తనతో కలిసి …

Painting: Rafi Haque

                              పెట్టె

నా బరువును దించుకుంటూ గతవారపు మేఘవిస్ఫోటనాన్నీ, ఒక ప్లాస్టిక్ మేకనూ, హై స్కూల్లో అనుభవించిన ఐదు సంవత్సరాల నరకాన్నీ, తత్తరపాటు నిండి వికృతమైన నా మొదటి ముద్దునూ, నేనెప్పుడూ కలవని నా అమ్మమ్మనూ తాతయ్యనూ, చాపమీద వొలికిన వొంటినూనె పరిమళాన్నీ, మొన్నమొన్ననే పుట్టిన పిల్లిపిల్లనూ, మొక్కజొన్న నూకతో చేసిన ఉప్మానూ పెట్టెలో సర్దేస్తాను. వృద్ధాప్యంలో వుంటాను కనుక నన్నూ అందులో పడేసుకుంటాను. ఎన్నైనా పట్టేలా ఆ పెట్టె వ్యాకోచం చెందుతుంది మరి! ఆఖరుకు దానికి ఏ లేబులూ తగిలించక రైలుస్టేషను ప్లాట్ఫామ్మీద వదిలేస్తాను. అలా అది తన గమ్యాన్ని చేరుకుని వుంటుందక్కడ, ఎవరో అపరిచితుడు తనను తీసుకుని నిధిలాగా దాచుకుని తనతో కలిసి బతుకుతాడని ఎదురు చూస్తూ.

                                              ఆంగ్లం: గెయిల్ డెండీ

                                      తెలుగు: ఎలనాగ

                     స్వర్గం అండ్ సన్స్ Co.

 

తిరుగు లేని నిర్ణయాధికార పరిధిననుసరించి మోక్షగాముల సంఖ్యను తగ్గించాలని నిశ్చయింపబడిందని తెలుపడానికి చింతిస్తున్నాను. ముక్తిని పొందవలసిన ఒక మహా మానవాళిని ఈ విధంగా తొలగించాల్సి రావటం మీకు చిత్రంగా తోచవచ్చు. కాని పెద్దసారు గారు అందరికీ శాశ్వత స్థాయిని వాగ్దానం చేయలేరనీ, కటాక్షవీక్షణాల రూపంలో వేతనం పొందుతున్నవారిని సైతం తొలగించకుండా వుండలేరనీ దయ చేసి గమనించాలి మీరు. ఈ సూత్రం పట్ల అవగాహన లేకపోవటం పెద్దసారు గారి దివ్యత్వాన్ని ఎంతగానో తగ్గిస్తుందనేది, నిజమైన వినయాన్ని క్షీణింపజేస్తుందనేది స్పష్టం. మిమ్మల్ని అంతిమంగా తొలగించే ముందు ఒక సమావేశాన్ని ఏర్పరచి పునర్ముక్తి కోసం మీరు ఏ ప్రత్యామ్నాయాలను కోరుకుంటారో అడుగుతాం. మీరు బాధితులుగా కాని, వేడుకునేవాళ్లుగా కాని రావచ్చు. ఇక వెంటనే మీ కాగితాలను వదిలి వెళ్లండి. చిన్నచిన్న గీతలూ పిచ్చిగీతలూ ఉన్న కాయితాల్ని కూడా వదిలి వెళ్లాలి. ఈ కార్యాలయం నుండి బయటికి పోయేటప్పుడు మీ వెంట ఒక సెక్యూరిటీ గార్డు వస్తాడు. మిమ్మల్ని తీసేయడం పెద్దసారు గారి అనుగ్రహపు అస్పష్టతను ఎలా తెలియజేస్తుంది అనే ప్రశ్న మీలో తలెత్తితే నన్ను సంప్రదించడానికి సందేహించకండి. మీ సేవలకు కృతజ్ఞుణ్ని. పునర్జన్మలో మీకు సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

ఆంగ్లం: ఫిలిప్ ప్రైడ్

                                          

                                                                                                    ***

 

 

 

స్వప్నాన్ని నాలో వొంపండి

jaya1

పూనే, మహారాష్ట్ర లో నివశించే జూయి కులకర్ణి మరాఠీ యువకవయిత్రి. హిందీ లోనూ కవితలల్లే చిత్రకారిణీ. మరాఠీ,హిందీ ఆంగ్ల భాషలతో పాటు పిగ్ లాటిన్ భాషలలో ప్రావీణ్యం సాధించిన బహుముఖ ప్రతిభావంతురాలు.

రాత్రంతా మేల్కొంటున్నావా? రెండు నదీ తీరాలను యేకం చేసే కవిత్వాన్నీ రాస్తున్నావా? అంటూ పలువురి సాహితీవేత్తల ప్రశంసలందుకొంది. శ్వాసల నిర్మాణ కార్యం అనే యీమె కవితా సంపుటి మరాఠీలో ఆసక్తిని రేకెత్తించింది. అతికోమలంగా కనిపించే పదాల వెనుకటి అల్లకల్లోలాలు పాఠకులను కలచివేసే కవితలు. యీమె కవిత్వ అభివ్యక్తి నూతనంగా వుండి ఆలోచింపజేస్తుందిలా-

నేటి నా కన్నీరును యీ పూలసజ్జలో దాస్తున్నాను..కొన్ని రోజుల్లో వో యాత్రికుడి దాహాన్ని తీర్చాక ఆరిపోవచ్చు.యీమె కవిత్వంలోని కల్పనలు,ప్రేరణలు,అర్థవంత నిర్మాణాలకు పునాదిగా నిలిచి మానవ సంబంధాలను నిర్మిస్తాయి. యీ కవితను గీత్ చతుర్వేది మరాఠీ నుంచి హిందీ చేసారు.

jaya

స్వప్నాల దాడి
——————–

యీ రోజుల్లో స్వప్నాలు
గొప్పగా ప్రపంచ వ్యవహారికంగానే వస్తున్నాయి

స్వప్నాలలోనూ
వంట చేయాలనిపిస్తుంది
చాలా సార్లు నన్ను నేను
వంట చేస్తున్నట్టే స్వప్నిస్తాను

చీల్చుతూ, కోస్తూ, మర్థిస్తూ
వుడకబెడుతూ, వేయిస్తూ, వండుతూ
పెరుగుతూనే వుంటాయి
నీ కవితలు, కథలు,వృత్తాంతాలు,నవలలు

స్వప్నాలలోనూ
తెరచిన కిటికీ నుంచి
బల్లులు, కప్పలు వస్తుంటే చూస్తుంటాను
భయపడిపోతుంటాను

స్వప్నాలలోనూ
గడియారపు ముళ్ళపై
నా బరువును తూకం వేసి
ఆకస్మిక భీతిలో నిద్రపోతాను

స్వప్నాలలోనూ
రుచి చెడిన అన్నపు వ్యంగం
గొర్తొస్తుంది

వినండి!
మీరెవరైనా సరే
బలవంతంగానైనా పర్లేదు
కొత్త కొత్తగా గాని
కఠినాతి కఠినమైనవి కాని
చూచేందుకు సరైన
స్వప్నాన్ని నాలో వొంపండి..

*

కాసింత రక్త స్పర్శ!

satya1

Art: Satya Sufi

1977 బొంబాయిలో జన్మించి భోపాల్ లో నివశిస్తున్న గీత్ చతుర్వేది గద్య పద్య రచనలను సమానంగా లిఖిస్తున్న కవి.  పదహారేళ్ళ పాత్రికేయ వృత్తి తరువాత తను అధిక సమయాన్ని రచనా వ్యాసంగానికే వెచ్చిస్తున్నారు. యితనిని యిండియన్ యెక్స్ప్రెస్ లాటి ప్రచురణ సంస్థలు ప్రసిధ్ది చెందిన 50 మంది హిందీ రచయితల్లో వొక్కడిగా పరిగణించాయి. యితని ఖాతాలో ఆరు రచనలు ప్రచురింపబడ్డాయి.

యితని కవితలు 14 దేశ విదేశీయ భాషల్లో అనువదింపబడ్డాయి. అనేక పురస్కారాలు సృజన,అనువాద రచనలకు యితన్ని వరించాయి. గీత్ చతుర్వేది 21వ శతాబ్దపు కవి. 2010లో తన మొదటి కవితా సంకలనం అలాప్ కా గిరహ్ ప్రచురింపబడితే రెండో కవితా సంకలనం న్యూనతం మైఁ ప్రచురణలో వుంది. గీత్ చతుర్వేది హిందీ కవిత్వంలో ప్రపంచ గుర్తింపును సాధిస్తున్న కవి.

వీరి కవితలు మారే కాలంతో పాటు యెదుగుతున్న సముచిత కవితలు. అందుకే వీరి కవిత్వం బరువైన  కవితలుగా మారుతున్నాయి. యితని కవితల్లోని ప్రతిబింబాలు, సంకేతాలు యాంత్రికతలో మనిషి హత్యల చల్లటి నెత్తురు యెగజిమ్ముతుంది.యితని కవితల్లో మనల్ని మనుషులుగా నిలిపి వుంచే మరో విశిష్ట సృజనాత్మక లక్షణం.

chatur

*

ఆనందపు గూఢచారులు
———————————–

వొక పసుపుపచ్చని కిటికి
తెరుచుకొంటోంది
పూరేకులు విప్పారుతున్నట్టుగా

వొక పంజరపు పక్షి
వూచల్ని కొరుకుతుంటుంది
తన పొలంలోని వరికంకుల్ని కొరికినట్టు

నా స్వప్నాలు కొన్ని
పొడిబారి పోయాయి యిప్పుడు
వాటితో నిప్పు గుండాన్ని
మండిస్తున్నాను యిప్పుడు

కొన్ని పచ్చగా వున్న నా కలలను
పోగేసుకొని
వో గొర్రె ఆకలిని నింపుతున్నాను

నా భాషలోని అతివృధ్ధ కవి
లైబ్రరీ నుంచి లావుపాటి పుస్తకాలు తెచ్చాడు
కూడలిలో కూర్చొని
బంగారు నాణేల్లాంటి పదాలను
పంచిపెడుతున్నాడు

నా పొరుగింటి ముసలావిడ
వొక యంత్రాన్ని ఆవిష్కరించింది
అందులో కన్నీటిని కుమ్మరిస్తే
తాగేందుకు నీరు
తినేందుకు వుప్పు వేరౌతాయి

వో అమ్మ తన బిడ్డలను
యెంత ప్రేమగా చూస్తుందో
ఆమె పాలధారతో
అనేక నదులు ప్రవహిస్తుంటాయి

నేల పైన చెల్లాచెదురైన
లోతైన నెత్తుటి యెరుపు రంగు
ప్రేమ యొక్క లేత గులాబి రంగులోకి
మారిపోతుంది….

*

యివే లేకుంటే …

vandana1వందన టేటే రాంచి, ఝార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ కవయిత్రి. రాజస్థాన్ విద్యాపీఠ్ లో తన విద్యను పూర్తిచేసి యే.కే.పంకజ్ ను వివాహమాడి ఆధార్ ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించి ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఝార్ఖండ్ ఆదివాసీల భాష,సాహిత్యం,సంస్కృతులను ప్రతిబింబించే ‘అఖాడా’ అనే పత్రికకు సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వందన టేటే వ్యక్తిగా చాలా ప్రశాంతంగా కనిపించినా ఆమె కవితలు మాత్రం చదివేకొద్ది మనలో నిద్రపోతున్న అలజడులను సృష్టించి మేల్కొల్పుతాయి. యిలాటి అనుభవం కోసం యీమె రచించిన స  ‘కోన్జోగా’ అనే కవితా సంకలనం చదివి తీరాల్సిందే. కొండలతో, నదులతో,పాటలతో తయారైన వో ఆదివాసీ స్త్రీ కి అంకితమిచ్చింది యీ కవయిత్రి. స్త్రీ మారిన తన యింటిపేరనే బరువును మొండిగా,నిర్భయంగా మోస్తున్నదని అవేదన చెందుతుంది. తన పూర్వీకుల త్యాగాలను కీర్తిస్తూ,తన వారి అస్తిత్వ సంక్షోభాలను కవిత్వంగా వినిపిస్తూ వారిలో నమ్మకాన్ని, యేకత్వాన్ని సాధించడాన్ని నిరంతరం కృషి చేస్తున్న కవయిత్రి సామాజిక కార్యకర్త కూడాను.

vandana

సీతాకోకచిలుక
——————–

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు వున్నవి
అందంగా కనిపించేందుకో లేక
యెగిరేందుకో కాదని
రెక్కలు దీని అస్తిత్వంలో భాగం అని
యివే లేకుంటే దానికి వునికే లేదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
మనసును ఆకర్షించేందుకో లేక
వాటి రంగులను నిర్వచించేందుకో కాదని
రంగులు దాని జీవితపు అంగాలు అని
యివే లేకుంటే దానికి యెలాంటి గుర్తింపూ వుండదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
ప్రియుణ్ణి వాటికింద పొదివించుకునేందుకు కాదని
కేవలం పిల్లలను పోషించేందుకు కాదని
దీని రెక్కలు ప్రకృతి శ్వాసలని
యివే లేకుంటే
యీ భూమి జీవించడం కష్టం అని…

*

చీకటిని మింగిన వెలుగు తార

hemantహేమంత్ కుక్రేతి హిందీ ఆచార్యులుగా పనిచేస్తూనే తన కవితా సేద్యంలో ఐదు కవితా సంపుటాలు పండించారు. కవిత విమర్శ పై నాలుగు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. హిందీ సాహిత్య వాస్తవ చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని రచించారు. వీరి కవితలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ  అనువదింపబడ్డాయి.ఆకాశవాణి,దూరదర్శన్లకు తమ రచనా సేవను అందిస్తున్నారు. సాహిత్య పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యిన్ని రకాలుగా సాహిత్యానికి సేవచేస్తున్న వీరికి పురస్కారాలు వరించవా?! వీరి కవిత్వం మనుషుల్ని నమ్మి వారి చుట్టూ తిరిగే అందాలను వర్ణిస్తుంది, మోసాలను పసికడుతుంది. వీరి కవిత్వం చీకటిని మింగి వెలుగు తారలను కురిపిస్తుంది. జీవితం పట్ల విపరీత ప్రేమ వో వైపూ మరో వైపు నిరశన కూడా లేకపోలేదు. దుఖాలను తుడిచే ప్రయత్నంలో చివరి వరకు పోరాడే కవిత్వం. కవిత్వాన్ని చదవాలని కవిత్వమై బతకాలనే ధృఢమైన సంకల్పం వుంటుంది అతని కవితల్లో. వ్యవస్థల పట్ల విపరీతంగా వ్యంగ్యంగా దుయ్యబట్టిన సంధర్భాలు అనేకం. వర్తమానంలో కవిత్వాన్ని వొక ఆయుధంగా వుపయోగించమనే కవుల్లో అగ్రగణ్యుడు.

మట్టి కవిత
—————-

నీరే మట్టిని రాతిలా మార్చుతుంది
నీటిలో నానితే అది మెత్తబడుతుంది
నిప్పు లోపల నీటిచుక్క వుండునేమో
ఆకాశంలో భూమి జీవితంలా

యెన్నో యుగాల నుంచి సీతాకోక చిలుకలు
తమ శరీరాలపై వొణుకుతున్న రంగుల
మౌనాన్ని మోస్తున్నాయి.
పూలు యెవరి ప్రేమ యాతనలోనో కాలుతుంటాయి
మరెవరిలోనో జ్ఞాపకాలు  మట్టిలా మారిపోతుంటాయి

జీవించడానికి ప్రాణానికి ఆత్మ తోడు కావాలి
శరీరమంతటా అన్నపు వాసనే లేదు
పనికి యే కవచము లేదు
తప్పించుకుని వుండడమంటే గింజలా మారడమూ కాదు
యీ పనికి రాని ప్రపంచంలో వో భారీ లాభం దాగుంది
కొన్ని లాభంలేని వుపాదులు
మిగిలిన వ్యాపారమంతా యిలానే వుంటుంది
తనకు తననే కొనుక్కొని
అమ్ముడుపోవడం నుంచి తప్పించుకోవాలి
దేవుడి గొప్పతనం దైనిక భవిషత్తు
ఫలితం తప్ప మరేం లేదు

ప్రేమించేందుకు అడ్డుపడుతూ కాలయాపన కోసం ప్రేమించలేదు
తన జీవితపు వుప్పును పొందేందుకు
తన మట్టినే పిసికి తన ముఖాన్ని తయారు చేసుకున్నాడు

మబ్బుల్లో  మెరుపులు వుంటాయి
మెరిసే ప్రేమమయ ముఖాలపై యెక్కడో లోతుగా గుచ్చుకున్న
గాయాలు వుంటాయి
వీటిల్లో నుంచి వొకరికొకరం దగ్గరగా సమీపిస్తాం
అంతం మమ్మల్నీ విరిచేసి
నిర్మించుకోమనే సవాలు విసురుతుంది

మట్టికి చావు లేదు
అది కొద్దిగా పెరిగుతుంది

వారి ప్రాణాలు యెవరి వద్ద వుంటాయో

పొదలలో దాక్కొన్న వాడు
ఎలుగుబంటి అయ్యుంటాడు
యెందుకంటే బంగాళాదుంప తినేవాడు
దాని కథతోనే భయపడి పోయాడు
బంగాళాదుంపను పండించేవారే
ఎలుగుబంటిని అదిలించారు

వారు వెచ్చదనం కోసం పాలు తాగేందుకు వెళ్ళారు
పశువులను మేపుకొని తిరిగొచ్చారు
వారి చెమట యెంతలా మండుతూ వుందంటే
బంజరును మండించేసేలా వుంది

నివాసించాలనే సాకుతో పల్లెలను కాల్చేస్తున్నారు
హిమాలయాలను కరిగించేసి సప్తసముద్రాలను దాటించేస్తారు
గంగాతీరంలో మధ్యసీసాల్లో నింపి , అమ్మేస్తారు

యిక కాపాడుకునేందుకు తమ
ప్రాణాలు తప్ప యిక యేమి లేనివారు
యిలాటి వారినే యెందుకు యెంచుకుంటాడో
తాను పండించిన బంగాళాదుంపల ఖరీదుతో భయపడి
అక్కడి పొదల్లో దాక్కొంటాడు

వాడు కథలలో నుంచి బయటకు వచ్చి
వారిని లోపలకు యెందుకు పంపడు

వీరి యిళ్ళను ఆక్రమించుకొన్నాక
పొలాల్లో
అంతరిక్ష నరకాన్ని నిర్మించాలనుకొంటున్నాడు.

*

నానుంచి నీకు విడుదల ఇక!

mastanకృష్ణ మోహన్ ఝా మధేపురా బీహార్ లో జన్మించారు. తన వున్నత విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి అస్సాం విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సమయ్ కో చీర్కర్ అనే కవిత సంపుటిని హిందీలోనూ,యెక్టా హెరాయల్ దునియా అనే సంపుటిని మైథిలిలోను ప్రచురించారు. యితని కవితలు మరాఠి,మైథిలి,నేపాలి,ఆంగ్ల భాషల్లో అనువదింపబడ్డాయి.

కృష్ణ మోహన్ ఝా కవితలలో కోమల దేహంపై కాలం చేసిన లోతైన గాయాలు వుంటాయి. గాయాల గురుతులు మన సభ్య నాగరికత చేసిన అనేక అసంగతులను సంకేతిస్తాయి. మనుషులు చేసే హింస హింసను కొట్టే దెబ్బలను భరించే ప్రకృతి దుఖంతో యితని కవిత్వం కంపిస్తుంది.యేడ్చే పిల్లవాడు తన మాటలను లిఖించినట్టు,యేడ్చి యేడ్చి లేచొచ్చిన స్త్రీ లా యితని కవిత్వముంటుంది. కవిత్వ రసస్వాదనలో దాని ఆంతరంగిక లయను ఆత్మగతమై రచిస్తాడు కవి.

నిన్ను విడుదల చేస్తున్నాను
————————————-

నేను వో రాతిని తాకుతాను
వారి కలవరంలో రాళ్ళుగా మారిన
వారి గాయాలు కనిపిస్తాయి

నేను మట్టిని తాకుతాను
భూమి చర్మం చుట్టూ అల్లుకున్న
అదృశ్యపు పువ్వుల సువాసనలు చూస్తాను

నేను చెట్టును తాకుతాను
క్షితిజంలో పరుగెత్తే వ్యాకులత నదులు
పాదగురుతులు వినిపిస్తుంటాయి.

ఆకాశం వైపు చూస్తూనే
నీ వీపులో నుంచి పుట్టిన బాణం
నన్ను చీల్చుకొంటూ వెళ్ళిపోతుంది

నా చుట్టు నిశబ్దాన్ని మోగనివ్వాలి
వెళ్ళిఫో
యీ ప్రపంచంలో నాకు ముక్తి లభిస్తుంది
నీతో యేం చెప్పలేను..చెబితే
దానికి అర్థము వుండదు
నేను నిన్ను నానుంచి విడుదల చేస్తున్నాను
యింత కంటే యింకేమి చెప్పలేను

నా దేహం, కళ్ళ నుంచి
నా శరీరపు పరాగాన్ని వూడ్చుకొని
తీసుకు వెళ్ళు

నాలో యెక్కడైన నా పేరున
వో అలికిడి మిగిలి వుంటే
దోచుకు వెళ్ళు

యుగాలు నేసిన దాహపు దుప్పటిని
నా దేహంపై నుంచి లాక్కెళ్ళు

వొక అర్థవంతమైన జీవితం కోసం
యింత దుఖం తక్కువేం కాదేమో…

*

రంగుల్ని కోల్పోయిన దిగులు!

vazda

వాజ్దా ఖాన్  సిధ్ధార్థ నగర్, వుత్తర్ ప్రదేశ్ లో జన్మించిన యీ ప్రసిధ్ధ చిత్రకారిణీ వో మంచి కవయిత్రి కూడా. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి చిత్రకళలో యెం.యె.,డి.ఫిల్. పట్టాను పొందారు.యీమె ‘జిస్ తరహ్ ఘుల్తీ హై కాయా’ (దేహం కరుగుతున్నట్టు) అనే కావ్య సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు. హేమంత్ స్మృతి సమ్మాన్ పురస్కారాన్ని పొందారు.  చిత్రకళాకారిణిగా అనేక యేక, సామూహిక చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. యీమె కవితలు భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి.

వాజ్దా ఖాన్ కవితల్లో రంగులను శిల్పించే శిల్పి సంవేదన వుంది.యింకా ప్రపంచపు రాగతత్వంతో పాటు వర్ణహీన జీవితపు స్థితుల్లోని సుఖ దుఖాలను వేరుగా చూడడం కష్టంగానే వుంటుంది. యీమె కవితల్లోని చైతన్యపు కరుణామయ పిలుపు అస్థిత్వపు దార్శినికత వైపు తీసుకెళుతుంది. భాషా శిల్పాల జుగల్బందిలో వాజ్దా ఖాన్ కవితల్లోని అంతరంగిక లయ కారణంగా పాఠకుణ్ణి ప్రత్యేకంగా పలకరిస్తుంటాయి.

మట్టి, గాలి, నేనూ
————————

స్వప్నాలూ
మీకు యేం అవసరం వుందని
శతాబ్దాల తరబడి నా చుట్టే తిరుగున్నారు
నా సారాన్ని రహదారుపై వెతుకుతుంటే
మీరు నన్ను వెంటనే నన్ను కప్పేస్తుంటారు

మీరిలా అంటుండే వారు కదూ –
నాలో  సూక్ష్మ రూపంలో వున్నావని
నా ప్రతి చింతనలో
నా ప్రతి శ్వాసలో
వాటిని దించుకునే దానిని నేను
మనసు రెప్పల పై నుంచి
ఆకాశపు రెప్పలపైకి
నా వుత్తమ విధానాన్ని రచించేందుకు
నీలో వెతుకున్నాను
నా సారం – భూమి, ఆకాశం,సముద్రం
మట్టి,గాలి,నేను
అన్నీ నీలో విలీనం అయ్యాయి
రెప్పల తడి శివమౌతోంది
యీ ఆలోచనను కూడా నీవే నిర్మించావు
సాధనా శివంగా మారే దిశ నిర్మింపబడింది
కల్పన రూపాన్ని గ్రహించడం ఆరంభమైంది
యుగపు శాశ్వత సత్యం నీవు
నీ దేహం నుంచి తన అమూర్తత వరకు…

*

వాన సంవాదం!

tushar

42 యేళ్ళ తుషార్ ధవళ్ సింహ్ డిల్లీ స్కూల్ ఆప్ యెకనామిక్స్ లో పట్టభద్రులై యిండియన్ రెవెన్యూ సర్వీస్ లో కమీషనర్ ఆప్ ఇన్కంటాక్స్ గా పని చేస్తున్నారు. పైంటింగ్,ఫోటోగ్రఫి, నాటకాలు కూడ అంతే యిష్టంగా వేస్తుంటారు.యిప్పటివరకు రెండు కవితా సంకలనాలు ప్రచురించారు.

యితని కవిత్వం యాంత్రిక జటిలతను ప్రశ్నిస్తూ ..వుత్తర పెట్టుబడి వాదంతో భారత దేశ సంస్కరణల వలన యేర్పడ్డ విషమ పరిస్థితులను యితని కవిత్వం గొంతెత్తుతుంది.రంగుల్లేని మధ్యతరగతి జీవనపు దుఖాలను దుఖమై కరుగును.యీ సంవేదనలన్నీ తన కవిత్వంలో తిరిగి మానవత్వాన్ని పొందాలనే ప్రయత్నంలో భాగమే. దృశ్యాత్మక బింబాల్లో యదార్థాలను ప్రకటించడమే తన శిల్పపు ప్రత్యేకత.

యీ యాత్రలో
——————-

చాల దూరం వరకు విస్తరించిన దట్టమైన అడవిలో
నాకు వో నది కనిపిపిస్తుంది
నువ్వు చూడలేక పోవచ్చు

తేమతో వేగంగా వీచే గాలి
వాన సంవాదంతో
వర్షాన్ని తీసుకురాదు
నిగిడిన వో తియ్యదనం వుంటుంది

యింతవరకు నడిచినదంతా
నా లోపలే నడిచిచాను
మైళ్ళ బొబ్బలు నా అరికాళ్లు
నా నాలుక పైనా వున్నాయి

నా గాయాల లెక్కింపు
నీ లెక్కించలేని
జయగాథల్లో జతకావచ్చు
యీ యాత్రలో
నా కోసం
యివి చిత్రాలు

యీ బెరడులపై
అక్కడి నుంచే బయలు దేరుతున్నాను
ఆ గుహల వరకు

నా పరిశోధన గురుతులు వున్నాయి
నీ యాత్రలలో దుమ్ము వుంది
వీటిల్లో సుఖపు రోజుల్లోని
విధ్వంసపు కథలున్నాయి

అన్నీ పడదోసి చేరుకున్నప్పుడు
నాకు నేను తిరిగివచ్చినట్టు
అనుకొంటాను

తిరిగి రావడమంటే
యేదో చెట్టు తన గింజలోకి ప్రవేశించడం
సాధారణ సంఘటన కాదు
యిది వొక అజేయ సాహసం
పతనానికి వ్యతిరేకంగా …

*

కొంత సిగ్గు మిగిలి వుండాలని…

dabral

మంగలేష్ డబ్రాల్ 1948 మేలో వుత్తరాఖండ్ లో జన్మించారు.అక్కడే ప్రాధమిక విద్యను అభ్యసించారు. అనేక పత్రికల్లో సంపాదక, వుపసంపాదకులుగా పనిచేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ లో సంపాదక బాధ్యతను నిర్వహించారు.

