‘పడగ’ల స్తబ్ధతా, ‘విండ్’ చలనమూ !


సాహిత్యంలో దృక్పథాలు రెలెవెన్స్-11

 వేయిపడగలలో ధర్మారావు ముఖంగా అతిమానుష, మానుష ప్రపంచాల మధ్య తారతమ్య వివేచన నవల పొడవునా జరుగుతూనే ఉండడం గురించి చెప్పుకున్నాం. అరుంధతినీ, కిరీటి భార్య శశిరేఖనూ కూడా అబ్బురపరచిన అతిమానుషజగత్తు అది. దేవదాసిని చూసినప్పుడు, “తానొక కల్పితజగత్తున, అమానుషప్రపంచమున  తిరుగాడుచున్నట్లు”; “ఈ సంవిధానమే చిత్రముగా నున్నట్టు” శశిరేఖకు అనిపిస్తుంది. అలాగే, కావ్యజగత్తే యథార్థమైన జగత్తు అనీ, అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావాలు కలిగిన మనమే కల్పిత జగత్తు అనీ ధర్మారావు అనుకోవడం గురించీ, దివ్యజగత్తు నుంచి భౌమజగత్తులోకి రావడంలో అతను ఎదుర్కొనే క్లేశం గురించి కూడా చెప్పుకున్నాం.

ఈ అతిమానుష, మానుష జగత్తులను; అవాస్తవిక, వాస్తవికజగత్తులుగా అనువదించుకుంటే ధర్మారావు పొందే క్లేశం వాస్తవికతను ఎదుర్కోవడంలోనే. శిల్పంలోనూ, కవిత్వంలోనూ కూడా వస్తుస్వరూపాన్ని “యథాప్రాప్తం”గా చిత్రించ కూడదని అతను అనుకుంటాడు. అతని ఆలోచనలు ఇంకా ఇలా ఉంటాయి:

లోకమునందలి వస్తువు బహుదోషభూయిష్ఠముగా నుండును. దాని నుండి దోషమును తీసివేసి దాని ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించవలయును. దోషమును పరిహరించుట రెండు విధములు. ఒకటి లోకమునందలి ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించుట, రెండవది, కొన్ని సమయములు, సంప్రదాయములు సృష్టించి తదనుగుణముగా శిల్పమును చిత్రించుట. మొదటిదాని కన్న రెండవది ఉత్కృష్టమైనది. పాశ్చాత్యశిల్పము మొదటి మార్గము ననుసరించును…వారి చిత్రము లన్నింటికి మాతృకలుండును…భారతదేశశిల్పి శిల్పము చక్షుర్విషయమున కన్న యెక్కువ మనోవిషయమగుచున్నది. పాశ్చాత్యశిల్పమునందు మనము చూచు బొమ్మ గొప్ప సౌందర్యము కలిగియుండును. అది మన నేత్రానందకరము. భారతశిల్పము నందలి చిత్రము పూర్తిగా మనోవిషయము…ఎన్ని చూచినను భారతశిల్పము యొక్క యుత్కృష్టత అవివాదాంశము.

రవివర్మచిత్రాల గురించి ఇలా అంటాడు:

రవివర్మ శిల్పము పాశ్చాత్యమార్గము ననుసరించును. అందులో కూడా చాలా తక్కువరకముది…ఇట్టి చిత్రములు వ్యాప్తి పొందుట చేత లోకమున జనులకు పూర్వ సంప్రదాయములయు, పూర్వ మహాపురుషుల స్త్రీల యథార్థతత్త్వము యొక్కయు జ్ఞానము లేక చెడిపోవుచున్నారు. పైగా వీనియందు సౌందర్యజ్ఞానము కలుగుటలేదు. మనస్సును స్పృశించుటలేదు సరికదా, నేత్రము యొక్క నైశిత్యమును కూడ తాకుట లేదు…ఇప్పటి యీ గ్రామఫోన్ల ప్లేట్ల సంగీతము వలెనే యిట్టి బొమ్మలును మనదేశమునందలి జ్ఞానమునకు వేరుపుర్వు లగుచున్నవి.

