తూరుపు గాలులు ( పెద్ద కథ – రెండో భాగం )

2

వంశధారనది ఒడ్డునేఉన్న శాలివాటిక (శాలిగుండం, శాలిహుండం) విహారంలో బసచేసి కళింగపట్నంనుండి సింహళద్వీపానికి వెళ్ళే ఓడల నిమిత్తమై భోగట్టాచెయ్యగా, కొద్దిరోజుల క్రితమే వాడబలిజీలఓడ ఒకటి సింహళదేశపు తూర్పుతీరానికి పయనమైపోయిందనీ, అయితే ఓ పారశీక ఓడ, నబోపాడా (నౌపాడా) ఉప్పుగల్లీలలో పండిన ఉప్పుని నింపుకొంటున్నదనీ, మరోరెండువారాల్లో త్రికోణమలై (ట్రింకోమలీ)కి బయిల్దేరబోతున్నదనీ తెలియవచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఇప్పట్లో సింహళదేశంవెళ్ళే ఓడలేవీ లేవన్నారు. ప్రయాణానికయ్యే కేవు తాము చెల్లిస్తామని స్థానికవర్తకులు ముందుకొచ్చారు. పారశీక నఖోడా (ప్రధాన వర్తకుడు, ఓడ యజమాని) కేవు తీసుకోకుండా ముగ్గురుభిక్షువుల్నీ త్రికోణమలైవరకూ తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. లంగరెత్తి, పైకి మడిచికట్టిఉన్న తెరచాపల్నిదింపి గాలివాటానికి అనుకూలంగా తిప్పగానే అవి పూర్తిగా విచ్చుకున్నాయి. ఓడ నైరుతిదిశగా రివ్వున ప్రయాణించసాగింది. తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి.

ఆచార్యశాంతిదేవునికీ అతనిశిష్యుడు గుణసేనుడికీ సముద్రప్రయాణం చేసిన అనుభవం ఉన్నదిగాని, దీపాంకరుడికది పూర్తిగాకొత్త. మొదటిరెండురోజులూ నౌకఊగిసలాటతో అతడు చాలాఇబ్బందిపడ్డాడు. తిన్నా, తినకపోయినా వాంతులయ్యాయి. నీరసంగా పడుకున్నాడు. రెండురోజులూ రెండుయుగాల్లా గడిచాయి. ‘భగవంతుడా, ఇంకా ఎన్నాళ్ళిలా?’ అనుకున్నాడు. మధ్యమధ్యలో  నఖోడావచ్చి భిక్షువుల యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నాడు. అరబ్బుసరంగు అబూ సయ్యద్ నిమ్మకాయి ముక్కలు తెచ్చిచ్చాడు. వాటిని చప్పరిస్తే వాంతులు కట్టేస్తాయన్నాడు.

“పైకివచ్చి చూడు, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో” అన్నాడు సరంగు – సంభాషణ అంతా సైగలతోనే.

మూడోరోజున ధైర్యంచేసి తమకిచ్చిన చీకటిగది నుంచి బయటకువచ్చి సముద్రాన్ని పరికించాడు. అరబ్బు, పారశీక నావికులు అతన్నిచూసి నవ్వుతూ పలకరించారు. పల్చని నీలాకాశపు పైకప్పుకింద కనుచూపుమేర అన్నివైపులా గాఢనీలిరంగులో పరుచుకున్న  సముద్రం; అక్కడక్కడా తెల్లటినురగలుకక్కుతూ చిరుకెరటాలు.  ఉప్పుగాలి దీపాంకరుడి మొహాన్ని మెత్తగా తాకుతూంటే అతనికొక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తన జీవితంలో ఒక నూతనాధ్యాయం తెరుచుకోబోతున్నదనే భావన అతనిలో బలంగామెదిలింది. మొదటిసారిగా పరిసరాలను ఆసక్తిగా గమనించసాగాడు. సముద్రతలాన్ని చీలుస్తూ ఓడ ముందుకుసాగుతూంటే గలగలమంటూ పక్కగాతాకే కెరటాల సవ్వడి, గాలివేగంలో, దిశలో మార్పులువచ్చినప్పుడల్లా తెరచాపలు కాసేపు కొట్టుకొని మళ్ళీ పూర్తిగా తెరుచుకునేటప్పుడు చేసే ‘ఫట్, ఫట్’ మనే శబ్దం,  ఓడ నెమ్మదిగా ఊగుతూంటే తడిసిన కొయ్యపలకలు, తెరచాపస్తంభాలు, కప్పీలూ, మోకులూ కలిసికట్టుగా ‘కీ…..కట…కట…కట…..కీ…..’మంటూ రాత్రనక, పగలనక నిరంతరంగా చేసే మూలుగుధ్వనులు, నావికులకు సరంగు అబూ సయ్యద్ చేసే హెచ్చరింపులు, నఖోడా, మౌలీంల ఆదేశాలు, నావికుల జవాబులు, తెరచాపల్ని గాలివాటాన్నిబట్టితిప్పి, తిరిగికడుతున్నప్పుడల్లా  “అరియా ……అబీస్……..వదార్”  – ఇవన్నీ నేపధ్యంలో వినిపిస్తున్నాయి.

ఇంతలో చుక్కానిపట్టుకున్న నావికులు కేక పెట్టారు, “కిర్రష్!, కిర్రష్!! (సొరచేపలు! సొరచేపలు!!)”

దీపాంకరుడు అటుగా చూశాడు. ఉదయపుటెండలో వెండిమెరుపుల్లా గిరికీలుకొడుతూవచ్చి ఓడను చుట్టుముట్టిన సొరచేపల గుంపు.  అంతవరకూ తెరచాపలు బాగుచేసుకుంటూ, తాళ్ళుపేనుతూ, వంటవాడికి సాయంచేస్తూ తమతమ పనుల్లోఉన్న ఓడకళాసులందరూ హడావిడిగా లేచివచ్చి గుమిగూడారు. వాళ్ళఅరుపులతో, కేకలతో వాతావరణం ఉద్రిక్తమైంది.  ఒక యువకళాసీ తెరచాపకి అడుగుభాగానఉండే రాటమీదెక్కి దానిఅంచువరకూ నడుచుకుంటూ వెళ్ళాడు. మిగతావాళ్ళు కేరింతలతో, హర్షధ్వానాలతో అతన్ని ప్రోత్సహిస్తున్నారు. ముదుసలి సరంగు అబూ సయ్యద్ మాత్రం కొన్నిదశాబ్దాలుగా ఉప్పుగాలితాకి నెరిసిన గెడ్డంతో, ముడుతలుపడ్డ తన మొహంలో ఏ భావనాలేకుండా, కుళ్లాయి (ముసల్మానులు ధరించే చిన్న అల్లికటోపీ)ని తీసి గుండునిమురుకుంటూ గమనిస్తున్నాడు; అతడిలాంటివి చాలా చూశాడు. తెరచాప అంచుకిచేరి తాడు పట్టుకొని రాటమీద నిల్చున్న ఆ యువకుడికి ఎవరో ఒక ఈటెను అందించారు. ఆ ఈటెకు ఒకతాడు వదులుగా కట్టిఉన్నది. నౌక ఊగుతున్నది. ఆ సాహసి కాలుజారిపడ్డాడంటే తిన్నగావెళ్లి సొరచేపల మధ్యలో పడతాడు. అతడు గురిచూసి విసిరిన ఈటె నేరుగా ఒక సొరచేప పొట్టను ఛేదించింది. నీళ్ళలో రక్తం చిమ్మింది. సొరచేప కొట్టుకుంటూ ఉంటే నురగ. నావికుల ఉత్సాహం, కేరింతలు. కొంతమంది చివరన వలకట్టిఉన్న పొడుగాటికర్రని తీసుకొచ్చి నీటిమట్టానికి చేరువగా నిలిపారు. యువకుడు ఈటెను పైకి లాగి ఒక్క ఊపుతో సొరచేపను నావలోనికి విసిరాడు. వల అవసరంలేకపోయింది. చెక్కబల్లలపైనపడ్డ చేపబలంగా కొట్టుకోసాగింది. నావికులు ఉడుపుగా దాని తోకనుపట్టుకొని, తలను కాళ్ళతో తొక్కిపట్టి కట్టడిచేశారు. అలాగే మరో రెండు చేపల్ని పట్టుకున్నారు. నాలుగవది ఈటెదెబ్బ తినికూడా తప్పించుకొని పారిపోయింది. సొరచేపలగుంపు వచ్చినంత అకస్మాత్తుగానే మాయమైంది. ఆరోజు దొరికిన చేపల్నికోసి, పులుసు వొండే కార్యక్రమంలో నిమగ్నమైనారు – వంటవాడూ, అతని సహాయకులూ.

