వీలునామా – 7వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పాత ఉత్తరాలు

ఫ్రాన్సిస్ ఎడిన్ బరో వొదిలి ఎస్టేటులో వుండడానికి వొచ్చే రోజు ఎల్సీ తల నొప్పిగా వుందని తన గదిలోనే పడుకుంది. జేన్ అతన్ని సాదరంగా ఆహ్వానించి, బంగళా, తోట అంతా తిప్ప్పి చూపించింది. నౌకర్లందరినీ పరిచయం చేసింది. వీలైతే వాళ్ళని పనిలో వుంచుకోమని సలహా కూడ ఇచ్చింది. అంతే కాదు, జేన్ ఇంతకు ముందు వృధ్ధులైన పనివాళ్ళకి పన్లోకి రాకపోయినా, ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పేది, పెన్షన్ లాగా. ఆ సంగతి కూడా చెప్పిందతనితో.

ఆమె మాటలన్నీ శ్రధ్ధగా విన్నాడు ఫ్రాన్సిస్. తను కూడా అలాగే కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు.

ఎస్టేటంతా తిరిగి చూసి అక్కడ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయాడు నగరవాసి అయిన ఫ్రాన్సిస్.

“ఇదంతా వొదిలి వెళ్ళాలంటే నువ్వు పడే బాధ నాకర్థమవుతుంది జేన్,” అన్నాడు.

“ఉమ్మ్మ్….నిజం చెప్పాలంటే, ఫ్రాన్సిస్, నాకు ఇల్లూ తోటా కంటే, ఇదిగో ఈ రెండిటినీ వొదిలి వెళ్తున్నందుకు ఎక్కువ దిగులుగా వుంది,” అంటూ రెండు అందమైన గుర్రాలని చూపించింది.

“నేనూ ఎల్సీ, ఎప్పుడూ ఈ రెండిటి మీదనే స్వారీ చేసే వాళ్ళం. ఫ్రాన్సిస్, ఈ గుర్రాలనీ, కుక్కలనీ, దయగా చుస్తానని నాకు మాటిస్తావా? వాటిని నేనూ, ఎల్సీ ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. పట్టణంలో పెరిగిన నీకు జంతువుల మీద ఎలాటి అభిప్రాయం వుంటుందో మరి,” సందేహంగా అంది జేన్.

“నువ్వన్నది నిజమే జేన్. నేను ఎప్పుడూ జంతువులని పెంచి, ప్రేమించలేదు. అసలు నాకొక్కడికే తిండి సరిపోయేది కాదు. అయినా, నీ మాట ఏదీ నేను కాదనను. అసలు మనిద్దరి పరిచయం ఇలా కాకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా నీకు నామీద ఎలాటి కోపమూ లేదన్నదొక్కటే నాకు తృప్తి. చాలా మంది వకీళ్ళని కలిసి వీలునామా చూపించాను, ఏదైనా ఒక దారి కనబడి మీకిద్దరికీ సహాయం చేద్దామని. ఇంత డబ్బు కంటే మా నాన్నగారు నాక్కొంచెం ప్రేమ ఇచ్చి వుంటే నేనెక్కువ సంతోషపడి వుండే వాణ్ణి. ఆ సంగతే ఆయనకు తట్టలేదు,” అన్నాడు ఫ్రాన్సిస్ ఆవేదనగా.

“ఫ్రాన్సిస్! ఈ ఎస్టేటూ, ఆస్తి పాస్తులూ నీ చేతుల్లో సురక్షితంగా వుంటాయి. నాకా నమ్మకం వుంది. నిజానికి, నేను సంవత్సరాల తరబడీ నేర్చుకున్నదొక యెత్తయితే, కిందటి నెలరోజులలో నేర్చుకున్నదొక యెత్తు. ఎప్పుడు లేనిది నేను మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి ఆలోచించాను! పొట్ట పోసుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది నాకు. కష్టపడి పని చేసేవాళ్ల మీద గౌరవం పెరిగింది. ఫ్రాన్సిస్! ఒక్కటే సలహా ఇస్తాను నీకు! పాత జీవితాన్నెప్పుడూ మరచిపోవద్దు. “నడ మంత్రపు సిరి” అని నిన్నెవరూ వెక్కిరించే పరిస్థితికి వెళ్ళకుండా వుండు. నేనన్న మాటలు నిన్ను నొప్పిస్తే క్షమించు!”

“జేన్! పాత జీవితం గుర్తున్నా లేకపోయినా, నీ మాటలు మాత్రం తప్పకుండా గుర్తుంటాయి,” నవ్వాడు ఫ్రాన్సిస్.

“ఆ రోజు మీ వూళ్ళో చర్చిలో ఫాదరు చెప్పిన ఒక్క మాట నేనూ మర్చిపోనూ!”

“ఏమిటది?”

“అంతా మన మంచికే నన్న మాట. దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే నన్న మాట. వుదాహరణకి, మావయ్య ఇలా వీలునామా రాయలేదనుకో! ఏం జరిగి వుండేదో తెలుసా?”

“ఏమిటి?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“డబ్బు కోసమే నా చుట్టూ తిరిగిన వాణ్ణి, నేనేమాత్రమూ గౌరవించలేని వాణ్ణి వివాహమాడి వుండెదాన్ని.”

ఫ్రాన్సిస్ నివ్వెరపోయాడు.

“అంటే…”

“అంత బాధ పడటానికేమీ లేదిందులో, ఫ్రాన్సిస్.”

“అంటే, నా వల్ల నువ్వు నిలవనీడా, పెళ్ళాడే అవకాశమూ అన్నీ పోగొట్టుకున్నావన్నమాట! బాధ పడకుండ ఎలా వుంటాను జేన్!”

“అబ్బే! అలా కాదు! నేనతనికి నేనున్న పరిస్థితి వివరించాను, ఇద్దరమూ విడిపోవాలని నిశ్చయించుకున్నాం, అంతే!”

“ఎల్సీ పెళ్ళి సంగతి?”

“మేమింకా దాని గురించి ఆలోచించలేదు. అదిప్పుడు కవితా ప్రపంచంలో మునిగి వుంది. ఎలాగైనా కవితల పుస్తకం ప్రచురించి, మా ఇద్దరికీ జీవనోపాధి వెతకాలని దాని తాపత్రయం.”

“అవునా? అదీ మంచిదే.”

“అవును కానీ ఎల్సీ విమర్శ తట్టుకోలేదు. విమర్శని తేలిగ్గా తీసుకోని మనిషి కవితా సంకలనాలేం వేయిస్తుంది చెప్పు?”

“ఫర్వాలేదు జేన్. కొంచెం సున్నిత మనస్కురాలంతే. నాకు కవిత్వం తెలుసన్న సంగతి తనతో చెప్పకు! మామూలుగా చదివి బాగున్నదీ లేనిదీ నీతో చెప్తాను. నీ సంగతేమనుకుంటున్నావు?”

“నాకు ఎల్సీ బాధ్యత లేకపోయినట్లయితే ఏవరైనా ధనవంతుల ఇంట్లో ఇంటి వ్యవహరాలు చూసే హౌస్ కీపరుగా వుద్యోగం వెతుక్కునేదాన్ని. కానీ, ఎల్సీని ఒంటరిగా వొదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. ఏదేమైనా, రేపు ఇద్దరమూ ఎడిన్ బరో వెళ్తున్నాము. అక్కడ ఒక స్నేహితురాలి ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుంటున్నాం.అన్నట్టు, ఇక్కడ మా ఇద్దరి గదుల్లో వున్న సామాను మేం తీసుకోవచ్చన్నారు. కానీ, అక్కడ చిన్న గదిలో ఈ సామానంతా పట్టదు. ఇంకో ఇల్లూ అద్దెకు తీసుకునేంతవరకూ ఏవో కొన్ని ముఖ్యమైనవి తప్ప, చాలా వరకు ఇక్కడే వుంచి వెళతాను. నీకేమైనా అభ్యంతరమా?”

“లేదు లేదు! ఇక్కడే వుంచుకో. గదులకి తాళాలు కూడా వేయిస్తాను, భద్రత కోసం.”

“తాళాలు వేసుకు వెళ్ళేంత అపనమ్మకం నాకు నీ మీద లేదు ఫ్రాన్సిస్. అంతే కాదు, అన్ని గదులూ అప్పుడప్పుడూ కిటికీలూ, తలుపులూ తెరిచి శుభ్రం చేయిస్తూ వుండలి.”

“సరే, అలాగే. ఎడిన్ బరో లో నువ్వు అద్దెకు తీసుకున్న గది ఎక్కడ?”

ఆ వీధి పేరూ, ప్రాంతం పేరూ చెప్పింది జేన్.

“అరే! ఆ ప్రాంతం నాకు బాగా తెలుసు. నేనక్కడ కొన్నాళ్ళున్నా కూడా!”

“అవునా? మీ అమ్మగారు ఎక్కడ వుండేవారు? ఆవిడ ఙ్ఞాపకం వుందా నీకేమైనా?”

“లేదు జెన్. అయితే ఎడిన్ బరో కంటే ముందు నేనింకెక్క డో వున్నట్టు లీలగా గుర్తుంది. అది మా అమ్మతోనేనో కాదో అంత బాగా గుర్తు రావడం లేదు.”

“ఆవిడ బ్రతికి వుందంటావా?”

“వకీలు గారైతే అవుననే అంటారు. ”

“ఏమో మరి! బ్రతికి వుండీ నిన్ను కలుసుకునే ప్రయత్నం చేయకుండా వుంటుందా? అలాటి తల్లి వుంటుందా ఎక్కడైనా?”

“ఆవిడ పరిస్థితి ఏమిటో! ఆవిడకీ మా నాన్నగారికీ మధ్య సంబంధాలు ఎలా వుండేవో! అయితే, ఆవిడకి సహాయం అవసరమైతే నేను సాయపడొచ్చని వుంది విల్లులో! కానీ, వకీలు గారు నన్ను ఆవిడ కోసం వెతకొద్దని సలహా ఇచ్చారు!”

“నువ్వు ఆస్తి పరుడవైన విషయం తెలిస్తే, ఆవిడే నిన్ను వెతుక్కుంటూ రావొచ్చు కదా!”

“ఒకసారి నాన్నగారి పాత ఉత్తరాలు వెతికితేనో? వకీలు గారు నాకు ఆయన పెట్టె తాళాలు ఇచ్చారు. ఇద్దరం కలిసి ఒక్కసారి ఆయనకి సంబంధించిన కాగితాలన్నీ చూద్దామా? ఎక్కడైనా నాకు మా అమ్మ ఆచూకీ దొరుకుతుందేమో!”

“సరే పద!”

ఇద్దరూ దాదాపు రెండు గంటలు కాగితాలన్నీ చూసారు. ఎక్కడా ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం కానీ, అతని తల్లిని గురించిన సమాచారం కానీ దొరకలేదు. ‘ఫ్రాన్సిస్ స్కూలు ఫీజులు’ అనే ఫోల్డరులో కొన్ని బిల్లులు మాత్రం దొరికాయి.

ఎవరో స్త్రీ చేతి రాతతో ఫ్రెంచిలో వున్న ఒక వుత్తరాల కట్త కూడా దొరికింది. కుతూహలంగా ఉత్తరాలు తెరిచారు. అన్నీ ఫ్రెంచి లో వున్నాయి.

“నాకు ఫ్రెంచి బాగా వచ్చు. ఇటివ్వు, నేను ఉత్తరాలు చదివి విషయాలు చెప్తాను!” ఉత్తరాలు తీసుకొంది జేన్.

మార్గరెట్ అనే ఫ్రెంచి స్త్రీ కొన్ని సంవత్సరాల పాటు హొగార్త్ కి రాసిన ఉత్తరాలు అవి.

“….ఫ్రాన్సిస్ స్కూల్లో బాగా చదువుతున్నాడని తెలిసి సంతోషించాను. ఇప్పటికైనా ఆ పసివాణ్ణి నువ్వు ప్రేమించగలిగితే మంచిది. మా వాడు ఆర్నాల్డ్ ఎంత తెలివైన పిల్లాడనుకున్నావ్? క్లెమెన్స్ కూడా అంతే. స్కూల్లో అంతా వాళ్ళిద్దర్నీ తెగ మెచ్చుకుంటారు…” ఇక మళ్ళీ ఆ వుత్తరంలో ఫ్రాన్సిస్ ప్రసక్తి లేదు.

ఆ తర్వాత అన్ని వుత్తరాలూ ఓపిగ్గా చదివారు. ఎక్కడా ఫ్రాన్సిస్ ప్రసక్తే లేదు. ఆవిడెవరో కానీ, స్నేహంగా, అభిమానంగా, ఆప్యాయంగా రాసినట్టనిపించింది. ఆవిడ వుత్తరాలని బట్టి ఆవిడ ఒక వితంతువనీ, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోందనీ అర్థమైంది వాళ్ళకి.

ఆవిడ ఉత్తరాల నిండా తన పిల్లల ముద్దూ మురిపాలు, తన వ్యాపారం విషయాలూ, వున్నాయి. పిల్లలక్కూడా హొగార్త్ తెలిసినట్టే వుంది. ఆవిడకి చాలా చిన్నప్పుడే పెళ్ళైనా, ఆ పెళ్ళి వల్ల పెద్దగా సుఖపడినట్టు లేదు.

అన్నిటికంటే ఆసక్తికరమైన వుత్తరం చివరికి కనబడింది. అప్పుడే బహుశా హొగార్త్ తన మేనకోడళ్ళని పెంచుకోబోతున్నట్టు చెప్పి వుంటాడు.

“… పోన్లే! నువ్వెందుకనో ఫ్రాన్సిస్ ని సొంత బిడ్డలా ప్రేమించలేకపోతున్నావు. ఈ అమ్మాయిలని ప్రేమగా పెంచుకొంటే నీ ఒంటరితనం తగ్గొచ్చు. మనిషన్నవాడికి ప్రేమతో కూడిన బంధాలు తప్పకుండ వుండాలి. లేకపోతే జీవితం మిద ఆసక్తి పోతుంది.

నాకూ, ఆర్నాల్డ్, క్లెమెన్స్ ల ప్రేమ లేకపోతే జీవితం ఎంత అససంపూర్తి, అనిపిస్తూ వుంటుంది. నేను వాళ్ళని ఎప్పుడు ఫిలిప్ పిల్లలుగా అనుకోలేదు. అనుకుని వుంటే వాళ్ళని ప్రేమించగలిగే దాన్ని కాదు. నువ్వేమో, ఫ్రాన్సిస్ తల్లి మీద వున్న అయిష్టాన్ని ఆ పసి వాడి మీద చూపిస్తున్నావు. ఎవరికి తెలుసు? నీ మేన కోడళ్ళిద్దరి పెంపకంతో నీ మనసు మెత్తబడి నీ కొడుకునీ చేరదీస్తావేమో! అలా జరిగితే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు!

మీ చెల్లెలు మేరీ మరణం గురించీ, ఆమె మరణించిన పరిస్థితులను గురించీ ఎంతో ఆవేదనతో రాసావు. చదివి చాలా బాధ పడ్డాను. అమ్మా నాన్నలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేనెంత కష్టపడ్డానో, ఇష్టపడ్డ మనిషిని పెళ్ళి చేసుకొని మేరీ అంతే కష్టపడింది.

నాకు మా అమ్మా-నాన్నా ఈ పెళ్ళి నిశ్చయం చేసినప్పుడు వొద్దని నేనెంత ఏడ్చానో నాకింకా గుర్తే. ఈ పెళ్ళిలో వాళ్ళసలు నా ఇష్టాయిష్టాల ప్రమేయమేమీ లేదన్నట్లు ప్రవర్తించారు. అయితే, నా పెళ్ళిలో ఒక్క సుగుణం వుంది. ఈ పెళ్ళి గురించి నాకే కలలు లేకపోవడం మూలాన ఆ కలలు విఫలమై మనసు ముక్కలయే అనుభవం నాకు కాలేదు, మేరీకిలా.

నేను చాలా సార్లు ఆలోచించాను, మనలని ఎక్కువగా నొప్పించే శక్తి మనల్ని ప్రేమించే వాళ్ళకుందా, లేక మనల్ని ద్వేషించే వాళ్ళకుందా అని. ఇప్పుడనిపిస్తోంది- ఎవరికీ కాదు, మనల్ని నొప్పించుకునే శక్తి అందరికంటే మనకే ఎక్కువగా వుంది, అని. మేరీ తన కలలన్నీ నేల కూలిపోతూంటే నిస్సహాయురాలిలా చూస్తూండి పోయింది. నేనేమో బ్రతుకుతో అడుగడుగునా పోరాటం చేస్తూనే వున్నాను. నువ్వేమో ఒక చిన్న పొరపాటు వల్ల అందమైన కుటుంబ జీవితానికి దూరమై పోయావు. ఇతర్లు చేసిన హాని నించి మనకి సహాయం చేయడానికి చట్టలూ, న్యాయ వ్యవస్థా వుంది కదా? అలాగే మనుషులని తమ నించి తాము కాపాడుకోనెటట్లు చేసే న్యాయ వ్యవస్థ వుంటే ఎంత బాగుండేది కదూ? అప్పుడు మన ముగ్గురం ఇలా వుండేవాళ్ళం కాదు!

ఇప్పుడైతే నా ఆశలన్నీ పిల్లల మీదనే పెట్టుకున్నా! నా బ్రతుక్కంటే క్లెమెన్స్ బ్రతుకు సంతోషకరంగా వుంటే నాకంతే చాలు!

నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకోమని దాన్నెప్పుడూ బలవంత పెట్టను. తెలివైన వాళ్ళని కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వకపోతే యేలా? మీ ఇంగ్లీషు వాళ్ళలో లోపమేంటో తెల్సా? ఆడపిల్లలకి నిర్ణయాలు తీసుకొనే స్వతంత్రం వుంది కానీ, అలా నిర్ణయాలు తీసుకోవడానికి కావల్సిన శిక్షణ మాత్రం లే దు. ఇప్పుడు నాకు ఎక్కడ పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల్ని చూసినా అదొకలాంటి భయం వేస్తుంది.

నీ మేన కోడ ళ్ళిద్దర్నీ చదివించు! వాళ్ళు మానసికంగా, శారీరకంగానూ దృఢంగా వుండేటట్లు శిక్షణ ఇప్పించు. వాళ్ళ అమ్మకంటే ఎక్కువ లోక ఙ్ఞానం వచ్చేలా తీర్చి దిద్దు.

కుటుంబంలో శాంతీ, చదువుకునే వసతీ వుంటే చాలు, ఆడపిల్లలు ఏదైనా నేర్చుకోగలరూ, ఎక్కడైనా నిలదొక్కుగోలరు. ప్రేమా, పెళ్ళీ,సంతోషమూ, అంటావా? అవి వాళ్ళు వాళ్ళ ఙ్ఞానాన్నీ, తెలివితేటల్నీ, స్వతంత్ర్యాన్నీ ఉపయోగించుకోవడాన్ని బట్టి వుంటుంది. ఆపైన కొంచెం అదృష్టం కూడా కల్సి రావాలనుకో!

కానీ వాళ్ళకు చదువులు చెప్పించకుండా, అందమైన బొమ్మల్లా తయారు చేస్తే మాత్రం వాళ్ళు బాధ్యత ఎప్పటికీ తెలుసుకోరు. అందుకే నా మాట విని వాళ్ళిద్దరికీ మగపిల్లల్లాగే చదువులు చెప్పించు. అమాయకత్వానికీ, అఙ్ఞానానికీ చాలా తేడా వుంది. అందుకే కొంచెం ప్రపంచ ఙ్ఞానం అవసరం. దానికి చదువొక్కటే మార్గం.

జేన్ అంతా నీ పోలికే ననీ, ఎల్సీ తన తల్లి పోలికనీ రాసావు. పిల్లల కబుర్లు నీ ఉత్తరాల్లో చదివి చాలా ఆనందిస్తాను. నీతో చెప్పానో లేదో కానీ ఈ మధ్య క్లెమెన్స్ చిన్న చిన్న అబధ్ధాలాడటం నేర్చుకుంటోంది. దానికి ఎవర్నీ నొప్పించడం ఇష్టం వుండదు. అందుకే చిన్న చిన్న అబధ్ధాల సహాయంతో ఇరుకున పెట్టే సంఘటనలనించి తప్పించుకోవాలనుకుంటుంది. అయితే మనిషన్న తర్వాత నొప్పిని భరించటం నించీ, నొప్పి కలిగించటం నించీ సంపూర్తిగా తప్పించుకోలేమని చెప్పాను. నొప్పించినా సరే, అవసరమైతే చేదు మందు తాగించక తప్పదు కదా!

కిందటి వారం, ఒక రోజు ఆర్నాల్డ్ అల్లరి చేస్తూ హాల్లో పూల కుండీని పగల గొట్టాడు. నాక్కోపం వస్తుందని భయపడి, క్లెమెన్స్ అన్నని రక్షించటానికి, తానే ఆ కుండీని పగలగొట్టానని అంది. కానీ దానికి నిజాన్ని నా దగ్గర ఎక్కువ సేపు దాచే చాకచక్యం లేకపోయింది. అబధ్ధమాడినందుకు మందలించాను.

“అమ్మా! ఆర్నాల్డ్ మీద నీక్కోపం వస్తుందనీ, ఆ కోపాన్ని వాడు తట్టుకోలేడనీ భయ పడ్డాను. అందుకే అబధ్ధమాడాను! అన్నకి కూడా సంతోషమే కాదా?” అంది క్లెమెన్స్.

“లేదు క్లెమెన్స్! మామూలు మనుషులు వాళ్ళు చేసే పనుల పర్యవసానాలు భరించగలిగే వుంటారు. కుండీ పగలగొట్టేటప్పుడు ఆర్నాల్డ్ కి నాక్కోపం వస్తుందనీ తెలుసు, దాన్ని తను తట్టుకోక తప్పదనీ తెలుసు. తమకోసం పక్క మనిషి అనవసరమైన త్యాగాలు చేయడం ఎవరికీ ఇష్టం వుండదు. కాబట్టి అలాటి అలవాటు మానుకో. భవిష్యత్తులో నిజంగా నువ్వు ఇతర్ల కోసం ఇష్టాలని వదులుకోవాలసిన తరుణాలు రాక తప్పదు. అయితే అలాటి సమయాల్లో కూడ, నిజాన్ని మాత్రం దాచకు”, అని చెప్పాను.

వీలైనంతవరకూ వాళ్ళిద్దరూ స్వతంత్రంగా ఆలోచించుకోవడమే అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే నేనింక ఎక్కువ రోజులు బ్రతకనని అనిపిస్తోంది! ఒక్కసారి పిల్లలిద్దర్నీ తీసుకొని రావొచ్చుగా నువ్వు? క్లెమెన్స్, ఆర్నాల్డ్ ఇద్దరికీ నేను నీ మేనకోడళ్ళ గురించి చెప్పాను. కలుసుకోవాలని కుతూహలంగా వున్నారు. వీలైతే వాళ్ళను తీసుకొని ఒక్క సారి రా.

వుండనా,

మార్గరెట్

 

ఆ వుత్తరం వెనక హొగార్త్ గారి చేతి రాతలో “మార్గరెట్- మరణం- డిసెంబరు 18, ” అని వుంది. అంటే ఆ వుత్తరం రాసిన కొన్నాళ్ళకే మార్గరెట్ మరణించిందన్నమాట.

“మావయ్య ఈ వుత్తరాలు నాకు చూపించి వుంటే బాగుండేది. కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేం కాబోలు!” జేన్ అంది బాధగా.

“మా అమ్మ గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆమెకోసం మనం వెతికి ప్రయోజనం వుండదు. ఆ విషయం వదిలేద్దాం లే జేన్!” ఫ్రాన్సిస్ అక్కణ్ణించి నిరాశగా లేచాడు.

వీలునామా- 6 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(గత వారం తరువాయి)

స్నేహ హస్తం

 జేన్, ఎల్సీలు వాళ్ళు వుంటున్న భవంతిని వదిలిపెట్టాల్సిన రోజు దగ్గరికి రానే వచ్చింది. తనకి ఆస్పత్రిలో మేట్రన్ వుద్యోగం కూడా దొరకలేదని తెలిసి జేన్ కృంగి పోయింది. రెన్నీ గారే ఈ విషయాన్ని వుత్తరంలో తెలియపర్చారు. ఆ వుద్యోగం ఒక విధవరాలికిచ్చినట్టు వుంది ఆ  వుత్తరంలో.

ఆస్పత్రి డైరెక్టర్లు జేన్ దరఖాస్తునెంతో శ్రధ్ధగా పరిశీలించిన మీదట, ఆమె చిన్న వయసు దృష్ట్యా ఆమె ఈ వుద్యోగ భాధ్యతలు నెరవేర్చలేదని అభిప్రాయపడ్డారట. దురదృష్టవాశాత్తూ తనకి తెలిసి ఇంకెక్కడా ఖాళీలు లేవని కూడా రాశారు రెన్నీ.

ఎల్సీ మాత్రం ఆ వార్త వినగానే ఎగిరి గంతేసింది.

“పోతే పోయింది, పాడు వుద్యోగం. కష్టమో, నష్టమో, మనిద్దరం కలిసే వుందాం జేన్! వుంటే తిందాం, లేదా పస్తులుందాం. అంతే కానీ, నన్నొదిలి నువ్వు ఒంటరిగా ఆ ఆస్పత్రిలో జన్మంతా పని చేయలని తలుచుకుంటే నాకెంత దిగులేసిందో తెలుసా?”, అక్క మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది.

వుద్యోగం లేక రేపెలా అన్న దిగులు ముంచేసినా, తానొంటరిగా వుండాక్కర్లేదన్న నిజం జేన్ ని కూడా సంతోషపెట్టింది. ఈ విషయం గురించే ఇద్దరూ మాట్లాడుతూ వుండగా, పెగ్గీ వాకర్ వచ్చి తన కోసం ఎదురుచూస్తుందని చెప్పాడు నౌకరు.

వాళ్ళ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చి ఇచ్చే పెగ్గీ వాకర్ ఆ వూళ్ళో అందరికీ తెలుసు.  ఆవిడ ముందు ఈ వూళ్ళోనే వుంటూ, ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చింది. మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, తన అక్క చెల్లెళ్ళపిల్లలూ అందరితో వాళ్ళ ఇల్లు మహా సందడిగా వుంటుంది. ముసలి వాడైన ఆమె తండ్రికీ, అంత మంది పిల్లలకూ ఆమె సంపాదనే ఆధారం.

చాలా పిసినారిదని వూళ్ళో వాళ్ళు ఆమె గురించి అనుకొనే మాట. ఆస్ట్రేలియా వెళ్ళోచ్చిన సంపాదనతో బోలెడంత ఆస్తి పాస్తులు సంపాదించినా, నిరుపేదరాలిలాగే బ్రతుకుతుంది, అలాగే కష్టపడుతుంది, దేనికోసమో మరి. అయితే, బట్టలు మాత్రం బహు చక్కగా శుభ్రం చేసి ఇస్త్రీలు చేసి తెస్తుంది. ఆమె నిజాయితీ, నిక్కచ్చితనమూ వూరంతా తెలిసిన విషయమే కావడం వల్ల, చాలా వరకు అందరూ బట్టలు ఆమెకే వేస్తారు.

“పెగ్గీ! ఇహ ఇదే ఆఖరు నీకు బట్టలు వేయడ, పై వారం నించి మా బట్టలు మేమే ఉతుక్కోని ఇస్త్రీ చేసుకోవాలి.”

“అయ్యో! అదేం మాట అమ్మాయి గారూ. అంతలోకే ఈ ఇంటి కొత్త యజమాని ఇక్కడ కాపురం వుండడానికి వచ్చేస్తారా? మీరు నిజంగా ఈ ఇల్లూ , ఊరూ వదిలి వెళ్ళిపోతారా?”

“అవును పెగ్గీ! గురువారం మేమీ ఇల్లు ఖాళీ చేయాలి.”

“ఎక్కడికి వెళ్తారు అమ్మాయిగారూ?”

“నాకు తెలిస్తేగా నీకు చెప్పెటానికి!”

“అదేంటండీ అమ్మాయిగారూ అలాగంటారూ! నిజంగా మీకూ, చెల్లాయిగారికీ తలదాచుకోవడానికింత నీడ లేదా?”

“ఇప్పటికైతే లేదు!”

“హ్మ్మ్మ్! అన్నట్టు మేమూ  ఈ వూరొదిలి పోతున్నాం తొందర్లోనే. ఎడిన్ బరో కి.”

“ఏమిటీ? నువ్వు వూరు వొదిలి పోతున్నావా? ఎందుకూ? నీకిక్కడ జరుగుబాటు బానే వుంది కదా?” ఆశ్చర్యంగా అడిగింది జేన్.

“ఆ మాటా నిజమేననుకోండి. అయితే మా టాం ఎడిన్ బరో లో ఇంజినీరింగు చదువుతానని ఒకటే గోల పేడుతున్నాడు. వాణ్ణి ఒంటరిగా పంపటం నాకేమో ఇష్టం లేదు.  మా నాన్న సరేనన్నాడు, పిల్లలంతా ఎగిరి గంతేసారు. అందరమూ అందుకే తట్టా బుట్టా సర్ది ఎడిన్ బరో వెళ్ళిపోదామని అనుకున్నాము.    ఆస్ట్రేలియా నించి ఇక్కడకొచ్చి లాండ్రీ దుకాణం తెరవగానే వూళ్ళో వుండే లాండ్రీ దుకాణం వాళ్ళు కొంచెం చిరాకు పడ్డారులెండి.ఇప్పుడు ఎడిన్ బరో లో అయితే ఎవరి ని బాధ పెడుతున్నానో తెలియను కూడా తెలియదు. అప్పుడే అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు కూడా మాట్లాడుకున్నాను. ”

“పెగ్గీ, నీకున్న ఆత్మ విశ్వాసం నాకుండి వుంటే ఎంత బాగుండేది. మావయ్య ఎంతో ఖర్చు పెట్టి చదివించాడు, కానీ ఏం ప్రయోజనం? ఆ చదువుతో నాకెలాటి వుద్యోగమూ దొరకటం లేదు.  అసలు మా ఇద్దరి పొట్టలూ ఎలా పోషించుకోవాలో కూడ అర్థం కాకుండా వుంది.”

“ఏం మాటలండీ అవి!  మీ  పొట్ట పోసుకోవడమే అయితే మీరు చేసుకోగలరు.   చెల్లాయి గార్ని కూడా చూసుకోవాలి. దాంతో మీరు బెంగ పడుతున్నట్టున్నారు. మా చెల్లి తన పిల్లల భారం నా మీద వేసి చచ్చి పోయినప్పుడు నేనూ భయపడ్డాను. ఎలా వీళ్ళందర్నీ సాకటమా అని.  అప్పట్లో నా రాబడి ఏడు పౌండ్లు మాత్రమే.   కానీ, చూస్తూ చూస్తూ మన వాళ్ళని పస్తు పడుకోబెట్టలేం కదా. అందుకే ధైర్యం చేసి ఆ బాధ్యత తల కెత్తుకున్నాను. ఏదో ఆ దేవుడి దయవల్ల పరవాలేదు. వాళ్ళ చదువులైపోతే ఎలాగో వాళ్ళని మెల్బోర్న్ పంపే ఏర్పాటు చేస్తాను. అక్కడ ఇక్కడ కంటే కొంచెం బాగుంటుంది.”

“అవునా పెగ్గీ? అక్కడ బాగుంటుందా?”

“ఫరవాలేదు. అక్కడుండే కష్టాలు అక్కడున్నాయనుకోండి.  అయినా, మాలాటి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఎక్కడైతే నేం లెండి!  తరవాతెప్పుడైనా దాని గురించి చెప్తాను. అన్నట్టు, అమ్మాయి గారూ, మీరు తప్పనుకోకుంటే ఒక మాట చెప్తాను.  మీరు ఎడినబరోలో ఎక్కడుండాలో తెలియదంటున్నారు కాదా? నేను అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక గదిలో  మీరూ చెల్లాయి గారూ వచ్చి వుండొచ్చు.  ఒక ఉద్యోగం దొరికి మీరు నిలదొక్కున్నాక వేరే ఇంటికెళ్ళొచ్చు. ” జంకుగా అంది పెగ్గీ.

“అద్దె కట్టడానికి డబ్బు లేదు పెగ్గీ!”

“అయ్యొయ్యో! అద్దె మాటెందుకు లెండి. మీరు నాకొక్క సాయం చేస్తే అదే పదివేలు.  మా ఇంట్లో ఆడపిల్లలకి కాస్త కుట్టు పని నేర్పించి, నా లాండ్రీ బిల్లులు కొంచెం రాసి పెట్టండి,  వీలైతే. ఆ రెండు పనులూ అసలు నాకు చేత కావడంలేదు.  దాంతో మనం అద్దె గురించి మాట్లాడుకునే అవసరం వుండదు.”

“పెగ్గీ!  తప్పకుండా చేసి పెడతాను. నాకు కాలు నిలదొక్కుకునే అవకాశం వస్తూంటే కాదంటానా?   అయితే పెగ్గీ, ఎడిన్ బరోలో నేనూ, ఎల్సీ, ఇద్దరమూ ఇరవై నాలుగు పౌండ్లతో బ్రతకగలమంటావా?”

“మా లాటి వాళ్ళం ఎలాగో బ్రతికేస్తామమ్మా! పాపం, మీకే…”

“ఫరవాలేదులే.  మీరంతా ఎలా వుంటే మేమూ అలాగే వుంటాము. ”

“అంతే లెండి. ముందు మనం దైవం మీద భారం వేస్తే, అంతా ఆయనే చూసుకొంటాడు.”

“నిజంగా భగనవంతుడు నిన్ను కష్టాల నించి తప్పించాడా పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“భగవంతుడు కష్టాలు తప్పిస్తాడో లేదో నాఖంతగా తెలియదు కానీ, ఆ కష్టాలని తట్టుకునేందుకు శక్తిని ఇస్తాడమ్మాయిగారూ!  ధైర్యమూ, ఆశా కూడా ఇస్తాడు. క్షమించండి, ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడి మిమ్మల్ని నొప్పించానా?”

“ఇందులో నొచ్చుకోవడానికేముంది పెగ్గీ? నువ్వన్నట్టు ధైర్యమూ శక్తీ వుండాలేకానీ, తీర్చుకోలేని సమస్య వుండదు.  ఇరవై నాలుగు పౌండ్లతో జీవితాన్ని ప్రారంభించటానికి నాకేమీ అభ్యంతరం లేదు.”

“మీ బట్టలూ, పుస్తకాలూ అన్నీ తెచ్చుకోండి. యేడాది దాకా బట్టలు కొనే పని వుండదు.”

” అవును. అంతే కాదు, మా గదుల్లో వున్న సామానంతా మాదే నన్నాడు మావయ్య. అవసరమైనంత వరకు వుంచుకోని, మిగతా సామాను అమ్మి వేస్తాను. ”

” ఇంతకీ మీరు ఎడిన్ బరో ఎప్పుడు బయల్దేరుతున్నారు”

“బుధవారం, ఫ్రాన్సిస్ వస్తాడు. అతనికి ఇల్లప్పగించి మేము బయల్దేరాలనుకుంటున్నాం.”

