పాపం పాకావిలాస్‌..!

 

కేరళా పాల్ఘాట్‌ నించి పారొచ్చేరు. తమిళ కంచినించి కదిలొచ్చేరు. కన్నడ బళ్లారినుంచి దౌడాయింపుతో వచ్చేరు. వచ్చి వచ్చి చోడవరంలో పడ్డారు. అంతా అయ్యర్ల మేళమే. ఊరి బస్టాండ్‌లో సోమయ్యరు పాల్ఘాట్‌ కాఫీభవన్‌ తెరుచుకుంది. చినబజార్‌లో తంబీ హోటల్‌ మెరిసింది. కొత్తూరులో గణపతీవిలాస్‌ గలగలమంది. లక్షిందేవిపేట సిగన కేశవ్‌కేఫ్‌ కుదురుకుంది. పోలీస్‌ ఠాణా ఎదురుగా మణికంఠా లంచ్‌హోమ్‌ రెడీ అయ్యింది.

పచ్చగా దోసపళ్లలా ఉండీవారు వచ్చిన అయ్యర్లు. విభూది పిండికట్లు ఒళ్లంతా పెట్టి, పాలతెలుపు పంచెలుకట్టి, భుజంమీద పట్టువాణీలు పెట్టి, రుద్రాక్షపూసలదండలు మెళ్లో చుట్టి, అప్పుడే కైలాసంనించి దిగొచ్చిన శంభోశంకరుని ప్రతినిధుల్లా ఉండీవారు. స్ఫటికాల్లాంటి వాళ్లరూపాలు చూసే మేం సగం పడిపోయేం. ఆనక వాళ్ల మాట తీరు మమ్మల్ని మరో సగం వొంచీసింది. వాళ్ల మర్యాద, మన్నన పూర్తిగా దిగలాగీసింది. వాళ్లు మాట్లాడే పగిలిన తెలుగు మమ్మల్ని ముచ్చటపరిచీసింది.

అయితే, వాళ్లొచ్చీదాకా మావూరి జనానికి అల్పాహారం గురించి స్వల్పంగా నయినా తెలీదని కాదు. మేం మరీ అంత దారుణంగా బతుకుతున్నామనీ కాదు. పెద్దబజార్లో పద్మనాభుని బుల్లబ్బాయి కాఫీహోటల్‌ మాకు తెలియందా. పీర్లపంజా దగ్గర్లోని కురందాసు పాపారావు పాకావిలాస్‌, ఎడ్లవీధిలో సింహాచలం నాయుడు తాటాకు వొటేలు తెలీకనా. తాలూకాఫీస్‌ పక్కనుండే అమ్మాజమ్మ టీ దుకాణం, ఫకీర్‌సాహెబ్‌పేట దార్లో ఉండే ఇప్పిలి మోహనరావు టీకొట్టూ, పూర్ణా సినీమాహాలు దరినున్న అగ్గాల సన్నాసి గొడుగుబండి మా బుర్రలో లేకనా. ఇవన్నీ  బాగానే తెలుసును. వీటన్నిట్లోనూ మేం తిన్నవాళ్లమే. కాపోతే, అయ్యర్లొచ్చేక  మా తిండి మొత్తం తిరగబడిపోయింది.

