బీటలు వారిన ‘గాలి అద్దం’

‘ ఏరుకున్న దుఃఖంలో’ అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది:

వెన్నెల రెక్క తెగిన
అమావాస్య ఏడుపురా నువ్వు

 

శ్వాసలూ భాషల్లోనే మూల్గాయని

ఆత్మహత్యాత్మకంగా నొక్కి

 

తలవాకిట పడిగాపుల్లో

చీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వి

 

నువ్ తీస్తున్న దౌడు పాదాల

పియానో చప్పుడు-

 

మహానగర కూడలి చాపిన తారునాల్కకి

వెగటు రుచివి

మొండి గోడల్ని బీటలు చీల్చిన

గడ్డిపూ పజ్యానివి

కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన

ఒంటరి అరిచెయ్యివేరా ఏంతకీ

నువ్వు-

 

పెకలించినా మట్టంటని మొక్కలు

మరెప్పుడూ నేల చేరని వాన చినుకులు

అరచేతి గ్రహణాల్ని కప్పుకుని బావురుమనే

చందమామలు

ఈ గట్టునే ఊడలు దించిన మృత్యువు!

 

దెయ్యం కాళ్ల పరుగుల్తో

వెనక్కి నడిచే గడియారాలం

 

లబ్‌డబ్మని పెట్లుతున్న గుండెల

పింగాణీమోతలో

విన్పించని

కన్నీటి వీడ్కోలు తేమరా నువ్వు

 

ఆ గట్టు చేర్చకుండానే కూల్తుందీ వంతెన

 

ఆగాగు!

ఊడల్తోనైనా దాటాలీ చీకటి జన్మాల ఏరు

నువ్వైనా మరి

నేనైనా-

* * *

నాయుడి కవిత్వం- గాలి అద్దం సంకలనానికి రమణసుమనశ్రీ ఫౌండేషన్ అవార్డు అందిస్తున్న వేళ నాయుడు గురించి నాలుగు ముక్కలు మాట్లాడవల్సి వచ్చిన సందర్భంగా సుమారు పాతికేళ్ల మా సాన్నిహిత్యాన్నీ, 22 ఏళ్ల నాటి ఆ కవితనీ స్మరిస్తున్నాను. దాన్నిలా తలుచుకుంటున్న సమయాన దాని భావంతో, సారంతో, ఉద్వేగంతో నేనిప్పుడు ఎంత కనెక్టు అయ్యి ఉన్నాన్నో తరిచిచూసుకున్నాను.

‘తాను పారిపోతున్నాడో, లేక నేనిక్కడ బందీనే అయ్యానో తేల్చుకోలేక వీడ్కోలులా’  నాయుడు కోసం రాసిన ఆ కవిత గానీ, అందులోని ‘పర్సనల్’ సందర్భంగానీ తనకైనా గుర్తుండి ఉంటుందని అనుకోను. ‘అనుక్షణిక’మంటూ నాయుడు నాడు రాసుకున్న భగ్నకవిత అతని జ్ఞాపకాల్లో భద్రంగా ఉందని కూడా అనుకోను. ‘అతడు గీసింది కన్నా/ చెరిపింది ఎక్కువ ‘ అన్నారు ఇస్మాయిల్ గారు ‘పికాసో’ గురించి. నాయుడు కూడా రాసింది కంటే చెరిపిందే ఎక్కువ, మర్చిపోయిందే ఎక్కువ. బహుశా 1997లోనే అనుకుంటా, మో (వేగుంట మోహన ప్రసాద్ గారు) తనలానే అనుకంపన లయతో సంచలిస్తుండే అక్షరాల… పదాల… వాక్యాల… దొంతర్ని 47పులు (47 ఏడుపులుని 47 లోని ‘ఏడు’తో ‘పులు’ కలిపి pun చేస్తూ) పేరిట నాయుడు 47- కవితల సంకలనం- ‘ఇపుడే’కి ముందుమాటగా నాకు పంపారు, కంపోజ్ చేయించమని. ‘ఆ 47 కవితలకి మరిక మార్పులు, చేర్పులూ చేయవద్దని, తన తొలిపలుకు కంపోజ్ చేయించి పంపితే, నాయుడి తొలి సంకలనం- ‘ఇపుడే’ వేయించేస్తాననీ’ మో నాకు కవరింగ్ లెటర్ రాసారు. నేను పరమ విధేయంగా 47పుల్ని టైపించి ఒరిజినల్, ఓపెన్ ఫైల్ రెండూ పంపించేశాను. ‘ఇపుడే’ కోసం ఎదురుచూస్తున్నపుడే, మహా అయితే మరో నెల లోపు, ‘మో’ చెప్పారు- నాయుడు తన కవితల రాతప్రతి చింపి తగలబెట్టేశాడని. చెరపడం, మరవడం – నాయుడి విషయంలో అంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, అపుడేపుడే నేను రాసినదేదో గుర్తుంటుందని కచ్చితంగా అనుకోను. నాయుడిది ఏరుకున్న, తనంతట తాను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్న దుఃఖమేనని అంటున్న ఆ నా కవితలో content- context ల దృష్ట్యా ‘పర్సనల్’ భాగంగా కొంత మేరకు వడకట్టేసి, depersonalise కాబడ్డ భాగం వరకూ మాత్రమే చూస్తే-

మహానగర కూడలి చాపిన తారునాల్కకి వెగటు రుచి వంటి, మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పజ్యం వంటి, కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరిచెయ్యివంటి అతడు, తలవాకిట పడిగాపుల్లో ఛీత్కార ప్రణయాన్ని obvious కాన్కగా పొందిన ప్రేమోపహతుడు మాత్రమే కాదు, కవి కూడా. ఎటువంటి కవి? మాటలు, ఆలోచనలే కాదు, శ్వాసలు సైతం భాషల్లో మూల్గడాన్ని ఏవగించుకునే కవి.  నేను పై కవిత రాసిన 1994 నాటికి మహా అయితే ఓ పుంజీడు కవితలు రాశాడేమో, అప్పటికే తన కవిత్వం తిరగేసిన భాష అని తెలిసిపోయింది మిత్రులమైన మాకు.

“She dealt her pretty words like Blades/ How glittering they shone/ And every One unbared a Nerve

Or wantoned with a Bone..” అంటూ Emily Dickinson తరహా ఊహలల్లుకున్నాం నాయుడి కవిత్వం మీద. ఇక్కడ ఒక సర్రియలిస్ట్ సత్యమేమంటే, ఏ కవితలూ రాయకముందే మా సిద్ధార్థకి ప్రియమైన కవి అయిపోయాడు నాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఖైరతాబాద్ దక్షిణ హిందీ ప్రచార సభ కాంపౌండులో ఉన్న తన జిరాక్స్ సెంటరుకి అరుదుగా వచ్చే ఓ ఫిలాసఫీ కుర్రాడి కళ్లలో విలోమబింబాలుగా కదలాడుతున్న కవితలు చదివి రేపటి కవిని సిద్ధార్థ discover చేయడం – బహుశా ఏ దేశకాల సాహిత్య చరిత్రలోనైనా విశేషమైన, అపూర్వమనదగ్గ వృత్తాంతం.

ఒక తరం కవుల్ని, లేదా ఒక తరహా కవిత్వోద్యమాన్నీ అర్థం చేసుకునేటప్పుడు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్నీ, యుద్ధాలు, క్షామాలూ వంటి ప్రాపంచిక పరిణామాల్నీ తరిచి చూసే విమర్శక, విశ్లేషణాత్మక పనిముట్లని ఆధునిక (పాశ్చాత్య) అధ్యయనం అలవాటు చేసింది. ఏమిటితని ఏడుపు, ఎందుకింత వగపు? ‘మధ్యతరగతి సుడో సుఖాల పడవ మునిగిపోతుందేమోనన్న వెంపర్లాట ‘గా అజంతా గారి కవిత్వం మొత్తాన్నీ తేల్చిపారేశాడు ఓ ఆధునిక విమర్శకుడు. ఒక తరం కవుల నిరాశకి, నిస్పృహకీ unemployment, underemployment కూడా కారణాలని చేసిన విశ్లేషణలూ విన్నాము. అంటే, ‘సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank- account, వొట్టిపోని ఆవు’ ఉంటే, మున్ముందు వాటి ఉనికికి ఏ ఢోకా లేదనుకుంటే అజంతా, నాయుడుల కవిత్వం ఉండేది కాదా? అలా సెటిల్ కాలేదనీ, తన జీవితం వడ్డించిన విస్తరి కాలేదనేనా నాయుడి దిగులు, గుబులు? నాకెందుకో ఈ వాదాలూ, విశ్లేషణలూ విచిత్రంగా, రొడ్డకొట్టుడుగా తోస్తాయి. నాయుడ్నే తీసుకుందాం. సుమారు పాతికేళ్లుగా గమనిస్తునానతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం; అంతేకాకుండా, అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురుచూడటం నిజజీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత, కల-మెలకువల మధ్య తిర్యగ్ బిందువుని దర్శించడంలా అనుభవంగానే తప్ప మరింకే విధంగానూ అర్థం చేయించలేని అభాస!

అయితే, మన తెలుగు ఆధునిక సాహిత్యావరణంలో కొన్ని సాహిత్యేతర హిపోక్రసీలు గమనిస్తే భలే వినోదాన్నిస్తాయి. “Poets are, by the nature of their interests and the nature of artistic fabrication, singularly ill-equipped to understand politics…” అని W H Auden అంతటివాడు అన్నట్లు చదివో, కర్ణాకర్ణిగా వినో ఉంటారు. Artistic fabrication మాట దేవుడెరుగు, ఏమీ తెలియకుండా ఉండటంలో ఉండే సౌఖ్యాన్ని అనుభవిస్తూ, చాలా convenient గా intellectual disturbance వంటి అరువు సలపరింతలకి గురౌతుంటారు. ఆధునిక సంక్షోభ యుగంలో కవులెలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ముందుగానే సిద్ధమై ఉన్న అలిఖిత రూల్ బుక్ లో కొన్ని పడికట్టు వాక్యాల్నే కాస్త అటూఇటుగా వల్లెవేస్తుంటారు: లౌకిక విషయాలు పట్టవనీ, నోట్లో వేలుపెడితే కొరకలేమనీ, రాయడానికి బద్ధకమనీ, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టు కొన్ని కవితావాక్యాలలాగ తళుక్కుమంటాయనీ, ఇక రాసినవి దాచే అలవాటు బొత్తిగా లేదనీ…. ఇలా ఈ అబద్ధాలకి అంతులేదు. ఇవన్నీ నిజమని అమాయకంగా నమ్మి, బహుశా ‘రంజని’ వారనుకుంటా, making of a poem తెలుసుకోవాలని తపించే ఆధునిక కవిత్వాభిమానుల కోసం ఇరవై ఏళ్లక్రితం ఒక సంకలనం తెచ్చారు. ప్రసిద్ధ కవులు, వారి కవిత (లేదా కవితలు)- ఆ కవిత అంతిమ రూపం తీసుకోక ముందటి చిత్తుప్రతి. తెలుగు ఆధునిక కవి మోసం, కాపట్యాలకి landmark గా నిలిచిపోయిందా సంకలనం. కాబట్టి అటువంటి కాలుష్య వాతావరణంలో నాయుడుని గ్రహించడం కష్టం. Making of a poem – తెలుసుకోగోరే ఏ సీరియస్ పాఠకుడు, కవితాప్రేమి, సాహిత్య విద్యార్థికైనా-  రాసినవి చెరిపేసే తెంపరితనం, మిగిలినవాటిని దాచని నిర్లక్ష్యం, అక్షరమంటే అలవిమాలిన ఆపేక్ష, కుకవిత్వం మీద తీవ్ర అసహనం – సహజంగా ఉన్న అసుర (అంబటి సురేంద్రరాజు), నాయుడు వంటి అతి కొద్దిమంది కవులు మాత్రమే testimonial గా నిలుస్తారు.

కవిత ఎప్పుడు రెక్కలల్లార్చి, ఎప్పుడు ముడుచుకుంటుందో తనకే తెలియకపోవడం వల్ల కాబోలు, ఎటువంటి తారీఖుల బరువుల్నీ కవితల రెక్కలకి కట్టే ప్రయత్నం చేయలేదు నాయుడు. పఠితకి విశ్రాంతిని ఎర చూపే మాయలాడి విరామచిహ్నాలు ఉండనే ఉండవు. నాయుడి కవిత్వంలో లౌకికమైన కళ్లకి తోచే ఏ రకమైన సందర్భాలూ, కనీసం నెపాలుగానైనా ఎదురుపడవు. కుర్చీగానో, హోదాగానో తప్ప, మనిషిగా పరిచయమైన ఎవర్నైనా చవక చేసే లోకంలో గత్యంతరం లేక మసలుతుంటాడు కాబట్టి, సందర్భాలు పటాటోపంగానైనా ఎత్తిచూపే scholarship కనబడదు నాయుడిలో. కానీ, కె.ఎన్.వై. పతంజలి గారి మీద రాసిన ఎలిజీ ‘వాగ్విశ్రాంతి’ (గాలి అద్దం- పేజీ 171) చూడండి: “ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్రఖచితమొనర్చాడు/ అంతర్థానమయ్యే అనుభవాల్లో/ నిబిడాంధకార శబ్దస్పర్శలు/ యాదృచ్ఛిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి/…. / అతడొక వాక్యవిస్మృతి/ అతడొక వాగ్విశ్రాంతి”!

పతంజలి గారి రచనా సర్వస్వం మీద వచ్చిన అత్యుత్తమ విశ్లేషణలు, సిద్ధాంతాలు వేటికైనా తీసిపోతాయా ఈ స్మృతిగీత పాదాలు! మో మీద, త్రిపుర గారి మీద రాసిన ఎలిజీలు కూడా అదే స్థాయి.

అయితే, ‘గాలి అద్దం’ కవితా సంకలనం మీద నాకు అసంతృప్తి ఉంది. నాయుడు కానిది ఇందులో ఎక్కువగా కనిపించడంవల్ల కలిగిన అసంతృప్తి. నాయుడు కానిదాని వైపు నాయుడిని జీవితం నెట్టడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటి దుఃఖ్ఖాన్ని పోలిన అసంతృప్తి. అంతకుముందు, ఎన్నింటిని గుదిగుచ్చినా దేనికదే ప్రత్యేకంగా తోచేలా చేసిన కవిత్వాంశ తగ్గి, monotonous గా అనిపించాయి ‘గాలి అద్దం’లో కొన్ని కవితలు; మరికొన్ని వచనమై సోలిపోయాయి. కవిత్వం ఇలా స్పష్టత దిశగా పలచబారడానికి కారణమేమిటా అని ఆలోచిస్తే ఏమనిపించిందంటే- ఒకానొక upper yielding point కు కూడా చేరుకున్నాక, బద్దలైనట్టు నాయుడు అలిగాడు. ఆ అలకని చూపడంలో ఎవరి పద్ధతి వారిది అయినట్టు, కవిత్వాన్ని విస్పష్టత దారుల్లోకి మళ్లించడం నాయుడి స్టైల్ ఏమో. ఏదిఏమైనా, తాను కినుక వహించడానికి కారణమైన లోకంలో నేను సైతం భాగం కావడాన్ని మాత్రం ఎంత కక్షతోనైనా క్షమించుకోలేకపోతున్నా.

*

 

ఫ్లెమింగోల దారిలో కవిత్వం!

fleming

ప్రపంచం ప్రేమను మరచిపోతున్న తరుణంలో ఒక సౌందర్య వంతమయిన  జీవితాన్ని ప్రేమించుకుంటూ వేల మైళ్ళ దూరాన్ని సునాయాసంగా ఈది తమకై  తాము ఒక నిర్మాణ కర్తలుగా నిలిపే ఈ పక్షుల ముందు మనిషి నిజంగా చాలా చిన్న వాడే .. కాలం ఒడ్డున నిలబడి కవి గొంతెత్తి మనిషిని పిలుస్తున్నట్లే  అన్పిస్తుంది నాకు .. తమ ఆరాటాన్ని మనిషి భాష లోకి అనువదించి లేకపోయినా ప్రాకృతిక భాషలో పరితపించి పోతున్నాయి. వాటి లోపలి స్వరాల్ని పసిగట్ట గలిగిన శక్తి  మనిషికి ఎప్పుడొస్తుందో అనేదే నా ప్రశ్న .. మన ఆశల్ని విప్పి పక్షుల ముందు  పరచే రోజు కాదు వాటి ఆశయాల్ని గుర్తించే రోజు రావాలన్నదే నా తాపత్రయం అంతా .. అందుకే ఒక పక్షి ప్రేమికుడిగా వాటితో పాటుగా చరిత్ర గమనంలో  నా  గొంతు కలాపాలన్నదే నా తపన . అందుకే పక్షుల గురించి పుస్తకం రాసాను. పక్షుల కవిత్వం ఆహ్వానిస్తున్నాను.  పక్షి పాటను ,పక్షి కవిత్వాన్ని గుండె కెత్తుకున్నాను . ఈ తంతు నడిచే దారిలో నిజానికి నేనే ఓ పక్షి లా మారిపోయాను.

ఒక సాయుధుడిగా ,ఒక నిర్మాణ కర్తగా  నిరంతరం ఒక విలక్షణ ,విన్నూత్న మయిన కార్యాలు చేయడమే విధిగా పెట్టుకుని సాకారం చేసుకుంటున్న కలల క్రమం లో 10 ఏళ్ళ క్రితం వృత్తి రీత్యా సుమారు ఏడేళ్ల పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో నివాసం వున్నప్పుడు మొదటి  సారి ఈ నేలపట్టు ,పులికాట్ క్రమం తప్పకుండా ప్రతి దసరా పండుగ నాటికి సైబీరియా లాంటి సుదూర ప్రాంతాలు నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చే ఫ్లెమింగో ,పెలికాన్ పక్షుల గురించి వినడం ,చూడడం జరిగింది. అప్పుడు అక్కడ కొచ్చే పక్షి శాస్త్రజ్ఞులను కలవడం,వాటి గురించి పలు ఆసక్తి కరమైన అంశాలు తెలుసుకునే అవకాశం దొరికింది.  జీవితం రంగులు కోల్పోయి నిస్సారం అవుతుంది ఈ అయస్కాంత వంతమైన ఆకర్షణ కలిగిన పక్షులు లేకపోతే అనే జవహర్ లాల్ నెహ్రు మాటలు గుర్తు కొచ్చాయి.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తా చివరలో విస్తారమైన పులికాట్ సరస్సు ,దొరవారి సత్రం మండలం లోని కుగ్రామం నేలపట్టు తరాలుగా పెలికాన్ ,ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి .. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాటిని పక్షుల రక్షిత కేంద్రముగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకి చేర్చి వాటిని అటవీ శాఖ తరఫున కాపు కాస్తుంది .. ఈ విదేశీ విహంగాలు విడిదికొచ్చి సంతాన ఉత్పత్తి చేసుకుని హాయిగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తుంటాయి . ప్రతి ఏడాది అక్టోబర్ నుండి సుమారు మార్చ్ వరకు ఇక్కడ ఇవి విడిది చేస్తాయి ..నీరు సమృద్ధిగా ఉన్నంత వరకు వుంటుంటాయి .

ఈ పర్యాటక కేంద్రానికి అంతర్జాతీయ పర్యాటక హోదా కల్పించాలనే సంకల్పంతో 2000 సంవత్సరం లో  సముద్రపు రామచిలుకగా అందమైన రంగులతో ఎత్తుగా నడిచే ఫ్లెమింగో పక్షి పేరుతో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి ఏటా పక్షుల పండుగ జరపాలని నిర్ణయించారు .. అప్పటి నుండి రెండు మూడు రోజుల పాటు సుళ్లూరుపేట ,నేలపట్టు ,అటకానితిప్ప, భీముని వారి పాలెం ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రదేశం గురించి ప్రచారం చేస్తూ తమిళనాడు ,కర్ణాటక ఇంకా ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ సీజన్లో వచ్చే పక్షుల ను దర్శించి అక్కడి మనోహర దృశ్యాల్ని మనస్సులో ముద్రించుకుని వెళ్లడం ఆనవాయితీగా చేసారు జిల్లా అధికారులు. క్రమేణా ప్రజల్లో స్పందన చూసి భారీగా పర్యాటకులు రావడం చూసిన ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర పండుగగా ప్రకటించి హోదా పెంచింది.

2005 లో ఈ పక్షుల పైన పరిశోధనాత్మక దీర్ఘ కావ్యం “ఫ్లెమింగో : ఈ వ్యాస రచయిత  రాసి ఇదే ఫ్లెమింగో పక్షుల పండుగలో అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర చేత ఆవిష్కరించి తొలి ప్రతి ఆరోజు సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్ కు అందించడం జరిగింది .. ఒక వైవిధ్యమైన వస్తువు ఎన్నుకోవడంలో నే కవి ఏభై శాతం విజయం సాధించాడు అని ప్రముఖ కవి ,తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ కితాబు అందుకున్న కవి గుండెల్లో ఫ్లెమింగో పక్షి చెదరని గూడు కట్టు కుంది .. ఆ కావ్యం విజయాల్ని సుమారు ఐదేళ్లు అనుభూతిస్తూన్న కవి అనేక భారతీయ ,ఇతర దేశ  భాషల్లోకి  ఈ దీర్ఘ కవిత్వం అనువాదం చేయడం ,పలు విశ్వ వేదికల మీద దాన్ని గురించి మాట్లాడుతుండడం వల్ల ఫ్లెమింగో నా జీవితంలో క్రమంగా ఒక భాగమై పోయింది.

unnamed

2015 లో ప్రభుత్వ పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రకటన వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం లో సాహిత్య వాసన కూడా జోడించాలని తపన పెరిగి ఫ్లెమింగో కవితోత్సవం అనే దక్షిణ భారత కవుల పండుగ పురుడు పోసుకుంది .. ఈ  నా ఆలోచన ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ కి మరియు కొత్తగా జిల్లాలో వెలసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వీ వీరయ్య గార్కి తెల్పి వారి ప్రోత్సాహం తో తెలుగు ,తమిళం ,కన్నడ ,మలయాళం ,తుళు ,ఆంగ్లం భాషలలో సుమారు 15 మంది ఆహ్వానిత కవుల్ని పిలచి వలస పక్షులు అంశంపై నెల్లూరు లో విశ్వవిద్యాలయం కాలేజీ ఆడిటోరియం లో మొదటి కవితా గానం విజయవంతం గా చేసిన సంతృప్తి మిగిలింది.

అలా మొదలైన ఫ్లెమింగో పోయెట్రీ ఫెస్టివల్ 2016 లో డిసెంబర్ ముందస్తుగానే రూపుదిద్దుకుని పక్షుల విడిదికి కూత వేటు దూరంలోనే వున్నా గోకుల్ కృష్ణ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో మళ్ళీ దక్షిణ భారత కవులను ఆహ్వానిస్తూ వలస పక్షులు అంశం మీదనే కవి సమ్మేళనం చేయడం ప్రభుత్వ పక్షుల పండుగ కళ పెంచేలా జరిగి కవితోత్సవం అలరించింది. ఈ కవితోత్సవం ముఖ్య అతిధులుగా మళ్ళీ  విశ్వవిద్యాలయం ఉప కులపతి వీరయ్య ,జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ లు హాజరై పక్షుల మీద పలు కోణాల్లో కవిత్వం వెలువరించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ,ఇక్కడకొస్తున్న పక్షుల మీద మరింత పరిశోధన జరగాలని  సూచించారు. ఈ కవిత్వ పండుగలో పాల్గొనేందుకు కవులు ఎంతో ఇష్టంగా వేదిక ప్రదేశం చేరుకున్నారు 24 వ తేదీ డిసెంబర్ ఉదయం తమిళం నుండి సుబ్బరామన్ ,మలయాళం కవులు శ్రీమతి పంకజం ,కుంబ్లేనిగాడు ఉన్నికృష్ణ, హిందీ కవులు డా ఇలియాజ్ ,డా రామలింగేశ్వర రావు ,ఇంగ్లీష్ కవి బెంగళూరు నుండి బి ఎల్ రావు ,సంస్కృత కవి అల్లు భాస్కర్ రెడ్డి , తెలుగు కవులు చిరంజీవి (కర్నూలు),గంగవరపు సునీత (త్రిపురాంతకం ),సరికొండ నరసింహ రాజు (నాగార్జున సాగర్),షైక్ ఖదీర్ షరీఫ్ (సోమశిల )ఈతకోట సుబ్బారావు ,పెరుగు సుజనా రామం ,వర్చస్వి , (నెల్లూరు ) శకుంతలాదేవి (శ్రీహరికోట) పాల్గొని వలస పక్షుల ను విభిన్న కోణాల్లో ఆలపించి ఆనందింప చేసారు.

*

ఉద్దానం- ఒక గుండె గోడు!

vuddanam-cover

నీ కవిత్వాన్ని నిషేధించాల్సిందే!

mouli

 

నిన్ననే చేతుల్లోకి వచ్చింది పద్యం,ఒంటి నిండా బాల సుధాకర మౌళి ని తొడుక్కుని. వొచ్చి వారం పైనే అయిందట ఊళ్ళోకి. వెళ్ళి పోస్టుమ్యాన్ ని బతిమాలుకుంటే దయ తల్చి నిన్న ఇచ్చాడు.

గుండె కళ్ళకు ప్రేమ గా అద్దుకుని మనసు చేతులు చాపి వెచ్చగా హత్తుకున్నాను.ఎలా ఉంది స్పర్శ? పువ్వులా మెత్తగా ఉంది. కత్తిలా కరుకు గా ఉంది. పాట లా తీయ గా ఉంది. బాధ లా చేదు గా ఉంది.అంటుకుంటున్న అడవి లా ఉంది. ’ఆకు కదలని చోటు’ లా ఉంది.

ఎన్ని ముచ్చట్లు పెట్టిందో! ఎక్కడుంటావు నువ్వని అడిగితే ఎంత హాయిగా నవ్విందో,అచ్చం కొంచెం గడ్డం తో అమాయకం గా కనపడే ఆ విజయనగరం పిల్లోడి లాగా. “ వేకువనే లేచి ఊరు దాటుతున్న ఆ భుజమ్మీది కావిడి లో లేనా” అంది. “ రేపటి విలుకాడి వద్ద శిష్యరికం చేస్తూ లేనా” అంది.

**

ఏవయ్యా మౌళీ..ఏం చేస్తున్నావు నువ్వు? “ప్రపంచం మధ్య లోంచి ఎక్కడో ఏ ఊరులోనో మొదలయి కాగడా లాంటి మనిషి ఒకరు నడుచుకుంటూ నడుచుకుంటూ వొచ్చినట్టు” – ఏంటి ఇలా లోలోపలకు వొచ్చేస్తున్నావ్? చంపేస్తున్నావ్, తిరిగంతలోనే బతికిస్తున్నావ్.

“ నీడ కురిసే చెట్ల మధ్యో,ఎండ కాసే వీధుల్లోనో, గోళీలాడుకుంటున్న పిల్లాడ్ని బంధించి కణతలపై గురి చూసి తుపాకీ కాల్చకూడద”ని గదా…కవికీ, కవిత్వానికీ నిషేధాలుండకూడదని గదా నువ్వంటున్నావ్. ఉహూ.. నిన్ను మాత్రం కాల్చేయాల్సిందే,నీ కవిత్వాన్ని నిషేధించాల్సిందే. లేకుంటే నువ్వు నిద్ర పోనిచ్చేట్టు లేవు.

ఎన్నో ఉద్విగ్న క్షణాలనుతీసుకొచ్చి మా రక్తనాళాల్లోకి ఊదేటట్టున్నావ్. రగిలే పోరుజెండా నీడలో రాలే పూలన్నీ మన కలలే అని అనిపించేటట్టున్నావ్. చలికి వణికే వానకు తడిసే భయపడి పరుగులు తీసే కొండ మేక ఒక్కసారి ఆగ్రహించి కాళ్ళకింది నేలను కబళించే వాళ్ళను నేలకేసి కుమ్మేసే దృశ్యాన్ని కళ్ళకు కట్టేటట్టున్నావ్.

ఎలా చెప్పు నిను నిషేధించకుంటే. దేశ అంతర్గత భద్రతను అసలు పట్టించుకోకుండా బస్తర్ ను ఎక్కుపెట్టిన విల్లు అంటావా? నిర్బంధం లో ఎగిరే పావురమంటావా? అరే ,అలా అమాయకంగా కళ్ళజోడొకటి పెట్టుకుని “ నెత్తురోడుతున్న నేల మీది వీరోచిత గాన”మంటావా?

ఏమంటావూ రాత్రిని? ఏ ఆదిమ మానవ సమూహమో నెగడు చుట్టూ చేరి ఆడి ఆడిఅలసి నిద్రలోకి జారుకున్నప్పుడు ఒడిలో వేసుకుని ఓలలాడించిన రాత్రా? ఆకుపచ్చని అడవి వాసన వేసే, నిషేధిత మనుషుల మహాస్వప్నాల వాసన వేసే రాత్రా?

ఏం చేయగలం మేము మాత్రం నీ లాగే ఆకుపచ్చని వాసనేసే రాత్రిని కళ్ళతోనూ హృదయం తోనూ ప్రేమించకా మోహించకా..?

**

ఏం చేద్దాం ఈ కవి ని? “ ఒక దుశ్చల స్థితి నుంచి కదులుతున్న పడవను ఒడ్డుకి చేర్చే ప్రయత్నం లో సంభవించే ఏ చిన్న కదలిక నైనా యుద్ధ విన్యాసం గానే భావిస్తాన”ని అంటున్న వాణ్ణి, “ అంతిమం గా యుద్ధాన్నే నేను ప్రేమించేద”ని తెగేసి చెబుతున్న వాణ్ణి.

తను తన విద్యార్ధికి చెప్పినట్టు , తన కవిత్వాన్ని ముద్దు పెట్టుకుందామా..అంతరాంతరాల్లోకి హత్తుకుందామా…?

ఆకు కదలని చోటుల్లోనూ నెమ్మదిగా ప్రశాంతంగా అంటుకడుతున్న  ముఖంలోనేలతారాడే మనుషుల్ని, దేహమంతా వేళ్ళే మొలిచే నిరసన దృశ్యాల్ని, HCU దారిన పోతున్న ఆ వరి సొప్పల కంఠపు అబ్బాయిని, కళ్ళ మీదకు ఆకాశాన్ని దించుకున్న అమ్మాయిని అందరినీ అన్నిటినీ దగ్గరకు తీసుకుందామా?

**

“నది మీద పిట్టెగురుతుందంటే నది బతికున్నట్టు….” అని మౌళి అన్నట్టుగా రేపటిని స్వప్నిస్తోన్న అక్షరాల్ని ప్రేమిస్తున్నామంటే మనం బతికున్నట్టు.

*

శ్రమను లాలించే దయా దీవి

chinukuజి. వెంకట కృష్ణ ప్రసిద్దకథకుడు, కవి, విమర్శకుడు. వీరు ఇటీవల “చినుకు దీవి” పేరుతో కవిత్వ సంఫుటి వెలువరించారు. “చినుకు దీవి” పదబంధం ఆకట్టుకొనేలా ఉంది. కొంత అస్ఫష్టంగానూ అనిపిస్తుంది. అదే శీర్షికతో ఉన్న ఓ కవితలో ఆ పదబంధాన్ని విప్పుకొనే తాళం చెవి దొరుకుతుంది.

చినుకు సృష్టికి ఆది
శ్రమను లాలించే దయా దీవి — (చినుకు దీవి).

ఎంతగొప్ప భావన ఇది. చినుకు పడితేనే వ్యవసాయం నడుస్తుంది, రైతుల శ్రమ ఫలిస్తుంది, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రజలు చేసుకొంటారు. మరీ ముఖ్యంగా వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలకు చినుకు అనేది ఎంత అపురూపమో, అవసరమో, చినుకు వాలటం ఎంతటి దయాపూరిత చర్యో పై వర్ణన తెలియచేస్తుంది. అలాంటి చినుకుని ఒక దయాదీవి గా పోల్చటం, ఆ పోలికనే కవితా సంపుటి శీర్షికగా ఎంచుకోవటం వెంకట కృష్ణ అభిరుచిని తెలియచేస్తుంది.

తెలుగు సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఉత్తరాంధ్రనుంచి వచ్చే సాహిత్యానికి ఉద్యమనేపథ్యముంటుందని, గోదావరి జిల్లాల కవిత్వంలో కడుపు నిండిన వ్యవహారం కనిపిస్తుందని, సీమ సాహిత్యం కరువు, పంటలెండిపోవటం లాంటి అంశాలను వ్యక్తీకరిస్తుందని తెలుగు సాహిత్యకారుల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం, ఒక కవి తాను సృజించే కవిత్వంలో తాను బ్రతుకు తున్న ప్రాంతం యొక్క అస్థిత్వం, తాను జీవించే జీవితం తాలూకు పదచిత్రాలు ప్రవహించక తప్పదు. అదొక అనివార్యత. ఆ కారణంగా పరిణామ క్రమంలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అదే సంఫూర్ణ సత్యం కాబోదు.

వెంకట కృష్ణ కవిత్వం అలాంటి పడికట్టు అభిప్రాయాల్ని బద్దలు కొట్టిందనిపిస్తుంది. సీమ కరువును, రైతు అస్థిత్వాన్ని ఎంతైతే బలంగా వ్యక్తీకరించిందో అంతే బలంగా చిక్కని భావుకతా, సౌందర్యం, సౌకుమార్యాలు కూడా అనేక కవితలలో అలవోకగా అంతే ప్రాధాన్యతతో ప్రతిబింబించాయి. దుఃఖమమయమైన సందర్భాల్ని చెప్పేకవితలకు కూడా చక్కని ఆశావహముగింపు ఇవ్వటం కూడా వెంకట కృష్ణ కవిత్వప్రత్యేకతగా భావించవచ్చు.

వెన్నెలను వర్ణిస్తూ…..

ఆకసం పొయ్యి లోన
పగలు మణిగిన జాబిల్లి పిల్లి
రాత్రి సంచారానికి లేచి
అంటిన బూదిని దులిపనట్లు వెన్నెలా — (వెన్నెల) — అంటూ చేసిన వర్ణన అపూర్వమైనది. అనాదిగా వెన్నెలను ఎంతమంది కవులు ఎన్నిరకాలుగా వర్ణించినా ఇంకా చాలానే మిగిలిఉందన్న భావన కలిగిస్తుంది.

ఇంటి మెట్ల అరుగులమీద కూచుని మూడు తరాల స్త్రీలు ఒకరి జడ ఒకరు అల్లుతూ కనిపించే దృశ్యం ప్రస్తుతం ఒక పురాస్మృతి. పల్లెటూర్లలో అయినా కనిపిస్తుందో లేదో!. జడ అల్లటాన్ని వస్తువుగా చేసి వ్రాసిన “జత పదార్ధం” అనే కవిత వెంకట కృష్ణ ప్రతిభకు గీటు రాయి. సామాన్యమైన వస్తువును కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది.

ఇద్దరు తనూ లతలు – వొకరిలో ఒకరు చుట్టుకున్న వాళ్ళు
తమనవ్వులను పురితిప్పి అనుబంధాలను కదా అల్లటం//
జడ అల్లడమంటే
ముచ్చటగా ప్రేమను తురమటం// — (జత పదార్థం) — తనూలతలు, తురమటము అన్న పదాలు ఎంత అందంగా ఒదిగిపోయాయీ సందర్భానికి. నిజమే కదా! జడ అల్లటం అంటే ప్రేమను తురమటమే!

ఒక బైరాగిని వర్ణిస్తూ వ్రాసిన ఈ వాక్యాలలో పొంగే ఊహాశాలిత చాలాబాగుంది

అప్పుడప్పుడూ అతని పెదవులు తాకి
పరవశించి పాడుతాయి వెదురు కన్నులు
ఆ పాటలు వినడానికి భూమిలో నుండీ
తొంగి చూస్తాయి వజ్రపు తునకలు (రవ్వల దీవి)— వెదురుకన్నులు పరవశించి పాడుతాయనటం, వజ్రపుతునకలు ఆ గానాన్ని వింటున్నాయనటం నూతన అభివ్యక్తి.

వెంకట కృష్ణ కవిత్వంలో కాల స్పృహ అనేక కవితలలో బలంగా వినిపిస్తుంది. లో-హితుడు అనే కవితలో—

ఒక గొంతుకు వురి బిగించి
పెళపెళ పెటిళ్ళున
ఎన్ని గొంతుల గొలుసులు తెంపి
యిలాగైనా యీ దళపతుల నోటి కుట్లు
తెంపావురా! — (లో-హితుడు) — కుల వివక్షకు బలైన రోహిత్ ఆత్మహత్య వృధా కాలేదని కొన్ని కోట్ల గొంతులు ఎలుగెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాయనటం, రోహిత్ మరణంలో మనంచూడాల్సిన మరోకోణంగా భావించవచ్చు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చింపబడుతున్న అంశం రైతు ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్రాసిన మూగ బాసట అనే కవితలో రైతుకు ఎద్దుకూ ఉన్న అవినాభావసంబంధాన్ని అత్యంత కరుణరసార్థ్రభరితంగా వర్ణిస్తారు.

పాదయాత్రలు చేసే వాళ్ళంతా
సింహాసనాల పైకే చేరుకుంటుంటే
ఎన్ని వేల పాదముద్రలో విత్తిన వాడు
చెట్టెందుకెక్కాడో
అట్నుంచీ పాడెందుకెక్కాడో
అర్ధంకాని మూగెద్దులు సలిపే సంభాషణ — (మూగ బాసట) రాజకీయ తంత్రంలో రైతు స్థానం కడపంక్తే. రైతు పిడికెడు మట్టై చెట్టుకు వేలాడాల్సి రావటం ఒక సామాజిక వాస్తవం. రైతు నేస్తం ఎద్దు. అలాంటి ఎద్దు కళ్ళనుండి “బాధా సర్పం జారిపడ్డదట”, “ఎద్దు పుండు ఎవరికిష్టం” అంటూ కవిత ముగుస్తుంది. రైతుకి ఎద్దుతో ఉండే ప్రేమానుబంధాన్ని అత్యంత అనుకంపనతో వ్రాసిన గొప్ప కవిత ఇది.

“తండ్రులు-కూతుళ్ళు” కవిత టీనేజ్ కూతుర్లున్న తండ్రులను తప్పక కదిలిస్తుంది. ప్రతీ వాక్యమూ గొండెలోపొరల్ని స్పృశిస్తుంది. గొప్ప ఆర్థ్రత నిండిన కవిత ఇది. (ఈ కవిత చదివినప్పుడల్లా ఇంటర్ చదువుతున్న మా అమ్మాయే నా తలపుల్లో మెసలుతాఉంది.)

“కవిత్వం మానవజీవితాన్ని ఆశ్రయించి ఉద్భవించిన కళ” అంటారు పింగళి లక్ష్మీ కాంతంగారు. కవి తాను జీవించే జీవితం, అనుభూతులు, తానునమ్మిన దృక్పథాలు తనకవిత్వంలో స్వాభావికంగానే ప్రకటితమౌతూంటాయి. ఎందుకంటే కవిత్వం ఎక్కువగా అంతశ్చేతనకు సంబంధించింది కనుక. వెంకట కృష్ణ కవిత్వంలో దళిత, బహుజన దృక్పథం , సమాజాన్ని చైతన్యపరచాలనే ఆకాంక్ష, బలహీనులపట్ల సహానుభూతి వంటివి అనేక కవితలలో కనిపిస్తాయి. ఇది ఇతని కవిత్వ తత్వం.

అరఅడుగు వొరలో వొదిగిన
ఆరడుగుల చీర
తనకంటే వొద్దికైన వాణ్ణి చూపించనా అంటుంది (కళతన నేతన్నా) అంటూ నేటి చేనేతకార్మికుల వెతలను అక్షరీకరిస్తాడు. ధనంనిండిన మార్కెట్ మాయాజాలం లో చిక్కుకొన్న నేతన్నలో స్థైర్యం, చైతన్యం నింపేలా కవిత ముగుస్తుంది.

పర్వాంతం అనే కవితలో ఈ దేశపు కర్షక, కార్మికులు సామాజికంగా, రాజకీయంగా ఎలామోసానికి గురవుతున్నారో, న్యాయం చేయమని తట్టిన న్యాయాలయాలు కూడా ఏ రకమైన తీర్పులు చెపుతున్నాయో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు వెంకట కృష్ణ

దేశంలోని ప్రతి రైతుదేహానికీ
ఒక తెల్లగుడ్డ
ప్రతి కార్మికుడి దేహానికీ
ఒక ఎర్రగుడ్డ
పరిహారం పంపిణీగా కోర్టు తీర్పు (పర్వాంతం) అంటూ ఆధునిక జీవనపోరాటంలో బలహీనుల పక్షాన నిలిచారు. ఈ కవితను ముగిస్తూ ఈ నాటకాన్ని మలుపు తిప్పాలనుకొనే ఔత్సాహికుడు, సాహసికుడు, ఉద్యమకారుడు అయిన ఒక పాత్ర ప్రవేశిస్తుంది అనటం ద్వారా ఒక ఆశావహ దృక్కోణం ఆవిష్కృతమౌతుంది.

సాధారణంగా ఉగాది కవితలు సౌందర్యంతో మెత్తమెత్తగా చక్కని ఉపమానాలతో సాగుతాయి. సమాజం పట్ల నిబద్దత, మార్పురావాలనే ఆకాంక్ష హృదయాంతరాళాలో పొదువుకొన్న ఈ కవి ఆ వచ్చిన ఉగాది అతిథికి….

శ్రమజీవన సౌందర్యానికి శ్రమదానం చెయ్యమని
నేల పాతరేసిన ఉషస్సును
జనానికి పంచమని! (అతిథి)— ఉపదేశిస్తాడు. గొప్ప సామాజిక చైతన్యం, ఈ వ్యవస్థ బాగుపడాలన్న నిబద్దత కలిగిన కవిమాత్రమే వ్రాయగల వాక్యాలివి.

ఒక హిజ్రా పై వ్రాసిన “స్వదేహ పరాయీకరణ” కవిత తీసుకున్న వస్తువులోని భిన్న పార్శ్వాలను స్పృశించిన తీరు అద్భుతమనిపించక మానదు. . చాలా గాఢత కలిగిన కవిత అది. అందులో ఒకచోట

జీవితమంతా అజ్ఞాతవాసంలో వుండటం
ఏ బృహన్నలకు మాత్రం సాధ్యం
రణరంగమొకటి రోజూ ఎదురొస్తుంటే
ఏ వొక్క క్షణాన్నీ ఎలా శాంతిగా గడపటం — అన్న వాక్యాల వద్ద తడిలాంటిదేదో చదువరుల హృదయాల్ని తాకుతుంది. వెంకట కృష్ణను- వాస్తవిక వాదిగా, వస్తువును శిల్పంగా, ఉద్వేగంగా, ఉదాత్త వాక్యాలుగా మార్చగలిగే శక్తి కలిగిన గొప్ప కవిగా నిరూపిస్తుందీ కవిత.

ఇంకా ఈ సంపుటిలో, యస్. ఆర్. శంకరన్, అరుణ్ సాగర్, కొండేపూడి నిర్మల, మార్క్వెజ్, కొప్పర్తి లపై వ్రాసిన ప్రేమపూర్వక కవితలున్నాయి.

ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఈ పుస్తకానికి  కాశీభట్ల వేణుగోపాల్, శ్రీ జి.ఎస్. రామ్మోహన్ లు ఆప్తవాక్యాలు వ్రాసారు.

రఫీక్ అహ్మద్ అందమైన ముఖచిత్రాన్ని అందించారు.

పుస్తకం వెల: 100/-

కాపీల కొరకు: 8985034894

*

ఇంకేమీ ల్యే ….. రివేరా సంతకం!

riveraa

 

మనుషుల్ని దూరం చేయడం ఈ యుగ లక్షణం. ఒకర్నొకరు కలవకుండా, మాట్లాడకుండా, ఆలింగనం చేసుకోకుండా,  ఒకరి కండ్లలో తడి మరొకరు అనుభూతి చెందకుండా చేయడం ఈ కాలం లక్షణం. ఒకర్నుండి ఒకర్ని యెప్పటికప్పుడు ఖాళీ చేస్తుండడం, చేయిస్తుండడం ఈ నాటి క్రూరత్వం. ఒకప్పుడు ఇల్లు ఖాళీ చేసేటోళ్లం. తర్వాత ఊర్లు ఖాళీ చేసినం. ఆ తర్వాత దేశాల్ని ఖాళీ చేసినం. ఇప్పుడింక మనుషుల్నే ఖాళీ చేయాల్సివస్తున్నది. మనుషుల్ని అలవోకగా,  యేమీ పట్టనట్టుగా వదిలేసి,  ఖాళీ చేసి,  గొరగొరా మనల్ని మనం ఈడ్చుకుపోవల్సి వస్తున్నది. మనుషులు మనల్ని భౌతికంగా వదిలి పోవుడు ,  సుదూరమై పోవుడు  అందనంత దూరంలో ఉండుడు  చివరికి ఈ లోకంలోంచే నిష్క్రమించుడు  మనకు రోజూవారీ చర్యై పోయింది. తీరా వదిలిపోయినంక కానీ తెలుస్త  లేదు ఆ నొప్పి – తీరా దూరమైనంక కానీ ఆ గాయాలు సలపడం లేదు – ఇంక మళ్ల కలవరు,  ఇంక మళ్ల చూడలేము , మళ్ళెప్పుడూ కరస్పర్శ ఐనా వీలుకాదు అని తెలిసినంక  కానీ వెచ్చని నెత్తుటి తడి అంటదు.

అనాదిగా కవులు,  కలయికల గురించీ, వియోగాల గురించీ,  విరహాల గురించీ పాడుతూనే ఉన్నరు. కలయికల తియ్యదనం గురించి పాడినట్లుగా,  వియోగపు చేదునూ మధురంగానే పాడుతున్నరు. ఐతే అన్ని కాలాల్లో కలయికలు వియోగాలు విరహాలు ఒకటికావు. మనుషులందరికీ కూడా కలవడాలూ విడిపోవడాలూ వేరు వేరుగానే అనుభూతిలోకి వస్తయి. ప్రేమికులకు ఒక రకంగా, స్నేహితులకు ఒక రకంగా, సన్నిహితులకు ఆప్తులకు మరో రకంగా అవి గోచరిస్తయి, అనుభూతినిస్తయి. అన్నింటికంటే సామూహిక కార్యాచరణలో ఉన్నవారికి, ప్రజాఉద్యమాల్లో ఉన్నవారికి కలయికలు అపురూపాలు – వియోగాలు అత్యంత విషాదాలు. వియోగం వేరొకచోటికి బదిలీల వల్ల కావచ్చు, బలవంతంగా పరిస్థితుల వల్ల విడిపోవడం కావచ్చు చివరికి దుర్మార్గపు వ్యవస్థ బలికోరే బలవన్మరణాలవల్ల కావచ్చు. యేది యేమైనా యీ వ్యవస్థ చేస్తున్నది మనుషుల్నుండి మనుషుల్ని ఖాళీ చెయ్యడమే – ఖాళీ చేసి దూరంగా సుదూరంగా అందరానంత దూరంగా,  మళ్ళెప్పుడూ కలవనంత దూరంగా విసిరెయ్యడమే – ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగల్చడమే.

ఇక ఇప్పుడు కవులు ఖాళీ చెయ్యడం గురించి పాడతరు. ఖాళీ ఐన చోట మిగిలిన శూన్యం గురించి పాడతరు. ఖాళీ చేసేటప్పుడు గొరగొరా ఈడ్చుకుపోయిన మనుషుల చప్పుడు గురించి పాడతరు. ఐతే ఖాళీ గురించి పాడడమంటే, ఖాళీ గురించి చెప్పడమంటే  ఉన్నప్పటి ఉనికి  గురించి చెప్పడమే కదా – ఉన్నప్పటి అనుభూతుల్నీ అనుభవాల్నీ ఆకాశాల్నీ నేల చెలిమల్నీ తడమడమే కదా!

ఇంక ఈ లోకంనుండే ఖాళీ చేసి పోయినవాళ్ల గురించి పాడెటప్పుడు యెంత విషాదం గడ్డకట్టుకు పోతుందో చెప్పడం యెవరికి సాధ్యం?   అందరానంత దూరాల్లో ఉండీ కలవలేకపోవడం  అర్థం చేసుకోవచ్చేమో – పక్క పక్కనే ఉండి ఒకర్నుండి ఒకరు ఖాళీ ఐన పరిస్థితి మరీ దారుణం కదా – మరి దాన్ని పాడడం యింకెంత విషాదం?

 

“వాళ్లు స‌జీవంగా ఉంటారు

మ‌న‌తో క‌ల‌వ‌రు

మ‌న‌ల్ని స‌జీవంగా ఉంచుతారు

అయినా, మ‌న‌తో ఉండ‌రు.”

అని మొదలవుతుంది రివేరా కవిత ‘ఇంక ల్యే… ‘ .

సజీవంగా ఉండీ, మనల్ని సజీవంగా ఉంచీ మనతో కలవని వారూ మనతో ఉండని వారి గురించి, వారు వదిలిన ఖాళీ గురించి పాడుతున్నడు కవి. వెంటనే ..

“కిత్నేబీ క‌హో… వాళ్లంతే

వాట్ మేబీ వుయ్ ఆర్‌.. వాళ్లంతే.”

అంటూ హింగ్లీషు లోనూ తెలుగులోనూ లయబద్దంగా చలిస్తడు.

“ పొయ్యి మీద కూర్చోబెట్టేసి

పొద్దున్నే చాయ్ కాసేస్తారు

చెవి మెలిపెట్టేసి రాగం తీయిస్తారు

పుట‌ల్లో చొర‌బ‌డి ప‌క్కున న‌వ్వేస్తారు

మ‌న జేబులు దోసేసి

దొంగ‌ల్లా బోనులో నిల‌బెట్టేస్తారు.”

కొంగ్రొత్త వ్యక్తీకరణతో , వాళ్ళేమి చేసినరో చెప్తున్నడు కవి. వాళ్ళు మనకెంత సన్నిహితులో, మనకెంత యేమి నేర్పించినరో యెట్లా నేర్పించినరో చెప్పి ముక్తాయింపుగ మన జేబులే దోసి మనల్నే దొంగల్ని  చేసిన వైనం చెప్తడు ఒకింత చమత్కారంగా – వాళ్ళు మన జేబుల్ని దోచింది మన పైసలు కాదని మనకి వేరేగా  చెప్పనవసరం లేదు కవి.

హాత్ మిలే, బాత్ ఖిలే.. వాళ్లంతే

సాత్ చ‌లే, రాత్ హిలే.. వాళ్లంతే.

