బతుకమ్మ మునిగింది

 

లోగో: భవాని ఫణి

 

కొన్ని కథలు అనుకోకుండా వెలుగులోకి వస్తాయి. కథల పోటీలూ నవలల పోటీలు ప్రకటించినపుడు పోటీ తత్వంతో రాసిన వాటిలో కొన్ని మంచి ప్లాట్స్ బయట పడతాయి. అలా వచ్చిందే ఈ “బతకమ్మ మునిగింది” నవల.నిజాం పాలించిన తెలంగాణా లో ఊరి పెద్దల దౌర్జన్యాలు వారసత్వంగా కొనసాగే రోజుల్లో చోటు చేసుకున్న కథ ఇది. ఈ నవల ను సాకేతపురి కస్తూరి 1992 లో ఆంధ్ర జ్యోతి నవలల పోటీ కోసం రాశారు. ఆ పోటీలో ఈ నవలకు ప్రథమ బహుమతి వచ్చింది.

సాకేత పురి కస్తూరి పల్లకీ, ఇతర వార పత్రికల్లో కథలు రాస్తూ ఉండేవారు. సీరియల్స్ కూడా రాసినట్లే ఉన్నారు. అయితే కొన్నేళ్ళ నుంచీ ఎక్కడా కనిపించడం లేదు, ఏమీ రాస్తున్నట్లు కూడా లేరు. వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. నవల లో ఉన్న ఫోన్ నంబర్ ఎప్పటిదో 1996 నాటిది. ఎంత ప్రయత్నించినా ఆమె వివరాలు కనుక్కోలేక పోయాను. ఎవరికైనా తెలిస్తే పంచుకోవచ్చు.

ఏ నవల పరిచయం చేసినా, రచయిత/రచయిత్రి పాయింటాఫ్ వ్యూ, ఆ నవల గురించి వాళ్ళ సొంత భావనా తెలుసుకుని రాస్తే మరింత బాగుంటుంది.

ఈ నవల్లో కస్తూరి ఒక బోల్డ్ ప్లాట్ ఎన్నుకున్నారు ఒక స్త్రీకి సంబంధించి. ఒక వివాహితను ఒక ఊరిపెద్ద కిడ్నాప్ చేసి తీసుకు పోయాక కొన్నాళ్ళకి ఆమె ఆతనితో ప్రేమలో పడుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ గా కస్తూరి చిత్రించడం వల్ల, కథా నాయిక పట్ల పాఠకుడికి ప్రేమే తప్ప కోపం కలగదు.

కథా కాలం వర్తమానం కాదని గుర్తుంచుకోవాలి. రచయిత్రి తెలంగాణాకు చెందిన వారా కాదా అనేది తెలీదు. కానీ, ఆమె భర్త వరంగల్ లో పని చేసే రోజుల్లో దశమి నాటి వెన్నెల్లో బతుకమ్మని పేర్చి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరిగే ఆడపడుచుల్ని చూసిన క్షణం ఈ నవల కథ తన మనసులో మెదిలింది అని చెప్పారు ముందు మాటలో!

కథ ఒక పల్లెటూరు లో బతుకమ్మ పండుగ రోజు మొదలవుతుంది. వూర్లోని ఆడవాళ్లంతా చెరువులో బతుకమ్మల్ని వదలడానికి వెళ్ళినపుడు, మునుగుతూ తేలుతూ పోతున్న ఒక బతుకమ్మ దేనికో చిక్కుకుందని గుర్తించి దాన్నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారు ఆడవాళ్ళంతా! ఆ ప్రయత్నంలో పసుపు పచ్చని పట్టుచీర కట్టి ఉన్న ఒక బండరాయి ని బయటికి తీయాల్సి వస్తుంది

