చాయ్ కప్పులో గోదారి!

(త్వరలో ప్రచురణ కానున్న భాస్కరభట్ల కవిత్వ సంపుటికి రాసిన ముందు మాట)

గోదావరి నాలో మొదటి సారి ఎప్పుడు గలగల్లాడిందో చెప్పాలి ఇప్పుడు భాస్కరభట్ల గురించి రాయాలంటే! నదితో కాపురమున్నవాడి గురించి రాయాలంటే నది నించే మొదలెట్టాలి, ఎందుకంటే అతని మూలం నదిలో వుంటుంది కాబట్టి! ఈ “పాదముద్రలు” భాస్కరభట్ల దాచుకున్న పదముద్రలు, నెమలీకలు.  తనే అన్నట్టు:

ఇప్పుడంటే రెండేగానీ…

చిన్నప్పుడు నాకు మూడు కళ్లు!

పుస్తకంలో

దాచుకున్న

నెమలికన్నుతో కలిపి!!!

కవిత్వంతో మొదలైన జీవితం చివరికి  పాటతో ముడిపడడం గోదావరి జీవులకి కొత్త కాదు. అది దేవులపల్లి కావచ్చు, నండూరి సుబ్బారావు కావచ్చు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కావచ్చు, సిరివెన్నెల కావచ్చు, భాస్కరభట్ల కావచ్చు. వాళ్ళు కవిత్వం రాసినా అందులో గోదావరి గలగలే  పల్లవి అందుకుంటాయి.  నేను ఎంతో ఇష్టపడే ఇస్మాయిల్ గారి తొలినాళ్ళ కవిత్వంలో కూడా ఆ పాట వినిపిస్తుంది,  “తొలి సంజ నారింజ ఎవరు వలిచేరూ?” అంటూ.

అయితే, ఇస్మాయిల్ లాంటి కవులు పాటలాంటి గోదావరి ప్రవాహంలోంచి కవిత్వ సెలయేటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే, భాస్కరభట్ల అటు ఆ ప్రవాహంలోనూ ఇటు ఈ సెలయేటిలోనూ రెండీట్లోకి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే, ఇప్పటికీ అతన్ని నడిపించే దారి  గోదారే అని నా నమ్మకం.

భాస్కరభట్ల ఆ గోదారి మీంచి హైదరాబాద్ దాకా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన 1998 నాటి రోజులు నాకు మంచి జ్ఞాపకాలు. అప్పుడు నేను ఆంధ్రభూమి దినపత్రికలో ఫీచర్స్ ఎడిటర్ గా వుండే వాణ్ని. తెలుగు జర్నలిజంలోనే మొట్ట మొదటి ప్రయోగంగా ప్రతి వారం నాలుగు పేజీల సినిమా స్పెషల్ “వెన్నెల” ని అప్పుడు మొదలు పెట్టాం. అదిగో అక్కడ కలిశాం నేనూ భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ. ఆ ఇద్దరూ రాజమండ్రిలో ఒకే నది వొడ్డున తిరిగారు, ఒకే బడిలో పెరిగారు, ఒకే కవిత్వపు ఒడిలో కరిగిపోయారు. ఆ స్నేహపు అందమైన ఒరవడి వాళ్ళ జీవితాల్ని ఇప్పటికీ వెలిగిస్తోంది.

చాలా అమాయకమైన అప్పటి ఆ ఇద్దరి ఆ లేత నవ్వు  కళ్ళల్లో  జీవితం మీదా, అక్షరాల మీద బోలెడు ప్రేమ కురుస్తూ వుండేది. సాయంత్రాలు మేం అలా నడుచుకుంటూ వెళ్లి, గార్డెన్ కేఫ్ లో హైదరాబాదీ చాయ్ లు తాగుతూ కవిత్వమూ కబుర్లూ…జీవితం చాలా బిజీగానూ వుండేది, ఆ బిజీలో బోలెడంత బిజిలీ కూడా వుండేది. ఇప్పుడు బిజీ మాత్రమే మిగిలి, బిజిలీ మాయమయ్యింది కానీ…

పులగం చిన్నారాయణ  సినిమా పత్రికా రచయిత. సినిమా గురించి ఏం అడిగినా క్షణాల మీద రాసివ్వగలిగిన మేదోజీవి. అతనికి భిన్నంగా భాస్కరభట్ల ఊహాజీవి. అందమైన ఊహలే ప్రాణంగా పాటలూ కవిత్వమూ అల్లుకుంటూ వుండే కాల్పనికుడు. కాని, పాపం, పొట్ట కూటి కోసం సినిమా వ్యాసాలు రాసిచ్చే వాడు మాకు. అతని కల మాత్రం ఎప్పుడూ పాటే! పాట అతన్ని రాత్రీ పగలూ వెంటాడేది! లోకాన్నంతా వొక్క  పాటగా మాత్రమే ఊహించుకుంటూ హాయిగా బతికేసే simple philosophy అతనిది. అందుకే, అందులో ఎలాంటి complications, implications వుండవ్. అతని నవ్వులోని ఆ simple innocence అతని వాక్యాల్లోకి హాయిగా తర్జుమా అవుతుంది ఇప్పటికీ- బహుశా, అందువల్లనే అతను మహామాయామేయ జగత్తులో వుండి కూడా, తన అందమైన అద్దాన్ని పోగొట్టుకోలేదు. ఆ శబ్ద దర్పణానికి మాయలు నేర్పలేదు.

ముఖ్యంగా, భాస్కరభాట్లలో వొక చమత్కారి వున్నాడు. తనతో మాట్లాడిన అనుభవం వున్న స్నేహితులకి అదేమీ కొత్త సంగతి కాదు. అతని మాట “పన్”చ దార పలుకు. అయితే, ఎప్పుడూ వొక చక్కని అనుభూతి చిలుకు. ఈ పదముద్రలో పన్ లేదు కాని, మంచి పరిమళభరితమైన అనుభూతి వుంది-

శీతాకాలం

తెలావారు ఝాము

మంచు కురుస్తోంది…

అప్పుడే వాయతీసిన

వేడి వేడి ఇడ్లీలమీద పొగలా!

తనకి  పదాల రాహస్యం బాగా తెలుసు. శ్రీశ్రీ లోంచీ, తిలక్ లోంచీ మొదలైన వాడికి పదాలూ వాక్యాల లోగుట్టు తెలియడంలో వింత లేదు. పన్నెండేళ్ళ నించీ కవిత్వంతో కాపురం చేస్తున్నవాడికి ఆ అందంలోని ప్రతి మెరుపూ తెలుసు. చాలా లోతైన విషయాలు కూడా సరళంగా చెప్పడం కూడా ఈ మెరుపు విద్యలో భాగమే.

ఇద్దరం..

మధ్యలో మరికొందరు..

మళ్ళీ మనిద్దరమే..!!

 

గుండె కలుక్కుమనే ఇంకో భావం:

హుండీలో వేసిన

అజ్ఞాత భక్తుడి కానుకలాగ

అనాధపిల్లలు..!!

 

కవిత్వ పదాల్ని  మహా పొదుపుగా వాడ్తాడు భాస్కరభట్ల. కథనంగా కవిత్వాన్ని సాగదీయడం కాకుండా, వొక మెరుపులా మెరిపించే గజల్ సౌందర్యమేదో అతని కవిత్వంలో కనిపిస్తుంది. క్లుప్తత దాని అంతర్/ బహిర్ సౌందర్యం. గజల్ కవిలానే భాస్కరభట్ల రెండు పంక్తుల్లో ఇహపరాల పారమెరిగిన వాడు. ఉదాహరణకి:

కనుపాపల మగ్గం మీద

కలల్ని నేస్తోంది

నిద్ర!!

మరో సందర్భంలో:

చీకటి చూరుకి

వేలాడుతున్న

వెలుతురు ఖడ్గంలా

వీధి దీపం !!

తనలోని తాత్వికుడు ఎక్కడ దొరుకుతాడూ అంటే, సహజమైన ప్రకృతికీ, మనిషి సృష్టించుకున్న అసహజమైన వికృతాలకూ మధ్య విరోదాభాసలో-

ఉదాహరణకి :

మా ఊరు

తప్పిపోయింది…

ఫ్లై-ఓవర్ వచ్చి..!!

~

‘Well’ settled

అనుకుంటుందేమో

నూతిలో కప్ప..!!

~

ఆకాశం

అదేపనిగా

ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..

లేకపోతే

ఇన్ని పొగమబ్బులెక్కడివీ?

విస్తరించి చెప్పడం ఏనాడూ భాస్కరభట్ల లక్షణం కాదు, చెప్పాల్సిందేదో చెప్పేసి చక్కా వెళ్ళిపోతాడు వచ్చిన దారినే! కాని, తను చెప్పింది మాత్రం మనలోపల మిగిలిపోతుంది, మంచి స్నేహవాక్యంలాగా- పాదముద్రలన్నీ అలాంటి అనుభవరసం నింపుకున్న నిమ్మతొనలే. మన మానసిక ఆరోగ్యానికి రోజూ కొన్ని కావాలి ఇవి.

తొలినాటి వొక స్నేహితుడు తన చిరునామా మళ్ళీ కవిత్వంలో వెతుక్కుంటున్న ఈ సమయం నాకు అర్థవంతమైన కవిసమయం!

*

 

రావి శాస్త్రి గారి ఆరు సారా కధల్లో ….

 

ravi-sastry

నా మేనమామ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు శాస్త్రి గారి ఆప్తమిత్రుల్లో ఒకరు కాబట్టి, వారు మా మావయ్య తో విశాఖలో ని సింధియా కోలని లో ఉన్న మా ఇంటికి తరచూ  రావడం వల్ల వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం నా అదృష్టం. ఆ పరిచయం నా వ్యక్తిత్వమూ, ఆలోచనలు సరి అయిన దారిలో రూపొందడానికి చాలా సహకరించింది. ఆరు సారా కధలు ఏప్రెల్ 2 1961 నుంచి  లో  విశాలాంధ్ర ఆదివారం సంచికలో 6 వారాలు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వయస్సులో నేను అన్ని  కధలు చదివి  చాలా ఇష్టపడి మా ఎకనామిక్స్ డిపార్టుమెంట్ లో ( అప్పుడు నేను ఆంధ్రవిశ్వవిద్యాలయం లో 4 సంవత్సరాల  ఎకనామిక్స్‌ హానర్స్ రెండవ సంవత్సరం విద్యార్ధిని) అందరితోనూ ఆ కధలు చదివించే వాడిని.

ఆ తర్వాత 1983 లో ఢిల్లీలో కల జె,యెన్.యు లో టంకశాల అశోక్ గారి ఆధ్వర్యంలో ఉండే  “ప్రగతి సాహితి” మిత్రులతో కలిసి సారా కధల ఆధారంగా   అత్తిలి కృష్ణరావు గారు రాసిన సారాంశం నాటికను నా దర్శకత్వంలో  ఢిల్లీలో 5 చోట్ల తర్వాత విజయవాడ లో జరిగిన విరసం సభల్లోనూ ప్రదర్శించాం . ఆ రకంగా ఆరు సారా కధలతో 21 ఏళ్ల తర్వాత నా అనుబంధాన్ని గట్టి పరచుకున్నాను.

2014 మార్చ్  లో ఢిల్లీ తెలుగు సాహితీ వేదిక వారు రావిశాస్త్రి గారి కధల మీద ఒక సదస్సు నిర్వహించినప్పుడు, శాస్త్రి గారి ఆరు సారా కధల మీద ఒక ప్రసంగం  చేయాలని ,   ఈ కధలని విపరీతంగా ఇష్టపడే  వాడిని కనుక,    సదస్సు నిర్వాహకుల అంగీకారం తర్వాత ఒక ప్రసంగం  చేశాను. ఇప్పుడు అదే ప్రసంగాన్ని  చాలా మార్పులు చేసిన వ్యాసమిది.  55 సంవత్సరాల తర్వాత నాకెంతో ఇష్టమయిన రావి శాస్త్రి గారి ఆరు సారా కధలను మళ్ళీ తలచు కోవడం  ఎంతో ఆనందం గా ఉంది.

మన రాజ్యాంగానికి స్వాతంత్రం  వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా మన న్యాయ వ్యవస్థ ఇంకా బ్ర్తిటిష్ వాడు తన వలస పాలన సౌలభ్యం కోసం  పెట్టిన   న్యాయ పద్ధతులు, ముఖ్యంగా భారత శిక్షా స్మృతి, ( బ్రిటిషోడు 1860 లో పెట్టినదే  – పాపం కొన్ని మార్పులు తర్వాత చేసినట్టున్నారు), ఇంకా అమల్లో ఉండడం మన దౌర్భాగ్యం. 2015, 2016 ల్లో,    బ్రిటిషోడు ప్రజలు తమకు అణిగి ఉండడం కోసం ఏర్పాటు చేసిన దేశభక్తి న్యాయం (Sedition Law) కూడా ఇంకా అమల్లో ఉండడం రాజ్యం చేస్తున్న దౌర్జన్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దేశద్రోహమనే ఈ చట్టం , 2016 జనవరి – ఫిబ్రవరిలో లో హైదరాబాద్ సెంట్రల్ & జె.ఎన్.యు. విశ్వవిద్యాలయాల విద్యార్ధుల మీద జరిగిన దౌర్జన్యానికి  ప్రస్తుత ప్రభుత్వం వాడింది. . అక్కడే కాదు ఇంకా అనేక చోట్ల ఈ ‘దేశద్రోహ నేరం’ ప్రస్తుత కేంద్ర పాలకులకు తరచుగ  ఉపయోగ పడుతోంది. ఈ మార్పులను దృష్టిలో  పెట్టుకొని, 2 ఏళ్ల తర్వాత ఈ వ్యాసాన్ని తిరిగి రాసాను.

పేదల – బడుగుల సమస్యల్నే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు, ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి ఇచ్చిన   గొప్ప వరం. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు. రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రజా వ్యతిరేకత  చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది

“ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాల కన్నా ప్రతిభావంతంగా సమాజాన్ని  ప్రతి ప్రతిఫలిస్తుంది. అందుకే “సాహిత్య పరిశీలన సామాజిక అధ్యయనానికి సాధనం మాత్రమే  కాదు అవసరం కూడా” అని మిత్రుడు సి.వి.సుబ్బారావు (విరసం రచయిత + పౌరహక్కుల ఉద్యమకారుడు  – సుర/సుబ్బా) తన విభాత సంధ్యలో అన్నారు. ఆ దృష్టి లో చూస్తే ఆరు సారా కధల పరిశీలన చాలా అవసరం  అని  నా ఉద్దేశం.

ఆరు సారా కధల సంపుటి  ముందు మాటలో శ్రీ శ్రీ  గారు అన్నట్టుగా ” అతడు కళా స్రష్ట. అతడు వ్రాసిన ఆరు కథానికలు ఆరు కళా ఖండాలు.  తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమయిన పాత్ర చిత్రణ ఈ కధల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో  కధనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది. జీవితాన్ని  నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దాని మీద వ్యాఖ్యానించినట్టు గా కనిపించని వ్యాఖ్యానం ఉంది”

రావి శాస్తి గారి ఆరు సారా కధల్లో ప్రత్యేకంగానూ, ఆయన రచనలు అన్నిటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత-దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్  దూరీకరణ  సూత్రం  (alienation effect) ,  తాదాత్మ్య విచ్ఛిత్తి , కనిపిస్తుంది.  ఇందు లో  నాటకంలో ప్రేక్షకులకు/కధలో పాఠకులకు , తాదాత్మ్యం కలిగించి వాస్తవమని భ్రమ కలిగించాలన్న సూత్రానికి భిన్నం గా ఆ తారతమ్యాన్ని ఛేదించి, నిరంతరం ఇది నాటకం/కధ అని జ్జ్ఞప్తికి తెస్తూ, వాటిల్లో ఇమిడి ఉన్న నైతిక, సామాజిక, రాజకీయ సంఘర్షణల అంతరాయాన్ని ప్రేక్షకుడు/పాఠకుడు గ్రహించే విధంగా  చేయడం ఈ సూత్రం లక్ష్యం.

ఉదాహరణకి ‘మాయ’ కధలో ముత్తేలమ్మ అన్న పాత్ర చేత అప్పుడు దేశం లోని సామాజిక పరిస్థితిని శాస్త్రి గారు చెప్పించిన విధం చూడవచ్చు. ఆమె ఇలా అంటుంది “పీడరు బాబూ సెప్తున్నాను ఇను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు సెప్పినా  నాను  నమ్మను.   ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప  మరేట్నేదు. పశువులూ-నోర్లేని సొమ్ములు  – ఆటికి నీతుంది కానీ మనకి నేదు. సదువు లేందాన్ని నాకూ నేదు; సదువుకున్నాడివి నీకూ నేదు. డబ్బు కోసం నోకం – నొకమంతా పడుచుకుంటోంది. డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి సదువుకున్న సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలిసోళ్ళు  నాయ్యేన్నమ్ముతున్నారు. మందు కోసం పెద్దాసుపత్రికెల్తే  అక్కడ మందులమ్ముతున్నారు. గుళ్ళోకెళ్లి కొబ్బరికాయ సెక్కా  కాన్డడబ్బూ  ఇస్తే ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. వొట్లొస్తే ( ఎన్నికలు) పీడరు బాబూ నువ్వూ. నానూ ,ఈ బాబూ, అందరం అమ్ముడయిపోతున్నాం. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరెట్నేదీలోకంలో.” ఇంతకన్నా సమాజంలో డబ్బు   ఎంత ముఖ్య పాత్ర వహిస్తోందో ఈ మాటల్లో శాస్త్రి గారు   నేరుగా  పాఠకులకు చెప్పారు. అలాగే ఈ కధల్లో  చాలా సార్లు పాత్రలు తిన్నగా పాఠకులతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి .

సామాన్య ప్రజలు తమ రోజు వారీ జీవితం లో ఎదుర్కునే రాజ్యం యొక్క వివిధ రూపాలను /శక్తులను, వాటితో ప్రజల ప్రతి చర్యలను ఉదాహరణగా తీసుకొని మన సమాజంలో రాజ్య స్వభావం  మీద మనకున్న అమాయక మాయను తొలగించడానికి రావి శాస్త్రి గారు ఆరు సారా కధల్లో అపూర్వమయిన ప్రయత్నం చేశారు. ఆయన ఈ రచనలో  పాత్రలు రాజ్యం తాలూకా   రూపాలు లేదా శక్తులు, విభిన్న సందర్భాల్లో  ఎదుర్కుంటాయి.   వాళ్ళ సామాజిక అనుభవాలని విశ్లేషించడం రావి శాస్త్రి గారు సాధించిన విజయం. ఆ పరిశీలనను, పైన చెప్పిన  బెక్ట్ పద్ధతి లో పాఠకులు ఆలోచించే శైలి లో వారు రాశారు.  అయన ఆరు సారా కధల  తరవాత వచ్చిన ఇతరుల కధల మీద, ముఖ్యం గా బీనాదేవి , పతంజలి రచనల మీద, వాటి ప్రభావం చాలా ఉంది.

వివిన మూర్తి, ఏం.వి.రాయుడు గార్ల సంపాదకత్వంలో వచ్చిన “రాచకొండ విశ్వనాధశాస్త్రి  రచనా సాగరంలో” లో వారు చెప్పినట్టు “బాధ్యతగా మాత్రమే రాయాలనుకుంటున్న రచయిత   తన ఆవేశానికి అనుగుణంగా కళాకౌశవాన్ని ఇనుమడింప చేసుకుని ఆరు సారా కధల వంటి కళాఖండాలను  వెలువరించిన దశ ఇది. ఈ కధలు శాస్త్రి గారు తన రాజకీయ దృక్పథాన్ని స్థిరపరచుకున్న దశలో వచ్చిన మొదటిది”.

ఆరు సారా కధల్లో రావి శాస్తి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజల పైన, తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలస వాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షా స్మృతి , మిగిలిన వలస వాద న్యాయ సూత్రాల సహాయంతో, రాజ్యం కొమ్ము కాచే  రెండు ముఖ్య సంస్థలు పోలీసు , న్యాయ వ్యవస్థ ల గురించి ఒక తిరస్కార   విమర్శ చూపించారు.  అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను, నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు. ఇది మనం మోసం కధలో చూడవచ్చు.  ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులను తమ స్వంత పనులకోసం  రాజ్యాన్ని నడిపే రాజకీయ నాయకులు, ఆ నాయకులను నిలబెట్టి గెలిపించే అత్యధిక ధనిక వర్గాలు  ఎలా హింస పెడతారో   అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు.

బ్రిటిషోడు తన రాజ్యాధికారం కోసం మరియు  తన వలసను స్థిరపరచుకునేందుకు ఏర్పాటు చేసిన శిక్షాస్మృతిని, న్యాయవ్యవస్థని స్వాతంత్రం వచ్చేకా కూడా మన దేశం లో అమల్లో ఉండటాన్ని “మాయ’ కధలో ఒక సీనియర్ న్యాయవాది ఒక చిన్న న్యాయవాదితో చెప్పిన ఈ కింది సంభాషణ లో కనిపిస్తుంది. అప్పటి వలస చట్టాలను గత రెండు సంవత్సరాలుగా , 2015-2016 ల్లో మన ప్రభుత్వం  దేశ ప్రజలమీద, ముఖ్యంగా విద్యార్ధుల మీద, రాజ్య పద్ధతులను ప్రశ్నిస్తున్న అన్నీ వర్గాల మీద   ప్రభుత్వం   తన సంస్థల  ద్వారా జరిపిస్తున్న దాడుల్లో కూడా ఈ సంగతి ఖచ్చితంగా కనిపిస్తుంది.

జ్ఞానమొచ్చినప్పటినుంచి,  నాకు  ఒక విషయం ఎప్పుడూ అర్ధమయ్యేది కాదు. చట్టాలోకటే అయినప్పుడు ఒక కేసు నిర్ణయం ఒకొక్క కోర్టు లో ఒకొక్క విధంగా యెందుకుంటుందని . ఈ న్యాయ నిర్ణయం లో అంతులేని పేద నిస్సహాయులకు, పలుకుబడీ, అధికారం లో ఉన్న తేడా కూడా మనం చూస్తూనే ఉంటాం. మనది చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమనీనూ , ఇంత గొప్ప దేశం లో న్యాయం  చాలా నిజంగానూ, స్వచ్ఛంగా తళతళ మెరుస్తుందనీనూ    నమ్మేవారు శాస్త్రి గారు   చెప్పిన ఈ కింది మాటలు (మాయ కధ)  మనస్సులో పెట్టుకోవాలి. ఈ మాటల నిజం  ఈ మధ్య ప్రభుత్వం ఆడిన  డీమోనటైజేషన్ నాటకం లో బాగా కనిపిస్తుంది. దేశం లో ఉన్న నల్ల డబ్బును బయటకు తీయడానికి మొదలు పెట్టిన ఈ ప్రక్రియ లో నల్ల డబ్బున్న కొద్దిమందీ బాగానే ఉన్నారు, ఏమీ లేని జనం మాత్రం  రోజుల తడబడి లైన్లలో నుంచుని , అందులో కనీసం 100 పైగా చనిపోయిన దౌర్భాగ్యం,  ఎలా జరిగుంటుందో  కూడా ఈ మాటల్లో తెలుస్తుంది.

ఇంగ్లీషువాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే.      మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలివెధవల్ది. లాభం బుగతది     (పెట్టుబడిదారుడిది).   ఏమైనా అంటే , ఎదురు తిరిగితే మన (రాజ్యం)    సాయానికి  (పోలీసులున్నారు) కోర్టులున్నాయి, జెయిళ్ళున్నాయి.  ఇవి లేకపోతే        ఇంగ్లీషువాడి  రాజ్యమే లేదు. ……… ఆఖర్నయినా ఏం          చేశాడు? అక్కడా-అక్కడా  చలాయించినట్టు ఇక్కడ (కూడా) కూలి       వెధవలు   పెత్తనం             చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది.  వెంటనే సాటి        షావుకార్లకి   రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి      జారుకున్నాడు.   గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారం లాగే ఉంది.   లాభాలు  లాభాల్లాగే ఉన్నాయి.  ఏదైనా       రొష్తుంటే అదంతా మన      వెధవల్దే  అయింది.

అందుకే ఇప్పటి న్యాయవ్యవస్థలో, అప్పటి వలస రాజ్యం లో లాగా, కోర్టుల్లో అనాధుల ఆక్రందన, పేదల కన్నీటి జాలులే కనిపిస్తాయి. ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే  డిసెంబర్ 31, 2015 కు , దేశంలో నిందమోపబడి, న్యాయ విచారణ కోసం  జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సగానికి పైగా – 54.9 శాతం , (దళితులు  21.6%. గిరిజనులు  12.4% మరియు ముస్లింలు 20.9%) వీరే కనిపిస్తారు. వీరు కాక మిగతా వెనుకబడిన కులాల (OBC) 31% శాతం కూడా కలిపితే మొత్తం 85.9% ఉన్నారు.

ఇదేమాట శాస్త్రి గారు 50 సంవత్సరాల కిందట  రాసిన వారి నిజం నాటకం ముందు మాటలో   ఇలా చెప్పారు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ, ప్రతీ ఛోటా కూడా ఎందరో      కొందరమాయకులు వాళ్ళు చేయని నేరానికి శిక్షలనుభవించడం            జరుగుతోంది. కానీ , ఈమాత్రం డబ్బూ పలుకుబడీ, పదవీ, హోదా        కలవాడెవడూ పడడు, ఇరుక్కోడు, ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి    తప్పించుకోగలడు.

ఇలా ఎన్ని రోజులు?. రావి శాస్త్రి గారు సారా కధల్లోని పుణ్యం కధలో మార్పు ఎలాగో సూచించారు. ఈ కధలో  పోలమ్మ అన్న ఆవిడ గురించి కరుణాకరం అనే లాయరు ఇంకో తోటి లాయరుతో మాట్లాడుతూ :

            అది తెలివితక్కువ ముండ, వెర్రి వెంగళ్ళప్పన్నావు . ఇప్పటికీ బాగానే  ఉంది. అలాంటి వాళ్ళు దేశంలో కోటానుకోట్లున్నారు. అందుకే నువ్వూ      నేనూ బతికేస్తున్నాం. కానీ ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా        ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు వాళ్ళు గప్పున తెలివి             తెచ్చుకుంటారు. వాళ్ళు తెలివి     తెచ్చుకుంటే నువ్వూ నేనూ,   నీలాంటి వాళ్లూ నాలాంటి వాళ్ళం అంతా కూడా జాగ్రత్తగా      ఉండాలి.            ఏంచేత జాగ్రత్తగా వుండలో తెలుసా?. అప్పుడు    పుణ్యం వర్ధిల్లుతుంది . అప్పుడు మనలాంటి పాపులం బహు జాగ్రత్తగా ఉండాలి.

  ఇప్పుడున్న వ్యవస్థలో, రాజ్యం సామాన్య ప్రజల అణచివేతకు, దోపిడీకి, బ్రిటిష్ వాడు తన వలస పాలన కోసం ఏర్పాటు చేసిన చట్టాలూ, న్యాయ వ్యవస్థలనూ,  స్వాతంత్రం వచ్చాక కూడా ప్రభుత్వం ఎలా వాడుకుంటున్నాయా 1961 లోనే చెప్పారు తన ఆరు సారా కధల్లో.

 చివరగా….

ఆరు సార కధల్లోని మోక్షం కధలో చెప్పినట్టు  –   ఒహ్హో మర్చేపోయాను! గవర్నమెంటుకి పాపం (ఈ డీమోనటైజేషన్ తో) పిచ్చెకింది కదూ? ఎలా ఉందో ఏమిటో చూద్దాం పదండి.

(ఈ వ్యాసం రాయడం లో మిత్రులు మృణాలిని, వేణుగోపాల్, , సాయిపద్మ, విజయభాను కోటె మంచి సలహాలనిచ్చి  సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు )

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ది లాస్ట్ బ్రాహ్మిణ్: ఒక దళారీ పశ్చాత్తాపం!

last

 

నిజాయితీగా మాట్లాడాలంటే నిర్భీతి ఉండాలి అని అంటారు. నిర్భీతి అనే క్వాలిటీ నిజాయితీగా మాట్లాడ్డానికి పూర్వగామిగా ( precursor) గా ఉండడం ఏమిటి ? మనకు ఏవన్నా నష్టం అంటే అది కూడా తీవ్రమైన నష్టం భౌతికంగానో, ఆర్థికంగానో లేదా మన అభిలాషకు, ఆశలకు  (  aspirations   ) విఘాతం కలుగుతుందనుకున్నప్పుడో భీతి ఉండాలి. అలాంటప్పుడు  నిజాయితీగా మాట్లాడాలంటే వెనకా ముందు ఆలోచించుకోవాలి. ఐతే కొల్పోడానికి ఏమీ లేని తనం ఉన్నప్పుడు, కోల్పోడానికి సిధ్ధపడ్డప్పుడు, కోలుపోతను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడ్డానికి భీతి ఎందుకు ?  పైగా మనమొక తప్పులో భాగమై నప్పుడు, ఆ తప్పు డొంక తిరుగుడుగా, సూచనప్రాయంగా, నీళ్ళు నములుతూ కాక నిజాయితీగా ఉన్నదున్నట్టుగా ఒప్పుకోవాలంటే (ఏమీ కోల్పోలేని తనం వలన కలిగే )  నిర్భీతి తో పాటు పాశ్చాత్తాపం కూడా ఉండాలి.  ఆ పాశ్చాత్తాపం ‘ అయ్యిందేదో అయ్యింది ..ఇక పద ‘ అన్నట్టు గాక  Descriptive  గా ఉంటే అందులో నిజాయితీ బలంగా ఉంటుంది.

‘ దళారీ పశ్చాత్తాపం ‘ అనే పుస్తకం విడుదల అయ్యాక ప్రపంచ బేంకు రాజకీయాలు చాలా దుమారమే లేపేసాయి. అంత వరకు ఈ రాజకీయాలు ఎవరికీ తెలియదని కాదు. ఐతే ఒక  insider  పబ్లిక్ గా నోరు విప్పి జరిగింది చెప్పడం తో , కేవలం విశ్లేషణ, గమనికల మీద ఆధారపడ్డ ప్రతి సామ్రాజ్య వ్యతిరేక వాదికి కాన్ ఫిడెన్స్ బల పడ్డది. ప్రతి సంస్థాగతమైన అన్యాయాల పట్ల ఒక ఖచ్చితమైన కంక్లూజన్ కు రావాలాంటే, శతృ స్థావరం నుండి ఒక్క వేగువైనా కావాల్సి వస్తుంది మనకు. శతృవు గురించి అంచనాకు రావడం ఒక ఎత్తైతే , వేగు సమాచారం ఒక బలమైన   conviction  ను నింపుతుంది. అది జరిగే యుద్ధం లో   predictability  ని తెస్తుంది. ‘ నిన్ను నీవు అర్థం చేసుకునే ముందు శతృవును అర్థం చేసుకో ‘ అనే మావో నినాదం సంపూర్తి అర్థాన్ని అప్పుడు సంతరించుకుంటుంది.

ఇంత ఉపోద్ఘాతం ఒక పుస్తక పరిచయానికి ఎందుకు అవసరమౌతుందో తెలుసుకోవాలంటే – అది ‘ ది లాస్ట్ బ్రాహ్మిణ్ ‘ కున్న ప్రత్యేకమైన ఫార్మాట్ ను గుర్తించడమే. ఇది ఆత్మకథ ఫార్మాట్ లో ఒక సనాతన బ్రాహ్మణుడి కుంచిత వ్యవహారాలను నిజాయితీగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం. అది కూడా అది ఒక సనాతన బ్రాహ్మణ వంశం లో పుట్టి కుటుంబ బంధాలపై ఉండే ప్రేమ చంపుకోలేక  కుటుంబ వ్యవహారాలపై ద్వేషం కలిగి ఉండే ఒక వ్యక్తి ఆ పుస్తక రచయిత  కావడం ఈ ఫార్మాట్ ప్రధాన లక్షణం.

నాకు ఈ  insider view  అవసరం ముఖ్యంగా అఫ్సర్ ‘ చంకీ పూల కథ ‘ రాసినప్పుడు తోచింది. అగ్ర కుల మేధావులు మార్క్సిస్టులమని చెప్పుకునే వాళ్ళు మైనారిటీ వాదాన్ని, సెక్యులరిస్ట్ ఫైట్ ను  ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య పోటీ కింద కుదించేసి మాట్లాడ్డం చూడ్డానికి అందంగా articulate  చేయడం , సాధారణ పాఠకులు డ్రైవ్ అయిపోవడం చూసి అనిపించింది ‘ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నిమ్న వర్గాల గురించి ఏమని ఊహించుకుంటూ ఉంటారో కదా ? ‘ అని. ‘ వీళ్ళు అగత్యం లేని పరిస్థితుల్లో నిమ్న వర్గాలను కూడ గట్టుకుని ఎలా పబ్బం గడపాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా ? ‘ అని. ‘ వీళ్ళ మాటలు ఆలోచనలు విన్న వాళ్ళెవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగున్ను కదా ? ‘ అని. నలుగురు అబ్బాయిలు గుమి కూడి ఒక అమ్మాయి గురించో , లేదా ఇక ఏదో సెక్సిస్ట్ టాపిక్ గురించో ఏం మాట్లాడుకుంటారో ఊహించి వారి గురించి అంచనాకు రావడం ఒక పద్దతి. ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి స్వయాన విని వారి గురించి ఒక అంచనాకు రావడం ఒక పద్దతి.

ఈ వేగులు అందించే సమాచారం లో మన అంచనాలు, విశ్లేషణకు లోతు వెడల్పును పెంచుతాయి.

“ఇలాంటి అభిప్రాయాలు మా నాన్న గారి నుంచి విన్నప్పుడల్లా ఆయన పట్ల నాకున్న వ్యతిరేకత మరింత ప్రబలమ్య్యేది.  శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రాతినిధ్యం వహించే సనాతన ధర్మం అంటే నాకు అరికాళ్ళ కింద మంటలు లేచేవి. మనిషిని మనిషిని విడదీసే ఈ కులాలు నిర్మూలింపబడాలని మానవులందరూ సమానంగ ఉండాలని నేను భగవంతుడిని మూగగా రోదించేవాడిని. మా నాన్న గారిని సనాతన ధర్మం నుండి బయట పడేయమని భగవంతుడిని ఒక సారి కోరుకున్నాను కూడా ” అని మధ్యలో ఒక చోట రచయిత చెప్తాడు. ఈ పుస్తకం మొత్తానికి ఇది భూమిక.  రచయిత తండ్రి తీవ్ర అనారోగ్యం తో, మరణానికి చేరువలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు,  తండ్రి కి కళ్లనీళ్ళ ప్రయంతం సపర్యలు చేసుకుంటూనే , ఆయన  psyche  పట్ల చంపుకోలేని ద్వేషానికి పుస్తక రూపం ఇస్తూ ఉండే  ఒక సంఘర్షణ వాతావరణం ఉండింది.

నాతో చాలా మంది అంటూ ఉంటారు ” బ్రాహ్మణులుగా పుట్టామండి…ఐతే మా చేతులో ఉందా ఏంటి ? మమ్మల్ని ఏ మాట మాట్లాడినా అలా వంకరగా విశ్లేషించడం ఏవన్నా భావ్యమా ? ” అని. పుట్టడం మన చేతులో లేదు. కాబట్టి మాకు మిగతా ఛాందస బ్రాహ్మణుల నుండి, బ్రాహ్మణ వాదులనుండి   exemption  కావాలి అని.  ఈ వాదనలో ఒక సౌకర్యం ఉంది. ఈ ఆత్మ విమర్శలో ‘ ఈ తప్పేదో జరగడం బానే ఉందే ‘ అన్నట్టు ఉంటుంది తీరు. కులం పుట్టుకకు సంబంధించిన అంశం కాదు, అది నిర్దుష్ట  సాంఘిక ఆర్థిక చట్రం కు సంబంధించింది అనే నిర్ధారణ జరిగాక ఈ లిబరల్ వాదనలు ఊపందుకున్నాయి. ‘ అసలు బ్రాహ్మణుడు అని నీకు ఇంకా ఎందుకు గుర్తు ఉంది ? ‘ అని అడిగితే ఏం తెలుస్తుంది ? భర్తనో భార్యనో బ్రాహ్మణ్ అయి ఉంటారు, ఇంట్లో సనాతన అచారాలు అలా కొనసాగుతూ ఉంటాయి, ప్రతి హిందూ పండక్కి ఇంట్లో సందడి ఉంటుంది, అడపా దడపా ఆఫీసుల్లో లిబరల్ బ్రాహ్మిణ్ అవ్వడం వల్ల అసలు సిసలు బ్రాహ్మిణ్ స్థాయిలో గౌరవం లేకున్నా ఉన్నత కులం వాడికుండె సగటు గౌరవం తక్కువ కాకుండా దొరుకుతుంటుంది, బంధువులు , మేధావులు చుట్టూ బ్రాహ్మణులే ఉండి బ్రాహ్మణ సందోహం ఆనందదాయకంగా లేకపోయినా తమ స్థాయిని గుర్తు చేసుకునే నిమిత్తం వరకైనా అలా ఉంటుంది.  ఇదంతా సోషల్ కేపిటల్ వెన్నంటి ఉంటుంది. ఆ మాత్రం దానికి ‘ నన్ను  exempt  చేయండి ‘ అని వాదించి , కొత్త తరహా బ్రాహ్మణ హక్కుల కోసం వాదించడం ఎందుకు ? ‘ సరేనండి…ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు ? పుట్టుకను మార్చలేము కదా ‘ అని వితండ వాదం చేసినప్పుడు నేనంటాను ‘ కులం తెలిస్తే తలలు తెగిపడతాయి అనే రోజు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతారా మీరు ? ‘ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత. రోహిత్ వేముల మరణానికి కారణమైన డాక్యుమెంటరీ ‘ ముజఫర్ నగర్ బాకీ హై ‘ ఫిల్మ్ మేకర్ బ్రాహ్మణుడు. ఒక ఇంటర్వ్యూ లో ” నేను బ్రాహ్మణ కులం లో ఉన్నా కాబట్టి నెను ప్లాన్ చేయని నేను ఊహించని అవకాశాలు నా చుట్టు ఉన్నాయి. కాబట్టి నేను సినిమా తీయగలిగాను. కులం అనేది లేకపోతే ఇంత కంటే ఇంకా బాగు తీయగలిగే వారు వచ్చే వారేమో ”  అన్నాడు. బ్రాహ్మణుడు కుల నిర్మూలన ఉద్యమం లో చేరుతున్నప్పుడు ఖరాఖండిగా జనాలకే కాదు, తనకు తాను చెప్పుకోవాల్సిన నిజం ఇది. డీ బ్రాహ్మినైజ్ కావడం లో మొదటి మెట్టు తనకున్న  Brahmin privileges  ను గుర్తించడం. ఇవేవీ లేనట్టు తెలీనట్టు నటించడం, లేదా తనకు మాత్రం అవి సంబంధం లేనట్టు మొహం పెట్టి మిగతా బ్రాహ్మణులను తిట్టడం గమనించలేని మూర్ఖమైన స్థాయిలో దళితులు, ఆదివాసీలు ముస్లిములు ఈనాడు లేరు.

ఈ ఆత్మ కథ లాంటి సాంఘిక ఇతివృత్తం కలిగిన పుస్తకం లో ఒక సనాతన బ్రాహ్మణ తండ్రి తన మొదటి కొడుకు హిందువుగా మారడం ( సనాతన ధర్మం ప్రచారాన్ని  కోరుకోదు. ఇతర వర్ణస్తులను సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకోమని కోరుకోదు ) ఇంకో కొడుకు ( రచయిత ) నాస్తికుడిగా మారడం, తన వంశానికి ఇక తనే చివరి బ్రాహ్మణుడిగా గుర్తించి చివరి క్షణాల్లో కూడా అదే మనోవ్యధలోనే బతుకుతాడు.

ఈ పుస్తకం ఒక సోషియాలజీ సబ్జెక్ట్ లాంటి పుస్తకం. సనాతన వర్ణశ్రమ ధర్మం లో బతికే ఒక బ్రాహ్మణ తెగ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా జీవిస్తుంది అని తెలియజేసే పుస్తకం. ఇస్లాం అని ప్రస్తావిస్తూ ఖురాన్ ఉంటుంది, క్రీస్తు బిడ్డలు అని ప్రస్తావిస్తూ బైబిల్ ఉంటుంది కాని హిందువు అని ప్రస్తావిస్తూ ఒక్క వేదం లేకపోయినా హిందువులు ఆ వేదాలను, ఆయా గ్రం థాలను నెత్తినేసుకుని తిరగడం భలే విచిత్రం. మొదటగా బ్రాహ్మిణిజం మాత్రమే మతం. అది ప్రజలను వర్ణాలుగా విడదీసింది. శ్రీ రామ కళ్యాణం బ్రాహ్మణుల ఆచారం. శివుడు, కృష్ణుడు వీళ్లందరూ బ్రాహ్మణుల ఇంటిలో మాత్రమే పరిమితం కావాల్సిన దేవుళ్ళు.  Temple system   బ్రాహ్మిణిజం ఈ సమాజం తో terms కుదిరించుకుని ఏర్పరుచుకున్న ఒక రాజీ. పూజారి వృత్తే కాని, బ్రాహ్మణుడి ప్రవృత్తి కాదు. ఈ విషయాలు తెలీక  ప్రతి హిందు ఛాందస వాది , అఖండ భారతం అని ఊగిపోతాడు. మన దేశం లో హిందుత్వం అన్న మతమే లేదు. ఉంటే అది బ్రాహ్మణీయ హిందుత్వం మాత్రమే. బ్రాహ్మణిజం అన్ని కులాల ప్రజలకు దేవాలయ వ్యవస్థ ద్వారా చేరాక, ఆయా వర్ణాశ్రమ ధర్మాలకు లోబడి ఉన్నా ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిని అనుకరించే పద్దతి మొదలయ్యింది. దళితుల్లో క్షవరం చేసే దళితులు వేరుగా ఉంటారు. వాళ్ళు దళితుల్లో దళితులకు  అధములు. సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సిన వ్రతం. ఐతే ప్రతి ఒక్కరూ చేస్తారు. పౌరోహిత్యం లో వైదిక పౌరోహిత్యం వేరు. పౌరాణిక పౌరోహిత్యం వేరు. సనాతన ధర్మం లో ‘ ఘర్ వాప్సీ’ లేదు. ఎందుకంటే అది హిందుత్వాన్ని నమ్మదు కాబట్టి. ( బ్రాహ్మణీయ హిందుత్వానికి సంఖ్యా బలం అవసరం ఎందుకయ్యింది అన్నది ఈ వ్యాసానికి వెలుపలి అంశం. ప్రస్తుతానికి వదిలేద్దాం )  దానికి శూద్రుడైనా ఇతర మతస్థులైనా ఒకటే. ఘర్ వాప్సీ చేసి ప్రయోజనం లేదు. బ్రాహ్మిణిజం అనే మతం ఒక వర్గం లోనే ఉండాల్సిన మతం . ప్రచారప్రధానం అయ్యాక అది బ్రాహ్మణీయ హిందూత్వం అయ్యింది. మనుస్మృతి  మన జీవన విధానం లో భాగమయ్యింది. ‘ వర్ణ ధర్మాన్ని అతిక్రమించడం అంటే తక్కిన వర్ణాల్లోకి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రవేశపెట్టడం అన్న మాట ‘ అంటూ , రచయిత ఇలా  అంటాడు ‘ మనుస్మృతి తగలబెట్తడం , భావొద్వేగాలను ప్రతిబింబిస్తుందే తప్ప , మనుస్మృతి సారాంశాన్ని మన జీవితాల నుండి వెళ్ళగొట్తలేదు ” ఇప్పుడు ప్రతి హిందువు ఒక బ్రాహ్మణుడిగా మారడం జరుగుతుంది. బ్రాహ్మణుల్లో వంటా వార్పు చేసే స్త్రీలు, ముట్టు బారిన పడే వీరు శూద్రులతో సమానంగా చూడబడతారు. బ్రాహ్మణ స్త్రీ లు ద్విజులు కాదు. వీరికి ఉపనయనం జరగదు. వేద మంత్రాలు చదివే అధికారం ఆ స్త్రీ లకు లేదు.  బ్రాహ్మణుల్లో స్త్రీలు సాధారణంగా వీణ ఎక్కువ నేర్చుకుంటారు. సనాతన ధర్మ వ్యవస్థలొ బయటి ప్రపంచం తో మగ వాళ్ల కన్న కాస్తో కూస్తో ఎక్కువ  interaction  పెంపొందించుకునే వాళ్ళు స్త్రీలే. ఈ పుస్తకం లో రచయిత తన తల్లి పరిస్థితి గురించి ఎంత మనోవ్యధ చెందుతాడో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. బ్రాహ్మణులు వాడే తిట్లు వేరు. ‘ సప్త కట్ల వెధవ ‘ ‘ లబోడి శంఖం ‘ లాంటి తిట్లు కనబడతాయి.

ఇలా సోషియలాజికల్ స్టడీ తో పాటు , ఒక బ్రాహ్మణుడిగా ఇంకో బ్రాహ్మణుడి రచనులు ఎలా అంతర్లీనంగా  connect  అవుతాయో కూడా రచయిత వివరిస్తాడు. ” బ్రాహ్మణ స్త్రీ లను చలం లేచి పొమ్మన్నాడని సనాతనస్తులు కాని హిందూ పాఠకులు పొరబడ్డారు. కానీ చలానికి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ లకు అంత ధైర్య సాహసాలు గానీ అవకాశాలు గానీ లేవని స్పష్టంగా తెలుసు. అందువలన సనాతన ధర్మ పీటాలకు అభ్యంతరం లేని ముస్లిం మతస్థులను తన రచనల్లో రహస్యంగా అభ్యర్థిబ్చాడు. ” ” చలం తన రచనల్లో వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ఊహ కూడా చేయలేదు. తన రచనల్లో వివాహాన్ని అరికట్టడం ద్వారా జాతి సాంకర్యాన్ని వర్ణ సాంకర్యాన్ని నివారించ బూని నాడు ” ఇలా చలం గురించి  బ్రాహ్మణ కోణం లో చూస్తునే విమర్శిస్తాడు. ఈ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనే కన్నా , ఇందులో ఎన్నో తరాల నుండి జరుగుతున్న బ్రాహ్మణ మేధో అవినీతిని బట్టి మొత్తానికి కొట్టివేసే వాదనగా కూడా అనిపించదు. అలాగే ” శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా లోని భాషంతా బ్రాహ్మణుల అద్వైత పరమాత్మ తత్వానికి – శంకరాచార్య వేదాంతానికి పూర్తిగా సంబంధించినదే . విశ్వానాథ సత్యనారయణ , కవితా ఓ కవితా చదివి శ్రీ శ్రీని తెగ కౌగిలించెసుకున్నట్టు చెప్తాడు. ‘ అది పురోగమనంగా కనిపించినా దాని ఆత్మ సనాతనమే . అది ఆ కవిత గొప్ప తనం’  అని అంటాడు రచయిత. అంతే కాకుండా గురజాడను విమర్శిస్తూ ఇలా అంటాడు ‘ సత్య సంధుడైన సౌజన్యారావు పంతుల్ని వైదిక బ్రాహ్మణుడిగానూ, లిటిగెంటు క్లయింటు రామప్పంతుల్ని వియోగి గాను గురజాడ చిత్రించాడు. వైదికులు సహజంగానే  వియోగులను అపహాస్యం చేస్తుంటారు. అంతెకాని గురజాడ ప్రత్యేకంగా బ్రాహ్మణులను విమర్శించింది లెదు ‘ అని కట్టే విరిచి నట్టుగా చెప్తాడు. ‘గురజాడ పూర్ణమ్మని వృద్ధుడికి యిచ్చి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. తన కుమార్తెకు సైతం బాల్య వివాహమే చేసాడు.’ అని మనకు విశదీకరిస్తాడు. అలా చె ప్తూ బ్రాహ్మణ కవులు రచయితల పట్ల ఇలా ముగిస్తాడు. ” మొత్తానికి బ్రాహ్మలకు సరిపడేదేదో కమ్యూనిజం లో ఉంది . అదేదో యెంతో కాలానికి కాని నాకు తెలీలేదు ”

అంతే కాక చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి. మఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఆది శంకరాచార్యుడు హిందువా బ్రాహ్మణుడా ? హిందుత్వం పై బుద్దిజం ప్రభావం , పదకొండవ పన్నెండవ శతాబ్దం లో దేవాలయాల పై దాడి దోపిడీ గురించి, చరిత్ర లో గుడికి ప్రాధాన్యత ఎంత ఉంది లాంటి విషయాలు కూడ మనం చూడవచ్చు.

రచయిత కుల నిర్మూలన పై ఆశవహంగా ఇలా  theorise  చేస్తాడు. ” పార్లమెంటును హేళన చేసే వాడు పార్లమెంటును ఏమీ చేయలేదు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నంగా పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారత దేశం లో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే. బ్రాహ్మణులు వస్తు జాలం కన్నా కష్టమైన భావ జాలాన్ని ఉత్పత్తి చేశారు. దాని మన్నిక చాలా కాలం ఉంటుంది. అది తిట్లతోనూ హేళనతోనూ నిర్మూలన కాదు. దీనిని ఎదుర్కోవాలాంటే చరిత్ర తెలియాలి. చరిత్ర చలన సూత్రాలు తెలియాలి. మానవ పరిణామం తెలియాలి. సంస్కృతి తెలియాలి. భావజాలం ఉత్పత్తి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి ”

ఈ పుస్తకం లో అక్కడక్కడా బ్రాహ్మణ జాఢ్యం చాయలు కూడా లేకపోలేదు. వీరేశ లింగం సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేశాడు అని ( సనాతన ధర్మమే ద్రోహం , దానికి తిరిగి ద్రోహం చేయడం ఏంటి ? ) , దీక్షితులు గారికి చందుడిలో మచ్చలా నల్లమందు అలవాటు ( అంటే ఆయన గారు  చంద్రుడు లాంటి వాడు అన్న మాట ) అంటాడు. ఐతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలి. ఇంత నిజాయితీగా రాస్తూ ఇలాంటి వాక్యాలు ఎందుకు దొర్లించాడు అని. రాణీ శివశంకర శర్మ గందరగోలవాది. ఆయన హిందూత్వాన్ని, కులాన్ని ఎంత నిరసిస్తాడొ, క్రైస్తవ్యాన్ని అంత నిరసిస్తాడు. హిందుత్వానికి వచ్చినా ఆ ప్రచార కాంక్ష సామ్రాజ్యవాద క్రైస్తవ కాంక్షగా చూస్తాడు. ఐతే వర్గ లక్షణం లేని మతం ఎలా ఉంటుందొ మనకు సరి అయిన వాదన దొరకదు. చాలా ఎలాబొరేట్ గా ఒక్కో పాయింట్ తీసుకుని ఆయన క్రైస్తవ్యానికి, హిందూత్వానికి పోలిక చూపిస్తూ రాస్తూ వస్తాడు. ముస్లిం మతస్తులు ఇక్కడ బతికి ఇక్కడే ఉండడానికి వచ్చారు. క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి రాలేదు. కేవలం దోచుకోడానికి వచ్చారు లాంటి కంక్లూజన్స్ కనిపిస్తాయి ఈ పుస్తకం లో.  ఇందులో కుటిలత్వం ఏమీ లేదు. కేవలం గందరగోళం. కొంచెం పిడివాద మూర్ఖత్వం తప్ప.

ఇలాంటి పాజిటివ్స్ నెగటివ్స్ తో చదవాల్సిన ఈ పుస్తకం సౌదా అరుణ తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఏ పుస్తక శాలలో కూడా దొరకదు. కేవలం సౌదాను ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేస్తే తప్ప దొరకదు. ప్రచురణ కర్తలు రివ్యూలపై అనాసక్తి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుస్తకం ఫార్మాట్ ఇందులో ఉన్న అంశాలు ఎంతగానో ఆకర్శించడం వలన తప్పక షేర్ చేసుకోదలచి రాయాల్సి వచ్చింది ( మితృడు సౌదాకు తప్పని సరి సారంగ పత్రికా ముఖంగా క్షమాపణలు. పాఠకుడికి రివ్యూ చేసే హక్కు నేను ఉపయోగించుకుంటున్నాను )

Note  : ఈ రివ్యూలొ చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు దొర్లాయి. అయితే సంస్కృత పర్యాయ పదాలు వాడ్డం చాత కాక అవి అలాగే ఉంచడం జరిగింది. వ్యాసకర్త వద్ద మరింత స్పష్టత కోరదల్చుకుంటే   pvvkumar@yahoo.co.uk  వద్ద గాని, ఫేస్ బుక్  ID – P V Vijay Kumar  వద్ద కూడ కాంటాక్ట్ చేయవచ్చు. 

*

 

 

మన “ఆధునికత” వొట్టి డొల్ల!

painting: Rafi Haque

painting: Rafi Haque

 

సాంస్కృతిక సామ్రాజ్యవాదం తృతీయ ప్రపంచదేశాలప్రజల మానసిక దౌర్భల్యాలనూ, ముఖ్యంగా అణగారిన ప్రజల్లో తమ “వెనుకబాటుతనం”, “సాంప్రదాయకత” పట్ల ఉన్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని వారికి ఒక రకమైన “వేగాన్నీ”, భావ ప్రకటనా స్వేఛ్ఛనీ ఇస్తున్నట్లుగా ఫోజు కొట్టి , వారి పాత కుటుంబ సామాజిక సంబంధాలను విచ్చిన్నం చేస్తుంది. తన కొత్త సంబంధాలను ప్రవేశ పెడ్తుంది. సంప్రదాయ వాదులనే ముద్రను చూసుకొని భయపడే తృతీయ ప్రపంచ దేశాల ప్రజల పట్ల , ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదం “స్వేచ్చగా అభిప్రాయాలు వెలిబుచ్చడం” పేరిట నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. మార్కెట్ అనే వొకే వొక్క ఆధునిక దైవం వుందని, దానికి అడ్డుగా వచ్చే సాంప్రదాయిక సంబంధాలన్నీ నాశనం చేయాలని సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఉపదేశిస్తోంది ( జేమ్స్ పెట్రాస్).

యింకా సాంస్కృతిక సామ్రాజ్యవాదం “ఆధునికత” అనే భాహ్య చిహ్నాలను ఆరాధించేలా చేస్తుంది. స్వతంత్ర వ్యక్తిత్వం పేరిట వ్యక్తివాదం పేరిట సామాజిక సంబంధాలపై దాడి చేస్తుంది అంటాడు జేమ్స్ పెట్రాస్. ప్రజలను వారి సాంస్కృతిక మూలాలనుంచీ, ఒకరికొకరు  యిచ్చిపుచ్చుకొనే సంప్రదాయాల నుంచీ తొలగించి ఆ స్థానంలో మీడీయా సృష్టించిన కృత్రిమ అవసరాలను ప్రవేశపెడ్తోంది అంటాడు. యిందుకు ఉదాహరణగా తమ వాతావరణానికి అనుకూలంగా వుండే,  వదులుగా, హాయిగా వుండే సంప్రదాయ దుస్తులను త్యజించి, తమకు తగని టైట్ బ్లూ జీన్ ఫ్యాంట్లు ధరించాలనీ, పెట్టుబడిదారీ మార్కెట్ డిమాండ్లకు తలవంచాలనీ, తృతీయ ప్రపంచ దేశాల ప్రజలను ప్రోత్సహించడమే కాదు,  నిర్బంధిస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

జేమ్స్ పెట్రాస్ పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాదం గురించి మాట్లాడడానికి చాలా సంవత్సరాల ముందే బ్రిటీష్ పరిపాలనా కాలంలోనే సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శని ఎక్కుపెట్టిన తెలుగు మేధావి విశ్వనాథ సత్యనారాయణ. భాష, వ్యవసాయం, కళలు, వొకటేమిటీ, అన్ని రంగాల్నీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం కబళించి వేయడాన్ని భారతీయ గ్రామీణ వ్యవస్థ నేపథ్యంలో చిత్రించారు విశ్వనాథ. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టుగానే, సంప్రదాయవాది, వెనుకబడినవాడు, ఫ్యూడల్ అనే వొక్క మాటతో ఆయన్ని నిరాకరించేవారు కమ్యునిస్టులు. వారి దగ్గర ఆధునికత అనే అస్త్రం వుంది.

ముఖ్యంగా భారత దేశంలో ఆధునికత అంటే వలసవాద ఆధునికతే.  యీ వలసవాదాన్నే సూర్యోదయంగా భావించారు కెవిఆర్ లాంటి కమ్యునిస్టు మేధావులు. వలసవాదాన్ని సర్వాత్మనా సమర్ధించిన గురజాడ, కందుకూరి వీరేశలింగంపంతులు వైతాళికులుగా అవతరించడంతో ఆధునికతకి రాజముద్ర పడింది. ఆధునికతని సందేహించడమే పాపమై పోయింది.

మన “ఆధునికత” తెచ్చిపెట్టుకున్నదీ, వలసవాదం వల్ల దిగుమతి ఐనదీ కావడం వల్ల కావచ్చు- దానిలో లోతు తక్కువ. మనకి  బెట్రాండ్ రసెల్ వంటి వైవిధ్యభరతమైన ఆలోచనలు కల మేధావులు లేరు. తీవ్ర వలసవాద ప్రభావం వల్ల కావచ్చు. మావోలా స్వదేశీ తత్వాన్ని జీర్ణించుకున్న మేధావులు బలంగా ముందుకు రాలేదు. ఫలితం ఆధునికత కాదు. వలసవాద లక్షణం కల ఆధునికత.  దేశీయమైన ప్రతీదాన్నీ,  స్థానికమైన ప్రతీదాన్నీ వెనుకబాటుగా చిత్రిస్తూ,  మేధావిలా కాదు, రౌడీలా,  పోలీసులా ముందుకొచ్చింది.  చైనాలో మావో పురాణకథల్ని ఉటంకిస్తాడు. మన పురాణాల్ని  ప్రస్తావిస్తే ఎక్కడ తిరోగమనంగా భావిస్తారోనని కొడవటిగంటి వాపోయారు.

దీని వల్ల జరిగిన పొరపాటు యేమిటంటే భారతీయ గతాన్ని పూర్తిగా నిరాకరించడం, లేక గతాన్ని పూర్తిగా కీర్తించడం అనే రెండు విధానాలు ముందుకొచ్చాయి.మొదటి పద్ధతి అగ్రెసివ్, రెండవది స్వీయ రక్షణాత్మకం (డిఫెన్సివ్). మొదటిది లెప్ట్, రెండవది రైటు. అందువల్ల విశ్వనాథ సత్యనారాయణ, బెంగుళూరు నాగరత్నమ్మ లాంటి వారిని తిరస్కరించడమో, పూజించడమో జరిగింది గానీ, వారి సామాజిక ప్రాధాన్యాన్ని గుర్తించడం జరగలేదు. వారి సామాజిక పాత్ర తిరోగమనశీలమైనదిగా నిరాకరించబడింది. లేక వారిని విగ్రహాలుగా  మార్చి  పూజించడం జరిగింది. ఈ రెండు పాత్రలూ వారి పాత్రని మరుగు పరిచేవే.

కందుకూరి వీరేశలింగంపంతులుని వైతాళికుడిగా కీర్తించే కమ్యునిస్టులు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన బెంగుళూరు నాగరత్నమ్మ పోరాటశీలతని ఎలా అర్థం చేసుకోవాలో విచారణ జరపనే లేదు. కెవిఆర్ అనే కమ్యునిస్టు మేధావి మగవాళ్ళని మించి పచ్చిగా శృంగారం రాసిందని నిందించిన ముద్దుపళని, “రాధికా స్వాంత”నాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడింది బెంగుళూరు నాగరత్నమ్మ. సిగ్గు అనేది ఆడవాళ్ళకు మాత్రమే ఉండవలసిన నీతా అని సవాలు విసిరింది. ముద్దుపళని శృంగారం రాసిందంటూ గోల చేసిన వీరేశలింగం అంతకంటే పచ్చి వర్ణనలున్న పుస్తకాలను మద్రాసు యూనివర్సిటీకి పాఠ్యపుస్తకాలుగా సిఫారసు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించింది. “రాధికా సాంత్వ”నాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అసభ్యమని నిషేధించింది. యీ నిషేధం వెనుకా,  అసలు మొత్తంగా దేవదాసీ వ్యవస్థే రద్దు చేయాలన్న ప్రయత్నం వెనుకా వీరేశలింగం ఉన్నారు. కానీ బెంగుళూరు నాగరత్నమ్మ దేవదాసీ వ్యవస్థని సమర్ధించారు. వ్యభిచారం మీద ఆందోళన పేరుతో కళలతో ముడిపడ్డ వ్యవస్థని రద్దు చేయడం తగదని పేర్కొన్నారు. “యీ రకంగా మొత్తం జాతిని నిషేధించాలనుకోవడం వెర్రితలలు వేసిన ప్రెంచి విప్లవం లాంటి” దని నాగరత్నమ్మ,  “ఆధునికత” సాంప్రదాయ సామాజిక సంబంధాల మీద చేస్తున్న ఏకపక్ష దాడిని వ్యతిరేకించారు. విశ్వనాథ దేవదాసీ పాత్రని సహానుభూతితో చిత్రించారు వేయిపడగలులో.  దేవదాసీ నృత్యాలు, భరతనాట్యం పేరుతో అగ్రవర్ణికరించబడ్డాయి చివరికి. బ్రిటీషువారు భారతీయ శృంగార గ్రంథాలను, జాతి చైతన్యాన్ని ప్రోది చేసే రచనలను కూడా నిషేధించారు. దానిలో భాగంగా విశ్వనాథ రాసిన ఆంధ్ర ప్రశస్తిని నిషేధించారు.

ఆధునిక క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథంతో భారతీయ సామాజిక అంశాల్ని తిరస్కరించారు. అంతేకాదు. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టు తమ వునికి, సమాజం మొత్తంగా వెనుకబాటుతనంతో నిండి వున్నాయని, ఆ స్థానాన్ని వలసవాద భావాలతో భర్తీ చేయాలనీ భావించారు. అందుకే ముద్దుపళని శృంగార కావ్యాలని వ్యతిరేకించిన వీరేశలింగం పాశ్చాత్య శృంగార కథల్ని అనువదించి ముద్రించడానికీ, వాటిని పాఠ్యగ్రంథాలుగా సిఫార్సు చేయడానికీ వెనుకాడలేదు. అందువల్ల సెక్స్ అపవిత్రం అనికాదు, భారతీయ సెక్స్ అనాగరీకం, వెనుకబాటుతనం అనే న్యూనతా భావం ఆధునికుల్ని వెంటాడింది. యీ దృష్టితోనే దయానంద సరస్వతి ( ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు) శ్రీకృష్ణుని శృంగార లీలలతో కూడిన భాగవత పురాణన్ని నిషేధించాలన్నాడు. యీ విధంగా స్థానిక సంప్రదాయాలూ, సామాజిక సంబంధాలూ, విశ్వాసాలూ, పాశ్చాత్య వలసవాద సాపేక్షికంగా నిరాకరింపబడ్డాయి. మార్కిస్టు మేధావులు యిదే పని చేసారు. ఎందుకంటే మార్క్స్ కూడా భారతీయ విశ్వాసాలూ, పూజా విధానాలూ, మనిషిని పశువుని పూజించే  పశు స్థాయికి దగజార్చేవిగా వున్నాయని విమర్శించాడు. సాంస్కృతికంగా ఉన్నతులైన పాశ్చాత్యుల పరిపాలన వల్ల భారతీయులు ఉద్ధరించబడ్తారని అంటాడు. అంటే మతం మత్తుమందు అనే మాట నిజమే కానీ కల్లు కన్న సారా గొప్పది. సారా కన్నా  విస్కీ గొప్పది. యీ సాపేక్షికత -పాశ్చాత్య వలసవాద సాపేక్షికత,  లెప్టునీ రైటునీ వెంటాడింది.

అందుకే హిందూత్వ వలసవాద సిద్ధాంతకర్త సావర్కర్ అన్ని రకాల ఆచారాల్నీ, సంప్రదాయాల్నీ తిరస్కరించాడు. భార్యకు కర్మకాండ జరపలేదు. తనకు కూడా కర్మకాండ జరపవద్దని వీలునామా రాసాడు. గుళ్ళూగోఫురాలూ తిరగవద్దన్నాడు. గోపూజని పరిహసించాడు. పాశ్చాత్య ఫాసిస్టు జాతీయ వాదం నుంచీ స్పూర్తిని పొందాడు. ఆర్యసమాజమైనా, బ్రహ్మసమాజమైనా యిలా పాశ్చాత్యం నుంచీ స్పూర్తిని పొంది ఏకేశ్వరోపాసన, వొకే గ్రంథం లాంటి ప్రొటెస్టెంట్ భావనలని పుణికి పుచ్చుకోవడానికి ప్రయత్నించాయి.

మనం తీవ్రంగా వలసవాద దాస్యంలో కూరుకపోవడం వల్ల చరిత్రని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారింది. నిజానికి కొన్ని ప్రాంతాలకి, కొన్ని కుటుంబాలకి పరిమితమైన సతీసహగమనం వలసవాద ప్రమేయం వల్ల మితిమీరిపోయిందని వెండీడోనేగర్ రాసారు (హిందూస్- ఏన్ ఆల్టర్నేటీవ్ హిస్టరీ). భారతీయుడు ఎవరైనా యిలా రాయగలడా? రాస్తే అతడు వెనుకబాటుదనంలోకీ సంప్రదాయంలోకీ కూరుకపోయినట్లుగా చిత్రించబడ్తాడు. అలాగే మనుస్మృతికి మితిమీరిన ప్రాధాన్యం వలసవాదుల కాలంలోనే వొచ్చిందని ఆమె రాసారు. మనుస్మృతిని చేతిలో పుచ్చుకున్న మొట్టమొదటి పాశ్చాత్య అనువాదకుడు విలియం జోన్స్ విగ్రహం ఇంగ్లండులోని ప్రముఖ చర్చి ముందు వుందని ఆమె రాసారు. అంతేకానీ అలాంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా కానరాదని ఆవిడ రాసారు. గ్రామీణ జీవితంలో మతగ్రంథం ప్రమేయం లేకపోవడాన్ని విశ్వనాథ, శార్వరీ నుంచీ శార్వరీ దాకా అనే నవలలో చిత్రించారు. అంటే అక్కడ మౌఖికమే ప్రధానం అన్న మాట.

ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే లెప్టుకు కానీ రైటుకు కానీ స్థానిక సంప్రదాయ సంస్కృతులతో ఏమాత్రమూ సంబంధం లేదు.

నిజానికి హిందూత్వని, ఆరెస్సెస్ లాంటి సంస్థల్నీ పోషించిన వాళ్ళు మహారాష్ట్రకు చెందిన చిత్పవన్ భ్రాహ్మణులు. నిజానికి శివాజీ ఆస్థానంలో ఉన్న సంప్రదాయ బ్రాహ్మణులు దేశస్థ భ్రాహ్మణులే. శివాజీ గురువులు సమర్ధ రామదాసు దేశస్థ బ్రాహ్మణుడే. చిత్పవన్ బ్రాహ్మణులు 17వ శతాబ్ధంలో హఠాత్తుగా వెలుగులోకి వచ్చారు. వీరు లౌకికులు. సంప్రదాయంతో వీరికి సంబంధం లేదు. వీరు సైన్యంలో పనిచేసారు. రాజకీయాల్లో ఆరితేరారు. పీష్వాలు వీరే. శృంగేరీ పీఠంపై దాడి చేసి దోపిడీ చేసిన బ్రాహ్మణుడు చిత్పవన బ్రాహ్మణుడే. ఆయన పేరు పీష్వా పరుశరామ భావూ. అప్పుడు శృంగేరీ మఠానికి రక్షణ కల్పించినదీ, తిరిగి సంపదనిచ్చినదీ టిప్పుసుల్తాన్. అందుకే 23వ శ్రుంగేరీ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి టిప్పుసుల్తాన్‍కి వ్యతిరేకంగా బ్రిటీష్ వారు రాసిన చరిత్రని ఖండించారు.

అలా శంకరాచార్యులు స్థాపించిన శృంగేరీ మఠంపై దాడి చేసిన చరిత్ర కలిగిన వారే చిత్‍పవన బ్రాహ్మణులు. అందుకే హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ కుల నిర్మూలనని  సమర్ధించాడు. అంబేద్కర్ మహద్ పోరాటానికి మద్దతు పలికాడు( అంబేద్కర్, సావర్కర్ ల జీవిత చరిత్రలు రెండూ రాసిన ధనుంజయ కీర్ ఈ విషయం రాసారు) సావర్కర్ దృష్టి విశాల హిందూ ఐక్య సంఘటన మాత్రమే. అది పూర్తి రాజకీయ పరమైనది.

1927లో సావర్కర్ సంగీతఉష్రాఫ్ అనే నాటకం రాసాడు. అదే ఏడాది ప్రదర్శన జరిగింది. అంటరానితనం, అగ్రకులాల హిందువులలో ఉన్న దౌష్ట్యం, దీని ఫలితంగా హిందూ కులాలు ఇస్లాం మతానికి మార్పు చెందడం, బ్రాహ్మణీయ హైందవంలో ఉన్న పరిమితులు, భారత దేశంలో ముస్లీంల అజెండా- యివన్నీ యీ నాటకంలో చర్చించిన అంశాలు. ఐతే యీ నాటకంలో ముస్లీంలని హిందూ స్త్రీలని అపహరించుక వెళ్ళే దుర్మార్గులుగా చిత్రించాడు (హిందూత్వ- జ్యోతిర్మయశర్మ)

దీనిలోసావర్కర్  మతమార్పిడికి హిందూమతంలోని కులవివక్ష, లోపాలే కారణమని పేర్కొనడం విశేషం. అంబేద్కర్ కూడా అలాగే భావించాడు.  కానీ యిద్దరూ ముస్లీంలు ప్రమాదకరమైనవాళ్ళే, దాడి చేసే దుందుడుకు స్వాభావం కలవాళ్ళేని వ్యాఖ్యానించారు. గురజాడ మతము- విమతము అనే కథలో ముస్లీముల బలవతపు మార్పిడుల  గురించి రాశాడు.

ఆధునిక విద్య ( ఇంగ్లీషు విద్య) నేర్చిన వాళ్ళూ, అన్ని రకాల సంస్కర్తలూ, ముస్లీంలని ప్రమాదంగా భావించారు.అదే సమయంలో ఇంగ్లీషు వాళ్ళని ఉద్ధారకులుగా భావించారు. వందేమాతరం గేయరచయిత బకించద్ర చటర్జి ముస్లీం దౌష్ట్యం నుండీ భారతీయులని యింగ్లీష్ వాళ్ళు కాపాడారన్నాడు ( ఆనందమఠం).

ముస్లీంలని దుర్మార్గులుగా చూపడంఅనేది బ్రిటీష్ పాలనకి, వలస ఆధునికతకి వొక సమ్మతిని కూర్చడంలో భాగంగా మారింది. అదే సమయంలో హిందూ అనైక్యతే ముస్లీంల విజయానికి కారణంగా వర్ణించబడింది. కనుక హిందువుల సంస్కృతి కూడా లోపభూయిష్టమైనదే. కులం దాని ప్రధాన లోపం. కనుక కులాలనీ, కులసంస్కృతులనీ నిర్మూలించి హిందూజాతీయవాదాన్ని నిర్మించాలి. కులం పునాదులపై  జాతిని నిర్మించలేమని అంటాడు అంబేద్కర్. సావర్కర్ అంగీకరిస్తాడు. అందుకోసం హిందూ ఐక్యత అవసరం. ఈ ఐక్యతలో ముస్లీం వ్యతిరేకత విడదీయరాని భాగం అని సావర్కర్ దృక్పథం.

వలస వాదం ఆధునికతపై లెఫ్టిస్టులకీ,  రైటీస్టులకీ యిద్దరికీ వ్యతిరేకత లేదు. ముఖ్యంగా సాంస్కృతిక వలసవాదంపై విమర్శ లేదు. అందుకే శ్రీశ్రీ  “దేశచరిత్ర” కవితలో ఇంగ్లీషు నియంతల పేర్లు వుండవు. ఎందుకంటే యింగ్లిషు వాళ్ళ రాక దైవప్రేరితమని బకించంద్ర చటర్జి, వీరేశలింగం లాంటి  వాళ్ళు భావించారు. మార్క్స్ చారిత్రక అనివార్యతగా,  చారిత్రక పురోగతిగా భావించాడు. ముస్లీం పరిపాలన యథాతథవాదంగా నిర్వచించబడింది.

వలసవాదంపై,  సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శ లెఫ్టిస్టు రైటిస్టు బృందాల నుండీ రాలేదు. సంప్రదాయ విద్యావంతుల నుండీ వచ్చింది. ముఖ్యంగా వలసవాదం తీసుకొని వచ్చిన సాంస్కృతిక సామాజిక మార్పుపై విమర్శ.

 

భాషని గురించే తీసుకోండి. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ప్రముఖ ఆఫ్రికన్ రచయిత గుగి “డీకలోనైజింగ్ మైండ్ ” అనే గ్రంథం రాసాడు. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తెలుగునాట ప్రధానంగా విమర్శించింది కవికోకిల జాషువా. ముక్కుతిమ్మన, తిక్కన లాంటి తెలుగు ప్రబంధకవులతో భైరన్, మిల్టన్, గోల్డ్ స్మిత్ లాంటి ఆంగ్లరచయితలు ఏమాత్రం పోటీపడలేరు. స్వకీయులైన కవులు నాటుగా భావించబడ్తున్నారు.  ఆంగ్ల భాషాకవులు నీటుగా భావించబడుతున్నారు అని ఆయన బాధపడతాడు. జాషువా ఆత్మకథలో( గబ్బిలం ) ఇంగ్లీషు భాషాధిపత్యం వల్ల తనకి గుర్తింపులేకుండా పోతోందని బాధపడ్తాడు. ఆధునిక కవులలో అందరికీ స్థానమిచ్చిన ముద్దుకృష్ణ,  “వైతాళికు”లలో జాషువా లేడు. అంటే వారి దృష్టిలో ఆయన వైతాళికుడు కాదు. ఆయనకి  ఆంగ్ల విద్యా సంపర్కము లేదు. పైగా సంస్కృతం, ఆంధ్రభాషలనభ్యసించి పద్యకవిత్వాన్ని అభ్యసించాడు. కాళిదాసు రాసిన మేఘసందేశాన్ని విలోమీకరించి “గబ్బిలం”  రాశాడు. ఆయన తిరుగుబాటులోనూ  సంప్రదాయకతని విడనాడలేదు. వలసవాదాన్ని యింగ్లీషుభాషా సాహిత్యాలని ప్రమాణంగా భావించిన గురజాడని సమకాలీన కవులందరూ ప్రస్తుతించారు.కానీ జాషువాని మాటమాత్రంగానైనా స్మరించకపోవడం విశేషం. చివరకి జాషువాని చెళ్ళపిళ్ళ వంటి సంప్రదాయ కవులే అభిమానించి గౌరవించారు.