ఆరోజున సాయింత్రం కూడా దీపాంకరుడు పైకి వచ్చి పడమటిదిక్కున సూర్యాస్తమయం సృష్టించిన అద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయాడు. అటుగా వెళ్తూన్న మౌలీం (ప్రధాన నావికాధికారి, కప్తాను) దీపాంకరుడిని చిరునవ్వుతో పలకరించాడు. అతడు చాలాసార్లు కళింగపట్నం, మచిలీపట్నం వెళ్లి ఉన్నాడు; తెలుగు కొద్దిగావచ్చు.

“నీటి రంగు మారింది, చూశారా?” అన్నాడు.

నిజమే, దీపాంకరుడు గమనించనే లేదు. “ఎందుచేత?” అనడిగాడు. మౌలీం చాలా కష్టపడి ఒక పక్క సౌంజ్ఞలు చేస్తూ వచ్చీరాని తెలుగులో చెప్పిన బదులుకి సారాంశం: “నరసాపురం, అంతర్వేది దాటుతున్నాం; గోదావరి సముద్రంలో కలిసే చోటు. పెద్దనదులు సముద్రంలోకలిసేచోట్ల నీటిరంగు కొంచెం బురదగాఉన్నట్టు కనిపిస్తుంది – ఆ నదులు మోసుకొచ్చే ఒండ్రుమట్టి మూలంగా”.

“అంటే మనం తీరానికి బాగా దగ్గరలోనే ఉన్నామా?”.

“అవును”.

“అయినా ఎటుచూసినా సముద్రం; ఎక్కడున్నామో మీకెలా తెలుస్తుంది?”.

“తీరానికి దగ్గరలోఉన్నప్పుడు తరచూ కొండలూ, గుట్టలూ, చెట్లూ, చేమలూ  కానవస్తాయి. ఈ ప్రాంతంలోలేవుగాని, కళింగపట్నం నుండి కోరంగివరకూ కొండలు కనిపిస్తూనే ఉన్నాయి; మీరప్పుడు పైకిరానేలేదు. ఒక్కోచోట స్తూపాలూ, గుళ్ళూ, గోపురాలూ ఉంటాయి. నీటిరంగునుబట్టి, నీటిలోకొట్టుకొచ్చే చెట్లకొమ్మల్నిచూసి, పక్షుల్ని, అవిఎగిరే దిశల్ని గమనించి, గాలివాటంలో వచ్చేమార్పుల్నిబట్టి, ప్రవాహాలను పరిశీలించి, దొరికేచేపల్నిబట్టి, లోతుని కొలిచికూడా తీరానికి ఎంతదూరంలోఉన్నామో అంచనావెయ్యవచ్చు. ఇంకాచాలా సూచనలుంటాయి”.

దీపాంకరుడిలో కుతూహలం పెరిగింది. “తీరానికి బాగాదూరంగా, నడిసముద్రంలో ఉంటేనో?”.

“నావికుడి నైపుణ్యానికి అత్యున్నతమైన పరీక్ష అదే. ముఖ్యంగా రాత్రిపూట. అలాంటప్పుడు నక్షత్రాలను చూసి తెలుసుకుంటాం. మేఘాలుకమ్ముకుంటే అది సాధ్యంకాదు. మీకు అర్థంఅయ్యేలాచెప్పాలంటే చాలారోజులు పడుతుంది. సాయింత్రపు నమాజ్ కాగానే సొరచేప పులుసుతో భోజనం చెయ్యడానికి వంటవాళ్లు రమ్మంటున్నారు. మీరూ పదండి”. అన్నాడు మౌలీం నవ్వుతూ.

“సూర్యాస్తమయం తరవాత మేము ఏమీ తినం. అయినా నేను శాకాహారిని. మన్నించండి”.

మౌలీం చుక్కానివైపుగా వెళ్ళిపోయాడు. పడమటివైపున సూర్యుడు అస్తమించాకకూడా నారింజకాంతులు మేఘాలను ముద్దాడుతున్నాయి. తూర్పువైపున చీకట్లు ముసురుకుంటున్నాయి; తొలిచుక్కలు మిణుక్కుమంటున్నవి. మౌలీం ఆదేశంమేరకు సరంగు అబూ సయ్యద్ చుక్కానివద్దనున్న గంటనుమోగించి మక్కా వైపుగా చెయ్యెత్తి చూపించాడు. నావికులందరూ అటువైపుగా తిరిగి, చాపలుపరుచుకొని ప్రార్థనకుపక్రమించారు. కొద్దినిముషాల్లో నమాజ్ పఠనం పూర్తయింది. “అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్” అని బిగ్గరగాఅంటూ ప్రార్థనలు ముగించారు. నూనెదీపాలు వెలిగించి అవిర్లుకక్కుతూన్న వేడివేడి వరన్నంతో కమ్మటివాసనలను వెదజిమ్ముతూన్న సొరచేపలపులుసు తినేటందుకు కలిసికూర్చున్నారు. వాళ్ళ హాస్యాలూ, నవ్వులూ లీలగా వినిపిస్తున్నాయి.

దీపాంకరుడికి అంతవరకూతెలియని ఒక కొత్తప్రపంచానికి తెరతీసిన ఆ నావికులపట్ల అతనికుండిన గౌరవం పదింతలు పెరిగిపోయింది. ‘భిక్షువుని కాకపోయుంటేగనక నావికుడినై సముద్రాల్నిశోధించి ఉందును’ అనుకున్నాడు – తమకిచ్చిన కొట్టుగదికి వెళ్తూ. భోజనాలుకాగానే ఒకనావికుడు తంబూరావాయిస్తూ తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ ఒళ్లెరగని పారవశ్యంతో ఓ పారశీక విరహగీతాన్ని పాడసాగాడు. రోజంతాపడ్డ కష్టాన్నిమరచి మిగతావాళ్ళు ఉత్సాహంగా వంతపాడుతున్నారు. బాగా నానిపోయిన కొయ్యపలకలూ, తెరచాపస్తంభాలూ, కప్పీలూ, మోకులూ సమిష్టిగా నేపధ్యసంగీతాన్ని ఆలాపిస్తున్నవి – ‘కీ……కట…కట…కట…కీ……’. నావ సుతారంగా ఊగిసలాడుతూ, చీకటిసముద్రాన్ని చీలుస్తూ ముందుకి కదులుతోంది.

