలిక కనుక!

రేఖల్నుంచి కొంత ముందుకి వెళ్తే రంగులొస్తాయి.. ఇంకొంచెం ముందుకు వెళ్తే వెలుగు నీడలు వస్తాయి. వీటిని perceive చెయ్యటం, చెయ్యగలగటం కొన్ని వేల ఏళ్ల తపస్సు ఫలితం గా భావిస్తాను నేను. చిన్న పిల్లవాడు ఆపిల్ ఎర్ర గా ఉంటుంది.. గుండ్రం గా ఉంటుంది అని చెప్పగలడు. ఆర్టిస్ట్లు అవ్వబోని వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. ఆ పిల్లవాడికే ఆ ఎరుపు ఉదయం వెలుతురు లో ఒక లాగా సంధ్య వెలుతురు లో ఒక లాగా వెన్నెల లో ఒక లాగా కనిపిస్తే? ఒకే రంగు కి ఉన్న వేల వేల రూపాల్ని గుర్తు పడుతూ పో గలిగితే? ఆ పండు ఛాయ తెల్లని టేబల్ పైన ఎలా పడుతోంది? గాజు టేబల్ పై ఎలా పడుతోంది? పసుపు రంగు వేసిన గోడ పై ఎలా పడుతోంది? ఇన్ని రకాల ప్రశ్నలు వేసుకుంటూ పోతే… ఒక రోజు ఆ పిల్లవాడు చిత్రకారుడిగా తన మొదటి శ్వాస తీసుకుంటాడు. ప్రశ్నలు వేసుకుంటూ దానికి సమాధానాలు వెదుక్కుంటూ కొన్ని దశాబ్దాల కృషి తర్వాత ఆర్టిస్ట్ అనిపించుకుంటాడు. Perceive చెయ్యగలగటం పై చాలా గౌరవం ఉంది నాకు. ఒక పెద్ద శిల లో శిల్పా న్ని perceive చేయగలిగే శిల్పి ని చాలా గౌరవిస్తాను.

భారతీయమైనా పా శ్చా త్యమైనా సరే. సులువు గా కనిపించిపోయే వాటి కన్నా ఎన్నో రోజుల mental exercise తర్వాత మాత్రమే అబ్బే color perception , light perception అంటే మరీ గౌరవం నాకు. దాన్ని యురోప్ నుంచి రవివర్మ అప్పు తెచ్చుకు న్నంత మాత్రాన ఆది ఆయనది కాకుండా పోదు గా? నిజమే , రంగు చిత్రాలు, వెలుగు నీడలు ఉన్న చిత్రాలు కళ్ళకి ఇంపు గా ఉంటాయి రే ఖా చిత్రాల కన్నా. వాటిని అంత ఇంపు గా చేయటం కోసం పడ్డ శ్రమ ని తృణీకరించటం తప్పు . Mass appeal ఉన్నంతమాత్రాన అది కళ కాకుండా పోతుందా? కోట్ల మంది జనాల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లే సినిమా ఎలాంటి medium మరి? దాన్ని కూడా తప్పు పట్టి తక్కువ స్థాయి గా అనుకోవాల్సిందే నా? ఒక కథ ని తెర పై చూపించటం అనేదే passion గా బ్రతుకుతున్న directors ఎందరో? అలాంటి వారే రవివర్మ కూడాను.

Draupadi_humiliated_RRV

తన ఊహ వందలాది మందికి చేరాలి అనుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆది ఆర్టిస్ట్ లకి ఉండే సహజ లక్షణం. ఏ స్థాయి వారినుంచి మెప్పు కోరుకుంటున్నారు అనేది వారి వారి ఇష్టం. It just does not disqualify them from being great artists. ఇక పోతే కొత్తదనం. రవి వర్మ యురోపియన్ ఇమిటేటర్ అనే విమర్శలు చాలా ఉన్నాయి ఆయన పైన. ఇక్కడ ఆర్ట్ కి క్రాఫ్ట్ కి మధ్య ఉండే ఒక భేదం తెలుసుకోవాలి. Craft can be taught. Its a monotonic pastime of the mind, while art is a limitless expansion of the same capability. Not everyone can be an artist, but everyone can be a crafter with certain amount of practice. A crafter need not dedicate his life to his craft., craft just does not demand you to be so. But art is a fiery monster that artists enjoy being devoured by. తంజావూర్ చిత్రాలని పెయింట్ చెయ్యటం gifted artists కానివాళ్ళు కూడా [ ఇతర చేతి పనుల లాగానే ] నేర్చుకోవటం చూస్తాం. అది వారి జీవితాల్లో ఎక్కువ సమయం తీసుకోదు. ఒక predetermined విధానం లో బొమ్మలు సాగటమే అందుకు కారణం.

Indian art లో so called నూతనత్వం ఎక్కడా ఉండదు. ఆది గురువు నించి శిష్యుడికి వచ్చే ఒక skill అంతే. గురువు వేసినట్టే శిష్యుడు వేస్తాడు. తమ regular జీవితాల్లో కొంత భాగం త్యాగం చెయ్యకుండా యురోపియన్ చిత్రకళ నేర్చుకోవటం సాధ్యమే కాదు. ముఖాల్లో భావాలు, scene setting , composition ఇవన్నీ యురోపియన్ చిత్రకళ పరిధి పెంచుతాయి. దాని లో ఒక కొత్త ఆర్టిస్ట్ తన సొంత మెదడు తో ఆలోచించటం చాలా చాలా అవసరం. రవి వర్మ చిత్రాల్లోనే కొన్ని పురాణ సన్నివేశాల్ని తన మనసు లో వచ్చిన విధం గానే వేశారు. He was indeed a visionary. ఫిల్మ్ డైరెక్టర్ సీన్ ని ఆలోచించుకున్నంత స్పష్టం గా ఎవరి ముఖాల్లోఏమి expression రావాలి అని ఎన్ని రోజులు ఊహించుకుని ఉంటారా అనిపిస్తుంది. దీని పైన పాశ్చాత్య శైలి ప్రభావం ఉంటే ఉండనివ్వండి . అక్కడ ఆయన full bodied emotions తో చిత్రీకరించింది భారతీయ సన్నివేశమే కానీ మరో టి కాదు గా? ఇలాంటి emotions ఇండియన్ ఆర్ట్ లో ఎక్కడ? ద్రౌపది సభ కి వచ్చి తనని కాపాడమని వెడుకునే painting చూస్తే కలిగే రసాను భవం

pacc196_the_unveiling_draupadi

రేఖా చిత్రాల్లో ఎక్కడినుంచి వస్తుంది? కళ్ళ ముందు జరిగినట్టు ఉంటేనేకదా మన empathy పుట్టేది ? ఇలాంటి అనుభవం కలంకారీ చిత్రాలని చూస్తేనో, కాంగ్రా చిత్రాలని చూస్తేనో నిజం గా వస్తుందా? ఒకవేళ వస్తే, వాటి కంటే గొప్ప వాటిని, ( ఇంకా శక్తి మంతం గా convey చెయ్యగలిగే వాటిని) చూశాక కూడా అలాగే వస్తుందా? Here we come back to the question of our evolution. Art has been evolving for several centuries, though not in a unidirectional sense. Realism ని వ్యతిరేకిస్తూ పుట్టిన impressionism , ఆరు బయటి చిత్రాలు ఎక్కువగా వెయ్యాలి అని, brush strokes ప్రస్ఫుటంగా గా తెలియాలి అని, వెలుతురు లోని భిన్నకోణాలు చూడాలని అనుకుంది. అదే సమయం లో పుట్టిన pre raphaelite movement మళ్ళీ roots లోకి వెళుతూ classic భంగిమలని, గ్రీక్ రోమన్ పురాణాల లోని సన్నివేశాలని చిత్రించింది. రెండూ నిలి చాయి.

Monet కి ఎంత పేరుందో John William Waterhouse కి అంతే పేరుంది. కానీ ఇద్దరూ వెలుగు నీడల్ని విస్మరించలేదు. వెలుగు నీడల్ని వదిలేసి మళ్ళీ రేఖ ల్లోకే వెళ్ళాలి అనుకోవటం ఒక obscurantism. Art is a celebration of the heights of human intellect. Artist is limitless. పరిధులు లేని ప్రపంచం లో తన దారి తనే వేసుకుంటూ వెళ్లే బాటసారి చిత్రకారుడంటే. ఇదే కళ, ఇలా ఉంటేనే కళ , ఇంత మందికి మాత్రమే నచ్చటం కళ లక్షణం అనుకోవటం ఆ పరిధుల్లేని ప్రపంచం లో తాము ఒక మూల దాక్కోవటమే ఔతుంది.

రవి వర్మ ఒక perfect artist కాక పోవచ్చు. ఆయన చిత్రాల్లో లోపాలు ఉండొచ్చు. కానీ ఆయన చిత్రాలు నచ్చని వారు కూడా ఒకందుకు ఆయన ని మెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. ఆయన అప్పటి వరకూ ఉన్న path of least resistance ని వదిలేసి మంచి పనిముట్లు అరువు తెచ్చుకుని కొత్త బాట వేసుకున్నారు. ఆది చిన్నది సన్నని దీ అయినప్పటికీ తన వెనకాల చాలా మందిని పిలిచి ఆ బాట ని మరింత మెరుగు పరచమన్నారు. ఆ ధైర్యం ఉన్నవారే ఆ పని ఇప్పటికీ చేస్తున్నారు. మనవి అయినవి అన్నీ అన్నిటికన్న గొప్పవి కావు. గొప్పవాటిని మనవి కావు కనుక కాదనటం తప్పు. ఆ గొప్పతనాన్ని మనది చేసే ప్రయత్నాన్ని తప్పు పట్టటం heartless.

– సాంత్వన చీమలమర్రి

S_148220

‘కారవాన్’ లో మన శివారెడ్డి, వరవర రావు, ఇస్మాయిల్

poetry_caravan-magazine_october-2014

 

For most Indian readers in English, contemporary poetry in Telugu lies below the horizon, its existence sometimes reported but never directly encountered. But even from this very small sample of the work of three Telugu poets, translated by the novelist Raj Karamchedu, it’s clear that this is a field as exciting as any other in Indian literature. Whether it is Siva Reddy’s poem about two human subjects and a burrow, Varavara Rao’s remarkable poem about speaking corpses and deaths in police custody, or Ismail’s unforgettable image of a real turtle inside a well and a metaphorical one inside the human mind, here are voices, images, rhythms and metaphors that proclaim a burning faith in  the power of poetry to both reveal and imagine the world afresh.

 The Caravan

 

మాండొలిన్ గురించి మరికొంచెం

1

క్రితంసారి మాండొలిన్ శ్రీనివాస్ గురించి రాసినదానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను తెలియజెప్పాలనే కోరికే నాచేత మళ్లీ యిలా రాయిస్తున్నది.

మాండొలిన్ శ్రీనివాస్ సెప్టెంబర్ 19 నాడు యీ లోకాన్ని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత – అంటే సెప్టెంబర్ 21 ఆదివారం రోజున – రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు గంటన్నర సేపు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమంలో మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ప్రసారం చేశారు. ప్రతి శని ఆది వారాల్లో దేశంలోని అన్ని ప్రధాన రేడియో కేంద్రాల ద్వారా యిలా సంగీతాన్ని ప్రసారం చేస్తారు ఆకాశవాణి వాళ్లు. అయితే you tube, raaga.com, gaana.com, music India online, surgyan.com మొదలైన ఎన్నో వెబ్ సైట్లలో సాధారణంగా దొరకని కొన్ని రాగాలను – శ్రీనివాస్ వాయించినవాటిని – ఆనాటి కార్యక్రమంలో వినగలిగారు రసికులైన శ్రోతలు.

అందులోని రెండు ప్రత్యేక రాగాలు చాలా మనోహరంగా, ఆకర్షించే విధంగా ఉన్నాయి ఆ రోజున. ఆ రెండింటిలో మొదటిది స్వరరంజని రాగంలోనిది. కర్ణాటక సంగీతంలో వున్న రంజని, శ్రీరంజని రాగాలే తప్ప ఈ కొత్త రాగాన్ని నేను అంతకు ముందెప్పుడూ విని ఉండలేదు. కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు లేక జనక రాగాలు వున్నాయి. మళ్లీ ఒక్కొక్కదాంట్లోంచి మరికొన్ని రాగాలు ఉద్భవిస్తాయి. కాని వాటన్నిటిలోంచి చాలా తక్కువ రాగాలను మాత్రమే కచేరీల్లో గానం చేస్తారు లేక వాదనం చేస్తారు. ఈ కారణంవల్ల సంగీత రసికులకు కొన్ని రాగాలే తెలుస్తాయి. హిందుస్తానీ సంగీతంలో పది రకాల ఠాట్ లు (జనక రాగాలు) మాత్రమే వుండటం చేతా, వాటిలోని చాలా రాగాలను కచేరీల్లో వినటం చేతా, సాధారణ శ్రోతలకు తెలియని రాగాల సంఖ్యతక్కువే అని చెప్పవచ్చు. మళ్లీ వెనక్కి వస్తే, ఈ స్వరరంజని రాగం అచ్చం కదన కుతూహలం రాగంలాగానే ఉన్నది. స్వరాల స్వభావాన్ని బట్టి రాగాలను గుర్తించగలిగేటంత సంగీత జ్ఞానం నాకు లేదు. ఉదాహరణకు ఇదిగో ఇది శుద్ధగాంధార స్వరం, ఇది చతుశ్రుతి దైవతం, ఇది కాకలి నిషాదం అంటూ గుర్తు పట్టలేను.

ఎన్నోసార్లు చూసిన ఒక ముఖాన్ని పోలిన మరో ముఖాన్ని మనం యెలా గుర్తించగలుగుతామో అలానే పోల్చుకోవటం అన్న మాట. ఇట్లా పోల్చుకోవటానికి రెండు అంశాలు బాగా ఉపకరిస్తాయి. మొదటిది ఆ రాగపు నడక. దీన్నే హిందుస్తానీ సంగీత పరిభాషలో ‘చలన్’ అంటారు. ఇక రెండవ అంశం ఆ రాగంలోని కొన్ని ప్రధాన స్వరాల ప్రత్యేకమైన మేళవింపు. దీన్ని ‘పకడ్’ అంటారు. ఈ రెండింటి మధ్య వుండే భేదం అతి స్వల్పమైనది కావటంచేత, వీటిని ఒకదానికి మరొకదాన్ని పర్యాయ పదాలుగా వాడుతారు. స్వరరంజని రాగం కదన కుతూహలం లాగా వుంటుందన్నాం కదా. ఈ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అనే వాగ్గేయకారుడు స్వరపరచిన ‘రఘువంశ సుధాంబుధి’ చాలా ప్రసిద్ధమైనది. ‘చూడాలని వుంది’ సినిమాలోని యమహా నగరి కలకత్తా పురీ అన్న పాట రఘువంశ సుధాంబుధికి అచ్చు గుద్దినట్టుగా వుంటుంది. ఆ సినిమా పాట కదన కుతూహలం రాగంలోనే వున్నది. అయితే అందులో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ పేరును సూచించకుండా ‘చిరు త్యాగరాజు’ అన్నారు గీత రచయిత – త్యాగరాజంతటి సంగీత నైపుణ్యాన్ని కలిగిన మన హీరో చిరంజీవి అనే అర్థంలో, సరదాగా. అది సముచితంగానే వుంది. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కదా.

ఇక ఆనాటి రేడియో కార్యక్రమంలోని రెండవ అరుదైన ‘కృతి’ స్వర సమ్మోదిని రాగంలో వుంది. ఈ రాగాన్ని కూడా చాలా మంది సాధారణ శ్రోతలలాగా నేనూ మొదటిసారిగానే విన్నాను. ఇది జనసమ్మోహిని అనే మరో రాగానికి దాదాపు అచ్చు గుద్దినట్టుగా వుంది. జనసమ్మోహిని రాగం హిందుస్తానీ సంగీతంలో కూడా ఉన్నది. అయితే అందులో దానికి జన్ సమ్మోహిని అని పేరు. ఈ జన్ సమ్మోహిని అద్భుతమైన, అతి మధురమైన, సమ్మోహహకరమైన రాగం. పండిత్ వసంతరావు దేశ్ పాండే ఈ రాగం లో గానం చేసిన ‘నిసే దిన్ హరికా గుణ్ గా’ ఖయాల్ అద్భుతంగా వుంటుంది. మొదట్లో అయితే దాన్ని వినప్పుడల్లా నాకు పారవశ్యంతో ఒళ్లు జలదరించి, కళ్లలో నీళ్లు తిరిగేవి.

కాని ఆ కన్నీళ్లకు కారణం దుఃఖం కాదు, ఆపుకోలేని మానసిక ఉద్వేగం మాత్రమే. సరోద్ వాదకురాలు విదుషి జరీన్ దారూవాలా కూడా ఈ రాగాన్ని ఎంతో మనోహరంగా వాయించింది. మన దురదృష్టంకొద్దీ జన్ సమ్మోహిని రాగాన్ని రేడియో మీద కాని, ఇంటర్నెట్ మీద కాని, కచేరీల్లో కాని చాలా అరుదుగా మాత్రమే వినగలుగుతాం. కారణం తెలియదు. కారణం చెప్పగలిగేటంత సంగీత జ్ఞానం, అవగాహన, ఆకళింపు నాకు లేవు. ఒకవేళ అది క్లిష్టమైన రాగం అయి, అందువల్ల దాన్ని పాడటానికి చాలా మంది సాహసించరా? ఏమో. జన్ సమ్మోహిని రాగం కళావతి అనే మరో హిందుస్తానీ రాగానికి అతి దగ్గరగా వుంటుంది. కళావతి రాగంలో విదుషి ప్రభా అత్రే పాడిన ‘తనా మన ధన తోపె వారు’ ఖయాల్, ఆమెదే మారూ బిహాగ్ రాగంలోని మరొక ఖయాల్ – ఈ రెండూ నేను పాతికేళ్ల క్రితం హిందుస్తానీ సంగీతంలో మొట్టమొదటి సారిగా విన్న సంగీత ఖండికలు. ఇట్లా చెప్తూ పోతుంటే తీగలాగా ఎటెటో పోతూనే వుంటుంది. కనుక యిక్కడే ఆపేద్దాం.

-ఎలనాగ

రాజ్యాంగం ముసుగు తీసిన నాలుగు నవలలు

 

(ప్రముఖ రచయిత అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవలల్లో చిత్రించిన రాజ్యాంగ నైతికత గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘సంతులిత’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ 12న ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగ వ్యాసం) 

ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్య ప్రభావం ఎక్కువ. చాలా నవలలు, కథలు, కవితలు సమాజంలోని అంశాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చాయి. చాలా రచనల్లో వ్యవస్థ దోపిడీ స్వభావం మనకు కనపడుతుంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా దోపిడీ వ్యవస్థలు మారుతున్నాయా? లేక కొత్త రూపంలో దోపిడీ, అణిచివేత జరుగుతుందా అన్న ప్రశ్నలను రచయితలు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు.

‘అబద్దం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచకమందు ఎక్కడైనా సాక్ష్యం అనేది ఉంటుందా మీరు అనుభవం లేకుండా నీతులు చెబుతున్నారు కాని.. హైకోర్టులో వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు.. నీ పుణ్యం ఉంటుంది బాబూ.. నిజం, అబద్దం అని తేలగొట్టక ఏదో ఒక తడక అల్లి తయారు చేస్తే కాని ఆబోరు దక్కదు..’ అని గురజాడ ‘కన్యాశుల్కం’లో హెడ్ కానిస్టేబుల్ గిరీశంతో అంటాడు. ‘స్వాతంత్య్రం వస్తే ఆ గాడిద కొడుకు హెడ్ కానిస్టేబుల్ మారతాడా..’ అని మరో పాత్ర అంటుంది.. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, శాంతిభద్రతల వ్యవస్థ ఎంత బూటకమైనదో గురజాడ కన్యాశుల్కం చెబుతుంది. అదే విధంగా ఉన్నవ మాలపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, మహీధర రామ్మోహన్ రావు రథచక్రాలు, దాశరథి చిల్లర దేవుళ్లు ఇలా ఎన్నో మనకు వ్యవస్థలో దుర్మార్గాల్ని తెలియజేస్తాయి.

అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్చా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటూ స్వాతంత్య్రం తర్వాత మనం భారత రాజ్యాంగం ఏర్పర్చుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? రాజ్యాంగం వచ్చింది కాని సమాజంలో వర్గ స్వభావం మారలేదు. ఒక పుస్తకం రాసుకున్నంత మాత్రాన సమాజంలో వర్గ స్వభావం మారుతుందా? అసలు రాజ్యాంగం ఎవరికోసం సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? పోరాడే వారికోసమా? లేక పోరాడేవారిని తొక్కిపెట్టడం కోసమా? రాజ్యాంగం కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని మార్చివేసిందా? పేదలకు, ధనికులకు మధ్య అగాధాన్ని చెరిపివేసిందా? అగ్రకులాలకూ, దళితులకు మధ్య తేడాను తగ్గించిందా? స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా తగ్గించిందా? స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం ఎంత మేరకు మారింది?

స్వాతంత్య్రం తర్వాత ఎన్నో రచనలు మనకు రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం మారలేదని నిరూపిస్తున్నాయి. అభ్యుదయకవులు, దిగంబర కవులు, విప్లవరచయితలు, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, రంగనాయకమ్మ, వరవరరావు, అల్లం రాజయ్య, కేశవరెడ్డి, అంపశయ్య నవీన్, ఓల్గా, అక్కినేని కుటుంబరావు మొదలైన వారందరి రచనలుచదివితే మన రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బూటకపు స్వభావం గురించి అర్థమవుతుంది.

volga book release

అయితే సాహిత్య విమర్శ ఈమేరకు ఎంతవరకు న్యాయం చేసింది? మన రచనల్లోచిత్రించిన వ్యవస్థ దుర్మార్గ స్వభావాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఎన్ని విమర్శనాత్మక గ్రంథాలు వచ్చాయి? యూనివర్సిటీల్లో చాలా పరిశోధనా వ్యాసాలు, గ్రంథాలు వచ్చాయి. వరవరరావు  ‘ప్రజల మనిషి’ నవలపై పరిశోధనా గ్రంథం రాశారు. కాళీపట్నం ‘యజ్ఞం’ గురించి పరిశోధనా గ్రంథాలు వచ్చాయి. కాని నిర్దిష్టంగా మన రాజ్యాంగ వ్యవస్థ బూటకత్వాన్ని, రాజ్యాంగ నైతికతను ఆయా రచనల్లో ఎత్తి చూపుతూ వచ్చిన రచనలు చాలా తక్కువ. ఓల్గా గారు అక్కినేని కుటుంబరావు నవలల్లో రాజ్యాంగ నైతికతను విశ్లేషిస్తూ విమర్శనా గ్రంథం రాయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందని చెప్పుకుంటాం. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? దాని బూటకపు స్వభావం ఏమిటి? దాని వర్గ స్వభావం ఏమిటి? అన్న అంశాలను మన రచనల్లోంచి ఎత్తి చూపడం ఇప్పుడు చాలా అవసరం.

గురజాడ రచించిన కన్యాశుల్కంల్లోను, రావిశాస్త్రి రచనల్లోను రాజ్యాంగయంత్రాంగం ప్రభావం గురించి బాలగోపాల్ రెండు వ్యాసాలు రాశారు. కన్యాశుల్కంలో న్యాయవ్యవస్థలో చిత్రించిన బూటకత్వాన్ని బాలగోపాల్ ఎత్తి చూపారు. హత్యకేసుపెట్టకుండా లంచం పుచ్చుకున్న హెడ్‌కానిస్టేబుల్ గురించి రాస్తారు. ‘డిప్టీ కలెక్టర్‌కు డబ్బు వ్యసనం లేదు’ కాని స్త్రీవ్యసనం కద్దు.. అని కరటక శాస్త్రి చేత అనిపిస్తాడు. ‘దరిద్రపు సంస్కృతం వదిలిపెట్టి ఇంగ్లీషు నేర్చుకుని నూతన రాజ్యాంగ యంత్రంంలో ఏదో ఒక అంతస్తులో కలిసిపోదామన్న ఆశ శిష్యుడికి ఉన్నందువల్లే లుబ్దావధాన్లుతో వివాహం ఆడడానికి అమ్మాయి వేషం వేసుకుంటాడు.. ఈ ఆశే లేకపోతే కన్యాశుల్కమే లేదు’ అని బాలగోపాల్ తీర్మానిస్తారు. రావిశాస్త్రి రచనల్లో నేరానికీ, రాజ్యాంగ యంత్రాంగానికీ ఉన్న పరస్పరతతో న్యాయవాదులూ, న్యాయమూర్తులూ భాగం పంచుకంటారని మనకు అర్థం అవుతుంది.

‘కట్నం సదివిచ్చుకుని కేసును తేలగొట్టేయడం’ ఎలాగో ముత్యాలమ్మ వంటి నిరక్షరాస్యురాలికి తెలుసు. ‘ఈ నోకంలో డబ్బూ, యాపారం తప్ప మరేట్నేదు.’. అని ఆమె జీవితసత్యాన్ని చెబుతోంది. ఆమె నేరం చేసానని ఒప్పుకోదు కాని కేసు ఒప్పేసుకుంటానని చెబుతుంది. పేదలు కేసులు ఒప్పేసుకోవాల్సి వస్తే చాలా మంది న్యాయమూర్తులు కేసులు తేలగొట్టేస్తారు. కేసులు తేలగొట్టేస్తే న్యాయమూర్తులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అది ఢిల్లీ స్థాయిలో కూడా మనం అర్థమవుతుంది. కేసులు తేలగొట్టేసిన న్యాయమూర్తులు గవర్నర్లు కావచ్చు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు కావచ్చు. రాజ్యసభ సభ్యత్వాలు పొందవచ్చు. ఇంకేమేదైనా పొందవచ్చు. రాజకీయ నాయకత్వానికీ, న్యాయ, అధికార యంత్రాంగానికీ మధ్య లాలూచీలు, ఒప్పందాల మూలంగానే ఈ రాజ్యాంగ వ్యవస్థ సాగుతుందన్న విషయంలో అవాస్తవం లేదు. ఇక సంస్కరణల తర్వాత మరో వ్యవస్థ ఒకటి ఏర్పడింది. అది కార్పొరేట్ వ్యవస్థ. అది అన్ని వ్యవస్థల్నీ ప్రభావితం చేసేంతగా విస్తరించింది. పార్లమెంట్‌లోనూ, చట్ట సభల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ, చివరకు న్యాయవ్యవస్థలోనూ దాని ప్రభావం చొచ్చుకుపోయింది. ఇప్పుడు రాజ్యాంగ నైతికత అనేది మరింత చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉన్నది.

అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవల్లో రాజ్యాంగనైతికత గురించి విశ్లేషించారు. ఓల్గా. రాజ్యాంగ నైతికత అనే దాన్ని తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ప్రస్తావించారు. constitutional morality is not a natural sentiment it has tobe cultivated. We must realise that our people have yet to learn it. Democracy in India is only a top-dressing on an Indian soil, which is essentially undemocratic  అంటారు. అంబేద్కర్. వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది మంచిదే కాని వన్ మ్యాన్‌కు వన్ వాల్యూ ఉన్నప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు అవుతుందని అంటారాయన. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత అందరు వ్యక్తులకు మనం ఒకే విలువ ఇస్తున్నామా? అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 

akkineni kutumba rao

అక్కినేని కుటుంబరావు నవలాసాహిత్యమంతా 15, 17,19,21, ఆర్టికల్స్ చుట్టూ తిరుగుతుందని విశ్లేషిస్తారు.. ఓల్గా. కులమత లింగ వివక్షలకు తావు లేదని, అంటరాని తనం అమలు కాకూడదని, భావ ప్రకటనా స్వేచ్చ ఉండాలని, జీవించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నదని ఈ అధికరణలు చెబుతాయి. కాని నిజంగా రాజ్యాంగం ప్రసాదించిన ఈ అధికరణలు అమలు అవుతున్నాయా?

‘అందరూ సమానమేంటి? ఎంతసమానమైనా బేంబళ్ల దారి వేరు..’ అని ఎంకి పాత్ర సొరాజ్జెంలో అంటుంది. అస్ప­ృశ్యత అగ్రవర్ణాల అవసరాలమేరకే ఉంటుంది. తమ అవసరాలు తీర్చేందుకు అస్ప­ృశ్యత అడ్డురాదు. దొంగతనం చేశారని జోజి అనే పాత్రను చిత్రహింసలు పెట్టి చంపుతారు కమ్మదొరలు. మళ్లీ ఆ కేసును మాలపల్లి యువకులపైనే నెట్టివేస్తారు. యజమానులపై కేసులు పెట్టిన వారే జైలు పాలయ్యారు. జనంలో చైతన్యం అడగడానికి వెళితే ‘మీరింతమంది ఒక్కసారిగా రావడం ఎంతఘోరమైన తప్పో మీకు తెలువదురా.. ఈ విషయం తెలిస్తే ఢిల్లీనుంచి గవర్నమెంట్ సైన్యాలు వచ్చి మిమ్మల్నందర్నీ చంపి కవాతుకొట్టుకెళ్తాయిరా పిచ్చి సన్నాసుల్లారా.. ‘అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రహ్మం గారు వారిని భయపెడతారు. ఇదే నవలలలో కూలీ రేట్ల గురించి అడిగిన తిరపతిని చంపి శవాన్ని కాలవలో తోసేస్తారు. మాలవాళ్లు వాళ్లే కొట్టుకున్నారని నిరూపిస్తారు.అవును.. సమాజంలో ప్రశ్నించిన వారిని వ్యవస్థ ఎక్కువ గాసహించదు. భూస్వామిని ప్రశ్నించినా, రాజకీయనాయకుడిని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పోలీసుల్ని ప్రశ్నించినా బూటకపు ఎన్‌కౌంటర్లు తప్పవు.. రాజ్యాంగం పేడకుప్పమీద కట్టిన రాజభవనమని అంబేద్కర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని ఓల్గా వ్యాఖ్యానిస్తారు.

కుటుంబరావు తన మరో నవల ‘కార్మిక గీతం’ లో యజమానులు కార్మిక చట్టాలను ఎలా ఉల్లంఘించిందీ వివరంగా రాశారు. ‘పోలీసులు, మీడియా, అధికారులు అన్నీ కార్మికుల పక్షం కాకుండా యజమాన్యాల వైపు ఉండే రాజ్యాధికార చట్ర స్వభావాన్ని కార్మిక గీతంలో కుటుంబరావు వాస్తవికంగా చూపిస్తారు.. ‘అని ఓల్గా చెప్పారు. ‘కార్మికగీతం’ పుస్తకాన్ని దాదాపు రెండు దశాబ్దాల క్రితం నేను సమీక్షించాను. అప్పటికీ ఇప్పటికీ కార్మికుల జీవితంలో పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్త రూపంలో ఇప్పుడు అణిచివేత ప్రారంభమైంది. భూముల స్వా«ధీనాన్ని, సెజ్‌లను వ్యతిరేకించిన వారిని ఊచకోత కోస్తే ప్రశ్నించేవారు లేరు. పోలీసుల కాల్పుల్లో నలుగురో ఐదుగురో చనిపోతే కాని వార్తల్లో రావడం లేదు. ఎందుకంటే గతంలో లాగానే రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలూ మిలాఖత్ అయిపోయాయి. కార్పోరేట్లు డబ్బులు వెదజల్లి ప్రకటనలు ఇచ్చి మీడియాతో సహా అన్ని వ్యవస్థల్నీ నోరుమూయించే కొత్త సంస్క­ృతి ప్రారంభమైంది. వీటిపై కూడా సాహిత్యం రావాల్సిన అవసరం ఉన్నది.

కుటుంబరావు మరో నవల ‘మోహన రాగం’ లో రాజ్యాంగంలో ప్రజల జీవించే హక్కునూ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రణాళికా కర్తలే విస్మరించిన తీరును రాశారని ఓల్గా విశ్లేషించారు. ప్రభుత్వ పథకాల్లోని బూటకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా నడుచుకుంటామని ప్రమాణం చేసిన శానస సభ్యులు ఖాప్ పంచాయతీలను సమర్థిస్తూ మాట్లాడతారని, వారికి శిక్షలుండవని ఓల్గా అంటారు. ఇక ‘కొల్లేటి జాడలు’ నవలలో మార్కెట్ వ్యవస్థ పర్యావరణాన్ని ఎలా హతమారుస్తుందో కుటుంబరావు వివరిస్తారు. మార్కెట్ అవసరాలకోసం, పెట్టుబడి ప్రయోజనాలకోసం జీవ వైవి«ధ్యంతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ఆయన చెబుతారు. ‘వేల సంవత్సరాలుగా జీవ వైవి«ధ్యాన్ని అనేక విధాలుగా రక్షిస్తూ, గౌరవిస్తూ వస్తున్న ప్రజలకు వాటిపై ఉన్న హక్కులను గుర్తించకుండా, ఆ ప్రజలు చేసిన పనికి విలువ ఇవ్వకుండా ఉండటమంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..’ అంటారు ఓల్గా. ప్రజల జీవనాధారాలకు ముప్పు తెచ్చిపెట్టడమంటే వారి జీవించే హక్కుని హరించి వేయటం కాదా అని ఆమె ప్రశ్నిస్తారు. ఈక్రమంలో కోర్టు తీర్పుల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో కూడా ఆమె చెబుతారు. పెద్ద పెద్ద బడాకంపెనీలకోసం పర్యావరణ చట్టాల్ని కూడా ప్రభుత్వాలు ఎలా సడలిస్తున్నారో తెలిసిన తర్వాత మనకు కొల్లేటి జాడలు సారం మరింత అర్థమవుతుంది.

అసలు ఒక రచయిత సమాజంలో దోపిడీని, వర్గ స్వభావాన్ని సమాజంలోని ప్రజల జీవితాల ఆధారంగానే అద్బుతంగా చెప్పడం గొప్ప విషయం అయితే రచయిత ఏమి చెప్పాడన్న విషయాన్ని వివరించడం మరో గొప్ప విషయం. అలా వివరించడం ద్వారా రాజ్యాంగం ఉనికినే ఆమె ప్రశ్నించారు. ‘రాజ్యాంగ ఉల్లంఘనను ఆపడం ఎలా? రాజ్యాంగ వాదాన్ని, రాజ్యాంగ నైతికతను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చైతన్యం పెంచటం కంటే మార్గం ఉందా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. అవునుప్రశ్నించడం ద్వారానే ప్రజల్లో చైతన్యం వస్తుంది. నా ప్రశ్న. ఒక్కటే మనకు లిఖిత రాజ్యాంగం ఉన్నది కాని అది ఎవరికోసం? వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతూ, ఎన్నికల్లో వేలకోట్లు ఖర్చులు పెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, అసమానత్వాల్నిపెంచుతున్న కోసమా? వాటిని చూసీ చూడనట్లుంటూ అవినీతిలో భాగస్వామ్యం పంచుకుంటున్న అధికార, న్యాయయంత్రాంగం కోసమా? రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేసే వాడు విప్లవకారుడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దానితో చెలగాటమాటుకుంటున్న వారిని ప్రజాస్వామిక వాదులనాలా? మన జీవితాలతో రాజ్యాంగయంత్రం ఆడుకుంటున్న క్రీడల్ని, పెంచి పోషిస్తున్న అసమానతలను, ప్రశ్నార్థకమైన రాజ్యాంగ నైతికతను మనం సాహిత్యంలో ప్రతిఫలింపచేయాలంటే ప్రజాజీవనాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.

-కృష్ణుడు

మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!

        విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడు వాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా నిలిచిపోతుంది. విమర్శ వ్యాఖ్యానానికి రచనలోని అంతర్గత సాక్ష్యాలను ఉపయోగించుకోవాలి. మనం ఎత్తిచూపకపోతే దొరకక పోయేవి అనిపించె వాస్తవాలను పాఠకునికి అందించదం మత్రమే వ్యాఖ్యానం అంటారు టి.ఎస్. ఇలియట్. ఇది చాలా విలువైన అభిప్రాయం. దీనిని బట్టి విమర్శకుడు చెప్పేదంతా వ్యాఖ్యానం కిందకు రాదని తెలుస్తుంది. రచయితను ఆకాశానికెత్తే ప్రశంసలన్నీ వ్యాఖ్యానాలు కాదనిపిస్తుంది. రచనలోని అంతస్సారాన్ని గంభీరంగా వెలిబుచ్చే ప్రామాణికమైన అభిప్రాయం మాత్రమే విమర్శ అవుతుంది.

విమర్శకుడు రచయితను గురించి రచనను గురించి నేనెంత గొప్పవిషయం చెబుతున్నానో అన్నట్లుండకూడదు. రచయిత ఎంత గొప్ప రచన చేశాడో చూడండి  అని అంటున్నట్లుగా వుండాలి. సాహిత్య విమర్శలో మాటల దుబారు వల్ల ప్రయోజనం లేదు. పైపెచ్చు గాంభీర్యం కూడా చెడిపోయే అవకాశముంది.

“విమర్శకునికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఉత్తమ పాఠకుడిగా ఉండటం. విమర్శకుడు ఉత్తమ పాఠకుడే కాకుండా ఉత్తమ విద్వాంసుడిగా కూడా ఉండక తప్పదు” ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయితకూ చదువు, నిరంతర చదువు – అవసరమే. కానీ విమర్శకునికి అవసరమైనంత చదువు రచయితకు అవసరం లేదు.” – ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“విమర్శకుడికి తాను ఏ సాహిత్యాన్ని గురించి విమర్శ రాయాలనుకుంటున్నాడో ఆ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన చెయ్యగల అవకాశం ఉన్న సామాజిక మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల పరిజ్ఞానం ఉండాలి.” (వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయిత కన్నా విమర్శకుడు రెండాకులెక్కువ చదివి ఉండాలంటారు.”- (కొడవటిగంటి కుటుంబరావు – సాహిత్య వ్యాసాలు)

అందుకే సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంపన్నుడు కావాలి. సాహిత్య విమర్శ జ్ఞాన ప్రధాన ప్రక్రియ. సాహిత్యంలో రచయితలు నిక్షేపించిన జ్ఞానాన్ని సమాజానికి విడదీసి, విశ్లేషించి అందించేది సాహిత్య విమర్శ. సాహిత్యంలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి విమర్శకుడు ఆ జ్ఞానానికి సంబంధించిన సర్వాంశాలు తెలుసుకోవాలి. సాహిత్య విమర్శ ఒక ఆహ్లాదకరమైన ఆట, మరోవైపు కఠిన పరీక్ష. సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంప్పనుడు అయితే విమర్శను ఆటగా మలచుకొంటాడు. అలా మలుచుకోలేని పక్షంలో అది విమర్శకులను ఆడుకుంటుంది. సాహిత్యానికి సమాజానికి మధ్య వారధి సాహిత్య విమర్శ. విమర్శకులు ఎంత జ్ఞాన సంప్పనులు అయితే వాళ్ళు నిర్మించే విమర్శ రూప వారధి అంత పటిష్టంగా ఉంటుంది. సాహిత్య విమర్శకునికి మూడు రకాల జ్ఞానం ఉండాలి.

  1. దృక్పధ జ్ఞానం
  2. శాస్త్ర జ్ఞానం
  3. కళా సాహిత్య జ్ఞానం

విమర్శకుడు తనదైన దృక్పధాన్ని కలిగి ఉంటూనే తన దృక్పథానికి విరుద్ధమైన దృక్పథాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. భౌతికవాదం దృక్పధం గల విమర్శకునికి భావవాద దృక్పధం స్వరూప స్వభావలు తెలియాలి. అలాగే భావవాదులకు కూడా.

1910 ప్రాంతాలనుంచి 1964 దాకా భారతదేశంలో శ్రీకాకుళ ప్రాంతంలో వచ్చిన ఆర్థిక రాజకీయ పరిణామాల చరిత్ర తెలిస్తే తప్ప కాళీపట్నం రామారావుగారు రాసిన ’యజ్ఞం’ కథ సమగ్రంగా అర్థంకాదు. అలాగే 1921-22 నాటి గుంటూరు ప్రాంత రాజకీయ సాంఘిక ఆర్థిక పరిణామల జ్ఞానంతో ’మాలపల్లి’ని, స్వతంత్రభారతంలో నాలుగు శతాబ్ధాల జీవితానుభవ జ్ఞానంతో “సొరాజ్జెం’ (అక్కినేని కుటుంబరావు) నవలను సమగ్రంగా అర్థం చెసుకోగలం. సామాజికశాస్త్రాలకు సాహిత్యానికి సంబంధం లేదనుకోవడం అసాహిత్యదృక్పధమే అవుతుంది. సామాజిక శాస్త్రాల జ్ఞానంతో వెలువడే సాహిత్య విమర్శ ఎంత సజీవంగా ఉంటుందో ’విభాతసంధ్యలు’ (సె.వి. సుబ్బారావు. సంపాదకత్వం) ’కథాయజ్ఞం’ (చేకూరి రామారావు సంపాదకత్వం) సాహిత్యంలో వస్తుశిల్పాలు (త్రిపురనేని మధుసూదనరావు,) వంటి గ్రంథాలు రుజువు చేశాయి. ఏ రచనను తీసుకొన్నా ఆ రచనలోని జీవితాన్ని పరిశీలించడం వర్తమాన సాహిత్యవిమర్శలో మొదటి భాగం. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.

వల్లంపాటి

వల్లంపాటి

“రచనను ఎవరి దృక్పధం నుంచి విలువకట్టాలి అన్న సమస్య కూడా చాలా కాలంగా వివాదస్పదంగానే ఉంది. రచనను రచయితనుంచి మాత్రమే వివరించి విశ్లేషించాలే కాని విలువ కట్టే బాధ్యతను విమర్శకుడు స్వికరింవకోడరు అనేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రచయితలు వీరి అభిప్రాయం ప్రకారం రచయితకే కాని ఉత్తమ పాఠకుడైన విమర్శకుడికి దృక్పధం ఉండకూడదు. ఈ వాదంలో అర్థం లేదు. ఒక దృక్పధం కలిగి ఉండటానికి రచయితలకు ఎంత అర్హత ఉందో విమర్శాకుడికి కూడా అంతే అర్హత ఉంది. రచనను రచయిత దృక్పధం నుంచి అర్థం చెసుకొని తన సామాజిక ఆర్థిక దృక్పధం నుండి ఆ రచనను విలువ కట్టడం విమర్శకుడు నిర్వహించవలసిన భాధ్యతలలో ప్రధానమైనది.” (పేజి నెం. 26 వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

విమర్శకుడు రచయిత ప్రాపంచిక దృక్పధాన్ని తన దృక్పదంతో, రచయితను తన నిబద్ధతతో అర్థం చేసుకొని విశ్లేషిస్తాడన్నది వాస్తవం. చాలా మంది దృష్టిలో విమర్శకుడు రచయిత ఆలోచన ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చెసుకోవటం మాత్రంతోనే విమర్శకుని పని ముగిసిపోదు. అర్థం చేసుకొన్న దానిని విశ్లేషించాలి. దానిమీద తీర్పును ఇవ్వాలి. వర్తమాన విమర్శ వ్యాఖ్యానం స్థాయిని దాటి చాల కాలమే అయ్యింది. వ్యాఖ్యానం మాత్రమే కాక తీర్పును ఇవ్వటంలో విమర్శకుని ప్రాపంచిక దృక్పధం నిబద్ధతలే అతనికి సహయకారులౌతాయి.

సాహిత్య విమర్శకునికి ఉండవలసిన జ్ఞానంలో రెండోవది శాస్త్ర జ్ఞానం. శాస్త్రాలు రెండు రకాలు 1. వైజ్ఞానిక సామాజిక శాస్త్రాలు 2. కళాసాహిత్యశాస్త్రాలు. సాహిత్యవిమర్శకుడు ఏ శాస్త్రజ్ఞానమూ లేకుండా విమర్శ రాస్తే ఫలితం పెద్దగీతకు చిన్నగీత.

సాహిత్యంలోని జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సాహిత్య విమర్శకుడికి సామాజిక శాస్త్రాల జ్ఞానం ఎంత అవసరమో రూప-శిల్ప విశేషాలను తెలుసుకోవటానికి కళా సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం అంతే అవసరం. మనకు మూడు రకాల కళా సాహిత్య శాస్త్రాలు ఉన్నాయి. 1. భారతీయ్య కళా సాహిత్యాలంకారశాస్త్రం 2. పాశ్చాత్య కళా సాహిత్యాలంకారశాస్త్రం

3. మార్కీయా కళా సాహిత్యాలంకారశాస్త్రం. మొదటి రెండు ఆయా భౌగోలిక విభిన్న కాల పరిధిలో పుట్టాయి. మూడవది ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరుచుకొన్న కళా సాహిత్యాలంకారశాస్త్రం. సాహిత్య విమర్శకులు వాళ్ళ దృక్పథాన్ని బట్టి చైతన్యాన్ని బట్టి అభిరుచిని బట్టి దేనిని స్వీకరించిన తక్కిన వాటిని గురించి కూడా తెలుసుకోవటం మంచిది. మూడింటిని అధ్యాయనం చేసి ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరిస్తే కళా సాహిత్యాలను సాధ్యమైనంత సమగ్రంగా అవగాహన చేసుకోగలమో నిర్ణయించుకోవటం ఉత్తమం.

సాహిత్య విమర్శకులకు కావలసిన మూడో జ్ఞానం కళా సాహిత్య జ్ఞానం. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. 1. సృజన కళా సాహిత్య చరిత్ర జ్ఞానం. 2. కళా సాహిత్య విమర్శ చరిత్ర జ్ఞానం. ఒక కాలం నాటి రచన మీద విమర్శ చేస్తున్న విమర్శకుడు ఆ కాలానికి ముందు వెనకల కాలాల్లో వచ్చిన సాహిత్యాన్ని విమర్శ రాస్తున్న విమర్శకుడు సాధ్యమైనంత వరకు చదవాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం విమర్శకుని సాంస్కృతిక స్థాయిని పెంచటమే కాక సాహిత్య విమర్శ మహోన్నతంగా రూపోంది, రాణిస్తుంది. అలాగే ఒక ఉధ్యమ సాహిత్యం మీద విమర్శ రాస్తున్నపుడు తక్కిన ఉద్యమాల సాహిత్యాన్ని కూడా చదివి తీరాలి.

 

Kalipatnam_Ramarao

కాళీపట్నం రామారావు

’యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) కథలో సర్పంచి శ్రీరాములు నాయుడు సుందరపాలెంలో చేసిన అభివృద్ధిని గురించి మాట్లాడుతూ పెట్టుబడికి రోడ్లు కావాలి, స్కూల్లు కావలి, కరెంట్ కావాలి. ఇది గ్రామం సరఫర చెయ్యలేదు. అందుకే రాజ్యం (State) పూనుకొని ఆ పాత్ర దరించాలి. ప్రైవేట్ పెట్టుబడి దారి విధానానికి రాజ్యం చేయూతనిస్తుంది. ఈ క్రమంలో శ్రీరాములు నాయుళ్ళు జవహర్ లాల్ నెహ్రులు అలంకార ప్రయంగా అదలం ఎక్కాలి. ఈ గ్రామం ఈ దేశం వాళ్ళవల్లే నడుస్తుందని, బాగుపడుతుందని నాయుడు నెహ్రు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. కాని వాళ్ళు పెట్టుబడి చెతిలో కీలు బొమ్మలు. వాళ్ళు పెట్టుబడి దారులు వెయ్యమన్న వేషం వెయ్యాలి. అడమన్న నాటకం ఆడాలి. అని గరికపాటి నిరంజన్ రావు చేసిన మార్కిస్ట్ వ్యాఖ్యానం ఇది. దీని ద్వారా మనకి తెసిందేమిటంటే సాహిత్య విమర్శకుడు రచన మీద వ్యాఖ్యానం లేదా విమర్శ చేసేటప్పుడు అతని భావజాలం ప్రాధాన్యం వహిస్తుంది. మార్కిస్ట్ కాని విమర్శకుడు ఇదే అంశంమీద వ్యాఖ్యానం చేస్తే అది ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉంటుంది.

అలాగే ఒక కాలంలో ఒక భాషలో ఒక రచన మీద కాని రచయిత మీద కాని లేదా ఉధ్యమ సాహిత్యం మీద కాని విమర్శ రాసే విమర్శకుడు ఆ రచనల మీద ఇతరులు రాసిన విమర్శను అధ్యయనం చేయటం ఎంతైన అవసరం. ఒక భాష విమర్శకునికి తక్కిన ప్రపంచ భాష సాహిత్య విమర్శ చరిత్ర తెలిసుంటే జరిగే మేలు ఎక్కువ. మన ముందు కాలపు విమర్శకులు సాహిత్య విమర్శలో ఏ ఏ పోకడలు పోయారో తెలిసి ఉంటే, మనం వాళ్ళ కన్న భిన్నంగా, ఆధునికంగా, విమర్శ చేయడం ఎలాగో నిర్ణయించుకోవడానికి వీలుకలుగుతుంది. వాళ్ళ విమర్శ అగిన చోటు నుంచే మన విమర్శ మొదలు పెడితే విమర్శ బండి నిరాటంకంగా సాగుతుంది. మాక్సింగోర్కి రష్యన్ యువ రచయితలకు ఒక సలహా ఇచ్చాడు. నేటి కార్మికుడు ఒక వస్తువును తయారు చేసే ముందు, ఆ వస్తువును తన ముందు కాలపు కార్మికులు ఏలా తయారు చేశారో తెలుసుకొంటే వాళ్ళ కన్నా బాగా ఆ వస్తువును తయారు చెయ్యటానికి వీలైనట్లే, నేటి రచయితలు తమ ముందు కాలంలోని సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకుంటే వాళ్ళ కన్నా బాగా రాయడానికి వీలౌతుంది. ఈ సలహా సాహిత్య విమర్శకులకు కూడా వర్తిస్తుంది.

ఏ కాలంలోనైనా సమాజం తన మనుగడ కోసం ఒక స్పష్టమైన దృక్పథం కలిగి ఉంటుంది. వ్యక్తికైన సమిష్టికైన మనుగడ సాగించటానికి ఒక దృక్పథం అవసరం. ఈ దృక్పథమే మనిషిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది. సమాజానికి ఒక నిర్థిష్టమైన ప్రాపంచక దృక్పథం ఉన్నట్లే సమాజ జీవితాన్ని సాహిత్యంగా మలిచే రచయితలకు కూడా తమదైన ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. తమ అవగాహనను శాస్త్రవేత్తలు సామాన్యులు కళాకారులు అభివ్యక్తం చేయటంలో బేధాలు ఉంటాయి. చూపులోనే(దృష్టి) బేధం ఉన్నపుడు చూచిన దానిని చెప్పటంలోను తేడాలు ఉంటాయి.

అధ్యయన లోపం సాహిత్య విమర్శ కృషించటానికి వెనుకడుగు వెయ్యటానికి అవకాశం ఇస్తుంది. సాహిత్య విమర్శ ఎదగలేదనే అభిప్రాయం కలగటానికి కూడా అవకాశం కలిపిస్తుంది. సమస్త సాహిత్య విమర్శ పరిజ్ఞానం నుండి తనదైన మార్గంలో విమర్శ రాస్తే దానికి విశ్వసనీయత అధికారికత కలుగుతుంది. సాహిత్య విమర్శకులలో అధ్యాయన లోపం- జ్ఞానలోపం సాహిత్య విమర్శ క్షీణతకు తద్వారా సమాజ క్షీణతకు దారీ తీస్తుంది. ఈ మూడు రకాలైన జ్ఞానం కలిగిన విమర్శకులు ఉత్తమ విమర్శకులు అవుతారు.

ఒక కథారచన చదివినతరువాత దానిలోని కథ పాత్రలు సంభాషణలు మొదలైన అనేక అంశాలను విశ్లేషించుకుంటాం. ఆరచనలో ఆ పాత్రల ప్రాధాన్యాన్ని ప్రమేయాన్ని వ్యాఖ్యానించుకుంటాం. ఆ రచనలోని కథా నిర్మాణాన్ని , కథాకథనాన్ని, పాత్ర చిత్రణను సభాషణల్ని ఇంకా అనేకాంశాలని ఇతర రచనలలోని అలాంటి అంశాలతో పోల్చి పరిశీలిస్తాం. అన్నీ అయినాక విమర్శకుడు, రచయిత ఈ రచన ద్వారా ఏమిసాధిస్తున్నాడు? అనేదాన్ని నిర్ణయించాలి. సాహిత్యవిమర్శకుడు తీర్పరి పాత్రను నిర్వహించవలసింది ఇక్కడే. ఏ నిర్ణయమూ చేయకుండా ముగించే విమర్శ వల్ల ఫలితముండదు. పాఠకుల్ని నడిదారిలో వదిలేసినట్లౌతుంది.

ఒక రచనలో అన్ని అంశాలు విమర్శకునికి నచ్చక పోవచ్చు. సాహితీలోకంలో చాలా ప్రసిద్ధుడైన రచయిత చేసిన బలహీనమైన రచన మీద విమర్శించి నిర్ణయం ప్రకటించడంలో అనేక పరిమితులు కూడా ఏర్పడవచ్చు. రచనలోని జీవితం మనంచూసిన జీవితంకన్నా భిన్నమైన జీవితానుభావాన్ని చిత్రించి వుండొచ్చు. ఇలాంటివన్నీ… విమర్శకుడు తాను చదివి లేదా విమర్శించే రచన మీద చివరి నిర్ణయాన్ని ప్రకటించడానికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే తాను గ్రహించిన సత్యాసత్య ప్రకటనకు తానుగడించిన అధ్యయన జ్ఞానం అవసరమవుతుంది.

తెలుగులో సాహిత్యవిమర్శ దీపం చిన్నది. తెలుగులో సాహిత్యవిమర్శ ఎదగలేదు. విమర్శకులు రచయితల అభిప్రాయాల్ని గౌరవించరు. విమర్శను భరించేస్థితిలో రచయితలు లేరు. తెలుగులో సాహిత్యవిమర్శ ఉన్నట్టా? లేనట్టా? తెలుగులో సాహిత్య విమర్శ ఉండీలేనట్టే! తెలుగులో సాహిత్యవిమర్శ లేనట్టే. –ఇలాంటి వ్యాఖ్యలు నిరంతరం వినిపిస్తూనే వున్నాయి. ఇందుకు కారణం ఎవరు ? అరకొర జ్ఞానంతో మిడిమిడి రాతలు రాసే విమర్శల పాత్ర . తెలుగుసాహిత్యవిమర్శలో శాస్త్రీయత లోపించడం. వ్యక్తిగత అభిరుచులు ప్రాధాన్యం వహించి, నిర్మాణాత్మకత లోపించడం.చరిత్రను గౌరవించలేని దౌర్భల్యం. మార్పుల్ని సహించలేని పిరికితనం, దుర్వ్యాఖ్యానాలతో చెలామణి కావాలనుకునే దురాశ వంటి రుగ్మతలు తెలుగు సాహిత్య విమర్శను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. సాహిత్యవిమర్శ ఒక శాస్త్రంగా భావించకుండా, దానిని స్వీయాభిరుచుల ప్రకటన సాధనంగా భావించినంతకాలం తెలుగువిమర్శ గురించి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుంటాయి.

.

-డా. కె. శ్రీదేవి

9441404080

మెటఫర్ కోసం “అనంత” అన్వేషణ!

unnamed

“గుడ్డినమ్మకంతో సమస్యల్లా ఒక్కటె-అది మతాన్ని నాశనం చేస్తుంది”–అనంతమూర్తి.

గుడ్డినమ్మకాన్ని మతాన్నుంచి వేరుచేయగలగవారెవ్వరు
ఇలాంటి వారెవ్వరో తప్ప…..

ఎవరింతలా చెప్పగలరు? ఎవరింతలా తెగించి మరీ, ధైర్యంగా మతాన్ని నిర్వచిస్తారు?
ఇది అనంతమూర్తి అనకపోతే ఏమయ్యేదొ కానీ తీరా ఆయన అన్నాక ఇక అక్కడ ఆగి వినాల్సిందే.

“ఒక్కసారి ఆలోచించి చూడండి, గీతాంశరేఖలన్నీ ఓ మాటపై నిలబడే ఉన్నట్టున్నాయి, అదే మాటపై నిలబడదామా
లేక ఓ మతాన్నేదొ నమ్ముకుని బయటపడదామా?”
అని అనంతమూర్తి అనరు. బదులుగా ఇలా అంటారు.

“జీవితాన్ని, మతాన్ని కలిపి చూడకండి
విడదీసి చూసే శక్తే మీకుంటే మీరందరూ ఓ గొప్ప మతవాదులవుతారు
నాలా, బ్రాహ్మణీకాన్నీ వదిలేసుకుని మరీ బతుకుతున్న వ్యక్తిలా”

షిమోగా జిల్లాలోని తీర్థహల్లి సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన అనంతమూర్తి సంప్రదాయ సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి మైసూర్ విశ్వవిద్యాలయంలోనే మాస్టర్స్ చేసి అక్కడె కొన్నాళ్ళు అధ్యాపకుడిగా పనిచేసి తర్వాత బర్మింగ్‌‌హామ్ యూనివర్శిటీనుంచి “Politics and Fiction in the 1930s” పై డాక్టరేట్ తీసుకుని మన దేశానికి తిరిగొచ్చారు.

1987 నుంచి 1991 వరకూ కొట్టాయం మహత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి తనకంటూ ఓ ముద్రవేసుకున్నారు. ఆయన ఎక్కడున్నా ఓ కొత్త ఒరవడికి నాంది పలకగడమే ఈయన ప్రత్యేకత. అదే అనంతమూర్తి.

2012 లో మొట్టమొదటి కులపతిగా (First Chancellor) కర్నాటక విశ్వవిద్యాలయానికి నియమింపబడ్డారు. 1993 లో సాహిత్య అకాడెమీకీ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. మనదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకే కాక విదేశాల్లోని గొప్ప యూనివర్శిటీలకి పనిచేసారు అనంతమూర్తి. 1990 లో సోవియట్ రష్యా, హంగేరి, ఫ్రాన్స్, జర్మనీ సందర్శించి అక్కడ ప్రసంగించారు. 1994 లో కేంద్రప్రభుత్వం నుంచి జ్ఞాన్‌‌పీఠ్ అవార్డ్, నాలుగేళ్ళ తర్వాత పద్మభూషణ్ అందుకున్నారు.