ప్రతీ భాషా తనదైన ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటుందని చెళ్ళపిళ్ళ వెంకటకవుల శిష్యుడు విశ్వనాథసత్యనారాయణ భావించాడూ అంటే భాష నశించడం అంటే జాతి నశించడమన్న మాట. అందువల్ల యింగ్లీషుకీ తెలుగుకీ గల తేడాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు విశ్వనాథ. యింగ్లీషు భాష వల్ల తెలుగుకి రాబోయే ముప్పుని గుర్తిస్తాడు. వొక కథ ద్వారా యీ సత్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు. వొక విషాధ వృత్తాంతాన్ని చెప్పినా ఇంగ్లీషులో బ్యూటీపుల్, బ్యూటిపుల్ అంటారు. అదే తెలుగులో ” అయ్యో పాపం ” అంటారని వివరిస్తాడు (వేయిపడగలు ). దేవుడు అనే మాటకి కూడా యింగ్లీషు వాళ్ళ అర్థం వేరు, మన అర్థం వేరు అని వ్యాఖ్యానిస్తాడు. భాషతో మత సంస్కృతులు విడదీయరానివి. స్థానికత కూడా భాషలోనే వ్యక్తమవుతుంది.

ఇలా వలస భాష వల్ల, వలస సంస్కృతి వల్ల తెలుగు భాషకీ, సంస్కృతికీ వచ్చిన ముప్పుని గుర్తించిన వాళ్ళలో శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి  కనపడ్తారు. విశ్వనాథ యింగ్లీషు చదివారు కానీ శ్రీపాద, జాషువాలాగానే యింగ్లీషు విద్య లేనివాడు. శ్రీపాద, విశ్వనాథ యిద్దరూ కూడా సుదీర్ఘ ముస్లీం పాలనలో కాదు, యింగ్లీషు పాలనలోనే సంస్కృతికి  ముప్పు వచ్చిందని భావించారు( అనుభవాలూ-ఙ్ఞాపకాలూ , మ్రోయు తుమ్మెద )

యీ సాంప్రదాయక మేధావుల్లో కనపడని లక్షణం జాతివిద్వేషం. చారిత్రకంగా వొక  పరాయి జాతి మనలని అణచి వేసిందన్న భావన వీరిలో మచ్చుకైనా కానరాదు. “వేయి పడగ”లలో ధర్మారావు కొడుకు శాస్త్రి, తాను హస్సవలీ నుంచీ రామకథని తెలుసుకున్నాను అంటాడు. వాడు కబీరు, నేను రామదాసుని అనికూడా అంటాడు. గుడిలో దేవదాసి నాట్యానికి సంగీతాన్ని సమకూర్చేవాని పేరు కబీరే ( కంచి పరమాచార్య తన ఆశ్రమంలోని ముస్లీం వాయిద్యకారుల పాండిత్యం గురించి వొక చోట ప్రస్తావించారు).  హిందుస్థానీ భక్తి సంగీతంలో ముస్లీం  మతస్థుల పాత్రని గురించి విశ్వనాథ “మ్రోయు తుమ్మెద”లో స్పష్టం చేశారు. మ్రోయు తుమ్మెదలో తెలుగువాడైన “తుమ్మెద” హిందుస్థానీ సంగీతంలో పాండిత్యాన్ని సంపాదిస్తాడు. నీవు పాడే పద్ధతి తురక పద్ధతిలో ఉందని వొక హిందుస్థానీ పండితుడు ఆక్షేపించినపుడు ముస్లీంలు లేకుండా హిందూస్థానీ ఉందా అని అడుగుతాడు తుమ్మెద.

 

సంగీతంతోనూ, భక్తితోనూ, గుడితోనూ ముస్లీంలకు గల అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తాడు విశ్వనాథ.  హిందుస్థానీ సంగీతంలో చాలామంది మతరీత్యా ముస్లీంలైనా దుర్గ, కృష్ణుడు, మొదలైన అనేక దేవతలని కొలుస్తారని అంటాడు విశ్వనాథ. మతాంతరీకరణ పట్ల వుద్వేగాన్ని విశ్వనాథ అనుభూతి చెందడు. అంతర్వాహిణిలా సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని ఆయన భావన. అందుకే “తెఱచిరాజు”నవలలో నాయకుడు అనేక మతాలని స్వీకరించినా, అతనిలో  సనాతన ధర్మం జ్వలిస్తున్నట్లుగా చూపుతాడు. వలసవాదం తీసుకొని వచ్చిన విధ్వంసాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. అందుకే తెలంగాణా గురించి రాసినా  ముస్లీంపాలన, ఉర్దూ విద్యల గురించి వ్యతిరేకంగా మాట్లడడు. ముస్లీం దాడుల వల్ల సంస్కృతికీ, ధర్మానికీ యేదో నష్టం జరిగిపోయిందన్న ఆవేశమూ కనపడదు. పైగా మన లోపాల వల్లే సంస్కృతికి ముప్పు అని ఆయన భావనలా కనిపిస్తుంది.

అరిపిరాలలోని శిథిల శివాలయము గురించి విశ్వనాథ యిలా వ్యాఖ్యానిస్తాడు.

“ముసల్మానులు ఆ దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక అపప్రధ యేమో. వీరే తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో ….” ( మ్రోయు తుమ్మెద ).

నిరాదరణ భావం, అభిమానంలేకపోవడం వల్లనే సంస్కృతికి వినాశనం జరుగుతుంది. కానీ బలవంతపు మతమార్పిడులు, దాడుల వల్ల కాదు.    వలసవాదం ఈ నిరాదరణ భావాన్ని పెంచుతోంది. అదే సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

హిందుస్థానీ సంగీత విద్వాంసుల గురించి మాట్లాడుతూ, బ్రాహ్మణులే రాజాశ్రయం కోసం ముస్లీంలుగా మారారని అంటాడు ( హిందూత్వవాది, సావర్కర్ లా వర్ణ వివక్ష ప్రసక్తి తీసుకరాడు, మతాంతరీకరణ సందర్భంలో ). అలా మతాంతరీకరణం పొందిన వారు అంతరాంతరాలలో స్థానిక దేవీ దేవతల భక్తులే. హిందుస్థానీ సంగీతంలో భక్తి,  కర్ణాట సంగీతంలో అధ్వైతం ప్రధానమంటాడు. హిందూస్థానీలో “భక్తి” ప్రధానం కావడానికి ఇస్లాం కారణామా అన్నది నా ప్రశ్న అనుకోండి.

జాషువా కూడా ఫిరదౌసీ,ముంతాజు మహలు లాంటి ముస్లీం జీవితాలని ఉదాత్తంగా చిత్రించే రచనలు చేసారు. విశ్వానాథలో, జాషువాలో, శ్రీపాదలో జాతి విద్వేషపు చాయలు కనపడవు. దానికి కారణం చారిత్రక నిర్లిప్తతే.

భారతదేశానికి చరిత్ర లేకపోవడం గురించి ఆధునికులు అందరూ బెంగపెట్టుకున్నారు. చరిత్ర అనేభావనలో స్పష్టమైన కాల విభజన, కాలానికి ఆది అంతాలు, పురోగతి అనే భావాలు వున్నాయి. కాలాన్ని స్వయం చలనంలో వున్నదిగా, అనంతమైనదిగా చూశారు ప్రాచీనులు. కానీ చరిత్ర రచనతో పాటూ చరిత్ర పురుషులూ, చారిత్రక శత్రువులూ పుట్టుకొచ్చారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు, “చరిత్ర బేలెన్స్ చేయబడింది” , అని వి. ఎన్. నైపాల్ ప్రకటించాడు. ఇలా చరిత్రని బేలెన్స్ చేయడం, చారిత్రక ప్రతీకారం లాంటి డైనమిక్ ఆలోచనలు మొదలయ్యాయి.

శ్రీపాద, జాషువాలకి భిన్నంగా యింగ్లీషు చదువు చదివినప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ “చరిత్ర”ని నిరాకరించారు. పురాణాన్నీ, వాస్తవాన్నీ ఏకం చేసి పౌరాణిక వాస్తవికతని కల్పించారు.దీనికే విసుగుచెంది ఆర్.ఎస్ సుదర్శనం పురాణం, నవల వేరువేరు అని హెచ్చరించారు.

చరిత్ర గమనమనే దృక్పథాన్ని పక్కనపెట్టడంతో చరిత్ర భావనవల్ల వచ్చే టెన్షన్ విశ్వనాథకి లేకుండా పోయింది. అదే ధర్మారావులోని నిర్లిప్తత.

గురజాడ, సావర్కర్ లాంటివాళ్ళలోవున్న మతపర ఉద్వేగం లేకపోవడానికి యీ నిర్లప్తతే కారణం. లెఫ్ట్, రైట్ వర్గాలకి చరిత్రే చోదకశక్తి.   విశ్వనాథ సనాతనత్వంలో “ఉదాసీనో మహాబలః”. ఉదాసీనంగా ఉండేవాడే బలవంతుడు. అందుకే “వూరకే ప్రహించుటకు ప్రవహించడం” అనేది ధర్మారావు స్థితిగా వర్ణించబడింది( వేయిపడగలు).

అందువల్లనే హిందూమతాన్ని క్రైస్తవవిద్యార్థులు అవమానించినపుడూ ధర్మారావు ఉద్వేగానికి గురికాడు. విద్యార్థుల సమ్మెలో పాల్గోడు. సమ్మెని కొనసాగింఛవద్దని సలహా యిస్తాడు.ఇది స్వార్థంగా ఎస్కేపిజంగా కనపడింది ఆర్.ఎస్ సుదర్శనం గారికి. నిజానికి ధర్మారావులో ఎక్కువశాతం యీ నిర్లిప్తతా భావమే రాజ్యం చేస్తుంది ధార్మికవిషయాల్లో. ఇతర మతాల్ని ఢీకొనడం కనపడదు. క్రీస్తు గొప్పా, హరిశ్చంద్రుడు గొప్పా, విగ్రహారాధన వ్యతిరేకత లాంటి విషయాల్లో ప్రత్యక్షంగా యితరమతాల వారితో ఘర్షణకు దిగడు. తన అభిప్రాయం క్లుప్తంగా చెప్పి వూరుకుంటాడు

మొత్తం విశ్వనాథ స్వభావంలోనే యీ ఘర్షణ స్వభావం కనపడదు. కారణం అంతర్గతంగానే ధర్మానికి హాని జరుగుతుందనే భావన. బ్రాహ్మణుల పతనం వల్లే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి అంటాడు (వేయిపడగలు).  అంతర్గత శత్రువుల వల్లనే ప్రమాదం ఎక్కువ. పసరికని అమ్మకానికి పెట్టిన వాడు అంతర్గత శత్రువే. అందుకే ఆర్య సమాజం లాంటి ఆధునిక సంస్థల్ని కూడా విమర్శిస్తాడు. హైదరాబాదులోని కళాశాలలో హిందూ ముస్లీంలకి వేరువేరు ప్రార్థనా గదుల్ని ఏర్పాటు చేయడాన్ని విమర్శిస్తాడు విశ్వానాథ. ప్రార్థన అనే ఆచారం సనాతన ధర్మంలోలేదు అని ఆయన భావన. అలాగే ఆధునిక బాబా కల్ట్ లాంటి “కేషబ్జీ”నివ్యతిరేకిస్తాడు.ఇలా ఇతరుల్ని అనుకరిస్తూ తన ఉనికినే మరచిపోవడమే అసలు ప్రమాదం. అందుకే సంగీతంపై ముస్లీం ప్రభావాన్ని అంగీకరిస్తూనే స్వతంత్రమార్గంలో పయనిస్తే తాన్‍సేన్ గౌడీ లాగే ఆంధ్రీ అనేకొత్త మార్గం ఏర్పడేదని ’తుమ్మెద”తండ్రి అంటాడు ( మ్రోయు తుమ్మెద ).

విమర్శకులు ఆర్ ఎస్ సుదర్శనంగారిది చరిత్ర దృష్టి. అందుకే మార్పు ముఖ్యం అని భావిస్తారు. ఆమార్పు చారిత్రకోద్వేగంతో వుంటుంది. ఆధునిక అసమానత్వ పరిభాషలో వుంటుంది. యీ అసమానత్వ పరిభాష సమానత్వంలా భాషిస్తుంది. వ్యక్తివాదం అనేది చాలా ముఖ్యం. వ్యక్తిమార్పు, వ్యక్తి అభివృద్ధి,  వ్యక్తి పురోగతి, అనేవి యీదృష్టిలో ప్రదానమైనవి. నిర్లిప్తత పనికిరానిది. చర్య ప్రధానం. సుదర్శనం గారి దృష్టిలో ధర్మారావు ఏమిచేయాలి?  విద్యార్థులతో కలసి క్రైస్తవులని కళాశాల నుంచీ నెట్టి వెయ్యాలి. హిందూత్వవాదుల దృక్పథం అదే. యిప్పుడు నడుస్తున్న చరిత్ర అదే.

యిటువంటి దుందుడుకు దృక్పథాన్ని అమలు చేయడానికి ఆధునిక మర్యాదస్తుల పరిభాష అవసరం.

“భారతరాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేకత ద్వారాహరిజనులలో జాత్యాభిమానము పొటమరించి పాదుకొనిపోవడం జరిగింది. తద్వారా దేశంలో అహంకారమునకు వృద్ధియే గానీ క్షయము మాత్రం జరగలేదనే సంగతి స్పష్టమే”(సాహిత్యంలో దృక్పథాలు- ఆర్.ఎస్ సుదర్శనం ).

దళితుల్లో అహంకారంపెరిగిపోతోంది. దానికి కారణంప్రభుత్వంప్రసాదించిన ప్రత్యేకత.1968కిముందే సుదర్శనం గారు వ్యక్తం చేసిన భయం యిది. దళితులది పోరాడి సాధించుకున్న హక్కుకాదు. దయాధర్మ భిక్షంగా ప్రభుత్వం కల్పించిన ప్రత్యేకత. యిప్పుడు యూనివర్సిటిల్లో అగ్రవర్ణాల వాదం యిదే. దళితులకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి? ప్రతిభకి విలువలేకుండా పోవడానికి , నిమ్నకులాలకి తలపొగరు పెరగడానికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడమే కారణమంటారు హిందూవాదులు. దళితుల చైతన్యాన్ని జాత్యాభిమానం కులతత్వంగా, అహంకారంగా తలపొగరుగా చిత్రీకరిస్తారు.

ఆధునికులకీ, హిందూవాదులకీ వివక్షని కొనసాగించేందుకు వొక తటస్థ భాష అవసరం. అందులో కులం, వర్ణం లాంటి పదాలు కనపడకూడదు. యిలాంటి మేధావులు వివక్షాపూరితమైన సెక్యులర్ భాషని ఏర్పరచారు. అర్థిక సమానత్వ, ప్రతిభ, పోటీ, ఉమ్మడి సివిల్ కోడ్ లాంటి పదాలు సెక్యులర్ పదాలే. కానీ అవి సృష్టించే వివక్ష సూక్ష్మమైనదేకాక తీవ్రమైనది.

కానీ విశ్వనాథసత్యనారాయణ జాషువాపై వివక్షతో కూడిన వ్యాఖ్యానంచేసేడంటారు. ఆయన రచనల్లో కొన్ని చోట్ల వర్ణవివక్ష బహిరంగంగానే కనబడ్తుంది “ఒక్క క్రైస్తవకవి  ఉదిత మాధుర్య రస్కోతటంబగు శబ్ధమూది పలుకు” ,అనిజాషువని అతని మత అస్తిత్వంతో సహా గుర్తిస్తూ కీర్తించే ఉదారత్వం విశ్వనాథలో కనపడ్తుంది. ఈ విషయాన్ని బయటకు తెచ్చింది ప్రముఖ దళితకవి ఆచార్య యెండ్లూరి సుధాకర్.

శ్రీశ్రీ జాషువాని ద్వితీయ స్థాయి కవి అని అంటే మిగిలిన కమ్యునిష్టులు జాషువాని స్మరించనే లేదు. ఆర్ ఎస్ సుదర్శనం కూడా  మాలపల్లి గురించి మాట్లాడారు కానీ ఆ పల్లెలోని మహాకవి గురించి మాటాడలేదు. ఎందుకంటే దృష్టి సూక్ష్మవివక్షా భావంతో నిండినది. సంప్రదాయవాదుల్లో వివక్ష కేవలం సైద్ధాంతికమైనదిమాత్రమే. ఆధునికుల్లో అది రాజకీయ పరమైనది.

సంప్రదాయ సమాజాల్లో కులాలు కులసంస్కృతులు చాలా బహుళత్వంతో వైవిధ్యంతో కూడుకొనిఉండేవి. సాంకర్యం కూడా సాధ్యమయ్యేది. కానీబ్రిటీష్ ఆధునికత హిందూ అస్తిత్వాన్ని వర్గ కుల అస్తిత్వాలుగా స్థిరీకరించింది. లిఖిత పూర్వకం చేసింది. జనాభా గణన అదే పద్ధతిలో చేయడం కూడా యీ స్థిరీకరణకి కారణమైంది.

అందువల్లే విశ్వనాథ నవలలో కులాల గురించిన వర్ణనలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వేయిపడగలలో రామేశ్వరశాస్త్రి నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్ళి చేసుకుంటాడు. అనులోమ విలోమవివాహాల పేరుతో యిటువంటి వివాహాలని శాస్త్రాలు సమర్ధించాయి. అంతేకాదు, నాలుగవశతాబ్ధానికి చెందిన మీమాంస భాష్యకారుడు శబరుడు నాలుగు వర్ణాల స్త్రీలని వివాహం చేసుకున్నట్టుగా కథ ఉంది.  దీని ఆధారంగా విశ్వనాథ ఈ కల్పన చేసి ఉండవచ్చు. “మ్రోయుతుమ్మెద”లో బ్రాహ్మణ బాలుడిని పద్మశాలీ దంపతులు పెంచుతారు. కానీ బ్రాహ్మణుడిలాగే విడిగా పెంచుతారు. కానీ అతడు పెద్దయ్యాక పెంచిన తల్లితండ్రుల మీదప్రేమతో పద్మశాలీ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు. ఐనప్పటికీ శంకరాచార్యులు అతనిలో బ్రాహ్మణత్వం నిలచి ఉందని తీర్మానిస్తాడు. దాంతో ఉపనయనం చేసుకొని దేవీదీక్ష వహిస్తాడు. అతడే నవలా నాయకుడు “తుమ్మెద”.

ఇటువంటి విశ్వనాథ వర్ణనల్ని చూసి ఆర్ ఎస్ సుదర్శనం సందేహంలో పడిపోతారు. “వర్ణాంతర వివాహాలు నేటి వర్ణ విబేధ సమస్యకు పరిష్కారం సూచిస్తున్నాయంటారా? ఆ పరిష్కారం ఎంతమదికి నచ్చుతుంది ?” అని ప్రశ్నిస్తారు ఆర్ ఎస్ సుదర్శనం. విశ్వనాథని మార్పుకి అంగీకరించని చాందసుడిగా చిత్రించిన సుదర్శనం గారి ప్రశ్నలు యివి. కారణం ఏమిటంటే సంప్రదాయఙ్ఞుల కన్నా ఆధునికులు మూస దృష్టి కలవారు. ఆధునికత వైవిధ్యాన్ని వైరుధ్యంగా నిరాకరిస్తుంది.

యీ ఆధునిక దృష్టే భోగానికీ, యోగానికీ, శృంగారానికీ, అధ్వైత తత్వానికీ మధ్య విభజన రేఖలు గీస్తుంది. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లిలో మానసిక దైహిక బేధంలేని శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని చాటుతాడు. అక్కడ ఉన్నవని మెచ్చుకొన్న సుదర్శనం వేయిపడగలు నవలలోని రామేశ్వరశాస్తిని భోగే కానీ యోగి కాదని సులభంగా సూత్రీకరించేస్తారు. వలస ఆధునికత ఐహికానికీ, పారలౌకికానికీ మధ్య విభజన తెచ్చింది. శ్రీకృష్ణుడు దేవుడు కనుక ఆయన శృంగారం పవిత్రం. కానీ రామేశ్వర శాస్త్రి మనిషి అనేది సుదర్శనం అభిప్రాయం కావొచ్చు. యీ విభజన నుంచీ జనించిన ప్యూరిటన్ దృక్పథమే బలపడి హుస్సేన్ గీసిన దేవతల నగ్న చిత్రాలపై దాడికి హిందూవాదులని పురికొల్పింది.

వ్యక్తికీ వ్యవస్థకీ మధ్య కూడా విభజనరేఖ గీసి వ్యక్తిధర్మమే సనాతన ధర్మమని సూత్రీకరించడంతో ఆర్ ఎస్ సుదర్శనంగారి వక్రవలస ఆధునికదృష్టి పరిపూర్ణమౌతుంది. వ్యక్తి ధర్మం అనే పదం కానీ తత్వంకానీ భారతీయతత్వశాస్త్రంలో మచ్చుకైనా కానరావు. విశ్వమంతా భగవంతుని స్వరూపమైతే, జీవుడు భగవంతుని యొక్క సూక్ష్మరూపం ( పంచీకరణం-శంకరాచార్య). యిక్కడ వ్యక్తికీ, విశ్వానికీ ; ప్రకృతికీ, మనిషికీ సూక్ష్మ స్థూలానికీ మధ్య ఎడతెగని వైరుధ్యం లేదు. అది ఆధునికత సృష్టించింది.

అందుకే ప్రకృతితో  మనిషికి గల బంధాన్ని ’పసరిక” పాత్ర ద్వారా నిరూపిస్తారు విశ్వనాథ. మెట్టపొలాలు అంతరించి అన్నీ మాగాణులు కావడంవల్ల,  వ్యవసాయంలో తీవ్రమార్పుల వల్ల, ఆధునిక నాగరికత వల్ల జీవవైవిధ్యం నశించిపోవడంగురించి  చాలాముందుగా హెచ్చరించింది విశ్వనాథవారే. యీపని యితరులెవరూ యెందుకు చేయలేకపోయారు. కార్యాకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మితిమీరిన “రిడక్షనిజం” చోటుచేసుకోవడమే దానికి కారణం. ఆధునికత, సాంకేతికత, తీసుకవస్తున్న ప్రత్యక్ష సౌకర్యాలనీ, భోగాలనీ చూడగలిగారే కానీ పర్యవసానాలని గురించి ఆలోచించలేదు. అలా ఆలోచించడం చారిత్రకపురోగతి, కాల గమనాలని అడ్డుకోవడంగా భావించబడింది.

 

యిది నేటి ట్రంపు,మోడీ లాంటివాళ్ళప్రాగ్మాటీక్ దృక్పథానికి దారితీసింది. పర్యావరణ చట్టాలనీ, పర్యావరణ అనుకూల చర్యలనీ పూర్తిగా నిలిపివేసి అధిక ఉత్పత్తి లాభాలే పరమార్ధంగా భావించబడ్తోంది. యిటువంటి దృక్పథానికి ఏనాడో ఎదురీదాడు విశ్వనాథ. మార్క్సు, అంబేద్కర్‌లలోని మానవ కేంద్రకదృష్టీ పర్యావరణ సంక్షోభానికి కారణమౌతుందని అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే భావించాడు. సకలజీవులలోనూ  ప్రాణం, ఆత్మ వున్నాయనే భారతీయ సనాతన దృక్పథాన్ని  విశ్వనాథ నొక్కిచెప్పారువేయిపడగలలో.

అంతరించి పోతున్న జానపద కళలు, కల్లుని కబళిస్తున్న సారా, గ్రామాల్నిమింగేస్తున్న ధనస్వామ్యం ఆధునికత విశ్వరూపాన్ని వేయిపడగలులో చూపారు విశ్వనాథ. గోరటి వెంకన్నరాసిన “పల్లె కన్నీరు పెడుతుందో ’’ పాటకి పూర్వ రూపం “వేయిపడగలు”. ఆనవలలోని నిజాయితీ యేమిటంటే – బ్రాహ్మణుడినే ప్రధాన పాత్ర చేసి తన అస్తిత్వాన్ని మరుగుపరుచుకోకుండా సూటిగా ముందుకు రావడం.

ఆధునిక భ్రాహ్మణుడి  అనుసరిస్తూ ఆధునిక శూద్రుడు అవతరించాడు. వారిద్దరికీ వలస ఆధునిక దృక్పథంలో సంస్కృతి కనపడ్తుంది. సంప్రదాయం కనపడ్తుంది. నిజానికి సంస్కృతి సంప్రదాయాలు రూపాంతరం చెంది తమ మౌళిక భావనల్ని కోల్పోయాయన్న వాస్తవాన్నిమరుగు పరుస్తారు. తద్వారా ఆధునికతకి తిరుగులేని సమ్మతినికలుగ జేస్తారు.

సామ్రాజ్యవాదం భారతదేశంలో హిందూత్వరూపం సంతరించుకోవడానికి సుదీర్ఘ వలసచరిత్ర వుంది. అది అన్ని కులాల్లోకి చొచ్చుకపోవడానికి మేధావుల కృషి ఉంది. జర్మనిలో యాంటీ సెమిటిజాన్ని రూపొందించింది సంప్రదాయవాదులు కాదు. ప్రగతిశీలురు, సంస్కర్తలు అనుకున్నవాళ్ళే దానికి బీజాలు వేశారు.హెగెల్, మార్టిన్ లూథర్, గొథేలాంటి మేధావులు యాంటీసెమిటిజానికి బలం చేకూర్చారు( రైజ్ అండ్ ఫాలాఫ్ థర్డ్ రీక్- విలియం.ఎల్. షీరర్). యూదు పురుషుల్ని జర్మన్ స్త్రీలు వరించరాదని లవ్ జిహాద్ లాంటి సిద్ధాంతాల్ని ప్రవచించాడు గోథే. యీ విషయాన్ని హిట్లర్ స్వయంగా తన ఆత్మ కథలో స్మరించుకున్నాడు. మత సంస్కర్త మార్టిన్ లూథర్ యూధు వ్యతిరేకి, రైతు వ్యతిరేకి.  ప్రొటెస్టింటిజం ఆధునికతకి బీజం వేసింది మరి. ఫాసిస్టులకి సిద్ధాంతాలేమీ ఉండవు. ఆధునికత యొక్క విషమ పరిణామమే ఫాసిజం. భారతదేశంలోనైనా సంస్కర్తలూ, ప్రగతిశీలులే ఫాసిస్టు భాషని రూపొందించారు. యీ విషయం ఖాదర్ మొహిద్ధీన్ “పుట్టుమచ్చ” కవితద్వారా స్పష్టమైంది.

సాంస్కృతిక సాంకర్యంలేని స్వచ్చమైన గతాన్ని విశ్వనాథ స్థాపించలేదు. మ్లేచ్చ సంపర్కాన్ని కప్పిపుచ్చలేదు. పైగా దానివల్ల సంస్కృతి విచ్చిన్నమైపోయిందని ఆయన ఏనాడూ ప్రతిపాదించలేదు.

“తాన్‍సేన్ చనిపోయినాడు. ఆయనకి యిద్దరు కుమారులు కలరు. ఒకడు తురుష్కుడు, మరొకడు హిందువు. ఆయనకొక తురుష్క స్త్రీ భార్యగా కలదు. ఆమెయందలి సంతానము విలాస్ ఖాన్, పేరు హిందువు పేరే కానీ చివర ఖాన్ అనికలదు. తాన్‍సేన్ బ్రాహ్మణ  స్త్రీ యందలి సంతానము సూర్యసేనుడు. తాన్‍సేన్ యొక్క శవము తనదియనగా తనదియని వీరిర్వురూ వివదించుకొనిరి. ఈ వివాదము ఎవరు తీర్చవలెను?”

 

” తాన్‍సేన్ భ్రాహ్మణుడో, ముసల్మానో మాకు తెలియదు. ఆయన మహా గాయకుడు. మీరిద్దరూ సంగీతమును పాడుడు. శవములేచి సెభాషనవలయును. ఎవనిపాటకు తాన్‍సేన్ యొక్క శవము సెభాష్ అని మెచ్చుకొనునో శవము వానికిత్తుము”అనిరి. సూర్యసేనుడు పాడెను. శవము కదలలేదు. అప్పుడు విలాస్ ఖాన్ “తోడి” రాగము పాడెను. పాడునది “భైరవి”,  రాగము “తోడి”. ఇది చాలా కష్టమైన రాగము. నాటి నుండీ యీ రాగమునకు “విలాస్ ఖాన్ తోడీ రాగము”యన్న పేరు వచ్చెను. తాన్‍సేన్ శవము లేచి కూర్చుండి చేయి యాడించి వీడే నాకొడుకు యన్నదట (మోయు తుమ్మెద).

శవం నిజంగా లేస్తుందా, ఎవరు వారసుడో నిర్ధారిస్తుందా, యిది అసంబద్ధం అనికొందరు నాతో అన్నారు.ఆధునిక సంబద్ధత కంటే, యిటువంటి జానపద పౌరాణిక కథలే  సత్యాన్ని వెలుగులా ప్రసరిస్తాయి. భారతీయ సంగీత సాహిత్యాల్లో,  సంస్కృతిలో ముస్లీంల పాత్ర విడదీయరానిది. ముస్లీంలతో కలసినడచిన కాలాన్ని మరుగుపరచడానికి కానీ, దానిని దుర్మార్గమైనదిగా చిత్రీకరించడానికి గానీ విశ్వనాథ ప్రయత్నించలేదు అనేదిప్రధాన విషయం.

భారతీయ చరిత్ర చాలా విచిత్రమైనది. బాబ్రీ మసీదు విధ్వంసం చేయాలన్న మూకల్నీ, అధ్వానీ రథయాత్రనీ వ్యతిరేకించిన లాల్ దాస్ రామజన్మభూమి పూజారి. ఫలితంగా  ఆనాటి  అతిశూద్ర హిందూముఖ్యమంత్రి ఆయనను పూజారి పదవినుండీ తొలగించాడు. ఆయన్ని చంపేసారు. బాబ్రీమసీదుని కూల్చేసారు. బాబ్రీస్థలం కోసం హిందూవాదులతో పోటీపడ్డ దళితవాది ఉదిత్ రాజ్,  అది బుద్ధిస్టుల స్థలం అని అన్నారు. బౌద్ధారామాల్ని కూల్చి మసీదు కట్టారని కోర్టుకెక్కాడు. ఆ ఉద్యమంలో అంబేద్కర్ భార్య సవితా అంబేద్కర్ మద్ధతు పలికారు. తర్వాత ఉదిత్ రాజ్ బిజెపిలో చేరాడనుకోండి.

హిందూత్వం అన్నా,బౌద్ధం అన్నా, మరేమన్నా ఆధునికులందరిదీ వొకటే దృష్టీ. ముస్లీం పరిపాలనా కాలం చెడ్డది అని చెప్పడం ద్వారా వలస ఆధునికతకి సమ్మతిని సమకూర్చడం.  అందువల్ల లెఫ్ట్, రైట్, దళిత వాదం- అందరి దృక్పథాలూ వొకే రకమైన చారిత్రక దృష్టిలో ఏకమైతాయి. అవి వలస ఆధునికతకి, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి మద్ధతునిస్తాయి.

యిటువంటి దృష్టిని ఎదుర్కొన్న వారు చరిత్రకీ, కాలానికీ ఎదురీదిన వారే.   జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టూ యీ ఎదురీతని వెనుకబాటుతనంగా, సంప్రదాయవాదంగా ముద్రించడం సులభం. తద్వారా సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని బలపరచడమే జరుగుతుంది చివరికి.

*

“ఈ భూమి అమ్మకానికి లేదు”

mamata%e0%b1%a9

మెక్సికో నుంచి వచ్చిన ఉద్యమకారుల ఆజ్టెక్ నృత్య ప్రదర్శన.

 

పడమటికి వాలిపోతున్న వెలుగులో నా కారుతో పోటీ పడుతూ గుట్టలమీద జరజర పాకుతున్న కారు నీడ తప్ప మరే కదలికా లేదు.  తెల్ల సున్నం రాయి గుట్టలూ, కొండల మధ్య చిన్న చిన్న ఊర్లు దూర దూరంగా ఉన్నాయి. పేరుకు పట్టణాలు అనేవి రెండు మూడు వందల మైళ్లకు ఒకటి తగుల్తోంది. మైళ్ల కొద్దీ నా కారు తప్ప ఇంకొక కారు ఆరోడ్డు మీద కనిపించడం లేదు.

ఎంతో సేపు ప్రయాణం చేసిన తరువాత, తప్పు దారిలో వచ్చానేమో అన్న అనుమానం, ఇంకో  రెండు గంటల్లో చీకటి పడ్డాక కొండల మధ్య చీకట్లో కారు పాడయితే ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు. సెల్ ఫోన్ కూడా సరిగ్గా పని చెయ్యట్లేదు. ఒక్కోసారి దగ్గరగా, ఒక్కోసారి ఉన్నదో లేదో అన్నట్లూ దూరంనుంచే మురిపిస్తూ మిస్సౌరి నది. గుట్టలు ఎక్కినప్పుడు నీలాకాశంలో సగం చందమామ నేను ఉన్నాన్లే అంటున్నాడు. ఇంత అందంలో తప్పిపోతేనేం అనికూడా అనిపిస్తోంది. హఠాత్తుగా రోడ్డు పక్కన పొలాల్లో, రోడ్డుకు సమాంతరంగా  ఒక మీటరు వెడల్పున చదును చేసిన నేల మీద నీలి రంగు పైపులు కనిపించడం మొదలయ్యింది. నిజానికి ఇవాళ్టికి అవి భూమిలో ఉండాల్సినవి. వాటిగుండా చమురు పారుతూ ఉండాల్సింది.

కాసేపటికి  రోడ్డు పక్కన ఒక చోట మూడు పోలీసు కార్లు కనిపించాయి. చెక్ పోస్టులా ఉంది. ఆ కార్లకు ఎదురుగ్గా ఉన్న రోడ్డు మీదకు కారు పోనిచ్చాను. దూరంగా విసిరేసినట్లున్న ఇళ్లను చూస్తూ ఓ పది నిమిషాలు బీటలువారిన రోడ్ల మీద తిరిగాను. నేను వెతుకుతున్న ప్రదేశం ఈ చుట్టుపక్కల లేదని అర్థమయ్యింది. ఇందాక చూసిన చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లి మళ్లీ మెయిన్ రోడ్డు ఎక్కాను. ఈరోజుకి నేను వెళ్లాల్సిన చోటు దొరకదేమో అని నిరాశ.

నార్త్ డకోట రాష్ట్రంలో, కానన్ బాల్ అనేది ఒక చిన్న ఊరు. లకోట,  డకోట తెగలకు చెందిన స్టాండిగ్ రాక్ రిజర్వేషన్ భూభాగం చిట్టచివర, ఆకాశమే దిగివచ్చినట్లుండే నీలాల మిస్సౌరి నది పక్కన, కొండల మాటున ముడుచుకుని ఉంటుంది ఈ ఊరు. ఈ ఊరికి కొంచెం ఎగువన మిస్సౌరీ నది అడుగునుంచి డకోట ఆక్సెస్ ఆయిల్  పైప్ లైన్ వేద్దామని సంకల్పించింది  ఎన్ ట్రాన్ పార్ట్నర్స్ (Energy Transfer Partners) అనే కంపెనీ.

నార్త్ డకోట ఉత్తర ప్రాంతంలో వెలికి తీసిన చమురును, రిఫైన్ చేయడానికి సౌత్ డకోట, అయోవా రాష్ట్రాల గుండా  ఇల్లినాయ్ రాష్ట్రానికి తరలించాలని ఈ పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నదుల కిందనుంచి గ్యాస్ లేక చమురు సరఫరా అవుతున్నప్పుడు, ప్రమాదం జరిగి నదుల్లో నీళ్లు కలుషితమయ్యాయి. ఈ పైప్ లైన్ లో కూడా అదే జరిగితే రిజర్వేషన్లోని ప్రజలకే కాక నదీ జలాల మీద ఆధారపడిన మరో పదిలక్షలమందికి తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టం జరిగుతుంది. అందుకే పైప్ లైన్ మిస్సౌరి నది దాటే చోట కొన్ని వందలమంది నేటివ్ అమెరికన్లు కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు.

ఈ మధ్యే ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ఉద్యమ వార్తలు తెలుస్తున్నా. ఉద్యమకారుల దగ్గరికే వెళ్లి, ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకుందామని, వాళ్లతో ఒకపూట గడుపుదామని బయలు దేరాను.

నార్త్ డకోట రాష్టం లోని క్యానన్ బాల్ దగ్గర ఉద్యమకారుల క్యాంప్ ఉందని మాత్రమే తెలుసుకున్నాను. క్యానన్ బాల్ కు వెళ్లగానే క్యాంప్ కనిపిస్తుందని సౌత్ డకోటలో కొంత మంది చెప్పారు.  క్యానన్ బాల్ నది ఇందాకే దాటేశాను. అంటే ఊరు దగ్గరున్నట్లే. కానీ క్యాంప్ ఎంతకీ కనిపించదే!

ఒక గుట్ట దిగీదిగకముందే, మలుపులో హఠాత్తుగా రోడ్డు పక్కన చిన్న లోయలో డేరాలు, కంచెకు కట్టిన జెండాలు ఎగురుతూ కనిపించాయి.  నా గుండె వేగంగా కొట్టుకుంది. అదే! ఒచేడి షాకోవీ (Oceti Sakowin – Seven Council Fires) క్యాంప్! రోడ్డు దిగి, చిన్న గేటు దగ్గరకి కారు పోనిచ్చాను. తలకు రుమాలు కట్టుకున్న ఒక యువకుడు నా కారు దగ్గరికి వచ్చాడు. నుదుటి మీదకు వచ్చేలా కట్టిన ఆ రుమాలు మీద నన్ను ఇక్కడికి రప్పించిన నినాదం, Water is Life (నీళ్లే ప్రాణం) అని రాసి ఉంది. కారు ఎక్కడ పార్కు చేసుకోవచ్చో చూపించాడు.

కారు పార్కు చేసి, పక్కనే ఉన్న గుట్ట ఎక్కి కాసేపు నిలబడ్డాను. నాకు దగ్గర్లో ఇంకొంత మంది నిలబడ్డారు. అందరూ పలకరింపుగా నవ్వారు, ఎప్పట్నుంచో తెలిసిన స్నేహితుల్లా అనిపించింది. నా చేతిలో కెమెరా చూసి, ‘మీరు జర్నలిస్టా’ అని ఒక యువకుడు అడిగాడు, నల్లగా మెరుస్తున్న పొడవాటి జుట్టును ముఖంమీద పడకుండా ఒకచేత్తో పట్టుకుని.

“లేదు. మీ ఉద్యమానికి మా ఇండియన్ పర్యావరణ ఉద్యమకారుల తరుపున  మద్దతు తెలపడానికి వచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడ ఎప్పట్నుంచి ఉంటున్నారు?” అని అడిగాను.

“నేనైతే ఈమధ్యే వచ్చాను. నా స్నేహితులు చాలామంది దాదాపు ఉద్యమం మొదలైనప్పటి నుంచి, అంటే ఏప్రిల్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. చలికాలం మొదలయ్యేలోగా పోరాటం విజయవంతం కావాలని చాలా మందిమి వచ్చాం.”

“ఏ రాష్ట్రం మీది?”

“ఏ రాష్ట్రం  కాదు. ఏ దేశం అని అడగండి. గ్రేట్ సూ నేషన్ మాది. ఓగ్లాల లకోట తెగ.” గర్వంగా అన్నాడతను. ఓగ్లాల లకోట అనేది లకోట తెగలో ఏడు ఉపతెగల్లో ఒకటి. ఇక్కడికి దాదాపు నాలుగు వందల మైళ్ల దూరంలో ఈ ఉపతెగకు కేటాయించిన రిజర్వేషన్ ఉంటుంది.

“అంత దూరం నుంచి వచ్చారా?”

“అదేమంత దూరం? కొంతమంది దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ నుంచి  వచ్చారు. కొంతమంది న్యూజీలాండ్  నుంచి కూడా వచ్చారు. మీరు…? ఇండియా నుంచి కదా?”

“ఇండియా నుంచి ఈ దేశానికి వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఇక్కడికి న్యూ జెర్సీ నుంచి వచ్చాను.”

“మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మా గురించి ఇండియా ప్రజలకు చెప్తారు కదా?”

“నేనైతే చెప్తాను. వింటారా లేదా అన్నది వాళ్ల ఇష్టం కదా?”

అప్పటి దాకా నవ్వుతూ మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. “వాళ్లు వినాలి. ప్రపంచంలో అందరూ వినాలి. ఎందుకంటే ఇది ఇక్కడున్న వాళ్ల సమస్యనో, నాలుగు వందల మైళ్ల దూరంలో ఉన్న మా సమస్యనో కాదు. పర్యావరణ సంరక్షణ అన్నది భవిష్యత్తు తరాల పట్ల కొంచెమన్నా బాధ్యత ఉందనుకునే వారందరి సమస్య. ”అన్నాడు.

వివరంగా చెప్పమని అడుగుదామని అనుకునేలోగా అతన్నెవరో పిలిచారు. “ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.” అంటూ వెళ్లిపోయాడతను.

కొద్దిసేపు అక్కడే నిలబడి కొన్ని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించాను. నా ముందు పరుచుకున్న అద్భుత దృశ్యం నా కెమెరా లెన్సుకు పూర్తిగా చిక్కడం లేదు. దూరాన కొండల ముందు రిబ్బనులా వంపులు తిరిగి మిస్సౌరి నదిలో కలవబోయే ఒయాహే సరోవరం(Lake Oahe) చాలా దూరానికీ నీలంగా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ సరోవరానికీ నాకూ మధ్య  వందల కొద్దీ గుడారాలు, టీపీలు (త్రిభుజాకారంలో జంతు చర్మంతో సూ తెగ ప్రజలు వేసుకునే గుడారాలు). వాటిమధ్య ఒక మట్టి బాట, బాటకు అటూ ఇటూ వివిధ తెగల జెండాలు ఎగురుతున్నాయి. గుట్ట దిగువన గుర్రాల కోసం కట్టిన కంచె.

గుట్ట దిగి గుడారాల మధ్య నడిచాను. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఒక గుడారం ముందు ఇద్దరు మహిళలు కూర్చుని సూప్ తింటూ కనిపించారు.

“మీతో కూర్చోవచ్చా” మొహమాటం లేకుండా అడిగేశాను.

“తప్పకుండా.”

వాళ్ల పక్కనే నేలమీద కూర్చున్నాను.

“నా పేరు మమత. న్యూ జెర్సీ నుంచి వచ్చాను. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?”

“నా పేరు సూసన్. నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి, నా స్నేహితురాలు బార్బర,  సౌత్ డకోట నుంచి.” (ఈ పేర్లు వాళ్ల నిజం పేర్లు కాదు.)

“ఎప్పటిదాక ఉంటారు?”

“పైప్ లైన్ నిర్మాణం ఆగిపోయేదాక. ఎంతకాలమైనా సరే. బార్బర రిటైర్డ్ టీచర్. నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చాను.” సూసన్ అన్నది.

“అదేంటి. వెనక్కి వెళ్లినప్పుడు కష్టం కాదూ? అట్లాంటి కష్టమైన నిర్ణయం తీసుకునేంత ముఖ్యమా ఈ ఉద్యమం?”

“ఒక్కోసారి  తప్పదు. దాదాపు 300 నేటివ్ అమెరికన్ తెగలు ఒక సమస్య గురించి పోరాడడానికి కలిసిరావడం సామాన్య విషయం కాదు. ఈ సమస్య కూడా సామాన్యమైనది కాదు కదా? మనుషులు, చెట్లు, జంతువులు, ప్రకృతిలో భాగమని నమ్ముతాం.  పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి  ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మేం నిరసన కారులం కాము, ప్రకృతి సంరక్షకులం. మా కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా ఫ్రాకింగ్ జరుగుతోంది. అక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్నాను. మా గొడవ ఎవరూ పట్టించుకోకుండానే నేను పాల్గొన్న ఉద్యమం సమిసిపోయింది. ఇక్కడ ఉద్యమం కూడా ఈ రిజర్వేషన్లోనే ఒక చిన్న గుంపు మొదలుపెట్టింది. తమతో ఎవరు కలిసినా కలవకపోయినా పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదని అనుకున్నారేమో.”

“ఆ చిన్ని బృందానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది?”

mamata1

అప్పటిదాక ఏమీ మాట్లాడని బార్బరా బదులిచ్చింది, “మీకు కొంచెం మా చరిత్ర చెప్తాను. ఒక నూటాయాభై ఏళ్ల క్రితం నుంచి జరిగిన చరిత్ర చెప్తాను. 1860ల్లో అమెరికా పడమరవైపు ఉన్న మా భూముల్లోకి చొచ్చుకుని వస్తున్న కాలం. అమెరికా సైన్యం చాలా బలమైంది. అయినా చాలా తెగలు ఆ దురాక్రమణను వీరోచితంగా ప్రతిఘటించాయి. నేటివ్ అమెరికన్ తెగలను అణిచివేయాలని ఎన్నో సైనిక దళాలు దేశమంతా దండయాత్రలు మొదలుపెట్టాయి.

1863 వేసవి చివర లకోట, ఇంకొన్ని మిత్ర తెగలు కలిసి మిస్సౌరి నదికి అవతలి వైపున విడిది చేసి చలికాలం కోసం తయారవుతున్నారు. అడవి బర్రెల వేటలు ముగించి, మాంసం ఎండబెట్టడం, టిపిలు వేసుకోవడం, బర్రె చర్మం దుప్పట్లు తయారు చేసి అమ్ముకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మొత్తం విడిదిలో 3000 మంది దాకా ఉన్నారు. అట్లాంటి విడిది దగ్గరకు సైనిక దళాలు వచ్చాయి. ఆ దళాలు యుద్ధానికే వచ్చాయని భావించి, తాము యుద్ధం చేయడానికి గుమిగూడ లేదని, శాంతియుతంగా తమ పని తాము చేసుకుంటున్నామని తెలియజేయడానికి కొంతమంది నాయకులు తెల్లజెండాలు పట్టుకుని సైనిక నాయకుడి దగ్గరకు వెళ్లారు. అట్లా వెళ్లిన నాయకులను సైన్యం బంధించడం దూరన్నుంచి గమనించిన యువకులు  విడిదిలోని ప్రజలను వెంటనే అక్కడ్నుంచి పారిపొమ్మని హెచ్చరించారు.

కానీ సైన్యం విడిదిని చుట్టుముట్టి దాదాపు 400 మందిని ఆరోజు హతమార్చింది. విడిదిలో ఉన్న మగవాళ్లు హఠాత్తుగా వచ్చి పడిన సైన్యాన్ని ఎదిరించకపోయివుంటే, అక్కడ్నుంచి పారిపోలేక ఇంకా ఎన్ని వందలమంది చనిపోయేవారో. ఖాళీ అయిన విడిదిలో చలికాలం కోసం పోగేసిన మాంసాన్ని, రోజువారి సామాగ్రిని, టిపీలను గుట్టలుగా పోగేసి తగలబెట్టింది సైన్యం. అక్కడ్నుంచి పారిపోయి మిస్సౌరి నది దాటి వచ్చిన జనం ఈ ప్రాంతంలో మెల్లగా నిలదొక్కుకున్నారు. సైన్యం నేటివ్ అమెరికన్ తెగలను పూర్తిగా హతమార్చలేకపోయింది. మా వీరులు అడపాదడపా సైన్యంతో తలపడేవారు. చివరికి ఎవరికీ శాంతి లేదని, 1868లో అమెరికా ప్రభుత్వం మా తెగలతో  ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం లకోట, డకోట తెగలకు, ఇంకొన్ని మిత్ర తెగలకు చెందిన ప్రజలకు ఇప్పటి డకోటా రాష్ట్రాల్లో, మిస్సౌరి నదికి పడమర ఉన్న భూభాగాన్ని, మిస్సౌరి నదిని, పవిత్రమైన బ్లాక్ హిల్స్ ను  కేటాయించి “గ్రేట్ సూ నేషన్” అని రిజర్వేషన్ కు పేరు పెట్టింది.

ఈ ప్రాంతమంతా స్వేచ్ఛగా తిరగాడిన ప్రజలకు సరిహద్దులు ఏర్పాటు చేసింది. అయితే  తెగలతో చేసుకున్న ఒప్పందాల మీద అమెరికా ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవంలేదని మాకు రెండేళ్లలోనే తెలిసివచ్చింది. 1870ల్లో బ్లాక్ హిల్స్ పర్వతాల్లో బంగారం బయటపడింది. మాకు కేటాయించిన భూభాగాన్ని ముక్కలు చేసి ఆ పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అమెరికా ప్రభుత్వం. ఎదురు చెప్పిన తెగలకు బ్లాక్ హిల్స్ కొంటామని బేరం పెట్టింది. “మనుషులు నడయాడే భూమిని ఎవరూ అమ్మలేరు.” అంటూ ఓగ్లాల లకోట వీరుడు తాషుంక వీట్కొ (Crazy Horse)  అమెరికా ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన, మరో నాయకుడు  తతంక యియోతక (Sitting Bull) కలిసి కొన్ని యుద్ధాలు చేశారు. తతంక యియోతక ఇందాక చెప్పిన హత్యాకాండలో సైన్యంతో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడిన హుంక్పప లకోట తెగ వీరుడు. అయితే, కొన్ని నెలల్లోనే తాషుంక వీట్కోను హత్య చేశారు. తతంక యియోతక అప్పటికే పెద్దవాడు. తాషుంక వీట్కో హత్య తరువాత ఒంటరివాడై, అలసిపోయిన తన అనుచర బృందంతో సహా సైన్యానికి లొంగిపోయాడు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే బ్లాక్ హిల్స్ అమెరికా పరమయ్యాయి. 1980లో మాకు క్షమాపణలు చెప్పి, 102 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది కానీ, మేం ఒప్పుకోలేదు. ఆ డబ్బును అమెరికా ప్రభుత్వం ఒక ట్రస్టులో పెట్టింది. ఈనాటికి అది $1.3 బిలియన్ డాలర్లయింది. ఆ డబ్బు మాకు వద్దు. మా నాయకుడు తాషుంక వీట్కొ అన్న మాట ఎప్పటికీ మరిచిపోం. ఆయన మాటే మా మాట. ఈ భూమి…” కోపంతో, దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో ఆగిపోయింది బార్బర.

“ఈ భూమి అమ్మకానికి లేదు.” మెల్లగా అన్నాను. నాకూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కళ్లల్లో నీళ్లతో, చిర్నవ్వుతో చూసింది బార్బర. “ఏ దేశంలో చూసినా, ఏ మూల చూసినా అవే అన్యాయాలు, దుఃఖాలు కదూ?” నిర్లిప్తంగా అన్నది సూసన్.

“అంతే ధైర్యంతో పోరాటాలు… “ అన్నాను.

ఊపిరి పీల్చుకుని మళ్లీ అందుకుంది బార్బర, “అప్పట్లోనే మా ఒక్క గ్రేట్ సూ నేషన్ ను ఆరు రిజర్వేషన్ భూభాగాలలో కుదించారు. ఇప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ కొంచెం కొంచెంగా మా భూమిని ఆక్రమిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ పక్కన కనిపిస్తొందే ఒహాయే సరస్సు. అది నిజానికి ఒక రిజర్వాయర్.  మిస్సౌరి నదిని దాటి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. మెల్లగా వ్యవసాయం, వ్యాపారాలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల కొన్ని టౌన్లు ఏర్పడ్డాయి. అయితే 1944లో ఇక్కడ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1948లో నిర్మాణం ప్రారంభమయ్యింది, 1968లో కెన్నెడీ డ్యాము ప్రారంభోత్సవం చేశాడు. తెగ ప్రజలు ఎంత ప్రతిఘటించినా  ఫలితం లేకపోయింది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కృత్రిమ సరస్సు ఒయాహే కింద కొన్ని టౌన్లు, పంట భూములు, విలువైన మూలికలు దొరికే స్థలాలు మునిగిపోయాయి. ఇప్పుడు మిగిలిన భూమిలో సున్నం ఎక్కువ కలిసి వుంది. పంటలు మునుపటిలా పండవు. అరుదైన మూలికలను పోగొట్టుకున్నారు ప్రజలు.  ‘ఈ రిజర్వేషన్లో ముసలి వాళ్లు ఎక్కువ కనిపించరేమి’ అని అడిగితే.‘పెద్దవాళ్లు గుండెపగిలి చనిపోయారు’ అని అంటారు. నిజంగానే ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఈ రిజర్వేషన్ ప్రజలు. ఇప్పుడు ఈ పైప్ లైన్ మరో పెద్ద దెబ్బ.”

“పైప్ లైన్ వేసేముందు ఈ రిజర్వేషన్ ప్రజల అభిప్రాయం కోసం మీటింగులేవీ పెట్టలేదా? ఇంతకీ ఇప్పటి టెక్నాలజీ తయారైన పైపులు సురక్షితమైనవని అంటున్నారు?” నా ప్రశ్నకు నాకే విరక్తితో నవ్వొచ్చింది.

“నిజానికి ఈ పైప్ లైన్ ఇక్కడికి ఎంతో ఎగువన మిస్సౌరి నదిని దాటాలన్నది మొదటి ప్రణాళిక. అప్పుడు వీళ్లను పిలువలేదు. ప్రపంచానికైతే పైపులు సురక్షితమని చెప్తున్నారు కానీ,అవే పైపులు పగిలితే బిస్మార్క్ నగరానికి ప్రమాదమని దారి మళ్లించారు. అంటే వాళ్లకూ వాళ్ల పైపుల మీద నమ్మకాలు లేవు. దారి మళ్లించినప్పుడు తెగ నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, ఈ రిజర్వేషన్ చైర్మెన్ డేవ్ ఆర్చెమ్ బాల్ట్ తెగ ప్రజలు ఈ పైప్ లైన్ కు విరుద్ధమని ఖచ్చితంగా చెప్పాడు. అయినా ఈ స్థలాన్ని పైప్ లైన్ కు కేటాయించింది ఆర్మీ కార్ప్స్ ప్రభుత్వ విభాగం. ఒకరోజు పవిత్ర స్థలాలనేమీ పట్టించుకోకుండా బుల్ డోజర్లతో ఆ ప్రదేశాన్నంతా చదును చేసేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఉద్యమకారుల మీద వేటకుక్కలతో దాడిచేశారు.”

 

సూసన్ మధ్యలో అందుకుని చెప్పింది,  “ఇంతకీ ఆ దాడి ఎప్పుడు జరిగిందో తెలుసా? సెప్టెంబరు 3న! నూటాయభై మూడు సంవత్సరాల క్రితం అదే రోజున వీళ్ల పూర్వీకుల విడిది మీద దాడి చేసి, పిల్లలని కూడా చూడకుండా, దొరికిన వాళ్లను దొరికినట్లు అతిదగ్గరగా తుపాకులతో కాల్చి దారుణంగా హత్య చేసిన రోజు.”

అవునన్నట్లు తలాడించింది బార్బరా, “నేటివ్ అమెరికన్లను ప్రాణమున్న మనుషులు అనుకోరు, ఇక పవిత్ర స్థలాల గురించి ఏం పట్టించుకుంటారు? ఇంతలా తెగించి పోరాడడానికి అసలు కారణం మిస్సౌరి నది. మంచినీళ్లు తాగడానికి కూడా భయపడే పరిస్థితి. చమురు తాగి బతకలేం కదా? నీళ్లే ప్రాణం కదూ? ఇక తెగించి పోరాడాల్సిందే.”

ఇంతలో కొంత మంది పిల్లలు ఒకరినొకరు తరుముకుంటూ పరిగెత్తుతున్నారు.

“ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. బడి ఎట్లా వీళ్లకు? శని ఆదివారాలు వచ్చి వెళ్తుంటారా?”

సూసన్ సమాధానమిచ్చింది, “లేదు, కొంత మంది చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఒక బడి కూడా ఏర్పాటైంది. ఒక ఊరిలో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చలికాలంలో మంచు తుపాన్లు పెద్ద ఎత్తున చెలరేగుతాయి. ఒక పెద్ద లాడ్జి ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కాకుండా వంతులవారిగా వచ్చి వెళ్లాలని అనుకుంటున్నాం. పరమ క్రూరంగా ప్రవర్తిస్తున్న నార్త్ డకోట పోలీసులకంటే, ప్రభుత్వం కంటే క్రూరమైనవి కావు మంచు తుపాన్లు.”

పకపక నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాసేపు కూర్చున్నాం.

“ఇంత మంది ఎలా కలిసి కట్టుగా పని చేస్తున్నారు?  ఈ ఉద్యమంలో ఇన్ని నేటివ్ అమెరికన్ తెగలు కలిసిరావడం చూస్తే  ఇంత మంది మద్దతు ఎలా సంపాదించుకోగలిగారు?” అని నా ఆశ్చర్యాన్ని ప్రకటించాను.

“మొదటిది, మేం నిజానికి కలిసికట్టుగా లేం. ఈ చుట్టుపక్కల ఐదు క్యాంపులున్నాయి. ఇక్కడ కూడా సైద్ధాంతికపరమైన అభిప్రాయ భేదాలు వున్నాయి. అయితే, పోలీసులతోనో, సెక్యూరిటీ గార్డులతోనో గొడవలైనప్పుడు, ర్యాలీలో పాల్గొనేటప్పుడు మా నాయకులు ఒకరినొకరు సంప్రదించుకుంటారు. అందరం కలిసే పోరాడుతాం. ఏదో ఒకలా చిన్న చిన్న ఉద్యమాల్లోనో, ర్యాలీలోనో పాల్గొని ఓడిపోయి, ఇక ఏం చెయ్యలేం అనుకున్నప్పుడు ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని, ఒక మెగా కార్పొరేషన్ను ఎదుర్కుంటోందని తెలిసినప్పుడు మళ్లీ ఆశ పుడుతుంది. ఒక్క చోటైనా ఉద్యమం గెలవదా అని. వేరే ఎన్ని కారణాలున్నా, ఇప్పుడు మన అందరి ముందు ఉన్నది పర్యావరణ సమస్య. కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి, ఎక్కువౌతున్న టొర్నడోలు, హరికేన్లు, మంచు తుపాన్లు, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు. ఈ ప్రకృతి వైపరిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో, ఇంత విధ్వంస పూరితంగా లేవు. భూకంపాలు కూడా ఫ్రాకింగ్, షేల్ గ్యాస్ కోసం తవ్వకాల్లో ఉపయోగించిన కలుషిత నీటిని భూగర్భంలో భద్రపరచడం వల్ల కూడా ఎక్కువయ్యాయి. భూతాపాన్ని అపాలంటే భూగర్భ వనరులను ఇక ఏమాత్రం వెలికి తీయకూడదని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నా ఇంకా చమురు, బొగ్గు, షేల్ గ్యాస్ వంటి భూగర్భ వనరులను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఖర్చవుతున్న 3.5 బిలియన్ డాలర్లు వాయు, సౌర శక్తి లాంటి ప్రాజెక్టులకు పెట్టరు. అందులో ఎక్కువ లాభాలు ఉండవని. భూమే మిగలనప్పుడు లాభాలతో ఏం చేసుకుంటారో. డోనాల్డ్ ట్రంప్ పర్యావరణ విపత్తు మీద నమ్మకంలేదని అంటాడు. ట్రంప్ కు ఐర్లాండ్ దేశంలో, సముద్రం పక్కన ఒక  గోల్ఫ్ కోర్స్ వుంది. ఎలక్షన్ కు కొన్ని రోజుల ముందే, ఆ గోల్ఫ్ కోర్సు చుట్టూ ఎత్తైన గోడ నిర్మించేందుకు ఆ ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. భూతాపం వల్ల సముద్రమట్టం పెరిగి మునిగిపోతుందని కారణం చెప్పాడు. ఎంత ఎత్తు గోడ కట్టాలనుకుంటున్నాడో, భూమి కుంగి పోతే ఏం చేస్తాడో?”

కాసేపు మౌనంగా కూర్చున్నాం. నాకు అక్కడనుంచి కదలాలనిపించలేదు. కానీ, మాముందు నీడలు పొడుగవుతున్నాయి. “ఇక బయల్దేరుతాను. ముందు దారి ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ లేచి  నిలబడ్డాను.

%e0%b0%ae%e0%b0%ae%e0%b0%a4%e0%b1%a8

ఇద్దరూ లేచి నిలబడ్డారు. “అభివృధ్ధి పేరిట ఇంకా ఎంత మందిమి చనిపోవాలి? ఎంతమంది నిర్వాసితులు కావాలి? చావో బతుకో, ఇక పోరాడాల్సిందే. ఇంతవరకూ మనకు ప్రాణ మిచ్చిన భూమి కోసం, నీటి కోసం  పోరాడాలి.”

అక్టోబరు మొదటి వారాంతాన, బార్బరా, సూసన్లతో నేను మాట్లాడిన రోజు వాళ్లకు ప్రశాంతంగా గడిచిన ఆఖరి రోజు. మరుసటి రోజునుంచే ఆందోళనకరమైన వార్తలు వినవస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని ఏ ప్రముఖ న్యూస్ మీడియా పట్టించుకోకపోయినప్పుడు, “డెమాక్రసీ నౌ” అనే వార్తా సంస్థ అధిపతి అయిన ఏమీ గుడ్ మన్ ఉద్యమకారుల మీద దాడిని మొదటిసారి రికార్డు చేసి ప్రపంచం ముందు పెట్టింది. ఏమీ మీద ట్రెస్ పాసింగ్ కేసు పై అరెస్టు వారంట్ ఇచ్చారు. జర్నలిస్టుగా తన విధి నిర్వహణ ప్రకారం వీడియోలు తీశానని కోర్టులో చెప్పుకున్న తరువాతే ఆమెపై కేసు ఎత్తివేశారు. పైపులైను నిర్మాణాన్ని శాంతియుతంగానే అడ్దుకునేందుకు వెళ్లిన వాళ్లమీద పెప్పర్ స్ప్రే, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. ఎన్నో వందలమందిని అరెస్టు చేశారు. రిజర్వేషన్ చైర్మెన్ అయిన డేవ్ ఆర్చెంబల్ట్ ను కూడా అరెస్టు చేశారు.

ఇటీవల, నవంబరు 24 (అమెరికన్ హాలిడే అయిన థాంక్స్ గివింగ్ రోజు) రాత్రి జరిగిన పోరాటంలో ఉద్యమకారుల మీద రబ్బరు బుల్లెట్లతో పాటు, పెప్పర్ స్ప్రే కలిపిన వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలు. ఒక పెద్దాయనకు గుండెపోటు వచ్చింది. కొంతమంది అల్పోష్ణస్థితికి గురయ్యారు. ఉద్యమకారులకు వైద్యులూ మద్ధతు ఇస్తూ అక్కడ ఉన్నారు కనుక వెంటనే వైద్య సహాయం అందబట్టి బతికిపోయారు లేకపోతే కొందరు గుండె ఆగి పోయో, శ్వాస ఆడకో మరణించి వుండేవారు. ఒక పోలీసు విసిరిన క్యానిస్టర్ తగిలి ఒక యువతి చెయ్యి ఎముక చిట్లిపోయింది. ఇంత జరిగినా ఉద్యమకారులు తమ పోరాటం ఆపేదిలేదని చెబుతున్నారు.

*

 

 

‘మనిషి’ కేవలం ‘మనిషి’ కాదు!

photo-1

 

 

కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు మనిషి.

ఎందుకో చెప్పలేను. మనిషి వినా మరే ప్రపంచమూ పట్టనట్టు, మనుషుల గాథలు, వాళ్ల అనుభవాలు, వాళ్ల సృజనాత్మకత, జీవితంలో స్వయంగా వాళ్లు ఆర్జించిన జ్ఞానము, వివేకము, కొన్నిప్రత్యేక సందర్భాల్లో వాళ్లు అనుసరించే విధానమూ, విధి అని అంగీకరించిన తీరుతెన్నులు, ఇవ్వన్నీ తెలిసో తెలియకో, ప్రయత్నంతోనో అప్రయత్నంగానో సాధారణంగా తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నా వరకు నేను ఈ జగత్తులో మనుషులందరి గురించి ఒక లైబ్రరీ తెరవాలన్నంత కుతూహలంతో ఇదే పని ఇష్టంగా చేస్తూ ఉంటాను. ఆ పని లో భాగంగా పరిచయ వ్యాసాలు, పరిచయ నవలికలూ రాస్తూ ఉంటాను. అచ్చు వేస్తూ ఉంటాను కూడా.

అయితే, ఎవరు కొత్తగా పరిచయమైనా ఒక చెట్టును చూస్తున్నట్టు, చెట్టును కావలించుకున్నట్టు… పిదప ఆ చెట్టుమీద వాలిన పక్షిలా నేను ఆ చెట్టు గురించి తనపై ఎంతో కొంత ఆశ్రయం పొంది తెలుసుకుంటూ ఉంటాను. క్రమంగా ఆ చెట్టు కొమ్మల్ని, ఊడల్నీ, రెమ్మరెమ్మనూ ఫీలయి వేర్లనూ తడిమి దాని జీవన దారుడ్యానికి తన్మయమై, ఇరుగు పొరుగు చెట్లనుంచి సేకరించిన అనుభవ ఫలాలతో ఈ చెట్టునూ భేరీజు వేసుకుని మెలమెల్లగా వీలైనప్పుడల్లా వాటి ఒక్కో ఆకూ గురించి, ముందే చెప్పినట్టు శాఖల గురించీ, వాటిని సజీవ గాథలుగా, పరిచయ గాథలుగా రాసుకుంటూ పోతాను. ఇదొక జీవనశైలి.

అదృష్టవశాత్తూ వృత్తీ, ప్రవృత్తీ రచనే కావడం వల్ల పాత్రికేయ రచయితగా నాదైన శైలితో పనిచేస్తూ, నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నందున కల్పన జోలికి వెళ్లకుండా- వాస్తవ గాథలను, మనుషుల గాథలను రాయడమే ఇష్టమైన కార్యంగా పెట్టుకున్నాను. జీవితాలతో నా జీవితం అలా గడిచిపోతున్నది, మనుషుల్లో మనిషిగా మసులుకుంటూ ఉన్నాను.

మధ్యలో ఒక చిన్న ఉదయం. అది కెమెరా వల్ల జరిగిందనిపిస్తున్నది.

చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాను. అది కూడా ఒక మనిషి గురించి పుస్తకం రాసే ప్రయత్నంలో ఉండగా, ఆ మనిషి ఫొటోగ్రాఫరే అయినందువల్లా, ఆ కెమెరా మళ్లీ అలవోకగా నా భుజంపైకి వచ్చి చేరింది. ఇప్పుడు extended arm అయింది కూడా. ఎం.ఎస్. నాయుడు మాటల్లో ‘అది వేలాడే కన్ను’ అయింది కూడానూ.

photo-2

ఎప్పుడైతే, అంటే ఆరేళ్ళ క్రితం ఇలా మళ్లీ కెమెరా ప్రపంచంలోకి అడుగుపెట్టానో -అప్పట్నుంచీ మనిషి రహస్యం మనిషి మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ ఉన్నది. ‘మనిషి’ కేవలం ‘మనిషి’ కాదని ధ్రువపడుతున్నది.

మనిషితోసహా పరిసర ప్రపంచం …తెలియకుండానే …ఆ మనిషితో నను చేరుకొని మనిషిఫై మరింత అవగాహన  కలిగిస్తున్నాదీ అనిపిస్తున్నది. ఒక సరికొత్త మార్పును ఏర్పాటు చేస్తూ ఉన్నాను.

క్లిక్ బై క్లిక్  – తీస్తున్నది మనిషి ఛాయనే. కానీ ఆ ఛాయ అన్నది మనిషిదే కాదన్నవిషయం ఒక్కో ఎక్సపోజ్ తో  బోధపడుతూ ఉన్నది.

మనిషి ప్రధానంగా రచన చేసే మనిషి ఫోటోగ్రఫీ కి వచ్చే వరకు మనిషి ని మాత్రమే తీయడం లేదన్న బోధనా ఒక అబ్యాసంగా మారింది. చిత్రంగానే అనిపిస్తుందిగానీ నిజానికి నేను మనిషిని మాత్రమే ఫొటో తీస్తూ ఉన్నాను. కానీ మనిషితో పాటు అటూ ఇటుగా అతడి పరిసర ప్రపంచమూ ఒక ఛాయలో చాయగా అనేక శ్రేణుల్లో బంధితం అవుతూ ఉన్నది. “ఇందులో ఏం ఆశ్చర్యం’ అని మీరు అడగవచ్చు. కానీ తెలిసింది అక్షరాలా పంచుకోవడం ఆశ్చర్యం. అది పంచుకోవడం లో ఒక ఆనందం ఉందని  ఈ చిన్న తలపోత, వాపోవడమూనూ!

+++

అప్పటిదాకా మనిషి మాత్రమే నా ఇతివృత్తం. కెమెరా కన్నులతో చూడగా ‘మనిషిని చూస్తున్నాననే’ అనుకున్నాను. అతడు పెరుగుతున్నాడు. అతడి ఆవరణా పెరుగుతున్నది. మీదు మిక్కిలి, అతడున్న ఆవరణ పట్ల స్పృహా కలుగుతున్నది. కానీ రచయితగా దర్శించినప్పటిలా కాకుండా- కెమెరాతో చూసినప్పుడు ఆ మనిషి ఫొటో నేను ఇదివరకు గమనించినట్టు, నేను అనుకున్నట్టు రాలేదు. అదొక ఆశ్చర్యం!

బహుశా అందుకే ‘చిత్రం’ అంటామా? అనిపిస్తోంది.

అంటే -నేను భావించినట్లు కాకుండా-ఉన్నది ఉన్నట్టుగా- వచ్చింది. అప్పుడనిపించింది, ఆలోచన కన్నా చూపు మరింత సత్యమేమో అని. అటు తర్వాత అనిపించింది, ఇందుకు కారణం ఆ మనిషిని సరిగ్గా చూపించే మాధ్యమంతో -ఫొటోగ్రఫీ మీడియం తో పనిచేస్తున్నాను కదా అన్న గ్రహింపు వచ్చింది, క్రమక్రమంగా. ఇది నిజం. వాస్తవం అనిపించేలా ఫోటో రచనలు చేయడం మొదలింది.

అంతకు ముందరి రచన నాది. అది సృజన. కానీ ఇది నా నుంచి ప్రతిఫలనము మాత్రమే అని అర్థమైనది. నా విశ్వాసాలకు భిన్నమైన జీవన ఛాయలు రచించడం మొదలయింది.

photo-3

ఒక మనిషి మనకు బాగా పరిచితుడే అనుకుంటాం. కానీ అతడిని ఫొటో తీసినప్పుడు ఆ మనిషిలోని అనేకానేక మార్పులు, ఛాయలు కనిపిస్తయ్. అంతకు ముందు మనం చూడలేనివి, బహుశా చూడ నిరాకరించినవీ కనిపించడమూ అగుపించి, ఆశ్చర్య చకితులం అవుతాం. నేను అదే అయ్యాను. ఇదే విశేషం అనుకుంటే మరో విశేషం, ఆ మనిషితో పాటు చుట్టుముట్టున్న విషయాలన్నీ స్పష్టంగానో అస్పష్టంగానో నమోదయ్యాయి. ఇంకా ఇంకా ఫొటోలు తీసుకుంటూ పోతుంటే, ఇంకా ఇంకా… విషయాలు అనుభవ గ్రాహ్యం కావడం మొదలైంది. ఇది రచనా వ్యాసంగంలో కంటే ఈ వెలుతురు రచనలో, కెమెరా ప్రపంచం కారణంగా, ప్రస్ఫుటంగా నా వరకు నాకే అర్థమవుతూ ఉన్నది. చూడటం వేరు అని, దర్శనం వేరు అని.

ఈ తారతమ్యమూ ఒక ఆశ్చర్యం!

ఎట్లా అంటే, ఒక మనిషిని లాంగ్ షాట్లో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి తీరు వేరు. బస్టు సైజులో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి వేరు. ఆ మనిషి ఏదైనా పనిలో -అంటే యాక్షన్లో ఉన్నప్పుడు అతడు అగుపించే విధానం మరీ వేరు. ఇక అతడు నలుగురిలో ఉన్నప్పుడు మరీ భిన్నం. పదుగురిలో ఉన్నప్పుడు తన అస్తిత్వం ఒక్కటే ప్రాధాన్యం వహించని కారణంగా బృందంలో ఒకడిగా, ఒక్కోసారి ‘గుంపులో గోవిందయ్య’గా అతడి వ్యక్తిత్వం అప్రధానం కావడమూ జరిగి -అతడు వేరుగా అగుపించసాగాడు. ఒక మనిషిని జూమ్ చేయడమూ, క్లోజపులో చూపడమూ కాకుండా లాంగ్ షాట్లో, వైడాంగిల్లో తీయడమూ చేస్తూ ఉండగా ఆ మనిషి తాలూకు మనిషితత్వం విడివడుతూ అంతకు ముందు పరిచయమైన మనిషి కాకుండా సరికొత్త మనిషి ఆవిష్కారం అవడమూ మెలమెల్లగా అర్థమైనది.

మీరూ గమనించే ఉంటారు. మీ ఫొటోలు మీకే కొత్తగా ఉండటం!

photo-4

అట్లే ఒక్కరు గ వేరు, ఇద్దరు ఉన్నప్పుడు వేరు, గుంపు లో మనస్తత్వం వేరు అని.

ఏకాంతం లో మీరు మరీ వేరు. ప్రకృతి లో మీరు కావడము అప్పుడు ఉండదూ!

ఆలా వేరువేరు చెట్లు వేరు వేరు.

అంటే మరోలా చెబితే, అతడున్న స్థానం అతడిదే కావచ్చు. కానీ కెమెరాకు స్థలమూ కాలమూ విశ్వమూ ఉండి అతడ్ని భిన్న కోణాల్లో నమోదు చేయడమూ జరుగుతున్నది. కావున మనిషిని చూడటంలో కన్నుకు ఉన్న పరిధి కెమెరా కన్ను దాటింది, దాటి చూపుతున్నదనీ కూడా నా గ్రహింపు!

మరీ చిత్రం ఏమిటంటే- ఆ మనిషి పెదవులు ముడుచుకుని ఇచ్చిన ఫోజుకు, పెదవులు తెరచి ఉండగా తీసిన ఫొటొకూ జీవన వ్యాకరణంలోనే పెద్ద తేడా కనిపించింది. ఒక రకంగా- పెదవులు ముడిచినప్పుడు అతడు అతడుగా అంటే ఒక నామవాచకంగా, ఒక ప్రత్యేక అస్తిత్తంలో ఫ్రీజ్ అయిన మానవుడిగా ఉండటం గమనించాను. కాగా,  పండ్లు కనిపిస్తూ ఉండగా తీసిన ఫొటోలో అతడు సహజంగా అగుపించి, ఒక క్రియలాగా తోచడమూ మొదలైంది. అది అతడికి తెలియకుండా జరిగ చర్యలాగూ ఉన్నది.

