రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29).  ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం.

వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో చెప్తూ,  “ఆయన పక్కా జంటిల్మేన్!” అన్నారుట. రెహ్మాన్‌కి ఈ ఎక్ష్ప్రెషన్ చాలా నచ్చి, “గురూజీ, ఇది ఏదైనా పాటలో వాడండి!” అని అడగడం “సూపర్ పోలిస్” సినిమాలో వేటూరి “పక్కా జంటిల్మేన్ ని, చుట్టపక్కాలే లేనోణ్ణి, పట్టు పక్కే వేసి చక్కా వస్తావా?” అని పల్లవించి ఆ కోరిక తీర్చడం జరిగింది. ఇలా వారిద్దరి స్వర-పద మైత్రి గొప్పది! కొత్తపుంతలు తొక్కుతున్న రెహ్మాన్ సంగీతానికి తానూ గమ్మత్తైన తెలుగు పదాలను పొదిగానని వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” లో చెప్పుకున్నారు! అలా పుట్టినవే “విదియా తదియా వైనాలు”, “జంటతోకల సుందరి” వంటి ప్రయోగాలు!

రెహ్మాన్ పాటలని తెలుగులో వినడం కష్టం అనీ, లిరిక్స్ చెత్తగా ఉంటాయనీ, కాబట్టి తెలుగు గీతరచయితలకి (వేటూరితో సహా!) ఓ దణ్ణం పెట్టి, హిందీనో తమిళాన్నో నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం ఒకటి ఉంది! ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇది ముఖ్యంగా రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో వచ్చే చిక్కు. “సూపర్ పోలీస్”, “గ్యాంగ్ మాస్టర్”, “నాని” వంటి రెహ్మాన్ తెలుగు సినిమాల్లో ఈ సమస్య అంత కనిపించదు.  అయితే రెహ్మాన్ – వేటూరి కాంబినేషన్‌లో చాలా చక్కని డబ్బింగ్ పాటలూ ఉన్నాయి.  కాస్త శ్రద్ధపెట్టి వింటే సాహిత్యాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వేటూరిని స్మరించుకుంటూ, రెహ్మాన్ కి అభినందనలు తెలుపుకుంటూ మచ్చుకి ఓ మూడు పాటలు చూద్దాం!

మేఘాలు గాయపడితే మెరుపల్లే నవ్వుకుంటాయ్!

వేటూరి డబ్బింగ్ పాటలని కూడా గాఢత, కవిత్వం కలిగిన తనదైన శైలిలో రాశారు. బొంబాయి సినిమాలో “పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ” అనే పల్లవితో వచ్చే పాటలో చాలా స్పందింపజేసే భావాలు ఉన్నాయి. పెద్దలనీ, సమాజాన్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువజంట, తమ జీవితాన్ని ప్రేమతో, ఆశావహ దృక్పథంతో ఎలా దిద్దుకున్నారో వివరించే పాట ఇది. పాట మొదట్లోనే వచ్చే ముద్దొచ్చే వాక్యం –

నింగీ నేలా డీడిక్కి, నీకూ నాకూ ఈడెక్కి!

ఇది నేలనీ ఆకాశాన్నీ కలిపే ప్రణయతరంగమై ఎగసిన ఆ పడుచుజంట హృదయస్పందనని ఆవిష్కరించే వాక్యం. “డీడిక్కి” అనే పదం వాడడం, దానికి “ఈడెక్కి”తో ప్రాస చెయ్యడం అన్నది వేటూరిజం! సినిమా సందర్భంలో తన శ్రీమతి గర్భవతి అయ్యిందన్న ఆనందంలో ఆ భర్త ఉంటాడు కనుక పసిపిల్లలకి వాడే “డీడిక్కి” అనే పదాన్ని వేటూరి వాడారు!