ఎనభైఏళ్లకు పైగా ఎంతనిర్భీతిగా జీవించారో అదే దృక్పథం అతని రచనల్లోనూ కన్పడ్డం వింతకాకపోయినా అది అతనికి అభిమానులనీ విమర్శకులనీ సమానసంఖ్య లోనే సంపాదించిపెట్టింది. ఐతే వివేకాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం జంకని అనంతమూర్తి అత్యంత వివాదాస్పద వ్యక్తిగా, రచయితగా కూడా ప్రసిధ్ధి.

తన రచనల్లో ఎక్కువగా కన్నడ బ్రాహ్మణులు ఎదుర్కునే సమకాలీన సమస్యల గురించీనూ, వారు తమ కట్టుబాట్లను వదిలి బయటికి రాలేకపోవటం గురించీ రాసుకున్నారు. ఈ క్రమంలో వచ్చిందే ఆయన ప్రముఖ నవల “సంస్కార”. ఇందులో ప్రధాన ప్రాత్ర పోషించింది తన సమకాలీనుడు మరో ప్రముఖ కవి లంకేష్. ఈ నవలని సిన్మాగా రూపొందించాక అనంతమూర్తి పామరజనుల్లోకి మరింత పదునుగా చొచ్చుకుపోయారు. అయితే తర్వాత కాలంలో లంకేష్ కీ ఈయనకీ విభేదాలు పొడసూపడంతో ఇద్దరూ దూరమయ్యారు.

“సంస్కార” నవల పూర్తిగా బ్రహ్మణ చాందసవాద ఆచారవ్యవహారాలపై ఓ తిరుగుబాటు బావుటా. జీవితాంతమూ బ్రాహ్మణ ఆచారవ్యవహారలకి దూరంగా ఉంటూ హఠాత్తుగా మరణించిన ఓ యువకుడి పార్ధీవదేహానికి అంతిమక్రియలు ఎవరు చెయ్యాలన్నదే నవల ప్రధాన అంశం. చివరికి అతనికి సహచరిగా ఉంటూవచ్చిన ఓ వేశ్య అతనికి దహన సంస్కారాలు నిర్వహిస్తుంది.

అనంతమూర్తి 1980

అనంతమూర్తి 1980

అప్పట్లో (1970) ఆ సిన్మాని విడుదల చేయడానికి సెన్సార్ బోర్డూ, ప్రభుత్వమూ భయపడ్డ మాట వాస్తవమే. కానీ తర్వాత విడుదలై National Film Award for Best Feature Film పొందటం యాదృచ్చికం కానేకాదు.

అనంతమూర్తి ఎక్కడ ఉన్నా అక్కడ విభేదాలుండేవి. ఆయనకి తనకంటూ కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలున్నా “మాట” విషయంలో తొందరపాటో లేక విపరీతమైన అభిజ్ఞానమో కానీ తనకంటూ ఓ ముద్ర లేకుండా అక్కడ ఉండనంటారు. అది రాను రాను ఎక్కువై ఆఖరికి అతని ఉనికికె భంగమైంది. అతని అనుచరులందరూ దూరమయ్యారు. అతనే తానొక ఉనికికోసం ఆదుర్దాపడాల్సిన పరిస్థితినీ తెచ్చుకున్నారు.

ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆయన చెంతకు చేరాయి. అందులో ప్రముఖంగా దేవెగౌడ (అదె, మన భారతదేశ పాత ప్రధాని) కూడా ఈయనకి పార్టీ(జనతాదళ్) టికెట్ ఇచ్చి లోక్‌సభకి నిలబెట్టారు. అయినా ఓడిపొయారు అనంతమూర్తి. మళ్ళీ పోటిచేసారు, మళ్ళీ ఓడిపోయారు. ఇక్కడ ఈయన ఓటమికి ప్రధానకారణం ఆయనకి మతమంటే ఖచ్చితమైన అభిప్రాయమూ లేదని అతని విమర్శకులంటారు. భారతదేశ రాజకీయాలూ, మతమూ నాణానికి రెండు పార్శ్వాల్లాంటివన్న విషయం అర్ధంకావటానికి అనంతమూర్తికి రెండు ఎన్నికల అనుభవం అవసరమయింది.

ఈయన తన జీవితపు చరమాంకంలో పలు మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలకి ఆద్యుడయ్యాడు. దాంతో ఆయన్ని సాహితీ పరంగా అభిమానించిన వారూ ఆయన్ని దూరంపెట్టడాన్ని ఓ “సంస్కారంగా” వ్యక్తపరిచారు. విగ్రహారాధన పై ఇతని అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ హిందువులని బాధించాయని అంటారు.
అయితే అనంతమూర్తిని నాస్తికుడనో హేతువాదనో అనడానికీ వీలులేదు. ఈయన ఉపనిషత్తులని అర్దం చేసుకున్నట్లుగా ఇతని విమర్శకులూ చదవలేకపోయారన్నది నిర్వివాదాంశం. మతానికి వ్యతిరేకుడు కాదు కానీ మతం ముసుగులో జరుగుతున్న అకృత్యాలనే ‘అనంతంగా’ అసహ్యించుకునే వ్యక్తిత్వం.

ఏది ఏమైనా అనంతమూర్తి ఓ మేధావి, ఓ జ్ఞాని. ఈయన రచనలని చదవాల్సిందే. ఈయన ఫిలాసఫీనీ అర్ధం చేసుకోవాల్సిన ప్రయత్నం చెయ్యాల్సిందే. అతని రచనల గురించి అతని మాటల్లోనే “writers use devices to hook readers. For me the writing process begins with a metaphor. I look for one everyday”

“Among the contemporaries UR Murthy was perhaps India’s biggest intellectual, not just a writer. He was very modern in his thinking and at the same time, he is deeply rooted in his culture”
-Adoor Gopalakrishnan, Eminent Film-maker based in Thiruvananthapuram, Kerala

 -శ్రీనివాస్ వాసుదేవ్

10603336_10202364645617595_2039969616780245559_n

 

 

ప్రతి రచయిత మదిలో మెదిలే మాస్టారు

చేరాగారితో 80-90 ల నాటి ఏ కవికైనా అనుబంధం లేకుండా ఉందా?  రచయితలెవరికైనా చేరా జ్ఞాపకాలు లేకుండా ఉంటాయా?
1991 లో కవులందర్నీ మొదటి సారి కలుసుకున్న సభలోనే “చేరా” ” “కె.గీత” అంటే డిగ్రీ చదువుతున్నంత చిన్నమ్మాయి అని అనుకోలేదు” అని ఆశ్చర్యపోవడం,  తర్వాతి సంవత్సరం  “నీ కవిత్వ సమీక్ష చూసుకున్నావా?” అని  నవ్వుతూ గద్దించి అడగడం… తొలి నాళ్ల జ్ఞాపకాలు.

తర్వాత ఎప్పుడు ఎక్కడ కనిపించినా కవిత్వం పట్ల ఉన్న ఆత్మీయ స్వరం కవికి కూడా బహూకరించిన మంచి మనీషి చేరా. “ద్రవభాష” కవిత్వ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని పుచ్చుకుని ఇంటికి వెళ్తే “అయ్యో, ఇంటిదాకా రావాలా, గీత కవిత్వం అంటే రెక్కలు కట్టుకుని రానూ…” అని చమత్కరించడం…., భాషా శాస్త్రం లో పీ.హెచ్.డీ చేస్తున్న రోజుల్లో తమ ఇంట్లో పెద్ద చెక్క పెట్టె నిండా ఉన్న పుస్తకాలతో తన అనుబంధాన్ని నాతో పంచుకున్న క్షణాలు…గంటల తరబడి నాతో భాషా శాస్త్రపు చర్చలు……”చాలా తమాషాగా మనిద్దరికీ ఒక సారూప్యత ఉంది చూసేవా, కవిత్వమూ, భాషా శాస్త్రమూ.. రెండు కళ్లు…నాకూ, నీకూ “….అని నవ్వడం…
ఒకటా, రెండా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు…..ఆయన దగ్గర చదువుకోకపోయినా నాకూ ఈ విధంగా చేరా “మాస్టారే”.
కన్నీళ్లు అక్షరాలను చెరిపి వేసే కాగితాలపై రాయకున్నా కీ బోర్డు మీద  తడి వేళ్లు అక్షరాలను మలిపి వేస్తున్న… దు:ఖం………

-కె.గీత

చేరా గారు లేరే అని ఎప్పుడూ అనిపిస్తుంది…!

చేరా గారిని నేను చూసింది, కలిసింది ఒక్కసారే. ఆ కలయిక ఒక జ్ఞాపకం.. అంతే. అయితే చేరా గారిని అనేక వందలు, వేల సార్లు కలుసుకున్నది చేరాతల ద్వారానే. ఆంధ్రజ్యోతిలో చేరక ముందు, చేరిన తర్వాతా.

చేరాతల ద్వారా నా యవ్వనకాలపు అనేక మంది యువ కవులను తెలుసుకోగలిగాను, కలుసుకోగలిగాను, కలబోసుకోగలిగాను. అఫ్సర్లు, యాకూబ్ లు, ఇంకా అనేక మంది… నాకు చేరాతల ద్వారానే తొలి పరిచయం. నేను కవిత్వానికి దూరమయ్యానేమో కానీ… ఈ కవులకు ఎప్పుడూ దూరం కాలేకపోయాను.. వారి భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే. నా భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే.. వారూ అంతే సన్నిహితంగా వుండిపోతూ వచ్చారు.

అలా.. ఒకరినొకరిని.. కవికి, పాఠకుడికి పీటముడి వేయగల అరుదైన సాహితీ క్రిటిక్ చేకూరి రామారావుగారు. యువకవులను చేరాగారు పరిచయం చేశారంటే… వారిక మన ఇంట్లో బంధువు అయిపోయినట్టే.

మా అమ్మగారి ఊరు వీరులపాడుతోనూ చేరా గారికి ప్రత్యేక అనుబంధం వుంది. ఆ విధంగా నాకూనూ.  వీరులపాడు.. ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామం, కృష్ణా జిల్లాలోది. చేరా గారి సోదరి మెట్టినిల్లు వీరులపాడు. అందువల్ల తరచూ వచ్చిపోతుండేవారు. వీరులపాడు వచ్చినప్పుడు… వారికి కాలక్షేపం అంతా, ఆ ఊరి గ్రంథాలయంలోనే. జీవిత చరమాంకంలోనూ ఆయన అదే పుస్తక పఠన వ్యాపకంలో వున్నారని పత్రికల్లో చదివాను.

అప్పట్లో… చేరా గారి మీద గుసగుసలు వినిపించేవి.. ముఖ్యంగా తోటి కవిలోకంలో. ఆయనెప్పుడూ ఆయనకు తెలిసిన, నమస్కారం కొట్టిన, మరీ ముఖ్యంగా ఖమ్మం కవుల గురించే రాస్తుంటారని. కాలక్రమంలో, నమ్మకంమీద నాకు తెలిసిన విషయం ఏమిటంటే… ఆయన అటువంటి పక్షపాతి కాదని. ఆయన పరిచయం చేయకపోయివుంటే… నాకు ఖమ్మం జిల్లాకు చెందిన వారివే కాదు… చాలా జిల్లాలకు చెందిన కవుల పేర్లు తెలిసేవి కాదు. ఆ రోజుల్లో వారిని చదివి వుండేవాడినీ కాదు.

కొద్ది నెలల క్రితం.. ఫేస్ బుక్ లోనే.. మెర్సీ సురేష్ జజ్జర గారి కొన్ని లైన్లు చూసి… అయ్యో.. మిమ్మల్ని లోకానికి పరిచయం చేయడానికి చేరా గారు లేరే అన్నాను. (చేరా గారు అప్పటికి జీవించే వున్నారు).

ఇంకా కరెక్టుగా చెప్పాలంటే.. చేరాతలు వస్తున్న కాలంలో మీరు కవిత్వం రాసి వుంటే ఎంత బావుండేది అనే భావంతో.

యువ కవులను ప్రోత్సహించి, మంచిచెడ్డలను విచారించి, వారిని ఓ ఉన్నత కవితా స్థాయికి తీసుకెళ్లడంలో చేరా గారు చేసిన కృషి… తెలుగు నేలపై ఇంకా గుబాళిస్తూనే వుంది.

ఆ రోజులు మళ్లీ రావు.

 

-వాసిరెడ్డి వేణుగోపాల్

మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”.

-రాల్స్ ఫాక్స్ “నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు, సామాన్యులు, కళాకారులు తమ అవగాహనను అభివ్యక్తం చేయడంలో బేధాలుంటాయి. చూచిన దానిని చెప్పటంలోనూ తేడాలుంటాయి. అందుకనే మామూలు సంభాషణకన్నా, వార్తకన్నా, సాహిత్య రచన భిన్నంగా వుంటుంది. అందువల్ల రచయితలు సమాజాన్ని చూడటంలోనే దృష్టి బేధాన్ని దానివల్ల వాళ్ళ సాహిత్య సృష్టిలో వచ్చే భేదాలను రచయితల సాహిత్యాన్ని పరిశీలించే ముందు తెలుసుకోవాల్సి వుంటుంది.

రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు. అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు. పాఠకులను చెడుకు వ్యతిరేకంగా, మంచికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు. రచయితలు ఇంత పని చేయాలంటే ఒక దృక్పథం లేకుంటే సాధ్యం కాదు. సమాజ పరివర్తనలో రచయితలు క్రియాశీల సృజనాత్మక పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు సహకరించేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే. అయితే, అందరు రచయితల ప్రాపంచిక దృక్పథం ఒకటి కాకపోవచ్చు. అలానే అన్ని కాలాల ప్రాపంచిక దృక్పథమూ ఒకటి కాకపోవచ్చు. రచయిత నేపథ్యాన్ని బట్టి సమాజంలో ప్రచురంగా వుండే భావజాలాన్ని బట్టి రచయితల మీద సమాజ, ప్రభావాల్ని బట్టి ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. రచయిత రచనకు పూనుకునే ముందు తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్ధారించుకొని రచన ప్రారంభిస్తాడు.

విమర్శకులు ఏ రచయితనైనా అధ్యయనం చేసేటప్పుడు మొదట ఆ రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకుంటే తక్కిన సాహిత్యాంశాలు వాటంతట అవే విశదమైపోతాయి. విమర్శకులు ఈ పని చేయాలంటే విమర్శకులకే మొదట స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుండాలి. ఆధునిక సాహిత్య రంగంలోనూ, సాహిత్య విమర్శరంగంలోనూ ఈ కారణంగానే ప్రాపంచిక దృక్పథం ప్రధానాంశంగా వుంది. అయితే అనేక మంది విమర్శకులు ఈ ప్రధానాంశాన్ని ఇంకా జీర్ణం చేసుకొకుండానే విమర్శ రాస్తున్నందువల్ల గందరగోళం రాజ్యమేలుతోంది. విమర్శకుడు తమ ప్రాపంచిక దృక్పథమేమిటో స్పష్టంగా, నిర్ధిష్టంగా ఏర్పడక ముందే తమ అజ్ఞానాన్ని దాచుకొని, అరకొర కొలమానాలతో విమర్శకు పూనుకుంటే, నమ్మకంలేని వాటిని గురించి బలంగా మాట్లాడే ప్రమాదం వుంది. పైగా సాహిత్య విమర్శ అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం కలుగుతుంది.

రచయిత సామాజిక చలన సూత్రాలను స్పష్టం చేసే పనిని నెత్తికెత్తుకున్నాడు. సంస్కర్తగా, జాతీయవాదిగా, అభ్యుదయ, విప్లవవాదిగా దిగంబరుడిగా, దళిత, స్త్రీ, మైనారిటీవాదిగా, ఆర్థిక, సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వ్యాఖ్యాతగా మారాడు. రచయితలు గుర్తింపబడని శాసనకర్త అని ఒక నాడు మాథ్యూఆర్నాల్డ్ అన్నాడు గానీ ఇవాళ రచయితలు గుర్తింపబడిన శాసన కర్తల్లో ఒకడయ్యాడు. రచయిత దృష్టికి, రచయితలుకాని వారి దృష్టికి తప్పకుండా తేడా వుంటుంది. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసిన, ఒక సామాజిక సంఘటనను చూసినా, ఒక సామాజిక పరిణామాన్ని పరిశీలించినా రచయిత దృష్టి నిశితంగా సృజనాత్మకంగా వుంటుంది. అయితే అందరి రచయితల దృష్టికోణం కూడా ఒకటే కాదు కనుక దృష్టి వైవిధ్యం కనిపించినా, దృష్టి వైచిత్రి మాత్రం అందరిలోనూ వుంటుంది. పారిశ్రామిక నాగరికత బలిసిపోయి మానవ సంబంధాలు కృత్రిమంగా తయారైన పాశ్చాత్య నాగరికత వల్ల ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది వుంటారు కానీ టి.ఎస్. ఇలియట్‍కు మాత్రమే అది ‘ఊసర క్షేత్రం’గా (waste land)గా కనిపించింది.

భారతీయ సామాజిక వ్యవస్థ, సంస్కృతులు విశ్వనాథ సత్యనారాయణకు వేయిపడగలుగా కనిపించాయి అదే వ్యవస్థ, అదే సంస్కృతి గుర్రం జాషువాకు నాల్గుపడగల నాగరాజుగా కనిపించాయి. విశ్వనాథ సత్యనారాయణ ’వేనరాజు నాటకానికి ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి ’ఖూనీ’ నాటకం రాశారు. దృష్టి బేధమే ఇందుకు కారణం. సంప్రదాయవాదికి అమ్మ ’మాతృదేవోభవ’ అవుతుంది. స్త్రీవాదికి అమ్మ ’మండుతున్న పొయ్యిలా’ (విమల-వంటిల్లు) కనిపిస్తుంది. ఇంకాచెప్పాలంటే ’మసిగుడ్డ’గా(కుప్పిలి పద్మ) కనపడుతుంది. మరొకరి దృష్టికి ’త్రీ ఇన్ వన్‍గా’ (సి.సుజాత) కనపడుతుంది. అందువల్ల సాహిత్యాధ్యయనంలో రచయిత దృష్టి ప్రాపంచిక దృక్పథమంత ముఖ్యమైంది.

మామూలు మనిషి దృష్టి కన్నా రచయిత దృష్టి విశిష్టంగా వున్నప్పుడు రచయిత సృష్టి కూడా విశిష్టంగా వుంటుంది. మరి దాన్ని అందుకునే స్థాయి విమర్శకులకు కూడా అవసరం. మల్లీశ్వరి ఆ దృష్టి వైవిధ్యాన్నిఎంత బాగా అవగహన చేసుకుందో వర్తమాన కథకులైన గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని తీసుకొని ఇద్దరినీ ఒకే గాట కట్టారు. గౌరునాయుడు ఆదర్శవాది, అప్పలనాయుడు విప్లవాచరణవాది. వాళ్ళిద్దరి కథా సాహిత్యాన్ని చదివిన సాధారణ పాఠకులకు సైతం ఇది అర్థమయ్యే విషయం. గౌరునాయుడికి గ్రామాలపట్ల, గ్రామీణప్రజలపట్ల, గ్రామీణవ్యవస్థపట్ల వర్తమానంలో చూస్తున్నదానిమీద వ్యతిరేకత వుంది. ఆవ్యతిరేకతతో ఒక ఆదర్శపూరిత గ్రామీణజీవనాన్ని ఆకాంక్షిస్తాడు. అదెలా సాధ్యమన్నది అతనికి పట్టని విషయం. ఇక సాధ్యాసాధ్యాల చర్చ వస్తే, అదే అతని కథలకు పరిమితి. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఆయనకు వర్గాతీత భావన వుంది. కానీ అప్పలనాయుడు సమాజాన్ని భౌతికవాద దృష్టితో చూస్తాడు. సామాజికంగా జరిగే చలనాలను, ఘటనలకు వర్గదృక్పథం వుందని అతని కథలు చెబుతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మార్క్సిస్ట్ దృష్టికోణమతనిది.

దాదాపు అతను కథారచన ఆరంభించిన ’పువ్వులకొరడా’ కాలం నుండి ఇప్పటి ’సంధిగ్ధాకాశం, వికృతి’ కథల వరకు సామాజికంగా, ప్రాకృతికంగా జరిగే అనేక మార్పులను, సంఘటనలను ఉత్తరాంధ్ర స్థానిక జీవితాన్ని నిర్ధిష్టంగా చిత్రించినా కొంచెంకొంచెం తేడాలతో, అన్ని ప్రాంతాల జీవితానుభవాల వ్యక్తీకరణ రూపాన్ని తన కథల్లో చిత్రించారు. ’క్షతగాత్రగానం’ (వంశధార కథలు-21ఫిబ్రవరి1999) ’షా’ (ప్రజాసాహితి నవంబర్ 2005) ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలనేకాక తెలుగు నేల నాలుగు చెరుగుల విస్తరిస్తున్న సామ్రాజ్యవాద సాంస్కృతిక ప్రతిరూపాలుగా అలరారుతున్న నగరాలు మొదలుకొని పల్లెసీమల వరకు ఈ విషవలయంలోనే చిక్కుకున్నాయని నమ్మడం ఎంత వాస్తవమో అట్టాడఅప్పలనాయుడి కథలకు సార్వజనీన లక్షణం వుండడం కూడా అంతే వాస్తవం.

560804_290376897745258_1563925822_n’క్షతగాత్రగానం’ కథ గురించి మల్లీశ్వరి ’పెద్ద రైతు నేపధ్యంలో రాసినప్పటికీ వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్, అర్థఫ్యూడల్ దోపిడీకి, వర్తమానంలోని పెట్టుబడిదారీ దోపిడీకి మధ్యనున్న తేడాగా మార్పుల్ని అర్థం చేస్తున్న కథ’ అన్నారు. నిజానికింతే కాదు ఇంకా అప్పటికి(1998) యెరుకలోకే రాని కార్పొరేట్ వ్యవసాయీకరణ ప్రవేశాన్ని చింత్రించిన కథ ఇది. ఈ అంశాన్ని గ్రహిస్తే, అది పెద్ద రైతుల పక్షాన మాత్రమే చెప్పిన కథగా కనిపించదు. ఈకథలోని రైతు పెద్ద రైతు కాదు. భూమి కోసం పడరాని పాట్లు పడి, తాతల తరం పొట్టచేతబట్టుకొని పరాయి దేశానికి(బర్మా) వలసపోయి, సంపాదించిన భూమిని, industrialized transformation జరిగిన తరవాతి తరం హరించేస్తుంది. దానికి కారణాలుగా రచయిత సామాజిక ఆర్థిక రాజకీయ భూమికలను కథలో అనేకచోట్ల చూపిస్తారు.

ఉదాహరణకు “వ్యవసాయంలో….వ్యాపార పంటలొచ్చాయి. షుగర్, జూట్ మిల్లు లొచ్చేయి. ఆ పంటల మార్కెట్ యెగుడూ దిగుళ్ళతో అప్పుల్తో మిగిలేరు”…
“పడమర దోవలో యెవరిదో మోడ్రన్ రైస్ మిల్లోకటి-పరాయిదేశ చక్రవర్తి స్థాపించిన విజయస్తంభంలా కన్పిస్తోంది. తూర్పుదారిలో-కాఫీ,టీ దుకాణాలు! కొత్తవీధి గుండా ఆటో-బలసిన పెనుమృగంలా నిల్చిన శంకర్రాజు ఎరువుల గోడాంని దాటింది. వీధులు, రోజ్ గార్ నిధుల కంకర రోడ్డుతో విశాలమయినట్లున్నాయి. వీధి మలుపులో “స్నోవైట్” కాన్వెంట్- చిలుకలను బొధించిన పంజరంలా వుంది!ఆటో ఆగిపోయింది”.(పే.నెం.282 అట్టాడ అప్పలనయుడు సాహిత్యం మొదటి సంపుటం కథలు కొన్ని 2013)

ఒకరకంగా, విద్యాసాగర్ గారి పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలను, మల్లీశ్వరి వ్యాసాంతంలో చెప్పిన ’జీవితాలను అర్థంచేసుకొని అక్షరబద్ధం చేసిన బాధ్యతాయుత రచయిత’కథగా దీన్ని ఉదహరించవచ్చు. గానీ మల్లీశ్వరి….ఇందులో వైరుధ్యాన్ని ఇటీవలి కథల్లో అప్పలనాయుడుగారు అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇందులోగల వైరుధ్యమేమిటో, దాన్ని ఆయన ఏకథల్లో ఎలా అధిగమించారో చెప్పలేదు. క్షతగాత్రగానం-మారిన గ్రామీణ పరిస్థితులను 1999 నాటికే ఎత్తిపట్టి చూపించిన గొప్పకథ. కార్పొరేట్ వ్యవసాయీకరణ, యాంత్రీకరణ, హైటెక్నాలజీ, కొత్తతరం జీవన విధానం, వారి ఆలోచనలు…….కోటేశ్వరరావు, పురుషోత్తం, భుక్త, ప్రవీణ్, తాత….సుభద్ర, పాలేరు…..అందరి జీవితాల్లోంచి విధ్వంసాలనెన్నింటినో చింత్రించిన కథ. పర ప్రాంత పెట్టుబడి, దాని విశ్వరూపం, అది నిర్ధిష్ట ప్రాంతపు రాజకీయ, ఆర్థిక రంగాలనెలా శాసిస్తుందన్న వస్తువుతో వచ్చిన కథ. ’షా’కథను మల్లీశ్వరి అర్థం చేసుకున్నట్టు……’పెట్టుబడి దారులందు స్థానిక పెట్టుబడిదారులుమేలయా’ అని కథలో ఎక్కడా రచయిత చెప్పలేదు. కథ కూడా అలాంటి భావనలకు ఎక్కడా ఊతమియ్యదు. ఈమె అపార్థంచేసుకుందనడానికి…..ఈ రెండు కథలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలే ఉదాహరణలు.

పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యముంటుంది. స్థానిక స్థానికేతర వైరుధ్యమది. ఆవైరంలో స్థానికులు ఓడిపోతారు. పెట్టుబడిని ఓడించేది, జనసమూహమే తప్ప వేరొకరుకాదన్నది ఈ కథ సారాంశం. ‘షా’ కథ పేరే దాన్ని సూచిస్తుంది. చదరంగం ఆటలో బంటుల్తో రాజును ముట్టడించటాన్నే ‘షా’ అంటారు. ఈ కథలో ముట్టడికి నాయకత్వం వహిస్తున్న రైతుకూలీ సంఘం నాయకుడు రైతుకూలీ సంఘం డిమాండ్లను స్థానిక పెట్టుబడి దారుడుగా ఎదిగిన శంభునాయుడు విని శభాష్ అనుకుంటాడు. శంభునాయుడి తండ్రి వ్యవసాయకూలీ ఉద్యమకారులతో పాటూ గొంతు కలుపుతాడు. కథలో ఎక్కడా స్థానిక పెట్టుబడిదార్ల మద్దతుగా వాక్యంగానీ, సంఘటనగానీ లేదు. అయితే మల్లీశ్వరి పొరబాటు ఎక్కడపడుంటుందంటే శంభునాయుని వైన్ షాప్‍లో పనిచేసే సేల్స్‍మేన్ తన అంతరంగం నుంచి శంభునాయుడి ఎదుగుదలని, బతుకు అవకాశాల్ని పాఠకులకు ఇలా వినిపించారు. ‘ఇతగాడంటే మోతుబరోడు…..తండ్రిని కాలవ భూముల ఊరిలో దించి, యితగాని పట్నంలో దిగేడు’. అని శంభు నాయుడి స్థానాన్ని అంచనా కడతాడు.

స్థానికులు స్థాపించిన మోడరన్‍రైస్‍మిల్లును, శంకర్రాజు ఎరువుల గోడౌన్‍ని ‘బలిసిన మృగంలా, స్నోవైట్ కాన్వెంట్‍ను చిలుకలను బంధించిన పంజరంతోనూ అప్పలనాయుడు పోల్చడం జరిగింది. మరి స్థానికులేర్పాటు చేసిన ఇంత చిన్న పెట్టుబడులను కూడా బహుళజాతి పారిశ్రామిక పెట్టుబడులకు ఉపయోగించాల్సిన ఉపమానాలనే ఎందుకు వాడారు? ఈ ఉపమానాల వాడకాన్ని బట్టి స్థానిక, స్థానికేతర పెట్టుబడుల వ్యత్యాసాలను పాటించినట్లుగా అనిపిస్తుందా మల్లీశ్వరి.

కథ ముగింపులో కూడా, నదీ జలాల వినియోగానికి సంబంధించిన డిమాండ్‍ను రైతు కూలీ సంఘం పెడుతోంది తప్ప స్థానిక పెట్టుబడిదారుడు కాదు. అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది. ముగింపులో ఇంత స్పష్టంగా బోధపడుతుంటే, మల్లీశ్వరికెందుకు బోధపడలేదు చెప్మా!

‘కథంతటిలో కార్పొరేట్ పెట్టుబడి విశ్వరూపాన్ని చూపిన అప్పలనాయుడు దానిని ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని విశ్వసించారు. తమ ప్రాంతానికి చెందని ఏ పెట్టుబడినైనా వ్యతిరేకించటం కోసం స్థానికంగా వుండే అన్ని వర్గాలవారు కలిసి పనిచేయడాన్ని ఈ కథ ద్వారా ప్రతిపాదించారు.’ అని మల్లీశ్వరి అట్టాడచేసిన ప్రతిపాదనలుగా ప్రతిపాదించడం ఆమె అవగాహనాలేమిని తెలియజేస్తుంది. ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం.

అప్పలనాయుడు తన కథలో కిరణ్ పాత్రద్వారా ఈక్రమాన్ని చిత్రించారు తప్ప మల్లీశ్వరి ఆశించినట్లు, అర్థంచేసుకున్నట్లుగా, ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని చెప్పారె తప్ప, స్థానికవాద, ప్రాంతీయఉద్యమ ప్రబోధకంగా కథనం చేయలేదు. స్థానిక పెట్టుబడిని రక్షించుకోవాలి లేదా నిలుపుకోవాలనే ప్రయత్నం కథలో ఎక్కడా ప్రస్థావించలేదు. ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు. ప్రజలనాయకత్వాన్ని శంభునాయుడు మెచ్చుకుంటాడు, ఆశ్చర్యపోతాడు కూడా. అతని తండ్రికి మరోమార్గంలేక నాయకత్వం వెంట నడుస్తాడు. శంభునాయుడి తండ్రిది భూస్వామ్య మనస్తత్వం. తన రాజ్యంలో ప్రవేశించిన శత్రు సైన్యంలాగానే బహుళజాతి కంపెనీల వాహనాలను, వర్కర్స్ ను చూస్తాడు. మరి అతడు ప్రజాసంఘాల నాయకత్వంలోకి రావడానికి ప్రజా ఉద్యమాలపట్లగల మమేకత్వంతో కాదు.

స్వతహాగా భూస్వామికి స్థానిక ఉత్త్పత్తివనరులైన భూమి నదులపట్లగల ప్రేమతోనే. శంభు నాయుడు దూరమవుతున్న అతని మూలాల్ని గుర్తుచేస్తాడు. స్వతహాగా శంభునాయుడిది మోతుబర్ల కుటుంబం. అందుకే అతనిమూలాల్ని గుర్తుచేసే ఎరుకలో ఏమాయా మర్మం కనిపించలేదు. తననుతాను స్వఛ్చందంగానే ఆవిష్కరించుకుంటాడు. ఆ ఆవిష్కరణే శంభునాయుడ్ని తనతండ్రికి ప్రకృతి వనరులపట్లగల ప్రేమ అతన్ని ద్రవీభూతం చేస్తుంది. అతను తండ్రి ఆలోచనలపట్ల ఎప్పుడు? ఎందుకు? మూవ్ అవుతున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే, తన రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లిందనుకున్నప్పుడే శంభునాయుడు తండ్రిని గుర్తించగలుగుతున్నాడు, భూస్వామి మనస్తత్వం ,పెట్టుబడిదారీ మనస్తత్వాలలో కొద్దికొద్ది తేడాలున్నప్పటికి, ఇద్దరి లక్ష్యం ప్రజావ్యతిరేక పథాయే. అయితే, తమ ఉనికికే భంగం కలుగుతున్నప్పుడు శంభునాయుడు,అతని తండ్రిలాంటి వాళ్ళందరూ ప్రజాఉద్యమంలో కలవాల్సిన అనివార్యతను ‘షా’కథలో అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. అంతమాత్రంచేత అది ప్రజాపోరాటం కాకుండా పోదు. వీళ్ళందరూ తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినంత మాత్రాన, అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాకుండాపోదు. అంతే తప్ప, ఒక ప్రాంతంలో వచ్చినంత మాత్రాన అది స్థానిక ఉద్యమం కాదు. ఏ ఉద్యమమైనా ఎక్కడో ఒకచోట మొదలుకాక తప్పదు. స్థానికత నుండే సార్వజనీనతను పొందుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను. మరి అట్టాడ అప్పలనాయుడి కథల్లో మల్లీశ్వరి అస్థిత్వవాదమెందుకు తెచ్చిందో అర్థంకాదు.

ఈమే స్వయంగా పాలపిట్టమాసపత్రిక, ఆగస్టు, 2013. సంచికలో అట్టాడ అప్పలనాయుడుతో చేసిన ఇంటర్వ్యూలో కూడా రచయితను అస్థిత్వవాదంపై వేసిన ప్రశ్నకు జవాబుగా అట్టాడ ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రాంతీయ, వర్గ దృక్పథాల పట్ల తనకుగల అభిప్రాయాలను స్పష్టీకరించిన దాన్ని అక్షరబద్ధం చేసింది. వాళ్ళ మాటల్లోనే గమనిద్దాం!

“వర్గచైతన్యం నుంచి ప్రాంతీయ అస్థిత్వవాదిగా మీ పరిణామం కేవలం సాహిత్య సంబంధమైనదేనా?” అనే ప్రశ్నకు అట్టాడ జవాబుగా, “నిజానికి మీరన్నట్లు నేను కేవలం ప్రాంతీయ అస్థిత్వవాదిని కాను. ప్రాంతీయ ప్రజాపొరాటాలనేవి రూపంలో అస్థిత్వ ఉద్యమాలలాగా కనిపిస్తాయిగానీ సారంలో అవి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలుగా అభివృద్ధి కాగలవు. ఆ భావనతోనే ప్రాంతీయ ఉద్యమాలను అర్థం చేసుకుంటాను. కనుక నిర్ధిష్ట ప్రాంతీయ పోరాటాలను అక్షరీకరిస్తున్నాను. వర్గచైతన్యానికి పోటీగానూ, ప్రత్యామ్నాయంగానూ ప్రాంతీయ అస్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. కాకపోతే వర్గ చైతన్యమనేది, నేడు అస్థిత్వ పోరాటాలను భూమికగా తీసుకొని అభివృద్ధి కావాలన్నది నాభావన.”

190291_290372241079057_1667688954_n

మల్లీశ్వరే స్వయంగా అట్టాడ అప్పలనాయుడి సమాధానాన్ని అక్షరాలా సాక్షీకరించింది. మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో కానీ మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడ్ని ప్రాంతీయవాదిగా ముద్రవేసే విఫలయత్నం చేసింది.ఇలా తన అజ్ఞానాన్ని ‘వివిధ’ లాంటి ప్రతిష్టాత్మక సాహిత్య పేజీలో నలుగురితో పంచుకోవడమేకదా! దయచేసి ఇప్పుడైనా అప్పలనాయుడి ముఖచిత్రంతో వచ్చిన పాలపిట్ట ప్రత్యేక సంచికను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది.

విద్యాసాగర్ ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రామీణ పరిశోధన గ్రంధం ఆధారంగా వర్తమాన కథను పరిశీలించదలచి, గౌరునాయుడు, అప్పలనాయుడుల రెండు కథలను మాత్రమే గ్రహించి, (తిరుగుడు గుమ్మి, నీటిముల్లు, ఒకరాత్రి రెండు స్వప్నాలు-గౌరునాయుడు; మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత- అప్పలనాయుడు కథలిన్ని ఉండగా)ఒకటి రెండు కథల్లో రచయిత దృక్పథాన్ని పోల్చడం, అంచనా కట్టగలగడం అంత సరైన పద్ధతీ కాదు. సాధ్యంకాదు. మల్లీశ్వరి ఈ వ్యాసాన్ని విద్యాసాగర్ పుస్తకాన్ని సమీక్షగా చేసుకొని తన వ్యాసాంతంలో రచయితల బాధ్యత గురించి, గ్రామాలలో మారిన పరిస్థితులను అర్థంచేసుకోవడానికి రచయితలు తప్పక చదవాల్సిన గ్రంధంగా చెప్పింటే ప్రయోజనముండేది. విద్యాసాగర్ అభిప్రాయాలకు- అప్పలనాయుడు, గౌరునాయుడు కథలకు గల సహజాత వైవిధ్యాన్ని ఒక లోపంగా, పొరపాటుగా చెప్పడం వలన అటు విద్యాసాగర్ పుస్తకానికీ న్యాయం జరగలేదు. ఇటు ఈ ఇద్దరి రచయితల కథలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, విద్యాసాగర్ పల్లెల్లోకి ప్రవేశించిన పెట్టుబడి విశ్వరూపాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేకరించిన గణాంకాలను ప్రచురించారు.

ఒకప్పటి పల్లెల్ని చూసిన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మేధో వ్యవసాయం చేసేవారికి, మారిన పల్లెల్ని చూడని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ పరిశోధన గ్రంథం కళ్లు తెరిపిస్తుంది. అయినా, ఇది 2013సంవత్సరంలో వచ్చిన గ్రంథం. ఒక దశాబ్ధమున్నర ముందుగానే “క్షతగాత్రగానం”(1988) దానికి ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన ‘షా’ (2005)కథలు అప్పలనాయుడు రాశారు. విద్యాసాగర్ ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు. విద్యాసాగర్ పరిశోధించి ఆవిష్కరించిన సత్యాలను అట్టాడఅప్పలనాయుడు తన కథల్లో ఇంతకుముందే చిత్రీకరించారు. ఈ అంశాన్ని డా.మల్లీశ్వరి పరిశీలించలేకపోయారు. దృష్టిలోపమా? దృష్టికోణంలోనిలోపమా?.

– డా. కె. శ్రీదేవి

 అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు శాఖ

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం .

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

 

మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి.   వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది.  ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.  


ఓ రోజు, ఆశ్చర్యగొల్పుతూ వారు మా ఇంటి ముందు నుండి బారులు తీరిన  ఏండ్ల బళ్ళలో వెళుతూ ..  ఆతర్వాత ఓ రోజు మా ఇంటి దగ్గర వారి బళ్ళు ఆపుకొని మా బోరింగ్ దగ్గర కూర్చొని వారు వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినడం నాకు వాళ్ళని గమనించడానికి అవకాశం దొరికింది. వాళ్ళు అక్టోబరు మాసంలో చెరుకు కొట్టడానికి ఇళ్ళనుండి బయలు దేరి వెళ్ళిన వాళ్ళు మార్చిలో వెనక్కి వస్తున్నారట.   ప్రతి సంవత్సరం అలా పిల్లాపాపలతో, గొడ్డు గోదా తీసుకొని వెళ్తారని మా వాళ్ళు చెప్పారు. చక్కని ముఖ కవళికలతో అందంగా, మంచి రంగుతో, పొడుగ్గా ఉండే వారి నడినెత్తిపైకి  కట్టి ఉండే జుట్టు, వారి మెడలో కనిపించే పూసలు, నిండు రంగులలో ఉండే బట్టలూ  ఆసక్తితో గమనించేదాన్ని.  మా వాళ్ళందరూ  చిన్నప్పటినుండి చూస్తూ ఉండడం వల్లనేమో వాళ్ళకి ఆ జాతి వారిని ప్రత్యేకంగా చూసేవారు కాదు.   నాకు మాత్రం వారు చాలా ప్రత్యేకంగా ఆనాటికీ ఈనాటికీ… నన్ను అంతగా ఆకర్షించిన వారే మథుర లంబాడీలు.

మధుర లంబాడాలు మాములుగా మనకు కనిపించే లంబాడాలు లేదా బంజారాలు లేదా సుగాలీలు లకు భిన్నంగా కనిపిస్తారు.  వారి భాష, ఆచార వ్యవహారాలు, కట్టు అన్నింటిలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తారు 

మధుర లంబాడాలు మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా కొద్దిగా కనిపిస్తారు. వీరు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు.  గుజరాత్ లో ఎక్కువ .  వీరిని మహారాష్ట్ర, గుజరాత్ లలో మధుర బంజారా, చత్తీస్ గడ్ లో మధుర లంబాని, మధ్యప్రదేశ్ లో మధుర లబాన్, ఉత్తర ప్రదేశ్ లో మధురాలు లేదా మధూరియా అని అంటారు.  మహారాష్ట్రలో వీరిని డి నోటిఫైడ్ విముక్త జాతులుగా ప్రకటించారు.
రాజస్థాన్ లోని బికనీర్, బహాల్యాపూర్ , పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ జాతి ఆవిర్భవించిందాని చరిత్ర కారుల అంచనా.  రాజపుట్ వంశస్తుల అనచివేయబడిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్రకారుల అంచనా.
DSC_0002
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా ,  నిజామాబాద్ ).
నిజామాబాద్ జిల్లాలో  వీరిని  మధుర లంబాడాలు అనీ, కాయితి లంబాడాలు అనీ, కొప్పు లంబాడాలని , జుట్టు లంబాడాలని రకరకాలుగా పిలుస్తారు.   వారి భాష, వేషధారణ, నగలు ,  పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాయిద్య పరికరాలు అన్నీ ప్రత్యేకమే.  అటవీ ప్రాంతాల్లోనే వీరి నివాసం.  మైదాన ప్రాంతాలకి వారాంతపు అంగళ్ళకి  వస్తారు. 
 
మధుర లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి. అవి నాయక్, బామన్, బాద్రియా, కిత్రియా,లేల్యా, మాంద్యా, బర్దావల్, తిత్రియా , పెళ్యా, సాబ్ల్యా, భట్ .    నాయక్ అందరికన్నా పై స్థాయిలో ఉంటే భట్ లు అందరికన్నా తక్కువ.
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , వర్ని మండలం, నిజామాబాద్ ). అయితే తమ వాళ్ళు ఎప్పుడొచ్చింది ఖచ్చితంగా చెప్పలేమని, మా ముత్తాతల ముత్తాతలది కూడా ఇదే ఊరు అంటాడు అతను.
మేం అంతా బస్సు తీసుకొని మా జాతి అంతా ఒక దగ్గర కలుస్తోంది అని తెలిసి గోకుల్ మధుర వెళ్లి వచ్చాం. అక్కడికి మాకు చూస్తే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా .  వాళ్ళు అంతా  చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో . డాక్టర్లు , ఇంజనీర్లు , కలెక్టర్లు . కొందరు అమెరికాలో . ఇక్కడ మేం ఇంకా అడవిలోనే .  చదువు సంధ్యలకు దూరంగానే ..  మా పిల్లలను  బాగా చదివించాలని ఇప్పుడు మా తపన అన్నాడు గోకుల్ దాస్ తండాకు చెందిన నాయకుడు బారత్యానాయక్
మా ముత్తాతల ముత్తాతల ముందు తరాల వాళ్ళు వందల ఏళ్ళ  క్రితం వచ్చినప్పుడు మా జాతి ఎట్లా ఉందో అట్లానే మా జాతి లక్షణాలు మా దగ్గరే బతికి ఉన్నాయి.  అక్కడ మా జాతి కట్టు బొట్టు , వేషభాషలు ఏమీ ఇప్పుడు  కనిపించవు  అన్నాడు పదవతరగతి వరకు చదివిన సజ్జన్లాల్ .
ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు మా జాతీయులు అని గుర్తించవచ్చు అంటాడు ఇంజినీరింగ్ చదువుతున్న పతేసింగ్.   వందల ఏళ్ళ క్రితం చెల్లా చెదురు అయిపోయిన మా జాతిని గుర్తించడానికి, ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అందుకు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతోంది  అన్నాడు ఈ ప్రాంతంలో మధుర లంబడాల  జాతి నుండి కాబోయే మొదటి ఇంజినీర్.
జీవన విధానం 
ప్రకృతి ఒడిలో కొండ వాలులోనో, అటవీ ప్రాంతంలోని వాగు సమీపంలోనో ఉంటాయి మథుర లంబాడాల నివాసాలు.  మధుర లంబాడాలు ప్రధానంగా పశులకాపరులు.  వ్యవసాయం చేస్తారు. గోవుల కాపరి శ్రీకృష్ణుడి రాజధాని గోకుల మధుర మాది అని వాళ్ళు చెప్తారు.    వీరి మెడలో జంధ్యం ఉంటుంది.  గాయత్రి మంత్రంతో పవిత్ర జంధ్యం వేసుకుంటారు.  వాళ్లకు వాళ్ళు మేం క్షత్రియులం అని చెప్పుకుంటారు.  కానీ, బయట ప్రపంచం వీరిని గిరిజన తెగలకు చెందిన వారిగానే చూస్తుంది.
వీరు సంచార జీవులుగా ఉన్న కాలంలో వీరు తండాల్లో ఉండేవారు.  వీళ్ళ నాయకుడుని నాయక్ అంటారు . వంశానుగాతంగా ఆ పదవి వస్తుంది.  నాయక్ ఎప్పుడూ తమ వారి మంచి కోసం ఆలోచిస్తూ కృషి చేస్తాడు.  అందరూ అతని మాటని గౌరవిస్తారు.
illu
ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి.  ఒక్క కుటుంబంలో అరవై డెబ్బై మంది కుడా ఉంటారు.  వ్యవసాయ పనులు, పశువుల పెంపకం అంతా కలసి చేసుకుంటారు .  పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో ఉంటారు.
ఇప్పుడు  తగ్గిపోయింది కానీ ఐదారేళ్ళ క్రితం వరకూ గోవులను మేపుతూ అలా రోజులు నెలల తరబడి వెళ్ళేవారు . ఇంటికి దూరంగా ఉండే వారు. గోవుల మందలను తోలుకెల్లి పొలాల్లో మంద పెట్టె వాళ్ళు.  అందుకు ప్రతిఫలంగా రైతులు జొన్నలు , వడ్లు ఏదో ఒక ధాన్యం ఇచ్చే వారు.  వీరి  జీవనం చాలా కష్టంగా సాగేది.  అప్పట్లో మాకు నాగరికత తెలియదు.  గత 20 ఏళ్లలో మా  జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.  నాగరికత తెలిసింది.  మా  కట్టు-బొట్టు, ఆచార వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది అంటాడు భారత్యా నాయక్ బంధువు .
అవును, అప్పుడు మాకు  అప్పులు లేవు.  ఇప్పుడు అప్పులు వచ్చాయి. ప్రభుత్వం వారూ, బాంకు వాళ్ళు రుణాలు ఇస్తున్నారు.  అవకాశం ఉంది కదా అని  భార్య పేరున  , పిల్లల పేరా అప్పులు చేసి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు ,  పొలాలు , బోర్లు సమకూర్చుకుంటున్నాం. కానీ అప్పటి రోజులే బాగున్నాయి అప్పులు లేకుండా యాలకింత తిని కంటి నిండా నిద్ర పోయే వాళ్ళం అన్నాడు భారత్యా నాయక్.
ఇప్పటికీ వ్యవసాయంలో నాగలి, రెండు  చక్రాల ఎడ్ల బళ్ళను  ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ ఉంటారు.   ఇప్పుడిప్పుడే  ట్రాక్టర్లు , కొత్త మిషన్లు వంటి యంత్రాలు వీరి జీవనంలోకి వచ్చి చేరుతున్నాయి.  
 
ఆహారం
వాస్తవానికి వీరు శాఖాహారులు.  అయితే నేటి తరం వారు మద్యం, మాంసాహారానికి అలవాటుపడిపోయారు.   వీరి సాంప్రదాయిక ఆహారం రోటి. జొన్నలు బాగా తింటారు .   గోధుమ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము , కంది పప్పులు ఎక్కువగా తింటారు . టమాటా , వంకాయ వంటి రకరకాల కూరగాయలు వాళ్ళ పొలాల్లో పండేవి తింటారు. ఆకుకూరలు తింటారు.  వరి బియ్యం తినడం ఒకప్పుడు లేదు. తిన్నా ఎప్పుడో పండుగ సమయాల్లో మాత్రమే తినేవారు. యన్. టి. రామారావు ప్రభుత్వం ఏర్పాటైన  తర్వాత రెండురూపాయల బియ్యం ఇచ్చినప్పటి నుండి నెమనెమ్మదిగా  బియ్యం తినడం అలవాటు అయింది  అంటాడు మాజీ సర్పంచ్ భర్త మోతిలాల్.
జామ, అరటి , యాపిల్ వంటి పళ్ళన్ని వారాంతపు సంతలో తెచ్చుకుంటారు.  పెరుగు, నెయ్యి  బాగా వాడతారు.  తీపి పదార్ధాలు ఇష్టపడతారు. టీ తాగుతారు.   పల్లీలతో, కందగడ్దలతో( చిలగడ దుంప) పండుగ సమయాల్లో పాయసం చేసుకుంటారు.
వారి ఇళ్ళు 
కొండ కోనలకు సమీపంలో వీరి నివాస సముదాయాలు ఉంటాయని ముందే చెప్పాను కదా !  సమీపంలోని అడవినుండి తెచ్చిన టేకు దుంగలను గోడలుగా అమర్చుకుంటారు.  పైన వర్షాకాలపు పంటకు వచ్చే  వరిగడ్డిని తెచ్చుకుని ఇళ్ళపై  కప్పుతారు.  ఇంటి ముందు పశువుల పాకలు ఉంటాయి.  పశువులే వారి ఆస్తి. లేగ  దూడలను ఇంట్లో తమతో పాటే ఉంచుకుంటారు.  వంటకి కట్టెల పొయ్యి వాడతారు.  
గతంలో పొయ్యిలో నిప్పు ఉన్నప్పుడే అన్నం తినేవారు. ఆరిపోతే తినరు . ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉపయోగించుకొని కొందరు పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళలో విద్యుత్ దీపాలు కనిపిస్తాయి.  మీటరు ఉండదు కానీ వైర్ తగిలించి విద్యుత్ దీపాలు వెలిగించు కుంటారు కొందరు.  కొందరి ఇళ్ళలో టి.వి లు కూడా వచ్చేశాయి.  నాగరిక ప్రపంచంలో కనబడే అనేక వస్తువులు అడవుల్లోనో , అటవీ అంచుల్లోనో ఉండే వారి ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి. 
 
స్నేహానికి ప్రాణమిచ్చే మథుర లంబాడీలు కొద్దికాలం క్రితం వరకూ అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోయారు. 
muchchatalo
మాతృభాష 
వీరి భాష లంబానా భాష.  వీరి  భాషలో మరాఠీ , హిందీ, బంజారా భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి.   నిరక్షరాస్యులైన వీరు మాతృభాషతో పాటు స్థానిక భాషలు మాట్లాడతారు.
భాషలో కొన్ని పదాలు 
లెహెంగ  (లంగా)
కచలి  (జాకెట్)
నమస్తే –  రామ్ రామ్
యా/బాయి  – అమ్మ
బా – నాన్న
దాదా – అన్న
జీజీ – అక్క
జీజొ – బావ
దండో – తాత
డంగి – నాన్నమ్మ
పుప్పీ – అత్త
పెళ్లి – బ్యహ
బాడువా – వడక లగ్గం
నాక్డా – నాయక్
పూజించే దేవతలు 
 
వీరు శ్రీ కృష్ణుడిని కొలుస్తారు.  తిరుపతి బాలాజీ , పూరి జగన్నాధ్ ని పుజిస్తారు.  
 
పండుగలు 
మథుర లంబాడాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పండుగ గోకులాష్టమి.  వీరి నివాసాలకు వెళితే శ్రావణమాసం అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.
DSC_0016
వస్త్రధారణ 
పెళ్ళికాని ఆడపిల్లలు లేహంగా, కచలి (జాకెట్ ) వేసుకుంటారు . పెళ్లి అయిన స్త్రీలు  చీర వాళ్లపద్దతిలో కట్టుకుంటారు.  
మగవారి ఆభరణం జంధ్యమే . దీన్ని జనువా అంటారు.  సాంప్రదాయంగా ధోతీ (బారకషి ), జుబ్బా (జహంగల ) వేసుకుంటారు. 
 
