వీలునామా – 37 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

కోట లో పాగా

తాననుకున్నట్టే మిసెస్పెక్ అడిలైడ్ వదిలి  మెల్బోర్న్ చేరుకుంది.

సముద్రప్రయాణంలో మూడురోజులుఅలిసిపోయినా, ఉత్సాహంగాకూతురి చిరునామా వెతికిపట్టుకుంది. ఏమాత్రం ఆలస్యంచేయకుండాఉన్నంతలోశుభ్రమైనబట్టలువేసుకుని కూతురిఇల్లుచేరుకుంది.

తలుపుతెరిచినపనమ్మాయితోతనపేరుమిసెస్మహోనీఅనీ, ఒక్కసారిఅమ్మగారితోమాట్లాడాల్సినఅవసరంవుందనీప్రాధేయపడింది. ఆఅమ్మాయిఅనుమానంగాచూస్తూమిసెస్పెక్నిలోపలికితీసికెళ్ళింది. అదృష్టవశాత్తూలిల్లీఫిలిప్స్ముందుగదిలోవొంటరిగాకూర్చొనుంది. చంటిపాపఆయాదగ్గరుంటే, ఎల్సీఇంకేదోపనిలోలోపలేవుంది.

లోపలికెళ్తూనేమిసెస్పెక్, కూతురిదగ్గరికెళ్ళిఆమెచేయిగట్టిగాపట్టుకుని,

“బెట్టీ! అమ్మా! నేనే, మీఅమ్మని. నన్నేమర్చిపోయావా?” అందిపనమ్మాయికివినబడకుండామెల్లిగామాట్లాడుతూ.

లిల్లీనివ్వెరపోయింది. పాలిపోయినమొహంతోలేచినిలబడింది. ఆమెగొంతులోంచిరాబోతున్నకేకనిపసిగట్టిమిసెస్పెక్,

“హుష్! బెట్టీ! అరవకు. ఊరికేనిన్నొకసారిచూసిపోదామనివచ్చా, ఎన్నాళ్ళయిందేనిన్నుచూసి! నిన్నుచూడాలనిప్రాణంకొట్టుకుపోయిందనుకో! అందుకేఎలాగోప్రయత్నంచేసినీమొగుడుఇంట్లోలేడనితెలుసుకునిమరీవొచ్చా! ఎంతమారిపోయావేనువ్వు!” కూతురినిపరిశీలనగాచూస్తూఅందిమిసెస్పెక్.

“అబ్బో! వేళ్ళకిఉంగరాలు, మెళ్ళోగొలుసులు, పెద్దఇల్లూ, నౌకర్లూచౌకర్లూ, దర్జా! అయినానిన్నుకన్నతల్లినీ, అందలంఎక్కించినఅమ్మనిమాత్రంమర్చిపోయావు. అవున్లే, నేనుచస్తేనీకేం, బ్రతికితేనీకేం! నీపెళ్ళయినీదార్ననువ్వెళ్ళిపోయాకానేనుపడ్డకష్టాలుఆపగవాడిక్కూడావద్దేతల్లీ! పోన్లేమ్మా, నువ్వైనాసుఖంగావున్నావు, అంతేచాలు,” కన్నీళ్ళుతుడుచుకుంటూ, ముక్కుచీదుకుందిమిసెస్పెక్.

తల్లీకూతుళ్ళకిపెద్దపోలికలులేకపోయినా, లిల్లీనిచూసిమిసెస్పెక్నిచూస్తే, ఆవిడాఒకవయసులోఅందంగావుండివుండేదేమోఅనిపించొచ్చు. భర్త గారాబమూ, నీడపట్టునజీవితమూ, మంచితిండీవుండడంచేతలిల్లీఆరోగ్యంగాఅనిపిస్తే, మిసెస్పెక్బ్రతుకులోదెబ్బలుతినిమొరటుమనిషిఅయింది. బ్రతుకుభయంలేనిలిల్లీమొహంనిర్మలంగాఅమాయకంగాఅనిపిస్తే, జన్మంతారకరకాలపోరాటాలుచేస్తున్నమిసెస్పెక్మొహంతోడేలుమొహంలాగుంది. లిల్లీకిఇంకాతల్లినిచూస్తేభయంగానేవుంది.

 

“అమ్మా! నువ్వెందుకొచ్చావిక్కడికి? స్టాన్లీకితెలిస్తేనన్నుచంపేస్తాడు!”

“ఇదిమరీబాగుందేవ్! కన్నబిడ్డనికళ్ళారాచూసుకోవడానిక్కూడాపనికిరానన్నమాట! నువ్వుమరీఇంతమారిపోతావనుకోలేదు.”

“అదిసరేకాని, స్టాన్లీ నువ్వుఅడిలైడ్లోవున్నావన్నాడే! ఇక్కడికెప్పుడొచ్చావ్? వస్తేవచ్చావుకానీ, వెంటనేవెళ్ళిపో! అక్కడే వుంటేస్టాన్లీనీఖర్చులకిడబ్బిస్తానన్నాడు!”

“అవున్లే, కన్నకూతురిక్కూడాకనికరంరానిజన్మనాది. నిన్నుచూడడానికిపడరానిపాట్లుపడివస్తేవెళ్ళిపొమ్మంటావేమిటే? అయినాభలేమంచిమొగుడుదొరికాడ్లే, అంతభయమేమిటివాణ్ణిచూస్తే”” కూతురిచేతులమీదముద్దులుపెట్టుకుందిమిసెస్పెక్.

“అయినాఆయనఇప్పట్లోరాడటకదా? కొద్దిరోజులుఊరికేవచ్చినిన్నుచూసిపోతూవుంటాను. ఎక్కడైనానన్నుచూసాడనుకో, నేనుఏదోపనిమనిషిననిచెప్పేయ్! నిన్నూపిల్లాణ్ణీచూసివెళ్తానే!”

నిజానికిలిల్లీఅమాయకురాలు. తల్లిచెప్పినంతతేలిగ్గాఅబధాలూకట్టుకథలూచెప్పలేదు.

“నీలానేనబధ్ధాలుఆడలేనమ్మా! స్టాన్లీతోదెబ్బలాడడంనాకిష్టంకూడవుండదు. పెళ్ళాడే ముందే నిర్మొహమాటంగా చెప్పాడు, నిన్ను మా ఇంటి గడప తొక్కనీయొద్దని. ఈ ఒక్క విషయంలో మొండి పట్టుదల తప్పించి స్టాన్లీ ఎంతో మంచివాడు. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అతనికి కోపం తెప్పించడం నాకిష్టం వుండదమ్మా! అర్థం చేసుకొని వెళ్ళిపో!” తల్లిని ప్రాధేయపడింది.

మిసెస్పెక్వున్నట్టుండిపెద్దగావెక్కిళ్ళుపెడుతూఏడవసాగింది. ఆగొడవకిపక్కగదిలోబట్టలుకుడుతూన్నఎల్సీపరుగునవచ్చింది. ఎల్సీనిచూడగానేమిసెస్పెక్, మాటమార్చింది.

“అమ్మా, లిల్లీగారూ, మీకుజన్మంతాఋణపడివుంటానమ్మా. ఏదోనాకూతురితోచిన్నప్పుడుఆడుకున్నమాటమర్చిపోకుండా, నన్నుఆదుకునేందుకుఒప్పుకున్నారు. అంతకంటేనాకింకేమీవొద్దు. మీరిచ్చేకొంచెండబ్బుతోఏదోఒకచిన్నవ్యాపారంపెట్టుకునినిలదొక్కుకుంటానమ్మా! మీదయఎన్నటికీమర్చిపోను,” వంకరగానవ్వుతూ, పైకిఏడుస్తూ, ఎల్సీవంకఓరకంటాచూస్తూకూతుర్నిఇరకాటంలోపెట్టింది. ఆమెనివొదిలించుకోకతప్పదనిలిల్లీతనడబ్బాలోడబ్బుకోసంవెదకసాగింది. ఆసమయంలోఎల్సీనిపరిశీలనగాచూసిందిమిసెస్పెక్. బహుశాఈఅమ్మాయేతానువిన్నఎల్సీమెల్విల్అయివుండొచ్చన్నఊహాఆమెమనసులోమెదలకపోలేదు.

“ఈఅమ్మాయెవరూ? పనమ్మాయా?” ఆరాగాఅడిగింది. అవునన్నట్టుతలూపిందిలిల్లీ.

“ఇదిగోఅమ్మాయ్! అమ్మగారికిఆరోగ్యంబాగోనట్టుంది. వెళ్ళికొంచెంవేడిగాతాగడానికేదైనాతెచ్చిపెట్టు!”

ఆమెగొంతులోవినవస్తున్నఅధికారానికిఆశ్చర్యపోయిందిఎల్సీ. ఏంమాట్లాడకుండాఆమెఅడిగిందిచ్చి మళ్ళీతనపనిలోపడింది. అయినాఆకొత్తమనిషీ, ఆమెఅమ్మగారితోచూపిస్తున్నచనువూ, అమ్మగారుడబ్బులకోసంవెదుకులాటాఎందుకోఎల్సీకిఅంతావింతగాఅనిపించింది. లిల్లీకిఅసలుడబ్బులతోపనేవుండదు. ఆమెఅవసరాలన్నీస్టాన్లీయేతీరుస్తాడు. ఇపుడీమెకిడబ్బివ్వడందేనికోఅనుకుంది.

“ లిల్లీ! ఏదోఇక్కడున్నకొద్దిరోజులూఅప్పుడప్పుడూనిన్నుచూడడానికివస్తూంటాను,” ఎల్సీలోపలికెళ్ళగానేమళ్ళీగుసగుసలాడిందిమిసెస్పెక్.

“నువ్వుమళ్ళీరానక్కర్లేదు. ఇదిగో, నాదగ్గరున్నడబ్బంతాఇచ్చేస్తున్నా. ఇదితీసుకొనిమళ్ళీనాకుకనపడకు, నీకుపుణ్యముంటుంది!”

“ఈడబ్బునాప్రయాణానికిసరిపోదమ్మాయ్! నాదగ్గరున్నదంతావూడ్చిఈవూరొచ్చాను. మరీఅంతభయపడతావేంనన్నుచూసి? అదిసరేకానీ, ఇందాకవొచ్చినమ్మాయెవరూ?”

“ఎల్సీఅని, నాక్కావాల్సినబట్టలవీకుట్టిపెడుతుంది. స్టాన్లీఆమెనిపన్లోపెట్టాడు. ఆమెఅన్నా, వాళ్ళఅక్కఅన్నాస్టాన్లీకెంతోఇష్టం.”

“మగవాళ్ళకిష్టమైనపనిమనిషినితరిమికొట్టకఇంట్లోవుంచుకున్నావా? ఎంతపిచ్చిమాలోకానివే!”

“అమ్మా! నీకుస్టాన్లీగురించసలేమీతెలియదు. అనవసరంగానోరుపారేసుకోకు. ఎల్సీకూడామంచిపిల్ల, అమాయకురాలు.” కోపంగాఅన్నదిలిల్లీ.

“ఆఅమ్మాయికిబట్టలుకుట్టడంవచ్చంటున్నావుకాబట్టినాకుతెల్సినవాళ్ళదగ్గర…”

“ఆఅమ్మాయినినువ్వుచూపించినపన్లోకిపంపాననితెలుస్తేస్టాన్లీమనమీదవిరుచుకుపడతాడు. వొదిలేయ్!”

“సరేలే, నీసంగతినాకెందుక్కానీ, మగవాళ్ళప్రేమలునమ్మడానికివీల్లేదు. ఆవొక్కవిషయంమాత్రంగుర్తుంచుకో. నాదగ్గరచిల్లికానీకూడాలేదేబెట్టీ! ఊరికేఅప్పుడప్పుడూవచ్చినీదగ్గరకాసేపుకూర్చొనివెళ్ళిపోతా. నోరెత్తితేఅప్పుడడుగు! ఇంకోపనిమనిషినిపెట్టుకున్నాననిచెప్పుఅందరితో. మాట్లాడకుండఒకమూలకూర్చొనినీకుస్వెట్టర్లుఅల్లిపెడతాను. ఇంతడబ్బున్నదానివి, కన్నతల్లికికాస్తసాయపడలేవటే?”

కొంచెంమెత్తబడిందిలిల్లీ!

“స్టాన్లీకితెలిస్తేమండిపడతాడనేనాభయమంతా…”

“దానికీనాదగ్గరఉపాయంవుందిగా? స్టాన్లీవచ్చేయగానేఈపనమ్మాయితోనాకెలాగోవార్తపంపించు. ఈచాయలక్కూడారాను!”

నిజానికిలిల్లీకితల్లిఅంటేమహాచెడ్డచిరాకు. పైగాతననెంతోప్రేమించినమ్మినస్టాన్లీమాటమీరడమంటేజంకుకూడా. ఆమెఆలోచించుకొనేలోపేమిసెస్పెక్మళ్ళీవెక్కిళ్ళుపెట్టిఏడవసాగింది. సరేననకతప్పలేదామెకు.

మళ్ళీమర్నాడువస్తాననిచెప్పిబయల్దేరిందిమిసెస్పెక్.

***

(సశేషం)

 

వీలునామా – 35, 36 భాగాలు

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ప్రేమ విజయం

హేరియట్ వస్తూ వస్తూనే, ఆస్ట్రేలియాని, వలస వచ్చిన వాళ్ళనీ, నగరాలనీ విమర్శించి పారేసింది. నిజానికి తను ఇంకో పదేళ్ళు ముందొచ్చినట్టయితే ఇంకా ఎక్కువ తిట్టిపోయడానికి వీలుగా వుండేది. స్టాన్లీ, బ్రాండన్ ఇద్దరూ మెల్బోర్న్ ని అందాల నగరమని పిలవడం ఆమెకి హాస్యాస్పదంగా తోచింది. వాళ్ళిద్దరు మాత్రం మెల్బోర్న్ నగరం ఎంత అభివృధ్ధి చెందిందో, కట్టడాలెంత త్వరగా పూర్తవుతున్నాయో, డబ్బెంత హాయిగా సంపాదించుకోవచ్చో చెప్పి చెప్పీ ఆమెని విసిగించారు.

అయినా ఆమెకి మెల్బోర్న్ కానీ, విక్టోరియా రాష్ట్రం కానీ ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే కారణం కూడా ఆమె చెప్పలేదు. ఇళ్ళూ వాకిళ్ళూ, డబ్బూ, దస్కమూ నాగరికతా, నాజూకూ అన్నీ బానే వున్నా, ఇంగ్లాండు లా లేదుగా అన్నదామె.ఆమె విక్టోరియాకి రావడానికి కారణం కేవలం కుతూహలం. ఎలాగూ ఇంగ్లండుతో పోలిస్తే వేరే రకంగా వుంటుందన్న విషయం ఆమె ఊహించిందే. అయితే అన్ని రకాలుగా ఇంగ్లండు ముందు తీసికట్టుగా వుందన్నది ఆమె ఉవాచ. అన్నిటికంటే ముఖ్యంగా వేడీ దుమ్మూ! ఆ వేడికి ఆమె తెచ్చుకున్న దుస్తులన్నీ వేసుకోవడం కుదరలేదు. కానీ, ఇంగ్లీషు సమాజం తమ దుస్తుల మీదా నాగరికత మీదా వుధించిన నియమాలను ఉల్లంఘించడానికీ లేదు. పాపం, ఈ రెండిటి మధ్యా నలిగిపోయి ఆమెకి విక్టోరియా అంటే మహా చికాకు పట్టుకుంది. అంత ఎర్రటి ఎండల్లోనూ అచ్చమైన బ్రిటిష్ పౌరుడిలా డాక్టర్ గ్రాంట్ నల్లటి సూటూ, నల్లటి హేటూ ధరించడం ఆమెకి కొంత ఉపశమనం.

“మా డెర్బీషైర్ లో వున్న శాంతీ తీరుబడీ లేదు, పోనీ లండన్ లో వున్న చైతన్యమూ నాగరికతా లేవు. ఈ మెల్బోర్న్ నగరాన్ని చూసా మీరంతా ఇంత మురిసిపోయేది,” అని ఆమె బ్రాండన్ ని వేళాకోళం చేసింది. కానీ, బ్రాండన్, స్టాన్లీ మెల్బోర్న్ నగరం పూరి గుడిసెలతో వున్న పల్లెటూరి స్థాయి నుంచి, డబ్బూ వెలుతురూ నింపుకున్న వీధుల నగరం వరకూ ఎదగడం కళ్ళారా చూసి వున్నారు. ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యమూ వుంది.వారికి ఆ నగరం బ్రతక నేర్చిన తనమూ, సాహసమూ నేర్పింది. అందుకేవాళ్ళిద్దరూ ఈ కొత్త మనిషికి మా నగరం నచ్చకపోవడమేమిటి అని గింజుకున్నారు.

లిల్లీ ఫిలిప్స్ కి మెల్బోర్న్ లో పరిచయస్తులూ స్నేహితులూ లేరనే చెప్పొచ్చు. కానీ డాక్టరు గ్రాంట్ కీ, స్టాన్లీకి చాలా మందే సన్నిహితులున్నారు. చెల్లెలికోసం స్టాన్లీ చాలామందిని తమ ఇంట్లో విందులకి ఆహ్వానించాడు. కానీవాళ్ళంతా హేరియట్ కళ్ళకి మొరటుగా అనాగరికంగా అనిపించారు. అయినా వాళ్ళతో ఆమె చనువుగానే మసిలింది.తన చదువూ, తెలివితేటలూ, సంభాషణా చాతుర్యమూ అన్నీ కలిసి అక్కడివాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెస్తాయనీ, తన నోటి వెంట వచ్చే ప్రతీ మాటకీ ఆ అనాగరికులంతా పరవశించిపోతారనీ ఊహించుకుందామె. కానీ, పాపం, తన అభిప్రాయాలనెవరూ పట్టించుకోరనీ, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ బ్రతుకు గురించీ తను చేసే గంభీరమైన వ్యాఖ్యల్ని మర్యాదకోసం చిరునవ్వుతో వింటారే కానీ, ఒక్కటికూడా వినిపించుకోరనీ అర్థమైనప్పుడు కోపమూ, ఉక్రోషమూ పట్టలేకపోయింది.అసలు ఆడా మగా అంత పూసుకొని తిరగడమే ఆమెకి కంపరంగా వుంది. తమ ఇంగ్లండులో స్త్రీ పురుషులు ఒకరినొకరు కళ్ళతో, చిరునవ్వులతో పలకరించుకుంటారు కనీ, ఈ వికవికలూ పకపకలూ ఎరగరు! కానీ ఈ విషయం గురించి ఆమె ఏదైనా వ్యాఖ్యానించి నట్టయితే అందరూ ఆమెని “మీరూ డాక్టరు గారితో చనువుగానే వుంటున్నారు కదా?” అని ఎదురు ప్రశ్నిస్తారన్న భయంతో నోరు మెదపలేదు.

డాక్టరు గ్రాంట్ తో హేరియట్ నవ్వులూ ఎడతెగని కబుర్లూ నిజంగానే ఎవరి దృష్టినీ దాటిపోలేదు. ఇంకొద్ది రోజుల్లో ఆయన మెల్బోర్న్ వదిలి తన వూరు బెన్ మోర్ వెళ్తాడనుకుంటే ఆమెకి దిగులు ముంచుకొస్తుంది.

“మిమ్మల్నొదిలి వెళ్ళడం నాకూ కష్టంగానే వుంది మిస్ హేరియట్. కానీ, బ్రాండన్ లా నేను పని ఎగ్గొట్టి ఊళ్ళు తిరగలేనుగా! ఊరికి వెళ్ళి నా పని చూసుకోవాలి. మీరు విరివాల్టా ఎస్టేటుకి త్వరగా వచ్చేస్తారుగా? అది మా వూరికి చాలా దగ్గర. మనం మళ్ళీ ఇప్పట్లాగే కలుసుకోవచ్చు.” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“తొందరగానే వచ్చేస్తాను. నిజానికి మా వదిన ఆరోగ్యం కుదుటపడింది కూడా. డబ్బంతా దండగ చేస్తూ ఆవిడ ఇంకా ఈ మెల్బోర్న్ లో ఎందుకుందో నాకైతే అర్థం కాదు!” హేరియట్ అన్నది.

“అవునవును! ఇహ ఆమె ఆరోగ్యానికేం ఢోకా లేదు.”

“నాకూ విరివాల్టా చూడాలని చాలా అతృతతగా వుంది. పిల్లల వుత్తరాల నిండా ఎస్టేటు కబుర్లే. టీచరు జేన్ కి కూడా చాలా నచ్చిందట. మీరు టీచరు గారిని చూసారా? మీలాగే ఆవిడా స్కాట్ లాండ్ సంతతి.”

“ ఆ టీచరు గారు మన పనమ్మాయి ఎల్సీ వాళ్ళ అక్కట కదా? ఈవిడ లాగే ఈసురోమని వుంటుంది కాబోలు!”

“అయ్యో అలాగంటారే! మా అన్నయ్యకి ఎల్సీ అంటే ఎంతిష్టమో తెలుసా? నావరకు నాకు జేన్ ఎక్కువగా నచ్చుతుంది. చూడడానికి మామూలుగా వున్నా మహా తెలివైంది. విరివాల్టాలో ఆమెని చూడగానే మీరు ప్రేమలో పడిపోతారేమో, జాగ్రత్త!” వేళాకోళంగా అంది హేరియట్.

“ఆ ప్రమాదమేం లేదులే. నాకు మరీ పుస్తకాల పురుగుల్లా వుండే ఆడవాళ్ళంటే చిరాకు. స్త్రీలు చదువుకోవల్సిందే, కానీ తాము ఆడవాళ్ళమన్న మాటే మరిచిపోయేంత చదువేం వొద్దు. అదలా వుంచండి. హేరియట్!మీకు విరివాల్టా వెళ్ళాలని వుంటే మీ వొదినగారు రాకపోయినా, నేను తీసుకెళ్తాను,” సాహసంగా అన్నాడు గ్రాంట్.

“వెళ్ళొచ్చనుకోండి, కానీ అన్నయ్య ఏమంటాడో!” నసిగింది హేరియట్.

“స్టాన్లీ తో నే చెప్తాగా. ఇక్కడ లిల్లీగారు బాగా కోలుకున్నారనీ, ఇక్కడ వున్న మన గుర్రాలు అర్జంటుగా ఎస్టేటు చేర్చాలనీ, అందువల్ల మనిద్దరమూ కలిసి గుర్రాలు తిసుకొస్తామనీ చెప్తాను.”

“నాక్కూడా మెల్బోర్న్ అంటే విసుగు పుడుతోంది. ఇహ ఇక్కడ చూడ్డానికింకా ఏమీ లేదు. విరివాల్టా వెళ్ళిపోతే అక్కడికి వదిన వచ్చేలోపు ఇల్లంతా ఆవిడకొరకు చక్కబెట్టొచ్చు. పైగా, జేన్ టీచరుకు లెక్కలూ, సైన్సూ లాటివే తప్ప సంగీతం బొత్తిగా రాదు. నేనుంటే పిల్లల సంగీతం పాఠాలు మళ్ళీ మొదలుపెట్టొచ్చు. నేను విరివాల్టా వొచ్చేస్తానంటే అన్నయ్య తప్పక ఒప్పుకుంటాడు!” హేరియట్ సాలోచనగా అంది.

“ఏమిటీ? జేన్ టీచరుకి సంగీతం రాదా? మరి ఆవిడని పిల్లలకి టీచరుగా ఎందుకు పెట్టారు?”

“అయినా ఆవిడ చాలా తెలివైంది. ఆవిడ రాక ముందు మా అన్నయ్య పిల్లలు దేభ్యాల్లాగుండేవారు. చెట్లూ గుట్టలూ ఎక్కి తిరుగుతూ మహా పోకిరీల్లాగుండేవారు. ఆవిడ కాస్త క్రమశిక్షణతో వాళ్ళని దార్లోకి తెచ్చింది. ఆవిడ బ్రిటిష్ యువతి కాదు, అదొక్కటే నాకు ఆవిడలో కనపడే లోపం,” నవ్వుతూ అంది హేరియట్.

“స్కాట్ లాండ్ వాళ్ళని మరీ అంత తీసిపడెయ్యొద్దు! నేనూ స్కాట్ లాండ్ వాణ్ణేగా? అది సరే, మరయితే మన ప్రయాణం ఖాయమేనా?”

“గుర్రాల మీద వెళ్తే ఎన్ని రోజులు పట్టొచ్చంటారు?”

“రెండురోజులు.మధ్య దారిలో మా మిత్రుడి హోటలుంది. ఒక రోజు రాత్రి అక్కడ బస చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పల్లెటూళ్ళల్లో ఎలాటి ఆతిథ్యం దొరుకుతుందో చూపిస్తాను. అందులోనూ, వాళ్ళూ నాలాగే స్కాట్ లాండ్ కి చెందిన వారు! ఆ ప్రదేశం కూడా చాలా అందంగా వుంటుంది,” ఊరిస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“సరే, అదీ చూద్దాం మరయితే. అయితే నేనొక్కమాట వదినని కూడా అడిగి చెప్తా, సరేనా?”

*******

 

ఆ రోజు లిల్లీ ఎప్పటికంటే చిరాగ్గా వుంది. మరదలు పిల్లల సంగీతమూ అదీ ఇదీ అని చెప్పిన ఒక్క మాటా నమ్మలేదు గానీ, మెల్బోర్న్ వెళ్ళడానికి తనకేమీ అభ్యంతరం లేదంది. నిజానికి ఆ అమ్మాయి అన్నగారి ఇంట్లో పేరుకు మాత్రమే వుంది. ఎన్నడూ వదిన గారితో ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. ఒంటరిగా డాక్టరుతో పంపితే భర్త ఏమంటాడో నన్న భయం కొంచెం ఏ మూలో కలవరపెట్టినా పెద్దగా పట్టించుకోలేదు. అందరు స్త్రీలకీ సత్ప్రవర్తన గురించి ఉపన్యాసాలిచ్చే హేరియట్ ఒంటరిగా డాక్టరుతో కలిసి రెండు రోజులు ప్రయాణం చేయబోతుందని తెలిసినప్పుడు ఎల్సీ మాత్రం ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యాన్ని హేరియట్ కనిపెట్టింది కూడా.

“ఇలాటి ప్రయాణం ఇంగ్లండులో అయితే నేను చచ్చినా తలపెట్టి ఉండేదాన్ని కాదు. కానీ, ఇక్కడ ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. అలాటప్పుడు నేను నా పధ్ధతులకోసం నిన్నిబ్బంది ఎలా పెడతాను వొదినా? ఎలాగూ నువ్వు కొద్దిరోజుల్లో అక్కడికే వొస్తున్నావాయె. కొంచెం ముందుగా వెళ్ళి ఇల్లదీ నీకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలనే నా తాపత్రయమంతా! పైగా ఇలా వెళితే కాస్త పల్లెటూళ్ళనీ చూసినట్టుంటుందన్న కుతూహలం ఒకటి. పోనీ నువ్వూ మాతో రాకూడదూ? ఇప్పుడు నువ్వు తేలిగ్గా ప్రయాణం చేయొచ్చని డాక్తరుగారు చెప్పారు.”

“నేను చచ్చినా ఒంటరిగా ప్రయాణాలు చేయను. మీ అన్నయ్య ఇక్కడికొచ్చి నన్ను తిసుకొస్తాడు లే. నువ్వు ఒంటరిగానే వెళ్ళు.” నిర్మొహమాటంగా అంది లిల్లీ.

“మరి ఇక్కడ నువ్వు ఒంటరిగా, అన్నయ్య కోప్పడతాడేమో!”

“అబ్బ! ఇక్కడ ఎల్సీ, ఇంకొక నర్సూ కూడా వున్నారుగా. వాళ్ళు చూసుకుంటార్లే. నువ్వు వెళ్ళి వీలైనంత త్వరగా మీ అన్నని పంపించు.”

హమ్మయ్య, అని నిట్టూర్చి ప్రయాణమైంది హేరియట్.

మధ్యలో ఒకరోజు ఆగి, రెండో రోజు సాయంత్రానికి విరివాల్టా ఎస్టేటు చేరుకున్నారు వాళ్ళు. ఆమెని ఎస్టేటు దగ్గర దిగబెట్టి తానింకో రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ గ్రాంట్.

ఇంటికెళ్ళేసరికి స్టాన్లీ లేడు. ఏదో పనిమీద బయటికెళ్ళాడు. జేన్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయినా ఏమి అనలేదు.

ఆ మర్నాడంతా హేరియట్ అన్యమనస్కంగానే గడిపించి. అన్నగారిల్లూ, ఎస్టేటులో పెంచుతున్న జంతువులూ, పిల్లల ఆటలూ, ఇంట్లో పనివాళ్ళూ, ఆమెకి పెద్ద సంతోషాన్నివ్వడంలేదు. కాలం గడవనట్టనిపిస్తూంది. ఆమెకి మళ్ళీ డాక్టర్ గ్రాంట్ వచ్చి కబుర్లు చెప్తే బాగుండనిపించింది. ఆమె ఆశపడ్డట్టే గ్రాంట్ మళ్ళీ వచ్చి ఆమెని కబుర్లలో ముంచెత్తాడు. మళ్ళీ హేరియట్ కి కాలం సరదాగా గడవసాగింది.

**********

వాళ్ళిద్దరూ అలాగే సరదా కబుర్లలో మునిగివున్న ఒకరోజు అకస్మాత్తుగా మేనల్లుడు ఎడ్గర్ ని వెంటబెట్టుకొని బ్రాండన్ విరివాల్టాకొచ్చాడు. అతన్ని చూసి ఒక్క క్షణం తడబడింది హేరియట్. అంతలోనే తేరుకొంది.

“ఎంత ఆశ్చర్యం! బ్రాండన్ దొరగారొచ్చారే! బహుకాల దర్శనం. బాగున్నారా? ఇన్ని రోజులూ ఎక్కడికి మాయమయ్యారు?” అంది వేళాకోళంగా.

“చాలా చోట్లే తిరిగాలెండి పన్ల మీద! అందుకే కనబడలేదు.” ఆమె వేళాకోళానికి చిరాకు పడ్డాడు బ్రాండన్.

“పన్లా? ఏం పన్లబ్బా అవి? గొర్రెలని తరుముతూ ఆస్ట్రేలియా అంతా పరుగులు తీస్తున్నారని విన్నానే!”

“అవునవును. సరిగ్గా గొర్రెల వెనకే తిరిగాను. అది సరే కానీ, మీ అన్నయ్యా వదిన లేరి?”

ఎమిలీ కల్పించుకుంది. “అమ్మ మెల్బోర్న్ లోనే వుంది బ్రాండన్. నాకు ఇంకో బుల్లి తమ్ముడు పుట్టాడు తెల్సా? నాన్న శనివారం వచ్చేస్తాడు. నిన్నూ, ఎడ్గర్ నీ చూసి చాలా సంతోషపడతాడు. మిమ్మల్నిద్దరినీ చాలా తలచుకుంటున్నాడు.”

“జేన్!మీ చెల్లాయి ఎల్సీ ఏది? తనూ ఇక్కడికొచ్చిందా లేకపోతే ఇంగ్లండులోనే వుండిపోయిందా? తనెలా వుంది?” జేన్ వైపు తిరిగి సంకోచంగా అడిగాడు బ్రాండన్.

“బాగుండకేం చేస్తుంది? అక్కడ మెల్బోర్న్ లో మా వదిన దగ్గరే వుంది. రెండు మూడు వారాల్లో వాళ్ళూ ఇక్కడికొస్తారు,” హేరియట్ అసహనంగా అంది.

“నీ అరోగ్యం బాగు పడిందా ఎమిలీ?”అభిమానంగా అడిగాడు బ్రాండన్. వాళ్ళందరూ భయంకరంగా జబ్బు పడ్డసంగతి తెలుసతనికి.

“ఓ! రోజూ జేన్ టీచర్ నన్ను ఎస్టేటంతా నడిపిస్తూందిగా? దాంతో బోలెడంత శక్తి వచ్చేసింది. మేమింకా మా బుక్కి తమ్ముణ్ణి చూడనేలేదు.”

“అవునుగాని, మీరెవరూ నాకసలు ఉత్తరాలే రాయలేదే? చాలా రోజుల కింద మీకందరికీ బాగా జ్వరంగా వుందనీ, చిన్నారి ఈవా మనకిక లేదనీ ఒక ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఉత్తరమూ లేదు! ఏమయ్యారు మీరంతా?”

“పడవ మీద ప్రయాణం చేస్తూన్నాం కదా? అందుకే రాయలేదేమో. పడవమీద అనుకున్నదానికంటే ఎక్కువరోజులు పట్టిందట, నాన్న అన్నాడు. అన్నట్టు పడవ మీద కూడా జేన్ టీచరు పాఠాలు చెప్పారు తెలుసా?”

నవ్వాడు బ్రాండన్.

“హేరియట్! మెల్బోర్న్ వదిలి ఈ పల్లెటూరు ఎలా వచ్చావు? నీకు ఈ ప్రదేశం కొంచెం కూడ నచ్చి వుండదు!”

“అదేం లేదు. నేను ఎస్టేటు చూస్తానంటే అన్నయ్య ఎగిరి గంతేసాడు.నాకిక్కడ భలే సరదాగా వుంది. ఇక్కడే వుండిపోతానని చెప్పలేను కానీ, అప్పుడప్పుడూ రావొచ్చు.”

ఆమె అతిశయం చూసి నవ్వొచ్చింది బ్రాండన్ కి. జేన్ వైపు తిరిగాడు.

“జేన్, మీకూ మీ చెల్లాయికీ, మాలాటి వలస పక్షులంటే అసహ్యం లేదు కదా? అన్నట్టు మీ బంధువు ఫ్రాన్సిస్ ఎలా వున్నారు? ఇప్పుడాయన పార్లమెంటు సభ్యుడట కదా?”

“ఫ్రాన్సిస్ బానే వున్నాడు బ్రాండన్. వలస పక్షులవల్లే కదా ఇంగ్లండు అభివృధ్ధి చెందేది. వలసపక్షుల మీద కోపం దేనికి?”

“వచ్చే ముందు పెగ్గీ కనిపించిందా?”

“వెళ్ళి ఒకసారి చూసొచ్చాము. తనూ త్వరలో ఇక్కడికి వస్తూండవచ్చు.”

తమనివొదిలేసి వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం గ్రాంట్ కేమాత్రమూ నచ్చలేదు.

“అది సరే కాని బ్రాండన్, ఇన్ని రోజులూ అడిలైడ్ లో ఏం చేసావ్? నన్నేమో ఎస్టేటు వ్యవహారాలు చూడొద్దన్నావు. నువ్వేమో ఊరేగపోయావు. ఇలాగైతే స్టాన్లీ ఏమంటారు?” దర్పంగా అడిగాడు.

తన ప్రియమైన బ్రాండన్ తో గ్రాంట్ అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు ఎమిలీకి.

“ఆహా! అక్కడికేదో నువ్వు మహా పెద్ద పని చేస్తున్నట్టు. అది చాలదని అక్కడ అమ్మనీ, ఎల్సీని ఒంటరిగా ఒదిలేసి అత్తయ్యనీ వెంటబెట్టుకొచ్చాడు. నాన్నేం అంటాడో! నాకూ బుజ్జి తమ్ముణ్ణీ అమ్మనీ చూడాలని వుంది.”

“పోనీ నేను నిన్ను తీసికెళ్ళనా మెల్బోర్న్? రేపే బయల్దేరదాం.” బ్రాండన్ అడిగాడు.

“వెళ్ళనా టీఛర్?” ఆశగా అడిగింది ఎమిలీ జేన్ ని.

నవ్వేసింది జేన్.

“లేదమ్మా!మీ నాన్నగారొస్తే చదువూ సంధ్యా మానేసి అంత దూరం పంపినందుకు నన్ను కోప్పడతారు. అయినా తొందర్లోనే అమ్మా,తమ్ముడూ ఎల్సీ అందరూ ఇక్కడికే వొచ్చేస్తారుగా?” అంది అనునయంగా.

ఇప్పుడే అడిలైడ్ నించి వచ్చి, మళ్ళీ మెల్బోర్న్ ప్రయాణమా? ఇలా అయితే ఇతని ఎస్టేటు నడిచినట్టే అనుకున్నాడు గ్రాంట్ హేళనగా.

తన ఉత్తరం ఎల్సీకి అందలేదు కాబట్టే ఏ జవాబూ రాలేదు. ఈ సంగతి విన్నదగ్గర్నించీ బ్రాండన్ కి రెక్కలు కట్టుకుని మెల్బోర్న్ వెళ్ళి ఎల్సీని చూడాలని వుంది.ఎడ్గర్ ని అక్కడే విరివాల్టాలో వొదిలేసి ఆఘమేఘాలమీద ఆత్రంగా మెల్బోర్న్ ప్రయాణమయ్యాడు బ్రాండన్.

*****************

36 వ భాగం

హేరియట్ ఫిలిప్స్ ఆత్మ బంధువు

డెంస్టర్ అడిలైడ్ హోటల్లో చెప్పినట్టు ఫిలిప్స్ కుటుంబం ఆస్ట్రేలియా చేరుకోగానే విడి పోవాల్సి వచ్చింది. లిల్లీ ఫిలిప్స్ ఆరోగ్య కారణాలవల్ల మెల్బోర్న్ లోనే వుండాలని నిశ్చయించుకుంది. ఎస్టేటు కెళ్తే ఆ పల్లెటూళ్ళో వైద్య సహాయం తేలిగ్గా దొరకకపోవచ్చు. వకీలు టాల్బాట్ ఉత్తరం రాసి మిసెస్ పెక్ ని బెదిరించడం ద్వారా స్టాన్లీ ఆవిడ మెల్బోర్న్ రాకుండా కట్టుదిట్టం చేసాననుకున్నాడు. దాంతో భార్య మెల్బోర్న్ లో వుంటానంటే అభ్యంతర పెట్టలేదు. ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబాన్ని అందులో వుంచాడు.

అయితే పిల్లలకి మాత్రం మెల్బోర్న్ కొంచెం కూడా ఇష్టం లేదు. వారికి వాళ్ళు వుండే విరివాల్టా వూరే ఎంతో ఇష్టం. దాంతో చెల్లెల్నీ, ఎల్సీనీ భార్యకి తోడుగా వుంచి పిల్లలనీ జేన్ నీ తీసుకుని విరివాల్టా వెళ్ళిపోయాడు స్టాన్లీ.

మెల్బోర్న్ లో దిగగానే బ్రాండన్ అడిలైడ్ వెళ్ళిన సంగతి తెలుసుకోని స్టాన్లీ చిరాకు పడ్డాడు. అతను స్నేహితుణ్ణి కలిసి తన ఎస్టేటు విశేషాలు ముచ్చటించాలన్న ఆత్రంతో వున్నాడు. డాక్టర్ గ్రాంట్ వచ్చి బ్రాండన్ తనని ఉద్యోగంలోంచి పీకేసేంతవరకూ తానెంత శ్రధ్ధగా ఎస్టేటుని కనిపెట్టి వున్న సంగతి చెప్పి వూదర గొట్టేసాడు.

“ పైగా ఎస్టేటు పన్లన్నీ వొదిలేసి అడిలైడ్ వెళ్ళాడండీ మీ స్నేహితుడు! ఏదో గొర్రెలని కొనుక్కొస్తాడట. నన్నడిగితే ఆయనకి గొర్రెకీ బర్రెకీ తేడా తెలియదు. మరేం బేరాలు చేస్తాడో కానీ..”

“మన ఎస్టేటు లోకి కూడా గొర్రెలు కొంటానన్నాడే, అవన్నీ మరి విరి వాల్టా చేరుకున్నాయా?”

“ఇంకెక్కడి గొర్రెలండీ? అయినా, నాకు తెలీకడుగుతాను, మన విక్టోరియా లో దొరికే గొర్రెలకంటే బాగుంటాయా ఆ అడిలైడ్ లో గొర్రెలు? అక్కణ్ణించి లారీల్లో ఈ వూరు ఒచ్చేసరికే అందులో మూడొంతులు చచ్చి వూరుకుంటాయి. ఆయన డబ్బూ, దాంతో పాటు మనదీ, అంతా మునిగినట్టే!”

“అది సరే, బ్రాండన్ మిగతా పరిస్థితి ఎలా వుంది? ఇంగ్లండు నించి చాలా ఆందోళనగా బయల్దేరాడు.”

“ఎస్టేటంతా బానే వుంది కానీ, ఆయనకే ఏదో మనసు బాగున్నట్టు లేదు. ఇంతకు ముందులా పని చేయడంలేదు. పైగా మన ఎస్టేటులో నన్ను పని చేయనివ్వకుండా ఒకటే కలిపించుకోవడం. పనివాళ్ళకి చనువిచ్చి నెత్తినెక్కిచ్చుకోవడం, అబ్బో ఒకటనేమిటి..”

హేరియట్ ఆ సంభాషణలో కలగజేసుకుంది.

“మీరన్నది నిజమే డాక్టర్ గ్రాంట్. మా అన్నయ్యకీ, బ్రాండన్ కీ, ఇద్దరికీ పని వాళ్ళకి చనువిచ్చే అలవాటుంది. దానికి వాళ్ళేం పేర్లు పెట్టినా, అది మంచి అలవాటు కాదు.”

నిజానికి డాక్టరు గ్రాంట్ కి తిక్క తిక్కగా వుంది. ఎస్టేటులో తన ఉద్యోగం బ్రాండన్ పీకేయడం ఒక కారణమైతే,

“ఆ పల్లెటూళ్ళో సరైన వైద్య సహాయం దొరకదు,” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లిల్లీ ఫిలిప్స్ మెల్బోర్న్ లోనే వుండిపోతాననడం ఇంకొకటి. అంటే ఏమిటావిడ వుద్దేశ్యం? నేను మంచి వైద్యుణ్ణి కాననా, అని గింజుకున్నాడు.

అందుకే స్టాన్లీ మెల్బోర్న్ వదిలి విరివాల్టా వెళ్ళింతరవాత కూడా తాను ఒక వారం పదిరోజులు మెల్బోర్న్ లోనే వుంటాననీ, కావాలంటే లిల్లీ అమ్మగార్ని కనిపెట్టుకునీ వుండగలననీ అన్నాడు.

అయితే స్టాన్లీ వెళ్ళిపోయి వారమే కాదు రెండూ వారాలు దాటినా, డాక్టర్ గ్రాంట్ మెల్బోర్న్ లో ఇల్లు వదిలి ఎస్టేటు కెళ్ళేప్రయత్నాలేవీ చేయలేదు. పైగా, స్టాన్లీకి

“ఇక్కడ అమ్మగారికీ, అప్పుడే పుట్టిన వారి బిడ్డకూ, చిన్నమ్మాయి హేరియట్ గారికీ తన అవసరం చాలా వుండడం వల్ల, నేను ఇక్కడే తమ అనుమతితో ఇంకొన్ని రోజులు వుండగలను,” అంటూ ఉత్తరం రాసి పడేసాడు. లిల్లీ ఫిలిప్స్ సంగతేమోకానీ, అతను హేరియట్ ఫిలిప్స్ ని చాలా బాగా కనిపెట్టి వున్నాడనే చెప్పుకోవాలి.

అతనికి హేరియట్ ని చూస్తున్న కొద్దీ ఇలాటి భార్య తనకుంటే బాగుండనిపిస్తూంది. ఆమె చదువూ, డబ్బూ, వేష భాషల్లో నాగరికతా, నాజూకు అతనికి తెగ నచ్చేసాయి.ఆమెతో పరిచయమూ చనువూ పెంచుకునే ఉద్దేశ్యంతో అతను రోజూ ఆమెని సాయంత్రాలు షికారు తీసికెళ్లడం మొదలు పెట్టాడు. ఆ షికార్లో తన కుటుంబం గురించీ, తన కున్న గొప్ప వాళ్ళ పరిచయాల గురించీ, స్కాట్ లాండ్ లో తమకున్న రాజ ప్రాసాదాల గురించీ వివరంగా చెప్పుకొచ్చాడు. కొంచెం ఆ మాటా నిజమే. అతని తల్లి వైపు నించీ తండ్రి వైపు నించీ కూడా రాజ వంశీకులకి దూరపు బంధుత్వం వుంది.

ఆ విషయాన్నతడు పదే పదే చెప్పి, తాను, డబ్బు కి పేదైనా కులానికీ, అంతస్తుకీ గొప్పనే నమ్మకం ఆమెకి కలిగించాడు.హేరియట్ స్కాట్ లాండ్ కి చెందిన స్త్రీ కాకపోవడం కొంచెం దురదృష్టమే ఐనా, ఆమె అతను చెప్పిన వీర గాథలన్నీ చాలా ఇష్టంగా విన్నది.హేరియట్ కీ బ్రాండన్ కీ నిశ్చితార్థమైనట్టు డాక్టర్ గ్రాంట్ చూచాయగా విని ఉన్నాడు. ఎలాగైనా బ్రాండన్ ని తప్పించి తానే హేరియట్ ని పెళ్ళాడేస్తే ఇహ జీవితాంతం డబ్బుకి లోటుండదు. అందుకే అతను వీలైనప్పుడల్లా బ్రాండన్ గురించి ఫిర్యాదులూ చేసాడు.

పైగా, హేరియట్ తండ్రీ, అన్నల్లాగే తనూ డాక్టరే. వీటన్నిటితో అతనికి హేరియట్ తో మాట్లాడాడానికి బోలెడన్ని విశేషాలూ, సంగతులూ వుండేవి. హేరియట్ కూడా అతనికేమీ తీసిపోకుండా డెర్బీషైర్ లో తమ ఇల్లూ, తమ తోటా, తమ ఇంట్లో జరిగే విందులూ, నగలూ, ఆస్తులూ గురించి వివరంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. దాంతో రోజుకి కనీసం అయిదారు గంటలు కబుర్లు చెప్పుకుంటే కానీ సరిపోని పరిస్థితి ఏర్పడింది.

చదువూ సంధ్యా లేనీ పల్లెటూరి గబ్బిలాయి లాంటి బ్రాండన్ కంటే డాక్టర్ గ్రాంట్ ఎంతో నచ్చసాగాడు హేరియట్ కి. ఎంత డబ్బుంటే ఏం, పుస్తకాల గురించీ, కళల గురించీ తెలియక పోయాక, అనుకునేదామె బ్రాండన్ ఙ్ఞాపకం వచ్చినప్పుడల్లా. తన పొలమూ, గొర్రెల ఖరీదూ, ధరవరల గురించీ తప్ప బ్రాండన్ కింకో విషయమే పట్టదు. అదే డాక్టర్ గ్రాంట్- పుస్తకాలు, చిత్ర లేఖనం, కవిత్వం, రాజకీయాలు, మతం, అబ్బో, అతనికి తెలియని విషయమే లేదనిపించేలా మాట్లాడగలడు.

అసలైతే హేరియట్ వదిన గారికి సాయంగా మెల్బోర్న్ లో వుంటానన్నది కానీ, ఆమెకి ఆ సంగతే గుర్తు లేదు. బాలింతరాలు లిల్లీ ఫిలిప్స్ బాధ్యతా, శిశువు బాధ్యతా కూడా ఎల్సీ పైనే పడ్డాయి. నిజానికి ఎల్సీ పెద్ద పిల్లలతోటీ, జేన్ తోటీ కలిసి విరివాల్టా వెళ్ళాలనుకుంది. హేరియట్ ,“వదినని నేనొక్కదాన్నీ చూసుకోలేను, నువ్వూ నాకు సాయానికి వుండిపో,” అని మొహమాట పెట్టేసరికి మెల్బోర్న్ లోనే ఉండిపోయింది. అయితే హేరియట్ పొరపాటున కూడ “వదినగారిని చూసుకోవడం” అనే పని పెట్టుకోదల్చుకోలేదని ఆమెకి అర్థమైపోయింది.

దానికి తోడు ఒక కూతురి మరణం, మళ్ళీ పురుడూ, పక్కనే భర్త లేకపోవడం అన్నీ కలిపి లిల్లీ గయ్యాళితనాన్ని ఇంకా పెంచాయి.

అయితే ఇంటి పనీ, పై పనీ కంటే ఎల్సీని వదినా మరదళ్ళు ఏదో ఒకనాడు పెద్దగా గొడవ పడతారేమోనన్న భయం ఎక్కువగా కృంగ దీసింది. ఎందుకంటే రాను రానూ హేరియట్ వదిన గారి గదిలోకి రావడమే తగ్గించేసి, ఆపైన మొత్తానికే మానేసింది!

                   ****************

 

 

 

 

వీలునామా – 34 వ భాగం

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ధనార్జన

మిసెస్ పెక్ తన గ్లాసులోని బ్రాందీని నెమ్మదిగా తాగుతూ వ్యూహాన్ని సిధ్ధం చేసుకొంది. లేచి మెల్లగా డెంస్టర్ పక్కనెళ్ళి కూర్చుని, తన ‘జీవిత గాథా ను అత్యంత దయనీయంగా ఆతనికి విశదీకరించింది. మధ్య మధ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, కొన్నిసార్లు లేని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె చెప్పిన మాటల సారాంశం-

తను చెప్పినట్టు ఇంతకుముందే తనకొచ్చిన ఉత్తరం తన కూతురు మరణానికి చేరువలో వుందన్న కబురుతో వచ్చింది. తనకి రెక్కలు కట్టుకొని మెల్బోర్న్ లో వున్న కూతురి దగ్గరకి వెళ్ళాలని వుంది కానీ, తనదగ్గర కనీసం ప్రయాణానికి కావాల్సిన డబ్బు లేదు. అల్లుడు మంచివాడే కానీ, పాపం వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోవడం లేదు. దానికి తోడు ఎడతెగని దురదృష్టం వాళ్ళని పట్టుకు పీడిస్తోంది.

“…ఆ ఇంట్లోకి వైద్యుడు వెళ్ళని రోజుండదంటే నమ్మండి! పురుళ్ళూ, లేకపోతే చావులూను. ఇహ డబ్బు ఎమ్మంటే ఏ మగవాడు మాత్రం ఎక్కణ్ణించి తెస్తాడు చెప్పండి? డెంస్టర్ గారూ, నేను చిన్న చిన్న చేబదుళ్ళు వాళ్ళకెన్ని సార్లిచ్చానో లెక్కలేదు. ఈ మధ్య నాక్కూడా డబ్బుకి ఇబ్బంది గానే వుంది. పిల్లది చావు బ్రతుకుల్లో వున్నా వెళ్ళలేకపోతున్నాను. రెక్కలుంటే కట్టుకుని ఎగిరిపోయేదాన్నే!తల్లి ప్రాణం ఎలా కొట్టుకుందో ఎవరికర్థమవుతుంది?”

“ఇంతకీ మీ అల్లుడిదే ఉద్యోగం?” అనుమానంగా అడిగాడు డెంస్టర్.

“హయ్యో రాత!నిలకడైనఉద్యోగం అంటూ ఏదీ లేదు కానీ, కేంప్బెల్ కంపెనీలో చేతి పన్లు చేస్తూ వుంటాడు.”

“ఆ కంపెనీలో జీతాలు బానే వుంటాయే!”

“చెప్పాగా! ఎప్పుడూ బాలింత, చూలింత! పైగా మెల్బోర్న్ లో ఖర్చులెలావుంటాయో మీకు తెలియదా? పాపం మంచివాడే, బయటి వ్యాపకాలు కూడా లేవు. ఇంకా చిన్నారి మేరీ పెళ్ళి కూతురి దుస్తుల్లో నా కళ్ళల్లో మెదులుతూనే వుంటుంది. అప్పుడే నూరేళ్ళు నిండిపోతున్నాయి నా తల్లికి!” పెక్ గట్టిగా కళ్ళు తుడుచుకుని వెక్కిళ్ళు పెట్టింది.

“మేమసలు బ్రతికి చెడ్డ వాళ్ళమండీ డెంస్టర్ గారూ! అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటుండదు. మన ఇంగ్లండు వదిలి ఇక్కడికొచ్చి ముఫ్ఫై యేళ్ళ పైనే అయింది. ఇందాక మీరూ ఫ్రాంక్ లాండ్ గారి భార్యా మాట్లాడుకున్నారు చూడండి? వాళ్ళల్లో చాలా మంది బాగా తెలుసు నాకు. నా స్నేహితులూ పరిచయస్తులంతా సిడ్నీలో వుండబట్టి ఈ గతి పట్టింది మాకు. ఈ దిక్కుమాలిన అడిలైడ్ లోఎవరూ తెలియదు మాకు! సిడ్నీ లో హంటర్ గారి కుటుంబం వుంది చూడండి, వాళ్ళు బాగా దగ్గరి స్నేహితులు మాకు.”

“మీకు ఫిలిప్స్ కుటుంబం తెలుసన్నారుగా, వాళ్ళని సహాయం అడగలేకపోయారా?” ఇంకా ఆమెని అనుమానంగానే చూస్తూ అడిగాడు డెంస్టర్.

“ఫిలిప్స్ కుటుంబం కంటే హంటర్ గారి ఆవిడ నాకు మంచి స్నేహితురాలు, నీ అడిగి చూస్తా……”

“అది వీలుపడదు లెండి. హంటర్ గారి కుటుంబం లండన్ లో వుంది. శ్రీమతి హంటర్ మరణించి నాలుగేళ్ళవుతుంది!”

“హయ్యయ్యో! ఎంత పని జరిగింది!”

“మరే! అంత మంచి స్నేహితురాలి మరణ వార్త మీకు తెలియకపోవడం వింతగా వుంది,” వెటకారంగా అని లేచి నిలబడ్డాడు డెంస్టర్.

“చూడమ్మా! నువ్వు మాట్లాడే మాటల్లో సగానికి పైగా అబధ్ధాలే నని నాకు తెలుసు. మెల్బోర్న్ వెళ్ళాలనుకుంటున్న మాట నిజమే, కానీ మరణించబోయే కూతుర్ని చూడడానికి మాత్రం కాదు. కాబట్టి డబ్బుకోసం ఇంకెవర్నైనా వెతుక్కో!” నిర్మొహమాటంగా అని అక్కణ్ణించి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఎంత మాటన్నారండీ! అయినా నేనేమీ మిమ్మల్ని దాన ధర్మాలడిగానా? అప్పు మాత్రమే కదా అడిగాను. నెలతిరిగేలోగా నాకందే డబ్బు రగానే మీ డబ్బు వడ్డీతో సహా మీ మొహాన పారేసేదాన్నే కదా? సరే పోన్లెండి, పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. ఒక చిన్నవిషయం చెప్పండి, మెల్బోర్న్ నించి ఎవరైనా డ్రాఫ్టో చెక్కో పంపితే ఇక్కడ బాంకిలో డబ్బిస్తారా?”

“ఆ డ్రాఫ్టో చెక్కో మీ పేరు మీదే వుండి, మీరు మీరే అని నిరూపించుకోగలిగితే తప్పక ఇస్తారు,” డెంస్టర్.

ఇహ ఆమె మాటలు వినడానికి ఓపికలేక అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను తన గదిలోకి.డెంస్టర్ దగ్గర తన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దిగాలు పడింది పెక్. కాసేపాలోచించి హోటల్ యజమాని ఫ్రాంక్లాండ్ కి గాలం వేయాలని నిశ్చయించుకుంది. అయితే ఆయన దగ్గర కొంచెం కథ మార్చదలచుకుంది. తనకొక జబ్బు పడ్డ కూతురున్నమాట నిజమే. అయితే ఈ సారి మెల్బోర్న్ ప్రయాణానికి కారణం వేరే.

తనకి మెల్బోర్న్ లో చాలామంది చిన్న చితకా రావల్సిన బాకీలున్నాయనీ, అయితే ప్రయాణానికి సరిపడా డబ్బు లేక అదంతా వొదులుకోవాల్సి వస్తుందనీ బొంకిందామె. ఎప్పుడూ లేనిది ఎంత కష్టపడి పని చేసినా తన భర్తకి రావాల్సిన జీతం డబ్బులు కూడా అందకపోవడం వల్ల ఇంత కటకటగా వుంది! ఆమె మాటాలకీ విన్నపాలకీ ఫ్రాంక్ లాండ్ కరిగిపోయేవాడే, వున్నట్టుండి ఆయన భార్య వచ్చి అడ్డు చెప్పకపోయినట్టయితే. ప్రస్తుతం ఆ హోటల్ ఆజమాయిషీ అంతా ఆమెదే అవడం వల్ల భర్య మాటకి ఎదురాడలేకపోయాడు ఫ్రాంక్ లాండ్.దాంతో అక్కడా విఫలమైంది ఆమె ప్రయత్నం.

మర్నాడు ఆమె ఆ హోటల్లో భర్తను తాకట్టు వుంచి పోస్టు కోసం వెళ్ళే బగ్గీలో అడిలైడ్ నగరం చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం కల్లా హోటలుకివ్వాల్సిన పైకం తెస్తానని ఫ్రాంక్ లాండ్ దంపతులకి వాగ్దానం చేసి మరీ బయలుదేరింది. ఎలాగైనా ఆ రోజు పది పన్నెండు పౌండ్లన్నా పుట్టించాలి. వేరు దారి లేదు.

వకీలు టాల్బాట్ తనకి రాసిన వుత్తరం చేతిలో పట్టుకుని ముందుగా కనిపించిన బాంకిలోకెళ్ళింది. ఆ ఉత్తరాన్ని అక్కడ గుమాస్తా కిచ్చి తన గోడు చెప్పుకుంది. అయితే పాపం అక్కడా ఆవిడకి చుక్కెదురైంది. నువ్వెవరో తెలియకుణ్డా కేవలం ఆ ఉత్తరం బలం మీద ఒక్క చిల్లి గవ్వ ఇవ్వనన్నాడా గుమాస్తా. కోపంగా వెనక్కి తిరిగింది మిసెస్ పెక్. ఆంఎకేం చేయాలో తోచలేదు. మర్నాడే ఒక స్టీమరు అడిలైడ్ నించి మెల్బోర్న్ బయల్దేరుతుంది. ఎలాగైనా దాన్లోకెక్కగలిగితే చాలు. కానీ, ఎలా డబ్బు పుట్టించడం?

ఆలోచనల్లోనే ఆమె తాను అడిలైడ్ లో వున్న ఇంటివైపు నడిచింది. అది చాలా ఇరుకైన వీధి. అయితే అద్దె సరిగ్గా కట్టలేదని అక్కణించి తమని తరిమేసారు. ఏదో అలవాటు చొప్పున అక్కడికొచ్చింది. తానెప్పుడూ సరుకులు కొనే కొట్టు ముందర తాను నిలబడ్డట్టు గమనించింది మిసెస్ పెక్.

“హలో మిసెస్ స్మిత్! బాగున్నావా?” కొట్టు లో కూర్చున్న యజమానురాలిని పలకరించింది.

“మీరా మిసెస్ పెక్? బాగున్నారా? బహుకాల దర్శనం! అయినా అలా వున్నట్టుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారే?” ఆవిడ పలకరించింది.

“అవునమ్మా! అనుకోకుండా ఆయనకీ నాకూ మంచి కొలువులు దొరికేసరికి ఉన్నపళాన బయల్దేరాల్సొచ్చింది. ఇక్కడంతా బాగేనా?”

“ఆ బాగేలే! నాలుగేళ్ళ కింద ఇల్లొదిలిపోయిన నా మొగుడు నిన్న రాత్రే తిరిగొచ్చాడు. ఉత్తరం పత్తరం లేకుండా దిగబడ్డాడు. ఇన్నాళ్ళూ నేను బ్రతికానో చచ్చానో చూడలేదు, కానీ ఇప్పుడు మహా ప్రేమ వొలకబోస్తున్నాడు.” చిరాగ్గా అంది మిసెస్ స్మిత్.

“ఏమిటీ? ఇప్పుడు తగుదునమ్మా అని వొచ్చాడా? చీపురు తిరగేసి తరిమెయ్యాల్సింది!”

“నేనూ అదే అనుకుంటున్నాను. నీకు హేరీ గుర్తున్నాడుగా? నేనూ హేరీ ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకుందామనుకుంటూంటే ఏమిటీ రభస నాకు? ఇప్పుడొచ్చి తానేదో వారం వారం ఉత్తరాలు రాసిన మొగుళ్ళా సాధింపు!”

“చేతిలో చిల్లి గవ్వ లేక మళ్ళీ నీ పంచన చేరాడు కాబోలు.”

కొంచెం తగ్గింది మిసెస్ స్మిత్.

“అదేం లేదులే. బాగానే సంపాదించినట్టున్నాడు. దాదాపు మూడు వందల పౌండ్లకి పైనే సంపాదించానంటున్నాడు.” మెత్తబడింది మిసెస్ స్మిత్ కంఠం.

“ఇంటిల్లిపాదికీ బహుమతులూ పట్టుకొచ్చాడు,” మళ్ళీ తనే అంది.

ఇంతలో అక్కడికి స్మిత్ వచ్చాడు. మిసెస్ పెక్ ని చూసి అదిరిపడ్డాడు.

“మీరిక్కడ వున్నారేంటి మిసెస్…! పేరు మర్చిపోయాను కానీ మీరు బాగా తెలుసు నాకు.”

చిరునవ్వు నవ్వింది మిసెస్ పెక్.

“హలో మిస్టర్ స్మిత్. నా పేరు మిసెస్ పెక్. మనిద్దరం బెండిగో వూళ్ళో కలిసాము.”

 

స్మిత్ మొహం ఎర్రబడింది. ఇబ్బందిగా నవ్వేస్తూ,

“అవునవును. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. రండి లోపలికి! సూసన్! కొంచెం తాగడానికో తినడానికో ఏమైన వుంటే పట్తుకురాకూడదూ? రండి మిసెస్ పెక్, ఇలా వొచ్చి కూర్చొండి.”

మర్యాదలు వొలకబోసాడు. మిసెస్ పెక్ నవ్వుతూ వొచ్చి కూర్చుంది.

“అబ్బబ్బ ఏం ఎండ! కొంచెం చల్లగా వుండేదేదైనా తగడానికివ్వమ్మయ్. పాత స్నేహితులని కలుసుకొని మాట్లాడడంలోని ఆనందమే వేరు. ఏమంటారు స్మిత్?”

“అవునండీ! సూసన్!ఇలా రా, నువ్వూ వొచ్చి కూర్చో! ఈ అమ్మాయేమిటో కాని మిసెస్ పెక్, చూసిన కొద్దీ చూడాలనిపిస్తూంది. మా పెళ్ళయి ఇన్నేళ్ళయిందా? ఇంకా నా కళ్ళకి కొత్త పెళ్ళికూతుర్లాగే కనపడుతుంది, అదేం మాయో మరి! దేవుడి దయవల్ల నేను సరిగ్గా సమయానికొచ్చాను. లేకపోతే వాడెవడో నా పెళ్ళాన్ని యెగరేసుకు పోవాలని కాచుకు కూర్చున్నాడు. అయినా సూసన్ దేమీ తప్పు లేదు లెండి. నా వుత్తరాలు అందకపోయేసరికి తను మాత్రం ఎంత కాలం ఎదురుచూస్తుంది? నాలుగేళ్ళాయే! ఎన్నెన్ని వుత్తరాలు రాసాను! ఒక్కటీ అందలేదట!”

“నువ్వసలు రాస్తే కదా అందటానికి!” నిర్లిప్తంగా అంది సూసన్.

“ఎంత మాటన్నావు సూసన్! మీరే చెప్పండి మిసెస్ పెక్! బెండిగో లో నేనెలా సూసన్ నామ జపం చేసేవాడినో, ఎన్నెన్ని వుత్తరాలు పోస్టు డబ్బాలో వేసేవాడినో, మీరంతా నన్ను చూసి ఎలా నవ్వే వారో అన్నీ చెప్పండి! అప్పుడైనా మహా రాణీ గారికి నమ్మకం కలుగుతుంది నామీద.”

మిసెస్ పెక్ ఈ అవకాశాన్ని వొదులుకో దల్చుకోలేదు. వెంటనే రంగం లోకి దూకింది.

“హయ్యో సూసన్! మిస్టర్ స్మిత్ అంటే ఇంకెవరో అనుకున్నా. ఈయనేనన్నమాట. అబ్బాయి చెప్పేదంతా నిజమేనమ్మా!నిల్చున్నా కూర్చున్నా నీ ధ్యాసే ననుకో! అతను చెప్పేదాంట్లో ఒక్క అబధ్ధమూ లేదు. కావాలంటే నాదీ సాచ్చీకం!ఆ..”

“హమ్మయ్య! నన్ను ఒడ్డున పడేసారు. ఇంకొంచెం నాలుగు చుక్కలు బ్రాండీ పోస్తా మీ గ్లాసులో.”

“ఆ, చాలు చాలు బాబూ. మీ ఇద్దరి ఆనందం చూస్తూంటే కళ్ళ నిండుగా వుందనుకో. అయినా నేనిప్పుడున్న కష్టాల్లో ఎవరి సంతోషాల్నీ పట్టించుకునే పరిస్థితిలో లేను,” దీనంగా అంది.

“అయ్యొయ్యో! అదేం మాట మిసెస్ పెక్! ఇంత మంది స్నేహితులం వుండగా మీకేం కష్టం! అదేంటో చెప్పకపోతే నేనూరుకోను. చెప్పండి, దయ చేసి,” గారాబం చేసాడు కొత్త మిత్రుడు.

“హయ్యో నాయనా!పరాయిలతో మన ప్రస్తావనెందుకని వూరుకున్నా. నీ అభిమానం ముందు చెప్పకుండా వుండలేకపోతున్నాననుకో. ఏం లేదు బాబూ! నాకు ఇప్పటికిప్పుడు పన్నెండు పౌండ్లు కావాలి. అప్పుగానేనయ్యోయ్! బెండిగోలో వినే వుంటావు. నాకు నెల నెలా స్కాట్ లాండు నుండి పెన్షన్ అందుతుంది.”

ఆమె మాట కాదనే ధైర్యం లేదు స్మిత్ కి. తల వూపాడు బలహీనంగా.

“ఈ మధ్య నాకూ , పెక్ గారికీ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. డాక్టర్లకీ, మందులకీ ఎక్కడి డబ్బూ చాలడంలేదు. ఒక్క పన్నెండు పౌండ్లు సర్దావంటే నా పెన్షను రాగానే వడ్డీతోసహా నీకప్పచెప్తాను!”

“మీరంతగా అడగాలా మిసెస్ పెక్! మీకిచ్చిన డబ్బెక్కడికీ పోదని నాకు తెలుసు. అయినా అవసరానికాదుకోకపోతే ఇహ స్నేహం ఎందుకు? సూసన్! ఆ డబ్బలా అందుకో!”

పన్నెండు పౌండ్లూ చేతిలో పడ్డాయి మిసెస్ పెక్ కి. ఆమె హాయిగా నిట్టూర్చింది.

ఆమెకి స్మిత్ బెండిగో లో తెలిసిన మాట నిజమే. అయితే అక్కడ అతను ఇంకొక పేరుతో , వేరే ఎవరికో భర్తగా చలామణీ అయ్యేవాడు.అడిలైడ్ లో భార్య నడుపుతూన్న కొట్టు గురించీ, సంపాదించుకుంటూన్న డబ్బు గురించీ విని వొచ్చి ప్రేమ వొలకబోస్తున్నాడని అతన్ని చూసిన క్షణంలోనే పసిగట్టిందామె. ఇప్పుడిహ చచ్చినా ఈ పన్నెండు పౌండ్లని తిరిగి అడగడు. సంతోషంగా గర్వంగా మర్నాటి ప్రయాణానికి తయారవసాగిందామె.

(సశేషం)

శారద

శారద

వీలునామా – 33వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మాతృమూర్తి

 

 

అడిలైడ్ నగరానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో- రహదారికి పక్కనే వున్న ఒక ఇరుకు హోటల్లో, ఆ సాయంత్రం ఒకావిడా, ఒకతనూ కూర్చుని ఉన్నారు. అంద చందాల సంగతటుంచి కనీసం శుచీ శుభ్రతా లేక మురికి ఓడుతూ ఉన్నారు. వాళ్ళెప్పుడైనా ఆనందంగా, గౌరవప్రదంగా వుండి వుంటే అది పూర్వ జన్మలో అయి వుంటుంది.

ఆ స్త్రీకి కాస్త కను-ముక్కూ తీరుగానే వున్నట్టున్నవి. అయితే ఆ ముఖం మీద వయసు వల్ల వచ్చిన ముడతల కంటే అశ్రధ్ధా, నియమాలు తప్పిన జీవన సరళీ తెచ్చిన మార్పులే ఎక్కువ. ఆమె బట్టలూ ఆమెలాగే అశ్రధ్ధగా మురికిగా వున్నాయి. నెరుస్తున్న జుట్టును దువ్వడాని క్కూడా ఓపిక లేనట్టు అంతా ఒక టోపీలోకి దూర్చేసింది. ఆమె కళ్ళల్లో ఒకలాటి నీచత్వమూ, క్రౌర్యమూ వున్నా, మెరుస్తూనే వున్నాయి, ఏదో భయంకరమైన ఆలోచన చెయ్యబోతూన్నట్టు. చేతులూ గోళ్ళూ కష్టపడి పనిచేయడంకంటే జేబు దొంగతనాల్నే ఎక్కువ నమ్ముకున్నట్టున్నాయి. ఆమెకంటే మురికిగా వున్నా, నిజానికి ఆ పురుషుడు అంత ప్రమాదకరమైన వ్యక్తిలా అనిపించడంలేదు. అప్పుడే పోస్టాఫీసు నించి ఒక ఉత్తరం తెచ్చి ఆమె ఒళ్ళో పడేసాడతను. దానిపైన “మిసెస్ పెక్” అని రాసి ఉంది. ఆమె ఆత్రంగా ఉత్తరం చించి చదివింది.

“హమ్మయ్య! నువ్వెదురు చూస్తున్న ఉత్తరం వచ్చేసింది. అంతా అనుకున్నట్టే జరిగిందా?” “నా బొంద. వాడిల్లు తగలెయ్య. దీనికోసమా ఇంతసేపు ఎదురుచూసింది. వాడి చేతులిరిగిపోనూ!” ఉత్తరం చించి కింద పడేసి నోటికొచ్చిన తిట్లు లంకించుకుందామె.

“ఏం జరిగింది? డబ్బివ్వడటా? లిజ్జీ! ఏమన్నాడో చెప్పసలు? నీగురించి వాకబు చేస్తాడా? ఏమంటున్నడు నీకొడుకు?”

“కొడుకా వాడి బొందా! ఈ ఉత్తరం వాడి దగ్గర్నించి కాదు. వాడసలు నా ఉత్తరాలకి జవాబిస్తే కదా? ఇప్పటికి కనీసం మూడు ఉత్తరాలు రాసి ఉంటా. ఒక్కదానికైనా జవాబిచ్చాడా? ఊ..హూ..నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. అయినా నేను వాణ్ణి ఒదిలేది లేదు. కన్న కొడుకైనా సరే కనికరం చూపించే అలవాటు నాకు లేదు.”

