తూరుపు గాలులు -చివరి భాగం

3

దీపాంకరుడు ఉత్తారారామానికివచ్చి రెండేళ్ళుదాటింది. కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త విషయాలు; నేర్చుకోవడానికి అంతులేని అవకాశాలు. వీటిమధ్య రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింహళభాష బాగాపట్టుబడింది. శిష్యుల సహకారంతో ఉచ్ఛారణ లోపాలు కూడా సరిదిద్దుకున్నాడు. తనకు సాయంగా నియమించబడిన శిష్యుడు ధర్మపాలుడితో అతనికి బాగా సఖ్యత కుదిరింది. ఉత్తరారామంలో దీపాంకరుడికి అన్నిటికన్నా ఆనందం కలిగించినదేమంటే దంతమందిరానికి సంవత్సరంపొడుగునా వచ్చేభక్తుల సందడి, అక్కడ ఉత్సాహపూరితంగాజరిగే పండగలు, పూజలు, దైనందిన కార్యక్రమాలు. నాలందాలోకూడా అతడటువంటి బౌద్ధ జనసందోహాన్ని చూడలేదు. వరసగా రెండేళ్లపాటు అన్ని పూజలనూ, పండగలనూ దగ్గరగా పరిశీలించినమీదట  అతనికి తోచిన విషయాలను వైశాఖ పూర్ణిమనాడు ఈవిధంగా తన జ్ఞాపకసంపుటిలో వ్రాసుకున్నాడు:

మరో బుద్ధజయంతి పండగ వచ్చి వెళ్ళిపోయింది. మొత్తానికి ఈ రెండేళ్లలో చాలా సంగతులే తెలియవచ్చాయి. ఉదాహరణకి సింహళదేశం కూడా బ్రాహ్మణపౌరోహిత కులం, రాజ, వైశ్య కులాలు, భూమిమీద, వ్యవసాయంమీద ఆధిపత్యం కలిగిన గోవి కులం, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ అనేక కులాలు, ఛండాల కులం – ఇలా చాలా కులాలున్నాయని తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. అనురాధపురంలోనూ, పొలోన్నరువలోని దంతమందిరంలోనూ వంశపార్యంపరంగా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు భారతదేశంనుండి మహేంద్రుడు, సంఘమిత్రలతో బాటుగా వచ్చారంటారు. (ఈ ఆచారం నిలబడిందిగాని, సంఘమిత్ర స్థాపించిన భిక్షుణిల విహారం ఎందుచేత మూతబడిందో? ఆ మాటకొస్తే నాలందాలో కూడా అంతా భిక్షువులేగాని, భిక్షుణిలు లేరు).

దంతమందిరానికి వచ్చే భక్తులను చూస్తూంటే, వాళ్లతో మాట్లాడుతూంటే తథాగతుడు దుఖాన్ని సార్వజనీన మానవజీవన విషాదంగా, నాలుగు మహాసత్యాల్లో మొదటిదానిగా ఎందుకు గుర్తించాడో వాస్తవరూపంలో కళ్ళముందు కదలాతుడుతుంది. సంతానం కలగలేదని విలవిలలాడుతూన్న దంపతులు, సంతానంపెట్టే బాధలుభరించలేకపోతూన్న తల్లిదండ్రులు, యుద్ధంలో మరణించిన సైనికుని భార్య, ఆత్మీయుల దీర్ఘకాలిక అనారోగ్యంతో వ్యధ, దగ్గరవారు చేసిన ద్రోహానికి తట్టుకోలేకపోయిన వంచితులు, వర్షాలులేక పంట చేజారిన రైతులు, భాగస్వాముల చేతిలో మోసపోయి వీధినపడ్డ వ్యాపారి, పైఅధికారుల ఆగ్రహానికి గురైన చిరుఉద్యోగి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూన్న యువతీ యువకులు….వీళ్ళందరితోనూ మాట్లాడుతూంటే తమ బాధల్ని చెప్పుకోవడంలోనే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారనిపిస్తుంది. వాళ్ళ మొహాల్లో చిగురించే ఆశాభావం ఉత్సాహం కలిగిస్తుంది. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి, దంతాన్ని భద్రపరచిన ధాతుపేటికను కడిగిననీళ్ళను తీర్థంగా స్వీకరించి, తథాగతునిపై భారంవేసి, ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో దైనందిన జీవనపోరాటాలని కొనసాగించడానికి తిరిగివెళ్తున్నారు. వారి విశ్వాసబలం చూస్తే ఆనందం కలుగుతుంది. నాలందాలో ఉండగా ఒక చీనావిద్యార్థి  ఏదో సందర్భంలో బౌద్ధధర్మంపై పాళీభాషలో అల్లిన ఒక కవిత చదివాడు. దాని సారాంశం ఇలా ఉంటుంది: ధర్మంఅంటే అంధకారంలో నిత్యంవెలిగే ఒక అద్భుత ఆశాకిరణం; భూత, భవిష్యత్తుల అవిరామ పదఘట్టనలో నలిగిపోయేవారి వర్తమానానికి అర్థంకల్పించే ఏకైక ఆధారం; విధివంచితుల వేడుకోలు; ప్రజానీకం భక్తి పారవశ్యంతో గొంతెత్తి పాడుకొనే పాట.

అప్పుడు తెలియలేదుగానీ, నాలందా విధ్వంసం తరువాత సాధువులతో చేసిన తిరుగుప్రయాణం ఒక గొప్ప అనుభవం. ఇప్పుడు కళ్ళారాచూస్తూన్న విశ్వాసబలమే ఆ సాధువులను అత్యున్నతస్థాయిలో ఆవహించిందనిపిస్తోంది. వారి భక్తివిశ్వాసాలకుమూలం,  జీవితం విరజిమ్మే వర్తమాన భయాందోళనలు కావు. వారిది మూర్ఖవిశ్వాసంకాదు; నిస్వార్థమైన, భయరహితమైన భక్తి; ప్రకృతినీ, మాననవాతీత శక్తులను నమ్రతతో గౌరవించి ఆరాధించే భావన; బాహ్య, అంతర్గత సౌందర్యాలను అవలీలగా సంధించగల శక్తి.

ఇక బౌద్ధం విషయానికి వస్తే భక్తిమార్గంలో, విశ్వాసాలతో మొదలుపెట్టినవారిని  జ్ఞానమార్గంలో, హేతుబద్ధత వైపు ప్రయాణింపజేయడమే బౌద్ధధర్మ విశిష్టత. అంతిమంగా ఎవరి కర్మలకువారినే బాధ్యులనిచేసి, ఎవరి దారిని వారే వెతుక్కోవాలంటుంది బౌద్ధం. మనుషులకే అన్ని నిర్ణయాలనూ వదిలిపెట్టిన తథాగతుడు గొప్ప ఆశావాది అయిఉంటాడు. ఎన్నుకున్న మార్గం ఏదైనా ప్రయాణారంభం మాత్రం మనుషులందరికీ ఒకటే.

పుట్టుక, నిత్యజీవన సంఘర్షణ, ఉన్నదిపోతుందేమోనని భయం, కోరుకున్నది లభించదేమోనని ఆందోళన, బాధనుండి విముక్తికోరుకోవడం, ఆనందాన్నిమాత్రమే ఆశించడం, అనారోగ్యం, వార్ధక్యం; చివరికి మృత్యువువాత పడటం, అక్కడకూడా ఆందోళనే – అనామకులుగా కాలగర్భంలో కలసిపోతామేమోననే ఆందోళన – ఇదే ప్రతిఒక్కరి జీవితానుభవం; అన్ని ప్రశ్నలకూ, అన్వేషణలకూ మూలం  ఇదే. ఈ విశ్వవ్యాపిత మౌలికతనుండే బౌద్ధం పుట్టింది. [బహుశా అందుకే తథాగతుడు తన మొదటి ప్రవచనమైన దమ్మచక్కపవత్తన సూత్త (ధర్మచక్ర ప్రవర్తన సూత్రం)లోనే ఈ పరమసత్యాన్ని ప్రస్తావించాడు].