చదువు 
చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. అతి కొద్ది మంది ఇంటర్ వరకు చదివి  ఉద్యోగం చేస్తున్నారు.  ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళారు.  ఆడ పిల్లల్లో చదువుకునే వారి సంఖ్యా మరీ తక్కువ.  ఇప్పుడిప్పుడే 10 వతరగతి కి వచ్చారు . ఒకరిద్దరు ఇంటర్ చదివితే , ఒకమ్మాయి మాత్రం నిజామాబాద్ లో ఉంది ప్రైవేటు కాలేజిలో ఇంగ్లిషు మీడియంలో డిగ్రీ చదువుతోంది.
పెళ్లి: 
మగవాళ్ళకి 21, వదువుకి 16 పెళ్లి వయస్సు.
మధుర లంబాడాల తండాలో నాయక్ అందరికీ పెద్దగా ఉండి గ్రామ మంచి చెడులు, గ్రామ మంచి కోసం చేసే కార్యాలు చేస్తాడు.  అలాగే భట్ గోత్రికుడి కి కూడా వంశపారంపర్యంగా బట్ పని వస్తుంది.  అతను నాయక్ కి సహాయకుడిగా ఉంటాడు. అంతే కాకుండా పెళ్లిల్లప్పుడు పెళ్లి పనులు చేస్తాడు.
అతను చేసే సేవలకు వారి వారి ఆర్ధిక స్థాయిని బట్టి కొత్త సొమ్ము ఇచ్చేవారు. మొన్నటి వరకూ పదకొండు వందల రూపాయలు ఇచ్చేవారు.  ఇప్పుడు 5 వేలు ఆరు వేలు కూడా ఇస్తున్నారు.
ఊరిలో ఎ సమాచారమయినా అందరికి చేరవేస్తాడు భట్.  పెళ్లి పిలుపులు , చావు వార్తలు అతనే చేర వేస్తాడు.
మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు సహజంగానే వారినీ ప్రభావితం చేయడం కనిపిస్తుంది.  ఒక  సమాజానికి  మిగతా సమాజాల వారితో సంపర్కం ఏర్పడ్డాక, రాకపోకలకు సదుపాయాలు ఏర్పడ్డాక, సమాచార వినిమయం పెరిగాక వచ్చే మార్పులు వీరి జీవన విధానంలోకి చోచ్చుకోచ్చేశాయి.
ఇంతకు ముందు పెళ్లి పత్రికలు వేయించేవారు కాదు.  ఆకులు – పోకలు ఇచ్చి ఫలానా వారి పెళ్లి ఉందని చెప్పి పిలిచే వాళ్ళు. ఇప్పుడు పెళ్లి పత్రికలు వేయిస్తున్నారు.
ఒకప్పుడు బ్రాహ్మడు ముహూర్తం చూసి పెళ్లి సమయం నిశ్చయించే పద్ధతి లేదు.  పెళ్లి సమయాన్ని నాయకుడే నిర్ణయించే వాడు.  ఆ సమయానికే పెళ్లి జరిగేది.  ఇప్పుడు కూడా నాయక్ పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు కానీ బ్రహ్మడికి కూడా చూపిస్తున్నారు.  ఆ సమయం మంచిదో కాదో చెప్పించుకుంటున్నారు.
అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు చూసుకునే పద్ధతి కూడా లేదు.  అమ్మాయి తరపు వారు అబ్బాయి గురించీ, అబ్బాయి తరపు వారు అమ్మాయి గురించీ ముందే బంధు మిత్రుల ద్వారా తెలుసుకుంటారు.  ఆ తర్వాత ఇరువర్గాలు నాయకుడి ఇంటి దగ్గరికి వస్తారు.  ఆకులు – పోకలు ఇచ్చి పుచ్చుకుంటారు. తింటారు.  పెళ్లి చేసే విధానంలోనూ అనేక మార్పులు.
పెళ్ళైన ఆడపిల్లకి కాలిపాట్ అని నల్లపూసల మంగళసూత్రం ఉంటుంది.  రక్షడి,  కాఖడి  జుట్టులో పెట్టుకుంటారు. ఇత్తడి కాళ్ళ కడియాలు, గూటి (టో రింగ్ ), బిడ్ (మెడ , చెవుల నగలు ). ఒకసారి పెడితే అవి చని పోయే వరకూ తీయరు. భర్త చని పోయిన స్త్రీ అవి తిసివేస్తుంది.
విడాకులు తక్కువ .  పిల్లలు పుట్టకపోతేనో , భార్య చనిపోతేనో, ఆరోగ్యం బాగోలేకపోతేనో మళ్లీ పెళ్లి చేస్కోరు.  విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్త చనిపోయిన మహిళలు  మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రెండో సారి పెళ్లి చేసుకొనే మహిళ వాళ్ళు విడాకులు తీసుకున్న వారినో , భార్య చనిపోయిన వ్యక్తినో చేసుకుంటారు.  విధవరాలిని రండ్ అంటారు.
మగవాళ్ళు విడాకులు కోరితే ఆడపిల్ల వారికి కుల పంచాయితీ పెద్దలు చెప్పిన విధంగా భరణం చెల్లించాలి.  విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత భర్తదే. పెళ్లి జరిగాక చేసే పెళ్లికి సంబంధించిన గుర్తులన్ని ఉంచుకోవచ్చు. భార్య/భర్త నడవడి బాగోలేకపోతే విడి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు.  రెండో పెళ్ళిని మొహ్తుర్ అంటారు.
కట్నం ఇచ్చి పుచ్చుకోవడం లేదు.  ఒకప్పుడు అబ్బాయి అమ్మాయికి కట్నం ఇచ్చే పద్దతి ఉండేది.  ఒలి ఇవ్వలేక అబ్బాయిలు ముదిరిపోయేవారట. ఓలి ఇచ్చి చేసుకునే వారు లేక అమ్మాయి ల పెళ్ళిళ్ళు అలస్యంగానే జరిగేవి.  అయితే ఇప్పటికీ పెళ్ళిలో అమ్మాయికి 11 రూపాయలు కట్నంగా ఇచ్చే పద్ధతి ఉంది.  ఓలి  పద్ధతి లేదు.  గురువు వచ్చాక ఆ విధంగా ఇవ్వడం మానేశారు.
 అమ్మాయి కుటుంబం పేదదయితే పెళ్లి చేసే స్తోమత లేకపొతే , ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తీసుకు వెళ్ళలనుకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆబ్బాయి వాళ్ళు ఇస్తారు. పెళ్లి చేసుకొని  అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.
ఇంటి కోడలు పురిటికి కన్నవారింటికి వెళ్ళే ఆచారం లేదు.  అత్తవారింటిలోనే పురుడు పోసుకుంటారు. పురిటి ఖర్చు అత్తింటి వారిదే . బిడ్డ  పుట్టిన రెండు మూడు నెలల తర్వాత వెళతారు.  ఒకప్పుడు ఇంటిదగ్గరే పురుడుపోసుకునే వారు. ఇప్పుడు ఆసుపత్రి కి వెళుతున్నారు.  నెలరోజులు పురిటి మైల పాటిస్తారు. ప్రత్యేకమైన గదిలోనే ఉంటారు.  ఆసమయంలో బిడ్డపనులు, తన పనులు తప్ప తల్లి ఏ పని  చేయదు. 
vaari veedhi
 బహుభార్యాత్వం 
సాధారణంగా ఏకభార్యత్వం పాటిస్తారు.  కొన్ని సందర్భాల్లో బహుబార్యత్వం కనిపిస్తుంది.  మొదటి భార్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా చేసుకుంటారు.
బంధుత్వాలు
చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల్ని చేసుకోరు. మేనరికాల్ని చేసుకుంటారు.
అన్న చనిపోతే వదినని తమ్ముడు చేసుకోవచ్చు.  కానీ, తమ్ముడి భార్యని అన్న చేసుకోడు.
వాయిద్య పరికరాలు 
నగారా , బాజాలు , గిల్ల
మహిళల భాగస్వామ్యం 
మగవాళ్ళ లాగే మహిళలూ అనడంతో పాటు ఎత్తుగా బలంగా ఉంటారు. స్త్రీలు ఇంటిపని, పొలం పని, పశువులు పాడిపనో  ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు.  ఒకప్పుడు బట్టలు చేత్తోనే కుట్టుకునే వారు.  ఇప్పుడు వాళ్ళ బట్టలు కుట్టడానికి ప్రత్యేకంగా ఉన్న దర్జీ కుడతారు.  వాళ్ళతో మాట్లాడినప్పుడు వారెవరికీ మిషను కుట్టడం రాదన్నారు.  గతంలో తీరిక సమయాల్లో  రకరకాల చేతికుట్లు కుట్టేవారట. ఇప్పుడు కుట్టడం లేదు అంటూ ఇప్పుడు అంతా కాలం మారిపోయింది కదా ..  ఆ కుట్టినవి.   ఇప్పటి వాళ్ళు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది ఓ వృద్దురాలు.
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ నుండి ఎవరో వచ్చారు.  మా తండాలన్నీ తిరిగారు. మా దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలకు ఉన్నవయినా సరే మేం చేత్తో కుట్టిన వాటిని అడిగారు. వాటికి బదులుగా మాకు ఇత్తడి సామాన్లు ఇస్తామన్నారు.  ఏమి చేసుకుంటాం అని మా దగ్గర ఉన్నవన్నీ వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేశాం అంటూ వాళ్ళు ఇచ్చిన ఇత్తడి గిన్నెలు చూపింది ఓ మహిళ.  ఇప్పుడు మా దగ్గర మేం చేసిన కుట్లు అల్లికలు లేవు. ఎక్కడో  ఒకరి దగ్గర తప్ప. అవి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు.  ఇప్పటి ఆడపిల్లలు ఎక్కడ నేరుస్తున్నారు ..? అంది జమునాబాయి .
మధుర లంబాడాల కుటుంబాల్లోనూ  మగ పిల్లవాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లకి ఇవ్వరు.  ఆడపిల్లలు బడికి పోయేవాళ్ళు చాలా తక్కువ.  గొడ్డు గోదా మేపడానికో, చేను కాపలాకో, ఇంటి పనులు చేయడానికో ఆడపిల్లలని బడికి పంపకుండా ఇంటిదగ్గరే ఉంచుతారు. ఏ పనులూ లేనప్పుడు  పంపినా తమ తండాలో ఉన్న బడికే. చాలా కొద్ది మంది ఆడపిల్లలు ఊరు దాటి వెళ్లి చదువుకునేది.  అదే మగపిల్లలయితే బడి ఉన్నప్పుడు ఊర్లొ కనిపించేది చాలా తక్కువ.
నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్తూనే మా గురించి అన్ని అడుగుతున్నావ్.. నీమిటి లాభం అని ఒకరు అంటే .. సర్కారు జీతం ఇస్తుందా అని మరొకరు .. ఆ ఏమి లాభం లేకుంటే చదువుకున్నోళ్ళు మన ఇళ్ళు ఎందుకు వస్తారు అంటూ మహిళల నుండి ప్రశ్నల పరంపర.  ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.
ప్రపంచీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా శరవేగంగా  జరుగుతున్న మార్పులు, చోటు చేసుకుంటున్న ధోరణులు స్వచ్చమైన ముత్యంలా మెరిసే మథురాలలొకి వచ్చి వారినీ ప్రభావితం చేస్తున్నాయి.  ఈ క్రమంలో వారి అభివృద్ధి ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ మథుర లంబాడాల జాతి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తమ అస్తిత్వాన్ని మాత్రం ఇక ఎక్కువ కాలం నిలుపుకోక పోవచ్చేమో త్వరలోనే కోల్పోతుందేమోనని నా  బెంగ.
వి. శాంతి ప్రబోధ

స్త్రీవాద విమర్శలో నిరసన, ప్రతిఘటన- కాత్యాయనీ మేలుమలుపు

                  కాత్యాయనీ విద్మహేకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో సమాన ప్రవేశం వుండటం వల్ల రెండు కాలాల సాహిత్యాలలోని స్త్రీవాద దృక్పథాన్ని ఆవిష్కరించటంలో స్త్రీవాద విమర్శను ముందుకు నడిపించగలిగారు. ‘ స్త్రీవాద సాహిత్యం – స్త్రీవాద భూమిక పుస్తకంలోని వ్యాసాలను చాలా నిర్థిష్టంగా స్త్రీవాద సిధ్ధాంత భూమికలోంచి  ‘ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించారు. విమర్శ చేయాల్సిన పని సాహిత్యంలో అమూర్తంగానయినా ఆవిష్కరించబడిన భావాల వెనుక వున్న విషయాలను వెలికితీసి వాటి తాత్విక మూలాలను ఆవిష్కరించగలగటం. ఈ పనిని కాత్యాయనీ విద్మహే చాలా సమర్థవంతంగా ప్రాచీన ఆర్వాచీన సాహిత్యాలకు అనువర్తింపచేశారు.

                  స్త్రీ శరీరం స్త్రీకి చెందకుండా చేసింది పితృస్వామ్యం. కాబట్టి శరీరాన్ని గురించి మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులకు అనివార్యమైనది.  Writing the body అనే భావం స్త్రీవాదంలో అంతర్భాగమైంది.

“Women in sexist society are physically handicapped. In so far as we learn to live out our existence in accordance with the definition that patriarchal culture assigns to us, we are physically inhibited confirmed, positioned and objectified” అంటుంది Iris Young అనే స్త్రీవాద విమర్శకురాలు దేహం లేదా శరీర స్పృహతో రాసిన కవిత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలకు సమాధానంగా కాత్యాయనీ విద్మహే ఇలా అన్నారు.

స్త్రీ అంటే శరీరంగా తప్ప మరోవిధంగా చూడలేని పితృస్వామిక సంస్కృతిని ధిక్కరిస్తూనే శరీరాన్ని గురించి ప్రపంచ సంబంధం  వలన ఏర్పడిన చైతన్యాన్ని, శరీర అనుభవ లక్షణాన్ని కవితా వస్తువుగా  చేసుకున్న స్త్రీవాద కవితలో శరీర స్పృహ ప్రధానాంశమైంది. పునరుత్పత్తి రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో  ఇది సంభవించింది. మాతృత్వపు నిరాకరణ అయినా, హక్కు అయినా తమదిగా వుండాలనే ఆకాంక్షను అభివ్యక్తి రూపాలుగా ఆ కవితను గ్రహించాలని” ఆ కవితలకు గల  తాత్విక బలాన్ని ఆమె వివరించారు.

కాత్యాయనీ విద్మహే పై మార్క్సిస్ట్ సిధ్ధాంత ప్రభావం బలంగా వున్నప్పటికీ అది ఆమె ఆలోచనను నియంత్రించకపోవటం గమనించాల్సిన విషయం. ఆ నియంత్రణ లేకుండా ఆలోచించబట్టే రష్యా లాంటి దేశాలలో కూడా స్త్రీలు  సామాజికంగా అన్ని రంగాలలో పురుషులకంటే  వెనుక వున్నారని అనగలిగారు. “ గత శతాబ్దిలో స్త్రీవాదం – తెలుగు సాహిత్యం”  అనే వ్యాసంలో అస్థిత్వ స్పృహ, శరీర స్పృహ , పునరుత్పత్తి హక్కుల స్పృహ, శ్రమ స్పృహ, కుటుంబ అధికార స్పృహ అని ఆమె చేసిన విభజనలు, నిర్వచనాలు, వివరణలు స్త్రీవాదం ఒక సిధ్ధాంతంగా నిలదొక్కుకొనటానికి అనివార్యంగా వుండాల్సిన  విషయాలు. స్త్రీవాద సాహిత్యం లేకపోతే ‘తెలుగు సాహిత్యానికి విస్తృతి లేదు, వినూత్నత లేదు, విశిష్టత లేదు. అని ఆమె ప్రకటించగలగటం వర్తమాన సాహిత్య సందర్భంలో స్త్రీవాదానికున్న  ప్రాముఖ్యతను, అనివార్యతను నొక్కి చెప్పటమే.

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

కాత్యాయనీ విద్మహే రాసిన మరో వ్యాసం  “ తెలుగు సాహిత్య విమర్శకు స్త్రీవాద పరికరాలు” (అరుణతార – డిశంబరు 2006) ఇదే వ్యాసంలో భాష గురించి, సాహిత్య విమర్శ లక్ష్యాన్ని గురించి ఆమె చేసిన నిర్థారణలు స్త్రీవాద సాహిత్య విమర్శలో చాలా కీలకాంశాలు. ఈ పై రెండు అంశాలను గురించి కూడా ఆమె ఇలా అన్నారు.

“సాహిత్యంలో వస్తువు ఏదైనా భాషా మాధ్యమం ద్వారానే వ్యక్తమవుతుంది. పితృస్వామిక సంస్కృతిలో అభివృధ్ధి చెందిన భావజాలం ఎలాగైతే పురుష ప్రయోజనానుకూలమైందో భాష కూడా అదే విధంగా పురుష ప్రయోజనానుకూలమైందే. సూటిగా నిర్భయంగా, స్పష్టంగా భావాలను ప్రకటించడానికి వీలులేని వాళ్ళ ప్రయోగం పరిమితంగానైనా వుంటుంది, లేదా ప్రత్యేకంగానైనా వుంటుంది. పరాశ్రయతను, ఆధీనతను, తక్కువ స్థాయిని సూచించేదిగా వుంటుంది. సామాజిక అధికార సంబంధాలలో అధీన వర్గాల సామాజిక అనుభవం భాషతో వాళ్ళ సంబంధాన్ని భిన్నంగా నిర్మిస్తుందని అందులో భాగంగా జెండర్ కు, భాషకూ వున్న సంబంధాలను చూడాలని స్త్రీవాదం చెప్తుంది.( పే-9)

“సాహిత్యాన్ని విమర్శించటమంటే, ఆ సాహిత్యం వెనుక వున్న విశ్వాసాలను, విలువలను విమర్శించటం. ఆ విశ్వాసాలు, విలువలు ఒక సామాజిక అధికార  నిర్మాణ సంబంధాల నుండి రూపొంది వుంటాయి. కనుక వాటిని విమర్శించడమంటే, అధికార రాజకీయాలను విమర్శించటమే.” అని గుర్తించటంలో కాత్యాయనీ విద్మహే స్త్రీవాద భావజాల సైధ్ధాంతికతను సొంతం చేసుకోవటమేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

విమర్శకులకు ఒక సిధ్ధాంతం వుండటమే ముఖ్యం కాదు. ఆ సిధ్ధాంతాన్ని నిర్థిష్ట సాహిత్య వాచకానికి (Text) అనువర్తింపచేసి విశ్లేషించినప్పుడు ఆ విమర్శకుల  సామర్థ్యం బయటపడుతుంది. ఈ విషయంలో కాత్యాయనీ  స్త్రీవాద విమర్శనా దృక్పథాన్ని ఆవిష్కరించగలిగారు.

గతాన్ని వర్తమనంతో అనుసంధానం చేసుకోవడానికి, కొథ పాతల మేలు కలయికకు పునర్మూల్యాంకనం అవసరం. గత సాహిత్యంలో విస్మరింపబడిన  కోణాలను ఆవిష్కరించటానికి సాహిత్య అధ్యయనంలో మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటానికి పునర్మూల్యాంకనం అవసరం. ఈ  విమర్శ రాయటానికి విమర్శకులకు ఎంతో అధ్యయనం, దైర్యం అవసరం. గతాన్ని సమర్ధించాలంటే కొత్తగా తలెత్తిన శక్తులు ప్రతిఘటిస్తాయి. గతాన్ని తిరస్కరించాలంటే గత అవశేషాలు విజృంబిస్తాయి. విభిన్నమైన రెండుకాలాల పరిణామాల మధ్య వారధి కట్టే సామర్థ్యం వుండాలి.  ఇలాంటి క్లిష్టమైన పునర్మూల్యాంకన  విమర్శ చేస్తున్న విమర్శకురాలు ఆచార్య కాత్యాయనీ విద్మహే. ప్రాచీన సాహిత్యం అంటే రాచరిక భూస్వామ్య వ్యవస్థను సమర్ధించే సాహిత్యం. ఇది పురుష స్వామ్య సాహిత్యం కూడా. ఈ రెండు సాహిత్యాలను స్త్రీ దృష్టికోణం నుంచి వ్యాఖ్యానిస్తూ ప్రాచీన సాహిత్యం మీద కొత్త దృక్పథాన్ని ఎనలైస్ చేశారు. సామాజిక ఆమోదం పొందిన సీత, దమయంతి, సావిత్రి, ద్రౌపది, సత్యభామ, చండిక , ప్రమీల, ప్రద్వేషిణి, గాంధారి, మాంచాల, నిపుణిక, విశాల వంటి పాత్రలు కుటుంబ వ్యవస్థ పట్ల నిరసన తెలపటాన్ని గుర్తించారు.

భారతీయ అలంకార శాస్త్రాన్ని కాత్యాయనీ స్త్రీ దృష్టికోణం నుంచి వివేచించారు. అలంకార శాస్త్రంలో స్త్రీ, రసము- మహిళ అనుభూతి, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర సందర్శనం అలంకారశాస్త్రం మనుషుల్ని గురించి మాట్లాడింది నాయికా ప్రకరణంలోనే. నాయిక చర్చంతా పురుషుడి చుట్టే తిరిగిందని అభిప్రాయపడ్డారు. అలంకారశాస్త్రం స్త్రీ వ్యక్తిత్వాన్ని గుర్తించలేదని, ఆమె వయసు, శరీరంచుట్టే తిరిగిందన్నారు. త్రివిధ నాయికలు, అష్ట విధ నాయికలు  ఏ పురషుడి దగ్గర ఉన్నారు లేదా ఏ పురుషుడి దగ్గరకు వెళ్ళారు అనే అంశం చుట్టూనే   విశ్లేషణంతా కేంద్రీకరించబడడాన్ని పురషస్వామ్య ప్రతిఫలన సాహిత్యంగా ధ్రువీకరించారు. ప్రాచీనులు అశ్లీలతను కావ్యదోషంగా పేర్కొంటూనే ఎంత అశ్లీలతను సాహిత్యంలో నింపారో అది ఆధునిక సాహిత్యంలో కూడా ఎలా కొనసాగిందో “సాహిత్యం – అశ్లీలం” అనే వ్యాసంలో తేల్చి తన స్త్రీవాద దృక్పథాన్ని వ్యక్తం చేశారు.

సాహిత్యం కూడా ఒక రాజకీయ భావజాల సాధనం. ఎందుకంటే, లింగ వివక్షతను, అసమానత్వాన్ని సాహిత్య వాచకాల్లో సమర్థించటం, సాధికారీకరించటం జరుగుతుంది. అలాగే అవి పితృస్వామిక భావజాలపు ప్రాసంగికతను బలపరుస్తాయి. అందువలన గత కాలపు సాహిత్యాన్ని విశ్లేషించి అందులోని స్త్రీ వ్యతిరేకత బహిర్గతం చేసి ఖండించడం స్త్రీవాదులు అనివార్యంగా చేయాల్సిన పని. అందువల్లనే Kate Millett తన Sexual Politics లోD.H.Lawrence, henry Millen, Normain Mailen, Jean genet లాంటి రచయితలు తమ రచనల్లో లైంగిక అధికార రాజకీయాలను ఎలా ప్రవేశపెట్టారో బహిర్గతం చేశారు. ఈ సందర్భంలోKate Millett `Sexual politics’ గురించి Toil Mai అన్న మాటలు గమనార్హం:

“……….Millett argued that social and cultural contexts must be studied it literature was to be properly understood”. (Sexual/Textual  Politics,p-24) Kate Millett భావాలు ఆ తరువాత స్త్రీవాద విమర్శకులకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. ఆ ప్రేరణలోంచి అనేక మంది స్త్రీవాద విమర్శకులు వర్తమాన సాహిత్యాన్నే కాక ప్రాచీన సాహిత్యాన్ని కూడా కొత్త స్త్రీవాద విశ్లేషణ పరికరాల సహాయంతో విశ్లేషించే పనికి పూనుకున్నారు. క్రమంగా ప్రాచీన సాహిత్య విశ్లేషణ అనేది స్త్రీవాదులు చేయాల్సిన అత్యవసరమైన పనులలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెలుగు సాహిత్య విమర్శ లోకంలో ఈ కృషిని స్త్రీవాద దృక్పథంతో మొదటగా కృషి చేసింది కాత్సాయనీ విద్మహే. తన “సాంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం” అనే రచన ఇందుకు తార్కాణం. ఈ రచనను చేకూరి రామారావు  ‘మహిళాభ్యుదయ విమర్శలో పెద్ద ముందడుగుగా”  గుర్తించటం చాలా సముచిత విషయం. ఎందుకంటే, ఈ పని అత్యంత క్లిష్టమైనదైనా అవసరమైన పని. ఆ పనిని అవలీలగా నిర్వహించగలిగారు కాత్సాయనీ విద్మహే గారు.

ప్రాచీన సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయటం వలన స్త్రీవాద దృక్పథంతో పునర్ మూల్యాంకనం చేయటం “ సంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం”  గ్రంథంలోని ప్రతి వ్యాసంలోనూ కనబడుతుంది. ఇంతకు ముందు స్త్రీవాదులు చేయలేని పనిని ఈమె చాలా సమర్థవంతంగా చేయగలిగారని చే.రా. అన్నారు.

స్త్రీల లైంగికత మీద పితృస్వామ్య నియంత్రణను ఈ రోజు స్త్రీవాదులు ప్రశ్నిస్తున్నారు. ఖండిస్తున్నారు. అందులోంచి విముక్తమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని అవలంబిస్తున్నారు. తద్వారా తమ లైంగిక స్వేఛ్ఛను Assert చేసుకుంటున్నారు కూడా. అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన ‘హంస వింశతి’ గ్రంధంలోని విశాల కథలో విశాల పాత్ర ఇలాంటి Assertion కలిగి వుండటం పాఠకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. కనకదుర్గ, కాత్యాయనీవిద్మహే సంప్రదాయ సాహిత్యంలో ప్రతిధ్వనించిన స్త్రీల ప్రతిఘటనా స్వరాల కోసం జరిపిన అన్వేషణలో విశాల కథ తగలటం కాకతాళీయం కాదు.

విశాల స్వతహాగానే భర్త శివదత్తయోగి పట్ల ప్రేమాదరణను కలిగి వుంటుంది. అందుకే అతని జంగమార్చనలో భాగస్వామి కాగలిగింది. కానీ ఆమెను భర్త రంకులాడిగా దూషించి తృణీకరించబడుతుంది. ఆమె తన లైంగికతను (Sexuality) కాపాడుకునే క్రమంలో పిత్రుస్వామ్య వ్యవస్థ ఏ అధికార రాజకీయాలతో ఆమె పాతివ్రత్యం పైన  నియంత్రణను అమలుచేసిందో, అదే వ్యవస్థ Promote చేసిన భర్త యోగిత్వాన్ని, వాక్శుధ్ధిని, తన లైంగికతను కాపాడుకోవడంలో వినియోగించుకోవటాన్ని కాత్యాయనీవిద్మహే గుర్తించారు. అందుకే  విశాల ప్రవర్తనకు దంపతీ వ్యవస్థలోని అసమానతల్నే కారణాలుగా చూపారు. స్త్రీలు దాంపత్యేతర సంబంధాలలోకి వెళ్ళే ప్రథాన కారణాలను ఈక్రింది విధంగా ప్రస్థావించడంలో స్త్రీవాద దృక్పథం స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్క విశాల విషయంలోనే కాదు, శుకసప్తతి, హంసవింశతి లాంటి కథా కావ్యాలన్నింటిలోనూ దాంపత్యేతర సంబంధాల పట్ల వ్యక్తమైన ఆసక్తిగా పైకి కనబడినా, “ దాంపత్య సంబంధాలలోని అసమానతలు, అసంతృప్తులు, ద్వంద్వ విలువలు మొదలైన వాటి పట్ల  ఏర్పడిన ఏహ్యత నుండి పుట్టిన నిరసన, తత్పలితంగా కుటుంబ వ్యవస్థా చట్రాన్ని ధిక్కరించాలనుకోవటం, ధిక్కరించేందుకు విఫలయత్నాలు చేయటం, నిపుణిక చర్య, విశాల తెంపరితనాల్ని ఈ కోణం నుండి అర్థం చేసుకోవలసినవి” అని కాత్యాయనీ ఈ వ్యాసంలో ప్రస్థావించిన అయిదుగురు స్త్రీలతోనూ గాంధారి, మాంచాల తమ నిరసనను మౌనంగానూ, మాటల్లోనూ వ్యక్తపరిస్తే ప్రద్వేషిణి, నిపుణిక, విశాల ఆనాటి సామాజిక స్థితి కంటే భిన్నమైన చైతన్యాన్ని, భావస్వేఛ్ఛను అందిపుచ్చుకున్న పాత్రలుగా కనకదుర్గ గుర్తించిందని    కాత్యాయనీ విద్మహే అభివర్ణించటంలోని ప్రత్యేకత బహిర్గతమవుతుంది.

స్త్రీలను పునరుత్పత్తికే పరిమితం చేయడంతో మొదలై ఉత్పత్తి సంబంధాలలో స్త్రీల భాగస్వామ్యాన్ని గుర్తింపు కాకుండా చేయడంతో పితృస్వామిక వ్యవస్థ స్వభావాన్ని గుర్తించారు. స్త్రీలు సమూహాలుగా,, సామాజికులుగా కాక వ్యక్తులుగా మిగల్చబడిన తీరును ఆమె గుర్తించారు. అందుకే స్త్రీల మీద అమలవుతున్న అణచివేత వెనుక వున్న రాజకీయ స్వభావాన్ని బట్టబయలు చేయడంలో స్త్రీవాద దృక్పథాన్ని చాలా నిశితంగా ప్రదర్శించారు.

ప్రతిఘటన ప్రథమ రూపమైన నిరసనను కుటుంబ వ్యవస్థలోని పరిమిత పరిథిలో వ్యక్తమైన సాంప్రదాయ సాహిత్యంలోని స్త్రీల నిరసనలు,, ప్రతిఘటన చర్యలను ఈ గ్రంథంలోచర్చించటం ద్వారా తరతరాల స్త్రీల ప్రతిఘటన చరిత్రను అందించటంలో కాత్యాయనీ విద్మహే చేసిన కృషి, అధ్యయనం అభినందించదగింది.

 -డాక్టర్ కే. శ్రీదేవి

 

 

 

 

 

 

 

 

 

 

విమర్శ గురించి నాలుగు వాక్యాలు!

 

అసలు విమర్శ అవసరమంటారా అంటే చాలామంది అవసరమే అని అంటారు విమర్శ ప్రయోజనం ఏమిటి అంటే రకరకాలుగా స్పందిస్తారు.

ఒక కవిత చదివిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటే మాత్రం చాలామంది వెనుకాడుతారు ఎందుకంటే దీన్లో చాలా రాజకీయం ఉందికనక అంటాను నేను. అభిప్రాయం చెప్పడంలో రాజకీయం ఏముందని మీరు అనుకోవచ్చు కాని కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమౌతుంది. ఎంత తెలివిగా వ్రాసామని అనుకున్నా చదివిన వారికి ఇట్టే అర్థమైపోతుంది మీరు రచయిత పార్టీనా లేక వ్యతిరేకించే పార్టీనా అన్న సంగతి. అభిప్రాయాన్ని అమాయకంగా వెలిబుచ్చే తరం కనుమరుగై చాలా కాలమైంది. లౌక్యం రాజకీయం సర్వసాధారణ మైపొయింది పల్లెటూళ్ళలో కూడా. రోడ్ మీద  నడుస్తున్నప్పుడు అటూ ఇటూ చూసి ఎలా నడుస్తామో అంత జాగ్రత్తగానూ అభిప్రాయాలు చెప్పాలి . విమర్శలు వ్రాయాలి. అవకాశం దొరికింది కదా అని అవాకులూ చెవాకులూ వ్రాస్తే అంతే సంగతులు. ఎక్కడో అక్కడ దొరక్కపోవు అక్కడ తొక్కేస్తారు.

అందుకే అంటున్నాను అభిప్రాయప్రకటన అనుకున్నంత సులభంకాదు. ఏదోఒక పార్టీ లోకి మిమ్మల్ని నెట్టేస్తారు మీ అభిప్రాయాన్ని లేక మీ విమర్శనీ ఆధారం చేసుకొని.

images

సరే అభిప్రాయప్రకటన చేసేటప్పుడు పాటించాల్సిన విధులేమన్నా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయని చెప్పాలి. మొట్టమొదటిది కవితని పదిసార్లు పైనించి కిందికీ కిందినించి పైకీ చదవాలి. కవిత్వం అంటే ఏమిటో కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కవిత్వానికీ ఫక్తు వచనానికీ గల ముఖ్యమైన  తేడాలు తెలిసి వుండాలి. అసలైన రసజ్ఞత ఉండాలి. కవిత్వం అంటే అమితమైన ప్రేమ కూడా ఉండాలి. కవిత్వ ఆల్కెమీలో ఉపయోగపడే పదాలు, పదబంధాలు, పదచిత్రాలు, ఉహాత్మక వై చిత్ర్యాలు,వాక్యవిన్యాసాలు, బింబ ప్రతిబింబ రహస్యాల గురించి  క్షుణ్ణంగా తెలిసి వుండాలి. అప్పుడే ఒక నాణ్యమైన నిష్పక్షపాత మైన విమర్శ వ్రాయగల సత్తువ కలుగుతుంది. ఇవేమీ తెలియకుండా విమర్శ వ్రాయకూడదా అంటే మహరాజులా వ్రాయచ్చు

 

కానీ ఆ ప్రయత్నం నుంచి ఎటువంటి ప్రతిఫలం ముట్టాలో అటువంటి ప్రతిఫలమే ముడుతుంది. విమర్శకుడు గనక సృజనాత్మకతని జోడించి కవిత తాలూకు అంతరార్ధాన్ని అందుకుని వివరించ గలిగితే ఇంకేముంది కళ్లముందు ఒక మంచి సాహిత్య విమర్శ దర్శనమిస్తుంది.

 

అయితే ఒక కవిత మనకి సరిగ్గానే  అర్దం అయిందని గారంటీ ఏమిటి – ఎలా నిర్ణయిస్తాం. ఇదంత తేలికైన ప్రశ్న కాదు. చాలా సార్లు మామూలు ఫక్తు వచనపు పలుకులనే మనం అపార్ధం చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో వుండగా గుప్తనిధి లాంటి కవితని అర్ధం చేసుకోవడంలోని కష్టం మనకి తెలియంది కాదు.అందుకని మనకు మరికొంత సమాచారం అవసరమనిపిస్తుంది. కవి ఆ కవితని ఏ సందర్భంలో వ్రాశాడో తెలిస్తే కొంత

ప్రయోజనం ఉండొచ్చు. నర్మగర్భితంగా ఉంటుందికదా కవిత. ఆ పై పొరని సున్నితంగా కవిత యొక్క అర్ధం చిన్నాభిన్నం కాకుండా అర్ధం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నమే చెయ్యాల్సి ఉంటుంది. చాల తేలికైన వాక్యాలే కదా అనుకున్నామో పప్పులో కాలెసినట్లే అవుతుంది.

 

ఒక కవిత వ్రాసిన కవి తాలూకు వ్యక్తిగత జీవిత విశేషాలు తెలిస్తే ఇంకా మంచిది. అయితే మనకి కవిత మాత్రమే ముఖ్యం అన్న సంగతి మర్చి పోకూడదు.

 

విమర్శ వ్రాయాలనుకునే వాళ్ళు తప్పకుండా గొప్ప ప్రఖ్యాతి చెందిన విమర్శకుల పుస్తకాలు జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ చదవటం బాగా ఉపకరిస్తుంది. విమర్శ మనది కావాలంటే సరయిన అధ్యయనం చాలాచాలా అవసరం. విమర్శ వ్రాయడం దాన్ని అందరి మెప్పూ సంపాదించేలా వ్రాయడం అంత తేలికేం కాదు.

ప్రయత్నిస్తే సాధ్యపడవచ్చు. ప్రయత్నించండి. శుభం భూయాత్!

సుమనశ్రీ

SUMANASRI_PHOTO

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్!

గమనిక: సింధూరం “హాయ్ రే హాయ్” ట్యూన్లో పాడుకోవలెను!

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
సామాన్యుడి పార్టీ పెట్టెరోయ్ కొత్తగా …

ఏం హంగురా, ఏం ఢంగు రా …
ఏం హంగురా, ఏం ఢంగు రా …

గెలిచిపోతే అంతకన్నానా అయ్యబాబోయ్ ..

హాయ్ రే హయి .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాఇ .. క్రేజీబాబు రోయ్

చరణం 1:

దానవీరశూరకర్ణ ఎన్ టీ ఆరు లా
సిపాయి చిన్నయ్య ఏయన్నారులా
ప్రతీకార జ్వాల రగిలే శోభన్ బాబులా
అల్లూరి సినీమాలో సూపర్ స్టారులా

ఫైటుసీన్లలో చిరంజీవిలా … తొడలుగొట్టే బాలకృష్ణలా …

యయయ యయయ యయ్యయాయ యయయ యయయ యై
యయయ యయయ యయ్యయాయ యయ్య యయ్య యై

లక్ష్మి వెంకీలా, బాస్ నాగ్ లా
ఢిల్లీ బాబుల తాటతీసెరో పోరగాడు

హాయ్ రే హాయ్ .. క్రేజీ బాబు రోయ్ ..

చరణం 2:

SMS ల పేరుతోటి Govt ఇలా
మెజారిటీ లేకున్నా form చేసే అలా ..
50 డేసు ఆడలేని ఫ్లాపు బొమ్మలా
నలభై తొమ్మిది రోజులు మాత్రం ఉండెనే కలా

ప్రభుత్వానికీ ప్రతిపక్షానికీ…. తేడా తెలియని కార్యకర్తలా ..

యయయ యయయ యయ్యయాయ యయయ యయయ యై
యయయ యయయ యయ్యయాయ యయ్య యయ్య యై

పుణ్యకాలమూ రెబెల్ స్టారులా
ధర్నాలతో వెళ్ళబుచ్చెరో సారువాడు

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్

-భరద్వాజ్ వెలమకన్ని

1609865_10202268640051518_1868149718_n

ఎవరు తవ్విన గోతులివి??

2007062553850301

పెద్ద రోడ్లపై, చిన్న రోడ్లపై,

సందులు గొందుల సన్న రోడ్లపై,

జూబిలి హిల్సూ, చింతల బస్తీ,

పెద్దల నగరూ, పేదల వాడా

భేదభావమే లేకుండా

                   గుంటలు! గుంటలు! గుంటలు! గుంటలు!

                   గోతులు!! గోతులు!! గోతులు!! గోతులు!!

సంకురాతిరికి ముగ్గులు వేస్తూ

తాటకి పెట్టిన చుక్కలు గోతులు,

నగరారణ్యపు మనుషుల వేటకు

యముండు పన్నిన ఉచ్చులు గోతులు

అనిపించేలా రోడ్లన్నీ

                   గుంటలు! గోతులు! గుంటలు! గోతులు!

                   గోతులు!! గుంటలు!! గోతులు!! గుంటలు!!

బురద గుంటలూ, మురుగు గుంటలూ,

లోతు గోతులూ, లేత గోతులూ,

మ్యాను హోలుసూ, మ్యాన్ మేడ్ హోల్సూ,

చిన్నా పెద్దా, ఎన్నో సైజులు,

ఎన్నో గుంటలు, ఎన్నో గోతులు!!

                   గోతులు! గుంటలు! గోతులు! గుంటలు!

                   గోతులు!! గోతులు! అబబా!! గోతులు!!

తుచ్ఛపు నోట్లకు బ్రహ్మాస్త్రాలను

అమ్మిన పాపం తలలకు చుట్టగ

ఉచ్చుకు చిక్కిరి పిచ్చిజనం!

తమ గోతిని తామే తవ్వుకుని

అందులో దూకిరి వెర్రిజనం!!

— వెల్లంపల్లి అవినాష్

మన పదసంపదని కాపాడుకోలేమా?

      ram  ఈ తృతీయ సహస్రపు గుమ్మంలో నిలబడి  మనం, గడిచిన రెండు వేల ఏళ్ల మానవ చరిత్ర లో లెక్కకు  అందుతున్న, కనీసం వెయ్యేళ్ళ  తెలుగు భాషా  వికాస చరిత్ర ను క్రమబద్ధీకరించుకోవలసిన అవసరం ఉన్నది. గడిచిన శతాబ్దాల భాషా వికాసం, సంస్కృతి  సాహిత్యం లోనే లభ్యమవుతుంది. అందువల్ల ఈ వెయ్యేళ్లలో తెలుగు భాష ఎటువంటి వికాసాన్ని పొందుతూ వచ్చిందో,  పరిశోధనల ద్వారా నమోదు చేస్తూ ఒక బృహత్కోశాన్ని మనం తయారు చేసుకోవడానికి  కావలసినంత కాలమూ గడిచింది. తగ్గ వనరులు  కూడా ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పుడు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలలో వున్న ఒక భావన ఏమిటంటే తగు సూచనలు, ప్రణాళికలు ప్రతిపాదనలు గా రావడం లేదన్నది , వస్తే గనక భాష విషయంలో లోతైన పరిశోధనలకు మద్దతు, నిధుల కొరత లేదు అని సంబంధిత అధికారులు తెలియచేస్తూ ఉన్నారు.
అనేక తత్సమ పదాలతో  కలిసి, ఆఛ్చిక పదాలుగా తెలుగు పదాలు,మొదటి నుంచీ ప్రతి కవి వాడుకలోనూ వున్నాయి. ఇందుకు నన్నయ నుంచి, నన్నెచోడుడి  నుంచి మొదలు పెట్టి,  ఈ ఇరవయ్యో  శతాబ్దం దాకా తెలుగు ఎలా వికాస పరిణామాలు చెందిందో ఒక పెద్ద ప్రాజెక్టును మన తెలుగు సాహిత్య, భాషా పరిశోధక సమాజం రూపకల్పన చేసుకుని ఆచరణలోకి తీసుకురావలిసిన  అవసరం వున్నది.
ఇప్పుడు  ఇటువంటి కృషి ప్రధాన కార్య క్షేత్రం గా,  ఇంతకు ముందు లేనటువంటి  సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రాచీన భాష ప్రాతిపదికన మైసూరు లో ఏర్పడిన ప్రాచీన భాషా విశిష్ట  అధ్యయన కేంద్రం ఒకటి. ఇది తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించాక  ఫలస్వరూపం గా ఏర్పడిన  సంస్థ. ప్రస్తుతం  మన రాష్ట్రంలో ఏర్పడి ఉన్న  సందిగ్ధతల దృష్ట్యా కూడా ఈ సంస్థ “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్”, మైసూరు, ఆధ్వర్యం లో పనిచేస్తున్నది. ఈ ప్రాచీన హోదా వల్ల తెలుగు భాష వికాస పరిశోధనలకు కావలిసిన నిధులను కూడా ఈ సంస్థ ద్వారా మనం పొందగలము. ఆలాగే  కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ, నిర్వహించే భాషా అభివృద్ది సంఘం లో తెలుగు భాష తరపున ఇప్పుడు ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి బాధ్యతలు   చేపట్టారు.
ఒకప్పుడు ఈ ప్రాచీన భాషా హోదాలు,  దాని వల్ల ప్రత్యేక కేటాయింపులుగా నిధులు, వనరులు, వసతులు  అందుబాటులో లేవు. ఇవాళ ఇవి ఏర్పడ్డాక, మన తెలుగు సాహిత్య, విద్యావంత సమాజం తగు లక్ష్యాలను ఏర్పరచుకుని ఈ సంస్థల ద్వారా నిధులు పొంది, తగు కృషి చేయగలిగిన మంచి సందర్భం ఇది. ఇందుకై  మనం ఒక బృహత్ ప్రణాళిక గా ఈ వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు ప్రాజెక్టును ఈ సంస్థల ఆమోదం తో, పలు విశ్వవిద్యాలయాలలోఆయా శాఖల ద్వారా, తదితర సాహిత్య రంగ పరిశోధకులకు  గ్రాంటులు గా నిధులు కేటాయింపులు పొందడం ద్వారా   పెద్ద యెత్తున  మొదలు పెట్టాలిసిన అవసరం, సందర్భం  కూడా ఇప్పుడు ఉన్నాయి.

94917_bapusignature_logo_jpg
ఈ బృహత్కోశం పని మూడు భాగాలుగా మూడు దశలలో జరగవలిసి వుంటుంది. ప్రతీ కవి తన రచనలో భాగం గా  ఎన్నో కొన్ని ( కొద్దిగానో, ఎక్కువ గానో) తెలుగు పదాలను వాడి వుంటాడు అనేది ఒక స్పష్టమైన అంశం.  ఆ పదాలు ఆనాటి సమాజంలో వాడుకలో వుండడానికి ఎన్నో కారణాలు వుంటాయి. ఈ వెయ్యేళ్ళ  కాలాన్ని,  తలా వంద ఏళ్లుగా కాల విభజనలు చేసి కవి పరంగా, కావ్య పరంగా ఈ తెలుగు మాటలు ఎలా కాల ప్రవాహంలో సాహిత్య రూపేణా నమోదు అవుతూ వచ్చాయో గమనిస్తూ పరిశీలనలు, పరిశోధనలు చేయడం ఒక భాగం కావాలి.
ఈ పది శతాబ్దాల తెలుగు భాషా వికాస స్వరూపం గురించి ఒక ప్రాధమిక రూపం ఏర్పాడ్డాక, ఆయా కావ్యాలు , కవుల కాలపు రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎలా ఈ రచనలలోని  పై లేదా కవుల పై పడ్డదో ఒక ప్రత్యేక కృషి గా రెండో దశలో మరో పది విభాగాలు గా విస్తార అధ్యయనాలు జరగాలి.
చివరి భాగం గా ప్రతి కవి, కావ్యం పరంగా  తెలుగు భాషకు తన కాలంలో తన రచనలలో పొందు పరుస్తూ  వచ్చిన  తెలుగు ఆచ్చిక పదాల జాబితా ( ఆఛ్చిక పద కోశం), ఆయా పదాలు తెలుగు భాష లోకి వచ్చి చేరిన క్రమం గురించి  వివరణలు కూడా చేరిస్తే ఇదొక సమగ్ర భాషా వికాస స్వరూప గ్రంధంగా తెలుగు వారం తయారు
చేసుకోగలుగుతాము.
కన్నడ దేశంలో ఇన్ఫోసిస్ సంస్థ  కు చెందిన నారాయణమూర్తి గారు  “ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా” పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని అనువాద ప్రచురణలు గా  తీసుకొచ్చే  ముఖ్యమైన పనిని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టారు. ఒక పేజీ లో మూల రచనా పక్క పేజీలో అనువాదం ప్రచురించడం పధ్ధతి గా అనేకమంది మన దేశ, విదేశాల పండితులు భారతీయ సంస్కృతి సాహిత్య రంగాలలో కృషి చేసే వారు ఈ అనువాదాలు, ప్రచురణల ఖరారు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.    మనం కూడా ఇవాళ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రంలో గల అనేక మండి వ్యక్తులు, సంస్థలు, రామోజీ ఫౌండేషన్ వంటి ఉన్నత వేదికలు అందరం కలిసి, మన వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు,  ప్రాజెక్టు కు కొన్నియేళ్ళు పట్టినా సరే ఇప్పుడే ప్రణాళికా బద్ధంగా  సంకల్పించడం అవసరం.
దీనికి తగిన ఒక ప్రాధమిక అవగాహనా సదస్సు విశాఖపట్నంలో నిర్వహించడం ఒక ప్రతిపాదన. ఇందుకు తగిన పూర్వ భూమిక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వున్నది. 1931 లో పండిత రాధాకృష్ణన్  ప్రారంభించిన తెలుగు శాఖ , రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా మొదట గా ఏర్పడ్డది. ఆచార్య తోమాటి దొణప్ప, బూదరాజు రాధాకృష్ణ  ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు , ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులే. దొణప్ప ఆరంభించిన
ప్రాజెక్టును ఆచార్య లకంసాని చక్రధరరావు ఒక్కచేత్తో, పూర్తిచేసి  ఏడు భాగాల  తెలుగు పదాల  వ్యుత్పత్తి కోశాన్ని జాతికి అందించారు.
కేంద్ర ప్రభుత్వ భాషాభివృద్ధి సంఘంలో సభ్యులు గా వున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, మన ప్రాతిపదికల మేరకు తీసుకునే చొరవ ఫలించి , మైసూరు లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆమోద, సహాయ సహకారాలు మన ప్రాజెక్టుకు  లభించి , రాష్ట్రంలోని ఇతర పెద్దలు,  ఫౌండేషన్ల పూనిక తో, ఇప్పుడు తెలుగు భాషకు ఒక మంత్రిత్వ శాఖ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యంలో  మనం స్పష్టమైన లక్ష్యాలతో, ఒక కార్యాచరణ పత్రంతో,  చైతన్యవంతమైన సాహిత్య  సాంస్కృతిక సమాజం గా  ముందడుగు వేయవలసిన తరుణం ఇది అని గుర్తు చేస్తూ, ఇందుకు అందరు పెద్దల నుంచి ఈ ప్రాజెక్టు సుసాధ్యమయే దిశలో ఆచరణాత్మకమైన సలహాలు, సహాయాలు, మార్గ దర్శకాలు లభిస్తాయని ఆశిస్తున్నాను.

-రామతీర్థ

సాహిత్యానికి భారతరత్నం రాదా?

bharathratna
దేశానికి గర్వకారణమైన వ్యక్తులను గౌరవించుకునేందుకు ఏర్పడ్డ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తన చరిత్రలో మరో మేలిమలుపు తీసుకుంది. ఆరుపదుల ప్రస్థానం చేరుకుంటున్న ఈ పురస్కారం సాంఘికసేవా, రాజకీయ, శాస్త్రసాంకేతిక, కళారంగాల పరిమితి నుంచి ఏ రంగంలో అత్యున్నత ప్రతిభ చూపినవారికైనా ఇవ్వవచ్చని నిబంధనలు మార్చడమేకాక తొలిగా సచిన్ టెండూల్కర్ ను క్రీడారంగం నుంచి ఎంపికచేశారు. ఇక జాతిభేదాలకు 1980దశకంలో భారత్ లో జన్మించని భారతపౌరురాలు మదర్ థెరెసా, బ్రిటిష్ ఇండియాలో భాగమైన నేటి పాక్ ప్రాంతంలో జన్మించిన విదేశీపౌరుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లకు, 90ల్లో ఈ దేశంలో జన్మించని, ఈ దేశపౌరుడూ కాని నెల్సన్ మండేలాకు పురస్కారం ఇచ్చి వసుధైవ కుటుంబమన్న భారతీయ ఆదర్శాన్ని చాటారు. లక్ష్యాల్లో ఇంతటి సువిశాలమైన అవార్డు మాత్రం తొలి నుంచీ మార్గదర్శకాల్లో భాగమైన సాహిత్యరంగాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం, బాధాకరమూను.
భారతరత్న పురస్కారం పొందినవారిలో కొందరు బహు గ్రంథరచయితలు ఉన్నారు. వారిని రచయితలని పేర్కొంటూ భారతరత్న సాహిత్యానికి దక్కిందని భావించే వీలు లేదు. పురస్కార గ్రహీత జవహర్లాల్ నెహ్రూ భారత చరిత్ర, ప్రపంచ చరిత్రవంటి అంశాలపై గ్రంథరచన చేసినవారే. ఐతే వారిని గురించి పేర్కొనాల్సి వస్తే భారత తొలిప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు అనితప్ప సాహిత్యవేత్త అనరు. ఆయన మౌలికంగా రాజనీతి రంగానికి చెందినవారు. భారతరత్న పొందిన రాజకీయనేతలు చక్రవర్తుల రాజగోపాలచారి, గోపీచంద్ బోర్డోలోయ్ , తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్, సంస్కృత పండితుడు, సంఘసంస్కర్త పాండురంగ్ వర్మన్ కానే,శాస్త్రవేత్త ఎ.పి.జె.అబ్దుల్ కలాం, తదితరులు ఎంతో విలువైన సాహిత్యాన్ని రాసినా వారు మౌలికంగా వేర్వేరు రంగాలవారు. ఏ రంగానికి చెందిన నిష్ణాతులైనా తమ ఆవిష్కరణలను వెలువరించడానికి సాహిత్యాన్నే ఉపకరణం చేసుకోవడం సాహిత్య ఔన్నత్యాన్ని తిరుగులేనివిధంగా నిరూపిస్తోంది. సాహిత్యమనే రంగం తొలినుంచీ అవార్డుల నిబంధనల్లో ఉన్నా, సాహిత్యవిభాగంలో ఎవరికీ భారతరత్న దక్కలేదనే చేదునిజం తేలుతోంది.
మానవ హృదయనిర్మాతలుగా, జాతి భవిష్యత్ నిర్దేశకులుగా ప్రపంచంలోని ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ సాహిత్యకారులకు గౌరవం దక్కుతోంది. కిర్గిజ్ జాతికి ఛెంగిజ్ ఐత్మోతావ్ జాతిపితగా పేరొందగా షేక్స్పియర్, టాల్ స్టాయ్ వంటి ఎందరో సాహితీవేత్తలను ఆయా దేశాలు తమ సాంస్కృతిక సంపదగా గౌరవించుకుంటున్నాయి. విగ్రహాలు, స్మృతిచిహ్నాలు మొదలైన ఎన్నో విధాలైన గౌరవాలతోపాటు కొన్ని దేశాల్లో రచయితలు జీవించిన వాడలు, చిన్న ఊళ్లు వారు జీవించిన కాలంలో ఎలా ఉండేవో అలాగే టైం ఫ్రీజ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా వారి స్మృతికే కాక వారి సృజనలకు ఇచ్చే నివాళి. ఒక్కో కవి, రచయిత తన భావజాలాల పరిధి వందల, వేల ఏళ్లకు, దేశాల సరిహద్దులు దాటి విశ్వమానవాళికీ విస్తరింపజేశారు. మరో కోణంలో చెప్పాలంటే శాస్త్రసాంకేతిక, తత్త్వశాస్త్రాది రంగాల్లోనైనా అత్యుత్తమ స్థాయి ప్రతిభ చూపినవారు వాటిని వ్యక్తపరచడానికి కూడా సాహిత్యాన్నే ఎన్నుకున్నారు. వివిధ మతాలు, రకరకాల ఇజాలు తమ ప్రభావాన్ని చూపేందుకు అక్షరమే ఆయుధమైంది.
ప్రపంచ మానవాళి అంతటిలాగానే భారతీయుల్లో కూడా సాహిత్యమనే దీపాన్ని వెలిగించి జాతిజనుల హృదయాలకు వెలుగులు పంచిన మహాకవులు, రచయితలూ సహజంగానే ఉన్నారు. వారి కవితాపాదాలు నినాదాలై  దేశాన్ని కుదిపేశాయి, వారి కవితల్లో భావచిత్రాలు శ్రోతల, పాఠకుల హృదయాల్లో జన్మాంతరమైన భావాలు రేపాయి. అలాంటి సహజరత్నాలైన ఎందరో సాహిత్యకారుల్ని భారతరత్నాలుగా గుర్తించకపోవడం వెనుక ఏ కారణాలున్నాయో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
తమ రంగాల్లోని అత్యున్నత ప్రతిభతో జాతికి సేవచేసిన, భారత జాతి ప్రతిష్టను పెంచిన వ్యక్తులు ఈ అత్యున్నత పురస్కారానికి అర్హులని మౌలికంగా చెప్పుకోవచ్చు. 1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభించిన ఈ పురస్కారం ప్రకటించిన సచిన్, శాస్త్రజ్ఞుడు రావులను కలుపుకుంటే 43మందిని వరించింది. ఈ అవార్డు పొందినవారి జాబితా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
1.భారతజాతీయుల ప్రతిభ, కృషి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించినప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో వారికి ప్రతిష్టాత్మక గౌరవాలు, పురస్కారాలు లభించినపుడు భారతరత్న ప్రదానం చేశారు.
అవార్డు ఏర్పరిచిన తొలిసారే నాటికి 20ఏళ్లనాడు ప్రతిష్టాత్మక నోబెల్ అందుకున్న సి.వి.రామన్ ను, ప్రపంచ ప్రఖ్యాతిపొందిన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ను అవార్డు వరించింది. ఆపైన నోబెల్ పొందిన ఏడాది తిరగకుండానే అమర్త్య సేన్, ప్రతిష్టాత్మక ఆస్కార్ జీవితసాఫల్య పురస్కారం తానై కలకత్తా చేరి వరించిన ఏడాదే సత్యజిత్ రాయ్ లకు భారతరత్న లభించడం కూడా ఈ ధోరణిని చూపిస్తుంది. ఇలా చాలామందే అంతర్జాతీయ స్థాయి సత్కారాలు పొందిన తర్వాత భారతరత్న అందుకున్నారు. వీరికి అవార్డు లభించడంతో అవార్డుకు గౌరవం వచ్చింది.
2.మరో ధోరణి దేశ చరిత్రలో పలు మేలిమలుపుల వెనుకనున్న ఒకరికి సత్కారం లభించడం. దేశ విభజన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకీకరణకు కృషి చేసిన వల్లభాయ్ పటేల్, 1944-1950 అస్సాంలో ప్రతిపక్ష నేతగానూ, పదవిలోనూ తన జాగ్రత్తతో ఆ ప్రాంతం తూర్పు పాకిస్థాన్ పరం కాకుండా కాపాడి, ఆపై సరిహద్దుల్లో చైనా దూకుడుకూ కళ్లెం వేసిన గోపీచంద్ బోర్డోలోయ్, ఆహారధాన్యాల కొరతతో విలవిలలాడుతున్న దేశానికి సుభిక్షతనిచ్చిన “హరిత విప్లవ” సారధుల్లో ఒకరైన నాటి వ్యవసాయమంత్రి చిదంబరం సుబ్రమణియం, దేశ ఆయుధరంగంలో కృషిచేసి సార్వభౌమత్వానికి పాటుపడ్డ ఎ.పి.జె.అబ్దుల్ కలాం తదితరులు ఈ కోవలోని వారు. వీరి కృషితో వచ్చిన గౌరవాన్ని అవార్డులకు ఆపాదిస్తారు. ఐతే వీరి ఎంపికలో రాజకీయపర కోణాలుంటాయి. ఒక్కో మేలిమలుపు వెనుక, ఒక్కో అపురూప ఘటన వెనుక కనీసం మరో నలుగురైదుగురు మూలమూర్తులు ఉంటారు. వారిలో ఎవరికి ప్రాతినిథ్యం కట్టబెట్టాలన్నప్పుడు ఆ స్వేఛ్ఛను వాడుకుంటారు.
3.కొన్ని భావజాలాలకు ప్రతినిథులను కూడా ఈ పురస్కారాలకు ఎంపికచేశారు. అలాగే వివిధరంగాల్లో మేరుసమానులనూ ఎంపిక చేశారు. వీరినే ఎందుకు ఎంచారన్నదానిలో కూడా అధికారంలోని వ్యక్తుల తాత్త్విక, రాజకీయ భావజాలాలు, ఆనాటి స్థితిగతులు ఉంటాయి. ముఖ్యంగా 1999లో కార్గిల్ విజయోత్సాహంలోని ఎన్.డి.యే. హయాంలో అస్సాం(నేటి ఈశాన్యరాష్ట్రాల్లో అధిక భాగం అస్సాంగానే ఉండేది)ను భారతదేశంలో విలీనం చేసిన అర్థశతాబ్ది నాటి గోపీచంద్ కు అవార్డు దక్కిందంటే దాని వెనుకనున్న కారణాలు చెప్పనక్కర లేదు కదా. అలాగే వారణాసి, గంగ, విశ్వేశ్వరాలయం నాతో అమెరికా తీసుకురాగలరా అని తనను ఆహ్వానించిన పాశ్చాత్యులను ప్రశ్నించిన షెహనాయ్ మేరుశిఖరం బిస్మిల్లా ఖాన్ కు కూడా వారి హయాంలోనే అవార్డు వచ్చింది. తాను ప్రధాని అయ్యేనాటికి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కామరాజ్ కు ఇందిర హయాంలో అవార్డు రావడం మొదలుగా చెప్పుకుంటూపోతే ఏ అవార్డు వెనుకనైనా ఏదోక రాజకీయకోణం తొంగిచూస్తూంటుంది. దేశంలోని కొన్ని భాషలు, కొన్ని వర్గాల వారు అభిమానించి ఆరాధించేవారెందరికో అవార్డు రావడం వెనుక అది కారణంగా నిలిచింది. రాజకీయ కారణాలతో పాటు పురస్కారాలు అందుకున్నవారు చాలామంది ఈ పురస్కారం విలువను పెంచినవారే అయ్యారు.
ఈ నేపథ్యంలో చూస్తే ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన పురస్కారాలు పొందినవారు, తమ కవితలోని రెండు పదాలు నినాదాలై చరిత్ర గతి మార్చిన ఉద్యమపతాకం పొందినవారు, నేటి మన ప్రతి భావజాలానికి ప్రతీకలై నిలిచినవారు గత శతాబ్ది సాహిత్యవేత్తల్లో ఉన్నారు. రెండుదేశాలకు జాతీయగీతాలుగా తాను రాసిన పాటలు వెలిగి ఆ కారణంగా ప్రపంచంలోనే అరుదుగా నిలిచిన సాహితీవేత్త భారతీయుడే. దేశంలో ప్రతిభాషలోనూ తమ జాతిజనులను ప్రభావితం చేసి అజరామరమూ, సర్వకాలీన, సార్వజనీన సాహితాన్ని సృష్టించినవారున్నారు. పోనీ రాజకీయ కారణాలని అనుకుంటే రాజకీయంగా వర్గాలుగా విడదీసుకుని చూసినా ఒక్కో సాహిత్యవేత్తనీ తమ భావజాలాలకు ప్రతినిధిగా చూసే అశేషప్రజానీకం ఉన్నారు.
వివిధ భాషా వైవిధ్యాలతో విలసిల్లే దేశంలో భాష ప్రధానాంశమైన సాహితీవేత్తలకు పురస్కారాలు ఇస్తే ఇతర భాషాసమాజాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించే అవకాశం ఉంది. కానీ జాతి భవిష్యత్తును నిర్మించేందుకు, సంస్కృతిని తమ రచనల్లో ప్రతిబింబించేందుకు కృషి చేసి ఋషిత్వాన్ని పొందిన సాహిత్యకారులకు నిష్పాక్షికంగా భారతరత్నకు ఎంపికచేస్తే బహుళత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న భారతీయులు సంతోషిస్తారు తప్ప వ్యతిరేకించరు. మరణానంతరం పురస్కారం ప్రదానం చేసే సంప్రదాయం ఉంది కనుక ఇన్ని ఏళ్లుగా పురస్కారం పొందని పలువురు అర్హులైన సాహిత్యవేత్తలకు ఇకనైనా ప్రదానం చేయవచ్చు. జాతి సామూహిక మేధలో, హృదయంలో తమ రచనలతో భాగమైపోయిన సాహిత్యకారులను అత్యున్నత పౌరపురస్కారంతో గౌరవించడం సముచితమే కాదు అత్యవసరం.
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

విఫల స్వప్నాలు, వైయక్తిక వేదనల ప్రతిబింబం ఆధునిక మళయాళ కథ

A house hotel boat on the backwaters in Kerala

రెండో భాగం

ఆధునిక మలయాళ కధ  

ఒకానొక కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలు మలయాళ కధా సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి .ఆ సామాజిక పరిణామాలు వల్ల ఏర్పడిన సామాన్య ప్రజల జీవిత వ్యధను శక్తివంతంగా చిత్రీకరించగలగింది అనేదే ఆధునిక మలయాళ కధ తాలూకు విజయం –కీర్తికి కారణం కూడా. అందువల్ల కేరళలో నెలకొన్న సామాజిక స్దితిగతులు గురించి సంక్షిప్తంగా నైనా  సమగ్రంగా చెప్పటం తప్పదు. ఈ సామాజిక స్దితిగతులు భారత దేశంల్లోని ఇతర ప్రాంతాల్లో నెలకొన్నవాటికన్నా చాలా భిన్నము . గొప్ప రచయితులైన ఎం. టి. వాసుదేవన్ నాయర్ మొదలగువారి రచనల తెలుగు అనువాదాలను చదివి ఆస్వాదించాలంటే అలనాటి సామాజిక స్దితి గతులు గురించి ఒక కనీస పరిజ్ఞానం  ఉండాలిసిందే.