మళ్ళీ లయబద్దమైన హింగ్లీషు. ఐతే యేదో చమత్కారం కోసం వాడడం లేదా సంగీతం కోసం లయకోసం మాత్రమే కాదు – మిలే ఖిలే చలే హిలే చాలా లోతైన పదాలు – మిలే చలే మనుషులకు వర్తిస్తే ఖిలే హిలే ప్రకృతి కి సంబంధించినవి. ఐతే మనుషులకీ  వికసించడం కదిలిపోవడం వణికిపోవడం సహజమే కదా – అందుకే కవి అమాయకంగా సంగీతం కోసం లయకోసం వాడినట్టున్నా , కొంచెం గడుసుతనం కూడ ప్రదర్శించిండు.

 

“ సూరీడికి అర‌చేతులు అడ్డుపెట్టి

మ‌న క‌న్నుల‌కు కాపు కాసిందెవ‌రో..

ఆ క‌న్నుల‌ను వొళ్లోకి తీసుకొని

ఊపిందెవ‌రో, ఊకోబెట్టిందెవ‌రో..

క‌న్నులు మూసినా, తెరిచినా

దృశ్యాన్నంతా దురాక్రమించిందెవ‌రో..”

 

‘అరచేతికి అడ్డుపెట్టీ సూర్యకాంతినాపలేరు’   అన్న నినాద ఉద్యమ సంప్రదాయం నుండి వచ్చిన కవే రివేరా – ఐతే ఆ స్ఫూర్తి యెంతమాత్రమూ పోకుండానే, మనకు బాగా తెలిసిన భావాన్ని మనకు అపరిచితం చేస్తున్నడు. యెండవేడిమి నుండి లేలేత కనుపాపలని కాపాడినరు, వొళ్ళోకి తీసుకోని ఊపినరు ఊకోబెట్టీనరు – మనల్ని పసిపాపలుగానూ,  పసిపాపలు చేసీ పెంచి పెద్ద చేసిన వాళ్ళ గురించి చెప్తూ కవి,  మన కళ్ళ లో దృశ్యాల్ని దురాక్రమించుకున్నరు అని ఒక విరోధాభాస ప్రయోగిస్తున్నడు. ఇది మంచి దురాక్రమణ అని వేరే చెప్పాలా కవి?

“ తిరిగే లోకంలో తిక‌మ‌క‌ప‌డిన‌ప్పుడ‌ల్లా

తిమ్మిరి తీసి తిన్నగా దారికి తెచ్చిందెవ‌రో..

మ‌నిద్దరినీ అంబాడే అడుగులు చేసిందెవ‌రో..”

మొదటి రెండు వాక్యాల్లో మనకి నడక నేర్పినరు అని చెప్పడానికి కవి వాడిన పదాలను వాటి సొగసునూ అనుప్రాసనూ గమనించండి. యెక్కడా తేలిపోకుండా, కవిత్వమవుతూనే అద్భుతంగా పదాలను కూర్చినడు కవి.

“ఎంత వెతుకూ… దొర‌క‌రు

ఎంత పిలువూ.. ప‌ల‌క‌రు

నీడ‌ల‌ను మ‌న‌కి మిగిల్చి

నిజ దేహాల‌తో ఎంచ‌క్కా లేచిపోతారంతా..”

ఇక్కడ ఇక కవితలో మొదటి రెండు చరణాల  తర్వాత ప్రయోగించిన హింగ్లీషు ప్రయోగం కాకుండా తన మాతృభాష లోనే శోకిస్తున్నడు కవి. నీడలను మనకు మిగిల్చి వెళ్ళిపోయే వారిని ‘యెంచక్కా లేచిపోతారంతా’ అనడం లో అట్లా హాయిగా వెళ్ళిపోయినరనే అర్థం స్ఫురించినా వెతికా దొరకని,  పిలిచినా పలకని, ఖాళీలు మిగిల్చి,  పుట్టెడు  శోకాన్నీ మిగిల్చి,  పూడ్చలేని ఖాళీలు మిగిల్చి , వెళ్ళిపోయారనే దుఃఖ భారమూ ఉన్నది. మనకు తేలిక అనిపించే పదాలతో మనం యెంతో బరువును అనుభూతి చెందేటట్టు చేయడం కవి గొప్పదనమిక్కడ.

“ ఇంకేమి ల్యే… గుర‌..గుర‌.. గ‌ర‌..గ‌ర‌.. బ‌ర‌..బ‌ర‌లే..”

అని ముగిస్తడు కవితను.  ఇది సందర్భం తెలవక పోతే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించే అవకాశం ఉన్నది. సాధారణంగా మనమేదేనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు,  చివరి సారి లోపలికి పోయి,  అంతా కలియ చూసి చివరి సందూక నో సూట్కేసునో గొరగొరా బరబరా ఈడ్చుకొచ్చి ‘ఇంకేమీ ల్యే.. ‘  అని అలసటతోనూ, నిస్పృహతోనూ, అన్నీ వదిలి వెళ్తున్నం కదా అనే దుఃఖంతోనూ అంటాం కదా – అ దీ కవి తన ముగింపు వాక్యంగా యెంచుకొన్నడు. నిజానికి ఇది కవితకు ప్రారంభవాక్యం . కవి ఇంకా చెప్పదల్చుకున్నదానికీ, చెప్పకుండా మనల్ని ఊహించుకోవడానికి వదిలేసిన దానికీ ప్రారంభ వాక్యాలు. నిజానికి ముందు చెప్పిందంతా ఒక ఉపోద్ఘాతం మాత్రమే – ఇక్కడ్నుండీ కవిత మొదలవుతుంది. అది మనమే ఊహించుకోవాలె  రాసుకోవాలె.  ఇట్లాంటి అనేక సందర్భాల్లో మనలో మిగిలిన ఖాళీలను చెప్పకుండా , అవి మన ఊహలకే వదిలేసి,  జీవితంలోని ఒక ప్రాక్టికల్ సందర్భానికి కవితాశక్తి ని తెచ్చి,  మనకియ్యడం  కవి అసమాన ప్రతిభకు నిదర్శనం.

రివేరా విరసం లో చాలా చురుకైన సభ్యుడు. చాలా రోజుల్నుంచి కవిత్వం రాస్తున్నడు. చాలా మంచి కవిత్వం రాస్తున్నడు. విరసం వాళ్ళు రాసేది కవిత్వమేనా అని పెదవి విరిచే వాళ్లకు కనబడకపోయి వుండొచ్చు కానీ ఇప్పటికే కవిత్వసంపుటాల్ని ప్రచురించి కవిత్వాన్ని ప్రేమించే వారందరికీ చిరపరిచితుడు. లబ్దప్రతిష్టుడు. కొత్తగా కొంగ్రొత్త వ్యక్తీకరణలతో రాస్తున్నడు. ఒకసారి చదవగానే మర్చి పోయే కవితలు కావతనివి. కనీసం రెండు మూడు సార్లు చదవాలి మనలో ఇంకడానికి  – మనమూ తనతో అంతే గాఢతతో అనుభూతించడానికి.    ఒక సారి ఇంకిపోతే ఇంకెప్పుడూ మనలోంచి ఆరిపోడు రివేరా. విస్తృతంగా ప్రపంచకవులను చదువుతున్నడని ఆయన కవితలను చదివితే అర్థమవుతున్నది.

యెక్కడా తన నిబద్దతనూ నిజాయితీనీ,  సమాజం పట్ల బాధ్యతనూ యెంత మాత్రం సడలకుండా కవిత్వాన్ని తనదైన సంతకంతో  రాస్తున్న అత్యాదునిక కవి రివేరా.

*

 

 

 

మార్పుని ఆహ్వానించాలి: జానకీ బాల

janaki1

ప్రతి నెలా లేఖినీ  మహిళా చైతన్య సాహితీ, సాంస్కృతిక సంస్థ  జరుపుకునే ముఖాముఖి సమావేశంలో భాగంగా లేఖిని సభ్యులు  అక్టోబర్ రెండున  సమావేశమయ్యారు. ఆ రోజు కలిశాను   ఇంద్రగంటి జానకీ బాలగారిని!

జానకీ బాల  ‘కనిపించే గతం’ నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం అందుకున్నారు.

మొదటగా మీ బాల్యం,గురించి చెప్పండి

1945  డిసెంబర్ నాలుగున  రాజమండ్రి లో పుట్టాను.  కానీ  ఆ తరువాత  బాల్యం అంతా  తణుకులో   గడిపాను. నా పుట్టిన రోజున  ఇద్దరు మహా గాయకులైన ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ పుట్టారని  చాలా గొప్పగా అనిపిస్తుంది.

సమాజం లో ఒక ఉన్నత వర్గం లో పుట్టినప్పటికి చాల దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. మా అమ్మగారు సూరి లక్ష్మినరసమాంబ గారు  రచయిత్రి కూడా . ఆ నాటి  పరిస్థితిల  దృష్ట్యా  ఆవిడ  తన రచనలను కొన్ని ప్రచురించినప్పటికీ  తరువాత అజ్ఞాతంగానే ఉండిపోయారు  ఆవిడ నాకు తల్లిగానే కాకుండా సంగీతం నేర్పిన గురువు గారు కూడా, నా స్కూల్ ఫీజులు కట్టిన గుఱ్ఱాల శకుంతల గారిని  ఈ సందర్భంగా  నన్ను చదువుకోమని ప్రోత్సహించి,  స్మరించుకోవాలి. సాయం చేసే చేతులకు కులమతాలు అడ్డు రావు.  ఆ తరువాత  నేను ఆమె ఋణం తీర్చేసాను.అది వేరే సంగతి.

మీ మీద ప్రభావం చూపించన రచయితలు

ఒక్కరని చెప్పలేను  ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,బుచ్చిబాబు గారు, మల్లాది వారే కాదు ఇంకా ఎందరో ఉన్నారు,అలాగే  రంగనాయకమ్మ గారి రచనలు  నాకు అత్యంత  ఇష్టమైనవి నచ్చినవి.

మీరు కవయిత్రి కదా? దానికి ప్రేరణ ఎవరు?

స్కూల్ లో ఉన్నప్పుడే  చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. నాకు కవిత్వం మీద ఇష్టం కలగటానికి గల కారణం  ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. వారు స్కూల్ లో జరిగే పోటీలకి జడ్జీగా వచ్చేవారు.  ఆయన అప్పటికే గొప్ప కవి,కానీ ఒక విధమైన  అమాయకత్వంతో నేను రాసిన  కవితలు చదవండి అంటూ ఆయనకి చూపించేదాన్ని. ఆయన  నా కవితలు చదివి ఎంతో ప్రోత్సహించేవారు. భవిష్యత్తులో చక్కటి కవయిత్రివి అవుతావని అనేవారు.

మీ మొట్ట మొదటి కధ ఎప్పుడు రాసారు ఆ వివరాలు తెలపండి

అంటే జగతి పత్రికలో ఓ  రెండు స్కెచ్ లు రాసాను.  ఆ తరువాత 1970 లో మనిషికి మరో మలుపు  అనే కధ  ఆంధ్రపత్రికకి రాసాను.ఆ కధ ప్రచురించబడినప్పుడు ఏదో సాధించినట్లు ఆనందపడిపోయాను. ఈ నలబై ఏళ్ళ కాలం లో దాదాపుగా 130 కధలు రాసాను. మొదటి కధా సంకలనం 1980 లో వేసాను. మొత్తం ఆరు సంకలనాలు వచ్చాయి. అవన్నీ కలిపి జానకీబాల కధలుగా 2013 లో ఒక బృహత్’సంకలనంగా వచ్చింది.

మీరు విలక్షణ మైన కొన్ని  రచనలు చేసారు  దాని గురించిన వివరాలు పంచుకుంటారా?

‘కొమ్మాకొమ్మా కోకిలమ్మా’ అని సినీ నేపధ్య గాయనీమణుల అంతరంగాలను ఆవిష్కరించే దిశగా  ఒక్కో గాయనిమణిని  కలిసి వాళ్ళ అనుభవాలను  అక్షరబద్ధం చేశాను. నా అదృష్టం కొంత మంది  ప్రఖ్యాత గాయనీ మణులను కలిసే అవకాశం  అస్మిత ఫౌండర్  వోల్గా ద్వారా కలిగింది. ముఖ్యంగా, పి.శాంతకుమారి, పి.భానుమతి. పి.లీల, జిక్కిలని  కలవడం  వారి అనుభవాలను వారి ముఖతాః  వినడం జరిగింది.  అలాగే  రావు బాలసరస్వతి, సుశీల,జానకి  గార్లను  కలిసి  వారి అనుభవాలను  కూడా రాసాను.

ఇక్కడ ఇంకో  విషయం నేను పాటలు పాడుతానని తెలిసి  మా తణుకులో ఉండే పి సుశీల వదినగారు రాయసం రాజ్యలక్ష్మి గారి ద్వారా  రెండేళ్లు సుశీలగారి దగ్గర మద్రాసులో ఉన్నాను. అప్పటికింకా నేను చాలా చిన్నదాన్ని.  యశస్విని :సినీ నటి,గాయనీ పి.భానుమతి గారి బయోగ్రఫీ, మార్గదర్శి  దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర, సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి కూడా పుస్తకాలు రాసాను.

janaki2

మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీ వివాహం ఆ వివరాలు చెప్పండి.

తప్పకుండా! తణుకు లో శ్రీకాంతశర్మగారి అన్నగారు ఉండేవారు. వారు మాకు దూరపు బందువులే. ఆ కారణంగా వారు వచ్చిపోతూఉండేవారు. వారి తో పాటు శ్రీకాంతశర్మగారు కూడా వచ్చేవారు. అప్పట్లో పుస్తకాలు చదవడం, వాటిని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉండేది. శ్రీకాంతశర్మగారు మనం పెళ్లి చేసుకుందామా అన్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.

మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి కిరణ్మయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, అబ్బాయి మోహన్ కృష్ణ అచ్చమైన తెలుగుదనానికి అద్దంపట్టే  చిత్రాలు తీస్తున్నాడు.

మీ కధా రచనలకు ప్రేరణ?

ఇంట్లో ఎక్కువ సాహిత్య వాతావరణం ఉండటం వల్ల రాయగలిగే అవకాశం లబించింది. పెళ్లి  తరువాత ఆర్టీసీలో  ఉద్యోగినిగా అకౌంట్స్ డిపార్టుమెంటులో అంకెలతో సావాసం చేస్తూ  అక్షరాలతో రచనలు చేసేదాన్ని, ఆంధ్రజ్యోతి లో శ్రీకాంత్ శర్మగారు ఉద్యోగం విజయవాడలో  జీవితం ఆరంభం. శ్రీకాంత్ శర్మగారు నా కధలు చదివి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు.

ఎక్కువగా ఎవరినీ ప్రశంసించని నండూరి  రామ్మోహన్ రావు గారు నువ్వు కధలు బాగా రాస్తావమ్మా! అనడం, అలాగే వాకాటి పాండురంగారావు గారు లాంటి మహానుభావులు నా కధని మెచ్చుకోవడం నిజంగా ఆనందంగా, సంతోషంగా  అనిపించింది.

మీ నవలల గురించి?

పన్నెండు నవలలు రాసాను. కాకపోతే నాకు  వీక్లీ సీరియల్ రచయిత్రిగా నాకు పేరు రాలేదు. అందుకు బాధ లేదు. నా నవలలు అన్ని కూడా డైలీ సేరియల్స్ గా వచ్చేవి.

చివరగా మీ మాటలు?

రచనలు చేసేటప్పుడు, ప్రాక్టికల్ ప్రొబ్లెంస్ ని గురించి  రచనలు రావాలి. ఆదర్శాలు,మానవత్వం,నీతులు లాంటివి  వట్టి  పేలవమైన పదాలే

అదే విధంగా పూజలు, వ్రతాలూనోముల పట్ల ఆసక్తి లేదు, దేవుడంటే కనిపించని ఒక శక్తి నడిపిస్తోందని నమ్ముతాను.

కొన్ని సార్లు మనలని మనం మార్చుకుంటూ, అంటే ముందు ఒక విధంగా ఉన్న కొన్ని అనుభవాల దృష్ట్యా  మార్పు తప్పనిసరి అవుతుంది. అప్పుడు అలా అన్నావు? ఇప్పుడు ఇలా మారిపోయా వేమిటీ? అనే వారు గమనించవలసిన విషయం, కొన్ని అనుభవాలు జీవితపు దిశను మార్చేస్తాయి కాబట్టి వాటి తో పాటు సాగి పోవలసినదే!

మంచి రచన, చెడ్డ రచన అనేవి లేవు. అది మనం  రిసీవ్ చేస్కోవడంలో ఉంది.

అన్నింటికంటే చాల ముఖ్యమైన విషయం పుస్తకపఠనం అనేది అన్ని వయసుల వారికీ మంచిది. అందుమూలంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది.

ఒక లలిత గీతం పాడి  ముగిస్తాను

“రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో..చల్లినారమ్మా… వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా   మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ… వెన్నెల పరచినారమ్మా..!! కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల  రాసి రాసులుగా…రాసి రాసులుగా…
ఎవరో…పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా”

అంటూ మధురమైన గొంతు తో అతి మధురంగా పాడిన కృష్ణశాస్త్రి గీతం  పట్ట పగలే వెన్నెల జల్లులు కురిపించింది

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సరళ నిర్వచనం కోసం అన్వేషణ!

 

book-cover-oka-sarala-nirvachanam

గరిమెళ్ల నారాయణ గారు వృత్తి రీత్యా శాస్త్రవేత్త. తన తొలి కవితా సంపుటి ‘-273˚C నుండి ఒక సరళ నిర్వచనం’ లో ఈ కవి సృజించిన కవితలు చదివితే, సంక్లిష్ట సమాజంలో మానవ మనస్తత్వాన్ని నిశితంగా గమనిస్తూ ఆదర్శప్రాయమైన జీవితానికొక సరళ నిర్వచనాన్నిచ్చిన సాహసిగా ఇతను కనిపిస్తాడు. ఇతని శాస్త్రీయ దృక్పథం ఇతనిలోని కవిని ప్రేరేపించిందనీ, తద్వారా ఒక కొత్త అభివ్యక్తిని ఇతను సొంతం చేసుకునేందుకు తోడ్పడిందనీ పుస్తకం చదువుతుంటే మనకు అర్ధమవుతుంది. కవితలన్నిటిలో అంతర్లీనమైన సానుకూల దృక్పథం, ఆశావాదం, తోటి మనిషి పట్ల అమితమైన అభిమానం, మన చుట్టూ ఉన్న కుళ్ళుని మనమే శుభ్రపరచుకోవాలన్న ఆరాటం,  స్నేహశీలత, అనుబంధాలపట్ల మక్కువ కమనీయంగా కనిపిస్తాయి.

‘పర్వతుడా! నీపాదాలకునమస్కారం’ కవితలో మల్లి మస్తాన్  బాబుని  స్మృతిస్తూ

తెలియని పాఠాలేవో చెప్పి పర్వతాలని పాదాక్రాంతం చేసుకున్నావో,

లేక అవి మాత్రమే సొంతం చేసుకున్న ప్రకృతి సహజత్వానికే ప్రణమిల్లావోగాని

అనడంలో ప్రకృతీ, పురుషుడూ ఒకరినొకరు పాదాక్రాంతం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రణమిల్లుతూ పరస్పరం గౌరవించుకునే సహజీవన సౌందర్యం కనిపించి‘ వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాట గుర్తొస్తుంది.

పర్వతశిఖరాలమీదజెండాలైనిలబడిననీపాదాలకుశిరసువంచినమస్కరిస్తున్నానుఅంటూ- శిఖరాల మీద నిలబడిన పాదాలనే, పర్వతారోహకుడు తానధిరోహించిన శిఖరం మీద పాతే జెండాలుగా వర్ణించడం కవి సాధించిన అందమైన అభివ్యక్తికి అద్దం పడుతుంది.

 

నిజానికి రెక్కల విలువ తెలిసిన వారు ఇతరుల బహుమతులేవీ ఆశించరు

ఎగిరేపుడు మాత్రం ఎవరైనా తన రెక్కల టపటపల కనుగుణంగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తే బాగుండు ననుకుంటారు

‘రెక్కలనే బహుమతిగా ఇవ్వు’ అనే కవితలో పొందుపరచిన ఈ వాక్యాలు ఒక నిత్య సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. కేవలం చిన్న చిన్న ప్రోత్సాహక వాక్యాలు అందించగల శక్తిని గుర్తుచేస్తాయి.

 

‘రెక్కలుకట్టేవాడు’ కవితలో గుబురుగా పెరిగిన వృక్షాలు భూమికి వర్షాన్ని బహుమతిగా రప్పించుకుంటాయని చెప్పి  ‘ఎగరడమంటే చెట్టులా పైకెగసి, చినుకులా భూమిని ముద్దాడటమేఅంటారు.

చినుకు భూమిని ముద్దాడాలంటే చెట్టు ఎలా పైకెదగాలో చెప్పే సూచన కనిపించి మనసుపులకిస్తుంది. ఇందులో చెట్లు నరికేస్తూ వర్షాభావానికి కారణం తెలుసుకోలేని మనిషికి ఒకసున్నితమైన మందలింపు వినిపిస్తుంది.

పసిపాపల బాల్యచేష్టలని వర్ణిస్తూ ఆ ఆనందాలని,  అపురూపాలని చేతులు చాచి పట్టుకోమని చెప్పే కవితలో‘ అలా పట్టుకున్నాక మీ వయసు విరిగి బాల్యంలో పడకపోతే నన్ను నిలదీసి అడగండి‘ అంటారు!

 

‘ముద్దుల బాధ్యత ఒక రక్షణ కవచం’ లో ‘ట్రోపో, స్ట్రాటో, అయానో ఆవరణాల దుప్పట్లు కప్పుకున్న మురిపాల పాపాయిగా భూమిని వర్ణించడం ఒకకొత్తప్రయోగం.

అమ్మ అనగానే అహర్నిశలూ మన బాగోగులు చూస్తూ, ప్రేమని పంచే వ్యక్తి మన ఊహ లో సాక్షాత్కరిస్తుంది. ఆమె కి అమితమైన బాధ్యత అంటగట్టి, మన బాధ్యతని సులువుగా మరచిపోతాం.  కన్నబిడ్డ విషయంలో మాత్రం అలా అనుకోం. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో ఎంతో శ్రధ్ధ వహిస్తాం!

భూమిని తల్లిగా కాకుండా, మురిపాల పాపాయిగా వర్ణించే ఈ కవితలో ఆమె సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే ఒక హెచ్చరిక వినిపిస్తుంది! ఇది మానవాళికి చాలా ఆవశ్యకమైన హెచ్చరిక.

 

అబల, ఆ(యుధ) బల కావాలని ఆకాంక్షిస్తూ

ఆమె ఒక తుపాకి అయ్యుంటే ఎంత బాగుండేది?…

ఎక్కుపెట్టిన బాణమో, మొనదేలిన బల్లెమో, వళ్లంతా ముళ్లు నింపుకుని ఆత్మరక్షణలో ఆరితేరిన జంతువో అయ్యుంటే ఎంత బాగుండేది?’  అంటారు.

అలా అంటూనే అనవసరమైన ఆయుధీకరణని తుపాకీ ఎప్పుడూ తుపాకీయేప్రతి సమస్యకూ పరిష్కారాన్నిపేలడంలోనే కనుక్కోవాలనుకుంటుందిఅంటూ నిరసిస్తారు.

 

ఎక్కడచూడు .. రెండే..! ఒక పై చెయ్యి ..ఒక కింద చెయ్యి.. పై చెయ్యెపుడూ హుకుం జారీ చేస్తా నంటుందికిందది బానిసలా పడుండి కింద కిందనే అణిగి మణిగి ఉండాలంటుందిఅంటూ, తానెపుడూ చేతులు రెండూ కలిసి కరచాలనమయ్యే చోటుకి ప్రయాణం కడతా’ నంటూ ఒక అపురూపమైన భావాన్ని కవితగా రూపొందించారు.

 

అమ్మ తెల్లవారడాన్ని బలవంతంగా ఆవులించి నిద్రలేపుతుంది అమ్మకి ఇంత కంటే సరళ నిర్వచన మేముంది?

 

అబ్సల్యూట్జీరో (-273˚C) డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పదార్ధాలన్నీ లోపరహితస్థితిలో ఉంటాయన్న వాస్తవాన్ని కవిత్వీకరిస్తూ‘ ఒక్కసారి స్థితిలోకి పోయివచ్చేద్దాంస్వచ్చంగానవ్యనాగరికతనుమొదలెడదాం’ అంటారు.

ఆహ్లాదకరాలు, భాగ్యురాలు లాంటి పదప్రయోగాలనూ, అక్కడక్కడ దొర్లిన అచ్చుతప్పుల్నీ పరిహరిస్తే ఈ నవ యువకవి తొలిపుస్తకం మనిషిని పునరుజ్జీవింపజేసే స్వప్నాలని ఆవిష్కరించి సేదతీరుస్తుంది; ‘ఊహించడానికి ఖర్చేం కాదులేఅని ఊరడిస్తుంది.

వాసిరెడ్డిపబ్లికేషన్స్ (ph.9000528717) లో ప్రింట్పుస్తకంగానూ ,www.kinige.com లో డిజిటల్ ప్రతిగా  లభిస్తున్న ఈపుస్తకం వెల రు. 60.

*

“చివరకు మిగిలేది” దేనికోసం?!

buchibabu‘‘చివరకు మిగిలేది’’ నవలకూ, ఆ నవలా రచయిత బుచ్చిబాబుకు, తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రముఖ స్థానం ఉంది. అప్పటికి తెలుగు నవలలలో విశాలమైన ప్రాతిపదికపై ‘‘మానవ జీవితం’’ పట్ల తాత్విక దృక్పథాన్ని ప్రతిపాదించే ప్రయత్నాలు జరిగాయి. అయితే వైయక్తిక జీవితానికి, ఆయా తాత్విక దృక్పథాలకు గల పరస్పరత (interaction) ‘‘చివరకు మిగిలేది’’ నవల. ఆధునిక జీవితానికి తప్పనిసరి అయిన పాశ్చాత్య తాత్విక దర్శనాలను బాగా పరిశీలించిన మేధావి బుచ్చిబాబు.

ఈ నవల కుండే చారిత్రక ప్రాధాన్యతను ఆర్‌.ఎస్‌.సుదర్శనం ఇలా చెప్పారు. ‘‘తెలుగులో మనో వైజ్ఞానిక నవల అవతరించడంతో ‘‘కాల్పనికత’’ బద్దలైంది. ఈ విధంగా చూస్తే ‘‘చివరకు మిగిలేది’’ తెలుగు సాహితీ పురోగతిలో ఒక మైలురాయి. భావనాత్మక ప్రేమ, ఆదర్శాలూ, జీవిత సత్యం, ముందు, దివ్వటీలు సూర్యుడి ముందు కాంతి విహీనమైనట్లు నిరుపయోగం కావటాన్ని చిత్రిస్తుందీ నవల’’. భావనాత్మక దృక్పథాన్ని నిజజీవితం ముందు పరీక్షకు పెట్టడం ఈ నవల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఈ నవలలో వ్యక్తి దయానిధి. అతని మానసిక పరిణామం ఈ నవల. అతని జీవితంలో కదలిక కంటే వలయాల వలననే ప్రాముఖ్యం కలుగుతుంది. ఆ ఆలోచనా వలయాల గుణాన్ని, విలువలను బట్టే సంఘటనలు ఎన్నుకోబడతాయన్నా ఆశ్చర్యం లేదు. అయితే అది కృతకంగా గాక సహజంగా ఉండడం వలన నవల విజయవంతం అయి జీవితంపై ఒక దృక్పథాన్ని కలిగించాలనే రచయిత ప్రయోజనం నెరవేరింది.

2

డాస్టోవిస్కీ నవల సాధారణతలను కాకుండా ప్రత్యేకత (peculiarities) లను చర్చించాలని అన్నాడు. ఇందులో ఉద్దేశ్యం సామాన్య జీవిత దృక్పథాలను వైయక్తిక జీవితాలకు అంటే ప్రత్యేక వ్యక్తి జీవితాలకు అన్వయించడం కావచ్చు.

‘‘చివరకు మిగిలేది’’ నవలలో దయానిధి ప్రత్యేకయిన వ్యక్తిత్వం కలవాడు. అతను అనుభూతిపరంగానూ, ఉద్వేగ స్థాయిలోనూ కాల్పనికమైన ఆలోచనలు కలవాడు. దయానిధి కాల్పనికత సాంప్రదాయక కాల్పనికత కంటే భిన్నంగా ఉండదు. అంటే స్ర్తీ పురుష సంబంధాలకు చెందిన కాల్పనిక ధోరణి జీవితంలో ప్రధానాంశం కావడం. అయితే దయానిధిలో ఈ కాల్పనికత కాల్పనికమైన వాదులాటకు సెంటిమెంటల్‌ కాన్‌ఫ్లిక్ట్‌కు దారితీయదు. కాల్పనికతకూ, నిజజీవిత గమనానికి మధ్య ఏర్పడే ఘర్షణ రచనా లక్ష్యం అనడంతో ఈ నవల ‘‘మైలురాయి’’ అయింది.

ఈ కాల్పనికత కారణంగానూ, మిగిలిన అంశాల వల్ల దయానిధిలో స్ర్తీల పట్ల అమితమైన కుతూహలం జనిస్తుంది. స్ర్తీలందరూ కేవలం తాము స్ర్తీలయినంత మాత్రాన్నే అతన్ని మానసికంగా స్పృశించి అతన్లో ఆలోచనలు లేపుతారు (కాత్యాయిని, రోజీ ఇందుకు మినహాయింపు) అయితే స్త్రీల పట్ల అతని దృక్పథం వాళ్ళ ‘‘అమ్మ’’ వల్ల ప్రభావితం అవుతుంది. ఇది మౌలికంగా సాంప్రదాయిక కాల్పనికత కంటే భిన్నంగా పరిణమిస్తుంది.

దయానిధి కాల్పనికతలో సంఘ నియమాల పట్ల మౌలికమైన పట్టింపు లేదు. నిజానికి సంఘం, దాని నియమాలు, పరిమితలకు అతని మానసిక పరిధిలో మొదట మొదట స్థానమే లేదు. అయితే తర్వాత తర్వాత ‘‘అమ్మ’’, తన ఊహలో ఎంతో ఉన్నతమైన ‘‘అమ్మ’’ను సంఘం తిరస్కారభావంతో చూడడం గుర్తించిన దగ్గిర్నుంచీ అతనికి సంఘంతో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ ఘర్షణ అంతస్సంఘర్షణగా రూపొందడంతో సమస్య జటిలమవుతుంది. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అతనికి సంఘ నియమాల పట్ల మౌలికంగా పట్టింపు లేదు. అతనికి సంఘంతో నిమిత్తం ఉంది.

‘‘ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధానపరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు’’

అతని రచయితే నవల మొదటి పేరాలోనే చెప్తాడు. అంతేకాదు. దయానిధికి సంఘంతో ఘర్షణ నిజానికి ‘‘అమ్మ’’ ద్వారానే మొదలవుతుంది.

దయానిధికీ అమ్మకూ ఉండే అనుబంధం మామూలు మాతృప్రేమకంటే విశిష్టమైనది. అతని ప్రకారం ఆమె ఒక్కతే అతన్ని అర్థం చేసుకున్నది. దయానిధి మరో సందర్భంలో చెప్పేట్లుగా ప్రతి మనిషి కొందరి దగ్గిర దాపరికం లేకుండా తనను తాను చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా ‘‘అమ్మ’’ దయానిధికి ఆప్తురాలు.

‘‘ఇంతవరకు అతనికి వేరేవునికి లేదు – ప్రతి చిన్న విషయానికీ తల్లి మీద ఆధారపడ్డారు. ఈ సంఘం ఒక సమ్రుదమయితే, అతను నిలబడేటందుకు అమ్మ ఒక లంగరు. ఇప్పుడు ఆ లంగరు లేదు; ఏదో శక్తి అతన్ని వదలిపోయింది; అతన్ని ప్రపంచానికి బంధించిన గొలుసులో గొళ్ళెం వూడింది.’’

అద్దంలో ‘‘అతన్ని చూస్తే అతనికే నవ్వొచ్చింది. అకస్మాత్తుగా అమ్మను చూసినట్లనిపించింది. తనలోంచి తల్లి తొంగి చూస్తున్నట్లు – తనలో ఎవరో వుండి అతన్ని జీవింప చేస్తున్నట్లు. నిజంగా తల్లి చావలేదు. అతనిలో ఉండిపోయింది.’’

అతన్ని జీవితాంతం వెంటాడిన విషయం ‘‘తల్లి తనలోంచి తొంగి చూడ్డం.’’ ఏ సంఘానికీ తనకూ లంగరుగా తల్లిని భావించాడో తర్వాత ఆ ‘‘అమ్మే’’ పరోక్షంగా సంఘానికీ తనకూ మధ్య ఘర్షణకు కారణం అవుతుంది. సంఘానికీ, తనకూ మధ్య నిలిచన అద్దం తల్లి. ఆ అద్దంలోంచీ తప్ప సంఘాన్ని చూడలేకపోవడం వల్లనే దయానిధి తర్వాత అంతగా సంఘానికి దూరంగా జరుగుతూ వచ్చాడు. సంఘం కూడా ఈ అంశాన్ని reciprocate  చేస్తుంది. దయానిధిని వాళ్ళ ‘అమ్మ’ అద్దంలోంచీ తప్ప చూడలేదు. అయితే ‘‘అమ్మ’’ ప్రభావం దయానిధి దృక్పథంపై పరోక్షంగా ఉంటుంది. సంఘం వైపు నుంచీ అది తప్ప మరో ప్రభావం లేనంత ప్రత్యక్షంగా ఉంటుంది.

అందుకే దయానిధి మిగిలిన జీవితాంశాలలో సంఘానికి స్థానం చాలా తక్కువ ఉంటుంది. అతని మానసిక ఆవరణోకి అతని వృత్తి చాలా కొద్దిగా ప్రవేశిస్తుంది. శ్యామలతో అతనికి పరిచయం వృత్తిపరంగానే కలిగినా, ఆ సంపర్కం ఆమె ప్రత్యేకతలకే పరిమితమవుతుంది. అనుశీలనలో మానసిక విశ్లేషణ (దయానిధికి చాలా ఇష్టమైన పని) ప్రధానం అవడం వలన, ఆ అనుశీలన మరి కొంచెం సాగి ఉంటే దయానిధికి తన వృత్తిలో సార్థక్యం కనిపించి అతని జీవితం మరో మార్గం పట్టేదేమో! వృత్తిపరంగా అతనికి పరిచయమయే మరో వ్యఇక్త కృష్ణమూర్తి. కృష్ణమూర్తి వ్యక్తిత్వం కానీ, అతని పరిచయం కానీ దయానిధిలో ‘‘మెడిసిన్‌’’ పట్ల ఆసక్తి కలిగించేవి కావు.

అయితే దయానిధి ప్రయత్నం చెయ్యలేదని చెప్పలేం. అతని జీవితంలో చాలా సుఖంగా గడిచిన రాయలసీమ అనుభవాలకు మూలం అతని వృత్తి. అయితే ఆ అనుభవాల్లో అతనికి దొరికిన వజ్రం అతన్ని మళ్ళీ సంఘంతో ఘర్షణకు ప్రోద్బల కారకమవుతుంది. అతను వ్యక్తిగా సంఘం దృష్టిని ఆకర్షించడానికి తోడ్పడుతుంది. అప్పటివరకూ సంఘం పట్టించుకోని అతని వైయక్తిక జీవితం పట్ల సంఘానికి ఆసక్తి కలుగుతుంది. (ఈ వజ్రం దొరకడాన్ని అదృష్టవశాత్తూ అనడం నాకు నచ్చదు. ఎందుకంటే అతని జీవితంలో ప్రశాంతమయిన భాగం వజ్రంతో నాశనమవుతుంది).

అలాగే ఆనాటి సాంఘిక సమస్యలు – స్వాతంత్యోద్యమం, విశాలాంధ్ర ఉద్యమం – దయానిధిని పెద్దగా ప్రభావితం చెయ్యవు. అయితే సాంఘిక పరిస్థితులు వైయక్తిక జీవితాలపై ప్రధానం చూపడం తప్పనిసరి. అదే దయానిధి విషయంలో జరిగినా ఆయా ఉద్యమాలు వాటి స్వీయ ఆకృతిలో Issues గా అతని మానసిక పరిధిలోకి పెద్దగా ప్రవేశించవు.

అలాగే మతం కూడా అతన్ని ప్రభావితం చెయ్యదు. తాత్విక దృష్టికి సంబంధించి అతనికి కొన్ని అభిప్రాయాలు ఉన్నా అవి ‘‘మతం’’తో సంబంధంలేనివి. ‘‘అమ్మ’’ మరణశయ్య మీద ఉన్నప్పుడు తప్ప అతనిలో దేవుడి ప్రసక్తి రాదు. ఆ ప్రార్థన కూడా ఎక్కువ భాగం ఫంక్షనల్‌ తప్ప అతనిలో మరో కోణం కాదు. అలాగే జీవితాలపై ఆర్థిక స్థితిగతుల ప్రభావం కూడా అతని సమస్యలో భాగం కాదు. అయితే బద్ధికంగా అతను ఆర్థిక ప్రాతిపదికను అంగీకరించాడు. ఈ విషయం గని త్రవ్వకపు పనివాళ్ళ గురించి అతను అనంతాచారితో చర్చించేపుడు తప్ప ఇంకెక్కడా తెలియదు కూడా. మరీ దర్రిదంలోకి దిగజారినప్పుడు తప్ప ఆ విషయం అతని జీవితంలో భాగం కాలేదు.

chivaraku_migiledi-300x450

అందువలన దయానిధి ప్రధానమైన సమస్య అతని కాల్పనికతకూ, అందులో ఔన్నత్యానికి చిహ్నమైన ‘‘అమ్మ’’కూ, అమ్మ పట్ల సంఘం దృష్టికీ, అతని సంఘ నిమిత్తానికి మధ్య ఘర్షణకు పరిమితమైంది.

నిజానికి దయానిధి ద్వారా తప్ప మనకు అతని తల్లి గురించి ఎక్కువగా తెలియదు. ఆమె ‘‘ప్రవర్తన’’లో సంఘ నియమాలకు సరిపోని అంశం ఉన్న సంగతి తెలుస్తుంది. అది నిజమో, పుకారో మనకు తెలియదు. (దయానిధికి ఎందరో స్త్రీలతో  ‘‘సంబంధం’’ ఉన్నట్లు సంఘం చిత్రిస్తుంది. దాని నిజానిజాలు మనకు తెలుస్తాయి. అలాగే అతని తల్లి కూడా కావచ్చు.)

అయితే ఈ విషయంలో దయానిధికి మాత్రం అనుమానం లేదు. తల్లి సంఘ నియమాలకు వ్యతిరేకంగా నడిచి ‘‘అపచారం’’ వంటిదేదో చేసిందని అతను విశ్వసిస్తాడు. అందుకే అతను ఎప్పుడు ‘‘క్షమించడం’’గా తప్ప ‘‘అంగీకరించడం’’గా ఆలోచించడు. ఆ విశ్వాసం అతనికి అమ్మ పట్ల ఉండే ప్రేమాస్పదమయిన ఆకృతిలో ఇమడదు. ఈ రెంటి మధ్య ఘర్షణ అతని జీవితంలో ప్రశ్న అవుతుంది. అందుకే హామ్లెట్‌తో పోలిక. హామ్లెట్‌లానే అతను కూడా మొదట్లో తల్లి  ప్రవర్తనను గర్హించకపోయినా తల్లి సాంఘిక నియమాలకు లోబడి ఉండగలిగితే బావుంటుందని అనుకుంటాడు.

‘‘ఇంట్లో గొడవలన్నీ తను (అమ్మ) తెచ్చిపెట్టుకున్నవే. వయస్సు మళ్ళింది – హాయిగా పేచీ లేకుండా సంసారం చక్కబెట్టుకోరాదూ? త్రండి సంపాదిస్తున్నాడు. పెద్దకోడలు కాపురానికి వచ్చింది – ఇప్పుడైనా తన జీవితాన్ని ఒక మార్గంలో పడేసుకుని వొడిదుడుకులు లేకుండా నడుపుకోరాదూ?’’ – అని సాధారణ సంఘంలోని వ్యక్తిగా ఆలోచిస్తాడు. (ఇక్కడ ఏసుల కాపరి కుర్రాడు పాడేపాట ‘‘స్థిరమైన నడవడి’’ కావడం గమనార్హం) అంటే దయానిధి సంఘాన్ని ఎక్కువ గౌరవిస్తాడని కాదుకానీ అతనికి సంఘం పట్ల అట్టే పట్టింపులేదు అప్పటికి. అయితే పై ఆలోచనే అమ్మను దూషించే గోవిందరావు ప్రసక్తి వచ్చేసరికి ఇట్టే మారిపోతుంది. సంఘ వ్యతిరిక్తత మొదలవుతుంది. అలాగ ప్రతిసారీ అతనికి సంఘర్షణ ‘‘అమ్మ’’ గురించే. ఆ ఘర్షణ అతన్లో అంత స్సంఘర్షణగా పెనుభూతమవుతుంది. ఆ ఘర్షణలో అతను సంఘ నియమాలను అయిష్టంగా ఎదిరించే రెచెతగా తయారవుతాడు. అయితే అతని రెబెలియన్‌ బాహాటంగా ఉండదు. ఎప్పటికప్పుడు సంఘాన్ని ఓడించాలని కాకుండా సంఘంతో Detached సహజీవనం కోరుకుంటాడు.

అందుకే తన సమస్యను హామ్లెట్‌కు అన్వయించి, హామ్లెట్‌కే కాదు, షేక్స్పియర్‌కు కూడా అన్వయిస్తూ రాసుకున్న వ్యాసంలో

‘‘తల్లితండ్రుల పాపాలు పిల్లల్ని వెంటాడినప్పుడు వారేం చెయ్యాలి అన్న దానికి షేక్స్పియర్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు. వారిని క్షమించి, ప్రేమించనున్నాడా? నీతి లేదనడం లేదు. ప్రాచీనశక్తులు, మానవత్వం – వీటికి నీతితో నిమిత్తం లేదు. ఈ గోళంపై మానవుడి బతుకు క్షణికం, అశాశ్వతం. నీతి పేరిట, కఠిన శిక్ష, కన్నీరు, జుట్టు పీక్కోడం ఎందుకో?’’ అని రాస్తాడు.

హామ్లెట్‌ సమస్యను పోల్చుకోవడం ద్వారా దయానిధి సమస్య ఇంకొంచెం విశదం చేసుకోవచ్చు. హామ్లెట్‌కు అతని తల్లి ‘‘అపచారం’’పై సానుభూతి లేకపోగా అతను ఆ అపచారాన్ని గర్హిస్తాడు. పైగా త్రండి హత్య, ఆ హత్యలో తల్లి పాత్ర సమస్యను మరింత జటిలం చేస్తుంది. అయితే అతని క్రియ ఆలస్యం కావడానికి కారణాలుగా అమ్మ పట్ల ప్రేమ, ఆ ‘‘అపచారం’’ అమ్మదనడంతో ఆ విషయాన్ని సాధ్యమయినంత వరకూ నమ్మకపోవడానికి ప్రయత్నించటం కారణాలు కావచ్చునని కొందరు విమర్శకుల అభిప్రాయం. అక్కడ సంఘం అమ్మను దూషించే ప్రసక్తి లేదు. పైగా చాలా భాగం ఆవిడ వైపు ఉంటుంది, కొంత నిజం తెలియక, కొంత సాంఘిక నియమావళిలో బేధం వలన, ఆమె సాంఘిక స్థాయి వలన. ఆ సమస్య పూర్తిగా హామ్లెట్‌లోని రెండు భాగాల మధ్య ఘర్షణ.

దయానిధికి అలాకాదు. అతనికి తల్లి ప్రవర్తన ‘‘అపచారమా’’ కాదా అని ఆలోచించేంత పట్టింపులేదు. కానీ సంఘంతో ఘర్షణ అయిష్టం కాబట్టి ఆ ‘‘అపచారం’’ అమ్మ చేయకపోతే బావుండును అనుకుంటాడు. ఇందుకు ఉదాహరణగా చివరిలో అంటే వజ్రం దొరికి, ఆ సంపదతో ఇల్లు కట్టుకుని ఒక రకంగా ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు- ‘‘దయానిధి మండువాలో కూర్చున్నాడు ‘అమ్మ’ వ్రిగహం కేసి చేస్తూ. స్ర్తీ జాతిపై అతని నమ్మకం పోయినందుకు ‘అమ్మ’ కారణం అనుకున్నాడు. క్షణం ‘‘అపచారం’’ చేస్తే వారి సంతతి ఇల్లాగైపోతుందని తెలుసుకోగలిగితే, ఏ స్ర్తీయేనా అపచారం చేస్తుందా? ‘‘అమ్మ’’ స్ర్తీత్వానికొక చిహ్నం – ఆ చిహ్నం వొక నల్లటి తెరగా తన దృష్టిని మరుగు పరుస్తుంది. ఆ తెర ఎక్స్‌రే లాంటిది. బైట రక్తం, మాంసం, మెదడు, ఊహ, ఆదర్శం, జ్ఞానం గల స్ర్తీలున్నా, లోపల్నించీ ఇతనికి కనబడేది అస్థిపంజరమే. అతనిక అనుభవాలను ఆత్మవంచన లేకుండా తరచి చూచుకుంటే, స్ర్తీలను ఆదర్శ వ్యక్తులుగా పరిగణించేటందుకు తగిన ఆధారాలు లేవు. ఏది యదార్థం? తన ఎక్స్‌రే దృష్టా? బైట మాంసం, రక్తం, మనుషులా?’’- అన్న ఆలోచన.

అమ్మను దూషించే సంఘాన్ని అంగీకరించలేడు. అలా అని సంఘంతో నిమిత్తం వదలుకోలేడు. అమ్మ ఔన్నత్యాన్ని తగ్గించుకోలేడు. ఇందుకు కారణం సంఘ నియమాలపట్ల అతనికి పెద్దగా నమ్మకం, అపనమ్మకం రెండూ లేవు. రెండూ వున్నాయి. ఈ విషయం ఆధునిక జీవితానికి దగ్గిర విషయమే. అయితే అప్పటికి సంఘం గొంతు చించుకోవడం మానదు. అందుకే కొంచెం సేపు ‘‘అమ్మ’’ ‘‘సరిగా’’ వుండి వుంటే బాగుండుననీ, మరింకోసారి సంఘానికెందుకింత గోల అని ఆలోచిస్తాడు. ఈ పరిస్థితి, ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతన్ని మామూలుగా ఉండనివ్వదు. దీన్ని ప్రేమరాహిత్యంగా భావించడం జరిగింది. దయానిధిని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు – అమృతం, జగన్నాధం, కోమలి, నారయ్య, అనంతాచారి మొదలైనవాళ్ళు. వీళ్ళలో అమృతంతో మ్రాతమే అతను తన మానసికాందోళనలను కొంత పరిధి వరకూ పంచుకోగలడు. అయితే ‘‘అమ్మ’’ విషయంలో అమృతానికి అతనికీ వ్యతిరేక అభిప్రాయాలు లేవు. సంఘం గురించి మనకెందుకులే బావా అంటుందేమో అమృతం. అమృతం ఈ విషయాన్ని కదల్చినా అతనికి జవాబిచ్చే మనస్తత్వం లేదు. ఈ పరిస్థితి అతన్ని మామూలుగా ఉండనివ్వదు. అసలే Introvert అయిన అతనిచేత విచ్రితంగా ప్రవర్తింప చేస్తుంది.  తనలోకి తను ముడుచుకు పోయేట్లు చేస్తుంది. అతని సంపద కానీ, వృత్తికానీ, ఈ విషయంలో Solace ఇవ్వలేవు. పూర్తిగా సంబంధం లేని వాళ్ళు కూడా అతన్ని దూషిస్తూంటే వాళ్ళను అడగడు. పైపెచ్చు తన అంతఃక్రోధంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి సంఘానికి మరింత దూరమవుతాడు. ఇందుకు ‘‘అమ్మ’’ అపచారం అతనిలో సెక్స్‌ పట్ల కలిగించిన Inhibitions ఏ స్త్రీతోనూ అతనికి శారీరిక సంబంధం లేకుండా చేస్తుంది. సంఘాన్ని అంగీకరించలేక వదలుకోలేకపోతాడు. ఈ ప్రవర్తనను శ్రీ ఆర్‌.ఎస్‌.సుదర్శనం గారు ‘‘న్యూరాసిస్‌’’గా పేర్కొన్నారు. ఇందులో భాగమే సంఘంతో పరోక్షంగా పోట్లాట. అయితే ఈ పోట్లాటకు కారణం ఉద్వేగం,Inhibitions అనడంతో అది Submissive గా ఉంటుంది. ఉల్లంఘిస్తున్న నియమాలతో మేలికంగా వ్యతిరిక్తత లేకపోవడం వల్ల మరో ప్రత్యామ్నాయ జీవన విధానం కోసం ప్రయత్నం, నమ్మకం ఉండవు.

ఈ ఘర్షణలో ఇంకోరిసాయం, స్నేహం ఉండవు, సాయం కోరినా దొరకదని అతని అభిప్రాయం కావచ్చు. పైగా అతను Introvert అవడం కూడా కారణం.

ఈ అంశంతో సంబంధంలేని సంఘం రాయలసీమలో కనపడుతుంది. అమృతంతో సంఘటనతో సెక్స్‌పట్ల మరింత చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఆ సంఘంలో అనంతాచారితో సుఖమైన స్నేహం ఏర్పడుతుంది. సంఘం పట్ల, ఇతరుల పట్ల ఏహ్యత ఏర్పడుతుంది. చివరికి అక్కడ కూడా మిగిలిన సాంఘిక అంశాలకు ఏర్పడే ప్రాముఖ్యత వల్ల అతని పట్ల జనం విముఖతనేర్పరచుకొంటారు. వాళ్ళలో ‘‘అమ్మ’’ అతని ‘‘ప్రవర్తన’’ చర్చనీయాంశాలు అవుతాయి. దాన్తో సంఘాన్ని నేరుగా ఎదుర్కొనక తప్పనిసరి అవుతుంది.

అప్పటికి అతను జీవితంలో చాలా అనుభవం గడించాడు. ఎందర్నో చూసి ఉన్నాడు. అతనికి జరిగిన వివాహం వల్ల దాంపత్యం, సహ జీవనం ఏమీ లేకుండా భార్య నికృష్టంగా చనిపోతుంది. అతని ‘‘శత్రువులు’’ చాలా మంది పోతారు. కొత్త శత్రువులు చేరతారు. ‘‘మిత్రులు’’ దూరమేతారు. ఆ స్థితిలో అతను మొదటసారిగా ‘‘సంఘం’’తో మాట్లాడతాడు. అంటే తనతో సంబంధం అట్టే లేని వ్యక్తులు తన గురించి, ‘‘అమ్మ’’ గురించి ప్రస్తావించడం విని వాళ్ళను Confront చేస్తాడు. అక్కడ కూడా అతని మనస్తత్వానికి తగినట్లే కోపం కంటే నిస్సహాయత, Submission కనిపిస్తాయి.

