రోహిత్ వొక సాంస్కృతిక ప్రశ్న

 

-రాణీ శివశంకర శర్మ
~

రాణీ శివశంకర శర్మ

ఈనాడు మనం యేది మాట్లాడాలన్నా “రోహిత్” నామస్మరణతో మొదలుపెట్టాల్సివస్తుంది. అతడొక గాఢమైన స్మృతిగా మారిపోయాడు.దళిత సాంస్కృతిక స్మృతిగా మారిపోయాడు.

నిజానికి విద్యార్దుల మరణాలు మన రాష్ట్రంలో మరీ కొత్తేమీ కాదు. అందులో దళిత విద్యార్దుల మరణాలు కూడా సర్వసాధారణమై పోయాయి. సాధారణంగా ఆత్మహత్యలు మౌనంలో ముగుస్తాయి. అవి తీవ్ర పరాజయ రూపంగా ఉంటాయి. కానీ రోహిత్ మరణం వట్టి ఆత్మహత్యేనా?
కానే కాదు. అతడి మరణం చీకట్లోకి మౌన నిష్క్రమణగా కాక, అక్షరాలుగా మార్మోగింది. ఆ అక్షరాలు అశక్తతనీ, వుడుకుమోత్తనాన్నీ, ద్వేషాన్నీ వెదజల్లేవి కావు. యీ వ్యవస్థ బోలుతనాన్ని స్పష్టం చేస్తూనే, వొక ప్రత్యామ్నాయ తత్వాన్ని చెప్పి పోయాయి. అందు వల్ల రోహిత్ మరణానికి ఎంతో మంది బతుకు కంటే ప్రాముఖ్యత ఏర్పడింది. అది రోహిత్ మరణాన్నికాక, చాలా మంది జీవించి వున్నామని భ్రమిస్తున్న వాళ్ళు నిజానికి జీవించి లేరని, యిప్పటికే మరణించారని నిర్ధారించింది. కృత్రిమత్వం, స్వాభావికత లోపించడం, ఆత్మ వంచన, పర వంచనల్ని కవితాత్మకం చేసింది.
యిది అగ్ర వర్ణాలకి పెద్ద తలనొప్పి. యెందుకంటే అధికారం ద్వారా, ధన బలం ద్వారా మాత్రమే అగ్ర వర్ణాలు బతికి బట్టకట్టకలుగుతున్నాయి. అవి సాంస్కృతికంగా మరణించాయి. రోహిత్ చనిపోయి, పూర్తిగా మౌనంలోకి జారిపోకుండా అగ్ర వర్ణాల మరణాన్ని నిర్ధారించే శాసనాన్ని లిఖించి పోయాడు. అందుకే అంత అలజడి. యిప్పుడు అగ్రవర్ణాలు పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయాయి. తమ నైతిక పతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లుతున్నాయి.
నిజానికి అగ్రవర్ణాలు సాంస్కృతికంగా యెప్పుడో స్తబ్ధతకు గురయ్యాయి. అక్షరం వారి దగ్గర నుంచి యెప్పుడో ఎగిరి పోయింది. “నను వరించిన శారద లేచిపోవునే” , అని జాషువా ప్రశ్నించాడు. యిప్పుడా శారద పూర్తిగా వాడలలోనే నివాసం ఉంటుంది. అగ్రహారం వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్వం బ్రాహ్మణులలో, అగ్రవర్ణాలలో ఉన్న గొప్ప కవులూ, మేధావులూ ఇప్పుడూ కరువయ్యారు. యిందుకు తెలుగు సాహిత్యమే మంచి ఉదాహరణ.
దానికి కారణమేమిటి? ధన సంపాదన, అధికార లాలస యివే ప్రధానం కావడం వల్ల అగ్రవర్ణాలు అక్షరంపై మక్కువ వదిలి వేసాయి. అందుకే అక్షరం కూడా వాళ్ళని వదిలేసింది. అగ్రవర్ణాలు నిరక్షరాశ్యులుగా మారిపోయారు. పుస్తకాల పురుగులుగా కాక కంప్యూటర్ పురుగులుగా మారారు. యంత్రాల్లో యంత్రాలుగా మారిపోయారు. అందుకే శ్రీపాద, చలం, విశ్వనాధ, శ్రీశ్రీ, భైరాగి లాంటి కవులూ, రచయితలూ వారి నుండి ఆవిర్భవించడం మానేశారు. హృదయ స్పందన కలిగించే అక్షరాలు వారి నుంచీ అదృశ్యమయ్యాయి.
దీనికి కారణం, బ్రిటీష్ వారి కాలం నుంచీ ఆధునికత వల్ల వచ్చే ప్రయోజనాల మీద దృష్టి  వారిలో అధికమైంది. యెప్పుడైతే ఆ ప్రయోజనాన్ని వారు అంది పుచ్చుకోవడం మొదలు పెట్టారో, ఆ ప్రయోజనాలే వారికి సర్వస్వమై పోయాయి. వారికి సాంప్రదాయకంగా వస్తున్న కళలూ, శాస్త్రాలూ, కవిత్వమూ, వాఙ్మ్ యాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా బ్రాహ్మణుల పరిస్థితి ఇది.
దీనితో బౌద్ధికంగా,  సాంస్కృతికంగా క్షీణించి పోయిన బ్రాహ్మణులలో అగ్రవర్ణ దురహంకారం మాత్రమే మిగిలింది. అక్షరం వలస పోయింది. బ్రాహ్మణులు నిరక్షరాస్యులుగా మారిపోయారు.
నిజానికి ఆధునికత అక్షరాస్యతను పెంచడంలేదు. నిరక్షరాస్యతను పెంచుతోంది. అక్షరం నిజానికి చాలా గాఢమైనది. అది మౌఖికంగా కానీ, లిఖిత రూఫంలో కానీ గాఢమైన ముద్ర వేస్తుంది. అటువంటి ముద్ర వేసే శక్తిని కోల్పోయినప్పుడు అక్షరం మరణించినట్లే. నిరక్షరాస్యత రాజ్యం చేస్తున్నట్లే.
భాష కేవలం సమాచార సాధనం కాదు. అది కమ్యూనికేషన్ స్కిల్ కాదు. భాష కమ్యూనికేషన్ స్కిల్‌గా మిగిలి పోవడం అంటే నిరక్షరాస్యత వ్యాపించినట్లే.  భాష రక్త ప్రవాహం వంటిది. అది సమాజంలో సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
కానీ నేటి కళా రూపాల్ని చూడండి. టీవీలో ప్రోగ్రాములు, సినిమాలు చూడండి. అటువంటి లక్షణమేమీ కనపడదు. యెటువంటి ప్రభావాన్నీ కలిగించకపోవడానికే “వినోదం” అని పేరు. యాంత్రికంగా చూస్తాం, మరచి పోతాం. సినిమాలలో దృశ్యాలూ, పాత్రలూ రిచ్‍గా కనపరచడం రివాజుగా మారిపోయింది. మన దరిద్రపుగొట్టు మొహాల్లో కొద్ది సేపు సంతోషాన్ని పోలిన దాన్ని అది కలుగ జేస్తుంది. మన జీవితంలోని లోపలి బయటి దారిద్ర్యాల్నీ, శూన్యాల్నీ మనం ఈ దృశ్యాల ద్వారా పూరిస్తున్నాం. రోహిత్ ప్రస్తావించిన శూన్యం రోహిత్‍కు మాత్రమే సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది.
ఈ సమాజం యెటువంటిది? యాంత్రికమైనది, సంపదనీ, అధికారాన్నీ ఆరాధించేదీ, స్పందన శూన్యమైనది, వెరసి నిరక్షరాస్యమైనది.
ఆధునిక యంత్ర నాగరికత విశాల దృక్పథాన్ని పెంచింది అనేది భ్రమ మాత్రమే. నిజానికి అది మనుషులలో సంకుచిత మనస్తత్వాన్ని  పెంచింది. స్థలకాలాలకు సంబంధించిన విశాల దృక్పథాన్ని బలహీనపరిచింది. యిటీవల నోమ్ చాం‍స్కీ అనే అమెరికా మేధావి మాట్లాడ్తూ అమెరికాలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట మాత్రమే విశ్వం ఆవిర్భవించిందని విశ్వసిస్తారని అన్నాడు. సుదీర్ఘమైన కాలం గురించి భారతీయ పురాణ గాధలు దిగ్భ్రాంతి కలిగించేట్టుగా ఊహించగలిగాయి. ఉదాహరణకి- బ్రహ్మకాలం. ప్రముఖ సైన్స్ రచయిత కార్ల్ సాగాన్ స్థలకాలాల గురించి భారతీయ పౌరాణిక దృష్టిని కొనియాడారు. రోహిత్ తన చివరి లేఖలో ప్రస్తావించినది యీయన గురించే. అనంత స్థల కాలాల గురించి యీ వైఙ్ఞానిక పౌరాణిక ఊహల వల్లనే తన మరణాన్ని కూడా నక్షత్ర లోకాల్లో అంతులేని గమనంగా ఊహించగలిగాడు. మరణం గురించిన ఆలోచనలు కూడా అతనిలో అంత ఊహాశక్తిని మేల్కొలిపాయి. కానీ ఆధునిక జీవితం సంకుచిత వలయాల్లో తిరుగుతోంది. మానవ అస్తిత్వం యిరుకుగానూ, ఖాళీగానూ తయారుకావడాన్ని రోహిత్ పసిగట్టాడు. అందుకే మనుషులు ప్రకృతిని ప్రేమింఛలేకపోతున్నారనీ, కృత్రిమత్వం పెరిగిపోయిందని బాధపడ్డాడు.
అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే ఆధునికతలోని మానవ కేంద్రక దృష్టిని విమర్శించాడు. మితిమీరిన సంపద వుత్పత్తి సామ్యవాదానికి దారితీస్తుందన్న మార్క్స్ భావంలోనే ఖాళీ వుందన్నాడు. అధిక వుత్పత్తి అనర్ధదాయకం అన్నాడు. అది ప్రకృతిని నిర్విచక్షణగా కొల్లగొట్టడంగా మారిపోయిందన్నాడు.
పాశ్చాత్య అభివృద్ధి నమూనాపై దళిత బహుజన మేధావుల్లో కూడా సందేహాలు మొదలయ్యాయి. యీ సందేహాలు పురోగతి అనే భావంలోని లోపాన్ని బట్టబయలు చేస్స్తున్నాయి. వెనక్కి తిరిగి దళిత స్మృతులని వెతికి పట్టుకొనవలసిన అవసరాన్ని కర్ణాటక బహుజన మేధావి డి ఆర్ నాగరాజు స్పష్టం చేస్తున్నారు. “పల్లె కన్నీరు పెట్టింది” గేయంలో గోరటి వెంకన్న  కుల వృత్తుల, కుల సంస్కృతుల ప్రాచీన స్మృతుల చప్పుడులో తాను మునిగి, మనని ముంచెత్తాడు.
అగ్ర వర్ణాలు ప్రకృతికీ, సంస్కృతికీ దూరంగా జరిగి పోతుంటే, దళిత బహుజన మేధావుల ప్రయాణం దానికి పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది. దీన్ని మన అగ్ర వర్ణ మేధావులు కూడా గుర్తించలేక పోతున్నారు. అరిగి పోయిన అభ్యుదయ, నాస్తిక సిద్ధాంతాల్ని వల్లిస్తున్నారు. రోహిత్ సైన్స్ దృక్పథం పరిశీలిస్తే యీ సంగతి స్పష్టమవుతుంది.
రోహిత్ స్టీఫెన్ హాకింగ్‍ని కాక, కార్ల్ సాగాన్‍ని అభిమానించాడు అనే విషయం చాలా ప్రధానమైందని మిత్రుడు నరహరి అన్నాడు. నిజమే, స్టీఫెన్ హాకింగ్ దృక్పథం పూర్తిగా ప్రాగ్మాటిక్. ఐన్‍స్టీన్ నుంచీ కార్ల్ సాగాన్ వరకూ వొక మత పర దృక్పథం కొనసాగుతూ వొస్తుంది. అది స్టీఫెన్ హాకింగ్ దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. హాకింగ్ యీ ప్రపంచాన్ని సృష్టించిన “గాడ్ ఫ్యాక్టర్” గురించి యిటీవల ప్రస్తావించారు. సైంటిస్టులు వ్యతిరేకించారు, కానీ దాని వల్ల స్టీఫెన్ హాకింగ్‍కి మత పర దృక్పథం ఉందని చెప్పలేం.
అసలు మతపర దృక్పథం అంటే ఏమిటి ? యిక్కడ నేను ఐన్‍స్టయిన్ ప్రతిపాదించిన కాస్మిక్ రెలిజియన్ గురించి ప్రస్తావిస్తున్నాను. విశ్వాన్నీ, ప్రకృతినీ పరిశీలించడంలో మనిషి తన అహాన్ని అధిగమించడం. అది ఐన్‍స్టీన్ ప్రస్తావించిన మత దృక్పథం. కార్ల్ సాగాన్ కూడా కాస్మిక్ రెలిజియన్ గురించి మాట్లాడాడు. మరింత ముందుకు వెళ్ళి హిందూ పురాణాల్లోని స్థలకాల దృక్పథంలోని విశాలత్వానికి దిగ్భ్రాంతి చెందాడు. యిక్కడ సైన్సూ, పురాణమూ యేకమయ్యాయి. అరలు అరలుగా విడిపోయిన మానవ ఙ్ఞానం వొకచోట సంగమించే నదీ సంగమాన్ని కార్ల్ సాగాన్ కలగన్నాడు. రోహిత్ హృదయం కూడా అక్కడనే విహరించింది. కార్ల్ సాగాన్ సహ రచయిత్రి, సహచరి నుంచి రోహిత్ మరణాంతరం అతనికి మద్ధతుగా లేఖ రావడం విధి వైచిత్రి. ఙ్ఞాన మహా సాగరాన్ని మధించడంలో కార్ల్ సాగాన్ చూపిన విఙ్ఞత ఐన్‍స్టీన్ చూపిన దృక్పథానికి కొనసాగింపే. క్రీస్తూ, బుద్ధుడూ వంటి మత ప్రవక్తలూ, రుషుల అంతర్దృష్టి, ప్రయోగాల మీద ఆధార పడిన సైంటిస్టుల దృక్పథం కన్నా గొప్పది అని ఐన్‍స్టీన్ అంటాడు.
“వాట్ షుడ్ బీ”, ప్రపంచానికి వొక లక్ష్యాన్ని మతమే యిస్తుందని ఆయన భావించాడు. మొత్తంగా మతమంటే మనిషి తన అహాన్ని త్యజించి ప్రకృతి ముందు పసిపిల్లవాడిలా నిలబడడం అనే అర్థాన్ని ఐన్‍స్టీన్ ఆశ్రయించాడు. ఙ్ఞానం ఙ్ఞానం కోసమేనన్నాడు. కార్ల్ సాగాన్ ఐన్‍స్టీన్ దృక్పథాన్ని ప్రశంసించాడు. ఆనంద్ తేల్ తుంబ్డే బౌద్ధాన్ని  మానవకేంద్రక దృష్టి నుంచి విముక్తం చేసే దృక్పథంగా కీర్తించినపుడు మతం అంటే దేవుడు, దెయ్యం అతీంద్రియ శక్తి అనే భావాల కంటే విశాలమైన దృక్పథం కనబడ్తుంది.
కానీ స్టీఫెన్ హాకింగ్ దృక్పథం సంకుచితమైనది. దుందుడుకుతనం, విశ్వంలోకి విస్తరించడం అనేవి ప్రాగ్మాటిక్ దృక్పథంలోని ప్రధానమైన అంశాలు.  గ్రహాంతర జీవుల పట్ల భయాందోళనలు కూడా ఆయనకు యెక్కువ.  కారణం దుందుడుకుతనం.  దురాక్రమణ దృక్పథం నుంచే అమెరికా నాగరికత ఏర్పడింది. నాగరికత ఆవిర్భావంలో భాగంగా అనేక జాతులు అంతరించాయి. అలాగే గ్రహాంతర వాసులవల్ల మానవ జాతి కూడా అంతరించవచ్చునన్న భయం ఆయనకి వుంది. అదే సమయంలో దురాక్రమణ, దుందుడుకుతనంలేనిదే మనిషి మనుగడ అసాధ్యమన్న దృక్పథం ఆయనకు ఉన్నాయి. అహాన్ని జయించడం అనే మత దృక్పథం ఆయనలో శూన్యం. విశ్వాన్ని నడిపే అతీంద్రియ శక్తి గురించి మాట్లాడినా ఆయనది మత దృక్పథం అనలేం. ఆయనది పాశ్చాత్య కేంద్రక దృక్పథం. పాశ్చాత్య విస్తరణ కాంక్షకి ఆయన చెప్పే కాస్మిక్ సిద్ధాంతం అద్దం పడ్తుంది. యింక భూమి నివాస యోగ్యం కాదు. వేరే గ్రహాన్ని వెతుక్కోవాలి అనడంలో యీ విస్తరణ కాంక్ష్యే విస్తృత రూపంలో కనబడ్తుంది.
భూమినే తల్లిగా పూజించడం, భూమిని కేంద్రంగా భావించడం వర్ధిల్లిన ప్రాచీన సమాజాల్లో భూమినీ, మానవ సమాజాన్నీ మెరుగు పరచడం యెలా అనే దృక్పథం ఉండేది. కానీ విశాల విశ్వమంతా ఆక్రమించాలనే భావన మనిషిలో మరింత దుందుడుకుతనాన్ని పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నమైనదే విశాల విశ్వభావన. మనిషిలోని యీగోని తగ్గించి, ప్రకృతిని ఆరాధించే స్థితికి తీసుకు వెళ్తుందనే దృక్పథం . యీ దృక్పథమే రోహిత్ దృక్పథం కూడా. రోహిత్, స్టిఫెన్ హాకింగ్‍లా కాక హేతువునీ, కల్పననీ(ఊహనీ) ఏకం చేసాడు. అతనిలో కలలూ, నక్షత్ర లోకాలూ ఐక్యమయ్యాయి.
యింత విశాలంగా, గాఢంగా పరిశీలించిన వ్యక్తిని గౌరవించే స్థాయిలో మన సమాజం లేదు. ప్రాచీన భారతీయ విశ్వ దృక్పథంలోని విశాలత్వం, యిక్కడి మనుషులలోని యిగోని తగ్గించలేక పోయింది. దానికి కారణమేమిటి?
నిజానికి మన సమాజాలు ప్రాచీన సమాజాల కన్నా సంకుచితంగా మారిపోయాయి. పురాణ కథనాలు మనుషుల మీద గాఢమైన ముద్ర వేయగలిగేవి. కుల పురాణాలు కూడా అటువంటి గొప్ప పాత్రని నిర్వహించేవి. నేటి మన కళలు కానీ, చదువులు కానీ పూర్తిగా కృత్రిమత్వాన్ని సంతరించుకున్నాయి. అవి మన దృక్పథాన్ని విశాలం చేసే అవకాశం సన్నగిల్లింది. దీన్నే ఆధునిక నిరక్షరాశ్యత అంటాను.
ప్రాచీన కాలంలో కంటే మనలో సహనం తగ్గిపోయింది. చిందు ఎల్లమ్మ అంటుంది – బ్రాహ్మణ నింద ఉన్నప్పటికీ పూర్వం బ్రాహ్మణులు జాంబపురాణాన్ని చూసేవాళ్ళు. యిప్పుడు మమ్మల్ని తిడుతున్నారంటూ చూడడానికే నిరాకరిస్తున్నారని చిందు ఎల్లవ్వ చెప్పారు. అంటే విమర్శని సహించే శక్తి ఆధునిక
 యుగంలో సన్నగిల్లింది.
టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చదువుకి అర్థాన్ని మార్చేసింది. భాషని కుదింపజేసింది. అంతిమంగా సంకుచిత దృక్పథాన్ని పెంచింది. నిజానికి, ఆధునిక పూర్వయుగాల్లోని దళితులు నిరక్షరాస్యులు అనే నిర్ధారణ ఆలోచించకుండా చేసిన నిర్ధారణగా కనిపిస్తుంది. కుల వృత్తులూ, కుల విద్యలూ, కుల పురాణాలూ, పటం కథలూ, యింతేకాక దళిత కళాకారుల్లో మాతృభాషని చదవడం, రాయడం వచ్చేవి. అంతే కాదు కఠినమైన సంస్కృత పదబంధాల్ని వుపయోగించేవారు. మీరు ఎప్పుడైనా తెలంగాణా వెళ్ళి చిందు భాగవతుల్నీ, ఢక్కలి జాంబపురాణ కళాకారుల్నీ కలిస్తే వాళ్ళూ ఏ మాత్రం నిరక్షరాశ్యులని పిలవలేమని తెలుస్తుంది. వొక విధంగా చెప్పాలంటే తెలంగాణా దళిత అంతశ్చేతన అనవచ్చు. శుభ కార్యాలు జరపడానికి  మేము బ్రాహ్మణుల్ని పిలవం. యెందుకంటే  మేం చదువుకున్న వాళ్ళం అంటుంది చిందు ఎల్లవ్వ. దళిత జీవితాన్ని నిరక్షరాశ్యతతో నిండిన చీకటిగా వర్ణించడం కుదరదనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే.
తెలంగాణాలో ఢక్కలి మొగిలిని నేను కలిసాను. అతడు అనేదేమిటంటే  అసలు వేదాలు మా దగ్గరే ఉన్నాయి. వాటిని మీ బ్రాహ్మణులు( వశిష్టుడు) దొంగిలించారు అంటారు. అంటే అసలైన ఙ్ఞానం దళితుల వద్దే వుందన్న మాట.
కానీ ఆధునిక యుగం ప్రాచీన సమాజ కథనాల్నీ పురాణాల్నీ వెర్రి పురాణ గాధలుగా తిరస్కరిస్తుంది. కానీ కార్ల్ సాగాన్ శివతాండవంలో విశ్వరహస్యాన్ని చూసాడు. బ్రహ్మ జీవితంలో కాల విస్తృతిని చూసాడు. అంటే ప్రాచ్య పురాణాల్ని ఙ్ఞాన చరిత్రలో ప్రధాన భాగం చేసాడు. అతడే మన రోహిత్‍కి ఆదర్శప్రాయుడు.
హిందూ వాదులు పాశ్చాత్య నాగరికతా శాపగ్రస్తులు. అందుకే రోహిత్‍కి ఉండే విశాల దృష్టి వారికి లేదు. కార్ల్ సాగాన్ కాదు, స్టిఫెన్ హాకింగ్, అతని పాశ్చాత్య  దుందుడుకు తనం వారికి ఆదర్శం.
రోహిత్ పాశ్చాత్య మానవ కేంద్రిత ఆధునికతని నిరసిస్తూ చివరి లేఖలో కూడా ప్రకృతి ప్రేమని చూపాడు. మార్పు, అభివృద్ధి పేరుతో పెరుగుతున్న కృత్రిమత్వాన్నీ, విధ్వంసాన్నీ నిరసించాడు.
పాశ్చాత్య ఆధునిక నాగరికతకి నిరంతరం వొక  శత్రువు అవసరం. ఎందుకంటే విస్తరణ, దుందుడుకు తనాలే దాని స్వభావం. ప్రస్తుతం దాని శత్రువు ముస్లీంలు (హిందువులు ప్రచ్చన్న క్రైస్తవులు, ప్రచ్చన్న అమెరికన్లు, కనుక విడివిడిగా వారి గురించి చెప్పడం వ్యర్ధం). యీ ఆధునికతనే ఆదర్శంగా తీసుకోవడం వల్ల దళిత ముస్లీం ఐక్యత యింతవరకూ సాధ్యం కాలేదు. దళిత ముస్లీం ఐక్యతతో కూడిన విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా యీ ఆధునిక సామ్రాజ్యవాదానికి ముప్పుగా పరిణమించాడు రోహిత్.
పౌరాణిక యుగంలోనైనా, సైన్స్ యుగంలోనైనా కాస్మిక్ దృక్పథానికీ, సామాజిక దృక్పథానికీ మధ్య తాత్విక సంబంధం ఉంటుంది.
స్థలకాలాల్లో దురుసుగా విస్తరిస్తూ పోవడమే ,మానవ జాతి లక్ష్యం అనేది వొక భావన. యిది ఙ్ఞానాన్ని ఆధిపత్యంగా మారుస్తుంది.
అనంతమైన స్థల కాలాలలో మనిషి స్థానం చాలా స్వల్పమని, అందువల్ల మనిషి ప్రకృతినీ తోటి మనుషుల్నీ జీవుల్నీ ప్రేమించడమే మానవ ఙ్ఞానపు అంతిమ లక్ష్యమనీ మరో దృక్పథం. యీ కాస్మిక్ కల్చరల్ దృక్పథమే రోహిత్ దృక్పథం. యీ దృక్పథాన్ని మొగ్గలోనే తుడిచేయాలని చూస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదపు వికృత శిశువే హిందూయిజం.
రోహిత్ మరణం గ్రహణం మాత్రమే. అతని తాత్విక సందేశం అమరం.
peepal-leaves-2013

సూఫీలు మనకి అర్థం కానేలేదు!

 

 

(గత గురువారం తరువాయి)

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

ఈ రాజ్యాధికారభావన, ఆధిపత్యవాంఛ పెరగడంతో సూఫీలూ పూర్వరుషులూ చేసిన కృషి మరుగున పడిపోతోంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెరిటోరియల్ భావన, హద్దులు గీసుకొనే నైజం దేశంలోని బహుళత్వాన్ని రద్దు చేసింది. ఒకేజాతి అనే భావనకి దారితీసింది. ముస్లింలు పరాయివాళ్ళయ్యారు. ఇలాంటి ఏకశిలా సదృశ జాతి నిర్మాణం పూర్తిగా ఆధునికం. అంబేద్కర్ వంటి మేధావి కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయాడు. ముస్లింలు ప్రమాదకరమైన వాళ్ళని, జనాభా మార్పిడే పరిష్కారమని ఆయన అన్నాడు.

భారతదేశపు బహుళత్వం జాతి నిర్మాణం లేకపోవడం వల్లే సాధ్యమైంది. జాతి నిర్మాణానికి బహుళత్వం సమిధగా మారింది. ఒకే జాతిని నిర్మించాలన్న ఆతృతే బ్రాహ్మణీయ హిందూయిజానికి ఆధారభూమిక.

అంబేద్కర్ కానీ, అంబేద్కర్ని విమర్శించిన రంగనాయకమ్మ కానీ సంస్కృత బ్రాహ్మణ గ్రంధాల్నే టార్గెట్ చేయడం ద్వారా అవే భారతీయ సంస్కృతికీ, నీతికీ, చట్టాలకీ ప్రాతినిధ్యం వహిస్తాయనే భావనని పెంచి పోషించారు. నిజానికి బ్రిటిష్ పూర్వ సమాజంలో స్థానిక పంచాయతీలు తీర్పులు చెప్పేవి. అవి చాలా బహుళమైనవి. ఈ పంచాయతీలలో ఏ కులానికి ఆ కులంగా విడివిడిగానూ, మొత్తం గ్రామానికి అన్ని కులాల సభ్యులతో కలిసినట్టివీ జ్యూరీలుండేవి. చాలా మంది పొరబడుతున్నట్టు బ్రాహ్మణులకు వీటి మీద పెత్తనమేమీ ఉండేది కాదు.

నిజానికి అన్ని గ్రామాల్లోనూ బ్రాహ్మణులు ఉండే అవకాశమే లేదు. ఉన్నా అందరికీ సంస్కృతం రాదు. విలియం జోన్స్ అనే ఇంగ్లీషు దొర మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు. దానిప్రకారం బ్రిటిష్ వాళ్ళు హిందూలాని సృష్టించారు. సదరు విలియం జోన్స్ చేతిలో బైబిల్ బదులు మనుస్మృతిని పట్టుకొని ఇంగ్లాండ్ లోని సెయింట్ పాల్ చర్చి ముందు విగ్రహంగా మారాడు. మనుస్మృతిని పట్టుకున్న పెద్దమనిషి విగ్రహం ఇండియాలో మాత్రం కనబడదు అని రాశారు వెండీ దోనిగర్.

అంబేద్కర్ ప్రతికూల పద్ధతిలో మనుస్మృతికి ప్రాచుర్యం కల్పించారు. ఆయన పంచాయతీ చట్టాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు, సూఫీయిజం ఆయన అధ్యయనం చెయ్యలేదనీ అందుకే ముస్లింలని మతతత్వవాదులుగా చిత్రీకరించారని గెయిల్ ఆమ్ వెద్ కు ఒప్పుకోక తప్పలేదు. బ్రిటిష్ వారు బ్రాహ్మలకి, వారి గ్రంధాలకి, ప్రాధాన్యం పెంచారు. ఇటువంటి సంస్కర్తలు వారినే అనుసరించారు.

రంగనాయకమ్మనే తీసుకోండి. రామాయణ విషవృక్షం పేరుతో సంస్కృత వాల్మీకి రామాయణంపై ప్రతి వాక్య ఖండన చేశారు. హిందూవాదుల దృష్టిలోనూ రంగనాయకమ్మ దృష్టిలోనూ రామాయణమంటే సంస్కృత రామాయణమే. హిందూవాదులకి ఎ.కె.రామానుజన్ మీద వచ్చినంత ఆగ్రహం రంగనాయకమ్మ పైన రాకపోవడానికి కారణం అదే. లోపల్లోపల ఇద్దరి మధ్యా ఒక అంగీకారం వుంది. ఎకె రామానుజన్ వివిధ దృష్టులతో రాయబడ్డ అనేక వేల రామాయణాల గురించి మాట్లాడాడు. అవి కేవలం సంస్కృత భాషలోనివి కావు. ప్రజల నాల్కలపై నాట్యం చేసే రకరకాల కథనాలవి. బహుళత్వం అంటే భయపడే హిందూవాదులు రామానుజన్ కి వ్యతిరేకంగా తీవ్ర గందరగోళం సృష్టించారు.

రంగనాయకమ్మ, అంబేద్కర్ లాంటి ఆధునిక సంస్కరణ వాదులు సంస్కృత పురాణాలకీ, సంస్కృత బ్రాహ్మణ ధర్మశాస్త్ర గ్రంధాలకీ తీవ్ర ప్రాచుర్యం కల్పించారు. దీన్నే వైరభక్తి అంటారు. అసలు హిందూయిజం అంటే యేమిటి? దాన్నెలా నిర్వచిస్తారు? అని నిలదీయకుండా హిందూయిజం ఇలాంటిది అలాంటిది అని నిందించడం ద్వారా లెఫ్టిస్టులు హిందూవాదుల వలలో చిక్కిపోయారు. వారికి ప్రాచుర్యం కల్పించారు.

అంబేద్కర్ జనసామాన్యంలోని జానపదాల్లోని ఆచార వ్యవహారాల గురించి యేమీ మాట్లాడలేదు. తన కుటుంబానికి చెందిన కబీర్ పంథీ గురించే నోరు విప్పలేదు. తద్వారా సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్లనే ముస్లింల గురించి హిందూవాదుల్ని మించి నిందించాడు. మౌఖిక సూఫీ సంప్రదాయాన్ని పక్కన బెట్టి మళ్ళీ గ్రంథస్థ బౌద్ధంలో సాంత్వన కోరాడు.

ప్రొటెస్టెంటిజం గ్రంధానికి ప్రాధాన్యం పెంచింది. కేథలిక్ క్రైస్తవంలోనివి కానీ, క్రైస్తవ పూర్వ సమాజాలకు చెందినవి కానీ, గ్రంథేతర బహుళ కథనాల్ని చిన్నచూపు చూసింది, రూపుమాపింది. దాన్నే ఆదర్శంగా తీసుకున్నారు ఆధునిక మేధావులు. పుస్తకాల పురుగులుగా మారిపోయారు. కళ్ళకీ చెవులకీ అందే వాటిని చిన్నచూపు చూశారు. ఈ ప్రొటెస్టెంటిజం ప్రభావం మన కొంప కూడా ముంచింది. మన సంస్కరణ భావాలకు కూడా ఈ ప్రొటెస్టెంటిజమే మూలం. ప్రకృతిని స్వేచ్ఛగా పరిశీలించిన పరిశోధకులను కాథలిక్కుల కంటే ప్రొటెస్టెంట్లు ఎక్కువ హింసించారని అంటాడు మార్క్సు.

చరిత్ర పుస్తకాలకి పరిమితమైతే పురాణం జీవితాల్లోకి విస్తరిస్తుంది. పౌరాణిక ఊహలకు విస్తృతీ పరిధీ ఎక్కువ. పురాణానికి వాస్తవమనే పరిధి లేదు. అది వాస్తవాన్నే ప్రభావితం చేస్తుంది. వాస్తవాన్ని సృష్టిస్తుంది. మహారాష్ట్రలోని వొక గ్రామంలో ఉన్న సీత గుడికి వొక కథ ఉంది. పట్టాభిషిక్తుడైన రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు ఆమె ఆ గ్రామంలో ఆశ్రయం కోరింది. ఆ గ్రామస్తులు నిరాకరించారు. దానికి పశ్చాత్తాపంగా సీతకి గుడి కట్టి పూజిస్తున్నారని స్థల పురాణం. ఒక స్వచ్ఛంద కార్యకర్త అక్కడికి వెళ్లి సీత పట్ల చూపిన అనుచిత వైఖరికి ప్రాయశ్చిత్తంగా స్త్రీలకి ఆస్తిహక్కు కల్పించాలని కోరగానే అక్కడి పురుషులు అందుకంగీకరించి ఆస్తి హక్కు కల్పించారు (Hinduism – An alternative history).

అందువల్ల పాజిటివ్ పద్ధతిలో పురాణకల్పనల్ని జోడించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చారిత్రక పురుషులకన్నా పురాణపురుషులు ఎక్కువ ప్రభావశీలురని రాం మనోహర్ లోహియా అంటాడు. భారతదేశంలో పురాణం చరిత్రని తనలో కలిపేసుకుంటుంది. అందుకే ఫక్తు చారిత్రక పురుషుల జ్ఞాపకాలు మనకు తక్కువ. స్వచ్ఛత వాస్తవికత అనే భ్రమల నుంచి భారతీయులు ఎప్పుడో బయట పడ్డారు. వాస్తవాలకి తమ దృష్టి కోణాన్ని జోడించి, శుష్క వాస్తవంలో జీవించడం కాక కల్పనని వాస్తవంగా మలచుకోవాలని, కలలని నిజం చేసుకోవాలనేది భారతీయ తత్త్వం. దీన్ని భారతీయుల అజ్ఞానంగా భావించేవాళ్ళే అజ్ఞానులు. దీన్ని చీకటిగా చరిత్రహీనతగా భావించే వాళ్ళే దివాంధులు.

అందుకే గాంధీ పురాణపురుషులనే స్మరించాడు. కబీర్ లా ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నాడు. అంతేకానీ అశోకుడినో అక్బర్ నో తలవలేదు. శ్రీశ్రీ కి కూడా ఈ రహస్యం తెలుసు. అందుకే అతని కవితల్లో పురాణ ప్రతీకలే కనిపిస్తాయి కానీ చారిత్రక ప్రతీకలు కనిపించవు. పురాణంలో చరిత్ర లీనమై గాఢమైన స్మృతిగా మారింది. అది మెలకువకీ స్వప్నానికీ సంధి కుదిర్చింది. చరిత్రనీ పురాణాన్నీ అభేదం చేసింది. అందుకే దళిత కవులు కూడా పురాణప్రతీకల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. పురాణాలని సరికొత్తగా వ్యాఖ్యానించాలని చూస్తున్నారు. గ్రీసులోలా మనకి పురాణం గతం కాదు, వర్తమానం.

పురాణం స్థలకాలాల్ని అధిగమించేలా చేసింది. మతాల సరిహద్దుల్ని చెరిపేసింది. వెంకటేశ్వరస్వామికీ బీబీనాంచారికీ పెళ్లి చేసింది. పీర్లపండగని సృష్టించింది. చరిత్రకీ శక్తి లేదు. చరిత్ర కార్యకారణ సంబంధం లో బంధిస్తుంది. ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని బలం చేస్తుంది. స్వర్ణయుగం చీకటియుగం అంటూ కాలాన్ని స్పష్టంగా విభజిస్తుంది. మార్క్సు లాంటి వాళ్ళు కూడా దీనికి అతీతంగా లేరు.

ఈ కాలవిభజన ఏం చేస్తుంది? బ్రిటిష్ కి పూర్వం చీకటి రాజ్యం చేసిందని, ముస్లింలు రాకపూర్వం ఎప్పుడో స్వర్ణయుగం వుందని భావించేలా చేస్తుంది. ఆ పూర్వయుగాన్ని ఆ స్వర్ణయుగాన్ని హిందూ వాదులు హిందూ యుగం అన్నారు, దళితవాదులు బౌద్ధయుగం అన్నారు. అందరూ కలిసి ఇండో అరబిక్ కల్చర్ కి గల ప్రాధాన్యాన్ని తుంగలో తొక్కారు. ఇదే మతతత్వానికి పునాది.

ఈ పాశ్చాత్య క్రైస్తవ సంకుచిత దృష్టిపై ధ్వజమెత్తాడు దళితకవి పైడి తెరేష్ బాబు.

వచ్చే ప్రతిదాన్నీ స్వాగతించాలన్న ఉదారత్వంతో

ఎక్కువ సార్లు స్వాగతించింది పతనాన్నే  (నేనూ నా వింతలమారి ప్రపంచమూ)

‘వచ్చెనిదే బంగారుకాలం’ అని సంస్కర్త గురజాడ చేసిన కీర్తనలకి పూర్తివిరుగుడు తెరేష్ బాబు వాక్యం.

అమ్మానాన్నలను మమ్మీడాడీలుగా మార్చినదానా

అమ్ముకోవడంలో ఉందన్నమాట

అసలు జన్మ సార్ధకం

ఇక్కణ్ణుంచి చేపలు మాంసము చలువరాయి తదితరాలు

ఎగుమతి అయినట్లే

నేనూ నీకోసం ఎగుమతి కావడం

ఎంతమధురం!

పడ్డాం కదా కొట్టుకుపోదాం అనడమే

అసలు సిసలు ప్రవాహ స్పృహ.

ఈ వాక్యాలకి వ్యాఖ్యానాలు అనవసరం. సుదీర్ఘ కాలపు పాశ్చాత్య ఆధిపత్యం మనని స్వంత ఆలోచన లేనివారిగా మార్చేసింది. “ఇక్కడి చర్మం కింద అక్కడి చైతన్యం విషాదం” యీ విషాదం నుంచే హిందూవాదులూ కంచె ఐలయ్య లాంటి వలసవాద బహుజనవాదులూ పుట్టుకొస్తున్నారు. “మరో రెండు వందలేళ్ళు మనం బ్రిటిష్ వలస పాలనలో ఉంటే దేశంలోని శూద్ర ఛండాల శక్తులు మరిన్ని అవకాశాలు పొందగలిగేవి” అంటారు కంచె ఐలయ్య (ప్రజాతంత్ర మార్చ్ 25, 2001). దళిత మేధావి గెయిల్ ఆమ్ వెట్ భారీడ్యాం లను మోన్ శాంటో కంపెనీని ప్రపంచీకరణను సమర్ధించారని బి. చంద్రశేఖర్ రాశాడు (చంద్రయానం). అంబేద్కర్ కూడా పాశ్చాత్యం తీసుకువచ్చిన మెగా ప్రాజెక్టుల విధానాన్ని సమర్ధించాడని అరుంధతీరాయ్ విమర్శించింది (ఆనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కి ముందుమాట).

నన్ను భీభత్సాల పాలు చేసి

నా జవసత్వాల్ని పీల్చేందుకు

నా నట్టనడి గుండెలో

నీ ప్రతినిధుల్ని భద్రంగా నాటావు.

యీ పరిస్థితిలో ఆత్మజ్ఞానం ఎలా సాధ్యం? రమణమహర్షి ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని పదేపదే చెప్పడానికి యీ వలసవాద పరాయీకరణ కారణమైందా? అసలు మనం కార్యకారణ సంబంధాన్ని చూసే తీరే వలసవాద కలుషితమైంది. వలసవాద అభివృద్ధి నమూనాని ప్రశ్నించే శక్తిని మనం కోల్పోయాం.

ఆ యీ పరిస్థితుల్లో గాంధీ పాశ్చాత్యంలో ప్రాచ్యాన్ని కనుగొనవలసి వచ్చింది. పాశ్చాత్యం భారతదేశపు గుండెల్లో తన ప్రతినిధుల్ని నాటడం వల్ల పరాయీకరణ మొదలైంది. దాంతో టాల్ స్టాయ్, థోరో వంటి పాశ్చాత్యుల నుంచి గాంధీ స్ఫూర్తి పొందవలసి వచ్చింది.

పాశ్చాత్య అభివృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయాన్ని వెదకడం కష్టమై పోయింది. స్థానికంగా వెదకడం మరీ కష్టమై పోయింది. ఏమంటే, స్థానికుల్లో చాలామంది తమ గతమంతా చీకటిగా భావించారు. యింకా చెప్పాలంటే తమ గతం విచ్ఛిన్నమైపోయిందని, తమ స్మృతులు పూర్తిగా చెదిరిపోయాయని భావించారు. స్మృతులలో ఉమ్మడితనాన్ని మినహాయించడమంటే స్మృతుల్నే ధ్వంసం చేయడమనే సత్యాన్ని విస్మరించారు. అలాగే తమ గత స్మృతుల్ని అవమానకరంగా భావించారు. గతంలో అవమానం, హింస వుండొచ్చు. అవమానమూ హింసలే గతం కాదు. స్మృతుల్ని మొత్తంగా దహనం చెయ్యడం ఆత్మ విచ్ఛిత్తికి దారితీసింది. తెరేష్ బాబు మాటల్లో ‘పాశ్చాత్యమే నా ప్రేయసి’ అని ప్రకటించుకొని ముద్దులతో మూతి కాల్చుకోవలసి వచ్చింది.

పాశ్చాత్య ప్రేయసిని ముద్దాడడం వల్ల మన కార్యకారణ సంబంధం పరిశీలన అనేది ఎంతగా కలుషితమైందో ఎంతగా పాశ్చాత్య వలస వాద పంక నిమగ్నమైందో తెలుస్తుంది. ఇస్లాంను విశ్లేషించే టప్పుడు అంబేద్కర్ ముస్లింలు ఉండటంవల్ల జరిగిన దౌర్జన్యాలను పెద్దవిచేసి చూపించారు. ఉమ్మడి సంస్కృతి, సంక్లిష్ట సంస్కృతిలోని ప్రధాన అంశాలను, మొగలులు రాజపుత్రులు సాధించిన రాజకీయ ఐక్యతను, సూఫీలు సన్యాసుల బోధనలను ఆయన విస్మరించారు. ఆయనకు ఇస్లాం మీద అంత సానుభూతి యేమీ లేదు. టర్కీ ముస్లిం దాడుల సమయంలో బౌద్ధారామాలను నాశనం చేసినందువల్లే ఇండియా నుంచి బౌద్ధం కనుమరుగైందని ఆయన భావించాడు. హిందూ జాతీయవాదులు భావించినట్లు గానే ముస్లిం దురాక్రమణ దారులు బలవంతపు మతమార్పిడులకి ఒడిగట్టారని అంబేద్కర్ భావించాడు (Ambedkar-Towards an Enlightened India by Gail omvedt).

ఈ అభిప్రాయాలు హిందూవాదులకి వుపయోగించాయని దళిత మేధావి గెయిలీ ఆమ్ వెట్ అంగీకరించారు. ఉమ్మడి సంస్కృతి, సూఫీలు సన్యాసుల బోధలు మన మేధావుల చెవికెక్కలేదు. అందుకే ఏకశిలాసదృశ జాతి నిర్మాణం కోసం కలలు, ఆ క్రమంలో బౌద్ధం పేరుతోనో మరో పేరుతోనో ముస్లిం జాతి వ్యతిరేకత వంటి యూరోపీయ ప్రొటెస్టెంట్ ఫాసిస్టు భావజాలం రాజ్యం చేసింది. దానినుంచే హిందూ ఫాసిజం పురుడు పోసుకుంది. హిందూ ఫాసిజం బహుళ సంస్కృతుల స్థానాన్ని దురాక్రమించింది.

“అసలు విశ్వజనీనమైన అభివృద్ధి నమూనాలోనే దానికి అపరిచితమైన జీవన విధానాలను అర్ధం చేసుకోలేని లోపం ఉంది. తనకు తెలీని దాన్ని, ఇతరాన్ని అది భరించలేదు” (డి.ఆర్.నాగరాజు)

*

 

మన చరిత్రలో చీకటీ వెలుగూ!

 

-రాణి శివశంకరశర్మ

~

 

Rani sarmaభారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కార్యకారణ సంబంధం, విశ్వాసం, వేరు వేరు.. ఈ రెండూ ఎక్కడా కలవవు అని వారు వాదించారు. భారతీయులు విశ్వాసమనే చీకటిలో కూరుకుపోయి, కార్యకారణ సంబంధాన్ని విస్మరించారు. క్రైస్తవ వలసవాదులు వాళ్ళ కళ్ళు తెరిపించారు. కార్యకారణ సంబంధం లోకి, హేతుబద్ధతలోకి వాళ్ళని మేల్కొలిపారు అని వీరి వాదన.

కన్నుగానని వస్తుతత్త్వము

కాంచగలుగుదురింగిలీజులు (గురజాడ)

కంటికి కనబడని వస్తుతత్త్వం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధమే!

కార్యకారణ సంబంధమే కాదు, దేవుడు కూడా కంటికి కనబడడు. దేవుడు కూడా కార్యకారణ సంబంధం నుంచే పుట్టాడు. దేవుడు మూఢవిశ్వాసమైతే, కార్యకారణ సంబంధం పట్ల ఆధునికులకు గల తిరుగులేని విశ్వాసం కూడా మూఢవిశ్వాసమే!

కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసమే సైన్సుకి మూలాధారం. అంటే కార్యకారణ సంబంధాన్ని పరిశీలించడం ద్వారా వస్తుతత్త్వాన్ని గుర్తెరగవచ్చనే విశ్వాసం అన్నమాట.

ఐతే కార్యకారణ సంబంధం గురించి మనుషులకే కాదు, జంతువులకీ పక్షులకీ చివరికి మొక్కలకి కూడా తెలుసు. పక్షి గూడుని నిర్మిస్తోందంటే ఈ కార్యకారణ సంబంధం తెలియడం వల్లే!

కాని కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసం మనిషిలో మాత్రమే వుంది. దీని నుంచే దేవుడూ సైన్సూ పుట్టుకొచ్చాయి. అంటే మతమూ సైన్సూ కూడా ఒకే మూలం నుంచి ఒకే రకమైన విశ్వాసం నుంచి పుట్టాయి. కుండకి కుమ్మరి నిమిత్త కారణం. అట్లాగే విశ్వానికి దేవుడు. యింత సింపుల్ లాజిక్ మీద ఆధారపడి దేవుడు పుట్టాడు. యిక్కడ కార్యకారణ సంబంధమే పనిచేసింది.

కుండ చేయడానికి కుమ్మరి ఉన్నాడు. అలాగే వివిధ వృత్తి పనులు చేయడానికి మనుషు లున్నారు. ప్రకృతిలో కూడా కార్యకారణ సంబంధం యిలా సహజంగా పనిచేస్తుండగా వేరే దేవుడెందుకు? అని ప్రశ్నించినవాడు కుమారిలుడు. ఈయన మీమాంసా శాస్త్రవేత్త, వైదికధర్మ వ్యాఖ్యాత. దేవుడు చనిపోయా డంటూ యూరప్ గగ్గోలు పెట్టింది కానీ, భారతదేశంలో దేవుడసలు పుట్టనే లేదు.

బుద్ధుడు కార్యకారణ శృంఖల అన్నాడు. కార్యకారణాలు గొలుసు లాంటివి. అంటే ఒకదాని మీద మరొకటి లింకై అనంతంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచనకు ప్రాచీన సాంఖ్యతత్త్వం మూలం. దేవుడనేవాడుంటే వాడికి కూడా మరొక కారణం వుండాలి అంది సాంఖ్యం. కార్యకారణ అభేదాన్ని చెప్పింది సాంఖ్యం. కారణంలోనే కార్యం వుంటుంది. విత్తులోనే చెట్టుంటుంది. అంటే కర్త క్రియ వేరు కాదు, రెండూ ఒకటే. యింక దేవుడు ఎక్కడ దొరుకుతాడు?

నిజానికి దేవుడు యూరప్ లో పుట్టాడు. క్రైస్తవంలో పుట్టాడు. యూరపియన్ క్రైస్తవంలో పుట్టాడు. నిజానికి మూల క్రైస్తవం గురించి మనకేం తెలుసు? బిగ్ బ్యాంగ్ థియరీకి, బైబిల్ విశ్వాసానికి సంబంధం వుంది. అందుకే రోమన్ చర్చి ఆ సిద్ధాంతాన్ని సమర్ధించింది. ఈమాట ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పాడు. ఐతే విశ్వానికి మొదలు ఉంటేనే దేవుడు ఉండే అవకాశం ఉంది. కాని విశ్వం అనాది, అనంతం కనుక దేవుడు లేడు పొమ్మన్నాడు (బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం). భారతీయుల విశ్వాసాల ప్రకారం అంతా అనాది. యింక దేవుడెక్కడ?

ఆధునిక సైంటిస్టులు క్రమేపీ పాంథీయిజం వైపు ప్రయాణించారు. దేవుడే యీ విశ్వంగా రూపాంతరీకరించబడ్డాడనేదే పాంథీయిజం. అటువంటి విశ్వాసంలో మాత్రమే అనంతం అనేది సాధ్యమౌతుంది.

భారతీయులకి అనంతం అంటే ముద్దు. దాన్ని గ్రీకులు చీకటిగా భావించారు. అనంతంలో నామ రూపాలు ఏర్పడవనీ, పరిధి కల చోట మాత్రమే అవి ఏర్పడతాయని అరిస్టాటిల్ అన్నాడు. కాని హెగెల్ ‘అనంతం’ అనేది ఆధునిక కాలపు విప్లవంగా భావించాడు. ఎందుకంటే… గణితంలోనూ, భౌతికశాస్త్రంలోనూ, తత్త్వశాస్త్రంలోనూ అనంతం ఆవిష్కరించ బడుతూ వచ్చింది (రీజన్ ఇన్ రివోల్ట్).

గ్రీకులు చీకటిగా భావించిన ‘అనంతం’ అనే కాన్సెప్టులో భారతీయులు వీరవిహారం చేశారు. అనంతం అనేది అనంతుడైన పరమాత్మ వంటిది. పరమాత్మ కూడా జీవసృష్టి వల్లగానీ, లయము వల్లగానీ మార్పు చెందడు అంటాడు ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యులు (సిద్ధాంత శిరోమణి).

సృష్టి ప్రళయాలు కూడా తుదీ మొదలూ లేకుండా సాగుతాయి. అది అనంతమైన ప్రాసెస్. అందువల్ల సృష్టికర్త లేడు, ఉన్నా నామమాత్రుడు. మొదలూ తుదీ లేని చోట కర్తని ఎక్కడ నిలబెడతావు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నిజమైతే, భారతీయ తత్త్వం ప్రకారం అనంతమైన బిగ్ బ్యాంగ్ ల గొలుసు మాత్రమే ఉంది. ఆ గొలుసుకి మొదలు లేదు. అదే బుద్ధుడు చెప్పిన కార్యకారణ శృంఖల. నిజానికి అనంతంలో యిది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ లో కాలమూ స్థలమూ కూడా కుదించబడతాయి. బిగ్ బ్యాంగ్ కీ దేవుడికీ గల అక్రమ సంబంధాన్ని గుర్తించిన కొందరు కమ్యూనిస్టులు యీ సిద్ధాంతాన్నే తిరస్కరించారు (Reason in Revolt-Marxist Philosophy and Modern Science by Alen Woods and Ted Grant).

అనంత విశ్వాలు ఉన్నాయన్నందుకే బ్రూనోని దహనం చేశారు. బ్రూనో పునర్జన్మపై విశ్వాసాన్ని కూడా ప్రకటించాడు. జన్మ పరంపర అనేది కూడా అనంతమే. అంటే విశ్వాన్ని గురించి, జన్మల గురించి అతని దృక్పథం క్రైస్తవానికి విరుద్ధం. బ్రూనో నాటికి ప్రసిద్ధంగా ఉన్న ‘టోలమీ నమూనా’ ప్రకారం విశ్వం పరిమితం, కాలం పరిమితం. దాన్ని బ్రూనో విశ్వాసాలు బద్దలు చేస్తుండడంవల్లనే ‘పేగన్’ అని ముద్ర వేసి చంపేశారు. యిది అనంతం అనే భావనపై వేటు.

నిజానికి ఆధునిక సైన్సుకి మూలాలు చాలావరకు క్రీస్తు పూర్వం లోనే ఉన్నాయని అనేకమంది మేధావులు భావించారు. సూర్యకేంద్రక సిద్ధాంతానికి ప్రేరణన్ గ్రీకుల సూర్యారాధనలో వుంది అన్నాడు బెర్ట్రాండ్ రసెల్. విశ్వం కొన్ని నియమిత సూత్రాల ప్రకారం పని చేస్తుందన్న సైన్సు నమ్మకానికి మూలం గ్రీకుల FATE లో ఉంది అని ఆయన చెప్పాడు (Is Science Superstitious).

ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే సైన్సూ విశ్వాసమూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయన్నది తప్పు. సైన్సు కూడా విశ్వాసాల పుట్ట. విశ్వాసం లేనిదే విశ్వం లేదు. అందుకే ఆస్ట్రానమి, ఆస్ట్రాలజీ కవలలు గా జన్మించాయి. రసవిద్య రసాయనిక శాస్త్రం కవలలు. తంత్రశాస్త్రం దేహంపై తీవ్ర విశ్వాసం కలిగింది కావడం వల్లే మెదడుకి గల ప్రాధాన్యాన్ని యేనాడో గుర్తించగలిగిందని దేవీప్రసాద్ చటోపాధ్యాయ అన్నారు (లోకాయత).

కనక సైన్సు కూడా విశ్వాసజనితమే. ఏమిటా విశ్వాసం? కార్యకారణ సంబంధం పై విశ్వాసం. యీ విశ్వాసం చేసిన పనేంటంటే … కాన్సెప్టులని సృష్టించడం. దేవుడిపై నమ్మకం మతాన్ని సృష్టిస్తే, కార్యకారణ సంబంధం పై తిరుగులేని నమ్మకం కాన్సెప్టులని సృష్టించింది. థియరీలని సృష్టించింది.

పక్షి గూడు కట్టుకుంటుంది. కాని ‘గూడు’ అనే భావాన్నీ కాన్సెప్టునీ అది సృష్టించలేదు. అందుకే ప్లేటో ‘భావాలే మూలం’ అన్నాడు. ఒక ఇమేజి, వొక కాన్సెప్టు, వొక భావం వీటిని మనిషి మాత్రమే సృష్టిస్తాడు. క్రిమి కీటకాలూ, పక్షులూ, జంతువులూ కూడా గూళ్ళు బోరియలు లాంటి వస్తువులను సృష్టించగలవు. కాని భావాలని కాన్సెప్టుల్ని మనిషి మాత్రమే సృష్టించగలడు. అంటే మనిషి ప్రాధమిక లక్ష్యం వస్తువుల్ని సృష్టించడం కాదు, భావాల్ని సృష్టించడం. యీ భావాల్ని సంస్కారాలుగా తర్వాతి తరానికి అందజేస్తాడు. ‘యద్భావం తద్భవతి’ అన్నది అందుకే. నువ్వెలా భావిస్తే, ఊహిస్తే అలా ఉంటుంది ప్రపంచం.

ఇల్లూ పక్షి గూడూ ఒకటి కాదు. రెండూ కార్యకారణ సంబంధం నుంచే పుట్టాయి. కాని ఇల్లు అనేది మనిషి సృజించిన భావం. అదొక వస్తువు కాదు. అదొక ఇమేజి, కాన్సెప్టు. అందుకే అది వినూత్న రూపాల్ని ధరిస్తుంది. మనుషుల ఊహలూ, భావాలూ ‘ఇల్లు’ అనే పదార్ధంలో తీవ్రమైన మార్పులు తెస్తాయి.

ఇల్లు ఎలా ఉండాలి? ఏది మంచి ఇల్లు, ఏ మోడల్ మంచిది అనేదాన్ని మనిషి సంస్కృతీ సంస్కారం నిర్ణయిస్తుంటాయి. అంటే సింపుల్ కార్యకారణ సంబంధం మనిషిలో స్మృతి పరంపరగా పదిలం చేయబడుతుంది.

యీ స్మృతులు ఆయా స్థలకాలాల్లో విభిన్నంగా ఉంటాయి. వీటినుంచి అక్కడి సంస్కృతి నిర్మించ బడుతుంది. ఈ సంస్కృతే లేకపోతే మనిషి లేడు. ఇంత వివరణ తర్వాత నేను సాహసించి ఒక ప్రశ్నని సంధిస్తాను. ఆధునిక సైన్సుని యూరోపీయ క్రైస్తవం శాసిస్తోందా? బిగ్ బ్యాంగ్ థియరీ వెనక క్రిస్టియన్ మోటివేషన్ ఉందా? అదే నిజమైతే కార్యకారణ సంబంధాన్ని సంస్కృతీ మతమూ శాసిస్తుందన్నమాట. అలాంటప్పుడు కార్యకారణ సంబంధం పై విశ్వాసం మతవిశ్వాసం కంటే నిష్పాక్షికమైనదని, పారదర్శక మైనదని యెలా చెప్పగలం!?

బిగ్ బ్యాంగ్ థియరీని అంటుకొని గాడ్ పార్టికిల్ కోసం చేసిన అన్వేషణను క్రైస్తవ అన్వేషణ అనొచ్చా? యీ మెగా సైంటిఫిక్ ప్రాజెక్టుల వెనక మతపరమైన పాక్షిక దృష్టి పనిచేయడం లేదని ఎలా చెప్పగలం? యద్భావం తద్భవతి. నువ్వలా చూడాలనుకొన్నావు గనక, ప్రపంచాన్ని నువ్వలా నిర్వచించాలనుకొన్నావు గనక నీకలా కనిపిస్తోందా?

మొత్తంగా సైన్సు చరిత్రని పరిశీలిస్తే దాని కార్యకారణ సంబంధం వెనక పాంథీయిజం, పేగనిజం, హెలెనిజం చాలావరకూ పనిచేశాయి. బ్రూనో లాంటి వాళ్ళ మీద దాడి నిజానికి సైన్సు మీద దాడి కాదు. యూరోపీయ క్రైస్తవ వ్యతిరేక భావాల మీద దాడి.

బిగ్ బ్యాంగ్ థియరీ విజయం ద్వారా యితర ప్రాపంచిక దృక్పథాల్ని క్రైస్తవ సైంటిస్టులు వెనక్కి నెట్టేశారు. సైన్సు పేరుతో జరిగిన క్రూసేడు యిది. ఈ క్రూసేడులో భరతఖండం కూడా బాధితురాలే. ఎందుకంటే, క్రైస్తవమత పూర్వపు యూరప్ కీ మనకీ పోలికలు ఉన్నాయి. ఆ ప్రాచీన గతం నుంచే బ్రూనో, గెలీలియో వంటి వారు స్ఫూర్తిని పొందారు. అలాంటి స్ఫూర్తిని వాళ్ళు ప్రాచ్యం నుంచి కూడా పొంది ఉండవచ్చు.

బ్రూనోని ఇటాలియన్ కాథలిక్ క్రైస్తవులు సజీవ దహనం చేసి అతని చితాభస్మాన్ని టైబర్ నదిలో కలుపు తున్నప్పుడు మనదేశంలో యమునా నది ఒడ్డున అక్బర్ చక్రవర్తి సర్వమత సమానత్వాన్ని పెంపొందింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభేదాల్ని సంవాదాలుగా మార్చడానికి కృషి చేస్తున్నాడు.

యిక్కడ నేనొక ప్రాచీన కథని ఉటంకించకుండా  ఉండలేను. దేవదానవులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక్క సరస్వతీదేవి మాత్రం దూరంగా వుంది. ఆమెని దేవతలూ రాక్షసులూ కూడా తమవైపుండి పోరాడమని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి వారికి ఒక సత్యాన్ని బోధించింది. “యుద్ధానికి ముగింపు ఉండదు. సంవాదం చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోండి.” యిటీవల అసహనం చర్చనీయాంశమైన సందర్భంలో వొక కన్నడ రచయిత యీ కథని స్మరించాడు. అక్బర్ ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. బ్రిటీష్ వాళ్ళు పూర్తిగా ఆధిపత్యం చెలాయించేంతవరకు సంవాద పద్ధతి కొనసాగిందని వెండీదోనిగర్ రాశారు (Hinduism – An alternative history).

క్రైస్తవవలసకు పూర్వం భారతదేశంలో ఉన్న స్థితిని చీకటియుగంగా భావించారు మన మేధావులు. ఇది లెఫ్టిస్టులకీ రైటిస్టులకీ కూడా చీకటిచరిత్రే. లెఫ్టిస్టు లేమంటారు? ఆకాలం కులతత్వపు చీకటితో నిండి ఉందంటారు. రైటిస్టులేమంటారు? అది ముస్లిం మతపు చీకటి అంటారు. ‘కసాయిబు’ల కాలం అంటారు. వీరిద్దరూ ఒకచోట కలుస్తారు. అది చీకటి. భారతీయులది చీకటి చరిత్ర.

భారతీయుల గతం చీకటి చరిత్రగా ఎందుకు కనిపించింది? దాని వెనక వున్న కార్యకారణ సంబంధం ఏమిటి?

మార్క్సు భారతీయుల గతం గురించి మూడు రకాలుగా చెప్పాడు. 1) నిరంతర ఓటమి 2) అంతులేని వైరుధ్యాల పుట్ట 3) అధమ మతం, ప్రకృతి ఆరాధనతో కూడిన పేగన్ మతం (ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం). వీటికి పరిష్కారం ఏమిటి? తిరిగి ఓటమి. బ్రిటిష్ చేతిలో ఓటమి. మార్క్సు మాటల్లో భారతీయులకు ఓటమి కొత్తేమీ కాదు. ఏ తురక చేతుల్లోనో కాకుండా బ్రిటిష్ వాడి చేతిలో ఓడిపోవడం మంచిదైంది. దీనికి కొనసాగింపే శ్రీ శ్రీ రాసిన దేశచరిత్రలు. ముస్లిం నియంతల పేర్లు తప్ప ఇంగ్లీషు నియంతల పేర్లు ఆ కవితలో కనబడవు. ఎందుకంటే భారతదేశాన్ని ఇంగ్లీషువాడు ఓడించడమే మంచిదైం దని మార్క్సు అన్నాడు కనుక. బంకించంద్ర చటర్జీది కూడా అదే పాట. ముస్లిం నియంతృత్వపు చీకటి నుంచి బ్రిటిష్ వాళ్ళు మనల్ని బయట పడేశారన్నాడు. జార్జి చక్రవర్తి హింసాత్మక విజయాన్ని గురజాడ కూడా శ్లాఘించాడు. ఈ ఆధునిక కవుల అభిప్రాయాలన్నీ ‘బ్రిటిష్ యుగం హింసాత్మకమైనప్పటికీ అది భారతదేశాన్ని గ్రామీణ చీకటి నుంచి విముక్తి చేసిన యుగం’ అన్న మార్క్సు మాటలకు ప్రతిధ్వనులే!

ఇప్పటికీ భారతీయ గతాన్ని మూడు రకాల చీకటిగా చూడడం జరిగింది. 1) గ్రామీణత 2) కులం 3) ముస్లిం సంస్కృతి. ఈ మూడూ విమర్శకుల దృష్టిలో చీకట్లే. విప్లవ మేధావి కెవిఆర్ బ్రిటిష్ పూర్వ యుగాన్ని ‘నిశీధిని’ అన్నాడు.

భారతదేశాన్ని చరిత్ర పూర్వ యుగంగా భావించాడు హెగెల్. అలాగే భావించాడు మార్క్సు. క్రైస్తవ పూర్వ సమాజంగా భావించారు క్రైస్తవులు. వీరి భావాలే కమ్యూనిస్టుల్నీ, ఆధునికుల్నీ, హిందూవాదుల్నీ ప్రభావితం చేశాయి. ఈ అన్ని దృక్పథాల వెనక కార్యకారణ సంబంధం పనిచేస్తోంది. అది క్రైస్తవ యూరోపీయ కార్యకారణ సంబంధం. దృష్టే సృష్టి.

అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి. దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అన్నాడు. క్వాంటం ఫిజిక్స్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ మాటలన్నాడు. భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచం దేవుడి లీల, క్రీడ మాత్రమే. అతనికి తోచుబడి కాక యీ క్రీడ మొదలు పెట్టాడు. మొదట తనని తాను రెండుగా స్త్రీ పురుషులుగా విభజించుకొన్నాడు. మైథునక్రీడ జరిపాడు. అప్పుడు సృష్టి మొదలైంది. దీన్ని సృష్టిక్రీడ లేక ఇంద్రజాలం అంటారు. క్రీడల్లో లాగే ఇంద్రజాలం సూత్రాలు కూడా కల్పితం. ఎవడా సూత్రాల్ని కల్పిస్తాడో, ఏ దృక్పథంతో కల్పిస్తాడో, ఆ రూపం ధరిస్తాయి. అటువంటి సూత్రాలు ఏర్పడతాయి. నువ్వు దేవుణ్ణి ఏరూపంలో చూడాలనుకొంటే ఆ రూపంలో కనబడతాడు. ప్రపంచం ఏరూపంలో కనబడాలనుకుంటావో అలా కనబడుతుంది. నిశ్చల సూత్రాలు లేవు. నువ్వు యూరోపీయ క్రైస్తవ దృక్పథంతో చూడాలనుకుంటే ప్రపంచం అలాగే కనబడుతుంది. భారతదేశానికి ఓటమి సహజాతం అని మార్క్సు అన్నాడు. అది అతని దృష్టి. అసలు ఓటమి అంటే ఏమిటి? భరతఖండ స్వరూప స్వభావాలు ఎటువంటివి? దీన్ని మనం తులనాత్మక పద్ధతిలో నిర్వచిద్దాం.

చైనా చాలాకాలం పాటు మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. ఒకే భాష ఒకే లిపి అందుకే అక్కడ సాధ్యమయ్యాయంటారు. బ్రిటిష్ వాళ్ళు మత్తు మందు యుద్దాలతో లొంగదీసేవరకు చైనా తన మానాన తాను బతికింది. అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు ఏకాంతంలో జీవించింది. యూరోపియన్ల ప్రవేశంతో వారితో వచ్చిన సూక్ష్మక్రిములు స్థానికుల్ని చంపేశాయి. మిగిలినవారిని గన్నులు వేటాడాయి. చరిత్ర లేని, బలమైన స్మృతులు లేని కొత్తజాతి పుట్టుకొచ్చింది.

భారతదేశానికొస్తే, యిక్కడ అడుగు పెట్టని జాతి లేదు. యిక్కడ దొరకని భాష లేదు. ముక్కోటి దేవతలు. యిక్కడ ఎవరు ఎవర్ని జయించారు, ఎవరు ఓడిపోయారు!? సుదీర్ఘమైన గతం. యింకా చదవబడని హరప్పా లిపి. భరతఖండం ఎప్పుడూ ఒంటరిగా లేదు. అతిధులు ఎక్కువ. అందుకే ఆతిధ్యం భారతీయుల ప్రత్యేకత అయ్యింది. నిజానికి అతిధుల్నీ స్థానికుల్నీ వేరు పరచడం అసాధ్యం. ఇది అతిధుల దేశం.

అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు. ఇండియాకి గుర్తించగలిగే చరిత్ర లేకున్నా గాఢమైన స్మృతులున్నాయి. యిక్కడ చరిత్రని వెతికే వాడు మూర్ఖుడు. స్మృతుల్ని వెదికేవాడు ఋషి. ఆ స్మృతులు ఎక్కడుంటాయి. ప్రజల నాల్కల మీద ఉంటాయి. స్థానిక సంస్కృతుల్లో ఉంటాయి. ఎవరో మనకి అశోకుడి పుట్టు పూర్వోత్తరాలు తెలియవని బాధ పడ్డారు. కానీ మనకి సూఫీ గురువుల బోధలు తెలుసు. కబీర్ దోహేలు తెలుసు. వేమన పద్యాలు నోటికొస్తాయి. అతి ప్రాచీనమైన వేదాలు కంఠతా వచ్చు. ఇవి స్మృతులు, గాఢమైన స్మృతులు. ఈ స్మృతుల్ని అధ్యయనం చెయ్యడం వల్ల మనుషుల మధ్య అనుబంధాలు దృఢమౌతాయి. మనకి అశోకుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోయినా, హరప్పా లిపి చదవలేకపోయినా, వర్తమానంలో మిగిలి ఉన్న సజీవ సంస్కృతులలో కులపురాణాలలో మన గత సంస్కృతి అందుతూనే ఉంది.

ఇంతకీ చరిత్ర మనకి ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని నేర్పింది. ఎప్పుడూ మనం ఓడిపోలేదు, ఎప్పుడూ గెలవనూ లేదు. భరతఖండానికి సంబంధించినంతవరకూ గెలుపోటములు వలస క్రైస్తవులు కనుగొన్న విషయాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మనలో ఒకరుగా ఉండదలుచుకోలేదు. దూరంగా ఉంటూ బిజినెస్సు చెయ్యదలుచుకున్నారు. అందుకని మనని ప్రాచీన ఆర్యుల దగ్గరినుంచి అందరూ ఓడిస్తూ వచ్చారని గెలుపు చరిత్ర మనకు లేదని నూరిపోశారు. ఆర్యుల దండయాత్ర కథ కట్టుకథ అని తేలిపోయినా మనం దానినే అంటిపెట్టుకొని ఉన్నాం. చరిత్ర దయ్యంలా మనల్ని వెంటాడుతోంది. చరిత్ర అంటే గెలుపు అని, ఒక జాతి మరొక జాతి మీద జెండా ఎగరెయ్యడమనీ బ్రిటిష్ వాడు మనకి నూరి పోశాడు. మన సంస్కృతినీ సంప్రదాయాల్నీ కళల్నీ మొత్తం మన జీవితాలనే తాను గెల్చుకున్నానని చాటాడు. యీ వలసవాద దృష్టితోనే భరతఖండాన్ని నిరంతరం వోడిపోయే దేశంగా మార్క్సు వర్ణించాడు.