భక్తులందరూ తమ సాంసారిక బాధలనుండి, దుఖమయ జీవితాలనుండి విముక్తిని కోరుకొనేవాళ్ళే. అయితే వాళ్ళ దుఃఖాలను తెలుసుకున్నప్పుడు కరుణాభావం కలగకపోతే అట్టివ్యక్తి భిక్షువుకాదుకదా, మనిషినని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు. అయితే కరుణఅనేది భావంగానే, లోలోపలే ఉండిపోతే సరిపోతుందా? నిత్యజీవనాచరణలో ప్రతిఫలించాలి కదా? అందుకనే తథాగతుడు మేత్త (మైత్రి)ని నిత్యం ధ్యానం ద్వారా అధ్యయనం చేయవలసిన అంశంగా, ఆచరించవలసిన ఆదర్శంగా అనేకసందర్భాల్లో పేర్కొన్నాడు. థేరవాదం ఈ అంశానికి అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తుంది. థేరవాద భిక్షువులు నిత్యం జనసమూహాలకుచేసే ప్రవచనాల్లో, పఠించే సూత్తాల్లో తరచూ వినిపిస్తుంది. రోగికి వ్యాధినిబట్టి తగిన మోతాదులో మందిచ్చేవాడే సరైన వైద్యుడు. (జనులందరినీ అనుక్షణం బాధించే నిర్దిష్టమైన సమస్యల్ని పక్కనపెట్టి శూన్యత, ఆత్మ, అనాత్మ, కర్మ, పునర్జన్మ, ద్వైతం, అద్వైతం – ఇటువంటి అమూర్తమైన విషయాలమీద ఉపన్యసించి ఊదరగొట్టడం అర్థరహితం. ఎవరికోతప్ప వీటిపై అందరికీ ఆసక్తీ ఉండదు).

దుఃఖం, కరుణ, మైత్రి ఈ మూడు అంశాలపైనా, వాటిమధ్యగల మానవీయసంబంధంపైనా గ్రంధాలలో ఎంత చదివినా, ఎంత చర్చించినా తెలియనిలోతు ఇప్పుడు సాధారణజనులతో మాట్లాడుతూంటే తెలిసివస్తున్నది. ఈ సంబంధాన్ని సరళంగా, అర్థవంతంగా తెలియజెప్పగలగడమే ఉత్తమబౌద్దాచార్యుని లక్షణం, ధర్మం. లక్షలసంఖ్యలో జనులకు ఈ సంబంధాన్ని విడమరచిచెప్పగలిగితే, వారిలోంచి వేలకొద్దీ ఉత్తమస్థాయి ఉపాసకులూ, ఉపాసికలూ, ఆచార్యులూ ఉదయిస్తారు. వీరే బౌద్ధానికి భవిష్యదూతలు. ఇలా ఆలోచిస్తే సామాన్యప్రజలనే లక్ష్యం చేసుకోవాలని మొదట్లో ఎన్నుకున్నమార్గమే సరైనదనిపిస్తున్నది. (ఏది ఏమైనా ప్రశ్నలు మాత్రం అవే; చుట్టూతిరిగి స్ఫురించే సమాధానాలుకూడా అవే. అయితే వాటినే మరింత లోతుగా, అర్థవంతంగా చర్చించడం సాధ్యపడుతున్నది. ఈ విషయంపై శాంతిదేవుడు ఏమంటాడో?).

శాంతిదేవుడిని కలుసుకోవడం, అతనితో పూర్వంరోజుల్లోమాదిరిగా సంభాషించడం, చర్చించడం నానాటికీ దుర్లభంగా ఉన్నది. అతడు ఎక్కువకాలం సంఘపరిషత్తు సమావేశాల్లోనూ, రాజభవనంలో జరుగుతూన్న  సంప్రదింపుల్లోనూ గడుపుతూన్నట్లుగా తోస్తున్నది. ఇదేమాట దీపాంకరుడు తనశిష్యుడు ధర్మపాలునితో అంటే – అతడు,

“అవును, ఆచార్యా! శాంతిదేవథేరోవారిని సంఘరాజాగా నియమిస్తూ రెండుమూడు రోజుల్లో రాజభవనంనుండి ప్రకటన విడుదల కావచ్చు. మేమంతా ఆ శుభఘడియ కోసమే ఎదురుచూస్తున్నాం. మీరు ఆయనతో సమావేశంకావాలని కోరుకుంటూన్న సంగతి ఆయనకు తెలియజేస్తాను”. అన్నాడు.

“తొందరేమీలేదు. ఆయనకు తీరుబడి దొరికినప్పుడేలే” అన్నాడు దీపాంకరుడు.

***

శాంతిదేవునితో సంభాషించే అవకాశం బుద్ధజయంతి వెళ్ళిన వారంరోజులకుగాని లభించలేదు. అయితే ఆరోజున అతడు తీరుబడిగా, ఉల్లాసంగా ఉన్నట్టుగా అగుపించాడు.

“ఏదో మాట్లాడాలన్నవుటకదా? మనం మాట్లాడుకొని చాలారోజులైంది. నీకిక్కడ ఎలాఉంది? నువ్వనుకున్నవన్నీ సాధించగలుగుతున్నావా? ఏమైనా సాయంకావాలా? చెప్పు”.

“పనులన్నీ సవ్యంగానే సాగుతున్నాయి, ఆచార్యా. గ్రంధాలప్రతులను వ్రాసిపెట్టుకోవడానికిమాత్రం  అనుకున్నదానికన్నా ఎక్కవ సమయంపడుతున్నది. ఇంకో సంవత్సరంగడువు ఉన్నదిగనుక ఆపని కూడా పూర్తవుతుందనే అనుకుంటున్నాను. కాకపోతే ఒక విషయం మీతో చర్చించాలనుకుంటున్నాను”.

“అలాగే, చెప్పు. నాకు తెలిస్తే చెబుతాను”

“మీకు గుర్తుండే ఉంటుంది – నేనిక్కడికి రావడానికి మీరిచ్చిన సూచనే కారణం. నాలందాలో నిలిపివేసిన అధ్యయనాన్ని కొనసాగించడం, ఉత్తరారామాన్ని ఉత్తమబోధనాకేంద్రంగా తీర్చిదిద్దడానికి మీరుచేస్తున్న కృషిలో పాలుపంచుకోవడం – ఇవేకాక మరో రెండు లక్ష్యాలను కూడా సాధించాలని అనుకున్నాం కదా! మొదటిది పాలకుల సమర్థన, సహకారం కలిగినఉన్నచోట్ల బౌద్ధం ఏవిధంగా వికసిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం, రెండోది జనబాహుళ్యంలో బౌద్ధం ఆచరించే దేశాన్ని సమీపంగా పరిశీలించడం. ఈ రెండు లక్ష్యాలనీ సాధించగలననే అనుకుంటున్నాను. అయితే మా దేశంలో ఈ రెండు అనుకూలతలూ లేవు. మాకున్న కొద్దిపాటి వనరుల్నీ ఎక్కడ కేంద్రీకరించాలి? అన్న ప్రశ్నే మళ్ళీమళ్ళీ  ముందుకొస్తోంది”.