అన్ని  విషయాలు వాళ్ళకు కావల్సినట్లుగా చేస్తానని చివర్లో ‘‘ఎవరో మా అమ్మ విషయం ఎత్తారు మీలో. నేనేం చెయ్యను? – మా అమ్మ చచ్చిపోయింది – చచ్చినవాళ్ళను నేనేం చెయ్యను’ ఒక్కసారి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. కంఠం పగిలిపోయింది. ఆపుగోలేక, నిధి బిగ్గరగా ఏడుస్తూ’’ చచ్చిపోయింది’’ అనుకుంటూ పిచ్చివాడిలా నడిచివొచ్చేశాడు. దూరంగా ఎవరో ముక్కు చీదుకుని నిట్టూర్చారు.

ఆచారి గారింట్లో దీపం మసగ్గా కనపడుతోంది. అంతా చీకటి. ఇంక అతనికి ఏడుపు రావడం లేదు. కన్నీరంతా ఎండిపోయింది. స్మశానంలో భూతాలతో ప్రసంగం చేసివచ్చిన తర్వాత, యింక గుండెల మీద భయం తాండవించలేదు- బరువుని సముద్రం మింగేసి, తుంపరల్ని మొహాన కొట్టింది – ఆ బరువు, సముద్రంలోని ఉప్పునంతా పీల్చేసింది- కన్నీరింక వుప్పగా ఉండదు’’.

అంతటితో అతనికి సమాధానం దొరికింది. సంఘంతో సంభాషణతో సంఘం పట్ల భయం పోయింది. అతని హృదయంలో Self pity స్థానంలో ఔదార్యం చోటు చేసుకుంది.

3

‘‘చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది? మానవుడు ఈ ప్రశ్నని వేసే అవసరం రావడమే జీవితానికేదో అర్థం వుందనుకోవడానికి తార్కాణం. అర్థం లేదని ఇతరులు ఋజువు చేకుంటే, సృష్టి అంత భయంకరంగా ఉండకపోవచ్చు. సృష్టికి ఇతరులు కల్గించిన అర్థాలను మనం అంగీకరించలేము; మనం కనుక్కుని, ఎముకలలో జీర్ణించుకున్న అర్థాలని ఇతరులకి చెప్పలేం. ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధాన పరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీనపునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరికి మిగిలేదేమిటి? అన్న వాక్యాలతో మొదలయ్యే ఈ నవల

‘‘కావల గట్టున ఇప్పటిలా ఏకాంతంగా గడ్డిలో పడుకుని, అతను వేసుకున్న ప్రశ్న ‘జీవితానికి అర్థం ఏమిటి?’ ఈనాడూ అదే ప్రశ్న చివరికి మిగిలింది, – దాని సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేందుకు తను చేసినయత్నాల – జ్ఞాపకాలు – తనతో తాను సమాధానపడడం – అది మిగిలింది.’’ అని ముగుస్తుంది.

ఈ సమాధాన పడడం ఎలాంటిది? దయానిధికి తన జీవితంలో ఏం అర్థం కనిపించింది? ఆ అర్థాన్ని సరళంగా చెప్పుకోవచ్చా?

రచయిత ఆ ముఖంలో జీవితం పట్ల ఒక దృక్పథం కల్పించడం ఈ నవల ధ్యేయంగా పేర్కొన్నాడు. ఆ దృక్పథం ఎలాంటిది?

చివర్లో దయానిధి ఆలోచనలలో ఈ ప్రశ్నలకు సమాధానం కనపడుతుంది.

‘‘కోమలీ నాకు మనుషులన్నా, సంఘం అన్నా ఇంతవరకూ భయంగా ఉండేది. ఇవాళతో ఆ భయం పోయింది!

… ఏం జరిగిందేమిటి?

– నేను వెలుగుని చూశాను- శ్మశానంలో.

– అవేం మాట్లండీ – నాకు భయం పుడతావుంది.

నమ్ముతావా! – మానవ హృదయంలో ద్వేషం ఎందుకుంటుందో కనుక్కున్నాను.

… ఎందుకో చెప్పండి?

… తనకేం కావాలో తెలీనప్పుడు, మానవుడు ద్వేషిస్తాడు.

అంటే?

ఏం కావాలో తెలిస్తే; ఆ వొస్తువుని ప్రేమించి, దాన్ని పొందటం కోసం యత్నిస్తాడు. అది తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం.

… కొందరికి ఏమీ అక్కర్లేదనుకోండి, వారి మాటేమిటి?

అక్కర్లేదని తెలుసుకున్నా ద్వేషం ఉండదు.

 

‘‘రెండు కొండల మధ్య నడచి నడచి అవతలకు చేరుకున్నారు – అవతలంటూలేని అవతల నడిచి నడిచి, నడిచినడిచి నడిచి నడిచి – మళ్ళా అక్కడికే చేరుకోవడమా? అంతేనా విశాల ప్రపంచం! అదేనా అనంత జగత్తు! ఇదా ఎడతెగని జీవిత రహస్యం!’’

‘‘సంఘాన్ని మార్చలేడు; మనుషుల్ని మార్చలేడు, మారిస్తే బాధ, పగ, యుద్ధం. తనతో తను సమాధానపడాలి, అది యీనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రతమైన మహత్తర ఆనందం అతనిలో వుద్భవించింది…. పిచ్చి ప్రపంచాన్ని దూరంగా వుంచే ఔదార్యం. మతాన్ని, దైవాన్ని, మనుషుల్ని తోసేసి సంతృప్తి చెందే, ఆథ్యాత్మిక దృష్టి తనలో కడసారి యదార్థం.

‘‘తనున తాను పరిపూర్ణంగా చూశాడు. ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనలో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించొచ్చు.’’

‘‘ఈ జీవితానికర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం; బాధలేవు, కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం వుంటాయి.’’

‘‘మానవుడికి కావల్సింది మతాలు, దేవుళ్ళూ మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు; మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు.’’

వీటన్నిటితో పాటు గుర్తించుకోవలసింది డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి చిన్న కథ అందులో సారాంశం ‘‘కన్నీరు కార్చిన వారికే వజ్రాలు.’’

ఈ మాటల్లోంచి ఎవరు తీసుకొనే అర్థమయినా చాలా పరిమితంగా వుంటుంది. అంతేకాదు. ఆ అర్థం వ్యక్తిగతంగా మారుతా వుంటుంది. అందుకు మన దృక్పథాలు, ఆలోచనలు కారణాలవుతాయి. అంటే మనం మళ్ళీ మొదటికే రావచ్చు.

 

కానీ, కొన్ని సామాన్యంగా అంగీకరించవలసినవిగా ఈ ముగింపులో తోచినవి చెప్పడమే క్రింది ప్రయత్నం.

జీవితం గడపడమే జీవితాన్ని సమన్వయ పరచుకోవడం (చివరకు మిగిలింది సమాధానం కాదు. సమాధానం తెల్సుకునేందుకు తను చేసిన యత్నాలు – జ్ఞాపకాలు) సంఘాన్ని మనం అంగీకరించడం అనేది మన స్వేచ్ఛకు భంగకరం కానవసరం లేదు. వ్యక్తి జీవితంపైన వ్యక్తి అభిప్రాయం, సంఘం అభిప్రాయం ఒక్కటి కానంత మాత్రం చేత వ్యక్తికి సంఘంతో ఘర్షణ అవసరం లేదు. అయితే ఈ రెండు అభిప్రాయాలూ పరస్పర విరుద్ధం అన్న భ్రమ మనలను బంధించే నిజమైన అంశం. ఈ బంధం వల్ల సంఘాన్ని జయించడానికో లేదా సంఘానికి పూర్తిగా లొంగిపోవడానికో మనం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో మనం అభాసుపాలవుతాం. నిజంగా విరుదమైన భావాలు మనవే. వాటిలో ఒకదానికి మనం దగ్గిరగా ఉన్నాం అని గుర్తించడంతో సంఘం శత్రువు కాకుండాపోతుంది. అందువల్ల సంఘాన్ని సహించడం కుదురుతుంది. అప్పుడు జీవిత గమనానికి స్వేచ్ఛ. (తనను తాను పరిపూర్ణంగా చూశాడు! ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనతో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించవచ్చు.) అవసరమయితే పట్టించుకోకపోవడం కూడా సహించడమే. (పిచ్చి ప్రపంచాన్ని దూరంగా ఉంటే ఔదార్యం…. ‘మానవుడికి (తనకు కాదు) కావల్సింది మతాలు, దేవుళ్ళు మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు. (ఇవన్నీ బాహ్యమైన సంఘం. శత్రు సంఘం తనలోదే. అది మన గురించిన ద్వైదీభావం) మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు)

దయ, ఔదార్యం, సహనం ఇవి లభించవలసినవి కావు. మనం ఇవ్వవలసినవి. ఇది మనకు జీవితంలో ఒకే సారాంశాన్ని, ఒక చెప్పుకో గలిగిన విజయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ విజయం గుప్తమైనది. నిజమైనది (Real). దానికి బాహ్యమైన చిహ్నం మన జీవితమే. మనం ‘‘జీవించా’’ మన స్పృహ నిజమైన స్వేచ్ఛ. (ఈ జీవితానికి అర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధలేవు. కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం ఉంటాయి.)

అదీ ఈ నవల జీవితంపై కలిగించే దృక్పథంగా నాకనిపిస్తుంది.

 

4

‘‘దయానిధి’’ కథానాయకుడిగా అల్లబడిన నవల ఇది. కథానాయకుడి ప్రాముఖ్యత ‘‘చింతామణి’’ పత్రిక పెట్టిన ‘వచన ప్రబంధ’ పోటీ నియమావళిలో ఒకటి, అయినంత పాతదే అయినా ఈ నవలలో ఆ ప్రాముఖ్యత ‘గుణం’ మారింది.

అయితే మిగిలిన పాత్రలు కేవలం ‘‘సృష్టింప’’ బడినవి కావు. ఆయా పాత్రల వ్యక్తిత్వం, ప్రత్యేకత వాటికుంది. ముఖ్యమైన భాగాలకు అవసరమైనట్లుగా మాత్రమే చిత్రించబడినా ప్రతీకలు మాత్రమే అయినా వాటిలో జీవం వుంది.

దయానిధి ‘అమ్మ’లోని ‘చెడుగు’కు కోమలి ప్రతీక అవుతుంది. అందుకే దయానిధి కోమలి గురించి చేసే ఊహలన్నీ అత్యధిక కాల్పనికతతో నిండి ఉంటాయి. ఆ ‘చెడుగు’ పట్ల దయానిధి కుండే అయిష్టతనూ, ఆ అయిష్టతను జయించడానికి అతను తనలో చేసుకునే ఊహాగానాల కల్పనికతనూ కోమలితో అతని సంబంధాలలో చూడవచ్చు. నిజానికి కోమలి కూడా సంఘ బాహ్యమయిన వ్యక్తియే. అయితే దయానిధిలా ఆమెలో ద్వైదీభావం లేదు. తన జీవితాన్ని గురించి చక్కని అవగాహన ఏర్పరచుకుంటుంది. సెక్స్‌ లేని జీవితాన్ని ‘‘బైరాగి’’ జీవితంగా చూడ్డమే కాదు. ‘సెక్స్‌’ను అత్యున్నతమైన ప్రేమకు ప్రకటనగా కూడా భావించగలుగుతుంది (లేకుంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో ఎలా తెలుస్తుంది?’) మొదట్లో ఆమె సహజమైన సంకోచాన్ని (Inhibition) ‘‘ఫ్రిజిడిటీ’’ అని బాధపడ్డ దయానిధి చివర్లో ఆమె రెచ్చగొట్టినా శాంతంగా, ఉద్రేకం లేకుండా సమాధానపరచడం అతని పరిణితికి నిదర్శనం. చివర్లో ఆమె దయానిధికి విడదీయరాని సన్నిహతురాలు కావడం దయానిధి సాధించిన సమన్వయానికి ప్రతీక. ఆమె నిజంగా అతన్ని ప్రేమించింది. అయితే ఆమె పట్ల అతనికి ఉన్న భావం ఆ ప్రేమ పూర్తి ఫలాన్ని అతనికి అందనివ్వలేదు.

దయానిధి అమ్మలోని సమర్థనీయమైన ‘‘మాతృ’’ భావనకు ప్రతీక అమృతం. ఆమెతో దయానిధి ఏర్పరచుకొనే చనవు అతనికి ‘‘అమ్మ’’లోని ‘‘మంచి’’ పట్ల పాక్షికతను తెలుపుతుంది. ఆమె తనకేం కావాలో తెలుసుకున్న పరిపూర్ణ వ్యక్తిత్వం కలది. జీవితంలో సమన్వయం సాధించిన వ్యక్తి దయానిధికి ఒకేసారి సెక్స్‌ అనుభవం ఆమె ప్రోద్బలంతో ఆమెతోనే కలగడం గమనార్హం. ఇది ఫ్రాయిడియన్‌ ఈడిపస్‌ కాంప్లెక్స్‌ ప్రభావితం కావచ్చు. ఆమెకు దయానిధిపై నిర్వచించలేని ప్రేమ, ఆప్యాయత, దయ. దయానిధికి చివర్లో కలిగే స్పృహ (మానవుడికి కావల్సింది, దయ, కొంచెమైనా చాలు) ఆమె వ్యక్తిత్వంలో భాగంగా కనిపిస్తుంది. ఆమె పట్ల కూడా దయానిధి కల్పించుకున్న ‘‘కాల్పనికమైన ఊహ’’కు ఆమె నుంచి ప్రోత్సాహం లభించదు, ఆమె Down to Earth, ప్రవర్తన వలన. అందువల్ల ఆమె ప్రేమను పూర్తిగా పొందలేకపోయాడు దయానిధి.

అమృతం, కోమలి కాక మిగిలిన పాత్రల్లో జీవితాన్ని నాశనం చేసుకునే సుశీల, కృష్ణమూర్తిల దగ్గిర నుంచీ స్నేహంతో జీవితాన్ని నింపుకోగల అనంతాచారి, రాజమ్మల వరకూ ఉన్నారు. ఒక్కొక్కరి మనస్తత్వ అనుశీలన నిజంగా గొప్ప అనుభవం. అయితే తెలిసిన కారణాల వల్ల ఆయా పాత్రలలోని ముఖ్యాంశాలుగా నాకు తోచినవి మాత్రం పేర్కొంటాను.

దయానిధికి ఎదురయ్యే స్త్రీ పాత్రలన్నిటికీ స్ర్తీలలోని ఒక ప్రత్యేక లక్షణం ప్రధానంగా ఆపాదించబడుతుంది. ఇందిర వివాహం ద్వారా ఏర్పడ్డ సంకెల అయితే చప్పుడు చెయ్యని సంకెల. సుశీల స్ర్తీ సహజమైన ఆహానికి ప్రతీక. అయితే సుశీలకెదురైన దయనీయమైన ముగింపు ఆలోచన కలిగిస్తుంది. నాగుమణి స్ర్తీలోని కేవలం శృంగార స్ర్తీత్వం అయితే శ్యామల ప్రస్తుత సమాజంలో స్త్రీని ఆవరించే లేదా స్త్రీలో వృద్ధి చెందడానికి అవకాశం ఉండే సౌందర్య రాహిత్యానికి ప్రతిరూపం. శ్యామల పంజరాన్ని తనతో తీసుకెళ్ళడం గమనార్హం. ఇందిర మరణం దయానిధికిచ్చిన Releif,నాగుమణితో బండిలో అనుభవాలు దయానిధి జీవితంలో వారికి గల ప్రాతలను తెలుపుతాయి. స్త్రీ కనపడగానే అన్నిటితో కూడిన స్త్రీత్వాన్ని తప్ప చూడలేకపోయిన దయానిధి కాత్యాయనిని చూడడంలో ప్రత్యేకత కనపరుస్తాడు. ఇది అతని పరిణితికి సూచన. ఇందిరను కూడా కాల్పనికంగా ఊహించే ప్రయత్నం (ఉంగరం ఇచ్చేప్పుడు) జరిగినా అది వివహానికి అత్యవసరమైన సెక్స్‌పట్ల దయానిధికి ఉండే సంకోచం ((Inhibition)తో దెబ్బతింటుంది.

దయానిధి జీవితంలో స్త్రీ  ప్రాతలకున్న ప్రభావం సంఘ ప్రతినిధులుగా తప్ప పురుష ప్రాతల కుండదు. సంఘంతో దయానిధి Interactionను పురుష ప్రాతలు చెప్తాయి. తనకు ప్రాప్తించిన వాటికి నవ్వుకొని ఇతరులకు ప్రాప్తించిన వాటికి బాధపడే నారయ్య నవ్వే శక్తిని అంటే జీవించే శక్తిని కోల్పోడు. జీవితం పట్ల గర్హనీయమైన ప్రాక్టికాలిటీ గలవాడు ‘‘రాజభూషణం’’. అయితే జీవితాన్ని మంచకి ప్రయోజనకరంగా మలచుకోగల స్నేహశీలి అనంతాచారి. ఇల్లు కాలిపోతే దయానిధి తనను కారణంగా చెప్పుకుంటున్నప్పుడు ‘‘ఆయన లేకపోవడం వల్ల ఇలా జరిగింది’’ అనే రాజమ్మ ప్రత్యేకత స్ర్తీత్వంలోని స్నేహం. సెక్స్‌ను అమిత తేలిగ్గా తీసుకుని జీవితాన్ని నిర్వీర్యం చేసుకునే వాడు కృష్ణమూర్తి. స్ర్తీలను సాధికారంగా మాత్రమే అభిమానించగల ప్రకాశరావు ప్రతి దానికీ బాహ్యమైన అర్థాలను చెప్పుకుని సంతృప్తి పడే కూర్మయ్య బృందం. వీళ్ళందరికీ విభిన్నంగా సంపూర్ణమైన జీవంతో ‘‘నేను నేనుగా ఉండే అవసరం పుస్తకాల్లో మనుషులకి తప్ప మామూలు లైఫ్‌లో మనుషులకి రాదు. వొస్తే వాళ్ళు ఛస్తారు.’’ అందుకే హృదయద్వారం బుల్‌ మూసి చిల్లు పడ్డవోడవలె’’ కాదు. ‘‘తల్లిపాలు తాగిన పాపవలె’’ బ్రతికే జగన్నాధం నిలుస్తారు.

ఈ వ్యాసాన్ని దయానిధి గురించి జగన్నాధం మాటలతో ముగిస్తాను.

“The wealth of kindness, Dayanidhi;

He, the boatman, made a childishness,

of loving humanity, with kindness killed

with having passion, chilled-

ఎంత గొప్పగా చెప్పాడో.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మంచు తడి ఆరని పారిజాతాలు!!

 Naa_Smruti_Pathamlo._1024x1024

ఆ మధ్య  అఫ్సర్ గారు  ఒక  సందర్భంలో   ఆచంట జానకిరాం గారి “నా స్మృతి పథంలో…సాగుతున్న యాత్ర”  పుస్తకాన్ని  గురించి  విశేషంగా ప్రస్తావించారు,  వెంటనే ఆ  పుస్తకం  చదివి  తీరాలని   అనిపించేంతగా!

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది.

“ఇవిగో! ఇంకా నిద్ర లేవని

మంచు తడి ఆరని, పారిజాతాలు!!

ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;

ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ

ఈ పరిమళము మన స్నేహసౌరభము!

అందుకోవూ..”

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది.

ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం – పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు:

 

” నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ

గవాక్షమందుండి యొక్క తారకామణి

మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు..”

 

“నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు

మమతతో కూయుచు మునిమాపువేళ

గువ్వతల్లియు తన గూడు చేరునపుడు

సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు

నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను

బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు

దూరమున దీపించు నా దివ్యతార

ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు”

 

” ” I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love..””  – ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, “మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?” అని అడిగారట శర్మ గారు.

“అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది.” అన్నారు ఆచంట.

“అల్లాగా ? ఈ పద్యం విన్నారా?” అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

“కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్”

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

“హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.” అని గుర్తు చేసుకుంటారు ఆచంట.

“చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక…” అంటూ మొదలయ్యే మరో పద్యంలో, “ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్” అంటాడు కవి.  ఇందులో మొదట చక్కెర బొమ్మ వినగానే, మగధీర చిత్రంలో, “పంచదారా బొమ్మా బొమ్మా” అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా:

“ఒకనాడు బుచ్చిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : ” మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో.”

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు.

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

“రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది” అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు.

” నువ్వూ నేనూ కలి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా

నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా” అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, “మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల” అన్న దేవులపల్లి గీతాలనైనా, “కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?” అన్న బసవరాజు గేయాన్నైనా,  “వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను” అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, ” గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!” అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న “చేతులార శృంగారము చేసి చూతు” నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

 

“ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది

మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది

లలితసుందర దివ్య లావణ్య నవజీవ

మధుమాస సుధలలో  హృదయమే పొంగినది”

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు.

బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, “ఎముకలు కుళ్ళిన” అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.

ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

“అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో

పాల్గొనమని నన్ను ఆహ్వానించావు

నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!

ఆనంద గీతము చెవులారా విన్నాను.

ఈ మహోత్సవములో నా వాద్యమును

నా చేతనైనంత అందంగా వినిపించాను..”

*

 

సమాంతర భాష: వొక సంభాషణ!

sach

 

1

కె. సచ్చితానందన్ కేరళకు చెందిన ప్రముఖ భారతీయ కవి, విమర్శకుడు, అనువాదకుడు.  ఈయన ఇంతవరకు    ఇరవైరెండు కవితాసంపుటులు, పదహారు అనువాద కవిత్వ సంకలనాలు, పంతొమ్మిది సాహిత్యవ్యాస సంపుటులు, నాలుగు నాటకాలు – వెలువరించారు.  ఆధునిక మళయాల సాహిత్యానికి బీజంవేసిన వారిలో సచ్చిదానందన్ ఒకరు.   సరళమైన భాష, కొత్తఒరవడి, ప్రతీకాత్మకత, సునిశితమైన వ్యంగ్యం వంటి లక్షణాలతో ఉండే సచ్చితానందన్  కవిత్వం దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకొంది.

2

ప్రశ్న: కవిత్వానికి తనదైన భాష ఉంటుందా? (A CONVERSATION WITH K. SATCHIDANANDAN ~ Rizio Raj  గారి ఇంటర్వూ లో ఒక ప్రశ్న)

సచ్చితానందన్ జవాబు:  కవి ఆత్మను సంపూర్ణంగా ఆవిష్కరించటంలో  భాష సరిపోదని కొన్ని కవితల్లో చెప్పాను. నేను వ్రాసిన కాక్టస్ అనే కవితలో, పదునుగా గుచ్చుకొనే సమాంతర భాష ఆవిష్కృతమవటం గమనించాను. ఉత్తర కేరళలో జరిగిన హింసాత్మక ఘటనలపై వ్రాసిన An attempt at Conversation  అన్న కవితకూడా అలాంటిదే. ప్రస్తుత కవులు- సంప్రదాయాల్ని, పునరుక్తుల్ని ధిక్కరించే కొత్త నుడికారాల్ని, భాషని వెతుక్కొని- నూతన తాత్వికతను, వినూత్న కోణాల్ని ఆవిష్కరిస్తున్నారు.

Tadeus Rozewicz – యుద్దానంతర కవిత్వం గురించి మాట్లాడుతూ- “ఆ కవిత్వం- భయకంపితమైన, కసాయివాళ్ళకు ఒదిలిపెట్టబడిన జీవన్మృతుల కొరకు వ్రాయబడి – తుక్కులోంచి తీసిన  పదాలతో, ఆకర్షణ లేని పదాలతో, కాపాడుకొన్నపదాలతో నిండి  ఉంటుంది” అంటాడు.  చివరకు కవిత్వం అంటే దాని పదాలే. Paz  “తన అస్తిత్వాన్ని తన పదాలుగా మార్చుకొన్నమనిషే కవి” అని అంటాడు. మనిషి- తనతో , ఇతరులతో, ప్రకృతితో , అగోచరత్వం తో చేసే సంభాషణలో కలిగే చిక్కులన్నీ అతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.

 

3.

“సంభాషించటానికి ఒక ప్రయత్నం” అన్న కవితలో సచ్చితానందన్ ఒక బీభత్స ప్రపంచాన్ని మనముందుంచుతాడు.  ఇది కవిత్వభాష.  వాచ్యం కాదు, ధ్వని పూరకం. మన చుట్టూ జరుగుతున్న హింసకు రక్తాన్ని ప్రతీకగా తీసుకొని చెపుతాడు. ఫుట్ నోట్సులు ఉండేది కవిత్వమే కాదు అని త్రిశ్రీ అన్నప్పటికీ ఈ కవితలో వచ్చే కొన్ని అంశాలకు ఇచ్చిన ఫుట్ నోట్సులు కవితను పరిపుష్టం చేస్తాయి. కొన్ని  పాతవిషయాల్ని సచ్చితానందన్ ఎలా ప్రస్తుతానికి అన్వయించాడో అర్ధమౌతుంది.

2వ ఖండికలో వచ్చే  Ezhuthachan, రాముని కథను రామచిలుక తో చెప్పించిన ప్రసిద్ద మళయాలకవి.

7వ ఖండికలో వచ్చే  Asan అనేది ఒక కవిపేరు. అతను  వ్రాసిన ఓ కవితలో సీత, రాముని పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుంది.

9వ ఖండికలో  “మన భాష చచ్చిపోయింది” అన్న వాక్యం వ్రాసి ఆత్మహత్య చేసుకొన్నది సుబ్రమనియదాస్ అనే ఓ యువ రాడికల్.

 

ఈ కవితలో ఖండికలన్నీ- కవి తనతో, సమాజంతో చేసే సంభాషణలు.  చెల్లాచెదురుగా, ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నప్పటికీ బీభత్సం, మానవత్వం రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగినట్లు- ఏదో ఏకసూత్రత    అన్నింటినీ బంధిస్తుంది.

ఈ కవితలో కనిపించే చేదు అంతా, ఒక కవి  అంతర్, బాహ్య లోకాలతో చేసిన సంభాషణలలో పలికిన చేదుగా అర్ధం చేసుకోవాలి.

 

 

సంభాషించటానికి ప్రయత్నంశ్రీ కె. సచ్చితానందన్

 

 

1
మనం ఒక కత్తినీడలో జీవిస్తున్నాం
ఎవరో పెంచిపోషించిన కత్తి అది.
ఎవరి హృదయమో చీల్చబడుతుంది.
ఆ రక్తం మనల్ని అంధుల్ని చేస్తుంది.
రక్తంలో స్నానం చేసి అన్నం తింటాం
రక్తంలో స్నానం చేసి ప్రేమించుకొంటాం
ఆఖరకు కలల్లో కూడా రక్తమే.
2

Ezhuthachan కు రామాయణ గాథ చెప్పిన రామచిలుక
మండేఎండలో టివి కేబుల్ పై విశ్రాంతి తీసుకొంటోంది
దాని ముక్కుపై నక్షత్రకాంతులు లేవు
దాని రెక్కలు కూడా రక్తమోడుతున్నాయి.
3

నాకు కన్నీళ్ళు లేకుంటే
నేనూ ఒక కత్తిగా మారి ఉండేవాడినేమో.
మా అమ్మ నాకు కన్నీళ్ళు ఇచ్చింది
ఆమె గొప్ప పాటకత్తె కాదు అయినప్పటికీ
ఆ స్త్రీమూర్తి సంగీతంలో నేను మునిగిపోయాను
4

నేను అమ్మాయినయితే బాగుండేదని ఆశపడేవాడిని
నా చిన్నతనంలో కళ్ళకు కాటుకపెట్టుకొని
పొట్టిగౌనులు వేసుకొని అద్దం ముందు ఆడుకొనేవాడిని
వద్దు వద్దు… ఏదో ఓ రాత్రిఫూట ఓ ఇరవై మందిచే
ఈ దేహం చీలి ఛిద్రమవటం నేను కోరుకోను.
నా సహచరీ! దయచేసి మూడో అమ్మాయిని ఈ లోకంలోకి తీసుకురాకు.
5

మా అమ్మ కన్నీళ్ళలో నేను పండించుకొన్న ముత్యాలు
ఏ సాగరాల్నీ వెలిగించలేక పోయాయి.
వాటి పిలుపును ఎక్కడో విన్న ఒకే ఒక్క అమ్మాయి
తన కనులు తెరిచి, ఓ పూవుగా మారింది
6

కత్తులు పూలగురించి మాట్లాడవు.
దారుల్ని, స్థలాల్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తుంటాయి
హృదయాల్లోకి చొచ్చుకొని అరుస్తాయి ‘నీ మతమేమిటి అంటో
పదాల్లోకి ప్రవేశించి గర్జిస్తాయి ‘నీదే పార్టీ అనీ.
7
Asan వర్ణించిన సీత
అడవికి, భర్త పేర్చిన అగ్నిపరీక్షకు మధ్య కూర్చొని
ప్రేమంటే ఏమిటో తొలిసారిగా నేర్పిన రావణుని త్యాగాన్ని
జ్ఞాపకం చేసుకొంటుంది.
ఆమె గర్భాశయం రాక్షస శిశువుని కాంక్షిస్తుంది
తన రావణుడు కోరుకొన్నంత బలంగా…
8
ప్రేమ పదాలు అన్నీ అయిపోయాయి
ఒక్కో పదము ఇప్పుడో పగిలిన సారాసీసా ముక్క
మనం ఒకరినొకరం దానితో గాయపర్చుకొంటూఉంటాం.
ఈ ప్రపంచం, కోర్టునోటీసులు మన తలుపులకు అంటించాకా
ప్రేమించుకోవటం అంటే ఒకరి రక్తం ఒకరు తాగటమే.
9
‘మన భాష చచ్చిపోయింది’ అన్న వాక్యం వ్రాసిన వాడు పారిపోయాడు
ఆ భేతాళ శవాన్ని మనమింకా మోసుకు తిరుగుతున్నాం
దాని ప్రశ్నలకు సమాధానాలు
పక్షి కువకువల్లో లేదా గజ్జెల గలగలల్లో ఎక్కడా లభించవు
10
తడబడుతూ మాట్లాడేవారు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు
నాలిక కత్తిరింపబడిన వ్యక్తి మాటల్లా నేను అస్పష్ట శబ్దాలు చేస్తున్నాను
అంతా కుదుటపడుతుందని, పూర్వస్థితి వస్తుందని ఏదో సంకేతం చెపుతుంది
నమ్మబుద్దికాక నన్నునేను కొరడాతో కొట్టి చూసుకొంటాను
11
బ్రహ్మపుత్ర నదీతీరాలపై గుల్మొహర్లు విచ్చుకొన్నాయి
నువ్వు ఈ గదిలో లేవు
నా భుజాలు మరల సలుపుతున్నాయి
మరో శవాన్ని మోయటానికేమో
లేక ఏ కత్తీ ఖండించలేని రెక్కలు మొలవటానికో

బయట నిప్పులు చెరిగే ఎండలో
జటాయువు తన తెగిన రెక్కల్ని తపతప లాడిస్తోంది

 

 

(An attempt at Conversation by Sri.K. Sachithanandam)

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

 

మానవత్వం తడబడిన వేళ…

 

~

huges

“ పుస్తకాలు గ్రేట్ మైగ్రేషన్ అని మురిపిస్తాయి కాని వలసలు ఇష్టపడటానికి మనుష్యులు పక్షులు కాదు కదా “ అనుకుంటుంది Minnie Bruce Pratt లోని ఒక విస్తాపకురాలు తన  “ది గ్రేట్ మైగ్రేషన్ “ కవిత ద్వారా. ఎంత నిజం కదా మనుష్యులు మట్టిని నమ్ముకుంటారు , బ్రతికున్నన్ని రోజులు మట్టితో కలిసి ఉంటారు బ్రతుకయిపోయాక అదే మట్టిలో కలిసిపోవాలనుకుంటారు . రెక్కలొచ్చిన పక్షుల్లా కొందరు అవసరాల కోసమో ఆడంబరాల కోసమో మట్టినొదలడానికి సిద్ధపడతారే తప్ప ఊరొదిలి పొమ్మంటే ఊపిరొదిలినంత కష్టమేగా ? ఈ మొత్తంలో ప్రాజెక్టుల పేరిటో ప్రపంచీకరణ పేరిటో సాగే ఈ అభివృద్ధికి ఎవరో ఒకరు బలవ్వాల్సిందే అయితే ఆ బలవ్వడం ప్రతిసారి మట్టిని నమ్ముకున్న వాళ్ళే  అవ్వడమే అత్యంత విషాదం .

ది గ్రేట్ మైగ్రేషన్ , దాదాపు 1910 -1970 మధ్య కాలంలో అర్ధ శతాబ్దం పాటు జరిగిన మైగ్రేషన్ , మొత్తం రంగు జాతి మీద చూపిన  ప్రభావం చాల బలమయినది ,అంతేకాకుండా మొత్తం నల్ల జాతీయుల జనాభాలో ఈ మైగ్రేషన్ వల్ల చాలా  జనాభాని  కోల్పోయింది కూడా . ఎక్కువగా నల్లజాతీయులు ఉండే గ్రామీణ దక్షిణ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అలబామా మిస్సిసిపీ లాంటి 14 రాష్ట్రాలకి బలవంతంగానో బ్రతుకుకోసమో జరిగిన 6 మిలియన్ల  ఆఫ్రికన్ల వలస విషయంలో జరిగిన రంగు కార్మిక దోపిడీ అనేది , యునైటెడ్ స్టేట్స్ ఆమోదంతో జరుగుతున్న ప్రపంచవ్యాప్త కుట్ర గా మొదలయిన సామ్రాజ్య వాదానికి చెల్లించిన ధర , దానివలన తడబడిన మానవత్వానికి అక్షర రూపం ఇది  అంటారు  చరిత్ర కారుడు , సివిల్ రైట్స్ అక్తివిస్ట్ W. E. B. Du Bois, మొత్తం గ్రేట్ మైగేషన్ గురించి రాస్తూ.

L1

50 ఏళ్ళ క్రింద జరిగిన  నష్టానికి దాదాపు మరో 50 ఏళ్ళ తర్వాత కూడా ఫలితాలు అనుభవిస్తున్న రంగు జాతి కష్టాలు ఈరోజుకి ఈ మధ్య జరుగుతున్న హ్యూస్టన్, టెక్సాస్ ,కాలిఫోర్నియా కాల్పులు దాని తర్వాత  జరిగిన ఆందోళనలు నిరూపిస్తున్నాయి . వెరసి మొత్తానికి ఒక శతాబ్దం తర్వాత కూడా ఒక మొత్తం జాతిని బానిసలుగానే చూస్తున్న ప్రపంచీకరణ ఫలితాలు మనల్ని నివ్వెరపరుస్తూనే ఉన్నాయి . నిజానికి మనదయిన లెజిటిమేట్ జీవితాలని కూడా అనుక్షణం భయపడుతూ గడుపుతున్న మనకి ,వలసల సంక్షోభం గురించి చర్చించడం ఒక కష్టమైన అంశం. ఇది నలుపు ,తెలుపు కాదు. ఇది చెడు వర్సెస్ మంచి కాదు. మనలోని మనిషితనం రాజ్యం ముందు పిరికితనంగా మారి ,సమస్య మనది కానప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకొని ముడుచుకొని పడుకొనే మూర్ఖ సివిలియన్ల శాతం పెరిగిపోయి , మనం బలవ్వనంత కాలం మన అభివృద్ధికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత మామూలు ప్రజలందరికీ ఉండాల్సిందే అని టాక్స్ పేయర్స్ అనబడే ఎలైట్ గుంపులు . మొత్తం జనం పై పడుతున్న ఆర్ధిక భారాలు  తెలియకుండా వాళ్ళ కళ్ళ ముందు ఆర్ధికాభివృద్ధి తాలుకు మాయలోకం సృష్టించి కాళ్ళ కింద భూమి చల్లగా  లాగేస్తున్న చట్టసభలు తెలివిగా  మల్లన్నసాగర్లు , అమరావతుల పేరిట విస్తాపకులని పెంచుతుంటే , ఆ విస్తాపకుల శోకం మనది కానిదిగా భావరహితంగా బ్రతికేసే బానిస ప్రజలు వాళ్ళ మేధోతనానికి మార్గం చూపాల్సిన కవులు రచయితలు ఆర్టిస్టులు రాజ్యానికి తొత్తులుగా మారి , రాబోయే అవార్డుల కోసమో రాల్చి పడేసే రివార్డుల కోసమో వ్యూహాత్మక మౌనాలు పాటిస్తున్న కాలంలో మనసున్న కొంతమందికోసమయినా  అలాంటివే ఎన్నో కవితలు రాతలు రావాల్సిన అసవరం చాలా ఉంది .

ముఖ్యంగా పదవుల బేరగాళ్ళ ఆకాంక్షల ఫలితంగా కాకుండా ,పసిగుడ్డుల నుండి ప్రాణాలని లెక్క చేయని వీరుల వరకూ ,తమదయిన నేల కోసం , తమకి మాత్రమే దక్కాల్సిన నీటి కోసం అమరవీరుల ఆత్మహత్యలతో తడిసిన తెలంగాణలో “దొంగలెవరో దోచిరి గౌరమ్మా , దొంగలతోపాటు దొరలందరు గౌరమ్మా” అన్న ఫోక్ సాంగ్ పూర్తిగా  నిజం చేస్తూ రాత్రికిరాత్రి 14ఊర్ల తలరాతలు , అందులో నివాసితుల బ్రతుకు రాతలు మార్చేసిన అభివృద్ధి రీ_డిజైన్  , సొంత చెలకలు కుంటల్లో పచ్చబడాల్సిన జీవితాలు రేపొద్దున ఇంకో పాలమూరులా ముంబై మురికివాడల్లో చితికిపోయేలా , వందల్లో కుటుంబాలు అందులో ముఖ్యంగా ఈ దేశ నిజ మట్టి దేహాలయిన దళితులు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ మోసంలో బలవుతున్నప్పుడు ,ఈ రోజుకి కూడా శతాబ్దం క్రితం పరిస్థితులే  ఇంకోచోట ఇంకో వికృత రూపంలో ప్రత్యక్షమై జీవ నదుల్లాంటి మనుష్యులని జీవితాలే లేకుండా చేయడం వెనక కుట్రలని ఆపాల్సిన అవసరం మనందరిది కాదా ?

 

అలాంటి వాళ్ళందరి వ్యధల సమాహారంగా , ఒకపక్క తన నమ్మకాలు కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూనే , ప్రపంచ శాంతి ప్రేమ అనబడే రంగుల కలల సాకారం కోసం రెండు చేతులు ముకిళించి ప్రార్ధిస్తున్న ప్రతి మనిషి “నువ్వెక్కడ నుండి” అని పక్క మనిషిని అడగని రోజుకోసం  , ఒకవేళ అలాంటి ప్రశ్న వచ్చినా , నేనిక్కడ నుండే, ఈ నేల నాది ,ఈ గుండె నిండిన మట్టి పరిమళం నాది అని గర్వంగా ప్రతి ఒక్కరు చెప్పుకొనే రోజుకోసం , ఏ ఒక్క  కుటుంబం బలవంతంగా తన అస్తిత్వానికి దూరంగా బహిష్కరించబడకుండా ఉండే రోజు ఒకటుందనే నమ్మకంతో మనలో మానవత్వపు కోణాన్ని తడిమి చూపడానికి Langston Hughes రాసిన “One Way Ticket” ని తెలుగులో అనుసృజించే చిన్న ప్రయత్నం . వలసలే  ఇంత భయంగా భయంకరంగా ఉంటే, బలవంతంగా ఊర్లు వదులుకోవలసిన పరిస్థితులని సృష్టిస్తున్న వ్యవస్థకు భయపడి  సంతకాలు పెట్టిన రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రతి గుండె చప్పుడులా వినిపించే కవిత ఒకసారి మనకోసం .

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని

తూర్పుకో ఉత్తరానికో

చికాగో, డెట్రాయిట్,

బఫెలో, స్క్రాన్టన్,

ఎక్కడో కాని

డిక్సీ మాత్రం కానిచోట

ఉంచడానికి వెళ్తున్నాను

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని ఎదో ఒక ట్రైన్

ఉత్తరానో ,పశ్చిమానో ,

దక్షిణం కాని ఏదయినా

లాస్ ఏంజిల్స్, బకేర్స్ఫీఎల్డ్,

సీటెల్, ఓక్లాండ్, లేదా

సాల్ట్ లేక్కో తీసుకెళ్తున్నాను

 

జిమ్ క్రో లాస్తో

క్రూరులైన మనుష్యులతో

విసిగిపోయిన నేను ,

నా నుండి వారు

పరస్పర భయంతో

ఒకరికొకరు దూరంగా

పరిగెడుతున్నాం

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని

వన్ వే  టికెట్ తో

ఉత్తరానికో ఈశాన్యానికో

వెళ్తున్నాను .

వెళ్ళిపోయాను (తిరిగిరా(లే)ను ) .

 

*

 

  • Jim Crow laws were state and local laws enforcing racial segregation in the Southern United States. Enacted after the Reconstruction period, these laws continued in force until They mandated de jure racial segregation in all public facilities in states of the former Confederate States of America, starting in 1890 with a “separate but equal” status for African Americans. Facilities for African Americans were consistently inferior and underfunded compared to those available to white Americans; sometimes they did not exist at all.

మూడు పాయల తెలుగు డయాస్పోరా   

 

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

 

-సాయి బ్రహ్మానందం గొర్తి

~

 

అశ్వశాల నుండి గుర్రాన్ని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాను. ఏం చెప్పానో పనివాడికి అర్థం కాలేదు. నేనే లేచి వెళ్ళి, జీను వేసి గుర్రం ఎక్కాను. దూరంగా ఎక్కడో శంఖనాదం వినిపించి, అదేమిటని పనివాణ్ణి అడిగాను. అతనికేమీ అది పట్టలేదు;వినిపించలేదు. గేటు దగ్గర నన్ను ఆపి “ఎక్కడికి ప్రయాణం?” అని ప్రశ్నించాడు.

“తెలీదు. ఇక్కడనుండి బయటకి. ఇంకాస్త దూరానికి. బయటకి వెళ్ళాలి. అదొక్కటే నా గమ్యాన్ని చేరుస్తుంది,” బదులిచ్చాను. “నీ గమ్యం ఎరుకా?” మరోసారి అడిగాడు.

“తెలుసు. ఇప్పుడే చెప్పాను కదా? ఇక్కడనుండి బయటకి. అదే నా గమ్యం!”

“ద డిపార్చర్” అనే కథలో చివిరి వాక్యాలు ఇవి. ఆ కథ రాసింది కాఫ్కా.

వలసజీవుల యాతనా, తపనా సూక్ష్మంగా చిన్న కథలో చూపించాడు కాఫ్కా.    

*******

ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా వేరే చోటకి వెళితే జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి. ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి. కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని పరిచయం చేయిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. జ్ఞాపకాల కుదుపులున్నా, నిలదొక్కుకునే ధైర్యం ఇస్తుంది. ప్రవాస జీవితానికి ఒకటి కాదు. రెండు ప్రపంచాలు.  ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు ప్రపంచాలు.

000000000000  

ఊరు మారినా, ఉనికి మారునా?

దూరమయినప్పుడే కోల్పోవడం విలువ తెలుస్తుంది. అది – మనుషులు కావచ్చు; అలవాట్లు కావచ్చు; ప్రదేశాలు కావచ్చు; సంస్కృతి కావచ్చు – ఇంకా ముఖ్యంగా భాష కావచ్చు. ఈ కోల్పోవడం వెనుక నీడలా కనిపించని అదృశ్య పార్శ్వం  ఒకటి ఉంటుంది. ఆ పార్శ్వమే “ఉనికి” లేదా “గుర్తింపు”. ఈ ఉనికి అన్నది స్థానం బట్టి మారుతూ ఉంటుంది.

ఇల్లు దాటగానే ఒక రూపం, వీధి దాటగానే మరో రూపమూ, వూరు దాటగానే వేరొక రూపమూ సంతరించుకుంటుంది.  పరాయి రాష్ట్రం వెళితే ఒకవిధంగానూ, దేశం విడిచి వెళితే ఇంకో కొత్త రూపంలోనూ దర్శనమిస్తుంది. ఈ ఉనికి అన్నది కేవలం వ్యక్తిగతమే కాదు, దానికి చాలా పార్శ్వాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవీ, చాలా ప్రభావితమైనవీ – భాషా, సంస్కృతి (అంటే జీవన విధానమూ, అలవాట్లు. ముఖ్యంగా ఆహారం). సంస్కృతి బయట ప్రపంచానికి తెలియకపోవచ్చునేమో కానీ, మొట్టమొదట కనిపించేదీ, వినిపించేదీ భాష ఒక్కటే.  ప్రపంచంలో ఏ మనిషికైనా తమ జీవన స్రవంతిలో భాషే ప్రధాన అంగమూ, ఆయుధమూ కూడా. అందువలనే భాష ఉనికిని అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగే అలవాట్లూ, సంస్కృతీ. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పరాయిదేశంలో అడుగు పెట్టీ పెట్టగానే ఇవి వారి ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

“ఊరు మారినా, ఉనికి మారునా? – ఉనికి మారినా, మనిషి మారునా?” అని పాత తెలుగు సినిమా పాటొకటుంది(ఆరుద్ర రాసినది). ఊరు మారితే ఉనికి మారినా, మారకపోయినా దాని పేరు మాత్రం మారుతుంది. రాయలసీమ వాస్తవ్యులూ, తెలంగాణా వాస్తవ్యులూ, కోస్తావాసులూ అన్నది రాష్ట్రం దాటితే తెలుగువారి గానే పరిగణించబడతారు. అదే దేశం వదిలి వెళితే భారతీయులుగా గుర్తించబడతారు.

వలస వెళ్ళిన దేశం అయితే అది “diaspOra”గా అవతరిస్తుంది. ఈ Diaspora (dispersed or scattered అన్నది గ్రీకు పదం. క్రీస్తు పూర్వం 586 కాలంలో యూదు జాతీయులు దేశ బహిష్కృతులై, ఈజిప్ట్‌ నుండి చెల్లాచెదరైపోయి పాలస్తీనా దగ్గర వలస చేరిన సందర్భంలో దీన్ని వాడేవారు. దాన్ని మెల్లగా వేరే దేశాలలో వలస వెళ్ళిన సమూహాలకి అన్వయించడం మొదలుపెట్టారు. ఈ అన్వయంలో చిన్న “d” తో వీరిని గుర్తించడం మొదలయ్యింది.  డయాస్పోరా (diaspora)కి ప్రధాన లక్షణం – ఉనికి.      

ఈ ప్రపంచంలో చాలా డయాస్పోరాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో.  వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance(అభిజ్ఞా వైరుధ్యం లేదా వ్యతిరేకత) ఆవరించుకొని ఉంటుంది.

వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురుపడ్డప్పుడు – తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య – వాటిద్వారా కలిగే ఒక మానసిక  ఒత్తిడి.  సూక్ష్మంగా చెప్పాలంటే – రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి.  ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.  వీటికంటే ప్రధానంగా మాట్లాడే “భాష” ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అంతవరకూ మాతృభాషకి అలవాటు పడ్డ ఆలోచనలూ, భావాలూ ఒక్కసారి వేరే భాషలో రూపాంతరం చెందేటప్పుడు కొన్ని అర్థం మారిపోవచ్చు; కొన్ని జారిపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో ఇలా అంటారు – “డయాస్పోరా అన్నది కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. విడిపోయేటప్పడు కలిగే అనుభవంలో అఘాతాన్నీ, స్థానభ్రంశాన్నీ ఎత్తి చూపిస్తుంది. అదొక్కటే కాదు – కొత్త ఆశలనీ, సరికొత్త అధ్యాయాలనీ సృష్టిస్తుంది కూడా. ఈ కొత్త సాంస్కృతిక జాగాలో వ్యక్తిగతమైన, సామూహికమైన జ్ఞాపకాలు ఢీకొంటాయి. కొన్ని పెనవేసుకుంటాయి. ఇంకొన్ని రూపాంతరం చెందుతాయి. ఇదే దీనికున్న బలమూ; బలహీనతా కూడా.”

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం. వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం.

0000000000000

సాహిత్యం అనగానే మొట్ట మొదట గుర్తొచ్చేది భాష. భాష అంటే ఏది? మాతృభాషా? పరాయి భాషా? కొత్త దేశంలో మాతృభాష వెనక్కి వెళ్ళి పరాయి భాష ముందుకొస్తుంది. ఆ క్రమంలో వ్యక్తిగత భావ ప్రకటనే ప్రధానాంశం అవుతుంది. ఎవరికైనా భాష వచ్చూ అంటే – మాట్లాడడం, అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం – వంటి వాటిలో నైపుణ్యం కావాలి.. ఈ నాలుగింటిలో నైపుణ్యత ఉన్నప్పుడే ఆ భాష వచ్చునని చెబుతాం.

ఎవరికైనా మాతృభాషలో ఉన్న ప్రావీణ్యత పరాయి భాషలో అంత తేలిగ్గా రాదు. కాబట్టి ప్రవాసీయులు తమ అనుభవాలానీ, జీవితాన్నీ చెప్పాలంటే మాతృభాషనే వాహకంగా ఎన్నుకుంటారు. తద్వారా తమ సొంత జాతీయులకి వారి జీవితం తెలిసే అవకాశం ఉంటుంది. ఇదొక పార్శ్వం. అమెరికాలో ఉన్న అనేకమంది తెలుగు రచయితలు అందిచ్చే సాహిత్యం, కథా, కవితా, నవలా, ఏ రూపమయినా ఈ కోవకి చెందుతాయి.

అలా కాకుండా పరాయి దేశపు భాషలో తమ అనుభవాలనీ, జీవితాన్నీ వ్యక్తీకరించినప్పుడు ఆయా దేశాలవారికీ తమ సంస్కృతీ, ఆలోచనలూ, సమస్యలూ, జీవితమూ తెలిసే అవకాశం ఉన్నాయి. అంటే ఇంగ్లీషులో సాహిత్య సృజన చెయ్యడం.