“యెహె! నోర్ముయ్యి! అడిగిందానికి చెప్పకుండా రంకెలేస్తావెందుకు? ఈ ఉత్తరం నీ క్రాస్ హాల్ రాజకుమారుడు కాకపోతే, మరి రాసిందెవరు?” అతను చిరాకు పడ్డాడు.

“ఇంకెవరు? ఆ లాయరు టాల్బాట్!”

“లాయరా? ఏం రాసాడు?”

“ఏముంది! మనం మెల్బోర్న్ వైపు తిరిగి చూడకుండా ఇక్కడే పడి వుంటే ముచ్చటగా మూడు పౌండ్లిస్తాడట. కాదని తెగించి మెల్బోర్న్ వెళ్తే మల మలా మాడి చస్తూన్నా ఫిలిప్స్ నించి ఒక్క పైసా రానివ్వడట. బెదిరిస్తూన్నాడు. వాడి మొహం మండ! అయినా వాణ్ణనేదేమిటిలే, నా ఖర్మ ఇలా కాలింది. ఇద్దరు పిల్లలు నాకు, ఇద్దరూ డబ్బులో మునిగి తేలుతూ ఉన్నారు. నాకు మాత్రం పస్తులు తప్పడం లేదు.”

“నీ పిల్లలా?” వెటకారంగా నవ్వాడతను. “నీ వాలకం జూస్తే నువ్వసలు వాళ్ళ తల్లిలాగున్నావా?”

“ఇద్దరికిద్దరూ- ఫ్రాన్సిస్ హాయిగా క్రాస్ హాల్ ఎస్టేటులో డబ్బు ఖర్చు చేసుకుంటూన్నాడు. ఇహ ఈ లిల్లీ గారి రాజభోగాలైతే చెప్పనే అక్కర్లేదు. గుర్రపు బగ్గీలూ, నౌకర్లూ, వంటమనుషులూ, హబ్బో! ఇహ ఈ అమ్మ దానికళ్ళకెందుకు ఆనుతుంది!” అక్కసుగా అంది ఆమె.

“పోనిలే లిజ్జీ! దక్కిందే చాలనుకుని ఈ అడిలైడ్ లోనే పడి వుందాం. మెల్బోర్న్ కంటే ఇక్కడే చవక కాబట్టి మూడు పౌండ్లతో వెళ్ళదీసుకోవచ్చు….”

“ఛీ నోర్ముయ్యి! వాడెవడు నన్ను ఎక్కడుండాలో చెప్పడానికి? నా ఇష్టమొచ్చిన దగ్గర, ఇష్టమొచ్చినట్టుంటా. అది సరే, హఠాత్తుగా మెల్బోర్న్ రావొద్దంటున్నాడు, వాళ్ళందరూ మెల్బోర్న్ నించి వచ్చే ఆలోచనలో వున్నారేమో. అందుకే నన్ను అక్కడకి రావొద్దంటున్నారు. అయినా, నా తల్లి ప్రాణం ఊరుకుంటుందా, నా కూతుర్ని చూడకపోతే. అసలు స్టాన్లీని పెళ్ళాడమని సలహా ఇచ్చిందే నేనయితే! ఆ రోజు, స్టాన్లీని కలిసే రోజు ఎంత శ్రధ్ధగా తయారు చేసా దాన్ని! ఆ అందం చూసే కదా మూర్ఛపోయి అతను పెళ్ళి చేసుకున్నాడు!”

“వాడెంత తెలివి తక్కువవాడో చూడు! ఏదో ఉంచుకుంటాడనుకున్నా కానీ, ఏకంగా పెళ్ళి చేసి తీసుకుపోయాడు. లిల్లీకి ఎప్పుడెప్పుడు నీతో తెగతెంపులు చేసుకోవాలా అన్నట్టుండేది కాబట్టి వెళ్లిపోయింది.”

“సరే, ఇప్పుడు డబ్బుకేం చేద్దాం?”

“ఏముంది, బెదిరించడమే! ఇన్నిరోజులూ ఫ్రాన్సిస్ ని బతిలాడుతూ, దీనంగా తల్లిలా ఉత్తరాలు రాసావు. ఇప్పుడిక డబ్బివ్వకపోతే చాలా రహస్యాలు బయటపెడతానని బెదిరించు. చచ్చినట్టు డబ్బిస్తాడు.”

“బెదిరింపా? వాణ్ణి బెదిరించడం తో ఏమీ ప్రయోజనం వుండదు. అనుకున్నది చేసేయడమే! దాంతో తెలుస్తుంది నేనంటే ఏమిటో!” అక్కసుగా అందామె.

“ఆగాగు! తొందరపడకు. అనవసరంగా చేతికొచ్చే డబ్బు పోగొట్టుకుంటాము!”

“వాడి వెధవ డబ్బేమీ నాకొద్దు. వాణ్ణి మసి చేసేయాలి  అంతే. అసలు ఆ మేనకోడాళ్ళిద్దరికీ ఆ ఎస్టేటొచ్చి వుంటే తేలిగ్గా డబ్బు లాగే వాళ్ళం. ఆడపిల్లలు బెదిరింపులకి తేలిగ్గా లొంగుతారు. ఈ కొరకరాని కొయ్యకి డబ్బంతా ఇచ్చి పోవాలన్న పాడు బుధ్ధి ఆ చచ్చిపోయిన వాడికెలాపుట్టిందో. నా దగ్గర ఏమాత్రం డబ్బున్నా, పేపర్లలో పెద్దాయన నాతో పెట్టుకున్న సంబంధం బట్టబయలు చేసి ఆ ఫ్రాన్సిస్ ని ఒక ఏడుపు ఏడిపించేదాన్ని కదా!”

“ఈ కోపమే ఒక రోజు మన కొంప ముంచుతుంది. డబ్బున్నవాళ్ళకి పగలూ, ప్రతీకారాలు కానీ మనలాటి తిండిగ్గతిలేనోళ్ళకి కాదు. అది సరే, ఆ మేనకోడళ్ళిద్దరినీ బెదిరిస్తే ఏమైనా రాలొచ్చు. కానీ వాళ్ళని చేరేదెలా? ఉత్తరాల్లో ఇలాటి సంగతులు రాయలేం కదా!”

“ఉత్తరాలంటేనే నాకసహ్యం. ఏదైనా మార్గం ఆలోచించి ఆ ఆడపిల్లలని పట్టుకోవాలి.”

వాళ్ళిద్దరూ ఈ సంభాషణలో మునిగి వుండగానే. అక్కడికొక ప్రయాణీకుడొచ్చి కూర్చున్నాడు. చక్కటి శుభ్రమైన బట్టల్లో హుందాగా వున్న ఆయన వీళ్ళిద్దరి కేసీ చిరాగ్గా చూసాడు. వాళ్ళ వాలకం చూసి ఆయన ఇంకో హోటలుకెళ్దామనుకున్నట్టున్నాడు. లేచి బయటికెళ్ళాడు. కానీ అప్పటికే తన గుర్రం శాలలో కట్టేసి వుండడం వల్ల వెనుదిరిగొచ్చాడు. ఇంతలో ఆ హోటలు యజమాని వొచ్చి,

“అరెరే! మీరా డెంస్టర్ గారూ! రండి రండి! ఇంగ్లండు నించి ఎప్పుడొచ్చారు? లోపలికొచ్చి కూర్చొండి. వీళ్ళని చూసి భయపడుతున్నారా? వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు సార్! కొంచెం దురదృష్టవంతులు అంతే! రండి, రండి! కూర్చొండి. భోజనం చేస్తారా?”

“హల్లో ఫ్రాంక్ లాండ్! ఈ హోటలు నీదని నాకు తెలియనే లేదే! ఇంకా ముందుకెళ్ళే ఓపిక లేదు. ఇహ ఇక్కడే దిగక తప్పేట్టు లేదు,” అక్కడున్న ఇద్దరి వంకా అనుమానంగా చూస్తూ కూర్చున్నాడు డెంస్టర్.

ఆయనకెందుకో ఆ ఇద్దర్నీ చూస్తుంటే మహా రోతగా వుంది. వాళ్ళ వేషభాషలకంటే వాళ్ళ దగ్గర్నించొచ్చే చవక సారాయి వాసన మహా చిరాగ్గా వుంది.

హోటలు చూడడానికలా వున్నా, ఫ్రాంక్ లాండ్ శ్రీమతి చక్కటి భోజనం తయారు చేసింది. భోజనం అయింతర్వాత విశ్రాంతిగా కూర్చున్నాడు డెంస్టర్. ఆయన దగ్గరికి టీ తెచ్చింది ఫ్రాంక్ లాండ్ శ్రీమతి. పనంతా అయిపోవడం వల్ల ఆమె కూడా తీరిగ్గా కూర్చుంది. ఫ్రాంక్ లాండ్ తో పోలిస్తే ఆయన భార్య ఎంతో చురుకైనదీ, తెలివి గలదీ. అతని తెలివితక్కువతనమూ, సోమరి తనమూ వల్ల వాళ్ళెంత డబ్బు నష్టపోయినా, ఆమె ఏదో విధంగా నెట్టుకొస్తూంది. బ్రతికి చెడ్డ మనిషవడం వల్ల తమ కంటే కొంచెం ఆర్థికంగా బాగున్న మధ్య తరగతి మనుషులతో మాట్లాడడం చాలా ఇష్టం ఆమెకి.  అందుకే డెంస్టర్ పక్కన కూర్చుని ఇంగ్లండు గురించీ తామక్కడ వదిలేసి వచ్చిన స్నేహితుల గురించీ మాట్లాడసాగింది.

veelunama11

“అయితే మీ అమ్మాయిని చూసొస్తున్నారన్నమాట! ఎలా వున్నారు వాళ్ళంతా?”

“ఇంగ్లండు నించి ఆస్ట్రేలియా రాగానే, నేను ముందుగా చేసేదదే కదా? అదసలే తల్లిలేని పిల్ల. బానే వున్నారు. మళ్ళీ ఇంకో బాబు!”

“ఆహా! భలే మంచి వార్త చెప్పారే! మరి మీరెలాగున్నారు?”

“నిజం చెప్పనా మిసెస్ ఫ్రాంక్ లాండ్? నా బిడ్డ సంసారమూ, ఇల్లూ పిల్లలూ చూసి సంతోషంగా అనిపించే మాట నిజమే. భార్యగా ఇల్లాలుగా ఒదిగిపోయిన బిడ్డని చూస్తే ఏ తండ్రికి గర్వంగా వుండదు? ఒక్కగానొక్క కూతురు, తల్లి లేదని అల్లారు ముద్దుగా పెంచాను. అయినా నాన్నని ఎంత తేలిగ్గా మరిచిపోయిందా అని అప్పుడప్పుడూ బాధ కలిగే మాటా నిజమే. అందుకే కొంచెం ఒంటరిగా అనిపిస్తూంది.”

“నా మాట విని మిమ్మల్నీ ఇంటినీ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి. కాస్త పెద్ద వయసులో వుండి,  సౌమ్యంగా పని చేసుకోగలిగే మనిషైతే..”

“అమ్మో! ఇంగ్లండునించి ఎవరైనా పనికి మనిషిని తెచ్చామనుకో, ఇహ ఆవిడ వచ్చిందగ్గర్నించీ ఇంటికెళ్దామని నా ప్రాణం తోడేస్తుంది. ఇప్పుడు నాకే పని మనుషులూ వొద్దు. ఇలాగే సాగిపోతే చాలు.” శ్రీమతి ఫ్రాంక్ లాండ్ ఏమీ మాట్లాడలేదు.

“అయినా నేను మీరనుకున్ననంత ఒంటరిగా లేను మిసెస్ ఫ్రాంక్ లాండ్. నన్ను ప్రేమించి నన్ను ఒదిలిపెట్టిపోయిన వాళ్ళ ఆత్మలు నా చుట్టూ తిరుగుతునే వుంటాయి ఎప్పుడూ. ఈ మధ్య నేను ఆత్మలతో సంభాషించడం నేర్చుకున్నా తెలుసా.”

“బానే వుంది కానీ, ఆత్మలు వంట చేసి ఇల్లు శుభ్రం చేయలేవు గదా? అలాటి పన్ల కోసమైనా ఇంట్లో ఇంకొక ఆడమనిషి వుండాలేమో ఆలోచించండి. అది సరే కానీ, ఇంగ్లండు నించి మీతో పాటు పడవలో ఇంకెవరొచ్చారు? ఎవరైనా మన పరిచయస్తులొచ్చారా?”

“ఆ! ఈ ట్రిప్పులో చాలా మందే వున్నారు. మనకి తెలిసిన వాళ్ళూ కొందరున్నారనుకోండి. “

“ఆహా? వాళ్ళల్లో మీకు నచ్చిన అందగత్తెలెవ్వరూ కనపడలేదా?” కొంటెగా నవ్వింది శ్రీమతి ఫ్రాంక్ లాండ్.

“అందగత్తెలు నా మొహం చూస్తారండీ? అందమంటే గుర్తొచ్చింది. ఒక అద్భుతమైన అందగత్తెని చూసిన మాట నిజం. కానీ, ఆమె పెళ్ళయిపోయిందట! వాళ్ళది మెల్బోర్న్ కాబోలు. వాళ్ళాయన పేరు ఫిలిప్స్ అనుకుంటా.”

“ఫిలిప్స్ ఆ? వాళ్ళది విరివాల్టా యేనా?” వున్నట్టుండి పెక్ ఆత్రంగా ఈ సంభాషణలో జొరబడింది.

“అదే అయివుంటుంది. పిల్లల నోటినుంచి ఆ పేరు బాగానే విన్న ఙ్ఞాపకం.” ఆమె వంక చిరాగ్గా చూస్తూ అన్నాడు డెంస్టర్.

“ఆవిడ  అంత బాగుందా?”

“హబ్బో! ఏం చెప్పను! చెక్కిన శిల్పం లాగుంది. అయితే పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు. నోరెత్తిందంటే చెవులు మూసుకోవాల్సిందే. ఆ భర్త ఆమె అందచందాలకే దాసోహమైనట్టుంటాడు. ”

“బాగా డబ్బున్నవాళ్ళేనా?” ఆశగా అడిగింది.

“అయే వుండొచ్చు. నేను లండన్ లో వాళ్ళింటికెళ్ళాను. ఇల్లదీ పెద్దగా బాగానే వుంది.”

“ఎంత మంది పిల్లలు? ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి! నాకు వాళ్ళు చాలా కాలం కింద తెలుసు.”

“పడవ మీద నలుగురున్నారు. ఒక పాప విషజ్వరం సోకి పోయిందన్నారు. కానీ, పడవ మీద ఆవిడ గర్భవతి కాబట్టి ఈ పాటికి పురుడయే వుండాలి. ”

“వాళ్ళాయన కూడా పడవలో వచ్చాడా?”

“వచ్చాడు కానీ మీకు వాళ్ళెలా తెలుసు?” డెంస్టర్ కుతూహలంగా అడిగాడు.

” చాలా యేళ్ళ కింద వాళ్ళింట్లో పని మనిషిగా చేసేదాన్ని. అప్పుడు అంత డబ్బున్నవాళ్ళేం కాదు, ఇప్పుడెలా సంపాదించారో కాని!”

“ఎలాగేముంది? అందర్లాగే! ఫిలిప్స్ చాలా కష్టపడి పని చేస్తాడు. లండన్ లో వాళ్ళ ఇల్లు మాత్రం చాలా బాగుండేది.”

“వాళ్ళకొక గుర్రబగ్గీ కూడా వుండి వుండాలే,” కాస్త వెటకారం జోడించింది పెక్.

“గుర్రబ్బగ్గీ మాటేమో కానీ, ఆ మధ్య వాళ్ళు యూరోప్ అంతా తిరిగొచ్చారు. ఆ ప్రయాణం లో శ్రీమతి ఫిలిప్స్ కూడా ఒక పనమ్మాయిని కూడా తీసికెళ్ళిందట.”

“అబ్బో! పనమ్మాయి కూడానా? ఇంకేం! మరి పిల్లల చదువులూ….”

“దానికొక టీచర్ని ఇంట్లోనే వుండేలా పెట్టుకున్నారు. ఆవిడ చెల్లెలే ఈ పనమ్మాయి. ఆ పనమ్మాయి కూడా అందంగా నాజూగ్గా వుండేది. ఆ టీచరమ్మ మామూలుగా వున్నా, బలే చదువుకున్నది!”

“పనమ్మాయి బాగుండడేమిటి నా మొహం!”

“అంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళూ బాగా బ్రతికి చెడ్డవాళ్ళట. చాలా ధనవంతుల ఇంట్లో పెరిగి చదువుకున్నారు కానీ, అకస్మాత్తుగా నిలవనీడ కూడా పోయేసరికి ఇలా దొరికిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ సంగతి పేపర్లలో కూడా వచ్చిందటగా. అదే, ఆ స్కాట్ లాండు భూస్వామి, హొగార్త్ మేనకోడళ్ళు,” ఉత్సాహంగా వివరించాడు డెంస్టర్.

“అంటే పేపర్లలో మెల్విల్ అక్క చెల్లెళ్ళని రాసారు, ” పెక్ మొహం ఉన్నట్టుండి వెలిగిపోయింది. దాన్ని దాచుకోవడానికి ఆవిడ శతవిధాలా ప్రయత్నించింది.

“నేనా కథంతా పేపర్లలో చదివాలెండి. మనలాటి చప్పిడి జీవితాలలో కాస్త ఇలాటి కథలేగా సరదాగా వుండేవి. అయితే ఇప్పుడు ఫిలిప్స్ ఇంటి నిండా జనమే నన్నమాట. భార్యా భర్తలూ, పిల్లలూ, పని వాళ్ళూ…”

“ఆ ఆ! వాళ్ళతోపాటు స్టాన్లీ చెల్లెలు కూడా వుండేది. హేరియట్ అనుకుంటా ఆమె పేరు.”

“పిల్లలెలా వున్నారు? నేను పెద్ద పిల్ల నెలలపాపగా వున్నప్పుడు చూసాను వాళ్ళని అంతే.

బాగా చదువుకుంటున్నారా?”

“వాళ్ళ టీచరు చాలా తెలివైంది కాబట్టి..”

“ ఆ టీచరమ్మ చదువు నేనూహించగలను లెండి. చచ్చిపోయిన క్రాస్ హాల్ హొగార్త్ కి బోలెడంత చదువు పిచ్చి వుండేది.”

డెంస్టర్ ఆశ్చర్య పోయాడు.

“ఓ! అయితే మీకు ఆ ఎస్టేటు, వాళ్ళంతా తెలుసా? అయితే మీకు ఫ్రాన్సిస్ హొగార్త్ కూడా తెలుసా? అదేనండీ, ఈ మధ్యే ఎన్నికల్లో అక్కడ పార్లమెంటుకి ఎన్నికయ్యాడూ!”

“ఏమిటీ? ఎన్నికల్లో కూడ పోటీ చేసాడా?” అక్కసు దాచుకోలేకపోయింది పెక్. ఆమె మొహంలో కోపామూ, గొంతులో ఈర్ష్యా అర్థం చేసుకుని ఆశ్చర్య పోయాడు డెం స్టర్.

“వాడు తెలియకపోవడ మేం ఖర్మ. మీకే వాడి బ్రతుకు గురించి తెలియదు. కొన్ని కొన్ని కథలు చెప్పానంటే.. అయినా చెప్పాల్సిన సమయమొస్తే కాని చెప్పకూడదేదీ. అయినా నాకెందుకులే…” డెంస్టర్ కెందుకో ఆమెతో సంభాషణ రుచించక మౌనంగా వుండి పోయాడు.

“మిసెస్ పెక్! మీరసలేమీ తినడం లేదు,” శ్రీమతి ఫ్రాంక్ లాండ్ మర్యాదగా మాట మార్చింది.

“సరిగ్గా తిన బోయే ముందు ఒక చెడ్డ వార్త విన్నానమ్మా! తినాలన్న ధ్యాసే పోయింది కానీ, ఏం చేస్తాం, తినక తప్పదుకదా! ఈ టీ చల్లారిపోయింది. ఇంకొక కప్పు వేడి టీ తీసుకురామ్మా! అలాగే తినడానికింకేమైనా…” అంటూ మిసెస్ పెక్ కడుపు నిండా తిని, రెండు గ్లాసుల బ్రాందీ తాగి, పెక్ ని బయటికి పంపేసింది కాసేపు ఆలోచించాలంటూ. ముందు మెల్బోర్న్ చేరడానికెలాగైనా డబ్బు పుట్టించాలి. ముందున్న ఈ డెంస్టర్ నే ముంచితే సరి! తన మీద చిరాకుతో మొహం అటు తిప్పి కూర్చున్న డెంస్టర్ కేసి చూసిందామె. మొహమంతా పేద చిరునవ్వు పులుముకుంది. అతనికి చెప్పడానికి అందమైన కథను సిధ్ధం చేసుకుంది.

**********************

వీలునామా – 32 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

బ్రాండన్ ప్రేమలేఖ

మేనల్లుడు ఎడ్గర్తోసహా మెల్బోర్న్ చేరుకున్న బ్రాండన్ హుటాహుటిని తన ఎస్టేటు బార్రాగాంగ్ చేరుకున్నాడు. అయితే అక్కడ పరిస్థితి తనూహించినంత దారుణంగా లేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అతని మేనేజరు స్వతహాగా కొంచెం భయస్తుడు కావడంతో బ్రాండన్ ని ఊరు రమ్మని కబురుచేసాడే కానీ, ఎస్టేటు డబ్బు వ్యవహారమంతా సజావుగానే వుంది.

ఆమాటకొస్తే ఫిలిప్స్ ఎస్టేటు విషయాలే కొంచెం తల్ల క్రిందులుగా నడుస్తున్నట్టనిపించింది బ్రాండన్ కి. స్టాన్లీ ఒకసారి వచ్చి తన ఎస్టేటు వ్యవహారాలమీద ఒక కన్నేసి ఉంచడం మంచిదేమో అనుకున్నాడు. వీలైతే ఈ విషయమై స్నేహితుణ్ణీ ఒకసారి చూచాయగా హెచ్చరించాలనీ అనుకున్నాడు. అయితే స్టాన్లీ మేనేజరు డాక్టరు గ్రాంట్ మాత్రం అంతా హాయిగానే వుందని ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించేస్తున్నాడు.

కొద్దిరోజులు ఎస్టేటు పనులు చూసుకుని, ఒకరోజు ఎల్సీ కొక ఉత్తరం రాయాలని కూర్చున్నాడు బ్రాండన్. హేరియట్ తో తనకింకే సంబంధమూ లేదనీ, తన మన్సులో ఎల్సీ పట్ల ప్రేమ కొంచెమైనా తగ్గకపోగా, ఇంకా పెరిగిందనీ, ఇంకా చాలా చాలా విషయాలు రాయాలనుకున్నాడు. అయితే ఇలాటి వన్నీ ఎదురుగా కూర్చుని చెప్పడం అయితే చేయొచ్చుగానీ, రాయడం కొంచెం కష్టమే. అందులోనూ భాష మీద పెద్దగా పట్టులేని బ్రాండన్ లాటి మగవాడికి.

ఎదురుగా అయితే, మెత్తటి ఆమె చేయి పట్టుకుని, కళ్ళల్లోకి చూస్తూ, మనసులోని ప్రేమనంతా గొంతులోకి నింపుకోవచ్చు. అప్పుడు ఒక్క మాటలో, లక్షలకొద్దీ భావాలు పంచుకోవడానికి వీలవుతుంది. కానీ, ఏమాత్రం హృదయం లేని కాగితమూ, కలం సహాయంతో మనసు లోతుల్లోని భావాలనెలా మాటల్లోకి మార్చడం? అందులోనూ, తను ఆమె నిరాకరించగానే ఇంకా ప్రాధేయపడడం మానేసి వెంటనే మరొక అమ్మాయితో పెళ్ళి నిశ్చయం చేసుకొచ్చాడు. అతనికి హేరియట్ ఫిలిప్స్ కానీ, ఆమెతో తనకి తప్పిపోయిన పెళ్ళి కానీ గుర్తొస్తే మనసంతా చేదు మింగినట్టనిపిస్తుంది. తనలాటి తెలివి తక్కువ దద్దమ్మనీ, చపల చిత్తుణ్ణీ ఎల్సీలాటి దేవత క్షమించి ప్రేమిస్తుందా? ఈ అందోళనతో అతను దాదాపు అర డజను ఉత్తరాలు రాసి చించేసాడు. అందులోనూ ఆమె ఎంతో చదువుకుని కవిత్వంకూడా రాయగల స్త్రీ. తన లాటి విద్యాగంధం లేని మొరటు మనిషి కాదు.

ఇంగ్లండులో వుండగానే చెప్పడానికి వీలు కాకపోయింది. కొంపలంటుకున్నట్టు కబురుచేసి తనని రప్పించిన మేనేజరుని కొట్టాలన్నంత కోపం వచ్చిందతనికి. ఆఖర్న వచ్చే రోజన్నా చెప్దామంటే శని గ్రహం లా పట్టుకుని వదల్లేదు హేరియట్. అతనికి చుట్టూ వున్న మనుషులందరిమీదా చిరాకు ముంచుకొచ్చింది.

పోనీ, ఎమిలీ తోనో జేన్ తో నైనా చెప్పి రావాల్సిందేమో. వయసుకి చిన్నదైనా ఎమిలీ తెలివైనది, అర్థం చేసుకోగలదీ. ఇహ జేన్ కీ ఎల్సీ కి వున్న అనుబంధమైతే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళిద్దర్లో ఒకరు తప్పక ఎల్సీకి తన మనసులోని మాట వివరంగా చెప్పేవారు.

ఎల్సీ చాలా మంచి అమ్మాయి. ఒక్కసారి కనక తను ఆమె లేకపోతే బ్రతకలేడన్న విషయం ఆమెకి అర్థమైతే చాలు. అది ఆమెకి అర్థం అయేలా చెప్పడం ఎలాగో తోచడం లేదతనికి.

మొత్తానికి ఆ రాత్రంతా కూర్చుని ఎలాగో ఉత్తరాన్ని పుర్తి చేసాడు బ్రాండన్. అది అతనికి కావల్సినంత బాగా రాలేదు కానీ, ఇహ ఓపిక లేకపోయిందతనికి. పైగా ఆ మర్నాడే పోస్టు వెళ్ళిపోతుంది. ఉత్తరం పోస్టులో వెళ్ళిపోయింతర్వాత అతనికి టెన్షన్ తో కాలు నిలవలేదు. పైగా ఫిలిప్స్ కుటుంబం కూడా దగ్గర లేదు. అందులోను స్టాన్లీ పిల్లలంటే బ్రాండన్ కి చాలా ఇష్టం కూడాను.  అతనికి దిగులుగా కాలం భారంగా సాగుతున్నట్టనిపిస్తూంది.

ఫిలిప్స్ మేనేజరు డాక్టరు గ్రాంట్ ఏమాత్రం నచ్చలేదు బ్రాండన్ కి. ఫిలిప్స్ ని రమ్మని రాయాలి, మళ్ళీ అనుకున్నాడు బ్రాండన్. గ్రాంట్ డబ్బు లెక్కలు నమ్మదగ్గవిగా అనిపించడంలేదు, పనివాళ్ళ మీద చలాయించే అధికారం బాగాలేదు. అతని శైలి నచ్చని పనివాళ్ళందరూ ఎస్టేటు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక మీదట ఫిలిప్స్ ఎస్టేటు విర్రావిల్టా వ్యవహారలన్నీ తానే చూసుకుంటానని చెప్పి బ్రాండన్ డాక్టర్ గ్రాంట్ ని తప్పించాడు. సహజంగానే గ్రాంట్ చాలా అవమాన పడ్డాడు. దానికి తోడు వచ్చే పై అదాయం కూడా తగ్గిపోతుందాయే.

veelunama11

అయితే ఎస్టేటులో పనివాళ్ళు మాత్రం ఫిలిప్స్ చిరకాల మిత్రుడు బ్రాండన్ కళ్ళాలు చేతిలోకి తీసుకోవడం చూసి చాలా సంతోషపడ్డారు. కొన్నళ్ళు ఆ పని హడావిడితో గడిచిపోయింది.

ఈలోగా ఎడ్గర్ కొత్త ప్రదేశానికి బానే అలవాటు పడ్డాడు. మేనమామ బ్రాండన్ కి బాగా చేరువయ్యాడు కూడా. సొంతంగా వ్యవహరించడం, గుర్రపు స్వారీ, పరిసరాలని నిశితంగా పరిశీలించడం లాటి వెన్నో నేర్చుకున్నాడు ఎడ్గర్. అతని తెలివితేటలూ, కష్టపడే మనస్తత్వమూ చూసి బ్రాండన్ ముచ్చటపడ్డాడు.

ఒకనాడు- మామూలు కబుర్లలో తనకి ఆస్ట్రేలియా చుట్టి తిరిగాలని వుందన్నాడు ఎడ్గర్. వింటున్న బ్రాండన్ కి వెంటనే తాము కొంచెం అలా తిరిగి ఆస్ట్రేలియాలోని మిగతా పట్టణాలు చూసి వస్తేనో, అనిపించింది. అన్నిటికంటే అడిలైడ్ పట్టణం చూడాలని అతను ఎన్నో రోజులనించి అనుకుంటున్నాడు. అక్కడ ముఖ్యంగా ఒక కొత్త రకం గొర్రెలు దొరుకుతున్నాయనీ, వీలైతే ఒక చిన్న మంద ని కొందామనీ అనుకున్నాడు. ప్రయాణమూ, పనిలో తలమునకలుగా వుంటే ఎల్సీ జవాబు కోసం ఎదురు చూడడం అంత దిగులుగా వుండకపోవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తూ ఎల్సీ తన ప్రేమనంగీకరిస్తే, తను ఉన్నపాటున వెళ్ళి ఆమెని పెళ్ళాడి ఇక్కడకి తీసుకొచ్చే పని ఎలాగూ వుంటుంది. అందుకే ఇప్పుడు అలా నాలుగు వూర్లూ తిరిగి తన ఎస్టేటు కి కావాల్సిన కొత్త రకాల గొర్రెలని కొనడం మంచిది.

మేనమామ ప్రయాణానికొప్పుకోగానే ఎగిరి గంతేసాడు ఎడ్గర్. గబగబా ప్రయాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టాడు. అతని చురుకుతనమూ, హడావిడీ చూసి వుంటే అతని తల్లి ముక్కున వేలేసుకునేది. ఇంగ్లండులో వుండగా తల్లి చాటు బిడ్డగా, అమాయకంగా వుండిన ఎడ్గర్ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించడమూ, ఇష్టాఇష్టాలు చెప్పడమూ నేర్చుకున్నాడు. అతను చేస్తున్న శారీరక శ్రమా, ఒంటరిగా పరిసరాలను పరిశోధిస్తున్న అతని ధైర్యమూ చూస్తే అతని తల్లి భయంతో గడగడా వొణికిపోయేది. కొన్నాళ్ళు తల్లికి దూరంగా వుందడం అతనికి మంచి చేసిందనే చెప్పాలి.

మామా అల్లుళ్ళిద్దరూ దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ పట్టణం చేరుకున్నారు. ఇక్కడ ప్రజలు కొంచెం అమాయకంగా, అందర్ని నమ్మేస్తూ వున్నారే, అనుకున్నారు అడిలైడ్ లోని మనుషులని చూసి.

అడిలైడ్ లో హోటల్లో దిగగానే బ్రాండన్ గొర్రెల మంద ఖరీదు చేయడానికి వెళ్ళిపోయాడు. స్టాన్లీ ఫిలిప్స్ కోసం కూడా ఖరీదు చేసాడు. ధర నచ్చడంతో ఇద్దరికీ కలిపి ఒక మందను కొని ఆ పని పుర్తి చేసి, నగరం చూడడానికి ఎడ్గర్ తో సహా బయల్దేరాడు.

ఎడ్గర్ మెల్బోర్న్ కంటే అడిలైడ్ అందంగా వుంది అనుకున్నాడు. బ్రాండన్ మెల్బోర్న్ తో పోలిస్తే అడిలైడ్ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వుందనుకున్నాడు. ధనవంతులు కూడా తక్కువే ననిపించింది. అయితే ఖరీదులు మాత్రం తక్కువే. ఎస్టేటులూ, ద్రాక్షతోటలూ, జీవన విధానమూ మెల్బోర్న్ కంటే అడిలైడ్ లో బాగున్నాయనుకున్నారు ఇద్దరూ.

మెల్బోర్న్ లో వుండే డబ్బంతా బంగారం తవ్వకాలనించి వచ్చిందే. ఆ పనులు చేసుకునే వాళ్ళు కొంచెం మొరటుగా వుంటారు. ప్రభుత్వ నియంత్రణలూ ఎక్కువే. దక్షిణ ఆస్ట్రేలియా ధనమంతా ద్రాక్ష తోటలూ, వైన్ తయారీ, పశు సంపదా నించి వచ్చింది. సహజంగా ఈ వ్యాపారాలు చేసే వారు ధనవంతులూ, విద్యావంతులూ అయివుంటారు. అందువల్ల సంఘంలో కొంచెం నాజూకూ, నాగరికతా కనిపిస్తాయి.

వాళ్ళిద్దరూ అడిలైడ్ లోని యార్క్ హోటల్ లో బస చేసారు. బ్రాండన్ తనకి లండన్ లో పరిచయమైన స్నేహితులని కలిసాడు. వాళ్ళు ఇంకొందరు స్నేహితులని పరిచయం చేసారు. చాలా మంది పెళ్ళి కావల్సిన ఆడపిల్లలూ కనపడ్డారతనికి. అయితే మనసంతా ఎల్సీ ఆలొచనలతో నిండి వుండడం వల్ల అతను ఎవరినీ శ్రధ్ధగా చూడలేదు. తనకేదైనా ఉత్తరం వస్తే అది వెంటనే అడిలైడ్ లో హోటల్ కి పంపాల్సిందని అతను తన మేనేజరు టాల్బాట్ కి పదే పదే చెప్పాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా అతను ఎదురుచూస్తున్న ఉత్తరం రానేలేదు.

ఒక నెల రోజుల కింద ఎమిలీ దగ్గరనించి వచ్చిన ఉత్తరం తర్వాత ఇంకే ఉత్తరమూ లేదు. ఆ ఉత్తరంలో ఎమిలీ అందరూ జ్వర పడ్డారనీ, చిన్నది ఈవా మరణించిందనీ, తాము మాత్రం కోలుకుంటున్నామనీ రాసింది. ఆ తరవాత ఇక ఏ సమాచారమూ లేదు వాళ్ళ దగ్గర్నించి. ఈ పాటికి తన ఉత్తరానికి జవాబూ రావాలి. మరి ఏమైందో! తనకీ ఏదైనా జబ్బు చేసిందేమో. అలాగైతే జేన్ తో నైనా రాయించొచ్చుగా?  లేకపోతే ఇద్దరూ జబ్బు పడ్డారేమో! అతనికి ఏ విషయమూ తెలీక పిచ్చెత్తేలాగుంది. అలాటి అల్లకల్లోలంగా వున్న మనసుతోనే బ్రాండన్ మేనల్లుడితో సహా మెల్బోర్న్ తిరిగి వచ్చి చేరాడు.

***

(సశేషం)

వీలునామా – 31 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మరొక వీడుకోలు

ఇంగ్లండు వదిలి మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నామన్న ఊహతోనే ఎమిలీ ఆరోగ్యం కుదుటపడసాగింది. స్టాన్లీ ఇంగ్లండు వదిలి వెళ్ళేముందు ఒక్కసారి ఎమిలీని తీసికెళ్ళి పెగ్గీకి చూపించాలనుకున్నాడు. తన చేతుల్లో పుట్టిన ఫిలిప్స్ పిల్లలని ఒక్కసారి చూడాలని పెగ్గీ ఎన్నోసార్లు అనుకుంది.

పిల్లలని తీసుకుని ఫిలిప్స్ దంపతులూ, జేన్ స్కాట్లండు బయల్దేరారు. ఎల్సీ ప్రయాణం పైన పెద్దగా ఉత్సాహం చూపించలేదు, పైగా ఇంటిల్లిపాదికీ సరిపడా బట్టలు కుట్టడంలో తల మునకలుగా వుండిపోయింది.

ఫిలిప్స్ కూతుళ్ళిద్దరినీ, జేన్ నీ చాలాకాలం తర్వాత చూసిన పెగ్గీ చాలా సంతోషపడింది. అందరూ నాలుగు రోజులు పెగ్గీ ఇంట్లో సందడిగా గడిపారు.  లిల్లీ అందాన్నీ, పిల్లల ముద్దు ముచ్చట్లూ చూసి పెద్దాయన టాం లౌరీ ఎంతో సంబరపడ్డాడు. జేన్ ని కలిసి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కూడా ఒకరోజు ఎస్టేటు నించి వచ్చాడు. అక్కణ్ణించే జేన్ వెళ్ళిపోవడం ఫ్రాన్సిస్ కే మాత్రం నచ్చలేదు.

“జేన్, ఇంగ్లండు మొత్తానికే వదిలి వెళ్ళేముందు ఒక్కసారైనా ఎస్టేటుకొచ్చి చూడవా? క్రాస్ హాల్ కి రాకుండానే వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో!”ఫ్రాన్సిస్ వేడుకున్నాడు. పల్లెటూర్లో ఎస్టేటుకి ప్రయాణం మాటేత్తగానే అందరికంటే ముంది ఎమిలీ ఎగిరి గంతేసింది.

“క్రాస్ హాల్! పేరు భలే వుందే! అదే మీ ఎస్టేటు పేరా? ఎప్పుడూ ఎల్సీ మాట్లాడుతూ వుంటుంది దాని గురించేనన్న మాట. వెళ్దాం! వెళ్దాం!వెళ్దాం!” గంతులేసింది.

లిల్లీ కూడా,

“నాకూ చూడాలనే వుంది. స్టాన్లీని అడుగుదాం. తప్పక తీసికెళ్తాడు!”  అంది.

నిజానికి జేన్ కి స్కాట్లాండు ప్రయాణమే ఇష్టం లేకపోయినా విధి లేక ఒప్పుకుంది. ఇప్పుడు క్రాస్ హాల్ కి వెళ్ళడమంటే పాత ఙ్ఞాపకాలతో మనసుని మళ్ళీ గాయపర్చుకోవడమేనని తెలుసామెకి. అందుకే వెళ్ళకుండా వుండాలని చాలా ప్రయత్నం చేసింది. కాని ఆమె మాట ఎవరూ వినిపించుకోలేదు. విధిలేక అందరి వెంటా జేన్ కూడా ప్రయాణమైంది.

రైలు దిగగానే ఫ్రాన్సిస్ ఆమె కొరకు పంపిన గుర్రపు బగ్గీలోకెక్కారందరూ. స్టేషను నించి ఎస్టేటు అయిదు మైళ్ళ దూరం. తనకు బాగా అలవాటైన మేనమామ గుర్రపు బగ్గీలో, తను స్వతంత్రంగా తిరిగిన వూళ్ళో, ఇప్పుడు అతిథిలా, దిక్కూ మొక్కూ లేని అనాథలా తిరిగి రావడం జేన్ కి దుర్భరంగా వుంది.

బగ్గీలో ప్రయాణం చేస్తూ వుండగానే ఆమెకి విలియం డాల్జెల్ తన కొత్త భార్యతో సహా కనిపించాడు. ఎస్టేటు వెళ్ళేదారిలోనే వున్న మిస్ థాంసన్ గారి ఇంటి దగ్గర ఆగారు.

మిస్ థాంసన్ ఇంట్లో జేన్ మొదటిసారి ఫ్రాన్సిస్ ఎన్నికల ఏజెంటు సింక్లెయిర్ ని కలిసింది. అయితే ఆ యింట్లో సింక్లెయిర్ కన్నా ఆమెని ఆకర్షించింది మేరీ ఫారెస్టర్, మిస్ థాంసన్ మేన కోడలు. మేరీ ఊరికే కొద్దిరోజులు అత్త ఇంట్లో ఉండిపోదామని వచ్చింది. మిస్ థాంసన్ ఇంట్లో ఉండే మిగతా పిల్లల సమ్రక్షణ లో తల మునకలుగా వుంది.

మేరీ నవ్వు మొహమూ, తెలివితేటలూ, సౌమ్యతా జేన్ కి చాలా నచ్చాయి. శీతాకాలపు ఉదయం సూర్య కాంతిలా ఇల్లంతా పరచుకోని వుంది మేరీ, అనుకుంది జేన్. ఫిలిప్స్ పిల్లలూ, థాంసన్ ఇంట్లో పిల్లలూ క్షణాల్లో కలిసిపోయారు.

వాళ్ళని ఆటల్లో వదిలి మేరీ, జేన్ కబుర్లలో పడ్డారు. అప్పటికే మేరీ జేన్ గురించి ఎంతో విని వుండడం మూలాన కుతూహలంగా చూసింది జేన్ వైపు. వాళ్ళు మాటల్లో వుండగానే జేన్ మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది.

ఈ అమ్మాయి ఇదే వూళ్ళో ఉండేటట్టయితే, బహుశా ఫ్రాన్సిస్ ఈ అమ్మాయినే పెళ్ళాడొచ్చు, అనుకున్నదామె. ఆ ఊహకి ఆధారం లేదు, నిజానికి. అయితే ఆ ఊహ వల్ల తన మనసులో రేగే భావం ఎలాటిదో కూడా జేన్ తేల్చుకోలేకపోయింది.

“జేన్!  మీ గురించి నేనెంత విన్నానో చెప్పలేను. మిమ్మల్ని చూస్తూంటే నాకెంతో ఈర్ష్యగానూ వుంది. మీరు బయట ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారోనని ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురు చూసారంటే నమ్మండి.  స్టాన్లీ ఫిలిప్స్ గారి దగ్గర ఉద్యోగం లో చేరడం విని అందరూ తెరిపిన పడ్డారు.  మీ ఫ్రాన్సిస్ కూడా పదే పదే మిమ్మల్ని తలచుకుని బాధ పడేవాడు. ఆయన కూడా మీకు దొరికిన ఉద్యోగాన్ని చూసి సంతోషపడ్డారు. ఆయనలాటి సున్నిత మనస్కులకి మిమ్మల్ని నడివీథిలోకి నెట్టి ఆస్తి అనుభవించే మొరటుదనం వుండదు కదా?”  అన్నది.

“అవును మేరీ! ఫ్రాన్సిస్ ఎంత మంచి వాడో నాకు బాగా తెలుసు. అయినా, భగవంతుని దయవల్ల నేనూ మా చెల్లాయి ఎల్సీ క్షేమంగానే వున్నాము.”

“జేన్! నిజానికి నాకు మీతో పోల్చి నన్ను చూసుకుంటే సిగ్గుగా వుంటుందండీ! మిమ్మల్ని మీ మామయ్య గారు చదివించి పెంచి పెద్ద చేసినట్టే మమ్మల్నందరినీ మా అత్త మార్గరెట్ థాంసన్ చదివించి పెద్ద చేసింది. అయినా మేమే రకంగానూ పొట్ట పోసుకోలేకుండా ఆమెకి భారంగానే వున్నాము. నాతో సహా నలుగురం ఆడపిల్లలం వున్నాం. అందర్లోకీ చిన్నది గ్రేస్ ఒక్కతే ఇంకా స్కూల్లో వుంది. మిగతా అందరమూ పెద్ద వాళ్ళమే, అయినా ఉద్యోగం సద్యోగం లేకుండ ఇలా బంధువుల దయా ధర్మాలతో వెళ్ళదీస్తున్నాము. మీలాగే నేను బయటెక్కడికైనా వెళ్ళి ఉద్యోగం వెతుక్కుందామనుకున్నాను. అయితే, అత్త ఈ చలికాలం ఇక్కడే తనకి సాయంగా వుండమనీ, కావాలంటే ఆ తర్వాత వెళ్ళమనీ అంది. నాకూ ఏదైనా ఉద్యోగం వెళితే బాగుండు. మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారట కదా? అక్కడ నాకేదైనా ఉద్యోగానికి అవకాశం వుంటే చూస్తారా?” ఆశగా అడిగింది.

“అయితే ఈ చలికాలం అంతా ఈ ఊళ్ళోనే వుంటావన్నమాట!” అంది జేన్ ఆమె ప్రశ్నకి జవాబివ్వకుండా, ఆసక్తిగా.

“అవును. ఇక్కడ అత్తా వాళ్ళింట్లో నాకు బాగా అలవాటే. సింక్లెయిర్ కూడా చాలా సాయంగా వుంటారు.”

“మీ అత్తకి మా ఫ్రాన్సిస్ కూడా చాలా నచ్చినట్టున్నాడు కదూ?”

“ఆ మాటా నిజమే. అసలు మీరిక్కడ వున్నప్పుడే ఆయన కూడా మీతోపాటే వుంటే బాగుండేది కదా?” అంది మేరీ అమాయకంగా. జేన్ నవ్వి, ఆమెని హత్తుకుని, వీడుకోలు చెప్పి క్రాస్ హాల్ ఎస్టేటుకి బయల్దేరింది.

క్రాస్ హాల్ ఎస్టేటులో భవంతీ, గదులూ తాము వున్నప్పుడెలా వుండేవో సరిగ్గా అలాగే వున్నాయి. ఫ్రాన్సిస్ ఏదీ మార్చనీయలేదు. భోజనం చేసి, లిల్లీ, పిల్లలూ విశ్రాంతి తీసుకుంటుంటే, ఫ్రాన్సిస్ స్టాన్లీనీ, జేన్ నీ ఎస్టేటంతా తిప్పి చూపించాడు. ఎస్టేటు పనివాళ్ళ కోసం, పాలేర్ల కోసం తను కట్టించి యిచ్చిన పక్కా యిళ్ళూ, చిన్న చిన్న పొలం ముక్కలూ అన్నీ తిప్పి చూపించాడు. పని వాళ్ళూ, పాలేర్లూ అందరూ జేన్ ని గుర్తుపట్టి పలకరించారు. ఇంట్లో నౌకర్లయితే జేన్ తో అన్ని కబుర్లూ చెప్పించుకొని గానీ వదల్లేదు. ఉద్యోగం ఎలా వుందో ఎల్సీ ఆరోగ్యం ఎలా వుందో, అసలు పెగ్గీ ఇంట్లో ఎలా సర్దుకునారో, అన్ని విషయాలూ మర్చిపోకుండా అడిగి మరీ చెప్పించుకున్నారు.

అందరితో కరువు తీరా మాట్లాడి జేన్ తనకని కేటాయించిన గదిలోకి వెళ్ళింది. పూర్వాశ్రమంలో ఆ గదినే తానూ, చెల్లీ పదిహేనేళ్ళపాటు వాడుకున్నారు. అంతా తను ఉన్నప్పుడు ఎలావుండేదో అలాగే ఉంది. రాత టేబిలూ, పడకా, దిండూ, దుప్పటీ అన్నీ అలాగే సర్దించాడు ఫ్రాన్సిస్. జేన్ మనసంతా ఒకలాటి ఆనంద విషాదాల్తో నిండిపోయింది. తన పూర్వపు గదిని చూసిన ఆనందం, ఇక ఆ గదికీ తనకీ ఋణం తీరిపోతుంది కదా అన్న విషాదమూ అలముకున్నాయామెని.

“పెద్దమ్మాయి గారూ? ఏదైనా కావాలాండీ?” సూసన్ తలుపు తట్టి లోపలికొచ్చింది.

“లేదులే సూసన్,” అనబోయింది జేన్. కానీ ఈ క్షణం లో తనకి ఇంకో మనిషి తోడూంటే బాగుండనిపించింది.

“లోపలికి రా సూసన్. కొంచెం తల దువ్వుతావా? బాగా అలసటగా వుంది,” అంది.

సూసన్ లోపలికొచ్చి దువ్వెన తో జేన్ తల దువ్వసాగింది.

“ఇక్కడంతా మీకు బాగానే వుంది కదా అమ్మాయి గారూ? ఫ్రాన్సిస్ సారయితే మీకే ఇబ్బందీ కలగకూడదని లక్ష సార్లు చెప్పారు. మీ గది కూడా దగ్గరుండి సర్దించారు,” సూసన్ చెప్పింది.

“లేదు సూసన్. అంతా బానే వుంది. ఎల్సీ ఇప్పుడు ఇక్కడ నాతో వున్నట్టయితే నేనసలు ఇక్కణ్ణించి వెళ్ళిపోయానన్న విషయం కూడా మర్చి పోయేదాన్ని. మీరంతా కూడా హాయిగా బాగున్నారు. ఇహ నేనే దిగులూ లేకుండ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను.”

ఉన్నట్టుండి జేన్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆ ఇంటినీ, ఫ్రాన్సిస్ నీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలేమో అన్న ఆలోచన ఆమెని అతలాకుతలం చేసింది కాసేపు.

     ***

ఆ రాత్రి భోజనాల బల్ల దగ్గర కూడా జేన్ ఏమీ మాట్లాడలేకపోయింది. భోజనాలు ముగిసింతర్వాత ఫిలిప్స్ కుటుంబం నిద్రకి ఉపక్రమించారు. జేన్ లేచి వెళ్ళబోతూండగా

“జేన్, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మార్పులు చేసింతరవాత లైబ్రరీ గది కూడా చూడలేదు. అక్కడ కాసేపు కూర్చుందాం రా! మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానే ఏమో! నీకు నౌక దగ్గరికొచ్చి వీడుకోలు చెప్పే ధైర్యం నాకు లేదు.” ఫ్రాన్సిస్ కూడదీసుకుని అన్నాడు.

మౌనంగా జేన్ అతని వెంట లైబ్రరీ గదిలోకి నడిచింది. ఆ రోజు మేనమామ ఉత్తరాలు ఫ్రాన్సిస్ తో కలిసి చదివిన తర్వాత ఆమె ఆ గది మళ్ళీ చూడలేదు.

ఫ్రాన్సిస్ టేబిల్ సొరుగు తెరిచి కొన్ని కాగితాలూ, కొంచెం డబ్బు పట్టుకొచ్చాడు.

“జేన్! గుర్తుందా? నువ్వు మీ గదిలో వున్న సామానంతా అమ్మేసి ఆ డబ్బు మీకివ్వమని అడిగావు. ఆ సామాను నాకు చాలా ఇష్టం. ఈ ఇంట్లో అదీ ఒక ముఖ్య భాగమనిపిస్తుంది నాకు. అందుకే ఆ సామానంతా నేనే కొనేసాను. మార్కెట్ లో వాటి ధర ఎంతుంటుందో ఖచ్చితంగా లెక్క వేయించాను. ఆ లెఖ్ఖంతా ఈ కాగితాల్లో వుంది. ఇదిగో డబ్బు. ఈ డబ్బు నీదే. ధర్మంగా నీకు ఒక్క కానీ కూడా ఇవ్వడంలేదు నేను. నీ స్వాభిమానం ఎంత విలువైనదో నాకు తెలుసు. ఆస్ట్రేలియా చాలా దూర దేశం. ఈ డబ్బు నీకు పనికొస్తుంది. కాదనకుండా వుంచుకో!” డబ్బూ కాగితాలూ ఆమె చేతిలో పెట్టాడు.

మౌనంగా అవన్నీ అందుకుంది జేన్.

“జేన్, నేను ఎస్టేటులో చేసిన మార్పులు నచ్చాయా? పార్లమెంటులో నేను చేసిన ప్రసంగాలు నచ్చాయా?” ఆశగా అడిగేడు.

గొంతు పెకలని జేన్ మళ్ళీ మౌనంగా తలాడించింది.

“జేన్! ఇవాళ నేనీ స్థితిలో వున్నానంటే దానికి కారణం నువ్వే. నీ ప్రోత్సాహమూ, చేయూతా లేకపోతే నేను ఈ పనుల్లో ఒక్కటి కూడ చేయగలిగే వాణ్ణికాదు.  నన్నొదిలి అంత దూరం వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పుతుంది జేన్? నాకయితే ఎవరో నా ప్రాణాన్ని సగానికి కొసి పట్టుకెళ్తున్నంత బాధగా వుంది!”

“అది మనిద్దరికీ మంచిది ఫ్రాన్సిస్!”

“జేన్! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా నీకా విషయం అర్థమైందనుకుంటాను. ఎప్పుడైనా నీకూ నాలాగె నన్నొదిలి వుండడం బాధగా అనిపిస్తే వెంటనే నాకుత్తరం రాయి. మరుక్షణం నీ ముందు వచ్చి వాలతాను. నీ మాట మీదే నేనీ ఎస్టేటు వ్యవహారాలు తలకెత్తుకున్నాను. నీకంటే ఈ డబ్బూ ఆస్తీ నాకు ముఖ్యం కావు.”

“ఆ సంగతి నాకు తెలుసు ఫ్రాన్సిస్. అందుకే నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ఎస్టేటో, లేదా నేనో, ఏదో ఒకటే నీ జీవితంలో వుండగలిగే విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాం ఇద్దరమూ. ఈ ఎస్టేటూ డబ్బూ, రాజకీయ హోదా వుంటే నువ్వు బడుగు వర్గానికి ఎంతైనా మేలు చేయగలవు. అటువంటప్పుడు మన స్వార్థానికి లొంగి బాధ్యతలనించి పారిపోగలమా? ఆలోచించు!” జేన్ ఆవేదనగా అంది.

“సరే! నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ, ఒక్కసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకోనీ! నిన్న పెగ్గీనీ, పొద్దున మేరీనీ హత్తుకొని వీడుకోలు చెప్పావు. నన్నూ అలాగే చెప్పనీ! నీకోసం ఏదైనా వొదులుకోగలను నేను. నన్ను ఎప్పటికీ వదిలి వెళుతున్నావు జేన్!”

జేన్ మనసు కరిగిపోయింది. అతని దగ్గరగా వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా కౌగలించుకుంది.

“జేన్! ఆ పాపిష్టి వీలునామా మన జీవితాల్లోకి రాకపోయినట్టయితే, మనిద్దరికీ ఈ కౌగిలి శాశ్వతంగా దక్కి వుండేది. ఇప్పుడైనా మించిపోలేదు జేన్! మళ్ళీ ఆలోచించుకో. ప్రేమ లేకపోయాక ఎంత డబ్బూ, ఆస్తీ వుండి ఏం లాభం? ఈ పేద ప్రజల బాగుకోసం నేను నా ప్రేమని ఎందుకు వొదులుకోవాలి?” ప్రాధేయపడ్డాడు ఫ్రాన్సిస్.

“మన జీవితాలూ, ప్రేమలూ వీటన్నిటికంటే సంఘానికి మనం చేయగల మేలు ఎంతో పెద్దది ఫ్రాన్సిస్. ఇంకొన్నాళ్ళు పోతే నీకే ఈ విషయం అర్థమవుతుంది.”

“సరే! ఉత్తరాలు మాత్రం రాస్తూండు. నీ ఉత్తరాల బలంతోనే నేను బ్రతికున్నానని మర్చిపోవద్దు. వుంటా జేన్! ఎక్కడ వున్నా నువు సంతోషంగా క్షేమంగా వుండడమే నాక్కావల్సింది,” ఫ్రాన్సిస్ ఆమె చెక్కిలి నిమిరి వెళ్ళిపోయాడు.

జేన్ ఒంటరిగా ఆ గదిలో నిలబడిపోయింది. ఇదే గదిలో కొన్నాళ్ళ కింద విలియం డాల్జెల్ తో ఇలాగే అన్ని సంబంధాలూ తెంచుకుంది. ఆ రోజు ఇంత బాధా నొప్పీ అనిపించలేదు. తను చేస్తున్న పని సరికాదేమో నన్న అనుమానమే రాలేదు. బహుశా విలియం మనసులో తన పట్ల అంత పెద్ద ప్రేమ ఏదీ లేదన్న విషయం తన అంతరాత్మకి తెలిసి వుండడం వల్ల కాబోలు. ఇవాళ తన నిర్ణయం ఫ్రాన్సిస్ ని ఎంత నొప్పిస్తుందో తన మనసుకి స్పష్టంగా తెలుసు. అందుకే తను తీసుకున్న నిర్ణయం పట్ల తనకే నమ్మకం లేకుండా పోతూంది. తన జీవితంలో తనకి ఎదురైన ఒకే ఒక్క అద్భుతమైన ప్రేమని కాలదన్నుకుంటూందన్న భయం బాధిస్తూంది.

ఒక్క క్షణం ఆమెకి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలో పచార్లు చేస్తూ అద్దంలోకి చూసుకుంది. తనేమీ అద్భుతమైన అందగత్తె కాదు. చదువూ సంస్కారం తప్ప తనదీ అని చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో చిల్లి గవ్వ కూడా లేని మనిషి తను. తనని ప్రేమిస్తున్నానని ఫ్రాన్సిస్ అంటూంటే అది నిజమే అయుండాలి. తన దగ్గర ఏమాశించి అతను అబధ్ధాలాడతాడు? ఆశించడానికి తన దగ్గర ఏముందని? ఫ్రాన్సిస్ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడు. తనే మూర్ఖంగా, అర్థంలేని ఆదర్శాలతో చేతికందిన అదృష్టాన్ని కాలదన్నుకుంటోంది.

కానీ ఫ్రాన్సిస్ మంచి నాయకుడిగా రూపు దిద్దుకుంటున్న మాటా నిజమే. తన మాటను తూచ తప్పకుండా పాటించేంత నమ్మకం అతనికి తనమీద. తన ఆలోచనలూ, ఆశయాలూ అన్నీ అమలులో పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. పైగా తను ఫ్రాన్సిస్ ని పెళ్ళాడితే ఎల్సీ సంగతి? ఇక్కడే వుండి అతనికి దూరంగా వుండడం మాత్రం తనకి అసాధ్యం.

తన ముందున్న రెండు దారుల్లో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక జేన్ ఆ రాత్రంతా మథనపడింది.

తన చేత్తో తనే మూసుకున్న తలుపుల ముందు ఆమె మనసు చాలా సేపు తారట్లాడింది.

      ***

ఆ పైవారమే జేన్, ఎల్సీ, హేరియట్ ఫిలిప్స్, ఫిలిప్స్ కుటుంబాన్నీ, వాళ్ళ ఆశలనీ దిగుళ్ళనీ మోస్తూ వాళ్ళెక్కిన పడవ ఆస్ట్రేలియాకి బయల్దేరింది.

(సశేషం)

వీలునామా – 30 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఫిలిప్స్ కుటుంబం లో సంక్షోభం

లిల్లీ ఫిలిప్స్ కి చాలా చిరాగ్గా వుంది. తన భర్త స్టాన్లీ ఫిలిప్స్ కి తమ ఇంట్లో పని చేసే మెల్విల్ అక్కచెల్లెళ్ళ మీద అంత గౌరవమూ, ఆప్యాయతా ఎందుకో ఆమెకి అంతుబట్టడం లేదు. పోనీ తనకన్నా అందగత్తెలా అంటే, అంద చందాలలో తన కాలిగోటిక్కూడా సరిపోరు ఇద్దరూ. మరేమిటి వాళ్ళలో ప్రత్యేకత?

ఇప్పుడు ఈ యూరోప్ యాత్రలో ఎల్సీకి తనతో సమానంగా జరుగుతున్న మర్యాదలు చూడరాదూ! అసలు ఈ ప్రయాణం గురించీ, కూడా ఒక పని మనిషిని తీసికెళ్ళగలిగే తన ఆర్థిక స్థోమతని గురించీ స్నేహితుల దగ్గర ఎన్ని గొప్పలో చెప్పుకుందామనుకుంది. తీరా చూస్తే తనతో సమాన స్థాయిలో వుండే స్నేహితురాలిని తీసికెళ్ళినట్టుంది కానీ, చేతికింద వుండి కనిపెట్టుకుని వుండే పనమ్మాయిని తీసికెళ్ళినట్టే లేదు.

ఎప్పుడైనా స్టాన్లీతో ఎల్సీ తమ ఇంట్లో పనిమనిషి అనీ, జేన్ లా టీఛరు కూడా కాదనీ, ఆమెకి అంత గౌరవం ఇవ్వాల్సిన పని లేదనీ చూచాయగా అన్నా కొట్టిపడేస్తాడు.

“నా దృష్టిలో జేన్, ఎల్సీ, ఇద్దరూ సమానమే. చదువు చెప్తోందని జేన్ ని గౌరవిస్తూ, ఇంటి పని చూస్తుందని ఎల్సీని హీనంగా చూడడం నా వల్ల అయ్యే పని కాదు,” అంటాడు మొండిగా. పైగా, ఫ్రాన్సు లో వున్నన్ని రోజులూ,

“ఫ్రెంచి స్త్రీలు చూడు పని చేసే ఆడవాళ్ళతో ఎంత మర్యాదగా ఆప్యాయంగా వుంటారో చూడు! మన ఇంగ్లీషు వాళ్ళం ఎంతైనా నేర్చుకోవాల్సి వుంది వాళ్ళ దగ్గర,” అనడం మొదలుపెట్టాడు.

మొదటిసారి లిల్లీకి ఇంకొక ఆడదాని మీద ఈర్ష్య లాటిది కలిగింది. అయితే తన అందచందాల మీద ఆమెకున్న నమ్మకం ఆపారమైనదీ, తన వ్యక్తిత్వంలోని లోపాలగురించి వున్న అఙ్ఞానం అనంతమైనదీ కావడంతో ఆ ఈర్ష్య ఎక్కువసేపు నిలవలేదు. బాహ్య సౌందర్యాన్ని తప్ప స్త్రీలో ఇంకొక కోణాన్నీ చూడగలిగే మగవాళ్ళుంటారన్న విషయం ఆమె ఊహకందదు. బాహ్య సౌందర్యానికొస్తే తనకి తిరుగులేదు. ఈ ఆలోచనతో లిల్లీ కొంచెం ధైర్యం తెచ్చుకొంది.

అయితే ఈ మధ్య ఎల్సీలో ఏదో ఒకరకమైన ఉత్సాహం, సంతోషం కనబడుతోంది. దానితోపాటు వయసులో వుండడం వల్ల వచ్చిన నాజూకు, నిష్కల్మషమైన చిరునవ్వుతో ఎల్సీ మెరిసి   పోతూంది. తనేమో వరస కానుపులూ, సంసార జీవితంలో వుండే నిరాసక్తతతో ఆకర్షణ కోల్పోతుందేమో! ఈ మధ్య స్టాన్లీ ఎల్సీవైపు ఎక్కువగా చూస్తున్నట్టూ, ఆమెతో ఎక్కువ మాట్లాడుతూన్నట్టు అనిపించి లిల్లీకి ఉక్రోషంగా అనిపిస్తూంది. దానికితోడు ఇద్దరూ మధ్య మధ్యలో ఫ్రెంచిలో సంభాషిస్తూ వుంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నప్పుడు తనకి తెలియని రహస్యాలేవో చెప్పుకుంటున్నారేమోనన్న ఆలోచన ఆమెని ఎక్కువగా బాధ పెట్టసాగింది.

నిజానికి స్టాన్లీ కేవలం తన ఫ్రెంచి భాష మెరుగుపరచుకోవాలన్న ఉబలాటంతో ఎల్సీతో ఎక్కువగా ఫ్రెంచిలో మాటాడుతున్నాడు. ఎల్సీ ఏమో తనదైన అందమైన ప్రపంచంలో కొట్టుకొనిపోతూంది. ఆమెకి లిల్లీ మనసులో రేగుతున్న సంఘర్షణ ఏమీ పట్టలేదు. ఈ యాత్ర ఆమెకెంతో ఆనందంగా వుండడమే కాకుండా మళ్ళీ ఈ మధ్య కవిత్వం రాయాలన్న ఆశపుడుతూంది.

పేరిస్, ఫ్లారెన్స్, రోమ నగరాలన్నీ తిరిగారు ముగ్గురూ.

పెద్ద పిల్లల్నిద్దరినీ కూడా తమతో తిప్పి వుండాల్సింది అనుకున్నాడు స్టాన్లీ.

వాళ్ళు లండన్ తిరిగొచ్చేసరికి ఎన్నికల్లో ఫ్రాన్సిస్ నెగ్గిన సంగతి తెలిసింది వారికి.

 

*****************

 

బ్రాండన్ లేని లోటు తప్పితే లండన్ జీవితం యథా ప్రకారం మొదలైంది. కొద్దిరోజులకే మళ్ళీ విసుగెత్తిపోయిన స్టాన్లీ అమెరికా వెళ్ళి చూసొద్దామనుకున్నాడు. అయితే లిల్లీ మాత్రం ప్రయాణాలతో అలిసిపోయాననీ, ఇక ఇంటి పట్టునే వుంటాననీ అన్నది. స్టాన్లీకి ఒంటరి ప్రయాణాలు ఇష్టం వుండదు. అయినా ఇక ఇంట్లో ఏ పనీ లేక విసుగ్గా ఉందని ఒంటరిగానే అమెరికా ప్రయాణమయ్యాడు.

అదలా వుంటే, లిల్లీ మొరటుదనాన్ని చూసి ఎల్సీ ఈ మధ్య ఆశ్చర్య పోతూంది. తనంటే యజమానురాలికి ఏదో కోపం మనసులో వుందన్న విషయాన్ని కనిపెట్టింది కానీ, దానికి కారణం మాత్రం ఊహించలేకపోయింది. వీళ్ళ ఇల్లు వదిలి ఇంకెక్కడైనా వుద్యోగం చూసుకోవాలని నిర్ణయించుకుంది ఎల్సీ.

ఆమె ఆ ప్రయత్నాలలో వుండగానే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి విష జ్వరం తగలసాగింది. పాఠాలన్నీ మూలపడ్డాయి. పొద్దస్తమానూ జేన్, ఎల్సీ ఇద్దరూ పిల్లల మంచాల పక్కనే కూర్చుని కనిపెట్టుకోవాల్సి వచ్చింది.

లిల్లీకి మధ్యమధ్య గదిలోకి వచ్చి పిల్లలని చూసి బెంబేలు పడడం తప్ప ఇంకేమీ తెలియదు. నిజానికి వాళ్ళ పరిస్థితి విషమిస్తూన్నట్టు కూడా ఆ అమాయకురాలు తెలుసుకోలేకపోయింది.

జేన్ ఆఖరికి పిల్లల తాతగారు, పెద్దాయన డాక్టరు ఫిలిప్స్ గారిని ఉన్నపళంగా రమ్మని ఉత్తరం రాసినతర్వాత గానీ, లిల్లీకి పరిస్థితి చేయి దాటిపోయిందేమోనన్న అనుమానం రాలేదు. వెంటనే జేన్ కి చెప్పి స్టాన్లీ ని కూడా అమెరికా నించి వెంటనే రమ్మని ఉత్తరం రాయించింది.

ఆమె ఉత్తరం చూడగానే తాతగారితో పాటు స్టాన్లీ తమ్ముడు డాక్టరు వివియన్ కూడా లండన్ చేరుకున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ పిల్లలకి శాయాశక్తులా చికిత్స చేసారు. ఎంత చేసినా స్టాన్లీ పిల్లలందర్లోకీ చిన్నది ఈవాని రక్షించలేకపోయారు.

లిల్లీ మొదలునరికిన చెట్టులా కూలబడిపోయింది. ఇది జీవితంలో ఆమెకి మొదటి దెబ్బ. పెళ్ళైంతర్వాత స్టాన్లీ సం రక్షణలో చీకూ చింతా లేకుండా వున్న లిల్లీ ఈ దెబ్బ తట్టుకోలేకపోయింది. అన్నిటికంటే పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించే స్టాన్లీ ఇంటికొచ్చి తనకే శిక్ష విధిస్తాడోనని వొణికిపోయింది. తనకే అంతుబట్టని కారణాల వల్ల బిడ్డ మరణించడం తన తప్పేనన్న నిర్ణయానికొచ్చింది లిల్లీ.

“అయ్యో! స్టాన్లీ, ఇప్పుడే నువ్వమెరికా వెళ్ళాల్సొచ్చిందా? ఇంటికొస్తే నీ ప్రియాతిప్రియమైన ఈవా లేకపోవడం చూసి ఎలా తట్టుకుంటావో! అసలు నాలాటి చేతకాని దద్దమ్మకి ఈ పిల్లల్నెందుకు అప్పజెప్పావ్ స్టాన్లీ? మిగతా పిల్లల్ని కూడా ఇలాగే పోగొట్టుకుంటానో ఏమో!”  గోడు గోడున ఏడ్చింది లిల్లీ.

రెండురోజుల తర్వాత మిగతా పిల్లలు కోలుకుంటున్నారనీ, ఇంకేమీ భయంలేదనీ మరిది వివియన్, జేన్ చెప్పినా నమ్మలేదు లిల్లీ. స్టాన్లీ వొచ్చి, నిజంగానే మిగతా పిల్లలు జ్వరం బారినించి తప్పించుకున్నారని చెప్పిన తర్వాతే ఆమెకి నమ్మకం కలిగింది.

స్టాన్లీ ఫిలిప్స్ పైకి ఏమీ అనకపోయినా ఈవా మరణం అతన్ని ఎంతగానో కృంగదీసింది. అయితే కనీసం మిగతా ముగ్గురు పిల్లలూ కోలుకుంటున్నందుకు అతను భగవంతునికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెల్పుకున్నాడు. జేన్, ఎల్సీ, వివియన్ ముగ్గురూ కలిసి తన పిల్లలని మృత్యు వాత పడకుండా కాపాడగలిగేరని అనుకున్నాడు.

 

అప్పుడే లండన్ లో పార్లమెంటు సమావేశాలకోసం వచ్చిన ఫ్రాన్సిస్ కూడా వచ్చి పిల్లలని అడపాదడపా వచ్చి చూసాడు. పార్లమెంటులో మొదటిసారి ఫ్రాన్సిస్ చేసిన ప్రసంగాన్ని అంతా శ్రధ్ధగా విన్నారు. అతని ప్రసంగం ఎల్సీకంతగా నచ్చకపోయినా, జేన్ మెచ్చుకుంది.

 

మాట ఇచ్చిన ప్రకారం ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి పెద్ద ఫిలిప్స్ గారిని కలిసొచ్చాడు. అతనికి ఆ కుటుంబం లో అందరికంటే చిన్న డాక్టరు వివియన్ ఫిలిప్స్ నచ్చాడు. అయితే అతను జేన్ తో చనువుగా మాట్లాడడం చూసి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు. పిల్లల చికిత్స కోసం వివియన్ జేన్ తో దగ్గరగా మసలేవాడు. అతను జేన్ ని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం ఫ్రాన్సిస్ ని పుండులా సలుపుతూంది. అతనికి వివియన్ ఎల్సీని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం రాలేదెందుచేతనో.