హిందీ పేట్రియాట్,ప్రతిపక్ష్, పూర్వగ్రాహ్ లాంటి పత్రికలు ఆయన సంపాదక వర్గంలో వూపందుకొన్నాయి.లోవా యూనివర్శిటీ నుంచి రైటర్స్ ప్రోగ్రాం ఫెలోషిప్ ను పొందారు.సాహిత్య అకాడమి అవార్డునూ పొందారు.

వర్తమాన హిందీ కవిత్వంలో వో ప్రముఖ గొంతుక మంగలేష్ డబ్రాల్. యితని కవిత్వం భారత దేశపు ప్రముఖ భాషల్లోనే కాక ప్రపంచ ప్రధాన భాషలైన ఆంగ్లం,రష్యన్,స్పానిష్,పోల్స్ కీ,బల్గేరియన్ లలో అనువదింపబడింది. యితను నాలుగు కవిత సంపుటాలు వెలువరించారు.యితని కవిత్వంలో సామంత,పెట్టుబడిదారి విధానాల పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది.తనే వో ప్రతిపక్షమై వో అందమైన కళ ప్రపంచాన్ని స్వప్నిస్తారూ. యితని కవిత్వం సూక్ష్మంగా సౌందర్యముతో,  పారదర్శిక భాషతో పాఠకులను ఆలోచింపజేస్తుంది.

*

నేను కోరుకొంటున్నాను
——————————

నేను కోరుకొంటున్నాను
కవుల్లో కొంత సిగ్గు మిగిలి వుండాలని

స్పర్శ మిగిలివుండాలని కోరుకొంటున్నాను
అది భుజాలను చెక్కుతూ
అత్యాచారిలా వెళ్ళాలని కోరుకోను
యెందుకంటే
అది వొక అపరిచితయాత్ర తరువాత
భూమి చివరి అంచుపై చేరినట్లు వుండును

నేను రుచి మిగిలివుండాలని కోరుకొంటున్నాను
తీపు చేదులకు అతీతంగా
తినని వస్తువులను కాపాడే
వొక ప్రయత్నపు పేరు

వొక సరళ వాక్యం కాపాడడం నా లక్ష్యం
మనం మనుషులం కదా!
యీ వాక్యపు నిజాయితీ బతికి వుండాలని కోరుకొంటున్నాను

దారిపై విన్పించే వో నినాదం
దాని అర్థంతో పాటు
అది మిగిలి వుండాలని
నేను కోరుకొంటున్నాను
నిరాశ మిగిలి వుండాలని

మళ్ళీ వొక ఆశ
మన కోసం జన్మిస్తుంది

పక్షుల్లా అప్పుడప్పుడూ
దొరకని పదాలు మిగిలి వుండాలి
కవుల్లో కొద్దిగా సిగ్గు మిగిలి వుండాలి

*

నేను యిరోంని!

arya

డాక్టర్  కర్మానంద్ ఆర్య అనే యీ యువకవి బీహార్ లోని గయలో నివసిస్తున్నాడు. దక్షిణ బీహార్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు.యితని కవితలు ప్రముఖ హిందీ సాహిత్యపత్రికలలో ప్రచురింపబడ్డాయి. త్వరలోనే తన మొదటి సంకలనం బోధి ప్రకాషన్, జైపూర్ వారు ప్రచురించనున్నారు.

“నీ దిగులు నా కవిత్వం సాధించిన అపజయమ”నే యీ కవి అడవి చరిత్రను కొత్తగా లిఖించే ప్రయత్నం కవితల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే మోచీనీ చూసి దుఖిస్తాడు. నదుల్లోని చేపల ప్రాణాన్ని యెంత గణిస్తాడో, విద్యా,ప్రజాస్వామిక వ్యవస్థలలోని అసమానతలను ఖండిస్తాడు. వొకటి చూస్తే మరొకటి కనిపించే అడవిపుత్రుల దుఖాన్ని చూసి కవితై ప్రవహిస్తాడు. చరిత్రలేని అడవిని గొంతెత్తి పాడుతాడు. తనను తాను వెతుక్కునే ప్రయత్నంలో వో ప్రత్యేక అస్తిత్వం కోసం చేసే కృషి కనిపిస్తుంది. విపరీతమైన ఆర్తి ఆవేశాలు యితని కవిత్వంలో మెండు.
యిరోమ్ షర్మిలా గురించి దాదాపు భారతదేశపు అన్ని భాషల్లో కవితలు లిఖింపబడిన కర్మానంద్ రాసిన యీ కవిత పాఠకులను కదిలిస్తుంది.

మృత్యువు అర్థాన్ని గ్రహించిన షర్మిలా కోసం యీ కవిత..

Irom-Sharmila-t40807

షర్మిలా యిరోమ్
———————–

నేను పోరాడుతున్నాను
మనుషులు పోరాడడం ఆపేసారు
వొక కలకు,వొక వొడంబడికకు వ్యతిరేకంగా
యేమౌతుంది?
గుర్రపు డెక్కల శబ్దం కంటే భయంకరంగా
యిప్పుడు నా గొంతు పదునెక్కి హెచ్చింది

నాకు జీవితమంటే  ప్రేమ యెక్కువే
నాకు చావు విలువ తెలుసు
అందుకే పోరాడున్నాను
గాయపడ్డ వేటగాడు నేర్పరి
అందుకే పోరాడుతున్నాను
నా పిల్లల నోళ్ళల్లో నా స్థన్యం వుంది
నన్ను నలువైపులా చుట్టుముట్టేసారు
పోరాడుతూనే వున్నాను

వేటగాడికి నా దంతాలు,నా గోళ్ళు, నా  అస్థికలు కావాలి.
నా సాంస్కృతిక ధనస్సు,బాణాలును
మార్కెట్టు లో అన్నింటి విలువలు
నిర్ణయింపబడ్డాయి
నా నల్లమందు మట్టి కూడా అమ్ముడైంది
నాకు నా దేశంలోనే నిర్వాసిత శిక్ష. విధింపబడింది
నేను నా దేశాన్ని వెతుక్కుంటున్నాను
డిల్లీ వీధులలో ఫిర్యాదులతో
తిరుగుతున్నప్పుడు
నా దేశం యేదని అడిగారు
నేను వారి చేరికకు లోపలే వున్నానని
నన్ను అంగీకరిస్తారు

వారు యెక్కడ కోరుకుంటే
అక్కడ జెండా పాతేస్తారు
మా పచ్చని దేహాలను పిసకడం
యీ వేటగాళ్ళను మోహింపచేయును
కామ పురుషులకు విరిగిన మా
యెముకలు కనిపించవు
సైనికుల చప్పుళ్లతో మా నిద్దుర
ముక్కలౌతుంది
వారు మమ్మల్ని వేశ్యలుగా భావించారు
మా పనులు చూస్తే వారికి అసహ్యం కలగదు
మమ్మల్ని చెరపడమే వారికి యిష్టం
వాడి అల్ప ప్రతిక్రియలలో నేను వోడిపోతానని ఆలోచిస్తాడు

గాయపడ్డ వేటగాళ్ళారా రండి చూడండి
నీ కోరిక కంటే యెతైన కఠినమైన నా వక్షోజాలను
నీవు నా స్తనాలను తాగాలనుకొన్నావు కదూ
రా వుప్పుతో విషంతో కలిసిన నా
నెత్తురును రుచి చూడూ!
రా చూడు! బూడిదను వెచ్చగా వుంచే రాతిరి నాలో ప్రాణాలతో వుంది

బ్రహ్మపుత్ర యెలా నవ్వుతుందో చూడూ
వితస్తా నన్నెలా కాపలా కాస్తుందో చూడూ
మా పగుళ్ళలో నుంచి ప్రవహిస్తన్న సిరా
యెంత యెర్రగా మత్తును యిస్తుందో వుందో చూడు
నేను మళ్ళీ పుట్టనని అనుకోకు
నేను నా తరాల్లో స్థిరంగా వున్నాను
నేను యిరోంని
యిరోమ్ షర్మిలా చాను

*

ఆమె కవిత రాస్తే కొరడా పడ్డట్టే!

subham

పాతికేళ్ళ  శుభమ్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని.శుభమ్ శ్రీ యెప్పుడు రాసిన చర్చనీయాంశమే.ఆమె  బుఖార్(జ్వరం) ,బ్రేక్ అప్ ఐ లవ్ యూ కవితలు రాసినపుడు కూడా చాలా చర్చలు, విముఖతలు,సుముఖతలెన్నో విన్పించాయి.యీమెకు హిందీ కవిత్వానికిచ్చే ప్రతిష్టాత్మకమైన భరత్ భూషణ్  అగ్రవాల్ పరస్కారం 2016 వ సంవత్సరానికి గానూ లభించింది. హిందీ సాహిత్యప్రపంచం జీర్ణించుకోలేక పోయింది.జ్యూరీ సభ్యులలో వొకరైన వుదయ్ ప్రకాష్ మాత్రం సరైన యెంపికేనని కొత్త వొరవడిని ఆహ్వానించాలని చెప్పారు.

సాంప్రదాయ శిల్పపు నడుములను విరచి ముక్కలుగా చేసి రాస్తున్నప్పుడంతా యిలాంటి చర్చలు జరగడం సహజమే అన్పిస్తోంది.

శుభం శ్రీ యీ కవితలో నెరేటివ్ వ్యాఖ్యానపు వుత్తరాధునిక శిల్పమైన పెరడి గొప్పగా కనిపిస్తుంది.కవిత్వపు జడత్వాన్ని విదిలించే వొక కావ్యాత్మక ప్రయత్నాన్నీ తిరస్కరించే కంటే దానిని అర్థం చేసుకొనే దృష్టిని అలవరచుకోవాలి. యీ కవితలో కవిత్వం రాయడం వొక వ్యాపారంగా,వొక కెరీర్గా భావించే వారిపై తిరుగుబాటు కనిపిస్తుంది.సోషల్ మీడియాపై వొక గర్జన, యింకా వామపక్ష భావజాలం, స్త్రీ పట్ల మగవాడి పెత్తందారి ప్రవర్తన,రాడికల్ స్త్రీవాద చర్చలు యీమె కవిత్వంలో అంతర్లీనంగా వుంటాయి.యిది మౌఖిక కవిత యిందులో కవిత్వాన్ని యెలాంటి ఫలాలు యివ్వని చర్యగా,ప్రపంచ వ్యాప్తంగా యే వుద్దేశ్యాలను పూరించలేక పోతుందని వాపోవడం కనిపిస్తోంది.

పొయెట్రీ మేనేజ్మెంట్
—————————

కవిత్వం రాయడం బోగస్!
అరే,పనికిరాని పని
మొత్తంగా….
పనిపాటలేని పని!
పార్ట్ టైం!

మావాఁ,యేదో నెమరేసినట్టు
యెంబియే సేమ్ బియే టైపు అన్పిస్తోంది
గుజ్జు వచ్చేస్తోంది గురూ!

యిటు వొక కవిత రాసారనుకో;
సెన్సెక్స్ పడిపోతుంది
కవి లింగరాజు వొక కవిత రాసారు
పెట్టుబడివాదాన్ని వ్యతిరేకిస్తూ
సెన్సెక్స్ పడిపోయింది
ఛానల్ లో చర్చ
యిది వొక నమూన
అమెరికా సామ్రాజ్యవాదం పడిపోయిందని
వెనిజులతో ప్రేరేపింపబడిన కవులను
అమెరికా నియంత్రించగలదా?
ఆర్థికమంత్రి వుపన్యాసంలో
చిన్న యిన్వెష్టర్లకు నమ్మకం లభిస్తుంది
ఆర్బీఐ వెంటనే రెపోరేటును పెంచేస్తుంది
మీడియాలో గందరగోళం
సమకాలీన కవిత్వం
వొక సంకలనంగా ప్రచురింపబడుతోంది
వొక సామాన్యుడు యీ కవితాసంకలనాన్ని
యెలా యెదుర్కుంటాడో ?దీని గురించి
మీరే చెప్పండి
మీ స్పందనలు మాకు యెస్యంమెస్ చేయండి

అరే, సీ పీ వో (చీఫ్ పొయెట్రీ ఆఫీసర్)పేరు
ఆకాశంలో మెరుస్తుంటుంది
యాడ్లు ప్రతి కార్యక్రమంలో చూపిస్తుంటారు
రిలయన్స్ డిజిటల్ కవిత
లైఫ్ ను యిచ్చును
టాటా కవిత
ప్రతి పదం మీ కోసమే
ప్రజలు తమ డ్రాయింగు రూముల్లో
వేలాడదీస్తారు
అరే, వావ్ భలే వుందే! అని
యే అకాడమీ వాడికో అనిపిస్తుంది
లేదండీ, యింపోర్టెడ్
అసలైనది కోట్ల డాలర్లది
మేము డూప్లికేటు కొనుక్కున్నాం
పిల్లలు వ్యాసాలు రాస్తారు
నేను యం పీ యే చదువుతానని
యలైసీ పొయెట్రీ యిన్సురెన్స్
మీ కల కూడా మాదే
డియూ, పొయెట్రీ ఆనర్సు, ఆకాశంలో
కట్ ఆఫ్ ప్యాట్ (పొయెట్రీ ఆప్టిట్యూడ్ టెస్టు)
పరీక్షలో మళ్ళీ అమ్మాయిలే సత్తా చాటారు
ప్యాట్ రిజర్వేషన్లలో జరిగిన అవినీతికి
వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో
వి.సీ.దిష్టిబొమ్మ దహనం చేయబడుతుంది
దేశంలో యెనిమిది కొత్త కవితాసంస్థల
స్థాపనకు ఆమోదముద్ర లభిస్తుంది

మూడేళ్ళ వయసుకే
మూడువేల కవితలు వల్లెవేస్తుంది
భారతదేశపు పసిఅధ్భుతం
అమెరికా యిరాన్ ప్రవృత్తితో దిగులు పడి
ఫారసీ కవితాసాంప్రదాయాన్ని వోడిస్తుంది.

యిది ఆల్ యిండియా రేడియో
వార్తలు చదువుతున్నది దేవానంద రావు
నమస్కారం
యీ రోజు ప్రధానమంత్రి అంతర్జాతీయ
కావ్యసమ్మేళనంలో పాల్గొనేందుకు
మూడురోజుల పర్యటన కోసం బయలుదేరారు
యిందులో కవితాగుంపుల నుంచి
ప్రతినిధులుగా పాల్గొంటున్నారు.
భారతదేశం యెలాంటి పరిస్థితులలోనూ
తన విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేసింది
భారత్ – పాకిస్తాన్ ల కవితా దైపాక్షిక చర్చలు మళ్ళీ విఫలం.
పాకిస్తాన్‌ యిక్బాల్,మంటో, ఫైజ్ ల
వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకోమటోంది

చైనా నేడు మళ్ళీ కొత్త కావ్యాలంకారాలను పరీక్షించింది
యిప్పుడు అతిశక్తివంతమైన కావ్యసంపుటాలను
సృష్టిస్తుందనే కథనాలు విన్పిస్తున్నాయి
యీ రోజు వుదయాన్నే ప్రముఖ కావ్యనిర్మాత ఆషిక్ ఆవారా ప్రాణాలొదిలారు
వారి అకాల మరణానికి రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు
వుత్తరప్రదేశ్ లో మళ్లీ దళితులపై దాడి
అటు క్రీడల్లో భారత్ వరుసగా మూడోసారి
కవిత అంతాక్షరిలో పసిడిపతాకాన్ని సాధించింది
భారత్ వరుస సెట్లలో 6 -4, 6-4, 7-2 తో
మ్యాచ్ ను గెల్చుకుంది
వార్తలు సమాప్తం

వచ్చేసింది నేడే హిందూ,హిందుస్తాన్ టైమ్స్, యీనాటి పత్రిక, ఆంధ్రనాడు
తెలంగాణ జ్యోతి
యువకుల్లోకి ప్రవేశించిన పొయెట్ హేర్ స్టైల్ జ్వరం
కవయిత్రులు తమ కురచైన,పొడవైన
అచ్చుల రహస్యాలను పంచుకున్నారు
ముప్పై యేళ్ళ యెం పీ యే అబ్బాయికీ
సంస్కార,సాంప్రదాయబద్ధమైన వధువు కావాలి
యిరవై ఐదు సంవత్సరాల యెం పీ యే చేసిన
సన్నని పొడవైన వధువు కోసం యోగమైన
వరుడు సంప్రదించగలరు

గురూ! తమాషాగా వుందే
మాట్లాడుతూనే వుండూ
నేనూ హీరో అవుతాను
యెక్కడికెళితే అక్కడ ఆటోగ్రాఫ్ లు
యిస్తూనే వుంటాను
చాల్లే రా
థార్డ్ డివిజనులో యెం .యే
యెం పీ యే ఫీజు యెవరిస్తారు?
కూర్చోని ప్రూఫ్ రుద్దూ.

*

ఆదివాసీల కొత్త గొంతుక!

jacinta

జార్ఖండ్ రాంచిలో నివశించే 32 యేళ్ళ జసింత కేర్ కెట్టా వోరాన్ అనే ఆటవి తెగకు చెందిన వో సాహస పాత్రికేయురాలు,ఆవేశపూరితమైన కవయిత్రి.కార్పోరెట్ వుద్యోగాలను  వొదలి తను పుట్టిన, తాను సంబంధపడిన ఆదివాసి మూలాలలోని కష్టాలకూ,మౌఖికంగా,రాతపూర్వకంగా,కవితాత్మకంగా ఫుల్ టైం శ్రమిస్తూ,బయటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రకటిస్తున్న ధైర్యవంతురాలు.తన ఆదివాసి సమాజంలో బాలికలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆదివాణి అనే వో ప్రచురణ సంస్థను సొంతంగానే స్థాపించింది.

యీమె మొదటి కవితాసంకలనం అంగోర్ (నిప్పు) హిందీ ఆంగ్ల భాషల్లో వొకే సంకలనంగా విడుదలైంది.యిదేకాక హిందీ-జర్మన్ అనువాదం,హిందీ-డచ్ అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా గత మే నెలలో ప్రచురింపబడ్డాయి. యీమె కవితాసంకలనం వొక సంచలనం.భారత దేశంలో కంటే విదేశాల్లో అనేక స్పందనలు, అనేక సమీక్షలు వొచ్చాయి.

యీమె కవిత్వంలో అడవి సౌందర్యంతో పాటు ఆదివాసీల భయం, పీడన,అభద్రత,బయటి ప్రపంచపు దోపిడీ, వారి సంస్కృతి పరిరక్షణ,అడవిని తవ్వకాలపట్ల విపరీత వ్యతిరేకత కన్పించే ప్రధాన వస్తువులు.చిన్నప్పటి నుంచి నాలో యేదో బూడిదలో దాగిన నిప్పులా లోలోపల యెక్కడో దహించివేస్తుండేది-అది యిప్పుడు అర్థం అయి యీ బాటను యెంచుకున్నాను అంటోది జసింత. యీమె కవిత్వం చదువుతుంటే పాఠకుడిలో సంభవించే విస్పోటనాలు,కోపం,ఆవేశాలను, నొప్పినీ  పర్సానిఫై చేస్తుంది.

~

satya2

చిత్రం: సత్యా సూఫీ

సుడిగాలులు – దిక్కులు
——————————

యీ నేల పైన
పిడికెడు గింజలు
మిగిలివుండాలి
అందుకే వరిపొట్టు
తూర్పార పట్టేందుకు
నిలబడి వుందొక వూరు
వేడిగాలులకు యెదురుగా

యిలా పని చేస్తున్న వొక సాయం వేళ
పెంకుల రంధ్రాలలో నుంచి
చూసుకొంటోంది దీపపు వెలుగును
కాలిబాటల నుంచి నిశబ్దంగా నడిచి
వచ్చే సుడిగాలులను
పరుగెత్తుతున్న తాజావాసనపు వొరిగింజల నుంచి తీగలను
యెండ యొక్క నిప్పులాటి కత్తిపదునును, కొడవలిని
సుడిగాలుల వక్షస్థలంపై పూడ్చిపెట్టేందుకు..

తటాలున నిలబడి చూసి

వేగంగా వీస్తున్న గాలుల కత్తితో
ధృఢమైన వూరిగాయం పైన
దిక్కుల్ని చీల్చి వేస్తోంది

వారి చరిత్ర పాత గుడ్డపేలికే
అది తనని తాను
మెల్లమెల్లగా ఘాఢమైన చీకట్లోకి
వోదార్పునిచ్చే దిక్కుల ఆధీనంలోకి …

చివరికి దిక్కులు
వెలుగు అభయాన్ని యిచ్చి
సుడిగాలుల్లోకి తోసేస్తాయి

వూడ్చుకొంటారూ
అధికారమిచ్చి
అధికారాన్నే

“యీ నేలను కాపాడేందుకు
యెవరో వొకరూ
ప్రాణాలర్పించుకోక తప్పదు”.

మూలం :జసింత కెర్ కెట్టా

యెదురుచూసే నేలలా…

arun

వుత్తర్ ప్రదేశ్ బిజనోర్ లో ఫిబ్రవరి 16, 1972 లో పుట్టిన డా. అరుణ్ దేవ్ తన వున్నత విద్యను జవహర్‌లాల్‌  నెహ్రూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు. యువకవి,విమర్శకులైన అరుణ్ దేవ్ “క్యా తో సమయ్” అనే తన కవితా సంకలనాన్నీ 2004 లో భారతీయ జ్ఞానపీఠ్ ప్రచురిస్తే, “కోయితో జగాహ్ హో” అనే మరో సంకలనాన్నీ వాణిప్రకాషన్ వారు ప్రచురించారు. వీరి కవితలు నేపాలీ,అసామీ,ఆంగ్లం,మరాఠీ భాషల్లో అనువదింపబడ్డాయి.గత అయిదు సంవత్సరాల నుంచి సమాలోచన్ అనే హిందీ అంతర్జాల పత్రికను నడుపుతున్నారు.

అరుణ్ దేవ్ గారు కవిత్వమంటే మానవత్వపు అనువాదంగా భావించే కవి.ఆయన కవిత్వం రాస్తూ నాగరికతను రాస్తుంటారు. దీని భూగృహంలో శవమైన విలువలు వుంటాయి.స్త్రీలు,పిల్లలు,నలుపు ముఖం కలవారి శాపంతో భయానకమౌతున్న యీ నాగరికతలో: రోజూ వొక నది మరణిస్తుంటుంది, వొక పక్షుల జాతి మాయమౌతుంటుంది, వొక జానపద పాట తన ప్రాణాలను కోల్పోతుంటుంది. యీ కవి మరో ప్రపంచాన్ని ఆశిస్తూ రాస్తుంటాడు.యితని కవిత్వంలో పొడిబారిన,వాడిన ముఖాల్లోని దుఖం పాఠకులను వెంటాడుతుంటుంది.

వారసత్వం
————–

పగటి వెలుగులో
పసిపిల్లవాడి యేడుపు కరిగిపోయింది
అక్కడే దగ్గరలోనే వొక తల్లి వుంది
ఆమె ముఖంలో
ఆ పసిపిల్లవాడి కలలు, దుఖపు క్లేశాలూ వున్నాయి.

ఆ తల్లి కోరికలో
వెన్నెల రాత్రి వుంది
ఘాఢమైన రాత్రి వాసనలో
అస్పష్టంగా పాడే కొన్ని కీచురాళ్ళు
వుదయం వొక ఆశలా
కొన్ని జాముల కోసం యెదురు చూస్తోంది

అమ్మ లాలిపాటలోని చంద్రుడు యెక్కడికో వెళ్ళిపోయాడు
అక్కడ వొక భయానక స్వరం విన్పిస్తోంది
అందులో నుంచి శతాబ్దాల నాటి పాత గీతాలు విన్పిస్తున్నాయి
అందులో వొక యెడారి వుంది
తాను దానిలో నడచి వెళ్తూవుంది యెందుకో తెలియదు

పిల్లవాడిపై యెండ
యెడారిలా రాలుతోంది
ఆమె యెండమావిలో జింక వొకటి పరుగెత్తుకుంటూ వచ్చింది
సీతాకోకచిలుక వెనుకగా విడివడి వెళ్ళిపోతూ రంగులు
పిల్లవాడి వీపుపై
ఆశకు ముందు వుండే దీర్ఘ నిరాశలు
కాల్చిన గురుతులు వున్నాయి

తల్లి దిగులుగా వుంది
పచ్చగడ్డి కోసం యెదురుచూసే నేలలా

అనువాదం, పరిచయం: పఠాన్ మస్తాన్ ఖాన్ 

*

ఆ లోతైన సముద్రం పేరు…

 

-పఠాన్ మస్తాన్ ఖాన్ 

~

babusha

మధ్య ప్రదేశ్ కు చెందిన బాబుషా కొహ్లీ 2014 సంవత్సరానికి గాను యువ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. ప్రేమ వుడత మనసు జామపండు(ప్రేమ్ గిల్హరీ దిల్ అఖరోట్ ) అనే తన మొదటి కవితా సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు.
బాబుషా కొహ్లీ, తన రచనలో భావాల లోతులను తాకే అనుభూతి, సంవేదనలను వినూత్నంగా వ్యక్తికరిస్తుంది.యీమె కవిత్వంలో ప్రేమ ప్రధాన కవితా వస్తువై కనిపించిన జీవితపు భిన్నత్వంలోని సంగీతం ప్రతిధ్వనిస్తుంది.

యింకా యీమె కవిత్వంలోని సాంద్రత, ఘాఢమైన అనుభవం,భాషా నవ్యతలు పాఠకులను మైమరిపిస్తాయి.సూఫీ ప్రేమతత్వము,విపరీత ఆరాధన యీమెలో కనిపించే ప్రధాన లక్షణం.

యీమె కవిత్వనిర్మాణం సంవేదనలతో పాటు బింబాత్మక ప్రతీకలు, ఆకృతులు మెండుగా వుండి పాఠకుల మనసులలో సులభంగా నిలబడిపోతుంది.