“సరే, అయితే అందరమూ కలిసి గురువారం బయల్దేరదామా?”

“అలాగేనండి. మీరు వూరి వాళ్ళకి చేసిన వుపకారాలగురించీ, సహాయాల గురించీ అందరూ చెప్పుకుంటున్నారు. కొత్త అయ్యగారు కూడా  మీలాగే ఈ ఇంట్లో సంతోషంగా వుంటే అంతే చాలు. నే వస్తా అమ్మాయి గారు.”

 

***

(సశేషం)

వీలునామా – 5 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సాయంకాలం విందు

 కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రమవుతూండగా ఫ్రాన్సిస్, జేన్ కలిసి రెన్నీ ఇంటికి చేరుకున్నారు. అక్కడందరూ తనని విచిత్రమైన కుతూహలం తో చూస్తారన్న సంగతి తెలిసినా, జేన్ కాసేపు పదిమందితో సరదాగా గడపాలని నిశ్చయించుకొంది.

విందన్న పేరేకానీ, ఎక్కువమంది ఆహూతులున్నట్టు లేదు. ఆడవాళ్ళైతే అసలు తను తప్ప ఇంకెవరూ రాలేదు. రెన్నీ భార్యా, కూతురు మాత్రం వచ్చి పలకరించారు. అనుకోకుండా ధనవంతుడవడంతో ఫ్రాన్సిస్ ని ఈమధ్య అందరూ ఏదో ఒక వంకన భోజనానికి ఆహ్వానించేవారే. అందరూ అతని తెలివితేటలనీ, అభిరుచులనీ కొనియాడేవారే!

రెన్నీ గారమ్మాయి, ఎలీజాకి పంతొమ్మిదేళ్ళు. అమాయకంగా వున్నా సాహిత్యంతో బాగా పరిచయం వున్నట్టు మాట్లాడింది. విధి వైపరీత్యంతో డబ్బంతా పోగొట్టుకున్న ఫ్రాన్సిస్ దూరపు బంధువు ఎలా వుంటుందోనన్న కుతూహలం పట్టలేకుండా వుంది. ఒక వీలునామా కోసం నిజంగా ఫ్రాన్సిస్ ఆ అక్క చెల్లెళ్ళలల్లో ఎవరినీ పెళ్ళాడకుండా వుంటాడా? మొదలైన ప్రశ్నలు ఆమె లేత మనసుని తినేస్తున్నాయి. జేన్ గురించి చెప్పమని తండ్రిని వేధించింది కానీ, రెన్నీ ఏమీ చెప్పలేదు. చాలా తెలివైనది, చాలా విచిత్రమైన అభిప్రాయాలున్న వ్యక్తి అని మాత్రమే చెప్పాడు.

ఆ రోజు విందులో జేన్ కి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన పబ్లిషరూ, ఎడినబరో కి చెందిన ఒక వకీలూ, ఒక పెద్ద వ్యాపారవేత్తా, ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళూ వచ్చారు.

“హ్మ్మ్మ్!! చాలా మామూలుగా వుందీవిడ, కనీసం ఇరవై యేడేళ్ళయినా వుంటాయేమో!” అనుకుని తృప్తిగా నిట్టూర్చింది ఎలీజా జేన్ ని చూడగానే.

“చూడడానికి మామూలుగానే వున్నా, ఏదో ప్రత్యేకత వుందీమెలో,” అనుకున్నారు అక్కడున్న మగవాళ్ళంతా. కథల్లో వుండే ఆడవాళ్ళలా, నాజూగ్గా, అమాయకంగా కాకుండా, ఆరోగ్యంగా, తెలివితేటలూ, లోకఙ్ఞానమూ వుట్టిపడే స్త్రీ మొహాన్ని అంత దగ్గరగా చూడడం ఆ వర్గంలోని మగవాళ్ళకి కొంచెం అరుదే మరి.

నిజానికి ఆరోజు ఆమె ఆత్మ విశ్వాసం దారుణంగా దెబ్బ తిని వుంది. నిరాశా నిస్పృహలతో కృంగి పోతుంది. మనుషుల మీదా వ్యవస్థ మిదా నమ్మకం సడలుతున్నట్టనిపిస్తోందామెకి. కానీ, మొహంలో అదేమీ కనబడకుండా, చిరునవ్వుతో అందరినీ హుందాగా పలకరించింది. ఆమె ప్రవర్తన చూసి రెన్నీ ఆశ్చర్యపోయాడు కూడా!

అతను ఉదయం చూసిన జెన్నీ కోపంగా ఆవేశంగా వుంది. ఇప్పుడు సౌమ్యంగా, తేటపడ్డ మొహంతో, నెమ్మదిగా వుంది. ఎలీజా పియానో మీద వాయించిన పాటను ఓపికగా, శ్రధ్ధతో విన్నది. మిగతా వారి మాటలనూ కుతూహలంతో విన్నది. పబ్లిషరు ప్రజల అభిరుచిని గూర్చి చెప్తూన్నాడు.

“మాల్కం! ఇప్పుడు రచనలతో డబ్బు సంపాదించాలంటే మతాన్ని ఎలాగో అలా కథలో జొప్పించాలి. విలన్లందరినీ హేతువాదులుగా, నాస్తికులుగా మార్చు. కథానాయికని నానా కష్టాలూ పెట్టు. ఆమెకొక ప్రేమికుణ్ణివ్వు. ఇద్దరూ క్రిస్టియన్ మతం పుచ్చుకోని భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగానే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టు రాయి. ఆ పుస్తకం వేలల్లో అమ్ముడుపోకపోతే అప్పుడు నన్నడుగు! డికెన్సూ, థాకరే కంటే నీకెక్కువ పేరు రాకపోతే చూస్కో!”

“నీ మాటలకేమొచ్చెలే గానీ, మా చెల్లెలు, ఆన్, అదేదో పుస్తకం కొనమని ప్రాణాలు తోడుతుంది. అది అయిదు ప్రచురణలయిపోయిందట, నిజమేనా?”

“అవును! ఇప్పుడే ఆరో ప్రచురణ కూడా వేస్తున్నాం! నిజానికి ఆ పుస్తకం ఏమీ బాగుండదు, తెల్సా? అందులోనూ, ఆ అమెరికన్లు మాట్లాడే భాషా, అయ్య బాబోయ్! ఏం చెప్పమంటావు?”

“నిజంగా అమెరికన్లు ఆ పుస్తకాల్లో వున్నంత చెత్త భాష వాడతారంటావా? ఇహ అలాంటి భాష మాట్లాడే అమెరికన్లతో బ్రతకడం ఎలా వుంటుందో! ఊహకే అందదు కదూ? అందుకే నేనెప్పుడు ఇంగ్లీషు వాళ్ళ పుస్తకాలే చదువుతాను!”

ఎలీజా వచ్చి జెన్నీ పక్కన కూర్చుంది.

“మాల్కం కి సాహిత్యంతో చాలా పరిచయం వుంది తెల్సా? ఆయన పత్రికల్లో కూడ బాగా రాస్తారు.”

“చాలా చాలా ధన్యవాదాలు మిస్ రెన్నీ! వింటున్నారా పబ్లిషర్ గారూ! జేన్, ఈ పబ్లిషర్లకి రచయితలంటే ఎంత లోకువ తెలుసా? ఈ దరిద్రుడికి నేను కిందటి వారం పత్రికలో రాసిన వ్యాసం నచ్చలేదట. ”

“లేదు లేదు మాల్కం! నాకే కాదు నాన్న గారికి కూడా చాలా నచ్చింది. పడీ పడీ నవ్వారు!”

“వినవయ్యా పబ్లిషరూ! నీకు నచ్చనివి చాలా మందికి నచ్చుతాయి, తెలుసుకో మరి!”

“నీ హ్యూమరు చాలా ఫాషనబుల్ మాల్కం! కానీ, కొంచెం అతిగా అనిపిస్తుంది నాకు. ఈ మధ్య అసలు విషయం వదిలేసి ఎక్కడెక్కడివో కొటేషన్లు రాయడం, కథకి అవసరం లేని విషయాలని జొప్పించడం కూడా చేస్తున్నారు రచయితలు. పాతకాలం ఆవూ, తాడి చెట్టు వ్యాసాల్ల్లాగా…”

వాళ్ళ సంబాషణొదిలేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, జేన్, ఎలీజా!

“జేన్! నాకు రచయితలూ, పబ్లిషర్లతో మాట్లాడడమంటే భలే సరదా! అందులో మాల్కం వున్నాడు చూడు, జీనియస్! అయితే చాలా కరుగ్గా విమర్శిస్తాడనుకో!”

“నువ్వూ రాస్తావా ఎలీజా?” అడిగింది జేన్.

“ఆ, ఏదో కొంచెం కొంచెం. నాకు వచనం కంటే కవిత్వం ఇష్టం. ఏ పత్రికకీ పంపలేదనుకో. మా స్నేహితులకిస్తా చదవమని, అంతే. కొన్ని ఆడవాళ్ళ పత్రికల్లో ‘ఎల్లా’ అనే పేరుతో ఒకటి రెండు కవితలు పడ్డాయనుకో! ‘ఎల్లా’ పేరు బాగుంది కదూ?”

“అది సరే కానీ, కవితలు పత్రికల్లో వేసుకుంటే డబ్బొస్తుందా?”

“నువ్వు భలే డబ్బు మనిషిలాగున్నావే! అందుకే నువ్వు వ్యాపారం చేస్తే బాగుంటుందన్నారు నాన్న. కవితలు పత్రికలో వేసుకుంటే డబ్బేమీ రాదు, కానీ నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు.”

“అదృష్టవంతురాలివి. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు.” నిట్టూర్చింది జేన్. పబ్లిషరు వైపు తిరిగింది.

“మీరు కొత్త కొత్త నవలలేకాక కవితల పుస్తకాలూ వేస్తారా?”

“అమ్మో! ఈ ఎడిన్ బరో లో కవితల పుస్తకమా? కొంచెం కష్టమమ్మాయ్! పాత కవితలే మళ్ళీ మళ్ళీ వేస్తాం.”

“అవును మరి, లేకపోతే కాపీరైటు చెల్లింపులకి డబ్బు ఖర్చు కదా!” వేళాకోళం చేసాడు మాల్కం.

ఇంతలో శ్రీమతి రెన్నీగారొచ్చి జేన్ ని ఒక పాటేదైనా పాడమన్నారు. తనకి సంగీతం బొత్తిగా రాదని చెప్పింది జేన్. రెన్నీ గారి మిగతా చిన్నపిల్లలొచ్చి తల్లిని చుట్టు ముట్టారు.

జేన్ మొహమాటంగా వాళ్ళ చదువులూ, ట్యూషన్ మాస్టార్ల గురించీ వాకబు చేసింది.

“ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ట్యూషన్లూ చెప్పుకోవడానికి వీలవుతుందో! ఇంగ్లీషూ, లెక్కలూ బాగా చెప్పగలను!” సాలోచనగా అంది జేన్.

“ట్యూషన్లా? చిన్న పిల్లవి, నీ వల్లేం అవుతుంది చెప్పు? నా మాట విని ఎవరైనా పెద్ద వాళ్ళింట్లో ఆడపిల్లలకి చదువు చెప్పే గవర్నెస్ గా చేరిపో! మీ చెల్లాయిని కూడా అలా ఏదో ఒక ఇంట్లో చేరి పొమ్మను. ఇల్లు అద్దెకు తీసుకోవడమూ, నెలనెలా అద్దెకోసం తడుముకోవడమూ, ఎందుకొచ్చిన బాదరబందీ? లేదా ఏదైనా స్కూల్లో టీచరుగా చేరిపో! నీకు సంగీతం వచ్చా? రాకపోతే నేర్చుకోవచ్చు.”

“ఇప్పుడు నాకు సంగీతమెందుకులెండి. అసలు మా చెల్లాయిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికీ వెళ్ళాలని లేదు. అయినా చూద్దాం, ఏమవుతుందో!”

“ఇవాళ పొద్దున్న రెన్నీ గారితో పిచ్చాసుపత్రి మేట్రన్ ఉద్యోగం గురించి మాట్లాడావట గదా? నన్నడిగితే అన్నిటికంటే అదే మంచిది. ఆలస్యం చేయకుండా నీ దరఖాస్తు పంపించేయి. జీతం తక్కువేననుకో. కానీ ఇహ వేరే దారి లేనప్పుడేం చేస్తాం!”

“అవును, నేనూ అదే అనుకుంటున్నాను.”

“రెన్నీ నీ కా ఉద్యోగం వచ్చేలా చేయగలరు. నువు చాలా తెలివైన దానివని అన్నారు నాతో.”

“తెలివితేటలే కాదు, నాకు ధైర్యమూ ఎక్కువే!”

“అన్నట్టు, ఎడిన్ బరో లో ఎక్కడ వుంటున్నావు?”

“ఈ వూళ్ళో నాకెవరూ తెలియదు. డబ్బు కూడా లేదు. అందుకే మా మావయ్య కొడుకు ఫ్రాన్సిస్ ఇంట్లోనే వుంటున్నాను.”

“ఏమిటీ? పెళ్ళి కాని ఆ బ్రహ్మచారి ఇంట్లో, వేరే తోడు లేకుండా వుంటున్నావా? నలుగురూ వింటే ఏమనుకుంటారు? ఏం పని చేసావు జేన్!”

బెదిరిపోయింది జేన్.

“ఏమోనండి! నాకేమీ తోచలేదు. ఎక్కడో వుండడమెందుకూ, మా ఇంట్లోనే వుండు అన్నాడు ఫ్రాన్సిస్. డబ్బు కలిసొస్తుందని ఒప్పుకున్నాను. మా వూరి మిస్ థాంసన్ ని సలహా అడిగాను కూడా! ఆవిడా పర్వాలేదంది!”

“మీ వూళ్ళో వుండే మిస్ థాంసనా? సరిపోయింది! అడక్కడక్క ఆవిడనే అడిగావా? ఆవిడదంతా ఉలిపికట్టె తీరు.”

“ఆవిడ ఎలాటిదైతే యేం లెండి! మమ్మల్ని చూసి జాలిపడకుండా ధైర్యం చెప్పింది  ఆవిడొక్కర్తే.”

“సరే, పోనీలే! అయిందేదో అయింది. ఇవాళ్టినుంచీ నువ్విక్కడ మాతో నే వుండు. మా అమ్మాయి ఎలీజా గదిలో సర్దుకోవచ్చు నాలుగురోజులు. ఇవాళ నువ్వు ఒంటరిగా ఫ్రాన్సిస్ ఇంట్లో గడిపావంటే లోకం కోడై కూస్తుంది!”

జేన్ ఒక్క క్షణం ఆలోచించింది.

“మీ సూచనకి ధన్యవాదాలు. నామీద ఏవైనా అపవాదులు రేగాల్సి వుంటే అవీ పాటికే పుట్టి వుంటాయి. ఇవాళ నేను కొంచెం సేపు ఒంటరిగా ఆలోచించుకోవాలి. రేపెలాగూ నేనీ వురునించి వెళ్ళేపోతాను.”

“రేపాదివారం. ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి, నువ్వనుకున్నట్టే ఇవాళ ఫ్రాన్సిస్ ఇంట్లో వుండి, రేపు పొద్దున్నే ఇక్కడకొచ్చేయి. ఏదో ఒక వంకన ఎల్లుండి వరకూ ఇక్కడే వుండి అప్పుడు వెళ్దువుగాని.”

“అలాగే, శ్రీమతి రెన్నీ గారూ! మీరు నాపైన చూపించిన శ్రధ్ధా, కరుణా ఎప్పటికీ మరచిపోను. ఇవాళ రాత్రి మాత్రం ఒంటరిగా వుండాలని వుంది నాకు. మీరన్నట్టు రేపు ఇక్కడకే వచ్చి వుంటాను. మరి ఇక మేం బయల్దేరతాం!”

అందరికీ చెప్పి ఫ్రాన్సిస్, జేన్ లిద్దరూ ఇంటినించి బయటపడ్డారు.

“ఎలా అనిపించింది జేన్ నీకు వాళ్ళ ఇల్లూ, కంపెనీ? నాకసలు నిన్ను కనిపెట్టి వుండడానికే వీలవలేదు. అసలే కొత్త చోటు , ఏమైనా ఇబ్బంది పడ్డావా?”

“ఇబ్బందేమీ లేదు కానీ, చాలా అలసటగా వుంది. ఇప్పుడిక్కడ ఎల్సీ వుంది వుంటే ఎంత బాగుండేది. నేను మా ఇంటికెళ్ళిపోతా ఫ్రాన్సిస్!”

“అప్పుడేనా? ఇంకొద్ది రోజులుండు. నీ ఉద్యోగం కోసం ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం.”

“ఏమీ లాభం లేదు ఫ్రాన్సిస్! ఆ మేట్రన్ ఉద్యోగానికి ఒక దరఖాస్తు పడేసి నేను ఇంటికెళ్ళిపోతాను. నాకిక ఉద్యోగాల మీద ఆశ పోయింది. పిచ్చాసుపత్రి లో రోగులు బయటి ప్రపంచంలో వాళ్ళకంటే మూర్ఖంగా, కౄరంగా వుండరు కదా!”

“చూద్దాం! సోమవారం కూడా ఆలోచించి, మంగళవారానికి పంపుదాములే. నువ్వు అధైర్య పడకు.”

ఫ్రాన్సిస్ గొంతులో వినిపించిన ఆప్యాయతా, ఆశలతో కొంచెం తేరుకుంది జేన్. ఆయినా ఆ రాత్రి కూర్చుని మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు రాసుకుంది.