వాస్తవికతను నిరాకరించి, అవాస్తవికతను నిర్మించాలని చెప్పడమే ఇది. దీనిని శిల్పానికీ, సాహిత్యానికే కాక సంఘానికీ  ఆపాదిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించగలం. యథాప్రాప్తంగా కాకుండా దోషాన్ని పరిహరించి ఉత్కృష్టాన్నే స్వీకరించడమంటే, వాస్తవిక ప్రపంచంలోని వైరుధ్యాలను మరుగుపుచ్చి సాహిత్యానికి, సాహిత్యకారుడికీ ఉపదేశక స్థానాన్ని కల్పించడమే. అదలా ఉంచితే పాశ్చాత్యంలో కానీ, మన దగ్గర కానీ సాహిత్యం వాస్తవిక జీవన ప్రతిబింబం కావడం వెనుక చాలా చరిత్రే ఉంది. అందులోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

గాన్ విత్ ద విండ్ కు వస్తే, వాస్తవికత గురించి యాష్లీ ఊహలు కూడా అచ్చం ధర్మారావు ఊహల్లానే ఉంటాయి. అతను కూడా వాస్తవికతను ఎదుర్కోడంలో క్లేశానీకీ, భయానికీ లోనవుతాడు. “దేనికి భయపడుతున్నా”వని స్కార్లెట్ అడిగినప్పుడు అతని సమాధానం ఇలా ఉంటుంది:

ఓహ్, నామరహితమైన అనేకవాటి గురించి. మాటల్లోకి మార్చితే అర్థరహితంగా ధ్వనించే వాటి గురించి. జీవితం హఠాత్తుగా మరీ వాస్తవికం అయిపోవడం, జీవితం గురించిన అల్ప వాస్తవాలతో కూడా మరీ వ్యక్తిగత సంబంధం కలగడం గురించి.  ఇక్కడ బురదలో నిలబడి కట్టెలు కొట్టవలసివచ్చినందుకు నేను బాధపడడంలేదు. ఇది దేనిని సంకేతిస్తోందో దానిని తలచుకుని బాధపడుతున్నాను. నేను అమితంగా ప్రేమించిన పాతజీవితంలోని సౌందర్యాన్ని కోల్పోయినందుకు కుంగిపోతున్నాను. యుద్ధానికి ముందు జీవితం ఎంతో అందంగా ఉండేది. గ్రీకుకళలోలా అందులో ఒక ఆకర్షణ, పరిపూర్ణత, సమగ్రత, సౌష్టవం ఉండేవి. అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఆ తేడా కూడా ఇప్పుడే అర్థమవుతోంది. నాకు మాత్రం ట్వెల్వ్ ఓక్స్ లో జీవించడంలోనే నిజమైన అందం ఉంది. నేనా జీవితానికి చెందినవాణ్ణి. అందులో భాగాన్ని. ఇప్పుడు అదంతా గతించిపోయింది, ఈ కొత్త జీవితంలో నేను ఇమడను. అందుకే భయపడుతున్నాను. పాత జీవితంలో ఛాయామాత్రంగా లేని ప్రతిదానికీ; మరీ వాస్తవికంగా, మరీ జీవశక్తితో కనిపించే మనుషులకు, పరిస్థితులకు దూరంగా ఉండేవాణ్ణి. నా జీవితంలోకి అలాంటి మనుషులు, పరిస్థితుల చొరబడితే కోపం వచ్చేది. అందుకే నిన్ను కూడా దూరంగా ఉంచాను. కారణం, నీలోనూ జీవశక్తి పొంగి పొర్లుతూ మరీ వాస్తవికంగా కనిపిస్తావు. నీడలనూ, స్వాప్నికతనూ ప్రేమించే పిరికివాణ్ణి నేను… యుద్ధం వచ్చి పడకపోతే, ట్వెల్వ్ ఓక్స్ లోనే పాతుకుపోయి, జీవితంలో భాగం కాకుండానే దాని గమనాన్ని సాక్షిమాత్రంగా దర్శిస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేసేవాణ్ణి.

