సుగాలిపిల్ల

Art: Satya sufi

నువ్వంతే
ఎప్పుడూ
నిత్య వికసిత
కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు
నిను కాంచే చూపుల పై… దేహాలపై…
~
నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం
కాంతి సముద్రాన్నెత్తుకొని
నీ నడుమ్మోసే చంటిపాపలా
ఓ మాయని మాయలా
ముడతలు కొన్ని
నీ ముఖంమ్మీద
అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి
అసలే నలుపు
ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు
నక్షత్రమంత కాకపోయినా
అలాంటిదే ఓ ముక్కు పుడక
నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ
అంత వరకూ చూడని
రంగురంగుల సీతాకోకచిలుక
దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల
అద్దాల్లోంచి తొంగి చూస్తూ
విభ్రమకు భూగోళం నిజార్థమై నిలబడిపోతే
దాని ఉపగ్రహమై నీ ఊహలతో  భ్రమిస్తూ  నేను…
ఏ తాండా నుంచి ఊడిపడ్డావో వాకబు చేయడానికనుకుంట
రోడ్డువార నిలుచొని నువ్వల్లిన పూసల పూల మీద
వాలింది  గాలిభ్రమరం మకరందాన్ని జుంటితేనెగా చేస్తూ
నల్లరంగందం లో  ఓ పిల్లా
పిల్లతెమ్మర నీ జడకుచ్చై కవ్విస్తోంది
కాసింత చూసుకో
నీ బోళాతనంలోనే
నీ అందమంతా దాగుందని తెలుసుకొని
కాబోలు
నీ రెండు కనుబొమల మధ్య జాగాలో
సాయంకాలాన్ని అద్ది వెళ్ళిపోయాడు
భానుడు
నీ ముఖవర్ఛస్సును
రెండింతలు చేస్తూ
నిను నీ అందపు అమృతాన్ని
నింపుకోకుండా
ఏ కంటి రెటినా ఉండగలదూ…చెప్పు..

మీ మాటలు

  1. Sreenivaas sattiraju says:

    ఒక ఆర్ద్రత కలిగిన భావానికి ఒక అనాకార చిత్రంతొ కలిపెయ్యడం నిజంగా పూవుకు తావి అబ్బినట్లుగా రక రకాల వికారాలకు గురి అవుతున్నట్లు చదువరిని తెగ ఇబ్బందిగా ఉంది. చిత్రాన్ని తీసెస్తే భావం బ్రతికి బట్టకడుతుందెమో బహుశా. కానీ చిత్రాన్ని కలుపుకుంటె మనలో ఆహ్లాదం బ్రతకడం నమ్మలెని నిజం కాదు.