***

ముగ్గురుభిక్షువులూ తమకిచ్చిన చిన్నగదిలోనే తామువెంటతెచ్చుకున్న చిన్న బుద్ధవిగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. రోజుకి మూడుసార్లు ప్రార్థనల్లోనూ, మిగతా సమయం ధ్యానంలోనూ గడపసాగారు. ఆచార్యశాంతిదేవుడే ప్రార్థనలను జపించడంలో ముందున్నాడు. మంద్రస్థాయిలో అతడు ఉచ్ఛరించే ప్రార్థనలు మొదట్లో దీపాంకరుడికి బొత్తిగా అర్థంఅయ్యేవికావు. అతనికి తెలిసిన ప్రార్థనలకు భిన్నమైనవిగా వినిపించాయి. వారంరోజులపాటు వినగా, వాటిల్లో పాళీభాషాపదాలు ధ్వనిస్తున్నట్టుగా అతనికి తోచింది. అదేమాట శాంతిదేవునితో అంటే, అతడు నవ్వి,

“మొత్తం అంతా పాళీ భాషే, అయితే సింహళయాసతో మేళవించిన పాళీ” అన్నాడు – దీపాంకరుడిని ఆశ్చర్యపరుస్తూ.

“అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏదీలేదు. తథాగతుని బోధనలను, త్రిపిటికానియామాలనూ వాటి మూల రూపాన్ని, సారాన్ని కాపాడుకుంటూ, ఎటువంటి మార్పులూచేర్పులూ చెయ్యకుండా అత్యంతస్వచ్ఛమైన ప్రామాణికతను కాపాడుకుంటూ వస్తూన్నది సింహళ థేరవాదమే. ఈ విషయంలో సింహళభిక్షువులు, పౌరులూ కూడా ఎంతో గర్వపడుతూంటారు; కొద్ది రోజుల్లో నువ్వే చూస్తావు”.

దీపాంకరుడు పూర్తిగాకోలుకున్నాడని గమనించిన శాంతిదేవుడు, తమ దేశంలోని సమకాలీన పరిస్థితులగురించి, బౌద్ధసంప్రదాయాలగురించి కొన్నివివరాలు అతనికి తెలియజేయ్యాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు.

“పద, ఈ చీకట్లోంచి పైకిపోదాం, మంచిగాలీ, వెలుతురూ ఉంటాయి” అన్నాడు.

శాంతిదేవుని వెంట నడిచాడు దీపాంకరుడు.

“మౌర్యవంశాన్ని అంతంచేసి చక్రవర్తిగా ప్రకటించుకున్న  బ్రాహ్మణసేనాపతి పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధయాగం చేసి మీదేశంలో బౌద్ధాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు అనేకవిధాలుగా ప్రయత్నించాడని మనగ్రంధాలు తెలుపుతున్నాయి. భిక్షువుల తలలునరికి తెచ్చినవాళ్ళకు బహుమతులు ప్రకటించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదట పుష్యమిత్రశుంగుడు, ఆ తరవాత – వంగదేశానికి చెందిన మరో బ్రాహ్మణరాజైన శశాంకుడు బౌద్ధాన్ని అన్నివిధాలా తొక్కిపెట్టారు. పురాతన బోధివృక్షాన్ని నాశనం  చేశారు; మీదేశస్థులు దానికొమ్మల్ని మళ్ళీమళ్ళీ పాతుకుంటూ కాపాడుకున్నారు. అయితే మాదేశంలోమాత్రం అశోకుని సంతానమైన మహేంద్రుడు, సంఘమిత్రలు తీసుకొచ్చిపాతిన మహాబోధివృక్షపు అంటు మహావృక్షంగామారి ఇప్పటికీ అనురాధపురంలో సురక్షితంగా, సజీవంగా ఉన్నది. దాని మహిమలు అన్నీఇన్నీ కావు”.

ఈ విషయాలన్నీ దీపాంకరుడు విన్నవీ, చదివినవీ;  నాలందాలో ఉండగా బౌద్ధచరితాధ్యయనంలో భాగంగా తెలుసుకున్నవీ. అయనా శాంతిదేవుడు చెబుతూన్నతీరుకు ముగ్ధుడై, ‘ఇతడు మంచి అధ్యాపకుడు’ అని మనసులోఅనుకుంటూ వింటున్నాడు. ఎవరెంత ప్రయత్నించినా నాశనంకాకుండా నిలిచి, వేళ్ళూని, సదా విస్తరించే  బోధివృక్షం బౌద్ధానికి చిహ్నంగా, ప్రతీకగా ఎందుకు నిలిచిందో అతనికి మరోకోణంలో అర్థంఅయింది. ఆచార్య శాంతిదేవుడు చెప్పుకుంటూ పోతున్నాడు –

“….అందుచేత చెప్పొచ్చేదేమంటే ఏవిధంగా చూసినా బౌద్ధం తన మూలస్వరూపాన్ని సింహళదేశంలోనే నిలబెట్టుకుంది. అంతేకాదు సింహళంనుండీ, భారతఖండపు తూర్పుతీరంనుండీ జావా, సుమాత్రా దీవులకీ,  శ్యామదేశానికీ (సయాం, థాయ్ లాండ్), బాగాన్ రాజ్యానికీ (బర్మా, మియన్మార్) థేరవాద విస్తరణ జరిగింది – దాన్ని కొందరు హీనయానంఅని తప్పుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మేము ఆచరిస్తున్నదే అసలుసిసలైన బౌద్ధం. అందుకే ఆ బౌద్ధాన్నికాపాడడం తమకు ప్రసాదించబడిన పవిత్రమైన బాధ్యతఅని మాపాలకులు భావిస్తారు. అలాగే మా రాజులు తథాగతుని దంతాన్ని వెయ్యికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్నారు. అది ఎవరి ఆధీనంలోఉంటే వాళ్ళే సింహళదేశ పాలకులు అవుతారు. ఇది నమ్మకం మాత్రమేకాదు, వాస్తవం కూడా”.

“ఆచార్యా, నాలందానుపోలిన మహోన్నతజ్ఞానకేంద్రాన్ని స్థాపించాలని మీరెందుకంతగా తపిస్తున్నారో నాకిప్పుడు బాగా అర్థంఅవుతోంది. మీవిహారంలోని బోధనాకేంద్రంగురించి, అందులో నేనుచేపట్టాల్సిన బాధ్యతలగురించి చెప్పండి” అన్నాడు దీపాంకరుడు ఉత్సాహంగా.

“చెబుతాను. అయితే అంతకన్నా ముందుగా మరికొన్ని విషయాలు చెప్పాలి. సుమారు వందేళ్ళక్రితం సింహళదేశం మూడురాజ్యాలుగా ముక్కలైంది. ఏభైఏళ్ళపాటు అంతర్యుద్ధం చెలరేగింది. పొలోన్నరువపట్టణం ఒక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ రాజ్యపురాజు, పరాక్రమబాహుడనే సార్థకనామధేయుడైన చక్రవర్తి,  మళ్ళీ దేశాన్ని ఐక్యపరచి తన పాలనకిందికి తీసుకొచ్చాడు. చోళులకు శత్రువులైన పాండ్యరాజులపక్షాన నిలబడి బాగాన్ రాజ్యంపై తన నౌకలతో దాడిచేసి ఆరాజ్యాన్ని నియంత్రించాడు. ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు చేపట్టాడు. ఇప్పుడు మేముండే ఉత్తరారామాన్ని అతడే స్థాపించాడు. అనురాధపురాన్ని పునరుద్ధరించాడు. తథాగతుని దంతాన్ని అనురాధపురం నుండి పొలోన్నరువకు తీసుకొచ్చి దానికొక గుడి కట్టించాడు. ముఖ్యంగా బౌద్ధం విషయానికివస్తే, ఎంతో దూరదృష్టితో ముక్కలైన బౌద్ధధర్మాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చాడు. బిక్షువులు పాటించవలసిన నియమాలను ప్రకటించాడు. దుర్మార్గులైన, అవినీతిపరులైన భిక్షువులను వెళ్ళగొట్టాడు, శిక్షించాడు”.