ఇంతకు ముందు ప్రస్తావించినట్లు యూదులు హీబ్రూ, అరామిక్ భాషల్లోనే అన్నీ వ్యవహారాలూ నడిపేవారు. మతంగురించి రాసినా, పండితులతో వ్యవహరించినా, మామూలు యూదు ప్రజలను ఉద్దేశించి చెప్పాలన్నా అవే భాషలు వాడేవారు. తమ దేశం వలస వచ్చిన వేరే జాతీయులకి చెప్పడానికీ ఇవే భాషలు వారికి బోధించి మరీ చేరవేసేవారు. తద్వారా వలస జాతీయుల ద్వారా కొంత సాహిత్యం పుట్టింది. వీరి అవస్థలూ, ఆలోచనలూ తెలిసాయి.

ప్రస్తుతం అమెరికా తెలుగు డయాస్పోరా సాహిత్యం తీసుకుంటే అది ఒంటికాలుతోనే ఉంది. ఎందుకిలా అనాల్సి వచ్చిందో చూద్దాం.

తెలుగు వారికంటే ముందు వచ్చిన చైనీస్ ఆరేడు తరాలు తమ జీవితాన్నీ, అనుభవాలనీ సాహిత్య పరంగా అందించాయి. మొదటి తరాలు తమ సొంత భాషల్లో చేస్తే, తరువాతి తరాలు ఇంగ్లీషులోనే రాయడం మొదలు పెట్టారు. తెలుగువారికంటే ముందు ఎక్కువగా వలస వచ్చిన భారతీయుల్లో గుజరాతీయులూ, పంజాబీలూ, బెంగాలీలు ఉంటారు (ఈ మాధ్యకాలంలో అంటే గత పదహారేళ్ళుగా మన తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అది వేరే విషయం.). 1914 కాలంలోనే ఎంతోమంది పంజాబీలు కెనడా వలస వచ్చారు. వారిలో చాలమంది ఉపాధికోసం అమెరికాకి వచ్చారు. వీళ్ళతరువాత వచ్చిన వాళ్ళల్లో మరో ముఖ్యమైన గుంపు గుజరాతీయులు.

ఇందులో అన్ని రంగాల వారూ, అంటే వ్యాపారస్తులు మొదలుకొని, విద్యార్థులూ, నర్సులూ, పనివాళ్ళూ అందరూ వచ్చారు. దాంతో వారికి ఇక్కడి జన జీవనంతో సంబంధ బాంధవ్యాలు త్వరిత రీతిన ఏర్పడ్డాయి. అమెరికాలో మోటెల్స్ (చిన్నసైజు లాడ్జీలు) వ్యాపారంలో అందరూ గుజరాతీయులే! అలాగే టాక్సీ, రెస్టారెంట్ లాంటి వివిధ రంగాల్లో పంజాబీలూ ఎక్కువగానే ఉన్నారు. వీరుకాకుండా బెంగాలీయులూ ఉన్నారు. వీరందరికీ కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజంలో వివిధ వర్గాల వారితోనూ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ తమ మాతృభాషల్లోనూ, ఇంకా ముఖ్యంగా ఇంగ్లీషులోనూ అక్షర రూపం ఇచ్చారు. అందువలన ఇండియన్ డయాస్పోరా చెప్పగానే వీళ్ళ పేర్లే అమెరికాలో అందరికీ తెలుసు. ఇండియన్ డయాస్పోరా పేరు చెప్పగానే ఝుంపా లహరి, చిత్రా దివాకరునీ(బెంగాలీ) – బల్వంత్ జాని,  పన్నా నాయిక్ (గుజరీతీ) – దర్షన్ సింగ్ తట్ల,  వంటి పేర్లు అమెరికాలో అందరికీ చిర పరిచయమే.

ఈ వలస అన్నది ఈనాటిది కాదు. ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సౌత్ఆఫ్రికా, మారిషస్, ఫిజీ, మయన్మార్(ఒకప్పటి బర్మా) వంటి దేశాలకు వ్యాపార రీత్యా, ఉపాధి కోసమూ అనేకమంది వెళ్ళారు. కాల క్రమేణా వారందరూ ఆయా దేశాల జన స్రవంతిలో కలిసేపోయారు. కొత్త తరం వారు పేరుకి తెలుగు వారయినా ఆయాదేశపు సంస్కృతీ, జీవిన విధానంలో భాగం కనుక, వారి ఉనికిని కోల్పోవడం సహజ పరిణాంగానే భావించాలి. ఎప్పుడైతే భాష అంతరించిందో అప్పుడే సాహిత్యమూ గతిస్తుంది. అందువల్ల ప్రపంచంలో పలు ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నా, అక్కడి నుండి గుర్తించగలిగిన సాహిత్యం రాలేదు. సౌత్ఆఫ్రికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అనేకమంది తెలుగు వారున్నారు. తెలుగులో రాయకపోయినా, కనీసం ఇంగ్లీషులో నయినా సాహిత్య సృజన చేపట్టినవారు కనిపించరు.

డయాస్పోరా అనగానే మాతృభాషలో వచ్చే సాహిత్యమే అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కేవలం మాతృభాషలోనే కాకుండా పరాయి భాషలో (ప్రస్తుతం ఇంగ్లీషు అనుకుందాం) కూడా సాహిత్య సృజన ద్వారా వారి జీవన విధానమూ, అనుభవాలూ అందజేయాలి. అప్పుడే అది పరిపూర్ణ డయాస్పోరా సాహిత్యం అవుతుంది. ఇంగ్లీషులో రాసింది ఒక కోణమయితే,  మాతృభాషలో రాసింది మరొక కోణం అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగువారినీ, భాషనీ తీసుకుంటే, కేవలం తెలుగులో రాసే తెలుగు రచయితలు మాత్రమే ఉన్నారు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఎంతో మంది పంజాబీలు అమెరికా, కెనడా వచ్చారు. కొంతమంది అక్కడున్న స్థానికులతో పెళ్ళి వంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. ఇంకొతమంది మెక్సికనలని కూడా పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత తరం వాళ్ళు విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి నిలదొక్కుకున్నారు. అమెరికాలో టాక్సీ వ్యాపారంలోనూ, డంకిన్ డోనట్స్ ఫ్రాంచైజ్ బిజినెస్సుల్లోనూ చాలామంది పంజాబీలు ఉన్నారు. అలాగే మోటెల్స్ నడపడంలోనూ, సబ్‌వే వంటి రెస్టారెంట్ బిజినెస్సుల్లో గుజరాతీయులు ఎక్కువగా కనిపిస్తారు.  గుజరాతీయులు మొదట వలస వెల్లింది సౌతాఫ్రికాకే. అక్కడినుండే అమెరికాకి వచ్చారు.   అమెరికాలో తెలుగువారి రాక 1950, 50లలో ఉన్నత విద్యకోసం ప్రారంభమయినా, డేబ్బైల్లో అనేకమంది డాక్టర్లు, నర్సుల రాకతో ఎక్కువయ్యింది. వీళ్ళందరూ సరాసరి ఉద్యోగలకే వచ్చారు. అందులోనూ వచ్చింది వైద్య వృత్తి రీత్యా కావడంతో వీరికి ఆర్థిక సమస్యలు అంతగా ఉండకపోవడం సహజం. ఆ తరువాత తొంభైల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలకోసం వచ్చిన వారిలో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికా పౌర జీవన ప్రమాణాలతో చూస్తే వీరందరూ ఆర్థికపరంగా మధ్యతరగతి కంటే ఎక్కువే.

డెబ్బైల తరువాత వచ్చిన వారికి అమెరికాలో అనేక అనుభవాలూ, సంఘర్షణలూ, సర్దుబాట్లూ ఉండి ఉంటాయి. ఇప్పటిలా సౌకర్యాలూ, వార్తా ప్రవహామూ అంతగా లేదు. అందువల్ల నాస్టాల్జియా వెంటాడుతూనే ఉండేది. భాషా, సంస్కృతీ ఇవన్నీ ఉనికిలో భాగం కాబట్టి అవి నిలబెట్టుకోవడం కోసం ఆ తరంలో తపనా, యావా ఉండేవి. అందులో సాహిత్యం కూడా కొద్దిగా ఉంది. ఆ విధంగానే తానా, ఆటా వంటి సంస్థలు వుద్భవించాయి. ఎంత దూరంలో ఉన్నా తెలుగువారు కలవడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. ఆ కోవలోనే అనేకమంది తెలుగు ప్రముఖుల రాకపోకలు అమెరికాలో ఎక్కువయ్యాయి. సాహిత్య పిపాస ఉన్న కొంతమంది ప్రేరణతో సావనీర్లు పుట్టుకొచ్చాయి.  తెలుగులో రాయడం అన్నది ఒక రివాజుగా వుండేది. అడపాదడపా కొన్ని కథలూ, వ్యాసాలూ వచ్చినా సాహిత్య పరిధి పెరిగినది మాత్రం 1996 కాలంలో ఇంటర్నెట్ వచ్చిన తరువాతే. ఆ విధంగా సాహిత్య సృజనకి కంప్యూటర్ సాంకేతిక రంగం(ఇంటర్నెట్) ఎంతో దోహదం చేసింది. చాలామంది ఔత్సాహిక రచయితలు అమెరికా నుండి రచనలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి అనుభవాలూ, నాస్టాల్జిక్ జ్ఞాపకాలూ కలగలిపి అనేక కథలూ, వ్యాసాలూ వచ్చాయి. ఆ విధంగా తెలుగు డయాస్పోరా అన్నది తెలుగు సాహిత్యంలో ఒక పాయగా మారింది.

ఇంతమంది తెలుగు వారు అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఎంతో కాలం నుండీ ఉంటున్నా ఏ ఒక్క తెలుగువాడూ ఇంగ్లీషులో రచనలు చేయడం కనిపించదు. వెల్చేరు నారాయణ రావు వంటి వారు అనువాదాలు చేసినా, అవి అందరి పాఠకులనీ చేరుతాయన్నది అనుమానమే. అమెరికాలో నవలలూ, కథల పుస్తకాలూ విరివిగా ప్రాచుర్యంలో ఉంటాయి. (వేరేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం కథ/నవల గురించే చెప్పుకుందాం) కొన్ని తరాల తెలుగు వారు ఇంత కాలం నుండి ఉన్నా ఏ ఒక్కరూ ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాయలేదు. అదే బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అయితే రెండు వైపులా సాహిత్యం వచ్చింది. అనేకమంది పేరున్న రచయితలు అమెరికాలో భారతీయ జీవన విధానాన్నీ, సాంస్కృతిక సంఘర్షణనీ సాహిత్య రూపంలో అందించారు. వెతికి చూస్తే, అమూల్య మల్లాది అన్న ఒక్క రచయిత్రి మాత్రమే కనిపిస్తారు. అటు కన్నడంలోనూ, తమిళంలోనూ నలుగురైదుగురైనా ఉన్నారు.

తెలుగు వారి జీవితం గురించి ఎవరైనా ఇంగ్లీషులో నవలా, కథా రాసినా అమెరికన్ల వరకూ అది ఇండియన్ల జీవితమే. మనకి భాషాపరంగా అనేకమంది ఉన్నా, అమెరికన్లకి మాత్రం గుజరాతీయులూ, బెంగాలీలూ, పంజాబీలూ, తెలుగువారూ అందరూ భారతీయులక్రిందే లెక్క. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న తెలుగు వారినుండి విరివిగా ఇంగ్లీషులో సాహిత్య సృజన జరిగితే తప్ప తెలుగువారి ఉనికీ, జీవితమూ, దాని వెండి వచ్చే కష్ట సుఖాలూ అమెరికన్లకి అర్థం కావు. ఈ విషయంలో ఝుంపా లహరి, బెంగాలీ రచయితని మెచ్చుకు తీరాలి. బెంగాలీ జీవితాన్ని అమెరికన్లకి బాగానే పరిచయం చేసింది. ఈమె రాసిన “నేమ్ నేక్” ఎంతో ప్రాచుర్యం పొందిన నవల.

వలస వచ్చిన తెలుగు వారు సాహిత్య సృజన చెయ్యకపోవడానికి నాకు కనిపించిన కారణాలు:

1) వస్తూనే మంచి ఉద్యోగాలతో రావడం వలన (90ల తరువాత వచ్చిన వారు) అమెరికన్ జీవన విధానంలో మమేకం అవ్వాల్సిన అవసరం లేకపోవడం.

2) వచ్చిన వారిలో చాలామందికి సాహిత్యం పట్ల ఆసక్తిలేకపోవడం.

3) సాంకేతిక ప్రగతీ, సౌకర్యాల వలన వేరే దేశం వచ్చామన్నా భావన అంతగా పట్టకపోవడం.

4) తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ఇక్కడున్న వారితోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. అవసరమయినంత మేరకే అమెరికన్ జీవన స్రవంతిలో కలవడం.

పై కారణాల వలన ఇంతవరకూ వచ్చిన సాహిత్యం, అమెరికన్ జీవిన విధానంలో ఉపరితలంలో కనిపించిన వస్తువుల చుట్టూ తిరిగింది. లోతైన అవగాహన, అధ్యయనం లేకపోవడం వలన ఊహించిన రీతిలో తెలుగు సాహిత్యం పుట్టకపోవడం; అమెరికన్ జీవన స్రవంతిలో కలవకపోయినా గడిచిపోయే వాతావరణమూ, ఇలా పలు కారణాలు కనిపిస్తాయి.  ఇంత వరకూ వచ్చిన సాహిత్యం కూడా ఈ క్రింది అంశాల పరిధి దాటి లోతుగా అధ్యయనం కాలేదు.

1) స్త్రీల సమస్యలు, గృహ హింస

2) నాస్టాల్జియా, నాస్టాల్జియా, నాస్టాల్జియా

3) పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, వృద్ధాప్యంలో సమస్యలు, ఇండియా నుండి వచ్చే వారి తీరుతెన్నులూ

4) అమెరికా జీవితం పై వ్యంగ్య, హాస్య రచనలు

అడపాదడపా వేరే అంశాలపై కథలు వచ్చినా, సింహభాగం రచనలు పైన చెప్పిన వాటిని మించి పోలేదు. అమెరికన్ సంస్కృతీ, జీవన విధానంతో లోతుగా ముడిపడిన వారి జీవితం గురించీ, వాళ్ళకి మన సంస్కృతీ, జీవితం పట్ల ఉన్న అవగాహనా వంటివి ప్రతిబింబింస్తూ వచ్చిన కథా వస్తువులు కనిపించవు.

రాసేవాళ్ళకీ ఉపరితల పరిశీలనే తప్ప లోతైన అధ్యయనలోపం ప్రధాన సమస్య. ఎంతో కొంత కథలు వచ్చాయి కానీ, అమెరికా జీవితన్ని ప్రతిబింబిస్తూ తెలుగులోనే మనకి నవలలు అంతగా రాలేదు. కనీసం రాబోయే కొత్త తరం అంటే అమెరికాలో ఇప్పుడున్న వారి సంతతి అయినా ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాసి తెలుగు డయాస్పోరాకి పూర్తి న్యాయం చేకూరుస్తారన్న చిన్న ఆశ. అది ఎంత సఫలం అవుతుందో కాలామే నిర్ణయించాలి.

*

ఇష్టమైన నరకం…

 

 

-మధు  పెమ్మరాజు 

~

 

 ఉన్నట్టుండి ఓ రోజు తెలుగు సాహిత్యానికి నా అవసరం ఉందనిపించింది.  ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అమెరికాలో తెలుగు మగవాళ్ళ పై (అంటే బేబీ షవర్ రోజు తలుపు చాటున దాక్కుని, తలుపు తెరుచుకోగానే  “సర్ప్రైస్” అని భయపెట్టే మగవాళ్లపై) బ్లాగు రాసి స్నేహితులకి పంపి అభిప్రాయం  అడిగాను, వారం దాకా ఏ సమాధానం రాలేదు, మనోభావాలు దెబ్బ తిన్నాయేమోనని ఫోన్ చేసి అడిగితే “అద్భుతం! నువ్వు మామూలు మనిషివి కాదు!” అని ఉత్తేజపరిచారు (తర్వాత చదవకుండా పొగిడారని తెలిసింది)

కానీ రైలు స్టేషన్ దాటేసింది. వారానికో బ్లాగు రాయడం, జనాలపై ఎక్కుపెట్టడం మొదలుపెట్టాను. నెట్లో నారద సంచారం చేస్తుంటే ఎందరో మంచి బ్లాగర్లు, రచయితలు తారసపడ్డారు. వారి పదునైన రచనలు చదివాకా నేను రాసింది ఏదైనా కావచ్చు కానీ సాహిత్యం మాత్రం కాదని, సాహిత్యానికి నా అవసరం లేదని తేలిపోయింది. అప్పటికే కొన్ని ప్రమాదాలు జరిగిపోయాయి – ”ఇంట్లో రచయితగా గౌరవిస్తున్నారు, యధేచ్ఛగా కంప్యూటర్ ముందు కూర్చోనిస్తున్నారు, పార్టీలకి వెళితే నా వీరు బ్లాగులు అవి రాస్తారని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు” ఇక ఇన్ని సదుపాయాలు, మర్యాదలు జరుగుతుంటే వదలాలని అనిపించలేదు.

అంతర్జాల పత్రికలలో కథలు, కవితలు చూసుకుని, లెక్కపెట్టుకుని మురిసిపోయేవాడిని. ఆ ముచ్చట వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది పోటీలలో బహుమతి రావడంతో ముగిసింది, ఏ బాదరబందీ లేకుండా హాయిగా బ్లాగులు రాసేవాడిని కాస్తా రాయడం సీరియస్ గా తీసుకోవడం అక్కడ మొదలయ్యింది. బ్లాగులు బాచిలర్ జీవితం లాంటిది (ఏ బాదరబందీ ఉండదు), కథలు కాపురం లాంటివి (బరువు, బాధ్యత, ఇష్టమైన నరకం).

మొదట్లో ఏది రాసినా చప్పగా అనిపించేది, కథలు పూర్తయినా నా లాప్టాప్ దాటేవి కావు, అంతా అస్పష్టత..అంతు పట్టని దారులు. అయినా నిరుత్సాహపడకుండా కథని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాను, ఆ క్రమంలో…

ఒక సగటు పాఠకుడు కథని ఎందుకు ఇష్టపడతారు? – పత్రిక చేతిలో పడగానే సగటు పాఠకుడు చూసే మొదటి శీర్షిక కథ. ఆ ఆకర్షణకి ముఖ్య కారణం పాఠకుడు పెట్టే అతి తక్కువ సమయానికి మానసిక ఉల్లాసం, తృప్తిని ఇవ్వగలిగే అవకాశమున్న ప్రక్రియ కాబట్టి (నా ఉద్దేశ్యం అన్ని కథలని కాదు, వేరే శీర్షికలు తక్కువ చెయ్యడం కాదు..ఎక్కువ అవకాశం ఉన్న శీర్షిక అని మాత్రమే).

పాఠకులు ఎలాంటి కథలు ఇష్టపడతారు? – తమ మనసుని తాకి, కదిలించే ఇతివృత్తాలకి పాఠకుడు స్పందిస్తాడు. నిజానికి కథలో తమని తాము వెతుక్కుంటాడని  అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు నచ్చే అంశాలు ఏమిటంటే- .

కథ సంపూర్ణ యాత్రలా (psychological journey) అనిపించాలి. మనని మనం పోగొట్టుకుంటూ, మళ్ళీ కలుసుంటూ వచన కవిత్వంలా సాగాలి.

నిదానంగా సాఫీగా, సాగినా ఆలోచింపజేయాలి, వెక్కిరించాలి, చుట్టూ ఉన్న పొరలని విప్పాలి.

పదాల గారడీలా కాకుండా వచనంలో నికరమైన యోగ్యత  ఉండాలి.    

చూసిందే, చదివిందే అనేలా చప్పగా అనిపించకూడదు

అంటే నేను ఆస్వాదించే స్థాయి (నా బేస్లైన్) వేరు, రాస్తున్న తీరు వేరు..ఈ రెంటి మధ్య దూరాన్ని  ఎలా తగ్గించాలి? నింగి అందనంత ఎత్తులో ఉందని చూస్తూ కూర్చుంటామా? ఇటుకలు పేరుస్తూ ఉంటాము, మెట్లు కడుతూనే ఉంటాము.

రాయడం ఏకాంత ప్రయత్నమయినా పెన్ను, పేపర్ ని తాకే లోపు ఎన్నో సందర్భాలు, వ్యక్తులు, పుస్తకాలు, సంభాషణలు మనలో జేరి అదృశ్య హస్తాలుగా రాయిస్తూ ఉంటాయి, కాబట్టి రాయడం ఒక సమావేశం.

అవకాశం వచ్చింది కాబట్టి నాకనిపించిన అదృశ్య హస్తాలు- సాహిత్య వాతావరణం, సంపాదకులు,  సాహితీవేత్తలు, పాఠకులు.

సాహిత్యం ఒక అవసరంలా అనిపించాలి, ఆదరించే వాతావరణం కావాలి. ఆ వేదిక చిట్టెన్ రాజు గారు అనే వ్యవస్థ ద్వారా లభించింది. కొన్ని దశాబ్దాలుగా బాషకి, సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. సాహితీ సదస్సులు, వెన్నెల వేడుకలు నిర్వహించడమే కాకుండా కొత్తవారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తారు. వారి పరిచయం వలన సాహిత్యంతో బలమైన, ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

కొత్త కథకులని వెలికి తీసి, వారిని ప్రోత్సహించే సహకార సాంప్రదాయం ఉండాలి. ఆ అంశంలో సంపాదకులు  కీలకమైన పాత్ర పోషిస్తారు. అంతర్జాలలో మనం రకరకాల పత్రికలని చూస్తుంటాము. రచన పంపగానే మాటామంతీ లేకుండా ప్రచురించే ‘పాసివ్’ పత్రికలు, అత్యున్నత ప్రమాణాల “కంచు కోట” పత్రికలు, రెండిటి వల్ల కొత్తవారికి పెద్ద ఉపయోగం లేదు.

కౌముది సంపాదకులు – కిరణ్ ప్రభ గారు, కవిత పంపినా, కథ పంపినా వెంటనే స్పందించి, అభిప్రాయం తెలిపేవారు. రచయిత దగ్గర స్పార్క్ ఉందని అనిపిస్తే విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తాను అని ఫోన్ లో మాట్లాడి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, తిరగ రాయించి పత్రికలో వేసేవారు.

తానా-సంపాదకులు-నారాయణస్వామి గారికి కొత్త కథలు పంపి అభిప్రాయం చెప్పమని అడిగేవాడిని, ఓపికగా ఫోన్లో విశ్లేషించే వారు. సవరణలు సూచించేవారు. గంటల, గంటల రైటర్ ల వర్క్ షాపులు కాదు. ఓ ఐదు, పది నిముషాల సంభాషణ, ఒకటి రెండు సూచనలు చాలు అల్లుకుపోవడానికి, నిండా ముంగిన వాడికి చిన్న తాడు చాలు.

సారంగ సంపాదకులు – అఫ్సర్ గారి ఆత్మీయ పలకరింపు, ఏదైనా రచన పంపమనే పిలుపు రచయితకి మంచి ఊతాన్ని ఇస్తాయి.

కథ పూర్తి చేసి, ఏదో ఒక పత్రికకి హడావిడిగా పంపి, అచ్చులో పేరు చూసుకునే తాపత్రయం కాస్తా నాకు నచ్చే వచనం రాయాలనే తపనగా మారింది.  ఓపికగా తిరగ రాయడం, మళ్ళీ రాయడం. – ప్రతీ పదం, వాక్యం, సంభాషణ మళ్ళీ మళ్ళీ చదువుకుని, పాఠకుడు ఎలా చదువుతాడో? స్పష్టత ఉందా? మనం అనుకున్న భావం ఇదేనా? అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ ముందుకి వెళ్ళడం అక్కడ నుండి  మొదలయ్యింది.

ఇక కథ పూర్తి అయ్యాకా అసలు కథ మొదలవుతుంది (optimization ఫేస్)  కొన్ని బాగా పండిన సంభాషణలు, వాక్యాలు  తొలగిస్తున్నపుడు చెయ్యో కాలో తీస్తున్నట్టు బాధ పడే వాడిని, రాను రాను పేషంట్ నుంచి సర్జెన్ పాత్ర పోషించడం నేర్చుకున్నాను.

నూటికొక ఐదో ఆరో గొప్ప కథలు దొరుకుతాయి. పతంజలి శాస్త్రి గారివి ఆ కోవకి చెందిన అరుదైన, అపురూపమైన కథలు. ‘వడ్ల చిలుకలు’ కథా సంపుటి నుండి ఈ మధ్యనే వచ్చిన ‘గేదె పై పిట్ట’ దాకా  అయిపోతాయేమోనని కొద్దికొద్దిగా చదువుకుంటాను, అయిపోయాకా మళ్ళీ చదువుతాను.

ఏ మాత్రం కష్టపెట్టని పదాలు, వచన కవిత్వం, వ్యంగ్యం, పాఠకుడితో తెలివైన, బరువైన, లోతైన..పొరల పొరల సంభాషణలు జరపడం వారికే సాధ్యం.  ఎప్పుడు కలిసినా చాయ్ తాగుదామా? అంటూ పలకరింపుతో మొదలయి రెండు, మూడు గంటల సరదా సంభాషణ సాగుతుంది. నేను కథల చిట్కాలు అడగను, సాహిత్యం అంటూ విసిగించను. ఆ మహా కథకుడి సమక్షంలో కాసేపు గడిపితే చాలు ప్రభావం మనతో నడిచొస్తుంది, మనలో నిలిచిపోతుంది.

కేవలం సాహిత్యాన్ని ప్రేమిస్తూ, పబ్లిసిటీకి దూరంగా ఉండే సాహితీవేత్తలు నన్ను అమితంగా ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి మిత్రుడు మెహర్.

రచనా శైలి, పద విన్యాసం, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చదివించే రిపీట్ వేల్యూ గల వ్యాసాలు, బ్లాగ్ గుళికలు, పుస్తక/రచయిత పరిచయాలు. రాయడం తపస్సులా సాధన చేసే వ్యక్తి. ఏమీ ఆశించకుండా సాహిత్యాన్ని ప్రేమించడడానికి / ఇష్టపడడానికి స్ఫూర్తి!! Inspiration for literary enthusiasm!!

ఈ మధ్యన ఒక పాఠకుడు మూడు పేజీల కథకి  నాలుగు పేజీల విమర్శ పంపాడు. కథని ఇంత సీరియస్ గా తీసుకుంటారని తెలియడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి అనుభవాలు రచయిత ఒద్దికైన ఇరుకుని వదుల్చుకునే అవకాశాలు. రచయిత కారైతే విమర్శ బ్రేక్ లాంటిది, ప్రశంస ఆక్సిలరెటార్ లాంటిది….రెండూ అవసరమే..

 

****

జ్ఞాపకాలు రాలిపోయిన ప్రపంచంలోకి ….

 

 

 

–      నారాయణస్వామి వెంకట యోగి

~

 

 

ఒక కవిని నాకు చాలా యేండ్ల నుండీ  తెలుసు అనుకోవడం కంటే, తొలి యవ్వన రోజులప్పటి నుండీ  తెలుసు అనుకోవడం ఒక గొప్ప విషయం. అట్లా తెలవడంలో ఒక ఆనందమున్నది. సాధారణంగా కవిత్వం రాసేవాళ్ళు తొలియవ్వన రోజుల్లోనే మొదలు పెడతారు. అట్లా అని వేరే దశల్లో రాయడం మొదలు పెట్టిన కవులు లేరా అంటే చాలా మందే ఉన్నరు కూడా. కానీ తొలియవ్వన రోజుల్లో రాయడం ప్రారంభించిన కవుల్లో మనం వేరు వేరు దశలను చూస్తాం. ఒక యెదుగుదలను, ఒక క్రమబద్ధ పరిణామాన్ని చూస్తాం. కవి వయసులో యెదుగుతున్న కొద్దీ కవిత్వంలోనూ పరిపక్వత (మెచూరిటీ) కనబడుతుంది. ఇదీ అందరి విషయం లో  నిజం కావాల్సిన అవసరమూ లేదు. యెన్నేండ్లు రాసినా యే యెదుగుదలా లేని కవులూ ఉన్నరు.

తొలియవ్వనం లో కనబడే ఒక ఆవేశమూ,విసురూ, ఉద్వేగమూ అప్పుడు రాసే కవిత్వం లో సహజంగానే కనబడుతుంది.  తర్వాత,  తర్వాత,  జీవితంలో అనేక ఒడి దుడుకులు సంభవించినంక,అనుభవం అనేక పాఠాలు నేర్పినంక కవిత్వం లో ఒక సాంద్రత వస్తుంది. చిక్కదనం వస్తుంది. వయసు తాలూకు పుస్తకాల్లో చిక్కిన అనేక క్షణాలు పూల రిక్కలై, నెమలీకలై కవిత్వంలో పరుచుకుంటాయి. కవిత్వానికి ఒక గొప్ప అందం వస్తుంది. కవితలో ఒక్కొక వాక్యం ఒక అద్భుత సౌందర్యం తో అలరారుతుంది. అయితే ఆ సౌందర్యం ఊరికే తళుక్కుమని మెరిసి మాయమయేది కాదు. గొప్ప పరిపక్వత తో వచ్చే సౌందర్యం. మనల్ని ఒకటికి పది సార్లు ఆగి ఆలోచించేటట్టు చేసే బాధతో కూడిన సౌందర్యం. కవికి అనుభవం నేర్పిన జ్ఞానమూ, తాత్వికతా, భావ పరిపక్వత కవిత్వం లో ప్రతిఫలించి మన అనుభవాన్ని మరింత సాంద్రంగా చేస్తుంది. సంపద్వంతం చేస్తుంది. ఒక కవిత మొత్తం చదివాక అందులో కవి చెప్పినదే కాకుండా చెప్పనివి కూడా మనకు గోచరించి మన ప్రపంచం మరింత విశాలమవుతుంది. మన ఊహా శక్తి కొత్త ప్రపంచాలకు ప్రయాణం  చేసి కొంగ్రొత్త ఆకాశాలను స్పృశిస్తూ విస్తరిస్తుంది. కవి చదువరి,  ఐతే అధ్యయన శీలి ఐతే, ప్రజా ఉద్యమకారుడైతే, తన కవిత్వం లో మనం ఆనందించేదే కాదు, ఆస్వాదించేదే కాదు నేర్చుకోవల్సిందీ చాలా ఉంటుంది.

అట్లా నాకు తొలియవ్వన రోజుల్లో పరిచయమైన కవి సుధాకిరణ్. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో జే యన్ టీ యూ ఇంజనీరింగ్ కాలేజీ  హైద్రాబాదు లో మా తొలి పరిచయం. ఇద్దరం ఒకటే అభిప్రాయాలని పంచుకున్నం . ఒకే రాజకీయ కార్యాచరణలో భాగమైనం. నేను సాహిత్యం లోనుండి రాజకీయాలలోనికి వస్తే తను రాజకీయాలనుండి సాహిత్యం లోనికి కవిత్వం లోనికి వచ్చిండని చెప్పవచ్చు – కొంచెం అటూ ఇటూ గా! కిరణ్ ఒక గొప్పకమిట్మెంటు తో కవిత్వం రాసిండు. రాస్తున్నడు. ఇన్నేండ్ల తర్వాత మేము యెవరి జీవితాల్లో వాళ్ళం పడినంక, క్రియాశీలక రాజకీయాచరణ నుండి ఒకింత దూరమై కనీసం సాహిత్యం లో నైన క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నం ఇద్దరమూ బహుశా నాకంటే యెక్కువగా కిరణ్! కవిత్వాన్ని జీవితంలో భాగం చేసుకుని కవిత్వమే జీవితంగా తపిస్తూ, మనం కలలు కన్న కొత్త సమాజం కోసం కవిత్వం యేదో మేరకు తోడ్పడుతుందని నమ్మి కవిత్వ సృజన చేస్తున్నడు కిరణ్.

కిరణ్ ఒక నిర్దిష్ట సామాజిక లక్ష్యంతో కవిత్వం రాసినట్టనిపించినా ప్రతి కవితలోనూ ఒక వైయక్తిక అనుభవం అనుభూతి ఉంటుంది. కవిత వైయక్తిక అనుభవం తోనే ఆ నిర్దిష్ట అనుభూతి తోనే ప్రారంభమైనా (అది విప్లవోద్యమం గురించి రాస్తున్నప్పుడు కావచ్చు అమరుల కోసం రాస్తున్నప్పుడు కావచ్చు బాబన్న, మల్లారెడ్డి లాంటి అన్ సంగ్ హీరో లగురించి వారి అమరత్వం గురించి రాస్తున్నప్పుడు కానీ ముందు గుండెల్ని కదిలించే వైయక్తిక అనుభూతితో ప్రారంభమౌతుంది కవిత. అట్లా యెత్తుకుని ఆ అనుభూతిని విశ్వజనీనం చేస్తాడు, తాత్వీకరిస్తాడు. అయితే ఇప్పుడు కిరణ్ రాసిన ఒక వైయక్తిక కవిత గురించి చెప్పబోతున్నాను. రాజకీయ అభిప్రాయాలను కవిత్వం లో ప్రకటించి, ఒక స్పష్టమైన సామాజిక లక్ష్యం తో కవిత్వం రాసే కవుల పైన ఒక దురభిప్రాయం ప్రచారంలో ఉన్నది. అదేమంటే వీరికి సహజమైన వైయక్తిక అనుభూతులుండవు – అన్నీ రాజకీయ అభిప్రాయాలనే నల్ల కళ్ళద్దాలనుండి చూస్తరు. అసహజంగా రాస్తరు అని. ఈ దుష్ప్రచారాన్ని చాలా మంది కవులు గతంలో అన్ని అంశాల గురించీ అద్భుతమైన కవిత్వం రాసి తిప్పికొట్టినరు. ఆ కోవలోకే కిరణ్ రాసిన‘విస్మృతి’  కూడా వస్తుంది. సామాజిక బాధ్యతతో రాస్తున్న కవుల కవిత్వం పట్ల ఇది ఒక దురభిప్రాయమే అని మరో సారి శక్తివంతంగా నిరూపించినడు కిరణ్ ఈ కవితలో. అల్జైమర్స్ కు గురై తన కళ్ళ ముందే క్రమ క్రమంగా క్షీణించి శిథిలమై పోతున్న తన అమ్మ గురించి రాసిన ఈ కవిత గుండె తలుపులు తట్టి యెక్కడో లోలోపలి పొరలను కదిలిస్తుంది.

 

జ్ఞాపకాలకీ, గుర్తు తెలియని తనానికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత.

 

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు.

 

అని ప్ర్రారంభమైన కవిత మనల్ని జ్ఞాపకాలు నెమ్మదిగా  చెదిరిపోతూ,  మెల్ల మెల్లగా ఒక రకమైన మసక వెలుతులాంటి చీకటిలోకి మాయమైపోతున్న  అమ్మ ప్రపంచంలోనికి తీసికుపోతుంది. అట్లా చెపుతూ యెందుకు జ్ఞాపకాలు యెందుకు రాలిపోతున్నయో మరింత కవితాత్మకంగా చెప్తాడిలా ….

 

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన

సముద్రమొకటి.

తలపుల కెరటాలు తరలిపోగా
దిగులు దీపస్తంభంలా నిలిచిన

కడపటి తీరమొకటి..

 

గాలిముందు దీపంలా దీనంగా మొకరిల్లిన ముదిమి మేఘమని వృధ్ధాప్యాన్ని అద్భుతంగా చెప్తూ రెండు ఉత్రేక్షలలో అమ్మ పరిస్థితిని చెప్తున్నాడు కవి – ఒకటి అలలు అలలు గా విస్మృతి విస్తరించిన సముద్రమనీ, మరొకటి తలపుల కెరటాలు తరలిపోగా మిగిలిన దీపస్థంభం లాంటి తీరమనీ. కవి ఇక్కడ,  సముద్రాన్నీ తీరాన్నీ,  విస్తరించే అలలనీ  తరలి పోయే కెరటాలనీ,  ఒకే అర్థాన్ని శక్తివంతంగా చెప్పడం కోసం వైరుధ్యంలా కనిపించే ఉత్ప్రేక్షలను వాడుతూ ఒకే ఒక విరోధాభాసతో మన ముందు అల్జైమర్స్ బారిన పడ్డ తన అమ్మ చిత్రాన్ని చాలా శక్తివంతంగా కళ్ళకు గట్టినట్టుగా గీసి మనల్ని ఆ ప్రపంచంలోనికి పూర్తిగా తీసుకుపోతడు. ఇక మనం పూర్తిగా కవితతో కట్టివేయబడి కవితో అమ్మ ప్రపంచంలో ప్రవేశిస్తం.

 

 

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

 

మళ్ళీ ఇందులోనూ వెలుతురు కుదించుకుపోవడం చీకటి విస్తరించడం (రెండూ ఒకటే అర్థమైనపటికీ) రెండు వ్యతిరేకార్థాలతో సమానార్థాన్ని వెలుతురు చీకటీ జ్ఞాపకాలూ విస్మృతులతో సూచిస్తూ ఒక భావైక్యతను సాధిస్తున్నాడు కవితలో.

 

అట్లా ఈ కవితలో ఒకే భావాన్ని సూచించడానికి  వైరుధ్యాల్లా కనిపించే ప్రతీకలు ఉత్ప్రేక్షలూ వాడుతూ కవి గొప్ప విజయాన్ని సాధించిండు. చెప్పదలుచుకున్న భావాన్ని మరింత శక్తివంతంగా చెప్పిండు.

 

చివరగా కవిత ముగిస్తూ ….

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు

నీడలకై వెదుకులాట.

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై

శూన్యాకాశంలో అన్వేషణ.

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి

ఋతువులు లేని కాలమొకటి.

కాలం కాటేసిన తలపుల వాకిలిలో,  

తలుపులు మూసుకుపోయిన

మలిసంధ్య జీవితమొకటి…

 

ముందు చెప్పిన కుదించుకుపోయిన వెలుతురు చీకటిగా, చీకటిలో కదిలే నిశ్శబ్దపు నీడల్లా మారిపోతే, చీకటేమో  వెలుతుర్లో కనిపించని నక్షత్రాలైపోయి , మర్రిచెట్టు లాంటి ఊడలు దిగిన రాత్రిలో రుతువులు లేని కాలంలా వృధ్ధాప్యం మిగిలిపోయిందని భిన్నమైన పొరలు  పొరలుగా చిత్రాలని గీస్తాడు. చివరికి ‘కాలం కాటేసిన తలపుల వాకిలి’ అని మతిమరపు వ్యాధి (అల్జైమర్స్) కాటేసిన తన తల్లి మలిసంధ్య జీవితాన్ని తన తల్లిలాంటిపరిస్థితినే యెదుర్కొంటున్న వారి జీవితాన్ని అద్భుతంగా మనముందుంచుతడు. తన వైయక్తిక వేదనకు పరిస్థితికీ ఒక విశ్వజనీనతను తీసుకొస్తడు. అటువంటి పరిస్థితినెదుర్కొంటున్న వారిని మనకు పరిచయం చేసి మన కంటనీరు బెట్టిస్తడు. తలుచుకుని దుఃఖింపజేస్తడు.

కవి ముఖ్యంగా కవితలో సాధించినది,   వైయక్తికతను విశ్వజనీనం చేయడం – అదీ పరస్పరం విభిన్నాలనిపించే ప్రతీకలతో ఉత్ప్రేక్షలతో సమానార్థాన్ని సాదిస్తూ  మన ముందు ఒక భిన్న పొరలు గల చిత్రాన్ని ఆవిష్కరించడం. హృదయాన్ని మెలితిప్పే అనుభవాన్ని కవితగా  మనలో  భాగం చేసిన కవి  సుధాకిరణ్ ను అభినందించకుండా ఉండలేము. ఈ కవితలో కవి చెప్పిన దానికన్నా యెక్కువగా చెప్పనిదే ఉన్నది – చెప్పని, మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమూ దాని అనుభూతుల పొరలూ ఇంకా అనేకం ఉన్నయి. మనం కవితను నిదానంగా మన ఆలోచనల్లోకి ఇంకించుకున్నప్పుడు మన అనుభూతిలోకి వస్తుందా కొత్తప్రపంచం. కాలం కాటేసిన తలపుల ప్రపంచం –జ్ఞాపకాలు రాలిపోయిన యెండు మోడుల ప్రపంచం.

ప్రేమకి చిరునామా శివలెంక రాజేశ్వరి!

Satyam Vaddu Swapname Kavali Title copy

-కొండేపూడి నిర్మల

~

భావుకత విషయ౦లో మరో రేవతీ దేవి మన శివలెంక రాజేశ్వరి .

మామూలు అంచనాలతో రాజేశ్వరిని  నిర్వచీంచడం చాలా కష్టం . కొంచెం కొత్త చూపు తెచ్చుకోవాలి.  ఆ చూపు బాహ్యా చర్మాన్ని దాటి మనసులోకి ప్రయాణించగలిగి వుండాలి. అ౦త ప్రయత్నం చెయ్యడానికి ఎవరికేం పని ?కాబట్టి పనిలేని వాళ్ళ౦దరూ ఆమెను పజిల్ గానే భావిస్తారు. నా దృష్టిలో రాజేశ్వరి   కొన్ని అక్షరాలు చదివి,అక్షరాలు రాసి, అక్షరాల్ని శ్వాసించి, అక్షరాలా ఈ ప్రపంచం నిరక్షరంగా , నిర్ధాక్షిణ్యంగా  కనిపించి తట్టుకోలేక వెళ్ళిపోయింది.. అసలంత భావుకతని ఏం చేసుకుంటాం కూర వండుకుంటామా, చారు కాచుకు౦టామా అని వాదించే వాళ్ళ మధ్య  అరవై వసంతాలు జీవించింది.  ఇంతకంటే విజయమూ వీర మరణమూ  ఇంకోటి వుందని కూడా నేను అనుకోవడంలేదు. ఎవడో ఒక  గొట్టాం గాడ్ని  తప్పనిసరిగా  పెళ్లి చేసుకోవడం , ఎలాగోలా కాపుర౦ చేసి  , ఎందర్నో అందర్ని కనడం , జీవితాన్ని ఈ రకంగా మూడు ముక్కలు చేసి ఒక్కో  ముక్కనీ ఒక మగవాడి నీడన  బతికేయ్యడం లాంటి  మూసకి భిన్నంగా బతకాలనుకుంది. ఎందుకంటే ఇ౦దులో మనసుకెక్కడ చోటుంది.  గంగిరెద్దు వేషం తప్ప అంటుంది రాజేశ్వరి.

నిజమే కదా జీవితం ఒక సూపర్ బజార్ అయితే ఆక్కడ వున్న వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవడం అనే పని తను చెయ్యలేకపోయింది. అందుకు భారీ మూల్యమే చెల్లించి౦ది.

గమనించారో  లేదో ఇవే మాటలు ఒక మగవాడు చెబితే గొప్ప అనార్కిస్టుగా గౌరవిస్తా౦. ఆడదానిక౦త భావ చైతన్యం వుండటం ఎవరూ సహించరు.  కుటుంబమూ  సమాజము ఒక్కటై గగ్గోలు పెట్టేస్తాయి.

జ్ణాన సముపార్జన కోసం ఇల్లు విడిచిన గౌతముడు ఒక ఆడదిగా పుట్టే అవకాశం ఎప్పుడూ లేదు.

రాజేశ్వరిని మొదటి సారి ఆ౦టే 1980 ప్రాంతాల్లో విజయవాడ రేడియో స్టేషన్లో చూసినట్టు గుర్తు. మధ్యతరగతి ఆడపిల్లలు పబ్లిగ్గా స్వేచ్చ గురించి   మాట్లాడ్డానికే భయపడే  ఎనభయ్యోదశకంలో  రాజేశ్వరి జగ్గయ్యపేట నుంచి ఒక స్నేహం కోసమా ,  కవి పరిచయం కోసమో వచ్చేసి , ఆఖరి బస్సు దాటిపోయి ఏ స్నేహితురాలి ఇంట్లోనో వుండిపోయేది. ఎదుటి మనిషిని తూకంవెయ్యడాలూ , అనుమానించడాలూ తన నిఘంటువులో లేవు. రాజేశ్వరి పసి మనసుకి అద్దం పట్టే ఈ కవిత చూడండి.

“వాళ్ళు గొప్పవాళ్లు సుమా

రుణాలూ వుండవు, ఋణ బ౦ధాలూ  వుండవు ,

అక్ఢరాలా కాపలాలు వుంటాయి.

మనకి మనల్నే   కాపలా పెడతారు

వాళ్ళకి కుటుంబం ఆ౦టే మొగుడు, ఇల్లూ , పిల్లలు

 స్నేహితులు శాశ్వతంగా వుంటారుటండీ అనేస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే,

మనకేమో ఆటోచ్చి ఒక సంతోషం, ఇటోచ్చి ఒక దిగులు ,

 మిణుగురు నుంచీ  కూడా వెలుగు తీసుకోవాల౦టే  నవ్వి పోతారమ్మా.

ఇన్నోసెన్స్ పోగొట్టుకుని ఇ౦టెలిజెట్స్  అయిపోతే ,

చిన్ని నాపొట్టకి శ్రీరామ రక్ష అయిపోతే ,

ఆ ముదిరిపోయిన గిడసబారిన ఇ౦టెలిజెన్స్  మనకోద్దులే తల్లీ ,

ఏదో మన  మానాన మనం  రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతిలోకి తీసుకొందాం

-చాలామ౦దిలాగా  రాజేశ్వరికి కవిత్వం  ఎంబ్రాయిడరీ కాదు . సరాసరి జీవితమే  

1987 అనుకుంటా నేను నందిగామలో వున్నప్పుడు రెండుసార్లొచ్చి నాలుగేసిరోజులపాటు వుండి వెళ్ళింది.  ఇ౦ట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని, అదృష్ట వశాత్తూ తను ఎవరికీ  నచ్చడం లేదని  చెప్పి నవ్వింది. నిజం చెప్పు  నీకే ఎవరూ నచ్చడంలేదు కదా  అంటే, మళ్ళీ నవ్వింది.

“ … అయినా వాళ్ళ పిచ్చి కానీ, మానవ సంబ౦ధాలు సహజంగా ఏర్పడాలి తప్ప ఒకరు వెతికి చూసిపెట్టడమేమిటి అని  విసుక్కుంది. ఇంటికొక అడ్డగడియ వున్నట్టు మెడకొక తాళి వుండాలల్సిందేనంటావా  అని నిలదీసింది. అన్నీ ప్రశ్నలే.

అమ్మాయిలు ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత పిచ్చి వాళ్లకింద జమకడతారు కదా, తను అలాగే కనిపించేది.

 “అసలు తనకి ఏం కావాలో తనకే తెలీదండి  మనల్ని కూడా కన్ ఫ్యూజ్ చేసేస్తుంది. “ అన్నాడు రాజేశ్వరి ఎంతగానో ఆరాధించే ఒక కవి ఆమె పరోక్షంలో . భద్రమైన ఇళ్ళు, ఇల్లాళ్ళు, బ్యాకు లెక్కలూ, షేర్ మార్కెట్ నాలెడ్జీ వున్నవాళ్లకి తనగురించి ఇంతకంటే ఎక్కువ అర్ధంచేసుకునేదేమీలేదు.

1990 లో నేను హైద్రాబాదు వచ్చేశాక అప్పుడో ఫోనూ, అప్పుడో ఫోనూ తప్ప మళ్ళీ కలవడం కుదరలేదు. చివరికి ఆ మబ్బు విడిచి మన్ను చిమ్ముకుని ఒక ఇంటికి అంకితం అవడానిక్కూడా రాజేశ్వరి సిధ్దపడి౦ది

“ వంటిళ్లూ అవసరమే మాసిగుడ్డా అవసరమే , ఎవరి సొంత వంటిల్లు వాళ్ళకి కావాల్సిందే  , సామూహిక వంటశాల కూలినప్పుడు , ఒకానొక కాల్పనికక సిద్ధాంతపు క్రేజీలో వాస్తవం స్పప్నమవుతుంది.

ఆ కాపుర౦లో  ఆవకాయ పచ్చడి కలుపుతున్న వేళ్ళు కళాత్మకంగా , మనోహరంగా కనిపిస్తున్నాయి. అలా చాతకాన౦దుకు  నేనివేళ సిగ్గుపడి చస్తున్నాను. ఎవరయినా అనూచానంగా మింగుతున్న చేదుమాత్రని సుగర్ కోటేడ్ అని చెప్పడమెందుకు , ఇవాళ నాకంటూ ఒక సొంత వొ౦టిల్లు  లేకపోవడం అవమానకరమే, ఇందుకే మొన్న ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను “

మనుషుల్ని విపరీత౦గా ప్రేమిస్తుంది రాజేశ్వరి.  ఎవరి వల్ల అయినా తను గాయపడినా సరే అంతక్రితం వరకూ వారితో వున్న మ౦చి జ్నాపకాలతో బతికేస్తాను అంటుంది.

“………..భావ సారూప్యతలేనే లేని / నీవింత పరిమళ స్నేహంకోసం /మనం మన స్వప్నాలను పోగొట్టుకున్నాం/ ఎలా జరిగిందిది /మాటల మీంచి హృదయం నిండదు /నాకు చాలు ఒక మాట ఒక చూపు, ఒక నవ్వు, ఒక స్పర్శ /పొదరిల్లు కింద దొరికిన ఆ దొంగ చిరునవ్వునేం చేసావు ?/అది వెన్నెలయింది కదా /ఈ మిట్ట మధ్యాహ్నం నువ్వు చూడలేదా …….”

ఇంత కల్తీ లోకంలో, కెరీర్ తప్ప ఇంకేదీ అక్కర్లేని ,  ప్రతిఫలం వుంటే తప్ప చిరునవ్వు అయినా ఖర్చుపెట్టని మనుషుల మధ్య రాజేశ్వరి ఒక మినహాయింపు .

రాజేశ్వరి గురి౦చి  ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా గిల్టీగా వుంది. నేను రాసిన “ఇల్లు ఖాళీ చేసినప్పుడు….”  కవిత చదివి,  మరి ప్రపంచాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో కదా అది రాస్తాను కానీ అస్సలు అనుభ౦లోకి రానివి ఊహించడం కష్టం కదా అంది . మరి ఇన్నేళ్ల తర్వాత అయినా దానిమీద రాసిందో లేదో తెలీదు. నామాడి శ్రీధర్ సేకరించి పంపిన వాటిలో అలాంటి శీర్షికతో ఏదీ కనిపించలేదు కానీ తీవ్రంగా ఆశాభంగం చెందిన ఒక సందర్భాన్ని గురించి మనసు కలచి వేసే కొన్ని వాక్యాలు ఎలా రాసిందో చూడండి..