తూరుపు నుంచి పడమర వరకు
——————————————-

మొలకెత్తేందుకు ప్రతి వొక్కరి వద్ద వొక వుదయం వుంది.
మునిగేందుకు సరైన చోటు లేదు అనుకోనక్కర్లేదు .

పిడికెడు చల్లని కోరికను తీసుకొని
నీరసంగా తిరుగాడుతోంది వో యెండ కన్య

యీ ప్రపంచంలో వొక్క ప్రశ్నకు వొందల జవాబులు వున్నాయి.
భిక్షగాడి కోసం కాస్త దయ, పిండి, బియ్యం వున్నాయి.

సుఖం

దక్షిణగా లభించదు
రాత్రిని
నేను కోరుకొన్నప్పుడల్లా నా కళ్ళలోనికి లాక్కుంటాను
తూరుపు రంగులమయమై వుంది
కాటుక రేఖ ముల్లులా వుంది

తమసోమ జ్యోతిర్గమయ నుంచి
యీ యాత్ర కఠినమైంది
తూర్పు నుంచి పడమర వరకు

పదే పదే తిరుగాడుతూనే వుంది వో యెండ కన్య

అక్కడ
జ్వలిస్తూ
మండుతూ
నిప్పు రథమై
సంతోషంతో యెగురుతూ పరుగెడుతోంది
అక్కడ

అయినను
కాకపోయినను
ఆ లోతైన సముద్రం పేరు
పడమరే.

మూలం : బాబుషా కొహ్లీ

*

నీ పాదాల గురుతులు…

neel

మూలం :నీలోత్పల్

అనువాదం: పఠాన్  మస్తాన్  ఖాన్ 

~

మధ్యప్రదేశ్, వుజ్జయినికి చెందిన యీ యువకవి నీలోత్పల్ మూడు కవితా సంపుటాలను ప్రచురించాడు. నీలోత్పల్ భారతీయ జ్ఞానపీఠ్ యువకవి పురస్కారం తో పాటు అనాజ్ పక్నే కా సమయ్ (ధాన్యం పక్వానికి వచ్చే సమయం) అనే తన కవితా సంకలనాన్ని ప్రచురించింది.యితని కవితలు అనేక భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి. కెనడా నుంచి ప్రచురింపబడే సౌత్ యేషియన్ మ్యాగజైన్ లోనూ యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

యితని కవిత్వపు అభివ్యక్తి విభిన్న స్థాయిలో ప్రకటితమౌతుంటుంది.యితని కవిత్వంలో వొక సంసిధ్ధత కనిపిస్తుంది.అతిపరిచితములను పరిచిత వస్తువులలోకి మార్చి దృశ్యాలకు ప్రాణం పోస్తాడు.యిలా జీవితాలకు కూడా అవసరమే కదా.యితని కవిత్వం తాకనితనాన్ని తాకుతుంది.నేటి సాంకేతిక ఆర్థిక ప్రధాన్య సమాజంలో వొక మనిషిగా తన గుండె చప్పుళ్ళను వినిపిస్తాడు.యితని కవిత్వంలో బౌధ్ధికపరమైన కఠినత్వం సహజంగానే వుంటుంది.యితని కవిత్వ ప్రపంచం మనలో దాగిన మానవత్వాన్ని,ప్రేమను,మార్మిక సందర్భాలను కదిలిస్తుంది.

South asian ensemble అనే పత్రికలో యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

———————

అసంభవపు సౌందర్యంలా
—————–

లోయలన్నీ, గాలిపటాల్లా యెగురుతున్నాయి.

నీ అరచేతులు
వొక చల్లని కొండతో అతుక్కున్నాయి.

అతను వుదయాన్ని స్తంభించినపుడు
నీవు నదీ వుపరితలంపై నుంచి లేవడం
ఆవిరిలా వుంది.

నేను యీ తడి మంచు వానలో
నీ రొమ్ముల్లో అణిగివున్న కోరికల వైపుగా వెళుతున్నాను.

వొక మంచుముక్కలో
యెన్నో నీటి చుక్కలు దాగివున్నట్టు
నాకు తెలియదు

కొన్ని సీతాకోకచిలుకలు
వాటిని తాకడం కష్టం
నీవు అక్కడే వుంటావు
నీ కళ్ళల్లో ల్యాండ్ స్కేప్లూ యీతాడుతుంటాయి
నేను వొక్కొక్క దాంట్లోంకి దిగుతుంటాను.

సీతాకోకచిలుకలన్నీ అలలైనట్టు
నీవు వొక తెలియని నదీ అయినట్టు

లోయపు కొన్ని మెట్లు మునిగే వున్న
నీ పాదాల గురుతులు కనిపిస్తూనే వుంటాయి నాకు

అలల సంపూర్ణపు గోళాల్లో
నా చిత్రాన్ని కొల్లగొట్టావు
అసంభవపు సౌందర్యంలా

*

కవిత్వంలో జేన్ దారి!

మమత కొడిదెల

~

జేన్ హర్ష్ ఫీల్డ్ 1973 లో తన ఇరవైవ ఏట మొదటి కవితను రాసింది. ప్రిన్సెటన్ యునివర్సిటీలో మొట్టమొదటిసారి మహిళలకు ప్రవేశం కలిగించిన బ్యాచిలో  ఉత్తీర్ణురాలయ్యింది.
జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కవిత్వం రాయకూడదని ఎనిమిదేళ్లు కవిత్వానికి విరామమిచ్చింది. ఆ సమయంలో సాన్ ఫ్రాన్సిస్కోలోని జెన్ సెంటర్లో చదువుకుంది. “కవిత్వానికి కేవలం కవిత్వమే ఆధారం కాదు. పరిపూర్ణంగా జీవించిన జీవితంలోంచే మంచి కవిత్వం వస్తుంది. అందుకనే ఎట్లాగైనా సరే కవిత్వం రాయాల్సిందేనని అనుకోలేదు. ముందు జీవితానికి అర్థం తెలుసుకోవాలనుకున్నాను” అని చెబుతుంది జేన్ . తనను ఎవరైన ‘జెన్ కవయిత్రి’ అంటే ఒప్పుకోదు. “జెన్ కవయిత్రిని కానే కాదు. నేను మానవీయ కవయిత్రిని” అని స్పస్టం చేస్తుంది.
“మరీ నిగూఢంగా లేకుండా అదే సమయంలో సంక్లిష్టతను మినహాయించకుండా సాగే ఆలోచనలు, సంభాషణల్లా, ప్రపంచాన్ని ఒకేసారి – హృదయం, బుద్ధి, కంఠధ్వని, దేహము- ఇలా ఎన్నోవిధాలుగా తెలుసుకునే కవిత్వంలా, సరళత లేకుండా స్పస్టతను సాధించే కవిత్వం నాకు ఆసక్తి కలిగిస్తుంది.” అని కవిత్వం పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది జేన్.
ఆమె కవిత్వం సామాజిక న్యాయాన్యాయాలు, పర్యావరణం వంటి నేపధ్యాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి, మానవ ప్రపంచం మధ్య విడగొట్టలేని లంకె ఉందన్న నమ్మిక ఆమె కవిత్వంలోని ప్రధానాంశం. ఆమె కవితలు రాజకీయాంశాలను సూటిగా వ్యాఖ్యానించవు కానీ, తన చుట్టూ సమాజంలోని యదార్థాలను ఎత్తి చూపుతాయి.
నిర్మలంగా, పారదర్శకంగా ఉండే ఆమె భాష, విశేషమైన సవాళ్ళను విసురుతుంది. ఒకేసరి భావగర్భితమూ, సాధారణమూ అయిన భాషతో, ఒక్కొక్క వాక్యంతో, ఒక్కొక్క చిత్రంతో ధ్యానానికీ, మార్పుకు అవకాశాన్నిస్తాయి ఆమె కవితలు.

~

శరణాగత  తేనె

~

ఒక చెక్కడపు బొమ్మ: ఒక కొమ్మ మీద ఖాళీ తేనెతుట్టెతో  ప్రపంచ వృక్షం

 

ఒక అతి సుందర దృశ్యం మనస్సును తిరస్కరిస్తోంది

తెగ వాగే నోరే గాని వినే చెవుల్లేని మనిషి లాంటిదది.

 

బషో నెలల తరబడి సాగిన నడకను పూర్తి చేసినప్పుడు

అరిగిపోయిన చెప్పులు విప్పి

అలా పడేశాడు.

 

ఒకటి వాడిపోయిన చామంతి పరిమళమయ్యింది

ఇంకొకటి కథలోంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది

 

నొప్పిని గమనించిన తరువాతే అదెప్పుడూ వుండిందని నువ్వు తెలుసుకుంటావు

పక్క తెర నుంచి వేదిక మీద అడుగు పెట్టక ముందు కూడా నటుడు వుండినట్లు

 

మరో బషో హైకూ:

శిథిలమైన ఒక పుర్రె, దాని కళ్లలోంచి పెరుగుతుంది పొడుగ్గా గాలికి వూగే గడ్డి

 

వాళ్లిప్పుడు ఒక ఫోటోగ్రాఫులోకి చూస్తున్నారు,

ఫ్రాన్సులో ఒక చదును పొలం, సెప్టెంబరు 1916:

కొందరు మనుషులు వంగి, పొగ తాగుతూ, చిరిగిన సంచుల్లో వెతుకుతున్నారు

ఉత్తరాల కోసం

 

యుద్ధం, నడక, చామంతి, చెప్పులు, గోధుమ పొలం,

కెమరా లెన్సు మీద తేనెటీగ-పొగ, యుద్ధం

 

అవన్నీ గత కాలానికి చెందినవి, మనం ప్రయాణిస్తుంటాం వాటివైపు, వాటికి దూరంగా

మోసుకు తిరుగుతుంటాం మిగిలిపోయిన, మనం కాపాడగల్గిన

 

శరణాగత  తేనెను.

 

ప్రేమ అనే విస్ఫోటనం

 

 

 

-అరుంధతి రాయ్

అనువాదం: వి.వి. 

~

 

‘దేశమును ప్రేమించుమన్నా

మంచియన్నది పెంచుమన్నా

దేశమంటే మట్టి కాదోయ్

దేశమంటే మనుషులోయ్’

 

దేశాన్ని ప్రేమిస్తే చాలదట భక్తి కావాలట

‘భారత్‌ మాతాకి జై’ దేశభక్తి

మనుషుల్ని ప్రేమించి మట్టిని అమ్ముకుంటే

భారతమాత పట్ల భక్తి పెరుగుతుందా?

 

‘ఇదేం ప్రేమ?’

దేశం పట్ల  మనకుండే ప్రేమ ఎటువంటిప్రేమ?

ఇదేం దేశం?

ఎన్నడూ మనస్వప్నాలను సాకారం చేయలేని దేశం

ఇవేం స్వప్నాలు?

సదా భగ్నమయ్యే స్వప్నాలు’

 

‘గొప్ప జాతుల గొప్పతనాలు ఎప్పుడూ

వాటి నిర్దాక్షిణ్యమైన మారణ సామర్ధ్యానికి

ప్రత్యక్ష సమతూకంతో ఉంటాయికదూ’

 

‘ఒక దేశ విజయం

సాధారణంగా దాని నైతిక వైఫల్యంలో ఉంటుంది కదూ.’

 

‘మన వైఫల్యాల సంగతేంటి?

రచయితలు, కళాకారులు, రాడికల్స్, జాతి ద్రోహులు, పిచ్చివాళ్ళు

వ్యవస్థలో ఇమడలేనివాళ్ళు-

వీళ్ళ భావాల, స్వప్నాల వైఫల్యాల సంగతేమిటి?’

 

‘జెండాల, దేశాల భావాన్ని

ప్రేమ అనే ఒక విస్ఫోటన పదార్థంతో

మార్చలేకపోతున్న మన వైఫల్యాల సంగతేమిటి?’

 

‘మనుషులు యుద్ధాలు లేకుండా జీవించలేకపోతున్నారా?’

కాందిశీకులు, కరువు బాధితులు కాకుండా,

వలసలు, ఆత్మహత్యలు లేకుండా

ఎన్‌కౌంటర్లు, అసహజమరణాలు లేకుండా జీవితంలేదా?’

 

‘మనుషులు ప్రేమలేకుండా కూడా జీవించలేరుకదా

ప్రేమకోసం యుద్ధాలకు మరణాలకు వెనుకాడరు కదా

యుద్ధాల బహిరంగ పగలు  రహస్య ప్రేమ రాత్రులు’

 

‘కనుక ప్రశ్న ఏమిటంటే

మనం దేన్ని ప్రేమించాలి?

ప్రేమంటే ఏమిటి? ఆనందమంటే ఏమిటి?

అవును నిజంగానే దేశమంటే ఏమిటి?’

మనుషులమధ్య ప్రేమేకదా

అంతేనా?

‘మన ప్రేమకు ప్రాధామ్యాలేమిటి?’

మనుషులం కనక మానవత్వం సరే-

మరిమట్టిని ప్రేమించవద్దా?

 

‘అత్యంత అర్వాచీనమైన దట్టమైన అడవి

పర్వతశ్రేణులు, నదీలోయలు’

భూగర్భజలాలు, ఖనిజాలు

మానవశ్రమ, ప్రకృతి సంపద

అవును-ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ, గ్రహాలు

గాఢాంధకారంలో ఇనుమిక్కిలి నక్షత్రాలు

ఇంకిన, కారుతున్న కన్నీళ్లు. పారుతున్న, గడ్డకట్టిన నెత్తురు

‘దేశంకన్నా ప్రేమించదగినవి కదూ.’

 

నేను పోగొట్టుకున్న నదీలోయలను

పోరాడుతున్న పడమటి కనుమలను

పోగొట్టుకున్న నల్లమలను

పోరాడుతున్న దండకారణ్యాన్ని

ప్రేమించినంతగా

దేశభక్తి, జాతీయత అనే భావనలను ప్రేమించగలనా?

అబద్ధమాడలేను,

ఎందుకంటే,

ప్రేమ విస్ఫోటనం చెందే సత్యం.

 

(ఆంగ్లమూలం: అరుంధతీ రాయ్ . తెలుగు, మార్పులూ చేర్పులూ- వి.వి.

 ఇందులో అరుంధతీరాయ్ వాక్యాలను ఆమె శైలి తెలిసిన ఎవరైనా పోల్చుకోగలరు)

 

ఇప్పుడొచ్చింది మెలుకువ!

 

 

 

కవిత్వ అనువాదం గురించి మహాకవి  షెల్లీ అన్నాడేమో – గుర్తు లేదు- కాని, వాక్యం వరకూ గుర్తుంది: The plant must spring again from its seed.

గొప్ప కవిత్వం అనువాదానికి లొంగదు అని చాలా సార్లు విన్నాం. అది ఎంత కష్టమో ఈ షెల్లీ వాక్యం చెప్తుంది. అదే విత్తనం నించి అదే మొలక సాధ్యం కాకపోవచ్చు కాని, రెండు భాషల రహస్యం తెలిసినప్పుడు కవిత్వం మక్కీ కి మక్కి కాకపోయినా భావానువాదం సాధ్యమే కావచ్చు. అయితే, ఆ రెండు భాషలూ వొక దానికి ఇంకోటి సాంస్కృతికంగా ఎంత దగ్గిరగా మసలుకుంటాయన్న విషయం మీద అది ఆధారపడుతుంది.

తెలుగు-ఒరియా భాషల మధ్య చుట్టరికం ఇప్పటిది కాదు. కాని, ఏ కారణం వల్లనో వచనం అనువాదం అయినంత ఎక్కువగా ఈ రెండు భాషల మధ్య కవిత్వం తర్జుమా కాలేదు. వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో ఇప్పటికైనా ఈ వెలితి కొంత భర్తీ చేస్తున్నందుకు వేలూరి వెంకటేశ్వర రావు గారిని అభినందించాలి.

సౌభాగ్య కుమార మిశ్ర పేరు ఒరియాలో సుపరిచితం. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఒరియాలో ఆయన కవిత్వం రాస్తున్నారు. యిప్పటికి పదకొండు కవిత్వ సంపుటాలు తీసుకువచ్చారు. ఆధునికమైన భావన ఎలా వుంటుందో, దానికి ఎన్ని కోణాలు వుంటాయో వాటన్నిటినీ ఆయన ఒరియా వర్తమాన కవిత్వంలో పరిచయం చేశారు.

సునిశితమైన సాంస్కృతిక అంశాలని చుట్టుకుని వుండే ఆయన వాక్యాల సొగసుని తెలుగులోకి తీసుకురావడం ఎంత శ్రమ వుందో, ఆ శ్రమ సౌందర్యమంతా ప్రతిఫలించే అనువాదాలు ఇవి- ఈ ఎండాకాలం కొన్ని అనువాదాల్నివొక పుస్తకంగా తీసుకురావాలని వేలూరి- వెనిగళ్ళ  ప్రయత్నం! ఈ రెండు అనువాదాలు మీ కోసం ఇదిగో..

-అఫ్సర్ 

 

ఆహ్వానం:

 

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

 

ఈ అరణ్యజనుల  ఉచ్చులు  తప్పించుకొని రా, మృగుణీ (1)

సిమెంట్‌ వరండా ఎర్రగా  కాల్చేసే సహజమైన ఈ  మండుటెండ

అగ్నివలయం లోపలినుండి తప్పించుకొని రా మృగుణీ

సందిగ్ధ సమయంలో ప్రార్థన కేవలం పునః స్మృతి; నిన్నటి ఎంగిలి కూడులా!

రాక్షసుడి ఆకలికి  ఈ వడ్డు, ఆ వడ్డు అనే భేదం లేదు.

 

నీలిమేఘాల ద్వీపంలో కూడా చావు లేదు మృగుణీ

టెలిఫోన్‌ లో పెద్ద గర్జన తప్ప. ఏనుగ లేదు, మొసలి లేదు,

ఏ దొంగదో, సన్యాసిదో, మెత్తని అవ్యక్తధ్వనిలో కలిసి పోయి రా, మృగుణీ.

 

కొండంత మా అపనమ్మకపు శిఖరం ఎక్కి రా మృగుణీ,

క్రిందకి దిగిరా మా దుర్మార్గపు గడ్డిపరకల కోసం.  మెలకువతో చేకొంటావు కదా,

దిగువనుండి  దిగ్మండలాంతానికి వ్యాపించిన ఈ నేలపై

లెక్కలేనన్ని దేవుళ్ళ అంగాలలో ఆలింగనాలలోవినిపించే రతికూజితాలు ఎన్నెన్నో!

*

మృగుణి  అంటే, కురంగి,  ఆడు జింక అని అర్థం.  మనం తెలుగులో లేడి అని కూడా అంటాం.   సప్తఋషులలోఒక ఋషి పులహుడు. అతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో ఒక భార్య మృగి.  పులహుడు, పిశాచాలని, క్రూరమృగాలు పులులని, సింహాలనీ, మొసళ్ళనీ పుట్టించిన ఋషి అని చెపుతారు.  పులహుడు సృష్టించిన జంతువులలో లేడి కూడా ఒక జంతువు. అది సాధు జంతువు. క్రూరజంతువుల బారినుండి తప్పించుకొని రమ్మని ఆడుజింకకి ఆహ్వానం అని అన్వయం చేసుకోవటానికి అవకాశం లేకపోలేదు.  కవితలో ఆఖరివాక్యం చదివిన తరువాత ఈ వ్యాఖ్య అసమంజసం అనిపించదు. ఈ అన్వయం గురించి  సౌభాగ్య కుమార మిశ్ర తో మాట్లాడినప్పుడు, అతను చెప్పాడు:  పులహుడి కథ తనకి తెలుసు.  అయితే, సుమారు యాభై ఏళ్ళక్రితం  ఈ కవిత రాసినప్పుడు తనకి పులహుడి సృహ లేదని! ఒకే పద్యానికి పాఠకులు/విమర్శకులు  వేరువేరు వ్యాఖ్యానాలు  చెయ్యటానికి అవకాశం ఉన్నది  సుమా అని అతనూ గుర్తించాడు.  పోతే, అనాగరిక  రాక్షసజనులబారినుండి తప్పించుకొని ఈ దుర్మార్గపు ప్రాంతానికి  రమ్మని కురంగికి “ఆహ్వానం” అని సాధారణ అన్వయం.  –  వేవేరా

 

కొండ:

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

నేను మహమ్మద్ లాగా కొండ దగ్గిరకి పోలేదు

నేను కొండని రమ్మని పిలవనూ లేదు. నా గది తలుపు

తెరిచి వుందని తానే దూసుకొని వచ్చింది; సాయంత్రం

ఆకాశంమీదుగ దిగివచ్చి, నందివర్ధనం చెట్టు పక్కనుంచి

మా ఇంటి గుమ్మంకేసి తిరిగింది.

నమ్మశక్యంకాని ఈదృశ్యం చూసి నేను అవాక్కయ్యాను,

కొండకి కుర్చీ వేసాను, టీ కెటిల్‌ పొయ్యి మీద పెట్టాను.

 

జాగ్రఫీ పాఠం నేర్చుకోవటం గ్యారంటీగా చాలా కష్టం.

అట్లాసులో ఎర్రచుక్క, నీలం గీత, నల్ల గుర్తూ,

ఏవి ఎక్కడ ఉన్నాయా అని వెతికి వెతికి కళ్ళు వాచిపోయేవి,

క్లాసులో వెనకబెంచీలో కూచొని కునుకుతీస్తూ కలవరపడేవాణ్ణి.

 

ఎక్కడిదీ కొండ?

ఏదో పిక్‌నిక్‌ సందడి. కాళ్ళు అటూఇటూకొట్టుకొని, చెప్పులుచిరిగిపోయాయి,

నా ప్యాంటు చొక్కాకి  ఏదో ముళ్ళకంప తగులుకుంది.

గ్లాసులోకరిగిపోయింది కొండ, పంచదార క్యూబ్‌లా!

నాకు ఎంతోఏడుపొచ్చింది; జాగ్రఫీ పుస్తకంలో,

యాభైఐదో పేజీలో ఇద్దరు భారీ మనుషులు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు.

 

ఇప్పుడు మెలుకువ వచ్చింది, నన్ను ఎవరో మోసగించారు.

నేను చిన్నప్పుడు పనస తోటలో చెట్లు ఎక్కటం

ఎందుకు నేర్చుకున్నాను? నిండు యవ్వనంలో

ఎందుకు కోరుకున్నాను, ఇంత భారం?

కన్నీటి కవితలో జీవితప్రహేళిక

 

-ఏల్చూరి మురళీధర  రావు 

~

 

కంఠంలో శోకవిషాదాల దుర్భరవిషాన్ని దిగమ్రింగి మానవాళి మనుగడకోసం తన వేదనానివేదనను అజరామరమైన అశ్రుగీతిగా మలచిన ఛు యువాన్ ప్రపంచ మహాకవులలో మహనీయుడైన మహాత్మకవి. చైనీయ సాహిత్యమహీభరం మొత్తాన్ని మోస్తున్న మహోన్నత మహీధరం ఆయన. వాఙ్మయసరస్సుకంతటికీ అందాలను అలవరిస్తూ వేయిరేకులతో పూచిన పుండరీక పుష్పం. సారస్వతవ్రతుల అంతరంగ తేజోమయలోకానికి నిండువెలుగును ప్రసాదిస్తున్న ప్రకృష్ట ప్రభామండలం. చిరంతన మధురకవితావాయువులు కొనివచ్చిన సురభిళ పరిమళం. సాహిత్యాకాశంలో సర్వోపరిగా వెలుగొందే ధ్రువతార.

ఛు యువాన్ క్రీస్తుకు పూర్వం 340-వ సంవత్సరంలో జన్మించాడు. రక్తసిక్తమైన చైనా రాజకీయచరిత్రలో పెనుగడ్డుకాలం అది. అప్పటికి చైనీయ పంచకావ్యాలలో చివరిదైన వాసంత శరత్సమాపన సంచికల(Spring and Autumn Annals) సంపుటీకరణ పూర్తయింది. ల్యు దేశపాలకులైన ఝావో రాజవంశీయుల విక్రమలీలలు, ఆనాటి వీరుల విశ్వవిజిగీష, విశాల రాజ్యవిస్తరణ గాథలు, అర్హపూజాదులలో సాంప్రదాయిక బలిసమర్పణవిధానం, జానపదుల ఆచారవ్యవహారాలు, వివిధ దేవతారాధనప్రక్రియలు, స్వర్గమర్త్యలోకాలలోని స్త్రీపురుషసంబంధాలను సజాతీయంగా ప్రతిబింబించే ప్రభావశీలి కథాచిత్రణలతోపాటు ప్రకృతివైపరీత్యాలతో సతమతమై, సంకులసమరాలతో తల్లడిల్లి కాందిశీకులైన సామాన్యుల జీవితం అల్లకల్లోలమైనప్పటి దుఃఖానుభవపరంపర సార్వజనీనంగా నిరూపితమైన మహారచనమది. భూస్వామ్యమదోన్మత్తుల నిర్విరామ యుద్ధోన్మాదం పట్ల వైముఖ్యాన్ని కలిగించే ఆ సంపుటి వల్ల ప్రభావితుడైన ఛు యువాన్ పెరిగి పెద్దయాక తననాటి ప్రభుసమాజంలోని ఒక్కొక్కరిచేత తిరుగులేని శాంతిపత్రం మీద సంతకం చేయించాలని ఆరాటపడటం సహజమే.

అప్పటికి – అంటే క్రీస్తుకు పూర్వం 770-403 మధ్య అని ఒకనాటి చరిత్రకారులు, 771-476 అని ఆధునికులు నమ్ముతున్న తరుణానికి – ఒకప్పుడు తీవ్రభయావహమైన చైనీయ ద్వాదశ రాజ్యాల ప్రాబల్యం క్రమక్రమంగా అంతరించిపోయింది. ఎడతెరిపి లేక సాగిన ఆనాటి మారణహోమాల ఫలితంగా క్రీస్తుపూర్వం 403-221 సంవత్సరాల నడిమికాలంలో మునుపటి ఆ రాజ్యాలు పన్నెండూ – మళ్ళీ పెద్దచేపలు చిన్నచేపలను మింగటం పూర్తయాక పునర్విభక్తాలై – మొత్తం ఏడు రాజ్యాలయ్యాయి. పశ్చిమ సరిహద్దులో వీ ద్వీపకల్పం చుట్టూ చీన్ మండలం నెలకొన్నది. దానికి ఈశాన్యాన ద్వాదశ రాజ్యాల కాలంలో ప్రముఖమైన ఒకనాటి త్సిన్ రాజ్యమే హాన్, ఛావో, వీ అన్న మూడు రాజ్యాలుగా ముక్కలయింది. తూర్పున ఛి; దక్షిణాన ఛు; ఇంకా యెన్ మండల ప్రాంతం వెలిశాయి. ఈ ఏడింటిలో చీన్ రాజ్యం అన్నింటికంటె శక్తిమంతమైనది. యాంగ్ త్సె నదీలోయలోని ఛు రాజ్యం అతివిశాలమైనదే కాని, ఛి రాజ్యం షాన్‌టుంగ్ ద్వీపకల్పానికి చేరువలో ఉండటం వల్ల మత్స్యసంపదకు, లవణోత్పాదనకు పేరుపొంది వాణిజ్యమూలకంగా బలపడింది. వీటన్నిటికీ ఆధిపత్యపోరు మొదలై నానాటికీ ఘోరం కాసాగింది. ఆస్తినష్టానికి, జననష్టానికి దారితీస్తున్న ఆ యుద్ధాల ఫలస్వరూపంగా రాజ్యాలన్నింటిని ఒక్క గొడుగు పాలన క్రిందికి తెచ్చి అవిభాజ్య చైనా మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చరిత్రలో ‘పోరాట రాజ్య యుగం’ అని చెప్పబడే దుష్కాలం అది.