ఇంకా, ప్రత్యేకంగా అతడిని ఒక స్థలంలో ఆరెంజ్ చేసి, తగిన వెలుగు నీడల్లో అందంగా, విశిష్టంగా ఫొటో తీసుకోవడం ఉందే – ఫోటో షూట్ – అది ఒక విశేషణంగా తోచింది. మనిషి ఒక్కడే – అక్షరమాలలోని పదం మామూలే. కానీ అతడితో కర్తకర్మక్రియలన్నీ మారిపోతూ ఉన్నవి, అక్షరం- పదం -వాక్యం కావడం -కొన్ని సార్లు కావ్యం కావడము ఉన్నదీ. అయితే ఇదంతా తనతో కాకుండా తనతోటి పరిసర ప్రపంచంలో ఆ మనిషి మార్పు నాకు అవగతం అవుతూ ఉండటం -‘మనిషి’ ‘మనిషి మాత్రమే కాదు’ అన్న అవగాహనకు బీజం అనిపిస్తోంది.

+++

photo-5

ఇదంతా ఒకెత్తయితే నేను సూటిగా చెప్పదలచుకున్న విషయం, అదే- ఈ మనిషి కేవలం నా సాహిత్య వస్తువుగా ఉన్నప్పుడు చీమూ నెత్తురూ రక్తమాంసాలు మూలుగు ఆత్మా ఉన్న వాడుగా, అనుభవాల సెలయేరుగా, ముందు చెప్పినట్టు ఒక చెట్టులా ఉన్నాడు. కనిపించాడు, నేను అలా ఆవిష్కరించాను కూడా. కానీ, ‘ఇది పరిమితమే’ అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఛాయాచిత్రలేఖనానికి వస్తే ఆ మనిషి ఒక ఉమ్మడి అంశంగా ఉన్నాడు. ఆ చెట్టు వేరుగా ఉన్నది. అతడు అడవి లోని  మానుగా ఉన్నాడు. లేదా జనారణ్యంలోని ఇనుప రజనుగా ఉన్నాడు.

ఆ వెలుగు నీడలు, ఆ ఆకుపచ్చ గానమూ, లేదా గాఢమైన ముదురెరుపూ తనవే కావచ్చును, కానీ, అతడు పంచభూతాల్లో ఒకడిగా ప్రతిబింబించసాగాడు. అతడి ప్రపంచం అన్నది లేదు. విశ్వంలో అతడున్నాడు. అంతే.

దాన్నే ఇలా చెబితే, అతడు ఫొటోగ్రఫి కారణంగా ప్రకృతిలో భాగంగా శోభిల్లడం నాకు దర్శనమిస్తూ ఉన్నది.  అదే ఈ వ్యాసానికి ఉపోద్గాతము, ముగింపునూ…

+++

చివరగా, మనిషి పంచభూతాల్లో ఒకడిగా, నేలా నింగితో, నీరూ నిప్పు గాలితో ప్రాణిగా ఉన్నాడు. వీటన్నిటి ప్రయోజనంగా, సంక్షిప్తమై ప్రత్యేక అస్తిత్వంగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందుకే అతడిని చూస్తే, తన స్థిరమైన లక్షణాన్ని గమనిస్తే మట్టిలా పరిమళంలా ఉంటాడు. ఆ సజల నేత్రాలను చూస్తే అది నీరు… ఆవేశకావేశాలతో ఎగిరిపడే అతడి హృదయం నిప్పు… ఆహ్లాదంతో తేలియాడినప్పుడు గాలి…. తన ఊహా ప్రపంచం, కల్పానమయ జగత్తును చూస్తే అది ఆకాశమో స్వర్గమో అనిపించసాగింది.

ఇలా పంచభూతాల సమాహారంగా అతడు లేదా ఆమె. వారి పరిసరాలు, ప్రతీదీ తన వ్యక్తిత్వంతో కాక ప్రాకృతిక జీవి గా వ్యక్తం కావడమూ ఉన్నది. అయితే అది స్వయంకృతం కాదని, మనిషంటే మనిషొక్కడే కాదనీ నాకు తీయగా తీయగా అనిపిస్తూ ఉన్నది. ఛాయలు చేయగా చేయగా అనిపిస్తోంది. మనిషి అంటే మనిషొక్కడే కాదని, ఇలా రాయాలనీ అనిపించింది.

ఈ రకంగా బోధపడ్డ అంశాలతో నేను మరింత నిలకడగా, లోతుగా ఛాయాచిత్ర లేఖనాన్ని అనుసరిస్తూ నాదైన సాహిత్య సృజన నుంచి మనిషిని చూసి అటు పిమ్మట కెమెరా గుండా  ‘మనిషి’ని -‘ప్రకృతి’ ని భాగం చేసుకునే, చూసుకునే ప్రయత్నం చేస్తూ మనిషి గా విస్తృతం అవుతున్నాను.

ఇలాంటి భావనలు పంచుకోవడంతో మిమ్మల్ని మీరు కూడా గమనిస్తారని, ఈ అందమైన సృష్టిలో ఒకరిగా, ఒక నిరంతర ప్రవాహంలో భాగంగా, soul of the universe గా గమనిస్తారన్న చిరు ఆశ. లేకపోతే నా ఫొటోగ్రఫి మాత్రమే కాదు, ఎవరి ఫోటోగ్రఫీ ఐనా అవిశ్రాంతం. మళ్లీ మనిషి ఉనికి ‘మనిషంతే’ అవుతుందన్న భయమూ కలుగుతుంది.

కావున, కృతజ్ఞతలు.

~

ముందడుగు ఇది…

suneeta2

అక్టోబర్ 19న నేను పనిచేసే అన్వేషి సంస్థ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సభ్యురాలు జకియా సోమన్ని వారు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారోద్యమం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇది ఆ విషయం పైన గత మూడు నెలల్లో సంస్థ పెట్టిన మూడవ చర్చ. అంతకు నెల క్రితం ముంబై కి చెందిన ప్రముఖ లీగల్ ఆక్టివిస్ట్ ఫ్లేవియా ఆగ్నెస్ కూడా అన్వేషి కి వచ్చి ఈ విషయంపై తన అభిప్రాయాలని చర్చకి పెట్టారు. ఆవిడ బి ఎం ఎం ఏ చేస్తున్న ప్రచారోద్యమం అనవసరమని, ఇది హిందూత్వ వాదులకి ఉపయోగ పడుతుందని బలంగా వాదించారు.

మామూలుగా 20  మంది మించకుండా హాజరయ్యే ఇటువంటి చర్చలకు జకియా మాట్లాడే రోజు సమయానికి ముందే హాలు నిండేటంత అంతకు ముందు ఎప్పుడూ రాని ముస్లిం స్త్రీలు హాజరయ్యారు. ఆమె అహ్మదాబాద్ లో తన నేపధ్యం, తన అమ్మమ్మ ఇల్లు ఎన్ని సార్లు మత కలహాల్లో దగ్ధ మయింది, తన వైవాహిక జీవితంలో పడిన హింస, గుజరాత్ మారణ కాండతో తానెలా ముస్లిం కమ్యూనిటీ కోసం పని చెయ్యటం ప్రారంభించారో చెప్పారు. తాను గుజరాత్ ఊచ కోత బాధితులకి సహాయం చేసే పనిలో నిమగ్నమయిన తరువాతే తనని తాను ఒక ముస్లిం గా భావించుకోవటం ప్రారంభించానని చెప్పారు. ఆ అవగాహన తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పారు.

ఇదంతా చెప్పిన తరువాత తాము చేపట్టిన ప్రచారోద్యమం గురించి, తాము షరియత్ పరిధిలో, ఖురాన్లో చెప్పినట్లు మాత్రమే భర్తలు భార్యలకు తలాక్ ఇచ్చే విధంగా ముస్లిం కుటుంబ చట్టాలని మార్చాలని, వాటిని క్రోడీకరించమని అడిగామని చెప్పారు. దీనికి తమ వద్దకి వచ్చిన అనేక మంది బాధిత ముస్లిం స్త్రీల జీవిత పోరాటాలే కారణమని కూడా చెప్పారు. నల్ల జాతి ఇస్లామిక్ స్త్రీవాది అయిన అమీనా వదూద్ నుండి, షరియత్ పరిధిలో ముస్లిం స్త్రీలు తమ హక్కులు సాధించుకోవాలనే  ముసావా అనే అంతర్జాతీయ ఇస్లామిక్ మానవ హక్కుల నెట్ వర్క్ నుండి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు.

అయితే హాజరయిన ముస్లిం స్త్రీలు జకియా మాట్లాడటం ప్రారంభమైన దగ్గరినుండి ప్రతి నిముషం ఆమెని అడ్డుకున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. ఆవిడకి ఖురాన్ లో, హదీస్ లో ఏమి తెలుసో ప్రశ్నించారు. ఆవిడ హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్నందు వల్ల ముస్లిం కాదని, ముస్లిం లకి ప్రతినిధిగా ఉండటానికి అర్హత కోల్పోయిందని వాదించారు. కొంత మంది మూడు తలాక్ లనేవి కేవలం ముస్లింల వ్యతిరేక ప్రచారం మాత్రమే నని, తాము ఎక్కడా వినలేదని, చూడలేదని అన్నారు. ముస్లిం స్త్రీలకి సరయిన చదువు ఉంటే ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారని వాదించారు. జమాత్ ఏ ఇస్లాం లో పని చేసిన ఖలీదా పర్వీన్, ముస్లిం స్త్రీలకి పేదరికం, చదువు లేకపోవటం, పితృస్వామ్యం వల్ల సమస్యలు ఉన్నాయని అయితే వీటిని కమ్యూనిటీ లోపలే చర్చించుకోవాలని, కోర్టుకి, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చట్టాల్లో మార్పుల కోసం అడగటం అనవసరమని అన్నప్పుదు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు సాయంత్రం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్  పైన ఇదే రకమైన విమర్శలు గుప్పించారు. ఆమెకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని ప్రశంశించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని వినవచ్చింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది.

అన్వేషి సంస్థ స్త్రీలకి సంబంధించిన కుటుంబ చట్టాలు, వాటిలో మార్పుల గురించి గత ముప్ఫయి ఏళ్ల లో అనేక చర్చలు నిర్వహించింది. 1990 ల మధ్యలో షాబానో వివాదం తరువాత వుమ్మడి పౌర స్మ్రితి వుండాలని అనేక స్త్రీల సంస్థలు వాదించి, దాని నమూనాలు తయారు చేసిన సమయంలో రెండేళ్ల పాటు చట్టం, చట్ట సవరణల గురించి సామూహిక అధ్యయనం జరిపి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి మాట్లాడే ముందు కుటుంబ చట్టాల విభిన్నత గురించి తగినంత అవగాహన వుండాలని, స్త్రీలకు న్యాయమంటే ఏకరూప ఉమ్మడి చట్టం అవసరం లేదని, వివిధ చట్టాలలో సంస్కరణలు చేసే విధంగా కృషి చెయ్యాలని వాదించి, ముంబై కి చెందిన మజ్లీస్ తో కలిసి స్త్రీవాద సంస్థ లన్నింటికీ ఒక అప్పీల్ ని పంపించింది – వుమ్మడి పౌర స్మ్రితి ముస్లింలని టార్గెట్ చెయ్యటానికి హిందూత్వ వాదులు వాడుకుంటున్నారు కాబట్టి, దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని, స్త్రీ వాద సంస్థలు ఈ ప్రయత్నం మాను కోవాలని అడిగింది. గత ఇరవై ఏళ్లలో అఖిల భారత ప్రజాస్వామిక స్త్రీల సంస్థ తో సహా అందరూ స్త్రీలకి న్యాయం కోసం ఉమ్మడి పౌర స్మృతి  మార్గం కాదని, ఆయా కుటుంబ చట్టాలలో తగిన మార్పులు చేసుకోవాలనే ప్రజాస్వామిక అవగాహనకి వచ్చారు.

suneeta1ఇదంతా వర్ణించటం ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ కి చెందిన స్త్రీలని విలన్లు గా, జకియా సోమన్ని హీరోయిన్ గా చూపించటానికి లేదా అన్వేషి సంస్థ గొప్పతనం చెప్పుకోవటానికి కాదు. నా ఉద్దేశంలో జకియా సోమన్ పట్ల అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత – భారతీయ ముస్లిం సమాజాల్లో కుటుంబ చట్టాల గురించిన చర్చ మెజారిటీ హిందూత్వ వాద నీడలో జరగటం వల్ల జరుగుతున్న దుష్ఫరిణామాలకి ఒక చిహ్నం తప్ప మరేమీ కాదు. ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ మరియు భారతీయ ముస్లిం మహిళా అందోళన్ రెండూ కూడా 1990 ల తరువాత, ఇంకా చెప్పాలంటే 2002 లో గుజరాత్ ఊచ కోత తరువాత పుట్టినవే. రెండూ కూడా బలంగా ఇస్లాం తమకు కావలిసిన హక్కులు, అధికారాలు ఇస్తాయని నమ్ముతాయి. ఇది కేవలం ఈ రెండు సంస్థల, సంఘటనల అవగాహనే కాదు. హైద్రాబాదు లో పని చేసే అనేక చిన్న ముస్లిం స్త్రీల సంస్థలు, తమ స్త్రీలకి సరయిన చదువు – ముఖ్యం గా ఇస్లాం గురించి – ఉంటే తమ హక్కులు తామే సాధించుకోగలరని, కుటుంబ సమస్యలని పరిష్కరించు కోగలరని, హింసకు వ్యతిరేకంగా పోరాడగలరని భావిస్తాయి.

అయితే ఏది సరయిన ఇస్లామిక్ అవగాహన, షరియత్ అంటే ఏమిటి, ముస్లిం పర్సనల్ చట్టాలంటే ఏమిటి, ఏ ఏ హక్కులు, అధికారాలు స్త్రీలకి వున్నాయి, అవి ఎవరి ఆధ్వర్యంలో సాధించుకోవాలి, ఎలా సాధించుకోవాల్సిన పద్ధతులపై మాత్రం తీవ్ర బేధాభిప్రాయాలు వున్నాయి. ఇస్లాం మత చట్టాలు మత విశ్వాసాలలో భాగమైనవి కాబట్టి అవి అచంచలమైనవి అని ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ వారు వాదిస్తే, వాటిని చారిత్రిక సందర్భం బట్టి అర్ధం చేసుకోవాలని బిఎంఎంఎ భావిస్తుంది. ముస్లిం పర్సనల్ చట్టాలు షరియత్ నుండే పుట్టాయి కాబట్టి వాటిని ఎవరూ మార్చలేరని, మార్చ కూడదని ఎంజిఎ వాదిస్తే, అవి షరియత్ స్ఫూర్తి తో రూపొందింన భారత దేశ రాజ్యాంగ చట్టాలని, మారుతూనే వస్తున్నాయని, కాబట్టి వాటిని మార్చుకోవచ్చని బిఎంఎంఎ అంటుంది. పితృస్వామ్యం వల్ల ముస్లిం స్త్రీలు తమకి రావాల్సిన అధికారాలు సాధించుకోలేక పోతున్నారని ఖలీదా పర్వీన్ మరియు జకియా సోమన్ ఇద్దరూ అంగీకరించినప్పటికీ, ఖలీదా తమ సమాజంలోనే పోరాడి సాధించుకోవాలని భావిస్తే జకియా ప్రభుత్వ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

స్త్రీలు ముస్లిం సమాజంలో ఉంటూ పోరాడాలి అనే భావన సాంప్రదాయక ధోరణిగా అనిపించి నప్పటికీ ప్రజాస్వామ్యం కరువైన లౌకికత చేసే చేటు గురించి 1985 తరువాత కలిగిన అవగాహన లో ఇది కొత్త రాజకీయ అర్ధం సంతరించుకుంది. ఈ విషయాన్ని చర్చించిన పార్థ ఛటర్జీ వంటి రాజకీయ సిద్ధాంత కర్త మైనారిటీ సమాజంలో స్త్రీల పోరాటం గురించి చర్చిస్తూ ముస్లిం స్త్రీలు ఒక పక్క తమ సమాజాలని బయటి సమాజ దాడి నుండి రక్షించుకుంటూ ఇంకో పక్క తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల ముస్లిం స్త్రీల పోరాటాలని అర్ధం చేసుకోవటానికి ఈ చట్రం చాలా ఉపయోగ పడుతుంది. ఈ ప్రక్రియలో స్త్రీలు కూడా తమ సమాజ ప్రతినిధులుగా ఎదుగుతున్నారు, అంగీకరించ బడుతున్నారు. ముస్లిం స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడే స్థాయికి చేరుకోక ముందే తమ సమాజాలలో – విద్య లేక ఆరోగ్యం గురించి – లేదా సమాజాలపై దాడులు – హిందూత్వ దాడులు, పోలీసుల దాడుల గురించి – అనేక సంవత్సరాలు పని చేసి వుంటారు. ఉదాహరణకి భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ గుజరాత్లో ఊచకోతకు గురయిన ముస్లిం ల కోసం పని చెయ్యటమే కాక, ఆ తరువాత కుటుంబ సమస్యల పరిష్కారం కోసం షరియత్ అదాలత్ లని స్థాపించారు. అలాగే వివాహ సమయంలో భార్యా భర్తలిద్దరూ సంతకం చెయ్యాల్సిన నిఖానామా లో స్త్రీల హక్కులు కూడా స్పష్టం గా పొందుపరచి వాటిని ప్రచారం చేసి అనేక పెళ్లిళ్లలో వాటిని వాడుకునేలా కృషి చేశారు. ఈ ప్రక్రియలో సమాజం మొత్తం, పురుషులతో సహా, వారిని కొంత మేరకు తమ ప్రతినిధులుగా ఒప్పుకుంటుంది.  తమిళ నాడు లో షరీఫా ఖానం తో సహా అనేక మంది ముస్లిం స్త్రీలు నడిపే తమిళ్ నాడు ముస్లిం స్త్రీల జమాత్ దీనికి మంచి ఉదాహరణ. ఇది పుదుకోట్టై లోని పేద ముస్లిం స్త్రీలు కుటుంబ సమస్యలని ఖురాన్ పరిధిలో పరిష్కరించు కుంటూ దురాచారాలకు వ్యతిరేకంగా సామూహికంగా పనిచేస్తున్న క్రమంలో ఏర్పడింది. మొదట్లో పురుష జమాత్ లు వ్యతిరేకించినా క్రమేణా వాళ్ళే కుటుంబ సమస్యల కేసుల్ని వీరికి పంపించటం మొదలు పెట్టారు.

హిందూత్వ వాదులు ముస్లిం సమాజాలలో జరిగే పోరాటాలని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోనంత వరకూ ఈ విషయాలపై పోరాడే స్త్రీలని ఆయా సమాజాలు కష్టం గా నైనా అంగీకరిస్తాయని గత ఇరవయి ఐదేళ్ల ముస్లిం సమాజాల చరిత్ర మనకి అర్ధం చేయిస్తోంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన పట్ల హైద్రాబాదుతో సహా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దీని నుండే పుడుతోంది. వారు నరేంద్ర మోడీ వద్దకి వివాహ చట్టాల మార్పు కోసం వెళ్ళటం అనేది కొందరికి కోపం తెప్పిస్తే, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నది మరి కొందరి బాధ. ‘దీనితో భారతీయ జనతా పార్టీకి జుట్టు అందించినట్లు కాలేదా? ముస్లిం సమాజాల పట్ల వ్యక్తమయ్యే అనేక అపోహలని – పురుషులు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు భార్యలకు తలాక్ ఇచ్చేస్తారు, అసలు వుమ్మడి పౌర స్మ్రితి రావడమే దీనికి పరిష్కారం – బల పరిచినట్లు అవుతోంది కదా?’ అనేవి వారికి వస్తున్న విమర్శ. ‘అయితే మరి తమతో మాటైనా చెప్పకుండా భర్తలు తమకి తలాక్ నామా పంపిస్తున్నారని మా దగ్గరకి వస్తున్న ముస్లిం స్త్రీల సంగతేమిటి? ముస్లిం స్త్రీలు తమ వివాహ చట్టాల్లో మార్పుల కోసం ఎంత కాలం ఆగాలి? కాంగ్రెస్ వున్నప్పుడు చెయ్యదు, బిజెపిని అడగ కూడదు, సమాజ పెద్దలుగా అంగీకరించబడిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు?’ అని బి ఎం ఎం ఏ వేస్తున్న అన్న ప్రశ్నలు ముస్లిం సమాజాల్లో, బయటా కావాల్సినంత చర్చని లేవదీస్తున్నాయి. అంతే కాక ‘ముస్లిం స్త్రీలు తమ సమాజంలో ఉంటూ తమ హక్కుల కోసం పోరాడాలి’ అన్న సూత్రీకరణకి  ‘ముస్లిం వివాహ చట్టాలలో షరియత్ ననుసరించి తగిన మార్పులు చెయ్యాలి’ అనే అర్ధాన్నిచ్చి కొత్త సవాలు విసురుతున్నాయి.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ మూడు తలాక్ లకి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారోద్యమం, సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు మళ్ళా తలెత్తిన ఉమ్మడి పౌర స్మ్రితి గురించిన అనవసర చర్చలో తేలిపోవచ్చు. వారి సర్వేలలో అసమగ్రత, వారి సభ్యత్వం లో లోపాలు, వారికి చట్టాల గురించిన అవగాహనా లేమి పరిశీలన లో ముందుకి రావచ్చు. ముస్లిం సమాజాలపై యుసిసి పేరుతో జరిగే దాడిని తిప్పి కొట్టటంలో భాగంగా మనలో కొంతమందికి వీరిని వ్యతిరేకించాల్సి కూడా రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నే ఈ వివాదాన్ని పక్కన పడెయ్యచ్చు. కానీ తమ సమాజంలో ఎప్పటి నుండో నలుగుతున్న సమస్యని అందరి దృష్టికి తెచ్చి తమ పెద్దలతో సహా అందరూ చర్చించేలా చేసారని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు తీర్పులకన్నా ఇటువంటి చర్చలే సామాజిక మార్పు కి దారి తీస్తాయి. ఇది ముస్లిం సమాజాల అంతర్గత మార్పులకి, ముస్లిం స్త్రీలు తమ సమాజ ప్రతినిధులుగా ఎదిగే ప్రక్రియకి చిహ్నం. దీనిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న హిందూత్వ వాదుల అవకాశ వాదమే ముస్లిం సమాజాలని ఆత్మ రక్షణ లోనికి నెట్టి ముస్లిం స్త్రీల గొంతుని పైకి రాకుండా, మార్పుకి అవకాశమివ్వకుండా చేస్తోంది.

 

References

 

Voice of the voiceless (Status of Muslim Women Part II) Report prepared by Syeda Hameed in 1999 for National Commission for Women: http://ncw.nic.in/pdfReports/vov-part-2.pdf

Faizan Mustafa ‘The debate on triple talaq must be based on proper research and data’,  http://thewire.in/77923/muslim-personal-law-reforms-bmma-studies/

 

Anveshi Law Committee “Is gender justice only a legal issue?: Political stakes in UCC debate’, Economic and Political Weekly, Vol. 32, No.9- 10,

http://www.epw.in/journal/1997/9-10/perspectives/gender-justice-only-legal-issue.html

 

A.Suneetha “Muslim women and marriage laws: the debate on the model nickhanama”, Economic and Political Weekly, No.43, 2012

http://www.epw.in/journal/2012/43/review-womens-studies-review-issues/muslim-women-and-marriage-laws.html

A.Suneetha “ Between haquq and taleem: Muslim women’s activism in contemporary Hyderabad”, Economic and Political Weekly, No. 34. 2012 http://www.epw.in/journal/2012/34/special-articles/between-haquq-and-taaleem.html

 

 

 

 

 

 

విశ్వనాథ దిగిన మెట్లు!

viswa1

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్:2

ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యప్రపంచంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక కోణంలో విరాణ్మూర్తే. ఆ విషయంలో ఎవరికి మాత్రం సందేహం ఉంటుంది? అయితే, ఆయన దృక్పథం మాటేమిటి?

ఒక కవిగా, పండితుడిగా, సాంప్రదాయిక సాహిత్యవేత్తగా, నవలాకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా విశ్వనాథ సాహిత్యపరామర్శా, విశ్లేషణా విస్తృతంగా జరిగి ఉండవచ్చు. బహుశా ఎనభై దశకం నుంచీ మారుతూ వచ్చిన ఆర్థికసామాజిక రాజకీయ పరిస్థితుల కారణంగా విశ్వనాథను సరికొత్త స్ఫూర్తిదాయక శక్తిగా దర్శించి ఆరాధించడం ప్రారంభించిన మధ్యతరగతిలోని ఒక నూతన విద్యాధిక తరం ఇప్పటికీ ఆ పని చేస్తూ ఉండవచ్చు. కానీ ఆయన దృక్పథాన్ని నిర్మమ దృష్టితో పరిశీలించి చర్చించడం ఎక్కడైనా జరిగిందా, జరుగుతోందా?

sudrarsanamఆర్.ఎస్. సుదర్శనంగారు తన ‘సాహిత్యంలో దృక్పథాలు’ లో విశ్వనాథ గురించి రాసిన భాగాలు చదువుతున్న కొద్దీ; అప్పుడు కానీ ఇప్పుడు కానీ విశ్వనాథ దృక్పథం గురించి వచ్చిన రచనలు ఏమేమి ఉన్నాయన్న ఆసక్తిదాయక ప్రశ్న నన్ను వెంటాడుతూనే వచ్చింది. సుదర్శనంగారి విశ్లేషణపై అప్పటివారు ఎలా స్పందించారు, దానిపై ఎలాంటి సమీక్షలు వచ్చాయి, ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి; అన్నిటికంటే ముఖ్యంగా ‘సాహిత్యంలో దృక్పథాలు’ వెలువడిన కాలానికి విశ్వనాథ జీవించే ఉన్నారు కనుక తనపై విశ్లేషణకు ఆయన ఎలా స్పందించారన్నవి, అంతే కుతూహలం రేపిన మరికొన్ని ప్రశ్నలు.

కొంత అకడమిక్ స్వభావం కలిగిన ఈ ప్రశ్నల్ని వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తాను.

‘సాహిత్యంలో దృక్పథాలు’లో ప్రప్రథమంగా ఆకట్టుకున్నది, విశ్వనాథ గురించి రాయడంలో సుదర్శనం ప్రదర్శించిన అద్భుతమైన వస్తుగతదృష్టి.  నా ఉద్దేశంలో సాహిత్యవిమర్శలో అది ఒక మంచి నమూనా. ఆయన కొన్ని చోట్ల విశ్వనాథను ఆకాశానికి ఎత్తారు. కొన్ని చోట్ల అంత ఎత్తునుంచీ కిందికి జార్చారు. ఆక్షేపణలూ చేశారు, అభినందనలూ వర్షించారు. ఒకచోట విశ్వకవి రవీంద్రునికన్నా విశ్వనాథ ప్రతిభావంతుడని అంటూనే, ఆ వెంటనే,  ఒక తత్వదర్శిగా రవీంద్రుడు ఎన్ని మెట్లు ఎక్కాడో విశ్వనాథ అన్ని మెట్లు కిందికి దిగారంటారు.

నవలాకర్తగా విశ్వనాథపై ప్రశంసాత్మక దృష్టినుంచి చేసిన సుదర్శనంగారి మదింపు ఇలా ఉంటుంది:

‘ఏకవీర’ గురించి:  విశ్వనాథలోని ఆధ్యాత్మికమైన లోచూపు ఇతర కాల్పనిక రచయితల భావనకు లేని తత్వ పరిపూర్ణతను ఇచ్చింది.  పూర్తిగా రొమాంటిక్ సంప్రదాయంలో పుట్టిన ‘ఏకవీర’ ఆ సంప్రదాయాన్ని అధిగమించి కావ్యగౌరవం పొందింది. ఈ నవల చివరి మూడు అధ్యాయాలూ ఉత్తమ కవిత్వం, ఔచిత్యం, మనస్తత్వ చిత్రణం, శాస్త్రపరిజ్ఞానం, తత్వదృష్టి, ధ్వని పరిపుష్టంగా ఉన్న రచన. ఈ స్థాయిలో వచనకవిత్వం, అసలు ఇంతకంటే కవిత్వం విశ్వనాథ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఏకవీర’తో పోల్చదగిన నవల రవీంద్రుని ‘నౌకాభంగము’. అందులో భావనాత్మకమైన ప్రేమ కన్నా, హిందూ వివాహవ్యవస్థ శక్తిమంతమని నిరూపించే ప్రయత్నం చేశాడు రచయిత. కానీ ఆ ప్రయత్నం అస్తవ్యస్తంగా పరిణమించింది. ‘ఏకవీర’కు ఉన్న తాత్వికమైన పటిమ రవీంద్రుని నవలకు లేదు. ఏకవీర కావ్యమైన నవల.

మనస్సులో అవ్యక్తమైన భాగం (Unconscious)ఒకటి ఉందనీ, దానికీ, వ్యక్తమైన భాగా(Conscious)నికీ సంఘర్షణ ఉంటుందనీ గుర్తించి పాత్రపోషణ చేసిన మొదటి తెలుగు నవలా రచయిత విశ్వనాథ. ‘ఏకవీర’లో వివాహవ్యవస్థనూ, వైయక్తికమైన వలపునూ -రెంటినీ ఆయన సమర్థించలేదు. వాటికి అతీతమైన సమన్వయాన్ని సూచించారు. అదే హైందవ సంప్రదాయమూలసూత్రం. అప్పట్లో వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించే బంకిం చంద్ర మార్గం కన్నా, వైయక్తికమైన ధర్మాన్ని కాల్పనిక వాదంలో భాగంగా సమర్థించే రవీంద్ర ప్రభావితులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి, వెంకట పార్వతీశ్వర కవుల కన్నా విశ్వనాథ తొక్కిన మార్గం ప్రత్యేకమైనదే కాదు, ఉత్కృష్టమైనది.

‘వేయిపడగలు’ గురించి:  ‘వేయిపడగలు’ నవల చదవడం ఒక అపూర్వమైన అనుభవం, మరపురానిది. అందులో ఎంత సంతృప్తి ఉన్నదో అంత అసంతృప్తి కూడా ఉన్నది. ‘వేయిపడగలు’ గొప్పదనం అది ఏకపాత్ర చిత్రణం కావడం. ఆ చిత్రణం వేయి పుటల దాకా విస్తరించినా, వేయి పుటలూ తప్పక చదివిస్తాయి. పాశ్చాత్యనాగరికతా ప్రభావం ముప్పై ఏళ్లలో ఏ విధంగా తెలుగువారి జీవనవిధానంలో ఒడిదుడుకులకు. అవకతవకలకు హేతువైందో విపులంగా విమర్శనా దృష్టితో వర్ణింపబడడం కావ్యాన్ని అపురూపమైనదిగా చేస్తున్నది. అలా చూస్తే ‘వేయిపడగలు’ ఒక చిన్న సైజు ‘విజ్ఞాన సర్వస్వం’ అనిపిస్తుంది. ధర్మారావుతో పాటు విశ్వనాథ సృష్టించిన పాత్రలు చాలావరకు సజీవమైనవి. ‘వేయిపడగలు’,  కాల్పనికోద్యమ కాలంలో వెలువడిన ఆత్మాశ్రయ కవిత్వ(Subjective Poetry) శాఖలో ఒక అపురూపమైన కావ్యం. దాని వైశిష్ట్యం, అది వేయి పుటల నవలగా రూపొందడమే. నవలకు కవిత్వగుణ మబ్బడం 20 వ శతాబ్ది సాహిత్యములో ఒక మహత్పరిణామం. తెలుగు సాహిత్యములో స్వతంత్రంగా ఈ పరిణామం తెచ్చిన ఖ్యాతి విశ్వనాథది.

మొత్తంగా ఆయన నవలల గురించి:  విశ్వనాథ నవలను కావ్యంగా, తత్వవిచారంగా రూపొందించారు. అది ఆయన సాహిత్యానికి కూర్చిన నవ్యత. విశ్వసాహితిలో తెలుగు నవలకు స్థానం ఏర్పరచిన నవ్యత.

***

విశ్వనాథ పాండిత్యం, అవగాహనల లోతును, కల్పనాశక్తిని, పాత్రచిత్రణను. ఇంకా ఇతరేతర అనేక గుణాలను ప్రతిబింబించే కొన్ని ఘట్టాలనో, భావ శకలాలనో  ఆయన రచనలనుంచిఎత్తి చూపి ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు ముగ్ధులవడం వేరు. ఒక రచనను మొత్తంగా చూసి అందులో ఆయన ప్రదర్శించిన వస్తు నిర్వహణ నైపుణ్యాన్ని, స్పష్టతను, ముఖ్యంగా ఆ రచన వెనుక ఉన్న ఆయన దృక్పథాన్నీ విశ్లేషించి అంచనా వేయడం వేరు. సుదర్శనంగారు చేపట్టినది రెండో పద్ధతి.

విశ్వనాథ దృక్పథ పార్శ్వానికి వస్తే, అది ఆయనకు చాలా అసంతృప్తినే కాదు, ఆవేశాన్ని, ఆవేదనను కూడా  కలిగించింది. అక్కడక్కడ ఆక్షేపణ, వ్యంగ్యం రంగరించి మరీ విమర్శ చేయడానికి ఆయన వెనుకాడలేదు. అదే సమయంలో ‘ఏకవీర’ నుంచి ‘తెరచిరాజు’ వరకు వివిధ నవలలో విశ్వనాథ దృక్పథం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో, దాని వెనుక ఎలాంటి అంతస్సూత్రత ఉందో; ఆ క్రమంలో విశ్వనాథ ఎలాంటి ద్వైధీ భావానికీ, ఘర్షణకూ, కలవరానికీ లోనయ్యారో, చివరికి ఎక్కడ ఆగిపోయారో సుదర్శనం విశ్లేషించిన తీరు అత్యద్భుతం. అది చదువుతున్నప్పుడు 20 వ శతాబ్ది తెలుగుసాహిత్యంలో ధీర గంభీర ఆజానుబాహువుగా కనిపించే అంతటి విశ్వనాథ , పసివాడుగా మారి బేల చూపులు చూస్తున్న దృశ్యం పొడగడుతుంది.  బాహ్యంగా ముద్రపడిన ఇమేజికి, ఆంతరిక ఇమేజికి ఉన్న ఈ తేడా; ఒక రాజకీయ నాయకుని, లేదా మత నాయకుని లేదా మరొకరి ఇమేజి నిర్మాణంతో ఏమైనా సామ్యాన్ని సూచిస్తోందా?!

viswa1

ఏకవీర

ప్రస్తుతానికి దానినలా ఉంచితే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో, అంతకు ఒకింత ముందు సాంప్రదాయిక ప్రభావాలనుంచి నవ్యతకు మళ్లిన అనుభవం ఎక్కువమంది కవి, రచయితలలో కనిపిస్తే; నవ్యతనుంచి సంప్రదాయం వైపు,అంటే వెనక్కి మళ్లి, అందులోనే కరడుగట్టిన అరుదైన సాహితీవేత్తగా విశ్వనాథ కనిపిస్తారు. మొదట్లో ఆయన కూడా తన సమకాలికులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి వగైరాలలానే కాల్పనికవాదంతో ప్రభావితులయ్యారు. ఆ కొత్త కళ్ళద్దాలతో జగత్తును నూతనంగా దర్శించి, పులకించి, భాష్యం చెప్పే వైశాల్యం వైపు ప్రవహించే ప్రయత్నం చేశారు. ‘ఏకవీర’లో అది ఎలా ప్రతిఫలించిందో సుదర్శనం విశ్లేషించారు. కాల్పనికోద్యమ ప్రభావంలో పుట్టిన ‘ఏకవీర’ కథలో, నిర్మాణంలో ఆ ఉద్యమ సంప్రదాయాన్ని పూర్తిగా అనుసరిస్తూనే; ఏకవీర పాత్రపోషణ, కథ ముగింపు విశ్వనాథ ప్రత్యేకదృక్పథాన్ని సూచిస్తాయని ఆయన అంటారు. నవలలో కుట్టాన్-మీనాక్షి; వీరభూపతి-ఏకవీర ప్రేమికులు. కానీ పెళ్లి అనే వ్యవస్థాధర్మం దగ్గరికి వచ్చేసరికి జంటలు తారుమారు అయ్యాయి. దానితో రెండు జంటలలోనూ సంఘర్షణ ఏర్పడింది. ఆ సంఘర్షణ తిరిగిన మలుపు ఈ నవలలో ఇతివృత్తం. పెళ్ళికి, ప్రేమకు మధ్య జరిగిన ఆ ఘర్షణలో ఏకవీర ద్వంద్వాతీతమైన తాత్వికస్థితిని చేరుకుని, లోకాన్నీ లోకధర్మాన్ని విడిచి వైగై నదిలో మునిగిపోయింది. వీరభూపతి సన్యాసి అవుతాడు.  వీరికి భిన్నంగా కుట్టాన్, మీనాక్షి పెళ్లి అనే వ్యవస్థాధర్మంతో రాజీపడే ప్రయత్నం చేస్తారు.

ఏకవీర, వీరభూపతిలలో ధర్మానికీ, ప్రేమకూ జరిగిన సంఘర్షణను, అది తిరిగిన మలుపును ప్రత్యేకంగా చిత్రించడమే విశ్వనాథ నిరూపించదలచుకున్న తాత్విక విషయమని సుదర్శనం అంటారు. కాల్పనికోద్యమ ప్రభావంలో ఉన్న ఈ దశలో విశ్వనాథ వైయక్తిమైన వలపును కాదనలేదు; అయితే వివాహవ్యవస్థా ధర్మాన్నీ కాదనలేదు. రెండింటికీ అతీతమైన ఒక సమన్వయాన్ని దర్శించారు. ఇందులో ఆయన నిరూపించదలచుకున్నది కేవల హైందవవ్యవస్థ కాదు; దానికి మూలతత్వమేదైతే ఉందో అది. అదే సనాతనధర్మం. వ్యక్తి ధర్మానికీ, వ్యవస్థా ధర్మానికీ జరిగే ఘర్షణలో రెంటి వైపూ మొగ్గక, రెంటినీ అధిగమించే సమన్వయాన్ని సాధించే ద్వంద్వాతీతమైన తత్వమే సనాతన ధర్మం. అది సామూహికం కాక, వ్యక్తిగతం. క్రమంగా విస్తృతమూ, వైవిధ్యవంతమూ అయిన అయిన హైందవ సంప్రదాయస్వరూపం ఇదే నని సుదర్శనం అంటారు. నాటి వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించిన బంకిమ్ చంద్ర మార్గం కన్నా, కాల్పనికవాదంలో భాగంగా వైయక్తిక ధర్మాన్ని సమర్థించిన రవీంద్రుని మార్గం కన్నా, విశ్వనాథ ఏకవీరలో ప్రదర్శించిన సమన్వయ పూరితమైన సనాతనధర్మ మార్గం ఉత్కృష్టమైనదని ఆయన నిర్ధారణ.

viswa2

అయితే అదే సమయంలో ఈ ‘ఏకవీర’లోనే తన మతావేశంపై, తత్వాన్ని వదలి దాని ప్రతీకలపై విశ్వనాథలో ఉన్న చాపల్యాన్ని సూచించే చిత్రణలూ ఉన్నాయని సుదర్శనం ఎత్తి చూపించారు. ఆ చాపల్యం, లేదా వ్యామోహమే క్రమంగా ఆయనలో పెరిగి పెద్దదై అనంతర రచనల్ని ఆక్రమించుకుందనీ, ద్వంద్వాతీతమైన సనాతనధర్మాన్ని వదిలి ద్వంద్వంలో ఒకటైన వ్యవస్థాధర్మాన్ని సమర్థిస్తూ వచ్చారనీ, వ్యవస్థాధర్మమే సనాతన ధర్మం అనే అపోహను కల్పించే ప్రయత్నం చేశారని సుదర్శనం విశ్లేషణ. అంటే, కాల్పనికోద్యమ ప్రభావంతో కొత్త చూపును తెచ్చుకోబోయిన విశ్వనాథే, వ్యవస్థ పట్ల రొమాంటిక్ వ్యామోహంలో పడిపోయి పాత చూపుకు తిరోగమించారని సారాంశం. ఆయన దృక్పథ పతనానికి ఇదే ప్రారంభం.

వేయిపడగలు

‘వేయిపడగలు’ నవలలో వ్యక్తమైనది ఇదే!

కారణం, వ్యవస్థకు పట్టిన క్షీణదశ అంటారు సుదర్శనం. దాంతో వ్యవస్థను సమర్థించడం, కాపాడడమే ఆయనకు ముఖ్యంగా తోచిందనీ; హేతువాదం, భౌతికవాదం, పురాణాల నిరసన మొదలైనవి కలిగించిన ఆవేశంతో విశ్వనాథ సాహిత్యరంగాన్ని సమరరంగంగా దర్శించారని ఆయన అంటారు. పాశ్చాత్య ప్రభావాలు, ఇంగ్లీష్ చదువులే కాక,  గాంధీజీ స్వాతంత్ర్య సమరంలోకి దళితులను, ముస్లింలను ప్రవేశపెట్టడం మొదలైన, సుదర్శనం చెప్పని ఇతరేతర పరిణామాలను కూడా వీటికి జోడించుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలోనే సుదర్శనం ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. వ్యవస్థ కాలం వెంబడి మారే సాధనం మాత్రమేననీ, అంతకంటే అది ప్రాతినిధ్యం వహించే తత్వం ముఖ్యమనీ; దానిని కొత్తగా, కొత్త సమన్వయంతో పునర్మించాలనీ విశ్వనాథకు తోచలేదని ఆయన అంటారు. అయితే, ఆ వెంటనే, “అలా ఆలోచించే అవకాశం అప్పట్లో ఆయనకు లే”దని సుదర్శనంగారే అనడం ఏమరుపాటో లేక ఉద్దేశపూర్వకమో తెలియదు. బహుశా, తాత్విక స్థాయిలోనే కావచ్చు కానీ, విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే హైందవసంప్రదాయం పట్ల ఒక అడ్మిరేషన్ కలిగిన ‘బాహ్యమిత్రు’డిగా ఆయనకు ఇలా సందేహలాభా(benefit of doubt)న్ని ఆపాదించి ఉండవచ్చు. ఎందుకంటే, విశ్వనాథకు సమకాలికుడైన ఉన్నవ లక్ష్మీనారాయణగారి ‘మాలపల్లి’ నవల గురించి ‘సాహిత్యంలో దృక్పథాలు’లో సుదర్శనంగారే చర్చిస్తూ ఆ నవలకూ, వేయిపడగలకూ ఉన్న తేడాను నిర్వచనప్రాయంగా ఆవిష్కరించారు.

‘మాలపల్లి’ ఆనాటి సామాజిక చైతన్యానికి ప్రతిబింబం కావడమొక్కటే కాదు, ఆ చైతన్యానికి నూతన దృక్పథాన్ని, పరిణామమార్గాన్ని నిర్దేశించిందని ఆయన అంటారు. ఆయన ప్రకారం, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రెండు విభిన్న మార్గాలను అనుసరించడం సాధ్యం. మొదటిది,  వర్ణాశ్రమ వ్యవస్థ శిథిలమైందనీ, వైదికధర్మం అడుగంటిందనీ, పరాయి మతస్థుల, విదేశీయుల పాలనలో భారతీయ సంస్కృతి, భాషలు, హైందవధర్మం, జీవనం సంకరమైపోయాయనీ, ఇక మిగిలిందేముందనీ అనుకుంటూ నిస్పృహ, నిర్వేదం ప్రకటించడం. ఇది ‘వేయిపడగలు’ లో ప్రతిభావంతంగా వ్యక్తమైంది. రెండవది,  పై వైఖరి సంపూర్ణ సత్యం కాదని చెబుతూ, మౌలికమైన హైందవధర్మమూ, సంస్కృతీ సజీవంగానే ఉన్నాయనీ, నెలవులు మార్చుకుని కాలగతిలో నివురు గప్పిన నిప్పులా ఉంటూనే ఉన్నాయనీ భావించడం. ఇది ‘మాలపల్లి’లో కనిపిస్తుంది. యధార్థం ఒకటే అయినా ఈ రెండు రచనల ప్రతిపాదనలు వేరు వేరుగా ఎందుకు ఉన్నాయంటే, హైందవధర్మమూ, సంస్కృతీ అగ్రవర్ణాలవారిలో, ధనికులలో పూర్వస్థితినుంచి శైథిల్యాన్ని పొందినా సామాన్యప్రజల్లో, పంచముల్లో, నిరుపేదల్లో సజీవంగా ఉండడం ఒక కారణం.  ‘వేయిపడగలు’ అగ్రవర్ణాలవారినీ, జమీందారులనీ ఆలంబనం చేసుకోగా, ‘మాలపల్లి’ పంచములను, శ్రామికులను ఆలంబనం చేసుకుంది. విశ్వనాథ వర్ణవ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యం సనాతనధర్మానికి ఇవ్వలేదు. ఉన్నవవారు సనాతనధర్మానికీ, మోక్షసాధనకూ ఇచ్చిన ప్రాధాన్యం వర్ణవ్యవస్థకు, వైదికకర్మానుష్ఠానానికీ ఇవ్వలేదు. ఇలా పోల్చి చూసినప్పుడు హైందవధర్మనిరూపణలో ఒకరిది ‘వెనుక చూపు’, ఇంకొకరిది ‘ముందుచూపు’ అని సుదర్శనం అంటారు.

ఇలా ‘వేయిపడగలు’ను, ‘మాలపల్లి’ని పోల్చి చూసినప్పుడు ఇంకా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సుదర్శనంగారు ‘వెనుకచూపు’గా పేర్కొన్న ‘వేయిపడగలు’కు లభించిన ప్రాచుర్యం, ‘ముందుచూపు’గా పేర్కొన్న ‘మాలపల్లి’కి ఎందుకు లభించలేదు; ‘వేయిపడగలు’ చర్చలోకి వచ్చినంతగా ‘మాలపల్లి’ ఎందుకు రాలేదు,  వర్ణాశ్రమ ప్రాధాన్యాన్ని కాక, సమన్వయాత్మకమైన సనాతన ధర్మాన్ని ప్రతిపాదించిన ఆ నవల అనంతరకాలానికి ఒక గొప్ప స్ఫూర్తీ, నమూనా ఎందుకు కాలేదు—అన్నవి ఈ ప్రశ్నలలో కొన్ని. ఇంకొకటి ఏమిటంటే, ‘మాలపల్లి’కి ఉన్నది స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం, గాంధీ తాత్వికత. ఉన్నవవారు స్వయంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. సుదర్శనంగారు గుర్తించి ప్రస్తావించనిది ఏమిటంటే, ‘వేయిపడగలు’ వెనుక ‘మాలపల్లి’కి ఉన్నట్టు బలమైన స్వాతంత్రోద్యమ నేపథ్యం లేకపోవడం. ‘వేయిపడగలు’,  ఆయనే అన్నట్టు, వ్యవస్థా శైథిల్యం పట్ల ఒక వ్యక్తి చెందిన నిర్వేదం, నిస్పృహ. ఉన్నవలా విశ్వనాథ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు.

స్వాతంత్ర్యోద్యమ ప్రభావాలనుంచి ‘వేయిపడగ’లూ, దాని రచయిత దూరంగా ఉండడం చారిత్రక దృష్టినుంచి మనకు ఏం చెబుతుంది? దళితులను, ముస్లిం లను, కార్మిక, కర్షకులను స్వాతంత్ర్యోద్యమంలోకి తీసుకొచ్చి ఉద్యమ పరిధిని అనేకరెట్లు విస్తృతపరచిన గాంధీ;  దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగివచ్చాక తన శేషజీవితం పొడవునా బ్రిటిష్ తో పోరాటానికి సమాంతరంగా, అంతకంటే ఎక్కువగా పోరాడినది ఛాందసవాదహైందవశక్తులతో. చివరికి ఆ శక్తుల చేతిలోనే ఆయన మరణించాడు కూడా. ఈ ఛాందసవాద హైందవ శక్తులు కూడా గాంధీ నాయకత్వంలోని నాటి స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఆ శక్తుల అండదండలతో, భావజాలంతో ప్రాణం పోసుకుని  నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి కూడా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటానికి దూరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ‘వేయిపడగలు’ వెనుక స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం లేకపోవడం ఆ రచనను, రచయితను ఎవరి మధ్య నిలబెడుతోంది? ‘మాలపల్లి’కి భిన్నంగా ‘వేయిపడగలు’ విశేష ప్రాచుర్యాన్ని, అడ్మిరేషన్ ను పొందుతూ ఉండడమే కాదు; ఎనభై దశకం చివరినుంచీ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆర్థికంగా బలోపేతమవుతున్న మధ్యతరగతిలోని ఒక విద్యాధిక యువతరం ఇప్పుడు విశ్వనాథను, ఆయన భావజాలాన్ని నూతనంగా కనుగొంటూ ఆయనను ఒక స్ఫూర్తిదాయక ఐకాన్ గా తిరిగి ప్రతిష్టించే ప్రయత్నం వరకూ దాదాపు ఒక వందేళ్ల కాలగమనాన్ని కళ్ళముందు నిలుపుకుని చూస్తే అందులో సరళరేఖా సదృశమైన ఒక కచ్చితమైన క్రమం కనిపిస్తుంది. ఆ సరళరేఖకు ఆ చివర గాంధీ భావజాలం ఉంటే; ఈ చివర ఉన్నది ఛాందస హైందవాద భావజాలం, అది సాధించిన పునరాధిక్యత. రాజకీయంగా చెప్పాలంటే, గాంధీ భారతంపై సావర్కర్ భారతం సాధించిన పునర్విజయం.

‘మాలపల్లి’ దళితులకూ స్ఫూర్తిదాయకం కాలేదు, నమూనా కాలేదు. కారణం స్పష్టమే. అందులో ఉన్నది ఒక బ్రాహ్మణ రచయిత చిత్రించిన గాంధీ మార్కు హైందవ తాత్వికత. గాంధీకి ఆనాడు అంబేడ్కర్ ప్రతిద్వంద్వి అయిన పరిస్థితిలో దళితులు గాంధీ మార్గాన్ని కాక అంబేడ్కర్ మార్గంవైపే మొగ్గు చూపారు. మొత్తానికి, సనాతన ధర్మాన్ని చిత్రించారని సుదర్శనంగారు చెప్పిన ‘మాలపల్లి’ రచయిత దళితులకు సరే, అగ్రవర్ణాలకూ పనికిరాకుండా పోయాడు.

ఇంతకీ ‘వేయిపడగలు’లో విశ్వనాథ ఘనంగా చెప్పదలచుకున్న వ్యవస్థా స్వరూపం ఎలాంటిది? సుదర్శనంగారి మాటల్లో చెప్పాలంటే, ఆయన ‘దృక్పథ శైథిల్యం’ ఇంకా ఎలాంటి మలుపులు తిరిగింది?

దాని గురించి తర్వాత….

*

 

పాషాణ పాకం – మైనపు ముద్ద!

viswanatha

ఒక పాతకాలపు మండువా ఇల్లు లాంటి ఇల్లు. చుట్టూ ప్రహరీ. ఎత్తైన ద్వారబంధం. లోపల విశాలమైన ఒక పూజగది. అందులో ఒక పెద్ద జ్ఞానభాండాగారం. ఆ పరిసరాల్లో ఆకురాలినా వినిపించేటంత నిశ్శబ్దం. ఆ గదిలో వెలుతురూ చీకటీ కానీ ఒక మిశ్రమస్థితి.

ఆ జ్ఞానభాండాగారం ముందు ఒక వృద్ధుడు ముకుళిత హస్తాలతో, అరమోడ్పు కనులతో కూర్చుని ఉన్నాడు. అంతర్ముఖుడై ఉన్నాడు. ఆయన ముఖమండలాన్ని అనంతమైన శాంతి ఆవరించి ఉంది. మధ్య మధ్య తల ఎత్తి భాండాగారంవైపు చూస్తున్నాడు. నిశ్చయాత్మకంగా తల పంకిస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనలోని ఆలోచనలకు అక్షరరూపమిస్తే అది ఇలా ఉంటుంది.

మానవుడు పుట్టినప్పటినుంచీ ప్రోది చేసుకుంటూ వచ్చిన జ్ఞానమేదైతే ఉందో ఆ యావత్తు ప్రపంచవిజ్ఞానానికీ ఇది అంతిమం. దీనికి ముందు ఏమీ లేదు. దీని తర్వాత ఇంకేమీ ఉండదు. ఇందులోంచి జ్ఞానాన్ని తోడి ప్రపంచానికి, అది కూడా అవతలివాడి యోగ్యతను బట్టి,  అందించవలసినదే కానీ, ఇందులోకి తీసుకొచ్చి కలపవలసిన ప్రపంచవిజ్ఞానం ఏమీ లేదు.

జ్ఞానానికి ఇది అంతిమ సరిహద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడిక తానుగా కొత్తగా జ్ఞానాన్వేషణ చేయవలసిన అవసరం నుంచి ఆయన విముక్తి పొందాడు. అయితే జన్మ ఎత్తాము కదా, దీనినేమి చేయాలి? ఈ జ్ఞానపు సరిహద్దును శత్రువులు ఆక్రమించకుండా కాపలా కాయడమే దానితో చేయవలసినది. అనగా తానొక యోధునిగా మారడం!

ఆ వీథి లోంచి ఆ ఇంటి మీదుగా రోజూ ఒకాయన వెడుతూ ఉండేవాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన అడుగులు కాసేపు ఆగేవి. ఆ ఇంటిమీద ఆయనకు ఒక అంతులేని కుతూహలం. ఆ లోపల ఉన్నవారు ఎవరో ఆయనకు తెలుసు, కానీ తెలియదు. ఇదో విచిత్రమైన ప్రహేళిక. తెలియడమంటే ఏమిటి, సన్నిహితంగా గాఢంగా తెలియడం. కానీ ఈయనకు ఆ అవకాశం లేదు. ఆ వృద్ధుడి సామాజిక నేపథ్యం, ఈయన సామాజిక నేపథ్యం ఒకటి కావు. కనుక కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఆ జ్ఞానభాండాగారాన్ని నింపుతూ వృద్ధి చేస్తూ వస్తున్న ఆ ఇంటిలోపలివారి ఆచారవ్యవహారాలు, వారి ఆలోచనాసరళి, వారి భాషకు చెందిన నుడికారం, అందులో ఉట్టిపడే ధిషణ, అధికారం-మొత్తంగా ఆ జ్ఞానభాండాగార వృద్ధి వెనుక గల వారి తాత్విక, మానసిక స్థితిగతులు ఈయనకు సన్నిహితంగా తెలియవు. ఆ ఇంటాయనదీ, ఈయనదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకరికొకరు పరిచితులే, కానీ అపరిచితులు. ఒకరు ఆ జ్ఞానభాండాగారపు లోపలి మనిషి, ఇంకొకరు వెలుపలి మనిషి.

కానీ ఈయనకు ఆ ఇంటిమీద వల్లమాలిన కుతూహలం. ఎప్పుడైనా సింహద్వారం తెరచి ఉన్నప్పుడు లోపల కొంత ఆ ఇంటి ఆకారం కనిపించేది, అంతే. అది కనిపించడం కాదు. మరీ అరుదుగా సాహసించి సింహద్వారం దాటి లోపలికి వెళ్ళేవాడు. కానీ అడుగులు జ్ఞాన భాండాగారమున్న గది ఇవతల ఆగిపోయేవి. ఇంకా అరుదుగా ఆయన అదృష్టం కొద్దీ ఆ భాండాగారపు తలుపులు  ఓరగా తెరచుకుని ఉండేవి. అప్పుడా సందులోనుంచి భాండాగారం వైపు తొంగి చూసినప్పుడు దానిలోని జ్ఞానశకలాల మెరుపులేవో తన బుద్ధిని తాకినట్లు అనుభూతి చెందేవాడు. ఆ మెరుపులు అప్పటికే ఈయన బుద్ధిలో నిక్షిప్తమైన జ్ఞానఫలకంపై ప్రసరించి కొత్త కాంతులను ఈనుతున్నట్టు అనిపించేది.

ఎందుకంటే, ఈయన తన బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నది కొత్త జ్ఞానం. ఆ వృద్ధుడి భాండాగారం నుంచి తోడుకున్నది కాక ఇంగ్లీషు చదువువల్ల కలిగినది. వృద్ధుని భాషలో చెప్పాలంటే అది కాలమహిమ! వృద్ధుడి వెనక వందలు వేల సంవత్సరాల చదువు ఉండగా ఈయనది ఇప్పుడిప్పుడే మొదలైన చదువు. పైగా అది ఇంగ్లీషు చదువు. ఈయనకు ఆ విధంగా ఇంగ్లీషు గవాక్షం నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది. ఆపైన తన జ్ఞానభాండాగారం యావత్తు జ్ఞానానికీ అంతిమం అనుకుంటున్న వృద్ధుడిది ఆగిపోయిన చదువైతే, ఈయనది  సాగుతున్న చదువు. వృద్ధుడిది కడుపు నిండింది అనుకునే చదువైతే, ఈయనది అప్పుడే హైబర్నేషన్ నుంచి బయట పడినట్టుగా ప్రపంచాన్నే మింగేసేటంతగా ఆవురావురు మంటున్న చదువు.

sudrarsanam

ఈయన తన కొత్త చదువుల దారిలో ఏవో కొన్ని జ్ఞానపు గీటురాళ్లను సేకరించుకున్నాడు. ఆ వృద్ధుని జ్ఞాన భాండాగారం నుంచి తనను తాకిన శకలాలను వాటిమీద పరీక్షించి విలువ కట్టాలని ఈయన తాపత్రయం. ఆవిధంగా రెండింటి మధ్యా ఏమైనా సమన్వయం సాధ్యమవుతుందేమో నని కూడా ఆయన తపన. కానీ విచిత్రం, ఆ జ్ఞానభాండాగారానికి తను అపరిచితుడు, ఔట్ సైడర్! కాకపోతే ఆ భాండాగారంపై ఈయనకు ఒకవిధమైన ఆరాధనాభావం ఉంది. కనుక దానికి ఆయన ‘బాహ్యమిత్రుడు’. మారిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులలో ఆ వృద్ధునికీ, ఈయనకూ కుదిరిన ఒకానొక ఐక్యత కూడా అందుకు కారణం కావచ్చు.  అంతకు చాలా ముందునుంచే ఉండి, ఇవే పరిస్థితులలో ఈయన కళ్ళముందే బలమైన గొంతును, నిర్దిష్టతను, అస్తిత్వాన్ని తెచ్చుకుంటున్న ఇంకొక సామాజికవర్గం ఉంది. ఈ వర్గానికి ఆ జ్ఞానభాండాగారం వైపు తలుపు సందులో నుంచి చూసే అవకాశం కూడా లేదు. కనుక ఈ వర్గాన్ని ‘బాహ్యశత్రువు’ అనవచ్చు.  ‘బాహ్యత’ అనేది ఉభయులకూ సమానం.

వృద్ధుని విశ్వనాథ సత్యనారాయణ అనుకుంటే, ఈ రెండో వ్యక్తి ఆర్. ఎస్. సుదర్శనం.

***

‘సాహిత్యంలో దృక్పథాలు’ ఆర్. ఎస్ .సుదర్శనంగారి ప్రసిద్ధ సాహిత్య విమర్శాగ్రంథం. మొదటిసారి 1968లో ప్రచురితమైంది. అందులోని వ్యాసాలను ఎప్పుడో చదివాననే గుర్తు. కానీ అది చదువు కాదు. విశ్వనాథవారి ఫక్కీలోనే చెప్పాలంటే, చదివితిని, చదవనైతిని. అసలు చదువనగా నేమి? ఒక పుస్తకములోని విషయమును సంపూర్ణముగా ఆకళించుకొనగల అధికారముతో చదివినదే చదువు. కేవలము చక్షురక్షర సంయోగమాత్రముగా చదువునది చదువు కాదు.

చదవడం గురించి నాకూ ఒక అభిప్రాయం ఉంది. మనం ఒకే రచనను వివిధ జీవితదశల మీదుగా చదువుతాం. ఆ వివిధ జీవిత దశలమీదుగా సునిశితమవుతున్న మన అవగాహనను, ప్రపంచజ్ఞానాన్ని ఆ రచనకు అదనంగా జోడిస్తూ చదువుతాం. ఆ చదువు వెనకటి జీవితదశలోని చదువును రద్దు చేస్తుంది. అంటే మళ్ళీ ఆ రచనను మనం కొత్తగా చదువుతాం. ఆ విధంగా ఆ రచన కాలం వెంబడి ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని తెచ్చుకుంటూ పాఠకుడికి ఎప్పటికప్పుడు కొత్తగా చదివిన అనుభూతినిస్తుంది.

ఇప్పుడు ‘సాహిత్యంలో దృక్పథాలు’ చదవడం నాకు నిజంగా అలాంటి ఒక విశిష్టానుభవం. అటు విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఇటు సుదర్శనంగారిని కూడా కొత్తగా ఒకింత ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడా రచన ఇచ్చింది. అయితే ఇది సబ్జెక్టివ్ గా అంటున్న మాట సుమండీ. విభేదించే హక్కు పాఠకులకు ఎప్పుడూ ఉంటుంది.

అందులోనూ నాకు ముఖ్యంగా అనిపించినది, ఈ పుస్తకానికి అది వెలువడిన రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ రెలెవెన్స్ ఉందన్నది. ఆ రెలెవెన్స్ ఉండడమే దాని గురించి నేను రాయడానికి ప్రధానమైన ప్రేరణ. ఆ రాయడంలో నేను సాహిత్యంలో దృక్పథాలు గురించి మాత్రమే రాయడం లేదు. విశ్వనాథ సత్యనారాయణ, ఆర్ ఎస్ సుదర్శనం అనే ఇద్దరు వ్యక్తులను గురించి రాస్తున్నాను. వారి భావాల మధ్య ఉన్న సంఘర్షణ గురించి, ఆ సంఘర్షణ వేళ్ళు వారి వారి సామాజిక, వైజ్ఞానిక వైవిధ్యాలలో ఉండడం గురించి రాస్తున్నాను. వారిని, వారి సామాజిక నేపథ్యాలను  కూడా దాటి,  దేశమంతటా ఇంకా కింది సామాజికవర్గాలవరకూ వ్యాపించి  ఈ దేశపు గతాన్ని, వర్తమానాన్ని కమ్ముకున్న ఆ వైవిధ్యమూ, ఆ భావసంఘర్షణా తాలూకు భవిష్యస్థితి గురించి, అది నేటి మన అనేకానేక భ్రమలను చెదరగొట్టే అవకాశం గురించి రాయడానికి ఈ ప్రయత్నం.

సుదర్శనంగారు సాహిత్యంలో దృక్పథాలు రాసిన కాలానికి ఉన్న దేశీయస్థితిగతులు వేరు. అప్పడు కాంగ్రెస్, అది చెప్పుకునే సెక్యులరిజం(లేదా ఇప్పుడు కొందరు ప్రబలంగా చిత్రిస్తున్న సూడో-సెక్యులరిజం) పెద్దగా పోటీ లేని అధికారాన్ని చలాయిస్తున్నాయి. దేశవిభజన తర్వాత దేశంలోని ముస్లిం మైనారిటీలు, ఇతర మతపరమైన మైనారిటీలు సెక్యులరిజం(లేదా సూడో-సెక్యులరిజం) గొడుగు కింద  కనీసం సూత్రరీత్యానైనా ఒక తటస్థ సామాజిక స్థితిలో ఉంటున్నారు.  ఇంకోపక్క వామపక్ష, వామపక్ష తీవ్రవాద ప్రభావం ప్రత్యేకించి యువత మీదా గాఢంగా ఉంది. నూతన రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో దళితులు, తరుజన, గిరిజనులు కొత్త అస్తిత్వాన్ని, గొంతును, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటున్నారు.

ఈ కాలమంతటా సాంప్రదాయికశక్తులుగా భావిస్తూ వచ్చిన శక్తులు సద్దు మణిగి ఉన్నాయి. వాటిమీద తిరోగాములన్న ముద్ర బలంగా ఉంది. పాశ్చాత్య విజ్ఞానపు వెలుగులో సాంప్రదాయిక విద్యా విజ్ఞానాలను సరికొత్తగా అర్థం చేసుకుని నూతన సమన్వయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఆరోజున పురోగామిగా ముద్ర పొందింది. ఆవిధంగా సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు రాసే కాలానికి పురోగామి చింతకులు అనుకుంటే, విశ్వనాథ తిరోగామి భావజాలానికి ప్రతినిథి. అయితే 1968 నుంచి 2016 కు వచ్చేసరికి నాడు ‘తిరోగామి’, ‘పురోగామి’ అనుకున్న శక్తుల బలాబలాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇప్పుడు విశ్వనాథ భావజాలం అధికారాన్ని పుంజుకుంటూ విశ్వరూపాన్ని ధరిస్తుంటే సుదర్శనం ప్రాతినిధ్యం వహించిన భావజాలం దానికి దారి ఇస్తూ వెనకడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా భావజాలాల ఆధిక్యత తలకిందులైన పరిస్థితే సాహిత్యంలో దృక్పథాలకు సరికొత్త రెలెవెన్స్ ను స్థాపిస్తూ నూతనంగా చదవలసిన అవసరం కల్పిస్తోంది.

నేను పైన అన్న ‘బాహ్య మిత్రుడు’, ‘బాహ్య శత్రువు’ అనే మాటలు ఇక్కడ కీలకంగా గమనించవలసినవి. ఇప్పుడు ఒకవిధమైన జాతీయతావాదాన్ని, దేశభక్తిని దేశంలో స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక్కడ దేశీయసమాజస్థితి ఎలా ఉంది? ‘బాహ్య మిత్రుడు’ ఇంకా ‘అంతర్మిత్రుడు’ కాలేదు. ‘బాహ్య శత్రువు’కీ, ‘అంతర్వ్యక్తు’లకూ మధ్య సయోధ్య, సమన్వయం, ఇరువురినీ కలిపే ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడలేదు. బలాబలాలు తలకిందులు కావచ్చు తప్ప, సాంప్రదాయికంగా వస్తున్న భావ, భౌతిక సంఘర్షణ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని రకాల వైరుధ్యాలను, వైవిధ్యాలను తన కంఠబలంతో అధికార బలంతో ఎగరగొట్టి తన అస్తిత్వాన్ని అంతటా వ్యాపింపజేయడంలో  వందలు వేల సంవత్సరాల అనుభవం ఉన్న సాంప్రదాయిక భావజాలానికి ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేయగల అవకాశం దాదాపు నూరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ వచ్చింది. తన బ్రాండు జాతీయతావాదాన్ని, దేశభక్తిని విధించి శాసించడం అందులో భాగమే.

కానీ విచిత్రమేమిటంటే ఆ జాతీయతావాదాన్ని, దేశభక్తిని పైనుంచి కృత్రిమంగా రుద్దే ఆ ప్రయత్నంలోనే దాని నిరంతర వైఫల్యమూ స్పష్టంగా లిఖించి ఉండడం. ఈ దేశానికి అదొక హాస్యాస్పద, విషాదకర అనుభవం.

నేను ఈమధ్యనే ఒక చోట రాశాను, భారత దేశమంతటా ఈనాటికీ ఉన్నది ప్రైవేట్ సంభాషణా, ప్రైవేట్ జీవితాలే తప్ప పబ్లిక్ సంభాషణా, పబ్లిక్ జీవితమూ లేదు. భారతదేశపు గొంతు ఇప్పటికీ ప్రైవేట్ గానే వినిపిస్తుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలు తమ నాలుగు గోడల మధ్య నిరంతరం ప్రైవేట్ గానే సంభాషిస్తూ ఉంటాయి. వీటి మధ్య ఒక ఉమ్మడి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. రాజ్యాంగం అవతరణ అలాంటి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసేందుకు ఒక ప్రాతిపదిక. కానీ ఇన్నేళ్లలోనూ రాజ్యాంగం పొందుపరిచిన ఆ పబ్లిక్ భాష పూర్తిగా ప్రజల పరం కాలేదు. అసలు రాజ్యాంగం ఉనికే జనం ఊహల్లో ఇంకలేదు. రాజ్యాంగం ముందునాటి వివాదాల అంతు తేల్చుకునే ప్రయత్నంలోనే ఇప్పటికీ ఉన్నాం. ఇప్పుడు సాంప్రదాయిక శక్తుల పునరాధిక్యస్థితి ఆ అంతు తేల్చుకునే ప్రక్రియను పూర్తి స్థాయి యుద్ధం వైపు మళ్లించింది.

మళ్ళీ ‘బాహ్యమిత్రు’డి దగ్గరికి వద్దాం. పైన చెప్పిన ఆ మండువా ఇంటి లాంటి ఇల్లూ, అందులోని జ్ఞాన భాండాగారం ముందు కూర్చుని ఉన్న విశ్వనాథ వంటి ఒక వృద్ధుడూ, ఆ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్ ఎస్ సుదర్శనం వంటి వ్యక్తీ, ఆ ఇంటి మీద ఆయన కుతూహలం, అందులోని జ్ఞాన భాండాగారం పట్ల ఆయనలోని ఒకవిధమైన అడ్మిరేషన్…కేవలం ఒక ప్రతీకాత్మక దృశ్యకల్పన కావు. సాహిత్యంలో దృక్పథాల వంటి సుదర్శనంగారి రచనల ద్వారానే కాక, వ్యక్తిగా కూడా ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయంతో నేను ఆయన గురించి చేసిన కల్పన ఇది.

సుదర్శనంగారు ఎనభై దశకం ప్రారంభంలో, అంతకు కొన్నేళ్ళ ముందు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, ఆ తర్వాత ఉన్నత విద్యా జాయింట్ డైరక్టర్ గానూ ఉన్న రోజుల్లో కొన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్ళి సాహిత్యం గురించే కాక, ఇతర విషయాల గురించి కూడా ఆయన చెప్పేవి వినే అవకాశం నాకు కలిగింది. ఇప్పటికీ ఒక సంభాషణ నాకు గుర్తుండిపోయింది.

ఓసారి మా సంభాషణ శంకరాచార్యులు స్థాపించిన మఠాలవైపు, కంచి పరమాచార్య వైపు మళ్ళింది. పరమాచార్య గురించి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన కళ్ళలో కనిపించిన ఒక మెరుపు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన గురించి నాకు దగ్గరగా తెలిసిన కొన్ని విషయాలు ఉత్సాహంగా చెబుతుంటే ఆయన ఆసక్తిగా విన్నారు. నేను మాట్లాడ్డం ఆపిన తర్వాత ఒకసారి ఆయన భారంగా నిట్టూర్చి, “మీరు చెబుతున్నవి బాగానే ఉన్నాయి. కానీ బ్రాహ్మణేతరులు పరమాచార్యకు దగ్గరగా వెళ్లచ్చా? వారితో శాస్త్ర, ఆధ్యాత్మిక విషయాలు చర్చించవచ్చా? బ్రాహ్మణ పండితులతో సమానంగా వారికి ఆ అవకాశం ఇస్తారా?” అన్నారు. అలా అంటున్నప్పుడు వారి గొంతులోనూ, ముఖంలోనూ ఒకింత బాధా, నిరాశా తొంగి చూశాయి.

“అదేమీ లేదు, నాకు తెలిసినంతవరకూ వారి దగ్గర బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తేడాలు ఏవీ ఉండవు. ఎవరైనా వారిని చూడచ్చు, మాట్లాడచ్చు” అన్నారు.

అప్పుడు ఆయన నన్నో అజ్ఞానిగానో, అమాయకుడిగానో చూసినట్టు చూసి, చిరునవ్వు నవ్వారు. “నేను అంటున్నది వారిని దర్శనం చేసుకోవడం గురించి, మాట్లాడడం గురించి కాదు. ఆ మఠానికి ఒక సంప్రదాయం ఉంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో బ్రాహ్మణులదే ముఖ్యపాత్ర. బ్రాహ్మణేతరులకు వాళ్ళతో సమానస్థాయిలో వ్యవహరించే అవకాశం లేదు” అన్నారు. ఆ మఠంలో వ్యవస్థకు, ఆచరణకు మొదటి ప్రాధాన్యమనీ, తత్వానికి తర్వాతి ప్రాధాన్యమనీ అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఇంగ్లీష్ విద్య చదువుకున్నవారు హిందూ తాత్వికతకు ప్రాధాన్యమిస్తూ దానిని ప్రపంచానికి పరిచయం చేశారనీ, తనదీ అలాగే తత్వానికి ప్రాధాన్యమిచ్చే దృష్టి అని ధ్వనింపజేశారు.

తాను సాంప్రదాయిక జ్ఞాన భాండాగారానికి ‘మిత్రుడి’ నే అయినా దానికి ‘బాహ్యుడి’ నన్న అసంతృప్తి, వెలితి ఆయన మాటల్లో కనిపించింది. ఆ జ్ఞానభాండాగారం నుంచి తనకు దొరికిన, అనుమతించిన కొన్ని శకలాలను ఆయన ఏరుకున్నారు. వాటిని ఇంగ్లీష్ విద్య తనకు అందించిన ఆధునిక విజ్ఞానం, అవగాహన వెలుగులో పరీక్షించుకుంటూ రెంటి మధ్యా ఏవైనా సమన్వయం సాధ్యమవుతుందేమోనని చూశారు. ఆయన  సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరుల మార్గంవైపు సహజంగానే మొగ్గారు. పాశ్చాత్య తత్వ వేత్తల గురించిన అవగాహనా  హిందూ తాత్వికతను కొత్తగా అర్థం చేసుకునే వెసులుబాటు ఆయనకు ఇచ్చింది.

అయితే ఆయన సాంప్రదాయిక జ్ఞానభాండాగారానికి బాహ్యుడన్న వాస్తవం మరచిపోకూడదు. ఆయన ఆ భాండాగారం నుంచి ఎంతో కొంత స్వీకరించి ఉండచ్చు, అయినా అది ఆయనకు కరతలామలకం అయినట్టు కాదు. ఎందుకంటే ఆ భాండాగారాన్ని అభివృద్ధి చేసిన ఆ ఇంటివాతావరణంతో, అందులోని వ్యక్తులతో, వారి జీవన సరళితో,  వారి ప్రైవేట్ ఆలోచనలతో, భాషతో, అందులోని ధిషణతో ఆయనకు ఆత్మీయ పరిచయం లేదు. కనుక ఎలాంటి జీవన శైలి, ఎలాంటి ఆలోచనా రీతి ఆ జ్ఞానానికి ఆకృతి నిచ్చాయో ఆయనకు సన్నిహితంగా తెలిసే అవకాశం లేదు. దానిపట్ల, దాని తాత్వికత పట్ల దూరం నుంచి చూసినప్పుడు కలిగిన ఒకవిధమైన రొమాంటిక్ అడ్మిరేషన్ ఆయనది. అది ఆయన అవగాహనకు హద్దు. కారణం ఆయనకు మౌలికంగా ఆ జ్ఞానానికి ‘బాహ్యుడు’. ఆయనలోనే కాదు, అలాంటి ‘బాహ్యులు’ అనేకమందిలో అలాంటి రొమాంటిక్ అడ్మిరేషనే ఉంది. దూరం నుంచి చూసినప్పుడు కలిగే ఆ అడ్మిరేషన్ తోనే ఇప్పటికీ దాని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివ్యక్తుల పల్లకీలను మోసే బోయీలుగానే వారు ఉన్నారు.

