బీటలు వారిన ‘గాలి అద్దం’

‘ ఏరుకున్న దుఃఖంలో’ అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది:

వెన్నెల రెక్క తెగిన
అమావాస్య ఏడుపురా నువ్వు

 

శ్వాసలూ భాషల్లోనే మూల్గాయని

ఆత్మహత్యాత్మకంగా నొక్కి

 

తలవాకిట పడిగాపుల్లో

చీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వి

 

నువ్ తీస్తున్న దౌడు పాదాల

పియానో చప్పుడు-

 

మహానగర కూడలి చాపిన తారునాల్కకి

వెగటు రుచివి

మొండి గోడల్ని బీటలు చీల్చిన

గడ్డిపూ పజ్యానివి

కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన

ఒంటరి అరిచెయ్యివేరా ఏంతకీ

నువ్వు-

 

పెకలించినా మట్టంటని మొక్కలు

మరెప్పుడూ నేల చేరని వాన చినుకులు

అరచేతి గ్రహణాల్ని కప్పుకుని బావురుమనే

చందమామలు

ఈ గట్టునే ఊడలు దించిన మృత్యువు!

 

దెయ్యం కాళ్ల పరుగుల్తో

వెనక్కి నడిచే గడియారాలం

 

లబ్‌డబ్మని పెట్లుతున్న గుండెల

పింగాణీమోతలో

విన్పించని

కన్నీటి వీడ్కోలు తేమరా నువ్వు

 

ఆ గట్టు చేర్చకుండానే కూల్తుందీ వంతెన

 

ఆగాగు!

ఊడల్తోనైనా దాటాలీ చీకటి జన్మాల ఏరు

నువ్వైనా మరి

నేనైనా-

* * *

నాయుడి కవిత్వం- గాలి అద్దం సంకలనానికి రమణసుమనశ్రీ ఫౌండేషన్ అవార్డు అందిస్తున్న వేళ నాయుడు గురించి నాలుగు ముక్కలు మాట్లాడవల్సి వచ్చిన సందర్భంగా సుమారు పాతికేళ్ల మా సాన్నిహిత్యాన్నీ, 22 ఏళ్ల నాటి ఆ కవితనీ స్మరిస్తున్నాను. దాన్నిలా తలుచుకుంటున్న సమయాన దాని భావంతో, సారంతో, ఉద్వేగంతో నేనిప్పుడు ఎంత కనెక్టు అయ్యి ఉన్నాన్నో తరిచిచూసుకున్నాను.

‘తాను పారిపోతున్నాడో, లేక నేనిక్కడ బందీనే అయ్యానో తేల్చుకోలేక వీడ్కోలులా’  నాయుడు కోసం రాసిన ఆ కవిత గానీ, అందులోని ‘పర్సనల్’ సందర్భంగానీ తనకైనా గుర్తుండి ఉంటుందని అనుకోను. ‘అనుక్షణిక’మంటూ నాయుడు నాడు రాసుకున్న భగ్నకవిత అతని జ్ఞాపకాల్లో భద్రంగా ఉందని కూడా అనుకోను. ‘అతడు గీసింది కన్నా/ చెరిపింది ఎక్కువ ‘ అన్నారు ఇస్మాయిల్ గారు ‘పికాసో’ గురించి. నాయుడు కూడా రాసింది కంటే చెరిపిందే ఎక్కువ, మర్చిపోయిందే ఎక్కువ. బహుశా 1997లోనే అనుకుంటా, మో (వేగుంట మోహన ప్రసాద్ గారు) తనలానే అనుకంపన లయతో సంచలిస్తుండే అక్షరాల… పదాల… వాక్యాల… దొంతర్ని 47పులు (47 ఏడుపులుని 47 లోని ‘ఏడు’తో ‘పులు’ కలిపి pun చేస్తూ) పేరిట నాయుడు 47- కవితల సంకలనం- ‘ఇపుడే’కి ముందుమాటగా నాకు పంపారు, కంపోజ్ చేయించమని. ‘ఆ 47 కవితలకి మరిక మార్పులు, చేర్పులూ చేయవద్దని, తన తొలిపలుకు కంపోజ్ చేయించి పంపితే, నాయుడి తొలి సంకలనం- ‘ఇపుడే’ వేయించేస్తాననీ’ మో నాకు కవరింగ్ లెటర్ రాసారు. నేను పరమ విధేయంగా 47పుల్ని టైపించి ఒరిజినల్, ఓపెన్ ఫైల్ రెండూ పంపించేశాను. ‘ఇపుడే’ కోసం ఎదురుచూస్తున్నపుడే, మహా అయితే మరో నెల లోపు, ‘మో’ చెప్పారు- నాయుడు తన కవితల రాతప్రతి చింపి తగలబెట్టేశాడని. చెరపడం, మరవడం – నాయుడి విషయంలో అంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, అపుడేపుడే నేను రాసినదేదో గుర్తుంటుందని కచ్చితంగా అనుకోను. నాయుడిది ఏరుకున్న, తనంతట తాను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్న దుఃఖమేనని అంటున్న ఆ నా కవితలో content- context ల దృష్ట్యా ‘పర్సనల్’ భాగంగా కొంత మేరకు వడకట్టేసి, depersonalise కాబడ్డ భాగం వరకూ మాత్రమే చూస్తే-