“భిక్షువుల్లో దుర్మార్గులూ, అవినీతిపరులూనా?” దీపాంకరుడి ఆశ్చర్యానికి అంతులేదు.

“భిక్షువులుకూడా మనుషులే. మనుషులన్నాక అన్నిరకాలవాళ్ళూ ఉంటారు. అందరిలాగే పరిస్థితులనుబట్టి నడుచుకుంటారు. ముఖ్యంగా రాజపోషణ, రాజ్యాధికారాలకు దగ్గరవుతున్నకొద్దీ ఆధిపత్యం కోసం జరిగే పెనుగులాటలో కలుగజేసుకొనే అవకాశాలు, అవసరాలు ఏర్పడతాయి. వాటికి సామాన్యప్రజల నిత్యజీవితాల్ని శాసించగల పరిస్థితులు తోడ్పడతాయి. సన్మార్గంనుండి దూరంకావడానికీ, అవినీతికి లొంగిపోవడానికీ ఆకర్షణలు కూడా ఎక్కువవుతాయి. ఇటీవలకాలంలో తగ్గుముఖం పట్టిందిగాని, పరాక్రమబాహుడు సంస్కరణలు అమలుచేసే నాటికి బౌద్ధసంఘం అస్తవ్యస్తంగా మారింది. స్త్రీలతో సాంగత్యంచేసి పిల్లల్నికన్న భిక్షువులూ, ఆచార్యులూ తయారయ్యారు. చాలామంది భిక్షువులు విసిగిపోయి సంఘాన్ని విడిచిపెట్టి సంసారులుగా మారిపోయారు. మీ దేశంలో బౌద్ధానికి ఈమధ్యకాలంలో అధికారపీఠానికి చేరువలో మెలిగే పరిస్థితులుగాని, జనబాహుళ్యంలో సంచరించే సందర్భాలుగాని  లేకపోయాయిగనుక మీకెవ్వరికీ ఈ దుర్గతి అనుభవంలోకి రాలేదు”.

శాంతిదేవుని మాటలు దీపాంకరుడికి కొత్తగా ఉన్నాయి. అర్థంఅవుతున్నట్టుగానే ఉన్నాయిగాని పూర్తిగా తెలియ రావడంలేదు. ఏమనాలో తోచలేదు. కాసేపుఆగి, “ప్రస్తుతం అధికారంలో ఉన్నది పరాక్రమబాహుడేనా?” అన్నాడు.

“కాదు. దురదృష్టవశాత్తూ ఆయన సుమారు ఇరవైఏళ్లక్రితం చనిపోయాడు. ఇప్పుడు తిరిగి కొంత అనిశ్చిత, సంక్షోభం ఏర్పడ్డాయి. దక్షిణభారతదేశాన్నిపాలించే  పాండ్యరాజుల దృష్టి మాదేశంపైన పడింది. పూర్వం చోళుల ఆక్రమణ నుండి బయటపడ్డాం; ఇప్పుడు పాండ్యులు దాడికి సిద్ధమౌతున్నారనే వదంతులు వింటూన్నాం. ఏదిఏమైనా, బౌద్ధాన్ని కాపాడే రాజులు బలంగా ఉండాలి; వారి రాజవంశాలు చిరకాలం కొనసాగాలి. వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మం వాళ్ళని రక్షించాలి. అందుచేత ఏదో ఒకమేరకు ఉన్నతస్థాయిలోని బౌద్ధనాయకత్వానికి రాజకీయ చదరంగంలో, ఎత్తుగడల్లో తలదూర్చడం తప్పనిసరి అవుతుంది”.

‘రాజవంశాల్నికాపాడడం?……బౌద్ధనాయకత్వం?…..రాజకీయ చదరంగం?….ఎత్తుగడలు?’ దీపాంకరుడి అంతా అయోమయంగా ఉంది. అతడు చదివిన బౌద్ధగ్రంధాలలో గాని, నాలందాలోచేసిన అధ్యయనంలోగాని ఈ విషయాలు ఎన్నడూ ప్రస్తావించబడలేదు. దీపాంకరుడి మొహంలో సందేహఛాయల్ని గమనించిన శాంతిదేవుడికి అవసరమైనదానికన్నా  ఎక్కువగా మాట్లాడానేమో అని అనుమానం కలిగింది. సర్దిచెప్పడానికి –

“అయితే ఈ విషయాలన్నీ మనబోంట్లకు ముఖ్యంకాదు; మనం పట్టించుకోనక్ఖరలేదు. వాటిని పట్టించుకొనే వాళ్ళు వేరేఉంటారు. మనదృష్టిని కేవలం అధ్యయనంమీదా, బోధనాకేంద్ర నిర్మాణంమీదా పెడితే సరిపోతుంది” అన్నాడు.

“అవిమాత్రం రాజుల సహకారం, నిధులులేకుండా సాధ్యం అవుతాయా?” అన్నాడు దీపాంకరుడు. అతనికి కాస్తంత బోధపడుతున్నది. చుట్టుపక్కలఉన్న వందగ్రామాల నుండేవచ్చే ఆదాయాన్ని నాలందాకు ధారాదత్తంచేస్తూ హర్షవర్ధనుడు శాసనం ప్రకటించాడని వినిఉన్నాడు. అదీగాక, రెండువందలగ్రామాల ప్రజలని భిక్షువులకు నిత్యం అవసరమయ్యే బియ్యం, పాలు ఇత్యాది సామగ్రిని ప్రతీరోజూ అందజేయమని కూడా హర్షుడు ఆదేశించాడని తెలుసు.

“సరిగ్గా అదే నీకూ, నాకూ సంబంధించిన అంశం; మనం పట్టించుకోవలసిన విషయం. మిగతావి మనకి అనవసరం” అన్నాడు శాంతిదేవుడు.

శాతిదేవుని శిష్యుడైన గుణసేనుడువచ్చి ప్రార్థనకు వేళయిందని సూచించాడు. ముగ్గురూ లోపలికి నడిచారు. దీపాంకరుడి మస్తిష్కంలో ఎన్నెన్నో సందేహాలు ముసురుకున్నాయి. ‘ఏదిఏమైనా ఇదంతా ఒక కొత్త అనుభవం; నేర్చుకోవలసిన విషయాలు చాలాఉన్నాయి’ అనుకుంటూ శాంతిదేవునివెంట తమ గదివైపు నడిచాడు. దారిలో ఎదురైన సరంగు అబూ సయ్యద్ వారికి సలాం చేశాడు.

***

ఉదయాన్నే త్రికోణమలై రేవుచేరిన ఓడ లంగరుదించింది. కళింగపట్నంనుండి మోసుకొచ్చిన ఉప్పుబస్తాల్ని చిన్నపడవల్లోకిదించే ఏర్పాట్లు నావికులు చెయ్యగానే ముగ్గురు భిక్షువులూ అందరివద్దా సెలవుతీసుకున్నారు. సరంగు అబూ సయ్యద్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడుగాని అర్థంకాలేదు. మౌలీం తన వచ్చీరాని తెలుగులోకి అనువదించగా అల్లా తమను సురక్షితంగా, క్షేమంగా ఉండేటట్టు కరుణించాలని కోరుకుంటున్నాడని బోధపడింది. ఓడ దిగుతూంటే నవ్వుతూ నావికులంతా చేతులూపుతున్నారు. అందరిలోనూ ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే మాట మౌలీంతో అంటే,

“అవును. ఈ రేవులోనే బియ్యం ఎక్కించుకొని బస్రా వెళ్తాం. దాంతో ఈ యాత్ర ముగుస్తుంది. నావికులంతా సెలవుమీద తమతమ దేశాలకు, ఇళ్ళకు వెళ్ళిపోతారు. అందుకనే ఈ ఉత్సాహం” అన్నాడు.