విచిత్రం ఏమిటంటే, యాష్లీకి ట్వెల్వ్ ఓక్స్ ఎలాగో; ధర్మారావుకు సుబ్బన్నపేట అలాగ.  చదువుకోసమనో, మరొకందుకనో మధ్య మధ్య అతను వేరే ఊళ్ళకు వెళ్ళి వచ్చినా ప్రధానంగా సుబ్బన్నపేటకే అతుక్కుపోతాడు. అక్కడి జీవితమే తనకు ఇష్టమని ఒకటి రెండు సందర్భాలలో అంటాడు కూడా. అతని అతిమానుషజగత్తుకు చెందిన ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్షేత్రం కూడా సుబ్బన్నపేటే.

అయితే, ఇద్దరి జీవనపరిస్థితులు, అనుభవాలు, ఊహల మధ్య పెద్ద తేడా తెచ్చిపెట్టింది, యుద్ధం! ఇదో చిత్రమైన వాస్తవం. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ యుద్ధం మనిషి అనుభవంలో, ఆలోచనల్లో, తద్వారా జీవితంలో తీసుకు వచ్చే మార్పు బహుముఖంగా ఉంటుంది. అది శతాబ్దాల స్తబ్ధతను వదలగొట్టి మనిషిని క్రియాశీలిని చేస్తుంది. మనిషిలోని మానవత్వాన్నీ, రాక్షసత్వాన్నీ కూడా ఆవిష్కరిస్తూ అంతిమంగా మనిషితనానికి ఒక పెద్ద పరీక్షాఘట్టం అవుతుంది. అంతవరకు ఆకాశవిహారం చేయించే అందమైన కాల్పనిక ఊహలనుంచీ, స్వాప్నికతనుంచీ మనిషిని హఠాత్తుగా కఠోరవాస్తవాల భూమార్గం పట్టిస్తుంది.

యాష్లీ ఇంకా ఇలా అంటాడు:

యుద్ధం రాగానే, జీవితం తాలూకు వాస్తవికత నాలోకి చొచ్చుకువచ్చింది. నీకు గుర్తుండే ఉంటుంది, మొదటిసారి నేను యుద్ధంలోకి దిగింది బుల్ రన్ దగ్గర. నా బాల్యస్నేహితులు తునాతునకలవుతున్న దృశ్యాన్ని అప్పుడు చూశాను. మృత్యుముఖంలో ఉన్న గుర్రాలు పెట్టే సకిలింపులు విన్నాను. నేను జరిపిన కాల్పులలో  అవతలిపక్క మనుషులు రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతున్నప్పుడు కలిగే హృదయవిదారకమైన, దారుణమైన అనుభూతిని చవిచూశాను.  అయితే నావరకు యుద్ధం తాలూకు దారుణాలు ఇవి కావు; నేను జనాల మధ్య జీవించవలసి రావడం!

నేను అంతవరకు జనానికి దూరంగా నాదైన గూడులో ఉండిపోయాను. నా మిత్రులు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న అతి కొద్దిమంది. కానీ, కొందరు స్వాప్నికులతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానన్నఎరుకను యుద్ధం  కలిగించింది. నా భార్యాపిల్లలను పోషించుకోవాలంటే, నాతో ఎలాంటి సాదృశ్యం లేని మనుషుల ప్రపంచంలో నేను జీవించక తప్పదన్న సంగతి ఇప్పుడు నాకు తెలిసివచ్చింది. నువ్వు వేరు, జీవితంతో ముఖాముఖి తలపడుతూ దానిని నీ ఇష్టానుసారం వంచడానికి పూనుకున్నావు. కానీ ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఇమడగలను? అందుకే భయపడుతున్నాను…నాదైన చిన్న ఆంతరిక ప్రపంచం అంతరించిపోయింది. నా ఆలోచనలతో ఎలాంటి సారూప్యతా లేనివారు, భిన్నమైన కార్యాచరణతో నాకు హాటెన్ టోట్లలా విజాతీయుల్లా తోచేవారు దానిని దురాక్రమించుకున్నారు. బురద కాళ్లతో నా ప్రపంచాన్ని తొక్కేశారు. నేనిప్పుడు తలదాచుకుందుకు చోటేదీ మిగల్లేదు.