“ హెలో వున్నారా / ఆహా వున్నాను వున్నాను/మాట్లాడరేం/ మాట్లాడుతున్నాను/ ఇప్పటి నా మాట వినిపించడంలేదేమో / నేను రానా, వద్దు/ మీరు వస్తారా , రాను/ నేను ఖాళీగా వున్నాను ఈవేళ / ఆత్మ చైతన్యమవుతున్నవేళలో నీ ఖాళీ సమయాన్ని నే పూరించలేను/ నీ చిరునవ్వుని నేను కాలేను/ i don’t want tobe fill in the blank please/ సరే ఏం చేస్తున్నారు / పక్షుల ఆశల్ని పాములు మింగేసే హింసాత్మక అసహ్యాన్ని చూస్తున్నాను /ఏమర్ధమయిందేమిటి ? / రేపటి సీతాకొక చిలుకలకోసం /ఈ వేళ అరచేతిలో గొంగళి పురుగుల్నీ సాకడం /

ఉత్తరానికీ ఎలిజీకి పెద్ద తేడా ఏముంది.

మనుషులుగా ఏ ఇద్దరయినా ఏళ్లతరబడి ఎవరి నదుల్లో వాళ్ళూ కొట్టుకు పోతున్నప్పుడు,

కెరటానికి పైన ఉన్నామా , అడుగున వున్నామా అనేది తప్ప ,

ఎవరి జీవన ఘోష అయినా ఈ భీభత్స శబ్దాల మధ్య ఎలా  వినిపిస్తుంది చెప్పు

-ఇది నువ్వు చదవలేని ఉత్తరం . చదివితే పోస్టులో మళ్ళీ కొన్ని పరిమళాలు నాకు అంది వుండేవి.

రాజేశ్వరీ , ఇవాళ నీ కవిత్వం చదివి నిన్ను తలచుకుంటుంటే ఏదో బాధగా వుంది.

ఏది నేరం ?! హజారీబాగ్ కథలు

hajaribagh

 

బి. అనూరాధ పుస్తకం “ఏది నేరం ?! హజారీబాగ్ కథలు” మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఫిబ్రవరి 2016 లో జరిపిన చర్చాసారాంశం. పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, పిన్నమనేని శ్రీనివాస్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వరరావు, భూపతి రాజు ఉష, రుద్రరాజు సుధ, వేములపల్లి పద్మ, ఆరి సీతారామయ్య.

చర్చా సమీక్ష: ఆరి సీతారామయ్య

విరసం ప్రచురించిన ఈ పుస్తకంలో 16 కథలున్నాయి. “కథల వెనుక కథ” అనే శీర్షికతో కథల నేపథ్యం గురించి రచయిత్రి వివరంగా రాశారు. ముందు ఈ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం.

డిగ్రీ వరకూ చదివిన అనూరాధ కొంతకాలం  బాంక్ లో ఉద్యోగం చేశారు. 1990 లో పౌరహక్కుల సంఘంలో చేరి కార్యకర్తగా పనిచేశారు. 1993 నుండి మహిళా సమస్యలపై పనిచెయ్యడం మొదలుపెట్టారు. చైతన్య మహిళా సమాఖ్య / సంఘం లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 2006 నుండి బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నారీ విముక్తి సంఘ్ వారితో పనిచేశారు. ఝార్ఖండ్ లో ఆదివాసీలు “మావోయిస్టు సిద్ధాంత మార్గదర్శకత్వంలో” మైనింగ్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు.

ఏపిఎస్‌ఐబి వారు 2009 అక్టోబర్లో రచయిత్రిని పాట్నాలో అరెస్ట్ చేసి, నాలుగు రోజులు  అజ్ఞాతంగా నిర్బంధించి, తర్వాత ఝార్ఖండ్లో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆగస్ట్ 2013 వరకూ ఆమెను ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్ర కారాగారంలో ఉంచారు. తను రాజకీయ ఖైదీనని రచయిత్రి రాసుకున్నారు.

మన సమాజంలో “సంపన్నులు చెప్పిందే న్యాయం”. “దానిని  కాపాడేది రాజ్యం.” ప్రజాస్వామ్యం పేరిట ధనస్వామ్యం చలామణీ అవుతుంది.” “దోపిడీ సమాజంలో ఏ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ విడిగా ఉండవు. ఈ సమాజాన్ని ప్రస్తుతం పీడిస్తున్న భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, వారికి ఊడిగం చేస్తున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావడానికి నేను ఎంచుకున్న రంగం మహిళారంగం. దానికే పరిమితం కావాలని కూడా అనుకోలేదు. అంతిమంగా కమ్యూనిస్టు సమాజంలోనే మనిషిని మనిషి దోచుకోగలిగే పరిస్థితి అంతరిస్తుందనేదే నా స్పష్టమైన అవగాహన.” ఇవి అనూరాధ రాజకీయాభిప్రాయాలు.

మన సమాజం ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ధనస్వామ్యం అనేది నిస్సందేహం. రచయిత్రితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మన రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, పొలీసు వ్యవస్థలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి. వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచెయ్యవచ్చు, కాని వారి అధికారానికి ప్రమాదం లేనంతవరకు మాత్రమే. ప్రమాదం రావచ్చు అనుకుంటే వ్యవస్థ ఎన్‌కౌంటర్లు జరిపిస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ముమ్మాటికీ నిజం.

కానీ, దీనికంతటికీ విరుగుడు కమ్యూనిజం అని రాశారు రచయిత్రి. వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో మావోఇస్టు మార్గాన్ని ఎంచుకున్నారు కూడా. కమ్యూనిస్టు సమాజాల్లో, మావోఇస్టు మార్గంలో ప్రజాస్వామ్యం ఉందా? లెనిన్‌, మావో, స్టాలిన్‌, పోల్ పాట్‌లు వారి వ్యతిరేకులను ఏం  చేశారు?   అంటే ధనస్వామ్యంలోనైనా కమ్యూనిజంలోనైనా అధికారానికి ప్రమాదం వస్తే పాలకులు సహించరనే కదా పాఠం. వారికి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని మావోఇస్టులు ఏం చేశారు? అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న మావోఇస్టులు ఇప్పుడే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక అధికారంలోకి వస్తే వారు ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తారా?

కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానావకాశాలు ఉండేలా చూడడం ప్రజాస్వామ్య లక్షం. ఆ గమ్యానికి చేరడానికి మిలిటెంట్ మార్గాలు చేపట్టిన వారు (రష్యా, చైనా) చాలా సాధించారు. కాని సాధించిన మార్పులను ఆ సమాజాలే తిరస్కరించాయి. సోవియట్ యూనియన్‌, చైనాల్లో జరిగిన దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోకుండా అదే దారిన మళ్ళా ప్రయాణం చేద్దామనడం అవివేకం కాదా?

“సంఘటితంగా చేసే ఈ పోరాటాలు ప్రజలలో మిలిటెన్సీని, చైతన్యాన్నీ పెంచుతాయి” అని రాశారు రచయిత్రి. చైతన్యాన్నీ, మిలిటెన్సీనీ పెంచుతాయని రాస్తే కొంత సబబుగా ఉండేదేమో. అయినా సంఘటితంగా చేసే పోరాటాలు మిలిటెంట్ గా ఉండనవసరం లేదు. స్త్రీవాద ఉద్యమం ఉదాహరణగా తీసుకుందాం. చైతన్య  వంతులైన  స్త్రీలు  వోటింగ్ హక్కుకోసం, కుటుంబ నియంత్రణ కోసం, సమాన జీతాల కోసం పోరాడారు. పోరాడుతున్నారు. ఈ  పోరాటాలు మిలిటెంట్ గా జరగలేదు, జరగడం లేదు. కానీ ఎంతో మార్పును తేగలిగాయి. అంటే చైతన్య వంతులైన వారంతా మిలిటెంట్ లు కానవసరం లేదు అనే కదా? మావోఇస్టులు మిలిటెన్సీని  చైతన్యం గా  భ్రమపెడుతున్నారు. దూరంగా ఆలోచించలేనివారు నమ్మేస్తున్నారు.

ఈ పుస్తకానికి శీర్షిక “ఏది నేరం?!” వ్యవస్థ చేస్తుంది నేరమా? దానికి వ్యతిరేకంగా పోరాడటం నేరమా?  రచయిత్రి దృష్టిలోలాగే మా దృష్టిలో కూడా వ్యవస్థదే నేరం, నిస్సందేహంగా. ఎలెక్షన్లు  జరుగుతున్నా  మన  ప్రభుత్వాలు  (ఇండియాలోనూ,  అమెరికాలోనూ) ప్రజల  చేతుల్లో  లేవనేది  నిస్సందేహం. కానీ వాటికి  వ్యతిరేకంగా  ప్రజాస్వామ్యం  కోసం  జరిగే  పోరాటాలు  ప్రజాస్వామికంగా, పోరాట  ఫలితాలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా జరగాలి. ప్రజాస్వామ్య పోరాట  మార్గాలమీద అన్వేషణ జరగాలి. ఇది వరకు జరిగిన తప్పులు మళ్ళా జరక్కుండా చూసుకోవాలి.  అలా కాకుండా ఊరికే  “ప్రజాస్వామ్య”  అని  పేరు  పెట్టుకున్నంత  మాత్రాన ఏ అప్రజాస్వామ్య  సంస్థనూ నమ్మే దశలో లేరు ప్రజలు.

*

ఇక కథల గురించి.

కథా, కథనం, భాషా, అన్ని విధాలా ఈ పుస్తకంలోని  కథలు మంచి కథలని చెప్పుకోవచ్చు. సులభంగా చదివించిన కథలు. తల్లులతోబాటు జైల్లో ఉంటున్న చిన్న పిల్లల గురించి రాసిన రెండు కథలు, “బేబీస్‌ డే అవుట్”, “చందమామని చూడని వెన్నెల,” మా అందరికీ ఎంతగానో నచ్చాయి. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియకుండా పెరుగుతున్న ఈ పిల్లల గురించి ఎంతగానో విచారిస్తూ రాసినా, పిల్లల సహజ ప్రవర్తనను, మాటల స్థాయినీ, అనుభవాలనూ చక్కగా ఆవిష్కరించారు రచయిత్రి.

“చందమామని చూడని వెన్నెల” కథలో “కానిచోట కాసావే వెన్నెలా, కారడవుల కాసావే వెన్నెలా,” పాట గురించి రాస్తూ, “అడివిలోనే పుట్టి పెరిగి అడివినే ఇళ్ళుగా చేసుకున్న వాళ్ళు”  కూడా  ఉన్నారన్న విషయాన్ని మరిచో, పట్టించుకోకనో, “అడవి కాచిన వెన్నెల” లాంటి సామెతలను వాడే వారిని సున్నితంగా ఖండించారు. “మనుషులు లేని అడవిలోనయినా ఎన్నో జీవాలూ, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు! సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే సాంత్వన కలగజెసే చందమామ మీద హక్కు ఎ ఒక్కరిదో ఎలా అవుతుంది?” అని గొప్ప భావుకతతో ప్రశ్నించారు రచయిత్రి.

మంచి కథ రాయడానికి సూక్ష్మమైన పరిశీలనా స్వభావం సహకరిస్తుంది. “మున్నీ బద్‌నామ్‌ హుయీ” కథలో ఈ సన్నివేశం చూడండి. “నాకేం అర్థం కాలేదు. ఎందుకంత భావోద్వేగం కలిగిందామెకు? అని ఆశ్చర్య పోయాను. నా ఆశ్చర్యం గుర్తించి, చెప్తాను అనబోయింది కానీ, గొంతు గాద్గదికంగా అయిపోయింది. దానిని దగ్గు వెనక దాచేసి, గబుక్కున నవ్వేసింది. అయినా ఒక కంటినుండి బుగ్గమీదకు సగం వరకు ఒక కన్నీటి చుక్క జారిపడింది. జుట్టు వెనక్కి తోసుకుంటూ దానిని రెప్పపాటులో తుడిచేసింది. నేనుకూడా గమనించనట్టే ఊరుకొన్నాను. మంచినీళ్ళ సీసా తీసి నేను ఒక గుక్క తాగి, యథాలాపంగా అందించాను. తాను ఒక గుక్క తాగి, గలగల నవ్వేసి అంతకు కొన్ని క్షణాల ముందు ఉన్న మున్నీ ఆమేనా కాదా అని నాకే అనుమానం వచ్చేలా ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.” ఎంత  అద్భుతంగా రాసారో కదా! మనుషుల మానసిక స్థితిని అంత సూక్ష్మంగా పరిశీలించి రాయగలగడం గొప్ప విషయం.

ఈ కథలు “భారతీయ జైళ్ళలో ఉన్న అమానవీయ పరిస్థితి” ని అందరి దృష్టికీ తీసుకురావాలనే ఉద్దేశంతో  రాసినవి. “జైలును నేను బయటనుంచీ లోపల నుంచీకూడా చూశాను. ఆ బయటా – లోపలికీ మధ్య ఉన్న దూరం మాత్రం అనంతం. ఆ దూరాన్ని తగ్గించగలిగితే అప్పుడు ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు,” అనీ రాశారు. ఈ కథల్లో ఒక్క హజారీబాగ్ జైలు గురించి మాత్రమే రాశారు కాబట్టి దేశంలోని ఇతర జైళ్ళలో పరిస్థితుల గురించి పాఠకులకు తెలిసే అవకాశం లేదు. కానీ రచయిత్రి ఆవిష్కరించిన జైలు జీవితం ఆధారంగా హజారీబాగ్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయనిపించదు. దీని గురించి తర్వాత మరోసారి ప్రస్తావిస్తాను. బయటికీ జైలు లోపలికీ ఉన్న దూరాన్ని తగ్గించ గలిగితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లే అన్నారు రచయిత్రి. అంటే జైలుని బయటి సమాజం స్థాయికి పైకితీసుకురావాలనేకదా? అంటే బయటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నదనే కదా? అలా అయితే సమాజంలో ప్రజాస్వామ్యం లేదు, కమ్యూనిజం మావో ఇజం రావాలి అని ఇంతకు ముందు చెప్పిన అభిప్రాయాలు మర్చిపోయినట్లున్నారు రచయిత్రి.

ఇవి  జైల్లో స్త్రీల విభాగంలో ఉన్న వారి కథలు.  ఒక స్త్రీ జైల్లో ఉందంటే ముందు ఆమె నేరం చేసి ఉండాలి. లేక ఆమె మీద నేరారోపణ జరిగి ఉండాలి. పొలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయ వ్యవస్థ దాని మీద విచారణ జరిపి,  ఆమె నేరం చేసిందని నిర్ణయించి శిక్ష వేసింది. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది.  అంటే సమాజం, పొలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ, జైలు – ఈ నాలుగు వ్యవస్థలకూ ప్రతి కేసులోనూ కొంత బాధ్యత ఉంటుంది. అనూరాధ కథల్లో ఉన్న పాత్రలను తీసుకుని ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాయో చూద్దాం.

మొదట సమాజం ఎలావుందో చూద్దాం. ఈ కథల్లో ఒక 14, 15 సంవత్సరాల అమ్మాయిమీద అత్యాచారం జరిగింది. ఆమె గార్డియన్లు ఆమెకు అండగా నిలబడలేదు. ఒకమ్మాయికి బాల్య వివాహం జరిగింది. భర్త ఆమెను తాగొచ్చి చితగ్గొట్టేవాడు. మరోమార్గం లేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బలవంతులు బలహీనుల మీదా, పేదలమీదా నేరారోపణ చేసి కేసులు పెట్టిన సందర్భాలు రెండుమూడు కథల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలకు ఎలాంటి మానవహక్కులూ ఉండవు. వాళ్ళకు సమాజంలోకంటే జైల్లోనే ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుంది. ఒంటరిగా సమాజంలో బ్రతకటంకంటే జైల్లోనే భద్రత ఎక్కువ కాబట్టి బెయిల్ వచ్చినా జైల్లో ఉంటుంది ఒకామె. దేశంలో ఒకచోట ఉన్న ఆచారాలు (భర్త చనిపోయిన స్త్రీ మరిదిని పెళ్ళి చేసుకోవడం లాంటివి) మరోచోట నేరాలుగా పరిగణించబడతాయి.

న్యాయ వ్యవస్థ ప్రవర్తన: ఈ కథల్లో ఉన్నంత వరకూ న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యలోపం కేసులను విచారించడంలో జరుగుతున్న జాప్యం. ఈ కారణంగా నేరం చెయ్యని వారు కూడా చాలా  సంవత్సరాలు జైల్లో ఉండడం జరుగుతుంది.

పొలీసు వ్యవస్థ: అకారణంగా అరెస్ట్ చెయ్యడం, అరెస్ట్ చేసిన వారిని సకాలంలో మేజిస్ట్రేట్ ముందుకు తీసుకు రాకపోవడం, లంచాలు తిని నేరస్తులను అరెస్ట్ చెయ్యకపోవడం, ఇవీ ఈ కథల్లో ఉన్న వివరాలు.

ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కథలన్నీ జైలు గురించి రాసినవి కాబట్టి ఈ వ్యవస్థ గురించి ఎక్కువ వివరాలున్నాయి.

ఖైదీలు పగలంతా  జైలు ఆవరణలో ఎక్కడైనా ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సాయంత్రం అందరినీ లెక్కపెట్టి లాకప్లో ఉంచుతారు.

జైలు శుభ్రంగా ఉంటుంది.

ఖైదీలు వారికి చేతనయిన పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకావిడ స్వెట్టర్లు అల్లి అమ్ముకుంటుంది.

బయటి సమాజంలోకంటే “ఇక్కడ చాలామంది స్త్రీలు స్వేచ్ఛగా ఉంటారు.”

నియమాల ప్రకారం జైల్లో వంటా మంటా నిషేధం. కాని రెండూ జరుగుతూనే ఉంటాయి. అధికారులు చూసీచూడనట్లు పోతుంటారు.

ఐదు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తల్లితో జైల్లో ఉండవచ్చు. ఆ తర్వాత బయట బంధువులదగ్గరో, శిశు సంక్షేమ శాఖవారి ఆధ్వర్యంలోనో ఉండాలి. కాని పది సంవత్సారాలు దాటిన పిల్లలుకూడా జైల్లో ఉన్నారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తూంటారు.

జైల్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే, రచయిత్రి కథల నేపథ్యంలో  ఆరోపించిన అమానవీయత మాకు కనపడలేదు. రచయిత్రి చెప్పినదానికీ, చూపించినదానికీ పొంతన లేదు.

మా అందరినీ ఆశ్చర్య పరిచిన సంఘటన “పేదింటిపొగ” కథలో జరిగింది. ఉష, ఆశ జైల్లో పడకముందు ఉద్యోగాలకోసం (డి ఆర్ డి ఎ లో) ఒక పరిక్ష రాశారు. జైల్లో పడిన తర్వాత ఒక రోజు వారి తమ్ముడు ఫలితాలు వచ్చాయనీ, ఇద్దరూ పాసయ్యారనీ, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎల్లుండనీ కబురు పంపాడు. ఇంటర్వ్యూలు టౌన్లో. పరిక్షల ఫలితాలుగానీ, ఇంటర్వ్యూకు కావాల్సిన సర్టిఫికేట్లుగానీ ఆ అమ్మాయిలదగ్గర లేవు. ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే, జైలు అధికారి ఒప్పుకోవాలి, కోర్టు  అనుమతికి దరఖాస్తుపెట్టుకోవాలి, పొలీసువారు ఎస్కార్టు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోవాలి. ఇదంతా ఎల్లుండిలోగా జరగాలి. ఇదంతా బయటి సమాజంలో జరగడమే ఎంతో మందికి లంచాలుపెడితేగాని జరగని పని. కాని జైల్లో ఉన్న ఈ అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్ళారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, సమయానికి బెయిల్ మంజూరయి ఆ అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా వీలయ్యేట్లు చేసిన జైలర్‌ని అభినందించకపోగా, అంతా సక్రమంగా జరగడానికి కారణం జైలర్ కి ఉన్న కీర్తి కండూతి అని అభిప్రాయపడ్డారు రచయిత్రి.

ఈ జైల్లో 100-125 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్నారు. ఇక్కడి కథల్లో పరిచయమైన పదిమందిలో ఎక్కువభాగం నేరాలు చేసినవారు కాదు, నేరం మోపబడి అన్యాయంగా జైల్లో ఉన్నవారు. ఈ పదిమందీ కాక మిగతా వారిలో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వారు ఎంత శాతం ఉంటారో చెప్పలేము. రచయిత్రి  ఎక్కడా వారి గురించి చెప్పలేదు. అందువల్ల జైల్లో ఉన్న స్త్రీలలో ఎక్కువభాగం అమాయకులు అనే అభిప్రాయం పాఠకులకు కలగవచ్చు. నిజానిజాలు ఈ పుస్తకం ద్వారా తెలిసే అవకాశం లేదు.

ఖైదీలు మాట్లాడేటప్పుడు వారి భాష అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు శకున్‌ మాటలు చూడండి (పేజీలు 30-31):  “మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చాచా, చాచీ నా పెళ్ళి చేసేశారు. ఎంత కాలం పోషిస్తారు? పెళ్లయితే ఇంక ఆళ్ళే చూసుకొంటారు కదా!” ఇలా మాట్లాడిన శకున్‌ వెంటనే మరో భాషలో మాట్లాడటం మొదలు పెడుతుంది: “మస్తు తాగుతడు. నన్ను చాలా కొట్టేది. — రోజూ తాగేది. నాకు ఇద్దరు పిల్లలయ్యింరు.” ఆ వరుసలో అన్న మాటల్లో,  “కొట్టేవాడు”, “కొట్టిండు”, “చచ్చిపోయిన్రు”  అంటుంది. ఈ ఉత్తరదేశం స్త్రీ మాటలకు తెలుగు మాండలీకాల అతుకులు ఎందుకు పెట్టారో, అదీ నిలకడగా ఒక భాషో యాసో కాకుండా ఒక యాసమాలిక ఎందుకు ఎల్లారో తెలియదు. ఇది ఒక్క శకున్‌ విషయంలోనే కాదు, మిగతా పాత్రల విషయంలోకూడా ఇలాగే చేశారు.

ఈ పుస్తకం శీర్షిక “ఏది నేరం?!”, ఉప శీర్షిక “జైలు కథలు”. జైల్లో ఉన్న వారు నేరం చేశారో లేదో నిర్ణయించేది జైలు వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థ. పైగా ఈ కథల్లో జైలు వ్యవస్థ సమాజం కంటే, న్యాయవ్యవస్థ కంటే, పొలీసు వ్యవస్థకంటే మెరుగ్గా పనిచేస్తుందనిపిస్తుంది. రచయిత్రి చూపించదల్చుకున్న అమానవీయత నిష్కారణంగా, చట్ట విరుద్ధంగా అరెస్త్ చేస్తున్న పొలీసు వ్యవస్థలో,   సంవత్సరాలతరబడి విచారణ జరపకుండా జైల్లో ఉంచుతున్న న్యాయవ్యవస్థలో, అయినదానికీ కానిదానికీ బలహీనులమీద కేసులు పెడుతున్న సమాజంలో ఉన్నంతగా జైలు వ్యవస్థలో కనబడదు.

*

జీవితంపై ప్రేమను పెంచే జయకాంతన్

 

 

– సి.ఎస్. రాంబాబు

~

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో సాహిత్య సభలే కాకుండా ప్రతి ఆదివారం ఒక సాహిత్య సమావేశాన్ని జరుపుకునే ఒక సత్సాంప్రదాయం ఒకటి మొదలయింది. అదొక శుభ పరిణామం. గత పదకొండు నెలలుగా ‘ఛాయ’ సంస్థ ప్రతినెలా మొదటి ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలు కొత్త తరహాలో ఉంటూ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో ! సమావేశానికి వారెంచుకునే అంశాలే దానికో ప్రాతిపదికను కల్పిస్తున్నాయి.

ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో తమిళ రచయిత ‘జయకాంతన్’ కధలపై సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఎవరు సమర్ధులు అంటే జయకాంతన్ గారితో సన్నిహిత సంబంధం కలిగిన సాహితీవేత్త మధురాంతకం నరేంద్రని మించిన ఛాయిస్ మరొకరుండరేమో ! ఎప్పటిలాగే సమావేశానికి సబంధించి ఒక చక్కటి పోస్టర్ ని డిజైన్ చేయించారు ‘ఛాయ’ సంస్థ వారు. చర్చనీయాంశమెంత ఆసక్తిగా ఉందో చూడండి … నేనేం చేయను చెప్పండి … మరికొన్ని విశేషాలు’

కధను సీరియస్ గా తీసుకునే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో జయకాంతన్ ను ఏదో ఒక రకంగా వంట పట్టించుకున్నవారే. ఇతర భాషలలో కూడా ఎంతో గౌరవాన్ని పొందిన రచయిత జయకాంతన్.

జయకాంతన్ గారి కధలను తొలిసారిగా తెలుగులో అనువదించిన వ్యక్తి మా నాన్న మధురాంతకం రాజారాం అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టారు మధురాంతకం నరేంద్ర. 1975 ప్రాంతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆ పనిని మా నాన్న కప్పగించారు. అప్పటికే వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఒక విధంగా జయకాంతన్ అనువాదానికి అంత తొందరగా లొంగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా నాన్న అనువదించారు. మా నాన్న తొలి అనువాదకుడయితే నేను తెలుగులో జయకాంతన్ రచనల తొలి పాఠకుడిని. అప్పటికి నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. ఆ పద్దెనిమిదేళ్ళ నవ యువకుడిని ఉత్కంఠంతో మరో ప్రపంచంలోకి లాక్కుపోయిన కధలివి.

ఒక విధంగా నాకు బాల్య స్మృతి వారి రచనలు చదవటం.

200 కధలు, 40 నవలలు, 4 సాహిత్య వ్యాసాల సంకలనాలతో జయకాంతన్ సాటి రచయితలందరూ అసూయపడేంతగా రాసిన వ్యక్తి. 1932వ సంవత్సరంలో కడలూర్ లో పుట్టిన జయకాంతన్ ని ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది. ఈ ఒక్క మాట మీకు చెప్పి వారి కధలను కొన్ని మీకు పరిచయం చేస్తాను.

జయకాంతన్ గారి నవలలు కొన్నింటిని సినిమాలుగా చేయటం జరిగింది. అలాంటి ఒక నవల ‘ఒరు నడిగ్తే నాడిగం పాకులాం’. ఇది సినిమాగా వచ్చిన వారి నవల. ఐదు నిముషాల నిడివి వున్న ఒక దృశ్యం చూడగానే నవలే చదువుదామనిపించింది. ఆ నవలను ఒక మిత్రుడు అనువాదం చేశాడు. తెలుగులో దాని పేరు “కళ్యాణి వెడ్స్ దివాకరం”. వారి నవలకు వారు పెట్టిన పేరును తెలుగులో చెప్పాలంటే ‘ఒక నటి నాటకం చూస్తోంది’ ఎంత బావుందో చూడండి.

ఆ అనువాద మిత్రునితో కలసి నేను కూడా మద్రాసు (చెన్నై) వెళ్లి జయకాంతన్ గారిని కలవడం జరిగింది. మా ప్రయత్నం వారిని ఇంటర్వ్యూ చేయాలని. వారిదో మధ్యతరగతి ఇల్లు. పైన ఒక చిన్న పాక వేసుకుని వున్నారు వారు. ఆయన అక్కడే కూర్చుని రాసే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు పక్కన టీ కొట్టులా వుంది వారిల్లు. దేన్నీ దాచుకోవడం వారి జీవితంలో లేదు. మాడు గంటల సేపు వారితో గడిపాం.

వారితో అలా అంత సేపు మాట్లాడిన తర్వాత వారి కథల మీద గౌరవం పెరిగింది. గళ్ళ చొక్కా, లుంగీ ఇదీ వారి డ్రెస్ కోడ్. అరమరికలు లేకుండా మాతో ఎన్నో విషయాలు మాట్లాడాడాయన. మాతో మాట్లాడినంత సేపూ మీసాన్ని తిప్పుతూనే ఉన్నాడాయన. మీసమున్న కధా వీరుడనిపించాడు నాకు.

నాలుగు నెలల క్రితం కృష్ణమోహన్ గారు, అనిల్ బత్తుల గారు ఫోన్ చేసి మీరు ‘ఛాయ’ సంస్థలో జయకాంతన్ గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు మళ్ళీ రీ-రీడింగ్  చెయ్యగలిగే అవకాశం వచ్చిందని ఆనందపడ్డాను. వారి కధల్ని చదువుకోవటమంటే మనల్ని మనం చదువుకోవటమే. ఆయనొక సార్వజనీన రచయిత. ఈ పుస్తకంలో 16 కధలున్నాయి. అన్నీ మోడరన్ ఉపనిషత్తు కధల్లా వుంటాయి.

ఇలా జయకాంతన్ కధల గురించి వారితో పరిచయం గురించి కొన్ని పరిచయ వాక్యాలు మాట్లాడి మధురాంతకం నరేంద్ర వారి ప్రసంగాన్ని రెండు భాగాలుగా కొనసాగించారు. మొదటి భాగంలో వారు కధలని విశ్లేషిస్తూ వెళ్లారు. ఆ తర్వాతి భాగం జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ లేదా పరిశీలనలతో సాగింది. ఒక స్రష్ట చూసిన ప్రపంచం తెలియాలంటే జయకాంతన్ పుస్తకాలు చదవాలంటారు నరేంద్ర.

వారు విశ్లేషించిన కధలలో మొదటిది ‘గురుపీఠం’. ఒక సత్రంలో ఒక బిక్షగాడు. పశుప్రాయుడు. నిత్యం ఎవరు ఏది పెడతారా అని ఆశగా చూసేవాడు. పాచిపోయిన ఆహారం తప్పితే మరొకటి తెలియని వాడు. నిత్యం పుసులు గట్టిన కళ్ళతో వుండే వాడికి ఒకరోజొక ఆకారం నమస్కారం చేస్తుంది. మీరేనా గురువంటుంది. అలా ఆ ఆకారం నేను మీ శిష్యుడిని అని ఈ బిచ్చగాడు ఏది చెప్పినా దాన్నో అధ్బుతంగా భావిస్తూ ఉంటాడు. బిచ్కగాడు ఆకాశంకేసి చూస్తూ వుంటే ఆకాశం శూన్యమని ఎంతబాగా సెలవిచ్చారంటాడు. పాచిపోయిన ఆహారం తినేవాడికి పులిహోర, దద్దోజనం పట్టుకొస్తాడు. క్రమంగా గురువు ఖ్యాతిని పెంచుతాడు. ఎవరు ఎవరికి శిష్యుడు అన్న అనుమానం ఈ బిచ్చగాడికి వస్తుంది. గురుస్థానంలో కూర్చొన్న బిచ్చగాడికి ఒకరోజున శిష్యుడు కనిపించటం మానేస్తాడు. గురు స్థానంలో తనని కూర్చోపెట్టిన ఆ శిష్యుడి పేరేమిటో తెలియదు. వాడి కోసం వెతుకుతూ ఉంటాడు.

ఇలా గురుపీఠం కోసం మనం ఎలా సిద్ధంగా చెబుతాడు జయకాంతన్.

అగ్నిప్రవేశం : సీత పేరు తీసుకురాకుండా ఆధునిక స్త్రీ రోజూ చేసే అగ్నిప్రవేశం గురించి చెబుతాడు జయకాంతన్. ఒక విధంగా చెప్పాలంటే జయకాంతన్ వన్నీ నవలికల్లాంటి కధలు. ఒక స్త్రీ బస్సు కోసం ఎదురుచూస్తోంది. భోరున వర్షం. సడన్ గా ఒక కారొచ్చి ఆగుతుంది. ఒక అపరిచితుడు ఆమెను కారులో తీసుకువెళతాడు. ఆ కారంటే ఆమెకు ఎంతో ఆకర్షణ కలుగుతుంది. అక్కడేం జరుగుతుందో జయకాంతన్ స్పష్టంగా చెప్పడు. కానీ జరగకూడనిదేదో జరిగిందని మనకు అర్ధమవుతుంది. ఆ వ్యక్తే ఆమెను ఇంటికి దూరంగా దింపేసి వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకోగానే తల్లి మీద పడి ఏడుస్తుంది. తల్లి ఏమీ మాట్లాడకుండా బాత్రూంకు తీసుకెళ్ళి నాలుగు బకెట్ల నీరు కూతురిపై కుమ్మరిస్తుంది. నీకేం జరగలేదంటుంది.

జయకాంతన్ గొప్పదనం ఎక్కడుంటుందంటే ఒక కధలో చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, తెలిసే చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, సార్వజనీన విషయాలుంటాయి అన్న భావన మనకు స్ఫురింపచేస్తాడు. ఈ కధలో నయాసంపన్న వర్గం పై మనకున్న మోజును పరిచయం చేస్తాడు.

ఎవరి ఆంతర్యం వారిదే : ఈ కధలో ఒక ప్రొఫెసర్, ఆయన భార్య పల్లెటూరిలో తాతా, నాయనమ్మల దగ్గర పెరిగే వారబ్బాయి మనకు తారసపడతారు. పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు ఆ కొడుకు. తండ్రి ఎవరో ఒక స్త్రీతో తిరగడం చూస్తాడు. కొంత నిఘా పెట్టి రెడ్ హాండెడ్ గా పట్టుకుంటాడు. నువ్వు చేసేది తప్పని తండ్రికి హితబోధ చేస్తాడు. విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పుడా తల్లి మీ నాన్న జీవితం మీ నాన్నది, నా జీవితం నాది, ఎవరి ఆంతర్యం వాళ్ళది, నువ్విక్కడినుంచి వెళ్లిపో అంటుంది. సంప్రదాయం, విలువలు గురించి చెప్పబోయిన ఆ కుర్రవాడు ఒక ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.

భార్యా, భర్త ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆయన సిగ్గుగా నవ్వుతాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు వారి ఆంతరంగిక విషయాలు అంటాడు జయకాంతన్. ఇలా ఒక చిన్న ముగింపు వాక్యంతో మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు జయకాంతన్.

ఆత్మదర్శనం : 70 – 80 ఏళ్ల సాంప్రదాయ బ్రాహ్మణ తండ్రి ఒకరోజు ఇంట్లోంచి మాయమయిపోతాడు. సరే తండ్రి కోసం కొడుకు వెతకటం మొదలు పెడతాడు. ఈలోగా తండ్రొక ఉత్తరం రాస్తాడు నువ్వు చెప్పే మంత్రాలకు అర్ధం నీకు తెలుసా అని మా గురువు గారు బజారులో నన్ను నిలదీశాడు అని. అవమానం ఫీలయి జంధ్యం తీసేసి ఆ ముసలాయన వెళ్లిపోతాడు. ఇది మన చేత జయకాంతన్ చేయించే ‘ఆత్మ దర్శనం’

పొరపాట్లు నేరాలు కావు : నాగరాజు అనే ధనవంతుడి దగ్గర కేథరిన్ అనే స్టెనో పనిచేస్తూ వుంటుంది. నాగరాజు ఇంట్లోనే కన్నయ్య అనే మిత్రుడు ఉంటూ ఉంటాడు. కేథరిన్ చనువును అపార్ధం చేసుకుంటాడు నాగరాజు. ఆ ఆమ్మాయి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని క్షమించమంటాడు. మీలో మా నాన్నను చూసుకున్నాను అంటుందా అమ్మాయి. ఈలోగా కన్నయ్య ఒక ఐదువందల రూపాయలు కొట్టేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తిరిగొచ్చేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి నేనెందుకు ఈ పని చేశానో తెలీదు, క్షమించు అంటాడు. స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అయిన ఆ ధనవంతుడు ‘క్షమింపబడిన వాళ్లే క్షమిస్తారు’ అని అన్నాడని కధను ముగిస్తాడు జయకాంతన్. ఇలా ముగింపు వాక్యంతో కధను నిలబెడతాడు జయకాంతన్.

మూతబడిన ఇల్లు : తను ఏం చూసినా కధగా మలచగలిగే శక్తి జయకాంతన్ ది. ఒక ఆల్కెమీ ఏదో ఆయనకు తెలుసు. ఒక పాత ఖైదీ శిక్ష అనుభవించిన అనంతరం ఒక ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఎవరూ అతన్ని ఆదరించరు. ఒక నాలుగేళ్ల పిల్ల మాత్రం అతనితో కబుర్లు చెబుతూ ఉంటుంది. ఆ పిల్లకి అతను చాక్లెట్లు అవి కొనిపెడుతూ ఉంటాడు. చివరికి అతను ఈ నిరాదరణ భరించలేక అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆ ఇంట్లోకి తొంగి చూస్తూ వుంటుంది అని జయకాంతన్ కధని ముగిస్తాడు.

మౌనం ఒక భాష : ఇదో చదివితీరవలసిన కధ. అరవై ఏళ్ల వయసులో గర్భం దాల్చుతుందో స్త్రీ. పిల్లలకి పిల్లలు వచ్చే ఈ వయసులో ఈ ఖర్మేమిటి అని బాధపడుతూ వుంటుంది. అప్పుడు కొడుకు తల్లిని ఇంట్లో ఉన్న పనసచెట్టు దగ్గరకు తీసుకు వెళతాడు. పనస చెట్టు మొదళ్ళ దగ్గర కూడా కాయలు కాస్తుంది అని ఓదారుస్తాడు. నువ్వు సిగ్గుపడాల్సిన విషయం కాదమ్మా అంటాడు.

కొత్త చెప్పులు కరుస్తాయి : అతనికి కొత్త భార్య వచ్చింది. కానీ ఆ భార్య అనుకూలంగా లేదు. పెళ్ళయి ఆర్నెల్లు కాలేదు పెడముఖంగా ఉంటుంది. అతను వెళ్ళిపోతే హాయిగా ఫీలవుతూ ఉంటుంది. అతనది అవమానంగా భావిస్తాడు. పాత స్నేహితురాలు గుర్తుకు వస్తుంది. పెళ్ళికి ముందు ఆ స్నేహితురాలుతో కాలం కలిసి ఉంటాడు పెళ్లి మీద ప్రేమ పుట్టిస్తుందావిడ. మళ్ళీ ఆవిడని చూద్దామని వెళతాడు. తన గోడు చెప్పుకుంటాడు. నీ భార్యకు సంసారానికి అనుభవం లేదు నాకనుభవం వుంది అంటుంది. కొత్త చెప్పులు కరుస్తాయని పాత చెప్పులే వేసుకుంటామా అంటుంది. ఆవిడ వంక చూసి అతను భోరుమని ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడో ఆలోచించమంటాడు జయకాంతన్. మానసిక సంఘర్షణలను ఒక్క మాటలో రాస్తాడు జయకాంతన్ అంటాడు నరేంద్ర.

ఇలా కధలను విశ్లేషించి జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ ఆ రోజు సభలో సభికుల ముందుంచారు. కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

జయకాంతన్ తనదయిన శైలిలో traditional పధ్ధతిలో కధలు చెబుతాడు. వారి కధలలో విశ్వాసాలుండవు. చిన్న విషయాన్ని కూడా పెంచుతూ రాయటం ఆయనకలవాటు. ఆయనో ప్రొఫెషనల్ రైటర్. కధని నవలగా, నవల నుంచి మరో నవలను సునాయాసంగా మలిచేవాడు.

ఎక్కడ దృశ్యమానం చేయాలో తెలిసినవాడు. కధలో కధ చెప్పే వ్యక్తి tone మాత్రమే విన్పిస్తాడు. అయితే 60, 70 దశకాలలో రాసినవి కాబట్టి నిడివి ఎక్కువే ఉంటుంది. అలంకారాలేవీ లేకుండా లిరికల్ గా కధలు రాస్తాడు జయకాంతన్. కధలోని ముగింపుతో ఒక effect సాధించడం ఒక్క జయకాంతన్ కే సాధ్యం.

హృదయాన్ని, మేధస్సును సమన్వయపరుస్తూ రాయటంలో జయకాంతన్ సిద్ధహస్తుడు. ఆయన కధలన్నింటిలో మనిషే కేంద్రకం. అణగారిన జీవితాలు, జీవితాల్లో వుండే చీకటి కోణాలపై టార్చి లైట్ లా కధను ఫోకస్ చేయటం ఆయన ప్రత్యేకత. ఈ రోజుకీ చెన్నై రైల్వే స్టేషన్ లోనూ, బస్ స్టాండుల్లోనూ ఆయన పాత్రలు సజీవ సాక్ష్యాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి.

కధలను స్టోరీస్ ఆఫ్ ఐడియాస్, స్టోరీస్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో చెబుతారు. జయకాంతన్ ది రెండవ పద్ధతి. ఒక ఆదర్శాన్ని తీసుకుని దానికి పాత్రలు తయారుచేసి కధలు రాయటం ఆయనకి అలవాటు.

అయితే ఆయన కధలలో కొంచెం కృత్రిమత్వం ఉందేమో అని ఇప్పుడు తోస్తోంది. స్టోరీస్ ఆఫ్ ఐడియాస్ పద్ధతిలో రాసేవారిలో ఆ సమస్య ఉంటుంది. కొన్నిచోట్ల పునరుక్తులు కూడా ఉంటాయి.

ఐతే జయకాంతన్ వ్యక్తిత్వ ముద్ర ఆయన కధల్లోని ముగింపులో ఉంటుంది. ఆ కధల్లో ఒక నిశబ్ధం ఉంటుంది. అది కధల వైశాల్యాన్ని మరింత విస్తృత పరుస్తుంది. రెండోసారి ఈ కధలను చదివినప్పుడు జయకాంతన్ మరింత స్పష్టాస్పష్టంగా అర్ధమయ్యాడు. ఆయన కధలు పెద్దవి అవడం వలన అనువాదాలలో వుండే క్లుప్తత ఒకోసారి ఆత్మను మింగేసింది. ఓహెన్రీ కూడా అలాంటి దురదృషవంతుడే.

విస్తృతంగా రాసినప్పుడు తనను తానే imitate చేసుకునే దుస్థితి ఎప్పుడూ ఆయనకు ఎదురవ్వలేదు. ఒక structural unity ఎప్పుడూ ఆయన రచనలో కనిపిస్తుంది. ఐతే అన్వయములేని పెద్ద పెద్ద వాక్యాలు జయకాంతన్ రాస్తారన్న అభిప్రాయం ఒకటుంది. అందువలన అనువాదానికి అంత తొందరగా లొంగడాయన.

*

 

పురాస్మృతుల స్వర్ణ మధూళి

 

 

 

-సాంత్వన చీమలమర్రి

~

 

sant3అనుకోకుండా ఒక ఉదయం ఏటవాలు గా పడుతూన్న యెండ ఎప్పటి గుర్తుల్నో మెరిపిస్తుంది. ఊరికే తోచక రెపరెపలాడే రోజూవారీ గాలి సరిగ్గా అప్పుడే పది వేసవుల పరదాల్ని కదిలిస్తుంది. అలవాటయిపోయిన దారుల్లో కాళ్ళు తిరుగుతూన్న మలుపులు ఇప్పటివే. మనసు చూసే దృశ్యం ఎక్కడిదో, ఎప్పటిదో. వర్తమానాన్ని మర్చిపోగలగడమే గొప్ప intoxication అయితే nostalgia ని మించిన మధువెక్కడుందీ?

ఎంత గమ్మత్తో పసితనం అసలు. నేర్చుకొమ్మని గట్టిగా అరిచి చెప్పినవేవీ తర్వాత గుర్తుండవు. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవల్లా ఎవరూ చూడని చోట్ల ఎవరి కోసమూ కాదన్నట్టు పూసే గడ్డిపూల్లాంటి అల్పత్వాలూ, లేతదనాలే. అలాంటి పసితనం వసంతం అయితే, ఆ పూసే పూలకి తామేంటో తెలిసి తలలు ఎగరేసే కాలం వేసవి. ఇంకా మగత వదలని ఆకాశాల ధూసరవర్ణ ఛాయల్ని తన గులాబీతనం తో కడిగేసే వేసవి. వచ్చే ప్రతీ రోజునీ బంగారపు కెంపు సంధ్యల మధ్య పొదివిపట్టుకునే వేసవి. వేసవంటే బాల్యానికి చివర. కౌమారపు తొలి గడప. యవ్వనానికి Passage way. అంత అందాన్నీ conscious గా అనుభవించడానికి ఆ వయసూ, పరిణతీ చాలా మందికి సరిపోవు. కావాల్సినదానికంటే ఎక్కువే సరిపోయే అదృష్టవంతుడొకడు, పన్నెండేళ్ళ డగ్లస్ స్పాల్డింగ్స్, రచయిత Ray Bradbury ప్రతిబింబం.

తెంపిన తక్షణమే వడలే గడ్డిపూలని ఎలా దండ గుచ్చడం? అదిగో అని తాకి చూపించగానే ఆవిరయ్యే సబ్బు బుడగల రంగుల్ని ఎలా రాశిపోయటం? అందుకు తెచ్చుకున్నారు Bradbury ఈ రంగురంగుల అక్షరాల అద్దం ముక్కల్ని. ఈ పుస్తకం మనల్ని మనకే వంద fragments గా విడగొట్టి చూపించే తళుకుటద్దాల mosaic.

నీలం ఆకుపచ్చా కలిపి అల్లిన అడవి నీడల కింద, రెండు చెవుల్లో వినపడే గుండె చప్పుడు లో, గాయమయ్యి ఉబికే రక్తపు ఎరుపు లో, పని చేసి వచ్చిన అలసట లో, ఆ అలసటని ఒప్పుకోని అహం లో తను జీవించి ఉన్నాననే స్పృహ ఒక వెలుతురు జలపాతం లా డగ్లస్ ని ముంచెయ్యటమే మొదలు ఈ పుస్తకానికి. జీవించి ఉండటాన్ని గుర్తించటమంటే తెలిసిన లెక్కల్లో సాగే మొనాటనీల మధ్య మోగే అభౌమ సంగీతపు nuances వినిపించుకోగలగటం.  ఆ మొనాటనీలని కూడా వాటికోసం వాటిని ప్రేమించగలగడం. ఆ యెరుక ఓసారి పుట్టిందా, ఇంక కనిపించేదంతా అద్భుతమే. ప్రతి రోజూ పేజీల మధ్య నెమలీకే.

కాస్త ఏమరుపాటుగా ఉంటే పచ్చిక పెరిగి ఊరిని ముంచేస్తుందా అనిపించే 1928 నాటి గ్రీన్ టౌన్ లో ని కొందరు మనుషుల  జీవితాలూ, వాటి మధ్య అన్నిటినీ లోతు గా అనుభవించగలిగే అదృష్టమూ ఆపదా ఉన్న డగ్లస్ వేసవి అనుభవాలూ ఈ Dandelion Wine పుస్తకం నిండా.  వేసవంటే వాళ్ళకి ఎవరూ పైకి గుర్తించని కొన్ని ఆనవాయితీలు. లెమనేడ్ తయారు చేసుకోవడం, ఐస్ క్రీం తెచ్చుకోవడం, కొత్త టెన్నిస్ షూస్ తొడుక్కుని తోక చుక్కల్లా పరిగెత్తడం, గడ్డి లో పూసే డాండీలియాన్ పూల నుంచి వైన్ తయారు చేసుకుని సోమరి తూనీగల రెక్కల్లోని సూర్య కిరణాలనీ, తేనెటీగల కాళ్ళకంటిన వెయ్యి పూల సౌరభాల్నీ సీసాల్లో  దాచుకోవడం. ఇంకా ఎండ తగ్గి చల్లబడే సాయంకాలాలు వాకిట్లో ఊగే కుర్చీల్లో, చెక్క బల్లల మీదా పెద్దవాళ్ళంతా కూర్చుని ముసురుతూన్న చీకట్లకి చిక్కు తీసి జడలల్లుతూ చెప్పుకునే కబుర్లు. మరునాటికి మర్చిపోయి అందరూ మళ్ళీ మొదలెత్తుకునే కబుర్లు. అతిప్రియమైన ఆ కబుర్లకి అర్థం లేదు, శబ్దం మాత్రమే ఉంది. ఎంత నిశ్చింత!

sant2

 

జూన్ మాసపు ఆగమనం తోనే వినబడే లాన్ మూవర్ శబ్దమంటే తాతగారికి ప్రేమ. అది వినపడితే ఆయన నిద్ర లో నవ్వుతాడు. ఊరిలో అన్ని లాన్ మూవర్ల నాదాలూ కలిసి సింఫనీ పాడినట్టు ఊహించుకుంటాడు. అసలు కత్తిరించాల్సిన అవసరమే లేని టైం సేవర్ లాన్ జాతి ని అమ్మేందుకు వచ్చిన బిల్ ఫారెస్టర్ తో అంటాడు కదా “అసలు అన్ని పనులూ త్వరత్వరగా చేసి ఏం సాధిస్తాం? మిగిలిపోయే సమయం లో చెయ్యటానికి కొత్త పనులు కల్పించుకునేందుకు బుర్ర బద్దలుగొట్టుకోవడం తప్ప? దారివెంట ఎదిగే మొక్కల్ని చూస్తూ, వాసనలు పీలుస్తూ నడిచే కాస్త దూరం కార్లో యాభై మైళ్ళ వేగం తో వెళ్ళటం కంటే ఎందుకు బావుంటుందో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించరాదూ?” అని.  ఆ ఆలోచనల్లోకి వెళ్ళి వచ్చే లోపు బిల్ కి డబ్బులిచ్చేసి సరుకంతా లోయలో పడేయిస్తాడు. ఆ తర్వాత బిల్ కూడా లాన్ మూవర్ని ప్రేమ గా బయటికి తేవటం ఒక తియ్యటి ఆశావాదపు కొసమెరుపు.

సంతోష యంత్రాన్ని కనిపెట్టాలనుకునే లియోది ఓ కథ. ఎప్పటికీ చెయ్యలేమనుకున్న పని ఒక్కసారే చెయ్యటంలో సంతోషం ఉందా లేక అశాంతా? క్షణికమైన సౌందర్యాలు- సూర్యాస్తమయాలు, ఇంద్రధనుస్సులూ… క్షణికం కనుకే అపురూపం కాదూ? అవన్నీ నిత్యమూ నిరంతరమూ అయితే అవి అలవాటు అయిపోవటాన్ని తట్టుకునీ నిలబడగలిగేంత సంతోషం పుడుతుందా మనకి? Now and Here ని మించిన సంతోషముందా? ప్రశ్నలు. వినపడీ వినపడనట్టుండే జవాబులు.

పుస్తకం చివర్న వచ్చే అమ్మమ్మ వంటల్లాగా ఈ సంతోషానిక్కూడా ఓ రెసిపీ లేదేమో. వంటగది ఎంత చిందరవందరగా అయినా ఉండనీ. డబ్బాల్లో దినుసులన్నీ ఏకమైపొనీ. చివరికి చేసే వంట మాత్రం దివ్యంగా ఉండాలి. యేది యెంత వేస్తే రుచో, ఆ మారిపోతూ ఉండే పాళ్ళ రహస్యం ఏమిటో తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర శిష్యరికం చెయ్యాలి. అప్పటికీ వాళ్ళు చెప్పగలిగే algorithm యేదీ ఉండదు. తోచినంత వేసుకుంటూ పోతే ఎప్పుడో ఒక రోజుకి epiphany.