‘బాహ్యుడు’ కావడం అనేది సుదర్శనంగారికి వ్యక్తిగతంగా ఒక కొరత, లేదా బలహీనత అయితే; మరో వైపునుంచి అదే ఆయన పరిశీలనకు బలం కలిగించింది.  ఆ జ్ఞానభాండాగారం వద్ద కూర్చుని ఉన్న ఆ వృద్ధుని ఆలోచనాసరళిని బయటినుంచి చూసి అర్థం చేసుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ చూడడానికి ఆ జ్ఞాన భాండాగారపు లోపలి ఉపకరణాలు కాక(అవి ఎలాగూ ఆయనకు అందుబాటులో లేవు) తాను ఇంగ్లీష్ విద్యతో సంపాదించుకున్న కొత్త ఉపకరణాలు, తర్కం, హేతువు వగైరాలు ఆయనకు సాయపడ్డాయి. అవి ఆ వృద్ధుడి ఆలోచనా స్వరూపాన్ని దాని వైరుధ్యాలతో సహా అత్యద్భుతంగా బయటపెట్టాయి. “పాషాణ పాక ప్రభువు”గా ముద్రపడిన ఆయనను మైనపు ముద్దలా మనముందు నిలబెట్టాయి.

సాహిత్యంలో దృక్పథాలు చదువుతుంటే, విశ్వనాథ గురించి మనం కల్పించుకునే ఆ ధిషణాహంకార దోర్బల బ్రాహ్మీమయమూర్తి కాస్తా మంచుబొమ్మలా కరిగిపోతున్న భావన కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశపు క్షితిజాన్ని ఆక్రమించుకున్న ఆయన భావజాలంలోని వైరుధ్యాలతో సహా దాని యథార్థ ఆకృతిని మన కళ్ళముందు నిలపడం ద్వారా సాహిత్యంలో దృక్పథాలు ఈ క్షణాన తన రెలెవెన్స్ ను ఆశ్చర్యకరంగా స్థాపించుకుంటోంది.

(ముగింపు తర్వాత)

 

 

 

పేర్ల తో శ్రామిక అస్తిత్వం!

 

Painting: Rafi Haque

Painting: Rafi Haque

పేర్ల వెనుక నిమ్న కులాలుగా పరిగణించబడే వాళ్ళు తమ కులానికి సంబంధించిన శ్రమ పేరును తగిలించుకోవడం – ఐలయ్య సజెషన్. ఇదో చారిత్రక నిర్ణయంగా ప్రకటించాడు ఐలయ్య. ఐలయ్యను ఇంటర్వ్యూ చేసి ఇంగ్లీష్ వెబ్ మేగజైన్ లో ప్రచురించాక ఇదే విషయం మాట్లాడుతూ అన్నాడు ” బాపనోళ్ళకు …చెప్పుకోడానికి ఏ శ్రమ కూడా లేదు. మనం శ్రమ చేయడానికి వెనుకంజ వేయలేదు. శూద్ర కులాలకు వృత్తి ఒకటుంది. అది మన మీద రుద్దబడింది. అయితే మనం చెప్ప్పాల్సింది ” సోమరి పోతులు మీరు. మా ఆత్మ గౌరవాన్ని చంపినా ఏదో ఒక శ్రమ మేము చేసి ఈ సమాజన్ని ఇన్ని యుగాలు పోషించాము. మీరు మా మీద పడి తిన్నాము అని చెప్పుకోడానికి సిగ్గు పడాలి. ” అని నా కులం కనుక్కుని , దానికి సంబంధించిన శ్రమ ను సజెస్ట్ చేసి …  రైటింగ్స్ అన్నిటిలో అదే ప్రచురించుకోమని సూచన ఇచ్చారు.

ఈ స్టాండ్ నేను కంప్లీట్ గా కన్విన్స్ అయిన అంశం కాదు కాబట్టి నేను అనుసరించలేదు. అలా అని నాకు ఎటువంటి కంప్లెయింట్ కూడా లేదు ఐలయ్య గారి సూచన లో.
బ్రాహ్మణిజం మన మీద బలవంతంగా రుద్దిన శ్రమ లు నీచమైనవే కావచ్చు. కాని సమాజానికి ప్రాడక్టివ్ గా ఉపయోగపడిన శ్రమలే. ఆ శ్రమ చేసినందుకు మాకు గర్వం లేదు. కాని శ్రమ నే చేయని సోంభేరుల మీద మాకో ఉన్నతత్వం ఉన్నదనే ఒక ఆలోచన మాలో ఉంది. మాపై రుద్దిన శ్రమలను మేము గ్లోరిఫై చేసుకోము గాని…….బలవంతంగా పూసిన అస్తిత్వాన్ని తిరిగి వాళ్ళ మీదనే ఉపయోగించడానికి వెనుకంజ వేయము. ” నీవు మాదిగోడు ” అంటే మొహం వాల్చేసే వాళ్ళము. అది బ్రాహ్మణుడికి కొండంత బలమిచ్చేది. ” అహె నీవు చెప్పెదేంటి…నేను మాదిగోన్నే…ఏంటంట …నీ ఫీలింగ్ ఇప్పుడు చెప్పు ” అని తల విదిల్చినప్పుడు, ఇందులో అవమాన కరమైన అంశం ఏదో బ్రాహ్మణులే వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించబడింది.

నిజం చెప్పాలంటే కింద కులాలు, పై కులాలను అనుకరించడం Sanskritisation లో భాగమే. అయితే అదో ధికార స్వరం తో చేస్తున్నదిగా మాత్రమే మనం చూడాలి కాని ఆ నిమ్న స్థాయి హోదాను అంగీకరిస్తున్నట్టు అస్తిత్వ రాజకీయాలు ( Politics of assertion ) ఎప్పుడు చెప్పవు. ఇది అర్థం చేసుకుంటే కన్ ఫ్యూజన్ ఉండదు. అంబేద్కర్ assertion గురించి ఇలా చెప్తాడు ” The assertion by the individual of his own opinions and beliefs, his own independence and interest as over against group standards, group authority and group interests is the beginning of all reforms. ” గ్రూప్…అంటే ఇక్కడ బ్రాహ్మణీయ సమాజం లో ” మా అస్తిత్వమిది … అయితే ఏంటంట ? ” అని ఎలుగెత్తి గద్దించే స్వరాలు ఆ బ్రాహ్మణీయ సమాజం లోని అభిప్రాయాలను, నమ్మకాలను, ప్రామాణికాలను, అథారిటీని ప్రశ్నిస్తాయి అని అర్థం .

 

ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ ఏమంటాడో గమనించండి ” But whether the reform will continue depends upon what scope the group affords for such individual assertion ” అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ? – ఎంత మేరకు ఈ Assertion ను గ్రూప్ tolerate చేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న ప్రజాస్వామికత దాన్ని బట్టి తెలుస్తుంది అని అంబేద్కర్ క్లియర్ గా ఒక్ ప్రమాణాని నిర్వచించి చెప్పాడు.

ఇంకా చూడండి ” On the other hand, if the group is intolerant and does not bother about the means it adopts to stifle such individuals they will perish and reform will die out ” అంటే మన assertion వలన కలిగే అసహనమే , మనపై పీడనను పెంచాలనే వాళ్ళ ఆలోచననే సంస్కరణను చంపేస్తుంది.
అంటే మొత్తంగా మన assertion వలన కలిగే అసహనం వారి దుర్మార్గాన్ని పచ్చిగా బయట పెడుతుంది. వారిని expose చేయిస్తుంది. ఇది జాగర్తగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా కుల వివక్ష చూపించే రోజులు తగ్గినా కేపిటలిజం ప్రబలినాక implicit casteism పెరిగింది. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పక్కన కూర్చుంటారు . మరి నేను ఎక్కే 200 సీట్ల విమానం లో దళితులు ఒకరు ఇద్దరు కూడా సరిగ్గా ఉండరెందుకు ? మనం ఈ విషయాన్ని గొంత్తెతి అరిస్తే కుల పిచ్చి అవుతుందా ? లేక assertion అవుతుందా ? మనం దళిత మహా సభ అని పెట్టుకుంటే – దళితులుగా ఉన్నందుకు మనం బ్రాహ్మణులకు ఎంతో ఋణ పడి ఉన్నామని అర్థం వస్తుందా ? బహుజన పార్టీ అంటే – బహుజనులుగా ఉన్నందుకు మనకు ఖుషీగా ఉందని అర్థమ ? ఇది చాప కింద నీరు లాంటి కుత కుత ను …ఉపరితలానికి తెస్తుంది. పాలను పాలుగా …నీళ్ళను నీళ్ళుగా విడగొడుతుంది.
సింపుల్ గా చూస్తే రిజర్వేషన్ గురించి కూడా ఇదే వాదనే కదా వినిపించేది. రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు , మనం కులం గురించి మన అస్తిత్వం గురించి చెప్పుకుంటున్నాము కదా ? ” నీవే కేస్ట్ ” అని అడిగితే ” నేనెందుకు మాలనౌతాను…మీరు అన్నంత మాత్రాన అయిపోతానేంటి ” అనం కదా ? Caste-wise representation (identity ) perpetuates caste అని అన్నప్పుడు సౌత్ బరో కమిటీ ముందు అంబేద్కర్ ఇచ్చినా వాంగ్మూలం ఏంటి ? it ( representation through individual caste identity ) does not perpetuate but it dissolves అని . నేను సఫాయికార్ కార్మిక సంఘం లో ఉన్నప్పుడు …నేను adopt చేసుకున్న నా శ్రమ అస్తిత్వాన్ని, నా పేరుకు తగిలిస్తే అందులో సిగ్గు పడాల్సింది ఏముంది ? ఒక సఫాయి కారుడిగా నేను నా హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, సంఘం లో నా అస్తిత్వం అదే కదా ? అవును నేను సఫాయి కారుడినే…అయితే ఏంటంట…నన్ను ముట్టుకోవా…మైల పడవా ? అప్పటికి నేను అలా చెప్పుకోకపోతే నన్ను ఈ బ్రాహ్మణిజం తల మీద పెట్టుకుని చూస్తున్నట్టు ! ఒక మాటలో చెప్పాలంటే.

 

ఈ దేశం గొప్ప ప్రజాస్వామిక దేశంగా చలామణీ కావాలని అంతర్జాతీయ స్థాయిలో అనుకుంటుంది. ఈ అస్తిత్వ రాజకీయాలు ఈ దేశాన్ని తెగ ఇరుకున పెట్టేసే స్వభావం కలిగి ఉంటాయి. బ్రాహ్మిణిజం యొక్క గొప్ప గుండె ఎంతో ప్రశ్నిస్తాయి. ” The emancipation of the mind and soul is a necessary preliminary for the political expansion of the people ” పెద్దాయన బాబ సాహెబ్ కు ఉన్న క్లారిటీ చాలా అరుదుగా ప్రపంచ స్థాయిలో మేధావులకు ఉంటుంది. Political expansion కావాలి మనకు. అందు కోసం మనల్ని చూసి మనమే, మన శ్రమను చూసి మనమే సిగ్గు పడ్డం ఆగాలి ( అంటే గర్వించాలి అని దాని అర్థం కాదు ) . ” మాదిగ ” ” మాల ” అని ఒక్కాణిస్తూ ఎంత మంది ముందుకు రాగలరో ఈ సమాజం యొక్క ప్రజాస్వామికతకు సవాల్. ఈ దేశం ” అబ్బే , మా దేశం లో కులం ఏమీ లేదండి. ఎక్కడొ అక్కడక్కడ తప్ప….” అని అంటుంటే ఇదో నిరసన లా ఉంటుంది.

అయితే ఇది సరిపోతుందా ? బ్రాహ్మిణిజం ఎన్నో ఎత్తులు ఎత్తుగడలు నేర్చింది. మీరు అలా కులం పేరు తగిలించుకుంటానే , వచ్చి హత్తుకుంటుంది ” నా గొప్ప తనాన్ని ప్రూవ్ చేసుకోడానికి, నాకు మరీ ఇబ్బంది లేని ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్య వాదాలు ” అంటూ. ఈ assertion ద్వారా బ్రాహ్మిణిజానికి కొంత సాంస్కృతిక ఇబ్బంది కలుగుతుంది కాని…ఇవి Socio-econoimc demographies లో మార్పు తెచ్చే ప్రక్రియలు కావు. పైగా ఈ cultural assertion విజయానికి ముఖ్యమైన precondition – వాల్యూం ఉండాలి. Dalit assertion is not great in volumes despite middle class educated individuals have been spreading the importance of assertion. అది పరిమితి. వీలైతే ఈ వాల్యూం మనం పెంచగలగాలి. లేదంటే ఇంకా ఉన్నతమైన భావ జాలం వేపన్నా నడిపించాలి. మనమెటువంటి గొప్ప ఉద్యమం చేయకుండా ఉన్నప్పుడు కనీసం ఇదన్న చేయాలి కదా ?
ప్రతి సమాజం లో ఏవో ఒక తార తమ్యాలు ఉంటాయి. ఎక్కువగా అవి అన్నీ Open nature కలిగి ఉంటాయి. అంటే – ఎవరన్నా సంపాయించుకోవచ్చు, హోదా సంపాయించొచ్చు. మన కుల వ్యవస్థ closed nature కలిగి ఉంటుంది. ఇందులో gradual promotions కూడా ఉండవు. Caste is an enclosure of class అని అంబేద్కర్ అన్నాడు. అంటే మన socio-economic demographies ముందే ఫిక్స్ అయిపోయాయి. అది close . అందులో ఒక గుంపుగా బయటకు రాలేరు (వ్యక్తులుగా రావచ్చు ) . ఒక గుంపుగా వేరే గుంపులో చేరలేరు. assertion ఈ సంస్కృతిని ఈ స్వభావాన్ని ప్రశ్నించినా , అది గుణాత్మక మార్పు తేగలిగే శక్తి దానికి లేదు. ఐలయ్య సిద్ధాంతం ఎదగనిది అక్కడే.

 

Self-sufficient economy గా ఉన్నప్పుడు శ్రమలు మాత్రమే ఉన్నాయి కులాలు లేవని ఒక అంచనా. ఆ తర్వాత economy expand కావడం తో క్రమేణా ఆర్యులు వారి స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా వర్ణ వ్యస్థను ఏర్పరిచారు అదే క్రమేణ కుల వ్యవస్థగా అంచెలంచెలుగా ఎదిగింది అని ఒక వర్షన్. ( Source : Cultural Past by Romila Thapar ) కాబట్టి కులం , శ్రమకు మధ్య న ఉండే Timing గురించి నేను ఇదమిద్దంగా వాదించలేను. అలాగే వ్యభిచారం, అడుక్కోవడం కులానికి సంబంధించిన శ్రమలుగా ఉండాలనే Sanction లేదు. అవి శ్రమ విభజన కిందకు రావు కూడాను. ఆర్థిక లేమి తనం వలన నిమ్న కులాలు గ్రా డ్యువల్ గా అడాప్ట్ చేసుకున్న means of living మాత్రమే. అలాంటి వాళ్ళు ఎటువంటి కులపు శ్రమ తగిలించుకోవాలి అంటే – వారికి శ్రమ allotment లేదు కాబట్టే వారు ఆ శ్రమలు ఎంచుకున్నారు. scavenging లాంటి శ్రమలు చండాల ప్రజలు చేయాలనేది sanction . అలాంటి వృత్తులు తెగించి ఎవరన్నా పేరు చివర తగిలించుకుంటే , వారి కరేజ్ , నిబ్బరం మెచ్చుకోదగ్గ assertion. కాని , పైన చెప్పినట్టుగా ‘ అది సరే, ఆ తర్వాత ఏంటి ? ‘ అనే ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది.
ఉన పోరాటం అస్తిత్వ పోరాటమే కాదు. హక్కుల పోరాటమే కాదు. అది ఇప్పుడు సాంఘిక ఆర్థిక మార్పు కోసం స్థాయిలో ఎదిగిన ఉద్యమం. ఇలాంటి పోరాటాలు కావాలి మనకు. ఇలాంటి సంస్కృతి మనం అలవర్చుకోవాలి. అందుకోసం మనకు assertion politics ను అర్థ చేసుకుంటూనే socio – economic space కోసం ideology ని రూపొందించుకోవాలి.
–          

 

( ఏదైనా స్పష్టత కోసం గాని, మరింత సమాచారం కోసం గాని రచయిత మెయిల్  ID pvvkumar@yahoo.co.uk  గాని  facebook ID ‘ P V Vijay Kumar ‘  పై గాని కాంటాక్ట్  చేయవచ్చు )

 

ఆ వూరు, ఆకాలం గుర్తొస్తే ఏడుపే!

   katya3

           ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పక్షాన ముప్ఫయి మంది రచయిత్రులం  12-9-2016 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలలో పర్యటించాం.కొత్తదేవరగొండి,కొత్త రామయ్య పేట మొదలైన పునరావాస గ్రామాలలోనూ, వాడపల్లి ,కొత్తూరు మొదలైన ముంపు గ్రామాలలోను  తిరిగి భిన్న ప్రజా సమూహాలను  కలిసి మాట్లాడాము.వారి ఇళ్ళు జీవించే పరిసరాలు, జీవన స్థితిగతులు పరిశీలించాం. రెండు భిన్నవాతావరణాలలోని ఏక రూప విషాదాన్ని అనుభవించి వచ్చాం.

              మేము ముందు చూసినవి  పునరావాస గ్రామాలు. అవి పోలవరం మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు పక్కన గ్రామాలు.కొన్ని ఊళ్ళు నాలుగేళ్ల క్రితం ,మరికొన్ని రెండేళ్లక్రితం పొందించినవి. పచ్చదనమే లేని ఎడారిని తలపించే మట్టి దారులలో రెండేసి గదుల సిమెంటు ఇళ్ళు. ఒక ఇంటికి అయిదేసి సెంట్ల భూమి.కొన్నిఇళ్ళు  మూడున్నర సెంట్ల భూమిలో కట్టి ఒకటిన్నర సెంట్ల భూమి వేరే చోట ఇయ్యటం వల్ల అది ఉపయోగంలోకి రానే లేదు.కూలివేతనం కిందనో ,మరే రూపంలోనో వచ్చిన నష్ట పరిహారం ఆ రెండు గదుల ప్రాధమిక నిర్మాణాన్ని వరండాలు దించి పూర్తి చేసుకొనడానికి వ్యయం చేసిన వాళ్ళే చాలామంది.

         గోడలు లేచి ప్రభత్వం కేటాయించిన  నిధులు ఇయ్యకపోవటం వల్ల పూర్తికాని  బాత్ రూములు కొన్నిచోట్ల.దొడ్లకు,స్నానాలకు మరుగు లేక ఆడవాళ్లు పడే ఇక్కట్లు.చుట్టూ నేల మట్టిపోసి చదును చెయ్యక పోవటంవల్ల,డ్రైనేజి చెయ్యక పోవటం వల్ల మురుగు కాలువలమధ్య ముసిరే దోమల మధ్య దుర్భరమైన జీవితం అక్కడి ప్రజలది.శుభ్రమైన గాలికి,పచ్చని పర్యావరణానికి పరాయీకరింప బడిన  వాళ్ళు. ఈ కొత్త ఇళ్ళ మధ్య పశువులను కట్టేసుకొనే చోటు ,వీలు లేక ఉన్నఆవులను అమ్ముకొని పాడికి దూరమైన వాళ్ళు. కొండమొదలు నుండి ఏరుకొచ్చుకొనే కట్టెపుల్లలు లేవు.అడవి నుండి  సేకరించుకుని వచ్చే కుంకుళ్ళు లేవు.జామ,సీతాఫలం వంటి  పండ్లు లేవు. ఇంట్లో పండించుకునే కూరలు లేవు. ఆర్ధికంగా స్వయం సంపూర్ణమైన గొప్ప జీవితం కోల్పోయి అన్నిటినీ డబ్బు పెట్టి కొనుక్కోవలసిన స్థితికి నెట్టబడ్డారు.   

         పొలానికి పొలం ఇచ్చారు కానీ అన్ని వూళ్ళల్లోనూ అవి ఇళ్ళు కట్టించి ఇచ్చిన చోటికి పది పదిహేను కిలోమీటర్లకు తక్కువ దూరంలో లేవు. అవికూడా చాలావరకు బంజరు భూములే . వర్షాధారపు వ్యవసాయమే చెయ్యాలి. ఈ పరిస్థితులలో ఆడవాళ్లు వ్యవసాయానికి  దూరమయ్యారు.మగవాళ్ళు కూడా  చాలా మంది భూమిని  కౌలుకు ఇచ్చి  కూలిపనులకు  పోతున్నారు. ట్రాక్టర్ లేని వ్యవసాయం ఇప్పుడు సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. గోదావరి నుండి దూరం తరిమివేయబడిన వాడోళ్లు (జాలరులు)జీవికకు దూరమయ్యారు. పదిపదిహేను కిలోమీటర్లు పోతేగానీ గోదావరి దొరకదు చేపలు పట్టటానికి. సైకిళ్ళమీదనో ఆటోలు పట్టుకొనో మగవాళ్ళు ఆ పనికి పోతున్నారు కానీ ఆడవాళ్లు ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మొత్తం మీద స్త్రీలు ఉత్పత్తి క్రమం నుండి వేరు చేయబడ్డారు. వైవిధ్య భరిత మైన జీవికను కోల్పోయి విసుగులోకి ,విచారంలోకి ,దుఃఖం లోకి జారిపోతున్నారు.

           పశ్చిమ గోదావరి జిల్లాలో  పోలవరం ముంపు గ్రామాలు 29 కాగా ఇప్పటికి లేపేసిన ఊళ్ళు ఏడు. చేగొండిపల్లి ,సింగినపల్లి ,పైడిపాక ,దేవరగొండి,రామయ్యపేట ,తోటగొండి,మామిడి గొండి.ఈ క్రమంలో మండల రెవిన్యూ ఆఫసర్లు వూళ్ళల్లోనే తిష్ఠ వేసి  రోజుకు రెండు మూడుసార్లయినా ప్రతి ఇంటికీ వెళ్తూ  బుజ్జగించో బెదిరించో ,ఆశపెట్టొ, వాళ్ళను తమతమ నెలవులు వదిలి వెళ్లేందుకు ఒప్పించారు.బాధితుల మాటల్లోనే చెప్పాలంటే ‘లేపేసే వరకు వెంట పడ్డారు.’పొండి పొండి అని తోలేసారు’.వండుకున్నగిన్నెలతో,తినటానికి అన్నం పెట్టుకున్న కంచాలతో సహా లారీలలోకి ,ట్రాక్టర్లలోకి ఎక్కి వెంటనే ఇల్లు వదిలి పోవాలని వత్తిడి చేశారు.ప్రొక్లెయిన్లు తెచ్చి ముందు పెట్టి ఇల్లు కూలగొడుతున్నాం ఖాళీ చేయండని ఖంగారు పెట్టారు. పూర్తికాని ఇళ్లల్లో ,పూర్తిగా చేతికందని పరిహారాలతో కొత్తజీవితం వాళ్లకు  అనివార్యం చేశారు.

        నష్ట  పరిహార పాకేజిలో 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకు ఐదులక్షల ఎనభైవేలు ఇస్తుండగా 18 ఏళ్ళ వయసు తో నిమిత్తం లేకుండా ఆడపిల్లలందరికీ ఆ పరిహారాన్ని వర్తింప చేయాలన్నది  ప్రజల కోరిక.  అందులో సగమైనా ఇప్పిస్తామని నమ్మించి పబ్బం గడుపుకున్న అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేమిటని అడిగితే ఏవో చెప్తాము ,చెప్పినవన్నీ చెయ్యటం అవుతుందా అని దాటవేస్తున్నారు.ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ యాష్ట పడుతున్న జనం ‘ఓట్లకు కావాలె మేము ,ఓట్లకు ముందూ అక్కరలేదు,తరువాత అక్కరలేదు’ అని పార్లమెంటరీ వ్యవస్థపై తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.పౌరులుగా ఒక గౌరవకరమైన గుర్తింపు లేక ,తమ సమస్యలు తాము ఎన్నుకున్న ప్రభుత్వానికే పట్టనివి అయి  కొత్త పరిసరాలలో,కొత్త పనుల వెతుకులాటలో తడుముకొంటూ తండ్లాడుతున్న పోలవరం ప్రాజెక్టు బాధిత ప్రజల విషాద  జీవన ముఖ చిత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.

katya2

          పునరావాస గ్రామాల నుండి ముంపు గ్రామాల వైపు చేసిన ప్రయాణంలో దారిపొడుగునా ప్రొక్లైన్లతో కూల్చ బడ్డ ఇళ్ల ఆనవాళ్లు కూడా కానరాకుండా ఊళ్లకు ఊళ్ళుఎత్తైన   రాళ్ళ గుట్టల కింద కప్పివేయబడిన దృశ్యాలు గుండె బరువెక్కించాయి.   ఊళ్ళు ఖాళీ చేయిస్తున్నప్పటి ఆందోళన గురించి ,ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తూ కొత్త రామయ్య పేటలో ఒక మహిళ “మమ్మల్ని కూడా కప్పెట్టేత్తారేమో అనిపించింది.ఆవూరు ,ఆ కాలం గుర్తొస్తే ఏడుపు తప్ప ఏమీ లేదు.” అని చెప్పిన మాటల లోని విషాద వాస్తవం కళ్ళకు కట్టినట్టయింది.    

       ముంపు గ్రామాల్లో వాడపల్లి – చలి నుండి ,చిరుజల్లుల నుండి ఒకింత కాపు కోసం హరితారణ్యాన్నిశాలువలా  కప్పుకుని గంభీరంగా ఉన్నతంగా నిల్చున్న కొండ గోడల మధ్య, నిండుగా ప్రవహించే గోదావరి ఒడ్డున ఉన్నవూరు.ఆ వూళ్ళో  ఇళ్ళు  రకరకాల రంగు రంగుల పూల తీగలు పాకిన దడులతో , కూరగాయ పాదులతో కళకళలాడుతున్న పెరళ్ళతో ,అటూ ఇటూ సందడిగా తిరిగే కోళ్లతో పర్ణశాలల వలె ప్రశాంతంగానే ఉన్నాయి .కానీ   ఆ ఇళ్లల్లో  మనుషుల ముఖాలు మాత్రం  దిగులు మబ్బులు కమ్మిన నిర్వేదపు నవ్వులను పూస్తున్న విషయం మా దృష్టిని దాటి పోలేదు.ఈ రోజో రేపో ఊళ్ళు వదిలి పోక తప్పదని వాళ్లకు తెలుసు. బలవంతపు ప్రయాణాలకు ఐచ్ఛికంగా సిద్ధమవుతున్నదుస్థితి వాళ్ళది. తమ ఇళ్ళు  ,జీవికకు ఎన్నో వనరులు ఉదారంగా పంచిపెడుతున్నకొండలు,అడవులు వాటితో వున్నతరతరాల అనుబంధాలు,జ్ఞాపకాలు,సంతోషాలు,సంబరాలు-అన్నిటికీ మూలమైన,అన్నిటికన్నావిలువైన  స్వేచ్ఛ సమాధి కాబోతున్నాయి అని తెలిసి రోజులు లెక్కపెట్టుకుంటూ నిస్సహాయంగా కాలాన్ని ఈడుస్తున్న జనం వాళ్ళు.

                  

ఈ పర్యటనలో మేము గుర్తించిన అంశాలు ;

 • పోలవరం ప్రాజెక్టు వస్తుందని పాతిక ముప్ఫయి ఏళ్లుగా అక్కడి ప్రజలు ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నారు.అది తమ బతుకులలో  తెచ్చే ఉపద్రవం గురించి   చూచాయగానైనా  వాళ్లకు తెలుసు.ఒక సందిగ్ధ సందర్భంలో జీవించారు వాళ్ళు.
 • 2004 లో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్  ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  జల యజ్ఞంలో భాగంగా మొదలైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులను   ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో   తెలుగుదేశ ప్రభుత్వం  కొనసాగిస్తున్నది.నష్ట పరిహార పాకేజీలు ఒక్కొక్క ప్రభుత్వ హయాం లో ఒకరకంగా మారుతున్నాయి. అవి ప్రజలలో అసంతృప్తికి కారణమవుతూ పరస్పర అవిశ్వాసాలకు దారితీస్తున్నాయి.
 • నష్ట పరిహారాల నిర్ధారణలో ఆశ్రిత పక్షపాతం ,అవినీతి ప్రధానంగా పని చేశాయి. అందువల్ల నష్టపరిహారం అందరికీ సమానంగా కాక అన్యాయంగా ఎక్కువ తక్కువలుగా అందింది.
 • ఉమ్మడి వ్యవసాయ కుటుంబాలు ముక్కలు చెక్కలు అయ్యాయి.
 • ఏజన్సీ ప్రాంతాల నుండి తరలించ బడిన ఆదివాసీలు తమ సంస్కృతి నుండి దూరం జరప బడ్డారు.
 • ఏజెన్సీ నుండిబయటకు వచ్చారు కనుక  పునరావాస గ్రామాల లోని వారికి  ఏజన్సీ ఎలవెన్సులు లేవు.
 • డబ్బు అవసరాలలోకి ప్రజలు నెట్టబడ్డారు.
 • నష్ట పరిహారపు డబ్బు ఇళ్లకు ఖర్చుపెట్టుకొని , కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక పనులు దొరకక ఉన్న డబ్బు ను వాడుకొంటూ ఈ రెండు మూడేళ్లు గడిపేశారు. ఇప్పుడు తమ బతుకు తెరువులు ఎట్లా అన్నది వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న.
 • వూరికి ఒక బడి ఇంకా రాలేదు.
 • ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఇంతవరకు ఆచరణకు రాలేదు.
 • అభివృద్ధికి మానవముఖం లేదు . విస్థాపన అంతా అమానవీయంగా జరిగింది.
 • విస్థాపిత ప్రజల పట్ల ప్రభుత్వాలకు ,పాలనా వ్యవస్థకు ఉండవలసిన అదనపు బాధ్యత పూర్తిగా విస్మరించి బడింది.
 • 2018 నాటికి ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసి ఫలితాలను పొందాలనే సంకల్పంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యుత్సాహం ఇప్పటికింకా తరలించబడని ముంపు గ్రామాల ప్రజల పట్ల అవలంభించే వైఖరి దానికి కొనసాగింపుగా కాక విభిన్నంగా ప్రజాస్వామికంగా ఉంటుందా?

                         katya1 విశాఖ పట్నం -కాకినాడ కారిడార్ అభివృద్ధి అవసరాలకు ,కోస్తాప్రాంత ధనిక వర్గ  వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగ పడే ప్రాజెక్ట్ కు లక్షలమంది స్థానికులను నిర్వాసితులను చేస్తూ వాళ్ళ అవసరాల పట్ల నిర్లక్ష్యం గా ఉండటం గౌరవంగా జీవించే హక్కును స్వేచ్ఛగా జీవించే హక్కును నిరాకరించటమే. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలు  ప్రజల హక్కులకు, ఆదివాసీల ప్రత్యేక హక్కులకు-భంగకరంగా పనిచేస్తూ సాధించే అభివృద్ధి అన్యాయమైనది,అమానవీయమైనది అని భావిస్తున్నది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.  ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ ఎన్నికలకు పరిమితం చేయకుండా ఒక వాస్తవ జీవితాచరణ విలువగా,రాజ్యాంగబద్ధ  పాలనాసారంగా పరివర్తింప చేయాలని కోరుకొంటున్నది. తెలంగాణాలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను వద్దనేది ఈ కోణం నుండే. 2013 చట్టం అమలు చేయమని కోరటం ప్రజల హక్కులను గౌరవిస్తూ అభివృద్ధి దిశగా గమనాన్ని నిర్దేశించుకొనమని చెప్పటానికే. బలహీనుల హక్కులను బలిపెట్టే అభివృద్ధి విధానాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ప్రరవే ఈ కింది డిమాండ్లు చేస్తున్నది.  

 

    – ఇప్పటివరకు జరిగిన విస్థాపన విధానాలను ,నష్టపరిహార పాకేజీలను పునఃసమీక్షకు పెట్టి విస్థాపిత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ,జీవన విధానం ,జీవితం ఎక్కువ నష్ట పోకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించాలి.

       – వ్యవసాయ జీవితాన్ని నిర్మించుకొనటానికి ఎన్టీఆర్ జలసిరి వంటి పధకాలను విస్థాపిత ప్రజా ప్రయోజనాలకొరకు విస్తరించటంపై దృష్టి పెట్టాలి. ఆవాసాలకు దూరంగా ఉన్న పొలాల సాగుకు వారిని ప్రోత్సహించే పధకాలు రూపొందించాలి

           -వ్యవసాయేతర వృత్తుల వారి అవసరాలను గుర్తించి ,గౌరవ జీవనానికి తగిన మార్గాలు చూపాలి.  

        -ఉద్యోగ పరికల్పన వేగవంతం చేసి వాటిలో మహిళలకు ప్రాధాన్యత నివ్వాలి. సామూహికంగా పాల్గొనగలిగిన చిన్న పరిశ్రమలు  ఏర్పాటు చేసి స్త్రీలకు పని కల్పించాలి.

    – పునరావాస గ్రామాలను ఆవాసయోగ్యాలుగా మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దేoదుకు  సత్వర చర్యలు చేపట్టాలి.  

*

     

                                                                      

 

     

         

        

 

           

 

  

పితృ, దేవ హత్య అనివార్యం!

Art: Rafi Haque

Art: Rafi Haque

‘తండ్రీలేనీ, దేవుడు లేనీ అనాథ లోకం’ ఒక అన్‌ఫిలసాఫికల్‌ మెటాఫిజికల్‌ కాక్‌టేయిల్‌ ఎక్స్‌ప్రెషన్‌. గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించిన నేపథ్యం విస్మరించి రాణిశివశంకర శర్మ తండ్రీ, దేవుడీ అవసరాన్ని వక్కాణించటం ఆలోచించాలి.
సోక్రటీసు ఆస్తిక‌త్వాన్నీ, దేవుడు ఉనికినీ ప్ర‌శ్నించింది  మొదలు హెగెల్‌ వరకు ఫిలాసఫీలో దేవుడు, మతానిదే కేంద్రస్థానం. మెటాఫిజికల్‌ ఫిలాసఫీని భౌతికవాదం వైపు మార్క్స్‌ నడిపించడానికి కాంట్‌, హెగెల్ త‌త్వం ఉపయోగపడ్డది నిజమే. కానీ, గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించటానికి మాత్రం కాంట్‌, హెగెల్‌ తాత్విక అన్వేషణ కారణం కాదు. నీష్చేను ఆ మాట అనేలా మనుస్మృతి ప్రేరేపించింది. బ్రాహ్మణిజం చాకచాక్యంగా దేవుణ్ణి తప్పించి బ్రాహ్మణున్ని కేంద్ర స్థానంలో నిలిపింది. బ్రాహ్మణుడే దేవుడని మనుధర్మం ప్రకటించింది. మ‌మ దేవః, అహం బ్ర‌హ్మ‌స్మి అన్న‌ది అందుకే. అతడి సంక్షేమమే రాజ్య సంక్షేమ‌మం, అదే రాజ్యం యొక్క బాధ్యతనీ, అతడిని రక్షించటమే రాజధర్మమని మనుధర్మం ప్రకటించింది. ఈ ప్రపంచాధిపతి విప్రుడని అది చేసిన ప్రకటన నీష్చేని అబ్బురపర్చింది.
మనుస్మృతిలోని అధిమానవుడు (సూపర్‌ హూమన్‌ బీయింగ్‌) తనకు ఆదర్శమని అతడు భావించేలా ప్రేరణిచిందది. అందుకే దేవుడు మరణించాడనీ, ఇక ఈ లోకాన్ని అధిమానవుడైన ఆర్యుడే ఏలి రక్షిస్తాడని పారవశ్యంతో ఏడ్చే ఒక సంభ్రమాశ్చర్య దుఃఖస్థితికి అతడు చేరుకున్నాడు. ఇంచుమించు వివేకానందుడిదీ అదే మనోస్థితి. అతడి చేష్టలు, వ్యాఖ్య‌లు,  భ్రాంతిపూరిత ప్రకటనలూ ఆ అధిమానవుడిని తండ్రిగా అంగీకరించిన ఫలిత‌మే! కాబట్టే నీష్చే, వివేకానందుల‌ మధ్య వుండే డిస్కర్సివ్‌ సిమిలారిటీస్‌ను డా. అంబేద్కర్‌ వివరించాడు. నీష్చే తాత్వీకరించిన ఆ అధిమానువుడు ఆర్యుడు. నీష్చే ప్ర‌వ‌చించిన రేసిస్టు ఫిలాసఫీ హిట్లర్‌ (శర్మగారు చెప్పిన ‘తండ్రి’) నాజీయిజానికి, తద్వారా రెండు కోట్లమంది మానవ హననానికీ కారణమైంది.
నీష్చే ఈ లోకానికి అధిమానవున్ని తండ్రిగా ఇవ్వానుకొని దేవుడనే భావనకు ఫిలాసఫీలో ప్రాధాన్యత తగ్గించాడు. అయితే, మనువు చెప్పిన అధిమానవుడే ప్రపంచానికి తండ్రిగా, దేవుడు (భూసురుడు)గా  ఎంత విధ్వంసం సృష్టించాడో చరిత్ర సాక్ష్యం చెప్తూనే వుంది. తండ్రి తన పిల్ల‌ల‌ను తప్ప ఇతరుల పిల్ల‌ల‌ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడన్న హామీ ఏమీ లేదు. హిట్లర్‌ అనే తండ్రి యూదుల‌ను శత్రువుగా భావించాడు కాబట్టే కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో పెట్టి దారుణమైన జాతి హననానికి ఒడిగట్టాడు. ఒక చెడ్డ తండ్రి వల్ల‌ సంభవించిన క్రైం అగనెస్ట్‌ హుమానిటీని శిక్షించే పేరుతో రిలేటివ్‌లీ మంచి తండ్రి అయిన స్టాలిన్‌ పుట్టుకొచ్చాడు. ఈ సాపేక్ష సద్గుణ తండ్రి చేతిలో రష్యాలోని తన సొంతబిడ్డలు ఎంత హింసను అనుభవించారో తెలిసిందే. ఈ తండ్రి చేతిలోనే రోజా ల‌గ్జంబ‌ర్గ్ హ‌త‌మైంది. ఇందిరాగాంధీ నియంతృత్వంలోని క్రూరత్వాన్ని చవిచూసిన వాళ్లే ఆమేలోని దైవ‌త్వాన్ని ఎరుగుదురు. నియంతల‌ నిజాయితీ ఆధారంగా పితృ, పుత్ర సంబంధాల‌ను అంచనా వేయటం నయా మనువాదం.
మిషేల్‌ ఫుకో, డెరిడా, రార్టీ వంటి ఉత్తరాధునికవాదులు, ప్రాగ్మాటిస్టులు అన్ని రకాల‌ ఆధిపత్య కేంద్రాల‌ను తిరస్కరించారు. తండ్రి, కొడుకు అనే  ద్వైధీకృత సంబంధంలోని ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు డెరిడా. తండ్రికి లోబడి కొడుకు లేదా కూతురు వుండాల‌న్నది ఆధిపత్య సంబంధమే తప్ప సమానత్వాన్ని స్థాపించే ప్రజాస్వామిక సంబంధం కాదని ఆయన అభిప్రాయం. దీన్నే వాచకానికి వర్తింప చేసి ముందుమాటను వాచకం అప్రధానం చేయటమో లేదా ముందుమాటే తనను తాను ప్రధాన వాచకానికి లోబడి, కుదించుకుపోవటమో చేస్తుందని వివరిస్తాడు. అందుకే పితృహత్యకు డెరిడా పిలుపునిస్తాడు. తండ్రి పాత్ర పూర్తిగా ఆధిపత్యానికీ, పితృస్వామ్య ఆధిపత్యానికి నెల‌వని సైమన్‌ డిబోవా అభిప్రాయం.
కౌటుంబిక వ్యవస్థలో తండ్రి పోషించే బాధ్యతాయుతమైన పాత్రను వర్ణ, కుల‌ సమాజం గ్లోరిఫై చేస్తుందేమో గానీ, యూరపు సమాజాలు మాత్రం తిరస్కరిస్తాయి. వర్ణ, కుల‌ వ్యవస్థలోని ఆధిపత్యం వల్ల‌ అనేక ప్రయోజనాలు పొందుతున్న సవర్ణ పితృస్వామ్యవాదులు సమర్ధిస్తారేమో గానీ ఆధిపత్య వ్యవస్థను తిరస్కరిస్తున్న ప్రజాస్వామికవాదులు లేదా ఎగాలిటేరియన్‌, యాంటీ ఫాసిస్టు శక్తులు సుతారమూ అంగీకరించవు. ఎంతో పాతబడినదీ, తిరస్కరించబడినదీ, వ్యతిరేకించబడినదీ, అస్తిత్వవాదుల‌ చేతా, ప్రగతిశీవాదుల‌ చేతా, అంబేద్కర్‌వాదుల‌ చేతా ఖండించబడీ, తిరస్కరించబడిన పితృవాదం, దైవవాదాల‌ను తిరిగి బాధితుల‌ శిరస్సు మీద రుద్దడం అనంగీకారం. పితృ/దైవ కేంద్ర సిద్ధాంతమే గొప్పదనీ, అవసరమైనదనీ ఒప్పుకొంటే, శర్మ తర్కం వల్ల‌ ఉత్ఫన్నమయ్యే ఫలితాల‌ను భరించాలి. తండ్రి పాత్ర పోషించాడని చెప్పిన రాముడి చేతిలో ఈ దేశ మూల‌వాసుల‌ శిరస్సు ఖండితమై, జ్ఞానార్జనా క్షేత్రాల‌కు దూరంగా కుళ్లిన కళేబరాలై చితికిపోవాలి. రాముడి ధర్మం ప్రాసంగికత ఎంత అసందర్భమైనదైనా సరే,  ఆ రాముడి ధర్మాన్నే తండ్రిబాధ్యతగా, దైవకార్యంగా ఈ దేశ రాజ్యం యొక్క సారభూతతత్వం (ఆంటలాజికల్‌ ఫిలాసఫీ) గా స్థాపించాల‌ని హిందూ జాతీయవాదం తపిస్తున్నది.
నిజానికీ, తండ్రి లేదా ధర్మకర్త పాత్ర పోషించాల‌ని చెప్పిన గాంధీ హితవాదాన్ని డా. అంబేద్కర్‌ తిరస్కరించి, రాజ్యాన్ని రక్షకుడి స్థానంలో నిబెట్టడం వల్లే బాధిత సమూహాల‌కు ‘అనాథ’ స్థితినించి ‘పౌర’ హోదా దక్కింది.  రాజ్యాంగంలో నిర్వచించుకొన్నట్టుగా పౌరుల‌ను రాజ్యమే రక్షించుకోవాలి తప్ప ఏ దేవుడూ లేదా ఏ అధిమానవుడూ రక్షించరాదు. శిక్షించరాదు కూడా. కానీ, పితృస్థానంలో వున్న రాజ్యాంగాన్ని తోసిరాజని తండ్రి పేరుతో బ్రాహ్మణున్నీ, దేవుడి పేరుతో బ్రాహ్మణ్యాన్నీ రాజ్యంగా ప్రతిష్టాపించే కృషిని నెహ్రూ మొదలుకొని నరేంద్ర మోడీ వరకు కొనసాగిస్తూనే వున్నారు.
శర్మ వగస్తున్నట్టు ఈ దేశానికీ లేదా ఈ లోకానికీ తండ్రి, దేవుడు లేడని ఎవరైనా భ్రమిస్తే అది వాళ్ల జువైనలిజమే అవుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా మ‌నువు ఆకృతినిచ్చిన తండ్రినీ, దేముడినీ ఈ స‌మాజంలో బ‌లంగా నిల‌బెడుతూనే వున్నారు. వాటిక‌న్ సిటీ దేవుడూ, అమెరికా తండ్రి క‌లిసి త‌యారు చేసిన హింస‌కు ప్ర‌తిహింస‌గా బ‌య‌ల్దేరిన తీవ్ర‌వాదం నెత్తుటి వాన‌ను కురిపిస్తూనే వున్న‌ది. దేవుడే లేని వెలివాడ‌ల్లోకి తండ్రి అయిన యేసును ప‌ర‌లోక ప్ర‌వేశానికి క‌చ్చిత‌మైన హామీ ఇస్తూ ప్ర‌వేశ‌పెట్టి చాలాకాల‌మైంది. ప‌ర‌లోకం త‌ప్ప ఇహ‌లోకం ప‌ట్ట‌ని ఒక ఉన్మ‌త్త స్థితికి తీసుకెళ్తున్న‌ది ప‌చ్చి నిజం. ఏది అస‌లైన ఇస్లామో చెప్ప‌లేనంత‌గా మారిపోయిన కాలంలో త‌బ్లిక్‌లాంటి జ‌మాతులు ముస్లిం స‌మాజాన్ని తిరోగ‌మింప చేస్తున్నదీ నిజ‌మే. తండ్రుల మ‌ధ్య‌, దేవుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న స‌మ‌రంలో సామాన్యుడు బంధీగా మారుతున్నాడ‌ని ఒక‌వైపు వేద‌న‌ప‌డుతుంటే శ‌ర్మ మ‌ళ్లీ పాత‌పాటే పాడ‌టం ఏ సాంస్కృతిక చాణ‌క్య నీతి?
 మనది జాతి రాజ్యం కాదన్న నిజాన్ని మేధాల‌వుంతా ఎందుకు గుర్తించ నిరాకరిస్తున్నారో అర్థం కాదు. యూరపులోని జాతి రాజ్యాల‌ లాంటిది కాదు మన రాజ్యం. జాతి భావనే లేని సమాజం మనది. కులం తప్ప జాతికి పుట్టగతుల్లేని అవ్యవస్థ ఇది. జాతి అనే అమూర్త భావనను నిజం చేయలేమని గ్రహించిన రాజ్యాంగ నిర్మాత గణతంత్ర రాజ్యంగా నిర్ధారించాడు. గణతంత్ర విధానంలోనే వివిధ జాతుల‌, కులాల‌, తెగల‌, మత బృందాల‌, భాషా సమూహాల‌, లింగ సమాజాల‌కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ల‌భిస్తుంది. జాతి రాజ్యాల్లో ఇది అసంభవం. పాలిత జాతికి చెందని సమూహాల‌కు, బృందాల‌కు, గణాల‌కు, తెగల‌కు, జాతుల‌కు రాజ్యం కల్పించే హక్కులు, రక్షణలు, ప్రాతినిధ్యం తప్పనిసరిగా దక్కే అవకాశం లేదు. అవి జాతి రాజ్యం యొక్క దయాదాక్షిణ్యాల‌ మీద ఆధారపడి జీవించాలి. కానీ, మనది గణతంత్ర రాజ్యం కావటం వల్ల‌ అలాంటి నిరంకుశ జాతి దురహంకారానికి బాధితులుగా మిగల‌కపోగా, స్టేక్‌ హ్డోర్లు కాగలిగారు. శర్మ మన రాజ్యాన్ని జాతి రాజ్యాల‌ సరసన నిబెట్టి బోనెక్కించటం సమర్ధనీయం కాదు.
కౌటుంబికవాదం మరో కాల్ప‌నికవాదం. అది తండ్రినీ, పిల్ల‌ల వికాసాన్నీ, తండ్రి పడే కష్టాల‌నూ రొమాంటిసైజ్‌ చేస్తుంది. పిల్ల‌ల‌ ఎదుగుదల‌కు తండ్రి, తల్లి మధ్య సామరస్య సంబంధాలు దోహదం చేస్తాయనీ, పిల్ల‌ల‌ను పెంచే బాధ్యతను తండ్రి భుజామీద మోపి, తల్లిని వారిని సాకే యంత్రంగా మార్చేస్తుందనీ ఈ కాల్ప‌నిక‌వాదం గుర్తించనీదు. తండ్రిని ఒక కులానికీ, ఒక వర్గానికీ బంధీని చేసిన దేవుడు ఆ పిల్ల‌ల‌ శారీరక, మానసిక ప్రగతికి తండ్రి యొక్క ఆర్థిక స్థితినీ లేదా ఆర్థికబలాన్ని పొందే ప్రతిభా సామర్ధ్యాల‌ను హేతువుగా చూపి తప్పించుకుంటున్నాడు. ఈ కుల‌ సమాజంలోని న‌ల‌భై కోట్ల పీడితులు రోజుకు ఒక్క పూట తిండి మాత్రమే తింటున్నారంటే, ఎనభైశాతంకు పైగా బడీడు పిల్ల‌లు స్కూలు డ్రాపవుటవుతున్నారంటే, తల్లిదండ్రుల‌ అజ్ఞానం, పేదరికం, అసమర్ధత వ‌ల్ల‌ నిత్యం కౌటుంబిక హింసకు గురై బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారంటే తండ్రి కేంద్ర వ్యవస్థే కారణం. కానీ, యూరపులోని అనేక దేశాలు గర్భస్థ శిశువు నుండి టీనేజీ వరకు పోషణ, విద్యాబుద్ధులు, బాల్యాన్ని అనుభవించే హక్కును గ్యారంటీ చేయటమే కాదు, మన కుల‌ సమాజం ఇచ్చిన పెత్తనపు హక్కు స్వభావంతో కన్నపిల్ల‌ల‌ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేసి ఖైదు చేసిన సంఘటనలున్నాయి. తండ్రి వున్నంత మాత్రానే బిడ్డకూ, త‌ల్లుల‌కూ స్వేచ్ఛ వుంటుందనుకోవటం పెద్ద దగా. నిజానికీ, స్వేచ్ఛకు తండ్రీ, దేవుడు పెద్ద అడ్డంకని ఎన్ని సామాజిక పరిణామ దశలు చూపించాయో మర్చిపోతే ఎట్లా?
శర్మ ఆర్థికవాదాన్ని నిరసించినంతనే తన వాదన‌ ఆమోదనీయమైనదని నిరూపించలేరు. స్వేచ్ఛా మార్కెట్ వ‌ల్ల‌ దళితుల‌ జీవితాల్లో పెద్ద మార్పులొస్తాయని ఎవరూ ఆశించలేదు. కానీ, కుల‌ సంబంధాల్లో స్వ‌ల్ప‌మైన మార్పులైనా వొస్తాయనీ, ముఖ్యంగా జైలుగదిగా మారిన గ్రామరాజ్యం విచ్ఛినమై, సుదీర్ఘకాలం కట్టుబానిసలుగా బంధితులైన దళితుల‌కు సాపేక్షమైన స్వేచ్ఛనిచ్చే సోషల్‌ మొబిలిటీ దొరుకుతుందని మాత్రమే ఆకాంక్షించారు. అన్ని దశల్లో అమలైన ఆర్థికఒప్పందాల వ‌ల్ల‌, వేగంగా విస్తరించిన టచ్‌స్క్రీన్‌ టెక్నోయిజం వల్లా, ఎక్ట్రో కమ్యూనికేషన్‌ ప్రగతివల్ల‌ బ్రాహ్మణ, వైశ్య మార్కెట్‌ లాభపడ్డది. కాస్టిస్ట్‌ మార్కెట్‌ స్వభావం, ప్రవర్తన పీడిత సమూహాల‌ను కనీసం వినియోగదారునిగా కూడా పరిగణించదనీ, అది అనేక మాయాజాల‌ పద్ధతుల‌తో జేబుదొంగకన్న హీనంగా ప్రవర్తిస్తుందన్న ఎరుక అంబేద్కరైట్‌ మేధావుల‌కు వుంది.
సవర్ణ సరుకుల‌ సంతను విస్తరింప చేయటానికీ, దేశ సహజ వనరుల‌ను సవర్ణ సంపన్నుల‌కు కట్టబెట్టడం ద్వారా ప్రపంచ కుబేరుల‌ను చేసి, ప్రపంచ మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవటం ద్వారా వైష్ణవ, వైదిక, సనాతన ధర్మపరంపరాగతమైన హిందూత్వ జాతీయవాదాన్ని ఆర్యజాతి ఐక్యత పేరుతో ప్రపంచమంతా వ్యవస్థాపితం చేయాల‌ని తపిస్తున్న సత్యం కనిపిస్తూనే వున్నది. సంఫ్‌పరివార్‌ సంస్థలు మొదలుకొని హరేక్రిష్ణ మిషన్‌, రామక్రిష్ణ మిషన్‌ వరకు ఎన్నో సంస్థలు ఆ దిశగా పనిచేస్తూనే వున్నాయి. ఆ ల‌క్ష్యం కోసమే పేద (హిందూపేదల‌) పితరగా ప్రకటించుకొన్న నరేంద్ర మోఢీ నిద్రాహారాలుమాని పనిచేస్తున్నాడు. ఆ ల‌క్ష్యం కోసమే ముస్లింల‌ను, దళితుల‌ను సామూహిక హనన కేంద్రాకు స్వ‌యంగా తరలిపోయి క్యూలో నిల‌బడే బలిమేకలుగా త‌యారు చేసే మానసిక ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సామూహిక హననక్రియకు అవసరమైన తలారుల‌ను శూద్ర, శూద్రఅగ్రకులాల‌ నుంచి తయారు చేసి శిక్షణిస్తున్నాడు.
ఇందుమూలంగా నిర్ధారించనైనది ఏమనగా, ఈ లోకాన్నీ, పీడిత సమూహాల‌ను సర్వనాశనం చేసిన, చేస్తున్న, భవిష్యత్తులో చేయబోయే తండ్రి ` అతడు ఎంతటి ఉదాత్తుడు, శీల‌వంతుడు, సద్గుణుడు, నిర్గుణుడు అయినప్పటికీ  తాత్వికంగా గానీ, కనీస ఇంగితజ్ఞానంతో గానీ అంగీకరించేది లేదని ప్రకటిస్తున్నాం. వేల‌ యేళ్లుగా ఈ ప్రపంచాన్నీ, ఈ దేశాన్నీ సర్వనాశనం చేసిన దేవుడు ఎంతటి దయామయుడైనా, ఎంతటి బల‌మైన దేహదారుఢ్యమూ, ఆయుధసంపత్తిని చేబూనివాడైననూ, ఎంతటి ధర్మనిరపేక్షమైనవాడైననూ, ఎంతటి కరుణామృత హృదయుడైననూ, అతడెంత నిర్గుణుడైనా, సద్గుణుడైనా, నిరాకారుడైనా, సాకారుడైనా సరే, తాత్వికంగాగానీ, సాధారణ బుద్ధితోగానీ, అసాధారణ బుద్ధిహీనతతో గానీ అంగీకరించేది లేదని ప్రకటించనైనది.
*

తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

నీషే చెప్పినట్లు దేవుడు మాత్రమే కాదు, అసలు తండ్రి అనే వాడే అంతరించి పోవడమే ఆధునిక కల్లోలానికి మూలం. ఇంతకీ దేవుడు పరమ పిత కదా, పురుషోత్తముడే కదా! అంటే ఆదర్శవంతమైన తండ్రి. అసలు తండ్రి అనే భావనకే కాలం చెల్లిపోతున్న సూచనలు కనపడుతున్నాయి. దాంతోపాటూ అతన్ని కేంద్రంగా చేసుకొని తిరిగిన కుటుంబ వ్యవస్థ కరిగిపోతోంది. వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన రాజు, తర్వాత ఆధునిక రాజ్యం, జాతీయత యొక్క జనగణమన అధినాయకత్వమూ తండ్రి అనదగ్గ చిహ్నాలన్నీ క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దాంతో కుటుంబ సంక్షేమం, రాజ్యం యొక్క సంక్షేమ భావం మొత్తంగా సంక్షేమ భావం నిలువనీడలేనిదిగా మారిపోతోంది.
పితృస్వామ్యంలో తండ్రి ఆధిపత్యస్థానాన్ని వహించడం నిజమే కానీ అతని కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఉంది. మనం సూర్యకుటుంబం అంటూ కాస్మిక్ చింతనలో కూడా కుటుంబ భావనని ప్రవేశపెట్టి , సూర్యుడికి తండ్రి స్థానాన్నీ,  యితర గ్రహాలకి అతనిపై ఆధారపడి  పరిభ్రమించే స్థితినీ కల్పించాం. ఇదొక అత్యాధునిక విఫల యత్నం. ఎందుకంటే నిజానికి ఆధునిక కాలంలో తండ్రిపాత్ర  క్షీణించింది. మానవుడే కనుమరుగయ్యాడు.  అయినప్పటికీ సూర్యకుటుంబం అనడం ఒక  భ్రమాత్మక కొనసాగింపు. ఇలాంటి కొనసాగింపు అన్ని రంగాల్లోనూ సాగింది. దీన్ని నేను తర్వాత వివరిస్తాను.
నిజానికి భూకేంద్రక సిద్ధాంతం అంతరించి విశ్వం నక్షత్రగుచ్చాలుగా ఉందనే వైఙ్ఞానిక దృక్పథం బలపడాక మనిషి యొక్క కేంద్ర స్థితే పూర్తిగా దెబ్బ తింది. దిక్కులు దిక్కులేనివయ్యాయి. కిందా మీదులనేవి లేకుండా పోయాయి. విశ్వం అనంతంగా అంతరించి మనిషి చిన్నబిందువుగా మారిపోయాడు. మనిషి కనుమరుగైపోయాడు. అంతరించాడు. అతనితో పాటుగా దేవుడు అంతరించాడు. దేవుడు మరణించాడని నీషే గగ్గోలు పెట్టాడు.
ఆధునిక యుగం చనిపోయిన దేవున్ని, అతని ప్రతిరూపమైన మనిషిని లేక మనిషికి ప్రతిరూపమైన దేవున్ని పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నం చేసింది. మానవునిపై తీవ్రమైన మూఢ విశ్వాసంతో మానవ చరిత్ర పురోగమనం అనే స్వర్గ కాంక్షతో ప్రొటెస్టెంటిజం నుంచీ కమ్యునిజం దాకా అనేక ప్రయత్నాలు సాగాయి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం, మనిషి మరణిస్తాడు కానీ మనుషులు మిగులుతారంటూ శ్రీశ్రీ చేసిన ఆశావాదపూరిత ప్రకటన దైవ పునరుద్ధరణ లేక మానవ పునరుద్ధరణ కోసం యూరప్ వేసిన పొలికేకకి ప్రతిధ్వని మాత్రమే.
జీవ శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ జరిగిన పరిశోధనలు మానవుడి ప్రత్యేకతనే సవాలు చేసాయి. మనిషి జంతువు నుంచీ వచ్చాడనే కాదు, అసలు నిర్జీవ పదార్ధం నుంచే సజీవ పదార్ధం ప్రమాదవశాత్తూ ఆవిర్భవించిందన్న ప్రతిపాదన మనిషికి ప్రత్యేకత లేకుండా చేసింది. అతని పుట్టుక వెనుక దైవసంకల్పం మాట దేవుడెరుగు, అతని పుట్టుక వెనుక అసలు డిజైను అనేదే లేదని చెప్పి, అతని పుట్టుకని వొక యాక్సిడెంట్ స్థాయికి పడదోసింది. ఖగోళ శాస్త్రం, సాపేక్షవాదం విశ్వంలో మనిషి ఉనికిని అనిశ్చితం చేసేసాయి. దీంతో పాటు యాంత్రిక నాగరికత మనిషికి గ్రామాల్లో ఉన్న స్థిరమైన ఐడెంటిటీని ముక్కలు చేసింది.
మనిషి ఈ శూన్యాన్ని భరించలేడు. అతనికి వొక కేంద్రం కావాలి. దేవుడు కావాలి. రాజు కావాలి. తండ్రి కావాలి. నిజానికి ఈ మూడూ వొకటే. అది పితృ భావన. పితృహననాన్ని మనిషి జీర్ణించుకోలేకపోయాడు. పరమపిత శిక్షించడం మాత్రమే కాదు. రక్షణ కూడా చూసాడు. యూదులకు ఒక స్థిర నివాసాన్ని వాగ్ధానం చేసాడు. దైవధిక్కారం వల్ల యూదులు కష్టాలు అనుభవించారు. తండ్రినీ, తండ్రి ఆఙ్ఞనీ ధిక్కరిస్తే అవ్యవస్థే, అనిశ్చితే. భారతదేశం పరిస్థితి వేరు. ఇక్కడ రాజుకి సరిహద్ధులు ముఖ్యం కాదు. వర్ణ వ్యవస్థ ముఖ్యం. ఎవరి వృత్తులు వారు నిర్వహించాలి. దాన్ని ధిక్కరిస్తే మరణ దండనే. శ్రీరాముడు శంబూకున్ని చంపింది అందుకే. యిక్కడ కులవృత్తులు ముఖ్యం. దాని మీదే వ్యవస్థ ఆధారపడి ఉంది. రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే ప్రజలు చాలా దూరం అనుసరిస్తారు. మధ్యలో వొక నదీ తీరంలో అందరూ నిద్రపోతున్న రాత్రి వేళ రాముడు నిష్క్రమిస్తాడు.
వొక ఆదర్శప్రాయుడైన తండ్రి అవసరం, రామాయణంలోని ఆదర్శాలు యీనాడు మనకు పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ వొక నాయకుడూ, తండ్రీ అవసరం అని అందరూ భావించారు. దీనిలో ఎరిక్ ఫ్రాం చెప్పినట్లు స్వేచ్చ నుంచీ పలాయనం చిత్తగించే మానవ ప్రవృత్తి దాగి ఉంది. తన నిర్ణయాల్ని భరించే వొక పిత,  పరమ పిత, నాయకుడు, వొక నిర్ణయం తీసుకోవడంలోనూ, వొక చాయస్ ఎంచుకోవడంలోనూ గల కష్టనష్టాలనుంచీ, మంచీ చెడూ ఫలితాలనుంచీ రక్షిస్తాడు.  ( అందుకే దేవుడికి సర్వసమర్పణ భావన మొదలైంది) అందుకే “తండ్రి” భావన. మరణ వేదన పడ్తున్న సమయంలో తండ్రి కావాలి, తండ్రి కావాలి అని గగ్గోలు పెట్టాడు. కానీ ఎగ్జెన్షియలిజం మనిషి సారాన్ని తిరస్కరించి, బాధ్యతనంతా మనిషి మీదే మోపేసింది. మనిషి స్వేచ్చాశాపగ్రస్తుడని ప్రకటించింది. కానీ యీ ఙ్ఞానం మనిషికి వూరటనివ్వలేదు. కనీసం వొక పిశాచంగా, వొక భ్రమగానైనా తండ్రికావాలి. తన భారాన్ని మోసే నాయకుడూ, దేవుడు కావాలి.
శ్రీరాముడేమన్నాడు. ” ఆరాధనాయ లోకస్య మంచతో నాస్తి మే వ్యధా” ( ఉత్తర రామచరితం- భవభూతి) ప్రజలనీ లోకాన్నీ మెప్పించడం కోసం భార్యని కూడా విడిచి పెట్టడానికి కూడా సిద్ధమే. దానిలో యిసుమంత బాధకూడా లేదన్నాడు. స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్యాన్నీ ప్రజలనీ కాపాడడం కోసం తన కొడుకు ని బలి పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఎర్ర సైన్యం చేతిలో బంధీలుగా ఉన్న నాజీలని విడచిపెట్టడానికి స్టాలిన్ తిరస్కరించాడు. దాంటో అతని కొడుకుని శత్రువులు చంపేసారు. ( దైవ కుమారుడు క్రీస్తు పాపుల కోసం శిలువ నెక్కిన సంగతి తెలిసిందే) మన నిర్ణయాల్నీ, మన మంచి చెడ్దల్నీ మోసే నాయకుడూ, తండ్రీ కావాలనే కోరిక మానవ సహజమైనది. అది స్వీయ బాధ్యతల నుంచీ పలాయనం కూడా.
కానీ మనిషి తండ్రిని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ద్వేషిస్తాడు కూడా. ఎందుకంటే తండ్రి స్వేచ్చకు పెద్ద అడ్డంకి. మనిషిలో స్వేచ్చాపిపాస ఉంది. అదే సమయంలో “పోదాం పద పారిపోదాం పద”( భైరాగి) అనే పలాయన వాదం ఉంది. ఈ రెండూ పరస్పర ఆశ్రితాలు. ఎందుకంటే స్వేచ్చలో అంతులేని బాధ్యత ఉంది. దాని వల్ల వచ్చే పెయిన్ ఉంది. నిర్ణయాన్ని తీసుకోలేకపోవడంలో, నిర్ణయాన్ని  యితరులపై మోపెయ్యడంలో శిశు సహజమైన భద్రతవుంది.
కానీ ఇలా తండ్రి మీదో నాయకుడి మీదో ఆధారపడి అతని చేతులకు బాధ్యతనప్పగించి బతికేయడం వల్ల ఆ తండ్రి, ఆ నాయకుడు స్వేచ్చని హరించే సైతానుగా మారిపోయే ప్రమాదం ఉంది. యీ ప్రమాదమే కాఫ్కా లాంటి రచయితల్ని వూపిరాడకుండా చేసి పితృ ద్వేషులుగా చేసింది. జర్మన్ రచయిత కాఫ్కా, లెటర్ టూ హిజ్ ఫాదర్, మెటామార్ఫాసిస్ – ఈ రెండూ స్వేచ్చని హరించే తండ్రి పైశాచిక రూపాన్ని బహిర్గతం చేస్తాయి. కుటుంబమూ, దానిపై ఆధిపత్యము వహించే తండ్రీ,  కథానాయకుడు- గ్రిగరీని వొక కీటకంగా మార్చేస్తారు. అతడు తన అస్తిత్వాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం సోఫా కింద నక్కుతుంటాడు. గదినుంచీ బయటకు వచ్చాడన్న కోపంతో తండ్రి విసిరిన ఆపిల్ గ్రిగరీ దేహంలో యిరుక్కపోయి తీవ్ర వేదనని మిగల్చడాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ( మెటామార్ఫాసిస్) ఎప్పటికీ ప్రారంభం కాని, నిరీక్షణంలోనే జీవితం ముగిసిపోయే న్యాయ విచారణ లాంటి విషయాల ద్వారా కాఫ్కా ఆధునిక మానవుడి జీవన అనిశ్చితినీ, క్రూరమైన రాజ్యాన్నీ కళ్ళముందు కడతాడు. నిజానికి రాజ్యమనే తండ్రి, వ్యవస్థ అనే తండ్రి యెలా మానవ స్వేచ్చని హరిస్తారో కాఫ్కా తన కథల్లో స్పష్టం చేసాడు. ( చలం కూడా తండ్రినీ, అతని నియంతృత్వాన్నీ ద్వేషిస్తాడు. బిడ్డల శిక్షణ పుస్తకంలో పిల్లల స్వేచ్చని బోధిస్తాడు)
కాఫ్కా చనిపోయిన కొంత కాలానికి అతని కుటుంబం మొత్తం నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో కడతేరడం అతని కథల్లోని బీభత్సాన్నీ, జుగుప్సనీ నేల మీదకు దించింది.
            ఈ బీభత్సానికి కారణం ఆధునిక జాతిరాజ్యాన్ని ఫాసిజంగా నిర్వచించిన ఆధునిక  పిత హిట్లరే కారణం. ఇంతకు ముందు చెప్పినట్లు విఙ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా పారిశ్రామిక నాగరికత ద్వారా పాత వ్యవస్తల్నీ, పాత ఆలోచనల్నీ కుదిపేసిన ఆధునిక యుగం మళ్ళీ తండ్రి కోసం పరమపిత కోసం (దేవుడి కోసం) అన్వేషణ మొదలెట్టింది. దానివల్ల యిద్దరు ఆధునిక  ఆదర్శాలతో  నిండిన తండ్రులూ, దేవుళ్ళూ ,నాయకులూ లభించారు.  ౧) హిట్లర్ ౨) స్టాలిన్. హిట్లర్ జాతీయ వాద ఆదర్శాన్నీ, స్టాలిన్ కమ్యునిస్ట్ ఆదర్శాల్నీ ప్రాతిపదికగా చేసుకొని నాయకులుగా మారారు. నియంతలుగా మారారు. దేవుళ్ళుగా మారారు. వారి పేర విగ్రహారాధన మొదలైంది. కానీ వారిద్దరూ విఙ్ఞాన శాస్త్ర ఆరాధకులే. కానీ స్టాలిన్ మరణిస్తే అతని శవాన్ని కూడా భద్రపరిచి శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శనకు పెట్టారు. యింతటి గౌరవం, భక్తి భావం బుద్ధభగవానునికి దక్కలేదు. దీనిలో వైరుధ్యం లేదా? విఙ్ఞాన శాస్త్రాన్నీ, హేతువాదాన్నీ ప్రమాణంగా భావించే వ్యక్తులే దేవుని స్థానాన్ని ఎలా ఆక్రమించారు?
కాలంలో వెనక్కి వెళ్ళి బుద్ధుడు బుద్ధభగవానుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించుకుందాం. బుద్ధుడు తనని దేవుడ్ని చేయవద్దన్నాడు. సొంత బుద్ధితో అన్వేషణ చెయ్యమన్నాడు. నిజమే, ఆ మాట స్టాలిన్ కూడా అంటాడు. కానీ బుద్ధుడు విహారాలని స్థాపించాడు. అక్కడ అతడే తండ్రి పాత్రని పోషించాడు. కఠోరమైన సన్యాసాశ్రమ వ్యవస్థని పోషించాడు. సెక్సుని అణచి వేయడానికి తీవ్ర ప్రయత్నం చేసాడు. ఎవరైనా ఆ నియమాన్ని అతిక్రమిస్తే తీవ్రంగా నిందించాడు. అలాగే వొక సన్యాసి శిష్యున్ని, తన మాజీ భార్యతో సంగమించినందుకు నిందిస్తాడు. ” అంగాన్ని నిప్పుల్లో కాల్చుకోలేక పోయావా కోరిక తీరకపోతే”- అని దుమ్మెత్తి పోసాడు. (బుద్ధ చరియ- రాహుల్ సాంకృత్యాయన్)
పారిపోయివచ్చిన సైనికుల్నీ, బానిసల్నీ విహారంలో ప్రవేశించడానికి నిరాకరించి రాజుకు సహకరించాడు. స్త్రీల ప్రవేశాన్ని కూడా నిరాకరించినా, శిష్యుడు ఆనందుని మాట విని తర్వాత వొప్పుకున్నాడు. కానీ స్త్రీల వల్ల వొక వెయ్యి సంవత్సరాల్లో బౌద్ధం క్షీణిస్తుందన్నాడు. బుద్ధుడు కుటుంబ స్థానంలో సన్యాసాన్ని స్థాపించి దానికి నాయకత్వాన్నీ, తండ్రి పాత్రనీ పోషించాడు. బుద్ధుడు మంచి తండ్రిలా కనపడవచ్చు కానీ తండ్రే. ఆ పాత్రలో నియంతృత్వధోరణి తప్పదు. మిగిలిన వాళ్ళ కంటే వొక అతీత స్థితీ, ఉన్నత స్థితీ తప్పదు. అదే బుద్ధున్ని దేవునిగా మార్చింది. అంటే బౌద్ధ విహారాల్లోనూ , వారి సన్యాస దీక్షలోనూ కూడా పితృస్వామిక లక్షణాలు బలంగానే ఉన్నాయి.
కానీ సన్యాసం అనేది కొత్త మార్పే. ముఖ్యంగా కుటుంబంలాగే అదొక వ్యవస్థగా మారడం. బుద్ధుడు వ్యవసాయక సమాజం ఏర్పడ్తున్న దశకు సంబంధించిన వాడుగా నిర్ధారిస్తాడు డి. డి. కోశాంబి. వ్యవసాయం విస్తరిస్తూ ఉండడం సొంత ఆస్తి ఆవిర్భావానికి కారణం. సంపద మిగులుకు కారణం. దీనివల్ల పనిలోకి పోకుండా బౌద్ధిక చింతన చేసే వర్గం ఆవిర్భవించింది. వాళ్ళే బౌద్ధ బిక్షువులు. రిచ్యువల్నీ, యఙ్ఞయాగాదుల్నీ, కర్మకాండనీ పరమమైనదిగా  భావించే బ్రాహ్మణులు సన్యాసాశ్రమాన్ని చాలాకాలం వ్యతిరేకించారు. కుటుంబ వ్యవస్థనే బలపరిచారు. అందుకే ఎనిమిదవ శతాబ్ధానికి చెందిన శంకారాచార్యుల్ని సన్యాసం తీసుకున్నందుకు మండన మిశ్రుడిలాంటి బ్రాహ్మణపండితులు మొదట తీవ్రంగా నిందించారు. స్త్రీ సంపర్కాన్ని నీచమైనదిగా భావించడాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత పీఠాలు వెలిసాయి. పీఠాధిపతులు వెలిసారు. వాళ్ళు రాజులుగా, తండ్రులుగా గౌరవాన్ని పొందారు.
అంటే మానవ సమాజం కుటుంబ వ్యవస్థని, సెక్సుతో సహా తిరస్కర్తించినప్పటికీ తండ్రి పాత్రని ఆరాధించడం విడిచిపెట్టలేదు. దేవుడికి మూలాలు యిక్కడే ఉన్నాయి. దేవుడ్ని తార్కికంగా హేతుబద్ధంగా తిరస్కరించినా  కొత్త దేవుళ్ళు వెలుస్తూనే ఉంటారు. కారణం దేవుడు పితృస్వామిక వ్యవస్థ యొక్క ఆదర్శ రూపం.
బ్రాహమణ ఫిలాసఫీ అయిన పూర్వ మీమాంస దేవుడి ఉనికినే హేతుబద్ధంగా తిరస్కరించింది. కుమారిలభట్టు యిటువంటి తర్కాన్ని అభివృద్ధిపరిచాడు. కానీ జాతి వ్యవస్థనీ, బ్రాహ్మణ అధిపత్యాన్నీ బలపరిచాడు. మనువు ఏమంటాడూ? అగ్రవర్ణాల్ని అనుసరిస్తూ , తమ నడవడికని తీర్చిదిద్దుకోవాలంటాడు. అంటే వర్ణ వ్యవస్థలో భూసురుడే దేవుడు. అతడే పరమ పిత. వేరే ఆకాశ దేవుళ్ళు అవసరం లేదు.
అందువల్ల పితృస్వామ్య మూలాల్లోనే దేవుడున్నాడు. యీ దేవుడు వొక్కొక్క సారి నిర్గుణుడు, మరొకసారి సగుణుడు, మరొక సారి మానవ ఆకారం ధరించిన వాడు, శ్రీరాముడూ లేక స్టాలినూ, హిట్లరు.
అదేమిటండి నాస్తికత్వానికీ, దేవుడికీ ఎలా పడుతుంది? యెలా సంధి కుదుర్తుంది అని మీరడగవచ్చు. ప్రాచీనకాలంలో బౌద్ధం వల్ల, ఆధునిక కాలంలో కమ్యునిజం వల్ల విగ్రహారాధన పెరగలేదా? అంటే మనం పితృస్వామ్యాన్ని తిరస్కరించడంలేదు. రంగనాయకమ్మగారు రామాయణనీతిని తిరస్కరించడం లేదు. ఆదర్శవంతమైన ఆధునిక హేతుబద్ధతతో కూడిన రామాయణ నీతి మోనోగమీ కావాలంటున్నారు.
కానీ రంగనాయకమ్మ గారికీ, రామాయణ నీతికీ ముప్పు ఏర్పడింది. వొకప్పుడు ఓల్గాలాంటి రచయితలు కుటుంబ వ్యవస్థతో సంబంధం లేని సెక్సు, స్వేచ్చ గురించి మాట్లాడారు. దానికి విరుద్ధంగా రంగనాయకమ్మగారు విరుచుకపడి ఆదర్శవంతమైన మోనోగమీని సమర్ధించారు. కానీ కుటుంబమనేదే పితృస్వామికం.
బ్రాహ్మణులే కాదు, ఆదిమవాసులు కూడా పితృదేవతల్ని నమ్ముతారు. కొన్ని సంవత్సారాల క్రితం వొక వార్త చదివాను. అమెజాన్ అడవుల్ని కొట్టేసి, అమెరికన్లు సోయాబీన్ పండిస్తున్నారు. అక్కడ గిరిజనుల గోడు ఏమిటంటే – ఇది పితృ దేవతల నిలయం.  యీ అడవులు వీటిని చేధించవద్దని వారి ప్రార్థన. బహుశా యీ పితృ దేవుడు చాలా ప్రాచీనుడు. పితృ దేవుడి నుంచే, పితరుల ఆత్మ నుంచే దేవుడు పుట్టాడు. కొడుకు వల్ల పున్నామ నరకం తప్పుతుంది. అలాగే తండ్రీ తాతలకి కర్మ ద్వారా పితృ ఋణం తీరుతుంది. యిదొక చక్రభ్రమణం, పితృ భ్రమణం.
ఆధునిక కాలంలో కమ్యునిష్టులు దీన్ని చేధించాలని చూసారు. కానీ కొత్త రూపంలో కొనసాగించారు. అంటే తండ్రి స్థానంలో సంస్కారవంతుడైన మంచి తండ్రినీ, మంచి నాయకుడ్నీ, హేతుబద్ధమైన దేవుడ్నీ స్థాపించాలని చూసారు. హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పితృ కర్మలని తిరస్కరించాడు. తాను చనిపోయినా కర్మ జరపవద్దని వీలునామా రాసాడు. ఆయన దృష్టిలో హిందూ జాతీయవాదమే పరమపిత. హిందూ జాతీయవాదం హిట్లర్ జాతీయవాదం యొక్క శిశువు. ప్రపంచానికి యిద్దరు పరమ పితలు. ౧) హిట్లర్ ౨) స్టాలిన్.
ఆధునిక రాజ్యం తండ్రిగా కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించింది. కొన్ని సంక్షేమ లక్షణాలని పుణికిపుచ్చుకుంది. ఎంత దుర్మార్గాలకీ, క్రూర చర్యలకీ పాల్పడ్డా ప్రజల పురోగతే తన లక్ష్యమని ప్రకటించుకుంది. టీచర్ పిల్లల్ని దండించడం వారి అభివృద్ధి కోసమేనని చాటుకున్నట్లు రాజ్యం తన హింసాత్మక చర్యల వెనుక కూడా ప్రజా సంక్షేమమే దాగి ఉందని చాటుకొంది. కానీ “సంక్షేమం” అనే మాటని విడిచి పెట్టలేదు. హిట్లరు కూడా నిరుద్యోగాన్ని రూపుమాపే చర్యల్ని చేపట్టాడు. సంక్షేమ రాజ్యం అనే పదబంధం కూడా పుట్టుకొచ్చింది. ఈ సంక్షేమ భావనే స్టాలిన్, ఇందిరాగాంధీల నియంతృత్వ పోకడలకి సమ్మతిని చేకూర్చింది. ప్రాచీన కాలంలో రాజు సామదానభేద దండోపాయాల్ని అవలంభించాలని రాజనీతి. ఆధునిక యుగంలో కూడా అదే కొనసాగింది.
కానీ అత్యాధునిక మార్పులూ, ప్రపంచీకరణ క్రమేపీ పితృస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాంతో తండ్రి, నాయకుడు, దేవుడు నిజంగానే మరణ శయ్యపై చేరుతున్నారు. దాంతో పితృస్వామ్యం వహిస్తూ వచ్చిన సంక్షేమ భావన కొండెక్కింది. మంచికైనా చెడుకైనా ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ తండ్రే లేకుండాపోయాడు. రావిశాస్త్రి వొకసారి అంటారు. “దేవుడు ఉన్నాడనే నేను భావిస్తాను. ఎందుకంటే తీవ్ర దుర్మార్గాలని చూసినపుడు నిదించడానికీ, నిలదీయడానికీ దేవుడు పనికొస్తాడు”. వొకప్పుడు రాజ్యం అపనిందల్ని భరించేది. తిరుగుబాట్లని ఎదుర్కొనేది. అణచివేయాలని చూసి, చివరికి రాజీకొచ్చేది. కొన్ని సంస్కరణలనైనా చేపట్టేది. గిరిజనులకి ఇలాగే కొన్ని హక్కులు లభించాయి.
యిప్పుడూ సంస్కరణ అన్న పదమే మారిపోయింది. రాజ్యం అన్ని సంక్షేమ బాధ్యతలనీ తప్పుకోవడమే సంస్కరణగా పిలవబడ్తోంది ( అంటే తండ్రి బాధ్యత నుంచీ తప్పుకోవడం).వొకప్పుడు రాజ్యం యొక్కపితృస్వామిక సహకారంతోనే అగ్ర వర్ణాలు పెట్టుబడిదారులుగా , మధ్యతరగతిగా బలపడ్డారు. దళితులూ, గిరిజనులూ, ముస్లీములూ కడగొట్టు బిడ్దలుగా తక్కువ పలితాన్ని పొందారు.రాజ్యం సంక్షేమ భావనని విడిచిపెట్టడంతో,  తండ్రి బాధ్యతని త్యజించడంతో వీరిపరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
కొంతమంది దళిత మేధావులు ప్రపంచీకరణ వల్ల దళితులకి మేలు జరుగుతుందని, కుల వివక్ష తగ్గిపోతుందనీ వాదించారు. చంద్రభాను ప్రసాద్ అలాగే వాదించారు. నిజానికి రాజ్యం పితృస్వామ్య బాధ్యతని విడనాడి, మార్కెట్‍కు అంతా వదిలేయడంతో వొక అరాచక పరిస్థితి ఏర్పడింది. ఆధునిక రాజ్యం ఏర్పడక ముందునుంచీ ప్రశ్నిస్తూ, పోరాడుతూ వొచ్చిన నిమ్నకులాలు యిప్పుడు ఎవరితో పోరాడాలో తెలియక, యెవరిని నిలదీయాలో తెలియక దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తిరుగుబాట్లు మాయమయ్యాయి. ఆత్మహత్యలు మొదలయ్యాయి. రైతాంగ తిరుగుబాట్లు, విద్యార్థి పోరాటాలూ లేవు. ఆ స్థానాన్ని రైతుల ఆత్మహత్యలూ, విద్యార్ధుల ఆత్మహత్యలూ భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వ విద్య, ఉద్యోగాలూ అంతరించి దళిత మధ్యతరగతి పెరుగుదల నిలిచిపోయింది.
యూరప్‍ని అనుకరిస్తూ  జాతి రాజ్యం(నేషనాలిటీ) ని ఏర్పరుచుకున్నప్పుడు, కొన్ని సంక్షేమ ఆదర్శాల్ని మనం ఆశించాం. కానీ స్వదేశీ, స్వజాతి అభిమానం వంటివి కనుమరుగవుతున్నాయి. దాని స్థానంలో కుహనా జాతీయవాదం మొదలైంది. విచిత్రంగా యీ కుహనా జాతీయవాదాన్ని ఎన్నారైలు భర్తీ చేస్తున్నారు.
రాజీవ్ మల్హోత్రా యిటువంటి కుహనా జాతీయవాదే. ఆయన బ్రేకింగ్ యిండియా అనే పుస్తకం రాసారు. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలూ, ప్రగతి శీల చరిత్రకారులూ, మావోయిష్టులూ … వీళ్లందరూ జాతీయతకి ముప్పుగా పరిణమించారంటారు. బ్రిటీష్ పాశ్చాత్య వలసవాద సంస్కృతి ఆధిపత్యం గురించి తెలివిగా మాట్లాడ్తారు. కానీ దేశాన్ని బహుళ జాతికంపెనీలకి బార్లా తెరవడంలో, పాశ్చాత్య దేశాల్లో కూడా నిషేధించిన అణూకర్మాగారాల్ని ఎటువంటి నిబంఢనలూ విధించకుండా విచ్చలవిడిగా అనుమతించడంలో , విదేశీ విశ్వవిద్యాలయాలు, రక్షణ రంగంలో విదేశి పెట్టుబడులూ… యివేవీ ఆయనకు జాతీయతకు  ముప్పుగా  ఆయనకు కనపడలేదు. పైగా వీటిని ప్రోత్సహించే హిందూ జాతీయ వాదుల్లో “స్వదేశీ” కనపడ్తుంది. సామ్రాజ్యవాదం వూసెత్తరాయన.
నిజానికి మరణ శయ్యపై చేరిన తండ్రి- జాతీయవాదం యింకా మరణించలేదనే భ్రమని యీ మేధావులు కలగజేస్తారు. పైగా జాతీయతకి ముప్పుగా పరిగణించిన విదేశి భక్తులలోనే దేశభక్తినీ, దేశ సంస్కృతినీ చూపుతారు. తద్వారా పరోక్షంగా స్థానిక సంస్కృతుల్ని పాతర వేసి పాశ్చాత్య అమెరికన్ సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. పశ్చాత్తాపం లేని దళారులు వీళ్ళు.
నిజానికి తండ్రి మరణించాడు. కుటుంబ వ్యవస్థ రూపు మాసిపోయే స్థితిలో ఉంది. సంతానాన్ని భాగ్యంగా వరంగా భావించే స్థితి పోయి, కొన్ని దేశాలు సంతానాన్ని కంటే రాయితీలు యిస్తానంటున్నాయి. యిదే సమయంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి పెంచడం కోసం, ప్రసవాన్ని వాయిదా వెయ్యమని, పిండాల్ని భద్రపరిచే సౌకర్యం కల్పిస్తామని అంటున్నాయి. అద్దె గర్భాలు లభిస్తున్నాయి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. యివన్నీ పితృస్వామ్యం అంతరించిపోతుందనడానికి , అదే సమయంలో వ్యాపిస్తున్న శూన్యానికీ చిహ్నాలు. ( సాంకేతిక అభివృద్ధి గల మనిషి స్థల కాలాల్ని పోగొట్టుకుంటున్నాడు. దాంతో బంధాలు, అనుబంధాలు కోల్పోయాడు).
యింక రాజ్యం దగ్గరికి వస్తే వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన హిట్లర్, స్టాలిన్, ఇందిరాగాంధీ వంటి నియంతలలో కనపడే నిజాయితీ నేటి పాలక వర్గంలో కనపడదు.
హిట్లర్ తన ఆత్మకథ(మెయిన్ కుంఫ్)లో యూదు వ్యతిరేకతని బహిరంగంగానే చాటుకుంటూ , దానికి మేధావుల తాత్విక మద్ధతుని ప్రకటించుకున్నాడు. స్టాలిన్ కూడా తన దృక్పథాన్ని కప్పిపుచ్చుకోలేదు. ఇందిరా గాంధీ  ఎమర్జన్సీ విధించడానికి కూడా వెనుకాడలేదు.
కానీ నేడు హిందూ ఆధిపత్య వర్గానికి ఆ నిజాయితీ లేదు. కొందరు దాడులు చేస్తారు. కానీ మా ఫిలాసఫీ ఫాసిజమేనని ప్రకటించే తండ్రి స్థానంలోని నాయకుడు ఉండడు. అంతా అరాచకం. స్థలకాలాలు అంతరించిపోయిన శాటిలైట్ ప్రసారాల కాలంలో మనం ఉన్నాం. మన ప్రత్యేకతని మనం కోల్పోయాం.
దీనికి కారణం మనని మనం పాలించుకోవడం లేదు. మనకి నాయకుడు లేడూ. తండ్రి లేడూ. తండ్రి మరణించాడు. మార్కెట్ అరాచకం రాజ్యం చేస్తోంది. యిటువంటి అసంబద్ధపు ప్రపంచపు లోగుట్టుని బయట పెట్టబోయిన వికీలీక్స్- అసాంజే వొక దేశపు రాయబార కార్యాలయంలో స్వయం బంధీ  అయ్యాడు. అతడి తరుపున వాదించే అమెరికన్ లాయర్ అనుమానపు స్థితిలో చనిపోయాడు. అంటే అత్యాధునిక ప్రసార సాధనాలు సత్యాన్ని కప్పిపుచ్చే ముసుగులు మాత్రమే.
తండ్రి లేని, నాయకుడు లేని, దేవుడు లేని సత్యం లేని అనాథల ప్రపంచం మనది.
*