ఆ రాత్రి మొదటిసారి మావయ్యని తిట్టుకుంది జేన్! అంతకుముందు ఆయన చూపించిన ఆప్యాయతా, చెప్పించిన చదువూ, అన్నీ గొప్ప అబధ్ధాలుగా అనిపించాయామెకి. అన్నిటికంటే, చెల్లెల్ని ఒంటరిగా ఒదిలి, తనూ దిక్కూ మొక్కూ లేని అనాథలా ఆ ఆస్పత్రిలో పడి వుండాల్సొస్తుందేమో అన్న ఆలోచన చాలా కలవరపెట్టిందామెని.

 ***

 మర్నాడు రెన్నీ కుటుంబంతో కలిసి చర్చి కెళ్ళారు ఫ్రాన్సిస్, జేన్. చర్చి లో ఫాదరు చేసిన బోధన ఒక్క ముక్క కూడా మనసులోకెక్కలేదు జేన్ కి. ఆమె మనసంతా ఆస్పత్రి చూట్టూ, అక్కడ తను చేయబోయే వుద్యోగం చూట్టూ తిరుగుతుంది.

ఆ తర్వాత రెన్నీ గారి ఇంట్లో సంభాషణంతా చర్చిల చుట్టూ, మతం చుట్టూ, మత బోధనల చుట్టూ తిరిగింది. జేన్ కి అవంతా ఎక్కువగా తెలియకపోవడం మూలాన, పెద్దగా పాల్గొనలేకపోయింది.

శ్రీమతి రెన్నీ ఆ రోజు జేన్ ని అక్కడే వుండిపొమ్మంది. జెన్నీ నిరాసక్తంగా ఒప్పుకుంది. ఫ్రాన్సిస్ వెంటనే జెన్నీని తాను ఎప్పుడూ వెళ్ళే చర్చి ఒక్కసారి చూపించి తీసుకొస్తానని అన్నాడు. మాట్లాడకుండా అతన్ని అనుసరించింది జేన్. అసలామెకి చర్చి మీదా, మతం మీదా పెద్ద నమ్మకమే లేదు. ఏదో అతని మాట తోసేయలేక వెళ్ళింది.

కానీ, ఆ రోజు మొదటిసారి ఆమె దేవుణ్ణి తనకు సహాయం చేయమని నిస్సహాయంగా అడిగింది. బయటికొస్తూ, నిస్సహాయ స్థితిలో మనిషి దేవుడి వైపు చూస్తాడు కాబోలు అనుకుంది.

రెన్నీ ఇంటికెళ్తూ దారిలో,

“ఫ్రాన్సిస్, నువ్వన్నట్టు రేపింకొక్కసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా ఉద్యోగం దొరకకపోతే ఆస్పత్రికి నా దరఖాస్తు పంపుతాను. దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది,” అంది.

సోమవారం మళ్ళీ జేన్ ఎడిన్ బరోలో తనకు తెలిసిన మరికొన్ని ఆఫీసులు చుట్టబెట్తింది. శనివారం లాగే, ఆ రోజూ ఆమెకి ఎక్కడా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించలేదు. ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు పోస్టులో వేసి ఎడిన్ బరో వదిలింది జేన్.

 ***

 ఇంటికెళ్ళి జేన్ ఎల్సీతో తన ఎడిన్ బరో ప్రయాణమూ, ఉద్యోగాలకోసం వేటా, ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తూ, అన్నీ వివరంగా చెప్పింది. ఒకవేళ ఉద్యోగం వస్తే, జేన్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడపాలో తలచుకొని ఎల్సీ హడలిపోయింది.

“వొద్దు జేన్! నూవ్వా ఉద్యోగానికెళ్ళొద్దు. నేను ఎలాగైనా మనిద్దరికీ పొట్టపోసుకునే ఉపాయాలు వెతుకుతాను. నువ్వు మాత్రం ఒంటరిగా యేళ్ళ తరబడి ఆ ఉద్యోగంలో మగ్గి పోవడం నాకిష్టం లేదు!” ఎల్సీ వాపోయింది.

***

వీలునామా – 4వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మూసిన తలుపులు

జేన్ రైలు దిగేసరికి ఫ్రాన్సిస్ ఆమెకొరకు ఎదురుచూస్తూవున్నాడు. ఇంటికి కలిసి నడిచి వెళుతూ దారిలో ఉద్యోగావకాశాలని గురించి ఆశగా అడిగింది జేన్.

ఫ్రాన్సిస్ తనామెకొరకు వెతికిన ఉద్యోగం గురించి చెప్పటానికి కొంచెం సంకోచించాడు. ఆమె తెలివితేటలూ, సామర్థ్యాలతో పోలిస్తే ఆ ఉద్యోగం చాలా చిన్నది మరి. కానీ, తన మేనేజరు రెన్నీ ఆ ఉద్యోగాన్ని చాలా గట్టిగా సిఫార్సు చేసాడు. స్కాట్లాండులోని ఒక మానసిక చికిత్సల ఆస్పత్రిలో పెద్ద మేట్రన్ గారికి ఒక సహాయకురాలు కావాలన్నారు. జేన్ కి నచ్చుతుందో లేదో !

జేన్ కుతూహలంగా ఉద్యోగాన్ని గురించి అడిగింది. ఆస్పత్రిలో వున్న చిన్నా చితకా సిబ్బంది పర్యవేక్షణా, స్టోర్ గది పరవేక్షణా లాటి బాధ్యతలుండొచ్చు నన్నాడు ఫ్రాన్సిస్.  దాదాపు యాభై దరఖాస్తులొచ్చాయట అంత చిన్న ఉద్యోగానికి. అయితే మేనేజరు రెన్నీకి ఆ సంస్థ డైరెక్టర్లలో ఒకరిద్దరు బాగా పరిచయమట. ఇంతకు ముందున్న సహాయకురాలు పని సమర్థవంతంగా చేయలేకపోవటం చేత తీసేసారట.

“నేను తప్పక దరఖాస్తు చేస్తా ఫ్రాన్సిస్.  డబ్బు లెక్కలూ, సామాన్ల పర్యవేక్షణా నాకు బాగా వొచ్చు. మా ఇంట్లో, అదే, మావయ్య వాళ్ళింట్లో అన్నీ నేనేగదా చూసుకున్నాను. జీతం సరిపోతుందో లేదో! ఈ ఉద్యోగం వస్తే నీకు రెన్నీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ ఉద్యోగం తప్పక నాకొస్తుంది!”

“అయితే జేన్, నీ తెలివితేటలకీ, విద్యార్హతలకీ ఈ ఉద్యోగం సరిపోదేమో. ఆఖరికి ఆయా ఉద్యోగం లో చేరతావా?” బాధగా అన్నాడు ఫ్రాన్సిస్.

“నాకలాటి భేషజాలేవీ లేవు ఫ్రాన్సిస్. ఇళ్ళల్లో వుండే గృహిణులు ఆ పనేగా చేస్తారు? అందుకే కదా కుటుంబం మొత్తం సుఖంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు? ఇంతకీ మనం రెన్నీ గారినెప్పుడు కలుద్దాం?”

“ఆయన నిన్ను రేపు పొద్దున్నే రమ్మన్నారు. నీకన్నీ నచ్చితే వెంటనే దరఖాస్తు పంపేయొచ్చు!”

ఇద్దరూ ఫ్రాన్సిస్ ఇల్లు చేరారు. చిన్నదైనా పొందికగా వుందతని యిల్లు. ఖరీదైనది కాకపోయినా వున్నంతలో బాగున్న ఫర్నీచరూ, షెల్ఫు నిండా నీటుగా పెట్టిన పుస్తకాలూ, చలి నుంచి తప్పించుకోవడానికి చిన్న చలిమంటా, వెచ్చటి భోజనం సిధ్ధం చేసిన బల్లా, అన్నీ ప్రయాణం బడలిక నించి ఆమెని సేద దీర్చేయి.

అతని పుస్తకాలలో కవిత్వమూ, సాహిత్యమూ చూసి ఆశ్చర్యపోయింది జేన్. అయితే వృత్తి బేంకరైనా, ప్రవృత్తి సాహిత్యకారుడిదన్నమాట, అచ్చం ఎల్సీ లాగే అంకుంది. అయితే ఎల్సీ కంటే ఈతని అభిరుచి ఇంకొంచెం పరిపక్వతతో గంభీరంగా వుంది, అనుకుంది ఆ పుస్తకాల పేర్లు చదువుతూ. ఈ సంగతి మావయ్యకి తెలిస్తే ఎలా వుండేదో అని కూడా అనుకుంది.

ఇద్దరూ భోజనం ముగించి కబుర్లలో పడ్డారు. తన తండ్రిని గురించి ఫ్రాన్సిస్ ఎన్నో ప్రశ్నలడిగాడు. జేన్ అతన్ని అతని ఉద్యోగం గురించీ, చదువుకున్నరోజుల గురించీ అడిగింది.

జేన్ తెలివికలదీ, చదువుకున్నదీ అయినా కొంచెం అమాయకురాలు. ఆమెలో స్త్రీ సహజమైన ఆశా భావమూ, ప్రపంచంలో అంతా మంచే వుందన్న భోళాతనమూ చూసి ఫ్రాన్సిస్ ఆశ్చర్యపోయాడు.

***

 మర్నాడిద్దరూ పొద్దున్నే ఫ్రాన్సిస్ పనిచేసే బేంక్ ఆఫ్ స్కాట్లాండ్ కి వెళ్ళారు.  రెన్నీ తోమాట్లాడినతర్వాత జేన్ కొంచెం నిరుత్సాహపడింది. ఆ ఆస్పత్రి లో పని ఆమె అనుకొన్నదానికంటే చాలా ఎక్కువగానూ, వాళ్ళివ్వ జూపే జీతం చాలా తక్కువగానూ వుంది. సెలవులు సంవత్సరానికి రెండు వారాలు! ఇలాటి ఉద్యోగానికి బోలెడు దరఖాస్తులు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది.

“ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని ఒక్కళ్ళతోనే చేయించాలనుకుంటూ, ఇంత తక్కువ జీతమా?” అడిగిందామె రెన్నీని.

“అవును! అయినా ఎంత మంది దరఖాస్తు చేసారో చూడండి. స్కాట్లాండ్ లో దిక్కూ మొక్కూ లేక ఏ ఆధారమూ లేని ఆడవాళ్ళు బొలేడు మంది వున్నారు. ఇందులో సగం జీతం వచ్చే ఉద్యోగానికి కూడ వందల లెక్కలో దరఖాస్తులొచ్చాయంటే నమ్ముతారా? జీతానికీ పనికీ ఏం సంబంధం వుండదిక్కడ.”

“అందుకనే మంచి పని వాళ్ళు దొరకరు. ఇంతకు ముందున్న ఆవిడ బాగా చేయలేదనేగదా తీసేసారు? ఇంత పని చెప్పి అంత తక్కువ జీతం ఇస్తే మంచి వాళ్ళెందుకొస్తారు? కొంచెం జీతం పెంచొచ్చుగా?”

“ఏమో మరి! ఎందుకలా చేస్తారో!” నిస్సహాయంగా అన్నాడు రెన్నీ.

“పోనీ, ఈ ఉద్యోగం లో ప్రమోషన్లకీ, పైకెదగడానికీ అవకాశం వుంటుందా?” ఆశగా అడిగింది జేన్.

“దాదాపు పదిహేను ఇరవై యేళ్ళు పట్టొచ్చు. అది కూడా మీకే వస్తుందని గ్యారంటీగా చెప్పలేం.”

“అవును, అప్పుడు మళ్ళీ డైరెక్టర్లకి తెలిసిన ఇంకెవరైనా వస్తే ఆ ఉద్యోగం వాళ్ళెగరేసుకు పోవచ్చు. అంటే ఇరవై యేళ్ళు ఎదుగూ బొదుగూ లెకుండా సంవత్సరానికి ముఫ్ఫై పౌండ్లతో గొడ్డు చాకిరీ చెయ్యాలన్నమాట. ఇంతకన్నా ఏదైనా హత్య చేసి జైలుకెళ్తే ఇంకొంచెం శుభ్రమైన జీవితం దొరకొచ్చు. ఏమంటారు?”  కోపంగా అడిగింది జేన్. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తనని తను సంబాళించుకుంది జేన్.

“పోనీ, ఇక్కడ ఫ్రాన్సిస్ రాజీనామా చేస్తున్నాడు కదా? ఆ ఉద్యోగం ఇవ్వడానికి వీలవుతుందా? నాకు అక్కవుంటింగూ లెక్కలూ బాగా వొచ్చు!”

“ఆ పనికి ఫ్రాన్సిస్ కింద పని చేసే అతనికి ప్రమోషన్ ఇచ్చాము. ఆఖరికి ఒక జూనియర్ క్లర్కు ఖాళీ మాత్రం వుంది.”

“ఆ వుద్యోగం నాకివ్వండి. అలా నిరాకరించకండీ. ఫ్రాన్సిస్, నువ్వైనా ఒక్క మాట చెప్పు,” ప్రాధేయపడింది జేన్.

“అవును రెన్నీ! నా వల్లే ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ అన్యాయమై పోయారు. ఆమెకీ ఉద్యోగం ఇచ్చి పుణ్యం కట్టుకో. ఆమె చాలా తెలివైనదీ, సమర్థురాలూ, బాగా చదువుకొన్నది కూడా!” బ్రతిమిలాడాడు ఫ్రాన్సిస్.

నవ్వాడు రెన్నీ!

“భలే వాళ్ళే! ఆడవాళ్ళకి లెడ్జర్లూ పాస్ బుక్కుల గురించేం తెలుస్తుంది లెండి,” తేలిగ్గా అన్నాడు.

“అవన్నీ నాకొచ్చని చెప్తున్నా కదా. కావాలంటే చూడండి,” అంటూ జేన్ అక్కడ బల్ల మీద వున్న లావు పాటి అక్కవుంటు పుస్తకం తీసుకొని ఒక పేజీ తిప్పి అందులో ఒక వరుసలో వున్న అంకెలన్నీ చకచకా కూడిక చేసింది. ఇంకొక తెల్ల కాగితం తీసుకొని ముత్యాల్లాంటి దస్తూరితో లెడ్జర్ ఎంట్రీ రాసి చూపించింది.

“మీకా పని బాగా వొచ్చు జేన్. అందులో సందేహం లేదు. అయితే అది పనికోసం వందలాది యువకులు ఎదురుచూస్తూ వున్నప్పుడు, అది మీకివ్వడం న్యాయమా? ”

“అలా అనడం మీకు భావ్యం కాదు. పోనీ, నేను స్త్రీనైనందుకు పరిహారంగా నాకు కేవలం పదహారేళ్ళ మగపిల్లాడికిచ్చే జీతమివ్వండి. నాకు ఎదగడానికీ, పైకి రావడానికీ అనువైన ఉద్యోగం కావాలంతే. మొదలు పెట్టినప్పుడు జీతం ఎంత తక్కువైనా పర్వాలేదు. పారిస్ లో ఎంత మంది స్త్రీలు క్లర్కులుగా పని చేయడం లేదు?”

“ఇది ఫ్రాన్సూ, పారిసూ కాదు గదా? ఇక్కడ ఆడవాళ్ళను బేంకుల్లో చేర్చుకోవడానికి వీలు పడదు. అంతెందుకు? మీకీ ఉద్యోగం ఇస్తే బేంకులో మిగతా ఉద్యోగులసలు పని చేస్తారా? అందరికీ మీ చుట్టు తిరగడానికే టైము సరిపోదు!”

నిర్ఘాంతపోయింది జేన్.

“నన్ను చూసి కూడా మీరిలా యెలా అనగలుగుతున్నారు? నా మొహమూ, వాలకమూ చుస్తే నేను మగవాళ్ళని నా చుట్టూ తిప్పుకునే దాన్లా వున్నానా? ఒక వేళ మీరన్నట్టే జరిగితే అప్పుడు వెంటనే నను ఉద్యోగంలోంచి పీకేయండి. ” బాధగా అంది జేన్.

ఆమె సిన్సియారిటినీ, వేడుకోలూనూ చూసి ఫ్రాన్సిస్ బాధ పడితే రెన్నీ ఇబ్బంది పడ్డాడు. అయితే బేంకరుగా అవతలి మనిషి అభ్యర్ధనని నొప్పించకుండా నిరాకరించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.

“మీ ధైర్యాన్నీ, పట్టుదలనీ మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను జేన్. అయితే, ఈ సంస్థలో నేను ఒంటరిగా ఏ నిర్ణయాలూ తీసుకోలేను. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేతిలో కీలుబొమ్మని. అందుకే మీరు ఏదైనా ప్రవైటు సంస్థ లో వుద్యోగం కొసం వెతకండి. అక్కడైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళుంటారు. మీకు తప్పక ఉద్యోగం ఇస్తారు. బేంకర్లూ, బేంకు డైరెక్టర్లూ,  బేంకు ఖాతాదార్లూ మహా ముతక మనుషులు! వాళ్ళ అభిప్రాయాలన్నీ ఎక్కడో రాతియుగంలో వుంటాయి. మీలాటి తెలివైన చురుకైన యువతికిది మంచి స్థలం కాదు.” పామూ చావకుండా, కర్రా విరగకుండా అన్నాడు రెన్నీ.

“ఏం మాట్లాడతారండీ? ఇంతవరకూ ఆడవాళ్ళకి బాధ్యతాయుతమైన పదవి ఒక్కటీ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి బాధ్యతలు నెరవేర్చడం రాదనటంలో ఏమైనా న్యాయం వుందా ఆలోచించండి!”