తెల్లవాడు వచ్చాక తెల్లారింది. అంతకుముందు అంతా చీకటే. అందుకే మరో వందేళ్ళు మనదేశాన్ని ఇంగ్లీషు వాడు పాలిస్తే బాగుండునని కంచ ఐలయ్యగారు అన్నారు. యిటువంటి భావాలు పాశ్చాత్య క్రైస్తవ అభివృద్ధి నమూనాకీ, టెక్నాలజీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నాయి. వలసవాదుల గెలుపు భావన, రాజ్యాధికార భావన మనల్ని వెంటాడుతోంది. అందరూ రాజ్యాధికారమే తమ లక్ష్యమని ప్రకటించుకుంటున్నారు.

(రెండో భాగం వచ్చే గురు వారం)

మేమూ మీరూ…ఇదే అసలు గొడవ!

 

-అల్లం కృష్ణ చైతన్య 

చిత్రం: అక్బర్

~

2014 సెప్టెంబర్. నిస్సహాయుడైన మనిషి, ప్రాణాలు అరచేతిల పెట్టుకుని ప్రాధేయ పడుతున్నడు. ఆకలికి కులం, మతం లేదు. ముందున్నది మనిషా, జంతువా అన్న సమాలోచన లేదు. మంచి, చెడు అన్న విచక్షణ లేదు. ముందున్నది ఆహారం మాత్రమే. వీడియో చూసిన దేశం అంతా దిగ్భ్రాంతికి గురైంది. పులిని చంపేయ్యాలన్నరు కొందరు. ఎక్కువ మంది అది క్రూర జంతువు, వేట దాని స్వభావం, దాని తప్పేమున్నది అన్నరు. చివరకు ప్రకృతి గెలిచింది. పులి నిర్దోషిగ నిలిచింది.

ఇక్కన్నే వాదం మొదలవుతది. మృగానికీ, మనిషికీ తేడా లేదా అని. మృగం-మనిషి అనీ, క్రూరత్వం మానవత్వం అనీ వాద ప్రతివాదాలు మొదలయినై. నిజమే. తేడా ఉన్నది. కానీ స్వభావం? వేట మనిషి స్వభావం. సహజ సిద్ధమైన ప్రాకృతిక లక్షణం. వేల సంవత్సరాలు మనిషి వేటాడిండు. జీవ రాశులన్నీ ఆహార చక్రంలో తమ తమ భాగాలని పంచుకున్నై. అది ప్రకృతి. అది స్వభావం. చరాచర భూప్రపంచం మీద మనిషి ప్రాథమిక మనుగడలో అంతర్భాగం వేట, మాంసాహారం.

అనాగరిక ప్రపంచం నుండి నాగరికతలు రూపు దిద్దుకోవడం మొదలయ్యింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మనుగడ, సంఘటిత జీవనం లాంటి వాటికి కొత్త అవధులు, ప్రమాణాలు సృష్టించబడ్డాయి. గీతలు గీసుకోవడం మొదలయ్యింది. రోజు రోజుకూ మనం నుండి నువ్వు-నేనులు పుడుతూనే ఉన్నై. నేను గొప్ప నుండి, నాది గొప్ప అనే పరిణామం నువ్వు, నీ పుట్టుక, అసలు నీ అస్తిత్వమే తక్కువ అనే స్థాయిని దాటినంక బలమైన సంఘాలు బలాన్ని కాపాడుకోవడం కోసం బల ప్రదర్శన చేస్తనే ఉన్నై. ఎన్నుకునే అంశాల పేర్లు వేరు కావచ్చు జరిగేది మాత్రం బల ప్రదర్శనే. నేను-నువ్వుల నుండి మేము మీరులు ఏర్పడ్డంక నా వాదన మా వాదనయ్యింది. ఆల్ఫాలు, బీటాలు అదే భావజాల వ్యాప్తిని కొనసాగించిన్లు. కొన్ని తరాల తరవాత పూర్తి స్థాయి మేము, మీరుల సమాజాలు తయారయినై. దేవుడు పుట్టిండు. కులాలు పుట్టినై. మతాలూ పుట్టినై. అలవాట్లూ, నాగరికతలకు అనుగుణంగా సంఘటిత జీవనం అనేకానేక రకాలుగా వేరు పడుతూనే ఉన్నది.

జంతు హింసని వ్యతిరేకించడం మంచి విషయం. అసలు హింసనే వ్యతిరేకించడం ఇంకా గొప్ప విషయం. సమస్త జీవజాలాన్ని(తోటి మనుషులతో సహా) ప్రేమించమని చెప్పడం మంచితనం, మహానీయత్వం, మానవత్వం. ఇవి ఉన్నవాళ్ళు సంఘంతో కలిసి పని చేస్తరు. నచ్చని విషయాన్ని పెటాలు, యానిమల్ షెల్టర్లు పెట్టి ప్రేమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందింప చేస్తరు. అయినా, సహజ సిద్ధమైన స్వభావాన్ని వదులుకోలేని వాళ్ళు అలవాట్లు మార్చుకోరు. ఒకరి ఆహారం వాళ్ళ ఇష్టం. తినని వాళ్ళు, తినే వాళ్ళు ఇద్దరూ చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఇక్కడ సమస్య అది కానే కాదు. నేను మాత్రం కోళ్ళనీ, చేపలనీ, మేకలనీ తింటా, నువ్వు ఆవుల్ని తినద్దు. నేను కరెక్టు, నువ్వు తప్పు. నేను తినను కాబట్టి నువ్వు తింటే నరుకుతా. ఇందులో ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం ఎక్కడ ఉంది? సరే ప్రేమతో అన్నావనుకుందాం, అని ఊరుకోవడం లేదే. వ్యతిరేకించిన కుత్తుకల తెగ్గోసి కారుతున్న రక్తాన్ని మీద పోసి చూడు నీకు ఇదే శాస్తి పడుతుందన్న వాడి మాటల్లో ప్రేమ ఎక్కడుంది? మానవత్వం ఎక్కడుంది? ధర్మం ప్రసక్తి ఎక్కడ వచ్చింది? సమస్య ఆహారం కాదు. మేము మీరుల మధ్య. సరిగ్గా ఇప్పుడే మళ్ళీ అదే ప్రశ్న. ఈ సారి వేరే మనుషుల మీద. మృగానికి, మనిషికి తేడా లేదా?

*

కలాలన్నీ కలిసి నడిస్తే…

 

 

-వి . శాంతి ప్రబోధ

అక్టోబర్ 25 వతేదీ
మధ్యాహ్న సమయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణా ప్రజా సంస్కృతిక కేంద్రం హాలు.
రచయితలూ , కవులూ , సాహిత్యకారులూ, సాహితీ సంఘాల ప్రతినిధులు, పత్రికా సంపాదకులూ ఒకొక్కరూ అక్కడ చేరారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అయ్యారు.   విభిన్న నేపథ్యాలు, వివిధ అస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన  సాహితీ సాంస్కృతిక సృజనశీలురు  ఒకే  చోట చేరిన అపూర్వ సన్నివేశం అది. ఈ సందర్భంలో అంతా కలసి కలబోసుకున్న ఆలోచనల విషయం ఒకటే.
ప్రస్తుత సమాజంలో పెచ్చరిల్లి పోతున్న మతతత్వవాదం, అందులోంచి మొలకెత్తి నాటుకుపోతున్న విషబీజాలు,  నియంతృత్వ ధోరణులు, హింస మర్రి ఊడల్లా విస్తరిస్తూ  సామాన్య ప్రజలనుండి రచయితలు , కళాకారులు , మేధావులు అందరినీ తన కబంధహస్తాల్లో బందీ చేయాలని చూడడం, లేదంటే నామరూపాలు లేకుండా చేయడం జరుగుతోంది. పరమత సహనం నశించి మతమౌడ్యం వెర్రితలలు వేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిసి లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న పరిస్థితులు కలిగిస్తున్న  ఆందోళన అందరినీ ఒక దగ్గర చేర్చాయి. అందుకు  “వర్తమాన సామాజిక సంఘర్షణలు- రచయితల బాధ్యత” అన్న అంశంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన చర్చాగోష్టి దోహదం చేసింది.వివిధ సంఘాలుగా, సమూహాలుగా వ్యక్తులుగా విడివడి ఉన్న సృజన కారులు, సాహితీవేత్తలు ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనబయ్యో దశకంలో కొంత జరిగింది.
మారిన ఆనాటి పరిస్తితులతో సద్దుమణిగింది .  తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో. విభిన్న నేపథ్యాలతో,  అస్తిత్వాలలోని సృజన శీలురు, కలం యోధులు ఒక్కటవ్వాల్సిన  అవసరం ఇప్పుడు ఏర్పడింది.  అందుక్కారణం ఇప్పటివరకూ  ప్రజాస్వామిక, లౌకికవాదుల మౌనమే. అలసత్వమే అని చెప్పక తప్పదు.  మన శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్నా చూసి చూడనట్లు ఉండడం వల్లే  నేడీ దుస్థితి.  శత్రువు అది అవకాశంగా తీసుకుని పెచ్చరిల్లిపోవడం, ఆధిపత్య ప్రదర్శనలు చేయడం, అహంకారంతో  తన భావజాలాన్నిప్రజలపై  బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నాడు.

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమాజం అంచులలో ఉన్నవర్గాలపైన, మహిళలపైన  దాడులు జరిగేవి. ఇప్పుడు వారితోపాటు మైనారిటిలపైనా దాడులు పెరిగిపోయాయి.  వారి ఆహారం, అబిరుచులపై నియంత్రణ మొదలైంది. వ్యక్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అది అక్షీకరించే  కలంయోధులపై దాడులు ఒక పథకం ప్రకారం జరిగిపోతున్నాయి. పెరుమాళ్ మురుగన్ పై దాడి,  కల్బుర్గి హత్య, దాద్రి సంఘటన వంటివి ముందు ముందు జరగబోయే అనర్ధాలకి  మచ్చు తునకలు మాత్రమే.   మనం మౌనం వీడక పొతే , నిరసన తెలపక పొతే, శత్రువు పై యుద్ధం ప్రకటించక పొతే  పరిస్తితి మరింత విషమిస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందూత్వ ఛాందస వాదానికి, సంకుచిత్వానికి, అసహనానికి, ఉన్మాదానికి ప్రజాస్వామ్యం బలి అవుతుంటే చూడలేని ప్రజాస్వామిక వాదులు ప్రగతి కాముకులు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను నిరసనగా తిరిగి ఇవ్వడం మొదలైంది.  అది ఒక నిరసన రూపం మాత్రమే.

అంతకు మించి మరెన్నోవీలయినన్ని  మార్గాలలో మన నిరసనని తెలపాల్సిన అవసరం ఉందని సాహితీప్రపంచం అభిప్రాయపడింది.అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందో, రచయితలు అవార్డులు ఎందుకు తిరిగి ఇస్తున్నారో నేటి యువతకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నారనీ,  వాస్తవ పరిస్థితిని వివరిస్తూ భవిష్యత్తులో జరగబోయే విపత్తు గురించి, ప్రజాస్వామిక విలువల వినాశనం గురించీ, విధ్వంసం గురించీ తెల్పుతూ యువతరంలోకి నవతరంలోకి వెళ్ళాలి.  లౌకిక భావజాల వ్యాప్తి విస్తృతంగా  జరగాలి. ఆదిశగా ప్రచారం జరగాలి.  విస్తృతంగా రచనలు రావాలి.  ఎవరికి వారుగా ఉన్న వ్యక్తులపై, సంస్థలపై శత్రువు దాడి చేయడం సులువు.   కాబట్టి సంఘటితంగా ఎదుర్కోవాలని, విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం అవసరం అని ఈ చర్చావేదికలో పిలుపునిచ్చారు వక్తలు. ఒక వైపు విధ్వంసం పెద్ద  ఎత్తున జరిగిపోతోంది. దాన్ని నిలువరిస్తూ నమ్ముకున్న విలువల్ని కాపాడుకోవడానికి మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతున్నాయనీ వాటిని ఎదుర్కొంటూ నూతన సంస్కృతీ నిర్మాణం జరగాలనీ, వాదాలను , విభేదాలను పక్కన  పెట్టి ఒక్క తాటిపై ముందుకు సాగాలనీ అభిలషించారు వక్తలు.

సమాజంలో పెరిగిపోతున్న అసహనం , మత  దురహంకారం, నియంతృత్వం  అసలు సమస్యని తప్పుదారి పట్టించడం జరుగుతోంది. దేశాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది.   ప్రగతిశీల శక్తుల పై ప్రభుత్వ అనుకూల  బృందాలు దాడులు చేయడం , .ఏకీభవించని వాడి  పీక నొక్కేయడం వ్యక్తి స్వేచ్చని హరించడం సాధారణం అయింది . మతం వ్యక్తిగతం అన్న స్థితి మారింది. దాన్ని  ప్రభుత్వం స్వీకరించింది, పండుగలు పబ్బాలు నిర్వహిస్తోంది.  అందుకు ప్రజా ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది. మత దాష్టీకం కనుసన్నల్లోకి వెళ్ళిన రాజ్యం  వ్యక్తిగత ఇష్టాయిస్టాల్లోకి చొచ్చుకొచ్చి లౌకిక శక్తులపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులను చేస్తోంది, మానవహక్కులను హరించివేస్తోందని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేసే ఇలాంటి ధోరణుల్ని రచయితలూ, కవులూ , సాహితీవేత్తలు , సృజనకారులు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంలో జరిగిన  చర్చలో కార్యాచరణకు వచ్చిన నిరసన రూపాలు ఇవి:

* భిన్న నేపథ్యాల్లోని అన్ని అస్తిత్వ ఉద్యమాలు కలసి కట్టుగా  శత్రువుని ఎదుర్కోవడం

*  మౌనం వీడి కలాలకు , గళాలకు పదును పెట్టడం.
* హిందూ పాసిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా రచనలు చేయడం.
* లౌకిక వాద భావ ప్రచారం చేయడం
* కళాశాల స్థాయిలో లౌకిక వాద భావ ప్రసారం, ప్రచారం జరిగే .కార్యక్రమాలు చేపట్టడం

*  రచయితల మార్చ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరపడం

*నిరసన ప్రదర్శనలు , రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చా గోష్టులు , సభలు జరపడం
* జాతీయ స్థాయిలో రచయితలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది
*  నిరసన తెలపడానికి వివిధ రకాల టూల్స్  ఎంపిక చేసుకోవడం
* నిరసన కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేయడం
* సోషల్ మీడియాని లౌకిక వాద భావప్రసారానికి సాధనంగా వాడుకోవడం
* చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం

* కరపత్రాలు పంచడం

* వివిధ జానపద  కళారూపాల ద్వారా లౌకిక భావ వ్యాప్తితో పాటు వాస్తవ పరిస్తితుల పట్ల అవగాహన కలిగించడం
* సామూహిక స్వరం వినిపించడం
* రచయితల డిక్లరేషన్ ప్రకటించడం
* జిల్లాలలో , పట్టణాలలో నిరసన కార్యక్రమాలు జరపడం
* భావప్రకటన స్వేచ్చ కాపాడుకోవడం
* మత కలహాలు జరిగే ప్రాంతాల్లో , గ్రామాల్లో లౌకిక వాద ప్రచారం జరపడం
* ట్రేడ్ యూనియన్ ల్లోకి , విద్యార్థులలోకి , ప్రజల్లోకి వెళ్ళడం
* జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం
* ప్రజల ఆహారపు అలవాట్లని శాసించదాన్ని ధిక్కరించడం
* వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం
* ఖండనలు , ప్రకటనలకి మాత్రమె పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రణాళిక ఏర్పాటుచేసుకోవడం
* సంతకాల సేకరణ రూపంలో నిరసన తెలపడం
* రచయితల భద్రత కోరుతూ ముందే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం

రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం కోసం         ” లౌకిక, ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతిక వేదిక” ఏర్పాటైంది.  ఈ వేదిక తరపున కొండవీటి సత్యవతి, యాకూబ్ , బమ్మిడి జగదీశ్వ రావు, పసునూరి రవీందర్ కన్వీనర్లు గా ఒక కమిటీ ఏర్పాటయింది.  ఆ కమిటీ లో  వీరితో పాటు ఉష. s. డానీ, స్కై బాబా , అరుణోదయ విమల , G. S. రామ్మోహన్ , కాత్యాయనీ విద్మహే , శివారెడ్డి , తెలకపల్లి రవి , రెహనా, రివేరా  సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేసి అమలు చేస్తుంది.

దాదాపు 200 వందల మంది పైగా  కలం యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ప్రో . హారగోపాల్ , వరవరరావు , తెలకపల్లి రవి , అల్లం నారాయణ , కె. శ్రీనివాస్ , నందిని సిధారెడ్డి , రమా మెల్కోటే,  వీణ శత్రుఘ్న, విమల, అనిల్ అట్లూరి , నాళేశ్వరం శంకరం ,  N. వేణుగోపాల్ , కుప్పిలి పద్మ ,  వాసిరెడ్డి నవీన్ , కాకరాల , వేంపల్లి షరీఫ్ , కత్తి మహేష్ , దేవి , జ్వలిత , తిరునగరు దేవకీదేవి, రమాసుందరి, అరణ్య కృష్ణ, సుమిత్ర , ఇంద్రవెల్లి రమేష్ , శిలాలోలిత, తారకేశ్వర్ , రామారావు  , కృష్ణుడు , వినోదిని , యలవర్తి  రాజేంద్రప్రసాద్ , అలీ సిద్దికి , వర్మ , వనజ .C,  గోపరాజు సుధ, రజని , ధనలక్ష్మి ,రాజ్యలక్ష్మి , కందుకూరి రాము , ప్రరవే సభ్యులు కాత్యాయనీ విద్మహే , మల్లీశ్వరి , శాంతిప్రబోధ , భండారు విజయ , మెర్సీ మార్గరెట్ , పి. రాజ్యలక్ష్మి, కొండేపూడి నిర్మల ,తాయమ్మ కరుణ , కవిని ఆలూరి , కొమర్రాజు రామలక్ష్మి , బండారి సుజాత , సమతా రోష్ని , శివలక్ష్మి, , హేమలలిత, లక్ష్మి సుహాసిని  తదితరులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సహకారంతో జరిగింది

వి. శాంతి ప్రబోధ , భండారు విజయ

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక , తెలంగాణ

ఫత్వాలని వెక్కిరించిన ఆమె..

–సాయి పద్మ 

~

ఫహ్మీదా రియాజ్ గురించి రెండు మాటల్లో లేదా బ్రీఫ్ గా చెప్పటం కష్టం. దేని గురించి చెప్పాలి? ఆమె కవిత్వపు మెరుపు గురించా? లేదా , వోకప్పటి అఖండ భారతంలో పుట్టి (సింధ ప్రాంతం ) పాకిస్తాన్ మెట్టి, నాలుగేళ్ల ప్రాయం నుండే కవిత్వం రాస్తూ, తన కవిత్వానికి ఫత్వా తో సహా జారీ చేయించుకున్న స్ట్రాంగ్ ఫెమినిస్ట్ కవయిత్రి గురించా ?
తన షాయరీల చైతన్యంతో, ప్రభుత్వాల్లో కదలిక తెప్పించి, రాజ్యపు ఆగ్రహానికి గురి అయి .. తన ముగ్గురు పిల్లలతో, భర్తతో, ఇండియా లో తల దాచుకోన్నప్పటికీ , మరింత పదునెక్కిన ధర్మాగ్రహపు వ్యంగ్యపు జ్వాల గురించా.. ?
చెప్పటం కష్టం.. ఆమె కవిత్వంతో ప్రేమలో పడకుండా ఉండటం ఇంకా కష్టం .. ఇన్ని కష్టాల మధ్య , ఆమె కవిత్వం చదువుకోవటమే ఇష్టం .. నేను చదువుకుంటున్నాను ఆమెని.. ఐచ్చిక బురఖాలు వేసుకున్నవాళ్ళు, డిస్క్రిమినేషన్ లేదు అనేవాళ్ళు, ఎల్లలు లేవంటూ ఎలుగెత్తి చాటేవాళ్ళు.. ఆమెని , ఆమె కవిత్వాన్ని చదవాలి .. వాళ్లకి నచ్చిన ఉటోపియా నుండి , నిజంలోకి నిర్భయంగా నడవాలి .. కనీసం ప్రయత్నించాలి.. ఫహ్మీదా  కోసం కాదు.. మన మానసిక ఆరోగ్యం కోసం..!!
* *

నువ్వచ్చం నాలానే తయారయ్యావు కదూ

ఎక్కడ దాక్కున్నావోయ్ ఇన్నాళ్ళూ

అదే మూర్ఖత్వం, ఆదే గర్వం

అందులోనే వో  యుగం కోల్పోయాములే  

చివరికి అవి నీ గుమ్మం దాకా వచ్చాయి

హార్దిక శుభాకాంక్షలోయి

మతపు జెండా నర్తిస్తోంది

హిందూ రాజ్యం స్థాపిస్తావా ఏంటి?

నీ పూలతోటని తొక్కుకుంటూ

అవకతవకలనే దారి చేసుకుంటూ

 

నువ్వు కూడా తీరిగ్గా అలోచిస్తావేమో

నిర్వచనాలతో సహా అంతా తయారయింది

ఎవరు హిందూ ? ఎవరు కాదని

నువ్వు కూడా ఫత్వా జారీ చేసే సమయం వచ్చింది

ఇక ఇక్కడ బ్రతకటం ఎంతో కఠినం

స్వేదంతో ప్రతీ రాత్రీ భయం

ఎలాగో వోలాగ జరిగే తీరుతుంది జీవితం

ప్రతీ వొక్క శ్వాసా వేదనా భరితం

దుఖం ఎక్కువై అలోచించేదాన్ని వొకప్పుడు

అదే ఆలోచనకి  భలే నవ్వొస్తుంది ఇవాళ

నువ్వచ్చం నాలానే తయారయ్యావు

మనం ఇక రెండు జాతులు కామోయీ

 

చదువూ చట్టుబండలూ పోతే పోనీ

అజ్ఞానపు గుణాలే కీర్తించనీ

ముందు గోతులున్నాయని ఆలోచించకు

గత వైభవాల మురుగును మళ్ళీ వెలికితీద్దాం

కష్టపడి నేర్చుకో వచ్చేస్తుందిలే

వెనుకకు నడవటం బాగానే

రెండో ఆలోచన మనసులోకి రానీకు

గట్టిగా గతంలోకే నీ దృష్టి పెట్టుకో

వొక జపం లా క్రమంగా చేస్తూ ఉండు

చర్విత చర్వణంలా అదే చేస్తూ ఉండు

ఎంత వీర మహత్వం మన  భారతం

ఎంత ఘనమైనది మా భారతం

అప్పటికి చేరుకుంటారు మీరా ఉన్నత స్థానం

అప్పటికి చేరుకుంటారు ఊర్ధ్వ లోకం

మేమక్కడే ఉన్నామోయ్ మొదటినుండీ

నువ్వూ సమయం గడుపుదువు గాని,

నువ్వున్న నరకం నుండి

ఉత్తరం గట్రా రాస్తూ ఉండవోయీ ..!!

–ఫహ్మీదా రియాజ్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు! 

 

– రంగనాయకమ్మ

~

 

 

రూధిని గారితో పరిచయం నాకు ఐదారేళ్ళు సాగింది. నిజానికి,  చాలా విషయాల్లో ఆవిడికీ నాకూ సరిపడేది కాదు. ఆవిడ, ‘‘నేను ఎవరితోటీ గొడవలు పెట్టుకోను. నెమ్మదిగా వుంటాను’’ అనేవారు. నిజానికి , కోపం రావలసిన సందర్భాల్లో కూడా అలాగే వుండేవారు. ఆవిడ అలా వున్నప్పుడల్లా నేను నవ్వి, ‘‘మీరు సగం సన్యాసి అయ్యారు. ఇంకా పూర్తి సన్యాసి అవ్వండి! గొడవలు ఎవ్వరూ నిష్కారణంగా పెట్టుకోరండీ. అవసరమైతే, గొడవ పెట్టుకోవలిసిందే’’ అనేదాన్ని. ఆవిడ ఒప్పుకునేవారు కాదు.

ఆవిడికి కళ్ళ వైద్యాలు చాలా సార్లు జరిగాయి. నేను తరుచుగా, ‘‘ఎలా వున్నారు?  కళ్ళల్లో అంతా మందులేనా? అబ్బా, ఎంత వోపిక బాబూ మీకు!’’అని పలకరిస్తూ వుండేదాన్ని. ఆవిడ చెప్పిన కళ్ళ డాక్టరు దగ్గిరికి నేను కూడా వెళ్ళాను. ఆ డాక్టరు ఆవిడికి బాగా నచ్చాడు. ఎందుకంటే, ఆవిణ్ణి డబ్బు ఇవ్వొద్దు అనేవాడు ఆయన. ‘‘డాక్టరు డబ్బే అక్కర లేదంటున్నాడు. ఏ డాక్టరూ నా దగ్గిర డబ్బు తీసుకోరు’’ అనేవారు ఆవిడ.

నేను, ‘‘అయ్యో! అలా చెయ్యకండి. వాళ్ళకీ బోలెడు ఖర్చులు వుంటాయి. మనం వైద్యం చేయించుకుంటే, వాళ్ళు వొద్దన్నా ఎంతో కొంత ఇచ్చెయ్యాలి. మీరు ఇవ్వదల్చుకున్నది, ఆయన ముందు టేబుల్ మీద పెట్టెయ్యండి ’’ అనేదాన్ని. ఆవిడ ఒకసారి అలా ఇచ్చినట్టే చెప్పారు. కళ్ళ వైద్యాలు జరుగుతూనే వున్నాయి. మళ్ళీ డబ్బు మాటలు రాలేదు. మా మధ్య ఎప్పుడూ నిస్సారంగానే, మర్యాద రకంగా మాత్రమే, వుండేది ఇద్దరికీ. కానీ పలకరింపులూ, కబుర్లూ, సాగుతూనే వుండేవి.

నేను, ఆవిడ భర్త గారి ‘దెయ్యాల శాస్త్రం’ మీద మొదటి వ్యాసం రాసినప్పుడు, తను నాస్తికురాలినని చెప్పుకునే ఆవిడ, భర్త గారి కీర్తిని నిలబెట్టే విధంగా వాదించడం చేశారు. అయినా నేను చెప్పవలిసింది నేను చెప్పి, అప్పుడప్పుడూ మాట్లాడుతూనే వున్నాను. నాతో మాటలు ఆపుకోవాలని ఆవిడ అనుకోలేదు. క్రమంగా ఆవిడ ధోరణి నచ్చక నేనే మాటలు ఆపేశాను.

ఆ తర్వాత మూడేళ్ళు నిశ్శబ్దంగానే జరిగాయి. ఈ 2015లోనే, సెప్టెంబరులో, వేణు అనే పాఠకుడు ‘సారంగ’ నెట్ పత్రికలో వచ్చిన వార్త ఒకటి మాకు పంపించాడు.

ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

నెట్ పత్రికలు చూసే ఆసక్తీ, టైమూ, నాకు ఎప్పుడూ లేవు. ఎవరైనా చెపితే వినడం, పంపితే చూడడం.

వేణు పంపిన ‘సారంగ’ వార్త ఏమిటంటేపి. విక్టర్ విజయకుమార్ అనే అతను, వరూధిని గార్ని కలిసి, రంగనాయకమ్మ గురించి చాలా తెలుసుకున్నట్టు, ‘సారంగ’లో రాసిన సమాచారం అది. ‘‘రంగనాయకమ్మ వరూధిని అమ్మ వంటి గొప్ప ఆవిడితో స్నేహం పోగొట్టుకుంది’’ అని తేల్చి, ఆ వార్త రాశాడు అతడు. అతడు రాసింది ఇంకా వుంది. అదంతా వరూధిని గారు అతనికి చెప్పిన విశేషాలే. అవన్నీనిజాలు కాని సంగతులే. ఆ సంగతులన్నీ వింటే విజయకుమార్ కి పండగ అయింది.  అంబేద్కర్ మీద విమర్శ రాశానని ఇతనికి కోపం. (తను విరసం మనిషిని కానని ప్రత్యేకంగా చెప్పుకున్నాడు. అయినా,  రంగనాయకమ్మ మీద కోపం ఎందుకంటే, అంబేద్కర్ వాదిగా ఆ కోపం. ఆ రకం కోపాన్ని నెట్ పత్రికల్లో కొన్ని సార్లు వేరే వాళ్ళు చూసి చెప్పారు.)  నేను, దెయ్యాల తత్వవేత్త మీద రాసిన వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని, అతడు ‘సారంగ’లో ఇలా రాస్తున్నాడు:

‘‘ఒకసారి కొ.కు. గారి మీద, మా రంగనాయకమ్మ గారు యధావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాశారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగనాయకమ్మతో కుటుంబ మిత్రత్వం వున్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. (రంగనాయకమ్మతో అలాంటి ఇబ్బందులే వస్తాయి మరి- అని చెప్పడం! )  రంగనాయకమ్మ ఆ వ్యాసం రాశాక, చాలా రోజుల వరకూ, రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుంచి వరూధిని అమ్మకు ఫోను లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుంచి ఫోను వచ్చింది. (ఇవన్నీ, వరూధిని అమ్మ ఆ ముద్దుల కొడుక్కి చెప్పిన మాటలు!) వరూధిని అమ్మ రంగనాయకమ్మని ఫోనులో యథాలాపంగా పలకరించాక, రంగనాయకమ్మ ఉండపట్టలేక,  ‘‘మీకు చూపు సరిగ్గానే వుందా?’’ అని అడిగింది. అప్పుడు, వరూధిని అమ్మ, ‘‘ఆ(.. ఫర్లేదు…పత్రికలు చదవగలుగుతున్నాను’’ అని సమాధానం ఇచ్చింది,  రంగనాయకమ్మ ఎందుకు వాకబు చేస్తోందో తెలిసి. రంగనాయకమ్మ, ‘‘మరి, నే కుటుంబరావు గారి గురించి వ్యాసం రాశాను, చదవలేదా?’’ అని ప్రశ్నించింది. వరూధిని అమ్మ ఏ మాత్రం హావభావాలు లేకుండా, ‘‘ఆయన పబ్లిక్ పర్సనాలిటీ. ఎందరో ఆయన్ని విమర్శిస్తుంటారు, పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను’’ అన్నది. (వరూధిని గార్ని నేను అడిగానో లేదో , ఆవిడ ఎలా అన్నదో, తెలియాలంటే, నేను ‘దెయ్యాల శాస్త్రం’ మీద ‘చినుకు’ పత్రికలో రాసిన వ్యాసం చూస్తే తెలుస్తుంది. ఆ వ్యాసాలన్నీ నా ‘పల్లవి లేని పాట’ సంపుటంలో దొరుకుతాయి. వరూధిని జవాబుకి నేను నోట మాట రాకుండా అయిపోయానని ఆవిడి ముద్దుల కొడుకు తర్వాత చెపుతున్నాడు చూడండి.) ‘అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్ ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం.’’(నేను మాట్లాడ లేకుండా అయిపోయినట్టు వరూధిని చెప్పిందని అనుకోవాలి.  అసలు, ఆవిడ విజయకుమార్ తో చెప్పినవన్నీ నిజం కాని అబద్దాలే. ఆవిడికీ, నాకూ, నా మొదటి వ్యాసం వచ్చిన వెంటనే మాటలు జరిగాయి. అది చాలా రోజుల తర్వాత కాదు. నేను ఏది రాసినా, ‘‘మీరు చదివారా? మీరు చదివారా?’’ అని ఎవ్వర్నీ అడగను. అలాగే, ఆవిణ్ణీ  అడగలేదు. ఆవిడి కంటి ఆరోగ్యం గురించి అడిగానంటే,  అది ఎప్పుడూ జరిగేదే. ఆవిడ, నా మీద వ్యతిరేకంగా చెప్పడం వల్లే, అతడికి అలాంటి పొగరు మాటలు వచ్చాయి. నా ఎక్స్ ప్రెషన్ అలా అయిపోయిందని వాగాడు! )

విజయకుమార్ రాసినదాన్ని చదివిన కూర్మనాథ్  (ఇతడు విరసం వాది, విరసం పత్రిక ‘అరుణతార’ సంపాదకవర్గ సభ్యుడు) తన కామెంట్ ఇలా రాశాడు :  ‘‘ఐ లైక్డ్ హర్ ఆన్సర్ టు రంగనాయకమ్మ. ’’(వరూధిని, రంగనాయకమ్మకి ఇచ్చిన జవాబుని ఇతడు చాలా ఇష్టపడ్డాడట! అసలు, వరూధిని ఇచ్చిన జవాబు ఏమిటో చూడాలంటే, నా ‘చినుకు’ వ్యాసం చదువుకోవాలి. అందులో తెలుస్తుంది వరూధిని జవాబు. ‘‘ఇప్పుడు లేని ఆయన మీద ఎందుకు రాశారు? ఆయన దెయ్యాల మీద ఎప్పుడో చిన్నప్పుడు రాశారేమో. అసలు, వాటిని వెయ్యడం విరసం తప్పు. మీరు విరసాన్ని విమర్శించండి గానీ, చిన్నప్పుడు రాసిన మనిషిని ఎలా విమర్శిస్తారు? ’’- ఈ పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. ఇదంతా నా ‘చినుకు’ పత్రిక వ్యాసంలో వుంది. విరసం వాదులందరూ చినుకు వ్యాసం చూసే వుంటారు, అది వాళ్ళ సంఘం మనిషి మీద రాసింది కాబట్టి. కానీ,  అసలు  నిజం తెలియనట్టు నాటకాలు! )

కూర్మనాథ్ కామెంటు తర్వాత, విజయకుమార్ ఇలా రాశాడు:  ‘‘రంగనాయకమ్మ ఒకప్పుడు వరూధిని అమ్మ కుటుంబానికి మంచి స్నేహితురాలు (గుడ్ ఫ్రెండ్). దురదృష్టవశాత్తూ, రంగనాయకమ్మ తన కలగజేసుకునే స్వభావం (ఇంటర్ ఫియరింగ్ నేచర్) వల్లా, ఆమె మూఢ వైఖరి (డాగ్మటిక్ అప్రోచ్) వల్లా, వరూధిని అమ్మను తన ఫ్రెండ్ గా పోగొట్టుకుంది.’’ (రంగనాయకమ్మ, దురదృష్టంతో , తన చెడ్డ గుణాలతో, అంత గొప్ప స్నేహితురాల్ని పోగొట్టుకుంది. రంగనాయకమ్మది, కలగజేసుకునే స్వభావం. మూఢ వైఖరి. ఒక తత్వవేత్త రాసిన దాంట్లో ఈవిడ ఎందుకు కలగజేసుకోవాలి? – ఇదీ వీళ్ళ తీర్పు!   వరూధిని గారు నాతో చాలా సందర్భాల్లో,  ‘‘నేను కలగజేసుకోను. అన్నీ నేను పట్టించుకోను’’ అనేది. ఆవిడ, మొగుడి చేష్టల్ని పట్టించుకోకపోవచ్చు. ‘‘తోటి రచయితలు పట్టించుకుంటారు’’ అనే జ్ఞానం లేదు ఆ మనిషికి. విజయకుమార్ వాగిన వాగుడంతా, ఆవిడ ద్వారా అందినదే.)

‘సారంగ’వార్తని నాకు పంపిన వేణు, విజయకుమార్ వాగుడు చూసి, తన ప్రశ్నలు తను అడిగాడు. ‘రంగనాయకమ్మ వ్యాసాన్ని తప్పుల తడక అన్నావు. అసలు ఆ వ్యాసాన్ని నువ్వు చదివావా?’ అనే పద్ధతిలో ఇలా అడిగాడు:  ‘ఆమె చేసిన విమర్శ దేన్ని గురించి? ఆ వ్యాసాన్ని కనీసంగా ప్రస్తావించకుండానే అది తప్పుల తడక అనెయ్యడానికి మాత్రం ఉత్సాహపడిపోయారు మీరు. ఆ వ్యాసం, కొ.కు. తత్వ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతిలో 2012 డిసెంబరు 24న రంగనాయకమ్మ రాసిన వ్యాసం.  దాని శీర్షిక: ‘సోషలిజం తేవడం చాలా తేలికే.’ ఆ వ్యాసం ప్రచురణ తర్వాత, వరూధిని- రంగనాయకమ్మ గార్ల మధ్య ఏం జరిగింది? మీరు వరూధిని గారి వర్షను ఇక్కడ ఇచ్చారు. ఈ విషయంలో, రంగనాయకమ్మ గారి వర్షన్ కూడా చూడాలి కదా? అది, 2013 ఏప్రిల్ ‘చినుకు’లో వచ్చింది. ఆ చినుకు వ్యాసం ప్రకారం చూస్తే, వరూధిని గారు, మీరు రాసిన పద్ధతిలో కాకుండా, వేరే రకంగా స్పందించారు. ….‘ఆయన ఇప్పుడు లేరు. లేని మనిషి మీద విమర్శలెందుకు?’ అనీ, ‘ఆయన మీద మీరు పర్సనల్ గా రాశారు’ అనీ- ఈ పద్ధతిలో ఆవిడ స్పందించారు. ఆ మాటలకు రంగనాయకమ్మ గారి స్పందన కూడా ఆ చినుకు వ్యాసంలోనే వుంది.’’- ఇలా కామెంట్ చేశాడు వేణు.  (నేను అప్పుడు వరూధినికి చెప్పిన జవాబు కావాలంటే, ‘చినుకు’ వ్యాసంలో చూడాలి. చాలా వుంది. అది ఇక్కడ చేర్చడం కుదరదు. నేను చాలా చెప్పి, ఆవిడితో మాటలే ఆపేశాను.)

నేను చెప్పింది అలా వుంటే,  ‘‘అటు పక్క ఎక్స్ ప్రెషన్ ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం’’ అని వరూధిని అమ్మ ముద్దుల కొడుకు తీర్పు!  రంగనాయకమ్మ నోరెత్తలేకపోయింది- అని! (ఇలాంటి అబద్దాల వాళ్ళు, దొంగల ముఠాల్లోనే వుంటారు.)

వేణు, తన కామెంట్ లో  ఇంకా కొంత ఇలా రాశాడు:  ‘‘కొ.కు. దెయ్యాలూ, ప్రేతాత్మల గురించి రాసిన విషయాలను నేను అంగీకరించను. మార్క్సిస్టులు గానీ, నాస్తికులు గానీ, ఆ విషయాలను వ్యతిరేకించాల్సిందే. ఆ పని, తన విమర్శతో చేశారు రంగనాయకమ్మ. ఆమె రాసింది తప్పుల తడక అంటున్నవారు, పర లోకాలనూ, పూనకాలనూ, దెయ్యాలనూ, ప్రేతాత్మలనూ, నమ్ముతున్నట్టే.’’  వేణు, నా ఆంధ్రజ్యోతి వ్యాసాన్నీ, చినుకు వ్యాసాన్నీ కూడా నెట్ లో పెట్టాడు.

 

 

వేణు రాసిన మొత్తం కామెంట్ కి విజయకుమార్ జవాబు ఏమిటంటే:  ‘‘మీరు చెప్పిన వ్యాసాన్ని చదివి, తర్వాత మీతో మాట్లాడతాను. (గెట్ బ్యాక్ టూ యూ.) ఒక కుటుంబాన్ని పరిచయం చేయడమే నా వుద్దేశం. కనక నేను, విషయం లోతుల్లోకి వెళ్ళే అవసరాన్ని చూడలేదు.’’ (విజయకుమార్ అలాంటి జవాబు ఇచ్చాడంటే,  దాని మీద ఎదటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారనీ, తన జవాబు ఎందుకూ పనికి రాదనీ, కనీసంగా కూడా ఊహించకుండా, ‘గొప్ప జవాబు చెప్పేశాను’ అనుకున్నాడు! )

వేణు మళ్ళీ ఇలా అడిగాడు:

‘‘ఒక కుటుంబాన్ని (వరూధిని గారి కుటుంబాన్ని)  పరిచయం చెయ్యడం మాత్రమే మీ వ్యాసం లక్ష్యమా? అలాగైతే, రంగనాయకమ్మా వరూధిని గార్ల  మధ్య జరిగిన అంశాల్లో , మీరు ఒకరిని ఏక పక్షంగా సమర్థిస్తూ, మరొకరిని హీనపరుస్తూ, రాయకుండా వుండాల్సింది.  రంగనాయకమ్మ గారి స్వభావం, ఇంటర్ ఫియరింగ్ నేచర్ అనీ, డాగ్మటిక్ అప్రోచ్ అనీ,  తీర్పులిచ్చేశారు, మీ కామెంట్లలో. మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి, విషయాల్ని చర్చనీయాంశం చేసేసి, తీరా ఇప్పుడు చర్చ అవసరం లేదంటే ఎలా?’’ అని ముగించాడు వేణు. ( ‘తప్పుల తడక’ అని, విజయకుమార్ మేధావి ఏ వ్యాసం గురించి అన్నాడో, ఆ మేధావి అసలా వ్యాసాన్ని చదవలేదని చెపుతున్నాడు. వరూధిని  అమ్మతో ముచ్చటించినప్పుడు కూడా ఆ వ్యాసం అతనికి తెలీదని అర్థం. విషయాన్ని తెలుసుకునే లోతుల్లోకి వెళ్ళలేదని చెపుతున్నాడు.)

‘సారంగ’లోనే, ఒక పాఠకుడెవరో , ఇంకో కొత్త విషయం తెచ్చాడు. వరూధిని భర్త గారికి, మరణించిన ఒక భార్య వల్ల ఒక కొడుకు వున్నాడు. ఆ సంగతులేవీ వరూధిని, విజయకుమార్ కి చెప్పలేదు. ఆ పాఠకుడు ఏమంటాడంటే: ‘భర్త గారి కొడుకు కూడా ఆ కుటుంబంలో వ్యక్తే కదా? నీ పిల్లల్ని నువ్వు చెప్పుకున్నప్పుడు, ఆ కొడుకు కూడా వున్నాడని చెప్పాలి కదా? ఆ కొడుకు ఇప్పుడు జీవించే వున్నాడు. భర్త గారి మొదటి కొడుకు సంగతి చెప్పడం అనవసరం అనుకుంటే రంగనాయకమ్మ సంగతి ఎందుకు అవసరం?’ అని ప్రశ్నించాడు.

దీని మీద విజయకుమార్ నోరెత్తలేదు.

‘సారంగ’ని చూసిన ప్రసాద్ (జె.యు.బి.వి.) ‘‘ఏమిటీ గొడవ?’’ అని నన్ను అడిగాడు. దెయ్యాల తత్వవేత్త మీద నేను రాసిన 4 వ్యాసాలూ చదివిన వాడే అతను. నేను వరూధిని గారికి రాసిన వుత్తరం సంగతి చెప్పాను. అది తనకి ఇవ్వమని అడిగితే, పంపించాను. దాన్ని కూడా నెట్ పాఠకులు చదవవలసిన అవసరం వుందని ప్రసాద్ దాన్ని నెట్ లో పెడతానంటే, ఒప్పుకున్నాను.

ప్రసాద్, ‘సారంగ’లో ఇలా రాశాడు:

‘‘…. రంగనాయకమ్మకీ, తనకీ, ఒకప్పుడు స్నేహం వుండేదనీ, ఆ స్నేహాన్ని రంగనాయకమ్మ పోగొట్టుకున్నదనీ, వరూధిని గారు చెప్పడం వల్లే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన విజయకుమార్ గారు ఇక్కడ చెప్పారన్నమాట! … రంగనాయకమ్మ గారు రాసిన వ్యాసాలు నేను గతంలోనే చదివాను. ‘పల్లవి లేని పాట’ సంపుటంలో వున్నాయి అవి. …. కుటుంబరావు గారి (తత్వ) వ్యాసాల విషయమై, వరూధిని గారితో జరిగిన సంభాషణ గురించి రంగనాయకమ్మ గార్ని అడిగాను. జవాబుగా, వరూధిని గారికి తను రాసిన ఉత్తరం రంగనాయకమ్మ గారు నాకు పంపారు. ఆ ఉత్తరం లింకు ఇక్కడ ఇస్తున్నాను. https://www.scribd.com/doc/283230141/To-Varudhini-19-1-13

కుటుంబరావు గారు ఎంత అశాస్త్రీయంగా ఆలోచించారో, ఆయన వ్యాసాల్లో నించే సంవత్సరాల వారీగా ఆధారాలు చూపినా అంగీకరించని వరూధిని గారిదే డాగ్మటిక్ ఎప్రోచ్ (మూఢ వైఖరి) అని స్పష్టంగా అర్థమవుతోంది…. ఇంతకీ, విజయకుమార్ గానీ, కూర్మనాథ్ వంటి వారు గానీ, దెయ్యాల తత్వశాస్త్రాన్ని సమర్థిస్తారా? ’’- ఇది ప్రసాద్ ప్రశ్న!

విజయకుమార్,  మొదటి వ్యాసం చదివి వేణుతో ఏదో చెపుతానన్నాడు. వేణు ఆ జవాబు కోసం ఎదురు చూస్తున్నట్టే వున్నాడు.

వేణూ! నమ్ముతున్నావా అతన్ని? చచ్చివుంటారు వాళ్ళందరూ ఈ పాటికి. దెయ్యాలై,  నీ దగ్గిరికి వస్తారేమో!  ఒక కర్ర దగ్గిర పెట్టుకో!  దెబ్బకి దెయ్యం జడుస్తుంది. అందుకే ‘దెయ్యం పట్టింది’ అని నమ్మి ఆ పిచ్చి వాళ్ళని బాదుతారు.

దెయ్యాల్ని నమ్మేవాళ్ళు, దేవుళ్ళనీ నమ్ముతారు. ఆ తత్వవేత్త, ‘భగవంతుడు ఉన్నాడు’ అన్నది కూడా మిడికాడు. అతని భార్యకి, పాప-పుణ్యాల నమ్మకాలు వుంటాయి. ఆమె ఆడిన అబద్దాల ఫలితంగా, ఇప్పటికి, ఆవిడ పాపం పండింది!

చివరికి చెప్పేది ఏమిటంటే- ఆ విజయకుమార్ గానీ, ఆ కూర్మనాథ్ గానీ, మళ్ళీ పత్తా లేరు!  ఉండేలు బద్ద చూసిన కాకుల్లాగ, మళ్ళీ ఈ విషయం ఎత్తకుండా నోళ్ళు మూశారు. రంగనాయకమ్మ రాసిన 4 వ్యాసాల్ని చదివినవాళ్ళూ, అడిగే వాళ్ళూ, చాలామంది వుంటారని, వాళ్ళు మొదట ఊహించలేదు. వరూధిని అమ్మ చెప్పే కబుర్లన్నీ అబద్దాలని తేలతాయనీ వూహించలేదు !  ఇక ఏం చెయ్యగలరు, నోళ్ళు మూసెయ్యడం తప్ప? రంగనాయకమ్మ ఎక్స్ ప్రెషన్ వర్ణించినవాడి ఎక్స్ ప్రెషన్ ఎలా మారిందో ఊహించండి!

                        *  *   *   

రూధిని గారితో నేను అప్పుడప్పుడూ మంచి విషయాలు మాట్లాడడానికే ప్రయత్నించాను. దాని ఫలితం  ఏమీ కనపడలేదు. ఆవిడ మద్రాసు నించి ఇల్లు అమ్ముకుని వచ్చిన తర్వాత, ఆవిణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళు, ‘‘మీ ఇల్లు ఎంతకి అమ్మారు?’’ అని అడిగే వారట. ఎవరైనా తన డబ్బు మాట ఎత్తితే ఆవిడికి నచ్చదు.

నాతో అన్నారు రెండు మూడు సార్లు. ‘‘మీ ఇల్లెంతకి అమ్మారు- అని అడుగుతారేమిటి నన్ను? వీళ్ళకి చెప్పాలా నేను?’’ అన్నారు.

అలాంటప్పుడు నేను, ‘‘అది కాదండీ. మద్రాసులో స్తలం ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటారు. అంత కన్నా ఏముంటుంది? మీ డబ్బు వాళ్ళడుగుతారా?’’ అనే దాన్ని.

‘‘అయితే మాత్రం, ఎందుకు వాళ్ళకి అదంతా?’’ అనే వారు.

చెప్పిన కారణాన్ని వినే పని లేదు.

నేనైతే అలా ఎప్పుడూ డబ్బు మాట అడగలేదు.

కానీ, ఒక సారి ఏమన్నానంటే, ‘‘మీ భర్త గారి పుస్తకాలు వాళ్ళూ వీళ్ళూ వెయ్యడం ఎందుకు? మీ దగ్గిర  డబ్బు వుంది. ఆ పుస్తకాలన్నీ చవక ధరలతో మీరే వేయించవచ్చు. ఆ పని శ్రద్ధగా చూసే వాళ్ళకి అప్పజెప్తే, ఆ పుస్తకాలు రెగ్యులర్ గా వుంటాయి. అలాంటి ఏర్పాటు చెయ్యండి. డబ్బు తీసుకుపోయి పిల్లల కివ్వాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళ ఆదాయాలు వాళ్ళకి వున్నాయి. ఆయన పుస్తకాల ప్రచురణ కోసమే ఏర్పాటు చెయ్యాలి మీరు’’అని చెప్పాను.

‘‘ఆ గొడవంతా నా కెందుకు?’’ అన్నారు.

‘‘మీకేం కష్టం వుండదు. డబ్బు ఇవ్వడమే మీ పని. మీకు నమ్మకం అయిన వాళ్ళతో మాట్లాడండి’’ అన్నాను.

‘‘ఎందుకూ? వేసే వాళ్ళు వేస్తున్నారు. విరసం వాళ్ళకి వూరికే ఇచ్చేశాను. వాళ్ళని రాయల్టీ అడిగానా? ఊరికే ఇచ్చాను’’ అన్నారు.

సరే, ఆవిడ ఆ పని పెట్టుకోడానికి భయపడుతున్నారు- అనుకుని వూరుకున్నాను. కానీ, ఆ డబ్బుని పిల్లలకి ఇవ్వకుండా, ఆవిడ భర్త గారి పుస్తకాలకే పెట్టేలాగ ఇంకా వివరంగా నేను చెప్పవలసింది- అని నాకు కొన్ని సార్లు అనిపించింది.

ఒకసారి చలసాని ప్రసాద్ గార్ని అడిగాను.  ‘‘వరూధిని గారికి మీరేమీ రెమ్యునరేషన్ ఇవ్వరా?’’ అన్నాను.

‘‘ఎందుకివ్వం? కంటి ఆపరేషన్ కి డబ్బు కావాలని అడిగితే ఆ మధ్య ఆపరేషన్ల కోసం 50 వేలు ఇచ్చాను’’ అన్నారు.

‘‘ఆవిడ అలా అన్నారే!’’ అంటే నవ్వారు, ‘‘ఆవిడ అంతే’ అన్నట్టు.

‘‘ఆవిడికి డబ్బు వుంది కదా? ఆవిడి భర్త గారి పుస్తకాలే కదా? ఆ పుస్తకాలకి  ఆవిణ్ణే డబ్బు ఇవ్వమని ఆవిడికి నమ్మకం కలిగేలాగ చెప్పండి. ఆ డబ్బుని ఆయన పుస్తకాలకే ఉపయోగించమని మీరు చెప్తే ఆవిడికి నమ్మకం కలుగుతుందేమో!’’ అన్నాను.

ఆయన మాట్లాడనే లేదు. ఆవిడితో ఆ పని జరగదని ఆయన అభిప్రాయం కావచ్చనిపించింది.

ఆ రకంగా, ఆవిడితో సామరస్యంగా వుంటూ వుండగానే,  ఆ దెయ్యాల పుస్తకం చదివి, ఆ తత్వవేత్త మీద చాలా కోపం వచ్చి 4 వ్యాసాలు రాశాను. ఆయన రాసిన కథలూ, నవలలూ వంటి వాటి సంగతి కాదు ఇది. వాటి మాట నేను ఎత్తలేదు. తను భౌతికవాదిననీ, దెయ్యాల్ని కూడా భౌతికవాదం అనీ, చెప్పిన మనిషిని గురించి ఎలా ఆలోచించాలి? తను నాస్తికురాలినని చెప్పుకునే ఆవిడ, భర్త గారు చేసిందేమిటో తెలిసి కూడా ఆ పనినే సమర్థించింది. నేను రాసిన మొదటి వ్యాసంతోనే, ఆవిడి సంభాషణ నచ్చక, ఇక ఆ పరిచయాన్ని వదిలేశాను.

ఆవిడ, ఆ మొదటి వ్యాసం చదివి, ఆశ్చర్యపడి, బాధపడి,   ‘‘ఇలా రాశారేమిటి ఈయన? మతి పోయిందా ఏమిటి?’’అంటే, ఆయన తప్పుని అలా అర్థం చేసుకుంటే, మా స్నేహం చెడేది కాదు. నా పని, ఆవిడికి నచ్చలేదు; ఆవిడ, ‘‘ఆయన అలా రాయరు’’ అంటూ చేసే పొగడ్త నాకు నచ్చలేదు. అంతా స్పష్టంగా కనపడుతోన్నా, ఆవిడ కళ్ళు మూసుకుంది.

వరూధిని గారికీ, నాకూ, అయిష్టాలు ఎలా ప్రారంభమయ్యాయి- అంటే:

 1. వరూధిని గారు, భర్త గారి పెద్ద కొడుక్కి ఏ మాత్రమూ దక్కనివ్వకుండా సవతి తల్లిలా ప్రవర్తించిందని ఆశ్చర్యపోతూ ఆవిడికి ఉత్తరం రాస్తే, ఆవిడ ఆ ఉత్తరాన్ని గోడకి అంటించుకునే ఉత్తరంగా వర్ణించింది. ఆ ఉత్తరం తర్వాత కూడా మాట్లాడుకుంటూనే వున్నాం. కానీ ఆవిడ ఏ రకం మనిషో నాకు అర్థమైంది.
 1. నేను ‘దెయ్యాల తత్వ శాస్త్రాన్ని’ చదవడం ఆ తర్వాతే జరిగింది. ఆ కోపంతో వెంటనే నేను ఒక వ్యాసం రాస్తే, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ తర్వాత ఆవిడ, ‘‘ఆయన అలా రాయరు’’ అని వాదిస్తే, ఆ తత్వవేత్త కొటేషన్లన్నీ ఇచ్చి ఆవిడికి రాశాను. అయినా, ఆవిడ ఒప్పుకోలేదు. ఇక నేను ఆవిడితో మానేశాను.

 ఆ తర్వాత, ‘చినుకు’ పత్రిక వారు ఏదైనా ఇవ్వమని అడిగితే, వేరే వ్యాసాలతో పాటు, ‘‘గోడకి అంటించుకునే ఉత్తరం’’ అనే పేరు పెట్టి, వ్యక్తుల పేర్లు లేకుండా, రచయిత భార్యకి కామేశ్వరమ్మ పేరు పెట్టి, రాశాను. – ఇంత వరకూ జరిగాక, అంతా నిశ్శబ్దం అయింది.

కానీ,  వరూధిని గారికి నా మీద కోపం! భర్త గారి పరువు నా వల్ల పాడయిందని. ఆయన రచన మీద నేను కలగజేసుకోకూడదని! రచయితలు, ఏ విషయంలోనైనా కలగజేసుకుంటారని, ఆవిడికి తెలీదు.

కుటుంబరావు రచయిత, తను మార్క్సిస్టునని చెప్పుకుంటాడు. అలాంటి వాడు, పసితనంలో తల్లి పోయిన పిల్లవాడికి, తన ఆస్తిలో నించి నాలుగు పైసలైనా అందాలని ఆలోచించలేదు! అది తప్పని, ఉత్తమురాలిననుకునే భార్యకీ, ఆమె పిల్లలకీ, అర్థం కాలేదు. ఆ విషయాలు నాతో చెప్పకుండా దాచుకుంటే, అది వేరు. ఆవిడ, ఆ సవితి కొడుకు మీద నేరం చెపుతున్నట్టు, ‘‘ఇంటి అమ్మకానికి సంతకం పెట్టమంటే, మర్యాదగా పెట్టి వెళ్ళక, లాయర్ని అడిగి పెడతానన్నాడు చూడండి!’’ అని నాతో అనడం!

ఎవరికీ అలా చెప్పకుండా, ఆ సంగతి దాచివుంచినా ఆవిడ ‘సవతి తల్లి’ గాక, ‘వరూధిని అమ్మ’ అయ్యేదా? మార్క్సిస్టునని చెప్పుకునే మనిషి, తన కొడుకునే అంత దగా చేస్తే, ఇక భూస్వాములూ పెట్టుబడిదారులూ, వాళ్ల చేతుల్లో వున్న ఆస్తులెలా వదిలి పెడతారు?

భర్త గారు రాసిన తప్పుడు రాతలు బట్టబయలుగా కనపడుతోంటే, ‘‘ఆయన అలా రాయరు’’ అని వాదించే మనిషి సంస్కారాన్ని ఏమనాలి?

ఈ తల్లికి, ఒక అడ్డగోలు ముద్దుల కొడుకు దొరికాడు! ఇద్దరూ కలిసి రంగనాయకమ్మ మీద ముచ్చట్లు చెప్పుకున్నారు! ‘‘రంగనాయకమ్మ తన ఇంటర్ ఫియరింగ్ నేచర్ వల్లా, డాగ్మటిక్ అప్రోచ్ వల్లా, వరూధిని అంత ఉత్తమురాలితో స్నేహం పోగొట్టుకుంది’’ అని!

నా గురించి, ఇలాంటి కూతలు కుయ్యకుండా వుంటే, మూడేళ్ళ నించీ సాగుతోన్న నిశ్శబ్దమే కొనసాగుతూ ఉండేది.

చీమ కూడా, దాని పుట్టలో వేలు పెడితే ఊరుకోదు, కుడుతుంది. ‘‘నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?’’ అంటుంది.

చీమకి తెలిసిన పాటి రక్షణ నాకు తెలీదా? నా మూర్ఖ ప్రవర్తనతో, వరూధిని అమ్మ వంటి గొప్ప ఆమెతో స్నేహం పోయిందని, ఆమె చెప్పింది నమ్మి, నా మీద చెత్తగా రాయడమా? వాళ్ళని నేనేమీ చెయ్యలేదు. వాళ్ళ గొయ్యి, వాళ్ళే తవ్వుకున్నారు!

*

 

 

డిస్‌క్లయిమర్!

14

-అరుణ్ సాగర్ 

~

 

arun-పెద్దతేడా ఏంలేదుగురూ. జస్ట్ ఒక్క అక్షరం. `గు` తీసి `షు` పెట్టు. మేల్‌కొనమన్న పాపానికి, పురుషులందు పుణ్యపురుగులు వేరయా అని ఒక పెద్దాయన నీచంగాతిట్టినపుడు ఆశ్చర్యంగా వైడ్ ఓపెన్ మౌథొకటి పెట్టుకుని. ఆపై అప్పటినుంచీ మూసుకుని. రాసుకుని.

-పురుగులు లేదా పురుషులు అనండి ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. (ఈ వాక్యాన్ని వీకో వజ్రదంతి కేప్షన్‌లా చదువుకోవాలి). నచ్చక పోతే షిఫ్టుడిలీటు కొట్టుటకు ఇదివాక్యము కాదుకదా, లేదంటే వైరస్ ఇన్‌ఫెక్టెడ్ ఫైలూ కాదు. మరేమి చేయవలె. ఈ నీచపుత్రులను. తాగుబోతు నాయాళ్లను. తిరుగుబోతు కుక్కలను. గళ్లలుంగీ చారల టీషర్టు అసియ్యపు మీసాల మోసగాళ్లకు మోసగాళ్లను. రాముని మించిన కిష్నులను.  దుర్మార్గపు వ్యక్తులను (హ హ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ. యే బాత్ కైకూ రే! ఇంకోమాటచెప్పు). ఈ పచ్చని పొలమును బోలిన ప్రెపంచికానికి పట్టిన పీడపురుగులను, పేడపురుగులను ఏ మందేసి చంపవలెను. పురుషులంట. తొక్కలో పురుషులు. ఈఅందాలలోకంలో దారిపొడవునా అడ్డొచ్చే అడ్డగాడిదలు. ఒంపువయ్యారాల లాండ్‌స్కేప్ పార్కులో పొడిచిన ముళ్లజిల్లేడు చెట్లు. ఈ అద్భుతవనంలోకి కంచె కిందనుంచి దూరివచ్చేసిన పందులు. షావనిస్టు పిగ్గులు.

-ప్రపంచములో మంచికీ, చెడుకీ జెండర్ ఉండును. మంచి అన్నది స్త్రీ లింగము. చెడు అన్నది పురుషలింగము. ఒరేయ్ లింగం, నీకేరా చెప్పేది. తెలియకపోతేమమ్మడుగుము. అంచేత, యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ మెన్ టూ బీ గుడ్. వాడెవడో సరయిన అవగాహన లేని వాడొకడు `ఫ్యూ గుడ్‌మెన్` అని సినిమా తీశాడు, ఇంకోడెవడోరాసిన నవలని బేస్ చేసుకుని! నిజానికి `గుడ్‌మెన్ ఆర్ ఎ ఫ్యూ`! అదీ టైటిలు! చూస్తూనే ఉన్నవ్ కద, చదువుతూనే ఉన్నవ్ కద. యూ నో వాట్? అచ్చులు ఆంబోతులకేఎందుకు వేస్తారు. బాల్స్ ఎద్దులకే ఎందుకు కొట్టేస్తారు. పశువులు కాబట్టి. పురుషుల వలె అవికూడా పశువులన్నట్టు. పురుగుల వలె పందుల వలె నక్కల వలె తోడేళ్ల వలెమొసళ్ల వలె మరియూ ఆ మొసళ్లు కార్చే కన్నీళ్ల వలె కొంగల వలె దొంగల వలె కొంగలు చేసే జపం వలె. లైకులు కొట్టీ పోకులు చేసీ ఛాటుకు వచ్చీ చాటుమాటు వేషాల! (ఛాటులు కలిసిన చప్పట్ల గురించి మాట్లాడుట నిషిద్ధము. అసలు నిన్నెవడు రెస్పాండ్ అవమన్నాడు?). ఈ మగాళ్లున్నారు షూషారూ…మేల్ ఈజ్ ఈవిల్. వన్ ఫైన్ నైట్ఆఫ్ ఫ్రైడే ది థర్టీంత్, అండర్ ఎ బ్లడ్‌మూన్ స్కై. కొడుకుల్ని రక్తం కక్కుకునేలా. ప్రియా ఏంచేస్తే శాంతిస్తావు చెప్పు. ఈ మగజాతిని ఏ ఎండోసల్ఫాన్‌తో నిర్మూలించాలి చెప్పు.

-అసలు స్త్రీలంటే దేవతలు. అభంశుభం ఎరుగరు. ఏనాడూ `పోక్` చేయరు. లీడ్లు ఇవ్వరు. ప్రిడేటర్లు కాదు గురూ. మగవారికి పూర్తిగా `భిన్నులు`. (ఖిన్నుడవైయ్యావా?).ఫెమీన. మంచితనానికి నమూన. నవీన. (అబ్బ..పురుష్! ఓ యబ్బో సిగ్గే, అదంతా?)

-బై ద వే, నిన్నొకడు కలిశాడు (సారీ నిన్న ఒకడు కలిశాడు) వాడికి చెడు అలవాట్లేమీ లేవు. వాడు తాగడు. పొగనూ మందునూ రెంటినీ! అంతేల, టీ కూడా తాగడు సఖీ.ఒక్క వొక్కపొడి పలుకు కూడా వాసన చూడడు చెలీ. కానీ వాడు కర్కశుడు. పెళ్లాన్ని కొడతాడు. పిల్లల్ని కొడతాడు. ఆడపిల్లల్ని బతకనివ్వడు. తెగ సంపాదిస్తాడు. పిల్లికికూడ బిచ్చం పెట్టడు. భార్యకి మాత్రం బస్‌పాస్ తీసిస్తాడు. పరమ సంకుచితుడు. నిన్నొకడు కలిశాడు. వాడు తెగ తాగుతాడు. సిగరెట్ మీద సిగరెట్ పీకుతాడు. కానీపిచ్చోడు, ప్రేమిస్తాడు. పక్కనోడి కష్టం చూసి జేబులో ఉన్నదంతా తీసి చేతిలో పెడతాడు. వాటేసుకుని భోరుమని ఏడుస్తాడు. తూలుకుంటూ నిలదొక్కుకొని తలుపు తీయగానేబిడ్డ నుదుటనొక ముద్దుపెట్టి సారీ మమ్మీ అనేసి సైడయిపోతాడు. గదిలో కెళ్లి బజ్జుకుంటాడు. అర్ధం కాలేదు కదా! కదా? ఎక్స్‌పెక్ట్ చేశా! అర్ధం కాదు గురూ. ఎప్పటికీ అర్ధంకాదు. తాగి పడిపోమని చెప్పట్లే. సిగరెట్ పీల్చి పీల్చి ఊపిరితిత్తులు కాలి చచ్చిపోరా అనీ చెప్పట్లే. పాయింటేంటంటే చెడ్డ మగాళ్లు వేరు, చెడ్డ అలవాట్లున్న మగాళ్లు వేరు. చెడ్డఅలవాటున్నోడు పశువూ కాదు, చెడ్డ అలవాటులేనోడు మానవజాతి మణిరత్నమూ కాదు. ఓ బిట్ పేపర్ కొషనడుగుతా ఆన్సర్ చెయ్యి ;-) …గొప్పవాడికీ మంచివాడికీ గలతేడాలను పేర్కొనుము.

-రేయ్ రేయ్ రేయ్ నోరు పెరుగుతుందేంటిరా. ఎక్స్‌ట్రా నెయ్యీకారం మాటలు మాట్లాడుతున్నావేందిరా. ఏంటి వెర్షన్ మారుస్తున్నవ్? ముయ్ రా కుయ్యా. లుచ్ఛా కీ బచ్చా.పాటపాడి మరీ చెప్పారు కదరా `నన్ను ప్రేమిస్తే నువ్వే లుచ్ఛా` అని. రాక్షసుడా. కిరాతకుడా. కీచకుడా. మృగాడా. బాబూ సాటి, మేటి పురుగ్స్! చెప్పండమ్మ చెప్పండి,ఉప్పందించండి. ఇంకా మాంఛి టైటిల్స్…కమాన్ క్విక్. పెద్దతేడా ఏంలేదుగురూ. జస్ట్ ఒక్క అక్షరం.

-ఏం ర భయ్! ఇంత తిట్టినా తోలుకు టచ్చవుతలే? చెవులు దొబ్సా? మనకి నో సిగ్సా? హుమ్…నీతోని అయ్యేది కాదులేగానీ. సరే ఆ పక్కన కూర్చుని గట్టిగా నట్టువాంగంవాయించుకొనుడు. ఛుపారుస్తుమ్. `మ` కు ఉకారమిస్తే `ము` ఛుపాకే!

ఆల్ మెన్ ఆర్ లివింగ్ థింగ్స్

పిగ్స్ ఆర్ లివింగ్ థింగ్స్

: సో ఆల్ మెన్ ఆర్ పిగ్స్

దిస్ ఈజ్ కాల్డ్ ఫిగరేటివ్ లాజిక్. మేధమెటికల్లీ కరెక్ట్. లీవ్ ద పొలిటికల్ కరెక్ట్‌నెస్. హేస్టీ, నాస్టీ జెనెరలైజేషన్. ఫ్లోసీనాసీనిహిలిపిలిఫికేషన్!

బట్. బిఫోర్ దట్, నోట్ దిస్ పాయింట్- అందమైన సింహపు జూలు నేలరంగు. నీలఖచిత నెమలిపింఛము ఆకాశవర్ణము.

-అద్సరే గానీ ఈ మగపురుగులులేని అందమైన లోకములోనికి మగవాసన వచ్చే పిచ్చిపూలు లేని రంగులవనంలోనికి కలలప్రపంచములోనికి స్వేచ్ఛాస్వర్గములోనికి`జాతిని` ఎప్పుడు మేల్కాంచెదవు ప్రమీలా!

(పోస్ట్‌స్క్రిప్ట్; ఆకాశవాణి కొత్తగుడెం కేంద్రం, జనరంజని కార్యక్రమంలో స్త్రీలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు గృహప్రవేశం చిత్రం నుంచి కేజే జేసుదాస్ పాడిన పాట.కోరినవారు, వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ నుంచి హేమ, రేఖ, జయ ఇంకా సుష్మా. “దారి చూపిన దేవతా ఈ చే….యి ఎన్నడు వీడకా”)

*

Artwork: Rajasekhar Gudibandi

 

అతల వితల సుతల..

 

-సత్యమూర్తి

~

కోతుల రాజ్యం పెద్దమంత్రి బవిరిగడ్డానికి కాలు ఒకచోట నిలవదు. ఆ జబ్బు వెనకటికి లంకలో ఓ కోతి పెంచిన తోకంత పెద్దదై చుట్టలు చుట్టేసుకుంది. చుట్టలు చుట్టేసుకుని కూర్చుంటే సమస్య లేకపోయేది. కానీ అది చుట్టలు విప్పుతూ మాటిమాటికి విదేశాలకు వెళ్తుండడంతో రాజ్య పరిస్థితీ, పాలనా సంక్షోభంలో పడ్డాయి.