“అర్థమైంది. మొదట కొన్నివిషయాలు చెప్పాలి. అనుకూలతలు అనేమాటవాడావు. నిజమే, మీకులేని అనుకూలతలు కొన్ని మాకున్నాయి. అయితే వాటిమూలంగా వచ్చే సమస్యలుకూడా అనేకం”

“నాకు అర్థంకాలేదు, ఆచార్యా”

“మొదట జనబాహుళ్యంలో బౌద్ధాన్ని తీసుకుందాం. మహిమలు, పూజలూ, తంతులు – వీటిని కోరుకోనేవారూ, నమ్మేవారూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు; ఎప్పుడూ ఉంటారు. వీరి మూలంగా థేరవాదం తన మూలస్వరూపాన్ని, తాత్విక స్వచ్ఛతను కోల్పోయి, ఆచరణలో మహాయాన, వజ్రయానాలవైపు మళ్ళిపోయే ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. ధర్మబోధకుని పనికూడా గొర్రెలకాపరిచేసే పనే. గొర్రెల్ని అప్పుడప్పుడూ అదిలిస్తూ, సరైనతోవలో నడిపిస్తూండాలి. ఒకటిరెండు గొర్రెలు దారితప్పాయంటే మొత్తం మందంతా వాటివెంట పారిపోయే ప్రమాదం ఉన్నది”.

గొర్రెలు, గొర్రెలకాపరి – ఈ ఉపమానం దీపాంకరుడికి అంతగా రుచించలేదు. అయినా కిమ్మనకుండా వినసాగాడు.

“ఇక రెండో అనుకూలత రాజుల సమర్థన, సహకారం. ఇదికూడా ఒక సమస్యే. ఏ ఇద్దరు రాజులూ ఒక మాదిరిగా ఉండరు. ఒక్కొక్కడికీ ఒక్కో పిచ్చి; ఎవడిపిచ్చి వాడికానందం అన్నారు. అందుచేత ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బౌద్ధాన్ని కాపాడుకోవడమంటే కత్తిమీద సామువంటిదే”.

‘పిచ్చిమారాజులు’, ‘కత్తిమీదసాము’ ఈ పదప్రయోగాలు దీపాంకరుడికి ఆశ్చర్యం కలిగించాయి. శాంతిదేవుడు చెప్పుకుపోతున్నాడు.

“మా దేశంలోని రాజవంశాలన్నీ కళింగ, చోళ, పాండ్య రాజ్యాలతో పెనవేసుకుపోయాయి. బౌద్ధం స్వీకరించి పూర్తిగా స్థానికులుగా మారినవారూ ఉన్నారు. యుద్దాలుచేసి ఆక్రమణదారులుగానే మిగిలిపోయినవాళ్ళూ ఉన్నారు. విదేశీయులతో యుద్ధాలు జరిగినప్పుడల్లా బౌద్ధం, సింహళ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. ఏదైనా సంక్షోభం మీదపడినప్పుడు ప్రజల్ని సమీకరించడానికి బౌద్ధమే శరణ్యం. అటువంటప్పుడు ధర్మం, సంఘం ఒక స్థాయివరకే; ఆ తరువాత అంతా రాజకీయప్రమేయం, ఆధిపత్యపోరాటమే. ఇది మా రాజులందరికీ తెలుసు. అందుకే అన్ని వ్యవహారాల్లోనూ మామాటకు విలువనిస్తారు. అందుచేత నీ ప్రశ్నకి సమాధానం ఏమంటే – మీరిప్పుడు సామాన్య ప్రజలమీదనే దృష్టిపెట్టాలి; తప్పీజారీ ఒకరిద్దరు పాలకులెవరైనా బౌద్ధానికి అనుకూలురుగా ఉంటేగనక ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. ఈ రెండు అనుకూలతల కన్నాకూడా మరో ముఖ్యమైన విషయం ఉన్నది. ఈ మధ్యంతా మీ దేశంలో ఉన్నానుకాబట్టి నాకర్థమైన సంగతి ఒకటి చెబుతాను”.

“చెప్పండి, ఆచార్యా”

“మీ దేశంలో బౌద్ధం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. ఇప్పట్లో పరిష్కారమంటూ ఏమీలేదు. ఎన్నో ఆరామాలు మూతపడ్డాయి. భిక్షువుల సంఖ్య రోజురోజుకీ క్షీణించి పోతున్నది. పైగా ఈ తురుష్కుల ఆక్రమణ. అందుచేత మీరిప్పుడు చెయ్యవలసిందల్లా మిగిలిన ఆరామాల్లోనయినా మూలగ్రంధాలను కాపాడుకోవడం, ధర్మవాణి పూర్తిగా మూగబోకుండా రక్షించుకోవడం. మన తరం చెయ్యవల్సిందీ, చెయ్యగలిగిందీ – ఇదొక్కటే”.

శాంతిదేవుడు కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడతాడని తెలుసుగానీ – మరీ ఇంత సూటిగా, నిర్మొహమాటంగా ఉండడం చూడలేదు. బహుశా ప్రతీదీ విడమర్చిచెప్పడానికి వ్యవధిలేకపోవడంవల్ల కావచ్చు అనుకున్నాడు దీపాంకరుడు.  

“తురుష్కుల ఆక్రమణ గురించి ప్రస్తావించారు. వారినుండి ఎప్పటికైనా విముక్తి ఉంటుందంటారా?”

“నాకు తెలిసి వాళ్ళను ఉత్తరభారతదేశంనుండి ఇప్పట్లో కదిలించగల వాళ్ళెవరూలేరు. దక్షిణదేశాన్నయినా కాపాడుకోగలిగితే అదే గొప్పవిజయం. తురుష్కులధర్మం వేరుకావచ్చు, వారి పద్ధతులు అత్యంత క్రూరమైనవీ, హేయమైనవీ కావచ్చుగానీ రాజులందరూ సామ్రాజ్యవిస్తరణకై యుద్ధాలుచేసినవాళ్ళే, అశోకునితో సహా”.

దీపాంకరుడు నివ్వెరపోయాడు. “తురుష్కులను అశోకునితో ఎలా సరిపోలుస్తున్నారో అర్థంకావటం లేదు, ఆచార్యా”

“నిజమే. కళింగయుద్ధం తరువాత అశోకునిలో ఉదయించిన పశ్చాతాపం, వైరాగ్యం మరే చక్రవర్తిలోనూ చూడం. అదొక్కటే అతనిలోని అపూర్వమైన విశిష్టత. అదే అతడిని బౌద్ధంవైపుగా మళ్ళించింది. దానిఫలితంగానే అతడు చరిత్రలో శాశ్వతమైనస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఒకేఒక్క ప్రత్యేకతని మినహాయిస్తే అతడూ రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిన పాలకుడే; అత్యంతక్రూర హింసాకాండకు వెనుదీయని పోరాటయోధుడే”.

అశోకుడ్ని ఈ కొత్తకోణంలో చూడడం దీపాంకరుడికి కొరుకుడుపడలేదు.

ఇంతలో శాంతిదేవుని ప్రధానశిష్యుడైన గుణసేనుడు వచ్చి అతని చెవిలో ఏదో చెప్పాడు. శాంతిదేవుడు లేచినిలబడి,

“దీపాంకరా, నేను బయల్దేరాలి. రాజభవనంనుండి  పిలుపువచ్చింది. మరోరోజున మనచర్చని కొనసాగిద్దాం” అని వడివడిగా వెళ్ళిపోయాడు.

