యాష్ లీలో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు

సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-10

 

‘వేయిపడగలు’, ‘గాన్ విత్ ద విండ్’-రెండూ వెయ్యి పేజీలు దాటిన బృహన్నవలలు.  తీరా వాటి మధ్య పోలికలు, తేడాలలోకి తొంగి చూడబోతే అదీ అంత భారీగానూ మారేలా కనిపించింది. కనుక వీలైనంతవరకు సంక్షేపించక తప్పదు.

రెండు రచనలూ చిత్రించినది ఒకానొక వ్యవస్థాపతనాన్నే, అయినా మళ్ళీ రెండు వ్యవస్థల మధ్యా తేడా ఉంది. స్థూలంగా చెబితే, వేయిపడగల వ్యవస్థ కాలికంగా ఎక్కువ నిడివీ, లోతు, ఘనీభావస్థితీ కలిగినదైతే; గాన్ విత్ ద విండ్ చిత్రించిన వ్యవస్థకు అంత కాలికమైన నిడివీ, లోతూ లేవు. మధ్యయుగాలనాటి వేయ్యేళ్ళ అంధచరిత్రనుంచి యూరప్ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్ విత్ ద విండ్ లోని కులీన సమాజం. యూరప్ లో జరిగినట్టు, వేయిపడగల వర్ణ సమాజపు, లేదా ఆ వర్ణసమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునికకాలంవరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్ధతను, ఘనీభవ స్థితిని, క్రియాశీల, పోరాటరాహిత్యాలను తాత్వికీకరించి ఘనంగా కీర్తించడం ఉంది. వేయిపడగల రచయిత ఒకచోట ఇలా అంటాడు:

ఆమె(జమీందారు రంగారావు పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని) యొక స్వతంత్రదేశమున పుట్టినది. అచ్చటి మరియాదలకు అలవాటులకు పరదేశములవారు వచ్చి భిన్నముగా నడచినచో ఆమె మనస్సు చాలా బాధపడి యుండును. కాని తన యీ భిన్నప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలిగించునని యామెకు యూహయే కలుగలేదు. కలుగవలసిన అవసరము లేదు.

ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని వాని నోర్పుతో సహింతురు. తమ కిష్టము లేమి సూచించరు. ఒక విషయమున, ఒక కార్యాచరణమున, తమ యిష్టము లేమిని ప్రతిఘటించి తెలుపుట, శశిని పుట్టిన దేశమున ప్రధాన ధర్మము. తత్ప్రకృతులకు ప్రతిఘటించకపోవుట అంగీకారము క్రిందనే లెక్క!

మొదటి వాక్యాలలో అశక్తతనుంచి పుట్టే ఆక్రోశమూ, నిష్టురత్వమూ వ్యక్తమవుతుంటే; రెండో వాక్యాలు అశక్తతను తాత్వికీకరిస్తూ ప్రతిఘటనలేమిని గుణంగా, ఘనంగా చూపిస్తున్నాయి. ఇది అశక్తతను, అది కలిగించే న్యూనతను ఆధిక్యంగా చిత్రించుకునే ప్రయత్నం.

ఈ అశక్తతకుగల పర్యవసానాలలో ఒకటి రాజీపడడం. మరోచోట మంగమ్మ అనే పాత్రతో వేయిపడగల రచయిత ఇలా అనిపిస్తాడు:

సంఘములో కాని, మతములో కాని, మరొకదానిలో కానీ మీ రెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.

సంఘంలోకానీ, మతంలో కానీ మీరు ఎన్ని మార్పులైనా తేవచ్చు ననడంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది, మార్పులతో రాజీపడడమే. అయితే, ఆ మార్పులు ‘ఇంద్రియ, మనోనిగ్రహాలు; తద్వారా భక్తి, జ్ఞానాలు’ కలిగించేవిగా ఉండాలని షరతు పెడుతున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ‘నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు సకల సంపదలూ సాధించుకు రావా’లని పాతాళభైరవి సినిమాలో నిరుపేద అయిన తోటరాముడికి రాజు షరతు పెడతాడు. తోటరాముడు నేపాళ మాంత్రికుని జయించి పాతాళభైరవిని మెప్పించి సంపదలతో తిరిగి వచ్చాడంటే అది సినిమా! నిజ జీవితం సినిమా కాదు. భక్తి, జ్ఞానాల సంగతి దేవుడెరుగు; ఇంద్రియ, మనోనిగ్రహాలనే మెట్లు ఎక్కడమే రచయిత చెప్పినంత తేలిక కాదు. అమాయకత్వమనాలో మరేమనాలో తెలియదు కానీ; లౌకిక ప్రాతిపదికపై నడిచే సంఘానికి రచయిత అలౌకికమైన, ఆధ్యాత్మికమైన సిలబస్ విధిస్తున్నాడు!