ఆ చీర లక్ష్మిది

ఏడాది క్రితం చెప్పా పెట్టకుండా వూర్లోంచి మాయమైన లక్ష్మిది ఆ చీర! లక్ష్మి చచ్చి పోయి ఉంటుందనే అనుమానం అందరికీ ఉన్నా, ఆ అనుమానాన్ని ఎక్కడా బయట పెట్టే పరిస్థితులు గానీ, ధైర్యం గానీ అక్కడెవరికీ లేవు. ఆ చీర చూడగానే వాళ్ళకి కొంత అర్థమై పోతుంది. కానీ అది కూడా బయటికి అరిచి చెప్పే ధైర్యం లేదు. అందుకే “లక్ష్మి లచ్చుమమ్మగా వెలిసింది” అని ఆ రాయిని ఆ చీరతో సహా చెరువు గట్టున పెట్టి పసుపూ కుంకుమ పెట్టి దేవతను చేస్తారు.

లక్ష్మి అలా రాలి పోయి, దేవతగా అవతరించడానికి వెనక కథ వ్యధా భరితమైందే

తెలంగాణ లోని ఒక చిన్న పల్లెటూరులోని బ్రహ్మయ్య కూతురు పదహారేళ్ల లక్ష్మిని వేరే గ్రామానికి చెందిన స్వర్ణకారుడు లక్ష్మయ్య కి ఇచ్చి పెళ్ళి చేశారు. లక్ష్మికి సవతి తల్లి కావడంతో ఆ పిల్ల పడే బాధలు చూడలేక తండ్రి వీలైనంత త్వరగా పెళ్ళి సంబంధం వెదికి పెళ్ళి చేసి కాపరానికి పంపిస్తాడు. వరసకు చుట్టాలైన ఒకరిద్దరుతప్ప ఎవరూ లేని లక్ష్మయ్య భర్యను అపురూపంగా కాపురానికి తెచ్చుకుంటాడు. ఇంకా మొదటి రాత్రయినా  గడవని ఆ జంట కి అదిక జరగనే జరగని విపత్తు సంభవిస్తుంది. ఆ వూరి పెద్ద దొర రామచంద్రా రెడ్డి చుట్టాల పెళ్ళి వేరే వూర్లో మరో మూడు రోజులో జరుగుతుండటంతో నగలు చేయడానికి అతన్ని అప్పటికపుడు తమతో రమ్మంటారు.

ఎదురు చెప్పలేక, తప్పని సరి పరిస్థితుల్లో లక్ష్మయ్య భార్యను పక్కింటి పోచమ్మ, లక్ష్మయ్యకు వరసకు చెల్లెలైన చుక్కమ్మల సంరస్ఖణ లో వదిలి రెడ్డి తో పెళ్ళికి వెళ్తాడు.

చుక్కమ్మ అందమైన  పడుచు. ఆమెగురించి వూళ్ళో ఎవరికీ సదభిప్రాయం లేదు. ఎందుకంటే ఆమెకు రామ చంద్రారెడ్డి దొర తో శారీరక బంధం ఉంది. చుక్కమ్మ లక్ష్మికి తోడు గా ఉంటూ, లక్ష్మయ్య మంచివాడనీ, అతనితో సఖ్యంగా ఉండి జీవితాన్ని సుఖంగా మల్చుకోమనీ పసితనం వీడని లక్ష్మికి దాంపత్య జీవితం పట్ల ఆసక్తిని కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.

రోజూ వూళ్ళోని చెరువు కి నీళ్ళు తేవడానికి తనతో పాటు లక్ష్మిని తీసుకుపోతుంది చుక్కమ్మ. బంగారు రంగుతో బారెడు జుట్టుతో దేవకన్యలా ఉన్న లక్ష్మిని చూసి వూళ్ళో అంతా అబ్బురపడి మనసులో దిగులు పడతారు “దొర కళ్లలో పడిందంటే ఈ పిల్ల బతుకేమవుతదో” అని. లక్ష్మి చెరువులో చేపపిల్లల్లే ఈత కొడుతుంటే చుక్కమ్మ ఆశ్చర్యపడుతుంది. తనకు మాత్రం నీటిగండముందని ఎవరో చెప్తే నమ్మి నీటి వైపు కూడా పోదు.