దీపాంకరుడికి శాంతిదేవునితీరు కొత్తగా అనిపించింది. ఇన్నాళ్ళూ శాంతిదేవుడతనికి ఒక ఉత్తమథేరవాద ఆచార్యునిగా, బౌద్ధచరిత్రకారుడిగా మాత్రమే తెలుసు. ఈరోజున అతడు లోకంపోకడను కాచివడపోసిన కార్యదక్షుడిగా, గొప్ప నాయకత్వలక్షణాలు కలిగిన కర్మయోగిగా కనిపించాడు. ఇదేమాట శిష్యుడు ధర్మపాలునితోఅంటే అతడు నవ్వి,

“ఆచార్య శాంతిదేవథేరోకు చాలా పార్శ్వాలున్నాయి. మనకు కనిపించేవి కొన్ని మాత్రమే” అన్నాడు.

ఆరోజున జరిగిన చర్చపై దీపాంకరుడు ఈవిధంగా వ్రాసుకున్నాడు:

ఈ రోజున శాంతిదేవునితో ఆసక్తికరమైన చర్చజరిగింది. అతడి దృష్టిలో ఇవాళ్టి భారతదేశ పరిస్థితుల్లో బౌద్ధధర్మరక్షణ, వికాసం, విస్తరణ ఎలా సాధ్యం – కిందనుండి పైకా లేక పైనుండి కిందకా? అన్న ప్రశ్నలు అంత ప్రధానమైనవికాదు. బౌద్ధానికి ఇప్పుడు ఏర్పడిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. మొత్తం తుడిచిపెట్టుకుపోకుండా ఎలా కాపాడుకోవడం? – అనేదే ముఖ్యమైన ప్రశ్న. అతనితో మాట్లాడాక ఎప్పుడూ కలిగే నిబ్బరానికి బదులుగా భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోయింది. ఏదిఏమైనా ఇక్కడ తలపెట్టిన పనులన్నింటిలోకీ మూలగ్రంధాల ప్రతులను వ్రాసిపెట్టుకోవడమే అత్యంత కీలకమైనదని బోధపడింది. వాటిని యదాతథంగా రాబోయేతరాలకు అందజేయగలిగితే అవే వారికి మార్గదర్శకాలు అవుతాయి. లేదంటే భవిష్యత్తు అంధకారమే.  (నాలందాలో అగ్నికిఆహుతైన జ్ఞానసంపందను తలచుకుంటే కన్నీళ్లు ధారలుకట్టాయి. రాత్రంతా నిద్రలేదు).

***

 

దుర్దినాన తెల్లవారుఝామునజరిగే ప్రార్థనలో పాల్గొనడానికి దీపాంకరుడు వెళ్తూంటే విషాదవదనుడైన ధర్మపాలుడు ఎదురై, రాత్రి శాంతిదేవుడు మరణించాడని చెప్పాడు. పిడుగులాంటి ఆ వార్తవిని దీపాంకరుడు నిశ్చేష్టుడయ్యాడు. మెదడు మొద్దుబారిపోయింది. యాంత్రికంగా ధర్మపాలునివెంట విహారప్రాంగణంవైపు నడిచాడు. అప్పటికే అక్కడ చాలామంది భిక్షువులు గుమిగూడి ఉన్నారు. మృతదేహం చుట్టూ కొంతమంది కూర్చొని ఉన్నారు. మంద్రస్వరంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఊదొత్తులు, ప్రమిదలు వెలుగుతున్నాయి; పూలదండల మధ్య శాంతిదేవుని శరీరం నిశ్చలంగా, నిద్రపోతున్నట్లుగా ఉంది. అతని మొహం ప్రశాంతంగా, చిరునవ్వు చిందిస్తున్నట్టుగా ఉన్నది. దీపాంకరుడికిదంతా ఒక పీడకలలా ఉందితప్ప నిజమని నమ్మలేకపోతున్నాడు. తదేకంగా శాంతిదేవుని ముఖంలోకి చూశాడు. ఇతడేనా నిన్నగాకమొన్న నాతో అన్నివిషయాలు చర్చించింది? ఇంతలోకే ఎలా మృత్యువాతపడ్డాడు? ఏదో  చెప్పాలని ప్రయత్నిస్తూన్నట్లుగా ఉంది శాంతిదేవుని ముఖం చూస్తూంటే. లేక అంతా తన ఊహేనా? మళ్లీమళ్లీ చూశాడు. ‘నేను చెయ్యగలిగింది చేశాను; ఇక మీ పైనే మొత్తం భారంపెట్టి వెళ్తున్నాను. ఏం చేస్తారో, మీ ఇష్టం’ అంటున్నట్టుగా తోచింది.   ఇక అక్కడ నిలబడలేక దూరంగావెళ్లి రాతి మంటపస్తంభానికి జేరబడి మెట్లమీద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. బాగా ఎండెక్కింది. అతన్ని వెతుక్కుంటూ శిష్యుడు ధర్మపాలుడు వచ్చాడు. చిన్న మట్టిముంతతో – చిటికెడు ఉప్పుకలిపినగంజి ఇచ్చి తాగమన్నాడు; అది తాగాక దీపాంకరుడికి కాస్త సత్తువ వచ్చింది. లేచినిలబడ్డాడు. అప్పటికి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అందరూ కంటతడిపెడుతున్నారు; పైకి ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. శాంతిదేవునికి ఇంతమంది సన్నిహితులూ, అనుచరులూ ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది.

“ఎలా జరిగింది?” అని ధర్మపాలుడిని ప్రశ్నించాడు.

“రాత్రి పడుకోనేటప్పుడే ఒంట్లో నలతగా ఉందని గుణసేనుడితో అన్నారట. వైద్యుడిని పిలిపిద్దామంటే అవసరంలేదు, పొద్దున్న చూద్దాంలే అన్నారట. అంతే, నిద్రలోనే పోయారు”.

చుట్టూ మూగిన జనాన్ని తప్పించుకుంటూ అంతిమ దర్శనంకోసం శాంతిదేవుని శరీరాన్ని ఉంచిన ప్రాంగణం వైపు ఇద్దరూ నడుస్తున్నారు. శాంతిదేవుని శిష్యుడైన గుణసేనుడు ఎదురై,

“ఆచార్యా, పొద్దుటనుండీ మీకోసం తెగవెతుకుతున్నాను. మీతో మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది – పదండి” అని చెయ్యపట్టుకొని గుంపునుండి దూరంగా లాక్కుపోయాడు.

అతడి గురువులానే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుణసేనుడి మోహంలో ఆందోళన, తీవ్రమైన ఆదుర్దా కనిపించేసరికి దీపాంకరుడుకూడా కంగారుపడ్డాడు. చుట్టూ ఎవరూలేరు.

“ఏమైంది గుణసేనా?”

“ఎవరితోనూ అనకండి, ఆచార్యా. విషప్రయోగం జరిగింది. కిట్టనివాళ్ళు శాంతిదేవథేరోని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రాజభవనంలో ఇప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉంది”. గుణసేనుడి కండ్లవెంట నీళ్ళు.

“అంత ఖచ్చితంగా ఎలాచెప్పగలవు?”

“రెండురోజుల క్రితం ఆయనే స్వయంగా నాతో అన్నారు”

“ఏమని?”

“నామీద హత్యాప్రయత్నం జరగవచ్చు అన్నారు. ఒకవేళ అనుకోనిదేమైనా జరిగితే ఏం చెయ్యాలోకూడా చెప్పారు”

“ఏం చెప్పారు?’

“చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయంలేదు. మీకు సంబంధినది మాత్రం చెబుతాను”

“చెప్పు”

“మీరు వెంటనే బయల్దేరి మీ దేశం వెళ్లిపోవాలి”

“అర్థంకాలేదు”

గుణసేనుడు అసహనంగా “దీంట్లో అర్థంకాకపోవడానికి ఏముంది? ఈరోజే బయల్దేరి మీదేశం వెళ్ళిపొండి” అన్నాడు.

“ఈ రోజే?”

“అవును. ఈ రాత్రికల్లా మీరు పొలోన్నరువ వదిలి వెళ్లిపోవాలి, ఆచార్యా”.

“అసాధ్యం. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాననుకున్నావు? అయినా ఎందుకు వెళ్ళాలి? నాకేం అర్థంకావడం లేదు”.

“వివరంగా చెప్పేటంత వ్యవధిలేదు. మీరు శాంతిదేవథేరో తీసుకొచ్చిన మనిషనీ, కళింగరాజ్యంకోసం పని చేస్తున్న గూఢచారులనీ, అందుకే సింహళభాషని అంతత్వరగా నేర్చుకొని స్థానికులతో సంబంధాలు పెట్టుకుంటున్నారనీ, ఇంకా చాలా ఆరోపణలున్నాయి.  ఏ నిముషంలోనైనా రాజభటులువచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు”.

దీపాంకరుడికి తలతిరిగిపోయింది. నెమ్మదిగా అన్నాడు –

“గ్రంధాల ప్రతులు?…..ఇంకా పూర్తికావల్సినవి చాలా ఉన్నాయి….. ఇప్పటివరకూ చేసినవో?”

“అవన్నీ మేంచూసుకుంటాం. మాకొదిలెయ్యండి. జాబితా నాకివ్వండి. పూర్తికాగానే మీవిహారానికి పంపే ఏర్పాటు చేస్తాను. మీగదికి వెళ్దాం పదండి”. ఆచార్యుల వసతిపైపు నడుస్తున్నారు. ధర్మపాలుడు ఇంకా ఏదో అంటున్నాడు –

“అందరూ అంత్యక్రియల సన్నాహాల్లో ఉన్నారు. మీరు వెంటనే బయిల్దేరితే రేపటివరకూ ఎవరూ గమనించరు”.  

దీపాంకరుడికేమీ అర్థంకావడంలేదు. అతని గదిని చేరుకున్నారు.

“మీ వస్తువులు తీసుకోండి”

చుట్టూచూసాడు దీపాంకరుడు. ఒక భిక్షువు తన వెంటతీసుకుపోయే వస్తువులేముంటాయి? భిక్షాపాత్ర, చేతికర్ర, భుజానికి తగిలించుకొనే చిన్నమూట – అంతే. ప్రతులను తయారుచేసుకోవడానికి వ్రాసుకున్న గ్రంధాల జాబితాగల తాళపత్రాలను వణుకుతూన్న చేతులతో, మౌనంగా గుణసేనుడికి అందజేసి,  

“ఎక్కడికి వెళ్ళాలి?” అని దీపాంకరుడు అయోమయంగా అడిగాడు.

“ఏర్పాట్లన్నీ చేసేశాం. మీరు ఎలాగైనా వారంరోజులలో ఉత్తరతీరంలోఉన్న యాపనయపట్టన (జాఫ్నాపట్నం) చేరుకోవాలి. దారిలోతగిలే ఆరామాలన్నీ మన సానుభూతిపరులవే. ఎవరైనా అడిగితే బౌద్ధక్షేత్రాలు దర్శించడానికి భారతదేశానికి వెళ్తున్నామని చెప్పండి. వీలైనంతవరకూ సింహళభాషలోనే మాట్లాడండి. మీవెంట ఒక శిష్యుడు వస్తాడు. యాపనయపట్టనలో మిమ్మల్ని మత్స్యకారుల పడవనెక్కిస్తాడు. అక్కడనుండి దక్షిణభారత తీరానికి ఒక్కపూటలో చేరుకోవచ్చు”.

గదిబయటకు నడిచారు. గుణసేనుడికి తను మరీ కర్కశంగా, ముక్తసరిగా ఉన్నానేమోఅని అనుమానం కలిగింది. నచ్చజెప్పే స్వరంలో, మృదువుగా –

“నేనే మీతో వద్దామనుకున్నాను, ఆచార్యా. కానీ నేనిప్పుడిక్కడ కనబడకపోతే అంతా అనుమానిస్తారు” అన్నాడు. మౌనంగా నడుస్తున్నారు. గుణసేనుడు తటాలున ఆగి –

“నేనిక్కడినుండి ప్రాంగణంవైపు వెళ్తాను. మీరు స్నానాలకోనేరు పక్కనేఉన్న మామిడిచెట్టుకింద ఉండండి. ఇప్పుడక్కడ ఎవరూ ఉండరు. శిష్యుడిని పంపిస్తాను. ముఖద్వారం వైపుగా కాకుండా పెరటిదారిన వెళ్ళిపోవడం ఉత్తమం”.

“అంత్యక్రియలు…?”

“సూర్యాస్తమయంలోగా అయిపోవాలి. మీరు రాకపోవడమే ఉత్తమం” అని దీపాంకరుడికి నమస్కరించి పెద్దపెద్ద అంగలువేస్తూ హడావుడిగా ప్రాంగణంవైపు వెళ్ళిపోయాడు.

దీపాంకరుడు స్నానాలకోనేరు దిశగా నడిచాడు. సూర్యుడు పశ్చిమదిశకు మళ్లిపోయాడు. ఉత్తరారామంతో తనకు ఋణంతీరిపోయిందంటే నమ్మలేకున్నాడు. ప్రాంగణంలోకివెళ్లి, ఆఖరుసారిగా శాంతిదేవుడిని దర్శించుకోవాలనీ, విద్యాధరబుద్ధుడి విగ్రహానికి నమస్కరించాలనీ, నిర్వాణబుద్ధుడ్నీ, చేతులుకట్టుకొని పక్కననిలబడ్డ ఆనందుడినీ మరోసారి చూసిరావాలనీ అతనికి బలమైనకోరిక కలిగింది.  అన్నికోరికల్నీ వదులుకొని ఒంటరిగా పెరటిదారిన బయట పడ్డాడు.

మూడువారాల్లో దీపాంకరుడూ, అతని శిష్యుడూ యాపనపట్టణం చేరుకున్నారు. దీపాంకరుడిని తమిళజాలరుల పడవనెక్కించి శిష్యుడు వెనుతిరిగాడు. సింహళతీరం అదృశ్యమవుతూండగా తను వ్రాసుకుంటూన్న జ్ఞాపకాల సంపుటి ఉత్తరారామంలోనే మర్చిపోయిన సంగతి దీపాంకరుడికి తటాలున గుర్తుకొచ్చింది. మనసు చివుక్కుమంది. గుణసేనుడు గ్రంధాల ప్రతులతోబాటు అందజేస్తాడులెమ్మని సరిపెట్టుకున్నాడు.

