విమర్శలను సహించలేని రచయితలు : పద్మవల్లి

నేను సాధారణంగా కథలు సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, ఈనాడు ఆన్లైన్ పత్రికలలోనూ, కొన్ని బ్లాగుల్లో వచ్చినవీ  చదువుతాను. అప్పుడప్పుడూ ఎవరైనా షేర్ చేసినపుడు నవ్య, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన ఆన్లైన్ పత్రికల్లోనూ చదువుతాను. నాకు ప్రింట్ పత్రికలు చదివే అవకాశం లేదు. అపరాధ పరిశోధనలు, హాస్యం, సైన్స్ ఫిక్షన్ నేను దూరంగా ఉండే అంశాలు కాబట్టి ఆ కథలు కూడా నేను చదివిన వాటిలో ఉండవు. నా ఈ అభిప్రాయాలు నేను చదివిన కొన్ని కథల మీద ఆధారపడి మాత్రమే తప్ప సంవత్సరం మొత్తంలో వచ్చిన కథలన్నిటి మీదా ఎంత మాత్రమూ కాదు. అలానే రచయితల మీద నా అభిప్రాయాలు కూడా అందరు రచయితలకూ చెందవు. నా అభిప్రాయాలు గత నాలుగైదేళ్ళుగా నేను గమనిస్తున్న వాటి మీద ఆధారపడినవి.

కథ అంటే సమాజానికి సందేశాన్నివ్వాలీ, సమస్యకి పరిష్కారం చూపించితీరాలీ లాంటి భ్రమలేమీ నాకు లేవు.  నేనో సాధారణ పాఠకురాలిని.  మంచి కథ అంటే నా దృష్టిలో, అది ముందు నన్ను పూర్తిగా చదివించగలగాలి. భాషా, శైలీ బావుండాలి. కథ పరిధులు దాటి వ్యాసాలుగా మారకూడదు. ఇవీ నాకు ఓ కథ నచ్చడానికి ఉండాల్సిన కనీస లక్షణాలు. ముఖ్యంగా చదివిన తరువాత అది చదవడానికి పెట్టిన నా సమయం వృధా అనిపించకూడదు.

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగాశిల్ప పరం గా మీ అభిప్రాయాలు

కథలు చాలానే ఉన్నా, చదివించగలివినవి గుప్పెడు కూడా లేవని చెప్పొచ్చు. మంచి కథ నాలుగు కాలాలు నిలుస్తుంది అనేవారు, అయితే వీటిలో చదివిన తరువాత నాలుగు రోజులు కూడా గుర్తుండే కథ ఏదీ లేదనే చెపుతాను. చాలామంది కొత్త రచయితలూ కనిపించారు. ఇప్పుడొస్తున్న కథల్లో ఏదో చెప్పాలన్న తాపత్రయం తప్ప, ఎలా చెప్పొచ్చో తెల్సినదనం తక్కువ.  చాలా కథలు వస్తుపరిధి దాటి విస్తరించి, వ్యాసాల్లా తయారయి పూర్తిగా చదివించకుండానే మిగిలిపోయాయి. కొన్నిటి  శైలి చిరాకు తెప్పిస్తే, కొన్నిటి కథాంశాలే విసుగెత్తించాయి. 

ముఖ్యంగా నేను గమనించిందీ, నన్ను బాగా విసిగించి చాలా కథలను పూర్తిగా చదవకుండా చేసినదీ భాష.  కథకు అవసరమున్నా లేకున్నా మాండలికం ఉపయోగించడం అనేది ఒక ఫాషన్ అయినట్టుంది. మాండలికం వాడటం తప్పు అని నేను అనడం లేదు, కానీ వ్రాస్తున్న దాని మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఒక పాత్ర చేత ఓ యాస మాట్లాడిస్తే, మొత్తం కథంతా అదే కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా హటాత్తుగా కొన్ని వాక్యాలు మామూలు భాషలో యాస లేకుండా మాట్లాడేస్తాయి. రచయిత నేరేట్ చేసే భాగాలలో కూడా అంతే. కొంతసేపు యాస, కొంత సేపు మామూలు భాష. చదువుతుంటే అయోమయం, అసహనం కలిగించాయి. కాస్త పేరున్న రచయితల నుండీ క్రొత్త రచయితల వరకూ ఇది సాగింది.  ఈ రకం కథల్లో శ్రద్ధగా వ్రాసినవి నాకు తెలిసి రెండు. ఒకటి జూపాక సుభద్ర ‘కంపనవడ్డ కాళ్ళు’, సాయి యోగి వ్రాసిన ‘ఖుష్బూ’. (ఇది ఈయన మొదటి కథ అని చెప్పుకున్నట్టు గుర్తు.)