విధించడమే కాదు, వేయిపడగల రచయిత గిరిక, ధర్మారావు, హరప్పల ద్వారా భక్తి, జ్ఞాన, కర్మమార్గాలనే సిలబస్ ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వ్యవస్థా పతనాన్ని ఆపలేకపోయింది. చివరికి అరుంధతి రూపంలో పతివ్రతాధర్మం ఒకటి మిగిలిందని ధ్వనించి సంతృప్తి ప్రకటిస్తాడు.

లౌకికంగా క్రియాశీల, పోరాటశీలతలు లోపించిన మహాస్తబ్ధతలో మన ఊహల్ని అస్పష్ట, అవ్యక్త, అధ్యాత్మిక సీమల్లోకి నడిపించి శాంతిని, సమాధానాన్ని వెతుక్కోవడమే ఇది. అలాగని లౌకికజీవితాన్నీ, వాస్తవికతనూ అంత తేలిగ్గా ఎగరగొట్టడమూ సాధ్యం కాదు. దాంతో లౌక-అలౌకికతల మధ్య అంతులేని సంఘర్షణ, సంక్లిష్టత, వైరుధ్యాలు! నిస్సహాయతను నిర్లిప్తతగా ఎంత ఉన్నతీకరించుకున్నా వ్యవస్థాపతనంపట్ల తప్పని దుఃఖం!

రచయిత ఆదర్శీకరించిన చాతుర్వర్ణ్యవ్యవస్థ ఆయన ఊహలో ఉన్నట్టు అచ్చంగా అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉందా అంటే, ఉండగల అవకాశమూ లేదు.  పునాదులను కదిలించి ఉపరితలంలో కీలకమైన మార్పును తేగల ఒక మహత్ పరిణామమేదీ లేకపోవడం; ఫలితంగా సుదీర్ఘకాలం వెంబడి కరడుగట్టిన భావజాలమూ, సమాజంపై దాని వక్రప్రతిఫలనమూ, ఆ రెంటి మధ్యా వైరుధ్యాలూ అలా ఉండగానే చాపకింద నీరులా పాకుతూ వచ్చిన మార్పులు; అవి ఎలాంటివో తెలుసుకుని స్పందించేలోగానే అవి జీవితంలో భాగం కావడం! వాటిపై ఏం చేయాలో తోచని నిస్సహాయత! ఇదీ వేయిపడగలు రూపు కట్టిన భారతీయసాంప్రదాయిక సమాజపతనం.

గాన్ విత్ ద విండ్ చిత్రించినది ఇందుకు భిన్నం. అందులోని కులీన సమాజం వేయిపడగల సమాజంలా తీసుకుని తీసుకుని మరణోన్ముఖమవుతున్న సమాజం కాదు. క్రియాశీలంగా మారి చావో రేవో తేల్చుకోవాలనుకుంటుంది. సాయుధ పోరాటానికి దిగుతుంది. ఓడిపోతే పోవచ్చు కానీ అందులో నాన్పుడు లేదు. వేయిపడగలకు రంగస్థలమైన సుబ్బన్నపేటలో ఆధునికమైన మార్పులు సాపేక్షంగా ఎక్కువ కాలవ్యవధిలో సంభవిస్తే; గాన్ విత్ ద విండ్ కు రంగస్థలమైన జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో అంతర్యుద్ధ పర్యవసానంగా నాలుగైదేళ్ళ వ్యవధిలో దాదాపు హఠాత్తుగా సంభవిస్తాయి. యుద్ధానికి ముందు పదివేల జనాభాతో ఒక పెద్ద గ్రామంలా ఉన్న అట్లాంటా యుద్ధకాలంలో ఎలా పెరిగిందో, యుద్ధానంతరం నగర స్థాయిని ఎలా అందుకుందో; ఆ క్రమంలో అది భౌతికంగానూ ఆత్మికంగానూ కూడా ఎలా మారిపోయిందో రచయిత్రి అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టత్వం నిండిన సాంప్రదాయిక జీవనం నుంచి జారిపోయి సామాన్యత అనే ప్రవాహంలో అది గుర్తుపట్టలేనంతగా కలసిపోతుంది.  ఒక యుద్ధం తెచ్చిపట్టే భౌతిక, మానసిక పరివర్తనకు అంతర్యుద్ధకాలపు అట్లాంటా ఒక గొప్ప నమూనా. సుబ్బన్నపేటలో వచ్చిన మార్పుల చిత్రణ కూడా  ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ; అది కల్పిత గ్రామమైతే అట్లాంటా వాస్తవికం.