వూర్లో ఆడవాళ్ళంతా చుక్కమ్మ మంచిది కాదని , దొరతో దానికి సంబంధం ఉంది కాబట్టి దానితో తిరగ వద్దని లక్ష్మి కి హితబోధ చేస్తుంటారు గానీ లక్ష్మి పట్టించుకోదు

ఒకరోజు  చుక్కమ్మ కనిపించని కారణాన, ఒక్కతే పోవడానికి ఇష్టపడక లక్ష్మి పోచమ్మ కొడుకు మల్లిగాడితో చెరువుకి బయలు దేరి వెళ్తుంది. నిండుగా ఉన్న చెరువుని  చూసి సరదా పడి , మల్లి గాడిని చింతకాయలకు  పంపి ఈతకి దిగుతుంది. గంటల తరబడి ఈతకొట్టి కొట్టి అలసి పోతుంది. కట్ట మీదుగా వెళ్తున్న చంద్రారెడ్డి దొర కళ్ళ బడనే పడుతుంది. బంగారు చేపల్లే ఈదుతున్న ఈ సౌందర్య రాశిని చూసి అలాగే కట్టుబడి పోతాడతడు. కాసేపలాగే చూసి చెరువులో అవతలి వైపు దిగి ఈదుకుంటూ వచ్చి లక్ష్మి ని అడ్డగిస్తాడు. ఆ తర్వాత లక్ష్మి ఎంత గింజుకున్నా లాభం లేకపోతుంది. పురుష స్పర్శే ఎరగని లక్ష్మి ని బలాత్కరించి, సొమ్మసిల్లిన లక్ష్మిని చెరువు గట్టున పారేసి పోబోతాడు. ఎవరో వస్తున్న అలికిడి కావడంతో ఆమెను వెనుక తుప్పల్లో పడేయాలని తీసుకు పోతాడు. స్పృహ తప్పి పడున్న లక్ష్మిని పరిశీలనగా చూసిన రెడ్డి ని లక్ష్మి కనుముక్కు తీరు , శరీర సౌష్టవం ముగ్ధుడిని చేస్తుంది

“తీస్క పోయి తోట బంగళాల పెడతా, ఎవరేమంటరో జూస్తా” అని బుజాన వేసుకుని తీసుకు పోయి ఇంటి పక్కనే ఉన్న తోట బంగళాలో గదిలో పడేస్తాడు

తోటకి కాపలాగా పెట్టిన మల్లమ్మ, ఆమె కొడుకు వీరన్నలని పిల్చి గదిలో ఉన్న పిల్లకి ఏం కావాలో చూడమని, జాగర్తగా చూసుకోమని ఆదేశిస్తాడు. “ఎవరీ పిల్ల దొరా? సెర్లో పడ్డదుండీ?” అని మల్లమ్మ అడిగితే “ఔ, లచ్మయ్య పెండ్లాం ఇక సెర్లో పడిన లెక్కనే” అని చెప్తాడు. లక్ష్మి కి స్పృహ వచ్చాక జరిగింది తెలిసి ఏడ్చి గోల చేస్తుంది గానీ ఆమె గోడుని పట్టించుకునే నాథుడు లేడు. మల్లమ్మ ఎంతగా నచ్చజెప్పినా వినదు.