***

పాండ్య, కాకతీయరాజ్యాలగుండా ప్రయాణించి పంపావిహారానికి చేరడానికి దీపాంకరుడికి ఆరునెలలపైనే  పట్టింది. అతడు ప్రయాణించిన దారిలో మూడు బౌద్ధ ఆరామాలు కనిపించాయి. ఒక ఆరామం పాడుబడి ఉంది; అక్కడ ఎవరూ లేరు. రెండవ ఆరామంలో ఆరుగురు భిక్షువులు కనిపించారు. వారిలో ముగ్గురు వయోవృద్ధులు. మిగతా ముగ్గురూ వారికి సేవచేస్తూ చెంతనే ఉండిపోయిన శిష్యులు. దీపాంకరుడినిచూడగానే వారందరికీ ప్రాణం లేచివచ్చింది; నాలందాలో చదువుకున్నాడనీ, సింహళదేశంలో ఆచార్యునిగా పనిచేసి వస్తున్నాడనీ తెలుసుకొని ఎంతో సంతోషించారు. తమతోబాటు ఉండమని అభ్యర్ధించారు. వాళ్లమాట కాదనలేక దీపాంకరుడు వారందినాలు  అక్కడేగడిపాడు. ఇక మూడవది ధాన్యకటకవిహారం; అక్కడి పరిస్థితి ఆశాజనకంగా ఉన్నది. వందకుపైగా  భిక్షువులూ, నలుగురు ఆచార్యులూ ఉన్నారు. తెలుగుమాటలు వినబడుతూంటే దీపాంకరుడికి వీనులవిందుగా ఉన్నది. థేరవాదులుకూడా ఉన్నప్పటికీ, మహాయాన, వజ్రయానాలను అనుసరించేవారు ఎక్కువగా ఉన్నట్టు తోచింది. నాగార్జునిబోధనల ప్రభావం బలంగాఉన్నది. దీపాంకరుడు ఈ విహారానికిరావడం అది రెండోసారి. ఆరేడేళ్లక్రితం, నాలందా వెళ్ళేదారిలో రెండురోజులు అక్కడ బసచేసాడు. అప్పుడుకూడా మంచిఅభిప్రాయమే కలిగింది. అక్కడి శిల్పసంపద అతన్ని ముగ్ధుడ్ని చేసింది.  దీపాంకరుడి గురించి తెలుసుకున్న ప్రధానాచార్యుడు అతన్ని వర్షావాసం అక్కడేగడపమనీ, తనకుతోచిన విషయాలపై ప్రసంగించమనీ కోరాడు. దీపాంకరుడు అంగీకరించాడు.

రెండోరోజున, ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ఆ విహారపు ప్రత్యేకత అయిన కాలచక్రస్థూపాన్ని దర్శించేందుకు దీపాంకరుడు బయలుదేరాడు. స్థూపంచుట్టూ ఉన్న సువిశాలమైన తోటపై సూర్యుని తొలికిరణాలు ప్రసరిస్తూండగా పక్షుల కిలకిలలతో మర్మోగుతున్నదా ప్రదేశం.

తథాగతుడే స్వయంగా సుచంద్రుడనే రాజుకీ, ఇతరులకూ ఈ ధరణికోటలోనే కాలచక్రతంత్రాన్ని బోధించాడని వజ్రయానంలో ఒక కథ ప్రచారంలో ఉన్నది. కొన్నివందల ఏళ్ల తరువాత శంభాల రాజవంశీకులు ఆ తంత్రపుసారాన్ని విమలప్రభ అనే రచన ద్వారా అందరికీ అర్థంఅయ్యేట్టుగా వివరించారని అంటారు. యుగాంతంలో బౌద్దులకూ, మ్లేచ్చులకూ ఘోరమైనయుద్ధం జరుగుతుందనీ, బౌద్ధులదే అంతిమవిజయం అవుతుందని కాలచక్రతంత్రంలో ఉందని దీపాంకరుడు నాలందాలోఉండగా వజ్రయాన తరగతుల్లో  తెలుసుకున్నాడు. థేరవాది కావటంమూలాన అప్పట్లో వజ్రయానంలో ఏమంత ఆసక్తి ప్రదర్శించకపోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మయుద్ధాలు, అంతిమ విజయాలు ఇటువంటి అంశాలపట్ల అతనిలో మొదటిసారిగా కుతూహలం కలుగుతున్నది. కాలచక్రతంత్రం సూచించే అంతిమవిజయం బౌద్ధమనుగడకు ఆఖరిఆధారం కావచ్చునేమోనని ఎక్కడో ఒక చిన్న ఆశ.

చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాక కాలచక్రస్థూపానికి మరోసారి నమస్కరించి బయలుదేరబోతూంటే వెనకనుంచి ఎవరో, “నీకోసమే ఎదురుచూస్తున్నాను, దీపాంకరా” అన్నారు. చూడబోతే చిరునవ్వులు చిందిస్తూ ప్రజ్ఞామిత్రుడనే వజ్రవాద ఆచార్యుడు. వయసు ఏభైపైనే ఉండొచ్చు. అయినా యవ్వనకాలపు చురుకుచూపు, పెంకితనపు నవ్వు.  క్రిందటిసారి అతన్ని చూశాడుగాని పెద్దగా పరిచయంలేదు.

‘ఈయన నాకోసం ఎదురుచూడడం ఏమిటి?’ అనుకుంటూ అభివాదం చేశాడు. ప్రజ్ఞామిత్రుడు అతని ఆలోచనలను గ్రహించినట్టుగా –

“థేరవాదులు కొట్టిపారేస్తారుగానీ, నిరంతరధ్యానం సృష్టించే ప్రగాఢ నిశ్శబ్దంలోంచి రహస్యసంకేతాలు వెలువడుతూనే ఉంటాయి – జాగ్రత్తగా వింటే” అన్నాడు.

దీపాంకరుడు మౌనం వహించాడు. ఇద్దరూ విహారంవైపు నడుస్తున్నారు. మొదట ప్రజ్ఞామిత్రుడే మాట్లాడాడు –

“అజ్ఞానంనుండి జ్ఞానంవైపు ఎంతదూరం  ప్రయాణించినాకూడా తెలుసుకున్నది పరిమితమైనదీ, తెలియనిది అపరిమితమైనదీ, అనంతమైనదీ అని మొదట అంగీకరించాలి”

“నిజమే, ఆచార్యా! మనల్ని నడిపించేది పరిమితమైన వర్తమాన జ్ఞానమే కావచ్చు; కాని అజ్ఞానం మాత్రం కారాదు”.

ప్రజ్ఞామిత్రుడు కొంటెగా నవ్వి, “జ్ఞానం, అజ్ఞానం వీటి మధ్య అందరికీ వర్తించే లక్ష్మణరేఖ ఏదీ ఉండదు. ఎక్కడ జ్ఞానం అంతమవుతుందో, ఎక్కడ అజ్ఞానం మొదలవుతుందో నిర్ణయించడం కష్టం. ఒకవేళ నిర్ణయించినా అది తాత్కాలికమే. ఆ సరిహద్దు స్థిరంగా ఉండదు. కదులుతూ ఉంటుంది. అయినా మాటలకు అందేది పాక్షిక సత్యమే”.

“ఆచార్యా! మీరేమి చెప్పదల్చుకుంటున్నారో అర్థంకావటం లేదు”.

“ఏమీలేదు. వజ్రయానతరగతులు నడుస్తున్నాయి. వారంరోజుల పాటు నువ్వుకూడా వచ్చి మా శిష్యులతోబాటు కూర్చొనివింటే సంతోషిస్తాను. చివరిలో అభ్యాసం కూడా ఉంటుంది”.

“అభ్యాసం అంటే?”

“నువ్వే చూస్తావు”

“తప్పకవస్తాను. కాలచక్రతంత్రంపై మీతో చర్చించవలసిన విషయాలుకూడా కొన్ని ఉన్నాయి”.