అప్పటివరకూ, పాపారావు పాకావిలాస్‌లో ముగ్గురు చేరేరంటే, నాలుగోవాడు నిలబడే  తినాలి. పదేళ్ల కిందట నేయించిన తాటాకు పైకప్పునుంచి నల్లటి నుసి గోధుమరంగు ఇడ్డెన్ల మీద పడుతున్నా భరించాలి. పోనీ అని సింహాచలం టీ దుకాణానికి వెళ్లేవనుకోండి. అక్కడ గోలెంలోని కుడితినీళ్లలాటి తెల్ల జలాల్లో అందరు తిన్న సివరి ప్లేట్లూ ముంచితీసీడవే. అన్నీ ఎంగిలిమంగలాలే. సర్వమంగళ మాంగల్యమే. అమ్మాజమ్మ టీ చిక్కం కుట్టించింది ఎప్పుడో ఎవడికీ తెలీదు. అది నల్లపీలికలా అయిపోయి మా చిన్నప్పటినించీ డికాషను ఒడకడుతూనే ఉండీది. సన్నాసి కొట్టూ తక్కువకాదు. అంచులన్నీ  చుట్టుకుపోయిన లొత్తల పేట్లుండీవి. మోహనరావు  వొటేల్లో కూర్చునీ కుర్చీకి మూడు కాళ్లు పొడవు. ఒక  కాలు కురచ. పద్మనాభునివారు ఉప్పుపిండి తప్పనిచ్చి మరోటి వడ్డిస్తే ఒట్టు. రుచుల సంగతి చెప్పుకుందావంటే అవీ నేలబారే. ఎక్కడికెళ్లినా ప్లేట్లో ఇడ్లీ పడీడం. వాటి మీద వేపిన శెనగపప్పు టుర్రు చెట్నీ పోసీడం. ఆటు మీదట పసుపుపచ్చ బొంబాయి చెట్నీ ఒలిపీడం. పోనీ అని, చెమ్చాతో తిందామని నోరుతెరిచి అడిగితే, చెయ్యిలేదేటి.. అనీది సమాధానం.  అన్ని పచ్చళ్లూ మీద పడిపోయిన ఇడ్లీలు ఎలా ఉండీవంటే, గంధాలు మెత్తిన సింహాద్రప్పన్న నిత్యరూపంలా ఉండీవి. ఏడాదికోమారయినా అప్పన్నబాబు నిజరూపాన్ని సింహాచలంలో చూడొచ్చు. మా ప్లేట్లో ఇడ్లీలెప్పుడూ మాక్కనబడిందే లేదు. అన్నీ కలిపికొట్టీసీ కావేటిరంగా అనీడవే. మూతి తుడుచుకుని పోడవే.

అట్టు విషయమైతే అసలు చెప్పక్కర్లేదు. అది మినపట్టో, రవ్వట్టో, పెసరట్టో నరమానవుడు పోల్చలేడు. ఉల్లిపాయుంటే అది ఉల్లి అట్టు. జీలకర్ర కనబడితే అది పెసరట్టు. అలా అంచనాగా అనీసుకోడవే. ఉప్మా అంటే గోడకి సినీమా పోస్టర్లు అంటించుకునీ బంకలాగుండీది. పీటీ ఉషలాగ పరిగెడుతుండీది. అయితే ఒకటి లెండి. మేవిచ్చీ పావలాకీ, బేడకీ అంతకంటే ఎవడు పెట్టగలడు లెండి. పైగా ఈ ఫలహార దుకాణాలు నడిపీవాళ్లంతాను, ఏరోజుకారోజు సామాన్లు తెచ్చి చేసీవాళ్లే.  డబ్బున్నవాళ్లేం కాదు. కాబట్టి మాటిమాటికీ కుర్చీలు కొత్తవి ఎలా కూర్చగలరు. బెంచీలు ఎలా మార్చగలరు.

అయ్యర్లు వచ్చేక మాకు కొత్త తిండి సంగతులు కొంచెంబానే తెలిసినట్టయింది. మాకు తెలీని మద్రాసు సాంబారు ఘుమఘుములు ముక్కుకు తగీలివి. వేడివేడి సాంబారిడ్లీ జుర్రుకు తినీసీవాళ్లం. సింగిలిడ్లీ.. బకెట్‌సాంబారు.. నినాదం ఒక జాతీయవిధానంగా మావూళ్లో స్థిరపడిపోయిందప్పుడే. అట్టు అనే మా మాట ఎక్కడికి పోయిందో తెలీదు. దోశ పదం దొరసానయింది. రవ్వదోశ, మావుదోశ, పెసరదోశ మాముందుకు వచ్చీవి. మామూలు ఉప్మా ఉండీదా. అది అయ్యర్ల చేతుల్లో పడ్డాక టమాటా బాత్‌ అయిపోయీదంటే నమ్మండి. ఎన్నడూ పెద్దగా ఎరగని మసాలాదోశ, తైర్‌వడ, బోండా, పొంగలి మానోటికి అందీసీటప్పటికి లజ్జుగుజ్జులు పడిపోయీవాళ్లం.