మహానగర కూడలి చాపిన తారునాల్కకి వెగటు రుచి వంటి, మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పజ్యం వంటి, కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరిచెయ్యివంటి అతడు, తలవాకిట పడిగాపుల్లో ఛీత్కార ప్రణయాన్ని obvious కాన్కగా పొందిన ప్రేమోపహతుడు మాత్రమే కాదు, కవి కూడా. ఎటువంటి కవి? మాటలు, ఆలోచనలే కాదు, శ్వాసలు సైతం భాషల్లో మూల్గడాన్ని ఏవగించుకునే కవి.  నేను పై కవిత రాసిన 1994 నాటికి మహా అయితే ఓ పుంజీడు కవితలు రాశాడేమో, అప్పటికే తన కవిత్వం తిరగేసిన భాష అని తెలిసిపోయింది మిత్రులమైన మాకు.

“She dealt her pretty words like Blades/ How glittering they shone/ And every One unbared a Nerve

Or wantoned with a Bone..” అంటూ Emily Dickinson తరహా ఊహలల్లుకున్నాం నాయుడి కవిత్వం మీద. ఇక్కడ ఒక సర్రియలిస్ట్ సత్యమేమంటే, ఏ కవితలూ రాయకముందే మా సిద్ధార్థకి ప్రియమైన కవి అయిపోయాడు నాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఖైరతాబాద్ దక్షిణ హిందీ ప్రచార సభ కాంపౌండులో ఉన్న తన జిరాక్స్ సెంటరుకి అరుదుగా వచ్చే ఓ ఫిలాసఫీ కుర్రాడి కళ్లలో విలోమబింబాలుగా కదలాడుతున్న కవితలు చదివి రేపటి కవిని సిద్ధార్థ discover చేయడం – బహుశా ఏ దేశకాల సాహిత్య చరిత్రలోనైనా విశేషమైన, అపూర్వమనదగ్గ వృత్తాంతం.