ఇలాంటి యాష్లీ మాటల్లో ధర్మారావు ఊహల ప్రతిఫలనానికి మరిన్ని ఉదాహరణలు ఇచ్చుకోనవసరం లేదు. ఇద్దరూ మార్పుతో రాజీపడలేని, మార్పును జీర్ణించుకోలేనివారే.  అంతటి యుద్ధం కూడా ఇలాంటి యాష్లీ స్వభావంలో మార్పు తేలేదు. అయితే, ఇద్దరి మధ్యా ఒక తేడా. తనకు ఎంత రుచించనిదైనా యాష్లీని యుద్ధం వాస్తవికతలోకి ప్రవేశపెట్టింది. వాస్తవికత గురించే కాక, తన గురించి కూడా కొత్త పాఠాలు నేర్పి, కొత్త ఎరుక కలిగించింది.  మారిన ప్రపంచంలో తనకు చోటు లేదనుకున్నా, అందులో ఇమిడి కాలు కూడదీసుకోడానికి శతవిధాల పోరాడుతున్న స్కార్లెట్ లాంటి వ్యక్తులపట్ల యుద్ధం అతనిలో ప్రశంసను, సానుభూతిని రేకెత్తించింది. దృష్టి వైశాల్యాన్ని పెంచింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పమని స్కార్లెట్ అడిగినప్పుడు, “అవును, నీ సాహసాన్ని, దృఢసంకల్పాన్ని, నీలోని జ్వాలనూ, నిర్దాక్షిణ్యతను ప్రేమిస్తున్నా”నని యాష్లీ అంటాడు. “ప్రేమించడానికి, పోరాడడానికీ  నాకేమీ మిగల్లే”దని స్కార్లెట్ అన్నప్పుడు;  తారాకు పూర్వవైభవం తెచ్చి పెట్టే పని ఒకటి మిగిలిందని సంకేతిస్తూ, కిందికి వంగి ఎర్రటి మట్టి తీసి ఆమె చేతిలో పెడతాడు.

లోకజ్ఞానాన్ని మించి, యాష్లీలో యుద్ధం కలిగించినది స్వస్వరూపజ్ఞానం. మారిన పరిస్థితులలో నీడలను, స్వాప్నికతను అంటిపెట్టుకుని ఉండడం పిరికితనం అనుకుంటాడు.  కొత్త ప్రపంచంలో తను ఇమడలేకపోవచ్చు కానీ, అందులో చోటుకోసం పెనుగులాడుతున్న వ్యక్తులపై ఇప్పుడతనికి నిరసన, తృణీకారభావం, నిషేధబుద్ధి లేవు. లోకాన్ని అదేపనిగా ఆడిపోసుకోవడంలేదు. గత, వర్తమాన జీవితాలను శ్రేష్టతా, సామాన్యతల తాసులో తూచి శ్రేష్టజీవితం కోసం కలలు కనడం లేదు. ఆత్మోత్కర్షలేదు. యుద్ధానికి ముందు అలాంటివి ఏమాత్రమైనా ఉన్నా, యుద్ధం తర్వాత  అంతరించిపోయాయి.

ధర్మారావులో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. కారణం, అతని వెనుక యుద్ధం లేదు, యుద్ధం కలిగించే అనుభవమూ, స్వస్వరూప జ్ఞానమూ, దృష్టి వైశాల్యమూ, మార్పులతో రాజీపడే, సర్దుకునే వ్యక్తులపట్ల సానుభూతీ లేవు. యాష్లీకి ఉన్నట్టు పెద్ద కుదుపుతోపాటు అనూహ్యమైన చలనశీలతను తెచ్చే యుద్ధ నేపథ్యంలేని స్థితిలో ధర్మారావుకు నిలబడి ఉన్న లౌకిక ప్రపంచం, సాపేక్షంగా స్తబ్ధ ప్రపంచం. ఎక్కువ కాలవ్యవధిలో చాప కింద నీరులా వ్యాపించే మార్పులతో  ధర్మారావు ఊహలోని గతవైభవ జీవితాన్ని లోపలినుంచి శిథిలం చేస్తున్న ప్రపంచం. ఈ మార్పుల దీర్ఘ కాలవ్యవధి, ధర్మారావు ఊహాశాలితను భూమార్గం పట్టించేబదులు మరింతగా అతిమానుష, కాల్పనిక జగత్తువైపు నడిపించి, లౌకికంగా అతన్ని నిష్క్రియుడిగా, నిస్సహాయుడిగా, నిర్వేదిగా మిగిల్చింది. గతవైభవోద్ధరణకు ఉద్దేశించిన అతని కార్యాచరణ ప్రణాళికా అతిమానుషమే, కాల్పనికమే. అది, ఇంద్రియ మనోనిగ్రహాల ద్వారా భక్తి జ్ఞానాలను పొందడం! సుబ్బన్నపేటలోని దేవాలయవ్యవస్థ అందుకు కార్యక్షేత్రం. గిరిక, గణాచారి, హరప్ప, అరుంధతి లాంటివారు కార్యకర్తలు.