ఈ బంగారపు వెలుతురుకి అవతల యేముంటుంది? గాఢమైన ఈ వెలుతురు దాచే నీడలు ఎంత నల్లటివో! వేసవి లో కూడా అమావాస్యలుంటాయి. తీతువులూ కూస్తాయి. ఎప్పుడూ పక్కనే ఉండే మనవాడు ఓ మధ్యాహ్నం వేరే ఊరికి వెళ్ళిపోతున్నానంటాడు, ఆ సాయంత్రం ఏం ఆడుకోవాలో ముందే అనుకున్నా కూడా. వాడేం మామూలు మనిషా? మన దృష్టి లో సగం దేవుడు. మన భాష అర్థమయ్యే ఒక్కగానొక్కడు. అన్నాళ్ళూ చెప్పుకున్నా మిగిలిపోయినవన్నీ గుర్తొస్తాయి. ఆ పైన జరగబోయేవన్నీ ఎవరితో చెప్పాలి? భయమేస్తుంది. ఒకరినొకరు మర్చిపోయే రోజు వస్తుందేమో అని. వెళ్ళిపోతాడు వాడు. ఊరూ వాడా, పచ్చికా చీకటీ అన్నీ అలాగే ఉంటాయి. వాడు మాత్రం అక్కడ ఉండడు. కలుస్తూ ఉండొచ్చు లెమ్మనే సగం నిజం మాత్రం ఉంటుంది. కోపమే వస్తుంది వాడిమీద. పసి గుండె కొంచెం ఎదుగుతుంది. ఒకింత మొద్దుబారుతుంది. కళ్ళ ముందే కట్టిపడెయ్యగలిగితే ఎంత బావుండు ఇష్టమైన వాళ్ళందరినీ!

sant4

మర్రి చెట్లలాంటి మనుషులు హఠాత్తుగా మాయం అయిపోతారు. జీవించి ఉన్నట్టు తెలిస్తే జీవించి లేకపోవటం అంటే ఏంటో కూడా తెలుస్తుంది నెమ్మదిగా. దిగులు పట్టుకుంటుంది. ఒంటరితనం ముంచేస్తుంది. అసలు ఎవరినైనా యే హామీ మీద ప్రేమించాలి? ఎన్నాళ్ళు మనతో ఉంటారని ప్రేమించాలి? అనిపిస్తుంది. అవును కొందరంతే. ఇంకా పెద్దరికం మీద పడకుండానే చప్పున విషాదం పాలైపోగలరు. గాఢంగా ప్రేమించగలరు. గాయపడి యేడవగలరు. ఎరువు మూటల్లో కూడా పూల తోటల్నే చూడగలరు. స్ఫటికాలకి మల్లే ప్రపంచాన్ని వర్ణాల్లోకీ, పదాల్లోకీ, స్వరాల్లోకీ విప్పార్చగలరు. ఓ చిన్న ఆకుపచ్చని పడవమీద కాలం లో వెనక్కి తీసుకుపోయి ఇదీ అని చెప్పలేనివన్నీ ఇక్కడే ఇప్పుడే చూపించగలరు. “ప్రేమ భ్రమ కదూ?”  అని అడిగితే… “మంచు ఆవహించేవేళ సూర్యుడూ భ్రమే అనిపిస్తాడు” అని మార్మికంగా నవ్వేయనూగలరు.

చివరి పేజీ మూస్తూనే తరుముకొస్తాయన్నీ. ఆకాశమంతా నిండే చందమామ నేరేడు చెట్ల వెనకనించీ తేలి వస్తోంది… చుక్కలు మాత్రమే మెరుస్తోన్న ఇంకో రాత్రి- గాజు పగిలినట్టు కారణం లేకుండా కలిసి నవ్వుతున్నారంతా. వేడి చల్లారుతున్న గచ్చు మీద, మొక్కలు తాగి మిగిల్చిన నీళ్ళ మీద మార్చి మార్చి అడుగులు వేస్తున్నాయి సైజ్ ఫైవ్ పాదాలు. నిద్రగన్నేరుల మీద ఎవరిదో నిర్దయ తెలిసి గొంతు లో ఏదో అడ్డుపడుతోంది. ఎపుడో విడిపోయిన వారి మాట వినపడి వాగ్దానాలు చేస్తోంది. తురాయి పూలు రాల్తూనే ఉన్నాయి. అన్నీ- అలాగే- అక్కడే… సరిగ్గా అప్పటిలాగే… ఎందుకంటే? గుర్తున్నాయి కదా మరి!

peepal-leaves-2013

 

 

అరె!!  భలే కథలే!!!

Ghanada_Sahasalu

-కృష్ణ మోహన్ బాబు

~

mohanbabu“లేదు నేను యెప్పుడూ బరువులు ఎత్తలేదు.  కాని ఒకసారి మాత్రం ఒక రాయిని లేపాను.”

ఒక్కసారిగా మేమంతా నిటారుగా ఆయిపోయాం.  “ఒక రాయిని లేపారా! అది ఎంత పెద్దది ఘనదా?”

“ఎంత పెద్దగా వుంటుందది! అది చాలా చిన్న గులాకరాయి, బహుశా అరవై గ్రాములు వుంటుందేమో _ _ _ _ _ దాని కారణంగానే మికియు దీవి ముక్కలుగా పేలిపోయింది.”

“ఒక దీవి మొత్తం ముక్కలుగా పేలిపోయిందా!  దానికి కారణం నువ్వు ఒక పలకరాయి లేపటమా?”  మా నోటినుంచి అప్రయత్నంగా ప్రశ్న దూసుకు వచ్చింది.”

……

“అవును. ఈ వానపాములే లేకపోతే  ప్రపంచం ఎడారిగా మారి వుండేదని మీకు తెలుసా? ఎకరంలో మూడవ వంతులో  రెండు లక్షల వాన పాములుంటాయని మీకు తెలుసా?  ఈ వానపాములు 12 నుంచి 15 అడుగుల లోతు వరకు సొరంగాలు చేస్తూ కింద మట్టిని పైకి తెస్తాయి.  కాబట్టే నేల సారవంతంగా వుంటుందని మీకు తెలుసా?  ప్రపంచంలో కెల్లా బలశాలి కంటే అవి బలమైనవని తెలుసా?  తన బరువు కంటే 60 రెట్లు బరువుండే రాయిని వాన పాము తేలికగా కదిలించ గలదని మీకు తెలుసా ……”

“అదే కాదు అవే లేకపోయి నట్లయితే ఆధునిక కాలంలో అద్భుతాన్ని, ఒక గొప్ప ఆవిష్కరణను కోల్పోయి వుండేవాళ్ళం .  అవే లేకపోతే  ఈ కాలపు గొప్ప శాస్త్రజ్ఞుడికి తన అద్భుత ప్రయోగాన్ని పూర్తి చేసే అవకాశాన్ని నేను కల్పించలేక పోయేవాడిని .”

అబ్బో, అబ్బో ఇలాంటి సాహసాలు, ‘ఘనదా’ చాలా చేసేడు.  ఘనదా అసలు పేరు ఘనశ్యామ్ దాస్.  బక్క పలచగా, సన్నగా వుండే ‘ఘనదా’

వయస్సు 35 నుంచి 55 మధ్యలో ఎంతైనా వుండచ్చు.  గత 200 సంవత్సరాల్లో ఈ భూగోళంలో ఇతను వెళ్ళని ప్రదేశం లేదు.  పాలు పంచుకోని ఘటన లేదు.  జేబులో డబ్బుల్లేక ఓ ఇరుకు సందులో వుండే కుర్రాళ్ళతో కలసి వుంటాడు. ఆ కుర్రాళ్ళు ఇతని సాహస గాథలు నోరు వెళ్ళ బెట్టుకు వింటూ వుంటారు.  కొత్త, కొత్త కథల కోసం వాళ్ళు అతన్ని రెచ్చగొడుతూ వుంటారు.  ప్రేమేంద్ర మిత్ర రాసిన “అడ్వంచర్స్ ఆఫ్ ఘనదా”కి తెలుగు రూపం “ఘనదా సాహసాలు.”   నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నెహ్రూ బాల పుస్తకాలయం సిరీస్ కింద దీన్ని తీసుకొచ్చారు.  సుబీర్ రాయ్ బొమ్మలతో, కె. సురేష్ తెలుగుతో ఈ పుస్తకం మన ముందు కొచ్చింది.

బెంగాలీ సాహిత్య వృక్షానికి అనేక కొమ్మలు, ప్రతి కొమ్మా రంగురంగుల పూలతో, మత్తెక్కించే వాసనల్ని పంచుతుంది.  అలాంటి ఓ బలమైన కొమ్మే ప్రేమేంద్ర .  సినిమాలతో సహా అన్ని ప్రక్రియల్ని అవపోసన పట్టాడు.  ఇతను జీవించిన కాలంలో (1904 – 1988) అనేక మంది సాహితీ శిఖరాలు వున్నా ప్రేమేంద్ర తన కంటూ ఒక శైలి, ఒక గొంతు, ఒక ఐడెంటిటీ తయారు చేసుకొన్నాడు.  ప్రేమేంద్ర సృష్టించిన “ఘనదా” పాత్ర

సమకాలీన బెంగాలీ సాహిత్యం లో వచ్చిన  డిటెక్టివ్ పాత్రల  కన్నా విభిన్న మైనదే కాకుండా మనం వూహించలేని వాతావరణంలో సైంటిఫిక్ టెంపర్ మెంటుతో, చక్కటి లాజిక్ తో నడుస్తుంది.  “ఘనదా సాహసాలు”  మొత్తం 13 కథలు.  ఒక్కో కథా ఒక్కో రకంగా వుంటుంది. ఎక్కడా ఒక్క స్త్రీ పాత్ర వాసన కూడా లేని సాహసాలు యివన్నీ.  చదవాల్సిందే.  చెప్పి లాభం లేదు.

ఈ పుస్తకంలో కథ లేవీ ఇండియాలో కాదు కదా, మన లాంటి మానవమాత్రులకు తెల్సిన ప్రదేశాల్లో జరగవు.  ఇక్కడ ఘనదా వూహకి, జాగ్రఫీ పరిజ్ఞానానికి  మనం జోహార్లు చెప్పాలి.  ఎందుకంటే తను చెప్పే సాహసాని కనుకూలమైన, దీటైన స్థలం వుండాలి.  వుదాహరణకి ‘ దోమ’ కథ సఖలం దీవి లో జరుగుతుంది.  అది జపాన్ కి దక్షిణాన వుంది.  అది వుత్తరం నుంచి దక్షిణానికి ఓ రంపంలా వుంటుంది.  దక్షిణ భాగం జపానుకి చెందితే, వుత్తర భాగం రష్యాకి చెందుతుంది.  ఆరు నెలలు కుండపోత వర్షాలైతే, ఆరు నెలలు చలికి గడ్డకట్టుకుని వుండే భయంకర దీవి.  తీవ్ర మంచు తుఫానులు అక్కడ సాధారణం. ఇంకో కథ న్యూ హెబ్రైడ్స్ అనే చిన్న దీవుల సమూహం లో జరుగుతుంది.  న్యూజిలాండ్ కి వుత్తరాన, ఆస్ట్రేలియాకి ఆగ్నేయ దిశలో వున్నాయి.  ఆకాశం నుంచి చూస్తే ‘Y’ ఆకారంలో పరచిన చిన్న రాళ్ళ మాదిరి కనపడతాయి.  ‘Y’ లో మూడు గీతలు కలిసే చోట వాటి రాజధాని, ఎఫేట్ వుంది.  రాజధాని ఒకటే కాని పాలకులు యిద్దరు.  ఇంగ్లీష్, ఫ్రెంచ్ కలసి దీన్ని పాలించేవి.  మరో కథ దక్షిణ అమెరికా కి వాయవ్యమూలన ఈక్విడార్ కి పశ్చిమంగా 600 మైళ్ళ దూరంలో వున్న గలపాగోస్, నార్ బరో దీవుల్లో జరుగుతుంది.  గలపాగోస్ లో ఆల్బెమార్ల లేదా ఇసాబెలా అన్నిటికంటే పెద్ద ద్వీపం.  ఇది ‘J’ ఆకారంలో వుంటుంది.  దీని కొస మీద ఓ చుక్క మాదిరి ద్వీపమే నార్ బరో లేదా ఫెర్నాండినా.  ఇక్కడ మొదలైన కథ మరెక్కడో తేలుతుంది.  ఇలా ఒక కథలో వున్న ప్రదేశం యింకో దాంట్లో వుండదు.  ఆ ప్రదేశాలు మన వూహకి కూడా అందవు.  అందుకే ఈ కథలు చాలా ఆశక్తిని కలిగిస్తాయి.

ఈ కథల్లో అభూత కల్పనలుండవు.  చక్కటి శాస్త్రీయ విశ్లేషణతో, చిన్న పాటి సైన్స్ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వుంటాయి.  సైన్స్ అవగాహన లేని వాళ్ళ కు కూడా అర్ధమయ్యేలా వుంటాయి.  ఒక కథ లో ఓ యూదు తీవ్రవాది, వాళ్ళ జాతిని హింసించిన జాతుల్ని రూపుమాపడం  కోసం సిస్టోసర్కా గ్రెగీరియా అనే ఓ మిడత జాతి పురుగుని వాటి ఎదుగుదలకి అనువైన ఓ మారు మూల ఆఫ్రికా అడవుల్లో పెంచుతాడు.  అవి వేల మైళ్ళు ప్రయాణం చేసి పచ్చగా కనిపించే దేన్నైనా సర్వ నాశనం చేయగలవు.  ఘనదా వాటి మధ్య ఓ వైరస్ వున్న మిడతని ప్రవేశ పెడతాడు.  ప్రపంచాన్ని కాపాడతాడు.  ఈ వింతని చదివి ఆనందించ వలసిందే.  ఇది మీకు ఆశక్తి కలిగించడానికి ఇచ్చిన చిన్న వుదాహరణ మాత్రమే. పదమూడు కథల్లో ఓ దాన్ని మించిన వింత మరొకటి వుంటుంది.

ఈ పుస్తకం అప్పుడప్పుడే పరిణితి చెందుతున్న పిల్లల్ని వుద్దేశించింది.  అయితే, యిలాంటి పుస్తకాల్ని ప్రచురించే  నేషనల్ బుక్ ట్రష్ట్ గాని, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు గాని   ఎగ్జిబిషన్ లో  కేటలాగులు పంచి పెట్టడం తప్పితే,  ఈ పుస్తకాల గురించిన చర్చ గాని, మారు మూల గ్రామాలకి వీటిని తీసుకెళ్ళే ప్రయత్నమే  చేయటం లేదు.  చదవ వలసిన వాళ్ళకి పుస్తకాలు చేరనప్పుడు వాటి ప్రయోజనం ఎలా నెరవేరుతుంది.  సిటీల్లో నెట్ లు , e బుక్స్ లాంటివి  అందుబాటులో వుంటాయి.  మరి గ్రామాల సంగతి ఏంటి?  సరే యివన్నీ పక్కన పెడితే  ఈ పుస్తకం ముఖ్యంగా మనకి ఓ విషయాన్ని రుజువు చేస్తోంది.  పిల్లల కథ లంటే ఒంటి కన్ను రాకాసి, నేపాల మాంత్రికుడు, భూతాలు, అభూత కల్పనలు కానక్కర లేదు.  బుద్ధిని, తర్కాన్ని పెంచే యిలాంటి రచనలు కావాలి.  అవి  శాస్త్రీయం గా ఆలోచించేందుకు వుపయోగపడతాయి.  పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిది.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

భరోసా నింపే వెలుగు రవ్వల “సందుక “

బాలసుధాకర్ మౌళి 

(కవి నారాయణ స్వామి వెంకట యోగి ఒక యాభై చేరుకున్న సందర్భంగా)

   మనిషి లోపల వొక చలనం సంభవిస్తుంది – అలానే బయటకు వ్యక్తమవుతాడు. లోపలి కదలికను బట్టి ఆ మనిషి వ్యక్తం కాబడటంలేదంటే.. ఏఏ సంకోచాలో బయటపడలేనంతంగా కట్టిపడేస్తున్నట్టు భావించాలి – నమ్మాలి.

నారాయణస్వామి గారు ‘సందుక’లో వొక డయాస్పోరా గొంతుకను వినిపించారు – ఎంతగా హృదయాన్ని తడిచేసే కవిత్వముందో – అంతగా వొక్కసారి వెనక్కి తిరిగి.. మళ్లీ ముందుకు చూసి ఆలోచించాల్సిన విధంగానూ వుంది.

‘సందుక’ మొత్తంలోకి – నారాయణస్వామి గారి Voice ని – అంతరంగ కాంక్షని సూటిగా పట్టి యిచ్చిన కవిత ‘చిన్నారి మొక్క’ని నా భావన. కారణాలు ఏవైనా కావొచ్చు – పుట్టిన దేశానికి దూరంగా బతుకుతున్న మనుషులు – దేశంపై ఆనాటి ప్రేమ యధాలాపంగానే మిగుల్చుకున్న మనుషులు..  ఏం ఆలోచన చేస్తారో – ఆ అనేకుల ఆలోచనలు అన్నీ ఈ కవితలో ప్రతిబింబిస్తున్నాయి. ఒక విష్మయకరమైన, విభ్రాంతి కల్గించే.. కవి ఊహాశక్తికి తలవంచి నమస్కరించే కవిత – మన వూళ్లను చూసి మనం తలయెత్తుకునే కవిత – ఇది. వొక్క డయాస్పోరా కవే యిలా రాయగలడు.

swamy

నిర్మాణపరంగా ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకంగా వున్నా.. నన్ను ఎక్కువుగా ఆకట్టుకున్న కవితలు : లోపలా.. బయటా… ; యాడికి పోయిన్రు ? ; ఎదురుచూపు.

గుండెని మెలిపెట్టి ఏడిపించిన కవితలు : అవ్వా ! ; యాడికిపోయిన్రు ? ; నాయనొస్తాడు !

” ఒక అన్వేషణ రూపం – కవిత్వంగా మొలకెత్తడం.
ఆ అన్వేషణ ఏమిటి ? తను వర్తమానంలో బతుకుతున్న నేల మీంచి – పుట్టి పెరిగిన నేల గురించి, అనురాగానుబంధంలో ముంచిన మనుషుల గురించి, ఆ జ్ఞాపకాలను… కొత్తగా అన్వేషించుకోవటం – అందులో ఉన్మీఖం కావటం.. సృజనశీలి అయిన కవి కవిత్వమైపోవటం.  ” నారాయణ స్వామి గారి కవిత్వం – ఇదేనంటాను.

కవితల్లో ఆయా సందర్భాల్లో – సందర్భాల్లాంటి జ్ఞాపకాల్లో మానసిక స్థితి బాగా అభివ్యక్తం అయ్యింది. అభివ్యక్తమయి అలరించింది.

నిరంతరం కవిత్వం చదవగా చదవగా – వొక కవిత ఎలా వుండాలనిపిస్తుందంటే… ‘ లోపలా.. బయటా ‘ లా. గొప్ప అనుభూతిని
మిగులుస్తుంది ఆ కవిత – కాన్వాస్ పెద్దది – లోతైన జీవితానుభవం పునాధుల మీద నుంచి వ్యాపించిన విషయముంది.
కవిత్వం ఆలోచనను కల్గించాలి – వొక ఆసక్తిని మెంటైన్ చెయ్యాలనుకుంటాను. వొక పదం లేదా వొక ప్రతీక లేదా రూపకం… కవి ఎందుకు వాడాడు – అనేది తెలుసుకున్నప్పుడు.. మన అవగాహనలోకి వచ్చినప్పుడు – చాలా ఆనందమేస్తుంది. కవిత్వం ద్వారా కొంత తెలియని విషయం కూడా తెలుసుకోవాలనుకుంటాను. ఇందులో కొన్ని కవితలు అలా వుపయోగపడ్డాయి.

నారాయణస్వామి గారి కవిత్వంలో – వొక దిగులు, వొక చైతన్యం, వొక జ్ఞాపకం, వొక గగుర్బాటు, వొక అమాయకత్వం – పసితనం, వొక నమ్మకం, వొక మంచి ఊహ, కృత్రిమత్వం – సజీవమైన ఆశ…. ఇవన్నీ – జీవితంలో, సమాజంలో వున్నవే.. కవిత్వంలోకి యదార్ధంగా తర్జుమా అయ్యాయి. కొన్ని వాక్యనిర్మాణాలు మరీ మృదువుగా వుండి.. వొక అందంలో మునిగితేలాయి.

వొక దిగులును ఎలా పలకాలో స్వామి గారికి తెలిసినట్టు మరెవరెవరికీ తెలియదేమో ! అనిపిస్తుంది. జీవితంపై వొక నమ్మకాన్ని
కల్గించడంలోనూ స్వామి గారి కవిత్వం వెలుగు రవ్వే.

నారాయణస్వామి గారి కవిత్వం మళ్లీ మళ్లీ చదవాలని మనసులాగుతున్న కవిత్వం – చదవకపోతే.. చదివి అనుభూతించకపోతే వుండలేనితనాన్ని సృష్టించే కవిత్వం.

తొలిసారి నేను అంతా ఇలాంటి కవిత్వమే చదవటం – వొక కవి కవిత్వ వాతావరణం వొక్కోసారి కొంతమేరకైనా ఆ కవికే ప్రత్యేకమైంది అవుతుంది. వొక కవిత్వం ఏర్పరుచుకున్న వాతావరణంలోకి ఎవరినైనా లాక్కుపోవడమే నిజమైన కవిత్వం గుణమైతే ఈ కవిత్వం అలాంటిదే !

బాల సుధాకర్

ఓ అపురూపమైన కానుక: హౌస్ సర్జన్                         

 

కృష్ణ మోహన్  బాబు

mohanbabu“ మెడిసిన్ ఓ మహా సముద్రం.  లోతు తెలియని, అవతలి ఒడ్డు తెలియని ఒక మహా సముద్రం.  దాని లోతు పాతులు తెలుసుకోకుండా బయట నిలబడి చూస్తే, అందులో ఈదటం చాలా తేలికనిపిస్తుంది.  లోనికి దిగామా ?  ఆ ఆరాటానికి అవధుల్లేవు.  విజ్ఞానం మీద తృష్ణే గాని, తృప్తి అనేది లేదు.

మెడిసిన్ ! మెడిసిన్ !! మెడిసిన్ !!!  అవే నా కలలు.  అదే నా ఆశా జ్యోతి.  అదే నా జీవిత పరమావధి. “

డా. ఎస్. మధుకర రావు, అప్పుడే చదువు పూర్తి చేసుకుని, హౌస్ సర్జన్సీ లో చేరిన కుర్రాడు.  సామాన్య కుటుంబం, తండ్రి లేకపోతే తల్లే వున్న ఆస్తి అమ్మి డాక్టరు చదివించింది.  ఓ చిరునవ్వుతో చుట్టు పక్కల అందర్నీ ఆకట్టు కోగలిగిన ఈ కుర్రాడి హౌస్ సర్జన్సీ అనుభవాలే డా. కొమ్మూరి వేణుగోపాల రావు గారు రాసిన “హౌస్ సర్జన్.”  ఇదొక మెడికల్ డైరీ .

ఆర్దర్ హైలీ అనే బ్రిటిష్ కెనడియన్ రచయిత 1965 ప్రాంతాల్లో “హోటల్ “  లాంటి ఇన్వెష్టిగేషన్ రచనలు చేస్తున్న సమయంలో వచ్చిన పుస్తకం ఇది.  ఈ తరహా రచన తెలుగులో ఇదే మొదటిది.  ఈ నవల అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది .  అప్పట్లో చాలా మందిలో ఈ పుస్తకం డాక్టర్ కావటానికి ప్రేరణ అయిందని చెప్తారు.  ఇంకో విషయం యేమిటంటే, హైలీ రాసినా, ఆ తర్వాత తెలుగు లో మరి కొంత మంది రచయితలు రాసినా, ఇన్వెష్టిగేషన్ రచనల కోసం ఒక వస్తువుకి సంబంధించిన కథలు ఎత్తుకోవటం, దానిలో అనేక మలుపులు తిప్పుతూ తాము చెప్పదలుచుకున్న సవివరణలని అందులో యిమిడ్చారే గాని ఏ విధమైన వంకర, టింకరాలూ లేకుండా, వైద్యం లోని ప్రతి విభాగాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ, దాని మీద ఏ మాత్రం ఆశక్తి తగ్గకుండా, ఎత్తిన పుస్తకాన్ని దించకుండా చదివించే నవల ఇది.  చాలా మంది వేణుగోపాల రావుగారి మొదటి నవల “ పెంకుటిల్లు” గొప్ప రచన అని మెచ్చుకుంటారు.  అయితే అలాంటి నవలల్ని, అతని సమకాలీకులు ఆ తర్వాత కూడా చాలా మంది  రాశారు.  కాని,
“హౌస్ సర్జన్” లాంటి నవల ఎవరూ ఇప్పటికీ రాయలేదు.

నవలలోకి తీసుకెళ్ళటం కొంచెం కష్టమైన పని.  ఎందుకంటే, కథ అంటూ ఏమీ లేదు.  మెడికల్ హౌస్ సర్జన్సీ చేసేప్పుడు మెడికల్ వార్డులు, పీడియాట్రిక్స్ , ఇ.ఎన్.టి , చెస్టు డిపార్టుమెంట్లలో పోస్టింగ్సు వుంటాయి.  సర్జికల్ హౌస్ సర్జన్సీ టైములో అన్ని సర్జికల్ వార్డులు, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీలలో పోస్టింగ్సు వుంటాయి.  ఇవి కాక గైనిక్, కాజువాల్టీలలో పోస్టింగ్సు వేరే వుంటాయి.  డా. మధు హౌస్ సర్జన్సీ ప్రయాణం మెడికల్ వార్డు, ఔట్ పేషంట్లతో ప్రారంభమై , తర్వాత సర్జికల్ పోస్టింగ్ , ఆ తర్వాత గై నిక్ , ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ నుంచి స్పెషల్ పోస్టింగ్ లోకి వచ్చి, కాజువాల్టీ, దాన్నుంచి రేడియాలజీ లతో హౌస్ సర్జన్సీ పూర్తి చేసి, టైఫాయిడ్ తో సిక్ అయి, స్టూడెంట్ సిక్ రూములో రోగిగా చేరి, ఆ అనుభవం కూడా కూడగట్టుకొని, పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు.  ఒక్కొక్క విభాగంలో చూసిన రోగాలు, వాటి ట్రీట్ మెంట్, రోగులు, వాళ్ళ మనస్తత్వాలు, ఎమర్జన్సీలు, అసిస్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, చీఫ్ లు అలా ప్రతీ అంశాన్ని తడుముకుంటూ నడుస్తుంది ఈ యాత్ర.

2213_front_cover

ఓ మంచి డాక్టరుకి సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం, అంతకుమించి మానవత్వం చాలా అవసరం.  మెడిసిన్ మీద శ్రధ్ధా శక్తులున్న ఎవరికైనా హౌస్ సర్జన్సీ పీరియడ్ మహత్తర దశ అని నమ్మిన డా. మధు తనకెదురైన ఎన్నో అనుభవాల్ని మనతో పంచు కుంటాడు.  సెలైన్ ఎక్కించడానికి వెయిన్ దొరక్కపోతే మొదటిసారి ‘ఓపెన్ మెథడ్ ‘ లో చర్మం కోసి రక్తనాళం బయటికి తీసి ఎక్కించటంతో డాక్టరుగా సాహసం మొదలవుతుంది.  మరో రోజు డిఫ్తీరియాతో వచ్చి ఊపిరాడక విల విల లాడుతున్న ఓ మూడేళ్ళ కుర్రాడికి, వైద్యం చేయవలసి వస్తుంది.  ఆన్టీ  డిఫ్తీరిక్ సీరం ఇచ్చి ఇ.ఎన్.టి. సర్జనుకి కబురు పెడ్తాడు.  గంట లోపల ట్రెకియాటమీ చేయక పోతే పిల్లాడు బతకడు.  ఇ.ఎన్.టి. డాక్టరు డ్యూటీ అయిపోయి ఏదో సినిమాకి వెళ్తాడు.  ఏం చేయాలి?  విద్యార్థి గా వుండగా ఒకటి, రెండు సార్లు చూసిన జ్ఞాపకంతో తప్పని పరిస్థితులలో ఆపరేషన్ కి సిధ్ధ పడ్తాడు డా. మధు.  చెయ్యక పోతే పిల్లాడు బతకడు.  సరిగా  చెయ్యక పోయినా బతకడు.  ప్రాణం కాపాడటం కోసం సాహసం చేసి నెగ్గుతాడు.  డా. మధు ఎదుర్కొన్న యిలాంటి ఎన్నో అనుభవాలని రచయిత మనల్ని దగ్గరకు తీసుకెళ్ళి, చూపించి విడమరచి మరీ చెప్తాడు.  అదీ ఇన్వెష్టుగేషన్ రైటింగ్ అంటే. మనల్ని కూడా యిందులో లోతుగా మునిగి పోయేలా చేయటం రచయిత సాధించిన విజయం.

ఓ రోజు అంబిలికల్ హెర్నియాతో ఓ రోగి వస్తాడు.  ఆలస్యం చేసి పీకల మీదకు తెచ్చుకుంటాడు.  రోగికి చావు బతుకుల సమస్య.  ఆపరేషన్ చేయడానికి మంచి కేస్ దొరికిందని డా. మధు సంతోషిస్తూ, “ఒక రకంగా వైద్య వృత్తి అతిక్రూరమైనది.  హార్టు కేసు చూసిన ఫిజీషియన్, ‘ఆహా వినండి, వినండి మర్మర్  ఎంత బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో ‘ అంటాడు.  ఈ వృత్తిలో ఎంత దారుణం  దాగి వుంది” అని స్వగతంగా అనుకుంటాడు.  ఇది వైద్య వృత్తిలోని మరో కోణం.

డా. మధు తో పాటు వచ్చే పోయే పాత్రలు, చీఫ్, డా. రంగనాధం, డా. కామేశ్వరి, హాస్పిటల్ సూపరింటెండెంట్, డా.దయానంద రాజు, మెడికల్ అసిస్టెంట్స్, డా.నాయుడు, డా. రామదాసు మొదలైన వాళ్ళంతా ఒకటి, రెండు పేరాల పరిచయమే అయినా పుస్తకం మూశాక మనల్ని వదలరు.  తోటి డా.మృదుల ప్రేమ, నర్సు నళినీ ఆరాథన ఈ మెడికల్ డైరీ కి కాస్త తడిని కలిగించి ఈ రచనని నవలగా మారుస్తాయి.  డాక్టరుకి  నర్సుకీ వుండే చిత్రమైన రిలేషన్, పరిధులు దాటే కొంతమంది నర్సులు, వాళ్ళతో తిరిగే డాక్టర్లు, రకరకాల మనస్తత్వాల రోగులు, హాస్పటల్ని నడిపే నియమ నిబంధనలు, ఇవన్నీ మరో ప్రపంచం.  ఈ ప్రపంచంలోని ప్రతి మూలకీ తీసుకెళ్తుందీ రచన.

ఇవన్నీ పాత జ్ఞాపకాలు.  హాస్పిటల్ అంటే ప్రభుత్వాసుపత్రి మాత్రమే అనుకొనే రోజులు.  ఇప్పుడు అన్నీ మారి పోయాయి.  వైద్యం కార్పొరేట్ పరం అయింది.  వేల ల్లో , లక్షల్లో ఖర్చు.  వుచితం వూహకందని విషయం.   ఫ్యామిలీ డాక్టర్లు మాయమయి, అవయవానికో డాక్టరు వచ్చాడు.  కనీసం రక్త పరీక్ష లేకుండా ఫ్లూ జ్వరానికి కూడా మందు రాయలేని కాలం.  మున్నాభాయిలు ‘వ్యాపమ్’ లో డిగ్రీలు కొనుకుంటున్నది నిజం.  వైద్యం లోను అనేక మారులు వచ్చాయి.  కొత్త కొత్త రోగాలు వచ్చాయి.  వాటికి కొత్త కొత్త మందులూ వచ్చాయి.  అవయవాలు తీసి అమర్చటం అవలీల గా జరుగుతోంది.  చెడు ఎక్కువగా కనబుడుతున్నా, మంచి కూడా చాలా వుంది.  ఎందుకంటే మనుషుల్లో భావోద్వేగాల్ని ఎవరూ తీసేయ లేరు.  ఆపరేషన్ ఫెయిలు అయితే ఆందోళన పడే డాక్టర్లు ఎప్పటికీ వుంటారు.  అందుకే ఈ నాటి విషయాలతో ఎవరైనా మళ్ళీ యిలాంటి రచనకు ప్రయత్నించ గలిగితే అది కొమ్మూరి వేణుగోపాల రావుగారి కిచ్చే అధ్భు తమైన నివాళి అవుతుంది.

*

 

గోదావరి గుండె తడి ఎండ్లూరి కవిత్వం

 

లక్ష్మణ్ ఆదిమూలం 

Lakshman copyనదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ది చెందుతాయి . నాగరికత ఉన్న చోటనే సాహిత్యం పుడుతుంది . నదికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది .  . దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద నది గోదావరి . ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు సాహిత్యంలో గోదావరి పయనాన్ని , తీర ప్రాంతాలలోని దేవాలయాలను వర్ణిస్తూ సాగిన సాహిత్యం అపారం.

ఆధునిక కాలంలో వచ్చిన దృక్పదంలో  కవిత్వంలో మార్పు వచ్చింది . సాహిత్యంలో కొత్త కోణం వెలుగులోనికి రావడం జరిగింది . అటువంటి కవిత్వం లోని రెండు కోణాలు ఎండ్లూరి సుధాకర్ రావు గోదావరి నది పై రాసిన కవిత్వంలో కన్పిస్తాయి . ఒక ప్రక్క గోదావరి అందాలను , గోదావరితో తనకు ఉన్న అనుబంధాన్ని కవిత్వీకరిస్తూనే , మరొక వైపు గోదావరి గుండె ఆవేదనను ఆవిష్కరించారు ఎండ్లూరి సుధాకర్ .

గ్రీష్మ కాలంలో గోదావరి స్వరూపాన్ని , ఎండిపోతున్న గోదావరిని చూసిన రచయిత తన గుండెలోని బాధని వ్యక్తం చేసాడు …

“నాన్న కొట్టినప్పుడు /ఒక మూల ముడుచుకొని

పడుకున్న అమ్మలా ఉంటుంది …

ఎండాకాలపు గోదావరి /నీటి కొవ్వు కరిగిపోతూ

పలచబడుతున్న  జలచర్మంతో /ఎనీమియా  పేషెంటులా ఎంతో జాలిగొలుపుతుంది “

గోదావరి నది చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం , అందాలను వర్ణించడం , వాటిని చూసి మురిసిపోవడమే కాదు మరో కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత “ఒక సాయంత్రం గోదావరి “ అనే కవిత లో ….

“గోదావరికే గొంతుంటే / జల భాషలో శతాబ్దాల గుడిసె కథలు చెప్పేది /

సాయంత్రం షిఖారులో /  గోదావరి మనోహరిలా కాదు /గొప్ప భారాన్ని దాచుకున్న తల్లిలా కనిపిస్తుంది “.

నాకు ఈ  జన్మ నిచ్చిన  తల్లిదండ్రుల ఆప్యాయతలను , అనురాగాలను స్మరణకు తెచ్చావు అంటూ “నువ్వు అమ్మా నాన్నవే గోదావరి” అనే కవిత లో “ నా బాల్య జ్ఞాపకాల అంతర్ ఝరీ !!/ ణీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు /అమ్మ దగ్గిర వున్నట్టుంటుంది ,ణీ ఇసుక మేనిపై పోర్లాడుతున్నప్పుడు /నాన్న గుండెల మీద ఆడుకుంటున్నట్లే వుంటుంది / నువ్వు అమ్మా నాన్నవే గోదావరి ! “

ఒకవైపు గోదావరిని ప్రత్యక్ష దేవతగా కొలిచే వారే ఆ నదీ  గోదావరిని కలుషితం కావడానికి కారణం అవుతుంటే చూసి భరించలేని కవి ఆవేదన కవిత్వ రూపంలో కన్పిస్తుంది .  పరిశుభ్రత పాటించాలని వచ్చిన కవితలు ఉన్నాయి .

భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు నదులకు ఒక్కొక నదికి ఒక సంవత్సరానికి పుష్కరాలు జరుగుతాయి . ఆ సమయంలో నదులు ఎలా కాలుష్యానికి గురి అవుతున్నాయో   రచయిత  గత గోదావరి పుష్కరాల సమయంలో  వెలువరించిన పుష్కర కవితలు ఈ కోణం  నుంచి  ఆలోచించి వచ్చిన కవితలే ….

గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షల యాత్రికులు శుభ్రత  పాటించక పోవడం  వల్ల గోదావరి ఎంతగా కలుషితం అయ్యిందో , గోదావరి పుష్కరాల తర్వాత గోదావరిని చూసిన కవి ఆవేదన ఇలా వ్యక్తీకరించారు .

“పుష్పాలు రాలిపోయిన కొమ్మల్లా /పుష్కరాల తర్వాత /రాత్రిపూట గోదావరి

రహస్యంగా దగ్గడం గమనించాను /దుర్భరమైన దుర్వాసనలో

మూగతల్లి ముఖం మీద /మురికి టీగలు వాలడం పసిగట్టాను

గోదావరి నీటినాడి  పట్టుకుంటే తెలిసింది/ఆమె పుష్కర జ్వరంతో బాధపడుతోందని “………కలుషితంగా మారుతున్న ఆ గోదావరమ్మ నీటికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఖండిక .

పుష్కరాల సమయంలో గోదావరి కలుషితం కావడం వలన స్నానానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులను గుర్తు చేస్తారు రచయిత ఈ కింది ఖండికలో …

“యాత్రికులకు గమనిక …పుష్కర స్నానాలయ్యాక

ఏ డెట్టాలు తోనో మళ్లీ ఒళ్లు కడుక్కోండి

ఎంత ధర్మ వుఆదుల వారికైనా

చర్మ వ్యాధులు రాకమానవు

అద్దర్లో మినిగినా …ఇద్దర్లో మినిగిగా …దద్దుర్లు తప్పవు “.

పుష్కరాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాజమండ్రి ,కొవ్వూరు , బాసర , ధర్మపురి ,కోటిపల్లి ఇలా ప్రసిద్ధ మైన ప్రదేశాలు అందరు అక్కడే స్నానాలు ఆచరించి గోదావరిని మురికి చేయకండి , ఇలా చూడండి ప్రకృతి ఒడిలోని గోదావరమ్మ ను అంటూ పాపికొండల మధ్య ఉన్న గోదావరిని స్పురణకు తెస్తాడు రచయిత

“పుష్కర యాత్రికులారా /మురికి రేవుల్లో ఏం మునుగుతారు ?

/అలల నగల ధగధగల /గిరిజన ప్రకృతి గోదావరి

/పాపికొండల నడుమ /పసుపు పూలదండలు దాల్చి

/అమ్మవారిలా కనబడుతుంది /ఆమెను చూసిరండి

అనుభూతి పుణ్యం లభిస్తుంది”.

అందుకే భక్తుడు కానీయండి ,  సగటు మనిషి కానీయండి గోదావరి కలుషితం కావడానికి కారణం  అయ్యామని మమ్మల్ని క్షమించమని ఆర్తిగా అర్దిస్తాడు ఈ  క్రింది ఖండికలో ఎండ్లూరి

“తల్లీ గోదావరి  /మేము జలహంత కులం

మాది విషవింత కులం  /నీ  అందాల

జల మంగళ  సూత్రాలను  /మలమూత్రాలతో అపవిత్రం చేశాం

పాపాత్ములమూ /అమ్మ వొడిని  పాడు చేసే పసిపాపలము

మన్నించవమ్మా  /పుష్కర పునీత మాతా !”

Yendluri_sudhakar

గోదావరి గొప్పతనాన్ని కీర్తిస్తూ గడిపేయడమే కాదు , కలుషితమై పోతున్న గోదావరిని  నిర్మలంగా  చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ,అందరు నడుం కట్టి పరిశుభ్రం చేయాలని పుష్కరాల తరవాత చేయావల్సిన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు రచయిత ఈ ఖండికలో …

“గోదావరి /మురికి నీటి అద్దంలో

ముందు ముందు /ఎవరి ముఖాలూ కనబడవు

రండి నడుం కడదాం !/గోదావరి మురికి ముఖం కడుగుదాం !

శాస్త్రాలతో కాదు /శాస్త్రీయంగా /శాశ్వతంగా . . .

ఈ విధంగా గోదావరి నదీ ప్రస్థానం ఎంతటి వైశిష్ట్యాన్ని పొందిందో , సాహిత్యంలోను గోదావరి కవిత్వ రూపంలోనూ అంతే ప్రాచుర్యం సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పుష్కర సమయంలో గోదావరి నది కలుషితం అవుతుందో ఈ కవిత్వం నిదర్శనం . సగటు మనిషికి అనుభూతిని కలిగించడంలోను ,వాస్తవాలను ప్రబోధించడమే నేటి కవిత్వం యొక్క ఉద్దేశ్యం వాటితో పాటు గోదావరి వ్యధను ప్రతి వ్యక్తి ఆలోచించేలా చేస్తుంది  ఎండ్లూరి  కవిత్వం .

*

 

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!”

 

మణి వడ్లమాని 

 

Mani Vadlamaniఈ ప్రపంచంలో కష్టాలు కన్నీళ్ళే కాదు సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులు కూడా ఉంటాయి. అని హాస్యం, నవ్వు గురుంచి ఎందరో పెద్దవాళ్లు చెప్పిన మాటలు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలలో మనకి  పుష్కలంగా కనిపిస్తాయి అలాంటిదే మరో హాస్యపుగుళిక స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది  సినిమా తియ్యండి!. అంటూ నవ్వుల గని  శ్రీమతి పొత్తూరివిజయలక్ష్మి గారు రాసిన పెద్ద కధ . “మొదటి కధ  అయినా గాని ఉత్తరాల ద్వారా ఎన్నో ప్రశంసల అందుకున్నాను.  అది పెద్ద హిట్ అని” తన ముందు మాటలో పేర్కొన్నారు రచయిత్రి-

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!” అని మన అక్కో పిన్నో, అత్తో మనలని పిలచినట్లుగా, విజయలక్ష్మి గారు మనందరికీ స్క్రిప్ట్ తోనే సినిమా చూపిస్తున్నారు..  ఒట్టండి.. నమ్మండి… తప్పకుండా చూడండి… కాదు కాదు చదవండి…. నవ్వి నవ్వి  డొక్కలు ఎగిరేలా, కళ్ళవెంబడి నీళ్ళు కారుతూ, ఇక చాలు బాబోయి అని మీరు అనక పోతే చూడండి. చెప్పదలచిన విషయాన్ని సున్నితంగా, సరసంగా, ఆకర్షణీయంగా చెప్పడానికి హాస్యం  పయోగపడుతుంది.

అందువల్లే హాస్య ప్రధాన రచనలు అనేకం, ఎప్పటి నుండో ఎందరో రాస్తున్నారు.  ఆ ఎందరి లోనో మణి పూస వంటి  పొత్తూరి విజయలక్ష్మి గారుకూడా ఉన్నారు. అందుకే ఆవిడ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్య రచయిత్రి.

విజయలక్ష్మి  గారు ఈ కధని  1982 లో  ఆంధ్రప్రభ  కి  రాసారు.ఇది ఆవిడ తొలి రచన.  అయితే  ఈ కధను  “జయంతి” అన్న కలం పేరు తో వ్రాసారు.  తొలి సంతానాన్నిచూసుకున్నప్పుడు  తల్లి పొందే ఆనందానికి ఎలా కొలమానం ఉండదో తొలి కధను అచ్చులో చూసుకున్నప్పుడు అదే భావం. అది ఒక మరపురాని మధురానుభూతి” అని అంటారు ఆమె.

pothuri

ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వసుంధర  ఇలా అన్నారు “నేటి చిత్రాల ప్రేరణతో సంపూర్ణేష్ బాబు ఒక్క రోజు లో స్టార్ అయిపోయాడు. ఇదే తరహాలో ఆప్పట్లో మీడియా ఉండి ఉంటే అప్పుడే శ్రీమతి విజయలక్ష్మి గారు చలనచిత్ర రంగం లో స్క్రిప్ట్ రచనలో మెగాస్టార్ అయ్యి ఉండేవారు”

వసుంధర గారు అన్నట్లు  పొత్తూరి విజయ లక్ష్మి గారు మన తెలుగు సినిమా వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చినా ఆ కధ వైపు కన్నేస్తే ఒట్టు. ఎందుకంటారా?  ఎంతటి కధా వస్తువునైనా మార్చి సినిమా కధ గా మలచ గలిగే శక్తి ఉన్న మహామహులు కూడా   ఎందుకో నిర్లిప్తత వహించారు.  కారణం  ఆ స్క్రిప్ట్  లో మార్చడానికి  ఏవి లేదు కనుక, మార్చే  అలవాటు ఉన్న వాళ్ళు కావడం  చేత సినిమాని యదాతధంగా తీసే ప్రయత్నం చేయలేదు అనుకోవాలి.

ఇక  సీనియర్  రచయత  కవనశర్మ గారు “ ఈవిడ ఒక మేధావి, ఈ పుస్తకం పూర్తి చేసేసరికి మీరు(పాఠకుల) కూడా ఈ విషయం తెలుసుకుంటారు, నిర్మాతలకి, దర్శకులకి  శ్రేయోభిలాషి గా చాలా సలహాలిస్తారు” అని తన ముందు మాటలో రాసారు.

ఇంతకీ ఈ పెద్ద కధ లో  ఏవుంది,  మేధావులకు కూడా  అర్ధం కాని ఎన్నో గొప్ప గొప్ప చిక్కు ముడులు ఉన్న కధలు మన తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి.  అలాంటి కధా లక్షణాలన్నీ అవపోశన పట్టి ఒక చక్కటి చిక్కటి సినిమా స్క్రిప్ట్  ని తయారు చేసారు.

మొదటగా సూచన పట్టిక ఇస్తారు. హీరో, హీరోయిన్  లు కాకుండా, సైడుహీరోయిన్, హీరో,     హీరోయిన్ తండ్రి, దర్శకునికి రచయిత్రి సలహా(ద.ర.స)  నిర్మాతకి రచయిత్రి సలహా(ని.ర.స).

ఇక ఇక్కడ నుంచి సినిమా (కధ)మొదలు. మొదటి  సీను లో హీరో ఓడంత  కారు లో వస్తూ ఉంటాడు . కారు అద్దాలు తో మొదలుపెట్టి  హీరో మొహం మీద దర్శకుడు పేరు తో టైటిల్సు ముగుస్తాయి.

హీరో ముందు అంతా బలాదూర్ గా ఉండి ఆడపిల్లలని వశపరచు కొంటూ ఉంటాడు.

అలా ఓ రోజున సైడ్ హీరొయిన్ని ఎత్తుకు పోతాడు. అక్కడ కొంత సేపు మెలోడ్రామా అయ్యాక  ‘నా చెల్లెలా!, అంటే   హా! అన్నయ్యా !’ అని ఇద్దరు వాటేసుకుంటారు.

ఇక హీరొయిన్ ఎంట్రన్స్ చాలా సినిమా ఫక్కీలో జరుగుతుంది. ఆమె ని విలన్ గ్యాంగ్ రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తుండగా హీరో వీరోచితంగా  పోరాడి  ఆమెని కాపాడుతాడు. అప్పుడు హీరొయిన్ కృతజ్ఞతలు ల తో పాటు తన ప్రేమ ను కూడా తెలుపుతుంది,  అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ  పుడుతుంది. ఆ పారవశ్యం  లో ఇద్దరూ ఎవరూ లేని మైదానాలదగ్గర,జలపాతాల దగ్గర ఆనందంగా పాత పాడుకుంటారు.

ఆ తరువాత అదే ప్రేమ కోసం స్వశక్తితో డబ్బు సంపాదిస్తానని, హీరొయిన్ తండ్రి తో చాలెంజ్ చేసి  ఏం పని చేయాలా అని ఆలోచించి ఒక ఇస్త్రీ దుకాణం పెట్టి మూడు సీన్లు అయ్యేసరికి కోటీశ్వరుడి గా ఎదిగి పోతాడు.

తల్లి కాని దొరికిన గుడ్డితల్లిని,  చెల్లి కాని దొరికిన చెల్లి తో ఇలా అంటాడు, “అమ్మా! చెల్లీ! నేనక్కడ అష్టైశ్వార్యాలూ, మీరు ఇలా పేదరికం అనుభవించడమా? మీరు నాతో రండి” అని తన  భవంతికి, ఓడంత  కారులో తీసుకోని వెళతాడు.

pothuri1

మధ్యలో తన చిన్న తనం లో తప్పి పోయిన తల్లి, చెల్లి ఎక్కడో లేరు  తనతో పాటు ఉంటున్న దొరికిన తల్లి, చెల్లి తన సొంత వాళ్ళే అని తెలుసుకొని చెప్పలేనంత ఆనందంతో  ఉన్న సమయం లో  విలన్ ఎంటర్  అవుతాడు.

హీరొయిన్  కూడా చాలా  స్వతంత్ర భావాలతో ఒక బిజినెస్ మొదలుపెడుతుంది. అది ఆవు, గేదల నుండి వచ్చే పేడ ద్వారా తాయారు చేసే పిడకల కంపెనీ. ఇక్కడ కూడా మూడు సీన్లు అయ్యేసరికి  హీరొయిన్  కూడా చాలా గొప్పదయిపోతుంది. తన పిడకల బిజినెస్ కి ప్రపంచం నలుమూలల నుంచి ఆదరణ రావడం తో ఎంతో పొంగిపోతుంది.

ఇలా కధ నడుస్తుండగా  ఎక్కడ పాటలు పెట్టాలో, ఎలాంటి  కాస్ట్యూమ్స్ వెయ్యాలో  బడ్జెట్ ఎలా తగ్గించుకోవాలో లాంటి విషయాలు  దర్శకుడికి, నిర్మాతకి కూడా  రచయిత్రి సలహాలు ఇచ్చారు. ఒక అడుగు ముందు వేసి రెండు మూడు పాటలు కూడా రచించారు.

ఇక సినిమా చివర్లో యధా విధిగా, హీరో కష్టాల ని అవలీలగా  ఎదుర్కొని   విలన్ గ్యాంగ్ ని మట్టు పెట్టి  విలన్ ని కొట్ట బోతుండగా,  కొన్ని కారణాలవల్ల  తప్పిపోయిన తన తమ్ముడే ఈ విలన్ అని తెలుస్తుంది. పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళతారు, విలన్ అదే హీరో తమ్ముడిని.  సోదరప్రేమతో , కోర్టులో వాదన చేసి తన తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోవటం వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల విలన్ గా మారాడని, ఒరిజినల్  గా చాలా అమాయకుడు అని, శిక్ష కు అర్హుడు

కాదని  తామే బల్ల గుద్ది వాదించి, గెలిచి తన తమ్ముడు ని  మారిన మనిషిగా చేస్తానని, జడ్జి గారి తో హీరో చెబుతాడు.