ఒక తరం కవుల్ని, లేదా ఒక తరహా కవిత్వోద్యమాన్నీ అర్థం చేసుకునేటప్పుడు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్నీ, యుద్ధాలు, క్షామాలూ వంటి ప్రాపంచిక పరిణామాల్నీ తరిచి చూసే విమర్శక, విశ్లేషణాత్మక పనిముట్లని ఆధునిక (పాశ్చాత్య) అధ్యయనం అలవాటు చేసింది. ఏమిటితని ఏడుపు, ఎందుకింత వగపు? ‘మధ్యతరగతి సుడో సుఖాల పడవ మునిగిపోతుందేమోనన్న వెంపర్లాట ‘గా అజంతా గారి కవిత్వం మొత్తాన్నీ తేల్చిపారేశాడు ఓ ఆధునిక విమర్శకుడు. ఒక తరం కవుల నిరాశకి, నిస్పృహకీ unemployment, underemployment కూడా కారణాలని చేసిన విశ్లేషణలూ విన్నాము. అంటే, ‘సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank- account, వొట్టిపోని ఆవు’ ఉంటే, మున్ముందు వాటి ఉనికికి ఏ ఢోకా లేదనుకుంటే అజంతా, నాయుడుల కవిత్వం ఉండేది కాదా? అలా సెటిల్ కాలేదనీ, తన జీవితం వడ్డించిన విస్తరి కాలేదనేనా నాయుడి దిగులు, గుబులు? నాకెందుకో ఈ వాదాలూ, విశ్లేషణలూ విచిత్రంగా, రొడ్డకొట్టుడుగా తోస్తాయి. నాయుడ్నే తీసుకుందాం. సుమారు పాతికేళ్లుగా గమనిస్తునానతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం; అంతేకాకుండా, అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురుచూడటం నిజజీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత, కల-మెలకువల మధ్య తిర్యగ్ బిందువుని దర్శించడంలా అనుభవంగానే తప్ప మరింకే విధంగానూ అర్థం చేయించలేని అభాస!

అయితే, మన తెలుగు ఆధునిక సాహిత్యావరణంలో కొన్ని సాహిత్యేతర హిపోక్రసీలు గమనిస్తే భలే వినోదాన్నిస్తాయి. “Poets are, by the nature of their interests and the nature of artistic fabrication, singularly ill-equipped to understand politics…” అని W H Auden అంతటివాడు అన్నట్లు చదివో, కర్ణాకర్ణిగా వినో ఉంటారు. Artistic fabrication మాట దేవుడెరుగు, ఏమీ తెలియకుండా ఉండటంలో ఉండే సౌఖ్యాన్ని అనుభవిస్తూ, చాలా convenient గా intellectual disturbance వంటి అరువు సలపరింతలకి గురౌతుంటారు. ఆధునిక సంక్షోభ యుగంలో కవులెలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ముందుగానే సిద్ధమై ఉన్న అలిఖిత రూల్ బుక్ లో కొన్ని పడికట్టు వాక్యాల్నే కాస్త అటూఇటుగా వల్లెవేస్తుంటారు: లౌకిక విషయాలు పట్టవనీ, నోట్లో వేలుపెడితే కొరకలేమనీ, రాయడానికి బద్ధకమనీ, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టు కొన్ని కవితావాక్యాలలాగ తళుక్కుమంటాయనీ, ఇక రాసినవి దాచే అలవాటు బొత్తిగా లేదనీ…. ఇలా ఈ అబద్ధాలకి అంతులేదు. ఇవన్నీ నిజమని అమాయకంగా నమ్మి, బహుశా ‘రంజని’ వారనుకుంటా, making of a poem తెలుసుకోవాలని తపించే ఆధునిక కవిత్వాభిమానుల కోసం ఇరవై ఏళ్లక్రితం ఒక సంకలనం తెచ్చారు. ప్రసిద్ధ కవులు, వారి కవిత (లేదా కవితలు)- ఆ కవిత అంతిమ రూపం తీసుకోక ముందటి చిత్తుప్రతి. తెలుగు ఆధునిక కవి మోసం, కాపట్యాలకి landmark గా నిలిచిపోయిందా సంకలనం. కాబట్టి అటువంటి కాలుష్య వాతావరణంలో నాయుడుని గ్రహించడం కష్టం. Making of a poem – తెలుసుకోగోరే ఏ సీరియస్ పాఠకుడు, కవితాప్రేమి, సాహిత్య విద్యార్థికైనా-  రాసినవి చెరిపేసే తెంపరితనం, మిగిలినవాటిని దాచని నిర్లక్ష్యం, అక్షరమంటే అలవిమాలిన ఆపేక్ష, కుకవిత్వం మీద తీవ్ర అసహనం – సహజంగా ఉన్న అసుర (అంబటి సురేంద్రరాజు), నాయుడు వంటి అతి కొద్దిమంది కవులు మాత్రమే testimonial గా నిలుస్తారు.