నీళ్ళకు వెళ్ళిన లక్ష్మి బిందె గట్టునే ఉంది గానీ లక్ష్మి జాడ లేక పోవడంతో లక్ష్మి చెర్లో పడి కొట్టుకు పోయిందని ఊర్లో అందరూ నిర్ధారణకొస్తారు. అయితే చుక్కమ్మ నమ్మదు. ఈత బాగా వచ్చిన లక్ష్మి చెరువులో ఎలా కొట్టుకు పోతుందని సందేహంతో చెరువు గట్టున మొత్తం వెదుకుతూ పోతుండగా లక్ష్మి కాలి పట్టీ దొరుకుతుంది. అది పట్టుకుని ఎందుకో అనుమానం వచ్చి దూరంగా చెట్ల మధ్యలో కనిపిస్తున్న  చంద్రారెడ్డి దొర తోట బంగ్లా కంచె దగ్గరికి వెళ్ళి చూస్తే బంగ్లా గదిలో లక్ష్మి! గుస గుస గా ఎంత పిల్చినా లక్ష్మికి వినపడదు! ఎలుగెత్తి పిలిచే పరిస్థితి లేదు. ఈ లోపు పెళ్ళి నుంచి తిరిగొస్తున్న చంద్రా రెడ్డి, వీరన్నలు చుక్కమ్మని చూడనే చూస్తారు.

తనను ఇష్టంతో దగ్గరికి తీసుకునే దొర ఇంకో స్త్రీని, అందులోనూ లక్ష్మిని తెచ్చాడంటే చుక్కమ్మ నమ్మలేక పోతుంది. “మా కులం ల పుట్టుంటే నిన్ను గూడా లగ్గం చేసుకునేటిదుందే చుక్కీ” అని మరులు గొల్పిన దొర, ఒక్కరోజు తను తోటకి రాక పోతే “రాత్రి రాక పోతివి తోటకి? నీ కోసం నడిజాము దాక జాగారం చేస్తూ కూచుంటి చుక్కీ”అని నిష్టూరాలు పోయిన దొర..

లక్ష్మి కి కొత్తగా పెళ్ళయిందని, తననేమీ చేయొద్దని, పై పెచ్చు తాను చంద్రా రెడ్డి వల్ల గర్భవతినయ్యాయని చెప్పి కాళ్లమీద పడి వేడుకుంటుంది

“నీ అసుంటి చెడిన దాని బిడ్డకి నేనెట్ల తండ్రైతనే” అని ఈసడిస్తాడు దొర.”లచ్మి సంగతి గానీ ఊర్ల ఎవరికైనా చెప్పినవంటే, రేపీయేల కి పాలెం చెర్ల నీ పీనుగ బతకమ్మ లెక్క తేలి ఆడతది, యాదుంచుకో” అని హుంకరిస్తాడు.

బతుకమ్మని పీనుగతో పోల్చినందుకు చుక్కమ్మ అగ్రహోదగ్రురాలై చంద్రా రెడ్డిని నానా శాపనార్థాలు పెడుతూ ఊర్లోకి పరిగెత్తి ఎలుగెత్తి అందర్నీ పేరు పేరునా పిలుస్తూ లక్ష్మి దొర చెర లో ఉన్న సంగతి అరిచరిచి చెప్తుంది. అందరూ గుండెలుగ్గబట్టుకుని ఇళ్ళలో వుండే వింటారు తప్ప ఒక్కరూ బయటికి రారు. రాలేరు. ఈ లోపు దొర మనుషులు వెంటాడటం తో చుక్కమ్మ చెర్లో దూకి మునిగి పోతుంది. నీటి గండముందని భయపడిన చుక్కి నీటికే బలై పోతుంది. ప్రేమను నమ్మిన చుక్కమ్మ జీవితం ఎవరికీ అర్థరాత్రి నీళ్లలో ఆమె భయపడినట్టే ముగిసి పోతుంది.

వూరునుంచి తిరిగొచ్చిన లక్ష్మయ్య కి పోచమ్మతో సహా మిగతా జనమంతా నెమ్మది మీద విషయం చెప్పి అతడికి పోచమ్మ కూతురితోనే పెళ్ళి చేసి వేరే వూరికి పంపేస్తారు.

