జ్ఞాపకం మరచిపోయే దారి చెప్పవూ?!

1975 లో ఫ్రాన్స్ కి వలస వెళ్లిన సలా అల్ హందాని, తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి ముప్పది సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలో తన మాతృభూమి అయిన బాగ్ధాద్ ని తలుస్తూ ఎన్నో కవితలు రాస్తూ, ఆశగా ఎదురుచూసాడు.
 
తనుపుట్టిన తేది ఎవరికీ తెలియకపోయినా, స్టేట్ రెజిస్టర్స్ లో మాత్రం 1951 లో పుట్టాడు అని రాయబడి ఉన్నది. అత్యంత బీద కుటుంబంలో పుట్టిన హందాని స్కూల్ కి వెళ్ళవలసిన వయసులో తన తండ్రితో  కలసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెరిగాడు. తన పదహేడవ ఏట సైన్యంలో చేరి నాలుగు సంవత్సరాలు కఠిన శిక్ష  పొందిన హందాని, ఆ కాలంలో కమ్యునిస్టు స్వభావాలున్న కొంతమంది యువకులతో స్నేహం చేయటం ద్వారా, అప్పటి బాత్ జాతీయ పార్టీ కి ఎదురు తిరగగలిగాడు. అందుకుగాను హందాని ని ఖైదు చేసిన ప్రభుత్వం రెందు సంవత్సరాలకు పైగా ఆయన్ను చెరసాలల్లో బంధించింది. ఈ సమయంలో హందానీ పునర్జన్మ పొందాడు అనే చెప్పాలి. తనతోటి ఖైదీలు ఎక్కువగా రాజకీయ మేధావులు కావటం హందానికి కలిసొచ్చింది. ఇక్కడ హందాని రాయటం, చదవటం, చెస్ ఆడటం, రాజకీయంగా ఆలోచించటం నేర్చుకున్నాడు.
విడుదలైన హందానిపై పాలకుల నుండి బెదిరింపులు, దాడులు కొనసాగాయి. చేసేదిలేక ఊరికి బయట, వేశ్యలూ దొంగలు నివసించే ఓ వాడలో హందానీ తలదాచుకున్నాడు. ఈ సమయంలో బాగ్ధాద్ కఫె లకి వచ్చే ఎందరో కవులతో మేధావులతో హందానికి స్నేహం ఏర్పడింది.  ఒక సారి జరిగిన దాడిలో ప్రాణాపాయ స్థితిని తప్పించుకున్నాడు. దానితో మేధావులూ, కవులు అందరూ డబ్బులు వేసుకొని హందానిని ఒప్పించి, ఫ్రాన్స్ కి పంపించేసారు.
 ఫ్రాన్స్ లో ఒక మార్క్సిస్టు స్నేహితుడి సాయంతో థియేటర్ లో చేరిన హందాని ఆ తరువాత ఎన్నో సినిమాల్లో, సీరియల్లలో, నాటకాలలో నటుడిగా జీవితం కొనసాగించాడు.   వామపక్ష భావజాలం గల హందాని పై దాడులు అక్కడితో ఆగిపోలేదు. 2003, అమెరికా – ఇరాక్ యుద్దం జరుగుతున్న సమయంలో వీధిలో ఓ సభ కు హాజరయిన హందాని పై కొంతమంది యువకులు దాడి చేసారు. ఈ దారి తర్వాత హందాని మరొక్క సారి చావు నుండి బయటపడ్డాడు. 20 కి పైబడి కవిత్వ పుస్తకాలు, ఎన్నొ కథలూ రాసిన హందాని, ఇప్పటికీ ఫ్రాన్స్ నగరంలో జీవిస్తున్నాడు.

విన్యాసం  

 

నువ్వొక చెట్టు నుండో
అకస్మిక వాన నుండో
పేరుకుపోయిన మంచు నుండో
రాలేదు.
నువ్వొక రాత్రి లోంచో
బండరాయి లోంచో
ఇసుక లోంచో
పుట్టలేదు.
నువ్వు నా అజాగ్రత్త వల్లనో
చీలిన భూమి వల్లనో
బయటపడలేదు.
నువ్వు పిచుక నుండో
తాటి చెట్టు మొండంలోంచో
రాలేదు.
దిగంతాలనుండి వస్తున్న ఈ ప్రతిధ్వని నుండి
కాగితం పై కదలకుండా నిలుచున్నా గాలి నుండి
నా తలపై ఉన్న దారితప్పిన మేఘం నుండి
నువ్వు పుట్టావు.
పరాయి లోకాల ఇతిహాసానివైన నువ్వు
ఇసుక గడియారం నుండి
వర్షపు రంగు నుండి పుట్టావు.
ఇవన్నీ నావీ, నీవీ
ముత్తాతలవీ, ప్రాచీనులవీ
కావు
ఈ భూప్రపంచానికి సంబంధించినవి.
~~~~~~~~~~

ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై రోజులు

 

మునిగిపోతున్న వానికి చేయినిచ్చి రక్షించినట్టు,
ఒకొక్కటిగా ఋతువులు విడుదలవుతున్నట్టు,
ఇక్కడి పేర్లను నేను చెప్తాను.
నీకు నేను చెప్పేవుంటాను
ఒకటి ప్రారంభమవుతుందంటే
మరొకటి అంతమవుతున్నట్టు అని.
యవ్వనపు గంధాలను మోస్తూ
ఓ దుమ్ము పట్టిన గాలి అటువైపుగా వీచినప్పుడు,
నా అనిశ్చితిలోని నేను, ఆ ఉత్సవంతో
యాంత్రికంగా ఆ రోజులోకి కొట్టుకుపోతాను.
నీకు దగ్గరిగా నేను వచ్చి
వెలివేయబడిన వాళ్ళు  రాయలేని పద్యాలను
నీకు ఇవ్వాలని అనుకుంటాను.
బాగ్ధాద్ లో వేకువ నాలో కల్లోలాన్ని
సృష్టిస్తుంది.
తల్లీ,
పగలు రాకను ఎవరూ గుర్తించనవసరం లేదు
కొంచం నిశ్శబ్దం  ఉంటే చాలు.
వలస వెళ్ళిన  కొడుకు కుడా
తన జనని కొమ్మ పై కూర్చోటానికి
ఎవరి అనుమతీ అక్కరలేదు.
కాని ఇంక నేను సెలవు తీసుకోవాలి
పలాయనమైన వాడు ఆశ్రయం కోసం
వచ్చినట్టు వచ్చాను అంతే.
ఓ చిరునవ్వు కోసం
ఓ బ్రెడ్డు ముక్క కోసం
మంచం పై ఓ మూల కోసం
ఇంకిపోతున్న కనుచీకటి కోసం.
~~~~~

ప్రశంస

 

బాగ్ధాద్ నగరం కోసం-
ఓ బాగ్ధాద్ నగరమా! నేను నీ శరణుకై వచ్చాను- నీ సహనాన్ని పోగుచేసుకో, కన్నీళ్ళని కూడబెట్టుకో, నీ భయాన్ని పక్కన పెట్టి, బాధని పెకిలించి, నీ నవ్వుల్ని నా కొసం కొంచం దాచి ఉంచుకో. ఇదిగో, నీకు తెలుసు కద, ఇలా చిన్న పిల్లానిలా కలలు కనటంలో నేను ఘనుడను. అంతెరుగకుండా ఈ ప్రవాస జీవితం నా ఒకొక్క అడుగునూ తరుముతోంది. ఇంకెప్పుడు నేను నీకు సంపూర్ణ స్వేచ్ఛని అందించగలను?
కొన్ని కొన్ని సార్లు నువ్వు నీ సమాధిలో కూర్చొని ఉంటావ్. నోటినిండా మట్టితో, ఒంటరిగా. అప్పుడు నాకు అగుపించే నోస్టాల్జియా లో నువ్వు స్వర్గం గానూ భువి గాను కనిపిస్తావ్. ఏకాంతంగా నీ విధికి ఎదురుగా కూర్చొని నువ్వు, అంధకారంతో నీ తల నువ్వే గోక్కుంటుంటే, నేను మాత్రం నీ కోసం వెన్నెలను సైతం తిరస్కరించి ఉంటాను.
ఆయినా, నీ శరీరం పైకి చీమలను ఒదిలిన వాళ్ళ దృష్టిలో, నేను నీ పక్క నిల్చున్న ప్రశ్నార్థకమే కదా?
ఓ బాగ్ధాద్ నగరమా! ఆ గతించిన రోజులలో నువ్వు నా గృహానికి తరచూ వస్తుండేదానివి. నేనూ నీ పతనమైన ఇళ్ళనూ, ప్రేగులు లేని కార్లనూ, పగిలిన మొహాలనూ, చూడటానికి నీ వీధుల్లో తిరగాడే వాడని.
కాని యుద్దం జరుగుతున్న సమయంలో నీ మాంసాన్ని ఎప్పుడైతే నేను వీడినానో, అప్పుడే నిన్ను నేను కోల్పోయాను.
అలా గడిచిన రోజులన్నీ ఇప్పుడు, దిగంతాల వైపు చూసిన చూపు మాయమైనట్టు కనుమరుగవుతాయి. ఇలాంటి ఉత్సవమైన దుస్సహమైన స్థితిలో  నువ్వు గోడలకు ప్రశ్నలు వేస్తావు.
నా నుండి ఏ సందేశం నీకు లేక పోయినా, తల్లి లా భూమీ ఆకాశాల నడుమ నన్ను నువ్వు ఊయల ఊపిన రోజులను గుర్తుతెచ్చుకుంతావు. ఆ రోజుల్లో మనం ఎంతో ఆనందంగా నవ్వే వాళ్ళం.
కిటికీ దగ్గర నేను నిల్చున్నాను, ఈ సాయంత్రం సముద్ర వాసన కలిగి ఉంది. ఇప్పుడు అనిపిస్తోంది, అప్పట్లో మనం కలిసి కలగన్న దారి నుండి చాలా దూరం వచ్చేశాను. ఇప్పటికీ ఇరాక్ అక్కడే ఉంది.
సంధ్యా సమయం లేని ఆ దేశం, శ్రేయస్సు నెరుగని ఆ దేశం, ప్రేమికులకు వీధులు లేని ఆ దేశం. ఆ దేశం లో మనుషుల్నీ, పువ్వులని, నదులనీ, వెన్నెలనీ చావు వెంటాడుతుంది.
ఇరాక్ దేశమా, ఇప్పటికైనా విను, ఈ మాటలను నా గొంతుకనుండి విడిపించుకొని మట్లాడవలసి వస్తోంది. టైగ్రిస్ ఇంకా యూఫ్రటిస్ నదులు ఒకవేల నాతోపాటు ఓ రాత్రి గడపటానికి వచ్చినట్టు అయితే- నేను వాటికి నా శూన్యాన్ని మాత్రమే     ఇవ్వగలను.~~~
నిజం
ఎవరికీ తెలియదు
జ్ఞాపకం మరచిపోవటానికి
వెళ్ళాల్సిన  దారి.
(Transations into English: Sonia Alland)
-రోహిత్
rohit

కవిత్వమే ఫిలాసఫీ..

           ఒక కవితలో కవిత్వం గురించి చెప్పినపుడు సాహిత్య విమర్శనా భాషలో అక్కడ కవిత్వం అంటే – ప్రజలు వారు అనుభవించే అయోమయం నుండి ఒక అర్ధాన్ని ఏ విధంగా నిర్మించుకొంటున్నారనీ; ప్రజలు తాము ప్రేమించే వాటిని ఎలా ఎంచుకొంటున్నారనీ; జీవితంలో లాభనష్టాలని ఏ విధంగా సమన్వయపరచుకొంటున్నారనీ; అనుభవాల్ని కోర్కెలతో కలలతో ఎలా మార్చు కొంటున్నారనీ; చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఏవిధంగా దర్శించి ఎలా ఒక చోటికి కూడదీసుకొంటున్నారనీ  అర్ధం చెప్పుకోవాలి. …Helen Vendler

           ప్రతికవికీ కవిత్వం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి.  వాటిని తన కవిత్వంలో ఎక్కడో ఒకచోట  బయటపెట్టు కొంటాడు.  మరోలా చెప్పాలంటే తన కవిత్వ మానిఫెస్టోని ఏదో కవితలో ప్రతీ కవి ప్రకటించుకొంటాడు. అలాంటి కవిత ద్వారా ఆ కవి కవిత్వసారాన్ని అంచనా వేయవచ్చు.  శ్రీశ్రీ  “కవితా ఓ కవితా”,  తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, నెరుడా “కవిత్వం నన్ను వెతుక్కొంటూవచ్చింది” లాంటి కవితలు కొన్ని ఉదాహరణలు.  ఇవి ఆయా కవుల సొంత అభిప్రాయాలుగా కొట్టిపడేయలేం.  Helen Vendler  అన్నట్లు ఇవి ఆ కవిత వ్రాసినప్పటి ప్రజల అభిప్రాయాలకు విష్పష్ట రూపాలు.  తన దృష్టిలో ఉన్న సమూహానికి కవి ఒక ఉమ్మడి గొంతుక నిచ్చి ఆయా కవితలుగా వినిపిస్తున్నాడని బావించాలి.    

1780617_1429511017288248_4344470_n

           రెండున్నర దశాబ్దాలుగా కవిత్వరచన చేస్తూ ఒక స్వంతగొంతును, పరిపక్వ శైలిని ఏర్పరచుకొన్న  రాధేయకు మంచి కవిగా పేరుంది.  జీవన వాస్తవాలను, సామాజిక వాస్తవాలను తన కవితలలో ప్రతిబింబింస్తూ అనేక రచనలు రాధేయ చేసారు. వాటిలో  కవిత్వాన్ని వస్తువుగా చేసుకొన్న కవితలు కూడా ఉన్నాయి.  కవిత్వం గురించి మాట్లాడటం, స్వప్నించటం, కవిత్వం తనకేమిటో చెప్పటం కూడా ఒక సామాజిక వాస్తవాన్ని చిత్రించటమే.

“కవిత్వం నా ఫిలాసఫర్” అనే కవిత రాధేయ “అవిశ్రాంతం” అనే సంకలనం లోనిది. ఈ కవితలో కవి తన జీవితంతో కవిత్వం ఎంతెలా పెనవేసుకుందీ వర్ణిస్తాడు.

ఇందులో ఒకచోట  ప్రేమించటం రానివాడు ప్రేమికుడు కానట్లే దుఃఖించటం రానివాడు కవెలా అవుతాడూ అని ప్రశ్నిస్తాడు.  కవిత్వాన్ని దుఃఖానికి పర్యాయపదం చేస్తాడు కవి. ఇక్కడ దుఃఖం అంటే సొంత గొడవ కాదు,  “ప్రపంచపు బాధ”. ఈ కవికి దుఃఖపు సందర్భాల్ని కవిత్వ సమయాలుగా మార్చుకోవటం తెలుసు. కవిత్వం అంటే మనిషి ఇంకా జీవించే ఉన్నాడని చెప్పే ఒక సాక్ష్యం అని తెలుసు.  అందుకే, ఈ లోకపు దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకోకుండా, ఎవరినీ పట్టించుకోక స్వార్ధంతో మెలిగే వాడిని చనిపోయినవాడిగా పరిగణిస్తున్నాడు కవి.

 

అక్షరసైన్యం నా వెంట నడిస్తే చాలు/సర్వం కోల్పోయినా లెక్కచేయను/ కవిత్వమై మిగిలిపోతాను అనటం చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఒకచోటకు కవిత్వం రూపంలో కూడదీసుకోవటమే.

స్పష్టమైన అభివ్యక్తి, సూటైన ప్రతీకలు, ఈ కవితకు సాఫీగా సాగే గమనాన్ని, పట్టుని ఇచ్చాయి.  కవిత్వాన్ని జ్వరంగా, కలగా, దుఃఖంగా, జ్ఞాపకంగా, ఎదురుదాడిగా, ఫిలాసఫర్ గా, గైడ్ గా  స్పృశించిన విధానం రాధేయను గొప్ప కవిగా నిరూపిస్తాయి. ఈ కవిత చదివినపుడు లోతైన  భావోద్వేగం, హృదయాన్ని కదిలిస్తుంది.

 -బొల్లోజు బాబా

baba

 

 కవిత్వం నా ఫిలాసఫర్  — రాధేయ

 

కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం

కవిత్వం నా కన్రెప్పల మీద వాలిన నమ్మకమైన కల

ఒక్క కవితా వాక్యం

ఈ గుండె లోతుల్లోంచీ

పెల్లుబికి రావాలంటే

ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో

వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్నే అడుగు

అక్షరసైన్యం నా వెంట నడిస్తేచాలు

నా సర్వస్వం కోల్పోయినా

లెక్కచెయ్యను

కవిత్వమై మిగిలిపోతాను

ఈ గుండె చప్పుడు ఆగిపోయి

ఈ తెప్ప ఏ రేవులోకి చేరవేసినా

అక్కడ పచ్చని మొక్కై

మళ్ళీ ప్రాణం పోసుకుంటాను

భాష్పీకృత జీవద్భాష కవిత్వం

నరాలపై తంత్రీ ప్రకంపనం కవిత్వం

సారవంతమైన స్మృతిలో

పారదర్శకమైన జ్ఞాపకం కవిత్వం

ఏకాంత దుఃఖమా!

నీ పేరు కవిత్వమే కదూ!

నువ్వు పొగిలిపొగిలి ఏడుస్తున్నావంటే

కవిత్వమై రగిలిపోతున్నట్లే లెక్క

దుఃఖించనివాడూ

దుఃఖమంటే ఎరుగనివాడూ

కవి ఎలా అవుతాడు?

ప్రేమించని వాడూ

ప్రేమంటే తెలియనివాడూ

ప్రేమికుడెలా అవుతాడు

ఎవర్నీ పట్టించుకోనివాడూ

బతికున్నా మరణించినట్లే లెక్క

కన్నీళ్ళు బహిష్కరించేవాడికి

బతుకుపుస్తకం నిండా

అన్నీ అచ్చుతప్పులే!

జీవించే హక్కును

కాలరాచే చట్టాలతో

జానెడు పొట్టకోసం

పిడికెడు దుఃఖంగా

మిగిలేవాడు మనిషి

ఈ మనిషి బలహీనతలమీద

వ్యామోహాలమీద

ఎదురుదాడి చెయ్యగలవాడే కవి!

రోజు రోజుకూ దట్టమౌతున్న

ఈ మానవారణ్యంలో

చిక్కనవుతున్న వ్యాపారకాంక్షల్లో

ఓ మృధువైన మాటకోసం

ఓ ఆర్ధ్రమైన లాలనకోసం

ఓ వెచ్చటి ఓదార్పుకోసం

కాలం మైలు రాయిమీద

తలవాల్చి ఎదురుచూస్తున్నా

కవిత్వం నా ఫిలాసఫర్

కవిత్వం నా గైడ్!!

-రాధేయ

అతడొక అరణ్యం…అతడొక యుద్ధం!

బాల సుధాకర్

బాల సుధాకర్

(కవి బాల సుధాకర్ మౌళికి కొలకలూరి ప్రత్యేక పురస్కారం లభించిన సందర్భంగా)

1

క౦టికి కనపడిన ప్రతి తడి దృశ్య౦లో చెలమ త్రవ్వి  విస్మృతానుభావాలను దోసిళ్ళతో తోడుకోని, వార బోస్తూ , గు౦డెల్లో ఒక అలికిడిని సృష్టిస్తూ, అలజడి లేపుతూ ఉ౦డే  కవిత్వాన్ని రాయాల‌నే మనస్తత్వం  బాల సుధాకర్ మౌళిది.  కొన్ని కవితలు చదువుతు౦టే, కళ్ళెదుటే మానవత్వ‍౦  నడిబజారున చప్పున జారిపడుతు౦దేమో అనిపిస్తు౦ది. ఆశావాది. అతనె౦తటి ఆశావాదో  ఆ కవితా స౦కలన౦   పేరులోనే  కనిపిస్తు౦ది..విప్లవనేపధ్య౦. ప్రా౦తీయ వెనుకబాటుతన౦ సుధాకర్   కవిత్వాన్ని పిడికిలి బిగి౦చమని అదేశి౦చాయనిపిస్తు౦ది.  అలా పిడికిలి బిగి౦చేలా చేసేటి  నైపుణ్య౦ సుధాకర్ లో ఉన్న విషయ౦ ఆ ప్రా౦త వెనుకబాటుతన౦ గుర్తి౦చి౦ది.   సుధాకర్ కవిత్వాని చదివితే  కళి౦గా౦ద్ర నేపధ్యాన్ని దాదాపు చదివినట్లే.  కవిత్వ౦ ని౦డా సహజత్వ౦ ఉ౦డాలని ప్రాకులాడి అతుకుల బొ౦తను కుట్టుకొనే మనస్తత్వం కాదు సుధాకర్ ది.  రాసుకొ౦టూ పోతాడు. సహజత్వ౦ దాన౦తట అదే వచ్చి వాలుతు౦ది.

గు౦డెల్లో  ఆర్ధ్రత పుట్టిన తర్వాత  అతనికి ఈ వ్యధా భరిత దృశ్యాలు కనిపి౦చాయో? లేక వాటిని చూసిన తర్వాత అతనికి ఆర్ద్రత కలిగి౦దో  తెలుసుకోవాల౦టే.. ఆయన కవిత్వాన్ని అతి సూక్ష్మ౦గా పోస్ట్ మార్ట౦ చేసుకొ౦టూ  పోవాల్సి౦దే. లోపలి లోపలి పొరల్లో ఎక్కడో చివరి కణ౦లో ఆయన కవితా జాడల్లోని మర్మాన్ని కనుగొనవచ్చునేమో!  భావ౦, అనుభవాల  మధ్య కవి సమన్వయ౦ కుదుర్చుకోవాలనీ, అ౦దుకు తగిన శ్రమ చేయాల్సి ఉ౦టు౦దని విశ్లేషకుల అభిప్రాయ౦.  అనుభవ  స౦గ్రహాన్ని భావ౦తో సరిచేయక పోయినా కవిత్వ౦  విఫలమైనట్లే.. అలాగే కవి వాడే పదాలు తన భావాన్ని మోయలేకపోయినా విఫలమైనట్లే.  దీనిపై ప్రత్యేక శ్రద్ద వహి౦చినట్లు అనిపి౦చక పోయినా,  సుధాకర్ కవిత్వ౦లో అవి సహజ౦గా ఏర్పడి అ౦దాన్నిచ్చాయి.

కవిత్వ౦లో  అభివ్యక్తి ప్రాధాన్యము 80 తర్వాత వచ్చిన కవిత్వ౦లో అధిక౦గా విస్తరిస్తూ వచ్చి౦ది. సుధాకర్ దాన్ని అతి సునాయస౦గా అ౦దిపుచ్చుకొన్నాడు.. చటక్కున పాటకుడి హృదయాన్ని దున్ని, అక్కడ నీళ్ళు జిలకరి౦చి, ఏవో క్రొత్త చైతన్య భీజాలు నాటి అక్కడికక్కడే మొలకలు సృష్టి౦చే ప్రయత్న౦ బాలసుధాకర్ ది. కొన్ని కవితలు మి౦గుడు పడవు. కొన్ని శ్వాసకు అడ్డుతగులుతాయి.. కొన్ని  మెలిపెడతాయి. కొన్ని మనల్ని ఖ౦డఖ౦డాలుగా నరికేస్తాయి.  నిస్సత్తువను, పిరికి తనాన్ని, చేతకాని తనాన్ని , అప్రయోజనాలను   పాటకుడి హృదయాన్ని  గునపాలతో గుచ్చి చూపెడతాడు.  ఎప్పటి ను౦డో  నాకో స౦దేహము౦డేది.  కొ౦దరు మనుషులకు పుట్టుకతోనే మార్క్సిజపు ఆలోచనలు వొ౦టపడతాయా? లేక  మార్క్సిజపు సిద్దా౦తాలు చదివి వొ౦టపట్టి౦చుకొ౦టారా?  అని..  !  ఈ స౦కలన౦ లోని  కొన్ని కవితలను చదివి  … మార్కిజపు ఆలోచన ధోరణి అతనికి పుట్టుక తోనే వొ౦టపట్టాయని పిస్తు‍౦ది. మార్క్సిజ౦ అ౦టే  హెయిట్  ఆఫ్ హ్యూమనిజ౦ అ౦తే కానీ,  ఇప్పుడూ రాజకీయ పార్టీల ధోరణి కాదని కూడా చెప్పాలనిపీ౦చి౦ది.

“కవి కె. శివారెడ్డి ” గారన్నట్లు  అతడు వెలుగుతున్న దీప౦లో వేలు ము౦చి రాయట౦ మొదలుపెట్టాడు. నిజమే! సుధాకర్ అడవ౦తా విస్తరి౦చాడు. అ౦దరికీ అడవిలో అ౦దాలు కనిపిస్తే , ఆయనకు కనిపి౦చే దృశ్య౦ వేరు. అక్కడ ఓ చెకుముకి రాయిని సృష్టిస్తాడు. అగ్గి రాజేస్తాడు. అగ్గి లో వేలును అద్ది రాయడ౦ మొదలెడుతాడు.

ప్రముఖ ఆ౦గ్ల కవి మాథ్యూస్ ఆర్నాల్డ్  చెప్పినట్లు- because thou must not dream  thou need not despair!  కలలు కనలేనివాడు నిరాశ చె౦దాల్సిన పనిలేదు.  నిజమే!  సుధాకర్ కేవల౦ కలలు కనడమే కాదు. ఆ కలల కుచ్చులను పట్టుకొని, మెలుకువలోనికి వచ్చి వాటికి కవిత్వాన్ని దిద్ది అక్షర రూప౦ ఇవ్వాలనే బలమైన కోరిక ఉన్నవాడు. దాన్ని తన కవిత్వ౦తో సఫల౦ చేసినవాడు. కళ్ళకు కనిపి౦చిన ప్రతి దృశ్య౦లో  ఏదోవెతుకుతాడు.. ఎదురైన ప్రతి మనిషిలోని చీకటి జాడలను తవ్వుతాడు. చీకట్లో మిణుగురు పురుగవ్వాలనుకొ0టాడు. వాటికి౦త కవిత్వాన్ని పులుముతాడు. వాటి చేతులను పిడికిలిగా మార్చే ప్రయత్న౦ చేయకపోయినా…నా కవిత్వ౦ లోని అర్థ౦ అదే!  అని గట్టిగా నమ్ముతాడు…  మిణుగురు పురుగుల మెరుపును  చేతుల్లొకి తీసుకొని…మానవీయ చీకటి గుహల్లో అద్దుతాడు.  మెరుపు అ౦చులను పట్టుకొని  జగత౦తా వెలుగు ని౦పాలనుకొ౦టాడు…!అ౦దరూ చూసేది వేరు. ఇతడి చూపులు వేరు. అతడే సుధాకర్ మౌళి.

A poem begins as lump in throat, a sense of wrong, a home sickness, a lovesickness   అన్న రాబర్ట్ ఫ్రాస్ట్ మాటలు  సుధాకర్ కవితల్లొ గుర్తుకు రాక పోదు.

“ఎవర౦డీ ఆ చీకట్లో / లోక౦ నిద్దురోయిన వాకిట్లో /వెలుతురు కన్ను తె౦చుకొని/ నగరాన్ని పరిక్షగా చూస్తున్నది

కాలాన్ని ప్రశ్నిస్తున్నది/ ఆ నల్లని రూప౦ ఎవరిద౦డి?”

“తీహార్ మరకల్లో”  అనే కవితలో-

” జైలు సమాధుల దేహాలపై పాలకుల ముద్ర/  శవ౦ కాదు కదా…/ శవాన్ని తాకిన గాలైనా

బయటకు వెళ్ళడానికి వీలులేదు/  హై అలర్ట్….!!!”

 కోటిపా౦…… నా కోటిపా౦ /నా రేపటి ఆశల /విశ్వగీత మాలపి౦చే  నా పల్లే పతకమా…నా అరుణారుణ స్వప్నమా!

నేనుపుట్టక ము౦దే  గాయపడి/ ఇ౦కా నెత్తురోడుతున్న / వో ప్రా౦త౦ గురి౦చి / నేనే౦ మాట్లడను…?

తెల్లారి నిద్ర లేస్తాను / గాయపడ్డ పావుర౦ లా౦టిదే ‘న్యూస్ పేపర్’/  గుమ్మ౦లో వాలి/  నెత్తురు కారుతూ

అలా పడి వు౦టు౦ది/ న్యూస్ పేపర్ని వేసిన చెయ్యి  గాయపడ్డదే!!

సమాజ౦లో అతి చిన్న ప్రాణాలను కూడా  తన కవిత్వ౦లో చుట్టేసి విసిరేస్తు౦టాడు. ఇక్కడ పేపర్ బాయ్ ని కూడా సమాజ౦లో గాయపడిన క్యారెక్టర్ గానే చిత్రి౦చాడు. “అ౦తా తెలిసి కూడా…..:”  అన్న  ఈ  కవిత వాస్తవ౦గా పాలాస్తీనా యుద్దవీరుల అమరత్వ౦పైనా, అగ్రదేశాల దాష్టికాన్ని ఎ౦డగట్టే ప్రయత్న౦. ఆ కవితలో కూడా  పేపర్ బాయ్ ని కూడా జొప్పి౦చడ౦. వాహ్!  ఎక్కడ దగాపడినా… వ్యధ నిలిచినా… అక్కడ సుధాకర్ క౦టే ము౦దు అతని కవిత్వ జాలు పారుతో౦ది.

“నా దేశ౦లో ఉదయ౦ ”   అన్న కవితలో-

అడవి బయట ఉదయ౦…..అది ఎలా ఉ౦టు౦దని చెప్తూ… / నా దేశ ప్రజానీక౦ పై /బలవ౦త౦గా అమలు పరస్తున్న/ నాలుగు చేతుల రహస్య పత్రాల మార్పిడిలో/ నలిగి పోతున్న / సామాన్యుని గు౦డె దు:ఖ౦ /దు:ఖపు ఆశ్రుకణాలపై మొలచిన జీవన ఆరాట౦, అడవి లోపల ఉదయ౦…….  ఎలా ఉ౦టు౦దో అని చెప్తూ…

పచ్చని స౦స్కృతి  చిత్రపటాన్ని/  ధ్వ౦స౦ చేస్తున్న/ రాజ్య౦ రాకసి వ్యూహ౦ /ఆకుపచ్చని వేటకి ఎదురు నిలిచిన /అడవి బిడ్డల అరుణ కేతన౦ చెట్టు పుట్టా పిట్టా సమస్త౦ /అడవి అస్తిత్వ౦ కోస౦ ఆయిధాలు ధరి౦చిన అద్బుత దృశ్యకావ్య౦….!!

ఒక కమిటెడ్ పొయట్ అనిపి౦చట్లేదూ?  అతని దృక్పధమే వేరనిపిస్తు౦ది..!!

తల వ౦చని ధీమాతో  కలానికి పదునుపెడుతూ…కదలిపోతూ … కనపడిన ప్రతి వ్యధలో.. ప్రతి స౦క్లిష్టత లో… అక్షరాలను విసిరేస్తూ.. …పీడితుల పక్షాన వహి0చి ,  ఒక కల్లోల సాగర తీర౦ ము౦దు నిలుచొని…కవిత్వ౦  అల్లుతున్నాడు.  అట్టడుగు పొరల్లో   ఎక్కడో దాగున్న చైతన్యాన్ని బయటకు తెప్పి౦చే౦దుకు ఎడతెరిపి లేని ప్రయత్న౦ తనవ౦తుగా కవితల్లో చూపి౦చాడు.

కవితల్లో చాలా సార్లు.. “నాదేశ ప్రజానీక౦”.. “నాదేశ౦” అని పదే పదే  పలకట౦ ఆశ్చర్యపరుస్తు౦ది.  ఒక కమిట్మె౦ట్ కనపడి౦ది.

 పగిలిన నెత్తుటి కడవ   …. అనే కవితలో

“నాదేశ౦లో  ఏ గిరిజన గుమ్మాన్నడిగినా

చెబుతు౦ది

వర్తమాన చరిత్ర ఎ౦త రక్త సిక్తవర్ణమో!!!

అని ముగిస్తాడు.  ఈ ట్వె౦టియత్ సె౦చురి  మానవహక్కుల స౦ఘాలు ఎస్టాబ్లిష్ ఔతూ ఉన్న పరిస్థితుల్లో   ఆ గిరిజన ప్రా౦తాల్లో ఎలా౦టి మార్పు కనపడ‌లేదనీ,  ప్రభుత్వ  డొల్లతనాన్ని ఎ౦డగట్టే ఆయన ప్రయత్న౦ … అద్భుత౦…..!!

“స్తబ్ధత”…..  కవితలో-

శిలా సదృశ్యమైన నేల మీద

యుద్దాన్నెలా రచిస్తావు అని చెపుతూనే చివరగా…

“నిశ్శబ్ద౦ కొ౦డ కూలుతు౦ది

జన౦ నది కదులుతు౦ది”   …. ఈ రె౦డు వ్యాఖ్యలతో  కవితను పూర్తిచేస్తాడు..

ఈ కవితకు ఎత్తుగడ “నది నదిలా లేదు/పడవ పడవలా లేదు/ప్రయాణ౦ ప్రయాణ౦లా లేదు”  అ౦టూ ప్రార౦భిస్తాడు..

తన‌ విప్లవధోరణి..ఆ చైతన్యస్రవ౦తి  పొల్లుపోనీకు౦డా  కవితల్లో పరచడ౦ చాలా ఆశ్చర్య౦…… రాధేయ గారన్నట్లు.. కవి వేరు కవితవేరు కాదు… తన లో పాదుకొన్న ఆ  చైతన్య స్రవ౦తి తన‌ కవితల్లో  మన౦ ఆసా౦త౦ గమనిస్తా౦.. వాటిలో  సుధాకర్ మార్క్ ఖచ్చిత౦గా కనిపిస్తు౦ది.

ఈ కవితా స౦కలన౦లో రైల్లో …1,2,3, రైలు దేశ౦   అని నాలుగు కవితలు  కనిపిస్తాయి.

బహుశా సుధాకర్ స్వయ౦గా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురైన దృశ్యాలే అనుకొ౦టాను. వాటిని  కవిత్వ౦లో  ము౦చి తడి దృశ్యాలను  రైలు  కిటికీ ఊచలకే ఆరవేశాడు. కదిలే రైలులో…కనిపి౦చే దృశ్యాలలో  ఆయన  ఏమేమో  చూశాడు.  ఈ రైల్లొ 2   అనే చిన్ని కవిత లో సుధాకర్ నిశిత పరిశీలన అద్భుత౦.  రైల్లో పాటలు పాడుతూ  బిక్షాటన చేసే అతి చిన్న ప్రాణి ని ఇతడు గమని౦చాడు.

“అతని వేళ్ళ చివర /  అతని గు౦డె ఉ౦ది / వేళ్ళ చిటికెన పుల్లలు / క౦జిర మీద నాఠ్యమాడుతున్న కొద్దీ/ గు౦డె/ వేల వేల పాదాల పాయలుగా మారి /  పాటై ప్రవహిస్తు౦ది/

అతను ‍ ….  ఆ పాటగాడు/ రైలు పెట్టెన౦తా/ వో వాద్యపరికర౦గా మార్చేశాడు //

ది వే ఆఫ్ ప్రజె౦టేషన్.. సో ఎక్సెప్రెసివ్ అ౦డ్ స్పెసిఫిక్ /

రైల్లో ..1  అనే కవిత లో…..  చాలా సూక్ష్మమైన దృశ్య౦..  మనకు ఎప్పుడూ కనిపి౦చే సహజ దృశ్య౦.. దాన్ని ఎ౦త మానవీయ౦గా రాశాడో.. ఏ దృశ్యాన్ని దేనికి అప్లికెబిల్ చేస్తాడో అమేజి౦గ్…!

ఒక పిల్లవాడు  రైలు కిటికి గు౦డా చూస్తూ  ఉ౦టాడు… వాళ్ళు చేరవలసిన గమ్య౦ రాగానే, అతన్ని తన త౦డ్రి చేయి పట్టుకొని పిలిచుకొని పోతాడు… (బహుశా ఆ పిల్లవాడిని  చిన్నప్పుడే అతని త౦డ్రి ఈ  కార్పొరేట్ విద్య మాయలో పడి హాస్టల్ లో వొదిలేసి.. సెలవుల్లో ఇ౦టికి పిల్చుకు పోతున్నట్లనిపిస్తు౦ది)  ఈ దృశ్యాన్ని కవితగా మలచిన విధాన౦  చూస్తే ఈయన దే౦ట్లోనైనా కవిత్వాన్ని వెతుకుతాడు..  తడి దృశ్యాలు మాత్రమే కనిపిస్తాయి ఇతనికి-

రైలు కిటికి  ను౦చి  బయటకు చూస్తున్న ఆ పిల్లాడి / చూపులో / దేన్ని చూస్తా౦ మన౦ //

నాకైతే / ఆ చూపులో ఆకాశ౦ కనిపిస్తు౦ది / ఆకాశ౦లో చుక్కలూ చ౦ద్రుడూ/ ఆ పిల్లడి సావాసగాళ్ళలా అనిపిస్తారు /  వెనక్కి వెనక్కి మరలిపోతున్న చెట్లన్నీ/ చెతులూపుతున్న/ చుట్టాల్లా కనిపిస్తారు / రైలు కితికీ ను౦చి బయటకు చూస్తున్న ఆ పిల్లాడి చూపులో/ ఓ కుటు౦బాన్ని, ఓ వీధిని, ఓ ఊరునూ /  చూస్తు౦టాను నేను /

చివరగా….ఆ పిల్లాడిని అతడి త౦డ్రి చేయి పట్టుకొని పిలుచుకొని పోయే దృశ్యాన్ని ఇలా రాస్తాడు….

“చిన్నప్పుడే చిటికెనె వేలు వొదిలేసి /  మళ్ళిప్పుడు బలవ౦త౦గా  చేతులు కట్టేసి తీసుకు పోతున్న/   వాళ్ళ నాన్నని ప్రశ్ని౦చలేని /  ఆ అమాయకపు చూపులు /  చుట్టూ వు౦డీ నిస్షాయులమైన మనల్ని /   క్షణక్షణ౦ నిలదీస్తూ…!! ”  అని ముగిస్తాడు.  ఏదో మ౦త్రజల౦ చల్లినట్లు అనిపిస్తు౦ది. ఒక ఆర్ద్రత చుట్టుముట్టేస్తు౦ది. కవి కనిపిస్తాడు. దృశ్యాలు మెదలుతాయి కళ్ళము౦దు.  సుధాకర్ ఒక్క ఉదుటున ఆ దృశ్య౦లోనికి వెళ్ళి  అక్కడ తన మార్కు కవిత్వాన్ని రుద్దుతాడు.  నిస్సత్తువుగా ఉన్న ఈ నిర్జీవ ప్రప౦చ౦ ని౦డా ప్రాణవాయువును ని౦పాలనుకొ౦టాడు. ఒక స౦జీవిని మొక్కను అక్కడ పె౦చి అమరత్వ౦ సాధి౦చలనుకొ౦టాడు.

ఈ కవితలో…

మనుషులు

యా౦త్రికతను ఆభరణ౦గా ధరి౦చి

మరీ బోలుగా, డొల్లగా

శూన్యత ఆవరి౦చిన గదుల్లా……..

అలా నిల్చు౦టారు

నిల్చున్నవాళ్ళు యధాలాప౦గా నడుస్తారు..