యుద్ధానుభవం లేదా సాంస్కృతిక పునరుజ్జీవనానుభవం ఉండడం, లేకపోవడం అనేది పాశ్చాత్య, భారతీయ సామాజిక, సాంస్కృతిక, సాహిత్యక, తాత్వికతల తారతమ్య పరిశీలనకు ఒక ముఖ్య కొలమానం. ఆ స్పృహ వేయిపడగల రచయితలోనే కాదు, ఆ భావజాలానికి చెందిన చాలామందిలో లేదు. దాని ఫలితం బహురూపాలలో కనిపిస్తుంది. అన్నింటిలోనూ ఉభయుల మధ్య ఉన్న తేడాలు స్థిరమైనవనీ, స్వాభావికమైనవనీ, మౌలికమైనవనే నిర్ధారణ వాటిలో ఒకటి. వేయిపడగల రచయిత ధర్మారావు ముఖంగా వ్యక్తీకరించిన అనేక నిర్ధారణలు అలాగే ఉంటాయి. ఒకచోట ఇలా అంటాడు:

పాశ్చాత్యలోకము తన సంఘము ప్రతినిమేష పరివర్తనములచేత గగ్గోలు పడుచున్నది. అనియత భావములు జలపాతమువలె నిలిచి ప్రవహించలేక, యూర్థ్వ తిర్య గధో ముహుస్తాడనములచేత ఘూర్ణిళ్లిపోవుచున్నది. సిద్ధాంతమేదో తెలియదు. ఆదర్శమేదో తెలియదు. ఒక నిలుకడకు రాని, వచ్చుటకు వీలు లేకుండ తనే చేసుకొనిన పరిస్థితుల నుండి బహుళసమస్యలు పెంచుకుని, తత్సమస్యాపరిష్కారము కొరకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నది. అది యంతయు సారస్వతమేనా?

పాశ్చాత్యలోకం పైన చెప్పిన విధంగా ఉండడానికి కీ ఎక్కుడుందన్న పరిశీలన వేయిపడగల రచయితలో లేదు. సాంస్కృతిక పునరుజ్జీవనం రూపంలో పెద్ద కదలిక వచ్చిన సమాజం అది. ఆ తర్వాత రెండు ప్రపంచయుద్ధాలను చూసింది(వేయిపడగల రచనా కాలానికి మొదటి ప్రపంచయుద్ధమే జరిగింది). ఆ విధంగా రకరకాల పరివర్తనలకు పాశ్చాత్యలోకం ప్రపంచప్రయోగశాల అయింది. మంచీ-చెడూ కలగలసిన పరివర్తనలు అవి. ఈ పరిణామాన్ని స్తబ్ధతా-చలనాల దృష్టికోణం నుంచి చూసినప్పుడు వేటి ప్రాధాన్యం వాటికుంది. కానీ వేయిపడగల రచయిత స్తబ్ధతను, నిలకడను గొప్ప గుణంగా చూపిస్తున్నాడు. స్తబ్ధతను ప్రేమించే దృక్పథం కాలాన్నీ, చరిత్రనూ, సారస్వతాన్నే కాక, సమస్తాన్ని స్టాణువుగానే చూస్తుంది. “మహార్థవంతమైనది నశించిపోవుటయు, అల్పప్రయోజనము లైనవి విజృంభించుటయు యీ నాటి సృష్టిపరిణామములోని యొక భాగము…ఒక నిమేషమాత్రమున్న మార్పు నిమేషజీవితులకు దీర్ఘముగానే కనిపించును. అనంతమైన కాలమున దీర్ఘ హ్రస్వత లెక్కడ?” అని ఒకచోట ధర్మారావు అంటాడు. ఈ నాటి సృష్టిపరిణామమే ఇలా ఉందనీ, ఒకప్పటి సృష్టి పరిణామం ఇలా లేదనే ఒక అతార్కిక ఊహను మొదటివాక్యం వెల్లడిస్తే, రెండో వాక్యం అనంతమైన కాలంలో మార్పు నిమేషమాత్రమే నంటూ మార్పు లేకుండా ఉండడమే కాలానికి గల అసలు స్వభావమని ధ్వనింపజేస్తోంది.