ఈ విషయం మల్లమ్మ ద్వారా తెలుసుకుని లక్ష్మి కుమిలి పోతుంది.”నా మొగుడికి నేనంటే ఎంతో ఇష్టమనుకున్నాను, ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. నన్ను ఎలా  మర్చిపోగలిగాడు” అని ఎంత ఏడ్చినా లాభం లేక పోతుంది.

ఇంత జరిగాక ఇక వూరిలో తాను చచ్చిన దానితో జమ అయినట్టే అని గ్రహిస్తుంది. ఇక లక్ష్మికి దొరని అంగీకరించడం తప్ప వేరే గత్యంతరం లేక పోతుంది. మల్లమ్మ మంచి మాటలతో లక్ష్మి మనసుని మళ్ళిస్తుంది. “దొరకి నువ్వంటే ఎంతో ఇష్టం! నీ కోసం చీరలు నగలు తెస్తాడు. మనిషి మాత్రం ఎంత బాగున్నాడో చూడు. ఆయన్నే నమ్ముకో! సంతోషంగా కాపురం చెయ్యి. నీకిక బయట జీవితం లేదు, నీ మొగుడు కూడా ముట్టక ముందే దొర తెచ్చాడు నిన్ను. నిన్ను మొదట తాకింది దొరే! ఇక ఈయనే  మొగుడనుకో” అని వాస్తవాన్ని వివరంగా చెపుతుంది.

కాలం గడిచే కొద్దీ చంద్రా రెడ్డినే భర్తగా భావిస్తూ,ప్రేమిస్తూ అతనికి వశమై పోతుంది లక్ష్మి. చంద్రా రెడ్డి ఎప్పుడూ స్త్రీలను వాడి పడేసే రకమే తప్ప ఇలా ప్రాణ ప్రదంగా ప్రేమించే అవకాశ్సం ఏ స్త్రీకీ  ఇచ్చినవాడు కాక పోవడంతో లక్ష్మి ప్రేమ అతనికి కొత్త, వింత అనుభూతిని కల్గిస్తుంది. లక్ష్మి ప్రేమలో పిచ్చి వాడై, వేరే స్త్రీల జోలికి కూడా పోకుండా ఎక్కువ కాలం తోట బంగ్లాలోనే గడపటం మొదలు పెడతాడు. సర్వస్వం లక్ష్మే అతనికిప్పుడు

ఈ సంగతి వూర్లో కూడా న్యూస్ అవుతుంది. లక్ష్మి దొరని వల్లో వేసుకుని పూర్తిగా వశం చేసుకుందనీ,పట్టు చీరెలు నగలు మోయలేక పోతుందనీ, త్వరలోనే దొరని దివాలా తీయించడం ఖాయమనీ, లక్ష్మి ఇంత గుండెలు దీసిన బంటని తాము ఊహించలేదనీ, దొర భార్య ఉసురు లక్ష్మికి తగిలి నాశనమౌతుందనీ .. ఎన్నో మాటలు. ఒకప్పుడు వీళ్ళే లక్ష్మి బతుకుని రెడ్డి దొర నిలువునా నాశనం చేశాడనీ, పూవు లాంటి లక్ష్మి దొర కాళ్ల కింద నలిగిందనీ, నలిపిన దొర దాన్ని విసిరి బయట పారేస్తాడనీ ఆవేదన చెంది జాలి చూపించిన వాళ్ళు. వాళ్ళు ఆశించినట్లు జరగక దొర లక్ష్మిని నెత్తిన పెట్టుకున్నపుడు విస్తుపోయి లక్ష్మి నాశనం కావాలని ఆశిస్తారు

లక్ష్మి ఎంత చెప్తే అంత అన్నట్టు నడుస్తున్నాడు రెడ్డి.

అయితే పార్వతమ్మ అన్న నాగిరెడ్డి దొర చుట్టపు చూపుగా వచ్చి లక్ష్మి మీద కన్నేసిన నాటి నుంచీ లక్ష్మి కి కష్టాలు ప్రారంభమవుతాయి. చంద్రా రెడ్డి ఉండబట్టి ఆమె వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక పోతాడు.