ఏ ప్రాణ స్ప౦దనలు లేకు౦డా

……

అలా స్థబ్దుగా

నిస్సత్తువుగా దొర్లిపోతు౦టారు..!  ”

మనిషి లోని డొల్లతన౦ భళ్ళున తెరుచుకొనేట్లు చేసి  అక్కడ వెలుగు రేఖలను ని౦పే పరిష్కారాన్ని చూపిస్తాడు.

ఈ కవిత చూడ౦డి…..

” నిరాధారుడైన  అతని ను౦చి నేనొక // మహిమాన్వితమైన  పుల్లని తీస్తాను // అప్పుడతను //

కవిత్వమౌతాడు // కథవౌతాడు // జీవన విధ్వ౦సపు శకలాల ను౦చి

లేచిన // వో యుద్ధమౌతాడు // అతనిలో ను౦చే // అతని // తల్లి, త౦డ్రీ, భార్యాపిల్లలు // కొత్తగా మొలకెత్తడ౦ మొదలు పెడతారు…

స౦కలన౦ ని౦డా  సుధాకర్  పరచుకొన్నాడు.. అతని విప్లవ  కా౦క్ష ను ప్రతి అక్షర౦లో  జొప్పి౦చాడు..  దృవాల అ౦చును నిల్చొని  ఏనాటికైనా  విశ్వ౦లో చైతన్యాన్ని ని౦పాలనే తాపత్రయ౦ ఉన్నవాడనిపి౦చట౦ లేదూ?

అతడొక అరణ్య౦

అతడొక యుద్ద౦

అతడి ఆలోచనల్లో  యుద్దకా౦క్ష

అతడి నరనరాల్లో కవిత్వ౦

అతని కళ్ళకు కవిత్వ౦ తప్ప ఇ౦కోటి కనిపి౦చదేమో అనిపిస్తు౦ది.. !

 -సి.వి.సురేష్

10386270_395333943952955_597755680242090455_n 

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్  –  కొప్పర్తి

నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”….. అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.

59740_566066773423516_1763463627_n

రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి.

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//…… అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.

 

ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి.

ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.

రక్తాన్నెక్కించగలరు కానీ

కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా…… అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.

 

 -బొల్లోజు బాబా

 

 

కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

 

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌

నిజమే కావచ్చు

బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

 

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు

రక్తం ఉబుకుతుంది

రక్తం ఉరలుతుంది

కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది

రక్తం కళ్లచూడాలంటే

రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌

ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

 

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో

అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు

నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది

ఒకే గొడుగు కిందకు తెచ్చింది

 

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది

ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది

అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం

నియంతను నరికినా అదే రక్తం

తెల్లవాణ్ణి నల్లవాణ్ణి

డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి

మంచివాణ్ణి చెడ్డవాణ్ణి

ఎవర్ని ఎవర్ని నరికినా

అదే రక్తం చిందుతున్నప్పుడు

మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ

మనిషితనానికి చిరునామా అవుతున్నదా

 

మంచి రక్తం చెడు రక్తం

అంటూ ఉంటాయి కానీ

మహామనిషి రక్తం

మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

 

అందుకే

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

 

లోలోపలి మనిషితనానికి

బాహ్యరూపం కన్నీళ్ళు

ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

 

తెలుసా

మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి

నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి

ఒకరు రాయి విసరనక్కరలేదు

మరొకరు కత్తి దూయనక్కరలేదు

గాయపరచేదైనా అనునయించేదైనా

చిన్నమాట చాలు

కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి

చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి

చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి

కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి

జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి

నిజానికి ఇవి కూడా అక్కరలేదు

ఒక్క ఊహ

వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

 

గుండె బరువెక్కి

ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి

కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

 

కళ్ళు వర్షించినపుడు

మనిషి నల్లమబ్బుల ఆకాశం

కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు

మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం

మనలోంచి మనం తవ్వుకునే

తెల్లటి మణులు కన్నీళ్ళు

 

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు

రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు

మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ

ఉండాలని ఎవరు చెప్పగలరు

రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది

కళ్ళు చిప్పిల్లాలంటే

రసాయనిక చర్య జరగాల్సిందే

 

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం

కణసముదాయాలుగా విడిపోయింది

పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది

కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా

స్వచ్ఛంగా ఉండిపోయాయి

 

యుద్ధ బీభత్స ప్రతీక – రక్తం

యుద్ధ విధ్వంస స్మృతి – కన్నీళ్లు

యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది

స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

 

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ

దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

 

రక్త హీనత ఉన్నట్టే

దుఃఖ లేమి కూడా ఉంటుంది

రక్తాన్ని ఎక్కించగలరు కానీ

కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా

 

—–కొప్పర్తి

“ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది”

images

కార్టూనిష్టు శంకర్ కుంచెలో శ్రీశ్రీ

 

“శ్రీశ్రీగురించి ఎందుకు రాయాలనుకుంటున్నావు?”

“అడిగారు కనక”.

“ఎందరో రాయమన్నవి నువ్వు రాయలేనన్నావు గతంలో. ఇప్పుడు?”.

“శ్రీశ్రీ కనక. దాదాపు ఎన్నడూ రాయలేదు కనక.”

“ఆయనగురించి అనేకమంది రాసారు. ఆయన కవిత్వం పట్టుకున్నవారు కవిత్వం గురించి రాసారు. వారిలో వ్యక్తిగతంగా దగ్గరైన వారు తమ సాన్నిహిత్యాన్నిచెప్పుకున్నారు, వ్యక్తిగా శ్రీశ్రీ గురించీ చెప్పారు. ఇంతమంది చెప్పాక నువ్వు కొత్తగా చెప్పటానికేముంది? ”

“రోజూ తిన్న అన్నమే తినుట ఏల? అందరూ పూజించు రామచంద్రమూర్తినే పూజించుట ఏల? అన్న ధోరణిలో విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం రాయటానికి కారణం చెప్పారు. 1910లో పుట్టి 1940ల నాటికి తన కవిత్వానికీ తనకీ ఆరాధకులను తయారు చేసుకున్నారు శ్రీశ్రీ. ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే దాదాపు నాలుగు తరాల యువకులను ఆయన కవిత్వం పట్టుకుంది. కమ్యూనిజం వైపు వారిని నెట్టింది. ఇంతమందిలో నేనొకడిని. నా అనుభూతులని కూడా చెప్పుకోటం కన్న ఏం చెపుతాను.”

“అంటే నీగురించి నువ్వు చెప్పుకుంటావన్నమాట. ”

“ఒక విధంగా అంతే. ఏ వ్యక్తిగత అనుభవంలోనన్నా, అనుభూతిలోనన్నా సామాజిక అంశ కొంత ఉంటుంది. దానిమీద నేను దృష్టిపెట్టి, చదువరుల దృష్టిపడేలా ప్రయత్నిస్తాను. పోతే- శ్రీశ్రీ నాకేమిటి అన్నదానికి జవాబివ్వటానికి ప్రయత్నిస్తాను.”

“ప్రయత్నించు”.

“ఒక పాఠకునికీ, కవికీ ఉండే సంబంధం అర్ధమయేలా చెప్పాలంటే ధార్మిక నమ్మకాలలో ముఖ్యమైన ఆత్మ అన్న భావనని నేను ఉపయోగిస్తున్నాను. ఆత్మపై నాకున్న విశ్వాస అవిశ్వాసాలను పక్కనుంచి, ఆ భావనను ఉపయోగించుకొంటేనే నాకు సరిగ్గా చెప్పానన్న తృప్తి కలుగుతుంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండి, దానికి చైతన్యం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వం అదే మాదిరి నా సమస్త స్పందనలనూ జీవంతో, చైతన్యంతో, కదలికతో నింపుతున్నదని అనుకుంటున్నాను. అందుకే శ్రీశ్రీ నాకు స్వాత్మ్యం.”

“నిన్ను నువ్వు తార్కికుడు అనుకుంటావు గదా?”

“నేను తార్కికుడినే. అయినా కేవలం కవిత్వంతో హృదయం తర్కాతీతమైన అనుభూతిని పొందగలదన్నది నాకు అనుభవమే. అంతకుమించి ఆ అనుభూతికి నేను ఇతర విలువలు ఆపాదించలేను, అర్ధాలు చెప్పను. అలాగే అటువంటి అనుభూతి ఒక మూఢత్వానికీ, పూర్తి దాసోహానికీ దారితీసి పాఠకుడిని క్రియాశీలుడిని చేయటం కూడా కాదనలేని వాస్తవం. అదీ నాకు అనుభవమే. శ్రీశ్రీ కవిత్వంతో క్రియాశీలులు అయిన ఎందరో చేసిన పనులతో తూచితే నేను చేసినది పూర్తిగా వీగిపోతుందనీ నాకు తెలుసు.”

“తార్కికుడు ఒక కవిత్వపు విలువను నిర్ణయించవలసి వస్తే కొన్ని ప్రమాణాలను ఏర్పరుచుకుంటాడు. ఆ ప్రమాణాలకు నిలిచేవీ, నిలవనివీ ఆ కవి కవిత్వ సృజనలోనుంచి గుర్తు పడతాడు. వేరు చేస్తాడు. తరతమాలను నిర్ణయిస్తాడు. ఒకే కాలానికి చెందిన, ఒకే భావజాలానికి చెందిన కవులను బేరీజు వేసేటపుడు అతడు తన ప్రమాణాలకే కట్టుబడతాడు. తనను ప్రభావితం చేసిన మహా కవుల, మహా రచయితల సాహితీ సృజన జాతికి అందించినదేమిటో చెప్పేటపుడు అందులో సమస్త మానవజాతికి కలిగించిన చిరు నష్టాన్నైనా ఉంటే చూడగలుగుతాడు, చూపగలుగుతాడు. ఎక్కిన ఎత్తులను గణించేటపుడు ఎక్కలేకపోయిన ఎత్తులనూ గుణించుతాడు. దిగిన లోతులకు దిగేటపుడు దిగలేకపోయిన లోతులకు కూడా తార్కికుడు దిగుతాడు. అవునా?”

“నిజమే. ఈ నా వ్యాసం పరిధి అంత సమగ్రమైనది కాదు. నేను అంత నిజాయితీగానూ, నిష్పక్షపాతంగానూ ఉండగలిగినా నాకున్న శక్తి చాలా పరిమితమైనది.”

2

“నేను 48లో పుట్టాను. మా కుటుంబంలో ఎవరికీ సాహిత్య వాసన లేదు. మా నాన్నగారు పుస్తకాలు చదివేవారు. 64 నాటికి చాలా పుస్తకాలు చదివాను. ప్రబంధాలు మొదలుకుని అదీ ఇదీ అని లేకుండా చదివాను. వాటిలో సాహిత్యం, చరిత్ర, జనవిజ్ఞానం నాకు ప్రధాన ఆసక్తులు. ఈ చదువులో ఏ సంవత్సరం. ఏ తేదీన శ్రీశ్రీ నాకు తటస్థపడ్డాడో, పడ్డపుడు నా తొలి స్పందనలేమిటో నేను చెప్పలేను. శ్రీమూర్తి అన్నమిత్రునితో నాకు స్పర్ధ ఉండేది. అతను కృష్ణశాస్త్రిని ఆరాధించేవాడు. నేను వేదులని ఆరాధించాను. దీపావళి అప్పట్లో నోటికి వచ్చేది. ..నాకు తలంపు లేదు లలనాజనతాకబరీ భరైక భూషాకలనన్.. అనటం వేదుల సమాజం చింతనగా, దేవులపల్లి మనసారగా ఏడ్వనీరు నన్ను అనటం సమాజ నిరాకరణగా అనిపించే అవకాశం ఉంది. 67 నాటికి చదువు పూర్తయింది. నిరుద్యోగం మొదలయింది. ప్రేమ అన్నది ఉందని, కనక ప్రేమించాలని చదువు చెప్తే, అదంతా కేవలం ఒక భావుక స్వభావం మాత్రమే, అలాంటిది ఉన్నా ఆకలి ముందు నిలవదని నా తర్కం చెప్పేది. ఈ ఘర్షణకీ, శ్రీశ్రీ ప్రభావానికీ సంబంధముందా అని ఇప్పుడు ఆలోచిస్తే లేదనే అనిపిస్తోంది. నాలోని ఈ ఘర్షణ నా జీవుడిని (మౌలిక స్వభావాన్ని) తెలియబరుస్తుంది. ఈ జీవునికి ఖచ్చితంగా అమరిన కవి శ్రీశ్రీ. లోకంలోని ఆకలిని ఒక వాస్తవంగా చూసాడు నా కవి. అదే సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి లోనై ఆ ఉద్వేగం అంతా తన పాఠకునిలో నింపగలిగాడు. నిజానికి ఆకలికీ, అనుభూతి తీవ్రతకీ చుక్కెదురు. నాదీ అదే పరిస్తితి. నాలో రెండూ ఉన్నాయి. అందుకే శ్రీశ్రీని నా స్వాత్మ్యం అనాలనిపిస్తోంది. మరికొంచెం ఆలోచిస్తే ఒక ప్రశ్న ఎదురవుతుంది”.

“ఏమిటది?”

“రాతిని కూడా గానం కరిగించగలదని అంటారు గాని అది సాధ్యమా? ఆ ఊహ కమ్మగా ఉంటుంది. అది గానం యొక్క గొప్పతనాన్ని అందంగా చెపుతుంది. కరగటానికి కరిగే లక్షణం కూడా అవసరం.”

“అది నీ ప్రత్యేక లక్షణమంటావు.”

“నాది అనుకోను. అది మానవజాతిలో సర్వే సర్వత్రా కనిపిస్తుంది.”

“శ్రీశ్రీతో నీకు విభేదం లేదంటావు”.

“అనను. ఇది విభేదం అనీ అనలేను. దీనికి చాలా వివరణ అవసరం. కవిత్వానికి ఛందస్సు, మాత్ర, లయ ఉంటాయి. కవులు ఓ లయను అనుసరిస్తున్నపుడు అది ఓ ఛందస్సును – అంటే కొన్ని గణ నియమాలనూ, కొన్ని వాక్య నియమాలనూ – అనుసరిస్తుంది. అలా ఆది కవులు స్వయంగా ఏర్పరుచుకున్న నియమాలను వర్గీకరణ చేసి, అవి తర్వాతి కవుల ఉపయోగం కోసం అందుబాటులోకి తేగా అది ఛందస్సు అనీ, అలాగే రాయాలని కవులు కానివారు పట్టుబట్టటం జరిగింది. ఇది భావప్రవాహాన్ని అడ్డుకుంటుందంటని శ్రీశ్రీ గొప్ప కవితావేశంలో కవితా ఓ కవితాలో అన్నారు. 68లోనే అని గుర్తు. పస్తులు, నిరుద్యోగాల మధ్య ఓ రాత్రి నేను వృత్త పద్యాలు రాయటం మొదలయింది. ఆ ఆవేశంలో రోజుల తరబడి పద్యాలు. కడుపు చేతబట్టుకుని ఇల్లు వదలి వెళ్లిపోయినపుడు నా దగ్గర ఉన్నది ఈ పద్యాలు, ప్రేమ-ఆకలి మధ్య సంఘర్షణ, శ్రీశ్రీ కవిత్వం.

ఈ బాటసారి పద్యంలో ఉన్నది నేనే అనిపించేది. కలకత్తా ఫుట్పాతులూ, బీహారు- ఒరిస్సా సరిహద్దులలోని గ్రామాలు తిరిగి జబ్బుపడి, చనిపోకుండా ఇంటికి రాగలిగాను. పోతన మీద ఒక మూడొంతుల కావ్యం, వామపక్ష భావాలతో కపోత సందేశం వృత్తాలలో రాసాను. పోతన కావ్యానికి ముందు మాటలుగా ఛందస్సును శృంఖలాలుగా భావించిన శ్రీశ్రీ అనుభవం గురించి చాలా ఆలోచన నడిచింది. ఛందస్సు వల్ల భావం ఉధృతి(force)ని కోల్పోతుందా పొందుతుందా అన్న చర్చ అనేక పుటలలో సాగింది. హృదయంలో భావాన్ని కవి అక్షరబద్ధం చేస్తాడు. ఈ భావంలో అవేశముంటే అది ఛందస్సు అనే పిచికారీ వల్ల మరింత ఉధృతితో పాఠకుడిని తాకుతుంది అన్నది ఆనాటి నా చర్చ ప్రధానాంశం. అక్షరంలో శబ్దం ఉంటుంది. అక్షరాల కూర్పులో శబ్ద విన్యాసం ఉంటుంది. అది భావావేశాన్ని మరింత గట్టిగా పఠితనూ, శ్రోతనూ కదిలిస్తుందన్నది మరో అంశం. ఇది మన పూర్వకవులు పలికి చూపించారు.  కవి శక్తిహీనుడైతే వచన పద్యాలలోనైనా కవిత్వం పలుకుతుందా? ఉధృతి వస్తుందా? అది మరో ఆలోచన.”

“నువ్వు రాసిన పద్యాలలో అలాంటి కవిత్వం, ఉధృతి ఉన్నాయంటావా? ”

” మారుమూల వృత్తాలు, గర్భకవిత్వం(పద్యంలో పద్యం) వంటి సర్కసు పద్యాలతో సహా అన్ని వృత్తాలూ, ఉదాహరణకి కవిరాజ విరాజితం, స్రగ్ధర, మహాస్రగ్ధర, మాలిని వంటి ఎన్నో, రాసాను. కోకిల రామాయణం పేరుతో మత్తకోకిల, తరళాలతో ఫోతన చెప్పినట్లు రామాయణం రాసాను. గోదావరి జిల్లా యాసలో సీసపద్యాలతో ముసురు అన్నపేరిట వ్యవసాయం గురించి కొన్ని రాసాను. ఇలా నేను రాసినవి పద్యాలేగాని కవిత్వమని ఎన్నడూ అనిపించలేదు. వచన పద్యాలు కూడా రాసాను. వాటిల్లో ఏదో కొంత తృప్తి ఉండేది.”

“శ్రీశ్రీ అభిప్రాయంతో ఏకీభవించానంటావు?”

“చెప్పలేను. వస్తువు పట్ల ఆవేశం, అభివ్యక్తి ఉన్నవారికి ఛందో నియమాలు వదిలెయ్యటం వల్ల కొంత వెసులుబాటు కలిగిన మాట వాస్తవం. మన నిచ్చెన మెట్ల సమాజంలో దేనికీ స్వచ్ఛత లేదు. స్పష్టత లేదు. కవిత్వం తీరికవర్గాల విలాసాలకు, వినోదాలకు ఎక్కువగా వినియోగపడింది. అంతేగాక, అది సామాన్య జనానికి అందని ఏదో పూర్వజన్మ సంస్కారఫలంగా, కవులు అసాధారణ వ్యక్తులుగా అనేక ఊహలు, వదంతులు చెలామణీలో ఉండేవి. “హయమట సీత” అంటూ ఆరింట త అక్షరం ఉంచి పద్యం చెపితే శత్రువు చనిపోయాడు వంటి కథలు ఉండేవి. ఈ రహస్యమయ అసాధారణ స్థానం నుంచి కవిత్వాన్ని అందరికీ అందేదిగా చేసిన గురజాడ, శ్రీశ్రీలను అంగీకరించకుండా ఎలా ఉండగలం? అదే సమయంలో పొట్టి, పొడుగు వాక్యాలతో, ఏ ఆవేశంగాని, వైచిత్రిగాని, రామణీయకత గాని లేని రాతలను పద్యాలుగా, అందులో కవిత్వం ఉందని నమ్మించజూచే వత్తాసు వ్యాసాలతో తెలుగు భాషలో ఒకప్పటి పేరుతో చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకునే లబ్ద ప్రతిష్టులూ, అమాయకులూ, సరైన మార్గదర్శకత్వం లేని కుర్రవాళ్లూ రాసేవి కంటబడినపుడు శ్రీశ్రీ పొరపడ్డాడా అనిపిస్తూనే ఉంటుంది.”

“మహాప్రస్థానంలో నీకు ఇష్టమైన కవిత?”

“రాత్రింబవళ్లు శ్రీశ్రీ, మనసు బాగుంటే శ్రీశ్రీ, ఓగుంటే శ్రీశ్రీ అన్నట్లు ఉండేది. కర్తవ్యం గురించి ఆలోచిస్తే జయభేరి, కవిత్వం గురించి ఆలోచిస్తే కవితా ఓ కవితా, కమ్యూనిజం గురించి ఆలోచిస్తే మహాప్రస్థానం, జీవిత మౌలిక లక్ష్యాలగురించి వెదుకుతుంటే శైశవగీతి, మానవజాతి గురించి ఆలోచిస్తుంటే మానవుడా ఇలా అనేకం నన్ను నడిపించాయి.”

CM24VIDU_2287311e

“శ్రీశ్రీతో వ్యక్తిగత పరిచయం ఉందా?”

“దాని గురించి చెప్పేముందు నా రచనలతో శ్రీశ్రీ గురించి చెపుతాను. ఋక్కులు తొమ్మిది పేర్లతో వారం పదిరోజులలో కథలు రాసాను. అందులో ఓ కథ రొట్టెముక్క. దానిని నా భార్య సాఫుచేసి పంపటం అది బహుమతి పొంది ప్రదురించబడటంతో నాకు తెలిసి నా ప్రచురణ పర్వం మొదలయింది. ఆ తొమ్మిది కథలూ వివిధ పత్రికలలో రావటం నాకు వ్యక్తిగతంగా గొప్ప సంతోషం కలిగింది. ఆ తర్వాత కవిత్వమెక తీరని దాహం(ప్రచురణకి ప్రయత్నించలేదు), ప్రపంచమొక పద్మవ్యూహం కూడా రాసాను. కాక కధలకు పేర్లు వెతుక్కోటానికి మహాప్రస్థానం ఆశ్రయించేవాడిని. ఇంక వ్యక్తిగత జీవితం. నా బిడ్డలకు నిద్రపుచ్చటానికి మహాప్రస్థానం పాడేవాడిని. వాళ్లు బడులలో పాడిన పాటలు శ్రీశ్రీవి. వంగపండు ప్రసాదరావూ, నేనూ షిప్ యార్డ్ లో కలిసి పనిచేసాం. అతని పాటలూ నా పిల్లలు పాడుతుండేవారు. మిత్రుడు అనంతుడు నా సహోద్యోగి. విశాఖ సాహితీ ప్రపంచంతో వ్యక్తిగత పరిచయానికి కారకుడు. వేణుగారు, కృష్ణక్క, ప్రసాద్ గార్ల ఇల్లు విశాఖ మేధోప్రపంచానికి కేంద్రం. దానిలో ప్రవేశమే నాకు అనేకమందిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం కలిగించింది. కాని నాకు పూనుకుని మాటలాడటం పూసుకుని తిరగటం అన్న భావన హెచ్చు. ఫొటోలకు ఎగబడటం అయిష్టం. అడిగితే చెప్పటం, చెప్పిన పని చేతనైన మేరకు చెయ్యటం నా పద్దతి. కవులు, రచయితల సృజనతో పొందే స్ఫూర్తి మీదనే నాకు ఆసక్తి ఉండేది. ఇలాంటి కారణాల వల్ల శ్రీశ్రీని కలిసిన సందర్భాలున్నా చెప్పుకోదగ్గ విషయాలు మాటలాడిన గుర్తులు లేవు. నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో గురజాడ కళా మందిరంలో 74 లో జరిగిన సభ. నా ప్రధమ సంతానం వీరారుణకవితకి ఎనిమిదో నెల. దానిని తీసుకుని నడుచుకుంటూ వెళ్లటం, వంగపండు పాటలు, శ్రీశ్రీ ఉపన్యాసం, ఆ రాత్రివేళ ఆ ఇసుకలో కూర్చుని శ్రీశ్రీ, కాళీపట్నం రామారావులు సభంతా తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటే దగ్గరగా వారిని చూడటం, సభానంతరం మళ్లీ నడుచుకుంటూ రామంతో కలిసి ఆ అనుభూతిని పంచుకోటం… ఒకమారు శ్రీశ్రీని స్టేషనుకి వెళ్లి తీసుకుని వస్తుంటే కారులో ఆయన పక్కనే కూర్చుంటే కారు తలుపులో నా చెయ్యి పడింది. అయ్యో అంటూ నా చెయ్యిని పట్టుకుని ఊదారు. ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు వ్యక్తిగత పరిచయం కిందకి వస్తే ఉన్నట్టే అని చెప్పాలి”

“ఇంకా చెప్పుకోవలసినది ఏమైనా ఉందా?”

“ఉంది. అది నా ఆలోచనా ప్రపంచంలో శ్రీశ్రీ. కవిత్వమంటే ఏమిటి అన్నది చాలా చిక్కు ప్రశ్న. ఈ ప్రశ్న కలిగిన సందర్భాలన్నీ శ్రీశ్రీని చదివినపుడే కలిగాయి. జవాబు ఇచ్చుకోవాలనిపించినపుడు ఉదాహరణలు అన్నీ మహాప్రస్థానం నుంచే వెదుక్కున్నాను. ఈ ప్రశ్నకి శతాబ్దాలుగా జవాబివ్వటానికి మానవజాతి ప్రయత్నించింది. క్రిస్టఫర్ కాడ్వెల్ చేసిన చర్చ నాకు తృప్తి కలిగించింది. అతని చర్చ మానవ జాతి ప్రస్థానంలో కవిత్వం పుట్టుక చుట్టూ తిరుగుతుంది. అయితే కవిత్వ నిర్వచనానికి అది అంతగా సహాయపడదు.”

“ఆ నిర్వచన మేదో నీకు లభించిందా?”

“లేదు. కవిత్వ సృజన ఒక ప్రత్యేక శక్తి అనీ, అలాగే కవితాస్వాదన కూడా వ్యక్తి ప్రత్యేక శక్తి అనీ ఒక భావన ప్రముఖంగా ఉంది. రెంటికీ సాధన, అభ్యాసం అవసరమన్న ఊహ కూడా ఉంది. అంటే వ్యక్తులకు ఉండే ఒక ప్రత్యేక శక్తి గానో, ఆసక్తి గానో ఒక వివరణ ఉంది. ఈ శక్తులని మన సాంప్రదాయ భావనలలో రససిద్ధీ, సహృదయ భావనలతో వివరించవచ్చు. అయితే ఈ వివరణ అటుతిరిగీ, ఇటుతిరిగీ భగవద్దత్తంగా, జన్మ సంస్కార ఫలంగా, ఒక మానవాతీత వ్యవహారంగా కవిత్వాన్నీ, కవిత్వాస్వాదననూ విస్తరించటం గమనించినపుడు దీనిని నేను అంగీకరించలేను. జనచైతన్యానికి కవి నిలవాలని, కవిత్వం నిలుస్తుందనీ సంఘాభ్యుదయ కాముకులు అంటారు. సమాజం పరిపక్వమౌతున్న దశలో, అంటే మార్పులకు సిద్ధమౌతున్న దశలో, అది “కవి” రూపంలో “కవిత్వం”గా తనను తను ఆవిష్కరించుకుంటుందనేది వారి వివరణ. ఇది కవిని సమూహంలో భాగంగా, కవిత్వాన్ని సమూహ వ్యక్తీకరణ రూపంగా చూస్తుంది. ఈ వివరణతో నాకు చాలావరకూ ఏకీభావం ఉంది. అయితే ఈ వివరణ కూడా కవిత్వాన్ని కొంతవరకూ ఒక ప్రత్యేక వ్యవహారంగానే చూస్తుంది. కవితాస్వాదకులు ప్రత్యేక వ్యక్తులుగా వారి వినియోగానికి మాత్రమే కవిత్వం అన్న నిర్ణయానికి చేర్చే వాదనను నేను ఒప్పుకోలేను. అలాంటి ప్రత్యేక శక్తి నాకు ఏమాత్రం లేదు. బహుశా అందువల్ల కవిత్వ నిర్వచనం నాకు దొరకలేదు.”

“నీకింకా కవిత్వ నిర్వచనం మీద అన్వేషణ ఉంది.”

“ఉంది. కవిత్వంలో ఆధునిక దశపై కొన్ని ఆలోచనలు ఈ అన్వేషణలో కలిగాయి. కవిలో “అసంకల్పితంగా” ఉన్న సామాజిక బాధ్యత “సంకల్పితం” కావటం ఈ దశకి ఆరంభం. జంటపక్షుల వియోగం వాల్మీకిని కదలించి రామాయణానికి కారణం అయిందట. కవి బాహిర ప్రపంచంలోని ఒక ఘటన అతని అంతఃప్రపంచాన్ని కుదిపివేసినపుడు, ఆ కుదుపుని అతను బాహిరప్రపంచంతో పంచుకోజూస్తాడు. ఇందులో ఆ కుదుపు, ఆ వియోగం కలిగించిన దఃఖం, దాన్ని పంచుకోవాలన్న ఆవేశం అన్న మూడు దశలు కనిపిస్తాయి. ఈ మూడూ “అసంకల్పితం” కావటం మనం గమనించవచ్చు. ఆధునిక కవిత్వ దశలోనూ ఈ మూడు దశలూ ఉంటాయి. అయితే కవి చైతన్యం పూర్తిగా అతని అంతఃనిర్మాణానికి పరిమితమైనది కాదు. బాహిర ప్రపంచ ఘటనలు కవి వశంలో ఎన్నడూ ఉండవు. అయితే ఆతని స్పందనలు ఆతని చైతన్యం మీద, ఎఱుక మీదా ఆధారపడే అవకాశం ఉంది. పక్షులు విడిపోవటం బాధాకరం కాటానికి అది బాధాకరమన్న ఎఱుక అవసరం లేకపోవచ్చు. పేదరికం, అసమానత అన్నవి బాధాకరం కాటానికి పట్టణంలో బ్రతుకుదామని వెళ్లిన బాటసారికి కలిగిన కష్టం దైవకృతం కాదని, మానవ కృతమేనన్న ఎఱుక అవసరం. అలసిన కన్నులు కాంచేదేమిటో కాంచటానికి ఆ ఎఱుక అవసరం. ఆధునిక దశ బీజాలు ఈ తరహా ఎఱుక పుట్టుకలో ఉన్నాయి. భావ కవిత్వపు వెల్లువకి భగవంతుడిని స్త్రీగా భావించి ఆరాధించే సూఫీతత్వం కన్న స్త్రీ సాంఘిక స్థితి పట్ల సమాజంలో ఉన్న అసమ్మతి ఎక్కువ దోహదపడిందని గమనించవచ్చు. వేమన, గురజాడలకు శ్రీశ్రీ ఇచ్చిన ప్రాధాన్యతను గమనించినపుడు మాత్రమే అతని కవిత్వంలోని మూడు దశలలో రెండవ, మూడవ దశలలోని “సంకల్ప” “అసంకల్ప” అంశాలను విడదీసి చూడవచ్చు. కవి consious, subconsious అవస్తలూ, ఆధునిక కవిత్వ లక్షణాలూ అర్ధం చేసుకోవచ్చు.”

“………..”

“ఆధునిక కవిత్వం అనగానే పాతనంతా – రూపంలో, వస్తువులో – విసర్జించాలన్నది చాలామంది ఆశించే విషయం. ఈ ఆశ ఎంతవరకూ సబబైనది అన్న విషయాన్ని పక్కనుంచి ఎంతవరకూ సాధ్యం అని నేను ఆలోచించాను. కొత్త ఆలోచనలు వ్యక్తి చైతన్య సంబంధి. చటులాలంకారపు మటుమాయల నటనలలో నీరూపం కనరానందున… అంటాడు శ్రీశ్రీ. అలంకారాల ప్రగల్భాలను చూడగలిగాడు కనక ఆ చైతన్యంతో వాటిని తొలగించుకోవాలన్న సంకల్పం సాధ్యం. వ్యాకరణాలను సంకెళ్లుగా, ఛందస్సులను సర్ప పరిష్వంగాలుగా, నిఘంటువులను శ్మశానాలుగా చూడగలిగినపుడు వాటిని వదిలించుకొనే ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ సంకెళ్లు అతని బాహిర ప్రపంచం వేసినవి. ఇవేకాక మరికొన్ని సంకెళ్లు లేదా మరికొంత పాత ఉండే ఉండవచ్చు. ఉదాహరణకు నరక లోకపు జాగిలమ్ములు, యముని మహిషపు లోహఘంటలు ధార్మిక కల్పనలు. వీటిని పాత కవులెవరూ శ్రీశ్రీ వాడిన ఉద్దేశ్యంలో వాడే అవకాశం లేదు. అయినా ఇవి పాతను సూచిస్తాయి. ఎవరినైనా తూచాలనుకున్నపుడు ఆ కవి తెంచుకున్న సంకెళ్లను లెక్కించాలా తెంచుకోలేకపోయిన సంకెళ్లను లెక్కించాలా అన్నది నా ప్రశ్న. అలాగే రాసిన అంశాలను చర్చించాలా? రాయని అంశాలను లిస్టించాలా? ఓ కవి అభ్యుదయతను, ఆధునికతనూ, సామాజిక స్పందనలనూ తూచటానికి కూర్చున్నపుడు అతని కవిత్వంలో ఉన్న అంశాలను ఆధారం చేసుకోవాలా? లేని అంశాలను – అవి అప్పటికే బాహిర ప్రపంచంలో ఉన్నాయి గనుక – పరిగణనలోకి తీసుకోవాలా? ప్రజాస్వామిక దృక్పధంతో అన్నీ తీసుకోవచ్చు. కాని అభిశంసన కోసం కూర్చున్నపుడు జరిగేదేమిటో మనకు తెలుసు. ఆ అభిశంసనకి కారణం కవి పట్ల విముఖత, ఆ విముఖతకి కారణం ఆ కవి నిలబడిన విలువల పట్ల అసమ్మతి, అతడు స్వప్నించే మరో ప్రపంచం పట్ల అసహనం అన్నది గమనించవచ్చు. అలాంటపుడు సాధ్యతకి సంబంధించిన ప్రశ్న పుట్టదు. శ్రీశ్రీ గురించి తలెత్తిన వివాదాలను పరిశీలనాత్మకంగా చూసినపుడు ఆయనకి ముందు వేమన, గురజాడ వేసిన కాలిబాటలు ఉండవచ్చు. వాటిని ప్రధాన రాచమార్గాలుగా మలచటంలో శ్రీశ్రీ కవిత్వం వహించిన పాత్ర ఒక యుగకవిగా ఆయనను నిలబెడుతుంది.   కవిత్వ నిర్వచన అన్వేషణలో ఇవీ నేను గట్టిగా ఆలోచించిన విషయాలు.”

“చివరగా?”

“విశ్వమానవ భావన తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అందించిన మహత్తర కానుక. అది తెలుగు సాహిత్యం మానవ జాతి సాహిత్యం కావటానికి దోవలు తెరిచింది. తానొక అణువునన్న గుర్తింపు మానపుడిని ఏకం చేసి అనంత విశ్వంలో భాగం చేస్తుంది. నామటుకు నాకు ఈ పెను సత్యం రవ్వంతైనా అందటానికి కారకుడు శ్రీశ్రీ.”

 -వివిన మూర్తి

vivina murthy

గాయపడ్డ మనసులోంచి కరుణ -రసూల్ ఖాన్ “ఓడిన నేను” కవిత

ధిక్కా రం ,తిరస్కారం లాంటివి ప్రతిఫలించే అస్తిత్వోద్యమాలు తెలుగులో ఎన్నో కనిపిస్తాయి.మైనారిటీ వాద కవిత్వానికి,ఇతర అస్తిత్వ వాదాలకు మధ్య ఒక ప్రధాన వైరుధ్యముంది.దళిత, స్త్రీ వాదాలు ప్రాచీన సంప్రదాయాలమీద తిరుగుబాటుచేసాయి.అంతే కాలికంగా గతంపై ధిక్కారాన్ని ప్రకటించాయి.స్త్రీవాదం వర్తమాన భూమికపై ఉద్యమించినా ప్రధానంగా పైతృకసమాజం పై తిరస్కారాన్ని చూపింది. ఈ మార్గంలో చూస్తే ఈ సంఘర్షణ గతాన్ని తిరస్కరించేది.

మైనారిటీ కవిత్వం వర్తమానంలోని అంశంతో సంఘర్షణ పడుతుంది.ఒక దశలో ఈ సంఘర్షణ కారణాలతో విభేదించిన,ధిక్కరించిన వచనమూ లేకపోలేదు.ఇందులో గతితార్కికచర్చ వర్తమానంపై ఆధారపడింది. ఐ.ఏ.రీచర్డ్స్ కవిత్వంలో దృష్టి(Sense)భావన(Feeling)గొంతుక/స్వరం(Tone)బోధి(Intuition)గురించి చెప్పాడు. మైనారిటీ వాదానికి ఇతరాలకు మొదటి రెంటిలో సారూప్యతలున్నాయి. చివరి రెంటిలో ఈ కవిత్వం ప్రదర్శిస్తున్న అనుభవం వేరు. ఒక దశలో తీవ్రత,ధిక్కారం,అసహనం కలగలసిన వాక్యాలు అదేసమయంలో తన స్థితికి సంబంధించిన నిశ్చేష్ట కవిత్వంలో వ్యక్తమయ్యాయి. కొన్ని సార్లు తీవ్రతను ప్రదర్శించినా అనేకసార్లు కారుణ్యాత్మక వచనాన్ని సృజించింది.

ఈ మధ్య కాలపు కవిత్వాన్ని గమనిస్తే అస్తిత్వ వాదపు కవిత్వంలో కూడా ఒకానొక మానసిక ప్రాతినిధ్యం కనిపిస్తుంది. గతంలోని సంఘర్షణకు,ఈ కాలపు కవిత్వంలో కనిపించే సంఘర్షణకు మధ్యనున్న సున్నితమైన వ్యక్తీకరణను ఆతాలూకు గొంతును స్పష్టంగా గుర్తించవచ్చు. రసూల్ ఖాన్ చాలా రోజుల క్రితం “దువా”అనే పేరుతో తన కవిత్వాన్ని వెలువరించారు. ఈ మధ్యన తనురాసిన కవిత. ఒక సున్నితమైన సంవేదనతో మానసిక ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించింది. సంభాషణలా కనిపించే  వాక్యాల నిడివితో ఒక దీర్ఘనిశ్శబ్దాన్ని ఈ కవిత మోసింది.నిజానికి ఈ సంవేదన వెనుక కొన్ని సంవత్సరాల వేచిచూడటం,తన సౌభ్రాతృత్వం అసహనాలపాలవటం లాంటి బాధ కనిపిస్తుంది.

మాటల తూటాలను/ఒకదానిపై మరొకటి ఇటుకలుగా చేసి మోస్తున్నా/బుజాల భారం తప్ప మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను

మాటల తూటాలను మోయటం గతాన్ని చెప్పే స్థితి వాక్యం..ముస్లిం మైనారిటీ కవిత్వం ఒక పరిమితకాల గతాన్నించే తనగొంతును విప్పుకుంది.”బుజాల భారం తప్ప/మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను “లో తన వర్తమాన సంఘర్షణకు కారణాన్ని ప్రతిపాదిస్తున్నారు.రెండవవాక్యం లోనూ ఇదే సంవేదన ఉంది.కాని దానికి కొంత కళాత్మక వచనాన్ని జతచేసారు.

