లోలోపలే మరణిస్తున్న ఎందరో….

నాలుగు వందల సంవత్సరాల వివక్షా పూరిత గాలులలో ఇప్పటికీ విషం చెరిగే అసత్యపు సాంస్కృతిక మూస ధోరణులు, జాతి మరీచికల నడుమ మనిషికి మనిషికి మధ్య ముఖ్యంగా నల్లజాతి మనిషికి తెల్లజాతి మనిషికి మధ్య  ముడి నగ్న సత్యాల మార్పిడి అత్యవసరం అంటారు  మనందరం చదివి ఔపోసన పట్టిన “రూట్స్” రచయిత అలెక్స్ హేలీ . మరి వేల ఏళ్లకి పైగా రంగు తేడాలు లేకుండానే వివక్షలననుభవిస్తున్న16.6 శాతం షెడ్యుల్ క్యాస్ట్స్ ఇంకో 8.6 శాతం షెడ్యుల్ ట్రైబ్స్ గొంతెత్తి చెప్తున్న నగ్న నిజాలని హత్తుకొనే ధైర్యం లేకపోయినా కనీసం రెండు చెవుల మధ్య మెదడు తెరచి పెట్టుకొని వినే క్షమత అయినా మిగిలిన వాళ్లందరికీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న .

రెండున్నరేళ్ళ క్రితం ఎంపికైన బ్యాలెట్ల రక్తం నిరంతర బలవంతపు సామాజిక సంఘీభావాలు  , నియంతృత జాతీయవాదాలుగా మారిపోయి నిరపరాధులను అమాయకులను హతమార్చడం ,ఇన్నోసెంట్ పీడిత మేధావుల అణచివేతకు కేరాఫ్ అడ్రెస్గా ప్రభలుతూ, గాంధీ స్థానంలో గాడ్సే ఆరాధకుల హంతక ముఖచిత్రాలు ముద్రించుకుంటున్న నయా మూఢభారతం అసలు వినిపించుకొనే పరిస్థితిలో ఉందా అని  ?

సరిగ్గా ఏడాది ఇప్పటికి, ఒక ధిక్కారాన్ని హత్య చేసి ! బ్రాహ్మణ వాదాన్ని భుజాన మోసిన గౌతమీ పుత్ర శాతకర్ణి, తల్లికిచ్చిన మర్యాదల కథలకి  కదిలిపోయి ఈ రోజుకి సైతం కన్నీరు పెట్టుకొనే సమాజం రోహిత్ వేముల తన కులమేమిటో నిర్ణయించుకొనే హక్కు మాత్రం తల్లి పేగు నుండి విడదీసి తండ్రి మొలకి చుట్టి చప్పట్లు కొడుతున్న అదే ప్రజల సమాజంగా రెండు నాలుకల పితృస్వామ్య నిసిగ్గు ధోరణికి పరాకాష్టగా నిలబడుతున్నప్పుడు ఇక్కడ ప్రశ్నలు మూగబోవట్లేదా ? సమాధానాలు నిశబ్దంగా సజీవ సమాధి కాబాడటం లేదా ? ఇహ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు అసలిక్కడ  ?

ఇప్పుడిక్కడ సంస్థాగత హత్యని యేమార్చి, హంతకులని అట్రాసిటీ కేసులనుండి తప్పించడమే మిగిలిన పరమ ధర్మం అయినప్పుడు దేవుడి సాక్షిగా సైన్సు పీఠాధిపతులు మధ్య ప్రధానమంత్రి చేతి నుండి ప్రతిభావంతుల తలారులు మిలేనియం అవార్డులు పొందుతారు . హత్యను ప్రేరేపించిన పరిమిత నేషనలిజపు పెద్ద తలకాయలు ఆధిపత్య జెండాలు ఎగరేయడానికి కొత్త అధికార కేంద్రాల మధ్య అదలాబదిలీ ఆటాడుకుంటుంటాయి. ప్రతిసారి పాయిజన్లు పరాన్న జీవులు కలగలిసిన తప్పుడు విశ్వాసాల ప్రమాణాల మధ్య  ప్రాదేయపడుతున్న హక్కుల వికాసం మళ్ళీ మళ్ళీ ఒక రోహిత్ వేములగా ఉరికొయ్యకి వేలాడుతుంది. అందుకేనేమో ఇప్పుడిక్కడ నిశబ్ధం కూడా చోటుచేసుకోనంత అనంత శూన్యమే మిగిలినట్టు కనిపిస్తుంది .