కేరళలోని అగ్రకులస్తులు [హిందువులుగురించే ఇక్కడ ప్రస్తావిస్తునాను ],నంబుద్రి ,నాయర్[మీనోన్ ,పణిక్కర్ మొదలగువారు  వారు కూడా నాయర్లే –అగ్రకులస్తులు ]నంబుద్రి అంటే బ్రాహ్మణుడు –ఈ కులంవాళ్ళు తరతరాలుగా భూస్వాములు  –పితృసామ్య వ్యవస్ద గలవాళ్ళు- ఉమ్మిడి కుటుంబంగా జీవించిన వీళ్ళ కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసి వుంటేవారు –ఆస్తి పెంపకం ఉండదు -. ఇంటికి పెద్దవాడు –తండ్రి లేదా  తండ్రి లేకపోతే పెద్దన్న ఆస్తి వ్యవహారాలు ఇంటి విషయాలు చూసుకునేవారు.  అలనాటి సాంప్రదాయనుసారంగా కావ్యాలు నాటకాలు తర్కం మొదలైనవి నేర్చుకున్న వీళ్ళు విద్యావంతులు –కవులు ,కళా సాంస్కృతిక పోషకులు. కాని వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్ద కొడుకు మాత్రమే నంబుద్రి యువతిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు –పెళ్ళి ఒకటో రెండో ,ఎన్నో –ఆ నంబుద్రి భార్య ద్వారా కలిగిన పిల్లలకే ఆస్తి హక్కు ఉంటుంది . మిగతా కొడుకులు వాళ్ళుకు తోచినటు ఇష్టమైన ఇతర కులస్తులతో [ముఖ్యంగా నాయర్ మీనోన్ యువతులతో] సంబంధం పెట్టుకుంటారు.సంబంధం అంటే అందరికీ తెలిసిన లైంగిక సంబంధమని అర్ధం . మంత్ర తంత్రాలతో కూడిన పెళ్ళి కాదు. తాళి కట్టు ఉండదు –అసలు తాళియే ఉండదు. అలా సంబంధం చేసుకున్న యువతి తన ఇంటిలోనే ఉంటుంది. నంబుద్రి, ఆ పిల్ల ఇంటికి రాత్రి వచ్చి పొద్దునే లేచి వెళ్ళి పోతాడు. పిల్లలు కలిగినా ఆ పిల్లలు తల్లితో పాటు తల్లి ఇంటిలోనే ఉంటారు –నంబుద్రి ఇచ్చినది పుచ్చుకోవటమే తప్ప హక్కు ఏది లేదు. అలనాటి నాయర్ సమాజంలోని వివాహ వ్యవస్ద దీనికి అనుగుణంగానే ఉంటేది .ధనవంతులైన గొప్ప నాయర్ కుటుంబాలు ఉంటేవి ఆ రోజుల్లో. మాతృస్వామ్య వ్యవస్ద పాటించేవారు నాయర్ ,మీనోన్ సమాజాలు . ఆస్తి మొత్తం ఆడపిల్ల పేరు మీదే ఉంటేది.మేనమామ ఇంటి పెద్ద –ఆస్తి వ్యవహారలంతా అతడే చూసేవారు. తరవాడు అనబడే నాయర్ మాతృస్వామ్య వ్యవస్డలోని ఉమ్మిడి కుటుంబంలో ఇంటి పెద్ద మేనమామ ,అతని తల్లి అక్కచెల్లిల్లు, తమ్ముళ్ళు,  మేనకోడళ్ళు , మేనల్లళ్ళు –అందరూ కలిసి ఉంటేవారు –నాయర్ మీనోన్ సమాజంలోని వివాహ వ్యవస్ద, సంబంధమే. ఇంటి పెద్దవైన మేన మామ భార్య ఆవిడ ఇంటిలోనే ఉంటుంది. ఇంటివ్యవహారాలు చక్కబెట్టుకున్న అతడు రాత్రి భార్య ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దునే తిరిగి తన ఇంటికి వస్తాడు . తరవాడులోని ఆడవాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఆ తరవాడులోనే బ్రతుకుతారు. ప్రతి ఆడపిల్లకి కూడా ఆస్తి మీద హక్కు ఉండేది ఇరవై ముప్పై మనుషులు వున్న తరవాడు సాధారణమే . వాళ్ళు కోసం పెద్ద పెద్ద ఇల్లు /వాటాలు ఒకే ప్రాంగణంలో ఉండేవి ,ఒకే వంట గదితో.

ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు ముఖ్యంగా తీయలు శ్రీ నారాయణగురు వల్ల ప్రభావితులై సామాజిక రంగంలో ముందడుగు వేసారు అప్పటికే. ముస్లింలు క్రిస్టియనులు ముఖ్య ధారలో కలిసిపోయినవాళ్ళే  . వీళ్ళు కాక తమిళ నాడు నుంచి వలస వెళ్ళి కేరళలో స్ధిరబడ్డ అరవ బ్రాహ్మణులు [అయ్యర్ ]కర్నాటకవాళ్లు కూడా సమాజంలో ఉండేవారు కనుక సాహిత్యంలో కూడా కనబడుతారు .

ఉమ్మిడి కుటుంబపు ఉక్కు హస్తాలనుంచి వ్యక్తి స్వతంత్రుడైన కాలం ఇది .అలా ఉమ్మిడి కుటుంబ వ్యవస్థ  నుంచి బయిటికి వచ్చి తన విధి తనే స్వయం నిర్ణయించడానికి ప్రయత్నించే మేనల్లుళ్ళ వైయక్తిక అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన భావుకతే ఈ తరం రచయితుల బలం . జీవితాన్ని గెలవాలనే ఆతృత ,ఆ ప్రయత్నంలో అందిన స్వల్ప విజయాలు ఎక్కువ నైరాశ్యం ,ఆత్మనింద ,ఛవి చూసిన మోసాలు కక్ష మొదలైన భావాలు ఈకాలం కధల్లో కనబడుతాయి .

ఆర్ధిక సామాజిక సమస్యలు అప్రసక్తం కాలేదు కాని సామాజిక సమస్యలకన్నా సొంత సమస్యలకూ కలలకూ వేదనలకు ప్రాధాన్యం ఇచ్చారుఈ కాలపు కధకులు .  ఆకలి బాధ కన్నా హృదయ బాధ భరించలేనిదిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కధ ‘’మానసిక జీవితానికి   ప్రచురణా కేంద్రమైంది ‘’ తన హృదయం మీద తగిలి  ప్రతిఫలించే అనుభవాలకు తన గుండె రంగు కలిపి చిత్రీకరించారు రచయితలు –అలా కధ ఒక భావ గీతానికి దగ్గరైంది.

కొన్ని మానసికావస్థలను అనుభవ ముహూర్తాలను ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు నిర్మాణ చాతుర్యం అనిర్వార్యమైంది. అంతర్భావావిష్కారం కోసం మాటలనూ  బింబాలనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఎత్తు గడ కధ ,ముగింపు మొదలైనవాటితో బంధించబడిన ఒక కధ చెప్పడానికి కాదు ,కధ ద్వారా కొన్ని వైయక్తికానుభూతులు అందించడానికి ప్రయత్నించారు ఈ కాలపు రచయితలు . ఇలా కధలకు కావ్యాత్మ ఇచ్చిన రచయితలు టి.పద్మనాభన్ ,ఎం.టి.వాసుదేవన్ నాయర్ ,కమలాదాస్ -1950 దశకపు ద్విదీయార్ధంలో జరిగిన పరిణామం ఇది. కాని వైయక్తికానుభవాల ఆవిష్కారం అని చెప్పగానే వాళ్ళు సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేశారని అనుకోకూడదు వైయక్తికానుభవం సామాజిక సమస్యనుంచి ఉత్పన్నమైనదే.

Mt_vasudevan_nayarఎం. టి. వాసుదేవన్ నాయర్ కధలు :[1933—జననం ]

ఈ కలఘటపు కధా చరిత్ర వీక్షణం  ఎం. టి. గారి కధలతోనే ప్రారంభించాలి.శిధిలావస్దకి చేరే ఒక సామాజిక స్దితిని దానివల్ల ఉత్పన్నమైన మానసిక సంఘర్షణలను కవితాత్మకంగా పాఠకుల  గుండెకి అంటుకునే విధంగా చిత్రీకరించగలగటమే   ఎం. టి. కధల గొప్పతనం.శిధిలావస్దకి చేరే తరవాడులు ,వాటిలో అవగణనకీ పీడనకీ గురయే మేనల్లళ్ళు వాళ్ళ వైయక్తిక ప్రపంచం –ఇవీ ఎం. టి. కధా ప్రపంచం. అతడు ఒంటరివాడైన వ్యక్తి కధే చెబుతున్నాడు . చిన్నపిల్లవాడుగా వున్నప్పుడు అనుభవించిన నిర్లక్ష్యమూ దారిద్ర్యమూ దీనికి కారణాలు. చిన్న పిల్లాడుగా వున్నప్పుడు అవసరాలు ఆనందాలు నిషేధింపబడిన వాడు యవ్వనంలో జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన బ్రతుగు గడిపే శక్తిని కోల్పోయి తీవ్ర జీవితాశక్తి తో ముందుకు సాగుతునాడు –శాంతి పర్వం ,సంధ్య వెలుగు, నీలి కొండలు ,మొదలగు మొదటి కధల్లో ఇలాంటి పాత్రలు కనబడుతాయి –సామాజిక పరిస్డితుల పట్ల కక్ష ,ఆత్మ నింద వాళ్ళ ముఖ ముద్రలు. మానసిక సంఘర్షణల చిత్రీకరణ అనే విశేషణానికి అర్హమైన ఇతని కధల్లో శిధిలమయే తరవాడు ఎప్పుడూ  ఉంటుంది.

కధా నేపధ్యం నగరమైనా ఎలాగోలా తరవాడు గ్రామీణ జీవితం ,గ్రామీణ వాతావరణం మొదలైనవి కధల్లోకి చొచ్చుకువస్తాయి –ఇతని కధలకు నిడివి ఎక్కువ. ప్రతి కధలోను కచ్చితమైన సామాజిక నేపధ్యం ఉంటుంది. స్థల కాల సామాజిక స్ధితులు కధల్లోని విడతీయలేని అంశాలు –అందువల్లనేమో కధను మనం అనుభవిస్తాం –అనుభూతి పొందుతాం. భావాత్మకమైన బింబాత్మక మైన  కధలు ఎం. టి. వ్రాసిన కధలు. ఎక్కువ కధలు ‘’అతడు ‘’అనే మాటతోనే మొదలవుతాయి –కధా నాయకుడు అతడే –పేరుకుడా ఉండదు. అనవసరమైన ,అర్ధ రహితమైన ఒక మాట కూడా అతని కధల్లో కనబడవు.

ఆత్మలో కవిత్వం లేనివాడు కధ వ్రాయకూడదు అనే తన నమ్మకాన్ని బయిట చెప్పటమే కాదు తన రచనలు ద్వారా ఋజువు చేసినవాడు కూడా టి. పద్మనాభన్ [జననం 1931]అనే రచయిత. సరళమైన కధాఖ్యాన శైలి ఇతనిది.

ఈ ఇద్దరి రచనా వారసత్వాన్ని కొనసాగించినా ,ఈ కధకులంత సహృదయామోదం పొందని రచయితలు కొందరున్నారు. గొప్ప కధలు వ్రాసినా మర్రి చెట్టుకృంత మొక్కల్లా నిలిచిన ఈ రచయితలు కూడా మలయాళ కధా వికాసానికి బాట వేసినవారే.ప్రముఖ రచయిత్రి మాధవికుట్టి [కమలా దాస్]గురించి ప్రస్తావించే ముందు ఇలాంటి కొందరు ప్రముఖ రచయితలు గురించి ప్రస్తావించాలి. –వాళ్ళలో ముఖ్యుడు ఎన్. పి. మొహమ్మదే. మతం తాలూకు సరిహద్దులు దాటిన అధికారం,జీవితం తాలూకు మానసిక ప్రశాంతతను పోగొట్టే మూఢ నమ్మకాలు ఆచార సాంప్రదాయాలు,మామూలు మనుషులను ప్రలోభాలు వల్ల మోసగించే తంగళ్ [ముస్లిం పెద్దలు ] బహుభార్యాత్వం వల్ల కలిగే నష్టాలు ,భోగాలకు ముసుగుగా నిలిచే మత నియమాలు వగైరాలను కొన్ని కధల్లో హాస్యంతోనూ ,మరి కొన్ని కధల్లో నిశిత విమర్శ తోను మిళితం చేసి రచన చేసాడు ఇతడు. ముస్లిం మిత్రుల  వ్యాఖ్యానాలు ద్వారా సామాజిక జీవితం తాలూకు అర్ధం వెతుకుతునాడు ఈ కధకుడు . ఒక కధలో రచయిత ఇలా అంటాడు

‘’మరణం ఎదుగుదలను మేం జీవితం అని అంటున్నాం –మీకు తెలియనిది అల్లాహుకు తెలుస్తుంది –మొక్కలను చూడండి. అవి ఎదుగుతున్నవి ,పుష్పించడానికీ కాయలు ఇవ్వడానికీ మాత్రమే.  మరణించడంకోసం ఎదుగుతున్నారు మీరు.  మీరు పుట్టగానే నిజంగా మీరు చనిపోతున్నారు –మీ జననమే మీమరణం ‘’

సామాజిక జీవితమే ఇతని కధావస్తువు

విషాద భావంతో మిళితమైన తీక్ష్ణ వైయక్తిక ప్రపంచం ఎన్. మోహనన్[1933 –1999 ] కధా ప్రపంచం –ఆత్మనిష్ట మైన అనుభవాల ప్రపంచం –వైయక్తికమైన సత్యాన్వేషణలు అవి. మరణం సృష్టించే విషాదం ఇతని కొన్ని కధల్లో చూడవచ్చు. రాజకీయభావాలకు ,కులానికి మతానికి అతీతమైన మానవతా కోణం ఇతని కధల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అతి తక్కువ కధలు వ్రాసిన ఇతడు కధా నిర్మాణంలో  ,మనసులోని భావానికి అనుగుణ మైన రూపం కధే తీసుకుంటుందని వదిలేసేవాడు. క్షేత్రోద్యోగి కనుక ,తనకు సుపరిచితమైన క్షేత్ర జీవితంలోని అనుభవాలనూ అలనాటి సంబంధం వ్యవస్థ వల్ల నెలకొన్న’ లూస్ ‘  లైంగిక సదాచారం  మొదలైనవాటిని ఆధారంగా చేసుకొని మంచి కధలు వ్రాసిన రచయిత ఉన్నికృష్ణన్ ,పుతూర్. సీదాసాదాగా కథనూ  పాత్రల మానసిక స్డితులనూ  వివరిస్తాడు ఈ కధకుడు.

కేవలం 12 కధలు వ్రాసి 34వ ఏట చనిపోయిన రాజలక్ష్మి షి [1930—1965] ఈ తరంలోని ఒక గొప్ప రచయిత్రి. స్త్రీల బాధలు ఆత్మ వ్యధలు ,అలనాటి సామాజిక గృహ వాతావరణంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు సంఘర్షణలు ఆమె కధలకు ఆధారం.

సంపూర్ణం కాని వ్యక్తిత్వాలూ ఆశ్చర్యకరమైన జీవిత సంఘటనలూ సి.వి. శ్రీరామన్ కధలకు ప్రాణంపోసే అంశాలు. వ్యక్తులకు సంఘటనలకు ఇతని కధల్లో సవిశేషమైన ప్రాధాన్యం ఉంటుంది.చాలా శ్రద్ధతో కధకి ఇతివృత్తం  అల్లుతాడు ఈ రచయిత. ఇతని కధానేపద్యం కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. అతని ప్రసిద్ధ కధ ‘వాస్తు హార ‘ కి నేపధ్యం బెంగాల్. వ్యత్యస్తమైన రెండు సంస్కృతుల సంఘర్షణల సమన్వయ తలాలను ఆవిష్కరిస్తోంది ఈ కధ. వృతి రీత్యా వక్కీలైన ఇతడు న్యాయవృత్తికి సంబంధించిన మంచి కధలు కూడా వ్రాసారు. తమ దృక్పథా నికి  అనుగుణంగా మంచి కధలు వ్రాసి మలయాళీ పాఠకుల  మన్నెన పొందిన రచయితలు ఎందరో ఉన్నారు ఈ తరంలో –కాని రచయితుల పేర్లు వారి కధలు, సంపుటాలు ,వివరించటం ఈ వ్యాసం తాలూకు ఉద్దేశం కాదు కనుక కొత్త భావాలకు కాని కొత్త రూపాలకు కాని ఊపిరి పోసి మలయాళ కధను ఒక మలుపు తిప్పిన రచయితలు గురించే వివరించాలని అనుకున్నాను కనుక కొందరి పేర్లు [వాళ్ళూ గొప్ప రచయితులే– అయినా ప్రస్తావించటం లేదు ]

Kamala_dasభావుకతే మాధవికుట్టి[1934—2007] [కమలాదాస్ ]ప్రత్యేకత  అని చెబుతే అది నిజం కాదు. జీవితమంటే ఆమెకున్న కచ్చితమైన వాస్తవిక స్పృహ,రుచికరంకాని నిజాల ముఖాలను దాచే ఆదర్శవాదుల తిరస్కారం —ఇవీ ఆమె కధలను అస్వస్డత రేకెత్తే  అనుభవాలుగా మలిచాయి. అందమైన జీవితనిమిషాలు చాలా అరుదుగా కనబడుతాయి ఆమె కధల్లో. ఆమె కధల్లో ఎక్కువ కధలు నగర నేపధ్యం తో వ్రాసినవే –కపట భరిత జీవితాలు గురించి జీవితాన్ని అడ్జస్ట్ మెంట్ గా  మార్చిన బ్రతుకులు గురించి వ్రాసారు ఆమె . పల్లెలు ,పల్లె మధురిమలు ఆ కధల్లో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా స్వప్నాలుగా కనబడవచ్చు.తమది కాని బ్రతుకు బ్రతక వలసిన ధనికుల ధర్మ సంకటాలు ఆమె కధా ప్రపంచానికి ఒక  ప్రతేక పరివేషంగా నిలిస్తోంది.

దారితప్పిన దాంపత్యాల అణిచివేసిన రోధనా స్వరాలు కమలా దాస్ వ్రాసిన ఎక్కువ కధల్లో అంతర్ధారగా కనబడుతాయి. పరస్పరం మోసగించి బ్రతికే  భార్యా భర్తలు –భర్త నుంచి తనకు సంపూరణమైన ప్రేమ అందనప్పుడు భార్య ఒక ప్రియుడు కోసం వెతుకుతుంది. –భర్తను మోసం చేస్తుంది.  భర్తను  మోసగించాననే నేర చింత వల్ల సతమతమయే వాళ్ళు కొందరు –నేరచింత కలగనివాళ్ళు రతీలోకంలో స్వతంత్రంగా విహరిస్తారు –ప్రేమ ,రతి –రెండూ ఒకటి కాదు అని చెబుతాయి ఈమె కధలు – తన కధలు ద్వారా కమలా దాస్ మన ముందు వుంచే ప్రశ్న ఒకటుంది. అది –

తనను ఎన్నెడూ మనస్ఫూర్తిగా ప్రేమించని  భర్తకి లైంగికంగా లొంగిపోవట మనేదా లేకపోతే తనను నిజంగా ప్రేమించే పరపురుషుడికి సంతోషం తో స్వయం అర్పించుకోవటమా  న్యాయం అనే ప్రశ్న అది. కామాసక్తి లేని ప్రేమ వాస్తవికమా? స్త్రీ తాలూకు జీవిత దృకోణం వేరు. ఆమె జీవితాన్ని, పురుషుడు చూసినట్లు చూడదు;అనుభవించదు. ఆమె కోరికలను ఆశలను పోల్చటంలో పురుషుడు విఫలమవుతునాడు –ఈ విశాల దృక్కోణం నుంచి వీక్షిస్తే కమలాదాస్ స్త్రీ వాదియే. సరళంగా గుండెను హత్తుకునే  రీతిలో వ్రాస్తారు. కమలాదాస్ కధల్లోని స్త్రీ పాత్రలు అలనాటి మలయాళీ సమాజానికి సంబంధించినవని చెప్పలేము –ఆమె కధల్లో కనబడే స్త్రీపాత్రలు విశ్వ మహిళలు. అందువలనే ఆమె కధలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి . కమలాదాస్ రచించిన  కొన్ని ముఖ్య కధలు తెలుగులో లభ్యం .

220px-Sara అభ్యుదయ ఆదర్శాల వెలుగులో కూర్చుని రచన చేసిన కధా రచయిత్రి సారా జోసెఫ్ [జననం 1934 ]జీవిత బంధాల్లోని కాలుష్యమూ వ్యక్తి జీవితంలోని దర్మ సంకటాలు ఈమె కధలకు ఇతివృత్తం. అలాగైనా సరే బ్రతుకు బ్రతకటం కోసమే అనేది ఆమె అభిప్రాయం. స్త్రీవాదానికి సంబంధించిన కధలు ఈమె వ్రాయలేదు ;కాని భారతీయ సామాజిక పరిస్డితిల్లో స్త్రీలు అనుభవించే అణిచివేతలనూ దురితాలనూ పోలిస్తునారు ఈవిడ. కధ చెప్పే టెక్నికు కన్నా కధ మీదే ఈ రచయిత్రి తన శ్రద్ధ కేంద్రీకరిస్తునారు.

ఈ తరానికి చెందిన మరో ముఖ్య కధకుడు పద్మరాజన్ [1945—1991 ]. ఎం.టి.లా కాల్పనికుడు కాదు. ఆధునికత యొక్క దర్శనము ప్రయోగాత్మకత కనబడదు అతని రచనల్లో. అతి సాధారణ జీవితాల్లోని  అసాధారణ ముహూర్తాలు  కనిబెట్టే అతని రచనలు వాస్తవికతకి అతి దగ్గరగా వుంటాయి. విషయం ఏదైనా –మనకు నచ్చనివైనా నిరాడంబరంగా ఆవిష్కరించే రీతి అతనిది.  ఇతడు చాలా తెర కధలు కూడా వ్రాసారు కొన్ని కధల్లో రతి యొక్క విస్తృత ఆవిష్కారం కనబడుతుంది

ఈ కధా రచయితల్లో ఎందరో ఇంకా రచనా రంగం మీద సజీవంగానే వున్నారు –కాని 1960లోనే వ్యత్యస్త రూపభావాలతో కూడిన వీళ్ళ రచనలు వెలుబడ్డాయి.  కవిత్వంలోనూ నవలలోనూ అలా కధల్లో కూడా ఆధునికత రూపు దిద్దుకుంటూనే ఉంది –కాని కధలోని ఆధునికతకి సమాంతరంగా రూపు దిద్దుకున్న నవీన కధ వైపు తిరుగుతాం ఇక

పైన చెప్పబడిన రచయితలు రచనా రంగం మీద అడుగు పెట్టిన కాలంలోనే రచనలు ప్రారంభించిన కొందరు కధా రచయితలున్నారు –అలనాటి మలయాళ సాహిత్యంలో నవీనధార సృష్టించినది ఆ  ధారని  సజీవంగా నిలిపినదీ వీరే. ఓ. వి.విజయన్ ,ఎం. ముకుందన్,కాక్కనాడన్ ,సేతు పునత్తిల్, కుంజబ్దుల్లా, ఆనంద్ మొదలైనవాళ్ళు వీరు –ఆధునిక కధకులు అని చెప్పబడే కధకులతో పాటు రచన ప్రారంభించిన వీళ్ళు భిన్నమైన ఒక భావుకతను  సృష్టించారు –అంతే .

ఫ్రెంచ్ ,జెర్మన్ ఆంగ్ల భాషల్లోని ఆధునిక సాహిత్య ప్రభావం వీళ్ళలో కనబడుతుందిసార్త్రే,  కాఫ్కా,  నీషే  మొదలగు రచయితుల దార్శనికత్వం కొంతవరకు వీళ్ళ అభిరుచిని ప్రభావితం చేసిందనే చెప్పాలి

“ అప్పటకే సమాజంలో నెలకొన్న మూల్యాలను సామాజిక వ్యవస్దనూ తిరస్కరించిన ఈ కధకులు జీవితం తాలూకు అర్ధ రాహిత్యం గురించి వ్యర్ధత గురించి వ్యక్తపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళు యదార్థ్యంగా దర్శించినది వ్యక్తిని కాని సమాజాన్ని కాని కాదు ,మానుషి అనే ప్రతిభాసాన్ని– ఆలంబ రహితమైన మానవావస్థ  తాలూకు దైన్యాన్ని –ప్రేమ వాళ్ళ దృష్టిలో కేవలం ఒక దైవ  ప్రేరణ – నగరాల్లో వేర్లు కోల్పోయిన మానుషి యొక్క ఒంటరీతనం  అతని నిసహాయ అస్తిత్వవేదన ,అస్థిత్వం గురించిన అన్వేషణ మొదలైనవి కధా వస్తువులుగా మారాయి. అస్తిత్వ వాద జన్యమైన ఆతృతలను వ్యధలనూ ఆవిష్కరించటం కోసం కధలను కట్టుకధలుగానో ‘ఇకువేషన్ ‘గానో మార్చారు వాళ్ళు “.

కాని ఇది అతి కొంత కాలం మాత్రమే నిలిచింది. ప్రతిభావంతులైన ఈ కధకులు అతి తక్కువ కాలంలోనే తమదైన రచనా మార్గాలు కనిబెట్టారు –మలయాళ కధకి వ్యత్యస్తమైన అనుభూతుల  కవాటాలు తెరిచారు.

ఆధునిక కధకుల్లో ప్రాతస్మరణీయుడు కాక్కనాడన్ [జోర్జ్ వర్గేస్]. ఆధునికత యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే ఇతని కధల్లో కనబడుతాయి. కాని ఎం. టి. తో పాటు అందరి సమకాలీన రచయితుల దృకోణాలనిర్మాణ శైలీల ప్రభావం ఇతని కధల్లో కనబడుతుంది . ఎంతో కాలం తనను మోసుకు తిరిగిన తరువాత  పాతదై నిష్ప్రయోజనమైన  పాదరక్షలను ప్రతీకగా తీసుకొని ఒక వృద్ధుని  మనోభావాలను చిత్రీకరించిన ‘’పాతబడటం’’ అనే కధ [1960కన్నా ముందు]చెప్పుకోదగ్గది. సమాజంలోని సదాచారపు డొల్లతనం బయిట పెడుతాయి ఇతని కధలు .

మరో ముఖ్య కధకుడు ఓ. వి. విజయన్ [1931 –2005]—ఇతడు గొప్ప కార్టూనిస్టు కూడా. ప్రతీకాత్మకంగా  కధ చెబుతాడు ఇతడు. ఆకస్మికం  గానో అప్రతీక్షితం గానో జీవితాన్ని పరిణతిలోకి తీసుకొని వెళ్ళే భౌతీకాతీత  నియోగాలు గురించిన అస్వస్థతలు ఇతని కధల్లో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఇతని కధలను రెండు విభాగాలుగా విభజించవచ్చు. సమకాలీన జీవితానుభవాలను ఒక కార్టూనిస్టు దృక్పదంతో అతిశయోక్తితో కాని  న్యూ నోక్తితో కాని గీసినకధా చిత్రాలు  ఒక విభాగానికి చెందినవి అయితే జీవితంలోని  మనశ్శాంతిని పోగొట్టే దార్శనిక సమస్యల నుంచి పుట్టుకొచ్చిన  కధలు రెండో విభాగానికి చెందుతాయి

చాలా భిన్నమైన ఇతివృత్తాలతో రచన చేసిన కధకుడు ఆనంద్ [పేరు –పి. సచ్చిదానందన్ – జననం 1936]220px-Sachidanandan

కధకుడుకన్నా నవలిస్టుగానే ఇతనికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ. కధల్లోనైనా ,నవలోనైనా తన చారిత్రిక దృక్పదం ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ఈ రచయిత. మౌలికంగా ఇతడు ఒక త్వాత్వికుడు. తన ఆలోచనలను వెలువరించే  మాధ్యమం అతని సాహిత్యం. వ్యాసాలు వ్రాసే బదులు సంఘటనలను కాని కధాపాత్రలను కాని ఆధారం చేసుకొని తన ఆలోచనా ధోరణిని వ్యక్తపరిస్తాడు అతడు. తన ఆలోచనా ధోరణికి అనుగుణమైన పాత్రలనూ సంఘటనలనూ సృష్టిస్తాడు.

పాఠకులను  తన ఆలోచనా ధోరణికి తీసుకురాగలిగిన నిర్మాణ శైలి వున్నందువల్ల వాళ్ళు అతని కధలను ఆస్వాదిస్తారు.

విషాద మిళితమైన ఒక నిస్సహాయ వాతావరణం ఇతని కధల్లో కనబడు తుంది. రాజకీయ చరిత్ర ఎప్పుడూ దోపిడీల,ఆధిపత్యాల చరిత్రే. దోపిడీ  శక్తులు రూపం మార్చుకుంటాయి తప్ప , దోపిడీకి కాని పీడనానికి కాని ముగింపు ఉండదు. పీడించేవాళ్ళు పీడనకి లోనయే వాళ్ళు ఎల్ల కాలంలోనూ ఉంటారు.వాళ్ళ చేతులనుంచి విముక్తి పొందామని అనుకుంటే అది కేవలం తాత్కాలికమే—ఇది ఈ కధకుడు ఆలోచనా ధోరణి . కొన్ని చోట్ల ఈ కధకుడు కధకుని పరిమితి దాటాడేమో నని కూడా అనిపిస్తుంది.

M_mukundanసమాజంలో నెలకొన్న మూల్యాలనూ సదాచార వ్యవస్థలను ప్రశ్నించిన రచయిత ముకుందన్. మత్తుమందుల పొగ నిండిన ఒక వాతావరణం ఇతని కధల్లో చూడవచ్చు. హరిద్వార్ కి వెళ్ళేట ప్పుడు కూడా మూడు పైపులు ఒక పెట్టె పొగాకు పెట్టెలో ఉంచుకోవడానికి మరవని పాత్రలు ఇతని కధల్లో సాధారణం .  బ్యాంగ్ తాగి ‘’పరిశుద్దులైన’’ వాళ్ళు వేశ్యలకు గుడి కట్టేవాళ్ళు కూడా కనబడుతారు ఇతని కధల్లో  –వీటి ద్వారా మూల్యాలను తిరస్కరిస్తునాడు కాని సమాజాన్ని విమర్శించటం లేదు కధకుడు. ఇతని కధల్లో ప్రేమ ఉండదు ;లైంగికత్వమే ఉంటుంది. తను అనుభవించినవి కావు ,తెలుసుకున్నవి ఇతడు కధల్లో ప్రస్తావిస్తునట్లు అనిపిస్తుంది.

ఇలాంటి రచయితుల కధలతో పోలిస్తే చాలా భిన్నంగా వుంటుంది సేతు కధా ప్రపంచం[జననం 1942]మధురమైన జీవితనుబంధాలు కానీ హృద్యమైన  జీవితానుభవాలు కానీ అతని చైతన్యానికి స్పందన అందించటం లేదు. కాల్పనిక సౌందర్యానికి అసలే ఆ కధా ప్రపంచంలో చోటు లేదు. బాహ్య జీవితం ఇతని రచనల్లో అడుగు పెట్టదు –అంతగా అడుగు పెట్టినా అవి ఫాంటసిగా మారుతాయి

జీవిత మహా ప్రవాహాన్ని ఉత్సుకతతో వీక్షించే వాడు కాదు సేతు. అతన్ని అస్వస్థత కు గురి చేసేది మనిషి అనే స్థితి  –దానివల్ల ఏర్పడే దురంత పూరిత పరిణామాలు . అరవై ఎనభై సంవత్సరాలకాలంలో అనావృతమయే ఒక దురంతాన్ని కొన్ని నిమిషాల్లో లేకపోతే ,కొన్ని గంటల్లో చూపించవలసి వచ్చినప్పుడు వాస్తవికత యొక్క మార్గం స్వీకరించటం కుదరదు. అలాంటప్పుడు ఫాంటసియోక్క మార్గం లోకి దారి మళ్లుతున్నాడు  ఇతడు. సేతు కధల్లోని మనుషులు పీడితలు –వివిధ బంధాల సంకేళ్ళల్లో ఇరుకున్నవాళ్ళు. ఇవి తప్పించుకోలేని స్ధితి అని, దానికి కారణం ప్రాకృతికం [నేచురల్ ]అని రచయిత నమ్ముతున్నాడు. జనన మరణాలు కలువలని మరణం బతుకుని మింగడానికి సమయం చూస్తూ వెంటాడుతుందని రచయిత భావం.  తప్పించుకోలేని ఏదో నియోగానికి తలవంచి నిర్ణయింపబడిన ఒక భ్రమణ పధంలో విఫలంగా తిరిగి తన దూరాంతాలను చేరడమే మానవావస్థ  అనే ఆలోచన రచయితను విడిచి పెట్టదు. ఆతని ఎక్కువ కధల్లో మరణం ఒక ముఖ్య పాత్ర. మరణాన్ని వివిధ కోణాల్లోనుంచి వీక్షిస్తాడు సేతు.

సక్కరియ గారి[జననం 1945] కధలు ఒక విచిత్ర ప్రపంచం.  మానవ మనస్తత్వాల సంక్లిష్ట భావాలను ఆవిష్కరించే కధలే కాక నేటి మానవుని ఆత్మస్తుతినీ కపట మనస్తత్వాన్ని హాస్య ధోరణితో నిశితంగా విమర్శించే కధలు కూడా వ్రాశాడు ఇతడు. మాటల్లో గొప్ప ఆదర్శాలు ఒలకపోసినా ,ని జ జీవితంలో అసలు వాటిని పట్టించుకోని క్రైస్తవ సమాజాన్ని చూసి నవ్వుతాడు ఈ రచయిత. మనో సంఘర్షణలను కాని మానసిక భావాలను కాని వ్యక్తపరిచేటప్పుడు ఆచి తూచి మాటలు వాడే సక్కరియ ,ఆక్షేప హాస్యం వ్రాసినప్పుడు మాటలు కుమ్మరిస్తాడు .

కొత్తదీ సంక్లిష్టమూ వైన ఆఖ్యాన శైలి వెతికి కనిబెట్టి ప్రయోగించిన కధా రచయిత మేథిల్ రాధా కృష్ణన్. ఇతని కధలు నిడివిలో చాలా పెద్దవి –శిధిలమైన సంఘటనా వివరాలు –కధా రూపంగురించి ప్రయోగాలు చేసిన ఇతడు ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా అతి సాధారణమైన సంఘటనకి అపరిచితత్వం ప్రసాదించి   భిన్నమైన ఒక వాతావరణం సృష్టించడానికి  ప్రయత్నిస్తున్నాడు. సృజన యొక్క  అందం కాదు రచనా నైపుణ్యమే ఈ కధల అస్తిత్వానికి కారణం.

ఆధునిక  కధా వికాసం గురించి సంక్షిప్తంగా ప్రస్తావించినప్పుడు కొందరు ప్రశస్త రచయితల పేరులు ప్రస్తావించక పోయివుండవచ్చు. శైలిపరంగా గాని దృక్కోణ పరంగా గాని మరే విధంగా గాని భిన్నమైన రచయితలు గురించే ప్రస్తావించటం జరిగింది –అంటే ఇక్కడ ప్రస్తావించబడని  ఎందరో, మలయాళ కధకి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అస్తిత్వ దర్శనం ఆధునిక కధకులను ప్రభావితం చేసింది కాని , ఆ ప్రభావం ఒకొక్క రచయితలోనూ ఒకొక మోతాదులో ఉంటుంది . కొందరు తొలి రోజుల్లో అస్తిత్వ వ్యధలను ఆవిష్కరించారు కాని తరువాత జీవితానుభవాల్లోకి తిరిగి వెళ్ళిపోయారు . 1980 నాటికి, 1960లో వ్యక్తమైన ఆధునికత యొక్క ప్రసక్తి  కోల్పోయింది మలయాళ కధ .

1980 తరువాత రచన ప్రారంభించిన కధకులు మూల్యాల అకారణ తిరస్కారాన్ని హర్షించలేదు. ఆధునికులు బోధ పూర్వంగా నిర్లక్ష్యం చేసిన సామాజిక స్పృహ ప్రదర్శించారు వాళ్ళు. నాగరీక జీవిత పరిస్థితుల్లో అనుబంధాలకు, మూల్యాలకూ వ్యక్తిత్వాలకు జరిగే పరిణామాల వైపు  సంఘర్షణా త్మకమైన జీవితపు సందర్భాల వైపు  మళ్ళీ తన ఆసక్తిని మళ్ళించింది మలయాళ కధ. కధ పూర్తిగా యుక్తి సహజంగా ఉంటాలని కాని నమ్మశక్యంగా ఉంటాలని కాని ఈ రచయితలూ అనుకోవటం లేదు. పూర్తిగా వాస్తవికమైనవీ ,కాల్పనికమైనవీ భావాత్మకమైన  కధలు కూడా ఈ కాలం కధకులు వ్రాస్తున్నారు .ఇతర ప్రాంతీయ భాషల్లో లా  స్త్రీవాద రచయిత్రులు కూడా తమ సాన్నిధ్యాన్ని తెలియపరిచారు ఈ కాలంలో.

lalithambikaనంబుద్రి కుటుంబాల అంతపురాల్లో మొగ్గే స్త్రీల గురించి యాబైల్లో వచ్చిన అంతర్జనం కధలతో –లేకపోతే దానికన్నా ముందే స్త్రీవాద రచనలు వెలుబడినా స్త్రీవాద రచయిత్రులు అనే ముద్ర పడిన రచయిత్రులు  కనబడేది ఈ కాలంలోనే. చంద్రమతి ,ఆషిత ,ప్రియ ఏ. ఎస్. , గీతా హిరణ్యన్,కే.ఆర్.మీర ,ఇందు మీనోన్ మొదలగు రచయిత్రులు వీళ్ళలో కొందరు. తను ఒక ఫెమినిస్టు కాదని గట్టిగా చెబుతూనే ఫెమినిజం  తాలూకు గొప్పతనాన్ని విమర్శించారు చంద్రమతి .  ఇతివృత్తాల్లోనూ  నిర్మాణంలోనూ వున్న వైవిధ్యం ఆమె మాటలను కొంత వరకు సమర్థిస్తుంది కూడా.  కాని ఆమె గొప్ప కధల్లో కొన్ని స్త్రీల సంకటాలను ఆవిష్కరించేవే. నేటి దాంపత్యం  తెలుసుకొని చేసే ఒక పరస్పర వంచన కదా అనే ప్రశ్నను ఒక గొప్ప కధలో ఆవిష్కరించారు ఆమె. స్త్రీల వ్యక్తి గత అనుభవాలను సరళంగా ఆవిష్కరించే ఆషిత [జననం 1956 ]టెక్నిక్ గురించి పెద్దగా పట్టించుకోరు.  తాళికి  ట్రాఫిక్ కానిస్టేబుల్  వేసుకున్న చొక్కాకి వున్న సురక్షితత్వం కూడా లేదని వ్రాస్తారు ఆమె ఒక కధలో.పురుషుని బాధ్యతా రాహిత్యం గురించి కూడా ఆమె అక్షర శిల్పాలు చెక్కారు. ఒంటరి స్త్రీలను గురించి వ్రాసారు ప్రియ .  జనాలమధ్య జబ్బువల్లనో పేదరికం వల్లనో స్నేహ రాహిత్యం వల్లనో ఒంటరిగా మారినవాళ్ళు ,జీవితంలో అమూల్యమైన ఏవేవో పోగొట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇష్టాల తీగలు పట్టుకొని బ్రతుగు సాగిస్తున్నవారు  –ఇలాంటి పాత్రలు ఆమె కధల్లో చూడవచ్చు –దాంపత్య జీవితంలోని నమ్మక రాహిత్యం కూడా ఈమెకి కధా వస్తువే. స్త్రీల మనసులోని సంఘర్షణలూ ధర్మ సంకటాలు ఆవిష్కరిస్తున్నాయి గీతా హిరణ్యన్ కధలు.

గొప్ప రచనా శైలి గల రచయిత్రి కే. ఆర్.మీర[1970] పరిశుద్ధమైన జీవిత బంధాలను గౌరవిస్తున్నారు ఈ రచయిత్రి –సమాజంలోని సదాచార నియమాలను సవాల్ చేస్తున్నాను  అనే భావం ధ్వనించ కుండానే  మానవ సహజమైన ఒక వాస్తవికత అనే రీతిలో సమీక్షిస్తున్నారు  ఆమె లైంగికతను.  కొన్ని కధల్లో ఫెమినిజం  తాలూకు కొన్ని పోకడలను నిశితంగా విమర్శిస్తున్నారు కూడా.  ఈమె కధ లు కూడా  కొన్ని తెలుగులో లభ్యం .

చివరికి ఒక మాట చెప్పాలి. పేజీ కధలు ,  కాలమ్ దాటని కధలు ,కార్డు కధలు మొదలైనవి  మలయాళం లో ప్రాచుర్యం పొందని కధా రూపాలు. ప్రఖ్యాత కధా రచయితలు కొందరు [కమలా దాస్ ,టి. పద్మనాభన్ మొదలగువారు ] పేజీ కధలు వ్రాసి ఉన్నారు. కాని వాటి సంఖ్య చాలా తక్కువ. 2000 సంవత్సరం తరువాత పి,కే. పారక్కడవ్ అనే రచయిత అయిదారు వాక్యాల్లో కధలు వ్రాస్తునాడు. సామాజిక ఐరనీ,రాజకీయ మోసాలు,  స్త్రీ పీడనం ,ప్రపంచీకరణ మొదలగు విషయాలగురించి చాలా ‘ క్రిస్ప్” గా  వ్రాస్తాడు అతడు. కొన్ని కధలు ప్రతీకాత్మకంగా ఉంటాయి. పాఠకుడి పెదవి పై ఒక చిరునవ్వు విరియించి కధలు ఇలా కూడా గొప్పగా వ్రాయవచ్చా అని అనిపించేలా చేస్తాయి ఇతని కధలు. ఉదాహరణకి ఒకటి :

అడుగుల సవ్వడి :

 

తరువాత ఒక గర్జనం లాంటి కాలింగ్ బెల్ మ్రోత

తలుపు సగం తెరిచి చూశాను —అతడే !

కాగితం నాకు అందిస్తూ అతడు అన్నాడు

‘’మీరు పీల్చిన గాలి తాలూకు బిల్ ‘’

 

చివరికి సంక్షిప్తంగా చెప్పాలంటే మలయాళ కధకి సంబంధించిన వరకు మూడు పరిణామాలు జరిగాయి అని చెప్పాలి. వాస్తవిక సామాజిక జీవితంనుంచి వ్యక్తి తాలూకు సొంత దు:ఖాలవైపు మారటం మొదటి పరిణామం. కధ అంతర్ముఖం కావటమే కాక ఆర్ద్రత సంతరించుకుంది ఈ కాలంలో.  మానవావస్థనూ జీవితాన్నీ తాత్విక విమర్శతో వీక్షించేది విశ్లేషించేది  రెండో పరిమాణం. ఈ తాత్విక బరువు వదిలేసి కచ్చితమైన వాస్తవిక దృక్కోణంతో జీవితానుభవాలనూ  అనుబంధాలనూ విశ్లేషించి సర్గాత్మక సాఫల్యం పొందుతునారు నేటి కధకులు.

సమకాలీన మలయాళ కధల్లో ఆధునికానంతర సాహిత్య ధోరణీలు కనబడుతున్నాయా ?ఫెమినిజం  దళిత అవగాహన,  ఇతర సంస్కృతుల దాడి గురించిన అవగాహన ,ఆ దాడిని ఎదురుకోవాలనే ఆతృత వగైరాలు ఆధునికానంతర సాహిత్యపు లక్షణాలని అనుకుంటే అలాంటి ధోరణి మలయాళ కధల్లో కూడా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అతి శక్తి వంతంగా కనబడేది ఫెమినిజం  .ఎందరో ఫెమినిస్ట్ రచయిత్రులు పురుషాధిక్యత గురించి స్త్రీ లైంగికత గురించి నేటి కట్టుబాటులకు సదాచార ఆలోచనలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నారు . జీవితమే తమ సిరాబుడ్డి అని అంటునారు. ఒకొక్కప్పుడు  ఈ కధలు వాస్తవికతకి భిన్నంగానూ దూరంగానూ కనబడుతున్నాయి. ఇప్పడు నెలకొన్నవాటిని తిరస్కరిస్తునారు కాని వాటికన్నా ప్రయోజనకరమైనవాటిగురించి  ఫలదాయకమైనవాటి  గురించి ఆలోచించలేకపోతునారు వాళ్ళు .

దళిత స్పృహ కధల్లో అంత శక్తివంతం కాదు . టి. కే. సి.వాడుతల తోనూ అంతకన్నా ముందూ మొదలైన ఈ ప్రక్రియ వేరు తన్నలేదు. బహుశా కేరళ లో వున్న సామాజిక స్థితి గతులు కావచ్చు దానికి కారణం –రచనలను వర్గీకరించి చూసేదానికన్నా సమగ్రంగానే వీక్షిస్తునారు రచయితలూ ,పాఠకులు.

ఆదివాసీ జీవితంగురించి ఆదివాసిఅయిన  నారాయణ్  వ్రాసిన కధలు,  నవలలు నేటి సాహిత్యంలో ముఖ్యమనే చెప్పాలి. అయినా నేటి మలయాళ కధ కొంతవరకు ఇతివృతపరంగానూ పాత్రలపరంగానూ కేరళ సరిహద్దులు దాటిందనే ది వాస్తవం –మలయాళీల క్రియారంగం విశ్వ వ్యాప్తమైనప్పుడు కధ,కధా పాత్రలు కూడా విస్తరించటం సహజమే కదా !

 

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

–ఎల్. ఆర్. స్వామి

 

 

ఒక నవల – తొమ్మిది అనువాదాలు

ఈ పరామర్శను ఒక వాస్తవిక ఉటంకింపుతోనే మొదలుపెట్టాలి. కథా, నవల ప్రక్రియల్లో పెద్దింటి ఏమిటి అని విగడించుకున్నప్పడు అతనికే చెందే కొన్ని గుణ విశేషాల్ని  ప్రత్యేకతల్ని చెప్పుకోక తప్పదు. కథానికని ప్రక్రియా గౌరవాన్ని పాటిస్తూ కథానికగానే రాయగలడాయన. నవల విషయంలోను ఇది అన్వయిస్తుంది. వస్తు పరిధిలోపల రకరకాల భావజాలాలు అయోమయాన్ని గుప్పించి  పిచ్చిగీతలు గీయడు. ఇతి వృత్తం వెంట 360 డిగ్రీల నుంచి గీసిన ఏ రేఖ అయినా ఉద్దిష్ఠ ప్రయోజనం అనే కేంద్రకానికి సూటిగా చేరుకుంటుంది. వస్తువు పరమ నవీనం సమకాలీనం సామాజికం అయి ఉంటుంది. విలక్షణం అయి తీరుతుంది. అప్పటి వరకు ఆ వస్తువుని ఏ కొందరు రచయితలో సృజించినా అశోక్‌ కూర్చుకున్నంత ఘాడమైన సాంధ్రమైన సాధికారమైన పరిజ్ఞాన భరితమైన ఇతి వృత్తాన్ని ఇతరులెవరూ కూర్చుకోలేక పోయారు అంటే అతని దృష్టి కోణంలోని నైశిత్యం కథా వస్తు గ్రహణంలో అసాధారణత్వం Pinning of the Plot లో అనుభవ విస్తృతి  ప్రత్యేకమైనవి. అతనికి మాత్రమే సాంతమైనవి. శిల్ప పరంగా ఏ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలి?  ఏ సంఘటనని ఎలా జరిపించాలి  ఏ పాత్ర తనంత తానుగా ఎంతగా ఎదగనివ్వాలి వంటి రస విద్యతో పాటు విజ్ఞత ఆయనకు కరతలామలకం. ఆ శైలి తెలంగాణ మాండలిక సొబగుతో పరిమళంతో అమృత సేతనాన్ని ఇస్తుంది. చదువరికి రచనని ఆద్యంతము ఒకే బిగిని చదివింపచేయగల శక్తి ఆ శైలికి ఉన్నదని గ్రహింపుకు వస్తుంది.

నవల సంగతికి వస్తే మూస ఇతి వృత్తానికి విభిన్నంగా ప్రాపంచిక దృక్పథ ప్రతిఫలనంతో సామాజిక వాస్తవికతతో ఒకే అపూర్వమైన అనన్య సామాన్యమైన రచనా శిల్పాన్ని మలిచి తన ప్రతిభా వ్యుత్పత్తుల్ని  గుమ్మరిస్తూ జిగిరి నవలని మన ముందుంచారు అశోక్‌ కుమార్‌.

గుడ్దెలుగు ఒక క్రూర జంతువు. అడవి నుంచి ఊరికి వచ్చి మృగ లక్షణాలను పోగొట్టుకుని సాధువయి పోతుంది. కాని సాధువులా వుండాల్సిన మనిషి  మృగమయి పోతాడు. వస్తువు మూల పదార్థం, ఇతివ్రుత్తం వలయం- రెంటిని స్ధూలంగా స్పర్శిస్తుందీ విషయం. వివరాలను చూద్దాం.

ఊరిచివరి గుడిసె ఆ నలుగురి నివాసం. ఇమాం యజమాని. జంతువు వెంట తిరిగే జంతువులాంటి మనిషి. బీబమ్మ ఇమాం భార్య. వీళ్ల కొడుకు చాంద్‌. ఈ ముగ్గురి దోస్త్‌ అంతకంటే జీవనాధారం షాదుల్‌. ఇది ఒక ఎలుగు. షాదుల్‌ తో ఈ ముగ్గురిది ఇరవయి యేండ్ల సోపతి. బీబమ్మ షాదుల్‌ ను మురిపెంగా చూసుకునేది. తనకు ఇద్దరు కొడుకులని అనందించేది. ఇమామ్‌ షాదుల్‌ అవిభక్త ప్రాణులు. షాదుల్‌ ను అడవిలోంచి తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడ్దారు దంపతులు. దాని అలవాట్లు మార్చి ఆటా పాటా నేర్పడానికి నానా అవస్థలు పడ్డారు.

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

ఈగాథనంతా పాటకులకు  వాస్తవికంగా అందించడానికి  అశోక్‌  అత్యంత సాధికారమయిన సమాచార సేకరణా వివరాలూ సాధించాడు. ఆ వివరాలు చదువుతుంటే  దిగ్బ్రమకి లోనవుతాం. ఎలుగును వేటాడి పట్టుకునే పద్దతులు, దాని జీవన పద్దతులు, స్పందన ప్రతి స్పందనలు , తిండి, రోగానికి మందులు-ఇలా అతి సూక్ష్మమయిన అంశాలన్నింటిని ఎంతో చిత్తశుద్దితో కథాగతం చేస్తాడు రచయిత. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యానుబందాన్ని , ఆనంద విషాదాల కలబోతని , మురిపాల ముచ్చట్లను,  దృశ్యం వెంట దృశ్యం తరుముకొని వచ్చేలా – స్క్రీన్‌ప్లేలాగా కనిపింపజేసాడు రచయిత.

ఒక సందర్భంలో బీబమ్మ తన స్తన్యాన్ని షాదుల్‌కి అందజేసే ఘటన  కరుణ ప్లావితమయి చదువరి కన్నుల్ని చెమరింప జేయడమేకాదు – గుండె బిగిసేట్టు చేస్తుంది. వెన్ను జలలదరింప జేస్తుంది. ఇక చాంద్‌ షాదుల్‌తో ఆడుకునేవాడు. వాళ్లిద్దరు చిన్నపిల్లలయిపోయేవారు. ఎలుగు కుటుంబంలో మనిషయిపోయింది. వారిది విడదీయరాని బంధం.

ఈ నవల ప్రారంభమయ్యే సందర్భంలో ఒక దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. కారణం గ్రామాల్లో ఎలుగును ఆడించకూడదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, రూలు. ఇది ఒకటి. ఎలుగు లేకపోతే వారి జీవనాధారం పోతుంది  కనుక ఆ కుటుంబానికి రెండెకరాల భూమిని పట్టా చేస్తుంది  ప్రభుత్వం – ఇది రెండు. ఈ రెంటిని కలిపి ఆలోచించినప్పుడు దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. చాంద్‌ ఇప్పుడు ఇరవయి ఏళ్ల యువకుడు. అతనికి భూమిని పొందాలని రయితు కావాలని కోరిక. భూమి కావాలంటే షాదుల్‌ ఉండకూడదు. నిజం చెబితే ఏమవుతుందోనని లేదని అబద్దమాడుతాడు. కనుక భూమి కోసం షాదుల్‌ను ఉండనీయకూడదు. చాంద్‌ బలవంతం వలన అతని భవిష్యత్తు మీది ఆరాటం వలన భీబమ్మ అతని దిక్కు చేరిపోతుంది. అప్పుడు మొదలవుతుంది ఘర్షణ. నవల చివర చూస్తే ముగింపు పేరాలను – కళ్లొత్తుకుంటూ ముక్కు పుటాలు అదురుతుండగా మళ్లీ మళ్లీ చదువుతుంటే నా నోట మరోవాక్యం అప్రయత్నంగా నవలని పూర్తి చేసింది. ఆవాక్య మేమిటంటే – అతనిక రాడు !!!

ఈ నవల సంచనాత్మకమైనది. ప్రభుత్వ నిబంధనలన వల్ల ఈ దుస్థితి అనే అంశాన్ని ధ్వన్యాత్మకంగా ఎంతో నిర్మోహతతో చిత్రించి తన శిల్ప నిర్వహణని నైపుణ్యంతో ముగించాడు. జరిగిన దురవస్థలో దుర్ఘటనలో రాజ్య ప్రమేయాన్ని ఎక్కడా ఫోకస్‌ చేయలేదు. రాజ్యం పట్ల విద్వేష ప్రదర్శన ద్వారా కథాగత ప్రాణుల పట్ల ఒక సానుభూతిని పెంపొందించాలనే లౌల్యానికి గురికాలేదాయన. రచయితగా ఇది పెద్దింటి విజయాల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను. దీనికి కారణాల్ని objectiveగా నవలే ఇచ్చింది. రాజ్యం విషయికంగా రెండు positive points ని చెప్పింది నవల. ఒకటి వన్యప్రాణి రక్షణ. రెండు వాటి ద్వారా బ్రతుకు దెరువును కోల్పోతున్న వారికి రెండెకరాల భూమి నివ్వటం. ఈ రెండింటికి నవలాకారుడు రాజ్య వ్యతిరేక చర్యల కల్పనతో ఉపన్యాసాల నిరసనతో తన దృష్టిని మరల్చుకోలేదు. నిజానికి  ఈనవలలో రాజ్యాన్నో దాని దుష్టత్యాన్నో లాగటం పీకటం రచయిత లక్ష్యం కాదు. ధ్వనిమంతంగా కూడా ఏ ఇతర పాత్రల టోన్‌లో కూడా దీన్ని రానీయలేదు. మనిషికి జంతువుకి మధ్య పుట్టి, పెరిగి, దగ్గరై ప్రాణప్రదమైన సంబంధం చివరికిలా చావులతో ముగియవలసిన పనిని అన్యాపదేశంగా కూడా రాజ్యమేమి ఫోర్స్‌ చేయలేదు. ”షాదుల్‌ ను పట్నంల జంతు ప్రదర్శన శాలకు అప్పజెప్పాలనట. మన ఇంట్లనే ఉండనీయద్దట” అని ఎమ్మార్వో  చెప్పినట్లు చాంద్‌ తండ్రికి చెప్పాడు కనుక ఆ option ఉంది కాని అతను అవసరార్థం అది తమతో లేదని బొంకి నెత్తి మీదికి, కొంప మీదికి తెచ్చుకున్నాడు.

ashok2

అసలు నవలా ధ్యేయం వీటన్నిటికీ అతీతమైనది. మనుషుల పట్లనే కాదు ఈ నాటి సామాజిక సంక్లిష్ఠతలో మానవ సంబంధాల సంకీర్ణతలో జంతువుల పట్ల కూడా మనిషి తన మనిషితనాన్ని మరచి ప్రవర్తిస్తున్నాడు. స్వప్రయోజనాకాంక్ష అనేది అతన్ని అంతటి బలవన్మరణానికి తలపడేటంత దారుణ పరిస్థితికి పురిగొల్చుతుందనే అంశాన్ని శిల్పభరితంగా, నవలా ప్రక్రియ సాధనంగా చదువరులకు ఆర్తితో అందించటం ఆ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చిత్తశుద్దితో, ప్రాపంచిక నిబద్దతతో, రచన పట్ల ఆరాధనాభావంతో నిర్వహించి విజయం సాధించాడు రచయిత.

పాత్ర చిత్రణలో ఆ మనుషులతో వారి భావోద్వేగాలతో తాదాత్యంచెందుతాడు కాని ఆసాంతం తానొక Outsider గానే నిలిచి తన ధర్మం నిర్వహిస్తాడు రచయిత. ఇది ఆయన ప్రజ్ఞ .ఏ పాత్ర పనిని ఆలోచనని ప్రవర్తనని ఆ  ఆపాత్రనే చేయనిస్తాడు. పాత్రల ఉత్ధాన పతనాన్ని వారినే పడనిస్తాడు. వారి మురిపాల్ని ఆక్రోశాల్ని వారినే వెల్లడించనిస్తాడు.  ”ఆనాడు తన ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టిన షాదుల్‌కు ఎర్రి మందు పెడుతున్నందుకు దుఖం వచ్చింది ఇమామ్‌కు” అనే ఘట్టాన్ని చదవండి. ఆ తరువాత దీనికి కొనసాగింపుగా ” ఆలోచించి దంచిన మందును ఆవేశంగా దూరంగా విసిరి కొట్టాడు ఇమామ్‌” అనే ఘట్టాన్ని చదవండి. పాత్రని తన పనిని తాను చేయనీయడమంటే ఎమిటో అర్థం చేసుకుంటాము. అలాగే చాంద్‌ ఉక్రోశము, ఆక్రోశము, యువ రక్తపు పొంగు వీటి తీవ్రతని చల్లార్పుని చూస్తాము.

కాలం నిరంతర శ్రోతస్విని. మనిషి బ్రతుకు అంతే ఒడ్డుల వొరుసుకుంటూ పొంగుతుంది. మెరక తేలి ఎండిపోతుంది. ఈ జీవ విభిన్నత్వాన్ని నవలలోని పాత్రలకి అన్వయింపజేస్తూ సార్వకాలీనము, సార్వజనీనము అయిన ఒక తాత్విక స్ఫూర్తిని పఠితులకు పంచే మెస్మరిజంను, సృజనాత్మకత కలిగిన  పెద్దింటి వంటి శిల్పనిపుణుడు నిర్వహిస్తాడు. ‘జిగిరి’ లో ఈ విద్యని మరింత ప్రతిభావంతంగా ప్రదర్శించాడు అశోక్‌ కుమార్‌. పాత్రల మనస్తత్వాల్లో, స్వభావాల్లో భేదాల్ని చెప్పగలగడం ఒక ఎత్తు కాగా ఒక పాత్రని మలచడంలోనే ఎత్తుపల్లాల్ని చూపగలగడం మరోక ఎత్తు. ఈ రెండింటిని అద్భుతంగా ఆవిష్కరించాడు అశోక్‌. ఒక ప్రత్యేక పాత్ర చిత్రణ నుంచి ఒక సమూహాన్ని సాధారణీకరణం చేయడం అనేది ఒక సృజనాత్మక కళ. ఈ కళలో ఆరితేరినవాడు ఈ రచయిత.