పెద్దమంత్రి హోదాలో బవిరిగడ్డం వారానికి ఒక దేశానికి అన్ని అధికార, అనధికార లాంఛనాలతో పయనం కడుతోంది. కొండముచ్చుల రాజ్యం, కోనముచ్చుల రాజ్యం, బారెడు కోతుల రాజ్యం, మూరెడు కోతుల రాజ్యం, జానెడు కోతుల రాజ్యం, బెత్తెడు కోతుల రాజ్యం, వేలెడు కోతుల రాజ్యం వగైరా నానా వానరజాతుల రాజ్యాలన్నీ ఇప్పటికే ఒకసారి చుట్టేసింది. భూమ్మీద చూడాల్సిన రాజ్యాలన్నీ అయిపోవడంతో ఇదివరకు వెళ్లినచోటికే  రెండోసారీ, మూడోసారీ వెళ్తోంది. అయినా కొత్త ప్రదేశాలు తిరగాలనే కోరిక మాత్రం పోలేదు. ఆస్థాన శాస్త్రమర్కటాలను పిలిపించి.. అతల, వితల, సుతల, తలాతల, పాతాళ వంటి భూమికిందా, ఆకాశంలోని నానా లోకాలకు తాను వెళ్లేందుకు దారులు వెయ్యాలని ఆదేశించింది. అవి ఆ పనిలో గోతులు తవ్వుతూ, నింగికి నిచ్చెనలు వేస్తూ ఉండగా బవిరిగడ్డం తీరికనేదే లేకుండా భూమ్మీది దేశాలను దర్జాగా చుట్టబెడుతోంది. దానికి ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే.. చివరకు సముద్రాల మధ్యలో కంటికి కనిపించనట్టుండే ఐదారు కోతులుండే రాజ్యాలకు కూడా రెండుమూడుసార్లు వెళ్తోంది. ఆ రాజ్యాలు తమకు తొలి ప్రాధాన్య రాజ్యాలని, వాటితో బంధం బలోపేతం చేసుకుని సమస్త లోకాన్ని సుఖశాంతులతో ఓలలాడిస్తామని నమ్మకంగా చెబుతోంది.

ఓ పక్క అతల వితల సుతల అన్వేషణ ఖర్చులు, మరో పక్క విదేశీ ప్రయాణ ఖర్చులతో రాజ్య ఖజానా తరిగిపోతోంది. కోతిస్వామ్యం ప్రకారం కోతులకు కనీసావసరాలు తీర్చడానికి కేటాయించిన పళ్లను, గింజలను, నీళ్లను, చివరికి కోతిపిల్లలు నోటిదురదతో కొరుక్కునే చెట్లబెరళ్లనూ.. వేటినీ వదలకుండా బవిరిగడ్డం విదేశాలకు అమ్మేయించి ఆ వచ్చిన డబ్బుతో షికార్లు కొడుతోంది. ఒకపక్క తన వానరానీకం ఆకులు అలములు లేక ఆకలితో అల్లాడి చస్తోంటే, మరోపక్క అది విదేశీ చట్టసభల్లో, అంతర్జాతీయ వానరమహాసభల్లో  తన రాజ్య సుభిక్షం గురించి, తన కోతుల సుఖసంతోషాల గురించీ గొప్పగా సెలవిస్తోంది. పనిలో పనిగా తన గొప్పతనాన్ని చాటుకోవడానికి నానా కారుకూతలూ కూస్తోంది. అది పెద్దమంత్రి అయితే కావొచ్చు కాని, ఎంతైనా అది గణతంత్ర కోతిస్వామ్యం కనుక, అందులో చట్టసభ, రాజ్యపెద్దా, విపక్షమూ వగైరా తగలడి ఉన్నాయి కనుక పరిస్థితి చేయి దాటింది.

బవిరిగడ్డం పద్ధతేం బాగాలేదని విపక్షం కట్టగట్టుకుని రాజ్యపెద్దకు ఫిర్యాదు చేసింది. రాజ్యపెద్ద కోతి.. విషయమేంటో కనుక్కుందామని పెద్దమంత్రికి కబురు పంపింది. కానీ అది విదేశాల్లో ఉందని సమాధానం వచ్చింది. వారం పోయాక మళ్లీ కబురు పెట్టింది. పెద్దమంత్రి అప్పుడే కోతులులాగే బండిలో విదేశానికి బయల్దేరిందని జవాబు వచ్చింది. అలాంటి చాలా జవాబుల తర్వాత.. ఇక తప్పదన్నట్టు బవిరిగడ్డం ఒకరోజు చికాకు పడుతూ రాజ్యపెద్ద ఉంటున్న చెట్టపైకొచ్చి ఓ కొమ్మల మధ్య అకులపై మల్లెపూలు పరిపించుకుని దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చుంది.

ముసలి రాజ్యపెద్ద మొదలుపెట్టింది.

‘నాయనా, బవిరిగడ్డమూ! నీ పద్ధతేం బాగోలేదు సుమా. మితనిద్రా మితాహారో, మితవస్త్రపరిగ్రహః మితభాషణమేకైకం భూషణం బ్రహ్మచా.. వొద్దులే బావుండదు! నువ్వు పెళ్లయినవాడివేగా. ఆ సుభాషితం పక్కనపెడదాం కాని, మితవిదేశీ ప్రయాణాణి అనేదాన్నిమాత్రం నువ్వు బాగా ఒంటబట్టించుకోవాలి బాబు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతావు.. ఇప్పటికే అయ్యావనుకో.. ఓ పక్క కోతులు ఆకలితో చస్తున్నాయి..’

‘సొద ఆపి.. సూటిగా, సుత్తిలేకుండా చెప్పు! అటువైపు నేను విదేశీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. పట్టు అంగీపైన ఈసారి నా పేరు కాకుండా నా అందచందాల ముఖంబొమ్మను వజ్రాలతో పొదిగించుకోవాలి. ఆ కాళాకారకోతి ఎదురుచూస్తూ ఉంటుంది. నేను త్వరగా వెళ్లాలి. సూటిగా సుత్తిలేకుండా..’ కసిరింది పెద్దమంత్రి.

ముసలి కోతి ఎప్పట్లాగే నొచ్చుకుని మళ్లీ గొంతు సవరించుకుంది.

‘నేను చెప్పేది నువ్వెప్పుడు విన్నావు కనుక! అయినా తప్పదుకదా. విదేశీగమనాలను కాస్త తగ్గించుకో. నీ దండగమారి ఖర్చులతో కోతుల ఊసురు పోసుకుంటున్నావు. ఒళ్లూపై తెలియకుండా నానా చెత్తా వాగుతూ మన రాజ్య పరువును, మన కోతుల పరువును పోగొడుతున్నావు.. ఇప్పటికే బజారుకెక్కిన నీ పరువును కొత్తకొత్త బాజార్లకు కూడా ఈడ్చుకుంటున్నావు..’

బవిరిగడ్డం గడ్డాన్ని నిమురుకుంటూ చిద్విలాసంగా నవ్వింది.

‘నువ్వు చెప్పుడు మాటలు విని బాగా చెడిపొయ్యావు.. ఇంతకూ ఇదేనా నువ్వు చెప్పాల్సింది.. ’

‘ఇక నేను చెప్పాల్సిందేముందిలే నా బొంద..’ అంటూ కిందికి చూసి చప్పట్లు కొట్టింది. కింది కొమ్మ మీద కూర్చున్న గుమాస్తా కోతి నాలుగు తాటాకుల కట్టలు పట్టుకొచ్చింది.

‘మన ఘనతవహించిన దేశాల తిరుగుబోతు పెద్దమంత్రిగారిపై విపక్షం చేసిన ఆరోపణలేంటో చదివి వినిపించు.. ’ రాజ్యపెద్ద గుమాస్తాను ఆదేశించింది.

చచ్చాన్రా బగవంతుడా అనుకుంటూ బగవంతుడి సాయం కోసం పైకి చూసింది గుమాస్తా కోతి. సరిగ్గా అప్పుడే  చెట్టుపైనుంచి చిన్న పచ్చివెలక్కాయ దాని గొంతులో పడింది. దాన్ని కష్టమ్మీద బయటకు తీసేసుకుని భయంతో వొణుకుతూ తాటకుల కట్ట విప్పి, ఒక ఆకు తీసి చదవడం మొదలుపెట్టింది.

‘‘శ్రీశ్రీశ్రీ పెద్దమంత్రి బవిరిగడ్డంపై మేం మనవి చేసుకుంటున్న ఆరోపణలు.. బవిరిగడ్డం విదేశాల్లో మన పరువు ఎలా తీస్తోందో విన్నవించుకుంటున్నాం. అది విదేశాల్లో ఏం మాట్లాడిందో దాని మాటల్లోనే చెబుతున్నాం..

మన బవిరిగడ్డం జానెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అక్కడికి వలసవెళ్లిన కోతులను పోగుచేసి ఇలా అంది ప్రభూ..

‘మన రాజ్యం విశ్వగురువు, పరమపవిత్రం, పాపనాశనం. అంతటి పుణ్యభూమిలో పుట్టినందుకు మీరూ, నేనూ గర్వించాలి. నాలాగా రొమ్మువిరుచుకుని తిరగాలి.  ప్రపంచ వానరజాతులకు చెట్లెక్కడం, పళ్లు కొరుక్కు తినడం, పేలు చూసుకోవడం, గుర్రుమనడం, కిచకిచలాడ్డం, పిల్లలను కిందపడిపోకుండా పొట్టకు కరిపించుకుని చెట్లపైన తిరగడం, మలవిసర్జన తర్వాత ఆకులతో స్వచ్ఛంగా తుడుచుకోవడం(ఇది నేను నేర్పిన విద్య) వంటి సమస్త విద్యలన్నీ నేర్పించింది మన రాజ్యపు కోతులే. అంతటి ఘనమైన గడ్డపై పుట్టినందుకు ఇదివరకు మీరు సిగ్గుతో, అవమానంతో తోకను కాళ్లకింద నించి పైకి తెచ్చుకుని నోట్లో పెట్టుకునేవాళ్లు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి పారిపోదామా అనుకునేవాళ్లు. ఇప్పడు ఆ అవసరం లేదు. నేను పెద్దమంత్రినయ్యాక మన రాజ్యప్రభ మహాగా వెలిగిపోతోంది కనుక ఆ తోకలను నోట్లోంచి తీసేసి ముడ్డి వెనుక నిటారుగా ఎత్తి పెట్టుకోండి. వీలైతే నా పేరు చెక్కిన చిరుమువ్వలను వాటికి కట్టుకుని గలగల్లాడిస్తూ ఊరేగండి.. ’

మా ఆరోపణ.. మనది గొప్ప రాజ్యమంటూనే మన రాజ్యంలో పుట్టడం సిగ్గుచేటని చెప్పింది బవిరిగడ్డం. దీనికి సమాధానం చెప్పించాలి..’’ గుమాస్తా కోతి చదవడం  ఆపింది.

రాజ్యపెద్ద బవిరిగడ్డంవైపు జవాబు చెప్పమన్నట్టు చూసింది. బవిరిగడ్డం ఇరకాటంలో పడింది కానీ వెంటనే తేరుకుంది.

‘ఏదో నోటిదూలతో అలా అనేశాను. పైగా నేను చెప్పిందంతా పొల్లుపోకుండా అచ్చేసే పత్రికలు మన రాజ్యంలో బోలెడున్నాయిగా. నా వాగ్ధాటి ఏంటో అందరికీ తెలుస్తుందని అలా వాగాను. అయినా వానరాలకు సుబ్బరంగా ముడ్డి కడుక్కునే విద్యనేర్పానన్న మహత్తర సత్యాన్ని చెప్పినందుకు, మన దేశాన్ని అంత గొప్పగా పొగిడినందుకు కృతజ్ఞత చూపి, శభాష్ అనక ఉడుక్కుంటారెందుకు? ఆ ప్రశ్నకు ఇదే నా జవాబు.’

రాజ్యపెద్ద మళ్లీ సైగ చేసింది. గుమాస్తా కోతి మరో తాటాకు అందుకుంది.

‘‘బవిరిగడ్డం కొండముచ్చుల రాజ్యానికి వెళ్లినప్పుడు ఇలా అంది ప్రభూ..

‘మీ రాజ్యానికి రావడానికి ఇదివరకు మా రాజ్య పెద్దమంత్రులుగా పనిచేసినవాళ్లు ఇష్టపడలేదు. వాళ్లకు మీరంటే చులకన. కండకావరం. అసలు మీ దేశం ఏ దిక్కున ఉందో కూడా తెలియని అజ్ఞానులు. అందుకే భూమి పుట్టినప్పట్నుంచి మా రాజ్యనాయకులు ఎవరూ మీ రాజ్యానికి రాలేదు. రావడానికి పడవలున్నా, దారులున్నా, కాస్త కోతిమాంసం పడేస్తే ఎగరేసుకొచ్చే గద్దలున్నా మా రాజ్యనేతలెవరూ మీ రాజ్యానికి రాలేదు.  కానీ నేను మహాజ్ఞానిని. ఈ సమస్త విశ్వంలో నాకంటే ఎక్కువ తెలిసిన కోతి మరొకటి లేదు. ఈ లోకంలో నాకు తెలియనిదేదీ లేదు. అయినా నాకు మీరంటే మహాగౌరవం. మీరు నాకంటే గొప్పవాళ్లు. మీ రాజ్యమన్నా, మీ పాలకులన్నా కాళ్లపైన పడిపోతాను. అందుకే ఆగమేఘాలమీద దారులు వేయించుకుని మరీ వచ్చాను. మీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. మా కోతుల రాజ్యంలోని చెట్లు, పుట్టలు, పిట్టలు, చేపలు, కప్పలు.. ఏదీ కావాలన్నా రాసిస్తాను. మీరెంత మహానుభావులు! మీరే లేకుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా? మా రాజ్యసమస్యలపై మాకంటే మీకే ఎక్కువ అవగాహన. మా వాళ్లు దద్దమ్మలు, చవటలు, సన్నాసులు. మీరు పరమోత్తములు. మీరు లేందే మేం బతకలేం. దాసోహం.. దాసోహం..’

మా ఆరోపణ.. బవిరిగడ్డం అబద్ధాలకు ఇది పరాకాష్ట ప్రభూ. కొండముచ్చుల రాజ్యానికి మన రాజ్యపెద్దలు, పెద్దమంత్రులు బోలెడుసార్లు వెళ్లారు. వాళ్లు వెళ్లిన దార్లు ప్రయాణాల ధాటికి కుంగిపోతే, మళ్లీ మట్టిపోయించి ఎత్తుచేయించుకున్నాం కూడా. అందుకు సాక్ష్యంగా, ఆ దారుల ఛాయాచిత్రాలను, వాళ్లు కొండముచ్చుల రాజ్యం నాయకులతో దిగిన ఛాయాచిత్రాలను జతచేస్తున్నాం. బవిరిగడ్డం మనం అజ్ఞానులమంటూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ, మన పరువు తీస్తోంది. వాళ్లకు మన దేశసంపదను అప్పనంగా కట్టబెడతానంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా చెబుతోంది. దీనికి సమాధానం చెప్పించాలి’’ గుమాస్తా ఆపింది.

బవిరిగడ్డం పగలబడి నవ్వింది.

‘ఇదీ ఒక ఆరోపణే! ఇది నా అబద్ధాలకు కాకుండా నా చమత్కారానికి పరాకాష్ట అనుకుని హర్షించండి. కొండముచ్చులు మంచిగా ఆతిథ్యమిస్తాయని, నా గొప్పలు చెప్పుకోవడానికి అలా అంటే గమ్మత్తుగా ఉంటుందని అనేశాను. వాళ్ల ఆరోపణలకు ఇదే నా తమాషా జవాబు. కోతన్నాక కూసింత కళాపోసన ఉండాల.. హ్హహ్హహ్హ.. హ్హహ్హహ్హ.. ఊ తర్వాతి ఆరోపణ.. హ్హహ్హహ్హ..’

రాజ్యపెద్దా, గుమస్తా బిత్తరపోయాయి. రాజ్యపెద్దకు సర్వసత్తాక, గణతంత్ర, కోతిస్వామ్య విశేషణాలు గుర్తుకొచ్చి మళ్లీ గుమాస్తాకు సైగ చేసింది.

‘‘బవిరిగడ్డం బెత్తెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అధికార, అనధికార సమావేశాల్లో కోతిసంబంధాల గురించి ఇలా అంది ప్రభూ..

‘మీరందరూ సుఖంగా కాపరం చెయ్యాలి. భర్తకోతులు భార్యకోతులను బాగా ఏలుకోవాలి. భార్యకోతులు భర్తకోతులకు సేవలు చెయ్యాలి. మా రాజ్యంలోని వాళ్లకు ఎప్పుడూ ఇదే బోధిస్తుంటాను. పెళ్లిళ్లు స్వర్గంలో చేసినా కాపరం మాత్రం ఈ లోకంలోనే చెయ్యాలి కదా. నాతిచరామి అని అగ్నిసాక్షిగా పెళ్లాడిన పెళ్లాన్ని గాలికొదిలేయడం న్యాయమా?  ఇక అమ్మలను నిత్యం, అణుక్షణం క్షణక్షణం ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మా అమ్మ నానా కష్టాలూ పడి, కొండలెక్కి, లోయల్లోకి దిగి పళ్లుగిళ్లూ తెచ్చి నన్ను సాకింది. ఆమెను తల్చుగుంటే గన్నీళ్లు ధారాపాతంగా గారిపోతాయి. కాటికి కాళ్లుచాపుకున్న ఆమె అంటే నాకెంతో ప్రాణం. ఇప్పటికీ ఏడాది ఒక్కసారి మాత్రమే ఆమె ఇంటికెళ్లి కాళ్లు మొక్కి, ఆమె పెట్టే మిఠాయి తిని వస్తుంటా. మాతృదేవో భవ.. ఎవరు రాయగలరూ.. అమ్మా అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ.. ’

మా ఆరోపణ.. ఇది పూర్తిగా బవిరిగడ్డం వ్యక్తిగత విషయంగా కొట్టిపారేలేం ప్రభూ.. వ్యక్తిగత జీవితాలు మీమీ సొంతం.. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. బవిరిగడ్డం పెళ్లాన్ని వదిలేసి, పరాయి దేశాల్లో, మన దేశంలో సందు దొరికినప్పుడల్లా పెళ్లాలను ఏలుకోవాలని చెబుతోంది. అలా చెప్పే నైతిక అర్హత దీనికి లేదు. తన పెళ్లాం కాపరానికొస్తానని బతిమాలుతున్నా ఆమెను ఏలుకోనందుకు దీన్ని దండించాలి. అలాగే, ముసలి తల్లిని ఏడాదికోసారి చూస్తానంటూనే తల్లిని నిత్యం బాగా చూసుకోవాలని ఊకదంచింది బవిరిగడ్డం. తల్లిని గాలికి వదిలేసిన దీనికి అలా చెప్పే అర్హత లేదు. ముసలి తల్లిదండ్రులను సాకకపోతే శిక్షలు వేయాలని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. బవిరిగడ్డం దీన్నిపాటించనందుకు శిక్ష వేయాలి..’’ గుమాస్తా కంఠం వొణికింది.

బవిరిగడ్డం ముఖం ఎర్రబారింది. కాసేపు గమ్మునుండి మళ్లీ దూకుడు మొదలెట్టింది.

‘ఇదొక ఆరోపణా..? నేను పెళ్లాన్ని వదిలేశాను. అయితే ఏంటట? నాకు పెళ్లాంకంటే నా తళుకుబెళుకుల బట్టలు, నా ఊకదంపుడు, నా స్వీయఛాయాచిత్రాలంటేనే ఇష్టం. వీటికి అడ్డమొస్తుందని కాపరం చెయ్యడం లేదు. నాతో బలవంతంగా కాపరం చేయించలేరు కదా. కనుక నా హక్కునూ మీరు గౌరవించాలి. ఎంతైనా ఇది కోతిస్వామ్యం కదా. ఇక మా తల్లి సంగతి. లోకంలో తల్లిదండ్రులను వీధిన పడేసిన కోతులెన్నిలేవు? యథాప్రజా తథా రాజా. ముందు వాటిని శిక్షించాక, నన్ను శిక్షించండి.. ఇదే నా జవాబు.’

గుమాస్తా కోతి ఈసారి రాజ్యపెద్ద చెప్పకుండానే మరో తాటాకుల కట్ట అందుకుంది..

‘‘‘బవిరిగడ్డం మూరెడు కోతుల రాజ్యంలో వివేకం మరిచి మమ్మల్నిఇలా కించపరచింది ప్రభూ..

‘‘బవిరిగడ్డం వేలెడు కోతుల రాజ్యానికి వెళ్లి సోయి లేకుండా ఇలా..

‘‘బవిరిగడ్డం పొట్టితోక కోతుల రాజ్యానికి వెళ్లి బుద్ధిలేకుండా..

‘‘బవిరిగడ్డం పొడవుతోక కోతుల రాజ్యానికి వెళ్లి..

‘‘బవిరిగడ్డం ఎర్రమూతి కోతుల రాజ్యానికి..

‘‘బవిరిగడ్డం తెల్లమూతి కోతుల…’’

అన్ని ఆరోపణలకూ బవిరిగడ్డం తిరుగులేని జవాబులు చెబుతూ పోయింది. గుమాస్తా మరో కట్ట విప్పబోయింది.

బవిరిగడ్డానికి అటుపక్క విదేశీ ప్రయాణ గడియలు దగ్గర పడుతున్నాయి. అది పైకి లేచింది.

‘కట్ట విప్పకు. రాజ్యపెద్దా..! అలాంటి ఎన్నికట్టలున్నా ఒకటే జవాబు. నోటితో చెప్పను. కళ్లారా చూపిస్తా’ అంటూ తన రెండు కాళ్లూ పైకెత్తింది.

కాళ్లలోంచి నెమ్మదిగా లోహపు చక్రాలు బయటకొచ్చాయి. ఒక్కమారు కీచుమంటూ గిర్రున తిరిగాయి.

వాటికి పచ్చి నెత్తుటి మరకలు కూడా అంటుకుని ఉన్నాయి.

*

పల్లెని మింగిన పెట్టుబడి ..

 

 palle

(శ్రీ ఆదిభట్ల విద్యాసాగర్ గారి “పల్లెను మింగిన పెట్టుబడి, గ్రామీణ ఆర్థికం-ఒక పరిశీలన” మీద డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సెప్టెంబర్ 13, 2012న జరిపిన చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, భూపతిరాజు ఉష, కట్టా మూర్తి, కట్టా విజయ, చేకూరి విజయసారధి, నర్రా వెంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, ఆరి సీతారామయ్య, పిన్నమనేని శ్రీనివాస్, సుధ రాజు, Ch. పుష్పావతి, కాజ జనార్ధనరావు.

చర్చలో ముఖ్యాంశాలను సమీక్షించిన సభ్యుడు: ఆరి సీతారామయ్య)

*

ఒకప్పుడు గ్రామాలు బాగా ఉండేవనీ, అక్కడి ప్రజలు ప్రేమాభిమానాలతో, పరస్పర సహకారంతో జీవించేవాళ్ళనీ, ఈ మధ్య గ్రామాలు పూర్తిగా మారిపోయాయనీ , అప్పటి ఆప్యాయతలూ, ఆత్మీయతలూ ఇప్పుడు లేవనీ, అప్పటి జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిందనీ తెలుగు ప్రజానీకంలో చాలామంది అభిప్రాయం. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆదిభట్ల విద్యాసాగర్ శ్రీకాకుళం జిల్లాలోని చాలా గ్రామాల్లో చేసిన ప్రత్యక్ష పరిశోధన, విషయసేకరణ ఫలితమే ఈ పుస్తకం. ఈ 400 వందల పేజీల పుస్తకంలో ఆయన బ్రిటీష్ పరిపాలనా కాలం నుంచి 2011 వరకు గ్రామాల ఆర్థిక పరిస్థితిలో క్రమంగా వచ్చిన మార్పుల గురించి సాక్షాధారంగా రాశాడు. నిజానికి శ్రీకాకుళం పల్లెల్లో వచ్చిన మార్పులు ఈ పరిశోధనకు కేంద్రబిందువు అయినా, ఇవి ఆంధ్ర అంతటా, భారత దేశం అంతటా జరిగిన మార్పులే.

భూమిని సొంత ఆస్తిగా పరిగణించడం బ్రిటీష్ వారి పాలనలో మొదలయిందని రాశాడు రచయిత. శిస్తు వసూలు చెయ్యటం సులభంగా ఉండటానికి, జమీందారీ విధానాన్నీ, కొన్నిచోట్ల రైత్వారీ (ఇనాందారీ) విధానాన్నీ ప్రవేశపెట్టారు పాలకులు. స్వతంత్రం వచ్చిన తర్వాత భూమికోసం జరిగిన ఉద్యమాల కారణంగా జమీందారీ ఇనాందారీలు అంతరించి భూమి పెద్ద పెద్ద రైతుల చేతుల్లోకి వచ్చింది. గత 50-60 సంవత్సరాల్లో కుటుంబ సభ్యులమధ్య ఆస్తుల పంపకం వలనా, భూసంస్కరణల వలనా, పెద్ద కమతాలు చాలా వరకు పోయి చిన్న కమతాలు ఏర్పడ్డాయి. శ్రీకాకుళంజిల్లాలో 2005 నాటికి 5 ఎకరాలకంటే తక్కువ భూమి ఉన్న రైతుల శాతం 82. భూమిలో 66% వీరి అధీనంలో ఉంది.

వ్యవసాయంచేసి ధనవంతులైన వారు అరుదు. కొన్ని చోట్ల చిన్న కమతాల్లో వ్యవసాయం చెయ్యటం వల్ల వచ్చే ఆదాయం బతకటానికి కూడా సరిపోదు. ఎక్కువ ఆదాయం వస్తుందనే భ్రమతో అప్పుచేసి పెట్టుబడి అధికంగా ఉండే పంటలు వేసి ఉన్న పొలం కూడా పోగొట్టుకున్న సన్నకారు రైతుల కథ అన్ని ప్రాంతల్లోనూ తెలిసినదే.

ఈ మధ్య తమ భూమిని అమ్మేసో, కౌలుకు ఇచ్చో, పనికోసం జీవనోపాధికోసం పట్టణానికి పోతున్నాడు సన్నకారు రైతు. వ్యాపార పంటలు అధికం కావటం వల్ల పెద్ద రైతులు కూడా తక్కువ కూలిఖర్చుతో చెయ్యగల వ్యవసాయాలు చేస్తున్నారు. క్రమంగా పల్లెటూరి భూమి పెట్టుబడిపెట్టగల వ్యాపారస్తుల చేతుల్లోకో, వలస వస్తున్న రైతుల చేతుల్లోకో పోతుంది. కొత్త వ్యాపారాలు పెడతామని వస్తున్న కంపెనీలకు ప్రభుత్వం వందల వేల ఎకరాల పల్లెభూములను చవుకగా (రైతుకు పరిహారంగా తక్కువ ఇచ్చి) సేకరించి ఇచ్చేస్తుంది.

సాంప్రదాయ వ్యవసాయం తగ్గిపోవటం వల్లా, వ్యవసాయం మీద సన్నకారు రైతు బతకలేకపోవటం వల్లా, వ్యవసాయ రంగంలో పల్లె జీవనంలో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్లా, ఒకప్పటి కులవృత్తులు అంతరించాయి. వ్యవసాయానికి సంబంధించిన కులవృత్తులు చేసుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు బతుకుతెరువు కోసం, మరో జీవన విధానాన్ని వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు.

పెట్టుబడుల ప్రభావంతో వచ్చిన పెను మార్పులు వ్యవసాయరంగంలోనే కాదు, ఆదివాసుల, దళితుల, మత్శకారుల, చేనేత కార్మికుల జీవితాల్లో కూడా వచ్చాయి. వీరిలో కూడా చాలామంది బతుకుతెరువుకోసం పట్టణాలకు వలస వెళుతున్నారు.

మా సభ్యుల అభిప్రాయంలో వ్యవసాయానికి సంబంధించిన ఇన్ని అంశాల గురించి (పంటల క్రమం, పశువుల వాడుక, నీటి పారుదల, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, మార్కెట్) ఇంత విస్తృతంగా విషయసేకరణ జరిపి ప్రచురించిన పుస్తకం ఇదివరకు మేము చదవలేదు. గ్రామ జీవితం ధ్వంసం అయిందని అందరూ చెప్పుకుంటున్నా  దానికి కారణాలు ఇంత లోతుగా అధ్యయనం చేసినవారు అరుదేనని మా అభిప్రాయం.

 

పెట్టుబడికులవృత్తులు

పెట్టుబడి వలన మంచి జరిగిందా చెడు జరిగిందా? “పల్లెను మింగిన పెట్టుబడి” ఈ పుస్తకం శీర్షిక కాబట్టి పెట్టుబడి వల్ల చెడే జరిగింది అని రచయిత అభిప్రాయం. పెట్టుబడులు తీసుకువచ్చిన మార్పుల వలన ఒకనాటి పల్లె వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాని ఉత్పత్తి పెరిగింది. అసమానతలూ పెరిగాయి. ఒకప్పుడు పలెల్లో ఉన్న పేదరికం ఇప్పుడు పట్టణాలలో కనిపిస్తుంది.

కానీ వ్యవసాయంతో సంబంధం ఉన్న కులవృత్తులవారు   వ్యవసాయం యాంత్రికం కావటంతో మరో జీవనోపాధి వెతుక్కోక తప్పలేదు. అయినా కులవృత్తులు పోవటం మంచిదయిందంటాడు రచయిత. “వ్యవసాయం అనేది ఒక వృత్తిగా స్వతంత్ర వృత్తి కాదు. అది నిలబడటానికి అనేక వృత్తుల సహకారం అవసరం. నిజానికి మనిషి శరీరంలో గుండె వ్యవసాయం అనుకుంటే మిగతా అన్నిభాగాలను మిగతా వృత్తులతో పోల్చవచ్చు. కానీ వ్యవసాయమే వృత్తిగా ఎదిగిన రైతాంగవిభాగాలు మిగతా వృత్తుల ప్రజానీకంపై నిరంతరాయంగా దోపిడి సాగించారు. వాళ్ళ మిగులు విలువను కాజేసి గ్రామీణ ధనిక రైతాంగంగా రూపొందారు. దీనితో వాళ్ళకు మిగతా అన్ని వృత్తుల ప్రజానీకమూ ‘నీచంగానూ’ వాళ్ళ వృత్తులు వ్యవసాయంకంటే నీచ వృత్తులుగానూ కనబడ్డాయి.” ఇదీ రచయిత అభిప్రాయం.

పెట్టుబడి తెచ్చిన మార్పుల వలన “గ్రామీణ వృత్తులు చేసుకునే ప్రజానీకమూ, వ్యవసాయ కూలీలయిన దళితులూ తమ శ్రమను ఎంతోకొంత స్వేచ్చతో అమ్ముకోగలిగే ప్రాంతాలకు తరలివెళ్ళారు.”

“ఇంతవరకూ వారి శ్రమపై ఎదిగిన వ్యవసాయ వృత్తి ఈ దెబ్బతో ఒడుదుడుకులకు గురైంది. దాన్నే వ్యవసాయ రంగం సంక్షోభం అంటూ వృత్తుల్ని కాపాడాలనీ, తిరిగి గ్రామాలను కళకళలాడేలా చేయాలనీ రాజకీయ, సాంఘిక ‘ఉద్యమకారులు’ నినదిస్తున్నారు. ఆ మేరకు మన ‘ప్రజారచయితలు’ పోయిన స్వర్ణయుగంగురించి తెగవిలపిస్తున్నారు.” (పేజీ 31)

వెటకారం పక్కనబెట్టి, నిజానిజాలు పరిశీలిస్తే వ్యవసాయదారులు కొన్ని వృత్తులను నీచ వృత్తులుగా చూసింది వాస్తవమే,  కానీ అన్ని వృత్తుల ప్రజానీకాన్నీ నీచంగా చూశారన్నది నిజం కాదు. ఉదాహరణకు  మాకు తెలిసిన గ్రామాల్లో నాగళ్ళు తయారు చేసే వడ్రంగిని, కుండలు తయారు చేసే కుమ్మరిని, నీచ వృత్తులు చేసే వారిగా పరిగణించేవారు కాదు.  నీచ వృత్తులు చేసే వారిగా చూసిన వారిని పల్లెల్లో వ్యవసాయదారులే కాదు, ఇతర వృత్తుల్లో ఉన్న పట్టణవాసులు కూడా అదే విధంగా చూశారు, చూస్తున్నారు. అంటే అది వ్యవసాయానికి సంబంధించిన వివక్ష కాదు, భారత సమాజానికి సంబంధించిన వివక్ష.

ఇంకొక విషయం- పెద్ద రైతు ఇతర కులాలవారి అదనపు విలువను కాజేసి ధనికుడయ్యాడని రచయిత అభిప్రాయం. అందువల్ల  ఈ పల్లె  వ్యవస్థ  విధ్వంసం అయినందుకు  సంతోషం  వ్యక్తపరుస్తున్నాడు. కానీ పెద్దరైతేకాదు, సన్నకారు రైతుకు కూడా  పల్లెల్లో కులవృత్తులు చేస్తున్న అందరి సహకారం అవసరమే. నిజానికి భూమిలో ఎక్కువభాగం సేద్యం చేస్తున్నది సన్నకారు రైతులే. అంటే పల్లె సంస్కృతి మీద ఆధారపడు తున్నవారిలో ఎక్కువమంది సన్నకారు రైతులే. సన్న కారు రైతులు కులవృత్తులవారి అదనపు విలువను కాజేసి బతికారా? లేదా? పెద్దరైతు చేస్తే తప్పుగాని చిన్నరైతు చేస్తే తప్పులేదా?

పల్లెటూళ్ళూ, కులవృత్తులూ ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలయింది. పెద్ద రైతులు ఏర్పడింది బ్రిటీష్ పాలన కాలంలోనే (ఈ పుస్తకం ప్రకారం). అంతకుముందు అందరూ కౌలుదార్లే. కులవృత్తులు  ఎలా  ఏర్పడ్డాయి?  వ్యవసాయానికీ కులవృత్తులకూ  సంబంధం  ఎలా  మొదలయిందీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో లేవు.

పుస్తకంలో  చెయ్యవలసిన మార్పులు

 

కాపీ  ఎడిటర్లు  లేకపోవటం వలన  తప్పులు లేకుండా తెలుగు పుస్తకాలు రావు అని సరిపెట్టుకోవటం మాకు అలవాటయింది. కాని ఈ పుస్తకంలో మామూలుకంటే పదిరెట్లు ఎక్కువ తప్పులున్నట్లుంది. అయినా ఇది అందరూ చదవ వలసిన పుస్తకం అని మా ఏకగ్రీవ అభిప్రాయం. ఈ పుస్తకాన్ని సవరించి మరోసారి ప్రచురిస్తారనే ఆశతో ఇందులో చెయ్యవలసిన మార్పుల గురించి ప్రస్తావిస్తాను.

 1. తెలుగులో పుస్తకం రాస్తూ, గణాంకాల పట్టికలు అన్నీ (77) ఆంగ్లంలో ప్రచురించారు. అవికూడా తెలుగులో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువమంది పాఠకులకు అందుబాట్లో ఉండేవి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్ప్రెడ్‌షీట్స్‌ తెలుగులో రాసే అవకాశం ఉందికాబట్టి అది కష్టమైన పనికూడా కాదు.
 2. ఏదో ఒక విషయం గురించి చర్చించేటప్పుడు దాని ఆధారాలు ఫలానా పట్టికలో ఉన్నాయి అని చెప్తాడు రచయిత. కాని ఆ పట్టికలో అవి ఉండవు. ఉదాహరణకు 1971 లో శ్రీకాకుళం జనాభా 22.24 లక్షలు అని (పేజీ 25), ఇది మొదటి పట్టికలో ఉందంటాడు రచయిత. కాని ఆ సంఖ్య ఆ పట్టికలో లేదు.

ఈ పుస్తకంలో ముఖ్యమైన పట్టికలు చాలా  ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భూయాజమాన్యం గురించిన వివరాలున్న పట్టిక (పట్టిక  4) వాటిలో ఒకటి. “పట్టిక 4లో 1977 నుంచి 2005 వరకూ వచ్చిన మార్పులను చూడవచ్చు” అని  రచయిత చెప్పినా, 1977 నాటి వివరాలు ఆ పట్టికలో లేవు.

 1. కొన్నిచోట్ల వాచకంలో చెప్పినదానికీ పట్టికలో ఉన్న దానికీ పొంతనలేదు. పట్టిక 65 ఆంధ్రప్రదేష్‌లో దళితుల అక్షరాశ్యత గురించి అని ఉంది. వాచకంలో ఈ పట్టిక శ్రీకాకుళం జిల్లాలో దళితుల అక్షరాశ్యత గురించి అని తెలుస్తుంది.

ఇలాంటి తప్పులు ఈ పుస్తకంలో కొల్లలు.

 1. గణాంకాలు పట్టికలలో ఉన్నాయి కాబట్టి వాటిమీద వ్యాఖ్యానం వాచకంలో ఉంటే చాలు. అవే సంఖ్యలను మళ్ళా ప్రస్తావించనవసరం లేదు. అలా చెయ్యకుండా ఉన్నట్లయితే ఈ 400 పేజీల పుస్తకం 300-350 పేజీల్లో వచ్చేది, చదవటానికి సులభంగా కూడా ఉండేది.
 2. అనవసరమైన పట్టికలు చాలా ఉన్నాయి. అవి అవసరం లేవని ఎందుకనుకుంటున్నామంటే పట్టీకల్లో ఉన్న సంఖ్యలమీద ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి. రచయిత ఈ వివరాలు సేకరించాడు కాబట్టి పుస్తకంలో పెట్టాడేమో అనిపిస్తుంది.
 3. పుస్తకం అంతటిలో భూమికొలతకు ఒకే పరిమాణం వాడితే అర్థంచేసుకోవటం సులభంగా ఉండేది. ఇప్పుడు కొన్ని చోట్ల హెక్టేర్లు కొన్ని చోట్ల ఎకరాలు వాడారు.
 4. మిగతా కొలతలకు కూడా పరిమాణాలలో మార్పులు చెయ్యకుండా ఉన్నట్లయితే పాఠకులకేకాదు, రచయితకు కూడా కొంత గందరగోళం తప్పేది. ఉదాహరణకు, “గరిష్టంగా 720 మిలియన్‌ కేజీల దారం మాత్రమే ఎగుమతి చేయాలనే నిబంధన మూలంగా ఎగుమతులు 72 కోట్ల కేజీలయింది.” (పేజీ 377). 72 కోట్లు అంటే 720 మిలియన్లేకదా.
 5. ఒక సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలుండాలో, అసలు ఉండాలో అక్కరలేదో,  జాగ్రత్తగా ఆలోచించాలి. ఉదాహరణకు 28వ పట్టిక చూస్తే 1969-70 నాటికి నూతుల నుంచి  నీళ్ళు  పట్టి వ్యవసాయం చేసిన  భూమి  11793.24 ఎకరాలు  అని  ఉంది.  అదే  పట్టికలో  1975-76 లో  4996 అని  మాత్రమే  ఉంది.  అంటే  4996.00 అనా?  లేక  ఆ  సంవత్సరం అంత  జాగ్రత్తగా  లెక్కపెట్టలేదు  కాబట్టి  దశాంశ  బిందువు  వాడలేదనా?

ఒకే పట్టికలో కొన్ని సంఖ్యలకు దశాంశబిందువు తర్వాత రెండు స్థానాలూ, కొన్నిటికి ఒకే స్థానం, కొన్నిటికి అసలు లేకపోవటం అంటే అర్థం ఏంటీ?   ఈ పరిస్థితి ఒక్క 28వ  పట్టికలోనే కాదు, ఈ పుస్తకంలో ఉన్న దాదాపు అన్ని పట్టికలకూ వర్తిస్తుంది. గణాంకాలను  ఇంత  విస్తృతంగా  వాడదలచిన  వారెవరైనా ముందుగా  significant figures అంటే  ఏంటో  అధ్యయనం చెయ్యాలి.  లేదా గణాంకశాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

 1. “బోదెపు రాజారావు అనే రైతు కౌలు కోసం ఐదు ఎకరాల భూమిని తీసుకున్నారు.” (పేజీ 89). ఐదెకరాల భూమిని ఆయన కౌలు కోసం తీసుకోలేదు. ఏదో పంట  వేసుకుందామని  కౌలుకు తీసుకున్నాడు.

ఈ బోదెపు రాజారావు గురించి రాస్తూ మొదటి వాక్యంలో “తీసుకున్నారు” అన్న రచయిత రెండో వాక్యంలో “బాకీపడ్డారు” అనీ, మూడో వాక్యంలో “వలస వెళ్ళాడు” అనీ రాశాడు.

 1. నీటి పారుదల గురించి రాస్తూ టూబ్‌వెల్స్, బోర్‌వెల్స్ కింద జరిగిన వ్యవసాయం వివరాలు 196-197 పేజీల్లో రాశాడు రచయిత. కానీ ఈ టూబ్‌వెల్స్‌కీ బోర్‌వెల్స్‌కీ తేడా ఎంటో ఎక్కడా ప్రస్తావించలేదు.
 2. “వరి పంటకు ఒక సంవత్సరానికి (ఒకసారి పండిస్తే) 107 మంది కూలీలు అవసరం అవుతారు” (పేజీ 142). ఎంత పొలంలో? ఒక ఎకరంలోనా? హెక్టేర్‌లోనా? రోజూ 107 మంది అవసరమా? 107 పనిరోజుల అవసరమా?

ఈ ఒక్క చోటే కాదు. 59 వ పేజీలో 80 సెంట్ల పొలంలో చెరకుపంట పండించటానికి 311 మంది కూలీలు అవసరం అవుతారు అని రాశాడు రచయిత. 311 కూలీలా?  కూలిరోజులా? గంటలా?

 1. ఈ వాక్యం చూడండి: “అంటే ఈ దశాబ్దంలోనే దేశంలో ప్రతీ 4గురు రైతులలో ఒక రైతును మించి పొలాన్ని వీడాడని అర్ధమవుతుంది.” ఇది ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులోకి దించిన వాక్యం. దీని భావం: That means more than one farmer in four have left the land in this decade. తెలుగులోకంటే ఇంగ్లీషులో సులభంగా లేదూ?

ఇలాంటిదే మరో వాక్యం: “దేశవాళీ విత్తన ఉత్పత్తి, దేశవాళీ ప్రభుత్వ పరిశోధనల స్థానంలో దేశవాళీ కంపెనీలవైపు, విదేశీ కంపెనీలవైపు భారతీయ రైతు విత్తనం కోసం చూడాల్సివచ్చింది.” (పేజీ  209)

ఇంకొకటి: “గ్రామీణ రైతాంగాన్ని మార్కెట్ యార్డులను ఎందుకు ఉపయోగించుకోరూ?” (పేజీ 238)

ఇలాంటి కృతకమైన వాక్యాలు ఈ పుస్తకంలో కొల్లలు.

 1. ఇక అర్ధ, అర్థ ల గురించి. ఇది రెండు వేర్వేరు  అనర్థాల మేలు  కలయిక.  మొదటిది, semi- అన్న ఉపసర్గాన్ని  (ప్రీఫిక్స్)  “అర్ధ”  అని ఎవడో మహానుభావుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఆ తర్వాత మన ఖర్మకొద్దీ అర్థకీ అర్ధకీ తేడా తెలిసిన తెలుగువాళ్ళు కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఇక చూడండి దీని ప్రభావం.

అర్థబానిస (పేజీ 336)

అర్థశతాబ్దం (పేజీ 361)

అర్ధశాస్త్రవేత్తలు (పేజీ 150)

ఆర్ధిక వ్యవస్థ (పేజీ 150)

ఈ మాటలు చూస్తుంటే తెలుగు భాషకు పట్టిన గతికి ఏడుపు రావటం లేదూ?

 1. “ఒక చారెడు నేలకోసం బందీ అయిపోయి తమ దేశాన్ని ఇతర దేశస్థులు దండయాత్రలు చేసి ఆక్రమించుకుంటున్నా పట్టని స్థితిలో భూమికి బందీ అయి భారత రైతు కొనసాగిన స్థితి వుందని సెల్యూకస్ తన పుస్తకంలో వివరించారని అంబేద్కర్ ఉల్లేఖించాడు.” (పేజీ 74)

అంటే  సెల్యూకస్  పుస్తకాన్ని  అంబేద్కర్  చదివి,  దానిమీద  వ్యాఖ్యానిస్తే,  దాన్ని  రచయిత  చదివి  మనకు  చెప్తున్నాడన్న  మాట.  సెల్యూకస్ పుస్తకానికిగానీ, అంబేద్కర్ ఉల్లేఖనానికిగానీ మూలాలు రచయిత మనకు చెప్పలేదు. ఇదంతా ఎందుకు విడ్డూరంగా ఉందంటే, భూమిమీద వ్యక్తుల యాజమాన్యం బ్రిటీష్ పాలన  కాలంలో మొదలయిందని చెప్పిన  రచయిత అలాంటిది సెల్యూకస్ కాలంలోనే ఉందని చెప్తున్నట్లులేదూ? ఏది నిజం?

ఇలా  తప్పుల పట్టిక రాసుకుంటూ  పోతే  చాలా పొడుగవుతుంది.  అయినా గత  యాభై  సంవత్సరాల్లో  మన  గ్రామాల్లో  వచ్చిన  ఆర్థిక  మార్పుల గణాంకాలు  వివరంగా  తెలుసుకోదలచిన  వారికి  ఈ పుస్తకం చాలా  ఉపయోగకరం అని మానమ్మకం.

 

పల్లెను మింగిన పెట్టుబడి

గామీణ ఆర్థికం – ఒక పరిశీలన

ఎస్. ఎ. విద్యాసాగర్‌

పీకాక్ బుక్స్, హైదరాబాద్

 

దేవుళ్లకు జడ్జీల శఠగోపం

 

-సత్యమూర్తి

చాలా మందికి ప్రశ్నలు గిట్టవు. అవి కొత్తవీ, ఘాటువీ అయితే అసలు గిట్టవు. ప్రశ్నలేవైనా అవి స్వీకరించేవాళ్లను బట్టి ఆలోచనో, ఆగ్రహమో పుట్టిస్తాయి. తోలు మందంగా ఉన్నవాళ్లకు ఏవీ పుట్టవనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే వాళ్ల గురించి. కాస్త బుద్ధీజ్ఞానమూ ఉంటాయని, మంచీ చెడూ తెలుస్తాయని అని అనుకునే జడ్జీల గురించి. అయినా, రోజూ కోర్టుల్లో కక్షిదారులకు శరపరంపరగా ప్రశ్నలు వేసే జడ్జీలకు నా బోటి సామాన్యుడు వేసే ఈ ప్రశ్నలు వినబడతాయా? అని.

జడ్జీలు కోర్టుల్లో పెద్దోళ్లయితే కావచ్చు కానీ బయటి మాత్రం వాళ్లు కూడా మనందరిలాంటి వాళ్లే. అందరి మాదిరే తిరుగుతుంటారు. ఉరిశిక్షల వంటి పేద్ద కఠినశిక్షలు వేసే పేద్ద జడ్జీలైతే వై ప్లస్, జెడ్ ప్లస్ గట్రా సెక్యూరిటీతో తిరుగుతుంటారు. తిరిగే హక్కు అందరికీ ఉంది. ఎక్కడైనా తిరగొచ్చు. కానీ వాళ్ల తిరుగుళ్ల వల్ల సామాన్య జనానికి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ల మనసులు గాయపడకూడదు. జనం కట్టిన పన్నులతో ఉబ్బిన సర్కారు ఖజానాకు చిల్లు పడకూడదు. కానీ ఇప్పడు జడ్జీల తిరుగుళ్ల వల్ల ఇవన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

జడ్జీలు గుళ్లకు వెళ్లారన్న వార్తలు కొన్నేళ్లుగా మన ఘనత వహించిన తెలుగు దినపత్రికల్లో విపరీతంగా వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫొటోలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ పాఠకులకు ‘కనువిందు’ చేస్తున్నాయి. జడ్జీలు గతంలోనూ గుళ్లకు వెళ్లేవాళ్లు. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు చాలా అరుదుగా వచ్చేవి. ఏ పత్రికలకైనా వాళ్లపై ప్రత్యేక గౌరవాభిమానాలు ఉంటే లోపలి పేజీల్లో ఏ మూలో సింగిల్ కాలమ్ లో పడేసేవి. కానీ ఇప్పుడు పత్రికలు ‘అభివృద్ధి’ చెందాయి కనుక ఈ వార్తలూ అభివృద్ధి చెందాయి. ఫలానా జస్టిస్ శర్మ, ఫలానా జస్టిస్ రెడ్డి, ఫలానా జస్టిస్ చౌదరి కుటుంబసమేతంగా(కుక్కలుంటే వాటితోనూ) ఫలానా ఆలయానికి వెళ్లి ఫలానా దేవుణ్ని, దేవతను దర్శించుకుని తరించారని(తరింపజేశారని!) భక్తిప్రపత్తి పదాలు దట్టంగా రంగరించిన వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు మొదటి పేజీల్లోనూ వస్తున్నాయి. పేద్ద జడ్జీలైతే చాలాసార్లు పేజీల్లో పైన, బుల్లి జడ్జీలైతే మధ్యలోనో, అడుగునో వస్తున్నాయి. ఎక్కడో ఒకచోట రాకుండా మాత్రం పోవడం లేదు. ఇదంతా మెయిన్ పేజీల సంగతి. జిల్లా పేజీల సంగతి మీరే ఊహించుకోండి! ఈ వార్తలు తెలుగు పత్రికలకే ప్రత్యేకం. దేశంలోని మరే ఇతర భాషా పత్రికల్లోనూ ఇంత వెల్లువలా రావడం లేదు. పాశ్చాత్య దేశాల పత్రికల్లో అసలు రావడం లేదు. వాళ్ల వెనుకబాటుతనంతో మన పురోగతిని పోల్చుకుని బోర విరుచుకుని తిరగొచ్చు.

అసలు.. ఫలానా జడ్జీ ఫలానా గుడికి వెళ్లాడన్న విషయం వార్త అవుతుందా? అవుతుందని పత్రికలు చెబుతున్నాయి కనుక ఒప్పేసుకోవాలి. మరి ఆ జడ్జీ కూరగాయల కొట్టుకో, బట్టలకొట్టుకో, బస్టాండ్ లో మరుగుదొడ్డికో పోతే వార్త ఎందుకవదు? అక్కడ దేవుడు లేడు కనుక అవదా? లేకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక అవదా? ఈ వార్తల వెనకున్న హిందూమతాధిపత్యం గురించి కూడా చెప్పుకోకపోతే విషయం పూర్తి కాదు. పత్రికల్లో గుళ్ల జడ్జీల వార్తలే వస్తాయి కాని, మసీదులకెళ్లే ముస్లిం జడ్జీల వార్తలు, చర్చీలకు వెళ్లే క్రైస్తవ జడ్జీల వార్తలు మచ్చుకు కూడా కనబడవు( మళ్లీ మంత్రులు, సినిమా తారలు గుళ్లకు వెళ్లినా, మసీదులకు, చర్చిలకు వెళ్లినా వార్తలే! సినీ తారలు వ్యభిచారం చేస్తూ పట్టబడితే పండగే పండగ). ఆ రకంగా మన పత్రికలు లౌకికవిలువలను బొంద పెట్టడంలో తమవంతు పాత్రను బహు చక్కగా పోషిస్తున్నాయి. తెలుగునాట డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతున్న భక్తిని కళ్లు బద్దలయ్యేట్లు పారిస్తున్నాయి.

దేవుళ్లను, పత్రికలను, పాఠకులను తరింపజేసే ‘జడ్జీల గుళ్ల సందర్శన’ వార్తలు మీడియా విప్లవంలో భాగం అనుకోవడం అమాయకత్వం. ఈ వార్తల వెనుక.. మేధావుల మాటల్లో చెప్పాలంటే రాజకీయార్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. ప్రతిఫలాపేక్ష వీటి అసలు ఉద్దేశం. పది, పదిహేనేళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పడు ఏపీ, తెలంగాణలో పచ్చ, గులాబీ, ఎరుపు, మువ్వన్నెల నానా రంగుల  పార్టీల నాయకులపై బోలెడు అవినీతి కేసులు నమోదయ్యాయి, అవుతున్నాయి. వీళ్లలో కొందరు ఢిల్లీ లెవెల్ నాయకులైతే, కొందరు హైదరాబాద్ లెవల్, గల్లీ లెవల్ లీడర్లు. వీళ్లలో చాలామందికి సొంత పత్రికలు, కొందరికి బాకా పత్రికలు, కొందరికి అవసరార్థం ఆదుకునే పత్రికలు ఉన్నాయి. వీళ్లు తరచూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు గుళ్ల చుట్టు తిరిగినట్లు. గుళ్ల జడ్జీల ముందు వినయంగా నుంచుని వాళ్ల ప్రశ్నలకు భక్తిప్రపత్తులతో జవాబులు చెబుతుంటారు. కోర్టుల్లో ఇండియన్ పంక్చువాలిటీ మరింత ఎక్కువ కనుక విచారణ ఏళ్లూపూళ్లూ సాగుతుంది. జడ్జీల ముఖారవిందాల సందర్శన భాగ్యాలూ పెరుగుతుంటాయి. బెయిళ్లు రావాలన్నా, తీర్పులు తమకు అనుకూలంగా రావాలన్నా జడ్జీలను న్యాయమార్గంలోనో, అన్యాయమార్గంలోనో ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం తలెత్తుతూ ఉంటుంది. ఆ క్రమంలో న్యాయమార్గంలో.. సదరు ఘనత వహించిన న్యాయమూర్తులుంగార్ల భక్తిపారాయణతను అశేష ప్రజానీకానికి వెల్లడి చేసి, వాళ్ల అజ్ఞానాన్ని తమ జ్ఞానఖడ్గాలతో  సంహరించడానికి సదరు నిందితుల తరఫు పత్రికలు కంకణం కట్టుకుని జడ్జీల గుళ్ల ఫొటోలను, వార్తలను సప్తవర్ణాల్లో అచ్చోసి వదలుతుంటాయి. సదరు ఘనత వహించిన వాళ్లు వాటిని చూసి ఆనందకందోళిత మనస్కులై ‘నాకిది, నీకది’ న్యాయం ప్రకారం తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ జడ్జీలు అలా ఉంటారని కాదు. దేనికైనా మినహాయింపులు ఉండి తీరతాయి.

జడ్జీలు వాళ్ల మానాన వాళ్లు గుళ్లకు పోతుంటే పత్రికలు, టీవీ చానళ్లే హంగామా చేస్తున్నాయనే వాదనొకటి ఉంది. ఇది పచ్చి బూటకం. సాధారణ జనానికి మల్లే విలేకర్లకు, ఫొటోగ్రాఫర్లకు కూడా రాజకీయ నాయకుల, సినీ తారల(టీవీ సీరియల్ల పుణ్యమా అని టీవీ తారల) ముఖాలే బాగా పరిచయం. దేశానికంతా, లేకపోతే ఒక రాష్ట్రానికంతా తెలిసిన జడ్జీ ముఖం ఒక్కటీ లేదు. మరి ఈ అనామక(అముఖ!) జడ్జీలు తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకే కాక, మూరుమూల గ్రామాల్లోని అంకాళమ్మ, నూకాలమ్మ గుళ్లకు వెళ్లినా ఈ విలేకర్లకు, మీడియా ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తోంది? అప్పటికప్పుడు కలాలు ఎలా చెలరేగిపోతున్నాయి? కెమెరాలు ఎలా క్లిక్కుంటున్నాయి? వీళ్లకు ఆ జడ్జీల రాక గురించి ముందస్తుగా ఏ కర్ణపిశాచాలు చెబుతున్నాయి? హైదరాబాద్ లో అయితే పెద్ద జడ్జీలను తరచూ చూసే విలేకర్లు ఉంటారని సరిపెట్టుకోవచ్చు. మరి ఆ జడ్జీలు మారుమూల గుళ్లకు వెళ్లినప్పడూ చాటంత వార్తలు, ఫొటోలు ఎలా వస్తున్నాయి? సులభంగానే ఊహించుకోవచ్చు. జడ్జీలు గుళ్లకు తమ పోకడ గురించి స్వయంగానో, అనుయాయుల ద్వారానో మీడియా చెవిన వేస్తున్నారు. అహాన్ని కొబ్బరికాయలా పగల గొట్టుకోవడానికి దేవుడి వద్దకు వెళ్లే ఆ న్యాయమూర్తులు ఇళ్ల నుంచి బయల్దేరే ముందు ‘మేమొస్తున్నామహో..’ అంటూ టాంటాం వేయుంచుకుని మరీ వెళ్తున్నారు. గుళ్లకు వెళ్లాకయినా అహన్ని చంపుకుంటున్నారా అంటే అదీ లేదు. వీళ్లకు పూజరులు పట్టుగుడ్డలతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలుకుతారు. అప్పడు ఒక ఫొటో. ధ్వజస్తంభం దగ్గర మరో ఫొటో. గర్భగుడి ముందర మరో ఫొటో. తర్వాత దైవ దర్శనం(అప్పడూ దేవుడితో కలసి ఫొటో తీయుంచుకోవాలనే ఉంటుంది కాని, పాపం మరీ మొహమాటం). తర్వాత శఠగోపం పెట్టించుకుంటూ ఒక ఫొటో. ఆనక బయటకొచ్చి గాలిగోపురం ముందు కుటుంబసభ్యులతో మరో ఫొటో. అందరూ నిలబడి ఒకటి ఫోటో, నడుస్తూ స్లో మోషన్ లో మరో ఫొటో. మొహమాటానికైనా వద్దన్న పాపాన పోరు. అలా ఛాయాచిత్రగ్రాహకులు ఒకపక్క జడ్జీల ఫొటోలను తీస్తూ తరిస్తూ ఉంటే.. మరోపక్క సర్వాలంకారభూషితులైన దేవుళ్లు, దేవతలు తమవైపు కన్నెత్తి చూసే కెమెరా లేక బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఈ తతంగం మధ్యలో సాధారణ భక్తులను క్యూలలో పడేసి చిత్రవధ చేయడం.

అయితే ఈ గుళ్ల జడ్జీల వార్తల వల్ల జనానికి వచ్చిన నష్టమేంటి? ఒట్టి అక్కసు కాకపోతే అని కొందరనుకోవచ్చు. ఈ వార్తల వల్ల చాలా నష్టాలున్నాయి.

మొదటి నష్టం… పత్రికలను డబ్బులిచ్చికొనే పాఠకులకు వార్తలకు బదులు ఆ అవార్తలను, కువార్తలను చదవాల్సిన ఖర్మ పట్టడం.

రెండో నష్టం… ఆ వార్తలు పత్రికల్లో స్థలాన్ని కబ్జా చేయడంతో పాఠకులకు(ప్రజలకు) కచ్చితంగా తెలియాల్సిన  సంక్షేమ పథకాలు, తుపాను హెచ్చరికలు, రైళ్ల, బస్సుల రద్దు వంటి ప్రధానమైన వార్తలకు చోటు దక్కకపోవడం. దక్కినా అవి అరకొరగా, ఏ మూలో సర్దుకోవాల్సి రావడం. ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, కొండెక్కుతున్న నిత్యావరసరాల ధరలు వంటి వార్తలకు కూడా ఇదే గతి పట్టడం. ఈ జడ్జీల వార్తలు క్రైమ్ వార్తల్లాంటివే. ఎలాగంటే.. క్రైమ్ వార్తలను సవివరంగా అచ్చేస్తున్న పత్రికలు జడ్జీల వార్తలనూ అలాగే అచ్చేస్తున్నాయి కనుక. గుడి గురించి, భక్తి గుర్తించి, ఆలయ సందర్శన భాగ్యం(దేవుడికి భాగ్యం!) గురించి సదరు జడ్జి వాక్రుచ్చిన మాటలు పొల్లుపోకుండా వస్తున్నాయి కనుక.

మూడో నష్టం… పత్రికలను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి వీలుగా ప్రభుత్వం వాటికి ఇస్తున్న సబ్సిడీల లక్ష్యం దెబ్బతినడం. పత్రికలు వాడే కాగితం(న్యూస్ ప్రింట్)పై కోట్లలో సర్కారు సబ్సిడీలు ఇస్తోంది. న్యూస్ ప్రింట్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకునేదే. ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యానికీ గండి. పోస్టల్ చార్జిల్లోనూ, ఇతరత్రా వ్యవహారాల్లోనూ సబ్సిడీలు ఉన్నాయి. ఈ సబ్సిడీలు ప్రభుత్వ పెద్దల కష్టార్జితంలోంచి కాక, గుళ్ల హుండీల్లోంచి కాక,  జనం కట్టే పన్నుల్లోంచి ఇస్తుండడం వల్ల అంతిమంగా ప్రజలకే తిరుపతి గుండు కొట్టడం. గుళ్ల బాపతు వార్తలు, రాజకీయ నాయకును కీర్తించే వార్తలు, జనం మధ్య చిచ్చు రేపే విద్వేష వార్తలతో, అబద్ధాలతో పత్రికలు సబ్సిడీల ఉద్దేశానికి గండికొడుతున్నాయి కాబట్టి వాటికి ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వొద్దనే డిమాండ్ ఒకటి చాలా కాలం నుంచి వినిపిస్తోంది.

నాలుగో నష్టం… ఈ ప్రతిఫలాపేక్ష వార్తల వల్ల న్యాయవ్యవస్థ కొంతైనా ప్రభావితమై నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోవడం, లేకపోతే తాత్కాలిక ఉపశమనాలు పొందడం. ఫలితంగా వాళ్ల నేరాల వల్ల దెబ్బతిన్న జనానికి న్యాయం జరక్కపోవడం. సందర్భం వేరు కావొచ్చు కానీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసులో సినీ నిర్మాతల వినతిపై కోర్టు అతనికి బెయిలిచ్చింది. అతడు విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేస్తున్నాడు. అతని సినిమాలు విడుదలై కోట్లు సంపాదిస్తున్నాయి. అతడు వీరోచితంగా కారుతో గుద్ది చంపేసిన మనిషి కుటుంబం, గాయపడిన వాళ్లు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు, ఆకలితో మాడి చస్తున్నారు. సంజయ్ దత్ పెరోళ్లపైన పెరోళ్లపై ఇంటికీ జైలుకూ తేడా లేకుండా గడిపేస్తున్నాడు. జడ్జీలకు అన్ని సంగతులూ తెలుసు. కానీ ప్రముఖుల ప్రయోజనాలపైనే వాళ్లకు శ్రద్ధ. తమను కూడా ప్రముఖులుగా ప్రజలకు పరిచయడం చేసే గురుతర బాధ్యత తలదాల్చిన పత్రికలపై మాత్రం శ్రద్ధ ఉండదా?

***

ayalan kurdi

మొన్నామధ్య  పత్రికల్లో.. మన తెలుగు పత్రికల్లో కూడా గుండెలు మెలిపెట్టే ఫొటో ఒకటి వచ్చింది. సిరియా నుంచి యూరప్ కు వలస వెళ్తూ పడవ మునిగి చనిపోయిన సిరియా బాలుడు అయలాన్ కుర్దీ ఫొటో అది. సముద్రపుటొడ్డున విగతజీవిగా పడున్న ఆ మూడేళ్ల బాలుడి ఫొటో ప్రపంచ దేశాల మనసు కరిగించి, కన్నీరు పెట్టిస్తోంది. శరణార్థులకు ఆశ్రయమిస్తామని యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. ఫొటో జర్నలిజం శక్తికి ఆ చిత్రం తాజా ఉదాహరణ. టర్కీ మహిళా ఫొటోగ్రాఫర్ నీలూఫర్ దెమిర్ ఆ ఫొటో తీసింది.

మన తెలుగు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా తలచుకుంటే అలాంటి ఫొటోలు ఎన్నో తీయగలరు. నగరాల్లో చితికిపోతున్న బాలకార్మికులు, అప్పులతో, కరువుతో పొలాల్లోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంటున్న బక్క రైతులు, నానా చోట్ల దోపిడీపీడనలకు గురవుతున్న శ్రమజీవులు.. అనాథలు, అభాగ్యులు.. ఎంతమంది లేరు! నీలూఫర్ దెమిర్ కళ్లతో చూడాలే గాని మన చుట్టూ లక్షలాది అయలాన్లు కనిపిస్తారు! కానీ మన కెమెరా కళ్లు గుళ్ల జడ్జీలవైపు నుంచి చూపు తిప్పనంత కాలం వాళ్లు మనకు కనిపించరు. మన చెవులను కర్ణపిశాచాలు కొరుకుతున్నంత కాలం ఆ అభాగ్యుల ఆర్తనాదాలూ వినిపించవు…

*

 

కల్బుర్గి తల నవ్వింది..

 

-సత్యమూర్తి

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కల్బుర్గిని దేవదూతలు బలవంతంగా స్వర్గం వాకిట్లోకి తోసేశారు. ఆ వృద్ధుడు బలాన్నంతా కూడదీసుకుని మళ్లీ బయటకి రావడానికి ప్రయత్నించాడు. కానీ అడుగు ముందుకు పడ్డం లేదు. దేవదూతలు పగలబడి నవ్వారు.

‘అయ్యా, తమది వృథా ప్రయత్నం! ఒకసారి స్వర్గంలోకి వచ్చాక బయటికెళ్లడం అసాధ్యం. మీకు స్వర్గసుఖాల రుచి తెలియదు కనుక పారిపోవాలనుకుంటున్నారు. ఈ సాయంత్రానికి మీ మనసు మారిపోతుంది. ఆనక ఇక్కన్నుంచి వెళ్లగొట్టినా వెళ్లరు’ అని అన్నారు.

కల్బుర్గిని లక్ష యోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ ఉన్న స్వర్ణమందిరంలోకి తీసుకెళ్లి మేనకకు అప్పజెప్పి వెళ్లిపోయారు.

మేనక వగలు పోతూ కల్బుర్గి ముందు నిలబడి కొంటెగా చూసింది. అతడు ముక్కు మూసుకున్నాడు. అప్సరస వద్ద నుంచి చెమటకంపు గుప్పుమని కొడుతోంది. ఆమె కాసేపటి క్రితమే విశ్వామిత్రుడి గాఢపరిష్వంగంలో నలిగింది. విషయం గ్రహించి చప్పున పక్కనే ఉన్న పన్నీరు బుడ్డి తీసుకుని ఒంటిపై చల్లుకుంది. గాల్లోంచి పౌడరు రప్పించి ముఖానికి దట్టంగా పూసుకుంది. చెలికత్తెలు వీణలు సవరించారు. మేనక ‘మదనా మనసాయెరా..’ అని కీచు గొంతుతో పాట ఎత్తుకుని నర్తనం మొదలెట్టింది.

కల్బుర్గి చెవులు మూసుకున్నాడు. మేనక కంగారు పడిపోయింది. ఇలాగైతే పని కాదని, ఆటాపాటా ఆపి పాత అతన్ని గట్టిగా వాటేసుకుంది. కల్బుర్గి ఆమెను విసురుగా తోసేశాడు.

‘ఏమి చిత్రం? ఏమి చిత్రం? ఒక అల్పమానవ ముదుసలి నా బిగికౌగిలిని నిరాకరించుటయా?’ విస్మయంగా అందామె.

‘ఏవమ్మో, మాటలు జాగ్రత్త! అల్పుడూ గిల్పుడూ అంటే ఊరుకునేది లేదు. ముందు నన్నిక్కన్నుంచి పంపేయండి. హాయిగా మేఘాల్లో, పాలపుంతల్లో తిరుగుతూ ఉంటే మీ వెధవలు ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు’ అన్నాడు కల్బుర్గి.

మేనక బుగ్గ నొక్కుకుని, మోహనంగా నవ్వింది.

‘భలే చిత్రంగా మాట్లాడుతున్నారే! నేను పుట్టి కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు అయ్యింది. మీలాంటి వింత మనిషిని ఎన్నడూ చూళ్లేదు..’

‘కాకి లెక్కలు చెప్పమాక. నువ్వు మేనకవూ కాదు. ఇది స్వర్గమూ కాదు. అవన్నీ పుక్కిటి పురాణాలు. ఆ మాట అన్నందుకేగా నన్ను తుపాకీతో కాల్చి చంపేసింది. ఇక్కడ.. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఏదో పౌరాణిక సినిమా సెట్టింగులా ఉంది..’

మేనకకు అతను చెప్పింది బొత్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అగత్యమూ లేదు కనుక దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఆమె కల్బుర్గిని మళ్లీ వాటేసుకుని పెదవులను ముడేయబోయింది.

కల్బుర్గి ఈసారి మరింత విసురుగా తోసి ఆమె చెంప చెళ్లుమనిపించాడు.

‘ఎందుకలా మీదమీదపడిపోతున్నావ్? కోట్ల కోట్ల కోట్ల ఏళ్లుగా ఎంతమంది దగ్గర పడుకున్నావో ఏమో. ఎయిడ్సూ గట్రా సుఖరోగాలు తగిలుంటాయి. నాకు అంటించమాక.. దూరంగా ఉండు.. మీద పడితే మర్యాద దక్కదు సుమీ..’ అన్నాడు.

అప్సరస నిశ్చేష్టురాలైపోయింది.

‘మానవాధమా, నన్నే కొడతావా? వెంటనే శిలావిగ్రహమైపో!’ అని శపించింది.

కల్బుర్గి విరగబడి నవ్వాడు. అతడు రాయీ కాలేదు, రప్పా కాలేదు.

మేనక విస్తుబోయింది. మళ్లీ శపించింది.

కల్బుర్గి నిక్షేపంగా నవ్వుతూనే ఉన్నాడు.

మేనక కోపంతో చరచరా దేవేంద్రుడి వద్దకు వెళ్లింది. విషయం చెప్పి ముక్కు చీదింది. చీదింది కాసింత ఇంద్రుడిపైనా పడింది. సురపతి దానితోపాటు మూతికంటిన సురను కూడా తుడుచుకుంటూ నవ్వాడు.

‘భామినీ, కలత వలదు! అతడు హేతువాది. అందుకే నీ శాపం పనిచేయలేదు. దయ్యాలు భయపడేవాళ్లనే కదా భయపెడతాయి.. ఆ ముసలాణ్ని అలాగే వదిలేసి ఈసారి వశిష్టుడి పడగ్గదికి వెళ్లు.. ఎప్పుడూ రాజర్షితోనే పడుకుంటున్నావని వశిష్టుడు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు…’ అన్నాడు.

***

కల్బుర్గికి స్వర్గంలో ఏమీ తోచడం లేదు. కొంపదీసి ఇదంతా కల కాదు కదా అనుకుని నాలుగైదుసార్లు గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. నొప్పి అనిపించలేదు. అయితే తను చనిపోయినట్టా? అనుమానం తీరక కల్పవృక్షం వద్దకెళ్లి ఒక కొమ్మ తెంపుకుని అరిచేతిపైనా, వీపుపైనా గట్టిగా కొట్టుకొట్టున్నాడు. నొప్పి పుట్టలేదు. రెండు రోజులుగా తనకు ఆకలేయనీ సంగతి కూడా గుర్తొచ్చి తను నిజంగా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాడు. కానీ అది స్వర్గమని నమ్మలేకపోతున్నాడు. స్వర్గమైతే చచ్చిపోయిన మహానుభావులందరూ ఇక్కడే ఉండాలిగా, వాళ్లెవరూ కనిపించలేదే అని అనుమానమొచ్చింది.