హీరో లో ని వ్యక్తిత్వానికి, పట్టుదలకు,  ఎంతో ముగ్ధుడై  ఈ నాటి యువతరానికి ఇలాంటి వాళ్ళే ఆదర్శం అని ఆ జడ్జి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటాడు.

చివరాఖరికి అందరూ నవ్వుతు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. నవ్వుతున్న వాళ్ళ మొహాల మీద శుభం అని వస్తుంది.

సినిమాని బాక్సాఫీస్ దిశగా నడిపే కధనం తో  అడగడుగున  ఉత్కంఠ రేపే సన్నీ వేశాల తో , భారీగా కన్నీళ్ళు కార్చే బరువైన సంబాషణలతో ఆద్యంతం రక్తి కట్టిస్తూ ఉన్న ఈ కధను చూసే వాళ్ళకి, అదేనండి బాబు చదివే వాళ్ళకి ఒక ముఖ్య  సూచన,  మీరు కుర్చీలో కూర్చొని చదివేతే మీ నవ్వుల ధాటికి కుర్చీ విరగావచ్చు, సోఫాలో గనుక  చదువుతుంటే  మీ నవ్వుల అదురుకి సోఫా నట్లు లూజ్  కావచ్చు. అదే మంచం  మీద  పడుకుని చదివితే ఆ నవ్వుల బాంబు పేలి , ఆ విస్ఫోటనం లో గుండ్రం గా దొర్లుతూ కింద పడనూ వచ్చు. మీకు దెబ్బలు తగలా వచ్చు. అందుకే ఈ కధ చదివే టప్పుడు తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిక  జారి చేయడం అయింది.

ఈ సంకలనం లో వారి కధలు  మరో నాలుగు  ఉన్నాయి, మధురిమ,ముకుందం,ఆనందరావు-ఆవు మరియు అన్నపూర్ణ కి బ్రాండ్ అంబాసిడర్.

చిన్న చిన్న పదాలతో, మనం రోజూ మాట్లాడుకునే  మాటలతో  హాస్యాన్ని పండించడం  పొత్తూరి విజయలక్ష్మి గారి  మార్కు.

*

చిన్నికలలని దాచి…చిట్టి పడవలో…

గరిమెళ్ళ నారాయణ 

 

Photo Narayana Garimellaపక్షిని ప్రేమించడం అంటే, దానికున్న స్వేచ్చ తో సహా ఆ పక్షిని ప్రేమించడం. పంజరం లో బంధించో, రెక్కలు నిలువరించో ఆ విహంగ జీవికి ఎన్ని భోగ భాగ్యాలు కల్పించినా అది ప్రేమ కాదు, కాలేదు. ముమ్మాటికీ స్వార్ధమే అవుతుంది.

జీవులను వాటి స్వేచ్చతో సహా ప్రేమించడం తెలిసిన వాళ్ళకు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతల గురించి వేరే చెప్పనవసరంలేదు. ప్రతి బంధాన్ని పరిపూర్ణంగా చూడగలరు, ఆశించగలరు. ఇంద్ర-ధనుస్సులోని రంగులను తమవిగా చేసుకుని తిరుగాడే సీతాకోక చిలుకలను సైతం అంతే పరిపూర్ణంగా దర్శించగలరు. సహజ రంగులూ, రంగులలో కాంతులీనే సహజ మెరుపుల తో సహా కలలో కూడా వారి  సీతాకోక చిలుకల రంగులు మాయవు.

స్వేచ్చను గౌరవించడం తెలిసిన ఎవ్వరైనా చదవదగిన ఇరవై ఐదు కవితల సమాహారం మమత వ్రాసిన రంగులు మాయని సీతాకోక చిలుక’ కవితా సంపుటి. గుండె ఆనందంతో ఉప్పొంగినప్పుడో,  బాధతో గుక్కపట్టినప్పుడో తప్ప కవిత్వాన్ని అల్లలేనని నిజాయితీగా చెప్పిన మమత స్వగతంగా ఆవిష్కరించిన పెరటిలోని అపురూపమైన పూల మొక్కల లాంటి కవితలు ఇందులో ఉన్నాయి.

‘స్వేచ్చగా ఎగరవే చిలుకా’ అని ఒక అందమైన ఉదయానికి దారితీస్తూ రోజు ప్రయాణం మొదలౌతుంది. నీడలలో నడుస్తూ, ట్రాఫిక్ లో దూసుకుపోతూ, దారిలోని మరో మోనాలిసాల కృత్రిమ నవ్వులను దర్శించి నిర్లిప్తంగా నవ్వుకుంటూ, పదిలంగా ఇల్లు చేరడం తో ఆ ప్రయాణం లో సగ భాగం పూర్తవుతుంది. అటు తరువాత ఎవరి కోసమో ఎదురు చూసి, నిరీక్షణల నిరాశతో ఎడబాటునొకదాన్ని ఎదుర్కొని, సాయం సంధ్య కు వీడ్కోలు చెప్పి, మంచు పూల వానలో తడిసి ముద్దవ్వడం తో ప్రయాణం లో రాత్రి మొదలవుతుంది. నిద్రలో ఒక దిగులు స్వప్నాన్ని విదిలించుకుని, కొన్ని తడి ఆరిన ఇసుక రేణువులని దులుపుకుని, పక్కనే పడుకున్న పసి పాపను హత్తుకుని, ఒక దివ్య స్వప్నం గుండా మళ్ళీ స్వేచ్చగా అందమైన ఉదయానికి చేరుకునే సరికి పరిపూర్ణమయ్యే ఒక ప్రయాణం ఈ కవితల పుస్తకం. ఆ ప్రయాణం నిండా పూలు, మడుగులూ, శంఖాలు, గవ్వలూ, గువ్వలూ, తూనీగలు, సీతాకోకలు ఒక పక్క నడయాడుతూ ఉంటాయి. అంతర్లీనంగా ఒక దుఃఖ జీర కూడా వదలని ప్రేమ బాంధవ్యం లా వెన్నంటి వస్తుంది.

నీ ప్రయాణం అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడమే. స్వ-అవగాహన లోనే, నువ్వు కోరుకుంటున్న ‘స్వేచ్చ’ కూడా తెలిసొస్తుంది.

నీవు నిర్మించుకున్న ఆశలసౌధం

పేకముక్కలతో కట్టినది కాదని

నీలో రగుల్తున్న లావా

పినటబు బురద కాదని

తెలుసుకున్న వేళ నీకు నీవే అర్ధమౌతావు

పేక మేడ కాదని’ అని క్లుప్తంగా అనెయ్యకుండా, ‘పేకముక్కలతో కట్టినది కాదని’వివరంగా అనడం వల్లే ఆశలసౌధానికి (బలహీనమైన దానితో పోలిక లేదనడం లో) బలం ఇవ్వబడుతుంది. అలాగే లోపలున్నది లావా అని తెలిసినప్పుడు, పైపైన పేరుకున్నట్టనిపించే బురద హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మౌంట్ పినటబు అనే

అగ్ని పర్వతం 1991 లో బద్దలైనప్పుడు మొదట చిమ్మిన బురదని రెండు పదాలతో ప్రస్తావించడం కవితా ప్రవాహం లో అలవోకగా వచ్చినదని అర్ధమై సరదాగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. పద చిత్రాలను ఎన్నుకోవడమే కాదు, వాటిని అలవోకగా అల్లుకుంటూ పోవడమూ కళే.

పంజరంలోని చిలుకా

ఇక పాడవే ఒక స్వేచ్చా గీతికా!

అని అనుకున్నాక,  ‘స్వేచ్చ’నుండి మరొక కవిత ‘అందమైన ఉదయం’ లోకి ప్రయాణం సాగుతుంది. కాస్త తడిసినా చెరగని రెక్కల మెరుపులతో ఒక సీతాకోక చిలుక కు కొత్త జీవితం రూపం లో అందమైన ఉదయం సాక్షాత్కారమౌతుంది. ఆ సీతాకోక తన పాప చేతిలో రెక్కలు ఆరబెట్టుకోవడంతో తల్లీ కూతుర్లిద్దరికీ కూడా ఆ ఉదయం మధురమౌతుంది.

ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా మధురం గానే ఉంటుంది. ‘తొలిసంధ్య’ లో అవతలి అంచుకి చేరుకునే ఒక అసలైన ఆరంభాన్ని అందులోని మాధుర్యాన్ని ఇలా చూడవచ్చును.

ఆమె కల అవతలి అంచు కి

నన్ను లాక్కెళుతోంది

ఉప్పొంగుతున్న ఆశలకు అచ్చెరువొందుతూ ఆమెకు చేయి అందించి ప్రయాణమయ్యాక ….

తామరపూలు నిండిన మడుగువైపు ఎగిరిపోయాం

ఆమె తో అంత అందమైన విహారాన్ని తలపోయటాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఉండగానే

తామరతూళ్ళ నడుమ కనుమరుగవుతూ

చివరొక్కసారి అరిచిందామె

ఈసారి స్పష్టంగా

ఇదిగో! ఇదీ అసలైన ఆరంభం!”

కవయిత్రి చేయి అందుకుని ఆనందించిన సాయంకాలం నాటి నెచ్చెలి సూర్యుడే అని తెలిశాక, ఆ ఎడబాటు తాత్కాలికమే అనిపించడమే కాదు…అదే అసలు సిసలు ఆరంభం అనీ అనిపిస్తుంది. సూర్యుడి లో నెచ్చెలి ని చూడటం కుదరదనుకుంటే నెచ్చెలినే సూర్యుడిలా చూసుకున్నా ఈ అనుభవం ఇలాగే పరవళ్ళు తొక్కుతుంది.

‘ఎడబాటు అన్ని సార్లూ చక్కని ఆరంభమే అవుతుందా?’ అనే ప్రశ్న తలెత్తితే ‘ ఒకరు – రెండు జ్ఞాపకాలు’ చదవాలి.

అందులోని మొదటి జ్ఞాపకం ఇలా ఉంటుంది.

ఆనాడు రోడ్డు దాటుతూ విడిపోయినప్పుడు

నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నావు నువ్వు

భలే వీడిపోయి కలుసుకున్నాం కదా?” అని

మళ్ళెప్పుడు రోడ్డూ దాటుతున్నా

మలుపులో నీ నీడ నా వైపు చూసి నవ్వుతుంది

ఇప్పటి వరకు ఎన్ని స్నేహాలు వచ్చి వెళ్ళినా

నీ అల్లరి నవ్వు మాసిపోలేదిప్పటికీ

ఒక మనిషిని ప్రేమిస్తే…ఆ మనిషితో ముడిపడిన కొన్ని సందర్భాలు అనాలోచితంగా గుర్తుకొచ్చి కలగలసిన కొన్ని ప్రేమైక ఆలోచనలను ఇలాగే కొత్త పుంతలు తొక్కిస్తాయి.

ఈ జ్ఞాపకంలోని ప్రేమను ‘ఆహా’ అని నెమరు వేస్తూ, రెండో జ్ఞాపకం లోకి ప్రయాణిస్తే….

అప్పుడప్పుడు నువ్వు నన్ను పిలిచినట్లయ్

గడిచిపోయిన జాడలవెంట వెనక్కి రావాలని

మనస్సు ఉక్కిరిబిక్కిరవుతుంది

కానీ, ఆఖరిసారి నీ కళ్ళల్లో నేను వెదికిన ప్రేమ

ఇప్పటికీ కనిపించదు మసకగానైనా

రెండు జ్ఞాపకాలనూ పూర్తిగా చదివాక ‘గొప్పగా ప్రేమించిన కుక్కపిల్లను పోగొట్టుకున్న పసిపాప’ వంటి వ్యక్తి కవిత వ్రాసిన మమతలో కనిపించి,అసంకల్పితంగా కళ్ళు చెమరుస్తాయి. నూరేళ్ళు మాత్రమే అని లిఖించిన మానవ జీవితాలకి, ‘ప్రేమించిన జీవుల ఎడబాటు’అనే కష్టం మాత్రం ఎందుకు? అనే ప్రశ్న తొలచుకొస్తుంది. మళ్ళీ తిరిగిరాదని తెలిసిన ఎడబాటు బాధపెడితే…తిరిగొచ్చే తొలిసంధ్య లాంటి ఎడబాటు మదిని పూయిస్తుంది.

దూరమైన తన తండ్రి  ఎడబాటు ను తలపోస్తూ ఒక పసిపాప అతనికి తన సందేశాన్ని పంపినప్పటిది. తెలిసీ తెలియని ఆ పసి వయసు నుండి చూసినప్పుడు (ఎడబాటు అనే ఊహ కూడా కఠినంగానే)  అనిపిస్తుంది. అది వాస్తవమే ఐనప్పుడు కూడా ఆ కాఠిన్యం ఇలా మృదువుగా ప్రేమగా జాలు వారడం ఎంత పరిణితో కదా అనిపించక మానదు. కల్మషం లేని పసి ఆశ ని ఇంతకన్నా నిరాడంబరంగా ఆవిష్కరించడం సాధ్యం కాదేమో!?

నిన్న రాత్రి

వెన్నెల్లో దొరికిన శంఖంలో

కొన్నంటే కొన్ని నా చిన్నికలలని దాచి

చల్లగా కాళ్ళను ముద్దాడిన

చిట్టి అల ఒడిలో వదిలాను

అవి నిన్ను చేరుకోవాలని

‘సముద్రపు ఒడ్డు మీద శంఖాలు, గవ్వలు ఏరుకుంటూ చల్లగా స్పృశించే నీటి అలల తాకిడిలో తుళ్ళుతూ తూలుతూ అనందించడం’ అనేది పెద్దలు సైతం పసివాళ్ళలా చేసేది. కానీ ఈ కవితలో పసిపిల్ల అవన్నీ వదలుకుని, దాటుకుని మరీ తండ్రిని తలపోస్తుంది. తను కోల్పోతున్న తండ్రికి, అతని ప్రేమకి ఒక సందేశాన్ని పంపిస్తుంది. పాషాణుడైతే తప్ప, ఆ తండ్రి అంత మృదు మధురమైన పసి ప్రేమని కోల్పోడు అనిపిస్తుంది.

ఇలాంటి కవితలు చదివినప్పుడే ఎడబాటు గుర్తుకు రాకుండా లేదా తెలియనివ్వకుండా, మనతో పాటూ ఉన్న భార్య (లేదా భర్త) ని, పిల్లలనీ వారితో పాటే అక్కడే అందుబాటులో ఉంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, లాంటి

వారందరినీ ఒకసారి మనసారా చూసుకుని హత్తుకోవాలనిపిస్తుంది. ఒకరు కోల్పోయిన సందర్భం తాత్కాలికమే ఐనా అది వారికి అది కల్గించిన భావావేశం ఎంతటిదో మనకి తెలిశాక, అలాంటి సందర్భం ఆ క్షణంలో మనకి లేనందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

చిన్నికలలని దాచి చిట్టి అల ఒడిలో వదలడం చిన్నారి మాటగా చెప్పక చెప్పడం అన్నమాట.

కవిత్వమంటే వ్యక్తిగతంగా చూసేది లేదా అనుభవించేదే. పాఠకుడు భావాన్ని గ్రహించే విధానం సార్వజనీనతని నిర్దేశిస్తుంది. ‘మరో మోనాలిసా’ కవిత ఇందుకు మంచి ఉదాహరణ. న్యూయార్క్ నగర వీధులలో పొట్ట నిమురుకుంటూ కనిపించిన ఒక మెక్సికన్ యువతి నవ్విన కృత్రిమ నవ్వూ , మన దేశం లోనే మరో చోట తన చేతిలోని చిట్టి చెల్లాయిని సముదాయిస్తూ  మల్లెమాలలు అమ్మి అమ్మకూ నాన్నకూ చేదోడువాదోడుగా కనిపించిన మరొక అలాంటిదే పసి నవ్వూ ముమ్మూర్తులా మరో మోనాలిసాల నవ్వులే అనిపిస్తాయి. అలాంటి నవ్వుల ఆంతర్యం చదవడానికి ప్రత్యేక దృష్టి కావాలి. ఈ నవ్వులెప్పుడూ నిరాశల ధుఖాల్ని దాచేసినందుకు రువ్వబడే భావ ఆవిష్క్రరణలే అనిపిస్తుంది. ఆ నవ్వులను మరచి, నవ నాగరికత ఒకటి తొందరపెడుతోందని ట్రాఫిక్ గుంపు లోకి దూసుకు పోయినా, సహజత్వాన్ని మాయం చేసే యాంత్రికత వెంబడిస్తూనే ఉంటుంది.

స్వచ్చమైన ప్రాణవాయువును కాస్త

పొగచూరిన గాలిలోంచి

వడగట్టుకోవడానికి

మొఖానికి చుట్టేసుకున్న

రంగురంగుల ముసుగుపై

పూలని భ్రమపడి వాలిన

సీతాకోకచిలుకను

చిరాకుగా దులిపేసి

పక్కవాడిని తోసుకుంటూ

దూసుకుపోతూ..

జీవితాన్ని అందులోని వివిధ పార్శ్వాలను నిర్మలంగా, ప్రేమగా, భావా వేశ పూర్వకంగా, వాస్తవంగా అనేక కోణాలలో దర్శించి చూసింది చూసినట్టే కవిత్వం ఆవిష్కరించారు మమత గారు. ఇందులో గోరు వెచ్హని ఉదయాలున్నాయి, సీతాకోకను తడిపేసిన వాన చినుకులున్నాయి. అదే సీతాకోకకు ప్రాణంపోసిన చిట్టి చేతులున్నాయి. దిగులూ, నిరాశ, నిరీక్షణ ,ఎడబాటు, వాటిని ఎదుర్కొని చేసే లావా లాంటి ప్రవాహం అన్నీ ఈ కవిత్వం లో ఉన్నాయి.

జీవితం ఉగాది పచ్చడిలా అన్ని రుచులూ కలిస్తేనే బాగుంటుంది అంటారు. తలవని తలంపుగా ఒక్క రుచి ఎక్కువైనా తక్కువైనా సమతూకం లోపిస్తుంది. అధిరోహనానికి ఆశ, శక్తీ, ఉత్సాహం అన్నీ ఉంటాయి. కానీ, మనం ఎంత ఇచ్చినా కొంచెం కూడా వెనక్కి ఇవ్వ బడని ప్రేమ ఒకటి సదా నిరుత్సాహపరచి పాతాళం లోకి లాగెయ్యాలనుకుంటూ ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకకు ప్రయాణించ నివ్వని పట్టుదల ఒకటి భుజం తడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, చుట్టూ ఉన్న సమాజం పై ప్రేమని, బాధ్యతని ఒకే సారి చూపించే కవితలున్నాయి ఇందులో.

 

*

చెమట చుక్కే సముద్రం!

Reviewer

డా. నారాయణ గరిమెళ్ళ

 

మనలో చాలా మంది కి సముద్రమంటే వల్లమాలిన ఇష్టం, తెలియని ఆహ్లాదం, అంతులేని పరవశం. గంగ పుత్రులకు సముద్రమంటే బతుకు తెరువు. నావికులకు అదొక ప్రయాణ మార్గం. ఇంకా అనేకమందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంతులేని అనంతమైన కడలితో తప్పని లేదా తప్పించుకోలేని ఏదో సంబంధం  నిత్యం ‘వంటల్లో వేసుకునే ఉప్పులా’ ఉంటూనే వుంటుంది.

ఉప్పగా వుండే సాగర స్వభావాన్ని కేవలం ఉప్పునీరుగా దర్శిస్తే  గొప్పేముంది!?  చెమట చుక్క గా  దర్శించడం లోనే గొప్పతనమంతా దాగి ఉంది. అక్కడే కవిత్వం ఉంది. ఏ అరమరికలూ లేకుండా ఖరా-ఖండీగా ‘ నేను శ్రామికజన  పక్షపాత కవిని ‘ అని  చెప్పగలిగే ధైర్యం ఉంది.

శ్రామిక జీవుల చెమటతో పాటు అనేకమంది ఆర్తుల జీవిత వ్యధలలో చిలికే కన్నీటి బొట్ల  వెతలను కూడా పొందిగ్గా పట్టుకుని ఈ కవి నిజంగానే ఒక కవితా సముద్రాన్నిసృష్టించి మనముందు కు తీసుకొచ్చారు.

మొయిద శ్రీనివాసరావు వ్రాసిన  నలభై కవితల సమాహారం ‘సముద్రమంత చెమట చుక్క’. మనకు పరిచయమున్న దారుల్లో కొంత సేపు నడిపించి, మరికొంత సేపు పరిగెత్తించి పరిచయం లేని వాస్తవాలను సైతం చూసే దృష్టిని ప్రసాదించారు. పరిమాణం దృష్ట్యా అల్పమైన వాక్యాలలో అనల్పమైన అర్ధాలను ఆవిష్కరించడం ద్వారా  ఈ బాధ్యతను నిర్వహించారు.

విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల గ్రామానికి చెందిన కవి, అక్కడి జ్యూట్-మిల్ కార్మికుల మీద జరిగిన కాల్పులకు తల్లడిల్లినప్పుడు, ఆ కార్మికుల త్యాగాలకు ప్రణమిల్లినప్పుడు,  ఆ ఉద్యమానికి ముందూ వెనుకా ఉన్న మూలాల్లో తన కుటుంబమూ ఒక పిడికిలిగా అంతర్భాగమైనప్పుడు ఆ ఉద్యమం తనపై చూపిన ప్రభావాన్ని, కల్గించిన భావావేశాన్ని తదనంతరకాలంలో చిమ్మిన కవిత్వానికి  నాంది లేదా పునాది గా మలచుకున్న విధానం పటిష్టంగా కనిపించే గొప్ప విషయం. ఆ పరిధి విస్తృతమై ఏ ఏ జీవితాలను, వాటి నేపధ్యాలనూ, సాగర మధనం చేసిందో తెలుసుకోవాలంటే ఈ సంకలనం లోని కవితలలోకి ప్రయాణించాలి.

‘నెల్లిమర్ల’ అనే ఊరి పేరే శీర్షికైన మొదటి కవిత లో, నిన్నటి ఆ ఊరి గురించి కవి తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం ఆ ఊరి ప్రజలను మరియు నైసర్గిక స్వరూపాలను తడుముకుంటూ సాగుతుంది. తెలిసినట్టనిపించిన సామాన్య విషయాలతో ప్రారంభం అవుతుంది. అందువలన పాఠకుడి కి ఈ కవిత్వం చదవడం ఎంతమాత్రం అసౌకర్యంగా అనిపించక పోగా, చదవాలన్న  ఉత్సుకత  ఏర్పడి చకచకా చదివిస్తుంది.

నిన్నటి నా ఊరు గూర్చి

తెలుసుకోవాలన్న ఆలోచన

నా బుర్ర తొర్రలోకి

వడ్రంగి పిట్టై వచ్చి వాలింది

ఆ ఊరు గురించి నలుగురు పెద్దమనుషులను మాత్రమే అడిగి ఊరుకోకుండా, కాలం కాలికిందపడి నలిగిన ఖాళీ అగ్గి-పెట్టె లా ఉన్న ఆ ఊరి ప్రక్కనున్న కొండమీది కోటను, ఊరిని ఆనుకుని ప్రవహించే ఏరునూ కూడా అడగటం బాగుంటుంది. తెలిసిన చరిత్రని మృదువుగా ప్రేమగా మనకు పరిచయం చేస్తూ ఇష్టాన్ని, ఆసక్తినీ కల్గిస్తుంది. నెల్లిమర్లకు సరైన నిర్వచనం, నారమిల్లు కవి కి ఇచ్చిన సమాధానం లో బహిర్గతమౌతుంది.  కాలే కడుపులు కాగే డప్పులుగా మారిన వైనాన్ని వివరిస్తుంది. కార్మిక కండచీమల తెగువును నినదిస్తుంది.

నలు దిక్కులా నలుగురి నాలుకలపై

నా ఊరెలా నిలిచిపోయిందో విన్నాక

నా ఊరి పేరునే

నా ఇంటి పేరుగా మార్చుకోవాలనుంది.”

అనడం తో కవి ఆ ఉద్యమాన్నుంచి ఎంతటి స్ఫూర్తి పొందాడో మనకి అర్ధమౌతుంది.  బుర్రని తొర్ర గా మార్చి వడ్రంగి పిట్ట అనే తపన తో పొడిచి వెదికే పక్షి కి ఇవ్వడం ఉదారత కాదు. తనకు మాత్రమే సొంతమైన తాత్వికత.

నేతులు తాగిన తాతల మూతుల గురించి, కులం గురించి, వంశాల వారసత్వం గురించి పాకులాడే మామూలు మనుషులు మధ్య, రక్తం చిందించిన శ్రామిక వీరుల విప్లవ జెండాకు నమస్కరిస్తూ నిలబడ్డ ఈ కవి  దృష్టి ఠీవిగా కనబడుతుంది.

 

తూటాలకు సైతం వెరవని కార్మికుల పోరాటం గురించి వారి త్యాగాల వలన ఆ ఊరు చారిత్రాత్మకమైన విధానం గురించి ‘ఔరా’ అని అబ్బుర పడుతుండగానే, మరొక కవిత ‘మంటల జెండా’ లో ‘వీచే పడమటి గాలులకు నేటి రైతు అరటి చెట్టు కూలినట్టు తాత్కాలికంగా కూలినా, రేపు ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి పొద్దయి పొడుచుకు రాక మానడు!’ అంటారు.ఒక సిధ్ధాంతానికి ప్రతీకగా చెప్పడానికి  జెండాతో పోల్చడం సాహితీకారులకు పరిపాటి. అయితే ఈ సంకలనంలోవాడిన పదచిత్రాలు, ఆయా కవితల ఆత్మలను కళ్ళకు కడతాయి.

‘పోరుపిట్ట’ లో శ్రమైక జీవన నాదాన్ని ధ్వనించే కాకిని ‘పోరుపిట్ట’గా ఎత్తి చూపించడం ఎంత మాత్రం అసహజమనిపించక పోగా మనకి ఆ పక్షి లాంటి శ్రమ జీవనాన్ని సాగించే వారి మీద తెలియని గౌరవాన్ని నేర్పుతుంది.

ఎర్రని ఎండలో

పురుగో పుట్రో ఏరి తెచ్చి

కళ్ళు తరవని పిల్లల నోటిలో

ఉషోదయానికి ఊపిరిలూదిన మాతృమూర్తి

కోకిల గుడ్లను కూడా తనే ప్రేమగా పొదిగే కాకి, ఎర్రని ఎండలో కూడా తన పని లేదా బాధ్యతను తను నిర్వహించడాన్ని కవి సునిశితంగా పట్టించుకోవడం ఆసక్తి ని రేపుతుంది. అది కవితంతా కనిపిస్తుంది.

కరెంటు దెబ్బకు రెండు పిట్టలు నేలరాలితే

గుంపు మొత్తంతో కలసి

గాలిలో గింగుర్లు కొడుతూ

సమర సన్నాయినూదిన చైతన్యదీప్తి

శ్రీశ్రీ గారన్న ‘కష్ట జీవికి రెండు వైపులా కాపలా కాసే వాడే కవి’ నిర్వచనం ఈ కవికి అక్షరాలా వర్తిస్తుందనిపిస్తుంది.

‘ఇనుప కౌగిలి’ లో అందరికీ ఏడాది చివరిలో అనుభవమయ్యే చలి కాలాన్ని, ఒక నాటి రాత్రి నేపధ్యంలో భయం దుప్పటి వదలమనే సంకేతంతో చెబుతారు. కుంపటిలో నిప్పు రాజేసుకున్న గుడిసెలోని ఆమె, నోటిలో చుట్ట అనే నిప్పు కత్తితో పొలిమేర పొలం లోని అతడు,  చలిని ఎదుర్కొన్న విధానాన్ని ఊలు దుస్తులు కప్పుకుని గుడిసెల లో నుండి చూసే పిల్లల దృష్టితో చూపించారు. ఈ కవిత ఇంతటితో ఆగిపోతే పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఆఖరిలో ఇలా అంటారు.

తెల్లారేసరికి

వారి తెగువకు అది (చలి) కాస్తా తల ఒగ్గేది

…………………………..

………………………….

తరువాత తెలుసుకునే వాళ్లం

భయపడితేనే ఏదైనా

ఇనుప కౌగిలిలో బంధించగలదని!

అగ్నిశిఖల్లా కలబడితే పారిపోతాయి

ఆఖరికి చలైనాపులైనా అని!!

Poet Photoనిప్పుని, భయాన్ని ఎదుర్కొనే పనిముట్టుగా చూపించారు. ఒకేలా అనిపించినా కూడా నిప్పులా కలియబడటానికీ, కొవ్వొత్తిలా వెలగడానికీ మధ్య చాలా అంతరం ఉందని నెత్తుటి పూలు కవిత చదివాక మాత్రమే తెలుస్తుంది. ఢిల్లీలో నిర్భయ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వ్రాసినది  ఇది.

కబంద హస్తాల కింద

పూలు నలగడం మూగగా రోదించడం

ఇక్కడ కొత్తేమీ కాదు

…….

రాలిన పూలకై

నెత్తిన నిప్పుకత్తులు ధరించిన కొవ్వొత్తులై

కన్నీరు కారిస్తే

కమ్ముకొస్తున్న పొగమంచు తొలిగిపోదు

………

పూలన్నీ ముళ్ళై కదిలితేనే

నిర్బంధ హస్తాల నుంచి

సరికొత్త సూర్యోదయం సాక్షాత్కరిస్తుంది!”

ఈ రకంగా చలిని నిప్పు బెదిరించగలదు అని ‘ఇనుప కౌగిలి’ లో చెప్పిన కలం తోనే, అత్యాచారం తరువాతి కొవ్వొత్తుల నిరసనలు మాత్రం కంటి తుడుపు చర్యలు మాత్రమే కాగలవని ఉద్భోద చేశారు.

కలియ బడాలి, మాట్లాడాలి, పోట్లాడాలి లాంటి సూచనలన్నీ ఎప్పుడన్నదే కదా ప్రశ్న? ఎందుకు మాట్లాడాలో ‘మౌనం మంచిది కాదు’ లో,

దీపమై మాట్లాడితే కదా

చీకటి చెదిరి

నిజం నలుదిశలా విస్తరించేది!

అంటారు.

మాట్లాడాలి అని అర్ధమయ్యాక, మాట్లాడితే ఎలా ఉండాలి అన్న ప్రశ్న కూడా సహజం. ‘మాట’కు గొప్ప నిర్వచనాన్ని మరొక కవితలో ఏకంగా చూడవచ్చు.

 

మాట ఎలా ఉండాలని

పొగచూరిన పొయ్యిలా ఉన్న

మా అమ్మనడిగాను

ఎండుపుల్ల విరిగినట్టు ఉండాలన్నది

ముఖం చెల్లని రూపాయి కాసులా ఉన్న

మా నాన్నని అడిగాను

 అడిగే ప్రతి మనిషి కీ ఒక సహజ వాతావరణం ఉంటుంది. దానికి లోబడే ఆ మనిషి మాటకు నిర్వచనం చెబుతాడు. అది వారి వ్యక్తిగత నిర్వచనం మాత్రమే అని బయటకు మనకు అనిపించినా, అందులో తొంగి చూసే సార్వజనీనత ఆశ్చర్యపరుస్తుంది. కవిత్వం వ్రాయడమెలాగో తెలియక పట్టువదలని ప్రయత్నాలు చేసే విద్యార్ధులకు ఈ కవిత మంచి పాఠం లా ఉంటుంది. సాధారణమైన విషయాల పరంగా మాట అంటే ఎలా ఉండాలో చెప్పిన తీరు అబ్బుర పరుస్తుంది.

ప్రశ్నిస్తూ, మాట్లాడుతూ, చొరవగా చొచ్చుకుపొమ్మని నిర్దేశించిన కలం, నిరసన జ్వాల గా మాత్రం అర్ధాంతరం గా జీవితాన్ని ఆర్పేసుకుని బుగ్గి కావద్దని హెచ్చరిస్తుంది. సెల్ టవర్లు ఎక్కి బెదిరించడం, వంటిపై కిరోసిన్ పోసుకుని దహించుకోవడం ఇవి పచ్చనైన ఒక్క జీవితాన్ని మాత్రమే బలి తీసుకోవు, ముందూ వెనుకా అనేక ఆశల్నీ జీవితాలానూ కూడా సమూలంగా నాశనం చేసేస్తాయి.

‘పొద్దు తిరగని పువ్వు’ లో బతుకులు రోడ్డున పడటం మరియు రోడ్డు దారి పట్టడం వెనుక ఉన్న నిరాదరణ ను పట్టి చూపించి ప్రస్తావిస్తుంది. ఆ నిరాదరణ అలాగే కొనసాగుతూ ఉంటే, అనాధల బతుకులు ఎప్పటికీ విరబూయక ముడుచుకు పోతున్న పొద్దు తిరగని పువ్వులౌతాయని  దైన్యంగా చెబుతుంది.

  నిరాదరణ

చెట్టు నుండి

నేలరాలిన పుష్పమో?

ఫుట్పాత్ పై ఆకలిమంటతో

ఒంటిని వెచ్చబెట్టుకుంటూ

విసిరేసిన ఆకాశపుటాకులో

మిగిలిన ఎంగిలి ముద్దకై

ఆశగా చూస్తూ

నిత్యం నిద్దట్లో

చిల్లర చుక్కలను కలగంటుంది

అవసరం, అవకాశం, తప్పని సరి జీవితం, తప్పించుకోలేని పరిస్థితులు ఇవన్నీ పలు చట్రాలుగా మనిషిని బంధీని చేస్తున్న తీరు కవితలలో ఏదో ఒక మూల ముల్లులా గుచ్చి మన ఆలోచనలలో ప్రశ్నలను రేకెత్తిస్తాయి.

పెట్టుబడి దారుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న బాల్యాన్ని, చదువు సంధ్యలనూ రూప విక్రయం రూపంలో లార్వా నుండి సీతాకోక చిలుక దశల పరంగా చెప్పారు.

 

సెల్ఫోన్ ను ‘మాటల పిట్ట’ గా ముచ్చటించి సరదాగా సాగే కవిత ప్రారంభం లో:

నా చెమటచుక్కలకు రాలిన

పది పచ్చరూకలు పోసి

మాయాబజారులో

ఒకనాడు

మాటలపిట్టను పట్టుకొన్నాను

అని సెల్-ఫోన్ తనను చేరిన సాధారణ విధానాన్ని సామాన్యంగా ప్రారంభిస్తారు. కవిత అంతానికి తెలిసొస్తుంది దాని మాయజాలం మనిషిని ఎంతలా దాసోహం చేసుకుంటోందో.

అది నా పంచేంద్రియాలను జయించిన

ఆరో ఇంద్రియమై

నన్నుతన ముక్కున కరచుకొని

నిదానంగా నడిచిపోతోంది!

ది మనుషులను ఎంత చాకచక్యంగా వ్యసన పరులని చేస్తోందో చెప్పి వాపోతారు. ఇలాంటి మాటల పిట్టల వలన అనుకోని సౌలభ్యం ఎంతో అందుబాటులోకి వచ్చి అబ్బురపరుస్తున్నట్టనిపించినా, అది కూల్చేస్తున్న లేదా తృణీకరించేస్తున్న సహజ సంబంధ బాంధవ్యాల ప్రస్తావనే  కవికి ఇక్కడ ముఖ్య విషయం.

ఈ సంకలనం లోని మొత్తం కవితలన్నీ వర్తమానం ఆటుపోట్లకి గురవ్వడానికి గత, భవిష్యత్ కి సంబంధించిన అంశాలు ఎలా కారణభూతులౌతున్నాయో  అంతర్లీనంగా నొక్కి చెబుతాయి. ఐతే, వాటిని ఎదుర్కోడానికి కావల్సిన శక్తి యుక్తులూ, ముందు చూపు, చొరవ, పరత్యజించాల్సిన అలవాట్లు, కాపాడుకోవలసిన సంపద లాంటి బంధాలు అన్నీ కూడా ఈ కవితల లోనే కనిపించి పరిష్కార మార్గాలను కూడా సహజంగా నేర్పుతుంటాయి. మాటల పిట్ట లాంటి కవితలను తెలుగు వాచకం పుస్తకాలలో చేర్చితే విద్యార్ధులకు కవిత్వం, భాష మరియు సాహిత్యం పట్ల ఇష్టం కల్గించడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా పలు ఇతర కవితలను తెలుగు సాహిత్యం తలకెత్తుకుని కాపాడు కోవడం చాలా అవసరమనిపిస్తుంది.

జీవితం లోంచి సహజంగా వచ్చిన వాక్యాలు, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మన ముందు నిలబడితే ఎంత అర్ధవంతంగా ఉంటాయో చూడాలంటె మొయిద శ్రీనివాసరావు గారి సముద్రమంత చెమటచుక్క లోని కవితలను తప్పక చదవాలి.

ఈ పుస్తకం చదివాక, ‘మాట’ కవిత లో లా ‘వందనం’ అంటే ఎలా ఉండాలి అని అడిగితే..

స్వేదానికి చేసే నమస్కారంలా

ఉన్నత విలువలకు కట్టే పట్టంలా

సముద్రమంత చెమట చుక్కలా

అని మనస్పూర్తిగా చెప్పాలనిపిస్తుంది. అదే ఈ చక్కని చిక్కని కవితలలో సమ్మిళితమైన అంతస్సూత్రం.

ప్రతులకు సంప్రదించండి.

Email: moidasrinivasarao@gmail.com

 

కవిత్వమై కట్టలు తెంచుకున్న కోపం!

ఆ సాయంత్రం త్యాగరాయ గానసభకి వెళ్ళాను.

వంగూరి ఫౌండేషన్ వారి   నెల నెలా తెలుగు వెలుగు అనే సాహితీ సదస్సులో శ్రీ ద్వానా శాస్త్రి గారు – ’ తన కవిత్వాన్ని తానే విశ్లేషించుకునే’ సాహితీ ప్రసంగాన్ని వింటం కోసం.

ద్వానా గారి  కవితా సంపుటాన్ని  నేనింతకు మునుపొకసారి చదివాను. విభిన్నాంశాలతో కూడిన   కవితల్లోంచి  నాకు నచ్చిన కొన్ని మంచి మంచి వాక్యాలను తీసుకుని, మన ‘సాహిత్యం’ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అందువల్ల, వీరి కవిత్వంతో నాకు పరిచయం తో బాటు, నాకు వీరి కవిత్వం పట్ల సదభిప్రాయమూ వుంది. ఈ సభ కు రావడానికి అదొక ముఖ్య కారణమని చెప్పాలి. అదీ గాక, కవి – తన కవిత్వం మీద తానే  విశ్లేషణ జరుపుకోవడం ఒక వినూత్నమైన ప్రక్రియగా తోచింది. ఎంతో ఆసక్తి కరం గా అనిపించింది. అందుకే, వారి ప్రసంగం వింటం  కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

ముఖ్య అతిధి – జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు  గారు! చాలా దూరం నించి వస్తున్నారనీ, అందుకే సభారంభం ఓ అడుగు అటూ ఇటూ అవ్వొచ్చని  చెప్పారు సుధ గారు.

అప్పటి దాకా ఔత్సాహిక గాయకులు పాడే పాటలు వింటూ గడిపాం.

అంతలో, ఆయన విచ్చేసారు.

అనంతరం, సభ – ఆరంభమైంది.

సాహితీ కిరణం సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

వేదికనలంకరించిన వారిలో – సమీక్షకులు శ్రీ రమణ ఎలమకన్ని గారూ వున్నారు.

అందరి పరిచయాలు, కొందరి ముందు మాటలు అన్నీ సాంప్రదాయక రీతిలో చక చకా జరిగిపోయాక, ద్వానా శాస్త్రి గారు – ప్రసంగించడం కోసం మైకు ముందుకొచ్చారు.

తాను రాసేది కవిత్వమే కాదనే విమర్శకులకు తాను సదా కృతజ్ఞుణ్ని అన్నారు. అలాటి విమర్శలలకు   తనకెలాటి అభ్యంతరం లేదనీ, పైగా, వాటిని ఆనందంగా అహ్వానిస్తానని చమత్కరించారు. మనసులోని భావాలను ఒక అరుదైన పధ్ధతి లో వ్యక్తపరిచేందుకు కవిత్వం సరైన ప్రక్రియ అని తాను భావిస్తున్నట్టు తన అభిప్రాయాన్ని వివరించారు. అసలు తనకు కవిత్వం రాయాలని ఎందుకనిపించిందో చెప్పారు. మొట్ట మొదట గా – క్లాస్ లొ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట వినని విద్యార్ధులను తన వైపు తిప్పుకోడానికి కవిత్వాన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నట్టు సోదాహరణలతో వివరిస్తూ సభికుల్ని నవ్వించారు.

‘నువ్వు కవిత్వం రాయడానికి వీల్లేదన్న’ ఒక విమర్శకుని ఘాటైన మాటలకు కవిత్వం జోలికి పోకుండా  ఊరకుండిపోయారట.

ఆ తార్వాత చాలా కాలానికి జ్యోతి సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం గారి సలహా  మేర తిరిగి కవిత్వాన్ని రాయడానికి పూనుకున్నారట.

అయితే కవిత్వానికి బలమైన ప్రేరణ గా నిలిచింది మాత్రం – ‘’కొండేపూడి నిర్మల గారు రాసిన లేబర్ రూం అనే కవిత..’’ అంటూ ఆగారు.

ఆ మాటలకి నేను,ఒక్క సారిగా అలెర్ట్ అవుతూ, నిఠారై కూర్చున్నా. ఏవిటీ, ద్వానా శాస్త్రి గారు కవిత్వానికి నిర్మల గారి కవిత స్ఫూర్తి గా నిలిచిందా? భలె. భలే. క్వయిట్ ఇంట్రెస్టింగ్!..అని అనుకుంటూ..వారి మాటలను ఎంతో శ్రధ్ధతో ఆలకించ సాగాను.

ద్వానా శాస్త్రి గారు – నిర్మల గారి కవిత ‘లేబర్ రూం’ ను పరిచయం చేసారు. పేపర్ మీద రాసుకున్న కవితా పంక్తుల్ని చదివి వినిపించారు. నిజంగానే మెచ్చుకున్నారు. కవయిత్రి కవిత్వీకరించిన ఆ వైనాన్ని చిన్నగా కొనియాడారు కూడా.

ఆ తర్వాత చిరు విమర్శలాడి నవ్వించారు.

ఆ పైన, కాస్త ఘాటు గానే స్పందించారు.

లేబర్ రూం అనే కవిత చివరి పంక్తుల్లో- స్త్రీ ప్రసవ వేదనకు పురుషుణ్ని కారణం గా చేయడాన్ని, దోషి గా చేసి చూపడాన్ని ..   వ్యతిరేకిస్తూ, ఆయన  తన విమర్శలని గుప్పించారు.

‘ఏం? నేరమంతా మగాడి మీద తోసేయడమేం ఎంతైనా చోద్యమన్నారు. స్త్రీ మాత్రం కారకు రాలు కాదా? ఆమె కోరుకోలేదా? ఆమె మాత్రం (ఎడిట్) లేదా?” అంటూ ఒక ఉద్వేగం లో ప్రసంగిస్తుంటే..వెంటనే స్ఫురించింది. ఆ మాటలు హద్దు మీరుతున్నట్టు! నేను వెంటనే అడ్డంగా  తలూపుతూ నా అభ్యంతరాన్ని తెలియచేసాను . అది సభా కార్యక్రమం. కాబట్టి, ప్రేక్షకుని సంస్కారం అంతవరకే అనుమతిస్తుందనే సంగతి మీకూ అర్ధమయ్యే వుంటుందని తలుస్తాను.

నేను అప్పటి దాకా శాస్త్రి గారి హాస్య ధోరణి కీ, వ్యంగ్యపూరితమైన మాటల విసుర్లకి నవ్వినదాన్నే.

ఎందుకంటే – నేను ఏ ‘ఇస్ట్’ కి చెందిన దాన్ని కాదు కాబట్టి.

ఆయన తన ముందు ప్రసంగంలో ఫెమినిస్ట్ ల మీద హాస్య వ్యంగ్య బాణాలు బాగానే సంధించి వొదిలారు.

భర్త – భార్యని ‘ఏమే’ అని పిలిస్తే  విప్లవం లేవదీయాలా? పెళ్ళాన్ని  అలా పిలిచే  హక్కు, అధికారమూ భర్త కు వుండదా? వుండకూడదా? అని నిలదీసారు ఫెమినిస్టుల్ని.

అంతే కాదు తన పెళ్ళాన్ని చనువుగా ఎలా పిలుచుకున్నా ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆ మాట కొస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు కట్టుకున్న వాణ్ని  ఏరా అని పిలుస్తున్నారు తప్పేముందీ? అని పాయింట్ లాగారు. ఆమె మొగుడు, ఆమె ఇష్టం. ఎలా ఐనా పిలుచుకోవచ్చు మధ్యన అడ్డుపడటానికి, అర్ధం లేని రాధ్ధాంతాలు చేయడానికి మనమెవరం? అని సూటిగా  ప్రశ్నించారు.

వింటున్న పృక్షకులకు వారి  మాటలు సబబు గానే తోచాయి.

కానీ, ఒకానొకఆవేశపు వాక్ప్రవాహం లో (..) అన్న మాటలకే నా కు అభ్యంతరమేసింది.

లేబర్ రూం అనే కవిత్వం లో కవయిత్రి – ప్రసవ వేదన అనే అంశాన్ని   స్త్రీ దృక్కోణం నుంచి  పరిశీలించి, ఆ వ్యధను   అక్షరాలలో పొంగించారు. ఆ నరకపు యాతన అలాటిది మరి.

అలానే, చివరి పంక్తుల్లో, పురుషుణ్ణి మెన్షన్ చేసీ వుండొచ్చు. దీనంతటకీ అతనే కారకుడనీ, అతను మాత్రం సుఖం గా వున్నాడని కూడా అనివుండొచ్చు. సరిగ్గా ఈ అంశం మీద ఎంత చర్చైనా కొనసాగించవచ్చు. తప్పు లేదు.

అంతే కానీ, … ‘ఏం, ఆమె మాత్రం పడుకోలేదా? కావాలనుకోలేదా? సుఖం పొందలేదా ?’ అనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబు గా తోచదు. అదీ, ఒక సభా వేదిక మీద.. ఉహు. మనస్కరించడం లేదు ఇలాటి బహిరంగ వాదాన్ని అంగీకరించేందుకు. అందులో, ఒక గొప్ప వక్తగా, ఒక విజ్ఞాన వేత్త గా నేనెంతో అభిమానించే ద్వానా శాస్త్రి గారు మాట తూలడం..జీర్ణించుకోలేకపోయాననే చెప్పాలి.

అంత వరకెందుకు? ప్రసవ వేదనలో భరించలేని నొప్పులతో భూమి దద్దరిల్లేలా కేకలేస్తూ..ఎందరో స్త్రీలు  కట్టుకున్న వాణ్ణి  తిట్టడం నేను విన్నాను. చూశాను. అలాంటి అసహాయ  స్థితిలో ఆమె కొట్టుమిట్లాడుతుంటే..ఆసుపత్రి స్టాఫ్ – నీచమైన చౌకబారు మాటలనడమూ విన్నాను.   ఆ ఆపద్కాలంలో ఆ తల్లుల పట్ల ఎంతో దయా హృదయం కలిగి వుండాల్సింది పోయి, అంత అసభ్యకరం గా మాట్లాడటం ఎంతైనా శొచనీయం. క్షమిచరాని నేరం.

అలానే, అంతే ఆవేదనతో ఈ సభలో ద్వానా శాస్త్రి గారు మాట్లాడిన  ఆ ఒక్క పదాన్ని కూడా నిరసిస్తున్నాను.

సరే, అసలు విషయానికొస్తాను.

అలా, నిర్మల గారి కవిత్వం – ఆయన లో ఆవేశాన్ని రేపిందనీ,   ఆ కవితకు ధీటుగా తనూ మగాళ్ళను సపోర్ట్ చేస్తూ..  కవిత రాసి గట్టి జవాబివ్వాలని  నిర్ణయించుకున్నారట. ఆ నిశ్చయమే – తన కవితా సాహిత్య పునఃప్రారంభానికి నాంది గా మారిందని తెలిపారు.

 

పిల్లల్ని కననంత మాత్రాన మగాడికి హృదయమే వుండదన్న అపోహ కూడదన్నారు. ఇల్లాలి ప్రసవం ప్రమాదకరం గా మారినప్పుడు, బిడ్డ దక్కకున్నా ఫర్వాలేదు తన భార్య – ప్రాణాలతో దక్కితే చాలని ఆ భర్త డాక్టర్ని వేడుకుంటాడనే సంగతిని గుర్తు చేసారు. మగాళ్లంతా చెడ్డవాళ్ళు, రాక్షసులు అనే అపోహల్ని బలపరిచే రీతిలో రచనలు చేస్తున్న పురుష ద్వేషులైన రచయిత్రుల పట్ల ఆయన తన ఆవేదనని వ్యక్తపరిచారు. మగాళ్ళు పైకి భోరుమని ఏడ్వనంత మాత్రాన కఠినాత్ములని అతని గుండె పాషాణమని ముద్ర వేయడం తగదనే హితాన్ని పలికారు. మగాళ్ళు లోలోనే కుమిలిపోవడం వల్ల వాళ్ళకే గుండె జబ్బులెక్కువొస్తున్నాయనీ, హార్ట్ ప్రాబ్లంస్ తో మరణించే మగాళ్ళ సంఖ్య నానాటికీ పెరిగిపోతోందనీ..మగాడికి హృదయం లేదంటే ఎలా నమ్మడం అంటూ తన ప్రసంగం లో హాస్యాన్ని జోడిస్తూ..సైన్స్ సమాచారాన్ని కూడా అందచేసారు.

అనంతరం తన కవిత ద్వారా చెప్పదలచుకున్న సమాధానాన్ని చదివి వినిపించారు.

dwana

ఆ తర్వాత..శాస్త్రి గారు తన సహజ సిధ్ధమైన సంభాషణా శైలిలోకొచ్చేసారు.

‘నా కవిత్వం – నా  విశ్లేషణ’ అనే  ప్రసంగం లో భాగంగా ‘బాల్యం’ అనే మరో కవితాంశాన్ని తీసుకున్నారు.