చైనీయ నాగరికతకు పుట్టినిల్లయిన హ్వాంగ్ హ నదీపరీవాహకప్రాంతంలో జనసమ్మర్దం అధికంగా ఉండేది. నీటిచాళ్ళ వద్ద కొంగలు బారుతీరినట్లు దగ్గర దగ్గరగా తీర్చిదిద్దినట్లుండే ఇళ్ళు, అంతకంటె సన్నిహితంగా మనుషుల మనస్సులు, శ్రేయోరూపకమైన సహజీవనం, ఆత్మీయతలూ ఆప్యాయనాలకు పెట్టింది పేరయిన ప్రాంతమది. ఛు రాజవంశీయుడైన ఛు యువాన్ జన్మించేనాటికి యెన్ రాజ్యం సరిహద్దున లియాఓటుంగ్ ద్వీపకల్పం, కొంత వరకు ఉత్తర కొరియా ఈ పోరాట రాజ్య యుగపు యుద్ధవాతావరణానికి దూరంగా ఉండేవి. మానవాళికి అభ్యుదయానందోల్లాసకరాలైన సంగీత సాహిత్య చిత్ర శిల్ప గానకళలు వెల్లివిరిసిన చోట్లవి. చదువుసాములకు పుట్టినిళ్ళు. అక్షరాస్యులు ప్రాచీనకావ్యసంపదను కాపాడుతుండేవారు. పట్టణవాసపు కృత్రిమ నాగరికత ప్రభావం, అస్తిత్వపు పెనగులాటలు లేక ఇంద్రియశాంతికి పట్టుగొమ్మలయిన ఆ పరిసరాల మట్టివాసన ముక్కుపచ్చలారని వయసులో ఆయన ఊహలకు రెక్కలు తొడిగింది.

రాజవంశానికి చెందినవాడని ఛు యువాన్ అంటే రాజు హ్యూవాయ్ కి మక్కువ కలిగింది. లోకజ్ఞుడు, విద్యావంతుడు కాబట్టి సమస్యలు తలయెత్తినపుడు వివేకంతో వ్యవహరింపగలడని నమ్మకం కుదిరింది. మంత్రివర్గంలో ఉన్నతపదవిని అప్పగించి రాజ్యతంత్రాన్ని నడపమన్నాడు. ఛు యువాన్ విశ్వాసపాత్రుడై మెలగుతూ ప్రభువుకు సన్నిహితుడయ్యాడు. రాజ్యంలో శాంతిభద్రతల రక్షణ నిమిత్తం కృషిచేశాడు. ప్రజోపయోగకర చట్టాలను రూపొందించటంలోనూ, ప్రభుత్వ విదేశాంగవిధానాన్ని తీర్చిదిద్దటంలోనూ తోడ్పడ్డాడు. సమర్థుడని పేరుతెచ్చుకొన్నాడు.

image1 (1)

అప్పటికే ఛు రాజ్యం పతనావస్థలో ఉన్నది. అవినీతిపరుడు, పరమక్రూరుడు అయిన హ్యూవాయ్, అతని చుట్టూ చేరిన స్వార్థపరులైన దళారీలు – ఛు యువాన్ ప్రగతిశీలభావాలను చూసి ఆందోళన చెందారు. ప్రజల సంక్షేమంకోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు రూపొందిస్తున్న వినూత్నపథకాల వల్ల ఆయనకు కలుగుతున్న ఆదరణను చూసి సహింపలేక – అడుగడుగున అడ్డుపడుతూ, లేనిపోని అవరోధాలను కల్పిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేశారు. తను ఎదురుచూస్తున్న కాలపు కొత్తకెరటం తీరాన్ని చేరలేకపోతున్నదని తెలిసినా, జాతి భవితవ్యం మీది నమ్మకంతో ఛు యువాన్ రానున్న మంచిరోజులకోసం ప్రతీక్షిస్తూనే ఉన్నాడు.

చీన్ రాజ్యం నుంచి తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ముందుగానే గుర్తించి, దానితో పొత్తు కుదుర్చుకోవటం మంచిదని ఛు యువాన్ భావించాడు. రాజు చుట్టూ చేరిన దళారీలకు, స్వప్రయోజనపరులకు ఆయన సూచన నచ్చలేదు. రాజుకు సలహాదారుగా ఉన్నతోద్యోగంలో ఉన్న త్జె ఛియావో, ఛు యువాన్ రాజకీయప్రత్యర్థి అయిన రౌతు నాయకుడు చీన్ షాంగ్, పట్టపు రాణి ఛెంగ్ హ్సీయు వంటివాళ్ళు శాంతి రాయబారాలు సాగకుండా ముందుకాళ్ళకు బంధం వేశారు. చీన్ దౌత్యాధికారి చాంగ్ యీ నుంచి లంచాలు మరిగి అధికారులు ఛు యువాన్ పలుకులను పెడచెవిని పెట్టారు. ఊహల పల్లకీలో పట్టుబాలీసులమీద పడుకొని ఎల్లకాలం స్వప్నలోకంలో సంచరించే మాటలమారికి ప్రత్యక్ష రాజకీయాలతో పనేమిటని రాజు చెవిలో ఇల్లుకట్టుకొని నూరిపోశారు. రాజు మనసు మారింది. వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రాణం మీదికి తెచ్చుకొన్నాడు. చేతిలో చేయివేసి చెలిమిచేస్తారని చీన్ దేశానికి స్వయంగా బయలుదేరి శత్రుకూటమి వద్ద బందీ అయ్యాడు.

చీన్ రాజ్యంలో హ్యూవాయ్ రాజకీయఖైదీగా ఉన్నప్పుడు ఉత్తరాధికారిగా వచ్చిన అతని కొడుకు చీంగ్ హ్సీయాంగ్ తండ్రికంటె అసమర్థుడైన రాజు. తిరుగుబాటు జరిగినపుడల్లా ఒక్కో సరిహద్దులో ఓడిపోయి ఎంతోకొంత భూమిఖండాన్ని పోగొట్టుకోవటమే తప్పించి ఎన్నడూ యుద్ధరంగంలో గెలిచి యెరుగడు. అతను రాచరికం చేపట్టిన ఇరవైఒక్క సంవత్సరాల కల్లోలకాలం తర్వాత – అంటే క్రీస్తుపూర్వం 278లో ఉన్నట్లుండి చీన్ సైన్యాధ్యక్షుడు పాయ్ చీ సాక్షాన్మరణదూత లాగా దక్షిణపు సరిహద్దు నుంచి విరుచుకుపడ్డాడు. దారుణమైన ప్రాణనష్టం జరిగింది. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఛు రాజ్యం ఆ చావుదెబ్బ నుంచి తేరుకోలేకపోయింది. మరో అర్ధశతాబ్ది నాటికి రూపనామాల అవశేషాలు లేకుండా అంతరించిపోయింది.

ఛు యువాన్ కవితలలో అధికభాగం ఆయన ప్రతిపాదించిన ప్రజాసంక్షేమవిధానాలు రాజతిరస్కృతాలైన తర్వాత మనసు చెదిరి చింతాక్రాంతుడైనప్పటి చీకటిరోజులలో రచింపబడినవి. పాయ్ చీ దేశరాజధానిలో ఘోరకలిని సృష్టించిన రోజులలో ఆయన అజరామరమైన తన కన్నీటి కవిత ‘ఆక్రోశము’ (లి సావో) ను వ్రాశాడు. అప్పటికాయన వయస్సు అరవైరెండేళ్ళు. పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలు దాటినా మనసుకు సరైన విశ్రాంతి సమకూడలేదు. తన కళ్ళతో దేశాభివృద్ధిని చూడగల మంచిరోజులు రాగలవని ఆయనకు అనిపించలేదు. ఏదో తెలియని అలజడితో ఉక్కిరిబిక్కిరయాడు. శాంతి లేకపోయింది. తన శక్తియుక్తులతో అగతికమైన లోకానికి మార్గదీపనం చేసిన మేధావితల్లజుడు, పాలనావ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకుల సారవిచారం చేసిన రాజనీతివిశారదుడు, స్వానుభవంలో సుఖదుఃఖాల కడపటి అంచులను చూసిన దార్శనికుడు – రాజ్యంలో అధర్మం తాండవించి, జీవితంలో అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కర్తవ్యాకర్తవ్యాల అంతస్సంఘర్షణను తట్టుకోలేక – క్రీస్తుకు పూర్వం 278 నాటి డ్రాగన్ సంవత్సరం ఐదవ నెల, ఐదవ రోజున హ్యూనాన్ లోని మీలో నదిలో దూకి జీవయాత్రను చాలించాడు.

2

ఛు యువాన్ జీవితమంతా విషాదమయంగానే గడిచింది. రాజకీయవేత్తగా భరింపరాని ఓటమిని చవిచూసినవాడు అక్షరజగత్తులో తిరుగులేని గెలుపును సాధించాడు. కష్టజీవులకోసం కాలాతీతకావ్యశిల్పానికి ప్రాణంపోసిన కవిగా ప్రజల ఆత్మీయతకు నోచుకొన్నాడు. చరిత్ర పుటలలో చిరంజీవి కాగలిగాడు. ఛు రాజ్య ప్రజానీకమే గాక చైనా దేశీయులందరూ మేదురమైన ఆదరం చూపి మెప్పుల కుప్పలలో ముంచెత్తారు. రెండున్నరవేల యేండ్ల సుదీర్ఘమైన కాలపు గీటురాయిమీద ఆ ఆదరాభిమానాలు అణుమాత్రమూ తరుగులేక మెరుగులీనుతూనే ఉన్నాయి. ప్రతియేటా చాంద్రమానానుసారం ఐదవ నెలలో ఐదవ రోజున ఛు రాజ్యవాసులు ఆయన నీటిలో తన భౌతికజీవితాన్ని చాలించినందుకు గుర్తుగా దేశమంతటా డ్రాగన్ పడవ పోటీలను నిర్వహించి నివాళులను అర్పిస్తారు. నిడుపైన వెదురాకుజొంపంలో కట్టిన నమీ ఫాయీఁ అనబడే బియ్యపు పిండిని నీళ్ళలో ఉడకబెట్టి, ఉండ్రాళ్ళ వంటి వంటకంతో నైవేద్యాన్ని సిద్ధంచేసి – డ్రాగన్లు, గండుచేపలు ఛు యువాన్ దేహాన్ని ఆహారంగా స్వీకరింపరాదని ప్రార్థనలు చేస్తూ – జలచరాలకు అర్పణగా నదిలోకి విడిచిపెడతారు. ఆ తర్వాత బంధుమిత్రులతో కొలువుతీరి విందుభోజనం చేస్తారు. చైనీయుల ఈ సత్సంప్రదాయం క్రమంగా కొరియా, జపాన్, వియత్నాం, మలయా దేశాలకు కూడా వ్యాపించింది.

లోకంలో ఎవరికీ దక్కని ఈ అరుదైన గౌరవం ఛు యువాన్ తన ప్రజల పట్ల చూపిన ప్రేమాతిశయం మూలాన, దేశభవితవ్యం కోసం తపించిన అంకితభావపు లోతుపరపుల వల్ల సంప్రాప్తించింది. రాజవంశీయుడైనప్పటికీ ఆయన సామాన్యప్రజానీకపు కష్టసుఖాలతో మమేకం అయ్యాడు. రెండువేలయేళ్ళ క్రితం ఫ్రాక్తన చైనీయభాషలో ఆయన ప్రకాశింపజేసిన భావాలివి:

దుఃఖమున వంగి, కష్టసందోహ నిత్య

భయముచేఁ గ్రుంగియున్న నా ప్రజలఁ గాంచి

నేత్రయుగళినిఁ దొలఁకు కన్నీరు దుడిచి,

పేర్చిన యనుతాపమున నిట్టూర్చినాఁడ.                  (‘ఆక్రోశము’)

కదలిపోయితి నా వారి కష్టములకుఁ;

గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి.              (‘చెదురుమదురు ఆలోచనలు’)

అని. ఏ మహాత్ముడు తమ అభ్యుదయంకోసం నితాంతదుఃఖోద్విగ్నుడై యావజ్జీవం పరితపించాడో, ఆ మహాత్ముని ప్రజలు కృతజ్ఞతతో గుర్తుంచుకొన్నారు. ఆయన కవిత్వం తరతరాల పాఠకులకు లక్షణశాస్త్రం కాగలిగింది.

ఛు యువాన్ కవితలలో నిండైన నిజాయితీ ఉన్నది. తాను మనఃపూర్వకంగా ఆదర్శమని దేనిని నమ్మాడో, ఆ ఆదర్శాన్ని అత్యంతనిష్ఠతో ఆచరించి నిజానిజాలను నిర్ధారించుకొన్న తర్వాతనే జనాళికి అవశ్యకర్తవ్యంగా మలిచి చెప్పాడు. కొలువునుంచి బహిష్కరింపబడి ఇరవైయేళ్ళ పైచిలుకు కాలం అజ్ఞాతవాసంలో గడిపినప్పటికీ – ఎట్టి పరిస్థితిలోనూ జన్మభూమిని విడనాడకూడదన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. “కదలిపోయితి నా వారి కష్టములకుఁ, గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి” అని  ప్రకటించాడు. తన దేశమంటేనూ, దేశప్రజలంటేనూ ఆయనకు గల భావబంధం అటువంటిది. అవ్యక్తుల మూలాన కలిగిన అవమానాలను సైరించి ఆత్మత్యాగానికైనా సిద్ధమయ్యాడే కాని తన ప్రజలనూ, ఛు రాజ్యాన్నీ విడిచిపెట్టడం మేలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంతగా ప్రజల గౌరవాభిమానాలను ఎట్లా పొందగలిగాడో అర్థం చేసుకోవటం సులభమే.

ప్రజల పట్ల పెంచుకొన్న గాఢమైన ఆ ప్రేమాతిశయమే ఛు యువాన్ కవిత్వంలో దీప్తమైన అభివ్యక్తిని పొందింది. ఆయన పేరుమీదుగా మొత్తం ఇరవైఅయిదు కవితలు లభిస్తున్నాయి. అందులో పదకొండు కవితలు ఓడ్ ఛందస్సులో వివిధ దైవతాలకు సమర్పితమైనవి. ఆధునిక సాహిత్యవేత్తలు కొందరు ఈ కవితలన్నీ వేర్వేరు కాలాలలో వెలసిన జానపద గీతికలు కావచ్చునని, ఏ ఒక్క కవీశ్వరుడో తన హృదయవీణపై శబ్దపు తంత్రులను మ్రోగిస్తూ పలికిన మధురస్వరసంగతులు కాకపోవచ్చునని వివదించారు కాని, ఛు యువాన్ కు సమీపోత్తరకాలికులైన హాన్ రాజవంశీయుల పరిపాలన కాలం నాటినుంచి మహాకవులను ప్రభావితం చేసిన రచనలుగా ఇవి ఆయన పేరిట పేరెన్నిక గన్నాయి. విమర్శకులు వీటిని పరిపరివిధాల వర్గీకరించారు. ‘ప్రాచీదిశా మహాచక్రవర్తి’, ‘అంతిమ క్రతువు’ వంటివాటిలో సాంప్రదాయికమైన చైనీయుల క్రతువిధానమే ప్రధానేతివృత్తం. ‘మేఘాంగన’, ‘యౌవన భాగ్యము’ కవితలలో సూత్రధారకృత్యాన్ని నిర్వహిస్తున్న గాయకుడో (లేక) క్రతుకృత్యానికి కూర్చొన్న ఋత్విజుడో మేఘమండలస్థితురాలై ఉన్న దేవతయెడ తనకు గల ప్రేమను వెల్లడించడమే వస్తువు. దేవతలకోసం క్రతువులను నిర్వహిస్తున్న తరుణంలో అతిమానుషవ్యక్తులతో ఈ భౌతికమైన వాంఛానివేశం ఏమిటంటే, మానవ మనోభావాల లీలాఖేలనవిలాసం అది. ప్రకృతిశక్తులతో భావుకులకేర్పడిన భావబంధానికి ప్రతీక. చైనీయ మహాకావ్యమైన ‘సంగీతికా సంకలనము’ (Book of Songs) లో చిత్రితమైనట్లు ఈ క్రతుకృత్యాలన్నీ కేవలం దైవతారాధనలకు మాత్రమే నిమిత్తీకరింపబడినవి కావు. మానవ మనస్సులో ఎల్లకాలం వ్యక్తావ్యక్తంగా నిబిరీసంగా ఉండే భావసంపుటులే క్రతుకృత్యవేళ మంత్రరూపంలో వ్యక్తరూపాన్ని పొందుతాయి. సర్వరసాశ్రయమైన ప్రేమభావం అందుకు అతీతమేమీ కాదు. ‘మహాభాగ్యము’ కవితలో మేఘమండలంలోని ఆ అతిలోకసౌందర్యరాశి మనస్సుకు నచ్చిన మనస్వినిగా సంబోధింపబడుతుంది. ‘పసుపువన్నె జాలు వేలుపు’ కవితలో యల్లో రివర్ అనబడే హ్సియాంగ్ నదీకాంత ప్రేమాధిదేవతగా, కవికి ప్రేయసిగా భావింపబడటం కనబడుతుంది. ‘హ్సియాంగ్ నదీ కాంత’, ‘హ్సియాంగ్ నదీ దేవత’, ‘పర్వతాత్మ’ కవితలలో ఆ నదీకాంత పర్వతరాజుపై తన మనస్సులో వెల్లివిరిసిన అనురక్తిని వెల్లడించడమే కథాసంగతి అయినప్పటికీ మొదటి రెండింటిలోనూ ఒక ఉదాత్తమైన నాటకీయసంవిధానం ఉట్టిపడుతుంటుంది. అవి సుదీర్ఘమైన వేరొక రచనకు నాందీప్రాయములేమో తెలియదు. ‘పర్వతాత్మ’ కవితలో కానవచ్చే కమనీయమైన కవనధోరణి మెచ్చదగినది. ‘సూర్యదేవుడు’ కవితలో సూర్యుని దైవత్వవిషయాన్ని స్తుతించటం గాక – జగత్ప్రీతిదాయంగా నిర్వహిస్తున్న క్రతువుయొక్క దర్శనీయశోభను చూసి కవి మైమరపు చెందటమే వస్తువు. దృశ్యమానమైన చరాచరలోకంలోని సౌందర్యానికీ, అవాఙ్మానసగోచరమైన అతిమానుషతత్త్వానికీ ముగ్ధుడు కావటమే తప్పించి, కవికి అలౌకికశక్తులంటే అణుమాత్రమైనా భక్తితాత్పర్యం లేకపోవటం ఈ కవితలలోని అంతస్సూత్రం. ఈ లౌకికతాభిమానం వల్లనే విమర్శకులు కొందరు ఇవన్నీ దేవతలను ఉద్దేశించినవి కావని, రాజును ఉద్దేశించి చెప్పివుండవచ్చునని భావించారు కాని, పదాల పోహళింపును బట్టి ఆ అన్వయం సరికాదని యాంగ్ హ్సియెన్-యీ, గ్లాడిస్ యాంగ్ వంటి ప్రామాణికవిద్వాంసుల అభిప్రాయం. ఇవిగాక, దేశంకోసం నిహతులైనవారిని సన్నుతిస్తున్న స్మృతిగీతం ‘రణరంగంలో నేలకొరిగిన వీరులకోసం’ ఒక్కటే ఈ ఓడ్ కవితల కూర్పులో విలక్షణంగా ఉన్నది. ఈ ఒక్కదానిలోనే తక్కిన కవితలలో వలె భావుక ప్రియంభావుకమైన ప్రేమభావం చిత్రవర్ణకిర్మీరాలతో మనస్సమ్మోహకంగా శబలితం కాలేదు. రణాంగణాన్ని ప్రత్యక్షీకరిస్తున్న కవి శబ్దశక్తి ఇందులో సర్వతోముఖంగా సాక్షాత్కరిస్తుంది. తెగిన మొండెం నేలపై గిలగిల కొట్టుకుంటున్నా శత్రుసంహారానికై ఉత్సవించే యోధాగ్రేసరుల ఆత్మశక్తికి నీరాజనం పడుతున్న ఈ కవితకు దేశభక్తి గీతాలలో ఉత్తమస్థానం లభించింది.

image2ప్రౌఢవయస్సులో జీవితం ఆనందోల్లాసాలతో హాయిగా గడిచిపోతున్న రోజులలో ఛు యువాన్ పధ్నాలుగు కవితలను రచించాడు. గ్రీష్మవేళాదక్షిణానిలవీచికలు నిదాఘతాపతప్తమైన తనువును తాకి తాదాత్మ్యాన్ని కలిగించినట్లు యుగయుగాంతరానుగతకర్కశసమస్యలతో సంతప్తమై సమ్యక్పరిష్కారంకోసం విలవిలలాడుతున్న మనస్సును మెత్తగా స్పృశించి, మైమరపింపజేసే ఒక చల్లదనం ఈ కవితలలో నిండి ఉంటుంది. ఒక సహజత్వం, ఒక సరళత్వం, ఒక సౌగంధ్యం, ఒక మాధుర్యం, ఒక గంభీరిమ, ఒక ఉద్వేజనం, ఒక సంగీతభంగి, ఒక సమతా గుణం, ఒక మాటలకందని వింత అందం మిరుమిట్లు గొలుపుతుంటాయి. తక్కిన కవితలన్నీ ఆయన కలలు కల్లలైన నైరాశ్యపు రోజులలో కూర్చినవి. పెనుతుఫాను వీచేముందు కమ్ముకొన్న కారుచీకటి లాగానో, కారుచీకటి కమ్ముకొన్న తర్వాత వచ్చిన పెనుతుఫాను లాగానో ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. తీవ్రమైన ఆగ్రహావేశం, మనసు లోతులను తాకే భావతీవ్రత, శోకవ్యాకులత, చింతావిలీనత, దుఃఖనిర్భరత నిండి ఉంటాయి. సమానహృదయంతో భావన చేయగల సహృదయులకు ఆ మహాప్రభావం నుంచి తప్పించుకోవటం సులభసాధ్యం కాదు. ఆ కవితలలో తొమ్మిది స్మృతిగీతాలు. వాటిలో ‘నారింజకు నివాళి’ అన్నది కూడా ఓడ్ ఛందస్సులోనే ఉన్నది. ఇవి ఏకకాలంలో కూర్పబడిన కృతులు కావని, హాన్ రాజవంశీయుల కాలంలో విద్వాంసులు ఈ కవితలను వేర్వేరు ఆకరాల నుంచి సంపాదించి ఛు యువాన్ రచనలుగా నామకరణం చేశారని – స్యూంగ్ రాజవంశపు ఐతిహాసికుడైన ఛు హ్సీ పండితుడు అభిప్రాయపడ్డాడు. బర్టన్ వాట్సన్, జేమ్స్ లెగ్గీ వంటి సుప్రసిద్ధ చరిత్రకారులు ఈ వాదాన్ని అంగీకరింపలేదు. ప్రామాణిక సంకలనాలన్నిటిలో ఇవి ఛు యువాన్ రచనలుగానే ప్రచురింపబడుతున్నాయి. వాక్యబంధాన్ని అనుసరించి చూస్తే ‘నారింజకు నివాళి’ని ఆయన కవిత్వాభ్యాసం మొదలుపెట్టిన తొలిరోజులలో వ్రాసి ఉండవచ్చునని ఊహించటానికి వీలున్నది. ఇందులోని ప్రథమార్ధం నారింజ గుణోత్కర్షను ప్రశంసిస్తుండగా ద్వితీయార్ధంలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి మెచ్చుకోలున్నది. ఆ వ్యక్తి నవయౌవనుడని తెలుస్తూనే ఉన్నప్పటికీ – అది ఛు యువాన్ కావచ్చుననీ, కాకపోవచ్చుననీ నిర్ణయించేందుకు వీలులేకుండా ఉన్నది.

ప్రపంచ సాహిత్యంలోని స్మృతిగీతావళిలో ఛు యువాన్ స్మృతిగీతాలు ప్రథమగణ్యాలని భావింపవచ్చును. వీటి రచనాకాలం ఎప్పటిదో నిర్ధారించేందుకు ఆధారాలు లేవు. అయితే, ‘విషాదకర పంక్తులు’ అన్న గీతంలోని పశ్చాత్తప్తవాక్యాల తీవ్రతను బట్టి కవి దీనిని రాజతిరస్కృతుడైన తొలిరోజులలో చెప్పి ఉండవచ్చునని ఒక ఊహ. పరిస్థితుల ఒత్తిడి వల్ల ఇంద్రియోద్వేజనకు లోనైనప్పుడు కవి స్థితప్రజ్ఞతకోసం ఉవ్విళ్ళూరుతాడు. వైరశుద్ధికోసం ప్రయత్నాలు చెయ్యడు. ఆత్మసంయమాన్ని పాటించడం ఎంతో కష్టమవుతుంది. హృదయానికి, బుద్ధికి ఏర్పడిన నిశితమైన ఘర్షణకు తట్టుకొనలేక శరీరం అలసిపోతుంది. మనోలయం సిద్ధించినప్పటి నిర్వికల్పస్థితి అది. ఆ చిత్తావస్థలో స్వయంవ్యక్తాలైన దుర్భరవిషాదకర పంక్తులవి.

ప్రాక్చికీర్షితం బెల్ల నిష్ఫలతఁ జెంది

దుఃఖభాజన మయ్యె; సంతుష్టి దొఱఁగె;

మెట్టుమెట్టుగ నెక్కుచు మేడపైకి 

నిచ్చెనను నేలఁద్రోచితి నిలువకుండ.          