ఇంతలో ఓ దేవదూత తలపై పెద్ద మధుభాండంతో అటుగా పోతూ కనిపించాడు. కల్బుర్గి అతని వద్దకెళ్లాడు.

‘ఇదుగో అబ్బాయ్. ఇది స్వర్గమేనంటావా? అయితే  మీ దేవేంద్రుడెక్కడోయ్?’ అని అడిగాడు.

దేవదూత విస్తుబోయాడు.

‘ఇది స్వర్గమేనండి. అయినా మీకా అనుమానం ఎందుకొచ్చింది?’ ఎదురు ప్రశ్న వేశాడు.

‘బతుకంతా ప్రతీదాన్నీ ప్రశ్నించి ప్రశ్నించి అలా అలవాటైందిలే. సరేగాని, తలపైన ఏమిటోయ్ తీసుకెళ్తున్నావ్? మాంచి వాసన వస్తోంది..’

‘ఇదా? మేలురకం మద్యం. దేవేంద్రుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఆయనగారింట్లో నిండుకుందని చెబితే పట్టుకెళ్తున్నా..’

‘సరేకానీ, నాక్కాస్త పోయవూ! ఆకలిదప్పుల్లేక నోరంతా అదోలా అయిపోయింది..’

‘అమ్మబాబోయ్. ఈ మధువా? మీకా? కుదర్దండి. ఇది దేవాధిదేవుడైన ఇంద్రులవారిది.. ఆయనే తాగాలి’

‘బోడి ఇంద్రుడు లేవోయ్. మా పక్క ఆయన్ని తార్పుడుగాడు అని గౌరవిస్తాం లెద్దూ.. అయినా మీ దేవతలకు ఆకలిదాహాలు ఉండవు కదా. మరి అల్పమానవుల మాదిరి ఈ సారాయిపై అంత కక్కుర్తి ఏమిటోయ్? అచ్చోసిన ఆంబోతుల మాదిరి రంభామేనకలపై ఆ పశువాంఛలేమిటోయ్?’

దేవదూతకు మాట పెగల్లేదు. కల్బుర్గి దేవదూత తలపై ఉన్న భాండాన్ని కాస్త వంచి కడుపారా మద్యం తాగాడు. మనసు కుదుట పడింది.

దేవదూత ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు.

కల్బుర్గి అతన్ని గట్టిగా గిచ్చాడు. దేవదూత కెవ్వుమన్నాడు. అల్పమానవుడు ఊరుకోలేదు. దేవదూతను కితకితలు పెట్టాడు. భాండం జారిపడి రోదసిలోకి వెళ్లిపోయింది.

దేవదూత కల్బుర్గికి దండం పెట్టి తనను వదిలేయమన్నాడు. ఏదో మంత్రం వేసి భాండాన్ని మళ్లీ పైకి రప్పించి తలపై పెట్టుకున్నాడు. కల్బుర్గి మళ్లీ  భాండాన్ని వంచబోయాడు.

‘బాబ్బాబూ, మీ పుణ్యముంటుంది! దాన్ని ముట్టుకోకండి. కావాలంటే వేరొక మద్యం తెస్తా. ఇంద్రుల వారి మద్యాన్ని ఎంగిలి చేశారంటే నా మెడకాయపై తలకాయ ఉండదు’

‘అంతగా వణికిపోతున్నావ్, నువ్వేం దేవుడివోయ్? మెడపైన తలకాయ పోతే మళ్లీ అతుక్కుంటుంది కదా, వినాయకుడి తలకాయలాగా. ఆ మందు తాగకపోతే మాత్రం నేను మళ్లీ చావడం ఖాయం..’ అంటూ కల్బుర్గి భాండాన్ని వంచి గుటకలేశాడు.

‘చచ్చిన పుణ్యాత్ములందరూ ఇక్కడికొస్తారంటారు కదా. మరి, మా వీరశైవ బసవన్న ఎక్కడున్నాడోయ్? ’ అని మత్తుగా అడిగాడు.

దేవదూత దివ్యదృష్టితో పరికించి చూశాడు.

‘ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు. అదుగో ఆ మలుపు దాటితే శివాలయం వస్తుంది. అక్కడ అరుగుమీద కూర్చుని వచనాలు వల్లెవేస్తున్నాడు’ అని చెప్పి గబగబా వెళ్లిపోయాడు దేవకింకరుడు.

కల్బుర్గి కాస్త తూలుతూ బసవడి దగ్గరకు వెళ్లాడు.

బసవడు అరుగుపైన శివలింగం పెట్టుకుని అరమోడ్పులతో శివశివా అంటూ ఊగిపోతున్నాడు.

‘అయ్యా..’ పిలిచాడు కల్బుర్గి.

బసవడు పలకలేదు. కల్బుర్గి మళ్లీ పిలిచాడు. వీరశైవుడు పలకలేదు. కల్బుర్గికి మండుకొచ్చి భక్తునికి తొడపాశం పెట్టాడు. బసవడు కెవ్వుమన్నాడు.

‘అయ్యా, నా పేరు మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి. మీ కన్నడం వాడినే.  కొంతమంది వీరభక్తాగ్రేసులు ఇంటికొచ్చి మరీ కాల్చేసిన పుణ్యం ఫలితంగా ఇక్కడికొచ్చాను.. ఆ పుణ్యంలో మీకూ వాటా ఉందిలెండి..’ అన్నాడు వెటకారంగా.

బసవడు తికమకపడ్డాడు.

‘నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు.. వివరించి చెప్పు’

‘చెబుతా, చెబుతా. ముందు ఆ బారెడు కత్తిని ఒడిలోంచి తీసి పక్కన పెట్టండి. సంఘసంస్కారం కోసం అంతగా తపనపడ్డ మీకు చచ్చాకా ఈ కత్తీగట్రా ఎందుకండీ? కొంపదీసి ఇక్కడా వీరశైవం ప్రచారం చేస్తున్నారా, ఏమిటీ?’

బసవడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

‘నా ముచ్చట తర్వాత. ముందు నీ సంగతీ, నీ హత్య వల్ల నాకు దక్కిన పుణ్యం సంగతీ చెప్పు’

‘అయ్యా, నేను మీ భక్తివచనాలపై లోతైన పరిశోధన చేశాను. మీలాగే మూఢనమ్మకాలపై అలుపెరగకుండా పోరాడాను. ఓ విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశాను. ఇరవైకి పైగా పుస్తకాలు, నాలుగొందలకుపైగా వ్యాసాలు రాశాను.. మీ కుటుంబం గురించి, విగ్రహాల పూజ గురించి కొన్ని ప్రశ్నలు లేవదీసినందుకు నన్ను చంపేశారు..’

‘చిత్రంగా ఉందే! నేను కలగన్న మూఢవిశ్వాసాల్లేని కన్నడసీమ ఇంకా సాకారం కాలేదా? ఇంతకూ నాపైన నీ విమర్శలేంటో?’

‘ఏవో కొన్ని ప్రతిపాదనల్లెండి. మీ రెండో భార్య నీలాంబికతో మీ కాపురం వొట్టి అమలిన శృంగారం అని అన్నాను. దానికి వచనాల్లోంచి రుజువులు చూపాను. మీ మేనల్లుడు చెన్నబసవడు మీ చెల్లెలు నాగలాంబికకు, మాదిగవాడైన దోహర కక్కయ్యకు పుట్టి ఉండొచ్చని, పండితులు ఆ సంగతి దాచారని అన్నాను.. దానికీ కొన్ని ఆధారాలు చూపాను..’

బసవడి ముఖం కందిపోయింది. కోపాన్ని బలవంతంగా అణచుకున్నాడు.

‘ఇంకా..’

‘ఇంకా అలాంటివేవో కొన్ని. మీరు జంధ్యం వద్దన్నారు కానీ, మెడలో మాత్రం ఇష్టలింగాన్ని ఎందుకేసుకోమన్నారు అని ప్రశ్నించా. విగ్రహారాధన కూడదని వాదించాను. జనం పాలూపెరుగూ లేక మాడిపోతోంటే రాతిబొమ్మలకు పంచామృతాభిషేకాలు ఎందుకన్నా.. జనం కట్టుగుడ్డలు లేకుండా వణికిపోతోంటే స్పర్శలేని దండగమారి బొమ్మలకు పట్టుగుడ్డలెందుకని ప్రశ్నించా. ఇవన్నీ నా చావుకు తెచ్చాయి..’

బసవడికి కోపంతో పాటు ఆసక్తీ తన్నుకొస్తున్నాయి.

‘కల్బుర్గీ! ఇష్టలింగధారణలో తప్పేముందోయ్.. ఆలయాల్లో డంబాచారాలకు విరుగుడుగా ఆ పద్ధతి తెచ్చాను.. పొదుపుకు పొదుపూ, భక్తికి భక్తీ. శివుడెప్పుడూ మెడలోనే ఉంటాడు..’

‘మీకు తప్పుగా అనిపించలేదు. నాకనిపించింది. విగ్రహారాధన కూడదని నా వాదన. అది గుళ్లో ఉన్నా, మెడలో ఉన్నా శుద్ధ దండగ. మీరు జంధ్యం దండగన్నారు. నేను లింగం దండగన్నాను..’

‘అది కాదోయ్.. ఏకాగ్రత కోసం లింగాన్ని వేసుకోమన్నా.. ’

‘నాకు కాఫీ, సిగరెట్టు తాగితే ఏకాగ్రత. కానీ నేను వాటిని మెడకు కట్టుకుని ఊరేగను..’

‘సరే ఇంకా ఏమని వాదించావు..’

‘ఇలాంటివేనని చెబుతున్నాగా..’

‘ఓసోస్.. ఈ మాటలకే చంపేశారా? ఇలాంటి వాదవివాదాల కోసమే కదా అనుభవ మంటపం పేరుతో జాతిమతవర్ణలింగ వివక్షల్లేకుండాల అందరూ వచ్చి చర్చించుకోవడానికి భవనం కట్టించాను..’

’ఆ భవనం ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయింది. తమకు నచ్చని వాదాన్ని వినిపించేవాళ్లను కాలగర్భంలో కలిపేయడమే నేటి వాదం. దానికోసం సరికొత్త అనుభవ మంటపాలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి..’

‘ప్చ్. ఇదేం బాగాలేదోయ్ కల్బుర్గి..’

కల్బుర్గి బసవడు ఆరాధిస్తున్న శివలింగం కేసి చూశాడు. పీకలదాక మధువు తాగడంతో కడుపుకింద ఒత్తిడి పెరిగింది.

‘మరో సంగతి చెప్పడం మర్చిపోయానండి. నన్ను ఖూనీ చేయడానికి మరో కారణం కూడా ఉందండోయ్..’

బసవడు చెవులు రిక్కించాడు.

‘అనంతమూర్తి అని నా స్నేహితుడొకడుండేవాడు. గత ఏడాదే పోయాడు. నా మాదిరే వాదించేవాడు. నా మాదిరే విగ్రహాలంటే పడదు. అతడు బాల్యంలో ఓ మంచి పని చేశాడు. విగ్రహాలకు మహిమ ఉందో లేదో తేల్చడానికి విగ్రహాలపై ఉచ్చ పోశాడు. అవి శపిస్తాయేమోనని చూశాడు. అవి ఏమీ చేయకపోవడంతో మనోడికి మరింత ధైర్యం వచ్చేసింది. ఆ సంగతి ధైర్యంగా ఓ పుస్తకంలో రాశాడు. నేను ఓ చర్చలో ఆ విషయం చెప్పాను. కాషాయమూకలకు అది నచ్చలేదు. అప్పటికే నాపైన కత్తులు నూరుతున్నారు కదా. సఫా చేసేశారు..’

బసవడు ‘శివశివా’ అని చెవులు మూసుకున్నాడు.

కల్బుర్గికి కడుపుకింద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. బుర్రలో బలమైన సరదా కూడా మెలిపెడుతోంది.

‘వీరశైవరత్నమా.. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట..’

‘చెప్పు..’

‘ఇది స్వర్గం కదా. ఇక్కడికొచ్చినవారికి చావు ఉండదు కదా.. అనంతమూర్తి చేసిన పరీక్షను నేను బతికున్నప్పుడు ఎన్నడూ చేయలేకపోయానండి. ఇప్పడు జరూరుగా చేయాలనిపిస్తోందండి. మీరు  కాస్త అరుగు దిగితే ఈ శివలింగంపై ఆ పని కానిచ్చేస్తాను..’

కల్బుర్గి మాట పూర్తికాకుండానే బసవడు ఖడ్గంతో ఒక్కవేటున అతని తల నరికేశాడు.

శివలింగం పట్టపానంపై పడిన కల్బుర్గి తల విరగబడి నవ్వుతోంది.

కల్బుర్గి పొట్టకింద నుంచి సన్నని ధార రాతి విగ్రహాన్ని తడుపుతోంది.

 

 

(మతోన్మాదులు చంపేసిన కల్బుర్గికి క్షమాపణతో నివాళిగా..)

చంపడమే ఒక సందేశం!

 

 

–  రమణ యడవల్లి

 

ramana yadavalliఈ లోకమందు చావులు నానావిధములు. ప్రపంచంలోని పలుదేశాల్లో పలువురు తిండి లేకో, దోమలు కుట్టో హీనంగా చనిపోతుంటారు. కొన్నిదేశాల్లో రాజకీయ అస్థిరత, యుద్ధవాతావరణం కారణంగా పెళ్ళిభోజనం చేస్తుంటేనో, క్రికెట్ ఆడుకుంటుంటేనో నెత్తిన బాంబు పడి ఘోరంగా చనిపోతుంటారు. ఇంకొన్ని దేశాల్లో మెజారిటీలకి వ్యతిరేకమైన ఆలోచనా విధానం కలిగున్న కారణంగా హత్య కావింపబడి చనిపోతారు. 

నరేంద్ర దభోల్కర్, గోబింద్ పన్సరె, మల్లేశప్ప కల్బుర్గి.. వరసపెట్టి నేల కొరుగుతున్నారు. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి.

సౌదీ అరేబియాలో మతాన్ని ప్రశ్నించడం తీవ్రమైన నేరం. శిక్ష కూడా అత్యంత పాశవికంగా అమలవుతుంది. ఇదంతా వారు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. కనుక సౌదీ అరేబియా ప్రభుత్వం ఎటువంటి మొహమాటాలు లేకుండా దర్జాగా, ప్రశాంతంగా, పబ్లిగ్గా తన శిక్షల్ని అమలు చేసేస్తుంది. సౌదీకి అమెరికా మంచి దొస్త్. దోస్తానాలో దోస్త్‌లు ఎప్పుడూ కరెక్టే. అందుకే అమెరికా సౌదీ అరేబియా క్రూరమైన శిక్షల్ని పట్టించుకోదు!

సౌదీ అరేబియా శిక్షలు అనాగరికమైనవనీ, ప్రజాస్వామ్యంలో అటువంటి కఠినత్వానికి తావు లేదని కొందరు విజ్ఞులు భావిస్తారు. అయ్యా! ప్రజాస్వామ్య దేశాల్లో కూడా విపరీతమైన భౌతిక హింస, భౌతికంగా నిర్మూలించే శిక్షలు అమలవుతూనే వుంటాయి. కాకపొతే అవి అనధికారంగా అమలవుతాయి. ఎందుకంటే – ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న ఈ దేశాలకి కూసింత సిగ్గూ, బోల్డంత మొహమాటం!

మతాన్ని ప్రశ్నించిన వారిని చంపడం ఎప్పుడూ కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరుగుతుంది, కాకతాళీయం అనేది అస్సలు వుండదు. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు బ్లాగర్లని వేదికి వెదికి వేటాడి మరీ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితీ ఇంతే. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రశ్నించినవారూ ఖర్చైపొయ్యారు! ఇక క్రిష్టియన్ మతం హత్యాకాండకి శతాబ్దాల చరిత్రే వుంది. ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.

దక్షిణ ఆసియా దేశాల్లో మెజారిటీకి వ్యతిరేకంగా డిఫరెంట్ అభిప్రాయాల్ని కలిగున్నవారిని గాడ్‌ఫాదర్ సినిమా టైపులో పద్ధతిగా ఎలిమినేట్ చేస్తుండడం అత్యంత దారుణం. ఇటువంటి హత్యలు అరుదుగా జరిగే సంఘటనలేనని, వీటికి స్టేట్‌తో సంబంధం లేదని కొందరు వాదించవచ్చు. కానీ – ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం. ఈ హత్యలు జరిగిన దాని కన్నా ఆ తరవాత దర్యాప్తు సంస్థలు చూపించే నిర్లిప్తతని పరిశీలించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవల్సిందిగా నా విజ్ఞప్తి.

ఇంకో విషయం – ఈ హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ‘మతాన్ని కించపరిచే ఎవరికైనా ఇదే శిక్ష’ అంటూ హత్యకి సపోర్ట్ చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న వ్యాఖ్యలు వెన్నులో వణుకు తెప్పిస్తున్నయ్! దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!

మరీ హత్యల వల్ల ప్రయోజనం?

సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!

*

వాటే ఫాల్‌! వాటే పిటీ!

 

రమా సుందరి 

 

ramasundariచలసాని స్మృతిలో వరవరరావుగారు ఒక వ్యాసం రాశారు. అందులో విరసం పుట్టుకను, అందులో చలసాని పాత్రను చర్చించారు. దానిపై రంగనాయకమ్మగారు స్పందించారు. ఆమె అభ్యంతరాలేవో ఆమె చెప్పారు. అవన్నీ రాజకీయ పరమైనవే. అందులో వ్యక్తిగతమైన విమర్శ కించిత్తులేదు. ఆ అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తామా, లేదా అనేది వేరే చర్చ. అక్కడక్కడా ఆమె ఉపయోగించిన టోన్‌తో, లాజిక్‌తో ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చును. మన ఇబ్బందులేవైనా సరే, ఆమె కొన్ని రాజకీయ ప్రమాణాలను ముందు పెట్టుకుని ఆ మేరకు విమర్శించారు. ఇట్స్‌ఎ పొలిటికల్‌పీస్‌.

కానీ వసంతగారి కవిత్వంలో ఏమున్నది. అది కవిత్వమా కాదా అనే చర్చను కాసేపు పక్కనబెడదాం. కవిత్వమే అనుకుందాం. ఏమిటీ ఆమె చెప్పదలుచుకున్నది? రంగనాయకమ్మగారి పుస్తకాల పేర్లకు అటూ ఇటూ తోచిన పదాలేవో అల్లి వెటకారాన్ని వెదజల్లడం తప్ప. రంగనాయకమ్మగారి వెటకారం కంటేనా అనబోదురేమో! ఆమెక్కడా అప్పొలిటికల్‌విమర్శ చేయగా నేను చూడలేదు. ఆమె తర్కంతో టోన్‌తో అన్నివేళలా ఏకీభవించకపోవచ్చు కానీ అప్పొలిటికల్‌ అనైతే ఎవరమూ అనలేము కదా!

కానీ ఇందులో ఏమున్నది? ఆ కవిత్వం చదువుతుంటే తెలీకుండానే మెటికలు విరిచిన చప్పుడు వినిపిస్తే అది పాఠకుడి తప్పవుతుందా! శాపనార్థాలు పెట్టే పెద్దమ్మల ధ్వని తప్ప మరో ధ్వని ఉన్నదా! పైగా ఆమె రాసింది గొప్ప కవిత్వమన్నట్టు కొందరు ఎంఎల్‌పార్టీ వారు కూడా దాన్ని సెలబ్రేట్‌చేసుకోవడం? క్యా చల్‌రహా హై భయ్‌..ఇస్‌దేశ్‌మే! శత్రువుకు శత్రువు మిత్రుడన్న అల్పసంతోషత్వం తప్ప మరోటున్నదా ఇందులో! పాతకక్షలు తీర్చుకోవడం లేదా స్కోర్లు సెటిల్‌చేసుకోవడం లాంటిది కాకుండా మరో రకంగా చూడగలమా! మొన్నమొన్నటిదాకా ‘విప్లవశిబిరాన్ని చీల్చడానికి’ పుట్టినటువంటివారై ఉండిన వసంతకన్నబిరాన్‌గారు సడన్‌గా మరింత దగ్గరైపోయి రంగనాయకమ్మగారు ఎలా దూరమైపోయారో అవేం రాజకీయాలో అర్థం కావడం కష్టం.

నిజమే కావచ్చు. రంగనాయకమ్మ గారి వ్యాసాల్లో తడి లేకపోవచ్చును. మానవీయ స్పర్శ తక్కువని పించవచ్చును. సందర్భశుద్ధి ఉండొద్దా అని కూడా కొందరికి అనిపించవచ్చును. ఇలాంటి అభిప్రాయాలు బోలెడుండవచ్చును. కానీ ఆమేం రాసినా కొన్ని ప్రిన్సిపుల్స్‌ఆధారంగా రాసినవి.

ప్రిన్సిపుల్డ్‌పొలిటికల్‌బీయింగ్‌. ఎందరున్నారు మనలో! ఆ మాటకొస్తే ఈ తడి అనేది కూడా అమూర్తమైనది. కన్నబీరన్‌చివరి చూపు కోసం విప్లవాభిమానులు పరిగెత్తుకుంటూ పోతే బూడిద కనిపించింది. ఏం కొంపలు మునిగిపోయాయని ఇంత హడావుడిగా అనిపించింది. వసంతగారి లాజిక్కేదో ఆమెకుంటుంది. అది మనకు తడిలేకపోవడంగా కనిపించొచ్చు. ఆ విషయం మీద ఆర్కే గారు తన ఆవేదన ఏదో రాశారు కూడా! ఇవన్నీ మనం ఎక్కడ నిలబడి ఏ వాంటేజ్‌పాయింట్‌లో చూస్తున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. రాజకీయంగా ఏవైనా చర్చించొచ్చు. కానీ వసంత అంత పెద్ద మనిషి ఎవరో చిన్న పిల్లలు చేసినట్టుగా నాలుగు అక్షరాలను రాళ్లుగా మార్చి విసిరితే ఎలా!

ఎవరో ఫేస్‌బుక్‌లో కొన్ని ప్రశ్నలు సంధించి రంగనాయకమ్మగారు చలసాని ఇంట్లో ఉన్నారని ఆమె స్వయంగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చాలా సాయం పొందినట్టు ఆమె రాసిన విషయాల్ని గుర్తుచేశారు. ఇవేమి రాజకీయాలో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. వాళ్లు సాయం చేసిన విషయాన్ని రంగనాయకమ్మగారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తుచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయఅభిప్రాయాలకు తేడా చూడలేనంత దూరం ప్రయాణించామా మనం! వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించకూడదా!

వాటే ఫాల్‌! వాటే పిటీ!

*

స్వేచ్ఛగా మాట్లాడుకునే జాగా కోసం….!

 

నారాయణ స్వామి వెంకట యోగి 

 

అన్ని సార్లూ నువ్వు
నేను మాట్లాడిందే మాట్లాడనక్కరలేదు.
అన్ని సార్లూ సరిగ్గా  నేనూ
నువ్వనుకున్నట్టుగానే చెప్పాల్సిన పనీ లేదు.

నువ్వు వూహించినట్టే ,
నిన్ను మెప్పించేట్టుగానే
నేనుంటేనే నీ వాణ్ణనీ,
లేకుంటే నీ పగవాడిననీ నిర్దారించకు.

అడుగులో అడుగు వేయడం,
మాటలు ప్రతిధ్వనించడం
అచ్చం ఒక్క లాగానే ఆలోచించడం
అయితే దానికి ఇద్దరం, ఇందరం  యెందుకు?

నువ్వు చెప్పేది నాకు నచ్చక పోయినా,
నేను మాట్లాడేది నువ్వు అసహ్యించుకున్నా
మనిద్దరం ఒకర్నొకరిని వినడం ముఖ్యం.
పరస్పరం గౌరవంగా విభేదించగలగడం ముఖ్యం.
అన్నింటికన్నా,
యింతమందిమి ఒప్పుకోవడానికో విభేదించడానికో,
నిలబడి స్వేచ్చగా మాట్లాడుకునేటందుకు
వుక్కిరి బిక్కిరి చేసే యిరుకుసందుల అంతర్జాలంలో
యింత జాగా ని కాపాడుకోవడం
మరింత ముఖ్యం.

 

యిటీవల జరిగిన కొన్ని సంఘటనలు,  వాటి మీద కొందరు చెప్పిన అభిప్రాయాలు, అభిప్రాయాల మీద జరిగిన వేడి వాడి చర్చలు,చర్చల్లో విసురుకున్న రాళ్ళూ రప్పలూ, దూసుకున్న కత్తులూ బాణాలూ, వాటన్నింటికీ ఈ యిరుకైన సువిశాల అంతర్జాలం లో మనందరికీ ఒనగూరిన ఈ జాగా –  చాలా అమూల్యమైనది.

సాధారణంగా మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మనం స్పందిస్తాం. కవులు కవిత్వం తోనో ,కథకులు కథల్తోనో , వ్యాస రచయితలు వ్యాసాలతోనో,  యెవరికి చేతనైన విధంగా వారి చైతన్యాన్ని వ్యక్తీకరిస్తారు. స్పందించడం ముఖ్యం. సకాలంలో స్పందించడం ముఖ్యం. యెట్లా స్పందించామన్నదీ ముఖ్యం. మన వ్యక్తీకరణలు మౌలికంగా ఉన్నాయా లేదా, శక్తి వంతంగా  ఉన్నాయా లేదా మన రచన సత్తా యెంత, దాని ప్రభావమెంత అనేది తెలివైన పాఠకులు వారి వారి అభిరుచులమేరకు, అభిప్రాయాల మేరకు నిర్ణయిస్తారు. బేరీజు వేస్తారు.

అందరికీ అన్నీ నచ్చాలనీ యెక్కడా లేదు. అట్లే అభిప్రాయాలు కూడా. ఒకరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో అందరూ పూర్తిగా ఏకీభవించాలనీ లేదు – నిజానికి అభిప్రాయలతో విభేదించకపోతే, చర్చించక పోతే, ఘర్షించకపోతే (యిక్కడ ఘర్షించడం అంటే భౌతికంగా దాడులు చేయడమని కాదు) కొత్త అభిప్రాయాలు జనించవు, ఉన్నవి వృద్ధి చెందవు. భావాలూ, అభిప్రాయాలూ శిలా శాసనాలు కావు, కాకూడదు. ప్రజాస్వామ్యబద్దంగా చర్చించబడాలి. సహనమూ సంయమనమూ కోల్పోకుండా చర్చ జరగాలి. ఇతరులను నొప్పించేలా , యిబ్బంది పెట్టేలా మాటలు తూలకుండా, తమకు నచ్చని వారిని  అవమానించకుండా, అగౌరవపర్చకుండా , తూలనాడకుండా విషయం మీద కేంద్రీకరించి చర్చ కొనసాగిస్తే అది కొత్త అభిప్రాయాలూ, భావాలూ జన్మించడానికీ , వృద్ధి చెందడానికీ ఉపయోగపడతుంది. అట్లే మనం అంగీకరించని అభిప్రాయలతో గౌరవంగా విభేదించడానికీ అంగీకరించవచ్చు.
చర్చలో దుందుడుకుతనం ప్రదర్శిస్తూ , తమ వాదనే గెలవాలనే యేకైక లక్ష్యం తో వీరావేశంతో యితరులమీద బండరాళ్ళు వేస్తూ వితండవాదన చెయ్యడం వలన యెవరికీ,  ముఖ్యంగా విషయానికి ఒరిగిందేమీ ఉండదు. అట్లాంటి వితండ వాదన వల్ల, అప్రజాస్వామ్య చర్చల వల్ల మన మధ్య  మనస్పర్థలూ , వైమనస్యాలూ యేర్పడి అవి బురద జల్లుకునేదాకా పోయే ప్రమాదముంది. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్న వారి మధ్య సహనం కోల్పోతున్న వాతావరణం కనబడుతున్నది.

తమకు నచ్చని అభిప్రాయాల పట్ల ప్రజాస్వామికంగా స్పందించి చర్చించాల్సింది పోయి దూషణలూ , అవమానించడాలూ, బెదిరింపులూ, దాడులూ చెయ్యడం దారుణమైన విషయం. దూషిస్తేనో, అవమానిస్తేనో, బెదిరిస్తేనో, దాడి చేస్తేనో అభిప్రాయాలు మార్చుకుంటారని, తమకు అనుకూలంగా వత్తాసు పలుకుతారనీ, లేదూ భయపడి పూర్తిగా మాట్లాడ్డం మానేస్తారని అనుకోవడం అమాయకత్వమూ, పైపెచ్చు  వెర్రి తనమూ కూడా! తెలుగు నేలమీద విస్తారంగా జరిగిన అనేకానేక ప్రజాస్వామ్య ఉద్యమాల భావజాల వారసత్వమూ, ప్రేరణా పుణికిపుచ్చుకున్నవారు అట్లా బెదిరిపోయి నోరు మూసుకుంటారనుకోవడం మూర్ఖత్వం.

అయితే ఈ అప్రజాస్వామిక సంస్కృతి ఇవాళ యెల్లెడలా వ్యాపించి బలపడడానికి ఒక నేపథ్యమున్నది. ప్రజాస్వ్యామ్య వాదులపైనా ,ప్రగతిశీల భావజాలం మీదా ఈ దాడులు – రాజ్యం చేసేవీ కావచ్చు, రాజ్యేతర శక్తులు చేసేవీ కావచ్చు –  గత అయిదేళ్ల కాలంగా యెక్కువైతున్నవి (అంటే అంతకు ముందు లేవని కాదు). ఇతరుల అభిప్రాయాలని సహనంతో, ప్రజాస్వామ్య దృక్పథం తో స్వీకరించి , చర్చించడానికి సిద్దంగా లేని అప్రజాస్వామ్య నియంతృత్వ శక్తులు ప్రపంచవ్యాప్తంగా బలపడినవి. ఈ శక్తులు తమకి నచ్చని అభిప్రాయాలని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నవి.

దాడి చేసి నోరు మూయించాలనే నిర్ణయించుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా  గ్లోబలైజేషన్ విఫలమై తనను,  తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి శాయశక్తులా అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న సందర్బంలో, దానికి  ఆలంబనగా నిలబడుతూ , దాని అండతో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి   ప్రయత్నిస్తున్న నియో కన్జ ర్వేటివ్ (నూతన సంప్రదాయవాద)  శక్తులివి. ఇవి ప్రపంచవ్యాప్తంగానూ,  తమ తమ దేశాల్లోనూ, గ్లోబలైజేషన్ కొనసాగిస్తున్న నిరాఘాట దోపిడీ పీడనలకు తమ శాయశక్తులా వత్తాసు పలుకుతూనే, అండదండలిస్తూనే, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల ముసుగులో  తమ అప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలుచేస్తున్నాయి.

ప్రజాస్వామిక చర్చలు జరగకుండా అణచివేస్తూ,ప్రశ్నించే గొంతులని నోరు నొక్కుతూ, యెల్లెడలా ప్రకటిత అప్రకటిత , రాజ్య , రాజ్యేతర నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఈ నూతన సంప్రదాయ శక్తులు యేకీకరణమౌతున్నాయి. చర్చలు జరిగే జాగాలన్నింటినీ బలవంతంగా ఆక్రమించుకుని,  అయితే తమకనుకూలంగా మార్చుకోవాలనో లేదా శాశ్వతంగా మూసెయ్యాలనో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే ఈ బెదిరింపులూ దాడులూ అవమానాలూ. చాలా మందికి ఇవి కొత్తకాకపోవచ్చు కానీ, ఇవి వేస్తున్న యెత్తుగడలూ, వస్తున్న మార్గాలూ, అవలంబిస్తున్న పద్దతులూ (కొన్ని సార్లు మనకు తెలీకుండా చాప కింద నీళ్ళలా , రకరకాల ముసుగులు వేసుకుని ) మరింత నవీనంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు .

యిటువంటి పరిస్ఠితుల్లో ప్రజాస్వామిక చర్చా వాతావరణాన్నీ, అభిప్రాయాల ఘర్షణనూ, అందరం కూడి ఒక చోట చర్చించుకునే జాగాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. వినడానికి ఒక పునరుక్తి (cliché ) లాగా ఉండొచ్చేమో కానీ,  ఇది ప్రజాస్వామ్యవాదులందరి భాద్యతా తక్షణ కర్తవ్యమూనూ. సహనమూ, యితరుల అభిప్రాయల పట్ల గౌరవమూ  కోల్పోకుండా, సంయమనంతో  వస్తుగతంగా (objective) చర్చ చేయడం యివాళ్ల యెంతో అవసరం. అట్లాంటి చర్చల్లోంచి యెదిగే అభిప్రాయాలే, భావజాలమే అప్రజాస్వామిక తిరోగమన శక్తులకు సరైన సమాధానం చెప్తాయి.

*

swamy1

కలాం వెనక వున్నది మనువాదమే!

 

పి. విక్టర్ విజయ్ కుమార్

హద్దులు దాటుతున్న కామెంట్ లను చూసి ” ఈ కామెంట్ లను moderate చేయమంటారా ? ” అంటూ తమ నైతిక బాధ్యతను నిర్వర్తించే క్రమం లో నన్ను సంప్రదించారు సారంగ టీం. అబ్బుర పడ్డా ఎడిటర్ కు ఉండాల్సిన sincerity చూసి. వ్యాస కర్తగా చెప్పా ” కలాం వెనకేసుకొస్తున్న మనువాద భావ జాలం నమ్ముకున్న వారి ప్రవర్తన ప్రతి ఒక్కరికీ తెలియాలి . మీరు అనుమతిస్తే అన్ని కామెంట్స్ ను కలుపుతూ ఒక ఫైనల్ నోట్ సబ్ మిట్ చేసుకుంటా అని. అనుమతించిన సారంగకు ధన్య వాదాలు .

” కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ” లాంటి ఉపోద్ఘాతం తో తో మొదలు పెట్టి ” ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !! ” తో ముగిసిన వ్యాసమిది. ఒకరు ముందూ వెనకా చూడకుండా ” రబ్బిష్ ” అన్నారు, ఇంకొంచెం ముందుకెళ్ళి ” పిచ్చ నా ____ ” అన్నారు ( ఫిల్ ద బ్లాంక్స్ అని రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయింది…ప్చ్ ! ), మరొకరు వ్యాస కర్తను ” చెప్పుచ్చుకు కొట్టాలి ” అన్నారు, ఎవరో ” ఫూల్” అన్నారు, ఇంకొకరు ఉద్వేగం ఆపుకోలేక “ఆకుకు ____ తెలియని వ్యాసమిది ” ( ఫిల్ ద బ్లాంక్స్ రిక్వెస్ట్ చేయడానికి అది నాకొక్కడికే సంబంధించింది కాదు. మొత్తం స్త్రీ సమాజానికి సంబంధించింది) అని దుర్గా మాతగా కొలిచే ఆడ వాళ్ళను అలవోకగా వాడుకుంటూ అటాక్ చేయడానికి వెనుకాడ లేదు.

అసలు మనువాద ఆలోచన విధానం అన్నది ఈ దేశాన్ని సగం తినేసింది. వ్యతిరేక దృక్పథాన్ని సహించలేని ఓర్వలేని తనం ఆ మనువాదం నర నరాన ఉంది. దళితుల నాలుకలను తెగ కోసిన ” దుర్మార్గమైన అసహనం ” కలిగిన నీతి అది. అదే నీతి దేశం లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంది. అదే కుటిల నీతి – మీరు మొత్తం చరిత్ర చదవండి….ప్రెసిడెంట్ స్థానానికి నారాయణన్ కల్పించిన విలువ, ఇక ఏ ఒక్కరన్నా కల్పించి ఉండి ఉంటే చెప్పండి. దేశ అత్యున్నత స్థానం లో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కు తలూపే ప్రెసిడెంట్ లు తప్ప ఎవరూ కనిపించరు. దళితుడైన నారాయణన్ ప్రెసిడెంట్ కావడానికి కారణం బీసీ, దళిత కులాలను రెప్రెజెంట్ చేసే పార్టీలే . 1997 లో అతను ప్రెసిడెంట్ అవ్వడం కాంగ్రెస్ నిర్ణయం కాదు. అది వెనుకబడిన కులాలు, ద్రవిడ పార్టీలు ఎంచుకున్న వ్యక్తి నారాయణన్. అతను తీసుకున్న తిరస్కార నిర్ణయాలు కాంగ్రెస్ కు , బీ జే పీ పార్టీలకు కొరుకుడు పడ లేదు. మొదటి టర్మ్ లో నిజానికి పర్ఫార్మెన్స్ చూపినా , సెకండ్ టర్మ్ కు కాంగ్రెస్ , బీ జే పీ మద్దతుతో పైకొచ్చిన కలాం అవసరం లేకపోయింది.

ఇది నారాయణన్ ను ” గ్లోరిఫై ” చేయడం కాదు. నారాయణన్ పక్కా కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా ఉంచుకుని పైకి వచ్చాడు. నిజానికి నాకూ గ్రీవెన్స్ ఉంది – ఒక పేద దళిత కుటుంబం నుండి వచ్చి, క్రియా శీలంగా, తనకున్న పరిమితుల్లో , తనకున్న రాజకీయ చాక చక్యం తో , తనకున్న స్థాయిలో ఈ దేశం లో అణగారిన దళితులకు తగినంత కృషి చేయలేదే అని.

ఐతే ఈ వ్యాసం మొత్తం అడిగిన ప్రశ్న ఒకటే – నిజాయితీగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి – మీరు ఏ గొప్ప కలాం లో చూసారో ఆ గొప్ప నారాయణన్ లో ఎందుకు కనిపించలేదు ? ఒళ్ళు తెలీకుండ మీదకెత్తుకునే తిరిగే కలాం లో ఉన్నదేంటి ? నారాయణన్ లో లేని దేంటి ? కలాం చేసిన తప్పుల్లో అర్థం చేసుకునేదేంటి ? నారాయణన్ తప్పుల్లో అర్థం కానిదేంటి ?….కలాం కు ఇచ్చిన స్థానం నారాయణన్ కు ఎందుకు కల్పించలేకపోయింది ?

Systemic bias అర్థం చేసుకోవాలంటే మనువాద ఆలోచనలు ముందుకు తోస్తాయి. ఇంత మీడియా ( అప్పట్లో వేదాలు ) తెగ నోరేసుకు తిరిగితే – ఇన్నాళ్ళు మాకున్న నమ్మకం బూటకమైతే – మేమెలా తట్టుకో గలం అనే ఒక భావన. అలాగే క్వశ్చన్ చేయడాన్ని మనువాద ఆలోచన అక్కడే ఆపేస్తుంది. తిరుగు బాటుకు తగిన గుణ పాఠమెంటో చెప్పాలనే ఉవ్విళ్ళూరుతుంది. ముఖ్యంగా హైందవ నాగుపామును తలకెత్తుకున్నాక – కరిపించుకోవాల్సిందే తప్ప విసిరి కొట్ట రాదు. ఇదీ మనువాద ఆలోచన !

” ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది ” అని ఈ వ్యాసం చెప్పడం గమనించి ఉంటే కృతజ్ఞతలు.

అంబేద్కర్ మూడు సార్లు ఎలక్షన్ లలో పోటి చేసి డిపాజిట్ కూడా లేకుండా ఓడించబడ్డాడు. కోల్పోని ధైర్యం తో అంబేద్కర్ స్వాంతంత్ర్య సమరం peak లో ఉండగా – గాంధీ ని దుమ్మెత్తి పోసాడు. ( నిజానికి గాంధీ [ ఇమేజ్ ను బహిర్గతం చేసి ] నోట్లో దుమ్ము కొట్టాడు అంటే నిజమేమో ?! ) . అంబేద్కర్ ” నేను హిందువుల తోటలో పాము లాంటి వాడిని ” అని చేసిన తిరస్కార గర్జన ఇప్పటికీ చల్లార లేదు.

గాంధీ విమర్శకు అతీతుడా ? కలాం విమర్శకు అందని దేవుడా ?

మీరు ఆరిందం చౌదరి రాసిన పుస్తకాలు చదివారా ? కలలు అమ్మడం ఒక గొప్ప మార్కెటింగ్ కళ. అందునా అభివృద్ధి కరువైన మన దేశం లో అది మరీ సులభం. ఆరిందం చౌదరి పుస్తకాలు మిమ్మల్ని కలాం పుస్తకాలకు ధీటుగా ఇన్స్పైర్ చేయకుంటే చెప్పండి. Ayn Rynd వ్రాసిన ” సీక్రెట్ ” పుస్తకం చదవండి – మీలో ఉరికే పాజిటివ్ ఎనర్జీ మీరే చూసుకోండి . ఆరిందం చౌదరి స్కాం లో అరెస్ట్ అయ్యాడు. Ayn Rynd కోట్లకు పడగలెత్తింది – కేవలం కలలను అమ్మడం తోటే. నిమ్న దేశాల్లో, నిమ్న మనసులకు Emotional hype ఇవ్వడం గొప్పగా చిత్రీకరించడం మను వాదానికే చెల్లింది.

కలాం పబ్లిక్ లైఫ్ – మధ్య తరగతి మనిషి కెరీర్ కోరికలకు ప్రతిబింబంగా , వివాదాలకు అతీతంగా ఇమిడి పోయే అందమైన జీవితాన్ని ఎన్నుకోడానికి మార్గ దర్శంగా నిల్చాడు కాని , తన సైన్స్ తో మానవత్వం కలిపి ప్రాక్టికల్ గా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏవన్నా గట్టి సాక్ష్యాలు ఉంటే తీసుకు రండి. తెలుసుకోవడానికి అభ్యంతరం ఇసుమంత కూడా లేదు. We are inspired by Kalam’s life అంటే అది వ్యక్తి గత అభిప్రాయం And you need a model man to build a career to emulate, which is completely understandable. దానితో పేచీ లేదు. ” ప్రజల మనిషి / పీపుల్స్ ప్రెసిడెంట్ ” అంటేనే చిక్కు !! ఇక్కడ – ఒక Individual interest కలిగిన అభిప్రాయాన్ని , అందునా ఒక మంచి ‘ స్వంత జీవితం ‘ గడపాలనే ఒక closed view ను Public opinion for public good లా చూపడం తో ఈ వ్యాసం ఖచ్చితంగా విబెధిస్తుంది.

‘ అచ్చే దిన్ ‘ పేరుతో మభ్య పెట్టి , 60 సంవత్సరాలలో చేయనిది 5 సంవత్సరాలలో చేస్తానని మానవాతీతమైన ప్రమాణాలు చేసి, నల్ల ధనం వెనక్కు తెస్తాననే అత్యాశ కలిగించి – కనీ వినీ ఎరుగని రీతిలో అధికార దాహం లో కులం, మతం ను వెనకేసుకుని సిం హాసనం ఏలుతున్న మోదీ దీర్ఘ కాలము నిలవడు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు కూడా అంతే. ఆ రోజు – ఇంత మహనీయుడు కలాం పాత్ర మరి ఏంటి ఈ పాపం లో అంటే – గుండెలు తడుముకోవాల్సిందే.

దయ చేసి వ్యవస్థతో మమేకమైన ఒక వ్యక్తిని అంచనా వేయడానికి mid way లేదు గమనించండి.

కలాం కొటేషన్స్ మత్తెక్కిస్తాయి. అది విషయం కాదిక్కడ. బాబా ల ముందు సాగిల పడ్డం యే విజ్ఞానానికి ప్రతీక ? యే సెక్యులరిజానికి ప్రతీక ? కలాం కు కావాల్సింది పొగడ్త కాదు. నిజానికి బోలెడంత సానుభూతి !! తన కుటుంబం నమ్మని మత గ్రంథాలను చదివాడు, తన సైన్స్ నమ్మని స్వాములకు దండం పెట్టాడు, ఊచకోత జరుగుతున్నా ఒక పక్క నారాయణన్ ” ఈ అల్లర్లకు అక్కడి అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంది ” అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే తన కళ్ళకు, తనలో మానవత్వానికి గంతలు కట్టేసుకున్నాడు . ఇదంతా తాను ఈ దేశం నమ్ముకున మను వాద వ్యవస్థ లో మనడానికి పడ్డ కష్టాలు. ఒక మైనారిటీ వ్యక్తి ఈ దేశం లో ముందుకెళ్ళాలంటే – ఎన్నొ పరీక్షలకు గురి అవ్వాలి. తన ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి తన ఇమేజ్ ను పదే పదే చెక్ చేసుకోవాలి – అని కలాం తన జీవన విధానం లో చెప్పకనే చెప్పాడు. ఆయన ( నేను నమ్మని ) ఆత్మ , పనికి రాని పొగడ్తల కోసం కంటే సానుభూతి కోసం చూస్తుందని నా నమ్మకం !!

P S : సారంగ లో యాక్టివ్ గా ఉండే ఎంతో మంది మార్క్సిస్టులకు ఒక విఙప్తి ! మనమింకా అద్భుతమైన ఆదర్శ సమాజం ఏర్పరుచుకోలేదు. నారాయణన్ ఈ బూర్జువా వ్యవస్థ accommodate చేసిన దళిత వ్యక్తి. ఆయనకున్న పరిమితులు ఆయనుకున్నాయి. సమస్య అది కాదిక్కడ. వ్యవస్థీకృతమైన మనువాదాన్ని వ్యతిరేకించాలంటే – నారాయణన్ ను సపోర్ట్ చేయ డానికి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు.

గాంధీ ” sentiment ‘ అయితే అంబేద్కర్ ” Counter sentiment ” అవుతాడు. కలాం ” sentiment ‘ అయితే నారాయణన్ ” Counter sentiment అవుతాడు.

మన దేశం లో ఉన్నది ప్రధానంగా మనువాద బ్రాహ్మణీయ అగ్ర కుల సమాజం. కాబట్టి ” కలాం ఇమేజ్ ” కేవలం మత ఛాందస వాద సమస్యే కాదు. This is an issue of systemic bias this state is practicing
Dont hesitate to support Narayanan, if you truly believe , you have to fight out the menace of majority fundamentalism in this country and I am sure this casteist society will have one ” Counter sentiment “, it tries to hide, unless you really search for.
*

కుంచెకి ఆయుధ భాష నేర్పినవాడు!

పి. మోహన్

 

P Mohanచిత్తప్రసాద్ స్నేహశీలి. దేశంలోనే కాదు నానా దేశాల్లో బోలెడు మంది మిత్రులు. డెన్మార్క్ వామపక్ష కవి ఎరిక్ స్టీనస్, చెకొస్లవేకియా ఇంజినీరు ఇంగ్ ఫ్రాంటిసెక్ సలబా, ప్రాగ్ లోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మిలోస్లావ్ క్రాసా, సీపీఐ కార్యకర్త తారా యాజ్ఞిక్, ఆమె భర్త, పిల్లలు, పీసీ జోషి సహచరి కల్పనా దత్తా, బెంగాల్ కరువును, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కెమెరాలో బంధించిన సునీల్ జనా, లక్నో ‘బ్రదర్’ మురళీ గుప్తా, ఎంఎఫ్ హుస్సేన్.. ఇలాంటి కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో చిత్త కలసి తిరిగేవాడు. వీళ్లలో చాలామంది కలిగినవాళ్లు. చిత్త నోరు తెరిచి అడగాలేకానీ వేలు గుమ్మరించగలవాళ్లు. కానీ చిత్త ఎన్నడూ అలా గుమ్మరించుకోలేదు. చిత్తకు కొండంత అత్మాభిమానమని, డబ్బు సాయం చేస్తామంటే చిన్నబుచ్చుకునేవాడని, జాలిపడితే కోపగించుకునేవాడని మిత్రులంటారు.

‘నేను తొలిసారి చిత్త లినోకట్లు చూడగానే ముగ్ధుడిని అయిపోయాను. వాటిలో మతగాథల బొమ్మలు కాకుండా సాదాసీదా బతుకు, పేదల బాధలు ఉన్నాయి. ఇక అప్పట్నుంచి ఏ వారాంతమూ నేను అతన్ని విడిచి ఉండలేదు. అతని గదికి వెళ్లేవాడిని, లేకపోతే మా ఇంటికి పిలిచేవాడిని. కానీ అతడు దుర్భర పేదరికంతో బాధపడుతున్నాడని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని చాలా నెలల తర్వాత తెలిసింది. ఆత్మాభిమానంతో అతడు ఆ సంగతిని బయటపడనివ్వలేదు. తన బొమ్మలను నాకు అమ్మడానికీ ప్రయత్నించలేదు. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని బొమ్మలను కొనడానికి ప్రయత్నించేవాడిని. కానీ అతడు మొండివాడు. బొమ్మల ఖరీదు చెప్పకపోవడంతో పెద్ద చిక్కొచ్చేది. అందుకే నాకు తోచినంత చ్చేవాడిని. అతని జేబులో కాసిని డబ్బులు కుక్కడానికి నానా యాతనా పడేవాడిని.. కొన్నిసార్లు తలప్రాణం తోకకొచ్చేది. డబ్బుసాయంతో మన స్నేహాన్ని కించపరుస్తావా అని కేకేలేసేవాడు..’ అని చెప్పాడు మిత్రుడు సలబా.

‘డబ్బు సంపాదించడానికే బాంబేకి వచ్చి ఉంటే ఎప్పుడో సంపాదించి ఉండేవాడినమ్మా. మార్కెట్ ప్రకారం నడిచే ఉద్యోగాలు నాకు సరిపడవు కనుకే ఉద్యోగం చేయలేదు… చాలామంది కేవలం పెయింటింగులు వేసే మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బాంబేల్లో ఇళ్లు, కార్లు కొనిపడేస్తున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటంటే, ధనికులకు తగ్గట్టు మారిపోవడం, ఆత్మగౌరవాన్ని మంటగలుపుకోవడం, కళాసృజనలో దగా చేసుకోవడం. నాకు ఆ దారి తొక్కాల్సిన అగత్యం లేదు..’ అని తల్లికి రాశాడు చిత్త. అతని మదినిండా బొమ్మలు.. బొమ్మలు.. అవికూడా బాధల పాటల పల్లవిని వినిపించే గాఢమైన నలుపుతెలుపు బొమ్మలు..  ఆ బొమ్మలతోనే తను బతకాలి. బొమ్మల్లో రాజీపడకూడదు. కానీ వాటితోనే బతకాలి. ఎంతొస్తే అంత. చేతికష్టంతో నిజాయితీగా బతకాలి. ముంబై పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ కు, బెంగాల్, డెన్మార్క్, చెకొస్లవేకియాల్లోని పబ్లిషింగ్ కంపెనీలకు బొమ్మలు వేశాడు. బాంబేలోని లిటిల్ బ్యాలే ట్రూప్ కు స్క్రీన్లు, క్యాస్ట్యూములూ అందించాడు. బిమల్ రాయ్ కళాఖండం ‘దో బీగా జమీన్’ సినిమాకు లోగో వేశాడు. 1958లో ఎవరో అడిగితే పాల్ రాబ్సన్ జయంతికి నిలువెత్తు పెయింటింగ్ వేశాడు. ఏది వేసినా తనకిష్టమైందే వేశాడు.

struggle

చిత్త వర్ణచిత్రాలు కూడా అతని లినోకట్లంత శక్తిమంతంగా ఉంటాయి. 1938నాటి స్వీయచిత్రంలో ఆలోచనామగ్నుడై కనిపిస్తాడు(ఈ చిత్రం ఈ వ్యాసం తొలిభాగంలో ఉంది). పార్టీ పరిచయాల్లోకి వస్తున్న ఆ యువకుడి ముఖంలో, నేపథ్యంలో అరుణకాంతి అలుముకుపోయింది. వర్ణచిత్రాల్లోనూ అతడు శ్రమైక జీవన సౌందర్యానికే పట్టంగట్టాడు. పోరాటాలనే కాకుండా సంతాల్, కాశ్మీరీ అతివల నృత్యాలను, బాంబే రేవు పడవలను, నగర శివార్లలోని పచ్చిక బయళ్లనూ పరిచయం చేశాడు. చిత్త రంగుల ఆడాళ్ల బొమ్మలు క్యూబిజం, ఫావిజం ప్రభావాలతో పికాసో, మతీస్ లను గుర్తుకుతెస్తాయి. కానీ ఆ మనుషుల హావభావాల్లో అసలుసిసలు భారతీయ ఉట్టిపడుతుంటుంది. చిత్త పంటపొలాలు, పూలగుత్తుల బొమ్మలు అతనివని తెలుసుకోకుండా చూస్తే వ్యాన్గో వేసిన చిత్రాలేమో అనిపిస్తుంది. కానీ చిత్తకు తాను వ్యాన్గోను కానని తెలుసు. ‘నా గురించి నేను ఎక్కువ ఊహించుకుంటున్నానని నువ్వు పొరపడొద్దు మిత్రమా! నేనందుకు పూర్తి భిన్నం. నేను వ్యాన్గో అంత ప్రతిభావంతుడిని కానన్న సంగతి అందరికంటే నాకే బాగా తెలుసు. కాను కనుకే నా జీవితం, మనసూ ఈ దేశ విప్లవపోరాటాల్లో నిమగ్నమైపోయాయి..’ అంటూ మురళికి తనను ఆవిష్కరించుకున్నాడు.

1950 దశకం మధ్యలో చిత్త పపెట్ షోలపై మళ్లాడు. వ్యాపారంపై బాంబేకి వచ్చిన చెక్ మిత్రుడు సలబా పపెట్ షోలు వేస్తుండేవాడు. చిత్తకూ నేర్పాడు. తన దేశానికి వెళ్లిపోతూ పపెట్ సామగ్రినంతా చిత్తకు ఇచ్చేశాడు. చిత్త కూడా కొబ్బరి చిప్పలు, గుడ్డపేలికలు వంటి వాటితో కీలుబొమ్మలు(పపెట్స్) సొంతంగా తయారు చేసుకున్నాడు. తన ట్రూప్ కు ‘ఖేలాఘర్’ అని పేరుపెట్టుకున్నాడు. షోల కోసం కథలూ, పాటలూ రాసుకున్నాడు. ఈ బొమ్మలాట కోసం చుట్టుపక్కలున్న మురికివాడల పిల్లలు చిత్త చుట్టూ మూగేవాళ్లు. చిత్త వాళ్లకు కూడా బొమ్మలాడించడం నేర్పాడు. వాళ్లకు కథలు వినిపిస్తూ ఆ బొమ్మలు ఆడించి, నవ్వుల్లో తేలించేవాడు. వచ్చే కాస్త డబ్బునూ ఈ షోలకు ఖర్చుపెట్టేసి ఉత్త చేతులతో మిగిలిపోయేవాడు. ‘నా దగ్గర ఓ మంచి టేప్ రికార్డర్ ఉండుంటే ఈ షోలలో నాకింక అడ్డేముంది’ అని అన్నాడు చిత్త. అతడు తన బొమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడని అంటాడు సునీల్ జనా. చిత్త ఫొటోలు కూడా తీసేవాడు. మిత్రులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. కొండకోనల్లో మిత్రులను నుంచోబెట్టి ఫొటోలు తీసేవాడు.

puppets

చిత్త భారతదేశ చరిత్రలో కీలక ఘట్టాలను చూపుతూ బొమ్మలతో పుస్తకం తేవాలనుకున్నాడు. చాలా చిత్రాలు వేశాడు. పబ్లిషర్లు ముందుకురావడం, ముందుకొచ్చిన వాళ్లు డబ్బులివ్వకపోవడంతో ఆ పని ఆగిపోయింది. సలబా సాయం చేస్తానన్నాడు. అయితే వరదల్లో ఆ బొమ్మలు కొట్టుకుపోవడంతో చరిత్ర బొమ్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. రామాయణాన్ని బొమ్మలకెత్తే పనికూడా డబ్బు కష్టాలతో ఆగిపోయింది. రామాయణాన్ని ఒక కథలాగే చూసిన చిత్త ఆ బొమ్మలను చాలా సరళంగా, జానపద చిత్రాల శైలిలో వేశాడు. ఇన్ని కష్టాల నడుమ.. తను ఆరాధించే నందలాల్ బోస్ తన లినోకట్లను చూసి మెచ్చుకోవడం, మురికివాడల పిల్లలకు చిట్టిపొట్టి కథలు చెప్పించి నవ్వించడం, ఆడించడం వంటి అల్పసంతోషాలూ ఉన్నాయి.

పార్టీకి దూరమై ఇలాంటి ఎన్ని కళావ్యాసంగాల్లో మునిగినా రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్వరూపంలా ముందుకొచ్చి నిలిచేవి. ఇక మళ్లీ బొమ్మల్లో కార్మికకర్షకులు, రిక్షావాలాలు, విప్లవకారులు ప్రత్యక్షమయ్యేవాళ్లు.

‘జీవితాన్నిపూర్తిగా కళకు అంకింతం చేసి, రాజకీయాలను పక్కకు నెట్టాలని ఎంత బలంగా ప్రయత్నిస్తున్నానో అంత బలంగా ఈ దేశప్రజల రాజకీయాలు తిరిగి నన్ను పట్టుకుంటున్నాయి. అదంతే. కళాకారుడు మనిషి. అంతకు మించి మరేమీ కాదు. తను పుట్టినగడ్డకు అతడు బద్ధుడు. ఈ సంగతి అతనికి తెలిసినా, తెలియకపోయినా అతడు ఈ దేశజనుల జీవితంలో భాగం.. ప్రతి కళాకారుడూ త్వరగానో, ఆలస్యంగానో, తెలిసో  తెలియకుండానో తన నైతిక, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసి తీరతాడు. నైతికవాదుల, రాజకీయ సంస్కర్తల సంప్రదాయాన్ని నేను నా కళలో ఆచరించి చూపాను. ప్రజలకు అండగా నిలబడ్డమంటే కళకూ అండగా నిలబడ్డమే. కళావ్యాసంగం అంటే మత్యువును బలంకొద్దీ తిరస్కరించమే… రెండో ప్రపంచ యుద్ధం నన్ను సంప్రదాయకళల ప్రభావం నుంచి బయటికి రప్పించింది. నా కుంచెను పదునైన ఆయుధంలా తయారు చేసుకునేలా మార్చింది. నా కళా ఆశయాలు సమకాలీన ప్రపంచంతో సంలీనమయ్యాయి. కళ అనేది నా ఒక్కడి ఆయుధం, కళాకారుడి స్వీయ అభివ్యక్తి ప్రకటన సాధనం మాత్రమే కాదని, అతడు జీవిస్తున్న సంఘపు ఆయుధం కూడా అని అర్థం చేసుకున్నాను. ఆ సంఘంలో అతనితోపాటు, తోటి మనుషుల స్వీయ అభివ్యక్తులు కూడా ఉంటాయి’ అంటాడు చిత్త.

తలకిందుల వ్యవస్థపై అతని ధిక్కారం కేవలం బొమ్మలకే పరిమితం కాలేదు. ఓసారి శివసేన కార్యకర్తలు బాంబేలో బందు చేసి, అంగళ్లను మూయించడానికి చిత్త ఉంటున్న వీధికి వచ్చారు. అతడు కోపంతో వాళ్లముందుకు దూసుకెళ్లాడు. ‘ఏమిటీ దౌర్జన్యం? బందులతో జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ముందు ఇక్కన్నుంచి వెళ్లిపోండి’ అని కేకేలేశాడు. వాళ్లు నోరుమూసుకుని వెళ్లిపోయారు. మరో ముచ్చట చిత్త మాటల్లోనే వినండి. 1959లో ‘‘రక్షణమంత్రి మీనన్ ఎన్నికల ప్రచారం కోసం మా వీధికి వచ్చాడు. దేశం కోసం పనిచేయాలంటూ జనానికి అర్థం కాని ఇంగ్లిష్ లో ఊదరగొట్టాడు. ‘అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ, ఈ గడ్డు పరిస్థితుల్లో మేమెలా పనిచెయ్యాలో చెప్పండి’ అని అడిగాను. ‘నీతో తర్వాత మాట్లాడతా’ అని చెప్పి మళ్లీ ఉపన్యాసం దంచేశాడు. తర్వాత ఓ పోలీసు ‘అతడు కమ్యూనిస్టు సర్’ అని మీనన్ కు బిగ్గరగా చెప్పాడు. మీనన్ ముఖంలో భయపు ఛాయలు. ఉపన్యాసం అయిపోయాక కారులో తుర్రుమన్నాడు..’

girl

చిత్తప్రసాద్ అంటే సంతోషంగా ఉండేవాడని అర్థం. ఈ చిత్తప్రసాద్ సార్థకనామధేయుడు కాదు. తన సంతోషాన్ని తృణప్రాయంగా ఎంచి సామాన్యుల ఈతిబాధలను బొమ్మకట్టడానికి తన బతుకును కొవ్వొత్తిలా కరిగించుకుని అసమాన కళాకాంతులు వెదజల్లాడు. మనిషి మనిషిగా బతకాలని సమసమాజ స్వప్నాల్లో పలవరింతలు పోయి తన బాగోగులను మరచిపోయాడు. ‘ప్రకృతి కోతిని మనిషిగా మారుస్తూ.. మానవజాతిని నిరంతరం పునర్నవం చేస్తోంది. అయితే మానవజాతి ఇప్పటికీ కోతిలా వ్యర్థవ్యాపకాలనే ఇష్టపడుతోంది. ఒక పనిచేసే ముందు కాస్త ఆగి, ఆలోచించే ఓపిక లేదు దానికి. దానికి అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలి.. తనకు దక్కిన దానితో అది తృప్తిడడం లేదు. ప్రతిదాన్నీ కొరికి అవతల పడేస్తోంది. గబగబా మింగింది అరగడం లేదు, అయినా నిరంతరం ఆకలే దానికి. మనిషి మనసులో అసంతృప్తి అనే అజీర్తి ఉంది. స్వార్థపరుడికి రెండే రోగాలు.. దురాశ, అసంతృప్తి.. ’ అని తల్లితో వాపోయాడు చిత్త.

నిత్యదరిద్రం, నిర్నిద్ర రాత్రులు, అనారోగ్యం, ప్రతిదానికి కలతపడిపోవడం, ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరికలు.. అన్నీకలసి చిత్తను శారీరకంగా కుంగదీశాయి. అసలు వయసుకంటే పది, పదిహేనేళ్లు పెద్దగా కనిపించేవాడు. 70వ దశకంలో తిండికి చాలా ఇబ్బందిపడ్డాడు. అదివరకు బొమ్మలకొచ్చిన డబ్బుల్లో పదోపరకో తల్లికి పంపుతుండేవాడు. ఇప్పుడు తనకే కష్టంగా ఉంది. ఆదుకునేవాళ్లున్నారు కానీ ఏనుగంత ఆత్మాభిమానం కనుక ఆకలికేకలు రూబీ టెర్రేస్ గది నుంచి బయటికి వినిపించేవి కావు. అరకొరా పనులతోనే కాలం వెళ్లబుచ్చేవాడు. డబ్బు విషయంలో చిత్త ఎంత ‘మొండివాడో’ చూడండి..

chittaprosadఓసారి ప్రముఖ కళావిమర్శకుడు, రచయిత ముల్క్ రాజ్ ఆనంద్.. చిత్త బొమ్మలను అతనికి తెలియకుండా  ఏదో విదేశీ పత్రికకు పంపాడు. అవి అచ్చయ్యాయి. చిత్తకు సంగతి తెలిసి కడిగేశాడు. ఆ పత్రిక పేరున్న పత్రిక కనుక అడిగి డబ్బులిప్పించమన్నాడు. ముల్క్ రాజ్ ‘వాళ్లివ్వరుగాని నా జేబులోంచి ఈ వంద ఇస్తున్నా, తీసుకో’ అని మనియార్డర్ పంపాడు. చిత్త తిప్పికొట్టాడు. తనకు రావాల్సింది ఐదొందలని, కక్కి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఇదే చిత్త చెకొస్లవేకియా పబ్లిషింగ్ కంపెనీకి మరోరకంగా షాకిచ్చాడు. ఆ కంపెనీ చిత్తతో కవర్ పేజీలు, ఇలస్ట్రేషన్లు వేయించుకుని చెక్కు పంపింది. చిత్త ఆ మొత్తాన్ని చూసి నిప్పులు తొక్కి వెనక్కి తిప్పిపంపాడు. తనకు రావాల్సినదానికంటే పదింతలు ఎక్కువిచ్చారని, తను తీసుకోనని రాసి పంపాడు. కంపెనీ తలపట్టుకుంది. తమ దేశంలోని మార్కెట్ ప్రకారమే డబ్బు ఇచ్చామని, అంతకంటే తక్కువిస్తే మోసం చేశారంటూ అధికారులు తమను ఇబ్బందిపెడతారని రాసింది. చిత్త వెనక్కి తగ్గలేదు. చివరికి అతడు బొమ్మలను వాపసు తీసుకుంటాడనే భయంతో కంపెనీ ఏవో తంటాలు పడి చిత్త అడిగిన తక్కువ డబ్బు ఇచ్చేసింది. ఇంత అమాయకుడు ఇప్పుడు తన బొమ్మలకు లక్షలు విలువకడుతున్న నేటి ఆర్ట్ మార్కెట్ ను చూసుంటే గుండెపగిలి చచ్చుండేవాడు.

చిత్త చిత్రాలను మనవాళ్లకన్నా విదేశీయులే ఎక్కువ కొన్నారు. చిత్త ఊరికే డబ్బిస్తే తీసుకోడు కనుక కొందరు బొమ్మలను వేరేవాళ్లకు అమ్మిపెడతామని చెప్పి తామే ఉంచుకుని డబ్బులిచ్చారు. అతని చిత్రాలు మన దేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాయని ఒక అంచనా. అతడు బతికుండగా జరిగిన రెండే రెండు సోలో ఎగ్జిబిషన్లలో మొదటిది 1956లో చెకొస్లవేకియా రాజధాని ప్రాగ్ లోనే జరిగింది, నాటి మన తోలుమందం పాలకుల పరువు తీస్తూ. రెండోది 1964లో కలకత్తాలో జరిగింది. 1972లో చిత్త జీవితం, కళపై చెక్ దేశీయుడు పావెల్ హాబుల్ ‘కన్ఫెషన్స్’ పేరుతో 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. అందులో చిత్త తన కళ, రాజకీయాలు, సమాజం గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. శాంతి ఉద్యమానికి ఇది దోహదమంటూ డాక్యుమెంటరీకి వరల్డ్ పీస్ కౌన్సిల్ అవార్డు కూడా వచ్చిది.

చెకొస్లవేకియా వాసులు చిత్తను తమవాడే అన్నంతగా అభిమానించారు. చేవచచ్చిన స్వతంత్ర భారతావనిలో అతని కళకు గౌరవం దక్కకున్నా, నిత్యం పోరాటాలతో వెల్లువెత్తిన తూర్పు యూరప్ దేశాల్లో అతని బొమ్మలకు జనం గుండెల్లో దాచుకున్నారు. అతని బొమ్మలను పత్రికల్లో అచ్చేసుకున్నారు. తమ పుస్తకాలకు ఎక్కడో దేశాల అవతల ఉన్న అతన్ని వెతికిపట్టుకుని బొమ్మలు వేయించుకున్నారు. అతని కవితలను అనువదించుకుని మురిసిపోయారు. అతన్ని ఎలాగైనా తమ దేశానికి తీసుకెళ్లాలని సలబా విశ్వప్రయత్నాలు చేశాడు. చిత్తతో పపెట్ షో ఇప్పించేందుకు ప్రయత్నించాడు. క్రాసా డబ్బు సర్దాడు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ చిత్తకు చెక్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఖర్చులు పెట్టడానికి హామీదారు కావాల్సి వచ్చింది. సలబా బాంబేలో తనకు తెలిసిన ఒకతన్ని హామీదారుగా ఉండమన్నాడు. అతడు సరేనన్నాడు.

 

డాక్యుమెంట్లపై సంతకాల కోసం చిత్తను అతని దగ్గరికి పంపాడు సలబా. ఆ హామీదారు మాటల మధ్యలో ‘నా దయవల్లే నువ్వుపోతున్నావు..’ ధోరణిలో కించపరచేలా మాట్లాడ్డంతో చిత్త సర్రున అక్కన్నుంచి వచ్చేశాడు. ప్రయాణం ఆగిపోయింది. మరోసారి 1965లో చెక్ పపెట్రీ గ్రూప్ ‘రోదోస్త్’ కళాకారిణి ఇవా వోడికోవా ద్వారా ప్రయత్నించాడు సలబా. ఆమె భారత్ కు వచ్చినప్పుడు చిత్తను కలసి ప్రయాణానికి ఏర్పాట్లు, అనుమతులు అన్నీ సిద్ధం చేసింది. ఆమె ఏదో పనిపై ఇండోనేసియా వెళ్లి విమానంలో తిరిగొస్తూ కైరోలో విమానం కూలడంతో చనిపోయింది. తను చెక్ ను చూసే భాగ్యానికి నోచుకోలేదంటూ సలబాకు లేఖ రాశాడు చిత్త. సలబా చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రయాణానికి అన్నీ సిద్ధమయ్యాక ప్రయాణించాల్సినవాడు లోకంలో లేకుండా పోయాడు.

1976 ప్రాంతంలో చిత్తకు బ్రాంకైటిస్ సోకింది. దాదాపు 32 ఏళ్లపాటు బాంబేలో బతికి, అక్కడి మనుషుల సుఖదుఃఖాలు పంచుకుని, వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేసిన ఆ అపురూప కళావేత్తను పట్టించుకునే నాథుడే లేకపోయాడు ఆ మహానగరంలో. చెల్లి గౌరి బాంబే వచ్చి అన్నను కలకత్తా తీసుకెళ్లింది. తన దేశప్రజల ఆరాటపోరాటాలను నాలుగు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా చిత్రికపట్టి, కన్నీటి వరదలు పారించి, గుండెనెత్తురులు ఉప్పొంగించి.. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వన్ అండ్ ఓన్లీ చిత్త 1978 నవంబర్ 13న కలకత్తాలోని శరత్ బోస్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ జనరల్ హాస్పిటల్లో 63వ ఏట పరమ అనామకంగా కన్నుమూశాడు.