కథాకల్పన, పాత్రచిత్రణ సహా రచనా సంబంధమైన వివిధాంశాలలో ఇద్దరు రచయితలమధ్య మౌలికమైన తేడాలూ ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ ఇద్దరి దృక్పథాలలో ఉన్న తేడాను వ్యక్తీకరిస్తాయి. వేయిపడగలులో ధర్మారావు ప్రధానపాత్ర. రచయిత భావజాలం ప్రధానంగా అతని ముఖంగానే వ్యక్తమైంది. కథాకాలానికి ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి గతించాడు కనుక అతన్ని పక్కన పెడితే, ధర్మారావు తర్వాత చెప్పుకోదగిన పాత్రలుగా గిరిక, గణాచారి, అరుంధతి, రంగారావు, హరప్ప, పసరిక, కుమారస్వామి, మంగమ్మలు కనిపిస్తారు. అయితే వీరందరూ ధర్మారావు ప్రభావంలో మొదటి నుంచీ ఉన్నవారు, లేదా తర్వాత వచ్చిన వారే(ఉదాహరణకు రంగారావు, మంగమ్మ) తప్ప విరుద్ధభావజాలానికి చెందినవారు కాదు. రాధాపతి, చక్రవర్తి, వామనరావు తదితరులు విరుద్ధభావజాలంగలవారైనా ధర్మారావుతో తులతూగేవారు కాదు. అంటే ఏమిటన్నమాట! వేయిపడగల రచయిత ప్రణాళిక ఏకపక్షం. ఆయన భావజాలానికి తగిన ప్రతివిమర్శ కానీ, దానితో సమానప్రతిపత్తిగల పోటీ భావజాలం కానీ లేవు. సుదర్శనంగారు అన్నట్టు వేయిపడగలను ఆత్మాశ్రయకావ్యమనుకుంటే అది అలా ఉండడానికి ఒక సమర్ధింపు అవుతుంది.

ఇందుకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ రచయిత్రి దృష్టి వస్త్వాశ్రయంగా ఉంటుంది. అందులో ప్రధానపాత్ర ఎవరన్న పరిశీలన చేయబోతే ఒకరు కాదు, నలుగురు పైకి తేలతారు: స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ, యాష్ లీ! రచయిత్రి స్కార్లెట్ ముఖంగా కథ చెబుతున్నట్టు కనిపించే మాట నిజమే. స్కార్లెట్ ప్రధానపాత్రే. అంతమాత్రాన రెట్ బట్లర్ తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. అలాగే మెలనీ, అలాగే యాష్ లీ…

ఇలా నాలుగు పాత్రలకూ ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటి? రచయిత్రి ఈ నలుగురి ముఖంగా నాలుగు దృక్పథా(లేదా ఒకే దృక్పథంలోని భిన్నచ్చాయ)లకు దాదాపు సమస్థాయిని కల్పించడమే. ఈవిధంగా వేయిపడగల లోని ఏకపక్షతకు భిన్నంగా రచయిత్రి బహుళపక్షతకు చోటిచ్చింది. మరోలా చెప్పాలంటే, కాన్ఫడరేట్ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధం చేసిన  అమెరికా దక్షిణ రాష్ట్రాలు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించాయో ఆ భావజాలాన్ని రచయిత్రి నిరాకరించనూలేదు, స్వీకరించనూలేదు. ఆ భావజాలానికి కాల్పనిక స్థాయిలో యాష్ లీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాకపోతే స్కార్లెట్, రెట్ బట్లర్ ల రూపంలో రచయిత్రి దానికి ప్రతిపక్షాన్ని సృష్టించింది. అలాగే, పాతను పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం, కొత్తను పూర్తిగా తృణీకరించడం చేయలేదు. మెలనీ రూపంలో రెంటి మధ్యా మానవీయత అనే అతుకు పెట్టి ఒక గొప్ప సమన్వయాన్ని సృష్టించింది.