మనం అనుకొని చేసినదంతా/మన్నించరాని నేరంగా చూస్తూ అనుబంధాల తోటలోంచి/అమాంతంగా తోసేస్తూ ఒంటరి వాడిని చేసిన నాడు/సగం కాలిన చితిలా నేను

ఒక సంస్కృతిలో,చరిత్రలో భాగస్వామికావాలనుకోవడం.దాన్నుంచి ఒంటరితనాన్ననుభవించడం.”సగం కాలిన చితిలా నేను”అనటంలో వర్తమానానుభవం ధ్వనిస్తుంది.మనుషులలోని చిత్తశుద్ధిని శంకిస్తూ,తన స్థితిని చెప్పడంతో కవిత ముగిసింది.

అన్నీ తానై అల్లుకున్న గూడును/రాళ్ళతో పడగొట్టి నవ్వుతుంటే అమాయకంగా రోధించే పక్షిలా నేను/ఆత్మీయతకు అవసరానికి మధ్య/అనాధలా నేను .”

నిజానికి తన ఉనికిని, అస్తిత్వాన్ని వ్యక్తపరిచే స్పష్టమైన వచనాన్ని ఎక్కడా రాయలేదు.కాని వచనంలోని సంలగ్నసంబంధం,గొంతు అస్తిత్వాన్ని నిరాకరించిన స్వగతాన్ని చెబుతున్నాయి..నిజానికి పై ఉదాహరణలతోపాటు అనేకసార్లు కవిత్వంలో ఈ ఉనికి కనిపిస్తుంది. గతాన్ని, ఒకింత మతపరమైన వర్తమానాన్ని స్పర్శిస్తూ చేసిన వ్యాఖ్యలనుంచి గాయపడ్డ వచనం ఇందులో శక్తినిస్తుంది.

నిజానికి ఈ వచనంలోనుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. గతపు తరం చేసిన అంసాలనుంచి ఈ తరంఅనుభవిస్తున్న వ్యథకు ఈ కవిత అద్దం పట్టింది. బహుశ:వెదక గలిగితే ఈ సంవేదన మరికొందరిది కూడా.

                                                                                  –ఎం.నారాయణ శర్మ

కళింగాంధ్ర కవిత్వ ‘పాయ’ల మురళీకృష్ణ

మా కళింగాంధ్ర ప్రాంతం నుండి చాన్నాళ్ళుగా కవిత్వం రాస్తున్న పాయల మురళీ కృష్ణ గత ఆగస్టులో ’అస్తిత్వం వైపు’ అన్న కవితా సంకలనం ప్రచురించారు. ఈ ప్రాంతం నుండి రాస్తున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయ వృత్తిలోని వారే కావడం గమనార్హం. టీచర్ గా పనిచేస్తూన్న వారికి నిత్యమూ గ్రామాలలో జరుగుతున్న విధ్వంసం వివిధ వృత్తుల జీవన విధానం ప్రజల దైనందిన జీవితంతో అనుబంధం వారిని రచయితలుగా కవులుగా బాధ్యతతో వ్రాసే వారిగా నిలుపుతుందనుకుంటాను. మిగతా వృత్తులలోని వారి కంటే వీళ్ళకు పిల్లలతో అనుబంధం వుండడం కూడా అదనపు సౌకర్యమే.
MURALI_PHOTO025-page-001

ఒక కుటుంబ నేపథ్యం తెలుసుకొనే అవకాశం వారి పిల్లల చదువు వారి కుటుంబ ఆర్థిక సామాజిక స్థితి గతులను తెలుసుకొనేందుకు, పిల్లలను చూస్తూ వారితో సంభాషిస్తూ వారి రోజువారీ సమయంలో అత్యధికంగా వారితో గడవడం మూలంగా మంచి అవగాహన కలిగిస్తుంది. నిబద్ధత కలిగిన రచయిత కవికి ఇది ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. దీనిని కవిత్వీకరించడం ద్వారా సామాజిక ప్రస్తుత వాతావరణాన్ని మన కళ్ళముందు పద చిత్రాలుగా బ్లాక్ అండ్ వైట్ లో స్పష్టంగా చూపించే ప్రయత్నం మురళీ కృష్ణ కవిత్వంలో చూడవచ్చు. అనుభూతి చెంది ఆలోచనలకు ప్రేరణనిస్తాడు కవి.

ఈ సంకలనం ముందు మాటలో శివారెడ్డి గారన్నట్టు కవిత్వం జీవితంలో అన్ని పార్శ్వాలను వెలిగించే దివ్యశక్తి. లోలోన గుణించుకొని కవిత్వాన్ని అల్లే పద్ధతి మురళీలో వుంది. అది ఒక చిక్కని నేతగా అతని కవిత్వంలో కన్పడుతుందంటారు. ఈ కవితలు చదువుతుంటే ఇది అక్షర సత్యం అని ఒప్పుకోక తప్పదు.

 

’అత్యవసరం’ కవితలో

ప్రపంచం ఒక కుటుంబమౌతుంటే

మనిషి మాత్రం ఒంటరిగా చీలిపోతున్నాడు

ఒకప్పుడు హృదయాలను కలిపిన సాయంకాలాలు

ఇప్పటి ఏకాంతాలై శోకిస్తున్నాయి…. అంటూ సమూహం నుండి విడివడి పోతున్న మనిషి పట్ల ఆవేదనను వ్యక్తపరుస్తాడు.

 

“ఈ రోజేం కథ చెప్తారు మాష్టారూ!?” కవితలో

 

ఎన్ని విషాదాలనైనా

ఒక పసి నవ్వు కడిగి పారేస్తుంది

బడి ప్రాంగణంలో మాత్రమే

బ్రతుకు కల్మష రహితమై కన్పిస్తుంది

 

బడి చివరి గంట తర్వాత

బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే

రేపటి ఉదయం వరకూ

రెక్కలు తెగిన పక్షులమే… అంటూ ఈ కవితలో మాస్టారుగా కాన్వెంటు బడులు సర్కారు బడులను మింగేస్తున్న వైనాన్ని చెపుతు టీచరుగా వృత్తి ధర్మాన్ని ఎంత నిబద్ధతతో పాటించాలో సవివరంగా వ్యక్తపరుస్తాడు.

 

పర్యావరణాన్ని మింగేస్తున్న విధ్వంసకర అభివృద్ధి మేకప్ వేసుకొని చేస్తున్న వినాశనం తద్వారా మనిషి కోల్పోతున్న సహచర సంపద పట్ల మక్కువను చూపే ప్రయత్నం “మొక్క” కవితలో ఇలా చెప్తాడు

PAYALA MURALI KRISHNA-page-001

భూమికీ ఆకాశానికి తేడా చెప్పమంటే

నేను మొదట మొక్కనే చూపిస్తాను

ఎన్ని చుక్కలున్నా

ఒక్క మొక్కను కూడా సరిపోవు కదా! అంటూ

 

మనుష్యుల మధ్యున్నప్పుడు

చాలా సార్లు పీడించే ఒంటరితనం

మొక్కల మధ్య నన్ను చూస్తే అంతర్ధానం అంటాడు.

 

“రేపటి సూర్యోదయానికి ముందు..” కవితలో బెస్త వారి బతుకుల్లో కంపెనీలు పెట్టిన చిచ్చు తద్వారా వారి జీవిక కోల్పోయినతనాన్ని మన కళ్ళముందు తడిగా ఆవిష్కరిస్తూనే వారికి విముక్తి మార్గాన్ని వారి ఐక్య పోరాటంలోనే సాధ్యమని చెపుతాడు.

 

అతడక్కడే ఉండేవాడు

ఎగసే కెరటాల సాక్షిగా

పగలంతా ఇసుక తిన్నెల మీద

ఈ సముద్రం ఒడ్డునే కూర్చుండేవాడు

నైలాన్ దారాలు ముందేసుకుని

సరికొత్త వస్తువును సృష్టించబోయే

శ్రామికత్వాన్ని ప్రేమించేవాడు

ఓ దారాన్ని తీసి మరో దారానికి కలుపుతూ

సునిశితంగా, వేగంగా

అతడు ముడివేయడం చూసేటప్పుడు

మనిషినీ మనిషినీ అంతే వేగంగా

కలపగలిగే వాడు ఎవరైనా ఉంటే బావుణ్ణనిపించేది

 

చివరిగా ఇలా

 

ఇప్పుడు కూడా అతడక్కడే ఉన్నాడు

తన వాళ్ళ పిడికిళ్ళు ముడివేస్తూ

సరిక్రొత్త మానవ వల అల్లుతున్నాడు

“వేట సముద్రం మీదకి కాదురా

ఒకానొక స్వార్థం మీదకని” చెప్పి

తెప్పల్ని నడిపే తెడ్లన్నీ

తిరుగుబాటు జెండాలు చేసాడు….. అంటాడు మురళీ.

 

అలాగే రైతు పొలాలకు దూరమై వలస బాట పట్టడాన్ని తనదైన శైలిలో “ఒక నిష్క్రమణకు ముందు” కవితలో చిత్రిస్తాడు మురళీ ఇలా

 

భవిష్యత్ ఛిద్రమై పోతున్న ఒకానొక దృశ్యం

ఎవరు మాత్రం ముందుగా ఊహించగలరు?

నడిచే దారులే కంటతడి తుడవలేక

వలసపొమ్మని సాగనంపుతుండడం

ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు..!?

 

ఊరూ ఊరంతా భూమిని కరెన్సీగా మార్చేసుకుంటుంటే

విస్తరించే విధ్వంసానికి

విచ్చుకుంటున్న పచ్చదనం బలికాదని ఎలా నిర్ధారించగలరు!?

 

సమూహం నుండి తప్పని సరిగా విడివడుతూ మనిషి తన అస్తిత్వంవైపు ఎలా అడుగులేస్తూ ఉనికిని కోల్పోతాడో ఈ సంకలనం శీర్షిక “అస్తిత్వం వైపు” కవితలో తనదైన శైలిలో ఇలా ఆవేదనగా ఆవిష్కరిస్తాడు

 

కొంత విరామం తర్వాత

అతడలా నడిచి వెళ్తుంటాడు

ఆ రాదారుల కఠినమైన రాళ్ళల్లో

ఏవో చిగురించిన జ్నాపకాలు

సుతిమెత్తగా తగుల్తుంటాయి..

 

ఇంటికెళ్ళేసరికి

సాయంత్రమైపోతుంది

ఇంటి ముందు ఎవరో

దీపాలు పెట్టడం గమనిస్తాడు

వేగంగా అడుగులేస్తాడు

ఒక్క దీపమూ కనిపించదు

 

తన ఇరుగ్గదిలో

తన కోసం ఎవరో పరిచిన చాప మీద

అలాగే నిద్రపోతాడు

 

తెల్లవారిన తరువాత

అతడు లేడు

తనలో ఇంకెవరో తప్ప………….

 

చివరిగా “దారిలో ఒకవేళ…..” కవితలో

 

తంగేడు చెట్టు పసుపు పచ్చగా నవ్వే

ఏదో ఒక వేళ

ఈ దారిలో నా నడక ఆగిపోవచ్చు

అక్కడక్కడా ఉన్న రక్తపు చారలు

చెబుతున్న నిజాలను

కొన్ని పాద స్పర్శలు పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు… అంటూనే

 

ఇప్పుడు

నాతో కవిత్వం నడుస్తోంది

అప్పుడు

కవిత్వంతో నేను నడుస్తాను… అంటాడు కవి ఆశావహంగా…

 

ప్రతులకు..

పి. మురళీకృష్ణ

మెంటాడ – 535 273,

విజయనగరం జిల్లా. 9441026977 సంప్రదించవచ్చు.

-కేక్యూబ్ వర్మ

 varma

 

కవిత్వం ఎప్పుడూ అతని తోడు!

10599497_779928925404414_7004760793705969153_n

వర్చస్వి బహుముఖీనుడు, కవి, కథకుడు, చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు. ఇవి కాక మంచి స్నేహితుడు . కవిత్వం తెచ్చిపెట్టుకున్నది కాక, ఇష్టంగానే తానే ఎంచుకున్నది. కవిత్వంలో అతను సంభాషిస్తాడు . కవిత్వంతో అతను మాట్లాడుతాడు . సమాజపు ప్రతి కదలికను అక్షరంలోకి ఒంపుతాడు. కవిత్వాన్నిచిత్రంగా రూపొందిస్తాడు . అలా కవిత్వం తనకొక సీరియస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న ప్రక్రియగానే భావిస్తాడు . అందుకనే ఈ కవిత్వమంతా అతని సంభాషణ అని అన్పిస్తోంది.

ముభావంగా వుండే అతని వ్యక్తిత్వంలానే, ఇతని కవిత్వం ముభావంగానే, ముక్తసరిగానే పలుకుతుంది, అందుకేనేమో ఈ కవిత్వానికి ఇంత బలం. ధీమా.

ఏ వస్తువు గురించి ఇతని కవిత్వం పలకలేదూ! .. అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను . అప్పుడెప్పుడో  మూసీలో మునిగిపోయిన చిన్నారి మాన్వి ఉదంతం నుంచి దిల్‍సుఖ్‍నగర్ ఘటనల వరకూ , కవిత్వం గురించిన తన స్పందన నుంచి, స్నేహవర్షం వరకూ అన్నీ అతని అక్షరాలుగా ఒదిగిపోయాయి. కవి తనతో పాటు తన ప్రయాణం లో కవిత్వాన్ని తోడు తెచ్చు కుంటున్నాడు , తనలోని అన్ని స్పందనలకు కవిత్వాన్ని వాహికగా మార్చు కుంటున్నాడు .

“అంతరించిపోతున్న పిచ్చి పిచ్చుక కంఠం

నన్నప్పుడప్పుడు రెచ్చగొడితే చాలు…….

ఏ రవివర్మ చిత్రమో అంతుపట్టని మర్మ కవిత్వంగా మారి

అర్ధాల్ని నాచెవుల్లో రహస్యంగా ఉపదేశిస్తే చాలు! (కవితోత్పత్తి ) –

వర్చస్వి కవిత్వం లోకి ఎట్లా ప్రవేశిస్తాడో  అర్థంకావాడానికి ఈ కవిత్వపాదాలు చాలేమో !

 

కదిలిపోయే , కరిగిపోయేతనం వున్నవాడవడం చేత, ప్రతి సందర్భానికి, సంఘటనకి, స్పందనకి అక్షరాన్నే ఆశ్రయించాడు. అటువంటి ఉద్వేగ సంభరిత క్షణాలే ఇతని కవిత్వం!

“అంతరంతరాల్లో అలరారే తడివల్ల

లోచూపు వెలుగంగ లోకమగు పించెన”

అని గోరటివెంకన్నచెబుతున్న లోచూపు వెలిగిన సందర్భాలే వర్చస్వి కవితలు . నిశ్శబ్ధంగా ఉండేతనం వల్ల , గాఢమైన పరిశీలనాదృష్టి వలన వర్చస్విలో ఆ లోచూపు వెలిగే సందర్భాలు అనేకం.

బహుశా అదే కారణంకావొచ్చు. వేరెవరూ అందుకోలేని, అంటుకోని వస్తువుల దాకా  ప్రయాణించగలిగాడు. తనను ఆ సందర్భాల్లో అనుసంధానించాడు. మమేకత సాధించాడు . ఆ మమేకత వల్లనే చాలా కవితలలో తనదైన ముద్రతో పలకడమే కాదు , పాఠకుడిని కూడా ఇన్‍వాల్వ్ చేయగలిగాడు . కేవలం కవిత రాయాలనే కాంక్షతో ఏదోకటి రాసేసే తనంతో కాకుండా , తప్పని సరై రాయకుండా ఉండలేని స్థితిలో కవితలను మలిచాడు . అందువల్లనే ఆయా కవితలలో అంతటి పదును, ఆర్ద్రత వచ్చిచేరాయి . కవితాతత్వం కవితలో వర్చస్వి చెబుతున్నది కూడా అదే . కవిత్వ మంటే ఏమిటో స్పష్టంగా ఆయనకు తెలుసు, అదో ఆషామాషీ వ్యవహారం కాదని . అది గోడ పక్కన కట్టేసిన దూడ కాదనే ఎరుక వుంది . ఆ ఎరుకను బాహాటంగా ప్రకటించాడు కూడా !

కవిత్వమంటే కేవలం అక్షరాల్నీ పేర్చుకుంటూ పోవడం కాదు, అందులో ఆత్మను ఆవిష్కరించాలి అనే కవుల కోవలోకి చేరుతాడు వర్చస్వి. తానురాయడం మాత్రమేకాదు, మంచి కవిత్వం ఎక్కడుంటే అక్కడ తన ప్రశంసతో భుజం తడతాడు . కామెంట్ భరోసాయిస్తాడు. తన కవిత్వం కన్నా , ఇతరుల కవితలపైన ఎక్కువ మక్కువ చూపుతాడు . అది ఎంత మంచి కవిత అయితే అంతటి సహృదయుడు . ఆ  సహృదయత , నిజాయతీతనం , కవిత్వం పట్ల వున్న పిచ్చి ప్రేమ – ఇవన్నీ ఆయన కవితల అంతస్సారంగా మనకు కన్పిస్తూనే వుంటుంది. కవిత్వం గురించే ఆయన రాసిన  కవితలు ‘కవిసమయం’ , ‘కెథార్సిస్’ , ‘కవిత్వం కావాలి కవిత్వం’ వంటివి కవిత్వపు సీరియస్‍నెస్ ను అంశాలను ప్రకటిస్తాయి .

కవిత్వభాష విషయంలోనూ వర్చస్విది ప్రత్యేకమైన వర్గం. ఆధునిక కవితకు వాడుతున్న వ్యావహారిక పదాలు , పద బంధాల్లోంచి కొంచెం పక్కకు జరిగి తనదైన స్వంత పదాల మార్పును కవిత్వంలో వాడతాడు . ఆ పదాల కూర్పు ఒకింత ప్రత్యేకం. కవితా శైలి విషయంలోనూ  తనదైన ముద్ర వుంది. ముగింపుల్ని ఒక సందేశంతోనే , చరుపుతోనో, లేదా ఆలోచింపజేసేదిగానో ముగించడం వర్చస్వి కవితల లక్షణం. బహుశా అతనిలోని కధకుడు, చిత్రకారుడు ఈ రకపుశైలికి అదనపు ప్రేరణ అయివుండవచ్చు .

10818812_10205758492627276_800166051_n

కొన్ని కవితల నిర్మాణంలో బిగుతైన పద్దతిని పాటిస్తూనే , కొన్ని కవితలలో ఆ వస్తువును కవిత్వం చేసే క్రమంలో అవసరంగా భావించి దీర్ఘమైన నిర్మాణాన్ని ఎంచుకోవడం చూస్తే, కవిగా ఇతనిలో కవితా నిర్మాణం పట్ల ఉన్న అవగాహన తెలిసి పోతుంది.

వర్చస్వి లోని చతురమైన దిగ్ర్భమ కలిగించే కవిత్వ శైలి నాకు భలే ఇష్టం .

“నగరవాసి చిరునవ్వు ఫెళ్ళున బ్రద్దలైంది” – ఇది ‘అమానుషం’  కవితలోని ప్రారంభ కవితా పాదం . ఈ కవిత దిల్‍సుఖ్‍నగర్ పేలుళ్ళకి స్పందించి రాసినది . ఆ మొదట పాదం లోనే మొత్తం కవితకి సంబంధించిన మూడ్ క్రియేట్ అయింది . ఇటు వంటివి అనేక కవితల్లో తారసపడతాయి .

అవును నాకు పనీ పాటా లేదు ,   నీ పెదవులు బందీలు కావుగా , తిప్పితిప్పి కర్రతో వత్తితే గాని రొట్టెకి టేస్టు రాదు . ఇవన్నీ కవితల ప్రారంభ పాదాలే. ఇటువంటివే   చాలా మట్టుకు చూస్తాం . ఇటువంటి ప్రారంభ పాదాలతో కంచలోకి ప్రవేశించి, తనదైన నిర్మాణ వ్యూహంతో కవిత రాయడం వర్చస్వి లోని ప్రత్యేకమైన పద్దతి . అందువల్లే ఈ కవితల్లో అదనపు బలం జోడింపబడుతోంది . ఆ అదనపు బలంవల్ల  కవితల స్వరంలో బలం వచ్చింది. ఆ విధంగా వర్చస్వి   కవిత్వం, మిగతా కవుల స్వరాల కన్న  విభిన్నమైనది , ప్రత్యేకమైనది కూడా!

జీవితం తాలూకా జాడలు , సమాజపు  ప్రతిఫలనాలు, విభిన్నపార్శ్వాలు, వైవిధ్యమైన కోణాలు వర్చస్వి కవిత్వంలో పరుచుకొని వున్నాయి . ‘లోకాస్సమస్తా… ‘ అంటున్నది కూడా ఇందుకేనేమో ! తనని కదిలించిన వ్యక్తుల గురించి తనని వెన్నాడిన   సందర్భాల గురించి , తనను తానూ లోతుగా పరిశీలించుకున్న క్షణాల గురించి , తనలోకి , తానూ బయటకీ , బయట నుంచి తిరిగి తనలోకి ప్రయాణిస్తున్న  క్రమంలో తారసపడిన అనేక క్షణాల ఆలోచనలన్ని బిగ్గరగా, బయటకి వినిపించేటంత స్వరంతో ఈ కవిత్వాన్ని సృష్టించాడు . ద్వంసమవుతున్న విలువల విషాదాన్ని విషాదంలా కాక , వాస్తవికంగా ప్రకటించే పద్దతిని ఆశ్రయించాడు. మరోరకంగా చెప్పాలంటే చార్లీ చాప్లిన్ ఎంచుకున్న పద్దతి- అన్ని విలువలపై విమర్శ వంటిది ఇతని కవిత్వం .  ఆ ఎంచుకున్న పద్దతి విలక్షణం!

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఫేస్‍బుక్ కవిసంగమం గ్రూప్ వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఒకానొకనాడు లాటిన్అమెరికా మహాకవి పాబ్లో నెరూడా ప్రఖ్యాత ‘మెమాయిర్స్’ ను అనువదించమని సహకవులకు సూచించినప్పుడు   వర్చస్వి ఒక్కడే స్పందించి సాధించాడు; ఆ కవితను పరిమిత స్వేచ్చానువాదమే చేశానని వర్చస్వి విన్నవించుకున్నా అపరిమిత మాధుర్యాన్ని తెలుగు సాహిత్య ప్రియులకు అందించాడనడంలో అతిశయోక్తి లేదు. లోకాస్సమస్తాలో ‘పదం’ చదివి తీరాల్సిందే!

 

“ఇప్పుడు పెదాల మధ్యనుంచి

మాయమాటలు ఒక్కొక్కటి

భూటకపుచీరలా జారుతుంటే

బాధేస్తోంది …”                                                           ( మళ్ళీవచ్చేయ్  )

భూటకపు చీర కృష్ణుడు ద్రౌపది కోసం పంపినదా? పెదాల మధ్య నుంచి మాయ మాటలు భూటకపు చీరలా జారడం , కోపాన్ని , ఆక్రోశాన్ని , ఉక్రోషాన్ని మోపడం కోసం, చెప్పడం కోసం ఎంచుకున్న విభిన్నమైన ప్రతీక . ఆ విభిన్నతకు కవి తన కవిత్వం కోసం, తప్పనిసరై, అవసరమై ఆశ్రయించాడు . గద్దింపు కోసం వాడుతున్నాడు, అలా ఆశ్రయించడం కేవలం వర్చస్వి లాంటి బహుముఖీన ప్రతిభ ఉన్నవాడికే సాధ్యమైన పని.

వర్చస్వి కవిత్వం ‘ లోకాస్సమస్తా… ‘ పేరిట పాఠకుడి ముందు సంభాషించడానికి సన్నద్దమవుతున్న తరుణం కూడా ప్రత్యేకమైనదే . అటువంటి ప్రత్యేకమైన సందర్భంలో కవిత్వంలో విభిన్నమైన గొంతుతో వస్తున్న వర్చస్వి కి ‘ జయహో ‘ లు !

 —కవి యాకుబ్

1779260_10203144783201536_2074735339_n

 

 

 

అంతర్నేత్రపు తల్లడిల్లిన చూపులు-“జీరోడిగ్రీ”

10653339_716759828412278_2494152736493877358_nకవిత్వాన్ని మామూలుగా చదవటం అర్థమయ్యాక ఎక్కడైనా,ఎప్పుడైనా ఒక వినూత్నమైన వస్తువో,నిర్మాణమో శైలినో కనిపిస్తే మనసు ఆహ్లాద పడుతుంది.ఈ క్రమంలొ సాహిత్యాంశాలగురించి,సాహిత్యేతరాంశాల గురించి రెండిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మోహన్ రుషి కవిత్వం కలిగిస్తుంది.రుషి నిశ్చయంగా ఒక దు:ఖవాతావరణం లోని సంకోచ వ్యాకోచాలను అనుభవిస్తాడు.ఈ సంఘర్షణ వెనుక ఉండే ఒక గంభీర నిశ్శబ్దాన్ని కవిత్వం చేస్తాడు.అందువల్ల కవిత్వానికి దానివల్ల ఉత్పన్నమైన మానసిక స్థితికి ఒక లంకెను జోడించి “కాలిక స్పృహ”తో మాట్లాడుకోవాల్సిన సమయం.

రెండవది తనకు సరిపోకున్నా ఏదో ఒక నిర్మాణంలోకి ఒదిగిపోకుండా తనగొంతుకకుతగిన పరికరాలను తానుగా తయారు చేసుకుని లేదా ఎన్నుకుని నిలవడం.స్పష్టంగ ఈరెండు అంశాలు రుషిని ప్రతేకంగా చూచేలా చేస్తాయి.ఒక సామాజిక వాతావరణాన్ని,ఒక సాహిత్యవాతావరణాన్ని రెంటినీ గమనించి ఆతాలూకు స్పృహనుంచి తానుగా వ్యక్తమౌతున్నాడు.

రుషిని అర్థం చేసుకోడానికి అస్తిత్వ వాదం(Existentialism)కొంత ఉపయోగ పడుతుంది. హైడెగర్ (Martin Heidegger)మానవాస్తిత్వం అనేక సంభావ్యతల క్షేత్రం అన్నాడు.సంభావ్యత(Possible)మనిషిలోని నిశ్శబ్దశక్తి.ఏక కాలంలో మనిషిలో అనేకాంశాలుదాగుంటాయి.కటి ఉపయోగంలో ఉన్నప్పుడు మరొకటి నిశ్శబ్దంగా ఉంటుంది.ఈ అంసం నిశ్శబ్దాన్ని భరించలేదు.ఈ నిశ్శబ్దంలో మనిఉషి అర్థమానవుడుగా,పార్శ్వమానవుడుగా ఖండ మానవుడుగా జీవించాల్సి వస్తుంది.రుషి కవిత్వం “జీరోడిగ్రీ”లో “సోమవార మహత్మ్యం(పే.76),8 pm(పే.82)నో అదర్ గో (పే.77)మొదలైఅన కవితలన్నీ ఇలాంటివే.ఒక అంశానికి కట్టుబడి బతికే యాంత్రిక యాంత్రిక జీవన విరక్తి(Aversion of mechanical life)వీటిల్లో కనిపిస్తుంది.

“బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/
పెద్దగా చెయ్యడానికేం ఉండకపోవచ్చు కానీ/
ఉండాలి అక్కఢ మెకానికల్ గానో, మెకాలేకు
లాయల్ గానో”- -(సోమవార వ్రత మహత్మ్యం)

పొద్దున ఇటూ సాయంత్రం అటు/ఉరుకుతుండాలి/
ఆలోచనకు అవకాశమివ్వకుండా”-(8pm)
“నీ ప్రపంచంలో నువ్వు ,నా కరాబ్ దిమాక్ లో నేనూ/పొద్దున్నే లేచిన తర్వాతకూడా బతికే ఉన్నాం/ఈ జీవితానికి ఈఅదృష్టం చాలదా ?”-(పొడిచిన పొద్దు-80 పే.)

“ఎవరిగురించి చూస్తున్నావు/
నిన్ను నిన్ను కాకుండా చేసిన ఈ మధ్యాహ్నం పూట ?!”-(నువ్విలా ?-30పే.)

1655904_593020304119565_1297827243_n
జీవితంపై పెంచుకున్న అపేక్షని,దాన్ని అందుకోవడంలో ఉండే ఇబ్బందిని రుషి కవిత్వం చేస్తాడు.జీవితంలో యాంత్రికతకు,ఇష్టానికి మధ్య సంఘర్షణను వ్యక్తం చేస్తున్న ఈ వాక్యాల వెనుక ఒక పెయిన్ ఉంది.రుషి స్వీయ జీవితాన్ని కూడా ఒక దృశ్యం చూసినట్టుగా చూస్తాడు.ఇది ఒక్కోసారి ఆనందాన్ని,విసుగును ఇవ్వొచ్చు.కీర్క్ గార్డ్ చెప్పిన అస్తిత్వ దశల్లోరెండవది బౌద్ధిక సౌందర్యం(Intellectual aesthete)ఇందులో మనిషి జీవితానికి వెలుపల ఉండి గమనిస్తాడు.ఈ వాక్యాలు ఇలాంటివే.ఈ వాక్యాలు అలాంటివే.కొన్ని సార్లు తృప్తిని ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి.
“ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?/పై గుండీ విప్పి,అంగీ /వెనక్కి లాగితే తగిలే చల్లగాలి “-(పే.56)
“ఆటోకిందా మీదా/అయినప్పుడు “రోడ్డుసల్లగుండ”అంటూ/
కోపంలోనూ నోరుజారని వాళ్ళు”-(నేర్చుకోవాలి.పే.86)
కవిత్వాన్ని చెప్పడానికి ఉపయోగించుకునే పద్ధతిని,పరికరాలను కూడా గమనించాలి.భాష ఆలోచన రెండు వేరుకాదని(Language is implict thought)అస్తిత్వ వాదుల అభిప్రాయం.ఆలోచనకు దాని ఆవేశ స్వభావాలకు వెలుపల రుషి భాష అలంకారాలను తొడుక్కోదు.చూడటానికి శుద్ధవచనం(Plain prose)లా కనిపిస్తుందికాని,సాంద్రమైఅన వాక్య సౌందర్యం ఉంది.మనసులోని స్వభావసారాన్ని కవిత్వం చేయడం వల్ల సౌందర్యమూ ఆమేరకే కనిపిస్తుంది.జ్ఞానం ప్రేరేపించే ప్రయత్న పూర్వక కళావాక్యాల నిర్మాణం లేదు.కొన్ని సార్లు విలోమ వాక్యాలు రాయటం కనిపిస్తుంది.
1″ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?”-(పే.56)
2.”బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/-(పే.76)
సాధారణంగా ఈ వాక్యాలు”ఇక ఈసమయానికి జీవితానికి ఏమికావాలె”/పాపానికో పుణ్యానికో బతికి ఉన్నందున ఆఫీసులకీ,స్కూల్లకీ వెళ్లేతీరాలి”ఈ క్రమంలో ఉంటాయి..వాక్యంలోని పదాలస్థానాలను మార్చిరాసి కవితాత్మకతను అనుభవించడం ఇక్కడ కనిపించేది.వాక్యాలు సంభాషణాత్మకం కావడం వల్ల చిన్న చిన్న వాక్యాలుగా రాయటం,కొన్ని సార్లు పదసమ్మేళనాలని,ప్రశ్నా వాక్యాలనీ ఎత్తుకోవడం కనిపిస్తుంది.ముఖ్యంగా శబ్దంలో ఉండే చమత్కారాన్ని బాగా ఉపయోగించుకుంటారు.
“మెకానికల్ గానో/మెకాలేకి లాయల్ గానో..(పే.76)మరణ జన్మ సంయోగక్రియ(పే.70)నరగ్రహ కూటమి-ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఇదే సందర్భంలో గంభీర సౌందర్యం గల వాక్యాలూ,పదబంధాలూ కనిపిస్తాయి.ఆకాశదారులు(పే.79)జీవితగణితం(పే.16.పే.)స్టీరియో నవ్వులు(పే.13)లాంటి ఆధునిక పదబంధాలూ కుమ్మరిస్తాడు.రుషిలో తనదైన అభివ్యక్తి ముద్ర ఉంది.అభివ్యక్తి,నిర్మాణం,వాక్యసంవిధానాలకు సంబంధించిన చర్చ జరిగితే ఒక అంచనాలో మోహన్ రుషిలాంటివారు ఒక మలుపులో నిలబడతారు

– ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఆత్మ ఘోష, ఋతు ఘోష కలిసి…ప్రవాస కవిత్వం

imagesX3953B67

ఇండియాలో కవిమిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వారిలో కొందరు తరచుగా ఒక కంప్లయింటు చేస్తుంటారు – నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా రాసావో, ఇప్పుడూ అలాగే రాస్తున్నావని. అదివిన్నప్పుడు, నాలో నేను అనుకుంటాను – అలా రాయగలిగితే మంచిదే కదా అని. అక్కడొక సాహిత్య వాతావరణం ఉంటుంది. మిత్రులతో వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా, నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో వైవిధ్యం, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల్ని గమనించటం వంటివి జరుగుతాయి. రాసేది అంతర్ముఖీనమైన కవిత్వమే అయినా, ఇవన్నీ సాహితీ సృజనకి దోహదం చేస్తాయి. నానృషిః కురుతే కావ్యం అంటారుగాని, ఒకవిధంగా చూస్తే మానవ సంపర్కం లేని స్థితప్రజ్ఞుడైన మనిషి కంటే, తక్షణ సంఘటనలకు స్పందించి, తేలిగ్గా చలించిపోయే non ఋషులే కవిత్వం రాయటానికి ఉత్సాహం చూపిస్తారేమో అనిపిస్తుంది. మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా ఉంటూ, చిన్నచిన్న సాంస్కృతిక ద్వీపాలలో నివసిస్తూ కూడా, కవిత్వ దీపంలో చమురు ఇంకిపోకుండా అదే స్థాయిలో రచన చెయ్యటం సాధించగలిగితే, ప్రవాస కవులలో అది ప్రశంసించ వలసిన గుణంగానే చెప్పుకోవాలి.

రెండో విషయం ఏమిటంటే, కవిత్వం సార్వజనీనమైన, సర్వకాలాలకూ వర్తించే సత్యాల గురించి అన్వేషిస్తుంది. బయటి ప్రపంచం చూడటం వల్ల, ఇటువంటి సత్యాలు మరింతగా మనకు అనుభవంలోకి వస్తాయి. “అవే ఆత్మలు ధరించిన రంగురంగుల శరీరాలు” అన్నట్టు, ఎక్కడికి వెళ్ళినా మనుషుల స్వభావం, వారి ఆశలు, నిరాశలు, ఆలోచనలు, విజయాలు, వైఫల్యాలు వంటివాటిలో పెద్దగా భేదం ఉండదని అర్థమవుతుంది. అందువల్ల, మానవ సంబంధాల గురించి, జీవితంలో అనివార్యంగా ఎదురయ్యే అనుభవాలు – జననం, మృత్యువు, వయస్సుతో వచ్చే మార్పులు, ఆశ, నిరాశ, ఎడబాటు – వంటివాటి ఆధారంగా రాసే కవిత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అయితే, కవి తన దృక్పథం ద్వారా వాటిని తనదైన ప్రత్యేకతతో చిత్రిస్తాడు. ప్రాంతం మారినంత మాత్రాన అటువంటి దృక్పథం సరికొత్తగా ఏర్పడటమో, పూర్తిగా మారిపోవటమో జరగదు. కాకపొతే, ఒకచోట పరిస్థితుల గురించి విన్నప్పటికంటే, అక్కడ ఉన్నప్పుడు, ఆ జీవితంలో భాగంగా నివసించి నప్పుడు, మన దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. అంతకు ముందు అపోహలేమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. చాలామంది తెలుగు కవుల్లాగా అక్కడున్నప్పుడు అమెరికా వ్యతిరేక కవిత్వం రాసివుంటే, బహుశా ఇక్కడకు వచ్చి నివసించాక, సగటు ఆమెరికన్లో ఉండే స్నేహభావం, హాస్యప్రియత్వం, సహాయంచేసే గుణం వంటివి చూసాక, అటువంటి తీవ్రమైన కవిత్వం ఇక్కడ రాయకపోవచ్చు. ఒకవేళ అటువంటిది జరగకపోయినా, ఇక్కడి బ్రహ్మాండమైన ప్రకృతి శోభకి పరవశం కలిగి, దేశమంటే మనుషులేకాదు, మట్టి కూడా అనే అవగాహన కలగవచ్చు.

మరొక విషయం ఏమిటంటే, కవిత్వం కవి ఊహాశక్తి మీద, అతని లోచూపు మీద ఆధారపడి ఉంటుంది. అతని సృష్టి అతని సొంతం. కథకుడిలాగా, తన ఊహలకి రక్తమాంసాలు ఇవ్వవలసిన అవసరం కవికిలేదు. అంటే, కవిత్వానికి వాస్తవంతో పనిలేదని కాదు నా ఉద్దేశం. వాస్తవాన్ని కవి చూసే దృష్టి, దానిని ఆవిష్కరించే పధ్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. కథలో ఒక వాతావరణం ఉంటుంది కాబట్టి, ఇక్కడి ఊరి పేర్లు వాడటం, పాత్రలకు ఇక్కడి పేర్లు పెట్టటం వంటివాటి ద్వారా, అమెరికన్ కథ అనే భావన కలిగించవచ్చు. కవిత్వానికి అటువంటి వాతావరణ కల్పన ప్రధానం కాదు కాబట్టి, ఎక్కడ రాసిన కవిత్వమైనా ఒకలాగే అనిపించవచ్చు.

ఈ ప్రశ్న అడిగేవారి ఉద్దేశం మరొకటి కూడా కావచ్చు. వారనుకొనే కొన్ని స్టీరియోటైపు అంశాల గురించి రాయాలని వారు ఆశించవచ్చు. వారి జీవన విధానం ఎలా ఉన్నా సరే, అమెరికా తెలుగు కవులు అక్కడి నల్లవారి గురించో, పేదరికం గురించో, గ్లోబలైజేషన్ గురించో, లేదా యుద్ధ వ్యతిరేకత గురించో రాయాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఇవేవీ కనపడని కవిత్వం వైవిధ్యంలేని, అప్రధానమైన కవిత్వమని వారు భావించవచ్చు. నియోగి అనేకమంది సాహితీ వేత్తలతో చేసిన ఇంటర్వ్యూలు ఇటీవల చదివాను. అందులో ఒక ఇంటర్వ్యూలో నగ్నముని కవిత్వాన్ని నాలుగు రకాలుగా విభజించారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్య కవిత్వమని ఆయన చెప్పే రాజకీయ కవిత్వం ప్రథమ శ్రేణికి, సామాజిక కవిత్వం ద్వితీయ శ్రేణికి, ఇజాల గురించి రాసే కవిత్వం తృతీయ శ్రేణికి చెందుతాయి. ఇకపోతే ప్రకృతి గురించి, ‘చెట్లు పుట్టల’ గురించి, మానవ సంబంధాల గురించి రాసేది సాధారణ కవిత్వమని (అంటే బహుశా అన్నిటికంటే తక్కువ స్థాయి అని ఆయన ఉద్దేశంగా నాకనిపించింది) ప్రమాద రహితం కాబట్టి ఎక్కువమంది అలా రాస్తారని తీర్మానించారు. మనం మహాకవులనుకొనేవారి ఆలోచనా పరిధే ఇంత తక్కువగా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రవాస కవిత్వంలో ప్రత్యేకతలు లేవా అంటే , తప్పక ఉంటాయి. ఇక్కడికి మాత్రమే చెందిన అనుభవాల గురించి రాసిన సందర్భాలు, ట్రాన్స్ ప్లాంట్ కావటంవల్ల మూలం నుంచి వేరయిన వేదనను ఆవిష్కరించే కవితలు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

“నేనొక చెట్టునిట

నన్ను నేనే పెళ్లగించుకొని

ఖండాంతరవాసి నైతిని

మొలకెత్తి తలయెత్తి చిగురించి పుష్పించుటకై

సారమిచ్చిన భారత భూమిక

పరభూమి నా కనవరతం

….. తల్లక్రిందులయిన నాకు

ఊర్థ్వమూల మథశ్శాఖః”

అని పెమ్మరాజు వేణుగోపాలరావు గారు రాసారు. అనేక సంవత్సరాల తరువాత నారాయణస్వామి, తన ఊరి నుంచి గుర్తుగా తెచ్చుకున్న మొక్కను గురించి చెబుతూ, అటువంటి పోలికనే వాడి ఆ విషయాన్ని ఆవిష్కరించాడు :

“మా ఊరి మొక్కను

ఎక్కడ నాటాలో తెలియక

నాలోనే

తలకిందులుగా

నాటుకున్నా

తలలోంచి బయటకు పెరిగిన

వేళ్ళు

భూమినీ ఆకాశాన్నీ

వొక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నయి.”