ఇంతకీ వివియన్ ఇద్దరు అమ్మాయిలతోనూ స్నేహంగా మర్యాదగా వున్నా ఇద్దరిలో ఎవరినీ ప్రేమించలేదు. జేన్ లాటి అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే మగవారు అరుదుగా వుంటారు. ఆ సంగతి అందరికంటే జేన్ కే బాగా తెలుసు కూడా. అలాటి అమ్మాయిల సహచర్యంలో మగవాళ్ళు తాము అలసిపోతాం అనుకుంటారు. మగవారికి తెలివైన ఆడవారూ, తమతో సమానంగా ఆలోచించగలిగే వారూ కేవలం స్నేహితులుగానే నచ్చుతారు. తమకి భార్య గా వొచ్చే స్త్రీ పెద్దగా తెలివితేటలూ, సొంత ఆలోచనలూ లేకుండా, అన్నిటికి తమ పైన ఆధారపడే మనిషై వుండాలని కోరుకుంటారు.

ఇవన్నీ ఎలా వున్నా పిల్లలు బాగానే కోలుకోవడం మొదలుపెట్టారు. అయితే అందర్లోకీ పెద్దది ఎమిలీ మాత్రం బాగా నీరసించిపోయింది. దానికి తోడు చలికాలం ముంచుకొస్తూంది.

ఆస్ట్రేలియా లోని వెచ్చదనమూ, వేడీ అలవాటైన పిల్ల లండన్ చలిని తన అనారోగ్యంతో తట్టుకోగలదో లేదోనన్న భయం మొదలైంది అందరికీ. మళ్ళీ అరోగ్యం విషమిస్తే ఏం చేయాలో తోచలేదెవరికీ. పినతండ్రి వివియన్ అమ్మాయిని లండన్ చలికాలం నించి దూరంగా తీసికెళ్ళక తప్పదని తేల్చి చెప్పాడు. ఫ్రాన్స్ వెళ్దాం వస్తావా అని ఎమిలీని తండ్రి అడిగాడు.

 

“ఫ్రాన్స్ కాదు నాన్నా! హాయిగా మన వూరు విరివాల్టా వెళ్ళిపోదాం. అసలు ఆస్ట్రేలియాలో ఎప్పుడైనా ఇలా జబ్బు చేసిందా మనకెవరికైనా? వొస్తానంటే టీచరు జేన్ నీ, ఎల్సీనీ తీసికెళ్దాం. అక్కడే చదువుకుంటాం. ఈ లండన్ లో ఏముంది? పొగా, మంచూ, మనుషులూ!”  ఎమిలీ అంది.

స్టాన్లీ ఆలోచనలో పడ్డాడు. నిజంగా పిల్లలందరినీ ఆస్ట్రేలియా తీసికెళ్ళడమే మంచిదేమో. కనీసం పడవ మీద సముద్రపు గాలుల వల్ల ఆరోగ్యం మెరుగవవచ్చు. కాస్త అక్కడ తన ఎస్టేటు వ్యవహారాల పైనా ఒక కన్నేసి వుంచొచ్చు. లండన్ లో జీవితం కొంచెం ఖర్చుదారీగా కూడా అనిపిస్తోంది. అయితే పిల్లల చదువుల దృష్ట్యా జేన్ నీ తమతో తీసికెళ్ళక తప్పదు. ఎలాగైనా ఆస్ట్రేలియా వెళ్ళడమే మంచిదనుకొన్నాడు స్టాన్లీ.

ఈ విషయం వినగానే మండిపడింది లిల్లీ!

“ఏమిటీ? ఆస్ట్రేలియాకా? అసలు మనం ఎప్పటికీ ఇక్కడే వుంటామన్నావుగా స్టాన్లీ? అక్కడికెళ్తే పిల్లల చదువులేం చేద్దాం?”

“చదువుల గురించి నువు భయపడకు. జేన్ టీచర్నీ మనతో తీసికెళ్దాం. ఆవిడ సంగీతం తప్ప అన్నీ నేర్పగలదు. అన్నిటికంటే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు. మనకి వెళ్ళక తప్పదు.”

“టీచరు చెల్లెల్ని వదిలి రానంటే?”

“అదీ నిజమే! అలా అయితే ఇద్దరినీ మనతో తీసికెళ్దాం.”

“నేనేదైనా అనగానే డబ్బు ఖర్చు ఎక్కవౌతుందంటావు, కానీ వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళనీ తీసికెళ్ళడానికి నీకే డబ్బు ఇబ్బందులూ గుర్తు రావు,” లిల్లీ కోపంగా అంది.

“ తెలివితక్కువగా మాట్లాడకు లిల్లీ. ఎల్సీ నీకు బట్టలు కుట్టి పెడుతూంది. జేన్ ఇంటి లెక్కలు చూసి పెడుతూంది. వాళ్ళిద్దరి వల్లా ఎంత లేదన్నా మనకి యేడాదికి రెండు వందల పౌండ్లు ఆదా అవుతూంది. అన్నిటికంటే, ఎమిలీ ఎల్సీని వొదిలి వుండలేదు. అసలు ఎల్సీ సహాయం లేకుండా నువ్వు పిల్లలని చూసుకోగలననుకుంటున్నావా?”

“అక్కడ జేన్ తో పనేమీ వుండదు స్టాన్లీ! ఇంతకు ముందు మనం అక్కడ డబ్బులెక్కలు చూసుకోలేదా?”

“ఆ విషయం మాట్లాడకు. నువ్వు డబ్బు లెక్కలు చూసినప్పుడు మన ఇల్లెలా వుండేదో నాకింకా బాగా ఙ్ఞాపకం వుంది. నా మాట విను. పిల్లలకీ, నీకూ, మనందరికీ సహాయంగా వుండడానికీ, చేదోడు వాదోడుగా వుండడానికీ జేన్, ఎల్సీ ఇద్దరూ మనతో రావడమే మంచిది. పిల్లలు కూడా వాళ్ళనొదిలి వుండలేరు.”

“ఆ మాటా నిజమే లే. పిల్లలని అంత అనారోగ్యంలో వాళ్ళిద్దరే కనిపెట్టి వున్నారు. నేను ఏడవడానికి తప్ప ఎందుకూ పనికి రాను,” తలచుకొని మెత్తబడింది లిల్లీ.

“కానీ, స్టాన్లీ, నాకు ఇప్పుడు సముద్రపు ప్రయాణాలంటే మహా విసుగు. పోనీ అందరం విమానం లో వెళ్దాం, ఏమంటావ్? బ్రాండన్ కూడా విమానం లోనే వెళ్ళాడు.” ఆశగా అడిగింది.

“పిల్లలతో విమాన ప్రయాణం కష్టం లిల్లీ! బ్రాండన్ అంటే ఒంటిగాడు, తోడుగా ఒక్క మేనల్లుడు, అంతే. మనమో? ఇంత మందికి విమానం టికెట్లు తడిసి మోపెడవుతాయి. పిల్లల ఆరోగ్యాలు సముద్రపు గాలికి కాస్త కుదుటపడతాయి. మనిద్దరమే కలిసి ప్రయాణం చేసేటప్పుడు నిన్ను విమానం లో తీసికెళ్తా, సరేనా?” భార్యని బుజ్జగించాడు స్టాన్లీ.

తమ కుటుంబంతో పాటు మెల్బోర్న్ రమ్మని స్టాన్లీ అడగగానే ఎగిరి గంతే సారు జేన్,ఎల్సీ.

 

“స్టాన్లీ గారూ! తప్పక మీతో వొచ్చి పిల్లల చదువులు చెప్తాను. అయితే మీకొక్క విషయం ముందుగానే చెప్పడం మంచిది. నేనూ, పెగ్గీ వాకర్ కలిసి ఎప్పటికైనా మెల్బోర్న్ లో మా సొంతంగా వ్యాపారం చేయలని అనుకున్నాము. అదే కనక నిజమైతే మీ కుటుంబాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదలక తప్పదు. అప్పుడు మీరు బాధ పడకూడదు. నాకైతే మీ ఇంట్లో పని చాలా హాయిగా వుంది, కానీ…”

“నాకు తెలుసు జేన్! ఎల్సీ కీ మా ఇంట్లో క్షణం కూడ మనశ్శాంతి లేదు. ఎల్సీకి కూడా ఇక్కడికంటే ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం దొరకొచ్చు. అప్పుడు తనైనా నిస్సంకోచంగా మా ఇల్లు వదిలి పోవచ్చు. లిల్లీ కూడా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ మా పిల్లలకి చేసిన సేవలకి ఇలా బదులు తీర్చుకోవాలనుకుంటుంది.”

 

ఆస్ట్రేలియా వెళ్ళడానికి స్టాన్లీ, లిల్లీ, పిల్లలూ, జేన్, ఎల్సీ అందరూ సిధ్ధమవుతూ వున్నారు. ఉన్నట్టుండి వాళ్ళతో ఇంకొక వ్యక్తి వచ్చి చేరడం జరిగింది.

 

**************

 

ఎన్నికల తర్వాత ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి ఫిలిప్స్ కుటుంబంతో కాసేపు గడిపి వచ్చాడు. కానీ అతనక్కడ హేరియట్ ఫిలిప్స్ ని కొంచెం కూడా పట్టించుకోలేదు. నిజానికి అక్కడ అతను రాజకీయాలూ, తన పనీ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. అదీ తమ తండ్రితోనూ, అక్కయ్య తోనూ. హేరియట్ హతాశురాలైంది. ఆమెకిప్పుడు తను బ్రాండన్ తో అంత నిర్దయగా ప్రవర్తించి వుండల్సింది కాదేమో, అనిపిస్తూంది. తను అతన్ని అంతలా ఉడికించకపోయి వుంటే తప్పక తనని పెళ్ళాడమని అడిగి వుండే వాడే. పైగా అందరిముందూ తనని ఇష్టపడి, తనకోసం పడి చచ్చిపోయే మగవాడు ఉండడం ఆమెకొక గౌరవాన్నీ ఇచ్చేది. ఇప్పుడు బ్రాండన్ లేకపోవడంతో ఆమె ఆ గౌరవాన్ని కోల్పోయింది. హేరియట్ మనసు ఇలాటి ఊగిసలాటల్లో ఉండగానే, అన్న కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నట్టు కబురందింది ఆమెకి.

 

ఉన్నట్టుండి, తనూ అన్న కుటుంబంతో పాటు విక్టోరియా వెళ్తేనో, అన్న ఆలోచన వచ్చిందామెకి. తనకి కాస్త స్థలం మార్పు వుంటుంది. ఎమిలీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే “మా వూరు విరివాల్టా” ని చూసే అవకాశం దొరుకుతుంది. అక్కడ తనలాటి లండన్ స్త్రీని అందరూ అబ్బురంగా చూస్తూ వుంటే బాగుంటుంది. అన్నిటికంటే బ్రాండన్ వుంటాడు! ఏడాది రెండేళ్ళు వుండి విసుగు పుట్టగానే మళ్ళీ వచ్చేయొచ్చు.

“లిల్లీకీ పిల్లలకూ తోడుగా వుండడానికి కావాలంటే నేనొస్తాను,” అని అన్నకి కబురు చేసింది హేరియట్. తన భార్యా పిల్లల పట్ల చెల్లెలికున్న ప్రేమ చూసి మురిసిపోయాడు స్టాన్లీ. తప్పక చెల్లిని తనతో తీసికెళ్తానన్నాడు.

రెండు వారాలు అహోరాత్రాలూ కష్టపడి ప్రయాణానికి సిధ్ధమయారు అందరూ.

***

 

వీలునామా – 29 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(గత వారం తరువాయి)

ప్రచారమూ – ఎన్నికలూ
ఆ రోజు ఉదయం టాం లౌరీ ఉత్తరం చూడకపోయి వుంటే జేన్ ఫ్రాన్సిస్ గురించి వేరే రకంగా ఆలోచించి వుండేదేమో! ఎందుకంటే ఆ రోజు ఫ్రాన్సిస్ మనసు ఆమెకి చూచాయాగా అర్థమైనట్టే వుంది. అయితే ఇంతకుముందే చెప్పుకొన్నట్టు ఆమె రాజకీయాల గురించీ, అందులో ఫ్రాన్సిస్ చేయబోయే పని గురించి ఉన్నదానికంటే ఎక్కివగా ఊహించుకుంది. ఒక రకమైన ఆదర్శంతో ఆ అమ్మాయి స్కాట్లాండులోని ఒక పల్లెటూరి నుండి ఎన్నికయే ఒక చిన్న భూస్వామి దేశ రాజకీయ వ్యవస్థనీ, రైతాంగాన్నీ మార్చి వేయగలడనుకొంది. అయితే ఒక సంఘమో, దేశమో అభివృధ్ధి చెందాలంటే ఇటువంటి అమాయకమైన ఆదర్శవాదం తప్పనిసరి. వాస్తవికత పేరుతో ఎటువంటి ఆదర్శాన్నీ పట్టించుకోనప్పుడే దేశమైనా సంఘమైనా పతనమయ్యేది. మనుషుల్లో అమాయకత్వమూ, ఆదర్శమూ లోపించిన సంఘం ఆర్ధికంగా ఎంతైనా అభివృధ్ధి చెందనీ గాక, నైతికంగా పతనావస్థలోనే వుంటుంది.

ఈ ప్రపంచంలో తనొక్కతే ఫ్రాన్సిస్ ని పెళ్ళాడగల స్త్రీ అయివుంటే తాను తప్పక ఫ్రాన్సిస్ ని పెళ్ళాడి వుండేది. కానీ, ఇప్పుడు ఫ్రాన్సిస్ ని పెళ్ళాడడానికి వందల్లో అమ్మాయిలు దొరుకుతారు. అతనికి ఇంకే అమ్మాయితో పరిచయం లేకపోవడమూ, తను అతని పట్ల కొంత స్నేహ భావం చూపడం వల్ల అతను తనని ఇష్టపడుతున్నాడు తప్ప వేరే ఇంకేమీ లేదు. ఎంతో మంచి రాజకీయ భవిష్యత్తు వున్నవాణ్ణీ, డబ్బూ హోదా వున్నవాణ్ణీ తను అతని బలహీనతలుపయోగించి కట్టేసుకోవడం న్యాయం కాదు. ఇంకొన్నేళ్ళు పోతే అతను తనకి అన్ని విధాలా సరిపోయి, తనకి నచ్చిన అమ్మాయిని వెతుక్కోగలడు. ఇలా ఆలోచించి జేన్, అతని అంతరంగం తనకి అర్థం కానట్టు ఉండిపోయింది. అయితే ఆమె కొంచెం తన మనసుని కూడా తరచి చూసుకొని వుంటే ఏమయి వుండేదో! కాని ఆమె అంత ధైర్యం చేయలేక పోయింది. అయితే అతను మంచి అమ్మాయిని పెళ్ళాడాలనీ, ఆ వచ్చే భార్యకి తమ స్నేహం పట్ల ఎటువంటి అభ్యంతరమూ వుండకూడదనీ ఆశపడింది జేన్.

జేన్ తన మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం పెద్దగా చేయలేదు.. అతను ఇంకొక అమ్మాయిని పెళ్ళాడడం అన్న ఊహ తనకే మాత్రం ఈర్ష్య కలిగించడం లేదు. అంటే తను అతన్ని ప్రేమించడంలేదన్నమాట, అనుకుంది. నిజానికి, ప్రేమ బలహీనమైన మనసులో ఒకలాటి ఫలితాలనిస్తే, బలమైన వ్యక్తిత్వంలో ఇంకొకరకంగా పరిణమిస్తుంది కదా? ఈ సంగతి తెలుసుకుని అర్థం చేసుకునేంత వయసు జేన్ కి లేదు. పైగా తమ మధ్య ఎన్నో తేడాలున్నట్టు అనిపించింది ఆమెకి.
అతను భావుకుడైతే తను నిత్య జీవితంలో తలమునకలయ్యే మనిషి. అతనికి కవిత్వమూ, చిత్రలేఖనమూ ఇష్టాలైతే తనకు లెక్కలూ విఙ్ఞాన శాస్త్రమూ అంతులేని ఆనందాన్నిస్తాయి. తనతో స్నేహం వల్ల పని వాళ్ల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు కానీ నిజానికి అతనిది భూస్వాములకుండే మనస్తత్వం! తను ఒక్క క్షణం కూడా ఒక చోట నిలకడగా వుండలేనిదయితే, అతను తీరికగా, కలల్లో విహరిస్తూ నింపాదిగా వుంటాడు. తనతో కలిసి బ్రతకడం అతనికి కొన్నాళ్ళాయింతర్వాత చికాకుగా మారినా ఆశ్చర్యం లేదు. అలాటి త్యాగం తను అతన్నేలా చేయనీయగలదు? ఇలాటి ఆలోచనలతో జేన్ తమ ఇద్దరికీ కలిసి భవిష్యత్తు లేదని మనసుకి గట్టిగా నచ్చ చెప్పుకుంది. అతనితో పాటు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పనిచేయాలని నిశ్చయించుకుంది.
అనుకుందే కానీ జేన్ కి పన్లతో అసలు తీరుబడే దొరకడంలేదు. పని మనిషులు ఇద్దరు ఇంట్లో పని మానేసారు. వాళ్ళ పని ఎల్సీ తో చేయించాలంటే జేన్ కి ఇబ్బందిగా వుంది. చేయించకుండా వుంటే మొహమాటంగా వుంది.
భార్యా భర్తలు, స్టాన్లీ, లిల్లీ ఫిలిప్స్ పిల్లలని జేన్ సం రక్షణలో వదిలి కొద్ది రోజులలా ఊరు తిరిగొద్దామనుకున్నారు. వాళ్ళతో పాటు హేరియట్ కూడా వెళ్ళాలని ఆశపడింది కానీ, లిల్లీ ఇక మరదలి కోసం తాము చేసింది చాలనుకొంది. అందుకని లిల్లీ జేన్ నీ పిల్లలనీ ఇంట్లో వదిలి తనతో పాటు ఎల్సీని తీసికెళ్దామని అనుకొంది. లిల్లీ కి కానీ, స్టాన్లీ కి కానీ ఇంగ్లీషు తప్ప వేరే భాష రాదు. అందుకే తోడుగా ఎల్సీ వుంటే మిగతా దేశాల్లో ఇబ్బంది వుండదు. ఎల్సీకి ఫ్రెంచి భాషా, ఇటాలియన్ భాషా వచ్చు. జేన్ కూడా చెల్లెలు కొన్ని వూర్లు తిరిగి అక్కడక్కడా పాఠశాలల్లో తమగురించి చెప్పగలిగితే తమకు ఇంకొక వుద్యోగం దొరకొచ్చు, అనుకొంది. ఇహ హేరియట్ కి లండన్ నగరం వదిలి తన వూరు డెర్బీషైర్ చేరుకోక తప్పలేదు. పనివాళ్ళెవరూ లేకుండా, పిల్లలూ, జేన్ తో కలిసి ఒంటరిగా వుండాలన్న వూహే నచ్చలేదామెకి.

******

ఇంకొక పక్క ఫ్రాన్సిస్ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. సింక్లెయిర్ ఫ్రాన్సిస్ కి కుడి భుజంలా పని చేసాడు ప్రచారానికి. ఫ్రాన్సిస్ పోటీ చేసిన కౌంటీలో మొత్తం కలిపి అయిదు ఊళ్ళున్నాయి. అన్నీ పక్క పక్క వూళ్ళే. “రిఫారం బిల్లు” ప్రవేశ పెట్టక పుర్వం ఒక్కొక్క వూరి నించి ఒక ప్రతినిధి మాత్రం ఓటు వేయగలిగే వాడు. ప్రతీ వూరికీ వుండే టౌను కౌన్సిల్ ఆ ప్రతినిధిని ఎన్నుకునే అలవాటు వుండేది. ఆ పధ్ధతిలో జరిగే ఎన్నికలని ప్రజాస్వామ్యం అనడం హాస్యాస్పదం.
“రిఫారం బిల్లు” ప్రతినిధులని ఎన్నుకునే పధ్ధతిని మార్చివేసి ప్రజలెకంతో మేలు చేసింది. ఆ బిల్లు వల్ల రాజకీయ నాయకులల్లోనో, నాయకత్వం లోనో పెద్ద మార్పు రాలేదు కానీ, ఎన్నికల యంత్రాంగం లో రాబోయే ముఖ్యమైన మార్పులకి నాంది పలికింది. ముఖ్యంగా స్కాట్ లాండు ఎనికల్లో ఇది చాలా చారిత్రాత్మకమైన మార్పు.
రిఫారం బిల్లు వల్ల ఇప్పుడు ప్రతీ వూళ్ళోనూ నమోదు చేయించుకున్న వోటర్లున్నారు. ఈ వోటర్లు తమకి నచ్చిన అభ్యర్థి కి వోటేస్తారు. ఒక వూళ్ళో వుండే అయిదువందల మంది మాటా, పక్క వూళ్ళో వుండే ఎనభై మంది మాటా ఒకేలా చెల్లుబడి అయే వీలు వుండదు.

సంప్రదాయ వాదులతో నిండిన టోరీ (కంజర్వేటరీ) పార్టీ అబ్యార్థి శ్రీమాన్ ఫార్టెస్క్యూ గారు. ఆయన సొంతంగా గొప్ప పన్లేవీ చేయకపోయినా, పెద్ద భూస్వామి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నవాడు. అయిదు ఊళ్ళల్లోనూ, రెండు వూళ్ళో టోరీ పార్టీ నెగ్గేలాగుంటే, ఒక వూళ్ళో లిబరల్ పార్టీ నెగ్గే సూచనలున్నాయి. మిగతా రెండు వూళ్ళూ ఏ సంగతీ చెప్పలేకున్నాయి, ఏమైనా జరగొచ్చు. ఇలాటి పరిస్థితిలో ఫ్రాన్సిస్ తో తలపడడమనటే ఇంతకు ముందు ఎన్నికలంత సులువు కాదేమో నని భయపడ్డారు ఫోర్టెస్క్యూ గారు.
తన ప్రచారానికి శ్రీమాన్ టౌట్ వెల్ గారిని తోడు తెచ్చుకున్నాడు. చాలా ప్రచార సభల్లో ఫోర్టెస్క్యూ కంటే టౌట్-వెల్ గారే ముందు నిలబడి ప్రసనగించారు.
“అయ్యా! నన్నడిగితే అన్నిటికంటే అనుభవం ముఖ్యం!”, టౌట్-వెల్ వోటర్లని మచ్చికచేసుకునే మెత్తటి గొంతుతో అన్నారు.
“ఇప్పుడూ- ఫోర్టెస్క్యూ గార్ని ఓడించి పార్లమెంటుకెళ్ళాలంటే ఎంతో కొంత అనుభవం అవసరం కదా? బాంకి కౌంటరు వెనక యేళ్ళ తరబడి కూర్చున్న మనిషికి భూస్వాముల కష్ట నష్టాలు తెలుస్తాయంటారా? ఒట్టిదే! నిజమే, మా ఫోర్టెస్క్యూ గారికి సభల్లో ప్రసంగాలు చేయడం రాదు. అయితే? పార్లమెంటులోకెళ్ళేది పని చేయడానికా, ప్రసంగాలు చేయడానికా? ఇంతకు ముందు పార్లమెంటులో ఆయన వోటు చేసిన విధానం చూడండి, మీకే తెలుస్తుంది ఆయన పని తనం. అదే ఫ్రాన్సిస్ హొగార్త్ సంగతి చూడండి! అసలాయనకి ఆయన పార్టీ టిక్కెట్టు ఇవ్వడమే పెద్ద విచిత్రం. భూస్వాముల భుమి భాగాలు చేసి పని వాళ్ళకివ్వాలంటాడు! ఇంత కంటే అన్యాయం, హానికరం ఇంకేదైనా వుంటుందా?దీనికొప్పుకుంటే ముందు ముందు మన గతేమిటి? సోషలిస్టు ప్రభుత్వాల్లాగయిపోమూ? ఇలా మనుషులంతా ఒక్కటే అని మాట్లాడేవాళ్ళని ఎంత దూరంగా వుంచితే సంఘానికంత మంచిది. భగవంతుని సృష్టిలోనే అన్ని జీవులూ సమానంగా లేవు. ఇప్పుడీ సోషలిస్టులు భగవంతుని సృష్టిలో లోపాలెతుకుతారా? అయినా దేవుడే లేడనే మూకకి ఏం చెప్పి ఏం లాభం?
పైగా ఆ పాలేరు వెధవలకి పక్కా యిళ్ళు కూడా నట! వాటితో ఆయన పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయేమోకానీ, మీ గతేమవుతుందో ఆలోచించుకోండి. మీ అందరినీ ఇప్పుడు పాలేళ్ళకి ఇళ్ళు కట్టించి ఇమ్మంటాడు. అసలా పని వాళ్ళేమైనా అడిగారా? లేదే! ఇహ మరి ఎందుకీ దాన ధర్మాలు? అసలా పెద్దాయన ఆ ఆస్తి ఆడపిల్లల పేరు మీద రాయకుండా ఇతనికిచ్చి పొరపాటు చెసాడు. ఊరికే వొచ్చి పడిన డబ్బూ, ఆస్తీ అంటే ఎవరికి మాత్రం లెక్క వుంటుంది?”
ఇలాటి ప్రసంగాలూ టౌట్-వెల్ గారూ, ఫోర్టెస్క్యూ గారూ బోలెడు చేసారు.

ఇక్కడ ఫ్రాన్సిస్ వర్గంలోనూ గెలిచి తీరాలన్న పట్టుదల పెరిగింది. ఫ్రాన్సిస్ తన ప్రచారానికి సహాయ పడడానికి ప్రెంటిస్ ని పెట్టుకున్నాడు.
“ఫ్రాన్సిస్! ముందు మీరు చాలా జాగ్రత్తగా ప్రసంగాలు చేయాలి. ఎక్కడా భూస్వాములని భయపెట్టే విధంగా మాట్లాడకండి. చిన్న చిన్న రైతులకి పెద్ద రాజకీయాలు తెలియవు. వాళ్ళ భూస్వామి ఎలా చెప్తే అలా వోటు వేస్తారు. కూలీ నాలీ జనానికీ, ఆడవాళ్ళకీ అసలు ఓటు హక్కే లేదు. అందుకే మనం నెగ్గినా ఓడినా అదంతా మోతుబర్లయిన భూస్వాముల చేతుల్లోనే వుంది. మీరు నిర్మొహమాటంగా మాట్లాడడం కాదు కావాల్సింది. తియ్యగా, ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా, రాజకీయ నాయకుళ్ళా మాట్లాడడం నేర్చుకోవాలి. ముందుగా మీ స్నేహితుడు సింక్లెయిర్ ని కొంచెం అదుపులో పెట్టండి. అలాగే మీరు చేయబోయే పన్ల గురించి అసలేమీ స్పష్టంగా మాట్లాడకండి. అలాగంచెప్పి మరీ అస్పష్టంగా వుంటే, మీరంటే ఇప్పటికే ఇష్టం వున్న వోటర్లు మీకు వోటు వెయ్యడం మానేసే అవకాశం వుంది. కాబట్టి మధ్యే మార్గంగా మాట్లాడాలి. పెద్ద పెద్ద మాటలూ, వాటికి ఏం అర్థాల్లేకపోయినా సరే, వాడడం నేర్చుకోండి. అన్నట్టు ఇవాళ రాత్రి ఒక సభలో మీరు ప్రసంగించాలి. ”
దానికంటే ముందు మిమ్మల్ని కలవడానికి కొందరు పని వాళ్ళూ, కూలీ నాలీలూ వచ్చారు.”
ఫ్రాన్సిస్ వాళ్ళని కలవడానికి లేచి వెళ్ళాడు. వచ్చిన వారిలో ఒక వర్గానికి నాయకుడు సాండీ. అతనికి స్వంతంగా ఒక మగ్గమూ, బట్టలు నేసే కార్ఖానా వున్నాయి. పెద్ద మోతుబరీ, డబ్బున్నవాడూ కాకపోయినా, ఓటు హక్కున్నవాడు. రెండో వర్గానికి నాయకుడు జేమీ, బట్టల కార్ఖానాలో పని చేసే సాధారణ కూలీ. రెండు వర్గాలనీ ఒకే సారి కలవదల్చుకున్న ఫ్రాన్సిస్ ని చూసి ప్రెంటిస్ ఆశ్చర్యపోయాడు.
ఫ్రాన్సిస్ వచ్చిన వారితో మామూలుగా మాట్లాడాడు. తన అభిప్రాయాల ప్రకారమే నడుచుకుంటాడు కానీ, పార్టీ పెద్దల తాఖీదులను ఖాతరు చెయ్యననీ స్పష్టం చేసాడు వారితో.
“అయితే సారూ! అందరికీ ఓటు హక్కు వస్తుందా మరయితే?” ఆశగా అడిగాడు సేండీ.
“ మా వూళ్ళో కూలీ నాలీ జనం బోలెడు మందే వున్నారు, వాళ్ళు కూడా వోటు వేసుకోవచ్చు కదా?”
“ పార్లమెంటులో ఈ విషయం చర్చకు వస్తుందనుకోను కానీ, వొస్తే మాత్రం నేను అందరికీ ఓటు హక్కు వొద్దనే అంటాను.”
ఫ్రాన్సిస్ జవాబు విని వచ్చిన వాళ్ళంతా చిన్నబోయారు.
“అదేంది సారూ! నువ్వు మా వైపుంటావనీ, మాకు ఓట్లిప్పిస్తావనీ మేమంతా ఆస పడుతూంటే, మీరేమో…” జేమీ నిరాశగా అన్నాడు.
“సారు మోతుబరి రైతులంజూసి బయపడుతున్నార్రా! నిజానికి మనకి వోటు హక్కు తెప్పిస్తార్లే! కదా సారూ?” ఆశ చావక అన్నాడు సాండీ.
“ఆగండి! నేను మీకు అనవసరంగా ఆశలు పెట్ట దల్చుకోలేదు,. ఈ విషయంలో నా అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్తాను. అందరికీ ఓటు హక్కు ఉండాల్సిందే, కానీ ఎప్పుడు? అందరికీ సమానంగా విద్యావకాశాలున్నప్పుడు. అప్పుడు అందరూ చదువుకోగల్గుతారు. వాళ్ళ నాయకుణ్ణి సరిగ్గా ఎన్నుకోగల్గుతారు. అంతే కానీ, ఏమాత్రం ప్రపంచ ఙ్ఞానమూ, వ్యవహార ఙ్ఞానమూ లేని వాళ్ళకి ఓటు హక్కిచ్చి ఏం లాభం? కొంచెం కొంచెం, అంచెల వారీగా అందరికీ, ఆడవాళ్ళతో సహా ఓటు హక్కు సంపాదించడమే నా ధ్యేయం. అయితే అది ఒక్కసారే, ఒక్క కలం పోటుతో తెచ్చుకుంటే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ.”
“ఆడవాళ్ళకి ఓటు హక్కెందుకులే సారూ, వాళ్ళని ఎటూ చుసేది మనమే కదా..”
ఇంకొంచెం సేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఆతర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు జరగడమూ, ఫ్రాన్సిస్ అయిదింట మూడు మద్దతుతో గెలవడమూ జరిగిపోయాయి. పార్లమెంటులో తన స్థానంలో కూర్చోడానికి ఫ్రాన్సిస్ బయల్దేరాడు.

(సశేషం)

వీలునామా – 28 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

వీడుకోలు

జేన్, ఫ్రాన్సిస్ తన గురంచి మాట్లాడుకుంటున్న సమయంలో బ్రాండన్ తన తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళనీ కలిసి వీడుకోలు చెప్పడానికి రైల్లో ఏష్ ఫీల్డ్ వైపు వెళ్తున్నాడు. తల్లీ, విధవరాలైన ఒక చెల్లెలు ఫానీ హోంస్, పెళ్ళికాని ఇంకోక చెల్లెలు మేరీ అతని కుటుంబ సభ్యులు. మేరీ చక్రాల కుర్చీకే పరిమితమైపోయిన వ్యాధిగ్రస్త. చెల్లెలి పిల్లల పైన బ్రాండన్ కెంతో ప్రేమ. తల్లినీ, చెల్లెళ్ళనీ, పిల్లల్నీ చూడడం, వాళ్ళతో కొంచెం కాలం గడపడం బ్రాండన్ కి చాలా ఇష్టమైన పనే, అయితే ఆ పల్లెటూళ్ళో పొద్దు పోవడం కొంచెం కష్టమతనికి.

అందరు ఆస్ట్రేలియా వాసుల్లాగే  బ్రాండన్ కి కూడా లండన్ లాటి పెద్ద నగరాలంటేనే ఇష్టం. ఆస్ట్రేలియాలోని విశాలమైన మైదానాలూ, ఏకాంతమూ, చిన్న చిన్న పల్లెటూళ్ళు చూసీ చూసీ విసుగెత్తిపోయిన వాళ్ళు పెద్ద నగరాల్లో సందడీ, సమూహాలూ కావాలనుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. పైగా ఆస్ట్రేలియాలోని పల్లెటూళ్ళల్లో ఒళ్ళు వంచి చాకిరీతో అలిసిపోయి వుంటారేమో, ఇంగ్లండు రాగానే పెద్ద పట్టణాల్లోని విశ్రాంతి జీవితం కోరుకుంటారు ఆట విడుపుగా.

బ్రాండన్ తల్లిగారు తెలివైన మనిషే కానీ బొత్తిగా ప్రపంచ ఙ్ఞానం శూన్యం. ఆచారాలూ, మూఢ నమ్మకాలూ ఎక్కువ. మిసెస్ హోంస్ కేవలం తన పిల్లల పని మాత్రమే పట్టించుకునే మనిషి. ఇంట్లో మిగతా వ్యవహారాలలో ఆమె తల దూర్చదూ, ఆమె అభిప్రాయం ఎవరూ పట్టించుకోరు. మేరీ తల్లి సాయంతో స్నానం చేయడానికి మాత్రమే తన చక్రాల కుర్చీలోంచి లేస్తుంది.

అందరికీ వాల్టర్ బ్రాండన్ పైన ప్రేమాభిమానాలు మెండు. అతను ఎవరైనా మంచి అమ్మాయిని పెళ్ళాడితే బాగుండునన్న ఆశ వున్నా, అతను పెళ్ళయి తమని పట్టించుకోకపోతే తమ గతి ఏంటన్న బెంగా వుంది. ప్రస్తుతం ఆ కుటుంబానికి వాల్టర్ ఆస్ట్రేలియాలో సంపాదిస్తున్న డబ్బే ఆధారం.

వాల్టర్ చెల్లెలు  ఫానీ హోంస్ తన పిల్లల చదువూ సంధ్యలూ శిక్షణ బాధ్యతా అంతా తానే చూసుకుంటుంది. ఆమె ఎంత జాగ్రత్త పరురాలంటే, ఆఖరికి పిల్లలకి చదవడానికిచ్చే పుస్తకాలు కూడా ముందు తాను చదివి వాళ్ళకిస్తుంది. వాళ్ళని ఇంట్లో నౌకర్లతో కూడా మాట్లాడనివ్వదు. దాంతో వాళ్ళకి వాల్టర్ మామ రాకా, అతను తెచ్చే బహుమతులూ, అతనితో వెళ్ళే షికార్లూ చచ్చేంత ఇష్టం. అయితే తల్లి మాత్రం అవేవీ తిసుకోనిచ్చేది కాదు.

ఎంతో మర్యాదగా తనని పలకరించి ఒద్దికగా కూర్చునే తన చెల్లెలి పిల్లలకన్నా, చూడగానే గొల్లుమని నవ్వుతూ పైన పడిపోయే ఫిలిప్స్ పిల్లలు ఎక్కువగా నచ్చుతారు వాల్టర్ బ్రాండన్ కి.

అయితే ఫిలిప్స్ పిల్లలూ ఈ మధ్య జేన్ శిక్షణలో కుదురుగా కూర్చుంటున్నారనీ, వాళ్ళ అల్లరి కొంచెం తగ్గిందనీ చెల్లెళ్ళతో చెప్పాడతను. అల్లరికంటే, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో గారాబం ఎక్కువని అతని అభిప్రాయం.

ఫిలిప్స్ ఇంట్లో చేరిన గవర్నెస్, జేన్ మెల్విల్ గురించి ఇదివరకే ఫానీ విని వున్నది. ఆమెకి అన్న జేన్ ని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానమూ వచ్చింది. అయితే ఈ మధ్య అలాటిదేమీ లేదని రూఢి చేసుకుంది.

“ఫానీ! నేను మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఎస్టేటు పరిస్థితి కొంచెం అస్త వ్యస్తమైంది, మళ్ళీ నేనెళ్ళి చేతుల్లోకి తీసుకుంటేగాని ఒక కొలిక్కి రాదు. ఒక పది రోజుల్లో బయల్దేరుతాను. మీకెప్పట్లాగే డబ్బు పంపుతూ వుంటాన్లే. అదలా వుంచితే, నాకింకొక ఆలోచన వస్తూంది. ఆరుగురు పిల్లల బాధ్యతతో నువ్వు సతమతమవుతూ వున్నావు. పెద్దవాడు, ఎడ్గర్ ని నాతో తిసికెళ్తాను. నాతో వుంటే ఏదైనా పని నేర్చుకుంటాడు, నీకూ కొంచెం భారం తగ్గుతుంది. ఏమంటావ్?” అడిగాడు వాల్టర్ చెల్లెలిని.

“అమ్మో! వొద్దులే వాల్టర్. వాణ్ణొదిలి నేనుండలేను. చిన్నవాడు, వాడి చదువుకూడా పూర్తికాలేదు.”

“నువ్వు నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని చదువు చెప్తే ఈ జన్మకి వాడి చదువు ఎప్పటికీ పూర్తికాదు కూడా! వాణ్ణి ప్రపంచంలోకి పంపించు ఫానీ! పదహారేళ్ళొచ్చాయి, వాడింకా చిన్నపిల్లాడు కాదు. అయినా నేను వుంటాకదా చూసుకోడానికి. వాడికి పుస్తకాల ఙ్ఞానం తప్పితే లౌకిక ఙ్ఞానం బొత్తిగా లేదు. అలాగని మరీ అంత తెలివి తక్కువ వాడు కూడా కాదు…”

“ ఏమిటీ? తెలివి తక్కువతనమా? వాడి వచ్చినన్ని లెక్కలూ, జాగ్రఫీ, లాటినూ, చరిత్రా మీకెవరికైనా వొచ్చా అసలు? కావాలంటే పరీక్ష చేయి.” గయ్యిమంది ఫానీ

“ఫానీ! నేను వాణ్ణి తెలివి తక్కువ వాడనలేదు. నువ్వన్నట్టే వాడికవన్నీ వొచ్చి వుండొచ్చు. కానీ తన పొట్ట పోసుకోవడానికి ఏదైనా పని కూడా వచ్చి వుండాలి కదా? ఆ పని నేను నేర్పిస్తాను.”

“అవును, నేను చదువైతే నేర్పిస్తాను కానీ, పని ఎలా నేర్పిస్తాను? వాడి కొచ్చిన చదువుకి చర్చిలో ఫాదరుద్యోగమైతే సరిగ్గా సరిపోతుంది,” స్వగతంగా అంది ఫానీ.

“ఫానీ, ఏ పనైనా సరే నేర్చుకోవాలంటే వాణ్ణి వదిలి నువ్వుండక తప్పదు.  వాణ్ణి బయట ప్రపంచంలోకి పంపకా తప్పదు. ఆ పంపేదేదో నాతో పంపు. నీకు వాడెలా వుంటాడో నన్న బెంగా వుండదు.”

“అమ్మో! వొద్దులే వాల్టర్. మీ విక్టోరియా రాష్ట్రమంతా ఖైదీలూ, దొంగల ముఠాలూ! బంగారం కొరకు ప్రాణాలు తీసేవారూ! ఎందుకులే, ఇక్కడే వుండనీ!”

“నా ఎస్టేటులో గొర్రెల మందలు తప్ప మనుషులుండరమ్మాయ్!  అక్కడ ఊపిరి సలపనిపనితో పక్క మనిషితో మాట్లాడే తీరికే వుండదు. కొన్నాళ్ళు పోతే వాడికీ ఒక చిన్న ఎస్టేటు కొనిస్తా. ఆ పైన మెల్లిగా చిన్నవాడి రాబర్ట్ నీ తీసికెళ్తాను.”

“వాల్టర్! నీకు నామీద ఎంతో ప్రేమనీ, నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావనీ నాకు తెలుసు. కానీ ఎందుకో వాళ్ళని వదిలి వుండగలననే నమ్మకం లేదు నాకు. డబ్బు పెద్దగా సంపాదించుకోలేకపోయినా పరవాలేదు. నేర్చుకున్న నీతిని పోగొట్టుకోకుంటే, అదే పదివేలు. బయట ప్రపంచంలో ఎదురయ్యే ప్రలోభాలు ఎదుర్కొనే శక్తి వాళ్ళకుందంటావా? పైగా మేనమామవు, ప్రేమతో వాళ్ళని కట్టడి చేయగలవో లేదో…”

“చూడు ఫానీ! నేను వాళ్ళని ఎంతైనా కట్టడి చేయగలను, ఎంతైనా పైకి తేగలను. అసలు నువ్వు వాళ్ళ అభిప్రాయాలకీ కొంచెం విలువివ్వడం నేర్చుకో. ఇప్పుడొక పని చేద్దాం. మనిద్దరం వాదించుకునే బదులు, వాణ్ణే పిలిచి అడుగుదాం. వాడికి ఎలా బాగుంటే అలా చేయనిద్దాం. ఏమంటావ్?”

సరేనంది ఫానీ. ఎడ్గర్ ని లోపలికి పిలిచారు. మేనమామ సలహానీ, సూచనలనీ శ్రధ్ధగా విన్నాడు ఎడ్గర్. కాసేపు తల్లి వంకా, కాసేపు మేనమామ వంకా, కాసేపునేలవంకా చూసాడు.

“అమ్మా! నువ్వేం చేస్తే బాగుంటుందనుకుంటున్నావు?” తల్లిని అడిగాడు.

“అమ్మ ముందు నీ ఇష్టం తెలుసుకోవాలనుకుంటుంది,” బ్రాండన్ జవాబిచ్చేడు.

“అయితే నేను నీతో వస్తాను మామయ్యా!”

“ఎడ్గర్! నిన్నొదిలి నేనుండలేనురా!” ఫానీ అడ్డుపడింది.

“అమాయకంగా మాట్లాడకు ఫానీ! వాడిష్టమొచ్చినట్టు చేయనీ! ప్రపంచం లో తిరగకుండా వాడు పెద్దవాడెలా అవుతాడు?” చెల్లెల్ని విసుక్కున్నాడు బ్రాండన్.

“అమ్మా! నీకంత బాధగా వుండేటట్టయితే నేను వెళ్ళను. ఇక్కడే వుంటాను,” ఎడ్గర్ తల్లి ఆవేదన చూసి వెనుకంజ వేసాడు.

“ఫానీ! అమ్మనీ, మేరీని కూడా అడిగి చూడు. తొందరపడి వాడి భవిష్యత్తు పాడు చేయకు,” వాల్టర్ సలహా ఇచ్చాడు.

పిల్లవాడి అమ్మమ్మా, పిన్ని మేరీ కూడా ఎడ్గర్ని  బ్రాండన్ తో పంపడమే మంచిదన్నారు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తానని వాగ్దానం చేసిన మీదట ఫానీ కొడుకుని అన్నగారివెంట పంపడానికొప్పుకుంది.

           ***

veelunama11

ఆస్ట్రేలియా వెళ్ళే పడవ ఎక్కడానికి ఎడ్గర్ తో కలిసి లండన్ తిరిగొచ్చాడు భ్రాండన్. తనతో చాలా ముభావంగా వున్న హేరియట్ ని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా, కొంచెం నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఫిలిప్స్ పెద్ద కూతురు చిన్నారి ఎమిలీ ఎడ్గర్ మెల్బోర్న్ వెళ్తున్నాడనీ, తమ ఎస్టేటు, ఊరు విరివిల్టా చూస్తాడనీ ఉత్సాహపడింది. అక్కడ వున్న తన స్నేహితులందరికీ పేరు పేరునా ఉత్తరాలిచ్చింది. ఎడ్గర్ అవన్నీ తప్పక అందజేస్తానని మాటిచ్చాడు.

“అది సరే, ఎమిలీ. ఫ్రాన్సిస్ హొగార్త్ కనిపించడే? లండన్ వదిలి తన ఊరికెళ్ళిపోయాడా?” బ్రాండన్ ఎమిలీని అడిగాడు.

“ఆయన పార్లమెంటు ఎన్నికలకి పోటీ చేస్తాడట. అక్కడ పాపం విసుగ్గా వుండదో మరి!”

“ఎమిలీ! చిన్న పిల్లవి, నీకు రాజకీయాలేం అర్థమవుతాయి? అన్నిటిలోనూ తలదూరుస్తావే!” కోపంగా అంది హేరియట్ మేన కోడలితో.

“అవునవును! నేనూ పేపర్లో చూసాను అతను పోటీ చేస్తున్నాడని. ఎమిలీ, నిజంగా పార్లమెంటులో పని చాలా విసుగు,” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“మీరంతా అలాగే వేళాకోళం చేస్తూ వుండండి. ఆయన మాత్రం నెగ్గేది ఖాయం,”  హేరియట్ ఉక్రోషంగా అంది.

“ఆయన నెగ్గితే జేన్ మెల్విల్ చాలా సంతోషపడతారు.”

“ఆవిడే కాదు, మేమంతా కూడా ఎంతో సంతోషిస్తాం. అసలు ఆయన లాటి వాళ్ళు పార్లమెంటుకే శోభ తెస్తారు. నాన్నగారిక్కూడా ఆయనన్నా, ఆయన పార్టీ అన్న ఎంతో ఇష్టం. ఈ ఎన్నికల్లో నెగ్గగానే మా ఇంటికి వొస్తున్నారాయన!”  అతిశయంగా అంది హేరియట్.

“అవునూ, జేన్, ఎల్సీ బాగున్నారా హేరియట్?”

“బాగుండకేం చేస్తారు? బానే వున్నారు. అయినా, చచ్చే చావుగా వుంది బాబూ ఈ నౌకర్లతో! మంచి మంచి నౌకర్లంతా ఇంగ్లండు వదిలిపెట్టి ఆస్ట్రేలియా వెళ్తున్నారల్లే వుంది,  ఇక్కడ అసలు ఒక్క మనిషైనా దొరకడం లేదు. ఆవిడ, అదే జేన్ మెల్విల్ గారయితే తాను టీచర్నన్న టెక్కో ఏమో కానీ, మా చేతికింద ఒక్క పనైనా అందుకోదు.”

“ఎల్సీ బాగుందా?”

“ఎప్పట్లాగే ఏడుస్తూ వుంది.”

నిట్టూర్చాడు బ్రాండన్.

“సరే, అందరికీ ఒకసారి వీడుకోలు చెప్దామని వచ్చా. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తానో ఏమో మిమ్మల్నందరినీ!”

లేచాడు బ్రాండన్. ఎమిలీ దగ్గరకెళ్ళి గుసగుసగా అన్నాడు,

“ఎమిలీ! ఒకరోజు నేను మంచి వాణ్ణి కాబట్టి నాకొక బహుమతి ఇస్తానన్నావు, గుర్తుందా? ఆ బహుమతి ఇప్పుడిస్తావా?”

నవ్వేసింది ఎమిలీ!

“ఓ! అదా? నీకు బానే గుర్తుందే!  రా, నాతో వస్తే నీ బహుమతి ఇప్పిస్తా!”

అతన్ని చేయి పట్టుకొని లాక్కెళ్ళింది తాము చదువుకునే గదిలోకి. గదిలో ఎల్సీ ఏదో పని చేసుకుంటూ చిన్న పాట కూనిరాగం తీస్తూ వుంది.

“ఎల్సీ! నీ పాట వినడానికెవర్ని తెచ్చానో చూడు!”  ఎమిలీ గొంతు విని టక్కున పాట ఆపేసింది ఎల్సీ. లేచి నిలబడింది.

“ఎల్సీ! పాట ఆపొద్దు. మళ్ళీ నేను నిన్నెప్పుడు చూస్తానో తెలియదు. ఈ పాట ఙ్ఞాపకాన్నైనా నాతో తీసుకెళ్తాను. పాడు! ఆపకు.” బ్రతిమిలాడాడు బ్రాండన్. ఎల్సీ మొహం సిగ్గుతో ఎర్రబడింది.

“భలే వారే! నేనేదో పిల్లలకోసం గాలిపాట కూని రాగాలు తీస్తుంటే! అసలది పాట కూడా కాదు.”

“నేనొప్పుకోను. అదేం గాలిపాట కాదు. ఎల్సీ మాకోసం ఆ పాట రాసి దానికి వరస కూడా తనే కట్టింది. ఇంతకీ పాట దేని గురించనుకున్నావు? వూళ్ళో మేము పుట్టకముందు ఇల్లు తగలబడుతూంటే నువ్వూ, పెగ్గీ, జిం కలిసి మంటలార్పారు చూడు? దాని గురించి. ఆ కథంతా మేం ఎల్సీతో చెప్పేసాం.”

“ఆ కథ నాతో పెగ్గీ కూడా చెప్పింది.  పిల్లలు మిమ్మల్ని బాగా తలచుకుంటూంటే ఆ పాట కట్టాను.”

“ఓ! అయితే నేను లేకపోయినా నన్ను తల్చుకుంటారన్నమాట!” ఆ మాట అనడం ఎమిలీ తో అన్నా, వాల్టర్ బ్రాండన్  చూపంతా ఎల్సీ పైనే వుంది.

“అయితే మిమ్మల్నందరినీ కాపాడిన హీరో లా కాకుండా, కేవలం ఒక స్నేహితునిగా గుర్తుంచుకోండి చాలు.” తిరిగి తనే అన్నాడు.

“ఇక్కడ మాకెవరూ స్నేహితులే లేరు బ్రాండన్ గారూ!  ఉన్న ఓకే ఒక్క స్నేహితుణ్ణి ఎలా మరిచిపోతాం?” దిగులుగా అంది ఎల్సీ.

“నా గురించి నువ్వు పాట రాయడం…”

మాటలు దొరకలేదు బ్రాండన్ కి. అతనికి అప్పుడక్కడ నించి ఫిలిప్స్ పిల్లలు మాయమయి పోయి తనూ, ఎల్సీ మాత్రమే వుంటే బాగుండనిపించింది.

“బ్రాండన్! ఎల్సీ దేని గురించైనా పాట కట్టగలదు తెలుసా. మా పెంపుడు పిల్లుల గురించి కూడా!” పిల్లలందర్లోకి చిన్నది కాన్స్టన్స్ చెప్పింది. ఎర్రబడ్డ మొహం తో నిలబడ్డ ఎల్సిని చూస్తూంటే బ్రాండన్ కి కొండెక్కినంత సంతోషంగా అనిపించింది.

 

ఆమె మనసులో తనపట్ల ఏదో మూల అభిమానం వుందన్నమాట. తనే తెలివితక్కువగా ఆమెని వొదులుకోవడానికి సిధ్ధపడ్డాడు. ఇప్పుడిక ఆలస్యమైపోయింది. తనూ ఎడ్గర్ మర్నాడే బయల్దేరాలి. అయితే ఏం, తను ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించెయ్యడూ! అతను ఆలోచనల్లో కొట్టుకుపోతూ వుండగానే

“జేన్ ని పిలుస్తాను,” అంటూ లేచిందిఎల్సీ. అతని మొహంలో కదులుతున్న భావాలని ఆమె గుర్తుపట్టింది.

“ఆగాగు, ఎల్సీ! ఇంతకుముందొకసారి నువ్వూ మీ అక్కా, పెగ్గీ అంతా కలిసి ఆస్ట్రేలియా వెళ్దామనుకున్నారు కదా? ఆ ఆలోచన ఏమైంది?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“మా అదృష్టం బాగుంటే అలాగే వెళ్తాము.”

“అయితే నేనక్కడ నిన్ను చూసే అవకాశం వుందన్నమాట!” వెలిగిపోతున్న మొహంతో అన్నాడు బ్రాండన్.

ఇంకేదో అనబోయిన బ్రాండన్ హేరియట్ రాకతో ఆపేసాడు. బ్రాండన్ పిల్లలతో కలిసి ఎక్కడికెళ్ళాడో నన్న కుతూహలంతో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది హేరియట్.

“ఛీ! ఛీ! ఎమిలీ! ఏంటిది? వాల్టర్ ని ఇక్కడకు తీసుకొచ్చావేం? మీ టీచరమ్మకి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుందో తెలుసా?” గద్దించింది మేనకోడలిని.

“పోనివ్వు హేరియట్! నేను వాళ్ళ టీచర్ను వెతుకుంటూనే ఇక్కడకొచ్చాను. ఇంతకీ ఎక్కడుందావిడ?” విసుగ్గా అన్నాడు బ్రాండన్.

“కింద వంటింట్లో మిగతా పనివాళ్ళతో వున్నట్టుంది. రా, నిన్నక్కడికి తీసికెళ్తాను. ”

చేసేది లేక, బ్రాండన్ ఎల్సీకి చెప్పి బయటికెళ్ళాడు. కనీసం జేన్ తో తన మనసులో మాట చెప్పుదామనుకుంటే, అతన్ని వదలకుండా హేరియట్ నిలబడింది.

ఎల్సీ మాత్రం అతని చూపులనీ, మూగ భాషనీ అర్థం చేసుకోవడమే కాక అతని ప్రేమని తన కన్నె మనసులో దాచుకుంది, స్త్రీ సహజమైన సంతోషంతో. మర్నాడే వాల్టర్ బ్రాండన్ ఆస్ట్రేలియాకి నౌకలో బయల్దేరాడు.

 ***

(సశేషం)

వీలునామా -27 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

రాజకీయం
(కిందటి వారం  తరువాయి)

“ఫ్రాన్సిస్! నువు ఎనికల్లో నిలబడితే నెగ్గగలవా?” ఉత్సాహంగా అడిగింది జేన్.

“మావయ్య ఆ వూళ్ళో లిబరల్ పార్టీకే వోట్లెక్కువ పడతాయనే వాడు. టాం అయితే నీకెదురే లేనట్టు మాట్లాడాడనుకో!”

“టోరీ పార్టీ అభ్యర్థీ, విగ్ పార్టీ అభ్యర్థి ఇద్దరూ సంపన్న కుటుంబాల నించి వచ్చిన వారే. అయితే ఇద్దరికీ గెలుపు దక్కకపోవచ్చనీ, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా నెగ్గొచ్చనీ అనుకుంటున్నారు. ” ఒప్పుకున్నాడు ఫ్రాన్సిస్.

“నువ్వంటే అందరికీ ఊళ్ళో ఇష్టమే కదా? ”

“చెప్పలేం జేన్! భూస్వాములకి నేనంటే కొంచెం కోపం. పాలేర్ల కోసం భూమి ఇవ్వడం, చిన్న ఇళ్ళూ కట్టించి ఇవ్వడం వంటివి ముందు ముందు పెద్ద సమస్యలౌతాయని వాళ్ళ అభిప్రాయం. పాలేర్లూ, కూలి వాళ్ళకి సహజంగానే నేను చేసిన పనులు నచ్చుతాయి కానీ, వాళ్ళకసలు వోటు హక్కే లేదు కదా? ”

“పోటీ చేస్తే ఏదో ఒక పార్టీ అభ్యర్థి గా చేస్తావా లేక స్వతంత్రంగా చేస్తావా? ”

“ఒకవేళ పోటీ చేస్తే మాత్రం, స్వతంత్రంగా నిలబడాలనే అనుకుంటున్నాను. అయితే ఏ పార్టీ మద్దతూ వుండకపోవడం తో గెలిచే అవకాశాలు తగ్గొచ్చు.”

“రెండు పార్టీల వోట్లూ చీలిపోతాయన్నమాట.”

“అదే సమస్య. ఏదో ఓక పార్టీతో చేరితే గెలుపు తథ్యమే కానీ, నా ఆశయాలూ, అభిప్రాయాలూ నీరు గారిపోతాయి. స్వతంత్రంగా పోటీ చేద్దామంటే గెలుపు కొంచెం సంశయం.”

“ఏదేమైనా, లిబరల్ పార్టీతో కలిసి నువ్వు పని చేయలేవేమో ఫ్రాన్సిస్. అందులోనూ ఆ పార్టీ మనుషులు పదవుల్లో వున్నప్పుడు, ప్రభుత్వంలో వునా, అప్పోజిషన్లో వున్నా, వాళ్ళతో నెగ్గలేం.. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేసేవన్నీ, స్వప్రయోజనాలకే తప్ప ప్రజలకి పనికొచ్చేవేమీ లేవు. ఆ మాట కొస్తే టోరీ పార్టీ యే కొంచెం నయం. ఎలాగైనా సరే, నీలాటి వాళ్ళు పార్లమెంటు మెట్లెక్కడం మంచిది. రెండు పార్టీల మెంబర్ల మీదా కన్నేసి వుండాల్సిన అవసరం సాధారణ పౌరులకెంతైనా వుందిప్పుడు. అందుకే నువ్వసలు ఏ పార్టీతోనూ చేరకుండా వుండడం మంచిదేమోననిపిస్తుంది నాకు. అలా అసలే గెలవలేనంటావా?” ఆశగా అడిగింది జేన్.

veelunama11

“ఏమో మరి. ప్రయత్నిస్తే కానీ తెలియదు. అందులోనూ అదంతా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం.”

“ఎంత వింత కదా! ప్రజలకీ, దేశానికీ ఏదైనా మంచి చేద్దామనుకుంటే అందుకు ముందుగా డబ్బుండాలన్నమాట. అసలు నువ్వు ముందుగా దాన్ని మార్చటానికి కృషి చేయాలోయ్!” ఆవేశంగా అంది జేన్.

“పిచ్చి జేన్! పార్లమెంటు సభ్యులూ, రాజకీయ నేతలూ ఎప్పుడూ రాజకీయాన్నీ, ప్రభుత్వాన్నీ డబ్బున్న వాళ్ళ చేతుల్లోనే వుండేటట్టు చూసుకుంటారు. ఎలాగనుకున్నావు? ఇదిగో, ఇలా రాజకీయాన్నీ చాలా ఖరీదైన వ్యవహారం చేయడం ద్వారా. అందుకే సామాన్య ప్రజానీకానికీ, ప్రభుత్వాలకీ అంత దూరం.”

“మరందుకే కదా నిన్ను ఎన్నికల్లో పోటీ చేయమనేది. రైతుల సాధక బాధకాలూ, పేదవారి కష్టాలూ తెలిసిన నీలాంటి వాడు పార్లమెంటులో వుండడం ఎంతైనా అవసరం ఈనాడు.

ఎన్నికలలో పోటీ చేయడానికి నీదగ్గర సరిపడా డబ్బు లేకపోవడం ఏమిటి? వెయ్యీ, రెండు వేల పౌండ్లు లేవా నీ దగ్గర? ఇంతకీ నీ నామినేషను పత్రం ఏదీ? తీసుకొచ్చావా?”

“ఓ! ఇదిగో, నా దగ్గరే వుంది. చూస్తావా? ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు లండన్ లోని ఫ్రీమాన్ గారితో మాట్లాడడం మంచిదని నా కనిపిస్తూంది. ఆయన ప్రభుత్వ పార్టీకి ఎన్నికల అభ్యర్థులని ఎంపిక చేస్తూ వుంటారట. నాలాటి అభిప్రాయాలున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఎంతుందో ఆయనైతే సరిగ్గా అంచనా వేయగలడు. నేనైతే ఇప్పుడు ఊళ్ళో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులందరితోనూ మాట్లాడుతున్నా.”

“ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఎంతో శ్రమ తో కూడుకున్న విషయం మరి.”

“ఆ శ్రమంతా నిజాయితీ పరులకూ, కష్టపడి ఏదైనా మేలు చేద్దామనుకునేవారికి మాత్రమే.”

“అలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి మరి.”

“అని నువ్వనుకూంటే సరిపోదు. రాజకీయ పార్టీలనుకోవాలి.”

“అదంతా పక్కన పెట్టు. నువ్వు నెగ్గి తీరతావు. నువ్వైతే ముందు స్పీచీ సాధన చేయి,” నవ్వుతూ అంది జేన్.

“మరే! కోడిగుడ్లతో కొట్టినా, నా పుట్టుకని గురించి హేళన చేసినా, మా అమ్మని గురించి గుచ్చి గుచ్చి అడిగినా, అలాగే ఆగకుండా ప్రసంగిస్తాను. ఆ సోదంతా వినడానికి ప్రజలకి ఓపికుంటుందో ఉండదో కానీ!”

“అంతా బానే అవుతుందిలే. పదేళ్ళ కిందట మనూళ్ళో భూస్వాములంతా కలిసి మావయ్యని ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. మావయ్య పది మందిలో మాట్లాడడానికి భయపడి వెనకడుగు వేసారు. అందుకే నువ్వు సభాప్రసంగాలకి ముందునించే సిధ్ధపడి వుండాలి.”

“ అది సరే కానీ, జేన్, ఈ మధ్య మిస్ థాంసన్ గారింట్లో నాకు తరచూ ఒక పెద్ద మనిషి కనపడుతూన్నాడు. బహుశా పార్లమెంటు సభ్యుడై వుండొచ్చు. బానే డబ్బు సంపాదించాడంటారు. కుటుంబమూ, వ్యాపారమూ లాటి బాదరబందీలేవీ లేవు. మన వూళ్ళో ఆయన మాట బానే చెల్లుబడి అవుతుంది. ఆయనే నన్ను ఈ ఎన్నికల్లో నిలబడమనీ, తాను సాయం చేస్తాననీ ప్రోత్సహిస్తున్నాడు. ఆయన సహాయమూ, నువ్వు పక్కనుంటే వచ్చే బలమూ వుంటే నేనీ ఎన్నికల్లో నిలబడొచ్చేమో!”

“తప్పకుండా. నువ్వు వెంటనే ఫ్రీమాన్ గారితో మాట్లాడు. రేపు రాగానే ఏ సంగతీ నాతో చెప్పు.”

 

 

ఫ్రాన్సిస్ ఫ్రీమాన్ గారిని కలవడానికి వెళ్ళిపోయాడు.

అదృష్టవశాత్తూ అప్పుడు పార్టీ పెద్ద ఆందోళనలూ, సమస్యలూ లేక శాంతియుతంగానే వుంది. విగ్గుల పార్టీ కానీ, టోరీ పార్టీ కానీ వాదించుకొని విభేదించుకునే అంశాలు జన జీవనంలో పెద్దగా ఏమీ లేవు. వోట్లు సమంగా పడతాయి రెండు పార్టీల అభ్యర్థులకీ. ఇలాటి పరిస్థితులలో ఒక స్వతంత్ర అభ్యర్థిని బల పర్చడం తమకి ప్రయోజనకరంగా వుంటుందేమోననిపించింది ఫ్రీమాన్ గారికి. ఫ్రాన్సిస్ భూస్వామి కావడం వల్ల డబ్బున్న వాళ్ళ వోట్లూ పడొచ్చు, రైతు కూలీలకెంతో మంచి చేసాడు కాబట్టి వారి వోట్లూ పడొచ్చు. ప్రభుత్వాన్ని అతను పెద్దగా నిగ్గదీసే సందర్భాలూ రాకపోవచ్చు.

“మీ ఎస్టేటులో పనిచేసే రైతు కూలీలు మీరెటు వేయమంటే అటే వోట్లేస్తారు కదా?” ఫ్రీమాన్ అడిగాడు ఫ్రాన్సిస్ ని.

“అదెలా చెప్పగలమండీ? మా ఎస్టేటులో పని చేసే రైతులని నేను చెప్పినట్టే వినమని నేనెప్పటికీ నిర్బంధించను. వాళ్ళ ఇష్టప్రకారమే వాళ్ళని వోట్లు వేయమంటాను. రైతులూ, ఎస్టేటు పని వాళ్ళూ వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకీ వేసుకుంటారు. లిబరల్ పార్టీకి చెందిన మీరు ఇలా మాట్లాడుతున్నారే?”

“అవుననుకోండి. కానీ మనకి అందరి మద్దతూ వుండాలి కదా, అప్పుడే ఎన్నికలు నెగ్గగలుగుతాం.”

“అందుకని నీతి మాలిన పన్లు చేయలేం కదా? నేను నా చేతులు శుభ్రంగా వుండాలనుకునే మనిషిని.”

“అయ్యొయ్యో, అందరూ అంతేనండి. ఈ వెధవ రాజకీయాల్లో చేతులు శుభ్రంగా వుండాలంటే అయ్యే మాట కాదనుకోండి….”

“అదేం లేదు ఫ్రీమాన్ గారూ! నేను రాజకీయాల్లో కూడా నీతి తప్పకుండా వుంటాను.”

“అలా వుండగలిగితే అంతకంటే కావలసిందేముందండీ! రండి, మిమ్మలని మా పార్టీ అభ్యర్థికి పరిచయం చేస్తాను.”

లిబరల్ పార్టీ అభ్యర్థి వున్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే అతను కూడా వేరే ఏ ప్రయోజనాలకూ ఆశించకుండా ఒక కొత్త స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వాలన్న ఆలోచనకి అడ్డు చెప్పలేదు. అతనికి ఫ్రాన్సిస్ నిర్మొహమాటమూ, ఖచ్చితమైన అభిప్రాయాలూ నచ్చినట్టున్నాయి. వాళ్ళ ఇంటికి ఒక సారి భోజనానికి రమ్మనీ, అక్కడ ఇంకొందరు రాజకీయ మిత్రులని కలుసుకొని ఎన్నికల వ్యూహం గురించి ఆలోచించుకోవచ్చనీ ఆహ్వానించాడు.

ఈ సంగతి ఫిలిప్స్ ఇంటికెళ్ళి ఫ్రాన్సిస్ చెప్పగానే హేరియట్ ఫిలిప్స్ దృష్టిలో ఫ్రాన్సిస్ చాలా ఎత్తుకెదిగాడు. లిల్లీ ఫిలిప్స్ ఈ సంగతి వినగానే ఇక పైన జేన్, ఎల్సీలిద్దరితో చాలా మర్యాదగా, ఆప్యాయంగా వుండాలని నిర్ణయించుకొంది. ఒక వారం లండన్ నగరంలో గడిపి ఫ్రాన్సిస్ తిరిగి తన ఎస్టేటు చేరుకున్నాడు. ఈ లోగా బ్రాండన్ అంటే ఎవరో గుర్తు కూడా రానంతగా బ్రాండన్ హేరియట్ మనసులోంచీ, ఆలోచనల్లోంచీ జారిపోయాడు.

 ***

(సశేషం)

వీలునామా – 26 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

    (గత వారం తరువాయి )

ఆధ్యాత్మికత,  ప్రేమా,  రాజకీయం

బ్రాండన్ ఇంగ్లండు వదిలి మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తాడని తెలియగానే చిన్నారి ఎమిలీ బావురుమంది. మళ్ళీ తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చన్న ఆలోచనతో బ్రాండన్ ఇంగ్లండులో తనుండబోయే ఇంకొద్ది రోజులూ తల్లితో చెల్లేళ్ళతో గడపడానికి లండన్ వదిలి ఏష్ ఫీల్డ్ వెళ్ళాడు. ఆ రోజంతా మొహం చిన్నబుచ్చుకోనే వుంది ఎమిలీ. ఎమిలీతో,  హేరియట్ తో వేగి విసిగిపోయిన జేన్ కి ఆ రోజు తన కొరకు ఫ్రాన్సిస్ వచ్చి కూర్చున్నాడన్న మాట సేద దీర్చింది. అందులోనూ తనూ అతనికి ఆతృతగా ఒక వార్త చెప్పాలని ఉవ్విళ్ళూరుతుంది.

అసలు తనారోజు రావాలనుకుంటున్నట్టు ఫ్రాన్సిస్ లిలీ ఫిలిప్స్ కి చెప్పాడు కూడా. ఆవిడ జేన్ తో ఆ సంగతి చెప్పడమే మర్చిపోయింది. బయట కూర్చున్న ఫ్రాన్సిస్ జేన్ చెల్లెల్ని తోడు తెచ్చుకోకుండా ఒంటరిగా వస్తే బాగుండు, అని ఆశ పడ్డాడు.

తను రాగానే, లేచి నిలబడి, చెల్లెల్ని పిలిచే అవకాశం ఇవ్వకుండా బయటికి దారి తీసిన ఫ్రాన్సిస్ ని చూసి జేన్ ఆశ్చర్యపోయింది. అయితే ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాలేమోననుకుని సరిపెట్టుకుంది.

తను అంతకు ముందురోజు తన తండ్రి ఆత్మతో మాట్లాడిన ఉదంతం మొత్తం జేన్ కి వివరించాడు. జేన్ ఏ వ్యాఖ్యానాలూ చేయకుండా,అడ్డు ప్రశ్నలు వేయకుండా శ్రధ్ధగా విన్నది. తన మన్సులోని గాఢమైన కోరిక గురించిన ప్రశ్నని ఫ్రాన్సిస్ దాట వేసాడు. తరవాత తనకి తన తల్లి నని చెప్పుకుంటూ మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరం గురించిన ప్రశ్నా, దానికి తనకొచ్చిన జవాబూ వివరించాడు.

“చెప్పు జేన్! నీ అభిప్రాయమేమిటి? ఇదంతా నమ్మొచ్చంటావా?”

“నిజంగా నమ్మలేకుండా వున్నాను. అయితే మనకొచ్చిన జవాబులని ఎలా అర్థం చేసుకోవాలో కూడా కొంచెం అయోమయంగా వుంది.”

“ఆయన ఆత్మ ఇచ్చిన సలహాలు పాటించొచ్చంటావా?”

“ఇంతకు ముందు నన్ను సలహాలడిగావు. ఇప్పుడు ఆత్మలనడుగుతున్నావు. నన్నడిగితే, బ్రతికున్న వాళ్ళనైనా, లేని వాళ్ళనైనా సలహా అడిగేకంటే, నీ మనసుకి నచ్చినట్టు చేసుకుంటూ పోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీదే కదా? అసలు నువ్వు నా వల్లనే ఫిలిప్స్ గారి సలహా పాటించడం నన్నెంతో బాధ పెడుతూంది. ఆయన సలహాకి అంత విలువ ఇవ్వకపోయి వుంటే నువ్వు మీ అమ్మ వుత్తరానికి జవాబిచ్చి వుండే వాడివి. ఇప్పటికే నేను నీ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నా కదా?”

veelunama11

“ఆ మాటకొస్తే మా నాన్నగారి ఆత్మ కూడా, ఆవిడ నా తల్లే అయినప్పటికీ ఆవిడకి దూరంగా వుండమనే కదా అన్నది. ఇందులో ఫిలిప్స్ గారొచ్చి పాడు చేసింది ఏముంది? అయినా, జేన్, నాకామెని చూడాలనీ, మాట్లాడాలనీ, ఉత్తరం రాయాలనీ ఏమాత్రం అనిపించడం లేదు.నాకు జన్మనివ్వడం అంటావా? అసలు నా జన్మలో సంతోషించాల్సిన విషయం, కనీసం ఒక్కటైనా వుందా చెప్పు? ఇలాటి జన్మనిచ్చినందుకా నేనావిడకి ఋణపడి వుండడం?”