చిరాకు కలిగించిన ఇంకో విషయం, చాలా కథలు ఎడిటింగ్ అంటూ ఒకటి ఉంటుందన్నసంగతి రచయితలు  మర్చిపోయినట్టు ఉండటం. వాక్యాల్లో తప్పులు, అర్ధం పొసగని వాక్యాలు. కనీసం ఓ రెండు సార్లయినా శ్రద్ధగా తన కథని చదువుకుంటే తమకే తెలిసే తప్పులు ఎన్నో. ఇలాంటివి కథను పూర్తిగా చదివించడంలో విఫలమవుతాయి.

మొత్తం మీద కథలు పెద్దగా సంతృప్తిని కలిగించలేదు.  మంచి కథలు రాయగలిగిన వారి నుండి కూడా ఈసారి వచ్చిన కథలు నిరాశనే మిగిల్చాయి.

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

ఎన్నెలో ఎన్నెలా  – అట్టాడ అప్పలనాయుడు (సారంగ): రోహిత్ మరణం నేపథ్యంలో నేను చదివిన వాటిలో, అతి నాటకీయత లేకుండా, గాడి తప్పకుండా, నన్ను పూర్తిగా చదివించగలిగిన ఒకే ఒక్క కథ.

 బౌండరీ దాటిన బాలు – మధు పెమ్మరాజు (వాకిలి): ప్రతి ఒక్కరి బాల్యంలోనూ ఇలాంటి  సంఘటన కనీసం ఒకటయినా ఉండే ఉంటుంది. నాస్టాల్జిక్ కార్నర్స్ ని టచ్ చేసిన కథ. చక్కటి కథనం.

 ఏం జీవితం – చంద్ర కన్నెగంటి (ఈమాట): ఒక మనిషి జీవితంలోని వర్ణాలను, సరళమైన భాషలో, చక్కని వచనంతో చూపించిన కథ.

 ద్వారబంధం – మైథిలి అబ్బరాజు (ఆంధ్రప్రదేశ్ పత్రిక):  ఫీల్ గుడ్ స్టోరీ అంటాను దీన్ని.  చక్కని వచనం మైథిలి గారి స్వంతం. ఈ కథ చదవగానే నాకెందుకో కళ్యాణ సుందరీ జగన్నాథ్ కథలు గుర్తుకు వచ్చాయి.

 హృదయం ఇక్కడే ఉంది – ఆర్. దమయంతి (ఈమాట): తప్పులు లేకుండా, మంచి శైలిలో, క్లుప్తంగా అవసరమైనంత వరకూ మాత్రమే చెప్పడం తెలిసిన వారిలో దమయంతి గారు ఒకరు.  ఇది ఇంకో ఫీల్ గుడ్ స్టోరీ.  

 డీహ్యూమనైజేషన్ – దేశరాజు (సారంగ): ఇది కూడా అతి తక్కువ నాటకీయతతో, ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద వచ్చిన సున్నితమైన సెటైర్.

 నచ్చిన ఇంకొన్ని కథలు – బ్లాక్ ఇంక్ – సాంత్వన చీమలమర్రి (సారంగ), కొన్ని ముగింపులు – చంద్ర కన్నెగంటి (సారంగ), సుచిత్ర చెప్పిన కథ – కొత్తావకాయ (బ్లాగ్), అద్భుతం – అరిపిరాల సత్యప్రసాద్ (వాకిలి), కంపనవడ్డ కాళ్ళు – జూపాక సుభద్ర (సారంగ), కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు  – ఉణుదుర్తి సుధాకర్ (సారంగ?), గంగమ్మే బెదరిపోయే – ఎండపల్లి భారతి (వాకిలి), సంసారంలో సరిగమలు – తమస్విని (కౌముది), డాక్టర్ చెప్పిన కథలు – చందు శైలజ (కౌముది)

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు

మధు పెమ్మరాజు, సాంత్వన చీమలమర్రి, ఎండపల్లి భారతి.  సాంత్వన రచనా శైలి బావుంటుంది. భారతి గారు ‘మావూరి ముచ్చట’ శీర్షికన వాకిలిలో వ్రాసిన కథానికలు మంచి మాండలికంతో శ్రద్ధగా వ్రాసినట్టు ఉంటాయి. ఉణుదుర్తి సుధాకర్ గారి రెండు కథల్లో కూడా కథనం బావుంది. ఆయన పేరు వినడం ఇదే మొదటిసారి నాకు.