తీరానికి పయనంకట్టిన ఒక పడవనెక్కి భిక్షువులు ఒడ్డుచేరారు. రేవులోనూ, గోదాములవెంటా నడుస్తూంటే సింహళభాష దీపాంకరుని చెవినపడింది. అది కాస్తోకూస్తో తెలుగులా ధ్వనించింది. సింహళలిపిని కూడా చూడడం తటస్థించింది. అక్షరాలన్నీ గుండ్రంగా తెలుగులిపికి దగ్గరగా ఉన్నట్లు కనిపించాయిగాని ఏమీ చదవలేకపోయాడు. దీన్ని గమనించిన శాంతిదేవుడు తన వివరణ ఇచ్చాడు.

“సింహళలిపి కూడా తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ లిపుల మాదిరిగా బ్రాహ్మీలిపి నుండి వచ్చినదే.  ఇంకా చెప్పాలంటే ప్రాచీన కన్నడ, తెలుగుభాషలు వినియోగించిన కదంబ అక్షరమాలే మా లిపికి మూలం. మాకు వంగ, కళింగదేశాలతోనూ, ముఖ్యంగా దక్షిణభారతదేశంతోనూ అనాదిగా సంబంధాలున్నాయని  మా ప్రాచీనగ్రంథాల్లో చెప్పబడింది. వ్యాపారసంబంధాలు, ఓడవర్తకమూ ఎప్పటినుండో నడుస్తున్నాయి. అంతెందుకు? హేమమాలిఅనే ఒక కళింగదేశపు యువరాణి తథాగతుని దంతాన్ని రహస్యంగా తనకేశాలలో దాచిపెట్టి ఆనాటి సింహళరాజుకు అందజేసింది. సింహళభాషపైన ద్రావిడభాషలప్రభావం మొదటినుండీ ఉంటూవస్తున్నది. అశోకునికాలంనుండి పాళీ, సంస్కృతభాషలుకూడా వచ్చిచేరాయి. మావిహారంలో ప్రధానబోధనాభాషలు అవే. తమిళులు ఎంతోకాలం మా దేశంలోని ముఖ్యప్రదేశాల్ని పాలించారుకూడా. కాకపోతే చోళరాజులతో యుద్ధాలుకూడా చేశాం. చోళులును ఓడించినప్పటినుండీ మారాజులు తమిళులను బానిసలుగా వినియోగిస్తున్నారు”.

“బానిసలా? పరాక్రమబాహుడు కూడానా?” దీపాంకరుడు సందేహం వెలిబుచ్చాడు.

“అవును. పరాక్రమబాహుడు కూడా. నిజానికి అతడు కట్టించిన ప్రజాహిత నిర్మాణాలన్నిట్లోనూ, ఉత్తరారామ నిర్మాణంతో సహా – తమిళుల బలవంతపు చాకిరీని విరివిగా వినియోగించాడు”.

“మరి బ్రహ్మజాలసూత్రం (పాళీలో బమ్మజాలసుత్త) లోని స్థూలశీల (పాళీలో చూలసీల) ప్రవచనంలో బౌద్ధులు బానిసల సేవలను వినియోగించరాదని తథాగతుడు స్పష్టంగా చెప్పిఉన్నాడే?”

“సాధారణ బౌద్దులకూ, సామాన్య ఉపాసకులకు అన్ని సూత్తాలను వర్తింపజేయడం సరికావచ్చుగాని రాజులకు చక్రవర్తులకూ అన్నీవర్తించవు. బానిసలూ, పనివాళ్ళూ, ఉద్యోగులూ, సైనికులూ, మందీమార్బలం లేకపోతే పరాక్రమబాహుడు అంతటి బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మించగలిగేవాడా? కట్టినా వాటిని కాపాడగలిగేవాడా? అతిత్వరలో నువ్వేచూస్తావు – వాటి విశిష్టత ఏమిటో స్వయంగా తెలుసుకుంటావు”.

దీపాంకరుడు మౌనంవహించాడు. త్రికోణమలై ఊరుదాటారు. పొలోన్నరువదిశగా నడుస్తున్నారు. ఎటుచూసినా పచ్చదనం; కొబ్బరి, అరటి, పనస చెట్లు; ఇళ్ళముందు మందార, బంతి, చేమంతి, సన్నజాజి పూలమొక్కలు. కళింగతీరంలో ఉన్నట్లుగానేఉందితప్ప మరోదేశానికి వచ్చామని అనిపించడంలేదు దీపాంకరుడికి. వాతావరణంకూడా ఉక్కగా, గాలిఆడకుండాఉంది. నాలుగేళ్ళతరవాత వాళ్ళదేశానికి తిరిగివస్తూన్న ఆనందం శాంతిదేవునిలోనూ గుణసేనుడిలోనూ ప్రస్ఫుటం అవుతున్నది. ఇన్నాళ్ళూ దీపాంకరుడి ఊహల్లో పొలోన్నరువ ఒక వినూత్న ప్రపంచపు ముఖద్వారం; ఇప్పుడది వాస్తవరూపంలో కళ్ళముందుకు రాబోతోంది. తన జీవితాన్ని బౌద్ధధర్మపథంలో సార్థకంచేసుకొనే అవకాశం. నాలాందాలో తురుష్కులచేతిలో శిరచ్చేదానికిగురైన పాళీభాషాబోధకుడు గుర్తుకొచ్చాడు; అతనిమదిలో రవ్వంత విషాదం చోటుచేసుకున్నది. మరోపక్క ముందుముందు ఏమిజరుగబోతోందో అని కాస్తంత ఆందోళన.

శాంతిదేవుని గంభీరవదనం చూస్తూంటే అతడికి తనగురువూ, పితృసమానుడూ అయిన భద్రపాలుడు గుర్తుకొచ్చాడు. భద్రపాలుడు పిన్నవయసులో ఇప్పటి శాంతిదేవునిలానే ఉండిఉంటాడనిపించింది; ఏదో మొండిధైర్యం అతన్ని ఆవహించింది.  ముగ్గురుభిక్షువులూ చెమటలు కక్కుతూనే అడుగులు వడిగా వేస్తున్నారు. మార్గమధ్యానఉన్న విహారాల్లోమజిలీలుచేస్తూ, రోజుకోపర్యాయం స్థానికభిక్షువులతోబాటుగా సమీపగ్రామాల్లో  భిక్షాటన చేసుకుంటూ ముప్ఫైకోసులదూరంలోఉన్న పొలోన్నరువ చేరడానికి నాలుగురోజులు పట్టింది.