“ఫ్రాన్సిస్! అంత నిరాశ పనికి రాదు. నిజంగా నీ బ్రతుకులో, ఆ మాటకొస్తే నా బ్రతుకులో సంతోషమేదీ లేదా? మనకైన అనుభవాలను తప్పు పట్టకు. ఆ అనుభవాలే లేకపోతే మనకి ఇంత ఙ్ఞానం కలిగేదా? జీవితం నించీ, మనిద్దరం ఒకరినించొకరం, నేర్చుకున్నదేదీ లేదా? దానికి విలువేమీ లేదా?”

” ఈ ఙ్ఞాన విఙ్ఞానాల సంగతీ, అనుభవ సారాల సంగతీ కాదు నేను మాట్లాడేది. నాక్కావల్సింది మామూలు మనుషులకుండే సంతోషాలు. చిన్నవీ, పెద్దవీ!”

అతని ఆవేశాన్నీ కోపాన్నీ చూసి జేన్ ఆత్మీయంగా నవ్వింది. ఆమె కళ్ళల్లో ప్రేమ బదులు, కేవలం స్నేహమూ ఆప్యాయతా వుండడం చూసి ఫ్రాన్సిస్ నిరాశ ఎక్కువైంది. తనని ఆమె ఎప్పటికీ ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించలేదేమో. తనన్నా, తన ఒంటరితనమన్నా ఆమెకి కేవలం జాలి! ఫ్రాన్సిస్ కి మనసంతా కృంగిపోతున్నట్టనిపించింది. ఇంకేదైనా మాట్లాడాలనుకున్నాడు.

“అదలా వుంచు? బ్రాండన్ ఏం చేస్తున్నాడు? అతనికి ఎల్సీ అంటే చాలా ఇష్టమని గుడ్డి వాళ్ళక్కూడా అర్థమవుతూంది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నాడు? ఎల్సీ పెళ్ళైపోతే నీకొక బాధ్యతైనా తిరుతుంది కదా?” అసహనంగా అన్నాడు.

నవ్వింది జేన్.

“ఇంతకు ముందే నీకు చెప్పాను ఫ్రాన్సిస్. బ్రాండన్ ఇదివరకే ఎల్సీని వివాహం గురించి కదిపాడు. అప్పుడది ఒద్దంది. ఇప్పుడు మళ్ళీ అడగాలంటే మొహమాటంగా వుంటుంది,  పైగా వాళ్ళిద్దరికీ ఒంటరిగా మాట్లాడుకునే సమయమూ సందర్భమూ కూడా వుండవు.”

“నేనైతే నా కిష్టమైన అమ్మాయి ఎదురుగా వుంటే చచ్చినా వదలను. ఎన్ని సార్లైతే అన్ని సార్లు ఎలాగో అలా వీలు చూసుకుని మాట్లాడతాను.”

“మళ్ళీ అడిగినా అది వొద్దంటుందని భయ పడుతున్నాడేమో! ఇప్పుడది ఒప్ప్పుకుంటుంది, కానీ ఆ సంగతి అతనికి తెలియదే!”

“ఓ పని చేయి! అతనడగడమే ఆలస్యం అని నువ్వు సూచన ప్రాయంగా తెలియచేయి. అర్థంలేని భయాలతో, మొహమాటాలతో చెల్లెలి భవిష్యత్తు పాడు చేయకు జేన్!”

“నువ్వన్నది నిజమే ఫ్రాన్సిస్. ఈ పరిస్థితిలో నేను పెద్దరికంగా  బాధ్యత వహించకపోతే దానికున్న ఒక్క అవకాశమూ పోతుంది. అయినా ఏదో సంకోచం నన్ను వెనక్కి లాగుతోంది. అదీ గాక అందరూ బ్రాండన్ హేరియట్ ని పెళ్ళాడతారని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎల్సీ గురించి ప్రస్తావిస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు వుండదూ?”

“నన్నడిగితే బుద్ధున్న వాడెవడూ హేరియట్ ని పెళ్ళాడడు. మొహం కుదురుగానే వున్నా, అంతా కలిపి చూస్తే ఆమెలో ఎలాంటి సౌందర్యమూ కనబడదు నాకు. ఇంకా ఆవిడ వదిన గారు, లిలీ ఫిలిప్స్ చాలా అందంగా అనిపిస్తారు. ఆవిడ ఎప్పుడూ అలాగే వుంటుందా?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

నవ్వేసింది జేన్.

“ముఖ సౌందర్యం మాటెలా వున్నా, లిలీ ఫిలిప్స్ ప్రవర్తన నాతోనూ ఎల్సీతోనూ చాలా సార్లు అంద వికారంగా వుంటుంది. అది సరే, నిన్నొక విషయం అడగాలనుకున్నాను. ఇవాళ పొద్దున్నే పెగ్గీ అక్క కొడుకు, నా శిష్యుడూ, టాం లౌరీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. వూళ్ళో అందరూ నిన్ను ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారట కదా? నాకు నువ్వు చెప్పనేలేదీ సంగతి!””

“అదా! అసలు నాకా సంగతే గుర్తు లేదు. మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరమూ, దాని గురించి ఆలోచనా, డెంస్టర్ ఇంటికెళ్ళడమూ, వీటన్నిటి ధ్యాసలో పడిమరిచేపోయాను,” చిన్న పిల్లాడిలా నవ్వుతూ అన్నాడు ఫ్రాన్సిస్.

ఆ రోజుల్లో ఆడవాళ్ళకి పెద్దగా రాజకీయాల్లో ప్రవేశం వుండేది కాదు. అయితే జేన్ లా కొంచెం ఆసక్తి వున్న స్త్రీలందరూ, రాజకీయాల్లో భవిష్యత్తుని వున్నదానికంటే పెద్దదిగా వూహించుకునేవారు. జేన్ కూడా అలాగే ఫ్రాన్సిస్ పెద్ద రాజకీయ వేత్త అయిపోయినట్టూ, తమ వూరినీ, ఎస్టేటునీ ఆదర్శవంతంగా తీర్చి దిద్దినట్టూ, అందరూ అతనికి జేజేలు పలుకుతున్నట్టూ ఊహించేసుకుంది. తమ కుటుంబానికి చెందిన వాడూ, విద్యాధికుడూ, పది మందికీ మంచి చేసే ఆలోచనలున్నవాడూ, ఎన్నికల్లో పోటీ చేసి పార్లిమెంటులో అడుగుపెడితే, అంతకంటే కావలసిందేముంది, అనుకున్నదామె అమాయకంగా.

స్వతంత్రంగా ఏదీ సాధించలేని స్త్రీలందరి లాగే, ఆమె తన కలలన్నీ నిజం చేసుకోవడానికి శిష్యుడు టాం లౌరీనీ, స్నేహితుడు ఫ్రాన్సిస్ నీ ఎన్నుకుంది. తన ఆశయాలకీ, ఆదర్సాలకీ ప్రాణం పోసి నిలబెట్టగలిగే వారు వాళ్ళిద్దరే అనుకుంది. అందుకే ఫ్రాన్సిస్ రాజకీయ ప్రవేశం గురించి అంత ఉత్సాహపడింది. డబ్బూ, చదువూ, సంఘంలో హోదా వున్న మగవాడు రాజకీయాల్లో ప్రవేశించి మనుషుల జీవితాలు మార్చెయ్యాలిగానీ, మామూలు మగవాళ్ళలా పెళ్ళీ, ఇల్లూ, పిల్లలూ లాటి మామూలు ప్రలోభాలకు లోను కాకూడదన్నది జేన్ నిశ్చితాభిప్రాయం. అందుకే ఫ్రాన్సిస్ చూపులూ, మాటలూ, కళ్ళల్లో తన పట్ల ఇష్టమూ అన్నీ అర్థమయినా, వాటిని పట్టించుకోదలచుకోలేదు. అవి ఆమె కన్నె మనసుని ఎంత గిలిగింతలు పెట్టినా, ఏమీ తెలియనట్టే వుండాలని నిర్ణయించుకుంది జేన్.

     ***

(సశేషం)

వీలునామా – 25 వ భాగం

శారద

శారద

 

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

ఆత్మలతో సంభాషణ

       ఆత్మలతో జరిపే సంభాషణకి తానొస్తానని డెంస్టర్ కిచ్చిన మాట ఫ్రాన్సిస్ మరచిపోలేదు. అన్నట్టే ఒకరోజు ఆ కార్యక్రమం చూడడానికి డెంస్టర్ ఇంటికెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకొందరు స్నేహితులు వచ్చి వున్నారు. కొందరు చూడాలన్న కుతూహలంతోటైతే, కొందరు పాలు పంచుకోవాలన్న ఉత్సాహంతో. ఆత్మలతో మాట్లాడబోయే అబ్బాయి (అతన్ని మీడియం అని పిలుస్తారట)  లేతగా వున్న పంతొమ్మిదేళ్ళ కుర్రాడు. కొంచెం బిడియంగా, బెరుగ్గా వున్నాడు. మనిషి మాత్రం చాలా నమ్మకస్తుడనీ, ఎట్టి పరిస్థితిలోనూ అబధ్ధాలాడడనీ అన్నాడు డెంస్టర్.

తన చుట్టూ జరుగుతున్న ఏర్పాట్లనీ, హడావిడినీ చూసి ఫ్రాన్సిస్ విస్తుపోయేడు. ఆత్మలు కొన్ని కుర్చీలూ బల్లలూ పడవేయడం చూసి అతనికి ఒకింత చిరాకు కూడా కలిగింది. అయితే అతనికి తన చుట్టూ వున్న వాళ్ళ గాఢ విశ్వాసం చూసి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. ‘ఇలాటివన్నీ ఇంత గట్టిగా నమ్మగలిగే వాళ్ళుంటారా?’ అనుకున్నాడతను విస్మయంగా. వాళ్ళందరూ ఎవరో ఒకరిని పోగొట్టుకున్నవారే అవడం అతనికి పట్టిచ్చినట్టయింది. అనంతమైన అపనమ్మకమనే సముద్రం మీద ప్రయాణిస్తూ, మృత్యువనే చేదు నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వారంతా.

అయితే ఆత్మలు ఆ మీడియం ద్వారా చెప్పిన విషయాలతనికేమీ ఉత్సాహకరంగా అనిపించలేదు. అన్ని ఆత్మలూ తాము సంతోషంగానే వున్నామన్నాయి. అతనికి చిన్నతనం నించీ మరణించిన తర్వాత మనిషికి ఉనికీ, అస్తిత్వమూ వుండివుండొచ్చన్న ఆలోచనలో పెద్ద నమ్మకం లేదు. అందువల్ల ఆ ఆత్మలూ, అవి చెప్తున్న విషయాలూ అన్నీ పెద్ద వేళాకోళంగా అనిపించాయి. దానికి తోడు అతను ఏ ఆత్మీయులనూ కోల్పోలేదు. అందువల్ల అతనికి ఏ ఆత్మతోనూ సంభాషించడంలో ఆసక్తి లేదు.

నిజానికతడు బ్రతికి వున్న మనుషుల గురించీ, అందులోనూ తన మేనత్త కూతుర్లయిన జేన్, ఎల్సీల గురించీ ఆలోచిస్తున్నాడు. వారికేరకంగా సహాయం చేయలేని తన నిస్సహాయ స్థితి గురించి ఆలొచిస్తున్నాడు. బ్రతుకులో ఇంత కష్టమూ, బాధా వుందగా అందరూ మృత్యువు గురించే ఎందుకు ఆలో చిస్తారో, అనుకున్నాడతను. ఒకవేళ నాన్నగారికి ఇంకా వునికి వుండి వుంటే తను రాసిన విల్లుని గురించి పశ్చాత్తాప పడివుండేవారా, అన్న ఆలోచనలో అతను కొట్టుకుపోతూండగా, వున్నట్టుండి ఎవరో అతనితో, “ఇప్పుడిక్కడికి మీ తండ్రిగారి ఆత్మ వొచ్చి వుంది,” అన్నారు.

ఫ్రాన్సిస్ నమ్మలేకపోయాడు. “ఆ ఆత్మ ఆయనదేనని ఏమిటి నమ్మకం?” అన్నాడు ఆ చెప్పిన అతని వంక వింతగా చూస్తూ.

డెంస్టర్ కలగజేసుకుని, “ఆయన మాట్లాడతారా, లేక సంకేతాలు పంపుతారా?” అడిగాడు అతని తరఫున.

“బల్ల మీద సంకేతాలు ఇస్తారట,” అన్నాడు ఆ చెప్పిన వ్యక్తి.

“సరే, అయితే మనం అక్షరాలు రాసి వున్న బల్ల దగ్గరకి వెళ్దాం రా!” ఫ్రాన్సిస్ చేయి పట్టుకుని బల్ల దగ్గరకి తీసికెళ్ళాడు డెంస్టర్.

“ఆ అక్షరాల మీద చేయి పెట్టు. ఆ ఆత్మే నీ చేయిని కదులుస్తూ నువ్వడిగే ప్రశ్నలకి జవాబిస్తుంది,” అన్నాడు డెంస్టర్ ఫ్రాన్సిస్ తో.

ఫ్రాన్సిస్ ఇంకా అపనమ్మకంగా చూస్తూ, బల్ల మీద వున్న అక్షరాల మీద చేయి పెట్టాడు. పెట్టి, ఆత్మని పేరు చెప్పమని అడిగి తన వేళ్ళవంక చూసుకున్నాడు.

“చేయి వరసగా అక్షరాల మీద కదల్చు. సరియైన అక్షరం మీదకొచ్చాక ఆత్మ చేయి కదలనివ్వదు,” చెప్పాడు డెంస్టర్.

అతని చెప్పినట్టే చేసి చూసాడు ఫ్రాన్సిస్. ఒక్కో అక్షరం దగ్గరా అతని చేయి ఆగిపోయింది. ఆఖరికి వచ్చిన అక్షరాలన్నీ పేర్చుకుని చూస్తే, “హెన్రీ హొగార్త్” అయింది.

వెంటనే, “మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా?” అని అడిగాడు.

“అవును,” అనే సమాధానం వచ్చింది.

“నేను ఎస్టేటు లో చేసిన మార్పులు మీకు నచ్చుతున్నాయా?”

“చాలా!”

“మీరు రాసిన విల్లు తలచుకుని బాధపడుతున్నారా?”

“అంతా మన మంచికే!”

“మీ మేనకోడళ్ళకి అన్యాయం చేసినందుకు ఎప్పుడైనా బాధ పడ్డారా?”

“అదంతా వాళ్ళకి అనుభవాన్నిస్తుంది. నీక్కూడా.”

“నా జేబులో వున్న ఉత్తరం రాసింది నిజంగా మా అమ్మేనా?”

“అవును.”

“ఆవిడకి మీరు డబ్బిస్తూ వున్నారా?”

“లేదు.”

“మరి ఆవిడ నన్నెలా వొదులుకుంది?”

“ఒకేసారి బోలెడు డబ్బిచ్చాను.”

ఫ్రాన్సిస్ కి ఇదంతా విచిత్రమైన అనుభవం లాగుంది.

“ఒక్క సంగతి చెప్పండి నాన్నా! ఈ ఉత్తరం రాసిన ఆవిడకి నేను సాయం చేయాలా?”

“వద్దు!”

“పోనీ ఉత్తరం రాయనా?”

“అవసరం లేదు. ఆవిడ జోలికెళ్ళకు.”

“నా మనసులో వున్న ఆశ నెరవేరుతుందా?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఓపిక పట్టు. నేనెప్పుడూ నిన్ను కనిపెట్టే వుంటాను.”

“మీరిప్పుడక్కడ ఏం చేస్తున్నారు?”

“నేనెంతో ప్రేమించిన వ్యక్తి నుంచి జీవితం గురించి తెలుసుకుంటున్నాను.”

“ఆవిడ పేరేమిటి?”

తన మనసులోని మాటలే జవాబుల రూపంలో వస్తున్నాయేమోనన్న అనుమానం వుంది ఫ్రాన్సిస్ కి. అందుకే తను వూహించిన స్త్రీ పేరు మనసులోంచి చెరిపే ప్రయత్నం చేసాడు. అయినా అతని చేయి ఆ పేర్లోని అక్షరాల మీదే ఆగిపోయింది.

“మార్గరెట్.”

“ఆవిడేనని అనుకున్నా. మీకిష్టమైన మనిషి మీకు పై లోకంలో కనిపించింది కదూ, ఇహ అంతా మన మంచికే అనిపిస్తుంది. కానీ నాకు జేన్ ని పై లోకంలో కాదు, ఈ లోకంలోనే కలుసుకోవాలని వుంది,” అక్కసుగా అనుకున్నాడు ఫ్రాన్సిస్.

“అది జరిగే సమయానికి అవుతుంది.”

“ఓహో! మీకు మనసులో అనుకున్న మాటలు కూడా వినపడతాయన్నమాట. అది సరే, ఫిలిప్స్ గారికీ, ఈ ఉత్తరం రాసిన ఎలిజబెత్ కీ ఏమిటి సంబంధం?” మళ్ళీ మనసులోనే అనుకున్నాడు.

ఏ జవాబూ రాలేదు.

“ఇప్పటికైనా నమ్ముతారా, ఆత్మలుంటాయని?” ఆత్రంగా అడిగాడు డెంస్టర్.

“తప్పకుండా! కొన్ని పేర్లు ఆయనకీ నాకూ తప్ప మూడో మనిషికి తెలిసే ప్రసక్తి లేదు.”

“అవును, పేర్లు చెప్పగానే చాలా మంది ఆత్మలని నమ్మడం మొదలు పెడతారు,” సంబరంగా అన్నాడు డెంస్టర్.

“అది సరే, ఆత్మలకి భవిష్యత్తు గురించి తెలుస్తుందా? నేను భవిష్యత్తు గురించి కొన్ని ప్రశ్నలడిగాను మరి!”

“తప్పకుండా తెలుస్తాయి.”

“అదెలా సాధ్యం? భవిష్యత్తు గురించి భగవంతుడికి తప్ప ఇనెకెవరికీ తెలిసే అవకాశం లేదు. భగవంతుడి మనసులో ఏముందో తెలుసుకోవడం తరం కాదు కదా?” అనుమానంగా అన్నాడు ఫ్రాన్సిస్.

“మన భౌతిక ప్రపంచంలో వుండే అడ్డుగోడలు ఆధ్యాత్మిక ప్రపంచంలో వుండవు కాబోలు. అందువల్ల ఆత్మలు ఇతరుల మనసుల్లోకి తొంగి చూడగలుగుతాయి. దాని వల్ల భవిష్యత్తుని కొంతవరకు ఊహించగలవేమో!”

“అంతే కాని, ఇలా జరిగి తీరుతుందని చెప్పలేవు కదా?”

“అవును.”

“కానీ, వర్తమానం గురించి మాత్రం చెప్పగలవు.”

“అబధ్ధాలాడని ఆత్మలైతే!”

“అబధ్ధాలాడే ఆత్మలుంటాయా?” ఇంకా ఆశ్చర్యపోయాడు ఫ్రాన్సిస్.

“వుంటాయి. అయితే మంచి ఆత్మలు అనైతికమైన పని చేయలేవు.”

“ఆగాగు! మంచీ చెడూ, నీతీ అవినీతికి కొలమానాలు భౌతిక ప్రపంచానికి వర్తిస్తాయి. వాటిని ఆత్మలకి ఎలా వర్తింప జేస్తావు?”

“కాదు! నీతీ, అవినీతీ, మంచీ చెడూల నిర్వచనాలు విశ్వమంతటా ఒకటే. భగవంతుడు కూడా మంచిని చెడు లా, చెడుని మంచిలా మార్చలేడు!”

ఇంతలో ఎవరో డెంస్టర్ ని పిలవడంతో అటు వెళ్ళాడు.

ఫ్రాన్సిస్ లేచి చల్ల గాలిలో నడుస్తూ ఇంటి దారి పట్టాడు. అతనికంతా కలలా వుంది. అందరూ కలిసి తనని మోసం చేస్తున్నారనుకోవడానికి వీల్లేదు. తను మనసులో అనుకున్న ప్రశ్నలకి కూడా సరైన సమాధానం వచ్చింది.

“రేపు జేన్ తో దీన్ని గురించి మాట్లాడాలి. నేను రాకుండా ఇదంతా నాతో ఎవరైనా చెప్పి వుంటే నేను నమ్మే వాణ్ణి కాదు. రేపు జేన్ నా మాట నమ్ముతుందో నమ్మదో!”

 ***

(సశేషం)

వీలునామా – 24 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పారిపోయిన ప్రేమ 

“ఆఖరికి నా మేనేజరు దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. అయితే అక్కడి వార్తలంతగా బాగోలేవు,” మర్నాడు పొద్దున్నే ఫిలిప్స్ ఇంటికి వొచ్చిన బ్రాండన్ చిన్న బోయిన మొహంతో ఆన్నాడు.

“ఏం జరిగింది?” అన్నారంతా ఆతృతగా.

“నేను వెంటనే వెళ్ళాలి. లేకపోతే కొంప మునుగుతుంది. ఉత్తరం ఇంకొంచెం ముందు వొచ్చి వుంటే, కిందటి పడవలో వెళ్ళి వుండేవాడిని. వెళ్ళి ఇంకొంచెం భూమి కొనాల్సి వొస్తుందేమో. ఇప్పుడు అక్కడ భూమి ధరలేమో బాగా పెరిగిపోయాయి. అసలు నా మేనేజరు తెలివితక్కువతనంతో కొంత నష్టం జరిగింది. నేను వీలైనంత త్వరగా వెళ్ళి లెక్కలూ అవీ చూసి పరిస్థితి చక్కబరచి రావాలి. ఆరు నెలలు దేశం వదిలితే చాలు, నష్టాల్లో కూరుకుపోతున్నాను. స్టాన్లీ, నీ ఎస్టేటు లెక్కలేలా వున్నాయి?”

“ఫరవాలేదులే. ఎలాగూ నువ్వెళ్తున్నావు కదా? ఒకసారి విర్రావాల్టా వెళ్ళి నా పొలం వైపు తొంగి చూడరాదూ? అక్కడ నాకొరకు పని చేసే గ్రాంట్ ఉత్త పనికిమాలిన వాడు. అసలొక పని చేస్తాను. నీకు పవరాఫ్ ఆటార్నీ ఇచ్చేస్తాను. ఏమంటావ్?” ఫిలిప్స్ అడిగాడు.

“అలా చేస్తే గ్రాంట్ ఏమైనా అనుకుంటాడేమో!”

“ఏమీ అనుకోడు. అసలు తనపనే తలకు మించి వుందని సణూక్కుంటూ నా పనికొప్పుకున్నాడు.”

“సరేలే. ఒకసారి వెళ్ళి చూసొస్తా.”

“నాకయితే ఇప్పట్లో ఆస్ట్రేలియా రావాలని లేదు. అక్కడ పొలం మీద వచ్చే రాబడి ఈ మాత్రం వుంటే నేనిక్కడ కుటుంబంతో కాలక్షేపం చేయొచ్చు.వీళ్ళందరకీ ఇక్కడ ఎంత బాగుందో చూసి, మళ్ళీ వీళ్ళని అక్కడికి ఎలా తీసికెళ్ళను? పెరుగుతున్న పిల్లలకి కాస్త చదువూ సంధ్యా చెప్పించుకోవాలి కదా?”

“మంచి రాబడి వుంటే లండన్ లో వుండడమంత సుఖం లేదు. అయితే నీలా లండన్ కి కుటుంబాన్ని తీసుకురావడానికి నాకింకో పదేళ్ళు పట్టొచ్చు. ఈ పదేళ్ళూఊ ఆస్ట్రేలియాలో నా వ్యవహారాలు చక్కబరచుకోని నిలదొక్కుకోవాలి. అప్పుడు నేనూ నీలా కుటుంబాన్ని ఇక్కడకి తీసుకొచ్చేస్తాను. అందుకే నన్ను పెళ్ళాడబోయే అమ్మాయి కనీసం పది పన్నెండేళ్ళు ఆస్ట్రేలియాలో ఉండగలగాలి,” బ్రాండన్ అన్నాడు సాలోచనగా.

వింటున్న హేరియట్ ఉలిక్కిపడింది. ఆమెకీ ప్రతిపాదన ఎంత మాత్రమూ నచ్చలేదు. ఆస్ట్రేలియాలో భూస్వామి అంటే తన అన్నలా బోలెడంత డబ్బూ దస్కం వున్నవాడై వుంటాడనీ, తనూ తన వదినలా దర్పంగా వుండొచ్చని ఈ పెళ్ళికి ఒప్పుకుంది కానీ, ఆస్ట్రేలియా పొదల్లోకీ పాముల్లోకీ వెళ్ళి గొడ్డు చాకిరీ చేయడానికా?ఆమెకి తలచుకుంటేనే కంపరం పుట్టింది.

అలాటి కష్టనష్టాలకి ఓర్చుకునేందుకు తనకేమీ బ్రాండన్ పైన కొట్టుకుపోయేంత ప్రేమ ఏమీలేదు. ఐనా బ్రాండన్ ఇంత మోసం చేస్తాడా! తనేదొ పెద్ద ధన్వంతుణ్ణీ భూస్వామినీ అని నమ్మించి ఇప్పుడు తన పేదరికాన్ని బయటపెడతాడా? తనీ మోసాన్ని ఎంత మాత్రమూ సహించదు. ఈ మోసంలో అన్నా వదినా, అందరూ భాగం పంచుకున్నట్టనిపించింది ఆమెకి.

హేరియట్ చిరాగ్గా ఆ రోజు బయటికెళ్ళడానికి తయారయింది. ఇంతలో కొత్త బోనెట్ తో వదిన ముస్తాబు ముగించి వచ్చింది. తనకి పాత బోనెట్ తప్ప వేరే గతి లేదు. ఎల్సీ తన బోనెట్ ఇంకా పూర్తి చేయలేదు మరి. అద్దంలో తన నీడా, పక్కనే వదిన గారి నీడా చూసి ఆమె చిరాకు ఇంకా ఎక్కువయ్యింది.

తలుపు మీద చిన్నగా తట్టి ఎల్సీ లోపలికొచ్చింది. ఆమె చేతిలో తనకోసం చేసిన కొత్త అందమైన బోనెట్. అందంగా, ఖరీదైనదానిలాగా, ముద్దొస్తూ వున్న ఆ బోనెట్ చూసి హేరియట్ మొహం విప్పారింది.

“ఓ ఎల్సీ! నా టోపీ తయారు చేసేసావా? నేను చెప్పలే నువ్వు చేయగలవని? ఎంత బాగుందో బుజ్జి టోపీ! రా లోపలికి ఎల్సీ. ఎవరూ కొత్త వాళ్ళు లేరు. బ్రాండన్, ఫ్రాన్సిస్ అంతే. వదినా, ఫ్రాన్సిస్, ఈ టోపీ ఎంత బాగుందో చూడండి. ” ఎల్సీ సిగ్గూ మొహంటాల్తో చితికిపోతూ డ్రాయింగ్ రూం లోకొచ్చింది. అందరూ ఎల్సీ అభిరుచినీ, పనితనాన్ని అందరూ మెచ్చుకునేంతవరకూ ఆమె వదల్లేదు.

ఇంట్లో పనిమనిషికి అంత గుర్తింపు ఇవ్వడంతో తన విశాల హృదయాన్ని చాటుకున్నాననుకుంది హేరియట్. నిజానికి అక్కడున్న ఇద్దరు మగవాళ్ళకీ ఎల్సీ పట్ల చాలా స్నేహ భావమూ, ఆఫ్యాయతా వున్నాయనీ, పదే పదే ఆ అమ్మాయి పనిమనిషి హోదాని వాళ్ళకి గుర్తు చేయడం మొరటు తనమవుతుందనీ, ఆ మొరటు తనానికి వాళ్ళు తనని అసహ్యించుకోవచ్చనీ తట్టనుకూడాలేదామెకి. ఎల్సీ ఆ గదిలోంచి తప్పించుకోగానే,

“నేను చెప్పలే! ఎల్సీ తప్పకుండా ఈ పని చేయగలదని. పని వాళ్ళని కొంచెం దబాయిస్తే కానీ పని చేయరు. ఇంతకీ ఇది మా వదిన టోపీ అంత బాగుందా లేదా?” అద్దంలో తన నీడని చూసి మురిసిపోతూ అంది.

veelunama11

అలంకరణ ముగించి,

“పదండి, పదండి, గాలరీకెళ్ళి చిత్రపటాలు చూద్దామనుకున్నాం కదా? బ్రాండన్! నేను ఫ్రాన్సిస్ గారితో వొస్తా, ఏమనుకోకు. నీకెటూ చిత్ర లేఖనం పెద్దగా అర్థం కాదు, ” అంటూ ఫ్రాన్సిస్ హొగార్త్ చేయి పట్టుకొని చిత్రకళా ప్రదర్శన చూడడానికి వెళ్ళిపోయిది హేరియట్. (పాశ్చాత్య నాగరికతలో ముఖ్యమైన కార్యక్రమాలకు మగవారి చేయి పట్టుకొని ఆడవారు నడవడం ఆనవాయితీ. )

అందమైన నాజూకు టోపీతో తను విజయాన్ని సాధించాననుకుంది కానీ, తనకెంతో ముఖ్యమైన వ్యక్తి మనసులో తన స్థానం పూర్తిగా పోయినట్టు తెలుసుకోలేకపోయింది.  అహంకారమూ, మితిమీరిన ఆత్మ విశ్వాసమూ కళ్ళని మాయ పొరల్లా కప్పేస్తాయి. తమ చుట్టూ వున్నవారందరూ తమని ఆరాధిస్తున్నారనే భ్రాంతిలో ముంచేస్తాయి. నిజంగా చుట్టూ వున్నవారికి తమ పట్ల అంత గౌరవమేమీ లేకపోగా, కొండొకచో కొంచెం చులకన భావం వుందనీ తెలిస్తే అహంకారి ఎలా తట్టుకుంటాడో.

తన పట్ల ఫ్రాన్సీ, బ్రాండన్ ఇద్దరూ భయంకరమైన ఆకర్షణాలో మునిగి పోయారన్న నమ్మకంలో వుంది హేరియట్. నిజం తెలిస్తే తట్టుకోగలదో లేదో.

తన చేయి పట్టుకోని నడవకుండా హేరియట్ ఫ్రాన్సిస్ చేయి పట్తుకున్నందుకు బ్రాండన్ ఏ మాత్రం బాధపడలేదు సరికదా, తమతో పాటు జేన్ కానీ, ఎల్సీ కానీ వచ్చి వుంటే బాగుండేదనిపించింది. ఈ మధ్య అతనికి జేన్ మాటలు వింటూంటే భయం పోయింది. ఆమె తెలివితేటల వెనక వున్న సౌజన్యమూ, కఠోర పరిశ్రమ వెనక వున్న ఆత్మ గౌరవమూ అతనికి అర్థం కాసాగాయి. ఎల్సీ అమాయకత్వమూ, సున్నితమైన మనసూ, పని తనమూ పట్ల అతనికున్న ఇష్టం సరే సరి. వాళ్ళిద్దరూ ఈ ప్రదర్శనకి వచ్చి వుంటే తనకెంత హాయిగా వుండేదో అనుకున్నాడు బ్రాండన్. వాళ్ళిద్దరూ రాకపోవడంతో అతను లిల్లీ ఫిలిప్స్ తో ప్రదర్శన తిలకించాడు.

ఫ్రాన్సిస్ కి హేరియట్ పట్ల ఎటువంటి భావమూ లేదు. కేవలం మర్యాద కోసం అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. అంతే కాదు, అతనికెంతో ప్రీతి పాత్రురాలైన జేన్ వాళ్ళ ఇంట్లో ఉద్యోగంలో వుంది. అటువంటప్పుడు తాను వారితో మర్యాదగా ప్రవర్తించకపోతే ఆమె కేదైనా సంస్యలు రావొచ్చన్న భయమూ వుందతనకి.  అంతే తప్ప అతనికి హేరియట్ పట్ల ఎటువంటి ఆసక్తీ లేదు. ఆమె మీద ఎంతో కొంత ఆసక్తి వున్న బ్రాండన్ మనసులోంచి ఆమె ఎప్పుడో రాలిపోయింది.

***

(సశేషం)

వీలునామా- 23వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

హేరియట్ మనసు దోచిన ఫ్రాన్సిస్

హేరియట్ చుట్టూ చాలా మంది ఆడా మగా స్నేహితులున్నా, ఆమెని నిజంగా ఆరాధించి అభిమానించిన మగవాళ్ళు లేరు. అయితే దీనికి తన గొప్పతనమే కారణమన్నది ఆమె ప్రగాఢ అభిప్రాయం.  తమ కుటుబం గొప్పతనమూ, తన అందచందాలూ, తెలివి తేటలూ చూసి మగవాళ్ళు భయపడి పోతున్నారన్న ఆలోచన ఆమె అహంకారాన్నెంతో తృప్తి పరచింది.

స్వతహాగా ఆమె తెలివైనదే. అయితే ఆమె ఆలోచనల వైశాల్యం చాలా చిన్నది. తనకి తెలిసిన విషయాలూ, తనకి ఆసక్తికరమైన విషయాలు మాత్రమే ప్రపంచానికంతటికీ నచ్చాల్సిన విషయాలన్నది ఆమె నమ్మకం. ఇంకా చెప్పాలంటే తనకి తెలియని విషయాలకి ప్రపంచంలోనే ఏ విలువా ఉండదనుకుంటుంది ఆమె. ఆత్మ విశ్వాసం మంచిదే. అయితే ఆత్మ విశ్వాసానికీ, అహంకారానికీ మధ్య వుండే గీత చాలా సన్నది.

బ్రాండన్ హేరియట్ గురించి తన సొంత అభిప్రాయం కంటే ఆమె అభిప్రాయాన్నే నమ్మాడు. అందుకే తన కంటే ఆమె ఎంతో గొప్పదనీ, సాంఘికంగా, ఆర్థికంగా తన కంటే ఆమె ఎన్నో మెట్లు పైనుందని అనుకున్నాడు. హేరియట్ కి అతని పట్ల గొప్ప గౌరవమేమీ లేకున్నా, అతనికి తన పట్ల వున్న గౌరవమూ, పది మందిలో అతను తన మీద ప్రకటించే అభిమానమూ నచ్చాయి.

ఎలాగూ ఎవరో ఒకరిని పెళ్ళాడక తప్పదు. అతను ఎటూ ఇంగ్లండులోనే వుండబోతున్నాడు కాబట్టి అతన్ని పెళ్ళాడడంలో తనకేమీ నష్టం వుండదని భావించింది హేరియట్. అప్పుడప్పుడూ విక్టోరియాకి తిరిగి వెళ్తానని అంటూ వుంటాడు కానీ, అదంతా తను ఎటూ పడనివ్వదు. తన మాట సాగించుకోవడం ఎలాగో తనకి బాగా తెలుసు. కాబట్టి బ్రాండన్ తో పెళ్ళికి అన్ని విధాలా సిధ్ధమయింది హేరియట్.

అయినా సరే, ఈ హొగార్త్ గారినీ తన ఆరాధకులలో ఒకరిగా చేర్చుకోక తప్పదనుకుంది. బ్రాండన్ అతని గురించి మాట్లాడుతూ, “అచ్చం నీలాటి వాడే” అన్నాడు. నిజంగానా? అయితే తన గురించేమనుకుంటాడు? ఈ రోజు తన అలంకరణా, వాక్చాతుర్యాలతో అతన్ని మంత్రించి వేస్తాను, అనుకుంది. అది చూసి బ్రాండన్ కొంచెం ఉడుక్కుంటాడేమో! ఉడుక్కోనీ, అదీ కొంచెం సరదాగానే వుంటుంది, అని సరిపెట్టుకుంది. స్త్రీ సహజమైన సానుభూతీ, ఆలోచనా ఆమెకుండినట్టయితే అప్పటికే బ్రాండన్ తన ప్రవర్తన పట్ల కొంచెం చిరాగ్గా వున్నాడనీ,  కాబోయే  భర్తని కొంచెం శాంత పర్చాలనీ ఆమెకి తట్టి వుండేది. తనేసుకున్న కొత్త చెప్పులు ఎక్కడ కరుస్తున్నాయో చెప్పలేని మనిషిలా, ఆమె తన ప్రేమికుడు అప్పటికే దూరమవుతున్నాడని గ్రహించలేక అతన్ని ఇంకా  దూరం చేసుకుంది.

ఆ రోజు సాయంత్రం ఆమె హొగార్త్ తో చాలా చనువుగా మాట్లాడింది. మాట్లాడే ప్రతీ విషయంలోనూ బ్రాండన్ కేమాత్రం తెలియని విషయాలే ఎన్నుకుంది. అతన్ని ఉడికించి అతను ఈర్ష్య పడుతూంటే చూసి సరదాగా నవ్వుకోవచ్చనుకుంది. అయితే జరిగింది వేరొకటి.

బ్రాండన్ కెందుకో తనని చుట్టుకున్న సంకెళ్ళు- అవి ప్రేమ సంకెళ్ళు కావు, తను అలవాటు చొప్పున తగిలించుకున్న మొహమాటపు సంకెళ్ళు, వాటంతట అవే విడిపోతున్నట్టు భావించాడు. అతని మన్సులో యే మూలో హేరియట్ పట్ల వున్న అభిమానం తుడిచి పెట్టుకుపోయింది. ఆవేళ అతను తనకీ ఫ్రాన్సిస్ కీ మధ్య హేరియట్ కాకుండా ఎల్సీ కూర్చుని వుంటే ఇంకాస్త హాయిగా గడిచి వుండేదనుకున్నాడు.

ఎల్సీ ఎక్కడుందా అని వెతికాడు. ఆమె ఫ్రాన్సిస్ కటువైపు, ఇంకొక ఆస్ట్రేలియన్ అతనికీ మధ్య కూర్చుని వుంది. అతనేదో చెప్తున్నట్టున్నాడు, శ్రధ్ధగా వింటూ, మధ్య మధ్య  లోగొంతుకతో ఏదో అంటూంది.

అతనికి వున్నట్టుండి రెన్నీ గారింట్లో జరిగిన విందు గుర్తొచ్చింది. ఆ రోజు ఎంత సంతోషంగా గడిచింది! అతను నిట్టూర్చాడు. అతని చూపులు పదే పదే ఎల్సీ వైపు పరిగెత్తడం హేరియట్ పసిగట్టింది. వెంటనే తనూ ఆ సంభాషణలోకి దూకింది.

“మీరెన్నైనా చెప్పండి మిస్టర్ డెంస్టర్!  ఈ ఆత్మలూ వాటితో మాట్లాడడం వంటి విషయాలు నేను చచ్చినా నమ్మను. నేను ఈ కాలపు సైన్సు మనిషిని.”

“సైన్సు మాట నిజమే అయినా నేను నా కళ్ళతో చూసిందాన్ని అబధ్ధమంటే ఎలాగండీ? ఆ మాటకొస్తే సైన్సు వివరించలేని విషయాలూ చాలానే వున్నాయి. అందువల్ల మొత్తం సైన్సునే తప్పు పట్టలేం కదా?” అన్నాడు సదరు డెంస్టర్ అనునయంగా.

“నిజమో అబధ్ధమో మాట అటుంచండి. ఇలా ఆత్మలతో సంభాషణవల్ల మీకేం ప్రయోజనం?” కుతూహలంగా అడిగింది జేన్.

” చాలా ప్రయోజనాలున్నాయి మేడం! ముందుగా మన కళ్ళతో చూసి, మన అనుభవంలోకి వచ్చేది మాత్రమే కాక ఆ బయట కూడా పెద్ద ప్రపంచం వుందన్న నా నమ్మకం బల పడుతుంది. దాంతో సంకుచిత దృష్టి తగ్గుతుంది. నిజంగా మనల్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయిన ఆత్మీయుల బాగోగులు తెలుస్తాయి. మనిషి పోగానే మరిచి పోలేం కదా? భౌతికంగా శరీరం కృశించి నశించినా ఆ జీవ శక్తి మిగతా పదార్థాలలోనో, ప్రకృతిలోనో వచ్చి చేరుతుందన్నది నా విశ్వాసం. ఆ జీవ శక్తికి మరణం లేదు. నేను సంభాషించేది ఆ జీవ శక్తితోనే.”

అతన్ని మధ్యలోనే ఆపింది హేరియట్.

veelunama11

“ఆగండాగండి! ఇప్పుడు మనిషీ మరణించక్కర్లేదంటున్నది సైన్సు.మానవుని ఆయు ప్రమాణాలని ఎంత వరకైనా పొడిగించవచ్చంటున్నారు వైద్యులు. అందుకే నాకు భౌతిక ప్రపంచం గురించిన విషయాల్లో సైన్సుని నమ్మి, ఆధ్యాత్మిక విషయాలకి బైబిలు ని సంప్రదిస్తే సరిపోతుందనిపిస్తుంది. మీకది సరిపోక కుర్చీలూ టేబుళ్ళూ వుపయోగించి ఆత్మలతో మాట్లాడుతున్నాననుకుంటున్నారు.” హేళనగా అంది.

“బైబిలు మానవుని మరణాంతర జీవితం గురించి కొంచెం గజిబిజిగా వుందనిపిస్తోంది. అసలు నిజానికి, మానవుని కి ఎడతెగని ఆయు ప్రమాణం అవసరమంటారా? నాకా ఆలోచనే అంత గొప్పగా అనిపించదు. భూమ్మీదకి వచ్చి తగినంత కాలం జీవితాన్ననుభవించాక భగవంతుని చేరుకోవడంలో ఎంతటి హుందాతనమూ, నిరంతర ప్రవాహ ధర్మమూ వున్నాయి? ఎల్ల కాలం భూమ్మీదనే వుండి మనం మాత్రం బావుకునేదేముంది?”

“మానవుని మరణాంతర జీవితం గురించి బైబిలు కావాలనే కొంచెం సందిగ్దంగా వుంటుందేమో.  ప్రతీ మనిషీ తనదైన స్వర్గాన్ని ఊహించుకుంటాడు. అలాటప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైన స్వర్గ నరకాల గురించీ చెప్పడం కష్టం కదా? అందువల్లనేమో. అయితే స్వర్గంలోనైనా మనిషికి ఙ్ఞాపకాలూ, తాను అన్న భావనా వుంటే బాగుంటుంది. అవి లేనప్పుడు ఏ స్వర్గమైనా మనిషికి ఒరగబెట్టేదేం వుండదు.” అన్నది ఎల్సీ తన అభిప్రాయం చెప్తూ.

“నాకూ ఈ విషయాల గురించి మొదట్లో ఏమీ తెలిసేది కాదు. ఆత్మలతో సంభాషించిన తర్వాతే నాకు మరణానంతర జీవితం గురించీ, స్వర్గ నరకాల గురించీ, దేవుని గురించీ, నిరంతరంగా ప్రవహంచే ప్రేమ గురించీ అవగాహన ఏర్పడింది,” అన్నాడు డెంస్టర్.

“కళ్ళతో చూస్తేనే నమ్ముతానంటే అది నమ్మకమే కాదు, అన్నాడు సెయింట్ పాల్. బహుశా స్వర్గ నరకాల గురించి ఆలోచనా, ఆత్మల గురించిన పరిఙ్ఞానమూ మనిషికి ఒక భద్రత కలిగిస్తాయి కాబోలు. అందరికీ ఆ భద్రత అవసరమనిపించదు. కొందరికి అవసరమనిపిస్తుంది. అంతే, ” అన్నాడు ఫ్రాన్సిస్ తేల్చేస్తూ.

” అసలు మీరందరూ ఒక సారి నాతో ఒక సియాన్స్ సెషన్ కు వస్తే బాగుంటుంది. మీరూ కళ్ళారా చూడొచ్చు,” అన్నాడు డెంస్టర్.

“నేను తప్పక వచ్చి చూస్తాను,” ఉత్సాహంగా అంది లిల్లీ ఫిలిప్స్.

“నేను చచ్చినా రాను,” ఖచ్చితంగా అంది హేరియట్.

“నాకెందుకో ఇలాటి వాటి మీద పెద్ద ఆసక్తి లేదు. నేను రాలేను,” అన్నాడు స్టాన్లీ ఫిలిప్స్.

“నేనూ రాలేను. ఎల్సీ చెప్పినట్టు ఎవరి స్వర్గం వారిది. ఎప్పుడో జరగబోయే దాని గురించీ, మన చేతిలో లేని దాని గురించీ ఆలోచనలతో ప్రయోజనం ఏముంది?” అన్నాడు బ్రాండన్.

సాధారణంగా ఏ విషయం గురించి ఎలాటి అభిప్రాయమూ చెప్పని బ్రాండన్ ఆ రోజు అభిప్రాయం చెప్పడమే కాక, ఎల్సీ అభిప్రాయాన్ని బలపర్చడం హేరియట్ కి చిర్రెత్తించింది.

ఫ్రాన్సిస్ మాత్రం తనతో వెళ్ళడానికి ఒప్పుకునే వరకూ డెంస్టర్ వదల్లేదు.

జేన్ పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళిపోయింది. ఎల్సీ గదిలోకి వెళ్ళి లిల్లీ ఫిలిప్స్ కొరకు మొదలు పెట్ట్టిన టోపీ పుర్తి చేసింది. వాళ్ళిద్దరూ మళ్ళీ కిందికొచ్చేసరికి ఇంకా అంతా కబుర్లలోనే వున్నారు.  ఎల్సీ మర్నాడు తెల్ల వారు ఝామునే లేచి హేరియట్ టోపీ కూడా పూర్తి చేసేద్దామనుకొంది. నిజంగానే వదిన గారు అందమైన బోనెట్ పెట్టుకొని, తాను పాతది పెట్టుకొని మొహం చిన్న బుచ్చుకుంటే ఏం బాగుంటుంది!

ఆ నిశ్చయంతో ఎల్సీ వచ్చి సంతోషంగా అందరూ పాటలు పాడుతుంటే వింటూ కూర్చుంది. తన టోపీ పని చేయకుండా ఆట పాటలతో కాలం వెళ్ళ బుచ్చుతోందని హేరియట్ ఉడుక్కుంది.

ఆ రాత్రి హేరియట్ పొద్దు పోయేవరకూ అందరి ఆనందం కోసం పియానో వాయిస్తూ పాటలు పాడింది. హేరియట్ కి చక్కటి కంఠమూ, మంచి పరిఙ్ఞానమూ వుండడం వల్ల పాటలు చాలా రక్తి కట్టాయి. హేరియట్, జార్జియానా, ఇద్దరక్కచెల్లెళ్ళల్లోనూ, డాక్టరు గారికి హేరియట్ అంటేనే ప్రీతి ఎక్కువ, బహుశా సంగీతం వల్లనే కాబోలు. స్టాన్లీకి కూడా చెల్లెలి పాటంటే చాల ఇష్టం. ఇలా ఇంట్లో నలుగురూ భోంచేసింతరవాత ఆమె కూర్చుని అందరి మధ్యా పాడుతూంటే ఇంకా ఇష్టం. తన భార్యకి కూడా కొంచెం సంగీతం చెప్పించాలని ప్రయత్నించాడు కానీ, లిల్లీకి సంగీతం అబ్బలేదు. అయితే స్టాన్లీ పెద్ద కూతురు ఎమిలీ మాత్రం మళ్ళీ చక్కగా పాడగలదు. అందుకే ఇప్పుడు కూతురికి శ్రధ్ధగా సంగీతం చెప్పిస్తున్నాడు స్టాన్లీ.

అందుకే ఆ రాత్రి పిల్లలతో పాటు పడుకోకుండా ఎమిలీ పెద్దలతో కూర్చుని పాటలు పాడింది. అందరూ తెలిసిన వారి మధ్య రెండు మూడు సార్లు పాడితే గానీ ధైర్యం రాదు మరి, అంది లిల్లీ ఫిలిప్స్.

“ఎమిలికి ధైర్యం లేకపోవడమేమిటి, విచిత్రం కాకపోతే! కాలనీల్లో ప్రకృతి మధ్య పెరిగే పిల్లల్లో చాలా ధైర్య సాహసాలుంటాయి. ఇక్కడ ఇంగ్లండులో సురక్షితంగా ఎరిగే అమ్మకూచిల్లా కాదు! ” వేళాకోళంగా పక్కనే కూర్చున్న ఎల్సీతో మెల్లిగా అన్నాడు బ్రాండన్.

“నాకు ఎమిలీ అంటే చాలా ఇష్టం. ధైర్యమే కాకుండా విషయాలని చాలా త్వరగా గ్రహించగలదు. అన్నిటికంటే, నేనంటే తనకి చాలా ఇష్టం. నాకేమో నన్నిష్టపడే చిన్న పిల్లలంటే ఇష్టం,” నవ్వుతూ అంది ఎల్సీ.

“అలాగా? మరి నిన్నిష్టపడే పెద్ద వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు బ్రాండన్. సిగ్గుతో మొహం ఎర్రబడింది ఎల్సీకి.

“ఎల్సీ! అత్త పాట  ఆపింతరవాత నువ్వొక పాట పాడాలి. నీ పాటలో చక్కగా అన్ని పదాలూ వినిపిస్తాయి నాకు,” అంది ఎమిలీ ఎల్సీ తో.

“నాకసలు కొంచెం కూడా పాట రాదు. దానికి తోడు నేనొక్కసారి కూడా సంగీతం క్లాసులకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను పాటెత్తుకుంటే..”

“అంతా వుత్తదే బ్రాండన్. ఎల్సీ చక్కగా పాడుతుంది. అందులోనూ ఊరికే క్లాసులో చెప్పే పాటలు కాకుండా, కొన్నిసార్లు కవితలూ కథలూ కూడా పాటల్లా పాడి వినిపిస్తుంది.” ఎమిలీ చెప్పింది.

“ఆహా! ఎమిలీ ఇవాళ ఎల్సీ రహస్యం బయట పెట్టేసింది. ఇహ పాడేయి ఎల్సీ!” బ్రాండన్ ఉత్సాహంగా అన్నాడు.

“ఇది మరీ చోద్యంగా ఉంది. నా పాట నేనూ, లేదా చిన్న పిల్లలు తప్ప ఇంకెవరూ వినలేరు. అర్థం చేసుకోండి.”

“అరెరే! నువ్వు నన్ను సరిగ్గా అర్ర్థం చేసుకోలేదు ఎల్సీ. నేను చిన్న పిల్లలల్లోకే చిన్న పిల్లాణ్ణి. ఇంతవరకూ నేను ఒక్కరి పాటను కూడా విమర్శించలేదంటే నమ్ము.”

“ఏం వాగుడు కాయవే నువ్వు! పాట శ్రధ్ధగా వింటూ కుదురుగా కూర్చోలేవు. అయినా ఇంత రాత్రి పడుకోకుండా పెద్దవాళ్ళతో నీకేం మాటలు?” పాట ముగించి కోపంగా మేనకోడలితో అంది హేరియట్.

“ఇవాళా నాన్న గారు నన్ను రాత్రి పది వరకూ మేలుకోవచ్చని అన్నారు. అయినా మేమిద్దరం ఏదో పాత ఆస్ట్రేలియా రోజుల గురించి మాట్లాడుకుంటూన్నాం, నీకెందుకు?”

“వేలెడు లేవు, నీకు పాత రోజుల ఙ్ఞాపకాలా?”

“అవును! మా ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది తెలుసా. అప్పుడు ఈ బ్రాండన్, ఇంకా పెగ్గీ మమ్మల్ని కాపాడారు. కదూ బ్రాండన్?”

“చాల్లే వూరుకో! ఇంటి పక్కనే వున్నా కాబట్టి పరిగెత్తుకొచ్చా. ఇప్పుడా సంగతులెండుకు, పోనీలే!” బ్రాండన్ కొట్టిపారేసాడు.

“కాదు కాదు! చేయంతా బాగా కాలి పెద్ద మచ్చ కూడా పడింది. చూపించు బ్రాండన్,” ఎమిలీ గోల చేసింది. షర్టు చేతులు పైకి మడిచి పెద్ద మచ్చని చూపించే వరకూ వదల్లేదు.

ఇంగ్లండు మర్యాదస్తుల ఇంట్లో అడవాళ్ళముందు షర్టు చేతులు పైకి మడవడం ఏమిటి! ఈ ఆస్ట్రేలియన్లకి మంచీ మర్యాదా తెలియదు, విసుక్కుంది హేరియట్. అదే ఫ్రాన్సిస్ గారు, ఎంత మర్యాదా, హుందా తనమూ, నెమ్మదీ! ఎంతైనా ఇంగ్లండులో వుండేవాళ్ళ నాజూకు ఆస్ట్రేలియాలో పొదల మధ్య తిరిగే మొరటు మనుషులకుంటుందా! తన పాటని మర్యాదగా విన్నాడు, పక్కవాళ్ళతో కబుర్లేసుకోకుండా. పాటని మెచ్చుకున్నాడు కూడా.. మర్నాడు తనని ఒక చిత్ర కళా ప్రదర్శనకి తీసికెళ్తానన్నాడు కూడా! ఆ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి తన టోపీ ఎల్సీ పూర్తి చేస్తుందోలేదో నన్న ఆందోళన ఒక్కటే మిగిలిపోయింది ఆమెకి ఆ రాత్రి.

***

(సశేషం)

వీలునామా – 22 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

హేరియట్ ఫిలిప్స్ వ్యక్తిత్వం

ఆ రోజు ఎల్సీ లిల్లీ ఫిలిప్స్ కొరకు ఒక మంచి గుడ్డను తెప్పించి దానితో ఆమెకి అందమైన బోనెట్ (టోపీ) తయారు చేసింది. వదిన గారి అందమైన బోనెట్ చూసిన దగ్గర్నించీ హేరియట్ కి తనకీ అలాంటిదొకటుంటే బాగుండనిపించింది. మర్నాడు తనతో పాటు దుకాణానికొచ్చి, తనకీ అలాటి గుడ్డనే, వేరే రంగులోది కొనాలనీ,తనకీ అంత బాగా టోపీ కుట్టిపెట్టాలని ఎల్సీకి ఆఙ్ఞ జారీ చేసింది హేరియట్.

మర్నాడే దుకాణానికి బయల్దేరుతూ ఎల్సీని కూడా బయల్దేరదీసింది. వీళ్ళ కూడ బ్రాండన్ కూడా బయల్దేరాల్సి వచ్చింది. స్టాన్లీ ఇంట్లో లేడు, లిల్లీ, పిల్లలూ జేన్ తో కలిసి గదిలో చదుకుంటూన్నారు. అందువల్ల ముగ్గురూ దుకాణానికి బయల్దేరవల్సి వచ్చింది.

హేరియట్ కి తన బలహీనత తనకే తెలియదు. తెలిసి వుంటే కాబోయే భర్తతో కలిసి బట్టల దుకాణానికి వెళ్ళి వుండేదు కాదు. ఎల్సీకీ అంతవరకూ లిల్లీతో కలిసి వెళ్ళిన అనుభవమే కానీ, హేరియట్ తో కలిసి బయటికి వెళ్ళింది లేదు. అయితే ఎంతో చదువుకుని అత్యాధునికంగా అలంకరించుకునే హేరియట్ నించి అలాంటి సంస్కార హీనమైన ప్రవర్తన ఊహించలేదేమో, చాలా సిగ్గుపడింది. తనని సంప్రదిస్తే, తను కావలసిన ధరలో నప్పే రంగులు చకచకా ఎంపిక చేసి ఇచ్చేదే. అయితే హేరియట్ కి నాణ్యమైన బట్టా, నచ్చే రంగులూ కావాలి కానీ దుకాణ దారు చెప్పిన ధరతోటి ఆమె సాధారణాంగా ఏకీభవించదు.  ఆమె దుకాణంలో వున్న అబ్బాయిలని పరుగులు పెట్టించింది. తాను దుకాణంలో అలాంటి పని ఇదివరకే చేసి వున్నందువల్ల ఎల్సీ ఆ అబ్బాయిలని చూసి జాలి పడింది. పాపం, ఒకటి తర్వాత ఒకటిగా లెక్కలేనన్ని డబ్బాలు తెచ్చి పడేసారు వాళ్ళు. ఒక్కటీ హేరియట్ కి నచ్చలేదు.

పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత రచయిత లే హంట్ అన్నాడట, “నువ్వు పెళ్ళాడబోయే అమ్మాయిని ఒక్కసారి బట్టల దుకాణానికి తీసికెళ్ళు. బయటికొచ్చినతర్వాత కూడా ఆమెనే పెళ్ళాడదలిస్తే పెళ్ళాడు,” అని. బట్టలకొట్లోని పనివాళ్ళతో ప్రవర్తనలోనే స్త్రీ వ్యక్తిత్వం బయటపడుతుందని ఆయన అభిప్రాయం.

నిజంగా మగవాళ్ళు పెళ్ళాడబోయే ముందు అమ్మాయిలకీ పరీక్ష పెడితే ఎంత మంది పెళ్ళిళ్ళవుతాయన్నది సందేహమే. దానికి తగ్గట్టు బట్టల దుకాణంలో బట్టలు చూపించే పని వారు ఏమాత్రం నోరూ, ఆత్మాభిమానమూ లేనట్టు ప్రవర్తిస్తారు. సహజంగా వుండే అలంకరణమీద ఆసక్తీ, లోకంలో వుంటూ అలవడే డబ్బాశా, ఆ సమయంలో ఎంతటి సౌమ్యురాలయిన స్త్రీనైనా సివంగిలా మారుస్తాయి.

బ్రాండన్ బట్టలకొట్లోని హేరియట్ ని ఏమాత్రమూ ప్రేమించలేకపోయాడు. అక్కడ హేరియట్ మొరటు ప్రవర్తనని చూసి సిగ్గుపడ్డ ఎల్సీ అతని కళ్ళకి ఎక్కువగా నచ్చసాగింది. అస్సలతనికి ఎల్సీ మీద హేరియట్ చలాయించే ధాష్టీకమే చిరాకెత్తించసాగింది. తన ప్రేమని నిరాకరించినా తనకామె పట్ల కోపమేమీ లేదని చెప్పే ఎల్సీతో అవకాశం వస్తే బాగుండు, అనుకున్నాడు బ్రాండన్.

అయితే అతనికా అవకాశం రాలేదు ఎప్పుడూ.

ఎన్నెన్నో దుకాణాలు వెతికీ, పెట్టెలన్నీ తెరిపించినతర్వాత బోనెట్ కి కావల్సిన లేసులూ, పువ్వులూ, గుడ్డా దొరికాయి. హేరియట్ తృప్తిగా నిట్టూర్చింది. చేతి గడియారం చూసుకుని కెవ్వుమంది.

“అయ్య బాబోయ్! ఎంత ఆలస్యం అయిపోయిందో! ఆకలవుతూంది. పొద్దుటిపూట బట్టలు కొనుక్కోవడం భలే సరదాగ వుంటుంది కదూ? హాయిగా కావలసినవన్నీ కొనుక్కుని భోజనాలకి లేవొచ్చు. అన్నట్టు, మనం ఇంటికెళ్ళేసరికి మనకోసం వదిన కానీ, పిల్లలు కానీ ఆగుతారనుకోను. బ్రాండన్, ఏదైనా మంచి రెస్టారెంటు చూస్తావా? భోజనం చేసేద్దాం. భోంచేసాక ఒక టాక్సీ సరేసరి. మగవాళ్ళతో రావాలోయ్, షాపింగుకి, ఏమంటావ్?” నవ్వింది.

“అలాగే హేరియట్. భోంచేసి టాక్సీలో ఇంటికెళ్దాం. నాకు పెద్ద కొంపలంటుకునే పనేం వుందని,” మామూలుగానే అన్నాడు బ్రాండన్.

“ ఏం మగాడివయ్యా! పెద్ద పన్లుంటే మాతో వచ్చేవాడివి కావన్నమాట! అంత తేలిగ్గా వుందా ఆడపిల్లలంటే? సరే, ఈ సారికి క్షమించి వదిలేస్తాలే!”

హేరియట్ వేళాకోళం చేసింది. ఆమె ఆశపడ్డట్టే బ్రాండన్ వాళ్ళని ఖరీదైన హోటల్ కి తీసికెళ్ళి భోంచేసాక గుర్రపు బగ్గీ కుదిర్చి ఇంటికి తీసికెళ్ళాడు.

“అసలు తన సొంతానికి ఒక గుర్రపు బగ్గీ పెట్టుకోవాలని నేను అన్నయ్యతో ఎన్నిసార్లు చెప్పానో లెక్క లేదు! ఈ ఒక్క విషయంలోనే నాకూ మా వదినకీ ఏకాభిప్రాయం. ఇలా మాటి మాటికీ ఇతర్ల మీద ఆధారపడాలంటే ఎంత విసుగు! పైగా, కిరాయి బగ్గీలని నడిపే వాళ్ళని చూస్తేనే నాకు భయం బాబూ! ఇంతకుముందు వీడేం పని చేసేవాడో కదా, వీడి బండిలో మనకిప్పుడేమేం జబ్బులు అంటుకుంటాయో కదా, అన్న భయం సహజమే కదా?”

“ఏమో మరి! అంత అసహ్యకరమైన ఆలోచనలు నాకైతే ఇంతవరకూ రాలేదు. నాకు సొంత బగ్గీ ఏదీ లేదు కూడా. మా వూళ్ళో గుర్రపు స్వారీ తప్ప వేరే దారి లేదు. మెల్బోర్న్ లో కూడా సాధారణ పౌరులు డబ్బిచ్చి గుర్రబ్బగ్గీ మీద వెళ్ళలేరు. ఈ లండన్ లో బగ్గీ కిరాయి ఎంత చవకా అని నేను ఆశ్చర్యపోయేను. మీరేమో సొంత వాహనాలకలవాటు పడి వీటిని చీదరించుకుంటున్నారు.”

“ఎల్సీ! మీ ఇంట్లో కూడా సొంతానికి ఒక గుర్రపు బగ్గీ వుండేదేమో కదా?”

“వుండేది కానీ, నాకెక్కువగా గుర్రపు స్వారీయే ఇష్టం. అయితే డాక్టరు ఫిలిప్స్ గారితో సాయంత్రపు పూట బగ్గీలో వెళ్ళడం కూడా బానే వుండేది. ఈ మధ్య కాలి నడక తప్ప ఇంకే సౌకర్యమూ లేకపోవడం తో నాకీ బగ్గీ లో హాయిగా వుంది.”

“డెర్బీషైర్ లో డాక్టరు గారితో కలిసి సాయంత్రాలు బయటికెళ్ళడం వల్ల మీ ఆరోగ్యం చాలా కుదుటపడినట్టుంది ఎల్సీ!” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“అవునవును! నాన్నగారందుకే ఎల్సీ ఆరోహ్యం గురించి ఆందోళన చెందవలసిందేమీ లేదని అననే అన్నారు. మీరిద్దరు అక్క-చెల్లెళ్ళూ ఎందుకంత భయ పడ్డారో గాని! అంతే కాకుండా, నీ ఆరోగ్యానికి ఎడిన్ బరో కంటే లండన్ మంచిదేమో ఎల్సీ! ఇక్కడికొచ్చింతరవాత నువు దగ్గడమే వినలేదు నేను.”

“అవును, నా దగ్గు బాగా తగ్గిపోయింది. మనసు కూడా చాలావరకు కుదుటపడింది.”

“అది సరే కానీ, రేపటికల్లా టోపీ కుట్టేయగలగుతావా? రేపు సినిమాకెళ్ళేటప్పుడు పెట్టుకుందామనుకున్నా,” హేరియట్ అడిగింది.

“రేపటి లోగా కాదేమోనండి. మనం ఇంటికెళ్ళేసరికే ఆలస్యమవుతుంది. పైగా ఇవాళ ఫ్రాన్సిస్ని భోజనానికి రమ్మన్నాం. ఫిలిప్స్ గారు నన్నూ అందరితో కలిసి భోజనం చేయమన్నారు,” ఇబ్బంది పడుతూ చెప్పింది ఎల్సీ.

“అలాగా! ఏం చేస్తాం. ఆ టోపీ పెట్టుకుని వెళ్ళాలని చాలా ఆశపడ్డాను.”

“ఇవాళ ఫ్రాన్సిస్ తో కబుర్లు చెప్పుకుందాం రమ్మంది జేన్. భోజనానికి రానంటే ఫిలిప్స్ గారేమంటారో!” ఎల్సీ భయపడుతూ అంది.

“అయితే ఇవాళ రాత్రి భోజనాల దగ్గర అందరూ చేరతారన్నమాట. స్టాన్లీ నన్ను పిలవడం మర్చి పోయాడల్లే వుంది. అయినా సరే, నేనూ వచ్చేస్తా!” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“నిన్ను పిలవడమేంటి బ్రాండన్? నీ ఇష్టం వచ్చినట్టు వస్తూ పోతూ వుంటావు గా మా అన్నయ్య ఇంటికి? అది సరే, ఎల్సీ, నువ్వు కొంచెం ప్రయత్నిస్తే టోపీ కుట్టడం అయిపోవచ్చు. నువ్వు ఎడిన్ బరోలో ఎంత వేగంగా బట్టలు కుట్టేదానివో నేను చూసాగా! రెండూ, రెండున్నరకల్లా ఇల్లు చేరుకుంటాం. బోలెడంత టైముంది నువ్వు కుట్టడానికి. మా వదినదీ అలాగే వేగంగా కుట్టి ఇచ్చేసావు గంట సేపట్లో!”

“వదిన గారి టోపీ పూర్తిగా కుట్టలేదండీ! ఆవిడదే రేపటి సినిమా వేళకి ఇచ్చేయాలి నేను. దాని పైన మీ టోపీ, పూర్తిగా కుట్టడానికి నాకు ఒక్క పూట చాలదేమో అని నా భయం. ”

హేరియట్ కోపంగా మూతి ముడుచుకుంది.

“సరేలే, ఎల్సీ! నాకు పెట్టుకోవడానికి ఇంకో టోపీ వుందిగా. మా వదినకైతే కొత్తది వుంది కానీ! మా అన్నయ్య చేసే గారాబంతో ఆవిడంటే ఎంత డబ్బైనా చెల్లిస్తుందీ, ఎంత ఖరీదైన అలంకరణైనా చేసుకుంటుంది. అసలంతంత డబ్బు తన కోసమే ఖర్చు చేసుకోవడానికి ఆవిడకి మనసెలా వస్తుందో! నేను చూడు ఎంత సాదా బట్ట కొనుక్కున్నానో, నా టోపీకోసం.  అయితే అది కుట్టింతర్వాత ఆవిడ టోపీ అంత అందగానూ వుండలి సుమా! వుంటుందా ఎల్సీ?”

“వీలైనంత అందంగా చేస్తానండి,” ఎల్సీ బదులిచ్చింది.

“అంత జాగ్రత్తగా డబ్బు ఎక్కువ ఖర్చు చేయకుండా బట్ట కొంటాను కాబట్టే నాకు బట్టల దుకాణంలో అంత సమయం పడుతుంది!”

బ్రాండన్ మర్యాదగా నవ్వి వూరుకున్నాడు.

“బ్రాండన్, నువ్వు కూడా వస్తున్నావు గా ఇవాళ భోజనానికి. అన్నట్టు నేనసలు ఫ్రాన్సిస్ హొగార్త్ ని ఇంతవరకూ చూడలేదు తెలుసా? అతని గురించి విని వుండడమే కాని. వాళ్ళ నాన్నా, మా నాన్నా స్నేహితులటగా? ఎలాటి వాడతను?” కుతూహలంగా అడిగింది హేరియట్.

“నాకు తెలిసినంతవరకూ సౌమ్యుడు, మర్యాదస్తుడు. జేన్, ఎల్సీలంటే ఎంతో అభిమానంగా వుంటాడు, కదూ ఎల్సీ?” బ్రాండన్ జవాబిచ్చాడు.

“ఓ! జేన్ కి ఇష్టమైనవాడైతే చాలా మంచి వాడన్నమాట. నాకు జేన్ చాలా నచ్చింది. మిగతా ఆడవాళ్ళలాగా తెలివి తక్కువగా వుండదు. అసలు మా నాన్నగారు మమ్మల్ని పెద్ద చదువులు చదివించిందే మేము మిగతా ఆడవాళ్ళలా కాకూడదని. అందుకే నాకు జేన్ అచ్చంగా నాలాటి మనిషే అనిపిస్తుంది. జేన్ చెప్పడం వల్లే నా మేనకోడళ్ళకి ఆ మాత్రం చదువు అబ్బుతుంది. అసలు నువ్వు కూడా టీచరుద్యోగం చేయి ఎల్సీ! మీ మావయ్య నీకందుకే చదువు చెప్పించి వుంటాడు.”

“మీ నాన్న కూడా నువ్వు టీచరుద్యోగం చేయాలని  నీకు చదువు చెప్పించారా హేరియట్?” బ్రాండన్ కఠినంగా అన్నాడు.

“లేదు, లేదు. మా సంగతి వేరు. మాకుద్యోగాల్తో ఏం పని? అయినా, జేన్ లా చదువులు చెప్పాలంటే మాకొచ్చే చదువులు చాల్తాయా ఏమన్నానా? పాపం, ఎల్సీకే, చదువుకున్న చదువంతా వృథా అవుతోంది.”

“నేర్చుకున్న ఏ చదువూ వృథా అవదు హేరియట్. తన విద్య వల్ల ఎంతమందికి ఎన్నివిధాల లాభమో ఎల్సీ ఎప్పుడూ నోరు విప్పి చెప్పదు. కానీ, పెగ్గీ వాకర్ ని అడుగు ఎల్సీ గురించి. అప్పుడు తెలుస్తుంది నీకు, ఇంకొకరి విద్యల విలువలు.”

“అబ్బ! నీకూ, మా అన్నయ్యకీ ఆ పెగ్గీ వాకర్ అంటే అంత ఇష్టం దేనికో అర్థం కాదు. స్టాన్లీకి కూడా పెగ్గీ మాటంటే తిరుగు లేదు!” వెటకారంగా అంది హేరియట్.

“అవును! స్టాన్లీ, నేనూ ఇద్దరమూ పెగ్గీ కెంతో ఋణపడి వున్నాం!”

“నువ్వు కూడానా బ్రాండన్? ఎందుకబ్బా? ఓ, తెలిసింది. మా వదినా పిల్లలని కాపాడి, చూసుకున్నట్టే, నువ్వూ జబ్బు పడితే సేవలు చేసిందటకదా పెగ్గీ?”

బ్రాండన్ ఒక్క క్షణం మౌనంగా వున్నాడు.

“లేదు హేరియట్. నా ప్రాణాలు నిలబెట్టినందుకు కాదు. పెగ్గీని చూసింతరవాతే నేను ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాను. అంత కార్య దక్షతా, ధైర్యమూ, త్యాగనిరతీ, నిజాయితీ, నేనైతే ఇంకెక్కడా చూడలేదు. ”

“మీ అమ్మా, చెల్లెళ్ళ కంటే గొప్పదనుకుంటున్నావా పెగ్గీ?”