“కానీ, జేన్! మీలాటి తెలివైన చదువుకున్న అమ్మాయిలు వచ్చి మగవాళ్ళ ఉద్యోగాలు కొల్లగొడితే ఎలా? అప్పుడు ఉద్యోగం సద్యోగం లేని ఆ మగవాళ్ళనెవరు పెళ్ళాడతారు చెప్పండి?”

అందుకని పోషణా భారాన్ని మగవాళ్ళకి వదిలేసి ఆడవాళ్ళు నీడ పట్టున వుండడమే మంచిదని..”

“అవునా? మరి పోషణా భారం వహించడానికి అన్నో తమ్ముడో, తండ్రో, భర్తో లేని ఒంటరి ఆడవాళ్ళూ, విధవరాళ్ళూ ఏం చేయాలంటారు? అలాటి వాళ్ళు చాలా మందే వున్నారు. లేకపోతే సంవత్సరానికి పన్నెండు పౌండ్లిస్తూ జైలు లాటి జీవితాన్నిచ్చే ఉద్యోగానికి యాభై దరఖాస్తులొస్తాయా చెప్పండి? అలా మగదిక్కులేని ఆడవాళ్ళందరూ కట్టకట్టుకుని ఒక్కసారే చస్తే పీడా విరగడవుతుందేమొ కదా? ఏమంటారు?” వ్యంగ్యంగా అంది జేన్. ఆమె ఆవేశాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు రెన్నీ.

“మీకు నవ్వులాటలాగే వుంది కానీ, ఒంటరి ఆడవాళ్ళకి చావు తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది నాకు.”

“నాకలాటి ఉద్దేశ్యముంటుందా చెప్పండి? మీ సమస్య నాకర్థమవుతూంది, కానీ..”

“కానీ, మీరూ మీ డైరెక్టర్లూ ఏమీ చేయలేని నిస్సహాయులు! ఒక్కళ్ళకైనా ఒక ఆడదానికి ఉద్యోగం ఇచ్చే ధైర్యం లేదు. ఇంత మంది మగవాళ్ళ మధ్య హేళనలూ, వెక్కిరింతలూ తట్టుకొంటూ పని చేయటానికి నాకు ధైర్యం వుంది కానీ.”

“నా మాట నమ్మండి. దేశం గొడ్డు పోలేదు. మీ తెలివితేటలకీ, విద్యార్హతలకీ తగిన ఉద్యోగం తప్పక దొరుకుతుంది. మా బేంకిలో దొరకకపోయినా సరే! అన్నట్టు, ఇవాళ సాయంత్రం మా ఇంటికి ఫ్రాన్సిస్ తో కలిసి భోజనానికి వస్తున్నారు కదూ? మా అమ్మాయి ఎలీజా, మా ఆవిడా మిమ్మల్ని కలిసి చాలా సంతోషపడతారు. నేను ఉద్యోగం ఇవ్వలేదన్న కోపం మనసులో పెట్టుకోకూడదు సుమా! తప్పక రావాలి. సరే, అయితే సాయంత్రం కలుద్దాం.” మెల్లిగా మాట మార్చి వాళ్ళని పంపేసాడు రెన్నీ. నవ్వి, ఒప్పుకుంది జేన్.

ఫ్రాన్సిస్, జేన్ బయటపడ్డారు.

“ఏం చేయాలి ఫ్రాన్సిస్? అసలు నాకేదైనా పని దొరుకుతుందంటావా? పోనీ, పబ్లిషర్ల దగ్గరా పుస్తకాల దుకాణాలల్లో ప్రయత్నిద్దాం. కొంచెం నాతో తోడొస్తావా?” జేన్ వాపోయింది.

వాళ్ళు వెళ్ళిన మొదటి ఇద్దరు పబ్లిషర్లూ ఏ ఖాళీలూ లేవన్నారు. మూడో పబ్లిషరు కాస్త ప్రోత్సాహంగా మాట్లాడాడు. కానీ, ఆయన ఉద్యోగం ఫ్రాన్సిస్ కోసమనుకొన్నాడు. కొంచెం సేపటి సంభాషణ తరవాత ఫ్రాన్సిస్ మృదువుగా ఉద్యోగం జేన్ కోసమని తెలియజెప్పాడు. వెంటనే ఖాళీలు లేవనేసాడు పబ్లిషరు.

“నిజం చెప్పండి! ఉద్యోగం లేదన్నది నేను ఆడదాన్నైనందుకా, లేకపోతే నాకు పని రాదనా?”

“ఆడవాళ్ళకి పబ్లిషింగు పనేం తెలుస్తుందమ్మా? అందుకే ఎవరూ ఈ రంగంలో ఆడవాళ్ళని నియమించరు,” నిర్మొహమాటంగా చెప్పాడాయన.

“ఆ పనిదేముందండీ, రెండు మూడు గంటల్లో నేర్చేసుకోవచ్చు. అసలు మీ అభ్యంతరం నేను ఆడదాన్నవటమే. అంటే మీ ఆఫీసులో ఆడవాళ్ళకేమీ ఉద్యోగాలుండవా?”

“ఎందుకుండవు? మేము ప్రచురించే పుస్తకాలు రాసేదంతా రచయిత్రులే కదా? మీరూ నవలలు రాసేటట్టయితే చెప్పండి. వెంటనే వాటిని ప్రచురిస్తాం.”

“ఇంకా?”

“ఇంకా అంటే ఇదొక్కటుంది, నాతో రండి చూపిస్తా,” అంటూ పబ్లిషరు వాళ్ళిద్దరినీ ఆఫీసు వెనకున్న చిన్న గదిలోకి తీసికెళ్ళాడు. అక్కడ ఓ పదిమంది ఆడపిల్లలు కాగితాలన్నీ బొత్తిగా పెడుతూ బైండు చేయడానికి అనువుగా పేరుస్తున్నారు. “ఈ పని తేలిక పని. ఎక్కువగంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కుట్టు పనిలా దీనికి పెద్ద ప్రావీణ్యం కూడా అవసరం లేదు,” చెప్తూన్నాడు ఆ పబ్లిషరు.

“అందుకని వాళ్ళ జీత భత్యాలు కూడా చాలా తక్కువన్నమాట!”

“మరంతే కదా!” నీళ్ళు నమిలాడు పబ్లిషరు.

“పోనీ, ఈ పని నేర్చుకొని బైండింగు పనిలోకి ఎదగడానికి వీలవుతుందా?”

“అమ్మో! బైండింగూ, పుస్తకాలు కుట్టడం మగవాళ్ళ పని. అంత మోటు పని ఆడవాళ్ళేం చేయగలుగుతారు?”

“అంటే, ఈ తక్కువజీతంతో వాళ్ళు ఎదుగూ బొదుగూ లేకుండా జీవితాంతం ఇదే పని చేస్తూ గడిపేయాలా?” ఆశ్చర్యంగా అడిగింది జేన్.

“కానీ, కొన్నేళ్ళ ప్రాక్టీసు తర్వాత ఈ పని చేయడం చాలా సులువౌతుంది వీళ్ళకి.”

“ఎంత అన్యాయం! తక్కువజీతాలొచ్చేవి, ఏ మాత్రం ఎదుగుదలా, మార్పూ లేనివి అయిన పన్లు ఆడవాళ్ళకోసం పెట్టి, పెద్ద ఉద్యోగాలు మాత్రం మగవాళ్ళకోసం పెడతారన్నమాట,” ఆక్రోశించింది జేన్.

“అదేం లేదండీ! ఆడవాళ్ళే రచనలు చేయగలరు. మగవాళ్ళ రచనలసలు వేసుకోనే వేసుకోం. అంటే ఆ రంగంలో మగవాళ్ళకన్యాయం జరుగుతున్నట్టే కదా? మీకెందుకు, మీరో మంచి నవల రాసి ఇచ్చేయండి, ఎలా డబ్బు సంపాదిస్తారో చూడండి!”

“నిజమే! అయితే దురదృష్టవశాత్తూ, నాకు కథలు రాయడమూ, బొమ్మలు గీయడమూ వంటి కళ్ళల్లో ప్రవేశమే లేదు. అదే మీరు నాకొక ప్రూఫ్ రీడరుగా ఉద్యోగం ఇస్తే రెండ్రోజుల్లో ఆ పని నేర్చుకోగలిగేదాన్ని. పోన్లెండి, ఎవర్నేమని ఏం లాభం! సంఘం మొత్తం ఆడదాని మీద పగబట్టినట్టుంది. బహుశా ఇహ ఆ అమ్మాయిలతో పాటూ కాగితాల పనే తప్పదో ఏమో!” నిరాశగా వెనుదిరిగింది జేన్.

బయటకొచ్చాక జేన్, “ఫ్రాన్సిస్, నా దృష్టిలో ఇంకొక్క ఉద్యోగం వుంది. అక్కడికి నేనొంటరిగా వెళ్ళగలనులే. ఎంతసేపు నాతో పాటు నువ్వూ అలిసిపోతావు? నువ్వు ఇంటికెళ్ళు.” అని ఒంటరిగా బయలుదేరింది.

***

అక్కణ్ణించి ఆమె సరాసరి వాళ్ళ కుట్టు టీచర్, శ్రీమతి డూన్ గారి దగ్గరకెళ్ళింది. పాపం, జేన్ బట్టలేవో కుట్టించుకోవడానికొచ్చిందనుకొంది ఆవిడ. జేన్ సూటిగా విషయానికొచ్చి, తాను ఉద్యోగం కోసం వెతుకున్నాననేసరికి ఆశ్చర్యపోయింది.

“మేము నీ దగ్గర కుట్టు నేర్చుకొనే రోజుల్లో నీదగ్గర లెక్కలు చూడడానికో గుమాస్తా వుండేవాడు కదా, ఇంకా వున్నాడా?” అడిగింది జేన్.

“ఆ, వున్నాడు. అతను నా కొక్కదానికే కాదూ, ఇంకా చాలా మంది దగ్గర పద్దులు రాస్తాడు!”

“అవునా? అయితే, అతని ఉద్యోగం నాకిప్పించగలరా? ఎన్నో చోట్ల చేస్తున్నాడు కాబట్టి ఒక చోట పోయినా అతనికంత ఇబ్బందేమీ వుండదు,” ఆశగా అడిగింది జేన్.

శ్రీమతి డూన్ కేమనాలొ తొచలేదు. ఇంతవరకూ వాళ్ళు లెక్కల గుమాస్తాగా ఆడవాళ్ళని పెట్టుకోలేదు. వాళ్ళ వ్యాపారమే కాదూ, ఆమెకి తెలిసిన ఏ వ్యాపారస్తుడూ ఆడవాళ్ళని పద్దులు రాయడానికి పెట్టుకోలేదు. ఇప్పుడు తను పెట్టుకుంటే అంతా ఏమంటారో! అన్నిటికంటే, పాపం పెళ్ళాం బిడ్డలున్నవాడు మెక్డోనాల్డ్, అతన్ని ఏ కారణం చూపించి ఉద్యోగం లోంచి తీసేయగలదు ! అసలే ఈ మధ్య అమ్మకాలు అంతంత మాత్రంగా వున్నాయి. ఇప్పుడు అవసరం లేని మార్పులు చేసి వున్న కస్టమర్లు కూడా పోతే! మెల్లిగా తన భయాలన్నీ జేన్ ముందు బయటపెట్టింది.

నిట్టూర్చింది జేన్.

“బోలెడంత పచ్చిక వున్నా గుర్రాలకి దాణా కరవు! ఎవరైనా ఒకళ్ళు ధైర్యం చేసి నాకుద్యోగం ఇచ్చే వాళ్ళే కనబడడం లేదు !”

తల దించుకుంది శ్రీమతి డూన్. నిరాశగా అక్కణ్ణించి బయటపడింది జేన్.

***

 మిగిలిన రోజంతా ఆమె తమ లాయరు దగ్గరా, చదువుకున్న పాఠశాలా, అన్ని చోట్లా ఉద్యోగం కొరకు ప్రయత్నించి విఫలమైంది. కొన్ని చోట్ల ఆమె అర్హత సరిపోలేదంటే, కొన్ని చోట్ల అనుభవం లేదన్నారు. మొత్తానికి తనకు నచ్చి, కొంచెం గౌరవప్రదంగా వుండి, పైకెదగడానికి అవకాశం వుండే ఉద్యోగాలు దొరకవన్న నమ్మకానికొచ్చింది జేన్.

అలసి సొలసి, నిరాశా నిరుత్సాహంతో ఆమె సాయంత్రం ఫ్రాన్సిస్ ఇల్లు చేరుకుంది.

“ఏమైంది జేన్?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ కాలేదు! పోనీ, పేపరులో ప్రక్టిస్తా ఫ్రాన్సిస్.ఇహ అదొక్కటే దారి! అలాగైనా ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ లేదనుకో!”

“బాధ పడకు జేన్! ఏదో దారి దొరకకపోదు.. లే, లేచి తయారవ్వు. అలా రెన్నీ ఇంటికెళ్ళీ భోచేసి సరదాగా గడిపొద్దాం. నీకూ కాస్త మనసు కుదుటపడుతుంది.”

“అలాగే! అసలు నాకు బాగా ఆకలవుతుంది. పొద్దుటినించీ సరిగ్గా తిండేలేదు!”

ఫ్రాన్సిస్ సౌమ్యతా, ఆదరణతో జేన్ కి మనసులో కొంచెం భారం తగ్గినట్టనిపించింది.

***

వీలునామా – 3వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మర్నాడు పొద్దున్నే ఎల్సీ తీరిగ్గా పేపరు చదువుతోంది. పేపరులో ఒక మూల హోగార్త్ గారి వీలునామా విశేషాలన్నీ వున్నాయి, ఎస్టేటు కొత్త హక్కుదారుడికి అభినందనలతో సహా.
“జేన్! చూడు! ఇప్పుడు ఇదంతా పేపరులో రాసి మన పరువు తీయాలా? ఇంకా నయం, నీ గురించీ, విలియం గురించీ ఏమీ రాయలేదు. లేకపోతే, అతనేదో నిన్ను కాదన్నాడనీ, నువ్వందుకు భోరుమని ఏడుస్తున్నావనీ కూడా కథలల్లే వాళ్ళు, ” ఆ పేపరు అక్కకి చూపిస్తూ చికాగ్గా అంది ఎల్సీ.

“చుట్టూ వున్న మనుషులు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అన్న విషయాలని మనం నియంత్రించలేం కదా? అందుకే వాటి సంగతి వదిలేయ్. నేను థాం సన్ గారింటికెళ్ళొస్తాను.”

***

జేన్ వెళ్ళేసరికి అప్పుడే మిస్ థాంసన్ పేపరు చదివి లేవబోతున్నారు. శ్రీమతి డాల్జల్ ఇచ్చిన ఉత్తరం తీసుకొని ప్రవేశించింది జేన్.

అరవై యేళ్ళ మిస్ థాంసన్ ఆరోగ్యంగా, చలాకీగా వుంది. ఆవిడ కళ్ళు చురుగ్గా, నోరు చిరునవ్వుతో విచ్చుకొనీ వుంది. ఇప్పుడిప్పుడే యవ్వనం లోని మెరుపు స్థానం లో వార్ధక్యం వల్ల వచ్చే హుందాతనం స్థిరపడుతోంది.

శ్రీమతి డాల్జల్ గారు కేవలం జేన్ ని పరిచయం మాత్రమే చేసారు తన చిన్న వుత్తరంలో. అందువల్ల జేన్ రాకకి కారణమేమై వుంటుందో ఊహించలేకపోయారు ఆవిడ. ముందుగా జేన్ ని కూర్చోమని, ఆ పైన వచ్చిన పని విచారించారు.

“మేడం! నేనొక చిక్కు పరిస్థితిలో మీ సలహా సహాయాల కొసం వచ్చాను. మా మామయ్య రాసిన వీలునామా సంగతీ, నేనూ మా చెల్లెలూ చిల్లి గవ్వ లేకుండా వీధిలో నిలబడ్డ సంగతీ మీరీ పాటికే విని వుంటారు.”

“అవునమ్మా! మీ మామయ్య ఎందుకలా చేసారో! పాపం, మీ పరిస్థితి చూస్తూంటే జాలేస్తూంది.”

“మేడం! మా మావయ్య ఎప్పుడూ మిమ్మల్ని ఆదర్శంగా చూపించి, ఆడవాళ్ళు తలచుకుంటే చేయలేనిది లేదు అని చెప్పేవారు. అందుకే నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. దయచేసి, నన్ను పనిలో పెట్టుకోని మీ వ్యవసాయం పనులు నేర్పండి. నేను మీ డబ్బు లెక్కలు చూడగలను, ఉత్తరాలు రాసి పెట్టగలను, ఇల్లు చక్క బెట్టగలను. మీకు పనిలో సహాయపడుతూ నేనూ వ్యవసాయం నేర్చుకోగలను. నన్నూ నా చెల్లెల్నీ రోడ్డు మీద నిలబడే పరిస్థితి నుంచి మీరే కాపాడ గలరు.”

మిస్ థాంసన్ ఆమె కేసి జాలిగా చూసి తల అడ్డంగా తిప్పారు.