బహుశ అధికార నియంతృత్వ మీడియాలో కాకపోయినా కనీసం సోషల్ మీడియాలో సైతం భావప్రకటనా స్వేచ్చ కరువైపోయాక, పౌరుషాలన్నీ ఎటిఎం క్యూల ముందు డీలా పడి స్వీయసంపాదనలలో పావలాకి  అర్ధకి యాచకులైనప్పుడు భారతదేశం శాంతికాముకుల దేశం కాదిది చేతగాని చవటాయిల రాజ్యమని నిసిగ్గుగా ప్రపంచ దేశాల ముందు ప్రకటించుకుంటున్నప్పుడు , దేవుని పేరిట రాజుల పేరిట నియంత్రించబడి, విభజించి జయించడానికే పరిమితమయిన సాంస్కృతిక రక్షకుల మెదడులు, చెవులు మాత్రమే కాదు ఇక్కడ ముక్కలయిన హృదయాలు సైతం మూతపడిపోయాయి అనుకుంటా కదా !

ఇహముందు రాబోయేదంతా మరింత గడ్డుకాలమే అని చుట్టూగాలులన్నీ వెర్రిగా ఏడుస్తున్నప్పుడు క్లాడ్ మెకై (Festus Claudius “ClaudeMcKay (September 15, 1889 – May 22, 1948) రాసిన   చిన్న పవర్ఫుల్ కవిత “ If we must die” అనుసృజన మనకేమన్నా కొద్దిపాటి ధైర్యం నేర్పుతుందేమో చూద్దాం .

 

చావు తప్పనిసరైనప్పుడు

_ క్లాడ్ మెకై  Claude McKay

 

మనందరికీ

చావు తప్పనిసరైనప్పుడు

శపించబడిన మనలాంటివారి చుట్టూచేరి

గేలిచేస్తున్న ఆకలి కుక్కల నడుమ

నికృష్టకరమయిన స్థలాలలో వేటాడబడిన పందుల్లా కాకుండా

చివరికి మనల్ని అంగీకరించని క్రూరులు సైతం ఈ మరణాలniని గౌరవించక తప్పనట్లు

మనందరికీ చావు తప్పని సరైనప్పుడు

మన విలువైన రక్తం నేలపాలు కాకుండా ఘనంగా చావునాహ్వానిద్దాం !

 

ఓ సంబంధీకులార !

మనది పరిమిత సంఖ్యే అయినా

వాళ్ళ వేల దెబ్బల ముందు ఒక్క మరణం విలువేమిటో చూపి

మన ధైర్యం చాటడానికిi మన సమిష్టి శత్రువుని మనందరం కలవాలి

(వంద గొడ్లని తిన్న రాబందులు ఒక్క తుఫానుకి చచ్చినట్టు )

 

అయినా ,

మన సమాధుల ముందు ఇహ మనకేమి మిగిలుందని

గోడలకేసి నొక్కి పెట్టె హంతక తోడేళ్ళ గుంపులపై తిరిగి పోరాడటం మినహా !