మసాలాదోశలోకి కూర ఎలా చేరిందో, గారెలోకి పెరుగు మరెలా దూరిందో, బోండాలోకి  బంగాళాదుంప ఇంకెలా చొచ్చుకుపోయిందో.. బాపతు సందేహాలతో మా ఊరి ముసిలాళ్లు కొందరు అదోలా అయిపోయీవారు. చెట్నీ వ్యవహారమూ చిన్నది కాదు. కొబ్బరి చెట్నీ అంటే కొబ్బరికాయ పచ్చడే తప్పనిచ్చి శెనగపప్పు పెద్దగా తగిలీదికాదు. వేగిన ఉల్లిపాయతో చేసిన సరికొత్త చెట్నీ చేతులోకొచ్చేక ఎవరి మాట మేం వినగలవండీ. మేమెప్పుడూ ఎరగని రసం ఉండనే ఉంది. అవియల్‌, పొరియల్‌ సిద్ధమయ్యేయి. స్వీట్లు, డ్రింకుల సంసారం గురించి చెప్పాంటే మాటలు చాలవు. జాంగ్రీలు, బాద్‌షాలు, బాదంగీర్లు రాజ్యం చేసీవి. కవురుకంపు టీలు తాగిన మాకు అయ్యరుబాబులు కమ్మని కాఫీ కప్పులు నోటికందించేరు. మా కళ్లముందే కాఫీగింజలు మిషన్లలో ఆడి ఫిల్టర్లకెత్తీవారు.

వాళ్ల శుచి, వాళ్ల శుభ్రతా మామూలేంటి. పరిమళాలు వెదజల్లే ఊదొత్తులు వెలిగించేరు. పొందికయిన కుర్చీలు వేసేరు. పాలరాతి పలకలున్న ఒబ్బిడి టేబుళ్లు పరిచేరు. తళతళలాడే స్టీల్‌ప్లేట్లు మాముందుపెట్టేరు. అందుకే, మేవంతా నిత్యమూ అయ్యర్ల హోటళ్లమీదేమీదనే ఉండీవాళ్లం. ఆ దెబ్బకి ఊరి పాకావిలాసున్నీ విలాసం లేకుండా పోయేయి. మామూలుగానే ఎప్పుడూ ఈగలు ముసురుకునీ ఈ హొటేళ్లు, ఒక్కసారిగా దోమలు కూడా తోలుకోడం మొదలెట్టేయి. ఒక్కడంటే ఒక్కడూ వాటి మొహం చూసీవాడు కాదు. అరువిద్దామన్నా వచ్చీదాతాదైవం కనిపించలేదు. మరంచేతే, అనతి కాలంలోనే, వీటిని నడిపేవాళ్లంతా  నిలువూ నిపాతంగా నీరయిపోయేరు. అడ్డంగా మునిగిపోయేరు. చెట్టోపిట్టగా ఎగిరిపోయేరు.

అయ్యర్ల భోజనసామ్రాజ్యం ఊళ్లో ఆ విధంగా నాలుగైదు దశాబ్దాలు నడిచింది. ఒక్కరిగా వచ్చిన అయ్యరు బాబులు, వాళ్ల దేశాలెల్లి పెళ్లిళ్లు చేసుకుని అడ్డబొట్టు కామాక్షమ్మల్ని తీసుకొచ్చేరు. చిమ్మిలి ముద్దల్లాంటి విశాలాక్షమ్మల్ని తెచ్చుకొచ్చేరు. పిల్లల్ని మాత్రం మావూళ్లోనే కన్నారు. వాళ్లూ చోడవరం గుంటల్లో ఒకటయిపోయేరు.

తొలినాళ్లలో వచ్చిన అయ్యర్లు,  తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం కలగలిపీసీవారు. సంకరభాషగా పనగలిపీసీవారు. ఆ తర్వాత మాత్రం మన భాషా నేర్చీసేరు. అయినప్పటికీ వారి పలుకుల్లో అరవయాస, మయాళీ ఘోష కనిపించీది. వాళ్ల  పిల్లలు మా మధ్యలో పడ్డారు కాబట్టికి, ఏట్రా, గీట్రా అని మాలానే మాటాడీవారు. అలా హాయిగా సాగిపోతున్న అయ్యర్లకి పదిపదిహేనేళ్ల కిందటినించీ గొప్ప దెబ్బతగుల్తూ వచ్చీసింది.

ఎక్కడినుంచో వెళిపొచ్చీసిన వాళ్లెవరో ఆంధ్రాలో రాజ్యం చేయడమేంటని అనుకున్నారో.. తిండికి మించిన వ్యాపారం మరోటి ఉండదని తలపోసారో.. మనవాళ్లని తినే హక్కు మనకే ఉందని భావించారో..  మనకి తెలీదు.  కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్నించి ఎవరెవరో పరుగుల మీద మావేపు వచ్చీసేరు.  రియల్‌ఎస్టేట్‌ ధర్మమాని వాళ్ల ఊళ్లో ధరలు పెరిగిన ఊర భూములు కొన్నింటిని భారీ డబ్బుసంచుకి అమ్మీసుకున్నారు. భవిష్యత్తులో బాగుపడిపోతుందనుకున్న విశాఖపట్నం ప్రాంతానికి వెల్లువెత్తీసేరు. ఉత్తరం పత్తరం లేకుండా మా ఉత్తరానికొచ్చి పడిపోయేరు.