గాన్ విత్ ద విండ్ కు పరిమితమై చూసినప్పుడు ప్రాధాన్యక్రమంలో యాష్ లీ ది నాలుగవ స్థానమే. బహుశా నవల చదివిన పాఠకులందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ వేయిపడగలతో పోల్చి చూసేటప్పుడు అతను  ప్రథమస్థానంలోకి వస్తాడు. అతనిలో అడుగడుగునా ధర్మారావు పోలికలు కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ధర్మారావులానే అతను కూడా భావుకుడు. స్వాప్నికుడు. సాహిత్యప్రేమికుడు. సాంప్రదాయికత మీద గాఢమైన అనురక్తి ఉన్నవాడు. అవ్యక్తంలోని సౌందర్యాన్ని ఆరాధించేవాడు. అయితే ఒక తేడా; ధర్మారావుకు భిన్నంగా అతను పతనమవుతున్న వ్యవస్థ పక్షాన ఆయుధం పట్టి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధ ప్రయోజకత్వం మీద నమ్మకంతో కాదు. అయినా ఎందుకు యుద్ధం చేశాడంటే ‘స్వధర్మా’న్ని పాటించడానికి తప్ప మరో సమాధానం కనిపించదు. సాటి యువకులే కాక, తండ్రులు, తాతలు కూడా యుద్ధంలోకి దిగినప్పుడు అతను దిగకపోవడం ఊహకు అందని విషయం. యుద్ధసందర్భంలో యాష్ లీ మహాభారతంలోని అర్జునుని గుర్తుచేస్తాడు. యుద్ధానంతర పరిస్థితులగురించి అర్జునుడు వ్యక్తం చేసిన భయాలే యాష్ లీ లోనూ వ్యక్తమవుతాయి. అయినా సరే అర్జునుడు స్వధర్మానుసారం యుద్ధం చేసినట్టే యాష్ లీ కూడా చేస్తాడు. భార్య మెలనీకి రాసిన ఒక ఉత్తరంలో యుద్ధం గురించిన అతని ఊహలు ఇలా ఉంటాయి:

పడుకుని నక్షత్రాలవైపు చూస్తూ అనుకుంటాను, “దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నా”వని. మన రాష్ట్ర హక్కుల కోసం, కాటన్ కోసం, డార్కీల కోసం, మనం ద్వేషించే ఆ యాంకీ(అప్పట్లో అమెరికాలోని ఉత్తరాదివారిని సూచించే నిందార్థకం)ల కోసం. కానీ నా పోరాటానికి ఇవేవీ కారణాలు కావు. నేను ట్వెల్వ్ ఓక్స్ (అతని నివాసం)ను మాత్రమే చూస్తున్నాను. తెల్లని స్తంభాలపై ఏటవాలుగా పడే వెన్నెలను, వెన్నెల్లో వికసించే చంపకాలలో వ్యక్తమయ్యే అలౌకికతను, ఎర్రని ఎండ కాసే మధ్యాహ్నం వేళ కూడా పక్క వసారాలో చల్లని నీడ పరుస్తూ ఎగబాకే గులాబీలను గుర్తుచేసుకుంటూ ఉంటాను. అమ్మ ఆ వసారాలో కూర్చుని కుట్టుపని చేసుకుంటున్న నా చిన్నప్పటి దృశ్యం కళ్ళకు కడుతూ ఉంటుంది. సంజె వేళ అలసిపోయి పొలాలనుంచి భోజనానికి ఇళ్లకు వెడుతూ డార్కీలు పాడుకునే పాటలు, బావిలోకి బొక్కెన దింపి నీళ్ళు చేదుకుంటున్న ధ్వనులూ వినబడుతూ ఉంటాయి. పత్తి పొలాల మీదుగా నదికి దారితీసే బాట తాలూకు పొడవాటి దృశ్యం, మసకచీకటిలో దిగువ భూములనుంచి పైకి లేచే పొగమంచు…వీటి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మృత్యువు, కష్టాలు, కీర్తిప్రతిష్టల మీద నాకు ప్రేమ లేదు. ఎవరిపట్లా  ద్వేషమూ లేదు. బహుశా ఇంటినీ, దేశాన్నీ ఇలా ప్రేమించడాన్నే దేశభక్తి అంటారు కాబోలు. కానీ, ఇది అంతకన్నా లోతైనది.  పైన చెప్పినవన్నీ నేను దేనికోసం నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టానో, నేను ఏ జీవితాన్ని ప్రేమిస్తున్నానో దానికి ప్రతీకలు మాత్రమే. పాత రోజులకోసం, నేను గాఢంగా ప్రేమించిన పాత జీవితం కోసం పోరాడుతున్నాను. అయితే అవి శాశ్వతంగా అంతరించాయనిపిస్తోంది. ఎందుకంటే, గెలిచినా, ఓడినా మనం ఆ జీవితాన్ని కోల్పోతాం.