ప్రస్తుత సాహిత్య సందర్భం వినిర్మాణాల పోస్ట్‌ మోడర్న్‌ కాలం అని చాలా మంది అంటున్నారు. అంటే రచయితలు వాళ్ల వాళ్ల వైయక్తిక అనుభవాల, ఆకాంక్షల అసాధరణతో Fragmented themes తో కాల్పనిక ప్రక్రియల్ని సృష్టిస్తారని అభిప్రాయం. అయితే ఈ జిగిరి నవల ఈ అభిప్రాయాల్ని అధిగమించి సాహిత్య సృజనలో శాశ్వత విలువల ప్రతిపాదనకే పట్టం కడుతుంది. నవలా వస్తువు ద్వారా శిల్పం ద్వారా మనిషి కోల్పోవకూడని మానవీయతని అంతర్లియంగా పటిష్టం చేసింది. సమాజానికి ఏది వాంఛితమో దాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ రెండిటింకి భిన్నంగా నవల ముగిసిందేమని అనిపించవచ్చు .అదే కళాత్మక వాస్తవికత మర్మం. చదువరిలో ఒక Purging effect తీసుకురావడానికి ముగింపు అలాగే ఉంటుంది. దాని సారభూతమైన ఉద్ధిష్ఠమైన సందేశం సరిగ్గా ఆ ముగింపుకు వ్వతిరేకమైన ఆలోచనని ఆశిస్తుంది. ప్రవర్తనని ప్రోది చేస్తుంది. అంటే సమాజంలో ఉన్న ఇమామ్‌ లాంటి బడుగులు  అలా తమ  బతుకుని ముగించకూడదు. షాదుల్ కు అలాంటి దుర్మార్గపు దయనీయమైన పరిస్థితి రాకూడదు. జిగిరి ప్రయోజనం విజయమూ కూడా పఠితలో ఆ భావనోల్మీనాన్ని అంతర్ముఖీనంగా అందించండమే. ఇది జిగిరి Pinnacle of Success.

ఈ నవల ఇంతటి ఆకర్షణ శక్తి కాంతివంతమైనది. కాబట్టే ఇంగ్లీష్‌, మైథిలీ, మరాఠీ భాషల్లో పుస్తక రూపంలో హిందీ, ఒరియా, పంజాబీ భాషల్లో మాస ప్రత్రికల్లో  ఒకే సారి నవలగా, కన్నడలో ధారా వాహికంగా ప్రచురించబడడమే కాకుండా బెంగాలీ, గుజరాతీ భాషల్లో ప్రచురణకు పత్రికల్లో సిద్ధంగా ఉంది.

 

    విహారి

 

సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ సంస్కృతిలోని భాగం. బొట్టు పెట్టుకోవడం, కత్తిపట్టుకోవడం, మట్టి కాల్చి కుండలు చెయ్యడం అన్నీ అన్నీ సంస్కృతిలో భాగాలే. ఒక జాతి చేయగల మంచి, చెడూ సంస్కృతిలో భాగాలే. తెలుగునాట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా నోములు నోచుకుంటారు. ఎలా భిక్షాటన చేస్తారు. ఎలా పెళ్లి చేస్తారు. ఏ విధంగా విడాకులు తీసుకుంటారు. యుద్ధాల్లో ఎలా పాల్గొంటారు. ఓటమిని ఎలా ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారు. యౌవనాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఇలాంటివన్నీ సంస్కృతిలో భాగమే. దొంగలు, దొరలు, పూజారులు, వేశ్యలు, అధికారులు, సామాన్యులు, వీరులు, భిక్షకులు, విద్యావేత్తలు, నిరక్షరాస్యులు ఇలా ఎందరుండే వీలుందో అందరూ సంస్కృతిలోనే ఉండగలరు. ఏం చేసినా సంస్కృతిలోనే చెయ్యగలరు. తెలుగు దొంగలు ఎలా జేబులు కొడతారు, తెలుగు వేశ్యలు ఎలా విటులను ఆకర్షిస్తారు,  తెలుగు పిల్లలు ఎలాంటి ఆటలాడుకుంటూంటారు వగైరా అన్నీ ఆ పేద్ధ వృత్తంలొ భాగం. ఇది సంస్కృతి గురించి నా అనుకోలు, అవగాహనానూ. “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ”, “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” సంస్కృతిలో భాగమైతే అణాకాసంత బొట్టు పెట్టుకుని పేరంటాలిచ్చిన వాయినాలతో నోము నుంచి తిరిగొస్తున్న సోమిదేవమ్మా సంస్కృతిలోని భాగమే. “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతూ, ఇవాళ్టికేమైనా వస్తుందేమోనని చూసి చూసి ఇంటికి వెళ్లి భార్య ఇచ్చిన తులసి ఆకుల తాంబూలం తృప్తిగా తిని వెర్రినవ్వు నవ్వుకునే పూజారీ సంస్కృతిలోనివారే.
ఇక సాహిత్యం అంటే టీషర్టుల మీద రాసిన రాతలు మొదలుకొని జనుల నాల్కలు తాటియాకులుగా లిఖింపబడ్డ పద్యాల వరకూ అంతా సాహిత్యమే. దాని ప్రయోజనమూ వేర్వేరు పద్ధతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక చక్కని ఊహ చదివితే ఒళ్లు పులకించింది అది సాహిత్య ప్రయోజనమే. ఒక చిన్న జోకు చదివితే పేద్ద నవ్వు కాకున్న చిరునవ్వు పొటమరించిందీ అదీ ప్రయోజనమే. ఒక రచన చదివి జీవితంపై మనకుండే అవగాహనే మారిపోయిందనుకోండి అదీ ప్రయోజనమే. ఐతే వాటి మధ్య చాలా అంతరువులున్నాయి. కానీ ఒక స్తరంలో చూస్తే లక్ష్యసిద్ధి ఉన్న సాహిత్యమే అవి మూడూను. ఆ సాహిత్యానికి ఎన్నో రూపాలుండవచ్చును. సామెతగా లోకరీతులు చెప్పినా, పేదరాశి పెద్దమ్మకథగా మరోలోకాల్లోకి తీసుకుపోయినా అవి చక్కని సాహితీప్రక్రియలే. సరే నాకు సాహిత్యం పట్ల ఉన్న అవగాహన ఇది.(అటు ఇటుగా మిగిలిన సృజనాత్మక ప్రక్రియలకు కూడా ఇంత పరిధీ ఉంటుంది)
ఇప్పుడు ఒక సృజనాత్మక ప్రక్రియ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నమాటకు అర్థమేమిటి చెప్పండి? నా అవగాహన వరకైతే సంస్కృతి అన్న పేద్ద కాంపౌండును ఒక రచనలో ప్రతిబింబించడం ఎలా సాధ్యపడుతుంది? సంస్కృతిలోని చాలా అంశాలను చక్కగా వివరించొచ్చు. పైగా ఎన్నో ప్రాంతాల, వృత్తుల సంస్కృతులని(పైన నేను చెప్పుకున్న వివరణనే సంస్కృతి విషయంలో గుర్తుతెచ్చుకోండి) కలగలిపితేనే ఒకనాటి తెలుగువారి సంస్కృతి ఏర్పడుతుంది. అందువల్ల ఆ విరాట్ స్వరూపాన్ని మనం ఎంతవరకూ దర్శించగలమో అంతవరకే కనిపిస్తుంది. బ్రాహ్మణుల జీవన విధానం రూపుకడితే సంస్కృతిలోని కొన్ని విశేషాల్ని ఎట్టేదుట పరిచినట్టే, ఐనంత మాత్రాన తెలుగు సంస్కృతినంతా ఆవిష్కరించంచినట్టు అవదు. అంత పని చేయాలంటే మహాభారతమంత లోతూ, విస్తృతీ కలిగిన ఉద్గ్రంథం అవసరమవుతుంది తప్ప చిన్న కథ, కవిత, నవలికలకు కుదరదు. విస్తృతీ, లోతూ ఒనగూడినా సంస్కృతి అంతటి మహా సాగరాన్ని మొత్తంగా ప్రతిబింబిస్తాయా అంటే కాదనే చెప్పాలి. ఆ పని ఎలాంటిదంటే ఆకాశమంతటినీ ఒక అద్దంలో చూపడం లాంటిది. ఆకాశాన్ని అద్దంలో చూపగలమా? చూపగలం. ఆకాశమంతటినీ ఒకే అద్దంలో చూపగలమా? ఏమో ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించినవారు ఉన్నట్టు నాకు తెలియదు. ఐతే సంస్కృతిని అనే ఆకాశాన్ని సాహిత్యమే సాగరం అత్యంత అరుదైన సందర్భాల్లో ప్రతిబింబించి ఉండొచ్చు. కాని మన చిన్న స్కేళ్లు దాన్ని నిరూపించలేవు.
మరి చేయగలిగింది ఏమిటంటే ఎవరి స్థాయిలో వారు సంస్కృతి విస్తృతిని అర్థం చేసుకుని తమ తమ స్థాయిల్లో ప్రతిబింబించగలగడమే. అలా చేస్తూన్నారు కూడా. అందుకే తెలుగు వారి సంస్కృతిని ప్రతింబింబించే సృజనగా దేన్నైనా చెప్తున్నారు అంటే వారు దాన్ని వాచ్యార్థంగా చెప్పలేదనో, సంస్కృతి అన్న పదానికి ఉన్న విస్తృతి వారికి తెలియదనో అర్థం చేసుకోవాలి.
ఇక మరో అంశం. ఎవరైనా సంస్కృతిని ప్రతిబింబించే సృజన అని అన్నప్పుడు సంస్కృతిలో భాగాన్ని ప్రతిబింబించి సారస్వతాన్ని సంపన్నం చేస్తోందన్న అర్థం స్వీకరించడం మాని ఇదే తెలుగు సంస్కృతా అని ప్రశ్నించి అంతటితో ఆగక ఇది జనాభాలో ఇంతశాతం మాత్రమే ఉన్నవారి అనుభూతులు, అనుభవాలు, ఆశలు, ఆశయాల సమాహారం మాత్రమే కనుక ఇది తెలుగు సంస్కృతి కాదని తిరస్కరిస్తున్నారు. ఐతే వారు కూడా తెలియకుండానే సంస్కృతి అనే విశాలమైన బంజరును కంచె వేసి సంకుచితం చేసేస్తున్నారు. ఫలానా వారి రుచులు, అభిరుచులు మాత్రమే సంస్కృతి కాదు అని చెప్పేప్పుడు అది ఫలానావారి సంస్కృతి అని దాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వారి హక్కు అని మరచిపోతున్నారు.
నిజంగా సంస్కృతీ అన్వేషకులు చేయాల్సిన పని అది కాదు. ఏ అంశాలను తెలుగు సారస్వతం విస్మరించిందో పట్టుకోవాలి. సృజన గలవారైతే దాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి. డబ్బున్నవారు అలాంటి విషయాన్ని సాహితీకరించడమో, తెరకెక్కించడమో చేసేవారికి దన్నుగా నిలవాలి. ఇవేవీ లేనివారు అలాంటివారిని కనీసం ప్రోత్సహించాలి. అప్పుడే సాహిత్యం సుసంపన్నమవుతుంది. ఆకాశం అరచేతిలో ఇముడుతుంది.
“జయంతి తే సుకృతినోః రససిద్ధా కవీశ్వరః
 నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం”
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !

Neelambari Cover

నాకు ముందుమాటలు రాసే అలవాటు లేదు. ఇదివరకోసారి రాసేను కానీ ప్రచురణకర్తలు అంగీకరించ లేదు  దాన్ని (చిత్రంగా ఉంది కానీ ఇలా కూడా జరగగలదని నాక్కూడా అప్పుడే తెలిసింది!). అంచేత, శారద నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు నేను సంకోచించాల్సివచ్చింది. కానీ శారద తప్పకుండా రాయమని మరీ మరీ అడగడంతో ఒప్పుకోక తప్పలేదు.

శారదతో నాపరిచయం నాసైటు www.thulika.net ద్వారానే. గత ఐదారేళ్ళలో దాదాపు పదికథలవరకూ అనువాదం చేసి ఇచ్చేరు. ఆమె నా సైటుధ్యేయం శ్రద్ధగా పరిశీలించి తదనుగుణంగా కథలు ఎంపిక చేసి. అనువాదం చెయ్యడం, అవి కూడా అనువాదాలవిషయంలో నా అభిప్రాయాలకి సానుకూలంగా ఉండడంచేత నాకు శారదయందు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అంచేత ఈ ముందుమాట రాయడానికి అంగీకరించేను.

ఆ తరవాత ఈ ముందుమాట రాయడానికి కూర్చుంటే, సంకలనాలపుట్టుక గురించిన ఆలోచనలు కలిగేయి. అసలు సంకలనాలు ఎందుకు వేస్తారు, అవి ప్రత్యేకంగా సాధించే ప్రయోజనం ఏమిటి అని.

మన దేశంలో ముద్రణాలయాలు 1675లో వచ్చినా, దక్షిణానికి ఆ యంత్రాలు 1711లో వచ్చేయి. మొదట్లో ప్రచురించినవి ఎక్కువగా క్రైస్తవ మతప్రచారానికే. రెండవదశలో తెలుగు సాహిత్యాభిలాషులు తెలుగుసాహిత్యానికి ప్రాధాన్యతని ఇస్తూ పత్రికలు ప్రచురించడం మొదలు పెట్టేరు. గోదావరి విద్యాప్రబోధిని (1800కి పూర్వం), మితవాది 1818లో వచ్చాయి. సుజనరంజని (1862-1867), పురుషార్థప్రదాయిని (1872-1878) లాటి పత్రికలతో పాటు  వీరేశలింగంగారి వివేకవర్ధిని (1874-1885), కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి ఆంధ్రభాషా సంజీవని (1871-1892; 1892-1900) లాటి పత్రికలు పుట్టేయి. (సమగ్రాంధ్ర సాహిత్యం. సం. 2. పు. 620-621, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఆరుద్ర సమకూర్చిన పట్టికలో 102 పత్రికలపేర్లు ఉన్నాయి. వాటిలో భారతి, గృహలక్ష్మి, ఆంధ్రపత్రికలాటి ఏ నాలుగయిదు పత్రికలో తప్పిస్తే, పైన ఇచ్చినతేదీలు కాక, మిగతాని పదేళ్ళపాటైనా మనలేదు. ఈ పత్రికలలో సమకాలీన సామాజికసమస్యలూ, సాహిత్యచర్చలూ విరివిగా జరిగేయి. వాటితోపాటు ప్రతి సంచికలోనూ ఒకటో రెండో కథలు కూడా ప్రచురించేరు. కానీ ఈ పత్రికలేవీ అట్టే కాలం నిలవకపోవడంతో, బహుశా ఆ యా రచయితలో సాహిత్య శ్రేయోభిలాషులో ఆ కథలని సంకలనాలుగా ప్రచురిస్తే, భావితరాలకి అందుబాటులో ఉంటాయన్న అభిప్రాయంతో సంకలనాలు ప్రచురించడం మొదలు పెట్టినట్టు నాకు తోస్తోంది. నేనిలా అనుకోడానికి ప్రమాణాలేమీ లేవు. నాకు చూడడానికి అట్టే పుస్తకాలు దొరికే అవకాశం లేదు కనక నేను ఈవిషయం ఇతర పరిశోధకులకి వదిలేస్తున్నాను.

ఈరోజుల్లో ఆధునికకథలు అనిపించుకుంటున్న కథలు సంకలనాలుగా 20వ శతాబ్దం ప్రథమపాదంలోనే వచ్చేయి. అప్పట్లో పత్రికలప్రచురణ బాగానే అభివృద్ధి చెందినా, చాలా పత్రికలు పుబ్బలో పుట్టి మఖలో మాడిపోడంతో రచయితలు తమ కథలని సంకలనాలుగా ప్రచురించడం మొదలెట్టి ఉండొచ్చు. ఆ తరవాత వేరు వేరు రచయితలకథలతో సంకలనాలు వచ్చేయి.

మనం స్మరించుకోవలసిన మరొక విభాగం జానపదసాహిత్యం. మనకి ఆనోటా ఆనోటా చెప్పుకుంటున్న జానపదసాహిత్యం చాలా ఉంది. అయితే ఈ చెప్పుకోడంలో పరిధి చాలా తక్కువ. ఇంట్లోవాళ్లూ, ఇరుగూ పొరుగూ, ఇంటికొచ్చినవాళ్ళూ – వీళ్లే ఆ చెప్పుకునే కథలకి శ్రోతలు. ఇది గమనించిన సాహిత్యాభిమానులు ముద్రణాలయాలొచ్చేక కథలని అచ్చొత్తించి భావితరాలకి అందించాలనే కోరికతో ఆ కథలని సేకరించి ప్రచురించడం ప్రారంభించేరు.  “కుంఫిణీయుగంలో పాతకథలకి కొత్త గిరాకీ వచ్చిందం”న్నారు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం 2. 47). 1819లో రావిపాటి గురుమూర్తి విక్రమార్కునికథలు సంకనలంగా ప్రచురించేరని ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంలో రాసేరు. (2. 268). 1830 మేలో ఏనుగు వీరాస్వామి కాశీయాత్రకి బయల్దేరి, దారిలో తాను చూసిన వింతలూ, విశేషాలూ …కి ఉత్తరాలలో రాసేరుట. … గారు వాటిని ఆ తరవాత ప్రచురించేరు. ఇది కథ కాదు కానీ కేవలం పుస్తకాలు అచ్చేయడంలో మనవారికి గల ఆసక్తి తెలియజేయడానికి చెప్పేను. కథలమాటకొస్తే, పంచతంత్రం 1834లో, పాటూరి రామస్వామి శాస్త్రులుగారి శుకసప్తతికథలు 1840లో ప్రచురించేరు (కె.కె. రంగనాథాచార్యులు. తొలినాటి తెలుగు కథానికలు. 1840 చాలా ప్రాముఖ్యత గల సంవత్సరం అంటారు ఆరుద్ర (స.సా. 2. 55). తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ప్రచురణ మొదలయిందప్పుడే కాబోలు. ఈ సంకలనాల్లో మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏకసూత్రత. అన్నీ జానపదసాహిత్యంలో అంటే నోటిమాటగా చెప్పుకుంటున్న కథలే అయినా, సంకలనాలుగా ప్రచురించినప్పుడు “మాకిష్టం అయినకథలు” అని గాక, ఒక నిబద్ధత పాటించేరు. భట్టి విక్రమార్కుడి కథలలో చిక్కు ప్రశ్నలు, శుకసప్తతికథల్లో శృంగారం, నీతి, తెనాలి రామలింగడికథల్లో హాస్యం, చమత్కారం, కాశీమజిలీకథల్లో దారిపొడునా ఊరూరా ఆ గురుశిష్యులు గమనించిన వింతలు, విశేషాలు – ఇలా ఏకసూత్రత కనిపిస్తుంది.

ఆతరవాత అంటే 1910 దాటేక, ఒక రచయిత తాను ఎంచుకున్న కథలు, కానీ ఒకే రచయిత కథలు గానీ ప్రచురించడం మొదలయింది. కె.కె. రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు పుస్తకంలో మొత్తం 15 సంకలనాలు 1917 నించి 1928మధ్య ప్రచురించినట్టు ఉంది. వీరిలో మనకి ఇప్పుడు తెలిసినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావు – సువర్ణలేఖా కథావళి (తేదీ లేదు), మాడపాటి హనుమంతరావు – మల్లికాగుచ్ఛము (1915), పానుగంటి లక్ష్మీనరసింహారావు – కథాలహరి (1917), గుడిపాటి వెంకట చలం – కన్నీటికాలువ, మునిమాణిక్యం నరసింహారావు – కాంతం కథలు, గురజాడ అప్పారావు – ముత్యాలసరాలు చిన్నకథలు, వీటితోపాటు మరుగున పడిపోయిన రచయితలు – వెదురుమూడి శేషగిరిరావు – మదరాసు కథలు (1911?), రాయసం వెంకటశివుడు – చిత్రకథామంజరి (1924), పోదూరు రామచంద్రరావు – కథావళి (1928) లాటి పేర్లు కూడా కనిపించేయి. (పు. 28-29). ఈ సంకలనాలలో ఏవి ఒకే రచయిత కథలు, ఏవి వివిధరచయితలో కథలు అన్నది రచయిత స్పష్టం చేయలేదు. నామటుకు నాకు రెండు రకాలూ అయి ఉండవచ్చని తోస్తోంది.

నలభై, యాబై దశకాలలో సంకలనాలు విరివిగా వచ్చేయి. మొదట్లో ఏదో ఒక సంస్థ పూనుకుని ప్రచురించడం జరుగుతూ వచ్చింది. సంకలనకర్తని ఆ సంస్థే ఎంచుకోవచ్చు. లేదా ఎవరో ఒకరు సంకలించడానికి పూనుకుని సంకలనం తయారు చేసి ప్రచురణసంస్థలని ప్రచురించమని అర్థించవచ్చు. ఈ సంకలనాలకి ఆదరణ కూడా బాగానే లభించింది. అందుకు కారణం ప్రధానంగా రచయితలపేర్లు పత్రికలద్వారా ప్రచారం కావడం. ఆ తరవాతి దశలో ప్రచురణకర్తలు నవలలకి ప్రాధాన్యం ఇచ్చి చిన్నకథలని చిన్నచూపు చూడడంతో రచయితలు తమకథలు తామే సంకలనాలుగా వేసుకోడం ప్రారంభించేరు. కాలక్రమంలో ఇది 90వదశకంలో వచ్చిందనుకుంటున్నాను.

ఇప్పడు, అంటే గత 40 ఏళ్ళగా డయాస్పొరా కథలు రావడం మొదలయింది. సంకలనాలు ఇంకా ఆలస్యంగా అంటే గత ఇరవై ఏళ్ళలో వస్తున్నట్టుంది. ఈ సంకలనాలు ఎక్కువభాగం అమెరికాలో ఉన్న తెలుగువారికలంనుండి వస్తున్నవే. శారదలా ఆంధ్రదేశానికీ, అమెరికాకీ దూరంగా ఉండి రచనలు సాగిస్తున్నవారు తక్కువే నాకు తెలిసి. ఇంతకీ ఏ కథలు డయాస్ఫొరా కథలు అంటే నేను సమాధానం చెప్పలేను. ప్రధానంగా డయాస్ఫొరా కథలు ఎలా ఉంటాయి అన్నవిషయంలో నాకు అవగాహన లేదు. వేలూరి వెంకటేశ్వరరావు వ్యాసం(http://www.eemaata.com/em/issues/201003/1547.html) చూసేక నాకు అర్థమయిన విషయం – ఈనాడు డయాస్ఫొరా కథ అంటే అటు పుట్టినదేశానికి దూరమై అక్కడిజీవితాన్ని మళ్ళీ మళ్ళీ తలబోసుకోడమో (నోస్టాల్జియా), ఇటు మెట్టినదేశంలో సాంస్కృతికసంఘర్షణలలో ఈతిబాధలు కలబోసుకోడమో అనిపిస్తోంది. ఆవిధంగా ఆలోచిస్తే శారదగారి సంకలనాన్ని డయాస్ఫొరా అనడానికి నాకు మనసొప్పడం లేదు. ఈకథల్లో ఇతివృత్తాలు ఈ డయాస్ఫొరా నిర్వచనంలో ఇమడవు అనిపించింది నాకు. ఈవిషయానికి మళ్లీ వస్తాను.

ప్రస్తుతం ఆధునిక, సమకాలీన, సామాజిక కేంద్రంగల కథలు అంటే ఒక సందేశమో ఇతివృత్తమో ఏకసూత్రంగా ఉన్నవి అనుకోవాలి. అంటే స్త్రీలకథలు, దళితకథలు, ఆకలి కథలు, ఏదో ఒక ఊరి కథలు … ఇలా ఆ సంకనలకర్త అభిరుచులని బట్టి, ఇష్టాయిష్టాలని బట్టి సంకలనాలు వస్తున్నాయి. ఎనభై దశకంలో స్త్రీవాదం, దళితవాదంలాటి వాదాలు ప్రబలడంతో, ఏదో “వాద“ కథలనే అంటున్నా, వీటన్నిటికీ సాంఘికప్రయోజనం అన్న మరో ధర్మసూత్రం కూడా గొడుగు పట్టడంతో సంకలనాలలో వైవిధ్యం అదృశ్యమయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా ప్రచురిస్తున్న కథ ????(ఏదో సంవత్సరం) తీసుకోండి మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఇదే.

ఒకే రచయిత రాసినకథల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈకథల్లో హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే అకృత్యాలమీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వచిత్రణ ఉంది. ఈ సంకలనంలో ప్రతికథమీద నేను వ్యాఖ్యానించను కానీ ఉదాహరణకి కొన్ని కథలు పరిశీలిస్తాను.

మొదటి కథ రాగసుధారసపానము ఎత్తుగడలో హాస్యరసస్పోరకంగా ఆషామాషీగా ఉన్నా, ముగింపులో మన శాస్త్రీయసంగీతం భవిష్యత్తుగురించిన తపన కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఈరచయిత్రే రాసిన మాయింట్లో మర్డర్లు చదివినప్పుడు, రచయిత్రి ఒకే అంశానికి భిన్నకోణాలు ఆవిష్కరించడం కనిపిస్తుంది. (చూ. నీలంబరి బ్లాగు, http://sbmurali2007.wordpress.com/).

యుద్ధసమయంలో బతికుంటే బలుసాకు తినొచ్చు అనుకుని పడవెక్కి  మరో దేశానికి పారిపోతే, అక్కడ ఎదుర్కొనే దుస్థితిగురించి చెబుతుంది పడవ మునుగుతోంది కథ. ఇది దేశం వదిలి పోయినవారి కథ కనక ప్రవాసాంధ్రులకథ అనుకోవచ్చేమో కానీ రచయిత్రి కథ మలిచినతీరులో డయాస్ఫొరా ఎల్లలు దాటి, మానవీయకోణం ఆవిష్కరించడం చూస్తాం. ఒక మనిషి పరిచయమయిన తరవాత ఆ మనిషితత్వాన్నిగురించి, వ్యక్తిత్వాన్నిగురించి ఊహలు కలగడం సహజం. నిజానికి మనఊహలకీ ఆశలకీ ఒక అవినాభావసంబంధం ఉంది. ఆ రెంటినీ సమన్యపరుచుకుని సమాధానపడడం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఊహాచిత్రం. ఇందులో వాచ్యం కాని మరొక అంశం ఎవరి ఊహలు ఎంతవరకూ నిజం అన్నది. అది పాఠకులఊహలకి వదిలిపెట్టడం రచయిత్రి నేర్పుకి ఉదాహరణ.

అతిథి కథలో విశేషం అతిథిసత్కారాలు మన జీవితంలో ఒక భాగం. ఆ ఆగంతుకుడు ఒక చిలుక అయినప్పుడు ఆ చిలుక పొందిన అతిథిసేవ హృద్యంగమంగా చిత్రించిన కథ. ఈ కథలో చిలుక ప్రసక్తి రాగానే నాకు గుర్తొచ్చిన రెండు కథలు భద్రాచల రామదాసుకథ, ఆచంట శారదాదేవిగారి పారిపోయిన చిలుక. ఈ రెండు కథలకీ భిన్నంగా శారద తనకథలో మానవుడికీ మానవేతర జీవులకీ మధ్య ఉండగల సౌమనస్యం, సౌజన్యం చిత్రించేరు. నాకు ఈ అభిప్రాయం ఏర్పడడానికి కారణం కథలో ప్రధానపాత్ర చిలుకే అయినా కథ కుక్కపిల్ల, పిల్లిపిల్లతో మొదలవడం. సాధారణంగా ఆధునికకథల్లో కథాంశం ఎత్తుగడలోనే చెప్పాలంటారు విజ్ఞులు. అలా అనుకుంటే ఈ కథ చిలుకతోనో, ప్రధానపాత్ర అయిన గృహిణితోనో మొదలవాలి. కానీ మరో రెండు జీవాలని పరిచయం చేయడంతో, కథకురాలు కథని విస్తృతం చేసేరు.

నేనెవర్ని కథలో వస్తువు సర్వసాధారణమే అనిపించినా, ఈకథకి నేనెవర్ని అని శీర్షిక ఇవ్వడం పెట్టడం రచయిత్రి సూక్ష్మదృష్టికి తార్కాణం. పాఠకులదృష్టిని ఆకట్టుకోగల శీర్షిక అది. ఎందుకంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఆ ప్రశ్న, నేనెవర్ని, అనిపించకమానదు. కథమాటకి వస్తే, “స్త్రీ ఎవరు?” అంటే మనకి అనూచానంగా వస్తున్న నిర్వచనం “కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, అని. కానీ ఈ శాస్త్రాలు పుట్టినకాలంలో పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఈనాటి స్త్రీ వ్యక్తిత్వం వేరు. ఈనాటి ధర్మపత్ని బయటికి వెళ్ళి బయటిపనులు కూడా చేస్తోంది. పైగా తన అస్తిత్వాన్ని గురించిన స్పృహ కొత్తగా వచ్చింది. ఆ దృష్టితో చూస్తే ఇది స్త్రీవాదకథ అనుకోవచ్చు. కానీ తరిచి చూసే పాఠకులకి మరికొన్ని ఆలోచనలు స్ఫురించగలవు. ఉదాహరణకి ఈకథలో ప్రధానపాత్ర మగవాడయితే, ఆఫీసులో అధికారికి సలాములు చేసినా, ఇంటికొచ్చేక, ఇంట్లో యజమాని, పిల్లలకి తండ్రి, భార్యకి భర్త, తల్లిదండ్రులకి సుపుత్రుడు – ఇలా అనేక పాత్రలు పోషిస్తాడు. మనిషి సంఘజీవి, కుటుంబజీవి కనక వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాత్రలు నిర్వహించడం సహజమూ, అవసరమూను. ఈ రెండు కోణాలూ పక్క పక్కన పెట్టి చూసినప్పుడు, సమాజంలోనూ, కుటుంబంలోనూ వ్యక్తికి గల బాధ్యత ప్రస్ఫుటమవుతుంది. తద్వారా సాటి మనిషిని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. రచయిత్రి ధ్యేయం ఇదీ అని నేను చెప్పడంలేదు. కానీ పాఠకుడు ఇలా కథని విస్తరించి చదువుకున్నప్పుడు కథకి మరింత బలం చేకూరగలదు అని నా నమ్మకం. కథకులకీ, పాఠకులకీ కూడా దీనివల్ల లాభమే.

అలాగే పడగనీడ కూడా పాఠకులని ఆలోచింపజేయగలకథ. లోకంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లలకి రక్షణ లేకుండా పోతోంది. పాము పడగనీడ వసించు కప్పల్లా పిల్లలబతుకులు దినదినగండం అయిపోతున్నాయి. ఇది అందరికీ తెలిసినవిషయమే. అయితే, అలా జరగడానికి కారణం ఏమిటి? ఒక కారణమేనా, అనేక కారణాలున్నాయా? ఉంటే అవేమిటి? ఇలా ఆ దౌర్జన్యానికి వెనక కారణాలు వెతకడం ఒక దారి. మరి రేపటిమాట ఏమిటి? ఆ హింస, దౌర్జన్యం జరగకుండా చెయ్యాలంటే, ఎక్కడెక్కడ మనం ఏ ఏ మార్పులు చెయ్యాలి, చెయ్యడానికి పాటు పడాలి అని ఆలోచించుకోడం మరో దారి. ఇన్ని కోణాలు చిత్రించడంలో రచయిత్రి విజయం సాధించేరు. కథలు పాఠకులని ఆలోచింపజేయాలి. అనేక కోణాలు స్పశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలి. ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ అదే వ్యత్యాసం.

స్థూలంగా, కథ నడపడంలో మంచి నేర్పు ఉంది రచయిత్రికి. ఎక్కడా అధిక ప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలివి. అలాగే కథలకి శీర్షికలు పెట్టడంలో, వస్తువు ఎంచుకోడంలో, ఆ అంశాల్లో తనకి గల అవగాహన స్పష్టం చేయడంలో, కథ నడపడంలో శారద కృతకృత్యులయేరని చెప్పడానికి నేను సందేహించను. అది మంచి రచయిత లక్షణం. ఎక్కడా విసుగు పుట్టకుండా చకచక చదువుకుంటూ పోవడానికి కావలిసిన పటుత్వం ఉంది శైలిలో.

భాషవిషయం నాకు ప్రత్యేకించి అభిమానవిషయం. అంచేత ప్రత్యేకించి ఈ సంకలనానికి ఇది వర్తించకపోయినా, ఈ విషయం కాస్త వివరంగా రాస్తున్నాను (అందుకు శారద, సురేష్ కొలిచాల అనుమతిస్తారని ఆశిస్తూ). గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి ప్రతిష్ఠాత్మకరచయితలు వందేళ్ళకి ముందే వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించేరు. ఇప్పుడు మనం అందరం వ్యావహారికభాషలోనే రాస్తున్నాం. అయితే, ఇది అప్పారావు గారూ, రామ్మూర్తిపంతులు గారూ చూసి ఆనందించి, అభినందించే వ్యావహారికమేనా? అంటే నాకు అనుమానమే. ఆనాడు మనతెలుగుకథలు సంస్కృతంలో రాస్తే, ఇప్పుడు ఇంగ్లీషులో రాస్తున్నట్టుంది. కొన్ని కథలు చూస్తే ఇది తెలుగుకథ అని నాకు అనిపించడం లేదు. ఇంగ్లీషుమాటలు కూడబలుక్కుని చదువుకుని, మనసులో మళ్ళీ నాతెలుగులోకి తర్జుమా చేసుకుని చదవాల్సివస్తోంది. ఈవిషయంలో బెంగాలీ రచయితలు కృషి చేస్తున్నట్టు గురజాడకి జ్ఞానేంద్రమోహన్ దాసు 1914లో రాసిన జాబువల్ల తెలుస్తోంది. (గురజాడ అప్పారావు. గురజాడ జాబులు, దినచర్యలు. సం. సెట్టి ఈశ్వరరావు. పిడియఫ్ లో పు. 58.). ఆయన ఇలా రాసేరుః

“విజయనగరం, విశాఖపట్టణాలలో నేను వున్న ఆ స్వల్పకాలంలో, నేనొక విషయాన్ని గ్రహించగలిగాను. అక్కడి పండితులు రెండు వర్గాలు. మొదటివర్గంవారి పద్ధతి అతి ప్రాచీనం. సాహిత్యరచనలో ఏ మాత్రపు ప్రాచీన పద్ధతులు సడలినా వారు సహించరు. మార్పుకు వారు విముఖులు. రెండవర్గంవారు సుముఖులు. కనక ఈ ఇరు తెగలవారికి అన్నిటా చుక్కెదురు.

ఒకొప్పుడు బెంగాలీభాష పరిస్థితి ఇలాగే వుండేది. పదాడంబరంతో పడికట్టు రాళ్ళవంటి శబ్దాలతో సమాసపు బిగింపులతో వచనరచన అధ్వాన్నంగా తయారయింది. విభక్తిప్రయ్యాలను మాత్రం మార్చి అనుస్వార విసర్గ క్రియారూపాలను సర్దుబాటు చేసుకుని, సంస్కృత శబ్దాలను ఠస్సాకు ఠస్సాయించి పండితులు భాషను కృతకం కావించారు. ఈ క్రియాపదాలు సైతం సంస్కృతవ్యాకరణసూత్రాలకు విరుద్ధంగా కటువుగా సృష్టి అయేవి. పండితులు వ్రాసే కృతకవచన శైలి ఇటు ప్రజలకు అటు విద్యావంతులకు అర్థం కాక కొరకరాని కొయ్యగా రూపొందింది. కాగా ఎవరి ఆదరణ లభించక, గ్రంథాలలో మేట వేసుకుపోయింది. ఇలాటి పరిస్థితులలో రాజా రామమోహన్‌రాయ్ చదవతగ్గ వచనాన్ని సృష్టించాడు. దానిని విద్యాసాగరుడు అనుసరించి, వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఈయన స్వతంత్రకల్పనలకు యోచనకు ఆస్కారం లేక అనువాదాలతోనే గడిచిపోయింది. … …

టేక్ చంద్ సర్వస్వతంత్రుడు, అత్యంత సాహసి. … ఆయన భాషాప్రవాహాన్ని తనకభిముఖంగా తిప్పుకుని, దానిని పండితులపై తిప్పికొట్టేడు. … ఈనాడు మీరు ఆంధ్రసాహిత్యంలో బహుశా ఏయే పరిణామాలను కోరుతున్నారో వాటిని ఆయన వంగసాహిత్యంలో సాధించాడు.

… … వ్రాసే, మాటలాడే, గ్రంథములలో పత్రికలలో వాడే భాషలనుగురించి వివాదం జరుగుతూనే వుంది. వాదప్రతివాదాలు, ఖండనమండనలు సాగుతూనే వున్నాయి. వాడుకభాషను గ్రామ్యమని, నింద్యమను పండితులు నేటికీ అంటూనే ఉన్నారు. ఇంతవరకూ ఏ నిర్ణయమూ జరగలేదు.

మీరూ, నేనూ, మనమంతా జవమూ, జీవమూ గల భాషను కావాలని వాంఛిస్తున్నాము. అంటే ఆ భాష పరిపూర్ణమైనదిగా వుండాలని మన ఆశయం. (అ) ప్రజలకు సాధారణజ్ఞానాన్ని కలిగించే, (ఆ) పారిశ్రామిక, వైజ్ఞానిక, కళారంగాలలో కృషి చేస్కున్న విద్యార్థులకు సాంకేతికజ్ఞానాన్ని ప్రబోధించే, (ఇ) పండితులకు ఉదాత్తభావాలను, ఆదర్శాలను జ్ఞానాన్ని ప్రబోధించే, (ఈ) ప్రసన్న గంభీర మధుర కావ్యసృష్టికి దోహదపడే అన్నివిధాలా అర్హమైన భాషను, భాషాశైలిని సృష్టించుకోవాలని మనం కృషి చేస్తున్నాము. … … దైనందిన జీవితంలో నిత్యమూ చెవిని పడుతున్న మాటలను, సులభంగా అర్థమయే సరళపదాలను, నుడికారాన్ని సాహితీపరులు స్వీకరిస్తున్నారు. … ఇప్పుడు బెంగాలులో రచయితలు సరళ సుబోధకశైలిని అనుసరిస్తున్నారు. మామూలు మాటలలో అర్థగాంభీర్యాన్ని సాధిస్తున్నారు. … సొగసయిన పదాలను ఎంచుకోడంలో, వాటిని అర్థవంతంగా ప్రయోగించడంలో రచయితకున్న నేర్పునుబట్టి అతనిశైలికి అందం అమరుతుంది. ఆఖరికి నింద్యమని అపభ్రంశమని పండితులు ఈసడించే శబ్దాలను సైతం, అశ్లీలతాదోషం అంటనీయకుండా, సమర్థుడైన రచయిత ప్రయోగించవచ్చు.

భాష నాజూకుగా, ఠీవిగా వుండాలి. ఆడంబరం అందమీయదు. జటిలపద ప్రయోగంవల్ల భాషాసౌకుమార్యం కలగదు. తేటమాటలతో నాగరికమైన అనుభవాలను, ఉదాత్తభావాలను వ్యక్తపరచాలి. శైలి సహజప్రవాహంవలె ఉరకలెత్తుతూ, అనుభూతులను కలిగిస్తూ హృదయంపై చెరగని ముద్రలను వేయాలి. శైలి అందం ఇలా ఇలా వుండాలని సిద్ధాంతీకరించి చెప్పడం సులభమే. కానీ ఈ అందాన్ని అలరించడం కష్టం. అక్కడే వస్తుంది అడ్డు.

నిఘంటువుల, పండితుల, వైయాకరణులసహాయం, అవసరం లేకుండా, చదవగానే అందరికీ అర్థమయే విధంగా భాషను సంస్కరించవలెనని మీఆశయం. అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము. అంటే దాని అర్థం భాషాగాంభీర్యాన్ని, స్నిగ్ధసౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామని కాదు. పైగా దాని సౌకుమార్యాన్ని ఇనుమారు తెచ్చుకుంటున్నాము (పు. 58-59).

నేను ఈ ఉత్తరంలో భాగాలను ఇంత విస్తృతంగా ఉదహరించడానికి కారణం – ఈ వ్యావహారికభాషావాదం ఎప్పటినించి ఎంత ప్రబలంగా ఉందో ఎత్తి చూపడానికి. ఈ అనువాదంలో సంస్కృతం బాగానే ఉండడం గమనార్హం. బహుశా జ్ఞానేంద్రమోహన్ దాసు ఇంగ్లీషులో అదే స్థాయి శైలిలో రాసేరేమో. అప్పారావుగారు వ్యావహారికంలో రాయాలని ఉద్యమం మొదలు పెట్టినా, ఆయన రాసిన భాష ఈనాడు మనకి వ్యావహారికంలా అనిపించదు. తిరగరాసిన దిద్దుబాటు కథలో కూడా నాకు పాతవాసనలే కనిపించేయి. కానీ ఇప్పుడు ఆస్థాయి అధిగమించి, నిజంగా మనం రోజూ మాటాడుకునే మాటల్లో కథలు రాయడం వచ్చింది. అయితే దానిలో తెలుగు తగ్గిపోతోంది. నేను కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో పేజీకి రెండో మూడో ఇంగ్లీషు మాటలు కనిపించేయి (నాకథల్లో కూడా). ఇప్పుడు వాక్యాలకి వాక్యాలే ఇంగ్లీషులో ఉంటున్నాయి. సరే అనడానికి ఓకే అంటున్నాం. ఆదివారం, సోమవారం అనడానికి బదులు సండే, మండే అంటున్నాం. నేను నాస్నేహితురాలితో మాటాడుతున్నప్పుడు, “ఆదివారం వస్తాను” అంటే “ఓకే, సండే రా,” అంటుంది. అంటే అలా తెలుగుమాటని ఇంగ్లీషులోకి మార్చుకుంటే తప్ప తలకెక్కని పరిస్థితికి వచ్చేం. ఇది దారుణం.

శారదగారి కథలలో చాలావరకు మంచి తెలుగు నుడికారం ఉంది. కానీ కొన్ని కథల్లో మాత్రం ఇంగ్లీషు కొంచెం ఎక్కువే అనిపించింది. ఈభాషకే అలవాటు పడినవారు “ఇప్పుడు ఇలాగే మాటాడుతున్నాం, ఆ వాక్యాలు వాస్తవంగా ఉన్నాయి” అని వాదించవచ్చు. కాదనను కానీ, సాంఘికప్రయోజనంలాగే తెలుగుభాషనీ, నుడికారాన్నీ నిలబెట్టి పటిష్టం చేసే బాధ్యత కూడాఈనాటి రచయితలకి ఉందనీ, లేదనుకుంటే, మనసు మార్చుకుని ఆ బాధ్యత చేపట్టాలనీ నేను గాఢంగా నమ్ముతున్నాను. నాకథలని అభిమానించేవారు నాకథలద్వారా మరచిపోతున్న మాటలు మళ్ళీ గుర్తుకి తెచ్చుకోడం, కొత్తగా తెలుసుకోడం కూడా జరుగుతోందన్నారు. అంటే మంచి తెలుగు నుడికారం గల కథలని పాఠకులు ఆదరిస్తున్నారు.

ఈ ముందుమాట రాయడానికి నాకు అవకాశం కల్పించిన శారదకీ, నేను రాసింది వంకలు పెట్టకుండా ప్రచురించుకుంటామంటూ ప్రోత్సహించిన సురేష్ కొలిచాలకీ ధన్యవాదాలు.

వర్ధమానరచయిత్రి శారద  ముందు ముందు ఇలాగే మంచి కథలు అందించగలరని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ,

నిడదవోలు మాలతినిడదవోలు మాలతి

సెప్టెంబరు 2, 2012.

శేషేంద్ర అద్భుత సృష్టి – స్వర్ణోత్సవ కావ్యం ‘ఋతుఘోష’

87648618-seshendrasharma-the

సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని పది సంవత్సరాలు బతకని కవితలు లేదా కవితా సంకలనాలు రాసి, పైరవీలతో పురస్కారాలు పొందుతున్న కవులూ, వారి సాహితీ జీవిత రజతోత్సవాలు ఇంకా ఇతర ఉత్సవాలు చేసుకుంటున్న కాలం ఇది. కాదు చేయించే సాహిత్య సంస్థలున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య ప్రపంచం ఋతుఘోష వంటి కావ్యానికి స్వర్ణోత్సవ ఋతువు వచ్చిందన్న సంగతి మర్చి పోవడంలో ఆశ్చర్యం లేదు. సరే. ఈ ఋతు ఘోష కావ్యాన్ని రాసినవాడేమన్నా మామూలు ఆషామాషీ కవా. అంటే కాదు సాక్షాత్తు గుంటూరు శేషేంద్ర శర్మ నోబెల్ బహుమతి కోసం పేరును ఒక ఎంట్రీగా పంపబడినంతటి గొప్పకవి.

ఈతరం కవులకు అంటే నా ఉద్దేశంలో 30 లేదా నలబై సంవత్సరాల లోపున ఉన్న వారికి, ఒక సాహిత్య జిజ్ఞాసతో వెనక్కు పోయి పెద్దల దగ్గర తెలుసుకుంటేతప్ప, గుంటూరు శేషేంద్ర శర్మ మంచి ప్రౌఢనిర్భర వయఃపరిపాకంలో కవిత్వం రాస్తున్న కాలం తెలియదు. అందుకే శేషేంద్ర వారికి కేవలం వచన కవిగా లేదా సాహిత్య విమర్శకుడుగా మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. శేషేంద్ర ఎంత గొప్ప కవి అంటే నన్నయ కన్నా ప్రాచీన కవి అయిన తెలుగు వారి గోల్డు నిబ్బు విశ్వనాథ సత్యనారాయణ గారే ఆయన పద్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంతే కాదు, పద్యాన్ని శేషేంద్ర లాగా రాయగలిగిన వారు నేడు ఆంధ్ర దేశంలో పట్టు మని పది మంది అయినా లేరు అని చెప్పారు. అంతే కాదు విశ్వనాథ రాసిన కావ్య పీఠికల్లో రెండు చాలా ఉత్తమోత్తమమైనవి అని మా గురుపరంపరలో ఉన్నతులైనవారు చెప్పేవారు. ఒకటి శేషేంద్ర శర్మ ఋతు ఘోష కావ్యానికి, రెండు వి.వి.యల్. నరసింహారావుగారు రాసిన ఆనంద భిక్షువు కావ్యానికి రాసిన పీఠికలు. ఋతు ఘోష మొదటి సారి 1963లో అచ్చు అయింది. తర్వాత చాలా సార్లు ముద్రించబడింది. ఇటీవలే ఆయన కుమారుడు సాత్యకి తిరిగి ముద్రించాడు. ఒక ప్రౌఢమైన పద్య కావ్యం అదీ ఈ కాలంలో ఇన్ని సార్లు అచ్చు కావడం విశేషమే.

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు  కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను.  శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢిమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికి ఉండడం చాలా అరుదైన విషయం. ప్రచారంలోనికి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం వల్ల శేషేంద్ర పద్యరచనకు అందవలసిన గౌరవం అందలేదు. లేకుంటే శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాథ అయిఉండేవాడు.

ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీన కావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రామణీయకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో మరీ ఎక్కువ పద్యాలు లేవు. ప్రతి ఋతువుకూ ఇన్ని పద్యాలు రాయలనే నియమాన్ని కూడా కవి పెట్టుకోలేదు. రెండు ఋతువులగురించి అయితే ఆరు పద్యాలే రాశాడు. కాని ప్రతి ప్రకృతి పరిణామాన్ని ఒంటి నిండా గుండె నిండాఅనుభవించి రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.

శేషేంద్ర పద్యాలలోని భాష అత్యంత ప్రౌఢంగా ఉంటుంది. అది అలనాటి ప్రాచీన తత్సమ బహుళ కావ్యభాష. ఇలాంటి భాష రాయగలిగిన పండితులు మనకు ఆంధ్ర దేశంలో అప్పటికి చాలా మందిఉన్నారు. కాని శేషేంద్ర వంటి భావనా ప్రతిభ ఉన్నవారు ప్రాచీన పద్య ప్రక్రియలో అత్యంత ఆధునిక భావాలను అనుభూతిని రంగరించిన కవి ఆనాటికి లేడు. నేటికీ వెదికి పట్టుకోవలసిందే లేరనే చెప్పవచ్చు. నేడు పద్యరచనలు ఈ స్థాయిలో చేసే వారు లేరు అని చెప్పడం తెలుగు వారికి అవమానమే కాని అలా చెప్పాలంటే మరికాస్త శోధన చేయాలి. సాంప్రదాయికమైన అలంకారాలతో పద్యాలను నడపడం అందరూ చేయగలిగిన, చేసిన పనే. కాని చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, సీస పద్యం, కందం వంటి ఛందాలను రాస్తూ పైగా ఋతువుల్ని గురించి రాస్తూ ఆయా ఋతువుల్లో సామాన్య మానవుడు, పేదవాడు పడే బాధల్ని గురించి రాయడం శేషేంద్ర మాత్రమే సాధించిన చూపిన ప్రతిభ, అంతే కాదు సామాజిక చింతన. వృత్త పద్యాలను రాసేటప్పుడు ఏ కవి అయినా ఆగణాలను తప్పనిసరిగా పాటించవలసిందే ఎందుకంటే అవి అక్షర గణాలు కాబట్టి. కాని కవి ఆ పద్యాన్ని ఏ సమాస చాలనంతో ఏ సృజన శక్తితో నడిపాడుఅన్నది ఆ కవికి ఉన్న స్వీయ ప్రతిభను బట్టి ఉంటుంది. ఇక జాతి ఉపజాతి పద్యాలు రాయడం లో కవికి స్వేచ్ఛ ఉంటుంది. కారణం ఇందులో ఇంద్రగణాలు చంద్ర సూర్య గణాలుంటాయి. ఇవి అక్షర గణాలు కాదు మాత్రాగణాలు అంటే కవి తనకు ఇష్టమైన గణాలు ఎంచుకోని రాయవచ్చు. తను ఏవిధమైన లయ సృష్టించాలనుకుంటే దానికి అనువైన గణాలను ఎంచుకోవచ్చు. అంతే కాదు ప్రత్యేకమైన వాక్య నిర్మాణాన్ని అంటే ఇక్కడ పాదనిర్మాణాలను సృష్డించుకోవచ్చు. ఈ పని శేషేంద్ర కంటే ముందు చాలా మంది చేశారు. ఆధునికుడైన కృష్ణశాస్త్రి కూడా పద్యాలలో గణాలను ప్రత్యేకంగా ఎంచుకొని తను కావాలనుకున్న లయను తెచ్చుకున్నాడు. “ఎలదేటి కెరటాల పడిపోవు విరికన్నె వలపు వోలె” ఈ పాదంలో గణాలు చూడండి అన్నీ సలము అనే గణాలను పాదాలలో వాడాడు. కవి ఇంద్రగణాలు ఆరింటిని వాడుకునే స్వేచ్ఛ ఇక్కడి సీస పద్య రచనలో ఉంది. కాని ఒకే గణాన్ని వాడి ఒక ప్రత్యేకమైన లయను ఈ పాదంలో సాధించాడు కవి. శేషేంద్ర సీస పద్య రచనలో ఈ తరహా పాద నిర్మాణ కళను చూపించి సీస పద్యానికి కొత్త అందాన్ని పట్టుకొచ్చాడు, చూడండి.

దుర్నీక్ష్య ప్రభా ధూర్ధరచ్ఛటలతో

క్షేత్ర జీవనుల శిక్షించినాడు

పటు రోష కషాయ కుటిలాంశు కశలతో

గోగణంబుల చావగొట్టినాడు

ఖరమయూఖ క్రూర ఘన కాండ పటలితో

విహగ జాతుల క్షోభవెట్టినాడు

గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో

తరువల్లికల కగ్గి దార్చినాడు

గగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి

నలఘు బ్రహ్మాండంబునలగద్రొక్కి

చటుల దుర్జన రాజ్య శాశనమువోలె

సాగె మార్తాండ చండ ప్రచండ రథము.

 

వివిధ నిమ్నోన్నత వీధులం బరుగెత్తి

వైశాఖలో మేను వాల్చె నొకడు

ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి

బెజవాడ కన్నీరు బెట్టె నొకడు

మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి

గుంటూరులో కుప్పగూలె నొకడు,

కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి

నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు

క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున

తన భుజాగ్రమునెక్కు భేతాళ మూర్తి

సర్వకాలాను వర్తి రిక్షా ధరించి

లాగలేకను వేసవికాగాలేక.

పైన రెండు సీస పద్యాలలలో గ్రీష్మఋతువును వర్ణించాడు. ఎండా కాలం ఎంత తీక్షణంగా ఉంటుందో అంత ప్రతిభతో రాశాడు ఈ రెండుపద్యాల్ని మొదటి పద్యంలో ఎండ తీవ్రత ఎలా ఉందో చెప్పడం దాని ప్రభావంతో ఏ జనం ఎలా బాధపడుతున్నారో చెప్పడం చేశాడు. సీసపద్యంలో ఒక్కొ పాదానికి  రెండు భాగాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో ఒకరమైన నిర్మాణ రీతిని రెండో దానిలో ఒకరమైన నిర్మాణ రీతిని అంటే రెండు భాగాలు కలిపి ఒక పాదానికి ఒక నిర్మాణ రీతిని పెట్టాడు. నాలుగు పాదాలు ఇలాంటి సమమైన నిర్మాణంతో నిర్మించాడు. అందుకే దీనికి అంతటి చక్కటి లయ అమరింది.

ఒక పాదాన్ని చూద్దాం. 1 దుర్నీక్ష్య ప్రభా ధుర్ధరచ్ఛటలతో 2 క్షేత్ర జీవనుల శిక్షించినాడు ఇవి పాదంలో రెండు భాగాలు ఒకటి సూర్యుడి గుణాన్ని చెబుతుంది రెండోది దాని ప్రభావం వల్ల కలిగిన ప్రజల ఇబ్బంది గురించి చెబుతుంది. కన్నెత్తి చూడడానికి ఏమాత్రం వీలుకాని కాంతితో తీక్షణమైన ఎండతో పొలంలో పనిచేసుకునే వారిని శిక్షించాడు అని దీనికి సులభమైన అర్థం. కాని ఈ నిర్మాణ పద్ధతిని నాలుగు పాదాలలో ఒకే విధంగా చేశాడు. నాలుగు పాదాల నిర్మాణంలో సామ్యం చూడండి ప్రతి పాదం చివరలో ఒక క్రియా పదంతో ముగిసింది. శిక్షించినాడు, చావగొట్టినాడు, క్షోభవెట్టినాడు అగ్గిదార్చినాడు అనేవి పాదాంతంలోని నాలుగు క్రియాపదాలు, అలాగే పాదంలోని మొదటి భాగం ముగింపులు అన్నీ ‘తో’  అనే క్రియా సంబంధాన్ని చెప్పే విభక్తితో ముగిసాయి. ఇది పద్య నిర్మాణంలో చూపిన తనదైన కళ. పొలంలో పనిచేసుకునే పనివారిని శిక్షించాడు, గోగణాలను చావగొట్టాడు, విహగజాతుల్ని క్షోభపెట్టాడు, తరువల్లికలకు అగ్గితార్చాడు అలఘు బ్రహ్మాండాన్ని నలగ దొక్కిన సూర్యుడు ఎలా ఉన్నాడంటే అతని రథం దుర్జన రాజ్య శాసనం లాగా కదిలిందట. ఒక మామూలు పద్యకవి అంటే పద్యం రాయడంమాత్రమే వచ్చిన మామూలు కవి గణాలు కిట్టించి సరిపెట్టి పద్యం వచ్చింది అని చెప్పుకోవచ్చు కాని ఉన్న పద్య నియమానలతోనే ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టడం ఛందస్సులో మంచి ప్రభుత ఉన్న కవి మాత్రమే చేయగలడు. అది శేషేంద్ర చేశాడు.

ఇక పైన చూపిన రెండో సీస పద్యంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టాడు.  ఈ పద్యాన్ని రిక్షాకార్మికులు ఎండా కాలంలో పడే బాధను వర్ణించడానికి అంకితం చేశాడు కవి. ఒక్కో పాదాన్ని గమనిస్తే వీటిలోని నిర్మాణ కళ తెలుస్తుంది. పాదం మొదటి భాగంలో ఒక క్రియాపదంతో ముగుస్తుంది రెండో భాగం పడిన బాధతో ముగుస్తుంది. పరుగెత్తి, తిరుగాడి, పోయి, చుట్టి అనే క్రియాపదాలు ఒక్కో పాదం మొదటి భాగంలో చివరిలో వచ్చి కూర్చున్నాయి. అలాగే మేనువాల్చె, కన్నీరు పెట్టె, కుప్పగూలె, సొమ్మసిల్లె అనే నాలుగు బాధను తెలిపే పదాలు అన్నీ ఒక్కో పాదంలో సరిగ్గా ఒకే చోటికి వచ్చేలాగా పాదాలలో వాక్యనిర్మాణాలు చేశాడు కవి. ఇది పద్యరచనలో అత్యుత్తమ నిర్మాణ కళ. అందుకే ఈ పద్యాన్ని చదివితే అత్యంత రమ్యమైన లయ వినిపిస్తుంది. నెల్లూరు, గుంటూరు, బెడవాడు, విశాఖపట్నం నగరం ఏదైతేనేం ఎండకి రిక్షాకార్మికుడు పడిన బాధ కవి తన బాధగా భావించి వర్ణించాడు. ఇలా ప్రతి ఋతువును వర్ణించిన సందర్భాలలో ఆఋతువు పేదవాడికి ఎంత కష్టాన్ని తెచ్చి పెట్టింది అలాగే సంపన్నుడికి ఎలా సుఖాన్ని అమర్చింది అనే విచక్షణతో ఋతువులను వర్ణించాడు శేషేంద్ర. ఋతువుల ప్రభావాన్ని ఇలా వర్ణించిన కవి అంటే ప్రజల బాధన్ని వర్ణించిన తీరు ఇంకా ఏ కవి చేశాడని వెదకాలి.