ఇక్కడికి వచ్చే తరాలు మారినా, తల్లక్రిందులయిన భావన మాత్రం మారలేదని వీటివల్ల తెలుస్తుంది. ఇదే విషాద భావాన్ని వైదేహీ శశిధర్ ఇటీవలి పుస్తకంలోని “మల్లె అంటు” అన్న కవితలో చాలా సున్నితంగా చెప్పారు. అందులో మొదట మల్లె అంటు సొగసుని వర్ణించిన తరువాత, చివర –

“తెగిన తల్లివేరు స్పర్స చల్లగా తగినట్లు తోచిందేమో

ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును

పచ్చని బాల్యాన్ని తలచుకుని చిన్నబోయిన మల్లె అంటు

చెమ్మగిల్లిన పూరేకులను దిగులుగా రాలుస్తుంది”

ఈ వియోగ భావం ఒకొక్కసారి అపరాధ భావంగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అఫ్సర్ కవిత “డెజావూ” లో

“ఏ అన్నాలవేళో

మిమ్మల్నందరినీ విడిచేసి వచ్చాను

అది మధ్యాహ్నమో, రాత్రో గుర్తులేదిప్పుడు

….. ఏ అన్నాలవేళోమరి

పొలిమేరలు దాటి, సముద్రాలు దాటి

అనేక జనావాసాల తడిపొడి నేలలు దాటి వచ్చాను

గుర్తున్నానా?”

అన్నప్పుడు ఈ అపరాధ భావమే వినిపిస్తుంది. కొన్ని కవితలలో ఈ వియోగ బాధ ఎంతవరకు వెళుతుందంటే, మరణానంతరం కూడా అది తీరదేమో అన్నంతగా వ్యక్తమవుతుంది. మొత్తం మీద, మాతృదేశ ప్రభావం ప్రవాస కవిత్వం మీద పడిన అతి పొడవైన నీడగా మనం చెప్పుకోవచ్చు.

దీనికి భిన్నంగా ఇక్కడి నేలను, ప్రకృతి వైభవాన్ని, పరిసరాల్ని ప్రేమించి, స్తుతించిన కవిత్వం ఆహ్లాదకరమైన పదచిత్రాల వెలుగులు నిండి ఆనందం కలిగిస్తుంది. ఇక్కడి ప్రదేశాలనే కాదు, అంతకంటే ఎంతో సుందరమైన ఋతువుల్ని, ఋతుసంధ్యలని దాదాపు అందరు ప్రవాస కవులు పొగిడారు. వీటిలో కూడా, ఇండియాలో మనకంతగా అనుభవంలోకి రాని ఫాల్, మంచుతో కూడిన వింటర్ – ఇవి రెండూ కవుల్ని ఎక్కువగా ఆకర్షించాయి. మంచు కురిసిన రాత్రిలో చంద్ర – కురుస్తున్న మంచు, గాలి పాపలు ఊదుకొంటూ పోతున్న పక్షి రెక్కల్లా ఉందని చెప్పినా, నా కవితలో ఒకచోట – ఉదయానికి మిగిలిపోయిన మంచు రాత్రి మరచి వెళ్ళిన వెన్నెలలా ఉందని చెప్పినా, ఫ్రోజన్ లేక్ కింద లేత కొబ్బరి నీరులా తేటగా నిలిచే హృదయ సౌకుమార్యం గురించి వైదేహి చెప్పినా, యదుకుల భూషణ్ శిశిర చిత్రాల్లో రాలిన ఆకులు రోడ్డు మీద చిన్న పిల్లల్లా పరుగిడతాయని చెప్పినా – అన్ని చోట్లా ఋతు సౌందర్యంపట్ల స్వచ్చమైన ప్రతిస్పందనే మనకు కనిపిస్తుంది. నిజానికి ఇక్కడి వివిధ కవులు ఋతువుల గురించి రాసిన పద్యాలన్నీ కలిపి ఒక సంకలనంగా రూపొందిస్తే చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడి కవుల ఘోష రెండు రకాలు – ఒకటి ఆత్మ ఘోష మరొకటి ఋతు ఘోష.

ఇంతకు ముందు చెప్పినలాంటి సామాజిక అంశాలతో కూడిన కవితలు అఫ్సర్ “ఊరి చివర” సంకలనంలో దొరుకుతాయి. “మెట్రోబస్ వెనకాల ఒక కితకితల నల్ల సముద్రమేదో అలలలలుగా తుళ్ళిపడుతుంది” అంటూ ఒక నల్ల అమ్మాయిని గురిచి రాసిన కవిత, యుద్ధ వ్యతిరేక కవితలు రాసిన ఇద్దరు మిత్రుల నుద్దేశించి రాసిన యుద్ధ వ్యతిరేక కవిత, హార్వర్డు యూనివర్సిటీలో ఒక ఆఫ్రికన్ ప్రొఫెసర్ మీద జరిగిన దాడికి నిరసనగా రాసిన కవిత వంటివి అనేకం ఇందులో ఉన్నాయి. నాకు బాగా నచ్చిన కవిత ఒక విద్యార్థితో అతని ఊరికి వెళ్ళిన అనుభవాన్ని వర్ణించే Take Me Home, Country Roads అనే కవిత. ఈ కవితల్లో ఇక్కడి నది పేరు, వీధుల పేర్లు, మనుషుల పేర్లు వంటివి వాడటం వలన వీటికొక స్థానికత ఏర్పడుతుంది. అప్సర్ కధకుడు కూడా కావటం వల్ల బహుశా ఇలా చెయ్యగాలిగాడనుకుంటాను. ఆ మధ్య నారాయణస్వామి కూడా క్షవరం చేసే నల్ల అమ్మాయి గురించి ఒక కవిత రాసాడు. ఆ అమ్మాయి లోతైన తడిమెరిసే కళ్ళను బట్టి ఆమెకున్న కష్టాల్ని ఊహించటం ఈ కవితలో ప్రదానాంశం.

రేస్ అన్నది అమెరికన్ సమాజంలో ఎప్పటికీ ముగిసిపోని సబ్జక్టు. మనలో ఎవరైనా ఎదుర్కొన్న వివక్ష గురించో, పైన చెప్పిన పద్యాలలో లాగా ఇక్కడి మైనారిటీల మీద కవికి కలిగిన సానుభూతి గురించో కాకుండా, మనవాళ్ళే కనబరిచే వివక్ష గురించి రాసిన పద్యాలు కొంత ప్రత్యేకమైనవి. మాచిరాజు సావిత్రి కవిత “నలుపు – తెలుపు” ఆటువంటి ఒక ఉదాహరణ. ఈ కవిత నల్లవారి పట్ల మనవాళ్ళుకున్న వివక్షను వివరిస్తూ, నల్లనయ్యని కొలిచేవాళ్ళే క్రమక్రమంగా ఆ దేవుణ్ణి నీలంగా మార్చిటం గురించి, మనం తెల్లవాళ్ళ మీద పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నా తెల్లదనం మీద మనకు తగ్గని మోజు గురించి, మనని మనం తెల్లవాళ్ళకి దగ్గరగా ఊహిచుకొనే బలహీనత గురించి ప్రశ్నిస్తుంది. నేను రాసిన ఈ క్రింది కవిత ఇదే భావాన్ని వ్యగ్యంగా చిత్రిస్తుంది.

చల్లని మధ్యాహ్నం వేళ

down town లో నడక

అంతగా జనసంచారం లేని వీధి.

ఎదురుగా నడుచుకొంటూ ఒక నల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాడు

తల దించుకుని వడివడిగా అడుగులు వేసాను.

కొంచెం దూరం పోయి కుదుటపడ్డాక

అటువేపు నుంచే ఒక తెల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాను

తల తిప్పుకొని వడివడిగా అడుగులు వేసాడు.

చాలా మంది ప్రవాస కవుల కవిత్వంలో బాల్యం, చిన్నప్పటి ఊరు మొదలైన వాటి గురించిన జ్ఞాపకాలే ఎక్కువగా కనిపిస్తాయి. మనసుని మనం స్వేచ్చాజీవిగా భావిస్తాము గాని, అది బాల్య యౌవనాలనే గొలుసుకి కట్టబడి, ఆ గొలుసు అనుమతించిన పరిమితికి లోబడి మాత్రమే సంచరిస్తుందని నాకనిపిస్తుంది. చాలామంది కవుల ఫార్మటివ్ ఇయర్సు అక్కడే గడిచాయి కాబట్టి అప్పటి జీవితం వారి కవిత్వంలో ప్రతి బింబించటంలో తప్పు లేదు. కాని, ఇప్పుడు సమాచార విప్లవం ప్రభావం వల్ల ప్రస్తుతాన్ని కూడా మానసికంగా అక్కడే గడిపే అవకాశం కలుగుతోంది. ఉండే నేల అమెరికాదే అయినా, ఆకాశం మాత్రం ఆంద్ర దేశంలో ఎక్కడో ఉంటుంది. ఒకచోట నివసించేవారి సాధక బాధకాలు చుట్టపు చూపుగా వెళ్లేవారికి అర్థం కావు. మీడియా ద్వారా లభించే దృశ్యం ఎప్పుడూ పాక్షికమే. అందువల్ల, అక్కడి హెడ్ లైన్లు చూసి, ఇక్కడి నుంచి కవిత్వం రాయటం అర్థంలేని పనిగా తోస్తుంది. అక్కడివాళ్లు విజిటర్లుగా వచ్చో, వినికిడి ద్వారా తెలుసుకొనో అమెరికన్ జీవితం గురించి కవిత్వం రాస్తే ఎంత అసంపూర్ణంగా ఉంటుందో, ఇది కూడా అంతే అసంపూర్ణంగా ఉంటుంది.

సావనీర్ల కోసమో, సంకలనాల కోసమో సరదాగా కవిత్వం రాసేవాళ్ళ రచనల్లో ఇక్కడి తెలుగువాళ్ళ జీవితాన్ని, లేదా మొత్తంగా అమెరికన్ జీవన విధానాన్ని విమర్శించే కవితలే ఎక్కువగా ఉంటాయి. పాలన రాసిన క్రింది పాటలాంటిది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది వంగూరి ఫౌండేషన్ వాళ్ళు ప్రచురించిన అమెరికా తెలుగు కవిత మొదటి సంకలనంలో చేర్చబడింది :

“చికాకెత్తి పోయినాదే ఈ చికాగో బతుకూ

చికాకుల మెల్తానే సెల్లీ సిల్లచ్చీ ….

దుంపల ఏయింపులూ, కొంపల సూపింపులూ,

తలుపుల తెరిపింపులూ దుకానాల్ల మురిపింపులూ,

పగటేసాల పెయింటింగులూ, పిజ్జాల యీటింగులూ

అనుబవించేసినానే!

రుచి చూసేసినానే సెల్లీ సిల్లచ్చీ ….”

అయితే, విమర్శగానో, వెక్కిరింతగానో కాకుండా, ఈ నేల మీద మమకారంతో, ఏ విలువల ఆధారంగా ఈ దేశం నిర్మించబడిందో ఆ విలువల మీద గౌరవంతో, నిజమైన అమెరికన్ డ్రీమ్ కోసం జీవించటానికి మరొక తరం పడుతుంది. ఆ తరం వారు దీనినే మాతృదేశంగా భావిస్తారు కాబట్టి వారికది సాధ్యమవుతుంది. వారిలో కొద్దిమందిలోనైనా కవిత్వ కాంక్ష మిగిలి, ఎవరైనా కవిత్వం రాస్తే, అది ఇంగ్లీషైనా, మన అదృష్టవశాత్తు తెలుగైనా, అందులో విభిన్నమైన ప్రవాస కవిత్వం చూడగాలుగుతామేమో!

చివరిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, కవి తన ప్రత్యేక దృష్టిని, కవిత్వం మీద తనకున్న నిజాయితీని, కవిత్వం ద్వారా తను చెయ్యాలనుకున్న సత్యాన్వేషణని వదులుకోనంత కాలం, ఆ కవి ఎక్కడున్నా మంచి కవిత్వం రాయగలుగుతాడు. ఆ అవకాశం ప్రవాస కవులకి తగినంతగా ఉంది. ప్రవాసం వల్ల ఏర్పడిన వియోగభారం బాధిస్తుంది గాని, అదే సమయంలో దానివల్ల కొన్ని వత్తిడులు, ప్రభావాలు దరిచేరకుండా కవిత్వం రాసుకో గలిగే వెసులుబాటు కూడా కలుగుతుంది. దీనిని సద్వినియోగ పరుచుకొని, ప్రవాస కవులు తమ ప్రత్యేకతను కాపాడుకొంటారని, విలువైన, సాంద్రమైన కవిత్వాన్ని పెంపొందదించటంలో తమ వంతు పాత్రను పోషిస్తారని ఆశిస్తాను.

 -విన్నకోట రవిశంకర్

64681_101182536614807_2154683_n

 

 

 

 

 

 

కాలాన్ని సిరాగా మార్చిన కవి

gournayudu

గంటేడ గౌరునాయుడి మాస్టారిని సాహిత్య లోకానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే తన కథలతో కవితలతో మనందరికీ సుపరిచితులే. ఇటీవల ఆగస్టు 8న తన అరవై వసంతాలు నిండిన సందర్బాన్ని పురస్కరించుకొని ’ఎగిరిపోతున్న పిట్టలకోసం’ అనే కొత్త కవితా సంకలనాన్ని తీసుకువచ్చారు.

 

ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్రగా పిలువబడే ఈ ప్రాంతంలో గత నాలుగు దశాబ్ధాలుగా జరుగుతున్న విధ్వంసం అది సామాజికంగా ఒక్కో పొరను కప్పేస్తూ కమ్మేస్తున్న వైనాన్ని అలాగే వ్యక్తిగతంగా మనిషితనానికి దూరమవుతు రక రకాల ప్రభావాలకు ప్రలోభాలకు లోనవుతు తమ ఉనికినే కోల్పోతున్న సంక్షుభిత సందర్భాన్ని తన కథలలోను కవితలలోను ఆవిష్కరిస్తారు మాస్టారు. ఈ కవితా సంకలనంలోని కవితలు 2011 నుండి మొన్నటి వరకు వున్న కాలానికి వేలాడుతున్న చినిగిన చొక్కాలాంటి బతుకు వెతలు. మాస్టారి శైలి జీవితంలోని అన్ని పార్శ్వాలను తన నుడికారంతో స్థానిక మాండలికానికి దగ్గరగా సామెతలతో కలగలిపి చెబుతూ ఒక ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి మనముందు ఆవిష్కరిస్తుంది.

 

చాలా మంది ఇటీవల వామపక్షానికి దగ్గరగా వున్న మేధావులు రచయితలు కూడా అభివృద్ధి అంటే విధ్వంసం కాకుండా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నిస్తూ చెరబండరాజు అన్నట్టు నీ ఖాకి నిక్కరు మార్చినారురో ఓ పోలీసన్న, నీ బతుకు మారలేదురో ఓ పోలీసన్న అన్నట్టుగా పొట్ట చేతబట్టుకొని నాలుగు గిన్నెలు ముంతలు ఓ సిమెంటు బస్తాలో మూటగట్టి మా వూరినుండి వెళ్ళే బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి చైన్నైకి, విజయవాడ పాసెంజరెక్కి ఆ చుట్టుపక్కలకి, నాగావళీ ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ కి పల్లెలనుండి వలస పోతున్న వారిని చూసి ఆహా రైతు కూలీ జనం కార్మిక వర్గంగా రూపాంతరం చెంది వీళ్ళంతా కార్మిక వర్గ విప్లవాన్ని తీసుకు వచ్చేస్తారు, పెట్టుబడి పల్లెలన్నింటిని కబలిస్తూ పట్టణాలలో కలిపి మెట్రో పాలిటన్ సిటీలుగా స్మార్ట్ సిటీలుగా మారిపోతున్నాయి యింక వ్యవసాయం చేయాల్సినది పెట్టుబడిదారులే అని చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లలో కాంప్లెక్సులలో ఉద్యోగాలు కావాలా? అన్న ప్రకటనలతో ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి జనం వలస బాట పడ్తున్నారు అని ప్రకటిస్తున్నారు. ఇది ఒక పార్శ్వం మాత్రమె.

కానీ ఈ జీవన విధ్వంసం వెనక ఈ ప్రాంతంలో అమలు జరుగుతున్న విద్వంసకర అభివృద్ధి నమూనాలు కారణంగా ఇక్కడి జనం తమ విరిగిన రెక్కలతో నెత్తురోడుతున్న భుజాలతో ఎక్కడెక్కడికో ఎగురుకుంటూ కాంక్రీట్ స్లేబుల కింద నలిగిపోతున్న తమ జీవితాలను, అనారోగ్యకర పరిస్థితులలో బతుకుతు ఆ వచ్చిన అరకొర కూలీని దాచుకొని పండగలకు పబ్బాలకు పల్లెలకు వస్తూ తామంత సంతోషంగ వున్నామని మురిపిస్తూ తిరిగి తిరిగి మరల మురికి కూపాలకు పునరంకితమవుతున్నారు. ఈ జీవన నరకయాతనను, చిధ్రమవుతున్న మానవ సంబంధాలను మాస్టారు ఈ కవితలలో మనకు చూపిస్తారు. ఈ బలవంతపు వలసలు, ఇగిరిపోతున్న పచ్చదనం, సెల్ ఫోన్ రింగులతో మూగబోతున్న పల్లె పాటలు, ఏ ఆసరా లేక కునారిల్లుతున్న ముసలి బతుకులు, మేపుకు దూరమై కబేళా బాట పట్టిన పశుసంపద ఈ చిద్రమైన తీరును మాస్టారు చెబుతారు. ఇది కొంతమందికి అభివృద్ధికి వ్యతిరేకంగా అవసరంలేని వలపోతగా కనబడడం విషాదం. కవికి కాలాన్ని సిరాగా మార్చడమే కర్తవ్యం కదా? అది మాస్టారిలో మనం పరికించవచ్చు.

 

ఇంక మాస్టారి కవిత్వంలో ప్రతీకల వెల్లువ వుంటుంది. ఉదాహరణకు

 

ప్రతి ఉదయపు నడకా ఒక మధుర గీతమే కవితలో

 

అదృశ్య హస్తాలేవో దోసిళ్ళతో ఆకాశంలోంచి

వొంపుతున్న పుప్పొడి ధూళిని తమ చిట్టి రెక్కలతో పిట్టలు

కొమ్మల మీదా రెమ్మల మీదా ఆకుపచ్చ మెరకల మీదా

గరిక పరకల మీదా వెదజల్లుతున్నప్పుడు,

 

చీకటిని అడిగి బొగ్గును

వేకువను అడిగి సుద్దను తెచ్చి ఉషస్సు

తన నలుపు తెలుపుల బొమ్మ గీస్తున్నప్పుడు

హృదయలయకి శ్రుతి కలుపుతూ ఆలపిస్తాను

నా చరణయుగళ గమన గీతం… అంటారు

 

మాట్లాడుకోవాలిప్పుడు కవితలో

 

చీలికల సంగతి మరచి

చేతులు కలుపుకోవాలి,

ఏటిదారానికి కూర్చిన పూసలు కదా మన ఊళ్ళు

పూసా పూసా చెప్పుకునే ఊసులు కదా

మన ఇల్లూ వాకిళ్ళు

కరిగిపోతుంది తీరం

తెగిపోతుంది దారం

ఇప్పుడే.. యీ క్షణమే

మాట్లాడుకోవాలి..

 

ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల దుఖాన్ని ఇలా చెప్తారు

 

అనుకున్నదే, ఏదో ఒకనాటికి యీ తల్లకిందులు తప్పదని

నోరూ వాయీ లేనోళ్ళం

తీరూ తెన్నూ తెలీనోళ్ళం

ఎవలకేటి కాదనీసినాం? ఎవలి మాట కొట్టేసాం?

ఏలినవోరిదయ, మీరేతంతే మామదే అన్నాం

పేగులు తెగిపోతంటే పెదివిప్ప్పి ఒకమాటన్లేదు

బతుకు బుగ్గైపోతుంటే బితుకు బితుకుమని కూకున్నాం

మా నేల మాది కాదనీసినా మూగోల్నాగ మూల జేరిపోనాం…

 

అయ్యలారా!

అన్నం పొట్లాలు అందించిందాక ఆయువుండాలగదా

ఎలీకాప్టరొచ్చిందాక హంసెగిరిపోకుంట ఆగాల గదా

మరపడవలు తెప్పించేవరకి గురుకు జారిపోకుండ వుంతే గదా? అంటూ

 

కట్టండి నాయనా కట్టండి

మాము కప్పులడిపోయిన ఇసక దిబ్బల మీద

కట్టండి ప్రాజెక్టులు… అంటారు.

 

పెట్టుబడిదారీ మనస్తత్వాన్ని యిలా చెప్తారు మాస్టారు

 

యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది

మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటాడు,

ఒక మారణ హోమం రగులుతూనే వుంటుంది

మరో మృత్యు యాగానికి ముహూర్తం నిర్ణయిస్తాడు.

 

మరణ మృదంగ నాదాలను మధుర సంగీతంగా

వినిపించగల మహా విధ్వాంసుడు వాడు

విద్యుద్ఘాతాలను బహుమతులుగా పంచగల

విద్వత్తు వాడిది……. అంటారు

 

అలాగే తెలంగాణా ఆకాంక్షను సమర్థిస్తూ

 

దుర్భరమే కావొచ్చు గాక ఎడబాటు

అదొక భవిష్యత్ పునస్సమాగమ సంతోష గీతిక,

వేదనా భరితమే కావొచ్చుగాక వేర్పాటు

అదొక మానవ మహోద్గమన సూచిక… అంటారు.

 

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగాక ఇంక రైతు చేసుకునే ఉగాది పండగ ఏముంటుంది అంటూ

 

గాదులు

ఇళ్ళముందునుంచి ఎగిరిపోయాక

ఉగాదులు ఒట్టి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి,

నాగలి

పురావస్తు ప్రదర్శనశాలలోకి పయనమైపోయాక

నాగేటి చాలొక చెదిరిన స్వప్నమైపోయింది….

లోహమహిషం ముందు నేను మోకరిల్లినపుడే

కొత్తామసకి కాలం చెల్లిపోయిందంటారు…

 

ఈ సంకలనంలో సద్దాం హుస్సేన్ ఉరిని టీవీలో చూస్తూ చలించి రాసిన ఈ కవిత

 

ఆకాశమంత నోటితో భూగోళం

నిరసన గీతం ఆలపిస్తుంటే

ఆత్మగౌరవ నినాదానికి అమావాస్య ముసుగువేసి

అహం నిస్సిగ్గుగా నవ్వింది.

ఆచ్చాదన లేని స్వేచ్చా విహంగం

ఉరితాడును ముచ్చటగా ముద్దాడింది

 

డాలర్ ఎగరేస్తున్న తుపాకీ మొనగాడి దగ్గర

భూగోళాన్ని వేలాడదీసే ఉరితాడు ఉందంటారా… అని ప్రశ్నిస్తారు.

 

గోర్కీ స్మృతిలో, భగత్ సింగ్ స్మృతిలో రాసిన కవితలతో పాటుగా తమ ఇంట్లో వొంగిన ఇంద్రధనస్సు మనవరాలిపైనా రాసిన కవితలతో పాటుగా ఉద్యమంలో అసువులు బాసిన వారిపట్ల సానుభూతితో రాసిన కవితలు ఇలా మనల్ని కదిలించి ఆలోచింప చేసే పద చిత్రాలతో నిండైన కవిత్వాన్ని మనకందించారు గౌర్నాయుడు మాస్టారు. తప్పక చదివి కదలాల్సిన కవిత్వం. ఇది స్నేహకళా సాహితి, పార్వతీపురం వారి ప్రచురణ. ప్రతులకు

 

గంటేడ కిరణ్ కుమార్

S.N.P. Colony,

Near Ramalayam, Belagam,

Parvathipuram – 535 501.

 

వెల: రూ.70/- లు.

  – కేక్యూబ్ వర్మ

 varma

 

 

తన్మయత్వం అంటే…?

చదివేటప్పుడు పాఠకుడు నేను ఎక్కడ ఉన్నాను?’ అని ప్రశ్న వేసుకుంటే నేను ఇక్కడ ఉన్నానుఅని స్వీయ లోకం నుంచి కాకుండా మరోలోకం నుంచి మారు బదులు వస్తే అదే తన్మయత్వంఅంటారు ప్రముఖ సాహిత్యవేత్త కవికొండల వెంకటరావుగారు యనభై ఏళ్లకిందట ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకని రాసిన ఒక వ్యాసంలో. వారి అబిప్రాయం ప్రకారం పాఠకుడు తన దృష్టిపథాన్ని విడిచిపెట్టి.. కవి దృష్టిపథాన్ని విడిచి పెట్టి.. చదివే అంశం దృష్టిపథం వెంటబడి పోవడమే ఆ తన్మయత్వ ముఖ్య లక్షణం. వాస్తవంకూడా అంతేననిపిస్తోంది.

రామాయణం రాసిన వాల్మీకి కథ కాదు. చదివే పాఠకుడి కథ అంతకన్నా కాదు. సీతారాముల కథ. మనల్ని మనం  మరచి, వాల్మీకినీ మరచి, సీతారాములనే స్మరించుకుంటో చదువుతాం కదా.. అదేనేమో వెంకటరావుగారు ఉటంకించిన ఆ పరలోక శక్తి! నిజమే. శ్లోకం ప్రతిపదార్థమో.. తాత్పర్యమో తెలుసుకుంటో అంతః సారంలోకి వెళ్ళకుండా పదే పదే ఎంత వల్లె వేసినా అది పురాణ పఠనం అవుతుందేమో  గానీ తన్మయత్వం కాబోదు గదా! ఆ తన్మయలోక ప్రయాణానికి టిక్కెట్టు దొరకటం అంత సులభం కూడా కాదేమో!

అంశా’న్నే లక్ష్యంగా తీసుకోవడం -అంటున్నారు వెంకటరావు గారు. అంటే ఏమిటో? బాహ్య స్వరూపమైన భాషను అనా అర్థం? ఆంతరంగికమైన భావాన్ని అనా అర్థం? రెండూ కాదు. అంశం ప్రతిపాదించే ధర్మం అని అనుకుంటా వెంకటరావుగారి ఉద్దేశంలోఉన్నది.

 ధర్మం ప్రతిపాదించని అంశం అంటూ ఏదైనా అసలు ఉంటుదా? ఉండదేమో. ధర్మం సహజ లక్షణం మర్మం. ఆ మార్మికత మీద లక్ష్యం ఉంచడమే తనయత్వం సాధించే ప్రక్రియల్లోని ముఖ్య మార్గం అనిపిస్తోంది.  రావణాసురిడి పది తలలమీదో, రాములవారి ధనుర్విద్యా పాటవం మీదో దృష్టి లగ్నం చేస్తే పర శక్తి కనికరించదు. సీతారాముల చరిత్ర ముఖ్య ధర్మం  నైతికత. భాతృధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రత సంకల్పం. నిష్ట, నైష్టిక ప్రవృత్తి, శరణాగత ఆర్త త్రాణ పరాయణత్వం లాంటి చరిత్రోదితాలైన ‘ధర్మా’లమీద దృష్టిసారిస్తేనే తన్మయత్వం సాధ్యం అయేది.

unnamed

రావుగారి లెక్క ప్రకారం ఈ ధర్మం మళ్లీ రెండు విధాలు.

1.విశ్రుతం

2.విస్మృతం

ప్రచండ వేగంతో వీచి, పెద్ద పెద్ద చెట్లను పడదోసి, భయంకరమైన వాననీటితో ముంచెత్తే గాలివాన ఆర్భాటం లాంటిది కేవల శ్రుత ధర్మం అయితే..  దూదిగుట్టలాగా విశాల ఆకాశానికి ఒక మూల ఒదిగి  సూర్యకాంతికి ఆరుతున్నట్లుండే తెలిబూది మేఘంలాంటిది విస్మృత ధర్మం.

ప్రకృతిలో  ఆ రెండు ధర్మాలూ విడివిడిగా ఉండవు. ఒకే ఒరలోని  రెందు కత్తుల్లా ఉన్నా.. ముందు మన మనసుకు తళుక్కుమని  తట్టేదే ప్రధాన ధర్మం. తుఫాను వీచేటప్పుడు విరామాన్ని గురించిన ఆలోచన తోచదు కదా! కదలక మెదలక  నిలబడి ఉన్న మేఘ శకలాన్ని చూసినా అంతే! అలాగే అప్పటిదాకా అది చేసిన ప్రయాణం కాని, ఇకముందు చేయబోయే ప్రయాణాన్ని గురించి గానీ మనసుకు తట్టదు. తుఫానుది చలనం.. మేఘశకలానిది నిశ్చలనం.. ప్రధాన ధర్మాలు కావడమే ఇందుకు కారణమేమో! అయితే ఇది కేవలం బాహ్యలోక లక్షణం మాత్రమే.

 

కావ్య ప్రపంచంలో అలా ఉంటుందా?  రెండు ధర్మాలూ ఒకే చర్యలో సమ్మిశ్రితంగా  ఉండి.. పాఠకుడి మనోనేత్రానికి ఒకేసారి దృగ్గోచరం  అవుతుంటాయి కదా! అంశం పరిపూర్ణంగా ప్రత్యక్షం అయే దాకా ఉత్కంఠను నిలిపి ఉంచేదీ ఈ సమ్మిశ్రిత ధర్మ సూత్రమే.

ఆకాశంలో నిలకడగా ఉన్న మేఘాన్ని కాళిదాసు మహాకవి దేశ దేశాల వెంట తిప్పి విశ్రుతం చేసాడు. విస్మృతిలో ఉన్న మేఘానికి విశ్రుత ధర్మం ఆపాదించడమే మేఘదూతంలో మహాకవి చూపించిన గడుసుదనమేమో! అక్కడ పాఠకుడు తన్మయత్వం పొందాలంటే ముందు విస్మృత స్థితిలో ఉన్న మేఘాన్ని దర్శించాలి. దాని వెంట దేశదేశాలు తిరుగుతున్నట్లు ఉహించుకుని శ్లోకాలు చదువుకోవాలి. మనన చాతుర్యం లేకుండా కేవలం పఠన చాతుర్యంతో  తన్మయత్వాన్ని సాధించడం అంటే   తివిరి ఇసుమున తైలంబు తీసే ప్రయాసే అవుతుంది.

అయితే ఆ తన్మయత్వపు స్థాయి చదువరి పఠన చాతుర్య భేదాల మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి బాలకృష్ణుణ్ని ఎగరేసుకు పోయే తృణావర్తుని కథ చదువుతున్నాం అనుకుందాం. కథ వరకూ చదివి ఊరుకుంటే అది విశ్రుతం. తన్మయత్వానికి ఇ అక్కడ తావన్నదే లేదు. ఆ సుడిగాలిని అచి మందస్మితారవిందంతో కిందకి దిగివచ్చే బాలకృష్ణుణ్ని విస్మృతికి తెచ్చుకుంటేనేగాని సంపూర్ణ తన్మయత్వం సాధ్యం కాదు.

 తన్మయత్వాన్ని పాఠకుడి స్మృతిపథంలోకి మళ్ళించే రసవిద్య బాధ్యత  కృతికర్తది అయితే.. కావ్య పఠనంలోని తన్మయత్వ స్థాయిని అందిపుచ్చుకునే శక్తి చదువరి  బుద్ధిస్థాయి ఆధారితం. ఆ సృజన శక్తి  కవులందరికీ ఒకే విధంగా వశం కానట్లే.. ఈ పఠన కౌశలమూ చదువరులందరి బుద్ధి స్థాయికీ ఒకే విధంగా అందదు. ఆ రస రహస్యం అంతుబట్టకే కావ్య(కవిత్వ)లోకంలో అప్పుడూ ఇప్పుడూ ఇన్నిన్ని వృథా కుమ్ములాటలు!

 

(ఆంధ్ర పత్రిక 1931 సంవత్సరాది సంచిక లోని కవికొండల వెంకటరావుగారి తన్మయత్వంగల్పిక చదివిన తరువాత కలిగిన ఆలోచనలు)

 – కర్లపాలెం హనుమంతరావు

65591_493465577379457_2073403944_n

 

మీరు ఒకసారి ఆగి చదవాల్సిన నరేష్ కవిత!

కవిత్వం కొన్ని సార్లు అలవాటుగా చదివేస్తూ పోలేం. అక్కడక్కడా కొద్ది సేపాగి మనల్ని మనం తడుముకుంటూ దాగి వున్న కాసింత నెత్తుటి గాయపు తడిని స్పర్శిస్తూ ఒక్కో పాదం అంచునుండి కిందకు పోగలం. వెళ్తూ మరల పైకి ఒకసారి చదవాలనిపిస్తుంది. చదివి కనుల తడిని తుడుచుకోబుద్ధి కాదు. అలాంటి కవిత్వం ఈ మధ్య యువ కవి కెరటం నరేష్ కుమార్ రాస్తున్నాడు. కవిసంగమం ద్వారా పరిచయమయిన ఈ అబ్బాయి కవిత్వం తనలాగే నిటారుగా నిబ్బరంగా మనముందు నిలిచి వుంటుంది.

nareshkumarచాన్నాళ్ళుగా కవిత్వం చదువుతున్న మీరు, రాస్తున్న మీరు ఒకసారి ఆగి చదవాల్సిన కవిత్వం నరేష్ కుమార్. వ్యక్తిగత పరిచయంలోనూ తన నవ్వు వెనక వుండే ఒక విషాదపు జీర ఈ కవి అక్షరంలో కూడా ఒదిగి వుంటుంది. ధిక్కార స్వరంలా గర్జించేటపుడైనా ఒక మార్థవం మూర్తీభవించడం గమనించవచ్చు. ప్రతి పాదంలోనూ స్వేచ్చగా ప్రతీకలకోసం తపన పడకుండా ఒక్కో పదం అల్లుకుపోతూ సూటిగా సరళంగా హృదయాన్ని తాకేట్టు చెప్పడం నరేష్ కవిత్వంలో మనకు ఎరుకవుతుంది.

ఇది ఇప్పుడు రాస్తున్న యువ కవుల ధారగా మనం గుర్తించ వచ్చు. కవిత్వాన్ని సుళువుగా నిస్సంకోచంగా నిర్భయంగా రాస్తున్న నేటి యువకవితరంలోని వాడిగా ఇటీవల ‘వాకిలి’లో వచ్చిన ఈ కవిత చదివి మరొక్క మారు అందరం చదువుదామని ఈ పరిచయం.

 

నిరాసక్తం

ఎందుకు వెలిగించి ఉంటారు
ఎవరైనా ఆ దీపాన్ని..!?
కంటి కొలకుల్లో మసిని తుడిచి వెచ్చని వెలుతురు
స్రవించేలా ….
జిగటగా కారే వెలుతుర్లో చేతిని ముంచాక
స్వచ్చమైన చీకటితో
మనసుని కడిగేసి
ఎవరో
వెలిగించే ఉంటారు ఆ దీపాన్ని..
ఎవరివో
కొందరు బాటసారుల
నిర్నిద్రా సమయాల
నిరాసక్త నిరామయపు
నిశ్శబ్దాన్ని కరిగించి
కర్పూరపు పొడిగా
రాల్చుకున్నాక
స్వచ్చంగా
స్వేచ్చగా
వెలుగుని ఎగరెసేందుకు
వెలిగించి ఉంటారు
కొన్ని పగిలిపోయిన
ఆకాశాల
ముక్కలని వెతికేందుకు
ఏవో ప్రమదా వనాల
చిత్తడి దారుల్లో
ఈ ప్రమిదని
వెలుగుల కాగడాగా
వాడేందుకేమో
ఏమో మరి…
ఎందుకోమరి
వారా దీపాన్ని ఒక
దేహంగా వెలిగించి ఉంచారేమో
బహుశా…
ఒకనాటి అనామక
పాదాలకంటిన
ఎర్రని పారాణి గానో
పోరాటపు వెలుగుల
నెత్తుటి గుర్తుగానో
ఆ దీపాన్ని
ప్రజ్వలించి ఉండవచ్చు
లేదంటావా…
కొన్ని అస్పృశ్యపు
ఆత్మ కథలు
రాయబడగా మిగిలిన
సిరాని ఎవరైనా
అక్కడ వొంపిఉండొచ్చు…
ఆ వెలుగుతో
ఒక కౄర
ద్వాంతపు దంతాన్ని
ద్వంసం చేసి
ఉండొచ్చు
ఐనా మిత్రుడా…!
ఎవరు వెలిగిస్తేనేం
ఆ వెన్నెల దీపం
అమ్మ గోరుముద్దా కావొచ్చు
ఒకనాటి ప్రేయసి గోటి ముద్రా
ఐ ఉండనూ వచ్చు..
శాశ్వతత్వపు చీకటిని
కాసేపు మరిచేందు కైనా
ఆ దీపాన్నలా వెలగనీయ్
ఏమో…!
ఒకవేళ
ఆ దీపం నీ నుండి
వేరైపోయిన
నువ్వె అయి ఉండొచ్చు….

ఈ కవిత చదివాక కవితను గురించి మరల విడమర్చి చెప్పనక్కరలేదు. తను కోరుకుంటున్న వెలుగు మనలోనే మనతోనే వుండి మాయమయి పోవచ్చనే ఆర్తిని ప్రదర్శిస్తూ మనకు ఓ జలదరింపును కలుగజేస్తుంది. చదివాక ఒక నిట్టూర్పు మనలనుండి బయటపడి ఒక జాగరూకతను గుర్తుచేస్తుంది. ఇలా యింత సూటిగా రాసే కవిత్వం నేటి అవసరం. అది నరేష్ కుమార్ కు పట్టుబడింది. మరిన్ని కవితలను ఈ కవి నుండి ఆశిస్తూ అభినందనలతో.