“హాయ్యో! పిచ్చి తల్లీ! స్కాట్ లాండ్ లో వ్యవసాయం చాలా డబ్బూ శ్రమా తో కూడిన విషయం. నువ్విపుడు చేసి పెడతానన్న పనులు  చిల్లి గవ్వ ఖర్చు లేకుండా నేనే చేసుకోగలను. బహుశా ఇంకో పదేళ్ళ వరకూ చేసుకోగలను. నాకు కావాల్సిన సహాయం ఆడవారి పనుల కోసం కాదు, మగవారు చేయగలిగే పనులు. అంటే గుర్రబ్బండీ వేసుకొని సంత కెళ్ళి సామాన్లు కొనటం, అమ్మి పెట్టటం, పొలాలన్నీ చుట్టి రావటం లాటివి. పెద్దదాన్నవుతున్నాను కదా, బయటికి వెళ్ళలేకపోతున్నాను.  నీకు ఏదైనా సహాయం చేయాలనే వుంది. కానీ, ఇప్పటికే నా సహాయం కోసం ఎదురు చూస్తూ బోలెడు మంది మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, అక్క చెల్లెళ్ళ పిల్లలూ వున్నారు. వారిని కాదని నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అందుకే ఈ మధ్యనే మా చెల్లెలి కొడుకు జాన్ ని పై పనుల్లో సహాయానికి పెట్టుకున్నాను. ఇంకా నేను పనిలో పెట్టుకుని తిండి పెడతానని జాన్ తమ్ముళ్ళూ కాచుకోని వున్నారు.”

జేన్ నిరాశగా తల దించుకొంది.

“నిజమే! మీ పరిస్థితి నాకర్థమవుతూంది. ప్రపంచంలో ఏ దిక్కూ లేని అనాథలం నేనూ, మా చెల్లి అంతే! మీలా మాకూ ఒక బంధువుండి వుంటే మాకూ ఎవరైనా పని చూపించి వుండే వారేమో! పోనీ, ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి!”

“జేన్! నేను ఈ వ్యవసాయం ఒక విచిత్ర పరిస్థితిలో చేపట్టాను. మా నాన్న వున్న డబ్బంతా పెట్టి ఇంత పెద్ద పొలం కొని దాన్ని సరిగా సాగు చేయలేక పోయాడు. ఫలితంగా చాలా డబ్బు నష్టం వచ్చేది. ఆయనకి కొడుకులు కూడ లేరు. మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళమే. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, పొలం అమ్మడం ఇష్టం లేక నేను దీని బాధ్యత తీసుకున్నాను. అతి కష్టం మీద, నష్టాలన్నీ పూడ్చుకొని లాభాలు సంపాదించాను. నాకు కష్టపడే మనస్తత్వం తో పాటు పొలం పనుల మీద ఇష్టం కూడా వుండడం వల్లనే అదంతా సాధ్యమయింది.”

“అదృష్టవంతులు మీరు. నాక్కూడా కొంచెం డబ్బు వుండి వుంటే నేనూ ఏదో వ్యాపారమో, వ్యవసాయమో మొదలు పెట్టి వుండగలిగేదాన్ని,” దిగులుగా అంది జేన్.

“అవును జేన్. ధైర్యమూ, ఆరోగ్యమూ, యవ్వనమూ తప్ప మరేమీ లేకుండా ప్రపంచంలో నెగ్గుకురావటం ఆడదానికి కష్టమే. పెళ్ళి చేసుకోవడమో, లేదా ఎవరింట్లోనైనా పిల్లల్ని చూసుకొనే గవర్నెస్ గా చేరడమో తప్ప వేరే దారి లేదు. దురదృష్టవశాత్తూ పెళ్ళిళ్ళ మార్కెట్టూ, గవర్నెస్సుల మార్కెట్టూ ఆడపిల్లలతో కిక్కిరిసి పోయి వున్నాయి. మనలాంటి వాళ్ళం ఇంకే పని చేసినా సంఘానికి నచ్చదు.”

“ప్రపంచం చాలా పెద్దది కదా! ఏదో ఒక పని దొరకకపోదు లెండి.”

“మరీ మీ మావయ్య చాలా అన్యాయం చేసారు జేన్. మీ ఇద్దరికీ కొంచెమేనా డబ్బు ఇచ్చి వుండవలసింది. అప్పుడు నాలా ఎక్కడైనా వ్యవసాయం చేయగలిగేవారు కదా!”

“కావొచ్చు! కానీ, డబ్బు ఒకళ్ళు ఇస్తే వచ్చే ఆనందం కన్నా, మనం సంపాదించుకుంటే వచ్చే ఆనందం ఎక్కువ కదా! ఆ ఆనందాన్ని మా అనుభవం లోకి తేవటం కొసం ఆయన అలా చేసారేమో! ఎవరికి తెలుసు?”

“నీ గురించి నాకు భయం కానీ అనుమానం కానీ లేవు జేన్. తెలివైనదానివీ, ధైర్యస్థురాలివీ. మీ చెల్లెలూ నీ లాటిదైతే….”

“ఏలాటిదైనా, మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం!” మధ్యలోనే అందుకుంది జేన్.

“అయితే మరీ మంచిది. మీక్కావల్సిన ధైర్యాన్ని ఆ ప్రేమే ఇస్తుంది. నా మాట విని ఎడిన్ బరో వెళ్ళండి.అక్కడ మీకు ఉద్యోగావకాశాలు ఎక్కువ. అక్కడ మీకు తెలిసిన వాళ్ళెవరైనా వున్నారా?”

“ఎవరూ లేరు.”

“ఇప్పుడు ఆస్తంతా అనుభవించబోయే అబ్బాయి, మీ కజిన్, అతను ఏదైనా సహాయం చేయడా?”

“అతను స్నేహంగానే వున్నాడు, కానీ వీలునామా ప్రకారం అతను మాకేవిధంగానూ సాయపడకూడదు.”

“డబ్బు ఇవ్వక్కర్లేదు. ఉద్యోగాలు వెతికి పెట్టొచ్చు. మీ గురించి అక్కడా ఇక్కడా చెప్పి సాయ పడొచ్చు కదా?”

“అతనూ అదే అన్నాడు. ఒకసారి ఎడిన్ బరో వెళ్ళి చూస్తాను. అక్కడ వుండడానికే అధారమూ లేదు. అతని ఇంట్లోనే వుండక తప్పదు. హోటాళ్ళల్లో వుండగలిగేంత డబ్బు లేదు.”

“అవును, అతని ఇంట్లో వుండడమే మంచిది. ప్రయాణాలకీ వాటికీ వీటికీ బోలేడు డబ్బి అవసరమవుతుంది జేన్. ఈ అయిదు పౌండ్లూ వుంచు,” డెస్క్ లోనించి అయిదు పౌండ్ల నోటు తీస్తూ అన్నారు మిస్ థాం సన్. ఆ డబ్బు తీసుకోవటానికి అభిమానం అడ్డొచ్చినా, ఆవిడన్న మాటల్లో నిజం వుండడం వల్ల, మౌనంగా ఆ నోటు అందుకొంది జేన్.

జేన్ ఇంటికొచ్చేసరికి ఎల్సీ తన దిగులు నుంచి తేరుకుంది. ఆ రోజు పేపర్లో వచ్చిన కవితల స్థాయి చుసి ఏల్సీ ఆశలు చిగురించాయి. నిస్సందేహంగా తాను అంతకంటే మంచి కవిత్వం రాయగలదు. పేపరుకి అడపాదడపా కవితలు రాసి పంపి డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తే, అన్న ఆలోచన వచ్చిందామెకు. గబ గబా పుస్తక తెరిచి రాసుకోవటం మొదలు పెట్టింది.

అక్క తిరిగి రాగానే, కూర్చో బెట్టి తన కవిత్వం వినిపించింది.

“చాలా బాగుంది ఎల్సీ! ఇంత తొందరగా ఎలా రాసావు?”

“నిజంగా బాగుందా? ఏదైన పేపరుకి పంపనా? వేసుకుంటారంటావా?”

“నాకు కవిత్వం గురించీ, సాహిత్యం గురించీ పెద్దగా తెలియదు కానీ, పంపించు! వేసుకుంటారనే అనిపిస్తుంది!”

“హమ్మయ్య! జేన్! నీ మాటంటే నాకెంతో గురి. నీలాటి తెలివైన మనిషికే నచ్చింది, కాబట్టి ఇదిచాలా మందికి నచ్చుతుండొచ్చు!”

ఎల్సీ ఉత్సాహమూ, సంతోషమూ చూసి జేన్ కూడా నిరాశ లోంచి బయటికొచ్చింది.

“అవును ఎల్సీ! నీలాటి సున్నిత మనస్కులు రాసే భావాలూ, భాషా, చాలా మందికి, ముఖ్యంగా స్త్రీలకి చాలా నచ్చుతుంది. పోనీలే, ఇద్దరిలో ఒక్కరికైనా కాస్త వెలుతురు కనిపిస్తుంది. ఎందుకంటే, నే వెళ్ళిన పని మొత్తంగా కాయే!” అంటూ మిస్ థాం సన్ తో భేటీ గురించి వివరంగా చెప్పింది.

“పొద్దున్న ఫ్రాన్సిస్ దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మనిద్దరినీ వీలైతే ఎడిన్ బరో రమ్మనీ, అక్కడేదైనా ఉద్యోగం దొరకచ్చనీ రాసాడు. వెళ్ళక తప్పేట్టు లేదు! మరి నువ్వూ వస్తావా?” ఎల్సీని అడిగింది.

“జేన్! నాకా ఉద్యోగాల మీద ఆసక్తీ లేదు, వస్తాయన్న ఆశా లేదు. నేనెందుకు చెప్పు, అక్కడికి, డబ్బు దండగ కాకపోతే? అయితే నీకొక్కదానికీ వెళ్ళటానికి ఇబ్బందిగా అనిపిస్తే తోడుగా తప్పక వస్తాను!”

“అదీ నిజమేలే! అయితే నువ్విక్కడే వుండు! ఆ కవిత్వాన్ని పేపరుకి పంపడం మర్చిపోకు మరి! నేనిప్పుడే వెళ్ళి  నేనొస్తున్నానని ఫ్రాన్సిస్ కి ఉత్తరం రాసి పోస్టు చేయిస్తాను. ఎంత తొందరగా ఉద్యోగం దొరికితే అంత మంచిది.”

***

 (సశేషం)

 ముఖ చిత్రం : మహీ పల్లవ్

వీలునామా-2వ భాగం

Sharada1    (గత వారం తరువాయి)

వున్నట్టుండి సోఫాలో లేచి కూర్చుంది ఎల్సీ.

“జేన్! ఫ్రాన్సిస్ మనిద్దరిలో ఎవరినీ పెళ్ళాడకూడదు, అనే షరతు ఎందుకు పెట్టాడంటావు మావయ్య? మనం మరీ ముక్కూ మొహం తెలియని అతన్ని పెళ్ళాడతామని ఎలా అనుకున్నాడు? ఫ్రాన్సిస్ చూడటానికి కూడా మామూలుగానే వున్నాడు. అతని తల్లిని గురించి కూడా మావయ్య ఏమీ చెప్పలేదు. ఇంతకీ అతని మొహం లో నీకేవైనా మావయ్య పోలికలు కనబడ్డాయా?”

“ఏమోలే, నేనంతగా గమనించలేదు.”

“ఇక్కడ వూళ్ళో వాళ్ళు అతన్ని వుండనిస్తారంటావా? మావయ్యదీ వాళ్ళమ్మదీ పెళ్ళీ అసలు చెల్లుతుందంటావా?”

“చెల్లినా చెల్లకపోయినా అది చట్ట బధ్ధమే? ఊళ్ళో వారికి అతన్ని ఆదరించకా తప్పదు. అతను కూడా చూడటానికి సౌమ్యుడిలానే వున్నాడు.”

“అతన్ని మనం పెళ్ళాడకూడనదన్న షరతు వుండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నీకే అతను తెగ నచ్చినట్టున్నాడే,” నవ్వింది ఎల్సీ.

“చాల్లే! అతన్ని చూస్తే జాలేసింది నాకు. అంతే! పైగా, సలహా ఇవ్వడానికి మనకింకెవరున్నారు చెప్పు?”

“ఫ్రాన్సిస్ సంగతలా వుంచు! విలియం మాటేమిటి?”

“అవును! సరిగ్గా నేనూ విలియం డల్జెల్ గురించే ఆలోచిస్తున్నాను.

డబ్బుంటే మనలని ఎవరైనా మోసం చేస్తారన్న విషయం నాకెందుకో మావయ్య విలియం ని దృష్టిలో పెట్టుకునే రాసినట్టనిపించింది. మావయ్యకెందుకో విలియం అంటే ఇష్టం వుండేది కాదు. అందులో విలియం నాతో చనువుగా వుండటం అసలే నచ్చేది కాదు. బహుశా మా స్నేహాన్ని తుంచెయ్యడానికే మావయ్య ఇలా చేసాడేమో!”

“నువ్వు దాని గురించేమీ బాధ పడొద్దు జేన్! విలియం చాలా మంచి వాడు. అతను ఆస్తి పాస్తులకి అతీతంగా నిన్ను ప్రేమించాడు.”

“పిచ్చిదానా! విలియం పేదవాడు. డబ్బున్న అమ్మాయిని పెళ్ళాడితే తన దరిద్రం పోతుందని ఆశపడ్డాడే తప్ప, పేదరాలిని చేసుకోవాలని కాదు. కాబట్టి ఆ ఆలోచన వదిలేయ్.”

“మరీ అంత దుర్మార్గుడా విలియం?”

“ఇందులో దుర్మార్గమేముంది? నన్ను చూసి చెప్పు. నాలాటి సామాన్యమైన అమ్మాయిని, ఏమీ లేనప్పుడెందుకు పెళ్ళాడాలి ఎవరైనా? అలాటి త్యాగలని ఇతరుల నుంచి ఎప్పుడూ ఆశించవద్దు. ఇక ఆ విషయం వదిలేయ్!”

“ఆగు జేన్! ఇప్పుడు విలియం వచ్చి, నిన్ను  ప్రేమిస్తున్నాననీ, పెళ్ళాడదామనీ అంటే, అతను డబ్బు కోసం అమ్మాయిల వెంట పడే రకం కాదని తెలిసిపోతుందిగా? అప్పుడు నువ్వు పెళ్ళాడతావా అతన్ని?”

“అతనలా అనడు.”అటు తిరిగి నోట్ బుక్కులో ఏదో రాసుకోసాగింది జేన్.

మళ్ళీ కాసేపాగి చెల్లెలి వైపు తిరిగి,

“మన దగ్గర ఏవైనా నగలున్నా బాగుండేది. అవమ్మి ఒక చిన్న దుకాణం తెరిచే వాళ్ళం,” అంది.

“దుకాణమా! ఛీ! ఇంత బ్రతుకూ బ్రతికి దుకాణం తెరుస్తామా?”

“పోనీ గవర్నెస్ ఉద్యోగం చేద్దామా?”

“ఏమో జేన్! అసలు మనిద్దరికీ ఒక ఇంట్లో ఉద్యోగం దొరకకపోతే. నువ్వు లేకుండా నన్ను నేను ఎలా రక్షించుకోగలను? ఇద్దరం ఒక్క దగ్గరుండేలా చూడు.”

“సరే, పోనీ! బట్టలు కుట్టే పనిలో చేరదామా? నీకు కుట్టడం బాగా వొచ్చుగా?”

“కానీ ఆ ఇరుకు గదులూ, ఎడతెగని పనీ!”

విసిగిపోయింది జేన్.

“అయితే నువ్వే చెప్పు, ఏ పనైతే నీకిష్టమో!”

“ఏమో జేన్. నేనెప్పుడూ ఆలోచించలేదు. బ్రతుకంతా ఇలాగే మనిద్దరం కలిసే వుంటాం, నాకేం కావాలన్నా నువ్వు చూసుకుంటవ్, అనుకున్నాను!”

“అలాగే జరిగితే సంతోషం. కానీ, కొద్ది రోజులైనా ఏదో ఒక పని చూసుకోకపోతే ఎలాగ?”

“కొద్ది రోజులు మనలని ఇంట్లో వుంచుకొని ఆదరించే స్నేహితులో, బంధువులో లేనే లేరా?”

“లేరు ఎల్సీ! మావయ్య కూడా ఎవరినీ రానిచ్చే వారు కాదు. అందుకే ఇప్పుడు మనకెవరూ లేరు, ఆదుకోవడానికి, మన చదువులు తప్ప.”

ఇంతలో నౌకరు వచ్చి విలియం గారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారని చెప్పాడు.

“అతన్ని పైకి రమ్మను!” జేన్ చెప్పింది కుర్చీలోంచి లేస్తూ.

“జేన్! జాగ్రత్తగా మాట్లాడు, తొందరపడకు. నే వెళ్తున్నా,” గబగబా వెళ్ళిపోయింది ఎల్సీ.

విలియం లోపలికొచ్చాడు. కాసేపు నిరాసక్తంగా మాట్లాడుకొన్నారిద్దరూ.

“అవునూ, పొద్దున్న చర్చి దగ్గర, అంత్యక్రియల్లో ఎవరో ఒక కొత్త యువకుడు కనిపించాడు. ఎవరతను?”

“ఎవరు?”

“ఎవరో, పొడుగ్గా, సన్నగా వున్నాడు. ఎడిన్ బరో నుంచి వచ్చాడట, మీ మావయ్యకి చాలా ముఖ్యుడట!”

“అయితే నువ్వేమీ వినలేదా?”

“దేనిగురించి?” అయోమయంగా అడిగాడు.

“మావయ్య వీలునామా గురించి.”

“నేనేమి వినలేదు. అది నాకనవసరం కూడా. అది మీ కుటుంబ విషయం. నీ పట్ల నా భావాలు..”

“ఆగు విలియం!  ముందీ విషయం విను. మా మవయ్య తన ఆస్తంతా ఆ యువకుడి పేర రాసి, నన్నూ ఎల్సీని కట్టు బట్టల్తో బయటికి పంపేసాడు. అన్నట్టు, ఆ యువకుడు మావయ్య కొడుకు. పేరు ఫ్రాన్సిస్.”