 

(“రో” జ్ఞాపకంలో  రోజురోజుకి లోలోపలే మరణిస్తున్న ఎందరో ఔత్సాహికులతోపాటు…)

*

 

 

 

 

మీ మాటలు

 1. ‘చావు తప్పనిసరైనప్పుడు’ వినాల్సిన మాటలనే వినిపించారు…మీ ‘మాటల్లో’

 2. Sreenivaas sattiraju says:

  సరిగ్గా ఏడాది ఇప్పటికి, ఒక ధిక్కారాన్ని హత్య చేసి ! రెండు నాలుకల పితృస్వామ్య నిసిగ్గు ధోరణికి పరాకాష్టగా నిలబడుతున్నప్పుడు ఇక్కడ ప్రశ్నలు మూగబోవట్లేదా ? ________________ సమాధానాలు నిశబ్దంగా సజీవ సమాధి కాబాడటం లేదా ? ఇహ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు అసలిక్కడ ? నీవు నిజాయితీగా విన్నదెప్పుడు?. అరిచి నానా గోలా చెయ్యడం తప్పా. మార్టిన్ లూథర్ కింగ్ నీలాంటి వారి ఆలోచనలు ఎప్పుడూ నిరసించే వాడే అన్న నిజం నీకర్థమయ్యే రోజు ఎప్పుడు ఎందుకు రాదో నాకు తెలుసు. ఎందుకంటే సమాధాన పెడదామనే ఆలోచనే లేనప్పుడు కేవలం ప్రశ్నిస్తూ ప్రాణాలు తీసుకోవడం ఒక వికృత క్రీడా అయ్యినప్పుడు రోజుకో గుండా పుడుతుంటాడు పోతుంటాడు. అలాంటి వారి తల్లులని చూసి జాలి పడుతుంది తప్పా గర్వించాడు. అసలు చచ్చినవాడే నాది తొందరపాటు నేను సరిగ్గా ఆలోచించలేదు నా ఆలోచనలు నన్ను సరిఅయ్యిన మార్గంలో నడపలేదు నమ్ముకున్న వాళ్ళే నట్టేట్లో ముంచారు కనీసం నా చావు నన్ను చావనిచ్చి ప్రశాంతతను ఆలోచనను ఆదరించండి అని చెప్పినా నానా వికృత సాహిత్య వికృత రాజకీయ క్రీడా జరుపుకుని మీ సాహితీ కండూతి ప్రదర్శనతో సాగించిన చేష్టలు మానసిక రోగులను మించి కనీస మానవత్వపు ఓదార్పుకూడా దూరం చేశాయన్నది మరిచిపోయి ఇప్పుడు ఓ నల్లజాతి ఆలోచనా విప్లవకారుడిని అడ్డం పెట్టుకుని మళ్ళీ వెక్కిరించడం చూస్తుంటే అసలు మనుషులున్నారా అనే సందేహం నాకొస్తోంది.
  ఆ ఉత్తరం రోహితాసురుడే రాసి ఉంటె మీరు చనిపోయేది మనుషుల ఆఖరు కోరికను కూడా మన్నించని మాహా మూర్ఖ మేధావులనేది స్పష్టమే.

  • శ్రీనివాసుడు says:

   అద్భుతం సార్!
   మీ ఫేస్ బుక్ చిరునామా గానీ, లేదా మిమ్మల్ని సంప్రదించే అవకాశంగానీ, లేదా మీ రచనలేవైనాసరే వ్యాఖ్య, కథ, కవిత, అభిప్రాయం, ఏదైనా సరే చదివే అవకాశం వుందా?
   నా ఫేస్ బుక్ లింక్. https://www.facebook.com/profile.php?id=100008364880355
   ఇ మెయిల్ ఐ.డి. sreenivasudu666@gmail .com
   సారూప్యభావాలు గల మీలాంటివారితో సంభాషిస్తే సత్యాన్ని త్వరగా చేరుకోవచ్చని నా అభిమతం.

  • శ్రీనివాసుడు says:

   “All great art and literature is propaganda.”
   …………………George Bernard Shaw

   Fine art is the subtlest, the most seductive, the most effective instrument of moral propaganda in the world, excepting only the example of personal conduct; and I waive even this exception in favor of the art of the stage, because it works by exhibiting examples of personal conduct made intelligible and moving to crowds of unobservant unreflecting people to whom real life means nothing.
   ………………………….George Bernard Shaw

 3. chandolu chandrasekhar says:

  చాలా బావుంది.

మీ మాటలు

*