-కేక్యూబ్ వర్మ

varma

 

 

మార్మికతా మరకలు

                                   Tripura

త్రిపుర కథాసర్పాలు నన్ను చుట్టేశాక

దిగులుచీకటి నిండిన గదిలో

పొగిలిపోవటమే పనైంది నాకు

లోపలి తలుపులు ఒకటి తర్వాత వొకటి

తెరుచుకుంటూ మూసుకుంటూ తెరుచుకుంటూ

బయటి కోలాహలం బాధానలమైతే

లోపలి ఏకాంతపు చీకటి

తాపకారకమైన నిప్పుకణిక

మనసును గాజుపలక చేసి

మరకల్తో అలంకరించుకున్నాక

దుఃఖజలంతో కడిగేసుకోవటం

చక్కని హాబీ

వెలుతురు లేని కలతబోనులో

సుఖరాహిత్య శీర్షాసనమే

నిను వరించిన హారం

ఎటూ అవగతం కాని భావం

ఎప్పట్నుంచో గుండెను కెలుకుతున్న బాకు

ఏమీ చెప్పలేనితనపు శూన్యత్వం

అంతరంగపు లోతుల్లో

కోట్ల నక్షత్రాల ద్రవ్యరాశి

అన్ని పొరల్నీ రాల్చుకున్న అస్తిత్వాన్ని

నిర్భీకతా వలయాల్లోకి విసిరేసి

నిప్పుల నదిలో స్నానించే ఆత్మకు

సాటి వచ్చే సాఫల్యత యేదీ

‘భగవంతం కోసం’ అల్లిన

అసంబద్ధ వృత్తాంతపు అల్లికలో చిక్కి

వెల్లకిలా పడుకోవటం ఊరట

‘కనిపించని ద్వారం’ కోసం

ఫలించని తడుములాట యిచ్చిన

ఉక్కిరిబిక్కిరితనపు కొండబరువు కింద

ఆఖరి నివృత్తితో అన్ని బాధలకూ సమాప్తి

‘సుబ్బారాయుడి’ ఫాంటసీ ప్రవాహంలో

ఆత్మన్యూనతా గాయానికి అందమైన కట్టు

‘కేసరి వలె’ వీకెండ్ విన్యాసాల్లో

కీడు అంటని చిన్నారి విజయరహస్యం

‘హోటల్లో’ కొలాజ్

మనోహరమైన మాంటాజ్

‘జర్కన్’ లో జవాబు దొర్కెన్

కథాసర్పాలు చుట్ట విప్పుకుని

కనుమరుగై పోయినా

మనోచేతన మీది మార్మికతా మరకలు

పరిమళిస్తూనే వుంటాయి

పది కాలాల పాటు

(సెప్టెంబర్ 2 త్రిపుర జన్మదినం)

-ఎలనాగ

elanaga

ఏడు పదుల “నయాగరా”… నవ కవిత్వ నగారా!

 

అది మార్చి 1944 అప్పటికే ఒకటో రెండో కవితలు మినహా మొత్తం మహా ప్రస్థాన గీతాల రచన శ్రీశ్రీ పూర్తి చేశారు. చలం గారి ముందు మాటలూ వచ్చి చేరాయి. అయినా , 1950 దాకా ,‘మహా ప్రస్థానం’ ఒక సంపుటంగా వెలువడే అవకాశాలు సానుకూల పడలేదు. ఆ గీతాలన్నీ ఎన్నో ఏళ్లుగా ఎందరో కవుల  నోళ్ల ద్వారా , సభల్లో గానం చేయడమూ, అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగుతూ వస్తోంది.

చూడబోతే  యుద్ధపు రోజులు , సామ్రాజ్య పంజరాలు బద్దలయ్యేలా సామాన్యుల సాహసాలు నమోదవుతున్నాయి. దగ్గరలోనే తెలంగాణ కూడా వ్యతిరేక పవనాలకు ఊతమిచ్చి ప్రతిఘటన తల దాల్చింది. అటు సోమసుందర్ , ఆరుద్ర,, కుందుర్తి వంటి కవులు జన గళాలకు తమ అక్షర నివాళులిచ్చిన , కొత్త నమ్మకాలు వెలార్చిన దశాబ్దం అది. 1948, 49 వత్సరాలలో కానీ ఈ కావ్య దుందుభులు మోగలేదు వజ్రాయుధాలుగా ,‘తెలంగాణా’ లుగా.

కవులు రాజుల ఏనుగులేక్కే కాలం కాదిది. ప్రజలు రాజుల్ని సింహాసనాల మీంచీ ఏనుగుల మీంచి కిందికి దింపే కాలం. అది కవుల చేతుల్లో అక్షరాల కరవాలం . మరీ ముఖ్యంగా ముగ్గురు అభ్యుదయ కవుల యవ్వనాల నయాగరా హోరెత్తిన దశాబ్దం అది. అది మార్చ్ 1944, బెల్లం కొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ల మూడు ముళ్లు తొమ్మిది కవితల ‘నయాగరా’ కవితల సంపుటి వెలువడిన నెల. ఈ నవ కవితల నవ్య ధార నగారాకు, ఇది సప్తతి పూర్తి నగారా మొగుతున్న వత్సరం(1944-2014).

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

అభ్యుదయ కవితా యుగం లో అచ్చైన తొలి కావ్యంగా దీని విశిష్టత ఎనలేనిది. ఈ కవులు ప్రగతి శీల భావ దురంధరులు. కోస్తా జిల్లాల యువకులు. వామ పక్ష జన ప్రయోజనాభిలాషులు. రోజూ యుద్ధ మృగంతో తల పడుతున్న ప్రపంచం లో . సామాన్యుల ముందర ఉన్నది ఒక్కటే ఆశ, ప్రజానుకూల శక్తులు గెలవాలి. నియంతలు, సైన్యాధికారోన్మాదులు . నర హంతలు ఓటమి పాలవ్వాలి. దేశాదేశాలను మెల్లగా యుద్ధపు ఊబిలోనికి లాక్కుపోతున్న ప్రపంచ పరిస్థితుల కాలంలోనే ఈ ‘నయాగరా’ ప్రపంచాగ్నికి సమిధగా వెలువడింది. ఈ కవితలు కొద్ది సంఖ్యలో వున్నా, వీటి చైతన్య స్థాయి గొప్పది. అది ప్రజల పక్షాన నిలిచింది.

ఎర్నస్ట్ టాలర్

ఎర్నస్ట్ టాలర్

అందుకే ఏ చిరు కవితల పొత్తం అంకితం ఇచ్చారు వీరు ఒక జన్మతః యూదుడైన , జర్మన్ నాటకకర్త , వారం రోజుల పాటు బవేరియా సోషలిస్ట్ రిపబ్లిక్ కు అధ్యక్షుడిగా పని చేసిన ఎరన్స్ టాలర్ కు , అతని పంక్తులనే ఊటంకిస్తూ.

“ఎప్పుడు మనం ప్రేమలో బతుకుతాము

ఎప్పుడు మనం ఇష్టమొచ్చిన పని చేయ గల్గుతాము

ఎప్పుడు విముక్తి???”

యుద్ధ పిశాచి దురంతాలకు లోనయి ఉన్న యావత్ ప్రపంచమూ, సామ్రాజ్య వాదుల పెచ్చుమీరిన దోపిడీ పరిపాలనలో ఉన్న ఎన్నో బడుగు దేశాలూ, బహుశా ఇదే ప్రశ్న తో పడే పడే సతమవుతున్న కాలం అది . అందుకే తెలుగులో తొలి అభ్యుదయ కవిత్వ సంపుటి ఇదే ప్రశ్నలు వేసింది. మొదటి మూడు కవితలు ‘నా గీతం’,’ఈ రోజున’. ‘చెరసాల’, బెల్లం కొండ రామ దాసు గీతాలు. వీటిని ఆయన రెండు నెలల ముందే అంటే జనవరి 1944 లోనే రాశారు. వీటిలో అంతర్జాతీయ స్పృహ, గుచ్చెత్తి చూపే అభివ్యక్తి , అచంచలమైన ప్రజాపేక్ష విశ్వాసం మెండుగా ఉన్నాయి.

మధ్య లోని మూడు కవితలు కుందుర్తి ఆంజనేయులు రాసినవి ‘మన్యంలో’,(ఏప్రిల్, 1943),‘జయిస్తుంది’, (అక్టోబర్ , 1941),‘తర్వాత’,(సెప్టెంబర్. 1942) లో రాయబడ్డాయి. వీటిలో మన్యం లో కవిత , విశాఖ మన్యం వీరోచిత పోరాట కారుడు అల్లూరి సీతారామరాజు గురించిన కదన కధనం. బహుశా అల్లూరికి అక్షర తర్పణాలు ఇచ్చిన అభ్యుదయ కవులలో కుందుర్తి ముందు వరుస లో వుంటారు. అల్లూరి బలిదానం(07/05/1924), తర్వాత పందొమ్మిదేళ్ళకు వెలుగులోకి వచ్చిన కవిత ఇది. కుందుర్తి అల్లూరి పై అంగార మాల రచిస్తే , ఏల్చూరి సుబ్రహ్మణ్యం తన మూడు కవితలలో ఇంకాస్త భిన్నంగా కనిపిస్తాడు.

ఈయన ‘ఠాకూర్ చంద్ర సింగ్” (జూలై, 1943), “ప్రజాశక్తి’, (జూన్, 1941),‘విజయ ముద్ర’(మార్చి, 1941) కవితలను నయాగరాకు అందించాడు. కవితల్లో ఎక్కడా ‘నయాగరా’ పదాన్ని ఈయన ముందు కవులిద్దరివలే వాడలేదు. బెల్లం కొండ రామదాసు ‘నా గీతం’ లో ,‘జగత్తునొక నయాగరా జల ధారలుగా వర్షించిన నా గీతం’, అని రాయగా , కుందుర్తి ‘గబ గబ గబ గబ నయాగరా జల పాతం లా నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది’ అంటారు తన గీతం ‘జయిస్తుంది’ లో.

Kundurti anjaneyalu

1938 కి ముందే అత్యధిక శాతం శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థాన గీతాలు , భావావేశ సంపన్నతకు ప్రతిబింబాలై , ఒక తాత్విక స్థాయి నుంచి ప్రజా పక్షం వహిస్తాయి. తక్షణ సందర్భాలు, కవితా వస్తువు కావల్సిన అవసరం శ్రీశ్రీ కి జూన్ 22, 1941, దాకా కలగ లేదు. అప్పుడే ‘గర్జించు రష్యా ‘ గీతం చండ ప్రచండంగా వెలువడింది. ఇంచుమించు యుద్ధకాలపు నీడలే నల్లగా వ్యాపించిన ప్రపంచం గురించి, ప్రగతి అనివార్యత గురించి, శ్రీశ్రీ ని ఆరాధించే , అభిమానించే ముగ్గురు తెలుగు కవులముప్పేట హారం ఈ కవిత్వ నయాగరా!

భాషా పరంగా , ఒకింత మోతాదు ఎక్కువగా అలంకారిక గ్రాంధికమా అన్పించే నడక బిగి , ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచనల్లో విరివిగా కన్పిస్తుంది. ‘సముద్ధర్త’,‘రూక్షోజ్వాల రుధిర దీప్తి’. ‘తమసా గర్భ ధళన హేతి’,’‘సుప్తోధృత జీవ శక్తి’ అంటూ మొదలైనా ఏల్చూరి విశ్వాసం తిరుగులేనిది. ‘వొస్తున్నది ప్రజా శక్తి’ అంటూ సాగే ఈ నయాగరా గీతం, యుద్ధాన్ని నిలదీస్తుందిలా ,‘హత్యకు హారతులిచ్చే , అగ్నికి దాహం పెంచే చీకటి కాటుక దిద్దిన యుద్ధం’. వామ పక్ష శక్తుల విజయాన్ని విశ్వసనీయంగా ప్రకటిస్తుంది. ‘ఎగిరే ఎగిరే ఎర్రటి జెండా , కరకరలాడే కొడవలి పదునూ, లోహం వంచిన సమ్మెట పెట్టూ, వైప్లవ్యపు వైతాళికులై నినదించెను నిప్పుల గొంతుక!’. ఈ ఏల్చూరి గీతం , అదే కాలం లో వెలువడిన మఖ్దూం మొహియుద్దీన్ కవిత ,‘వస్తున్నది , వస్తున్నది సామ్యవాద మహా నౌక , యువకుల బలిదానాలను అందుకుంటూ వస్తున్నది’ ను బలంగా మన మనసుల్లో మెరిపిస్తుంది.

Bellamkonda ramadasu

‘నా గీతం’ అనే బెల్లం కొండ రామదాసు గీతం, అంతర్జాతీయ సంఘర్షణామయ ప్రపంచ గందరగోళం లో, ఒక ప్రజల చేతి ఆయుధం ‘ నా గీతం’ అంటూ బెల్లం కొండ దర్శించేది , బహురూపాలైన జన ప్రతిఘటనను. 1944 లో రాస్తున్నాడేమో, యూరప్ నగరాల బాంబు మోతలు తన కవితల్లో సాకారమౌతాయి. “గత సాంఘిక నరబలి నగరం పై బాంబులు దూకించిన నా గీతం”, అంటూ వర్గ రహిత సంఘ స్వర్గానికి పూల నిచ్చెనలు వేసిందట, నరహంతలకు చెరసాలలకు , ఊరి తీర్పులకు , నిరంకుశ నియంతలకు తల కొరువులు పెట్టిందట’ అని కవన వ్యాఖ్యానం చేస్తూ జీవితాన్ని విహంగం చేసిందట’ అని నయాగరా అంతా నవ మోహన విహంగం అవుతాడు ఈ కవి కుమారుడు.

ఉన్నవి తొమ్మిది కవితలే . రాసింది ముగ్గురే . అయినా ఇదొక ప్రయాణానికి పచ్చ జెండా. ప్రపంచ విప్లవ శక్తుల గుర్తింపు, దేశదేశాల రూపు రేఖలు మారి పోనున్న మహత్తర సందర్భాలు , వాటిలో అతలాకుతలమయే మానవుడి పాత్ర , ఇవన్నీ వీటిలో సముచితంగా , సమున్నతంగా ప్రస్తావితం కావడం , ఈ నవ కవితల నయా గరాకు కొత్త వడిని, వరవడినీ తెచ్చి పెట్టింది. అల్లూరి గురించి కుందుర్తి రాయగా , దండి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 18 గర్వాల్ దళ నాయకుడు ‘ఠాకూర్ చంద్ర సింగ్ ‘ కు ప్రశంసగా తన గీతం అదే పేరుతో రాశారు ఏల్చూరి .

యుద్ధ కల్లోల దశాబ్దాలలో కవిత్వ రచనా చేస్తున్నా, తమ జీవన సౌకుమార్యతలను కోల్పోని ఈ ముగ్గురు నయాగరా త్రేతాగ్నులు (ఇది ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి మాట ), ఈ సంపుటిని అనిశెట్టి సుబ్బారావు (మరొక ప్రముఖ తెలుగు అభ్యుదయ కవి), లక్ష్మిల వివాహ సందర్భంగా ‘అని-ల’ కు అంకితం ఇచ్చారు.

ఇంకా ముందుగా ప్రస్తావించబడ్డ ఎరన్స్ టాలర్, దేశాలు వేరైనా ఫ్రెంచ్ వారయినా ఫ్రెంచ్ వారూ జెర్మన్ వారూ సోదరులే అని చెప్పడం తో పాటు , ఆనాటి హిట్లర్ ఆధిపత్య దేశంలో హీరోలను, హీరోయిజాలను తిరస్కరిస్తూ, “అసలు ఉదాత్త నాయకులనే భావనే అన్నిటికన్నా అతి తెలివి తక్కువ ఆలోచన” అన్నందుకు ఏళ్ల తరబడి చెరసాలల్లో బతికాడు. జెర్మనీలోని ఫాసిజపు ముష్కర మూకలు, నాజీల స్నేహాన్ని నిలదీస్తూ , యూరప్ అంతా ఉపన్యాసాలు ఇచ్చాడు. 1939 లో ఒక హోటల్ గదిలో ఉరిపోసుకు చనిపోవడం వెనుక వివాదాస్పద కధనాలు వున్నాయి.

ఇలా డెబ్భైయ్యేళ్ళకు వచ్చిన ‘నయాగరా’ ఒక సంఘటనల సమాహారం. జాతీయంగా , అంతర్జాతీయంగా , ప్రాంతీయంగా 1940లకు అటూ , ఇత్తూ గల సామాజిక పరిణామాలకు దర్పణంగా నిలుస్తూ దార్శనిక సంపన్నతను నిండుగా కలిగున్న మైలు రాయి ఈ కవిత్వ సంపుటి. ఏడు దశాబ్దాలు నిండిన ‘నయాగరా’, తెలుగు ఆధునిక కవిత్వం లో శిఖరమూ, జల పాతమూ కూడా .

రామతీర్థ

ramateertha

ఇది poetry + prose లోని రెండు భావనల fusion!

fusion

నేపథ్యం —

            ప్రస్తుత ప్రపంచం లో మనకంటూ ప్రత్యేకంగా దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు , భాషలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ గ్లోబలైజ్డ్ వ్యవస్థ లో మన తరం మాత్రం మల్టీ కల్చరల్ విశ్వం లోనే బ్రతుకుతోంది. దీని ప్రభావం ఇప్పుడు మన ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణ లలో కూడా కనిపిస్తూనే ఉంది. అంతే గాక మానవ భావోద్వేగాలను వ్యక్తీకరించే సాధనమే భాష అయితే, కొన్ని భావోద్వేగాలను కొన్ని భాషలలోని పదాలు, ఇతర భాషా పదాల కన్నా బలంగా, గాఢoగా అభివ్యక్తి చేస్తాయనేది కూడా నిజం. దీని వల్ల, సంక్లిష్టమూ, సమ్మిశ్రితమూ అయిన సమకాలీన జీవన వీక్షణ ని కూడా మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్ దృక్కోణం లోంచే పరిశీలించాల్సిన ఆగత్యం ఏర్పడుతోంది. ఈ అనివార్యతే ఇప్పుడు new-gen కవిత్వం పుట్టుకకు కారణం అవుతోంది. ఈ మల్టీ లింగ్వల్, మల్టీ కల్చరల్ కవిత్వా  నేను fusion షాయరీ అని పిలుస్తున్నాను.
ఆవశ్యకత

               పద్యం లోని ఛందో బందోబస్తులను బద్దలు చేస్తూ వచ్చింది వచన కవిత.  అయినప్పటికీ తొలి నాళ్లలో పద్య లక్షణాలు కొన్ని అలాగే కొనసాగాయి.  దీనికి ఉదాహరణే ఆనాటి వచన కవితల్లో లయ, అంత్య ప్రాస నియమం,   అని చెప్పాలి .  కానీ ఆధునికత, స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదాలు ఉధృతమైన తర్వాత తెలుగు వచన కవిత్వం నిర్మాణ పరంగా స్వేచ్చని, భావాల పరంగా గాడతని, వస్తు పరంగా myriad life stylesని , శిల్ప పరంగా iconoclastic trendsనీ పరిచయం చేసింది. ఇక 1991 తర్వాత మొదలైన గ్లోబలైజేషన్, 2001 అనంతరపు విశ్వ సాంస్కృతిక సంగమ భావనలు, ఆదాన ప్రదానాలు ఇప్పుడు సాహిత్యానికీ, కవిత్వానికీ ఉన్న ఆఖరి బంధనాలను, నియమాలను కూడా తెంచి వేసాయి.  అలా నిబంధనల విబంధనకు గురి అయిన వాటిలో భాష కూడా ఒకటిగా మారింది. భావం universal అయినప్పుడు, దానిని అభివ్యక్తి చేసే భాష కూడా హద్దులకు, పరిమితులకు అతీతంగా universal గా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యం లోంచి ఉద్భవించిన సమకాలీన నవ కవితా సంప్రదాయమే multi-lingual, multi-cultural సాహిత్యం/ కవిత్వం.  దీనికే నేను, Fusion షాయరీ అని పేరు పెట్టాను.  దీనికి సశాస్త్రీయతను, సాహితీ ప్రతిపత్తిని ఆపాదించడానికి కొన్ని నియమాలను కూడా రూపొందించాను.
నియమాలు:
— పేరు లోనే చెప్పినట్లు, ఇది poetry + prose లోని రెండు భావనల fusion! అందుకే ఈ కవిత prose style లోని పేరాగ్రాఫ్ pattern ని, పోయెట్రీ లోని stanza రూపం లో అనుసరిస్తుంది.
— దీనిలో కవిత్వం లోని భావ చిత్రాలు, symbolism, allegory, metaphoric expressions మరియు prose లోని వాక్య నిర్మాణ శైలి, విషయ విస్తృతి జమిలిగా కలిసి పోయి ఉంటాయి
— ఈ కవిత్వం లో బహు భాషా పదాలు, బహు సంస్కృతుల దృగ్విషయాలు, బహు సమాజాల, దేశాల జీవన శైలులు ఒక్క భావనను లేదా కవిత్వ చింతనను చెప్పడానికి వాడబడతాయి.
— వస్తువు విషయం లో ఏకత్వ నియమం ఉంటుంది కానీ, శిల్పం, నిర్మాణం విషయం లో మాత్రం అనేకత్వ నియమం అనుసరించ బడుతుంది.
— poetry is the spontaneous over-flow of powerful feelings అని William Wordsworth చెప్పినట్లు, ఏయే భావోద్వేగాలను వ్యక్తీకరించడం లో  కవికి ఏ భాషా పదం తగినట్లుగానూ, perfectly apt గానూ తోచుతుందో, ఆ భాషా పదాన్నే వాడతాడు తప్ప, భాషా భిషక్కు లానో, భాషా తీవ్రవాది లానో బలవంతంగా తెలుగు భాషా పదం కోసమో, తెలుగు సమానార్ధకం కోసమో వెతుకులాడుతూ బుర్ర బద్దలు కొట్టుకోవడం ఉండదు. కవి ఆలోచనా ధారలో ఏ పదం మెరిస్తే, ఆ పదాన్నే వాడతాడు. తెలుగు పదం కోసం వెతికే ప్రయత్నం లో కవి తన original మూల భావాన్ని, భావనని కోల్పోయే ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది. “నా మంచి పాట నాలో నే పాడుకుంటా. నే పైకి పాడ. పాడితే గీడితే వచ్చేదంతా రెండో రకమే”!
— ఈ కవితా నిర్మాణానికి నిర్దిష్ట పధ్ధతి కానీ, నియమం/ సంప్రదాయం కానీ లేదు. అయితే దీనిలో 4 నుండి 8 stanzaలు ఉంటే బాగుంటుంది. ప్రతి stanza చివర విడిగా కొస మెరుపు లాంటి వ్యాఖ్యానం ఉంటే, ఆ stanzaకు గాడత వచ్చి, చదువరికి  రసానుభూతి కలుగుతుంది. దీనికి గాను కవికి పదజాలం, భాషా సంపత్తి ని creativeగా వాడే నైపుణ్యం కా (రా)వాలి.
– మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

కటకటాల్ని వెక్కిరించిన కవిత: కిటికీ పిట్ట

kitiki pitta

మోహన్ చిత్రకారుడుగా ఆ రంగంలో లోతైన విశ్లేషణా వ్యాసాలతో “అరుణతార”లో రచనలతో సుపరిచితుడు. 2005-06 మద్య కాలంలో తీవ్రమైన నిర్బంధ కాలంలో మోహన్ ఒకరోజు అనంతపురంలో యూనివర్శిటీ దారిలో నడిచి వెళ్తుండగా తెల్ల సుమోలో యూనిఫాంలేని పోలీసులు బంధించి పదిహేను రోజులపాటు తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయగా ఆ చిత్రహింసల కొలిమిలోంచి పెల్లుబికిన సాంద్రమైన ఆర్థ్రత నిండిన ఆగ్రహ వాక్యం ఈ ఖైదు కవిత్వం.

 

ఖైదులోంచి అనేకమంది కవులు రచయితల రచనలు మనం చదివాం. కానీ ఈ కవిత్వంలో ఉన్న కొత్త చూపు మానవీయత శత్రువును కూడా తనను తాను ప్రశ్నింప చేసుకొని మనిషిని చేసే సౌందర్యాన్ని తన కుంచెనుండి కలానికి ఒలికిన లేలేత నెత్తుటి రంగు పూసిన గాయాల చిత్రవర్ణ కవిత్వం ఇది. రచయితగా చిత్రకారునిగా నలుగురికీ సుపరిచుతుడైన మనిషిని తన రాజకీయ విశ్వాసానికి యింత తీవ్రమైన చిత్రహింసల పాల్జేసి రాజ్యం మానసికంగా తనని బలహీనుణ్ణి చేయబూనడం అమానుషం. కానీ రాజ్యానికి ఇవేవీ అంటని మట్టికాళ్ళ మహారాక్షసి కదా? తన కాళ్ళు నరికివేయబడ్తాయన్న భయం వెంటాడి మనుషులను వేటాడుతుంది. కానీ నిబద్ధత నిమగ్నతగల మనిషి తన సుదూర స్వప్నాన్ని ఈ దేశ శ్రామిక వర్గ విముక్తిలో కాంక్షించే వాడిగా చెక్కు చెదరని ఆత్మవిశ్వాస ప్రకటనగా తన కలాన్ని పదును పెట్టే అవకాశంగా ఈ ఖైదు సమయాన్ని కూడా సద్వినియోగం చేయగల ధీశాలత్వం ఇదే సామాజిక సందర్భం యిస్తుందని ఈ కవిత్వం మరోమారు నిరూపిస్తుంది.

 

నిజానికి ఖైదులో వున్నది ఖైదీ పేరుతోను తనకు కాపలాగా వున్న ఉద్యోగి జైలర్ పేరుతోను ఇరువురు వున్నది జైలులోనే కదా అన్న స్పృహ జీతం తీసుకునే వాడికి వుండదు కదా? వాడికి తను మనిషినే అన్న స్పృహ నశించి ఉద్యోగ ధర్మం పేరుతోనో, తన నిస్సహాయతతోనో తోటి మానవునిపై మృగంలా అమలుచేసే చిత్రహింసల గురించి ఒకింత బాధ్యతతోనే మోహన్ వారిపై కూడా సానుభూతి చూపడం కవి హృదయాన్ని పట్టిస్తుంది.

 

నువ్వయినా ఎన్నిసార్లని గాయాలు చేయగలవులే

నువ్వయినా ఎన్నిసార్లని ప్రేమలు కోల్పోగలవులే

నేనైనా ఎన్నిసార్లని నిన్ను ద్వేషించగలనులే

ఇదుగో ఇటు

నా ముఖంలోకి సూటిగా చూడు

నా కళ్ళలో నీకే వెన్నెలా కనిపించడం లేదూ

నా నుదిటిమధ్య నీకే సన్నని జీవరేఖా పొడగట్టడం లేదూ

 

హు.. అవున్లే

చూపును కోల్పోతేనే గదా

నీ చేతులకు అసహజ చర్యలు మొలుచుకొచ్చేది

కార్పణ్యపు బిరడాను బిగించుకుంటేనే కదా

నీ హృదయ సున్నిత సంస్పర్శలు బండబారేది..

ప్రియ శత్రువా

నువ్వేం దిగాలుపడకు!

నీ భ్రమల విచ్చిత్తి కోసమే

నే బతికి బట్టకడతా

నాపై నువ్వెన్ని గాయాలకైనా పాల్పడు

నీలో మూల మానవుడు అంతరించడు

 

“గాయానికి గాయానికీ నడుమ

కాసింత తెరిపి

నాకే కాదు నీకూ కావాలి” అంటాడు కవి.

 

“పునరుత్థానం ఒక పురాకాంక్ష

వేటలో అసువులు బాసిన

ఆదిమానవుని ఖననంలో పోసిన

ఇంత కుంకుమా ఎర్రగంధమూ

వియోగపు రద్దుకు గొప్ప ఆశ్వాసన” అని విశ్వాస ప్రకటన చేస్తాడు కవి.

 

“హింస పాలబడిన పురాశరీరాన్ని

నిలువెత్తుగోడల మధ్య పడదోసి కూడా

తలుపుల భద్రత కోసమో

తలుపుల్లో దాగిన బతుకు భద్రత కోసమో

తాళంపైన తాళమేసుకునే

సంశయాత్మల విచికిత్సకు

విరగబడినవ్వుతున్నా” అని జైలు వాతావరణాన్ని హేళన చేస్తూనే

 

తలుపులంటే చెట్ల రూపాంతరాకృతులే కదా

తలుపులంటే రెండు చెక్కల కలయికే కదా!

 

చెట్ల రుతు సౌందర్యాలను ఆరాధించేవాణ్ణి

రెక్కల ఆవరింతలో కదిలిపోయేవాణ్ణి

తలుపు భౌతిక చలనాలనౌ తుంపేయవచ్చు

మరి మనసు తిరిగే స్వప్న ప్రపంచపు సంగతో– అని ప్రశ్నిస్తాడు కవి.

 

మోహన్ ఇందులో ఖైదులోనుండే బయట తనకోసం వేచివున్న అమ్మా, నాన్నా, చెల్లెల గురించి, తను రోజూ చూసే మందారం కొమ్మ తెంపిన అమ్మాయి గురించి కవిత్వం రాసారు. చిత్రహింసల మద్యలోంచే తన రాజకీయ విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తూ తన నుండి ఏ ఒక్క రహస్యాన్ని పొందలేకపోయిన శత్రువుని హేళన చేస్తూ విస్పష్ట ప్రకటన చేస్తారు. ’దేహం దేహమే రహస్యమైన చోట దేశంలో కోటానుకోట్ల రహస్యాలు’ అంటాడు కవి. ఈ కవిత్వం మొత్తం సరికొత్త ఉపమాన చిత్రలిపితో తాననుభవించిన చిత్రహింసలను మన కళ్ళకు కట్టినట్టు చూపుతూ శత్రువు యొక్క అమానవీయతను వాని నిస్సహాయతను బట్టబయలు చేయడం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూనే కర్తవ్య నిర్వహణకు గుండె నిబ్బరాన్నిస్తుంది.

కేక్యూబ్ వర్మ

varma

మగతవాక్యాల మేల్కొలుపు నిశీధి కవిత…!

ఎప్పుడో కానీ ఓ కవిత నిద్రలేపదు. ఎప్పుడో కానీ ఓ కవిత గుండెగదుల ఖాళీలని పూరించదు. ఎప్పుడో కానీ కొన్ని వాక్యాలు ఆలోచనని రేకెత్తించవు. ఇదిగో ఇప్పుడు దొరికింది అలాంటిదే ఓ కవితలాంటి పిలుపు, మేల్కొలుపూనూ. నిశీధి కవితలో!

ఈమె కవితలలో కనిపించే strong metaphors కోసం కనపడిన ప్రతీసారీ ఈ కవితలని చదువుతూంటాను. దానికి మించి అంతకంటే బలమైన ఆవేశపూరిత వాతావరణాన్ని సృష్టించే పదచిత్రాలకోసమూ వెతుకుతుంటాను. ఎక్కడో ఒకటో రెండొ కవితల్లో తప్ప ఈమె నన్ను నిరుత్సాహపర్చలేదు. ముఖ్యంగా కవిత్వానికున్న శృంఖలాల్ని తెంచడానికోసమేనన్నట్టుగా రాసే ఈ కవితల్లో శీర్షికనుంచీ ఎంచుకున్న డిక్షన్ వరకూ తనదైన ఓ ముద్రకోసం తపించకుండా వాడిన డిక్షన్నే మళ్ళీ వాడకుండా ఓ ప్రవాహంలా సాగిపోయే ఈమె కవితల్లో ఓ మాజిక్ ఉంటుంది. పైడ్ పైపర్ ఆఫ్ హామ్లిన్ లాగా నిశీధి పైడ్ పైపర్ ఆఫ్ మాడర్న్ పొయిట్రీ!! ఓ సారి మొదలుపెట్టాక చివరివరకూ చదవాల్సిందే.

ఓ బలమైన జలపాతాన్ని అనుభూతిస్తుండగా హఠాత్తుగా మనల్నేవరో అందులోకి తోసేస్తే అంతే స్పీడుగా బయటకొచ్చి చూసుకుంటే ఒళ్లంతా ఆ నీళ్ళన్నీ మనఒంటిమీదే ఉన్నాయన్న ఓ అద్భుత ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి కొంచెం సేపు పడుతుంది. దాదాపు అదే అనుభూతి నిశీధి కవితలు.

తన ఓ కవిత “ఫైట్ ఫర్ లైఫ్ ” లో

“జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు ”

 

జారిపోతున్న ఇసుకల్లాంటి–ఓ సిమిలీ

నిజాల నీడ, సూర్యుడి కాన్వాస్, ఉమ్ముల రంగూ– ఓ స్ట్రాంగ్ మెటాఫర్

 

మనక్కనిపించే చాలా కవితల్లొ ఇలాంటి ఉపమానాలక్కొదవేమీలేదు. ఐతే ఇదే ఎందుకంత ప్రత్యెకంగా చెప్పుకోవాలంటే దాదాపు ప్రతీ వాక్యంలోనూ ఇన్నేసి ఉపమానాలున్నా అవి విసుగనిపించక మళ్ళీ ఓ సారి వెనక్కెళ్ళి చదివి గుండెకెక్కించుకుని ఊరేగుతూ నలుగురికీ చెప్పాలనే తపన కలగచేయటంలో నిశీధి ఎఫోర్ట్‌‌లెస్ ప్రయత్నం అభినందనీయం.

 

ఇదేకవితలో–

“మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి ”

అసలేవరీమె? ఎలా శాసించగలుగుతుందిలా? ఏమిటి తనకున్న ఆయుధాలు? ఒఠ్ఠి మాటల మంత్రమేనా? ఒఠ్ఠిమాటల యుధ్ధమేనా?

కొత్తైనా, కొంతైనా పాతవాసనేమీ లేని ఈ యువతరపు ఫీమేల్ వాయిస్‌‌కి కావల్సిందేమిటి?

మనచుట్టుపక్కలే ఉన్నా మనమేత్రాం పట్టించుకోని ఇన్ని ఖతర్నాకీలనీ ఎలా ఒడిసిపట్తుకుందేమో కానీ అవన్నీ ఓ నిశీధి శతకంలా మారి మన డెడ్ బ్రెయిన్ని ఉరకలెత్తిస్తుంటే మరి ఆమెందుకు తన కలంపేరుని బ్రెయిన్ డెడ్ అని పెట్టుకున్నట్లు? ఆమె కవితల్ని ఇంకొన్ని చదవాల్సిందే!

 

“అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు”

 

బహుశా మొదటి వాక్యంలో “దాచుకోని” కాదేమో, “దాచుకుని” అనుకుంటా!

ఐనా ఇంధ్రధనుస్సు కిరణాలలోనూ సమతత్వపు సమాధానాలు వెతకమనడంలో ఉద్దేశ్యం మనకి మనమే ఓ అద్దంలా మారి మనలోకి మనమే తొంగిచూసుకుంటే ఏం కనిపిస్తుందో నిర్మొహమాటంగా చెప్పమంటుందనుకుంటాను.

 

please unlock yourself blatantly and reveal shamelessly

 

“గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు”

 

తోకచుక్క శంకువులా పగలటం కొంచెం అసమంజసమైనా తరువాతి వాక్యపు గాఢతలొ అది కొట్టుకుపొతుంది. అలాగే “స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు” ఇదీ కొంచెం బలమైనదే. “ఆగి వెళ్ళుము” అన్న సైన్ బోర్డ్ లాగా మనసు స్టాగ్నేటేడ్ వాసనరాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని అలోచింపచేసే కమాండ్‌మెంట్.

 

“నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు” ఈ ముగింపే కాదు కవితలోని మరికొన్ని వాక్యాల్లోనూ విభిన్నభావాలనీ, different trends నీ కలిపేసిమరీ అతికినట్లు కుట్టినట్లుగా అనిపించినా పాఠకుడికొచ్చే నష్టమేమీలేదు. చదవాల్సిన కవిత ఇది అనటంలొ నిర్మొహమాటేదీలేదు.

 

ఇదీ పూర్తి కవిత—

 

నిశీధి | ఫైట్ ఫర్ లైఫ్ |

వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్ మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ

పూల కోసం యే మార్గం లో వెతుకుతున్నావు చీకట్లో

పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ

అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం

జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు

యుద్ధాలన్నీ శాంతికోసమేనట

ఇంకా మొదలవని యుద్ధాల వెనక

అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు

జనోద్దరణ పేరుతో భారీహస్తాల

పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ?

మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి

నిన్ను శాశ్వత నిద్ర కి పంపి నీ ఎముకల పొడి తో వ్యాపారం చేసే

నయా వలస వాదం మరో సారి మతం ముకౌటా తగిలించుకొని

నీ రక్తం తాగడానికి సిద్దమయింది

అందుకే

అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు

గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు

నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు

భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు .

 

 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

 

 

 

 

 

“ రాతి చిగుళ్ళ” మెత్తదనం

1186062_754399994593747_749247437465763954_n

“ రాతి చిగుళ్ళ”  మెత్తదనం “గు౦డె పగిలిన దృశ్యాల”  సౌకుమార్యం, తన కవితకు  గుర్తింపు పత్రం ,చిరునామా అవసరం లేని కవయిత్రి శైలజామిత్ర . ఆవేదనా ప్రవాహం  ,ఆలోచన అంతర్ దర్శనం, అస్తిత్వపోరాటం, అలసిపోయిన ఆరాటం, ఎల్లలు లేని ఆకాంక్ష అన్నీ కలగలిపి కవితాత్మ రంగులద్ది ఆరవేసిన పట్టువస్త్రం శైలజ కవిత్వం. అలాంటి కవిత్వానికి ఈ సంవత్సరం ఉమ్మడిసెట్టి రాధేయ అవార్డు లభించడం సంతోషకరం.

“ రాతి చిగుళ్ళు “ అక్షరాలా, అక్షరాల్లా యాభై ఆరు కవితల సమూహం. సమూహం అనడానికి కారణం ఏ రెండు  కవితలూ ఒక శీర్షికకి౦ద ఇమడని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటమే. ఆరంభంలోనే తనదైన స్వప్నాన్ని పరిచయం చేసారు శైలజామిత్ర

“ఏదైనా ఒకటి

మనల్ని నిత్యం పలకరిస్తోంది అంటే

అది మనం వదిలి వచ్చిన బాల్యమే….

చిన్న చిన్న మాటలు అతిపెద్ద భావన. ఏదైనా ఒకటి … అదేదో ముందు చెప్పరు. కాని అది చేసే పని వివరిస్తారు. మనల్ని పలకరించడంలో  చెప్పకనే చెప్పే ఆప్యాయత ,అనంత స్నేహభావం ,ఎక్కడో చిన్న తెలిసిన తనం లేకపోతె పనిగట్టుకుని రోజూ పలరి౦చరు గద, ఎవరబ్బా అంత చిరపరిచితులు ?  అది మనం వదిలి వచ్చిన బాల్యం. ఇక్కడా లోతుగా తరచి చూస్తే బాల్యాని మనం వదిలి వచ్చాం-మానను బాల్యం వదిలి వెళ్ళలేదు. ఎంత వారలైనా అప్పుడో ఇప్పుడో చిన్నతనం పోనీ పిల్లల్లా ప్రవర్తించడం మన రెండో స్వభావమా?

10154100_747870085246738_1608587565_n

ఇక్కడ బాల్యం మానవీకరి౦చ బడి౦ది. బాల్యం మనలను నిత్యం పలకరిస్తోంది, మనం దానిని పలకరించటం లేదు. వదిలి వచ్చినా విడవకుండా పలకరిస్తోంది. చిన్నప్పటి కళలు , అనుభవాలు , అనుభూతులు మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు రోజుకోసారైనా పలకరించడం అందరికీ స్వానుభావమే. సర్వ జనీనమైన అనుభవాన్ని విశ్వైక భావనగా మనముందుంచారు శైలజ.

మరేదైనా ఒకటి

మనల్ని ధైర్యంగా నిలదీస్తో౦దీ అంటే

ఖచ్చితంగా మనం చేసిన పాపమే.