1979లో ప్రాగ్ లో, కలకత్తాలో అతన్ని స్మరించుకుంటూ ఎగ్జిబిషన్లు పెట్టారు. తర్వాత ప్రాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లలో అతని బొమ్మలు ప్రదర్శించారు. 2011లో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ అతని చాలా బొమ్మలను సేకరించి ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఎగ్జిబిషన్లు పెట్టింది.

చిత్త దేశానికి ఇచ్చినదానితో పోలిస్తే దేశం అతనికిచ్చింది శూన్యం. ‘నా పెయింటింగులను ఇంట్లో ఉంచుకోవడం నీకు కష్టమవుతుందమ్మా. వాటిని గంగానదిలో వదిలెయ్’ అని చిత్త తన చెల్లితో అన్నాడంటే ఈ దేశం అతని కళను అతడు బతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా గౌరవించిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కరువుకు బలైన మిడ్నపూర్ లోని స్వాతంత్ర్య వీరులను తలచుకుంటూ చిత్త తన ‘ హంగ్రీ బెంగాల్’లో.. ‘నిన్న మన స్వాతంత్ర్యం కోసం తెగించి పోరాడిన దేహాలను ఇప్పుడు కుక్కలు, రాబందులు పీక్కుతుంటున్నాయి. ఒక దేశం తన యోధులకు అర్పించే నివాళి ఇదేనా?’ అని ఆక్రోశించాడు.

చిత్త చరిత్రను, అని ప్రజాకళాసంపదను కన్నెత్తి చూడదల్చుకోని నేటి మన పేరుగొప్ప ప్రజాస్వామ్య పాలకులు అతనికి అర్పిస్తున్న నివాళి అంతకంటే ఘనంగా ఉందా? రవీంద్రనాథ్ టాగూరు వందో జయంతినే కాకుండా 150వ జయంతినీ కోట్లు ఖర్చుపెట్టి జరుపుకుని, అతని ‘వెర్రిమొర్రి’ బొమ్మలను దేశమంతటా తిప్పారు మూడేళ్లకిందట యూపీఏ పాలకులు. దేశజనుల బాహ్యాంతరంగాలను, దారిద్ర్యాన్ని, మౌనవేదనను ఉట్టిపడే భారతీయతతో అనితరసాధ్యంగా వర్ణమయం చేసిన అమృతమూర్తి అమృతా షేర్గిల్ శత జయంతి పండుగను అతిజాగ్రత్తగా మరచిపోయారు. అమృత బొమ్మలకంటే ప్రమాదరకమైన బొమ్మలు సంధించిన చిత్త వందో జయంతిని అతడు నరనరానా ద్వేషించిన నాగపూర్ నాజీ పాలకులు పట్టించుకుంటారనుకోవడం భ్రమ.

blue flowers

చిత్త పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. బడుగుజీవుల సుఖసంతోషాల కోసం తపనపడ్డాడు. తన కళతో వాళ్ల కన్నీరు తుడిచి, వాళ్లతో జెండాలు, బందూకులు పట్టించి దోపిడీపీడకుల గుండెలపైన కదం తొక్కించాడు. చిత్త ఆదర్శాలు, విలువలు ఏమాత్రం ‘గిట్టుబాటు’ కాని వ్యవహారాలు కనుక అతనికి వారసులు లేరు. ‘భారత్ లో గ్రాఫిక్ కళలు, ఇప్పటికీ నిరాశాపూరితంగా, బలహీనంగా ఉన్నాయి. ప్రచారం, ఆదర్శాల వంటివాటిపై కళాకారులు మొగ్గుచూపకపోవడం కారణం కావచ్చు’ అని చిత్త 1958లో అన్నాడు. నేటికి తేడా ఏమైనా ఉందా? చిత్త రాజకీయ విశ్వాసాలు, వాటిపట్ల అతని నిబద్ధత వల్లే అతనికి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ‘మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్’ లో ఎన్నడూ చోటు దక్కలేదు.

చిత్త కలలు ఇంకా ఫలించలేదు. ఆన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం, కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలు చాలా చాలా దూరంలో ఉన్నాయి. లినోలపై, కేన్వాసులపై చిత్త గొంతుచించుకుని శఠించిన దుర్మార్గాలు, దోపిడీపీడనలు ప్రజాస్వామ్యం, దేశభక్తి ముసుగుల కింద కోట్లరెట్లు పెచ్చరిల్లి జనాన్ని కాల్చుకుతింటున్నాయి. ఆనాడు ఒక్క బెంగాల్లోనే కరువైతే, నేడు దేశమంతా తిండిగుడ్డనీడల కరువులు. ‘96 కోట్ల సెల్ ఫోన్లు’,   అధికారిక దొంగలెక్కల ప్రకారమే 40 కోట్ల మంది నిత్యదరిద్రులు ఉన్న ఘన భారతావనిలో ఈ కరువులతో నల్ల, తెల్ల కుబేరులను బలుపెక్కిస్తూ మన జీడీపీ, తలసరి ఆదాయం తెగ వాచిపోతున్నాయి. చిత్త తుపాకులు, గొడ్డళ్లు ఎక్కుపెట్టిన విదేశీగద్దలు నల్లదొరల ఆహ్వానాలతో మందలుమందలుగా ఎగిరొచ్చి మాయారూపాల్లో ఈ గడ్డ సరిసంపదలను తన్నుకుపోతున్నాయి.

అతడు తిరుగాడి బొమ్మలు వేసిన బెజవాడ నేలతల్లిని ‘రాజధాని’ మంత్రగాడు చెరపట్టాడు. చిత్తను రగిలించి, మురిపించిన సాయుధపోరుసీమలో నయా నిజాంలు తుపాకుల అండతో కొత్త గడీలు కడుతున్నారు. నైజాము సర్కరోన్ని గోల్కండా ఖిల్లా కింద గోరీ కడతామని యుద్ధగీతికలతో గర్జించిన ప్రజాకవుల, కళాకారుల వారసులు పెరుగన్నం కోసం కొత్త నిజాం పంచన చేరి అతన్ని స్తోత్రపాఠాలతో ముంచెత్తుతూ మహోన్నత పోరాట వారసత్వాన్ని పెంటకుప్పలో బొందపెడుతున్నారు. చిత్త ద్వేషించిన నిరంకుశ, స్వార్థకపటాల క్రీనీడలు మరింత ముదిరి మదరిండియా అంతటా గాఢాంధకారం అలుముకుంది.

మరి ఈ చీకటి తొలగిపోదా? అడుగు కదిపితే చాలు కత్తులు దూసి నెత్తురోడిస్తున్న ఈ తిమిరానికి అంతం లేదా? చిత్త తన నిశాగంధి(‘నైట్-కాక్టస్) కవితలో ఏమంటున్నాడో వినండి..

‘ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది

అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే

ఈ తిమిరాన్ని వెలిగించి

పరిమళాలతో ముంచెత్తడం..

*

 

 

ఆ చిత్రాల ముందు తుపాకులు కొయ్య బొమ్మలే!

పి. మోహన్ 

P Mohanకరువు బొమ్మల తర్వాత చిత్తప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలాడు. ఢంకను వాయిస్తున్న మనిషి బొమ్మతో ‘ఇప్టా’కు లోగో వేశాడు. 1943లో లెనిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘం తరఫున 43 మంది దేశవిదేశ కమ్యూనిస్టు యోధుల చిత్రాలతో ఓ ఆల్బమ్ తయారు చేసి పార్టీకి అందించాడు. ఇందులో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో మొదలుకొని, పుచ్చలపల్లి సుందరయ్య వరకు ఉన్నారు.

1944 మార్చి 12, 13న విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు చిత్త హాజరయ్యాడు. ఎన్నో చిత్రాలు గీశాడు. ఎర్రజెండాలు కడుతున్నవాళ్లను, వంటలు వండుతు వాళ్లను, లంబాడాల నాట్యాలను.. ప్రతి సందర్భాన్నీ చిత్రిక పట్టాడు. తెలుగు రైతుల హావభావాలను, ఆశనిరాశలను తెలుగువాడే వేశాడని భ్రమపడేలా పరిచయం చేశాడు. సభలను విహంగవీక్షణంలో చూపుతూ గీసిన స్కెచ్చులో ఓ బ్యానర్ పై ‘కయ్యూరు కామ్రేడ్స్ గేట్’ అని తెలుగులో రాశాడు. కయ్యూరు అమరవీరులపై చిత్త అంతకుముందే ఓ బొమ్మ వేశాడు. కేరళలోని కయ్యూరు గ్రామంలో 1942లో భూస్వాములపై కమ్యూనిస్టుల నాయకత్వలో రైతాంగం తిరగబడింది. ఓ పోలీసు చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచేసింది. నలుగురు యువ రైతునాయకులను ఉరితీసింది. చిత్త ఆ నలుగురిని ఉరితీస్తున్న దృశ్యాన్ని ఒకపక్క.. నేలకొరిగిన వీరుడి చేతిలోని జెండాను చేతికి తీసుకుని సమున్నతంగా పట్టుకున్న మహిళను మరోపక్క చిత్రించాడు. చిత్రం మధ్యలో ఆ వీరుడికి కమలంతో నివాళి అర్పిస్తూ, అతని పోరు వారసత్వాన్ని ఆవాహన చేసుకుంటున్న బాలుడిని నుంచోబెట్టాడు.

R0189P049-011-2318KB

R0189P049-011-2318KB

భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి(1946 -51) చిత్త చిత్ర హారతులు పట్టాడు. యావద్దేశానికి ఆశాకిరణంలా జ్వలించిన ఈ పోరాటంపై వేసిన బొమ్మల్లో వర్గకసి నిప్పులను కురిపించాడు. కాయకష్టంతో చేవదేరిన తెలంగాణ రైతు ధిక్కారాన్ని, త్యాగాన్ని నలుపు తెలుపుల్లోనే ఎర్రజెండాల్లా రెపరెపలాడించాడు. బ్రిటిష్ పాలకులు, వాళ్ల కీలుబొమ్మ నిజాం, అతగాడి రజాకార్ ముష్కరులు, యూనియన్ సైన్యం కలసికట్టుగా సాగించిన దారుణమారణకాండలో నెత్తురోడిన తెలంగాణను గుండెల్లోకి పొదువుకుని దాని వేదనను, ఆక్రోశాన్ని రికార్డు చేశాడు. సంకెళ్లు తెంచుకుంటున్న రైతులను, శత్రువు గుండెకు గురిపెడుతున్న గెరిల్లాలను, సుత్తీకొడవలి గురుతుగ ఉన్న జెండాలతో సాగిసోతున్న ఆబాలగోపాలాన్ని, రజకార్ల, యూనియన్ సైనికుల అకృత్యాలకు, అత్యాచారాలకు బలైన పల్లెజనాన్ని.. పోరాటంలోని ప్రతి సందర్భాన్నీ చిత్త ఒక నవలాకారుడిలా రూపబద్ధం చేశాడు.

ఒక చిత్రకారుడు సాయుధ గెరిల్లాలతో కలసి తిరిగి బొమ్మలేయడం మన దేశ కళాచరిత్రలో అపూర్వఘట్టం. నాటి తెలుగు ప్రజాచిత్రకారులకు చిత్త ఒక ఆదర్శం. మాగోఖలే, గిడుతూరి సూర్యం తదితరులు వేసిన తెలంగాణ సాయుధరైతు పోరాట చిత్రాలకు, కార్టూన్లకు చిత్త బొమ్మలే స్ఫూర్తి. ఈ పోరాటాన్ని గానం చేసిన గంగినేని వెంకటేశ్వరావు ‘ఉదయిని’కి చిత్త ఆరు చిత్తరువులు అందించాడు. చిత్తకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తెలియకున్నాఅందులోని చాలా కవితలకు అతడు చిత్రానువాదం చేశాడు! చిత్త బొమ్మలు నాటి ‘అభ్యుదయ’, ‘నవయుగ’ వంటి తెలుగు పత్రికల్లోనూ వచ్చాయి.

abyudaya

అభ్యుదయ పత్రిక 1948 ఆగస్టు సంచిక చిత్త వేసిన శ్రామికజంట ముఖచిత్రంలో వెలువడింది. అందులో ఆ బొమ్మ గురించి, చిత్త కళాసారాంశం గురించి ఇలా రాశారు.. ‘స్త్రీ పురుషుల సమిష్టి కృషి ఫలితంగా మానవ జీవితం సుఖవంతమూ, శోభావంతమూ ఔతుంది. పరిశ్రమలో, ఫలానుభవంలో సమాన భాగస్వాములైన స్త్రీపురుషులు ఒకవంక ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుంటారు. గనులు త్రవ్వుతారు. పంటలు పండిస్తారు. తాము శాస్త్రజగత్తును శోధించి సృష్టించిన యంత్రాల సహాయంతో తమ శ్రమశక్తిని సద్వినియోగం చేస్తారు. తమ హృదయాన్ని, మేధస్సును విశ్వంలోని గుప్తరహస్యాలను గ్రహించటానికి ప్రయోగిస్తారు. జంతువైన నరుడు, జగత్తునిండా వ్యాపించి, మానవుడుగా దివ్యమూర్తిగా వికసించటానికి చేసే సమిష్టి కృషికి, ప్రపంచాభ్యుదయానికి చిహ్నంగా ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ ఈ చిత్రాన్ని రచించాడు.’

చిత్తకు తెలుగువాళ్లతో 1950ల తర్వాత కూడా అనుబంధం కొనసాగింది. 1959లో ముత్యం రాజు, సంజురాజే అనే ఇద్దరు తెలుగు గిరిజనుల బొమ్మలను చిత్త స్పాట్ లో గీశాడు. ఆ బొమ్మలున్న కాగితంపై వాళ్లు తెలుగుప్రాంత గిరిజన వైద్యులు, వేటగాళ్లు అని, గోండులు కావచ్చని రాసుకున్నాడు.

joy

చిత్త 1946 నుంచి బాంబేలో స్థిరపడ్డాడు. పరాయి పాలకులను గడగడలాడించిన 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును, దాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వైనాన్ని బొమ్మకట్టాడు. సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మద్దతిచ్చినా, ఇది దేశ సమస్య కాబట్టి కాంగ్రెస్, ముస్లిం లీగులు కూడా కలసి రావాలని ఆ చిత్రాల్లో సుత్తీ కొడవలి జెండాల పక్కన వాటి జెండాలనూ అమర్చాడు. వీటిలోనే కాదు చాలా సమ్మెల చిత్రాల్లో చిత్త ఈ మూడు పార్టీల ఐక్యత అవసరాన్ని గొంతు చించుకుని చెప్పాడు. గాంధీ రాజకీయపరంగా బద్ధశత్రువైనా అతని జనాకర్షణ శక్తి చిత్తనూ లాక్కుంది. గాంధీ నిరాయుధ మార్చింగ్  దృశ్యాలను, అతని ధ్యానదృశ్యాలను చిత్త రాజకీయ శత్రుత్వం, వ్యంగ్యం, వెటకారం గట్రా ఏవీ లేకుండా అత్యంత మానవీయంగా చూపాడు. అతి సమీపం నుంచి చూసిన నేవీ తిరుగుబాటు అతన్ని చాలా ఏళ్లు వెంటాడింది. 1962లో దీనిపై ఓ పెద్ద వర్ణచిత్రం వేశాడు. హార్బర్లో నేలకొరిగిన వీరులు, పోలీసుల దమనకాండ, మౌనంగా చూస్తున్న సామాన్య జనంతో ఆ చిత్రం నాటి పోరాటాన్ని మాటలు అక్కర్లేకుండా వివరిస్తుంది.

1946 నాటి చరిత్రాత్మక పోస్టల్ సమ్మె, 1975 నాటి రైల్వే సమ్మె, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం.. ఇలా ప్రతి చారిత్రక జనోద్యమాన్నీ చిత్ర బొమ్మల్లోకి అనువాదం చేశాడు. హోంరూల్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా వంటి భారత స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ‘పీపుల్స్ ఏజ్’ పత్రికలో ‘ఇండియా ఇన్ రివోల్ట్’ బొమ్మల్లో చూపాడు. చేయిపట్టుకుని కవాతు చేయించే ఈ బొమ్మలతోపాటు శత్రుమూకలను తుపాకులకంటే ఎక్కువ జడిపించే కార్టూన్లనూ వందలకొద్దీ గీశాడు. శ్రమజీవుల కష్టఫలాన్ని తన్నుకుపోయే దేశవిదేశాల గద్దలు, వాటికి కాపలాకాసే పోలీసు జాగిలాలు, గాంధీ టోపీల కుర్చీ తోడేళ్లు, నల్లబజారు పందికొక్కులు.. నానా పీడకజాతులను బట్టలను విప్పదీసి నడిరోడ్డుపైన నిలబెట్టాడు. దామీ, డేవిడ్ లో, థామస్ నాస్త్, జార్జ్ గ్రాజ్ వంటి విశ్వవిఖ్యాత కార్టూనిస్టుల, కేరికేచరిస్టుల ప్రభావం చిత్త కార్టూన్లలో మనవైన భావభౌతిక దరిద్రాలను, దాస్యాలను అద్దుకుని వెక్కిరిస్తుంది.

chitta

1947లో దేశం పెనంలోంచి పొయ్యిలో పడింది. స్వాతంత్ర్యం మామిడిపళ్లు పెదబాబుల ఇళ్లకే చేరాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చేవచచ్చి, శాంతియుత పరివర్తన అగడ్తలోకి జారిపోయాయి. చాలామంది కమ్యూనిస్టులు రంగులమారి నెవురయ్య సోషలిజం మాయలో పడిపోయారు. చిత్త తెగ ఆరాధించిన పీసీ జోషి కూడా మెత్తబడ్డాడు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభల్లో రణదివే వర్గం జోషిని పక్కన పెట్టేసి సాయుధ పోరాటమే తమ మార్గమంది. ఈ వ్యవహారం కుట్రపూరితంగా, కక్షగట్టినట్టు సాగడంతో చిత్త చలించిపోయాడు. రణదివేను కూడా తర్వాత అతివాద దుస్సాహసికుడంటూ పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. పార్టీలో ఇలాంటి తడబాట్లు, ఆధిపత్య రాజకీయాలు, అభ్యుదయ కళాకారుల సంఘాల్లోకి పిలక బ్రాహ్మణుల, స్వార్థపరుల చేరికలు, సినిమాల్లోకి అభ్యుదయ కవిగాయకనటకుల వలసలు, దేశవిభజన నెత్తుటేర్లు, మతకలహాలు.. చిత్త సున్నిత హృదయాన్ని కోతపెట్టాయి. పార్టీతో అనుబంధం తగ్గించుకున్నాడు.

కానీ పార్టీ రాజకీయాలపై విశ్వాసం రవంత కూడా సడల్లేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అదివరకటికంటే జోరుగా సాగుతున్న దోపిడీపీడనలపై మరింత కసి రేగింది. ‘యే ఆజాదీ జూటా హై’ అన్న నమ్మకం బలపడిపోయింది. ‘బాబ్బాబూ, మా గడ్డకు స్వాతంత్ర్యం ఇవ్వండయ్యా అని కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వాడిని దేబిరించిన కాలం ఎంత పాడుకాలం! దీనికి బదులు స్వాతంత్ర్యాన్ని ఎదురుబొదురుగా కొట్లాడి, చచ్చి తెచ్చుకుని ఉండుంటే అదేమంత పెద్ద పొరపాటు, అమానవీయం అయ్యేదా?’ అని తల్లికి రాసిన లేఖలో ఆక్రోశించాడు. ‘రెండు నాలుకల నాయకులు రాజ్యమేలుతున్నారు. ఈ దేశానికి చరిత్రపై ఇంకెంతమాత్రం ఆసక్తి లేదు, ఒట్టి గాసిప్ లపై తప్ప. అబ్బాస్ ఏదో సినిమా కథను కాపీ కొట్టాడని మొన్న వార్తలొచ్చాయి. గాసిప్ చాలు. ఇక ఉంటాను’ అని లక్నోలోని ఆప్తమిత్రుడు మురళీ గుప్తాకు రాసిన లేఖలో చీదరించుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధంతో గుణపాఠం నేర్చుకున్న ప్రపంచం తర్వాత శాంతిమంత్రం పఠించింది. అయితే అన్నిరోగాలకూ అదే మందని ప్రచారం చేశారు. వర్గపోరాటాన్ని చాపచుట్టేశారు. 1952లో కలకత్తాలో ఇండియన్ పీస్ కాంగ్రెస్ జరిగింది. చిత్త ఆ ఉద్యమంలోని రాజకీయాలకు కాకుండా సందేశానికే ఆకర్షితుడయ్యాడు. లోకమంతా శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని బోలెడు బొమ్మలు గీశాడు. 1950 దశకం నాటి అతని చాలా చిత్రాల్లో వీరోచిత పోరాటాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. వాటికి బదులు రెక్కలు విప్పిన శాంతి పావురాలు, మతసామరస్య సందేశాలు, పిల్లాపెద్దల ఆటపాటలు, ఆలుమగల కౌగిళ్లు, తల్లీపిల్లల ముద్దుమురిపాలు, పాడిపంటలు, పశుపక్ష్యాదులు చేరి చూపరుల మనసు వీణలను కమ్మగా మీటాయి. ఆ కల్మషం లేని మనుషులు ఇంతలేసి కళ్లతో మనవంక చూస్తూ మీరూ మాలాగే పచ్చగా బతకండర్రా బాబూ అని చెబుతుంటారు.

 

‘లవర్స్’ పేరుతో చిత్త చెక్కిన ప్రణయ గాథలు అపురూపం. స్త్రీపురుష సంగమాన్ని ప్రింట్లలోనే కాదు, పెయింటింగుల్లోనూ అంతనంత ప్రేమావేశంతో చిత్రించిన భారతీయ చిత్రకారులు అరుదు. ఆ లినోకట్లలోని వలపులు ఒట్టి దైహిక కలయికలు కావు, రెండు మనసుల గాఢ సంగమాలు. ఒకచోట తెలినలుపుల గదిలో ఊపిరాడని కౌగిలింతల్లో, ముద్దుల్లో లోకం మరచిపోయిన జంట కనిపిస్తుంది. మరోచోట పచ్చికబయళ్లలో పడుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తుంది. మరోచోట.. కడుపుతో ఉన్న సహచరిని దగ్గరికి తీసుకుంటున్న మనిషి కనిపిస్తాడు. మరోచోట కడుపుపంటను తనివితీరా చూసుకుంటూ మురిసిపోతున్న జంట తారసపడుతుంది. సిగ్గులేని శృంగారం, ఆత్మాభివ్యక్తి పేర్లతో నేటి కళాకారులు కుబేరులకు వేలం వేసి అమ్ముకుంటున్నమర్మాంగాల బొమ్మలను చూసి తలదించుకునేవాళ్లు.. చిత్త ప్రణయచిత్రాలను తల ఎత్తుకుని సగర్వంగా చూడగలరు. చిత్త కల్మషం లేని కళాభివ్యక్తికి ఇది నిదర్శనం. తన చిత్రసుందరులను కూళలకిచ్చి అప్పుడప్పుడు  కూడు తినని కమ్యూనిస్టు పోతన.. చిత్త.

cartoon

చిత్త వలపు చిత్రాల్లో చాలా వాటిలో అతని పోలికలున్న పురుషుడు కనిపిస్తాడు. పెద్ద నుదరు, పొడవాటి ముక్కు, విల్లుల్లాంటి కనుబొమలు, అనురాగ దరహాసాలు.. అన్నీ చిత్తపోలికలే. అతడు చిత్త అయితే మరి అతని ప్రేయసి ఎవరు? ప్రేమాస్పదుడైన చిత్తను ఇష్టపడని ఆడమనిషి ఉండదని అతని మిత్రులు గుంభనంగా చెబుతారు. అతడు ఒకామెను గాఢంగా ప్రేమించాడని, అయితే ఆమె పెళ్లి చేసుకుని యూరప్ వెళ్లిపోయిందని అంటారు. పెళ్లి చేసుకోని చిత్త కూడా ఏమంటున్నాడో మురళికి రాసిన ఉత్తరంలోంచి వినండి.. ‘నేను సునీల్, దేవీ(మిత్రులు) వంటి వాడిని కానని నాకు తెలుసు. తండ్రి ఆస్తిపై బతికే పరాన్నభుక్కూనూ కాను. దుఃఖమన్న సౌఖ్యానికి కూడా నోచుకోలేదు నేను. ఓ గ్లాసు మందుతోనో, తాత్కాలిక ప్రేయసితోనే వెచ్చపడే సుఖమూ లేదు. అయితే నేను సన్యాసిని కూడా కాను. నాకు మా అమ్మంటే, మానవత అంటే, ఈ దేశమంటే తగని ప్రేమ. నేను ఈ దేశపు స్త్రీని ప్రేమిస్తాను. నా దేశంలోని ఎంతోమంది స్నేహితులను గాఢంగా ప్రేమిస్తాను. పెయింటింగ్ వేయడాన్ని, పెయింటింగులను చూడడాన్ని ప్రేమిస్తాను..’

అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ల కోసం చిట్టిపొట్టి కథలు రాసి బొమ్మలేశాడు. ‘రసగుల్లా కింగ్ డమ్’ పేరుతో బడాబాబులకు చురుక్కుమనిపించే కథలు రాశాడు. కొన్ని బెంగాలీ కథలను  తిరగరాసి, బొమ్మలేశాడు. కల్లాకపటం తెలియని పిల్లల ఆటపాటలపై చిత్రాలతో పద్యాలు అల్లాడు. ఆ బుజ్జికన్నలను కాగితప్పడవలతో, సంతలో కొన్న ఏనుగు బొమ్మలతో, లక్కపిడతలతో ఆడించాడు. ఆవుపైకెక్కించి పిప్పిప్పీలను ఊదించాడు. పావురాలతో, చేపలతో ఆడించాడు. వాళ్లతో లేగదూడలకు ముద్దుముద్దుగా గడ్డిపరకలు తినిపించి కేరింతలు కొట్టాడు. వీళ్లంతా కష్టాల కొలిమి సెగ సోకని పిల్లలు. ఆ సెగలో మాడిమసైపోయే పిల్లలూ చిత్త లోగిళ్లలో కన్నీటి వరదలై కనిపిస్తారు. తిండిలేక బక్కచిక్కిన పిల్లలను, ఆకలి కోపంతో పిచ్చెత్తి రాయి గురిపెట్టిన చిన్నారిని, బూటుపాలిష్ తో కనలిపోయే చిట్టిచేతులను, చిరుదొంగతనాలతో జైలుకెళ్తున్న బాల‘నేరస్తుల’ను, తల్లిదండ్రులు పనికెళ్లగా, పసికందులను చూసుకుంటూ వంటావార్పుల్లో మునిపోయిన ‘పెద్ద’లను, ఇళ్లులేక ఫుట్ పాత్ లపై పడుకున్న చిన్నారులను, మశూచితో అల్లాడుతున్న పసిదేహాలను.. కళ్లు తడయ్యేలా చూపాడు. అంతేనా.. గోడలపై క్విట్ ఇండియా నినాదాలు రాసి, తెల్లోడి పోలీసులను హడలగొట్టే చిచ్చుబుడ్లను, తల్లిదండ్రుల వెంట సుత్తీకొడవళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కదిలే బాలయోధులను కూడా బొమ్మకట్టాడు.

beedi

చిత్త బాలకార్మికుల చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధం.  ‘చిల్ర్డన్ వితౌట్ ఫెయిరీ టేల్స్’ పేరుతో చేసిన ఈ లినోకట్లు పిల్లల ప్రపంచాన్ని పెద్దలు ఎంత కర్కశంగా కాలరాస్తున్నారో చెబుతాయి. అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు బీడీలు చుట్టడం, తల్లిఒడిలో నిదురపోవాల్సిన పిలగాడు బూట్ పాలిష్ తో అలసి రోడ్డుపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలు విదూషకులై పొట్టకూటికి కోతిని ఆడించడం, సాముగరిడీలు చేయడం.. చందమామ కథలకెక్కని ఇలాంటి మరెన్నో వ్యథాగాథలకు చిత్త రూపమిచ్చి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిఫెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్’ కు అంకితం చేశాడు. వీటిని యూనిసెఫ్ డెన్మార్క్ కమిటీ 1969లో పుస్తకంగా తీసుకొచ్చింది. డెన్మార్క్, చెకొస్లవేకియా, టర్కీ.. మరెన్నో దేశాల రచయుతలు భారత్ పై రాసిన పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు అందించాడు.

చిత్తకు మూగజీవులన్నా ప్రాణం. పిల్లులను, కుక్కలను పెంచుకునేవాడు. అవీ మనలాంటివేనని ముద్దు చేసేవాడు. ‘నికార్సైన బాధ, సంతోషం, శాంతి మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. ఆకలిదప్పికలు, రాగద్వేషాలు జీవరాసులన్నింటికి  ప్రకృతి సహజమైనవి. అందుకే మనం జంతువుల సుఖదుఃఖాలను, మొక్కల దాహార్తిని, పూల ఉల్లాసాన్ని సహానుభూతితో గ్రహించగలం.. అవి కూడా మనలాగే జీవితంలో ఒక క్షణకాలాన్ని కోల్పోయినా భోరున విలపిస్తాయి.. వాటిలో ఏదీ ఈ అందమైన లోకం నుంచి వెళ్లాలని అనుకోదు..’ అని తల్లికి రాశాడు చిత్త.

bezwada sabha

పార్టీ పనులు లేకపోవడంతో చిత్త కు అనేక వ్యాపకాలు మొదలయ్యాయి. అంధేరీ మురికివాడలోని రూబీ టెర్రేస్ లో అంధేరా ఒంటరి గది చిత్త ఆవాసం. అందులోనే వేలాది లినోకట్లు, పేస్టల్స్, పెయింటింగులూ వేశాడు. కవితలు, కథలు, నాటకాలు రాశాడు. కిటికీ ముందు రెండుమూడు పూలకుండీలు, కిటికీ పక్కన చెక్కపై పుస్తకాలు, దానికింది చెక్కపై కీలుబొమ్మలు, భయపెట్టే ఇండోనేసియా డ్యాన్స్ మాస్కులు, ఓ మూల మంచం, వంటసమయంలో మంచం కింది నుంచి బయటి, వంటయిపోయాక మంచం కిందికి వెళ్లే  వంటసామాన్లు, చిత్రాలు, ఓ పిల్లి, పంచలో రెండు కుక్కలు, పక్కిళ్ల వాళ్లతో కలసి వాడుకునే బాత్రూమ్, ఇంకాస్త బయట కాస్త పసిరిక.. చుట్టుపక్కల అతిసామాన్య మానవులు.. ఇవీ చిత్త బతికిన పరిసరాలు.

telengana

తెలంగాణా

రేషన్ షాపులో గోధుమపిండి, కిరసనాయిల్, చిరిగిన బనీను, లుంగీ, రెండు జతల బట్టలు, వారానికో అప్పు, అప్పుడప్పుడు ఎండుచేపలు, ఉర్లగడ్డల కూర, కాస్త డబ్బుంటే గ్లాసెడు మందుచుక్క, డబ్బుల్లేనప్పుడు పస్తులు, ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు, పుస్తకపఠనం, మిత్రులతో కబుర్లు, వాళ్లతో కలసి ‘బ్రిడ్జ్ ఆఫ్ రివర్ క్వాయ్’, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలకు వెళ్లడం, తల్లికి, చెల్లికి రాజకీయాలు, సాహిత్యం రంగరించి రాసే మమతల లేఖలు, సోమరి ఉదయాల్లో పోస్టమేన్ కోసం ఎదురుచూపులు.. చిత్త జీవితం కడవరకూ సాగిపోయిందిలా.

– ముగింపు వచ్చేవారం

అతని కారునల్లని సంతకం!

పి. మోహన్ 

 

P Mohanకళాకారులందరి లక్ష్యం జనాన్ని చేరుకోవడం. చిత్త లక్ష్యం వారిని చేరుకోవడమే కాకుండా చైతన్యవంతం చేయడం కూడా. కనుక అతని మార్గం భిన్నం. పునజ్జీవనం పేరుతో పాత కథలకు కొత్త మెరుగులద్ది తృప్తిపడిపోయే నాటి బెంగాల్ కళాశైలి అతనికి నచ్చలేదు. జనానికి అర్థం కాని సొంతగొడవల, డబ్బాశల పాశ్చాత్య వాసనల బాంబే, కలకత్తా శైలులు అసలే నచ్చలేదు. తన బొమ్మలు జనబాహుళ్యానికి అర్థం కావాలి, తను చెప్పేదేమిటో వాళ్ల మనసుల్లోకి నేరుగా వెళ్లాలన్నదే అతని సంకల్పం. ‘ఒక చిత్రం గురించి నువ్వూ నేనూ ఏమనుకుంటున్నాం అనేదానికి కాకుండా, ఎక్కువమంది ఏమనుకుంటున్నారనే దానికి ప్రాధాన్యమివ్వడమే అభ్యుదయ మార్గం’ అన్న లెనిన్ మాట దివిటీ అయ్యింది. అందుకే జనానికి కొరుకుపడని పిచ్చిప్రయోగాలవైపు, గ్యాలరీలకు పరిమితమయ్యే ఆయిల్స్, వాటర్ కలర్స్, వాష్ వంటివాటివైపు కాకుండా జనంలోకి ఉప్పెనలా చొచ్చుకెళ్లే ప్రింట్లకు మళ్లాడు.

ప్రజాకళాకారులకు ప్రింట్లకు మించిన ఆయుధాల్లేవు. ఆయిల్ పెయింటింగ్ వేస్తే, అది కళాఖండమైతే ఒక ఇంటికో, గ్యాలరీకో పరిమితం. ప్రింట్లు అలా కాదు. కొద్దిపాటు ఖర్చుతో ఇంటింటికి, ప్రతి ఊరికి, లోకానికంతటికీ పంచి, జనాన్ని కదం తొక్కించొచ్చు. ఒక్కోటీ ఒక్కో కళాఖండం. అందుకే అవి రష్యా, చైనా, మెక్సికన్ విప్లవాలకు పదునైన ఆయుధాలు అయ్యాయి. జర్మనీలో కేథే కోల్విజ్, హంగరీలో గ్యూలా దెర్కోవిట్స్, మెక్సికోలో సికీరో, ఒరోజ్కో, లేపోల్దో మెందెజ్,  చైనాలో లీ కున్, అమెరికాలో చార్లెస్ వైట్.. అనేక దేశాల్లో అనేకమంది జనచిత్రకారులు ప్రింట్లతో సమరశంఖాలు పూరించారు. వాళ్లకు ముందు స్పెయిన్లో గోయా యుద్ధబీభత్సాలపై, మతపిచ్చి వెధవలపై లితోగ్రాఫులతో ఖాండ్రించి ఉమ్మేశాడు. ఎడ్వర్డ్ మంక్, పికాసో, మతీస్.. ప్రింట్లతో చెలరేగిపోయారు. వీళ్లందరికంటే ముందు యూరప్ లో ద్యూరర్, బ్రూగెల్, రెంబ్రాంత్ లు ప్రింట్లలో కావ్యాలు చెక్కితే.. హొకుసాయ్, హిరోషిగే వంటి అమరకళావేత్తలు రంగుల ప్రింట్లతో తూర్పుకళ సత్తా చాటారు. చిత్తపై వీళ్లందరి ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ అతని కళ భారతీయతకు ఎన్నడూ దూరం కాలేదు. కాళీఘాట్ వంటి బెంగాలీ జానపద కళాశైలులు, మొగల్ సూక్ష్మచిత్రాలు, ప్రాచీన భారత కుడ్యచిత్రాల్లోని, శిల్పాల్లోని సరళత, స్పష్టత అతని చిత్రాల్లో కొత్త సొగసులు అద్దుకున్నాయి.

chitta1

ప్రింట్ల శక్తి, సౌలభ్యాలన్నింటిని చిత్త పూర్తిగా వాడుకున్నాడు. తర్వాత వాటిని అంత బలంగా వాడుకున్నవాడు చిత్తకంటే ఆరేళ్లు చిన్నవాడైన హరేన్ దాస్ ఒకడేనేమో. కరువుకాటకాలు, విప్లవం, శాంతి, ప్రణయం, ప్రసవం, పసితనం.. ప్రతి బతికిన క్షణాన్నీ చిత్త తన ప్రింట్లలో నిండైన భావసాంద్రతతో బొమ్మకట్టాడు. కరువుపై అతని ప్రింట్ల పుస్తకాలను బ్రిటిష్ వాళ్లు తగలబెట్టారంటే అతని కళాశక్తి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

చిత్త అనగానే తొలుత ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని పోరాట చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలే. కరువు పీడితులను అతనంత బలంగా ప్రపంచంలో మరే కళాకారుడూ చూపలేదు. అతని కరువు చిత్తరువులు ఆకలి పేగుల ఆర్తనాదాలు, ఆరిపోయిన కన్నీటి చారికలు.

 

1943-44 నాటి బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి విపత్తు, మనిషి స్వార్థం కలగలసి కరాళనత్యం చేశాయి. 1942లో వచ్చిన తుపానులో పంటలు దెబ్బతిన్నాయి. రోగాలు పెచ్చరిల్లాయి. మరోపక్క.. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాపై దాడి చేసి బెంగాల్ సీమలోకి చొచ్చుకొస్తున్న జపాన్ ఫాసిస్టులపై పోరాడుతున్న సైనికులకు బళ్లకొద్దీ తిండిగింజలు తరలించారు. బర్మా నుంచి బియ్యం సరఫరా ఆగిపోయింది. దేశభక్తులు కొందరు తమ పంటను బ్రిటిష్ వాడికి అమ్మకుండా నదుల్లో పడేశారు, కాల్చేశారు. కొందరు దేశీవ్యాపారులకు అమ్మేశారు. నల్లబజారు జడలు విప్పింది. పోలీసులు, అధికారులు కొమ్ముకాశారు. జనం పిడికెడు తిండిగింజల కోసం పొలాలు, బొచ్చెలు బోలెలు అమ్ముకున్నారు. అడుక్కుతిన్నారు, వలస పోయారు. ఏదీ చేతకాకపోతే దొంగతనాలకు, కరువు దాడులకు పాల్పడ్డారు. అవి చేతగాని ఆడకూతుళ్లు ఒళ్లు అమ్ముకున్నారు. లక్షల మంది మంచినీళ్లు దొరక్క మలేరియాతో చచ్చిపోయారు. ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన వంగదేశపు పల్లెసీమల్లో ఎక్కడ చూసినా పీనుగులు, ఆకలి కేకల సజీవ కంకాళాలే కనిపించాయి. కరువును దగ్గరగా చూసి రిపోర్ట్ చేయాలని పార్టీ చిత్తను నవంబర్ లో మిడ్నపూర్ కు పంపింది. చిత్త ఆ శవాల మధ్య, ఆకలి జీవుల మధ్య తిరుగాడి మానవ మహావిషాదాన్ని నిరసనాత్మక నలుపు రూపాల్లోకి తర్జుమా చేశాడు.

2 (5)

సంచిలో కాసిన్ని అటుకులు, స్కెచ్ ప్యాడు, పెన్నుతో కాలినడకన క్షామధాత్రిలో తిరిగాడు. కనిపించిన ప్రతి ఆకలిజీవినల్లా పలకరించి, బొమ్మ గీసుకున్నాడు. కూలిన గుడిసెలను, నిర్మానుష్య పల్లెలనూ గీసుకున్నాడు. ‘ఈ బొమ్మలతో వాళ్లను నేనేమాత్రం ఆదుకోలేనని తెలుసు. కానీ, అవి కళ అంటే విలాసమని భావించేవాళ్లకు ఒక పచ్చినిజాన్ని చాటి చెబుతాయి’ అన్నాడు. చిత్త అలా తిరుగుతున్నప్పుడే అతని తండ్రి కరువు సహాయక కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడినుంచో దాతలు పంపిన తిండిగింజలు దారిలోనే మాయమైపోతున్నాయని, బాధితులకు దొరుకుతున్నది పిడికెడేనని కొడుక్కి చెప్పాడు. చిత్త ఆ కరువు సీమలో ఎలా తిరిగాడో అతని చెల్లి ‘ఒంటరి పరివ్రాజకుడు’ వ్యాసంలో రాసింది. ‘అన్నయ్య ఊర్లు తిరిగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, చెప్పులతో ఇంటికి వచ్చేవాడు. బోలెడన్ని బొమ్మలు గీసుకుని తెచ్చేవాడు. అమ్మ గదిలో కూర్చుని తను చూసిన ఆకలి జనం బాధలను రుద్ధకంఠంతో గంటలకొద్దీ వివరించేవాడు.’

chitta2

చిత్త కరువు నీడలను చిత్రించడంతోపాటు తన పర్యటన అనుభవాలను వివరిస్తూ ‘పీపుల్స్ మార్చ్’ ప్రతికలో సచిత్ర వ్యాసాలూ రాశాడు. కరువులో కాంగ్రెస్, హిందూమహాసభల కుళ్లు రాజకీయాలను ఎండగట్టాడు. ఆ రుద్రభూమిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆస్తులు పోగేసి కొత్త మేడ కడుతున్న వైనాన్ని, ఆ కామందును తిడుతూ ఊరివాళ్లు కట్టిన పాటనూ పరిచయం చేశాడు ‘అభివృద్ధి’ పేరుతో ఈ నేలమీది సమస్త వనరులనూ దేశవిదేశీ పెట్టుబడి దెయ్యాలకు కట్టబెడుతూ, ‘సొంత అభివృద్ధి’ చూసుకుంటున్న నేటి జనసంఘీయులను చిత్త చూసి ఉంటే బొమ్మలతో చావచితగ్గొట్టి ఉండేవాడు.

మిడ్నపూర్ పర్యటన అనుభవాలతో, బొమ్మలతో చిత్త 1943లో ‘హంగ్రీ బెంగాల్’ పేరుతో ఓ చిన్న పుస్తకం అచ్చేశాడు. ఆకలి వ్యథలను కేవలం సాక్షిలా కాకుండా ఆర్తితో, ఆక్రోశంతో వినిపించాడు. ఓపిక ఉంటే, వినండి అతడు బొమ్మచెక్కిన ఆ అభాగ్యుల దీనాలాపనలను…

‘‘ఓ రోజు దారి పక్కన ఇద్దరు ముసలి ఆడవాళ్లు, ముగ్గురు నడీడు వితంతువులు, ఒక యువతి కనిపించారు. ఎక్కడినుంచో తెచ్చుకున్న కాసిని తిండిగింజలను మామిడి చెట్టుకింద పొయ్యి వెలిగించి వండుకుంటున్నారు. వితంతువుల్లో ఒకామె చేతిలో 11 రోజుల పసికందు ఉంది. మరొకామె గర్భిణి. వాళ్లకు తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలని ఉంది. దగ్గర్లో ఓ కామందు వస్త్రదానం చేస్తున్నాడని, అందుకోసం ఆగిపోయామని చెప్పారు. ‘రేపు మా అన్నయ్య ఎడ్లబండిలో వస్తాడు, ఊరికి వెళ్తాను’ అని బాలింత చెప్పింది.. పక్షం రోజు తర్వాత అదే దారిలో రిక్షాలో వెళ్లాను. ఓ పోలీసు ఇద్దరు చింపిరి యువకులతో, ఇదివరకు నేను మాట్లాడిన యువతితో గొడవ పడుతున్నాడు. రిక్షావాలా చెప్పాడు.. ‘ఈ ఆడాళ్లు ఒళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు. పాపం ఇంకేం చెయ్యగలరు? రోజుల తరబడి, వారాల తరబడి తిండి లేకపోతే మానం మర్యాదలకు విలువేముంటుంది బాబూ?’..

chitta3‘‘కరువుపై సభ పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పార్టీ కామ్రేడ్లు చెప్పారు. పార్టీ పోస్టర్లను ఓ సీఐడీ చింపేసి జనాన్ని భయపెట్టాడు. ఈ ప్రాంతంలో మళ్లీ పోస్టర్లు కనిపిస్తే చావగొడతామని బెదిరించాడు.. ఇంతకూ ఆ పోస్టర్లో ఏముంది? కరువును ఎదుర్కోడానికి అందరూ ఏకం కావాలన్న పిలుపు, దేశనాయకులను విడుదల చేయాలన్న డిమాండ్, మా భూమిని మేం కాపాడుకుంటామన్న ప్రకటన..

‘‘కుదుపుల బస్సులో ఇబ్బంది పడుతూ మధ్యాహ్నానికి కాంతాయ్ చేరుకున్నాం. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో ఒంట్లో నలతగా ఉంది. కాంతాయ్ లో ఆ రోజు సంత. బియ్యం ఎక్కడా కనిపించలేదు. పప్పు దినుసుల అంగళ్ల వద్ద జనం మూగి ఉన్నారు. అయితే స్వర్ణకారుడి వద్ద, పాత్రల అంగళ్ల వద్ద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో అంగడి వద్ద పది, పదిహేను మంది రైతులు తమ వంటసామాన్లను అమ్మడానికి వరుసగా నిల్చుని ఉన్నారు.  ఇత్తడి కంచాలు, గిన్నెలే కాదు దీపపు కుందీలు, దేవుడి గంటలు, హారతి పళ్లేలు వంటి పూజాసామగ్రినీ అమ్మడానికి తెచ్చారు. ఒకచోట బెనారస్ లో తయారైన శ్రీకృష్ణుడి కంచుబొమ్మ కూడా కనిపించింది. అది రెండు రూపాయల 12 అణాల ధర పలికింది. ఈ దేవుళ్లు తమ పేదభక్తులను వదలి బానపొట్టల హిందూవ్యాపారుల చెంతకు చేకుంటున్నారు…  మధ్యాహ్నం రెండుకల్లా అంగళ్ల నుంచి జనం వెళ్లిపోయారు. అదే రోజు ఓ ఓడ సంతలో అమ్మిన వంటసామాన్లతో కోలాఘాట్ కు బయల్తేరింది. రెండు పడవల్లో కూడా పాత్రలు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ఇదే తంతట.. రైతులు ఒక్క పాత్రకూడా ఉంచుకోకుండా అన్నింటినీ తెగనమ్మడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది..

3 (4)

‘‘ఓ రోజు పల్లె పొలిమేరలో నడుస్తున్నాం. ‘అదిగో, అటు చూడు, వరిపొలంలో ఏదో కదులుతోంది!’ అన్నాడు తారాపాద. ఓ ఆరేళ్ల పిల్లాడు పండిన పొలం మధ్య మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఏపుగా పెరిగిన పొలం నీడలో ఆ పిల్లాడి తెల్లకళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. మాటలకందని దృశ్యం అది. ఆ పిల్లాడు మేం పిలవగానే వచ్చాడు. ఎముకలతో తయారైన చిన్ననల్లబొమ్మలా ఉన్నాడు. అతని చిట్టికథ తెలుసుకున్నాం. అతని తండ్రి జ్వరంతో, తల్లి మలేరియాతో చనిపోయారు. పెద్దన్న చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లున్న మరో అన్న.. జనం వదిలిపోయిన ఆ గ్రామంలోని ఓ బ్రాహ్మడి ఇంట్లో పాలేరు. ఆ ఇంటివాళ్లు పెట్టే తిండిని అన్నదమ్ములు పంచుకుని తినేవాళ్లు. అయితే కొన్ని రోజులుగా ఇతనికి తిండిపెట్టడం లేదు. అన్నం కావాలని ఏడిస్తే కొట్టారు. ఇప్పటికీ చెయ్యి నొప్పెడుతోంది. చివరికి ఇతన్ని ఇంట్లోంచి గెంటేశారు.. మళ్లీ మీ అన్నదగ్గరికి వెళ్తావా అని అడిగాడు తారాపాద. అతడు తలను గట్టిగా అటూ ఇటూ ఊపి, పోను అన్నాడు. గంజిపోసి, బట్టలిచ్చే అనాథాశ్రమం దగ్గర్లో ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వెళ్తావా అని అడిగాం. సరేన్ననాడు. అతని పేరు అనంత. నిన్ను ఎత్తుకుని నడుస్తాం అని చెప్పాం. అతడు టక్కున ఉహూ అన్నాడు..

‘‘సాయంత్రం అయిదవుతుండగా జనుబాషన్ గ్రామానికి వెళ్లాం. ఐదు గుడిసెలే ఉన్నాయి.. ఊరి ఆనవాళ్లే లేవు. చిన్నసంచి, రెండుమూడు మట్టికుండలతో ఎక్కడికో వలసపోతున్న భార్యాభర్తలు కనిపించారు. ఆడమనిషి కొత్త ముతక చీరకట్టుకుని ఉంది. దాన్ని దగ్గర్లోని గంజికేంద్రంలో ఇచ్చారట. భర్త తుండుగుడ్డకంటే కాస్త పెద్దగా ఉన్న ధోవతీ కట్టుకుని ఉన్నాడు. వాళ్ల దీనగాథ అడిగాం. ఆ పల్లెలో మూడువందల మంది ఉండేవాళ్లట. తుపానులో వందమంది, మలేరియా, ఆకలితో మరికొందరు పోయారట. బతికినోళ్లు పట్నానికి వెళ్లగా, వీళ్లిద్దరే మిగిలిపోయారట. ఇప్పుడు వీళ్లూ వెళ్తున్నారు. ‘సరేగాని, ఈ మునిమాపున ఎందుకు వెళ్తున్నారు?’ అని అడిగాం. దొంగల భయం వల్ల అని చెప్పారు. పది రోజుల కిందట ఓ రాత్రి వీళ్లు అడుక్కుని తెచ్చుకున్న బియ్యం వండుకుంటుండగా 40 మంది బందిపోట్లు వచ్చిపడ్డారట. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారట. భర్త రెండు రోజులపాటు పైకి లేవలేదట. దొంగలు సగం ఉడికిన అన్నంతోపాటు, వీళ్ల దగ్గర మిగిలున్న రెండు ఇత్తడిపాత్రలను, చివరికి మురికి గుడ్డలను కూడా దోచుకెళ్లారట. ఈమెకు ఒంటిపై కప్పుకోవడానికి రెండు రోజులపాటు గుడ్డకూడా లేదట..

chitta6

‘‘గోపాల్ పూర్ లో రోడ్డు పక్కన ఓ వితంతువు శ్యామా గడ్డి విత్తనాలు సేకరిస్తోంది. మూడు గంటలు కష్టపడితే పిడికెడు గింజలు దక్కాయి. ఆమెకు ఆ పూటకు అవే భోజనం..

‘‘అతని పేరు క్షేత్రమోహన్ నాయక్, అందరి మాదిరే రైతు. భార్యాబిడ్డలు ఆకలి, మలేరియాలతో చనిపోయారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తికాకముందే అతనికీ మలేరియా సోకింది. మేం అతన్ని చూసేసరికి అతని కళేబరం కోసం కుక్కలు, రాబందులు కాట్లాడుకుంటున్నాయి. దహనం కోసం ఆ శవాన్ని నిన్న రాత్రి శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించేలోపు అక్కడున్నవారికీ జ్వరం కమ్మేసింది. శవాన్ని అలాగే వదిలేసి ఇళ్లకు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ల  శవాలను మోసుకెళ్లడానికి ఎవరైనా మిగిలి ఉంటారా?.. క్షేత్రమోహన్ కు పట్టిన దుర్గతి బెంగాల్ జిల్లాల్లో అసాధారణమైందేమీ కాదు. కానీ.. క్షేత్రమోహన్ నోటికాడి కూడు లాక్కుని, బోలెడు లాభాలు కూడబెడుతున్నవాళ్లను మనమింకా క్షమించడమే కాదు ప్రోత్సహిస్తున్నాం కూడా..’’

ఇలాంటి మరెన్నో మింగుడుపడని నిజాల ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం సంగతి తెల్లదొరలకు తెలిసింది. అచ్చేసిన ఐదువేల కాపీలనూ తగలబెట్టారు. చిత్త తన తల్లికి పంపిన ఒక పుస్తకం మాత్రం భద్రంగా మిలిగింది. పార్టీ పత్రికలకు చిత్త వేసిన బొమ్మల బ్లాకులు కూడా పోయాయి. అతన్ని పోలీసులు పట్టుకుపోతారనే భయంతో పత్రికల నిర్వాహకులే వాటిని నాశనం చేశారు.

మిడ్నపూర్ కరువు ప్రాంతాల పర్యటన తర్వాత చిత్త 1944లో జూన్-ఆగస్టు మధ్య మరో కరువు సీమకు వెళ్లాడు. బిక్రమ్ పూర్, కాక్స్ బజార్, మున్షీగంజ్, చిట్టగాంగ్ లలో కరువు దెబ్బకు సర్వం కోల్పోయిన జనం బొమ్మలు గీశాడు. వాటి వెనక వాళ్ల పేర్లు, ఊళ్లు, వాళ్ల కష్టాలను నమోదు చేశారు. జాలరి అబ్బుల్ సత్తార్, రైతు అలీ అక్బర్, నేతగాడు గనీ, రోగిష్టి హలీషహర్, వేశ్యగా మారిన చిట్టగాంగ్ బట్టల వ్యాపారి భార్య అలోకా డే, ఆస్పత్రితో అస్థిపంజరంలా పడున్న ముసలి మెహర్జెన్, ఒంటికింత బట్టలేక తనకు వీపులు తిప్పి ఇంట్లోకి వెళ్లిపోయిన బాగ్దీ కుటుంబం.. అన్నింటిని గుండెబరువులో ఆవిష్కరించాడు. ‘ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపా’న్నీ జడుసుకునేలా చూపాడు. ఆకలి తాళలేక పిచ్చెక్కి రాయి గురిపెట్టిన బాలుడి బొమ్మచూస్తే కన్నీళ్లూ, క్రోధమూ వెల్లువెత్తిపోతాయి.

బెంగాల్ కరువును చిత్త మిత్రులైన సోమనాథ్ హోరే, జైనుల్ అబెదిన్ లతోపాటు గోపాల్ ఘోష్, గోవర్ధన్ యాష్ వంటి ఇతర బెంగాల్ చిత్రకారులు కూడా వేశారు. అయితే వాళ్ల బొమ్మలు చిత్త బొమ్మలంత శక్తిమంతంగా కనిపించవు. నందలాల్ బోస్, గోపాల్ గోష్ వంటి బెంగాల్ స్కూల్ వాళ్లకు ఆ కరువు కలిపురుషుడి బీభత్సమైతే, చిత్తకు అది మనిషి స్వార్థం సృష్టించిన మృత్యుకాండ. అందుకే అతని చిత్రాల్లో అంత మానవతా, భావగాఢతా, కన్నీరూ. ‘మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ’ అని అంటాడు ప్రముఖ కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. ఆధునిక భారతంలో ఆ నీరాజనం పట్టిన పిడికెడు మందిలో చిత్త ఒకడు.

                                   నాలుగు భాగాల్లో ఇది రెండో భాగం. మూడో భాగం వచ్చేవారం..

 

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు!

ఎన్ వేణుగోపాల్

 

venu1చాల ఇష్టమైనవాళ్లు, కౌగిలిలోకి తీసుకొని ఆ స్పర్శను అనుభవించాలని అనిపించేవాళ్లు మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాత్రమే అయిన సన్నిహిత, సున్నిత, ఆంతరంగిక సంభాషణ సాగించాలని అనిపించేవాళ్లు ఒక గజం అవతల నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? కాని మీకూ వాళ్లకూ మధ్య అడ్డుగోడ. వాళ్లు కనబడుతూనే వినబడుతూనే ఉంటారు. మీరు చెయ్యి చాపలేరు. అవతలివాళ్లు చెయ్యి అందించలేరు. వాళ్లను మీరు దగ్గరికి తీసుకోలేరు. మీ కంటి తడిని వాళ్ల మునివేలుతో తుడవలేరు. మీకూ వాళ్లకూ మధ్య రెండు ఇనుప జాలీల తెర, ఆ రెండు జాలీల మధ్య ఇటు మూడు అంగుళాలు అటు మూడు అంగుళాలు వదిలి ఇనుప ఊచలు. అప్పుడు మీ హృదయం ఎట్లా రవరవలాడుతుంది? దేహం ఎట్లా స్పర్శ కోసం తపిస్తుంది? అరచెయ్యి అవతలి అరచేతి వేడిని అనుభవించాలని ఎంత కొట్టుకులాడుతుంది? గుండెలోని మాటను చెప్పనూలేక, చెప్పకుండానూ ఉండలేక గొంతు తానే గుండెను ఎలా పొదివి పట్టుకుంటుంది? మనశ్శరీరాలు వాగర్థాల లాగ కలిసిపోయి ఏ అనంతవేదనను అనుభవిస్తాయి? సామీప్యమే సుదూరమైన ఆ కఠినమైన, భయానకమైన, దుఃఖభాజనమైన ఎరుక ఎలా ఉంటుంది?

పది సంవత్సరాల కింద అటువంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది.

నిజామాబాదులో రఘునాథాలయం అనే బోర్డు ఉన్న ఎత్తైన పెద్ద కోట సింహద్వారంలోంచి లోపలికి వెళ్లి, ఒక మలుపు తిరిగితే గుట్ట మీదికి ఓ వంద మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కితే ఒక పక్కన పాత కాలపు గడీ బంకుల లాంటి వరండా, మరొక పక్కన కొండ అంచు పిట్టగోడ. ఆ వరండాను కూడ గదిగా మార్చి అక్కడ కాపలా జవాన్లు ఉంటారు గనుక అక్కడ కూచోవడానికీ నిలబడడానికీ వీల్లేదు. ఆ వరండాకూ ఇటు లోయ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ముగ్గురు మనుషులు నిలబడగలిగినంత స్థలంలో అన్నిటికన్న పై మెట్టు. దాని అవతల ‘ప్రధాన జైలు’ అని రాసి ఉన్న దిట్టమైన తలుపు. ఆ తలుపు పైభాగంలో ఇనుప జాలీ, దాని వెనుక ఇనుప ఊచలు. ఆ వెనుక మరొక ఇనుప జాలీ. ఆ తర్వాత కటకటాల తలుపు. అక్కడినుంచి ఆరడుగుల నడవా. దానికి ఒకపక్కన జైలు అధికారుల గదులు. ఆ నడవా చివర కిందికి దిగడానికి నాలుగైదు మెట్లు. మెట్ల చివర మళ్లీ ఒక చిన్న చెక్క గేటు. అది దాటి లోపలికి వెళ్లి రెండు మలుపులు తిరిగి ఇరవై ముప్పై గజాలు నడిస్తే మళ్లీ గేటు. అది దాటితే నాలుగు వైపులా ఖైదీల బారక్ లు, మధ్యలో కాపలా జవాన్ల గది, దాని పక్కన నీళ్ల ట్యాంక్. అక్కడున్న బారక్ లలో ఒకదాంట్లో దాదాపు ఇరవై రోజులు నిర్బంధంలో గడిపి పది సంవత్సరాలు గడిచింది.

 

మహారాష్ట్ర ఔరంగాబాదులో జరిగిన అరెస్టు, మానసిక హింసతో, ప్రశ్నల వేధింపులతో మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం, అబద్ధపు ఆరోపణలతో నిజామాబాదులో కేసు, ఇరవై రోజుల పాటు నిజామాబాదు జైలు జీవితం, ఐదు సంవత్సరాల పాటు సాగిన విచారణ, ఆ విచారణలో పోలీసుల అబద్ధాలు ఒకటొకటిగా తుత్తునియలు కావడం, చివరికి కేసు కొట్టివేత, నిర్దోషిగా విడుదల ఎన్నో స్థాయిలలో నామీద ప్రభావం వేశాయి. అంతకు ముందు రెండు మూడు సార్లు పోలీసు నిర్బంధంలోకీ, జైలులోకీ కూడ వెళ్లాను. అంతకు ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కుటుంబ సభ్యుల, మిత్రుల అరెస్టుల సందర్భంగా వారిని కలవడానికి జైలుకు వెళ్తూ ఉన్నాను. కాని ఈసారి అనుభవం పూర్తిగా కొత్తది. మన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల పనితీరు గురించి ఆ నిర్బంధం నాకు అనుభవైకవేద్యమైన పాఠాలు నేర్పింది. స్టేట్ వర్సస్ గంటి ప్రసాదం అండ్ అదర్స్ అనే ఆ కేసులో నా సహనిందితుడు, గురువు, మిత్రుడు గంటి ప్రసాదం హత్యకు గురయి రెండు సంవత్సరాలయింది. ఆ కేసు నాటికి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉండిన నేను ఇవాళ ఆ స్థానంలో లేను గాని, ఏ విశ్వాసాలతో ఆ నిర్బంధాన్ని అనుభవించానో ఆ విశ్వాసాలు ఇవాళ మరింత దృఢంగా ఉన్నాయి. పది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఆ భయోద్విగ్న అనుభవాలను, అవి ఇచ్చిన అవగాహనలను పంచుకోవాలనిపిస్తున్నది.

“ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది” అని నా అరెస్టు సమయానికి ప్రజాతంత్ర వారపత్రికలో నేను రాస్తుండిన ‘ఆఖరిపేజీ’ కాలంలో విడుదలై రాగానే రాశాను. (ప్రజాతంత్ర 2005 జూన్ 19-25)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య 2004 అక్టోబర్ లో హైదరాబాదులో తొలివిడత చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన నక్సలైట్ల ప్రతినిధులతో ఆ చర్చలు జరిగాయి. ఒకటి అంతకు ముందు వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (పీపుల్స్ వార్) గా ఉండి, సరిగ్గా చర్చల సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గా మారినది. మరొకటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (జనశక్తి). రెండో విడత చర్చలకు నవంబర్ లో ఆహ్వానిస్తామనే ప్రభుత్వ హామీతో, రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో నక్సలైట్లు వెనక్కి వెళ్లారు. కాని ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు. మళ్లీ ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఆ ప్రస్తావనే మానేసి మళ్లీ నిర్బంధం ప్రారంభించి, జనవరి 2005 తర్వాత ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గనుక తామూ కట్టుబడి ఉండబోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నక్సలైట్ల వైపునుంచి ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నదనీ, విస్తృత ప్రజా సంబంధాలతో ప్రజాభిప్రాయం ఏమిటో చెప్పగల ప్రముఖులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నామనీ. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం (గంటి ప్రసాదం) కబురు పంపారు. ఈ విషయం మాట్లాడడానికి నేను తనను కలవడం వీలవుతుందా అని అడిగారు. ప్రభుత్వ నిర్బంధం పెరిగిన స్థితిలో తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బైట జరిగితే మంచిదని, అందువల్ల రెండు రోజుల కోసం ఔరంగాబాదు రమ్మని అడిగారు. నాతోపాటు విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వస్తారని రాశారు.

venu2

నేను అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, అట్లాగే విరసం సభ్యుడిగా కూడ ఉన్నాను.  పాత్రికేయుడిగానూ, విరసం సభ్యుడిగానూ ఆయనను కలవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య పెద్ద విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయ వృత్తి విధి నిర్వహణలోకి రాజకీయ విశ్వాసాలను తీసుకురాలేదు. మాట్లాడతానంటున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. మాట్లాడదలచుకున్నది పాత్రికేయుడిగా, విరసం సభ్యుడిగా ఉన్న నాతో. అటువంటప్పుడు అభ్యంతరం ఎందుకుండాలి? అంతకు ఆరు నెలల ముందే ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితో, ఇతర నాయకులతో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు ప్రభుత్వ భవనంలోనే మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ప్రభుత్వ మంజీర అతిథి గృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి, మాట్లాడి, తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయాలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ మీద నిషేధం కూడ లేనప్పుడు, నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో, పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే 2005 మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. కాసేపటికి ప్రసాదం, ఇతర మిత్రులు వచ్చారు. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడు – ఏడున్నర మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి ప్రశ్నలతో వేధించారు. చంపుతామని బెదిరించారు. మర్నాడు రాత్రి వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించారు. మరొక చోట మళ్లీ రెండు రోజులు అట్లాగే కళ్లకు గంతలతో, చేతులు వెనక్కి విరిచికట్టి ఒక గదిలో నిర్బంధించారు. అప్పటిదాకా మాపక్కన ఉన్నవాళ్లు మమ్మల్ని పట్టుకున్న మూడో రోజు మధ్యాహ్నం, “ఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారు” అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని అలాగే కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతో ఒక వ్యాన్ ఎక్కించి అరగంట ప్రయాణం చేయించారు. అక్కడ మా కట్లు విప్పదీస్తే అది నిజామాబాదు డిఐజి కార్యాలయం అని మాకు తెలిసింది.

అక్కడ పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే మే 30 సాయంత్రం ఏడు నుంచి జూన్ 2 సాయంత్రం నాలుగు దాకా, దాదాపు 70 గంటలు మేం కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా, మధ్యలో ప్రశ్నల వేధింపులతో, చంపుతామనే బెదిరింపులతో నిర్బంధంలో, మా అదృశ్యం గురించి మా కుటుంబాలు ఎలా ఆందోళన పడుతున్నాయో వేదనతో ఉన్నాం. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని, నిందితుల పట్లనైనా వ్యక్తిగత గౌరవాన్ని చూపాలని, చట్టబద్ధమైన విచారణలో నిస్సందేహంగా రుజువయ్యేవరకూ నిందితులను కూడ నిర్దోషులుగానే పరిగణించాలని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ప్రముఖులుగా, రచయితలుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘనకు గురైతే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు? చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే పోలీసు వ్యవస్థ ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలు కావడానికి అవకాశం ఉంది!

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమయ్యామనే నిజం చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్రలోని పట్టణానికి వెళ్లి అక్కడినుంచి ఐదుగురు వ్యక్తుల్ని ఎత్తుకురావడానికి చట్టబద్ధంగా వీల్లేదు గనుక నిజామాబాదులో అరెస్టు చేశామని అబద్ధం చెప్పారు. మేం ఔరంగాబాదు సమావేశం నుంచి నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం అంత ఘనంగా ఉంది! ఎవరైనా ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్లదలచుకుంటే ఏమార్గంలో వెళతారో పటం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా హైదరాబాద్ తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 సాయంత్రానికి బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయి.

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను నిష్కారణంగా అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, పోరాట నాయకులను దొంగచాటుగా పట్టుకుని చంపడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులను నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖకు తెలిసిన పనులయిపోయాయి.

ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి అసలు పనులు మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పని చేస్తే చాలునని, అది చేస్తే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. ఎంతమందిని చంపితే అంత తొందరగా పదోన్నతులు కల్పించే దుర్మార్గమైన హంతక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ప్రకటించి అమలు చేసింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలిగారో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివీ, నైపుణ్యమూ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని. అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉండడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినదీ, అక్కడ తాము నిర్వహిస్తున్న రహస్య స్థావరంలో ఒకరోజంతా పెట్టుకున్నదీ వాళ్లే. రెండున్నర రోజులపాటు మాతోపాటు ఉన్నది వాళ్లే. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని మామూలు పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. వాళ్లను మేం చూడకుండా, గుర్తు పట్టకుండా ఉండడం కోసమే మా కళ్లకు గంతలు.

ఇక మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీద ఆధారపడి మా మీద కేసు నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని అల్లిన కట్టుకథ మామీద నేరారోపణ. ఆ ఎఫ్ ఐ ఆర్ తో మమ్మల్ని జుడిషియల్ కస్టడీకి పంపించడానికి నిజామాబాదు మెజస్ట్రీటు ముందర హాజరు పరచవలసి ఉండింది. నిజామాబాదులో హాజరు పరుస్తామని చివరిదాకా చెపుతూ వచ్చారు. కాని అంతకు ముందురోజు సాయంత్రం నుంచే మా అరెస్టు వార్త టివిల్లో వచ్చినందువల్ల నిజామాబాదు కోర్టుకు చాలమంది రావడంతో, చివరి నిమిషంలో ఏదో సాంకేతిక కారణం చూపి బోధన్ మెజస్ట్రీట్ ముందర హాజరుపరిచారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో మా మీద కేసు నమోదు చేశారు. మా అక్రమ నిర్బంధం గురించీ, శారీరక, మానసిక చిత్ర హింసల గురించీ, పోలీసులు చెపుతున్న అబద్ధాల గురించీ బోధన్ మెజస్ట్రీట్ ముందు నేను పావుగంట పాటు వినిపించిన వాదన అరణ్యరోదన అయింది. చిన్నకోర్టులన్నిట్లోనూ న్యాయమూర్తులకు తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదనే గుర్తింపే ఉండదు. హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్కన నిలబడి ఉన్న సర్కిల్ ఇనస్పెక్టర్ వైపో, డీ ఎస్పీ వైపో చూస్తూ వాళ్ల కనుసన్నలను బట్టి ప్రవర్తిస్తుంటారు.

venu4

మా అరెస్టుల గురించి మొత్తంగానూ, నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ చాల నిరసన వ్యక్తమయింది. అప్పటికి పదమూడు సంవత్సరాలుగా రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవలసిన డయాబెటిక్ గా ఉన్న నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా మా అరెస్టులను ఖండిస్తూ, మాకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు ఇచ్చాయి. సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి “ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోము” అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ దాఖలు కావడానికి ముందే, విచారణకోసం తమకు అప్పగించాలని పోలీసులు కోరి ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు.

వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. “ఏదో సమాచార లోపం వల్ల అలా జరిగింది” అన్నారాయన! హైటెక్ ప్రభుత్వానికి అంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయింది. కాని నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు. ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల నేనూ, మిత్రులందరమూ బెయిల్ మీద విడుదలయ్యాం. అలా నిజామాబాదు జైలులో దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం వచ్చింది.

నిజామాబాదు జైలు తెలంగాణ జనజీవితంలో, సాహిత్యంలో ముఖ్యమైనది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి మహామహులు నిజాం వ్యతిరేకపోరాటంలో ఆ జైలులో బందీలుగా ఉన్నారు. ‘నాతెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి పద్యాలు రాసినది ఆ జైలులోనే. పోలీసులు చెరిపినకొద్దీ ఆ పద్యాలను మళ్లీ మళ్లీ గోడలమీద బొగ్గుతో ఆళ్వారుస్వామి రాసినదీ ఆ జైలు లోనే. ఆ జైలులోకి వెళ్లడం ఒక అపురూపమైన అనుభవం. అక్కడి గోడల మీద ఆరు దశాబ్దాల కింది దాశరథి, ఆళ్వారుస్వామి అక్షరాలు ఉన్నాయా అని వెర్రిగా వెతికాను. జైలు నుంచి బైటికి రాగానే ‘ఖిలా జైలు – దాశరథి నుంచి ఇవాళ్టి దాకా’ అని నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయింది.

