కలెబడె కవి అలిశెట్టి  

 

వులు, రచయితలు, కళాకారుల్ని బతికున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత మాత్రమే గౌరవించడమనేది ఇవ్వాళ తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని పీడిస్తున్న జాఢ్యం. సరే కనీసం చనిపోయిన తర్వాతైనా పట్టించుకుంటున్నారన్నది కొంత సంతృప్తి ఇచ్చే విషయం. అయితే ఈ పనిని వారి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఎక్కువగా చేస్తున్నారు. కానీ కవి, రచయిత తాను జీవితకాలం ఏదైతే సంస్థతో అసోసియేట్‌ అయి వున్నాడో ఆ సంస్థలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. సమగ్ర రచనలు ప్రచురించకున్నా కనీసం జయంతి, వర్దంతులు కూడా నిర్వహించడం లేదు. ఇది ఏదో ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని చెబుతున్న విషయం కాదు. అన్ని సంస్థలు అట్లానే ఉన్నాయి. అరసం, విరసం, తెరసం ఏ సంఘమైనా కానివ్వండి అన్నీ అలానే వ్యవహరిస్తున్నాయి. ఇందులో కొంత విస్మరణ, మరికొంత వివక్ష, ఎక్కువగా నిర్బధ్యాత ఉన్నది. బాధ్యతగా భావించి గౌరవించాల్సిన ప్రభుత్వాలూ ఈ విషయంలో ‘సెలిక్టివ్‌’గా వ్యవహరిస్తున్నాయి.  ఈ వివక్ష, విస్మరణ ఇవ్వాళ 63వ జయంతి, 24వ వర్ధంతిని జరుపుకుంటున్న అలిశెట్టి ప్రభాకర్‌ విషయంలోనూ జరిగింది.

అభ్యుదయ రచయితల సంఘానికి ఆయువు పట్టుగా నిలిచి, నడిపించిన తాపీ ధర్మారావు సమగ్ర రచనలు ఇప్పటికీ తెలుగు పాఠకులకు ఒక్క దగ్గర అందుబాటులో లేవు. అలాగే విద్వాన్‌ విశ్వం రచనలు కూడా సమగ్ర సంపుటాలుగా అందుబాటులో లేవు. ఆళ్వారు స్వామి రచనలు సమగ్ర సంపుటంగా వెలువడలేదు. (తెలుగు అకాడెమీ ప్రచురించినా ఆ సంపుటం అసమగ్రం). వీళ్ళు పేరుకు మాత్రమే. ఇలాంటి సాహితీవేత్తలు ఎంతోమందివి సమగ్ర సంపుటాలు రావాల్సి ఉన్నవి. మరోవైపు పొట్లపల్లి రామారావు రచనల్ని భూపాల్‌ సాయంతో ఆయన కుటుంబ సభ్యులు వెలుగులోకి తెచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపన నాటి నుంచి చనిపోయే వరకూ దాంట్లో భాగమైన కె.వి.రమణారెడ్డి రచనల్ని ఆయన కుటుంబ సభ్యులు వరుసగా ప్రచురిస్తున్నారు. అలాగే అలిశెట్టి ప్రభాకర్‌ రచనల్ని సమగ్ర సంకలనంగా ఆయన మిత్రులు నర్సన్‌, నిజాం వెంకటేశం, జయధీర్‌ తిరుమలరావు తదితరులు పూనుకొని వెలువరించారు. ఇందులో ఇంకా సిటీలైఫ్‌లో భాగంగా వెలువడ్డ కొన్ని కవితలు జోడించాల్సి ఉంది.

జీవిత కాలం సేవ చేసిన సంస్థలే పట్టించుకోకపోవడమనేది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్నది కాదు. ఆది నుంచి ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. 1953కు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ రచయిత సంఘం ఏర్పడింది. దీని ద్వారా ఎక్కువగా సంస్థ బాధ్యులైన దాశరథి, నారాయణరెడ్డిల స్వీయ ప్రచురణలే ప్రచురితమయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారి రచనలు వీళ్లు వెలువరించలేదు. దీని వల్ల ఆయన రచనలు సమగ్రంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఆ యా సంఘాల తరపున దాని బాధ్యుల స్వీయ రచనలు అప్పుడూ వెలువడ్డాయి. ఇప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్నాయి. అయితే తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసిన వెలుగుల రచనలన్నీ ఒక్క దగ్గర లేక పోవడం మూలంగా సాహిత్య చరిత్రకూ, సాహితీవేత్తలకు, సృజనకారుకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన గౌరవం నుంచి వాళ్ళు వంచితువులతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కొంతమంది విస్మ ృతుల్ని, వారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో జోడించాని ప్రయత్నించినపుడు అవి అందుబాటులోకి రాలేదు. దీనివల్ల వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయాం. అయితే అలిశెట్టి రచనలన్నీ ఒక్క దగ్గర ఉండడం మూలంగానే ఆయన రచనని పాఠ్యాంశంగా నిర్ణయించడానికి వీలయింది.