గుండెలో ఆనందం, తలపులో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. ఆ జంట అచ్చంగా ఇలాగే ఉన్నారు. పువ్వులు నవ్వు లేకుండా దిగులుగా ఉండవు,  ఎగిరే గువ్వలు కన్నీళ్ళు పెట్టుకోవు అని చెబుతూ “సూర్యుడికి రాత్రి తెలీదు” అంటూ వచ్చే భావం గొప్పగా ఉంటుంది –

పున్నాగ పూలకేల దిగులు?

మిన్నేటి పక్షికేది కంటి జల్లు?

రవి ఎన్నడూ రాత్రి చూడలేదు

స్వర్గానికి హద్దూ పొద్దూ లేనే లేదు

జీవితమనే ప్రయాణం సుఖవంతంగా ఉండాలంటే లగేజీ తగ్గించుకోవాలి. “ఓటమి బరువు” మోసుకుంటూ వెళ్ళినవాళ్ళకి బ్రతుకంతా తరగని మోతే! మేఘాలు సైతం ఢీకొని గాయపడ్డాక మెరుపులా గలగలా నవ్వేసుకుని చకచకా సాగిపోవట్లేదూ? ఎంత బావుంటుందో ఈ ఎక్స్ప్రెషన్!

కవ్వించాలి కళ్ళు, కన్నెమబ్బు నీళ్ళు

మేఘాలు గాయపడితే మెరుపల్లెయ్ నవ్వుకుంటాయ్

ఓటమిని తీసెయ్ జీవితాన్ని మోసెయ్

వేదాలు జాతిమత భేదాలు లేవన్నాయ్

 

ఈ పాటలో వచ్చే ఇంకా కొన్ని లైనులు చాలా బావుంటాయి. “ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి” అనడంలో కవిత్వం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. “అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు!” అనడం ఎంత గొప్ప భావం! ప్రేమమూర్తులకు ప్రకృతి సమస్తం ప్రణతులర్పించదూ?

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – పూలకుంది కొమ్మ

 

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో!

ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట చప్పున గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట!  పల్లవిలో వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి –

నగవే పూలది

లేనగవే వాగుది

మౌనముగా నవ్వనీ, నీ కౌగిలి పూజకి!

“మౌనంగా కౌగిలి పూజకి నవ్వడం” – ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్!  సుమబాల నవ్వునీ, సెలయేటి పాటనీ, (బైటపడలేని) చినదాని మౌన ప్రేమనీ గమనించే పురుషుడు ధన్యుడు!

ఇంతకీ ఆ అమ్మాయికి తను ప్రేమలో పడ్డానని ఎలా తెలిసింది? అతను చెంత ఉన్నప్పుడు విరబూసిన విరజాజై తన కన్నెతనం గుబాళించినప్పుడు, చేమంతుల పూరేకులు ప్రేమలేఖలై అతన్నే గుర్తుచేసినప్పుడు! ఎంత కవిత్వం! ఇంత ప్రేమ తనలో ఉన్నా గ్రహించని ప్రియునికి అభ్యర్ధనగా “ఒక్క సారి నన్ను చూడు, నువ్వే ఉసురై (ప్రాణమై) నా అణువణువూ నిండి ఉన్నావని తెలియక పోదు” అని జాలిగా అడగడం కదిలిస్తుంది –

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో

చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే

ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురవుతాలే!

“నాలోని తీయని అనుభూతులన్నీ నీ వల్లనే!” అనడం నుంచి, “నువ్వు లేక నేను లేను” అంటూ తనలోని ప్రేమ తీవ్రతని కూడా ఎంతో అందంగా వ్యక్తీకరించడం రెండో చరణంలో కనిపిస్తుంది. తమిళ భావాన్ని ఎంత అందంగా వేటూరి తెలుగు చేశారో ఇక్కడ. “తొలిదిశకు తిలకమెలా” అనడంలో శబ్దంపై వేటూరి పట్టు తెలుస్తుంది. ఈ వాక్యమనే కాదు, మొత్తం పాటలోనే ఎంతో శబ్దసౌందర్యం కనిపిస్తుంది!