ఒక్క పలకరి౦తతో రోజు గడిచిపోదు. చేసిన పాపాలు నిలదీస్తాయి.

ఒక వెదుకులాట ,ఒక అంతర్ మదనం అంతేనా ఆరాతియ్యడం పనిలేనితనాన్నీ , ఆలోచించడం తప్పించుకునే ప్రయత్నాన్నీ వీటన్నింటి మధ్య జీవితం ఒక స్వప్నమే.

ఆకాశమంతా ఆవిరైపోతున్నట్టు

ఏమిటో ఈ అసహనపు జల్లులు

ఆకాశమే ఒక శూన్యం అది మొత్తం ఆవిరై మళ్ళీ కురిసే జల్లు

మానవీకరణ , ప్రతీక కవితవ పరికరాలిక్కడ.  పాదరసాన్ని పట్టుకోవడం, లిప్త కాలపు తూటా చప్పుళ్ళు కదులుతున్న కలాలలన్నే కవికి ఎలా అనిపిస్తాయో వివరించారు.

ఒక భావన నుండి మరో భావానికి పాదరసంలా జారిపోయిన కవయిత్రి తనతో పాటు పాఠకులనూ లాక్కుపోతారు. ఒక వాస్తవిక వస్తుగత ప్రయోగం ద్వారా అమూర్త భావనల్లోకి ప్రవహించి అక్కడ మళ్ళీ తనదైన భానిలో ఆవేశ కావేశాలు, ఆకాంక్షలు ,నిరాశా నిస్పృహలు వెళ్ళగక్కి  ఇది౦తే అన్న ఒక ఒక బలమైన ముగింపుకి వస్తారు రచనలో.

10169055_755538614479885_1656040067_n

 

“కదులుతున్న కలాలన్నీ

నిశ్చలనిరాశల మధ్య

అనుభవాల దోబూచులాటలే..

……………….

 

నిరంతర ప్రయాణ సూచికలే …

అంటూ ఖచ్చితమైన ఆత్మాశ్రయ తత్వానికి వచ్చేస్తారు.

“  ప్రవహిస్తున్న క్షణాలు “ కవితలో

ప్రతి వ్యక్తీ ఒక గాజు గదిలో నివాసం

ఒకవైపును౦డి మరోవైపుకు రాళ్ళ ప్రహారం

ఒక అంచునుండి మరో అంచుకు బుల్లెట్ల విహారం

సగటు మానవుల స్థితి కళ్ళకు కట్టినట్టు వివరించారు.

వస్తు పరంగా చూసినపుడు ఒక విస్తృత వైవిధ్యాన్ని చూపారు కవయిత్రి వ్యక్తినుండి, పరిసరాలు, సమాజం, దేశం చివరకు విశ్వైక భావనతో ప్రపంచ సమస్యలూ కవితామయం చేశారు.

వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికీ అంతః చేతనకూ మధ్య, సమాజ వైరుధ్యాల మధ్య, సంఘర్షణ  సమయోచిత  అభివ్యక్తి ఇవన్నే శైలజ కవితలు.

ఒంటరి తనం, అశక్తత వల్ల వచ్చిన నైరాశ్యం, జీవన వైరాగ్యం పర్యవేక్షణ, ఆత్మా పరిశీలన చక్కని భావచిత్రాల్లో అందంగా మలచబడ్డాయి. ఆ భావ చిత్రాలు కొన్ని ప్రగాధంగా ,కొన్ని తేలిపోయే మబ్బు తునకలంత తేలికగా , మరికొన్ని హరివిల్లు తీగలుగా సాగాయి.

అతి మామూలు దృశ్యాల నుండి అరూప భావనలకు తీసుకు వెళ్ళడంలో మాంత్రికురాలు శైలజ.

ఉత్తమ కవితల సరాగమాల తప్పకుండా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని చెప్పిన మూడో రోజునే ఈ పుస్తకం ఉమ్మిడి శెట్టి కవితా పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా మిగిలి ఉన్న సాహితీ విలువలకు తార్కాణం.

మంచి కవితకు చక్కని రూపం “రాతి చిగుళ్ళు”

    – స్వాతి శ్రీపాద

స్వాతీ శ్రీపాద

కలని ఆయుధం చేసుకున్న కవి అరసవిల్లి!

arasavilli krishnaకవిత్వానికి కవికి మద్య ఏ తెరలూ లేని మనిషి వుండాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా? ఈ మాటెందుకంటే కవులుగా కథకులుగా చలామణీ అవుతూనే మాస్క్ తీస్తే వాళ్ళలో ఓ అపరిచిత మనిషి దాగుంటాడన్నది చాలా మందిలో చూస్తుంటాం. కానీ అరసవిల్లి కృష్ణ తన కవిత్వానికి జీవితానికి లోపలి మనిషికి బాహ్య రూపానికి తేడాలేని స్వచ్చమైన మానవుడు. దర్జీగా దేహానికి సరిపోయే దుస్తులను మాత్రమే కాకుండా మనసు పొరలను చేదించే అక్షరాలను అల్లిక చేసే కవిగా సామాన్య జీవితం గడుపుతూ సరళమైన పదాల మద్య తన భావోద్వేగాలను “తడి ఆరని నేల” గా మనముందుంచారు.

 

కవిత్వాన్ని తన నెత్తుటిలోకి ఆహ్వానించుకొని దేహమంతా ప్రవహింప చేసుకొని అదే తడితో తన సహజమైన సరళ పద చిత్రాలతో మనముందు సామాజిక వాతావరణాన్ని చిత్రించడంలో అరసవిల్లి తనదైన శైలిని పట్టుకుని చిత్రిక పట్టి మనముందు ఆవిష్కరిస్తాడు. వర్తమాన సమాజంలోని అన్యాయాన్ని సామాజిక సంక్షోభాన్ని రాజ్య నిరంకుశత్వాన్ని ఆగ్రహంగా ఎండగడుతూనే దానిని నినాదప్రాయం కాకుండా హత్తుకునేట్టు చెప్పడం ఈయన కవిత్వంలో చూస్తాం. 2008 నాటినుండి విరసం సభ్యుడిగా వుంటూ “సామాజిక నిబద్ధతతో కవిత్వాన్ని సృజిస్తూన్న అరసవిల్లి ఉద్యమ కవిత్వంలో సౌందర్యాత్మక విలువల్ని ప్రోదిచేస్తూ కవిత్వ భాషలోనూ, అభివ్యక్తిలోనూ, నిర్మాణంలో ఒక విలక్షణతని సాధించారంటారు” ప్రముఖ విమర్శకులు గుడిపాటి.

 

 

మరణం తర్వాత ఓ దీపం

ఆరిపోకుండా వెలుగుతుంది

 

సౌందర్యం కాలుతున్న

వాసన వెంటాడుతుంది

 

ఓ దేశాన్ని వెతుకుతున్నాను

ఒకే దేశం రెండు చేతులుగా కన్పిస్తుంది

ఒక చేతిలో ఆయుధముంది

రెండవ చేతిలో స్వప్నముంది

 

రైతుల ఆత్మహత్యలు, బూటకపు ఎదురుకాల్పులు, సామూహిక మానభంగాలు రాజ్యం చేయిస్తున్న మానభంగాలు దహనకాండలూ ఇలా మన కళ్ళముందు నిత్యమూ జరిగే సామాజిక చిద్రపటాన్ని తన కవితా వస్తువుగా తీసుకొని అరసవిల్లి కృష్ణ కవిత్వ గానం చేస్తున్నారు.

 

మరణం వ్యక్తిగతం కాదు

మరణం సామూహిక విషాదం

 

భూమితో నా సంభాషణ

గర్భంలో దాగిన పిండం వింటుంది

వినడం మట్టి ప్రయాణంలాంటిది.

 

వినడం భూమికి తెలిసినంతగా

అధికారలాలసకు తెలియదు.

 

ఈ దేశంలోని నదులన్నీ

స్త్రీల కన్నీళ్ళతో ప్రవహిస్తున్నాయి

 

స్త్రీలు కదా

సమాధానాలుండవు

ఏనాటికయినా

అడవి మాట్లాడుతుంది

ఆ పదకొండుమందికీ

ఆకాశం వందనం చేస్తుంది.

నిబద్ధతా కవిత్వ ప్రేమా రెండీటిని బాలన్స్ చేసుకుంటున్న కవి అరసవిల్లి!

-కేక్యూబ్ వర్మ

varma

సముద్రం మోసపోతున్న దృశ్యం!

 

 

3211225569_b8f3b4b541

సముద్రం – ప్రపంచ కవులందరూ సొంతం చేసుకున్న గొప్ప కవితా వస్తువు.

సముద్రం నాకు – పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా నాకు గొప్ప ఉత్సాహం కలుగుతుంది. కవితావేశం కలుగుతుంది. రాళ్లను వొరుసుకుంటూ మహా చైతన్యంతో కెరటాలు ముందుకు వస్తుంటే.. కాసిన్ని గవ్వలు వొడ్డుల వొడిలోకి చేరుతుంటే – ఆ అనుభూతిని సొంతం చేసుకోవటం నాకు మరిచిపోలేనిది.

గవ్వల్లో, శంఖాల్లో కూడా సముద్రమే. సముద్రపు ఘోషే ..

కవులు – సముద్రాన్ని ఆసరాగా చేసుకుని బతుకుతున్న శ్రమజీవులను, శ్రమ సౌంధర్యాత్మకతనూ కవిత్వం చేసారు. సహజ సిద్ధమైన వాళ్ల జీవన విధానం -భయాందోలనకు గురవుతున్నప్పుడు – ఎదురుతిరగడాన్ని ప్రవచించారు.

సముద్రం – ఉత్తరాంధ్రాకు గొప్ప వనరు. సముద్ర తీరప్రాంత ప్రజలు – ముఖ్యంగా మత్స్యకారులు సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వనరైనా ప్రజల ఉమ్మడి ఆస్తి. కానీ యిప్పుడు ఏ వనరును చూసినా వొకే వ్యక్తికి ధారాదత్తమౌతున్న స్థితి.
సముద్రం మీద పెట్టుబడిశక్తులు కన్నేసినప్పుడు.. ఆర్థిక సంస్కరణల మాయా ముసుగు పొర కమ్మేసినప్పుడు..  ప్రజల జీవన స్థితి ధ్వంసమైనప్పుడు – ఒకరిద్దరు వర్తమాన ఉత్తరాంధ్రా కవులెలా స్పందించారన్నది ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

సిరికి స్వామి నాయుడు

సిరికి స్వామి నాయుడు

‘మంటిదివ్వ’ కవితాసంపుటితో ఉత్తరాంధ్రా మట్టిపరిమళపు కవిత్వ సొబగును ప్రపంచానికి తేటపరిచిన  కవి – సిరికి స్వామినాయుడు –

‘ యీ సముద్ర గర్భాన చేపపిల్లలై ఈదులాడుతున్న వాళ్లు
పోటెత్తిన తరంగాల మీద పురుడోసుకున్న వాళ్లు
అలల పయ్యాడ కొంగుపట్టి ఉయ్యాలలూగినవాళ్లు
తీరాన్ని తలకెత్తుకుని……… సాగరగీతమైన వాళ్లు ‘

అని.. వాళ్ల సహజమైన జీవన విధానాన్ని కవితామయం చేస్తారు. సముద్రాన్ని తల్లిగా భావించి, అలలను పయ్యాడ ఉయ్యాలగా చేసుకుని.. నిష్కల్మసంగా బతుకుతూ  బతుకు జీవన పోరాటంలో వాళ్లు తీరాన్ని తలకెత్తుకుని సాగరగీతమవుతుంటారు-
అని అంటారు.

మరో ఉత్తరాంధ్రా కవి-  ఇటీవలనే ‘అస్తిత్వం వైపు’ కవిత్వ సంపుటితో ముందుకొచ్చిన- పాయల మురళీకృష్ణ ‘రేపటి సూర్యోదయానికి ముందు..’ కవితలో… మత్స్యకారులు వేటకి దిగినప్పుడు జరిగే కోలాహలాన్ని కవిత్వం చేస్తూ..

‘ తెప్పల మీదకు చేరిన వలలన్నీ
నడి సముద్రంలో
నడి రాత్రి కూడా చైతన్యాన్ని రెక్కలుగా తగిలించుకుని
ఎంతో విలువైన జల పుష్పాలనందిస్తుంటే
అక్కడెక్కడో అతని హస్త నైపుణ్యం
ఎన్నెన్నో గర్భ గోళాల మీద
పరోక్షంగా తన సంతకాన్ని ముద్రించుకునేది ‘

వొక మత్స్యకార సృజనశీలిని కేంద్రబిందువుని చేస్తారు. యిక్కడ వొక సంఘటనను వొకే దృశ్యశకలంగా కవిత్వం చేయడం గుర్తించొచ్చు.

యీ యిద్దరు ఉత్తరాంధ్రా కవులూ మత్స్యకారుల జీవన పరిశ్రమను వొకింత ప్రేమతో, వొకింత ఆర్తితో కవిత్వం చేసారు.

‘ పుట్టెడు ఆశతో వెళ్లిన తెప్పలన్నీ
కలుషిత జలదేవత విదిల్చిన
అనంతమైన శూన్యాన్ని ఎత్తుకొస్తుంటే
సమస్తాన్నీ కోల్పోయిన
బెస్త బతుకులు పస్తు బతుకులయ్యాయి ‘

– అని ‘మురళీకృష్ణ’ దుఃఖపడితే…..

‘ వాళ్లు కట్టుకున్న గుజ్జన గూళ్ల మీదా
నురగల పరవళ్ల తెల్లని చిరునవ్వుతీరం మీదా
ఓ రాకాసి నీడ కమ్మేసింది
తూరుపు సముద్రపు తరంగాల మీద
తుళ్లిపడే బంగారు బొచ్చెపరిగె సూరీడ్ని
రాహువేదో మింగేసింది’

– అని స్వామినాయుడు కలవరపడతారు.

యిద్దరూ తమ తమ కవితల్లో పోరాట అవసరాన్ని వ్యక్తం చేయడం సున్నితంగా గుర్తించొచ్చు.

‘రేపటి సూర్యోదయం
వాళ్లకు వాళ్ల అస్తిత్వాన్ని ప్రసాదించడమే చూడాల్సి వుంది’
ఇది మురళీకృష్ణ యిచ్చిన ముగింపు.

‘పల్లె వాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి కురిసే కన్నీళ్లు – సముద్రం
చందమామ-
వాళ్ల సామూహిక సమాధి మీద దీపం’
ఒక జీవిత దుఃఖాన్ని ముగింపుగా పలికించారు. లోలోపల అంతర్గతంగా
జ్వలితమౌతున్న కసే – నాకైతే ఈ ముగింపులో కనిపించింది.
దిగులు నుంచే దుఃఖం నుంచే పీడన నుంచే పోరాట పుష్పం విరుస్తుంది.

పైడిరాజు

పైడిరాజు

నేటి ఉత్తరాంధ్రా కవుల వారసత్త్వాన్ని అందుకుంటూ..  పద్నాలగేళ్ల కవి- ఎస్. పైడిరాజు ‘నీళ్లు’ కవితలో ఏమంటున్నాడో చూడండి.

‘విశాలంగా
విన్నూత్నంగా వున్న ఆ నీళ్లలో
జలకాలాడేం వొకప్పుడు..
మరి యిప్పుడో
ఆ నీటి వొడ్డుకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాం
ఆ నీరు అనేక ఫ్యాక్టరీలకు ఆధారమయ్యింది

కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్లు విశ్వాసం మరిచారు’

వొక  స్పృహని కల్గి వుండడమంటే బహుశా యిదే అనొచ్చు. వర్తమాన సామాజిక స్థితిని అర్థం చేసుకొని కవిత్వం చేయడంలో రేపటి మలితరం సిద్ధంగా తయారౌతుందనడానికి యిదొక రుజువు. మొత్తానికి కవిత్వం ప్రజల కోసం- అనే విషయాన్ని ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న కవిత్వంలాగానే ఉత్తరాంధ్రా కవిత్వమూ నిరూపిస్తుంది.

బాలసుధాకర్ మౌళి

జాజిపూల తల్పం – ఎలనాగ శిల్పం

ఉత్తమ కవులంటూ వేరే ఉండరు. హితం కోరుతూ యోగుల్లా మన మధ్యే ఉంటారు. వాళ్ళ అరచేతుల దరువుల్లో రూపకాలు ఏరువాకలవుతాయి. ఐనా వెంటపడి ఎవరి మెప్పూ కోరుకోరు. వాళ్ళను తృణీకరించిన పాపం గంగా స్నానం కూడా తీర్చలేదు.

నచ్చినవాళ్లకు పీఠం వేయడం, నచ్చనివాళ్లకు లేబుల్ వేసి దూరం చేయడం తెలుగువాళ్ళ తెంపరితనం. ఇది పత్రికలకూ వర్తిస్తుంది. ఎలనాగ మాటల్లో చెప్పాలంటే ‘అది మహా వృక్షాలకు నీరు పోసి లేత మొక్కలకు ఎడారి చవిచూపే ఆటవిక న్యాయం’

వృత్తి రీత్యా పిల్లల డాక్టరైన ఎలనాగ నుడికారం నాడి తెలిసిన మొనగాడు. వచనంలో ఆయన రాసిన కందాలు ఊరించే వాక్యబృందాలు.

Vagankuralu

‘కల్లాపి చల్లనెంచిన

ఇల్లాలికి పేడ లేక ఇబ్బందవగా

తెల్లారే లోపు తనకు

నల్లావును తెమ్మని తన నాధుని వేడెన్’

చమత్కారం ఒలికే ఈ తరహా పద్యాలు ఆయనే రాయగలరు.

పాల మీగడ తరగలు ఆయన ‘వాగంకురాలు.’ అవి కవిత్వానికి శాస్త్రీయతను అద్దుతాయ్.

‘ఊటలు ఊటలై వలపు

టూహలు పాటల రూపమెత్తి నీ

మాటలలోన తేనియలు

మాటికి మాటికి జాలువారగా

కాటిని పూలబాట వలె

కాంచన దీప్త మయంబు జేసి మా

బీటలు వారినట్టి ఎద

బీడుల సేదను తీర్చుమా కవీ’

అని ఆయన మాత్రమే చెప్పగలరు.

 

మౌనమైత్రి పేరుతో టాగూర్ కవితకు ఎలనాగ చేసిన అనువాదం దాని బెంగాలీ స్వచ్ఛతను మూలాలతో పెకిలించి తెచ్చినట్టుంటుంది.

‘నన్ను గిల్లితే వెన్నెల బొట్లుబొట్లుగా కారుతుంది

సన్నగిల్లని ఏకధారగా ఎల్లప్పుడూ పారుతుంది’

 

అని చెప్పుకున్న ఎలనాగ మధురోహల రుచుల్ని మాటల్లోకి తెంచి తెచ్చిన ఋషి.  అంతే కాదు, సంగీతం రుచి తెలిసిన మనిషి.

 

‘గాజుపలక మీద

గాత్రపు పాదరసం దొర్లినట్టు’

అంటూ జేసుదాసు గాత్రం అద్భుతంగా ఆయన పంక్తుల తంతుల మీద గమకాలు పలుకుతుంది.

 

ఎలనాగ నాడుల్లో కళాపిపాస ఇమిడినవాడు. జాజుల డోలల్లా ఊగే విదుషీ స్వరాలు విని ఊరుకోడు. ఉబికిన చలనాన్ని వచనంలా చెక్కుతాడు. కవితల దువ్వెనతో పూలజడ లల్లుతాడు.

 

ఆకురాయి వంటి ఆయన అనల్ప శిల్పానికి నా జేజేలు….!

 

                                                                    -శేషభట్టర్   రఘు

 

                (2009లో ఎలనాగ వెలువరించిన మొదటి కవితా సంపుటి ‘వాగంకురాలు’    మీద సమీక్ష ఇది)

***

 

నేలతల్లి విముక్తి చిరునామా – పాణి కవిత్వం!

aboozmaad

 

అబూజ్ మాడ్.. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. ఏడు దశాబ్దాల తరువాత కూడా స్వాతంత్ర్యం పొందామనుకుంటున్న ఈ దేశ చిత్రపటంపై ఈ పేరు ఒకటి వున్న ప్రాంతమున్నదన్నది అటు పాలకవర్గాలకు కానీ సామాన్య ప్రజానీకానికి కానీ ఎరుకలో లేదు.  కానీ ఇటీవలి సామాజిక రాజకీయ ఉద్యమాల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఈ పేరు అందరికీ తెలిసింది. కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అంటూ కార్పొరేట్ మీడియా కథనాలు ఈ ప్రాంతం చుట్టూ కమ్ముకుంటున్న సైనిక యుద్ధవాతావరణం దీనిని ప్రజలందరి మనసులో ఓ ప్రశ్నగానో లేక ఒక భయంగానో ఎక్కువమందికి ఆశ కల్పించే ఓ సుదూర అరుణతారగానో మదిలో మెదులుతూంది.

కారణం మధ్య భారత దేశంలో కేంద్రీకృతమైన ప్రజాయుద్ధ గెరిల్లా క్షేత్రం ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలతో పాటుగా ఆధునిక కలష్నికోవ్ లతో ఈ దేశ కార్పొరేట్ పాలక వర్గ సైన్యాన్ని సవాల్ చేస్తూ నిలబడి వుండడమే. దీని నేపథ్యంగా పాణి తన కవితా సంపుటిని అబూజ్ మాడ్ పేరుతో వెలువరించారు. విరసం బాధ్యులుగా వున్న పాణి తన విమర్శనారంగం, నవలా రచనలనుండి కవిత్వ రంగం వైపు అనివార్యంగా వచ్చానని తన ముందుమాటలో పేర్కొన్నారు.

“కవిత్వంతో ఎందుకులే అనుకున్నా… కానీ కవిత్వం కావాలి. కవిత్వం ఉద్యమాలకు కావాలి. కార్యకర్తలకు కావాలి. మనిషికి తప్పక కావాలి. కవిత్వం రాయడమొక అవసరమని, గొప్ప అనుభవమని, అంతులేని ఓదార్పు, తిరుగులేని శక్తి అనీ ఈ కవిత్వం రాస్తూ, రాస్తూ తెలుసుకున్నాను” అని అంటారు. నూతన మానవుని ఆవిష్కరణ అనే ఓ సుదీర్ఘ స్వప్నాన్ని కలగంటూ తడిగా బురద అంటి ముళ్ళు గుచ్చుకున్నా మండే కొండ రాళ్ళపై ఓర్పుతో సహనంగా నేలపై నగ్న పాదాలతో విల్లంబులు ఎక్కుపెట్టి తన నేలను నేల గర్భంలోని సంపదను భవిష్యత్ తరాలకు పచ్చగా అందించేందుకు గోచి పాతతో ఎదురొడ్డి నిలిచిన ఆదివాసీ ఈ దేశ అసలు సిసలు భూమిపుత్రులు చేస్తున్న పోరాటాన్ని త్యాగాన్ని వారికి దిశా నిర్దేశం చేస్తున్న ఉద్యమకారుల వీరోచిత నెత్తుటి త్యాగాలను అక్షరాలలో పచ్చి నెత్తుటి తడితో మనకు పరిచయం చేస్తూ తద్వారా ఓ సామాజిక సందర్భాన్ని యుద్ధ మేఘాల ఉరుములు మెరుపులను రాజ్యం చేస్తున్న హంతక పాలనను, కుట్రలు కుయుక్తులను కవిత్వంగా అందించారు పాణి.

అబూజ్ మాడ్ లో దండకారణ్యంలో కొనసాగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో సంక్షుభిత కాలంలో జరుగుతున్న విధ్వంసపూరిత ప్రయాణంలో అక్కడే జరుగుతున్న అద్భుతమైన ప్రత్యామ్నాయ సామాజిక ప్రయోగం జనతన సర్కార్ గురించి పాణి కవిత్వం ద్వారా ప్రకటన చేసారు.

 

అబూజ్మాడ్ రాజకీయం అంటే – తెలియనిది తెలియడమే

శత సహస్ర యుద్ధ రంగాల్లో

గెలుపోటముల నిమిత్తం లేకుండా తలపడిన ఆదివాసీకి

నక్సల్బరీతోనే తన యుద్ధం రాజకీయమని తెలిసింది

పోటీ రాజకీయమని తెలిసింది

అప్పటి నుంచే దండకారణ్యం

లోకమంతా తెలుసుకోవాల్సిన ప్రయోగం అయింది… అంటారు.

 

గెలిచిన పోరాటాలు సరే

ఓడినా తలవంచని గాథలలోనే కదా

చరిత్ర రక్త ప్రసరణ పోటెత్తేది…

 

ఈ కవిత్వంలో సామూహిక సామాజిక నేపథ్యాలతో పాటు కవి తన వైయక్తిక భావ సంఘర్షణను హత్తుకునేట్టు ఆలోచింపచేసేట్టు అక్షరబద్ధం చేయడం విరసంపై గత కొన్నేళ్ళుగా ప్రధాన స్రవంతిలో వున్నామనుకుంటున్న కవుల సాహిత్యకారుల విమర్శలకు ధీటుగా చాలా కవితలు వున్నాయి. కవిత్వం కావాలి కవిత్వం అని గొంతెత్తేవారి దాహార్తిని తీర్చే కవిత్వం మెండుగా వుంది.

పాణి

పాణి

తెలిసీ తెలియక

 

దు:ఖమొకసారి కార్చిచ్చు

మరోసారి విరిగిపడే కడలి ఘోష

 

నీ స్పర్శకెపుడైనా తెలిసిందా

 

మనిషి తెలియకపోవడమే దు:ఖం

ఎందుకిలా ఉన్నాడు

ఎందుకిలా ఉన్నది

ఏ అంచనాకూ

పరికరాల్లేని నిస్సహాయతే దు:ఖం

 

అబూజ్ మాడ్ (కవిత్వం) – పాణి

ప్రతులకు: దిశ పుస్తక కేంద్రం, సహచర బుక్ మార్క్, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. వెల: రూ.50/-

  కెక్యూబ్ వర్మ

1236896_10200449162092190_608445714_n

మట్టి మీది గట్టి నమ్మకం: మంటిదివ్వ

 

    ఏకాలానికి ఆ కాలం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కవిత్వమవ్వొచ్చు. కథవ్వొచ్చు. మనిషి జీవితాన్ని  ఉన్నతీకరించడానికి దోహదపడేవి – ముఖ్యంగా తక్షణమే వొక సంఘటనకు లేదా వొక దృశ్యానికి గొప్ప స్పందనగా వెలువడేది కవిత్వం మాత్రమే. కాలాన్ని పట్టి యిచ్చే మేలిమి మెరుపులాంటి అద్దం కవిత్వమని నిరూపించుకుంది. చరిత్రను కళగా ప్రకటించే అత్యద్భుతమైన కర్తవ్యాన్ని కవిత్వం నెరవేరుస్తుంది. ఈనాటి సంక్లిష్ట వర్తమాన ప్రపంచ నేపథ్యంలో నుంచి – కవిత్వం – మనిషి వ్యక్తిత్వాన్ని -తద్వారా – సామాజిక పరిణామశీలతను గొప్ప సాంస్కృతిక దృష్టితో ప్రభావితం చేయడం జరుగుతుంది.

యిప్పుడు కవిత్వాన్ని నిర్వచించడానికి కూడా అద్భుతమైన దశ వచ్చింది. వర్తమాన సామాజిక సాంస్కృతిక స్థితిగతులు – మంచి కవిత్వం రావడానికి ప్రేరణోపకరణాలుగా వున్నాయి. కవిత్వమిపుడు – దుఃఖమవుతుంది. దుఃఖంలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమవుతుంది. యుద్ధమవుతుంది. సామూహిక ఆగ్రహంలోంచి జనించే కరుణవుతుంది.

సకలం ధ్వంసమవుతున్న వర్తమానం – చీకటి ఊడలు భయంకరంగా అల్లుకున్న భవిష్యత్తు – కళ్ల ముందు యివే తప్ప యింకోటి కనిపించని – ఈ స్థితిలో – కవిత్వం మరింత శక్తిని కూడగట్టుకోవాల్సిన అవసరం వుంది. కవిత్వం అత్యంత అవసరమైన – ప్రాణభూతమైన – వొక సృజనకారుని చూపు.

కవులు ఆ చూపుని పోగొట్టుకోకూడదు.

కవిత్వం – సమస్యను మూలాల నుంచి చర్చించి వదిలేయడమే కాదు. సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన పరమోత్కృష్టమైన బాధ్యత దానిది.

కవికి – సామాజిక చలనాన్ని సరైన దృష్టితో పరీక్షించి… సమీకృతం చేసి – వొక దగ్గరకు చేర్చాల్సిన ఉత్కృష్టమైన ధర్మం వుంది. అలా సామాజిక చలనాన్ని రికార్డ్ చేసిన కవితా సంపుటి – ‘మంటిదివ్వ’. కవి – సిరికి స్వామినాయుడు. నేపథ్యం – ఉత్తరాంధ్రా.

siriki1

స్వామినాయుడుని గానీ, మిగతా ఉత్తరాంధ్రా కవులను గానీ చదివిన వాళ్లకిది అర్థమవుతుందనుకుంటాను – నాలుగైదేళ్లుగా ఉత్తరాంధ్రాలో జరుగుతున్న కల్లోలం సంగతి – దాని రాక్షస రూపం సంగతి – ప్రజల జీవన కాంక్షపై అది మోపిన ఉక్కుపాదాల సంగతి – సరిగ్గా అక్కడే సిరికి స్వామినాయుడు కవిత్వఖడ్గాన్ని చేతబూని యుద్ధవీరుడిలా కనిపిస్తాడు..

‘మంటిదివ్వ’ చదివాక – వొకసారి కాదు – మళ్లీ మళ్లీ చదివాక – ఉత్తరాంధ్రా దుఃఖపు స్థితి కళ్ల ముందు నెత్తుటి చారికలా మిగిలిపోతుంది. దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా యించుమించు యిదే స్థితి. యివే గాయాలు. ఆ గాయాల నెత్తురును తుడిచే మృదుహస్తమే కవిత్వం . గాయపడిన వాళ్ల వెన్నంటి వుండి ధైర్యాన్ని యిచ్చే ఖడ్గమే కవిత్వం. ‘మంటిదివ్వ’ – అలాంటి బరోసాను యిస్తుంది.

స్వామినాయుడు అంటాడు –

ఈ మట్టిపొరల్ని కొల్లగొట్టే
ఒకానొక ఉత్పాతాన్నెవడు కోరుకుంటాడు ?
భూమిని చాపలా చుట్టుకుపోయే
హిరణ్యాక్షుడు తప్ప !
మళ్లీ నేల మీద వాలే చోటు లేక మరణం వేపు సాగే
కష్టజీవుల కన్నీటి విషాదాన్నెవడు కలగంటాడు ?
తునాతునకలైన బతుకు శకలాన్ని
కాసుల కాటాలో తూనిక పట్టేవాడు తప్ప !
( కంచే చేను మేస్తే.. ! )

రహస్యాన్ని శోధించేవాడే కవి. సమస్త అంశాలను మార్కెటైజ్ చేస్తున్న అభివృద్ధి విధానాల ముసుగు వ్యవహారాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు నిలబెట్టేవాడే నిజమైన ప్రజావాది. ఈ కవి – ఆ పనే చేసాడు.

‘మంట’, ‘తూరుపు ఒక నెత్తుటి పొద్దు’ – ఈ రెండూ.. కళింగాంధ్రాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నేపథ్యంలో రాసినవి. ప్రజల అభీష్టమేదైతే వుందో దానినే వ్యక్తం చేసాయి ఈ కవితలు. కాలమే కవిని, కవిత్వాన్ని తయారీచేస్తుంది. అవును. ఈ కవి గానీ, ఈయన రాసిన కవిత్వం గానీ కాలం గర్భకుహరం నుంచి – వేదన నుంచి – తన ప్రజల మీద తనకు గల వొకానొక గొప్ప ప్రేమ నుంచి జనించిన భౌతిక పదార్థాంశాలే. ప్రజల సామూహిక ఆస్తిని వొక్కరే వొచ్చి నొల్లుకుపోతుంటే ఆగ్రహించాడు ( ‘కళ్లం’ కవిత ). ‘పొద్దు’ లాంటి కవితల ద్వారా తిరుగుబాటును ప్రవచించాడు. ఫ్యాక్టరీలు సృష్టిస్తున్న కాలుష్యానికి మత్స్యకారులు నానా అవస్థలు పడుతుంటే వాళ్లతో పాటూ దుఃఖించాడు.
అందుకే..

పల్లెవాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి
కురిసే కన్నీళ్లు – సముద్రం !
చందమామ – వాళ్ల సామూహిక సమాధి మీద దీపం !!
( సముద్రం మీద చందమామ )
అన్నాడు.

siriki
అడవిని గురించి – అడవి ఆసరాగా నూతన సామాజిక ప్రజాతంత్ర వ్యవస్థ కోసం పని చేస్తున్న ‘ఎర్రమందారాల’ త్యాగాల గురించి – సానుభూతితో రాసాడు. భూమి అంగడి సరుకవ్వడాన్ని చింతించాడు. పల్లెల్లో అశ్లీల నృత్యాలనుఒప్పుకోలేదు.

కవి సమాజానికి కన్నులాంటివాడు. కాపలాదారుడు. వెలుగుబావుటా. ‘మంటిదివ్వ’తో ప్రజలకు గొప్ప ప్రామిస్ చేసిన కవి – స్వామినాయుడు మరింత గొప్ప కవిత్వం సృజించాలని కోరతున్నాను.

    ( 09.02.2014 తేదీన – సిరిసిల్లలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ స్వీకరించబోతున్న సందర్భంగా…..  )

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

ఆత్మీయత ఆ వాక్యాల అందం!

                              

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

                 1

‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’ లాంటి వైవిధ్యభరితమైన కవిత్వం రాసిన కవి- అఫ్సర్ గారి- కొత్త కవితా సంపుటి ‘ఊరిచివర’ ని చదవడం వొక గొప్ప రిలీఫ్. కవిత్వానికి వొక కొత్త పరికరాన్ని, వొక కొత్త చూపుని అందిస్తూ… కవి, కవిత్వం వొక్కటిగా పరిణమిస్తూ సాగడం- వొక గొప్ప జీవలక్షణం. ముందుమాటలో ఎన్.వేణుగోపాల్ గారు అన్నట్లు- ‘జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య’- అఫ్సర్ గారి ‘ఊరి చివర’ కవిత్వం.
‘ఊరి చివర’ కవిత్వాన్ని నేను గత రెండు సంవత్సరాలుగా చదువుకుంటున్నాను. మొత్తం అన్ని కవితలూ నన్ను మళ్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా రెండు కవితలు- నన్ను నిరంతరం వెంటాడుతునే వున్నాయి.ఒకటి: Take me home, country roads!
రెండు: నల్లానల్లని నవ్వుఈ రెండు కవితలు ఇన్ని నెలలుగా, ఇంత గాఢంగా- ఎందుకు వెంటాడుతున్నాయి- అని ఆలోచిస్తే… కవిత్వంలో వున్న స్వచ్చత, నిజాయితే కారణమని రూఢీ అయ్యింది. అవే ఆ కవితలను తాజాగా వుంచాయనీ అర్థమౌతుంది.కవిత్వానికి ‘తాజాదనం’ రెండు రకాలుగా చేకూరుతుందనుకుంటా.
-కవిత్వవస్తువు సర్వకాలాలకు చెందినదై.. కవి దానిని ప్రతిభావంతంగా కవిత్వీకరించినప్పుడు…
-అలాగే కవిలోని, తను ఎన్నుకున్న అంశం పట్ల తనకుండే గాఢమైన ‘ఆప్యాయతా సాంద్రత’ ఉన్నదున్నట్లుగా కవిత్వంలోకి బదిలీ అయినప్పుడు…!అఫ్సర్ గారి పై రెండు కవితల్లోని తాజాదనానికి కారణం అదే. కవిలోని కవిత్వాంశం పట్ల గాఢమైన ప్రేమ కూడా… సర్వకాలాలకు చెందినదేననడం సబబు.uri_civara                                                                        2‘ Take me home, country roads!’ కవిత- అఫ్సర్, తన విద్యార్థి ‘బ్రైస్’తో అతని సొంత ఊరిలో కలిసి గడిపిన క్షణాల కలవరింత.
ఈ కవితలో-‘మెత్తని అరచెయ్యి
నీ కొలరాడొ నది‘  అని అఫ్సర్ కవితను ప్రారంభిస్తారు.’మెత్తని నీ అరచెయ్యి- కొలరాడొ నది’ అని అనొచ్చు కదా- అని కవిత చదివిన మొదటలోనే వొకసారి నాకు అనిపించింది. కానీ ‘నీ కొలరాడొ నది’- అని అనడం మూలాన కొలరాడొ నదికి, బ్రైస్ కి మధ్య అనుబంధాన్ని మరింత తీవ్రం చేసారు అఫ్సర్. సరిగ్గా ఆ అనుబంధంలో వున్న అనుభూతి కొసని అందుకుంటూ.. కవిత్వంలోకి ప్రవేశించినప్పుడు… అక్కడే… ఆ ప్రారంభ వాక్యాలే- పాఠకున్ని కట్టిపడేస్తాయి.వొకరి అనుభవాన్ని, అనుభూతిని own  చేసుకునే వొక గాఢమైన కళని అఫ్సర్ ఒంటబట్టించుకున్నారనిపిస్తుంది. ముఖ్యంగా కవి నిజాయితీపరుడైతే (అవ్వాలి కూడా..) అతను సృజించిన కవిత్వం కవిత్వాభిమానుల హృదయాలలో పరిమళిస్తుంటుంది.

సరిగ్గా ఆ పనే చేసారు అఫ్సర్. తన శిష్యుడు ‘బ్రైస్’ తో- అతని ఊరు ‘బాస్ట్రాప్’లో గడిపిన క్షణాల వెంట- మనల్ని కూడా తీసుకుని వెళ్తారు.

ఆ relation ని నాలాంటి కవిత్వాభిమాని కోరుకుంటాడు.

కవిత్వం విషయానికొస్తే… తర్వాత వాక్యాలలో అఫ్సర్ నెమ్మదిగా జ్ఞాపకంలోకి జారిపోతారు.

దీని నిదానమయిన నడకల్లోంచి
నా వూరి గుండె గూళ్లలోకి
పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా’   అని…..

ఆ జ్ఞాపకం- పుట్టిన ‘తల్లి ఊరి’ నుంచి దూరమైన ఎవరినైనా వెంటాడుతుంటుంది- నాకు లాగే………

వొకటో స్టాంజా చివరలో- నది జీవత్వాన్ని ‘బ్రైస్’ చిరునవ్వుతో పోలుస్తూ… అద్భుతమైన ‘మెరుపు’ను సాధించారు అఫ్సర్.

బ్రైస్, నీలాగే నవ్వుతుంది
మీ వూళ్ళో నీ కొలరాడొ ‘ అంటూ………

తరువాత స్టాంజాల్లో-

‘ఈ పూట నీ వూళ్లో
నీ కొలరాడొ చీరమడతల్లో
కరిగిపోయాను ఆత్మని మడతపెట్టి

అఫ్సర్ కవిగా- యిప్పుడు అసలుసిసలైన కవిత్వపు లోతుల్లోకి ప్రవేశించారు. ‘బ్రైస్’ అనుభూతిని తను స్వంతం చేసుకున్నారు. నదితో తనను ఏకీకరణం చేసుకున్నారు. ఇది నిజాయితీతో కూడిన ప్రతిస్పందన.
అందుకే……

నిన్ను కన్న వూరికి ధన్యవాదాలు, బ్రైస్‘     అని ప్రేమతో అనగలిగారు.