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయివ్యక్తిగతంగాసాంఘికంగాఅంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

సమాజంలో వస్తున్న మార్పులని స్పృశించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే సమస్యకు సహజంగా స్పందించి కాకుండా, మేమూ ఏదో చెప్పాలన్న ఆత్రుతతో వ్రాస్తున్నట్టుగా ఉంటున్నాయి. మధ్యలో వాదాలూ, కులాలు ప్రాముఖ్యం సంపాదించుకుని, అసలు సమస్యను వదిలి ఎక్కడికో పోతాయి. వెరసి చాలావరకు విసుగు కలిగించే వ్యాసాలుగా మిగిలిపోతున్నాయి. నిజానికి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే భయం వేస్తుంది, ఆ తర్వాత తెచ్చిపెట్టుకున్న ఉద్వేగాలతో వెల్లువలా వచ్చే పసలేని కథలూ, కవితలూ చూడాల్సి వస్తుందని. అసలు కష్టాన్ని మించిన కష్టం ఇది ఒక్కోసారి నాకు.

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

ఇక్కడా అని చెప్పడం కష్టం. ప్రతీ చోటా నచ్చినవీ ఉంటున్నాయి, నచ్చనివీ ఉంటున్నాయి. అయితే ఎక్కువ నాసిరకపు కథలు ఈనాడులో వస్తున్నాయని మాత్రం అనిపిస్తుంది. 

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

కథా విమర్శా? అంటే ఏమిటీ, ఎక్కడుందీ అని అడగాలని ఉంది. నావరకూ నాకు మంచి కథలు రాకపోవడం కన్నా, మంచి విమర్శ లేకపోవడమే ఎక్కువ అసంతృప్తిగా ఉంటుంది. కథలను కాకుండా రచయితలను విమర్శించడం/పొగడటం రానూ రానూ ఎక్కువయి, నిజమైన విమర్శ అనేది మాయం అయిపోయింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటో రెండో మంచి కథలు వ్రాయగానే, ఇక వాళ్ళు ఏం వ్రాసినా (అది ఎంత నాసిరకంగా ఉన్నప్పటికీ) అద్భుతంగా ఉందనీ, వాళ్లు తప్ప ఇంకొకరు అలా వ్రాయలేరనీ ఆకాశానికి ఎత్తెయ్యడం.  ఇక సోషల్ నెట్వర్క్ లో గ్రూపులు. గ్రూపులో ఒకరు ఏదైనా వ్రాస్తే, అది ఎలా ఉన్నా సరే మిగిలిన వాళ్ళు భట్రాజులను మించిపోతూ పొగడ్తలు. ఎవరి రాతలైనా నచ్చలేదని ఎవరైనా అన్నారో, అందరూ కలిసి సామూహకంగా అన్నవాళ్ళని టేస్ట్ తెలీని వాళ్ళనీ, అహంకారులనీ ముద్రలు వేసెయ్యడం. సోషల్ మీడియాలో రచయితల ఇన్వాల్వ్మెంట్ పెరిగాక ఈ ధోరణి  ఇంకా ఎక్కువయిపోయింది.

ఇప్పటి రచయితల్లో పొగడ్తలు తప్ప, విమర్శలు సమన్వయంతో తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. పొగిడినంత సేపూ సంతోషం. ఎప్పుడన్నా ఎవరైనా ఒకటి నచ్చలేదు అంటే, అక్కడి నుండీ రాజకీయాలు మొదలు. తన కథలోని లోపాలను సహేతుకంగా చూపినందుకు ఒకరిని,  ‘వాచాలత్వం, ప్రేలుడూ, అహంకారం’ అంటూ రభస చేసిన వారొకరు. విశ్లేషణలో తన కథను తను అనుకున్నట్టుగా పొగిడి ఆకాశానికి ఎత్తకుండా విమర్శించినందుకు, వేరొకరు ఫేస్బుక్ లో నడిపిన నాటకాలూ, అస్మదీయుల ఓదార్పులూ. ఇలాంటివి చూస్తూ ఎవరైనా కూడా సరైన విమర్శ చెయ్యాలన్నా వెనుకాడతారు. కొద్దో గొప్పో రచనలు చేసిన వారి నుండి, చెయ్యి తిరిగిన రచయితలు అనిపించుకున్న వాళ్ళ వరకూ, దాదాపు అందరిలోనూ విమర్శల పట్ల ఇదే అసహనం.

అయితే ఈ సందర్భంలో చెప్పవల్సినది ఒకటి ఉంది. దీనికి భిన్నంగా ఓ రెండేళ్ళ క్రితం, ‘అపర్ణ తోట’ తన కథపై వాకిలిలో ఎంతో ఘాటైన  విమర్శలు వచ్చినా, సంయమనంతో, హుందాగా ప్రవర్తించడం అభినందనీయం.    