“హేరియట్! ప్రతి దానికీ అమ్మా, చెల్లెళ్ళతో పోలిక యెందుకు? వాళ్ళ స్థానం వాళ్ళదే. పెగ్గీ పట్ల నాకుండే గౌరవాభిమానాలకీ, వాళ్ళపట్ల నాకుండే ఆప్యాయతకీ అసలు సంబంధమే లేదు.”

హేరియట్ హేళనగా నవ్వేసి వూరుకుంది.

బ్రాండన్ వ్యక్తిత్వం గురించి హేరియట్ కి అర్థమైందో లేదో కానీ, ఎల్సీకి మాత్రం పూర్తిగా అర్థమయింది. మొదటిసారి తను బ్రాండన్ ని కాదని తప్పు చేసిందేమోనన్న అనుమానం ఆమె మనసులో కదలాడింది. ఆనాటి సంభాషణ గుర్తు రాగానే వున్నట్టుండి ఆమె చెంపలు ఎర్రబడ్డాయి.

వున్నట్టుండి ఆమె మొహం చూసిన బ్రాండన్, ఆ సాయంత్రం ఆమెతో కలిసి కూర్చొని భోజనం చేయబోతున్నాడన్న విషయం తలచుకుని సంతోషపడ్డాడు. ఆ సంగతి తెలిస్తే హేరియట్ ఏమనుకుంటుందో!

(సశేషం)

వీలునామా – 21 వ భాగం

శారద

శారద

[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)  [/su_quote]

 అంతగా విద్యా గంధం అంటని మనిషి రాసినట్టుంది ఆ ఉత్తరం.

మెల్బోర్న్

20 ఏప్రిల్

 ప్రియామైన ఫ్రాన్సిస్,

నీకీ మధ్య బాగా డబ్బొచిందటగా? ఆ పెద్ద మనిషికి మాబాగా అయిందిలే. మనిద్దరినీ రోడ్డు మీద  పడేయాలని బాగా ఆశపడ్డాడు, కానీ పాపం ఏం లాభం? అమ్మని మర్చిపోకు నాయనా. ఎంత బలవంతంగా నిన్ను నానుండి లాక్కున్నాడు! నీకు నా మొహం కూడా గుర్తులేదేమో.

పోయేవరకూ నాకు యేడాదికి నూటాయాభై పౌండ్లు పంపే వాడులే! అది ఆగిపోయేసరికి ఏమైందా అని వాకబు చేసా. అప్పుడు తెలిసింది, ఆయన పోయి ఆస్తంతా నీ చేతికొచ్చిందని. నాకొక్క మాటైనా చెప్పలేదెవ్వరూ. అయినా నా గతి ఎప్పుడూ అంతేలే. నా మొహం చూసి కష్టసుఖం పట్టించుకున్నదెవరు?

కనీసం నువ్వైనా ఈ అమ్మని కొంచెం కనిపెట్టి వుండు. నేను నిన్ను వదిలిపెట్టలేదు. ఆ పెద్దమనిషే నిన్ను లాక్కొని  నన్ను ఆస్ట్రేలియా పంపించాడు. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలని వుంది కానీ, రానూ బోనూ ఖర్చుల మాట? అందుకే ఏమనుకోకుండా కొంచెం డబ్బు పంపావంటే, నిన్ను చూడ్డానికొస్తా. ఏమంటావ్?

ఈ పాడు ప్రపంచకం రోజు రోజుకీ నాశనమవుతూందిలే. నన్ను కనిపెట్టి వుండడం నీకే మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కనిపెట్టి వుంటావులే, ఇహ మళ్ళీ నేను చెప్పేదేమిటి!

ఈ కింద చిరునామ కి ఒక ఉత్తరం రాసి కొంచెం డబ్బు పంపించు. శ్రీమతి పెక్ అంటే ఎవరో అనుకునేవు. నేనే, ఆ పెద్దాయన నన్ను నా పేరూ వుంచుకోనివ్వలేదు, తన పేరూ ఇవ్వలేదు. నా ఖర్మ, ఏం జేస్తాం!

వుంటా నాయనా,

మీ అమ్మ,

ఎలిజబెత్ హొగార్త్.

శ్రీమతొ పెక్.

హెన్రీ టాల్బోట్.

వకీలు.

మెల్బోర్న్.

 

తా.క. వెంటనే డబ్బంపుతావుగా? నాకు చాలా కష్టం గా  వుంది చేతిలో డబ్బు లేక.

జేన్ ఉత్తరాన్ని శ్రధ్ధగా ఒకటికి రెండు సార్లు చదివింది. తపాలా ముద్రలూ, చిరునామా అన్నీ పరిశీలించింది.

“ఏమంటావ్ జేన్? ఆ ఉత్తరంలో వున్నది నిజమేనంటావా?”

“మన వకీలు, మెక్ ఫర్లేన్ గారికి చూపించావా? మావయ్య వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు. ఆయన ఏమన్నాడు?”

“ఆయన ఇంతవరకూ మా అమ్మ ఫోటో కానీ, చేతి వ్రాత కాని చూడలేదట. అందుకే చెప్పలేనన్నాడు.”

“యేడాదికి నూట యాభై పౌండ్లు పంపిన సంగతి ఆయనకి తెలిసుండాలి కదా?”

“అదీ తెలియదట, అయితే ఆ డబ్బు ఆవిడ నోరు మూయించడానికి నాన్న గారు వాడి ఉండొచ్చనుకున్నాడు.”

“మావయ్య బాంకు పాస్ బుక్కులు చూడకపోయావా? ఆయన క్రమం తప్పకుండా డబ్బు చెల్లిస్తూ వచ్చి వుంటే ఆ సంగతి బాంకు పాస్ బుక్కులో వుంటుంది కదా?”

“హయ్యో జేన్! నాన్న గారెంత ఆశ్రధ్ధగా లెక్కలు రాసారనుకున్నవు? ఒక్క దానికీ సరైన వివరణలే లేవు. డబ్బు బాంకు నించి తెచ్చిన సంగతి రాసారు కానీ, అది ఎలా ఖర్చయిందో మాత్రం ఎక్కడా రాయలేదు. ఎలా కనిపెట్టడం?”

“సరే, అయితే వకీలు గారి సలహా ఏమిటి?”

“ఏముంది? ఆ ఉత్తరం పట్టించుకోకుండ వదిలేయమన్నారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నిజంగా నన్ను కన్న తల్లేనో కాదో తెలియదు. ఆయన ఒకసారి నాన్నగారితో అన్నారట, ‘ఫ్రాన్సిస్ తల్లికీ ఏదైనా డబ్బు ఏర్పాటు చేయి, ఆవిడ ఎక్కడుందో, ఎలా వుందో,’ అంటూ. దానికి నాన్నగారు చాలా చిరాకు పడి, ‘ఆవిడ నా భార్య అని నిరూపించడానికి ఒక్క ఆధారమూ లేదు, ఆమెకి చిల్లి గవ్వ ఇవ్వాల్సిన పని లే’దంటూ మండి పడ్డారట. డబ్బు అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారట. వకీలు గారి ఊహ ఏమంటే, ఆమెకి డబ్బిచ్చి నాతో సహా తమ సంబంధాన్ని గురించిన అన్ని ఆనవాళ్ళూ నాన్నగారు కొనేసుకున్నారని. ఆవిడ అందినంత డబ్బు తీసుకొని నా గురించి కానీ, నా పెంపకం గురించి కానీ పట్టించుకోవడం మానేసింది.”

“సరే, మరైతే ఇప్పుడీ ఉత్తరం గురించి ఏమైనా వాకబు చేయిస్తావా, లేదా ఊరికే వదిలేస్తావా?”

“అసలు నాకు ఇదంతా ఆలోచించాలంటేనే చిరాగ్గా వుంది. అయితే ఈవిడ నిజంగా మా అమ్మేనా కాదా అన్న సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా వుందనుకో. నువ్వేమంటావు జేన్? నీ సలహా ఏమిటి?”

“ఇలాటి సున్నితమైన విషయాన్ని గురించి నేనేం సలహా ఇవ్వగలను ఫ్రాన్సిస్? నీకెలా తోస్తే అలా చేయి.”

“నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావ్?”

“అదెలా చెప్పగలం? మనిద్దరం వేర్వేరు మనుషులం, మన వ్యక్తిత్వాలూ, మనస్తత్వాలూ వేర్వేరు. ఒకే పరిస్థితిలో ఇద్దరం వేర్వేరుగా ఆలోచిస్తాం. అందువల్ల నేను చెప్పేది నీకు పనికిరాకపోవచ్చు.”

“కానీ, నీ వ్యక్తిత్వం నాకంటే వెయ్యి రెట్లు మెరుగు జేన్. అందుకని నా ఆలోచన కంటే నీ ఆలోచనే సబబుగా వుండే అవకాశం ఎక్కువ. నాకైతే ఏం చేయాలో తోచడంలేదు. ఒకవేళ ఆ విల్లులో, నేను అమ్మకి సాయపడకూడదు అని వుంటే, అప్పుడు ఈ ఉత్తరం రాసినావిడని చూడాలనీ, డబ్బివ్వాలనీ కోరిక బలంగా కలిగేదేమో.  నాకీమధ్య ఆ వీలునామాని వీలైనంతగా ఉల్లంఘించాలని కోరిక పుడుతోంది. అసలా వీలునామా నా జీవితాన్ని నాశనం చేసింది జేన్! ఆ డబ్బు నాకెందుకూ పనికి రాదు. నాకెంతో ఇష్టమైన మనిషికి సాయపడకుండా అడ్డంపడే ఆ విల్లంటే నాకెంత కోపమో చెప్పలేను.”

ఫ్రాన్సిస్ మొహంలో ఆవేదనా, కంఠంలో ఆవేశమూ చూసి జేన్ చాలా ఆశ్చర్యపోయింది. ఉన్నట్టుండి జేన్ కి అతనీ మధ్య ఉత్తరాలెందుకు తగ్గించాడో అర్థమైనట్టుంది. ఆమె గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది.

“సరే ఫ్రాన్సిస్, నువ్వంతగా నా సలహా అడుగుతున్నావు కాబట్టి చెప్తా.  ఈ ఉత్తరం రాసిన స్త్రీ గురించి వాకబు చేయి. ఆ తరవాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అదృష్టవశాత్తూ, ఈ ఉత్తరం మెల్బోర్న్ నించి వచ్చింది కాబట్టి మనం వాకబు చేయడం చాలా తేలిక. స్టాన్లీ ఫిలిప్స్ గారికో,  బ్రాండన్ గారికో తప్పక ఈ వకీలు టాల్బోట్  తెలిసే వుండలి. సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, ఈ పేరెక్కడో విన్నట్టే వుంది! ఒకవేళ అలా కాకపోతే, బ్రాండన్ గారు ఇంకొద్ది రోజుల్లో మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నారు. అప్పుడు వాకబు చేయమందాం! ఒక విషయం గుర్తుంచుకో, మావయ్య రాసిన వీలునామా గురించీ, నీ గురించీ అక్కడక్కడా పత్రికలలో వచ్చింది. ఎవరైనా ఆ వార్తలు చదివి ఇలా ఊరికే ఓ రాయి వేసి చూద్దాం అని ఈ ఉత్తరం రాసి వుండొచ్చు. ఈ ఉత్తరం లో ఇంగ్లాండు యాస వుంది. కానీ మావయ్య మీ అమ్మ స్కాటిష్ యువతి అన్నట్టు గుర్తు. అందుకే మనం ఈ విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశిలిద్దాం.”

“సరే!”

“నువ్విక్కడే వుండు. స్టాన్లీ గారిని నువ్వు పిలుస్తున్నావని చెప్పి ఇక్కడికి పంపుతాను,” జేన్ లేచి వెళ్ళింది.

జేన్ దగ్గరి బంధువని ఫ్రాన్సిస్ ని స్నేహంగా పలకరించాడు స్టాన్లీ ఫిలిప్స్.

కొద్దిసేపు మామూలు కబుర్లు అయ్యాక అడిగాడు ఫ్రాన్సిస్ ఆయనని.

“మీకు మెల్బోర్న్ లో వుండే హెన్రీ టాల్బోట్ అనే వకీలు తెలుసా?”

 

veelunama11

“తెలుసు! ఆయన మెల్బోర్న్ లో పెద్ద పేరు మోసిన వకీలు. అయితే ఆయనతో నాకు పెద్దగా పరిచయం మాత్రం లేదు. మన బ్రాండన్ కి ఆయన బాగా పరిచయం. పెగ్గీ వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారనుకుంటా.”

“అలాగా? అయితే మీకు వారింట్లో వుండే పెక్ అనే స్త్రీ తెలుసా? ఆవిడ పూర్తి పేరు ఎలిజబెత్ పెక్ అనుకుంటా…” ఇంకేదో చెప్పబోయిన ఫ్రాన్సిస్, స్టాన్లీ మొహం చూసి ఆపేసాడు.

“ఆవిడ సంగతి ఎవరికి తెలీదు? ఆవిడ నుంచి దూరంగా వుండండి ఫ్రాన్సిస్. ఆవిడ ఎంత దుర్మార్గురాలో చెప్పలేను. ఆమెగురించి మీరెందుకు అడుగుతున్నారు?”

“ఆమె నా తల్లినని చెప్పుకుంటుంది!”

“ఏమిటీ? అయితే నేను చెప్పేది వేరే స్త్రీ అయి వుండొచ్చు! నాకేం అర్థం కావడం లేదు.” స్టాన్లీ లేచి అలజడిగా గదంతా పచార్లు చేయడం మొదలు పెట్టాడు.

“ఆవిడ మీకేమైనా ఉత్తరం రాసిందా? ఆవిడ చేతి రాత చూపిస్తారా?”

చేసేదేమీ లేక ఫ్రాన్సిస్ మౌనంగా ఉత్తరాన్ని ఆయనకి అందించాడు.

“ఈ ఉత్తరాన్ని మీకభ్యంతరం లేకపోతే చదువుతాను. భయపడకండి. నేను ఇంకెవ్వరితోనూ ఈ విషయాన్ని గురించి మాట్లాడను.”

ఫ్రాన్సిస్ ఇబ్బందిగానే ఒప్పుకున్నాడు. స్టాన్లీ ఉత్తరాన్నంతా చదివి తిరిగి ఇచ్చేసాడు.

“ఈ ఉత్తరం లో ఆమె మీ అమ్మనంటుంది. ఆమె ఎంత అబధ్ధాలకోరంటే, ఆమె చెప్పే ఒక్క మాటైనా నిజం కంటే అబధ్ధం అయ్యే అవకాశం ఎక్కువ. నా మాట వినండి ఫ్రాన్సిస్. ఆమెకి ఎంత దూరంగా వుంటే మీకంత మంచిది. ఆమెకి మీరు జవాబూ ఇవ్వవద్దు, డబ్బూ పంపవద్దు. ఉత్తరంలో చెప్పినంత పేదరాలేమీ కాదు. ఉత్త అబధ్ధాలకోరు!”

“ఆమె ఎవరు? మీకెలా తెలుసు?” ఎన్నో పశ్నలు అడగాలనుకున్నాడు ఫ్రాన్సిస్, కానీ స్టాన్లీ మొహం లో కోపం చూసి ఏదీ అడగలేకపోయడు. కొంచెం సేపయాక కూడదీసుకొని,

“మిమ్మల్ని అడగమని జేన్ అంది!” అన్నాడు.

“ఏమిటీ? ఈ సంగతి జేన్ తో కూడ చెప్పావా? ఎంత పని చేసావయ్యా!”

“అసలు నేను వచ్చిందే ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడడం కోసం. జేన్ ఈ సంగతి ఎవ్వరితోనూ అనదు. నాకా నమ్మకం వుంది. అసలింతకీ జేన్ ఏది?”

స్టాన్లీ జేన్ ని పిలిపించాడు.

లోపలికొచ్చిన జేన్ స్టాన్లీ మొహంలో చిరాకూ అసహనమూ చూసి ఆశ్చర్య పోయింది  .

“జేన్! ఫ్రాన్సిస్ ఇప్పుడే మెల్బోర్న్ లో వుండే ఒక స్త్రీ గురించి అడిగాడు. నాకు తెలిసినంతవరకూ ఆవిడ  ఒక మోసగత్తె. ఈ ఉత్తరం లో వున్న ప్రతీ మాటా అబధ్ధమే అని నా అభిప్రాయం. నువ్వూ, ఫ్రాన్సిస్ ఈ విషయం గురించి ఇక్కడే మరిచిపోవడం మంచిది. నువ్వు ఈ విషయాలేవీ ఎల్సీతో కుడా అనొద్దు. నేనలా బయటికెళ్ళొస్తాను. ఫ్రాన్సిస్, రేపు రాత్రి మీ భోజనం మా యింట్లోనే. సరే మళ్ళీ కలుద్దాం!” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు స్టాన్లీ ఫిలిప్స్.

“జేన్! మా అమ్మ గురించి మా నాన్న గారు వెలిబుచ్చిన అభిప్రాయాలే సరిగ్గా ఈ పెక్ గురించి స్టాన్లీ గారంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఆవిడే మా అమ్మయి వుండొచ్చు కదా? సరేలే, ఆయన అన్నట్టు ఈ విషయం ఇక్కడే వదిలేయడమే మంచిదేమో. మనం ఇంకా పొడిగిస్తే స్టాన్లీ గారికి కోపం రావొచ్చు. నిన్నింతగా గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చిన మనిషికి మనం కోపం తెప్పించటం అంత అవసరమా? అది సరే, ఆయనకి ఎప్పుడూ ఇలాగే కోపం వస్తూ వుంటుందా?”

“అదే నాకూ అంతు బట్టటం లేదు. చాలా నెమ్మదిగా సౌమ్యంగా వుంటాడాయన. ఇంత కోపం రావడం నేనైతే ఎప్పుడూ చూడలేదు.”

“నీతో ఎల్సీతో బానే ప్రవర్తిస్తాడు కదా?”

“ఆయన బానే వుంటాళ్ళే! లిల్లీ గారే, కొంచెం గయ్యాళి.”

“ఎందుకు ?నీతో ఎప్పుడైనా దెబ్బలాడుతుందా?”

“నన్నేమీ అనదు కానీ ఎల్సీనే చాలా ఏడిపిస్తుంది. అందులోనూ ఎల్సీ ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోదు. భయం భయం గా ఒణికిపోతూ, తననెవ్వరు ఏ తప్పు పడతారో అన్నట్టు ఒదిగి ఒదిగి ఉంటుంది. ఆలోచనా, తెలివితేటలూ, మంచితనమూ ఏ కోశానా లేని ఒక మూర్ఖురాలికింద నోరూ వాయీ లేని మెతక మనిషి పని చేస్తే ఏమవుతుంది?”

“ఇప్పుడు ఇక్కడ ఎల్సీ పనిని కూడా నువ్వే పర్యవేక్షించాలి కదా? నీకిబ్బందిగా లేదూ?”

“అవును, కొంచెం ఇబ్బందిగానే వుంది. అయితే ఎల్సీ చాలా ఆత్మ న్యూనతతో బాధ పడుతూంది. దానిని ఎలా సరిచేయాలో నాకర్థం కావడం లేదు. నేను దేన్నైనా తట్టుకోని నిలబడగలను. కానీ, ఎల్సీ పాపం సున్నిత మనస్కురాలు. చిన్న చిన్న విషయాలకే మొహం చిన్న బుచ్చుకుంటుంది.”

“కవితలు ప్రచురించే ప్రయత్నం ఎలా వుంది?”

“ఇక్కడ లండన్ లో కూడా ప్రయత్నించా, కానీ కాలేదు.”

“ఈ మధ్య మళ్ళీ ఏమన్నా రాస్తుందా?”

“ ఇక్కడ లిల్లీ, హేరియట్ ఇద్దరి పరిచర్యలతో దానికి సమయం ఎక్కడుంది? అసలు వాళ్ళకి దాన్ని నాతో మధ్యాహ్నం కాసేపు నడవడానికి పంపడం కూడా ఇష్టం వుండదు. నేనే డాక్టరు గారు కోప్పడతారని వాళ్ళిద్దర్నీ బెదిరించి నాతో పాటు కాస్త నడకకి తీసుకెళ్తాను! అన్నట్టు ఆ డాక్టరు గారు మావయ్యకి మంచి స్నేహితులట తెలుసా? నువ్వు ఒక్కసారి డెర్బీషైర్ వెళ్ళి ఆయనని కలిసి రారాదూ?”

“అలాగే. బ్రాండన్ ఇక్కడికొస్తూ వుంటాడా? అతన్ని చూస్తే అతనికి ఎల్సీ మీద ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు అనిపించింది నాకు! అదేమైనా ముందుకెళ్ళిందా?”

జేన్ తల అడ్డంగా ఊపింది.

“ఇప్పుడు ఆయన హేరియట్ ఫిలిప్స్ మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు.”

“అయ్యో! నేనింకా ఆయన ఎల్సీని పెళ్ళాడతాడని ఆశ పడ్డాను.”

వాళ్ళిద్దరూ మాటల్లో వుండగానే ఎల్సీ వచ్చింది. లిలీ పన్లన్నీ చేసి అలసిపోయినా ఆమె మొహం ప్రశాంతంగా వుంది. ఫ్రాన్సిస్ ఆమెని ప్రేమగా పలకరించాడు. జేన్ కానీ, ఫ్రాన్సిస్ కానీ ఆమెకి ఆస్ట్రేలియా నించొచ్చిన ఉత్తరం గురించి ఏమీ చెప్పలేదు.

  ***

(సశేషం)

వీలునామా – 20 వ భాగం

శారద

శారద


[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీ కొత్త ఉద్యోగం [/su_quote]

డాక్టర్ ఫిలిప్స్ గారు ఎల్సీని బాధ పెడుతున్న దగ్గు గమనించి, ఆమెని అన్ని రకాలా క్షుణ్ణంగా పరీక్షించారు.

“నిజం చెప్పండి డాక్టరు గారూ! ఆ దగ్గు ఏదో ప్రాణాంతకమైందనిపిస్తుంది నాకైతే. నేనింకెన్నాళ్ళో బ్రతకను కదూ? భయపడకుండా చెప్పండి. బ్రతకాలన్న ఆశ కూడా నాకేమీ పెద్దగా లేదు!” అన్నది ఎల్సీ డాక్టరుతో.

“భలే దానివే! నీకే జబ్బూ లేదు. నాకర్థమైనంతవరకూ, శారీరకంగా నీకే సమస్యా లేదు. మనసులోనే అంత బాగా లేదు. పైగా, ఎక్కువ పనీ, తక్కువ తిండీ! దాంతో నీరసించి పోయావు. అందులోనూ, ఈ యేడాది స్కాట్ లాండ్ లో చలి కని వినీ ఎరగనంతగా వుంది. దాంతో సూర్య రశ్మి సోకక మొహం బాగా పాలిపోయింది. అంతకంటే ఎక్కువేమీ లేదు. అక్క మీద బెంగా, ఆహార లోపమూ, భయంకరమైన చలీ, విశ్రాంతి లేని పనీ, అన్నీ కలిపి నీ మీద దాడి చేసాయి. నాలుగు రోజులు ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకొని, కడుపునిండా తిండి తిను! అన్ని  మంత్రం వేసినట్టు మాయమౌతాయి,  ” అన్నాడాయన.

“జేన్! మీ చెల్లెలి ఆరోగ్యం కుదుట పడాలంటే ఒక్కటే మార్గం. ఆమెని నీతోపాటు లండన్ లో వుంచుకో. కాస్త పది మందితో సావాసమూ, వెచ్చటి వాతావరణమూ, విశ్రాంతీ, ఆహారమూ, ఇవన్నీ వుంటే తను తేలిగ్గా కోలుకుంటుంది,” జేన్ తో అన్నారు.

ఆయన మాటలు విని ఎల్సీ నిట్టూర్చింది.

“నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకండి డాక్టర్! నాకైతే నేను బ్రతుకుతానన్న ఆశకానీ, బ్రతకాలన్న ఉత్సాహం కానీ లేనే లేవు. బ్రతుకు మీద తీపి లేకపోవడం తప్పే అనుకోండి,”

“ఎల్సీ! బ్రతుకు మీద తీపి లేకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం కుదుటపడితే బ్రతుకు మీద ఆశ దానంతటదే పుట్టుకొస్తుంది. అది సరే కాని, లేచి బట్టలు మార్చుకురా పో! ఇద్దరం అలా బయట తిరిగొద్దాం.”

పెద్దాయన ఎల్సీని బలవంతంగా బయట తిప్పడం మొదలు పెట్టాడు.

తర్వాత జేన్ డాక్టరు గారిని ఒంటరిగా కలిసి నిలదీసింది, ఆయన మాటల్లో నిజమెంతో చెప్పమని.

“నేను నిజమే చెప్తున్నా జేన్. మీ చెల్లాయికి వ్యాధి అంటూ యేమీ లేదు. కొంచెం అశ్రధ్ధా, ఒంటరితనం అంతే! అయితే నువ్వు మాత్రం ఆమెని ఎడిన్ బరో పంపే ప్రయత్నం చేయకు. ఎలాగైనా లండన్ లో నీ దగ్గరే వుండే ఏర్పాటు చేయి. ఆ కుట్టు షాపులో పని కంటే ఇంకొంచెం తేలికైన పని ఏదైనా దొరుకుతుందేమో చూడు! ”

“పనా! ఆ పని దొరకకే కదా ఇన్ని కష్టాలు. నాకు మీ అబ్బాయి స్టాన్లీ ఇంట్లో మంచి ఉద్యోగం దొరికింది. అలాటి ఉద్యోగం ఎల్సీ కి వచ్చే అవకాశం ఎంతుంది చెప్పండి?”

“మా అబ్బాయికి నీలాటి మంచి ఉద్యోగి దొరికే అవకాశం మాత్రం తక్కువ కాదూ? నువ్వేం భయపడకు. ఎల్సీ కొంచెం కోలుకున్నాక  తన కి లండన్ లోనే నీ దగ్గరే వుండేటట్టు ఏదో ఏర్పాటు నే చేస్తాగా?” అభయమిచ్చారు డాక్టరు గారు.

 

***

 

బ్రాండన్ ఎల్సీ నిరాకరణకి పెద్దగా నొచ్చుకున్నట్టో, ఆశాభంగం చెందినట్టో అనిపించలేదు. ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆయన డాక్టరు ఫిలిప్స్ గారి చిన్న అమ్మాయీ, స్టాన్లీ చెల్లెలూ అయిన హేరియట్ ఫిలిప్స్ ని ఆకర్షించే ప్రయత్నం లో పడిపోయాడు. అంత త్వరగా మారిపోయే అతని మనసు చూసి ఎల్సీ కొంచెం ఆశ్చర్య పడింది కూడా. అయితే ఆమె ఆశ్చర్యం అతని మనసు మారినందుకు కాదేమో.

అతను తనని ప్రేమించానన్నాడు, పెళ్ళి చేసుకొమ్మనీ అడిగాడు. తను ఒద్దనగానే, హేరియట్ వెంట పడ్డాడు. అందులో పెద్ద వింతేమీ లేక పోవచ్చు. ఆమెకి వింతగా తోచిన విషయమేమిటంటే, తనని ప్రేమించానన్న మనిషి, రెండ్రోజుల్లోనే, తనకి మొత్తంగా విభిన్న ధృవం లాటి హేరియట్ ని ప్రేమించడం. పరస్పరం రెండు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలని కొద్ది కాలం లోనే ప్రేమించడం ఎలా సాధ్యం, అనుకొందామె.

తన వెంట పడ్డ బ్రాండన్ ని చూసి హేరియట్ పెద్దగా మురిసిపోలేదు. అదేదో తన జన్మ హక్కుగా తీసుకొందామె. కన్నె మొహంలో దోబూచులాడే సిగ్గు దొంతరలూ, చిరు నవ్వులూ లేవు కానీ, ఒక గర్వంతో కూడిన దరహాసం మాత్రం ఆమె మొహం లో మెరిసేది, బ్రాండన్ తో మాట్లాడేటప్పుడు.

తన అభిప్రాయాలూ, ఆలొచనలూ అన్నీ నిర్భయంగా, నిర్మొహమాటంగా వెలిబుచ్చగలదామె. తన తెలివి తేటల మీదా, విఙ్ఞానం మీదా అపారమైన నమ్మకముంది ఆమెకి. తను బ్రాండన్ కంటే అన్ని విధాలా ఉన్నతమైన దానినని ఆమె భావం.

సంఘంలో హోదా, డబ్బూ, చదువూ, సంస్కారం, తెలివి తేటలూ, ఏ రకంగా చూసినా తాను బ్రాండన్ కంటే అన్ని విధాలా గొప్పది. బ్రాండన్ తో సహా మగవాళ్ళెవ్వరి నీతి నియమాల మీదా ఆమెకి నమ్మకం లేదు కాబట్టి, ఆ రకంగా నైనా తానే ఉన్నతురాలినని ఆమె విశ్వాసం.

దానికి తోడు బ్రాండన్ తన తెలివితక్కువతనాన్ని ఆమె ముందర అనేక సార్లు బయటపెట్టుకున్నాడు. తన గొప్ప తానెన్నడూ చాటుకోలేదు సరికదా, ఆమెకి చాలా నచ్చిన చర్చి ఫాదరు ప్రసంగం లో ఎన్నో తప్పులు పట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఎడారుల్లో తిరిగే అనాగరికుడికి విద్యాధికుడైన ఫాదరు ప్రసంగం అంత కంటే ఎక్కువ అర్థం కాదనుకుంది హేరియట్.

ఏదెలావున్నా, బ్రాండన్ అడిగితే పెళ్ళికొప్పుకోవాలనే అనుకుంది హేరియట్. ఎందుకంటే, అన్ని రకాలా తన కు సరిపోయే మగవాడెటూ కనిపించడు. అయినప్పుడు ఎవరో ఒకర్ని పెళ్ళాడడమే మంచిదనుకుంది.  బ్రాండన్ కి హేరియట్ పెద్దగా నచ్చలేదు కానీ, ఎవర్నో ఒకర్ని పెళ్ళాడి ఆస్ట్రేలియా తీసికెళ్ళాలని ఉంది అతనికి.

ఇలాటి పారిస్థితిలో ఎల్సీ,  స్టాన్లీ భార్య లిల్లీ దగ్గర పని మనిషిగా ఉద్యోగాని కొప్పుకుందని తెలిసి నివ్వెరపోయాడు.

 

పెద్ద కుటుంబం లోని ఆడవాళ్ళలా, కేవలం తన పన్లు మాత్రమే చూసే పని అమ్మాయిని పెట్టుకోవాలని లిల్లీ కెప్పణ్ణించో ఉబలాటంగా వుంది.  ఎల్సీకి బట్టల ఎంపికా, బట్టల నాణ్యతల గురించిన ఙ్ఞానమూ, రకరకాల గౌన్లు తయారు చేయడంలో వున్న నేర్పూ చూసి, ఎల్సీని తన పన్ల కోసం నియమించుకోవాలనుకుంది. దాంతో ఆ అమ్మాయికి సహాయపడినట్టు కూడ వుంటుంది, అనుకొంది.

“ఎలాగైనా పెద్దింటి స్త్రీలా చలామణి అవ్వాలని మా వదినకి ఆశ,” హేళనగా నవ్వుతూ అంది హేరియట్.

ఇంకో పని అమ్మాయికి జీతమా, అని కొంచెం వెనుకాడాడు స్టాన్లీ ఫిలిప్.

“ఇప్పుడు అంత అవసరమా!” అన్నాడు భార్యతో. ఎట్టకేలకు ఒప్పుకోక తప్పలేదతనికి. సాంఘికంగా పిల్లల బాగోగులు చూసే గవర్నెస్ కన్నా, అమ్మగారి బట్టలు వెతికి పెడుతూ, తల దువ్వే పని అమ్మాయి హోదా, జీతమూ చాలా తక్కువ. అయినా అక్కకి దగ్గరగా వుండొచ్చనే ఆశతో ఎల్సీ వెంటనే ఒప్పుకుంది.

జేన్ ఒక్కర్తే, ఎల్సీ లాటి నెమ్మదస్తురాలు, లిల్లీ గయ్యాళి తనంతో నెగ్గుకురాగలదా అని భయపడింది. పెగ్గీ తో చెప్తే, ఆమె కూడా,

“ఆలోచించుకోండి అమ్మాయిగారూ! ఇద్దరికిద్దరూ లిల్లీ మీద ఆధారపడటం మంచిది కాదేమో, మీకు చెప్పేంత దాన్ని కాదనుకోండి!” అన్నది.

ఎల్సీ ఆరోగ్యం కొంచెం కుదుటపడగానే, స్టాన్లీ కుటుంబమూ, జేన్, ఎల్సీ అందరూ కలిసి లండన్ తిరిగొచ్చేసారు. డాక్టరు గారూ, చిన్నబ్బాయి వివియన్ ఇల్లంతా బోసిపోయిందనీ, వాళ్ళ కబుర్లు వినే వాళ్ళేవరూ లేరనీ కొద్ది రోజులు బాధ పడ్డారు.

 

***

 

   ఫ్రాన్సిస్ కొచ్చిన లేఖ

 

లండన్ తిరిగొచ్చిన కొద్ది వారాల తర్వాత అనుకోకుండా ఫ్రాన్సిస్ కనబడ్డాడు జేన్ కి. జేన్ ని కలవడానికే లండన్ వచ్చానని చెప్పాడు.

“నిన్ను కలవడానికి ఎడిన్ బరో పెగ్గీ ఇంటికెళ్ళాను. మీరిద్దరూ ఇక్కడున్నారని చెప్పింది పెగ్గీ. తాతయ్య థామస్ లౌరీ చాలా జబ్బున పడ్డాడు. ఈ చలి కాలం స్కాట్ లాండు దుర్భరంగా వుంది. మీరిద్దరూ అక్కణ్ణించి వొచ్చేసి మంచి పని చేసారు జేన్! అన్నట్టు, ఎల్సీకి ఉద్యోగం బాగుందా?” అడిగాడు ఫ్రాన్సిస్.

“ఉద్యోగం పర్వాలేదులే! అయితే ఆమె ఆరోగ్యం మాత్రం చాలా బాగుపడింది. ”

“నువ్వు కూడా మునుపటికంటే ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా కనిపిస్తున్నావు జేన్.”

“అది సరే కానీ, ఫ్రాన్సిస్, నువ్వు అక్కడ ఎస్టేటులో తల పెట్టిన పన్లెలా వున్నాయి? తీరుబడి లేనట్టుంది. ఈ మధ్య నువ్వు ఉత్తరాలే సరిగ్గా రాయడం లేదు. రాసినవి కూడా ఒకటి రెండు వాక్యాలకంటే మించి ఉండడంలేదు.”

“తీరుబడి లేకపోవడమేముంది జేన్! ఏదో బధ్ధకం, అంతే!”

జేన్ కి ఉత్తరాలు క్లుప్తంగా రాయడానికి ఫ్రాన్సిస్ చాలా కష్టపడాల్సొస్తుంది, నిజానికి. ఆమె రాసే ఉత్తరాల నిండా ఉత్సాహమూ, ఆసక్తికరమైన స్నేహితుల విశేషాలూ, పిల్లల చదువులూ మొదలైనవి వుంటున్నాయి. అవి చూసినప్పుడల్లా అతనికి అనిర్వచనీయమైన నొప్పీ, తనకిక ఆమె దక్కదేమోనన్న నిరాశా కమ్ముకుంటున్నాయి. అదెక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఉత్తరాలు వీలైనంత క్లుప్తంగా రాసుతున్నాడు.

“అంత బాధ పడకు ఫ్రాన్సిస్. మగవాళ్ళకెవరికీ పెద్ద ఉత్తరాలు రాయడం చేత కాదట. గాలి పోగేసి కబుర్లతో పేజీలు నింపడం మా ఆడవాళ్ళకి మాత్రమే చేతనైన విద్య. అందుకే నేను రాసే ఉత్తరాలు పెద్దవి,” నవ్వుతూ అంది జేన్.

“అంతే కాదు! నువ్వు చుట్టూ వున్న మనుషులనీ, సంఘటనలనీ, చక్కగా ఆకళింపు చేసుకోగలవూ, వాటి  గురించీ ఆసక్తికరంగా రాయనూ గలవు. పైగా ఈ లండన్ మహా నగరం లో చాలా మంచి స్నేహితులని కూడా సంపాదించుకున్నావు. మన ఊళ్ళో ఏముంటయి విశేషాలు?”

“అవును ఫ్రాన్సిస్. నువ్వు లండన్ లో, నేను మన వూళ్ళో ఉంటే మన ఇద్దరి ఉత్తరాలూ ఇటుదటు అయేవన్నమాట! అది సరే, ఎలా వున్నారు మన వూరి జనం? అందరినీ కలిసావా?”

“కలిసాను.అందరికంటే నాకు మిస్ థాంసన్ బలే నచ్చింది. చాలా మంచిదావిడ. బలే కష్టపడి పని చేస్తుంది కదూ? ఆ మధ్య ఎడిన్ బరో లో డూన్ గారి దర్జీ దుకాణంలో ఎల్సీ కనిపించిందట కదా? ఎల్సీని చాలా మెచ్చుకుంది.”

“అయితే ఈ సంగతి మనం ఎల్సీతో చెప్పాలి. ఎప్పుడూ మొహం ముడుచుకుని నిరాశగా వుంటుంది.”

“అవన్నీ అలా వుంచు జేన్. నాకొక విచిత్రమైన ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం చూపించడానికే వచ్చాను నేను.”

ఫ్రాన్సిస్ ఒక ఉత్తరం ఆమె చేతిలో పెట్టాడు. కుతూహలంగా ఉత్తరం చదవసాగింది జేన్.

( సశేషం)

వీలునామా – 19 వ భాగం

శారద

శారద

 

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీనిర్ణయం 

 బ్రాండన్ అసలు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళాడే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియానించి ఇంగ్లండు వచ్చాడు. ఒక ఆరు నెలలు రకరకాల అమ్మాయిలని కలిసి, మాట్లాడాడు. డాక్టరు ఫిలిప్స్ గారమ్మాయ్యి హేరియట్ అతనికి కొంచెం నచ్చినట్టే అనిపించింది. కానీ ఎందుకో ఆమెని పెళ్ళాడేంత నచ్చలేదు. ఆ ఆలోచనల్లో ఉండగానే అతను ఎల్సీ మెల్విల్ ని రెన్నీ గారింట విందులో కలిసాడు.

అప్పట్నించీ అతనికి ఆమె ధ్యాసే మనసంతా నిండిపోయింది. ఆమె సౌమ్యమైన రూపమూ, చదువూ, సంస్కారమూ, సన్నటి స్కాటిష్ యాసతో కూడిన మాటలూ, అన్నీ అతని మనసుని పట్టి లాగినాయి. ఆమె నిస్సహాయత అతని మనసుని కరగించి వేస్తే, ఆ పరిస్థితులలో ఆమె చూపించిన ధైర్యం అతనికి అబ్బురమనిపించింది.

ఇప్పుడు ఎల్సీని చూస్తుంటే కొంచెం చిక్కి, కళా కాంతులు తగ్గినట్టున్నా, తను మొదటి రోజు చూసినట్టే వుంది. ఆమెని తను పెళ్ళాడతాడు! తన స్నేహంలో, సంరక్షణలో ఆమె ఆరోగ్యం పుంజుకుంటుంది. ఆ కవితల పుస్తకం కూడా తను అచ్చేయిస్తాడు. ఒక పుస్తకాన్ని తమ హాల్లో టేబిల్ మీద అందరికీ కనబడేలా వుంచుతాడు కూడ! స్నేహితుల్లో, బంధువుల్లో అందరిలో తన హోద చకచకా పెరిగిపోతుంది!  చదువుకున్నదీ, కవితలు రాసేదీ, డబ్బున్న కుటుంబానికి చెందిందీ అయిన భార్య వుండడం ఎంత గర్వ కారణం.

ఇప్పుడు డబ్బు లేక కుట్టు పనికెళ్తూండొచ్చు. అయితే మాత్రం? నిజానికి అదీ గర్వపడాల్సిన విషయమే కదా? ఇలాటి ఆలోచనలన్నీ బ్రాండన్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాతు. అతని మనసు అతని కుటుంబ సభ్యులకర్థవకపోయి వుండొచ్చు కాక! పెగ్గీ త్వరగానే కనిపెట్టేసింది.

ఎలాగైనా ఎల్సీని ఈ పెళ్ళికొప్పించాలి అనుకుందామె. వెంటనే తాతగారితో మాటల్లో యథాలాపంగా అన్నట్టు బ్రాండన్ మంచితనం గురించీ, దయా గుణాలగురించీ చెప్పింది.

***

veelunama11

డాక్టరు గారింటికి ప్రయాణమయ్యారు ఎల్సీ, బ్రాండన్. రైలులో ఒంటరిగా ఆమెతో ప్రయాణం చేసే అవకాశం దొరికినందుకు పొంగిపోయాడు బ్రాండన్. ఈ ఏకాంతంలోనే ఆమెకి తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ఎలాగో తత్తరపడుతూనే ధైర్యంగా ఆమె అంటే తనకున్న ఇష్టాన్నీ మాటల్లో తెలియజేసాడు.

ఎల్సీ మొహం పాలిపోయింది.

“అయ్యో! అలా అనకండి. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడంలేదు,” మొహం చేతుల్లో కప్పేసుకుంది.

“అదేమిటి మిస్ ఎల్సీ? అలా అంటున్నారెందుకు? మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది. అక్కడ నేనొక మంచి ఇల్లు కూడా కట్టించుకున్నాను. పెగ్గీ అక్కణ్ణించి వచ్చేసింతర్వాత ఇల్లంతా బాగు చేయించాను. మీకక్కడ అంతా హాయిగా గడిచిపోతుంది. మీ కవితల పుస్తకం కూడా అచ్చేయించాలని ఆశపడుతున్నా..”

“కవితల పుస్తకమా?” అయోమయంగా అడిగింది ఎల్సీ.

“అవును! మీర్రాసిన కవితలన్నీ చదివాను. చాలా బాగున్నాయి. అవన్నీ పుస్తకంగా అచ్చేయిస్తాను. మా వూళ్ళో అందరూ మిమ్మల్నీ, మీ తెలివితేటల్నీ చూసి మెచ్చుకుంటారు. నేనైతే గర్వంతో పొంగిపోతానేమో! కాదనకండి.”

నిట్టూర్చింది ఎల్సీ. ఆత్రంగా ఆమె వైపు చూస్తున్నాడు బ్రాండన్.

“మీరు పొరబడుతున్నారు బ్రాండన్. నేను మీరనుకున్నంత తెలివైన దాన్ని కాను. ఆ కవితలన్నీ ఉత్త చెత్త రాతలు. వాటిల్లో వస్తువూ బాలేదు, శిల్పం అంతకంటే బాలేదు. ఇలా బట్టలు కుట్టుకోవడానికి మాత్రమే నాకు అర్హత వుంది.”

“అని మీరనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం వేరు. ఇలా దిగజారి బట్టలకొట్లో పని చేయాల్సిన స్త్రీకాదు మీరు.”

“మన కడుపు మనం నింపుకోవడం లో దిగజారడం ఏముందిలెండి.”

“ఒప్పుకుంటాను. అయినా మీరు ఇలా బట్టలు కుట్టుకుంటూ మీ పొట్ట పోసుకోవడం అన్న విషయం నన్ను చాలా బాధిస్తుంది. ఈ సంగతి తెలిసిన నాటినుంచీ నాకు కంటి నిండా నిద్దర కూడా పట్టలేదు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వుండనీయను.”

“నన్ను చూసి జాలిపడుతున్నారా? అది నన్నెంత నొప్పిస్తుందో మీకు తెలుసా?”

“జాలి కాదు! మీమ్మల్ని ప్రేమిస్తున్నాను.” ధైర్యంగా అన్నాడు బ్రాండన్.

“మీ ప్రేమ జాలిలోంచి పుట్టింది. నా మీద మీరు జాలి పడటం మానేసిన మరుక్షణం మీ ప్రేమా చచ్చిపోతుంది. వద్దు బ్రాండన్. నేను మిమ్మల్ని పెళ్ళాడలేను. నన్ను క్షమించండి.”

ఆమె గొంతులో వున్న నిరాశా నిస్పృహలు పసిగట్టి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. ఆమె చెప్పే మాటలు అబధ్ధాలనిపించడంలేదు. అంటే, ఆమె మనసులో ఇంకెవరైనా వున్నారేమో! లేకపోతే, హాయిగా ఏ బాదరబందీలూ లేని జీవితాన్ని తనిస్తానని చెప్తున్నా, దర్జీ పని చేస్తూ బ్రతకడమే బాగుండడం ఏమిటి? ఇందులో ఏదో తిరకాసుంది.

ఎప్పుడూ ఆమె మొహంలో వుండే దిగులూ, చిక్కి శల్యమైపోతూ వుండడం, ఆమె నిట్టూర్పులూ, అన్నిటికంటే ఆమె కవిత్వం రాయడం, అన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. బాగున్న రోజుల్లో ఎవరో నీచుడు ఆమెని ప్రేమలోకి దింపి వుంటాడు. ఇప్పుడు ఆమె డబ్బంతా పోగానే మొహం చాటేసి వుంటాడు. ఎంతటి నీచుడు. బ్రాండన్ మనసులో ఆమె పట్ల ప్రేమ సంగతేమోకానీ, జాలి మాత్రం ఇంకా పెరిగిపోయింది.

సౌకర్యవంతమైన జీవితాన్నీ, ప్రేమనీ పంచి ఇస్తానని ఒకవైపు తను చెప్తూంటే ఎప్పడిదో పుచ్చిపోయిన ప్రేమనీ, ఆ ప్రేమికుణ్ణీ తల్చుకుని బాధ పడుతూనే వుంటానంటే, అది ఆమె ఖర్మ! తనేం చేయలేడు, అనుకున్నాడతను. ఆ సంగతి రెట్టించి అడగడం కూడా అమర్యాదగా అనిపించింది. ముభావంగా వుండిపోయాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకోని వుంటే అతని మనసులో ఆమె పట్ల మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ పదింతలయేది. నిజంగానే ఆమెని సూఖపెట్టడానికి పగలూ రాత్రీ కష్టపడి వుండేవాడు. ఆమె కాదనడంతో ఆ మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ ఆరిపోయింది. కనీసం తను అందించాలనుకున్న ప్రేమకి ధన్యవాదాలు కూడా చెప్పలేదామె. ఎందుకో తల దించుకుని మౌనంగా వుండిపోయింది. పక్క స్టేషనులో ఇంకొంతమంది ఆ పెట్టెలోకెక్కడంతో ఆ ఇబ్బందికరమైన మౌనానికి తెర పడింది.

ఎల్సీ మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఆమెకీ మౌనం దుర్భరంగా వుంది. అయినా ఏం మాట్లాడాలో తోచలేదు. అతను ఇంతకు ముందు పెగ్గీని కూడా ఇలాగే పెళ్ళాడమని అడిగాడు. పెగ్గీ నిరాకరించింది. ఆయన కనబడ్డ ప్రతీ ఆడదాన్నీ ప్రేమించేవాడల్లే వుందే!

నిజం చెప్పాలంటే ఆతని లాంటి కష్టజీవిని పెగ్గీలాంటి స్త్రీయే సుఖపెట్టగలదు. తనలాటి దుర్బలురాలు కాదు. తన ఆరోగ్యమూ బాగుండలేదు. అతనితో సమానంగా శారీరక కష్టమూ చేయలేదు. కాలనీలో ఒంటరితనంతో పోరాడుతున్న అతనికి ప్రేమనూ, స్నేహాన్నీ ఇవ్వలేదు. తనని పెళ్ళాడడం వల్ల అతనికేమాత్రమూ సుఖం వుండదు సరి కదా, తనని కని పెట్టుకోని వుండడం అతనికి అదనపు భారం. అతను తన మీద పడుతున్న జాలిని ఉపయోగించుకొని అతని పైన తన బరువును మోపడం ఏం న్యాయం? ఇలా సాగుతోన్న ఆమె ఆలోచనల గురించి తెలిస్తే బ్రాండన్ ఎంత ఆశ్చర్య పడి వుండేవాడో!

రైలు గమ్యం చేరుకుంది. ఇద్దరూ కిందికి దిగారు. డాక్టరు ఫిలిప్స్ గారి పల్లెటూరికి గుర్రపు బగ్గీ మాట్లాడుకుని ఎక్కారు. చలికి కొయ్యబారిపోయినట్టున్న ఆమె చేతులు పట్టుకుని ఆమెని బండేక్కించాడు బ్రాండన్. మరింతగా ముడుచుకుపోయిన ఆమెని చూసి,

“మిస్ ఎల్సీ, నను చూసి భయపడుతున్నారల్లే వుందే! ఈ విషయం నేనింకో నరమానవుడికి తెలియనివ్వను. నేను మాట్లాడితే మీకు ఇబ్బందిగా వుందంటే అసలు మీతో మాట్లాడనే మాట్లాడను. చెప్పండి, నిజంగా నేను మీతో మాట్లాడడం మీకిష్టం లేదా?” ఆశగా అడిగాడు.

“అవును! మీరింక నాతో మాట్లాడడమూ, నాతో స్నేహం చేయడమూ మానేస్తే మంచిది. నన్ను నమ్మండి! నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది మీకు.”

“మీరు కాదన్నాక ఇహ ఎంత మంచి అమ్మాయి కనబడి ఏం లాభం లెండి. అయినా మీరు నన్ను దూరంగా వుండమంటే అలాగే వుంటాను.”

***

వాళ్ళు ఇల్లు చేరేసరికి జేన్ పిల్లలకి చదువు చెప్తోంది. ఆ రోజూ లిల్లీ కూడా పిల్లలతోపాటే కూర్చోని వుంది చదువుకుంటూ.

ఎల్సీని నఖశిఖ పర్యంతమూ పరికించి చూసింది లిల్లీ. మొహం బానే వుంది కానీ, కళ్ళు బాగా అలిసిపోయినట్టున్నాయి. బాగా పాలిపోయి కూడా వుంది. కాస్త కండ పడితే కాని మనుషుల్లోకి లెక్కకి రాదు, మరీ స్తంభం లాగుంది, అనుకుంది.

ఫిలిప్స్ చెల్లెళ్ళు కూడా ఎల్సీ కంటే జేన్ బాగుంటుందని తీర్మానించేసారు. ఫిలిప్స్ మాత్రం ఎల్సీ అనారోగ్యం వల్ల అలా అనిపిస్తుంది కానీ, మంచి అందగత్తె అని చెప్పాడు ఆడవాళ్ళందరితో. డాక్టరు ఫిలిప్స్ గారు ముందా దగ్గు సంగతేమిటో తేల్చెయ్యాలన్నారు. అందరూ ఆమె పట్ల చూపించిన ఆప్యాయత చూసి ఎల్సీ కొంచెం సర్దుకుంది.

చెల్లెలి మొహం చూస్తూనే జేన్ ఆమె మనసెందుకో అలజడి గా వుందని పసి కట్టింది. అయితే అదంతా అనారోగ్యం వల్లనే ననీ, డాక్టరు గారి వైద్యం తో ఎల్సీ మళ్ళీ ఎప్పట్లాగే అవుతుందనీ తనకి తనే సర్ది చెప్పుకుంది.

ఆ రాత్రి ఇద్దరూ ఒంటరిగా వున్నప్పుడు ఎల్సీ అక్కతో బ్రాండన్ ప్రతిపాదన గురించి అంతా చెప్పింది. జేన్ మౌనాన్ని చూసి భయపడింది ఎల్సీ.

“జేన్! నా మీద కోపంగా వుందా? తప్పు చేసాననుకుంటున్నావా? నాకతని మీద ఏ కోశానా ప్రేమలేదు. అలాటప్పుడు అతన్ని పెళ్ళాడడం అతన్ని మోసం చేయడమే అవుతంది కదా? ” ప్రాధేయపడింది ఎల్సీ.

“పిచ్చిదానా! నీమీద కోపం ఎందుకే? నువ్వేం తప్పు చేసావని?” శాంతంగా అంది జేన్.

“అది కాదు జేన్! ఒంటరితనమూ, పేదరికమూ నన్నెంత బాధపెడుతున్నాయో, ఎంత దుర్భరంగా వుందో నీకు తెలీదు. ఆ పరిస్థితులకి బెదిరిపోయి అతన్ని పెళ్ళాడొచ్చు. కానీ, ఎప్పటికైనా అతనికి నిజం తెలియకపోదు. అతని మీద ఇష్టం తో కాక కేవలం పరిస్థితుల వల్ల అతన్ని పెళ్ళాడానని తెలిస్తే అతను ఎంత బాధ పడతాడు?”

“ఇప్పుడు నీకతనంటే పెద్ద ఇష్టం లేకపోవచ్చు ఎల్సీ! ఇంకొన్ని రోజులయుంటే నీకతని మీద ఇష్టం పుట్టేదేమో. ఇలాటి ఇష్టాయిష్టాలు ఒక్క క్షణంలో పుట్టేవి కాదు. నువ్వతన్ని కొంచెం వ్యవధి అడిగివుంటే అయిపోయేది.”

“కానీ, జేన్, నీకు గుర్తుందా? అతను పెగ్గీనీ పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు. ”

జేన్ ఏమీ మాట్లాడలేదు.

“చెప్పు జేన్! చాలా మొరటుతనంగా అతన్ని బాధ పెట్టానా? కనీసం ఎందుకు వద్దన్నానో కూడా చెప్పలేదు. నేనేం పరపాటు చేయలేదు కదూ?” ఆవేదనగా అడిగింది అక్కని.

“ఎల్సీ! పొరపాటో కాదో ఎవరం చెప్పగలం? నిజమే, నీకు బ్రాండన్ కనబడ్డ ప్రతీ ఆడదాని దగ్గరా పెళ్ళి ప్రస్తావన తెస్తాడనీ, అతను నీకు తగడనీ అనిపించొచ్చు. అయితే, మనకి ఎవరు నచ్చుతారన్నది కాదు ప్రశ్న, మనం ఎవరికైనా నచ్చుతామా అన్నది సమస్య. మళ్ళీ నిన్నిలాంటి మనిషి ముందుకొచ్చి పెళ్ళాడకపోవచ్చు! ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదనుకో, అయినా చెప్తున్నాను. అతను చాలా మంచి వాడనీ మనకు తెలుసు. అతను మనకెన్నో రకాలుగా సాయపడ్డాడు కాబట్టి మనమంటే ఏమూలో అభిమానం వుండే వుండాలి. ఎప్పుడో కొన్నేళ్ళ కింద పెగ్గీని పెళ్ళాడమని అడిగే వుండవచ్చు. అయితే ఏం? చిన్నతనంలో, ఆస్ట్రేలియా లాటి కాలనీలో ఒంటరిగా బ్రతికే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మనమెలా ఊహించగలం? పెగ్గీ కాదన్నా, ఇప్పటికీ పెగ్గీ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాడు. లండన్ లో కూడా అతను ఫిలిప్స్ ఇంటికొచ్చినప్పుడు చూసాను. నాకు అతను చాలా మంచివాడనిపించింది. ఇప్పుడు మనమున్న పరిస్థితి కంటే అతనితో బ్రతుకే నీకెంతో బాగుండేదేమో. ఆలోచించు.”

“వద్దు జేన్! ఎంతో కష్టపడి నేనా పిరికితనాన్ని వదిలించుకున్నాను. ఈ కష్టాలకి భయపడి, ఏమాత్రం ప్రేమలేకుండా, అతనికి నేనసలు తగనని తెలిసీ పెళ్ళాడగలనా? నాకు బాగా తెలుసు జేన్. అతను నన్ను చూసి జాలి పడుతున్నాడు. అసలు ఒక మనిషి నన్ను ప్రేమించే పరిస్థితిలో వున్నానా నేను? నా అవతారం చూడు! నా వాలకం చూడు! ఏముందని నన్నెవరైనా ప్రేమిస్తారు? అసలు జేన్, నాకా దర్జీ కొట్లో ఎంత దుర్భరంగా, ఎంత అవమానంగా వుందో తెలుసా? అవమానం నా పనిని తలచుకోని కాదు. ఊరికే అనవసరంగా నా మీద జాలి ఒలకపోస్తూ ఏదో ఒక వంకన నన్ను చూడడానికొచ్చే మన ఊరివాళ్ళ వల్ల. నిన్ను చూస్తే ఎవరికీ జాలనిపించదు జేన్. ధైర్యంగా తలెత్తుకోని నడవగలవనిపిస్తుంది. నన్ను చూస్తేనే ఎక్కళ్ళేని జాలీ ముంచుకొస్తుంది మనుషులకి. నాకది ఎంత చిరాగ్గా వుంటుందో చెప్పలేను. ఇప్పుడితనూ నన్ను చూసి జాలిపడే పెళ్ళాడతానన్నాడు. అది నాకెంత అవమానంగా వుంటుందో అర్థం చేసుకోరెవరూ. ”

ఆమె ఆవేశాన్ని చూసి జేన్ నవ్వింది.

“ఎంత అమాయకురాలివి ఎల్సీ! నువ్వు చక్కటి మంచి అమ్మాయివి. తళ తళ లాడే నీ నీలి రంగు కళ్ళూ, సౌమ్యంగా ఆహ్లాదంగా వినిపించే నీ గొంతూ, చదువూ సంస్కారమూ అన్నీ వున్నాయి నీకు. నిన్ను ఎవరూ ప్రేమించకపోవడం ఏమిటి? అసలు ఇంత ఆత్మ విశ్వాసం లోపిస్తుందెందుకు నీలో? బ్రాండన్ కి నీమీదున్నది జాలి కాదు, గౌరవం. కష్టాల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరి సాయం కోసమో ఎదురు చూడకుండా దర్జీ కొట్లో పనికి కుదురుకున్నావన్న గౌరవం. నాకైతే ఏ కోశానా అతనికి నీమీదున్నది జాలి మాత్రమే అనిపించడం లేదు.”

“పోనీలే జేన్!  పెళ్ళయింతరవాత నేనంత గొప్ప స్త్రీనేమీ కానని తెలిసి నిరాశ పడడం కంటే ఇప్పుడు కొంచెం బాధ పడడమే మంచిది. అదలా వుంచు జేన్. నాకు నా ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళనగా వుంది. ఎడిన్ బరో చలికి బాగా దగ్గు ముదిరింది. ఏదైనే ఊపిరి తిత్తుల్లో జబ్బేమో! నేను పెళ్ళి వద్దనడానికి అది కూడా ఒక కారణం. ఈ ఊపిరి తిత్తుల్లో జబ్బుతో నేను చచ్చిపోతే…”

“ఎల్సీ! ఏంటా మాటలు? నీకే జబ్బు లేదు. రేపే డాక్టరు గారిని నిన్ను మొత్తం పరీక్ష చేయమంటాను. ఆయన చేతిలో ఏ జబ్బైనా ఇట్టే నయమైపోతూంది తెల్సా? చాలా అనుభవమూ, తెలివి తేటలూ వున్న మనిషాయన. నీకేం భయం లేదు. నువ్విక్కడికి వచ్చి మంచి పని చేసావు.”

“జేన్! నువ్విక్కడ వీళ్ళింట్లో హాయిగా వున్నావు కదూ? అందరూ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. జీతం బాగానే ఇస్తున్నారా లేదా?”

“అవును ఎల్సీ! ఈ ఉద్యోగం మనకు భగవంతుడే ఇచ్చాడు. నీకెందుకు! నీకూ అన్నీ నేను సరి చేస్తాగా? హాయిగా ఇక్కడున్న నాలుగు రోజులూ విశ్రాంతి తీసుకో!”

ఆ రాత్రి ఎల్సీ నిద్ర పోయినా జేన్ కి చాలా సేపు నిద్ర పట్టలేదు. ఎల్సీ బ్రాండన్ తో పెళ్ళికొప్పుకోని వుంటే ఎంత బాగుండేది. ఆమె భవిష్యత్తు స్థిర పడేది. ఆమె లాటి అమాయకురాలు బ్రాండన్ రక్షణలో ఎంతైనా సుఖపడివుండేది.  డాక్టరు గారి చికిత్సలో ఎల్సీ కోలుకోగానే బ్రాండన్ మళ్ళీ ఎల్సీతో మాట్లాడితే బాగుండు! ఆలోచనల్లోనే నిద్ర పోయింది జేన్.

***

(సశేషం)

వీలునామా -18వ భాగం

శారద

శారద

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీ పరిస్థితి

ఎల్సీ గురించి జేన్ ఆందోళనపడడంలో విపరీతమేమీ లేదు. నిజానికి జేన్ ఊహించినదానికన్న ఎక్కువగానే ఎల్సీ మానసిక శారీరక ఆరోగ్యాలు దిగజారుతున్నాయి. ధైర్యంగా శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనికి వెళ్తోంది కానీ అక్క తోడు లేని ఆమెని ఒంటరితనం లోపల్నించి తినేస్తూంది.

జేన్ కి కూడా చెల్లెలు లేకపోవడం తో కొంచెం ఒంటరిగా అనిపించిన మాటా నిజమే, కానీ ఫిలిప్స్ ఇంట్లో పిల్లలతో, లిల్లీతో, అప్పుడప్పుడూ వచ్చే బ్రాండన్ తో ఆమెకి బాగా పొద్దు గడిచేది. పైగా అక్కడ ఆస్ట్రేలియానించి ఇంటికి తిరిగొచ్చే స్నేహితులతో ఫిలిప్స్ ఇల్లు చాలా సందడిగా వుండేది. వాళ్ళందర్నీ గమనించడం, వాళ్ళ మాటల్ని విని అర్థం చేసుకోవడం, ఆస్ట్రేలియాలో జీవితాన్ని గురించి తెలుసుకోవడం జేన్ కి భలే కాలక్షేపంగా వుండడంతో చెల్లెలి మీద బెంగ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. జేన్ ఈ సంభాషణల గురించి ఉత్తరాల్లో రాసేది. తనకి అలాటి తెలివైన స్నేహితులు లేనందుకూ, తను రాసే ఉత్తరాలు చాలా నిరాసక్తంగా వున్నందుకూ ఎల్సీ ఎంతో బాధపడేది.

ఇంటికి వచ్చి ఎంత అలసిపోయినా లౌరీ పిల్లలకి అక్క అలవాటు చేసిన క్రమశిక్షణ మరచిపోనివ్వలేదు ఎల్సీ. వాళ్ళని రాత్రి పూట అక్కలాగే కూర్చోబెట్టి చదివించడం, వాళ్ళ పుస్తకాలవీ సరిదిద్దడం చేసేది. కానీ టాం అడిగే చిక్కు ప్రశ్నలకి ఆమె దగ్గర సమాధానాలుండేవి కావు. ఆమె కవిత్వమూ మొత్తానికి మూలపడింది. ఎంత ప్రయత్నించినా ఒక్క పంక్తి కూడా రాయలేకపోయింది చాలా రోజులు.

అక్కతో కలిసి నడిచినప్పుడు ఆహ్లాదంగా, సరదాగా అనిపించిన నడక ఇప్పుడు దుర్భరంగా అనిపిస్తూంది. పొద్దున్నే పెగ్గీ ఇంటినుంచి డూన్ గారి కొట్టుకి నడిచే దారిలో వుండే చిన్న చిన్న ఇళ్ళూ, వాటికి అన్నిటికీ ఒకేలా వుండే రంగులూ, ద్వారాలూ, కిటికీలూ అన్నీ తనని చూసి ఎగతాళి చేస్తూన్నట్టనిపించేవామెకు. స్వతహాగా ఆమె అక్కలా శారీరకంగా, మానసికంగా దృఢమైన మనిషి కాదు. దానికి తోడు ఎడిన్ బరో లో వీచే చల్లటి గాలులూ, ఏదో ఆదరాబాదరాగా తినే తిండీ, కృంగిపోతున్న మనస్సూ అన్నీ ఆమె ఆరోగ్యం మీద దాడి చేసాయి. రోజురోజుకీ ఆమె మొహం మరింతగా పాలిపోతూ, ఆకలి మందగిస్తూ, దగ్గుతో సతమతమవసాగింది.

అయితే ఎంతో ఆత్మాభిమానం కలది కావడంతో కూర్చుని పెగ్గీ సంపాదన తినలేక దర్జీ కోట్లో కష్టపడేది. శ్రీమతి డూన్ కొద్ది రోజుల్లోనే ఎల్సీకిచ్చే జీతాన్ని పెంచింది. ఎల్సీకి సహాయం చేసే ఉద్దేశ్యమేనో మరింకేమిటో కానీ, రెన్నీ గారమ్మాయి ఎలీజా తల్లిని బలవంతం చేసి డూన్ కొట్లోనే తమ బట్టలు కుట్టించుకునేది. ఆమెతో బాటు లారా విల్సన్ కూడా వచ్చి స్వయంగా ఎల్సీ తోటే తమ బట్టలు కుట్టించుకున్నారు. వాళ్ళ ఊరి నుంచీ చాలా మంది స్త్రీలు కేవలం ఎల్సీని చూడడానికి డూన్ దుకాణానికొచ్చి తమ బట్టలు కుట్టించుకోవడం మొదలు పెట్టారు. పెరిగిన అమ్మకాలు చూసి డూన్ సంతోషించినా, వెనకటి పరిచయస్తులను ఇలాటి దిగజారిన పరిస్థితులలో చూడడం ఎల్సీకి ప్రాణాంతకంగా వుండేది.

అలాటి రోజుల్లో ఒకరోజు-

veelunama11

ఎలీజా రెన్నీ, లారా విల్సన్ ఇద్దరూ దుకాణానికొచ్చి బట్టలు చూడడం మొదలుపెట్టారు. ఇద్దరూ చాలా సంతోషంగా వెలిగిపోతున్న మొహాలతో హడావిడిగా అనిపించారు. లారా ఫాషన్ పత్రికలు తెరిచి తనకి కావాల్సిన డిజైన్లు ఎన్నిక చేసుకుంటూంటే ఎలీజా ఎల్సీ పక్కకొచ్చి చేరింది. మెల్లిగా గుసగుసగా-

“ఎల్సీ ! అంతా నిశ్చయమైపోయినట్లే! లారాకీ, విలియం డాల్జెల్ కీ పెళ్ళి కుదిరిపోయింది. అదేనోయ్, మీ వూళ్ళో మీ స్నేహితుడూ, మీ అక్కయ్యని ఇష్టపడ్డాడూ, విలియం డాల్జెల్!  ఆ, అతనితోనే! పెళ్ళి కుదిరిపోయింది.  పెళ్ళి బట్టలు కుట్టించడానికి ఇక్కడికే వొస్తుంది చూడు! నన్నడిగితే డూన్ నీకెంతో ఋణ పడి వుండాలి. నువ్వు లేకపోతే మేమసలు ఇలాంటి దుకాణాలవైపే  రాము. అయినా, భలే పెళ్ళిలే! మీ అక్కయ్యకంటే ఎందులో గొప్పని ఈ లారా ని ఆ డాల్జెల్ పెళ్ళాడుతున్నాడో ఆ దేవుడికే ఎరుక! అంతా డబ్బు మహిమ! ఏం చేస్తాం. అయినా లారా డబ్బూ ఆస్తీ అంతా తన పేరునే వుండేలా చూసుకుంటుంది. నాన్నారేకదా ఆమె ఆస్తికి ట్రస్టీ. అంతా పకడ్బందీగా ఏర్పాటు చేయించుకుంది. చూడ్డానికలా వుంది గానీ, మహా గడుసుది. పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి కూతుర్నవుతున్నానని మహా మురిసిపోతూందిలే! అయినా డబ్బు కొరకు కాకపోతే దాన్ని పెళ్ళాడేదెవరు! వెధవ నోరూ, అదీనూ! విలియం మాత్రం ఏమన్నా తక్కువ వాడా? ఎంత బాగుంటేనేం, నక్క వినయాలూ వాడూ! నాకైతే విలియం మొహానికి అంటించుకునే ఆ నవ్వూ, అతని అతి వినయాలూ చూస్తూంటే ఒళ్ళు మండుతుంది. తొందరగా ఈ పెళ్ళి అయిపోతే బాగుండు బాబూ! నాకు వీళ్ళ బోరు తప్పుతుంది. ఆ, ఆ, వస్తూన్నా లారా! నచ్చిన డిజైన్లన్నీ చూసుకున్నావా?”

“ఎలీజా! ఇంత ఖరీదైన పెళ్ళి బట్టలు కుట్టడం నావల్లేమవుతుంది?  మీరు మేడం డిఫో దగ్గరకెళ్ళడం మంచిదేమో!” ఎల్సీ మృదువుగా అంది.

“ఏమో బాబూ ! లారాకి నువ్వు ఎన్నిక చేసే రంగులు బాగా నచ్చుతాయట. నాకూ ఆ డిఫో ఎన్నికలకంటే నీ అభిరుచే నచ్చుతుంది!” గారంగా అంది ఎలీజా రెన్నీ.

“అదేమో కానీ, ఇప్పుడు నాకిక్కడ తీరిక లేనంత పని వుంది. పెళ్ళి బట్టలు డిజైను చేసి కుట్టేంత తీరిక లేదు ఎలీజా! అదిగో చూడు, ఎవరో వస్తున్నారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అసలు మీరు డిఫో దగ్గరకెళ్ళడం మంచిది.”  అక్కణ్ణించి లేచి వెళ్తూ అంది ఎల్సీ. ఆమెకెందుకో లారా విల్సన్ ని చూస్తే ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా వుంది. అప్పుడే తలుపు తెరుచుకుని ఒక పెద్దవిడ ఒక పదమూడేళ్ళ అమ్మాయితో లోనకొస్తూంది. వాళ్ళని చూసి ఎల్సీ కంటే ముందు ఎలీజా రెన్నీ లేచి వాళ్ళ ముందుకొచ్చింది.

“అరే! మిస్ థాంసన్! బాగున్నారా? మీ వూర్నించి ఎడిన్ బరో ఎప్పుడొచ్చారు? మా అమ్మ మిమ్మల్ని బాగా తలచుకుంటూంది. తప్పక మా ఇంటికి రావాలి. వూళ్ళో అంతా ఎలా వున్నారు?” చనువుగా ఆవిడని అడిగింది.

“హలో మిస్ రెన్నీ! బాగున్నారా? కొద్ది రోజులు ఎడిన్ బరో లో వుంటాను. తప్పక ఇంటికొచ్చి అమ్మని కలుస్తాను,” మర్యాద పూర్వకంగా అంది మిస్ థాంసన్.

“ఈ అమ్మాయెవరు? మీ మేనకోడలా?”

“అవును ఎలీజా! దీని పేరు గ్రేస్. బాగా చదువుతుంది. వచ్చే వారం ఏదో స్నేహితురాలి పార్టీ వుందిట. దానికోసం ఒక మంచి గౌను కుట్టిద్దామని ఇలా వచ్చాం.”

“అవునా? ఇక్కడ బట్టలు కుట్టరు. ఇక్కడ రంగులూ బట్టలూ ఎన్నిక చేస్తారు. పక్క గదిలో కుట్టించుకోవచ్చు,” ఎలీజా సలహా ఇచ్చింది.