ఉత్తరారామం చేరేసరికి చీకటిపడింది.  ఆచార్యశాంతిదేవుడూ, అతని శిష్యుడు గుణసేనుడూ ఎప్పుడు వస్తారాఅని కళ్ళుకాయలుకాచేలా ఎదురుచూస్తున్నవందలకొద్దీ భిక్షువులు వారికి ఘనంగా స్వాగతంపలికారు. ఆర్భాటాలేవీలేనప్పటికీ, వారిలోవిరిసిన సంతోషం, ఆప్యాయత దీపాంకరుడ్ని కదిలించాయి. నాలందాని మినహాయిస్తే అతడు ఇంతమంది భిక్షువులున్న ఆరామాన్ని ఎన్నడూచూడలేదు. నాలందాలో మాదిరిగానే ఇక్కడకూడా నిబద్ధతకలిగిన జ్ఞానాన్వేషణ, క్రమశిక్షణతోకూడిన యువశక్తి ఉన్నట్టుగా అతడికి తోచింది. ‘ఇక్కడ నాకు మంచి అనుభవం ఎదురౌతుంది’ అనే ఆశాభావం కలిగింది. యువభిక్షువులు దీపాంకరుడిని చుట్టుముట్టారు. ఎన్నోప్రశ్నలు వేశారు. కొన్నాళ్ళపాటు తమతోబాటు ఉంటాడని తెలుసుకొని  సంతోషం వ్యక్తపరిచారు. ప్రతిఒక్కరూ పాళీపదాలు జోడించిన చక్కటి సంస్కృతం మాట్లాడుతున్నారు. బాగా పొద్దుపోయింది. శాంతిదేవుడు కలుగజేసుకొని,

“ఇవాళ్టికి మీ ప్రశ్నలు చాలు. ఆయన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. ఒక యువభిక్షువుని ఉద్దేశించి,

“ధర్మపాలా, దీపాంకరుడి వసతిఏర్పాట్లు చూడు. ఈ రోజునుండీ ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండు” అన్నాడు.

అధ్యాపకుల వసతివైపు దారితీశాడు ధర్మపాలుడు. దీపాంకరుడి గది చూపించాడు. నూనెదీపం వెలిగించాడు. మంచినీళ్ళకూజా తెచ్చిపెట్టాడు. కప్పుకోనేందుకు దుప్పటి ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుఝామునే వస్తానని చెప్పి బయల్దేరబోతూంటే దీపాంకరుడు సందేహిస్తూనే అడిగాడు – “నాలందాలో ఏమైందో మీకు తెలిసిందా?”.

“తెలిసింది. కొందరు భిక్షువులు, తీర్థయాత్రలకని బౌద్ధక్షేత్రాలకు వెళ్ళిన ఉపాసకులు ఆ దుర్వార్తని మోసుకొచ్చారు. ఆచార్యలు తిరిగివస్తారనే ఆశ వదులుకున్నాం. మాఅందరికీ ఈరోజు ఎంతటి శుభదినమో మాటల్లో చెప్పలేను”

ధర్మపాలుడు వెళ్ళిపోయాడు. అంతటా నిశ్శబ్దం. ఎక్కడా మనుషుల అలికిడిలేదు. నేపధ్యంలో కీచురాళ్ళ రొద. దీపంచుట్టూ పురుగులు చేరాయి. బాగా అలిసిపోయిన దీపాంకరుడు నిద్రలోకి జారుకున్నాడు.

***

శిష్యగణం తనను ‘ఆచార్యా’అని సంబోధిస్తూంటే దీపాంకరుడికి మొదట్లో కొత్తగా అనిపించినా క్రమేపీ అలవాటైంది.  ఆచార్యశాంతిదేవథేరోకు (ఉత్తరారామంలో శాంతిదేవుడిని అలాగే పిలుస్తారు) సహాయకుడిగా వ్యవహరిస్తూ పాళీ మూలగ్రంధాలలోని కొన్నిసూత్రాలను (సూత్తాలను) విద్యార్థులకు వివరించే తరగతులను అతనికి అప్పగించారు. అదేమంత కష్టమైనపని కాదనుకున్నాడుగానీ దిగాకే లోతుతెలిసింది. శాంతిదేవుడిని సంప్రదించాడు. అంతా విని అతడిలా అన్నాడు –

“అధ్యాపకుని పాత్ర నీకు కొత్త. మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బోధనకూడా ఒక కళ. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళంతా ఉత్తమ ఉపాధ్యాయులయితీరాలనే నియమం ఏదీలేదు. నాలందాలో గమనించిఉంటావు; అక్కడున్న వాళ్ళంతా మహాపండితులేకాక, అత్యుత్తమ ఉపాధ్యాయులుకూడా. మనకెంత జ్ఞానం ఉన్నదనేదొక్కటే ముఖ్యంకాదు. మొదట బోధించే విషయంపట్ల విద్యార్థుల జీవితకాలమంతా వారిని అంటిపెట్టుకొనేటంత ఆసక్తిని, కుతూహలాన్ని, ఉత్సుకతని రేకెత్తించాలి. వారిస్థాయికివెళ్లి చెయ్యిపుచ్చుకొని నడిపించగలగాలి. అంటే వాళ్ళతోబాటు నాలుగడుగులు వేసి ఆ తరువాత వాళ్ళనే శోధించమనాలి. ఒకవేళ దారితప్పితేగనక సరైనమార్గాన్ని సూచించాలి; అంతేగాని దారిపొడుగునా మనంవారివెంట నడవాలనుకోకూడదు. ఒక్కముక్కలోచెప్పాలంటే మనం మార్గసూచకులం మాత్రమే, సహయాత్రీకులంకాదు. బౌద్ధంలో ఇదిముఖ్యం. ఎవరి మోక్షానికివాళ్ళే స్వయంగా కృషిచెయ్యాల్సి ఉంటుంది. ఎవరి అన్వేషణ వారేచేసుకోవాలి. వారివారి అనుభవాలకు, అవగాహనకు విషయసారాన్ని అన్వయించుకోవాలి. తథాగతుడి కాలామసూత్తను గుర్తుంచుకుంటే మనపాత్ర స్పష్టమౌతుంది”.

ఇదీ ఉత్తరారామంలో అడుగుపెట్టాక దీపాంకరుడు శాంతిదేవునివద్ద నేర్చుకున్న మొదటిపాఠం. అక్కడున్న మూడేళ్ళలోనూ శాంతిదేవునివద్దా, మిగతా ఆచార్యులవద్దా, ముఖ్యంగా శిష్యులనుండీ చాలా నేర్చుకున్నాడు. ఒకోసారి అతనికి అనిపిస్తుంది – నేర్పినదానికన్నా నేర్చుకున్నదే చాలాఎక్కువ అని.

ఆరామజీవనానికి దీపాంకరుడు తొందరగానే అలవాటుపడ్డాడు. అతని నాలందా అనుభవం అన్నివిధాలా అక్కరకు వచ్చింది. మొదటి మూడునెలలూ పని ఒత్తిళ్ళతోనే గడిచిపోయింది. పరిసరాలను పట్టించుకొనే అవకాశం చిక్కలేదు. బోధనాంశాలపై కాస్తంత పట్టుచిక్కాక ఒక్కొక్కొటిగా మిగతా విషయాలను గమనించనారంభించాడు. ఉత్తరారామాన్ని నాలందాతో పోల్చడం అతనికి అనివార్యం అయింది. అతనికి తెలిసింది నాలందాయే మరి. ఆచార్యుల నిబద్ధత, విద్యార్థుల త్రికరణశుద్ధి పోల్చదగినవిగా ఉన్నాయి. అయితే బోధనాంశాల విస్తృతి, విహారపు విస్తీర్ణం, సదుపాయాలూ, గ్రంధాలయాలూ – వీటన్నిటిలోనూ నాలందా అనేక శతాబ్దాలముందుగానే అత్యున్నతస్థాయిని చేరుకున్నదనడంలో సందేహంలేదు. అసలు నాలందాని అందుకోవాలని అనుకోవడమే ఒక మూర్ఖత్వం అవుతుందని దీపాంకరుడికి బలంగా అనిపించసాగింది. అయితే ఆ మహావిహారాన్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా భావించి ఉత్తరారామంలో చెయ్యవలసిన కృషిచేస్తూపోవడమే బుద్ధిమంతుల లక్షణం అనుకున్నాడు. ఈమాట శాంతిదేవునితోఅంటే అతడు నవ్వి,

“నాకు తెలియదనుకున్నావా? నాలందాకున్న విశిష్టత, చరిత్ర ఏంచేసినా తిరిగిరావు. అలాగని ఊరుకోలేకనే ఈ ప్రయత్నం. ఇప్పుడు మొదలుపెడితే ఎప్పటికో ఒకప్పటికి ఒకస్థాయికి చేరుకోగలం. ఆ రోజుని నువ్వూనేనూ చూడం. మహావిహారాలచరిత్రలో ఒక జీవితకాలం అంటే క్షణకాలమే”.