చాలాసార్లు కథ మీద చర్చలు పక్కదారి పట్టి, అస్తిత్వాలు, ఇజాలు, పరస్పర దూషణలతో నిండిపోతున్నాయి. కథకు సంబంధించి వాఖ్యానించడానికి కూడా ఇక మరెవరూ అక్కడ అడుగు పెట్టే సాహసం చెయ్యరు. ఇక విమర్శలు చెయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

నావరకూ కథల సంకలనాలు అవసరమనే అనిపిస్తుంది.  వాటిల్లో అన్నీ మంచి కథలే ఉంటాయని కాదు. వీటి వల్ల చదవని క్రొత్త కథలు చదివే అవకాశం వస్తుంది. అలానే ఎక్కడెక్కడో చదివిన కథలు మళ్ళీ మళ్ళీ కావల్సినపుడల్లా చదువుకునే వీలుంటుంది. కథాసాహితి సంకలనాల వల్ల నేను ఇంతకు ముందు చదవలేకపోయిన ఎన్నో మంచి కథలు చదవగలిగాను. మళ్ళీ మళ్ళీ చదువుకోగలుగుతున్నాను. అలాగే రచయితల కథల సంకలనాలు కూడా అవసరమనే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా కథ నచ్చినపుడు ఆ రచయితవి మిగిలిన కథలు కూడా చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సంకలనాలే అక్కరకు వస్తాయి.

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకుతెలుగు కథలకు తేడా కనిపిస్తోందాఅయితే అది ఎలాంటి తేడా?

నేను సాధారణంగా ఇంగ్లీష్, అదీ కూడా ఎక్కువగా నవలలే చదువుతాను. నవలకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది కథ కన్నా.  కాబట్టి వాటితో తెలుగు కథలను పోల్చలేను.  ఇతర భాషల కథల అనువాదాలు శారద గారు, కొల్లూరి సోమశంకర్ గారు, ఇంకొందరు చేసినవీ కొన్ని చదివాను, అయితే వాటి మూల కథలు ఎప్పుడో వ్రాసినవి కాబట్టి, వాటితో పోల్చడం కూడా సరైనది కాదు అనుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, అవి ఎప్పటివైనా సరే వాటిలో క్లుప్తత, హద్దులు దాటని నాటకీయత, వస్తు వైవిధ్యం ఉన్నాయి. నీతిసూత్రాలు, ఉపన్యాసాలు దాదాపు లేవనే చెప్పాలి. 

*

పద్మవల్లి

మీ మాటలు

 1. పద్మవల్లి గారు: మీ సమాధానాలు సూటిగా చాలా బావున్నాయి. కథావిమర్శ-2016 మీద మీ అబిప్రాయానికి 100 కి 200 మార్కులు మీకు. సరిగ్గా అందుకే నచ్చినదాన్ని ఒప్పుకుని చెప్పడం , నచ్చని దాన్ని తప్పుకు వెళ్లడం అలవాటు చేసుకున్నాను నేను.

  • మేడంగారు
   మీరు చెప్పిన విషయాలు ఎంతో పరిశీలించి రాసినవి. తెలుగు కథ దుస్థితి ఇది. అయితే కొత్తవారు, రాయాలనే తపన ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ వారినందరినీ సరైన రీతిలో మార్గదర్శనం చేసే వాళ్ళు కరువయ్యారు. అస్తిత్వవాదము పేరుతో కూడా తెలుగు కథ బలహీన
   పడుతోందా అనిపిస్తుంటుంది నాకు.
   రఘు, ఉప సంపాదకుడు

   • రఘు గారూ, మీ ఆవేదన చాలా అర్ధవంతమయినది. క్రొత్త రచయితలు పొగడ్తల కోసం, గుర్తింపు కోసం ఆరాట పడటం మరీ అంత నేరం కాదు. కానీ డజన్ల కొద్దీ కథలూ నవలలూ వ్రాసేసి, పుస్తకాలు వేసుకున్న వాళ్ళ దగ్గరే అంత కన్నా వికారపు ప్రవర్తన కనబడుతోంది. క్రొత్త వాళ్ళకు అన్నిరకాలు గానూ మార్గదర్శకులుగా ఉండాల్సిన వాళ్ళే పాపులారిటీ కోసం పాకులాడటం మన దౌర్భాగం. ముందే చెప్పినట్టుగా సోషల్ నెట్వర్క్స్ రచయితలకూ, పాఠకులకూ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి, పాఠకులకు చాలా అన్యాయం చేసాయి. అయితే ఇందులో పాఠకుల తప్పూ కొంత ఉందని నేను అంగీకరిస్తాను. ముందు ముందు పరిస్థితి ఏమన్నా మెరుగయ్యి, నిజమైన మార్గదర్శకులు కనిపిస్తారని ఆశిద్దాం. అయితే ఎవరికీ వారు స్వవిమర్శ చేసుకోనంత వరకూ అది సాధ్యం కాదు. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 2. S. Narayanaswamy says:

  Good show

 3. మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా తెలియచెప్పినందుకు అభినందనలు. అంగీకరించాల్సిన అంశాలని ప్రస్తావించారు.

  ప్రతీ చోటా ఉన్న వివాదాలూ, చిరాకులకీ సాహితీలోకమేమీ అతీతం కాదు. కాబట్టి, నేతిబీరకాయల్లో నెయ్యి వెతుక్కోడం కంటే, కాలపరీక్షకి తట్టుకుని నిలబడే సత్తువ ఉన్న సాహిత్యం కోసం ఎదురుచూద్దాం. తప్పదు. :)

  • థాంక్ యు. నువ్వు చెప్పింది నిజమే.
   “కాలపరీక్షకి తట్టుకుని నిలబడే సత్తువ ఉన్న సాహిత్యం కోసం ఎదురుచూద్దాం — సాహిత్యం మీద మనకున్న ప్రేమ ఆ ఆశని సజీవంగా ఉంచుతుంది.

 4. “నేనో సాధారణ పాఠకురాలిని. మంచి కథ అంటే నా దృష్టిలో, అది ముందు నన్ను పూర్తిగా చదివించగలగాలి. భాషా, శైలీ బావుండాలి. కథ పరిధులు దాటి వ్యాసాలుగా మారకూడదు. ఇవీ నాకు ఓ కథ నచ్చడానికి ఉండాల్సిన కనీస లక్షణాలు” అంటూ కథనుంచీ తాను ఆశించేదేమిటో స్పష్టం చేశారు పద్మవల్లి గారు.

  అలాగే రచయితల తీరు మీద కూడా ఒక పాఠకురాలిగా తన అభిప్రాయం ప్రకటించే ధైర్యం చేసారు.

  రచయితలు తాము రాసింది ఎడిట్ చేసుకోవాలనీ, వాడే భాష గురించి జాగ్రత్త పడాలనీ, ఒకరినొకరు పొగుడుకొంటూ ఓ చిన్న బృందానికి పరిమితమవరాదనీ అన్నారు. అలాగే విమర్శ పేరుతో ఇప్పుడు మిగిలిందల్లా పొగడ్తలే అని కుండబద్దలు కొట్టేశారు.

  పై విమర్శలన్నీ ఒక రచయితగా నాకూ వర్తించేవే అయినా, ‘మొదటగా నేను పాఠకుడిని ఆ తర్వాతే రచయితని’ అని మరింత బాగా గుర్తుండటంవల్ల వాటితో ఏకీభవించలేకుండా ఉండటం కష్టం.

  ఎడిటింగ్ గురించి ఒక లాయర్ మిత్రుడు ఆసక్తికరమయిన విషయం చెప్పాడు. తను లాయర్ అయిన కొత్తలో మొదటిసారి రాసిందే తనకి గొప్పగా అనిపించేదట . త్వరలోనే తన డాక్యుమెంట్లనే తన మీద ఆయుధాలుగా అవతలివాళ్ళు వాడుకోవటం చూసి, లండన్కు చెందిన ఓ ఎడిటింగ్ కోర్సులొ చేరి ఇప్పుడు రెండు సార్లు కాదు, ఏడు సార్లు మళ్ళీ మళ్ళీ చదివి వాటిని తిరగ రాస్తున్నాడట. ABCDEFG అని ఆ ఎడిటింగ్ చేసే పద్దతి వివరించాడు. A for Accuracy, B for Brevity, C for Correctness ఇలా… అంటే మొదటి సారి చదివినపుడు Accuracy గా వుందా లేదా అని చదివి ఎడిట్ చేసుకొంటాడు. అలా మొత్తం ఏడు సార్లు.

  ఒక లాయర్ గా తనే ఆ పనిచేయ్యగా లేనిది రచయితలు ఎందుకు చెయ్యకూడదు అని అతని ప్రశ్న.