ఈ ఆదివాసీ కంట తడి కనిపిస్తోందా మీకు?!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా …

adivasi

సమాజంలో జరుగుతున్న దాడులు , అసమానతలు ,అవినీతి వంటి అంశాల పై సామాజిక ఉద్యమకారులతో పాటు రచయితలు కూడా అంతే బాధ్యతతో బాధితులకి అండగా నిలవడం నైతిక బాధ్యత .ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు రచయితలు తమ కలాలకు పదును పెట్టి ఉద్యమాల విజయానికి కారకులయ్యారు . భారత దేశపు ఆదివాసీయుల సంస్కృతి , పోరాటాలు వారి కన్నీటి గాధలు పరిచయం చేస్తూ రచనలు చేసి రచయిత్రి మహాశ్వేతాదేవి సాహిత్యలోకానికి స్పూర్తిగా నిలుస్తుంది .

ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గి పోతున్న సామాజిక వర్గాలలో ఆదివాసీలు ఇంకా అట్టడుగున వున్నారు . ఆదివాసీ దినాలు వస్తున్నాయి పోతున్నాయి గానీ వాళ్ళ జీవితాల్లో మార్పు కనిపించట్లేదు . ఇంక ఆదివాసీ మహిళల జీవితాలు , సొంత సమాజంలో వారి స్థానం ,వారిపై జరుగుతున్న హింసాకాండ ,అంతు చిక్కని న్యాయవ్యవస్థ  ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.

మన రాజ్యంగంలోని ఆర్టికల్ 46 గిరిజనులపై జరిగిన అన్ని రకాల అన్యాయలనుంచి కాపాడాలని, 275(1)  ప్రకారం వీరి అభివృద్ధికి నిధులను కేంద్రప్రభుత్వం విడుదల చేయాలనీ తెలియజేస్తుంది .350(2)ఆదివాసుల జనాభా, అధికారం,గిరిజన రక్షణ చట్టాలను కల్పిస్తుంది.ఇది కాకుండా అట్రాసిటి చట్టం,ల్యాండ్ ట్రాన్సఫర్ ఆక్ట్ ,పిసా ఆక్ట్ ,RNR ప్యాకేజ్ ,ఆటవిక సంరక్షణ హక్కు వంటి చట్టాలు మన రాజ్యాగంలో వున్నాయి.మనదేశంలో 600 కు పైగా  , మన రాష్ట్రoలో 33 కు పైగా ఆదివాసీ  తెగలు గుర్తించబడ్డాయి . భారత జనాభాలో 8%వున్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం న్యాయం చేయటం లేదు.

ఆదివాసీ మహిళల ఆక్రందన 

2007 లో ఇదే నెలలో విశాఖ జిల్లా వాకపల్లి లో  జరిగిన ఆదివాసీ మహిళలపై పోలీసుల అత్యాచార సంఘటన మనసుల్ని కదిలిస్తుంది. నక్సలైట్ల కూంబింగ్ కోసం వెళ్ళిన పోలీసులు వారి స్త్రీలపై జరిపిన ఈ అవమానకరమైన సంఘటన ,ప్రాంతాలతో సంబంధం లేకుండా కదిలించి వేసింది.న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటం పెద్ద సవాల్ గా మారింది. ప్రజా సంఘాలు,బాధితులు కలిసి చేసిన పోరాటంలో 21 మంది నిందితులుగా నమోదయ్యారు.చివరికి అందులో 13 మంది మాత్రమే మిగిలారు.తొమ్మిది ఏళ్ళు గడచిన ఈ సంఘటనని  జనం మరచిపోయినా, బాధితుల మనసులు భగభగ మండుతూనే వున్నాయి .వారిలో ఇద్దరు మహిళలు ఆహార పానీయాలు మానేసి బలవంతపు చావుని ఆహ్వానించారు.తమకు న్యాయం జరగాలని రాజధానుల వెంట నడిచిన రోజుల్ని గుర్తు తెచ్చుకుని తమ తెగలోని మహిళల మధ్యకూడా తాము అవమానాల పాలయ్యామని బాధపడుతున్నారు. ఐదేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ  న్యాయానికి  నోచుకోలేదు. ఖాకీల కర్కశ పాదాల కింద నలిగిన స్త్రీ మూర్తుల జీవితాలు   బాగుపడనేలేదు.  ఈచట్టలు  గిరిజనుల  కోసం   ఏర్పాటు  చేయబడ్డ నిబంధనలు ఎంతవరకు అమలౌతున్నాయో ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి.

చత్తీస్ ఘడ్ లో ఇటువంటి సంఘటనలెన్నో జరుగుతూనే వున్నాయి.అక్కడి ఆదివాసీ మహిళల సమస్యలపై పోరాడుతున్న ‘సోనీసోరి’ బస్తర్ జిల్లా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నాయకురాలు.ఆమె మీద పోలీసు దాడులు జరపడం అప్రజాస్వామికం.ఆమె ముఖంపై ఒక అజ్ఞాత ముఠా రసాయన పదార్థాన్ని  చల్లి పారిపోవటం ఆమెను శారీరకంగా కుంగదీసినట్లు భావించవచ్చునేమో కానీ ఆమె మానసికంగా దృఢ నిశ్చయంతో అన్యాయాన్ని ఎదిరించటానికి ముందుకు వెళ్ళటానికి ఈ సంఘటన సహాయపడింది.

ఆదివాసీలు – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యయనం

సామాజికంగా సాంఘికంగా స్త్రీలు రకరకాల నేపథ్యాలలో అణిచివేతకు, అన్యాయానికి గురౌతున్న సందర్భంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక స్త్రీల అస్తిత్వ సమస్యలను అధ్యయనం చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించింది.

2013 సెప్టెంబర్ 26 న ఆదిలాబాదులోని మంచిర్యాల చుట్టు పక్కల గ్రామాల ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాన్ని పర్యటించిన ప్రజాస్వామిక రచయిత్రుల  వేదిక సభ్యులు ఎన్నో యదార్ధ బాధితుల గాధలని రికార్డ్ చేశారు.సింగాపూర్ లో తవ్వుతున్న బొగ్గు గనుల ప్రాంతాన్ని వర్ణిస్తూ రచయిత్రి శివలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిoది.’’ఈ గనుల కోసం తవ్విపోస్తున్న ఇసుక గుట్ట ఒక చిన్న ఊరంత జాగాని ఆక్రమించి బొగ్గు తవ్వే కొద్ది అది పాపంలా పెరిగిపోతూనే వుంటుంద”ని చెప్పింది.  880 ఎకరాలలో 19 గ్రామాలను సర్వ నాశనం చేస్తూ ఊళ్ళను బొందలగడ్డలుగా మారుస్తున్నారని గ్రామస్తులు తెలియజేసారు.

ప్రరవే సభ్యురాలు శాంతి ప్రబోధ, భండారు విజయ , తాయమ్మ కరుణ , హేమలలిత    కలిసి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలోని ఎర్ర చెలక , పునుకుడు చెలక , తోక బందల గ్రామాలకు  పర్యటించారు  . అక్కడి కోయ , గిరిజన గ్రామాలలో  కొత్త గూడెం విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ అక్కడి ఉద్యమకారులకి గిరిజనులకు మద్దతు తెలిపారు .

మెదక్ జిల్లా సింగూర్ ప్రాంతాలలోని తండాల ప్రజలు సందర్శించిన ప్రరవే సభ్యురాలు కవిని ఆలూరి వారి సమస్యల పై అధ్యయనం చేసింది . ఒక్క పూటైనా తినడానికి కష్టంగా ఉన్న వాళ్ల పరిస్థితిని వివరించింది . చెరకు కర్మాగారాలకు నీరు లేకపోవడం వలన వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి . కర్ణాటక , తెలంగాణ సరిహద్దుల నుంచి పుల్కల్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెరకు కొట్టడానికి వచ్చిన జూకల్ తండా , తడ్కల్ తండా స్త్రీలను కలిసి వారి జీవన గాథల్ని తెలియజేసింది . ప్రపంచీకరణ విధానాల అమలుతో గ్రామాలలో చేతి వృత్తులు ధ్వంసమై ,ప్రజలు జీవనాధారం లేక వలసలకు వెళుతున్నారని , వెళ్ళిన చోట పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారని కవిని వివరించింది .  తండాలలో వలసపోయే ముందు రోజు తండావాసులoదరు కలసి పoడగ చేసుకొని ఆ రాత్రి గతంలో వలస సమయంలో ఎదుర్కొన్న కష్టాలను తలచుకుంటూ విలపిస్తుంటారు . వృద్ధులను చూస్తే చాలా దయనీయంగా అనిపిస్తుంది .

పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్సు వచ్చిన దగ్గరనుంచి ప్రజా  సంఘాలు , ఉద్యమకారులు,రచయితలు కూడా పర్యావరణానికి, గిరిపుత్రులకి అండగా నిలిచి ఆందోళన చేపట్టారు .తెలంగాణా ఆంధ్రాప్రాంతాల ముంపు గ్రామాలను దర్శిస్తూ వారి బాధల్ని  పంచుకున్నారు.ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారుగా ఏడు లక్షల ఎకరాలకు పైగా పొలాలను పండించవచ్చు . అదే సమయంలో ఆదివాసీల అటవీ ప్రాంతం మూడున్నర లక్షల హెక్టార్ల భూమిని కోల్పోతున్నారు.నిర్బoధoగా ఆదివాసీల జీవన సౌధాలను కొల్లగొట్టి పట్టణాలకి పరుగులు తీయించడం , సంస్కృతిని అంతంచేయటం వంటిది .

ఇందులో భాగంగానే తెలంగాణా విభాగం నుంచి  ప్రజాస్వామిక  రచయిత్రుల  వేదిక సభ్యులు అనిసెట్టి రజిత, భండారు విజయ ,కొలిపాక శోభారాణి, కందాళ శోభారాణి,బండారి సుజాత ,కొమర్రాజు రామలక్ష్మి జూన్ 10 , 2014 న ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నగ్రామాలకు వెళ్ళారు .కుకునూరు , కోకుళ్ళపాడు , టేకుపాక మొదలైన గ్రామాల గుండా కూనవరం వెళ్ళారు . బలవంతంగా తమ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపటాన్ని నిరసిస్తూ ‘’మా పంటలు , మా గొడ్డు గోదా , మా అడవి తల్లి సంపద అన్నింటినీ వదిలేసి మేం ఎందుకు వెళ్ళాలి ‘’అని ప్రశ్నిస్తున్న ఆ ప్రాంతపు స్త్రీల మనోవేదనని తెలియజేశారు .

‘’కూనవరం, వీ. ఆర్. పురం , చింతూరు మండలాలలో దాదాపుగా 85 వేల   మంది గిరిజనులు , గిరిజనేతరులు నివసిస్తున్నారు . నిత్యావసర వస్తువుల కోసం గుట్టలు , పుట్టలు దాటి సరుకులు కొనుగోలు చేస్తారు . కొన్ని సందర్భాలలో నిల్వ ఉంచిన ఆహారాలు తిని రోగాల బారినపడి చావుకు దగ్గర అవుతున్నారు . విషపురుగుల బారిన పడి వైద్యసదుపాయం లేక నాటు మందులతో ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు . రాష్ట్రాల విభజనవల్ల నష్టపోయే ఆదివాసుల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకపోవటం వలన  సంస్కృతిని కోల్పోతున్నారు ‘’అని భండారు విజయ తెలియజేసింది   .

కందాల శోభారాణి  ప్రజలందరూ సమానమని భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణంలో పొందుపరుచుకున్నాం కాని , పర్యావరణానికి , ఆదివాసీ జీవనానికి తీవ్ర హాని జరుగుతున్నా కూడా పాలకులు పట్టించుకోవటం లేదని ఆదివాసుల ఆస్తిత్వాన్ని రద్దు చేసి వారి జీవితాన్ని విధ్వంసం చేస్తూ పరాయీకరణకు గురి చేస్తున్నారని , కొమరంభీం , బేర్సా  ముండా , మన్యం తిరుగుబాటు సందర్భంలో ఆదివాసులు చురుకైన పాత్ర వహించారని గుర్తుచేసింది .

బండారు సుజాత , కొమ్రరాజు లక్ష్మి తమ కవితలలో ఆదివాసుల కష్టాలను కవితల్లో చెప్పారు .

ధనసరి అనసూయ ’ ముంపు’ దీర్ఘ కావ్యాన్ని కోయ భాషలోనికి అనువదించింది .

కాత్యాయనీ విద్మహే వరంగల్ చుట్టు ప్రక్కల ప్రాతాలలోని లంబాడీ తండాలకు వెళ్లి వారి జీవన విధానాన్ని , ఆ స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలని , హక్కుల గురించి అధ్యయనం చేసింది .

ఈ ముంపు  గ్రామాలలో ‘’వ్యవసాయ ఆధారిత జీవన విధానాన్ని సమూలంగా ధ్వంసం చేసే విపత్తు అంతర్భాగంగా ఉందని,  ఆoధ్రప్రదేశ్ లో  275 గ్రామాలు , ఒరిస్సా లో 13 గ్రామాలు , ఆoధ్రప్రదేశ్ కలిసిన  ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలు మొత్తం 27 వేల  కుటుంబాలు , లక్ష పదిహేడు వేల మంది  ప్రజలు నిర్వాసితులు అవుతార’’ని అనిసెట్టి రజిత తన ఆవేదనని  వ్యక్తం చేసింది .

కొలిపాక శోభారాణి శ్రీకాకుళం నుంచి నెల్లూరు  తీర ప్రాంతం వెంబడి నిర్మించబడుతున్న భారీపరిశ్రమలకి నీటి అవసరాన్ని తీర్చడానికి మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించబడుతుందని , ఈ పరిశ్రమలన్నీ జాతీయ బహుళ  ప్రైవేటు కంపెనీలే అని అభిప్రాయపడింది .    గిరిజనలు కోల్పోయే భూములకి సమానమైన భూమి ప్రాజెక్ట్  ఆయకట్టు కింద ఇవ్వాలనే ఒప్పందం పైన గిరిజన మంత్రిత్వ శాఖ 2007  లో ప్రాజెక్ట్ పనులకి అనుమతినిచ్చిందని కానీ యిప్పటి వరకు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని తెలిపింది .

 

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (A.Pశాఖ) ఆదివాసీ స్త్రీల అస్తిత్వ సమస్యల పై ఎన్నో కార్యక్రమాలు చేసింది .యువ గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో బాలికల స్థితిగతుల మీద అధ్యయనం గిరిజనుల సాంస్కృతిక జీవనం మీద అధ్యయన కార్యక్రమాలను నిర్వహించింది .

 

2016 ఏప్రిల్ లో సంస్కృతీ గ్లోబల్ స్కూల్ ,మహిళాచేతనతో కలసి నవతరంతో యువతరం అనే కార్యక్రమంనిర్వహించింది. ఇందులో భాగంగా ప్రకృతి సోయగాల్ని ,విరజిమ్మే అందాల విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలోని సుంకరమెట్టలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలపై అవగాహన కోసం విద్యార్థులు, రచయితలు పర్యావరణ ప్రేమికులతో కలిసి ఒక పర్యటన నిర్వహించింది. విశాఖపట్నం జిల్లాలోని సుంకర మెట్ట ప్రాంతంలోజరుపుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలవల్ల అక్కడి గిరిజన  ప్రాంతాల ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలవారికీ కలుషిత పర్యావరణం కలిగించే విషప్రభావం ఎంతగా వుంటుందో భావి పౌరులకి తెలియజేసింది.స్వార్ధ పూరిత ప్రభుత్వ విధానాలు అందమైన ప్రకృతిని నాశనం చేస్తూ ఆదివాసీల మనుగడకి ప్రమాదం ముంచుకు రావటం తీవ్రంగా ప్రతిఘటిoచవలసిన విషయాలు.

***                                    ***                                    ***

విహంగ మహిళా సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో నేను , రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి , ప్రముఖ బ్లాగర్ రసజ్ఞ  , పోలవరం మండలం లోని ఆదివాసీ గ్రామాల పై పరిశోధన చేస్తున్న ఎం .ఫిల్ విద్యార్ధి, విహంగ పాఠకులు జొన్నకూటి రవికిరణ్ , సందీప్ ఒక బృందంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం ముంపు గ్రామాల సందర్శనకు వెళ్ళాము .

పోలవరం ,ఎర్రవరం ప్రాంతంలో అతివేగంగా జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణo,పనిచేస్తున్న మరయంత్రాలు భూమాత గుండెల్ని కర్కశ ఇనుప చేతులతో పెళ్ళగిస్తున్న  ప్రొక్లైనర్లు, గుoడెల్ని తూట్లు పొడిచే డ్రిల్లింగ్ యంత్రాలు… అక్కడక్కడ కన్నీటి ధారలుగా ప్రవహిస్తున్న నీటిపాయలు… మనసుని వికలం చేస్తుండగా ప్రాజెక్ట్ నిర్మాణం మధ్య వేసిన తాత్కాలిక రహదారుల మీద మా ప్రయాణం కొనసాగింది.పచ్చని ప్రకృతి మధ్య గోదావరి నదిపై జరుతున్న ఆ మహానిర్మాణం సిరిసంపదలు తెచ్చి పెడతాయని భావిస్తుంటే గిరిజనుల మానసిక పరిస్తితి,అలజడి, మనోభావాలు ఏవైపుగా ఆలో చిస్తున్నాయో ఈ ప్రయాణం నాకు  తెలియజేసింది.

మేము పర్యటించిన ప్రాంతంలో యర్రవరం ,మాధవవరం,పైడాకుల మామిడి సరుగుడు, టేకూరు,శివగిరి ,కొండ్రకోట,సింగన్నపల్లి గ్రామ ప్రజలు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.

యర్రవరం గ్రామస్తురాలు ఎండిపల్లి నాగమ్మ ఎంతో సేపు నాతో ముచ్చటించింది.వాళ్ళ మాటల్లో అడవి, కొండలు,ప్రకృతిని దాటి వేరే విషయాలు రాలేదు.తమ జీవనాధారమైన కొండ ప్రాంతాలకు వెళ్ళటాన్ని నిషేధించటం  ఎంత బాధను కలిగించిందో ఇలా చెప్పారు.

బుట్టాయగూడెం మండలంలోని చంద్ర వంక గ్రామంలో పోలవరం ప్రాంతపు ఆదివాసీలకు ఇళ్ళస్థలాలు ఇచ్చారు .కానీ ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అక్కడ కొండలు కనిపిచవు.వీరి ఆవేదనకు ముఖ్యకారణం కొండలు లేవనేదే.వారితో మాట్లాడినంత సేపు కొండలు లేవు లేవు లేవు అని ఎన్నో సార్లు ఎంతో బాధతో చెప్పారు .ప్రకృతితో విలీనమైన వారి జీవితాలు ఆ వాతావరణాన్ని వదలలేనివారి అమాయకం  అర్థమయ్యాక లేగదూడని  తల్లి నుండి విడదీస్తున్న భావంతో మనసు బరువెక్కిపోతుంది.

‘’కొండ ఎక్కుతుoటే ఎక్కటానికి వీల్లేదన్నారు కట్టె పుల్లల కోసం కూడా వెళ్ళటానికి వీల్లేదన్నారు  మాకు గ్యాస్ వాడకం రాదు కదమ్మా చిన్నప్పటి కాడ నుండి పుల్లలమీద  వండుకోవటం అలవాటు , అందరూ రాయించుకున్నారు కానీ మేము గ్యాస్ రాయించుకోలేదు .’’

వాళ్ళకి పునరావాసం కల్పించిన చంద్రవంక కాలనీ గురించి అడిగితే ఎంతో అసంతృప్తిని వ్యక్తం చేసారు. “ ఏమో అక్కడ ఎలాగున్నదో మేముకూడా చూడలేదు అని నాగమ్మ అంటే- పామా బుచ్చిరాజు వెంటనే ఇలా అన్నాడు “అక్కడేం బాగాలేదండి .కొండల్లేవ్ ఏమ్లెవ్” అని పెదవి విరిచాడు .

“మీరు ఈ కొండలమధ్యే  ఉండటానికి ఇష్టపడుతున్నారా  అన్న ప్రశ్నకి అవునని ఖరాఖండిగా సమాధానం చెప్పారు.

‘’మీరు ఈ ఊర్లో ఉంటే సమయానికి బస్సు సౌకర్యం ,వైద్యం వసతులు వంటివి వుండవు కదా!’’అని నేను ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా నాగమ్మ మాట్లాడుతూ ‘’మనుషులందరూ ఒకే స్థితిలో వుండరు కదా!నేనున్నట్లు నువ్వు వుండవు నువ్వు  వున్నట్లు నేను ఉండను.మాకు పది తోకల దూడలు వున్నాయనుకోండి .ఇక్కడైతే ఖాళీ స్థలంలో తిరుగుతాయి .మేము  కూడా ఇక్కడ ఖాళీ స్థలంలో తిరుగుతాము.మేము అక్కడికెల్లాక ఏ ఖాళీ స్థలంలో తిరుగుతాము?

మా పశువులు ,మా దూడలు ఎవరి చేలోకెల్లి మేస్తాయి? ఇక్కడైతే వాటికి నచ్చిన చోట మేస్తాయి.కట్టె  పుల్లలు తెచ్చు కోవాలంటే ఇక్కడైతే అడవుల్లోకి వెళ్తాం .అక్కడ ఎక్కడ నుండి తెచ్చుకుంటాం? మాకు అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు .కాని మీకు డబ్బులిచ్చేసాం మీరిక బయలు దేరండని మమ్మల్ని పంపేస్తున్నారు .పోక్లేనర్లతో గుడిసెలు కూలగొడుతున్నారు  పిల్లలమీద పడిపోతాయనే భయం తో అందరు ఊళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు .ఇటువంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి .ఇవన్ని పగలైతే మేమేదైనా చేసే వాళ్ళం .ఇదంతా రాత్రి చేసారు.

ఇంక ఆస్పత్రి అంటే పోలవరం కాని కొండ్రుగూడ కానీ వెళ్లి చూపించుకుంటాం .ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళాల్సిందే .’’

 

పోలవరం ప్రాజెక్ట్ కడితే మీకు లాభకరంగా ఉంటుందని అనుకుంటున్నారా? అని అడిగితే నాగేశ్వరరావ్ ,రామ కృష్ణ , లింగరాజు అందరు ఒకే మాట చెప్పారు. ‘’ఏం  ఉపయోగo ఉంటుందమ్మా? మా కొంపా గోడు చెల్లా చెదురై పోయాక మమ్మల్నిక్కడనుంచి పంపేసి అక్కడ ఏమిస్తారో ఏమివ్వరో? తెలీదు’’ అన్నారు .

‘’ప్రాజెక్ట్ కడితే పొలాలకి నీళ్ళందుతాయి.పంటలు బాగా పండుతాయి .మన రాష్ట్రo బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా? ‘’ అన్న ప్రశ్నకి

‘’లాభపడే వాళ్లకి బాగానే వుంటుంది .మేం ఇక్కడ మా నివాసాలను,పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మాకున్న అతి కొద్ది భూమిని మాకు నచ్చిన చోట కోల్పోతున్నాం . మేం కోల్పోయిన దానికి సరిపడ నష్ట పరిహారం ఇవ్వాలి .మాకు స్వేచ్ఛగా బతికే మంచి ప్రదేశంలో నివాసాలేర్పాటు చేయాలనీ కోరుకుంటున్నాం.అది కూడా అడవిలోనే మేం వుండాలని కోరుకుంటున్నాం.వాళ్ళు పట్టణ  ప్రాంతాలకి దగ్గరగా నివాసం ఇస్తున్నారు. అక్కడికెళ్ళి బ్రతకటం మావల్ల కాదు . అక్కడ మా వాతావరణం వుండదు.ఇక్కడున్న జీవితం అక్కడ రావాలంటే కొన్ని సంవత్సరాలు అలవాటుపడితే కానీ రాదేమో. కొండలు లేవు . పనులు దొరకవు. ఇది మాకు అలవాటైన ప్రాంతం కాబట్టి ఏపనైనా చేసుకుని బ్రతుకుతాం.ఊర్లో కుర్రోళ్ళు అడవికి వెళ్లి వేటాడుకొస్తుంటారు.కుందేళ్ళు ,కొండ గొర్రెలు, అడవి పందులు వంటివి వేటాడుతారు‘’ అని సామా బుచ్చి బాబు అన్నాడు .

జానకి, కుమారి  మాట్లాడుతూ తమ కుటుంబంలో ఐదు మంది సభ్యులుండగా మొత్తం కుటుంబానికి లక్షరూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు చెప్పారు .

ఉమ్మడి కుటుంబాలుగా వున్న ఇళ్ళకి కూడా ఈ లక్షరూపాయలే వర్తిoచటంతో ఈ మొత్తం ఎంత మందికి నష్ట పరిహారంగా  మారుతుంది?కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములకు విడివిడిగా ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదా అన్నది అటు ప్రభుత్వం తేల్చి చెప్పకపోవటంతో గ్రామస్తులు అయోమయంలో వున్నారు. ఉన్న చోట పోడు  వ్యవసాయం, పశువుల మందలు ,ఇల్లు,వాకిలి కోల్పోయి  తెలియని ప్రాంతాల్లో ఎలా బతుకును వెళ్ళదీసుకోవాలో అర్థం కాని స్థితి లో ఉన్నట్టుగా వారి మాటల్ని బట్టి తెలుస్తుంది .

పునరావాసం కల్పించిన చోట మీకు పొలాలు కూడా ఇచ్చారా? అన్న ప్రశ్నకి – ‘’ఇక్కడ మా చేలల్లో పండిన పంటలు చేతికి అందాక చంద్రవంక కాలనీలో గవర్నమెంట్ మమ్మల్ని ఏం వుద్దరించారో  అని అడగటానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక కాని మా కోసం ఏం వుందో ఏం లేదో తెలుస్తుంది .ఒక్కప్పుడు మాకిక్కడ పొలాలు ఉండేవి .మా పెద్దోళ్ళు అవన్నీ కోల్పోయారు .ఆ తర్వాత కొంత కాలానికి మా ప్రాంతపు ప్రజలంతా భూపోరాటం చేసి భూములు సంపాదించుకున్నాం. నాకో 70 సెంట్ల పొలం వచ్చింది ఈ భూమిని ఇక్కడ పోగొట్టుకున్నట్టే .అక్కడ ఇస్తారో లేదో తెలియదు.

పండిన పంట  మాకు కావలిసినంత మేం వుంచుకొని మిగిలినవి ఇచ్చేస్తాం .మా వూళ్ళో  వరి ,శనగలు,మినుములు ,పెసర్లు ,కందులు ,దనియాలు అన్నీ  పండిస్తాం . .’’ అన్నారు .

‘’అవి అమ్మితే ఎంత ధర వస్తుంది ?’’

‘’ ఏమో మాకు తెలియదు. అవి మేము కేజీల లెక్కన అమ్మం. కాటాకి  ఇచ్చేస్తాం. బస్తాల లెక్కన అమ్మేస్తాo.నాల్గు ముంతల పెసర్లు పండితే  ఇచ్చేసాం  ’’

‘‘దానికి మీకు ఎంత డబ్బు వచ్చింది ?

‘’ఇంకా లెక్క తేలలేదు ‘’

ఇంతకీ ఎవరికి ఇచ్చారుమీ ధాన్యం ? మీ  లెక్కలెవరు చూస్తారు ?

‘’సెట్టిగారు అని ఒకాయన వున్నారు.నాగలి దున్నటానికి,విత్తనాలకి, మందులకి అన్ని ఖర్చులు ఆయనవే. దున్ని పంట పండించిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకిస్తే  ఆయన పెట్టిన ఖర్చుల లెక్కలు చూసుకొని మిగిలింది మాకిస్తాడు. అన్ని లెక్కలు చూసి ఇంతవరకు తీర్మానం అయిoదని ఆయన డబ్బులు   ఆయన తీసుకుంటాడు.  మిగిలింది మాకిస్తాడు ‘’అని చెప్పారు .

 

పై సంభాషణని పరిశీలిస్తే ఇంకా మారుమూల   ఆదివాసీల ప్రాంతాలలో వున్న నిరక్ష్య రాస్యత ,పేదరికం ,అమాయకత్వం,పట్టణ  ప్రాంతపు దళారీల చేతులో చిక్కుకున్న వారి జీవితాలు అర్థమౌతా యి .

శ్రీకాకుళ ప్రాంతం లో జరుగుతున్న భూమి పోరాటాలు, పోలవరం ప్రాజెక్ట్ కి సంబందించిన ఆదివాసీ ప్రాంతాలలో బలవంతంగా జరుపుతున్న వలసలు, ఆదివాసీయుల సొంత  అస్థిత్వానికి గౌరవం  లేకుండా చేస్తున్నారు . పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం గిరిజనులకు,ప్రకృతికి విడదీయరాని అనుబందం వున్న దృష్ట్యా వారి హక్కులకు భంగం కలిగించకూడదు. యాభైవేల కంటే ఎక్కువగా ఆదివాసీ జనాభా ఉన్నట్లయితే ఆప్రాంతాలలో ప్రాజెక్ట్ల నిర్మాణం చేయరాదని 2006 లో జాతీయ గిరిజన ముసాయిదా చట్టం చేయబడింది.

యిప్పుడు పోలవరం ప్రాంతంలో జరుగుతున్న ప్రాజెక్ట్ నేపథ్యంలో జలసమాధి కాబోతున్న భూముల్లో నివసించే   ఆదివాసీయులను పట్టణ ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రకృతితో మమేకమైన వారి జీవితాలను శరీరం నుండి ప్రాణాన్ని వేరుచేసినట్లుగా వారు భావిస్తున్నారు.

నాగమ్మ  స్వచ్ఛ మైన నవ్వు, మనసు విప్పి మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకుతుండగా ‘’నువ్వు భలే నవ్వుతున్నావు’’ అన్నాను.

నాగమ్మ నవ్వుతూ ‘’మరింకేం చేస్తామమ్మా నవ్వాలి కదా !’’అన్నది.

ఉన్నదంతా కళ్ళముందే పోతూ ఉన్నా అడవి బిడ్డలుగా పుట్టటంలో వున్న సంతృప్తి వాళ్ళ మొఖంలో కన్పించింది నాకు .

మేము ఆగ్రామాన్ని విడిచి వస్తుంటే మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళే అవకాశం లేదని అనిపించే సరికి హృదయం భారం అయింది . అక్కడి వాళ్ళు కూడా ఏ సమయానికి గ్రామాన్ని వదిలి పెట్టాల్సివస్తుందో మాకే తెలియదు అన్నారు .   కొన్ని వందల  అడుగుల లోతున జల సమాధి కాబోయే ఆ ప్రాంతాల్ని మా కళ్ళలోకి నింపుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యాo.

ప్రకృతి బిడ్డలను స్వేచ్ఛగా జీవించే హక్కు ఆనందంగా తమకు నచ్చినట్టుగా జీవించేలా నాగరికులు సహకరించటం అత్యవసరమైన విషయాలు. వారి హక్కుల్ని వారి సంపదను వారినే అనుభవించనిద్దాo .

*

 

అవును, నేను దేశద్రోహినే!

husain_motherindia_0

 

-గుఱ్ఱం సీతారాములు

~

 

తారీకులూ దస్తావేజులు, రాజులూ రాణులూ జరిపిన ముట్టడి కి  అయిన ఖర్చు, జమా ఖాతాల శిధిలాల మీద నిర్మితమయిన జాతుల చరిత్రలకు నూతన బాష్యాలు మొగ్గ తొడుగుతోన్న  తరుణం లో జాతీయత చర్చ ప్రాధాన్యత సంతరించుకున్నది. యురోపెయన్ సమాజాల్లో వికశించిన ప్రజా పోరాటాల చైతన్యం మీద నిర్మితమయిన అరువు తెచ్చుకున్న భావన జాతీయత అని కొందరు సామాజిక శాస్త్ర కారుల భావన. జాతీయత అంటే ఒక ప్రాదేశిక ప్రాంతం లో బ్రతికే ఒకే రకమయిన ఆశలూ,అలవాట్లూ, ఆకాంక్షలతో కూడిన ప్రజాశ్రేణులతో తో కూడిన  ఊహాజనిత మయిన భావన. భావోద్వేగాలు పెల్లుభికిన ప్రతి చారిత్రిక సమయం లో జాతి ఉనికి, అస్తిత్వం పలు రూపాలు గా మారుతూనే ఉంది. ఈ తాత్విక చర్చను ఆండర్సన్ మొదలు పార్థ చటర్జీ నుంచి అంబేద్కర్, ఫూలే నిర్మించిన భావనలు, మారుతున్న సామాజిక పోరాటాల వెలుగులో పదునెక్కుతున్న సందర్భం. అలోషియస్ లాంటి తత్వవేత్తలు అసలు ఈ  దేశం లో జాతీయత ఉట్టి డొల్ల అనీ,  ఏకరూప జాతి లేని జాతి నేడు జాతీయతగా పరిగణలో ఉందనీ, ఇక్కడి జాతీయత హిందూ మనువాద పునాదుల మీద నిర్మించ బడినదీ అని చేసిన సూత్రీకరణలు, నిజాలూ మన కళ్ళముందే ఉన్నాయి .

 

ఇరవయ్యో శతాబ్దపు మొదటి బాగం లో మూడో ప్రపంచ దేశాల విముక్తి పోరాటాల స్పూర్తితో ప్రభావితం అయిన గాంధీ ప్రవచించిన జాతి ఆందోళనలు, బొంబాయి నగరాన వినాయక పందిర్ల లోగిళ్ళలో తిలక్ ప్రేరేపిత  జాతీయ ఉద్వేగ భావనలు అంతిమంగా ఏ విలువలను ప్రభోదించాయో చర్చకన్నా, ఈ దేశం లో సంఘీయుల నుండి వామపక్ష మేధో వికాశం దాకా  జాతీయతకు ఒక ప్రామాణిక నిర్వచనం ఉందా? అనే ప్రశ్నా వేయడం అసందర్భం మాత్రం కాదు. జాతి పోరాటాలు వికశించాలి అనే భావనలో ఉన్న సమూహాలు నేడు జరుగుతున్న  జాతీయ చర్చల్లో ఉదాసేనంగా ఉండడం వెనక హిందూ జాతీయ భావన కు భిన్నమయిన ఆలోచన వాళ్ళకు ఉందా అనే ప్రశ్నా ఉత్పన్నం కాకపోదు. ఇలా జాతీయ ఉద్వేగాలు పెల్లుభకడానికి  రోహిత్ ఆత్మహత్య ఒక సందర్భాన్ని ఇచ్చింది.

కేంద్రీయ విద్యాలయాల్లో వికృత క్రీడకు బలయిన దళిత పరిశోదకుడు వేముల రోహిత్ చావు ఈ దేశం లో దనావాలంలా ఒక వెల్లువను,ఆ వెల్లువ వెలుగులో లబ్ది పొందిన రాజకేయ బెహారులూ, వ్యవస్థీకృత మయిన చట్టబద్ద హత్యలకు కారణాలు వెతక కుండా, ఉద్యమ బంతిని కాంగ్రెస్ కోర్ట్ లో ఉంచేందుకు అన్నివిధాలా ప్రయత్నం జరిగింది. ఖైర్లాంజి నుండి లక్షిమ్ పేట దాకా  ముజాఫర్ నగర్ నుండి రోహిత్ దాకా జరిగిన ఘోరాల మీద ఒక్క ప్రకటనా చేయని రాహుల్ గాంధి కి హటాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారు.  ఈ చర్యలను పక్క దోవ పట్టించే క్రమం లో డిల్లీ లో దేశ భక్తులకూ, దేశ ద్రోహులకూ మధ్య నలిగిన ఒమర్ ఖాలీద్ , అనిర్భవ్ బట్టచార్య , కన్నయ్య, లు  దేశానికి దేశ అంతర్గత రక్షణకు ముప్పుగా పరిగించ బడి రోహిత్ చావును డిల్లీ చుట్ట్టూ తిప్పి సప్పున చల్లార్చిన యుక్తి ఈ దేశ అలాగా జనాలకు నిజంగా అర్ధం గాలేదు.

కన్నయ్య జైలు నుండి విడుదల అయ్యాక అయన స్వరం లో మార్పు ఎవరూ పసిగట్ట లేకపోయారు. ఈ దేశంలో అసమ అభివృద్ధికీ , అసమానతలకీ  కారణ భూతులు అయిన రాబందుల నుండి ఆజాది కావాలి అని అనడం వెనక ఈ దేశం లో జరుగుతున్న విముక్తి పోరాటాలను నిర్వీర్యం చేయడమే. గణేశ పందిళ్ళ నుండి పురుడు పోసుకున్న అఖండ భారతానికీ కన్నయ్య  కలగంటున్న ఆజాదీ కి నాకయితే తేడా ఏమీ కనిపించడం లేదు. ఈ చర్చను జాతీయ చర్చలో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అర్ధం జేసుకోవాలి.

అమరుడు ప్రొఫెసర్ నాగప్ప గారి సుందర్రాజు గురించి అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేకున్నా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకుడిగా, పరిశోదకుడిగా ఒక గొప్ప కవి, కథా రచయతగా సుపరిచితులు. అవి మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి వచ్చిన రోజులు. ‘గ్రామాలకు తరలండి’ నినాదాలు విశ్వ విద్యాలయాల్లో జేగురు రంగు అక్షరాలు తడి ఆరని రోజులు. దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్ది, అధ్యాపక వైరి వర్గాలు రిజర్వేషన్ అనుకూల వ్యతిరేకులుగా నిట్టనిలువు చీలిన సందర్భం. అప్పుడప్పుడే మొదటి తరం దళిత బహుజన విద్యార్డులు గ్రామీణ ప్రాంతం నుండి నగరానికి కాసింత కుల చైతన్యం తో వస్తున్న దశ.  దళితుల్లోనూ అంటరాని వాళ్ళు ఉన్నారనీ, ఆ కడగొట్టు అలగా జనాలూ జనాభా లెక్కల్లో భాగమే అనీ, దళితుల్లో అంతర్గత రిజర్వేషన్ పంపకాల్లో కూడా అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయిన సందర్భం.

ఆ సంక్షుభిత దశలో రాటు దేలిన ఆణిముత్యం నాగప్పగారి సుందర్రాజు. ఎమ్మే చదివి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత  జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్  పొంది, పరిశోదన కోసం  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిధ్యాలయం లో ఇంటర్వ్యూ కు  వచ్చిన సుందర్రాజు మాటల్లో కాటిన్యం , నిచ్చిత మయిన అభిప్రాయాలు చూసి ‘వీడు ప్రమాద కారి, వీణ్ణి విశ్వవిద్యాలయం లోకి రానిస్తే ప్రమాదం అని భావించి ఎలా అయినా రీసెర్చ్ లో సీట్ రాకుండా చేయాలి అని నువ్వు ‘’దేశ ద్రోహివి’అని అన్నారు. ఆనాడు కోపంతో ఊగిపోయి విచక్షణ కోల్పోయి నాలుగు తన్నలేదు. కానీ మను స్మృతిని విశ్వవిధ్యాలయ కరదీపిక గా ఉపయోగించుకునే అపర దేశభక్తునిగా అనిపించుకోవడం ఆయన ఆరోజు అనుమానగా భావించి  ‘అవును నేను దేశ ద్రోహినే’ అనే దీర్గ కవిత రాసాడు. ‘అమ్మ చెమటను అక్షరాలుగా మలుచుకొని అయ్యవార్లకు అంజలించా’ అని ‘పాద రక్షలు పాలిష్ చేయాల్సిన వాడిని పద్యములు పాడుతున్నాను’ ‘చదవు రాదని జంధ్యం రెండు మార్కులిస్తే విదిరాతని ఊరకుండా యుజిసి తో పోటీ పడి జేఆర్ ఫ్ సాదించు కున్నాను’ అందుకే నేను దేశద్రోహిని. కేవలం ‘నన్నయ్యకు నమస్క రించ నందుకు, విశ్వనాధుని విధానం కాదన్నందుకు, శేషేంద్రవీ వేయి పడగలె’ అన్నందుకు, ‘ఊరవతల ఉండమంటే ఊరు ఎవరిది అని అన్నందుకు’ విశ్వవిద్యాలయాలు ఆర్య జాతి సొత్తు’ అని. ఆదిపత్య సాహిత్య కారుల కుటిల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేయగల సత్తా ,  ఉన్నోడు కనుక సుందర్రాజు ను వెలివాడ లకు పరిమితం చేయాలనే కుట్ర. అలా అలాగా జనాలు తమ కాలి ధూళితో మలినం చేస్తున్నారు కాబట్టి , సుందర్రాజు, వేముల రోహిత్, సెంథిల్ కుమార్, పుల్యాల రాజు, కన్నయ్య, అనిర్భావ్  నుంచి ఉమర్ ఖాలిద్ దాకా ఇప్పుడు దేశద్రోహుల జాబితాల్లో  కలిసారు. ఇందులో కొందరు బ్రతుకు బారం అయి బలవన్మరణం పొందారు. మరికొందరు బ్రతుకు మీద ఆశతో ఏటికి ఎదురు ఈదుతూ జాతీయతకు కొత్త అర్దాలు కనిపెట్టే క్రమం లో కత్తుల వంతెన మీద నడుస్తున్నారు.

ఇక్కడ మనకు కావాల్సింది జాతి, జాతీయతా లాంటి క్లిష్టమయిన భావనల చర్చలోకి పోవడం కంటే ఎందుకు ఈ దేశం లో కొన్ని కులాలు మతాలే తమ జాతీయ శీల పరీక్షకు గురి కావాల్సి వస్తోంది అనేది తీవ్రంగా చర్చించాల్సిన తక్షణ అవసరం. జాతీయ ఉద్యమ స్పూర్తితో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పనిచేసినోల్లని  ‘టెర్రరిస్టు, అని ముద్రేసుకున్న దశనుండి ప్రత్యామ్నాయ రాజకీయ విస్వాశాన్నికలిగి ఉన్నందుకు నక్షలైట్ గా అతివాదిగా ముద్రవేసిన దశ  మొదలు ఇరవై ముప్పై లలో ‘వందేమాతరం’ అన్నందుకు ఉస్మానియా నుండి పదుల సంఖ్యలో బహిష్కరణకు గురయిన రోజు నుండి, డెబ్బయ్యో దశకం లో విధ్యార్ది నాయకుడు జార్జ్ రెడ్డిని కాషాయదళం ధూల్ పేట కిరాయి హంతకులతో అమానవీయంగా చంపబడినప్పుడు, ఉస్మానియా ఇంజనీరింగ్ హాస్టల్లో అరుణ్ కుమార్ ని అత్యంత క్రూరంగా కోసి చంపడం వెనక జాతీయ శీల పరీక్షలో భిన్నాభిప్రాయం ఉండడం అనేది దాచేస్తే దాగని సత్యం. ఈ హత్యల వెనక ఈ దేశంలో నమ్మిన విస్వాశాలకు జరిగిన శిక్షలు. ఈ విదంగా  జాతీయభావనకు భిన్నమయిన రాజకీయ విశ్వాసాల ను క్రూరంగా చిదిమినప్పుడు, అరాచకంగా మారిన ఉస్మానియాను సంతోష్ రెడ్డి మొదలు , వివేక్ విద్యాసాగర్ శ్రుతి దాకా నాగేటి చాళ్ళలో  త్యాగాల విత్తనాలు చల్లి అమరులు అయిన పరంపరను అనేక పౌర ప్రజాస్వామిక వాదులు కొనసాగిస్తూనే ఉన్నారు. నాడు ఉస్మానియాలో అరాచకాలు మితిమీరి  ప్రజాస్వామ్యం కనుమరుగు అయినప్పుడు  ప్రజా ఉద్యమ వెలుగులో నాటి కాషాయ  విద్యార్ది నాయకుడు  చంద్రారెడ్డి చావు ఉస్మానియా లో దళిత బహుజన శ్రేణులకు  కాసింత గాలి పీల్చుకొనే వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత మారిన పోరాటాల నేపధ్యం మూలంగా  ఇఫ్లూ, హైదరాబాద్ యూనివర్సిటీ,   జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కేంద్రంగా పెల్లుభుకున్న నయా సాంస్కృతిక అస్తిత్వ భావనలు వాళ్లు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు జాతీయ భావన చుట్టూ పరిబ్రమిస్తున్నాయి. అవి ఏ ఒక్కరోజో ఊడిపడ్డవి కావు. వాటివెనక ఎనభయ్యో దశకం లో పెల్లుభికిన  మండల్ కమిషన్ వెలుగులో , చుండూరు, కారం చేడు రగిల్చిన కసి తో వచ్చిన స్ఫూర్తి నేడు కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ఇప్పుడిప్పుడే పురి ఇప్పుకుంటోంది .ఒక ప్రజా స్వామిక ప్రాతినిధ్యం ఇప్పు డిపుడే మొగ్గలు తోడుకుంటోంది. దళిత బహుజన విద్యార్థుల సమన్వయం నేడు అగ్రవర్నాలను  గంగ వెర్రులెత్తే లా చేస్తున్నాయి . ఒక మెరుగయిన సమాజం కోసం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం ఆహార హింస కు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నారు, పురాణాల గుట్టును నిట్ట నిలువుగా ఛీల్చేస్తున్నారు.  ఆ చైతన్యాన్ని చిదిమేసే క్రమం లో మనువాదం స్వైర విహారం చేస్తోంది ఆ క్రమం లోనే నాటి సెంథిల్ కుమార్, మాదిరి వెంకటేష్ , ముదశిర్ ఖమ్రాన్ , మరియు మొహమద్ మొయిన్, రోహిత్ వేముల  దాకా అ సహజ  ఆత్మ హత్య గటనలు.

రెండేళ్ళ కింద అఫ్జజ్ గురు ఉరితీత సందర్భంగా ఈ దేశ సామూహిక భావాల సంతృప్తి కొరకు ఒక  ఉరి అవసరం అని ఒక చట్టబద్ద హత్యను సమర్దించుకుంది. అదే క్రమంలో ముంబై అల్లర్ల బాధ్యడు అని అభియోగం మోపబడిన  యాకుబ్ మెమన్ ఉరి శిక్ష వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా జరిగిన నిరసన లో రోహిత్ వేముల పాల్గొని దేశ ద్రోహి గా మారాడు.  అంతా రోహిత్ చావుకు కారణాల వెతుకులాటలో ఉన్నారు. కానీ  ఎదిగొచ్చిన కొడుకు అర్దాంతరంగా తన ప్రస్థానాన్ని అసంపూర్తిగా ముగిస్తే, అంతిమ సంస్కారలకీ, అయిన వాళ్ళ చుపుకూ నోచుకోకుండా వెలివాడ లో పుట్టిన రోహిత్ ని వెలివేసి   ఒక దిక్కులేని అనాధ శవం లాగా చాదర్ ఘాట్ మురికి కాలవలో కాల్చేసి, బూడిద పక్కేనే ఉన్న మూసీలో కలిపేసారు. కర్కశ పోలీసుల అమానవీయమైన ఈఘటన అందరినీ కలచివేసింది. రాజ్యం రోహిత్ చనిపోయాక ఆయన శవానికి బెదిరింది  ఎక్కడో గుంటూరు జిల్లా  గురజాల లో పుట్టిన రోహిత్ అసహజ మరణం చట్ట బద్ద హత్య వెలివాడ నుండి చాదర్ ఘాట్  మురికి కాలవలో అంతర్ధానం అయింది.

కానీ  ఆ చావు లేవనెత్తిన ప్రశ్నల కు జవాబులు ఇంకా బాకీనే. రోహిత్ హత్య  ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని , కోట్లాదిమంది బడుగు జీవుల ఉనికిని అపహాశ్యం చేసింది. అలా ఈ దేశం సహనం కోల్పోయిన ప్రతి సందర్భం లో భారతమాత సామూహిక సమర్ధనగా తన సహనాన్ని నిరూపించుకుంది.  నేడు దేశ భక్తులకూ, దేశాన్ని అమ్ముతున్న ద్రోహులకూ మధ్య యుద్ధం జరుగుతోంది. స్వదేశీ నినాదం తో గద్దెనెక్కిన మోడీ అరుదుగా ఈ దేశ నేల మీద ఉంటున్నాడు మిగతా కాలం అంతా గాలిమోటార్ల మీద తిరుగుతూ అపారమయిన ఖనిజ సంపద ను బడా దేశాల కు అమ్ముతూ, నమ్ముకున్న నేల చె రబడుతుంటే ప్రాణాలు ఫణంగా అడ్డుపెడుతున్న ఆదివాసుల మీద వైమానిక దాడులులకు పురిగోల్పుతున్న సంక్షుభిత సమయం లో ఒక నాస్తికుడు, ఒక ప్రజాస్వామిక వాది అయిన ఉమర్ ఖాలిద్ కోల్పోయిన తన ముస్లిం అస్తిత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాడు. ఎందుకంటె తాను ముస్లింగా ఉంటూ కూడా నిజమయిన దేశభక్తున్ని కావాలి అనే ప్రయత్నం లో ఉండు పుట్టుక కారణంగా దేశద్రోహుల జాబితాలో కలుపుతున్న కారణాల వెతుకు లాటలో ఉండు. జోరుగా తెలంగాణా ఉద్యమం జరుగుతున్న కాలంలో  కలవని కనురెప్పల్లా ఉన్న రెండు సాంస్కృతిక ప్రేమలను  గ్లిసరిన్ కళ్ళతో ఒలికించిన తెలంగాణా మాత  ఇప్పుడు ఏం చదవాలో చదవకూడదో ప్రవచనాలు ఇస్తోంది.

నిట్టాడి లేని నిర్బాగ్యం నుండి కర్కషమయిన కాటిన్యం నుండి ఒక నిప్పు కణాన్ని కన్న రోహిత్ తల్లి ప్రత్యమ్నాయ జాతీయతను ఎన్నుకున్నది. రాజ్యం దృష్టిలో రోహిత్ తల్లి వేముల రాధిక  ఇప్పుడు  దేశ ద్రోహి.  అలా దేశద్రోహుల జాబితా లో గతం నుండే నమోదు అయిన అరుందతి రాయ్ మొదలు కంచ ఇలయ్య దాకా ఈ దేశ జాతీయ పరీక్షలో విఫలం అవడం మూలంగా దేశ ద్రోహుల జాబితాలో కల్పబడ్డారు. గోవింద్ పన్సారే మొదలు,నరేంద్ర ధబోల్కర్, కన్నడ సాహితీ వేత్త కల్బుర్గి గా ఈ నరహంతక వేటకొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కంచె ఐలయ్య మీద వేట మొదలయ్యింది.

ఉస్మానియా కేంద్రంగా సాగిన అన్ని సాంస్కృతిక పోరాటాల లోనూ కంచ ఐలయ్య వేసిన సైద్దాంతిక భూమిక ఉంది. అది ఎద్దుకూర పండగ కావచ్చు, నరకాశూర, రావణా శూర, మహిశాశూర అమరత్వాన్ని పొలిటి సైజ్ చేస్తూ దళిత బహుజన సాంస్కృతిక పోరాటం గా మార్చిన క్రమం కావొచ్చు, వీటి వెనక  ఐలయ్య  ఉన్నాడనే అక్కసుతో కుట్ర ఇప్పుడు మొదలయింది.  శాకాహారం జాతీయ వాదానికి వ్యతిరేకం అనీ, భారతమాత కేంద్రక ఆలోచనలకు భిన్నమయిన జాతీయభావనకు ఊపిరులు ఊదిన ఆయనను చంపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి . భారత మాత సవితి బిడ్డలుగా బ్రతకడం కన్నా ‘భీం భూమికి జై’ అన్న నినాదం ఇచ్చినందుకు ఆయన ఇప్పుడు దేశద్రోహుల జాబితాలో కల్పబడ్డాడు. ఇలా ఉపేక్షిస్తే ఆ జాబితాలో మనం అందరం చేరే రోజు ఎంతోదూరంలోలేదు. ఫూలే-అంబేద్కర్ తాత్విక చింతనల వెలుగులో నూతన జాతి అస్తిత్వం పురుడు పోసుకోవడం నేరాల్లో కెల్లా నేరం.

విశాల ప్రజా, పౌర పోరాటాల నిర్మాణం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో నేను దేశద్రోహిని అని చెప్పడానికీ చింతించడం లేదు. ఒక వేల నిజంగా భారత మాత ఉన్నా ఆ భారతమాత ను  బర్బాదీ చేస్తున్న ద్రోహులెవరో తేల్చుకోవాల్సిన చారిత్రిక అవసరం ఇప్పుడు మనందరి మీదా ఉంది.

*

వ్యాఖ్యానాలు- నా అనుభవాలు!

 

– నిడదవోలు మాలతి

~

 

కొంతకాలంగా రచయితలకీ పాఠకులకీ మధ్యన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది విమర్శలవిషయంలో. వ్యాఖ్యలు సూక్ష్మంగా ఉంటాయి కానీ అవి కూడా విమర్శలే నాకు సంబంధించినంతవరకూ. రెంటిలోనూ జరిగేది రచనమీద చదివినవారు చదవడం అయేక స్పందనలను తెలియజేయడమే జరుగుతుంది కనక.

పండితులు తమ అభిప్రాయాలను పత్రికలలో చర్చించుకోడం వీరేశంలింగం, కొక్కొండ వెంకటరత్నంపంతులు గార్ల కాలంలోనే ఉంది. అంతకుపూర్వం పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ప్రెగడ నరసరాజు వంటి కవులు సభలలో ఒకొరినొకరు ఆక్షేపించుకోడం ఉండేది.

19వ శతాబ్దంలో విద్యావంతులని ప్రొత్సహించే ఆశయంతో పత్రికలు వెలువడ్డాయి. ఈనాడు జాల పత్రికలు “మీరు కూడా రచయితలే,” అని పాఠకులని రాయమంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంప్రదాయానికి నాంది పత్రికలు ప్రారంభించినరోజులలో సంపాదకులు స్త్రీవిద్య ప్రోత్సహించడమే.

పండితులూ సాహతీవేత్తలూ శల్యపరీక్ష చేసి రాసే విమర్శలజోలికి పోబోవడం లేదు నేను ఈ వ్యాసంలో. నా అనుభవాలు అన్నాను కదా. నాఅనుభవంలో అలాటి విశ్లేషణలు జరగలేదు కనక నేనేమీ చెప్పలేను.

నేను కథలు రాయడం మొదలు పెట్టేక, అంటే 50వ దశకంలో అభిప్రాయాలు గమనించడం మొదలు పెట్టేను. ఆ రోజుల్లో వారపత్రికలే ఈ అభిప్రాయప్రటనలకి వేదిక. కథ చదివేక కార్డో ఇన్లాండ్ కవరో తీసుకుని అభిప్రాయం రాసి ఆ పత్రికకి పంపితే అది మళ్ళీ పాఠకుడు చూసుకోడానికి కనీసం మరో రెండు వారాలు పట్టేది. అది కూడా ఆ పత్రిక ఎడిటరు వేసుకోడానికి అంగీకరిస్తేనూ, ఎడిట్ చేయకపోతేనూ మాత్రమే పాఠకుడు తాను రాసింది రాసినట్టు చూసుకునే అవకాశం. అంటే డబ్బు ఖర్చూ, కాలయాపనా కూడా అన్నమాట. నిజానికి చాలామంది పాఠకులు వ్యాఖ్యానాలు రాయడానికి మొహమాటపడేవారు కూడా ఆరోజుల్లో. ఇప్పటికీ మీ అమ్మమ్మనో వాళ్ళమ్మనో అడిగి చూడండి. ఏమో, నాకేం తెలుసులెద్దూ అంటారు. ఈమధ్య ముఖపుస్తకంలో “మీరేం అనుకుంటారో అని friend request పెట్టలేదు” అన్నవారు నాకు కనిపించేరు. రచయితలయందు పాఠకులకు గల గౌరవమర్యాదలనేపథ్యం ఇలాటి సందర్భాలలో అర్థమవుతుంది.

20వ శతాబ్దం ఉత్తరార్థంలో వారపత్రికలలో సాహిత్యపరంగా కూడా మంచి చర్చలు జరిగేయి. మహీధర రామ్మోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మవంటి రచయితలచర్చలు కనిపిస్తాయి 70, 80 దశకాలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలలో. భారతి, కృష్ణాపత్రికలలో కూడా ప్రముఖ రచయితలు అభిప్రాయాలను ప్రచురిస్తూ ఉన్నారనే గుర్తు. పోతే సాధారణ పాఠకులవ్యాఖ్యలు ఒక్కొక కథమీద ఒకటో రెండో నామమాత్రంగా కనిపించేవి. గత 20 ఏళ్లలో అంతర్జాలంలో పత్రికలూ, బ్లాగులూ, మిత్రసంఘాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చేయి. పాఠకులసంఖ్య లెక్కకు మిక్కిలిగా వృద్ధి పొందింది, పొందుతోంది. రచయితల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది.

ఈ నేపథ్యంతో నా అనుభవాలు చెప్తాను. పత్రికలలో నాకథలకి “ఈ కథ ఎందుకు రాసేరో అర్థం కావడంలేదు,” అని ఒక వ్యాఖ్య ఉంటే “చాలా బాగా రాసేరు,” అని మరో వ్యాఖ్య ఉండేది. ఒక కథమీద రెండో మూడో అభిప్రాయాలు కనిపిస్తే ఘనం. అంతర్జాలం ప్రవేశించేక, పాఠకులతో ముఖాముఖీ virtual స్థాయిలోనే జరగడం మొదలయింది. ఇది కొంతవరకూ ఆనందదాయకమే.

ఘనంగా కాకపోయినా నా పుస్తకంమీద జరిగిన ఒక చర్చ ఈవ్యాసానికి పనికొచ్చేది ఉంది. అది 20వ శతాబ్దం ఉత్తరార్థంలో స్త్రీల రచనావ్యాసంగానికీ, వారి సాహిత్యప్రస్థానానికీ దోహదం చేసిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకంమీద వేలూరి వెంకటేశ్వరరావు ఈమాట.కాంలో రాసిన సమీక్ష. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగించిన సమీక్ష. నేనెంత గొప్పదాన్నో అని కాక కేవలం వస్తువుని విశ్లేషిస్తూ రాసిన సమీక్ష అది. ఆ సమీక్షమీద వచ్చిన వ్యాఖ్యలలో ఈ వ్యాసానికి పనికొచ్చే వ్యాఖ్య బుజ్జాయి అన్నపేరు (బహుశా కలంపేరు)తో రాసింది, “ఎందుకిప్పుడు ఇది రాయడం. పాసిబూరె,” అని. ఆ వాక్యం గౌరవప్రదంగా నాకు అనిపించలేదు కానీ అక్కడ సైటులో ఎవరూ దాన్ని తప్పు పట్టలేదు. ఆ బుజ్జాయే అడిగిన రెండు ప్రశ్నలకి నేను మర్యాదగానే జవాబులిచ్చేను అది సీరియస్ గా జరుగుతున్న చర్చ అన్న అభిప్రాయంతో. ఆయనకి ప్రశ్నలడగమే కానీ పుస్తకం చదివే ఉద్దేశం లేదని అర్థం అయేక పుస్తకం చదివితే వారి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పి ముగించేసేను.

ఇప్పుడు ఆలోచిస్తుంటే మరో కోణం తోస్తోంది నాకు. ప్రతి పత్రికకీ తరుచూ వ్యాఖ్యానించేవారు కొందరుంటారు. పాఠకులకి ఈ వ్యాఖ్యాతల ధోరణి తెలిసి ఉంటుంది. అలాటి సందర్భాలలో “పాసిబూరె” లాటి పదాలు హేయంగా కనిపించవు. అతనలాగే మాటాడతాడు కానీ చాలా తెలివైనవాడు అంటూ సమర్థిస్తారు. నేను ఆ వ్యాఖ్యలన్నీ చూడను కనక ఆ పదం నాకు అసమంజసంగానే అనిపించింది. వ్యాఖ్యానాలు రాసేవారు తమగుంపులో వారే కాక ఇతరులు కూడా చదువుతారనీ, అపార్థాలకీ తావు అవుతాయనీ కూడా గ్రహిస్తే ఇలాటి వ్యాఖ్యలు రావు. ఇది కూడా నాకు అనుభవం అయింది :).

పై చర్చ అయినతరవాత నేను రాస్తున్న ఊసుపోక ధారలో ఈ వ్యాఖ్య వాడుకున్నాను. బహుశా మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది ఈ ఊసుపోక కతలలో ప్రధానాంశం హాస్యం, వ్యంగ్యం అని. అనేక సందర్భాలలో నామీదే నేను హాస్యం, వ్యంగ్యం విసురుకున్నాను. ఈ platform అలాటిది కనక సహజంగానే ఆ బుజ్జాయి వ్యాఖ్యని  వ్యంగ్యాత్మకం చేసేను, అమెరికాలో celebrity roastలాగ అనుకోవచ్చు. దానిమీద కొడవళ్ళ హనుమంతరావు వ్యాఖ్యానించేరు. ఆయనకి నారచనలంటే గౌరవమనీ, నేను బుజ్జాయిని అలా హేళన చేయడం మాత్రం బాగులేదనీ వారి వ్యాఖ్య సారాంశం. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించి విషయం నేను తీసుకున్న అంశాన్ని బుజ్జాయి పాసిబూరె అంటే ఆయనకి ఆభ్యంతరకరంగా కనిపించకపోవడం. హాస్యప్రధానమైన ఊసుపోకలో నేను హాస్యంగా రాసింది అభ్యంతరకరంగా కనిపించడం. నేను ఈమాట.కాంలో మర్యాదగానే జవాబిచ్చేను అన్నది ఆయన గమనించేరో లేదో నాకు తెలీదు. నాబ్లాగులో జరిగిన చర్చ అంతా ఇక్కడ పెట్టను. ఈవ్యాసం చివరలో లింకు ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు.

ముఖపుస్తకంలో చేరేక ఈ వ్యాఖ్యానాలధోరణిలో వచ్చిన మార్పులు నాకు మరింత స్పష్టం అయేయి. ఇది మరొక సంప్రదాయంగా రూపొందిందన్నా తప్పు లేదేమో.

