తెలుసు

Art: Rajasekhar Chandram

 

రాత్రి వొడవదు

ఎన్నో రాత్రి ఇది

చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క

జారి

ఆరిపోతున్నది

 

తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు

కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు

ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు

దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు

 

నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే

 

నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం

వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు

కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు

 

నల్లని అద్దాన్ని దాటే ప్రయత్నం

కమ్మని పరిమళం కొన్ని గాయాల నుంచి

నొప్పి మందుగా ఏవో కలలు రాసుకుని

బతకొచ్చు అనెస్తీసియా మైమరుపులో

 

నేను మరణించాక ఎవరో వచ్చి

పోపుల డబ్బాలు కూడా ఘాలించి

స్వప్నాల వాసన ద్రవ్యాలు మూటగట్టి

గేటు దూకేస్తారు వొంటికి నూనె రాసుకుని

దొంగలను పట్టుకోలేవు

వాళ్ళే అరుస్తారు నీ వేపు వేలు చూపి

నువ్వూ దొంగవేగా, ఏమీ అనలేవు

 

ఎలాగో ఇంటికొచ్చేశావు

బాగా నలిగిపోయావు

నిద్దర పోరా నాన్నా నిద్రపో

 

ఏడూర్ల వాళ్ళు తిన్నా మిగిలే

పెను చేపను పట్టి, కత్తి కోరల

సొరచేపలతో తలపడి ఓడి

చివరికి ఈ గట్టున

ఊరక దొరికే కాడ్ లివర్ ఆయిల్ తాగి

గుడిసెలో ముసలి నిద్రలో మునిగిపో

నువ్వు నిద్ర పోరా నాన్నా నిద్ర పో

 

ఇంతగా చెప్పలా

నువ్వూ నేనూ తానూ వేరా?

మనం చిరిగి చీలికలవుతున్న

ఒక ప్రపంచం చీరె ముక్కలం

 

తెలుసు

ఈ రాత్రి ఇంతే ఇక

వుదయం ఒక అపహాస్యం

పద్యం ఒక ఆర్తనాదం

 

*

మీ మాటలు

  1. Sreenivaas sattiraju says:

    నిజమే ఈ వ్యక్తీకరణం ఒక అర్ధం లేని వ్యర్ధ ప్రేలాపనం చీకటిలో ఆటగత్తెలయ్యి చిందులేసే శిధిల శిల్పాల ఆక్రోశం కాదిది. ఒక ఆధునిక చిత్ర కళా కౌశల్యపు బుర్ర తిరుగుడు రంగుల కలా అనిపించే పూర్తి నగ్నపు నృత్యం. అర్ధమయ్యినా కాకున్నా ఇది కూడా ఒక రచనే భావ వ్యక్తీకరణే గజిబిజి అస్తిత్వ ఆకాంక్షల తికమకల తిలోత్తమే.