“అలాగా! అయితే నాకూ కొంచెం ఒక టోపీ, షాలూ కావాలి. అవన్నీ ఎన్నిక చేసుకుని గౌను కుట్టించటడానికి తిసికెళ్తా,” అని ఎల్సీ వైపు తిరిగింది మిస్ థాంసన్.

“అన్నట్టు మీరు చిన్న మెల్విల్ అమ్మాయి కదూ? ఆ మధ్య మీ అక్కయ్య జేన్ నన్ను కలవడానికొచ్చింది. ”

“అవునండీ!”

“అదీ సంగతి! ఎక్కడో చూసిన మొహం లాగుందే అనుకున్నాను. మీరిద్దరూ ఇంచుమించు ఒకేలాగున్నారు. మీ అక్కయ్య ఆస్ట్రేలియన్ల ఇంట్లో గవర్నెసు గా చేరిందట కదా? మంచి పని చేసింది. ఆమెని అందరూ మెచ్చుకుంటూంటే భలే సంతోషం వేసిందనుకో! మరి నీ సంగతేంటి? నువ్విక్కడ పని చేస్తున్నావల్లే వుందే! సంతోషం. చిన్నదో పెద్దదో, మనకంటూ ఒక వృత్తి వుండడం మంచిది.”

నవ్వింది ఎల్సీ.

“అది సరే కానీ, నాకు ఒక టోపీ, ఒక షాలూ కొంచెం తయారు చేసి పెడతావా? నాకింతకు ముందు తయారు చేసిన ఆవిడ బలే కొత్త ఫాషన్లతో చేసేది కానీ, ఆ టోపీ నా తల మీద నిలవనే నిలవదు. ఇహ ఎందుకా ఫాషను? కాల్చనా?”

మళ్ళీ నవ్వేసింది ఎల్సీ.

“అలాగే చేస్తాలెండి. మా పెగ్గీ కి చేసినట్టు చేసిస్తా, కొంచెం ఫాషన్ గా ,కొంచెం సౌకర్యంగా వుండేటట్టు చేస్తా, సరేనా?”

“నాకు ఫాషన్ కంటే సౌకర్యం ఎక్కువ ఇష్టం! అది సరే! నువ్వు పెగ్గీ ఇంట్లోనే వుంటున్నావా? తిండి సరిగ్గా తినడంలేదా? ఇంత చిక్కిపోయవ్!”

“పెగ్గీ చాలా మంచిదండీ! అక్కడ నాకేమీ కష్టం లేదు. ఈ మధ్య కొంచెం ఒంట్లో నలతగా వుంది, అంతే. అదే కాకుండా నాకు జేన్ మీద బెంగ ఎక్కువయింది. అన్నట్టు ఫిలిప్స్ గారి సతీమణి నన్ను వాళ్ళింట్లో కొన్ని వారాలు ఉండేలా రమ్మని ఆహ్వానించారు. ఒక సారలా వెళ్ళొస్తే నా ఆరోగ్యం సర్దుకుంటుంది.” ఎల్సీ ధైర్యంగా అంది.

“అది మంచి ఆలోచన. అన్నట్టు మీ బావ, ఫ్రాన్సిస్, ఎస్టేటులో చాలా మార్పులు చేస్తున్నాడు.”

“అవునా? మార్పులతో అందరూ అంగీకరిస్తున్నారా?”

“అందరి సంగతేమోకానీ, నావరకు నాకైతే, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగుండలే. పాలేర్లకు చిన్న చిన్న ఇళ్ళివ్వడం మంచి ఆలోచనే, కానీ, వాళ్ళకి స్వంతంగా భూములు కూడా ఇచ్చేయాలా? అయితే, నేనూ మా పొలంలో పని చేసే పాలేర్లకోసం చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నాను.”

“అది సరే కానీ, మిస్ థాంసన్, మీ ఊళ్ళోకి ఒక కొత్త పెళ్ళికూతురు రాబోతున్నట్టు మీకు తెల్సా? అమ్మ మీతో మాట్లాడాలనుకున్నది దాని గురించే, ” మధ్యలో అందుకుంది ఎలీజా రెన్నీ.

“అదేనండీ! లారా విల్సన్ విలియాం డాల్జెల్ ని పెళ్ళాడబోతున్నట్టు మీకింకా తెలియదా?” తనే పొడిగించింది.

“ఓ! అలాగా? వచ్చి మీ అమ్మని కలుస్తాలే. అలాగే ఒకసారి పెగ్గీ వాకర్ ని కూడా చూడాలి,” అంటూ మిస్ థాంసన్ మేన కోడలికి గౌను కొలతలు చెప్పడం కోసం పక్క గదిలోకెళ్ళింది.

లారా పెళ్ళి దగ్గరకొచ్చేసరికి తాను ఈ కొట్టులో కుట్టు పని మానేయగలిగితే బాగుండు అనుకుంది ఎల్సీ. ఆ సాయంత్రం పని ముగించుకొని ఇల్లు చేరేటప్పటికి బ్రాండన్ వచ్చి పెగ్గీతోనూ, తాతగారు థామస్ లౌరీ తోనూ కబుర్లు చెప్తూ కూర్చొని వున్నాడు.

డాక్టరు ఫిలిప్స్ గారు ఎల్సీకి డెర్బీ షైర్ రావడానికి వీలవుతుందేమోనని కనుక్కోమన్నారట. అక్కడ ఒక వారం పది రోజులు చిన్న ఫిలిప్ కుటుంబమూ, జేన్ అందరితో గడిపి, అందరూ కలిసి లండన్ వెళ్ళాలన్న ఆలోచనలో వున్నారు.

అంత తొందరగా అక్కను చూడగలగటం ఎల్సీకి ఎంతగానో నచ్చింది. తనకోసం అంత శ్రమ తీసుకొని ఎడిన్ బరో వచ్చినందుకు బ్రాండన్ కి పదేపదే ధన్యవాదాలు చెప్పింది ఎల్సీ.

(సశేషం)

వీలునామా -17 వ భాగం

శారద

శారద

  కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

జేన్ ఉద్యోగ బాధ్యతలు -II

“ఒక పని చేద్దాం. నాలుగైదు రోజులు మీరూ మాతో పాటు వచ్చి ఊరికే కూర్చొండి. మీకు నా పధ్ధతీ, పాఠాలూ నచ్చితే, అలాగే చదువుకుందురుగాని. ” జేన్ సూచించింది.

లిల్లీకి ఈ ఆలోచన నచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు లిల్లీ కూడా పిల్లలతోపాటు వచ్చి చదువుకునే గదిలో కూర్చుని శ్రధ్ధగా పాఠాలు విన్నది. జేన్ తను చెప్పిన పాఠాన్ని పిల్లల్తో తల్లి ముందర వల్లె వేయించేది. లిల్లీకీ, పిల్లలకీ ఆ పధ్ధతి బాగా నచ్చింది. అందులోనూ జేన్ ఎలాటి విషయాన్నైనా పిల్లల భాషలో, ఆ స్థాయిలోకి దించి చెప్పేసరికి, పిల్లలతోపాటు తల్లికీ ఆ పాఠాలు బాగా వంటపట్టడం మొదలుపెట్టాయి.

ఆ పాఠాలు వినడంతోపాటు, యజమానురాలిగా జేన్ పనిని పర్యవేక్షణ చేస్తున్న భావన కలిగి లిల్లీకి గొప్ప ఆనందం కలిగింది! లిల్లీకి సంగీతం పట్ల వ్యామోహం మాత్రం తగ్గలేదు. కొన్నిరోజులు ఎమిలీ కి సంగీతం నేర్పే గురువుగారి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమెకా విద్య కొరుకుడు పడలేదు. ‘అబ్బ! అన్నీ తెలిసిన జేన్ ఈ సంగీతం ఒక్కటే వదిలేయాలా, నా ఖర్మ కాకపోతే!’ అని విసుక్కున్నదామె.

మొత్తమ్మీద జేన్ కి వాళ్ళింట్లో సంతోషంగా, సంతృప్తిగానే రోజులు గడిచిపోతున్నాయి. మొదటిసారి తన జీతం అందుకున్నప్పుడు జేన్ వర్ణాతీతమైన గర్వాన్నీ, సంతోషాన్నీ అనుభవించింది. ఆ క్షణంలో తనకి ఇక కావాలిసిందింకేమీ లేదనిపించింది.

అయితే వెంటనే ఎల్సీ ఎలా వుందో అన్న ఆలోచన వచ్చి మనసు కలుక్కు మంది. క్రమం తప్పకుండా ఎల్సీదగ్గర్నించీ, ఫ్రాన్సిస్ దగ్గర్నించీ, పెగ్గీ దగ్గర్నించీ వుత్తరాలు అందుతూనే వున్నా, ఎల్సీ గురించి ఏదో ఆందోళన జేన్ మనసులో.

శ్రీమతి డూన్ గారి బట్టల కొట్లో,చీకటి గొయ్యారం లాటి గదిలో, కుట్టు పని చేస్తూ ఎల్సీ ఏమంత సంతోషంగా, ఆరోగ్యంగా వున్నట్టు లేదు. వీలైతే ఆ ఉద్యోగం మానేయమనీ, బయట సూర్య రశ్మిలో ఎక్కువ తిరగమనీ ఉత్తరం రాసింది జేన్. ఎడిన్ బరో వదిలి లండన్ తీసుకొస్తే ఎల్సీ ఆరోగ్యం బాగవుతుందేమోనన్న ఆశ వున్నా, తనని తీసుకురాగలుగుతుందా? జేన్ చెల్లెలి మీద పెట్టుకున్న బెంగను బ్రాండన్ గమనించాడు. ఒకరోజు,ఫిలిప్స్ తో,

“స్టాన్లీ! ఎండాకాలం మీ ఇంటికి లిల్లీని పిల్లల్నీ తీసుకుని డెర్బీషైర్ వెళ్దానుకున్నావు కదా? అంతకు ముందొకసారి పిల్లల్ని జేన్ ని తోడిచ్చి ఎడిన్ బరో  పంపరాదూ? పెగ్గీ చాలా అనుకుంది పిల్లలని చూడాలని. అక్కణ్ణించి కావాలంటే నేను పిల్లల్ని డెర్బీషైర్ తీసుకొస్తాను. జేన్ చెల్లెలితోపాటు కొన్నాళ్ళుంటుంది. మీరు డెర్బీషైర్ లో వున్నప్పుడు తను ఇక్కడ లండన్ లో ఎందుకు అనవసరంగా?” అన్నాడు.

“అవుననుకో, కానీ, మేము జేన్ కూడా మాతోపాటు డెర్బీషైర్ వస్తుందనుకుంటున్నాం. అనవసరంగా పిల్లల చదువులు నెల రోజుల పాటు పాడవుతాయి లేకపోతే. కిందటిసారి అక్కడ మరీ అల్లరి ఎక్కువ చేసారు. కాస్త జేన్ వుంటే వాళ్ళని అదుపులో పెట్టగలుగుతుంది,” ఫిలిప్స్ అన్నాడు.

“అవునవును! అందులో స్టాన్లీ చెల్లెళ్ళు మేనకోడళ్ళని కూడా చూడకుండా ఎంత సణిగారో పిల్లల అల్లరిగురించి! “ మూతి మూడు వంకర్లు తిప్పింది లిల్లీ.

“అలాగా? నేనైతే తప్పక మా ఇంటికి ఏష్ఫీల్డ్ వెళ్ళే ముందర ఎడిన్ బరో వెళ్ళి పెగ్గీని చూడాలని నిశ్చయించుకున్నా. అందుకని కావాలంటే జేన్ నీ, పిల్లలనీ దిగబెట్టగలను. కానీ, తననీ మీతో డెర్బీషైర్ తీసికెళ్ళాలని మీరనుకుంటే, నేను వాళ్ళ చెల్లెలికి ఆ సంగతే చెప్తాలే!” అన్నాడు బ్రాండన్.

“మీ చెల్లెలు కుట్టుపనో ఏదో చేస్తుందని చెప్పావు కదా జేన్! పాపం, ఎలా చేస్తుందో ఏమో. తనకీ నీకున్నట్లాంటి ఉద్యోగం దొరికితే బాగుండు. మా ఇంట్లో అయితే జేన్ లేకపోతే క్షణం కూడ గడవదు,” అతిశయంగా అంది లిల్లీ!

“ఊరికే కూర్చుని తినడం కంటే కుట్టు పనైనా పర్వాలేదంటుంది మా చెల్లెలు! పని కంటే, అలా గంటలు గంటలు చిన్న కొట్టులో కూర్చోవడం వల్ల కొంచెం దానికి అనారోగ్యం చేసింది. అంతే! దానికి తోడు నేను పక్కన లేకపోవడం వల్ల ఒంటరితనం. మేమిద్దరమూ చిన్నప్పటినించీ ఒకరినొకరం వదిలి ఎప్పుడూ వుండలేదు.”

“అవునా? పోనీ, ఓ పని చెద్దామా? తననే కొద్ది రోజులు ఇక్కడ వుండడానికి రమ్మందాం. మనం డెర్బీషైర్ నించి తిరిగొచ్చాక అయితే కాస్త తీరుబడిగా కొన్ని రోజులు గడపొచ్చు. ఏమంటావు జేన్?” స్టాన్లీ ఫిలిప్స్ అన్నాడు.

జేన్ చెల్లెలితో స్నేహం చేయడానికి లిల్లీకి ఏమీ అభ్యంతరం కనిపించలేదు. వెంటనే జేన్ తో ఉత్తరం రాయించారు. ఎల్సీ కూడా రావడనికి ఒప్పుకునేసరికి జేన్ మనసు తేలిక పడింది. బ్రాండన్ కూడా తన ప్రయాణాన్ని వాయిదా వేసి ఇంకొన్ని రోజులు లండన్ లో వుండడానికి నిశ్చయించుకొన్నాడు. కొద్ది రోజులైతే చెల్లెల్ని చూడొచ్చన్న ఉత్సాహంతో జేన్ ఫిలిప్స్ కుటుంబంతో కలిసి డెర్బీషైర్, స్టాన్లీ తండ్రి ఇంటికి బయల్దేరింది.

 ***

స్టాన్లీ ఫిలిప్స్ తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. హాయిగా కబుర్లు చెప్తూ ఊరి వారందరితోనూ స్నేహం చేస్తూ, ఆడుతూ పాడుతూ వుండే మనిషి. ఆయనకి భార్య ద్వారా బోలెడంత ఆస్తి సంక్రమించింది. వాళ్ళ సంతానంలో మొదటివడైన స్టాన్లీ ఫిలిప్స్ విక్టోరియా కెళ్ళి బంగారు గనుల్లో బోలెడంత డబ్బు సంపాదించుకున్నాడు. స్టాన్లీ తల్లి మరణించిన తర్వాత పెద్దాయన మళ్ళీ పెళ్ళాడలేదు. ఇద్దరు పెళ్ళికాని కూతుర్లతో, ఆఖరివాడైన చిన్న కొడుకుతో కలిసి ఉళ్ళో వాళ్ళ భవంతిలోనే వుంటున్నాడు. తన ప్రాక్టీసు అందిపుచ్చుకోగలడని చిన్నవాణ్ణీ మెడిసిన్ చదివించారు, కానీ వాడికి అన్నలా ఆస్ట్రేలియాలో నిధులూ నిక్షేపాలు వెతుకుతూ గొర్రెల స్టేషనూ, ఆస్ట్రేలియాలో భూమీ కొనుక్కోవాలన్న ఆశ.

స్టాన్లీ చెల్లెళ్ళిద్దరూ మరీ అంత చిన్న పిల్లలేమీ కాదు. డబ్బూ, చదువూ వల్ల వచ్చే ఆత్మ విశ్వాసమూ, మర్యాదా వాళ్ళల్లో ఉట్టి పడుతూంటాయి. తండ్రి వృత్తి వల్లా, తల్లి ధనం వల్లా, వారిద్దరికీ ఆ ఊళ్ళో గౌరవ మర్యాదలు ఎక్కువ! వాళ్ళకి జీవితం లో తీరని లోటంటూ వుంటే అది వారి అన్నగారు ప్రేమించి పెళ్ళాడిన వదిన, లిల్లీ! తన ప్రేమను గురించీ, లిల్లీ అంద చందాల గురించీ స్టాన్లీ రాసిన ఉత్తరాల వల్ల వాళ్ళు ఊహించుకున్న వ్యక్తి వేరు. ఆమె నిరక్షరాస్యతా, మొరటు ప్రవర్తనా చూసి వాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళకి ఆమెని తమ స్నేహితులకి పరిచయం చేయాలంటేనే గొంతు పట్టేసినట్టయింది.

చెల్లెళ్ళ ప్రవర్తనకి స్టాన్లీ ఎంతగానో నొచ్చుకున్నాడు. అభిమానపడ్డాడు. ఆయన తన చెల్లెళ్ళ చదువులూ, అంద చందాలూ ,తెలివితేటల గురించీ ఎంతో గర్వంగా భార్యతో చెప్పుకొన్నాడు అంతకు ముందు. కానీ వదినగారితో వాళ్ళ ప్రవర్తననీ, వాళ్ళు ఆమెని చేసే వెటకారాలనీ, హేళననీ గ్రహించాడు. వాళ్ళ ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు.

లిల్లీకైతే స్టాన్లీ చెల్లెళ్ళిద్దరినీ తలుచుకుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి. నిజానికి వాళ్ళు స్టాన్లీ చెప్పినంత గొప్ప అందంగా కూడా లేరు. స్టాన్లీ ఇంగలండు వదిలిన పద్నాలుగేళ్ళలో వాళ్ళిద్దరూ పెద్దయిపోయినట్టున్నారు. వాళ్ళ తెలివితేటలేమో ఆమెకి కేవలం భయం గొలిపేవి. వాళ్ళ మంచితనం ఆమెకైతే అనుభవంలోకి రాలేదు. మరి స్టాన్లీకి ఏ కారణం వల్ల చెల్లెళ్ళంటే అంత ప్రేమా గౌరవాలున్నాయో ఆమెకి అర్థం కాలేదు. కనీసం ఒక మొగుణ్ణి కూడా వెతుక్కోలేని వృధ్ధ కన్యలు, పెళ్ళయి పిల్లలని కన్న తనని వెక్కిరించడమేమిటి? అని చిరాకు కూడా వేసేది. స్టాన్లీ చెల్లెళ్ళిద్దరికంటే జేన్ వేయి రెట్లు నయం అనుకుంది లిల్లీ! జేన్ ఎంత తెలివైనదైతే ఏం, తన కింద పని చేసే మనిషే కదా! అలా అనుకుంటే ఆమెకి తన ఆత్మ న్యూననతా భావం అంతా చేత్తో తీసినట్టు మాయమై పోయేది.

చెల్లెళ్ళల్లో వచ్చిన మార్పు చూసి స్టాన్లీకూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. అయితే తాను వాళ్ళనొదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఇరవై ఒకటీ, పదిహేడూ ఏళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు, పద్నాలుగేళ్ళ తర్వాత, వాళ్ళకి వయసు హెచ్చిందీ, మొహంలో లేత దనం తగ్గిందీ, అంద చందాలూ తగ్గాయి, అభిప్రాయాల్లో ఒక రకమైన కరకుదనం వచ్చి చేరింది. అంతే కాదు, వాళ్ళిద్దరూ సంపన్న కుటుంబ స్త్రిలలోకి రూపాంతరం చెందితే, తాను ఆస్ట్రేలియాకి చెందిన మొరటు రైతులోకి రూపాంతరం చెందాడు. ఎంత సర్ది చెప్పుకున్నా, వాళ్ళ హుందాతనమూ, ఆత్మ విశ్వాసమూ తనని చిన్న బుచ్చుతున్నట్టే అనిపిస్తూంది.

అన్నిటికంటే వాళ్ళు తన పిల్లలతో ప్రవర్తించే తీరు స్టాన్లీనెంతో నొప్పించింది. ఆ పిల్లలేదో తమ పరువు తీస్తున్నట్టూ, వాళ్ళని చూసి తామంతా సిగ్గు పడుతున్నట్టూ వుండేది స్టాన్లీ చెల్లెళ్ళిద్దరి ప్రవర్తనా. ప్రపంచంలో ఏ పిల్లలూ ఇంత అల్లరి చేయరనీ, వాళ్ళకి గారాబం ఎక్కువనీ, అసలు వాళ్ళ పెంపకమే సరైనది కాదనీ ఏవేవో వ్యాఖ్యానాలు వస్తూనే వుండేవి.

ఇదంతా వాళ్ళు కిందటిసారి డెర్బీషైర్ వెళ్ళినప్పటి సంగతి. ఈ సారి కాస్త నయం. జేన్ పర్యవేక్షణలో పిల్లలంతా చక్కగా, హుందాగా ప్రవర్తించారు. ఇద్దరు మేనత్తలూ జేన్ క్రమశిక్షణ వల్ల పిల్లల ప్రవర్తనా, చదువు సంధ్యలూ మెరుగు పడ్డాయని ఒప్పుకున్నారు. జేన్ గురించి విన్న వాళ్ళందరూ, ఆమె గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొవాలన్న ఉత్సాహం కాబర్చారు. ముఖ్యంగా పెద్దాయన ఫిలిప్స్. ఆయన పారిస్ లో చదువుకునేటప్పుడు జేన్ మావయ్య, హోగార్త్ గారు పరిచయం అయ్యారట.

ఆ సంగతి తెలిసిన వెంటనే, జేన్ అదంతా ఏ సంవత్సరం లో అయిందో అడిగింది, అప్పటికి ఫ్రాన్సిస్ పుట్టాడో లేదో తెలుసుకుందామని. ఫ్రాన్సిస్ తల్లిని గురించిన వివరాలేమైనా తెలుస్తాయేమోనని ఆ పెద్దయనతో చాలా మాట్లాడింది జేన్. అయితే అప్పటికి హొగార్త్ గారికి ఫ్రాన్సిస్ తల్లి పరిచయం అయినట్టు లేదు. ఈ వివరాలన్నీ ఫ్రాన్సిస్ కి ఉత్తరంలో రాసింది జేన్.

ఈ మధ్య ఎందుకో ఫ్రాన్సిస్ మారుతున్నాడా అనిపించింది జేన్ కి. అతని ఉత్తరాల్లో ఇంతకు ముందున స్నేహమూ ఆప్యాయతా తగ్గుతున్నాయా? అని అనుమాన పడింది. తాను మాత్రం ఎప్పట్లాగే ఉత్తరాలు రాస్తూంది, ప్రతి చిన్న విషయమూ అతనితో పంచుకుంటూంది.

జేన్ కి ఆ యింట్లో అందరికన్నా స్టాన్లీ తండ్రి, డాక్టరు ఫిలిప్స్, తమ్ముడు వివియన్ చాలా నచ్చారు. వివియన్ మంచి చదువూ, డబ్బూ వుండి కూడా ఇంగ్లండు వదిలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలని ఎందుకనుకుంటున్నాడో ఆమెకర్థంకాలేదు. అతనికి విఙ్ఞాన సంబంధమైన విషయాలమీదున్న ఆసక్తీ, అతను చేసే ప్రయోగాలూ జేన్ కెంతో కొత్తగా తొచాయి. తన అక్కలిద్దరి దగ్గర్నించి ఎటువంటి ప్రోత్సాహమూ రాకపోవడంతో అతనికి జేన్ చురుకుదనమూ, తన పని

మీద జేన్ చూపించే ఆసక్తీ చాలా నచ్చాయి.

ఇద్దరక్కలకి ముద్దుల తమ్ముడవదంతో వివియన్ కి ఆ ఇంట్లో గారాబం ఎక్కువే. అయితే వివియన్ కోపిష్టి మనిషి. కోపం వస్తే ఇల్లూ వాకిలీ ఏకం చేసేస్తాడు. అలాటి సమయాల్లో అతన్ని ఒంటరిగా వదిలేయడం మినహా చేయగలిగేదేమీ లేదు.

వివియన్ కి సాంఘిక మర్యాదలూ, సంప్రదాయాల మీద నమ్మకం ఎక్కువ. అన్నగారింట్లో పని చేసే పంతులమ్మని ప్రేమిస్తాడేమోనన్న భయం ఏ మాత్రం అవసరం లేదు. దాంతో అతని అక్కలిద్దరూ అతను జేన్ తో చేస్తున్న స్నేహాన్నీ పెద్ద పట్టించుకోలేదు. నిజంగానే అతను జేన్ వయసులో వున్న స్త్రీ అన్న విషయాన్ని పట్టించుకొన్నట్టుండడు.

జేన్ ఫిలిప్స్ కుటుంబం గురించీ,  వూరి గురించీ ఫ్రాన్సిస్ కీ, ఎల్సీ కి వివరంగా వుత్తరాలు రాసింది. ఆమెకి ఆ కుటుంబాల్లో వున్న స్త్రీల జివితం చాలా విచిత్రంగా, వ్యర్థంగా తోచింది. డబ్బూ ,చేతినిండా తీరుబడీ వున్నా వాళ్ళకి చేయడానికేమీ వున్నట్టు తోచదు. కుటుంబంలోకానీ, ప్రపంచంలో కానీ ముఖ్యమైన పనులూ, ఆసక్తికరమైన పనులూ అన్నీ మగవాళ్ళే చేస్తూంటారు.

అందంగా అలంకరించుకోవడం, పిల్లలని కనడం తప్ప ఆడవాళ్ళకి ఏ వ్యాపకామూ లేకపోవడం, జేన్ కెంతో ఆశ్చర్యంగా అనిపించింది. డాక్టరు గారి ఇంట్లో స్టాన్లీ చెల్లెళ్ళిద్దరికీ అసలే పనీ వుండేది కాదు. ఇంటిక్ కావల్సిన డబ్బు సంపాదించడం మగవారి వంతైతే, ఇంటి లోపలి బాధ్యతలు నమ్మకస్తులైన పనివాళ్ళకుండేది. తమ కంటే ఆర్ధికంగా, సాంఘికంగా తక్కువ స్థాయిలో వున్నవాళ్ళ గురించీ వాళ్ళెప్పుడూ ఆలోచించినట్టు వుండేవాళ్ళు కాదు. ఏదైనా సహాయం ఎవరికైనా చేయవలసి వస్తే, ఏదో నిరాసక్తంగా, బిచ్చం విదిలించినట్టు విదిలించేవారు.

బయట ప్రపంచానికి సంబంధించిన ఏ విషయమైన ఆ సంపన్న స్త్రీలకు పట్టదు. “అదంతా మగవాళ్ళ వ్యవహారం,” అన్న ధోరణే వుండేది. బయటి ప్రపంచానికెంతో స్నేహ శీలురుగా, చదువూ సంస్కారమూ వున్న స్త్రీలుగా కనిపిస్తారు వాళ్ళు. దగ్గర్నించి వాళ్ళను చూసి జేన్ ఏర్పరుచుకున్న అభిప్రాయలివి.  వాళ్ళల్లో చిన్నది హారియట్ ని బ్రాండన్ పెళ్ళాడతాడని ఆశపడ్డారంతా. కానీ, అతనికెందుకో ఆమె నచ్చలేదు.

(సశేషం )

వీలునామా

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  జేన్ కొత్త బాధ్యతలు       

అనుకున్నట్టే ఆ తరవాత కొద్దిరోజులకే బ్రాండన్ పెగ్గీ ఇంటికొచ్చి జేన్ కి ఫిలిప్స్ ఇంట్లో ఉద్యోగం ఖాయమయినట్టే చెప్పాడు. మరో రెండు రోజుల్లో ఫిలిప్స్ స్వయంగా ఎడిన్ బరో వచ్చి జేన్ ని కలిసి అంతా ఖాయం చేద్దామనుకుంటున్నారట.

మరో రెండు రోజులకి ఫిలిప్స్ పెగ్గీ ఇంటికొచ్చాడు. అయితే తన కూడా పిల్లలు ఎమిలీ, హేరియట్ ని తీసుకు రాలేదు. ఇద్దరూ జలుబుతో పడకేసారన్నాడు. పిల్లల్ని చూడాలని ఎంతో ఆశపడ్డ పెగ్గీ నిరాశ చెందింది.

జేన్, ఎల్సీ ఇద్దరూ ఫిలిప్స్ ప్రవర్తనా, మర్యాదా, మన్ననా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, పెగ్గీ ఆయన ఇంట్లో పనిమనిషి! అయినా పెగ్గీతో, పెగ్గీ ఇంట్లో పిల్లలతో, తాతగారు లౌరీ తో ఫిలిప్స్ చాలా మర్యాదగా మాట్లాడాడు.

ఫిలిప్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో మాట్లాడి తన ఇంటికి జేన్ లాటి మనిషి అవసరం వుందని అనుకున్నాడు. తన ఇంటి వ్యవహారాలు చూస్తూ, పిల్లలకి చదువులు చెప్తే ఏడాదికి డెభ్భై పౌండ్లు జీతం కింద ఇస్తానని చెప్పాడు. అయితే జేన్ రెండే రోజుల్లో బయల్దేరవలసి వుంటుంది.

“మేము ఈ ఎండాకాలం ఇటువైపే వస్తున్నాము కాబట్టి మీరూ ఎడిన్ బరో వచ్చి మీ చెల్లాయిని కలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మీరు వెంటనే నాతో బయల్దేరాల్సి వుంటుంది.” అన్నాడు ఫిలిప్స్.

“అలాగే బయల్దేరతాను. ఎల్సీ కి వీడ్కోలు చెప్పడం తప్ప ఇక్కడ నాకు మాత్రం పెద్ద పనేముందని?” అంది జేన్.

“అయ్యా! ఇంతకీ పిల్లలెలా వున్నారు?  నేను ఆస్ట్రేలియా వదిలేటప్పటికి ఎమిలీకి నాలుగున్నరేళ్ళు. ఇప్పుడు బాగా పొడుగయిందా?” కుతూహలంగా అడిగింది పెగ్గీ. “ఈ ఎండాకాలం ఇక్కడికే వస్తున్నామని చెప్పా కదా? అప్పుడు చూద్దువుగాని. ఎల్సీ నిన్నయితే గుర్తు పడుతుంది, నువ్వు దాన్ని గుర్తు పడతావో లేదో కాని! నీకు గుర్తుందా పెగ్గీ? ఒకసారిఎవరో ఆర్టిస్టుతో నీ బొమ్మ గీయించా. అదింకా వుంది ఎల్సీ దగ్గర!”

“అవునా? అయినా మీరు పిల్లల్ని గారాబం చేసి పాడు చేస్తారు సారూ! హేరియట్ తరవాత పుట్టిన పిల్లల పేర్లేమిటి?”

“కాన్స్టాన్స్, హ్యూబర్ట్, ఈవా.”

“ఆహా! అమ్మగారికి ఇంగ్లండు నచ్చిందా?”

“చాలా! ఇక్కడి నించి ఆస్ట్రేలియా రాననే అంటోంది. నాక్కూడా ఆవిడ పిల్లల్ని పట్టుకుని ఇక్కడ వుండడమే మంచిదనిపిస్తోంది. నేను వెళ్తూ వస్తూ వుంటాననుకో.”

“అవునండీ! ఇక్కడైతే స్నేహితులూ కుటుంబమూ వుంటాయి. అందుకే ఆవిడకి ఇక్కడ నచ్చి వుండొచ్చు. మిగతా అంతా ఎలా వున్నారు? బెన్నెట్, మార్తా బాగున్నారా? మార్తా టక్ ని పెళ్ళాడిందేమో కదా?”

“అవును పెగ్గీ! ఇద్దరూ అక్కడే వున్నారు. బెన్నెట్ ఎంత పని మంతురాలో ఎంత మంచిదో నీకు తెలుసు కదా? ఆవిడ మొగుడేమో తాగుబోతు, సోమరి. అదే తెలివి తక్కువ మార్తాని అందర్లోకీ కష్టపడి పనిచేసే టక్ కట్టుకున్నాడు. కొన్నిసార్లు ఇలాటి అవక తవక పెళ్ళిళ్ళని చూస్తే విచిత్రంగా వుంటుంది.”

ఫిలిప్స్ వెళ్ళిపోయింతర్వాత పెగ్గీ అమ్మాయిలతో,

“మగవాళ్ళకి తమ పెళ్ళి తప్ప అందరి పెళ్ళిళ్ళూ అవక తవకగానే అనిపిస్తాయనుకుంటా! నాకైతే అసలు ఫిలిప్స్ గారి పెళ్ళే అన్నిటికన్నా అవకతవక పెళ్ళి అనిపిస్తుంది. జేన్, నువ్వు శ్రీమతి ఫిలిప్స్ గారితో కచ్చితంగా వుండలి సుమా! ఆయనేమో మహా మెతక మనిషి,” అంది.

***

veelunama11

ఫిలిప్స్ దగ్గర అక్కకి ఉద్యోగం ఖరారు కాగానే ఎల్సీ శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనిలో చేరడానికెళ్ళింది. జేన్ కి దొరికీ ఉద్యోగం సంగతి విని డూన్ ఎంతో సంతోషించింది.

రెన్నీ కుటుంబం జేన్ వెళ్ళే ముందు ఆమెకోసం చిన్న విందు కూడ ఏర్పాటు చేసారు. ఎలీజా రెన్నీ అయితే అక్క చెల్లెళ్ళిద్దరినీ తాను బ్రాండన్ కి పరిచయం చేయడం వల్లనే ఇదంతా జరిగిందని ఎంతో సంతోషించింది. వాళ్ళ ఇంట్లో విందుకు బ్రాండన్, ఫ్రాన్సిస్, లారా విల్సన్ అందరూ వచ్చారు. ఫ్రాన్సిస్ మొహం వేలాడేసుకుని కూర్చున్నా, బ్రాండన్ తన జోకులతో అందరినీ నవ్వించాడు.

రెండు రోజుల అనంతరం జేన్ తో పాటు ఫిలిప్స్ మాత్రమే కాకుండా బ్రాండన్ కూడా వున్నాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. జేన్ మాత్రం తన ఆలోచనల్లో తనుండిపోయింది.

***

ప్రయాణం ముగిసి ఇల్లు చేరిన జేన్ శ్రీమతి ఫిలిప్స్ ని చూడగానే ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. తన  జన్మలో అంత అందగత్తెని చూసి వుండలేదు మరి. అయితే ఆమె నోరెత్తి మాట్లాడగానే ఆ పారవశ్యం కొంచెం భంగమైన మాటా నిజమే. ఏ మాత్రం విద్యాగంధమూ, సంస్కారమూ, నాజూకూ లేని మొరటు తెలివితక్కువ మాటలతో ఆమె మౌనంగా వుంటే బాగుండనిపిస్తుంది పక్కవారికి.

కానీ, ఆమె అందం మాత్రం వర్ణనాతీతం. పొడవుగా, మంచి అంగ సౌష్ఠవం తో పాటు, పాల మీగడలాటి రంగూ, అద్దాల్లాటి చెక్కిళ్ళూ, బాదం కాయల్లాటి మట్టి రంగు కళ్ళూ, ఎర్రటి పెదిమలూ, తరంగాల్లా భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి ఒత్తైన జుట్టూ, ఆమె వైపు ఎంతసేపైనా చూస్తూ వుండిపోవచ్చు.ఆమెని చూడగానే ఆమెని ఫిలిప్స్ ఎందుకు అంతగా ఇష్టపడి చేసుకున్నాడో అర్థమయిపోతుంది. అంత అందగత్తెనని ఆమెకూ తెలిసే వుండాలి. దాంతో సహజంగా ఆత్మ విశ్వాసమూ, ఇతర్లు తన మాట జవదాటరన్న నమ్మకమూ వుండే వుంటాయి. ఈవిడ కింద పని చేయగలుగుతానా, అని భయపడింది జేన్.

ఆమె పెగ్గీ వర్ణించినదానికంటే బాగున్నట్టనిపించింది జేన్ కి. పెగ్గీ వర్ణించింది పదహారేళ్ళ పసి మొగ్గని. ఇప్పుడు తన ముందున్నది ఇరవై యేడేళ్ళ పరిపక్వమైన స్త్రీత్వం. అయిదుగురు పిల్లల తల్లిలా అనిపించనేలేదామె. ఎమిలీకి తల్లి పోలికా,తల్లి అందమూ రాలేదు. అయితే మహా చురుకు. హేరియట్ కొంచెం ముద్దుగానే వున్నా, తల్లి అందం ముందు దిగదుడుపే.

వాళ్ళు ఇల్లు చేరగానే ఎమిలీ తండ్రిని చుట్టుకుపోయింది. హేరియట్ ఆయన వళ్ళోకెక్కి కూర్చుంది. కాన్స్టాన్స్ ఆయన గడ్డాన్ని పీకడం మొదలు పెట్టాడు. మొత్తానికి అందరికీ తండ్రి దగ్గర చాలా చేరిక లాగుంది.

“అబ్బ! నువ్వొస్తున్నావని ఫిలిప్స్ చెప్పగానే ఎగిరిగంతేసా జేన్! ఈ పిల్లల పనీ, ఇంటిపనీ తెగక చస్తున్నాను. అయినా ఇంగ్లండు వచ్చేది ఏదో కాలక్షేపానికో సరదాకో అనుకున్నా కానీ ఈ గొడ్డు చాకిరీ వుంటుందని నాకేం తెలుసు! ఇదిగో పిల్లలూ! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీ పంతులమ్మ వెళ్ళిపోతుంది.”

“నేను నా ఇష్టమొచ్చినట్టుంటా, నాన్న దగ్గరున్నట్టే!” ఎమిలీ తండ్రి మొహం మీద ముద్దులు కురిపిస్తూ అంది.

“ఎమిలీకి అసలు కుదురే వుండదు. అసలు దానికి బుధ్ధి చెప్పేవాళ్ళే దొరకలేదు ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఇహ మీ శిక్షణలో కొంచెం బాగు పడుతుందేమో!” బ్రాండన్ అన్నాడు.

ఎమిలీ తండ్రినొదిలి బ్రాండన్ మీదకి ఉరికింది.

“బాగు పడటమా? అంటే మీ ఏష్ ఫీల్డ్ ఇంట్లో పిల్లలు ఉంటారే, వాళ్ళలాగానా? వద్దు బాబూ, వద్దు! వాళ్ళంత మొద్దు మొహాలెక్కడా వుండరు. వాళ్ళకి మట్టి పిసికి బొమ్మలు చెయ్యడమూ రాదు, చెట్లెక్కడమూ రాదు, గోడలేక్కడమూ రాదు. ఆ రోజు ఆ తోటలో నేనూ హేరియట్ ఎంత హాయిగా పరుగులు తీస్తూ ఆడుకున్నామో! వాళ్ళకేమో అసలు పరిగెత్తడమంటేనే భయం!” అల్లరిగా అంది ఎమిలీ.

“మరి వాళ్ళలాగా నీకు చదువొచ్చా? అయినా ఫిలిప్స్! ఇక నేను వీళ్ళని ఏష్ ఫీల్డ్ తీసికెళ్ళను. తోటంతా పరుగులు పెడుతూ మన పరువు తీస్తారు.”

“తీసికెళ్ళకపోయినా ఏం ఫర్వాలేదు. అసలక్కడ మాకెంత బోరు కొట్టిందో! హేరియట్ కి అక్కడ నచ్చిందేమో నాకు తెలియదు మరి!”

“నాకు పుస్తకాలంటే అసహ్యం!” వున్నట్టుండి అంది హేరియట్.

“బొమ్మల పుస్తకాలో, కథల పుస్తకాలో అయితే తప్ప!”

“జేన్! పిల్లల మాటలు పట్టించుకోకండి,” ఫిలిప్స్ సంజాయిషీగా అన్నాడు.

“అయ్యో! మరేం ఫర్వాలేదండీ. కొన్నాళ్ళకి వాళ్ళకి చదువూ, పుస్తకాల మీద ఇష్టం కలిగించడానికే ప్రయత్నిస్తాను.”

“లిల్లీ! పెగ్గీ అక్కయ్య పిల్లలు ఏం చదువుతారనుకున్నావు? అంతా జేన్ చలవే! పెగ్గీ వాళ్ళకోసం ఎంతెంత డబ్బు కర్చు పెడుతోందో!”

“పెగ్గీ కెలాగైనా మధ్య తరగతిలోకెళ్ళిపోవాలన్న ఆశ. మరీ ఆకాశానికి నిచ్చెనలు వేయడం అంత మంచిది కాదేమో!”

“ఆ పిల్లల తెలివితేటలూ కష్టమూ చూస్తే నువ్వీ మాట అనవు. ఏదో ఒక రోజు నేను టాం లౌరీ ఎదుట టోపీ చేతిలో పట్టుకుని నిలబడ్డా ఆశ్చర్యం లేదు!”

“పో స్టాన్లీ! నీవన్నీ పిచ్చి మాటలు” లిల్లీ అతన్ని వేళాకోళం చేసింది. ఫిలిప్స్ దంపతుల పేర్లు లిల్లీ,  స్టాన్లీ అని అప్పుడే తెలిసింది జేన్ కి.

“మాటలు కాదు. టాం నిజంగానే ఒక పెద్ద ఇంజినీరయ్యాడనుకో, ఏ రైల్వే లైనో వేయించడానికి ఆస్ట్రేలియా వచ్చాడనుకో, అప్పుడు నేను చెప్పినట్టేగా అయేది. అదంతా ఎందుగ్గానీ, నాకు ఆ పిల్లలనీ, వాళ్ళ చదువులనీ చూస్తే ముచ్చటగా అనిపించినమాట నిజం. దానికంతటికీ కారణం జేన్ వాళ్ళకిచ్చిన శిక్షణ అని చెప్పింది పెగ్గీ!”

“ఓ! అందుకన్నమాట నువు జేన్ ని ఇక్కడకి తీసుకొచ్చింది,” నవ్వాడు బ్రాండన్.

“నాకూ పెగీ పిల్లలు నచ్చినా, మరీ నీ అంత కాదు. ఎమిలీ, నిన్ను జేన్ మెల్విల్ ఆ పెగ్గీ పిల్లల్లా తయారు చేయాలన్నదే మీ నాన్న ఆస. వాళ్ళలా నీకూ చదువు మీదా, విద్య మీదా ఆసక్తి పెరిగిపోతుంది ఇక!” ఎమిలీని వేళాకోళం చేసాడు బ్రాండన్.

“మీకు చిన్నప్పట్నించీ చదువుకోవడం అంటే ఇష్టంగా వుండేదా?” కుతూహలంగా జేన్ ని అడిగింది ఎమిలీ.

“అవును ఎమిలీ!” నవ్వుతూ జవాబిచ్చింది జేన్.

“మా అమ్మ కూడా అదే మాట అంటుంది, కాని ఆవిడ అసలు స్కూల్ కెళ్ళిందే లేదు. మరీ ఇంతింత కాకపోయినా, కొంచెం చదువు బానే వుంటుందేమో!”

లిల్లీ ఫిలిప్స్ కి జేన్ చాలా నచ్చింది. ఆమె చదువు ఎక్కువై వుండొచ్చు కానీ, రూపు రేఖలు చాలా సామాన్యం గా వున్నాయి. దాంతో ఒకలాటి జాలి కలిగిందామెకు జేన్ పట్ల. దానికి తోడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని విన్నది.

అందులో ఆమెకి ఇంటి పనులు చేసుకోవడం, డబ్బు లెక్కలు చూసుకోవడం కొంచెం కూడా చేత కాదు. ఎంతో ఓపికస్తుడూ, పెళ్ళాన్ని విపరీతంగా ప్రేమించేవాడూ అయిన ఫిలిప్స్ కూడా భార్య దుబారా ఖర్చు చూసి కొంచెం విసుక్కున్నాడు. ఇప్పుడిక ఆయనే వెతికి ఇంటి పనికీ డబ్బు లెక్కలకీ ఒక మనిషిని పెట్టాడు కాబట్టి తాను ఆ బాధ్యతలన్నీ పట్టించుకోనక్కరలేదు. అందువల్ల జేన్ తో వీలైనంత మంచిగా ప్రవర్తించాలని నిశ్చయించుకుంది.

రాత్రి పది కొట్టగానే లిల్లీ ఫిలిప్స్ నిద్రొస్తూందని వెళ్ళి పడుకున్నది. వెళ్ళేముందు భర్తతో జేన్ కి అప్పజెప్పవల్సిన బాధ్యతలు గుర్తు చేసి మరీ వెళ్ళిందావిడ.

రాత్రి పొద్దుపోయేంతవరకూ ఫిలిప్స్ జేన్ కి శ్రధ్ధగా ఇంటి వ్యవహారాలూ, జమా ఖర్చులూ అన్నీ బోధపర్చాడు. ఇంటి తాళాలూ, లెక్క పుస్తకాలూ, అన్నీ జేన్ కి అప్పగించాడు.

“జేన్!నువ్వు ఇంట్లో ఒక ఉద్యోగిలాకంటే, ఇంటి మనిషిగా వుంటే ఎక్కువ సంతోషిస్తాను. నీకు లిల్లీ గురించి మొత్తం తెలియదు. ఆమె వయసులో పెద్దదైనా ఆ పిల్లల కంటే పసిది. నీకు వీలైతే నువ్వు ఆమెకీ కొంచెం చదువూ సంస్కారం నేర్పితే నీకెంతో ఋణపడివుంటాను!” ఇబ్బందితో ఆయన మొహం ఎర్రబడింది.

ఆలాగేనని ఆయనకి మాటిచ్చినా, తనకంటే వయసులో పెద్దదీ, మహా రాణులకుండే అందచందాలున్నదీ, ఇంటి యజమానురాలూ అయిన లిలీని చదువు వైపు మళ్ళించడం సాధ్యమేనా అన్న ఆలోచనతో నిద్ర పట్టలేదు జేన్ కి. తన మాట పిల్లలు వింటారో వినరో నని జేన్ బెంగ పడింది. కానీ, ఊరంతా ముద్దూ, గారాబమూ చేయడం అలవాటైన ఫిలిప్స్ పిల్లలకి జేన్ క్రమశిక్షణ నిజానికి బాగనిపించింది. మౌనంగా, తక్కువ మాట్లాడుతూ హుందాగా వుండే తమ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం వాళ్ళకి కొత్తగా, హాయిగా అనిపించింది.

ముందుగా జేన్ వాళ్ళ పాఠ్యాంశాలన్నీ వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగు మార్చేసింది. అది వాళ్ళకి అన్నిటికన్నా యెక్కువగా నచ్చింది. ఏ సంగతినైనా సరళంగా ఓపిగ్గా బీధించే ఆమె పధ్ధతీ, దానికన్నా అసలామెకున్న విషయ పరిఙ్ఞానమూ వాళ్ళకి చాలా అబ్బురంగా అనిపించింది.  భూగోళశాస్త్రమూ, చరిత్రా లాటి మహా విసుగు పుట్టే అంశాలని కూడా ఆమె చాలా ఆసక్తికరంగా మార్చింది.      తండ్రి దగ్గర ఎమిలీ, హేరియట్ ఇదివరకే చక్కవగా చదవనూ, రాయనూ నేర్చుకున్నారు. వాళ్ళకి రానిదల్లా, లెక్కలూ, చరిత్రా లాటి విషయాలు. స్వతహాగా చురుకైన పిల్లలు కాబట్టి వాళ్ళు జేన్ పధ్ధతులకి వెంటనే అలవాటు పడిపోయారు.

లిల్లీ కి జేన్ మొత్తంగా నచ్చినా, ఆమె స్కాట్ లాండు యాస కొంచెం కూడా నచ్చలేదు. పిల్లలూ అదే యాసతో మాట్లాడతారేమోనని భయపడింది కూడా.

లిల్లీ కి ప్రస్తుతం వున్న సమస్య- తన అత్తవారింటికి వెళ్ళడం. అక్కడ ఆస్ట్రేలియాలో ఆమె నిరక్షరాస్యతనూ, మొరటుతనాన్నీ ఎవరూ పట్టించుకోలేరు. కానీ, ఇక్కడ స్టాన్లీ చెల్లెళ్ళూ, బంధువులూ అంతా చాలా చదువుకున్న వాళ్ళు. మహా నాజూకు మనుషులు. క్రితం సారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తననీ, తన పిల్లల్నీ ఎలా పల్లెటూరు బైతుల్లా చూసారో లిలీ కింకా గుర్తే. జేన్ ని  చుస్తూనే తనూ ఆమెలా చిన్న గొంతుతో మాట్లాడడం, నాజూగ్గా  ప్రవర్తించడం నేర్చుకోవాలనుకుంది. ఇప్పుడు పిల్లల ఆలనా పాలనా అంతా జేన్ చూస్తుండడంతో ఆమెకి తీరిక కూడా చిక్కింది.

ఆమెకి పాపం, చదవడం కానీ, కుట్టు పని కానీ, సంగీతం కానీ, ఏదీ రాదు. ఆవిడకి వచ్చిందల్లా, అలా సోఫాలో కూర్చొని పగటి కలలు కనడం. ఆవిడ అలౌకిక సౌందర్యం వల్ల, ఆమె అలా కూర్చొని ఆలోచిస్తూన్నప్పుడు ఆమె ఏదో అద్భుతమైన తత్త్వ చింతన చేస్తూందేమోనని పిస్తుంది కానీ, ప్రాపంచిక విషయాలు ఆలోచించే మామూలు స్త్రీలా అనిపించనే అనిపించదు.

ఒకానొక మధ్యాహ్నం అలాటి అలౌకిక స్థితిలోనే ఆమె విద్యాభ్యాసం గురించి జేన్ దగ్గర ప్రస్తావించింది. జేన్ చదువూ, ఇతర వ్యాపకాల గురించీ వినగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి, నోరు తెరుచుకుంది. ఆడపిల్ల మగపిల్లల్లా లెక్కలూ, సైన్సూ చదవడమా? అంతవరకూ ఆమె అమ్మాయిల చదువంటే ఏదో సంసార పక్షంగా కుట్లూ అల్లికలూ, కాలక్షేపం పుస్తకాలూ కవితలూ, పది ముందు గొప్పగా చెప్పుకోవడానికి కాస్త సంగీతమూ  అంతే అనుకుంది. కానీ చదువంటే కఠోర పరిశ్రమ అనీ, దాంతో మనసుకీ, మెదడుకీ రెక్కలు మొలిపించుకోవచ్చనీ ఊహించనే లేదు. అసలు చదువు పూర్తయింతర్వాత కూడా జేన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం ఆమెకి కొరుకుడు పడని విషయం.

తనకి పదహారేళ్ళకే పెళ్ళయిపోవడం తలచుకొని నిట్టూర్చింది లిల్లీ. అంతకుముందు కూడా ఒకటే ఊర్లు మారడంతో ఆమె ఎక్కడా కుదురుగా బడికి వెళ్ళిందే లేదు. ఆస్ట్రేలియాలో వాళ్ళున్న కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడపిల్లలకి బళ్ళే లేవు! ఆ మాటకొస్తే ఇప్పుడూ అంతే. అసలు పిల్లల చదువులు అక్కడుంటే పాడవుతాయనే కదా స్టాన్లీ కుటుంబాన్ని ఇంగ్లండు తీసుకొచ్చింది. ఇప్పుడు లిల్లీకి జేన్ చదువు చెప్తే బాగుండనిపించడం మొదలయింది. కానీ జేన్ ఏమంటుందో! నవ్వుతుందేమో, “ఈ వయసులో చదువుకుని ఏం చేస్తారండీ” అని ఎగతాళి చేస్తుందేమో!

జేన్ ఆ అభిప్రాయాన్ని వినగానే ఎగతాళి చేయలేదు సరికదా, ఎంతో ప్రోత్సహించింది. అయితే ఏ విషయం చదవాలన్న విషయం మీద ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేకపోయారు.  తనకి పూలు తయారు చేయడమూ, పియానో వాయించడమూ ఇష్టమని చెప్పింది జేన్ తో.

“హ్మ్మ్మ్మ్… దురదృష్టవశాత్తూ అవి రెండూ నాకంతగా రావండి. ఒక పని చేద్దాం. అవి నేర్పించడానికి ఎవరీనా టీచర్లు దొరుకుతారేమో చూద్దాం. అంతవరకూ నేను మామూలు చదువు చెప్తాను. అయితే సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం కష్టంపడాల్సి వుంటుందేమో!” అన్నది జేన్.

“ఎందుకూ? ఎమిలీ, హేరియట్ ఏమంత కష్టపడుతున్నారు? కనీసం గంటసేపుకూడా సాధన చేయరు! అన్నట్టు నువ్వుకూడా గంటసేపు సాధన చాలన్నావట?”

“అవును, నేను మూడు గంటలు పియానో దగ్గరఊరికే కూర్చునేకంటే, గంట సేపు శ్రధ్ధగా సాధన చేసి తర్వాత ఆడుకొమ్మన్నాను. ఆ వయసులో అంతకంటే ఎక్కువ అవసరమూ లేదూ, వాళ్ళు చేయనూ లేరు. అదే మనలాటి వాళ్ళం ఎక్కువ సమయమూ శక్తీ వెచ్చించాల్సి వుంటుంది,” వివరించింది జేన్.

“అవునవును! అప్పణ్ణించి పిల్లలు రోజూ సాధన చేస్తున్నారట. నాతో చెప్పారు. అయితే నీకొచ్చిందే నాకు నేర్పు. సంగీతం రాకుంటే అది వొదిలేద్దాం.”

***

(సశేషం)

 

 

వీలునామా – 16 వ భాగం

  

శారద

శారద

       

  (  కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  ఫ్రాన్సిస్ వింత ధోరణి

 

 

ఫ్రాన్సిస్ ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి జేన్ ని పెళ్ళాడమనే నిర్ణయం నచ్చసాగింది. తలచుకుంటున్నకొద్దీ ఆతనికి జేన్ తనవైపు చూసే చూపులో, నవ్వే నవ్వులో ఏదో అర్థం కాని ఆప్యాయతా, అభిమానమూ వున్నవనిపించింది. చెల్లెలు ఎల్సీకి కూడా నీడను కల్పిస్తానంటే ఆమె ఇంకెంతగానో సంతోషిస్తుంది. అయితే ఆమెని ప్రలోభ పెట్టడం తన ఉద్దేశ్యం కాదు. తన మనసులో ఆమె పట్ల వున్న ప్రేమని గుర్తించి అతన్ని వివాహమాడాలి. ఆమె ఆశలకీ, ఆశయాలకీ కుటుంబ జీవితం ఏ రకంగానూ అడ్డం రాదని ఆమెని ఒప్పించాలి! కుటుంబంలో వుంటూ కూడా పది మందికి పనికొచ్చే పనులు చేయొచ్చని ఆమెకి నమ్మకమిస్తే చాలు! తనూ తన వంతు సహకారాన్నెలాగూ ఇస్తాడు.

తానిప్పుడు ఒంటరి కాడు. ఆమెని ఒప్పించి, పెళ్ళాడి పట్నం వచ్చేస్తారు. ఏదో ఉద్యోగం చూసుకుంటాడు తాను.

ఇంతకు ముందూ ఉద్యోగం వుండేది కానీ, ఎంతో ఒంటరిగా అనిపించేది. ఇప్పుడల్లా కాదు. పని చేసి అలసిపోయి ఇంటికొచ్చేసరికి తనకొరకు ఎదురుచూసే భార్య. ఆ ఊహే ఎంతో సంతోషాన్నిచ్చింది ఫ్రాన్సిస్ కి.

నిజానికి తనలాటి భావుకుడికి ఆమెలాటితెలివైన యువతి నచ్చడం ఎంతో వింతగా వుంది. సాధారణంగా భావుకులకి నాజూకైన స్త్రీలు, ఎప్పుడూ పక్క వాళ్ళ మీద ఆధారపడే ముగ్ధలూ నచ్చుతారంటారు. తనకి మాత్రం ఆమే చాలా నచ్చింది. ఆమె మంచితనమూ, సున్నితమైన ఆలోచనా, వ్యవహార దక్షతా తనకెంతో ఊరట నిస్తాయి. తన మనసులోని ఏ భావాన్నైనా ఆమెతో నిర్భయంగా చెప్పుకోగలడు. జీవిత సహచరిలో ఇంతకంటే కావలసిన లక్షణమేముంటుంది? అలాటి మనిషి తోడుంటే జీవితంలో వచ్చే ఆటుపోట్లని వేటినైనా తేలిగ్గా ఎదుర్కోగలడు. తీయటి సంతోషాన్నిచ్చే ఆలోచనలతోటే తెల్లవారిందతనికి.

***

మర్నాడు అతను పెగ్గీ ఇల్లు చేరుకునేసరికి ఎల్సీ సంతోషంగా ఎదురొచ్చింది. జేన్ అతనితో ఉత్సాహంగా బ్రాండన్ తనకు ఫిలిప్ దగ్గర ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారని చెప్పింది. ఇద్దరు అక్క-చెల్లెళ్ళ మొహాలూ తేటపడి సంతోషంగా వున్నారు.

“కొద్ది రోజుల్లో ఫిలిప్ గారు చెప్పేస్తారట. నాకీ ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రాన్సిస్! అన్ని సమస్యలూ తీరిపోతాయి. పెగ్గీ అయితే ఫిలిప్ గారు తప్పకుండా పని ఇస్తారనే అంటూంది. నాకే కంగారుగా వుంది. నువ్వేమంటావు ఫ్రాన్సిస్? నీకు సంతోషంగా లేదూ?” జేన్ ఆగకుండా మాట్లాడుతూనే వుంది.

జేన్ ఉత్సాహమూ, సంతోషమూ చూసి ఫ్రాన్సిస్ నీరుకారిపోయాడు. అతని ఆలోచనలు సర్దుకునేలోపే, జేన్ అతను ఎస్టేటులో పాలేర్ల కోసం చిన్న ఇళ్ళూ కట్టించ దలచుకున్న సంగతి పెగ్గీతో చెప్పింది. ఫ్రాన్సిస్ తో నిమిత్తం లేకుండా అందరూ అతను గీసిన ప్లాన్ల బొమ్మలు చూడడంలో మునిగిపోయారు. పెగ్గీ, థామస్ లిద్దరూ శ్రధ్ధగా ఆ ఇళ్ళ ప్లానులు పరిశీలించి మార్పులు సూచించారు.

ఆ తర్వాత ఎస్టేటులో ఎవరెవరికి ఈ ఇళ్ళూ, చిన్న చిన్న స్థలాలూ ఇవ్వాలన్న చర్చ మొదలైంది. నిజానికి ఇదంతా ఫ్రాన్సిస్ కెంతో సంతోషాన్నివ్వాల్సిన మాట. అయితే ఎందుకో అతనికి చాలా దిగులుగా చిరాగ్గా అనిపించింది.

“ఇవ్వాళ నువ్వు చాలా ఉత్సాహంగా వున్నావు జేన్!” ఉండబట్టలేక అన్నాడు.

“అంతే కదా మరి! ఏడాదికి యాభై అరవై పౌండ్లు జీతం వచ్చే ఉద్యోగం అంటే మాటలనుకున్నావా? అందులోనూ పిల్లలకి చదువు చెప్పడం లాటి పనులంటే నాకెంతో ఇష్టం! ఫిలిప్ గారికి నేను నచ్చుతానో లేదో అన్న బెంగ తప్ప పని గురించి నాకెలాటి భయమూ లేదు. చూస్తూండు! ఈ ఉద్యోగమే దొరికితే కొన్నేళ్ళు పని చేసి డబ్బు దాచుకుని సొంతంగా వ్యాపారం మొదలు పెడతాను.”

“మరి ఎల్సీనొదిలి ఉండగలవా?”

“తప్పదు ఫ్రాన్సిస్! ఇతర్ల మీద ఆధారపడకుండా మా బ్రతుకులు మేం వెళ్ళదీసుకోవాలంటే కొన్ని కష్ట నష్టాలు ఓర్చుకోక తప్పదు.”

“జేన్! నేను నీదారికెప్పుడూ అడ్డు రాను! నీ మీద భారం మొత్తం చచ్చినా వేయను. పరిస్థితులతో సర్దుకు పోతాను.” ఎల్సీ అక్క మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది.

“నువ్వు నాకెప్పుడూ భారం కాదు ఎల్సీ. నీ కవితల పుస్తకం కూడా అచ్చవుతుంది. నీ సంపాదన నీకుంటుంది.”

“ఛీ! ఛీ! ఆ కవితల మాటెత్తకు!” చిరాగ్గా అంది ఎల్సీ.

“ఆగాగు! ఇవాళ అసలా కవితలు ఫ్రాన్సిస్ కి చూపిద్దామనుకున్నాం కదా?”

“వాటి మాటెద్దొన్నానా? అసలు జేన్ ఎన్ని రోజులనించి లండన్ చూడాలనుకుంది! ఇప్పటికి తన ఆశ నెరవేరింది!”

“అది సరే ఎల్సీ! నువ్వేం చేయదల్చుకున్నావు? ఇక్కడే పెగ్గీతోపాటే వుండి పోతావా?” ఫ్రాన్సిస్ అడిగాడు.

“పెగ్గీతోపాటే వుంటా కాని, అక్క చేయాలనుకున్న కుట్టు పని నేను చేస్తా! శ్రీమతి డన్ గారి దగ్గర కొంచెం కత్తిరింపులూ, డిజైనూ కూడా నేర్చుకుంటా. తర్వాత జేన్ చేయబోయే వ్యాపారంలో పనికొస్తుంది కదా?”

“ఎల్సీ! నిజంగా కవితలు రాయడం మొత్తానికే మానేసి కుట్టు పనిలోకెళ్తావా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏం ఫ్రాన్సిస్? నువ్వు బాంకు లో పని చేసినన్నాళ్ళూ కవితలూ, పుస్తకాలూ వదిలెయ్యాలేదూ? ఇదీ అలాగే!”

“నిజం చెప్పాలంటే సాహిత్యం లాటి వ్యాపకాలతో జీవన భృతి ముడి పడి లేనప్పుడే మంచి సాహితం సృష్టించగలుగుతామేమో!” సాలోచనగా అంది జేన్.

“అంతే అంతే!” ఏదో దీర్ఘాలోచనలో వున్నట్టు పరధ్యానంగా అన్నాడు ఫ్రాన్సిస్. నిజానికి అతను ఎల్సీ గురించి కానీ ఆమె కవితల గురించి కానీ ఆలోచించే స్థితిలో లేడు. మనసంతా ఒకలాటి నిరాశ కమ్మేసిందతన్ని.

నిన్ననే తను పెళ్ళి ప్రస్తావన తెచ్చి వుంటే జేన్ ఆలోచించేదేమో! ఇప్పుడసలు ఒప్పుకోదు. అందులోనూ ఈ పెళ్ళితో తను ఆస్తిపాస్తులూ, ఎస్టేటూ ఒదిలేసుకోవాలి కాబట్టి అసలే ఒప్పుకోదు.

“ఆ డబ్బుతో ఎన్నెని పనులు చేయొచ్చు! పాలేర్ల ఇళ్ళ మాట మరిచిపోతావా?” అంటుందు.

ఫిలిప్ గారి ఇంట్లో ఆమెకి తప్పక తనకంటే మంచి వరుడు దొరుకుతాడు. జేన్ ఇంకొకరి భార్యగా మారటమన్న ఊహకే అతనికి ఒళ్ళు కంపరమెత్తింది.

కలలో కనిపించిన అందమైన లోకం చేయి జారిపోయినట్టనిపించింది అతనికి. చేజారిపోయిన వరం ఎప్పుడూ చాలా అందంగా, ఉన్నతంగా అనిపిస్తుంది.ఒక్కక్షణం ఫిలిప్ జేన్ కి ఉద్యోగం ఇవ్వకుంటే బాగుండన్న స్వార్థపుటాలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచనని అక్కడే అదిమి పట్టాడు.

” పెద్దమ్మాయిగారు వెళ్ళిపోతారని చెప్పగానే పిల్లలందరూ గొల్లుమన్నారు! అయితే ఉత్తరాలు రాసుకోవచ్చని సంబరపడ్డారు కూడా అనుకోండి. ఇప్పుడు పోస్టు కార్డు ఒక పెన్నినే!” పెగ్గీ మాట్లాడుతోంది. ఈ లోకంలో కొచ్చి పడ్డాడు ఫ్రాన్సిస్.

“జేన్! నాకూ ఉత్తరాలు రాస్తావు కదూ? చిన్నదైనా పెద్దదైనా, అన్ని విషయాలూ రాయాల్సిందే! నీ మనసులో వచ్చే ప్రతీ భావమూ నాతో చెప్తావు కదూ?”

“తప్పక రాస్తాను ఫ్రాన్సిస్! నువ్వు మాత్రం నీ పని అనుకున్నట్టు జరగకపోతే నిరాశపడొద్దు ఫ్రాన్సిస్. పాలేర్లు నువ్వనుకున్నంత కష్టపడి ఉత్పత్తి పెంచలేకపోవచ్చు. నువ్వు వాళ్ళకొరకు ఎంత చేయబోతున్నావో అర్థం  చేసుకోలేకపోవచ్చు. అన్నిటినీ తట్టుకోవాలి!”

ఫ్రాన్సిస్ మౌనంగా కూర్చున్నాడు.

“ఇవాళెందుకో ముభావంగా వున్నావు ఫ్రాన్సిస్? ఎల్సీ! ఇవాళ నీ కవితల పుస్తకం చూపించొద్దులే. ఈ చిరాకులో చాలా తీవ్రంగా విమర్శిస్తాడేమో,” జేన్ నవ్వుతూ అంది.

“కాదు జేన్! ఇలాటి మూడ్ లోనే నా కవితలు ఇవ్వాలి. అప్పుడు నేను కవితల్లో చూపించే నిరాశా నిస్పృహలు అర్థమవుతాయి. ఇప్పుడే పుస్తకం తీసుకొస్తా. ”

ఎల్సీ వెళ్ళి దారంతో కట్టి వున్న కాగితాల బొత్తి తీసుకొచ్చింది.

కవితా పఠనంలో ఆనందం పాఠకుడి మానసిక స్థితిని బట్టి కూడా వుంటుంది. ఇవాళ తనున్న బాధలో ఫ్రాన్సిస్ కి ఎల్సీ కవితల్లో తన నిస్సహాయతే ప్రతిధ్వనించినట్టనిపించింది. చాలా చోట్ల కవితాత్మ చక్కగా వుందని మెచ్చుకున్నాడు కూడా. అక్కడక్కడా కొన్ని తప్పుల్ళేకపోలేదు. కానీ మొత్తం మీద ఎల్సీ కవిత్వం బానే అనిపించింది ఫ్రాన్సిస్ కి.

ఆ రోజు వాళ్ళు ముగ్గురూ ఒక పాటకచ్చేరీకెళ్ళారు. అతనికి ఎల్సీ అభిరుచి నచ్చింది. నిజానికి అతనికి ఎల్సీతో భావ సారూప్యం ఎక్కువ. అయినా అతనికి జేన్ మీదున్న గొప్ప అభిప్రాయమూ, అభిమాననూ ఎల్సీ పట్ల ఏర్పడటం లేదు. ఎందుచేతనో మరి!

 

ఎల్సీ తనకి మొదట్లో ఫ్రాన్సిస్ మీదున్న కోపమూ, అపనమ్మకమూ గుర్తొచ్చి నవ్వుకుంది. అంతలోనే ఆమె దృష్టిలో అప్పుడే అక్కడికొచ్చిన విలియం డాల్జెల్ పడ్డాడు.

చిరాకుతో ఆమె మొహం ముడుచుకుంది. అక్కని అతను మోసం చేసాడన్న కోపం ఆమె మనసులో ఇంకా అలానే వుంది. డాల్జెల్ రెన్నీ కుటుంబంతోనూ, లారా విల్సన్ తోనూ కలిసి వచ్చినట్టున్నాడు. అతనిలాటి స్వార్థపరుడికీ, ఫ్రాన్సిస్ లాటి మంచి మనిషికీ ఎంత తేడా, అనుకుంది ఎల్సీ.

విలియం డాల్జెల్ ని ఫ్రాన్సిస్ కూడా దూరం నించి చూసాడు. అన్నీ కలిసొస్తే జేన్ అతన్నే పెళ్ళాడేదన్న విషయమూ తెలుసతనికి. అతనికి ఆ సంగతి తలచుకోగానే గుండెల్లో ముల్లు దిగినట్టైంది.

 

***

(సశేషం)

 

 

వీలునామా- 15 వ భాగం

శారద

శారద

  (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

శుభ వార్త 

పిల్లలూ, జేన్, ఎల్సీ అంతా బయటికెళ్ళాక, బ్రాండన్ పెగ్గీతో తీరికగా కబుర్లు చెప్పాడు. అన్నిటికన్నా, ఆయనని సంపన్నుల ఇంటి ఆడపడుచులు ఈ చాకలి మనిషి ఇంట్లో ఎందుకున్నారా అన్న కుతూహలం వేధించింది. అంతకు ముందు రోజు రాత్రి రెన్నీ గారి అమ్మాయి, ఎలీజా ఏవో వివరాలు చెప్పింది కానీ, ఆయనకి అవంత నమ్మదగ్గవిగా అనిపించలేదు. వాటిల్లో అతిశయోక్తీ, అతిశయమూ ఎక్కువగా అనిపించాయి. ఆయన ఊహించినట్టుగానే, పెగ్గీ వాళ్ళిద్దరి గురించీ మామూలుగా నిజాలు వెల్లడించింది. పెగ్గీ కి అందులోనూ జేన్ అంటే చాలా ఇష్టమూ, మర్యాదా.

“పెద్దమ్మాయిగారు ఎంత తెలివైందనుకున్నారు? ఆవిడకి తెలియని విషయం లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అంత తెలివైన మంచి మనిషి, కుట్టు పనికి వెళ్తోందటే ఎలాటి రోజులొచ్చాయో చూడండి. రాత్రి పూట ఆవిడ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు చూడాలి. మా టాం అయితే ఆవిడ చేతిలో బొమ్మే అనుకోండి. ఆవిడ మాటంటే మావాడికి వేద వాక్కు. ఆ వయసులో మగపిల్లలకి అలా ఆరాధించేందుకు ఒక స్త్రీ మూర్తి వుండి తీరాలండీ! వాళ్ళకి ఆడవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది.”