జైలు జీవితం చిత్రమైనది. ఎవరు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో ఎవరికీ తెలియకుండానే ఖైదీలను శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసే దారుణమైన నిబంధనలు అమలవుతుంటాయి. అన్నిటిలోకీ విచిత్రమైనది జీవితాన్ని కురచబార్చడం. ఉదయం ఆరింటికి బారక్ ల తాళాలు తెరుస్తారు. సాయంత్రం ఆరింటికి తాళాలు వేస్తారు. అంటే పన్నెండు గంటలు మాత్రమే బారక్ బైటి జీవితంతో సంబంధం ఉంటుంది. ఆ పన్నెండు గంటలలోకే మొత్తం ఇరవై నాలుగు గంటల జీవితాన్ని కుదించుకోవాలి. రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసిన రోగగ్రస్తుడిగా నాకు ఈ నిబంధన ప్రాణాంతకమయింది. ఖైదీలను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించడానికి ఖైదీల దగ్గర అందుకు ఉపయోగపడే పరికరాలేవీ ఉండనివ్వగూడదని ఒక నిబంధన. అందువల్ల బారక్ లో నా దగ్గర ఇంజక్షన్ ఉంచుకోవడానికి వీలులేదు. అది జైలర్ గదిలో రక్షణలో ఉండేది. నా బారక్ తాళం తెరిచిన తర్వాత అరగంటకో, గంటకో ఏడు గంటల సమయంలో ఉదయపు ఫలహారం తినే ముందు జైలర్ గదికి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని రావాలి. మధ్యాహ్న భోజనం పదకొండు, పన్నెండు మధ్య మళ్లీ జైలర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవాలి. రాత్రి భోజనం బారక్ తాళాలు వేయక ముందే అంటే ఐదు, ఐదున్నర ప్రాంతాలలో పెడతారు గనుక మూడో ఇంజక్షన్ అప్పుడు తీసుకోవాలి. పోనీ ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని గంటల తర్వాత తిందామనుకుంటే, ఆ మొద్దు బియ్యం అన్నం అరగంట ఆలస్యమైనా తినడం అసాధ్యం. అంటే కనీసం ఆరు-ఎనిమిది గంటల వ్యవధి ఉండవలసిన నా ఇన్సులిన్ ఇంజక్షన్లు నాలుగు-ఐదు గంటల వ్యవధికి మారిపోయాయి. మరొకపక్క సాయంత్రం ఇంజక్షన్ కూ ఉదయం ఇంజక్షన్ కూ మధ్య పన్నెండు గంటల వ్యవధి వచ్చింది. ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామమో చెప్పనక్కరలేదు.

venu5

అలాగే జైలు జీవితం గొప్ప అనుభవం, మహత్తర పాఠశాల. జాలీ ములాఖాత్ సంభాషణలు మానవ సంబంధాల మీద ఇనుపతెరలు కప్పుతాయి. అతి చిన్న నేరాలు చేసినందువల్లనో, అసలు నేరాలే చేయకుండానో నెలల తరబడీ, సంవత్సరాల తరబడీ జైలులో గడిపే అమాయకుల విభిన్న జీవన దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. జైలు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలూ, దినపత్రికలూ తక్కువ గనుక దొరికిన ప్రతి అక్షరాన్నీ ఆబగా చదవడం అలవాటవుతుంది. సహఖైదీలతో ఎడతెరిపిలేని చర్చలు వాటికవే వివరంగా రాయవలసిన గ్రంథాలు అవుతాయి.

బెయిల్ మీద విడుదలైన తర్వాత ఐదు సంవత్సరాలపాటు ప్రతి నెలా రెండుసార్లు మేం నిజామాబాద్ కోర్టుకు హాజరు కావలసివచ్చింది. వాదనల సమయంలో పది రోజులు నిజామాబాదులోనే ఉండవలసి వచ్చింది. ఈ వాయిదాల కోసం ప్రతిసారీ కావలి, ప్రొద్దటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి సుదూర ప్రాంతాలనుంచి గంటలకొద్దీ ప్రయాణాలు చేసి, కోర్టులో రోజంతా పడిగాపులు పడి, న్యాయస్థానం చుట్టూ తిరగడంలో ఐదు సంవత్సరాల విలువైన కాలం వ్యర్థమయింది. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సి వెంకటేష్ 2010 ఆగస్ట్ 2 న కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

పోలీసులు కేసు నడిపినతీరు తప్పులతడక అని వర్ణిస్తే అది చాల చిన్నమాట అవుతుంది. మా అరెస్టు చూపిన పత్రికాసమావేశంలో భయంకరమైన నేరం జరగబోతుండగా పట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అసలు ఎవరిమీదనైనా సెక్షన్ 120 (బి) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయదలచుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి, మెజస్ట్రీట్ అనుమతి తీసుకోవాలని చట్టం చెపుతుంది. కాని ఆ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు, కేసు నడిపారు. పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ చట్టవ్యతిరేక ప్రవర్తనకు అది తొలి నిదర్శనం. అసలు నేరారోపణలు అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది. మమ్మల్ని నిజామాబాదు పొలిమేరల్లో అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వాహనం తూర్పుకు వెళ్లిందని ఒకరు చెపితే పడమటికి వెళ్లిందని మరొకరు చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసేటప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు సాక్షులు ఆటోడ్రైవర్లు. తమ ఆటోలను పోలీసులు జప్తు చేసుకుని పోలీసు స్టేషన్ లో పెట్టుకుంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద పోలీసులు తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆ కాగితాలేమిటో తమకు తెలియదనీ, మమ్మల్ని తామెప్పుడూ చూడలేదనీ, మా అరెస్టుకూ పంచనామాకూ తాము సాక్షులం కాదనీ చెప్పారు.

మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపనే కదా’ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడా పోలీసు సాక్షి.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు.  మాదగ్గర తాను జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ‘దీనిలో కుట్ర ఉందా’, ‘దీనిలో కుట్ర ఉందా’ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని ఆ దర్యాప్తు అధికారి తన నోటనే చెప్పకతప్పలేదు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ‘ఆధారమేమీ లేదు’ అని దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాడు.

దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమూ లేదు. కుట్రా జరగలేదు, అరెస్టు చేసినదీ ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులూ కాదు. ఆధారాలుగా ప్రదర్శించినవి ఆధారాలూ కావు. అరెస్టు చేయడానికి వెళ్లామన్న పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు కాదు. అలా ఎన్నెన్నో ‘కాదు’ల మీదా, ‘లేదు’ల మీదా ఆధారపడి పోలీసులు మా నేరం రుజువు చేయదలిచారు.

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు చూపమంటే అది లేదన్నాడు. తాము చేస్తున్న పని అధికారికంగా సరైనదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట. అలా విచారణలో మా న్యాయవాది గొర్రెపాటి మాధవరావు చాల సమర్థంగా పోలీసుల అబద్ధాలనూ కట్టుకథలనూ అబద్ధపు సాక్ష్యాలనూ తుత్తునియలు చేశారు.

అయితే, ఇదంతా కేవలం పోలీసు అధికారుల, సాక్షుల సమర్థత, అసమర్థతలకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ అబద్ధపు సంస్కృతిని, హింసా సంస్కృతిని నేర్పిపెట్టారు. ‘ప్రజలు మాకు శత్రువులు. మీరు మా ఉద్యోగులు గనుక ప్రజలు మీకూ శత్రువులే. మీరు వాళ్లను అలా తప్ప మరొకరకంగా చూడడానికి వీల్లేదు. వాళ్లను ఏమిచేసినా, వేధించినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా ఫరవాలేదు. హక్కుల చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదు’ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు శిక్షణ ఇచ్చారు. (‘అన్నా తమ్ముడూ బంధువూ అని చూడకు, చంపడమే నీ ధర్మం’ అని సరిగ్గా అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత లాగ!) 1947 తర్వాత కూడ పోలీసు శాఖ పాటిస్తున్నది అవే చట్టాలను, అదే సంస్కృతిని, అదే శిక్షణను. అంతకుముందరి వలసపాలకుల సేవ నుంచి ప్రజాసేవ స్థానానికి మారడానికి తగిన శిక్షణ లేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు.

అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారుచేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ తాను చేసిన నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. ఇతర కేసుల సంగతి సరేసరి.

“మావోయిస్టు పార్టీ నాయకులు ఇద్దరితో (గంటి ప్రసాదం, సురేందర్) కలిసి కుట్రపన్నామని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మేం ఆయుధాలు వగైరా సేకరించామని, అది శిక్షార్హమైన నేరమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని మేం కుట్ర చేశామని రుజువు చేసే ఒక్క సాక్ష్యాన్ని కూడ ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. మేం ఆయుధాలు వగైరా సేకరించామని, ఈ ప్రభుత్వ చట్టాల ప్రకారమైనా నేరం చేశామనడానికి ఒక్క ఆధారం కూడ చూపలేకపోయింది. మొత్తం కేసు అంతా మేం ఔరంగాబాదులో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కలిసి మాట్లాడుకున్నామనే ఆధారం తప్ప మరేమీ లేదు. అంటే మనుషులు కలిసి మాట్లాడుకోవడమే ఈ ప్రభుత్వానికి, పాలకులకు, పోలీసులకు తమను కూలదోసే కుట్రలా కనబడిందన్నమాట. ప్రభుత్వాలను కూలదోసే పని పాలకవర్గ ముఠాలు చేసుకుంటూనే ఉన్నాయి. మేం చేయదలచుకున్న పని ఈ వ్యవస్థను కూలదోసే శక్తులకు కలమూ గళమూ ఇవ్వడం. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీద ఆధారపడి ఉన్నది గనుక, ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నది గనుక ఈ వ్యవస్థను కూలదోయడం అవసరమనీ, అనివార్యమనీ, సహజమనీ, న్యాయమనీ మేం భావిస్తున్నాం. అందులో దాపరికమేమీ లేదు. అందుకొరకు మేం కుట్రలు చేయం. ప్రజలకు నిజాలు చెపుతాం. పోరాట అవసరం చెపుతాం. వారు పోరాడుతున్నప్పుడు అండగా నిలబడతాం. వారి పోరాటాలను గానం చేస్తాం. ఆ పోరాటాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతాం” అని మా కేసు కొట్టివేత తర్వాత విరసం పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత చివరిగా న్యాయమూర్తి నిందితులను ‘మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా’ అని అడుగుతారు. దానికి జవాబుగా నిందితులు చేసే ప్రకటనను క్రిమినల్ ప్రొసేజర్ కోడ్ సెక్షన్ 313 వాంగ్మూలం అంటారు. నిజామాబాదు కోర్టులో 2010 జూలై 12న నేను ఆ 313 ప్రకటన చేశాను. దానిలో భాగాలు:

“మొట్టమొదట ఇటువంటి కోర్టు ప్రకటన చదవడం అనే సంప్రదాయం భారతదేశపు న్యాయస్థానాలలో వంద సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని మీ దృష్టికి తేదలచాను. బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్, వి డి సావర్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, ఎం ఎన్ రాయ్ మొదలయిన భారత జాతీయోద్యమ నాయకులు, మీరట్ కుట్రకేసు వంటి ప్రఖ్యాత కేసుల నిందితులు కూడ ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. ఆశ్చర్యమూ విషాదమూ ఏమంటే సరిగ్గా ఇవాళ మామీద ప్రాసిక్యూషన్ వారు బనాయించిన సెక్షన్లే – ఐపిసి 120 (బి), 121 (ఎ), 122 – ఈ నాయకులందరిమీద కూడ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బనాయించింది. ఆ నేరారోపణలకు జవాబుగా ఆ ముద్దాయిలందరూ న్యాయస్థానాలలో తమ మీద బనాయించిన తప్పుడు కేసుల గురించి, తమ రాజకీయ విశ్వాసాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చదివారు. అవన్నీ బ్రిటిష్ వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమ చరిత్రలో భాగమైనవే.

1947 అధికార మార్పిడి తర్వాత కూడ ఇటువంటి నేరారోపణలు, వాటికి జవాబుగా న్యాయస్థానాలలో ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అచ్చయిన ఐదువందల పేజీల పుస్తకం తరిమెల నాగిరెడ్డి హైదరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా చేసిన కోర్టు ప్రకటనే. ఆ కుట్రకేసులోనే ముద్దాయిలందరి తరఫున దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం – ఎత్తుగడల వివరణ’ అనే సుదీర్ఘమైన కోర్టు ప్రకటన చదివారు. పార్వతీపురం కుట్రకేసు నిందితులలో చాలమంది కోర్టులో తమ రాజకీయ విశ్వాసాలను తెలియజెప్పే కోర్టు ప్రకటనలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి అనేక కేసులలో ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. రచయితల విషయానికే వస్తే సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి వాటిలో ముద్దాయిలైన కె. వి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం టి ఖాన్ మొదలయిన వారు సుదీర్ఘమైన కోర్టు ప్రకటనలు చేశారు. అవన్నీ పుస్తకాలుగా కూడ అచ్చయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

venu6ఈ వ్యవస్థలో సాగుతున్న దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ రచనలు చేసేవారిని, ఉపన్యాసాలు ఇచ్చేవారిని ‘ఇదిగో ఇలా వేధిస్తాం, అక్రమ నిర్బంధాల పాలుజేస్తాం, అబద్ధపు కేసులు బనాయిస్తాం’ అని బెదిరించడానికే ఈ కేసు. ఈ దోపిడీ పీడనల వ్యవస్థను మార్చాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న వారిని కలుసుకున్నా, వారితో మాట్లాడినా వేధింపులు తప్పవు అని హెచ్చరించడానికే ఈ కేసు. ఈ వ్యవస్థ మీద వచ్చే ప్రశ్నలను మూసిపెట్టడానికే ఈ కేసు. ప్రశ్నించేవారిని, తమ ప్రశ్నల గురించి ఇతరులను ఆలోచించేలా చేసినవారిని వేధించడానికి పాలకవర్గాలు, అధికార యంత్రాంగం నిరంతరం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కేసు.

నావరకు నేను గత మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలుగా పాలన నెరపడం లేదని, భారత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ప్రవేశికను గాని, ప్రాథమిక హక్కులను గాని, ఆదేశిక సూత్రాలను గాని గౌరవించే, చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించడం బుద్ధిజీవిగా నా బాధ్యత అనుకుంటున్నాను. నేను ఆ బాధ్యత నిర్వహించడం పాలకులకు కంటగింపు అయినందువల్లనే, నన్ను శారీరకంగాను, మానసికంగాను వేధించడానికే, నా కృషిని అడ్డుకోవడానికే నాపై ఈ అబద్ధపు కేసు బనాయించారు.

కాని ఈ కేసు వల్ల ప్రభుత్వాలు, పోలీసులు చెప్పే అబద్ధాలే బయటపడ్డాయి. నా తాత్విక, రాజకీయ విశ్వాసాలు బలపడ్డాయి. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీదనే ఆధారపడి ఉన్నదని, దీన్ని రద్దుచేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించక తప్పదని నా విశ్వాసం బలపడింది. ఆ కొత్త వ్యవస్థ గురించి కలలు కనేవారిని, ఆ కలలను ఇతరులతో పంచుకునే వారిని నిర్మూలించడం, నిర్బంధించడం, భయపెట్టడం, వేధించడం ఈ వ్యవస్థ లక్ష్యం అని నాకు ఈ కేసు తెలియజెప్పింది. మనిషికి కలిగే ఆలోచనలనూ, వాటిని ఇతరులతో పంచుకునే మాటలనూ చూసి ఈ వ్యవస్థ భయపడుతోందని ఈ కేసు తెలియజెప్పింది. ఈ కేసులో మాట్లాడుకోవడాన్నే నేరంగా చిత్రిస్తున్నారు. మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను.”

నిజామాబాదులో ఒక హైటెక్ జైలు కట్టి, ఆ జైలును మార్చేశారు. మా కేసు తీర్పు నాటికే ఆ మార్పు జరిగిపోయింది. వాదనల సందర్భంగా పది రోజులు నిజామాబాదులో ఉన్నప్పుడు మేమందరమూ రఘునాథాలయంలోనుంచి పాడుబడిపోయిన పాత జైలు భవనాల పైకప్పు మీదికి ఎక్కి మాకు ఇరవై రోజులు ఆశ్రయం ఇచ్చిన ఆ స్థలాల ఫొటోలు జ్ఞాపకంగా తెచ్చుకున్నాం. పది సంవత్సరాలు గడిచిపోయింది. జ్ఞాపకంగా మిగిలిన ఆ జైలు శిథిలమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా మారింది. కాని పోలీసులూ, న్యాయవ్యవస్థా, చెరసాలలూ, నిర్బంధ సంస్కృతీ ఏమీ మారినట్టు లేదు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

రెండు దమ్ములు

పూడూరి రాజిరెడ్డి

 

rajireddi-1నా కుతూహలానికి ఫలితం ఇవ్వాళ అనుభవించబోతున్నాను.

‘అన్నా, నైట్ ప్లాన్ ఏంటి? అక్కాపిల్లలు ఊళ్లో ఉన్నరా?’ అప్పుడెప్పుడో అనుకున్నది…’ పొద్దున్నే వంశీ నుంచి మెసేజ్.

ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. వేసవి సెలవులు కదా ఊరెళ్లారు. ఏ అజ్ఞాతస్థలంలోనో చేయాల్సివచ్చేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు! ‘పక్కోళ్లు గుర్తుపట్టరు కదా!’

ఆఫీసు పనిలో మునిగిపోయినా, ఒకట్రెండు సార్లు రాత్రి జరగబోయేది చప్పున గుర్తొచ్చింది. ‘ఇవ్వాళ చారిత్రక దినం అవుతుంది నా ఆత్మకథలో’.

వంశీ పడుకోవడానికి సిద్ధపడి వస్తానన్నాడు కాబట్టి, సాయంత్రం వెళ్లాక అన్నం, టమోటపప్పు వండాను. గెస్టు కదా, వేడివేడిగా ఆమ్లెట్లు వేయడానికి సిద్ధంగా అరడజను గుడ్లు కూడా కొనిపెట్టాను. స్నానం చేసి వచ్చేలోగా మిస్డ్ కాల్.

“అన్నా, జీతూ ముందటున్న. బీర్లేమైన తేవాన్న?”

‘బీర్లా? అసలు విషయం ఉందా మనవాడి దగ్గర?’

“రెండు లైట్ బీర్లు తీస్కొ”

“సిగరెట్స్?”

ఇవా మనం కాల్చేది! ‘ఉత్తగనే ఊరియ్యలేదు గదా నన్ను’.

“కింగ్స్ తే”

“లైట్సేనా?”

“రెగ్యులర్”

గిన్నెలు, గ్లాసులు అన్నీ ముందరపెట్టుకుని, చాపలో కొంత చంద్రుడు కనబడేలా కూర్చున్నాక, ఎక్కువ సస్పెన్సులో ఉంచకుండానే పొట్లం బయటికి తీశాడు. దళసరి కాగితంలో చుట్టిన మరో కాగితం. ఆకుపచ్చటి ఎండు ఆకులు!

“వాసన జూడు”

నా ముక్కు బలహీనం. ఏమీ తెలియలేదు.

“ఇది రా అన్న”

“ఏడ సంపాయించినవ్?”

“ధూల్ పేట్. ఇంతకుముందు వందకు ఇంత పెట్టెటోడు. ఇప్పుడు మినిమమ్ మూడు వందలు జేసిండు.”

రెండు బీర్లు, నాలుగు సిగరెట్లు అయ్యాక, చెప్పాడు కవిసోదరుడు: “ఒక మహత్తర కార్యానికి దేహాన్ని సంసిద్ధపరచాలంటే ఇవన్నీ గావాలె. లేకపోతే ఆ మూడ్లోకి పోలేం.”

‘అసలు ఇదే ఏమైనా ఎక్కివుంటే, దాని పాలు ఎలా తెలుస్తుంది?’

“అన్నం ముందు తినేద్దామాన్నా”

“తర్వాత్తిందాం తియ్ ఏంది?”

“తర్వాత ఏ ప్లేన్లో ఉంటమో!”

‘ఇది మరీ అతిశయం’!

అంచనా ఘోరంగా తప్పడం అంటే ఇదే! ఒక విషయం వినడానికీ, అనుభవంలోకి రావడానికీ మధ్య ఊహించలేనంత అంతరం!

 

ఫస్ట్ రౌండ్:

సిగరెట్ లోని పొగాకును వేలితో సుతారంగా మీటినట్టు కిందకు రాల్చేసి, గింజల్ని పక్కకు ఏరేస్తూ ఆకుల్ని అరచేతిలో పొడిగా చేసి, ఆ పొడిని సిగరెట్లోకి బదలాయించి, కొసను దగ్గరగా ఒత్తడం ద్వారా మూతి బిగించిన తర్వాత-

“అన్నా, జాయింట్”

మామూలుగా అగ్గిపుల్ల గీకి అంటించడమే! గట్టిగా లాగాలి. ఏమీ రావట్లేదు. పొగ పీల్చినట్టు కూడా అనిపించదే!

నేను తాగుతున్నానా! ఇది నాకు తాగడం వచ్చా? ఏమీ కాదేంటి?

కటిక చేదు మాత్రం పెదాలకు తెలుస్తోంది. ‘ఛీ’!

అంతే, పెద్ద మార్పు లేదు. ఓస్ ఇంతేనా! ఇది నన్నేమీ చేయదు. మామూలుగానే ఉంది. నేను మామూలుగానే ఉన్నా. అందరినీ అన్నీ కదిలించలేవేమో! నేను సరిగానే పీల్చానా?

లేదు, నేను గట్టివాణ్ని. ఊరికే చెబుతారంతే. నన్ను ఇది పెద్దగా ఏమీ చేయలేదు. తెల్లారి చెప్పాలి, నేను మామూలుగానే ఉండగలిగానని! ఇది జస్ట్… ఉత్తదే! నేను గ్రేటే!

ఊఊఊఊఊఊఊ…. శూన్యం లాంటి గాలి. ఏదో తెలిసింది నెమ్మదిగా!

ఏదో తెలుస్తోంది… తెలుస్తోంది… రెండు మూడు నిమిషాలై ఉంటుందా?

మెదడు మొద్దుబారుతోంది. మెదడు బరువుగా అవుతోంది.

అరే దీన్ని రాయాలి, నోట్ చేయాలి, నోట్సు ఎక్కడుంది?

డైరీ… డైరీ…

“అన్నా, డైరీ నిండిపోతది. కానీ రియల్ లాంగ్ పొయెమ్ అయితది”

వేడి పొగలేవో వస్తున్నాయి, ఛాతీ తిరుగుతోంది, పెదాలు నవ్వుతున్నాయి.

మోకాళ్ల కింద పొడుస్తోంది, పొడుపు మెదడుకు పాకింది, మెదడు ఉందా అని జోక్ వేసుకుంటున్నాను.

కాలికి ఏదో పెద్ద తాడు తగులుతోంది; ఏం తాడు? ఇదెక్కడిది? ఓ దీనియమ్మ డైరీ రిబ్బన్; చక్కలిగింత పెడుతోంది.

నేను రాసింది చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అక్షరాలు పెద్దగా కనబడుతున్నాయి. పెద్దగా… పెద్దగా… బ్లో అప్!

గాలి కంట్లోకి వచ్చింది. ఫ్యానుదేనా? పెద్ద అలలాంటి గాలి కంటి కొసన. చిన్న శబ్దం కూడా పెద్దగా. పేజీ తిప్పుతుంటే పుస్తకం అంత బరువుగా అనిపిస్తోంది. అరే ఈ వాక్యాలకు నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదా? పెట్టాను.

నెమ్మదిగా అక్షరాలు జూమ్ ఇన్ అవుతున్నాయి. నేను నార్మల్సీ… ఇంతే! స్పీడ్ తగ్గుతోంది… దేని స్పీడ్, ఫ్యాన్ స్పీడా?

తగ్గలేదు. తిరుగుతోంది. తల. తల తిరుగుతోంది. గుండ్రంగా తిరుగుతోంది. గుండ్రంగా… గుండ్రం… అరే ఇప్పుడేమో కర్ణంలాగా. ఆఆఆఆఆఆఆ ఇప్పుడు స్లోప్… జారినట్టుగా… జారిపోతున్నట్టు…

ఇప్పుడు పూర్తిగా బోర్లించినట్టు. తల బోర్లా పడుతోంది… బోర్లా…

‘అయినా నువ్వు భలే రాయగలుగుతున్నావురా’

నిజమే, నేను రాస్తున్నా…

తల తలకిందులవుతోంది, తలకిందులు కిందులు…

ఇప్పుడేమో ఏవో కంపనాలు, థిల్లానా థిల్లానా…

చంకల్లో పొడుస్తోంది, వంశీ శ్వాస తెలుస్తోంది, పొడుపు ఎక్కువైంది… పొడుపు… పొడుపు కథ? పొడుపు మరీ ఎక్కువైంది. దీనియమ్మ పొడుపు… పొడుపు…

కళ్లు గట్టిగా తెరిచి, రాయడం చాలించి, నడుమెత్తి వంశీని చూశాను.

“ఏం జేస్తున్నవ్?”

వంశీ రెండో రౌండుకు సిద్ధం చేస్తున్నాడు. ఎన్ని రౌండ్లు తిరగాలని ఇతడు!

నా తలలో మామూలుగానే ఉంది. ఊఊఊఊఊఊఊ…

నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను దీన్ని? ఎగ్జాగ్ట్. లాస్ట్ టైమ్ వాచీ చూసినప్పుడు 11:36. ఛా 11:09. ఇప్పుడు 11:36.

వంశీ ఏదో బ్యాగ్ సర్దుతున్నాడు, జిప్ ఏదో లాగుతున్నాడు, జీప్ అని రాయబోయి జిప్ చేశాను.

ప్లేట్ చప్పుడు… ఎక్కడో కుక్క మొరుగుతోంది, అవ్ వ్ వ్ వ్ వ్ వ్ వ్… బయటా?

“రండి, వచ్చాక రాసుకుందాం; అన్నా, దా”

 

సెకండ్ రౌండ్:

మళ్లీ ఇందాకటిలాగానే- రూమ్ లోంచి బయటి వాకిలి సందులోకి వచ్చి, చీకట్లో గోడకు వీపును ఆన్చి కూర్చుని-

 

(ఈ తర్వాతిదంతా నేను అప్పుడే రాయలేకపోయాను. ఆ మాటకొస్తే తెల్లారి సాయంత్రం కూడా రాయాలనిపించలేదు. 36 గంటల తర్వాత, మళ్లీ జరిగింది గుర్తుచేసుకుని రికార్డు చేశాను. దీన్ని రాయడంలో నా ప్రధాన ఉద్దేశం ఒక స్థితికి సంబంధించిన గ్రహింపును నమోదు చేయడమే! అదైనా 100 స్కేలులో 5,10 కౌంటు మాత్రమే- కేవలం ఒక నీడనీ జాడనీ పట్టుకోగలిగానంతే!)

 

మొదటి పప్ఫు. గట్టిగా, లోపలికి…

రెండోది పీల్చేసరికి శరీరం స్థాణువైంది. చేయి కదిలేట్టు లేదు. వంశీకి దీన్ని పాస్ చేయాలంటే చేయి కదిలించాలని అనిపించట్లేదు. నా చేతు ఇలాగే కాలిపోతుందేమో!

బరువుగా… శక్తిని కూడదీసుకుని… చేయిని కదిపి…

ఇక నేను పీల్చలేను.

నె..మ్మ..ది..గా లేచి మళ్లీ రూమ్ లోకి వచ్చాను.

ముందు తిందాం అనుకున్నా. కానీ కదిలేలా లేను. వెనక్కి చేతులు పెట్టి, నడుం చాపుకుని అలా కాసేపు కూర్చున్నా. బ్యాలన్స్ అవట్లేదు.

శరీరాన్ని మోయలేను. లేను. పడుకోవాల్సిందే… వెల్లకిలా… చేతులు, కాళ్లు బార్లా జాపి…

ఏదో వేడి…  సన్నని మంట ఒళ్లంతా పాకినట్టు, పాదాల నుంచి పైదాకా వచ్చినట్టు… ఎర్రగా…

నోరు పిడచగట్టినట్టు, పెదాలు తెరవలేనట్లు, శాశ్వతంగా మూసుకుపోయినట్లు…

అరే, శక్తి కూడదీసుకుని లేస్తే స్ప్రింగు లాగా లేచిన ఫీలింగ్…

కొన్ని నీళ్లు ఫిల్టర్ లోంచి…

తినేటట్టు లేదు. ఇప్పుడు అన్నం గిన్నె వెతకడం నా వల్లకాదు.

వంశీ తింటున్నట్టున్నాడు. ప్లేట్ కడుగుతాడా? రేప్పొద్దున ఎంగిలిపళ్లెం నాతో కడిగిస్తాడా?

అలాగే రూములోంచి హాల్లోకి వచ్చిపడ్డాను. పడలే, పడ్డంత పనై పడుకున్నా.

నేను శ్వాసిస్తున్నానా?

ఊమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్…

ఏదో కదులుతోంది. ఒంట్లోకి ఏదో ప్రవహిస్తోంది. ఏదో కొత్తది, లేదూ తెలిసినట్టే ఉన్నది… మొత్తం శరీరంలోకి ఆనందం జొరబడుతోంది, పెదాల మీద తెలియకుండానే నవ్వు చేరింది, నా ముఖంలో కొత్త వెలుగేదో తెలుస్తోంది.  దివ్యమైన కాంతి. రంగులరాట్నం ఎక్కినట్టు ఒకటే ఏదో హేహేహేహేహేహేహే…

భావప్రాప్తి. భావప్రాప్తి. భావం ప్రాప్తించింది. ఇదే ఇదే ఇదే, ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నా కలగని సుఖం… అట్లాగే నిలకడగా, నిలిచిపోయినట్టుగా… ఈ ఆనందం నేను ఓపలేను, ఈ ఆనందం తట్టుకోలేను… ఇలా స్త్రీ కదా అనాలి!

మర్మాంగాలు మాత్రమే ఉనికిలో ఉన్నట్టుగా… అవి మాత్రమే నిజం… అంతా అబద్ధం… ఆనందం… బ్లిస్… అద్భుతం… ఇదే ఇదే పరమానందం… వదులుకోలేని ఆనందం… ఓఓఓఓఓఓఓ…

దేవుడా దేవుడా దేవుడా ఆనందం ఆనందం ఆనందతాండవం, ఎక్కడ కదలకుండానే తాండవం, లోలోపలి నర్తనం… ఓహోహోహోహోహోహోహో…

దివ్యానందం… సుఖమజిలీ… సుఖం సుఖం… ప్రాణానికి సుఖం… హాయి హాయి హాయి మహాగొప్పగా నవ్వుగా, ఇక చాలన్నట్టుగా…

ఆఆఆఆఆఆఆ…

కదిలేట్టు లేదు. బరువు అలాగే ఉంది.

స్టేట్ మారుతోంది.

శరీరంలో ఏదో మారుతోంది, మార్పు తెలుస్తోంది, వైబ్రేషన్ మోడ్…

ప్లగ్గులో బాడీని పెట్టినట్టుగా సన్నటి కంపనాలు… క్ క్ క్ క్ క్ క్ క్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్… వైబ్రేషన్ వైబ్రేషన్… శబ్దం తెలుస్తోంది…

శరీరంలో అలలు… ప్రకంపనలు…

అయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యో… జూజూజూజూజూజూజూ…

శరీరాన్ని విరిచినట్టుగా…  బట్టలాగా పిండినట్టుగా… మెడ తిరిగిపోయిందేమో… తిరిగిపోతోందా? పోతోందా? పోతోం…

చచ్చిపోతానేమో! చావడం అంటే ఇదేనేమో! నేను బతకడం కష్టం… నేనిక బతకను…

దాహం దాహం… నీళ్లు నీళ్లు మంచినీళ్లు…

కదిలేలా లేను… నేను కదలలేను… అయ్యో … అయ్యో…

లేదు, తాగకుండా ఉండాల్సింది… ‘వంశీ నువ్వు నన్ను వార్న్ చేయాల్సింది. సరిగ్గా వారించాల్సింది. ఇది నాకు నువ్వు కరెక్టుగా వివరించి చెప్పాల్సింది. ఈ స్థితి గురించి’… దేవుడా దేవుడా చచ్చిపోయానా…

రేపు అందరికీ తెలిసిపోతుంది, ఇట్లా చచ్చిపోయారని తెలిసిపోతుంది… ఈ కారణంగా మరీ ఇలాగా…

చచ్చినట్టే… బతికే చాన్స్ లేదు… డీ హైడ్రేషన్… నీళ్లు ఇంకిపోతున్నాయ్… ఇంట్లో నీళ్లు లేవు, ఒంట్లో ఒంట్లో లేవు, చుక్క కూడా లేదు… చుక్క కూడా చుక్క కూడా…

నీళ్లు తాగాలి, రేపు అందరికీ తెలిసిపోతుంది… నీళ్లు తాగాలి నేను బతకాలి…

తాగాలి నేను బతకాలి నీళ్లు తాగాలి అది తాగకూడదు నీళ్లు తాగాలి తాగకూడదు తాగాలి తాగకూడదు తాగా…

చేయి కదిలింది… అమ్మయ్య… ఈజీ ఈజీ కదిలింది… ఈజీ… లేచాను…

గ్లాసు ఎక్కడ? నీళ్లు… కిచెన్ లోకి…

వంశీ అప్పటికే నీళ్లు తాగుతున్నాడు… నీళ్లు అమ్మా… నీళ్లు… ప్రాణం ప్రాణం…

గుక్క గుక్క గుక్క…. ఊఊఊఊఊఊఊ… ఏమైంది నాకు?

హొహ్హొహ్హొ… ఒక్కసారి స్విచాఫ్ అయినట్టుగా… వైబ్రేషన్ మోడ్ పోయింది. ఇది మ్యాజిక్. మ్యాజిక్ జరిగింది. కంపనం ఆగిపోయింది. లోపలి రొద సద్దుమణిగింది.

“ఏం వంశీ ఇట్లా స్విచాఫ్ అయింది”

నోట్లోంచి మాట వస్తుందని కూడా ఊహించలేదే!

“అంతే అన్నా, త్రీ ఫోర్ అవర్స్ ఉంటుందంతే”

హేహేహేహేహేహేహే… నేను బతికాను నేను బతుకుతాను. నేను చావను నేను చావను బతుకుతున్నా…

అయిపోతుంది ఏం ఫర్లేదు…

ఇప్పుడు టైమెంత? ‘మూడు గంటలు’. సరిగ్గా మూడు.

అమ్మా అమ్మా… మళ్లీ వచ్చి పడక… ఇప్పుడు బెడ్రూములో, ఇప్పటికైనా బెడ్రూములోకి సరిగ్గా…

“వంశీ నువ్వు గూడ బెడ్లోనే పండుకో…  చెద్దరేమన్న గావన్నా?”

“ఏమొద్దన్నా”

“బయటి గొళ్లెం బెట్నవా?”

“అప్పుడే పెట్నన్నా”

ఆఆఆఆఆఆఆ… కొంచెం రిలీఫ్…

నిద్రపోదాం కాసేపైనా…

నిద్ర పోదాం. నిద్ర. నిద్ర.

దోమలు చెమట గాలిలేనితనం… కరెంటు పోయినట్టుంది…

మళ్లీ ఏమవుతోంది? వూవూవూవూవూవూవూ…  కోకోకోలా బుడగలు పేలినట్టుగా… లోపల ఏదో చర్య… ఇది పూర్తిగా రసాయనిక చర్య… బాడీ డీకంపోజ్ అవుతోంది… ఓహో ఇలా చంపేస్తుందేమో… మళ్లీ చావు… చావు తప్పదా?

సూసూసూసూసూసూసూ… మోకాళ్ల కింద నొప్పి. సులుక్ సులుక్ సులుక్…

కిటికీలు బంధించి వుండి గాలి రాకపోతే ఇది కచ్చితంగా సూసైడ్ అవుతుంది. అయిపోతుంది. చచ్చి ఊరుకుంటాం. గాలి కావాలి గాలి…

కిటికీ తీసి కదలకుండా బోల్ట్… లొకేషన్ కుదరట్లేదు… కాన్సంట్రేట్… ధ్యాస ధ్యాస పెట్టగలిగాను.

రేపటి డెడ్ లైన్… ఆఫీసు వర్కు… చెమట వెళ్లిపోతున్నట్టుగా…

ఏదోలా అవుతోంది. తినివుంటే వాంతి అయ్యేదా? తినకపోవడమే మంచిదయ్యిందా?

ఇందాక మిక్చర్ ప్యాకెట్లు కత్తిరించడానికి తెచ్చిన కత్తెరను సర్దానా? ఆ కత్తితో వంశీని పొడుస్తానా… ఆ కత్తెరతో…

అట్లా ఎవరికైనా పొడవాలనిపిస్తుందా? మనం ఏం చేసేదీ మనకు తెలియకుండా పోతుందా? నిజంగా తెలియదా?

నాకు తెలుస్తోంది. మరీ శూన్యమైపోవడం ఏమీలేదు. బాహ్య ప్రపంచం తెలుస్తోంది. ఇది ఇల్లు ఇది మంచం ఇది నేను ఇది వంశీ… అది కిచెన్… నీళ్లు నీళ్లు… ఎలా లేవను? మళ్లీ లేవాలా? మళ్లీ మళ్లీ లేవాలా ఇలాగా! ఆకలి ఆకలి…

తిని పడుకోవాల్సింది… ఇప్పుడు ఈ టైములో తింటే జీర్ణమవుతుందా? తప్పు చేశాను, తిని పడుకోవాల్సింది…

ఆకలి… ప..క్క..కు తిరిగి… అ..మ్మ..య్య ఎంతసేపటికి తిరిగాను!

కరెంటు వచ్చినట్టుంది… హా గాలి… చల్లగా గాలి… గాలి…

ఒకట్రెండు పఫ్పులైతే ఆర్గాజం స్టేట్ వచ్చి ఆగిపోయేదేమో! తర్వాత ఈ పెయిన్ ఎందుకు? అసలు ఎంతయితే కరెక్టు? ఫూలిష్… తెలియక చేశా.. రెండో రౌండులోకి వెళ్లకుండా ఉండాల్సింది…

శ్వాస పీల్చుకుంటున్నానా… కళ్లు బరువుగా రెప్పలు తెరవలేనట్టుగా… కూలిపోయేట్టుగా… ‘వంశీ, దీన్ని మళ్లీ మళ్లీ తాగకు… చచ్చిపోతాం… తెలుస్తోంది. నాకు అర్థమవుతోంది. ఇది చావే ఇది చావే చావు తెచ్చుకోవడమే’…

అయ్యో పొద్దున చెప్పాలి… ఇప్పుడు మాట్లాడబుద్ధి కావట్లేదు… దాహం దాహం… వంశీ ఇందాక ఎక్కడో పెట్టాడు. అద్దం దగ్గర… సగం తాగిన నీళ్లగ్లాసు…

“రెడ్డిగారూ”

……………………

ఓనర్ అంకుల్ పిలుస్తున్నాడు. పడుకోబుద్ధవుతోంది… ఇలాగే ఇలాగే… ఇంకో అరగంట… ఇంకో గంట… ఇంకో రెండు గంటలు…

“రెడ్డిగారూ, రెడ్డిగారూ”

శరీరానికీ మెదడుకూ పోలిక లేదు. అది బరువుగా ఇది రకరకాలుగా… ఎలా మొదలైంది ఇదంతా? ఎలా ఇప్పటి స్థితికి వచ్చాను!

కళ్లు తెరిచి… ఏడు అవుతున్నట్టుంది. “ఆ… అంకు… అంకుల్ వస్తున్నా”

తలుపు తెరిచి- ‘తేడా ఏమన్న గుర్తువడుతడా? నడకలో మార్పుందా?’

ఇంటి రెంటు ప్లస్ కరెంటు బిల్లుకు కలిపి ఇచ్చిన డబ్బుల్లోంచి- “మీకు వన్ సిక్స్టీ నైన్ ఇవ్వాలండీ”

రెండు వంద నోట్లు ఇచ్చాడు.

నేను ఇంట్లోకి వచ్చి… మూడు పది నోట్లు, ఒక రూపాయి బిళ్ల వెతికి…

మళ్లీ కాసేపు పడుకుని, ఇంకాసేపు పడుకుని, లేచి, వంశీని సాగనంపి, “జాగ్రత్త” “ఏం ఫర్లేదన్న”- ‘ఆఫీసుకెళ్లే ధైర్యం చేయొచ్చు’.

ఒకటేదో జరక్కూడనిది జరిగిందన్న ఫీలింగులోనే సాయంత్రం దాకా గడిపి-

దీన్నో ఘనకార్యంగా చెప్పుకోవాలన్న ఉబలాటాన్ని లోలోపలే దాచి-

రాత్రి- స్నానం చేశాక- నిన్నటి గోడ అంచునే కాసేపు విరామంగా, నిశ్శబ్దంగా కూర్చుని- పక్కనే ఉన్న మల్లెచెట్టును చూస్తూ- వేసవి వరంగా విచ్చుకుంటున్న దాని పూల పరిమళాన్ని అనుభవిస్తూ- మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్-

‘ఒక చెట్టుకూ మరో చెట్టుకూ మధ్య ఎంత తేడా ప్రకృతిలో!’

*

బీఫ్‌పై మాట- పాట- ఒక సాంస్కృతిక నిరసన!

వొమ్మి రమేష్ బాబు

 

nandi award 012“పెద్దపులి గడ్డి మేసింది…”’
ఈ వాక్యం శాస్త్రసమ్మతంగా ఉందా..? పోనీ…
“ఆవు మాంసభక్షణ చేసింది..”’
ఈ వాక్యాన్ని లోకం మెచ్చగలదా..? మెచ్చదు. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం.
బీఫ్‌ ఈటర్స్‌ కూడా అంతే! వాళ్లు బీఫ్‌నే తింటారు. బీఫ్‌ తినొద్దనీ, పప్పు తినమని వాళ్లని నిర్బంధించడం లోక విరుద్ధం.
తప్పు అని తెలిసి కూడా ఈ పనికి ఇప్పుడు భారత పాలకులు ఒడిగడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే గోవధ నిషేధం అమలవుతోంది. గోవధ చేసినా, ఎద్దుమాంసం అమ్మినా, కొనినా, తిన్నా కేసులు పెడుతున్నారు. దేశమంతటా గోవధ నిషేధం విధించాలన్న నినాదం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మే 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని లామకాన్‌లో “బీఫ్‌ బచావో ఆందోళన్‌” ఆధ్వర్యంలో బీఫ్‌పై మాట- పాట- కవిసమ్మేళనం జరిగింది. జూపాక సుభద్ర, పసునూరి రవీందర్‌, నలిగంటి శరత్‌, స్కైబాబా, జిలుకర శ్రీనివాస్‌ ప్రభృతుల పిలుపుతో బీఫ్‌ ఈటర్స్‌, ఫుడ్‌ డెమొక్రసీని కోరుకునే యాక్టివిస్టులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశంలో కోట్లాదిమంది తినే ఆహారం బీఫ్‌. అది వారి ఇష్ట భోజనం. నోటికాడి విందు. పంటికింద ముక్క. చౌకగా దొరికే మాంసం. ఎద్దుకూరే వారికి దిక్కు- దివాణం. మందు- మాకు. బలం- పోషకం! ఘనత వహించిన మన భారతదేశంలో ఇప్పుడు ఆ కూర తినొద్దని ఆంక్షలొస్తున్నాయి. గోవథ నిషేధ చట్టాల పేరుతో బీఫ్‌ ఈటర్స్‌ గొంతు కోయాలనుకుంటున్నారు. గోవుని దేవతగా ప్రొజెక్టు చేయడం ద్వారా ఈ దేశ మూలవాసుల ఆహార హక్కుమీదే ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని కలిసికట్టుగా తిప్పికొట్టాలని “బీఫ్‌ బచావో ఆందోళన్‌” పిలుపునిచ్చింది.

తరతరాలుగా తింటున్న ఆహారం. ఊహ తెలిసినప్పటినుంచి తింటున్న ఆహారం… ఆ రుచికి నాలుక అలవాటుపడిపోయిన జీవితం… ఎద్దుకూరని బ్యాన్‌ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటుందా..? ఊరుకోదు కదా..? ఆ మాటే తెగేసి చెప్పారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జూపాక సుభద్ర. గోవధ నిషేధ రాజకీయాలు సాగనివ్వబోమంటూ ఆగ్రహ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇకపై బీఫ్ వంటకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది కూడా!

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగబద్ధం చేసిన రిజర్వేషన్ల పుణ్యమా అని దళిత, ఆదివాసీ, బహుజన కులాల విద్యార్ధులు విశ్వవిద్యాలయాల గడప తొక్కగలుగుతున్నారు. వారిలో అత్యధికులు తినే బీఫ్‌ వంటకాలకు మాత్రం యూనివర్సిటీ క్యాంటిన్లలో ఇప్పటికీ చోటులేదు. అంటే అప్రకటిత నిషేధం ఏనాటినుంచో అమలవుతోందన్న మాట! దీనిపై గత రెండు దశాబ్దాలుగా బీఫ్‌ ఈటర్స్‌ ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. తమ నోటికి రుచించే ఆహారం కావాలని కోరుకోవడంలో అప్రజాస్వామికం ఏముందో అంతుబట్టని విషయం. ఈ కోణంలో ఆలోచించవలసింది పోయి బీఫ్‌ గురించి మాట్లాడేవారిపై దాడులు చేసే రోజులొచ్చాయి. ఈ క్రమం అంతటినీ ఈ సమావేశంలో వక్తలు తునకలు తునకలుగా గుదిగుచ్చారు. దళిత బహుజనులను ఇన్నాళ్లూ సామాజికంగా అణగదొక్కుతూ ఉన్న అగ్రవర్ణ హిందూత్వ శక్తులు ఇప్పుడు వారి కిచెన్‌లోకి ప్రవేశిస్తున్నాయనీ, ప్రతిఘటనతోనే ఆ శక్తులకు సమాధానం చెప్పాలని ఊ.సాంబశివరావు దిశ చూపించారు. సమావేశంలో తొలి వక్తగా ఎద్దుకూరపై మాస్టర్జీ రాసిన పాటతో ప్రసంగాన్ని ఎత్తుకున్న ఊసా ఆ వాతావరణాన్ని పదునెక్కించారు. పుట్టుక రీత్యా మనిషి బోత్‌ ఈటర్‌ (శాక- మాంసాహారి) అనీ, బీఫ్‌ ఈటర్స్‌ని వారి సంప్రదాయ ఆహారం తినవద్దు అని చెప్పడం ఫాసిజం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టంచేశారు.

కోట్లాది మంది తినే ఆహారం ఒక కానిపనిలాగా, గోప్యతకి గురయ్యే పరిస్థితి నేటికీ ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? వస్తే గిస్తే ఎవరికి వచ్చింది..? అని నిలదీసి కడిగేయాలనిపిస్తుంది. ఎందుకంటే పప్పు తినేవాళ్లో, కూరగాయలు, దుంపలు తినేవారో తమతమ వంటకాల గురించి బహిరంగంగా చర్చిస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. అదే బీఫ్‌ ఈటర్స్‌ దగ్గరికి వస్తే వీరికి అలాంటి ఆస్కారమే లేకుండాపోయిందని బాధేస్తుంది. కూర, పెద్దకూర, తునకలు, దస్‌ నెంబర్‌, కల్యాణి… ఇలా రకరకాల మారుపేర్లతో మాట్లాడుకోవడం… న్యూనతతో గొంతు పెగలకపోవడం ఎందుకు జరుగుతోంది?ఎందుకని బీఫ్‌ గురించి బహిరంగంగా చర్చించకూడదు? ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో ఎద్దుకూరని ఎందుకు చేర్చరు..? ఆహార సర్వేలలో ఎద్దుమాంసంలో పోషక విలువల ప్రస్తావన ఎందుకు చేయరు..? నాన్‌వెజ్‌ హోటల్స్‌ మెనూలో బీఫ్‌ అన్న పేరు ఎందుకు కనిపించదు..? ఇలాంటి అనేక ప్రశ్నలను సమావేశంలో వక్తలు లేవనెత్తారు. సజయ, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, సంగిశెట్టి శ్రీనివాస్‌, జి. రాములు (సిపిఎం), తిప్పర్తి యాదయ్య, వహీద్‌ తదితరులు బీఫ్‌పై నిషేధపర్వాన్ని ధిక్కరిస్తూ ప్రసంగించారు. ఒకరికి ఇష్టమైన ఆహారంపై నిషేధం విధించడం, ఇష్టం లేని ఆహారాన్ని తినమని నిర్బంధించడం- ఈ రెండూ కూడా క్షమించలేని నేరాలతో సమానమని సజయ చాలా సూటిగా చెప్పారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థుల ఉద్యమ ఫలితంగా ఘనంగా బీఫ్‌ ఫెస్టివల్స్‌ జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఆ ఇద్దరే నలిగంటి శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌. తమ సంప్రదాయ ఆహారం తాము తినడం కోసం వారు ఒక యుద్ధమే చేశారు. చేసి గెలిచారు. గెలిచి అందరితో శహబాష్‌ అనిపించుకున్నారు. ఆ కథలోకి వెళ్లాలంటే అంతకు ముందు జరిగిన ఒక ఘోరాన్ని గుర్తుచేసుకోక తప్పదు.

ఇఫ్లూ క్యాంపస్‌లో (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) బీఫ్‌ని వండుకు తినాలని గతంలో కొందరు విద్యార్థులు తీర్మానించుకున్నారు. మేనేజ్‌మెంట్‌ అంగీకరించనప్పటికీ ఆ పని చేసి తీరాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు చేసుకున్నారు. ఫుడ్‌ డెమొక్రసీని గౌరవించే పెద్దలను అతిథులుగా పిలిచారు. తామె స్వయంగా రంగంలోకి దిగి బీఫ్‌ వంటకాలు గుమాయించేలా వండారు. కానీ ఈ విషయం బయటికి పొక్కింది. హిందూత్వశక్తులు భరించలేపోయాయి. క్రూరంగా దాడికి దిగాయి. కొందరు ఉన్మాదులైతే బీఫ్‌ వంటకాలపై మూత్రం పోశారు. నానా రభస సృష్టించారు. తినే ఆహారాన్ని అలా అవమానించడం ఏ విలువల కిందకి వస్తుందో వారికే తెలియాలి.

ఈ చర్యతో బీఫ్‌ ఈటర్స్‌ వెనక్కి తగ్గలేదు. ఏమైనాసరే బీఫ్‌ తినాల్సిందే అని నిశ్చయానికొచ్చారు. ఏ ప్రదేశంలో అయితే హిందూత్వశక్తులు దుర్మార్గానికి పాల్పడ్డారో అదే చోట బీఫ్‌ బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుని కసిదీరా తిన్నారు. అదే తగిన సమాధానం అనుకున్నారు. ఆ వేడి ఓయూ క్యాంపస్‌లోని నలిగంటి శరత్‌ చమర్‌ వంటివారిని కుతకుతలాడించింది. ఏమైనా సరే ఓయూ ప్రాంగణంలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. పట్టుదలతో ఆ సంబురాన్ని నిర్వహించారు. వండర్స్‌ క్రియేట్‌ చేశారు.

అదే స్ఫూర్తితో సెంట్రల్‌ యూనివర్సిటీలో పసునూరి రవీందర్‌ బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించ తలపెట్టినప్పుడు కొన్ని శక్తులు అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాయి. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. దాంతో బీఫ్‌ని ఎందుకని తినకూడదు అన్న ప్రశ్న ఉద్యమకారుల్లో ఉదయించింది. రవీందర్‌ ప్రభృతులు కోర్టుని ఆశ్రయించారు. ఎద్దుకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని ధృవీకరిస్తూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. అంతే! సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకోవాలనుకున్న వారి కుయుక్తులకు బ్రేక్‌ పడింది. బీఫ్‌ పండగని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ఆ తర్వాత నుంచి ఏటా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ని జరుపుకుంటూనే ఉన్నారు. తాము చదువుకునే ప్రాంగణంలో తమకు కావాల్సిన ఆహారం కోసం అంత యుద్ధం చేయాల్సి వచ్చింది ఆనాడు. అవును…. దళిత బహుజన శ్రేణులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఆనాటి తమ అనుభవాలను శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌ ఈ సమావేశంలో పంచుకున్నారు.

బీఫ్‌ బచావో ఆందోళన్‌ కార్యక్రమంలో మరొక పదునైన ధిక్కారస్వరం కృపాకర్‌ మాదిగ. బీఫ్‌పై నిషేధం విధించే వారినే నిషేధించాలన్నంత కసిగా కృపాకర్‌ ప్రసంగం సాగింది. ఈ దేశంలో అగ్రవర్ణ, అగ్రవర్గ భూస్వాములు ట్రాక్టర్లను తెచ్చి పశుసంపదను నిర్వీర్యం చేశారనీ, ఎరువులు, పురుగుమందులు ఇష్టారాజ్యంగా వాడి భూసారాన్ని నాశనం చేశారనీ, పంటలను విషతుల్యం చేశారనీ, ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారనీ విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు గోవధ నిషేధం గురించి మాట్లాడటం కుట్రే అవుతుందన్నారు కృపాకర్‌. ఆయన ఆవేశపూరిత ప్రసంగం కొత్త ఆలోచనలకు పాదులువేసింది.

*

అట్టలూ పోయాయి!

పి.మోహన్

 

P Mohanపదేళ్లకు మించిన అపురూప బంధం.. ఎన్నెన్ని సంభాషణలు, ఎన్నెన్ని స్పర్శలు! అసలు వియోగమనేది ఎప్పుడుందని? కడుపులోని బిడ్డకు తల్లి పేగులోంచి జీవాధారాలు అందినట్లు నిరంతరం నా బుర్రకు జ్ఞానధారను అందించిన నేస్తం. ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడల్లా బస్సుల్లో, లారీల్లో పసికూనలా తీసుకొచ్చి దాచుకోవడం.. ఏ నిధీ లేకున్నా అదే తరగని నిధి అని గర్వపడడం.. నిధి చాల సుఖమా, జ్ఞాననిధి చాల సుఖమా అని పాడుకోవడం.. అంతా ఒక వెర్రి ఆనందం!

ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా అమరినట్లుండే నా ప్రియ నేస్తం శాశ్వతంగా దూరమైంది. నా ‘ఫంక్ అండ్ వాగ్నల్స్’ ఎన్ సైక్లోపీడియా ఇక కనిపించదు! మబ్బులు పట్టిన వేళ మిలమిల మెరిసే గిల్ట్ అక్షరాలతో ఇంటినీ, కళ్లనూ వెలిగించిన ఆ అనురాగ బంధం తెగిపోయింది. గత నెల నేను ఇంట్లో లేని ఒక శుభముహూర్తంలో మా ఆవిడ దాన్ని పాతపుస్తకాల వాడి తక్కెడతో పుటుక్కున తెంచేయించింది. వాడు కేజీల్లెక్కన  కొనేసి ఓ వంద మా ఆవిడ చేతుల్లో పెట్టిపోయాడు. పోతూపోతూ జ్ఞాపకంగా దాచుకొమ్మనేనేమో అట్టలను మాత్రం వదిలేసి వెళ్లాడు. అవి అమ్ముడుబోవట. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. చాలా సేపటి తర్వాత.. ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించి, అదెక్కడా అని నేను కోపాన్ని అణచుకుంటూ శాంతంగా అడిగితే మా ఆవిడ సర్రున కోపం, చిరాకు, అక్కసు, వెటకారం, ఎత్తిపొడుపు వంటి సవాలక్ష రసాలతో ఇచ్చిన సమాధానం..

‘అమ్మి పారేసిన! కొంప ముందుగానే ఇరుకు. బోకులుబొచ్చెలకే గూళ్లు సరిపోవడం లేదు. ఇంక బుక్కులేడ పెట్టేది? చెమ్మకు రెండు పుస్తకాలకు చెదలు పట్టినాయి. అన్నిదాన్లకూ ఎక్కుతున్నాయి. అయినా నువ్విప్పుడు దాన్లను సదువుతున్నావా అంట! సదవనప్పుడు ఇంట్లో ఎందుకూ దండగ.. ! అందుకే అమ్మేసిన.. ఆ అటకబండపైన ఉన్న పుస్తకాలు కూడా ఎప్పుడో ఒకతూరి నీ నెత్తిపైనే పడతాయి.. దాన్లను కూడా ఎప్పుడో ఒకతూరి నువ్వు ఇంట్లో లేనప్పుడు అమ్మిపారెక్కుతా. అంతగా అయితే నువ్వు సొంత ఇండ్లు కట్టినాక కొనుక్కో ఆ బండపుస్తకాలను..’

తిరిగిరాని దాని కోసం కోపాలు, సంజాయిషీలు ఎందుకు. పైగా ఉన్నవాటినైనా కాపాడుకోవాలి కదా. అయినా అందులో ఆమె తప్పేముంది? పీత కష్టాలు పీతవి. ఇంటి సర్దుడులో ఆమెకవి శనిగ్రహాల్లా కనిపించి బెదరగొట్టేవి. అప్పటికి చాలాసార్లు విసుగుతో బెదిరించింది. ‘కోపమొస్తే దీన్లను ఎప్పుడో ఒకతూరి అమ్మిపారెక్కుతా’ అని. ‘చస్తా, చస్తా అన్న సవతే కానీ చచ్చిన నా సవితి లేద’న్న సామెతను గుడ్డిగా నమ్మి పట్టించుకోలేదు. అయినా ప్రియమైన వాటిని పోగొట్టుకోవడం కొత్త కనుకనా. అందుకే సోనియా గాంధీ ముందు మన్మోహన్ సింగు, మోడీ ముందు అద్వానీ దాల్చే మౌనముని అవతారం దాల్చేశా. బంధం తెగిపోతే పోయిందిలే, దాని ఆనవాళ్లుగా అట్టలయినా మిగిలాయిలే అనుకుని పిచ్చిగా సంతోషపడ్డాను.

3. maa avida mechin kalakhandalu

కానీ ఆ ఆనవాళ్లనూ మా ఆవిడ మొన్న పిచ్చి ఐదు రూపాయల బిళ్లకు అమ్మేసింది. ఈ సారి కొన్నవాడు మరీ పాతపాత పుస్తకాలవాడు అయ్యుంటాడు. అయినా ఇప్పుడు వగచి ఏం లాభం! అట్టలలైనా అలా పడుండనివ్వవే అని చెప్పకపోవడం నా తప్పే కదా ! జీవితంలో వస్తున్న అవాంఛనీయ, అనివార్య మార్పుల్లో భాగంగా గత నెల అప్పు చేసి ఓ కెమెరా ఫోన్ కొనుక్కున్నా. దాంతో నా ఎన్ సైక్లోపీడియాను ఫొటో తీసుకుని ఉంటే ఎంత బావుండేది! పోనీ, ఆ పుస్తకాలు అమ్మేసిన తర్వాత మిగిలిన అట్టలలైనా ఫొటో తీసుకునే ఉంటే ఆ జ్ఞాపకం నిలిచిపోయేది కదా. ఆ తెలివి లేకపోయింది నాకు(నాకు అసలు తెలివనేది ఉందా అని మా ఆవిడకు నిత్య అనుమానం. తెలివిగల వాళ్లు పుస్తకాలు చదవరని, వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తూ ఇళ్లు, కార్లు, బంగారం, చాటడంత సెల్ ఫోన్లు, పెళ్లాలకు పట్టుచీరలు కొంటుంటారని.. ఊటీ, కాశ్మీర్లకు తీసుకెళ్తుంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం).

కెమెరా ఫోన్ అంటే నా తొలి కెమెరా ఫోన్ గుర్తుకొస్తోంది. నేను పుట్టిన కడప జిల్లా ప్రొద్దుటూరిలోని హోమస్ పేటలో ఉన్న ‘మా’ ఇంటి ఫోటోను పదేళ్ల కిందట డొక్కు కెమెరా ఫోన్ తో ఫొటో తీసుకున్నాను. ఐదారు కుటుంబాలు కాపురం చేసేంత పెద్ద ఇల్లు అది. 1980లలో దాన్ని మా పెదనాన్న తన తండ్రి, తమ్ముళ్లపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించి తన పేర రాయించుకుని కొన్నాళ్ల తర్వాత లక్షలకు అమ్మేశాడు. కనీసం జ్ఞాపకంగానైనా ఉంటుంది కదా అని ఆ ఇంటి ముందు భాగాన్ని ఫొటో తీసుకున్నాను. 1950లలో కట్టిన ఆ ఇంటి వసారాలో రెండు పెద్ద బర్మాటేకు స్తంభాలుండేవి. వాటికి మా నాయనమ్మ నారమ్మ ఊయల కట్టి, అందులో నన్ను పడుకోబెట్టి ఊపుతూ  ‘రార.. రార సన్నోడా..’ అని పాడుతుండేదట. దూలాల్లాంటి ఇంటి అరుగుపైన మా తాత నాకు బిస్కెట్లు, తాటిముంజెలు, మెత్తని మాంసం ముక్కలూ తినిపిస్తుండేవాడట.

నేను తీసిన ఫొటోలో ఆ స్తంభాలు, అరుగులు కూడా పడ్డాయి. ఆ ఇల్లు మాకు దూరమైనట్టే ఆ ఇంటి ఫొటో ఉన్న కెమెరా కూడా దూరమైపోయింది. దాన్ని 2008లో హైదరాబాద్ సిటీ బస్సులో దొంగ ఎవడో కొట్టేశాడు. ఆ ఇంటిని కొన్నవాళ్లు దాన్ని కూల్చేసి, పెద్ద భవనం, కాంప్లెక్సు కట్టారని ఇటీవల తెలిసింది. దోగాడి, పాకి, పసుపుకొమ్ముల్లాంటి మా అమ్మ చేతులు, నల్లరేగు పళ్లలాంటి మా మేనత్త చేతులు పట్టుకుని ఆడుకున్న ఆ కడప బండరాళ్ల ఇంటి జ్ఞాపకం అట్లా శిథిలమైపోయింది.

2. atakekkin art pustakaalu

అలాంటి ప్రేమాస్పద దృశ్య జ్ఞాపకాలెన్నో తడిచూపుల మధ్య చెరిగిపోయాయి. బతుకు పోరాటంలో మా అమ్మ కోల్పోయిన చిన్నపాటి నగలు, కోపతాపాలతో ఇంట్లో వాళ్లూ, బంధువులూ పోటీలు పడి కాల్చేసుకున్న ఆత్మీయుల వస్తువులూ, అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలూ, పదో తరగతిలో సంస్కృతంలో స్కూలు ఫస్ట్ వచ్చినందుకు ఓ కోమటాయన బహుమానంగా ఇచ్చిన ఐదొందలను బట్టలు కొనుక్కోకుండా ఇంటర్ పుస్తకాల కోసం ఖర్చుపెట్టిన దయనీయ సాయంత్రమూ.. ఇంకా ఇంటర్ గట్టెక్కలేక అవమానాలు భరించలేక ఉరేసుకున్న కుంటి మిత్రుడు రామ్మోహనూ, ఇంటి గొడవలతో 22 దాటకుండానే పురుగుమందు తాగిన ఆప్తమిత్రుడు నాగేశుతో దిగిన ఫొటోలూ.. చచ్చిపోయిన పెంపుడు కుక్కలూ, నల్లపిల్లులూ, తాబేళ్లూ, చిలుకలూ..

అయినా  కోల్పోయింది కేవలం దృశ్యాత్మక జ్ఞాపకాలనేనా? ఉద్యమోత్సాహంలో పచ్చగా కళకళలాడే అడవుల్లో, సెలయేళ్ల మధ్య అనుభూతించిన ఆత్మీయ ఆలింగనాలు, వెచ్చని బలమైన కరచాలనాలు, గుప్పుమని వీచే అడవి మల్లెల పరిమళాల వేళ కన్నీళ్లు లేని లోకం కలగంటూ రేయింబవళ్లు ఎడతెగకుండా జరిపిన ఎర్రెర్రని చర్చలు, మళ్లీ కలుసుకోలేమోనన్న భయంతో చివరిసారి అన్నట్లు మహాప్రేమతో కళ్లారా చూసుకుంటూ లాల్ సలామ్ అంటూ ఇచ్చిపుచ్చుకున్న తడిచూపుల వీడ్కోళ్లు..

ఇప్పుడవన్నీ ఎండమావులు. గతమంతా మసకమసక పగుళ్లు. యాదృచ్ఛికంగా తారసపడినా అంతా భ్రాంతియేనా అన్న భావన. గుర్తుకు వచ్చీ రాని పేర్లు, ముఖాలు, ఊళ్లు, బాటలు, ఎన్ కౌంటరయిపోయి నెత్తురు మడుగు కట్టిన స్మృతుల పరంపర. కాలం పాతగాయాలనే కాదు, అజాగ్రత్తగా ఉంటే మరపురాని జ్ఞాపకాలనూ మానుపుతుందేమో!

ఎన్ సైక్లోపీడియా నుంచి దారి తప్పి ఎక్కడికో వచ్చాను. ఇలా శాఖాచంక్రమణాలు చేయొద్దని ఎన్నిసార్లో అనుకుంటాను కానీ సాధ్యం కాదు. పన్నెండేళ్ల కిందట.. అప్పటికింకా ఇంటర్నెట్ ఇళ్లలోకి, ఫోన్లలోకి అంతగా చొచ్చుకురాని కాలం. ఏదైనా అవసరమొస్తే ఇంటర్నెట్ సెంటర్ కో, పబ్లిక్, యూనివర్సిటీల లైబ్రరీలకో వెళ్లి తెలుసుకునే కాలం. 2004లో పనిపై హైదరాబాద్ లో కొన్ని నెలలు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అబిడ్స్ కు వెళ్తుండేవాడిని. చాలా వరకు ఆర్ట్ పుస్తకాలనే కొనేవాడిని. ఒకసారి ఫంక్ అండ్ వాగ్నల్స్ న్యూ ఎన్ సైక్లో పీడియా 1991 ఎడిషన్ 29 వ్యాల్యూములూ దొరికాయి. బతిమాలి, బామాలి 1,600 రూపాయలకు కొన్నట్లు గుర్తు. వాటిని పెద్ద అట్టపెట్టెలో ఆటోలో రూమ్ కు తీసుకొచ్చాను. కొన్నాళ్లు ప్రతి వ్యాల్యూమునూ తడిమితడిమి చూసుకుంటూ ఉబ్బుతబ్బిబ్బయ్యాను. ఏ టు జెడ్ జ్ఞానం కదా.

ముఖ్యంగా ఆర్టిస్టుల బయాగ్రఫీలు, పెయింటింగులు చూస్తూ, చదువుతూ నిద్రాహారాలు మరచిపోయేవాడిని. అలా కొన్నాళ్లు గడిపాక, ఒక అనివార్యత వల్ల రూమ్ ఖాళీ చేసి, అనంతపురంలోని అక్కలాంటి, అమ్మలాంటి శశికళ ఇంటికి పంపాను, మా ఇంటికి పంపలేక.  కొన్నాళ్ల తర్వాత తిరిగి అనంతపురం వెళ్లాక వాటితో కుస్తీ పడుతూ గడిపాను. రాసుకున్న కవితలకు, ‘అడవి చిట్టీల’కు, ఉత్తరాలకు, పదీపరకా డబ్బులకు ఆ పుస్తకాలు భద్రస్థలాలు. డోంట్ కేర్ గా బతికిన కాలమది. కానీ కాలం లెక్కలు కాలానికుంటాయి. మనం లెక్కచేయకున్నా మనల్ని లెక్కచేసే దొంగనాయాళ్లు వేయికళ్లతో, లాఠీలు, తుపాకులతో కాచుకుని ఉంటారు. వాళ్ల బారిన పడి మనోదేహాలు ఛిద్రమయ్యాక అనంతపురాన్ని వీడి ఇంటికెళ్లాను, ఎన్ సైక్లోపీడియాను వెంటబెట్టుకుని.

బతుకులో అటూ ఇటో తేల్చుకోవాల్సిన కాలమది. కమ్చీ దెబ్బలు తిన్నవాడికి, తినని వాడికి చాలా తేడా ఉంటుంది. పైగా దెబ్బమీద దెబ్బ తినగలిగేవాళ్లు అతికొద్దిమందే ఉంటారు. నేను ఆ కొందరి కోవకు చెందని వాడిని కనుక మిత్రులు దెప్పుతున్నట్లు ‘సేఫ్’ సైడ్ ను ఎంచుకున్నాను. సామాన్యులకు సేఫ్ అనేది ఎప్పుడూ సాపేక్షికం, ఎన్ సైక్లోపీడియాలో ఎన్నిసార్లు చదివినా అర్థం కాని సాపేక్ష సిద్ధాంతంలా! కష్టం తప్ప ఏ సిద్ధాంతమూ కూడు పెట్టదని జ్ఞానోదయమయ్యాక పొట్ట చేతపట్టుకుని తిరిగి భాగ్యనగరానికి వచ్చాను. కాస్త సాపేక్షికంగా నా కాళ్లపై నేను నిలబడి, పెళ్లి చేసుకున్నాక నా ఎన్ సైక్లోపీడియాను తిరిగి తెచ్చుకున్నాను. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా ఊరకే దాన్ని అప్పుడప్పుడూ తిప్పుతుండడం అలవాటుగా ఉండేది. ఇటీవల కొన్నాళ్లుగా అది తప్పింది. అందుకే ఒక గూటిలో సర్దుకుపోకుండా మరో గూటిని ఆక్రమించే ఆ పుస్తక సంచయం మా ఆవిడకు అక్కర్లేని పెను భూతమైపోయింది. అట్లా హైదరాబాద్ లో కొనుక్కున్న నా జ్ఞానభాండం ఎంతో భద్రంగా ఊళ్లు తిరిగి తిరిగి చివరికి ‘విధిరాత’లా మళ్లీ హైదరాబాద్ చేరి, అట్టలు వొలిపించుకుని బద్దలైపోయింది.