అని కథావ్యక్తి తన గతాన్ని, స్వయంకృతాన్ని నెమరువేసుకొంటాడు. ‘ప్రతికూల ఝంఝ’, ‘ప్రేమోత్కలిక’లు కూడా ఆనాటివే. క్రీస్తుకు పూర్వం 300 – 295 (±) నాటి ఆయన మనఃస్థితికి అద్దంపడతాయి.‘గతకాలపు నెమరువేత’, ‘రాజధానిని విడిచిపెడుతూ’ కవితలు పాయ్ చీ దక్షిణపు సరిహద్దునుంచి దేశరాజధానిపైకి దండెత్తి, కోటను సర్వనాశనం చేస్తున్న రోజులలో చెప్పినవి. రాచరికపు వ్యవస్థ తన శక్తియుక్తులను సంకుచిత స్వార్థప్రయోజనాలకోసం అన్వయించుకోవటం మొదలుపెట్టినప్పుడు సామాన్యుల జీవితం ఏ తీరున అల్లకల్లోలమై ధర్మానికి నిలువనీడ లేకుండాపోతుందో పరిపరివిధాల పదచిత్రాలతో వర్ణించటం ఆయన అన్ని కవితలలో గోచరించే దృగ్విషయమే. అదే కాలంలో ఆయన ‘నదీతరణం’ అన్న అమోఘమైన కవితను చెప్పాడు. విజ్ఞానపు

నిండైన వెలుగును అజ్ఞానాంధకారం ఆవరించి ధర్మం అధర్మం గానూ, అధర్మం ఆచరణీయంగానూ మారిన రోజులలోని నైతికపతనాన్ని చూడలేక తలవంచి తప్పుకొనిపోవటమే కర్తవ్యమని నిర్ణయించుకొన్నాక కాలస్రవంతిపై ఆయన ప్రయాణాన్ని వర్ణించే అద్భుతావహమైన సువర్ణరూపచిత్రం ఇది. తనను సుదూరమైన ఆవలి తీరానికి తీసికొనివెళ్ళగల పడవలోకి అడుగుపెట్టేముందు కూడా ఆయన మనస్సు రాచరికపు ఇనుప పాదాలకింద నలిగిపోతున్న నోరులేని బానిసల దుఃస్థితి పైనే మగ్నమై ఉన్నది. ఆ వెంటనే ‘చెదురు మదురు ఆలోచనలు’, ‘మునుక వేసే మునుపు’ కవితలను చెప్పినట్లుంది. అవే ఆయన పార్యంతికరచనలై ఉంటాయి.

ఛు యువాన్ కావ్యశిల్పానికి ప్రాణశక్తి అనర్ఘమైన కన్ఫ్యూషియస్ తత్త్వదర్శనాన్ని అధ్యయనించిన పుణ్యఫలంగా సమకూడింది. రాజకీయాలలోకి అడుగుపెట్టి ప్రజాజీవితంతో అనుబంధాన్ని పెంచుకొన్నవాడు కనుక ఆ మహోపాధ్యాయుని ప్రభావం ఆయనపై ప్రసరించటం సహజమే. పాలనావ్యవస్థలో అవినీతికి చోటుండకూడదని, సామాజికన్యాయకల్పనే రాచరికపు బాధ్యత అని విశ్వసించినవాడు కనుక జీవితంలో నైతికవిలువలను నెలకొల్పేందుకు తన కవిత్వమూలకంగా కృషిచేశాడు. అయితే అతిస్వతంత్రుడైన దార్శనికుడు కనుక ఆయన మేధావిత ఏ సమసామయిక భావజాలపు సంకుచితపరిధిలోనో ఇమిడిపోలేదు. ‘ప్రతికూల ఝంఝ’ కవితలో భవ్యమైన టావో దర్శనపు మార్గదీపనం, ఝువాంగ్జి బోధనల సారనవనీతం అగుపిస్తాయి. ‘గతకాలపు నెమరువేత’ కూర్పులో చైనీయ ఫా-జియా దర్శనపు ప్రభావం ఉన్నది. రాజు సర్వజనహితభావంతో సామాజికరాజనీతిని, పాలనావ్యవస్థను తీర్చిదిద్ది, పేదలయెడ దయగలిగి ప్రవర్తించాలన్న ఆలోచన ఈ ఫా-జియా న్యాయదర్శనఫలమే.

చరిత్రప్రసిద్ధమైన ‘లి సావో’ రచనకు పూర్వం ఛు యువాన్ ‘భవితవ్యబోధకుడు’ (జోస్యం చెప్పేవాడు), ‘జాలరివాడు’, ‘మృతులకై శ్రద్ధాంజలి’, ‘ప్రహేళికలు’ అన్న నాలుగు కవితలను వ్రాశాడు. అజరామరమైన ఆయన సాహిత్యప్రశస్తికి మూలకందాలివి. వీటిలో మొదటి రెండూ ఆయనవి కావని, రెండవదైన ‘జాలరివాడు’ కవితను హాన్ రాజవంశం పాలనకు వచ్చేనాటికే ఛు రాజ్యంలో త్సాంగ్ లాంగ్ నదీతీరవాసులెవరో ఛు యువాన్ శైలిని అనుకరిస్తూ చెప్పినది కావచ్చునని విమర్శకులు భావించారు. ఛు యువాన్ ఒక పాత్రగా ఇది ప్రథమ పురుషలో రచితమైంది. ప్రజాజీవితం కలుషితమైందని, జనసమ్మర్దం ఎక్కువై నదీతీరమూ,నదీజలాలూ కలుషితం కాసాగాయని, నది చెంతకు రాకపోవటమే మంచిదని – ఒక జాలరి వృద్ధునితో అంటూ ఛు యువాన్ బాధపడతాడు. ప్రపంచం పాడవుతోందని మనం ప్రపంచానికి దూరంగా బతుకుతామా?ఇక్కడే ఉంటూ ఇక్కడి కష్టసుఖాలలో పాలుపంచుకోవద్దూ? మార్పు తెచ్చేది మనమే కదా! అంటాడు ఆ ముసలి జాలరి. ఇక్కడ తలస్నానం చేస్తే ఆ మురికితో తలపాగా పాడవకుండా శుభ్రం చేసుకోవాలి. మునకవేస్తే దుస్తులనుంచి దుమ్ము దులుపుకోవటం ఒక పని. ఇంతటి కల్మషవాతావరణంలో పరిశుద్ధదేహాన్ని పాడుచేసుకొంటారా? ప్రపంచంలోని కాలుష్యమంతా ఇక్కడే ఉన్నది. ప్రపంచం పాడయేకొద్దీ ఈ చోటూ పాడవుతున్నది. ఈ నీళ్ళలో మునిగే కంటె దూకి ఏ చేపకడుపులోనో తలదాచుకోవటం మంచిది – అంటాడు ఛు యువాన్. మత్స్యోపజీవి అయిన ఆ జ్ఞానవృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, “నాకేమీ అట్లా అనిపించదయ్యా, నది నీళ్ళు బాగున్నాయనిపించినప్పుడు గిన్నెలు కడుక్కొని, స్నానంచేసి వెళ్ళిపోతాను. మరీ బాగాలేదనిపిస్తే పైపైనే కాళ్ళు మాత్రం కడుక్కొని వెళ్ళిపోతుంటాను” అని జవాబిస్తాడు. లయాత్మకమైన గద్యబంధంలో సాగిన కవిత ఇది. జీవయాత్రను ముగించే ముందు కర్తవ్యాకర్తవ్యాలు డోలాయమానంగా ఉన్నప్పటి మనఃస్థితిలో వ్రాశాడని ఊహింపవచ్చును.

‘మృతులకై శ్రద్ధాంజలి’ ఒక లోకోత్తరమైన కవితాఖండం. ఆనాటి చైనాలో ఎవరైనా జబ్బున పడ్డప్పుడు బంధువులందరూ రాత్రిపూట గుమిగూడి, రోగి ఆత్మను వెంటనే తిరిగి వచ్చెయ్యమని మౌనప్రార్థనలు చేసేవారట. జానపద రాగధోరణిలో పాఠ్యే గేయే చ మధురంగా కూర్చిన రచన ఇది. జన్మభూమి అంటే ఛు యువాన్ మనస్సులో ఉన్న అనుబంధానికి అక్షర రూపం. జగన్మోహనమైన కల్పనాశిల్పంతో,ఇంద్రధనుస్సులోని రంగులను విరజిమ్ముతున్న శబ్దసంపుటితో ఆయన దీనినొక రామణీయకనివేశంగా తీర్చిదిద్దాడు. గీతికాంతంలో యాంగ్ హ్సీయెన్-యీ గారి ఆంగ్లానువాదంలోని ఉపసంహారవాక్యావళి అపూర్వభావనిర్భరమై ఇందులోని ప్రతిపాదితాంశాన్ని సహజగంభీరిమతో  ప్రకాశింపజేస్తున్నది:

And once in early spring, in days gone by,

I rode to hunt beneath a southern sky.

Angelica and dogwood sprouted green,

My way stretched far across the stream was seen.

Then leftward o’er the lakes and woods I glanced;

Proudly my four black chargers stamped and pranced.

With thousand chariots thundering around,

They burnt the woods and passed the torches round.

The sky grew red, the slaves pursued my steed;

So on I rode and let the slaves succeed.

I curbed my steed and turned him toward the right

To join the king. My sov’reign came in sight.

I urged the slaves; my sov’reign drove ahead;

The fierce rhinoc’ros at one shaft fell dead.

 

The fiery orb arose, the night star waned,

The years went past, no hour could be detained.

Now hidden is the path where orchids teem;

Still stands the maple by the limpid stream.

A thousand miles away my heart doth yearn,

Beyond the Wailing stream, O soul, return!

ఛు యువాన్ తన రాగద్వేషాలన్నింటిని ఈ రెఖ్వియమ్ కవితలో ప్రస్ఫుటింపజేశాడని విమర్శకులంటారు. క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్ది నాటి సుప్రసిద్ధ చరిత్రకారుడు స్సూమా చీయెన్ దీనిని ఛు యువాన్ రచనగానే అభిమానించాడు. ఇందులోని ప్రసంగసంగతిని బట్టి కవి దీనిలో తన దేశపు రాజు ఆత్మను ఉద్దేశించాడని కొందరు; కాదు, కవి తనను తానే సంబోధించుకొన్నాడని కొందరు; స్యూంగ్ యు అనే కవి దీనిని రచించి, ఛు యువాన్ ను సంబోధిస్తున్నాడని కొందరు భావించారు. ఛు యువాన్ సాహిత్య పరిశోధకులలో అనేకులు రాజ్యబహిష్కృతుడైన తర్వాత ఛు యువాన్ దీనిని హ్యూవాయ్ రాజు చీన్ రాజ్యంలో బంధితుడై ఉన్నప్పుడు చెప్పాడని విశ్వసిస్తున్నారు.

జానపదకవిత్వపు భంగీభణితి ప్రాతిపదికగా ఛు యువాన్ తన కవితారూపాలను తీర్చిదిద్దాడు. పల్లెపట్టులలో ప్రవహిల్లుతున్న దేశి పలుకుబడులను జాతీయజనజీవనస్రవంతిలో ప్రవేశపెట్టి ఎన్నడూ లేని కావ్యత్వగౌరవాన్ని కల్పించాడు. అనూచానమైన చైనీయకవిత్వంలో ఒక నవవిప్లవాన్ని తీసుకొనివచ్చి, ఒక వినూత్నశకాన్ని మొదలుపెట్టాడు. రెండువేలయేండ్లు గతించినా ఆ విప్లవకాంతి ఈనాటికీ తరిగిపోలేదు. ఆయన కవితాదీక్ష చాలా గొప్పది. ప్రజలు ఆ మహాకవిత్వదీక్షను మనసారా మెచ్చుకొన్నారు. అభిమానంతో గుండెలకు హత్తుకొన్నారు. ప్రశంసల పుష్పవృష్టిని కురిపించారు. ఆనాటి పలుకుబడి తీరు మారి భాషలో చెప్పలేనన్ని పరిణామాలు వచ్చినా ఆధునిక చైనీస్ భాషలోకి, వివిధ విదేశీయభాషలలోనికి పరివర్తించినపుడు దాని ప్రభావశీలితలో మార్పేమీ రాలేదు. పాఠకహృదయాలను పరవశింపజేయటమూ మానలేదు.

సాహిత్యచరిత్రలో మహాకవులందరి విషయంలో లాగానే ఛు యువాన్ ఉనికిని గురించి, రచనలను గురించి, కర్తృత్వాదికాన్ని గురించి అనేక వాదవివాదాలున్నాయి. క్రీస్తుకు పూర్వం 206లో సామ్రాజ్యపాలన మొదలుపెట్టి, ఎన్నడూ లేని విధంగా చైనీయ భాషాసాహిత్యాల వ్యాప్తికి పూనుకొన్న హాన్ రాజవంశీయుల కాలం నాటికే ఛు యువాన్ కీర్తివల్లి దిగంతాలకు పాకుతున్నది. అందుకు సాహిత్యాధారాలనేకం ఉన్నాయి. రెండవ హ్యువాయీ చక్రవర్తి ఆస్థానంలోని విద్వాంసులు ఛు యువాన్ దివ్యానుగ్రహసంపన్నుడని భావించేవారు. క్రీస్తుశకం 1638లో ఛు యువాన్ కవితల తొలి సంకలనం లాయీ చీంగ్-చీహ్ వ్యాఖ్యానంతో రూపుదిద్దుకొన్నది. మీంగ్ రాజవంశీయుల ఆస్థాన దారుశిల్పి, ప్రముఖ చిత్రకారుడు అయిన ఛెన్ హంగ్-షావ్ (1599-1652) తన కాలంలో లభిస్తుండిన చిత్రం ఆధారంగా ఛు యువాన్ వర్ణచిత్రానికి జీవకళ ఉట్టిపడుతున్న ఒక ప్రతికృతిని కల్పించాడు. ఆజానుబాహు దీర్ఘ శరీరయష్టితో, సముజ్జ్వలమైన కాంతిపరివేషంతో, చైనీయ సంప్రదాయానుసారం పెద్దలయెడ గౌరవానికి నిదర్శకంగా కేశపాశం అగ్రభాగాన ముడివేసి – ఆ కేశబంధం చుట్టూ అలంకరించికొన్న స్వర్ణాభరణంతో, తెలివితేటలను సూచిస్తున్న విశాలమైన నెన్నుదురుతో, నిడుపైన ముఖరేఖతో, జీవితంలో తారసిల్లిన నిమ్నోన్నతాల చింతాక్రాంతి ఫలంగా ముడివడిన కనుబొమలతో, ఆకర్ణాయతనేత్రాలతో, కవులకు సహజమైన ఆవేశాన్ని, భావతీవ్రతను ప్రదర్శించే పలుచని పెదవులతో, ఆపాదభుజాగ్రం విస్తరించిన నానావర్ణమనోహరమైన ఛాంగ్ షాన్ కూర్పాసంతో,వీపున ఉన్నత రాజకీయోద్యోగులకు లాంఛనమైన కెంపులు పొదిగిన ఖడ్గలాంఛనంతో మహాపురుషలక్షణాలు ఉట్టిపడుతున్న చిత్రం అది. ఆయన చారిత్రికవ్యక్తి కాడని, పురావృత్తాలలోని కాల్పనికమూర్తి అని భావించటం సమంజసం కాదు.

3

ఛు యువాన్ భావుకత్వం, రూపశిల్పీకరణకౌశలం నిరుపమానమైనవి. ఆయన రచనావళిలో మహోదాత్తమని చెప్పదగిన ‘లి సావో’ (ఆక్రోశము) కవితలో మానవుడు స్వార్థపరుడై ప్రకృతిశక్తుల జీవశక్తిని,సత్త్వసంపదను స్వత్వానికి ఏ విధంగా మలచుకొన్నాడో చిత్రించటం కనుపిస్తుంది. అంతులేని అతని ఆశకు పగ్గాలుండవు. గాలి, వాన, ఉరుము, మెరుపు, మబ్బులు, చంద్రుడు మొదలైన ప్రకృతిశక్తులన్నీ అతనికి అనుచరగణమూ, పరివారమూ, రథచోదకులూ అయ్యారు. ఫీనిక్స్ పక్షి, డ్రాగన్ పక్షి అతని రథాన్ని నడుపుతాయి. తన సత్త్వసంపదతో వాటిని ఆకసానికి ఉరకలువేయించి, పరుగులు తీయించి, స్వర్గద్వారం మీదుగా భువనకోశపు పైకప్పు మీదికెక్కి అతను భూ పరిక్రమణకు ఉపక్రమిస్తాడు. అనంతానికి ఆవలి తీరాన ఉన్న అదృశ్య క్షితిజరేఖలపై అడుగుమోపేదాకా అతని అన్వేషణ కొనసాగుతుంది. అంతులేని ఆ ప్రయాణంలో అతనికి విశ్రాంతి దొరకదు. అంతాన్ని చవిచూసేంతవరకు అతని యాత్రకు ముగింపు ఉండదు.

ఛు యువాన్ తన భావుకతకు సనాతన సంప్రదాయం తొడిగిన సంకెళ్ళను తొలగించివేశాడు. సంప్రదాయ రూపచిత్రాలలోని స్వర్గాన్ని, నరకాన్ని, ఆత్మలను అభివర్ణించినా ఆయన వాటిని విశ్వసనీయ దృగ్విషయాలుగా విశ్వసింపలేదు. సర్వసుఖాలకు గమ్యస్థానమైన స్వర్గంలోనూ, పాపులకు శిక్షానిలయమైన నరకంలోనూ కూడా ఆ ఆత్మపదార్థం స్వస్థంగా ఉండటం సాధ్యం కాదని అన్నాడు. ‘ద రెఖ్వియమ్’(మృతులకై శ్రద్ధాంజలి) కవితలో ఆయన ఆత్మను ఉద్దేశించి,

వలదు స్వర్గమ్ము, నరకమ్ము వలదు నీకు,

దశదిశల వెదుకాడు దుర్దశకుఁ బోకు;   

వాంఛనీయమ్ము లే దెట్టి వలను నందు

క్షణము నివసింపలేవు సౌఖ్యముగ నెందు!

అని ఉద్బోధిస్తాడు. ఎండమావులలో దాహం తీర్చుకోవాలనుకొనేవారి సుఖభ్రాంతిని నిరసించే వాక్యమిది. ఆత్మ అంటూ నిజంగా ఒకటుంటే, జీవి మరణానంతరం శరీరం నుంచి బైటపడిన తర్వాత కూడా దానికి సుఖానికోసం వెతుకులాట తప్పకపోవటాన్ని విమర్శించటం ఇందులో కనబడుతుంది. ‘లి సావో’ కవితలో ఒక చిత్రమైన సన్నివేశం: అతను ఆత్మరూపంలో స్వర్గాన్ని చేరుకొని, అక్కడ గుమ్మానికి ఆనుకొని చిద్విలాసంగా నిలబడి ఉన్న ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళనివ్వమ్మని అర్థిస్తాడు. ఎంతో కష్టం మీద అనుమతి సంపాదించి లోపలికి వెళ్ళిన తర్వాత – అక్కడ సుఖభోగాలను అనుభవిస్తున్న జీవులు ఎవరెవరో గుర్తుపట్టాక – పెదవి విరిచి, “ఈ స్వర్గంలోనూ మంచివాళ్ళున్నట్లు లేదు” అనుకొంటాడు!

సంవిధానశిల్పం రీత్యా ఛు యువాన్ రచించిన అద్భుతావహమైన కవిత ‘తీయెన్ వెన్’ (ప్రహేళికలు) గురించి చెప్పుకోవాలి. ప్రకృతిని, మానవజాతి చరిత్రను మతాతీతమైన హేతువాద దృష్టితో అధ్యయనం చేసి, తన దర్శనసారాన్ని ఇంత గంభీరంగా కవిత్వీకరించినవారు విశ్వసాహిత్యంలో వేరొకరు లేరంటే అది అతిశయోక్తి అనుకోకూడదు. ఈ విశ్వోత్పత్తికి పూర్వం సృష్టిస్వరూపం ఎలా ఉండేది? ఆ సర్వశూన్యంలో ఏమేమి జరిగి ఏయే పరిణామాలు సంభవించాయో తెలుసుకోవటానికి ఏ శాస్త్రం ఉపకరిస్తుంది? మహనీయుడైన ఏ కళాకారుని అంతర్దార్శనికత తోడ్పడుతుంది? ఏ చిమ్మచీకటిలో రాత్రి కడుపున పగటి వెలుగు పురుడుపోసుకోవటం జరిగింది? తొమ్మిది ద్వీపాలతో విలసిల్లుతున్న ఈ భూమిఖండముయొక్క నిర్మాణం ఎట్లా జరిగింది? ఏ అదృశ్యశక్తి యొక్క కుశల కరాంగుళులు భువిలోనూ, దివిలోనూ నివసించే జీవరాశిని పోతపోశాయి? అన్న విచికిత్సతో ఈ ప్రహేళికాపరంపర ఉత్తరోత్తరానుసంధానపూర్వకంగా కొనసాగుతుంది. పురాగాథలను గురించి, పూర్వమహావ్యక్తులకు సంబంధించి, చారిత్రిక ఘటనలను అధికరించి కవి ప్రశ్నలను సంధిస్తాడు. నూటడెబ్భైకి మించిన ప్రహేళికలే గాని ఒక్కదానికీ సమాధేయరీతిలో సమాధానం కనుపింపదు. ఒకప్పుడు చరిత్రకు గుర్తులు తెలియని కాలంలో వెలసిన ఏవో కొన్ని పురాగాథల స్వరూపం ఈ ప్రహేళికలను బట్టి ఊహింపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. వీటిలో ప్రసక్తులైన కొందరు మహనీయుల కథావిశేషాలు బహుశః ఒకప్పుడు ప్రచారంలో ఉండి, ఈనాడు ఏ వివరాలూ తెలియనందువల్ల ఈ ప్రహేళికలలోని కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవటం కష్టం. ఈ ప్రశ్నలన్నీ వేర్వేరు కాలాలలో వేర్వేరు రూపాలను సంతరించికొని ప్రహేళికలుగా రూపొందేనాటికి వీటి స్వరూపం పరిపరివిధాల మారి ఉండవచ్చును. ప్రహేళికల క్రమసంఖ్యలోనూ మార్పులు జరిగి ఉంటాయి. కొన్నింటి పూర్వాపరస్థానాల వ్యత్యయం వల్ల తర్కసంగతి లోపించి, అర్థాంతరసంక్రమణం జరిగినట్లు కనబడుతుంది. పైగా ‘తీయెన్ వెన్’ కు ఉన్న అనువాదాల సంఖ్యకూడా తక్కువేమీ కాదు. వీటిలో క్యూవో మో-జో గారి అనువాదం భాషాశాస్త్రరీత్యా ప్రామాణికమని ఆధునిక చరిత్రకారులు నమ్ముతున్నారు.

ఆధిభౌతిక శక్తులను గూర్చిన, గ్రహనక్షత్త్రతారకాదులను గురించిన విజిజ్ఞాస ఇందులో ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ ఆకాశాన్ని నిర్మించినదెవరు? ఆకాశం ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది?ఆకాశానికి ఆధారభూమిక ఏమిటి? జ్యోతిర్విజ్ఞానంలో పన్నెండు రాశిచిహ్నాల విభాగానికి కారణం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్త్రాలు క్రిందికి రాలకుండా తమతమ స్థానాలలో ఎలా ఉండగలుగుతున్నాయి?ఒక రోజులో సూర్యుడు ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తాడు? నెలలో చంద్రుని వృద్ధిక్షయాలకు కారణం ఏమిటి? ప్రాతస్సంధ్యకు మునుపు సూర్యుడు ఎక్కడ దాగివుంటాడు? ఇత్యాదిగా ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ తర్కబద్ధమైనవని వేరే చెప్పనక్కరలేదు. ప్రకృతిని ఛు యువాన్ ఎంత సూక్ష్మదృష్టితో పరిశీలించాడో, ఆయన భావనాశక్తి ఎంత పుష్కలమో మనము చూడవచ్చును.

Li_sao_illustré_(crop)

ప్రపంచ సంస్కృతివిశేషాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి కలవారికి, భారతీయ – చైనీయ సంస్కృతుల సాజాత్యాన్ని తెలుసుకోవాలనుకొనేవారికి ఈ ‘తీయెన్ వెన్’ ఒక తరగని గని వంటిది. కృతి ప్రారంభంలోనే భూమిని ఎనిమిది స్తంభాల వలె మోస్తున్న దిగ్గజాల ప్రసక్తి వస్తుంది. “భూమిని ఎనిమిది ఏనుగులు మోయటం” అన్నది ఎంతటి విశ్వజనీనమైన భావుకతావిశేషమో! అన్న ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రునిలోని మచ్చ కథ; ఛావోస్ చక్రవర్తికి పౌర్వికుడైన ఝి రాజును ప్రసవించిన వెంటనే తల్లి అతనిని మంచుపై విడిచిపెట్టగా పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడిన సన్నివేశం; మునుపు పర్వతాలకు రెక్కలుండిన రోజుల్లో చూంగ్ పర్వతపుత్త్రుడైన కు రాజుకు రెక్కలు వచ్చి, అతను ప్రజావాసాలపై వాలుతూ లోకకంటకుడు కావటం; హ్సీయా రాజవంశానికి మూలపురుషుడైన యు రాజు త్యు పర్వతం వద్ద నది పొంగును అరికట్టటానికి వెళ్ళి, అక్కడొక వనితను చూసి ఆకర్షితుడై ఆమెతో సంగమించటం, ఆమె భర్త కోపించి ఆమెను రాయిగా మారమని శపించటం, శాపావధి ముగిసిన తర్వాత ఆమె చీ రాజును కనటం;పూర్వం గగనసీమలో తొమ్మిదిమంది సూర్యులుండటం, హ్సీయా రాజవంశానికి చెందిన మహాధానుష్కుడు యీ అనే రాజు వారిలో ఎనిమిది మందిని కూల్చివేసి ఒక్క సూర్యుని మిగల్చటం వంటివి పాఠకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ఒకప్పుడు యుద్ధంలో మహావీరుడైన కావో యాంగ్ చక్రవర్తి చేతిలో ఓటమి పాలైన కుంగ్ కుంగ్ అన్న డ్రాగన్ పక్షి క్రోధంకొద్దీ పూఛావ్ పర్వతం కేసి తలను మోది, భూమిని మోస్తున్న ఆగ్నేయస్తంభాన్ని కూలద్రోసిందట. అందువల్ల అప్పటి వరకు చదరంగా ఉండిన నేల దక్షిణానికి ఒరిగి, సముద్రపు నీటిని తాకిందట. ఈ ఘటన అంతరార్థం ఏమిటి? అని ‘తీయెన్ వెన్’ చిత్రంగా వితర్కిస్తుంది. భూ ఉపరితలం పైని గొడుగు పైకప్పు వంటి అర్ధగోళాకృతిలో తొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది చిన్ని చిన్ని స్వర్గాలుంటాయట. వీటి ఉనికి పరమార్థాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఇహపరాలకు మధ్యనున్న సూక్ష్మమైన విభాజకరేఖ పైని నిలబడి, అజ్ఞేయమైన పరాన్ని విడిచి సుజ్ఞేయమైన ఇహం కేసి మొగ్గుచూపుతున్న ఛు యువాన్ మనస్తత్త్వాన్ని పట్టిచూపుతుంది. విశ్వజయాని కంటె ఆత్మజయం మేలన్న నిశ్చయానికి వచ్చిన రోజులవి.