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా?

సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా

నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు (50:30 నుంచి)  – పూనగవే పూలది

 

వానొస్తే నీవే దిక్కు!

దాశరథి రంగాచార్య గారు ఓ వ్యాసంలో ఒక అందమైన ఉర్దూ షాయరీ గురించి చెప్పారు.  ఇద్దరు ప్రేయసీ ప్రియులు రాత్రి రహస్యంగా కలుస్తారు. బైట వర్షం పడుతోంది. ప్రియుడు వర్షంలోకి వెళ్ళి తడిసి ఆనందిద్దామంటాడు. మగవాళ్ళింతే!  ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడవాళ్ళకి స్పృహ ఉంటుంది కాస్త! సరసానికి గోప్యం ఉండద్దూ? అందుకే ప్రియురాలు అంటుంది – “వర్షం వర్షం అంటావ్. ఏముంది అక్కడ? నా కళ్ళలోకి చూడు – నీలి మేఘం ఉంది, మెరుపు ఉంది, తడి ఉంది. హాయిగా నా కళ్ళల్లో కొలువుండు! ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది?”

వేటూరికి (లేదా తమిళ రచయితకి) ఈ కవిత తెలుసో లేదో కానీ, రిథం సినిమాలోని “గాలే నా వాకిటకొచ్చె” పాట మొదటి చరణంలో పంక్తులు విన్నప్పుడల్లా ఆ ఉర్దూ కవితే గుర్తొస్తుంది నాకు!

 

అతడు: ఆషాఢ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు

నీ ఓణీ గొడుగే పడతావా?

ఆమె: అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం

కన్నుల్లో క్షణమే నిలిపేవా?

ఈ పాటలో “గాలిని” ప్రేమగా వర్ణిస్తాడు కవి. గాలి మెల్లగా వచ్చి తలుపు తట్టిందిట. “ఎవరోయ్ నువ్వు?” అంటే “నేను ప్రేమని!” అందిట. “ఆహా! మరి నిన్నామొన్నా ఎక్కడున్నావ్? ఇన్నాళ్ళూ ఏమయ్యావ్?” అని అడిగితే – “నీ శ్వాసై ఉన్నది ఎవరనుకున్నావ్, నేనే!” అందిట. ఇదో చమత్కారం!

గాలే నా వాకిటకొచ్చె, మెల్లంగా తలుపే తెరిచె

ఐతే మరి పేరేదన్నా, లవ్వే అవునా?

నీవూ నిన్నెక్కడ ఉన్నావ్, గాలీ అది చెప్పాలంటే

శ్వాసై నువు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా?

 

తెమ్మెరలా హాయిగా సాగే ఈ ప్రేమపాటలో రెండో చరణంలో చక్కని శృంగారం కనిపిస్తుంది. ప్రియురాలు ముత్యంలా పదిలంగా దాచుకున్న సొగసుని పరికిస్తూ తన్మయుడై ఉబ్బితబ్బిబైపోతున్న ప్రియుని మనస్థితికి “ఎద నిండా మథనం జరిగినదే!” అంటూ ఎంత చక్కని అక్షరరూపం ఇస్తారో వేటూరి!

 

ఆమె: చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే

నా వయసే తొణికిసలాడినదే!

అతడు: తెరచాటు నీ పరువాల తెరతీసే శోధనలో

ఎదనిండా మథనం జరిగినదే!

ఈ చరణం చివరలోనే వేటూరి చిలిపితనాన్ని చూపెట్టే ఓ రెండు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆనందించాల్సిందే, వివరిస్తే బాగుండదు!

అతడు: కిర్రుమంచమడిగె కుర్ర ఊయలంటే సరియా సఖియా?

ఆమె: చిన్నపిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా!

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – గాలే నా వాకిటకొచ్చె!

 

 

 

 

 

 

మీ మాటలు

*