మొత్తానికి కవితలో- ‘బ్రైస్’ అనుభూతిని తన అనుభూతిగా; బ్రైస్ అనుభవ గాఢతను తన అనుభవ గాఢతగా చేసుకుంటూ కవిత్వాన్ని సృజించిన తీరు నాకు విపరీతంగా నచ్చింది.
ఈ కవితను చదివిన నేను- అఫ్సర్ గారిలో వున్న సహజమైన, సున్నితమైన పసిపిల్లల నిర్మలత్వానికి జోహార్లు చెప్పకుండా వుండలేను.

‘బ్రైస్’ ఊరి నుంచి తిరిగి వెనక్కి వచ్చేస్తూ….. ఆ అనుభూతి గాఢత తనలో వుంటూనే వుంటుందని చెప్పడానికి-

నెమ్మదిగా పరిగెట్టే నీ నదిలో
ఇప్పటికీ నా కాళ్లు సగం అలాగే వుండిపోయాయి
తడి ఆరకుండా ‘

కవితకు అసలైన ముగింపు- ఇంతకంటే మరొకటి వుండదనుకుంటా.

                                    3

సరిగ్గా మళ్లీ అలాంటి అనుభూతి గాఢతే వున్న కవిత ‘నల్లానల్లని నవ్వు’. సర్వదేశాల సంస్కృతుల కూడలిలాంటి…. వొక యూనివర్షిటీలో అధ్యాపకుడిగా  పనిచేయడం- అఫ్సర్ గారి ఆలోచనలకు, కవిత్వవస్తువులకు, కవితా వ్యూహాలకు- వొక విస్తృతిని ఇచ్చాయి.
‘నల్లానల్లని నవ్వు’ కవితలో…………..

మెట్రోబస్ వెనకాతల
వొక కితకితల నల్లసముద్రమేదో
అల లలలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది

అని అనడంతోనే కితకితలు పెట్టినప్పుడు మనిషి ఎలా మెలికలు తిరుగుతాడో…. దానిని సముద్రంలో అలల కదలికలతో పోల్చారు. అద్భుతమైన ఈ పోలికను ఎవరైనా నచ్చకుండా వుండలేరు. ‘నల్లసముద్రం’ అని అనడం వొక రూపాన్ని తీసుకురావడమే. దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షింపబడుతుంది.

ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని…..’

ముందు కవితలాగే- ఈ కవితలో కూడా… ఎదురుగా వున్న వొక మనిషి అంతరంగంలోకి చొరబడి… ఆ మనిషిలోని అనుభూతితో మమేకమయ్యారు అఫ్సర్.
కవిత ముగింపులో-

మెట్రోబస్ వెనకాల
వొక కితకితల నల్లసముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్రకళ్లు వాలకుండా! ‘

నిజంగా వెంటాడే కవితే. అనేక రోజులుగా నన్ను వెంటాడుతున్న కవితా ఇదే.

                                                                    4

ఊరి చివర కవితా సంపుటి వచ్చి మూడున్నరేళ్లు దాటినా… నాకు మాత్రం ఎప్పటికీ, ఎన్ని సంవత్సరాలైనా- అపుడే పుట్టిన లేగదూడవంటి నిర్మలమైనదే. సరికొత్త కవితా సంపుటే!

కొత్తదనాన్ని పొదిగివున్నదేదైనా సజీవమైనదే కదా!

– బాల సుధాకర్ మౌళి

కవిత్వ తాత్విక మార్మిక కావ్యం ‘మహాశూన్యం’!

        Front Page

   మాతృగర్భం నుండి మహా శూన్యంలోకి మట్టిఘోష వినడానికీ అహోరాత్రం ప్రయాణం చేస్తూ, జననమరణాలు ఎందుకు? ఈ సృష్టి ఎలా వుంది?-అనే తాత్విక చింతనతో కాలగర్భంలో బందీ అయిపోయీ బయటపడటానికి నిరీక్షణ చేస్తూ జీవప్రమిదెలు వెలగడానికీ ఊపిరి పొస్తూ కాలకుసుమాలు పూయించడానికీ సంకల్పం చెప్పుకొంటూ అప్రయత్నయత్నం తో విశ్వరూపంను డర్శించి ఆదర్శనంతో నేనుగా మిగిలిపొయాను-అనే తాత్విక విచారాన్ని చేస్తున్న ఉత్తమ కవి డాక్టర్ దీర్ఘాశి విజయ భాస్కర్   గారు.

ఎన్నో పర్యాయాల పఠానానంతరం విమర్శకున్నో,విశ్లేషకున్నో కాకపోయినా కవిత్వపు వొడిలో వొరిగిపోయే ఐంద్రికున్నవ్వటం వల్ల వో నాలుగు మాటలు రాయాలనిపించింది.

భారతీయ తత్వచింతనతో, జననమరణాల గవేషణ గూర్చిన ఆలోచనతో, విశ్వరూప రహస్యాల శోధన చేస్తూ వాటిని పారదర్శక చీకటి పొరల్లా మహాశూన్యం లో కవి పాఠకునిముందుంచుతాడు.  ఆనాటి భారతీయ తత్వచర్చ అంతా భావవాద,భౌతివాదాల ఘర్షణే. భావవాదానికీ కేంద్రబిందువు దైవ భావన. భౌతికవాదానికీ ఆధారం ప్రకృతిశక్తులు.  ఈ రెండింటి సమన్వయ ప్రయత్నమే ఈ కావ్య రచనేమో?

ఏ కవైనా ముందు కవిత్వ రచన చేసి పరిపక్వత సాధించిన పిదప నాటక రచనకు పూనుకొంటాడు. కానీ డాక్టర్. దీర్ఘాశీ విజయభాస్కర్ గారు చాల గొప్ప నాటకాల రచన చేసింతరువాత మహాశూన్యం రచించాడు. ఆ కారణంగానేమో ఈ కవిత్వంలో గాధత, సాంద్రత, చిక్కదనం ఆవరించాయి.

లోకాయతం,  సాంఖ్యం,న్యాయం, యోగం, బౌద్దం, జైనం, పూర్వమీమాంస, వేదాంతం మున్నగు దర్శానాల ఙానం “మహాశూన్యం”లో అంతర్లీనంగా అంతరగంగలా కవిత్వపొరల్లో ప్రవహించడం పరిశీలిస్తే ద్యోతకమవుతుంది.  ఈ కావ్యాన్ని కవి అనుభావ కావ్యమన్నాడు.         అనుభావమంటే “నిగూఢమైన తాత్విక భావనల్ని, అందులోని సున్నితమైన పొరల్ని అనుభవించి అనుభవింపజేసేది”- అని కవే తెలియచేశాడు.కన్ ఫ్యూషియస్ భావనలో అనుభవం కూడా వొక ఙానమే.ఈ ఙాన సముపార్జన కష్టమైంది చేదైంది.దీన్ని స్వానుభవంతో మాత్రమే సాదించుకోగలుగుతారు.

“జనన మరణాలు అభేధమని / అవిభాజ్యమని తెలుసుకొని/ఙ్ఞానినయ్యాను/నేనే ఙ్ఞానమయ్యాను”-అని కవి అనటంలోనే కావ్యాస్వభావం స్థూలంగా తెలుస్తుంది.   అనుభవించి అనుభవింపచేసె అంశాలు అనేకం ఈ కావ్యమంతా అల్లుకొని దీన్నొక కవిత్వతాత్వికమార్మిక కావ్యంగా రూపొందించాయి.పాథకుల మేధోచిత్త సంస్కారాన్ని బట్టి ఈ కావ్యం కొందరికి కవిత్వపరిమళం అలదికొన్నదిగా, మరి కొందరికి తాత్విక చింతనాత్మకతను సంతరించుకొన్నదిగా,  ఇంకొందరికి సంవేదన,  సంశయాత్మక మార్మికత కూడుకొన్నదిగా స్ఫురిస్తుంది.   ఇలాంటి కావ్యాలు అరుదుగా సౄజించబడుతుంటాయి.

దీర్ఘాశి విజయభాస్కర్

దీర్ఘాశి విజయభాస్కర్

మహాశూన్యంలో”అంతా వుండి అంతటానిండి వున్నసమస్తం లోని శూన్యం నుంచి చైతన్యం ఎలా అంకురిస్తుందో,అంతటా వుండే శూన్యం,అంతా తానై ఎలా రూపాన్నిపొందుతుందో సృష్టి,స్థితి లయలను ఎలా క్రమబద్దం చేస్తుందో ఈ కావ్యంలో ముకురంలో బింబంలా దర్శనమిస్తుంది.  ఏమీ లేని తనం నుండి ప్రారంభించబడి విశ్వాంతరాళానికీ ఎగబ్రాకీ, కాలస్పర్శతో అంతర్ముఖమై తనలోకి తాను గతించే పదార్థంయొక్క నిరంతరగమనశీలతను కవి ఈ కావ్యంలో ఆవిష్కరించాడు.

మానవుడు నిరంతర అన్వేషణాసక్తుడు.అంతేకాదు తమకంతోఅన్నింటిని అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు.   ఈ లక్షణం కవిలో పుష్కలంగా వుంది.కాల స్వభావాన్నీ తెలుసుకోవాలనే తన గాఢ వాంఛను పాఠకుడి గుండెకు తగిలేలా కవిత్వం చేసి గురి తప్పని బాణంలా సంధించాడు.

“కాల గర్భంలో క్షణాల కణాల్లా దూసుకొస్తున్నాయి”, “కాలం ఏక ముఖి” ,  “కాలం హాలాహలం”,  “కాలం త్రినేత్రి”-ఇలా ఎన్నో కాల సంబంధి అంశాలు కవిత్వమంతా పరచుకొని పఠిత మనసుని కాలంతోపాటు కవితలవెంట పరుగెత్తిస్తాయి.కాల గర్భంలొ దాక్కున్న కాలాన్ని కవి  “అది అంతరిక్ష విశేష కల్పన “అని ”  స్వయంభువు అయిన చైతన్యం వల్లనే సృష్టి మొత్తం ఏర్పడిందని తీర్మానిస్తూ కాలం మాటలన్నీ మనిషికిచ్చి తాను మాత్రం మౌనం మిగుల్చుకొని ఆ మౌనంలో చావు పుట్టుకల్ని దాచుకుందంటాడు.  కాలం విశ్వమంతా వ్యాపించి సృష్టినంతా ఆక్రమించి పంచభూతాలకు ఆధారభూతమైన  ఆద్యంత హేతువైందని కవి భావిస్తున్నాడు.  ఏంచేసినా…ఏంచేయించినా కాలమే చేసేది చేయించేది.  అయితే కాలం దేన్ని తనదిగా చేసుకోదు-అని కవి కాలస్వభావాన్ని మార్మికంగా వ్యాఖ్యానిస్తాడు  ఈ కావ్యంలో.  కాలం ఈ సంపుటిలో వొక అంతస్సూత్రంగా అల్లుకపోయింది.

ఎవరైతే  ” ఎవనిస్వరూపం తుదిలేని మహాశూన్యమని భావిస్తారో, ఎవరైతే ప్రతి మట్టి రవ్వ,నీటి బొట్టు, గాలి రెబ్బ సమిధలవుతున్నాయి అంతశ్శక్తి మళ్ళీ మళ్ళీ అవతరించాడానికీ అని నమ్ముతారో, ఎవరైతే మనం మరో లొకంలో వున్న రూపాలకు నీడలమని తలపోస్తారో,  ఎవరైతే మట్టిలొ పడింది మరుగుపడినా మెరుగుపడే బయటికొస్తుంది మృత్యుఘాతంతోనని విశ్వసిస్తారో,  ఎవరైతే దేహికి మట్టి మళ్ళీ మళ్ళీ దేహాన్ని సిద్ధం చేస్తుందని భావిస్తారో,  అలాంటి కవులకు వ్యక్తులకు మరో జన్మ మీద, కాలాన్ని నడిపిస్తున్న  శక్తి మీద విశ్వాసం వుండే అవకాశం వుంది.

బౌద్దమత పరిచయ జ్ఞానంతోనో,  అంబేత్కర్ ఆలోచన విధాన అనురక్తుడైన ఈకవి తన కావ్యానికి బౌద్ద తత్వవేత్త నాగార్జనుడు ప్రతిపాదించిన శూన్యవాదానికీ దగ్గరగా వున్న” మహాశూన్యం”-అనే పదాన్ని కావ్య శీర్షికగా చేసుకొన్నాడు. మనిషి జీవితం కూడా కాల ప్రవాహంలో నిరంతరం  కృశిస్తూ సాగిపోయే వొకజనానంతరయానమని బౌద్దమతవిశ్వాసం.  బౌద్ద జాతక కథలు బోధిసత్వుడు అనేకలెత్తిన అంశాన్ని చెబుతాయి.  ఈ ప్రభావం వల్లనేమో  దీర్ఘాశి విజయభాస్కర్ గారు అనంత కాలంలోకోట్లాది మనసుల్లో మెదిలిన ప్రశ్న,ఎన్నో మెదల్లను వెధించిన ప్రశ్న,ఎందరో మహర్షులు,తత్వవేత్తలు శోధించి సంధించిన  ప్రశ్న ఒకటే అది మరుజన్మ.  మరణానంతరం మనిషి ఏమవుతాడు అన్న సంశయం.   ఈ ప్రశ్నకు సంశయానికి సమాధానంగా”ఆత్మక్రతువు”అనే కవితలో కవి ఇలా అంటాడు “అందుకే ఇక్కడ పాతవారెవరూ వుండరు/కొత్తవారెవరురారు/ప్రతి వ్యక్తి సనాతన విశ్వచేతనకు ఓ అధునాతన ” అభివ్యక్తి”-అని.  అయితే ఈ సంశయానికీ బైరాగి ఇలా సమాధనం చెబుతాడు వొకచోట.”ఏదీ చావదు ఇచట/ద్రవ్యంలోంచి రూపంలోకి/రూపంలోంచి భావంలోకి/ఓజంలోంచి భావంలోకిరూపం మారుతున్నది ఒకే శక్తి/రాలుటాకు సెజ్జలోంచి క్రొంజిగురులు లేచినట్లు”-అని బైరాగి తాత్వికంగా వ్యాఖ్యానిస్తాడు.  ఇలా అనేకులు అనేక విధాలుగా మరోజన్మ గురించి ఆలోచనలు చేశారు.

పోషణ శోషణ డైవం నుంచి ప్రకృతికీ మారినప్పుడు ఈ విశ్వమంతాప్రళయతరంగాలలో కూడిన సముద్రంలో ప్రయాణించే నావికుడు లేని నావగా కవి పోలుస్తాడు.ఆ నావలోని ప్రయాణికులు భయంతో ఎవరికీ వారు తీరాన్ని చేరడానికీ వారంతా అన్నివైపులకు తెడ్డు వేసీ ఆనావను నడ్ఫిపించే ప్రయత్నం చేస్తే దానికీ కదలిక వుంటుది కాని గమనం వుండదు.అంటే ఈ సమస్త విశ్వసృష్టిని ఎవరికీ వారు వారివారి ధోరణుల్లో ఆలోచించుకుంటూ వ్యాఖ్యానించుకుంటూ పోతే అసలు సత్యం,ఙ్ఞానం మున్నగు గమ్యాలను  ఈ మానావళి అందుకోలేక పోయిందనే భావనను కవి మహశూన్యంలో ఆవిష్కరిస్తాడు.

అప్రయత్నయత్నం అనే ఈ కవితలో “కణం ఆధారంగా ప్రకృతి క్షణం క్షణం ఆకృతి దాల్చాలనే నిర్దేశం ఎవరిది?….సృష్టి సమస్తం పర ప్రయత్నరహితమై స్వయం భోజక రూపమై ఘటిల్లే అప్రయత్న యత్నం  ఏ  శక్తిహేతువుది? -అని తనకు తానుగా ప్రశ్నించు కోవడంలోనే కవ్య స్వభావం అర్థమవుతుంది.

ప్రకృతి, పదార్థం జడంగా.చైతన్యంగా అవస్థీకరించడం వల్లనే అహం, ఇహం విభజించబడ్డాయని మనిషి తనప్రవర్తనలో, నడవడిలో మహన్నొతుడిగా ఎదగకుండా మరుగుజ్జు అవుతున్నాడని కవి తాత్విక పరితాపాన్ని ప్రకటిస్తాడు. ప్రకృతి, పర్యావరణ నేఫథ్యంతో ఎంతో తాత్వికంగా మనిషిని మలిచిన మట్టి ఘోషను మనకు వినిపిస్తాడు.  మానవీయ లక్షాణాల్ని అలక్ష్యం చేసి అరిషడ్వర్గాలను అక్కున చేర్చుకొని క్రోధిగా, లోభిగా, పాపిష్టిగా, భూమాత గుండె మీద పుండుగా మారిన మనిషిని మట్టిఘోషను వినమని చెబుతాడు. “భూమాత చేసే ఘర్జనలే భూకంపాలు/మనిషి జరిపే విధ్వంసం చూసీవిశ్వజనని కార్చే కన్నీరే కుంభవృష్టులు” -అనిచింతన చేస్తూ “ప్రభూ!ప్రకృతిని ప్రేమించే పుట్టించమని” నమ్రతతో నమస్కరిస్తూ, ప్రకృతిని ప్రేమించే మనిషి జనన అనివార్యతను గుర్తుకు తెస్తాడు.

పంచభూతాలు,తోకచుక్కలు,కృష్ణబిళాలు,గ్రహశకలాలు ఏవి ఎప్పుడు ఈ అవనిని ఆవగింజగా మార్చి అంతం చేస్తాయో ఎవరికీ తెలుసు-అని మనో సంశయాన్ని చెబుతూ మానవుని ఙ్ఞానావిష్కరణా పద ఘట్టనలకింద ప్రకృతి నలిగినలిగి నుజ్జునుజ్జవుతుందని ఈ సత్యం గ్రహించే సరికి మనిషి మిగలడూ భూమి వుండదని కవి వొక మార్మిక రహస్యాన్ని విప్పుతాడు.

పదార్థం దాని స్వభావాన్ని కనబరచకబోతే విలువను కోల్పోయి న్యూనతను పొందుతాయని ప్రతిపాడిస్తూ” తుఫానే లేకపోతే సముద్రమెంత చులకన?  కంపించడం మరచిపోతే భూమి ఎంతలోకువ”- అంటాడు.  ఈ  కవే మరో చోట పదార్థం తన స్వభావాన్ని కనబరచకబోతేఆధిక్యతతో భాసిస్తాయంటాడు.  “గాయపర్చే శక్తిని కోల్పోతే అస్త్రమే ఆభరణమవుతుంది నోప్పించే గుణాన్ని కోల్పోతే మాటే మంత్రమవుతుంది”- వొక  అభాస వైచిత్రుల్నీ కావ్య పరిమళంలో కలిపి పఠితల్ని ఆఘ్రానింప చేస్తాడు.

గతవైభవ ఆలొచనలతో శాస్త్రీయతను అంగీకరించకపోవడం,  ఆధునిక  దృక్ఫథాల  పెడసరితనంతో శాస్త్రాలను పక్కన పెట్టడం ప్రతి తరంలోను వుంది.ఆ భావనతోనే అనంత ఆత్మ తత్వాన్ని “విశ్వరూపం”-అనే కవితా ఖండికలో ఆవిష్కరించానని కవే పేర్కోన్నాడు.   “కాలాన్ని వొడిసిపట్టి కాలంలో లీనమై  నేనే  కాలస్వరూపంగా  మారాను.”-“భౌతికం నుండి బ్రహ్మంగా మారుతున్నాను.  అడిగో మహాశూన్యం సాక్షాత్కరిస్తోంది.”-  అ ఒటున్నాడు కవి విశ్వరూపంలో.

బ్రహ్మం అంటే ఏమిటి?  ఙ్ఞాని కావడం ఏమిటి?  ఙ్ఞానమై పొవడమేమిటి?  ఈ ప్రశ్నలు పాఠకుల మనసును తొలుచక మానవు.   ఇది మార్మిక తాత్విక కావ్యమవ్వటం వల్ల ఇలాంటి అనేక సంశయాలు కావ్యంలో పొదగబడ్డాయి.   పొరలుపొరలుగా వున్న కవిత్వాన్ని విప్పుకొంటు పాఠకుడు ముందుకు పోగలిగితే కావ్య స్వరూపం మాధుర్యం మనసుకు అంది ఆలోచనామృతం అవుతుంది.

సర్వకాల సర్వాస్థలలో కాదలేనిది, లేదనడానికీ వీలులేనిది, పరిమితి, సంకుచిత తత్వం,వివాదం లేనిది, అప్రమేయమైనది, స్వతంత్రమైనది ఏదంటే ” బ్రహ్మం”.  ఆ బ్రహ్మం కోసం అన్వేషణ సాగించాలంటే సూక్ష్మదృష్టి కావాలి.   కళ్ళతో చూస్తున్నప్పుడు కన్పించేది వేరేగా వుంటుంది.  అట్లాంటి స్థితిలో కనిపించిన దానిమీదంతా కాకుండా, అవసరమైన దానిమీదే మనసును కేంద్రీకరించ గలిగితే, అలా…అలా ఒకానొక కేంద్రానికి చేరాక,సూక్ష్మస్థితికి చేరుకొన్నాక ఆ కేంద్రబిందువు మీద మనసు నిలిపితే గోచరమయ్యేది శుద్దమైన సత్యం.   అదే బ్రహ్మం.  అప్పుడు ఏమి?  ఏంత?  ఎన్ని?  అనే ప్రస్నలు ఏర్పడవు.ఎంత వున్నా కావాలనిపించేది ఏదీ వుండదు.    అదే బ్రహ్మం.  ఆ స్థితికీ మనిషి చేరుకోవలన్నది  కవి కాంక్ష.   అప్పుడే సృష్టి సమస్తం సుఖవంతం   .జననమరణాలు అభేధమని, అవిభాజ్యమని తెలుసుకోవడం ఙ్ఞానం.    తనను తాను తెలుసుకోవడం ఙ్ఞాని అవ్వడం.

ఇది ఎంత తాత్విక మార్మిక కావ్యమే అయినా ఆ తాత్వికమార్మికతా ఉంగరంలో కవిత్వ రత్న వాక్యాలు  వొడుపుగా పొదగబడ్డాయి.  కవి విజయభాస్కర్ గారి భావనా శక్తి అపారం.  సముద్రం ఎట్లా ఏర్పడిందో కవి భావిస్తాడు చూడండి.  సూర్యుడు,చంద్రుడు ఆకాశానికి అందాల బిడ్డలు.  ఆకాశానికి పాలు పడక ఆకలితో అల్లాడే వాళ్ళకి పాలిమ్మని ఆకాశం భూమిని అడుగుతుంది.  భూమి మంచు తెరల పయిటను తొలగించి పర్వత పాలిండ్లను చేపి ఆకాశపు బిడ్డల కడుపు నింపిందట.  వాళ్ళు తాగుతున్నప్పుడు జారిపడ్డ పాలబొట్లే మడుగుకట్టి సముద్రమయ్యిందట.  ఇలా ఊహించటమ్ ఈ కవికీ సాద్యమేమో?  అలాగే రాత్రి,  పగలు ఏర్పడిన విధానాన్ని కూడ అడ్భుతంగా ఊహిస్తాడు.

“వయోభారంతో విశ్వం బుద్ది మందగిస్తోంది.  ఙ్ఞానభారంతో భూమి తల్లడిల్లుతోంది.  అంతరిక్ష అంతరంగం గాయాలతో మూలుగుతోంది.”- కవి అన్న ఈ మాటలు ఎన్నొ సంకేతార్థాలను స్ఫురింపచేస్తాయి.  గాఢతాత్వికాంశాల  ప్రస్తావనలోనే సమకాలీన అంశాలను స్ఫురింప చేయడం ఈ కవి ప్రత్యకత.

మనిషి భయంకర వికృత ఆలోచనలతో ప్రకృతిని, చివరకూ గ్రహాలను కూడా వొదలకుండా దోచుకోబోతున్నాడని “గ్రహాల్లారా పారిపోండి”-అని హెచ్చరిస్తాడు.   ప్రకృతిని సృజించడానికీ ముక్కోటి దేవతలు కావాలేమో కాని వినాశనానికి ఒక్క మనిషి చాలు అని లుప్తమైపొతున్న మానవ్త విలువల్ని గురించి ఆలోచింప చేస్తాడు.  “భూమి గుండె గుజ్జు వొలుచుకొంటున్న గనుల గుర్తులు.సుర్యున్ని మింగేసిన అంజనీ పుత్రుడొక్కడే ఆనాడు భూమిని నమిలేస్తున్న వాయునందనులెందరో ఈనాడు”-అని అనటంలో బళ్ళరి గనులను నమిలేసిన గాలిని గుర్తుకు తెస్తాడు.

ఇలా తాత్వికతతో, మార్మికతతో, కవిత్వంతో భాసిస్తున్న మహాశూన్యం ను గూర్చి   ఎంత మాట్లాడినా మిగిలిపోయే అంశమేదో వుందని అనిపిస్తుంది.ఎవరికీ వారు దీన్ని చదివి కవిత్వపు లోపలిపొరల్లోకి  వెళ్ళి తమ లోపలి ప్రపంచాల్నీ ప్రక్షాళన చేసుకోవాల్సిందే.కొలకలూరి వారన్నట్లు శ్రీశ్రీ మహాప్రస్థానం చేస్తే విజయభాస్కర్ మహాశూన్యం డర్శించాడు.

ఈ కవే అన్నట్లు” మనందరి మధ్య ఏమీ తెలియని తెలిసిన తన మొకటుంది.  తెలుసు కున్నవారు కూడా తెలియచెప్పలేని తెలివి తక్కువతనమది”-తెలివి తక్కువ తనంతో ఏదైనా రాసివుంటే దానికి బాధ్యత నాదే,  కావ్యానిది కాదు.

 

   -రాజారామ్ తుమ్మచర్ల

రాజారాం తుమ్మచర్ల

రాజారాం తుమ్మచర్ల

కన్నీటిగుండె ఆకాంక్షలోంచి పుట్టిన కవిత్వం: బూర్ల వెంకటేశ్ “పెద్ద కచ్చురం”

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఏ కవిత్వంలోనైన వ్యక్తి ఉంటాడు.అతనిచుట్టూ అతను గ్రహిస్తున్న,గమనిస్తున్న సమాజం ఉంటుంది.ఈ సమాజాన్నానుకొని కొన్ని విలువలుంటాయి.అవి సామాజిక, ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక, కళాభావనలు ఏవైనా కావొచ్చు.కవికుండే నిబద్దతలను బట్టి కొన్ని అంశాలు ప్రధానంగా,కొన్ని సాధారణ దృష్టితో కవిత్వీకరించబడుతాయి.కవిత్వంలో వాస్తవ సమాజం స్వీకరింపబడుతుంది.కవికి ఆయా అంశాలపై ఉండే విఙ్ఞానం మేరకు వాటిని  స్వీకరిస్తాడు.అది కళాత్మక ప్రతిఫలనం చెంది పాఠకులకు చేరుతుంది.వెంకటేశ్ కవిత్వంలో సమకాలీన వాస్తవ సమాజం ఉంది.ఈ మధ్య కాలంలో తను ఆవిష్కరించుకున్న కవితా సంపుటి”పెద్దకచ్చురం”లో ఆసమకాలీన సమాజానికి అద్దం పడుతుది.
వస్తువు గురించి మాట్లాడుకుంటే తనకు తాను పరిధులు గీసుకోనట్టుగానే కనిపిస్తాడు.అంతే స్పష్టంగా సమాజాన్నీ వదిలేయలేదు.గతంలో ప్రచురించిన “వాకిలి”కి ఈవల వెంకటేశ్ కవిత్వాన్ని గమనిస్తే స్పష్టమైన పరిణతి కనిపిస్తుంది.బూర్లలో ప్రపంచీకరణ,తెలంగాణా ఉద్యమం లాంటివాటితోపాటు గుట్టలవిధ్వంసం,తన వ్యక్తిగతమైన అంశాలుకొన్ని ఉన్నాయి. సాధారణంగా కవిత్వం రాస్తున్నప్పుడు కొన్ని నిర్దిష్టతలుంటాయి.ఒక నిర్దిష్ట వస్తువు(perfect Content)పై రాస్తున్నప్పుడుకూడా ఇవి ప్రధానాంశంతో పాటు ప్రభావాన్ని చూపుతాయి. ఆముఖ కవిత్వం(prefaced Poetry)రాస్తున్న ప్పుడు ఈధార ఎక్కువ.
“కవితల్నెవడు అల్లుతాడు””కవిత”లాంటి కొన్ని కవితలు వెంకటేశ్ వస్తుసంబంధమైన అస్తిత్వ నిర్దిష్టతల్ని పరిచయం చేస్తాయి.తను ఎక్కడ మేల్కొని ఉన్నాడో తెలుపుతాయి.”కవితల్నెవడు అల్లుతాడు/ప్రవహించే ఊహల కంటిముత్యాల్ని ఆల్చిప్పలా ఒడిసిపట్టి/హృదయ హారం ఎవడు చేస్తాడు””రహదారంతా పరిగెడుతున్నప్పుడు /ఎర్రమెరుపులా ఎగిరిపడ్డ/అమాయకుని పాదాల్నెవడు ముద్దాడుతాడు””ఎర్ర దీపాలవెనుక కుమిలిపోతున్న/మాంసపుముద్దల మనోవేదనలకెవడు/అక్షర వైద్యం చేస్తాడు””ఐదేళ్ల అవతారాన్ని/ప్రతిఙ్ఞ మొదలు రద్దువరకు/సెకనులో వెయ్యోవంతై/పిల్లలకోడిలా ఎవడు కనిపెడతాడు”కచ్చితమైన నిబద్దతని చెప్పినప్పుడుకూడా జీవితాన్ని మర్చిపోకపోవడం కనిపిస్తుంది.కవుల బాధ్యత ఏపరిధిలో ఉంటుందో చెప్పిన వాక్యలివి.ఏ వస్తువైనా వెంకటేశ్ కి తనదిగా రూఢిచేసుకున్న శైలి ఒకటి ఉంది.పాఠకుడిని అనుభోక్తగా మార్చడానికి వాతావరణంలోనికి తీసుకెళ్లటం,ఉద్వేగాన్ని కలిగించడం వంటి క్రమ పద్దతిని పాటిస్తాడు.అంశాత్మక పరిశీలన(Case Study)వచనంలో వేగం ఉన్నాయి.రాజకీయల మీద మాట్లాడుతున్నా కేవలం నినాదం చేయకుండా కవిత్వాన్ని చంపేయకుండా హృదయానికి అందిస్తాడు.”ఆత్మగౌరవ కిరీటం””ఆత్మగౌరవంలోంచి””ఉద్యమం“”ఏమొస్తది””ఇక్కడ””నడువుండ్రి”-లాంటి కవితలు తెలంగాణా ఉద్యమాన్ని గురించి రాసినవి.ఒక సాధారణ వాక్యాన్నిబలంగా హృదయనికి చేర్చడానికి ప్రతీకలని ఉపయోగించుకుంటాడు.అలా అంతే దీర్ఘాలోచనలో భారంగా అదే మానసికావస్థలోకి అడుగుపెట్టేలా చేస్తాడు.

“ఒక గుండెకాయను మరో శరీరంతో కలిపి కుట్టిన శస్త్ర చికిత్స”-(ఆత్మ గౌరవంలోంచి-పే.-1)

“ఎంత జాలె పోత పోసి అల్లినా/నువ్వు నాపై బిగువుగా విసిరిన వల/పెద్దమనుషుల ఒప్పందం/నువ్వు పచ్చ బొట్టు పొడిపించుకోడానికి తయారైన ఫార్మూలా”-(పైదే)

“మనో భూమిలో విత్తన మంటూ పడ్డాక/తాను చిట్లటం నేలను చీల్చడం తప్పుతుందా?”(పైదే)

 

కెనెత్ బర్క్ ఇలా అంటాడు-“సాహిత్యంలో వస్తు రస భావ స్వభావాలను బట్టి హృదయానికి అనుభూతినందించే అవస్థాస్థితి ఒకటి ఉంది-ఈ అవస్థాస్థితిని Pattern  అని దాని ఉపయోగాన్ని ప్రతీక (Symbol)అనివ్యవహరిస్తారు.”-ఈ అభివ్యక్తిమెరుపుల్ని వెంకటేశ్ లో అనేక చోట్ల గమనించ వచ్చు.అమ్మ గురించి రాసిన కవిత అసలుసిసలైన కవిత్వానికి ఉదాహరణగా మిగులుతుంది.

boorla

“పక్కలో వెన్న ముద్దను పెట్టుకున్నట్లు/నా పక్కన ఎంత ఒత్తిగిలి పడుకునేది అమ్మ”-(అమ్మగురించి-పే.6)

“అటువెల్లిన నాఊయల /ఇటువచ్చేవరకు అమ్మ కళ్లు విచ్చిన తామరలై ఎదురుచూసేవి”

“అనేక చూపులను అనుమానించి/పూటపూటకూ దిష్టి తీసిన కనురెప్ప అమ్మ”

“తనగుండెను రెండుచేసి ప్రాణం పోసిన అమ్మ/ఈ అందాలబొమ్మను విడిచిపోవడం/ముళ్లకంప గీరుకుపోయినంత బాధ”

ఒక బలమైన మానసిక వాతావరణాన్ని పరిచయం చేసే వాక్యాలు.మూస అభినివేశం కాకుండా తనదైన కొత్త దర్శనం ఇందులో కనిపిస్తుంది.

“అమ్మకోసం””నాన్న””అర్ధాంగికి””నువ్వు నేను ప్రేమ””వెల్డర్ తిరుపతి”-లాంటివి వైయ్యక్తిక సంబంధాలకు సంబంధించినవి.నిజానికి కవిత్వం చుట్టు ఒక ఆర్ద్రమైన ,ప్రతీకాత్మక ప్రపంచాన్ని సృష్టించాడు వెంకటేశ్.

తనదైన ముద్రని పదిల పర్చుకుంటున్న సమయంలా కచ్చితంగా ఈ సంపుటి కనిపిస్తుంది.బలమైన కవితాత్మక వచనంతో తనను తాను నిలబెట్టుకోడానికి వెంకటేశ్ కు ఎక్కువకాలం పట్టదు.

ఎం.నారాయణ శర్మ

అతనిలా ఇంకెవరున్నారు?!

“కాలే గచ్చుపై కుంకుండు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు చురుగ్గా అంటించినప్పుడు
పరిక పొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను సుతారంగా తీసినప్పుడు
ఎర్రటి మధ్యాహ్నం మనం భూతద్దపు చేతులతో
రెండు పచ్చి అగ్గిపుల్లలని వెలిగించ చూసినప్పుడు”

ఈ గుప్పెడు పదాలూ చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్ఫృశిస్తూ , మనకే తప్ప మరొకరికి తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ “నీలాగే ఒకడుండేవాడు” అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి – ‘ఆ మాట నీకెలా తెలిసిందసలు’ అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నావాడేమో కదా, లోకాన్ని చూడని అమాయకత్వం పదాల్లో వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ…అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

“వెన్నెల స్నేహితా!
నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం కావాలి. సత్తువతో నిండిన దేహం. శుభ్రత నిండిన మనసు, స్వచ్ఛత నిండిన ఆత్మ కావాలి. మనం మనమై జీవించడం కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం కావాలి. ఏం చేద్దాం?! అవేమీ నా దగ్గర లేవు. ఉన్నదల్లా ఒక అనారోగ్యమైన దేహం, గాయాలు నిండిన మనసూ, వెలుతురు లేని ఆత్మ. నీ అద్భుత హృదయం లాంటిదే నాకూ ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ ఒకేసారి అంతమైతే బాగుండు. చిందరవందరగా పడి ఉన్న ఊహలకి నిశాంతమేదైనా ఆవహిస్తే బాగుండు. కానీ-

కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి ఊహలో తప్ప ఏవీ ఎక్కడా అంతమవవు.
దుఃఖిత సహచరీ!
మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం రాసిచ్చి ప్రయోజనం లేకుండా పరుగు తీస్తాను.” అంటూ ఊపిరి వేగం పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు – ఎవరితను?

గుర్తొస్తారు, ఒక్కో కవితా మొదలెట్టగానే, ఎవరెవరో కవులు గుర్తొస్తారు. కానీ కవిత పూర్తయ్యేసరికి మాత్రం, ఈ కవి ఒక్కడే మిగులుతాడు, ఒక అపూర్వ అనుభవాన్ని మనకి విడిచిపెడుతూ. అదే నంద కిశోర్ ప్రత్యేకత. ఇతనికి తనదైన గొంతు ఉంది, తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలి ఉంది. ఇంకా, అతనికి మాత్రమే సొంతమైన కొన్ని అనుభవాలున్నాయ్. అయితే, అవి ఎలాంటివైనా, ఆ బాధనో, సంతోషాన్నో, పాఠకులకు సమర్థవంతంగా చేరవేయగల నేర్పూ, ఆ విద్యలో అందరికీ దొరకని పట్టూ కూడా ఉన్నాయ్. పాఠకులను ఆదమరచనివ్వడు. పరాకుగా చదివే వాళ్ళను కూడా “ఓయ్, నిన్నే!” అని కవ్వింపుగా పిలిచి మరీ ప్రశ్నించే అతని గడుసుదనం, ఈ కవిత్వాన్ని తేలిగ్గా తీసుకోనివ్వదు. అంత తేలిగ్గా మరచిపోనివ్వదు.

“చేపలా తుళ్ళేటి పరువాన్నంతా
దేశాలమీదుగా విసురుకున్నవాళ్ళం.
వానలా కురిసేటి యవ్వనపు కోరికని
సముద్రపు అంచులకు వదులుకున్నవాళ్ళం.
ఒరుసుకున్న రాళ్ళ మీదా ఓడించే నీళ్ళ మీదా
సంతకాలు చేసినవాళ్ళం, సంతోషం పొందిన వాళ్ళం.
చెప్పు! ఏదో ఒకటి..
అంతా అర్థమవుతోందనో
అప్పటిలా ఉండలేననో చెప్పు.
అసలే తెలీదనో
అణువంతైనా గుర్తులేదనో చెప్పు.
నిశ్శబ్దాన్ని వింటూ
రక్తం ఇంకిపోకముందే

నేనేడ్వనుగాని
ఓయ్!నిన్నే…”

“నిశ్శబ్ద్దాన్ని వింటూ, రక్తం ఇంకిపోకముందే” అన్న నాలుగు పదాల్లో ఆశానిరాశల ఊగిసలాటనీ, తానిక మోయలేని బాధనీ సుస్పష్టంగా చూపెడుతూనే, “నేనేడ్వను గానీ” అన్న మరుసటి పాదంలో తనకున్న తలబిరుసునంతా చూపెడతాడు. ఆ “ఓయ్! నిన్నే” అన్న పిలుపుకు ఎంత వేటాడే లక్షణమున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గుండె ఒక్కసారిగా ఝల్లుమని, నన్నేనా అన్న ఉలికిపాటుతో లోకంలోకి, అతని లోకంలోకి, కవిత్వంలోకీ గబగబా వెళ్ళి చక్కర్లు కొడుతూంటామే – అప్పుడనిపిస్తుంది, కవిత్వం ఇతనికి అడక్కుండా దొరికిన వరమని.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలను సమీక్షిస్తే, అనుభూతిని ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా చేయడానికి ఉన్న పద్ధతుల్లో,” స్వాత్మీయీకరణ” ప్రథానమైనది. పఠితకు అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవి వ్యక్తీకరించడం, దానిని పఠిత ఆత్మీకరించుకుని తాదాత్మ్యంతో అనుభవించడం ఈ ప్రక్రియలో కనపడుతుంది. ఈ సంపుటిలో ఎన్నో కవితలు కవికి ఈ ప్రక్రియలో గల పట్టుకి అద్దం పడతాయి. కవితల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, “నీలాగే ఒకడుండేవాడు” అన్న శీర్షికలోనే ఎంత కవిత్వం ఉందో , చూసే కళ్ళుంటే!