కవిత ఎప్పుడు రెక్కలల్లార్చి, ఎప్పుడు ముడుచుకుంటుందో తనకే తెలియకపోవడం వల్ల కాబోలు, ఎటువంటి తారీఖుల బరువుల్నీ కవితల రెక్కలకి కట్టే ప్రయత్నం చేయలేదు నాయుడు. పఠితకి విశ్రాంతిని ఎర చూపే మాయలాడి విరామచిహ్నాలు ఉండనే ఉండవు. నాయుడి కవిత్వంలో లౌకికమైన కళ్లకి తోచే ఏ రకమైన సందర్భాలూ, కనీసం నెపాలుగానైనా ఎదురుపడవు. కుర్చీగానో, హోదాగానో తప్ప, మనిషిగా పరిచయమైన ఎవర్నైనా చవక చేసే లోకంలో గత్యంతరం లేక మసలుతుంటాడు కాబట్టి, సందర్భాలు పటాటోపంగానైనా ఎత్తిచూపే scholarship కనబడదు నాయుడిలో. కానీ, కె.ఎన్.వై. పతంజలి గారి మీద రాసిన ఎలిజీ ‘వాగ్విశ్రాంతి’ (గాలి అద్దం- పేజీ 171) చూడండి: “ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్రఖచితమొనర్చాడు/ అంతర్థానమయ్యే అనుభవాల్లో/ నిబిడాంధకార శబ్దస్పర్శలు/ యాదృచ్ఛిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి/…. / అతడొక వాక్యవిస్మృతి/ అతడొక వాగ్విశ్రాంతి”!

పతంజలి గారి రచనా సర్వస్వం మీద వచ్చిన అత్యుత్తమ విశ్లేషణలు, సిద్ధాంతాలు వేటికైనా తీసిపోతాయా ఈ స్మృతిగీత పాదాలు! మో మీద, త్రిపుర గారి మీద రాసిన ఎలిజీలు కూడా అదే స్థాయి.

అయితే, ‘గాలి అద్దం’ కవితా సంకలనం మీద నాకు అసంతృప్తి ఉంది. నాయుడు కానిది ఇందులో ఎక్కువగా కనిపించడంవల్ల కలిగిన అసంతృప్తి. నాయుడు కానిదాని వైపు నాయుడిని జీవితం నెట్టడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటి దుఃఖ్ఖాన్ని పోలిన అసంతృప్తి. అంతకుముందు, ఎన్నింటిని గుదిగుచ్చినా దేనికదే ప్రత్యేకంగా తోచేలా చేసిన కవిత్వాంశ తగ్గి, monotonous గా అనిపించాయి ‘గాలి అద్దం’లో కొన్ని కవితలు; మరికొన్ని వచనమై సోలిపోయాయి. కవిత్వం ఇలా స్పష్టత దిశగా పలచబారడానికి కారణమేమిటా అని ఆలోచిస్తే ఏమనిపించిందంటే- ఒకానొక upper yielding point కు కూడా చేరుకున్నాక, బద్దలైనట్టు నాయుడు అలిగాడు. ఆ అలకని చూపడంలో ఎవరి పద్ధతి వారిది అయినట్టు, కవిత్వాన్ని విస్పష్టత దారుల్లోకి మళ్లించడం నాయుడి స్టైల్ ఏమో. ఏదిఏమైనా, తాను కినుక వహించడానికి కారణమైన లోకంలో నేను సైతం భాగం కావడాన్ని మాత్రం ఎంత కక్షతోనైనా క్షమించుకోలేకపోతున్నా.

*

 

మీ మాటలు

 1. Dr. Sumanasri (Chellapilla Kameswara Rao) says:

  నున్న నరేష్ గారూ! చాలా కవితాత్మకంగా రూపుదిద్దుకుంది మీ ప్రసంగ వ్యాసం! కృతజ్ఞతలు!

 2. గొప్పగా ఉంది. ఇంకేం చెప్పను?