“జేన్! హాస్యాలాడుతున్నావా? మావయ్య అలా యెందుకు చేస్తారు? ఈ జోకేమీ బాగాలేదు.”

“కాదు విలియం. ఆరు వారాల కిందటే మా మావయ్య తన విల్లు రిజిస్టరు కూడా చేయించారు.”

విలియం మొహం పాలిపోయింది. అతనికి ఏమనటానికీ ధైర్యం సరిపోలేదు.

“విలియం! నీ పరిస్థితి నాకర్థమవుతుంది. ఇన్ని రోజులూ మనం అనుకున్న మాటలూ, చెప్పుకున్న అభిప్రాయాలూ వొదిలేద్దాం. నాకు నీమీదేం కోపం లేదు. ఒక్క కానీ కూడా లేని నన్ను నువ్వు పెళ్ళాడలేవని నాకు తెలుసు. నీకు భారమవటం నాకిష్టం లేదు కూడా, ” అంది జేన్ దయగా.

విలియం తలొంచుకున్నాడు. నిజానికి అతను ఎల్సీని ఇష్టపడ్డాడు. అయితే మావయ్యకి ఇద్దరిలో జేన్ అంటే ఎక్కువ ఇష్టమనిపించి అతనూ తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. జేన్ తెలివితేటలూ, నిబ్బరమూ, హుందాతనమూ కంటే ఎల్సీ అందమూ, చిలిపితనమూ, తెలివి తక్కువతనమూ అతనికెక్కువ నచ్చాయి. జేన్ ఎప్పుడూ తన సలహా, సహాయమూ అడగదు.  శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతురాలు. అయితే మేన మామకు అత్యంత ప్రీతిపాత్రురాలు కనక ఆస్తికంతటికీ ఆమే వారసురాలౌతుందని ఆశాపడ్డాడు.

తమకున్న కొద్దిపాటీ ఆస్తీ కోర్టు వ్యాజ్యాలలో చిక్కుకొని వుండడం మూలాన అతని ఎన్నికకి అతని తల్లీ యేమీ అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిడా పాపం జేన్ ని ప్రేమాభిమానాలతో ముంచెత్తింది.

కొద్దిసేపటికి విలియం తేరుకున్నాడు. అప్పటికి జేన్ తనని తిట్టినట్టుగా అనిపించి కొంచెం కోపం కూడా వచ్చిందతనికి. అసలు తనే గంభీరంగా మాట్లాడి వుండాల్సింది. తనని వదిలి వుండలేనని జేన్ యేడిస్తే, తనే యెలాగో నచ్చ చెప్పి వుండాల్సింది.

అలాటిది జేన్, తమ ఇద్దరి మధ్యా అసలేమీ లేనట్టూ తనకి ఏ మాత్రమూ ఆమె మనస్సులో చోటు లేనట్టూ, “ఇహ నువ్వు వెళ్ళొచ్చు,” అన్నట్టు మాట్లాడేసరికి అతనికి ఉక్రోషంగా అనిపించింది. ఎప్పుడు తనకంటే ఆమెదే పై చేయి, అనుకున్నాడు అసహనంగా,

“అవును జేన్! నువ్వన్నది నిజమే. నాలాటి పేద వాణ్ణి కట్టుకుని నువ్వు సుఖపడేదీ ఏం వుండదు. నన్ను క్షమించు.”

విలియం లేచి మెట్లు దిగి వెళ్ళిపోయాడు.

“నాకతని మీద కోపమేమీ లేదు!”

తనకి తనే పదే పదే నచ్చ చెప్పుకుంటూ కుర్చీలో కూలబడింది జేన్.

***

జేన్ “మావయ్య ఆలోచించే ఈ పని చేసి ఉంటాడు”, అన్నప్పుడు కేవలం తన సొంత అభిప్రాయాన్నే వెలిబుచ్చింది. మేనమామని ఆమె ఎంతగానో అభిమానించి, గౌరవించింది. తన మీదా చెల్లెలి మీదా ఆయన విధించిన ఆంక్షలేవీ ఆమెనెక్కువగా బాధించలేదు. అయితే ఆమె అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఎవరూ లేరు.

తన మేన కోడళ్ళిద్దరికీ తన ఆస్తిలో దమ్మిడీ కూడా ఇవ్వలేదాయన అన్న విషయం బయటికి పొక్కగానే, ఊరి వారందరూ నానా రకరకాలుగా వ్యాఖ్యానించారు.

“పెద్దోరింటి గొడవ మనకేం తెలుసు,” అని పనివాళ్ళనుకుంటే, “ఈయనంత వింతగా ఎవరైనా ప్రవర్తించగలరా?” అనుకున్నారు మిగతా ఎస్టేటు దారులు.

ఏదెలావున్నా, మేనమామ పుణ్యమా అని, జేన్ కి కానీ, ఎల్సీ కి కానీ స్నేహితులే లేరు. ఆడవాళ్ళు స్నేహం పేరిట  పోచికోలు కబుర్లతో కాలయాపన చేయటం ఆయనకి నచ్చేది కాదు.

ఆడా మగా కలిసి సరదాగా విందులూ వినోదాలూ చేసుకోవడం ఇంకా నచ్చేది కాదు. అయితే, అప్పుడప్పుడూ ఆయన చుట్టు పక్కల వారిని విందు భోజనాలకి ఆహ్వానించిన మాటా నిజం. కానీ, సాయంత్రం ఆరింటికి వచ్చి రాత్రి పన్నెండింటికి తప్పకుండా వెళ్ళిపోవాలన్న నియమం వుండడం చేత ఎవరికీ ఆ విందు భోజనాలంటే పెద్ద ఆసక్తి వుండేది కాదు.

వాళ్ళిద్దరి చదువూ, ఇతర వ్యాపకాల విషయంలో మాత్రం ఆయన ఏదీ తక్కువ చేయలేదు. అమ్మాయిలిద్దరూ గుర్రపు స్వారీ, ఈతా, తుపాకి పేల్చడం లాటి విద్యలన్నీ నేర్చారు. అయితే అంత ఖర్చు పెట్టి వాళ్ళీద్దరికీ చెప్పించిన విద్యతో ఆయనే సంతోషపడలేదు! హొగార్త్ గారు విద్యతో వ్యక్తిత్వాలను తీర్చిదిద్దవచ్చని అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలకీ ఒకే రకం విద్య చెప్పించినా, ఇద్దరి వ్యక్తిత్వాల్లో అంత తేడా వుండడం ఆయనకి అర్థం కాలేదు.

పెద్దది జేన్ ఇద్దర్లోకీ చురుకైనదీ, ధైర్యం గలదీ. ఆస్తిపాస్తుల ఆజమాయిషీ, చెల్లెలి సంరక్షణా తన బాధ్యతలే ఆవుతాయి కాబట్టే మామయ్య అందరు ఆడపిల్లల్లా కాకుండా తనకు విభిన్నమైన శిక్షణ ఇప్పిస్తున్నాడనుకొందామె. అందుకే, సంతోషంగా లెక్కలూ, అక్కవుంటుంగూ, వ్యవసాయ శాస్త్రమూ, వగైరా విషయాలు ఆసక్తిగా నేర్చుకుంది. ఆడవాళ్ళకి అప్పట్లో నేర్పించే విద్య చాలా వరకు ప్రదర్శనలకొరకు పనికొచ్చేదే అయివుండేది. అలాంటి అల్లిక పనీ, కుట్టు పనీ, బొమ్మలేయడం, సంగీతం వంటి కళలు నేర్చుకునే పని తనకు తప్పినందుకు జేన్ ఎంతైనా సంతోషించింది.

ఎల్సీకి పాపం ఇవన్నీ కాకుండా మిగతా అమ్మాయిల్లా వుండాలని వుండేది. కానీ, అక్క లాగానే చదువుకోవాలని మామయ్య ఆదేశం. అందుకే ఎల్సీ చదువు ఏదో అంతంతమాత్రంగా సాగింది. భాషలు నేర్చుకోవడం హొగార్త్ గారి దృష్టిలో ఎందుకూ పనికి రాని విషయం. అయినా అమ్మాయిల ట్యూషన్ మాస్టారు, విల్సన్ గారు పట్టు బట్టి ఇద్దరికీ గ్రీకు, లాటిన్ భాషలు నేర్పించాడు. వాళ్ళిద్దరూ తమ ఇష్టంతో ఫ్రెంచీ, ఇటాలియన్ భాషా నేర్చుకుంటామంటే ఎడిన్ బరో లో కొన్నాళ్ళుంచి ఆ రెండు భాషలనీ చెప్పించారు హొగార్త్. భాషల్లో చాలావరకు ఎల్సీ అక్కకంటే ముందుండేది. వీటన్నిటికంటే ఎల్సీకి సంగీతం మీద చాలా ఇష్టంగా వుండేది. కమ్మటి కంఠంతో బాగా పాడగలదు కూడా.

అయితే తన చెల్లెలు మేరీ జీవితం నాశనమవడానికి కారణం ఆమెకి సంగీతం మీద వున్న ఆసక్తే అన్న దృఢాభిప్రాయంతో హొగార్త్ గారు పిల్లలని సంగీతం ఛాయలకెళ్ళనివ్వలేదు. అందువల్ల ఎల్సీ ఆసక్తులూ ఇష్టాలూ నెరవేరనే లెదు. దాంతో చదువు పూర్తయినా ఎల్సీ అనాసక్తంగా, చిన్న పిల్లలా ప్రవర్తిస్తే జెన్నీ పెద్దదానిలా బాధ్యతలు తిసుకునేది.
హొగార్త్ గారు మరణించే నాటికి జేన్ కి ఇరవై మూడేళ్ళు నిండాయి. ఎల్సీ అక్కకంటే రెండేళ్ళు చిన్నది. అప్పుడప్పుడే విద్యాభ్యాసం ముగిసి, వాళ్ళకి నాలుగు ఊళ్ళూ తిప్పి చూపించాలని అనుకుంటున్నంతలో ఆయన ఆరోగ్యం పాడయి పరిస్థితి చూస్తూండగానే విషమించింది.

ఆయన విచిత్రమైన వీలునామా సంగతి తెలియగానే ఊళ్ళో వాళ్ళంతా జాలిపడ్డారు. అయితే వాళ్ళిద్దరినీ వొచ్చి పలకరించటానికెవరికీ ధైర్యం చాలలేదు. అందరికంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో పడింది విలియం తల్లి, శ్రీమతి డాల్జెల్ గారు! అమ్మాయిలద్దరూ తన దగ్గరికి వచ్చి ఏదైనా సాయమడిగితే ఏం చేయాలో నన్న భయం పట్టుకుందామెని. అందుకే వారి ఇంటికెళ్ళి పరామర్శించే పనిని వీలైనంత వాయిదా వేయదల్చుకుంది.

అంత్యక్రియలు ముగిసిన మర్నాడే చర్చి ఫాదర్ వొచ్చి పరామర్శించాడు. చాలా సేపటి వరకూ ఆయన మాట్లాడింది వాళ్ళకు అర్థం కాలేదు. అర్థమయింతర్వాత నచ్చలేదు. ఎక్కువగా ఆయన “ధనికులంతా దుర్మార్గులూ, డబ్బుతో వచ్చే సుఖాలకంటే, నష్టాలే ఎక్కువా, డబ్బు లేక తిండి కోసం మలమల మాడే పేదలే భగవంతునికి ప్రీతి పాత్రులు” వగైరా మాటలతో వాళ్ళని ఓదార్చారు. జేన్ కి తాము డబ్బు లేని పేద వాళ్ళుగా వుండటాన్ని ఇష్టపడటం లేదనీ, ఏదో కష్టం చేసి బ్రతకగలమనీ చెప్పటానికి ఆయన వాగ్ధాటి ముందు ధైర్యం చాలలేదు.
ఎందుకూ పనికిరాని సానుభూతి వాక్యాలతో విసిగిపోయిన జేన్, ఈసారి వచ్చే వారిని ఉద్యోగం కోసం ఏదైనా సలహా అడగాలని నిశ్చయించుకుంది. ఆ వ్యక్తి శ్రీమతి డాల్జల్ కావడం యాదృఛ్ఛికం! డాల్జల్ గారు వచ్చి ఏవో మామూలు మాటలు మాట్లాడి, అంటీ ముట్టనటుగానే వున్నారు. వున్నట్టుండి ఆవిడని జేన్ అడిగింది

“ఇప్పుడు మేమేం చేస్తే బాగుంటందంటారు ఆంటీ?”

గతుక్కుమంది శ్రీమతి డాల్జల్.

“హయ్యో! నాకేం తెలుసమ్మా? పెద్దాయన ఇలా చేస్తాడని ఎవ్వరమైనా అనుకున్నామా? నా బుర్రకైతే ఒక్క ఆలోచనా తట్టడం లేదు. విలియం ఈ సంగతి చెప్పగానే గుండె నీరైపోయిందంటే నమ్ము! హవ్వ! సొంత తోబుట్టువు పిల్లలని వీధులకప్పజెప్పి ఎవరో ఊరూ పేరూ తెలియని వాడికి తన సొత్తంతా ఇస్తాడా? పోనీ ఆయన రాసిన విల్లు చెల్లదని కోర్టులో దావా వేస్తే? అసలా అబ్బాయి ఈయన కొడుకే అని ఋజువేదీ? కొంచెం డబ్బు కోసం ఆ పిల్లాడి మిద వొత్తిడి తెచ్చినా తప్పు కాదంటాను!”

“అదయ్యే పని కాదులే! ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చెప్పగలరా? మీకు తెలిసిన వాళ్ళెవరైనా…”

శ్రీమతి డాల్జల్ ఆలోచించింది.

“చామర్స్ గారి శ్రీమతి వాళ్ల పిల్లలకి ఒక గవర్నెస్ కోసం వెతుకుతున్నారు. మరయితే మీకా ఉద్యోగం నచ్చుతుందో లేదో! మాక్స్వెల్ కుటుంబం కూడా వాళ్ళ అబ్బాయిలకి మొన్నీమధ్యనే ట్యూషను మాస్టారును కుదుర్చుకున్నారు.”

“అక్కా! మనకి వేరే దూరంగా వుండే వూళ్ళల్లో ఉద్యోగాలు దొరికితే బాగుండు. నాకీ ఊరంటే అసహ్యం పట్టుకుంది,” ఎల్సీ అంది.

“అవునమ్మాయ్! హాయిగా ఎడిన్ బరో లోనో, గ్లాస్గో కొ వెళ్ళండి. అక్కడేమైనా స్కూల్ మాస్టారు ఉద్యోగాలు దొరకొచ్చు.”

“చదువు చెప్పటం కాకుండా ఇంకేమైనా ఉద్యోగాలు దొరకవంటారా?”

“అయ్యో! పెద్దింటి పిల్లలు! నీడ పట్టున వుండే పనులు కాక ఇంకేం చేయగలరు?”

“అన్నట్టు మీకు మిస్ థాంసన్ గారు తెలుసా? మావయ్య ఆవిడ గురించి చాలా చెప్పారు. చాలా తెలివైనదనీ, ధైర్యం గలదనీ, ఏ పనైనా చక్క బెట్ట గలదనీ అన్నారు. ఆవిడ దగ్గరికెళ్తే ఏదైనా ఉద్యోగం దొరకొచ్చు.” సాలోచనగా అంది జేన్.

“ఆవిడ తెలియకపోవటమేంటి? అంటే పనీ పాటలూ చేసుకునేవాళ్ళతో మాలాటి కుటుంబీకులు ఎలా కలిసి మెలిసి తిరుగుతారు కానీ, చాలా పనిమంతురాలనే విన్నాను. వాళ్ళ పొలం పనులన్నీ తనే ఒంటి చేత్తో చూసుకుంటుందిట. పెళ్ళీ పెటాకులూ కూడా లేవాయె! ఇప్పుడు కొంచెం వయసు మీద పడుతున్నట్టుంది ఆమెక్కూడా!”
“ఆవిడ దయ తలచి నాకూ ఏదో ఉద్యోగం ఇవ్వకపోదు! వెళ్ళి నన్ను తనకి సాయంగ పెట్టుకోమని అడుగుతాను. నేనూ చాలా వ్యవసాయ శాస్త్రం చదువుకున్నా కాబట్టి ఆమెకీ లాభమే. ఆంటీ, ఆవిడకి నన్ను పరిచయం చేస్తూ ఒక చిన్న ఉత్తరం ఇస్తారా? ”

తనకే నష్టం కలగకపోతే అమ్మాయిలద్దరికీ సాయం చెయ్యడానికి ఆవిడకేమీ అభ్యంతరం లేదు. అందుకే నిరభ్యంతరంగా ఒక చిన్న ఉత్తరం రాసిచ్చింది.

***

 (సశేషం)

ముఖచిత్రం : మహీ పల్లవ్

వీలునామా

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

  మొదటి భాగం

స్కాట్లాండ్ లోని ఒక పల్లె దగ్గర వుండే ఒక పెద్ద భవంతిలో, ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకోని వుంది. ఆ భవంతి సొంత దారు శ్రీయుతులు హొగార్త్ గారు జబ్బు చేసి మరణించి అప్పటికి రెండు రోజులైంది. ఆ రోజు ఉదయమే ఆయన అంత్య క్రియలు ముగిసాయి.