అరచేతిలో ఇంటర్నెట్ ఒదిగిన ఈ కాలంలో బోడి పాతికేళ్ల కిందట అచ్చయిన, డొక్కు, ఔట్ డేటెడ్, దండగమారి, అక్కర్లేని, చదలు పట్టిన ఎన్ సైక్లోపీడియా కోసం అంతగా వగస్తావెందుకు అంటున్నారు మిత్రులు. అన్నీ ఇంటర్నెట్ లో దొరుకుతాయని వాళ్ల భ్రాంతి(పోనీ నా భ్రాంతి కూడా అనుకోండి!) అక్కర సాపేక్షికం. పనికిరావని పారేసుకున్న వాటి అసలు విలువ ఏమిటో తెలిసినప్పుడు గుండె పట్టేస్తుంది. కళ్లు సజలమవుతాయి. దుఃఖపు ఉప్పెన జపాన్ అమర కళావేత్త హొకుసాయ్ వేసిన ‘కనాగవా మహాకెరటం’ చిత్రంలా వేయి పడగలతో విరుచుకుపడుతుంది. అల విరగిపడ్డాక బోల్తాపడిన శూన్యపు పడవల్లా మిగిలిపోతాయి కళ్లు.

1. funk and wagnalls

ఇప్పటికి మూడొందలకు పైగా పుస్తకాలు కొనుంటాను. అడుక్కున్నవీ, మళ్లీ ఇస్తానని తెచ్చుకుని ఇవ్వనివీ మరో రెండు వందలుంటాయి. నేను నా మిత్రులకిచ్చినవీ, వాళ్లు నా దగ్గర పుచ్చుకుని తిరిగివ్వనివీ అంతే సంఖ్యలో ఉంటాయి. స్థలం చాలక చాలా వాటిని మూటలు కట్టిపెట్టాను. తరచూ అవసరయ్యేవాటిని అటకెక్కించాను. ఈ అటక విద్య నాకంటే మా ఆవిడకు మరింత బాగా తెలుసు. ఇల్లు ఇరుకని గోలచేసే ఆమె తను మహా కళాఖండాలుగా భావించే బాతు, కుక్క, కొంగ, కోడి బొమ్మలను మాత్రం షోకేస్ లో చక్కగా విశాలంగా సర్దుతుంది. వారానికోసారి జాగ్రత్తగా తుడుస్తుంది. సంక్రాంతికి సంక్రాంతికి సబ్బెట్టి తోమితోమి స్నానాలు కూడా చేయిస్తుంది. నా పుస్తకాలను మాత్రం పనికిరాని చెండ్లలా అటకపైకి విసిరిపారేస్తుంది. ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం. ఈ వింత ప్రజాస్వామ్యంలో నాకు ఏదైనా పుస్తకం అవసరమైతే మంచాలూ, కుర్చీలూ ఎక్కి ఆ అటకపైని పద్మవ్యూహంలోకి చొరబడి వెతుక్కోవడం. చాలాసార్లు అభిమన్యుడి చావులే.

కొన్నిసార్లు కొన్నిపుస్తకాలు కనిపించవు. ఆవిడకేసి చూస్తాను. ఆమె మౌనయోగినిలా చూసి పక్కగదిలోకి వెళ్లిపోతుంది. ఆ చూపులకు సవాలక్ష అర్థాలు! కనిపించని పుస్తకాలు ఒక్కోసారి విఠలాచార్య సినిమాల్లో దెయ్యాల మాదిరి అటకెక్కిన పాత కుక్కర్లో, పాతచీరల మధ్యలో, పాతసామాన్ల మూటల్లో, ఇంకా ఊహించశక్యం కాని నానాస్థలాల్లో దర్శనమిస్తాయి. అసలు కనిపించకుండా పోవడం కంటే ఎక్కడో ఒక చోట పడుంటే మేలు కదా. ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నా ఎన్ సైక్లోపీడియానే చుక్కల్లో చందమామలా కొట్టొచ్చినట్టు కనపడేది 1,2,3…. 29 నంబర్లతో వరుసగా ఎర్రని అట్టలపై బంగారువన్నె అక్షరాలతో, యూనిఫామ్ లో వరుసగా నిల్చున్న బడిపిల్లల్లా.

ప్రతి ఇష్టానికీ కారణం లేకపోవచ్చు కాని, ప్రతి వియోగానికీ ఒక కారణముంటుంది. సామాన్యులకు ఎదురయ్యే వియోగాల కారణాల్లో చాలా తక్కువ మాత్రమే స్వయంకృతాలు, మిగతాన్నీ అన్యకృతాలు. బోడి పుస్తకాల కోసం ఇంత వలపోత ఎందుకని పాఠకులకు అనిపిస్తుండొచ్చు. ఒక నిర్దిష్ట కాలపు వ్యక్తుల సామూహిక  ఈతిబాధలు సహజంగానే చరిత్రలో భాగం అవుతాయని అంటారు కదా, అందుకని. అలాగని నా గోస చరిత్రకెక్కాలన్న తపనేం నాకు లేదు కానీ, రాసుకోకుంటే చాలా జ్ఞాపకాలను మరచిపోతాం కనుక ఇలా రాతకెక్కించడం.

గూళ్లు లేని ఇరుకు ఇల్లు, చదలు పట్టడం, కొన్నాళ్లుగా ముట్టకపోవడం వగైరాలు.. ఎన్ సైక్లోపీడియాతో నా అనుబంధం తెగడానికి కారణాలని మరోసారి సరిపెట్టుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ పాత పుస్తకాల షాపుల్లో ఫంక్ అండ్ వాగ్నల్స్ ను మించిన బ్రిటానికా, మ్యాక్ మిలన్ వంటి ఎన్ సైక్లోపీడియాలు పది, పదిహేను వేలకు వస్తాయి. బేరమాడితే ఇంకా తక్కువకు. కానీ.. కలం, కాగితం అక్కర్లేకుండా తయారైన ఈ వ్యాసాన్ని జీమెయిల్ లో ‘సారంగ’కు పంపుతున్న నాలో.. గూళ్లకు సరిపడే ఆ జ్ఞానభాండాగారాలను కొనాలన్న అభిలాష ఇంకా మిగిలి ఉందా అని?

*

 

 

భావుకత అంచుల్లోకి ప్రయాణం..గ్లేసియర్!

మణి వడ్లమాని 

10694228_10152765337716095_4192333521636583623_oఅసలు ఏ స్త్రీ మూర్తి లో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మాతృప్రేమ ని చవి చూస్తాం అందరం . ఆ ప్రేమకి వయసు, జాతి, కుల, మతాల తో సంభందం లేదు. అలాంటి మాతృ ప్రేమ నాకు దక్కింది. జన్మ నిచ్చి అక్షరాలు నేర్పి,విద్యా బుద్దులు నేర్పిన ది మా అమ్మగారు అయితే సాహితీ జన్మనిచ్చి , నాచేత సాహితీక్షరాభ్యాసం చేయించి,నువ్వు రాయగలవు అంటూ నన్ను వెన్ను తట్టి ప్రోత్శాహించిన డాక్టరు మంథా భానుమతి గారి కి మాతృదినోత్సవ సందర్భంగా  శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
డాక్టరు మంథా భానుమతి గారు కధలు మద్య వయసు నుంచి రాయడం మొదలుపెట్టి అనతి కాలం లోనే ప్రాచుర్యం పొందిన రచయిత్రి గా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ మొదటి కథానిక 1993 ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితం అయింది.

ఆమె రాసిన నవలలో నాకు నచ్చిన నవల గ్లేషియర్ . ఇది ఆమె మొదటి నవల , రచన మాసపత్రిక నిర్వహించిన విశ్లేషణాత్మక నవలల పోటిలో. బహుమతి వచ్చిన నవల. ఈ నవల పోటికి పంపేటప్పుడు ఆమె అనుకున్నారట బహమతి వస్తుందా,పెడుతుందా? కాకపోతే ఒక అనుభవం వస్తుంది కదా అని సాహసం చేసారుట. ఆనాటి ఆవిడ సాహసమే ఈ నాడు తెలుగు సాహితీ లోకానికి ఒక చక్కటి విశ్లేషణాత్మక పూర్వమైన నవలని అందించింది. అది అసలు ఆవిడ మొదటి రచనలా అనిపించదు. నవల సహజత్వానికి ఎంతో దగ్గర గా ఉంటుంది. మనమూ కూడా పాత్రధారులతో మమేకం అయ్యి వాళ్ళతో పాటు తెల్లటి కొండలు. వాటి మధ్య నీలం రంగు గ్లేషియర్లు. క్రింద ఆకుపచ్చని నీళ్ళల్లో తేలుతున్న తెల్లటి హిమ శకలాలు. మధ్యే మధ్యే తెల్లటి నీటి పక్షులు ఆ పైన చుట్టూ కొండలూ, అడవులూ, సరస్సులూ, జలపాతాలూ. అలా .అలస్కా అందాలను చూస్తూ వెళుతూ ఉంటాము.

వర్ణనలు చూస్తూ ఉంటె చదువుతున్న రచయిత్రిలోని భావుకతా కోణం కూడా మనకి ఆవిష్కృత మవుతుంది. నవలలో చాలా భాగం క్రూజ్ లో నడుస్తుంది. ఈ నవలలో ముఖ్యపాత్ర గ్లేషియర్ దే! దాని చుట్టురా తిరుగుతుంది కధ ఆసాంతం.

అమలాపురం లో ఉన్న స్కూల్ లో తొమ్మిదో క్లాసు చదువుతున్న శాంత దగ్గరనుంచి కధ ప్రారంభం అవుతుంది.సాంఘిక శాస్త్రం పాఠం వింటూ అందు లో ఓడలు, గ్లేషియర్స్ గురుంచి విని అవి చూస్తె యెంత బావుంటుందో అని అనుకుంటుంది. కాలం తన గతులు మార్చుకుంటూ వెళుతున్నప్పుడు దానితో పాటే మనిషి కూడా జీవితం లో ఎదుగుతుంటాడు. అలాంటి జీవనక్రమం లో శాంత కి కృష్ణ తో పెళ్ళయి,ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలలో స్థిరపడతారు. అది గో అప్పుడు మళ్ళి శాంత లో గ్లేషియర్ చూడాలనే కోరిక బలం గ కలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ మనాలి వెళతారు శాంతా కృష్ణ, కాని అక్కడ శాంతకి గ్లేషియర్ దగ్గరనుంచి చూడాలనే కోరిక తీరదు . దూరం నుంచే ఆ అందాలను చూసి తృప్తి పడుతుంది. అప్పుడు కృష్ణ అంటాడు. ఇక నుంచి మనం ప్రతి ఏడు తప్పక సిమ్లా వద్దాం అప్పుడు చూద్దువు గానే లే, అలా దిగులుపడకు అని సముదాయిస్తాడు. మూడేళ్లు గడచి పోతాయి. కానీ ఏదో కారణాల వల్ల మళ్ళి సిమ్లా వెళ్ళలేకపోతారు.

Glacier_large
ఇంతలో పిల్లలు అమెరికా రమ్మనమని చెబుతారు. మొదట చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళినప్పుడు శాంత తన కోరికనుచెబుతుంది. అమ్మా! నువ్వు అన్నయ్య ఊరు వెళ్తావు కదా అక్కడనుండి అలస్కా ట్రిప్ కి వెళ్ళచ్చు. అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చేస్తాడు అని చెబుతాడు. అనుకున్నట్లుగా పెద్ద కొడుకు టికెట్లు కొని అలస్కా ట్రిప్ కి పంపిస్తాడు.
ఇక్కడ రచయిత్రి ప్రతి చిన్న విషయం కూడా చదువరులకు క్షుణ్ణంగా,వివరిస్తూ కధను సాగిస్తారు.ఓడ, తయారీ, అసలు క్రూజ్ లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఎన్ని అంతస్తులు ఉంటాయి.,ఎన్ని డెక్ లు ఉంటాయి, ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలు ఎంతో విపులంగా,విశ్లేషణ తో వివరించారు.

ఆ వారం రోజుల ట్రిప్ లో ఎంతో మంది సన్నిహితులవుతారు. వేరే వేరే దేశస్థులే కాకుండా ఇద్దరూ ఇండియన్ ఫ్యామిలీ లు కూడా వస్తారు. శాంత పాత్ర ఇలాఅనుకుంటుంది. “పరాయిదేశస్తులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అదే మన దేశంవాళ్ళు,మనబాష బాషమాట్లాడే వారు మాత్రం అంటీముట్టనట్లుగా ఉండటం ఒకింత బాధను కలిగిస్తుంది.”
ఈ నవల ఏదో ఒక టూర్ గురించే కాకుండా,ఆ క్రూజ్ లో కలిసిన బాబ్,ఉర్సులా మధ్య నడిచేప్రేమ లోని సంఘర్షణలను చాలా బాగా మలచారు రచయిత్రి,ఆ నేపధ్యం లో ఉర్సులా ఎప్పుడూ అనుకుంటుంది, బాబ్ గ్లేషియర్ లా చలనం లేకుండా ఉంటాడని. కాని ఆమెకు క్రమేణా అర్థమవుతుంది. “ధీర గంభీరంగా ఉన్న గ్లేషియర్ కొననెమ్మదిగా వంగి కింద ఉన్న మంచు నది లో కలుస్తుందని”
అలాగే క్రూజ్ కెప్టన్, హోటల్ డైరెక్టర్ జో, పర్సర్ టెర్రీ, వీళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా అనిపిస్తారు. అంటే ఆ నవల అంత గ ప్రభావితం చేస్తుంది.
“నార్తరన్ లైట్స్ ఎంతో చెప్పుకోదగ్గ విశేషం, ఆగష్టు నెలాఖరి నించీ ఏప్రిల్ మొదటివారం దాకా రాత్రిపూట ఆకాశం రంగులు పులిమేసిన ఒక చిత్రపటంలా, ఆ రంగులు రకరకాల రూపాలను సంతరించుకుంటూ వెలిగిపోతుంది. అది చూడటానికి కృష్ణ ని రమ్మన్నప్పుడు అబ్బ ఇంటికి వెళ్ళాక యు ట్యూబ్ లో చూద్దాం లే అనడం తో ,శాంత కొంత నిరుత్సాహ పడినా తను చూడటానికి ఒక్కత్తే అర్ధరాత్రి అలారం పెట్టుకుని మరీ వెళుతుంది.
మధ్య మధ్యలో అందమైన బొమ్మకు నగిషీలు చెక్కినట్లుగా నవలలో రచయిత్రి శాంత పాత్రకు భావుకతను జోడిస్తారు. ఆ భావుకత్వపు గుబాళింపు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. షిప్ వెళుతున్నప్పుడు సముద్రం లో దారి , ఏర్పడినట్లు రెండు పక్కలాసముద్రం చూస్తూ ప్రపంచంలో అతి సుందరమైన, రంగురంగుల ప్రదేశం అలాస్కా వే,అని శాంత అనుకుంటుంది.
ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి,దానిని పాఠకుల కి చెప్పడంలో సఫలీకృతులు అయ్యారు. అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు అలస్కా వెళ్ళడానికి వీలుగా ప్రతి చిన్న విషయం కూడా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎంతైనా అధ్యాపకురాలు కదా !
నవల ఆసాంతం చదివిన తరువాత కలిగిన అనుభూతి గురుంచి మాటలలో వర్ణించడం కష్టం. అది పుస్తకం చదివిన వాళ్ళకే అనుభవైకవేద్యం అవుతుంది. అందుకే ఇది అందరూ తప్పక చదవాల్సిన నవల.
***

చీకటి చీకాకులు

 కర్లపాలెం హనుమంతరావు

 

 

”జీవితం ఏమిటీ? వెలుతురూ.. చీకటీ! హుఁ.. హుఁ.. హుఁ!.. వెలుతురంతా చీకటైతే.. అందులోనే సుఖము ఉన్నదీ!’

‘చీకటీ.. చీకటీ అంటూ ఆ శోకన్నాలేవిట్రా?.. లేచి స్విచ్చి వేసుకుంటే వెలుతురు రాదా!’

‘స్విచ్చి వేసే ఉంది బాబాయ్! వెలుతురే లేదు’

‘అదేంటీ! కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావా?  కట్టలేకపోయావా?’

‘కట్టలేకపోవడానికి అదేమన్నా కోట్లలో వచ్చిందా ఏమిటీ! వట్టి సర్ ఛార్జీనే కదా! కట్టినా కట్టకున్నా కరెంటు ‘కట్’తప్పదు కదా! మా కాంప్లెక్సులో వెలుతురు మొహం చూసి ఎన్నిరోజులయిందో తెలుసా? కొత్త ఇల్లు కదా.. అని బోలెడంత పోసి ఝిగేల్ ఝిగేల్ మనే ఛాండ్లియర్సుకూడా పెట్టించింది మా శ్రీమతి. విగ్రహం పుష్టి .. నైవేద్యం నష్టి సామెతగా ఉంది మా అపార్టుమెంటు పరిస్థితి. ఎల్ కే జీ చదివే మా సుపుత్రుడు నిన్నేం అడిగాడో తెలుసా బాబాయ్? ఎ ఫర్ ఏపిల్, బి ఫర్ బ్యాట్.. అని చదివేస్తూ  ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ అని రాగానే ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ? అని ఆడిగాడు బాబాయ్!

‘అదేదో హైటెక్ సిటీ అనుకుంటున్నాడు కాబోలు పాపం పసివెధవ’

‘అదే మరి! పోనీ ఇదీ అని చూపిద్దామంటే.. ఇల్లు కట్టినప్పట్నుంచీ ఒక్క పూటైనా వచ్చి చస్తేకదా!’

‘అందరి సంబడం అలాగే ఉందిలేరా బాబూ! మా అపార్టుమెంట్లలో ఐతే పూర్తిగా ‘లిఫ్టు’ అనేదే తీసేసారు. ఎవరికి వాళ్లం సొంతంగా బక్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో మెట్లమీదనుంచే డేక్కొస్తున్నారనుకో!  కంప్లైట్ చేద్దామని కరెంటాఫీసుకు పోతే అక్కడా వాళ్ళు చీకట్లో తడుముకుంటున్నార్రా బాబూ!’

‘చీకట్లో ఇట్లాంటి చిత్రాలు చాలానే జరుగుతున్నాయ్ బాబాయ్! మొన్న గుళ్లో అదేడో సామూహిక వివాహాలు జరిపించారు చూసావా!వందమంది వధూవరులు ఒక్కటవ్వాలని వచ్చారు పాపం. పట్టపగలే కటిక చీకటి! ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికూతురు మెళ్ళో తాళి కడుతున్నాడో.. అంతుబట్టక పాపం నిర్వాహకులు ఎంతలా తల్లడిల్లిపోయారో తెలుసా? కరెంటు వాళ్ల నిర్వాకంమీద కంప్లైట్ చేద్దామని పోలీస్ స్టేషనుకు పోతే’

‘అర్థమైందిలే! అక్కడా చీకట్లో ఎవరూ కనిపించలేదనేగా చెప్పబోతున్నావ్? సందు దొఇకింది కదా అని.. సర్కారంటే గిట్టని నీలాంటి వాళ్ళంతా ఇట్లాంటి కట్టుకతలు పుట్టిస్తున్నారుగానీ.. నీళ్ళు పుష్కలంగా ఉంటే గవర్నమెంటు మాత్రం కరెంటెందుకివ్వదురా?’ ఇదివరకటి ప్రభుత్వాలకు ఈ కరెంటు కొట్టిన షాకు ఇప్పటి సర్కారులకు మాత్రం తెలీదనా! పవర్ లేదు పవర్ లేదు అని దొరల పరువుతీయాలని చూస్తున్నారుగానీ.. ఫారడే మహాశయుడు కరెంటు కనిపెట్టకముందుమాత్రం లోకం చల్లంగా సాగిపోలేదా! మన మూరగండడ రాయడు శ్రీక్రుష్ణదేవరాయలు కాగడాల వెలుతురులోనే సువర్ణపాలన సాగించాడు తెలుసా? మా చిన్నతనంలో ఈ కరెంటుగోల ఎక్కడిదీ! మా చదువులన్నీ ఆముదం దీపాల కిందనే  తెల్లారిపోయాయి. విసనకర్రలు, పాత పేపర్లు ఉన్నంతకాలం పంఖాల అవసరం ఏమంత ఉంటుందిరా! కోతల పుణ్యమా అని కరెంటుషాకుల దుర్మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రిళ్ళూ నిశ్చింతగా బట్టలు ఆరేసుకుంటున్నాం కరెంటు తీగలమీద.’

‘అట్లా ఆరేసుకోబట్టే రాత్రిళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయీ మధ్య మళ్లీ! ఇప్పటివరకు శివార్లవరకే చోరుల సామ్రాజ్యం పరిమితం. ఇప్పుడు నగరం నడిబొడ్డుక్కూడా వాళ్ల హస్తలాఘవం విస్తరిస్తోంది. దొంగలు, దోరవయసులో ఉన్నవాళ్ళూ కరెంటుకోతలకు పండగలు చేసుకుంటున్నారు. సరససల్లాపాలకు  ఎక్కడో  దూరంగా ఉన్న పార్కుల చాటుకోసం  పాకులాడేవాళ్ళు  కోడెవయసుగాళ్ళు. ఇప్పుడంత శ్రమ పడటంలేదు. సర్కారువారి పుణ్యమా అని నగరం నడిబొడ్డులే కోడెకారుకు పడకగదులై పోతున్నాయ్ బాబాయ్!’

‘సర్వే జనా సుఖినోభవన్తు- అనే గదరా ఏ ప్రభువైనా కోరుకొనేది! జనభాలో సగమైనా ఎలాగోలా సుఖపడుతున్నారని సంతోషపడక అలా కుళ్ళుకోవడమేం సబబుగా లేదబ్బీ!ఏం? దొంగలుమాత్రం సుఖంగా బతకద్దా? పని చేసినా చేయకున్నా పగలంతా పెళ్ళివారిల్లులా ఫెళ్ళున వెలిగిపోవాలంటావ్ ప్రభుత్వాఫీసులు? దొంగవెధవలకూ వాళ్ల వృత్తి క్షేమంగా చేసుకునే సావకాశం వద్దంటావ్?! పెద్దవాణ్ణి. అనుభవంతో చెబుతున్నా..విను! చీకటి పడకముందే పిల్లకాయలకి రెండుముద్దలు తినిపించి పక్కలెక్కించెయ్! ఇంచక్కా మీ అమ్మగారు చెప్పే చందమామ కథలన్నీ వింటూ పడుకుంటారు. చక్కటి పాటలూ నేర్చుకుంటారు. పాడు టీవీ నోరు మూతపడీంతరువాత పెద్దవాళ్ళకుమాత్రం ఇంకేం పొద్దుపోతుందీ? తెల్లార్లూ కాలక్షేపంకోసం చిన్నతనంలో నేర్చుకున్న ఆంజనేయ దండకాలూ, అష్టోత్తరాలూ మళ్లీ మళ్ళీ నెమరేసుకుంటారు. బోలెడంత పుణ్యం సంపాదించుకొంటారు. ‘

‘చీకటిమూలకంగా కుటుంబ నియంత్రణ పథకాలు మళ్లీ మొదటికొస్తున్నాయ్ బాబాయ్!’

మరేం ఫర్లేదు. ఏడాదికి మూడొందలరవైయ్యైదు రోజులు  పసుపు కుంకుమలని.. సీమంతంనోములని.. ప్రసవవేదమని,బాలింతలాలింతలని.. ఏవేవో పేర్లతో సర్కార్లు సొంతమనుషులకుమించి ఆదుకుంటూనే ఉన్నవాయె! శబ్దవేధి అని మనకో వేదకాలంనాటి విద్య ఉంది. కటిక చీకట్లో కూడా కంటి సాయం లేకుండా  శబ్దాలను బట్టి వస్తువులజాడను పసిగట్టే గొప్పకళ అది.ఎందుకూ కొరగాని ఇంజనీరింగు చదువులమీద పడి ఆనక  బాధపడే బదులు.. శబ్దవేధిని ఓ కోర్సులా పౌరులందరూ నిర్బంధంగా అభ్యసిస్తే సరి.. ఈ చీకటి పాట్లు, చీకట్లో పాటలు తప్పుతాయి! వేలెడంత లేని బుడతడు కూడా రెండ్రెండ్లెంతరా అని అడిగితే ఠక్కుమని సెల్ తీస్తున్నాడు! కరెంటే లేనప్పుడు ఇంక  చార్జింగేముంటుంది! సెల్లేముంటుంది! ఎందుకైనా మంచిది.. మళ్ళీ పిల్లాడికి నోటిలెక్కలు గట్రా ఇప్పట్నుంచే  గట్టిగా నేర్పించు! మోటార్లమీద ఆధారపడి ఇబ్బందులు పడేబదులు.. పాతకాలంనాటి ఏతాములు మళ్లా బైటికి తీస్తే వ్యవసాయం నిరాటంకంగా సాగిపోదా! బియ్యంమిల్లులు ఆడకపోతేనేం? అత్తాకోడళ్ళు  దంపుడు పాటలు పాడుకొంటూ ఇచక్కా ధాన్యం దంచుకుంటే పోదా?’

‘ ఎందాకా ఇలా చీకట్లో దంచుకోడాలు బాబాయ్?’

‘చెత్తనుంచి కూడా కరెంటు తీయచ్చని అంటున్నారు గదరా ఈ మధ్య! నీళ్ళక్కరువుగానీ, మనదేశంలో చెత్తాచెదారానికి కొదవేముంది? ఆ సాంకేతిక నైపుణ్యం అభివృద్దయ్యేదాకా పోనీ ఓ పని చేయచ్చు! బియ్యంలో రాళ్ళు తింటే పెళ్ళినాడు జడివానలు కురుస్తాయనిగదా పెద్దలు చెబుతారు! పెళ్ళికావాల్సిన కుర్రకారునంతా సేకరించి  కిలోరూపాయిబియ్యం ఓ రెండు కిలోలు బలవంతంగానైనా బొక్కించి పెళ్ళిపీటలమీద కుదేస్తే సరి.. వానలే వానలు. నీళ్ళే నీళ్ళు. కరెంటే కరంటు!.ఇక నీ సెటైర్లుండవు!’

***

  పబ్బులో శ్రీకృష్ణుడు

పి. మోహన్

 

P Mohanస్నానమాడుతున్న అమ్మాయిల బట్టలను దొంగిలించిన వాడు దేవుడయ్యాడు. ఆ దృశ్యాన్ని రంగుల్లో చిత్రించి, రాళ్లపై చెక్కినవాళ్లు మహాకళాకారులయ్యారు. గోపికా వస్త్రాపహరణంలో ఒక పరమార్థముందని కవులు గానం చేశారు. ఇదంతా చరిత్ర. ఇంత ఘన చరిత్రకు వారసులమని  బోరవిడుచుకుని చెప్పుకుంటున్నవాళ్లు ఇప్పుడు ఆ వారసత్వాన్నికాలదన్నడమే విషాదం.

 మొన్న గౌహతిలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనలోంచి రెండు బొమ్మలను తీసేశారు. ఒక దాంట్లో శ్రీ కృష్ణుడు బికినీలు వేసుకున్న యువతులతో బార్లో ఉన్నాడు. మరోదాంట్లో జాతీయ పతాకంపై మద్యం బాటిళ్లు వంటివి ఉన్నాయి. కృష్ణుడిని అవమానించారని కాషాయ సంస్థలు, దేశ పతాకాన్ని అవమానించారని దేశభక్తులు మండిపడ్డంతో వాటిని తీసేశారు. వాటిని వేసింది అక్రమ్ హుసేన్ అనే ముస్లిం. అతనిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడు. హిందూ దేవుళ్లను అశ్లీలంగా చిత్రించి అవమానించాడని ఎంఎఫ్ హుసేన్ బొమ్మలను చించేసి, దేశం నుంచి వెళ్లగొట్టిన కళాస్వాదకుల దేశం కదా మనది. ఇప్పుడు ఈ అస్సామీ హుసేన్ కూడా ఆ బాటలోనే ఉన్నాడేమో. అక్రమ్ ముస్లిం కాకుండా హిందువో, సిక్కో అయ్యుంటే ఇంత గొడవ జరిగేదా? కృష్ణుడిని అక్రమ్ కంటే ‘అశ్లీలంగా’ చిత్రించిన బోలెడు మంది హిందూ చిత్రకారులను పద్మ అవార్డులతో గౌరవించిన దేశం కదా మనది!

relief-at-gopuram-base-krishna-stealing-gopis-clothes-nambiraja-temple-tirukkurunkudi-india-d

దేశమంటే మనిషి కాదోయ్, మట్టోయ్..! అంటూ మనిషిని మట్టి నుంచి దూరం చేస్తున్న వర్తమానంలో కనీసం జాతిపతాకంపైనైనా పట్టుదలగా ఉన్నందుకు దేశభక్తులకు శతకోటి వందనాలు. ప్రభుత్వాలు తద్దినాల్లో వాడి పారేసిన జాతీయ జెండాలను చలితో పోరాడ్డానికి తమ మురికి దేహాలకు చుట్టుకుని నిద్రిస్తూ అవమానిస్తున్న, అగౌరవిస్తున్న పేవ్మెంట్ అలగా జనంపై కేసులు పెట్టని వారి క్షమాగుణానికి జేజేలు. కృష్ణుడికి జరిగిన అవమానం ముందు ఇవన్నీ చాలా చిన్న సమస్యలు కనుక వదిలేద్దాం. జాతి మనుగడకు పెను సవాల్ విసురుతున్న ఆ బికినీభామల పరివేష్టిత గోపాలుడి చిత్రం గురించే వాదులాడుకుందాం.

Krishna Gopis Mattancherry

నగరాల్లో పబ్, డ్రగ్ సంస్కృతి పెరుగుతోంది. రాత్రి పదిగంటలకు పచారీ కొట్లను మూసేయించే పోలీసులు పబ్బులను తెల్లారేవరకూ నడిపిస్తున్నారు. సంపన్నకుటుంబాల యువతీయువకులు ఖరీదైన కార్లలో దూసుకొచ్చి, మందుకొట్టి, చిందేసి తెల్లారేటప్పుడు తూలుతూ, చెత్త ఊడ్చేవాళ్లను కార్లతో గుద్దుతూ వెళ్లిపోతుంటారు. అక్రమ్ హుసేన్ ఈ పబ్ కల్చర్ సంగతేంటో జనానికి చూపాలనుకున్నాడు. ఆర్ట్ స్టూడెంట్ కనుక స్వేచ్ఛ తీసుకున్నాడు. పబ్లో కృష్ణుడిని ప్రవేశపెట్టాడు. నీలి వ్యవహారాలు నడిచేచోటు కనుక నీలవర్ణుడిని, గ్రంథసాంగుడిని పట్టుకొచ్చాడు. మధురానగరి రాసలీలలను తను బతుకుతున్న స్థలకాలాల్లో ఆవిష్కరించాడు. అక్రమ్ కాస్త జాగ్రత్తపడినట్లే ఉంది. అదే రాముడి జోలికి పోయింటే ఆ బొమ్మ గ్యాలరీ గడప తొక్కేదే కాదేమో.

akramhussain_1428766784

ఈ చిత్రంలో అక్రమ్ కృష్ణుడినేమీ అశ్లీలంగా చిత్రించలేదు. ఓ అమ్మాయి అతని నిమిత్తం లేకుండా అతన్నికౌగిలించుకుంది. అతన్నిరేపల్లె కన్నెపిల్లల మానసచోరుడని కీర్తించేవాళ్లకు, నగ్నగోపికల, నల్లనయ్య రాసలీలల చిత్రాలను పటాలు కట్టించుకుని పూజించేవాళ్లకు, గోపీలోలుని నఖదంతక్షతాల అష్టపదులను ఉషోదయాన మైమరచి వినేవాళ్లకు ఇందులో అభ్యంతర పెట్టాల్సిందేముంది? ఆ చిత్రాల్లోని యువతులకంటే ఈ బికినీ అమ్మాయిలే కాస్త ‘శ్లీలంగా’ ఉన్నారు కదా? మరి దేవుడిని బార్లో ఉంచాడని అభ్యంతరమా? మరి వేదాల్లోని, హిందూ పురాణాల్లోని సురాపానాల సంగతి? మద్యంపై కోట్ల ఆదాయం కోసం వెంపర్లాడుతూ, కోట్ల సంసారాలను బుగ్గి చేస్తున్న ప్రభుత్వాల సంగతి? మద్యానికి మగువకూ లింకుపెట్టి తాగుడును పబ్లిగ్గా ప్రోత్సహిస్తున్నవ్యాపార ప్రకటనల సంగతి? ఇవన్నీలౌకిక ప్రశ్నలు కదా, పసలేనివి. పారలౌకికమైతే పసందుగా ఉంటాయి.

నగ్నగోపికలు కృష్ణుడిని వేడుకుంటున్నచిత్రాలను హిందూ కళాకారులు వందల సంవత్సరాలుగా వేస్తున్నారు. మొగలాయిల కాలంలో ముస్లిం చిత్రకారులు కూడా వాటిని రసభరితంగా చూపారు. కేరళలోని మట్టంచేరి ప్యాలెస్ లో ఉన్న పదిహేడో శతాబ్దినాటి కుడ్యచిత్రం కృష్ణుడి రాసలీలలను కనువిందుగా చూపుతుంది. పడచుపిల్లలు పార్కుల్లో ముచ్చట్లు చెప్పుకున్న పాపానికి గుంజీలు తీయించే నైతిక పోలీసులకు ఈ బొమ్మ హిందూజాతి గర్వించదగ్గ కళాఖండంగా కనిపిస్తుంది. అక్రమ్ బొమ్మ మాత్రం హిందూ సంస్కృతిపై దాడిలా కనిపిస్తుంది. మన ప్రాచీన కళాకారులు సౌందర్యపిసాసులు. అక్రం మాత్రం కళావిధ్వంసకుడు. వాళ్లది శృంగారం, అతనిది…!  సినిమా పాటల్లో హీరో హీరోయిన్ను తాకరానిచోట తాకితే కళ్లప్పగించి చూసే మన ఘన మర్యాదకు.. చలనంలేని బొమ్మకు గుడ్డకరవైతే మాత్రం భంగం కలుగుతుంది.

P35-Gita-Govinda 1775

కళ విషయాల్లో నైతిక పోలీసుల అజ్ఞానం, అక్కసు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. భారతీయ కళ దేవాలయాలను అంటిపెట్టుకుని బతికింది. దేవాలయాలపైని శృంగార శిల్పాల ఉద్దేశం సౌందర్యారాధనే కాదు, కామజ్ఞాన ప్రచారం కూడా. వాత్స్యాయన కామసూత్రాలకు చిత్రశిల్పరూపాలు ఇవ్వడం ఇందులో ఒక భాగం. అవి రాజుల భోగలాలసతను కూడా చూపుతుండొచ్చు. కానీ అవి తొలుత కళకారుడి ప్రతిమలు. నైతికతతో కలుషితం కాని సృజన. గర్భగుడిలోని దేవుడి బొమ్మను చెక్కిన శిల్పులే ఈ బొమ్మలనూ చెక్కారు. దేవుడిని ఎంత శ్రద్ధగా తీర్చిదిద్దారో వీటినీ అంతే శ్రద్ధగా తయారు చేశారు. ప్రాచీన పంచలోహ విగ్రహాలను బట్టల్లేకుండా చూస్తే ప్రాచీన కళాకారులకు మానవసౌందర్య సృజనలో ఎంత అభినివేశం, కళాత్మక దృష్టీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ మన వేడుకలు, నైతికత ఆ సౌంద్యర్యాన్ని ఉత్సవ పట్టుబట్టలతో జాగ్రత్తగా కప్పెడతాయి. అందుకే మనకు మన ప్రాచీనులు దర్శించిన అసలు సౌందర్య దర్శన భాగ్యం లేదు. అరకొరగా మిగిలిన సౌందర్యానికి మన కుహనా నైతికత సున్నం, రంగులూ కొడుతోంది. కళాస్వేచ్ఛకు మన మర్యాద ఇనుప కచ్చడాలు తొడుగుతోంది.

krishna_stealing_clothes_hc92

కళాస్వేచ్ఛ అంటే ఇతర మతాలను అవమానించడమా? అని అడుగుతున్నారు. అవమానించడానికి, కించపరచడానికి వేసింది కళ కాదు. కళ అని ప్రచారం చేసినా దానికి మనుగడ ఉండదు. ముస్లిం, క్రైస్తవ కళాకారులు హిందూ దేవుళ్లను కించపరచేందుకు,

హిందూ కళాకారులు ఏసుక్రీస్తును, మహమ్మద్ ప్రవక్తను కించపరచేందుకు బొమ్మలు వేస్తే అవి కించపరచే బొమ్మలే అవుతాయి కానీ కళ కావు. ఆయా దేవుళ్లను కళాత్మకంగా, స్వేచ్ఛాభావాలతో, చివరకు వాళ్లంటే ఆగ్రహంతో అయినా వేస్తేనే కళ అవుతుంది. పాశ్చాత్య కళలో దీనికి బోలెడు రుజువులున్నాయి. వాళ్లు ఏసుక్రీస్తు శిలువ ధ్వంసం చేస్తున్నట్లు, మేరీమాత ప్రసవిస్తున్నట్లు చిత్రాలు వేశారు. మనగడ్డపైనా దీనికి ఉదాహరణలున్నాయి. అజంతా చిత్రాల్లో, ఖజురహో శిల్పాల్లో, మారుమూల గుళ్లలో మానవదేహాన్ని అపురూపంగా సృజించారు. ఎక్కడా వ్యతిరేకత రాలేదు. బూతు చూసే చూపులో ఉంది. శిశువుకు పాలిస్తున్న తల్లిరొమ్ము వేరు, శ్రీకృష్ణుడు మర్దిస్తున్న గోపిక రొమ్ము వేరు.

            *                                                               

 

Obscenity is a function of culture – a function in the mathematical sense, I mean, its value changing with that of the variables on which it depends.  – A. P. Sabine.

Obscenity is a moral concept in the verbal arsenal of the  Establishment, which abuses the term by applying it, not to expressions of its own morality, but to those of another.    -Herbert Marcuse

Obscenity is whatever happens to shock some elderly and ignorant magistrate.    -Bertrand Russell

రంగుల భోజనం…గొంతులో వీణలు!

సేకరణ, పరిచయం: పి.మోహన్

 

P Mohanచెన్నపట్టణం రైల్వే స్టేషన్.. 1898 తొలకరిలో ఓ రోజు. విశాఖపట్టణం నుంచి వచ్చిన రైల్లో నూనూగు మీసాల యువకుడొకడు దిగాడు. బస వాకబు చేస్తూ తంబుచెట్టి వీధి బాటపట్టాడు. ఓ పుస్తకాల కొట్టుముందు జనం బిలబిల మూగి ఉన్నారు. యువకుడు కూడా ఆసక్తితో వాళ్లలో కలసిపోయాడు. అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. కొట్టు గుమస్తా అప్పుడే బొంబాయి మెయిల్లోంచి వచ్చిన పెట్టె విప్పి ఒక్కో పోస్టర్ ను టేబుల్ పైన పరుస్తున్నాడు. జనం కళ్లార్పకుండా చూస్తున్నారు. మూరెడుకుపైగా పొడవున్న రంగురంగుల రవివర్మ చిత్రాల పోస్టర్లు ఇంధ్రధనుస్సులా పరచుకున్నాయి. మెరుస్తున్న రంగుల వాసన ముక్కుపుటాలకు మైకంలా సోకుతోంది.  

‘ఎంత బావున్నాయ్! అన్నీ కొత్తవే. నాకు ఆ మేనకావిశ్వామిత్రుల బొమ్మ ఇవ్వండి’

‘నాకు లక్ష్మీసరస్వతులు కావాలి. పటం కట్టించుకుంటా’

‘నాకు మాత్రం అదిగో ఆ పైటజారిన రంభ బొమ్మ కావాలి’

‘నాకు ఆ మలయాళ కన్నెపిల్ల బొమ్మ’

జనం ఎగబడ్డారు. గుమస్తా అణాలు, బేడలు పుచ్చుకుని బొమ్మలు ఇచ్చాడు. కాసేపటికి సందడి తగ్గింది. విశాఖ యువకుడు బొమ్మలను కళ్లార్పకుండా చూస్తూ ఉన్నాడు.

‘ఏమి తంబి, అట్లా సూస్తా ఉండావు, నీకు ఏమి కావాలి?’ గుమస్తా యువకుడిని అడిగాడు.

యువకుడు తేరుకున్నాడు.

‘అన్నీ.. ఇవన్నీ కావాలి..’

గుమాస్తా తుళ్లిపడ్డాడు. ఎగాదిగా చూశాడు.

‘ఇవన్నీ కావాలి. ఖరీదు పుచ్చుకుని చిల్లర ఇవ్వండి’ యువకుడు మూడు రూపాయల బిళ్లలను బల్లపైన ఉంచాడు.

గుమాస్తా ముప్పై బొమ్మలను చుట్టచుట్టి యువకుడికి అందించాడు.

యువకుడు బలిజ సంఘం సత్రంలో గది తీసుకున్నాడు. రంగుల భోజనంలో పడిపోయి అసలు భోజనం సంగతి మరచిపోయాడు. బొమ్మలన్నింటిని నేలపై పరచి గంటలతరబడి అలాగే చూస్తుండిపోయాడు. గొంతులో వీణలు మోగాయి. రాగాలు రేగాయి. పద్యాలు పలికాయి.

***

2 (2)

3 (2)యువకుడి పేరు సెట్టి లక్ష్మీనరసింహం(1879-1938). మనకు అపరిచితుడిలా అనిపిస్తాడు కానీ అతని సమకాలికులకు మాత్రం సుపరిచితుడే. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు రాశాడు. నాటకాల్లో వేషాలు కట్టాడు. యవ్వనంలో గిడుగు, గురజాడల బాటలో నడిచాడు. గ్రాంధికవాదులతో తలపడ్డాడు. వయసుపైబడ్డాక మాత్రం ప్లేటు ఫిరాయించి గ్రాంధికంలో పడ్డాడు. అతడానాడు ఏం చేసినా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, రవివర్మ బొమ్మలపై ‘చిత్రమాలికలు’ పేరుతో రాసిన పద్యాలు తప్ప. ఇవి తొలుత ’కృష్ణా’ దినపత్రికలో వచ్చాయి. తర్వాత సెట్టి మరికొన్ని రాసి మొత్తం 54 మాలికలతో 1935లో పుస్తక రూపంలో తెచ్చి, తన ప్రభువైన జయపురం మహారాజుకు అంకితమిచ్చాడు. ఆ మాలికల్లోకి వెళ్లబోయే ముందు సెట్టి గురించి కాసిని ముచ్చట్లు. సెట్టి చిత్రమాలికల ముందుమాట, అతని ఇతర పుస్తకాలు, ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’, తెలుగు సాహిత్య కోశం వంటి పుస్తకాలు, పత్రికల్లోంచి ఈ వివరాలు..

సెట్టి విశాఖపట్నంలో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకయ్యమ్మ, అప్పలస్వామి. సెట్టి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆరు నెలలు కొక్కొండ వెంకటరత్నానికి, ఆరు నెలలు కందుకూరి వీరేశలింగానికి శిష్యుడు. 1900లో బీ.ఏ. పాసై విశాఖ వచ్చి మిసెస్ ఏవీఎన్ కాలేజీ అనుబంధ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. మహాకవి శ్రీశ్రీ తండ్రి వెంకట రమణయ్య, సెట్టి సహోద్యోగులు. సెట్టిని ‘సెట్టి మాస్టార’ని, రమణయ్యను ‘రమణయ్య మాస్టార’ని పిలిచేవాళ్లు. శ్రీశ్రీకి సెట్టి వద్ద తండ్రివద్ద ఉన్నంత చనువు ఉండేది. ఆ వివరాల్లోకి తర్వాత.

సెట్టి దాదాపు ఇరవయ్యేళ్లు(1901-19) ఏవీఎన్ పాఠశాల, కళాశాలల్లో పనిచేశాడు. హెడ్మాస్టర్ గా, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. వ్యావహారికభాషావాదులైన కాలేజీ ప్రిన్సిపాల్ పీటీ శ్రీనివాస అయ్యంగారు ప్రోత్సాహంతో ఆంగ్లంలోంచి ‘గ్రీకుపురాణ కథల’ను అనువదించాడు. ‘సంధులు మొత్తంగా విసర్జించిన శైలి’లో రాసిన ఈ పుస్తకం పాఠ్యపుస్తకమైంది. దీని గురించి గురజాడ తన డైరీలో, ‘కథలలో గొప్ప లక్షణాలు, సాహిత్య మెలకువలు ఉన్నాయి. తెలుగు సారస్వతంలో నూతన పోకడలను ఇవి ప్రవేశపెడుతున్నాయి.. ఈయన అనువాదం చక్కగా ఉంది. సంధిని పరిత్యజించడంలో ఒక నిమయాన్ననుసరించారు. ఇది గ్రాంథికంలో వ్రాసిన గ్రంథమే’ అని రాసుకున్నాడు. అయినా ఈ  పుస్తకంపై గ్రాంథిక భాషావాదులు మండిపడ్డారు. సెట్టి కూడా తగ్గలేదు. తాపీ ధర్మరావు ఓ చంపకమాలలో గ్రాంధికాన్ని సమర్థించగా, సెట్టి దానికి బదులుగా 116 పాదాల శార్దూలం రాసి దానికి ‘నూటాపదహార్లు’ అని పేరుపెట్టాడు.

కవిభూషణ బిరుదాంకితుడైన సెట్టి కొన్ని కొక్కిరాయి పనులూ చేశాడు. ‘రసికాభిలాషం’ రాసి, దాన్ని శ్రీనాథుడికి ఆపాదిస్తూ ప్రకటించాడు. అది కవిసార్వభౌముడిది కాదని చిలకమర్తి లక్ష్మీనరసింహం తేల్చాడు. దాన్ని సెట్టి తనముందే రాశాడని విశాఖ వాసి బొడ్డు రామయ్య చిలకమర్తికి చెప్పాడు. సెట్టి ‘మరీచీ పరిణయం’ రాసి దాన్ని శ్రీ కృష్ణదేవరాయల కూతురు మోహనాంగికి అంటగట్టాడు. సెట్టి చనిపోయాక చాలా ఏళ్లకు అది అచ్చయింది. అది మోహనాంగిది కాదని ఆరుద్ర తేల్చడం మరో ముచ్చట.

సెట్టి విరివిగా రాసేవాడు. ప్రభాసశాపవిమోచనం(కావ్యం), శ్రీకృష్ణరాయబారం, లుబ్ధాగ్రేసర చక్రవర్తి(మోలియర్ రాసిన మైజర్ నాటకానికి అనువాదం), మాలినీ విజయం, చిత్రహరిశ్చంద్రీయం(నాటకం), అహల్య(నాటకం), వసంతసేన(నవల, గురజాడకు అంకితం), పన్నా, బప్పడు(రాజస్థానీ కథాకావ్యాలు), గంగికథ(నవల), దొంగ(కథ), కొన్నిశతకాలు, ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ఉగాది పద్యాలు, బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్ ల పద్యాలకు అనువాదాలు.. ఇవన్నీ అతని సాహిత్య కృషి.

సెట్టి అక్కయ్య సీరం సుభద్రమ్మ(1876-47) కూడా కవయిత్రి, నవలా రచయిత్రి. రెండువేల పద్యాల్లో ‘సుభద్రాపరిణయం’ రాసింది. కానన్ డయల్ రాసిన షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధక నవలావళిలోని ‘ద హౌండ్ ఆఫ్ ద బాస్కర్విలీస్’ను తెలుగులో ‘జాగిలం’ పేరుతో చక్కగా అనువదించింది. ఇది మద్రాస్ వర్సిటీ పాఠ్యపుస్తకమైంది.

సెట్టి స్కూలుకు రాజీనామా చేశాక లా చదివి ఫస్ట్ గ్రేడ్లో పాసయ్యాడు. జయపురం మహారాజు, రచయిత, దాత విక్రమదేవవర్మ(1869-51)కు 1930లో ఆంతరంగిక కార్యదర్శిగా చేరాడు. జయపురం(ఒడిశా) ఆస్థానప్రభావంతో గ్రాంధికంలోకి మళ్లాడు. ‘చిత్రమాలికల’తోపాటు చాలా కావ్యాలను రాజుకే అంకితమిచ్చాడు. వర్మ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఏటా లక్ష చొప్పున ఇరవయ్యేళ్లు విరాళాలు ఇచ్చాడు. శతాధిక గ్రంథకర్త, శతాధిక కృతిభర్త. గిడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి ప్రసిద్ధ రచయితలు తమ రచనలను వర్మకు అంకితమిచ్చారు. తెలుగులో తొలి కార్టూనిస్టు, చిత్రకారుడు, కళావిమర్శకుడు తలిసెట్టి రామారావు వర్మకు దివాన్ గా పనిచేశాడు.

1 (1)

సెట్టితో శ్రీశ్రీ అనుంబంధం గురించి. వయసులో ముప్పయ్యేళ్ల తేడా ఉన్నఈ ఇద్దరూ కవితాసమితి సభ్యులు. సెట్టి చాలావరకు ఏది ఎత్తుకున్నామాలికల్లోనే ఎత్తుకునేవాడు. శ్రీశ్రీ తొలి పద్యరచన ‘విశ్వరూప సందర్శనం’ కూడా మాలికే, సెట్టి ప్రభావమే. ‘మనుచరిత్రకన్నా వసుచరిత్ర గొప్పదని బహుశా సెట్టి మాస్టారు శ్రీశ్రీకి చెప్పారు’(ఆరుద్ర). జగన్మిత్ర నాటక సమాజంలో సెట్టి శ్రీశ్రీతో కుశుడు వంటి బాల పాత్రలనేకం వేయించేవాడు. అవధాని చెళ్లపిళ్ల వెంకట శాస్త్రికి సెట్టి వీరాభిమాని. ఓ సారి చెళ్లపిళ్ల విశాఖకు వచ్చి తన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్నప్పుడు, జయపురంలో అవధానానికి రావాలని విక్రమదేవవర్మ తరపున ఆహ్వానించడానికి వెళ్లాడు సెట్టి, కూడా శ్రీశ్రీని వెంటబెట్టుకుని. శ్రీశ్రీకి చెళ్లపిళ్లను చూడ్డం అదే తొలిసారి. సెట్టి మాత్రాఛందస్సులో గురజాడను గుర్తుకు తెచ్చేలా రాసిన ‘బప్పడు’ లోని కొన్ని పద్యాల ప్రభావం శ్రీశ్రీ ‘శైశవగీతి’ లో కనిపిస్తుంది. బప్పడులోని పిల్లల ఆటపాటల వర్ణన ఇలా సాగుతుంది..

‘పది పండ్రెండేడుల ఈడును గల

సిగ్గును తెలియని చిన్న బాలికలు…

కన్నుల నిండా కాటుక రేఖలు..

చిన్ని చప్పట్లు చెరచేవారూ

గడ్డిపువ్వులను కోసేవారూ..

ఎచ్చటను చూచినా తామే ఐ

వచ్చిన చోటికె వచ్చుచు తిరిగీ

పోయిన చోటికే పోవుచు మరియూ..’

 

శ్రీశ్రీ ‘శైవశగీతి’ ఇలా సాగుతుంది…

‘అయిదారేడుల పాపల్లారా..

అచ్చటికిచ్చటి కనుకోకుండా

ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే..’

 

తాపీ ధర్మారావు గ్రాంధిక చంపకమాలకు ప్రతిగా సెట్టి రాసిన శార్దూల మాలికలోంచి

శ్రీశ్రీ కొన్ని పాదాలను ఉటంకించేవాడని అంటాడు ఆరుద్ర.

ఆ పాదాలు..

‘…కేవాస్తే ఇస్తరఫ్, ఇస్లియే, మగరుమా ఫక్ భేష్ చమక్కంచు హిం

దుస్తానీ పదసంచయంబె కృతులన్ దూరుస్తురో లేక నో

యెస్తేంక్స్, మిస్టరు, మైడియర్, మొదలుగా ఇంగ్లీషు శబ్దాలనే

వేస్తారో తమ చిత్తమండి.. బస్తీమే సవాల్..’

 

శ్రీశ్రీ తొలినాళ్ల పద్యాలపై సెట్టి ప్రభావం గురించి ఎవరూ విశ్లేషించినట్లు లేదు. ఆ పనిచేస్తే తొలినాళ్ల శ్రీశ్రీని మరింత బాగా అంచనా వేయొచ్చేమో!

ఇక ‘చిత్రమాలికల’ సంగతి. దీనికో ప్రత్యేకత ఉంది. భారతీయ భాషల్లోనే కాదు, బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ ఇలాంటి పుస్తకం లేదనొచ్చు. వర్ణచిత్రాలపై కవితలు ఆంగ్లం, ఫ్రెంచి తదితర భాషల్లో మధ్యయుగాలనుంచే నుంచే ఉన్నాయి. జపాన్ చిత్రకారులైతే చిత్రాల పక్కనే పద్యాలు రాసేవాళ్లు. లియోనార్డో డావిన్సీ వేసిన మిలాన్ రాజు ప్రేయసి ‘చిచీలియా గల్లెరని’ చిత్రంపైన డావిన్సీ మిత్రుడు బెర్నార్దో బెలీంచియోని శృంగారభరిత పద్యాలు రాశాడు. ‘మోనాలిసా’ చిత్రంపై తెలుగులో చాలా కవితలు వచ్చాయి. అయితే ఒక చిత్రకారుడు వేసిన చిత్రాలపై పనిగట్టుకుని యాబైకిపైగా పద్యాలు రాసింది, అచ్చేసింది మాత్రం సెట్టినే. ఇది సాముగరిడీలా ఉన్నా వ్యర్థవిన్యాసంగా మాత్రం మారిపోలేదు. సెట్టివి పద్యాలే అయినా నారికేళపాకాలు కావు. తెలుగు పలుకుబళ్లతో, సహజ సంభాషణలతో, సరళంగా, ప్రవాహసదృశంగా సాగుతాయి. చిత్రంలోని సారాంశాన్ని కవిచూపుతో కొత్తగా పరిచయం చేస్తాయి. చిత్రమాలికలు ‘కృష్ణా’ పత్రికలో వస్తున్నప్పుడు అన్నీకాకపోయినా కొన్నయినా పాఠకులను ఆకట్టుకున్నాయి. ‘గంగావతరణం’, ‘హంస దమయంతి’, ‘బాలకృష్ణుడు’ వంటివి సెట్టి కవితాప్రతిభకు అద్దంపడతాయి.

సెట్టికి రవివర్మ చిత్రాలు తొలుత విశాఖలో లితోగ్రాఫుల రూపంలో పరిచయం. చిత్రమాలికల ముందుమాటలో తాను చెన్నపట్టణంలో ఇరవై, ముప్పై రవివర్మ చిత్రాలను కొన్నానని సెట్టి రాసుకుంది లితోగ్రాఫుల గురించే. తొలి యవ్వనంలో పరిచయమైన ఆ చిత్రాలు సెట్టిని తుదకంటా వెంటాడాయి. ఆ సంగతులన్నీ చిత్రమాలికల ముందుమాటలో ఉన్నాయి. సెట్టికి కేరళ రంగరి బొమ్మలపై ఎంత ప్రేమంటే, సందర్భశుద్ధి లేకపోయినా పొడిగేంత. ‘ఆంధ్రపత్రిక’ 1930 ఉగాది సంచికలో సెట్టి ‘ఉగాది కానుకలు’ కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కనకగిరి రాకుమార్తె అన్నపూర్ణాదేవిని పెళ్లాడ్డం, అన్నపూర్ణ తన తండ్రి కుట్రబారి నుంచి భర్తను కాపాడుకోవడం ఇందులోని విషయం. ఇక్కడ రవివర్మ చిత్రాల ప్రసక్తి శుద్ధ అనవసరం. అయినా సెట్టి వదల్లేదు. అన్నపూర్ణాదేవి అందాన్ని వర్ణించడానికి రవివర్మ చిత్రాలను అరువు తెచ్చుకున్నాడు. ఆ వర్ణన.. ‘రవివర్మ చిత్రపటములు సుప్రసిద్ధములు. ఆ చిత్తరువులందలి నాయికలందఱు నొక్కవిధమైన యాకారము గలవారు. భేదములు వయస్సులనుబట్టి, వ్యవస్థలను బట్టి, వలువలను బట్టి వచ్చినవి. ఇంచుక పొడుగుపాటి శరీరములు, కొంచెము కోలవాటు ముఖములు, వంగిన కనుబొమ్మలు నిడుదఱెప్పలతోడి వెడఁద కన్నులు, రవంత సూదిగానున్న ముక్కులు, నిండైన క్రిందిపెదవులు, ఉగ్గులుదేఱి నిగ్గులు వాఱిన పెన్నెఱులు: ఇవి యా యాకారమునకు లక్షణములు. స్త్రీసౌందర్యము పరిపూర్ణత్వమున నట్లుండునని యారాజ చిత్రకారుఁడూహించి యుండనోపును. అతని మేనక మేనిసొంపు, మోహిని ముఖకళ, రాధరామణీయకత, కలిసి యన్నపూర్ణాంబ రూపము తేలును…’

రవివర్మ బొమ్మలను ఇంతలోతుల్లోకి వెళ్లి చూసిన సెట్టి ఆ చిత్రకారుడు వేసిన అసలు తైలవర్ణ చిత్రాలను కొన్నింటినైనా చూసే ఉంటాడు. మద్రాస్, విశాఖ, రాజమండ్రి, కాకినాడ ధనికులు, జమీందార్లు రవివర్మతో బొమ్మలు వేయించుకున్నారు. సెట్టికి వాళ్లలో కొందరితోనైనా పరిచయాలు ఉండుంటాయి.

6

సెట్టి చిత్రమాలికలకు ప్రేరణ అతని సహాధ్యాయి మారేపల్లి రామచంద్రశాస్త్రి(1873-1943). ఆ వివరాలు సెట్టి ముందుమాటలో ఉన్నాయి కనుక ప్రస్తావించడం లేదు. సెట్టి చిత్రమాలికలను రవివర్మ చిత్రాలతో సచిత్రంగా ముద్రించాలనుకున్నాడు. అయితే ఆనాడు చిత్రాల ముద్రణ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కనుక సాధ్యం కాలేదు. చివరకు బొమ్మల్లేకుండానే అచ్చువేశాడు.

చిత్రమాలికలను పాఠకులు చదవబోతున్నారు కనుక వాటి గుణగణాల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. మచ్చుకు సెట్టి విసిరిన చమక్కులు కొన్ని..

విష్ణువు శ్రీదేవి, భూదేవిలను గద్దపై ఎక్కించుకుని వలపు పారవశ్యంలో

‘ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే, మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి.. మేన్ పులకితంబగుచుండగఁ…’ వెళ్తున్నాడని వర్ణిస్తాడు సెట్టి మాస్టారు ‘శ్రీమహావిష్ణువు’ మాలికలో.

‘గంగావతరణం’ మాలికలో ఆ నది దివి నుంచి భువికి..

‘రంగత్తుంగతరంగసంఘములు తోరంబై చెలంగం గడుబొంగం బాఱుచు, జాఱుచున్, దొరలుచుం, బొర్లాడుచున్, వేనవేల్ పంగల్ పెంచుచున్, జెంగలించుచును, బైపై లేచుచుం, దేఱుకొంచుం.. భ్రమించుచున్.. నురుఁగుతోఁ జూపట్టుచున్.. హోరుమంచుం..’ దూకిందంటాడు.

దమయంతి వనవిహారంలో ఉండగా, ‘గుప్పగఁ బడ్డ దూది తెఱఁగుం గల హంసము కానిపించె’ నంటాడు ఓ మాలికలో. మరో మాలికలో.. కారడవిలో తన చీరను చించుకుని నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన భర్తను తలచుకుంటున్నదమయంతితో ఇలా అనిపిస్తాడు.. ‘నీదు హక్కౌటచే, మేనఁ జీరను జించుకొంచరిగితే? మేనో, శిరస్సో తెగంగా నీ చేతను ద్రుంచిపోవునెడ, నిక్కష్టంబు లేకుండు?’

వనంలో వయ్యారంగా మేనువాల్చి దుష్యంతునికి తామరాకుపై లేఖరాస్తూ, వలపు తలపుల్లో మునిగిపోయి ‘లేఖలో బంతులు నొండు రెండయిన బాలిక వ్రాయఁగ నేర,దంతయున్ సాంతము చేసి సంతకము సల్పుటకెంతటి సేపు పట్టునో?’ అని సంశయిస్తాడు ‘శకుంతలాపత్రలేఖనం’లో.

‘బాలకృష్ణుఁడు’ మాలికలో.. వెన్నెల వెదజల్లే నవ్వుతో కళ్లను చల్లగ చేసే తన బిడ్డను చూసి యశోద, ‘నా ముల్లె, మదీయ గర్భలత పూచిన మల్లె’ అని మురిసిపోతుంది. దాపున కూర్చున్న రాధతో  ‘నోసి రాధ, మేనల్లుని సంబరంపడుచు నారయుటే యనుకొంటివేమొ? నేఁడెల్లి కొమార్త నోర్తు కని యీ వలెన్ సుమీ ’ అని మేలమాడుతుంది. అందుకు రాధ, ‘యేమిరా యల్లుఁడ!  ‘యత్త, యత్త,’ యని యందువు నత్తిగ: నిందుకోసమా?’ అంటూ చిట్టి మేనల్లుని పాదము ముడుతుంది నవ్వుతూ.

‘మృద్భక్షణము’ మాలికలో.. మన్నుతిన్న కృష్ణుడిని తల్లి మందలిస్తూ ‘చిన్నతనంబునన్ విషము చేరిచి పూతన నీదు నోటికిం, జన్నొసఁగంగఁ గ్రుక్కుకొని చప్పునఁ జప్పునఁ జప్పరించినా,వన్నియు నిట్టి పాడు రుచులబ్బినవేమిర?’ అని అంటుంది.

‘నికుంజరాధ’, ‘మాలినీ కీచకులు’, ‘ఉషానిరుద్ధులు’ వంటి మాలికలూ భావయుక్తంగా సాగుతాయి. ‘చిత్రమాలికలు’ ఒకరకంగా చిత్రాలకు అనువాదం లాంటివి. ఓపక్క రవివర్మ రంగరించిన సౌందర్యాన్ని అక్షరాల్లోకి తోడాలి. మరోపక్క మక్కికి మక్కీ చెప్పినట్లు కాకుండా, భావశబలతతో తెలుగు సొబగులు చెడకుండా చిత్రికపట్టాలి. సెట్టి ఈ పని బాగానే చేశాడు. చేయలేదని అనడానికి వేరొకరు ఆ పని చేసి ఉంటే కదా!

***

 

4

శ్రీ చిత్రమాలికలు

పీఠిక

నా యీ చిత్రమాలికల రచనకుఁ ప్రారంభము 1897 సంవత్సరమున: అప్పటికి నాకుఁ బదునెనిమిది యేఁడుల యీడు;  విశాఖపట్టణమున ఎఫ్.ఏ. తరగతిలోఁ జదువుచుంటిని. ఇటీవలఁ గవిగారని సార్థకనామము గాంచిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు నా సహపాఠి. తత్పూర్వమే యాయన రవివర్మ చిత్రించిన మేనకావిశ్వామిత్రచిత్రముఁ గూర్చి యొక మాలిక రచించియుండెను. అది వినుట వలనఁ గలిగిన కుతూహలము, తరువాతి కథను దెలుపు శకుంతలాజననచిత్రముఁ గూర్చి యొక మాలిక వ్రాయ నన్ను బురికొల్పినది. రామచంద్రశాస్త్రిగారు హూణవిద్య చాలించుటయు, మఱొక యేఁడాదికి బి.ఏ. చదువు నిమిత్తము నేను చెన్నపట్టణము వెళ్లుటయు, మా చిత్రమాలికా రచనము మూలఁబడుటకు హేతువులైనవి. నాఁటికిని నేఁటికిని వారు వ్రాసిన చిత్రమాలిక యది యొక్కటియే. అది వారు కేవలము మఱచియే పోయిరి. నాకు ముఖస్థమై యుండెను. శృంగారకంఠాభరణమునకుఁ బంపితిని. అందలి కాలవలాహకాంతరేతి పద్యమదియే.

చెన్నపట్టణమునకు నేను వెళ్లిన సరికి రవివర్మ చిత్రములమీఁద జనాదరము ముమ్మరమై యుండెను: అవి యమ్మకమునకుఁ జూపని యంగడి లేదు; అలంకరింపని గృహము లేదు; యభినందింపని జనులు లేరు. ఇరువది ముప్పది చిత్రములు నేనును గొంటిని. అందలి రంభాశుక, మదాలసాఋతుధ్వజు, చిత్రములు రెండింటిని మాత్రమే వర్ణించి మాలికలు వ్రాసితిని. అప్పటికింకను జిత్రమాలికలను విశేషముగా వ్రాయవలయునన్న సంకల్పము నామనసున నంకురింప లేదనుట నిశ్చయము.

1900 సంll రము జనవరిలో నేను బి. ఏ. పరీక్షయందుఁ దేలితిని. పిమ్మట బహుకాలము గడచినది. విశాఖపట్టణమున మిస్సెస్. ఏ. వీ. ఎన్. కాలేజీలో నేనుపాధ్యాయుఁడనుగా నుంటిని. 1915వ సంవత్సర ప్రాంతమని జ్ఞాపకము: బ్రహ్మపురనివాసులును, మ. రా. రా. దేవళరాజు వేంకటసుబ్బరావుపంతులుగారు నాయొద్దఁ గల మూడు మాలికలు విని, తమ వేగుఁజుక్క కథావళియందుఁ సచిత్రముగాఁ బ్రకటించు నభిలాషమును దెలిపిరి. శకుంతలాజననమాలికలోఁ దత్పూర్వమున్న స్త్రీజనసామాన్యవర్ణనము బాలెంతరాలి వర్ణనముగా మార్చి ఇచ్చితిని; వారు ప్రకటించిరి. తూఁగక వేగుఁజుక్క కథావళి వారాఁప వలసి వచ్చినది. ఒక్క దానితో నా మాలికలు నాఁగ వలసి వచ్చినవి.

మఱికొంత కాలమునకుఁ, దత్పద్యమునే కృష్ణాపత్రికకుఁ బంపితిని. అది 1916వ సంll రము అక్టోబరు 21 వ తేదీ పత్రికలోఁ బ్రకటితమైనది. నాఁటి నుండి వారము వారము నేనొక మాలిక పంపుటయు, అది ప్రకటితమగుటయు, 1918 వ సంll రము ఏప్రిలు 13 వ తేదీ వరకు జరిగినది. అలాగున నేను బంపినవి 33 మాలికలు. నేను వ్రాసిన మాలికల వరుసను విషయసూచికయందలి కుడి ప్రక్కను గల యంకెలు తెలుపఁ గలవు. అమూల్యమైన తమ పత్రికలో నా మాలికలకుఁ దావిచ్చి, తద్రచనకుఁ బ్రోత్సాహము కలిగించిన కృష్ణాపత్రికాధిపతులకు నేను గృతజ్ఞుఁడను.

కారణాంతరమున హఠాత్తుగా నిలిచిన మాలికలు 1922 వ సంll రము తుదిని మరలఁ బ్రారంభమైనవి: ఈ మాఱు, పునరుద్ధారణము గన్న వేగుఁజుక్క కథావళియందు. అట్లు ప్రకటితమైనవి యాఱు మాత్రమే. గత సంవత్సరమున ‘అహల్య’ యను నాటకము రచించి, దానికొఱకు రెండు మాలికలు వ్రాసితిని; శృంగారకంఠాభరణము కొఱకు నికుంజరాధ, యమునాతటరాధ, యని మఱి రెండు. అక్కడకు మొత్తము నలుబదిమూడు.

మొదటి మాలికలు 22 పంక్తులును, దురువాతివి కొన్ని 23 పంక్తులును, గలవిగా వ్రాసినను ఇప్పుడన్నియు 24 పంక్తుల వానిఁగా జేసితిని. వాడిన ప్రాసము మరల వాడలేదు. త్రివర్ణచిత్రములను జూచి మొదటిలో మాలికలు వ్రాసితిని గాని, యిటీవల మాత్రము చిత్రశాలాముద్రాక్షరశాలవారు పుస్తకరూపముగా వెలువరించిన చిత్రములను జూచియే వ్రాసితిని. అస్పష్టమైన ముద్రణమగుటచేత, స్థితులతో నేనెచ్చట నైనను బొరపడి యుండ వచ్చును. మన్నింపఁ బ్రార్థన.

మనోరమ మనుచరిత్రలోని స్వరోచి భార్యగా నేను వర్ణించితిని. తత్కథ యాంధ్రకవితాపితామహుని నేర్పు కతముఁ దెలుగు దేశమున సుప్రసిద్ధము. అది మార్కండేయపురాణమందలి కథయే యైనను, రవివర్మ యది యుద్దేశించెనా యన్నది సందేహకరము.

సచిత్రముగా మాలికలను ముద్రింపుమని పలువురు మిత్రులు నాతోఁ బలుసారులు చెప్పుచు వచ్చిరి. 64 మాలికలైనను గాకుండ ముద్రించు నుద్దేశము నాకు లేకుండెను. 1932 వ సంవత్సరముఁ గల్యాణీశృంగారగ్రంథమాలాధిపతులు బ్రహ్మశ్రీ గంటిసూర్యనారాయణశాస్త్రిగారు నన్నందు విషయమై తొందరపెట్టిరి. అందుచేతఁ దొందరతొందరగా మఱి పదునొకండు పద్యములు వ్రాసి ముగించితిని. దీని యచ్చు బాధ్యతను బూనుకొని, శాస్త్రిగారు చిరకాలము గ్రంథముంచుకొని, తిరిగి పంపిరి. చిత్రములను గూర్చిన ప్రయత్నములన్నియు విఫలములయినందున సచిత్రముగాఁ బ్రకటింప లేకుంటిని.

అడిగినంతనే యంకితమొందుటకనుగ్రహబుద్ధితో నంగీకరించిన మత్ర్పభువర్యులు, శ్రీజయపురరాజ్యధుర్యులు, శ్రీశ్రీశ్రీ శ్రీవిక్రమదేవవర్మమహారాజు గారికి నేనీవిధముగానేయన్న మాట యేమి, యన్ని విధములను గృతజ్ఞుఁడను: వారు నాకన్ని విధములను వంద్యులు.