“పెగ్గీ! ఆదర్శవంతమైన్స్ స్త్రీ మూర్తిని చూడాలనే అనుకుంటే నీకంటే వేరెవరున్నారు?” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“నాకు అక్షరం ముక్క రాదాయే! నన్నెవరు గౌరవిస్తారు లెండి. అయితే నాకు దాని గురించి పెద్ద బాధా లేదు. నిజానికి టాం చాలా మంచి కుర్రాడు, చురుకైన వాడు. వాడికి రాని లెక్కలూ, లాటినూ, ఏదైనాసరే, అన్నీ పెద్దమ్మాయి గారు చెప్తారు. ఆవిడ ఒక పేజీ నిండా వున్న అంకెలని కూడా చకచకా మనసులోనే కూడిక చెయ్యగలరు తెలుసా! అయినా, నాకు తెలీకడుగుతాను. జేమీకి లాటిన్ తో ఏం పని చెప్పండి? చెక్క పనులు నేర్చుకుని వడ్రంగి అవుదామనుకునేవాడికి, ఈ లేటినూ భాషలూ ఎందుకో! వీణ్ణి చూసి టాం! ఇద్దరూ లాటిన్ నేర్చుకుంటున్నారు. ఏం ప్రయోజనమో ఆ దేవుడికే ఎరుక. భాష మాటెలావున్నా వాళ్ళ అక్షరాలు మాత్రం ముత్యాల్లా అయ్యాయంటే నమ్మండి. అంతా పెద్దమ్మాయిగారి చలవే. ఆవిడ ఆజమాయిషీలో వున్నప్పుడు, వాళ్ళ మావయ్యగారి ఎస్టేటులో, ఇంట్లో లెక్కా, అదీ వొంక పెట్టలేకుండ వుండేదు. అంత తెలివీ చదువూ వుండి ఏం లాభం, పాపం. ఇప్పుడు ఎక్కడో కుట్టు పనికి కుదురుకోవాలనుకుంటోంది. చిన్నమ్మాయిగారున్నారా, ఆవిడంతా అదో ప్రపంచం. కవితలూ, కథలూ, నవలలూ, అంతా రాత పనే. అయితే ఈ మధ్య అన్నీ మానేసారులెండి. ఈ మధ్య కొంచెం నిరుత్సాహంగా వున్నారని చెప్పి ఫ్రాన్సిస్ గారు అలా బయటికి తీసికెళ్ళారన్నమాట.”

“నాకు మీ చిన్నమ్మాయిగారితోనే కొంచెం స్నేహం! ఆ పెద్దమ్మాయిని చూస్తే నాకు వొణుకు. అందులో ఆవిడ మాట్లాడితే నీతులు బోధిస్తున్నాట్టే అనిపిస్తుంది.”

“అబ్బో! ఆవిడ నీతుల వల్ల మీరు చెడిపోయిందేమీ లేదే! మంచి చెప్పినా తప్పేనా? సరే, ఇదంతా అలా వుంచండి. నిజంగా మెల్బోర్న్ లో నా కొట్టు చవకగా ఇచ్చెయాల్సి రావడం నాకు బాధగా వుంది. మీరన్నట్టు ఆ కొట్టుకు రెండు వేల పౌండ్లు వస్తేనా, నేను పెద్దమ్మాయిగార్ని మెల్బోర్న్ తీసికెళ్ళి ఇద్దరమూ కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవాళ్ళం.”

జేన్ పట్ల పెగ్గీ అరాధన చూసి బ్రాండన్ కి నవ్వొచ్చింది. ఇంకొంచెం సేపు మామూలు కబుర్లయ్యాక ఆయనన్నాడు,

“పెగ్గీ! నాకొక ఆలోచన తోస్తుంది!”

“ఆలోచనా?”

“అవును! నీకు ఫిలిప్ గారి కుటుంబం గుర్తుందా?”

“ఎందుకు గుర్తు లేదు? వాళ్ళు బాగున్నారా? అడగడమే మర్చిపోయాను. చిన్న పాప ఎమిలీ ఎలా వుంది? ఇప్పుడు బాగా పెద్దదయి వుంటుంది.”

“బానే వున్నారు. వాళ్ళకిప్పుడు ఎమిలీ కాక ఇంకా నలుగురు పిల్లలు. శ్రీమతి ఫిలిప్ గారికి ఎప్పట్లానే తన షోకులకే సమయం చాలటం లేదు.”

“ఆవిడ ఎప్పుడూ అంతే లెండి.”

“ఇంతకీ సంగతేమిటంటే, నేను మెల్బోర్న్ నించి ఇంగ్లండు వచ్చేటప్పుడు అదే నౌకలో ఫిలిప్ గారి కుటుంబం కూడా వచ్చింది. వాళ్ళు ఇక ఎప్పటికీ లండన్ లోనే వుండిపోతారట. మీ పెద్దమ్మాయి గారికి ఆ కుటుంబంలో వుద్యోగం దొరికిందనుకో, వాళ్ళకీ హాయి, తనకీ సుఖంగా వుంటుంది. వాళ్ళ పిల్లలు ఎమిలీ, హేరియాట్ ని అదుపులో పెట్టగలిగే టీచర్లు లేక అవస్థ గా వుందని అన్నాడు ఫిలిప్ నాతో. వాళ్ళు జేన్ శిక్షణలో కాస్త నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు. ఏమంటావ్? మాట్లాడి చూడనా?”

“నేనక్కడ వున్నప్పుడే ఎమిలీ తండ్రినొక ఆట ఆడించేది. ఆవిడ కేమో అసలు ఏ పనికీ ఒళ్ళొంగదు. మీరన్నట్టు ఇది మంచి ఆలోచనే.”

“జేన్ లాటి మనిషి దొరికితే ఫిలిప్ ఎగిరి గంతేస్తాడనుకుంటా. నేను వెంటనే ఫిలిప్ తో మాట్లాడతా. అతనెటూ ఇటు వైపొచ్చే ఆలోచనలో వున్నాడు. అప్పుడు నిన్నొకసారి కలవమంటా. అతనే జేన్ తో మాట్లాడి ఏ విషయమూ నిర్ణయించుకోవచ్చు. నువ్వు ఆవిడని తొందర పడి కుట్టు పనికి వెళ్ళొద్దని చెప్పు.”

“ఆయన వొచ్చేటట్టయితే తప్పక ఎమిలీని తీసుకురమ్మని చెప్పండి. వారి కుటుంబానికి పెద్దమ్మాయిగారు నచ్చి పనిలో పెట్టుకుంటే కాస్త వాళ్ళకి సాయం చేసిన వాళ్ళమవుతాం.”

“ఇహ ఆ పని మీదే వుంటాను. నేను మరి బయల్దేరతా పెగ్గీ! నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా వుంది.”

లోపలికెళ్ళి పిల్లల తాతగారు థామస్ లౌరీ కి నమస్కారం చేసి బయల్దేరాడు బ్రాండన్. పెగ్గీ ఆలోచనలో పడింది.

‘…. చూస్తూంటే బ్రాండన్ గారికి చిన్నమ్మాయి గారు బాగా నచ్చినట్టున్నారు.  ఇప్పుడు చిన్నమ్మాయి గారికి ఈయన నచ్చుతాడో లేదో! నేను ఆయన గురించి అంతగా చెప్పి వుండకుండా వుండాల్సిందేమో! పొరపాటైపోయింది. ఇప్పుడామెకి ఆయన్ని చూస్తే నవ్వులాటగానే వుంది. బ్రాండన్ గారన్నట్టు పెద్దమ్మాయిగారికి ఫిలిప్ గారి దగ్గర ఉద్యోగం దొరికితే బాగుండు. పాపం ఇక్కడ పిల్లలు ఆవిడ లేకపోతే దిగులు పడతారేమో. మరప్పుడు చిన్నమ్మాయిగారు ఒంటరిగా ఇక్కడుండాల్సొస్తుందేమో! అసలే కళాకళాల మనిషి. ఆమెని ఒంటరిగా నేను సంబాళించుకోగలనో లేదో!…’

అంతలోనే ఆమె ఆలోచనలు మెల్బోర్న్ లో తను అద్దెకిచ్చిన కొట్టు మీదికెళ్ళాయి.

‘…ఆ జులాయి వెధవ కొట్టు నిజంగానే కొనేసుకుంటాడనుకోలేదు. రెండు వందలక్కొన్న కొట్టు ఇప్పుడు రెండు వేలయిందట. అయినా నాకు రెండు వందలే వొస్తాయి. ఎంత అన్యాయం. అంతా నేను చేసిన పొరపాటు. ఇప్పుడేమనుకొని ఏం లాభం….’

ఆలోచనల్లోనే పెగ్గీ పనంతా ముగించి బయటికెళ్ళిన అమ్మాయిలిద్దరికోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

జేన్ ఎల్సీలిద్దరూ నాటకం చూసి వచ్చేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది.

“ఇంత ఆలస్యమయిందే! భయపడ్డా మీరిద్దరూ ఎక్కడున్నారోనని.” తలుపు తీస్తూ అంది పెగ్గీ.

“అవును పెగ్గీ! ఇంత పెద్ద నాటకం అనుకోలేదు. అసలు నువ్వెందుకు మాకోసం ఎదురు చూస్తూ మెలకువతో వున్నావు? పడుకోకపోయావా!” చెప్పులు విప్పుతూ అంది జేన్.

ఎల్సీ చాలా రోజుల తర్వాత ఆ రోజు సంతోషంగా అనిపించింది.

“ఏం పెగ్గీ! ఆస్ట్రేలియాలో నువ్వెప్పుడైనా నాటకం చూడ్డానికెళ్ళావా?” సరదాగా అడిగింది.

“వెళ్ళా కాని నాకేం నచ్చలా! ఆ రంగులు పూసుకున్న మొహాలూ వాళ్ళూ!”

నవ్వింది జేన్.

“పెగ్గీకి రంగుల కల్పనలకంటే నలుపూ-తెలుపుల నిజ జీవితమే నచ్చుతుంది. కదూ పెగ్గీ!”

“మీ వేళాకోళానికేమొచ్చె కానీ, నిజ జీవితమంటే గుర్తొచ్చింది! అమ్మాయిగారూ! బ్రాండన్ గారు మీకొక మంచి ఉద్యోగం చూసి పెడతానన్నారు!”

అమ్మాయిలిద్దరూ ఉత్సాహంతో కెవ్వుమన్నారు.

“ఒక ఇంట్లో పిల్లల చదువులూ, డబ్బు లెక్కలూ చూసుకునే గవర్నెస్ ఉద్యోగం. రేపే మాట్లాడతానన్నారు. కనీసం తాను ఏ కబురూ చెప్పేవరకూ కుట్టు పనికి వెళ్ళొద్దన్నారు.”

తర్వాతె పెగ్గీ ఫిలిప్ గారి గురించి వివరాలన్నీ చెప్పింది.

“జీతం ఎంతుంటుందో!” ఆత్రంగా అంది జేన్.

“దాఇ గురించి మీరు ఆలోచించకండి. ఫిలిప్ గారు పిసినారి కాదు నాకు తెలిసినంతవరకూ.

“అయితే రేపు ఫ్రాన్సిస్ వచ్చేసరికి మనం అతనికొక శుభవార్త చెప్పొచ్చన్నమాట!” జేన్ అంది సంతోషంగా.

 

***

(సశేషం)

 

వీలునామా – 14వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“ఏమిటీ? ఆడవాళ్ళకి సంగీతం తేలికగా అబ్బదా? విచిత్రంగా వుందే? వాళ్ళు ఎప్పుడు చూడూ పియానో వాయిస్తూ పాటలు పాడుతూ వుంటారు కదా?”

“అదే మరి! అంత మంది సంగీతం నేర్చుకున్నా, ఒక్కళ్ళైనా మంచి సంగీతం సమకూర్చడం విన్నామా మనం? అదే కవిత్వమూ చిత్రలేఖనమూ తీసుకోండి. ఎక్కువమంది ఆడవాళ్ళు నేర్చుకోకపోయినా, మంచి కవయిత్రులూ, చిత్రకారిణులూ వున్నారు.  అందుకే ఆడవాళ్ళకి సంగీతం కంటే కవిత్వమూ చిత్రలేఖనమూ సహజంగా అబ్బుతాయేమో అనిపిస్తుంది.”

“ఆహా! ఎన్నాళ్ళకు విన్నాను ఇంత చల్లని మాట! మా పిన్నీ, ఆవిడ కూతుళ్ళిద్దరూ రోజూ నాకు ఈ విషయం మీద తలంటుతున్నారంటే నమ్మండి. ఆడా, మగా సమానమేననీ, ఇద్దరికీ అన్ని విద్యలూ సమానంగా వస్తాయనీ నాతో ఒప్పించే దాకా ఊర్కునేలా లేరు వాళ్ళు. మీరేమో ఆడవాళ్లకీ అన్ని విద్యలు సహజంగా రావని అంటున్నారు. అన్నట్టు ఈ సారి వాళ్ళతో వాదించేటప్పుడు ఈ పాయింటు దొరకబుచ్చుకుంటా! మీకేమైనా అభ్యంతరమా?”

“భలే వారే! ఇందులో అనుకోవడానింకేముంది. అయితే ఇంతటి విలువైన ఆయుధాన్ని మా శతృవుల చేతుల్లో పెట్టటమా అని సంకోచం, అంతే!” నవ్వింది ఎల్సీ.

“శతృవులా? ఎంత మాటన్నారు! నేనింకా మీ స్నేహం కోసం అర్రులు చాస్తుంటే!”

చూస్తూండగా బ్రాండన్ కి ఎలీజా రెన్నీ కవితలు చదవడం కంటే ఎల్సీ తో కబుర్లాడడం లోనే ఎక్కువ ఉత్సాహంగా అనిపించింది. కాసేపయ్యాక ఆ ఆల్బం బల్ల మీద పడేసి,

“పదండి! మళ్ళీ హాలులోకెళ్ళి పాటలు విందాం!” అన్నాడు. ఎల్సీకి ఆ కవితలు చదువుతూంటే భలే ఆనందంగా అనిపించింది. తన కవితలే ఎలీజా కవితలకంటే బాగున్నాయనే నిర్ధారణ కొచ్చింది ఆమె. దాంతో ఆమె నిరాశ కొంచెం తగ్గినట్టనిపించింది.

బయటికొచ్చిన ఎల్సీ, విలియం డాల్జెల్ లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసింది.

విలియం గంభీరంగా లారాతో తన గురించీ, తన పొలాల గురించీ చెప్తూన్నాడు. ఎందుకో అతని గొంతూ, ఆరాధనగా అతను లారా వైపు చూసే చూపులూ, తెచ్చి పెట్టుకున్న గాంభీర్యమూ చాలా చిరాకెత్తించాయి ఎల్సీని.

“నీలాటి మోసగాడికి లారా విల్సన్ లాటి తెలివి తక్కువ డబ్బున్న

అమ్మాయే సరి జోడీ,” అనుకుందామె అక్కసుగా. డబ్బుంటే ఎన్ని లోపాలన్నీ కప్పబడిపోతాయ్, డబ్బు లేకుంటే ఎన్ని సుగుణాలైనా మరుగున పడతాయి, అనుకుంది మళ్ళీ అంతలోనే.

విలియం కొద్దిసేపటి తర్వాత జేన్ దగ్గరికి వచ్చాడు. ఆమెని చూసీ పలకరించకపోవడం మర్యాద కాదనుకున్నాడు. అంతకు ముందు ఎల్సీని పలకరించే ప్రయత్నం చేసాడు కానీ ఎల్సీ ముక్తసరిగా మాట్లాడింది.

జేన్ అతనితో ఎలాటి వైషమ్యాలూ లేకుండా సౌమ్యంగా మాట్లాడింది. అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తనను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందనీ, దెప్పి పొడుస్తుందనీ, తన కష్టాలు చెప్పుకుంటుందనీ ఎన్నెన్నో ఊహించాడు. అదేమీ లేకపోగా జేన్ ఎప్పట్లాగే మర్యాదగా మాట్లాడింది. తను లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసి ఈర్ష్యపడలేదు సరికదా, అసలా ప్రసక్తే ఎత్తలేదు. అక్కడికీ విలియం ఉండబట్టలేక తమ పాత స్నేహాన్నీ, ఆప్యాయతనీ గుర్తు చేయబోయాడు. జేన్ అదంతా మర్చిపోయినట్లు మాట్లాడేసరికి అతనికి కొంచెం  అసహనంగా కూడా అనిపించింది.

తానూ, తన తల్లీ వాళ్లని చూడడానికి రాలేకపోయామనీ, దానికెంతో బాధ పడ్డామనీ అతనన్నాడు.

దానికంత బాధ పడాల్సిందేమీ లేదనీ, తనకసలు వాళ్ళు రాలేదన్న సంగతే గుర్తు లేదనీ ఆమె అన్నంది.

“హాయిగా ఎస్టేటులో వున్న తర్వాత పెగ్గీ చిన్న ఇంట్లో ఇరుకుగా ఇబ్బందిగా వుందా?”

“అబ్బే, అదేం లేదు. అయినా పనితో తల మునకలుగా వుంది. ఇంకేదీ పట్టించుకునే తీరిక లేదు.”

“పెగ్గీ ఏమైనా..”

“పెగ్గీ చాలా మంచిది. మర్యాదస్తురాలు.”

“పిల్లలు ఏమైనా ఇబ్బంది..”

“పిల్లలు చాలా బుధ్ధిమంతులు.”

ఆ సంభాషణ అయిపోయేసరికి ఇద్దరూ సంతోషపడ్డారు. అతను మళ్ళీ లారా విల్సన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. జేన్ లేచి ఎల్సీని వెతుక్కుంటూ లోపల లైబ్రరీలోకెళ్ళింది.

ఈసారి అక్కడ ఎల్సీ ఫ్రాన్సిస్ తో కలిసి ఎలీజా రెన్నీ కవితల పుస్తకం చదువుతూ చర్చిస్తోంది.

“ఫ్రాన్సిస్! నువ్విక్కడ వున్న నాలుగు రోజులూ మా ఇంటికి వస్తావు కదూ? అసలు మనం కొన్ని రోజులు సరదాగా గడపాలి. రేపు సినిమాకి, ఎల్లుండి చిత్రకళా ప్రదర్శనకి, మర్నాడు పాట కచేరీకి వెళ్దాం, సరేనా?”

ఎల్సీ ఆశ్చర్యంగా అక్కవైపు చూసింది.

“నేను రాలేను జేన్. నాకు కొంచెం నలతగా వుంది.”

“చచ్చినా ఒప్పుకోను. ముగ్గురం కలిసే వెళ్దాం. ఆ తర్వాత నేనొక టైలరింగ్ షాపులో పనికి కుదురుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నా మాట వినాల్సిందే!”

“జేన్! ఎల్సీకి నాతో రావడం ఇష్టం లేదేమో!” ఫ్రాన్సిస్ అన్నాడు.

ఎల్సీ మొహం ఎర్రబడింది.

“అయ్యొయ్యో! అదేమీ లేదు ఫ్రాన్సిస్. నాకు ముందు నీమీద కొంచెం కోపంగా వున్నమాట నిజమే. నీవల్లే మాకీ కష్టాలన్నీ అనుకున్నా కూడా. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇందులో నీ తప్పేం లేదని. నా దురుసుతనానికి క్షమించు!”

“ఇందులో క్షమాపణలకేముంది ఎల్సీ! మీ స్థానంలో ఎవ్వరున్నా అలాగే అనుకుంటారు. అది సరే, రేపు ఉదయాన్నేనాతో వస్తే నీకు ఎడిన్ బరో ఎంత అందంగా వుంటుందో చూపిస్తాను. జేన్ కి చూపించి లాభం లేదు. తనకసలు ఏమాత్రం కళా హృదయం లేదు. నీలాటి సున్నిత

మనస్కురాలికే ఆ సౌందర్యం అర్థమవుతుంది. ఏమంటావ్?” నవ్వుతూ అడిగాడు ఫ్రాన్సిస్.

అతని అభిమానానికీ, స్నేహానికీ ఎల్సీ పెదవులు విచ్చుకున్నాయి. మర్నాడు అతనితో కలిసి కాసేపు గడపాలని నిశ్చయించుకుందామె.

***

ఫ్రాన్సిస్ నిర్ణయం

పార్టీ నించి వచ్చి పడుకునేసరికి ఆలస్యం అయింది. జేన్, ఎల్సీ లిద్దరూ మర్నాడు లేచేసరికే పెగ్గీ పని మీద బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెగ్గీ తిరిగి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయింది. ఆడ పిల్లలిద్దరూ అప్పటికి లేచి ఫ్రాన్సిస్ కొరకు ఎదురు చూస్తున్నారు.

తలుపు చప్పుడైంది. తమని బయటికి తీసికెళ్ళడానికి ఫ్రాన్సిస్ వచ్చి వుంటాడనుకొని ఇద్దరూ చెప్పుల వైపు కదిలారు. పెగ్గీ తలుపు తెరిచింది. అటు చూసిన ముగ్గురూ ఆశ్చర్యపోయారు. వచ్చింది ఫ్రాన్సిస్ కాదు! బ్రాండన్. పెగ్గీ ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు!

“పెగ్గీ! నిన్ను నాలుగు వీధులవతల చూసి వెంబడించాను. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తావేమో ఆగమని సైగ చేద్దామంటే, ఏదీ, నువ్వు గబ గబా నడుచుకుంటూ వచ్చేసావు. నీతో సమానంగా నడవలేకపోయాను నేను! నగర వీధుల్లో నడవదం అలవాటు తప్పినట్టుంది నాకు.”

పెగ్గీ ఇంకా ఆశ్చర్యం లోంచి తేరుకోలేదు. జేన్ ఎల్సీ ల వైపు తిరిగాడు బ్రాండన్.

“పెగ్గీ! నువ్వు మీ అక్కయ్య పిల్లలని చెప్తూ వుండే దానివి. వీళ్ళా ఆ పిల్లలు?” నమ్మలేనట్టు అడిగాడు.

“అయ్యొయ్యో! కాదండీ. మా అక్కయ్య పిల్లలందరూ బడికెళ్ళారు. అయినా, వాళ్ళని చూస్తుంటే మీకు వాళ్ళు మాలాటి వాళ్ళ పిల్లల్లా కనబడుతున్నారా? వాళ్ళిద్దరూ ఊరికే ఇక్కడ అద్దెకుంటారు. వాళ్ళు మా వూళ్ళో వుండే భూస్వామి గారి మేన కోడళ్ళు.”

“అలాగా? నిన్న రాత్రి నేను ఒక విందులో వీళ్ళిద్దరినీ కలిసాను. అందుకే ఆశ్చర్యపోయాను.”

“అదిసరే,  మీరు ఇటువైపెందుకొచ్చారు?” పెగ్గీ అడిగింది.

“అసలు నిన్ను చూడడానికి నువ్వు ఇచ్చిన మీ వూరి అడ్రసుకే వెళ్దామనుకున్నా. ఇంకా నయం వెళ్ళాను కాదు. ఊరికే ఒక ప్రయాణం దండగయ్యేది. నిన్ను చూడాలని చాలా అనుకున్నాలే. ”

“మొన్న మొన్నటి దాకా ఊళ్ళోనే వున్నా. ఇహ పిల్లలు పెద్ద స్కూల్లో చదువుకుంటామంటే ఇక్కడికి వచ్చాం. వాళ్ళ తాతగారిక్కూడా ఇక్కడ బాగుందట. ”

పెగ్గీ అమ్మాయిలవైపు తిరిగింది.

“అమ్మాయిగారూ! ఈయన మా బ్రాండన్ గారు. నేను చెప్పలా? ఆయనే.”

బ్రాండన్ చలి మంట దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

“హబ్బా! పెగ్గీ! ఆస్ట్రేలియా లాటి వెచ్చటి ప్రదేశంలో వుండి నువ్విక్కడ చలి యెలా తట్టుకుంటున్నావు?”

“అటూ ఇటూ నడుస్తూ వుంటే చలి తగ్గుతుందండీ!”

“పెగ్గీ! నువ్వసలేం మారలేదు. అన్నట్టు నీకొక ముఖ్యమైన వార్త చెప్పాలి.”

“చెప్పండి! ఏంటది?”

“ఏంటా? నువ్వసలు మెల్బోర్న్ వదిలి వుండల్సింది కాదు. ఇప్పుడు మెల్బోర్న్ లో డబ్బే డబ్బు! అన్నట్టు పోవెల్ గుర్తున్నాడా? అతని పెళ్ళయ్యిందో లేదో గుర్తు రావడం లేదు.”

“నేను మెల్బోర్న్ లో వున్నప్పుడే ఆయనకి పెళ్ళయింది లెండి. ఇంతకీ సంగతేమిటి?”

“ఇప్పుడు పోవెల్ మెల్బోర్న్ లొని పెద్ద ధనికులలో ఒకడు తెలుసా? నాకంటే ఎక్కువ డబ్బూ, గొర్రెలూ, పొలమూ సంపాదించాడు. అతన్ని పెళ్ళాడకుండా పొరపాటు చేసావేమో పెగ్గీ!”

“ ఇప్పుడదంతా ఎందుకు కానీ, ఆయనకి ఏమైనా పిల్లలా?”

“ఇద్దరు. అబ్బో! ఇహ ఆయన మురిపం చెప్పనలవి కాదు.”

“ఆయన భార్య మంచిదేనా?”

“మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ, నీ అంత పనిమంతురాలు మాత్రం కాదు. ఆమెకి ఎంత సేపూ తన బట్టలూ, అంద చందాల మీదే ధ్యాస. అదలా వుంచు కానీ, నీ లాయరు లేడూ, టాల్బాట్ గారు! ఆయన నీకోక సందేశం ఇచ్చాడు.”

“టాల్బాట్ అక్కడ నా డబ్బు వ్యవహారాలన్నీ చూసే వాడు, ” పెగ్గీ కొంచెం గర్వం నిండిన కంఠంతో అంది అమ్మాయిలతో.

మళ్ళీ బ్రాండన్ వైపు తిరిగి, “ఏమంటాడు టాల్బాట్?” అని అడిగింది.

“నువ్వు నీ కొట్టు అద్దెకిచ్చావు చూడు, వాడికి కొట్టు కొనుక్కునే హక్కు కూడా ఇచ్చావు కదా? అలా ఇవ్వకుండా వుండాల్సింది అని బాధ పడ్డాడు.”

“నేనా కొట్టు అమ్మింది ఒక చిల్లర వ్యాపారస్తుడికి. వాడి జన్మకి వాడు రెండొందల యాభై పౌండ్లు ఎప్పటికి కూడబెట్టాలి, ఎప్పటికి కొనాలి? టాల్బాట్ అనవసరంగా భయ పడుతున్నాడు.”

“కానీ, ఇప్పుడా కొట్టు వున్న స్థలం దాదాపు రెండువేల పౌండ్ల కంటే ఎక్కువ ఖరీదు చేస్తుంది! ఆ కిరాయిదారు భలే ఉపాయం వేసాడులే. నీ లీజు అయిపోయేదాకా ఏమీ మాట్లాడడు. నువ్వడిగిన తక్కువ అద్దె కడుతూ అలాగే వుంటాడు. లీజు అయిపోయే సమయానికి స్థలం కుదువబెట్టి రెండొందల యాభై పౌండ్లు తెచ్చి నీకిచ్చి కొట్టూ, స్థలమూ అంతా తన పేర రాయించుకుంటాడట. ఈ విషయం వినగానే నీ మీద నాకు మహా చికాకు కలిగింది. అంత మంచి స్థలాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు చూడు!”

“హాయ్యో! ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం వూహించగలరు చెప్పండి! ఆ రెండొందల యాభై ఏదో ఓ రోజు నాకొస్తుందన్నమాట! పోన్లెండి. దక్కిందే మనదనుకుంటే సరిపోయే! అన్నట్టు, అదిగో, పిల్లలొచ్చేసారు.”

మెట్ల మీద అడుగుల సవ్వడి విని అంది పెగ్గీ!

“ఆఖరికి వచ్చారన్నమాట! నువ్విన్ని త్యాగాలు చేసి పెంచిన ఆ పిల్లలు ఎలా ఉంటారో అన్న కుతూహలంతో చస్తున్నాను! వస్తూనే వాళ్ళ పేర్లేమిటో చెప్పాలి నువ్వు.”

వాళ్ళు వస్తూంటే వరసగా పేర్లు చెప్పింది పెగ్గీ.

“టాం, జేమీ, నాన్సీ, జెస్సీ, విల్లీ!”

“చక్కటి పిల్లలు! చురుగ్గా వున్నారు. వీళ్ళని ఆస్ట్రేలియాకి తీసికెళ్తా నాతో! పైకొస్తారు.”

బ్రాండన్ ప్రశంసలకి పెగ్గీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“అంతా భగవంతుడి దయ. ఆరోగ్యాలు చల్లగా వుంటే అంతే చాలు. కానీ మహా అల్లరి పిల్లలు లెండి.” జవాబిచ్చింది.

ఇంతలో టాం కలగజేసుకున్నాడు.

“పిన్నమ్మా! కింద మెట్లదగ్గరెవరో ఒకాయన నిలబడి వున్నాడు. ఎవరు కావాలని అడిగితే, జేన్, ఎల్సీల కోసమొచ్చానన్నాడు. పైకి రమ్మన్నాను కానీ, రానని అక్కడే వుండిపోయాడు.”

“పెగ్గీ! అది ఫ్రాన్సిస్ అయి వుంటుంది. పైకి రమ్మను టాం. మేము సిధ్ధంగానే వున్నాం. ఒక్క అయిదు నిముషాలు కూర్చొని వెళ్ళిపోవచ్చు.” జేన్ చెప్పింది.

 టాం వెళ్ళి పిలిచినమీదట ఫ్రాన్సిస్ వచ్చాడు. బ్రాండన్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు, కానీ పెగ్గీ తమ పూర్వ పరిచయం గురించి వివరించింది. బ్రాండన్ తో రెణ్ణిమిషాలు మాట్లాడి ముగ్గురూ బయటికెళ్ళారు.

బయట పగటి వెల్తుర్లో కానీ అక్క చెల్లెళ్ళిద్దరిలో వచ్చిన మార్పు ఫ్రాన్సిస్ కనిపెట్టలెకపోయాడు. చిక్కిపోయిన ఆకారాలూ, పాలిపోయిన మొహాలూ చూస్తే అతనికి కడుపులో దేవినట్టైంది. అందులోనూ కుట్టుపనికి వెళ్తానని జేన్ అన్నప్పట్నించీ అతని మనసు మనసులో లేదు.

కొద్ది రోజులుగా తన మనసులో మెదుల్తున్న విషయం గురించి ఆలోచిస్తున్నాడతను. జేన్ అంటే అతనికి చాలా ఇష్టమన్న విషయం అతనికి కూడా అర్థమైపోయింది. కానీ జేన్ ని పెళ్ళాడితే ఆస్తి పాస్తులు వదిలేసుకోక తప్పదు. ‘ఈ డబ్బుతో నాకేం పని? ఇవన్నీ వదిలేసి హాయిగా జేన్ ని పెళ్ళాడితే పోలా?’ అని ఈ మధ్య బలంగా అనిపిస్తుందతనికి. ఇంతకు ముందు ఉద్యోగమే మళ్ళీ చేసుకుంటూ, యేడాదికి రెండొందల యాభై పౌండ్లతో ఎంతైనా హాయిగా బ్రతకొచ్చు. అందుకోసం కావాలంటే తన ఖరీదైన పుస్తకాల అలవాటూ, నాటకాలకెళ్ళే అలవాటూ, అన్నీ మానుకోగలడు తను.

మనసుకి నచ్చిన మనిషితో దుర్భరమైన పేదరికాన్ని భరించొచ్చు కానీ, ప్రేమించేందుకు మనిషి లేక అష్టైష్వర్యాల మధ్యా క్షణం కూడా వుండలేం.

‘నన్ను ఆమె పెళ్ళాడుతుందన్న నమ్మకం వుండి వుంటే మర్నాడే ఆ ఎస్టేటూ, ఇల్లూ అన్నీ గాలికొదిలేసి ఇక్కడే హాయిగా వుండిపోదును కదా! కానీ, ఆమెకి నా మీద ఎలాటి అభిప్రాయం వుందో! ఇప్పుడు నేను ఈ విషయం మాట్లిడితే, తన నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటున్నానుకుంటుందో ఏమో!’

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. డబ్బు వల్ల తనకి కొత్త అలవాట్లేమీ రాకపోయినా, ఆ తీరుబడిగా వుండే జీవితమూ, ఎప్పుడూ డబ్బుకొసం తడుముకోవాల్సిన అవసరం లేని నిశ్చింతా అతని ప్రాణానికి చాలా సుఖంగానే వున్నాయి. ఇప్పుడవి వొదులుకోవదమంటే తననుకున్నంత తేలికైన పనేనా?

జేన్ కోసం డబ్బూ, ఇల్లూ వదిలి వచ్చేస్తానంటే ముందు అసలు రెన్నీ గారు తన పాత ఉద్యోగమిస్తారా లేక తిట్టి పంపేస్తారా? ఇంకో విషయం కూడా ఆలోచించాలి. జేన్ ని పెళ్ళాడితే, జేన్ తో పాటు ఎల్సీ బాధ్యత కూడా తీసుకోవలి. వచ్చే డబ్బుతో ముగ్గురం సర్దుకోగలమా? ఎందుకంటే జేన్ ని పెళ్ళాడడమొక్కటే కాదు తనకు కావల్సింది, ఆమెని సంతోషంగా వుంచడం కూడా! అంతే కాదు, ఆ డబ్బుతో తను పదిమందికీ పనికొచ్చే పనులు చాలా చేయాలని ఆశపడ్డాడు. మరి వాటి మాటో?

రకరకాల ఆలోచనలు సాగిపోతున్నాయి అతని మనసులో.

జేన్ వైపు తల తిప్పి చూసాడు. ఆమె కళ్ళల్లో ఆప్యాయత, స్నేహం చూసి అతనికి తనేం చేయాలో అర్థమైపోయింది. తను డబ్బూ, ఎస్టేటు అన్నీ ఏదైనా చారిటీ ట్రస్టులకిచ్చి జేన్ ని పెళ్ళాడతాడు. తను ఒప్పుకుంటుందా? తప్పక ఒప్పుకుంటుంది. తన మనసేమిటో ఇంకా ఆమెకి తెలియదా? తను ఇక ఒంటరివాడు కాదు.

ఆ రాత్రి అతను ఆలోచనలతో నాటకం సరిగ్గా చూడలేకపోయాడు. జేన్, ఎల్సీలు మాత్రం చాలా సంతోషంగా ఆ రాత్రి నాటకాన్ని చూసారు. తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు నాటకం గురించి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కేమీ తోచలేదు. విమర్శ అంతా ఎల్సీయే చేసింది.

  ***

(సశేషం)

వీలునామా – 13వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

ఎడిన్ బరోలో బ్రాండన్

“నాతో పాటు డాన్సు చేయడం మీకు బాగుంటుందో లేదో! నేను మీలా ఇంగ్లండు నాజూకు తెలిసిన మనిషిని కాను. ఆస్ట్రేలియాలో తిరిగే మోటు మనిషిని,” బ్రాండన్ ఎల్సీతో వినయంగా అన్నాడు. ఎల్సీ కొంచెం కొత్త మనిషి ముందర కంగారు పడింది. దానికి తోడు అతను ఒడ్డూ పొడవూ బాగా వుండి, ఎండలో వానలో తిరిగినట్టు మొరటుగా వున్నాడు. అతనితో నాట్యం చేయాల్సిన బాధ్యత తప్పినందుకు ఎలీజా రెన్నీ చాలా సంతోషించింది.

“ఆస్ట్రేలియాలో మీరు వుండేది ఎక్కడ?” ఎల్సీ అడిగింది అతన్ని.

“విక్టోరియా. ఇంతకు ముందు దాన్ని పోర్టు ఫిలిప్ అని పిలిచేవారు.”

“మీరక్కడికి వెళ్ళి చాలా కాలమైందా?”

“చాలానే అయింది. ఇక్కడ నా స్నేహితులు నన్ను మరిచిపోయేంత. అలాగని నాకు నా స్నేహితుల మీద కోపమనుకునేరు. అలాటిదేమీ లేదు.”

అతని యాసా, వాడే మాటలూ కొంచెం విభిన్నంగా వున్నాయి. బహుశా అది ఆస్ట్రేలియాలో వాడుక భాష అయివుండొచ్చు అనుకున్నదామె.

“ఎల్సీ! అక్కడ జీవితం బలే మోటుగా వుంటుందిలే. ఇక్కడ మీ అందరి మంచి బట్టలూ, మర్యాదలూ, నవ్వులూ, మాటలూ చూస్తూ వుంటే భలే హాయిగా వుంది. నేనిక్కడికి వచ్చీ చాలా యేళ్ళయిపోయిందేమో, ఇదంతా ఎదో పూర్వ జన్మ ఙ్ఞాపకం లా వుంది.”

ఎల్సీకి అతనెవరో తెలిసిపోయింది. ఆమెకి గమ్మత్తుగా నిపించింది. ఇతని గురించి నాకు చాలా తెలుసు, కానీ ఇతనికి నా గురించే మీ తెలియదు కదా అనుకుంది. అచ్చం పెగ్గీ వివరించినట్టే వున్నాడతను.

“ఇంగ్లండు వచ్చి ఎన్నాళ్ళయింది?” అడిగింది.

“కొద్ది నెలలు.”

“మీ బంధువులంతా ఇంగ్లండులో లేరా? స్కాట్లాండు కెందుకొచ్చారు?”

“ఆస్ట్రేలియాలో వుండే మనవాళ్ళంతా బ్రిటన్ మొత్తం చూడాలని ఆశపడతారు. ఇక్కణ్ణించి వెనక్కెళ్ళింతర్వాత ఉత్త ఇంగ్లండు వెళ్ళొచ్చానంటే చులకనగా చూస్తారు. అందుకే ఈ ట్రిప్పులో స్కాట్లాండు చూద్దామనుకున్నాను. అయితే ఇక్కడ మాకు దూరపు బంధువులు కూడా వున్నారనుకోండి. అదిగో, అక్కడ కూర్చుని వుందే పెద్దావిడ, ఆవిడ నాకు దూరపు చుట్టం. వరసకు పిన్ని అవుతందనుకుంటా. ఆవిడ రెన్నీ వాళ్ళకి కూడ దూరపు బంధువే. మీ స్కాట్ లాండు వాళ్ళకి బంధుత్వాలూ, బంధు ప్రీతీ ఎక్కువేమో కదూ? ఎప్పుడూ విందులూ వినోదాలు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడీ విందు నాకూ బాగుందనుకోండి,” ఎల్సీ కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు.

“హ్మ్మ్… విందుల్లో సంతోషంగా చలాకీగా వుండడం ఇప్పుడు ఫాషన్ కాదండీ! ఇప్పుడు మా దగ్గర మగవాళ్ళంతా ఎప్పుడూ ఏదో మునిగిపోయినట్టు మొహం పెట్టడం ఫాషన్. నాకైతే సంతోషంగా వున్నవాళ్ళే బాగనిపిస్తారు.”  చిరునవ్వుతో బదులిచ్చింది ఎల్సీ.

“అంత సీరియస్ గా మొహాలు పెట్టుకోవడం దేనికో! అసలు నన్నడిగితే ఇంగ్లండు, స్కాట్ లాండు దేశాల్లో వుండగలిగే వాళ్ళు చాలా అదృష్టవంతులన్నట్టే లెక్క. ఎప్పుడూ విందులూ వినోదాలూ, చదువుకోవడం, సాహిత్య చర్చలూ, సంతోషాలూ, అంతా నాజూకు వ్యవహారం. ఎండకి ఎండి, వానకి తడిసే నాలాటి వాడికి కొంచెం అర్థం కాని జీవిత శైలి. కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది కూడ! ఈ సంతోషంలో ఎక్కువ రోజులుండలేను. మళ్ళీ మా వూరికి ప్రయాణం తప్పదు కదా అని.”

అప్పటికి వాళ్ళ నాట్యం ముగిసి ఒక పక్కకొచ్చి నిలబడ్డారు. పక్కనే నిలబడి వుంది జేన్. అతని మాటలు విని,

“మీరనుభవిస్తున్న సంతోషం దేశం వల్లా, విందుల వల్లా వచ్చింది కాదు. మీ మనసులోంచి వచ్చింది. అక్కడ కష్ట పడి పనిచేసారు. ఇక్కడ ఆట విడుపుగా వుంది. అంతే!” అంది.

“ఆస్ట్రేలియానించి ఇక్కడికొచ్చినప్పుడే మాకక్కడ లేనిదేమిటో బాగా అర్థమయ్యేది,” అన్నాడు బ్రాండన్.

“అది పరిస్థితులని బట్టి వుంటుందేమో. నాకైతే బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ళు ఆస్ట్రేలియాలో వుంటే బాగుండనిపిస్తుంది.”

“నాక్కూడా!” అప్పుడే ఫ్రాన్సిస్ తో కలిసి అక్కడికొచ్చిన ఎలీజా రెన్నీ అందుకొంది.

“ఎవరూ అడుగుపెట్టని ప్రదేశం చాలా కొత్తగా, ఉహాతీతంగా వుండొచ్చు కదా? అందులోనూ ఆ బంగారు గనులెలా వుంటాయో చూడాలన్న కుతూహలం కూడా.!”

“ఛండాలంగా వుంటాయి. మీరనే ఆ కొత్తదనమూ, ఉత్సాహమూ మచ్చుకైనా కనబడవు. చెట్లూ చేమలూ లేని ఎడారి ప్రదేశం, ఒంటరితనం, తెగని చాకిరీ, ఏం గొప్పగా వుంటాయి చెప్పండి? విక్టోరియా కెళ్ళగానే ఎప్పుడెప్పుడు ఇక్కణ్ణించి బయటపడదామా అనిపిస్తుంది! బ్రిటన్ అందానికి సాటి వచ్చే ప్రదేశం ఎక్కడా వుండదేమో!” బ్రాండన్ అన్నాడు.

“మన దేశం కంటే మనకింకే దేశమూ నచ్చదనుకోండి!” ఎలీజా ఒప్పుకుంది.

“అయినా బ్రతుకు తెరువు వెతుక్కుంటూ భూమి నలుమూలలా చుట్టి రావడం కూడా అద్భుతంగా వుంటుందేమో! మన ఆంగ్లో- సాక్సన్ జాతి

కున్న శక్తే, ఎలాటి ప్రదేశంలోనైనా నెగ్గుకు రావడం. అందుకే మన వాళ్ళే ఎక్కువ వలస రాజ్యాలు స్థాపించారు.”  జేన్ అభిప్రాయపడింది.

“మీరన్నదీ నిజమే. నన్ను చూడండి. ఆస్ట్రేలియా జీవితానికెంత అలవాటు పడిపోయానో! అది సరే కానీ, మిస్ రెన్నీ, ఈ వచ్చే పాటకి నాతో మీరు నాట్యం చేయగలరా?” బ్రాండన్ మర్యాదగా ఎలీజాని అడిగాడు.

ఎలీజా అయిష్టంగానే ఒప్పుకుని వెళ్ళింది. ఫ్రాన్సిస్ ఎల్సీ పక్కకొచ్చి నిలబడ్డాడు.

అతన్ని చూసి ఎల్సీ మొహమాట పడింది. దానికంటే, తన కవితల గురించి అడుగుతాడేమోనని భయపడింది. తను వచ్చీ రాని కవితలని ప్రచురణకి పంపటం చూసి నవ్వుకున్నాడేమో. అంతకంటే అతను తన ప్రయత్నాలని చూసి పడబోయే జాలిని తల్చుకుని ఇంకా వొణికిపోయింది.

అతనితో ఏమి మాట్లాడకుండా పాటలు వినే నెపంతో, అక్కణ్ణించి వెళ్ళి బాండు మేళం పక్కన నిలబడింది. వాళ్ళకి తన గురించీ, తన కవితల గురించీ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర భయం లేనట్టనిపించిందామెకి.

దూరం నించి ఆమెని చూసిన ఎలీజా, తనతో పాటు పాటకి అడుగులేస్తున్న బ్రాండన్ తో ఎల్సీ గురించీ, జేన్ గురించీ చెప్పింది.

“నాన్నగారు చెప్పారు. ఇద్దరు అక్కచెల్లెళ్ళూ బాగా చదువుకున్నారట, కానీ మేమందరం చదివినట్టు కాకుండా, కొత్త కొత్త చదువులు చదివారట. విచిత్రంగా అందువల్లే వాళ్ళకి బ్రతుకు తెరువు దొరకడం కష్టమై పోయింది.”

బ్రాండన్ ఏమీ జవాబివ్వకుండా ఎల్సీ వైపు చూస్తూ నిలబడ్డాడు.

“పాపం, ఒంటరిగా నిలబడింది. బ్రాండన్, మనం ఆమె దగ్గర్కికి వెళ్దామా? ఇప్పుడు మనమీ డాన్సు ఆపేస్తే కొంపేమీ మునగదుగా!”

ఎలీజాకి నిజానికి బ్రాండన్ తో కలిసి డాన్సు చేయడం కొంచెం కూడా నచ్చడం లేదు. వాళ్ళు ఎల్సీ దగ్గరకొచ్చేటప్పటికి, అక్కడికి మాల్కం కూడా వచ్చాడు ఎలీజాని చూసి.

“హలో మాల్కం. బాగున్నావా? ఈవిడ ఎల్సీ మెల్విల్. నా కొత్త స్నేహితురాలు. ఎల్సీ, ఇతను మాల్కం, ప్రఖ్యాత రచయిత.”

తనున్న పరిస్థితిలో ఎల్సీకి ప్రఖ్యాత రచయితలని కలిసే ధైర్యం లేదు. ఆమెకి దుఃఖంతో మాట పెకలనట్టయింది ఒక్క క్షణం. ఎలాగో గొంతు పెకలించుకుంది.

“అవునవును, జేన్ చెప్పింది మీ గురించి.”

“ధన్యవాదాలు. జేన్ కూడా వచ్చారా ఈ విందుకు?” చుట్టూ చూస్తూ అడిగాడు మాల్కం.

“అక్కడ ఫ్రాన్సిస్ తో మాట్లాడుతూంది.”

“ఫ్రాన్సిస్ తోనా? ఊమ్మ్.. మేధావులిద్దరూ ఏదో చర్చలో వున్నట్టున్నారు కదూ?” నవ్వాడు మాల్కం.

ఎలీజా ఎల్సీ వైపు తిరిగింది.

“ఎల్సీ! ఫ్రాన్సిస్ మీ ఎస్టేటునీ, గుర్రాలనీ, కుక్కలనీ చాలా శ్రధ్ధగా చూసుకుంటాడు తెలుసా? మీ ఇద్దరి గది చాలా విశాలంగా వుంది కాబట్టి దాన్ని అతిథులకోసం వాడదామని మా అమ్మ అంటే దాదాపు కొట్టినంత పని చేసాడు!”

“జంతువులని ప్రేమగా చూడమని జేన్ అర్థించింది ఫ్రాన్సిస్ ని.”

ఈ సంభాషణ ఎలీజాకి పెద్దగా నచ్చలా. మాల్కం వైపు తిరిగి,

“మాల్కం! నీ కొత్త నవల సంగతేమైంది?” అని అడిగింది.

“రాయటమూ, ప్రింటుకివ్వడమూ కూడ జరిగిపోయాయి.”

గర్వంగా నవ్వాడు మాల్కం.

“ప్రజలకి నచ్చుతుందో నచ్చదో! అయినా నువ్వు రాసిన నవల నచ్చకపోవడమంటూ వుండదులే.”

“మా పబ్లిషరు కథ బానే వున్నా, పాత్రల యాస ఇంకొంచెం గాఢంగా వుంటే బాగుండేదన్నాడు. కూలీ నాలీ జనం యాసలు మనకెలా తెలుస్తాయి చెప్పు? అయినా, ఒక ప్రేమా, ఒక లేచిపోవడమూ, ఒక విడాకులూ, ఒక దెబ్బలాటా, ఒక హత్యా, అన్నీ గుప్పించి రాసి పారేసా!”

“ఓ! నాకు రాత ప్రతి ఒక్కసారి ఇవ్వరాదూ! చదివి ఇచ్చేస్తాను!”

“అసలు నాకు ఈ కథలూ నవలలూ ఎలా రాస్తారో అర్థమే కాదు. ఒక దాని వెంట ఒకటి సంఘటనలు సాగిపోతూ! అంతా చివరికి ఒక పెళ్ళితోనో, మరణంతోనో ఆఖరయ్యేలా! బాబోయ్! తలచుకుంటేనే భయం వేస్తుంది నాకు. కథలే ఇంత కష్టమనిపిస్తే, ఇహ కవితల గురించి చెప్పేదేముంది. ఏమంటారు ఎల్సీ?” బ్రాండన్ అన్నాడు

బ్రాండన్ ప్రశ్నతో ఎల్సీ తడబడిపోయింది.

“అవును. కవితలెలా రాస్తారో నాకూ తెలియదు.” మొహమంతా ఎర్రబడుతూండగా అంది.

“కవితల గురించైతే మీరు, ఇదిగో ఈ రెన్నీ అమ్మాయినే అడగాలి. ఆవిడ చాలా కవితలు రాసారు.” మాల్కం ప్రకటించాడు.

“ఓ మాల్కం! ధూర్తుడా! నా రహస్యాన్నిలా అందరి ముందూ బయటపెడతావా! ఉండు నీ పని చెప్తా!” సంతోషాన్ని దాచుకుంటూ పైకి విసుక్కుంది ఎలీజా రెన్నీ.

“అవునా ఎలీజా? మీరు కవితలు రాస్తారా? ఇహ నాకు మీతో మాట్లాడాలన్నా భయం పట్టుకుంది. ఎల్సీ! నువ్వు కవితలూ కథలూ గట్రా రాయవు కాబట్టి నీ స్నేహమే బాగుంటుంది నాకు.” పరిహాసం చేసాడు బ్రాండన్.

“బ్రాండన్! కవితలు రాయడం అంత కష్టమేమీ కాదు. ఏదో ఒక ఆలోచన రావాలంతే!” ఎలీజా రెన్నీ అంది.

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మిరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఊదికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మీరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఉడికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“అలా కాదు. ఎలీజా, బ్రాండన్ గారికి నువ్వు కవితలతో తయారు చేసిన ఆల్బం చూపించు.” మాల్కం సూచించాడు.

ఎల్సీ కుతూహలంగా, “అవును చూపించండి. నేనూ చూస్తాను. నాకు కవితలు చదవడమంటే చాలా ఇష్టం,” అంది. ఎలీజా రెన్నీ నవ్వు మొహంతో,

“సరే అయితే! లైబ్రరీ గదిలోకి వెళ్దాం రండి. నేనసలు ఆ ఆల్బం ఎవరికీ చూపించను. అది చదివితే బ్రాండన్ గారికి కవితలు రాయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలిసొస్తుందని చూపిస్తున్నా, అంతే!” అంటూ ఎలీజా బయటికి దారితీసింది. ”

ఆల్బం తీసి వారికిస్తూ, “నేను రాసిన కవితలన్నిటి కిందా నా సంతకం, ఎల్లా, అని వుంటుంది.” అని బయటికెళ్ళిపోయింది.

ఎల్సీ, బ్రాండన్ అక్కడే సోఫాలో కుర్చుని ఆల్బం తెరిచారు.  దాన్లో కొన్ని ఎలీజాకి నచ్చిన వేరేవారి కవితలూ, కొన్ని ఆమె సొంతంగా రాసుకున్నా కవితలూ వున్నాయి. ఎల్సీ ఆత్రంగా ఎలీజా కవితలన్నీ గబ గబా చదివేసింది.

“అబ్బో! ఎంత బాగున్నాయో. ఇవన్నీ పత్రికల్లో వచ్చి వుంటాయంటావా? వీటన్నిటినీ ఒక పుస్తకం లా అచ్చేయించుకోలేదెందుకో!” బ్రాండన్ ఆశ్చర్యంగా అన్నాడు.

“ఎందుకంటే, కవితలు పత్రికల్లో ఒకటీ రెండూ ప్రచురించుకోవడం తేలిక. పుస్తకం అచ్చేయించాలంటే చాలా కష్టం.” ఎలీజా అతనికి వివరించింది

“అలాగా? అయినా అచ్చులో పేరు చూసుకోవడం బాగుంటుందేమో కదూ?”

ఏదో అనబోయి ఆగింది ఎల్సీ.  బ్రాండన్ ఇంకా కవితలు చదువుతూనే వున్నాడు.

ఒక కవిత చూపించి నవ్వాడు బ్రాండన్.

“ఇది చూడు. ‘బ్రతుకు ప్రయాణం’ అట. హాయిగా అమ్మా నాన్నలతో సురక్షితంగా జీవితం గడిపే ఎలీజా రెన్నీకి బ్రతుకు ప్రయాణం గురించి ఏం తెలుసు?”

“అవునవును! ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చిన వాళ్ళకే బ్రతుకు ప్రయాణం గురించి మాట్లాడే హక్కు వుంటుంది కాబోలు,” అతన్ని వెక్కిరించింది ఎల్సీ. నవ్వాడు బ్రాండన్.

“అదేం లేదులే. అయినా ఈ కవిత బాగానే వుంది.”

“గ్లాస్గో దాటి వెళ్ళని అమాయకురాలు రాసినా కూడా బాగుందా?”

“ఎలీజా రెన్నీ గ్లాస్గో దాటి వెళ్ళలేదు కాబట్టి ఆమె తెలివి తక్కువదని నేను తీర్మానించలేదు. అంత వెటకారం చెయ్యక్కర్లేదు. అయినా, నిజం చెప్పు. మీరిక్కడ సురక్షితంగా కాలం గడుపుతూ, మాకు  ప్రపంచం తెలుసంటే నమ్మేదెవరు?”

“మీరన్నదీ నిజమే. ఆడవాళ్ళం ఇల్లు దాటి ప్రపంచం చూడం. ఇహ ప్రపంచం గురించి మేం చెప్పేదేముంటుంది? అందుకే మగవాళ్ళకి ఆడవాళ్ళు రాసే పుస్తకాలంటే చులకన కాబోలు!” సాలోచనగా అంది ఎల్సీ.

“మీరు నేనన్నదానికి భలే విపరీతార్థాలు తీస్తున్నారే! నిజానికి నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఎంత తక్కువ అవకాశాలు వున్నా, వాళ్ళు ప్రయత్నం మానరని. ఇహ పుస్తకాల గురించి నా అభిప్రాయలకసలు విలువే లేదు. నేను చదివిందే చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడీ కవిత విషయమే తీసుకుందాం. నాకు బాగానే అనిపిస్తుంది. అయితే నిజానికి నాకు ఈ ముందు మూడు మాటలకీ అసలు అర్థమేమిటో కూడా తెలియదు! అయినా నాకు బాగుంది. ఎందుకు బాగుందంటే చెప్పలేను.”

“కవి పాఠకుడి నించి ఆశించేదీ అంతే. ”

“అంతేనా? నేనింకా కవులు ప్రబోధిస్తూ వుంటారనుకున్నానే. ఏమైనా, నాకు ఎక్కువగా చదువుకున్న ఆడవాళ్ళంటే కొంచెం భయం. ఈ మధ్య ఆడ పిల్లలూ, వాళ్ళ తెలివి తేటలూ, శక్తి సామర్థ్యాలు చూస్తూవుంటే నాలాటి వాళ్ళకి వొణుకొస్తూంది! కొంపదీసి నూవ్వూ బోలెడు చదువు చదివేసావా ఏమిటి?”

“అదేం లేదు. నేను చాలా మామూలు అమ్మాయిని.”

“నిజంగానా? అద్భుతంగా పియానో వాయించలేవూ?”

“ఉహూ! అసలు నాకు సంగీతమే రాదు.”

“పోనీ, అందమైన ప్రకృతి దృశ్యాలు గీయడం?”

“అబ్బే…”

“అయితే నువ్వు సైన్సూ, లెక్కల టైపన్న మాట! వాళ్ళంటే ఇంకా భయం నాకు.”

“మా మావయ్య నాకు సైన్సు చెప్పించాలని చాలా ప్రయత్నం చేసారు కానీ, నాకే అబ్బ లేదు.”

“ఇంత మంచి వార్త నేను ఈ జన్మ లో వినలేదు. నీముందు ఏ తప్పులు మాట్లాడతానో అని వణికిపోతూ వుండక్కర్లేదు.”

“మీరు తప్పు మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి సరి దిద్దితే అంత బాధ పడడానికేముంది? మీకది మంచిదేగా?”

“మంచిదే అనుకో! కానీ భలే అవమానంగా వుంటుంది. ఐనా, ఆడవాళ్ళు భలే కష్ట పడి పనిచేస్తారు. గంటలు గంటలు సంగీతం ఎలా సాధన చేస్తారో పాపం.”

“అక్కయ్య ఎప్పుడూ అంటుంది- ఆడవాళ్ళు వాళ్ళకి తేలికగా అబ్బని సంగీతం మీద అంత శ్రమా, సమయం వ్యర్థం చేస్తారూ, అని!”

 

(సశేషం)

 

వీలునామా-12 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సంభాషణ

ఫ్రాన్సిస్ పార్టీకి వెళ్ళే ముందే జేన్ ని కలవాలని ఆశపడ్డాడు. కానీ, అతను పెగ్గీ ఇల్లు చేరేటప్పటికి అక్కా చెల్లెళ్ళు బయటికెళ్ళారని తెలిసింది. దాంతో నిరాశగా రెన్నీ గారిల్లు చేరుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత జేన్, ఎల్సీ ఇద్దరూ విందుకు హాజరయ్యారు.

అతనికి వాళ్ళిద్దర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది. నిజానికి వాళ్ళిద్దరూ పెద్ద అందగత్తెలు కాదు. ఇద్దర్లో కాస్త ఎల్సీ పర్వాలేదనిపిస్తుంది. జేన్ చాలా సాధారణంగా వుంటుంది. ఈ మధ్య తగిలిన ఎదురు దెబ్బలతో ఎల్సీ మొహం కొంచెం పెద్దరికాన్ని సంతరించుకుని బాగుంది. కానీ, ఫ్రాన్సిస్ కి జేన్ వంకే చూడాలనిపిస్తుంది. ఆమె మొహంలో అలసట నిరాశ చూసి అతనికి ఏదో తెలియని బాధ అనిపించింది. కనిపించగానే ఆమె చేతులు పట్టుకుని, అక్కడ మాట్లాడుకుందాం పద, అంటూ ఒక పక్కకి తీసికెళ్ళాడు. ఎల్సీ కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేసింది.

రెన్నీ గారి అమ్మాయి వచ్చి ఎల్సీని ఎవరికో పరిచయం చేస్తానని తీసికెళ్ళింది. మామూలుగా వుండే జెన్నీ కంటే కొంచెం చూపులకి నదురుగా వుండే ఎల్సీ కి స్నేహితులని చూపెట్టడం కష్టం కాదు, అనుకున్నారు రెన్నీ కుటుంబ సభ్యులు.

“తరచుగా ఉత్తరాలు రాసుకుంటూనే వున్నాం. ఇంకా కబుర్లేం వుంటాయి ఫ్రాన్సిస్?” చిరునవ్వుతో అంది జేన్.

“ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా, కలుసుకునేటప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడంత వుంటుంది. అసలు నీ వుత్తరం చూసినప్పుడల్లా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి చెప్పు, నీ ఉద్యోగప్రయత్నాలెలా వున్నాయి?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ లేదు ఫ్రాన్సిస్. ఎల్సీకి ఆ మధ్య వచ్చిన ఉత్తరం చూసి కృంగి పోయింది. ఆ వుత్తరం మరీ మొరటుగా రాసారులే. పాపం దాన్ని చూస్తే జాలేసింది. ఇహ ఆ తర్వాత మొత్తానికే రాయడం మానేసింది.”

“మరి నీ సంగతి?”

“ఏముంది? ఏమీ లేదు. ఎవరైనా ప్రైవేటు చెప్పించుకుంటే బాగుండని ప్రయత్నించాను. అదీ దొరకలేదు. ఇహ బట్టల కొట్లో కుట్టు పని తప్ప ఇంకేదీ దొరికేటట్టు లేదు. ”

“అయ్యో! నీకెలా సాయపడాలో నాకర్థం కూడా కావడం లేదు.”

“అదేం లేదు ఫ్రాన్సిస్. నిజానికి నేనంత బాధల్లో ఏమీ లేను తెలుసా? నిజమే, భవిష్యత్తు తలచుకుంటే భయంగానే వుంది. కానీ, మరీ అంత నిరాశగా కూడా లేను. పెగ్గీ చాలా మంచిది. నన్ను చాలా విధాలా ఆదుకుంటూంది. అన్నిటికంటే నన్ను అభిమానంగా, గౌరవంగా చూస్తుంది. ఇహ పిల్లలయితే చెప్పనే అక్కర్లేదు. అందరికంటే తెలివైన వాడు టాం. చూస్తూ వుండు, వాడు ఎంత పెద్దవుతాడో. ఆడవాళ్ళకిమాకు పైకెదగడానికి అవకాశం వుండదు కాబట్టి,  పైకెదగాలన్న ఆశయం వున్న వాళ్ళని చూస్తే ఎక్కళ్ళేని సంతోషమూ! నాకెటూ అన్నదమ్ములో, భర్త గారో, కొడుకులో లేరు కదా! అందుకే నేను టాం లౌరీ భవిష్యత్తు గురించీ, నీ భవిష్యత్తు గురించీ కలలు కంటూ ఉంటాను.  నా మొహం చూసి నా కష్టాలు ఊహించుకోకు. సాయంత్రం పూట టాం, నాన్సీ లకి పాఠాలు చెప్పేటప్పుడు నన్ను చూడు! అప్పుడు అర్థమవుతుంది నేనెలాగున్నానో. ఇక్కడికొచ్చేసరికి నా పాత జీవితం అంతా ఙ్ఞప్తికొచ్చింది. అంతే!”

“నీ మాటలతో నా మనసు తేలికైంది జేన్. కానీ…”

“ప్రతీ సంఘటనలోనూ మంచీ చెడూ వుంటాయి ఫ్రాన్సిస్. ఈ సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను. కొంతమంది అన్ని సుఖాలూ, సౌకర్యాలూ వున్నా,  ఇంకా దేనికోసమో ఏడుస్తున్నట్టుంటారు. ఇంకొంతమంది దుర్భరమైన జీవితం లో కూడా అన్నీ వున్నట్టు ధీమాగా వుంటారు. దేన్నైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది. ఆ మధ్య నేనో పేదరాలిని చూసాను. ఆవిడకి లేని కష్టం లేదంటే నమ్ము!  అష్టకష్టాలూ పెట్టే భర్తా, స్వార్థపరులైన పిల్లలూ, పేదరికమూ, అనారోగ్యమూ! ఆమె సంతానంలో ఒక్క కొడుకు మాత్రం మూడు నెలలకోసారి వచ్చి కొంచెం డబ్బిచ్చి వెళ్తాడు. ఆవిడని చూస్తే, ఏ నమ్మకంతో ఆవిడ బ్రతుకీడుస్తుందా అని మనకే అనుమానం వేస్తుంది. కానీ ఆవిడ నవ్వు మొహం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్లో ఒక్క మాట కూడా నమ్మలేవు నువ్వు! ఆవిడని చూసింతర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసింది. ఇంకా నాకు, ఆరోగ్యమూ, చదువూ, చిన్న వయసూ వున్నాయి. నేనింత నిరాశతో దిగజారిపోవడం ఏమిటి అనిపించింది. అది సరే కానీ, నువ్వు ఫ్రాన్స్, ఇంగ్లండు అంతా చుట్టి రావాలానుకున్నావు. చూసొచ్చావా? ప్రయాణం విశేషాలేమిటి?” కుతూహలంగా అడిగింది జేన్.

“ప్రయాణం బాగా జరిగింది. కొంచెం ఫ్రెంచి మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. అన్నట్టు, మనం ఎస్టేట్లో ఒక ఉత్తరం చదివాం చూడు, ఫ్రెంచి మహిళ, మార్గరెట్! గుర్తుందా? ఆవిడ కూతురు క్లెమెన్స్ ని కలిసాను. ఇప్పుడావిడ శ్రీమతి లీనాయ్.”

“అవునా? ఏలా వుందావిడ?”

“చూడడానికి మామూలుగా వుంది కానీ, మాట్లాడితే భలే బాగుంది. సుతి మెత్తని యాసా, నాజూకూ, డబ్బున్న స్త్రీల హుందాతనమూ! నేనొక్కటి చెప్పనా? మన ఇంగ్లీషు యువతులంత అందంగా వుండరు ఫ్రెంచి అమ్మాయిలు. కానీ, వాళ్ళ సంభాషణా చాతుర్యంతో నెగ్గుకొస్తారు ఎక్కడైనా.”

“ఆవిడని ఎలా కలిసావు?”

“ఫ్రెంచి సొసైటీలో జొరబడడం ఇక్కడికంటే తేలిక. ఒక ఫ్రెంచి హోటల్లో ఒకాయన కనిపించాడు. నాన్నగారికి పాత స్నేహితుడట. నా పేరు చూసి నాన్న గారిని గురించి అడిగాడు. ఆ తర్వాత అతనితో ప్రతీ విందుకీ తీసికెళ్ళాడు. అసలు నాకు మనుషులతో మాట్లాడడమంటేనే సిగ్గూ, మొహమాటం. అలవాటు కూడ లేదాయె. సరే, మొత్తం మీద ఎలాగో నెట్టుకొచ్చాను. ”

“కొత్త వాళ్ళముందు అంత సిగ్గు పడడానికేముంది ఫ్రాన్సిస్? అయినా నీకు బాంకు లో ఎంతో మంది స్నేహితులుండాలిగా?”

“అవుననుకో! కానీ, ఆడవాళ్ళతో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందే. అందులోనూ, జేన్, ఇల్లూ వాకిలీ, కుటుంబమూ, అమ్మా నాన్నా లేని నాలాటి అనాథకి ఇతర్లతో స్నేహంగా మాట్లాడే అలవాటు ఎలా వుంటుంది చెప్పు? వింత ఏమిటో తెలుసా? అందరూ ఇప్పుడు నా తండ్రెవరో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చాలా సంతోషంగా దర్జాగా వున్నాననుకుంటారు. కానీ నాకెందుకో ఇంకా సిగ్గుగా మొహమాటంగానే అనిపిస్తుంది.”

“నేనూ నువ్వు సంతోషించి వుంటావనే అనుకున్నా మరి!”

“నన్ను కన్న తల్లీ తండ్రులు ఒకర్నొకరు ప్రేమించుకోలేదు. మోసం చేసుకున్నారు. నన్ను కన్న తల్లికి నా మీద ప్రేమ లేదు. నా తండ్రికి నా పట్ల బాధ్యత తప్ప మరేమీ లేదు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు లేకపోగా అలవిమాలిన అసహ్యం. నా పరిస్థితి నీకర్థం కాదు. నా వునికే నాకు చాలా అవమానకరంగా తోస్తుంది. ”

“అమ్మా నాన్నల మధ్య వుండే ప్రేమలతోటే మన ఆత్మ గౌరవాలు ముడి పడి వున్నట్టయితే, నా పరిస్థితీ అంతే మరి. మేము పుట్టిన కొన్నేళ్ళకే అమ్మ మనసులో నాన్న పట్ల ప్రేమ చచ్చిపోయింది. ఆయనకైతే స్వార్థం తప్ప ఆమె మీద ప్రేమ ఎన్నడూ లేదు. అందుకే అలాటి ఆలోచనలు మానేద్దాం. అమ్మా నాన్నల మాటెలా వున్నా మనం దేవుని బిడ్డలం. ఆయన ప్రేమ అందరికీ అందుతుంది కాబట్టి దాంతో తృప్తి పడదాం. ఇంతకీ క్లెమెన్స్ తల్లి గురించి నీతో మాట్లాడిందా?”

“మాట్లాడింది. తన తల్లికి నా పేరే వున్న స్నేహితుడు వుండేవాడనీ, ఆ స్నేహితుడు మా నాన్నేననీ తెలిసి చాలా సంతోషించింది. తల్లి చిత్తరువు కూడ చూపించింది.”

“అయితే ఫ్రాన్సులో చాలా సరదాగా గడిచిందన్నమాట.”

“అవును! అందులో ఫ్రెంచి వాళ్ళ మాటలు, అబ్బో! ఏం చెప్పమంటావు. హాస్యమూ, చమత్కారమూ నిండి వుంటాయి. పెద్దగా వాదించుకోరు కానీ, అభిప్రాయాలు బానే ఇచ్చి పుచ్చుకుంటారు. వాళ్ళకి రాజకీయ స్వాతంత్ర్యం లెదని మనమేదో జాలి పడతాం కానీ, నాకైతే వాళ్ళకి భావ స్వాతంత్ర్యం చాలా వుందనిపించింది. అక్కడ చిన్న రైతులు వుంటారు. మన దగ్గరేమో చిన్న రైతులన్నవాళ్ళే కనబడరు. అంతా మోతుబర్లు, మిగతా వాళ్ళు రైతు కూలీలు. ఈ రైతు కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా వుంటుందో తెలుసా? మన దగ్గర కూడా రైతు కూలీలకి చిన్న చిన్న పొలాలిస్తే వ్యవసాయం బాగు పడొచ్చేమో!”

“అదేమిటి ఫ్రాన్సిస్? చిన్న చిన్న పొలాలౌ ఆర్థికంగా మంచి కాదంటారు కదా? మరీ మన బ్రిటన్ లాటి కిక్కిరిసిన దేశంలో పెద్ద పొలాలు సాగు చేయడంలోనే లాభముందేమో! అప్పుడు డబ్బూ, యంత్రాలూ, మానవ వనరులూ ఎక్కువ అవసరం వుండదు కదా?”

“అవును. ఇక్కడంతా అలాగే అనుకుంటాం. ఫ్రాన్సు లో వేరేలా ఆలోచిస్తారు. ఒక భూస్వామి దగ్గర వంద ఎకరాలున్నాయనుకో. దాన్ని యాభై మంది రైతుకూలీలు సాగు చేస్తున్నారనుకో. ఆ పొలానికి తాము స్వంతదార్లం కాదన్న నిరాసక్తత వుంటుంది వాళ్ళలో. అదే వాళ్ళకి తాము తలా రెండెకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పామనుకో. అదే భూమిలో కష్టపడి బంగారం పండిస్తారు. అందుకే అన్నారు-‘ ఏడేళ్ళు పొలానికి కౌలుకిస్తే, తోటలాటి భూమి కూడా బీడు పడిపోతుంది. అదే మనిషికి సొంతానికి ఎడారి లాటి భుమినిచ్చినా, ఏడేళ్లలో దాన్ని నందనవనంలా మార్చగలడూ- అని! అదే ఆలోచన అమలులో పెట్టాలనుకుంటున్నాను.”

“ఏమిటది?”

“మన ఎస్టేటులో గుట్ట వెనకాల ఊరికే స్థలం పడి వుంది చూడు, దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి పాలేర్లలో కష్టపడే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నా. పదేళ్ళలో వాళ్ళు దాన్లో మంచి పంట పండించగలిగితే, అది వాళ్ళే వుంచేసుకోగలిగే ఒప్పందం మీద. ఆ మాటకొస్తే నీకసలు రెండు ఆలొచనలు చెప్దామనుకున్నా.”

“బాగుంది. రెండో ఆలోచన ఏమిటి? చెప్పు చెప్పు!”

“ముందుగా పొలంలో పని చేసే పాలేర్లందరికీ చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నా. ఎప్పుడైనా ఆ పాలేర్ల ఇళ్ళు చుసావా? దుర్భరంగా వుంటాయి. భూస్వాములూ, రైతులూ మంచి ఇళ్ళు కట్టుకుంటారు కానీ, కొంచెం కూడా ఆ పాలేర్ల సంగతి పట్టించుకోరు. అందుకే ఇంకొంచెం శుభ్రంగా వసతిగా వుండే చిన్న ఇళ్ళు ప్లానులు గీయించి పట్టుకొచ్చాను. తర్వాత చూపిస్తాను.”