  భాష గురించి మార్క్వెజ్ చెప్పిన ఈ విషయం గుర్తొస్తోంది. కథలోని వస్తువుని బట్టీ , పాత్రల సామాజిక పరిణామాన్నీ వాటి స్థాయిని బట్టీ భాష కూడా మారుతుంటుందనీ, భాష యాస శిలా సదృశ్యం కాదనీ ఆయన నొక్కి చెప్పాడు.
  అలాగే కథలు రాసే కొత్తలో ఒక అమూర్త పాఠకుడికోసం (అనేకమంది పాఠకుల కోసం) రాయటం ప్రారంభించి ఆ తర్వాత తన మిత్రుల విమర్శకుల పొగడ్తలకోసం మాత్రమే రాయటంతో సరిపెట్టే ధోరణి వచ్చిందేమో అని అలోచించాల్సి వస్తోంది. రచయిత తీసుకున్న ఆ స్టాండ్ వల్ల సహజంగానే ఆయా రచనలకి మామూలు పాఠకులు దూరం జరిగే అవకాశం ఎక్కువ.

  అలాగే రచయిత తన కథను తానే ఆసక్తిగా చదవలేకపోతే తన బదులు ఆ పని పాఠకులు చెయ్యమని కోరుకోవటం అన్యాయం అని వేరే చెప్పనవసరం లేదు.

  ఆ మధ్య వివిధలో పాశ్చాత్య కథా పరిణమాన్ని వివరిస్తూ నేను రాసిన ఒక వ్యాసం మీద ఇక్కడి తెలుగు రచయితలు వ్యాసానికి సంబంధంలేని హాహా కారాలు చెయ్యటం మన రచయితల్లోని అసహనానికి పరాకాష్ట.

  ఆ వ్యాసం ఇక్కడ…

  http://epaper.andhrajyothy.com/c/15121085

  కథ లేదా విమర్శ ఆధారంగా చర్చించ కుండా ఆయా రచయితలమీద లేదా విమర్శకులమీద వ్యక్తిగత దాడి చేయటం వల్ల నష్టపోయేది మన సృజనకారులే అన్నది ఎప్పుడు అర్ధమవాలి?

  -సురేష్

  • సురేష్ గారూ, “పై విమర్శలన్నీ ఒక రచయితగా నాకూ వర్తించేవే, అయినా మొదట నేను పాఠకుడిని” అంటూనే విమర్శని పాజిటివ్ గా చూడగలిగిన మీ సంస్కారానికి ముందుగా నా అభినందనలు మరియు కృతజ్ఞతలు. అయితే నేను ముందే చెప్పినట్టుగా నా అభిప్రాయాలు అందరు రచయితలనూ ఉద్దేశించి ఎంత మాత్రమూ కాదు. గంజాయి వనంలో తులసి మొక్కలూ ఉన్నాయి. అలానే నా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని కూడా నేను అనుకోను.

   మీరు అందరికీ పనికొచ్చే విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు చాలా చెప్పారు. మీరు షేర్ చేసిన వ్యాసం నుండి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మీ లాయర్ ఫ్రెండ్ చెప్పిన విషయం, రచయితలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కామెంట్స్ వ్రాసే వాళ్ళందరం కూడా పాటించాల్సినది.

   “కథ లేదా విమర్శ ఆధారంగా చర్చించ కుండా ఆయా రచయితలమీద లేదా విమర్శకులమీద వ్యక్తిగత దాడి చేయటం వల్ల నష్టపోయేది మన సృజనకారులే అన్నది ఎప్పుడు అర్ధమవాలి?” —- మీరు చాలా మంచి, అతి ముఖ్యమైన ప్రశ్న వేసారు. రచయితలూ, పాఠకులూ కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మీ స్పందనకు, మంచి విషయాలు చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు.

   • నీహారిక says:

    రచన లేదా కమెంట్ ఎంత పెద్దదా చిన్నదా? పాశ్చాత్యులదా స్వదేశీయులదా అన్నది కాదు ముఖ్యం. ఏం చెప్పారన్నది ముఖ్యం. ట్రంప్ అయినా కేసీఆర్ అయినా చెప్పేదొకటే, ఎవడి బాగు వాడు చూసుకోమని. నేను చెప్పినది రెండు పాయింట్స్. ఒకటి…ముసలివో ముతకవో ఈనాడులో కధలు బాగుంటాయి. రెండు….సృజనకి సృజనకారులకు సంబంధం ఉంటుంది. సృజనని విమర్శిస్తే సృజనకారులు పారిపోకూడదు.