వచ్చినవాళ్లు పట్టణాలకే కాదు. పల్లెలకీ పాకీసేరు. వాళ్లకి డబ్బంటే భయం లేదు. రిస్కంటే రస్కంత ఇష్టం. అడ్డంగా సొమ్మొచ్చి పడిపోతే ఆలోచన సరళమైపోతుంది. ఇందువల్లే, ధనాన్ని వెదజల్లీగలిగేరు. నెల్లూరుమెస్‌ అన్నారు. బెజవాడహోటల్‌ అన్నారు. గూడూరుసదన్‌ అన్నారు. గుంటూరుగృహ అన్నారు. ఒంగోలు కాఫీహౌస్‌ అన్నారు. మెస్‌ మీద మెస్‌ పెట్టీసేరు. మెస్సు సంస్కృతి మాకు మప్పీసేరు. నీరు పల్లమెరుగు. నీరు లాంటిదే పెట్టుబడీను. దానికీ పల్లమే తెలుసు. పల్లంలోకి ప్రవహించి పదింతలు కావడమే తెలుసు. చోడవరం కూడాని పల్లంలోనే ఉంది కదేంటి.

మెస్సు వస్తాదులు వస్తూవస్తూ కొత్తరుచులు వెంటతెచ్చీసేరు. మా అయ్యర్లకి బొక్క బద్దలయిపోయింది. విజయవాడ ఉలవచారు ముందు చెన్నై సాంబారు చెదిరిపోయింది. గుంటూరు గోంగూర దెబ్బకి అవియల్‌ అయిపులేకుండాపోయింది. కృష్ణా పులుసుకూరలు హూంకరించీసరికి పొరియల్‌‌ పులిసిపోయింది. నెల్లూరు మొలకొలుకుల ముంగిట కళింగ హంస బియ్యాలు  కడదేరిపోయేయి. ఎర్రగా వర్రగా నోటికి తగిలే అల్లం పచ్చడి ముందర మద్రాసు శాకం చిన్నబోయింది. ఫ్రైకర్రీ ముఖం చూ సీసరికి అరవ కొబ్బరికూర హడలెత్తిపోయింది. చుక్కకూర పప్పు పుల్లపుల్లగా విరగబడ్డంతో అయ్యరుగారి ముద్దపప్పు ముణగదీసుకుపోయింది. చివరాఖరికి, చవులూరించే సరికొత్త పాకం ముందు పాల్ఘాట్‌ పడకేస్సింది.  అయ్యర్లు వెజిటేరియన్లు. మెస్సుయితే నాన్‌ వెజ్జూ వడ్డించగవు. అయ్యర్లకి అరువివ్వడం భయం. మెస్సులు అరువు ఇవ్వాగగలవు.  అరిచి రిచి వసూలు చేసుకోనూగలవు. దానాదీనా, ఊరి జనం నాలుకలన్నీ కొత్తవేపు మొగ్గుచూపించేయి. మా అయ్యర్ల హోటళ్లన్నీ బోసిపోయేయి. లాభం లేకపోతే పోయే. నష్టాలు తగులుకోడం మొదలయ్యింది.

మావూళ్లో అయ్యర్లు ఎంత సంపాదించుకున్నా ఎప్పుడూ గజం భూమి  కొనలేదు. మెస్సు మారాజులు అలా కాదు. రూపాయొచ్చినా స్థలాలే కొనీవారు. మజ్జిగచార్లు గట్రా మాచేత మట్టసంగా తాగించీసి, మాభూములే క్రయిచీటిలు రాయించీసుకునీవారు. ఇంకోమాట ఏంటంటే, అలగ.. ఇలగ.. ఎలగ..  అని మాట్లాడే మా సొంత మాటలకి బదులుగా, అట్టాగ.. ఇట్టాగ.. ఎట్టాగ.. అని మేవందరూ కొత్త పలుకు నేర్చడమూ ఆ మహానుభావుల పుణ్యమే. వాళ్ల తెలివితేటలకి, వ్యాపారదక్షతకి మోకరిల్లిపోయి, ఆ మాటలే అసలైన తెలుగుభాషని మావూళ్లో చాలామంది అనుకోపోలేదు కూడాను.