ఇక పద్యాలలో ఉన్న భాష అత్యంత ప్రాచీన భాష కాని భావాలు అత్యంత నూతనం, సృజన శక్తి భావశబలత సరికొత్తగా మనసుకు హాహి గొలిపే రీతిలోఉంటాయి. కొన్ని పద్యాలు చూద్దాం.

ఈ ఆకాశము నీ మహాజలధులు న్నీధారుణీ మండలం

బీ యందాల తరుప్రపంచనిచయం బీ విశ్వవైశాల్యమెం

తో యంతస్సుషమా సముల్బణముతో నుఱ్ఱూతలూగించె నా

హా యూహా విహగమ్ము తా నెగిరిపో నాశించె నుత్కంఠతో.

 

ఏ మాకంద తకరు ప్రవాళములనో హేలాగతిం గోకిలా

భామాకంఠము శంఖమై మొరసె శుంభత్ కీర నారీ దళ

శ్యామంబై మెరసెన్ నభంబు, భ్రమర జ్యావల్లి మల్లీ సుమ

శ్రీమీనాంక శరమ్ములం గురిసె వాసిం జైత్రమాసమ్మునన్.

రాసింది శార్దూల పద్యాలు భాష కూడా చాలా ప్రౌఢమైంది కానీ భావం అత్యంత సున్నితమైంది. అంతే కాదు కవి ప్రకృతిలో పరవశించి తన స్వీయభావాన్ని ఆవిష్కరించిన తీరు సరికొత్తగా, ఫ్రెష్ గా కనిపిస్తుందీ పద్యంలో. అంతే కాదు పద్యరచనలో పదాలను వెదికినట్లు ఏ పద్యంలో కనిపించదు ఒక్కో పదం దానంతట అదివచ్చి తనకు సరిపడేగణంలో అదే వచ్చి కూర్చున్నంత స్వతంత్రంగా ఉంటుంది శైలి పై పద్యంలో ఇదే కనిపిస్తుంది. భాషలో అంతటి ధార, భావంలో అంతటి ఆవేగం పై పద్యంలో లాగే అన్నంటిలో కనిపిస్తుంది. చైత్ర మాసాన్ని గురించి చెప్పిన పైని రెండో పద్యాన్ని చూడండి ఎక్కడా నట్టుపడదు ధార. నాలుగు పాదాలలో వాక్యం ఏకధాటిగా తిరిగి వచ్చింది ఇది అసాధారణమైన ప్రతిభ ఏ నన్నయ ఏ పోతన ఏ శ్రీనాథుడు వంటి స్థాయి కవులు మాత్రమే చేయగలిగిన పద్యనిర్మాణ శక్తి ఇది. ఇక భావాలు చూద్దాం.

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ, యెడద పురుషునిలో మొగ్గ దొడిగె నేమొ విశ్వమందిర కుడ్యముల్ విరగ గొట్టి మోహకల్లోల వీచిక ముంచి వైచె అని తన అనుభూతిని పలికిస్తాడు కవి. ప్రకృతి పట్ల ఒక మోహ కల్లోల వీచిక తనను ముంచి వేసిందని తాను మునిగిపోయిన రీతిని చెప్పాడు. ఏ అంతర్గత సృష్టి సూత్ర మహిమా హేవాకమో అంటాడు ఒక చోట. పొదంల తోటల బాటలాధరలతో పోలేని కూలీ జనుల్ మదిలో గుందుచు చేలలో దిరిగిరా మధ్యాహ్న కాలంబులన్ అంటాడు మరొక చోట. శరీరమొక కారాగారమై తోచగన్ అని అంటాడు ఒక పద్యం చివరిలో ఆసల్ దీరునె దృష్టిచే, మహిత గాఢాలింగనాయుక్తిచే అని సరికొత్తగా చెబుతాడు మత్తేభ పద్యంలో. ప్రకృతి నంతా ఒక పద్యంలో వర్ణించి చివరిలో ఒక శ్రామికుడు ఇంతటి అందమైన ప్రకృతిలో సాయంత్రం దాకా పనిచేసి ఇంటికి బోయేసరికే చీకటి దిక్కులు పిక్కటిల్లింది అని చెబుతాడు. శ్రామికునికి ఈ అందాల ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయిందని చీకటే మిగిల్చిందని బాధపడతాడు ఒక పద్యపాదంలో.. దూరగ్రహాంతరాగతవినూతన జీవిగ గ్రుమ్మరిల్లి యిల్ సేరగబోవు శ్రామికుడు చీకటి దిక్కుల పిక్కటిల్లగన్ అని రాస్తాడు. ప్రతి పద్యంలో అందం వెనుక ఈ వేదనను చూపుతాడు శేషేంద్ర. ఒక పేద కుటుంబం పడే బాధను ఒకే చోట రెండు పద్యాలలో కూరుస్తాడు. ఇక ఆయన వర్ణించిన ప్రకృతి అందాలు కమనీయం కొన్ని ఇక్కడ గమనిద్దాం.

కనరాదు యామినీ కబరీభరమ్ములో బెడగారు కలికి జాబిల్లి రేక

సికతరీతిగ తమశ్చికురనికరమ్ములో నలతి చుక్కల మోసులలముకొనియె

జిలుగు వెన్నెల చీర చిరిగిపోయినదేమొ కాఱు మబ్బులు మేన గమ్ముకొనియె

యెడదలో నేదేని సుడియుచుండెనొ యేమొ కాకలీ నినదముల్ క్రందుకొనియె

మేను విరిచె నేమె మెల్లగా నిట్టూర్చి

విధురవాయు వీచి విస్తరించె

నాత్మవేదన కొక్క యాకారమై తోచి

నేటి రేయి నన్ను కాటువేసె.

పైది సీస పద్యం కాని ఇందులో సంప్రదాయికమైన అలంకారాలు రాయాలని కవి భావించడు. ప్రతి వర్ణననీ సరికొత్తగా దిద్ది తీర్చాడు కవి. యామిని అంటే రాత్రి కబరీభరం అంటే కొప్పు రాత్రి అనే స్త్రీ కొప్పులో జాబిల్లి రేక కనిపించడం లేదట. తమశ్చికుర నికరం అని అన్నాడు ఇలాంటి సమాసాన్ని ఇంతకు ముందు ఎవరూ సష్టించలేదు. తమస్సు అంటే చీకటి చికురము అంటే వెంట్రుకలు పైన తమశ్చికుర నికరం అనిఅన్నాడు. అంటే వెండ్రుకలు చీకటిలా ఉన్నాయని చెప్పడంకాదు ఆ చీకటి వెంట్రుకల గుంపులా గుబురులా ఉంది అని ఈ సమాసంలో సరికొత్తభావాన్ని సృష్టించాడు కవి. ఇదీ శేషేంద్ర ప్రతిభ. జిలుగు వెన్నెల చీర చిరిగి పోయింది కాబట్టి మేనిమీద కారుమబ్బులు కమ్ముకున్నాయి అన్నాడు. జిలుగు వెన్నెల చీర చినిగి పోయిందేమో అని చెప్పిన కవి ప్రతిభని ఏమని పొగడాలి వాహ్ వాహ్ అని వందసార్లు అనాలి. ఇది అత్యంత నవ్యమైన భావన కాని సంప్రదాయికమైన సీస పద్యంలో రాయగలగడం శేషేంద్ర సాధించిన ఆధునికత. విధుర వాయు వీచి అనడం,  నేటి రేయి ఆత్మవేదన కొక్క ఆకారమై తోచింది అని చెప్పడం అత్యంత నవ్యమైన భావాలు.

ఇక వర్షఋతువను గురించి రాసిన కొన్ని పద్యాలు అత్యంత ప్రౌఢమైనవి గాఢమైన సంస్కృతభాషా పరిజ్ఞానం ఉంటే తప్ప అర్థం కావు. కాని భావాలు అంత్యంత నవ్యం. ప్రకృతి అందాలను ఇంత వర్ణించే కవి పద్యం చివరిలో ఏమంటాడో ఒక చోట చూడండి.

యేమి ధర్మంబు భాగ్యవిహీన దీన

జనులమీదనె దౌర్జన్య చర్యగాని

హేమధామ సముద్దామ సీమలందు

అడుగు వెట్టంగ పర్జన్యుడైన వెఱచు.

అని అంటాడు. పర్జన్యుడు అంటే వర్షాధి దేవతను అదుపులో ఉంచుకునే ఇంద్రుడు కూడా భాగ్యవిహీనులు మీద దౌర్జన్యం చూపిస్తాడు కాని హేమధామ సముద్దామ సీమలలో అంటే కలిగిన వారి బంగారు లోగిళ్ళలో అడుగు పెట్టడానికి ఆయన కూడా భయపడతాడట. నిన్నటి ఫైలిని తుఫాను చేసిన భీభత్సం గుర్తుకు వచ్చేంత నవ్యంగా ఉందీ భావన.

ఇన్ని పద్యాల మధ్యలో నాలుగైదు గేయాలు వాడాడు శేషేంద్ర కొన్ని చూద్దాం.

ముల్లోకములు ఏలు ముద్దు హరిణాంకుడు

విరజాజి తీవలకు విరహిణీ జీవులకు

తరిపి వెన్నెలపాలు తాగించుచున్నాడు

 

ఏగాలికెగసెనో యీ చికిలి తారకలు

అందాల తళుకుతో అప్సరసలకుమల్లె

ఆకాశ రంగానికవతరిస్తున్నాయి.

 

నిర్మాలాకాశంపు నీలాటి రేవులో

పండువెన్నెల నీట పిండి ఆరేసిన

తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి.

పైభావాలు శేషేంద్ర సృజన శక్తికి మచ్చుతునకలు ముల్లోకములు ఏలే చంద్రుడు విరజాజితీవలకు విరహిణీ జీవులకు తరిపి వెన్నల పాలు తాగిస్తున్నాడంట. వెన్నలను తరిపి పాలు అనిచెప్పడం, నిర్మాలాకాశం అనే నీలాటి రేవులో పండువెన్నెలఅనే నీటిలో పండి ఆరేసిన బట్టలు తెలిమబ్బులు అట అవి తేలి పోతున్నాయట. ఏం చెప్పాలి ఈ భావాల్ని, వాహ్ వాహ్ అంతే. ఇలాంటి మధురమైన వర్ణనలు ప్రతి పాదంలో రంగరించిన అత్యధ్భుత కావ్యం ఋతుఘోష దీన్ని చదవడం అందునా భాషను బాగా అర్థంచేసుకొని చదవడం ఒక అపూర్వమైన, అనుపమానమైన అనుభూతి. ఈ అనుభూతిని ఈ తరం కవులు, పాఠకులు పొందాలి. ఈ నాటి యువతరం కవులు కూడా ఈ ఋతుఘోష కావ్యాన్ని చదివి ఎన్నో నేర్చుకోవచ్చు. అంతే కాదు కవులు అలసత్వాన్ని వదిలిపెట్టాలి. స్నేహించడం, అని ఇంకా రకరకాల కొత్త పదాల్ని కొత్త కవులు ప్రతిభా వంతులు చేస్తున్నారు. నిజమే చేసేటప్పుడు వ్యాకరణం పట్టదు. వ్యాకరణం గురించి మాట్లాడితే మాట్లాడిన వాడు ఛాదస్తుడు. అంతే కాదు శబ్ద స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అంటే పుస్తకాలు చదివే బుద్ధి శ్రమపడే లక్షణం అలవరచుకునే వారు తగ్గారు. ఎంత ప్రాచీన భాషలోనైనా ఎంత ప్రాచీన ఛందస్సులోనైనా అత్యంత ఆధునికతని అత్యంత నవ్యమైన సృజన శక్తిని కవి చూపవచ్చు అని చెప్పడానికి ఋతుఘోష కావ్యం మంచి ఉదాహరణ. నేటికవులు దీన్ని చదవాలి శ్రద్ధగా చదవాలి. దీనికి స్వర్ణోత్సవం జరుపుకునే ఈ సంవత్సరంలో మరోసారిదీన్ని ముద్రించాలి. చాలా ఎక్కువ ప్రతులు ఎక్కుమందికి చేరాలి.

పులికొండ సుబ్బాచారి.

subbanna

సెప్టెంబర్ 17: “పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది…”

నాలుగేళ్ళ క్రిందట మలి దశ తెలంగాణా ఉద్యమం మొదలయిన తరువాత తెలుగు జాతీయతా భావన యొక్క పతనం వేగవంతమయింది. తెలంగాణా వాదులు తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, విశాలాంధ్ర ఏర్పాటు క్రమంతో పాటు, హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో కలిసిన విధానం పై కూడా చర్చ కూడా మొదలయింది. సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకోవాలా అనే చర్చలో భాగంగా నిజాము రాజ్య స్వభావం, జాతీయవాద దృక్కోణంలో/కమ్యునిస్టు దృక్కోణంలో హైదరాబాదు చరిత్ర, విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యునిస్టు పార్టి పాత్ర ను విమర్శనాత్మకంగా చూడటం మొదలయ్యి ఈ రోజుని విలీనంగా, విమోచనగా, విద్రోహంగా చూడాలా అనే ఆరోగ్యకరమయిన చర్చ ముందుకొచ్చింది.

ఆరోగ్యకరం ఎందుకంటే చరిత్ర (ఏమి జరిగింది) అన్నది చరిత్రకారుల దృక్కోణాల నుండి విడతీసి చూడలేము; కొత్త అవసరాల, చర్చల, దృక్కోణాల వెలుగులో చరిత్రను మళ్ళా, మళ్ళా, చూడవలసిన అవసరం వస్తుంది అన్న అంశం దీనివల్ల ముందుకొచ్చింది. ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆ సమయం గురించి వివిధ వర్గాల, కులాల, మతాలకు చెందిన స్త్రీల అనుభవాలను, జ్ఞాపకాలను చర్చించే ప్రయత్నం చెస్తాను. ఈ వ్యాసం ద్వారా ఇంతకు ముందు ‘జ్ఞాపకాలకీ రాజకీయాలున్నాయ్’ వ్యాసం లో ప్రస్తావించిన చర్చను కొంత ముందుకి తీసుకువెళ్లటం కూడా నా వుద్దేశం.    
ఈ వ్యాసంలో రజాకార్ల గురించి, హైదరాబాదు రాజ్య విలీనం గురించి ప్రస్తుతమున్న ‘కామన్ సెన్స్’ను స్పృశించే ప్రయత్నం చెస్తాను. ప్రజా బాహుళ్యంలో ఈ గుంపు గురించి, సమయం గురించి వున్న’జ్ఞాపకాలు’, ‘నమ్మకాలు’, ‘అనుభవాలు’ కాల క్రమేణా ప్రజా సంస్కృతి (పాపులర్ కల్చర్) లో ఒక రకమయిన ‘కామన్ సెన్స్’ గా రూపుదిద్దుకున్నాయి. కామన్ సెన్స్ అంటే ‘రోజువారి జీవితంలో అనుభవాల నుండి పొందే లోకజ్ఞానం’ కాదని,  క్లిఫర్డ్ గీర్త్జ్ (కామన్ సెన్స్ అస్ కల్చరల్ సిస్టం – లోకల్ నోలేడ్జ్ 1983) అంటారు. దీనిలో కొంత నిజం, కొంత భావజాలం, కొంత అనుభవం, కొంత వ్యాఖ్యానం, కొంత గుర్తు, మరి కొంత సమాజం ఒప్పుకునేది – అన్నీ కలిసి పోయు వుంటాయి అనీ, అన్ని రకాల సంస్థాగత జ్ఞానాలను విశ్లేషించినట్లే కామన్ సెన్స్ ను కూడా విశ్లేషించాలని అయన అంటారు.
Dsc_1203_0
రజాకార్లు, హైదరాబాదు రాజ్యం భారత యునియన్ లో కలిసిన విధానం గురించి చరిత్ర రాసిన తీరు లోనే కాక, కామన్ సెన్స్ లో కూడా ‘కమ్యూనల్’ గా నిక్షిప్తమయ్యాయి: హైదరాబాదు ఒక ముస్లిం రాజ్యం. హిందువులందరూ పీడితులూ, సేవకులూ; ముస్లిములేమో భూస్వాములూ, కులీన వర్గమూ, పీడించేవారు. ముస్లిం రాజు పాలనలో ముస్లిములందరూ ముస్లిములు కాని వారిని నీచంగా చూసినట్లూ; ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో స్వతంత్రత కాంక్షించే హిందువులను అణిచివేసి నట్లు గానూ;  భారత దేశం ఆవిర్భావం తరువాత, హైదరాబాదు రాజ్య హిందూ ప్రజలందరూ (వర్గాల, కులాల కతీతంగా) దానిలో విలీనం కావటానికి తహ తహ లాడితే, రజాకర్లనే మత చాందస వాదులు ముస్లిముల ఆధిక్యత కాపాడటానికి హిందువులని క్రూర అణచివేతకు గురిచేసారనీ; అందువల్లే భారత మిలిటరీ వచ్చి హిందువులని కాపాడి, తప్పులు చేసిన ముస్లిముల్ని శిక్షించిందనీ ఈ కమ్యూనల్ కధనం. ముఖ్యంగా హిందూ స్త్రీలను  రజాకార్లు హింసించారని అనేక కధనాలూ, కధలూ విరివిగా చెప్పాయి.
ఇటువంటి కామన్ సెన్స్ ను చెదర గొట్టటం, రూపు మార్చటం ప్రస్తుత తెలంగాణా ఉద్యమ సందర్భంలో చాలా అవసరం. తెలంగాణా వీరత్వం, గొప్పతనం రజాకర్లను ఎదుర్కోవటం, నిజామును ఎదిరించటం తో ముడి పడుతున్న ఈ చారిత్రిక సందర్భంలో ఇటువంటి  కామన్ సెన్స్ ను చెదరగొట్టటం మరింత అవసరం. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు హిందుత్వ వాదంలో ఇమడని దళితులకూ, ఇతర బహుజన  కులాలకూ, ఈ కామన్ సెన్స్ ప్రభావాన్ని రోజూ చవిచూసే ముస్లిములకూ, అన్ని వర్గాలకు చెందిన స్త్రీలకూ కూడా చాలా అవసరమవుతుంది. ఎందుకంటే, ఈ కామన్ సెన్స్ లో స్త్రీలు అలలు, బలహీనులు, కమ్యూనిటి ఆస్తులు గా మాత్రమె వుంటారు. తమకు తాముగా, తామంతట తాముగా అలోచించుకోలేని, బ్రతకలేని, అస్తిత్వ రహితులు.
నా వంతు నేను ఈ కామన్ సెన్స్ ని సామాన్య స్త్రీల అనుభవాలు, జ్ఞాపకాల సహాయంతో విశ్లేషించి, చెదరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఆయా అనుభవాలన్నీ 1997-99 ల మధ్య నా డాక్టరల్ పరిశోధన కోసం హైదరాబాదు లోనూ, వరంగల్ లోనూ వివిధ వర్గాల, కులాల, మతాల స్త్రీలతో జరిపిన సంభాషణ లలో భాగంగా డాక్యుమెంట్ చెసినవి. నా పరిశోధన ఉద్దేశం 1930-50 ల మధ్య పుట్టిన స్త్రీలు కుటుంబ పరంగా అనుభవించిన హింస, బాధల గురించి అర్ధం చెసుకోవటం. అయితే తమ తమ జీవితాల గురించి చెప్పే సందర్భంలో అనేక మంది, 1944-50 ల మధ్య  రజాకార్లు, పోలీసు యాక్షన్ ల వల్ల తాము ఎదుర్కున్న  ఇబ్బందులు, తమ కుటుంబాల లో వచ్చిన వొడిదుడుకుల గురించి కూడా చెప్పారు. ఆ విషయాలు నా పరిశోధనకు కీలకం కాదు కాబట్టి నేనప్పుడు వాటిని గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతే కాక అప్పటికి ఇటువంటి చర్చ కూడా లేదు. గత నాలుగేళ్లలో జరుగుతున్న చర్చ నేపధ్యంలో వాటిని మళ్ళా చూసి రాయాల్సిన అవసరం వుందనిపించింది.
ఈ స్త్రీలందరూ ఏ రకమయిన ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు. తమ జీవితంలో ఏమయినా ఇబ్బంది కలిగితే, తాము చూసింది, అనుభవించింది గుర్తు తెచ్చుకుని చెప్పారు తప్ప, ఎవరూ రాజకీయ విశ్లేషనలకు సిద్ధపడలేదు. అయితే, ఆయా జ్ఞాపకాల్లో రాజకీయాలు తప్పకుండా వున్నాయి.  ఈ వ్యాసంలో ఈ జ్ఞాపకాలు ఎటువంటివి, ఏ భావజాలంతో కూడుకున్నవి, ఎందుకలా చెప్పి వుంటారు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ విశ్లేషణ మరిన్ని ప్రశ్నలతో, అసంపూర్తిగా వుంటుంది. అడగాల్సిన ప్రశ్నలు అప్పుడు అడిగుంటే బహుశా వాళ్ళు చెప్పి వుండే వారేమో. అప్పటికే ఆ స్త్రీలందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావటంతో, ఇప్పుడు వారిని మళ్ళా పలకరించే అవకాశం చాలా తక్కువ.
t4
గాలి మోటర్లు వచ్చినయి, బాంబు లేసినయ్యి:
వరంగల్ జిల్లా తెలంగాణా సాయుధ పోరాటం ఉద్ధృతంగా జరిగిన జిల్లాల్లో ఒకటి. వరంగల్ పట్టణం ఆనుకుని వున్నఖిలా వరంగల్ గ్రామంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు, చాలా మంది స్త్రీలు ఆ సమయంలో అక్కడే ఉన్నామని చెప్పారు. వారందరూ అత్యంత భయపడిన సమయం గా వర్ణించారు. అయితే, కింద వారు చెప్పింది చూస్తే, వారు భయపడింది – రజాకార్ల గురించా, నిజాం పోలీసుల గురించా, సెప్టెంబర్ 17 తరువాత వచ్చిన భారత సైన్యం గురించా, లేదా అప్పుడు జరిగిన దోపిడీల గురించా అన్న సందేహాలు రాక మానవు.
శాంతమ్మ అనే మాదిగ వ్యవసాయ కార్మికురాలు, తనొక రోజు బావులు తవ్వే పని చేస్తుంటే ‘వాల్లచ్సిన్రు’ అని చెప్పారు. “రగతాలు తీస్తరంట, రజాకార్లు. అందరూ బావుల్నించి దిగిపొయిన్రు. నేనొక్కతినే వున్న. పిలిసిన్రు. పిలిస్తే, ‘మేము చీకటి పడే దాక కష్టం చేసుకుంటే గాని తిండి వుండదయ్య’ అని సెప్పిన. పొమ్మన్నరు. ఉరికొచ్చిన. ఒక పిల్లగాన్నిపట్టుకున్నరు. వయసోడే. సాన రక్తం తీసిన్రట. బాంబులు పడినయ్యి”
తాము తమ అన్న కుటుంబం వుండే గీసుకొండపల్లికి  వెళ్దామని బయల్దేరితే, దార్లో వారి కుటుంబమే ఎదురొచ్చిందని, ఎందుకొస్తున్నారంటే, “అక్కడ సానమందున్నారు బావా, గుట్టకింద జివజివ మంటున్నరు. తుపాకులన్నీ పెట్టి” అన్నాడని, అందరు కలిసి మళ్ళా ఖిలా వరంగల్ కే వచ్చామని చెప్పారు. “ఏం కాదులే, తలుపులు పెట్టి పందాం” అని ఇక్కడే ఉన్నామని చెప్పారు. మరి వచ్చింది పోలీసులా, రజకార్లా? తెలియదు. రక్తాలు తాగే వారని ఆమె ఎక్కడ విన్నది? గుట్టకింద వున్నది రజాకార్లా, సంఘం మనుషులా?మరి రజాకార్లు రక్తాలు తాగే వారయితే, ఆవిడని ఎందుకు ఏమీ చెయ్యకుండా వదిలేసారు? వయసతన్ని మాత్రమే ఎందుకు పట్టుకున్నారు, అతను సంఘం మనిషనా? బాంబులు ఎవరేసారు? అన్న ప్రశ్నలు ఆవిడకి, నాకూ కూడా తట్టలేదు.
ఈరమ్మ అనే ఒక ఒక తెలగ వ్యవసాయ కార్మికురాలు రజాకార్లప్పుడు ఏమయింది అని అడిగితే, “ఈ వూరికేం కాలేదింక. ఇక్కడనే వున్నాం. పని నడుపుతాన్నం. మరి పంచేయందే కడుపులో ఎట్లా? దెంగ్కపొతె.. మేం పోలె. ఇక్కడోల్లెవరు పోలె. తురకోల్లు పోయిన్రు. అప్పుడా రజాకార్లప్పుడు వీధి మోటార్లు తిరిగి బాంబు లేసినయ్యి. ఆ పైకెళ్ళి తిరిగి డామ్మ, డామ్మ, డీమ్మ, డూమ్మ అయ్యేసిన్రు..” అని చెప్పారు.
వాళ్ళు ఎక్కడికీ పారిపోలేదనీ, పన్లు చేసుకునే వారికి పారిపోయే అవకాశం రాలేదనీ అంటూ, “తురకోల్లొస్తుంటే గజ గజ వణికినాం.. ఇగ పదిరవైమందొస్తున్రు.. మగోల్లెవ్వరు లేరు, పన్లకి పోయిన్రు. మేవు నల్గురాడాల్లం ఉన్నం. మా అత్తుంది. ఆమె వింది. వత్తాన్రు, వత్తాన్రు అనే వరకు రానే వచ్చిన్రు, చమ్మకు చమ్మున. ఇల్లు కొంచెమే వున్నదప్పుదు.. ఇగ మా అత్త, మా యారాల్ని, నన్ను లోపలికి తోసి  గొల్లిం పెట్టింది. ఒక పెద్ద యారాలు, పిల్లని తీస్కుని వచ్చే లోపల, ఆల్లు అరుగెక్కనె ఎక్కిన్రు. ఎక్కంగనే మా యారలంది కదా. ‘మా వాల్లెవ్వర్లేరు’. అంటనే అరుగెక్కిన్రు, చూసిన్రు, ఇగ పొయిన్రు రజాకార్లు. మల్ల రాలే. ఇగ దోప్కాలయినాయి. ఇగ మనకెంత? దోప్కాలచ్సినయ్యంటే అది పాపకారి సొమ్ము”. ఎవరు ఎవరిని దోచుకున్నారంటే, ‘ఏమో, రజాకార్లప్పుడయినాయి. పేట, గీటంతా దోచుకున్నారు”
నిజాము పోలీసులు వచ్చారా, లేక రజాకార్లు వచ్చారా అని అప్పుడు అడిగుంటే బాగుండేది. ఆవిడ దృష్టిలో తురకోల్లకి, రజాకార్లకి, నిజాము పోలీసులకి పెద్ద ఫరక్ లెదు. అంతే కాదు, గాలి మోటార్లు – విమానాలు – భారత సైన్యంతో వచ్చినా, ఆవిడ జ్ఞాపకంలో అవి రజాకార్లతోనే ముడిపెట్టి వున్నాయి. ఎందుకు? ఇంకా చిత్రంగా, ముస్లిములపై దాడులు జరిగినట్లు చెప్తున్నా, అవి కూడా రజాకార్లకే ముడిపెట్టి ఎందుకు చెప్పినట్లు?
ఖిలా వరంగల్ లోనే పోశమ్మ అనే ఎరుకల ఆవిడ మాటల్లో కూడా ఇదే వ్యక్తమయింది. ఆవిడ తామందరూ అడవి లోకి పారిపోయి, తోటలో వుండి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఊర్లోకి వచ్చామని చెప్పారు. ఇద్దరు పిల్లలు పుట్టటమంటే, కనీసం రెండు, మూడేళ్ళ వ్యవధి. ఆ సమయమంతా రాజాకార్లే వున్నారని ఆమె అభిప్రాయం. పోనీ గుర్తు లేదా అంటే, వయసు 90 పై పడినా, ఆవిడకి తన పిల్లలు, పారిపోయిన వూర్లు, తిరిగొచ్చిన సమయం అన్నీ గుర్తున్నాయి.
రజాకార్లు క్రియాశీలకంగా నిజాం అధికారాన్ని కాపాడటానికి పనిచేసింది 1947-1948 మధ్య కొన్ని నెలలు. ముఖ్యంగా వాళ్ళు నిజాం పోలీసులతో కలిసి, భూస్వామ్య దొరల ఆధిపత్యం కాపాడటానికి, కమ్యునిస్టు సంఘాల కార్యకర్తలని ఎదుర్కోవటానికి గ్రామాల్లో వున్నారు. వాళ్ళు కొన్ని నెలలుంటే, ఆ తరువాత వచ్చిన భారత సైన్యం కొన్ని సంవత్సరాల పాటు వుందని అందరికి తెలుసు. ఉస్మాన్ అలీ ఖాన్ ని దింపటం, సాయుధ పోరాటాన్ని అణచటం అన్న రెండు ఉద్దేశాలతో ఆపరేషన్ పోలో జరిగిందని;  తెలంగాణలో, ఆంధ్రాలో సాయుధ పోరాటం జరిగే జిల్లాల్లో దేశంలోనే పెద్ద మిలిటరీ క్యాంపులు నడిపారనీ, అనేకమందిని చంపారనీ, దోచుకున్నారనీ, అత్యాచారాలు చేశారనీ కమ్యునిస్టు చరిత్రకారులు మనకి చెప్పారు.
‘రక్తాలు తాగే’ రజాకార్లకు, భారత సైన్యానికి, ముస్లిములపై దాడులను, జరిగిన దోపిడీలను సామాన్య ప్రజలు కలిపేసి చూసారని పైన స్త్రీలు చెప్పిన తీరు బట్టి అర్ధం చెసుకోవచ్చా? రాజకీయ ఉద్యమాలతో సంబంధం లేని సామాన్య స్త్రీలుగా వారందరికీ రజాకార్ల ఉదంతం లో తాము, కుటుంబం, బంధువులు పడిన బాధ గుర్తుంది; ఎవరు ఎవరి తరపున పోరాడారు, ఎవరి రాజ్యం పొయ్యి, ఎవరి రాజ్యం వచ్చింది అన్న విషయాలు పట్ట లేదు. ఒక్కళ్ళు కూడా పోలీసు యాక్షన్ అన్న మాట కూడా అనలేదు. అలాగే స్వాతంత్ర్యం, విమోచన వంటి మాటలు కూడా చెప్పలెదు. వాళ్ళందరికీ ఆ సమయం అల్లర్లు, అశాంతి, గందరగోళ సమయం. ‘మాటలతో భయపెట్టిన’ సైన్యానికి, వచ్చి క్రూరత్వానికి ఒడిగట్టిన మరో సైన్యానికి మధ్య తేడాలుంటాయని గుర్తించే అవసరం లేకపోవటం వల్ల రజాకారు పేరుతోటే అందర్నీ, అన్నింటినీ – ‘రక్తాలు తీయటం, గాలి మోటార్లు రావటం, దోప్కాలవ్వటం, తురకోల్లు పోవటం’ – గుర్తుపెట్టుకున్నారా? ప్రజా సంస్కృతిలో కూడా ఆ సమయాన్ని, అప్పటి భయానక అనుభవాలని ‘వారి’ పేరుతోనే ‘జ్ఞాపకం’ పెట్టుకోవటం దీనికి దోహదం చేసిందా? 
పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది:
భారత సైన్యం, నిజాం పోలీసులు, రజాకార్లు మధ్య తేడా గుర్తించని స్త్రీల జ్ఞాపకాలు ఒకలా వుంటే, ఈ సమయం గురించి పెద్దగా ఎవరూ చర్చించని అనుభవాన్ని చవిచూసిన ఇంకొకావిడ ఘోష ఇంకోలా వుంది. ఇక్కడ రజాకార్లు, మహారాష్ట్ర నుండి వచ్చిన హైదరాబాదు స్వాతంత్ర సమర యోధులతో కలిసి కన్పిస్తారు.  ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన ప్రకటనకు స్పందించి గుంటూరులో తమకున్న రెండెకరాల పొలం అమ్ముకుని నిజామాబాద్ జిల్లాలో బోధన్ దగ్గర పదెకరాలు కొనుక్కుని స్థిరపడ్డ క్రిస్టియన్ కమ్మావిడ ఇనాసమ్మ చెప్పిన విషయాలు ఈ గందరగోళాన్ని వివరిస్తాయి. 1998 లో ఆవిడ రెండు మూడు సార్లు విడమరిచి  చెప్పినా నేను అర్ధం చేసుకోలేక పోయిన విషయాలు ఆవిడ ఇంటర్వ్యూ మళ్ళా చదివితే ఇప్పుడు బోధపడుతున్నాయి. ఎందుకంటే, భారత సైన్యం బ్రిటిషు వారు వెళ్ళిపోయిన తరువాత భారత దేశంలో కలవటానికి సందేహించిన హైదరాబాదు వంటి స్వతంత్ర రాజ్యాల పట్ల వ్యవహరించిన తీరు గురించి కాప్టెన్ పాండురంగా రెడ్డి వంటి వారు ఈ మధ్యనే కొంతమంది రాస్తున్నారు. భారత సైన్యాలు, రజాకార్ల వంటి పనులే హైదరాబాదు సరిహద్దుల్లో చేసాయని; రజాకార్లలో ముస్లిములు మాత్రమె లేరనీ, హిందువులు కూడా ఉన్నారనీ చెప్తున్నారు. హైదరాబాదు రాజ్య సరిహద్దుల్లో నివసించిన ఈవిడ మాటలు ఈ విషయాలకే  అద్దం పడతాయి.
“మేమొచ్చిన ఐదు సంవత్సరాలకి ఇక్కడ రజాకార్ల మూమెంట్ వచ్చింది. నెహ్రూకి చాలా లెటర్లు రాసాం. అయినా ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదు. శాంతం, శాంతం అన్నడు. పటేలు మట్టుకు ఆయనికి చెప్పకుండా ఆర్డర్ ఇచ్చెసాడు… మావి ఇరవయి ఎనిమిది కుటుంబాలు… అందరూ కలిసి రజాకార్లు మన వూరికి రాకుండా చేసుకుందా మనుకున్నాము. పగులొస్తే ‘మాకు నాలుగు బస్తాల బియ్యం కావాలా’ అంటే మనం మన దగ్గరున్న వడ్లు తీసుకుపోయి మరకిచ్చి వాళ్ళకిచ్చి రావాల. ఈ రాజాకార్లని పెట్టుకుని మహారాష్ట్ర వోళ్ళు వచ్చేవారు దొంగతనాలు చెయ్యటానికి, రాత్రిళ్లు. మన దగ్గర పెద్ద డబ్బులేం ఉండేవి కాదు కదా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు పొలం మీద పెట్టటం తప్ప, వాళ్ళు దోచుకోవటానికి! ఇహ మాకు నాగలి మొద్దులు కావాలా అంటే పది మొద్దులు కొట్టుకు పోయి వాల్ల్లకేసి రావాల, తురకోళ్ళకి. అట్లా దౌర్జన్యంగా తీస్కునే వాళ్ళు గాని, మా ఊల్లో దొంగతనాలయ్యి ఎక్కువ జరగనియ్యలెదు. చుట్టూ కాపలా, రాత్రంతా కాపలా. ఐదు నెలలు కాసామమ్మాయ్ కాపలా, రాత్రంతా. ఏడు గంటల కల్లా అన్నాలయ్యీ తినేసి, ఆ పెద్ద పెద్దయ్యి వుంటాయి కదా, ఇత్తడివి అవి గుంటల్లో పెట్టి కప్పెట్టాం. పొద్దున్నే మళ్ళీ చీకటి తోటే లేచి ఆ గాదెలన్నీ బయటికి తీసేది, వంటలు చెసుకునెది… మాకు పారిపోటానికి వీల్లేకపోయింది”
ఇదంతా చాలామంది ఆంధ్రా వాళ్ళు, తెలంగాణలో గ్రామీణులు చెప్పే సంగతులే. భారత ప్రభుత్వం ఆర్ధిక బ్లాకేడ్ విధించటం వల్ల అనేక వస్తువులకి కటకటగా వుండేది ఆ రోజుల్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా వుండేది. ఈవిడ బంధువులు చాలా మంది ఆంధ్రాలో తమ తమ ఊర్లకి పారిపోయారు. నిజామాబాదు దూరమవ్వటంతో వీరి కుటుంబం వూరు వదిలి వెళ్ళలేదు. వారు వెళదామనుకున్నా కుదరలెదు. ఆవిడ భర్త నిజాం పోలీసుల దృష్టిలో వుండేవారు. ఎందుకు?
“ఈయన లీడరు..  ఏమయినా అయితే పదిమందిని వేసుకుని పొయ్యేది..  ఒక రోజు ఈయన్ని కొట్టారు పోలీసులు. అరెస్టు చెయ్యటానికి వారంటు తీసారు. ఆరుగురు పోలీసులు, ఒక సబ్ ఇన్స్పెక్టర్  ఇంటికొచ్చారు…మా పెద్దోళ్ళoదరూ ప్రార్ధనలు చెయ్యటం మొదలెట్టారు.. చివరికి చాయ్ తాగి వారంటు వెనక్కి తీసుకుని వెళ్లిపొయ్యారు”. అంత భయపెట్టే నిజాం పోలీసులు వారంటు వెనక్కి తీసుకొని ఎందుకెళ్ళిపోయారు అన్న ప్రశ్న ఆవిడకి రాలేదు. తన భర్తను పోలీసులు అరెస్టు చెయ్యటానికి కూడా ఆవిడ వేరే రకంగా కారణాలు వెతుక్కుంది, “అప్పుడందరూ ‘ఆళ్ళే’ కదా.. ఇప్పుడు స్వతంత్రం వచ్చె వరకు  కలెక్టరు, పెద్ద పెద్ద పోస్టులన్నీ ‘ఆళ్ళ’కే ఇచ్చారు కద. మనోళ్ళకి ఇయ్యలేదు కదా. ఆ నవాబు తురకోళ్ళకే ఎస్.ఐ పోస్టులిచ్చేవాడు. తతిమ్మా వాళ్ళందరూ ఇక్కడెవరు డెవలప్ కాలేదు కదా ఇక్కడ. అన్నీ ముస్లింలకే ఇచ్చేవాళ్ళు.. ఇహ మనం పోయి చెప్పుకోవటానికి ఎవర్లేరు. ఎవరున్నారు?”
మీ వూర్లో రజాకార్లుండేవాళ్ళా అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం అత్యంత ఆశ్చర్యకరమయింది,
“మా వూర్లో అయితే, అస్సలు ముస్లిములే లెరు. ఒక్క ఫామిలీనే వుండేవాళ్ళు. కూలికీ, నాలికీ వచ్చే వోళ్ళే. … చిల్లర కులాల వాళ్ళు వుంటారు కదా, వాళ్లకి నెలకి ముప్పై రూపాయలు, ఒక మిలటరీ డ్రెస్సు, ఒక తుపాకి ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వాళ్ళందర్నీ పెట్టుకున్నారు. ముస్లింలు ఎంతమందున్నారు లేకపోతె? హిందువుల్ని చేర్చుకున్నారు. ఏ కులమయినా గానీ ‘నేను రజాకార్లలో చేరతానం’ టే చాలు ఆళ్ళ పేర్లు రాసుకుని ఆళ్ల కో డ్రెస్సు, తుపాకి, కత్తి ఇచ్చేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు చేరిపొయెవాళ్లు,  ముప్పై రూపాయల జీతమిస్తారని. … ఆ రోజు రేడియోలో రజాకార్లందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోండి అని చెప్పారు. ఇక చూడు ఎక్కడ గుంట వుంటే అక్కడ ఏభై మంది ఆ డ్రెస్సులు, కత్తులు, తుపాకులు అయన్నీ పారేసేది”
ఆవిడ రాత్రి పూట దోపిడీకి ‘వాళ్ళు’ వచ్చారంటే, నేను ‘వాళ్ళు’ కూడా రజాకార్లే అనుకున్నాను విన్నప్పుడు. కానీ ఆవిడ చెప్పింది వేరు. కాంగ్రెసు, ఇతర హిందూ సంస్థలూ దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, హైదరాబాదు ‘విమోచన’ కోసం,  సైన్యం సహకారంతో నడిపిన కాంపులలో తయారయిన ‘యోధుల’ గురించి ఆవిడ మొత్తుకున్నది. ఆవిడ వాల్లెవ్వరో పేరు పెట్టి చెప్పలేకపోయారు. నేను కూడా ‘వాళ్ళ’ని హైదరాబాదు ‘స్వాతంత్ర సమర యోధులు’ లేదా విముక్తి కోసం పోరాడిన వారని గుర్తుపట్టలేక పొయాను. మొహమ్మద్ హైదర్ ‘అక్టోబరు కూ’ పుస్తకం (2012, రోలి బుక్స్) లో భారత దేశం ఏర్పాటు చేసిన ‘బార్డర్ కెంపులు’ గురించి చదివేదాకా. హైదరాబాదు రాజ్య చరిత్ర లో నిజాం రాజ్యాన్ని ‘విముక్తి’ చెయ్యటానికి ‘సర్వ శక్తులనూ’ ధారపోసిన యోధులుగా ఎవరినయితే వర్ణిస్తారో వారే వీరని ఇప్పుడు అర్ధమయింది. ఎందుకంటే, ఆవిడ స్పష్టంగా ఐదు నెలల పాటే ఈ కాపలా,  అనిశ్చితి, మహారాష్ట్ర దోపిడీల వున్నాయని చెప్పింది. ఇంతకీ ఆ ‘యోధులు’ చేసిందేమిటి?
 “వాళ్ళ పేరు పెట్టుకుని, మహారాష్ట్ర, నాందేడ్ వాళ్ళు ఎక్కువ దోపిడీ కొచ్చే వాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న ఊళ్ళల్లో పటేళ్లకి బాగా బంగార ముంటుంది కదా.. వాళ్ళు తవ్వి పెట్టుకోవటమది. అది వీళ్ళు దోచుకుపోయ్యేవాళ్ళు.. ఈ రజాకార్లదేముంది? వస్తారు మాకిది కావాల, అది కావాల అంటే అది ఇయ్యాల.. మాకు నెయ్యి కావాలంటే అవి సప్లై చెయ్యాల.. కానీ వీళ్ళు బద్దెయ్యని తెసుసా.. ఆయన్ని కొట్టి నలభై ఐదు రూపాయలు తీస్కున్నారు.. హరి నారాయణని కొట్టారు, చాలా మందిని కొట్టారు”.
imagestel
స్వాతంత్ర సమరయోధులని మనం పుస్తకాల్లో రాసుకున్న వాళ్ళు చేసిన ఘనకార్యాలివి. నిజాము రాజ్యాన్ని అంతర్గతంగా అస్థిర పరిచి భారత సైన్యం కోసం సామాన్య ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కల్పించటంలో జరిగిన గెరిల్లా యుద్దం తీరిది. ఈ యుద్ధాన్ని ఆఖరి విమోచన పోరాటంగా హైదరాబాదు చరిత్రలో రాసుకోవటం జరిగింది. ఇవేవీ పట్టక పోయినా అప్పటి పరిస్థితిని చవిచూసిన సామాన్య స్త్రీ గా తనకే తెలియని చరిత్రని ఆవిడ ఈ విధంగా నాకు వర్ణించింది. నిజాం తరపున రజాకార్లు వున్నారని, ఆ బందిపోట్లు రజాకార్లని ఎదుర్కో వటానికి వచ్చారని తెలుసుకానీ,  ఆవిడకి (నాకు కూడా) వీళ్ళు ఎవరి తరపున పనిచేస్తున్నారో తెలియదు. ఇది రెండు రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధమనీ, ఆ యుద్ధంలో కొత్తగా ఏర్పడిన భారత దేశం గెరిల్లా పద్ధతిలో హైదరాబాదు రాజ్యాన్ని అస్థిర పరచటానికి ఈ దోపిడీలని ప్రోత్సహించిందనీ, ఆ యుద్ధంలో తాను కూడా పావునని ఆవిడకి, అందరి లాగే, అర్ధం కాలెదు. ఆవిడ కూడా చాలా సార్లు, ఆ పరిస్థితి నంతా ‘రజాకార్లు’ అన్న పదంతో ముడిపెట్టేసింది. అయితే చూసిన, అనుభవించిన విషయాల గురించి ఆవిడ చెప్పింది ఇప్పుడు చదివితే, ఆ సందిగ్ధ సమయపు రాజకీయాల నేపధ్యంలో అర్ధం చేసుకుంటే ఒకరి స్వాతంత్ర యోధులు, మరొకరికి దోపిడీ దారులు, దొంగలు అవుతారు కాబోలు అన్న అనుమానం తప్పకుండా వస్తుంది.
ఎవరో వచ్చి రక్షిస్తారని చాలా ఎదురు చూసినా, ఆవిడ పోలీసాక్షన్ తరువాత ముస్లిముల పరిస్థితి చూసి చాలా జాలి పడింది. చెడ్డ పనులు చేసిన ‘ముస్లిం’లని లైన్లల్లో నిలబెట్టి సైన్యం ఆయా గ్రామస్తులకి కర్రలిచ్చి కొట్టిచ్చారని చెప్పింది. తాను జాలిపడటం చూసి కొంత మంది ముస్లింలు ఆశ్చర్య పోయారంది.
“నాందేడ్ అవతల చాలా మందిని చంపారు. చాల మంది బోధన్ వచ్చారు. షుగర్ ఫాక్టరీ వుంది కదా, ఉద్యోగాలు దొరుకుతాయి కదా (అందుకని)… మాకు బోధన్ లో చేపలు అమ్మేవోళ్ళు, ఎండు చేపలు అమ్మేవోళ్ళు (చెప్పిందేంటంటే)  ‘నేను అరవై మందికి జీతాలిచ్చే వాణ్ణమ్మా. నాకు మిల్లుండేది. ఇప్పుడు నేను, నా భార్యా చేపలమ్ముకుని బతుకుతున్నాం అని చెప్పాడు. తాళాలమ్ముకునే అతను కూడా అదే చెప్పాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. బోధన్ లో అప్పుడు ముస్లింలు తక్కువ. ఇప్పుడు సగం మంది వాళ్ళే. అక్కన్నుంచి పారిపోయి వచ్చి నోళ్లే. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లెదు. ఏద్దొరికితే అది”
వలస రైతు కుటుంబానికి చెందిన స్త్రీగా, ప్రాణాలతో పాటు, తమ ఉనికి ఏమయిపోతుందనే ప్రశ్న కూడా ఆవిడకి వచ్చింది. అయితే, ఆవిడ స్థానిక రాజకీయాలతో సంబంధం లేకపోవటం వల్ల, ప్రభావితం కాకపోవటం వల్ల హిందూ-ముస్లిముల సంబంధాలని కొంతలో కొంత పక్షపాతం లేకుండా అర్ధం చేసుకోవటానికి కూడా ప్రయత్నించింది. తన కుటుంబం, తానూ కూడా పెద్దగా నిజాం పోలీసుల వల్ల బాధ పడక పోవటం కూడా ఆవిడకి ఈ తటస్థత ను ఏర్పరిచి ఉండొచ్చు. స్వాతంత్ర్యమంటే, ‘మనోళ్ళు’ అధికారంలోకి రావటం అని ఆవిడ అర్ధం చేసుకుంది. మనోళ్ళు అంటే, ఆంధ్రా వాళ్ళా? హిందువులా? తాను హిందూ మతస్తురాలు కాకపోయినా ‘హిందువులు రాజ్యాధికారం లోకి రావటాన్ని’ మనోళ్ళు అనుకోవటానికి కారణమేమిటని నేనప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగుంటే బాగుండనిపిస్తోంది.
ఉస్మాన్ అలీ పాషా చనిపోయాడు, మా ఆయన నౌకరి పోయింది
పాత బస్తీ లో ముస్లిం స్త్రీలతో మాట్లాడినప్పుడు నేను అడక్కుండానే వాళ్ళు చెప్పిన విషయాలివి. అప్పట్లో కోవా సంస్థ లో పనిచేసే నూర్జహాన్ గారు నాకు వీరిని పరిచయం చెసారు. నా పరిశోధన గురించి వివరిస్తే వారు కుటుంబం గురించి మాట్లాడతారు అని నేననుకున్నాను, కానీ వారు ‘కుటుంబం, హింస, బాధలు’ వంటి మాటలు నా నోటి నుండి వినంగానే యాక్షన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. యాక్షన్ తో వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి, చితికిపొయాయి, పూర్తిగా రూపు మార్చుకున్నాయి, అన్నది వారు చెప్పిన మాటల సారాంశం. పది మంది స్త్రీలతో మాట్లాడితే, వారిలో ఐదుగురు యాక్షన్ గురించి మొదలు పెట్టి తమ జీవితాల గురించి మాట్లాడారు. తెలంగాణా గ్రామీణ ప్రాంత స్త్రీలతో మాట్లాడేటప్పుడు రజాకార్ల గురించి వారిని అడిగితే గానీ చెప్పలేదు. పోలీసు యాక్షన్ గురించి పైన వర్ణించిన ఆవిడ తప్ప వేరే వాళ్ళందరూ రజాకార్ల గురించి, తమ తమ ధైర్యం గురించి చెప్పుకున్నారు తప్ప, యాక్షన్ గురించి చెప్పలెదు. పాత బస్తీ స్త్రీలకి మాత్రం యాక్షన్ వారి జీవితాల్లోనే అతి పెద్ద ఉపద్రవం. వారి జీవితాలని అతి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసిన ఉపద్రవం.
“బీదర్ జిల్లా కళ్యాణి లో వుండేవాళ్ళం మేము. మా నాన్న వూరి నవాబు దగ్గర వాచ్మన్ గా పని చెసె వాడు. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అత్త గారింట్లోనే పెద్దమనిషి అయ్యాను. నా భర్త కూడా వూరి అమీన్ ఇంట్లో నౌకర్ గా పని చెసెవాదు. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అప్పుడు మొదలయింది పోలీసు యాక్షన్. నా భర్త, మామ, మరిది అందరూ మరణించారు. ఎవరు ఎవర్ని చంపారో ఎవరికి తెలుసు? హిందూ మిలిటరీ వచ్చింది. జొన్న చేలల్లో దాక్కున్న వాళ్ళని కూడా వెతికి చంపారు. చాలా మంది పారిపొయారు. ఏమీ మిగల్లెదు – తినటానికి, కట్టుకోవటానికి, వుంటానికి. మాకు ఎనిమిది మామిడి చెట్లు ఉండేవి. అక్కడి హిందువులు లాగేసుకున్నారు. ఇక్కడికి పారిపోయి వచ్చాం. మక్కా మసీదులో ఉంటూ, పని కోసం వెతుక్కున్నాం. పాన్, బీడీ చేసే పని దొరికింది” – అయేషా బీ

“మాది బీదరు గ్రామం. మేము దర్జీలం. మేము బట్టలు కుడితే, ధాన్యం, పప్పు, పాలు, కూరలు ఇచ్చేవాళ్ళు, పైసలకి బదులు. పోలీసు యాక్షన్లో నాకు తొమ్మిదేళ్ళ పిల్లాడు, ఏడేళ్ళ పాప వున్నారు. పటేలింట్లో దాక్కున్నాం. మాకేం కానీయలె ఆయన. మా చిన్న మామ (మా భర్త బాబాయి) జొన్న చేలలో దాక్కుంటే ఆయన్ని తీసుకెళ్ళి పొయ్యారు. మళ్ళా ఎప్పడూ కనిపించలేదాయన. రైల్లో ఎక్కి ఇక్కడికొచ్చి బహదూర్ యార్ దేవ్డిలో ఉన్నాం. తరువాత నాకు చాలా మంది పిల్లలు పుట్టి చనిపొయ్యారు” – అమీనా బీ
“మాది హైదరాబాదే. ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లయింది. మా ఆయన హోం గార్డ్ గా చేస్తుండె. ఉస్మాన్ అలీ పాషా పోయిండు. మా ఆయన నౌకరి పోయింది. రిక్షా తొక్కిండు” – గౌసియ బేగం
“మాది బీదర్లో పేద వ్యవసాయ కార్మిక కుటుంబం. నన్ను మేనమామ కొడుక్కి ఇచ్చి పెళ్లి చెసారు. ఈ లోపల యాక్షన్ అయింది. హిందువులు మా వాళ్ళని చాల మందిని చంపేశారు –  మా తాత, చిన్న తాత, మామ చనిపొయారు. మా ఆయన కూడా చచ్చిపోయడనుకున్నాం. ఆయన హైదరాబాదు పారిపోయి వచ్చాడని మా దూరపు చుట్టం చెప్పాడు చాల రోజుల తర్వాత. అప్పుడు అందరం ఇక్కడికొచ్చి కలిసాం” – జరీనా బేగం
“మాది బీదర్ జిల్లా కల్యాణి. పేద కుటుంబం. పొలాల్లో పని చేసే వాళ్ళం. పోలీసు యాక్షన్ అప్పుడు ఏమైందో నాకు అంతా గుర్తుంది. ఎక్కడికి పారిపోయామో, ఏ ఊర్లల్లో దాక్కున్నామో అంతా.. మా మామ రసమ్ (తాంబూలాలు) అవుతుండే. కాల్పులు మొదలయినయ్. అన్ని ముస్లిముల ఇళ్ళని దోచుకున్నరు. ఆర్మీ వచ్చుండే. మేమందరం పారిపోయినం. మా ఇళ్ళల్లో ఏమి మిగల్లేదు. నాకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో ఏమీ తెలియదు. ఈ దోపిడీ, పారి పోవటం ఇదే గుర్తుంది” – చాంద్ బీ
హైదరాబాదు ఒక బహు భాషా రాజ్యం గా బ్రిటిషు వారి కనుసన్నల్లో నడుస్తూ ఉండింది. అంతర్జాతీయ రాజకీయాల్లో టర్కీ పతనం తర్వాత, బ్రిటిషు వారికి ‘హైదరబాదు రాజ్యం’ తాము ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదని చెప్పుకోవటానికి, కీలకంగా పరిణమించింది. ఆ సమయంలో పెరిగిన పరపతిని నిజాం సుస్థిర పరచుకుందామనుకున్నాడు కానీ ఆయనకి సాధ్య పడలేదు. జాతీయతా భావన వేళ్ళూనుకోని ఈ రాజ్యంలో మత సంస్కరణ పేరుతో వచ్చిన ఆర్య సమాజ ప్రభావం ఎక్కువగా ఉండింది. బ్రిటిషు ఇండియాలో జాతీయోద్యమ ప్రభావం పెరిగే కొద్దీ, ఇక్కడ కూడా ఆ ప్రభావం వచ్చింది కానీ వేరే రూపంలో వచ్చింది. అది 1930 లల్లో ఒక రూపు తీసుకుంది. ‘మత సంస్కరణ’ వెనక్కి పోయి, కాంగ్రెసు, ఇతర శక్తులు – ఉదారవాద ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని, సంస్కరణ లనూ సాధించుకోవటం కోసం ప్రజలను సమీకరించటానికి – మత పరమయిన భేదాలను వాడుకోవటం మొదలు పెట్టాయి. ‘తురక రాజుని’ ఎలాగయినా సింహాసనం దించాలని హిందూ సంస్థలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలంటే ‘రాజు’ ని ఎలాగయినా ప్రజలకి బాధ్యుడిని చెయ్యాలనే రాష్ట్ర కాంగ్రెసు ఈ ప్రయత్నంలో కలిసి పనిచెసాయి అని మార్గ్రిట్ పెర్నౌ (పాసింగ్ అఫ్ పాట్రి మోనియలిజం: పాలిటిక్స్ అండ్ పొలిటికల్ కల్చర్ ఇన్ హైదరాబాద్, మనోహర్ పబ్లికేషన్స్, 2000 ), లూసిఎన్ బెనిచౌ (ఫ్రం అటానమి తో ఇంటిగ్రేషన్, పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ 1938-1948, ఓరియంట్ లాంగ్మన్ 2000) అనే చరిత్రకారులు రాసారు. ఈ ప్రయత్నాలను ఎట్లాగయినా తిప్పి కొట్టాలని, హైదరాబాదు రాజ్య స్వతంత్రతను కాపాడాలని ఖాసిం రజ్వి రజాకార్ల ద్వారా ప్రయత్నించాడు. అందువల్లే, కుల మత విభేదాలు లేకుండా ఎవరి నయినా చేర్చుకున్నాడు ఆ సైన్యంలో. అయితే మత విభేదాల భూమికపై పనిచేస్తున్న ఉదార వాద హిందూ రాజకీయాలను 1947 తరువాత భారత ప్రభుత్వం (హైదరాబాదు రాజ్యాన్ని కలుపుకోవాలనే ప్రయత్నంలో) సమర్ధించింది. హైదరాబాదు రాజ్యానికి చుట్టూరా కాంపులు పెట్టి హైదరాబాదు ను అస్థిర పరచటానికి అవసరమయిన ఆయుధాలు, డబ్బు, ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళూ, భారత సైన్యం కలిసి సెప్టెంబర్ 17 తరువాత ఓడిపోయిన హైదరాబాదు రాజ్యంలో సాధారణ ముస్లింలపై చేసిన ప్రతీకార మారణ కాండకి నిదర్శనమే పాత బస్తి ముస్లిం స్త్రీల జీవిత అనుభవాలు.
పాత బస్తి స్త్రీలలో ఎవ్వరూ కూడా పెద్ద కుటుంబాలకి చెందినవారు కాదు. పటేళ్ళూ కాదు, పఠాన్లు కాదు, భూస్వాములూ కాదు. కొలువు వుండిన వాళ్ళు కూడా అతి తక్కువ స్థాయిలో ‘నౌకరి’ చేసుకుంటున్న కుటుంబాలకి చెందిన స్త్రీలు. వ్యవసాయపు పనులో, వేరే పనులో చేసుకుని పొట్టపోసుకునే శాంతమ్మ, నరసమ్మ, పోశమ్మ వంటి వాళ్ళే వీరందరూ కూడా. తరువాతి కాలంలో వీరి ఆర్ధిక, సామాజిక  స్థితి మరింత దిగజారింది. రెండు, మూడు తరాల వరకూ కూడా ఎవరూ కోలుకోలేదు. వీరి కుటుంబాల్లో ఎవ్వరూ డిగ్రీ చదివిన వారు గానీ, ఒక గవర్నమెంటు వుద్యోగం చేస్తున్న వారు గానీ లేరు. ఇంటర్వ్యూలు చేస్తున్న సమయంలో నాకు వారి బాధను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక వేరే విషయాలకు సంభాషణ మల్లించేసాను. ఇప్పటికి కూడా వీరి అనుభవాలని అర్ధం చేసుకోటానికి నాకు/మనకి ఏ సాధనాలూ లేవని, అసాధ్యమనే నాకు అనిపిస్తోంది. హైదరాబాదుకి వలస వచ్చిన స్త్రీలు వూరు, బంధువులు, కుటుంబం పోగొట్టుకుని దేశం కాని దేశంలో వచ్చీ రాని పని వెతుక్కుని ఎట్లా బ్రతికారు? అసలు తమనెందుకు బాధించారు అన్న విషయం కూడా అర్ధం చేసుకునే అవకాశం వారికి వచ్సిందా? వారి బాధను గురించి ఎవరూ అడక్క పోవటం వల్లనేనా, నేను కుటుంబం గురించి అడగ్గానే పోలీసు యాక్షన్ గురించి చెప్పారు? బాధ చెప్పుకునే అవకాశం కూడా లేకపోవటం దారుణం కదా? అసలు వారి బాధను పట్టుకునే భాష ఉందా మనకు? భాష కూడా ఇక్కడ ఈ స్త్రీలని వదిలెసిందేమో అనిపిస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచుకుని, కన్నడ, తెలుగు, మరాఠీ వాళ్ళందరం ఎవరి భాషలో వాళ్ళు, వారి ఘోష, చరిత్ర, అనుభవాలు రాసుకోగలుగుతున్నాం. మరి  వీళ్ళు ఏ భాషా సంస్కృతిలో తమ బాధను వ్యక్తం చేసుకోగలరు?
1944-50 ల మధ్య జరిగిన విషయాల గురించి పైన చెప్పిన ప్రజా బాహుళ్యాని కున్న ‘కామన్ సెన్స్’ లో వీరి అనుభవాలకి, జీవితాలకి వున్నస్థానమేమిటి? ఇది ‘అనివార్యం’ అని లేదా ‘రజాకార్ల/ముస్లిం పోలీసు/ముస్లిం దొరల ఆధిపత్యానికి’ తగిన ప్రతీకారమే అని అందామా మనం కూడా? ఈ కామన్ సెన్స్ వివరణ సరయిందేనా? వీరు ముస్లింలే కానీ, పీడించేవారు కాదు. నిజాం అధికారం క్రింద ఉన్నవారే కానీ అధికారంలో భాగస్వాములు కాదు. మరి వీరిపై హింస ఎందుకు జరిగినట్లు? అంతే కాదు, ఇన్నాళ్ళకి కూడా, వారి బాధకు ‘మన’ భాషలో, కామన్ సెన్స్ లో గుర్తింపు ఎందుకు రాలేదు? వారిని కనీసం ‘బాధితులుగా’ ఎందుకు గుర్తించలేదు మనం? రజాకార్ల బాధితులు, నిజాం పోలీసుల బాధితులు, దొరల బాధితులకూ వున్న చోటు ఈ బాధితుల కెందుకు లేదు? మన కామన్ సెన్స్ ను ఏ విధంగా రూపు మారిస్తే వీరు తమ బాధను గురించి కనీసం చెప్పుకోగలుగుతారు?
ముస్లింలను నిజాము, రజాకార్ల వారసులుగా చూడొద్దని అనేకమంది ముస్లింవాదులు చెప్తూ వస్తున్నారు. దీన్నానుకుని వున్నఇంకొన్ని అంశాలను కూడా మనం పునరాలోచించు కోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోంది నాకు. 1944-50 సమయంలో జరిగిన అన్ని రకాల అలజడిని, హింసని, గందరగోళాన్ని’రజాకార్ల’కి అంటగడుతున్నామేమో అన్న ప్రశ్న మొదటిగా వెసుకోవాలి. ఆ సమయంలో భారత ప్రభుత్వం, కాంగ్రెసు పార్టి, కమ్యునిస్టు పార్టి, నిజాము ప్రభుత్వాల మధ్య – ఒకరి స్వాతంత్ర యోధులు మరొకరికి దోపిడీ దారులు. అప్పుడు సామాన్య ప్రజల జీవితాల్లో ఏర్పడిన గందరగోళానికి, జరిగిన అలజడిలో ఎవరి బాధ్యత ఎంతుందో కూడా ఆలోచించుకోవాలేమో. కేవలం విలీనం, విమోచన అని సెప్టెంబర్ 17 ను వర్ణించేటప్పుడు ఎవరి దృక్కోణం నుండి అన్న విషయం కూడా తప్పకుండా చర్చించాలి. ఈ రాజ్య విమోచన ముస్లిముల ప్రాణాల ఫణంగా జరిగినప్పుడు, అది బీదర్లో, వేరే చోటా జరిగిందని, తమకు సంబంధం లేదని తెలంగాణా వాదులు తప్పించుకునే అవకాశం లేదు. అప్పట్లో బీదర్, నాందేడ్, గుల్బర్గా ప్రాంతాల్లో నివశించిన ముస్లింలు సెప్టెంబర్ 17 తరువాత ఇప్పటి తెలంగాణ  జిల్లాలలోకి పారిపోయి వచ్చి తెలంగాణలో అంతర్ భాగమయి పోయిన తరువాత, వారి భయంకర అనుభవాలని, ఎదుర్కున్న హింసని తెలంగాణా చరిత్రకారులు గాని, తెలంగాణా వాదులు గాని ఎట్లా కొట్టిపడేయగలరు?
సెప్టెంబర్ 17 వస్తోందంటే చాలు ప్రతి తెలుగు వార్తా పత్రిక ఒక ‘రజాకార్’ దుర్మార్గాన్ని, ఒక నిజాం పోలీసుల కధనీ ప్రచురిస్తుంది. తెలంగాణా ప్రజలను, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, విలీనాన్ని సమర్ధించి తమ దేశ భక్తిని చాటుకున్నందుకు ‘జాతీయ గుర్తింపు’ నిచ్చి పొగుడుతుంది. పైన చర్చించిన స్త్రీల జ్ఞాపకాలు, అనుభవాలు ఈ జాతీయతా మూసలో ఇమడవే మరి! రజాకార్ల దౌర్జన్యాలు, నిజాం పోలీసుల అరాచకాలతో పాటు, విమోచన యోధుల దోపిడీలు, భారత సైన్యం దుర్మార్గాలు కూడా స్మరించుకోవాలి మనం. సాయుధ పోరాటం హైదరాబాదు విమోచన కోసం, ఆ రాజ్యాన్ని భారత దేశంలో కలపటానికీ రాలేదని, ప్రధానంగా దున్నే వారికి భూమి కోసం, ‘హిందూ’ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిందనీ గుర్తు చేసుకోవాలి. ఆలోచనా పరులైన తెలంగాణా వాదులు పదే పదే చెప్తున్నట్లు, ఈ ప్రాతం అనేక చరిత్రల చౌరస్తాలో ఉండింది, ఉంటూ వచ్చింది. ఇది జాతీయ వాద చరిత్రలోనో, హిందుత్వ వాద చరిత్రలోనో, వామ పక్ష చరిత్రలోనో వొదిగేది కాదు, ఏకోన్ముఖంగా వివరించగలిగేదీ కాదు. 1944-50 ల మధ్య సమయపు రాజకీయాలను కూడా బహు ముఖంగా, పలు కోణాల నుండి మాత్రమె చూడగలం. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి, కొత్త చరిత్రలను రాసుకోబోతున్న తరుణంలో ఇటువంటి అవగాహన అలవరచుకోవటం బహుశా మరింత అవసరం. 
 