 స్త్రీలంటే వుండే అపారమైన గౌరవం చేత ఆయన వివాహం చేసుకోలేదని ఊళ్ళో వాళ్ళనుకుంటారు. భార్యా బిడ్డలూ లేకపోయినా, ఆయనతో పాటు పదిహేనేళ్ళుగా నివసిస్తూన్న  మేనకోడళ్ళు, జేన్, ఎల్సీ లిద్దరూ వున్నారు. ఒక్కగానొక్క చెల్లెలు పదిహేనేళ్ళ క్రితం చనిపోతే వాళ్ళిద్దర్నీ ఆయన చేరదిసి ఇంటివద్దనే చదువు చెప్పించారు. ఆయనకున్న ఇద్దరు అన్నలూ సంతానంలేకుండానే మరణించారు. అందువల్ల ఆయన ఆస్తి పాస్తులన్నీ ఇప్పుడా ఇద్దరు అమ్మాయిలకే చెందొచ్చని అందరి ఊహ. ఆయనకింకెవరూ బంధువులు వున్నట్టు లేరు. కనీసం ఆ భవంతిలో వేరే బంధువులెప్పుడూ కనపడలేదు.

ఊళ్ళో అంతా ఆయన గురించి కొంచెం వింతగా చెప్పుకుంటారు. ఏ క్షణంలో ఆయన మనసెలా వుంటుందో, ఎప్పుడే విచిత్రమైన పని చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడీ మేనకోడళ్ళ సంగతే తీసుకుంటే, అందరు అమ్మాయిలకు చెప్పించినట్టు సంగీతమూ, చిత్ర లేఖనమూ లాటి నాజూకు విద్యలు కాకుండా కొంచెం విభిన్నమైన చదువులు చెప్పించారని వినికిడి.

అంత్య క్రియలు ముగిసి అందరూ ఆ భవంతిలోని హాలులోకి చేరుకుంటున్నారు. హొగార్త్ మేనకోడళ్ళు, వకీలు మెక్-ఫార్లేన్ గారూ, వైద్యుడు బైర్డ్ గారూ వున్నారు హాలులో. వీళ్ళతోపాటు ఒక అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు అమ్మాయిలిద్దరూ. దాదాపు ముఫ్ఫై యేళ్ళ వయసున్న ఆ పొడుగాటి వ్యక్తిని వాళ్ళింతకు ముందెప్పుడూ చూడలేదు. చాలా గంభీరంగా వున్నాడెందుకనో.

వకీలు గారూ, డాక్టరు గారూ కొంచెం ఇబ్బందిగా, చిరాగ్గా వున్నారు. వీలునామా చదివే ముందు అవసరమైన చిన్న చిన్న పనుల వల్ల అయి వుండొచ్చు. ఏవేవో కాగితాలు చూస్తూ కాలయాపన చేస్తున్నారు.

ఆఖరికి అందరూ కూర్చున్నాక వీలునామా చదవడం మొదలైంది. ఎందుకనో వకీలు గారికి గొంతు పట్టేసినట్టుంది.

“.. నా అభిప్రాయం ప్రకారం, స్త్రీలకి పురుషలకీ పెద్ద తేడాలేం లేవు. అవసరమైన చదువులు చెప్పిస్తే, ఆడవాళ్ళు కూడా తమ కాళ్ళమీద తాము నిలబడగలరు. ప్రపంచంలో తమ దారి తాము వెతుక్కోనూగలరు. ఈ సూత్రానన్నుసరించే నేనూ నా మేనకోడళ్ళు ( జేన్ మెల్వీల్, ఎల్సీ గా పిలవబడే ఆలిస్ మెల్వీల్) ఇద్దరికీ తగు విద్యా బుధ్ధులు నేర్పించాను. ఇప్పుడు గనక నేను నా ఆస్తిపాస్తులన్నీ వారికిస్తే, వాళ్ళు తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడాలన్న నా ఆశయానికి భంగం వాటిల్లక తప్పదు. ఇద్దరిలోకి పెద్దదీ, తెలివైనదీ అయిన జేన్ తెలివితేటలెందుకూ పనికిరాకుండా పోతాయి. చిన్నది ఆలిస్ ఆమాయకురాలు. డబ్బున్న అమాయకురాలిని వంచించటానికి కాచుకోని వుండే నక్కలకి మన సంఘంలో లోటు లేదు. వారి తండ్రి జార్జి మెల్వీల్ ఆ డబ్బు కోసమే కదా మా చెల్లి చుట్టూ తిరిగి దాని మనసునీ, జీవితాన్నీ ముక్కలు చేసింది! అందువల్ల ఈ డబ్బు వారిద్దరికీ హాని చేయడమే తప్ప ఇంకెందుకూ పనికిరాదని నా అంచనా.

అందుకే నా స్థిరాస్తులూ, చరాస్తులూ, అన్నిటినీ బేంక్ ఆఫ్ స్కాట్ లాండ్ లో హెడ్ క్లర్కు గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఆర్మిస్టవున్ పేర రాస్తున్నాను. అతని తల్లి ఎలిజబెత్ ఆర్మిస్టవున్ ని నేను దాదాపు ముఫ్ఫై అయిదేళ్ళకింద రహస్య వివాహం చేసుకున్నాను. ఫ్రాన్సిస్ కి ఈ సంగతి ఈనాటి వరకూ తెలియదు. ఎలిజబెత్ తో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్న నేను, ఫ్రాన్సిస్ కి దూరం నించే సహాయం చేస్తూ వున్నాను. నేనిచ్చే అతి కొద్దిపాటి దబ్బుతో ఫ్రాన్సిస్ పేదరికాన్నించి పైకొచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అలా చదువుకొని ఉద్యోగస్తుడవ్వడానికి అతనెంతో కష్టపడ్డాడు. అందుకే అతనిప్పుడు డబ్బునీ, ఆస్తినీ అందుకోవడానికి అర్హుడని నా అభిప్రాయం.

అయితే, అతను ఏలిస్, జేన్ లకి ఒకరొకరికీ  సంవత్సరానికి పన్నెండు పౌన్ల చొప్పున మూడేళ్ళు ఇవ్వాల్సి వుంటుంది. ఆ మూడేళ్ళల్లో వాళ్ళిద్దరూ తమ జీవనోపాధి వెతుక్కోవాల్సి వుంటుంది. మూడేళ్ళ తర్వాత ఆ డబ్బు ఆపేయ వలసివుంటుంది.

తమకి చెందిన బట్టలూ, కొంచెం ఇంటి సామాన్లతో ఇద్దరు అమ్మాయిలూ ఇల్లు వొదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వారికి ఇంకే విధమైన ధన సహాయం ఫ్రాన్సిస్ చేయటానికి వీల్లేదు. వాళ్ళల్లో ఎవరినీ వివాహమాడటానికి కూడా వీల్లేదు.

నేను నియమించిన షరతులలో వేటిని ఉల్లంఘించినా, నా అస్తంతా సాంఘిక సంక్షేమ సంస్థలకి చెందుతుంది. అటువంటి సంస్థల పట్టిక ఈ వీలునామాకి జత చేయబడి వుంది. నేనీ ఏర్పాటు పిల్లల మంచికోసమే చేసానని నమ్ముతున్నాను…”

హాలంతా నిశ్శబ్దం. జేన్ నిర్ఘాంతపోయి, మొహం ఎర్రబడి, కళ్ళల్లో నీళ్ళు నిండినా, వాటిని జారనీయకుండా నిబ్బరంగా, కఠినంగా కూర్చుంది. ఏలిస్ మొహం పాలిపోయి, మూర్ఛపోయింది. అందరికంటే సిగ్గుతో, అపరాధ భావనతో తడబడ్డాడు, ఫ్రాన్సిస్. అతి కష్టం మీద మాటలు కూడదీసుకొని,

“హొగార్త్ గారు విల్లు రాసినప్పడు ఆరోగ్యంగానే వున్నారు కదా?” అన్నాడు.

“చక్కగా వున్నారు! దాన్లో అనుమానం లేదు. ఏమంటారు డాక్టరు గారూ?”

లాయరు గారి ప్రశ్నకి డాక్టరు బైర్డ్ గారు అవునన్నట్టు తలాడించారు.

“ఈ వీలునామా దాదాపు ఆరు వారాల కింద రాయించారు. అప్పుడాయన ఆరోగ్యంగానే వున్నారు. ఇంత విచిత్రమైన వీలునామా రాసారెందుకో! పాపం లాయరు గారు కూడా వద్ద న్నారట. అయినా మీ మామయ్య ఎవరి మాటా వినిపించుకోరు. మీ ఇద్దర్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతూంది! ”

ఇంతలో ఏలిస్ కళ్ళు తిరిగి సోఫాలో ఒరిగిపోవటంతో, డాక్టరుగారూ, జేన్ ఆమెకి ఉపచారాలు చేయసాగారు.

లాయరు గారు ఫ్రాన్సిస్ వైపు తిరిగి ఉన్నట్టుండి ధనవంతుడైనందుకు అభినందనలు తెలిపాడు. ఫ్రాన్సిస్ కి ఆ పరిస్థితి దుర్భరంగా, అవమానంగా అనిపించసాగింది. ఏం మాట్లాడాలో తోచక ఊరికే హాల్లోని బొమ్మలనీ, కిటికీ బయట తోటనీ చూడసాగాడు. అతనికి ఆ ఇద్దరి అమ్మాయిలనీ తలచుకుంటే ఏదోలా వుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎటెళ్తారు? అసలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరా? తనిప్పుడేం చేయాలి? తనకంటే సంవత్సరానికి పన్నెండు పౌన్లతో గడుపుకోవటం అలవాటే. వాళ్ళిద్దరూ?

పెద్దమ్మాయి కాస్త ధైర్యస్థురాలిలానే వుంది కానీ, చిన్నమాయి పాపం నాజూకుగా, అమాయకంగా వుంది. వాళ్ళిద్దరికీ ఇప్పుడేం ఉద్యోగాలొస్తాయి?వాళ్ళనెవరు పెళ్ళాడతారు? వాళ్ళిద్దరూ పాపం పెళ్ళి పెటాకులూ లేక పెద్దైపోతుంటే తాను వాళ్ళ డబ్బంతా అనుభవిస్తూ సంతోషంగా వుండగలడా? మధ్యలో తనేం సహాయం చేయకూడదని షరతు విధించాడెందుకో ఆ పెద్దాయన!

ఫ్రాన్సిస్ మెల్లిగా లేచి ఏలిస్ పడుకున్న సోఫా దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. ఏలిస్ చేతుల్లో మొహం కప్పుకొని ఏడుస్తోంది. జేన్ అతని వంక నిర్వికారంగా చూసింది. ఫ్రాన్సిస్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు.

“నన్ను నమ్ము జేన్! ఈ వీలునామాతో నాకే ప్రమేయమూ లేదు. దాంతో సంతోషమూ లేదు. వీలైనంత త్వరగా నేను ఇదంతా మీ ఇద్దరి పాలు చేసే ఉపాయం ఆలోచిస్తాను.”

“వొద్దొద్దు! మావయ్య ఆశయాలనీ, ఆలోచనలనీ మన్నించడమే మనం చేయవలసింది. తప్పో ఒప్పో, ఆయన అభిప్రాయాలు ఆయనవి. చాల సార్లు ఇలాటివన్నీ ఆయన నాతో చర్చించేవారు. నాకూ ఆయన అభిప్రాయాలు సరిగ్గానే అనిపించేవి. ఇప్పుడు కూడా ఆయన సరిగ్గా ఆలోచించే ఈ పని చేసి వుంటాడు.”

“ఏం ఆలోచనలో, ఏం అభిప్రాయాలో! నాకైతే మీ ఇద్దర్నీ ఇలా కట్టుబట్టలతో ఇల్లొదిలి వెళ్ళమనడం అన్యాయంగా అనిపిస్తుంది. నా సంగతి వేరు.నేను మగవాణ్ణి, ఎక్కడున్నా సర్దుకోగలను. పైగా పేదరికం నాకలవాటే! మీరంటే పాపం, ఆడవాళ్ళు….”

“భలే వారే! ఆడవాళ్ళు ‘పాపం’ ఆడవాళ్ళెందుకయ్యారు? పేదరికానికీ, కష్టాలకీ మీరు అలవాటు పడగలిగితే మేం అలవాటు పడలేమనా మీ ఉద్దేశ్యం?” కఠినంగా అంది జేన్.

“మావయ్య మమ్మల్నేమీ అన్యాయం చేయలేదు.  మా అమ్మ పోగానే, ఎందుకుపనికిరాని మా నాన్న నుంచి మమ్మల్ని విడిపించి ఈ యింటికి తీసుకొచ్చాడు. ఆడవాళ్ళు తలచుకుంటే ఏ పనైనా మగవాళ్ళకి తీసిపోకుండా చేయగలరని ఆయన నమ్మకం. నేనాయాన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను.  అందులోనూ ఇదంతా మావయ్య స్వార్జితం. తన ఇష్టం వచ్చిన వారికిచ్చే హక్కు ఆయనకుంది.”

ఉన్నట్టుండి ఏలిస్ వెక్కిళ్ళు వినిపించడంతో మాటలాపి వెనుదిరిగింది జేన్.

“ఎంత పని చేసావు మావయ్యా? నీకు మనసెలా వొప్పిందసలు? ఇప్పుడు మేమేం చెయ్యాలి?”

ఏలిస్ దుఃఖాన్ని చూడటంతో జేన్ ధైర్యం కొంచెం సడలింది. కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.

“ఎల్సీ! నువ్వలా ఏడవొద్దు. నేనేదో చేస్తాగా? అంత భయపడితే ఎలా చెప్పు?”

“ఇప్పుడు మనం మీ సమీప భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆర్మిస్టవున్ గారికి, అదే, హొగార్త్ గారికి మీరీ ఇంట్లో ఇంకొక నెల రోజులుంటే ఏమీ అభ్యంతరం వుండకపోవచ్చు. నెలలోగా మీరు ఉద్యోగమూ, ఇల్లూ వెతుక్కోవచ్చూ. ఏమంటారు ఫ్రాన్సిస్?”  లాయరుగారు ఫ్రాన్సిస్ వైపు చూస్తూ అడిగారు.

“అయ్యొయ్యో! దానిదేముందండి. ఇంత పెద్ద ఇల్లు. నెల రోజులే ఏమిటి, ఎన్ని రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు.”

“పూర్తిగా ఇక్కడ వుండడానికి వీల్లేదనుకో! నెల రోజులు వుండడంలో చిక్కేమీ వుండదనుకుంటాను.” లాయరు తీర్మానించారు.

“నేను ఈ లోగా మా వూరు వెళ్ళి నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొస్తాను. ముందుగా నా బదులు బాంకిలో పని చేయటానికి ఎవరినైనా చూడాలి. ”

“ఫ్రాన్సిస్! మీరు మాకు ధన సహాయం చేయడానికి వీల్లేదు. కానీ, సలహాలు ఇవ్వచ్చేమో! మీరిప్పుడు ఎడిన్ బరో వెళ్తున్నారు కదా! అక్కడ మాకు పనికొచ్చే ఉద్యోగాలుంటే చూసి చెప్పగలరా?” జేన్ అడిగింది.

“తప్పకుండా! ఇంతకీ మీరు ఎలాటి వృత్తి కావాలనుకుంటున్నారు? ”

“ఏదో ఒకటి! మా ఇద్దరికీ ఇంత తిండి పెట్టేదైతే చాలు.”

“అయితే ఏదైనా కుటుంబాల్లో గవర్నెస్ ఉద్యోగాలున్నాయేమో చూస్తాను.”

“చూడండి! అయితే ఆడపిల్లలకి ఎలాటి చదువు చెప్పాలో నాకంతగా తెలియదు. మగపిల్లలకైతే చక్కగా చెప్పగలను. అక్కవుంటింగూ, జామెట్రీ, లెక్కలూ, కెమిస్ట్రీ, వ్యాకరణమూ, అన్నీ తెలుసు నాకు. అన్నిటికంటే మావయ్య నా అక్కవుంటింగుని బాగా మెచ్చుకునేవాడు. అక్కవుంటింగంటే గుర్తొచ్చింది! మీ ఉద్యోగం ఎలా మొదలైంది?”

“నేను బాంకులో గుమాస్తా గా పదహారేళ్ళప్పుడు చేరాను. అప్పుడు నాకు యేడాదికి ముఫ్ఫై పౌన్లొచ్చేవి. దానికి తోడు హొగార్త్ గారిచ్చే పన్నెండు పౌండ్లు!”

“యేడాదికి ముఫ్ఫై రెండు పౌండ్లు! సరిపోతుందా?”

“సరిపోవడానికేముంది లెండి. ఎలాగో సరిపుచ్చుకోవాలి. అయితే అలా మూడేళ్ళే ఇబ్బంది పడ్డాను. పని చేస్తూ చదువు పూర్తి చేసాను. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం మొదలైంది. ఇప్పుడు నాకు యేడాదికి దాదాపు మూడొందల పౌండ్లొస్తాయి. అదే బాంకు లో పదిహేడేళ్ళుగా పనిచేస్తున్నా కదా? ”

“మొదట్లో యేడాదికి ముప్పై పౌండ్లు. పదిహేడేళ్ళు గడిచేసరికి యేడాదికి మూడొందలు. అచ్చంగా మావే! ఎవరి దయా ధర్మాల మీదా ఆధారపడకుండా! ఎంత బాగుంటుంది! నాకేం భయం లేదు. ఎల్సీ కొంచెం ధైర్యంగా వుంటే బాగుండు.”

“పదిహేడేళ్ళా! అంతలో మనం చచ్చే పోతాం!” మళ్ళీ ఎల్సి బావురుమంది.

“ఎల్సీ! నేనున్నాకదా!”

“తిండికే లేక మల మల మాడి పొతామో యేమో!”

“ఏదో ఒకటి చేస్తా కదా! సరే ఫ్రాన్సిస్! నీకే ఉద్యోగం గురించి తెలిసినా నాకు చెప్పు!”

మెల్లిగా ఒకరొకరూ సెలవు పుచ్చుకున్నారు. హాలంతా ఖాళీ అయింది.

***

 

(సశేషం)