Facebook ప్రధానంగా స్నేహితులు తమ స్వంత కబుర్లు చెప్పుకోడానికీ బొమ్మలు పెట్టుకోడానికీ ప్రారంభించినది. అయినా అనతికాలంలోనే సాహిత్యం, సంగీతం, పద్యం, కథ, సినిమా, పుస్తకాలు – ఇలా ఎవరి అభిమానవిషయాలనుబట్టి వారు పేజీలు ప్రారంభించడంతో “ముఖపుస్తకం కేవలం కాలక్షేపం కబుర్లకి మాత్రమే కాదు” అన్న స్థితికి చేరింది. అలాగే పూర్వ పరిచయాలున్న మిత్రులే కాక కొత్తవారు కూడా మిత్రత్వం కోరడం, అంగీకరించమో లేదా నిరాకరించడమో కూడా జరుగుతోంది. వీటివల్ల వచ్చే ఇతర అనర్థాలు ప్రస్తావించను కానీ వ్యాఖ్యలకి సంబంధించినంతవరకూ మాత్రం చెప్తాను.

అన్ని రంగాలలోలాగే ఇక్కడ కూడా మంచీ చెడూ కూడా ఉన్నాయి. బాగున్నవి – నాసందేహాలకి సూటిగా వివరంగా సమాధానాలు రావడం. ఇది నాకు చాలా నచ్చింది. ఇందుకే ముఖపుస్తకంలో నావ్యాసంగం కొనసాగిస్తున్నది. రెండో భాగం నాకు అంతగా నచ్చనిది – సీరియస్గా అడిగిన ప్రశ్నలకి హాస్యధోరణిలో జవాబులివ్వడం. ఉదాహరణ ఇస్తాను.

“కరుణ ఏవ ఏకో రసః” అని భవభూతి  వాక్యం. నాకు ఈ వాక్యం పరిచయమే కానీ పూర్వాపరాలు తెలీవు. అంచేత నా పేజీలో అడిగేను. సంగతి సందర్భాలు తెలిసినవారు చక్కగా వివరించేరు. నేను సంతోషించేను. అదే సమయంలో మరొకతను ప్రవేశించి “ఇంకా చాలా రసాలున్నాయి. నీరసం, నిమ్మరసం …” అంటూ వ్యాఖ్య పెట్టేడు నా టపాదగ్గర. నేను వెంటనే అలాటి వ్యాఖ్యలమూలంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనీ, అంచేత అలా రాయవద్దని చెప్పేను. దానికి అతను, “నాకు హాస్యం ఇష్టం. అష్టావధానంలో అప్రస్తుతప్రసంగంలాగే ఇది,” అని సమర్థించుకున్నాడు. నాకు మాత్రం కాదనే అనిపించింది. అష్టావధానం ఒక సాహిత్యప్రక్రియ. అక్కడ చెల్లింది కదా అని ప్రతి చోటా అప్రస్తుతప్రసంగం చెల్లుతుందనుకోడం సరి కాదు. ముఖ్యంగా  సీరియస్గా ఒక విషయం చర్చిస్తున్నప్పుడు హాస్యం, హేళన, వ్యంగ్యం ప్రయోగిస్తే, నాకే కాదు సీరియస్గా సమాధానాలిస్తున్నవారికి కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. వారిని కూడా కించపరచినట్టే అవుతుంది. ఇంతకుముందు చర్చించిన పాసిబూరె లాటిదే ఇది కూడా.

పూర్వకవులూ, ఆ తరవాత వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులువంటివారు వ్యక్తిగతంగా పత్రికలలోనే ఒకరినొకరు హేళన చేసుకున్న సందర్భాలు ఉన్నా వారందరూ వ్యక్తిగతపరిచయాలు గలవారు. ఏమాట ఎక్కడ నప్పుతుందో తెలిసినవారు. అంతర్జాలంలో అలా కాదు. అంతా తెరవెనక భాగోతమే. నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఎవరు ఎవరో తెలీదు. ఏ ఉద్దేశంతో ఏమాట అంటున్నారో తెలీదు. తరుచూ కనిపించే పేర్లమూలంగా తెలిసినట్టు అనిపించినా అది నిజంగా తెలియడం కాదు.

ఈ రోజుల్లో మామూలయిపోయిన రెండో రకం వ్యాఖ్యలు – రచయిత రాసిన వాక్యం సంపూర్ణంగా కాక ఏదో ఒకమాట తీసుకుని పక్కదారి పట్టించడం. అంటే సూటిగా నావాక్యానికి వ్యాఖ్యానం కాక అందులో ఒక మాట తీసుకుని మరో కోణం చెప్పడం. ఒకొకప్పుడు ఆ కోణానికి సందర్భశుద్ధి ఉండదు. కిందటేడు ముఖపుస్తకం నాపేజీలో నేను ఇది పోస్టు చేసేను –

రచయితకి మరణం రెండు మార్లు.

ప్రాణం పోయినప్పుడు

ప్రజలు మరిచినప్పుడు.

రెండోమరణం రెండు రెట్లు దారుణం.

దీనిమీద వచ్చిన ఒక వ్యాఖ్య “ఆ రచయిత చావడమే మేలు” అని. ఈ వ్యాఖ్య ఇంగ్లీషులో ఉంది, “he better die.” నేను రాసింది రచయిత రచయితగా  పాఠకులదృష్టిలో ఎంతకాలం అన్నది. పాఠకులు మరిచిపోతే ఎంత మంచి రచయిత అయినా ఎన్ని రచనలు చేసినా మృతుడితో సమానం అన్న భావానికి గురి అవుతాడు అని. ఆ రచయిత చచ్చిపోవడమే మంచిది అన్న వ్యాఖ్యలో ఆ భావం లేదు. నేను వివరణ అడిగితే, “విశ్వనాథ సత్యనారాయణలా ఎవరూ రాయడంలేదు, ఈరోజుల్లో మంచి సాహిత్యం రావడం లేదు” అన్నారు ఆయన. నావాక్యంలో మరణం మాట ఉంది కనక తానలా వ్యాఖ్యానించేనని కూడా చెప్పేరు. నా రెండో వాక్యంలో మరణం అంటే మానసికంగా రచయిత అనుభవించే మరణం అని. ఎ.వి. రమణమూర్తిగారు ఈ వివరణ ఇవ్వడంతో నాపని తేలిక అయింది.

నాపోస్టుకీ వ్యాఖ్యాత కొంపెల్ల శర్మ వెలిబుచ్చిన అభిప్రాయానికీ మధ్య గల తేడా గమనించండి. విశ్వనాథవారిలా రాసేవారు మళ్ళీ పుట్టకపోవచ్చు. కానీ ఆ కారణంగా తెలుగు సాహిత్యం అక్కడితో ఆగిపోయిందనో ఆగిపోవాలనో అనడం సబబేనా? అన్నది ఒక ప్రశ్న. మిగతా రచయితలందరూ నిజంగా రచయితలు కాకుండా పోతారా అన్నది మరో ప్రశ్న. మరి కొంపెల్ల శర్మ కూడా సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు గదా, వారు కొనసాగించడాన్ని ఎలా సమర్థించుకుంటారు అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నలు ఇక్కడితో ఆపుతాను. నా మొదటి వాదన- ఒక రచనకీ దానిమీద వచ్చిన వ్యాఖ్యలకీ ఎడం ఎంతగా పెరిగిపోతోందో, ఎంత అర్థరహితం అయిపోతోందో తరిచి చూసుకుందాం అంటున్నాను.

మూడోరకం వ్యాఖ్యలు రచనలో అంశాలను రచయితకు ఆపాదించి వ్యాఖ్యానించేవి. నేను రాసే కథల్లోనూ వ్యాసాల్లోనూ నా అనుభవాలు ఉన్నా అవి సార్వజనీనం అనుకున్నప్పుడే వాటిని కథల్లో వ్యాసాల్లో చొప్పిస్తాను. అంటే అది ఒక్క నా అనుభవమే కాదు, చాలామందికి వర్తిస్తుంది అని. అలాటప్పుడు అది నా ఆత్మకథ అయిన్నట్టుగా నాజీవితంలో ఇతర విషయాలు ప్రస్తావించడం, నాకు “సముచిత” సలహాలివ్వడం, సానుభూతి చూపడం వంటివి చేస్తున్నారు. అపార్థం చేసుకోకండి. నేను ఈ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఇది నా ఒక్క అనుభవమే కాదు అని చెప్పడానికే. చాలామంది రచయితలు నాతోనే ప్రత్యక్షంగా చెప్పేరు వారికి కూడా ఇలాటి  అనుభవాలు ఎదురవుతున్నాయని.

ఈ విషయంలో చిన్న ప్రయోగం చెయ్యదలుచుకుని నేను ముఖపుస్తకంలో రెండు పోస్టులు పెట్టేను. ఒకటి నాపేరుతోనే.

చిన్న చిన్న నొప్పులు చీమల్లా గులాబీముళ్ళలా

ప్రాణాంతకాలు కావు కానీ పనులు చేసుకోనివ్వవు.

ఇది నా స్వంత అనుభవమని చెప్పలేదు. ఏం చెయ్యమంటారని సలహాలు అడగలేదు. అయినా సలహాలు వచ్చేయి. సుప్రసిద్ధులయిన కవులూ, వేదాంతవిదులూ చెప్పిన వాక్యాలు ప్రతిరోజూ కనీసం 5, 6 కనిపిస్తాయి ముఖపుస్తకంలో. ఆ ప్రవచనాలదగ్గర ఏ సలహాలూ ఉండవు.

అది ఋజువు చేసుకోడానికి నాపేరు చెప్పకుండా కొన్ని వాక్యాలు రాసేను.

“కవులు ఉపాధ్యాయులు సుభాషితములు చెప్పుదురు.

నటులు, నాయకులు నటింతురు”

– అజ్ఞాతకవి.

“కవులు స్వీయ అనుభవము వ్రాసినను అది లోకసామాన్యముగ మాత్రమే ఆవిష్కరింతురు. కొందరు అమాయకులు దానిని కవిజీవితమునకు అన్వయించి స్పందించవచ్చును. నేను గాడిదగురించి వ్రాసిన నన్ను గాడిదగా గుర్తించవచ్చును. స్వర్గమునుగూర్చి వ్రాసిన నేను స్వర్గవాసినయితినని తలపవచ్చు.”

– అజ్ఞాత కవి.

ఈ పోస్టులమీద చర్చ వస్తువుమీదే జరిగింది. నేనే రచయితని అని కొందరు గ్రహించేరని తరవాత తెలిసింది కానీ వ్యాఖ్యానాలలో వ్యత్యాసం సుస్పష్టం.

స్థూలంగా చెప్పాలంటే పూర్వం రచయితలు, స్థానికులూ, వ్యక్తిగతస్థాయిలో పరిచయాలు ఉన్నవారూ విమర్శలూ, వ్యాఖ్యానాలూ వైయక్తికస్థాయిలో నడుపుకున్నారు. ఇప్పుడు సాహిత్యవేదిక virtual వేదికగా రూపాంతరం పొందింది. వ్యాఖ్యాతలు తదనుగుణంగా తమపద్ధతులని దిద్దుకోవాలి. జాలపరిచయాలు ఇతరత్రా వ్యక్తిగత పరిచయాలుగా మారే అవకాశం ఉంది కానీ ఒక రచయితపేరు తరుచూ అంతర్జాలంలో చూసినంతమాత్రాన ఆ రచయితతో హాస్యాలాడే పరిచయం ఏర్పడిపోయినట్టూ కాదు. అది సమంజసమూ కాదు. వస్తువుమీద దృష్టి ఉంచి చేసిన వ్యాఖ్యలకి ఉన్న గౌరవం హేళనకీ, ప్రధానాంశాన్ని వదిలేసి తమకి తోచినట్టు రాసే వ్యాఖ్యలకీ ఉండదు. రచయితలు విమర్శలను ఆదరించడంలేదు అని రచయితలని తప్పు పట్టేముందు విమర్శలూ, వ్యాఖ్యలూ ఆమోదించదగ్గవిగా ఉన్నాయో లేదో కూడా చూడాలి.

రచయితలూ వ్యాఖ్యాతలూ – ఇరు పక్షాలవారూ వస్తునిష్ఠతో తమ ఆలోచనలు వ్యక్తం చేస్తేనే వీరికీ వీరికీ కూడా గౌరవమూ, సాహిత్యానికీ గౌరవమూను క్షీరనీరన్యాయంగా. లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అయి అర్థరహితం అయిపోతుంది చర్చ.

 

000

నా ఊసుపోక టపాకి లింకు ఇక్కడ

(జులై 12, 2016)

గ్రంథాలయాల గతి చూడండి!

 

 

-కె. శ్రీనివాస్‌

~

(ఇది “ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో అచ్చయిన వ్యాసం. ప్రస్తుత పరిస్థితులలో ఈ  విషయం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ చాలా మంది  చదువరులు కోరడం వల్ల ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. ఈ  వ్యాసం మీద చర్చని ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసం పునర్ముద్రణకి అనుమతించిన కె. శ్రీనివాస్ కి కృతజ్ఞతలు)

~

నాలెడ్జ్‌ సొసైటీ అన్న మాట ఓ రెండు దశాబ్దాల క్రితం నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏ శామ్‌ పిట్రోడా లాంటివారో మన దేశంలో ఈ సమాస పదాన్ని ప్రవేశపెట్టి ఉండాలి. ఐటి రంగాన్ని తెలుగు వారిలో వ్యాప్తిచేయడానికి తానే కీలకదోహదం చేశానని భావించే చంద్రబాబు నాయుడు కూడా మొదటి హయాం తొమ్మిదేళ్ల కాలంలో ఈ మాటను విరివిగా వాడేవారు. సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగువారు విస్తృతంగా పనిచేయడం, దాని కారణంగా కొన్ని శ్రేణుల వ్యక్తుల ఆదాయాల్లోనూ, కొన్ని స్థలాల్లోనూ వృద్ధి కనిపిం చడంవల్ల, అదే క్రమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లడమే జ్ఞానసమాజాన్ని ఆవిష్కరించడం అన్న అభిప్రాయం ఏర్పడింది.

నిర్వచనం ప్రకారం జ్ఞానసమాజం అంటే, తాను ఉత్పత్తి చేసే జ్ఞానాన్ని అందరూ పంచుకుని, అందరికి అందుబాటులో ఉంచుతూ, మానవ పరిస్థితులను మెరుగు పరచడానికి వీలుగా దానిని వినియోగించే సమాజం. మానవసమాజాలు పూర్వ కాలం నుంచి జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ, ఏదో ఒకరీతిలో కొందరిమధ్య అయినా పంచుకుంటూ, ముందుకు వెడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ఈ పద ప్రయోగం ప్రాచుర్యంలోకి రావడానికి నేపథ్యం సమాచారసాంకేతికశాస్త్రం అవతరణే. ఈ పరి ణామం కారణంగా, సమాచారం క్రోడీకరణకు, విశ్లేషణకు, వినిమయానికి అనేక కొత్త వేగవంతమయిన అవకాశాలు ఏర్పడ్డాయి. కేవలం సమాచారమే ఉత్పత్తి అవు తుంటే, అది జ్ఞానం కాదు. సమాచారం జ్ఞానంగా పరివర్తనం చెందడంలో మానవ వివేచన, మానవీయశాస్త్రాలు అందించిన పరికరాలు చాలా అవసరం. అదే విధంగా, సమాచారం అంటే కేవలం వర్తమాన సమాజాల అవసరాలకు సంబంధించినది మాత్రమే కాదు, చారిత్రక సమాచారం, భవిష్యత అంచనాలూ ఆకాంక్షలూ కూడా. సమాచార సాంకేతికత మానవుల యాంత్రికమైన చాకిరీని తప్పించగలగడమే కాక, అతి తక్కువ స్థలాన్ని, కాలాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఈ వెసులుబాటు కారణంగా, మానవ వివేచన, అవగాహన, శాసీ్త్రయదృష్టి మరింతగా ఉన్నతస్థాయిలో వినియో గించుకోగలుగుతాము. ఒకవైపు జ్ఞానసమాజాన్ని ఫ్యాషనబుల్‌గా కోరుకుంటూనే, మరోవైపు మానవీయశాస్త్రాల అధ్యయనం అనవసరమని భావించడం హ్రస్వదృష్టినే సూచిస్తుంది. అట్లాగే, ఐటీ కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని, నూతన ఆవిష్కరణలకు ఆరంభసదుపాయాలూ హబ్బులూ నెలకొల్పడం వల్ల బంగారు సమాజం ఏర్పడుతుందనుకోవడం అమాయకత్వం అవుతుంది.

విద్యారంగంలో వచ్చిన మార్పులను, ప్రపంచమార్కెట్‌కు అవసరమైన శ్రమశక్తిని ఎగుమతిచేయడానికి మాత్రమే వినియోగించుకుంటే సమాజాలు తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చును కానీ, దీర్ఘకాలికంగా అజ్ఞానసమాజాలుగా మారతాయి. గత పాతికేళ్లుగా మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను, సాంకేతిక ప్రజ్ఞావంతులను ఉత్పత్తి చేయగలిగాము. విద్యార్జన వయస్సులో ఉన్న పిల్లలలో చదువుమీద తీవ్రమయిన అభినివేశం, కష్టపడే తత్వం చూస్తున్నాము. అనేక దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలు అనూహ్యమైన రీతిలో తమ ఆదాయాలను పెంచుకున్నాయి. మరోవైపు, ఆ విజయాలకు తగిన నిష్పత్తిలో మేధో వికసనం, సాంస్కృతిక అభిరుచులు, జీవితనైపుణ్యాలు అభివృద్ధి చెందకపోవడం కూడా గమనిస్తున్నాము. మాతృభాష మీద ఆదరణ తగ్గిపోతున్నది. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు, కళలకు, సాహిత్యపఠనానికి విద్యార్థులు దూరమవు తున్నారు. మార్కులు, ర్యాంకుల వేటలో, చదువు తప్ప మరి దేనికీ సమయం, ప్రోత్సాహం లేకుండా పోతున్నది. పోటీపరీక్షలకోసం తప్ప, వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాల గురించి చదవడమే గగనమై పోతున్నది. ఇందుకు తగ్గట్టుగా, ప్రభుత్వ విద్యాసంస్థలు సదుపాయాల్లోనూ ప్రమాణాల్లోనూ వెనుకబడి పోతున్నాయి. జీవనకళలను పోషించే వ్యవస్థలన్నీ ఆదరణ లేక కునారిల్లుతున్నాయి. పబ్లిక్‌ లైబ్రరీలు అటువంటి బాధిత సంస్థల్లో ముఖ్యమైనవి.

తెలుగు రాషా్ట్రలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ- ఈ రెండింటి చరిత్రలోనూ గ్రంథా లయాల పాత్ర అమోఘమైనది. నైజాం పాలనలో ఉన్న తెలంగాణ తనను తాను తెలుసుకుని ఎలుగెత్తడానికి చాలా కాలం పట్టింది కానీ, ఆ ప్రయాణంలో తొలి అడుగు శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం (1901) స్థాపనతోనే జరిగింది. రాయల సీమలో 1870లలోనే ఒక బుక్‌క్లబ్‌ ఏర్పడి, మరోదశాబ్దానికి నాలుగైదు చోట్ల గ్రంథాలయాలు వెలిశాయి. రావిచెట్టు రంగారావు, మాడపాటి హనుమంతరావు మొదలయినవారు తెలంగాణలో గ్రంథాలయాల స్థాపనకు ఆద్యులయితే, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు ఆంధ్రలో ఉద్యమ నేతలు. వీరంతా తెలుగుసమాజాల వికాసానికి బహుముఖమైన కృషి చేశారు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, వేటపాలెం సారస్వతనికేతనం, విజయవాడ రామమోహన గ్రంథాలయం- బ్రిటిషాంధ్ర జనజీవనంలో అవిభాజ్య అంగాలు. పాఠ శాలలో చదువుతో పాటు, ఇతరుల జీవితానుభవాన్ని, సృజనను చదవడం కూడా నాటి వికాసయుగానికి అవసరమయింది. గ్రంథాలయం కేవలం చదువరుల వసతి మాత్రమే కాదు. చైతన్యవంతుల కూడలి. సమావేశ స్థలి. తెలంగాణలో అయితే, అది భూస్వాముల గడీకి ప్రజా ప్రత్యామ్నాయం.

సమాజానికి అవసరమైన మేధాశక్తిని, వివేచనను అందించే మౌలికవసతి అయిన గ్రంథాలయం, స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాలపాటు సగౌరవంగానే జీవించింది కానీ, ఇప్పుడు దాపురించిన పాడుకాలంలో అది శిథిలమవుతున్నది. ఆర్జించలేని ఏ సంస్థ అయినా పనికిమాలినదనే దృష్టి పెరిగిపోయింది. సంపన్న దేశాలలోని ఆకాశహర్మ్యాలను చూసి అదే అభివృద్ధి అనుకుని అనుకరిస్తూ, ఆ దేశాలలోని ఇతర విలువలను ఖాతరు చేయకపోవడం కూడా మన పాలకులకే చెల్లింది. అభివృద్ధి ‘కాముకుల’ందరికీ ఆరాధ్య దేశమైన అమెరికాలో లక్షా ఇరవైవేల పబ్లిక్‌ లైబ్రరీలున్నాయి. అక్కడ జనాభా మన దేశంలో మూడోవంతు కన్నా తక్కువ, 32 కోట్లు. 2015 సంవత్సరంలో ఆ దేశంలోని లైబ్రరీలలో నమోదైన వ్యక్తిగత సందర్శనల సంఖ్య 150 కోట్లు. లైబ్రరీలలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరయిన వారి సంఖ్య 10 కోట్లు. ఏటా అక్కడ 1150 కోట్ల డాలర్ల ప్రజాధనం లైబ్రరీల మీద ఖర్చు పెడతారు. భారతదేశంలో జనాభా 120 కోట్లు అయితే, పబ్లిక్‌ లైబ్రరీల సంఖ్య 55వేలు. ఇక రెండు తెలుగు రాషా్ట్రలూ ఎంతో పరవశించిపోయే ధనికదేశం సింగపూర్‌. ఆ చిన్నదేశంలో 26 పబ్లిక్‌ లైబ్రరీలు, నాలుగైదు జాతీయస్థాయి లైబ్ర రీలుఉన్నాయి. అక్కడ జనాభా 56 లక్షలు. అక్కడి జాతీయ లైబ్రరీ బోర్డు (ఎన్‌ఎల్‌బి)కు ఏటా 38 కోట్ల సింగపూర్‌ డాలర్ల (సుమారు 1900 కోట్ల రూపాయలు) బడ్జెట్‌. 3 కోట్ల ఆదాయం. తక్కినదంతా గ్రాంట్ల రూపంలో వస్తుంది. అక్కడ పఠనాభిరుచి క్రమక్రమంగా పెరుగుతోంది. 7-12 సంవత్సరాల మధ్య వయస్కులు నూటికి 91 మంది లైబ్రరీలు సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ దేశం పఠనోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఎక్కువ చదవండి, విస్తృతంగా చదవండి, కలసి చదవండి’ అన్న నినాదంతో పాఠకుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నది.

మరి మన తెలుగు రాషా్ట్రలలో పరిస్థితి ఎట్లా ఉన్నది? తెలంగాణలో సుమారు 1225 గ్రంథాలయాలున్నాయి. ఇందులో ఐదువందల దాకా బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (ఇతరులు ఏర్పరచి, నిర్వహించి, తరువాత ప్రభుత్వానికి బదిలీ అయినవి), 562 బ్రాంచి లైబ్రరీలు, 165 గ్రామీణ లైబ్రరీలు. ఇవి కాక రెండు ప్రాంతీయ లైబ్రరీలు (నిజామాబాద్‌, వరంగల్‌) ఉన్నాయి. ఈ అన్నిటికీ కలిపి కేవలం 466 మంది గ్రంథపాలకులున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు లైబ్రరీల బాధ్యత నిర్వహిస్తున్న పరిస్థితి. 1987 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లైబ్రరీ కూడా కొత్తది స్థాపించ లేదు. 1993 నుంచి గ్రంథాలయాల్లో ఒక్క కొత్త నియామకమూ జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి కొంచెం మెరుగు కానీ, మొత్తం మీద పెద్ద తేడా లేదు. 624 బ్రాంచి లైబ్రరీలు, 249 గ్రామీణ లైబ్రరీలు, 600 బుక్‌డిపాజిట్‌ కేంద్రాలున్నాయి. 562 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వాలు కొత్త పుస్తకాలు కొని ఎన్ని సంవత్సరాలైందో లెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టిన హైదరాబాద్‌ నగరకేంద్ర గ్రంథాలయంలో మంచినీళ్లు లేవు, మూత్రశాల ఉండదు. ఏటా జాతీయస్థాయి రామమోహన గ్రంథాలయ సంస్థ తానే కొన్ని పుస్తకాలను కొని అన్ని లైబ్రరీలకు పంచిపెట్టేది. రాష్ట్రవిభజన కారణంగా, ఉమ్మడి జాబితాలో ఉన్న గ్రంథాలయసంస్థ మూడు సంవత్సరాల నుంచి రామమోహన లైబ్రరీకి ప్రతిపాదనలే పంపలేదు. పుస్తకాలు ఇస్తామన్నా, తీసుకునే గతి లేదు. వంద సంవత్సరాలు పైబడిన గ్రంథాలయాలకు జాతీయసంస్థ నుంచి పదికోట్ల దాకా నిర్వహణా గ్రాంటువస్తుంది. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం- ఈ రెండూ ఆ గ్రాంటుకు అర్హమైనవే అయినా, ప్రతిపాదనలు పంపే ప్రభుత్వాధికారిలేడు.

పుస్తకం పాతబడిపోయింది, డిజిటల్‌ యుగం వచ్చింది- అంటూ గ్రంథాలయా లను ఆధునీకరించడమే తక్షణ కర్తవ్యం అన్న వాదనా వినిపిస్తోంది. డిజిటల్‌ పరి ణామాలు నిజమే. కానీ, భౌతికమయిన పుస్తకానికి కాలం చెల్లలేదు. అమెరికాలోనూ, సింగపూర్‌లోనూ భౌతిక గ్రంథాలయాలతో పాటు అనుబంధంగా ఆధునిక విభాగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ డిజిటల్‌ పఠనవనరులు పెరుగు తున్నాయి. కానీ, మన దేశంలో ఇంకో నూరు సంవత్సరాల వరకు ముద్రిత అక్షరా నికి, భౌతిక పుస్తకానికి అవసరం ఉంటుంది. లైబ్రరీలను ఆధునీకరించవలసిన అవసరమూ ఉన్నది. లైబ్రరీ వ్యవస్థను, ఆర్కైవ్స్‌ వ్యవస్థను సంధానం చేయవలసి ఉన్నది. ప్రభుత్వ విభాగాలలో ఉండవలసిన ఇన్‌ఫర్మేషన్‌ అధికారులు ఎప్పటి కప్పుడు వర్తమాన గణాంక సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్‌ సామగ్రి కింద ప్రజలకు అందుబాటులోకి తేవలసి ఉన్నది. పాఠకుల కోసం కంప్యూటర్లు, దృశ్య, శ్రవణ సమాచారం, సంపుటులు, ఈ బుక్స్‌, జర్నల్స్‌, చలనచిత్రాలు, డాక్యు మెంటరీలు- ఇవన్నీ లైబ్రరీలలో కొత్త విభాగాలుగా రావడం నేటి అవసరం. అన్నిటికి మించి, గ్రంథాలయాల్లో నూతన నియామకాలు చేయడం, కనీస వసతులు కల్పిం చడం అవసరం. అలక్ష్యం బారిన పడి శిథిలమవుతున్న చారిత్రక పత్రాలను, పుస్త కాలను కాపాడుకోవలసిన అవసరం ఉన్నది.

రెండు రాషా్ట్రల ముఖ్యమంత్రులూ పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యావంతులే. నీళ్లు విద్యుత ఎంత అవసరమో విజ్ఞానం కూడా అంత అవసరమని తెలుసుకోగలిగిన వాళ్లే. గ్రంథాలయాల విషయంలో కూడా తెలుగు రాషా్ట్రలను సింగపూర్‌ చేయమని వారిని కోరడం దురాశ అవుతుందా?

*

 

మతము-నాస్తికత్వము-నాస్తిక మతము                                                                                        

 

                                                                                                                       – రాణి శివ శంకర శర్మ

~

 

మనం ఆధునిక కాలంలో మతచాందసత్వాన్ని కాదు. ఎథీస్ట్ ఫండమెంటలిజాన్ని అంటే నాస్తిక చాందసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం ద్వారా మనం సంఘర్షిస్తున్నాయి అని అనుకుంటూన్న శక్తులు ఒకే కుదురులోనివనీ, తోబుట్టువులనీ అర్థమవుతుంది. వైరుధ్యాలు అనుకున్నవి మిత్ర వైరుధ్యాలనీ వైరుధ్యం ముసుగులోని మైత్రీపూర్వక సంబంధాలనీ అవగతమవుతుంది. అప్పుడు కమ్యూనిజము, హిందూవాదము లాంటి అనేక పేర్లు ఒకే సత్యానికి సహస్ర నామాలని అవగతమవుతుంది.

నిజానికి కమ్యూనిజం వ్యాన్ గార్డులుగా వ్యవహరించిన కొన్ని అగ్ర కులాలని గ్రామీణ బంధనాల నుండి విముక్తం చేసి పెట్టుబడి దారీ వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల ఆవిర్భావానికి చోదక శక్తిగా పని చేసినట్లేనన్న మాట. చైనాలో కూడా అంతే. కమ్యూనిజం చిన్న కమతాలని సమిష్టి వ్యవసాయంలోకి లయం చేసి ప్రాచీన గ్రామీణ వ్యవస్థని బలహీనపరిచింది. ఇప్పుడు అలా సమీకరించబడిన భూమి పెట్టుబడికి ప్రశ్నకవకాశం లేని వనరుగా మారింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ఆవిర్భవించిన కమ్యునిష్టు వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకి దుర్భేధ్యమైన కవచంగా మారింది. తావోయిజం ప్రకారం ప్రతీదీ పూర్తి విరుద్ధంగా మారుతుంది. ఆ మాటని మావో తాత్వీకరించాడు. ఇప్పటి పరిణామాలు కూడా ఆ తాత్వీకరణలో భాగమేనా? తాత్విక సూత్రాలు స్వయం చలనంగా ఉండి తమ అర్థాలని తామే నిర్ణయించుకుంటాయా? మానవ ప్రగతి అనే భావనలో ఏ మానవుడి ప్రగతి, ఏ జాతి ప్రగతి అనే ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. దురదృష్టవశాత్తూ కమ్యూనిజం ఈ భావన మీదే కాళ్ళూనుకొని ఉంది. నిజానికి ఆధునికత అంతా అంతే.

 

హిందూ వాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ,  కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.

 

ఈ క్రమంలో పెట్టుబడి దారీ వ్యవస్థలో, గ్లోబలైజేషన్లో తగిన భాగం పొందలేక, గ్రామీణ వ్యవస్థ విచ్చిన్నమై నూతన అవకాశాలు కూడా పొందలేక బాధపడుతున్న దళిత, బహుజనులు, ముస్లీంలు తమ అస్తిత్వాలతో, మతాలతో, సంస్కృతులతో ముందుకు వచ్చి వాటినే అగ్ర కులాల ముందు ప్రశ్నలుగా ఎగరవేశారు. దాంతో అగ్ర కులాలు నాస్తికత్వం, ఆర్థిక సమానత్వం, హిందూ నేషనలిజం లాంటి సెక్యులర్ అబ్స్ట్రాక్ట్ పదాల్ని ఆశ్రయించారు. దళితులు, బహుజనులు తమ ప్రత్యేక అస్తిత్వాలని కరిగించుకొని అబ్స్ట్రాక్ట్ గా మారిపోవాలని ఆదేశిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని ఇష్టపడుతుంది. ప్రత్యేక అస్తిత్వాలని కాక కొనుగోలుదార్లని వాంఛిస్తుంది. నగరీకరణలో ప్రత్యేకతలు, ప్రత్యేక సంస్కృతులు లయమైపోవాలని ఆదేశిస్తుంది. కమ్యునిష్టు, హిందూ ముసుగుల్లోని అగ్రవర్ణాలది మొదటి నుంచీ అబ్స్ట్రాక్ట్ పరిభాషే. భూస్వామి అన్నా, బూర్జువా అన్నా, పెటీ బూర్జువా అన్నా, హిందుత్వ అన్నా, నేషనలిజం అన్నా అంతా వలసవాదుల నుంచీ దిగుమతి చేసుకున్న అబ్స్ట్రాక్ట్ సరుకే. ఈ పదాలతోనే వీళ్ళు నగరీకరణలోకీ, గ్లోబలైజేషన్లోకీ సులభంగా ఎగబాకారు. అదే సమయంలో దళిత, బహుజన, ముస్లీంలు ఈ నిచ్చెన మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ప్రత్యేకతల్నీ, కులాల్నీ, మతాల్నీ, సంస్కృతుల్నీ ఉపరితలం అంటూ అగ్రకులాలు విసిరి కొట్టారు. హిందూవాదులైతే బహుళత్వాన్ని హిందూ జాతీయతకి ముప్పుగా పరిగణించారు.

 

అందుకే ఇప్పుడు కమ్యునిష్టులు, దళిత బహుజనుల్ని, వారి ప్రత్యేక మతాలనీ , సంస్కృతులనీ  గ్లోబలైజేషన్ దుష్పరిణామాలుగా వాదిస్తున్నారు. ఐక్యతకి ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి గ్లోబలైజేషన్‍కీ వాటి ఫలితాలకీ కారణం ఆ కులాల వాళ్ళే. ఐక్యత అనే విశాలార్థం కల  పదం ఎప్పుడూ కొద్దిమంది అభివృద్ధికి అనేక మంది అణచివేతకి కారణమవుతూ వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావానికి కారణమదే. మాదిగల ప్రత్యేక అస్తిత్వ ప్రకటన సాంస్కృతికంగా మరుగుపడిపోయిన అనేక అంశాల్ని బయటికి తెచ్చింది. సంస్కృతి గురించి అగ్రవర్ణాలు కమ్యునిష్టు హిందూవాదులు వ్యక్తం చేసిన ఆధిపత్య కోణాల్ని బట్టబయలు చేసింది.

 

ఉదాహరణకి ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య చెప్పడానికి నిరాకరించాడనే కథని, కమ్యునిష్టులు కూడా యాధార్ధంగా స్వీకరించారు. ద్రోణుడిని వ్యాన్ గార్డ్ గా ఏకలవ్యుడిని కార్యకర్తగా చూసారు. అసలు ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యునిష్ట్ హిందూ అగ్ర వర్ణాలవారు తాము ప్రజలనుంచీ నేర్చుకోవడం కంటే వారికి నేర్పే వారిగానే తమని తాము చిత్రీకరించుకున్నారు. తాము గురుత్వం వహించారు. అందుకే జాంబ పురాణం వంటి ప్రత్యామ్నాయ పురాణాలని అధ్యయనం చేయలేదు. దళితులు అవిద్యావంతులనీ, అగ్రకులాలు విద్యావంతులనే స్టీరియో టైపుని బద్దలు చేయలేక పోయారు. డక్కలి వారికి చదవడం, రాయడం వచ్చని, వేద పండితులకి రానే రాదనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎందుకంటే అగ్రకులాలే ఙ్ఞానవంతులనేది వారి అభిప్రాయం. కానీ డక్కలి వారి దృష్టి వేరు. వాళ్ళు ఙ్ఞానాన్ని అగ్ర కులాలు తమ వద్దనుంచే దొంగిలించాయంటారు.

 

వలసవాద విద్య వల్ల అగ్రకులాలు తమరిదొక్కరిదే ఙ్ఞానమని, విద్య అనీ, మతమనీ ఇతరులందరినీ బ్రిటీషువారిలాగే సంస్కరించే వైట్ మ్యాన్స్ బర్డేన్ తమ మీద ఉందనీ భావించడం మొదలు పెట్టారు. ఇతర సంస్కృతుల్ని అంటరానివిగా చూడడం కాక, వాటిని మొత్తంగా నిర్మూలించి, వాటి స్థానంలో తాము సంస్కృతీ, మతం, నాగరికత అనుకున్నదాన్ని బలంగా ప్రతిష్టించాలని వారు భావించారు. ఈ భావనలకి    అత్యాధునిక ప్రతిధ్వనులే గోగినేని బాబు, హెచ్చార్కే, రంగనాయకమ్మ. వీరిది నాస్తిక మతం. ఎథీస్ట్ ఫండమేంటలిజం. గోగినేని బాబు గద్దరు అనే ప్రజా గాయకుడు శివుడ్నీ, బసవడ్నీ సమానత్వ భావాలకి నిలయంగా భావించి పాట రాసినందుకు తీవ్రంగా నిందిస్తాడు. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతంలో అబ్స్ట్రాక్ట్ విశాల దృష్టినన్వేషిస్తాడు. హెచ్చార్కే కులమతాలు పోవాలనీ, తానే మైనారిటీననీ అంటాడు. రంగనాయకమ్మ బ్యాక్ టూ మార్క్స్ అంటుంది. అంటే తనలోనూ, మార్క్స్ లోనూ తప్ప అన్ని చోట్లా లోపాలే ఉన్నాయని అంటుంది.   ఇంతవరకూ లోపాలు లేని వ్యక్తులు, వ్యవస్థలు, సంఘాలు బయట ఎక్కడా ఉదాహరణగా నిలచి లేవు కనుక తన హృదయంలోని మార్క్స్ కలగన్న సమాజం కోసం జపం చేస్తూ ఉండాలని బోధిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళు నిర్మించుకున్న అబ్స్ట్రాక్ట్ ఏకాంత మందిరంలో లోపాలు, పక్షపాతాలూ ఏవీలేని స్వచ్చమైన నాస్తిక మతంలో నాస్తికతనే దేవుడిగా ఆరాధిస్తూ జీవిస్తారు. ఈ స్వచ్చతని పాటించడం కోసం అన్ని మతాలకీ, అన్ని కులాలకీ సమదూరం పాటిస్తున్నట్టూ నటిస్తారు.

 

 

నట సామ్రాట్

నీ ఇంట్లో అరలెన్నో మరలెన్నో

నాకు తెలుసు నాకు తెలుసు

నీ పాత్ర చిలుం పట్టింది తోముకో

-మహాస్వప్న

 

 

*

సయొనర ఇక.. చెరిగేనా?

 

 

-ఆర్.  దమయంతి 

~

 

‘మన భాషని మనం గౌరవించుకోకపోతే ఎంత తప్పో, మాతృ భాషలో కొన్ని అగౌరవ పదాలని సరిది ద్దుకోపోతేనూ  అంతే తప్పు ‘అని ఋజువు చేస్తున్నారు – కొన్ని దేశాల  ప్రజలు.

ఇక మన మాతృ భాష మాటకొస్తే – మనం మాట్లాడే తెలుగుభాషలో తెలుగుదనమెంత అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్నే. ఈ అంశం పై వాదించుకుంటూ పోతే ఒక యుగమైనా సరిపోదు.

చాలా తెలుగు పదాలు మరుగున పడిపోయిన మాట వాస్తవం. నేను చెప్పేది కేవలం మాట్లాడే మాటల్లో ధ్వనించే భాష గురించి. ఇక రాయడం లో ఐతే – భాష ఎంత సహజం గా వుంటే అంత హాయిగా, సౌకర్యం గా  వుంటుంది చదువరులకు అనే అభిప్రాయానికొచ్చేసాం.

తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకుని కథో, వ్యాసమో తయారు చేసినా..అది అతుకుల బొంత లానే వుంటుంది. అక్కర్లేని ఆర్భాటాలతో –  పెళ్ళి చూపులనాడే పెళ్ళి కూతురిలా తయారై వచ్చిన అమ్మాయి అసందర్భపు అలంకరణ లా ఎబ్బెట్టనిపిస్తుంది. అఖ్ఖర్లేని ఆ ఫోజు లో –  రచనలోని భావం అడుగంటిపోయి చికాకు పుట్టిస్తుంది. పర్యవ సానం గా – పుస్తకం మూత పడిపోతుంది.

ఇంగ్లీష్ పదాలు నాలుగు ఎక్కువేసినా ముందుగా మనకు ఎదుటివారి భావం  అర్ధం కావాలి..

ఉదాహరణకి : ” – ఆమె ఇన్వైట్ చేస్తే పార్టీ కెళ్ళాను. కలిసి డిన్నర్ చేసాం. ఓకే? చిట్ చాట్ చేసుకున్నాం. ఏవో జెన్రల్ టాపిక్స్. అంతా అయ్యాక,  కారులో ఆమెని ఇంటి దగ్గర దింపాను. ఓకే?  ఒకరి కొకరు బై బై , గుడ్ నైట్లు చెప్పుకుని విడిపోయాం. అంతే. దట్సాల్. ” అని అన్నాడురా. ఇదంతా నాకెలా తెలిసిందంటే..నిన్న ‘ఈవినింగ్’ శ్యాం కలిసి చెప్పాడు. అంతకు మించి – తమ ఇద్దరి మద్య ఏమీ జరగలేదు, ‘డొంట్ వర్రీ’ అని కూడా అభయమిచ్చాడు.” –

” ఒహ్హో!.. కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పొద్దనూ! ‘ ఎగ్జాక్ట్లీ వాట్ హాపెండ్’ అన్నది నాకు తెలుసు. – ” సెటైరేశాడు సోమనాధం.

ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళు తెలుగు ని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారన్న సంగతి గురించి. :-)

వినేటప్పుడు భలే ఆసక్తి కరం గా వుంటుంది. ఆ తర్వాత ఏమైందా అనేంత ఉత్సుకత రేగుతుంది.

కానీ ఇదే సన్నివేశం కథలో రాసేటప్పుడు కొంత ఆంగ్ల భాగం వెళ్ళి పోతుంది. మరి కొంత తప్పని సరి గా మిగులుతుంది. కారణం, ఆంగ్ల పదాలకు సరితూగు పదాలు మన భాషలో లేక కాదు. కాని అవి అతకవు.  కొన్ని సార్లు చాలా ఇబ్బంది పెడతాయి.  కారణమేమిటంటే –  ఆంగ్ల పదాలు  మన నోట్లో ఎక్కువగా నానడం వల్ల, సంభాషణల్లో ఎడా పెడా అతిగా ఆంగ్లం వాడటం వల్ల. వాగడం వల్ల కూడా! ఇంగ్లీష్  మీడియం లో చదువులు ఎక్కువైపోవడం వల్ల… – పాఠకులకు స్వచ్చమైన తెలుగు మింగుడు పడదు. కాబట్టి రచనల్లో ఆంగ్ల పదాలకు  చోటివ్వడం తప్పనిసరైపోతోంది.

అదే అలవాటైపోయింది. రాన్రాను ఈ పోకడ ఇంకా ఎక్కువైపోతోంది కానీ తగ్గడం లేదు. ఒక తెలుగు పదానికి బదులు ఆంగ్ల పదం జేర్చడం వల్ల రచన వన్నె తేలే అవకాశమూ లేకపోవట్లేదు.

sayanora..

మన మైథిలి గారు – ‘అబ్సెషన్’ కి సమానార్ధం కల తెలుగు పదాన్ని సూచించవలసిందిగా కోరారు. అందరం తలో ఒక అర్ధం చెబుతున్నాం కానీ ఇంకా అసలు అర్ధం చేజిక్కలేదు.

కారణం? –

“అబ్సెషన్ అంటే..అబ్సెషనే ఇంకేముంటుంది?”-  అని విసుక్కుంటూ కనిపిస్తున్నారు మా ఇంగ్లీష్ లెక్చరర్. (ఆయన్ని కష్టమైన పదాలకు తెలుగు చెప్పమని అడిగినప్పుడల్లా ..నొసలు చిట్లించి ఇలా.. అంటుండే వారు. ఆయన డైలాగ్ గుర్తొచ్చి నవ్వొస్తోంది.)

అంటే రచనల్లో చాలా ఆంగ్ల పదాలొస్తున్నాయంటే మరి – ఆ యా స్థానాల్లోంచి – తెలుగు పదాలు       తప్పుకుంటున్నట్లే కదా.  వాడుకలో- విస్తృత  తగ్గినట్టే కదా! అందుకేనేమో ‘అలు, అలూ’ – అక్షరాలకి స్వస్తి పలకడం జరిగింది?

మాటల్లో నువ్వెన్ని సార్లు  రోడ్డు రైల్ అనే పదాలు వాడవన్నది నా వాదన కాదు. వాటిని  తెలుగు లో రాయడం లేదెందుకన్నది  అసలు పాయింట్.

రాస్తే చదవబుధ్ధి కాదు. (వ్యక్తిగతం గా చెప్పాలంటే నేనెప్పుడూ రోడ్  అనే రాస్తుంటాను) ఎందుకంటే – ఎక్కడో        అసహజత్వం  కొట్టొస్తూ కనిపిస్తుంది – తెలుగు లో.  పంటి కింద రాయి లా  కసుక్కు మంటుంది. ఇక పాఠకుని పరిస్థితి ఎలా వుంటుందంటే –  కాల్లో ముల్లు గుచ్చుకున్నాక చెప్పులేసుకుని నడవడం లా వుంటుంది. ‘ఇది ఇలానే వుంటుంది. నువ్వు భరించాలి. మన భాష కి వంకలు పెట్ట కూడదు. నొప్పున్నా భరించాల్సిందే ..’ అని చెప్పలేం కదా పాఠకులకి.

మన పెరటి చెట్టే కదా అని,  వేపాకు పచ్చడి చేసుకుని తినలేం. ఇది సత్యం. నేననుకుంటూ ఉంటాను. మనం మనం అని కులానికో మతానికో ప్రాంతానికో దేశానికో జాతి వివక్షత కో ఓటేసుకుని తృప్తి గా బ్రతికేస్తున్నామని. కానీ..అంతర్లీనంగా మనం జీవిస్తోంది వేరే ప్రపంచం లో.  మనం నిజంగా మెచ్చుకుని హృదయంతో స్వీకరించేది  సౌందర్యాన్ని. సౌందర్యారాధనలో విశ్వమంత హృదయాన్ని కలిగి వుంటాం. అందులోనే శాంతిని పొందుతాం. గీతాంజలి రాసింది బెంగాలీ అని ఊరుకుంటామా?  సోక్రటీస్ గ్రీక్ అని వొద్దనుకుంటామా? షేక్స్పియర్ ని కళ్ళకద్దుకున్నా, మిల్టన్ ని మనసులో కొలుచుకున్నా..మాతృ భాషకి సంబంధించిన వారనా? కాదు.

muslim women

సాహిత్యం లో మనకు భాషా భేదాలు లేవు. సుందరమైన ఏ సాహిత్యాన్నైనా అవలీలగా ప్రేమించేస్తుంటాం. ఆరాధిస్తాము అంటే అర్ధం – అందులోని భావ సౌందర్యానికి మనం  బానిసలం అన్నమాట.

అంటే – మన మాతృ భాషని వదిలేయం. కానీ నచ్చిన పర భాషా పదాలెన్నైనా సరే..ఇష్టం గా అక్కున చేర్చుకుంటాం.అది నిన్నటి వరకు జరిగిన సంగతి.

నేడు జరుగుతున్న కొత్త సంచలన సత్యం ఏమిటంటే – మాతృ భాష ఎంత ప్రియమైనదే అయినా.. అందులోని కొన్ని పదాలు – ప్రమాదాలకు దారి తీస్తున్నప్పుడు వాడుకలోంచి బహిష్కరించడమే శ్రేయస్కరం అని పట్టు బడుతున్నారు ప్రజలు.  తీసేయకపోతే – బ్రతుకు లేదన్నంత గా వ్యధ చెందుతున్నారు.  కారణం – మాతృ భాషా పదాలు తమ జీవన విధానానికి ఆటంకం గా వుంటం వల్ల, అసలు జీవితమే లేకుండా చేసేస్తున్నందు వల్ల. – ఏమిటీ? భాష పుట్టినప్పట్నించీ వాడుకై, వేయి నోళ్ళ పాకిన పదాలు ఉచ్చరించినంత మాత్రానే పాపం కలుగుతుందా అని  విస్మయం కలగ వచ్చు. కాని, ఇది నిజం.

‘మాతృ భాషే అయినా ఇక నించి ఈ  పదం మేం వాడం. రేపట్నించీ-  మావూలు గా మేం మాట్లాడుకునే మాటల్లోకి సైతం రానీయం.’ అని ఒట్టేసుకుంటున్నారు ప్రజలు.  పై పెచ్చు ఏమంటున్నారంటే – ‘..’ ఈ ఫలాని మాట చేర్చి మాట్లాడటం మాకు సిగ్గు గా వుంది. తలొంపులుగా వుంటోంది.  పెద్దలు ఏమన్నా అననీ, అనుకోనీ, మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ పలుకు ఎంత పవిత్రమైనదైనా సరే, అదెంత శిలా శాసనం లాంటిదైనా సరే మాకిక వద్దే వొద్దంటూ మొత్తుకుంటున్నారు. దయచేసి మతపెద్దల అంగీకారంతో  ఈ పదాన్ని రద్దు చేయండి.  తొలగించండి. వాడుక నించి బహిష్కరించండి. మాకు విముక్తిని ప్రసాదించండి.’ అంటూ వేడుకుంటున్నారు. పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అదొక చట్టం గా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇది అధిక శాతం స్త్రీల ఆకాంక్షకి నిదర్శనం’ అంటూ కొన్ని లక్షల సంతకాలను సేకరిస్తున్నారు – ముస్లిం వనితలు.

అంత గా వారి పాలిట శాపమైన పదం ఒక్కటే  – త లా క్.

ఆవేశం లో ఈ ఒక్క మాటని 3 సార్లు  పలకడం వల్ల కలిగే దుష్పరిణామం ఎంత విషాద కరం గా వుంటుందో వుంటుందో

– ఒక మరపు రాని సినిమాగా మలిచారు నిర్మాత.  అదే – నిఖా.

https://www.youtube.com/watch?v=00F9HJlCzs8

 

మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల ఆత్మ పరిశుధ్ధి జరుగుతుంది.

దేవుడంతటి వాడు – తల్లి కోరితే జ్ఞాన బోధ చేసాడు.

‘తల్లి తర్వాత తల్లి వంటింది అయిన మన మాతృ భాషని కూడా సరిద్దుకోవడం లో తప్పు లేదు…’ అని నేననడం లేదు. జపాన్ ప్రజలు ఘోషిస్తున్నారు.

ఇలాటి బాధే జపాన్ ప్రజలకూ కలిగింది. వాళ్ళు వొద్దనుకుంటున్న ఆ పదం ఏమిటంటే – సయొనర.. ‘

భారతీయులకిది జపనీయుల భాష అనిపించదు. ఎందుకంటే మనకంత పరిచయమైనపదం. ఎలా అంటే – ‘సయొనర.. సయొనర ‘ అంటూ లతా మంగేష్కర్ స్వరం దేశం నలుమూలలా మార్మ్రోగి పోయింది కాబట్టి. సయొనర ఖ్యాతి అలాంటిది. ఐతే- అది నిన్నటి మాట. ఇప్పుడు తాజాగా – జపాన్ దేశ ప్రజలు – 70 శాతానికి పైగా  ఏమంటున్నారంటే – అసలీ సయొనర  ఊసే ఎత్తొద్దని వాపోతున్నారు.

ఈ పదం పట్ల అంత వ్యతిరేకత వెల్లువెత్తడానికి కారణం?  ఈ పదార్ధం – నెగిటివిటీని సంతరించుకుందని మూకుమ్మడిగా అభిప్రాయపడుతున్నారు.  వీరిలో యువత ప్రాముఖ్యత ఎంతైనా వుందని చెప్పాలి.

‘సయొనరా  – అంటే గుడ్ బై అని అర్ధం. ఇది తాత్కాలికమైన గుడ్ బై వంటిది కాదు,  ‘శాశ్వతంగా ఇక సెలవ్’ అనే అర్ధం తో కూడి వుందట.

గుడ్ బై టు సయొనర :

********************

* నాకీ పదం పలకడం ఇష్టం వుండదు. ఎందుకంటే మా కలయిక – ఈ మాటతో అంతమై పోతోందన్న బాధ కలుగుతుంది.

 

* సయొనారా చెప్పుకోవడం తో ఏమనిపిస్తోందంటే ఇక మేము మళ్ళీ కలవమేమో అనే కలవరాన్ని కలిగిస్తోంది. అందుకే, నేనిక ఆ మాటని నేనిక ఉపయోగించ దలచుకోవట్లేదు. సయొనర-  ఇదొక  కోల్డ్ వర్డ్ అనే భావన కలుగుతుంది.

* ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, మిత్రుల దగ్గర కానీ సయొనర కి బదులు నేనెప్పుడూ ‘సీ యు లాటర్’ అనే అంటాను తప్పితే, సయొనర అని అననే అనను.

 

ఇలా – మొత్తం మీద జపాన్ ప్రజలు ఎంతో పూర్వమైన ఈ పదానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఎలా అంటే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ బై కి బదులు ఫేర్ వెల్ అని ఎలా అనరో – జపనీయులు కూడా ఇక మీదట  బైబైలే చెప్పుకుంటారట గానీ, తమ మాతృ భాషా పదమైన సయొనర ని నాలుక మీద రానీయమని నిర్ధారిస్తున్నారు.  అయినా, రేపు తిరిగి కలవబోతున్న ప్రియమైన వారితో సయొనర అని అంటమేమిటీ అర్ధం లేకుండా? అని ఆ పదం పట్ల తమ అయిష్టాన్ని మాటల్లో వెళ్ళగక్కుతున్నారు.

సయొనర అంటే వెంటనే గుర్తుకొచ్చేది జపాన్. భాషా చెక్కిలి మీద ఒక చక్కని సంతకమైన పదం భాషలోంచే తొలగిపోవడం ఎంతైనా విచారకరం. కానీ ప్రజలు వాదుకలో వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరైనా చేయగలిగేదేముంటుందనీ?

ప్రాచీన ఈ  జపనీ పదం ఇక గాల్లో కలిసిపోవాల్సిందేనా అనే బెంగా లేకపోలేదు మాతృ భాషా ప్రియులకి. నిజమే కావొచ్చు. ఎవరూ తిననప్పుడు ఆ పదార్ధం  ఎంత  తీయటి పాయసమైనా వండీ, వృధానే కదా!

అయితే స్వభాషలో సయొనర కి ప్రతి గా ఏమిటా అనే  ప్రశ్న తలెత్తక మానుతుందా?

ప్రజలకిష్టమై ఆమోదించిన పదమే ప్రజా పదం. అదే భాషా పథం. ఏ దేశ భాషా సంస్కృతి కైనా ఇదే సిధ్ధాంతం వర్తిస్తుంది.

ఆ మాట కొస్తే మన తెలుగు లో ఎన్ని సాంప్రదాయపు మాటల్ని మనం మానేశామని? మాటల్లోను, రాతల్లో నూ? (ఒకప్పుడు చాలా వాడుకలో వున్నవి, ఇప్పుడు మాయమైనవి ఒక  లిస్ట్ చేసుకుని చూసుకుంటె – ‘ ఔరా! ఎంత మార్పు’ అని అనిపించక మానదు. )

మనం మోసుకెళ్తున్న మాతృ భాష అనే బంగారపు మూటలోంచి  ఒక్క పదం జారి పడినా ఊరుకోవద్దు, సరే. కానీ, ఎన్ని పర భాషా పదాలొచ్చి చేరనీ, – మానుకోవద్దు. అంగీకరిద్దాం.

ఏమంటారు?

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నవల నడచిన దారి

 

 

-దాసరి అమరేంద్ర

~

 

మొదటి తెలుగు నవల వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రము – 1878లో వచ్చింది, దాదాపు నూట నలభై ఏళ్ళ క్రితం.

కథ జీవితపు తునక అయితే నవల ఏకంగా జీవితమే.

జీవితం గురించీ, సమాజం గురించీ తపనపడే నవలల గురించి ఈ మాటలు.

జీవితానికీ సాహిత్యానికీ గాఢమైన అనుబంధం ఉన్నది అన్న నమ్మకంతో ఈ మాటలు.

గత నూట నలభై ఏళ్ళలో నవల పోయిన పోకడలూ, ధోరణుల గురించీ, గత ఇరవై ఏళ్ళలో వచ్చిన ముఖ్యమైన నవలల గురించీ, ఈ మధ్య కాలంలో మంచి నవలలు రావడం లేదు అన్న విషయం గురించీ – అందుకు కారణాల గురించీ ఈ మాటలు.

స్థూలంగా చెప్పాలంటే నవల నడచిన దారిని రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమిది.

***

ఒకప్పుడు సాహిత్యమంటే పాండిత్య ప్రకర్ష.

రాజులూ, జమీందార్ల వ్యవస్థకు వందిమాగధ ప్రక్రియ. వారి వారి మనోరంజక వ్యాసంగం.

భూస్వామ్యం విచ్చిపోతూ, ప్రజాస్వామ్యానికి దారి ఇచ్చినప్పుడు సమాజంలో ‘మనిషి’ ముఖ్యమయ్యాడు. సాహిత్యానికీ, మనిషే కేంద్రమయ్యాడు. స్వంతంగా, స్వశక్తితో తన జీవితాన్ని నిర్ణయించుకొనే మనిషిని గురించి సాహిత్యం రాసాగింది. అందుకు అనుకూలంగా ఉందే సాహితీ ప్రక్రియలు రూపుదిద్దుకొన్నాయి. కావ్యాలూ, ప్రబంధాల స్థానంలో కథ, నవల వచ్చి చేరాయి. ఆంగ్ల సాహిత్యంలో పద్దెనిమిదో శతాబ్దంలో మొదలయితే, మరో వందేళ్ళకు భారతీయ భాషలలోకి ప్రవేశించి నిలదొక్కుకుంది నవల. ఈ ప్రక్రియకు జన జీవితమే వస్తువయింది. నవల అంటే జీవితానికి ప్రతిబింబం అయింది.

***

ముందుగా రెండు ప్రశ్నలు.

నవలలు ఎందుకు రాస్తారూ?

నవలలు ఎందుకు చదువుతారూ?

ఏ మనిషిలో అయినా ఒక నిరంతర అసంతృప్తి ఉంటుంది.

పరిసరాల మీదా, పరిస్థితుల మీదా, సమాజం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది.

పరిస్థితి మారాలనుకొంటాడు. మార్పు కోరతాడు. ఆ మార్పు ముందుకూ అవవచ్చూ, వెనకకూ అవవచ్చు. మార్పు కోరతాడు. అందుకోసం తపన పడతాడు.

చలనశీలత ఉన్న వ్యక్తి ఆ మార్పు కోసం నడుం కడతాడు. తనదైన పరిధిలో ఏదో ఒకటి చేస్తాడు – నిర్లిప్తంగా ఉండలేడు.

ఆ మనిషికి తన ఆలోచనల మీదా, అక్షరాల మీద ‘అధికారం’ ఉంటే రచయిత అవుతాడు.

పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఘర్షణ పడుతూ, జీవితాలను మెరుగుపరచాలని తపిస్తూ, ఆయా సమస్యల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూ, రెబెల్‌గా మారి –

తన అనుభవాలకు తనదైన చైతన్యం జోడించినప్పుడు జీవితాన్ని నడిపించే సూత్రాల గురించి అవగాహన ఉన్నప్పుడు, గతం ఆసరాగా వర్తమనం భవిష్యత్తు వేపుకు వెళుతుంది అన్న అవగాహన కలిగినప్పుడు,

తనదంటూ ఒక దృక్కోణాన్నీ, దృక్పథాన్నీ ఏర్పర్చుకొన్నప్పుడూ – రచయిత అవుతాడు. నవలా రచయిత అవుతాడు.

మరి చదవడం?

novel6

నేను ఒక గాఢ అనుభూతి కోసం ‘హిమజ్వాల’ పదే పదే చదివాను. ఒకానొక జీవితానుభవం కోసం ‘చదువు’ నవల చదివాను. విభిన్నంగా ఆలోచించగల శక్తినిచ్చే చెలాన్ని చదివాను.

విజ్ఞానమూ, సంస్కారాల కోసం ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె’ లోని శాంతం, శుభ, లక్ష్మిలను పలకరించాను.

ఒక్కమాటలో చెప్పాలంటే జీవితపు చిక్కుముళ్ళు విప్పే శక్తి సాహిత్యానికీ, నవలలకూ ఉంటుందని చదివాను.

జీవితాలను సమూలంగా మార్చి, జీవితాలకు దిశానిర్దేశం చేసే శక్తి ‘జానకి విముక్తి’లకు ఉంటుందని చదివాను.

నా వరకూ నాకు ‘ది మూన్ అండ్ సిక్స్త్ సెన్స్’ అనే ఆంగ్ల నవల దీపస్తంభంలా నిలబడి దారి చూపించడం – స్వానుభవం.

ఒకే ఒక్క జీవితకాలంలో అనేకానేక జీవితాల అనుభవాలను మనకు అందించే శక్తి నవలకు ఉందని చదివాను.

ఈ నేపథ్యంలోంచి చూస్తే తెలుగు నవల నడచిన దారిలో కూడా సమకాలీన జన జీవితంలోని అన్ని పార్శ్వాలు, కోణాలూ, సంఘర్షణలు, పరిణామాలు కనిపిస్తాయి.

నూటా ఏభై ఏళ్ళ తెలుగు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చరిత్రను మన నవలలు మన ముందు ఉంచుతాయి.

***

ప్రభువుల వ్యవస్థ మారి సామాన్యుడు సాహిత్యానికి కేంద్రబిందువవడం గురించి చెప్పుకొన్నాం. ఆంగ్ల సీమలో పద్దెనిమిదో శతాబ్దానికల్లా కథా నవలా వికసించడం గురించి చెప్పుకొన్నాం.

పంతొమ్మిదో శతాబ్దం ప్రథమ పాదానికల్లా ఆయా మార్పులు మన దేశాన్నీ తాకాయి. ఇంగ్లీషు చదువు మొదలైంది. రాజారామ్‌మోహన్ రాయ్, అతని సంస్కరణలు మనిషికీ, సమాజానికీ వెలుగుబాట పరిచాయి. అదే ఒరవడిలో అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగార్, ఇక్కడ కందుకూరి వీరేశలింగం.

యాదృచ్ఛికమే అనిపించినా తెలుగునాట అదే సమయంలో అతి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రెండు ఆనకట్టల పుణ్యమా అని సామాన్యుని కడగండ్లకు తెరపడింది. కడుపు నిండింది. సంపద సృష్టి ఆరంభమైంది. పట్టణాలు మొలకెత్తాయి. ఇంగ్లీషు పాఠశాలలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలకు అంకురార్పణ. కొత్త చైతన్యాలు… పరిస్థితుల మీద అసహనం… మార్పు కోసం తపన… సంస్కరణల అభిలాష…

అదిగో – అలాంటి సమయంలో వచ్చాయి తొలి తెలుగు నవలలు.

రాజశేఖర చరిత్రము – వీరేశలింగం – 1878

సహజంగానే ‘సంస్కరణ’ ఈ నవల ప్రధానాంశం. రాజశేఖరునునికి తన అజ్ఞానమంటే అసహనం కలుగుతుంది. తనలోని మూఢ విశ్వాసాలంటే ఏవగింపు కలుగుతుంది. తనలో తాను సంఘర్షించడం, పోరాడడం, జయించడం…

అదే కోవలో మరో నవల – రామచంద్ర విజయం – చిలకమర్తి.

రాజశేఖరుని సంఘర్షణ తనతోనే అయితే, రామచంద్రుని పోరాటం పక్కవాళ్ళతో, వాళ్ళ స్వార్థాలతో, పరిసరాలతో.

మనిషి తనను తాను సంస్కరించుకొంటే, పరిసరాలను మార్చే ప్రయత్నం చేస్తే పరిస్థితులు మారతాయి, ప్రపంచం మరింత బాగుపడుతుంది – అన్న నమ్మకంతో వచ్చినవీ – సంస్కరణ దశలోని నవలలు.

***

క్రమక్రమంగా – వ్యక్తి చైతన్యం, మనుషులు దగ్గరవడం, ఉమ్మడి ఎజెండాలు. 1885 నాటికి ఆ ఎజెండాలు కాంగ్రెసు సంస్థ ఆవిష్కరణకు దారితీయడం… జాతీయ భావాలు… శతాబ్దం మారేసరికి జాతిలో నవచైత్యన్యం.

ఈలోగా నవలకు తోడుగా కన్యాశుల్కాలు, ధనత్రయోదశిలు, దిద్దుబాటులు… వలపు నవలలు, చారిత్రక నవలలు, దుర్గేశ నందిని నకళ్ళు… ఏదైమైనా సాహిత్య ప్రక్రియగా నవల నిలబడటం…

సంస్కరణ బావాలకు ఉద్యమ స్ఫూర్తి తోడయితే నవలలకు కొదవ ఉండదు. అదే జరిగింది తెలుగు నవల విషయంలో.

1920ల నుంచి కనీసం 1960ల వరకూ జాతీయ ఉద్యమ నేపథ్యంగా ఎన్నో చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి.

అందులో బాలాంత్రపు వెంకటరావు రాసిన “మాతృమందిరం” – 1920 తొలి తెలుగు జాతీయోద్యమ నవల అంటారు చరిత్ర తెలిసినవారు. అందులోని ‘మాతృ’ శబ్దం మాతృ దేశానికి సంబంధించినది. గాంధీ ప్రతిపాదన కన్నా ముందుగానే మద్యపాన నిషేధం, హరిజన సమస్య, స్త్రీల సమస్యలు, వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు – ఇలా అనేకానేక విషయాలు చర్చించిదట ఈ నవల.

1922లో వచ్చిన మాలపల్లి ఈ ఒరవడిలోణి ఓ బృహన్నవల. జీవన విస్తృతి, వస్తు గాఢత ఉన్న నవల. భారతీయ సంప్రదాయం పట్ల ఎంతో అనురక్తి ప్రదర్శిస్తూ, ఆ సంప్రదాయం భౌతిక పరిస్థితులలో ఎన్ని మార్పులు వచ్చినా – ఆ మార్పులకు అనుగుణంగా తననూ ముందుకు నడిపించుకొంటోంది అన్న గొప్ప నమ్మకాన్ని వ్యక్తీకరించారీ నవలలో ఉన్నవ లక్ష్మీనారాయణ.

 

సరే రామదాసు, సంగదాసు, తక్కెళ్ళ జగ్గడు లాంటి సజీవ పాత్రలూ, గాంధీతత్వపు ప్రతిఫలన, జన జీవన సమగ్ర చిత్రణ – దాదాపు వందేళ్ళు గడిచినా ‘మాలపల్లి’ని తెలుగు నవలలకు తలమానికంగా నిలబెట్టడం అందరికీ తెలిసిన విషయమే.

మాలపల్లి నవలలో మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.

సమాజంలోనూ, సామాజిక సంబంధాలలోనూ వస్తోన్న స్ఫుటమైన మార్పుల్ని ఆ నవల పట్టుకోగలిగింది. కొత్త చూపు, కొత్త దృక్కోణం, కొత్త దృక్పథం. సమాజాన్ని వ్యక్తిపరంగా గాకుండా సమిష్టి వ్యవస్థగా అర్థం చేసుకొని విశ్లేషించడం – దిగువ జాతులు చైతన్యం పొంది పోరాటం సాగిస్తేనే ప్రజా ప్రభుత్వం సాధ్యమవుతుంది. అలా కాని నాడు ధనస్వామ్యమే చెల్లుబాటు అవుతుందన్న అద్భుతమైన అవగాహన – వందేళ్ళ క్రితం!!

ఇదే ఒరవడిలో బాపిరాజు నారాయణరావులోనూ, విశ్వనాథ వేయిపడగలులోనూ జాతీయోద్యమం ఒక ప్రధాన పాత్ర పోషించింది. ‘అతడు-ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’, ‘రామరాజ్యానికి రహదారి’, ‘చదువు’ లాంటి నవలల్లోనూ జాతీయోద్యమ నేపథ్యం ప్రముఖంగా ఉంది.

అదే వలస పాలన, జాతీయ భావన, ఆధునిక జీవన విధానం – ఇవి ముప్పేటగా సాగుతోన్న సంధి దశలో – 1930లు నలభైలలో – ఈ విషయాలను చర్చిస్తూ, సంప్రదాయంలో వస్తున్న మార్పుల్ని గుర్తిస్తూ నవలా రచన సాగింది. ఉన్నవ లాంటి వాళ్ళు ‘సంప్రదాయం నిలిచి తీరుతుంది’ అంటే, విశ్వనాథ ‘ధ్వంసమయిపోయింది’ అని నిర్ధారించడం – వాస్తవ స్థితి చిత్రణ అనడం కంటే వారి వారి దృక్కోణ వైరుధ్యం అనడం సరైన పని.

ఈ మధ్యలో కొవ్వలి వెయ్యికి పైగా పాపులర్ నవలలు రాసి తెలుగు నవలలకు పాఠకులను ఏర్పరచడమన్నది నవల నడచిన దారిలో ఒక ముఖ్యమైన మైలురాయి.

***

స్వతంత్ర్యం వచ్చాకా సామాన్యుని జీవితం ఎలా పరిణమించింది? సాంఘిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆర్థిక, రాజకీయ, పరిణామాల దిశ ఎటువైపు మళ్ళుతోంది? – అన్న ఆలోచన సాహితీకారుల్లో సహజంగానే వచ్చింది. ఆయా విషయాలను నవలలో చిత్రించే ప్రయత్నమూ జరిగింది.

1953లో వచ్చిన జీవీ కృష్ణారావు గారి ‘కీలుబొమ్మలు’ ఆ కోవకు చెందిన నవలల్లో మొట్టమొదట చెప్పుకోదగ్గది.

ఇది ప్రధానంగా అస్తిత్వవాద పోకడలున్న నవల అని విమర్శకులు నిర్ధారించినా – సమకాలీన జీవిత చిత్రణా, రాజకీయాలన్నవి ఏదో అధికార పీఠాలకు చెందినవి కావు – అవి సామాన్యుని జీవితంలోని అన్ని పార్శ్వాలను తాకుతాయి అన్న బలమైన ప్రతిపాదానా ఉన్న నవల ఇది.

ఆ తాకటం మనిషిని ఎంతగా దిగజార్చుతుందో 1961లో వచ్చిన బలివాడ కాంతారావు ‘దగాపడిన తమ్ముడు’లో కనిపిస్తుంది. 1940 వ దశాబ్దపు చివరి పాదంలో నడిచిన ఈ కథలో సన్నకారు రైతులు పట్నపు కూలీలుగా మారడమూ, చివరికి బిచ్చగాళ్ళుగా దగాపడడమూ బలంగా చూపించిన నవల ఇది.

ఇదే ఒరవడిలో 1969 నాటి బీనాదేవి ‘హేంగ్ మీ క్విక్’ లో రాజమ్మ ఉరిశిక్ష కోసం త్వరపడుతుంది. 1975 నాటి అర్నాద్ ‘చీకటోళ్ళు’ లో అదే పరిణామం మరింత బలంగా కొనసాగడం కనిపిస్తుంది. అరవైలలో వచ్చిన రావిశాస్త్రి నవలల్లో పట్టణాల పేద ప్రజల కన్నీళ్ళు, కడగండ్లూ – వ్యవస్థ ఆ కన్నీళ్ళతో ధనస్వామ్యపు పంటలు పండించడం – స్పష్టంగా తెలుస్తుంది.

పట్టణీకరణ తెచ్చిన మార్పుల గురించీ, అవి మానవ సంబంధాలలో తెస్తోన్న విపరీత పరిణామాల గురించీ, జీవితాలలో ధనమూ, స్వార్థాల ప్రమేయం గురించీ మాలతీ చందూర్ లాంటి వాళ్ళు 1950ల నుంచి రాయడం మొదలుపెడితే, అప్పుడే రూపుదిద్దుకొంటోన్న మధ్యతరగతి వారి జీవితాల గురించీ అందులోని స్వార్థాలూ, త్యాగాలూ, సంవేదనల గురించీ, అరవైల తొలి దినాలలో కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ వచ్చింది. మరో పదేళ్ళకు కొలిపాక రమామణి ‘ఏటి ఒడ్డున నీటి పూలు’…

novel4

***

అటు తెలంగాణా వేపు దృష్టి సారిస్తే బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయుడు’ (1947) నవలలో అప్పటికీ తనదంటూ ఉనికే లేని తెలంగాణా సామాన్యుడు నవలా వస్తువుగా రూపొందడం కనిపిస్తుంది. మరో పదేళ్లకు వచ్చిన వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’లో ఆ సామాన్యుడి ‘కంఠం’ ప్రస్ఫుటంగా ధ్వనిస్తుంది. మరో పదేళ్ళకు వచ్చిన దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ నవల – కథాకాలం 1930లకు చెందినదే అయినా – దొరలూ, గడీలూ, ఆడబాపల జీవితాలను కళ్ళకు కడుతుంది. మరో పదిహేనేళ్ళకు అల్లం రాజయ్య కొలిమి అంటించి జనజీవన కఠోరాలను ఆ మంటల వెలుగులో చూపించారు.

ఇటు ఉత్తరాంధ్రకు వస్తే అప్పటి రావిశాస్త్రీ, బలివాడ కాంతారావులకూ, ఇప్పటి అట్టాడ అప్పల్నాయుడికీ సామాన్యుని కతలూ, వెతలే నవలా వస్తువులు. సీమ వేపు వెడితే మధురాంతకం రాజారాం ఆనాడే సిరివాడ చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తే, మొన్న కేశవరెడ్డీ, నిన్న నామినీ తమ తమ నవలలకు దిగువ తరగతి జీవితాలనే ముడిసరుకుగా తీసుకొన్నారు. ఈనాటి మధురాంతకం నరేంద్ర తిరుపతి పట్టణంలో గత వందేళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా వేళ్ళూని విషవృక్షంగా పరిణమించిందో ‘భూచక్రం’ నవలలో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు.

***

తెలుగు నవల అంటే అనువాద నవలలను గుర్తు చేసుకోకుండా ఉండలేం. శరత్ తెలుగు వాడా? అన్నది ఏ మాత్రమూ సందేహం లేని ప్రశ్న. బడీ దీదీ మాధవి, దేవదాసు పార్వతి, శ్రీకాంతూ మన మనుషులయ్యారు. గోర్కీ అమ్మ స్ఫూర్తితో నవలలే వచ్చాయి. రాహుల్ సాంస్కృత్యాయన్‌ని చదవని తెలుగు యాత్రాప్రేమి ఉండడు. గోపీనాథ్ మొహంతీ అమృత సంతానం – మన గిరిజనుల గురించేగదా? ‘మరల సేద్యానికి’లో శివరామ కారంత్ చెప్పుకొచ్చిన సరస్వతీ, పారోతీ తెలుగువాళ్ళు గాదూ? ప్రేమ్‌చంద్, యశ్‌పాల్, జయకాంతన్, తజకి, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ, జమీల్యా, ఐతమతోవ్, నండూరి అనువదించిన ‘రెండు మహానగరాలు’; ఎన్నో ఎన్నెన్నో పరభాషా నవలలు తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి.