రెడ్డి భార్య పార్వతమ్మకి అతని వ్యవహారాలు అలవాటే కాబట్టి అతనితో ఏ సంబంధమూ లేక ఒక కప్పు కింద ఉంటుందంతే! వూర్లో గుడి ని రెడ్డితో చెప్పి బాగు చేయిస్తుంది లక్ష్మి. అలాగే దేవదాసి నాగరత్నం ని తిరిగి  బంగళా వైపు చూడకుండా చేసి పంపేస్తుంది. రెడ్డి ఇదివరకటి అహంకారి కాదు. ప్రతి దానికీ అంతెత్తున ఎగిరి పడే అతను సౌమ్యంగా మారి పోతాడు. ఇదంతా లక్ష్మి చలవే అని భావించి పార్వతమ్మ లక్ష్మి మీద అభిమానంగా ఉంటుంది.

కొన్నాళ్ళకి పార్వతమ్మ తనకీ లక్ష్మి కీ కలిపి బట్టలు ఇతర వస్తువులు తెప్పించేంత దగ్గరవుతుంది లక్ష్మి కి. ఆమెను తనతో పాటు వూరి జనం మధ్యలోకి బతకమ్మ ఆడటానికి గౌరవంగా తీసుకుపోతుంది పార్వతి. మొగుడు ఉంచుకున్న దాన్ని తనతో పాటు వూరి మధ్యలోకి తెచ్చిన పార్వతిని గురించి వింతగా చెప్పుకుంటారు జనం

అయితే బతకమ్మ పండగ రాత్రి వెన్నెల్లో తోట బంగ్లాకి బయలు దేరిన చంద్రా రెడ్డికి చుక్కమ్మ దెయ్యమై తనను వెంటాడుతున్న భ్రమ కల్గుతుంది. వెన్నెల్లో చెట్ల నీడలు చూసి జడుసుకుంటాడు. చుక్కమ్మ తన ఎదురుగా నిల్చుని మాట్లాడుతుంది. అతడు తనకు చేసిన ద్రోహానికి బదులు తీర్చుకోక వదిలి పెట్టనంటుంది. నీ శవం బతుకమ్మ వోలె నీళ్ళలో తేలిస్తా చూసుకోమని వెంటబడుతుంది. ఆ భ్రమలో చంద్రా రెడ్డి భయపడి చెరువు కట్ట మీద పరిగెడుతూ, పట్టు తప్పి చెరువులో పడి పోతాడు. ఎంతటి ఈతగాడైనా, చుక్కమ్మ దెయ్యం తనను చంపబోతున్నదన్న భయంతో నీళ్ళలోంచి బయటికి రాలేక చెరువులోనే ప్రాణాలు వదిలేస్తాడు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? లక్ష్మి ఎలా మరణించాల్సి వచ్చింది. ఆత్మ హత్య చేసుకుందా హత్య చేశారా? Concubine ముద్ర వేయించుకున్నా ఒకడితోనే చివరి వరకూ ఉండి పోయిన లక్ష్మి కథేమైంది?నిజంగా చంద్రా రెడ్డి ని చంపింది చుక్కమ్మ దెయ్యమేనా? కాక పోతే ఆ వేషంలో వచ్చిందెవరు?

మల్లమ్మ వీరన్నలేమయ్యారు? ఈ నవల తిరిగి ప్రచురణకి వస్తే ఇవన్నీ అందులో చదవొచ్చు. నిజానికి ఈ నవల తిరిగి ప్రచురణ కావడానికి ఇది సరైన సమయం కూడానేమో, మల్లమ్మ గతమేమిటి?

ఈ నవలలో కథ చాలా చాలా బలమైనది. తన ప్రమేయం లేకుండా అన్యాయమై పోయిన ఒక యువతి కథ. దొరల చరిత్రలో ఒక మామూలు పేజీ. నేల పాలై రాలిన జీవితాల్లో ఒక నిర్భాగ్య జీవితం లక్ష్మిది.