ఎ. సునీత

ఎ. సునీత

– సునీత అచ్యుత

జ్ఞాపకాలకూ రాజకీయాలున్నాయ్!

ఎ. సునీత

ఎ. సునీత

హిందీ రచయిత కిశోరిలాల్ వ్యాస్ నీలకంఠ రాసిన ‘రజాకార్’ నవల హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలపటం కోసం జరిగిన పోరాటం, దానిలోని ముఖ్య సంఘటనల చుట్టూ నడుస్తుంది. 

ముఖచిత్రంపై ఉన్మాదిగా కనిపించే ఖాసిం రజ్వి తో సహా అనేక మంది చారిత్రక ప్రముఖుల పాత్రలు, కాల్పనిక పాత్రలతో కలిసి నవలను నడిపిస్తాయి: మంచి వాడు, కానీ బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్; ధీరుడయిన స్వామీజీ; హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీరోచితంగా ఆయుధాలు చేపట్టే ఆర్య సమాజ సభ్యులు; భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్ట్ కార్యకర్త శంకర్; క్రూరులయిన ముస్లిం పోలీసు అధికారులు; మత పిచ్చితో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పెట్రేగి పోయి వినాశనానికి పాల్పడిన రజాకార్లు, వీరికి వ్యతిరేకంగా పోరాడి, తమ మగవారికి చేయూతనిచ్చే హిందూ స్త్రీలు; అణగారి నివసించే ముస్లిము స్త్రీలు; మత మార్పిడికి లొంగ కుండా ప్రాణాలు పోగొట్టుకున్న మంచి హరిజనులు; ప్రలోభాలకు లొంగిపోయి రాజాకార్ల తో కలిసిపోయిన చెడు హరిజనులు. షోయబుల్లా ఖాన్, నరసింగ రావు, నెహ్రూ, మున్షి, లాయక్ అలీ కూడా ఈ నవలలో పాత్రలే.

నవల కధనం ఇలా సాగుతుంది. బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్ ఖాసిం రజ్వి కి అధికార పగ్గాలు అప్పగిం చటం అనేక విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. శంకర్ వంటి యువకులు రజాకార్ల అత్యాచారాలను చుస్తూ పెద్దవుతారు. పెద్దయిన తరువాత వీరు వారి ఆగడాలని అడ్డుకోవటానికి ఆర్య సమాజ్, కాంగ్రెసు, కమునిస్ట్ పార్టీలలో రాజకీయ కార్యకర్తలవుతారు. శాంతి యుతంగా నిజాం  పాలనకు వ్యతిరేకంగా ప్రజలని సమీకరిస్తారు. పత్రికల్లో రాస్తారు. కొన్నిసార్లు భరించలేక ఎదురు తిరుగుతారు. నిజాం పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకులను చంపటమే కాక, రైతులను, హరిజనులను తమ పశుత్వానికి గురి చేస్తారు. ఇవన్నీ తీవ్ర స్థాయికి చేరుకున్న సందర్భంలో హిందువులను రక్షించటానికి భారత సైనికులు వస్తారు. భారత సైన్యంలో వున్న సిక్కులు, అప్పటికే దేశ విభజన సమయంలో ముస్లిముల చేతుల్లో హింసకి గురయి వున్నారు కాబట్టి ఆ కోపాన్నంతా ఇక్కడి ముస్లిం సైనికులు, పోలీసుల పై తీర్చు కుంటారు. నిజాం ప్రభుత్వం పడిపోయిన తరువాత, కొంత మంది మామూలు హిందువులు ముస్లిం లపై దాడులు చేస్తారు. కానీ ఒక గ్రామంలో ముస్లిము జాగిర్దార్ ని హిందువులు క్షమించి, రక్షణ కల్పించటంతో నవల ముగుస్తుంది.

 

నవల తెలంగాణా ప్రజల జ్ఞాపకాల్లో నిక్షిప్తమయిపోయిన అనేక సంఘటనలను వర్ణిస్తూ వివరిస్తుంది. కమునిస్టు ఉద్యమంలో ముఖ్య సంఘటనలు, వారు ప్రజలని సమీకరించిన విధానం, రజాకార్లతో, నిజాం పోలీసులతో వారి యుద్ధాలు; మామూలు హిందువులపై ముస్లిం పోలీసులు జరిపిన అత్యాచారాలు, వారు వాటిని వ్యతిరేకించిన తీరు; ఆయా పోరాటాల్లో స్త్రీల పాత్రా – కళ్ళకు కట్టేటట్లు వర్ణిస్తారు. ఈ పరిస్థితులు రావటానికి కారణాలు కొంత తానూ, మరి కొంత పాత్రల ద్వారా రచయిత చెప్పిస్తారు.  ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలన మంచిగా ఉండేదనీ, ఆయన తన హిందూ ప్రజల పండగలలో పాల్గొని, వారితో కలిసి పోయే వాడనీ ప్రశంసా పూర్వకంగా వర్ణించిన తరువాత, గాంధీ-జిన్నాల మధ్య భారత దేశ భవిష్య రాజకీయ చిత్రం గురించిన చర్చ పరిస్థితులను మార్చిన నేపధ్యంగా ముందుకు తెస్తారు. దేశ స్వాతంత్ర్య సమరంలో కలవకుండా జిన్నా హిందువులు ముస్లిం ల మధ్య విభేదాలు సృష్టించాడని, ఆ విభేదాలే హైదరాబాదు రాజ్యంలో కూడా పొడచూపాయనీ, వాటికి కారణం మత మౌడ్యం వున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, తన ఇస్లామిక్ భావజాలంతో ముందుకు రావటమే నని అంటారు. హైదరాబాదు రాజ్యంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులు మన కళ్ళ ముందు చిత్రీకరిస్తారు. షోయబుల్లా ఖాన్ హత్య, బహదూర్ యార్ జుంగ్ అకాల మరణం ఈ పరిస్థితులలో భాగమే. దేశాన్ని విభజించిన జిన్నాతో సంబంధం పెట్టుకున్న రజ్వి చేపట్టిన చర్యల వల్లే అనేక రకాల ఉద్యమాలు తెలంగాణా ప్రాంతంలో వచ్చాయని; అమాయక ‘హరిజనుల’ను చేర్చుకుని హిందువుల ఆస్తుల మీద, వారి స్త్రీల పైనా దాడులు చేసి, మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలం సృష్టించి రజ్వి తెలంగాణా జిన్నా గా అవతరించాడనీ ఈ నవల చెప్తుంది.

 

జరిగిన సంఘటనల చుట్టూ తిరిగే ఈ చారిత్రిక నవల చరిత్రను, తనకిష్టం వచ్చినట్లు తిప్పుకుంటూ వాడుకుంటుంది. శంకర్ రజాకార్ల ఆగడాలు చూస్తూ పెద్దవుతాడు, అంటే, రజాకార్లు దశాబ్దానికి పైగా వున్నారని రచయిత  భావన. హైదరాబాదు రాజ్య చరిత్ర తెలిసిన ఎవరికయినా రజాకార్లు రెండు, మూడు సంవత్సరాలకు మించి లేరని తెలుసు. ఇస్లాం లోకి దళితుల మత మార్పిడులు జరిగింది రజ్వి వున్నప్పుడు కాదు, 1920లలొ, ముఖ్యంగా బహదూర్ యార్ జంగ్ నాయకత్వంలో. అవి బల వంతపు మత మార్పిడులు అనటానికి ఆధారాలు లేవు.  కాంగ్రెసు, ఆర్య సమాజం అందరూ రజాకార్ల కు ప్రతి చర్యగా ఉద్భవించాయని రచయిత చిత్రణ. ఆర్య సమాజం హైదరాబాదు రాజ్యంలో 1890 ల నుండి పని చేసింది. కాంగ్రెసు పార్టీ, నిజాం ప్రభుత్వం వొప్పుకోకపోయినా, 1920 ల మధ్య నుండి ఏదో రూపంలో ఉంటూనే వచ్చింది. గాంధీ హైదరాబాదు రాజ్యానికి మూడు సార్లు వస్తే, ప్రభుత్వాధికారులు వెళ్లి స్వాగతం పలికారు. రచయిత చెప్పినట్లు, పోలీసు చర్య తరువాత హిందువుల, హిందు సైన్యం దాడుల్లో చనిపోయింది పోలీసు అధికార్లు మాత్రమె కాదు, మామూలు,  సాధారణ ముస్లిం లు కూడాను. అయితే, ఈ నవల ఉద్దేశం జరిగింది జరిగినట్లు చెప్పటమో, సంక్లిష్ట సమాజ చిత్రాన్ని పాఠకులకి అందించటమో కాదు. అందరు ద్వేషించగలిగె ఒకే ఒక్క శత్రువుని సృష్టించటం. ఆ శత్రువు ఎవరంటే ‘రజాకార్లు’.

 RAJAKAR- NOVEL FRONT PAGE

వారు గ్రామాల పై చేసిన దాడుల్నీ, వారి క్రూరత్వాన్ని, దయ లేని తనాన్ని, అమానుషత్వాన్ని వివిధ రకాలుగా చిత్రీకరి స్తుంది ఈ నవల. వారు స్త్రీల పట్లే కాదు, ‘హరిజనుల’ పట్ల కూడా క్రూరత్వాన్నిచూపించారనీ, ఎట్లా అంటే, వాళ్లకి గొడ్డు మాంసం తినిపించి, ఇస్లాం లోకి మార్పించి అని అంటుంది! మరి వారి నుండి ‘ప్రజల్ని’ కాపాడగలిగే సత్తా వున్నవాళ్ళెవ్వరు? బ్రాహ్మణులు. నవలలో ముస్లిములు, ‘హరిజన్లు’, బ్రాహ్మణులూ, రెడ్లు తప్ప మరే కులాల వాళ్ళు పెద్దగా కనిపించరు. కనిపించినా వారి వారి కులాల ప్రస్తావన వుండదు. బ్రాహ్మణులు తప్ప అన్ని కులాల వారూ డబ్బు, అధికారం, స్త్రీల వ్యామోహానికి గురవుతూ వుంటారు. బ్రాహ్మణ పాత్రలు ఎప్పుడు ఈ వ్యామోహాలకి గురి కావు. నిజాయితీతో, దైవ భక్తితో, హిందూ మత రక్షణ కోసం ఆయుధాలు పట్టటానికి కూడా సిద్ధంగా వుంటారు. వీరి నాయకత్వంలో పనిచేయటానికి మిగిలిన కులాల వారు  కూడా సిద్ధం గా ఉంటారు, కమ్యునిస్టులు, కాంగ్రెసు వారితో సహా. అంటే, ప్రధానంగా, అప్పుడు జరిగింది, హిందూ ధర్మానికీ, ఇస్లాం మత మౌడ్యానికి (ముస్లిములకు) మధ్య జరిగిన యుద్ధమని చెప్పటం నవల వుద్దేశం: హిందువులు కేవలం ఆత్మ రక్షణ కోసం పోరాడారు తప్ప,  వారికి మత మూడత్వం వుండదు. ఎందుకంటే, రచయిత దృష్టిలో హిందూ మతంలో ఎవరి పాత్ర – కుల వ్యవస్థ రూపంలో – రైతులు, స్త్రీలు, యువకులు, హరిజనులు – వారి కుంటుంది. వారందరూ, ఈ ‘హిందూ సమాజాన్ని’ రజాకార్ల నుండి రక్షించుకునే పోరాటంలో తమ తమ స్థాయిల్లో, రక రకాల పార్టీల ద్వారా ఈ పోరాటంలో పాల్గొన్నారు.

 

నవల మొదట్లో ముస్లిం లలో – రజాకార్లకి, షోయబుల్లా ఖాన్ కి, మంచి వాడయిన నిజాముకు మధ్య – తేడాలు చూపించినా, మధ్యలో కొచ్చేటప్పటికి, ముస్లిమ్ లందర్నీ ఒకే వర్గం గా (ముస్లిం లు కాని వారందరినీ, హిందువులు గా) వర్ణించటం మొదలు పెడుతుంది. అంతే కాదు, నెమ్మదిగా ముస్లిం లందరికి మత పిచ్చి ఉన్నట్లుగా – వారికి సమాజంలో, ప్రభుత్వంలో, రాజకీయాలలో వున్న స్థానానికి సంబంధం లేకుండా –  చిత్రీకరిస్తుంది. తన సృజనాత్మక వాస్తవికత ద్వారా ప్రతి సాధారణ ముస్లిం లో ‘రజాకారు’ దాగి ఉంటాడని చూపిస్తుంది. చివరికి, అమాయక ముస్లిం ల మీద పోలీసు యాక్షన్ తరువాత జరిగిన మారణహోమం కూడా, ముస్లిం లు చేసిన దానికి ‘జరగాల్సిన’ (ఇనెవిటబుల్) ప్రతిచర్యగా చూపిస్తుంది.

 

2005/2007 లలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లలో  వచ్చిన ఈ నవలా ‘వాస్తవికత’ స్పష్టంగా సమకాలీన హిందుత్వ జాతీయవాద రాజకీయ దృక్కోణంలో హైదరాబాదు రాజ్య ‘విలీన’ చరిత్రను చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ వాస్తవికతలో, నిజాం ప్రభుత్వం లో గ్రామ గ్రామానా పనిచేసిన బ్రాహ్మణ కరణాలు, అధికార్లు, మిగిలిన బ్రాహ్మణ ఉద్యోగుల ప్రస్తావన కి స్తానం వుండదు (వాళ్ళందరూ వుంటే, ఆ రోజుల్ని హిందూ ధర్మమూ, ఇస్లాం మత పిచ్చి కి మధ్య యుద్ధం గా వర్ణించటం అసాధ్యం కద!) ‘హరిజనులు’ గొడ్డు మాంసం తిని తమ మతాన్ని కొల్పోతారనే హెజిమోనిక్ (అ)’సత్యం’ దీనిలోనే అర్ధం చెసుకోగలం. గొడ్డు మాంసం తినే అలవాటు ముస్లిం ల వల్లే వచ్చిందని చెప్పటం వల్ల, దళితులను, ముస్లిం లను వేరు చేయచ్చు. మొత్తానికి దళితులు హిందూ సమాజంలో భాగమే అని చెప్పచ్చు (ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న గొడ్డు మాంస ఉత్సవాలకి హిందుత్వ వాదుల నుండి వస్తున్న వ్యతిరేకత ఈ దృక్పధం నుండే) మరి ‘ప్రతి చర్య’ సిద్ధాంతం 2002 సందర్భంలో నరేంద్ర మోదీ ప్రతిపాదించిందే. వీటన్నిటితో పాటు ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిన సంఘటలని కలిపి రంగరించిన నవలిది.

 

 

అయితే, హైదరాబాదు రాజ్యం గురించి ఇటువంటి ‘చారిత్రకత’ కేవలం హిందూత్వవాద కాల్పనిక (ఎంత వాస్తవికతతో కూడినదయినా) సాహిత్యానికి మాత్రమే పరిమితమయి లేదు. ఈ మధ్యనే (2008లో) గాంధీ భవన్ నుండి ప్రచురించ బడిన కాంగ్రెసు బ్రాండు చరిత్ర (రామారావు గారి హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్ర్య ఉద్యమం) కూడా ఇదే ధోరణిలో, మరిన్ని వివరాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో రాయబడింది. ఇక్కడ కూడా, రామానంద తీర్ధ, సుందరయ్య, నరసింగ రావులు, ఎటువంటి వైరుధ్యాలు లేకుండా, తెలుగు భాష కోసం, మత మార్పిడులకు, దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వుంటారు. ఈ పుస్తకంలో ఒక దశాబ్ద కాల – 1940 ల చరిత్రను, మొత్తం ఆధునిక హైదరాబాదు రాజ్య చరిత్రగా జరిగే ప్రయత్నం జరిగింది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన కొత్తల్లో రాయబడిన హైదరాబాదు చరిత్ర జాతీయవాద దృక్పథంలో రాయబడితే, క్రమ క్రమంగా దీనికి, వామ పక్ష దృక్పధం తోడయ్యి దొరలకు, రజాకార్లకు, నిజాముకు వ్యతిరేకంగా పోరాడటమే (తెలంగాణా) హైదరాబాదు రాజ్య చరిత్ర గా – విమోచన పోరాట చరిత్ర గా- (జాతీయ వాద విమోచన కావచ్చు, సాయుధ పోరాట విమోచన చరిత్ర కావచ్చు) – చిత్రీకరించటం ఎక్కువయింది. ఇటువంటి చరిత్రీకరణే ఉద్యమాల ద్వారా, సాహిత్యం ద్వారా తెలుగులో ప్రాచుర్యం పొందింది. ముస్లిం లకు (సామాన్య ముస్లిం లు,  కులీన వర్గాలు, మధ్య తరగతి తేడా లేకుండా) జాతీయ వాదులు,  కమ్యూనిస్టులు, నిజాం ప్రభుత్వ ఉద్యోగులు గానో తప్ప – ఈ చరిత్రలో స్థానం లెదు. 1940 లలోనే లక్షల్లో సభ్యులున్న మజ్లిస్ పార్టీకి, ఆ పార్టీ సభ్యులకు రజాకార్లుగా, జిన్నా సమర్ధకులుగా తప్ప స్థానం లెదు. దళితులకు, ముస్లిం లకు మధ్య సంబంధాలు, దళితులకు, నిజాం ప్రభుత్వానికి గల సంబంధాలు కూడా వ్యతిరేకతతోనే కూడుకుని వున్నట్లు, మూస పోసిన ఆలోచనా రీతుల్లోనే చిత్రీకరించ బడ్డాయి, చాలా వరకు.

ప్రస్థుతమున్న ఇటువంటి జాతీయ వాద, విమోచన వాద రీజినల్ చరిత్రను తిరగ రాయటానికి కొన్ని దశాబాలే పట్టొచ్చని సరోజినీ రేగానే వంటి చరిత్రకారులు అభిప్రాయ పడ్డారని కె. శ్రీనివాసు వంటి కొత్త తెలంగాణా చరిత్రకారులు అన్నారు. బొడ్డు వెంకట్, కవిత దాట్ల, గోగు శ్యామల వంటి కొంత మంది ఈ చరిత్రను వేరే ద్రుక్కోణాల్నుండి రాయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, 1990 లలో మొదలయిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చైతన్యం విస్తరించిన తరువాత ఈ  చరిత్ర, జ్ఞాపకాల లో ఖాళీ – సామాన్య ముస్లిం లకు స్థానం లేకపోవటం – అన్నది స్పష్టంగా కనిపించటం మొదలయింది. ఈ ఖాళీ లోకి, ఇప్పటికే ప్రాచుర్యంలో వున్న చరిత్ర, సాంస్కృతిక స్మృతులు, కళా రూపాల్లో నిబిడీ కృతమయిన నిజాం, రజాకార్ల వ్యతిరేక జ్ఞాపకాలలోని ముస్లిం ల గురించిన కల్పనలు ప్రవేశిస్తున్నాయి. ముస్లింలందరూ అంతర్గతంగా రజాకార్లే అన్న భావన ను, జాతీయ వాద, విమోచన దృక్పధాల చరిత్ర ప్రభావానికి, అది ప్రజల జ్ఞాపకాలో నిక్షిప్తమయిపోయిన విధానానికి సంబంధం లేకుండా అర్ధం చేసుకోలేము. ఈ మధ్యన సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా, జిలుకర శ్రీనివాస్ వంటి కొంతమంది దళిత, ముస్లిం ఉద్యమకారులు ఇటువంటి చరిత్ర, జ్ఞాపకాల కున్న రాజకీయాలను  ప్రశ్నించారు. కానీ, అంచుల నుండి వేస్తున్న ఈ సవాళ్లు అధికారిక చరిత్రని, ఉద్యమ చరిత్రని, అంత కన్నా ముఖ్యంగా ముస్లిం లు అంటే రజాకార్లు అని సాధారణ ప్రజల్లో వున్నబలమయిన జ్ఞాపకం/అభిప్రాయాన్ని మార్చగలవా అన్నది ప్రశ్నార్ధకమే.

 

ఈ సాధారణ ప్రజల ‘జ్ఞాపకం’ ఎంత బలమయిందో నాకు 2010 లో మా సహాధ్యాయులు మొయీద్, డా.  మొహమ్మద్ తో కలిసి సిద్దిపేటలో హిందువులు ముస్లిముల మధ్య చెలరేగిన కమ్యూనల్ టెన్షన్ గురించి అర్ధం చేసుకోవటానికి వెళ్ళినపుడు తెలిసింది.

తన కూరల దుకాణంపై పక్క ముస్లిం దుకాణాదారులు చేసిన దాడిని వర్ణిస్తూ ఒక కూరలమ్మే బి.సి కులస్తురాలయిన మహిళా దుకాణదారు  ‘మా అమ్మ చెప్తుండే ..వెనకటి సంది తుర్కోల్లు, రజాకార్లు .. మనోల్లని, తెలుగోల్లని.. ఇట్లనే కొట్టిన్రట’ అన్నది.  ఆవిడ అన్న మాటల్ని తేలిగ్గా కొట్టిపడేయ్యచ్చు.  అక్కడున్న హిందుత్వ వాద కార్యకర్తలు ఆవిడకి అవన్నీ నేర్పారని అనుకొవచ్చు. అప్పుడే గొడవయింది కాబట్టి ఆవిడ కోపంతో మాట్లాడింది అనుకోవచ్చు. ఆవిడా, ఆవిడ తో గొడవ పడ్డ దుకాణాదారులు అందరు దాదాపు ఒకే వర్గానికి చెందిన వారు, బహుశా ఒకే కులానికి చెందిన వారయి వుంటారు.  అయినా సరే, ‘తుర్కోల్లు-మనోళ్ళు; రజాకార్లు-తెలుగోళ్ళు’ అన్నతేడా, చదువు రాని కూరలమ్మే ఆమెకి నాలుక మీదే వుందంటే..అది నిజంగానే కుటుంబం, కమ్యూనిటి జ్ఞాపకాలనించి వచ్చిందనుకోవాలా? లేదా ఆవిడ రోజువారి జీవితాన్నించి వచ్చిందనుకోవాలా? గత పదేళ్లుగా రజాకార్ల గురించిన ‘జ్ఞాపకాల’ ను తిరగ తోడిన తెలంగాణా ఉద్యమ చరిత్ర దీనికెంత తోడ్పడింది? తెలంగాణాలో మారుతున్న రాజకీయ సమీకరణల్లో కొత్తగా అధికారంలోకి ప్రవేశిస్తున్న కులాలలో వస్తున్నసాధికారత ఎంత మేరకు తోడ్పడుతోంది?

 

వీటిల్లో ఏ కారణాలు మనకు 2007లో ‘రజాకారు’ నవల రావటాన్ని, 2010లో కూరలమ్మే బి.సి మహిళ తన తోటి ముస్లింలను, ‘రజాకార్ల’ వారసులుగా భావించటాన్ని ఎలా  అర్ధం చేసుకుంటాం?

 – అచ్యుత సునీత

 

మన కథా ప్రయాణం గురించి…ఒక విహంగ వీక్షణం!

సదస్సు

గమనిక: ” తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం ” అనే అంశం పై  ఆగస్ట్ 2,3-2013 న జరగాల్సిన యు. జి. సి. జాతీయ సదస్సు సమైక్యాంధ్ర -తెలంగాణ ఉద్యమాల ఉద్రిక్త వాతావరణం  వలన ఆగష్టు చివరి వారం/సెప్టెంబర్ మొదటి వారానికి  వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది సరైన తేదీతో సంప్రదిస్తాం.

– వెల్దండి శ్రీధర్

గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని అనేక అస్తిత్వ ఉద్యమాలు కుదిపేస్తున్నాయి. వర్గం. కులం, జెండర్, మతం, భాష, జాతి, ప్రాంతం… ఇలా వివిధ అస్తిత్వాలు ఎన్నో నూతన పార్శ్వాల్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడంతో పాటు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే మార్కెట్, ఒకే ఆలోచనా స్రవంతిలోకి మార్చాలని చాప కింది నీరులా వస్తోన్న ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్న సమూహాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు తమ అస్తిత్వ అన్వేషణలో తమను తాము పునర్నిర్మించుకుంటున్నాయి .

ఈ కోణంలోనే విభిన్న అస్తిత్వ ఉద్యమాలతో పాటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా బలం పుంజుకుంటోంది. అసలు ప్రపంచీకరణకు విరుగుడు స్థానికత లేదా ప్రాంతీయతనే అనే స్పృహతో గత రెండు దశాబ్దాలుగా మానవ సమాజం జీవిస్తోంది. ఈ దృష్టితోనే అనేక దేశాల్లో వివిధ అస్తిత్వ ఉద్యమాలు తలెత్తుతున్నాయి . ఆఫ్రికాలో వివిధ జాతుల అస్తిత్వ పోరాటాలు, శ్రీలంకలో తమిళుల సంఘర్షణ, సోవియట్ యునియన్ విఛ్ఛిత్తి… ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత దేశంలో ఐతే గ్రీన్ హంట్, టైగర్ ప్రాజెక్ట్ లను, సెజ్ ఉద్యమాలను, ప్రాజెక్ట్ కారిడార్లను ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని,  తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను, భాషను, సంస్కృతిని, రాయలసీమలోని రాతి నిక్షేపాలను, గనులను ధ్వంసం చేయడాన్ని, కొల్లగొట్టడాన్ని ఈ దృష్టితోనే చూడాల్సిఉంది. ఈ అన్ని పరిణామాలను గూగీ, మహాశ్వేతాదేవి, అరుందతీ రాయ్ ల నుండి మన తెలుగు కవులు, రచయితల దాకా అనేకులు తమ కవిత్వంలో, కథల్లో చిత్రించారు.

telanga

“ప్రాంతీయ ముద్ర అంటనిదే ఒక కళా రూపానికి జీవం రాదు. జీవితాన్ని చిత్రించదలుచుకున్నప్పుడు, ప్రజల కష్టసుఖాలు నిజాయితీగా వ్యక్తీకరించ దలుచుకున్నప్పుడు ప్రాంతీయతా భావనల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు” అంటారు నందిని సిధారెడ్డి. ఒక ప్రాంతం యొక్క దుఃఖ స్పర్శను ఇతరులు ఎప్పటికీ యథార్థంగా చిత్రించలేరు. ఒకని మృత్యువును మరొకడు ఎత్తుకోనట్లే ఒక ప్రాంతం విశిష్టతను మరో ప్రాంతం  ప్రతిబింబించదు. దేనికదే సాటి. ఏ ప్రాంతం ఇంకో ప్రాంతానికి నమూనా కాదు. దేనికదే ప్రత్యేకమైనది. మనిషి ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు ఒక ప్రాంతం ఆ ప్రాంతీయుల ఆత్మను ఆవిష్కరిస్తుంది.

ఏ లక్షణాలైతే మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి చూపుతాయో అలాగే కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, వేష భాషలు, సుఖ దుఃఖాలు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో వేరు చేసి చూపుతాయి. ఇదే ప్రాంతీయ  అస్తిత్వం. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అస్తిత్వ “సోయి” తో అనేక కథలు వెలువడ్డాయి. మన అనుభవం, జ్ఞానం ఎప్పుడూ సంపూర్ణం కాదు. శకలాలు మాత్రమే. తెలుగు కథా సాహిత్యంలో అనేక ఖాళీలున్నాయి. వీటిని అర్థం చేసుకోవడం, కథా సాహిత్య విస్తృతిని తరచి చూడడం, శిల్ప మెరుగుదలకు జరిగిన దోహదాన్ని, మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని పునరాలోచింపజేయడం లేదా ఒక విద్యాత్మిక సమీక్ష (Academic Review) చేయడం ఈ సదస్సు ఉద్దేశం.

తెలుగు కథపై అభిరుచిని, విజ్ఞానాన్ని కల్గించడం, తెలుగు కథ సమగ్ర రూపాన్ని దర్శింప జేయడం, తెలుగు కథలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చర్చించడం, తెలుగు కథ శైలీ శిల్పాలలో తొక్కిన కొత్తదన్నాన్ని శోధించడం, తెలుగు కథ కాల పరిణామం లో సంతరించుకొన్న మార్పును అధ్యయనం  చేయడం, తెలుగు కథా ప్రయాణంలో మనం ఎక్కడున్నాం? ఏం  సాధించాం? ఎలా ముందుకు సాగాలి? చర్చించడం, తెలుగు సాహిత్యం పై అస్తిత్వ స్పృహతో వెలువడిన కథ ఏ  మేరకు ప్రభావాన్ని చూపిందో పరిశీలించడం సదస్సు లక్ష్య్యాలు.

sridhar

               వెల్దండి శ్రీధర్,

జాతీయ సదస్సు సంచాలకులు 

 

మూడు ముక్కలయిన గుండె కోత “మొరసునాడు కథలు”

MorasunaduKatalu

భాషాప్రయుక్త రాష్ట్రవిభజన, పరిపాలనా సౌలభ్యం కోసమే అనడం నిజమే అయినా, ఒకే భాష మాట్లాడుతున్నవారు, వేర్వేరు రాష్ట్రాలలో కొందరైనా మిగిలిపోవడం, ఆ భాషకు జరిగిన అన్యాయానికి గుర్తే! ఎక్కువమంది మాట్లాడుతున్న భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తమిళనాడు, మైసూరు, ఒడిశా, మధ్యప్రదేశ్ మున్నగు ప్రాంతాలలో ఎంతోమంది తెలుగువారిని పోగొట్టుకుంది. తమిళనాడులో దాదాపు యాభై శాతాన్ని మించి ఉండిన తెలుగు ప్రజల సంఖ్య,  2012 నాటి తమిళనాడు ప్రభుత్వ గెజిట్ ప్రకారం కేవలం రెండు శాతం మాత్రమే అనడం సాంస్కృతికంగా, ముఖ్యంగా భాషాపరంగా తెలుగు వారు నష్టపడుతున్న విధానానికి ఆనవాలు.

ఈ నేపథ్యంలో, యిటీవల వెలువడిన “మొరసునాడు కథలు” అన్న ముప్ఫైకథలతో కూడిన సంకలనం పేర్కొనదగినది. ఆంధ్ర, కర్ణాటకం, తమిళ రాష్ట్రాలుగా ముక్కలైన మొరసునాడులో నివసిస్తున్న రచయితల రచనలివి. తెలుగు భాషాభిమాని,  ప్రళయకావేరి కథల రచయిత,   యీ పుస్తక సంపాదకులలో ఒకరు అయిన స.వెం. రమేశ్ గారు

మొరసునాడును గూర్చి చేసిన విశ్లేషణ గమనింపదగినది. మొరసు అంటే గులకరాతినేల అని అర్థం. గాంగ, రాష్ట్ర కూట రాజవంశస్థుల మధ్య జరిగిన పోరాటాలకు నెలవైన ఈ మొరసునాడు, ప్రాచీన ప్రాకృత శాసనాలలో ‘ సణ్ణనాడు’ గా చోళుల కాలంలో ‘చోళమండలం’గా నొలంబరాజుల కాలంలో ‘నొలంబవాడి’ గా పిలువబడినా క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దపు

శాసనాలలో మొరసునాడుగా గుర్తింపబడింది.

ఆంధ్రప్రదేశ్ లోని పాత కుప్పం, పలమనేరు, పుంగనూరు, హిందూపురం తాలూకాలు, మదనపల్లి తాలూకాలోని ఎక్కువ భాగం,    కర్ణాటకలోని కోలారు, చిన్నబళ్ళాపురం, బెంగుళూరు నగరంలోని అన్ని ప్రాంతాలూ, బెంగుళూరు పరిసర ప్రాంతాలైన పెద్ద బళ్ళాపురం, దేవునిపల్లి, కొత్తకోట తాలూకాలు,  తమిళనాడు లోని హోసూరు, డెంకణి కోట తాలూకాలు, వేపనపల్లి ఫిర్కాలు కలిస్తే మొరసునాడు అవుతుందట! ఈ మొరసునాడులో  మొత్తం మీద యాభై శాతం తెలుగువారు, ముప్ఫైశాతం కన్నడిగులు, పది శాతం తమిళులూ, పదిశాతం యితర భాషలు మాట్లాడేవారున్నారట!

ఈ సంకలనం లోని కన్నడ కథల్లో తొమ్మిదింటిని నంద్యాల నారాయణరెడ్డి గారు, ఒక్క కథను కె.యెస్. నరసింహమూర్తి గారు తెలుగులోకి అనువదించగా, తమిళనాడు నుండి తీసుకున్న పది కథలూ తెలుగులో వ్రాసినవే కావడం అక్కడి వారి తెలుగు భాషాభిమానానికి పతాకనెత్తుతూంది.

మూడు ముక్కలైన మొరసునాడు లోని తెలుగు ప్రజల ఏకీకృత  సాంస్కృతికాంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధకులకూ మంచి ఆధార గ్రంథంగా ఉపకరించే ఈ “మొరసునాడు కథలు” తెలుగు సాహిత్య సరస్వతికొక విలువైన ఆభరణంగా అమరిన గ్రంథం. శతాబ్ద కాలాన్ని అధిగమించిన  తెలుగు , కన్నడ కథలు జానపద

స్థాయినుండి గ్లోబలైజేషన్  ప్రభావం దాకా గల విస్తార పరిథిలో సాగగా, తమిళనాడులోని తెలుగు కథలు ఎక్కువమందివి పదేళ్ళ ప్రాయపు పసితనంతో కూడినవైనా, తాము నష్టపోతున్న తమ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాలన్న తపనకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

ఈ కథలనన్నిటినీ చదివిన తర్వాత, మానవుని జీవితంలో అత్యంత సాదారణంగా కనిపించే మౌలికాంశాలు, ఏ ప్రాంతంలో నివసించే వారిలోనైనా సమానమైనవే అన్న సత్యాన్నిమరోసారి గుర్తు చేసుకుంటాం. జీవితాలను తలక్రిందులు చేయగలిగిన శక్తి అంతటా సమానమే అని గమనిస్తాం.

స్వాతంత్ర్యానంతరం మనుష్యుల జీవితాల్లో వచ్చిన వేగవంతమైన మార్పులు. ప్రాచీన విలువలను విధ్వంసం చేసే దిశగా పయనించడం, మానసికంగా మారలేని, ఆర్థికంగా పురోగమనం సాధించ వీలుకాని పెద్దల జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడటం, యీ స్థితి మానవసంబంధాలపై చూపే ప్రభావం (రానున్న శిశిరం) యీ కథల్లో కనిపిస్తాయి.

ప్రపంచీకరణ ప్రభావం కులవృత్తులను అంతరింపజేసి, జీవితాలను తలక్రిందులు చేయడాన్ని (అన్నంగుడ్డ) కరుణరసాత్మకంగా వివరిస్తాయి. ఫ్యాక్టరీలకోసమని,  కార్ఖానాల కోసమని, పంట చేలను సెజ్ లుగా గుర్తించి, నామమాత్రపు ధరలు చెల్లించి స్వాధీనం చేసుకునే ప్రభుత్వం, భూస్వాములను కూలీలుగా ఎలా మారుస్తుందో, ఆ ప్రాంతపు ప్రజలు పొలాలను, ఊర్లను కోల్పోయి నిలువనీడలేక వలసవాదులుగా ఎలా మారిపోతున్నారో, మనసును పరిమళింపజేసే మట్టి వాసనలను కోల్పోయి, స్వచ్చమైన ప్రాకృతిక సౌందర్యం కోసం ఎలా వెదుక్కుంటున్నారో చెప్పే కథలు ( మా ఊర్లుఎత్తేస్తారా…!, బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల) గుండెను తడి చేస్తాయి.

దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు నుండి ఉత్తరం రావడం ఆలశ్యమైతే, తరంగాల్లా పుట్టే ఆలోచనల్తో సతమతమయ్యే తండ్రి మనసు (తరంగాలు)కు అద్దంపట్టే కథలు, రెండు సంవత్సరాలకొకసారి కూడా గ్రామంలోని తలిదండ్రులను చూసిరావడానికి తీరికలేని కొడుకుకోసం బియ్యాన్ని, కూరగాయలను మూటలుకట్టే తల్లి, ఈ సారి వచ్చేటప్పుడు తనకొక చీరను తెచ్చిపెట్టమని, కొంగున ముడివేసి యున్న రూపాయలను కొడుకు చేతిలో పెట్టే (అమ్మకొక చీర) కథలు మనసును తడిచేసే అపురూపమైన అక్షర శిల్పాలు.

స్వార్థ రాజకీయాలు,  గ్రామీణ ప్రజల ఐక్యతారాగాలను రూపుమాపి, విధ్వంసాలను సృష్టిస్తున్న  (ఇసుక) అమానవీయతను, ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా తనిఖీకి వచ్చిన అధికారికి ఆతిథ్యమిచ్చి, రాత్రిపూట అతడు నిద్రిస్తున్న యింటితో బాటు ఫైలును కూడా తగలబెట్టిన ( తనిఖీ) దౌష్ట్యాన్ని చూసి ఉలిక్కి పడతాం.

వేటగాడి ఉచ్చులో తగుల్కున్న జింకపిల్లలా మగవాడి మోసానికి సులభంగా లొంగిపోయిన చదువుకున్న యువతి ( జింకపిల్ల ),  ప్రేమించిన యువతి మరొకరితో చనవుగా మాట్లాడటాన్ని కూడా సహించలేని వారు (ఎదగలేనివారు),  లేచిపోయి, మోసపోయిన భార్యను ఆదరించిన మనసున్న మనిషి ( వెంకటగాని పెళ్ళాము ), బస్సులో దొరికిన తొమ్మిది లక్షల రూపాయలను డిపోలో అప్పగించిన నిజాయితీని,  చేతకానితనంగా నర్ధారించిన లోకరీతి ( మీరైతే ఏం చేస్తారు?),  తన జన్మకు సంబంధించిన రహస్యాన్ని చెప్పి, తత్ఫలితంగా తన ఆస్తి మీద హక్కునూ, తన ఉనికినీ కోల్పోయి, ఆత్మహత్య చేసికొన్న చంద్రంలాంటి వ్యక్తులు (నేను చంపిన యువకుడు ) , మట్టిగాజులు కొనడానికయ్యే ఐదు రూపాయలను భర్తకు తెలియకుండా దాచడంలో సంఘర్షణ పడిన యాది ( యాది పండగ సంత చేసింది)వంటి నిరుపేదలు, తనను నిర్లక్ష్యం చేసిన కొడుకు కోడళ్ళ మన్నన పొందిన”‘ కూరాకవ్వ”లు, తెలుగు నేల వైశాల్యాన్నిగుర్తుచేస్తూ ఆలోచింపచేసే హాస్యరసస్ఫోరకమైన “కూరేశికాశిరెడ్డి ” వంటి వారు, జీవనం కోసం ఎన్నో వ్యాపారాలు మార్చి, “చివరిమజిలీ” గా  రాజకీయాల్లో కుదురుకున్న తారానాథ్ వంటి బ్రతకనేర్చిన వారు….. ఇలా ఎందరినో,– అనునిత్యం మనకు అక్కడక్కడా తటస్థపడే ఎందరినో — కళ్ళముందు నిలుపుతాయీ కథలు.

అంతే కాదు, మనం నష్టపోతున్న కుటుంబ సంబంధాలను అందంగా గుర్తుచేస్తాయి.  నాన్నమ్మల అకళంకమైన ప్రేమను కోల్పోయి, జీవచ్చవాల్లా బ్రతుకుతున్నమనుమలను ( శబ్దాల వెలుగులో ), అపారంగా వర్షించే మేనత్తల ఆప్యాయతలను, (కావేరత్త మడుకు), తనకేదో అయ్యిందన్న అనుమానంతో క్రుంగిపోయి ఆరోగ్యాన్ని దిగజార్చుకుంటున్న వెంకన్నను, ఉపాయంతో స్వస్థుణ్ణి చేసిన పెద్దమ్మల మానవత్వంతో కూడిన సమయస్ఫూర్తిని (నీడ నీళ్ళు), పరిచయం చేసే ఈ కథలు, మనలోని బాల్యాన్ని తట్టిలేపి, మనం ఈ తరానికి అందకుండా చేస్తున్న అపురూపమైన ఆనందాలను మనముందు ప్రశ్నార్థకంగా నిలుపుతాయి. హాలుక్కమ్మగా పూజలందుకుంటున్న మాతృమూర్తి ( రగిలిన పేగు) కథనం, సాంస్కృతిక సంపదగా మిగిలిన ‘గౌరమ్మ పండగ ‘లు, ‘పాటలపెట్టి ‘శిన్నమ్మలు,  రైతుకూ, ఎద్దుకు ఉన్న బాంధవ్యాన్ని హృద్యంగా అందించే ( జంకనపల్లి దేవగౌని జాలెద్దు ), కథనాలు, గ్రామీణ సంస్కృతీ ప్రత్యేకతను చాటుతాయి.

ఇవన్నీ ఒక యెత్తు కాగా, సంవత్సరమంతా పండిన పంటను, ఏనుగుల బారినుండి కాపాడుకునే నేపథ్యంలో, అనునిత్యం జీవన పోరాటాన్ని సాగిస్తున్న ఒక భౌగోళిక వర్గపు ప్రజల సామాజిక జీవితాలకు ప్రతీకలుగా (జాడ, ఏనుగుల బాయి ) కనిపించే కథలు మనం తినే ఆహారం వెనుకనున్న జీవనావేదనలను గుర్తుచేస్తాయి. ఈ సామాజిక జీవన పోరాటాన్ని ‘ అల్లమదేవి ‘ కథతో కలిపి, తమ వాడ స్త్రీల మానరక్షణకు ఉపయోగించుకున్న ( సిడి మొయిలు ) మహిళల వీరోచిత కృత్యం ఆలోచింపచేస్తుంది.

“ఇంటిముందర పిల్లలు” చేసే అశౌచ్యం అనే అత్యంత ప్రాథమికావస్థ స్థాయి నుండి మొదలై, సెజ్ లు, ప్రపంచీకరణ నేపథ్యాలు, జీవితాలను తలక్రిందులు చేసే పరిస్థితులను వివరిస్తూ, మనం కోల్పోయిన, కోల్పోతున్న ఆప్యాయతాను రాగాలను,మట్టి వాసనలను, పండుగల సంస్కృతినీ, మట్టికీ మనిషికీ మధ్యనున్న సంబంధాలను, ఆదరంగా గుర్తుచేస్తూ సాగిన ఈ కథలు, భౌతికంగానే కాదు, మానసికంగా కూడా మనిషి ఎదగవలసిన ఆవశ్యకముంది అన్న జీవన నేపథ్యాన్ని వివరించడం మరువలేదు. అప్పన్నపదాలు, నారాయణతాత తత్వాలను గుర్తు చేయడమేగాక, అనంతమూ, మహాశక్తిమంతమూ అయిన మనస్సు పోకడలను కరుణార్ద్రంగా వివరిస్తూనే( జాన్ పాల్ చేసిన బీరువా కథ ), అనశ్వరమైనది ఏదివుందో, అది నశ్వరమై కనిపించే లోకం ద్వారానే మనుష్యునికి అందుతుందనే అద్వైత భావంతో (మధుర మీనాక్షి ) కూడిన జీవన తాత్వికతనూ వివరిస్తాయి.

ఈ కథలను చదివినపుడు, మనం పొందే మరో మధురానుభూతి, మొరసునాడులో ప్రతిఫలిస్తున్న మాండలిక భాషాసౌందర్యాన్ని ఆస్వాదించడం  వలన కలిగే అనుభూతి. ముఖ్యంగా కన్నడ, తమిళ ప్రాంతాలలో వాడుకలో మిగిలి ఉన్న తెలుగు పల్కుబడులు, ఆయా భాషలతో కలగలసి ఏర్పడిన కొత్త పదబంధాలు మనస్సులను పరిమళింప జేస్తాయి. సోరంపు రెక్కలు(కిటికీ తలుపులు), బెడుకు (దీపం)లు, తీరాటు(యూనిఫారం)లు, తేటంగా పటం (మ్యాప్) లు,  నేల కంజము( ధాన్యం పాతర)లు, తొణేకత్తె( తొండ)లు, చెలువు(ఖర్చు)లు, పోటుముట్టు (ఆయుధాలు) లు, మంగళం(ఫోర్టికో)లు, కలకుండు(ఊరకుండు)లు, పొక్కిపోవిడి(వదంతి)లు, బానము(ఆకాశము), జాలుమట్లు( చారలు), సారిగ( పెద్ద పొలం)లు — వంటి పలుకు బడులు, మాండలికాలుగా రూపుదిద్దుకుంటూ తెలుగు భాషా పరిథిని పెంచుతున్నాయి.

తెలుగు భాషా సౌరభాలు మనలను ముంచెత్తుతున్న  ఈ పుస్తకాన్ని  చదివి ముగిసిన తర్వాత, మంచికథలను చదివామన్న ఆనందంతోబాటు, చిక్కి పోయిన తెలుగునాడు పరిథిని, మరిచిపోయిన సాంస్కృతిక పరీమళాలను తలచుకొని మనసు మూగబోతుంది.

మన సంస్కృతిని శ్వాసింపజేసే ఈ మొరసునాడు కథల సేకరణలో తోడ్పడిన ఎందరో మహానుభావులకు, కథల ఎంపికలో పాలుపంచుకున్న, మధురాంతకం నరేంద్ర గారికి, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుగారికి, సంపాదకులు స.వెం. రమేశ్ గారికి, స. రఘునాథ్ గారికి తెలుగు భాషా ప్రేమికులు ఋణపడి ఉంటారు, యింత మంచి కథల హారాన్ని తెలుగు సాహిత్యంలో చేర్చినందుకు.

భాషాపరంగా, సాంస్కృతికంగా,తెలుగునాడుకు ఉపబలకంగానున్న మొరసునాడు, దీనికి దక్షిణంగా ఉన్న వరుసనాడు (తేని జిల్లా లోని మరొక తెలుగు తావు)లను గూర్చిన పరిశోధనవైపు విశ్వవిద్యాలయాలు దృష్టిని సారించ వలసిన అవసరముంది అంటున్న స.వెం.రమేశ్ గారి ఆర్తినీ, అభ్యర్థననూ గూర్చి ప్రతి తెలుగు పరిశోధకుడూ సానుకూలంగా స్పందించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి వక్కాణిస్తుంది.

 డా .రాయదుర్గం విజయలక్ష్మి

 

 

ఇస్లాంలోని మంచి కూడా మనకి తెలియాలి: ఫర్హాద్ జమా

“మీ క్లాస్మేట్ ఫర్హాద్ జమా నవలలు రాస్తున్నాడంటా తెలుసా?” దుర్గ ఫోన్ లో చెప్పినపుడు నా స్మృతి పధంలో తెల్లటి పాల బుగ్గల కుర్రాడు చటుక్కున మెరిసాడు. క్లాస్  టాపర్స్ లో ఒకడైన ‘జామ’ పుస్తకాలు పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీకి, యూనివర్సిటీ లైబ్రరీకి తిరగడం ఒకటే నా కళ్ళ ముందు వెంటనే కదిలిన విషయం. అప్పటికి పాతికేళ్ళ క్రితం వదిలేసిన జ్ఞాపకాలవి. డిగ్రీ పూర్తి కాగానే, క్లాస్ లో ముప్పై ఆరు మందిలోనూ తరువాత కలిసిన వాళ్ళు తక్కువ. ఎవరికి వాళ్ళం ఇంకొకరికి తెలియని జీవిత దారుల్లో నడిచి పోయాం. ఆ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దగా మాట్లాడుకొనే వాళ్ళం కాదు. అబ్బాయిలతో మాట్లాడితే ఏవో అంటగట్టేస్తారని మాకు భయాలు ఉండేవి. వాళ్ళకు ఇవే భయాలు మా కంటే ఎక్కువ మోతాదులో ఉండేవని తరువాత తెలిసింది. అయితే ఫైనల్ ఇయర్ హెచ్.సి.ఎల్  కాంపస్ ఇంటర్యూలో కాలేజ్ అంతటికి జామా ఒక్కడే  సెలెక్ట్ అయ్యాడని, అందులో చేరకుండా ఐఐటి ఖరగ్ పూర్ లో ఎమ్.టెక్ లో చేరాడని విన్నాను. తరువాత నేను అతని గురించి విన్నది ఇదే.  నెట్ లో అతని గురించి వెదికాను.

n270850

అప్పటికే అతని పుస్తకాలు రెండు ప్రచురణ అయ్యాయి. మొదటి పుస్తకం “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్” విశేష పాఠకాదరణ పొందింది. దాదాపు లక్ష కాపీలు అమ్ముడు పోయి, తొమ్మిది ప్రపంచభాషలలో అనువదింపబడి ఉంది. (ఫ్రెంచ్, జర్మన్, డచ్, స్వీడిష్, స్పానిష్, ఇటాలియన్, సెర్బియన్, టర్కిష్, ఇండోనేషియన్). రెండో పుస్తకం  ‘మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్’ అప్పుడే విడుదల అయ్యింది. వెంటనే పుస్తకాలు తెప్పించుకొని చదివాను. ఫేస్ బుక్ పుణ్యమా అని మా పాల బుగ్గల కుర్రాడు మళ్ళీ కలిసాడు. కాకతాళీయంగా అదే సంవత్సరం మా రీయూనియన్ జరగటం, విశాఖలో జమాను కలవటం జరిగింది. లండన్ లో స్థిరపడటం వలనేమో ఇంకా తెల్లగా, సుకుమారంగా మారి దర్శనం ఇచ్చాడు. ఈ ఇంటర్యూ లో సగభాగం అప్పుడు చేసేసిందే.

తరువాత విడుదలయిన అతని రెండు పుస్తకాలు (ఇవన్నీ సీక్వెల్) ‘వెడ్డింగ్ వాలా’, ‘మిసెస్ ఆలీస్ రోడ్ టు హాపీనెస్’ కూడా చదివాను. వెడ్డింగ్ వాలా గురించి చిన్న రివ్యూ కూడ అప్పట్లో  ఫేస్ బుక్ లో రాసుకొన్నాను. లండన్ లోని ఒక ఇన్వెస్ట్ మెంట్ బాంక్ లో ఐ.టి డైరెక్టర్ గా పనిచేస్తూ; ఉద్యోగానికి వెళ్ళే మెట్రో ప్రయాణంలోనూ (దాదాపు గంట), శని ఆదివారాలలోను ఈ నవలలు పూర్తి చేసాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

అందమైన విశాఖ నేపధ్యంగా ఇతని నవలలు రూపొందాయి. మధ్య తరగతి ముస్లిం కుటుంబంలోని వ్యక్తులు మిష్టర్ ఆలీ, మిసెస్ ఆలీ ఈ నవలలలో ప్రధాన పాత్రలు. ఒక ముస్లిం కుటుంబం చుట్టూ హిందూ సమాజాన్నిఅల్లించి, కధలను విజయవంతంగా పండించాడు.  సమకాలీన సమస్యలు, మత రాజకీయాలు, సుందరమైన ప్రేమలు, మధ్యతరగతి కుటుంబ వెతల మధ్య ఇమిడిన గాఢానురాగాలు, మొలక బియ్యం సారం లాంటి వృద్ధ దంపతుల సాహచర్య సహజానుభూతులు, కొద్దిగా శృంగారం, చాలా హాస్యం…..వెరసి ఫర్ హాద్ జామా నవలలు. నా చిన్నప్పటి క్లాస్ మేట్, ఇప్పటి ఎన్నదగ్గ రచయిత ఫర్హాద్ జమా ఇంటర్యూ మీ కోసం……

zama

Q నలబ్భై ఏళ్ళు దాటిన వెంటనే మీ మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ ” మొదలు పెట్టానన్నారు. ‘మిడిల్ ఏజ్ క్రైసిస్ ‘ కాకుండ ఇంకేమైనా ఆ వయసులో,ఆ కాలంలో మిమ్మల్ని సాహిత్యరచనకు ప్రేరేపించిన కారణాలు ఏమైన ఉన్నాయా?