  • నీహారిక says:

   @ సురేష్ గారు,
   మీ వ్యాసం లో నాకు నచ్చినవి 6 కధా లక్షణాలు. నా మటుకు నేను కధలో రచయత/త్రి ఏం చెప్పదలుచుకున్నారో వెతుకుతాను. నా అదృష్టం బాగుంటే గుర్తించుకోదగ్గ కొన్ని వ్యాఖ్యలు దొరుకుతాయి.
   కొత్త తరం కధల్లో ఇంగ్లీష్ రచయతల పేర్లు,ఇంగ్లీష్ వ్యాక్యాలు తెలుగులో వ్రాయడం ఎక్కువగా కనపడుతున్నాయి.(యండమూరి,మల్లాది గార్లు కూడా ఇంగ్లీష్ నవలలు ఎక్కువే చదివారు కానీ తెలుగులో వ్రాసేటపుడు ఆ పాండిత్యాన్ని మా మీదపోసేసి పోకుండా వీలైనంత వరకూ పాఠకులను చైతన్య పరిచేవారు.) అచ్చ తెలుగులో వ్రాయడం కష్టమేమో తెలియదు.
   మన నేటివిటీకి దగ్గరగా ఉండి కధను కధే చెప్పాలి రచయత కనిపించకూడదు అంటే చాలా కష్టం.సాంకేతికత పెరిగి రచయత/త్రి ఫోటో తో సహా ఎదురుగా కనిపిస్తుంటే నాకు కధ కన్నా వాళ్ళే కనిపిస్తున్నారు.ప్రతి ఒక్కరూ ఒక్కో ఇజాన్ని కధల్లో కూర్చి మరీ వండుతుంటే సహించలేకపోతున్నాం.

   కొంతమంది రచయత/త్రులు ఒక సమస్యని లేవనెత్తి పరిష్కరించే బాధ్యత ను మా నెత్తిమీదకే వదిలేస్తారు.ఏదో ఒకటి మన ఊహకే వదిలేస్తారన్న మాట ! సమస్యని లేవనెత్తి పరిష్కరించకుండా వదిలేస్తే, చలాన్ని వదిలేస్తే రంగనాయకమ్మ పుట్టుకొచ్చినట్లు ఇపుడు ఈ రచయిత/త్రులని వదిలేస్తే మరొకరు పుట్టుకొస్తారు.వీలయినంతగా కధను కధగా చెప్పడం వాళ్ళ హక్కయితే కధలో నీతిని వెతకడం మా హక్కు.సన్నీలియోన్ వచ్చి ఆదర్శ దాంపత్యం గురించి సినిమా తీస్తే కధని కధగా చూడడం కష్టమేమో ?
   అరిస్టాటిల్ నుండి అరిపిరాల(రైమింగ్ కోసం వాడుకున్నా) వరకూ తమ జీవితాల్లో జరిగినవి,చూసినవే కధలుగా చెప్పగలరు కానీ ఊహల్లోనే కధని వ్రాయడం జరుగదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రచయత/త్రి కి కధకి సంబంధం ఉండితీరుతుంది.ప్రతి రచనకి రచయత/త్రి బాధ్యత తీసుకోవాలి.విమర్శ వస్తే విని/చదివి తట్టుకుని తీరాలి.విమర్శకి భయపడి (కమెంట్స్ సెక్షన్ ని ఎత్తేసి)పారిపోయేటట్లయితే ఇంట్లో కూర్చుని డైరీలో వ్రాసుకోవడం అన్నివిధాలా అందరికీ ఉత్తమం !
   ఆధిపత్యం ఎక్కడ ఉందో పోరాటాలు అక్కడే ఉంటాయి.పోరాడే శక్తేలేనపుడు బరిలోకి దిగడం వివేకవంతులు చేయవలసిన పనికాదు. ఒక్క కధకి ఇన్ని చూడాలా అంటే టైం పాస్ అవడానికి సవాలక్షా మార్గాలు.బిల్ గేట్స్ కూడా మంచు గడ్డకట్టే చలిలో బయటకు వెళ్ళే దారిలేక టైం పాస్ అవ్వకే మైక్రోసాఫ్ట్ ని కనుక్కున్నట్లు,విదేశాల్లోని తెలుగు వారు నడిపే వెబ్ పత్రికలు వెలువరించే కధలతో కూడా ఏదో ఒకటి కనుక్కోలేకపోతామా ?
   రాబోయే రోజుల్లో ఉపద్రవం ముంచుకొస్తుందనో,గతంలో అన్యాయం జరిగిందనో వ్రాసే రచనల కంటే కధల్లో వాస్తవికతను జోడించి వ్రాసే వాటికెపుడూ ఆదరణ ఉంటుంది.