కవులందరూ తమ తమ బాల్యాన్ని అద్భుతం, అమోఘం అంటూ పొగుడుకుంటుంటే ఆయనకి ఆశ్చర్యం గానూ, అపనమ్మకంగానూ వుండేదిట. ఎందుకంటే అలాటి తీపి అనుభవాలు కానీ, మధురమైన అనుభూతులు కానీ.. ఏవీ తనకు తెలియనందుకు! పైగా, ఒక కవి కి మించి మరో కవి పోటీ గా ఆ ఆనంద బాల్య దశని వర్ణించడం చూసి మరింత ఆలోచనలో మునిగిపోయేవారట. ఏ కవి ని చూసినా ‘అహా.. ఓహో’ అంటున్నారు, మరి ఇలాటి పరిస్థితుల్లో తను- తన బాల్యం దుర్భరమని రాస్తే   ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోననీ, చిన్న చూపు చూస్తారేమోనని సందేహించారట. ఆ తర్వాత, వున్నదున్నట్టు రాయడానికే నిశ్చయించుకుని, అలానే ఆ కవితని వెలుగులోకి తీసుకురావడం జరిగిందని ఒక చిన్న కథ లా వర్ణించి చెప్పారు.

అన్న దమ్ముల్లో అందర్లోకెల్లా శాస్త్రి గారి నే చిన్న చూపు చూసేవారట వారి తండ్రి గారు.

చదువు దగ్గర్నించీ, దుస్తులు వరకు తనపై చూపిన వివక్షతని, నిర్లక్ష్య ధోరణిని జరిగిన సంఘటనల ద్వారా వివరించి చెబుతుంటే  నేను తలొంచుకుని శ్రధ్ధగా విన్నాను.  నిజమే, ఏ పసివానికైనా ఆ దశలో ఇలాటి అవమానాలు భరింపశక్యం కాని చేదుఅనుభవాలు. పైకి కనిపించని ఈ హృదయ గాయాలు. మనిషి మరణించే దాకా మాయని మచ్చలు.

అసలేమనిషికైనా ఆనందకరమైన బాల్యమే తరగని ధనం.

ఇలాటి  తండ్రుల గురించి    ఎందరో చెప్ప గా విన్నాను. కొందర్ని చూసాను కూడా.

అలాటప్పుడు ఎవరికైనా బాల్యం బంగారం లా ఎలా అనిపిస్తుంది మరి? అనిపించదు. ఆ వ్యధని  యధాతధంగా   కవిత్వీకరించినట్టు ఎంతో ధైర్యంగా చెప్పారు కవి.

అటు పిదప మరో కవితాంశం – కలం!

తాను కంప్యూటర్ జోలికి వెళ్ళనని చెబుతూ, కలం మీద   గల ప్రేమనీ, కలంతో రాసే అక్షరాల పట్ల తనకు గల      అనుబంధాన్నీ, ఆప్యాయతానురాగాలని  వ్యక్తపరిచారు.   ఈ సందర్భం గా కవి శివారెడ్డి గారిని ఉదహరిస్తూ, ఆయన కంప్యూటర్ కాదు కదా, కనీసం సెల్ ఫోన్ కూడా వాడరని తెలియచేసారు.

ఆ ఉపోద్ఘాతానంతరం, తను రాసిన రమ్యమైన ‘కలం ‘కవితని చదివి వినిపించారు. నవ్యలో ప్రచురితమైన ఈ కవితను చూసి తనకు సినారె కితాబిచ్చినట్టు గా కూడా పేర్కొన్నారు.

సభ కొనసాగుతూనే వుంది.

టైం చూసాను. అప్పటికే నాకు ఆలస్యమైంది..నేను ఇల్లు చేరడానికి పట్టే సమయాన్ని దృష్టిలో వుంచుకుని, మెల్లగా నా సీట్లోంచి  లేచి, సభకి మౌనంగా అభివాదం చేసి, వెలుపలికి దారి తీశాను. వస్తూ వస్తూ, శ్రీమతి సుధ గారికి, వంశీ రామరాజు గారికి వీడ్కోలు తెలియచేసుకుంటూ..సడి కాకుండా బయటపడ్డాను.

నాలో నేను తర్కించుకుంటూ..నాతో నేను వాదించుకుంటూ నిశ్శబ్దం గా ఇల్లు చేరాను.

సాహితీ సభలకెళ్లొస్తే, ఒక కావ్యం వెనక దాగిన రహస్యాన్ని     ఛేదించిన ఆనందమేయాలి కదూ!

– ఆర్.దమయంతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ కవిత్వం ఒక ఆర్ట్ గ్యాలరీ..వెంటాడే పూల సంబరం!

 

 “కవిత నా మతం – మతం లేనివాడి మతంనా భాషే నా ముల్లు

నెత్తురు చిమ్మే నా స్పర్శలో

నేలకి తెలియచేస్తున్నాను

నేనిక్కడ ఉన్నానని నేలకు తెలియదు

ఒకప్పుడు ఈ ముళ్లన్నీ పూలేనని

పచ్చికల దాపుల్లోమరో సౌందర్యం సృష్టిస్తున్నాను

వెన్నెలకి అతీతంగా కలలకి అతీతంగా

పదునైన సమాంతర భాష”.

-సచ్చిదానందన్ (ప్రసిధ్ద మలయాళీ కవి)

 

 

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్ గ్యాలరీ’ లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్య సౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ  verbal expression కవి ప్రసాదమూర్తి  ‘heightened emotions’ ని అందుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సీమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూల తోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.

సుప్రసిద్ద సాహితీవేత్త సోమసుందర్ గారు ప్రసాదమూర్తి కవిత్వం లో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్టకవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు,  సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదా సంచారి, సత్యాన్వేషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.

నేను ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్ర చిత్రాలు’గా రంగురంగులుగా , నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతిచెందుతూ ఉంటున్నప్పుడు ఒక  అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళ్లాను. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక ‘ Transcendental consciousness’.

‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన  ‘ the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృదయుల్ని సమ్మోహ పరిచింది. తన్ను తాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.

ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.

“మనుషులంతా పూవ్వులైపోయినట్టు..

పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి

మంచికీ, మానవత్వానికీ మధ్య

ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు..

——-   —–   ——

బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట

ఈ పరిమళాల బజారులోనే

నాకు బతుకుపరమార్ధం  దొరికింది.”.

పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయకళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడు కట్టుకున్న చీకటి నుంచి తేజస్సు దిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని  negative impulses,  క్రూరత్వం, ద్వేషం, అసూయల్ని సమూలంగా  ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotions  ని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis ( purgation) )  కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్వ్తవేత్త అరిస్టాటిల్ విశ్లేషించాడు.

1904041_740635095949533_1999613464_n

ప్రసాదమూర్తి పై కవితలోనే  ‘పరమార్ధం’ అనే మాటలో టాల్ స్టాయ్ భావన  ‘poetic justice ’ ద్వారా నీతి బద్దత, ధర్మాచరణ, మానవతా దీప్తి స్పూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.

ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి  కేవల పదార్ధంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్య ప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్య ప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.

ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్ల కంటే ఉదాత్తమైన, ప్రేమపాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన  పువ్వులుగా  రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనువచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకు తాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా  సామూహికత్వాన్ని పొందాలి. త్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవ ప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతం చేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యం యొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసిన వాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం  చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి

“పూలు లారీల కెక్కించే  చోట

పనిచేసుకున్నా సరిపోయేది

సువాసనల సూదీ దారాలతో

మనుషుల్ని కుట్టి పారేసేవాడిని” అంటూ ఉదాత్తమైన పూలపాదాలు అల్లగలిగారు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు కావ్యం పారాయణం చేస్తూ, పుష్ప పరిమళయోగ ముద్రలో ఉన్న సమయంలోనే మరొక మార్మికం, మధుర, మాదక ద్రవ్యం  లాంటి సుప్రసిద్ధ జపాన్ దేశ కవి మత్సువొబషో కవిత్వాన్ని ధ్యానస్థితిలో ఆస్వాదిస్తూ వుండటం కాకతాళీయంగా జరిగింది. ప్రసాదమూర్తి గారి అద్భుతమైన  పుష్పసృష్టి కవిత్వ వృష్టికి హృదయం మార్దవమైపోతున్న సందర్భంలోనే, ఏమిటి ఈ పూల మహిమ, ఈ పూలను ఇంత ప్రత్యేకించి కవితా వస్తువుగా తన ప్రతిభతో సుగందభరితం  చెయ్యడం ఏమిటి? పూల పరిమళం ఒక మాదక ద్రవ్యనదిగా తెలుగు కవిత్వపు మాగాణిలో ప్రవహించడమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కొన్ని ఆశ్చర్యంగా  బషో రచనల్లో లభించాయి. బషో  తన  యాత్రా వర్ణనలో కవిత్వ తృష్ణ, సౌందర్య లాలసను గురించి, ప్రకృతితో తాదాత్మ్యం గురించి తన భావాలను చాలా కవితాత్మకంగా, తాత్వికంగా  విశ్లేషించాడు. కొంత మేరకు పూలండోయ్ పూలు కావ్య వస్తువుకి దగ్గరగా చూసుకోవడానికి సామ్యతను, సారూప్యతను కలిగి ఉంటుంది. కవిలోను, చిత్రకారునిలోను,  కవిత్వాసాద్వకునిలోను,  ప్రకృతిని ఆరాధించడం అనే సహృదయత, పరిపూర్ణ తాదాత్మ్యం చెందగల మనోధర్మం ఉంటుంది. అది కళా సౌందర్య సంబంధిగా ఉంటుంది.  అటువంటి హృదయ ధర్మం కలిగిన వ్యక్తి ఏది చూస్తే అది ఒక పువ్వై కనిపిస్తుంది. అతడేది స్వప్నించినా అది చంద్రుడై  సాక్షాత్కరిస్తుంది. పువ్వుకన్నా అన్యమైన దాన్ని చూడగలిగేది అసంస్కృత హృదయం మాత్రమే. ఏ కళాకారుడికైనా అటువంటి అసంస్కృతినీ,  అటువంటి చిత్తవృత్తిని ఎలా అధిగమించాలి, ప్రకృతితో ఎట్లా మమేకం చెందాలన్నదే అంటూ వివరిస్తాడు.

ప్రపంచంలో ఎక్కడైనా, మానవ సంస్కారం, సహృదయత, సౌందర్యదృష్టి ఒకేలా వుంటాయి. ఆ స్పందనల్లో, భావనల్లో ఒక అందమైన సారూప్యత ఉంటుంది అనడానికి ఇదొక దృష్టాంతం కావచ్చు, భావసౌందర్యం కావచ్చు. లేదా ప్రపచంలోనే కవుల హృదయ స్పందన ఒకే తీగపై సాగుతాయని ఊహించవచ్చు. ఆ తీగకు పూచిన పూలు మానవతా పరిమళాలే వెదజల్లుతాయని భావించవచ్చు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు, పచ్చ పూల చెట్టు (పురాప్రియురాలు) చదువుతూంటే జపాన్ కవి బషో కవితలు పక్కపక్కనే మనసు చెట్టు కొమ్మలపై వాలుతున్నాయి. అందుకే ప్రసాదమూర్తి కవితలు తెలుగులో చిత్రించినా, కవితా రసాస్వాదకులకు పున:పున: ‘జపనీయ’ కవిత్వమే.

దేశాలు వేరైనా భాషలు వేరైనా ప్రపంచంలో ‘కవిత్వ భాష ’ అనేది ఒక్కటే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ  “THE VINTAGE BOOK OF CONTEMPORARY WORLD POETRY” సంకలనంలో జె.డి క్లాచ్ అంటాడిలా  “poetry knows no borders, it has no capitals and no provinces. Languages are many but poetry is one.  Every culture’s poetry is a local wine and tends to lose its unique savor the aroma of wine yard and weather, harvest and history- when sipped abroad.”

హెగెల్ అభిప్రాయం ప్రకారం ” The true medium of poetry is not words but poetic ideas”.

ఈ సంకలనంలో ప్రసాదమూర్తి కవిత్వ భావనలు ప్రతికవితలో సునిశితమైన ఊహాశాలిత్వంతో, సుందరమైన  అభివ్యక్తితో కళకళలాడుతూ ఉంటాయి. ప్రగాఢమైన మానవీయ స్పందనలతో సమ్మిళితమై ఉంటాయి. “కత్తుల భాష మాత్రమే తెలిసిన మనుషులకు / ఆ చెట్టుతో పూలగుత్తుల సంభాషణ నేర్పించాలి / నలుగురి ఆనందం కోసం / సర్వం రాల్చేసుకోవడం / ఎలాగో ఒక ఈ చెట్టు నీడలోనే తెలుసుకోవాలి”.

వస్తువుతో పాటు, శిల్పం, ప్రసాదమూర్తి కవిత్వంలో సంయమనంతో సాగటమే కాక, సమతౌల్య స్థితిని కలిగి ఉంటాయి. ప్రయోగించే భాష సార్ధకంగా వుండటమే కాక భావఫల సిద్దికి ప్రచోదక శక్తిగా ఉపయోగించడం ఈ కవికి అబ్బిన అరుదైన కళ. వర్తమానతా లక్షణం తో పాటు సమస్త సాహిత్యానికీ కేంద్రబిందువైన ‘ మనిషి’  మానవ సంబంధాలు, మనిషి బ్రతుకును ఉన్నతీకరించడంపై కవికి శ్రద్ధ, స్పృహ ఎక్కువ. అందుచేతనే పూలతోనో, చెట్టుతోనో మనిషికి హితబోధ చేయిస్తాడు.

‘దయామయి’  కవితలో అనాధ బిచ్చగత్తెను portray చేస్తూ కవి ప్రసాదమూర్తి మానవీయ సంస్కారంతో పలుకుతాడు. ఈ కవిత కరుణ భావనతో మలచబడి మానవ సేవా సౌందర్యంతో కవి బుద్ధుడి శిల్పం దర్శనమిస్తుంది.

“ధేహాన్ని ఒక బొచ్చెగా విసిరి / మెట్టులో మెట్టుగా ఒదిగిపోతుంది / మెట్లన్నీ నాకు /కనికరం లేని లోకాన్ని కాపాడమని / దేవున్ని వేడుకుంటున్న / అనాధ బిచ్చగత్తెల్లానే కనిపిస్తున్నాయి”.

తన కళ్లెదుటి భౌతిక జగత్తులో కాసింత జాలి కోసం, మానవ స్పందన కోసం దీనంగా ఎదురుచూసే తోటి మనుషుల కళ్లలోకి సానుభూతితో తొంగిచూస్తూ.. చలిస్తూ, ద్రవిస్తూ, ఆర్ధ్రతతో నిర్జీవ వస్తువుల్లో కూడా కదలాడే ప్రాణ స్పందనలో గుండెతో చూడగల సౌజన్యం, సున్నితత్వం కవి ప్రసాదమూర్తి తత్వం. కవిత్వపరంగా ఇదొక వినూత్న శిల్పం. ప్రసాదమూర్తి కవితాభివ్యక్తిలో మరొక వైవిధ్యమేమిటంటే సమాజం ఏ దీనుల కోసం, ఆర్తుల కోసం దయామయులుగా స్పందించి సహాయ హస్తాలనందించాలో.. వాళ్లే కరుణామయులుగా కనిపించటం. చూడండి ..”మాయదారి మనుషులే / ఆ మెట్టుదాకా వచ్చాక దేహాలనీ కళ్లనీ /చటుక్కున అటు తిప్పేసుకుని విసురుగా పారిపోతారు / ఆమె మాత్రం దయ నిండిన నేత్రాలతో ఆశీర్వదిస్తూనే ఉంటుంది”.  ‘దయామయి’ పేరు సార్థకమైంది. ఈ కవితలో బౌద్ధతత్వంలోని మూల భావనలు ద్యోతకమవుతాయి. సమ్యక్ కరుణ, సమ్యక్ జ్ఞానం మొదలైనవి. ఆమె పేరుకే బిచ్చగత్తె. కానీ లోకానికి దయాబిక్షం పెట్టే ప్రేమగల తల్లి. ఇక్కడ నేను ప్రస్తావించదలచిన మరొక ప్రధాన అంశం ఏమిటంటే, కవి సమాజం పట్ల దయామయుడు కావడం, స్పందించడం, నిస్వార్ధ చింతనతో నిబద్ధుడు కావడం – నిర్మల చిత్తంతో సేవా బుద్ధుడు కావడం. ఇది ప్రసాద కవి గుణంలో మరొక సాత్విక భావాంశంగా భావిస్తున్నాను. మనుషుల్లోనే కాదు, పూలలో, చెట్టులో, రాళ్లలో, కరుణాంతరంగాన్ని, దయా గంగోత్రిని ఈ కవి చూడగలడు. కవి ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతుల్లో ఇదొక విలక్షణత, వైవిధ్యం.

మరొక కవిత ‘గుండె కొల్లేరు’ పఠితల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. మెస్మరైజ్ చేసేస్తుంది. ‘గుండె కొల్లేరు’  కవి ప్రసాదమూర్తి  ‘ పురిటి వేరు ‘ గా భావించవచ్చు. తాను బాల్యంలో దేనితో మమేకమై జీవించాడో, దాని ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకం కావటం కవిని వేదనకు గురి చేసింది. తన జీవనానుభూతిని కవిత్వీకరించిన పద్దతి చాలా విలక్షణంగా ఉంటుంది. పఠితల్ని ఆ కవితావస్తువైన కొల్లేటితో మమేకం చేయిస్తుంది. మునకలు వేయిస్తుంది. ఈ కవితలో ప్రయోగించిన పదజాలం అచ్చమైన ప్రాంతీయతను, మట్టి వాసనల మాండలికాన్ని పుణికిపుచ్చుకొని ఉంటాయి. కవి ప్రసాదమూర్తి సహృదయుల్ని తన భావోద్వేగాలలో, పాత జ్ఞాపకాల వెతుకులాటలో, మూగ సంవేదనలో, మూగవాని పిల్లనగోవి పాటలో, దిసమొల ఆత్మలో పూర్తిగా సంలీనం చేసుకుంటాడు. ఒక తల్లిని పోగొట్టుకున్న పిల్లాడిలా.  ‘గుండె కొల్లేరు’ కవిత అచ్చంగా ప్రసాదమూర్తి  ‘ అమ్మ పాత ఫోటో ‘, పాత హిందీ సినిమాలో సైగల్ విరహగీతం, మెరాదీహసన్ గజల్.

ఎంత అద్భుతమైన పదచిత్రాల్ని సృష్టించాడో ఈ కవి అనబడే  ‘ రంగుల గీత కార్మికుడు ‘ చూడండి.    అచ్చెరువుతో  అచ్చెరువులో మునిగిపోతారు.  “ఆకాశం ఈ సరస్సులోనే   /  తన ముఖం చూసుకుంటూ  /  సూర్యుణ్ణి బొట్టు బిళ్లగా  /  సర్దుకునే దృశ్యం తలపుకొచ్చింది.”. ఈ చెదరిన నీటిగూడు ఎలా అల్లబడిందో , ఏ సామాగ్రి వాడాడో చూడండి. కొంగలు, నీటికాకి, తుమ్మచెట్టు, గట్లు, తాటి దోనె, నాచుబట్ట, చద్దన్నం, ఉలస పక్షులు, చిలకబాతులు, పరజ పిట్టలు, గిన్నికోళ్లు, నత్తకొట్టు పక్షులు. ఇవన్నీ కొల్లేరుతో విడదీయరాని అనుబంధమున్న సదాబాలకుడు కవి ప్రసాదమూర్తికి పుట్టిన నేల అందించిన పద సౌందర్య సంపద. మూల్యం అమూల్యం.

ఈ కవిత  మృగ్యమైన బాల్యంలోని కొల్లేటి సరస్సు ఆత్మను పలవరిస్తూ, స్మరిస్తూన్న ఒక  ‘ఎలిజీ  ఛాయ లాంటిది. ప్రసిద్ధ మలయాళీ కవి కె. సచ్చిదానందన్  ‘వడ్లగింజ’ కవిత ఇలాంటి పోగొట్టుకున్న ఇల్లు, పొలాన్ని గురించే. ఆయన భావాల్లోనే ఈ కొల్లేటిని కవి ప్రసాదమూర్తి   అనుభూతిని ఇలా కోట్ చెయ్యొచ్చు.  ‘ నా కవితలో నేను మండుతూనే ఉన్నాను  /  నా చితిలోని కట్టెలా  /  నాకవితలో నేను  /  కవిత్వాన్ని అనువదించడం  /  ఒక గూడు వదిలి మరో గూడు చేరటమే  /  నీటిలో మునిగి ఈదే చేపలా  / మనసులోనే మునిగి ఈదుతున్నాడు, అనువాదకుడు  / నాకు వచ్చిందో కల  /  ఓ రోజు నా కవితని నేనే  /  నా భాషలోకి అనువదిస్తున్నట్లు  /  మనం మన కవితలని  /  మన భాషలోకి అనువదిస్తున్నాం’.

కె. సచ్చిదానందన్  “కవిత్వ మంటే పరిపూర్ణ వ్యక్తీకరణ ”  అని చెప్పిన నిర్వచనానికి అర్ధం ఇదే. ప్రసాదమూర్తి  ‘ గుండె కొల్లేరు ‘ కవిత్వ నిర్మాణం ఇలా పరిపూర్ణ వ్యక్తీకరణతో  రూపుదిద్దుకున్నదే అని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనా గుండె కొల్లేరు కవిత పరిపూర్ణమైన  ‘సరస్సౌందర్య శాస్త్రం ‘  (LAKE AESTHETICS)  గా తెలుగు కవిత్వంలో పచ్చగా పదిలంగా ఉంటుంది.

ఆధునిక కవిత్వంలో, కవిత్వీకరణ వ్యూహాలతో ప్రధానమైనది రూపకం. ప్రసాదమూర్తి కవిత్వంలో రూపకాలంకార ప్రయోగ నైపుణ్యం చాలా అందంగా ఆకర్షిస్తుంది.

మచ్చుకు కొన్ని :  జ్ఞాపకాల జాజులు  / మమకారాల మందారాలు  / మమతల మల్లెలు  /  కలల కనకాంబరాలు  / ఊహలగులాబీలు  / ముద్దు చూపుల ముద్దబంతులు  / పాటల పారిజాతాలు  / పరిమళాల బజారు  / ఎర్రని ఎండపిట్ట   / మబ్బుల బురఖాలు  / చెట్టు దేహం.

కవి  ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు ‘ కావ్యంలో ఇంకా ఎన్నో కవితలు, అమ్మ పుట్టిన రోజు, వాన, వాన, వాన, చిలకల రైలుడబ్బా , చెల్లి అమెరికా యాత్ర, పురా ప్రియురాలు మొ.. అన్నీ  ఈ కవిచిత్రకారుని  కవిత్వచిత్రశాల ( పొయెట్రీ ఆర్ట్ గ్యాలరీ ) లో కళాఖండాలు.  మాలాంటి కరువు సీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజలలాంటి వానచినుకులు. కవిచిత్రకారుడు ( Poet Painter )  ప్రసాదమూర్తి గారి ‘Rare collection of poetry  paintings ‘.

ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యానమార్గం. శిల్పి శిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.

అందుకే చివరగా  ప్రసిధ్ద చిత్రకారుడు పి. మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు  డావిన్సీ ,  మొనాలిసా చిత్రరచనను చేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

“డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు.ఈజిల్ పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసి ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగు నీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం  మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుం,చెలో రంగుల స్నానం చేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి”.

ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అన్వేషి, సంచార జీవి  ప్రసాదమూర్తి గారిని నిండుగుండెతో అభినందిస్తూ, మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెన్నెలలో కరిగిపోతూ..

మల్లెల  నరసింహమూర్తి

(  కవి ప్రసాదమూర్తి నవంబర్ 18న ప్రతిష్ఠాత్మక సోమసుందర్ సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

 

నేను కూడ ఒక ‘నాటు’ మనిషినే!

AmericaAnubhavalu

మనం ఎవ్వరూ కని, విని, ఎరగని కైలాస్ సత్యార్థి కి నోబెల్ శాంతి బహుమానం వచ్చిందని తెలియగానే “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న గీతా ప్రబోధం గుర్తుకి వచ్చింది.

నిష్కామ కర్మ గొప్పతనం అది. ఏ ఫలితం ఆశించకుండా ఎవరి పని వారు చేసుకుని పోతూ ఉండడం. కాయ పండగానే అదే రాలుతుంది.

వంగూరి సంస్థ వారు గత నాలుగు దశాబ్దాలబట్టీ చేస్తూన్న పని కూడ ఇలాంటిదే. వారు చెయ్యాలనుకున్న పనిని, విధాయకంగా, చేసుకుపోతున్నారు. దీని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా కనిపిస్తుంది.

. విత్తు నాటిన వారు పండు తినే అవకాశం తక్కువ – అయినా కొందరు నాటుకు పోతూ ఉంటారు. వీళ్లని “నాటు మనుష్యులు” అందాం.

నేను కూడ ఒక నాటు మనిషినే! ఒక ఫలితాన్ని కాని, ఒక పురస్కారాన్ని కాని ఆశించి రాయడం మొదలెట్టలేదు. ఈ పురస్కారం నాకు చెయ్యాలని నేను ఎవ్వరినీ అడగలేదు. అయినా సరే ఈ పురస్కారానికి నన్ను కూడా ఎన్నుకున్నందుకు వంగూరి సంస్థ అధినేతలకు నా కృతజ్ఞతలు.

నేను ఇండియాలో చదువుకునే రోజులలో “కథ కాని కథ” అనే శీర్షిక ఆంధ్రపత్రిక నడిపింది. నా మొట్టమొదటి కథ, పోస్టు కార్డు మీద రాసి, పంపేను. వారు 5 రూపాయలు బహుమానం ఇచ్చేరు. తరువాత దీక్షతో రచనా వ్యాసంగం మొదలు పెట్టినది అమెరికా వచ్చేకనే – నిక్కచ్చిగా చెప్పాలంటే 1967 లో. అప్పటి నుండి ఇప్పటి వరకు, తరచుగా ఏదో ఒకటి అలా ప్రచురిస్తూనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 10 పుస్తకాలు అచ్చయాయి, మరో 6 పుస్తకాలు  నా కంప్యూటరులో ఉన్నాయి – ప్రకాశకుల కోసం ఎదురు చూస్తూ. లెక్కపెట్టలేదు కాని కథలు కనీసం 50 ఉండి ఉండొచ్చు. వ్యాసాలు మరొక 50 ఉంటాయి. టూకీగా ఇదీ నేను చేసిన పని.

ఎందుకు రాస్తున్నాను? ఏ విషయాల మీద రాస్తున్నాను? ఈ విషయాలమీదే ఎందుకు రాస్తున్నాను? ఈ పని వెనక అంతర్లీనంగా ఏదైనా ఒక సూత్రం ఉందా? – అని పలువురు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానాలు వెతుకుదాం.

 

  1. తెలుగులో ఎందుకు రాస్తున్నానా?

 

సైన్సుని తెలుగులో – నలుగురుకీ అందుబాటులో ఉండేలా – చెప్పాలనే కోరిక నాలో చిన్నప్పటినుండీ ఉంది. నేను ఇంగ్లీషు అర్థం అవుతుంది . ఇంగ్లీషులో రాయగలను కూడా. కానీ, తెలుగులో చదివినా, రాసినా ఆనందంగా ఉంటుంది. సైన్సుని తెలుగులో ఆస్వాదించి ఆనందించేవారు ఎవరైనా ఉంటే, వారి కోసం రాస్తున్నాను. అలాంటివారు ఎవ్వరూ లేకపోతే నా ఆనందం కోసం రాసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే చదవకండి – కాని, నన్ను రాయొద్దని అడగకండి.

 

“సైన్సుని తెలుగులో ఎలా రాస్తారండీ? మనకి వొకేబ్యులరీ లేదండీ,” – ఒకరు.

 

“సైన్సుని తెలుగులో బోధించడం మొదలుపెడితే ఇప్పటికే వెనకబడి ఉన్న మనం ఇంకా వెనకపడి పోతాం అండీ!” – మరొకరు

 

తెలుగులో “వొకేబ్యులరీ” లేకేమి? కావలసినంత ఉంది. ఆర్వీయస్ సుందరం గారు ఒక సారి లెక్క వేసేరు. షేక్స్‌పియర్ నాటకాలలో వాడిన ఏకైక ఇంగ్లీషు మాటల కంటె తిక్కన తెలుగు భారతంలో వాడిన ఏకైక తెలుగు మాటలు ఎక్కువట!

 

సైన్సుని తెలుగులో బోధించాలని అనటం లేదు. ఇంగ్లీషుని తరిమికొట్టాలనీ అనటం లేదు. తెలుగులో కూడ రాయమంటున్నాను. రాసినవి చదవమంటున్నాను. తెలుగులో మాట్లాడమంటున్నాను. ఇది తప్పయితే క్షమించండి.

 

వాడుక లేక తెలుగు మాటలు వాడితనం పోయి వాడిపోతున్నాయి. తుప్పు పట్టి మూల పడిపోతున్నాయి. అవసరం అయినప్పుడు కొత్త మాటలు సృష్టించుకునే ధైర్యం మనలో చచ్చిపోయింది. నా గమ్యం ఒక్కటే. “సైన్సు ని తెలుగులో రాయకలం” అని రాసి చూపించడం. అందుకని తెలుగులో రాయడం మొదలు పెట్టేను.

 

  1. తెలుగులో ఏమిటి రాస్తున్నానా?

 

మొదట్లో, సైన్సు విషయాలని నలుగురికీ అర్థం అయే రీతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే అమెరికాలో నా మొట్టమొదటి తెలుగు రచన. దాని పేరు “కంప్యూటర్లు.” దానిని 1967 లో రాసేను. నా అదృష్టం బాగుండి శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఆ రోజులలోనే తెలుగు భాషా పత్రిక స్థాపించేరు. అందులో నా పుస్తకం ధారావాహికగా మూడేళ్ల పాటు ప్రచురించేరు. దానికి అనూహ్యంగా స్పందన వచ్చింది. అప్పుడు తెలుగులో ఇంకా రాయాలనే కోరిక ఇనుమడించింది.

 

ఇలా వచ్చిన స్పూర్తితో నాలుగైదు “సైన్సు” కథలు, వ్యాసాలు కూడ ప్రచురించేను – తెలుగు భాషా పత్రికలోనూ, ఆంధ్ర పత్రికలోను, భారతిలోనూ. నా “బ్రహ్మాండం బద్దలయింది” కథకి  తెలుగు భాషా పత్రిక వారు ప్రోత్సాహక బహుమతి కూడ ఇచ్చేరు. ఇదే కథని సాహిత్య అకాడమీ వారు 2013 లో ప్రచురించిన “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే కథల సంపుటంలో వేసుకున్నారు. నాకు 1500 రూపాయలు పారితోషికం కూడ ఇచ్చేరు. నలభయ్ ఏళ్ల పాటు పాట్లు పడ్డ తరువాత “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే ప్రక్రియకి గుర్తింపు వచ్చింది కదా అని సంతోషించేను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.

 

తరువాత – 1970-80 దశకంలో జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టుకొచ్చిందో వివరిస్తూ “జీవరహశ్యం” అనే పుస్తకం, ఇంటింటా, వంటింటా కనబడే పదార్థాల వెనక ఉండే రసాయన శాస్త్రం చెబుతూ “రసగంధాయరసాయనం” అనే పుస్తకం ప్రచురించేను – నా సొంత ఖర్చులతో! ఈ రెండూ డాక్టర్ గవరసాన సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగేయి.

 

ఆ దశకపు చివరి రోజులలోనే తానా ప్రారంభం అయింది. అప్పుటి నుండి వారు  సభ జరిపినప్పుడల్లా  కథో, వ్యాసమో కావాలని అడిగేవారు. ఆ రోజుల్లో రాయగలిగే వాళ్లు తక్కువ. అందుకని నాకు తప్పకుండా ఆహ్వానం వచ్చేది. అప్పుడు ఎక్కువగా వ్యాసాలు రాసేను. ఈ వ్యాసాలు తెలుగు భాషని, లిపినీ సైన్సు రచనకి అనుకూలంగా ఎలా  మలచాలి అన్న అంశం మీద ఉండేవి. అప్పుడప్పుడు తెలుగు సంస్కృతికి సంబంధించినవి కూడ రాసేవాడిని.

 

నేను రాసినంత జోరుగా అమెరికాలో ప్రచురణకి అవకాశాలు దొరికేవి కావు. నా రాతలు ఇండియా పంపిస్తే ఆ పత్రికల వారు వేసుకున్నారో, నిరాకరించేరో చెప్పరు కదా. పైపెచ్చు తట్టెడు తపాలా ఖర్చులు. కనుక ఏమిటి రాయాలో, ఎక్కడికి పంపాలో తెలియని అంధకార యుగంలో పడ్డాను. శ్రీ కిడాంబి రఘునాథ్ గారి తెలుగు జ్యోతిలో అవకాశం దొరికినప్పుడల్లా ఇరికేవాడిని.

 

ఈ పరిస్థితులలో, 1987లో అనుకుంటా, శ్రీ చందూరి మురళి రచన అని ఒక పత్రిక స్థాపించి, జీవిత చందా కట్టమని అడిగేరు. “కడతాను కాని సైన్సుకి ఒకటో, రెండో పేజీలు కేటాయిస్తారా?” అని అడిగేను. “మీరు సైన్సుని “సైన్సు”లా  రాస్తే ఎవ్వరూ చదవరు. కథ రూపంలో రాయండి, వేసుకుంటాను” అన్నారు. అప్పుడు సైన్సు ప్రాతిపదిక మీద చాల కథలు రాసేను. కల్పనలు కాదు. పక్కా సిద్ధాంత పరంగా పటిష్ఠమైన సైన్సు. ఎక్కువగా వైద్యానికి సంబంధించిన కథలు. ఈ కథలు చదివి నేను వైద్యుడననే భ్రమతో పాఠకులు  ఉత్తరాలు రాసేరని రచన శాయి గారు చెప్పేరు. తెలుగు కథల ద్వారా సైన్సు ప్రచారం చేసినందుకు మా యూనివర్శిటీ వారు నాకు “పబ్లిక్ సర్విస్ ఎవార్డ్”తో పాటు 250 డాలర్లు బహుమానం కూడ ఇచ్చేరు.

 

మరొక పక్కనుండి, 1980 దశకంలో, అంతర్జాలం అందుబాటులోకి రావడంతో  కంప్యూటర్ తెర మీద తెలుగు అక్షరాల కోసం తాపత్రయం మొదలైంది. ఈ కొత్త మాధ్యమంలో  చెయ్యి నలగాలంటే ఏదో ఒకటి రాస్తూ ఉండాలి కదా. రాయడానికి వెంటనే వస్తువు దొరకొద్దూ? అందుకని కొత్తగా వస్తూన్న ఖతులతో (ఫాంట్లతో) అనుభవం సంపాదిద్దామని నా జీవిత చరిత్ర రాసుకోవడం మొదలు పెట్టేను. అదొక పుస్తకం అంత పొడుగు అయింది. ఆ పుస్తకానికి “అమెరికా అనుభవాలు” అని పేరు పెట్టి, ఎమెస్కో వారి ద్వారా ప్రచురించేను. బాగా ఆదరణ పొందింది.

 

కంప్యూటరు మాధ్యమంతో తెలుగు రాయడానికి వెసులుబాటు దొరికిన తరువాత నా కథా రచన కొంత ఊపు అందుకొందనే చెప్పాలి. కంప్యూటర్ మీద కథలు రాసేటప్పుడు రకరకాల వాక్య నిర్మాణాలతో ప్రయోగాలు చేసి చూసుకోవడం తేలిక అయింది. అదే విధంగా అనువాకాల క్రమాన్ని అమర్చడం కూడ తేలిక అయింది. ఈ తరుణంలో రాసిన  కథలు కొన్నింటిని “కించిత్ భోగో భవిష్యతి” అన్న పేరుతో వంగూరి సంస్థ వారు ప్రచురించేరు. తరువాత కొన్ని కథలని “మహాయానం” అన్న పేరుతో “ఇ-పుస్తకం” గా కినిగె సంస్థ వారు వెలువరించేరు. ఈ రెండవ సంకలనంలో ఉన్న “మరోలోకం” అన్న కథకి వంగూరి సంస్థ వారు $116/ బహుమానం ఇచ్చేరు.

 

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను రాసేవాటిని మెచ్చుకునేవారు తక్కువే.

 

“వేమూరి రాసే కథలలో సైన్సు మన సంపాదకులకి, విమర్శకులకి, సమీక్షకులకి అర్థం కాదు. అందుకని వేమూరికి దక్కవలసిన గుర్తింపు దక్కడం లేదు,” అని కవన శర్మ ఒక చోట రాసేరు.

 

“ఈ మధ్య మీ కథ చదివేను. విలక్షణంగా ఉంది. సైన్సు అర్థం కాలేదు” అని మధురాంతకం రాజారాం అన్నారు.

 

నా “కించిత్‌భోగో భవిష్యతి” కి అట్ట మీద బొమ్మ వేసిన బాపు నాకు స్వహస్తంతో ఉత్తరం రాస్తూ: “పంటికింద పోకచెక్క”  కథలో మీరు వర్ణించిన ఇల్లు మా ఇంటిని గుర్తుకి తెచ్చింది,” అని రాసేరు. కథ బాగుందో బాగులేదో చెప్పలేదు.

 

“ఆడవారి పాత్రలు ఉన్న కథలు కూడా రాయండి,” అని పెమ్మరాజు గారు అన్నారు.

 

“సైన్సు లేని కథలు రాయండి” అని మరికొందరు అన్నారు.

 

“అమెరికా జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాయరాదూ?” అన్నవాళ్లూ ఉన్నారు.

 

ఈ రకం ఆక్షేపణలని ఎదుర్కోవాలని కొన్ని కథలు రాసేను: పెళ్లికూతురు మనస్సుకి క్షోభ కలిగించేరంటూ మగ పెళ్ళివారిని కోర్టుకి ఈడ్చిన వయినం “లోలకం” లో కథా వస్తువు. రచన శాయి గారు ఈ కథని “కథా పీఠం” లో వేసుకుని వెయ్యినూటపదహార్లు ఇచ్చేరు.

 

డిట్రాయిట్ లో నేను చదువుకునే రోజుల నేపథ్యంలో, “ఎమిలీ” అనే కథ రాసేను. ఇందులో ముఖ్యమైన పాత్రలు స్త్రీలే. ఈ కథ చదివి వసంత లక్ష్మి గారు “ఓ. హెన్రీ కథలా ఉంది” అని కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

“అభయారణ్యంలో ఏంబర్” మా యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన కథ. ఇందులో ఒక భారతీయుడు ఒక అమెరికన్ అమ్మాయితో అమెజాన్ అరణ్యాలలో తిరగడానికని వెళ్లి తప్పడిపోతారు. అయిదు రోజులు నిద్రాహారాలు లేకుండా ఇద్దరూ ఒకరికొకరు ఆసరాగా బతికి బయటపడతారు. ఈ అయిదురోజుల పరిచయం అనురాగంగా మారుతుంది. “ఈ కథని చాలా సంయమనంతో నడిపేరు” అని ఈమాట సంపాదకుడు కె. వి. యస్ రామారావు కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

నేను రాసిన “భయం” కథ చదిన వారందరు, వంగూరి చిట్టెన్‌రాజు తో సహా, “అయ్యా, మీరు నిజంగా అలాస్కా వెళ్లేరా?” అని అడిగేరు.

 

ఎంత బాగా వంట చెయ్యడం వచ్చినవారైనా ఎప్పుడూ బాగా వండలేకపోవచ్చు. తినేవాళ్లకి కూడ ఒక రోజు రుచించిన వంటకం మరొక రోజు రుచించకపోవచ్చు. కథల విషయం కూడ అంతే. రాసిన కథలు అన్నీ బాగా రావు. ఒకనాడు నచ్చని కథ మరొకనాడు నచ్చవచ్చు. ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చదు. కనుక ఒకరి మెప్పు పొందాలని కాకుండా నాకు నచ్చిన కథలు నేను రాసుకుంటాను. కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన!

 

vemuriratease-వేమూరి వేంకటేశ్వరరావు

 

ఒక ప్రశ్నలోంచి పుట్టిన కథ !

10253980_10154027889035385_5076761124300498188_n

(కథ 2013 ఆవిష్కరణ సందర్భంగా – అందులో ఎంపికైన కొన్ని కథల నేపథ్యాలు వరసగా ప్రచురించాలని ఆలోచన. ఈ వారం అనిల్ ఎస్. రాయల్ కథ “రీబూట్” నేపథ్యాన్ని అందిస్తున్నాం)

కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా.

నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది

‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నలోంచి. 1898లో హెచ్.జి.వెల్స్ War of the Worlds రాశాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అదో మైలురాయి. అంగారకవాసులు భూగ్రహమ్మీద దాడి చేసి దొరికినవారిని దొరికినట్లు చంపుకుతినటం ఆ నవల ఇతివృత్తం. మొదట్లో చెలరేగిపోయిన మార్స్ దళాలు, అనుకోనిరీతిలో భూమ్మీది బాక్టీరియా ధాటికి కుదేలవటం, దెబ్బకి తోకముడిచి తమగ్రహానికి పారిపోవటంతో ఆ నవల ముగుస్తుంది.

ఆ నవల చదివినప్పట్నుండీ నన్నో ప్రశ్న తొలిచేది. ‘అలా పారిపోయిన మార్షియన్స్ రోగనిరోధకశక్తి పెంపొందించుకుని తిరిగి మన మీద దాడి చేస్తే? వాళ్లని కాచుకోటానికి ఉన్న ఒక్క ఆయుధమూ నిర్వీర్యమైపోతే మనుషుల పరిస్థితేంటి?’.

నేను కథలు రాయటం ప్రారంభించిన తొలినాళ్లనుండి ఈ అంశంతో ఓ కథ రాయాలన్న ఆలోచనుండేది. అంటే, War of the Worldsకి సీక్వెల్ రాసే ఆలోచన అన్నమాట.

‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’ తర్వాతో రెండున్నరేళ్లు విరామం తీసుకున్నాక, మళ్లీ కథ రాసే మూడొచ్చింది; సీక్వెల్ ఆలోచనకి దుమ్ము దులిపే వీలు కుదిరింది. అలా ఈ కథ మొదలయింది. దీనికి ముందు నేను రాసిన మూడిట్లో రెండు కథలు టైమ్‌ట్రావెల్ నేపధ్యంలో రాసినవే. అదే నేపధ్యంలో మరోటీ రాసేసి ‘ఇదిగిదిగో నా టైమ్‌ట్రావెల్ త్రయం’ అనాలనే దుగ్థ ఒకటి ఈ రెండున్నరేళ్లుగా తొలుస్తూనే ఉంది.

అందుకే, War of the Worldsకి కొనసాగింపు రాయటానికి సిద్ధమైనప్పుడు దానికి అనుకోకుండానే టైమ్‌ట్రావెల్ నేపధ్యమై కూర్చుంది. నా కథల్లో జరిగిన/జరుగుతున్న చరిత్ర, ఎప్పుడో జరిగిపోయిన/జరగని పురాణాల ప్రస్తావన లీలా మాత్రంగా చొప్పించటం నాకలవాటు – వాటిక్కాస్త సైన్స్ పూతపూసి. ‘రీబూట్’ దానికి మినహాయింపు కాదు. ‘మానవుల మధ్య కలహాలు ముదిరిపోయి ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగితేలుతుంటే విసిగిపోయిన దేవుడు ప్రళయం ద్వారా మానవజాతిని మళ్లీ మూలాల్లోకి పంపటం’ అనేదో ప్రపంచవ్యాప్త నమ్మకం.

దీన్ని నా కథకి అనుగుణంగా వాడుకుందామనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితులు, మానవులు భూగృహాల్లో బతకటం, ఇలాంటివి అలా వచ్చి కథలో కలిశాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో మనుషుల బదులు మరసైనికులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి (అది మరో విధంగా ఇప్పటికే జరుగుతుంది, నిజానికి), ఆ రకంగా కథలోకి రోబాట్స్ కూడా వచ్చి చేరాయి. మరమనిషి ప్రధాన పాత్ర అనగానే ఐజక్ అసిమోవ్ కథలు గుర్తొస్తాయి.

ఆ తరహా సాహిత్యమ్మీద ఆయన వేసిన ముద్ర అంత బలమైనది. ఆ మహారచయిత గురించి తెలుగు పాఠకలోకంలో ఎక్కువమందికి తెలీదు. అందుకే, ఆయన్ని పరిచయం చేసినట్లుంటుందని కథలో అసిమోవ్ ప్రస్తావన తెచ్చాను. ఈ పెద్ద కథని రెండు భాగాలుగా ఏప్రిల్ 6న అసిమోవ్ వర్ధంతి సందర్భంగా ప్రచురించటం జరిగింది.

-అనిల్ .ఎస్.రాయల్

 

 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10253024_10202317416069206_1368318419_oరీబూట్

(a tribute to Isaac Asimov)

***

 

 

క్రీ.. 2372, సెప్టెంబర్ 1. సాయంత్రం నాలుగూ పది.

 

కిటికీలోకి చూస్తున్నాడు విక్రమాదిత్య. బయటకనుచూపుమేరంతా బూడిద వర్ణం. ఒకప్పుడదో మహానగరం. బహుళంతస్తుల భవనాలు, వాటిని కలుపుతూ రహదార్లు. పచ్చదనం పంచుతూ చెట్లు. వాటి కింద సేదదీరుతూ మనుషులు. ఇప్పుడో? శిధిల నగరం. సూర్యుడిని కమ్మేసిన ధూళి మేఘం. పగలూ రాత్రీ ఏకమైన సమయం. కమ్ముకున్న చిమ్మ చీకటి. దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ లేజర్ మెరుపులుమార్స్ వాసులకీ, మరమనుషులకి మధ్య పోరాటానికి గుర్తుగా. 

 

విక్రమాదిత్య చూపులు బయటున్నా మనసు మాత్రం కొడుకు మీదుంది. ప్రయోగానికింకా రెండుగంటలే ఉంది. అన్నీ సరిగా ఉన్నాయోలేదో ఆఖరుసారి పరీక్షించాలి. వేరే విషయాలు ఆలోచించే సమయం లేదు. కొడుకు మీదనుండి బలవంతంగా మనసు మళ్లిస్తూ కిటికీ అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసుకున్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు రోబోటిక్స్ జంటవిభాగాల అధినేతగా, రక్షణశాఖ కీలక సలహాదారుగా నిరంతరం ఎదుర్కొనే వత్తిడి నలభై ఐదేళ్లకే తెచ్చిపెట్టిన వార్ధక్యం వెక్కిరిస్తూ కనపడింది. ఎర్రబారిన కళ్లు రెండ్రోజులుగా కరువైన నిద్రని గుర్తుచేస్తున్నాయి. తన ముఖంలో గాంభీర్యం తననే భయపెడుతుండగా రిమోట్ అందుకుని ఆఫ్ బటన్ నొక్కాడు. మరుక్షణం కిటికీలోంచి అతని ప్రతిబింబం, దాని వెనకున్న అధివాస్తవిక దృశ్యం మాయమైపోయాయి. అప్పటిదాకా కిటికీలా భ్రమింపజేసిన త్రీడీ టెలివిజన్ తెర వెల్లవేసిన తెల్లగోడలా మారిపోయింది.

బాస్

వెనుకనుండి వినబడ్డ యాంత్రికమైన పిలుపుకి ఉలికిపడి తలతిప్పి చూశాడు. ఐజక్ నిలబడున్నాడక్కడ.

 ***

 

మనిషి పుట్టుక మీద లెక్కకు మిక్కిలి వాదాలు. కోతినుండి మనిషొచ్చాడనే వాళ్లు కొందరు. వేరేదో గ్రహం నుండి వలస వచ్చాడనే వాళ్లింకొందరు. అదనంగా, పురాణాలు ప్రవచించే ఆదిమానవుడి గాథలు. ఆవిర్భావంపై వివాదాలెలా ఉన్నా, మనిషి ఎలా అంతరిస్తాడనే విషయంలో మాత్రం ప్రస్తుతం ఎవరికీ అనుమానాల్లేవు. 

 

మొదట్లో అవసరాల్లోంచి యుద్ధాలు పుట్టేవి. తర్వాత యుద్ధాల కోసం అవసరాలు పుట్టుకొచ్చాయి. క్రమంగా యుద్ధమే అవసరంగా మారింది. అది కల్పించే విస్తారమైన వాణిజ్యావకాశాల కోసం ఇరవై మూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది. విచ్చలవిడి అణువిస్ఫోటాలకి భూమండలం భస్మీపటలమయింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పైకెగసిన అణుధూళి మేఘాలు సూర్యుడిని కమ్ముకుని ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాయి. సూర్యరశ్మి సోకక చెట్లు, అడవులు నశించిపోయాయి. వాటిమీద ఆధారపడ్డ జీవరాశి అంతరించిపోయింది. ఓజోన్ పొర ఆవిరైపోయింది. రేడియేషన్ వల్ల అపరిమితంగా వేడెక్కిన ఉపరితలం ఆవాసయోగ్యం కాకుండాపోయింది. అణుయుద్ధాన్ని తట్టుకోటానికి ముందస్తు సన్నాహాలు చేసుకున్న దేశాలు మాత్రం కొద్ది శాతం మనుషుల్ని, కొన్ని జాతుల జంతువుల్ని భూగర్భ బంకర్లలోకి తరలించి కాపాడుకున్నాయి. 

 

అప్పట్నుండీ మనుషులు పాతాళంలోనే బతుకుతున్నారు. పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూట ఎనభై ఏళ్ల సుదీర్ఘ సమరంలో ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పాత దేశాలెన్నో కనుమరుగయ్యాయి. పాతిక దేశాలు, అవి కట్టిన రెండు కూటములు మిగిలాయి. వాటి తరపున మరసైనికులు భూమ్మీద  మొహరించి పోరాడుకుంటుండగా …. ఐదేళ్ల కిందటొచ్చిపడిందో ఊహించని ఉపద్రవం. దానివల్ల యుద్ధమైతే ఆగలేదు. కానీ యుద్ధ లక్షణాలు మారాయి. లక్ష్యమూ మారింది. 

 

అది క్రీ.. 2367. అరుణగ్రహం నుండి మొదటి బెటాలియన్ భూమ్మీద పాదం మోపిన ఏడాది. ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగి ఆదమరిచిన మానవుల మీద ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి మార్స్ సైన్యాలు. అంగారకుడిమీద బుద్ధిజీవుల ఆనవాళ్లే లేవని అపార్చునిటీ మొదలు ఇరవైపైగా రోవర్లు పంపిన సమాచారమంతా తప్పులతడకని అర్ధమయేసరికే ఆలస్యమైపోయింది. వెలుపలి నుండి వచ్చిపడ్డ ప్రమాదాన్ని కాచుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ గొడవలు పక్కనబెట్టి ఏకమయ్యారు మనుషులు. 

 (మిగతా కథ – కథ 2013- సంకలనంలో చదవండి)