ప్రతి పాత్రనూ రచయిత్రి సజీవంగా చిత్రీకరిచడానికి వీలైనంతగా ప్రయత్నించారు. లక్ష్మి, పార్వతి, రాంచంద్రా రెడ్డి,నాగి రెడ్డి , మల్లమ్మ, వీరన్న ప్రతి పాత్రా పాఠకుడిని ఆకర్షిస్తుంది. మల్లమ్మ వీరన్నల కథలోని మలుపు కొంత సినిమాటిక్ గా అనిపించినా అది కూడా దొరల వారసత్వపు  దౌర్జన్యాలకు అద్దం పట్టేదే కాబట్టి కథకు అతికేదిగానే ఉంటుంది తప్ప, విడిగా తోచదు.

ఇది సినిమాగా తీసి హిట్ చేయగలిగినంత గొప్ప కథ. అయితే కథనంలో గానీ భాషలో గానీ బలం లేదు. రచయిత్రి మాటల ప్రక్రారం ఆమె వరంగల్ లో నివసిస్తున్నపుడు చుట్టు పక్కల జరిగే బతకమ్మ సంబరాలు చూసి ప్రేరణ పొంది నవల రాశారు. అంతే తప్ప ఆమెకు తెలంగాణా మాండలికంతో  దగ్గరి పరిచయం ఉన్నట్టు కనిపించదు, పైగా నవల లో మాండలికాన్ని ప్రభావశీలంగా ప్రయోగించలేక పోయారనేది స్పష్టంగానే తెలుస్తుంది. సంభాషణలన్నీ తెలంగాణా భాషలోనే నడిచినా, కథ నెరేషన్ మాత్రం (పత్రికల) ప్రామాణిక భాషలోనే నడుస్తుంది. అందువల్ల కథ ఎంత బలమైనదైనా, ఒకరకమైన తేలిక దనం నవలంతా పరుచుకుని ఉంటుంది. నవలలో ని నేటివిటీ కూడా తెలంగాణా దే అని తెలియజెప్పే శిల్పం ఎక్కడా కనిపించదు. వూరు చెరువు తప్ప మిగతా జన జీవనం ద్వారా తెలంగాణా పల్లెను స్ఫురింపజేయలేక పోయారు. తెలంగాణా ప్రాంతపు సంభాషణలన్నీ ఆమె అదే భాషలో రాయడానికి ప్రయత్నించి దాదాపుగా 90 శాతం సఫలమయ్యారు గానీ, గాఢత కనిపించదు.

బలమైన కథకు తగ్గట్టు మిగతా అంశాలన్నీ అమరి ఉంటే ఇది చాలా పేరు తెచ్చుకుని ఉండేది. సీరియల్ గా ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైనపుడు ఆసక్తి కరమైన కథ కోసం ప్రతి వారమూ పాఠకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేలా చేసిన నవలే!

బహుమతికి ఎట్టి పరిస్థితిలోనూ ఇది అర్హమైన నవల. రచయిత్రి ఆచూకీ తెలిసి ఉంటే ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలిసి ఉండేవి.

ఎక్కడైనా పాత పుస్తకాలమ్మే చోట్ల దొరికితే తప్పక చదవండి

*

మీ మాటలు

  1. సుజాత గారు: ఇన్ని మంచి పుస్తకాలు మీకెలా దొరుకుతాయండి? పాత తెలుగు పుస్తకాలు దొరికే చోటుకి వెళ్లే అవకాశం ఇప్పుడిప్పుడే లేదు కానీ ఇంకో మాటేదైనా చెప్పండి – ప్లీజ్!