మా నాన్న స్వతహాగా రచయిత. నన్ను రాయమని పోరుతూ ఉండేవారు. రాయగలనని నమ్మకం లేక నేను ఆయన మాట తీసేసాను. ఒక రకంగా చెప్పాలంటే అది మిడిల్ ఏజ్ క్రైసిస్ అనవచ్చు., ఎందుకంటే నేను నా నలబ్భైయవ పుట్టిన రోజు నాడు రాయటం ప్రారంభించాను. కాని కొన్ని ఇతర కారణాలు కూడ ఉన్నాయి. అప్పుడు నా కెరీర్ లో ఒక కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను. నా మీద వత్తిడి ఊహించనంతగా ఉంది. నేను దాని నుండి బయట పడటానికి దారులు వెతుక్కోవలసి వచ్చింది. సాహిత్యరచన అనే మార్పు నాకు అప్పుడు కావాల్సి వచ్చింది. ఇంకొక విషయం. నా కొడుకులు ఇంగ్లండులోనే పుట్టి, అక్కడే పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను పుట్టి, పెరిగిన భారతదేశం వాళ్ళకు విదేశం అవుతుంది అనే విచారం ఉండేది.  నేనేమైనా చేసి నా దేశాన్ని వాళ్ళకు సజీవం చేయాలి అనుకొన్నాను.

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.  9/11   దాడులు, మరీ ముఖ్యంగా జులై 7, లండన్ అండర్ గ్రౌండ్ బాంబింగ్స్ తరువాత ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. కొంతమంది మల్టీ కల్చరలిజం ఓడిపోయిందని అన్నారు. నేనేమనుకొంటాను అంటే మల్టీ కల్చరలిజం పాశ్చాత్యానికి కొత్త కావచ్చు. కొన్ని పదుల సంవత్సరాల క్రితం, బహుశ 50,60 లలో ప్రారంభం అయి ఉండొచ్చు. కాని భారత దేశంలో వివిధ సంస్కృతులు, మతాలు కలిసి ఉండే సంప్రదాయం శతాబ్ధాల క్రితమే ప్రారంభం అయ్యింది. అందులోను విశాఖపట్నం, అలాంటి సహనం కలిగిన పట్టణం. పై కారణాలు అన్ని నన్ను రచనా వ్యాసాంగానికి  ప్రేరేపించాయి.

Q మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ “లో సున్నితమైన ప్రేమ కధను  సెజ్ లు, విద్యార్ధి ఉద్యమాలు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో రాసారు. 90 తరువాత కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉన్న మీరు; మారిన భారతదేశ సామాజిక, సాంస్కృతిక  చిత్రాన్ని అంత అర్ధవంతంగా, ఆసక్తికరంగా ఎలా దృశ్యీకరించగలిగారు?

‘మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్’ రాసేటప్పటికి నా జీవితంలో సగ భాగం ఇండియా బయటే గడిపాననేది వాస్తవం.  కాని దాదాపు నా కుటుంబం అంతా ఇక్కడే జీవిస్తుంది. నేను కనీసం ఏడాదికి ఒక సారి ఇక్కడకు వస్తాను. భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికలు, మేగజైన్స్ ఎక్కువ చదువుతాను.  ఇక్కడ ఏమి జరుగుతుంది అనే విషయం గమనిస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇక్కడ నివసించే వాళ్ళు కూడ ఇక్కడి విషయాల పట్ల గుడ్డిగా ఉంటారు. బయటనుండి తరచుగా వచ్చేవాళ్ళు విషయ పరిజ్ఞానంతో చూడ గలుగుతారు. ఆ పరంగా అది నాకు సహాయం చేసింది.

Qఆర్.కె నారాయణ్ ‘పిక్యోరియల్ నేరేషన్’ మీ కధల్లో కనిపిస్తుందని విమర్శకులు అన్నారు. అది మీకు కేవలం పుస్తకాలు చదవటం వలనే అబ్బిందా? మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇతర రచయితలు ఎవరైనా ఉన్నారా?

ఆర్. కె నారాయణ్ నన్ను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసాడు. అతని సరళమైన భాష, ఆమ్ ఆద్మీ చుట్టూ అల్లిన అతని కధావస్తువులు, సున్నితమైన హాస్యంతో కూడిన అతని బరువైన కధలు …. ఇవన్నీ నాకు ఇష్టం. నన్ను ప్రభావితం చేసిన ఇంకొక రచయిత్రి జాన్ ఆస్టన్. ఆమె రాసిన ఇంగ్లండు ఇప్పుడు అదృశ్యమైంది. ఆమె చెప్పిన పెద్దలు చెప్పిన వివాహాలు, కట్నాలు, పెళ్ళిలో డబ్బు ప్రాధాన్యత … ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లండులో లేవు. కాని భారతదేశంలో ఇవన్ని ఇప్పటికీ ప్రాముఖ్యత గల విషయాలు. ఒక రచయిత కాని, రచయిత్రి కాని తను  చదివిన దాని వలనే ప్రభావితం అవుతారని నేను అనుకొంటాను. మనకు తెలిసి కావచ్చు, మనకు తెలియకుండా కూడ కావచ్చు.

 Qనాకిష్టమైన మీ రెండో నవల “మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్” ( మొదటి నవల కొనసాగింపు)లో  ప్రేమ లోని  ప్రాక్టికాలిటీని, షరతులను క్షుణ్ణంగా చర్చించారు. ఘర్షణలకు, కష్టాలకు నిలబడలేని ప్రేమలలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. మనలో మాట. ఎంతో బుద్దిగా అమ్మ, నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకొని స్థిరపడిన మీరు,  సున్నితమైన ప్రేమలోని మరింత సున్నితమైన కోణాలను ఎలా తాకగలిగారు?

 అది కొంత కల్పితం, కొంత నిజం. ప్రేమ కోసం అంతా త్యాగాలు చేయాలి అనే కధలు చాలా ఉన్నాయి. మరి అలా చేయలేక పోతే? మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్ లో ఒక దృశ్యం ఉంటుంది. చివర్లో ఉష వాళ్ళ నాయనమ్మను “ఎందుకు మా ప్రేమకు అన్ని షరతులు పెట్టావని” అడుగుతుంది. “ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి పెట్టానని” చెబుతుంది. నేను మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ నవలకు సీక్వెల్ రాయాలని అనుకొన్నపుడు ఈ దృశ్యం ముందు నా స్మృతిపధంలోకి వచ్చింది. నిజానికి మొత్తం పుస్తకమంతా ఈ దృశ్యానికి కొనసాగింపుగానే రాసాను.

Qమీ నవలలలోని ప్రధాన పాత్రలు మిష్టర్ ఆలీ అండ్ మిసెస్ ఆలీ. మధ్యతరగతి ముస్లిం కుటుంబ పాత్రలు. నిజానికి కధానాయకుడు మిష్టర్ ఆలీ అయినా, మీరు ప్రతిభావంతంగా మలిచిన పాత్ర మిసెస్ ఆలీ.  ప్రేరణ?

నాకు ముందే తెలిసిన విషయం, మిష్టర్ ఆలీ నా కధలో ఒక ముఖ్యమైన పాత్ర కాబోతాడని. ఆ పాత్రని కొద్దిగా మా నాన్న లాగే మలిచి, కావాలనే కొద్దిగా భిన్నంగా కూడ రాసాను. కాని కధ మొదలు పెట్టినపుడు మిసెస్ ఆలీ పాత్రను మా అమ్మను కేంద్రంగా చేసుకొని అంత ప్రాముఖ్యం లేని పాత్రగా మొదలు పెట్టాను. కాని నేను రాసే కొలది మిసెస్ ఆలీ పాత్ర ఎదిగి తనంతట తాను జీవం దాల్చింది. అందుకేననుకొంటాను, ఆమె చాలా శక్తివంతంగాను, వాస్తవికంగాను రూపొందింది.

Qమొదటి రెండు నవలలో బిడియస్తుడు, బుద్దిమంతుడు అయిన జామా, మూడో నవల ‘వెడ్డింగ్ వాలా’ లో హఠాత్తుగా హోమో సెక్యువాలిటీ, నక్సలిజం లాంటి కాంట్రావర్సెల్ అంశాలు ధైర్యంగా రాయగలిగాడు?

 నా మొదటి పుస్తకాన్ని నోస్తాలిజియాతో, విభిన్నసంస్కృతుల ప్రజలు భారతదేశంలో ఎలా కలిసి నివసించారో ప్రపంచానికి చెప్పటానికే రాసాను. తరువాత పుస్తకాలు రాసేకొద్ది నేను స్వేచ్చగా మరిన్ని కాంట్రావర్సెల్ విషయాల్ని ఎక్స్ ప్లోర్ చేయగలిగాను. ‘వెడ్డింగ్ వాలా’ సగం రాస్తుండగా ఢిల్లీ కోర్టు హోమోసెక్సువాలిటీ వ్యతిరేకచట్టాన్ని కొట్టి వేసింది. నేను కొద్ది రోజులు అయోమయంలో పడ్డాను. నేను ఆ తీర్పును పట్టించుకోకుండా, హోమోసెక్సువాలిటీ ఇంకా చట్ట విరుద్ధం అని రాయాలా, లేక ఆ నవలను పూర్తిగా వదిలి వేయాలో నిర్ణయించుకోలేక పోయాను. సీరియస్ గా ఆలోచించి తీర్పును కూడ కధలో భాగంగా, నాకు సంతృప్తి కలిగేటట్లు రాయగలిగాను.

నక్సలిజం చాలా సీరియస్ విషయం. నేను దానికి సింపతి ఆపాదించి కొంత పబ్లిసిటీ ఇవ్వగలిగాను. (ఇంగ్లండు, అమెరికా నుండి చాలా మంది నా పాఠకులు,నేను రాసినది చదివేదాక నక్సలిజం గురించి తెలియదని ఈమైల్ చేసారు.) కాని నేను ఆ విషయానికి పూర్తిగా న్యాయం చేయలేక పోయానని అనుకొంటాను.

Qమీకొచ్చిన అవార్డు గురించి చెప్పరా?

 చెప్పటానికి ఏముంది? అదొక గౌరవం. బ్రిటీష్ బుక్ అవార్డ్స్ వారి బెస్ట్ న్యూ నావలెస్ట్ లిస్ట్ తో సహా చాలా వాటిలో ఫైనలిస్టుగా వచ్చాను.  నాకు వచ్చింది మాత్రం మెలిస్సా నాథన్ అవార్డ్ ఫర్ కామెడీ రొమాన్స్. మెలిస్సా నాథన్ ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి. చిన్న వయస్సులో కాన్సర్ తో చనిపోయారు. ఈ అవార్డ్ ఆమె పేరుతో ఆమె కుటుంబసభ్యులు ఇస్తున్నారు. జో బ్రాండ్ (ఫన్నీ కమేడియన్), సోఫియా కిన్సెల్లా ( మాస్ రచయిత) లాంటి వాళ్ళు ఆ జూరీ లో ఉన్నారు. ఆ అవార్డు పురుషుల్లో నేనే మొదట తీసుకొన్నందుకు సంతోషంగా ఉంది.

Q ఒక ముస్లిం రచయితగా మీ చివరి నవలలో(మిసెస్ ఆలీస్ రోడ్ టూ హేపీనెస్) ముస్లిం మత ఛాందస భావాలను కూడ తూలనాడారు. ఆ మతానికి సంబంధించి మీరు కోరుకొంటున్న సంస్కరణలు ఏమిటి?

 నేను పెరిగిన ఇస్లాం స్ట్రిక్ట్. కాని సున్నితమైన మతం. జీవితంలో క్రమశిక్షణ, మద్యాన్ని తిరస్కరించటం, రంజాన్ రోజుల్లో ఉపవాసాలు ముఖ్యమైనవి మాకు. అలాగే దానధర్మాలు కూడ. ఇస్లాం మతం అంటేనే కుల, మత సమానత్వం. స్త్రీలకు ఆస్తిహక్కు, విడాకుల హక్కు, అనాధల సంరక్షణ ఉన్న ప్రగతిశీల మతం అది. కొంతమంది ముస్లిమ్స్ , విద్వేషం ప్రబలేటట్లు దానిని వక్రీకరించటం బాధాకరంగా ఉంటుంది. మరికొంతమంది దానిని వెనకబడిన మతంగా చెప్పటం కూడ అంతే బాధాకరం.

Qమీ నవలలు ఫిక్షన్ అంటే నమ్మబుద్ది కాదు. చేతన్ భగత్ నవలల లాగా మీ నవలలు కూడ   స్వీయ అనుభవాల నుండి వచ్చాయా, అంత సజీవంగా ఉన్నాయి?

నేను నా నవలలో రాసిన అనేక దృశ్యాలు ఒక్కొక్కటే తీసుకొంటే చాలావరకు నిజాలు. నేను చూసినవి, అనుభవించినవి. కాని మొత్తంగా కధ లైన్ మాత్రం కల్పితం.

 – ఇంటర్వ్యూ: రమా సుందరి

 

స్త్రీ విద్య మొదలు ‘తన్హాయి’ వరకు

vasaదేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యమందు మహిళ లెస్స.

మృదు మధురమైనది తెలుగు భాష. అందుకే తేనెవలె తీయనైనది తెలుగు భాష అంటారు. 11వ శతాబ్దము పూర్వం గురించి అనగా నన్నయ్య పూర్వము నుంచి తెలుగు భాష జానపద భాషగా తెలుగుదేశంలో వాడుకలో ఉంది. నన్నయ్య కాలం నుంచి ప్రధానంగా సాహిత్యము ప్రారంభమయింది. 19వ శతాబ్దము నుంచి ఆధునిక యుగం ప్రారంభమయింది.
ఆధునిక యుగంలో ప్రధానమైన ప్రక్రియలలో కవిత్వము, వ్యాసము, కథానిక, నవల, నాటకము, ప్రసిద్ధి వహించాయి. అందులో కథానిక, నవలా రంగాలలో స్త్రీలు మరింత పేరు గడించారు. అందులో 1960 మొదలు 1980 వరకు రచయిత్రుల స్వర్ణయుగము అన్నారు. ఎందరో  కథానిక, నవలాకారులు. అందుకే “తెలుగు సాహిత్యమందు మహిళ లెస్స” అన్న నానుడి ఏర్పడింది. నదిలో పాతనీటిని ముందుకు తోస్తూ కొత్త నీరు వచ్చి చేరుతున్నట్లుగానే పాత సాహిత్యము వెంట కొత్త సాహిత్యము వస్తూ ఉంటుంది. అది సహజము.
మనిషి ఆలోచన కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనిషి ఆలోచన మారినప్పుడు సాహిత్యమూ మారుతూ ఉంటుంది. ఆ కొత్త సాహిత్యము సమాజానికి శ్రేయోభిలాషి కావచ్చు. ఒకొక్కప్పుడు అనర్ధదాయకమని కొందరు భావించవచ్చు. ఏదైనా సాహిత్యంతో మార్పు మాత్రము సహజము. దానిని బట్టి ఎవరు ఒకలా ఉండాలని శాసించలేరు. మార్పుతో పాటు మానవ విలువలు మారుతూ ఉంటాయి. అందుకే సమాజంలో రచయిత్రులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. పోషిస్తున్నారు.
అప్పటివరకు ఉన్న సమాజానికి మేలుకొలుపుగా ఆధునిక యుగం ప్రారంభమయింది. ఓ పక్క రాజా రామ్ మోహన్ రాయ్ బెంగాలులో సతీసహగమన నిషేధానికి పూనుకొన్నాడు. ఆ ప్రభావంతో బానిసత్వంతో అన్ని విధాల మగ్గుతున్న భారతదేశంలో తిరుగుబాటు ధోరణి ప్రారభమయింది.

ఝాన్సీ లక్ష్మీ బాయి పరాయి పాలకులపై మొదటిసారిగా యుద్ధం ప్రకటించి పోరాటం ప్రారంభించింది. దాని ఫలితంగా క్రమంగా భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రారంభము, ఆంగ్ల ప్రభుత్వముపై తిరుగుబాటు ధోరణి ప్రారంభమయింది. మరొక పక్క విదేశీ పాలనా ప్రభావం వల్ల భారతదేశంలో ఆంగ్ల భాషా చదువులు ప్రారంభమయ్యాయి. పురుషులు చాలా మంది ఆంగ్లేయుల వద్ద ఉద్యోగాలు చేయడం  ప్రారంభించారు.మరొకపక్క వీరేశలింగం పంతులు సమాజం బాగుపడాలంటే స్త్రీ విద్య ప్రాధాన్యతకై, అనాధ స్త్రీల రక్షణకై కృషి ప్రారంభించారు. ఈ వీరేశలింగం పంతులు గారి సాంఘిక తిరుగుబాటు మూలంగా స్త్రీలలో చైతన్యం ప్రారంభమయింది.

స్త్రీలు చదువుకోవటంతో పాటు రచనలు చేయటం, స్త్రీ జనోద్ధరణకై మహిళా సంస్థలు కూడా ప్రారంభం చేసారు. అట్టివారిలో మొదట పేర్కొనదగినవారు శ్రీమతి బండారు అచ్చమాంబగారు. ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇంట్లోనే గురువు వచ్చి, చదువుకుంటుంటే ఆవిడకూడా పక్కన చేరి విద్య నేర్చుకున్నారుట. వివాహమైన తరువాత భర్తతో పాటు వెళ్లి హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించారు.స్త్రీ విద్య, ధనత్రయోదశి, బీద కుటుంబం, దంపతుల మొదటి కలహం మొదలగు 12 కథలు రచించారు. స్త్రీ విద్య ప్రచురణ 1902లో జరిగింది. వరాహమిహిరుని భార్య ‘ఖానా’ బెంగాలీలో దానిని తెలుగులో రచించారు. ఆబాల సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంధం కూడా ప్రచురించారు.”బృందావనం” పేరుతో మచిలీపట్టణంలో స్త్రీ జనోద్ధరణకై సమాజం స్థాపించారు.అప్పటికి ఇంకా వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభం కాలేదు. అందుచేత ఈవిడ సాహిత్యం గ్రాంధికంలోనే సాగింది. అందుచేత అవి కథలు కావని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ‘స్త్రీ విద్య’ ఒక రచయిత్రి రచించిన మొదటి కథ. అది భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ అయినా కథగానే పేర్కొనవచ్చు. అప్పటివరకు ఇంటి పనులలోనే స్త్రీలు జీవిస్తున్న కాలంలో ‘స్త్రీ విద్య’ ఒక తిరుగుబాటుగా ప్రారంభమయినదిగా పేర్కొనవచ్చు. “ఆవిట స్త్రీ హితైషిణీమండలి” స్థాపన కూడా ఆ కాలంలో చెప్పుకోదగిన సామాజిక సేవారంగాలలో చెప్పుకోదగిన కృషి.

తదుపరి కాలంలో చెప్పుకోదగిన రచనలు, సంఘసేవ చేసిన మహనీయురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ. అప్పటికి వీరేశలింగం పంతులుగారి సాంఘిక తిరుగుబాటు చైతన్యంతో పాటు గాంధీ స్వరాజ్య ఉద్యమం ప్రారంభమయింది. అప్పటికి ఆంధ్రపత్రిక వారపత్రిక, గృహలక్ష్మి పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈవిడ చిన్నతనంలోనే రాసిన శారద లేఖలు  గృహలక్ష్మి పత్రికలో ప్రసారమయ్యాయి. మా చెట్టు నీడ ముచ్చట్లు ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఆనాటి సాంఘిక, దేశ  పరిస్థితికి చిహ్నాలు అవి. ఆవిడ రచనలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. ఆవిడ కథానికలలో కుటీర లక్ష్మి  కుటీర పరిశ్రమలపై వెలువడిన కథ, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, 5 మాసాల 20 రోజులు మొదలగు కథానికలు చెప్పుకోదగినవి. 1925లో వెలువడిన ‘వసుమతి’ ఆవిడ మొదటి నవల. ఆనాటి సాంఘిక దేశ, కాల పరిస్థితులను తెలియచేసిన నవల. గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్న మొదటి రచయిత్రి . ఈవిడ రచనలు వ్యవహారిక భాషలోనే రచింపబడ్డాయి.

తరువాత చెప్పుకోదగిన రచనలు డా.ఇల్లిందల సరస్వతిదేవిగారివి. ఆనాటి కాలంలోని అనేక సమస్యల మీద ఈ రచనలు సాగాయి. 12 నవలలు, 250 వరకు కథానికలు, వ్యాసాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. ఈవిడ కాలం నాటి స్త్రీ విద్య అంతగా ప్రాధాన్యత ఇంకా సంతరించుకోలేదు. పెళ్ళినాటికి ఎక్కువ చదువుకోలేదు. ఇల్లిందల సీతారామారావుగారితో వివాహమైన తరవాత ఆయన కనీసం మెట్రిక్ అయినా చదివించి కాపురానికి పంపండి అని పట్టు పట్టటం వల్ల ఆవిడ చదువుకుని హైదరాబాదు వచ్చి భర్త ప్రోత్సాహంతో జర్నలిజం చదివారు.ఆవిడ రచనలు కృష్ణా పత్రిక, భారతి, సుజాత మొదలైన పత్రికలలో వెలువడ్డాయి. ఈవిడ రచనలు సాంఘిక దురాచారాలపై విమర్శ ఉంది. ఈవిడ రచించిన రచనలు సంఘసేవలో ప్రధాన పాత్ర వహించాయి. హైదరాబాదులో  వనితా మండలి స్థాపకులలో ఒకరు. రాజహంసలు, పెద్ద కథలు (1962) తేజోమూర్తులు. కొందరు మహానుభావుల జీవిత చరిత్రలు పాఠకలోకానికి చైతన్యం కలిగిస్తాయని రచించారు. ఈ విధంగా ఆవిడ రచనలు పాఠకలోకానికి ఎంతగానో ఉత్తేజం కలిగించి, ఆలోచింపచేసే రచనలు చేశాయి.
తరువాత చెప్పుకోదగిన నవల కాలాతీత వ్యక్తులు. డా.పి.శ్రీదేవిగారి రచన ఇది. 1958లో ప్రచురించబడింది. తెలుగులో ‘చివరకు మిగిలేది’ రచించి గొప్ప రచయితగా పేరు పొందిన బుచ్చిబాబుగారి నవల వలె శ్రీదేవిగారు ‘కాలాతీత వ్యక్తులు’ నవల రచించి కీర్తి గడించారు. మానవ జీవితాన్ని గురించిన విషయమంతా ఇందులో పొందుపరచబడింది. విజ్ఞానవంతులైన పాఠకలోకాన్ని ఆలోచింపచేసిన నవల ఆవిడ రచించిన కాలాతీత వ్యక్తులు.

ఆచార్య బిరుదు రాజు రామరాజుగారి మార్గంలో జానపద సాహిత్యంలో కృషి చేసిన వ్యక్తి ఆచార్య నాయని కృష్ణకుమారి. ‘గౌతమి నవల’, పువ్వులన్నీ శ్రీవారికే’ వంటి కథలలో స్నేహము, ప్రేమ, ఆదరణ కనిపించేట్టు మలచిన నవలలు, కథానికలు రాసినా జానపద సాహిత్య కృషి వాసి కెక్కినది. ఆంధ్రుల కథ, జానపద గేయగాథలు, సిద్ధాంత గ్రంధము, మొదలగునవి ఎంతోమంది విద్యార్థులకు అనుసరణీయమైనవి.

పిన్నవయసులోనే రచనలు చేసి పాఠకలోకాన్ని ఆకట్టుకున్న రచయిత్రి తెన్నేటి హేమలత. లతగా ప్రసిద్ధి వహించారు. వేశ్యావృత్తిపై రచనలు చేసిన మొదటి రచయిత్రి కూడా. ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా పని చేసి శిలాహృదయం వంటి నవలలే కాదు పాఠకలోకాన్ని ఆకట్టుకున్న మోహనవంశీ వంటి నవలలు ఊహాగానం వంటి   (5 వాల్యూములు) రచించిన రచయిత్రి. ఈ కాలంలోనే పాఠకలోకంలో మార్పు వచ్చింది. స్త్రీల పాఠకలోకం కూడా పెరిగింది. స్త్రీలలో చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. రచయిత్రుల సంఖ్య కూడా పెరిగింది. 1960 నుండి 1980 వరకు రచయిత్రుల యుగమని చెప్పవచ్చు.

ఒక పక్క మాలతీ చందూర్ ఆంధ్రప్రభలో ప్రమదావనం మరొకపక్క రామలక్ష్మిగారి ప్రశ్నలు సమాధానాలు ఆంధ్రపత్రికలో స్త్రీ పాఠకలోకాన్ని మరింత పెంచింది. ఈ కాలంలోనే కృష్ణవేణి, పేకమేడలు, కూలినగోడలు, స్త్రీ, చదువుకున్న కమల, ఆకర్షణీయమయ్యాయి. ఇవే కాకుండా రంగనాయకమ్మగారి బలిపీఠం సాహితీలోకంలో సంచలనం కలిగించింది. జానకి విముక్తి పాఠకలోకంలో ఆలోచన రేకెత్తించింది. రంగనాయకమ్మగారు రామాయణ విషవృక్షం రచించి సాంప్రదాయ లోకంపై ఒక సవాలు విసిరారు. ఈ విధంగా రచనలు చేసిన రచయిత్రి మరొకరు లేరనే చెప్పాలి. నేడు హేతువాద దృష్టితోనే రచనలు చేస్తున్నారు. మాలతీచందూర్‌గారి హృదయనేత్రి నవల స్వాతంత్ర్యోధ్యమ నేపధ్యంలో వెలువడి పాఠకలోకాన్ని ఆకర్శించింది.

ఈ కాలంలోనే మరొక సంచలన రచయిత్రి యద్ధనపూడి సులోచనరాణి. స్త్రీపురుషుల లోకంలో అనురాగ లతలు సృష్టించి అర్ధవంతంగా, ఆకర్షణీయంగా రచించిన సెక్రటరీ, జీవన తరంగాలు, మౌనభాష్యం, కీర్తికిరీటాలు, సహజీవనం, మీనా, మొదలైన 80 నవలలు పాఠకలోకంలో ఆబాలగోపాలాన్ని అలరించాయి. నవలలన్నీ  సినిమాలుగా వెలువడి పాఠకలోకాన్ని పరవశింపచేసాయి. ఈ నవలలో సమాజ సమస్యలకంటే స్త్రీ పురుషుల మధ్య సుఖసంతోషాలను కలిగించే సన్నివేశాలు సృష్టించే నైపుణ్యంతో, చక్కని శైలితో, అనుచిత, అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఆకర్షణీయంగా రచనలు చేసిన నైపుణ్యం యద్ధనపూడిగారిది.

ఇదే కోవలో రచనలు చేసిన మరొక రచయిత్రి కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి. ఈవిడ నవలల నైపుణ్యం కూడా పాఠకలోకాన్ని ఎక్కువగా ఆకర్షించింది. సూర్యముఖి, కల్పవృక్షం, స్వయంసిద్ధి, మార్గదర్శి, తపోభూమి, మోహనమురళి, చక్రనేమి, ప్రేమ్ నగర్ మొదలైన నవలలు రాసి పాఠకలోకంలో ఎనలేని కీర్తి గడించారు. ఎన్నో నవలలు సినిమాలుగా వెలువడ్డాయి. వైకుంఠపాళి, వారధి, పయనం ఎక్కడికి, ఎక్కవలసిన రైలు ఎంతో దూరం, ఈ పయనం మొదలైన నవలలు రాసి పాఠకలోకాన్ని ఎక్కువగా ఆకట్టుకున్న రచయిత్రి విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్ష్మి. చక్కని శైలి, అనువైన వర్ణనలు, ఈమె నవలల్లో ప్రసిద్ధి.

ఈ కాలం రచనల్లో మరొక సంచలనం సృష్టించిన  ‘మట్టిమనిషి’ వాసిరెడ్డి సీతాదేవిగారి రచన. రచయిత్రులెవ్వరూ మట్టి, గ్రామీణ వాతావరణం, రైతు జీవితం హృద్యంగా రచించిన నవల. రాబందులు, రామచిలుకలు, రాజకీయాలపై సంధించిన మరొక నవల వాసిరెడ్డిగారిది. అరుదైన విషయాలపై నవలలు రచించిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఈ కాలంలో కుటుంబ సమస్యలపై రచన చేసిన రచయిత్రులెందరో ఉన్నారు. ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి, పోల్కంపల్లి శాంతాదేవి, ఆనందాశ్రమం, తురగా జానకీరాణి మొదలైన రచయిత్రులెందరో కథానిక, నవలా రచనలు చేస్తున్నారు. ప్రధానంగా కుటుంబ వ్యవస్థ, స్త్రీల కష్టాలు, కన్నీళ్లు వెలికి వచ్చాయి.

ఈ కాలంలోని కథానికా రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి నిడదవోలు మాలతి. ఈమె చాతక పక్షులు నవల రాసారు. వందకు పైగా కథానికలు వెలువడ్డాయి. ఈమె రచనల్లో ముఖ్యంగా మానవతా విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతరులకు చెప్పడం విశేషం. నిజానికి, ఫెమినిజానికి మధ్య కథానిక సంచలనం కలిగించింది. ఈనాడు ఈమె తూలిక పత్రిక ద్వారా అనేక వ్యాసాలు, కథానికా అనువాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రపంచ స్థాయిలో ఇతర భాషలవారికి, ఇతర దేశాలవారికి తెలియజేయడమే ప్రధానోద్ధేశ్యంగా అనువాదాలు వెలువడుతున్నాయి. అనువాద రచయిత్రులలో ప్రథమస్థానము ఈమెదే. 1952 తెలుగు స్వతంత్రలో ప్రారంభమైన ఈమె రచన కొనసాగుతూనే ఉంది.

ఈ కాలంలో ప్రసిద్ధి పొందిన రచయిత్రి ఆర్.వసుంధరాదేవి. నిజజీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా రచనలు చేసిన రచయిత్రి ఈవిడ. ఈ కాలంలో అత్తగారి కథలు వంటి హస్య రచనలు చేసి  ప్రసిద్ధి పొందిన హాస్యకథా ఏకైక రచయిత్రి శ్రీమతి భానుమతిగారు. స్త్రీవాదము రాకమునుపే స్త్రీవాద  కథారచన చేసిన రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి. “బొన్సాయ్”వంటి స్త్రీవాద కథలకు పెట్టింది పేరు చాయాదేవి…”ఆకాశంలో సగం”వంటి నవలలు “అయోని”వంటి కథానికలు రాసి స్త్రీవాద రచయిత్రిగా 1990ల్లో ప్రసిద్ధి పొందిన రచయిత్రి ఓల్గా. సాహితీరంగంలో ఓ సంచలనం కలిగించిన స్త్రీవాద రచయిత్రి. కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, కుప్పిలి పద్మ, విమల మొదలైనవారు కవిత్వం, కథానికలు రచించి ఈ మార్గంలో నడిచారు. జయప్రభ కూడా కొన్ని కవితలు రాసి తనదైన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు.

ఈ తరం రచయిత్రులతో పాటు అనేకమంది రచయిత్రులు కుటుంబ సమస్యలు, సమాజ సమస్యలు తీసుకుని తమ రచనలు వెలువరిస్తూనే ఉన్నారు. జలంధర కొంత తాత్విక ధోరణిలో తమ రచనలు ఆకర్షణీయంగా రాస్తున్నారు. వివిధ కోణాలలో స్త్రీల సమస్యలను చిత్రించిన రచయిత్రి సోమరాజు సుశీలగారు. మానవ జీవితాలకు అద్దం పట్టే రచనలు చేసినవారిలో నందుల సుశీలాదేవి ఒకరు. పేషెంటు కథలు పేరుతో తన హాస్పిటలుకు వచ్చే రోగుల కథలను కథా రూపంలో వర్ణించే అరుదైన రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మిగారు. కొన్ని సంవత్సరాలు కృష్ణక్కగా ఆంధ్రభూమి వారపత్రికలో ప్రశ్నలు, సమాధానాలు చెప్పి మరొక పక్క కథానికలు, నవలారచన చేస్తున్న రచయిత్రి డా.కె.వి.కృష్ణకుమారి. హేతువాద దృష్టితో తనదైన శైలితో కథానికలు చేసిన రచయిత్రి డా.చాగంటి తులసి ఒకరు.  తనదైన శైలిలో వచన కవిత్వంలో దీర్ఘ కవిత, కావ్యము, కవితలు, కథానికలు రచించిన రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి ఒకరు.

1962లో కథానవలా రచన ప్రారంభించి నేటితరం వరకు “కాదేదీ కథకు అనర్హం” సుమారు 300 కథలు , 20 వరకు నవలలు రచించిన రచయిత్రి డి.కామేశ్వరీదేవి. అగ్నిపరీక్షవంటి నవలలే కాక ‘కొత్త మలుపు’ వంటి అద్భుతమైన నవల రాసి పురుషుడు మోసం చేసి అనుభవించి పెళ్ళిని దాటవేసిన వ్యక్తికి కోర్టుకు తీసికెళ్లి అబలగాకాక సబలగా కోర్టులో నెగ్గిన నాయిక పాత్రను సృష్టించిన సీతల రచించిన డి.కామేశ్వరి ఒకరు. “రెల్లు పొదలు” పేరుతో పేరుపొందిన నవల రచించిన పోలాప్రగడ రాజ్యలక్ష్మి ఎన్నో కథానికలు, నవలలు రచించారు.
స్త్రీవాదం రచనల్లో తగ్గిన తరువాత నేడు ఎంతోమంది రచయిత్రులు తమ కథానిక, నవలలు రచించి పాఠకలోకాన్ని ఆకట్టుకుంటున్నారు. “రేగడి విత్తులు” నవల రచించి రైతు జీవితానికి పట్టం కట్టిన రచయిత్రి శ్రీమతి చంద్రలత. మొదటినుంచి వార, దిన, మాసపత్రికలు రచయిత్రుల రచనలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. నేటి రచయిత్రులను కూడా దిన, వార, మాస మొదలగు ప్రసిద్ధ పత్రికలు స్త్రీ రచయిత్రుల సాహిత్యాన్ని పోషిస్తూనే ఉన్నాయి. ఒకనాడు స్త్రీల సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమని పేర్లు పెట్టారు. ఈనాడు సాహిత్యంలో రచయిత, రచయిత్రుల బేధం లేదనే చెప్పాలి. అన్ని రకాల విషయాలపై రచయిత్రులు కూడా పోటీపడి తమ రచనలు కొనసాగిస్తున్నారు. మీ రచనవల్ల మా పత్రిక అమ్మకం పెరిగిందని చెప్పే పత్రికలు కూదా ఉన్నాయి.

ముందు తరంలో కవిత్వము, కథానికలు, నవలలు  రచించిన శ్రీమతి శారదా అశోకవర్ధన్ చెప్పుకోదగిన రచయిత్రి. మంచి కథానికలు, నవలలు వ్యాసాలు రాసిన వేదుల శకుంతల, గోవింద సీతాదేవి మొదలైన రచయిత్రులున్నారు. వెండి వెలుగులు వంటి నవలలు, దేశబాంధవి వంటి ప్రసిద్ధ నాటకము , అనేక  కథానికలు, స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు స్త్రీలు వంటి వచన గ్రంధాలు, మళ్లీ మళ్లీ పుడతా వంటి కవితలు రాసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి డా.వాసా ప్రభావతి.

ఇటీవలి కాలంలో ఉత్తమ కథానికలు, నవలలు రచిస్తున్న వారిలో శ్రీమతి తమిరిశ జానకి, హాస్యకథలు రాస్తున్నవారిలో పొత్తూరి విజయలక్ష్మి, చక్కని, చిక్కని కథానిక, నవలలు రాస్తున్న గంటి భానుమతి, వారణాసి నాగలక్ష్మి, ఆధ్యాత్మిక తత్వంతో కథానికలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక, వి.ప్రతిమ, మల్లీశ్వరి ముఖ్యులు. వీరే కాదు మరెందరో చెప్పుకోదగిన రచనలు చేస్తున్న రచయిత్రులు.

2011లో వెలువడిన నవల “తన్హాయి” పేరే కాదు అందులోని వస్తువు, కథా కథన శైలి చెప్పు మానవ సంబంధాలను కొత్త కోణంలో చిత్రించిన నవలా రచయిత్రి కల్పన రెంటాల. ఇటీవలి కాలంలో కొత్తకోణంతో రచించిన నవల. కల్పన రెంటాల భావస్ఫూర్తి ఇది. ఈ నవలపై విమర్శ ఇంకా వెలువడవలసి ఉంది. నవలలోని కొత్త విషయాలు అందరికీ అందాలి. కాలం ఒడిలో మానవ ఆలోచనలు, పరుధులు మారుతూనే ఉంటాయి. కాలం ఒడిలో విలువలు మారుతున్న కొన్ని రచనలు వానిలోని పాత్రలు సాహిత్రీ గమనంలో మైలురాళ్లలా నిలిచిపోతాయి. చెరిపితే చెరిగిపోయేదీ కాదు. వాటి విలువ వాటిదే!

డా. వాసా ప్రభావతి

తెలంగాణ బహుజన కథకు ఆదరణ ఏది?

bahu1

తెలుగు కథగా చెలామణి  అవుతున్న కథలను పరిశీలిస్తే సింహభాగం బ్రాహ్మణుల కథలు లేదా  బ్రాహ్మణీయ  భావజాలం నుంచి వచ్చిన కథలు. పైగా ఆంధ్రా  ప్రాంతపు కథలు.  వీటిలో తెలంగాణకు చోటు లేకపోగా, ఇక తెలంగాణ బహుజనుల అజా పజా లేదు. ఈ దశలో తెలుగు సాహిత్య చరిత్రలోనే మొదటిసారిగా బహుజన కథకుల సమావేశం ఏర్పాటుచేయాలనుకున్నాం. అందులోనూ తెలంగాణ బహుజనుల కచ్చీరు. ఆ ఆలోచన రావడానికి కారణం-

బహుజనులకు, మిగతా వర్గాలకు మధ్య  చర్చ జరుగుతున్నప్పుడు స్పష్టంగా తేడా కనబడుతున్నది. వాళ్లు శిల్పం తప్పనిసరి అని మాట్లాడినప్పుడు అది ఎవరు నిర్ణయించిన శిల్పం అని మేము ప్రశ్నిస్తున్నాం. పత్రికలు, సంకలనాల్లో లెక్క కోసమే బహుజనుల కథలు ఎంపిక చేస్తున్నారే తప్ప ఆ కథల్లో వారి జీవిత సంఘర్షణ ఏమేరకున్నది, వారు కులపరంగా ఎట్లాంటి బాదలు అనుభవిస్తున్నారు అనే విషయాల్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ బహుజనులు రాసే కథలు వేసుకునే పత్రికలే లేవు. ఆంధ్రా వారికి తగ్గట్టుగా మార్చి ఇస్తే వేస్తామంటున్నారు. ఆంధ్రా వారి కథలు పత్రికల భాషలోనే ఉంటాయి కాబట్టి వారికి ఏ అడ్డంకులూ లేవు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్  20, 21 తారీఖుల్లో నేను, స్కైబాబ, సంగిశెట్టి శ్రీనివాస్ కలిసి హైదరాబాద్‌లోని  ‘లామకాన్’లో ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ ఏర్పాటు చేశాం. రెండ్రోజులూ బహుజన కథల్లోని జీవితం, సంస్కతి, లక్ష్యం , సిద్ధాంతం తదితర విషయాల మీద విలువైన చర్చ జరిగింది.
తెలంగాణ బహుజన రచయితల మీద ఆంధ్రా వారి ఆధిపత్యమే కాకుండా, హిందూత్వ, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాలు బలంగా పనిచేస్తున్నాయి. పైగా ప్రధాన స్రవంతి భావజాలం ఎలాగూ ఉండనే ఉంది. ఈ ప్రభావాల మూలంగా బహుజనులు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, తాజాగా రచనలు చేయడం కష్టమే. చేసినా ఆ రచనలు ఉన్నదున్నట్లుగా అచ్చు కావడం పెద్ద సమస్యగా మారింది. ఆ రకంగా మీడియా బహుజనుల రచనల్ని నిర్దేశిస్తోంది. అందువల్లనే బహుజన జీవన సంఘర్షణలు విస్తత స్థాయిలో రికార్డు కావడం లేదు. దాంతో కథల్లో ఒరిజినాలిటీ  కూడా కరువవుతోంది. ఈ విషయాలన్నింటి నేపథ్యంలో మేము ఏర్పాటు చేసిన ఈ కచ్చీరులో వక్తలందరూ ఈ విషయాలను తడమడం విశేషం.
అయితే సిద్ధాంతపరంగా జరిగిన చర్చలో కాలువ మల్లయ్య తానొక బీసీ అయినప్పటికీ బీసీల కంటే, మైనారిటీల కంటే ఎక్కువగా నష్టపోయింది దళితులని, ప్రస్తుతం దళితుల్లో ఉన్న చైతన్యం బీసీల్లో లేదని, కాబట్టి దళితుల నాయకత్వంలోనే మిగతా బహుజనులు ముందుకెళ్లాలని, అంబేద్కరిజాన్ని స్వీకరించడమే బహుజనులందరికి సరైన మార్గమని చెప్పడం ఈ సమావేశమంతటికీ హైలెట్. ఆ విషయంతో విభేదిస్తున్న బీసీలు చెబుతున్న  కారణాలు సహేతుకంగా లేవు. బహుజన ఐక్యతను కోరుకుంటున్నవారెవరైనా ఈ విషయంమీద విస్త్రుత చర్చ జరిపి బహుజనవాదం ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం చేయాల్సిన అవసరముంది.

ఈ రెండ్రోజుల్లో 13 మంది వక్తలు మాట్లాడారు. వాటిపై చర్చ జరిగింది.

జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ –కథల మీద సైద్ధాంతిక చర్చ జరగడం లేదు. అందుకే ఇలా  కథల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోకారణం ఇప్పటికీ సాహిత్యంలో కవిత్వానిదే పైచేయిగా అవుతోంది. ఎందుకంటే కథ, నవల సాహిత్య డిస్కోర్స్‌లో లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది.కులాన్ని నిర్మూలించే పని అగ్రవర్ణాలు చేయరు. తెలంగాణలో వ్యవస్థను మార్చివేసే రచయితలు పుట్టలేదు. ఉర్దూ రచయితలకు పరిమితి ఉంది. వారికి కుల సమస్య లేదు కాబట్టి వారు ఈ సమస్య మీద దష్టి పెట్టే అవకాశం లేదు. ముస్లిమేతరులు దాదాపు బ్రాహ్మణిజపు పర్‌స్పెక్టివ్ నుంచే రాశారు అని అన్నారు.
1960 నుంచి సిద్ధాంతం పక్కన పెట్టి కేవలం అనుభవాల ప్రాతిపదికగానే రచనలు వచ్చాయి. అనుభవం వరకే ఆగిపోవడం సిద్ధాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల బహుజనుల రచనల్లో రావలసినంత వైవిధ్యం , విస్తతి రాలేదు. కాబట్టి బహుజన రచయితలకు సిద్ధాంతం తప్పనిసరిగా ఉండాలి. బహుజనులు తమ కథల్లోనూ బ్రాహ్మణ సంస్ర్కృతి నే  చిత్రిస్తున్నారు. కల్చరల్ బ్యాగ్రౌండ్‌ను చేంజ్ చేయకుండానే క్యారెక్టర్స్‌ను మాత్రమే మారుస్తున్నారు. మొత్తంగా సంస్కతినీ, జీవన విధా నాన్నీ మార్చితే తప్ప అవి బహుజన కథలు కావు అని అభిప్రాయపడ్డారు.

బిఎస్ రాములు మాట్లాడుతూ: బహుజనులు జీవితాన్ని చిత్రిస్తే చాలు, అందులోంచే సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. జీవితం నుంచి సిద్ధాంతం ఏర్పడాలి కాని సిద్ధాంతం నించి జీవితాలు రికార్డు చేయడం సరికాదు. జిలుకర శ్రీనివాస్ దక్పథం ఉండాలనడం గానీ, మరొకరు అనుభవం కన్నా జ్ఞానం ముఖ్యం అనడం గానీ బ్రా హ్మణిజమే అవుతుంది అని అన్నారు.

ఈ విషయం మీద కాసేపు రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. బహుజనులు పెద్ద ఎత్తున హిందువైజ్ అవుతున్నారని, అందువల్ల బహుజన జీవితం, సంస్కతి కథల్లో మాయమవుతోందనే చర్చ ముందుకొచ్చింది. దాంతో తాము హిందువుల లాగే జీవిస్తున్నాం కాబట్టి తాము హిందువులమే కదా అని బిఎస్ రాములు, జ్వలిత అన్నారు. అయితే మరి బహుజనవాదంతో మీకేం పని అని వారిని కొందరు ప్రశ్నించారు. హిందూత్వమేమిటో, బహుజనవాదమేమిటో స్పష్టత ఏర్పర్చుకోవలసిన అవసరముందని ముక్తాయించారు.

ఈ మధ్య  ఒక కథా వర్క్‌షాప్‌లో- రచయిత డ్యూయల్ రోల్ ప్లే చేయడం వల్లే వారి పిల్లలు అమెరికా వెళ్లడమో, మరోటి కావడమో జరుగుతుందన్న అల్లం రాజయ్య మాటలు ప్రస్తావనకొచ్చాయి. పిల్లల ఇష్టాలని తల్లిదండ్రులెలా నిర్దేశిస్తారని కొందరు, తల్లిదండ్రులు కల్పించే వాతావరణమే వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుందని మరికొందరు వాదించారు.

పగడాల నాగేందర్ మాట్లాడుతూ: ఎప్పుడైతే విప్లవోద్యమం మీద తిరుగుబాటు మొదలైందో, ప్రశ్నే ప్రగతికి మూలం అనుకున్నారో, అప్పటి నుంచే ఎస్సీ, బీసీల  నుంచి బహుజన దృ ష్టితో  కథలు రావడం మొదలైంది.. ఇంకా నిర్దిష్టంగా బీసీల నుంచి కథలు రావలసి ఉంది. బీసీ కథా సంకలనాలు ప్రత్యేకంగా రాలేదు. రావలసిన అవసరముందని అన్నారు.

డా.పిల్లలమర్రి రాములు  మాట్లాడుతూ: బహుజనుల రచనల వల్ల కొత్త చర్చ ప్రారంభమైంది. పూర్వ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే కథను చెప్పాల్సిన పనిలేదు అనే కొత్త చైతన్యం వచ్చింది. బహుజనుల  జీవితం చెప్పే పద్ధతిలో గాని, ఆలోచింపజేసే పద్ధతిలోగాని చాలా మార్పొచ్చింది. బహుజన జీవితాల రచనలు పాఠ్యాంశాలుగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇంకా గుర్తించడం లేదు. కథంటే గురజాడ, చలం, కాళీపట్నం లాంటి వాళ్ల కథలే అనుకునే దశలోనే ఉండడం వల్ల బహుజనుల కథల్ని లెక్కలోకి తీసుకోవడంలేదు. ఈ  పరిస్థితి మారాలి. కొత్త ప్రమాణాల్ని కొత్త విమర్శా పద్ధతుల్ని అనుసరించేలా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు .

గోగు శ్యామల మాట్లాడుతూ ఇలా అన్నారు: బ్రాహ్మణ సంస్కతి బహుజనుల మీద గుర్తించలేనంతగా ప్రభావం చూపుతున్నది. బహుజనులు రాసే విషయం మీద, సంస్కతీ మీద, పండగల మీద, చివరికి తిండి మీద కూడా  నియంత్రణ ఉంటున్నది.  ఇవాళ హిందూత్వవాదుల వల్ల ముస్లింలు టార్గెట్ చేయబడుతున్నట్లు కనిపిస్తున్నారు కాని, ఆ దాడి దళితుల మీద, బీసీల మీద జరుగుతున్నది. ఈ దేశ మూలవాసులుగా బహుజనులకొక చరిత్ర ఉంది. మాతస్వామ్య వ్యవస్థ కలిగిన చరిత్ర. ఆ చరిత్ర మీద ఆధా రపడి బహుజనుల రచనలుండాలి. బ్రాహ్మణుల, అగ్రవర్ణాల సాహిత్యం చదివి బహుజనులు తమ ఉనికిని మర్చిపోయారు. తమ  సొంత జీవితాన్ని, శైలిని మర్చిపోయారు. తిరిగి దాన్ని అందిపుచ్చుకోవాలి.

స్కైబాబ మాట్లాడుతూ: ఈ దేశంలోని ముస్లింలు 90 శాతం పైగా దళిత, బీసీల నుంచే ఇస్లాం స్వీకరించినవారు. వారిని ఇక్కడి వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటుదారులుగా గుర్తించాలి. అందుకే వారిపై హిందూత్వ దాడులు అధికంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో దళితులు, బీసీలు ముస్లింల కన్నా భద్రంగానే ఉన్నారు, పైగా తమ బహుజన సంస్కతికి వారు దూరమవుతూ హిందువైజ్ అవుతున్నారు, ఆ విషయంపై మాత్రం బహుజన రచయితలు స్పందించడం లేదు. ముస్లింవాద రచయితలుగా మేము ముస్లింలలోని లోపాలని ఎత్తిచూపుతూ రచనలు చేశాం. ఆ విషయంలో దళితులు, బీసీలు ఆ పని చేయకపోగా అసలా విషయాన్ని గుర్తించనట్లే నటిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాసుకోవడానికి బహుజన సబ్జెక్టేమీ మిగలదు అని అన్నారు.

bahujanakatha

దానిపై కొంతసేపు చర్చ జరిగింది. మొత్తంగా ఆ విషయాన్ని అందరూ అంగీకరించారు. ఎస్టీలను అధికమొత్తంలో ఇప్పటికే హిందువైజ్ చేసేశారని జయధీర్ తిరుమలరావు అన్నారు.

అంబటి సురేంద్రరాజు మాట్లాడుతూ: తెలంగాణ నుంచి గొప్ప కథలుగాని, నవలలు గాని అంతగా రాకపోవడానికి కారణం -వృత్తులను పట్టుకు వేలాడడమే. ఇక్కడ జీవితమే బహుజనులకు ముడిసరుకు. బహుజనులకు కావలసినంత జీవితం ఉంది. నీషే అన్నట్లు వృత్తులు అంతరించిపోతే గాని ఆయా కులాల నుంచి గొప్ప రచయితలు పుట్టుకురారు. వృత్తులకు ఏనాడో దూరమైన స్కైబాబ, షాజహానా లాంటి వారి నుంచి మంచి కథలు వస్తున్నాయి. వృత్తులు ఉన్న కులాలవారు  వారసత్వ ంగా వాటిని నేర్చుకుంటారు కాబట్టి క్రియేటివ్‌గా ఆలోచించడానికి అవకాశముండదు, వృత్తులు కోల్పోయి ఒక శూన్య దశకు చేరుకున్నవారి నుంచి, అడ్డామీది కూలీలుగా మారిన జీవితాల్లోంచే గొప్ప రచయితలు పుట్టుకొస్తారని అన్నారు.

సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ: బీసీలు చాలావరకు తమ కుల బాధల్ని తక్కువగా రికార్డు చేశారు. చేయాల్సిన అవసరముంది. నో స్టాల్జియా అయినప్పటికీ కుల వత్తులు, బీసీల జీవితాల్ని కథల్లో రికార్డు కావాల్సి ఉంది.  తెలంగాణ బహుజన కథ ఎట్లా ఉంది, ఏ దారిలో పోవాలె ఏ దక్పథం నుంచి సమాజాన్ని చూడాలనే దానికి బహుజనుల కథలు, సంకలనాలు ఉపయోగపడాలి అన్నారు.బహుజనుల జీవితాన్ని, సంఘర్షణను, బాధ లను ఎట్లా రికార్డు చేసుకోవాలి? ఎంతో సంఘర్షణ ఉన్నా కూడా శైలి శిల్పం లేదని కథలను పక్కన పెడుతున్నారు.   శైలి శిల్పం అవసరమే కాని జీవితాన్ని చూడాలని కూడా చెప్పారు.

జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ: కథ అధ్యయనం నుంచి వస్తుంది తప్ప సమాచారం నుంచి రాదు. దానికి శిబిరాలు అవసరం. కొత్త మెథడాలజి, కొత్త స్టైల్‌లో కథ ఎందుకు రావడం లేదు? కొత్త ఎక్స్‌ప్రెషన్ ఎందుకు రావడం లేదు. అది సాధించాల్సిన అవసరముంది. అది తెలంగాణ బహుజనులకు పెద్ద కష్టం కాదు అన్నారు.

ఆడెపు లక్ష్మీపతి మాట్లాడుతూ:  పాఠకుణ్ని ఆకట్టుకోకపోతే మనం విజయం సాధించలేము. టెక్నిక్ అనేదాన్ని ఆంధ్రా విమర్శకులు, పడకకుర్చీ మేధా వులు బ్రహ్మపదార్థం చేశారు. శిల్పం అనేది రచయిత చేతిలో అతని ఆలోచనా క్రమంలో ఉంటుంది. కథకు మనం రూపం ఇచ్చే క్రమంలోనే, మన నేర్పరితనంలోనే ఉంటుంది అన్నారు.
ఆడెపు లక్ష్మీపతిని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక్కో టెక్నిక్‌లోంచి ఒక్కో మంచి కథను ఎంచుకొని తెలుగులోకి అనువదించి పుస్తకంగా వేయాలనే ప్రతిపాదన జయ‘దీర్ చేశారు. మరికొందరిని కలుపుకొని ఆ ప్రయత్నం చేస్తానని లక్ష్మీపతి ఒప్పుకున్నారు.

పెద్దింటి అశోక్‌కుమార్  బహుజనుల వలస బతుకుల్ని ఆర్ద్రంగా వివరించారు. ఆ విషయాలన్నింటినీ కథలుగా చిత్రించాల్సిన అవసరముందన్నారు. అశోక్ చెప్పిన విషయాలు కథకులందరి మనసుల్ని కలచివేశాయి.

తెలంగాణ కథల్లో ఫెయిల్యూర్స్ చిత్రీకరణే ఎక్కువగా ఉంటోంది. మీ జీవితాల్లో విజయాలు లేవా? అని ఆంధ్రా  మిత్రులు అడుగుతున్నారు. భాష విషయంలో వ్యతిరేకత చాలా వస్తోందని వెల్దండి శ్రీధర్ అన్నారు.
జూపాక సుభద్ర బహుజన స్త్రీల పట్ల వివక్ష  గురించి మాట్లాడుతూ ఎన్నో  విషయాలు చర్చించారు.  షాజహానా, జ్వలిత, చెన్నూరి సుదర్శన్, వలి హుసేన్, నిసార్, గాదె వెంకటేష్, ఏశాల శ్రీనివాస్, ఓదెల వెంకటేశ్వర్లు, కనీజ్ ఫాతిమా, సుదర్శన్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. స్కైబాబ ఈ కచ్చీరును ముగిస్తూ – ఇన్నేసి అభిప్రాయాలు విన్నప్పటికీ రచయితలుగా తమకు అబ్బిన రీతిగా రచనలు చేసుకుంటూ పోవాలని, అందులోంచి కొత్త శైలి, టెక్నిక్ నిర్మాణమయ్యే అవకాశముంటుందని అన్నారు.

అనుభవమా? సిద్ధాంతమా?
బహుజన కథకులకు అనుభవం ముఖ్యమా? సిద్ధాంతం ముఖ్యమా? అన్న విషయం మీద రెండురోజులూ చర్చ జరుగుతూనే ఉండడం విశేషం. మొదటి రోజు జిలుకర శ్రీనివాస్ అనుభవానికి పెద్దపీట వేస్తూ సిద్ధాంతం సరికాదనే ప్రచారం వల్లనే నష్టం జరుగుతూ వస్తుందన్నారు. సిద్ధాంతం పూర్తిగా తెలిసే రాయాలనడం సరికాదు. ఐడియాలజీకల్ దక్పథం ఉంటే చాలు, అన్నీ చదువుకుని రాయాలంటే కుదరదని పగడాల నాగేందర్ అన్నారు. కథ జీవితానికి సంబంధించింది . ఏ ఏంగిల్ చిత్రించాడు అనేది ముఖ్యం. ఇది బహుజన సిద్ధాంతానికి అనుగుణంగా ఉందా లేదా అని మళ్లీ చర్చించుకోవచ్చు. కథ నిర్మాణాన్ని వదిలేసి సిద్ధాంత చర్చ అనవసరం అని బిఎస్ రాములు అన్నారు.  రెండో రోజు అంబటి సురేంద్రరాజు- సిద్ధాంతాలు, ఉద్యమాల పేరుతో రచయిత నష్టపోవద్దని, రచయిత ఏకాంతాన్ని ఆశ్రయించడం ద్వారా రచనలు బలంగా వస్తాయని, బహుజనులకు జీవితం చాలా ఉందని, జీవితమే వారికి ముడిసరుకు – అన్నారు.

అంబేద్కరిజమా? ఫూలేయిజమా?

జిలుకర శ్రీనివాస్ అంబేద్కరిజం దక్పథంతో రచనలు చేయాలని అన్నప్పుడు పగడాల నాగేందర్- బీసీలు అందుకు ఒప్పుకుంటారా? వారు ఫూలేను అనుసరిస్తున్నారు కదా.. అంటూ చర్చను లేవనెత్తారు. దాంతో అంబేద్కరిజం అనడం సరైనదేనా అనే దానిమీద కొంత చర్చ జరిగింది. బహుజన యిజం అనడం ‘ావుంటుందేమో అన్నదాకా ఆ చర్చ కొనసాగింది. సురేంద్రరాజు కూడా అంబేద్కరిజం కాదు, పూలేయిజం అనాలనడంతో ఆ చర్చ వివాదమై కూర్చున్నది. దీనిమీద విస్తతమైన చర్చ జరిపి బహుజనవాదం ముందుకు  వెళ్లేలా చేయాల్సిన బాధ్యత బహుజన రచయితల మీదే ఉంది.