“పెగ్గీ అభిప్రాయం కనుక్కుందాం. తను అలాటి ఇళ్ళల్లోనే పెరిగింది కాబట్టి తన అభిప్రాయం నమ్మదగ్గదై ఉండొచ్చు.”

“నిజానికి అలా చిన్న ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి పెద్ద డబ్బు కూడా ఖర్చు కాదు తెలుసా? ఆ మధ్య చామర్స్ గారు నన్ను భవంతిని కొంచెం మార్చమనీ, కొన్ని కొత్త గదులు కట్టించమనీ సలహా ఇచ్చారు. అప్పుడనిపించింది, అదే డబ్బుతో ముఫ్ఫై కూలీలకి చిన్న యిళ్ళు కట్టించొచ్చు కదా అని! దీన్లో ఇంకొక ఆలోచన కూడా వుంది. మన స్కాట్ లాండు నుంచి ఎంత మంది అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారో తెలుసా? మరీ ఆస్ట్రేలియాలో బంగారం కొరకు మన దేశం నుంచి కష్టపడగలిగే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఇంకొంత కాలం సాగితే ఇక్కడ పనికొచ్చేవాళ్ళెవరూ మిగలరేమో. అందుకే కనీసం నా పరిధిలోనేను పని వాళ్ళ పరిస్థితులు మెరుగు చేద్దామని ఆలోచిస్తున్నాను. నన్ను చూసి నాలా ఇంకొందరు చేయొచ్చు కదా? నువ్వేమంటావు?”

“నిన్ను చూసి నలుగురు చేసినా చేయకపోయినా, నీ ఆలోచన చాలా గొప్పది ఫ్రాన్సిస్!” మనస్ఫూర్తిగా అంది జేన్.

“సరే! ఎవరెవరికి ఇళ్ళు ఇవ్వదలచానో, ఎవరెవరికి భూమి ఇవ్వదలచానో పట్టిక రాసి వుంచాను. ఒక్కసారి నువ్వు చూసి నీ అభిప్రాయం చెపితే…”

“చాలా మంచి ఆలోచన ఫ్రాన్సిస్! మావయ్య నిన్ను ఆస్తికంతా హక్కుదారుణ్ణి చేసి మంచి పని చేసాడనిపిస్తుంది.”

ఇంకేదో చెప్పబోయిన జేన్, చాలా పరిచితమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది.

విలియం డాల్జెల్ రెన్నీ దంపతులని పలకరించి, కొంచెం ఇబ్బందిగా వున్న మొహం తో ఎల్సీతో మాట్లాడుతున్నాడు.

“రెన్నీ గారికి విలియం ఎలా తెలుసు?” ఫ్రాన్సిస్ ని అడిగింది జేన్.

“రెన్నీ వాళ్ళు అక్కడ ఎస్టేటు చూడడానికి వచ్చినప్పుడు చుట్టు పక్కల అంతా పరిచయం అయ్యారు. ఒక్క క్షణం జేన్! ఇప్పుడే వస్తాను. రెన్నీ గారి అమ్మాయితో ఒక్క డాన్సు చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ వస్తా!”

ఫ్రాన్సిస్ లేచి ఎలీజా దగ్గరకెళ్ళాడు.  ఎలీజా పక్కన విలియం డాల్జెల్ తో పాటు ఇంకొక అతను కూడా వున్నాడు.

“ మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఈ డాన్సు నేను ఫ్రాన్సిస్ హొగార్త్ తో చేస్తానని మాటిచ్చాను. కానీ మీ ఇద్దరితో డాన్సు చేయడానికి అందమైన అమ్మాయిలని వెదికే బాధ్యత నాది. సరేనా, ఇక్కడే వుండండి, ఒక్క క్షణం లో వస్తా! ”

అంటూ వెళ్ళింది ఎలీజా. రెండు నిమిషాల్లో లారా విల్సన్ ని అక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితురాలు లారా విల్సన్. బోలెడంత డబ్బూ, కొంచెం చదువూ వున్నవి కానీ, తెలివితేటలు తక్కువ. ఈ పార్టీకి ప్రత్యేకంగా ముస్తాబయి వచ్చింది. ఆమెతో డాన్సు చేయడానికి విలియం వెళ్ళాడు.

“ఫ్రాన్సిస్! మీ కజిన్ ఎలీసా ఈ కొత్త వ్యక్తితో డాన్సు చేస్తుందంటావా? జేన్ అయితే భలే సీరియస్ గా వుంటుంది. ఆమెని అడిగితే ప్రయోజనం వుండదు. ఎలీసాని ఇతనికి పరిచయం చేస్తా..” గుసగుసగా ఫ్రాన్సిస్ తో చెప్పి ఆ కొత్త వ్యక్తి చేయి పట్టుకొని ఎలీసాని వెతుక్కుంటూ బయల్దేరింది ఎలీజా.

ఆస్ట్రేలియానించి కొద్ది రోజుల క్రితమే వచ్చిన బ్రాండన్ కి  ఎల్సీని పరిచయం చేసింది ఎలీజా రెన్నీ.

(సశేషం)

వీలునామా -11 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి) 

ఎల్సీ ప్రయత్నం

 

ఎల్సీ మనసు రెండో రోజుకి కొంచెం కుదుట పడింది.

రోజూ ఉదయాన్నే లేచి అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు షికారెళ్ళి రావడం మొదలు పెట్టారు. దాంతో కాస్త మనసు సర్దుకునేసరికి, ఎల్సీ రాసుకోవడనికి కాగితాలు ముందేసుకుని కూర్చుంటుంది. జేన్ ఉద్యోగ ప్రయత్నాలకి బయటికి వెళ్తుంది.

ప్రతీ రోజూ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అయినా జేన్ ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాలేదు. ఊరికే వుండడం ఇష్టం లేక పెగ్గీకి సహాయం చేస్తూనే వుంది జేన్. పిల్లల పనులు చూడడం, వాళ్ళకి సాయంత్రాలు చదువు చెప్పడం చేయసాగింది. కొద్ది రోజుల్లోనే పిల్లల చదువులు మెరుగవడం గమనించి చాలా సంతోష పడింది పెగ్గీ! అందరికంటే పెద్దవాడు టాం జేన్ దగ్గర బాగా చదువుకోవడం అలవాటు చేసుకున్నాడు.

జేన్ మెల్లి మెల్లగా ఆ పిల్లలు చేసే అల్లరికీ, ఇంట్లో వుండే శబ్దాలకీ అలవాటు పడసాగింది. ఆమెకి బెస్సీ పిల్లలు అయిదుగురూ భలే తెలివైన వాళ్ళనిపించింది. టాం ఎలాగైనా పెద్ద చదువులు చదవాలనీ, మంచి ఉదోగం సంపాదించుకోవాలనీ పట్టుదలగా వున్నాడు.

చదువుకుంటూనే ఒక చిన్న కార్ఖానాలో తీరిక వేళల్లో పని చేయటం మొదలు పెట్టాడు టాం. అక్కడ వాడి కొచ్చే ప్రశ్నలకెవరూ సమాధానం చెప్పేవారు కాదు. అవన్నిటి గురించీ జేన్ తో చర్చించడం వాడికెంతో నచ్చేది. వాడి పట్టుదలా, శ్రధ్ధా జేన్ కెంతో ముచ్చటగా అనిపించేవి.

ఈ ప్రపంచంలో తన అవసరం వున్న మనిషి ఒకరైనా వున్నారన్నమాట అనుకుంది జేన్. అలాగే పెగ్గీ ఆశ ప్రకారం మిగతా పిల్లలకి చక్కగా రాయడం నేర్పించింది జేన్.

జేన్ ప్రభావం ఆ పిల్లల మీద బాగానే పడి, వాళ్ళు తమ మొరటు ప్రవర్తన వదిళేసి ఆమెలా హుందాగా, నాజూగ్గా ప్రవర్తించడం నేర్చుకోసాగారు. పెగ్గీకి ఎప్పుడూ ఏదో ఒక అవసరం వున్న వాళ్ళకి సహాయం చేసే అలవాటు పోలేదు. అలాటి అసహాయులందరినీ తరచూ ఇంటికి తీసుకొస్తూండేది.

అలాటి వారికి సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల సిగ్గు పడేది జేన్. అయితే అవసరంలో వున్న మనిషికి సహాయం చేయడానికి డబ్బొక్కటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు వున్నయని కాల క్రమేణా తెలుసుకుంది జేన్. వచ్చిన వారికి చిన్న చిన్న పనులుంటే చేసి పెట్టడం, సలహాలివ్వడం, కాగితాలు రాసి పెట్టడం మొదలైన చాలా పనులు చాలా సులువుగా చేయగలిగేది జేన్.

అయినా ఏదో రకంగా డబ్బు సంపాదించి తననీ చెల్లెల్నీ పోషించుకోవాలన్న దిగులు మాత్రం వదలడంలేదామెని. తనకేమో ఉద్యోగం దొరకడం లేదు. చెల్లెలి కవితల పుస్తకం ఎవరైనా ప్రచురించి కొంచెం డబ్బిస్తే బాగుండు. ఎన్నాళ్ళిలా పెగ్గీ దయా ధర్మాల మీద ఆధారపడి వుండడం, అనుకుందామె.

మొత్తం మీద ఎల్సీ ఒక పుస్తకంలో వెయ్యగ్లిగేన్ని కవితలు రాసిందని అనిపించేక, వాటిని పట్టుకుని పబిషరు దగ్గరికెళ్ళారిద్దరూ. ఆయన ఇంతకు ముందు, “ఆడపిల్లలు ఏదైనా రాసిస్తే ప్రచురించడం తేలిక” అన్నారని గుర్తు జేన్ కి.

పది రోజుల తర్వాత, “ఈ కవితలు బాగానే వున్నా, పుస్తకం లా ప్రచురించేంత బాగా లేవు,” అని ఉత్తరం వచ్చింది ఎల్సీ కి. ఆ ఉత్తరం చదివి ఎల్సీ కృంగిపోయింది.      నిరాశపడ్డ చెల్లెల్ని జేన్ ఓదార్చింది. ఎడిన్ బరో లోని ప్రచురణ సంస్థలు కాకుండా లండన్ పంపిద్దామని సూచించింది జేన్. ఎల్సీ మళ్ళీ ఉత్సాహంతో తన కవితలు లండన్ లోని ప్రచురణాలయాలకి పంపింది. అందరి దగ్గర్నించీ ఒకటే మాట!

“కవితలు బాగానే వున్నా, పుస్తకంలా ప్రచురించేంత బాగాలేవు, క్షమించవలసింది….” అంటూ.

కొన్ని ఉత్తరాలు సంక్షిప్తంగా వుంటే, కొన్ని సుదీర్ఘంగా వుండేవి.

“…మా దగ్గర లెక్కకు మించి కవితా సంకలనాలున్నా, మేము కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అత్యంత శ్రధ్ధతో పరిశీలించాము. మా సంపాదకుడి అభిప్రాయం ప్రకారం అవి ప్రచురణకి ఇంకా సిధ్ధంగా లేక పోవదం మూలాన, వాటిని సంకలనంగా వేయలేమని చెప్పుటకు చింతిస్తున్నాము…” అంటూనో, లేక

“….కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అక్కడక్కడ బానే వున్నా, వాటిల్లో అన్నిట్లో ఒకటే ముఖ్యాంశం అవడం వల్ల పాఠకుడికి ఆసక్తి కలిగించలేవు. అందుచేత వాటిని ప్రచురించడం వీలుపడదని చెప్పుటకు చింతిస్తున్నాము….”

అంటూనో వుండేవి.

అలాటి లేఖ వచ్చిన ప్రతీసారీ, ఎల్సీ కృంగిపోయేది. సంక్షిప్తంగా వున్న లేఖలకంటే సుదీర్ఘ విమర్శలు ఎల్సీని ఎక్కువ బాధించేవి.

నిజానికి ఎల్సీ కవితల్లో భాషా సౌందర్యం, వ్యక్తీకరణలో నాజూకు తక్కువే. అయితే భావంలో గాఢత వుండేది. జీవితానుభవం ఇంకొంచెం వస్తే, ఎల్సీ చక్కటి కవయిత్రి కాగలదు. అయితే ఆ సంగతి ఆమెకి తెలియక పోవడం వల్ల తనకసలు భవిష్యత్తే లేదనుకుని నిరాశపడింది.

తన కవితల రాతప్రతిని ఒక సంచీలో పెట్టి డెస్కులో పడేసింది. ఇక కవితల జోలికీ, పుస్తకాల జోలికీ పోగూడదనుకొంది.

“జేన్! నితో పాటు నేనూ పెగ్గీకి సాయంగా బట్టలు ఇస్త్రీ చేస్తాను. బట్టలు కుట్టడం కూడా ప్రారంభిస్తాను. అనవసరంగా డబ్బంతా పోస్టు మీదా, కాగితాల మీదా దండగ చేసాను. ఇహ ఏదైనా పని వెతుక్కుని నీ కష్టం తగ్గిస్తాను.” అన్నదే కానీ పాపం ఆమె కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. అన్నట్టే బట్టలు కుట్టడంలోనూ, ఇస్త్రీలు చేయడంలోనూ నిమగ్నమైపోయింది ఎల్సీ.

వున్నట్టుండి ఒకరోజు రెండు వుత్తరాలు వచ్చాయి వారి పేరిట. ఒకటి ఫ్రాన్సిస్ దగ్గర్నించయితే, రెండోది రెన్నీ గారి దగ్గర్నించి.

రెన్నీ గారు ఇస్తోన్న కొత్త సంవత్సరం పార్టీకి తాను ఎడిన్ బరో వస్తున్నట్టూ, వచ్చి తప్పక వాళ్ళను కలుసుకుంటాననీ ఫ్రాన్సిస్ రాసాడు. రెన్నీ గారి దగ్గర్నించి పార్టీకి రమ్మన్న ఆహ్వానం వుంది.

కాస్త ఆ పార్టీకి వెళ్ళి నలుగురితో మాట్లాడితే మనసులు కుదుటపడొచ్చు.

పార్టీకోసం అక్కకి కొత్త గౌను కుట్టడం మొదలు పెట్టింది ఎల్సీ. ఈ మధ్య కాలంలో జేన్ చిక్కిపోయి మొహం పాలిపోయింది. అయినా ఎల్సీ కళ్ళకి అక్క అందంగానే అనిపించింది.

 

(సశేషం)

 

 

 

 

 

వీలునామా – 10 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

బ్రాండన్ గారికి పెద్ద పెట్టున జ్వరం కాసింది. పగలూ రాత్రీ ఆయన సేవలోనే గడిచిపోయేవి నాకు. పాపం తిండి తినడానికి కూడా ఓపిక లేక, జావ తాగిస్తే తాగేవారు. అలా కొన్ని వారాల తర్వాత నెమ్మదిగా కొలుకున్నారు. ఒకరోజు కుర్చీలో విశ్రాంతి గా కూర్చుని ఏదో పని చూసుకుంటున్న నాతో ఒక మాటన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాని ఆడపిల్లలు, మీతో ఆ మాటలేమిటో నేను చెప్పలేను కానీ, ఆ మాటలు నాకెంతో కోపం తెప్పించాయి. ఒక్క నిముషం మాట్లాడలేకపోయాను. ఎలాగో కూడ దీసుకుని,

“అలాటి మాటలు మీరనా వద్దు. నేను వినా వద్దు. అయినా, ఇలాటి పాడు ఉద్దేశ్యాలు నన్నీ ఊరు తెచ్చినప్పుడు మీకు లేవు. అందుకే వూరుకుంటున్నాను,” అన్నాను.

“అంత కోపపడకు పెగ్గీ! నువ్వు రావడం వల్ల నాకెంత హాయిగా వుందో నీకు తెలియదు. అందుకే…”

“అవునా? మీకు నామీదున్న గౌరవాన్ని చూపించడానికి ఇది మార్గం కాదనుకుంటా!”

“జార్జి పెళ్ళాడమంటే వద్దన్నావట. దాంతో నీ చూపు ఇంకా పైనుందేమో ననుకున్నాను.”

“జార్జి కంటే మంచివాళ్ళూ, గౌరవనీయులూ నాకైతే ఇంతవరకూ కనబడలేదు. కాబట్టి పెళ్ళాడనే దల్చుకుంటే అతన్నే పెళ్ళాడతాలెండి. మీకంటే జార్జి చాలా మర్యాదస్తుడు. అతను నన్ను పెళ్ళాడతానన్నాడు. మీలా…”

“సరే అయితే! పెగ్గీ! నేనూ అదే మాటంటాను. చెప్పు, నన్ను పెళ్ళాడతావా?”

“లేదండీ! నా స్థాయికి మించిన మగవాళ్ళతో నేను నెగ్గుకురాలేను. పెళ్ళి చేసుకునే రోజు వస్తే, నా స్థాయికి తగ్గ మగవాణ్ణే చేసుకుంటాను.”

నా మాటలు విని పెద్దగా నవ్వేసాడాయన.

“ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పెగ్గీ, నువ్వు తెలివి కలదానివి సుమా! నిజమే. నువ్వెంత మంచి పిల్లవైనా, నిన్ను తీసుకెళ్ళి నా కాబోయే భార్యగా మా అమ్మకీ, నాన్నకీ ఎలా పరిచయం చేస్తాను? సరే, ఎప్పటికైనా జార్జిని నువ్వు పెళ్ళాడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను.”

అంతే అమ్మాయిగారూ! నిజంగానే నాకు జార్జికంటే ఎక్కువగా ఎవరూ నచ్చలేదు. పాపం, నన్నెంతో ఆపేక్షగా కనిపెట్టుకుని వుండేవాడు. నేను సరిగ్గా ఆలోచించుకొనేలోపే నాకు బర్రాగాంగ్ వదలాల్సొచ్చింది. అక్కడే ఇంకో ఆరునెలలు వుండి వుంటే జార్జితో నా పెళ్ళి జరిగి వుండేదేమో.

మేముండే వూరికి ఇరవై మైళ్ళ దూరంలో బ్రాండన్ గారి స్నేహితుడు ఫిలిప్ గారు వుండేవారు. ఆయనది ఇంకా పెద్ద పొలమూ, పెద్ద పశుసంపదా! ఆయన భార్యకి ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. అందుకని ఆయన ముందే మెల్బోర్న్ నించి ఒక నర్సును ఏర్పాటు చేసుకున్నారు కానీ, ఆ నర్సు ఆఖరి నిముషంలో రానంది. ఇంకో మనిషిని ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు. నీళ్ళాడ పొద్దుల మనిషి! అందుకని పురిటి వరకూ తోడుండడానికి నన్ను పంపమని బ్రాండన్ గార్ని బ్రతిమాలారాయన.

పురుడు జరిగి తల్లి కొంచెం కొలుకోగానే నన్ను వెనక్కి పంపే షరతు మీద నన్నక్కడికి వెళ్ళమన్నారు బ్రాండన్ గారు. అక్కడ నిజానికి ఇంకో పని అమ్మాయి వుంది, కానీ ఆ పిల్లకసలేమైనా పనొచ్చో రాదో అనిపించింది నాకు.

ఫిలిప్ గారి శ్రీమతి (వాళ్ళ పెళ్ళయి అప్పటికి యేడాది అయిందిట) మంచిదే. సౌమ్యురాలు. పని వాళ్ళతో పని చేయించుకోవడం తెలియదావిడకి. మౌనంగా ఒక కుర్చీలో కూర్చుని వుండే వారు. నేను వెళ్ళిన కొద్ది రోజులకే ఆవిడ ప్రసవించి ఒక పాపాయిని కన్నది.

తల్లేమో కానీ, తండ్రి మాత్రం ఆ పాపాయిని చూసి పొంగిపోయాడు. బుల్లి ఎమిలీ ని చూసిన దగ్గర్నించీ ఆయనకి వేరే ప్రపంచమే లేకుండా పోయింది. అంత పెద్దాయన బవిరి గడ్డంతో మొగ్గలాటి కూతుర్ని ఎత్తుకోని, ముద్దు పెట్టుకోవడం, దానితో పాపాయి భాషలోనే గంటల తరబడి మాట్లాడడం, అందరినీ పిలిచి పాపాయి గురించి కబుర్లు చెప్పడం చూస్తే నాకైతే నవ్వాగేది కాదు. పిల్లలని అంత ప్రేమించే తండ్రిని ఇంతవరకూ చూడలేదు.

ఫిలిప్ గారి శ్రీమతితో వేగడం కొంచెం కష్టమే అనిపించింది. బాలింతరాలి సంరక్షణ అంటే మాటలా? జలుబు చేయకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! పథ్యం వంట కూడా చేయాలాయే! కానీ, ఆవిడ నా ప్రతీ మాటనీ పెడ చెవిన పెట్టేది. మీ స్కాట్ లాండ్ లో జలుబూ పడిశం పదతాయి కానీ, ఈ ఆస్ట్రేలియాలో ఏమీ కాదు అనేది. పథ్యం విషయంలోను అంతే. ఫిలిప్ గారి కేమో ఆమెతో వాదించే ఓపిక లేక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపొమ్మనేవారు. తల్లీ పిల్లల పనితో నా ఒళ్ళు హూనమైపోయింది.

అప్పటికి నాకు బ్రాండన్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనిపించసాగింది. ఫిలిప్ గారి భార్యకి కూడా నన్ను పంపాలనే అనిపించింది. తనకి తోచినట్టు చేయడమే తప్ప, ఇంకోరు చెప్తే నచ్చదావిడకి! కానీ విచిత్రంగా, ఫిలిప్ గారు నన్ను ఇంకొన్నాళ్ళుండి పాపని చూసుకొమ్మని బ్రతిమిలాడారు.  నన్ను ఇంటికి తీసికెడదామని వచ్చిన జార్జితో అదేమాటన్నాడాయన. నేనూ వుండిపోదామనుకున్నాను. దాంతో జార్జికి ఎక్కళ్ళేని కోపమొచ్చింది. ఆ చంటి దాని మూలంగానే నేను ఫిలిప్ గారి ఇంట్లో వుంటున్నానని దాని మీద కోపం పెంచుకున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది.

ఒక్క చంటి పాపనే భరించలేని వాడు నాకు చుట్టుకున్న బెస్సీ పిల్లలయిదుగుర్ని ఎలా భరిస్తాడు? నాకంటూ ఇల్లొకటి ఏర్పడితే అందులో బెస్సీ పిల్లలకెప్పుడూ చోటుండాలి! ఆ కోరికలో తప్పేం వుంది చెప్పండి? అందుకే జార్జిని ఆ తర్వాత దూరంగా వుంచేసాను.

ఫిలిప్ గారింట్లో దాదాపు యేణ్ణర్ధం వున్నాను. అమ్మగారు నాతో సర్దుకు పోవడం నేర్చుకున్నారు. అక్కడ మగవాళ్ళు నన్నెక్కువ బాధించలేదు. ఎందుకంటే నాకంటే చిన్నదయిన మార్తా వుండబట్టి. కొన్నళ్ళకి మార్తా పెళ్ళయిపోయింది.

“నీ అక్క పిల్లల కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోకు పెగ్గీ!” అని అప్పుడప్పుడూ అన్నా, ఫిలిప్ గారు బెస్సీ పిల్లల పట్ల నా బాధ్యత అర్థం చేసుకున్నారు. ఆయన భార్య మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి పురిటికి మెల్బోర్న్ వెళ్తానని ఎంతో గోల చేసింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. అక్కణ్ణించి డాక్టరుని ఇంటికే రప్పిస్తానని అన్నారు. అన్నట్టే ఒక డాక్టరు పురిటి వరకూ అక్కడుండడానికి వచ్చాడు. నాకెందుకో ఆ డాక్టరు వాలకం అంతగా నచ్చలేదు.

ఫిలిప్ గారు నాతో, “పెగ్గీ! ఆయన మంచి డాక్టరే కానీ, కొంచెం తాగుబోతు. అందుకని ఆయనకి మన ఇంట్లో వుండే మద్యం సీసాలు కనబడనీయకు. అన్నట్టు, ఈ సంగతి అమ్మగారితో అనకు!” అన్నారు రహస్యంగా. ఆయన చెప్పినట్టే నేను ఆ డాక్టరు కార్టర్ గారిని వేయి కళ్ళతో కనిపెడుతూ వచ్చాను. దాదాపు రెండు వారాలు, ఆయనా బానే వున్నారు. కానీ ఆ తర్వాత ఇహ తట్టుకోలేకపోయారు. రాత్రంతా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేసే వాడు! మనిషి పాపం దిగాలుగా నీరసంగా అయిపోయాడు.

ఒక రోజు అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. డాక్టర్ని పిలుద్దామని పైకి వెళ్తే, ఏముంది! ఎక్కడ సంపాదించాడో కానీ,   బ్రాండీ బాటిలు ఒకటి మొత్తం ఖాళీ చేసేసాడు. నేల మీద మత్తుగా పడి నిద్ర పోతున్నాడు. వైను బాటిల్లుండే సెల్లార్ తాళాలు నా దగ్గరే వున్నవి. మరి ఈయన ఇదెక్కడినించి సంపాదించాడో నాకర్థం కాలేదు. ఎందుకంటే, ఆ పల్లెటూళ్ళో బయట టీ దొరికితే మహా ఎక్కువ! తరవాత తెలిసింది, ఒక నౌకరును నలభై మైళ్ళు పంపించి తెప్పించాడట! అయ్యగారు ఆ నౌకరును పనిలోంచి తీసేసారులెండి!

సరే, అదలా వుంచి, అమ్మగారికి నొప్పులొస్తున్నాయని లేపి చెప్పాను. ఎలాగో కళ్ళు తెరిచి పురుడు అయ్యిందనిపించాడు. ఆడపిల్ల, హేరియట్ అని పేరు పెట్టారు. రెండు వారాలయింది. ఇహ మెల్లిగా పంపించేద్దామనుకున్నారు ఫిలిప్ గారు.

వున్నట్టుండి ఒక రోజు మళ్ళీ తాగొచ్చాడు డాక్టర్ కార్టర్. పాపం, పడుకోని వున్న అమ్మగార్ని తన పెడ బొబ్బలతో భయ పెట్టాడు. పాపం, బాలింతరాలు, గజ గజా వణికిపోయింది. అతన్ని ఎలాగైనా బయటికి పంపని అడిగింది నన్ను.

నేను మెల్లగా మంచి మాటలు చెప్పి అతన్ని బయటికి తిసికెళ్ళాను. ఏదేదో సణుగుతూ అక్కడే వున్న గుర్రానెక్కి వెళ్ళిపోయాడతను. ఈ గుర్రం మీద వుంటాడా, కింద పడిపోతాడా అని నేను ఆలోచిస్తూండగానే ఒక నౌకరు, జిం ,పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“పెగ్గీ! మంటలు! ఇల్లంటుకుంటోంది!” వగరుస్తూ అన్నాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. కిటికీలోంచి బయటికి చూసాను. దూరంగా మంటలు కనిపిస్తున్నాయి. దగ్గరకొచ్చాయంటే మా పని అయిపొతుంది. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, చంటి పిల్ల తల్లీ! ఇంట్లో నేనూ, మార్తా, జిం మాత్రమే వున్నాం. అదృష్టవశాత్తూ, అమ్మగారూ, పిల్లలూ నిద్రపోతున్నారు. గబగబా మార్తానీ, జిం నీ పిలిచాను. మంటలార్పడనికి నీళ్ళూ బకెట్లూ తీసుకురమ్మన్నాను. మార్తా భయపడ్డది కానీ, తేరుకొని బాగా సహాయం చేసింది. ఆ డాక్టరు సిగరెట్టు కాల్చి ఎండు గడ్డి మిద పడేసినట్టున్నాడు. అంటుకుంది. గాలి వల్ల మంట తొందరగా పెద్దవసాగింది. మాకెటూ పాలుపోలేదు.

దూరంగా గుర్రం మిద ఒక మనిషి రావడం చుసాను. అమ్మయ్య, ఫిలిప్ గారొస్తున్నారనుకున్నాను. తీరా చూస్తే, వచ్చింది బ్రాండన్ గారు. వచ్చీ రావడమే మంటలు చూసి వాటినార్పే పన్లో పడ్డారు. ఆయన సాయంతో తొందరగానే మంటలార్పేసాము. గొర్రెలు బోలెడు మంటల్లో కాలి చచ్చిపోయాయి.

మర్నాడు ఆ పొలాన్నంతా చూస్తే కడుపులో దేవినంత పనైంది. ఫిలిప్ గారొచ్చారు మధ్యాహ్నానికి, మండిపడుతూ.

“సారూ! అమ్మగారూ పిల్లలూ క్షేమంగానే వున్నారు, భగవంతుని దయవల్ల!” ఆయన్ని చూడగానే చెప్పేసాను. భార్యా పిల్లలు క్షేమంగా వుండడం చూసి ఆయనా కుదుట పడ్డాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే మా బావ విలియం లౌరీ బంధువు సేండీ లౌరీ, మెల్బోర్న్ వస్తున్నాడని తెలిసింది. ఒక్కసారి ఆయనని కలిసి పిల్లలెలా వున్నారో కనుక్కుందామనుకున్నాను. ఫిలిప్ గారితో చెప్పాను. సరే నన్నాడాయన. అప్పటికి ఇంకొక నౌకరుకు పెళ్ళవడం వల్ల, అతని భార్య వుండేది ఇంటి పన్లు చూసుకోవడానికి.

వెళ్ళేముంది నాతో ఫిలిప్ గారు,

“పెగ్గీ! నువ్వు నాకు చేసిన మేలు నేనెన్నటికీ మర్చిపోలేను. నువ్వే లేకుంటే నా భార్యా బిడ్డలు మిగిలుండేవారు కారు” అన్నాడు.

“అయ్యో! అలాగనకండి సారూ! నేను చేసిందేముంది. అంతా భగవంతుని దయ” అన్నాను.

“భగవంతుని దయ సంగతేమో కానీ, నీ ఋణం మాత్రం తీర్చుకోలేను పెగ్గీ!”

“అయ్యా! నేను చేసిన పనికంతా జీతం పుచ్చుకుంటూనే వున్నా కాబట్టి ,ఋణాల ప్రసక్తి లేదు లెండి.”

“అలాగంటే నేనొప్పుకోను పెగ్గీ! నువ్విలా అంటావని తెలిసే నేను ఒక వంద పౌండ్లు నీ బేంకు అక్కవుంట్లో వేసాను. దాన్ని ఎక్కడైనా మదుపు పెట్టి వచ్చే ఆదాయాన్ని వాడుకో! నన్నడిగితే, ఏదైనా చిన్న దుకాణం కొనుక్కోని నడుపుకో! కావాలంటే నేను సహాయం చేస్తాను!” అన్నాడు.

ఆయన నా మీద చూపించిన అభిమానానికి నేను కరిగిపోయాను. నిజంగానే ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలుపెడదామా అనిపించింది, కాని, ఆయనకీ ఆయన భార్యా పిల్లలకి నా అవసరం వుంది కదా అని వెనుకాడాను. కాని ఆయన వినిపించుకోలేదు.

“ఈ జీతంతో ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని సాకుతావు? అసలు నీకంటూ డబ్బూ, ఇల్లూ వాకిలీ వొద్దా? అందుకని చిన్న వ్యాపారం మొదలు పెట్టు. ఆ పిల్లల బాధ్యత తీరిపోతే నువ్వూ పెళ్ళి చేసుకొని స్థిరపడొచ్చు. పిల్లలు పెద్దవుతున్నారుగా? మేమిక్కడ సర్దుకుంటాంలే!” అని ఒప్పించారు నన్ను.

ఆయన అన్నట్టే మెల్బోర్న్ వెళ్ళి ముందుగా సేండీ లౌరీ ని కలిసి, బెస్సీ పిల్లల గురించి విచారించాను. పిల్లలంతా బాగున్నారనీ, చక్కగా చదువుకుంటున్నారనీ సేండీ చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక పల్లెటూళ్ళో చిన్న కొట్టొకటి అద్దెకు తీసుకున్నాను. అందరూ నన్నక్కడ మిస్ వాకర్ అని పిలిచే వాళ్ళు. కొట్టు బాగా నడిచి, కొంచెం డబ్బు రావడంతో మళ్ళీ పెళ్ళికొడుకుల బెడద పట్టుకుంది. అద్దెకు తీసుకున్న కొట్టుని మొత్తంగా కొనేసుకున్నాను.

అంతా బాగున్న సమయం లో సేండీ తమ్ముడు రాబీ లౌరీ అక్కడికి వచ్చాడు. వచ్చి, బెస్సీ ముసలి అత్తగారు పొయారనీ, పిల్లలని అదలించే వారులేక చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారనీ చెప్పాడు. ముసలి మావగారున్నారు కానీ, పిల్లలకి అసలు ఆయంటే బొత్తిగా భయం లేదు. ఇహ చేసేదేం లేక కొట్టునీ, కొట్లో సామానునీ అమ్మి మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డాను.

ఇక్కడికొచ్చి చూద్దును కదా, ఊరంతా అప్పులు! నేను పంపిన డబ్బంతా ఏమయిందో తెలియదు! అయితే చదువులు మాత్రం బాగా వంటబడుతున్నాయి. అదొక్కటే సంతోషం. అందుకే వాళ్ళనలాగే చదువుకోమన్నాను. నా దగ్గరున్న డబ్బు ఎంతకాలం సరిపోతుంది? అందుకే మళ్ళీ బట్టలు ఉతికి ఇస్త్రీలు చేయడం మొదలు పెట్టాను. అంతేనమ్మా! ఇహ పడుకోండి. ఇప్పటికే పొద్దు పోయింది,” అంటూ ముగించింది పెగ్గీ తన కథని.

                     ***

                      (సశేషం)

 

వీలునామా – 9 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పెగ్గీ ప్రయాణం

పెగ్గీ తన కథ మొదలు పెట్టింది.

***

అమ్మాయిగారూ! అసలు విషయమేంటంటే నేనూ మా అక్క బెస్సీ ఒకళ్ళంటే ఒకళ్ళం ఎంతో ప్రేమగా వుండేవాళ్ళం. బెస్సీ నాకంటే బాగానే పెద్దది. ఎంత పెద్దదో గుర్తు లేదనుకోండి!  నాకు ఆరేళ్ళ వయసులోనే మా అమ్మ పోయింది. బెస్సీ నన్ను తనే తల్లిలా పెంచింది. ఇప్పుడు మీరు చిన్నమ్మాయిగార్ని చేస్తూన్నంత ముద్దు కాకపోయినా, బెస్సీ నన్నూ ఇలాగే ప్రేమగా చూసేది. సౌమ్యంగా, కొంచెం లావుగా వెండేది బెస్సీ. మా పక్కింటి విలియం లౌరీ హై స్కూలు రోజుల్లోనే బెస్సీ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాడు. నాన్నకి మేమిద్దరమూ కాక ముగ్గురు కొడుకులున్నా, మా మీదే ఆధారపడి వుండేవాడు. కొంచెం జబ్బు మనిషి కూడా! మా అన్నదమ్ములు ఎందుకూ కొరగాని వాళ్ళు. బెస్సీ నేను కొంచెం పెద్దయ్యే వరకూ నాన్నని తనే కనిపెట్టుకుని వుంది. నేను ఒక చిన్న వుద్యోగం చూస్కున్నాకే విలియంని పెళ్ళాడింది బెస్సీ! పెళ్ళయినా నాన్న వాళ్ళతోటే వుండేవాడు. దాని పెళ్ళయిన మూడేళ్ళకి నాన్న పోయాడు!

బెస్సీకి చక చకా పిల్లలు పుట్టేసారు! అది అయిదోసారి కడుపుతో వుండగా విలియం జబ్బుపడి పోయాడు. బెస్సీ పాపం కుప్పకూలిపోయింది. ఎలాగో తేరుకుని బయటికి వెళ్ళి పని చేసి కుటుంబాన్ని నడిపేది కానీ, విలియం తోడు లేకుండా ఎక్కువ రోజులు బ్రతకలేక పోయింది. దాని పిల్లలు పాపం అనాథలయ్యారు. నన్ను చిన్నప్పుడు సాకింది బెస్సీ. ఇప్పుడు దాని పిల్లల్ని నేను అనాథల్లా వదిలేస్తానా?

విలియం అమ్మా నాన్నలు ఆ పక్కనే ఇంకో పల్లెటూళ్ళో వుండేవాళ్ళు. వాళ్ళూ మాలాగే పేద వాళ్ళు. అయినా నా దగ్గరికి వచ్చి డబ్బు సాయం చేస్తే పిల్లలని తాము చూసుకోగలమన్నారు. అయిదుగురు పిల్లలని సాకేంత డబ్బు నాకెక్కణ్ణించొస్తుంది?

అప్పుడు నేను గ్రీన్ వెల్స్ లో ఒక పెద్ద ఎస్టేటులో పని చేసేదాన్ని. వంటా వార్పూ, పాలు పితకడం, పాడి పనీ అన్నీ చేసేదాన్ని. ఇంతా చేస్తే నా జీతం ఏడాదికి ఏడు పౌండ్లు. దాంతో ఇంత మందిమి ఎలా బ్రతకడం చెప్పండి? ఇంకా పని ఎక్కువైనా పర్వాలేదు కానీ నా జీతం పెంచమని మా అమ్మగార్ని కాళ్ళా వేళ్ళా పడ్డాను. ఇక ఇంతకంటే పని ఎక్కువ చేయలేనని ఆవిడ కోప్పడ్డారు. అయితే జీతం ఇంకొక్క పౌండు పెంచారనుకోండి. అయినా అదేమూలకి?

ఒక రోజు పెరట్లో వంటకోసం ఒక పక్షికి ఈకలు పీకి శుభ్రం చేస్తున్నాను. కింద పాత పేపర్లు వేసాను మురికి కాకుండా. యథాలాపంగా ఆ పేపర్లో చూద్దును కదా, ఒక ప్రకటన! మెల్బోర్న్ లో పని చేయడానికి ఒప్పుకుంటే ఖర్చులు తామే భరించి తీసికెళ్తామని ఎవరో ఇచ్చారా ప్రకటన.

ఇంటి పనీ, వంట పనీ, పాడి పనీ పశువుల పనీ వంటివి తెలిసిన మనిషి దాదాపు పదహారు నించి ఇరవై ఐదు పౌండ్ల వరకూ సంపాదించుకోవచ్చట. ఒక అడ్రసు ఇచ్చి వచ్చి సంప్రదించమన్నారు. ఆ ప్రకటన చూస్తే ప్రాణం లేచొచ్చినంత పనైంది! తప్పక ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని ఆ క్షణం లోనే నిశ్చయించుకున్నాను. ఆ పేపర్లో ఇచ్చిన చిరునామాకి వెళ్ళీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాను.”

“ప్రయాణం ఎలా అయింది పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“వింత ఏంటంటే అమ్మాయిగారూ, నాకు ఆ ప్రయాణం తాలుకు విషయాలు కొంచెం కూడా ఙ్ఞాపకం లేవు. అయితే అయిదు నెలల ప్రయాణం అన్న మాట మాత్రం గుర్తుంది. ఇప్పుడంత సమయం పట్టదు లెండి. వచ్చేటప్పుడు నాలుగు నెలల్లో వచ్చేసాగా? సరే, ఎలాగో మెల్బోర్న్ చేరుకున్నా. చాలా మురికిగా, ఇరుకుగా అనిపించింది. నేననుమానించినట్టే అంతంత జీతాలేం ఇవ్వలేదు. ముందు పదమూడు పౌండ్లిస్తామన్నారు. నాకు ఏడుపొచ్చినంత పనైంది. ఈ మాత్రానికేనా నేను అయిదునెలలు కష్టపడి దేశం కాని దేశం వచ్చింది, అనిపించింది. ఏజెన్సీ లేబర్ ఆఫిసులో బాగా దెబ్బలాడాను. ఎంత కష్టమైన పనైనా చేస్తాననీ, ఎక్కడికైనా వెళ్తాననీ, డబ్బు మాత్రం ఇంకొంచెం కావాలనీ మొత్తుకున్నాను. అప్పుడే ఆ ఆఫీసులోకి ఒక పెద్దమనిషి వచ్చాడు. ఆయన వాలకమూ మాటా చూస్తే ఇంగ్లండు నించే వచ్చినట్టనిపించింది. ఆఫీసరుతో నా పోట్లాట విని,

“అయితే అందరిలానే నీకూ డబ్బాశ ఎక్కువేనన్నమాట,” అన్నాడు వెటకారంగా.

“అయ్యా! ఇంత దూరం వచ్చిందీ కష్టపడి డబ్బు సంపాదించుకోవడానికేగా,” అన్నాను నేను.

“అవునమ్మా! డబ్బు వచ్చేటప్పుడొస్తుంది. అంతలోకే తొందరపడితే ఎలా? రాగానే ధన రాసులు కావాలా ఏం?” కసిరాడాయాన.

“ఇన్ని మాటలెందుకు సారూ! మీకు పనిమనిషి కావాలంటే చెప్పండి,” నేనూ కోపంగానే అన్నాను.

“పనిమనిషా? మాటవరసకి కావాలే అనుకో! నువ్వు సరిపోతావో లేదో నాకెలా తెలుస్తుంది?”

“మీకెందుకు! అమ్మగారికి నన్నొక్కసారి చూపించండి. నా పని తనాన్ని చూసి ఆవిడే నచ్చుకుంటారు.”

“అలాగా? సరే, ఏమేం పనులు చేయగలవో చెప్పు?”

“ఒకటేమిటండీ, ఏదైనా చేయగలను. వంట పనీ, చాకలి పనీ, పాడి పశువుల పనీ, ఇంటిక్కావాల్సిన సమస్తం చాకిరీ చేయగలను.”

“సరే, నీ వయసెంత? మీ అమ్మగారడిగితే చెప్పాలిగా!”

“ఇరవై అయిదేళ్ళు. ఇంతకు క్రితం అయిదేళ్ళూ, అంతకు ముందు మూడేళ్ళూ వేర్వేరు చోట్ల పనిచేసాను. కావాలంటే వాళ్ళందరి దగ్గర్నించీ ఉత్తరాలు కూడా చూపించగలను. పనికీ, ఒంటరితనానికీ, దేనికీ భయపడను.”

“ఏదో పెద్ద రౌడీలాగున్నావే! కొంచెం డబ్బాశ కూడా ఎక్కువేనా ఏమిటి? ఏడాదికి ముప్పై పౌండ్లిస్తానంటే, ఇక్కడికి వందమైళ్ళ దూరంలో వున్న పల్లెలో పని చేస్తావా?”

“సరే నండి! అలాగే చేస్తాను.” ధైర్యంగా ఒప్పుకున్నాను.

“రేఫణ్ణించే లెక్కకట్టి నీకు జీతం ఇస్తాను. ప్రయాణానికి సిధ్ధం కా.”

“అలాగే సారూ! వంద మైళ్ళంటున్నారు. అక్కణ్ణించి ఇంటికి డబ్బు పంపాలంటే ఎలా?”

“అదంతా నేను చూసుకుంటాలే. జీతం ఎక్కువ కదా అని  సంబరపడకు, బోలెడంత చాకిరీ వుంటుంది., అడవుల్లో ఇల్లు, ఆలోచించుకో మళ్ళీ!”

“ఫర్వాలేదు సారూ! ఆ దేవుడి మీదే భారం వేసాను నేను.”

“సరే అయితే!”

ఆయన అక్కడ వున్న ఏజెన్సీ ఆఫీసరుకు చెప్పి ఒప్పందం రాయించాడు. దాని మీద ఆ పెద్దాయన వాల్టర్ బ్రాండన్, నేనూ సంతకాలు చేసాం. మర్నాడే ప్రయాణమయ్యాం. భలే దారిలెండి అదంతా. ఎగుడు దిగుడుగా, మట్టి దిబ్బలతో! మాతో పాటు నలుగురు మగవాళ్ళూ వచ్చారు. అందులో ఇద్దరు కొంచెం తాగుబోతుల్లాగనిపించారు. నేను వాళ్ళకంటే మొరటుదాన్ని కావడంతో నా జోలికి రాలేదు. దాదాపు రెండు వారాలు బండిలో ప్రయాణం చేసి బ్రాండన్ గారి ఇల్లు చేరాము. అయితే ఈ ప్రయాణం నాకంత విసుగనిపించలేదు! ఎందుకంటే ప్రయాణం రోజులకి కూడ లెక్క కట్టి జీతం తీసుకుంటున్నాగా! అందుకు!”

*****************

మేము బ్రాండన్ గారి వూరు, బర్రాగాంగ్ చేరుకునేసరికి శనివారం చీకటిపడింది.  మాలా కాకుండా అయ్యగారు గుర్రబ్బగ్గీలో ప్రయాణం చేసినందువల్ల మాకంటే చాలా ముందు గానే వూరు చేరుకున్నారు.

“పెగ్గీ! ప్రయాణం బాగా జరిగిందా?నెమ్మదిగా సాగింది కదా? నువ్విలాటి ప్రదేశాల్ని ఎప్పుడూ చూసి వుండవు.” ఆదరంగా అన్నారు అయ్యగారు నేను బండి దిగుతూంటే.

“అవునండీ! చాలా నెమ్మదిగా అనిపించింది.”

“అదేమిటి పెగ్గీ! ప్రయణం అంతా ఎండలో కూర్చున్నావా ఏమిటి? నీ మొహం అంతా నల్లగా కమిలిపోయింది. ఇటు వైపు ఎండలు చాలా ప్రమాదకరం. జగ్రత్తగా వుండాలి.”

“మొహం నల్లగా కమిలిపోతేనేం లెండి. చేతులూ కాళ్ళూ సవ్యంగానే వున్నాయిగా! అన్నట్టు, సారూ, అమ్మగారెక్కడా? వంటగదిలోకెళ్ళి చూడనా?”

“నీకొక విషయం చెప్పాలి పెగ్గీ! అసలీ ఇంట్లో అమ్మగారనే పదార్థమే లేదు!” నవ్వుతూ అన్నారయ్యగారు. ఒక క్షణం కోపం ముంచుకొచ్చింది నాకు. ఇదేమైనా నవ్వులాటా?

“ఏమంటున్నారు మీరు? అమ్మగారు లేకపోవడమేంటి?” కోపంగా అన్నాను.

“ఆగాగు! అమ్మగారి ప్రసక్తి తెచ్చింది నువ్వే! గుర్తు తెచ్చుకో! ఇక్కడ ఇంకో ఆడదిక్కు లేదు కాబట్టి, నువ్వే అమ్మగారూ, పనిమనిషీ కూడా!”

నిజం చెప్తున్నా అమ్మాయిగారు. ఆ దేశం కాని దేశంలో, ఎక్కడో మారుమూల ఆడతోడు లేకుండా, ముక్కూ మొహం  మగవాళ్ళ మధ్య వుండాలని తెలిసేసరికి నాకు గుండె జారిపోయింది. చాలా భయం వేసింది.

“అయ్యగారూ! మీరు చేసిన పని మంచిది కాదండీ!” బాధగా అన్నాను.

“నీకేం భయం లేదు పెగ్గీ! నువ్వడిగినంత జీతం ఇస్తాను. ఇక్కడ మాకు నీ అవసరం చాలా వుంది. ఆడదిక్కు లేక మేమంతా మురికిగా, సరైన తిండీ తిప్పలు లేక పడి వున్నాము. ఇప్పటికిప్పుడు పెళ్ళాడాలంటే మాలాటి వాళ్ళకు పిల్లనెవరిస్తారు చెప్పు? నువ్వేం చిన్న పిల్లవు కాదు. నిన్ను నువ్వు బాగా కాపాడుకోగలవు. మిగతా పనివాళ్ళు నీ జోలికి రాకుండా నేనూ చూస్తూనే వుంటాగా? దయచేసి ఈ ఇల్లూ, వంటిల్లూ ఒక కొలిక్కి తెచ్చి నాకింత తిండి వండి పెట్టు. అంతకంటే ఎక్కువ నిన్నేమీ అడగను! కనీసం వారం రోజులు వుండి చూడు. ఆ తర్వాత కూడ నీకు ఇబ్బందిగా భయంగా వుంటే నిన్ను మళ్ళీ మెల్బోర్న్ పంపించేస్తాను, సరేనా?” కాళ్ళా వేళ్ళా పడ్డాడు అయ్యగారు.

భయం భయంగానే ఒప్పుకున్నాను. వారం రోజులు బ్రాండన్ గార్ని గమనించాను. పాపం, ఆయన మంచాయనే, అని తెలిసి వుండిపోవడనికే సిధ్ధపడ్డాను, నా డబ్బాశ ఏదో రోజు నా కొంప ముంచుతుందని తిట్టుకుంటూనే. నిజంగానే ఆ ఇంటికి ఒక ఆడమనిషి చేయి అవసరమనిపించింది కూడా! ఆ మొరటు వెధవల మధ్య నన్ను నేను వెయ్యి కళ్లతో కాపాడుకోవాల్సి వచ్చిందనుకోండి!

బ్రాండన్ గారు మనిషి సౌమ్యుడే, కానీ ఇంటి పని బొత్తిగా చేతకాదాయనకి. చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవాలనీ, టేబిల్ మీడ దుప్పటి లాటిది పరచి వుంచాలనీ కూడ తెలియదు.

అసలా ఇంట్లో వంటిల్లే లేదు! టీ తాగే కప్పులు లేక డబ్బాల్లో పోసుకుని టీ తాగే వాళ్ళు. చెంచాలు, ఫోర్కులు, గంటెలు, తువ్వాళ్ళూ, అసలు సామానే లేదు. అక్కడ నేల మీద మురికి చూస్తే మీరైతే వాంతి చేసుకుంటారు.

పక్కనే వుండడానికి నాకొక చిన్న పాక వేయించారు అయ్యగారు. ఒంటరిగా ఆ పాకలో వుండాలన్న ఆలోచనకే గజగజా వణికి పోయాను. అయితే దేవుడి మీద భారం వేసి నా పని నేను చేయాలనుకున్నాను.

ముందుగా వాళ్ళని పోరి నేల మీద చెక్కలు పరిపించాను. కిటికీలకి గాజు తలుపులు పెట్టించాను. ఒక చిన్న వంట పాక వేయించి అందులోకి సామాన్లు కొనిపించాను. మెల్లి మెల్లిగా ఇల్లంతా శుభ్రంగా చేసి పుష్కలంగా పాలూ, పెరుగూ, వెన్నలతో భోజనం ఏర్పాటు చేసాను. మగవాళ్ళంతా మొరటుతనాలు వదిలేసి మంచి జీవితానికలవాటు పడ్డాడు.

జార్జి పావెల్ అనే అతను ఇంటికి కావాల్సిన సామన్లు కొని ఇచ్చేవాడు. ముందు అతను వంటింట్లో వుండే వెన్నా, మీగడలకోసమో, బిస్కట్ల కోసమో వంటింటి చుట్టూ తిరుగుతున్నాడనుకున్నా. కొది రోజులయ్యేసరికి నాకర్థమయింది, అతను వచ్చేది నాకోసమే నని.

వున్నట్టుండి ఒకరోజు వంటింట్లో నాతో మాటాడుతూ ఏదో సణిగాడు. పిచ్చి వేషాలేస్తే అయ్యగారికి చెప్తానని బెదిరించాను.

“అంత కోపమెందుకు! పెగ్గీ, నేను నిన్నేం అవమానించట్లేదు.

నన్ను పెళ్ళాడతావా అని అడిగాను, అంతే.” అన్నాడు మొహం ఎర్రబడుతూండగా.

“అది అయ్యే పని కాదులే. ఇంత మంచి కాంప్లిమెంటు ఇచ్చినందుకు ధన్యవాదాలు కాని, నాకు పెళ్ళి మీద పెద్దగా ఆసక్తి లేదు,” అన్నాను మర్యాదగానే.

“నిజం చెప్పు పెగ్గీ! నేను నచ్చకపోతే ఆ విషయం నిర్భయంగా చెప్పు, అంతే కానీ, పిచ్చి పిచ్చి వంకలు పెట్టొద్దు!”

“నిజమే చెప్తున్నాను. నీమీద అయిష్టమేమీ లేదు నాకు. పెళ్ళాడే పరిస్థితి కాదు నాది, అంతే!”

“నా మాట విను పెగ్గీ! ఒంటరిగా ఇలాటి చోట మగవాళ్ళ మధ్య, భయం వేయడంలేదూ? అదే నన్ను పెళ్ళాడావనుకో, నిన్ను రక్షించే బాధ్యతంతా నేనే తిసుకుంటాను.”

ఆ తర్వాత ఎన్నో సార్లు అడిగాడు జార్జి నన్ను పెళ్ళి చేసుకుందామని. అదేమాట ఇంట్లో పని చేసే ముగ్గురు పశువుల కాపర్లూ, గుర్రాలు చుసుకునే అబ్బయీ కూడా అడిగారు. అందరికీ లేదనే చెప్పాను. అది నాగొప్పేమీ కాదమ్మాయి గారూ! అలాటి చోటికి ఆడది రావడమే మహా భాగ్యం ఆ రోజుల్లో. ఇక అంద చందాల గురించి ఎవరేడ్చారు?

వింత చూడండి! ఆడవాళ్ళకి విలువ వుండే చోటికి ఖర్చుకి బయపడి వాళ్ళని తీసికెళ్ళరు. ఇక్కడ ఇంత మంది ఆడపిల్లలున్నా పెళ్ళాడేందుకు మగవాళ్ళు లేరు. అక్కణ్ణించి రావడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కాని పిల్లల కొసం వచ్చా, మళ్ళీ వెళ్ళిపోతాలెండి.

ఎక్కడ దాకా చెప్పాను? ఆ, ఇంట్లో పని వాళ్ళని మెల్లిగా నా చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నాను.

కాని అంతలోనే నా పరిస్థితి మారింది.

       ***

(మిగతాది వచ్చే వారం)

వీలునామా – 8 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

                     పడి లేచే కడలి తరంగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన డబ్బూ, అంతా కలిసి జేన్ అనుకొన్నట్టు దాదాపు నలభై వేల పౌండ్ల పైనే వున్నట్టుంది. ఎస్టేటు లో కొంచెం భూమిని సాగు చేయించినట్టున్నాడు పెద్దాయన.

ముందు ఎల్సీ ఆ వూరి జనం ఫ్రాన్సిస్ ని ఆదరిస్తారా అని అనుమానపడింది కానీ, ఆ భయం అర్థం లేనిది. ఆ వూళ్ళో ఇదే అంతస్థుకి చెందిన కుటుంబాలలో దాదాపు ఇరవై మంది పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లలుంటే, నలుగురు పెళ్ళీడుకొచ్చిన యువకులున్నారు, విలియం డాల్జెల్ తో సహా. అలాటప్పుడు, యుక్త వయసుల్లో వున్న ఇద్దరమ్మాయిలు ఊరు వదిలి, చక్కగా చదువుకుని పెళ్ళి కాని ఒక మగవాడొస్తూంటే ఊళ్ళోని సంపన్న కుటుంబాలు అతన్ని ఎందుకు నిరాదరిస్తాయి?  సహజంగానే అతని కొరకు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేయబడ్డాయి. తమ తమ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తండ్రులూ, తల్లులూ ఎంత దూరమైనా వెళ్తారూ, ఆత్మ గౌరవాన్ని ఎంతైనా చంపుకుంటారు.  బ్రిటిష్ సంఘంలో ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక వర్గాన్ని ఆకాశానికెత్తేస్తూ, ఇంకో సగాన్ని పాతాళానికి నొక్కేస్తూ…

ఇహ స్కాట్లాండ్ లో ఒక మారుమూల పల్లెటూళ్ళొ అంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా వుంటుంది? అప్పటికే పల్లెటూళ్లలో మధ్య తరగతి, సంపన్న కుటుంబాలనుంచి యువకులు అవకాశాలు వెతుక్కుంటూ, కాలనీల్లోకి, భారతదేశానికో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. అంత దూరం కాకుంటే కనీసం పట్టణాలకైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో పడి వుండడం తప్ప చేసేదేం వుంది? చదువూ లేక, వృత్తీ వ్యాపారాలూ లేక, కేవలం ఎవరో ఒకరు వచ్చి కన్నె చెర విడిపించాలని ఎదురు చూడాల్సి రావడం ఎంత దుర్భరం!

కాలనీల్లోంచి తిరిగొచ్చిన యువకుల కంటికి సహజంగా తమతోటి కలిసి ఆడుకుని పెరిగి పెద్దయిన యువతులకంటే, చిన్న వయసులో వున్న బాలికలే ఎక్కువ నచ్చుతారు. పాపం, చదువూ, జీవనాధారమూ, పెళ్ళీ లేక ఒక తరం యువతులంతా అమ్మా-నాన్నల పంచనో, అన్న దమ్ముల పంచనో పడి వుండాల్సొస్తుంది.

ఇంత దుర్భరమైన పరిస్థితిలో, ముఫ్పై అయిదేళ్ళ బ్రహ్మచారీ, చదువు సంధ్యలున్నవాడూ, ఆస్తి పరుడూ తమ మధ్యకొస్తే ఆడపిల్లల తలి దండ్రుల ఆశలు ఆకాశాన్నంటటంలో ఆశ్చర్యమేముంది? అతన్ని విందులకూ, వినోదాలకూ ఆహ్వానిస్తూ కుప్పతెప్పలుగా ఉత్తరాలొచ్చి పడ్డాయి.

అయితే ఈ పరుగు పందెంలో అందరికన్నా ముందు పరుగు ప్రారంభించింది మాత్రం రెన్నీ దంపతులే. తన కింద, తన సంస్థలోనే పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఉన్నట్టుండి గొప్ప ఆస్తిపరుడు కాగానే, రెన్నీ ఆ అవకాశాన్ని వొదల దల్చుకోలేదు. తన కూతురు ఎలిజాకి ఇంతకన్న మంచి వరుణ్ణి తాను తేలేడు. అందుకే ఒకసారి తన ఎస్టేటు చూడడానికి రమ్మని ఫ్రాన్సిస్ ఆహ్వానించిందే తాడవు, రెన్నీ దంపతులు కూతురితో సహా వస్తామని మాటిచ్చారు.

నిజానికి శ్రీమతి రెన్నీ ఫ్రాన్సిస్ ని వూళ్ళో వుండే సంపన్న కుటుంబాలు ఎగరేసుకు పోతారేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫ్రాన్సిస్ సహజంగా ముభావి. పైగా యేళ్ళ తరబడి ఒంటరితనానికి అలవాటు పడ్డవాడు. అందుకే వూళ్ళో కుటుంబాలతో పెద్దగా మనసిచ్చి కలవలేకపోయాడు. అతనికెందుకో వూళ్ళో వాళ్ళు అంత నచ్చలేదు కూడా. అన్నిటికంటే వూరి వాళ్ళు జేన్, ఎల్సీల పట్ల చూపించిన నిరాదరణ అతన్ని ఎంతో నొప్పించింది. ఆ నిరాదరణ ఆ అక్క-చెల్లెళ్ళ పట్ల కాదనీ, తన తండ్రి పట్ల అనీ అతను గుర్తించలేకపోయాడు.

చాలా మామూలు మనుషులుండే ఆ వూళ్ళో, పెద్దాయన హొగార్త్ భావాలూ, మతపరమైన నమ్మకాలూ, కొంచెం విభిన్నంగా అనిపించేవు. దాంతో వూరి వారికి అతనంటే కొంచెం అనుమానం అసహనం కూడా వుండేవి. అతని పెంపకంలో పెరిగిన అమ్మాయిలవడం చేత, ఆ అనుమానమూ, అసహనమూ, జేన్, ఎల్సీల పైకి కూడా తిరిగాయి. దానికి తోడు వేరే ఆడదిక్కులేని ఇల్లు. వాళ్ళిద్దర్నీ ఆయన మగపిల్లల్లా పెంచాడందులో. అయేసరికి వూరి వారికీ హొగార్త్ గారి కుటుంబానికి పెద్ద సఖ్యతేమీ వుండేది కాదు.

అదెలాగున్నా, పెద్దాయన ఆడపిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వకుండా వీధిలో నిలబెట్టాడని తెలిసినప్పుడు మాత్రం, వూరి వాళ్ళు చాలా బాధ పడ్డారు. వాళ్లకొరకు చందాలు పోగు చేయలనుకున్నారు కూడా. చిన్న చిన్న సహాయలు చేయాలనుకున్నారు. అయితే జేన్, ఎల్సీలిద్దరూ ఎవరి దయా దాక్షిణ్యాల మిదా ఆధారపడదల్చుకోలేదు. అందుకే వూరొదిలి పట్నంలో బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారనీ, చాకలి మనిషి, పెగ్గీ ఇంట్లో అద్దెకుంటున్నరనీ తెలిసి వూళ్ళొ వాళ్ళు బాధ పడ్డారు.

పెగ్గీ చాలా యేళ్ళు స్కాట్ లాండు వదిలి ఆస్ట్రేలియాలో వుండడం వల్ల, ఆమె ఆలోచనలో కొంచెం వైశాల్యం వచ్చింది. అందుకే వూరి వాళ్ళలా, హొగార్త్ నమ్మకాలకీ, ఆచార వ్యవహారాలకీ ఆడపిల్లలని తప్పు పట్టలేదు. వూళ్ళో వున్నప్పుడు కూడా వాళ్ళ బట్టలు వుతికి ఇస్త్రీ చేస్తూ, వాళ్ళతో చనువుగా, స్నేహంగా వుండేది పెగ్గీ.   జేన్, ఎల్సీలు ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు పెగ్గీలాగే, ఇంట్లోని నౌకర్లూ, చాకర్లూ అందరూ ఎంతో బాధ పడ్డారు.

 

  ***

  ఎడిన్ బరోలోని ఆ వీధిలో ఆ చిన్న ఇల్లు దొరకడం అదృష్టమే, అనుకుంది పెగ్గీ. చిన్నదైనా ఇల్లు శుభ్రంగా వుంది. గాలీ వెల్తురూ ధారాళంగా వచ్చే గదిని అక్క-చెల్లెళ్ళిద్దరికీ అద్దెకిచ్చింది. పెగ్గీ చెల్లెలి మావగారు థామస్ లారీ కి కూడా, ఇల్లూ, ఇంట్లోంచి బయటికి చూసే కిటికీ భలే నచ్చాయి. పెగ్గీ చెల్లి పిల్లలయిదుగురికీ ఇల్లు బ్రహ్మాండంగా నచ్చేసింది.

జేన్, ఎల్సీలు మాత్రం, దిగజారిపోయిన పరిస్థితులూ, అంత చిన్న ఇంట్లో సర్దుకోవడమూ తలచుకుని భయపడ్డారు. ఎంత శుభ్రంగా వున్నా, ఆ ఇంట్లోంచి వాళ్ళకలవాటు లేని లేమి అడుగడుగునా తొంగిచూస్తోంది.

అయినా, వాళ్ళిద్దరూ పెగ్గీ కుటుంబంతో వీలైనంతగా సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నారు. అందుకే, ఆ రాత్రి భోజనం వాళ్ళు పెగ్గీ కుటుంబంతో పాటు కలిసే చేసారు, పెగ్గీ ఎంత వారించినా. ఆ గందరగోళానికి వాళ్ళకసలు భోజనమే సయించలేదు. ఏదో తిన్నామనిపించి తమ గదికి వెళ్ళి కూర్చున్నారు. వున్నట్టుండి బావురుమంది ఎల్సీ.

“జేన్! నాకిక్కడేం బాగోలేదు. చాలా భయమేస్తుంది. పేదరికం గురించి కవితలు రాయడమూ, చదవడమూ వేరు, నిజాంగా పేదరికాన్ని అనుభవించడం వేరు. పేదరికంలో అందముందని ఎందుకు రాస్తారు, జేన్?”

“నువ్వవన్నీ ఆలోచించకు ఎల్సీ! నిజానికి నాకు మన వూళ్ళో వున్న కుటుంబాలూ, వాళ్ళ కృత్రిమ మర్యాదలూ, కపటనాటకాలకంటే పెగ్గీ కుటుంబమే ఎంతగానో నచ్చింది. మనకీ పరిస్థితి నచ్చినా నచ్చకపోయినా, మనం సర్దుకు పోక తప్పఫు! అర్థమయిందా?”

“అబ్బ! ఆ పెద్ద తాతగారు ఎందుకలా దగ్గుతాడు జేన్? ఆయన దగ్గరొచ్చే ఆ ముక్కు పొడుం వాసన! టీ కప్పులోంచి సాసర్లో పోసుకుని తాగుతారు వీళ్ళు, చూసావా? ఛీ!”

“ఎల్సీ! నిజం చెప్పు, అవన్నీ అంత ముఖ్యమైన విషయాలా? వాళ్ళలాగా ఏ పరిస్థితికైనా యెదురీదే శక్తి లేనందుకు మనం సిగ్గుపడాల్సిన మాట!  ఏదో పెద్ద చదివేసుకున్నాం అన్న అహంకారం తప్ప మన దగ్గరేముంది, ఆలోచించు!”

“ఏమోలే! ఇవాళ రాత్రైతే నేనొక్క మాట కూడా రాయలేను. మనసంతా చికాగ్గా వుంది. ఈ వూరూ, ఈ మురికీ, ఈ ఇల్లూ…”

“అదేం లేదు ఎల్సీ! బయట ఎడిన్ బరో చాలా అందంగా వుంటుంది తెల్సా! రేపు నిన్ను బయటికి తీసికెళ్తా! ఇద్దరమూ అలా నాలుగు వీథులూ నడిచొద్దాం, సరేనా?”

“సరే! రేపణ్ణించి మళ్ళీ రాయడం మొదలు పెడతా! ఇవాళ్తికి వొదిలేస్తా!”

“అవును! నీకెప్పుడు మనసులో హాయిగా అనిపిస్తే అప్పుడే రాసుకో. ఇప్పుడిక పడుకో!”

తలుపు దగ్గర చప్పుడైంది. పెగ్గీ గుమ్మంలోంచి మొహం లోపలికి పెట్టి,

“అమ్మాయిగారూ! అంతా బాగుందా? ఇంకా ఏమైనా కావాలా?” అని అడిగింది.

“లేదు పెగ్గీ! ఏమీ వొద్దు, కానీ నువ్వొచ్చి కాసేపు కూర్చోరాదూ?” జేన్ ఆహ్వానించింది.

పెగ్గీ లోపలికొచ్చి కూర్చొంది.

ఎల్సీ గబగబా తన కగితాల కట్ట సంచీలోకి తోసేసింది. అవన్నీ ఎల్సీ ఎవరికో రాస్తున్న ప్రేమలేఖలనుకుంది పెగ్గీ!

“చిన్న అమ్మాయిగారు ఏదో ఉత్తరాలు రాసుకుంటున్నట్టున్నారు. నేనొచ్చి పాడు చేసానా?”

“వుత్తరాలు కాదు పెగ్గీ! ఎల్సీ ఒక పుస్తకం రాస్తోంది!”

“పుస్తకమే? వామ్మో! నాకు అసలు సరిగ్గా చదవడమే రాయడం రాదమ్మాయిగారూ! మీరా పుస్తకాలెలా రాస్తారో గానీ! అయితే, దానికేమైనా డబ్బొస్తుందాండీ?”

“చూద్దాం! వస్తుందో రాదో!”

“అంతే లెండీ! చదువున్న మారాజులు! నాకు పెన్ను పట్టుకుంటే అక్షరం ముక్క రాదు! ఆస్ట్రేలియాలో వున్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసే దిక్కులేకపోయింది. ఎవరినైనా అడగడానికి సిగ్గు పడిపోయాను. ఏదో కూడబలుక్కోని నా ఇష్టం వొచ్చినట్టు రెండు మాటలు రాసి పడేసేదాన్ని లెండి. అందుకే, నాలా అవస్థలు పడొద్దని ఈ పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నాను.”

“పెగ్గీ! నువ్వు నీ ఆస్ట్రేలియా జీవితం గురించి చెప్పాలి మాకు. నాకైతే భలే కుతూహలంగా వుంది!”

“ఎందుకు లెండి అమ్మాయి గారు! మీరవన్నీ మళ్ళీ ఏ పుస్తకంలోనో రాస్తే అంతా నన్ను చూసి నవ్వుతారు!” అనుమానంగా అంది పెగ్గీ!

నవ్వింది ఎల్సీ!

“లేదు పెగ్గీ నువ్వు చెప్పే సంగతులు నేనెప్పుడూ పుస్తకాల్లో రాయను సరేనా?”

ఆమె కాగితాల్లోకి తొంగి చూసింది పెగ్గీ.

“అమ్మాయి గారూ! మీర్రాసే లైనులు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వున్నాయండి! అంటే మీరు రాసేది కవితలే కదండీ?”

“అవును పెగ్గీ ! అవి కవితలే!”

“ఇహ అయితే నా గురించి చెప్తా లెండి. కథలైతే భయం కానీ, కవితలైతే భయం ఎందుకు?”

“అవునూ, నువ్వు ఆస్ట్రేలియానుంచి ఒంటరిగా వచ్చావెందుకు? అందరూ నువ్వు పెళ్ళి చేసుకుని జంటగా వస్తావనుకున్నారు.”జేన్ కుతూహలంగా అడిగింది.

“అవునండీ! పెళ్ళాడడానికి అవకాశాలు కూడా వచ్చాయండి. కానీ, నేను పెళ్ళాడి నా దారి చూసుకుంటే, ఈ చిన్న పిల్లల గతి ఏమిటి చెప్పండి? ఒకరిద్దరైతే ఈ పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కానీ, నాకెందుకో నమ్మకం లేక పోయింది!”

“ఈ పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళు పెగ్గీ! అప్పుడు మళ్ళీ ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసుకో.” సలహా ఇచ్చింది ఎల్సీ.

“లేదు లేమ్మా! నాకు చాలా నచ్చిన మనిషికి మెల్బోర్న్ లో పెళ్ళయిపోయింది. అతను మాత్రం ఎన్నాళ్ళని ఆగతాడు చెప్పండి? నాకు తెల్సుసు చిన్నమ్మాయి గారూ, మీరేమనుకుంటున్నారో! పెగ్గీ లాటి దాన్ని కూడా ఇష్టపడే మగవాళ్ళుంటారా, అనేకదా? అయితే ఆస్ట్రేలియా లాటి చోట అంద చందాలకంటే కష్టపడే మనస్తత్వానికే ఎక్కువ విలువ. అందుకే నాలాటి దాన్ని కూడా చేశుకోవడానికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తా వినండి.”

పెగ్గీ సర్దుకుని నేల మీద చతికిలబడింది. ఎల్సీ అక్క దగ్గరికి జరిగి, ఆమె వొళ్ళో తల పెట్టుకుంది. జేన్ చెల్లెలి జుట్టులోంచి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, పెగ్గీ కథ వినడానికి సిద్ధమైంది.

  ***

(సశేషం )