దేవీ దేవతలు, మతవిశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన అనేకాంశాలలో పాశ్చాత్య, భారతీయ సమాజాల మధ్య ఉన్న తేడాలు స్వాభావికమైనవీ, మౌలికమైనవీ కావనీ; క్రీస్తు పూర్వ ప్రపంచంలో పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతా ఈ విషయాలలో దాదాపు ఒకేవిధమైన అనుభవాన్ని పంచుకుందనీ సారంగలోనే వెలువడిన నా పురాగమన వ్యాసాలలో సోదాహరణంగా చూపించాను.

అదలా ఉంచితే, వేయిపడగలను, గాన్ విత్ ద విండ్ ను పక్క పక్కన పెట్టి పరిశీలించినప్పుడు; వేయిపడగలకు గాన్ విత్ ద విండ్ ఒక సమాధానమనీ, యుద్ధానుభవం ద్వారా, వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక సంపూర్ణతను, సమగ్రతను అది పొందగలిగిందనీ, వేయిపడగల రచయిత ధర్మారావును నాయకుణ్ణి చేసి పట్టం కడితే; గాన్ విత్ ద విండ్ రచయిత్రి ధర్మారావు ప్రతిబింబమైన యాష్లీ నిరాకరించి మార్పుకు పట్టం కట్టడమే లక్ష్యంగా తన నవలను నడిపించిందనే భావన కలుగుతుంది.

(ఈ భాగాన్నిఇక్కడితో సశేషం చేసి సారంగను చూడబోతే ఇక సెలవు’, ‘ఇదే సారంగ చివరి సంచిక అంటూ సంపాదకవర్గం చేసిన పిడుగుపాటులాంటి ప్రకటన. సారంగ లాంటి పత్రిక ఆగడం సాహిత్యవిజ్ఞానప్రేమికులందరికీ  బాధాకరపరిణామం. ఇది తాత్కాలికం కావాలనే అందరిలా నేనూ కోరుకుంటున్నాను. నా పురాగమన వ్యాసాలు, ఈ వ్యాసాలతోపాటు వివిధ ఇతర వ్యాసాలను కూడా ప్రచురించిన అఫ్సర్, కల్పనగార్లకు కృతజ్ఞతలు.

ఈ పరిణామం కారణంగా ఈ వ్యాసపరంపర ఇక్కడ అర్థాంతరంగా ఆగిపోక తప్పడంలేదు. మరోచోట పునః ప్రారంభమవు తుందేమో నన్నది ప్రస్తుతానికి ఆశాభావం. -కల్లూరి భాస్కరం)

 

 

 

 

మీ మాటలు

  1. Kallakuri Sailaja says:

    Oh . Please do నాట్ సస్పెండ్ సారంగా. వాట్ is నీడేది ఎక్స్ప్ట్ ది సెన్సిబిలిటీ అఫ్ ఆ ఫ్యూ people ? ఐస్ it ఫాలోయింగ్ నంబర్స్ యు నీద? నెవెర్ సో . ది పెఒప్లెవిత్ సెన్సిబ్లె మైండ్స్ అండ్ delicate ఎమోషన్స్ అర్ ఆచోసిన ఫ్యూ ప్లీజ్ don’t స్టాప్ Saranga