  “ఆగాగు!

  ఊడల్తోనైనా దాటాలీ చీకటి జన్మాల ఏరు

  నువ్వైనా మరి

  నేనైనా-“

 3. నరేశ్… నాయుడు గురించి నీ వాక్యాలు చీకటి ఊడల్లా ఒళ్ళంతా చుట్టేసి పాతికేళ్ళ వెనకాలకు విసిరిపారేశాయి. నాకూ అనిపించే విషయమేమంటే… కవిత్వం నాయుడ్ని రాస్తూ పోతుంది. మన మధ్య నాయుడొక మిస్టిక్. అనుభవాలకూ పదాలకూ ఉన్న మార్మిక బంధాన్ని పునర్నిర్వచించే మహత్తు ఉన్నవాడు. రాసిందీ చెరిపిందీ పక్కన పెడితే… రాయని అగాధాల లోతుల్లోకి తీసుకువెళ్ళడం నాయుడికే సాధ్యం. అది ఒక వెళ్ళిపోతాను లాంటి పునర్యానాలే. ఇంతకీ,”ఇపుడే”గా రావాల్సిన కవితలేవీ ఒక వెళ్ళిపోతానులో లేనట్లేనా?
  నువ్వు చెప్పిన మాటల్లో.. :”సుమారు పాతికేళ్లుగా గమనిస్తునానతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం; అంతేకాకుండా, అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురుచూడటం నిజజీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత, కల-మెలకువల మధ్య తిర్యగ్ బిందువుని దర్శించడంలా…” అన్నమాటలు అద్భుతం. చివర్లో, “నాయుడు కానిది” అంటూ వాపోతూనే.. నీ అసంతృప్తికి కారణాలు చెప్పే ప్రయత్నం చేశావ్. నువ్వన్నట్లు అలిగి విస్పష్టమవుతున్నాడా? “ఒకోసారి కలలు స్త్రీలు స్నేహితులు రాచపుండ్లు” అని తేల్చేస్తున్నాడందుకేనా? ఏమో.. నాకైతే, “ఇల్లు పెద్దదవదు పిల్లలే మరీ పెద్దయ్యారు… కాలం పేరుకుపోయింది కళ్ళ పెంకులపై ఇల్లొక శవపేటిక” అన్నప్పుడు నాయుడు బద్దలైపోలేదు…ఉండచుట్టుకుపోతున్నాడేమో నెత్తుటి ముద్దలా అని భయమేస్తోంది. గాలికీ చీకటికీ దుఖ్కానికీ, నిశ్శబ్దానికీ,శూన్యానికీ రంగులద్దేవాడు నిర్మోకంగా యెటుపోతున్నాడు? “ఒడ్డే లేదు మౌనంలో” అన్నవాడికి లోతులతోనే పని కానీ తీరంతో ఏమిటి? వైరాగ్య ద్వారాల చెంత మోకరిల్లేవాడు..”వాన వెలిసింది పౌర్ణమిని ఆటకు పిలిచాయి చేపలు” అంటాడుచూడూ… అందుకే కొంత ఓదార్పు.

 4. K.WILSON RAO says:

  నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఎం.ఎస్.నాయుడు గారి ” గాలి అద్దం” కవిత సంపుటికి పురస్కారం వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు . నరేష్ నున్న గారు నాయుడి గారి కవిత్వం పై సమీక్ష చాలా ఆసక్తి తో అందరూ వినటమే కాకుండా సమీక్ష ముగిసిన వెంటనే సమీక్ష కాపీ ని సుమనశ్రీ గారు తీసుకొని చాలా మంచి సమీక్ష చేశారని అభినందించటం, నాయుడు గారు కృతజ్ఞతగా కళ్ళు chemarchatam నేను గమనించాను. naresh నున్నా గారిని గొప్ప సమీక్షకుడుగా అందరూ చెప్పుకోవటం నేను విన్నాను. సమీక్షను వినడమే కాకుండా చదివిన అనుభూతి గొప్పగా వుంది.

మీ మాటలు

*