రత్నగర్భ నేకాతపత్రంబు గాఁగ  

నేలు నరపాలమౌళి నిర్వేలమైన 

భ్రాంతి విడలేక దేనినిఁ బడయఁగోరుఁ?      

గాంక్షను జయించు కాంక్షంబు గలుగదేల?

అని. ఛు యువాన్ కాలానికి చైనాలో విజ్ఞానశాస్త్రం మహోన్నతస్థితికి చేరుకొన్నది. ఖగోళశాస్త్రంలోనూ, కాలవిజ్ఞానంలోనూ, గణితశాస్త్రంలోనూ గణనీయమైన కృషి జరిగింది. సాధ్యనిర్దేశం మొదలుకొని నిగమనం దాకా వాదవిధానంలో నవీన సిద్ధాంతాలు రూపొంది, సప్రమాణంగా తర్కశాస్త్రం పరిణతిని పొందింది. ఛు యువాన్ కు కొద్దిరోజుల ముందు దాక్షిణాత్య తత్త్వవేత్తలలో పేరెన్నిక గన్న హ్యూవాంగ్ ఔత్తరాహులలో సుప్రసిద్ధ తార్కికుడైన హ్యూయీ షీహ్ వద్దకు వెళ్ళి అంతరిక్షంలోని గ్రహనక్షత్త్రాదులు నేలకు రాలకుండా ఉండటానికి శాస్త్రీయకారణం ఏమిటనీ, గాలినీ వాననూ ఉరుమునూ మెరుపునూ సృష్టించిన భౌతికశక్తి ఏదనీ సుదీర్ఘంగా చర్చించాడట. హ్యూయీ షీహ్ ఆయనకు సహేతుకంగా సమాధానాలను చెప్పాడట. దీనిని బట్టి ఆ కాలంలో విశ్వవిజ్ఞానాన్ని గురించిన మేధావుల ఆసక్తి ఏ విధంగా ఉండేదో వెల్లడవుతుంది.

చైనీయ నాగరికత సముజ్జ్వలంగా వెలుగొందిననాటి స్వర్ణయుగంలో ఛు యువాన్ ఉన్నాడు. సహజంగానే మేధాసంపన్నుడైనందున తనచుట్టూ జరుగుతున్న సామాజికపరిణామాలను పరిశీలించాడు. ప్రజాసమస్యలను లోతుగా అధ్యయన చేశాడు. వివిధవ్యక్తుల మనస్తత్త్వాలను అవగాహన చేసుకొన్నాడు. రాజకీయోద్యోగంలో ఉండటం వల్ల అన్ని వర్గాల జనులతో గాఢమైన సంబంధం ఏర్పడి సమకాలిక భావధారయొక్క సమగ్ర స్వరూప స్వభావాలు ఆకళింపుకు వచ్చాయి. అందువల్ల ఆయన ప్రతిభ సర్వతోముఖంగా వికసించింది. అయితే, ఆయన ప్రధానంగా కవి. కవిత్వం ఆయన జీవలక్షణం. ప్రతిభ సముజ్జ్వలమైనది. చిత్రకర్మకౌశలం సాటిలేనిది. అంకితభావంతో అక్షరవరివస్య చేశాడు. పట్టుమని పాతిక కవితలు లేకపోయినా పదికాలాలకు సరిపడే కీర్తిని పండించాడు. అహర్నిశం తన దేశప్రజలకోసం జీవించాడు. నిర్వికల్పమనస్సుతో ప్రజాసేవకే అంకితమయ్యాడు. కష్టజీవుల న్యాయసాధనకోసం ఆయనంతటి శక్తివిలాసంతోనూ, చైత్యచోదనతోనూ, శ్రేయోభిలాషతోనూ, అంతర్లీనపాండిత్యంతోనూ,ప్రకాశవిమర్శతోనూ గంభీరమైన భావసంపుటిని మనోహరమైన శబ్దసంపుటిగా పోహళింపగల కవులు ఎక్కడో కాని కనుపింపరు. వైదుష్యవిలసనానికి గాక కేవలం శ్రమజీవుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం కవితలను రచించాడు. ప్రజాహృదయాలలో శాశ్వతనివాసం ఏర్పరచుకొన్నాడు.

*

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

 

-బొల్లోజు బాబా

~

 

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.

ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.

అదీ ఈ కవితకు నేపథ్యం.

ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

 

*******

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు

రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

 

నిశ్శబ్దమా వర్ధిల్లు!

 

 

మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

ఇంత నిద్రెందుకో మనకి!

 

 

-నిశీధి

~

మతం తర్వాత  ఈ ప్రపంచానికి పట్టిన భయంకరమయిన జబ్బు , నిజానికి అంటువ్యాధి అనే చెప్పుకొనేది ఏమయినా ఉంటే అది ఖచ్చితంగా అవనీతి మాత్రమే . ఆ జబ్బు మనలో ఎంత  ముదిరిందో తెలుసుకోవడానికి  , అధికారం జనాన్ని కరప్ట్  చేయదు ,  జనమే అధికారాన్ని కరప్ట్ చేస్తారు  అనడానికి ప్రస్తుత  భారతదేశం ప్రపంచ దేశాలకే ఒక నెగటివ్ మోడల్ ఐకాన్ గా మారుతుందని అర్ధం కావడానికి మనలో మన చుట్టూ కొన్ని వందల ఉదాహరణలు దొరుకుతున్నాయి .

ఇందుకు అతి పెద్ద  ఉదాహరణగా , నిజానికి దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ఎవరు అన్న చర్చ అటు కార్పోరేట్ కనుసన్నలలో నడిచే మీడియాలోనే కాక స్వీయ అభిప్రాయ ప్రకటన అవకాశాలు  హెచ్చుగా ఉన్న సోషల్ మీడియాలో లో సైతం  పెద్ద ఎత్తున సాగుతున్న ఈ తరుణంలో ఒక పక్క   పనామా  పేపర్స్లో ఇండియా కీర్తి పతాకాలు రెపరెపలాడించి మరో పక్క ఇడియట్ బాక్సుల ముందు కూర్చునే ఇడియట్స్ కోసం చాలా జాగ్రత్తగా కాసుల గలగలలు స్పష్టంగా వినిపించేలా  తయారు చేసిన క్రికెట్ ఆటల ముందో వెనకో చేతిలో ఇండియన్ ఫ్లాగ్ అందరికి కనపడేలా బేస్ వాయిస్ లో జనగణమన పాడి వీర దేశభక్తుల దిల్  కా దడ్కన్ తో పాటు వళ్ళంతా  వద్దన్నా  కరుచుకోచ్చే గూస్బంప్స్ పెంచిన ఆరడుగుల దేశభక్తిని రేపొద్దున్న మన ఖర్మ కాలితే భారత దేశ మొదటి పౌరుడుగా  చూడాల్సోస్తుందేమో అన్న ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది . ప్రెసిడెంట్ పదవి ఆషామాషీ ఆటేమి కాదు “ దేశంలో  అతున్నత స్థాయి రబ్బర్ స్టాంప్  ఉద్యోగమే “ అని గల్లీలలో క్రికెట్ ఆడే పిల్లలకి సైతం విదితమే  అయినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెరిగిపోతున్న అర గుంట ఆస్తుల్లో పంటలు పండించుకోడానికి అప్పులు  తీసుకోని , కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుభారతం ఒక పక్క లక్షల కోట్లు ఎగేసి రంజుగా విమానాలేసుకొని దేశాలు దాటి పోతున్న మోడీలు మాల్యాలు ఇంకో పక్క , అదే సమయంలో కోట్లు వెనకేసుకొని విలాసంగా నవ్వుతూ  దేశంలో కౌన్ బనేగా  కరోడ్పతి అంటూ ఈజీ మనీ గేమ్స్  తో పాటు మనీ ల్యాండరింగ్  కేసుల్లో ప్రముఖంగా  వినబడే  బచ్చన్లు దేశభక్తులుగా  కీర్తించబడుతున్న ఈ   టైమ్లో నిజమే ఈ దేశంలో  ఉండాలంటే  భయమే మరి . అదే మాట పైకి చెప్పిన పాపానికి అమీర్ఖాన్ పై  సహన ప్రియులంతా  ఎంత అసహనాన్ని  చూపారో ఇంక్రేడిబుల్ ఇండియా బ్రాండ్  అంబాసిడర్గా అమీర్ ని పక్కన పెట్టినప్పుడే  తెలిసిపోయింది మనం అంతా  ఎలాంటి సమాజాన్ని  సృస్టించడంలో  నిమగ్నమై  ఉన్నామో .

ఒక సామాన్యుడికి పేట్రియాటిజం అంటే తిరంగా ఝండాలు భుజాన మొయ్యడం , భారత మాతాకి జై  చెప్పడమేనా  ? లేదా  దేశాన్ని  దేశ భవిష్యత్తుని నిర్మించుకొనే పునాది ఇటుకల్లో భాగస్వామ్యం కావడమా ?  ప్రతి వ్యక్తిని , పూర్తి వ్యవస్థని వ్రేళ్ళతో సహా కుళ్ళబెట్టి మొత్తం దేశపు నదుల్లో , భూసారంలో కూడా  కలిసిపోయినంతగా  మనల్ని పెనవేసుకుపోతున్న  పెనుబాము అవనీతికి  ఎదురు నిలబడే శక్తి మనలో నశించిందా ? లేక ఎదురు తిరిగే సామర్థ్యం ఉన్నా నిద్ర నటిస్తూనే  ఉంటామా  ? పనామా  పేపర్స్  నిండా మనదేశ  హేమాహేమిల పేర్లు  బయటికొస్తున్న సమయంలో నిజంగా  స్పందించాల్సిన రీతిలోనే  మనం  స్పందిస్తున్నామా ? అక్కడో ఇక్కడో  సోషల్ మీడియాలో చెణుకులు వినిపిస్తున్నా మాతాజీలు బాబాజీ ల అభ్యంతరకరమైన వాక్యాల  మీదనో , పాపులర్ నినాదాల మీదనో  జరుగుతున్న  చర్చలు , ప్రతి సామాన్యుడి రక్తం ఉడికిపోవాల్సిన సిట్యువేషన్స్ ఏమి  ఈ రోజు ఎందుకు కనిపించడంలేదు ? ఈ ప్రశ్నలకి సమాధానమేది ?  లేదా  మనమొక వెయ్యి  తింటాం పక్కనోడు పదివేలు ,  ఆ పై వాడు పదివేల  కోట్లు తింటాడు  అన్నంత  సింపుల్గా  కణాల్లో  జీర్నించుకుపోయిన కరప్షన్ జీభూతాలని  వదిలించుకోవడానికి ఇష్టపడటం లేదా ?

ఇంత మౌనం పాటిస్తున్న  సభ్యసమాజం కోసం  నిజానికి  సరయిన నిర్వచనాలలో దేశభక్తి అంటే ఏమిటో ఒక పెద్ద డిబేట్  జరగాల్సిన  ఈ సందర్భంలో మత్తు  వదలరా  నిద్దుర మత్తు వదలరా  అని  మన కొసరాజు  1966 లోనే  రాసినా  , ఇపుడు మాత్రం అన్నా హజారే యాంటి  కరప్షన్  మూమెంట్ సమయంలో బాలివుడ్ లిరిసిస్ట్ ప్రసూన్ జోషి రాసి గళమెత్తిన ఒక చిన్న కవిత ఈ  సారి  మనకోసం . గవర్నమెంటులు మారినా , అధికారపు పార్టీల జెండా  రంగులు  ఏవయినా మనలో మార్పు  రానంత వరకూ మన దేశభక్తి నాటకాలు అన్ని హుళిక్కి అని తేల్చి  చెప్పే  సర్వకాల సకల జనుల గీతం  తెలుగు లో  ఇలా

 

ఇంత నిద్రెందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి

అలికిడి లేకుండా నల్లని రాత్రులు వచ్చిపోతూనే  ఉంటాయి

అలికిడి లేకుండానే ఏ క్షణమయినా గుండె చప్పుడు ఆగిపోతుంది

అయినా మరోసారి వత్తిగిలి పడుకొని  అన్నీ మర్చిపోతాం మనం

ఇంత నిద్రెందుకో  మనకి

మగతా లేక  మరేదయినా మత్తా ఇది

నెమ్మది నెమ్మదిగా ఇంతగా  అలవాటు పడిపోతూ

 

అబద్ధాల వర్షపు వెల్లువలో

నిజాల వేణుగానమేదో

ఒకే ఒక గాలి వీచిక కోసం ఎదురు చూస్తూనే కృశిస్తుంది

తర్వాతెందుకో దుఃఖిస్తాం మనం

మరీ ఇంత నిద్రెందుకో మనకి

 

నారు మనదే  నాట్లు  మనవే

ఆశ్చర్యం ఏమిటో  ఇలా ఎదిగిన పంటలు చూసాక

నరికేయాలి నశింపచేయాలి

ఈ రోజు మనముందు పెద్ద సవాలే  నిలబడి ఉన్నపుడు

ముళ్ళనెందుకు విత్తుతున్నాం మనం

ఇంతగా ఎందుకు  నిద్రిస్తున్నాం  మనం

 

ఆట అందరిదే

ఓటమీ అందరిదే

అదేమిటో అనూహ్యమైన విచిత్రపు  ఆట

ఇంజను  నలుపే

డబ్బాలు నలుపే

నిండు భారంగా నడిచే పాత ట్రైనే ఇది

మరి ఈ రైలే ఎక్కిపోవాలని కోరికేమిటో మనకి

 

జోలపాటలు కాదిప్పుడు

లాగిపెట్టి చెంపదెబ్బలు కొట్టండిప్పుడు

ఒక చిన్న బ్రతుకాశ ఇవ్వండిప్పుడు

లేదంటే  మళ్ళీ  నిద్రిస్తాం

కలల్లో మళ్ళీ మునిగిపోతాం

రండి ఇలా  పాపాలు కడుక్కుందాం

 

ఇంత నిద్రేందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి!

 

 

~

ఇంకొంచం ఓపిక ఉన్నవారికోసం ప్రసూన్ జోషి ఒరిజినల్  కవిత యూట్యూబ్ లింక్

 

 

 

 

 

కొంత కదలిక…కొంత గలగల!

 

-రామతీర్థ

~

 

ramateerthaఒట్టాప్ళాక్కన్ నీలకండన్  వేలు కురుప్ గా జన్మించి (27.05.1931 – 13.02.2016)  ఎనభై నాలుగేళ్ల ఒ.ఎన్.వి.కురుప్ శనివారం 13.02.2016న మరణిస్తే,  కేరళ శాసన సభ ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఈ ఒక్క విషయాన్నే ప్రస్తావించి, మరుసటి పనిదినానికి వాయిదా పడ్డది. ఒక్క శాసన సభ్యులకే  దక్కే ఈ గౌరవాన్ని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తొలిసారిగా ఒక మహాకవికి ప్రకటించింది. 2011-12 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి “దినాంతం” అన్న  కురుప్ దీర్ఘ కవిత నుంచి ప్రారంభ చరణాలు చదివి  తన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు.

 మలయాళ కవిత్వంలో గేయ ఫణితి లయాత్మకత, గాన లక్షణం,  సాహిత్యంలో ఇప్పటికీ అంతర్భాగాలే. వాటిని తన కవిత్వపు అంతర్భాగాలుగా మలుచుకుంటూనే, కురుప్ “నేను ప్రాచీన కవినే” అని చెప్పే వారు, ఎంతలా  ఆధునిక విషయాలపై రాసినా. కురుప్ ఉన్నత విలువలతో రాసిన సినిమా పాటలు ఆయనను, ఈ తరం యువ మలయాళీలకు కూడా  చిర పరిచితుడిని  చేసాయి. ఒకింత శృంగార సన్నివేశాలకు కూడా, మనోహర గేయాలు రచించిన ఖ్యాతి కురుప్ దే. మొదటి సారిగా “కాలం మారున్ను” 1954 సినిమాకు పాటలు రాసిన కవిగా కురుప్,   పలు దశాబ్దాలు అటు సాహిత్య రంగంలో, ఇటు సినిమా రంగంలో కూడా, తన సృజన ప్రమాణాలను రాజీ పడకుండా నిలబెట్టుకున్నారు.

 సినిమా రంగపు హడావిడి, రాత్రుల పార్టీలు, అవసరానికి మించి సినీ రంగపు వ్యాపార వేత్తలతో  కలిసి మెలిసి తిరగడాలు వీటన్నిటికీ, కురుప్ ఎప్పుడూ దూరంగా ఉండే వారు. ఒక యువ దర్శకుడు ఒక సారి, కొని పదాలు వాడి ఆయనను  పాట  రాయమంటే, అలాంటివి కుదరవని నిక్కచ్చిగా చెప్పిన  కళాకారుడు ఆయన. అయినా, “వ్యాపార రంగంలో  మేం డబ్బులు పెడుతున్నాము కనుక, సరకును మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము” అనే ఈ కాలపు పద్ధతి అయిన  లాభాల పంట పండించుకునే బండ వాదన ప్రభావంలో పడ్డ, ఆ యువ దర్శకుడు, పాట  రికార్డింగ్ సమయంలో ఏ మాటలైతే, కురుప్ రాయలేదో, వాటిని చేర్చిన విషయం  తెలిసి, పెద్ద  యెత్తున  అభ్యంతర పరిచిన వేళ , ఆ దర్శకుడు, ఆ మాటలను తొలగించడమే  కాక, కురుప్ కు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పిన సంఘటన, కురుప్ సాహిత్య నైతిక స్థాయి పట్ల కేరళ సమాజంలో ఎంతటి గౌరవాదరాలు ఉన్నాయో తెలియ చేస్తుంది.  రెండు వందల ముప్ఫై రెండు సినిమాలకు రాసిన తొమ్మిది వందలు పైగా సినీ గీతాలు కురుప్ కలం  నుంచి వెలువడ్డాయి.

 ముణ్ణోట్టు ( ముందుకు) అనే కవితను తన పదహారేళ్లకే రాసిన ఈ కవి “దాహికున్న పానపాత్రం” కవితా సంపుటి తో  మొదలై, ఇరవైఒక్క సంపుటాలు రచించారు.  ఆరు  వచన రచనలు కూడా వీరు వెలువరించారు. “భూమిక్కొరు చరమ గీతం” పేరిట, వెలువడ్డ కురుప్ రచన గానయుక్త లక్షణంతో, మలయాళ  సమాజంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.  రష్యా దేశపు పుష్కిన్ పురస్కారం, మన దేశపు పద్మశ్రీ , పద్మ విభూషణ్, కేరళ విశ్వవిద్యాలయపు డాక్టరేట్,  కమలా సురయ్య పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఎన్నో గౌరవాలు కురుప్ ను వరించాయి. “వైశాలి”  చలన చిత్రానికి, జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయిత గా(1989)  పురస్కారం పొందారు. కేరళ రాష్ట్ర చలన చిత్ర పరిషద్  కురుప్ ను పదమూడు సార్లు ఉత్తమ సినీ గీత రచయితగా పలు వార్షిక గౌరవాలను అందచేసింది.

 2013లో గోర్కీ ఇన్స్టిట్యూట్  ఈయన  రాసిన యాభై కవితలను రష్యన్ భాషలోకి అనువాద ప్రచురణ గా ఆ దేశ ప్రజలకు అంద చేసింది. రష్యా దేశం “పుష్కిన్  ఆఫ్ కేరళ” అని గౌరవప్రదంగా సంభావించింది కూడా. రాజకీయాలు, విభేదాలు ఎన్ని ఉన్నా కేరళ సమాజం మౌలికంగా ఒక సాంస్కృతిక విలువల సమాజం. అది  కురుప్ విషయంలో, అసెంబ్లీ ఆయన మృతికి సంతాప సూచకంగా ఒక రోజు మూత పడితే, అటు  ఆయన అంత్యక్రియల్లో, సంగీతం ప్రధాన పాత్ర వహించింది. ఆయనే పేరి పెట్టిన కేరళ ప్రభుత్వ  శ్మశానవాటిక “శాంతికవాటం” లో, ఆయన  వయసు ఎనభై నాలుగేళ్ల సంఖ్యకు సరిపోయేట్టుగా, ఎనభైనాలుగు మండి గాయకులు, కురుప్ రచించిన గీతాలను ఆలపిస్తుండగా, ఆయన  పంచభూతాల్లో లీనమయాడు. కూచుని అంత్యక్రియలను తిలకించిన వారిలో కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాండీ ముందు వరసలో ఉన్నారు.

కేరళ సాంఘిక రంగంలో ప్రముఖులు, ప్రఖ్యాతులు, భిన్న భిన్న రంగాలనుంచి, ఆయన కడసారి  చూపులకు తరలి వచ్చి, తమ ప్రేమ, గౌరవం, తెలుపుకున్నారు.భాషా  రాజకీయాల్లో పడి , మాతృభాషలను అలక్ష్యం చేయవద్దన్నది, కురుప్  హెచ్చరిక. విశాల వామపక్ష చింతనకు నెలవైన ఆయన రచనల్లో ఏదో ఒక రకంగా మనుషులను వేరులు పెట్టే  వివక్షల, ఆధిపత్య సంస్కృతుల పట్ల ఆగ్రహ ప్రకటన ఒక కేంద్ర స్వభావంగా కనిపిస్తుంది. అశాంతిపర్వం అనే కవితలో, ఆయన మందలింపు చాలా తీవ్రమైనది. “ కొయ్యి, ముక్కలు చెయ్యి, విడగొట్టు, వేరుపరచు, పల్లెనూ,పట్నాన్ని, తెగలనూ, నగరాన్నీ, భాగాలుగా ఎడం పెట్టు, వాటాలుగా ఎడ పెట్టు, ఒప్పందాలుగా పంచేసుకో – మృగాల్లా బతకండి, చంపుకుంటూ, కబళిస్తూ, పీక్కుంటూ, పులుల్లా, సింహాల్లా – ఒక్క  క్షణమైనా మనుషులుగా బతకవద్దు – మృగత్వానికి  పట్టం  కట్టి పండుగ చేసుకోండి”

 తన కవిత్వ రచన పట్ల కురుప్ విశ్వాసం  ఇది –

 “కవిత్వం నాకు అలా కలుగుతుంది అంతే. ఏది దాన్ని ఎగసన  తోస్తుందో నాకు అవగతం కాలేదు. అలాగని అదేదో కాలక్షేపపు ఆలోచన అని అనుకోలేను. ఒక స్ఫూర్తి అయితే తప్పకుండా ఉన్నది. మనం జీవితాన్ని గాఢంగా జీవిస్తాము. అన్నిటి పట్లా అదే గాఢ  భావన కలిగి ఉంటాము. జీవితమే నాకు ఒక కవిత్వ దోహద కారి. అదే నా స్ఫూర్తి, నాకు మరింకే ఆలంబనలూ లేవు. సూర్యుడి కింద ఉన్నదేదీ, కవిత్వానికి అతీతం కాదు.  లోకపు సంఘటనలన్నీ, కవి పట్టించుకోదగ్గవే. ప్రతీ రాత్రీ కొన్ని పీడకలలు మన తలల చుట్టూ తిరుగుతుంటే మనం నిదురిస్తాము. చెట్లు నరికే గొడ్డళ్ళ  చప్పుడో, బాంబులు పేలుతున్న బీభత్సారావాలో,  ఆడపడుచుకో, అవని తల్లికో, నిర్దయా  హైన్యంలో జరిగే మాన భంగాలో, అవి ఆందోళన కలిగించి మెదడులో ఉత్పాతాలకు కారణమవుతాయి. ప్రతీ విషాదంలో, ఇంకా తీవ్రమైన మరుసటి విషాదపు బీజాలు ఉండనే  ఉంటాయి. ఒక దుర్ఘటన, మరొక దుర్ఘటనకు పురిటి పక్క అవుతుంది. అవి అలా రెట్టింతలవుతాయి. ఒక నగరం అంతా  మత విద్వేషాల మంటల్లో మాడి  మసి అయితే, అది కవిత్వాన్ని, సాహిత్యాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. కవిగా నా కర్తవ్యం ఏమిటని నేను అనుకుంటున్నానంటే, ఈ దుఖాల, పెనుగులాటల, తీవ్ర వేదనల ఒడ్డు నుంచి, స్వేఛ్చ  అనే మరొక ఒడ్డుకు, వంతెనలు కట్టడమే. ఎక్కడో ఒక చోట, నా పాట  కొంత కదలిక,  కొంత గల గల,   కలిగిస్తే నేను గర్వ పడతాను. గౌరవం దక్కిందని భావిస్తాను, ఇదే నా పని అని కొనసాగిస్తాను. కవిత్వం పట్ల నా దృష్టి ఇది.”                          

 కురుప్ కవితలు రెండు 

క్షణికమే కానీ –
మంచుబిందువును నేను

ఆకుకొస నా ఆకుపచ్చ సింహాసనం

నింగి నిమ్మళమైన నీలం కరిగిపోతుంది నాలో

నా శిరసు పై సూర్య కిరణాలుశిలువ గుర్తులు గీస్తాయి

ఉదయ రవిబింబ మూర్తినా ఒళ్ళో  కిలకిలా నవ్వుతాడు

రొమ్ము తాగుతున్న అల్లారు ముద్దు బిడ్డలా –

కొంచెం ఒంగి చూసుకో ఒక సారి

నీ చిన్నదయిన ప్రతిబింబం స్పష్టంగా ప్రతిఫలించడం లేదూ  నాలో –

అయినప్పటికీ

నన్ను పొదివి పట్టుకున్నా ఆకు కొస

ఒకింత రవంత కదిలినా

ఏ అలికిడీ లేకుండా ముగిసిపోతుంది నా కథ

రాలిపోతూ కటిక నేలపై –

నాలో కరిగిపోయిన  సూరీడూ, ఆకాశమూ,

నావయినవన్నీ అంతరిస్తాయి – అప్పుడిక శూన్యమే –

ఆవిరై ఆ ఎగువనున్న స్వర్గాలకు వెళ్లాలనుకోను  నేను

అవసరమైతే నా చెమ్మను అంద చేస్తా

ఈ నేల  మట్టి రేణువుకు.