ఆ వారం రోజుల్లో వజ్రయానంగురించీ, కాలచక్రతంత్రంగురించీ దీపాంకరుడు చాలా తెలుసుకున్నాడుగాని ఈ మ్లేచ్చులు ఎవరు? వాళ్ళతో యుద్ధం ఎప్పుడు జరగబోతోంది? బౌద్ధులకెవరు నాయకత్వం వహిస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకలేదుగాని చివరిరోజున ప్రజ్ఞామిత్రుడు నిర్వహించిన ఆచరణాత్మక అభ్యాసంలో అతడికి ఊహించని కనువిప్పు కలిగింది. తన అనుభవాన్ని ఈ విధంగా వ్రాసుకున్నాడు:

ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ప్రజ్ఞామిత్రుడు నన్నుతన గదిలోకి తీసుకుపోయాడు. మా వెంట అతని శిష్యుడొకడున్నాడు. ముగ్గురం ముఖాలకు ఇత్తడి తొడుగులు ధరించాం. ఎందుకని అడిగితే – మన ప్రస్తుత రూపాలనుండి వేరుపడి దూరంగా ప్రయాణించడానికి అన్నాడు. శిష్యుడు ఊదొత్తులు వెలిగించాడు ఒకే ఒక్క ప్రమిదను వెలిగించి, తెరలుమూసి చీకటిచేశాడు. ప్రజ్ఞామిత్రుడు నన్ను తనతోబాటుగా ధ్యానంచెయ్యమని అడిగాడు. ఇద్దరం చాలాసేపు ధ్యానంచేసాం. నాకలవాటేగనుక ఏ విధమైన ఇబ్బందీ కలుగలేదు. తనతోబాటుగా ఊపిరితీసుకొని వదలమన్నాడు. అలాగేచేశాను. ఇరువురి సన్నటి ఊపిరిశబ్దం మినహా అంతటా నిశ్శబ్దం. పిదప నన్ను శవాసనంలో పడుకోమన్నాడు. దీర్ఘనిద్రలోకి వెళ్ళమనిసూచించాడు. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. తెలివివచ్చేటప్పటికి మధ్యాహ్నమయింది. ప్రజ్ఞామిత్రుడి శిష్యుడు వ్రాసిపెట్టుకున్న వివరాలను బట్టి క్రింది సంభాషణ జరిగినట్టుగా తెలిసింది:

ప్రజ్ఞామిత్రుడు: నీవు విహారంలో కొత్తగా ప్రవేశించిన రోజుల్ని గుర్తుచేసుకో. ఆరోజులు నీకు బాగా గుర్తొస్తున్నాయి. ఇప్పుడేం కనిపిస్తోంది?

దీపాంకరుడు: అప్పుడునేనొక చిన్నపిల్లవాడిని. పదేళ్ళుంటాయేమో. ఒక భిక్షువు నా చెయ్యపట్టుకొని నడిపిస్తున్నారు. ఉత్సాహంగా వెళ్తున్నాను. ఒక చెట్టుకింద కూర్చోబెట్టి గుండుగీసారు. భయంవేసింది. కాషాయిబట్టలిచ్చి కట్టుకోమన్నారు. ఏడుపొస్తోంది. మా ఇంటికి, అమ్మ వద్దకు వెళ్ళిపోతానన్నాను”.

ప్ర: మీ అమ్మ అక్కడలేదా?

దీ: అక్కడే ఉంది. ‘ఇది నీ బడి. ఇక్కడుంటే నీకు చదువుచెబుతారు. ఈయన నీకు గురువులు; వారు చెప్పినట్టుగా చెయ్యి. నీకు బాగా చదువొస్తుంది. గొప్పవాడివి అవుతావు’ అని అంటోంది ఆమె నాతో.

ప్ర: తరవాత ఏమైంది?

దీ: గురువుగారు మా అమ్మని వెళ్ళిపొమ్మని అంటున్నారు. మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేనూ ఏడుస్తున్నాను. గురువుగారు ఓదారుస్తున్నారు.

ప్ర: మీ నాయిన లేడా?

దీ: ఏమో, తెలీదు. కనబడడం లేదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్తున్నావు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: మా నాయినను అరుగుమీద పడుకోబెట్టారు. అమ్మ ఏడుస్తున్నది. ‘మాకు దారిచూపించి వెళ్ళిపో’ అంటున్నది. ఇంకా ఎవరో చాలామందే ఉన్నారు.

ప్ర: మీ నాయిన ఏమంటున్నాడు?

దీ: ఏమీ మాట్లాడడం లేదు.

ప్ర: మీ నాయన ఏమిచేస్తుంటాడు?

దీ: రాచకొలువులో నియోగిగా (కరణీకం) చేస్తూంటాడు.

ప్ర: ఏ ఊళ్ళో?

దీ: తెలియదు.

ప్ర: మీ ఊళ్ళో ఏముంది?

దీ:  మా ఊళ్ళో నృసింహస్వామి ఆలయం ఉంది. ఊరవతల నది ఉంది. తెల్లవారుఝామున మా నాయినతో వెళ్లి నదిలో స్నానంచేస్తున్నాను. అబ్బో చలి! నీళ్ళు చల్లగా ఉన్నాయి. కార్తీకమాసం. మా నాయిన మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నడవలేనంటే నన్ను భుజంమీదఎక్కించుకొని ఇంటికొచ్చాడు. మాఅమ్మ మాకోసం చక్కెరపొంగలి చేసింది.

ప్ర: ఆ నది పేరేమి?

దీ: బాహుదా నది.

ప్ర: కళింగరాజ్యంలో ఉన్నది. అదేనా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్ళు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: ఏమీ కనబడటంలేదు. చీకటి. అయినా ఎంతో వెచ్చగా, ప్రశాంతంగా ఉన్నది. ఆనందంగా ఉన్నది.

ప్ర: నీ తల్లి గర్భంలో ఉన్నావు. అవునా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: గాఢనిద్రనుండి బయటకు వస్తున్నావు. మళ్ళీ ఇప్పటికాలంలోకి వస్తున్నావు. కళ్ళు తెరిచిచూడు.

ఈ అనుభవంతో దీపాంకరుడు చలించిపోయాడు. అతనికి లీలగా గుర్తున్నవిషయాలూ, పూర్తిగా మర్చిపోయిన విషయాలూ అనేకం జ్ఞాపకానికిరాసాగాయి. ఈ ప్రయోగాన్ని ఇంకా పొడిగిస్తే దీపాంకరుడు తన గతజన్మల గురించి తెలుసుకోవచ్చన్నాడు ప్రజ్ఞామిత్రుడు. ఈ విషయమై దీర్ఘంగా ఆలోచించాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

“మళ్ళీ ఎప్పుడు కూర్చుందాం?” అని ప్రజ్ఞామిత్రుడు అడిగినప్పుడు,

“ఈ జన్మ యిచ్చిన విషాదాన్ని భరించడమే కష్టంగా ఉన్నది. గతజన్మల విషాదాన్నికూడా తవ్వుకోవాలనుకోవడం నాకు అర్థరహితంగా కనబడుతున్నది – జన్మరాహిత్యంవైపుగా ప్రయాణించాలని బయల్దేరినవాడిని” అన్నాడు.

అక్కడితో ఆ చర్చ ముగిసింది. వారంరోజుల తరువాత ప్రజ్ఞామిత్రుడు కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకొని వజ్రయానాన్ని అధ్యయనం చెయ్యడానికని తిబెత్తుదేశానికి బయలుదేరాడు. మరో రెండువారాల తరువాత దీపాంకరుడు పంపావిహారానికి ప్రయాణంకట్టాడు.