    • సుజాత says:

      లలిత గారూ

      మా యింటికి రండి :)

      నేను షికాగో లో ఉన్న రోజులలో మీకు పరిచయం లేదు మరి
      సెలవులలో ఎప్పుడైనా డాలస్ రండి, పుస్తకాలు తీసుకుని చదవండి , మళ్లీ జాగ్రత్త గా ఇచ్చేయండి. అదొక్కటే మార్గం :)

      • సుజాత గారు: మేమంటూ డల్లాస్ వస్తే తప్పక మిమ్మల్ని కలుస్తాను – పుస్తకాలకోసం కాదులెండి- మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు :)

  2. శ్రీవల్లీరాధిక says:

    కస్తూరిగారు ఈ మధ్య ఏమీ రాయడంలేదు సుజాతగారు. మనవళ్ళతో కాలం గడుపుతున్నారు. ఆవిడ ఫోన్ నంబర్ 040-24048737. ఇప్పుడే మాట్లాడాను. ఈ వ్యాసం గురించి చెప్పాను. బతకమ్మ మునిగింది కాపీలు ఇంకా ఉన్నాయట ఆవిడ దగ్గర.

    • సుజాత says:

      శ్రీవల్లీ రాధిక గారూ, చాలా థాంక్స్! కస్తూరి గారి కాంటాక్ట్ గురించి చాలా ట్రై చేశాను. తప్పకుండా మాట్లాడతాను.

    • శ్రీవల్లీ రాధిక గారు: కస్తూరి గారి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు!

  3. కె.కె. రామయ్య says:

    టి.ఎస్. లలిత గారు, పాత తెలుగు సాహిత్యం పుస్తకాల కోసం విజయవాడ లోని ఏలూరు రోడ్డు వద్ద సెకండ్ హాండ్ పుస్తకాల షాపు నడుపుతున్న శ్రీ నర్రా జగన్మోహన్ రావు గారిని ( మొబైల్ నంబర్ 09849632379 ) కూడా సంప్రదించవచ్చు అని త్రిపుర గారి ఆప్త మిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు చెప్పారిటీవల.

    “బతకమ్మ మునిగింది” నవలా రచయిత్రి సాకేతపురి కస్తూరి గారి ఫోను నంబరు వివరాలు ఇచ్చినందుకు శ్రీవల్లీ రాధిక గారికి, నవలను పరిచయం చేసిన సుజాత గారికి కృతజ్ఞతలు.

  4. కె.కె. రామయ్య says:

    ఇన్నాళ్ల తరువాత తన నవలను సారంగలో రివ్యూ చెయ్యడం ఏంతో ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉన్నట్లు … సుజాత గారికి తన కృతజ్ఞతలు తెలియజెయ్యమని చెప్పారు సాకేతపురి కస్తూరి గారు. తాను తెలంగాణా ప్రాంతం లోనే పుట్టిపెరిగినట్లు వివరించారు. శ్రీవల్లీ రాధిక గారు తనకు మంచి మిత్రులని, వారి ద్వారా ఈ వ్యాసం గురించిన వివరాలు తెలిశాయని … అలాగే రేడియో న్యాయపతి కామేశ్వరి గారు, శారదా శ్రీనివాసన్ గార్లు కూడా మంచి మిత్రులని చెప్పారు.

    తమ వద్ద మిగిలి ఉన్న “బతకమ్మ మునిగింది” నవల కొద్దీ కాపీలను ( ఆసక్తి ఉన్న పాఠకుల కెవరికైనా అందుబాటులో ఉండే విధంగా ) విశాలాంధ్ర బుక్ హౌస్, నవోదయ బుక్ హౌస్ కాచిగూడా, హైదరాబాద్ వారికి పంపించటానికి అంగీకరించారు.

    తన నవలలు కొన్ని కన్నడ భాషలోకి అనువదించబడ్డాయనే సంతోషకరమైన విషయాన్ని కూడా మనతో పంచుకుంటున్నారు రచయిత్రి సాకేతపురి కస్తూరి గారు.

మీ మాటలు

*