 

 

 పల్లె పదం

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా

పాడిన పాటలు బాట తప్పి పోయాయి

నడిరేయి కాక గళం ఒరిసి అరుస్తున్నది

ఆ కాకిగోలలా  పదే పదే  పాడమా పాడమా

కను తెరవని వేకువలకు స్తుతి సంగీతాలూ

పిట్టలకు ముంగిలినా గింజలు జల్లేసి

పావురాళ్ల రాకకై పిట్ట పాట  పాడమా

లేని మావి చెట్టుకు ఊహ మావి కొమ్మకు

ఊగి ఊగేలా ఉయ్యాల పాట  పాడమా

ఎండిన వాగుల నెర్రెల  పర్రల బీడులా

హైలెస్స హైలెస్సా కాగితపు పడవలై

ఎండిన గొంతులా మేము పాటలు  పాడాలా

పాడాలా పాటలు తడి లేని మబ్బులకు

ఎత్తాలా గొంతులు మనసు లేని వానలకు

నిదరలు నటించే లేవని  వారిని లేపేలా

మేము డప్పులు మోగిస్తూ చప్పుడై రేగాలా

అలనాటి విందుల ఆ నిండు కథలన్నీ

చెప్పాలా పిల్లలకు కడుపుకోత జోలలుగా

ఆకొన్న బిడ్డలకు చేత లేని ముద్దలుగా

పాడాలా తీయగా పాడాలా  హాయిగా

ఆ పట్టు పుట్టాల సుతిమెత్తందనాలను

ఆ రాజు, ఈ రాజు ఎక్కినా  రథాలను

పాడాలా  జోరుగా, పాడాలా హోరుగా

ఈ నేల పాలకుల దిస మొల దర్పాలూ

ఊరేగే డాబులా ఆ బట్టబయలులూ

మునుపు పాడిన పాటలన్నీ ఏక మొత్తంగా

బాట తప్పి పోయాయి, దారి ఎరుగకున్నాయి

చెప్పండి అన్నలూ, చెప్పండి నాన్నలూ

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా..

 

అక్షరమే అష్రఫ్ పోరాటం!

 

తెలుగు సేత : జగద్ధాత్రి

 

సమాన అవకాశాలు

ఒక కొడుకు , ఒక కూతురు

తల్లి కూతురికంటే కొడుకే కావాలని కోరుకుంది

జీవితపు ఒడిదుడుకులన్నింటా కొడుకు తల్లికి తోడుగా ఉంటాడు

కూతురు తనో కొడుకును కంటుంది తనకు దన్నుగా నిలబడేందుకు.

 

ఓ ప్రహేళిక

ప్రేమలో పడటం అంటే నువ్వు ప్రేమించిన ఒకడి చేతిలో పక్షిలా ఉండటం కాదు

పొదలో ఉన్న పది ఇంతకంటే పదిలం

పొదలో ఉన్న ఒక్క పక్షి, చేతిలో ఉన్న పది పక్షులకంటే మెరుగు

పక్షి దృష్టి కోణం నుండి

 

ముగింపులు

కొన్ని సార్లు ప్రేమ, ఉపవాసం ఉన్న వాడికి భోజనం లాంటిది

మరి కొన్ని మార్లు అంగవైకల్యం గల పిల్లవాడికి

సరి కొత్త జత బూట్స్ జత ఇవ్వడం లాంటిది

ప్రేమ, సాధారణంగా , పెద్ద మొత్తం లో

అన్ని వైపులా అందరికి నష్టం కలిగించే బేరం

 

తర్కం

ఆ పాత తలుపులు చప్పట్లు కొట్టాయి

చెట్లతో కలిసి గాలి ప్రదర్శించిన నృత్యానికి మెచ్చుకోలుగా

ఆ పాత తలుపులకి చేతులు లేవు

ఆ చెట్లు ఏ నర్తన శాలకూ వెళ్ళి ఉండలేదు

చెట్లతో కలిసి నృత్యం చేస్తున్నా సరే

అగుపించని జీవి గాలి

 

(అష్రఫ్ ఫయాధ్ సౌదీ అరేబియా లోని యువ కవి. మతానికి వ్యతిరేక కవిత్వం రాశాడన్న నేరం పై మరణ శిక్ష విధించబడిన వాడు. ఇప్పుడు మరణ శిక్షని తగ్గిస్తూ 8 సంవత్సరాలు జైలు శిక్ష , 800 కొరడా దెబ్బలు గా శిక్ష ఖరారు చేసేరు. మనం ఉన్నది మనుషుల లోకమేనా ఒక యువ మేధావికి, కవికి ఇలాంటి శిక్షా అని ప్రపంచం మొత్తం ఈ శిక్షని వ్యతిరేకిస్తోంది. )

నాలుగు చిన్న కవితలు అష్రఫ్ ఫయాధ్ వి: Equal opportunities , An aphorism, Conclusions, Logic   అరబిక్ నుండి ఆంగ్ల సేత జొనాథన్ రైట్

*

 

 

కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్సన్

 

 

    – నాగరాజు రామస్వామి

~

ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో దాగిన కవన స్వరాలను ఆవిష్కరించకుండా ఉంటే, బహుశ, ఆ అభినవ కోకిల గొంతు కొమ్మల్లోనే సద్దుమణగి పోయేదేమో.

ఎమిలీ – ఏమిలీ ఎలిజబెత్ డికిన్సన్ (1830 – 1886 ) – అమెరికా లోని ఆమర్స్ట్ (Amherst ) లోని క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమర్స్ట్ అకాడమీ లో తెలివైన విద్యార్థినిగా పేరు పోందింది. 17 ఏళ్లకే చదువు చాలించి, తండ్రి కట్టిన ఇల్లు హొమ్ స్టెడ్ లో  శేష జీవితాన్ని ఒంటరిగా గడిపింది. ఒకటి రెండు సార్లు వాషింగ్టన్ డి.సి, ఫిలడల్ఫియా, బోస్టన్ కు మాత్రమే వెళ్లింది. అడపాదడపా కలిసే ఒకరిద్దరు మిత్రులు తప్ప చెప్పుకోదగిన ఆత్మీయులు లేరు. పెళ్లిచేసుకోకుండా ఉండి కన్య గానే మరణించింది. ఎప్పుడో గాని చర్చికి వెళ్లేది కాదు. తెల్లని దుస్తులే ధరించేది. ఎవరితోనూ కలుపుగోలుగా ఉండక ఏకాకిగా బతికేది. కనుకనే ఆమెను మిథ్ (myth) అని అంటుండే వారు. రాసిన కవితలలో సింహభాగం మృత్యువు సంబంధమైనవే అయినందున ఆమెను మార్బిడ్ (Morbid) పోయెట్ అనేవాళ్లు. ఫోటో పంపమని అడిగిన సంపాదకులకు ‘I am small like the wren, and my hair is bold, like chestnut bar – and my eyes like the sherry in the glass, that the guest leaves ‘ అని చెప్పిందే కాని ఫోటో పంప లేదు. ఎక్కడో దొరికిన ఏదో ఒక Daguerreotype ముతక ఫోటోతో వాళ్లు సరిపుచ్చుకోక తప్పలేదు.

మానవ సంబంధాలకూ, ప్రపంచ రీతులకూ దూరంగా ఉన్న ఆ ఒంటరి జీవి అన్ని కవితలు ఎలా రాయగలిగిందో,  ‘ America’s true poetic genius ‘ గా ఎలా ఎదుగ గలిగిందో ఆలోచిస్తే వింతగా ఉంటుంది. ఆమెను అంటిపెట్టుకున్న పలు పుస్తకాలే అందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఆమెను ప్రభావితం చేసిన కవులలో పోయెట్ ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్, హాతోర్న్, థోరో, ఎమెర్సన్, లాంగ్ ఫెలో, షేక్స్ పియర్,జాన్ కీట్స్ , జార్జ్ ఇలియట్ ముఖ్యులు.
వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్, కీట్స్, బైరన్, షెల్లీ, బ్లేక్  ప్రభృతులతో  ప్రారంభమైన కాల్పనిక సాహిత్యోద్యమ కెరటం ( Romantic Movement ) పలు ప్రపంచ దేశాలను చుట్టి 19 వ శతాబ్దం నాటికి అమెరికా తీరాన్ని తాకింది. రష్యాలో Pushkin, స్పేన్ లో Jose de Espronceda, పోర్చ్ గల్ లో Almeida Garette, ఇటలీ లో Ugo Foscolo, అర్జెన్టీనా లో Esteban Echeverria, బ్రాజిల్ లో Jose de Alenar  వంటి వాళ్లను  ప్రభావితం చేసిన రొమాంటిక్ కవిత్వం అమెరికా లో  విలియమ్  బ్ర్యంట్, వాల్ట్ విట్మన్, ఎమిలీ డికిన్ సన్ లను సృష్టించింది. అమెరికా జాతీయ అధునిక సాహిత్య నుడికార  సృష్టి కర్తలుగా పరిగణించ బడుతున్న ఇద్దరి లో ఒకరు వాల్ట్ విట్మన్, మరొకరు కవయిత్రి  ఎమిలీ డికిన్ సన్. విట్మన్ ది బైబల్ సంబంధిత దీర్ఘ పంక్తుల కవిత్వ మైతే, డికిన్ సన్ ది ప్రొటెస్టంట్ భావ సాంద్ర మైన లఘు వాక్యాల కవిత్వం. విట్మన్ లో విస్పష్ట భావోద్వేగం పొంగి పొరలుతే, డికిన్ సన్ లో వికల భావ అస్పష్టత దోబూచులాడుతుంది. అమెరికా లో పరిఢవిల్లుతున్న నేటి ఆంగ్ల కవితా అధునిక చైతన్య ధారకు వీళ్లిద్దరు మూలభూతులు అనడంలో సందేహం లేదు.

ఆమె ఎన్నోమరపు రాని ప్రణయ కవితలను, వెంటాడే మత సంబంధిత గీతాలను, ‘Master Letters’ అని కొనియాడబడిన  ఉత్తరాలు రాసింది. డికిన్ సన్ జీవితం ఎంత చిత్రమైందో, ఆమె కవిత్వం అంత అసాధారణ మైంది. భాషను కొత్త పుంతలు తొక్కించే స్వేచ్ఛాధోరిణి. వ్యాకరణ సూత్రాలను లెక్కచేయని స్వైర  ప్రయోగాత్మకత. ఆమెది ఒకవిధంగా  capre diem poetry – శక్తివంతమైన వర్తమాన క్షణాలను పొదవి పట్టుకొని ‘Seize the day’, ‘ Live-in-the-moment’, ‘Dwell in the possibility’ అంటూనే లౌకిక సీమలను అధిగమించే ఆత్మ భావన. ‘Bring me the sunset into my cup’ – అన్న ఆమె కవితా పంక్తులు అధునికత గత శతాబ్దంలోనే కవిత్వ భూములలో అడుగిడిందనటానికి ఆనవాలు. ఆమె వాక్య నిర్మాణం నవీనం. వ్యాకరణం ఆమోదించని విరామ చిహ్నాలను, డాష్ లను ఇచ్ఛానుసారం వాడుతుంటుంది అనడానికి నా ఈ యథాతథ అనువాదాలు :
             నేను నివసించేది సంభవంలో —
వచనం కన్నా అందమైనది —
దానికి కిటికీలు అనేకం —
ద్వారాలు ఉత్కృష్టం —
గట్టి కర్ర తో కట్టినవి —
కనుచూపుకు గహనమైనవి —
శాశ్వతమైన పైకప్పు కోసం
ఆకాశపు వసారాలు వాల్చబడ్డవి —
సందర్శకులు — సజ్జనులు —
వాళ్లు ఉండేందుకు — ఇది–
స్వర్గాన్ని పోగుచేసుకునేందుకు
చాచిన నా బాహువులు —

ఆమె కవితలకు శీర్షిక లుండవు. రూపం ( Form ) లోనూ, ఉత్ప్రేక్షల వినియోగం లోనూ ఆమెది అసాంప్రదాయ కవిస్వేచ్ఛ ( Poetic license ) :
             మేధ — ఆకాశం కన్నా విశాలం —
పక్క పక్కన పెడితే —
దాంట్లో రెండోది అవలీలగా ఇముడుతుంది —
మరి నీకూ ఉంటుంది పక్కన చోటు —
మెదడు సముద్రం కన్నా లోతైంది —
నీలిమనూ నీలిమనూ —
పట్టుకొని చూడు —
అది రెండో దాన్ని ఇట్టే పీల్చేసుకుంటుంది–
స్పాంజ్ — బకెట్ లా–
మస్తిష్కం బరువు దేవుని అంత —
తూచి చూడు– పౌండు కు పౌండు —
భేదం అంటూ ఉంటే–
అది ఉచ్ఛారణకూ శబ్దానికి ఉన్నంత —

కవితకు సరిపడదేమో అన్నట్టుంటుండే ఆమె ఉన్న ఫళంగా వాడిన ఆరంభ వాక్యం ఊహకు పొసగదు. Humming Bird ను ఉద్దేశించిన కవిత తొలి పంక్తి  ‘మాయ మయ్యే మార్గం’ – ‘A route of Evanescence’. కాని, ఆ కిటుకు తెలిసాక, పాఠకుకునికి సంభ్రమాశ్చర్యం తప్పదు :
  చిటికెలో మాయమయ్యే మార్గంలో
గిర్రున తిరిగే చక్రం —
పచ్చలను అనునదించే కంపనం —
ఆరుద్ర అరుణిమల శీఘ్ర గమనం —
ఆ రంగుల ఉరవడికి
వాల్చిన తలను సవరించు కుంటుంది
పూలపొద మీది ప్రతి పుష్పం
ఆది
దూరదేశం నుండి దూసుకొచ్చిన జాబేమో,
కన్వేగు వేళ హాయిగొలిపే  కాలి నడకేమో —         

ఒక్కో చోట వ్యాకరణ విరుద్ధంగా  capital letter వాడుతుంది. ఇక్కడ పువ్వు – Flower ( F in upper case) ! పైగా ఆ పువ్వు సంతోషం గా ఉన్న పువ్వు !
           ఆటకోలు మంచు
యాదృశ్ఛికంగా
తన తలను ఖండించినా
సంతోషంగా ఉన్న ఏ పువ్వూ
ఆశ్చర్య పడినట్టు లేదు —
ఆ అందాల హంతకి
అలవోకగా కదలి పోతుంటుంది —
చలించని సూర్యుని దినచర్య
యథావిధి కొనసాగుతుంటుంది —
ఆమోదించే దేవుని కోసం .

వాక్యాల వింత విరుపులతో, భావావరణాల కుదింపులతో కూడిన అందమైన అస్పష్టత :
           ఘోర విషాదం పిదప
మామూలై పోయిన స్తబ్ద యాంత్రికత —
నరాలు ఆచార్య పీఠం వేసుకొని కూర్చుంటవి — సమాధుల్లా,
బిగుసుకు పోయిన హృదయం ప్రశ్నిస్తుంటుంది
అతడేనా భరించింది ?
మరి ఇది నిన్నమొన్ననాటిదా  లేక శతాబ్దాలకు ముందుదా?’ అని–
కలప బాట మీదో, గాలిమీదో, దేనిమీదో
కాళ్లు యాంత్రికంగా కదలాడుతుంటవి —
లోన ఏదీ పట్టని బండబారిన నిర్లక్ష్య స్ఫటిక  నిశ్చలత —
సీసంలా ఘనీభవించిన సమయం —
చలి బారికి బతికి బయట పడి గడ్డ కట్టినా
మంచునే స్మరించే మనుషులు —
మొదట చలి, పిదప దిగ్భ్రాంతి,
ఆపిదప వదలివేత — అనాసక్త స్వేచ్ఛ —

చిత్రమైన భ్రాంతి మెలకువల సందిగ్ధ భావ చిత్రం . మన ఊహకే వదిలివేయబడిన అర్ధాంతర ముగింపు :
         నా తలలో ఒక శవయాత్ర కదలిక ,
నా మెదడులో  ఒక అంతిమ క్రియాకాండ —
సంతాపకులు అదేపనిగా అటూ ఇటూ తిరుగుతూ,
నా ఆలోచనను ఆసాంతం అణగదొక్కుతూ —
సందడి.
ఆ తతంగం అంతా ఒక భరించరాని ఢంకా మ్రోతలా ఉన్నది
ఎడతెగని ఆ కఠోర ధ్వనికి నా తల దిమ్మెక్కేట్టున్నది.
వాళ్లు ఆ శవపేటికను ఎత్తేటప్పుడు
కీచు శబ్దమేదో నా గుండెల్లోంచి దూసుకు పోతున్నది,
వాళ్ల ఇనుప బూట్ల తొక్కిడికి లోని నేల కూలు తున్నది.
స్వర్గసీమలన్నీ కలసి  ఒక పెద్ద ఘంటగా మారినట్టు,
నా అస్తిత్వం అంతా వెరసి అది వినేందుకే ఉందన్నట్టు,
నేనూ నా నిశ్శబ్దం ఏదో వింత ఒరిపిడికి విరిగి ఒరిగినట్టు ,
ఇక్కడ నేను ఒంటరినై మిగిలి పోయినట్టు —  ఉన్నది.
నా కాలికింది కలప పగిలి నేను పడిపోతున్నాను —
కిందకు – మరింత కిందకు —
ఒక్కో పతనంలో ఒక్కో ప్రపంచపు తాకిడి,
ఒక్కో తాకిడితో ఒక్కో శిథిలమైన ఎరుక మరపు —
– – –
మరి ఆవెనుక – – – –

ఆమె ఒక విధంగా మత విశ్వాసాల కవయిత్రే. వ్యక్తిగత జూడీ-క్రిస్టియన్ నమ్మకాలకూ శుద్ధ భగవత్ తత్వ భావానికీ మధ్య నున్న లంకె కోసం ఆన్వేషించింది. ‘ Hope is the thing with feathers ”అనే కవితలో అమూర్త అంశాలకూ భౌతిక విషయాలకూ మధ్య నున్న సమగ్రతను పట్టుకోవడం కోసం పరితపించింది. ఆమె కవితా ప్రక్రియ ఎంత జటిలమైందో, ఆమె మత పరమైన భావధార కూడా అంత క్లిష్టమైంది. స్వీయాత్మ చింతనా నేపథ్యంలో, దేవున్ని కరుణ హీనునిగా చిత్రించింది.చర్చికి వెళ్లడం మానేసింది. ‘ Tell the Truth, but, tell it slant ‘లో పరోక్షంగా దూషించినా,’ My Life has stood — A loading gun ‘వంటి  కవితలలో నేరుగా దేవున్ని క్రూరునిగా దుయ్యబట్టింది. అయితే, ఆమెను నాస్తికురాలని అనలేము. ఆమెకు తనదైన స్వయంకపోలకల్పిత  దైవీయ భావన ఆమెకుంది – A home-spun theology of her own.
డికిన్సన్ ను విశిష్ట కవయిత్రిగా నిలిపింది మాత్రం ఆమె అసాంప్రదాయ అధునిక శైలీ శిల్పాలనే చెప్పాలి. భావ గాఢతను మించిన శైలీ విన్యాసం. Style is the poetry అన్నంతగా రచనలు చేసింది. పదాల పోహళింపును  (Syntax) తలకిందులు చేసి, అసంబద్ధ పదబంధాలను, విరోధాభాస (Paradox) పదాలను పక్క పక్కన పేర్చి    ( Parataxis technic  ), కామాలటో, డాష్ లతో, ఊహించని పునరుక్తులతో, అసదృశ Word Play తో తనదైన విశిష్ట వైయక్తిక శైలిని ( Ideosyncracy ) సంతరింప  జేసుకుంది కనుకనే అమెరికన్ అంగ్ల అధునిక సాహితీ వైతాళిక కవయిత్రిగా ఆమెకు స్థానం స్థిరపడింది. అయితే, ఆమె లోని ఈ వినూత్న విశిష్ట వైకృతులకు అనితర సాధ్యమైన అభివ్యక్తీకరణ సత్తా  ఉన్నందువల్లనే ఆమె నూత్న ప్రక్రియ అంతగా రాణించింది. డికిన్సన్ చూపిన అధునిక సృజన వైఖరి వల్ల అమెరికన్ ఆంగ్ల సాహిత్యం కొత్త మలుపులు తిరిగింది. ఆమె నవ్య ధోరిణికి ప్రభావితమైన వర్ధమాన కవితాలోకం నవనవంగా వర్ధిల్లింది. ‘డికిన్స్ ప్రభావిత కవిత’ పేర ప్రతి సంవత్సరం Poetry Society of America బహుమతి ప్రధానం చేస్తున్నది. అది ఆమెకు అమెరికా ఇస్తున్న సృజన నివాళి.

కట్టు బానిస రగిల్చిన కాగడా!

-నిశీధి 

~

విరిగిన మనుష్యులని అతకబెట్టె మరమ్మత్తుల పనులకన్నా  ఒక  బలమయిన కొత్త తరాన్ని  నిర్మించుకోవడం సులభం అన్న విషయం  Ac రూముల్లో కూర్చొనో ఇరానీ చాయిల మధ్య సిగార్ ధూపాల్లో రాలిన ఆకుల్లో  పచ్చదనాన్ని వెతుక్కొనే కవిత్వపు కళ్ళ సాహిత్యానికెలా తెలుస్తుంది ?

బానిసత్వపు  సంకెళ్ళని  వదిలించడానికి కాఫీ టేబుల్ పోయెట్రీ కాకుండా సూర్యుడి మొహాన  వదలని నెత్తుటి మరకలని స్వయంగా  తుడిచే ధైర్యం తో పాటు అసలు మరకెంత మరణమో తెలిసుండాలి. ఒక కట్టు బానిసకేమిటీ అసలు తెలివితేటలు ఏమిటీ అని ముక్కు మీద వేలేసుకొని నవ్వే ప్రపంచం ముందు వెలుగుతున్న కాగడాగా నిలబడి స్లేవరీ నుండి సెలెక్టెడ్ రీడింగ్స్ వరకు మిగిలిన ఒకే ఒక ఉదాహరణ ఫ్రెడెరిక్ డాగ్లస్ . చీలమండలు చినిగి రక్తాలోడేలా ఒక తోటి మనిషికి సంకెళ్ళేసే వ్యక్తి ఆ సంకెళ్ళ తాలూకు మరో అంచు అతని మెడకి ఎప్పుడో చుట్టుకుంటుంది అన్న నిజం తెలియకుండా ఉండడు అని తెలిసి మనుష్యులని   జంతువులకన్నా  హీనంగా  చూసే అసహ్యాల గురించి ఆటను రాసుకున్న  మాటలు  ఎంత నిజం కదా .

పరిస్థితుల్లో మార్పు రావాలంటే వెలుగు కాదు ఇపుడు కావాల్సింది ఏకంగా  కార్చిచ్చు . గాయాలకి లేపనమయ్యే చిరు జల్లులు కాదు  అసలు గాయాల ఉనికే కొట్టుకుపోయే సునామీలు తుఫానులు హోరుగాలులు  అని పద్దెనిమిదో శతాబ్దపు మొదట్లోనే ఫ్రెడరిక్ రాసాడు  అంటే , ఇప్పటి అసహన దినాలు లేదా టార్చర్ సెల్స్ లా  మారి  నోక్కకనే నొక్కుతున్న మనసుల మధ్య నెమ్మదిగా హృదయాన్ని బాధించకుండా మృదువయిన మాటలలో విప్లవం గురించి మార్పుల గురించి చెప్పాలండి అనే మితవాదులు ఏ చీకటి గూట్లో తల దాచుకుంటారో ఒకోసారి చూడాలనిపిస్తుంది .

అంతేనా జనం వాళ్ళు కోరుకున్న ప్రతిది వాళ్ళ వాళ్ళ పనుల ద్వారా పొందలేకపోవచ్చు కాని వాళ్ళిప్పుడు ఉన్న స్తితికి గతికి కారణమయిన పని పట్ల గౌరవం ఉండాల్సిందే పని చేస్తూ బ్రతకాల్సిందే అన్నాడు కూడా బాబు అంటే సడెన్గా అది సాహిత్యం అయినా ప్రజా యుద్ధం అయినా మాకు కావలసినంత గుర్తింపు రాలేదు కాబట్టి పని చేసే  ఇంట్రస్ట్ లేదు అని చెప్పే బద్ధకపు పని దొంగల సాంబార్ బుడ్డి ఎక్కడ గప్చుప్ అవుతుందో కూడా మరో తరానికి తెలియాలి . ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయాలో లాగి పెట్టి కొట్టినట్లు చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఫ్రెడరిక్ మిమ్మల్ని ప్రేమించడానికి అని చెప్పాలి అనిపించదా ఆ  పెద్దాయన కనిపిస్తే మాత్రం ?

, రచయిత , వక్త , పరిపాలనకర్త . అన్నిటిని మించి కాపిటల్ పనిష్మెంట్ కింద అప్పట్లో బ్రతుకుకాలం పాటు బానిసగా బ్రతకమనే శిక్షని అబాలిష్ చేసిన వ్యక్తిగా Frederick Douglass ( 1818 – 1895) బానిస జీవితాల దుర్భారత్వాలని వివరిస్తూ రాసిన కొన్ని వాక్యాలు చదివితే గుడ్నే తడవ్వదా ? “ ఓపెన్ సీక్రెట్ ఏమిటంటే మా యజమానే నా తండ్రి అన్న విషయంలో రహస్యమెంతొ నిజమెంతో నాకెప్పుడు తెలియలేదు కాని రాత్రి చీకట్లో మాత్రమే నన్ను జోకొట్టి ఉదయం వెలుగుకల్లా మాయమయ్యే అమ్మతో గడిపిన జ్ఞాపకం బహుశ ఆ కొన్ని క్షణాలేనేమో “

పోనీ ఇది చదివితే అన్న ఏమన్నా కదలిక ఉంటుందా మనలో  , మనది కాని జీవితాల పట్ల మనకుండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూస్తయినా పెరుగుతుందా ?

f2

స్వేచ్చ

 

ఈ అందమయిన భీభత్సపు  స్వేచ్చ

పీల్చే గాలంత అవసరం అయిన స్వేచ్చ

ఉపయోగపడే పచ్చని భూమంత స్వేచ్చ

పూర్తిగామనదైనప్పుడు

రాజకీయనాయకుల టక్కుటమార శుష్క వచనాల్లా కాకుండా

సంకోచవ్యాకోచాలు  అసంకల్పిత చర్యలంత సహజంగా

ఆలోచనలని ఆపలేని మెదడంత స్వేచ్చ మనం గెలిచినప్పుడు

ఈ మనిషి, ఈ డగ్లస్, ఈ పూర్వ బానిస,

మోకాళ్ళ విరిగేలా కొట్టబడ్డ  ఈ నీగ్రో

ఏ మనిషి గ్రహాంతరవాసికాని

ఎవరూ వేటాడబడని

వంటరవ్వని

ఒక కొత్త ప్రపంచాన్ని వీక్షించాలని కోరిక

ప్రేమ తారకం నిండిన ఈ మనిషి జ్ఞాపకాలు

గొప్ప వాక్పటిమ నిండిన కావ్యాల్లో

మూలమలుపుల్లో వంటరిగా నిలబడిన కంచి విగ్రహాలలో కాకుండా

తన బ్రతుకునుండి బ్రతుకై నిలిచే

తన కలలని రక్తమాంసాలలో అదుముకొనే

ముందు తరాలుగా చూడాలన్న కోరిక

*ఇది రాస్తున్నపుడు ఎందుకో ఒక్క క్షణం అంబేద్కర్ జ్ఞాపకం , ఒక వేళ బాబా సాహెబ్ ఈ కవిత రాసి ఉంటే ఇదే రాసేవారేమో కదా ? పూలుపళ్ళలో పలుకు చివర దండాలలో కాకుండా నన్ను నా భావజాలాన్ని  గుండెలలో నింపుకొండి అనేగా చెప్పేవారు ?