***

దీపాంకరుడు పంపావిహారం చేరేనాటికి శిశిరం వెళ్ళిపోయి వసంతఋతువు ప్రవేశిస్తున్నది.  కొండల్లో  పచ్చదనం, చల్లదనం ఇంకా మిగిలిఉన్నవి. అల్లంతదూరాన పచ్చని విహారపు కొండలు కనబడగానే దీపాంకరుడి ఉత్సాహం రెట్టింపయింది. అడుగులు వడివడిగా పడుతున్నాయి. చెమటలుకక్కుతూ విహారప్రాంగణం చేరుకున్న దీపాంకరుడికి నిరాశే ఎదురైంది. అక్కడ మనుష్యసంచారం లేదు. పరిసరాలను పరికిస్తే అక్కడ చాలాకాలంగా ఎవరూ అడుగుపెట్టిన సూచనలు లేవు. ఎటుచూసినా దుమ్మూ, ధూళీ, ఎండుటాకులు, పిచ్చిమొక్కలు. దీపాంకరుడికి విపరీతమైన దాహం వేస్తున్నది. మెట్లమీద ఉండే మంచినీళ్ళ కుండలు అడవిజంతువులేవో వాటిని పడదోసినట్టు ముక్కలై ఉన్నాయి. కోయిలల పిలుపులతో లోయంతా మార్మోగిపోతోంది. వేడిగాలి మోసుకొస్తూన్న మామిడిపూత వాసన గుప్పుమంటోంది. విహారపు గుహలోపలికి నడిచాడు. నిర్మానుష్యంగా ఉన్నది. ‘అక్కడసలు మనుషులు ఉండేవారా ఎప్పుడైనా?’ అని సందేహం కలిగేట్టుగా ఉంది. అతడిరాకతో మేల్కొన్న గబ్బిలం ఒకటి కీచుమని అరుస్తూ అతని తలమీదుగా బయటకు ఎగిరిపోయింది. కాసేపు తను చూస్తున్నది పీడకలా నిజమా అని దీపాంకరుడికి అనుమానం కలిగింది. ప్రాంగణంలోకి వచ్చి మర్రిచెట్టుకింద కూర్చున్నాడు. అప్పటికే సన్నబడిన పంపానదిలో ఎప్పటిలానే చాకళ్ళు బట్టులుతుకుతున్నారు. బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. కోయిలల సందడి దీపాంకరుడి చెవులకు అసందర్భంగా వినిపిస్తున్నది.

ఎంతసేపలా కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. మధ్యాహ్నమైంది; భిక్షాటనకు వెళ్ళాల్సిన సమయం మించిపోయింది. దాహానికి ఆకలి తోడైంది. గుడిగంట వినబడింది. ఆదిక్కుగా చూశాడు. శివుడి కోవెలగా మారిన విహారపు గుహనుండి. ఇదివరకెన్నడూ అక్కడ్నించి గుడిగంటలు వినరాలేదు. చూడబోతే జనసంచారం ఉన్నట్టుగానే అనిపించింది. లోయలోకి దిగాడు. ఒక వేపచెట్టువద్ద గ్రామదేవత గుడిముందు అలంకరించిఉన్న మేకలను బలివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డప్పులు మోగుతున్నాయి. అక్కడ మూగిన మనుషుల్నిదాటి ముందుకి నడిచాడు; కొండపైకి ఎక్కి శివకోవెలగా మారిన విహారపుగుహని చేరుకున్నాడు. అక్కడంతా భక్తులతో సందడిగా ఉంది; ఇదివరకులేని బ్రాహ్మణపూజారి కనిపించాడు. శివలింగరూపమెత్తిన అసంపూర్ణ స్తూపానికెదురుగా కొత్తగా వచ్చిచేరిన రాతిమంటపంలో నందివిగ్రహం. పూజారినడిగితే గ్రామపెద్దకు ఈశ్వరుడు కలలోకనిపించి నందీశ్వరుడిని ప్రతిష్టించమని కోరాడని చెప్పాడు. పూజారినడిగి మంచినీళ్ళు తాగాడు. ప్రసాదంఇస్తే తన బిక్షాపాత్రలో వెయ్యమన్నాడు. పక్కకు వెళ్లి ఒక రాతిమీద కూర్చొని ప్రసాదం తిన్నాక పూజారిని అడిగాడు –

“పక్కనున్న కొండపైన విహారంలో ఉండే భిక్షువులు ఏమయ్యారో తెలుసా?”

పూజారి నోరువిప్పేలోగా పక్కనున్న భక్తుడు సమాధానం చెప్పాడు, “గుండు సాధువులేనా? వాళ్ళ పెద్దగురువు పోయి ఏడాదిపైనే అవుతుంది. ఆయనపోయాక వాళ్ళెవరూ ఇటు రావడంలేదు”.

“అంటే భద్రపాలుడుగారు పోయారా?”

“పేరు తెలియదు స్వామీ. పసరువైద్యం చేస్తూండేవారు కదా – పెద్దాయన. ఆయన పోయాడు”

దీపాంకరుడు ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయాడు.

“మొన్నటి వర్షాకాలంలో ఎవరైనా ఇటు వచ్చారా?”

“అబ్బే, ఎవరూ రాలేదు, స్వామీ”

భిక్షాటనకు మాత్రం ఊళ్లోకి వెళ్ళివస్తూ విహారంలో ఒంటరిగా వారంరోజులు గడిపాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడిక చెయ్యగలిగేదేమీ లేదు. గ్రంధాలకు ప్రతులు వ్రాసిపెట్టడంలోనూ, అవకాశంఉన్న మేరకు యువభిక్షువులకు బోధనలు చెయ్యడంలోనూ గడిపితేనే శేషజీవితం సార్థకమవుతుంది. ఇందుకుగాను ధాన్యకటక విహారానికి మరలిపోవడమే  ఉత్తమం అనిపించిది. ఏ కష్టాలూ, ఇబ్బందులూ ఇకపై అతన్నితాకబోవనీ,  అతని లక్ష్యాన్ని ఛేదించలేవనీ అతనికి స్పష్టమైపోయింది.

దీపాంకరుడు ధాన్యకటక విహారం చేరుకున్నప్పుడు ప్రధానాధ్యాపకుడు అతనికి ఎంతో ఆదరంగా స్వాగతంపలికాడు. దీపాకరుడు తలపెట్టిన మహాత్కార్యాలకు విహారం తప్పకుండా సహకరిస్తుందని అభయమిచ్చి కలకాలం గుర్తుండిపోయే ఒక మాటన్నాడు:

“బౌద్ధానికి కాలంచెల్లిపోయిందని కొంతమంది ప్రచారంచేస్తున్నారు. ఇప్పటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నమాట వాస్తవమే. మానవజీవితం దుఃఖభరితంగా ఉన్నంత కాలం, అజ్ఞానంఅనే అంధకారం చుట్టూతా ఆవహించినంత కాలం, చావనే అంతుతెలియని అగాధం మనుషులకెదురుగా నిలిచిఉన్నంత కాలం, బౌద్ధం ఒక ఉత్తమ మోక్షసాధనంగా ఉంటూనేఉంటుంది; సత్యం, కరుణ, మైత్రి – వీటివైపు మనుషుల్ని నడిపిస్తూనే ఉంటుంది”.

దీపాంకరుడు మరో ఇరవైఏళ్లపాటు తనవంతు కృషిచేసి, ధాన్యకటకవిహారంలోనే తనువుచాలించాడు. అతడు కోరుకున్నట్లుగానే అతని చితాభస్మాన్ని కళింగదేశ సరిహద్దుల్లోని బాహుదానదిలో కలిపారు. ఆ మారుమూల ప్రాంతంలో, చిన్న వాగులాంటి నదిని ఆచార్యులవారు ఎందుకు ఎన్నుకున్నారో శిష్యులకు తెలియలేదు. అయినప్పటికీ దీపాంకరునిపై ఉన్న గౌరవంతో అతని ఆఖరి కోరికని నెరవేర్చారు.

oOo

ఉణుదుర్తి సుధాకర్