 5. నీహారిక says:

  మీ వ్యాసం ఆలోచింపచేసేదిగా ఉంది. కొన్ని విషయాలు అంగీకరంచాల్సినవి ఉన్నా ఒక్క విషయంలో విభేధిస్తున్నాను. ఈనాడులో కధ ఎంపికకావడమే రచయత/రచయిత్రి అని చెప్పుకోడానికి ఒక ప్రాధమిక అర్హతగా నేను భావిస్తాను. మీలాగా గుర్తుపెట్టుకుని చెప్పలేను కానీ చాలా వరకూ వాస్తవికతను జోడించి రాసే ఈనాడు కధలు వ్యాసాల్లా కాకుండా అక్షరాల వెంట కళ్ళని పరిగెట్టించేలా ఉంటాయి. ఆదివారం అనుభంధం కోసమే ఆదివారం 5 గంటలకే నిద్ర లేవాలనిపిస్తుంది.2016 లో ఏయే కధలు నచ్చాయో చెప్పమంటే వెతికి చెప్పగలను కానీ నాకంత సమయం లేదు, ఈనాడులో మీకు నచ్చని కధలు మీరు చెప్పండి,తెలుసుకుంటాను.

  • నీహారిక గారూ, నా అభిప్రాయాలతో విబేధించే హక్కు మీకుంది. ఈనాడులోనే మంచి కథలు వస్తున్నాయి అన్న మీ అభిప్రాయాన్ని నేనూ గౌరవిస్తాను. కొన్నేళ్ళ క్రితం వరకూ ఈనాడు ఆదివారం అనుబంధం గురించి నాకూ అదే అభిప్రాయం ఉండేది. అందుకే ఇప్పటికీ చదవటం వీలయినంత వరకూ మానను. అయితే గత కొద్దికాలంగా ఏ కథా పూర్తిగా చదివాక, నాకు బావుంది అనుకున్నట్టు గుర్తులేదు. ఎప్పుడన్నా అక్కడక్కడా బాగున్నవి వచ్చినా, నాకు గుర్తు లేకపోవడమో, లేదా వాటిని నేను చదవక పోవటమో జరిగి ఉండాలి. ప్రత్యేకంగా నచ్చినవీ నచ్చనివీ పేర్లు నాకూ గుర్తులేవు. అందుకే ఎక్కువ కథలు అన్నాను, అన్నీ అనలేదు. అది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈసారి ఇంకొంచెం శ్రద్ధగా గమనించడానికి ప్రయత్నిస్తాను. మీ స్పందనకి చాలా థాంక్స్.

  • manaswini says:

   నా అభిప్రాయమలో ఆంధ్ర మొత్తానికి అత్యంత చెత్త కథలు(అడపా దడపా తప్పించి) ఈనాడులో వస్తాయి! ముసలితనం కష్టాలను ఏకరవు పెట్టడం, అత్యంత తక్కువ స్థాయి వ్యక్తీకరణ, పేలవమైన వాక్య నిర్మాణం.

 6. లలిత గారూ, నారాయణ స్వామీ గారూ, థాంక్ యు.

 7. లలిత ,బి says:

  చాలా చక్కగా ,సూటిగా వ్రాసారు .ముఖ్యంగా విమర్శ అనే విషయం లో నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరచిన తీరు అభినందనీయం ..నా మనసులో భావాలను మీ అక్షరాలుగా చదివి ఆనందించాను .

 8. సాయి.గోరంట్ల says:

  పద్మవల్లి గారు త్యాంక్యూ మంచి చర్చకు అవకాశం కల్పించినందులకు..అలాగే మీ విమర్శ(విశ్లేషణ)చాలా సూటిగా చెప్పారు.ఇక విషయంలోకి వస్తే ఇప్పటి రచనలు ఎక్కువ బాగం సమకాలీన పరిస్థితులగురించి తమ కోణంలో చెప్పే ప్రయత్నం జరుగుతోంది..అందుకే వారి స్వంత అభిప్రాయాలు కలిపి చెప్పడం వలన చదువరిలో కన్ఫ్యూజన్ కలుగుతోంది..అదీకాక వాదాలు,సిద్దాంతాలు,రాద్దాంతాలుగా ప్రస్తుత సమాజం విడిపోయింది.ఎవరికి నచ్చిన కోణంలో వారు తమదైన దృష్టి కోణంలో చూడఃడం వలన సహజంగానే ఆ అభిప్రాయాలతో విభేదించేవారు ఎక్కువ అవుతారు..అందుకే ఇప్పటి రచనలపై విమర్శ(విశ్లేషణ)లు ఎక్కువ అయ్యాయనుకుంటా.
  దీనివలన కొంత గందరగోళం నెలకొనడం కూడా సత్యమే..

మీ మాటలు

*