తమ హోటళ్లు ఆకులు నాకి పోతూ, మెస్సులన్నీ కస్టమర్లతో కళకళలాడిపోతున్న తరుణంలో, దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే తత్వంగల అయ్యర్లకి లైటు వెలిగింది. చోడవరంనించి పొందింది చాలనుకుంటూ తమ సొంత ప్రదేశాలకు ప్రయాణాలు కట్టీయాలని నిర్ణయించీసుకున్నారు. మెల్లగా దుకాణాలు మూసీసి, వచ్చినంతకే కుర్చీలు, బెంచీలు మెస్సుల వాళ్లకే అమ్మీసుకుని బయలెల్లిపోడం ఆరంభించేరు. ఎక్కడ చదువుతున్న పిల్లల్ని అక్కడే ఉద్యోగా లు చూసుకోమన్నారు. లేదా వ్యాపారాలు పెట్టుకోమన్నారు. చదువూసంధ్యాలేని కుర్రాయిల్ని   చోడవరంలోనే తగలడమన్నారు. వాళ్లిక్కడే గంతకి తగ్గ బొంతల్ని లవ్‌మేరేజ్‌లు గట్రా చేసుకుని మెస్సుల్లోనే సూపర్‌వైజర్లుగా, వెయిటర్లుగా స్థిరపడిపోయేరు. పూలమ్మినచోట కట్టెలమ్మడమూ ఒక కళే అనీసుకున్నారు.

చోడవరం నుంచి ప్రయాణం కట్టిన కొందరు ముసలి అయ్యర్లు ఓపికలు పోయి, మోకాళ్లు వీకయిపోయి, ఉన్నదేదో బ్యాంకులో వేసీసుకుని, కంచి కోవెల్లో పూజార్లయిపోయేరు. మరికొందరేమో పాల్ఘాట్‌ వెళ్లిపోయి  కాఫీగుండ దుకాణాలు తెరుచుకున్నారు. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు ఒక్కటంటే ఒక్క అయ్యరు హోటలూ మావూళ్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అయితే,  ఒకటి మాత్రం నిజం. పాకావిలాసుల్ని అయ్యర్లు సాగనంపీగలిగేరు. అయ్యర్లని మెస్సులు తగిలీగలిగేయి. కానీ, మెస్సుల్ని దారిపెట్టీడం మటికి అంత సులువుకాదు. అలుణ్ని బలుడు కొడితే, బలుణ్ని బ్రెమ్మదేవుడు కొడతాడంటారు. అలాంటిదేదో జరగాలంతే..!

*

 

 

మీ మాటలు

 1. Satyanarayana Rapolu says:

  “పాపం పాకా విలాస్” చోడవరం కేంద్రంగ గ్లోబలైసేషన్ పరిణామం! ఎంత చక్కని కథనం!!

 2. కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకు పొడాన్ని చక్కగా అనవవసరపు కన్నీళ్లు కలపకుండా చూపారు చాలా బాగుంది ధన్య vaadaalu

 3. Merusomayajula phani kumar says:

  Srinivas rao gaari papam paakavilas chala bagundi. Swardha prayojanalatho kudina mess vyaparalu. Mess tho modalu petti real estate varaku paake vidhanam ippudu chaala chotla chustunnade.

 4. సీనూ … కథ బాగుంది.
  ఇప్పుడర్థమైంది – నీకింత దేహ దారుఢ్యం ఎక్కడదా అని ఇన్నాళ్లు తెగ గింజుకున్నాను. అడక్కుండానే చెప్పీసేవు సుమా :) ఏటి … చోడవరంలో కనిపించిన హోటళ్లన్నీ తిరిగీసి అన్నీ లాగించీసి నట్టున్నావు.
  అయ్యర్లే కాదు , మార్వాడీలు భూములు కొన్న దాఖలాలు లేవెక్కడానూ – సుబ్బరంగా మనల్ని దండుకొని పోవడమే – అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి – అయ్యర్లు , మార్వాడీలు కష్ట జీవులు. మనలా పీకల్దాకా తినీసి తొంగునే రకం కాదు.

 5. yerra nageswararao says:

  స్ అలియాస్ రియల్ ఎస్టేట్ ఉరఫ్ వలసబాబు కళింగాంధ్రను ఎలా కాల్చుకు తింటున్నారో చెప్పే కథ. శ్రీనివాసరావుకు వందనాలు.

మీ మాటలు

*