***

ప్రపంచమూ, సాహిత్యమూ, తెలుగు నవలలు మగవాడి చుట్టూ – అతని సమస్యలూ, పోరాటాల చుట్టూ తిరుగుతోన్న సమయంలో – స్త్రీలకు తమ తమ సమస్యలు లేవా? ఆకాంక్షలు లేవా? పోరాడాల్సిన విషయాలు లేవా? అన్న మౌలికమైన ప్రశ్నలను చలం 20లు, 30లలోనూ బలంగా బయటకు తెస్తే సమాజం ఉలిక్కిపడింది. తత్తరపడింది.

ఆ బాటలో మహిళా నవలాకారులు కొనసాగడం సహజ పరిణామం.

వట్టికొండ విశాలాక్షి 1956లో రాసిన ‘నిష్కామ యోగి’ నవలలో జాతీయోద్యమంలో పాల్గొనేంత చైతన్యమూర్తి అయిన ఓ మహిళ కూడా కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి నిస్సహాయురాలవడం కనిపిస్తుంది.

మరో ఏడాదికే వచ్చిన డాక్టర్ శ్రీదేవి నవలలో ఇందిర, కళ్యాణిలతో పాటు వసుంధరా వైదేహిలు కూడా వ్యవస్థను ప్రశ్నించి, నిలదీసి, కాలాతీత వ్యక్తులుగా నిలబడడం కనిపిస్తుంది. ‘సహవాసి’ అన్నట్లు తర్వాత వచ్చిన స్త్రీవాదానికి ఆనాటి సజీవవాదం ఈ నవల.

తెన్నేటి హేమలత ఆలోచనలూ, వ్యక్తీకరణలూ ఒక విలక్షణ మార్గంలో సాగితే, రంగనాయకమ్మ కూలిన గోడలు దగ్గర్నించి జానకి విముక్తి దాకా తానే ఒక మార్గం ఏర్పరిచారు. ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. ఓల్గా ఎనభైలలో రాసిన ‘స్వేచ్ఛ’ స్త్రీవాద నవలలకు కొత్త దీపస్తంభం అయింది.

మరో వేపు మాలతీ చందూర్, మాదిరెడ్డి సులోచన, ద్వివేదులు విశాలాక్షి, కె. రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి తమ తమ బాణీలలో మధ్యతరగతి స్త్రీల ఆలోచనలకూ, ఆకాంక్షలకూ, చైతన్యానికీ, వికాసానికీ కేంద్ర బిందువులయిన నవలలు రాసారు. ఇదే ఒరవడిలో సులోచనా రాణి ‘మీనా’ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించారు.

 

అదే సమయంలో స్త్రీ చైతన్యాన్నీ, అస్తిత్వ స్పృహనూ సంతరించుకొన్న ‘గీతాదేవి’ని మనకు పరిచయం చేసారు వడ్డెర చండీదాస్.

తెలుగు నవలా సాహిత్యంలో 1950లు, అరవైల నాటి తాత్త్విక, అస్తిత్వ, మనోవిశ్లేషణాత్మక నవలలు ఒక ముఖ్యమైన పాయ.

“మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూడాలి. ఉమ్మడి బతుకుల సిద్ధాంతాలు మనిషి ప్రత్యేకతని దెబ్బతీస్తాయి. మనిషిని యంత్రంగా చేస్తాయి. మనిషే ముఖ్యం.” అంటుంది అస్తిత్వవాదం.

“మనిషి అన్నివేళలా ‘సహజంగా’ ప్రవర్తించడు. అతనిలో అసహజ ప్రవర్తనా ఉండవచ్చు. దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వెతకాలి. ఆ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. అతనికి అప్పుడు సాయం చెయ్యగలుగుతాం” అంటుంది మనోవిశ్లేషణా మార్గం.

మనిషిలోని ఉపచేతన – సబ్ కాన్షియెస్- ను దాటి వెళ్ళి, సుప్త చేతన – అన్ కాన్షియెస్ – లోని భావధారను పట్టుకొనే ప్రయత్నం చేస్తుంది చైతన్య స్రవంతి ప్రక్రియ.

ఈ నవలా కుటుంబానికి తలమానికం 1946లో బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’. తన జీవితానికీ, తన ప్రవర్తనకూ తాను జవాబుదారీ కాదు అని భావించే దయానిధి అంతరంగపు పొరలలోకి వెళ్ళి ఆ ధోరణికిని ఆవిష్కరించే ప్రయత్నం ఎంతో సమర్థవంతంగా జరిగింది ఈ నవలలో. తర్వాత వచ్చిన శీలా వీర్రాజు ‘మైనా’ నవలకూ, చండీదాస్ ‘హిమజ్వాల’కూ ప్రేరణ అయింది ఈ చివరకు మిగిలేది నవల.

ఈ బాణీలో రావిశాస్త్రి అల్పజీవి రాసారు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర రాసారు. హిమజ్వాలా, మైనాల గురించి చెప్పుకున్నాం. ఈ నవలలోని అస్తిత్వవాదం, మనో విశ్లేషణా, చైతన్యస్రవంతి ప్రక్రియలను ముప్పేటలుగా సాగితే, ‘అంపశయ్య’ నవలలో నవీన్ చైతన్య స్రవంతి ప్రక్రియను పరిపూర్ణ రూపంలో దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే మనముందుంచారు.

***

ప్రతీకాత్మక నవలల గురించీ మనం చెప్పుకోవాలి.

రాజకీయాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రజాస్వామ్యం దున్న గురించి రాసారు వినుకొండ నాగరాజు. కిక్కిరిసిన బస్సును దేశానికి ప్రతీకగా మార్చి స్వర్ణసీమకు స్వాగతం అన్నారు మధురాంతకం మహేంద్ర. దళిత రాజకీయాలలోని విపరీత లక్షణాలను తనదైన బాణీలో ‘నల్ల మిరియం చెట్టు’లో ఆవిష్కరించారు చంద్రశేఖరరావు. అటు చాళుక్యుల కాలాన్నీ ఇటు రాజశేఖరుల ఆవిర్భావాన్నీ ఒకే నవలలో – వీరనాయకుడు-లో చూపించారు పతంజలి శాస్త్రి. సినిమా రంగపు జీవితాలను బట్టబయలు చేసి మనముందు నిలిపారు ‘పాకుడురాళ్ళు’లో రావూరి భరద్వాజ.

***

ఇక్కడ పాపులర్ నవలల గురించి ఒక్కమాట.

అరవైల ఆరంభంలో కౌసల్యాదేవి ఆరంభించిన చక్రభ్రమణం ఈ ఏభై అరవై ఏళ్ళతో నిరంతరాయంగా యండమూరి సులోచనల సాక్షిగా సాగిపోతూనే ఉంది. ఆ నవలలన్నీ తెలిసోతెలియకో వ్యవస్థకు వంతపాడే బాణీవన్న మాట నిజమే అయినా – ఆయా నవలలూ, రచనలూ పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. కొత్త కొత్త పాఠకులనూ, యువతరాన్నీ అక్షరాల వేపు ఆకర్షించాయి. ఇది అన్ని భాషలలోనూ జరిగింది, జరుగుతోంది.

 

***

తెలుగు నవలల్లో భాష నడిచిన దారిని ఓ మారు చూద్దాం.

తొలి నవలలు – సహజంగానే – శుద్ధ గ్రాంథికంలో నడిచాయి.

ఇరవయ్యో శతాబ్దపు తొలి దినాలు వచ్చేసరికి నవలల్లో సరళ గ్రాంథికం సామాన్యమయిపోయింది.

నలభైలకల్లా శిష్ట వ్యవహారికం, ఏభైల నుంచీ ప్రజలు మాట్లాడే వ్యవహార భాష నవలలకు ఆధారపీఠమయిపోయింది.

ఎనభైలు వచ్చేసరికి నామిని లాంటి వాళ్ళ పూనిక వల్ల మాండలికం సాహితీభాష అయింది. ఒప్పుదల పొందింది.

అయినా నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలను కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె సరళ గ్రాంథికంలో రాయడం, పదిమందినీ ఒప్పించడం – భాష విషయంలో పాఠకులకూ, రచయితలకూ, తెలుగు నవలా సాహిత్యానికీ ఉన్న పట్టు విడుపులకు ప్రబల నిదర్శనం అని చెప్పుకోవాలి.

***

చారిత్రక నవలలంటే ఏమిటీ?

జీవితమే నవలకు ముడి వస్తువు అయినప్పుడు ఒక రకంగా చూస్తే ప్రతి నవలా చారిత్రక నవలే. తన కాలపు సమాజానికి అద్దం పట్టే నవలే.

అయినా మనకు మొట్టమొదట్లో వచ్చిన చారిత్రక నవలలు సహజంగానే – రాజ ప్రశంస, రాజ్య ప్రశంస, జాతీయ దురభిమానాలు ప్రాతిపదికగా, అభూతకల్పనలతో – వచ్చాయి.

కానీ మానవ పరిణామ క్రమంలో కొన్ని కొన్ని సంఘటనలూ, పరిస్థితులూ నిర్వహించిన పాత్రల గురించీ అవి చరిత్ర గతిని మార్చిన విషయం గురించీ కూడా తెలుగులో నవలలు వచ్చాయి. నిన్న మొన్నటి ‘అతడు – ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’ లాంటి నిన్నటి నవలల గురించి చెప్పుకొన్నాం.

novel3

మధ్య యుగాల నాటి సమాజం గురించి తెలుగులో వచ్చిన రెండు నవలల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

పదమూడో శతాబ్దపు గోబీ ఎడారులలోణి ఓ తండాకు చెందిన పనినాయకుడు ప్రతికూల పరిస్థితులలో ఏభై ఏళ్ళ పాటు అలుపు లేకుండా పోరాటం చేసి మానవ చరిత్రలోనే అతి పెద్దదయిన సామ్రాజ్యాన్ని నిర్మించిన వైనాన్ని ‘చెంఘిజ్‌ఖాన్’ నవలలో చెపుతారు తెన్నేటి సూరి. ‘రక్తపు ధారల్లో మునిగి తేలిన మనిషి కథ గదా ఈ నవల’ అన్న విమర్శకులకు – “పీడన ఉంటే అగ్ని పుడుతుంది నిజమే – చెంఘిజ్‌ఖాన్ ఓ అగ్నికణం. విధ్వంసకరమైన జ్వాల పుట్టగూడదు అనేవాళ్ళు ఆ పుట్టడానికి హేతువయిన పీడన ఎందుకు ఉందో చెప్పాలి.” అని సమాధానమిచారు తెన్నేటి సూరి.

ఎనిమిది తరాల ఓ బడుగు బోయ వంశం అటు చాళుక్యులు, ఇటు చోళుళ ఒడిదొడుకుల మధ్య చిక్కడిపోయి, తట్టుకొంటూ మనుగడ సాగించినా పాండురంగడు అన్న సేనాని క్రోధానికి మసి అయిపోయిన విధానాన్ని అతి చక్కని రీతిలో చిత్రించారు ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలలో బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె.

ప్రభువుల పల్లకీల గురించి కాకుండా, రాళ్ళెత్తిన కూలీల గురించి వచ్చిన అరుదైన నవలలు ఇవి.

***

నిన్న మొన్నటిదాకా వ్యవసాయ ప్రధానంగా ఉన్న తెలుగు జీవితంలో, వ్యవసాయమే జీవవ విధానంగా బతికిన సాంబయ్యల గురించీ, బక్కిరెడ్ల గురించీ నవలలు వచ్చాయి. మట్టిని తల్లిగా భావించే రోజులు మారి క్రమక్రమంగా వరూధినిలూ, వెంకటపతిలూ భూమిని వ్యాపార వస్తువుగా పరిగణించడాన్ని ‘మట్టి మనిషి’ బలంగా చిత్రించింది. అదే ఒరవడిలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ వచ్చింది. ఇరవై ఏళ్ళ క్రితం చంద్రలత ‘రేగడి విత్తులు’… నిన్నటికి నిన్న నల్లూరి రుక్మిణి ‘ఒండ్రుమట్టి’.

novel4

***

జీవితాలను అతి సజీవంగా, అతి సహజంగా చిత్రించిన రెండు పుస్తకాల గురించి – నవలలు కాని నవలల గురించి – చెప్పుకోవాలి.

పంతొమ్మిదో శతాబ్దపు ప్రథమ పాథంలో అర్థ అక్షరాస్యుడిగా భారతదేశంలో అడుగుపెట్టిన మెడోస్ టైలర్ అన్న బ్రిటీషు యువకుని ఆత్మకథ ‘సురపురం’. ఆ యువకుడు సమర్థవంతుడైన అధికారిగా, పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిగా, పరిపూర్ణ మానవుడిగా భారతదేశమే తన దేశమని భావించే మట్టిమనిషిగా 1825 – 65 ల మధ్య పరిణామం చెందిన వైనమూ, ఆ కథ చెపుతోన్న క్రమంలో ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల చిత్రీకరణా – అరుదైన ‘నవల’ ఇది.

1930ల నాటి పట్టణాల్లోని ఓ పెద్ద దళిత కుటుంబంలో ‘చదువు’ మీద ఉన్న పట్టుదల ఎంత గణనీయమైన మార్పులు తెచ్చిందో, ఆ అతి సామాన్యమైన కుటుంబం చదుపు పునాది మీద ఎలా ఎదిగి నిలబడగలిగిందో రాగద్వేషాలకు అతీతంగా నిమిత్తమాత్రంగా చెప్పుకొచ్చిన బయోగ్రఫీ ‘మా నాయన బాలయ్య’. రాసిన మనిషి ఆ బాలయ్య గారి అబ్బాయి సత్యనారాయణ.

ఈ రెండు పుస్తకాలూ ఇంగ్లీషు మూలభాషగా కలవే అయినా వాటి అనువాదాలూ, అందులోని తెలుగు జీవితం – అపురూపం.

***

తెలుగు నవలల గురించి మాట్లాడేడప్పుడు నవలాభిమానులు, ‘విమర్శకులూ’ అడిగేది ఒకటే మాట – ఈ మధ్య కాలంలో మంచి నవలలు అంటూ వచ్చాయా?!

‘వచ్చాయి – లేదు’ అన్నది నా సమాధానం.

ఒక్కసారి గత ఇరవై పాతికేళ్ళను గమనిస్తే మరో ఐరవై పాతికేళ్ళు నిలబడగలిగే నవలలు చాలా కనిపిస్తాయి.

కేశవరెడ్డి నవలలు వచ్చాయి. ‘అంటరాని వసంతం’ వచ్చింది. ‘నల్ల మిరియం చెట్టు’ వచ్చింది. మునెమ్మ, దృశ్యాదృశ్యం, వీరనాయకుడు, బోయకొట్టములు, ఒండ్రుమట్టి, భూచక్రం, నిప్పుల వాగు, వేముల ఎల్లయ్య కక్క…

“వ్యాపార (పాపులర్) నవలల వెల్లువలో కొట్టుకుపోతోన్న తెలుగు నవలకు చేయూత ఇవ్వాలనే” మంచి ఉద్దేశంతో అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ సంస్థలు – ఇరవై ఏళ్ళ క్రితమే – ప్రయత్నం చేసాయి. రేగడి విత్తులు, వలస దేవర, అయిదు హంసలు లాంటి చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి. అమెరికా నేల మీద నుంచి కూడా గొర్తి బ్రహ్మానందం రాసిన ‘అంతర్జ్వలనం’, రెంటాల కల్పన ‘తన్హాయి’ వచ్చాయి. ‘కథతో పాటు నవల కూడా అమెరికా నేల మీద వికాసం చెందుతోంది’ అన్న నమ్మకం కలిగించాయి.

kalpana

అప్పటి మాలతీ చందూర్లకు చక్కని కొనసాగింపుగా మంథా భానుమతి, గంటి సుజలలు చక్కని నవలలు రాస్తున్నారు.

గమనమే గమ్యంగా తెలుగు నవల సాగిపోతోంది.

అయినా –

ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది.

నూతన జీవన విధానాలనూ, ఆర్థిక రాజకీయ పరిణామాలనూ, సాంకేతిక సంక్లిష్టతలనూ ఈనాటి నవల పట్టుకోగలుగుతోందా?!!

లేదనే అనాలి!

ఎందుకనీ?!

నవల అంటే విస్తృత అధ్యయనం. నిరంతర పరిశీలన, విశ్లేషణ. మారుతోన్న జీవితాన్ని ‘పట్టుకోవడం’, కూలంకుషంగా అర్థం చేసుకోవడం… కార్యకారణ సంబంధం మీద మౌలికమైన అవగాహన కలిగి ఉండటం…

ఇది అనుకొన్నంత సులభంగాదు.

మన తెలుగు రాష్ట్రాలలో గత ఇరవై పాతికేళ్ళుగా కంప్యూటర్ వేగంతో మార్పులొచ్చాయి, వస్తున్నాయి. ఈ మార్పుల్ని ‘అందుకోడం’ సామాన్యులకు సాధ్యం కాదు. ఉదాహరణకు కారా గారు ఇరవై ఏళ్ళ క్రితమే తాను కథలు రాయకపోవడానికి మార్పుల్ని పట్టుకోలేకపోవడం ముఖ్య కారణమని అన్నారు. ఇదే మాట ఇంకో సందర్భంలో ఏభై ఏళ్ళ క్రితం కొడవటిగంటి అన్నారు.

ఒప్పుకున్నా లేకపోయినా మనవి ఉద్రేక స్వభావాలు. వెంటవెంటనే స్పందించే తత్వాలు. అవి కవిత్వానికీ, కథలకూ సరిపోతాయేమోగానీ నవల విషయంలో గ్రక్కున విడవాల్సిన విషయాలు. నవలకు సంయమనం, సమగ్రదృష్టి, ఆధార పీఠాలు. కొకు, ఉప్పల, మహీధర లాంటి వాళ్ళు ఆవేశకావేశాలను పక్కనబెట్టి రాసారు. తమ తమ నవలల్లో సిద్ధాంతాల ప్రకారం నడిచే జీవితాలను చిత్రించకుండా, జీవితాలు నడిచే విధానాలను సిద్ధాంతాల నేపథ్యంలోంచి చూపించారు. ఆ సంయమనం ఇప్పుడు – ఈ నూతన జీవన విధానాలలో – కొరవడుతోంది.

నవల రాయడం అంటే ఆరు నెలల తపన, ప్రేమ. కనీసం మూడు నెలల కష్టం. శ్రద్ధగా, ఓపికగా, నిబద్ధతతో, అంతంత కాలం నవల మీద ఖర్చు పెట్టడం – ఊహాతీతమయిపోతోంది!

అయినా

నవల నడిచిన దారిని మరోసారి చూసుకొంటే, గత పాతికేళ్ళ మందగమనాన్ని విస్మరించకుండానే, మనం సంతోషించవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

దాదాపు నూట ఏభై ఏళ్ళ తెలుగువారి జీవితాలకు సాక్షీభూతంగా నిలిచింది తెలుగు నవల. అనేకానేక పరిణామాలను ఒడిసి పట్టుకొని నమోదు చెయ్యగలిగింది. గొప్ప సాంస్కృతిక సంపదగా మిగిలింది. అనుమానం లేదు.

ఈనాడూ, రేపూ సంగతి అంటే –

ఆశావాదంలో తప్పు లేదు గదా!

***

ఈ మాటలన్నీ నా పరిజ్ఞాన ఫలితంగా వచ్చినవి గావు.

సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికీ, జీవితానికి అన్వయించుకోడానికీ నేను చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఒక భాగం ఈ  ‘నవల నడిచిన దారి’ కూర్పు.

కొండను అద్దంలో చూపించే ప్రయత్నమిది.

మరి అద్దంలో కొండే కనిపిస్తోందో – ఎత్తిపోతల బండరాళ్ళు కనిపిస్తున్నాయో – తెలియదు.

ఇది సమగ్రమనీ, దోష రహితమనీ, చర్చకు అతీతమనీ – ఆ భ్రమ నాకు లేదు. చర్చ అంటూ జరిగితే అందులోంచి నేను మరికాస్త నేర్చుకోగలనన్న ఆశ ఉంది.

ఈ మాటలు రాయడానికి మిత్రులు వివినమూర్తి, వాసిరెడ్డి నవీన్‌లతో జరిపిన సంభాషణలు బాగా సాయపడ్డాయి. సహవాసి వ్యాస సంకలనం – నూరేళ్ళ కథ, బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే రాసిన సుదీర్ఘమైన ముందుమాట ఒక సాహితీ గనిలా నా ముందు నిలబడింది. ఏ మాత్రమూ సిగ్గూ, మొహమాటాలు లేకుండా ఆ గని లోంచి మాణిక్యాలను ఏరుకొన్నాను. నా దగ్గర ఉన్న రాళ్ళను వాటితో కలిపాను.

వెరసి – ఈ ప్రసంగ వ్యాసం.

 

 

(27 మే 2016 నుంచి 29 మే 2016 వరకు మూడు రోజుల పాటు డాలస్ నగరంలో జరిగిన నాటా మహా సభలలో రెండో రోజు కార్యక్రమాలలో తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నులపై  దాసరి అమరేంద్ర చేసిన ఉపన్యాసపు పాఠం ఇది).

 

సూఫీ- సంత్ సంవాద కేళి

 

 

-అవ్వారి నాగరాజు

~

 

సంత్ ఏక్‍నాథ్ ఒక రోజున స్నానమాచరించడానికి గోదావరీ నదీ తీరానికి వెళ్ళాడట. శుచిగా స్నానం చేసి తిరిగి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక ఫకీరు ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. శరీరం మైల పడిపోవడంతో  ఆయన తిరిగి మరోసారి స్నానానికి వెళతాడట. తిరిగి వస్తుండగా ఆ ఫకీరు మరో సారి ఆయన మీద ఉమ్మి ఊస్తాడట.  ఏక్‍నాథ్ ఆ ఫకీరుని ఏమీ అనకుండా సహనం వహించి తిరిగి మరో సారి నదికి వెళతాడట.

స్నానం చేసి తిరిగి రావడం, ఫకీరు ఉమ్మడం – ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత కూడా తనని ఏమీ పల్లెత్తు మాట కూడా అనని సంత్‍ సహనానికి ఆ ఫకీరు పశ్చాత్తాపం చెంది తనను క్షమించమని అడుగుతాడట. పైథాన్(ప్రతిష్టాన పురం) నివాసి అయిన ఏక్‍నాథుని గొప్పతనం గురించి జనసామాన్యపు నాలుకల మీద ఉన్న ఈ కథనానికి కొనసాగింపు ఉంది.

తనని క్షమించమని అడిగిన ఫకీరుకు, బదులుగా ఏక్‍నాథ్-  మీరు చేసిన ఈ పని వల్లనే పవిత్రమైన ఈ గోదావరీ నదిలో అనేక మార్లు  స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందని అంటాడట. సంత్ ఏక్‍నాథునితో ఫకీరు జరిపిన ఈ సంవాదాన్ని సంత్ అనుచరులు ఇద్దరు మహాత్ములు జరిపిన దివ్య కేళీ కలాపంగా వివరిస్తుంటారు.

సంత్ గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఫకీరుగా తన పాత్రని పండించిన వ్యక్తి సిద్ధి ఆలీబాబా. ప్రముఖ సూఫీ గురువు.  ఆయన అప్పుడు- మీ మీద ఇన్ని సార్లు ఉమిసాను కదా, బదులుగా ప్రాయశ్చిత్తం చెప్పమంటాడట. నా పుట్టిన రోజునాడు నా భక్తులు చేసే ఉత్సాహాల సందోహంలో, వారి కాలికింద రేగిన దుమ్ము నీ దర్గాపై పడుతుంది పో. అదే నీకు ప్రాయశ్చిత్తం అని సంత్,  బాబాని  సముదాయిస్తాడట.

సంత్ పుట్టిన రోజు ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, దారిలో ఉన్న సిద్ధి ఆలీ బాబా దర్గాను చూసి ఈ కథనాన్ని  తలుచుకోవడం ఇప్పటికీ వాడుకలో ఉంది.

జనం వాడుకలో ఉన్న ఈ కథనాలు భక్తి ఉద్యమాన్ని గురించి మనకు సంకేత ప్రాయంగా రెండు విషయాలని తెలియజేస్తున్నాయి. పదమూడవ శతాబ్ధి చివరి వరకూ తెర వెనుకగా ఉన్న ఇస్లామ్- సూఫీ ప్రభావాలు ఉత్తర భారత దేశంలో పద్నాలుగ శతాబ్ధం నుండీ ప్రత్యక్షంగా అయిపోయాయి. ఈ రెండూ పరస్పరం జరుపుకున్న ఆదానప్రధానాలు పైన చెప్పిన కథనంలో మాదిరిగా ఎదురెదురుగా  నిలుచున్న సూఫీ, సంత్‍లు జరిపిన సంవాదకేళిలాగా మారిపోయాయి.  అలాగే,  పైన చెప్పిన కథనంలో మాదిరిగా సాధికారికమైన మత తాత్వికతకు ప్రత్యామ్నాయమైన  విశ్వాసాలూ, ఆచరణా కలగలిసిన సాంస్కృతిక ఆవరణాన్ని భారత దేశ మధ్యయుగాలకు ఇవి అందివ్వగలిగాయి.

ఇలాంటి సాంస్కృతిక వాతావరణం నుండే ఉత్తర భారతదేశపు భక్తి ఉద్యమం అభివృద్ధి చెందింది.

ఙ్ఞానేశ్వర్, నామదేవ్, కబీర్, రాయ్‍దాస్, నానక్, దన్నా, దాదూ, ఇంకా ఒరిస్సాలోని పంచసఖులు, తుకారాం, చైతన్యుడు, మీరా- ఇలా వీరందరూ ఉత్కృష్టమైన సాంస్కృతిక పర్యావరణానికి ఉదాహరణలు. వీరు ఇస్లాం, సూఫీల ప్రభావానికి ప్రత్యక్షంగా లోను కావడమే కాకుండా, తమ కాలపు మత ఆచరణలలోని చెడులను తీవ్రంగా విమర్శించారు కూడా. నామదేవ్ విగ్రహాలను పూజించడాన్ని అపహాస్యం చేస్తాడు. హిందూ-ముస్లీంల నడుమ సయోధ్యను ఏర్పర్చడానికి కృషి చేస్తాడు. కబీర్ ఇటు బ్రాహ్మనీయ హిందూ మతంలోనూ,ఇస్లాంలోనూ ఉన్న అతిని ఖండిస్తాడు. నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. సూఫీలవలే గురు పరంపరను ఏర్పరచి గురుస్థానాన్ని మార్గదర్శకంగా చేస్తాడు. ఒరిస్సాలోని పంచసఖులు భారత, భాగవత, రామాయణాలను ఒడియాలోకి అనువాదం చేసి భక్తి మార్గాన్ని సుస్థిరం చేసారు. చైతన్యుడు సంకీర్తనామార్గాన్ని అవలంభించాడు. మీరా రాబియా వలే భగవంతునిలో సఖుడిని వెతుక్కుంది.

ఒక భక్తి ఉద్యమ కవినీ లేదా సంత్‌నీ అధ్యయనం చేయడానికి వారి స్థానిక సాంస్కృతిక వాతావరణం, వారి వాఙ్మయ సారస్వతం గొప్ప ఆధారాలుగా ఉపయోగపడతాయి. వాటిని ఆధారంగా వారు తమ కాలపు సామాజిక చలనంలో ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు తమ కాలానికి చెందిన లక్షణాలను ఎలా ప్రతి ఫలించగలిగారో మనం అధ్యయనం చేయవచ్చు.

మధ్య యుగాల నాటి ఉత్తర భారత దేశంలో ఉన్న సాంస్కృతిక వాతావరణం మునపటికన్నా మరింత కాంతివంతంగా మారడానికి బయటి నుండీ జరిగిన దండయాత్రలూ,ముస్లీంల రాజ్య స్థాపన దోహద పడ్దాయి. సామాజిక స్థితిగతులలో కుదపూ ఏర్పడింది.ఈ కుదుపుకు అనుగుణంగా సమాజంలో సర్దుబాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. గుప్తుల కాలం నాటికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన శకులు, హుణులు లాంటివారు ఇక్కడి స్థానిక సమాజంలో భాగమయ్యారు. అలాగే స్థానిక ఆదివాసీ తెగలు ప్రధాన స్రవంతిలో భాగమయ్యి రాజపుత్రులుగా, వివిధ కులాలుగా స్థిరపడ్డారు. సరిగ్గా అలాంటి  సామాజిక మార్పులే ముస్లీం రాజ్య స్థాపనల వల్ల మరోసారి ఏర్పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ రకమైన సామాజిక మార్పులు వ్యక్తమవడానికి ఇస్లాం-సూఫీ తాత్వికతలు ఈ కాలంలో ఎంతగానో దోహద పడ్డాయి.

సాధికార మత తాత్వికతలు, కొత్తగా తమ చారిత్రక పాత్రని నిర్వహించడానికై ఉబికి వస్తున్న ప్రజా సమూహాలకు గొప్ప అడ్డంకులుగా ఉండడం వల్ల వాటిని తోసివేసే మత విశ్వాసాలూ, ఆచరణలే మధ్య యుగపు తాత్విక భూమికలయ్యాయి. ఇవి అటు బ్రాహ్మణీయ హిందూ మతానికీ, ఇమాంలు ప్రవచించే  ఇస్లాంకూ సవాల్‍గా నిలబడ్డాయి. ఈ చారిత్రక ఘట్టం భక్తి ఉద్యమంగా పిలవబడడానికి బహుళత్వానికి పీట వేసే వివిధ సంప్రదాయాలు, సూఫీల కృషీ పునాదులుగా దోహదపడ్దాయి. సూఫీలు తమను తాము ఇస్లాంలో విడదీయరాని భాగంగా చెప్పుకుంటూ ఈ కృషిలో పాలు పంచుకున్నారు.

ఉత్తర భారతంలో భక్తి ఉద్యమ కాలపు సాంస్కృతిక వాతావరణాన్ని మనం తిరిగి సంత్ ఏక్‍నాథ్ నుండే ఉదహరించవచ్చు. ఏక్‍నాథ్ దక్కన్‍లో భాగమైన మహారాష్ట్ర ప్రాంతపు బ్రాహ్మణుడు. ఆయన పదహారవ శతాభ్ది చివరి అర్థభాగానికి చెందిన వాడు. ఆయన పుట్టిన పైథాన్ పట్టణం ప్రతిష్టానపురం పేరుతో చరిత్రలో శాతవాహనుల ఏలుబడిలో ఉండేది. మహారాష్ట్రలో వర్కారీ సంప్రదాయానికీ ఆలంబనగా ఉన్న విఠోబా విగ్రహాన్ని విజయనగరం నుండీ వెనక్కి తీసుకొని వచ్చి పండరీపురంలో పునఃస్థాపించిన భానుదాసు ఈయన పూర్వీకుడు. దేవగిరి దౌలతాబాద్‍గా మారడానికి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవులు మరాఠీ భాషాభిమానులు. నిజాంషాహీల పాలన ఇక్కడికి వచ్చే నాటికి పైథాన్ పట్టణం గొప్ప విద్యా, వాణిజ్యకేంద్రం.

ఏక్‍నాథ్ తండ్రి సుల్తాన్ వద్ద వజీరుగా పని చేసే ఒక బ్రాహణుడికి గురువు. ఆ రకంగా వారి కుటుంబానికి ఇటు పైస్థాయి అధికార వర్గంతోనూ, భక్తి సంప్రదాయంతో మమేకమయ్యే సాధారణ ప్రజానీకంతోనూ దగ్గరి తనం ఉండేది. ఏక్‍నాథ్‍ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్‍లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్‍కు  జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్‍నాథ్ కాలం నాటికే  ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్‍నాథ్‍కు  విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్‍నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.

ఊహించడానికి కూడా సంభ్రమాన్ని కలిగించే ఇలాంటి చిత్రమైన సామాజిక వాతావరణం ఏక్‍నాథ్‍ను మహారాష్ట్రలో ఏ విధంగా ప్రముఖమైన సంత్‍గా మార్చి వేసిందో దాదాపుగా అలాంటి సామాజిక పర్యావరణమే ఉత్తర భారత దేశంలోని భక్తి ఉద్యమకారులమీదా భక్తి ఉద్యమం మీదా ప్రభావితమై అంతటా తానై అయి నడిపించింది.

ఇలాంటి చిత్రమైన సామాజిక పర్యావణం ఏర్పడడానికీ, వాటిని అందిపుచ్చుకొనే సామాజిక శక్తులు ఏర్పడడానికి  ప్రధాన కారణాన్ని సామాజిక చరిత్రకారులు పైకి ఎదిగి వస్తున్న కులాల అస్తిత్వ చైతన్యం నుండి వివరిస్తున్నారు. ఈ వివరణను దక్షణాదిన భక్తి ఉద్యమం ప్రారంభమయ్యే నాటి కాలానికి కూడా వీరు వర్తింప చేస్తున్నారు. గుప్తుల పతనానంతరం స్థిరమైన, విశాలమైన రాజ్యాలు దక్షణాదినే ఏర్పడడంతో పాటుగా, చాప కింద నీరులాగా ఇస్లాం- సూఫీల ప్రభావం కూడా పని చేయడం వల్ల ఇక్కడ నూతనంగా ఆవిర్భవిస్తున్న సామాజిక శక్తులకు ఒక దారి దొరికినట్లయింది. నయనార్లతో భక్తి ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్నదని అనుకున్నట్లయితే, సంగం యుగం కాలం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ కొనసాగిన ఈ సంప్రదాయపు సాహిత్యం పదవ శతాబ్ధానికి గానీ క్రోడీకరింపబడలేదు. పదవ శతాబ్ధంలో క్రోడీకరింపబడిన ఈ సాహిత్యపు ఉనికిలోనూ, ప్రత్యేకించి ఎంపిక చేయబడిన అరవైమూడుమంది నయనార్ల పేర్లలోనూ ఈ అస్తిత్వ చైతన్యమే పని చేసిందని వీరు వివరిస్తున్నారు. ఆళ్వార్లుగా ప్రసిద్ధిపొందిన వారికీ ఇది వర్తిస్తుంది.

భక్తి ఉద్యమం- అది కొనసాగిన కాలం దృష్ట్యా, అది వ్యాపించిన భౌగోళిక ప్రాంతం దృష్ట్యా చాలా విస్తృతమైనది.  నూతనంగా ఎదిగి వస్తున్న సామాజిక శక్తులకు ఉనికికి అది ఒక తాత్విక వ్యక్తీకరణగా ఎట్లా ఉపయోగపడిందో, సమాజంలోని ప్రధాన స్రవంతితో, ఆధిపత్య భావజాలంతో సర్దుబాటు చేసుకోవడానికి కూడా అంతగానే ఉపకరించింది. సాధికారికమైన భావజాలాలతో పేచీ పడడానికి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి అది ఎలా కారణమైందో అలాగే తిరిగి మరో కొత్త సాధికారిక భావజాల కేంద్రాల స్థాపనకు అది దోహదమయింది. ఘర్షణ-ఐక్యతా చరిత్ర చోదక సూత్రాలుగా ఎలా పదేపదే ప్రకటితమవుతూ వచ్చాయో అదే విధంగా సాధారణీకరణ-వైవిధ్యమూ భక్తి ఉద్యమ కాలపు లక్షణాలుగా వ్యక్తమవుతూ వచ్చాయి.

ఇంత సంక్లిష్టత ఈ కాలపు లక్షణంగా ఉన్నందువల్ల భక్తి ఉద్యమం సామాజిక శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన వనరయింది. సామాజికంగా ఉన్న కుల వివక్షలను స్థూలంగా పక్కకు నెట్టడం, బౌద్ధిక వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న సంస్కృత ఆధిపత్యాన్ని తోసివేసి స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, దైవం గురించి, ఆరాధనా సంబంధమైన కర్మకాండలకు సంబంధించి పై కులాలకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న మత తాత్విక విధానాలను కిందికి దించి జన సామాన్యానికి అర్థమయ్యే ఉద్వేగ సంబంధమైన  ఆచరణలలోనికి తీసుకరావడం, దేవుడిముందు రాజూ-పేదా అందరూ సమానమనే భావనలను తేవడం భక్తి ఉద్యమకాలపు సాధారణ వ్యక్తీకరణలు. భక్తి ఉద్యమ కవులు, యోగులందరిలోనూ ఈ లక్షణాలను మనం చూడవచ్చు.

అయితే సామాజిక శాస్త్రవేత్తలకు ఈ సాధారణించబడిన లక్షణాలకన్నా, భక్తి ఉద్యమంలోని  వైవిధ్యమూ, బహుళత్వమే మరింత ఆసక్తికరమైన అంశాలుగా కనపడుతున్నాయి. సగుణ-నిర్గుణ వంటి విభజనల ఆధారంగా ఉత్తర భారతంలోని భక్తి ఉద్యమం గురించి స్థూలంగా కొన్ని సాధారణీకరణలను చేయడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు. అయితే ఈ విభజనకూడా స్థూలమైనదే కానీ ఏ ఆచరణనూ పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి పనికి వచ్చేది కాదు. భక్తి ఉద్యమాన్ని ఇలా సాధారణీకరించడానికి ప్రయత్నించిన ప్రతీ సారీ , దాని లోపలి నుండే పొడ చూపే భిన్నత్వం చరిత్రకారులకు నిరంతర సవాల్‍గా ఉండేది. ఒక ఆచరణ నిర్దిష్టమైమైన స్థల కాలాల పరిమితుల్లో  వివిధ సామాజిక శ్రేణులమధ్య వ్యాప్తిని పొందేటప్పుడు ఆయా ప్రజానీకపు అస్తిత్వ అవసరాలకనుగుణంగా అది నిరంతరంగా మార్పులకు గురికావడమే దీనికి కారణం . ఈ మార్పులు ఎంతగా తీవ్రంగా ఉంటాయంటే,  అవి దాని తొలి రూపానికి ఏమాత్రమూ పొంతనలేని ఒక కొత్త మత ఆచరణలోకి మార్చేసేవి.  బసవుని వీరశైవం నుండీ వివిధ పంథాల వరకూ వీటిని మనం గమనించవచ్చు.

సగుణ భక్తి భగవంతునికొక రూపాన్ని ఇచ్చి స్తుతిస్తుంది. నిర్గుణ భక్తి భగవంతుని నిరాకారునిగా చూస్తుంది. సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి ప్రగతి శీలమైందనీ, ఇది సాధికారిక మత సంప్రదాయాలను నిర్ద్వంధ్వంగా తోసివేసిందనీ సామాజిక చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిర్గుణ భక్తికి కబీర్‍ను, సగుణ భక్తికి తులసీ దాస్‍ని వీరు చెబుతారు.

బసవని తర్వాత కబీర్ అపురూపమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. సాధికారికమైన మత ఆచరణలను కబీర్ తన రచనల ద్వారా ఆవలికి నెట్టివేస్తాడు. తన జీవిత కాలమంతటా మగ్గం నేసి జీవిస్తూ, సాధారణ ప్రజానీకానికి సాధ్యంకాని సన్యాసి-ఫకీర్ ఉదాహరణలకు భిన్నమైన పంథాగా ఆయన జనానికి అందుబాటులో ఉంటాడు. ఆయన సారస్వతం పూర్తిగా మౌఖికమైంది. తర్వాత అది గ్రంథస్తమైనా మౌఖిక సంప్రదాయమే ఆయన విధానం. ప్రజలు పాడుకొనే భాషలో, వారికి అర్థవంతంగా ఉండే ఆయన ధోరణి సాధికారికమైన పుస్తక కేంద్రక విధానానికి వ్యతిరేకమైనది. ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి.  రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు. దీనివల్లనే కబీర్ శిష్యులలో అసంఖ్యాకంగా కింది కులాలవారూ, ముస్లీంలూ కూడా మనకు కనపడతారు.

సగుణ భక్తుడైన తులసీదాస్ దీనికి భిన్నంగా రాముడిని పురాణ పురుషుడిగా,దశావతారాలలో ఒకనిగా రామచరిత మానస్‍లో రాస్తాడు. గ్రంథానికీ, బ్రాహ్మణాధిక్యతకూ చోటిచ్చి పునరుద్ధరణ వాదానికి దోహదపడతాడు.

ఒక వైపు  మౌఖిక సంప్రదాయంలో భక్తి వ్యాపిస్తూ ఉండగా, ఈ కాలంలోనే  మరొక వైపు సంస్కృత మత గ్రంథాలు, భారత, భాగవత, రామాయణాలు స్థానిక భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇవి మూలానికి పూర్తిగా లోబడి ఉండక ఆయా భాషలలో స్వతంత్రమైన వైఖరులను తీసుకున్నాయి.  బ్రాహ్మణీయ విలువలను, ఆధిక్యతనూ స్థాపించడానికే ఇవి ఆయా భాషలలో రాయబడ్డాయని విమర్శకు గురయినా అప్పటి ఆధిపత్య భాష అయిన సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలను ముందుకు తేవడానికి ఆయా కవులు పెద్ద యుద్ధమే చేసారు.  ఏక్‍నాథ్ మరాఠీలో భాగవతపురాణాన్ని రాయడం కోసం తన కొడుకు నుండే వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు. తనకంటే చాలా  ముందుగానే ఙ్ఞానేశ్వర్ మరాఠీలో రాసే సంప్రదాయాన్ని ఆరంభించినప్పటికీ ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా భక్తి ఉద్యమ కవులు స్థానిక భాషలను ముందుకు తెచ్చి పెద్ద తిరుగుబాటునే చేసారు.

ఒక వైపు తిరుగుబాటూ, మరో వైపు పునరుద్ధరణ పక్కపక్కనే, ఒక దాని వెంట ఒకటిగా కొనసాగడం భక్తి ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రధాన లక్షణం. ఈ విచిత్రమైన స్వభావాన్ని సామాజిక చరిత్రకారులు గ్రామ్‍స్కీ ప్రతిపాదించిన “హిస్టారికల్ బ్లాక్” (historical block) భావన ద్వారా వివరిస్తున్నారు.

సమాజంలోని వివిధ శ్రేణులు తమ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ఉనికిలో ఉన్న సాధికర భావజాలాలతో, నిర్మాణాలతో తిరుగుబాటును ప్రకటించి పోరాడతాయి. ఈ క్రమంలో అవి తమవయిన తాత్విక సామాజిక భావజాలాలను ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తాయి. అయితే అవి తమ గమనంలో ఒక సంతృప్త స్థితికి చేరుకున్న తర్వాత  ఇదివరకటి తిరుగుబాటును పక్కన పెట్టి  ప్రధాన స్రవంతిలో భాగమవుతాయి. సమాజగమనం గురించిన ఈ సత్యాన్ని గ్రామ్‍స్కీ “హిస్టారికల్ బ్లాక్” భావనలో వివరించాడు.

భక్తి ఉద్యమంలోని తిరుగుబాటు-పునరుద్ధరణ లేదా సర్దుబాటులను మాత్రమే కాకుండా సమకాలీన సమాజంలోని వివిధ ఉద్యమాలు, ధోరణుల  గమనాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ భావన బాగా ఉపయోగపడుతుంది.

 

ఆధారం:

1. Sufism, An introduction-Farida Kahanam

2.Rabia As Mystic, Muslim And Woman- Barbara Lois Helms

3.Influence Of Islam ON Indian Culture- Tarachand

4. Vaishnavism, Saivism And MInar Religious Systems- R.G. Bhadarkar

5.Contextualizing The Past, The Saint And His Environment -Dusan Deak

6. Challenging Gender And Sexuality Norms Through Devotion: Bhakti And Sufi Writings- Srishti Nayak

తప్పుల వెనక మూగ రోదన!

 

 

టి. చంద్రశేఖర రెడ్డి

~

          పాఠకులు-పరిణామక్రమంలో కథకులో, సమీక్షకులో/విమర్శకులో అవుతారు. కాని, ఎంత మంది కథకులు తమ రచనలకు/వాటి పుస్తకరూపానికి నిబద్ధత గల ప్రూఫ్ రీడర్ అవుతారు?

ఈ ప్రశ్నకు సరైన జవాబు; వ్యక్తులెవరూ చెప్పనవసరం లేదు. తప్పులతడకలుగా వస్తున్నందుకు మూగగా రోదిస్తున్న రకరకాల రచనలే మౌనంగా సమాధానిస్తాయి.

ఆ రోదనకి కారణం రకరకాల ముద్రా రాక్షస చర్యలు.  వాటిని నివారించలేని, తొలగించలేని పరిస్థితులు.

అలాంటి వాటిని కొన్నిటిని ఈ వ్యాసం బహిర్గతం చేస్తుంది. ఈ ప్రయత్నానికి మద్దతుగా ఇచ్చిన ఉదాహరణలు నేను సృష్టించినవి.

అసలు రచనలనుంచే కొన్ని ఉదాహరణలు  ఇవ్వవచ్చు. ఇవ్వకపోవటానికి కారణం చెప్పకుండానే అర్థం చేసుకోవాల్సినది, చేసుకోగలిగినది.

 1. మన చేతిలో ఉన్న పుస్తకం కవరు పేజీ మీద కథల సంపుటి పేరు ‘విడాకుల పర్వం’ అని అందమైన అక్షరాలతో ఉంది. అదే సంపుటి వెన్నెముకపై ఆ పేరు కాకుండా  ‘నూరేళ్ల పంట’ అని ఇంకో పేరు అంతకన్నా అందంగా తీర్చిదిద్దబడింది. మొదటిది ప్రస్తుత కథల సంపుటి పేరు. రెండోది అదే రచయిత వెలువరించిన ఇంతకు ముందు కథల సంకలనం పేరు. కవరు పేజీ డిజైన్ చేసినపుడు ఒక చోట పేరు మార్చి, మరో చోట మార్చకపోవటంతో దొర్లిన పొరపాటిది. ఆ తప్పుతో, ఇప్పుడొక ప్రముఖ రచయిత కథల సంపుటి మార్కెట్లో ఉంది.
 2. రచనలో ప్రతి పేరా ఒక చోటే మొదలు కాకపోవటం. ఇది రెండు రకాలు. ఒకటి ప్రగతిపథంలో దూసుకుపోవటం. రెండవది వెనకబడిన వర్గానికి చెందాలనుకోవటం.

            “మీరిద్దరూ ఒకసారి నాతో బయటికి రావాలి” పెళ్లి జరిపిస్తున్న బ్రాహ్మణుడి సూచనతో పెళ్లికొడుకు లేచి నిలబడ్డాడు. అతడితో పాటు పెళ్లికూతురు కూడా లేచి నిలబడింది. వాళ్లిద్దరూ బ్రాహ్మణుడి వెంట ఫంక్షన్ హాల్ బయటికి నడిచారు.

“ఇప్పుడు బయట మాతో ఏం చేయిస్తారు?”  తన పక్కనే ఉన్న అన్నని నెమ్మదిగా అడిగాడు పెళ్లికొడుకు.

“మీ ఇద్దరికీ ఆకాశంలో ఉన్న అరుంధతీ నక్షత్రం చూపిస్తారు, ” అన్న లోగొంతుకతో జవాబిచ్చాడు.

వధువుతో పాటు అరుంధతి నక్షత్రం చూడటానికి ప్రయత్నిస్తున్న వరుడికి వివాహప్రక్రియలో,  ఒక భాగంగా ఈ క్రియ ఎందుకో  అర్థం కాలేదు.  పెళ్లైనతర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరికి లేదా ఇద్దరికీ చుక్కలు కనపడతాయనటానికి ముందస్తు సూచనా ఇది?  తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది అతడికి.

 1. 0 విడిగా జీవించాల్సిన పదాలు సహజీవనం చేయటం.

అప్పుడేవిచ్చుకున్నగులాబీలా (ఈ మూడు పదాలూ కలిసి ఉండకూడదు) ఉంది కొత్త పెళ్లి కూతురి ముఖం. ఆమె మెడలో తాను వేసిన మూడు ముళ్లు, ముళ్లై గుచ్చుకుంటాయా తనకి, ముట్టుకోబోతే?ఎర్రబడ్డ వధువు కళ్లు చూస్తున్న వరుడికి అనుమానం కలిగింది.

 1. 0 పదాల్లో అక్షరాల మధ్య సమైక్యత లోపించి విడిపోవటం.

ఇంట్లో ద్వారాలకీ, కిటికీలకీ వేలాడుతున్న తోరణాల్లో ఎండిపోయిన మామిడి ఆకుల వంకా తన చేతిలో ఉన్న కాగితాల వంకా మార్చిమార్చి చూశాడతను. అది అతడికి భార్య పంపిన విడా  కుల (విడాకుల అని ఉండాలి) నోటీసు.

 1. 0 వాక్యంలో ఒక పదం బదులు ఇంకో అర్థం వచ్చే పదం రాయటం.

ఇద్దరి వైపూ పెద్దలు కూర్చుని రాజీకి ప్రయత్నిద్దామని అనుకుంటున్న సమయంలో అర్థంతరంగా ఈ నోటీసు ఏమిటి? (అర్థంతరంగా అంటే అర్థంలో భేదంతో అని. అర్ధంతరంగా అని ఉండాలి)

 1. 0 ఒక వాక్యం (బ్రాకెట్లలో ఉన్నది) పూర్తిగా లేకపోవటం.

బాసింపట్టు వేసుకుని కూర్చున్న అతని పక్కన ఆమె-మోకాళ్ల మధ్యలో తలదూర్చి అతడి వైపు తమకంతో చూస్తూ. ఆమె కాళ్లు బార్లా చాపి ఉన్నాయి. (ఇద్దరి పాదాలనూ తాకి వెనక్కి మళ్లుతున్న సముద్రకెరటాలు). అతడికి, దోసిళ్లతో వాటిని పట్టుకుని తాగాలనిపించింది.

 1. ఓ పంక్తి చివర పదంలో ఓ అక్షరం ఉండిపోయి, మిగిలిన అక్షరాలు రెండో పంక్తి మొదట్లోకి వెళ్లిపోవటం. ఈ జబ్బు ఎక్కువగా ‘ఉ’ అక్షరంతో మొదలయ్యే పదాల్లో కనపడుతోంది.

కొడుకుల చేతుల్లో తియ్యటి చెరకు రసం. వరండాలోని మడత మంచంలోకి విసిరేయబడ్డ పిప్పి

న్నట్లుండి (ఉన్నట్లుండి అనే పదంలో అక్షరాలన్నీ ఒకే చోట ఉండాలి) ఖళ్లుఖళ్లున దగ్గుతోంది.

 1. అక్షరాలకి గుణింతం లోపించటం.

ఈ వయసులో తనకి ఆసరాగా నిలబడాల్సిన ఒక్క కొడుకూ, తనన (తనని అని ఉండాలి) ఇలా వదిలేస్తాడని తవిటయ్య కలలో కూడా ఊహించలేదు.

 1. ఒక వాక్యంలో భాగమో, వాక్యమో, వాక్యాలో-అదే పేరాలో రెండో సారి పక్కపక్కనే రావడం. ఇలాంటి పొరపాటు సాధారణంగా ఒక పేజీ చివరనుంచి, మరో పేజీ మొదటికి వెళ్ళినపుడు జరుగుతుంది.

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (పేజీ ముగింపు)

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (తర్వాత పేజీ మొదలు)

 1. 10. అవసరం లేని చోట ఒక అక్షరానికి గుణింతం వాడటం.

తన మనసు ఇంతగా పరిణితి ఎప్పుడు చెందిందో ఆమెకి తెలీటం లేదు. అది కూడా పరిణితి చెందితేనే తెలుస్తుందేమో? (పరిణితి కాదు పరిణతి).

 1. 11. అక్షరాలకి ‘ఒత్తు’ తప్పుగా ఇవ్వటం.

అలాగైతే సెకండ్లూ గంటలూ ఏమిటి? అతడికి అర్ధం కాలేదు (‘థ’ ఒత్తు బదులు ‘ధ’ ఒత్తు).

 1. 12. అసలు వాడకూడని ‘ఒత్తు’ ని వాడటం.

పెళ్ళిపీటల మీద కూర్చున్న అతనికి అవి ముళ్ళకంచెల్లా అనిపిస్తున్నాయి (‘ళ’ ఒత్తు ఏ అక్షరానికీ వాడకూడదు. అన్ని సందర్భాల్లోనూ ‘ల’ ఒత్తే వాడాలి).

 1. 13. పదంలో ఒక అక్షరానికి వాడాల్సిన గుణింతాన్ని ఇంకో అక్షరానికి ఉపయోగించటం.

ఆ భ్రమ కలిగించిన భయంతో ఉన్న అతడికి, పెళ్లికూతురు పెదాలపై చిరునవ్వు చూసి కొంచెం స్వాంతన కలిగింది. (‘సాంత్వన’ బదులు ‘స్వాంతన’).

 1. పదంలో వాడకూడని అక్షరాలని వాడటం.

కళ్యాణమంటపం అనే పదబంధంలో ‘మంట’ అనే పదం ఎందుకుందో, పెళ్లైన సంవత్సరానికి కాని అర్థం కాలేదతనికి (‘కళ్యాణ’ అని రాయకూడదు-‘కల్యాణ’ అని ఉండాలి).

 1. 15. పదంలో ఉండాల్సిన అక్షరాలు లేకపోవటం.

వద్దన్నా వెంటపడుతున్న ఆమె జ్ఞాపకాలు అతడి మనసును అతలాకుతం (అతలాకుతలం అని ఉండాలి) చేస్తున్నాయి.  

 1. 16. ఒత్తు సరిగా వాడి, అక్షరం తప్పు రాయటం.

గతం స్మశానమైతే స్మృతులు మరణించిన అనుభవాలకి సమాధులా? (‘స్మ’  కాదు, ‘శ్మ’ అని ఉండాలి).

 1. 17. ఒక పేజీ పూర్తిగా డి‌టి‌పి కాకపోవటం.

ఇంటిముందు నిలబడి అనుమానంగా కాల్ బెల్ నొక్కాడతను. లోపలినుంచి ఎవరో నడిచి వస్తున్నట్లు అడుగుల చప్పుడు. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి.

(మధ్యలో ఒక పేజీ లేదు)

ఎదురుగా విశాలంగా వినీలంగా ఒక కల్లోలిత సముద్రం. ఉవ్వెత్తున లేచి పడుతున్న అలలు. ఆ హోరు వింటూ చేష్టలుడిగిపోయి అతడు నిలబడ్డాడు.

 1. 18. ఒక వాక్యంలో పదాలు తర్వాత వాక్యంలో భాగంగా మారటం.

ఆమెకి దుఃఖం వచ్చింది. అతడి మాటలు గుర్తొచ్చి, దూరంగా ఎవరో నవ్వుతున్న సవ్వడి (ఆమెకి దుఃఖం వచ్చింది అతడి మాటలు గుర్తొచ్చి అనేది ఒక వాక్యం. మిగిలింది ఇంకో వాక్యం.)

 1. సంబంధం లేని అక్షరాలు పదాలతో జత కట్టటం.

నీళ్లొచ్చినంత మాత్రాన నల్లాలూ, కళ్లూ ఒకటే అనుకుంటే ఎలా!1 (ఆశ్చర్యార్థకం, 7 అంకె కీ బోర్డ్ లో ఒకే ‘కీ’ గా ఉంటాయి. అందుకే రెండు ఆశ్చర్యార్థకాల బదులు ఒక ఆశ్చర్యార్థకం, వాక్యం చివర 7 అంకె వచ్చాయి.)

వివిధ ప్రక్రియల్లో రచనలు చేసేవారూ, తమ రచనలని పుస్తకరూపంలో తెచ్చేవారూ వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రూఫ్ రీడింగ్ చేస్తే, తమ రచనల్లో ముద్రారాక్షసకాండని నిశ్చితంగా గణనీయంగా తగ్గించొచ్చు.

మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు!

-అవ్వారి నాగరాజు
~

చేర రాజు పెరుమాళ్‍కు ఒక చిత్రమైన కల వొచ్చిందట.
ఆ కలలో అర్థచంద్రాకృతిలో ఉన్న  చంద్రుడు రెండుగా చీలిపోయినదట. ఆ కలకు భావమేమిటొ కనుగొనాలని రాజు తన ఆస్థానంలోని పండితులందరినీ అడిగి చూసాడట. కానీ వారు ఇచ్చిన వివరణలేవీ అతనికి సంతృప్తినివ్వలేదట. అంతలో అతని సమాచార బృందం అతనికి, ఒక అరబ్ నావికుల బృందం తమ తీరం మీదుగా ప్రయాణిస్తున్నదనీ, ఆ ఓడలో అనేక మంది వర్తకులతో పాటుగా మత ధార్మికవేత్తలు కూడా ఉన్నారని ఆయనకు సమాచారమిచ్చిందట. రాజుకు అంతకు ముందే ఇస్లాం మత ధార్మిక వేత్తల పాండిత్యం గురించి పరిచయం ఉన్నది కాబట్టి, వారిని కూడా అడిగి చూతామని ఆలోచన కలిగిందట. రాజు తలిచినదే తడవుగా ఆ పండితులను ఆయన ముందర హాజరు పరిచారట.

అపుడు వారు రాజు చెప్పిన కలను సావధానంగా విని అది ఒక మార్మికమైన వృత్తాంత్తంగా, మహ్మద్ ప్రవక్త పిలుపుగా ఆయనకు తెలియ జేసి వెళ్ళిపోయారట. అపుడు రాజు ఏకాంత మందిరంలో తన ఆంతరంగికులతో చింతన చేసి, తన రాజ్యాన్ని కొన్ని  భాగాలుగా చేసి,  అర్హులైన వారి నాయకత్వం కింద అప్పగించి మహ్మద్ ప్రవక్తను కలిసేందుకు మదీనాకు తరలిపోయాడట. మహ్మద్ ప్రవక్త సాంగత్యంలో ఆయన అక్కడే ఇస్లాంను స్వీకరించాడట. అటు తర్వాత అక్కడ కొంత కాలం గడిపి, తిరిగి వస్తూ ఉండగా అనారోగ్యంతో ఒమన్‍లోని సలాలహ్ వద్ద దేహాన్ని విడిచాడట.

భారత దేశ తాత్విక చింతనలో ఇస్లాం ప్రభావాన్ని తెలిపే గాధలలో ఇది ఒకటి. చేరమాన్ రాజు ఉనికి, అతని కాలమూ, అతను కాంచిన అద్భుతమైన కల, అతను చేసిన ప్రయాణము – మొదలైన వాటిపై చరిత్రకారులలో వాదవివాదాలు ఉన్న మాట వాస్తవమే. రాజు మదీన వెళ్లిన మాట నిజమే కానీ ఆ ప్రయాణం పక్కా వ్యాపార లావాదేవీలకు సంబంధించిందిలెమ్మని చెప్పే వాళ్ళూ ఉన్నారు. కానీ అతని రాజధాని కొడంగుళ్ళూరు (కేరళ)లో మాత్రం అతని పేరు మీద ఒక మసీదు వెలసింది. ఇది భారత దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మసీదులలో ఒకటిగా గుర్తింపబడింది. క్రీశ 629నుండీ ఇది ఇక్కడి నేల మీద ఒక చారిత్రక సంగమంగా సమున్నతంగా నిలబడి ఉంది.

ఈ నేలమీదకు ఇస్లాం రాక నిజంగా చారిత్రక సంగమమే. అది మనకు పరిచయంలేని నియో ప్లాటినిజం, యూదు, క్రైస్తవ వంటి అనేక  తాత్విక భావధారలనూ, మత సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, ధిక్కారాలనూ తనలో కలగలుపుకొని ఈ నేలమీదకు మోసుకొని వచ్చింది. ఇస్లాం, సూఫీల  రూపంలో ఆయా తాత్విక భావ దారలు ఇక్కడ పాదుకొని, నేల నాలుగు చెరుగులా ప్రవహించి, ఇక్కడి మట్టిలోనికి ఇంకి “సంగమం” అనే మాటకు విన సొంపయిన అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సరిగ్గా ఈ అర్థం నుండే, సహజీవన విలువలను ప్రస్తుతిస్తూ  తాత్వికుడూ, కవీ అయిన షాజాహాన్ కుమారుడు దారాషికోహ్ తన సూఫీ తాత్విక గ్రంథానికి “రెండు సముద్రాల సంగమం” అని పేరు పెట్టాడు.

రాబియా గురించి మార్గరేట్ స్మిత్ అనే మతతాత్విక విమర్శకురాలి విమర్శను పూర్వ పక్షం చేస్తూ, లూయిస్ మాసింగ్సన్ “సంగమం” (కాన్ఫ్లుయెన్స్) అనే మాటను ఉపయోగించాడు. ఏదైనా ఒక కొత్త ధోరణి లేదా విశ్వాసం ఉనికిలోకి వచ్చినపుడు దానిని  ఒక మతానికీ మరో మతానికీ అంటుకట్టకుండా(హైబ్రిడైజేషన్), ఆయా మత భావాల పుట్ట్టుక, పరిణామాలతో పాటుగా ఆయా స్థల కాలాల నాటికి  ఉనికిలో ఉన్న ఇతర ప్రాభావికమైన అంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలని చెబుతూ, ఈ విషయాలను  సూఫీయిజం పుట్టుకకు అన్వయించి చెబుతాడు. మన దేశంలోని మత సాంప్రదాయాలతో సూఫీ, ఇస్లాంల పారస్పరిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.

భారత దేశంలో ముస్లీం పాలన ఏర్పడక ముందునుండే దేశ దక్షణ కోస్తాకు అరబ్, పర్షియా, ఈజిప్టు, ఇతర మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. భారత దేశానికి ఇస్లాంతో ఏర్పడిన సంబంధాలను చరిత్రకారులు మూడు రకాలుగా వివరిస్తున్నారు. దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతానికి ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుండే ఆయా దేశాల వర్తకులు రాకపోకలు సాగించేవారు. ఇస్లాం ఉనికిలోకి వచ్చాక వర్తకులతో పాటుగా మిషనరీలు కూడా ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. స్థానిక ప్రజలలో భాగంగా కలిసిపోయారు. మోపిల్లాలు దీనికి ఉదాహరణ. దీనికి తోడుగా ఉమయ్యాడ్‍ల కాలంలో సింధ్ ప్రాంతంమీదకు చేసిన దాడులు, ఆక్రమణలు స్థానిక ప్రజలకు ఇస్లాంను, సూఫీలను పరిచయం చేసాయి. ఈ రెంటితో పాటుగా క్రమ పద్ధతిలో  పదవ శతాబ్ధం నుండి చేసిన దాడులు, వలసలు, రాజ్యాల స్థాపన, వీటికి తోడుగా పదమూడవ శతాబ్ధంలో మంగోలుల దండయాత్రల వల్ల ముస్లీం ప్రాభల్య ప్రాంతాలు స్థిరత్వాన్ని కోల్పోయి అనేకమంది ఇస్లాం పండితులు, సూఫీలు ఢిల్లీ సుల్తానుల ఆశ్రమాన్ని కోరి ఢిల్లీని చేరడం, ఆక్కడ నుండీ వివిధ ప్రాంతాలలో స్థిర పడడ-. ఈ సంఘటనను చరిత్రకారులు కాన్‍స్టాంట్‍నోపిల్ పతనంతో పోలుస్తున్నారు.

దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతం మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా ముందుగా ఇస్లాం ప్రభావానికి గురి  కావడం వల్ల దాని మతతాత్విక వ్యక్తీకరణలలో అది  గొప్ప కుదుపుకు లోనయ్యింది. ఇది భక్తి ఉద్యమం రూపంలో ఇక్కడ వ్యక్తమయ్యింది. మధ్య యుగాల సామాజికమార్పులకు ఈ ప్రాంతం వేగుచుక్కగా నిలిచింది.
ఈ ప్రాంతంలో ఇస్లాం వచ్చే నాటికి వివిధ తెగల, జాతుల సాంస్కృతిక మతపర సంకేతాలు ఒక దానితో మరొకటి ఘర్షణ, ఐక్యతలను పొంది సరికొత్త దేవుళ్ళూ, మత సంకేతాలూ ఏర్పడ్డాయి. కుల వ్యవస్థ స్థిరపడింది. మతాలు వ్యవస్థీకరణ రూపాన్నిపొంది బ్రాహ్మణీకరింపబడ్డాయి. బౌద్ధ, జైన మతాలు అనేక చీలికలుగా మారి తమ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అయితే ఏకేశ్వరారాధన ఇంకా బలపడలేదు. ఒకే దేవుని కింద మత విశ్వాసాలు బలాన్ని పుంజుకోలేదు. ఒకే దేవుడి గురించిన భావనలు ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ కనిపించినప్పటికీ అవి తాత్విక పరిభాషలోనూ, తర్కపరమైన చర్చల్లోనూ ఉంటూ,  సమాజంలోని పైస్థాయి పండిత చర్చలుగానే ఉండిపోయాయి. అంతేగానీ సామాన్య ప్రజల వ్యక్తీకరణలుగా అవి పాదుకోనలేదు. ఈ అంతరం సమాజంలోని ప్రజల మధ్య ఉన్న సామాజికార్ధిక విభనను సూచిస్తున్నది. వేదకాలపు కర్మకాండకు వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ, జైన మతాలు నాస్తిక మతాలుగా ప్రజలకు పరిచయమయ్యాయి. బౌద్ధం అటు తర్వాత మహాయాన బౌద్ధంగా మార్పు చెంది, బుద్ధున్ని దేవునిగా మార్చినప్పటికీ అది వేడుకలు, ఉత్సవాలకు ఆలవాలమై కేవలం విగ్రహారాధానను మాత్రమే మిగుల్చుకున్నది. అందువల్ల అప్పటి సామాన్య ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు సరిపోయేదిగా కాలేక పోయింది. ఇస్లాం ఈ లోటును పూరించేందుకు తగిన దన్నును అందించగలిగింది.

ఇస్లాం సాధారణ ప్రజల వ్యక్తీకరణకు ఒక అంతఃస్రవంతిగా ఇక్కడ పని చేయగలగడానికి ఇక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా దోహదపడ్డాయి. హర్ష సామ్రాజ్య పతనానంతరం దేశ మొత్తం మీద ఇక్కడే సుస్థిరత కలిగిన రాజ్యాలు ఏర్పడ్డాయి. చేతి వృత్తులు, వాణిజ్యం వృద్ధిచెందాయి. వృత్తినిపుణులు, చిన్న చిన్న వర్తకులు సమాజంలో తమ స్థానాలను తాము గుర్తించగలిగే స్థితికి చేరుకున్నారు.  ఈ స్థితిలో వారి వ్యక్తీకరణకు సరిపోయే మతం కావలిసి వచ్చింది. ఇది భక్తి ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది.

భక్తి ఉద్యమం శూద్రుల వ్యక్తీకరణ. అది బ్రాహ్మణియ వ్యక్తీకరణలకు పూర్తిగా భిన్నమైనది. భక్తి అనే భావన భగవద్గీతలోనూ, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ, మహాయాన బౌద్ధంలోనూ అప్పటికే ఉన్నప్పటికీ సారంలో భక్తి ఉద్యమ కాలపు భక్తికీ దీనికీ చాలా అంతరం ఉంది. భక్తి భావన వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ కూడా ఉందని కొందరు అంటుంటారు. కానీ వేదాలలోని భక్తి కర్మకాండనుంచీ వేరు చేయలేనిది. కాగా భక్తిఉద్యమ కాలపు భక్తి ఏకేశ్వరారాధనతో ముడిపడి ఉన్నది. అది కర్మకాండ ప్రధానమైనది కాదు. ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ ఉన్న భక్తి ఙ్ఞానంతో ముడి పడి ఉంటుంది. అది అవ్యక్తిగతంగానూ, భావోధ్వేగరహితంగానూ, తాత్విక పదబంధాలతోనూ ఉంటుంది.

భక్తి ఉద్యమం ప్రతిపాదించిన భక్తి దేవుని ముందర భక్తులందరినీ సమానం చేసింది. ఇది బౌద్ద్ధ, జైనాలలో కూడా ఉన్నప్పటికీ కుల అసమానతలను తుడిచివేయగలగిన తీవ్రమైన ఆవేశిత మిలిటెంట్ స్వభావం ఇస్లాం ప్రభావం నుండే భక్తి ఉద్యమం పొందింది. ఆరవ శతాబ్ధం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన నయనార్లలో స్త్రీలు, శూద్రులు, దళితులూ ఉన్నారు. బ్రాహ్మణుడైన సుందరమూర్తి నయనార్ అబ్రాహ్మణ స్త్రీలను వివాహమాడాడు. ఆళ్వార్లు కూడా  కులం పట్ల ఇదే విధానాన్ని అవలంబించారు. రామానుజుడు కులాలకు అతీతంగా వ్యవహరించాడు. మార్గ నిర్ధేశకులుగా, గురువులుగా, దైవానుగ్రహాన్ని పొందిన వారిగా, భగవంతునితో సంధాన కర్తలుగా ఉంటూ కుల, లింగ వివక్షతలు  లేకుండా పాటించి చూపారు. నయనార్లలోకంటే ఆళ్వార్లలో, రామానుజునిలోనూ ఇస్లాం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రామానుజుడు అనుసరించిన “ప్రపత్తి” ( సెల్ఫ్ సరెండర్) ఇస్లాం నుండి వచ్చినదే. భండార్కర్ ఇది క్రైస్తవ ప్రభావం నుండి వచ్చినదని అభిప్రాయపడ్డాడు. కానీ ఆ కాలంలో దక్షణ భారతదేశంలో   క్రైస్తవ ప్రభావం ఇస్లాంతో పోలిస్తే చాలా తక్కువ.
భక్తి ఉద్యమం ముందుకు తెచ్చిన భగవంతుడు అద్వితీయుడు. అతను తప్ప మరొకరు భగవంతుడు కాలేరు. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, శాక్తేయులకు శక్తి తప్ప మరొకరెవరూ దైవంగా ఉండజాలరు. అయితే భగవంతుడొక్కరే కానీ ఆయన సూఫీలు అనుభూతి పొందిన మాదిరిగానే,  వైయక్తికంగా ఒక్కొక్కరికీ ఒక స్వరూపంగా గోచరిస్తాడు. ఒకరికి ఆయన గురువు, మరొకరికి స్నేహితుడు, ఇంకొకరికి ప్రియుడు. భగవంతుడు ఇంతలా వివిధ వైయక్తిక భావనలతో అత్యంత సన్నిహితునిగా మారడం మనం భక్తి ఉద్యమంలో మాత్రమే చూడగలం .అందుకే భక్తి ఉద్యమ కాలపు భక్తి సూఫీల వలే అత్యంత వైయక్తికమైనదీ, భావోద్వేగపూరితమైనది.

ఆళ్వార్లు, నయనార్లు, ఆ తర్వాత వచ్చిన భక్తి ఉద్యమ కవులు గురువులూ, మార్గ నిర్దేశకులూ కూడా. భగవంతునితో అనుసంధానం చేసే వాళ్ళు కాబట్టీ వీరు అత్యంత గౌరవనీయులూ, పూజనీయులు. గురువులుగా వీరు పొందిన స్థానం సూఫీ పీర్‍లను  పోలి ఉంటుంది. సూఫీ గురువు భగవంతునిచే ఎంపిక చేయబడ్డవాడు. మార్గ నిర్ధేశకుడు. దివ్యానుగ్రహం పొందిన వాడు. పూజనీయుడు. అతను తనను అనుసరించే వారిని ముక్తి మార్గంలో నడిచేలా చేస్తాడు. బౌద్ధ, జైనాలలో కూడా ఈ రకమైన గురుశిష్య సంబంధం ఉంటుంది. అయితే భక్తి ఉద్యమం దీనిని సూఫీల దారిలో మరింత ముందుకు తీసుకొని పోయింది. సూఫీ ఫీర్‍ల వలెనే భక్తి  ఉద్యమ కాలపు గురువులు దివ్యత్వాన్ని పొందినవారు. ఈ దివ్యత్వం వారిని దేవునితో  సమం చేస్తుంది. నయనార్లు సాక్షాత్ శివ స్వరూపులు.  శంకరాచార్యులు శివుని స్వరూపం. సరిగ్గా ఇలాంటి దివ్యత్వం ఆళ్వార్లలో కూడా ఉంటుంది.  భక్తి ఉద్యమం దీనిని అంతటితో ఆపక సూఫీలలో వలెనే  గురు స్థానాన్ని  దేవుని అధిగమించి ముందుకు తీసుకొని పోతుంది. వీర శైవులలో భగవంతుని కన్నా గురువు స్థానం ముందుంటుంది.

ఏకేశ్వరారాధనతో కూడిన భక్తి,ప్రపత్తులు, గురువుకున్నప్రత్యేక  స్థానంతో పాటుగా భక్తి ఉద్యమం ఆచరించిన మరొక గొప్ప విలువ కుల, లింగ సమానత్వాలను పాటించడం. ఇది బసవని కాలంలో తీవ్రరూపాన్ని తీసుకున్నది.
” బలులను అర్పించవలసిన పని లేదు. ఉపవాసాలు, విందులను పాటించనవసం లేదు. తీర్ధయాత్రలతో పని లేదు. శుద్ధి పొందేందుకు ఏ నదిలోనూ మునగవలసిన పని లేదు. కులం లేదు. కడజాతివారయినా శైవునిగా మారిన తర్వాత అతడు బ్రాహ్మణుని కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు. పుట్టుక, లింగం కారణంగా ఎవరూ ఎవరికీ తక్కువ కాదు,. మనుషులందరూ పరమాత్ముడు నివశించే దేవాలయాలే.”

 

“వివాహం ఐచ్చికం. దానికి వధువు అంగీకారం తప్పనిసరి. బాల్య వివాహాలు చేయరాదు. విధవలు గౌరవనీయులు. వారిని  వివాహం చేసుకొనేందుకు అంగీకరించాలి.  మరణించిన వారికి శ్రాద్ధకర్మలు అవసరంలేదు. పునర్జన్మలనేవి లేవు. లింగాయతులందరూ కలిసి భుజిస్తారు. కలిసి జీవిస్తారు.”

 

ఆరవ శతాబ్ధం నుండి పదమూడవ శతాబ్ధం వరకూ దక్షణ భారత దేశంలో సామాజిక మార్పును సూచించిన భక్తి ఉద్యమం అసమానతలపై సూఫీలు చేసిన తిరుగుబాటు వంటిది. ఈ రెండూ మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు. సూఫీలు, భక్తి ఉద్యమ కవులు చేసిన సామాజిక తిరుగుబాట్లను ప్రస్తావించకుండా సూఫీల ప్రేమ తత్వం, భక్తి ఉద్యమ కవుల గొప్పదనం  గురించి మాటాడబోవడం ఒక రకమైన వంచనే అవుతుంది.
ఇస్లాం, సూఫీల ప్రభావం,   భారతీయ తాత్విక చింతనను ఆరవ శతాబ్ధం నుండీ పదిహేడవ శతాబ్ధం వరకూ ఇక్కడి సామాజిక చలనాలకు అనుగుణంగా తమవైన వ్యక్తీకరణలను ఎంచుకునేందుకు అవసరమైన తాత్విక తోడ్పాటునందించి, ఎంతగానో దోహద పడ్డాయి. ఇస్లాం, సూఫీల ప్రభావంలేకుండా వీటిని మనం  ఊహించలేము.