“నీలాగే ఒకడుండేవాడు..
వాడు నీలాగే-
అచ్చం నీలాగే నవ్వుతూ తుళ్ళుతూ
పొద్దు నెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ
చేతిలో సంచితో, సంచిలో సద్దితో
సద్దిలో బువ్వతో, బువ్వలో అమ్మతో
పొద్దుగూకేదాక బళ్ళోనే దాగిపోయి
సాయంసంధ్యపైన సూరీడై వెలిగేవాడు”

అని ఈ నందుడు అంటున్నప్పుడు ఎందరు యశోదల మనసులు బరువయ్యాయో ఊహించడం అసాధ్యమేం కాదుగా!

“కవిత అందరిళ్ళకూ వెళ్ళదు, ఎవరి ఇంటి తలుపు తడుతుందో, అతడిక ఉన్మత్తుడు” అంటారు చినవీరభద్రుడో కవితలో. నందకిశోర్ కవిత్వంలో ఆ ఉన్మత్తత ఉంటుంది. అది ఎదుటి వాళ్ళకి వెన్నులో నుండి జలదరింపు తెప్పించేంత గాఢమైనది.లోతైనది.

“తూరుపు దోసిట్లోంచీ సూర్యుడు రాకముందే ఊపిరి నదుల్లో స్నానం చేసి రావాలి. పోనీ- నాలోంచీ నువ్వూ, నీలోచీ నేనూ నడుచుకుంటూ పోతాం, ఏంటట? నా కాళ్ళకి వెన్నెల అంటుకోనీ..నీ కాళ్ళు రెండూ రాళ్ళు తగిలి చిట్లిపోనీ..ఏంటట” అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పేస్తాడో!

“శిశిరాన్నిగెలిచిన పిచ్చిలో వెర్రిలో
చెట్టుకి ఏమీ పట్టకపోవచ్చు.
వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒక్కటే
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.”

– అన్నప్పుడు చేదు జీవిత సత్యాలను అలతి పదాలలో కూర్చిన నేర్పుకి అవాక్కయ్యాను. ఆత్మాశ్రయ పద్థతిని దాని చివరి అంచుల దాకా కొనసాగిస్తే, ఏనాడైనా బాహ్య ప్రపంచాన్ని పునర్దర్శించే పరిణామం తప్పదు. ఉదాహరణగా పై కవితనే తీసుకుందాం. ఇక్కడ చెట్టును జీవితంతోనూ, వాలే పక్షులను అవసరాలుగానూ ఊహించుకోండి. మీకొక భావం చప్పున స్ఫురిస్తుంది. అలా కాకుండా చెట్టును ఒక మనిషి గానూ, వాలే పక్షిని స్త్రీగానూ ఊహించుకోండి – మరొక అద్భుతమైన అర్థం దొరుకుతుంది. ఇహ దాని నుండీ “గూడు కడితే గుండె పగలడం” ఎందుకో, “గాలివాన వస్తే తేలిపోయే నిజ”మేమిటో కవి చెప్పక్కర్లేదు. గొంతుకలో కొట్టాడుతున్న ఆ భావాన్ని నిజానికి పదాల్లో పెట్టక్కర్లేదు. అదే ఈ కవితలోని సౌందర్యం. కవి ఏ ఉద్దేశ్యంతో రచన చేశాడో అంతకంటే భిన్నమైన స్ఫూర్తినివ్వగల శక్తి దానికి ఉన్నప్పుడే, అది కాలం ధాటికి తట్టుకుని నిలబడగలదు. ఈ కవితకు ఆ శక్తి ఉందో లేదో, ప్రతీకలను అర్థవంతమైన వస్తువులతో పూరించగల పాఠకులెవరైనా తీర్మానించగలరు.

1461245_10102664998433657_1684156529_n

ఈ పుస్తకం ఉత్తరార్థం మాత్రం ఒకింత పలాయన లక్షణాలతో ఊహాజనిత దుఃఖ పరిథికి కుదించుకుపోవడం మొదలెట్టింది. ఉదాత్తంగానూ సమస్తాన్నీ ఆత్మీకరించుకోగలిగింత విస్తృతంగానూ కనిపించిన ప్రణయ భావం మెల్లిగా ప్రతికూలమై, జీవితానికే ప్రతికూలమై “ముగింపు” కోసం ప్రాకులాడుతున్న భావన కలిగిస్తుంది.

“ఎవరికీ చెప్పకుండా, ఎవర్నీ అడగకుండా/ఎందుకో తెలీకుండా ఉరి వేసుకుంతారు” అన్న పంక్తుల్లోనూ,

“సముద్రం వాణ్ణి ప్రేమించిందని
ఎవ్వరికీ చెప్పడు
కల్లోలాన్ని వాడు కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు
తెలిసేదల్లా
వాడిక లేడనే!”

అన్నప్పుడూ ఇదే ధోరణి కనపడుతుంది.

రెండవ సమస్య అతని భాషకు సంబంధించినది. చాలా చోట్ల అతను కొత్త పదాలను కూడా సృజించాడు, సందర్భోచితంగా వాడాడు. మచ్చుకు, ఒక కవితలో “నిశిద్దోహలు” అని వాడాడీ కవి. ఆ పదం ఉందా? లేదు. మరెందుకలా వాడాడూ? అతని కవిత చెప్తుంది. కొన్ని చోట్ల భాషాపరంగా, శైలిపరంగా ప్రయోగాలూ చేశాడు. వాటితో కూడా నాకేం పేచీ లేదు. “రాఖీ” కవితలో చక్కటి తెలంగాణా మాండలీకాన్ని వాడాడు. నన్నడిగితే ఆ కవిత ఈ పుస్తకానికే తలమానికమంటాను.

“గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..
తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీ లెక్క నా లెక్క గుచ్చిపెట్టిన..” అంటూ ఆర్ద్రంగా సాగిపోయే ఆ కవిత, ఏమో, మామూలుగా వ్రాసి ఉంటే ఏ మేరకు అలరించేదన్నది ప్రశ్నార్థకమే. కానీ ఇలా వ్రాయడంలో మాత్రం తమ్ముడి చేతికి రాఖీ కట్టేందుకు తపిస్తోన్న అక్క తడికళ్ళత్ మన ముందుకొస్తుంది.

అలాగే “పిచ్చిరాత” కవితలో “దృశ్యాదృశ్య సంకెలలు తెగి/నిస్సందేహ స్వేచ్ఛావాయువులలో/ఏకాంతముగా సంగమించు” అంటూ గ్రాంథికంలోకి ముడుచుకున్నప్పుడు కూడా దానినొక విలక్షణతగానే స్వీకరించగల్గుతాం ( ఈ కవితలో ఒకే ఒక్క పాదంలో మాత్రం శిష్ట వ్యావహారికాన్ని కవి వాడటం కనిపిస్తుంది – అది కవితా ప్రవాహానికి అడ్డు కలిగించకపోగా దాని ప్రత్యేకతను నొక్కి చెప్తుంది). కనుక, ఈ కవికి భాష ఉన్నది ఎందుకో తెలుసు. ఏ మాండలీకంలో లేదా ఏ శైలిలో తన మనసు లోతుల్లో ఉన్న భావం నర్మగర్భంగా పాఠకులకు చేరవేయాలో సుస్పష్టంగా తెలుసు. ఇంత తెలిసినవాడు కూడా మామూలు భాషలో సాగుతోన్న కవితల్లో “వాణ్ణి” అనవలసిన చోట “వాన్ని” అనడమే, బొత్తిగా మింగుడుపడని విషయం. అలాగే “అట్లా” అని దీర్ఘం ఉండవలసిన చోట హ్రస్వంతో రాజీపడటం (ఉదాహరణకు ఆఖరు పేజీలోని – “రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం” అనడం) అకారణమనిపిస్తుంది. ఇవి అచ్చుతప్పులో, కవి ఈ పదాలను పలికే పద్ధతిదేనో పాఠకులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏదేమైనా, ఈ పలుకురాళ్ళ ఏరివేతలో పాయసపు రుచిని మరచిపోయే ప్రమాదమెంతైనా ఉంది కనుక, మలి ముద్రణల్లో ఈ లోపాలు సవరించబడతాయని ఆశిద్దాం.

ఒక సంవత్సర కాలంలో సృజింపబడ్డ కవిత్వం కనుక, సమకాలీన సమాజపు పోకడలేవో కవిని ప్రభావితం చేయడమన్నది ఊహించదగ్గ విషయమే. స్పందించే లక్షణమూ, దానిని భద్రపరచాలన్న తలంపూ ఉన్నవాడవడం వల్లేమో, “కాంక్ష” అంటూ పాక్, ఆఫ్గన్, సిరియాలను చుట్టేసి వచ్చాడు. కవిలో అకస్మాత్తుగా కనపడ్డ ఈ అభ్యుదయవాదం మాత్రం ఆశ్చర్యపరచింది. భావకవిత్వ లక్షణాలతో ఉప్పొంగిన ఈ కవితా సంపుటిలో, ఈ ఒక్క కవితా తన చుట్టూ తానే ఒక గిరి గీసుకుని పాఠకులను అటు నుండటే వెళ్ళిపొమ్మంది. ఈ సంపుటిలో ఇమడదనిపించిన ఒకే ఒక్క కవిత ఇది.

మొదటి 36 కవితలకు అనుబంధంగా వచ్చిన వచనాన్ని ( అనుకోకుండా, ఒక సంధ్యావస్త కాలంలోంచీ)చదువుతున్న కొద్దీ, ఈ కవికి బలమైన అభివ్యక్తి, శిల్పానికి సంబంధించి గొప్ప అభిరుచీ, ప్రత్యేకతా ఉన్నాయని తెలుస్తుంది. “చిట్టితల్లీ” అనేటప్పుడతడి నిష్కల్మషమైన అనురాగమూ, “దేవీ, దేవీ!” అంటూ తపించే ఇతగాడి వలపూ, “వెన్నెల స్నేహితా!”, “దుఃఖిత సహచరీ!” అంటూ ఆర్తిగా పిలుచుకునే నవనీత హృదయమూ, మనకు తెలీకుండానే కవితో ఓ దగ్గరి సంబంధాన్ని కలుగజేస్తాయి. “తన బాధను లోకం బాధ”గా మలచిన కృష్ణశాస్త్రి అసంకల్పితంగా గుర్తొస్తారు.

” ఆ కొత్త రోజుల్లో, మేలుకున్న కొత్త సమాజంలో తనకు లభించిన ఒకటి రెండు అనుభవాలనో, కష్టసుఖాలనో కవి తన దివ్యకావ్యాల్లో పెట్టాడు. తరువాత అహంకారం వల్లనో, అశ్రద్ధ వల్లనో ఆ అనుభూతుల్నే కౌగిలించుకుని చుట్టూ ఆవరణ కట్టి కూర్చున్నాడు”
– (–పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం, భారతి రజతోత్సవ సంచిక)

కృష్ణశాస్త్రి తన కవిత్వం గురించి తానే చెప్పుకున్న మాటలివి. పునరుక్తి దోషాలకు తన బాధ్యత ఎంతవరకూ ఉందో లోకం ముందు ఒప్పుకుంటూ చెప్పిన సత్యమిది. శైలి, భాష, శిల్పాల పరంగా ఏ పోలికా లేకపోయినా, ప్రస్ఫుటంగా కనపడే సంవేదన ఇద్దరిలోనూ ఒకటే కనుక, పై మాటలు ఈ కవి భవిష్యత్తులో ప్రచురించబోయే మరే కవితా సంపుటికీ అద్దం పట్టే స్థితి రాకూడదని అభిలషిస్తున్నాను. ఆ ఆవరణలు మరీ సంకుచితమై, కరుడు గట్టి, కవికీ పాఠకులకు మధ్య ఏ అఖాతాన్నీ సృష్టించకుండా నందకిశోర్ తగిన జాగ్రత్తలు తీసుకోగలడనే విశ్వసిస్తున్నాను.

నందకిశోర్లోని కవితాదృష్టి విశ్వరహస్యాల్నీ, జీవిత రహస్యాల్నీ వర్తమాన వస్తుప్రపంచంలో చూడటాన్ని నిరాకరించి, లేదా అధిగమించి అనుభూతి వైశిష్ట్యంలో అన్వేషించింది. అందుకే అంత ప్రత్యేకంగా కనపడుతుందది. అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలోనూ, అనుభూతులకు పట్టం కట్టి రూపపరంగా నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం చేయడంలోనూ, అనుభూతిని విస్తరింపజేయడానికి సమర్థంగా కవితాభాషను రూపొందించుకోవడంలోనూ ఈ కవి తనదైన ముద్రను ప్రతి పుటలోనూ చూపెడుతూ వచ్చాడు. ఆనందానికి ఒకింత నిర్లక్ష్యాన్నీ, బాధలకు ఒకింత నిబ్బరాన్నీ జోడించి, మోహంలో మాత్రం ప్రాణాలర్పించే నిజాయితీని ప్రకటిస్తూ సాగిన ఈ సంపుటి, “నీలాగే ఒకడుండేవాడు” అన్న కవి మాటలకు నిజమేనని జవాబివ్వగల అనుభవాన్నైతే ఇచ్చే తీరుతుంది. ఆశ్చర్యానికి పదాలు మరచిన లోకంలో మనను వదలిన ఈ కవి, మరిన్ని సంపుటులతో మళ్ళీ మన ముందుకు రావాలనీ, “నీలా మరెవ్వరూ ఉండరు” అనిపించేంత ప్రత్యేకంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలనీ మనసారా ఆకాంక్షిద్దాం.

–మానస చామర్తి

మానస చామర్తి

మానస చామర్తి

సూర్యుడి చూపు కోసమే అద్దేపల్లి కల!

 

సాహితీ లోకానికి సుపరిచితులైన అద్దేపల్లి రామమోహన రావు గారు  ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతున్న అనేకానేక పరిణామాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య, విమర్శనాత్మక కవితా బాణాల సంపుటి – “కాలం మీద సంతకం”.

అద్దేపల్లి కవిగా కంటే విమర్శకులుగా, అద్భుతమైన వ్యాసకర్తగానే నాకెక్కువపరిచయం. పత్రికల్లో చదివిన వారి సాహిత్య వ్యాసాలు, “సాహిత్య సమీక్ష” వంటి పుస్తకాలు, “మా నాయిన” లాంటి ఎన్నో కవితా సంపుటాలకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వ్రాసిన ముందు మాటలూ, ఈయన కవిత్వం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయి.

మూఢత్వం మూలంగా నిస్తేజంగా మారిన జనజీవితాల్లోకి వెలుగు రేఖలను ప్రసరింపజేయడమే అభ్యుదయ కవుల లక్షణం. భారతీయ సాహిత్యానికి సంబంధించి, 1935వ సంవత్సరంలో భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అలహాబాదులో ఏర్పాటు చేయబడింది. 1936 ఏప్రిలులో ప్రసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన ప్రథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ లక్నోలో జరిగింది.  అదేసంవత్సరం సెప్టంబరులో ఈ కవి జన్మించాడు. అద్దేపల్లి 1960లలో కవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టారూ అనుకుంటే, అప్పటికి రాష్ట్రంలో అభ్యుదయ కవిత్వోద్యమ తీవ్రత మెల్లిగా సన్నగిల్లి, దిగంబర కవిత్వం ఉద్యమంగా మారుతోంది. (1965 లో దిగంబర కవులు తమ తొలి సంకలనాన్ని విడుదల చేశారు). 70-80 విప్లవ కవిత్వమూ, 80 తరువాత అనుభూతివాదమూ, మినీకవితలూ ఇతరత్రా జోరందుకున్నాయి.

ఇన్ని ఉద్యమాలనూ దగ్గరి నుండీ గమనిస్తూ కూడా, అద్దేపల్లి కవిత్వం తొలినాళ్ళలో వ్రాసిన “అంతర్జ్వాల” మొదలుకుని, ఈనాటి “కాలం మీద సంతకం” వరకూ, శైలి-శిల్పంపరంగా అనివార్యమైన బేధాలు, అభివ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే పరిణతీ మినహాయిస్తే, మొత్తంగా అభ్యుదయ కవిత్వ ధోరణిలోనే సాగడం విశేషం. “సమాజంలో ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు ప్రథానంగా ఉన్నంతకాలం అభ్యుదయ కవిత్వం ప్రథాన కవితా ధోరణిగా ఉండక తప్పదు” అని ఉద్ఘాటించిన ఈ కవి, దశాబ్దాలు దాటినా ఆ మాట మీదే నిలబడి కవిత్వ సృజన చేయడం ఆసక్తికరం.  నమ్మిన కవిత్వోద్యమం పట్ల ఈ కవికున్న నిబద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం.

addepali title

ఇక ఈ సంపుటిలోని కవితల విషయానికి వస్తే – మొత్తం యాభై కవితలు. అత్యధికం సమాజంలోని అసమానతలను ఎండగడుతూ, రోజురోజుకీ హెచ్చరిల్లుతోన్న విష సంస్కృతులను విమర్శిస్తూ, సమసమాజాన్ని స్వప్నిస్తూ సాగేవే.  మన భాష గురించీ, సంస్కృతి గురించీ, పశ్చిమ దేశాల ఎఱలకు లోబడుతున్న ఇరుకు మనస్తత్వాల చిత్రీకరణకు సంబంధించీ కొన్ని చిక్కటి కవితలున్నాయిందులో.

 

“ఉగాదికి తెలుగు దూరంగా పరుగెత్తుకు పోతున్నప్పుడు

గంగిరెద్దు మూపురం మీద నించి

జానపదం జారిపోతుంది

హరిలోరంగ హరీ అని

నెత్తి మీద పాత్రలోని బియ్యం కారిపోతుంది

వసంతుడికీ వనానికీ మధ్య ఉన్న వలపు

కోకిల పాటలోంచి పారిపోతుంది ”                                           (పు:71)

 

అలాగే ఈ సంపుటిలో అనేక కవితలకు, చెట్లూ – మనం మినహాయించుకొంటోన్న ఆకుపచ్చందనం వస్తువుగా నిలబడ్డాయి. ” ఏ గడ్డిపరకను చూసినా/మంచు కన్నీటిబొట్టు/సూర్యుడి చూపుల్ని కలగంటోంది/తోటలోని చెట్లన్నీ/పరిశ్రమల దుమ్ములో మాసిపోతున్నాయ”ని ఆవేదన వ్యక్తం చేస్తూ,

“రాతి మేడల నీడలు

తోటల్ని దూరంగా విసిరేస్తున్నప్పుడు

పంచమ స్వరం వినపడని వారికోసం

నా కవిత్వ బంధంతో కోకిలను పట్టి తెచ్చి

ప్రజల గుండెలపై ప్రతిష్ట చేస్తాను

నాకొక్క కొత్త చిగురు చాలు

అరుణారుణ స్పర్శతో

నూతన వసంతోత్సవంలో

తోటంతటినీ జలకాలాడిస్తాను” అంటారు. ( “నాకొక్క చిగురుటాకు చాలు” )

 

ఈ కవికి పశ్చిమ దేశాలు ప్రాక్దేశాల మీద చూపిస్తోన్న ప్రభావం పట్ల ఖచ్చితమైన దురభిప్రాయం ఉంది. మార్పు అభిలషణీయమని అంగీకరిస్తూనే, మన మూలాలను కదుపుతోన్న భావజాలాలను మాత్రం అడ్డుకుందామంటారు. ఈయన కవిత్వంలో ఆవేశంతో పాటు ఆర్ద్రత కూడా సమపాళ్ళలో మిళితమై ఉండి పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

“వేకువ ఝామున అరుణకాంతి వలయాల మధ్య

నేనొక దృశ్యాన్ని చూస్తాను-

దేశాన్ని తలపాగా చుట్టుకుని

భుజాన ప్రాణశక్తిని నాగలిగా పట్టుకుని

కళ్ళనిండా నీటిపొరలు పేర్చుకుని

కాళ్ళకి బురద కడియాలు పెట్టుకుని

గుప్పిట్లోని విత్తనాలు చల్లుకుంటూ

తూర్పు నుండి ఒక రైతు నడచి వస్తున్నాడు-

పెద్ద పండుగ వచ్చేసిందని

అరిచే పిట్టల ఆహ్వాన గీతల మధ్య

రైతు నడచిన అడుగుజాడల్లో

భారతీయ సుక్షేత్ర నిర్మాణం జరుగుతుంది”           (“ఇది హాలికుని అడుగుజాడ”)

ADDEPALLI (1) [3]

ఈ వర్ణన నిజంగా ఏ ఏటికాయేడు తమ ఆకుపచ్చ కలలను మబ్బుల దాకా పంపే హాలికులను సజీవంగా కళ్ళ ముందు నిలబెట్టడం లేదూ? పైన ఉదహరించిన మొదటి పాదంలోనే, –

ఇతను దేశానికేదో అవ్వడం కాదు – ఈ బక్కపచ్చ కలల హాలికుడే దేశాన్ని తలపాగాగా ధరించాడుట! ఎంతటి బాధ్యత కల్గిన వాడు, ఎంత అభిమానధనుడు ఈ దేశపు రైతు – కవి మాటల్లో నుండి ఎంత హుందాగా చదువరుల గుండెల్లోకి నడిచొస్తున్నాడో గమనించారా?!

కవిత్వం నరనారానా జీర్ణించుకున్న వారు దేని మీదైనా అలవోకగా కవితాత్మకంగా వ్రాసేయగలరు. “బీడీ” నుండి “చకారం” దాకా, గాంధీ మొదలుకుని బిస్మిల్లాదాకా, “కాదేదీ కవిత కనర్హం”. ఎంత అభ్యుదయవాది అయినా, అనుబంధాల గురించి మాట్లాడవలసి వస్తే – ఆవేశం పాలు తగ్గడమూ అనురాగం మరింత శోభాయమానంగా వ్యక్తీకరింపబడటమూ సహజమే కదా! వైయక్తికమే అయినా, మనసును తడిమిన కవితలోని భాగమొకటి :

“అర్థరాత్రి వేళ గంగానది

నీ షెహానాయి స్వరాల్ని నెమరు వేసుకుంటూ

ప్రవహించడం మానేసి

నిశ్శబ్ద వేదనతో

ఆకాశ ప్రతిబింబాన్ని హత్తుకుంటుంది

……

నీ షెహనాయి

ఒక్కసారి మనసు కందితే చాలు

ఈ దేశం సంగీత సంస్కారంతో

సమగ్ర వాయువీథుల్నినిర్మిస్తుంది

దేహాన్ని ఆత్మతో అనుసంధానం చేసే

సజీవ మానవుణ్ణి సృష్టిస్తుంది”

 

ఇవి కాక, కవికి ప్రియాతి ప్రియమనిపించే “బందరు”(మచిలీపట్నం) గురించీ , స్నేహాలూ ఇతరత్రా గురించీ మూణ్ణాలుగు కవితలున్నాయి. వాటిలోని పాదాలు (“గుండె వెనుక సముద్రం పిలిచినట్టుంది ” వంటి శీర్షికలు కూడా) బాగున్నాయనిపించినా, ఈ పుస్తకంలో ఇమడలేదనిపించింది. వాటిని మినహాయించి ఉంటే ఈ సంపుటి మొత్తం ఒకే ఊపులో సాగినట్టై, ఒకేవిధమైన భావజాలాన్ని, తదనుభవాన్నీ చదువరులకు మిగిల్చేదేమో కదా అనిపించింది. అలాగే, “మార్కెట్ మగాడి రెక్కలు”, “నెల్లిమర్లలో నెత్తుటి వేళ్ళు” తొలుత తేలిగ్గా అర్థంకాక, కవిత ఉదయించిన సందర్భమేమై ఉంటుందోనన్న మీమాంసకు గురి చేశాయి.

అనుభూతివాద కవిత్వ ఝరుల్లో ఉల్లాసంగా ఓలలాడేందుకు అభిలషించే నవతరం కవిత్వాభిమానులను, అనేకానేక సామాజిక సమస్యలను స్పృశిస్తూ ఆవేశంగా విమర్శనాత్మకంగా సాగిన ఈ అభ్యుదయ కవిత్వం ఏ మేరకు అలరిస్తుందన్నది ప్రశ్నార్థకం. కానైతే, అనిసెట్టి అన్నట్టు “సాహిత్యం ఉద్వేగ మార్గాన జరిగే సత్యాన్వేషణ” అన్న మాటను నమ్మేవారినీ, వివిధ వైరుధ్యాలతో సతమతమవుతున్న సంఘం నాడిని కవిత్వంలో వాడిగా వేడిగా వినిపించడమొక అవసరమే కాదు, అరుదైన కళ కూడానన్న స్పృహ కలిగిన వారినీ- ఈ సంపుటిలోని వస్తువైవిధ్యమూ, శిల్పమూ, గాఢతా అయస్కాంతాలై ఆకర్షిస్తాయనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

77 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొంటూ, కవిత్వాభిమానులతో ఆత్మీయ చర్చలు జరుపుతూ హుషారుగా కాలం గడుపుతోన్న మన అద్దేపల్లి, మున్ముందు మరిన్ని సంపుటులతో మన ముందుకు రావాలనీ, తెలుగు కవిత్వ చరిత్రలో చెరిగిపోని సంతకమవ్వాలనీ ఆకాంక్షిద్దాం!

– మానస చామర్తి

అడివిలో మాయమయిన ఇంకో వెన్నెల!

’సముద్రుడు’ ఈ పేరు వినగానే ఒక గంభీరమైన వాతావరణం ఆవరించుకుంటుంది. నాకు కవిత్వాన్ని విశ్లేషించడం రాదు. ఆస్వాదించడం లేదా వంటపట్టీంచుకోవడమే వచ్చును. కొన్ని కవితలు చదివినప్పుడు బాగున్నాయనుకుంటాం మరికొన్ని చదువుతుండగానే  మనలోని వెలితిని కోల్పోతూ మమేకమవుతాం మరికొన్ని చదువుతూ కొత్త వెలుగును చూస్తాం. అలా కొత్త వెలుగును చూపే కవిత్వం ఆసరా భరోసా ఇచ్చే కవిత్వం ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు కొద్ది మంది కవిత్వంలోనే పొందుతాను. అందులో మొదటిది సముద్రుని కవిత్వం. ఈ వరుసలోనే అమరులు కామ్రేడ్ ఎమ్.ఎస్.ఆర్., కామ్రేడ్ కౌముదిల కవిత్వం. ఈ ముగ్గురి కవిత్వ వస్తువు ఒక్కటే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి అక్షరం వారిదే. ఒకరికొకరు యుద్ధ రంగం నుండే రాస్తున్నా తమ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ విప్లవ కవిత్వానికి ఓ కొత్త పరిమళాన్ని అద్ది దారి చూపిన వారే. ఇప్పుడు సముద్రుని సమయం గురించి మాటాడుకుందాం.

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం 1991 సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉద్యమ కార్యాచరణలో భాగంగా మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు యువకులపై కాల్పులు జరిపి గాయపడిన వారిని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి ఎదురుకాల్పుల పేరిట రాజ్యం హత్య చేసింది. వారిద్దరిలో ఒకరు కామ్రేడ్ జనార్థన్. తన కలం పేరు సముద్రుడు. అతని అమరత్వం తరువాత ఆయన ముద్రిత రచనలు ’త్యాగమే జయిస్తుంది’, ’భూమి నా తల వెల నిర్ణయించు’, ’స్వేచ్చ’, ’వాడు నా భూమి, మరణానంతరం అచ్చయిన ’మృత్యువే మరణిస్తుంది’ కవితా సంకలనాల సంపుటిగా సముద్రుడి సమయం’ పేరుతో విరసం 1994 లో ప్రచురించింది.

నిజానికి విప్లవ కవిత్వమంటే నినాద ప్రాయంగా ఒకే వస్తువుతో ఎలిజీలకు పరిమితమవుతూ ఉంటుందని చాలా మంది అభిప్రాయం, నిజమే కదా యుద్ధ రంగం నుండి పిలుపు ప్రేమ పల్లవిలా ఎలా పలుకుతుంది? అది వీరుని గొంతులోనుండి యుద్ధ నినాదంగానే పెడబొబ్బలా సింహనాదంలా ప్రతిధ్వనించి మేల్కొలపాల్సిన అవసరముంది. అదే సమయంలో మీ తూనిక రాళ్ళకు సరిపోయే కవిత్వాన్ని అందించే కృషి జరుగుతునే వుంది నిరంతరం. అలా కృషి కొనసాగుతున్న క్రమంలోనే నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రాయంలోనే యుద్దరంగంలో ఒరిగిపోతున్న వారి కవిత్వానికంటిన పచ్చి నెత్తురు తడి మీ అరచేతులకంటుతుంది ఈ సంపుటినిండా. ఒరిగిపోతున్న తన గురువులు, సహచరుల గురించి కవి గుండె కలిగిన సముద్రుడు రాయకుండా వుండగలడా? అలా ఇందులోను ఎలిజీలు వున్నాయి.

శివారెడ్డి గారన్నట్టు విప్లవ సాహిత్యం ఎదుగుదలలో ’ఎలిజీ’ది ప్రత్యేక స్థానం. ఒక ఎడబాటు, ఒక లాస్, ఒక తీరని దు:ఖం, పోయిన దాన్ని వెతుక్కునే క్రమంలో తగిలే కారణాల్లోంచి జన్మించే క్రోధం నుంచి ’ఎలిజీ’ పుడుతుంది అంటారు. అసహజ మరణాలు నిత్యకృత్యమయ్యే దశలో ’ఎలిజీ’ అనివార్యమయింది. ఎవడి ’ఎలిజీ’ వాడు రాసుకునే దశ ఇది అంటారు. యుద్ధ రంగంలో వున్న గెరిల్లా తనను తాను సంభాళించుకొని అడుగు ముందుకు వేయటానికి పనికొచ్చేదే కామ్రేడ్ స్వర్ణలత ’చరితార్థయై’ గాధగా మిగిలినప్పుడు రాసిన వాక్యాలు..

 

’ ప్రపంచంలోని విషాదాన్ని, ఆనందాన్ని ఒక్కసారే ఎవ్వరైన

 తాగుతారో లేదో తెలియదు గానీ.

 విప్లవకారులు మాత్రం హాలాహలాన్ని అమృతాన్ని ఒకేసారి

 తాగి జీర్ణించుకోగలరు’

అలాగే కామ్రేడ్ సుధాకర్ అమరుడయినప్పుడు రాసిన ’బేబాకీ’లో

 

’ చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే

 గేలిచేస్తూ పగలబడి నవ్వే వారెవరు?

 కబళించిన చావును తిరిగి విసిరి

 గోడకు దిగ్గొట్టిన వారెవ్వరు?

 శహభాష్! నా వీరులారా!

 మీరు చావుకి గోరీలు కడుతున్నారు’

అలాగే కామ్రేడ్ బాబూరావు అమరత్వంపై రాసిన కవిత ’మృత్యుంజయులు’ లో

 

మీ కోసం వదిలిన ఈ కన్నీళ్ళు

సామాన్యమైనవి కావు కామ్రేడ్ అంటూ

ఇవి రక్త సంబంధం కోసం వదిలిన అశువులు కావు

హిమాలయాలకంటే ఉన్నతమైన

వర్గసంబంధం కోసం వెచ్చించిన కన్నీటి ధారలు

కామ్రేడ్! అంటాడు సముద్రుడు.

 samudrudi samayam

కవిత్వంలో కొత్త ఎత్తుగడలను పదబంధాలను ఎన్నుకొని ప్రయోగించడంలో సముద్రుడు తనదంటూ ఒక ముద్రను వేస్తూ పోయాడు. అందుకు ఈ సంపుటిలోని మొదటి కవిత నీవు – నేను ఒక మంచి ఉదాహరణ. మిషనరీ స్కూళ్ళలో విద్యార్థులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలును ఉదహరిస్తూ రాజ్య దౌష్ట్యాన్ని మన కళ్ళముందుంచుతాడు,

 

’పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక!’

 నీ రాజ్యంలో దాసదాసీలున్నంత కాలం నీ రాజ్యం వద్దు స్వామీ!

 ప్రజల కొరకు ఏ రాజు పాటుపడ్డాడు?

 ఏ పులి మేకలకై త్యాగానికి సిద్దపడుతుంది

 రెండు చేతులు జోడించనందుకు

 నా అరచేతులు కాల్చినపుడు

 రాలిన నీటిబిందువులపై

 నీ ఆత్మ ’అల్లాడిందా’ ప్రభూ?’

సిద్ధాంతాన్ని తద్వారా పోరాట పటిమను ఎలుగెత్తి కీర్తించడంలో సముద్రుని కవిత్వం ప్రతిభావంతంగా సాగుతుంది. ’మేకవన్నె పులులు’, ’జడుడు’, ’ప్రతిఘటన’ ’మేం వజ్రాలనే వెదుకుతాం!’ మొ.న కవితలు ఉదాహరణలు. ఇందులో ’ప్రతిఘటన’ కవితలో

 

’సముద్రపు అంచు పైపైకొస్తున్న

 సూర్యుణ్ణి అణచాలని

 సాయుధంగా సముద్రంలో ముందుకు సాగినా

 సూర్యుణ్ణి చూసి ఉత్సాహంగా లేచే అలల్ని

 మాత్రం మీరు అణచగలరు గాని

 సూర్యుణ్ణి ఏమీ చేయలేరు’

అని విప్లవ ఉద్యమాన్ని రాజ్యం ఎన్ని బూటకపు ఎదురుకాల్పులు జరిపినా, ఎన్ని వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తూ విష ప్రచారం చేసినా అణచలేదని భరోసా ఇస్తాడు.

 

గెరిల్లా కవిగా సహచరులకు తన కవితల ద్వారా కార్యోన్ముఖులను చేయడంలో సముద్రుడు చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ఉదాహరణకు

’కాలం సందిట్లో గుణపాఠం నేర్వకుంటే

 పొందికగా నడవడం చేతకాదు

 గుణపాఠాన్ని గుర్తించకుంటే

 రేపటి నీ ఆకారానికి గుర్తింపే ఉండదు’

’వేళ్ళను నమ్మని వాళ్ళకు చెట్టుపై విశ్వాశముండదు

కాపును కోయ సిద్ధమేగాని నీళ్ళు పోయడానికి భయం’ అని లొంగిపోయిన వాళ్ళని ఎద్దేవా చేస్తాడు

’విశ్వాశం పట్టుదల తరాలను మారిస్తే

త్యాగం అంతరాలను మారుస్తుంది’  అంటాడు.

ఇంకా ఉద్యమాన్ని హేళన చేస్తూ తామే ఉద్యమాన్ని నిర్మించామనుకునే స్వీయ ప్రకాశుల కోసం

 

’ సారె మీద తిరిగే ఈగ

 సారె తిరిగేది తన గొప్పతనంనుండే అనుకుంటే

 చివరకు కుడితిలో పడ్డ ఈగలా

 ఊపిరాడక చావక తప్పదు

 ఒకనాటి తోటరాముడు చివరకు

 కాగితం పువ్వుకంటే హీనమైపోతాడు’ అంటాడు

’పాలక వర్గం “ఫేస్” మీద “పౌడర్”లా

అతుక్కుపోయిన వీరికి

ఏ ధర్మం అర్థం కాదు

అందుకే అవకాశవాది నోరు తెరిస్తేనే దుర్వాసన’ అంటాడు.

సముద్రుడు కవిత్వంలో ఏ వస్తువునీ స్పృశించకుండా వదలలేదు. తన తల్లి, గురువులు, సహచరులు, బిడ్డ సాగర్, అడవి, ప్రకృతి, పెట్టుబడిదారీ విధానం, గెరిల్లా యుద్ధతంత్రం, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలు వ్యూహాలు ఇలా అన్ని అంశాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. ఇందులోని చివరి దీర్ఘ కవిత ’అడివి’ చదివితే మన కళ్ళ ముందు అడివిలోని జీవితం ప్రకృతి రమ్యతతో పాటు యుద్ధమూలాలు సజీవంగా మనకు కదలాడుతాయి. తన రచనా శైలిలోని బిగువుకు అడివి సజీవ ఉదాహరణ. విప్లవ కవికి శిల్పం పట్ల నిర్లక్ష్యం అన్నమాటకు జవాబుగా ఇందులో తాను తీసుకున్న అనేక ప్రతీకలలో

 

’నడిజాము ముబ్బుల మధ్య దోబూచులాడే చంద్రుడు

 నీటిలో చేపలా తిరుగాడే గెరిల్లా

 అకస్మాత్తుగా దాడి జరిపే వానజల్లు

 చివరికి ఆకులపై పొంచివుండి సెంట్రీ జేస్తుంది!

 గుట్టలమీద నుండి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది

 ఎత్తైన కొండల్ని – అగాధాల్ని దాచుకున్న అడివి పూర్ణగర్భిణిలా వుంటుంది!

’ అడివిలో వృక్షాలపై, కొమ్మలపై, ఆకులపై నిఘాను పెట్టగలడేమో గాని

 అడివిలో వెన్నెల వెల్లి విరియడాన్ని ఎవడాపగలడు?

’వెన్నెల వేడిలో అడివి స్నానమాడుతుంది

 అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది’

’అడివి వసంతాన్నావహించి చిగుర్లలో లేత ఎరుపును కౌగిలించి

 లేత చిరు ఎండలో ఆరుద్రలో మెరిసిపోతుంద”

’ఆకాశం కాలుష్యాన్ని చూసి భోరుమని విలపిస్తే

 అడివి కడిగిన ముత్యంలా వెలిగిపోతుంది’

 

ముప్పైఏళ్ళలోపు పిన్న వయసులోనే అమరత్వాన్ని ముద్దాడిన కామ్రేడ్.  నిత్యమూ యుద్ధరంగంలో తన మెడపై వేలాడే కత్తిని గమనిస్తూనే సమకాలీన కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ, వేటగాళ్ళ చూపులనుండి తప్పించుకుంటూ తనకిష్టమైన కవులను కలుస్తూ సాహిత్యం గురించి చర్చిస్తూ తన సృజనకు మెరుగులు దిద్దుకునే క్రమంలో రాజ్యం అత్యంత నీచంగా హింసాత్మకంగా తన ముఖాన్ని చెక్కి దేహమంతా గాయాల మయం చేసినా తన కవిత్వంలో నిర్బంధం గురించి ఏమి రాసాడో అవే అక్షరాలకు బద్ధుడై తన పిడికిలిలోని రహస్యాన్ని తెరవకుండా చిరునవ్వుతో చావును గేలి చేస్తూ శతృవుకు తనను చంపడమనే చేతకాని చర్య తప్ప మరో దారి లేకుండా చేసిన మరో భగత్ సింగ్, ఆజాద్ ల వారసుడు. జీవితమే యుద్దమై యుద్ధమే జీవన రంగమైన ఓ నవయువకుని ఆశల స్వప్నాల ఆరని జ్వాల ఖండిక ఈ ’సముద్రుని సమయం’ ఇప్పటికీ యుద్ధ సమయమే.

-కెక్యూబ్ వర్మ

వర్మ

వర్మ