ఫ్రెడరిక్ రాసిన ఒరిజినల్ పోయెం

When it is finally ours, this freedom, this liberty, this beautiful

and terrible thing, needful to man as air,

usable as earth; when it belongs at last to all,

when it is truly instinct, brain matter, diastole, systole,

reflex action; when it is finally won; when it is more

than the gaudy mumbo jumbo of politicians:

this man, this Douglass, this former slave, this Negro

beaten to his knees, exiled, visioning a world

where none is lonely, none hunted, alien,

this man, superb in love and logic, this man

shall be remembered. Oh, not with statues’ rhetoric,

not with legends and poems and wreaths of bronze alone,

but with the lives grown out of his life, the lives

fleshing his dream of the beautiful, needful thing.

 

మరోసారి మరో ఉత్తేజంతో

బ్రెయిన్ డెడ్ !

 

 

 

 

మనలోకి మనం పుప్పొడిలా…

కొన్ని మాటలూ, పాటలూ, కవితలూ దయలేనివి! కదిలించీ, కంపించి పోయేట్లు చేసి.. మనలోకి మనం పుప్పొడిలా రాలిపోయేలా చేస్తాయి.
‘…నహీ ఆయే కేసరియా బల్మా హమారా..’ అంటున్న శుభా ముద్గల్ స్వరంలో మునిగి, ఆ భావావేశంలో ఊపిరాడక ఉగ్గపట్టినట్లుండగానే ‘యే బారిష్ గున్‌గునాతీ థీ…….’ అంటూ గంభీరంగా గుల్జార్ గొంతు పొదవిపట్టుకుంటుంది.. ఆ మరునిమిషంలోనే ఆ పదాలు తడిచిన కనురెప్పల గుండా గుండెని పెకలించివేస్తాయి!
వెలుతురూ, చీకటితో సంబంధం లేకుండా చుట్టూ నిశ్శబ్దం ఒక కంచెలా పాతుకుపోతుంది. ఎక్కడో మనకి సంబంధంలేని అడవిలోతన మానాన తాను కురుస్తున్న వర్షం అకస్మాత్తుగా రెక్కలు విదిల్చుకుంటూ వచ్చి మన తలుపవతలే కురుస్తున్నట్లు… ఎన్నెన్నో సంగతులు.. బుజ్జగించేవీ, పదునైనవీ, వణికించేచీ… ఏవేవోజ్ఞాపకాలు ఆ కంచె లోపల చేరతాయి.
ఎంతసేపనీ, ఎన్నిరోజులనీ ఇంక లెక్కలనవసరం!
 

రెయిన్‌కోట్ సినిమాలో ‘పియా తోరా కైసే అభిమాన్ ‘ పాట, మధ్య మధ్యలో గుల్జార్ స్వయంగా వినిపించే ఈ కవితా ఆ కోవలోకే వస్తాయి.


ఏదో
ఈదురుగాలి వల్ల అనుకుంటా…

~

ఏదో ఈదురుగాలి వల్ల అనుకుంటా

ఈ గోడకి తగిలించి ఉన్న చిత్రం పక్కకి ఒరిగింది

పోయిన వర్షాకాలంలో గోడలు ఇంత తేమగా లేవు
ఈసారి ఎందుకో వీటిలో తడి చేరింది..
బీటలు వారాయి.
ఈ చెమ్మ ఎలా పారుతుందంటే

ఎండిన చెంపల మీదుగా కన్నీటి తడి జారుతున్నట్టుంది!

ఈ వాన ఇంటి పైకప్పు మీద తనలోతాను పాడుకుంటుండేది
కిటికీల అద్దాల మీద తన వేలికొసలతో ఏవేవో సందేశాలు రాస్తుండేది

ఇప్పుడు మాత్రం మూసిన వెంటిలేటర్ అవతల నిర్లిప్తంగా కురుస్తోంది!

ఇప్పటి మధ్యాహ్నాలని చూస్తుంటే
ఏ పావులూ లేని చదరంగపు బల్ల ఖాళీగా పరిచినట్లుంది

ఎత్తుగడ వేయడానికి ఎవరూ లేరు.. తప్పించుకునే ఉపాయాలు అసలే లేవు!

పగలు మాయమయింది.. ఇక రాత్రి కూడా తప్పించుకుపోతోంది
ఆసాంతం ఆగిపోయింది!
అనుకోని ఋతుపవనాల వల్లనే అనుకుంటా

ఈ గోడ మీద తగిలించిన చిత్రం పక్కకి ఒరిగిపోయింది!

satya

Artwork: Satya Sufi

మూలం:
Kisi mausam ka jhonka tha…

Kisi mausam ka jhonka tha
Jo iss deewar par latki tasveer tirchhi kar gaya hai

Gaye sawan mein ye deeware yun seeli nahi thi
Na jane kyun iss dafa inn mein seelan aa gayi hai
Daraarein pad gayi hain
Aur seelan iss tarah behti hai jaise
Khushk rukhsaaro par geele aansun chalte hain

Ye baarish gungunati thi isii chhat ki mundero par
Ye ghar ki khidkiyon ke kaanch par ungliyon se likh jaati thi sandese
Bilakhti rahti hai baithi hui ab band roshandano ke peechhe

Dopehre aisi lagti hain
Bina moheron ke khali khane rakkhe hain
na koi khelne wala hai baazi, aur na koi chal chalta hai

Na din hota hai ab na raat hoti hai
Sabhi kuchh ruk gaya hai
Wo kya mausam ka jhonka tha
Jo iss deewar pe latki tasveer tirchhi kar gaya hai

——————————————-

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

 

నువ్వెళ్తున్న సంగతి పాపం నీక్కుడా తెల్సుండదులే! వెళ్తూ వెళ్తూ హడావిడిగా బుద్దుడి విగ్రహం దగ్గర నాలుగు నందివర్ధనాలు పెట్టి, కాళ్ళల్లో చెప్పులు దూర్చి కూడా ఎందుకో ఆగి క్షణ కాలం ఆ మౌనినీ, వెనువెంటనే నన్నూ ఆప్తంగా చూశావు.

ఆ రోజు సాయంత్రం పార్టీకి వేసుకుందామనుకుని బయటపెట్టిన బట్టలూ, ఎలాగైనా ఆరోజుకి ముగించేస్తానని అనుకున్న పుస్తకంలోని ఆఖరి పది పేజీలూ ఇవాళ్టి రోజున కూడా చాలా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి.

నేనూ.. ఆ నందివర్ధనాలూ మాత్రం ఒకేలా మిగిలాం!

పువ్వులంటూ నువ్వు, కాయలంటూ నేనూ కావాలని ఇష్టంగా తెచ్చుకున్న నారింజ చెట్టు కోసం తవ్విన గొయ్యి మాత్రం చాలా అసహనంగా చూస్తోంది. చాలా సార్లు దాని పక్కనే కూర్చుని బొమ్మా బొరుసు వేస్తుంటాను.. నేనా, నారింజ చెట్టా అని!

కాసేపేలే!

నువ్వు పెంచుకునే పిట్టలకి గింజలు వేయాలన్న నెపంతో చివాలున లేచి వచ్చేస్తాను!
అప్పటివరకూ ముద్దగా, ముగ్ధంగా నవ్వుతున్న పువ్వు రేకలన్నీ ఒక సన్నగాలి స్పర్శతోనే ఊగి, రాలి పడిపోయాక స్థాణువైపోయే తొడిమని చటుక్కున నువ్వు తుంచేసేప్పుడు విసుక్కున్నాను కానీ, ఒక మహా దిగులు నించి తప్పించడమని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది.

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

వెళ్ళాల్సిన దూరం ఇంకా ఉంది కానీ, మొదలూ చివరా కూడా కూడానే ఉంటావనుకుంటే.. కాస్త వరకూ తోడొచ్చినట్లు వచ్చి, ఒంటరిగా వదిలేస్తే ఎలా!?
తోవ కనబడుతూనే ఉంది కానీ, ముందుకెళ్ళాల్సినప్పుడల్లా మాత్రం కాస్త వెనక్కెళ్ళి నువ్వు వేసిన అడుగుల్ని కొన్ని అప్పుగా తెచ్చుకుంటూ ఉంటాను!

 

~

satya

నువ్వొదిలి వెళ్ళిన రోజులు…

*

 

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

యాలకుల మొక్క పక్కనే ఉన్న రాయి మీద
కాస్తంత త్వరగా అయితే నీడ పరుచుకుంటోంది
ఆ మొక్క మాత్రం ఇంకొంచెం గుబురుగా పెరిగింది
నేను ఆ కుండీని కొంచెం కొంచెం జరుపుతూ ఉంటాను..
ఫకీరా ఇప్పుడు కూడా నా కాఫీని అక్కడికే తెస్తాడు
ఉడుతలని పిలిచి బిస్కట్లు తినిపిస్తుంటాను
అయినా అవి నా వంక అనుమానంగా చూస్తుంటాయి
నీ చేతి పరిమళం వాటికి బాగా పరిచయమనుకుంటా!

అప్పుడప్పుడూ సాయంత్రమవుతూనే ఒక డేగ పైకప్పు నించి వాలుతుంది
అలసటగా కాసేపు లాన్‌లో ఆగి,
బత్తాయి చెట్టు వైపుకి ఎగిరి, తెల్లని గులాబీ పూల మధ్యలో మాయమైపోతుంది
అచ్చు ఐస్ ముక్క విస్కీలో కలిసిపోయినట్టుగా!

ఇవాళ్టి రోజుని నా మెడలోంచి స్కార్ఫ్‌లా తీసి వేసి,
నువ్వొదిలి వెళ్ళిన రోజుల్ని చుట్టుకుంటాను
నీ పరిమళంలో ఎన్నో రోజుల్ని గడిపివేస్తుంటాను!

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

*

మూలం:

 

Tere Utaare Hue Din Tange Hain Lawn Mein Ab Tak..

*

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi …!

Elaichi ke bahut paas rakhe patthar par,
zara si jaldi sarak aaya karti hai chhanv..
Zara sa aur ghana ho gaya woh paudha,
main thoda thoda woh gamla hatata rehta hun.
Fakeera ab bhi wahin meri coffee deta hai..
gilhariyon ko bula kar khilata hun biscuit.
Gilahariyaan mujhe shaq ki nazar se dekhti hain..
woh tere haathon ka maans jaanti hongi …!

Kabhi kabhi jab utarti hai cheel shaam ki chhat se..
thaki thaki si zara der lawn mein ruk kar,
suffeid aur gulaabi masumbe ke paudhon mein hi ghulne lagti hai..
ki jaise barf ka tukda pighalta jaaye whiskey mein …!

Main scarf din ka gale se utaar deta hun..
tere utaare hue din pehen ke ab bhi main,
teri mehak mein kayi roz kaat deta hun …!

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi!!

***

 

చిత్రం

 

గుర్తుందా ఒకరోజు?
నా బల్ల మీద కూర్చున్నప్పుడు
సిగరెట్ డబ్బా మీద నువ్వు
చిన్న మొక్కలాంటి
ఒక చిత్రాన్ని గీశావు…

వచ్చి చూడు,
ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!

మూలం:

Sketch

Yaad Hai Ik Din?
Mere Maze Par Baithe Baithe
Cigartte Ki Dibiya Par Tumne
Chhote Se Ek Paudhe Ka
Ek Sketch Banaya Tha

Aakar Dekho,
Us Paudhe Par Phool Aaya Hai

————————–

Artwork: Satya Sufi

ఇంకా భూమి కోలుకోనేలేదు!

 

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అవగాహన కలిగేది సినిమాల వల్లనే అనుకుంటా, నా మట్టుకూ!
చిన్నప్పుడెప్పుడో ‘కాశ్మీర్ కీ కలీ’ సినిమా పాటలు చూసినప్పుడనుకుంటా మొదటిసారి ఆ ప్రాంతం మీద ఆసక్తి కలిగి ఎక్కడా, ఏమిటీ అనే ప్రశ్నలు ఉదయించాయి.
తెల్లని పర్వత శ్రేణులూ, పచ్చని లోయలూ, సరస్సులూ, అన్నిటినీ మించిన కాశ్మీరీ అమ్మాయిల అందం, అమాయకత్వపు నవ్వు… ఇదేదో పెద్దయ్యాక పదే పదే వెళ్ళాల్సిన ప్రదేశం అని తీర్మానించుకున్న రోజులవి!

‘రోజా’ సినిమాతో ఆ ఆశలన్నీ పటాపంచలయ్యాయి, అది వేరే విషయం! అసలు కాశ్మీరు సంక్షోభంలో ఎవరి పాత్ర ఎంత అనే వాదోపవాదాలు పక్కన పెడితే కాలేజీ రోజుల్లో నా హాస్టల్ రూమ్మేట్, కాశ్మీరీ అమ్మాయి కళ్ళల్లో నిరంతరం కనిపించిన భయం ఇంకా గుర్తుంది.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో ఊరు వదిలి రావాల్సి వచ్చిందో చెప్పాలంటే ఒక పెద్ద కధ అవుతుంది, కానీ తను అన్న ఒక మాట ఎప్పటికీ గుర్తుంటుంది, ‘ఇప్పుడు ఎక్కడ ఉన్నా, క్షేమంగానే ఉన్నా కానీ ఏదో కార్నివాల్ లో తప్పిపోయినట్టు భయం, ఆందోళన! ఏదో ఒక రోజు మన ఊరుకి, మన వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతామనే ఆశ. ‘

ఆ మధ్యనెప్పుడో ఈ కింది చిట్టి గుల్జార్ కవిత చూడగానే మళ్ళీ ఆ అమ్మాయి ముఖం కళ్ళ ముందు నిలిచింది.

కాశ్మీరు నించి వచ్చిన పండిట్‌లు
తమ పేరుతో ఇంటికి ఉత్తరాలు రాస్తుంటారు
తాము వదిలివచ్చిన ఇంటికి కనీసం
ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారని!

gulzar

కాశ్మీరు లోయ

ఎంతో ఉదాశీనంగా ఉంటుంది ఈ లోయ
ఎవరో వేలితో బలవంతంగా గొంతుని నొక్కిపెట్టినట్టు

ఇది ఊపిరి తీసుకోవాలి, కానీ ఊపిరి అందనీయనట్టు!

మొక్కలు మొలవడానికి ఎంతో ఆలోచిస్తూ అనుమానపడుతుంటాయి
మొదట పెరిగిన తల అక్కడికక్కడే తీసివేయడుతుందని
మబ్బులు తలలు వంచుకుని వెళ్తుంటాయి, నపుంసకుల్లా

వాటికి తెలుసు రక్తపు మరకల్ని కడిగివేయడం తమకి చేతకాదని!

చుట్టూ పరిసరాల్లో పచ్చదనమే కానీ, గడ్డి మాత్రం ఇప్పుడు పచ్చగా లేదు
బుల్లెట్లు కురిసిన గాయాలనించి ఇంకా భూమి కోలుకోనేలేదు!
ఎప్పుడూ వచ్చే వలస పక్షులన్నీ
గాయపడిన గాలికి భయపడి వెనుతిరిగి పోయాయి
ఎంతో ఉదాశీనంగా ఉందీ లోయ.. ఇది కాశ్మీరు లోయ!
* *
మూలం:

Vaadii-E-Kashmiir

Badii udaas hain vaadii
Galaa dabaayaa huaa hain kisii ne ungalii se

Ye saans letii rahen, par ye saans le na sake!

Darakht ugate hain kuch soch-soch kar jaise
Jo sar uthaayegaa pahale vahii kalam hogaa
Jhukaa ke gardane aate hain abr, naagim hain

Ki dhoyen jaate nahii khoon ke nishaan un se!

Harii-Harii hain, majar ghaans ab harii bhii nahii
Jahaan pe goliyaan barsii, jamiin bharii bhii nahin
Vo migratory panchii jo karate the
Vo saare jakhmii hawaavon se dar ke laut gaye

Badii udaas hai vaadii – ye vaadii-E-Kashmiir!!

————————————-
చిత్రం: సత్యా సూఫీ

….ఇవన్నీ ఏమైపోతాయి!?

satya

Art: Satya Sufi

ఒకప్పుడు.. చాన్నాళ్ళ క్రితం పుస్తకాల షాపుకి వెళ్ళడమంటే చెప్పలేని ఉత్సాహం. దాచుకున్న పాకెట్‌మనీని ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకుని, కొనాల్సిన పుస్తకాల జాబితాని అరడజను సార్లైనా సరిచేసీ… తీరా అక్కడికెళ్ళాక ఇంకొన్ని పుస్తకాలు నచ్చేసీ, ఏది కొనాలో ఏది వాయిదా వేయాలో తేల్చుకోలేక అక్కడే అదేపనిగా తచ్చట్లాడిన పుస్తకాల రాక్‌లు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడూ!
కొత్త వాసనతో పెళపెళలాడే పేజీలు తిప్పుకుంటూ ఆ పుస్తకాల్ని చదవుకోవడం ఇంకో అనుభవం.. మనమూ, మన పుస్తకమూ తప్ప ఇంకేదీ ఉండని సమయాలూ, ప్రదేశాలూ వెదుక్కుని ఆ అక్షరాల్లో తప్పిపోవడం గమ్మత్తుగా ఉండేది.
పుస్తకమంటే ప్రాణం అయితే అది ఏ రూపంలో ఉన్నా ఇష్టం గానే ఉంటుంది.. కాయితమైనా, కంప్యూటర్ స్క్రీన్ అయినా!
కాకపోతే ఇప్పుడంతా ఇన్‌స్టెంట్… ఎదురుచూడటమంటే మహాపరాధం చేసినట్టే! ప్లానింగులూ, షాపింగులూ అనే ప్రోసెస్ ఆప్టిమైజ్ చేశేయబడి ఒక క్లిక్ లో మన కళ్ళ ముందు ఉంటుంది.
అయినా పెద్ద తేడా ఏం కనబడదు.. ఎలక్ట్రానిక్ బుక్ రీడర్ అయినా చేతిలో ఇమిడి పోయే ఒకలాటి అచ్చు పుస్తకమే!
వెల్లకిలానో లేక బోర్లానో పడుకునీ ప్రబంధ నాయికలా వేలికొసలతో వాలుజడని తిప్పుకుంటూ ఒక్క రీడర్‌తో బోల్డన్ని పుస్తకాలు చదివేసుకోవచ్చు!

కాకపోతే ముందుపేజీ తిప్పి అపురూపంగా చూసుకుంటే మన పేరో లేక ‘ప్రేమతో…’ అంటూ మనకిచ్చిన వారి పేరో కనబడదు! ఇంకా, గుల్జార్ అన్నట్టు చదువుతూ ఉంటే మధ్యలో ఉన్నట్టుండి నెమలీకలూ, ఎండిన పూలరేకుల జ్ఞాపకాలు రాలి పడవంతే!

 

gulzar

 

పుస్తకాలు

మూసిన అల్మరా అద్దాల్లోంచి తొంగి చూస్తుంటాయి పుస్తకాలు
చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి
నెలల తరబడి కలవనే లేదు
ఒకప్పుడు వాటి సమక్షంలో గడపబడే సాయంత్రాలన్నీ ఇప్పుడు తరచుగా
కంప్యూటర్ తెర మీదనే గడచిపోతున్నాయి!
ఎంతో అసౌకర్యంగా కదులుతుంటాయి ఆ పుస్తకాలు
వాటికిప్పుడు నిద్రలో నడిచే అలవాటు మొదలైపోయింది

చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి

అవి వినిపించే విలువలకి
ఎన్నడూ బ్యాటరీ అయిపోవడమనేది ఉండదు
ఏ బంధాల గురించి వివరించాయో
అవన్నీ విడివడి తెగిపోయాయి
ఏదైనా పేజీ తిప్పినప్పుడు ఒక నిట్టూర్పు వెలువడుతుంది
ఎన్నో పదాలకి అర్ధాలు రాలి పడిపోయాయి
ఆకులు రాలి, మోడు బారిన కొమ్మల్లా మిగిలాయి ఆ మాటలన్నీ ఇప్పుడు
వాటి మీద ఏ అర్ధాలూ మొలకెత్తవు!
ఎన్నో పరిభాషలున్నాయి
అవన్నీ పగిలిన మట్టి కుండల్లా చిందరవందరగా పడి ఉన్నాయి
ఒక్కొక్క పేజీ తిప్పినప్పుడల్లా
కొత్త రుచి ఏదో నోటికి తగిలిన అనుభూతి!
ఇప్పుడొకసారి వేలితో నొక్కగానే
ఓరచూపు మేరలో స్క్రీన్ మొత్తం పొరలు పొరలుగా బొమ్మలు పరుచుకుంటాయి
పుస్తకాలతో ఆ వ్యక్తిగత అనుబంధం తెగిపోయినట్లే ఉంది
ఒకప్పుడు వాటిని గుండెల మీద పరుచుకుని నిద్రలోకి జారుకునేవాళ్ళం
లేకపోతే ఒడిలో దాచుకునో
లేక మోకాళ్ళని బుక స్టాండ్ చేసుకుని

ఏదో ఒక దీర్ఘ పూజలో ఉన్నట్టు.. ఇంచుమించు నుదుటిని తాకిస్తూ.. తలలు వంచుకుని చదివేవాళ్ళం!

అ ప్రపంచ జ్ఞానం అంతా ఇప్పటికీ ఏదోరకంగా లభిస్తూనే ఉందనుకో
కానీ,
ఆ పేజీల మధ్యలో ఉన్నట్టుండి పలకరించే ఎండిన పూలూ, పాత ఉత్తరాల పరిమళాలూ,
పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ కావాలని జారవిడిచీ,
కలిసి తీసుకునే నెపం మీద నిర్మించుకునే కొత్త బంధాలూ
ఇవన్నీ ఏమైపోతాయి!?
అవన్నీ ఇక మిగిలుండవేమో!?!?
 * *
మూలం:

Kitaaben

~

Kitaaben jhaankti hain band almaari ke sheeshon se
badi hasrat se takti hain
maheenon ab mulaqaaten nahin hoti
jo shaamen un ki sohbat main kataa karti thi,ab aksar
guzar jaati hain computer ke pardon par
badi bechain rehti hain kitaaben
Unhe ab neend mein chalne ki aadat ho gayi hai
badi hasrat se takti hain

jo qadren woh sunaati thi
ki jin ke cell kabhi marte nahin the
woh qadren ab nazar aati nahin ghar mein
jo rishte woh sunaati thi
woh saare udhde udhde hain
Koi safha palatTa hun toh ek siski nikalti hai
kayi lafzon ke maani gir pade hain
bina patton ke sookhe tund lagte hain woh sab alfaaz
jin par ab koi maani nahin ugte
bahut si istelaahen hain.
Jo mitti ke sakoron ki tarah bikhri padi hain
gilaason ne unhen matrook kar dala

zabaan par zaaiqa aata tha jo safhe palatne ka
ab ungli click karne se bas ek
jhapki guzarti hai
bahut kuchh tah-b-tah khulta chala jaata hai parde par.

Kitabon se jo zaati raabta tha kat gaya hai
kabhi seene pe rakh ke lett jaate the
kabhi godi mein lete the
kabhi ghutnon ko apne rahl ki soorat bana kar
neem sajde mein padha karte the, chhoote the jabhee se.

Woh saara ilm toh milta rahega aainda bhi
magar woh jo kitaabon mein mila karte the sookhe phool aur
mehke hue ruqe
kitaaben maangne, girne, uthaane ke bahaane rishte bante the
un ka kya hoga ?
woh shayad ab nahin honge. !!

———————-

బుద్ధుడంటే…

 

కన్నడ మూలం: ఆరీఫ్ రాజా

 అనువాదం: సృజన్

~

అడుగు లేని మరచెంబు

ప్రతి క్షణం నిండే

ప్రతి క్షణం ఖాళి అయ్యేది

 బుద్ధుడంటే

మాంసం దుకాణం లో కోసిన

గొర్రె తల మరియు దాని కళ్లల్లో దొరికిపోయిన

కసాయివాడి నిస్సహాయక చిత్రం

 

*

che

చే

 

పడుచు కుర్రాడి

టీ  షర్ట్ మీద బొమ్మయ్యాడు చెగువేరా.

ముంచేతి అద్దం లో బూతు సినిమాలని

చూసి హస్త ప్రయోగం చేసుకునే

ప్రతి రోజు సాయంత్రం పబ్ లో

దొరకని అమ్మయిలని గుర్తు తెచ్చుకుంటూ,బీరు నురగతో

ప్రభుత్వం ఉద్యోగం కొరకు వందలకొద్ది దారాఖాస్తులు పెట్టి

పరీక్షల్లో అద్రుష్టాన్ని పరీక్షించుకునే

పసి పిల్లాడి షర్ట్ మీద .

 

మిలిటరి క్యాప్ ధరించి అర నోటితో సిగార్ కాల్చే చేగువేరా

కుడిచేతి ముష్టి బిగించి ఘోషవాక్యాన్ని ఆకాశానికి  చేర్చే చేగువేరా

 

పోరాటపు వేలకొద్ది నదులని సంధించి

ఉరకలు వేస్తూ ప్రవహించే చేగువేరా

టీనేజ్ పోరగాడి

టీ షర్ట్ గుండెల మీద నలుపు తెలుపు బొమ్మలా

 

ఎత్తైన చెట్లు ,కొండలనెక్కి

రాబందులని ఉండేలు విసిరి పడగొట్టే

రోమాంటిక్ విప్లవ వీరుడి క్షయ పీడిత గుండెగూటిలో ఏముండేదో

నెరుడా చివరిరోజుల కవిత మెరుపు అతడి కళ్లల్లో ఊండేదా ?

 

నాకు గుర్తుకోస్తుంది

బొలివియా విముక్తికోసం  తుపాకిని భుజానికి తగిలించి

నేస్తాలతో వేటకు వెళ్లిన గెరిల్లా గురు

 

దట్టమైన అడవుల్లో అడవి పందిలా వేటాడింది

కాక ఊరి బడిలో

అతడి శవాన్ని  చివరి చూపుకోసం ఉంచింది

 

వరుసపెట్టి అభిమానులు అతడి శవం వైపు వస్తుంటే

చూస్తూ చూస్తూ ముక్కు మూసుకుని వెళ్తున్నారు

 

ఎందుకంటే కళ్లు తెరిచి పడుకున్న

చిరుత కళ్లల్లొ కళ్లు పెట్టి చూసె గుండె ధైర్యం ఎవరికీ లేదు.

*