ఈ యుద్ధాన్ని, తద్వారా మనం స్వప్నించే కాటన్ సామ్రాజ్యాన్ని గెలిచినా మనం పరాజితులమే అవుతాం. కారణం, మనం విభిన్న వ్యక్తులుగా మారిపోతాం. వెనకటి ప్రశాంత జీవనసరళులు నిష్క్రమిస్తాయి. ప్రపంచం కాటన్ కోసం దేవిరిస్తూ మన గుమ్మంలో పడిగాపులు పడుతుంది. అప్పుడు, కాటన్ ధర మనం ఎంత చెబితే అంత. ఎవరి డబ్బు కక్కుర్తిని, సంపద పోగేసేకునే ప్రవృత్తిని, వ్యాపార ధోరణిని ఏవగించుకుంటున్నామో; ఆ యాంకీలలానే మనం కూడా మారిపోతాం.

ప్రమాదాలకూ, పట్టుబడడానికీ, గాయాలకూ, చివరికి మృత్యువుకు కూడా నేను భయపడడంలేదు. వెనకటి కాలానికి మళ్ళీ ఎప్పటికీ వెళ్లలేమనే భయపడుతున్నాను. నేను పాతకాలం వాణ్ణి. ఒకరి నొకరు ఊచకోత కోసుకునే ఈ ఉన్మత్త వర్తమానానికి చెందను. ఎంత ప్రయత్నించినా ఏ భవిష్యత్తులోనూ ఎక్కడా ఇమడలేనని అనిపిస్తోంది. నాలో ప్రవహించే రక్తమే నీలోనూ ఉంది కనుక నువ్వూ అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు; కానీ గత మంత అందంగా, తృప్తికరంగా మాత్రం ఉండదు.

పాతకాలం గురించిన యాష్ లీ ఊహల్లో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రుక్మిణమ్మారావుతో అతను అన్న మాటలే చూడండి: “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది….నేను, మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనును ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!”

ఇంకా ఆశ్చర్యకరంగా, వేయిపడగల రచయితలానే యాష్ లీ కూడా వ్యక్తావ్యక్తంగా ఉండడంలోనే సొగసు ఉందనుకుంటాడు. అతనొకచోట స్కార్లెట్ తో అంటాడు: యుద్ధంలోకి అడుగుపెట్టేవరకూ, జీవితం తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు. అదే నాకు ఇష్టంగా ఉండేది. ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం నాకు నచ్చదు. అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలి”

వేయిపడగల రచయిత అంటాడు: “అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనపడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

యాష్ లీ యుద్ధం నుంచి తారా(స్కార్లెట్ పుట్టిల్లు)కు వచ్చిన తర్వాత ఒకరోజున అతనికీ, స్కార్లెట్ కు జరిగిన సుదీర్ఘ సంభాషణ అతనిలోని ధర్మారావు పోలికలను మరింతగా ఆవిష్కరిస్తుంది. వాటిని స్పృశించే ముందు, ఇద్దరి సారూప్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే;

గాన్ విత్ ద విండ్ ను పూర్తిగా యాష్ లీ ముఖంగా చెప్పి ఉంటే, (కొన్ని తప్పనిసరి తేడాలతో) అది మరో ‘వేయిపడగలు’ అయ్యేది!

      (సశేషం)

మీ మాటలు

  1. manjari lakshmi says:

    గాన్ విత్ ది విండ్ తో వేయి పడగలును పోల్చడం ఆశ్చర్యంగా ఉంది. బాగుంది అవో వెయ్యి పేజీలు ఐవో వెయ్యి పేజీలు చదివి వాటిలో పోలికలు పట్టుకోవటం. చాలా శ్రమ పడి చక్కగా రాస్తున్నారు

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ మంజరి లక్ష్మి గారూ…

మీ మాటలు

*