 

విశాఖపట్టణము

1-10-1935                                                                                                                                                                                                  సెట్టి లక్ష్మీనరసింహము

 

 

అంకితము.

శ్రీకరముగా సలకసృష్టిచిత్రముల వి-

చిత్రలీలఁ జిత్రించి, తచ్చిత్రసముద-

యావలోకనమునఁ బలుభావములొద-

వించి, చిత్రకారులకుఁ గవిప్రతతికి

హేతువౌ భగవంతుండు కృష్ణచంద్ర-

దేవపుత్రు, శ్రీవిక్రమదేవవర్మ-

ధారుణీకళత్రు, మహితోదారు,  జ్ఞాన-

సారు, సుగుణనిస్తంద్రు, శ్రీజయపురనృప-

చంద్రు, నాయురారోగ్య విస్తారసౌఖ్య-

యుతునిగాఁ జేసి, రక్షించుచుండు గాక!

ఆ మహారాజు మామక స్వామి యనుచుఁ,

గవివతంసంబంనుచుఁ, బండితవరుఁడనుచుఁ,

సారము గ్రహింపఁ జాలు రసజ్ఞుఁడనుచుఁ,

దప్పులొప్పులఁ జేయు నుదారుఁడనుచు,

ఆంధ్రవిశ్వవిద్యాలయంబధికవృద్ధి

నొంద వత్సరలక్షల నొసఁగిన నెఱ

దాత యనుచు, జ్ఞాని యనుచు, ధర్మమూర్తి

యంచు, నర్హుండనుచు, నే రచించినట్టి

చిత్రమాలికాకృతిని దచ్చిత్తవృత్తి

యెఱిఁగి, తదనుజ్ఞఁ బడసి, ప్రహృష్టుఁడనయి,

ప్రభువరునకు నభ్యుదయపరంపరాభి-

వృద్ధి, వంశవృద్ధియుఁ గార్యసిద్ధియుఁ నిర-

తమును గల్గింప దేవు ప్రార్థనమొనర్చి,

యంకితంబిచ్చువాఁడఁ బ్రియముతోడ.

_

 

కవి విషయము.

ప్రచురయశుండు తత్ర్పభుని ప్రాపును గాంచిన చిత్రమాలికల్

రచనమొనర్చినట్టి కవి, ప్రాజ్ఞులకెల్లను గేలుదోయి మో-

డ్చి చెలఁగు సెట్టిలక్ష్మినరసింహము: సెట్టి కులాంబురాశిలో-

ని చలువఱేఁడనన్ ధర జనించిన యప్పలసామినాయుఁడున్

సుచరిత వేంకయాంబయు మనోరథసిద్ధిగఁ గన్న పుత్రుఁ; డా-

స చెడక స్వీయమౌ బలిజె జాతి కనుంగొన, వాసి గన్న వాఁ-

డు; చదువునన్ గురుల్ తనుఁ గడుం గరుణింప బి.యే. పరీక్ష బు-

ద్ధిచతురతన్ సమున్నతిగఁ దేలి, విశాఖపురంబునందు లో-

క చరిత మిస్సె. సే.వి.యెను కాలేజిలోపలి బోధనంబు చే-

యుచు, మఱి యెల్.టి.యై, యచట నొజ్జగ నిర్వదియేఁడులుండి, శి-

ష్యచయము సెట్టి మాస్టరన సన్నుతి గన్న యతండు; ఫస్టు గ్రే-

డు చదివి, ఫస్టెయై, తగునటుల్ పది యేఁడులు న్యాయవాదిగా

నచటనె యున్నవాఁడు; తెనుఁగందొక యించుక పూర్వవాసనన్

రుచి గని, పూర్వసత్కవులు త్రొక్కిన త్రోవఁ గవిత్వఫక్కి నే-

రుచుకొని, తప్పులున్న చదురుల్ సరిదిద్దుదురంచుఁ బద్దెముల్

వచనములున్న గ్రంథములు వ్రాసి, సుధీతతి వల్ల మెప్పు నొం-

దుచుఁ గవిభూషణాఖ్యఁ గృపతో నృపుఁడీయఁగఁ గన్న వాఁడు; మం-

చి చనవు గల్గునట్టులుగ శ్రీయుతవిక్రమదేవవర్మరాట్

శచిపతి యంతరంగము నొసంగుచుఁ దద్విధకార్యదర్శిగా,

సచివునిగాఁగఁ బెట్టుకొన, స్వామి హితంబునె కోరి యున్న వాఁ;

డచలపతిత్వమున్ను హరియందు, మహేశ్వరునందు, భక్తిఁ దా-

ల్చుచుఁ దమితో నిజప్రథమసూనుని వేంకటశబ్ధమాది ని-

ల్పుచు రమణుండటంచుఁ, బెఱ పుత్రుని దా శివరావటంచుఁ బి-

ల్చుచు, నిటులిష్టదైవముల సూక్ష్మముగాఁగను గొల్చునాతఁడున్.

_

 

 

కృతజ్ఞత.

ఆదికావ్యమగు రామాణయంబు రచించి-

నట్టి వాల్మీకిం, బురాణభార-

తగ్రంథకర్త వేదవ్యాసు, నాటక-

కావ్యముల్ వ్రాసిన కవులఁ గాళి-

దాసు, శ్రీహర్షు, శూద్రకు, భవభూతిని,

నుతియించి కొల్చి, సంస్కృతమునందు

నవ్వారు రచించినట్టి పురాణేతి-

హాస కావ్యాదుల నాంధ్రభాష

విరచించినట్టి కవిత్రయంబునకుఁ బో-

తనకు, భాస్కరునకుఁ దక్కినట్టి

వారికిన్ మ్రొక్కి, గీర్వాణపురాణాదు-

లందున్న కథల రమ్యమగు భంగి

వర్ణించి, చిత్రించి, వానిని గన్నుల

యెదుటికిం గొనితెచ్చి, హృదయములను

నవరసంబులు సముద్భవమొందఁ జేసిన

చిత్రకారవరుండు, క్షత్రియుఁడయి

రాజవంశంబునం బ్రభవించియును శ్రద్ధ

కలిగి విద్యను సమగ్రముగ నేర్చు-

కొని ప్రసిద్ధుండైన ఘనుఁడు, భారతదేశ

మునఁ జిత్రకళ కలదనుచు నితర

ఖండములను వాసి కలుగఁ జేసిన మేటి,

గృహవితతి నలంకరించిన హితుఁ,-

డని కృతజ్ఞబుద్ధి నౌచు రాజారవి

వర్మకేనొనర్తు వందనములు.

_

 

శ్రీమహావిష్ణువు.

శ్రీకలశాబ్ధిపుత్రియు, ధరిత్రియు భూషితగాత్రులై పవి-

త్రాకృతులొప్పఁ బార్శ్వములయందు వసించుచు, మేను మేనులన్

సోఁక గగుర్చుచున్, సొలపుఁజూపుటళుల్ తన మోముతామరం

బైకొన నిర్నమేషలయి బాళిని జూచుచుఁ జామరంబులం

జేకొనియుం గదల్చుటకుఁ జేతులు రాని యవస్థ నుంటచే,

ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే-

మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి, యా

తాఁకుడుచేత మేన్ పులకితంబగుచుండఁగ, నేత్రముల్ సుఖో-

ద్రేకముఁ దెల్పుచుండ, నునుతేటనిగారపు నవ్వు మోవిపైఁ

బ్రాఁకుచునుండ, మూర్ధమున రత్నకిరీటమునున్ ధరించి, లే-

దో కలదో యనం దిలకమూర్ధ్వముగా నొసటన్ ఘటించి, వ్రేఁ-

గై కదలాడు కుండలములందపు వీనులఁ బూని, సుప్రభా-

శ్రీకరవైన కౌస్తుభము సిస్తు దలిర్ప నుంబు మీఁద శో-

భాకమనీయహారముల ప్రాపునఁ దాలిచి, వైజయంతిఁ దా-

నా కెలనన్ గదించి, యదిరా! మది రాగమటన్నదెన్నఁడున్

లేక చరించు యోగులఁ జలింపఁగఁ జేసెడి మోహనాకృతిం

గైకొని, -గోళ్లతోడ గజకచ్ఛపభారము మోసినట్టి య-

స్తోకబలాఢ్యుఁడౌ గరుడు తోరపు వీఁపునఁ గూరుచుండి, తన్

నాకనివాసులెల్లరు ననాకులభక్తి మెయిన్ భజింపఁగా,

ఆకసముందు మెల్లగ విహారమొనర్చుచు, మింటినుండి భూ-

లోకము వారి మీఁద నెదలోఁ గల దివ్యదయామృతంబు నా-

లోకనజాలమార్గమున లోపము చేయక క్రుమ్మరించు ప్రే-

మైకవరస్వభావుని, ధృతాఖిలజీవుని, విష్ణుదేవునిన్,

నా కరముల్ మొగిడ్చి వృజినంబులు పో భజనంబొనర్చెదన్.

_

 

 

శ్రీమహాలక్ష్మి.

తామరసంబుఁ దా మృదుపదంబుల మెట్టుట, కిట్టకుంటనో?

ధామమటంచునో? పువుల దండను దాలిచినట్టి తొండమున్

సామజమెత్తు, టర్చననొనర్చుటొ? మరాళతతుల్ తన పజ్జ నుంట, య-

త్తామరసోద్భవుం గనిన తల్లి యటంచునొ? యానవైఖరిం

దాము సమభ్యసించెడి విధంబొ? యన గల యట్టి సంశయ-

స్తోమము నంతరంగములఁ జూపఱకుం గలిగించుచున్, సర-

స్సీమ సరోజమధ్యమునఁ జేతులఁ దమ్ములఁ బూని, హస్తికిన్

సామమెలర్పఁగా నభయసంజ్ఞను జేతను జేసి, యంచలం

బ్రేమను జేతితోఁ బలుకరించి, కరంబులు నాలుగున్ శ్రిత-

క్షేమనిమిత్తమే యనుచుఁ జెప్పక చెప్పెడి యీమె లక్ష్మియే!

సోముని చెల్లెలీమె యనుచుం బలుకం దగినట్టి మోముతోఁ,

గాముని కన్నతల్లి యనఁగాఁ దగు మిక్కుటమైన గోముతో,

శ్రీమహిళామతల్లి యని చెప్పెడి మైసిరితోడ, ముద్దు నె-

మ్మోమొక యద్దమై యచటఁ బూసిన పాదరసంబుఁ బోలె ని-

ద్దామెఱుఁగున్ ఘటించెడి మితమ్మయినట్టి స్మితమ్ముతోడఁ, బ్రే-

మామృతముబ్బి వెల్లువగునట్లు వెలార్చెడి కన్నుదోయితో,

లేమల లోన నీమె యెన లేని విలాసిని యయ్యెఁ; గాననే

యా మరునయ్య తా మరులు నందుచుఁ; బాల్కడలిన్ జనించు రం-

భాముఖులైన  యచ్చరలపై మనసుంచక, యొక్క యీమెకే

కాముకుఁడయ్యె: లోకపితకామిని కావున, లోకమాతయై

యీమె తనర్చె; శ్రీ గనుక, నిచ్చు సిరుల్ శరణన్న వారికిం;

గామితకల్పవల్లియు, జగంబుల తల్లియుఁ, గాన వేమఱున్

నా మనమందుఁ గొల్తుఁ గరుణారసమందిర యైన యిందిరన్.

_

 

పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం

 పి.మోహన్

రాజారవివర్మ.. పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం. రాజులకు, జమీందార్లకే పరిమితమైన తన వర్ణచిత్రాలను లితోగ్రాఫులతో జనసామాన్యానికి చేరువ చేసిన అతనంటే మన తెలుగువాళ్లకు విపరీతమైన అభిమానం. అందుకు నూటాపదేళ్ల కిందట వచ్చిన ఈ వ్యాసం ఉదాహరణ. బాలాంత్రఫు నీలాచలం రాసిన ఈ వ్యాసం 1906 అక్టోబర్లో.. అంటే రవివర్మ చనిపోయిన మాసంలోనే ‘సువర్ణలేఖ’ పత్రికలో వచ్చింది. 1910-40లమధ్య తెలుగువాళ్లకు బాగా తెలిసి, ఇప్పుడు తెలియకుండా పోయిన మరో  తెలుగు కవికి కూడా రవివర్మ అంటే విపరీతమైన అభిమానం. రవివర్మ వేసిన ఒక్కో చిత్రంపై పాతికలైన్ల పద్యాలు రాసి, వాటిని పుస్తకంగా అచ్చేసేంత ప్రేమ.  సారంగ పాఠకుల కోసం ఆ పద్యాలను రవివర్మ చిత్రాలతో జతచేసి వచ్చేవారం నుంచి అందిస్తున్నాం.. ఇక నీలాచలం వ్యాసంలోకి వెళ్లండి

         

రాజారవివర్మ

ప్రసిద్ధికెక్కిన చిత్రలేఖరియగు రవివర్మ తిరువాన్కూరు రాజవంశముతో సమీపబంధుత్వము కలిగియున్న క్షత్రియవంశములోనివాడు. తిరివెందరమున కుత్తరముగా నిరువదినాలుగు మైళ్లదూరములోనున్న కలిమనూరు గ్రామమందు 1848 సంవత్సరము, ఏప్రియలు నెల ది 29 తేదీ నాతఁడు జననమందెను. ఒకప్పుడు తిరువాన్కూరు ప్రభువులను శత్రువులనుంచి కాపాడినందుకుగాను రవివర్మయొక్క పూర్వులకీ కలిమనగరము జాగీరుగా నీయఁబడెను. రాజారవివర్మయొక్క తల్లి ‘‘ఉమాంబాయి’’. ఈమె పండితురాలు. సృష్టియందలి వైచిత్రములను బరికించి యానందించు కుశాగ్రబుద్ధికలది. తన గానవిద్యాకౌశలమునకునఁదోడు సహజమాధుర్యమగు కంఠస్వరముకలది. ఈమె ‘‘పార్వతీపరిణయమ’’ను గ్రంథమును తన దేశభాషలో రచియించి కవిత్వమందసమానురాలని యాదేశజనులచేఁ గొనియాడఁబడెను. ఇట్టి విదుషీమణి గర్భమును ఫలింపఁజేసిన రవివర్మ సామాన్యుఁడగునా? ఈతనికిఁ  జిన్నతనమున రాజవంశములోని పద్ధతిప్రకార మింటియొద్దనేయొక సంస్కృతపండితుని గురువుగా నియమించి చదువు నేర్పించుచుండిరి. రవివర్మ తన పాఠములను వల్లించుటకు వినియోగించుకాలముకంటె నెక్కుడు కాలము గోడలమీఁదను, దలుపులమీఁదను, మసిబొగ్గుతోనూ, సీమసుద్దతోనూ బొమ్మలువేయుటయందు వినియోగించెడువాడు.

 రాజారవివర్మ

రాజారవివర్మ

స్వభావముగా జనియించు నాచిన్నతనపుచేష్టలను గూర్చి యప్పుడప్పుడు పెద్దవారిచేనతఁడు మందలింపఁబడుచుండెను. కాని యతని మేనమామయును, మాతయును, నీబాలుని బుద్ధిసూక్ష్మతనుబట్టి, భవిష్యచ్ఛిత్రకారచిహ్నము లీతనియందుఁగనిపెట్టి, బొమ్మలువేయుటలో నుత్సాహపఱచుచుండిరి. రవివర్మ మేనమామ రాజా రాజవర్మ. అతఁడు చిత్రలేఖనమందు మంచి సమర్థుడు. ఆ కాలమున బొమ్మలు వ్రాయుపని గొప్పకుటుంబమువారిచే నిరసనగాఁజూడఁబడుచుండుటచే, ఆయన విలాసార్థమే చిత్తరువులను వ్రాయుచుండెడివాఁడు. చిత్రలేఖనముయొక్క ప్రధాననోద్దేశము గ్రహించక దేవతావిగ్రహలు వ్రాయుటయందే తమకాలము వెచ్చపెట్టెడు సామాన్య చిత్రలేఖరులవలెఁగాక, రాజవర్మ స్వభావమును జక్కగాఁగ్రహించి యట్టియందములొప్పునట్లుగాఁ జిత్రపటములను వ్రాయుచుండెను. ఆయనచే వ్రాయఁబడిన చిత్తరువులు జీవకళయుట్టిపడునట్లగపడుచుండెను. మేనల్లుడగు రవివర్మయెడల నాయనకుఁ బ్రేమమెండు. రవివర్మ యెప్పుడును తన మేనమామ చిత్తరవు వ్రాయుచుండ విరామములేకుండఁ జూచుచుండెడివాడు. ఒకనాఁడతని మేనమామ యొక చిత్తరువును సగము వ్రాసి యెచ్చటికో యేగెను. అతఁడింటలేనితఱిఁజూచి రవివర్మ యాచిత్తరవుపై నొకపక్షిని వ్రాసి యెప్పటియట్లయుంచెను. దానినాతఁడు మరల వచ్చిచూచి యానేరస్థునిబట్టుకొనఁ బ్రయత్నింపఁగా రవివర్మయొక్క దొంగతనము బయలుపడెను. ఏమిచేసిపోవునోయని భయపడుచున్న యాచిన్నవానికిఁ దాననుకొనినయట్లు తనమేనమామచేఁ జీవాట్లకు మారుగఁ జక్కని బహుమానమొకటి లభించెను. ఆనాటినుండి యాతఁడు మేనమామకుఁ బ్రియశిష్యుఁడై యాతనియొద్ద చిత్తరవుపని నేర్చుకొనుచుండెను.

రవివర్మ చిత్తరవులు వ్రాయుటయందును నీటితోఁ గలిపిన  రంగులు వేయుటయందును శీఘ్రకాలములోనె విశేషాభివృద్ధినిగాంచెను. రాజవర్మ మేనల్లుని దిరువనంతపురము తీసుకొనివెళ్లి మహారాజునకుఁగనపఱచి యాతనిచే వ్రాయఁబడిన చిత్తరవులను గూడఁ జూపెను. అప్పటికి రవివర్మకుఁ బదునాలుగు సంవత్సరముల ప్రాయము. మహారాజును నింతటి చిఱుతప్రాయమునఁ జిత్రలేఖనముందు విశేషబుద్ధిచాతుర్యమును గనపఱచిన రవివర్మనుజూచి పరమానందభరితుఁడై వాని తెలివితేటలభివృద్ధినొందుటకనేక విధములఁబ్రోత్సాహము గావించెను. రవివర్మ పదునేఁడేఁడులవాడఁగునప్పటికి తిరువాన్కూరు రాణీగారి సోదరీమణిని 1866 సంవత్సరనఁ బరిణయముగావించిరి.

తిరువాన్కూరు రాజకుటుంబములో మనకు వింతగానగపడు నాచారాములు కొన్నిగలవు.  అవి చదువరుల మనంబులనాకర్షింపకపోవను నభిప్రాయమున నిక్కడఁ గొంతవఱకు వ్రాయుచున్నాఁడను. ఆ రాజ్యమునకు స్త్రీలే వారసులు. వారికి సంతతి లేనిచో స్త్రీలనేపెంచుకొందురు. ఆయాచారముచొప్పునఁ దిరువాన్కూరు రాజకుటుంబముచేఁ బ్రకృతమునఁ బెంచుకొనఁబడుచుండిన చిన్నరాణులు రవివర్మ కూఁతురు బిడ్డలు.

రెండు సంవత్సరములకుఁ దరువాత జరిగిన, రవివర్మ యొక్క భావికాలపుసుప్రసిద్ధికి హేతుభూతంబగు నొక విషయమును గూర్చి ముచ్చటించవలసియున్నది. 1868 సంవత్సరమున చిత్రలేఖనమునందు విశేషబుద్ధిచాతుర్యమును సామర్థ్యమునుగల ‘‘త్యోడరుజాన్ సన్’’ అను నాంగ్లేయుఁడు తిరువాన్కూరు సంస్థానమునకు విచ్చేసి మహారాజుయొక్కయుఁ దక్కినవారియొక్కయుఁ జిత్తరవులను నూనెతోఁ గలిపిన రంగులతో నేర్పరితనము మెఱయ వ్రాసెను. మహారాజుగారి యనుజ్ఞచొప్పున నాయాంగ్లేయచిత్రలేఖరి రవివర్మను దగ్గరనుంచుకొనియే పటములనుజిత్రించెను. నూనెరంగులతోఁ బటములను వ్రాయుట కదివఱకలవాటులేని రవివర్మ యాయాంగ్లేయలేఖరియొక్క పనితనమున కాశ్చర్యమునొంది తానను రంగులు వేయవలసివచ్చినప్పుడు నూనెతోఁగలిపిన రంగులే వాడుకచేయుటకు నిశ్చయించుకొనెను. కాని వానినుపయోగించువిధమును రవివర్మ తెలిసికొనుటకు పూర్వమె ‘‘జాన్ సన్’’ తిరువాన్కూరునుండి వెళ్లుట తటస్థించినది.

నూనెరంగులెట్లుపయోగించ వలయునో నేర్చుకొనని మన రవివర్మ కొద్దికాలములోనే తన బుద్ధిసూక్ష్మతచేతను బ్రయత్నములచేతను నట్టిరంగులు వేయుటయందుఁగూడ విజయమునుబొందెను. అతఁడిటీవల వ్రాసిన తిరువాన్కూరు మహారాజుయొక్క రాణీయొక్కయుఁ జిత్తరవులు నానాటికభివృద్ధిఁజెందుచున్నయాతని యోచనాశక్తిని బుద్ధికౌశలమును వెల్లడించకమానవు. చూపఱుల మనంబులు వ్యామోహజలధి మునుంగునట్లుగ నసమానసౌందర్యవిలాసతంగ్రాలు నాయరు స్త్రీలపటములీ రవివర్మచేఁ జిత్రింబఁడెను. మొదటినుండియునితఁడు స్త్రీవిగ్రహములు వ్రాయుటలోఁ దన నేర్పరితనమును వెల్లడించుచుండెను.

1873 సంవత్సరము చెన్నపురిలో జరుపఁబడిన శిల్పశాస్త్రవస్తుప్రదర్శనము(Fine Arts Exhibition)లో మల్లెపూవులదఁడను సిగయందలంకరించుకొనిన యొక యువతీమణిరూపమును వ్రాసిన పటమువలన రవివర్మ యొక బంగారుపతకమును గవర్నరుగారిచే బహుమానముగాబడసెను. ఆ పటమునందని చిత్రమును గూర్చి మిగుల సంతసించి గవర్నరుగారు రవివర్మను మిగులనభినందించిరి. అమఱుచటి సంవత్సరము తిరుగఁ చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో నొక ద్రావిడస్త్రీపటమును వ్రాసి మఱియొక బంగారుపతకమునుబడసెను. 1875 సంవత్సరమున మన యెడ్వర్డు చక్రవర్తిగారు హిందూదేశమును సందర్శించుటకు వచ్చినప్పుడు తిరువాన్కూరు మహారాజుగారాయనకీ ద్రావిడస్త్రీపటమును మఱికొన్ని పటములతోఁగానుకనొసంగిరి. పశ్చిమదేశచిత్రకారులయొద్ద నభ్యసింపకయె మిగుల ప్రావీణ్యముతో వ్రాసిన రవివర్మ నేర్పరితనమునుగాంచి చక్రవర్తిగారద్భుత ప్రమోదములనొందిరి.

3nayaru pilla pushpalankarana

నాయరుపిల్ల పుష్పాలంకరణ

 

1876 సంవత్సరము మూడవసారి చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో ‘‘శకుంతలపత్రలేఖనము’’ అను పటమునకు రవివర్మయప్పటి గవర్నరుగారగు ‘‘బకింగుహామ్’’  ప్రభువుగారివలన నొకబంగారుపతకమునుబడసెను. స్వభావానుగుణముగ జీవకళయుట్టిపడ వ్రాసిన యాచిత్తరవునుదిలకించి గవర్నరుగారానందాబుంధిమగ్నులయి వెంటనే యాపటమును క్రయమునకుఁదీసికొనిరి.  తరువాత రెండు సంవత్సరములకు ‘‘బకింగుహామ్’’  ప్రభువు జ్ఞాపకార్థమై యాయనవిగ్రహమును దొరతనమువారి మందిరమననుంచుటకు మహాజనులచే నిశ్చయింబడెను. ఆప్రకారమాప్రభువువారి రూపమును రవివర్మచే వ్రాయఁబడియెను. తరువాత ‘‘బకింగుహామ్’’  ప్రభువువారు రూపవతులైన తనయిరువురి కుమార్తెల రూపములను రవివర్మచే వ్రాయించుకొనెను.

మదరాసునుండి రవివర్మ తిరువాన్కూరు చేరుసరికాయన కిదివఱకుఁ జేయూతగానుండి తగిన ప్రోత్సాహమును కలిగించుచుండిన తిరువాన్కూరు మహారాజు పరలోకగతుఁడగుట తటస్థించెను. తరువాత వచ్చిన మహారాజును నీతనియెడ మిక్కిలి ప్రియమునే కనపఱచుచుండెను. ఈ మహారాజు మిక్కిలి విద్యావంతుఁడు. శిల్పము, చిత్రలేఖనము, మొదలగు విద్యలందిష్టము కలవాఁడు. ఈ మహారాజు ప్రోత్సాహము చేతనే రవివర్మ ‘‘సీత అఘోరప్రమాణము’’ అను చిత్రపటమును లిఖియించెను. ఈ చిత్తరవు వ్రాయుట బహుదుర్లభము. ‘‘సీతయొక్క పాతివ్రత్యమును గూర్చి రాముఁడనుమానించినపుడు సీత వేడుకొనఁగా భూదేవి యామెనుతనలోనికిఁ దీసికొనుపోవుట’’ అను విషయమును జిత్తరవునందు కనపఱచుటకెట్టి బుద్ధిసూక్ష్మతయు నేర్పరితనముండవలయునో చదువరులే యూహించుకొందురుగాక. ఈ చిత్తరవును బరోడా రాజ్యమునకప్పటికి దివానుగారగు సర్. టి. మాధవరావుగారు తమ యజమానియగు మహారాజుగారి కొఱకు వెలయిచ్చిపుచ్చుకొనిరి.

ఆమహారాజీపటమునుజూచి యానందించి రవివర్మను తనయాస్థానమునకుఁ బిలిపించుకొని తమ కుటుంబమును వ్రాయించుకొనెను. ఆసంవత్సరమే పూనానగరమున జరుపఁబడిన ప్రదర్శనములో నాయరు కన్యకరూపమును వ్రాయఁబడిన పటమువలన రవివర్మ బరోడా మహారాజుగారిచే బంగారుపతకమును బహుమానముగాఁ బడసెను. ఆపటమును సర్. టి. మాధవరావుగారు వెలయిచ్చికొనిరి. అప్పటి బొంబాయి గవర్నరుగారగు ‘‘ఫెర్గూసన్’’ దొరవారాపటముయొక్క ప్రతిమను దమనిమిత్తమై తిరుగవ్రాయించుకొనిరి. ఈప్రకారమాప్రతిమకనేక ప్రతిమలు తీయఁబడి విక్రయింపఁబడెను. ఈచిత్తరవు రవివర్మచే వ్రాయఁబడిన యందమగు చిత్తరవులలోనొకటి.

రవివర్మ బరోడా సంస్థానమునఁ దానుండిన నాలుగు మాసములలో మహారాజుయొక్కయు, రాణీయొక్కయు, సర్. టి. మాధవరావుగారియొక్కయు, రెసిడెంటుగారియొక్కయు చిత్తరవులను వ్రాసెను. అక్కడినుండి భువనగిరి వెళ్లి యారాజుగారి కోరిక ప్రకారము వారికొరకనేక చిత్రములను వ్రాసెను. 1885 సంవత్సరము రాజధానికళాశాల ప్రధానోపాధ్యాయుఁ(Principal)డగు ‘‘ధామ్ సన్’’ దొరవారియొక్కయు వెనుకటి మైసూరు మహారాజుగారి కార్యదర్శులగు ‘‘పోర్టరు’’ దొరివారియొక్కయు చిత్రములను వ్రాసెను. ‘‘పోర్టరు’’ దొరివారి కాలమున మైసూరు మహారాజుగారి స్నేహమునుగాంచి మైసూరు నగరమునకువెళ్లి యచ్చట మహారాజుగారి నిమిత్తము రవివర్మయనేక చిత్రములను వ్రాసెను.

4sakuntala patralekhanam

శకుంతల పత్రలేఖనం

 

‘‘గ్రాంటుడఫ్’’ దొరవారు పుదుక్కోట సంస్థానమును సందర్శించు సమయమున రవివర్మ యచ్చటికేగి దర్బారుపటమును చిత్రించెను. తరువాత నాతడిఁలు చేరినపిమ్మట నాతనిమాతయగు ‘‘నుమాంబాబాయి’’ స్వర్గస్థురాలై యాతనికిఁ దీరనిదుఃఖమును గలుగఁజేసెను. 1888 సంవత్సరమీచిత్రకారుఁడు తన తమ్ముఁడైన రాజా రాజవర్మతోఁ గలసి యుదకమండలమునకేగినప్పుడు బరోడా మహారాజువారు తాము నూతనముగాఁ గట్టించిన రాజమందిరముకొఱకు జనసామాన్యముచేఁగొనియాడఁబడు పురాణకథపట్లను చిత్రపటములుగ వ్రాసి యూయవలసినదని జాబు వ్రాసెను. ఆ యుత్తరమునుగ్రహించి ఆయాకథలు జరిగిన స్థలములకేగి యందలివిశేషములను దెలిసికొనుచు స్థలములయాకారములను గుఱ్తించుకొనుచు నుత్తరయిండియాయంతయునుఁ దమ్ముడితో రవివర్మ తిరిగెను.

సోదరులిరువును నింటికిఁజేరిన పిమ్మట రెండు సంవత్సరములకాపనినంతనుఁ బూర్తిచేసికొని పదునాలుగుపటములను వ్రాసి బరోడాకేగి మహారాజునకు వానినర్పించిరి. బొంబాయి రాజధాని నలువంకల నుంచి బరోడా మహారాజుగారి నూతనమందిరమునలంకరించిన చిత్రపటములను గన్నులారఁగాంచి యానందించుటకు వేలకొలది పురుషులును స్త్రీలును బిడ్డలును విచ్చేసి పట్టణమెల్లెడ సందడిగావించిరి. ఆపటములనుండి తీయఁబడిన ఫొటోగ్రాఫులు వేలకొలది విక్రయింపఁబడెను. అందువలన నాసేతుహిమాచలము పర్యంతము రవివర్మయొక్క కీర్తి ప్రకాశించెను.

రవివర్మ తాను వ్రాసిన చిత్రపటములనుండి ప్రతులనుదీయుటకుగాను రాతియచ్చుసంబంధమైన యొక ముద్రాయంత్రశాలను బొంబాయియందు స్థాపించెను. దీని సహాయముచే మనదేశమునందలి పూర్వపు చిత్రలేఖనము పునర్జీవమువడసెను. కొంచెము విద్యనేర్చిన ప్రతివారి గృహమందును రవివర్మచే వ్రాయఁబడిన చిత్తరవులు కనఁబడుచుండెను. ఉత్తరదక్షణ హిందూస్థానములలోని మహాపురుషుల యిండ్లు రవివర్మయొక్క అసలు పటములచేతనేయలంకరింపఁబడియుండెను. ఆచిత్రలేఖరిచే వ్రాయఁబడిన చిత్రములచే హిందూదేశమంతయు  నలంకరింపఁబడియుండెను. తుదకు వీథులలోని జనులుకూడ రవివర్మయొక్క చిత్తరవులనుగాంచి యానందించు భాగ్యమునుపొందుచుండిరి. 1904 సంవత్సరమున హిందూదేశపు శిల్పిచిత్రలేఖనము మొదలగు మహాశాస్త్రములయందు రవివర్మకనపఱచిన బుద్ధిసూక్ష్మమునకు మొచ్చుకొనుచు నొక బంగారుపతక మాయనకొసంగఁబడెను.

6ravivarma rangullo atani kooturu mahaprapha

రవివర్మ రంగుల్లో అతని కూతురు మహాప్రభ

 

రవివర్మ మనహిందూదేశమునందు బహూకరింపఁబడుటయేగాక, వియానా, లండను, చికాగో మొదలగు నితరదేశముఖ్యపట్టణములలో జరుపఁబడిన ప్రదర్శనములందుఁగూడ మేలుచేయియై బంగారుపతకములను సన్నదులనుబడసెను. వంశపారంపర్య వచ్చెడి పిత్రార్జితమగు నీజ్ఞానధనమును రవివర్మతోఁబాటు, సోదరుడు, రాజారాజవర్మయు, సోదరి మంగళాబాయియు, సమానముగాఁబంచుకొనిరి. రాజవర్మ ఎలయరాజాగారితోఁగూడ నాంగ్లేయభాష నేర్చుకొనెను.

ఆతఁడు విద్యాభ్యాసము చాలించినపిమ్మట చిత్తరవులు వ్రాయుచు నాయాపట్టణములలోఁ బ్రదర్శింపఁబడిన ప్రదర్శనములకుఁ దనచిత్తరవులనుగూడఁ బంపుచు బహుమతులువడసెను. రవివర్మయు సోదరునితోఁగూడ నాంగ్లేయచిత్రలేఖరి యబ్రూగ్సదొరవారు ఇండియాకు వచ్చినపుడు వారి సాంగత్యము చేసి కొన్ని నూతన సంగతులను గ్రహించెను.

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

ప్రదర్శనమునకుఁ బంపవలసివచ్చినపుడుదక్కఁ దక్కిన కాలములయందు సోదరులిరువురు కలసియే చిత్తరువులను వ్రాయుచు వచ్చరి. అట్టి భ్రాతృవాత్సల్యమునుగలిగియున్న రవివర్మను దుఃఖసముద్రమునముంచి రాజవర్మ నిరుటి సంవత్సరమునఁ గాలధర్మమునొందెను. అతఁడింకను గొంతకాలముజీవించియుండినచోఁ బ్రపంచములో స్వభావమువ్రాయు చిత్రకారులలో మేటియనిపించుకొనియుండును. రవివర్మయొక్క సోదరియగు మంగళాబాయి విశేషగానవిద్యాసంపన్నురాలు. ఆమెయుజిత్రలేఖనమందు మిక్కిలి నేర్పరురాలు. రవివర్మ మిగులదయాంతఃకరణముగలవాడు. ఔదార్యసౌశీల్యాదిసద్గుణసంపన్నుడు.

ఓ చదువరులారా!

ఇంతవఱకు మీయుల్లమును బల్లవింపఁజేయు సచ్చారిత్రమునుడివితిని. సోదరవాత్సల్యముచే నామహానుభావుని చరిత్రమును వినుచు నానందవార్ధినోలలాడు మిమ్ములను పిడుగులతోనిండిన తుపానువంటిదుఃఖవార్తచే నొక్కసారి దుఃఖసముద్రనముంచి వేయుచున్నందులకు నన్నుమన్నింపఁబ్రార్థిలు. ఏమహామహుఁడుత్తమవంశసంజాతుండై చిఱుతప్రాయముననే తనబుద్ధికౌశలమునుజూపి తల్లిదండ్రులకు సంతోషదాయకుఁడయ్యెనో, ఏమహానుభావుఁడు చిఱుతప్రాయముననే తనమేనమామయొక్క యసంపూర్తి చిత్తరవును బూర్తిచేసి యాయనచేబహుమానమువడసెనో, ఏధీవిశాలుండు పిన్నవయసుననే చిత్తరవులచే రాజాధిరాజులమెప్పువడసెనో, ఏచిత్రకారోత్తముఁడు, ఆసేతుహిమాచలపర్యంతమునుగల గృహములను తన పటములచేనలంకరించి దిగంతవిశ్రాంతకీర్తిమంతుండయ్యెనో ఏమహాత్ముఁడు నిర్జీవములైపడియున్న హిందూదేశశిల్పాదిశాస్త్రకాంతలకు జీవాధారుఁడై ప్రకాశించెనో ఏవిద్యానిధి సమస్తదేశవస్తుప్రదర్శన సభలో మేలుచేయివడసి బంగారుపతకములను బహుమానముగానందెనో అట్టి ‘‘రాజారవివర్మ’’ 2 అక్టోబరు 1906న కీర్తిశేషుఁడయ్యెనని చెప్పుటకునోరాడకున్నది. ఆహా ! ! వ్రాయుటకుఁగలమాడకున్నది.

-బాలాంత్రపు నీలాచలము

 

 

  గోగా.. అందుకే నీకంత గ్లామర్!

when will you marry

నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో ముద్దాడుతున్నకడలి హోరులో కపాల పరిహాసపు ప్రతిధ్వని. పుర్రె కదిలింది. ఎముకలగూడు లేచింది. సమాధి పగిలింది.

అస్థిపంజరం కొండ దిగింది. ఊర్లోకొచ్చింది. ఇంటర్నెట్ కఫేకు వెళ్లింది. గూగుల్ సెర్చ్ లో కెళ్లింది. కావలసిన దాన్ని క్షణంలో వెతికి పట్టుకుంది. మానిటర్ పై మెరిసిపోతున్న రంగురంగుల బొమ్మను లేని నిలువుగుడ్లేసుకుని చూసింది. కొన్ని నిమిషాల మౌనం. అస్థిపంజరం వణికింది. లేని కళ్లు చెమ్మగిల్లాయి. లేని గుండె బరువెక్కింది. అస్థిపంజరం లేని నోటితో మళ్లీ నవ్వింది. పగలబడి నవ్వింది. లేని పొట్టను పట్టుకుని విరగబడి నవ్వింది. నవ్వీనవ్వీ అలసిపోయి కుర్చీలో జారగిలబడింది. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంది. దగ్గరున్న మనుషులను పలకరించింది. ఎవరూ పలకలేదు. గిల్లింది. ఉలకలేదు. రక్కింది. కదల్లేదు. అరిచింది. వినలేదు. కపాల కనురంధ్రాలు ఎర్రబడ్డాయి. కోపమొచ్చింది. ఏడుపొచ్చింది. నవ్వొచ్చింది. పిచ్చొచ్చింది.

కాసేపటికి అస్థిపంజరం కుదుటపడింది. రెండు ఈమెయిల్ అడ్రస్ లు సృజించుకుని చాటింగ్ లో స్వీయ సంభాషణ మొదలెట్టింది.

‘‘విన్నావా గోగా? నవ్వు బతికున్నప్పుడు ఈ తాహితీ దీవిలోనే 1892లో నువ్వేసిన ‘నువ్వెప్పుడు పెళ్లాడతావే?’ బొమ్మ 1800 కోట్ల రూపాయలకు అమ్ముడుబోయిందట!’’

‘విన్నాను. అందుకేగా విషయమేంటో కనుక్కుందామని గోరీ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాను. ఇంతకూ ఏ మహానుభావుడు కొన్నాడో?’’

‘‘ఖతర్ రాచవంశం వాళ్లని అంటున్నారు’’

‘‘నేనూహించింది నిజమేనన్న మాట! రాజులే కొనుంటారని అనుకున్నాన్లే. అన్ని డబ్బులు రాజుల వద్దేగా ఉంటాయి !’’

‘‘పొరపాటు! ఇప్పడు కిరీటం, రాజదండం గట్రాలేని పెద్దమనుషుల వద్ద కూడా అంతకంటే ఎక్కువ డబ్బులున్నాయి’’

‘‘మరే, లోకం బాగా ముదిరిందన్నమాట! రాజులు కాని వాళ్లు అంత డబ్బెలా సంపాదిస్తారో?’’

‘‘మరీ అంత అమాయకంగా మాట్లాడకు. నువ్వు బతికున్నప్పుడు స్టాక్ ఎక్స్ఛేంచ్ బ్రోకర్ గా పనిచేశావు కదా. డబ్బులెలా పోగపడతాయో తెలీదా ఏంటి?’’

‘‘ చచ్చినా ఈ స్టాక్ ఎక్స్ఛేంచ్ గోలేనా? అదంటే రోసిపోయేగా బొమ్మలపై మనసు పారేసుకుని, పెళ్లాం, పిల్లలను విడిచిపెట్టి, యూరప్ గీరపు వదలి, సముద్రాలు దాటి ఈ దీవికొచ్చి హాయిగా బొమ్మలేసుకుందీ, ఇక్కడి వాళ్లతో కలసిపోయిందీ, ఇక్కడే కన్నుమూసిందీ!’’

‘‘కొయ్ కొయ్ కోతలు! ఇక్కడి వాళ్లతో కలసిపోడానికొచ్చావా, లేకపోతే ఇక్కడి నీ కూతురి వయసున్నకన్నెపిల్లలను ఈ పచ్చని దీవిలో, అందమైన తీరంలో రంజుగా అనుభవించడానికొచ్చావా?’’

‘‘ఛత్. మళ్లీ అవే కూతలు! నేనెవర్నీ బలవంతంగా అనుభవించలేదే, ఎవరి పెళ్లాలనూ లేపుకు రాలేదే! వాళ్ల నాకు నచ్చారు. నేనూ వాళ్లకు నచ్చాను. ఇష్టమున్నన్నాళ్లు కలిసున్నాం, ఇష్టం లేకపోతే విడిపోయాం. డబ్బులపై, కానుకలపై ఆశతో ఇష్టం లేకున్నా ఒళ్లప్పగించే నవనాగరికపు ఆడాళ్లనో, లేకపోతే కడుపు నింపుకోడానికో, పిల్లలను సాకడానికో ఒళ్లప్పగించే వేశ్యలనో అనుభవిస్తే అది పవిత్రప్రేమ అవుతుంది కాబోలు!’’

‘‘అంటే నీది శృంగారం, మిగతా వాళ్లది..’’

gauguin

‘‘నేనలా అనడం లేదు. నాకు నచ్చింది నేను చేశాను. నా ఇష్టం వచ్చినట్టు బతికాను. ఆత్మవంచన చేసుకోలేదు. కృత్రిమత్వంపైకొట్లాడాను, సహజంగా బతకాను. ఉంటే తిన్నాను, లేకపోతే పస్తున్నాను. రోగాలపాలయ్యాను. క్రుశించాను. అంతేకానీ ఎక్కడా రాజీపళ్లేదు. నాకే అమ్మాయిల పిచ్చుంటే ఆ స్టాక్ ఎక్స్ఛేంచ్ లో కోట్లు సంపాదించి రోజుకో ఆడదాంతోనే గడిపేసుందును కదా. నేను చట్రాల్లో ఇమడలేదు. స్వేచ్ఛ కోసం పలవరించాను. నిష్కల్మషమైన, గాఢమైన ఆదిమప్రేమ కోసం పరితపించాను. అది స్వార్థమే. కానీ అది నా జీవితాన్ని, తనివితీరని నా మనోదేహాలను ఛిద్రం చేసుకుని సుఖించే స్వార్థం! డబ్బుదస్కం, పేరుప్రతిష్టలను కోరే స్వార్థం కాదు!’’

‘‘శభాష్. అందుకేగా నవ్వంటే ఈ పిచ్చిజనానికి అంతిష్టం! నవ్వు చచ్చి వందేళ్లు దాటినా నీ బొమ్మలకు అంత విలువ! నాటి నీ తిరుగుబాటుకు ప్రతిఫలంగా నీ బొమ్మలపై ఇప్పడు కనకవర్షమెలా కరుస్తోందో చూడు!’’

‘‘హు… బతుకున్నప్పడు తన్నితగలేశారు. చిత్రహింసలు పెట్టారు. బొమ్మలేసుకుంటానంటే పెళ్లాం నవ్వింది. తిట్టింది. కొట్లాడింది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికిపోయింది. తాగుబోతువంది, తిరుగుబోతువంది. బొమ్మలు మానితేనే కాపురమంది. చివరికి దూరమైపోయింది’’

‘‘పాపం ఆవిడ తప్పేముంది? అందరి ఆడాళ్ల మాదిరే కాపురం నిలుపుకోవాలని ఆరాటపడింది’’

‘‘మరి నా ఆరాటం! నేనేం కోరాను? బొమ్మలేసుకుంటానూ అని అన్నా. అంతేకదా. మూర్ఖపు జనానికి నా బొమ్మల విలువ తెలియకపాయ. ఇప్పుడిన్నికోట్లు పోసి కొంటున్న నా బొమ్మలను ఆనాడు అమ్ముకోడానికి ఎన్ని తిప్పలు పడ్డాను? ఎందరి కాళ్లావేళ్లా పడ్డాను? బొమ్మలు అమ్ముడుపోక, డబ్బుల్లేక, కూడూ గుడ్డాలేక, కడుపు దహించుకుపోయే ఆకలితో, పీక్కుపోయిన దేహంతో, రోగాలతో మంచానికి అతుక్కుపోయి, స్నేహితులు దయదలిస్తే కాసింత రొట్టెముక్క తిని, ఘాటు యాబ్సింత్ ను కడుపులో దింపుకుని మత్తులో చిత్తుగా పడిపోయి, పిచ్చిపచ్చిగా వాగుతూ..’’

‘‘అందుకేగా నీకంత గ్లామర్! అంత గుర్తింపు ఊరకే వస్తుందా మరి!’’

’’చచ్చాక వస్తుందనవోయ్, బావుంటుంది! యథార్థవాది బతుకుంటే లోకవిరోధి. చచ్చాకే వాడికి విలువా, గౌరవమూ. సరేగానీ, ఆ ఇద్దరు ఆడంగుల బొమ్మలో ఏముందనోయ్ అంత డబ్బెట్టి కొన్నారు?’’

‘‘కాంతులీనే రంగులు, సరళ రూపాలు, నిష్కల్మషమైన ఆదిమజాతి అతివల స్వప్నాలు.. కళాచరిత్ర గతినే మార్చేసిన సౌందర్య విలువలూ గట్రా ఏమిటో ఉ..న్నా..య..ట!’’

‘‘ఉ..న్నా..య..ట! ఏంటా ఎత్తిపొడుపు మాటలు! ఏం అవన్నీఅందులో లేవా? నేనాడు వీటి గురించే కదా బుర్రబద్దలు కొట్టుకుంది. క్లుప్తత, సారళ్యం, మటుమాయల పొడలేని స్వచ్ఛవర్ణాల ఉద్విగ్ననగ్ననర్తనం.. మొత్తంగా కళ్ల తెరలపై పదికాలాలపాటు నిలిచిపోయే అపురూప కళాదృశ్యం..’’

‘‘ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాదనను. కానీ వీటితోపాటు నీ విశృంఖల జీవితం, నీ తిరుగుబాటు కూడా నీ పేరుప్రతిష్టలకు కారణం కాదంటావా?’’

‘‘మళ్లీ అదేమాటంటావు! నన్నుకాదు నా బొమ్మలను చూడు. ముదురురంగుల ముక్కవాసనల, టన్నుల భేషజాల హావభావాల, పైపైసొగసుల రోతముసుగుల పక్కన.. నా మహోగ్ర జ్వలితవర్ణాల ఆవరణల్లో మెరిసే కొండల్లో, చెట్లలో, గుడిసెల్లో, పశువుల్లో, పక్షుల్లో, పళ్లలో, రాళ్లలో, ఆదిమ దేవతా విగ్రహాల్లో, కల్లాకపటం తెలియని పరువాల్లో, ప్రణయాల్లో, ప్రసవాల్లో, మెలకువలో, నిద్రలో, తీపికలల్లో, పీడకలల్లో, మరణాల్లో, గోరీల్లో.. తారసపడే నా అజరామర కళాభివ్యక్తిని చూడు..’’

‘‘ఇవన్నీ సరే. వీటితోపాటు నీ బతుకులోనూ కావలసినంత మసాలా ఉంది కదా. అందుకే నీ బొమ్మలకన్ని డబ్బులు’’

‘‘నోర్ముయ్, మూర్ఖుడా! నీ బుర్రను ఈ తాహితీ కొండపై బండరాయితో బద్దలుకొట్టిపారేస్తా.. నీ తోలువొలిచి, దానిపై నీ నెత్తుటితో బొమ్మలేస్తా.. నీ మాంసాన్నిఈ దీవి మృత్యుదేవత ఓవిరీకి నైవేద్యం పెడతా.. నీ ఎముకలపై కొండదేవరల బొమ్మలు చెక్కి ఆడుకొమ్మని దిసమొలల పిల్లలకిస్తా..’’

‘‘అందుకేగా నీకంత గ్లామర్, నీ బొమ్మలకన్ని డబ్బులు..’’

                                                                                                                              వికాస్

(ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడు పాల్ గోగా(Paul Gauguin 1848-1903) తాహితీ దీవిలో ఉన్నప్పుడు Nafea Faa lpoipo(When Will You Marry? పేరుతో వేసిన చిత్రాన్ని ఖతర్ రాజవంశం మొన్న రూ. 1800 కోట్లకు కొన్న విషయం తెలిసి..ఒక బొమ్మకు ఇంత ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి)

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు పక్కన మౌనంగా నుంచుని అందమైన తేడాలు తప్ప అన్ని తేడాలూ సమసిపోవాలని కోరడం మినహా మరేమీ చెయ్యలేం. అందమైన తేడాలు నిజంగానే అంత బావుంటాయా?

రాజా రాజవర్మ.. అవును రాజా రాజవర్మనే! రాజా రవివర్మ కాదు. రవివర్మ తమ్ముడు. అన్న అనే చిక్కని నీడ కింద పూర్తిగా వికసించకుండానే నేలరాలిన మొగ్గ. అన్నను జీవితాంతం అంటిపెట్టుకుని అతని కంటికి రెప్పలా, చేతికి ఊతకర్రలా బతికిన మనిషి. సోదరుడు పురుడుపోసిన హిందూ దేవతలకు బట్టలు సర్దిన మొనగాడు. అన్న బొమ్మకట్టిన నానా రాజుల, తెల్లదొరల ముఖాల వెనక కంటికింపైన తెరలను వేలాడదీసిన సేవకుడు. రవికి బంటురీతిగా మెలగి, అతని వెంట ఆసేతుహిమాచలం తిరిగి, ఏవేవో పిచ్చికలలు కని, అవి తీరకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒక మసక రంగుల జ్ఞాపకం.

మనకు రవివర్మ గురించి తెలుసు. జనం అతని దేవతల బొమ్మలను పటాలు కట్టుకుని పూజించడమూ తెలుసు. అతని నున్నటి వక్షస్థలాల మలబారు, నాయరు అందగత్తెల చూపులకు మన చూపులు చిక్కుకోవడమూ తెలుసు. అతని చిత్రాలు యూరోపియన్ కళకు నాసిరకం నకళ్లని, వాటిలో కవిత్వం, సహజత్వం లేదని, అతనిదంతా క్యాలండర్ ఆర్ట్ అని.. కారణంగానో, అకారణంగానో చెలరేగే విమర్శకుల గురించీ కొంత తెలుసు. ఆ తెలిసిన దాంట్లోంచి అరకొరగా, అస్పష్టంగా కనిపించే అతని తమ్ముడి కథేంటో తెలుసుకుందాం.

ఇద్దరు వర్మలు

ఇద్దరు వర్మలు

రాజవర్మ రవివర్మకంటే పన్నెండేళ్లు చిన్న. 1860 మార్చి 3న కిలిమనూర్ ప్యాలెస్ లో పుట్టాడు. నాటి త్రివేండ్రమైన నేటి తిరువనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కిలిమనూర్. తండ్రి ఎళుమావిల్ నీలకంఠన్ భట్టాద్రిపాద్. బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు. తల్లి ఉమా అంబాబాయి క్షత్రియ. కవయిత్రి, గాయని. వీరికి నలుగురు పిల్లలు, రవివర్మ, గొడవర్మ, రాజవర్మ, మంగళాబాయి. మాతృస్వామ్య వ్యవస్థ కనుక ఉమ పుట్టింట్లోనే ఉండేది. ఆమె సోదరుడి పేరు కూడా రాజా రాజవర్మే. చిత్రకారుడు. ఇంట్లో కథాకళి నాట్యాలు, సంస్కృత నాటకాలు, కచేరీలు సాగేవి. రవివర్మ మేనమామ వద్ద తొలి కళాపాఠాలు నేర్చుకుని పద్నాలుగేళ్లప్పుడు త్రివేండ్రానికెళ్లాడు. రాజాస్థాన చిత్రకారుల వద్ద, అతిథులుగా వచ్చిన పాశ్చాత్య చిత్రకారుల వద్ద నానా తంటాలుపడి తైలవర్ణ చిత్రాలు నేర్చుకున్నాడు. రవివర్మ పెద్ద తమ్ముడు గొడవర్మ సంగీతంలో దిట్ట. చెల్లెలు కూడా బొమ్మలు వేసేది. చిన్నతమ్ముడు రాజవర్మ త్రివేండ్రమ్ లో ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాడు. షేక్ స్పియర్, ఆలివర్ గోల్డ్ స్మిత్, బాల్జాక్ రచనలంటే ఇష్టం.

రవివర్మ పేరు దేశమంతటా మారుమోగింది. దేశంలో ఇన్నాళ్లకు పాశ్చాత్యులకు సరితూగే కళాకారుడు పుట్టాడని దేశీ కళాపిసాసులు ముచ్చటపడ్డారు. బొమ్మలు వేయించుకోవడానికి రాజులు, తెల్లదొరలు బారులు తీరారు. చేతినిండా పని. లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడపడానికి మనిషి కావాలి. ఇంగ్లిష్, దొరల మర్యాదలూ గట్రా తెలిసినవాడు కావాలి. తమ్ముడు నేనున్నానని ముందుకొచ్చాడు. సెక్రటరీ మొదలుకొని నౌకరీ వరకు అన్ని పనులూ చేసిపెడతానన్నాడు. అన్న తమ్ముడికి బొమ్మలు నేర్పాడు.

చిత్రాయణంలో రామలక్ష్మణుల ప్రస్థానం మొదలైంది. రవివర్మ బరోడా రాజు కోసం వేసిన నలదమయంతి, శంతనమత్స్యగంధి, రాధామాధవులు, సుభద్రార్జునులు వంటి పౌరాణిక చిత్రాల రచనలో రాజవర్మ ఓ చెయ్యేశాడు. చెల్లెలు మంగళాబాయి కూడా రంగులు అద్దింది. నైపుణ్యం పెద్దగా అక్కర్లేని బట్టలు, ఆకాశం, నేల, బండలు, ఆకులు, చెట్ల కాండాలు వగైరా వెయ్యడం వాళ్లపని. అన్నకు తీరికలేకుంటే దేవతల ముఖాలపైనా, చేతులపైనా చెయ్యిచేసుకునేవాళ్లు. అన్న వాటిని సరిదిద్దేవాడు. అంతా కుటీరపరిశ్రమ వ్యవహారం.

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

పచ్చని కేరళ సీమలోకి తొలుచుకొచ్చిన సముద్రపు కాలవల్లో చల్లని వెన్నెల రాత్రి పడవ ప్రయాణాల్లో అన్నదమ్ములు భారత భాగవత రామాయణాలు చెప్పుకున్నారు. ఏ దేవతను ఏ రూపలావణ్యాలతో కేన్వాసుపైకి తీసుకురావాలో ముచ్చటించుకున్నారు. బొమ్మలు వెయ్యడానికి దేశమంతా తిరిగారు. మద్రాస్, మైసూర్, బాంబే, బరోడా, ఉదయ్ పూర్, ఢిల్లీ, లక్నో, కాశీ, ప్రయాగ, కోల్ కతా, కటక్, హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ.. అన్నదమ్ములు కాలూనని పెద్ద ఊరుకానీ, స్నానమాడని నది కానీ లేకుండా పోయింది. కొన్ని బొమ్మలను కలసి వేసేవాళ్లు. వాటిపై ఇద్దరూ సంతకాలు చేసేవాళ్లు. కలసి నాటకాలకు, గానాబజానాలకు వెళ్లేవాళ్లు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రికల్లో న్యాపతి సుబ్బారావు పంతులు వంటి కాంగ్రెస్ నేతల రాతలు చదువుతూ దేశ స్థితిగతులు చర్చించుకునేవాళ్లు. బాంబే రెండో ఇల్లయింది. దాదాభాయ్ నౌరోజీ, తిలక్, రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహామహులతో కలసి తిరిగేవాళ్లు. కోల్ కతా వెళ్లినప్పుడు టాగూర్ల జొరసొంకో భవంతిలో బసచేశారు. అబనీంద్రనాథ్ టాగూరు బొమ్మలు రవికి నచ్చాయి.

అన్నకు పౌరాణిక గాథలపై మక్కువ. తమ్ముడు ప్రకృతి ఆరాధకుడు. దాని పరిష్వంగంలో పులకరింతలు పోయాడు. ప్రకృతి(ల్యాండ్ స్కేప్) చిత్రాలు భారతీయ కళలో అంతర్భాగం. మొగల్, కాంగ్రా, బశోలీ, రాజ్ పుత్ వగైరా కళాసంప్రదాయాలన్నింటా చెట్టుచేమలు నిండుగా ఉంటాయి. రాజవర్మకు అవి నచ్చలేదు. తనపై పాశ్చాత్య కళాప్రభావం ఉంది కనుక తన దేశ ప్రకృతిని పాశ్చాత్య కళాకారుల్లాగే ఆవిష్కరించాడు. ఆంగ్లేయ ప్రకృతి చిత్రకార దిగ్గజాలు టర్నర్, కాన్ స్టేబుల్ లపై వచ్చిన పుస్తకాలను చదివాడు. రాజవర్మ ప్రకృతి ప్రేమ, కవితా హృదయం అతని డైరీల్లోని ప్రకృతి వర్ణనల్లో గోచరిస్తుంది. రవివర్మ రాజమందిరాల్లో రాచగణాన్ని చిత్రించే వేళ తమ్ముడు చెట్టుచేమా, చెరువులూ కాలవలూ పట్టుకుని తిరిగేవాడు.

పల్లెపడుచు

పల్లెపడుచు

స్టూడియోకు తిరిగొచ్చి వాటిని చిత్రికపట్టేవాడు. ఒడ్డున కొబ్బరి చెట్లతో, లోపల గూటిపడవతో, నారింజరంగు నింగి వెలుతురు ప్రతిఫలించే పరవూర్ సరస్సును, ఆకుపచ్చ నీటి కాలవలను, చెరువుగట్లను ఇండియన్ ఇంప్రెషనిస్ట్ మాదిరి పొడగట్టాడు. ఒంటిపై తడిచిన తెల్లచీర తప్పమరేమీ లేని యువతిని తొలిసంజెలో నెత్తిపై నీళ్లబిందెతో ఓ చిత్రంలో చూపాడు. ‘పంటకోతలు’ చిత్రంలో..

పంటకోతలు

పంటకోతలు

గోచితప్ప మరేమీ లేని మలబారు నల్లలేత పరువాన్ని ఆవిష్కరించాడు. పసుపురంగుకు తిరిగిన పొలం, ఆకాశం, బూడిదాకుపచ్చలు కలసిన కొబ్బరి తోటల నేపథ్యంలో ఆమె చేరో చేత్తో గడ్డిమోపులు పట్టుకుంది. ఫ్రెంచి రొమాంటిస్ట్, రియలిస్ట్ చిత్రకారులు మిలే, లెపెజ్, జూల్ బ్రెతా వంటివాళ్లు వేసిన ఆడరైతుల బొమ్మలకు ఏమాత్రం తీసిపోదీ కేరళకుట్టి. ‘నాటుసారా కొట్టు’ లో సారాకుండ, సీసాల మధ్య స్టూలుపై వయ్యారంగా కూర్చుని బేరం కోసం ఎదురుచూస్తున్న మలయాళీ బిగువు మగువను పరిచయం చేశాడు. అన్న వేసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ లోంచి కోడిపుంజును అరువుకు తెచ్చుకుని ఆ కొట్టు ముందుంచాడు.

రవివర్మ, రాజవర్మలు సమకాలీన యూరోపియన్ అకడమిక్ కళను చాలా దూరం నుంచే అయినా జాగ్రత్తగా గమనించేవాళ్లు. ‘ది ఆర్టిస్ట్’ పత్రిక తెప్పించుకుని చదివేవాళ్లు. రవివర్మ మూర్తిని రాజవర్మ, రాజవర్మ మూర్తిని రవివర్మ చిత్రించేవాళ్లు. ఆప్త బంధువును కోల్పోయిన దుఃఖపురోజుల్లో నెరిసిన గడ్డంతో ఉన్న అన్నను తమ్ముడు ఓ చిత్రంలో చూపాడు. తమ్ముడు కళ్లద్దాలు పెట్టుకుని కిరోసిన్ దీపకాంతిలో దీక్షగా చదువుకుంటున్నట్లు వేశాడు అన్న.

సారా కొట్టు

సారా కొట్టు

మనదేశంలో ఆడవాళ్లు మోడళ్లుగా ముందుకు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. అయితే వాళ్లు బట్టలు విప్పడానికి ససేమిరా అనేవాళ్లు. దీంతో అన్నదమ్ములు బ్రిటన్, జర్మనీల నుంచి నగ్నమహిళల ఫొటోలు తెప్పించుకుని వాటితో కుస్తీపడేవాళ్లు. వాళ్ల దేహాలకు చీరలు, రవికలు తగిలించి భారతీయీకరించేవాళ్లు. అందుకే రవివర్మ అందగత్తెలు యూరప్ ఆడాళ్లకు బొట్టుపెట్టి, చీరలు చుట్టినట్లుంటాయనే విమర్శలు ఉన్నాయి. రాజవర్మ 1895 నుంచి 1904 వరకు రాసుకున్న డైరీల్లో అతని జీవితమే కాకుండా రవివర్మ చివరి పదేళ్ల జీవితమూ బొమ్మకట్టినట్లు కనబడుతుంది. అవి ఒకరకంగా రవివర్మ డైరీలు కూడా. రవివర్మకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మిరుమిట్లు గొలిపే అతని కళతోపాటు, రాజవర్మ చేసిపెట్టిన ప్రచారం కూడా సాయపడింది. బొమ్మలు అడిగిన వాళ్లకు అన్న బొమ్మలు ఎంత గొప్పగా ఉంటాయో ఉత్తరాలు రాసేవాడు తమ్ముడు. ఏ సైజుకు బొమ్మకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడం, వేసిన వాటిని భద్రంగా పార్సిల్ చేసి పంపడం, వచ్చిన డబ్బును బ్యాంకులో వెయ్యడం, రాని బాకీలను వసూలు చెయ్యడం వరకు అన్ని పనులూ పకడ్బందీగా చక్కబెట్టేవాడు. దేశవిదేశాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుని అన్నవేసిన చిత్రాలను పంపేవాడు.

రవివర్మ తన పెయింటింగులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి తపనపడ్డాడు. తన పేరుతో బాంబేలో మిత్రుల భాగస్వామ్యంతో కలర్ లితోగ్రాఫ్ ప్రెస్సును స్థాపించాడు. లావాదేవీలను తమ్ముడికే అప్పగించాడు. భాగస్వామి మోసగించాడు. అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. తీర్చడానికి తంటాలు పడ్డారు.

రవివర్మ, రాజవర్మలకు ఆంధ్రదేశంతో తీపి, చేదు అనుభవాలున్నాయి. ఇద్దరూ హైదరాబాద్, కురుపాం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖల్లో బసచేశారు. రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ రైల్వే స్టేషన్ల గుండానే ముంబైకి వెళ్లేవాళ్లు. తాడిపత్రి, రేణిగుంటల్లో కలరా పరీక్షలు చేయించుకున్నామని రాజవర్మ ఓ చోట రాసుకున్నాడు. కురుపాం రాజా వారి ఇంట్లో వడ్డించిన తెలుగు వంటకాలు తమిళ, మలయాళ వంటలకు భిన్నంగా ఉన్నా రుచిగానే ఉన్నాయని రాసుకున్నాడు.

ప్రెస్సుతో ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదమ్ములు 1902 తొలి మాసాల్లో హైదరాబాద్ లో బసచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ వంటి మిత్రుల మాటలపై భరోసా పెట్టుకున్నారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ తమతో బొమ్మలు వేయించుకుంటాడన్నఆశతో చాన్నాళ్లు పడిగాపులు కాశారు. దేశమంతా గౌరవించిన రవివర్మకు నిజాం మాత్రం ముఖం చాటేశాడు. అధికారులు రేపోమాపో అంటూ తిప్పారు. అన్నదమ్ములు తొలుత సికింద్రాబాద్ లోని దీన్ దయాళ్ ఇంట్లో బసచేశారు. పొరపొచ్చాలు రావడంతో చాదర్ ఘాట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని బొమ్మలు మొదలుపెట్టారు. వ్యాహ్యాళికి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లేవాళ్లు. చార్మినార్, చౌమొహల్లా, ఫలక్ నుమా ప్యాలెస్ లను, మీరాలం చెరువును చూశారు. ఆడ మోడళ్ల కోసం వాకబు చేశాడు రాజవర్మ. కొంతమంది వేశ్యలు వస్తామన్నారు కానీ మాట తప్పారు. చివరకు ఓ ముస్లిం యువతి ఒప్పుకుందట.

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజవర్మ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చిత్రాన్నివేశాడు. ఆ చెరువు నీళ్లు వందేళ్ల కిందట ఎంత తేటగా, నీలంగా ఉండేవో ఈ చిత్రం చూపుతుంది. కుడివైపు చెట్ల మధ్య మసీదు గుమ్మటం ఉంది. చెరువు ఒడ్డున గడ్డిలో పశువులు మేస్తున్నాయి. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. చెరువులో పడవలున్నాయి. నేటి కళాప్రమాణాలకు ఇది నిలవకపోవచ్చు కానీ 1903లో మద్రాస్ లో జరిగిన పోటీలో దీనికి బంగారు పతకం వచ్చింది.

రాజవర్మపై పరోక్షంగా నాటి జాతి పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఉంది. పరాయి పాలనలో రవివర్మ హిందూదేవతల బొమ్మలను చిత్రించడం, వాటి నకళ్లను వేలకొద్దీ అచ్చుగుద్ది జనంలోకి తీసుకెళ్లడం ఆ ఉద్యమం సామాజిక ఉపరితలాంశంపై వేసిన ప్రభావ ఫలితమే. రాజవర్మకు కపటత్వం నచ్చదు. మూఢాచారాలు గిట్టవు. బాంబేలో బహుశా ఏదో లావాదేవీలో మోసపోయిన సందర్భంలో 1901 ఆగస్ట్ 1న డైరీలో ఇలా రాసుకున్నాడు, ‘ the markets are all great liars and try to take advantage of the ignorance of the strangers.’ నిజాం బొమ్మను కొంటానని చెప్పి, ఆ తర్వాత బేరం తగ్గించిన ఓ హైదరాబాదీపై కోపంతో 1902 జూన్ 8న.. ‘the majority of the Hyderabad nobles and officials are notorious for their dishonesty, want of truthfulness and immoral character‘ అని తిడుతూ రాసుకున్నాడు. జోస్యాలపై నమ్మకం లేదంటూ.. ’I have myself no belief in palmistry, fortune telling etc., for it is my firm conviction that God has not given men the power to pierce into the mystics of the dark future, for the consequences of possessing such a power would be disastrous to the continuance of the world’ అని 1903 అక్టోబర్ 14న రాసుకున్నాడు.

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజవర్మ క్షత్రియ నాయర్ పెళ్లిచేసుకున్నాడు. పేరు జానకి. పిల్లలు కలగలేదు. బొమ్మలెయ్యడానికి దేశాలు పట్టుకుని తిరగడం వల్ల భార్యను సరిగ్గా చూసుకోలేకపోయాడు. రవి కూడా అంతే. మాతృస్వామ్యంలో, అందునా దేశదిమ్మర చిత్రకారులు కావడంతో భార్యలకు చుట్టాల్లా మారిపోయారు. భార్యను సరిగ్గా చూసుకోలేకపోయానని రాజవర్మ అంత్యకాలంలో అన్న కొడుకు రామవర్మతో వాపోయాడట. రాజవర్మ 1904 చివర్లో మైసూర్ రాజు కోసం బొమ్మలేసే పనిలో బెంగళూరులో ఉన్నప్పుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మద్రాసుకు తీసుకొచ్చారు. పేగుల్లో అల్సర్. ఆపరేషన్ చేసిన కొన్నరోజులకే 1905 జనవరి 4న 45 ఏళ్ల ప్రాయంతో కన్నుమూశాడు. అప్పడు జానకికి ముప్పైమూడేళ్లు. ఆమె చెల్లెలు భగీరథి ప్రసిద్ధ మలయాళ నవలా రచయిత సీవీ రామన్ పిళ్లై భార్య. భగీరథి అంతకు కొన్నేళ్లముందు ఆరుగురు పిల్లలను అమ్మలేని వాళ్లను చేసి వెళ్లిపోయింది. రామన్ ను పెళ్లాడింది జానకి. అతని నవలలకు ఆమె స్ఫూర్తినిచ్చిందంటారు. ఆమె 1933లో కన్నుమూసింది.

రాజా రాజవర్మ

రాజా రాజవర్మ

గాయకుడికి గాత్రసహకారంలా పాతికేళ్లు తన కుంచెకు వర్ణదోహదం అందించి తన కళ్లముందే సెలవంటూ వెళ్లపోయిన తోడబుట్టినవాడి మరణంతో రవివర్మ కుదేలయ్యాడు. పైగా మధుమేహం, మతిమరపు, ప్రేలాపనలు. అప్పటికే రవి భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. పెద్ద కొడుకు కేరళవర్మ దురలవాట్లకు లోనయ్యాడు. రవి 1906 అక్టోబర్ 29న తను పుట్టిన కిలిమనూర్ ప్యాలెస్ లోనే ఆఖరి శ్వాస తీశాడు.

ఆ అన్నదమ్ములను బతికి ఉన్నప్పుడూ, పోయిన తర్వాతా ఎందరో ఆడిపోసుకున్నారు. అయితే వాళ్లిచ్చిపోయిన బొమ్మలను జనం ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. తలనిండ పూదండ దాల్చే రవివర్మ అందగత్తె వలువల మడతల్లోనో, అతని సరస్వతి, సీత, శకుంతల, దమయంతులు కూర్చున్న రమణీయ వనాల్లోనో, ఆ వనాల దాపు కొలనుల్లోనో, కొలనులపైని కాంతిగగనంలోనో రాజవర్మ కుంచెపూతలు సంతకాల్లేకుండా తారసపడుతూ ఉంటాయి. ఆ అన్నచాటు తమ్ముడి ప్రకృతి లాలసను, అతనికి అందిన అందాలను లీలగా గుర్తుచేస్తూ ఉంటాయి.

-పి.మోహన్

P Mohan