దీపాంకరుడికి భద్రపాలుడు తరచూవాడే మాట జ్ఞాపకం వచ్చింది: ‘కాలం విధించిన కర్తవ్యం’. ఉత్తరారామ చరిత్రలో తనకూ ఒకచిన్నపాత్ర ఉందనుకోవడం అతనికి ఆనందం కలిగించింది. ఆవెంటనే ‘నావల్ల అవుతుందా?’ అనే  సందేహం అతన్ని కలవరపరచింది. ఏదిఏమైనా, తనవంతు ప్రయత్నం చేసితీరాలనీ, తనకు ప్రసాదించబడిన ఈ అవకాశాన్నీ, మూడేళ్ళ వ్యవధినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలనీ దృఢనిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట బోధనకుమాత్రమే పరిమితంకాకుండా మూడులక్ష్యాలను సాధించాలని తీర్మానించుకున్నాడు. మొదటిది సింహళభాష నేర్చుకోవడం – ముఖ్యంగా మాట్లాడడం. తద్వారా స్థానికప్రజలతోనూ, శిష్యులతోనూ వారిభాషలో సంభాషించడానికీ, వారికి మరింతచేరువ కావడానికీ, అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికీ సాధ్యపడుతుంది. రెండోది – వీలు చిక్కినప్పుడల్లా ఆరామపు గ్రంధాలయానికివెళ్లి అరుదైన బౌద్ధగ్రంధాల ప్రతులను తయారుచేసుకోవడం. చివరిగా – చుట్టుపక్కలఉన్న ప్రదేశాలతో మొదలుపెట్టి ఒక్కటొకటిగా ఆ దేశపు బౌద్ధక్షేత్రాలను సందర్శించి వాటివివరాలను జ్ఞాపకార్థం ఒకచోట వ్రాసిపెట్టుకోవడం. తన నాలందా జ్ఞాపకాలను ఒకచోట రాసిపెట్టుకోకుండా గడిపివేసినందుకు అతనికి విచారంగా ఉంది. ఈ పర్యాయం మాత్రం అనుకున్నదే తడవుగా దీపాంకరుడు తన తీర్మానాలను ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు.

దీపాంకరుడు సింహళభాష నేర్చుకోవదానికి అతనికి శిష్యుడిగా, సహాయకుడిగా నియమింపబడిన ధర్మపాలుడి తోడ్పాటు చాలా ఉన్నది; నెల్లాళ్ళలోనే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడగలిగాడు. అంతకన్నా ముఖ్యంగా సింహళ భిక్షువుల మాటలు కొద్దికొద్దిగా అర్థంఅవుతూవచ్చాయి. మిగతా శిష్యులుకూడా సహకరించారు; చిరునవ్వులతో తప్పులను సవరించారు. తమలో ఒకనిగా దీపాంకరుడ్ని స్వీకరించడానికి వారికి ఎన్నోరోజులుపట్టలేదు. వాళ్ళు అతనితో తమ వ్యక్తిగత సమస్యలనుండి రాజకీయ పరిణామాలవరకూ ప్రతీదీ చర్చించడం మొదలుపెట్టారు. శిష్యులతో అతడు గడిపే సమయం బాగా ఎక్కువైంది. అయినప్పటికీ దీపాంకరుడు అధ్యయనానికీ, గ్రంధాలయానికీ, కొంత సమయం కేటాయిస్తూ వచ్చాడు. నాలందాగ్రంధాలయాలతో పోలిస్తే బాగాచిన్నదే అయినప్పటికీ  ఉత్తరారామంలోని పుస్తకసముదాయం అతన్ని ఆశ్చర్యపరచింది. అరుదైనగ్రంధాల జాబితాను తయారుచేసుకొని ప్రతులు తయారుచెయ్యడం మొదలుపెట్టాడు. ఈపనిలో దీపాంకరుడికి సహకరించేందుకు నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యానికి శాంతిదేవుడు తన ఆమోదం తెలియజేసాడు. మరో నలుగురు భిక్షువులను ఈ పనికి నియమించాడు. అయితే, దీపాంకరుడు వ్రాసిపెట్టుకున్న జాబితానిచూసి పెదవివిరిచాడు. వాటినన్నిటినీ వెంటతీసుకు పోవాలంటే ప్రత్యేకించి ఒక ఓడ, రెండువందల గాడిదలూ ఉండాలని చమత్కరించాడు.

“ఎన్ని ప్రతులను నీతో తీసికెళ్ళడం సాధ్యమవుతుందో నిశ్చయించుకొని అప్పుడు మొదలుపెట్టు” అని సూచించాడు.

శాంతిదేవుని ముందుచూపుకు సింహళభాషలో కృతఙ్ఞతలు తెలియజేసి ఆయన్ను ఆశ్చర్యపరిచాడు దీపాంకరుడు. దీపాంకరుడ్ని వెంటతీసుకురావడం సరైననిర్ణయంఅని శాంతిదేవునికి బలంగాఅనిపించిది. అనాటినుండీ దీపాంకరుడిపట్ల మరింత సుముఖంగా, అభిమానంగా ఉండనారంభించాడు.

ఇక బౌద్ధక్షేత్రాల సందర్శనానికివస్తే ఉత్తరారామం, పొలోన్నరువలతో మొదలుపెట్టాలని దీపాంకరుడు నిశ్చయించుకున్నాడు. తను కన్నవీ, విన్నవీ, వ్యాఖ్యాసహితంగా ఈవిధంగా రాసుకోవడం ఆరంభించాడు:

‘సుమారు వందేళ్ళక్రితం దక్షిణభారతదేశానికి చెందిన చోళులు స్థానిక సింహళరాజులను ఓడించి, రాజధానిని అనురాధపురంనుండి పొలోన్నరువకుమార్చి ఏభైఏళ్లపాటు పాలించారు. విజయబాహుఅనే సింహళ రాజవంశీకుడు చోళుల్ని తరిమివేశాడు. అయితే భౌగోళికంగానూ, ధర్మంపరంగానూ సింహళదేశ ఏకీకరణ తరువాత వచ్చిన పరాక్రమబాహునిద్వారానే సాధ్యంఅయింది. ఇతడిని ఈ దేశస్థులు అశోకునితో సమానంగా గౌరవిస్తారు.