*
.

త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః

 

 

-శ్రీ చమన్

~

 

ప‌ది త‌ల‌లు రావ‌ణుడు..ఒక్క ఇమామీ మెంతోప్ల‌స్‌… ప‌దిత‌ల‌ల‌కూ ఒకేసారి గాయ‌బ్‌. త‌గ్గిపోయింది. పోయిందే ఇట్స్‌గాన్‌!

ఇక్క‌డ ల‌క్ష‌లాది త‌ల‌కాయ‌లు. ఇవి పిందెల ద‌శ‌ నుంచి కాయ‌లుగా మారి, ముదిరి పండై  రాలిపోయే ద‌శ వ‌ర‌కూ ఈ త‌ల‌కాయ‌ల్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఎవ‌రిది వారిదే. అయిన‌ప్ప‌టికీ   ప్ర‌జాస్వామ్యానికి పెద్ద‌త‌ల‌కాయ‌ల్లాంటి ప్ర‌భుత్వం, న్యాయ‌స్థానాలు, ర‌క్ష‌క భ‌ట నిల‌యాలు, కొన్ని సంస్థ‌లు ..త‌ల‌కాయ‌ల‌న్నీ స‌మాన‌మ‌ని భావించి స్వ‌చ్ఛందంగా కాప‌లా కాస్తుంటాయి. జుట్టురాలిన బ‌ట్ట త‌లైనా, నూనె జిడ్డు కారుతున్న త‌లైనా,  హెడ్ అండ్ షోల్డ‌ర్ వారి హెయిర్ కేర్ కార‌ణంగా నిగ‌నిగ‌లాడుతున్న త‌ల‌కాయ అయినా ఈ పెద్ద‌త‌ల‌కాయ‌ల‌కు స‌మాన‌మ‌ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

సామాన్యంగా ఇందులో కొన్ని త‌ల‌కాయ‌లు ఎక్కువ స‌మాన‌మ‌న్న‌ది ఆఫ్ ది రికార్డ్‌. ఏది ఏమైన‌ప్ప‌టికిన్నూ, గో ఎ హెడ్. అలా ముందుకు పోదాం అని నిర్ణ‌యించేస్కున్నారు. వీరి బాధ జ‌నం బాధ‌. వీరి తాప‌త్ర‌యం ప్ర‌జా క్షేమం.  కాలుష్య‌పు పొర‌లు చీల్చుకుంటూ, కారుతున్న ముక్కు చీదుకుంటూ ద్విచ‌క్ర వాహ‌నాల‌పై దూసుకొస్తున్న కొన్ని ల‌క్ష‌ల‌ త‌ల‌ల‌కు నొప్పి లేని బాధా నివారిణి అందుబాటులోకి తెచ్చారు. శిరోభారమ‌ని భావిస్తే చేతి చ‌మురు వ‌దిలిపోద్ది.  ప్ర‌జ‌ల ధ‌న‌, మాన ప్రాణాలు కాపాడే ప‌నిలో 24/7 న్యూస్ చాన‌ల్‌లా ప‌నిచేస్తున్న వారి మైండ్‌లో మెరిసిన మెరుపే ఈ శిర‌స్ర్తాణం. మ‌ర‌కా మంచిదే!

జేబుకు చిల్లు, బుర్ర‌కు బ‌రువూ అయినా.. హెల్మెట్టూ మంచిదే.  కోర్టు అక్షింత‌ల‌తో, స‌ర్కారు త‌ప్ప‌నిస‌రై జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో, ఉన్న‌తాధికారుల ఆదేశాల వంటి ఇత్యాది కార‌ణాల‌తో ప్ర‌జాసంక్షేమ సైన్యం రంగంలోకి దిగింది. పైన శాంతికి చిహ్న‌మైన‌ ధ‌వ‌ళ‌వ‌ర్ణ చొక్కా, క‌నిపించ‌ని నాలుగో సింహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి ఖాకీ పంట్లాం వేసుకున్న బృందాలు మ‌హాన‌గ‌ర దారుల్లో అడుగ‌డుగునా చ‌లానా కొర‌డాల‌తో, ఎల‌క్ర్టానిక్ జ‌రిమానా మిష‌న్ల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. వీరికి తార‌స‌ప‌డ్డాడు న‌ర్సిమ్మ‌. న‌ర్సిమ్మ‌ ఎవుడ‌ని అడిగేరు! యాద్గిరి గాడి బామ్మ‌ర్ది. యాద్గిరి గురించి మ‌నం అడ‌గ్గూడ‌దు. గ‌ల్లీలోని ఆ అడ్డాలో  ఏ పార్టీ అయినా ఆడే నాయ‌కుడు. ఏ కుల‌మైనా ఆడే పెద్ద‌.  ఏ మ‌తానికైనా యాద్గిరే దేముడు. ఎన‌క‌మాల ఇంత‌టి ద‌న్నున్న న‌ర్సిమ్మ‌ గారు.. సాయంత్రం కిష్న‌కాంత్ పార్కులో న‌డుస్తాడు.

న‌ర్సిమ్మ‌కి న‌డ‌వ‌డం కొత్త కాదు. కానీ ఇప్పుడు న‌డ‌వ‌డం కొత్తొక వింత‌. గుడుంబా మూట నెత్తికెత్తుకుని దొంగ‌చాటుగా ఎన్ని ఊర్లు దాటి సిటీలోకి ఎంచ‌క్కా ఎంట‌రిచ్చేవోడు. ఇది జ‌మానాలోని మాట‌. న‌ర్సిమ్మ న‌డిచిన తోవ లెక్కేత్తే వైఎస్ పాద‌యాత్ర కంటే ఎక్కువ కిలోమీట‌ర్ల లెక్కొస్త‌ది.  ఇప్పుడు ఆ బాధ‌లేదు. బామ్మ‌ర్ది యాద్గిరి రూపంలో న‌ర్సిమ్మ వైన్ సిండికేట్‌లోకి దూరాడు. డ‌బ్బుతోపాటు షుగ‌ర్ జ‌బ్బు వ‌చ్చిన పెద్దోళ్లంతా న‌డిచిన దారినే ప‌ట్టాడు న‌ర్సిమ్మ‌. అలాగ కిష్న‌కాంత్ పార్కులో పెద్దోళ్ల‌తో దోస్తాన న‌డ‌క త‌ప్పించి..మామూలు న‌డ‌క త‌ప్పిపోయింది. ఎండ పొడ‌గిట్ట‌ని సుకుమార సౌంద‌ర్య తేజోవిలాస న‌ర్సిమ్మ‌గారికి ఒకానొక సాయంత్రాన పాన్ న‌మ‌లాలి అనిపించింది. త‌న ఇంటిప‌క్క‌నే మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న కిల్లీ బంక్ ద‌గ్గ‌ర‌కు న‌డిచెళితే నామోషీ అనుకుని  ద్విచ‌క్ర‌వాహ‌నం తీశారు.  మెయిన్‌రోడ్‌కు ఎంట‌ర‌వుతూనే న‌ర్సిమ్మ బండి ఆగింది. లేదు ట్రాఫిక్ పోలీసోళ్లు ఆపారు.  మ‌న క్షేమ  ధైర్య‌, స్థైర్య అభ‌య ఆయురారోగ్యాల కోసం వారాపుతున్నార‌నే నిజం న‌ర్సిమ్మ‌కు తెలుసు. అందుకే ఆపాడు.

హెల్మెట్ లేదు. జ‌రిమానా క‌ట్ట‌మ‌న్నారు. యాద్గిరి బామ్మ‌ర్దిన‌ని చెప్పాడు. ఇప్పుడే క‌ట్ట‌క్క‌ర్లేదు. చ‌లానా వ‌స్తుంద‌న్నారు. ప‌ది రూపాయ‌ల పాన్ కోసం వ‌స్తే ప‌రేషాన్ చేస్తున్నారా అని మండిప‌డ్డాడు. మీరు పాన్ తినొచ్చు..వెయ్యి క‌క్కండి సారీ క‌ట్టండ‌న్నారు. చ‌లానా తీసుకుని చ‌ల్ల‌గా జారుకున్న న‌ర్సిమ్మ బామ్మ‌ర్ది చెవిలో త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వం ఊదాడు. యాద్గిరి స్విచ్ నొక్కాడు. శిర‌స్ర్తాణం-శిరోభార‌మ‌నే అంశంపై సెమినార్లు, హెల్మెట్ దాని వ‌ల్ల లాభ‌న‌ష్టాల‌పై స‌మీక్ష‌లు మొద‌ల‌య్యాయి. పోలీసు, ట్రాఫిక్‌, ఆర్టీఏ, ఫైర్ అండ్ సేఫ్టీ, వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ అధికారుల‌తో రివ్యూ ప్రారంభ‌మైంది. న‌ర్సిమ్మ గారికి క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని మొద‌లుపెడుతూనే ..న‌ర్సిమ్మ‌గారి త‌ల‌కాయ‌ను కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు ఆర్టీఏ వారు. ఇదిగాకుండా కోర్టు వారి ఆదేశాలు శిర‌సావ‌హించి, త‌మ‌శాఖ‌కు..వాహ‌న‌చోద‌కుల‌కు శిరోభార‌మైనా, శిర‌స్ర్తాణ  ధార‌ణ త‌ప్ప‌నిస‌రిగా అమ‌ల‌య్యేలా చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

హెల్మెట్ లేక‌పోతే వెయ్యి జ‌రిమానా వేసే బ‌దులు అదే వెయ్యి తీసుకుని ఓ హెల్మెట్ అక్క‌డే ఇవ్వొచ్చు క‌దా! అని ఓ ట్రైనీ అధికారి అందామ‌నుకున్నాడు. మ‌న‌సులోనే తొక్కి పెట్టేశాడు. ఇంత‌లో పోలీస్ అధికారి లేచాడు. “మీకేమి పోయింది? అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేశారు. మా ప‌నే ఘోరంగా త‌యారైంది. దొంగ‌నా కొడుకులంతా హెల్మెట్లు పెట్టేసి దొరికిన‌ది దొరికిన‌ట్టు దోచుకెళ్తున్నారు. అన్ని హెల్మెట్లు ఒకేలా ఉంటున్నాయి. సీసీ ఫుటేజీకి దొంగ‌లు దొర‌క‌డంలేదు హెల్మెట్ ముఖాల‌తో ఏ ఒక్క కేసు ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డంలేదు. చోరీ సొత్తు రిక‌వ‌రీలు కాక ఆఫీస‌ర్స్ మా ఉద్యోగ జీవితాల‌తో ఆడుకుంటున్నారు. చైన్‌స్నాచ‌ర్లు హెల్మెట్‌ల మాటున త‌ప్పించుకుంటున్నారు. సూది సైకోలకు హెల్మెట్టే ర‌క్ష‌ణ‌. మా బాధ ఎవ‌రితో చెప్పుకోం“ అంటూ ల‌బోదిబోమ‌న్నాడు.

ఆదేశాలిచ్చేది కోర్టు, అమ‌లు చేయాల‌ని స‌తాయించేది ఆర్టీఏ వాళ్లు..మ‌ధ్య‌లో వాహ‌న‌చోద‌కుల‌తో తిట్లు, నాయ‌కుల‌తో చీవాట్లు తినేది మేమంటూ వాపోయారు ట్రాఫిక్ పోలీసులు. మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న వాణిజ్య ప‌న్నుల‌శాఖాధికారులు.. మ‌హాన‌గ‌రంలో 25 ల‌క్ష‌ల ద్విచ‌క్ర‌వాహ‌నాలున్నాయ‌ని, వీరంతా హెల్మెట్లు కొంటే.. 25 ల‌క్ష‌ల హెల్మెట్లు అమ్మ‌కం అయి ఉంటాయ‌ని. ఓ 5 ల‌క్ష‌ల మంది కొన‌క‌పోయినా 20 ల‌క్ష‌ల ఖాయ‌మ‌ని, కానీ త‌మ‌శాఖకు హెల్మెట్ల అమ్మ‌కాల నుంచి ఆ స్థాయి ప‌న్నులు జ‌మ కాలేద‌ని వాపోయారు. ఇదే స‌మావేశానికి “ ప్ర‌జ‌ల ప్రాణాలు-ప్ర‌మాదాలు-ప్ర‌భుత్వ బాధ్య‌త“ అనే అంశంపై పోరాడుతున్న స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు కూడా హాజ‌ర‌య్యారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వానికి  ప్ర‌జ‌ల త‌ల‌కాయ‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించారు.  దీని కోసం తాము హైకోర్టులో పోరాడామ‌ని, ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు.

బైక్ పై వెళ్లేవాడొక్క‌డే హెల్మెట్ పెడితే చాల‌ద‌ని, వాడి వెనుకున్న వాడికి కూడా శిర‌స్ర్తాణం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లేవాళ్లు మాత్ర‌మే హెల్మెట్ పెట్టుకుంటే స‌రిపోద‌ని, న‌డిచి వెళుతున్న వాళ్ల‌ను వీళ్లు గుద్దితే వాళ్ల త‌ల‌కాయ పుచ్చ‌కాయ‌లా ప‌గిలిపోతుంద‌ని, అప్పుడు వారి ప్రాణాల్ని ఎవ‌రు తిరిగి తెస్తార‌ని లాజిక్ తీశారు.  బైకుల‌ను ఆపి త‌నిఖీ చేసే పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల‌ను.. కొంద‌రు నేర‌స్తులు, అగంత‌కులు గుద్ది వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెల్మెట్ వేసుకుని  బైక్లు దూసుకుపోయి కారు అద్దాలు ప‌గిలి అందులో వారి త‌ల‌కాయ కూడా ప‌గిలే అవ‌కాశం ఉంద‌న్నారు. ఓవ‌రాల్‌గా ఇంట్లో ఉన్న‌ప్పుడు త‌ప్పించి..విమానాల్లో వెళ్లే వారిని మిన‌హాయించి..అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేయాలని డిమాండ్ చేశారు.

చివ‌రికి న‌ర్సిమ్మ పాన్ కోరిక‌కు రోడ్డుపై న‌డిచెళ్లే వాళ్ల‌కూ శిరోభారం త‌ప్ప‌ని స‌ర‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః నినాదాలు మిన్నంటుతున్నాయి.  చిన్న‌పిల్ల‌ల‌తో ప్ల‌కార్డులు ప‌ట్టుకుని లైసెన్సు ఉండి సెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా న్యూసెన్స్ చేస్తున్న వాళ్ల‌ను చైత‌న్యం చేసేందుకు భారీ ర్యాలీ తీస్తున్నారు.
*

మంచి పుస్తకానికి తోడూ నీడా!

 

 

-సుజాత 

~

 

నవోదయ షట్టర్లు దించేశారనే వార్త “ది హిందూ” లో చూసి అక్కడ పుస్తకాలు కొని ఉన్న వాళ్లమంతా ఉలిక్కి పడి విషాదంలో మునిగి పోయి ఫేస్బుక్ గోడల మీద విచారాలు వ్యక్తం చేశాం మూకుమ్మడిగా !

వార్తలో చివరి లైన్లోని ముక్కలు (షాపు వెనక సందులో చిన్న షాపు తీసుకుంటున్నామనీ, అక్కడ పుస్తక విక్రయం కొనసాగుతుందనీ) కాస్త సందేహాన్ని మిగల్చడం తో ,దాన్ని నివృత్తి చేసుకునే దాకా నిద్ర పట్టక నవోదయ రామ్మోహన రావు గారికి, వాళ్లబ్బాయి సుధాకర్ గారికి ఫోన్ చేశాను.

అమ్మయ్య, రామ్మోహనరావు గారి నోటి వెంట “ఏం, కంగారు పడద్దు, నవోదయ మూత పడలేదు. మూత పడింది రిటెయిల్ సేల్స్ షాపు మాత్రమే” అన్న మాట వినపడింది.

ఆయన మాటల్లోనే “కొత్త పుస్తకాలు వేయడం మానేసి చాలా రోజులైందిగా? కేవలం అమ్మకాలు మాత్రమే సాగిస్తున్నాం కదా! ఇప్పుడు మూసేసింది రిటెయిల్ సేల్స్ కౌంటర్ మాత్రమే! నవోదయ ఇంకా ఉంది. వెనక షాపు తీసుకున్నాం కదా! ఎవరికి ఏ తెలుగు పుస్తకం కావాలన్నా, ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పంపినా సరే, మా దగ్గర లేక పోతే సేకరించైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో మాదిరెడ్డి సులోచనవి 60, 70 పుస్తకాలు కొత్తవి వేయాలనే ఆలోచన కూడా ఉంది! ఏం చేద్దాం, పుస్తకాలు చదివే అలవాటు చాలా వరకూ తగ్గి పోయింది జనంలో! ఆన్ లైన్లో పుస్తకాలు అందుబాటులో ఉండటం, ఈ బుక్స్ రావడం ఇవన్నీ కూడా ఇలాటి పరిస్థితికి కారణాలే! దేన్నీ కాదనలేం”

షాపు మూసేసినట్లు అద్దె షాపు తాలూకు తాళాలు కూడా ఓనర్ కి ఇచ్చేసినట్టు చెప్పిన సుధాకర్ “నాన్నగారికి పుస్తకమే జీవితం. అందుకే ఆయన దీన్ని కొనసాగిస్తారు, కాక పోతే వెనక చిన్న షాపులో” అని చెప్పారు.

ఇదంతా అలా ఉంచితే,

పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడమనే సామెత పబ్లిషర్ , పుస్తకాలు వేయడం మాని కేవలం పుస్తక విక్రేత గా మిగిలి పోవడానికి కూడా వర్తిస్తుందేమో! ఏ వ్యాపారమైనా ఏదో ఒకనాటికి మూత పడటానికి దాని కారణాలు దానికి ఉంటాయి. పాఠకుల పఠనాభిరుచి మీద ఆధారపడి నడిచే పుస్తక ప్రచురణ మూత పడటానికి ఆర్థిక కారణాలెన్నున్నా, వాటికి దారి తీసేవి మాత్రం సాంస్కృతిక కారణాలే! గత పదిహేను, ఇరవయ్యేళ్ళుగా పుస్తకాలు చదవడం అనేక కారణాల వల్ల గణనీయంగానే పడి పోయింది.   సిలబస్ తప్ప వేరే పుస్తకాలు ముట్టడానికి సమయం లేని టెక్నికల్ చదువుల్లో విద్యార్థులు మునిగి పోవాల్సి రావడం,మధ్య  తరగతి లివింగ్ రూములోకి టీవీ ప్రవేశించి పఠనాభిరుచిని హత్య చేయడం, ఆక్టోపస్ లా చుట్టూ అల్లుకున్న సోషల్ నెట్ వర్క్ .. కారణం ఏదైనా కానివ్వండి పుస్తకాల సంఖ్య జీవితంలోంచి నెమ్మది నెమ్మదిగా తగ్గి పోవడానికి వీటన్నిటి ప్రమేయం ఉంది!

నవోదయ విశాలాంధ్ర లాంటి గట్టి సంస్థలు కొన్ని తప్పించి అనేక ప్రచురణ సంస్థలు ఏ నాడో మూత పడ్డాయి.

విజయవాడ ఏలూరు రోడ్ లో పుస్తకాల షాపులన్నీ చూసుకుంటూ తిరగడం నవోదయలోనో విశాలాంధ్రలోనో గంటల కొద్దీ పుస్తకాలు తిరగేస్తూ, ఏ పుస్తకం కొనుక్కోవాలో తేల్చుకోలేక, అన్నీ కొనాలని ఉన్నా, డబ్బులు చాలవని దిగులు పడిన రోజులు మన గత చరిత్రలో ఉండటం ఒక గొప్ప గౌరవమూ గర్వకారణమూ! స్మార్ట్ ఫోన్లు లేక ఎన్ని సెల్ఫీలు మిస్ అయి పోయామో ఆ రోడ్డులో!

ఎమెస్కో పాఠకుల కోసం “ఇంటింటా గ్రంథాలయం” పేరుతో బుక్ క్లబ్ నడిపింది చాలా యేళ్ళు. అందులో స్కూలు రోజుల నుంచీ సభ్యత్వం, ఎన్నో పుస్తకాలను నా లైబ్రరీలో చేర్చింది. నెల నెలా 20 లేక 30 రూపాయలు కడితే ప్రతి నెలా ఇంటికో పుస్తకం వచ్చేది పోస్టులో .(నా సభ్యత్వ నంబర్ EBC 7463) వాళ్లెంత మంచి వాళ్లంటే, నెల నెలా వాళ్ళు వేసే పుస్తకం మనకి నచ్చకపోతే వేరే పబ్లిషర్ వేసిన పుస్తకం కావాలంటే తెప్పించి మరీ పంపే వాళ్ళు. ఆ అవకాశాన్ని వాడి అరుణా పబ్లిషింగ్ హౌస్ నుంచి చలం, రంగనాయకమ్మ గారి పుస్తకాలన్నీ ఎమెస్కో బుక్ క్లబ్ నుంచి కొన్నవే!

బుక్ క్లబ్ లే కాదు, చాలా చాలా వార పత్రికలు, మాస పత్రికలు కూడా అంతర్థానమై పోయాయి. యువ, జ్యోతి, వనిత,విజయ, పల్లకి, ఈ మధ్య నాటిదే హాసం, బాల్యపు అద్దం చందమామ, మరెన్నో!

పుస్తకాలని వ్యసనంగా మార్చిన లెండింగ్ లైబ్రరీలు, సర్క్యులేషన్ కాన్సెప్టూ మాయం! వర్తమానం లోంచి జ్ఞాపకాలు గా మారి చరిత్రలో కల్సి పోయాయి. శాఖా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు శూన్యం!

మార్పు ఏ సమాజంలో అయినా అనివార్యం! ఐతే అది అభివృద్ధికి దార్లు వేస్తుందా, సాంస్కృతికి విషాదానికి దారులు తీస్తుందా  అనేది అది ప్రయాణించే మార్గం నిర్ణయిస్తుందేమో బహుశా! ఆర్ట్సు గ్రూపులు పనికి రానివి గా ముద్ర వేసుకుని చదువుల్లోంచి దాదాపుగా అంతర్థానం అయ్యాయి! బుర్ర కథ, హరికథ వంటి కళారూపాలు వాస్తవం లోంచి జారి పాఠ్యాంశాల్లో ప్రస్తావనలు గా మారాయి. తోలు బొమ్మలాట అంతరించి తోలు బొమ్మలు వాల్ డెకార్లు గా, టేబుల్ లాంపులు గా అవతరించాయి,   కళల్ని, సంస్కృతిని చంపుకునే వాళ్లని ఎవరు బాగు చేస్తారు? రేపటి రోజున పత్రికలు ఆగి పోయినా, పుస్తక ప్రచురణ సంస్థలు మూత పడినా ఆశ్చర్యపోకుండా ఆమోదించే స్థాయికి మనమే చేరాలి!

కానీ పుస్తకం మాత్రం చావకూడదు. రూపం మారినా , అది పాఠకుల చేతిలోనే ఉండాలెప్పుడూ! పబ్లిషర్స్ అందరికీ ఆశ కల్గించేది ఏటా జరిగే బుక్ ఫెయిర్లే! ఒక పుస్తక విక్రేత హాస్యానికిలా అన్నారు నాతో “చదువుతారో లేదో తెలీదు కానీ, ఫేస్బుక్ లో ఫోటో పెట్టడానికైనా సరే, కొంటున్నారు పుస్తకాలు” ఇది వినోదమో విషాదమో గానీ పుస్తకాల అమ్మకాలకి ఆ రోజుల్లో ఢోకా లేదు

మధ్య తరగతి జీవితంలోంచి పుస్తక పఠనం నిష్క్రమిస్తోందని బాధ పడ్డా, పుస్తకానికెప్పుడూ మంచి రోజులే అని భరోసాగా రామ్మోహనరావు గారు మాట్లాడ్డం చాలా రిలీఫ్ ని ఇచ్చింది.  కానీ ఇకపై దుమ్ముతో రద్దీతో కిట కిట లాడే ఆ ఏలూరు రోడ్ లో ఇక నవోదయ బోర్డు కనిపించదు. ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కక పోతే ఆదా చేయగలిగే పధ్నాలుగు రూపాయలతో ఏ పుస్తకం అదనంగా కొనచ్చనే ఆలోచనలతో స్నేహితులతో పాసెంజర్ ట్రైన్ ఎక్కి పుస్తకాల కోసం విజయవాడకు చేసిన ప్రయాణాలే ఇక జ్ఞాపకాల్లో మిగిలేవి!

నవోదయ వెనక సందులోకి మారినా, ఆ బొర్డు కనిపించక పోయినా, రేపో మాపో అసలు మూత బడే పోయినా, ఎవరు మాత్రమేం చేయగలం? చూస్తూ “ఎటు పోతున్నాం” అని రొటీన్ ప్రశ్న వేసుకోడం తప్పించి!

 

*

 

అనంతం అంతు చూసిన వాడు..

 

-అరుణ పప్పు

~

 

కుంభకోణం నుంచి విజయనగరం దాకా దసరా సమయంలో పని నుంచి దొరికిన కొద్దిరోజుల ఆటవిడుపులో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను చూసి వద్దామని బయల్దేరాం. ‘టెంపుల్ టూరిజం’ తప్ప మరేదీ అంత ప్రముఖం కాని మన పరిస్థితుల పట్ల విసుగు నాకు. అయినాగాని, ఆ సందర్శనలో మతాన్నీ సైన్సునీ మించిన విశాలత్వమేదో నా అనుభవంలోకి రావడం అత్యంత సుందరమైన భావనగా అనిపించింది.శరత్కాలపు లేత ఎండ మమ్మల్ని దారి పొడుగునా ఎక్కడా ఇబ్బంది కలక్కుండా కాపాడింది.

పాండిచేరి అరవిందాశ్రమం, చిదంబరంలోని నటరాజ దేవాలయం తర్వాత మా మజిలీ కుంభకోణం.కుంభకోణంలో ప్రసిద్ధ దేవాలయమేదో ముందుగా మాకేం తెలియదు. కాని ఇంటి నుంచి బయల్దేరే ముందే, ‘కుంభకోణం మనకు అత్యంత పుణ్యక్షేత్రం’ అన్నారు మా నాన్నగారు. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మస్థలమదే. ఆయన ఇల్లు చూద్దామని, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలేమైనా ఉంటాయేమోనన్న ఆసక్తితో మేం కుంభకోణం ప్రయాణం కట్టాం.
మనం పోగొట్టుకున్న మేథావిగణితం తప్ప మరేదీ పట్టని రామానుజన్ ఇక్కడ ఎఫ్ఏ కూడా పాసవలేకపోయాడు. కాని జి. హెచ్. హార్డీ చొరవతో 1914లో లండన్‌కి ప్రయాణం కట్టిన ఆయన కాంపోజిట్ నంబర్స్ మీద చేసిన పరిశోధనలకు పట్టా లభించింది, లండన్ మేథమెటికల్ సొసైటీ, రాయల్ సొసైటీల్లో సభ్యుయ్యాడు. 1918లో కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ ఫెలో అయిన తొట్టతొలి భారతీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. శాకాహారం దొరకక, విటమిన్ లోపంతో ఆయన వ్యాధినిరోధక శక్తి క్షీణించి టీబీ బారిన పడి భారతదేశానికి తిరిగి వచ్చి 32 ఏళ్ల వయసుకే (1920లో) చనిపోయాడు రామానుజన్. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి 1957లో రెండు సంకలనాలుగా ఆయన రచనల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన 125 జయంతి సందర్భంగా కలెక్టర్స్ వాల్యూమ్స్ వేసింది. తమిళనాడు డిసెంబరు 22ను ‘స్టేట్ ఐటీ డే’గా జరుపుకొంటోంది. ఆయన 75 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది. ప్రస్తుతానికి మనం ఆయన పుట్టిన రోజు డిసెంబరు 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా జరుపుకొంటున్నాం. రామానుజన్ కృషి నంబర్ థియరీలో, ఫిజిక్స్‌లో, స్ట్రింగ్ థియరీలో చాలా విలువైనదంటారు

మేథమెటీషియన్ చిదంబరం నుంచి కుంభకోణం వరకూ – చిన్నాపెద్దా పల్లెటూళ్లు, పచ్చని వరిపైరుతో నిండిన పొలాలు, పెద్ద ముగ్గులు తీర్చిన ఇళ్ల ముంగిళ్ల మీదుగా మా ప్రయాణం సాగింది.కావేరి, అరసలార్ నదుల మధ్యలో ఉండే కుంభకోణం తెలుగులో ఒక జాతీయంగా ఎలా స్థిరపడిందో తెలియదుకాని, ప్రళయకాలంలో అమృతం ఉన్న కుంభం (కుండ) కొట్టుకుపోతూ ఉంటే బ్రహ్మ దాన్ని తెచ్చి రహస్యంగా ఇక్కడ దాచిపెట్టాడట. అందువల్ల ఇది కుంభకోణం అయింది.కుంభకోణంలోని దేవాలయాలతో పాటు
మహామహమ్ పుష్కరిణి చాలా ప్రసిద్ధమైనది. మన పుష్కరాల్లాగా పన్నెండేళ్లకోసారి మాఘ పున్నమినాడు జరిగే ‘మహామహమ్’లో మునకలెయ్యడానికి లక్షలకొద్దీ భక్తులు వస్తారు. ఇది మొన్నీమధ్యే జరిగింది.
బ్రిటిష్‌వాళ్ల కాలంలో విద్యాకేంద్రాలు విరివిగా ఏర్పడటంతో కుంభకోణం ‘కేంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా’గా పేరు పొందింది. ఈ ఊరు తమలపాకులు, వక్కలకీ, ప్రశస్థమైన కాఫీకీ ప్రసిద్ధి. వాటితో పాటు ఇత్తడి, కంచు విగ్రహాలు పూజాసామగ్రి తయారీకీ ప్రసిద్ధి. మన దగ్గర దుకాణదారులెక్కువమంది అక్కడినుంచే వాటిని దిగుమతి చేసుకుంటారు. అలాగే కుంభకోణంలో పట్టు పరిశ్రమ పెద్దది. ప్రసిద్ధి చెందిన త్రిభువనం చీరల తయారీలో ఈ పట్టును ఉపయోగిస్తారు. ఈమధ్యే కుంభకోణం ఎరువుల తయారీ కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. 2004లో జరిగిన అగ్నిప్రమాదంలో తొంభైమందికి పైగా చిన్నారులు చనిపోయిన సంఘటన కుంభకోణం చరిత్రలో చెరిగిపోని మచ్చ.

మేమక్కడకు చేరేప్పటికల్లా విశాలమైన ఆది కుంభేశ్వర దేవాలయంలో దసరా జాతర జరుగుతోంది. ప్రాకారం లోపం కనీసం లక్షమంది ఉన్నారంటేనే అదెంత పెద్ద ఆలయమో అర్థమవుతుంది. ఆ జనసందోహంలో తప్పిపోకుండా అనుకున్న చోటికి తిరిగి రావడానికి మాకు విశ్వప్రయత్నమయింది.కుంభకోణంలో అడుగుపెడుతూనే మా నాన్నగారి ఆతృత రెట్టింపయ్యింది. ప్రయాణ బడలిక ఎంతున్నా, ఆకలి విపరీతంగా ఉన్నా కూడా ఆయన శ్రీనివాస రామానుజన్ ఇల్లెక్కడో అప్పటికప్పుడే అడిగి కనుక్కోవడానికి నిశ్చయించుకున్నారు. తిరిగి వస్తూనే ఆయన చెప్పిన సంగతిదీ.
‘నీకు తెలుసా? ఎవరో ఒక పెద్దాయనను రామానుజన్ ఇంటి గురించి అడిగాను. అది చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా అని ఆశ్చర్యపోయాడాయన. ఒక లెక్కల మేస్టారిననే గౌరవానికే ఆయన నాకు కాఫీ ఇప్పించి ఆ ఇల్లు చూపెట్టి మళ్లీ ఇక్కడ తీసుకొచ్చి దిగపెట్టి వెళ్లారు! ‘ అని.

మర్నాడుదయమే మేం సారంగపాణి దేవాలయం వీధిలోని ఆ ఇంటికి వెళ్లాం.కృష్ణనీలపు రంగు వేసిన గుమ్మం, కిటికీతో పాతకాలపు పెంకుటిల్లు. మధ్యన వసారా, చివరన వంటిల్లు, పెరడు, బావి. అంతే. రోడ్డు వైపునుండే పడకింట్లో ఉన్న చెక్క మంచం, వసారాలో ప్రతిష్టించిన రామానుజన్ విగ్రహం, వెనక ఆయన గురించిన పాత ఫోటోలు. అంతే మరేమీ లేదక్కడ.

పుస్తకాల్లోనో, ఇంటర్నెట్లోనో లభ్యం కాని కొత్త వివరాలూ లేవు. శాస్త్ర యూనివర్సిటీ వాళ్లు ఉన్నంతలో బాగు చేసి నిర్వహిస్తున్న ఆ ఇంటి కి పర్యాటకులంటూ నిత్యం వచ్చిపోయేదెవరూ ఉండరు. అందువల్ల దుమ్ము కాస్త పేరుకునే ఉంటుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అదొక రకమైన చిత్రమైన భావనేదో కలిగింది. పాదరసం వంటి మేథగల గణిత శాస్త్రవేత్తను అతి చిన్నవయసులోనే పోగొట్టుకున్న దేశ కాల పరిస్థితులను తలచుకుని మనసు దుఃఖమయమైంది.

ఆ అరుగు మీదే కూర్చుని రామానుజన్ అత్యంత కఠినమైన ఈక్వేషన్లను సాధించేవాడని, దాదాపు 3900 ఈక్వేషన్లను ప్రతిపాదించాడని గుర్తు చేసుకున్నప్పుడు శరీరం ఒకలాంటి వివశత్వానికి లోనైంది. ఎదురుగా సుమారు 150 అడుగుల ఎత్తు, 12 అంతస్తులతో ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తున్న సారంగపాణి దేవాలయ గోపురం ఆయనకు స్ఫూర్తినిచ్చేదని, ఆ ప్రాకారాల్లోని గచ్చు మీద సుద్దముక్కతో ఆయన లెక్కలు చేసేవాడని గుర్తుచేసుకుంటే కళ్లు చెమర్చాయి.’దైవాన్ని గురించిన ఆలోచన ఇవ్వలేని ఏ గణిత సూత్రమూ నాకు అర్థవంతంగా అనిపించదు. ఆ కోవెల్లోని కోమలవల్లి (మహాలక్ష్మి )అమ్మవారే తనకు స్ఫూర్తి ‘ అన్న రామానుజన్ మాటలు జ్ఞాపకమొచ్చాక ఆ తల్లిని దర్శిస్తుంటే మనసు ఆ్రర్దమైపోయింది.

సారంగపాణి దేవాలయం వెనకాలే పెద్ద బజారు. గులాబి పువ్వులు, పూజా సామగ్రి హోల్‌సేల్‌గా అమ్మే చోటది.ఒకవైపు నుంచి దట్టంగా మేఘాలు కమ్ముతున్న మధ్యాహ్నపుటాకాశం తల మీద. కంటికెదురుగా గులాబీల రంగు, గాఢమైన వాటి పరిమళం, అరటినారలతో పాటు తమ మాటలనూ నవ్వులనూ కలిపి గులాబీలను పొడవాటి దండలుగా చకచకా అల్లుతున్న శ్రామికులు.. ఇవన్నీ కలిసి ఒక్క క్షణం నేను విజయనగరం గంటస్తంభం బజారులో ఉన్నానేమో అన్న భ్రాంతిలోకి నెట్టేశాయి.అదెందుకంటే కుంభకోణం రావడానికి ముందే నేను విజయనగరంలో యు.ఎ.నరసింహమూర్తిగారింటికి వెళ్లాను.

అప్పటికి కొద్ది నెలలైంది ఆయన మరణించి. కన్యాశుల్కం మీద అథారిటీగా, సంప్రదాయ సాహిత్య విమర్శకుడిగా ఆయన ఎక్కువమందికి తెలిసిన పెద్దమనిషి. నాకాయన పెదనాన్నగారవుతారు.సాహితీలోకానికి ఆయన కృషి ఆయన రాసిన విమర్శనాత్మక పుస్తకాల మేరకే తెలుసు. మాకు ఆయన సాహితీవ్యాసంగాన్ని మించిన నిండైన వ్యక్తిత్వం, ఆ పుస్తకాల్లో కనిపించని జీవిత దృక్పథం, కఠిన పదజాలంతో నిండిన విమర్శలను సైతం స్థిమితంగా స్వీకరించగలిగిన నెమ్మదితనం – ఇవన్నీ తెలుసు. ఆయన లేని ఇంట్లోకి అడుగుపెడుతున్నానన్న భావనకే ఒళ్లు జల్లుమంది. ఆయన చెబుతుంటే పుస్తకాలను రాసి పెట్టేవారు ఆయన భార్య రవణ. నాకు దొడ్డమ్మ. ఆయన పుస్తకాల గదిని చూపిస్తూ ఆమె కూడా అదే అన్నారు ‘మనుషులు శాశ్వతం కాకపోవచ్చు కాని, వాళ్ల పనిలోని స్ఫూర్తి మనల్ని అంత త్వరగా వదిలిపోదు కదా’ అని.
విజయనగరం – కుంభకోణం : ఈ రెండు ప్రాంతాల సందర్శనా వెన్వెంటనే జరిగినది కావడం పూర్తిగా యాదృచ్ఛికమే. కాని వాటి నుంచి అందిన స్ఫూర్తి నన్ను రోజువారీ పేరుకునే దుమ్ము నుంచి శుభ్రం చేసింది. నా హృదయాన్ని తేటపరిచింది. అటు శ్రీనివాస రామానుజన్ – ఇటు యూఏ నరసింహమూర్తిగార్ల జీవితాలు, నెమ్మదైన స్వభావాలు, నిరంతర అధ్యయనశీలురైన వాళ్ల వ్యక్తిత్వాలు నాలోని ఏ చైతన్యాన్ని, ఏ వివేకాన్ని మేల్కొల్పాయో మాటల్లో చెప్పలేను.

 

ఈ తలపోత ఎందుకంటే రెండు కారణాలు.

మొన్నొకరొచ్చి ‘విశాఖపట్నంలో శ్రీశ్రీ, రావిశాస్త్రి ఇళ్లెక్కడున్నాయో తెలుసా, మనం చూడటానికి వీలుందా?’ అని అడిగితే తెల్లముఖం వెయ్యవలసి వచ్చింది. ఏవైనా జ్ఞాపకాలు భద్రంగా ఉంటే కద, ఏ రంగంలోనైనా గొప్పవాళ్ల గుర్తులు ఎన్నో కొన్ని తర్వాతి తరాలకు అందడానికి? రెండోది – శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా హాలీవుడ్ కిందటేడు ‘ద మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ అనే చిత్రాన్ని నిర్మించింది. రాబర్ట్ కనిగెల్ రాసిన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ చిత్రంలో దేవ్ పటేల్ రామానుజన్‌గా నటించాడు. టొరంటో, గోవా లాంటి చోట్ల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయి, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 29న భారతదేశంలో విడుదలవుతోంది. అందుకని.

 

=========
ఈ సినిమా ట్రెయిలర్ లింకు

.
యూఏ నరసింహమూర్తిగారి గురించి విశాఖపట్నం సాహితీప్రేమి రామతీర్థ రాసిన వ్యాసం
శ్రీమతి రవణ గురించి జగద్ధాత్రి రాసిన కవిత ఇక్కడ.

అక్షరాంగి

 

అర్ధరాత్రి తెలియకుండా వదిలి వెళ్ళిన

సిద్ధార్ధుని యశోధర ధు:ఖం కాదు ఆమెది

మురిపించి మైమరపించి కొంగు పట్టుకు తిరిగి

సకల సాహిత్య భువనాలు తిప్పి

అకస్మాత్తుగా రేపల్లె వీడి వెళ్ళిన

బాల కృష్ణుని యశోదా విలాపం ఆమెది

ఆమె మాటల్లో అర్ధ శతాబ్దపు దాంపత్యం

గూర్చిన మరపు రాని ముచ్చట్లు

ముత్యాల సరాల్లా దొరలి పోతున్నాయ్

మధ్య మధ్యలో ఆగలేని కన్నీటి ముత్యాలూ

చెక్కిళ్ల పై జారి కొంగులో ఇంకి పోతున్నాయి

ఏడు పదుల వయసులోనూ చంటి పిల్లాడికి మల్లే

తనతోడిదే లోకమని తిరిగిన వాడు

హఠాత్తుగా ఒంటరిని చేసి వెళ్ళి పోయాడన్నతలపు

ఆమెను నిలవనీయడం లేదు

అయినా జన్మ సంస్కారం తో అందరినీ

ఆత్మీయంగా పలకరిస్తోంది

మీరు లేనిదే వారి అక్షారాలు లేవమ్మా అన్నాం

ఆయనా అలాగే అనేవారు ప్రతి క్షణం

చుట్టుముట్టాయేమో ఆతని స్మృతులు

పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి

కళ్ళు రెండూ నీటి కుండలవుతున్నా …

అంతటి సాహితీ మూర్తికి

కలమూ , కళత్రమూ కాగలిగిన ఆమె ధన్యురాలు

భావాలన్నీ సమ్మిళితమయిన  ఆమె మాటలలో

ఎన్నెన్ని అనుభూతుల ఉద్విగ్నతలను దాచిందో

వారి ఇరువురి జ్ఞాపకాల మల్లెల పరిమళాలను

మాతో ఆప్యాయంగా పంచుకుంది

అహరహము అక్షరం తోనే సహవాసం చేసినా

సాహిత్యాన్నెప్పుడూ సవతిగా భావించలేదు ఆమె

వారి భౌతిక దాంపత్యానికి కొడుకు ఆనవాలు

వారి అలౌకిక సాహిత్యానురాగానికి

ఆయన రచనలు ప్రత్యక్ష ప్రమాణాలు

చూడటానికి వెళ్లింది ఒక కలం మూగ బోయిందని

చూసి వచ్చింది తెగిన వీణ తంత్రులతో

నిరుత్తర అయి విలపిస్తున్న సరస్వతిని

మహాభారత రచన చేస్తున్న వినాయకుడి కలాన్ని

హఠాత్తుగా విధి లాగేసుకున్నట్టు

మూగబోయిన ఆమె కలం చిందిస్తోంది కన్నీరు

సాహితీ  లోకాన అతను చిరంజీవి

ఆతని భావాలను అక్షరీకరించిన ఆమె

అనునిత్యం స్మరణీయురాలు

తల్లీ! సరస్వతి ! అని ఆమెకు

మొక్కి, ఆమె కరణాలను

కళ్ళకు అద్దుకుని

సాహిత్య క్రౌంచ ద్వయానికి ప్రణమిల్లాను

సాష్టాంగ ప్రమాణం చేసుకుని వెనుతిరిగాను

 

 

(కీ.శే. యు. ఏ. నరసింహ మూర్తి గారి భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లినప్పుడు ఆతని భార్య శ్రీమతి రమణమ్మ గారితో కాస్త సమయం గడిపాక హృది కదిలి…ఇలా …ప్రేమతో జగద్ధాత్రి ) 8.30 (రాత్రి) 1/5/2015 శుక్రవారం

   సూఫీ నెచ్చెలి రాబియా

 

 

‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

 

రమణ యడవల్లి 

~

ramanaమన్దేశంలో ఆనేక రంగాల్లో కృషి చేసిన (చేస్తున్న) వారికి ప్రభుత్వాలు పద్మ అవార్డులులిస్తాయి. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిస్తాయి. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్‌కి ఈ యేడాది ఫాల్కే అవార్డు లభించింది, అందుగ్గాను మనోజ్ కుమార్‌కి అభినందనలు. గత కొన్నేళ్లుగా ఈ అవార్డులు అనేవి ప్రతిభకి చిహ్నంగా కాకుండా పలుకుబడికి నిదర్శనంగా మారిపొయ్యాయి. ఇందుగ్గానూ ప్రజలు మిక్కిలి చింతించి ఈ అవార్డుల గూర్చి పట్టించుకోవడం మానేశారు.

సినిమా వాళ్లకి ఒక ప్రత్యేకత వుంది. డాక్టర్లు స్పెషాలిటీ కోర్సులు చదువుకుని స్పెషలిస్టులు అవుతారు. సినిమావాళ్ళకి అలా కోర్సులేమీ వుండవు కానీ, వారు ఒకే మూసలో సినిమాలు తీసి స్పెషలిస్టులు అవుతారు. పౌరాణిక జానపదాలు, భక్తి సినిమాలు, ఫైటింగు సినిమాలు, ప్రేమ సినిమాలు, హాస్య సినిమాలు, బూతు సినిమాలు.. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్పెషాలిటీ. అలాగే మనోజ్ కుమార్ స్పెషాలిటీ దేశభక్తి!

షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్.. మనోజ్ కుమార్ ఇలా అనేక దేశభక్తి సినిమాలు తీశాడు, విజయాలు సాధించాడు. అందుకే అభిమానులు ఆయన్ని ‘భారత్ కుమార్’ అని పిలిచుకున్నారు. మా మేనమామ ఒకాయనకి సినిమాల పిచ్చి. వరసపెట్టి సినిమాలు చూసీచూసీ సినీ పండితుడైపొయ్యాడు. మనోజ్ కుమార్ తన కెరీర్ అంతా ఒకటే ఎక్స్పెషన్‌తో లాగించేశాడనీ, ఆ వొక్కటైనా దిలీప్ కుమార్ దగ్గర అరువు తెచ్చుకున్నదనీ చెబుతుండేవాడు. నాకైతే నిజానిజాలు తెలీదు.

ఇవ్వాళంటే ‘మేం స్వచ్చమైన దేశభక్తులం’ అని మన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం యేర్పడింది గానీ – నా చిన్నతనంలో ఈ సమస్య లేదు. ఆగస్టు పదిహేనో తారీకున ఒక స్వతంత్ర సమర యోధుడితో స్కూల్లో జాతీయ జెండా ఎగరేయించేవాళ్ళు, బిస్కట్లు పంచేవాళ్ళు. చాలా సినిమాల్లో యేదోక సందర్భంలో ఒక దేశభక్తి పాట వుండేది. ఆ పాటలో కనిపించే గాంధీ తాత, నెహ్రూ చాచా క్లిప్పింగులకి చప్పట్లు కొట్టేవాణ్ని. సినిమా అయిపొయ్యాక తెరమీద ‘జనగణమన’ వేసేవాళ్ళు, చివర్లో ‘జైహింద్’ అంటూ సెల్యూట్ చేసేవాణ్ని. ఈ విధమైన నా దేశభక్తికి నేను చాలా సంతోషించేవాణ్ని.

 ఎందుకంటే – నాకు తెలిసిన చాలామందికి నా మాత్రం దేశభక్తి కూడా వుండేది కాదు! పదో క్లాసు తప్పి పెళ్లి కోసం ఎదురు చూసే అక్కా, ‘ఫలానా ముండమోసినావిడ (సిగ్గు లేకుండా) ఫలానా వాడితో యికయికలు, పకపకలు’ అనే వార్తల్ని అందించే మా రంగమ్మత్తా, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి బక్కచిక్కిన మా సూరిమామా – వీళ్ళెవరూ యేనాడూ దేశభక్తి గూర్చి మాట్లాడిన గుర్తులేదు. అంతేనా? సోడాబండి తిరుపాలు, పాచిపని చేసే బతకమ్మ, పాకీపని చేసే పుల్లాయ్ గాడు.. వీళ్ళందరికీ దేశభక్తి సంగతి అటుంచండి, కనీసం దేశం అంటే ఏంటో తెలీదని నాకు తెలుసు.

స్కూల్లో సైన్స్ టీచర్ గారు – మనం భారద్దేశంలో పుట్టినందుకు తీవ్రంగా గర్వించాలనీ, మనమందరం భారతమాత సేవలో తరించిపోవాలనీ గంభీరంగా చెప్పేవారు. మన ఉన్నతిని వోర్వలేని పాకిస్తాన్ సాయిబులూ, చైనా కమ్యూనిస్టులూ మన్దేశాన్ని కబళించడానికి నిరంతరం కుట్రలూ, కుతంత్రాలు పన్నుతున్నారని కూడా చెప్పేవారు. ఆయన చెప్పింది సరీగ్గా అర్ధం కాకపోయినా.. ప్రపంచ దేశాల్లో మన భారద్దేశ సంస్కృతి మాత్రమే పవిత్రమైనదీ, గొప్పదీ అనీ.. మిగిలిన దేశాలన్నీ భ్రష్ట సంస్కృతికి, దుర్మార్గాలకీ మాత్రమే నిలయమన్న సంగతి నాకు బాగా గుర్తుండిపోయింది.

దేశభక్తి విషయాల్లో మా సుబ్బు వాదన వేరుగా వుంటుంది. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ తన అమూల్యమైన అభిప్రాయాల్ని అలవోకగా చెబుతుంటాడు.

“యే దేశంలోనైనా ‘దేశభక్తి’ అనేది రాజకీయ పార్టీల నినాదం మాత్రమే. ఈ నినాదం ఆయా రాజకీయ పార్టీల మెరుగైన భవిష్యత్తు కోసమే గానీ సామాన్య మానవుడి భవిష్యత్తు మెరుగు పడేందుకు మాత్రం కాదు. యే దేశచరిత్రలోనైనా ‘దేశభక్తి’ అనే భావన అణగారిన వర్గాల కష్టాలు కడగళ్ళు తీర్చినట్లుగా గానీ, సామాన్య మానవుడి జీవన స్థితిగతులు మెరుగు పరచినట్లుగా గానీ ఋజువుల్లేవు.” అంటాడు మా సుబ్బు.

“గురజాడ గారు ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్నారు. మనం, మన తోటి మనుషులు – అందరం ఈ దేశంలో భాగమే కదా! మరప్పుడు ఒక దేశపౌరుడు ఇంకో దేశపౌరుణ్ని మోసం చెయ్యకూడదు. భారతీయ పోలీసులు భారతీయ నిందితుల్ని లాకప్ డెత్ చెయ్యకూడదు, భారతీయ అగ్రకులాలు భారతీయ దళితుల్ని హీనంగా చూడకూడదు, భారతీయ సైనికులు భారతీయ ఆదివాసీల అణచివేతకి పాల్పడకూడదు. మరి – ఇవన్నీ జరుగుతున్నయ్యా?” అంటూ ప్రశ్నిస్తాడు మా సుబ్బు.

“గురజాడ వారే ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా!’ అని చెప్పారు. అయితే వాస్తవానికి ఈ సూక్తి ఎవరికి వర్తిస్తుంది? ప్రజల్ని నిలువునా ముంచేస్తున్న రాజకీయ నాయకులకి వర్తిస్తుంది, పబ్లిక్ బ్యాంకుల్ని పబ్లిగ్గా దివాళా తీయిస్తున్న కార్పోరేట్ సంస్థలకి వర్తిస్తుంది. కానీ ఈ ఉన్నత వర్గాల వారే స్వతంత్ర దినం నాడు భారతమాత విగ్రహానికి దండేసి, జాతీయ జెండాకి దణ్ణం పెట్టి దేశభక్తులైపోతారు! దేశభక్తి గూర్చి ఉపన్యాసాలు దంచుతారు.” అంటూ నవ్వుతాడు మా సుబ్బు.

“ఒక దేశానికి అన్నిరకాల వృత్తులూ అవసరం. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశుధ్య పనివారు, సైనికులు.. ఇలా అనేకమంది కలిస్తే గానీ ‘దేశం’ అనే బండి నడవదు. వీరిలో యే ఒక్కరూ ఇంకొకరికన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. పొలం దున్నుతూ పాము కరిచి చనిపొయ్యే రైతూ, ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో చనిపోయ్యే కార్మికుడూ, రోగి నుండి సంక్రమించిన ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయ్యే వైద్యుడూ, మేన్‌హోల్లో కుళ్ళు కంపుకి ఊపిరాడక చనిపోయ్యే పారిశుధ్య కార్మికుడూ, సరిహద్దులో శత్రువు దాడికి చనిపోయ్యే సైనికుడూ.. అందరూ సమానంగా అమరులే (దీని అర్ధం యేమైనప్పటికీ)!” అంటూ బల్ల గుద్దుతాడు మా సుబ్బు.

ప్రస్తుతం దేశ పరిస్థితులు బాగాలేవు. దేశభక్తి టాపిక్ చాలా కాంప్లికేట్ అయిపొయింది. ఏదైనా కొంచెం అటూఇటుగా మాట్లాడితే దేశద్రోహులం అయిపొయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మా సుబ్బు అభిప్రాయాల్తో నాకస్సలు సంబంధం లేదని విన్నవించుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు కొండ వెంకటప్పయ్యగారికి ‘దేశభక్త’ అనే టైటిల్ వుంది. వెంకటప్పయ్యగారి ‘దేశభక్త’ టైటిల్ సినిమావాళ్ళల్లో ఎవరికైనా యివ్వాలంటే మన మనోజ్ కుమార్‌ని మించిన యోగ్యుడు లేడని నా అభిప్రాయం.

చివరగా –

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

*

రెటమతం గురించి…ఒక  సంభాషణ

 

 

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

కుడి ఎడమైతే నష్టమేమీ లేదు. ఎడమ కుడి అయినా కొంప మునిగేదేమీ లేదు. ఒక బ్ర్రాహ్మణుడి మరియూ అబ్రాహ్మణుడి లేక సగం భ్రాహ్మణుడి సంభాషణ నదీ సముద్రాల సంగమం కావొచ్చు. అంటే నది సముద్రంలోకలిసిపోతుందనే అర్థమేమీ కాదు. అది అంతఃస్రవంతిగా తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. సంగమాలు ప్రళయాలు కావు కదా. అలాగే ఒక రెట మతం లేక పూర్తి ఎదురుమతంగా భావించబడినదే శుభ శకునంగా పరిణమించవొచ్చు. అలాంటి శుభ శకునమే ఇస్లాం అంటాను నేను.

ఇస్లాంని టెర్రరిరిజానికి పర్యాయ  పదంగా మార్చేసిన కాలంలో- ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం. సంగమాలను మనం పూర్తిగా నిర్వచించలేకపోవొచ్చు. అవి సహజంగా సంభవిస్తాయి. వాటి పుట్టుక తర్వాత వాటిని మనం నిర్వచిస్తాం. అది ప్రణాళిక ప్రకారం జరిగేది కాదు. అందుకే ఆ సంగమాలని మనం అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతాం.

నిజమే, ఇస్లాం ఎదురు మతమే. దాని ప్రకారం ప్రకృతీ, దేవుడూ వేరువేరు. అవి ఎప్పుడూ, ఎక్కడా కలవవు. కానీ భారతీయ సంస్కృతులలో పాంథీఇజానికే పెద్ద పీట. అంటే దేవుడు సృష్టిగా అవతరించాడన్న మాట. సృష్టే దేవుని మొదటి అవతారం. అవతార భావన దీనికి కొనసాగింపే. కానీ ఇస్లాంలో అవతారాలే లేవు. ఇంకా క్రైస్తవం నయం. దైవ కుమారుడు అవతరించాడు కదా! నేనూ, దేవుడూ ఒకటేనని అతడు చాటుకున్నాడు. దీనిలో అద్వైతం ఉందని వివేకానందుడు అన్నాడు. యూదు, ఇస్లాం మతాలని ఫక్తు చాందస మతాలుగా నిర్వచించాడు కూడా. నిజమే, క్రైస్తవానికీ, అద్వైతానికీ, హిందూ అవతార భావనకీ పోలిక సాధ్యమే. కానీ ఇస్లాంతో ఇలాంటి పోలిక ఏమీ లేదు. ఇస్లాం ఎదురు మతమే. రెట మతమే. కానీ ఇస్లాంతోటే భారతీయ సంస్కృతి దాంపత్యం నెరపింది. చలం బ్రాహ్మణ స్త్రీలు ముస్లీం పురుషులతో ప్రణయ కలాపం నెరపడమే కాదు, ప్రాచీన సంస్కృత పండితుడు, అలంకార శాస్త్రవేత్త, జగన్నాధ పండిత రాయలు ఒక ముస్లీం స్త్రీని వివాహం చేసుకొని ప్రేమ కవిత్వం రాసాడు. వెంకటేశ్వర స్వామి కూడా అంతే.

భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయన్నట్టుగా ఉందీ కథ. సైద్ధాంతికంగా చూసినపుడు ఇస్లాం నుంచీ సూఫీయిజం వరకూ జరిగిన పరిణామం ఇటూవంటిదే. “అనల్‍హక్” (అహం బ్రహ్మాస్మి) అన్నందుకు ఒక సూఫీ యోగిని ముస్లీం మత పెద్దలు చంపేసారు ( దీ్నినే మళయాల రచయిత వైకం మహమ్మద్ బషీర్ కథగా రాసాడు).  మొగల్ రాజ వంశీయుడు, దారాషికోహో ఉపనిషత్తులని తురక భాషలోకి అనువాదం చేసి స్వమతం వారిచేత, సకుటుంబీయుల చేత వివక్షకు గురయ్యాడు. అంటే ముస్లీంలు తిరుగుబాటు జెండా ఎగురవేసి ఇతర సంస్కృతులతో సంగమించడానికి ఉద్యమించారు. అంటే దూరంగా ఉండిపోవల్సిన ఇస్లాం దగ్గరైంది. దగ్గర కావల్సిన క్రైస్తవం దూరమైంది. ఈ చరిత్రని ఎందుకు మరుగు పరుస్తారు? మనుస్మృతిని ప్రేమించేవాళ్ళు మనుస్మృతి ఏమి  చెప్పిందో గ్రహించాలి. కులాల, వర్ణాల నిరంత సాంకర్యం గురించి మను స్మృతి వేనోళ్ళ చాటింది. భారతీయ సంస్కృతులు చాటుతున్నది కూడా సాంకర్య చరిత్రే, సంగమ చరిత్రే. అది కుడి ఎడమల సంగమం. ఇస్లాంతో సోకాల్డ్ హిందూ దేవతలు, హిందూ సంస్కృతి జరిపిన ప్రణయ కలాపం ( “హిందూ” అనే పదాన్ని స్పష్టత కోసం వాడుతున్నాను, అంతే).

ఈ ఆలోచనలూ, సందర్భమూ ఇట్లా పెనవేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు, ఈ ఆలోచనలు మరొకరితో పంచుకోవొచ్చు కదాని నాకు దగ్గరలో ఉన్న అవ్వారి నాగరాజుని మా ఊరికి రమ్మన్నాను.  ఇంట్లో కూడా తోడుగా ఎవరూ లేరు. తను ఫోన్ చేయగానే రావడానికి అంగీకరించాడు. కాసేపు సాధారణ మర్యాదలు అయిపోయాక మాట వెంట మాట  కలిసాక,  తను మామూలుగానే, మీరు రాతల్లో ఎక్కువగా ముస్లీం అనుకూలతని కనపరుస్తుంటారు కదా ఏమిటీ కథ అని అడిగాడు. అసలే ఇది ఒక పక్క హిందూ పాసిస్ట్ వాదులూ, అన్నింటినీ ఒకే తక్కెడతో సరిచూడగల  నాస్తికపు పెద్ద మనుషులూ విరుచుక పడుతున్న కాలం కదా.

వెంటనే నేను నాస్తికుల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు హిందూత్వ సిద్ధాంత కర్త వీర సావర్కర్ మానస పుత్రులు. ఆ సావార్కారేమో, హిట్లర్ నోట్లో నుండీ ఊడి పడ్డవాడు. అంటే ప్రొటెస్టంట్ క్రైస్తవపు జాతీయతా వాదం నుంచి. ఆ జాతీయత తీసుకొచ్చిన జాతి విధ్వేషం నుంచీ. ఈ పెద్ద మనుషులకు దేవుడూ లేడూ, ప్రకృతీ లేదూ అన్నాను. వాళ్ళు వొట్టి సంకుచిత మానవ కేంద్రక వాదులు

అన్నింటికన్నా ముఖ్యంగా ఇస్లాం కలోనియలిష్ట్ మతం కాదు అన్నాను. అదేంటో చెప్పరాదూ అన్నాడు తను.

నేను మానవసమాజంలో సర్వ సమగ్రమైన, హింసా రహితమైన దేన్ని గురించీ మాట్టాడం లేదు. స్వర్ణ యుగాల గురించి కూడా ప్రస్తావించడం లేదు. ఒకే మాట చెబుతున్నాను. ఇస్లాం కలోనియలినిజం కాదు అని మాత్రమే అని గట్టిగా అన్నాను.

ఈ దేశంలో ఇస్లాం నడక కూడా శైవ, వైష్ణవాల్లాగే. అవి కొట్టుకున్నాయ్. చంపుకున్నాయ్. తర్వాత కలిసి కొత్త రూపు ధరించాయి. ఇస్లాం కూడా ఇక్కడి సంస్కృతులతో అటువంటి సంబంధమే నెరిపింది. నిజానికి, శైవ వైష్ణవాల పుట్టుకకి మూలం ఇస్లామే.  థీయిజం, ఒకే దేవుడూ అనే భావాలు ప్రాచీన భారత దేశంలో కాళ్ళూనుకోలేదు. ఉపనిషత్తుల్లో కూడా ఈ భావాల ప్రసక్తి తక్కువ. శ్వేతాశ్వేతతరోపనిషత్తులో ఈ భావాలు కొంత వరకు ఉన్నాయని, అది ఆధునికమైనదని ఇండాలిజష్ట్, ప్రిట్స్ స్టాల్ చెప్పారు (వేదాస్). కనుక ఇస్లాం రాక  భారతీయ సంస్కృతిని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. కేవలం మతాంతరీకరణల గురించి ఎందుకు మాట్లాడతారు? ఇస్లాం కొత్త మతాల ఆవిర్భావ వికాసాలకు కారణమైంది. అందువల్ల నేడు హిందూయిజం అని చెబుతున్న దాంట్లో ఇస్లాంది చాలా భాగమే ఉంది. అందువల్ల హిందూ వాదులు వాస్తవికంగా అయితే దారాషికోహోకు ఉత్సవాలు జరపాలి. ఇస్లాంకు సాంస్కృతికంగా  ఋణపడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించాలి. కానీ హిందూ వాదులు చేస్తున్న దేమిటి? ఇస్లాంని రెటమతమనీ, ఎదురు మతమనీ ఉగ్రవాదమనీ నిందించి తమ మూలాల్ని తామే చెరిపి వేసుకుంటూ మహా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. వాళ్ళు రూట్స్ కోసం అన్వేషించాలి అన్నాను.

అయితే మీరు ఇస్లాంని కౌగిలించుకొని, క్రిష్టియానిటీని సైద్ధాంతికంగా ఎందుకు విమర్శిస్తారు? రెండింటిలోనూ విస్తరణ వాదం ఉంది కదా? అసలు ఏ మతానికైనా విస్తరణ కాంక్ష సహజమే కదా. క్రిస్టియానిటీ విషయానికే వొస్తే అది దళితులకు మేలు చేసిందని అంటారు కదా  అంటాడు తను.

అసలు మనిషే విస్తరణ వాది. మనిషి ప్రకృతినీ, ఇతర జీవులని ఎక్స్ ప్లాయిట్ చేస్తూ విస్తరించాడు. విస్తరణ వాదం దానికదే కలోనియలిజం కాదు. విస్తరణ వాదంలో ఆధిపత్యం ఉంటుంది. కానీ కలోనియలిజంలో అదనంగా ఙ్ఞానాధిపత్యం ఉంటుంది. క్రైస్తవం కలోనియలిజంగా చారిత్రక పాత్ర నిర్వహించింది. వలస క్రైస్తవం నిర్వహించిన ఆ చారిత్రక పాత్ర మీదే నా వ్యతిరేకత. పదకొండవ శతాబ్ధికి చెందిన ముస్లీం పండితుడు అల్ బెరూని బ్రాహ్మణుల సంకుచిత దృక్పథాన్ని విమర్శించాడు. భరత ఖండంలోని అనేక లోపాల్ని ఎత్తి చూపాడు. వలస క్రైస్తవులు చేసినది మాత్రం ఇది కాదు. వాళ్ళు ఇతర సంస్కృతులని ద్వేషించలేదు. నిర్వచించారు. తమ కంటే హీనమైన సంస్కృతులుగా, తమకన్నా అనాగరికమైనవిగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలని శాస్త్రాలని బూకరించారు. చరిత్రని, మతాన్ని కలగాపులగం చేసారు. దీని నుంచే ముస్లీం వ్యతిరేకత పుట్టింది. దాన్నే హిందూవాదులు స్వీకరించారు. అందుకే హిందూ వాదులు ప్రచ్చన్న క్రైస్తవులు.

“డెవిల్ ఆన్ ది క్రాస్”- పేరుతో ఆఫ్రికన్ రచయిత, గుగీ ఒక నవల రాసాడు. దాన్ని మనవాళ్ళు  “మట్టికాళ్ళ మహారాక్షసి” అని అనువాదం చేసారు. వలస వాద అభివృద్ధి పట్ల ప్రేమే దానికి కారణం. ఆయనే ఇంగ్లీషు భాషాధిపత్యాన్ని నిరశించాడు. వలస వాదానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ సంప్రదాయంలో ఒక మాట ఉంది. వాడు ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో తుపాకీ పట్టుకొని వొచ్చాడని. కళ్ళు తెరచి చూసేటప్పటికి బైబిల్ మాచేతుల్లో ఉంది. మా నేల మాత్రం వాడి అధీనమైంది. క్రైస్తవ కరుణ క్రూరమైన కరుణ(లాస్ట్ బ్రాహ్మిన్).

దగ్గర కావల్సింది దూరమైందీ- అన్నారు కదా అది ఎట్లా? అని అడిగాడు తను.

ఏ సంస్కృతీ ఏకశిలా సదృశం కాదు. మతాలు కూడా అంతే. క్యాథలిక్ క్రైస్తవాన్ని పరిశీలిస్తే ప్యాగన్ మతాల ప్రభావం కనపడుతుంది. మాతృ దేవతారాధన కూడా కనపడుతుంది.  మన స్థానిక ఆచార సాంప్రదాయాలతో చాలా పోలికలు కనపడతాయి. అందుకే అద్వైత దృష్టీ, అవతార భావన వంటి పోలికలు మన పురాణాలని గుర్తుకి తెస్తాయి. ఆ రకంగా క్రిస్టియానిటీ మనకు దగ్గర. అయితే ఇలాంటివేవీ మనకు ఇస్లాంలో కనిపించవు.  కానీ ఆధునిక కాలంలో సంస్కరణ వాదంగా వొచ్చిన ప్రొటెస్టింటిజం, గ్రంథానికి  ప్రాధాన్యం పెంచి బహుళ కథనాలకి ఆస్కారం లేకుండా చేసింది. మోనోపలీని, జాతీయతా భావం పేరుతో ఇతర జాతి విధ్వేషాన్నీ పెంచి హిట్లర్ మన్నన కూడా పొందింది. ప్రొటెస్టెంటిజం ప్రవక్త, లూథర్ ఉద్యమిస్తున్న రైతుల్ని కుక్కల్లా కాల్చి చంపమన్నాడు. యూధుల్నిదేశం నుంచీ తరిమేయమన్నాడు (రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీక్). ఇదంతా ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ అభివృద్ధి భావజాలంగా పరిణమించింది. మన నాస్తికులూ, హేతువాదులు కూడా ఈయన శిష్యులే. హిందూవాదులని కూడా ఈయన జాబితాలోనే చేర్చవొచ్చు. లిబరల్ ఫాసిస్ట్ దేశమైన అమెరికా ప్రొటెస్టెంట్ దేశమే.  అక్కడ ఒక్క క్యాథలిక్కూ ప్రథాన మంత్రి కాలేదు. కాలేడు. ఈ విషయాన్ని కంచె ఐలయ్యగారు ఒక వ్యాసంలో రాసారు.  ప్రొటెస్టంట్ సహజాత ముస్లీం విద్వేషానికి  అమెరికా ఇప్పుడు ప్రచార కర్త అయి కూర్చుంది. ఈ ప్రొటెస్టంట్లని అనుసరిస్తూనే ఆర్య సమాజం పుట్టింది. బ్యాక్ టూ బైబిల్ అని వాళ్ళంటే, బ్యాక్ టూ వేదాస్ అని దయానంద సరస్వతి అన్నాడు. వీరి  ముస్లీం విద్వేషం కూడా అక్కడ నుండి వొచ్చిందే. ఈ ప్రొటెస్టంట్ భావజాలమే చివరికి హిందూ ఫాసిజంగా రూపు మార్చుకొంది. ప్రొటెస్టెంట్ క్రైస్తవం, జినోయిజం, హిందూయిజం ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని విహరిస్తున్నాయి. జాతి విధ్వేషం వీటి సాధారణ ధర్మం.

అయితే మరి ఇస్లాం ఉగ్రవాదం మాటేమిటి? అని తన ప్రశ్న

ఉన్నది అమెరికన్ ఉగ్రవాదమే. వేదికమీద ఏం జరుగుతున్నది కాదు. తెర వెనుక జరిగేదే ముఖ్యం. సద్దాం హుస్సేన్ సంగతే తీసుకోండి. ఆయనని అమెరికా మీడియా గొప్ప ప్రజాస్వామిక వాదిగా సెక్యులరిస్టుగా, సంస్కర్తగా ఒకప్పుడు కీర్తించింది. ఒక ఉదయాన హఠాత్తుగా ఉగ్రవాదిగా చిత్రించింది. ఇరాక్‍ని ధూర్త దేశం అంది( మీడియా కంట్రోల్- నోం చాంస్కీ).

(రాణీ శివశంకర శర్మ అనే బ్రాహ్మణుడు – జంధ్యం వేసుకునే శూద్ర కులపు అవ్వారి నాగరాజు మాటా మంతీ)

          కనువిప్పు

 

  కరుణాకర్

~

 

మొన్న మేడమ్ గారి రౌద్రోపన్యాసం విన్నపటినుండి నాలో చిన్న భయం మొదలైంది. కొంపతీసి నేనుగాని దేశద్రోహుల లెక్కలోకి రాను గదా అని. ఇదే మాట మా ఝాన్సీతో( అంటే మా ఆవిడ)అన్నాను. దీనికి కారణం లేకపోలేదు.

అపుడెప్పుడో ఎన్టీయార్ దానవీరకర్ణ సినిమాలో దేవతలు దేవుళ్ళ జుగుప్సాకర పుట్టుపూర్వోత్తరాల్ని గుక్కతిప్పుకోకుండా తూర్పాలు పట్టగావిని, ఓ నాలుగు ముక్కలు బట్టిబట్టి నోరూరుకోక వాళ్ళదగ్గరా వీళ్ళదగ్గరా వాగేసి ఉన్నాను కదా. వీళ్ళల్లో ఎవరన్న ఉప్పందిస్తే నాగతి ఏంగాను.

“ముందు ఆ డైలాగులు రాసినోళ్ళు, పలికినోళ్ళ తర్వాత కదా మీ వంతు” అని ధైర్యం చెప్పబోయింది మా ఆవిడ. “వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు కదా “అని అంటుండంగానే ఎదురుగా ఉన్న పుస్తకాలా ఆరమరలో అడ్డంగా నిలబడి తాపిధర్మారావు దేవాలయాల మీదబూతుబొమ్మలు కనబడ్డాయి.

పెరుమాళ్ మురుగన్ మనసులో మెదిలాడు. ఒక్క పరుగున వెళ్ళి తీసి వంటగదిలో మచ్చుబల మీద పెట్టేశాను. హమ్మయ్య అనుకునేలోపు మొన్ననే కొన్నఇదండీ మహాభారతం గుర్తొచ్చింది. అది సరే అసలు అప్పుడెప్పుడో కొని అందరిచేతా చదివించిన రామాయణ విషవృక్షం? రావణాసురుడు ఉత్తముడనీ రామూడే అల్పుడనీ…వామ్మో రంగనాయకమ్మకి ఏమన్నా అవనీ. ముందు మన సేఫ్టీ ముఖ్యం. లోపలెక్కడో ఉన్న ’విషవృక్షాన్ని’ బయటకులాగాను.

ఇలా కాదని పాతలుంగీలో మూటకట్టాను.  మధ్యలో ఎక్కడో త్రిపురనే ని రామస్వామి చౌదరి తగిలాడు. పురాణ పాత్రలను తిరగేసి, బోర్లేసి చీల్చిచెండాడాడు కదా. పక్కనే పెరియార్. వీళ్ళందరికీ ఇట్లాంటి అలోచనలకు కారణమైన కోశాంబీ..అందర్నీ కట్టకట్టి మూటలోకి తోసాను. ఇంతలో వంటగదిలోనుంచి ఝాన్సీ గొంతు ’దేశమును ప్రేమించుమన్నా…’ పిల్లలకి నేర్పించడానికి ప్రాక్టీసు చేస్తున్నట్లుంది. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది…అ,,,దొరికింది. దేశమును ప్రేమించుమన్నా అన్నడు కానీ భారతదేశమును ప్రేమించుమన్నా అనలేదు.

ఇక్కడ కొండల్నీ గుట్టల్నీ…ప్రవహించే పుణ్య నదుల్నీ మాటలైనా తలవనేలేదు కదా. ఇన్నాళ్ళూ ఎందుకు తోచలేదు. ’మతములన్నియు మాసిపోవును మానవత్వమే నిలిచి వెలుగును. మతములన్నీ మాసిపోతాయా…ఒక మతం కాదు అందరూ కట్టకట్టుకోని వస్తారేమో….మూటకు అర్హుడే. మతమంటే గుర్తొచ్చింది. సైన్సు నా మతమన్నడు కదా సి.వి.రామన్. సైన్స్ అరకేసి చూశాను. భౌతికశాస్రం, రసాయనశాస్త్రం ఈ శాస్త్రాలన్నీ కలసి విశ్వాసాలను వెక్కిరించినట్లనిపించింది. సైన్స్అర ఖాళీ అయింది. ఆ మాటకొస్తే ఆలోచన, వివేకమూ కలిగించే పుస్తకాలన్నీ ఏదో ఒకమేరకు విశ్వాసాలను కాదనేవే. రిఫరెన్స్ కోసం కొన్న భగవద్గీత, ఏవో యోగాసనాల పుస్తకాలూ తప్ప అన్నీ ప్రమాదంగానే తోచాయి. లుంగీ చాల లేదు.

అనవసరంగా పుస్తకాలకోసం ఒక అరకట్టించి తప్పుచేశా. ఈసారి విష్ణుసహస్రనామాలు, హనుమాన్ చాలీసాలాంటి పుస్తకాలన్నా కొనాలి. విశాలాంద్రకూ ప్రజాశక్తికీ కాదు. రామకృష్ణ మఠానికో టిటిడికో పోవాలి. ఈ ఆలోచనతో మనసు కాస్త కుదుట పడింది. ఒక నిముషం సోఫాలో కూలబడ్డాను.

~