పరాక్రమబాహుడు అధికారం చేపట్టేనాటికి సింహళదేశపు బౌద్ధం అభయగిరివిహార, జేతవనవిహార, మహావిహార అనే  మూడు నియాక సమూహాలుగా చీలిపోయిఉన్నది. అతడు ఈ మూడు సమూహాల ప్రతినిధుల్నీ ఉత్తరారామానికి పిలిపించి సమావేశపరిచాడు. భ్రష్టుపట్టిన, అవినీతిపరులైన భిక్షువుల్ని సంఘంనుండి బహిష్కరించాడు. సాధారణపౌరులుగా మార్చివేశాడు. (ఇక్కడ మరికొన్ని వివరాలు అవసరం). మహావిహారసంఘాన్ని సమర్థించి మిగతా రెండుసమూహాల్ని, అంటే అభయగిరి, జేతవన సంఘాలను నామరూపాలు లేకుండాచేశాడు.  థేరవాదబౌద్ధానికి పెద్దపీటవేసి మహాయాన, వజ్రయాన ధోరణులను పూర్తిగా అరికట్టాడు. భిక్షువులు పాటించవలసిన నియమాలను పునర్లిఖింపజేసి వాటిని ఉత్తరారామంలో శిలాశాసనంగా ప్రకటించాడు. (వినయపీటికఉండగా మళ్ళీ ఇదిఎందుకు అవసరమైందో తెలియరాలేదు). సంఘానికి పెద్దగా, నాయకునిగా, ప్రతినిధిగా వ్యవహరించేదుకు సంఘరాజా అనే పదవిని సృష్టించాడు. అతనికి సహాయకులుగా ఇద్దరు ఉపసంఘరాజాలు ఉండేటట్టు ఏర్పాటు చేసాడు.

పరాక్రమబాహుడు మరణించాక గద్దెనెక్కిన కళింగవంశప్రభువు నిస్సంకమల్లుడే స్వయంగా పూనుకొని శాంతిదేవుడిని నాలందాకు పంపాడని శిష్యుడు ధర్మపాలుడిద్వారా తెలిసింది. శాంతిదేవుడు నాలందా చేరకముందే నిస్సంకమల్లుడు మరణించాడు. రాజ్యం పరిస్థితి గందరగోళంగా మారింది; రాజభవనంలో కుట్రలూ, కుతంత్రాలూ పరాకాష్టకు చేరుకున్నాయని వినవస్తున్నది. సర్వత్రా వదంతులు వ్యాపిస్తున్నాయి. (నాలందానుండి తిరిగివచ్చాక శాంతిదేవుడు ఉపసంఘరాజాగా  నియమించబడ్డాడు. త్వరలో అతడే సంఘరాజా పదవిని చేపడతాడని వినికిడి. అయితే అతని నియామకాన్ని కొందరు రాజవంశీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. తుదిపరిణామాలు ఎలాఉంటాయో వేచిచూడాలి. పరాక్రమబాహుడు బౌద్ధసంఘ పునరుజ్జీవనానికీ, అనురాధపుర  పునర్నిర్మాణానికి, ఉత్తరారామ ప్రశస్తికి చేసిన కృషినిగురించి తెలుసుకున్నాక అతనిపాలనలో నిర్మితమైన  కట్టడాలను మరింత ఆసక్తిగా పరిశీలించ సాగాను).

కొండరాతి పార్శ్వతలాన జీవకళ ఉట్టిపడేట్టుగాచెక్కిన నాలుగు పెద్ద ఏకశిలా బుద్ధవిగ్రహాలు ఉత్తర ఆరామపు ముఖ్య ఆకర్షణలు. కొండరాతినిదొలిచి సృష్టించిన విజ్జాధరగుహ (విద్యాధర గుహ)లో  ధ్యానముద్రలో ఉన్న తథాగతుడు దర్శనమిస్తాడు. తలపై గొడుగుతో, అటూఇటూ బ్రహ్మ, విష్ణువుల ఆశీర్వాదంతో సింహాసనంపై కూర్చున్నట్టుగా బుద్ధుని రూపకల్పన చేశాడు శిల్పి. ధ్యానముద్రలోనే ఉన్న పదిహేను అడుగుల ఎత్తైన మరో పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉన్నది. ఇక మూడవది – నిర్యాణానికి ముందు కుడివైపు తిరిగి చేతిపై తలనానించుకొని పడుకొని ప్రశాంతవదనంతో ఆఖరి ప్రవచనం చేస్తున్నతథాగతుడి శిల్పం. ఇది సుమారు ఏభై అడుగుల పొడవైన బ్రహ్మాండమైన కళాసృష్టి. పక్కనే ఆనందుడు విషాదవదనంతో చేతులుకట్టుకొని నిలుచున్నట్టుగా చెక్కారు. శయనభంగిమలోఉన్న తథాగతుని విగ్రహం ఎంతసహజంగా ఉందంటే, ఆయన తలఆనించిన దిండు మెత్తగా, ఒకవైపు కొద్దిగా నొక్కబడినట్టుగా అగుపిస్తుంది. విగ్రహాలన్నిటి పైనా బంగారురేకు తాపడాలున్నాయి.  అన్ని విగ్రహాలకూ వాటిని ఆనుకొని చెక్కలతో నిర్మించిన ఆలయాలున్నాయి. [శిల్పశాస్త్రం గురించి నాకేమీ తెలియదుగాని ఇక్కడి శిల్పాలను చూస్తూంటే నాలందా వెళ్ళేదారిలో ధాన్యకటకం (అమరావతి)లో చూసిన విగ్రహాలు ఎంతగానో జ్ఞాపకంవచ్చాయి. రెంటికీ చాలాపోలికలున్నాయి. కారణం ఏమైఉంటుంది? ఎవరైనా శిల్పశాస్త్రప్రవీణులను  సంప్రదించాలి].

పరాక్రమబాహుడు తనపాలనలో చేబట్టిన ప్రజాహిత నిర్మాణాలనుగురించి వ్రాసిపెట్టుకోకపొతే ఈ జ్ఞాపక సంపుటి అసంపూర్ణంగా ఉండిపోతుంది. తన రాజ్యంలో వర్షించిన ఒక్క నీటిబొట్టునుకూడా వృధాగా పోనివ్వనని శపథంచేసి శాసనం ప్రకటించాడు. సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంకలిగిన పరాక్రమసముద్రం అనే బ్రహ్మాండమైన సరస్సుని సృష్టింపజేశాడు. దానిమూలంగా ఇరవైవేలఎకరాలు సశ్యశ్యామలంగా మారాయి. దిగువగ్రామాల్లో తాగునీటి సమస్యకూడా తీరిపోయింది. ఇటువంటి ఆనకట్టల నిర్మాణాల్ని రాజ్యమంతటా చేయించాడు. మనుష్యులకేకాకుండా పశువులకుకూడా వైద్యశాలలు ఏర్పాటుచేసాడు. అవన్నీ నేటికీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇక్కడి ప్రజలు పరాక్రమబాహుడిని అశోకుడంతటి గొప్ప చక్రవర్తిగా గౌరవిస్తున్నారంటే అందులో ఆశ్చర్యపడవలసిందేమీలేదు. (బౌద్ధాన్ని కాపాడుకోవాలంటే సానుకూలురైన, ప్రజాహితులైన, సైనికబలం కలిగిన, దృఢచిత్తులైన  పాలకులు ఉండితీరాలని ఈమధ్య కాలంలో – అంటే పొలోన్నరువ రాజ్యానికి వచ్చిన నాటినుండి – బలంగా అనిపిస్తున్నది. రాజ్యాధికారంతో ప్రమేయం లేకపోతే బౌద్ధం నిలువదేమో. అలాగని రాజులమీదే పూర్తిగా ఆధారపడటంకూడా సరికాదు. ఒక్కోరాజూ ఒక్కోతీరుగా ఉంటాడు. ఈ విషయంపై శాంతిదేవునితో చర్చించాలి).

***

(మూడో భాగం -వచ్చే వారం )

ఉణుదుర్తి సుధాకర్

మీ మాటలు

  1. సాయి.గోరంట్ల says:

    చక్కని మీ మాటల్లో కొత్త విషయాలు తెలిశాయి.ఆనాటి బౌద్ద బిక్షువుల ,రాజుల జీవన విధానం చాలా బాగా వివరించారు .కృతజ్ఞతలు

Leave a Reply to సాయి.గోరంట్ల Cancel reply

*