నిజానికి అలిశెట్టి ప్రభాకర్‌ 1993లో చనిపోతే 2013 వరకూ ఏ సంస్థా ఆయన మీద సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క విప్లవ రచయిత సంఘం మాత్రం ఆయన మరణానంతరం ‘మరణం నా చివరి చరణం కాదూ’ పేరిట చిన్న కవితా సంపుటిని వెలువరించింది. (అంతకు ముందు అలిశెట్టి తన సిటీలైఫ్ ని అచ్చేసి దాని ద్వారా వొచ్చిన డబ్బుని చెరబండరాజు చికిత్సకు అందించిండు) అయితే నర్సన్‌, నిజాం వెంకటేశం, దాసరి నాగభూషణం, వి.సామ్రాట్‌ అశోక్‌, గుండేటి గంగాధర్‌ ఇంకొంతమంది 2012 జనవరిలో అలిశెట్టి ప్రభాకర్‌ సంస్మరణ పెట్టేవరకు లబ్ధప్రతిష్టులైన ఆయన మిత్రులెవరికీ ఆయన స్మరణలో లేడు. బతికున్నప్పుడంటే తమకు పోటీ అవుతాడు కాబట్టి అలిశెట్టిని విస్మరించారు అనుకోవచ్చు. కానీ చనిపోయాక…అదీ 20 ఏండ్ల వరకూ ఆయన రచనలేవీ అందుబాటులో లేవు అంటే అలిశెట్టిని కవిగా ఖతం చేయడమే! ఇదే కాలంలో శ్రీశ్రీ రచనలు సమగ్ర సంపుటాలుగా విరసం, మనసు ఫౌండేషన్‌ వాళ్ళు ప్రచురించారు. అట్లాగే ఇప్పటికీ ఎవరో ఒకరు మహాప్రస్థానం ప్రచురిస్తూనే ఉన్నారు. ‘కవి’ అనే రెండక్షరాలతో ఇద్దరినీ పోల్చడం కాదు గానీ అలిశెట్టి కవిత్వం ఒక్కసారి చదివితే చాలు నిద్రాణంగా ఉన్నవాణ్ని సైతం నినాదమై మేల్కొల్పుతుంది

ఈ మేల్కొలుపు కవిత్వానికి పునాది జగిత్యాలలో పడింది. అలిశెట్టి 1974 నుంచి కవిత్వం రాస్తున్నా, 1978 జగిత్యాల జైత్రయాత్రలో ఔట్‌సైడర్‌గానే ఉన్నడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ కవుల రచనలు అతి తక్కువగా పత్రికల్లో  ప్రచురితమయ్యేవి. అడపా దడపా దాశరథి, సి.నారాయణరెడ్డి రచనలు మాత్రమే పత్రికల్లో అచ్చయ్యేవి. అయితే ఈ స్థితిని అధిగమించేందుకు తెలంగాణలో కొంత ప్రయత్నం అన్ని జిల్లాల్లో జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల కేంద్రంగా బి.నర్సన్‌, గంగాధర్‌, రఘువర్మ, ధరన్‌ బాబులు పత్రికల వారికి ప్రత్యామ్నాయంగా కవితా సంకలనాలు తీసుకురావాని సంకల్పించారు. అందుకే తామే సొంతంగా వివిధ ప్రాంతాల్లోని కవులకు ఒక వేదికగా ‘సాహితీ మిత్ర దీప్తి’ ని ఏర్పాటు చేసిండ్రు. దీని ద్వారా దీప్తి, చైతన్య దీప్తి తదితర ఐదు కవితా సంపుటాలు వెలువరించిండ్రు. ఇందులో రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వారి కవిత్వంతో పాటు తెలంగాణాకు చెందిన రామాచంద్రమౌళి, నందిని సిధారెడ్డి లాంటి ఆనాటి యువ కవుల కవిత్వం కూడా చోటు చేసుకునేది. ఈ కవితా సంపుటాల ప్రచురణ, నిత్య కవితా పఠనం, సాహితీ మిత్ర దీప్తి దోస్తానా అలిశెట్టిని కవిగా నిలబెట్టింది. అందుకు ఆయన ఎదిగొచ్చిన సమాజం, ఎదుర్కొన్న ఒడిదొడుకులు పాఠాలను నేర్పాయి. ఏదైనా పని ముందటేసుకుంటే దాని అంతు చూసే వరకూ, లేదా సమస్యకు పరిష్కారం కనుక్కునే వరకు దాంట్లోనే మునిగిపోయేవాడు. అందుకే తాను చూస్తున్న సమాజంలోని రుగ్మతలకు వెంటనే రియాక్ట్‌ అయ్యేవాడు.

నిజానికి 1970 నుంచే దొరలు, భూస్వాములు నక్సలైట్‌ ఉద్యమం రూపుదిద్దుకోవడాని కన్నా  ముందే తమ పిల్లల చదువు కోసం గ్రామాల నుంచి పట్టణాల బాట పట్టిండ్రు. దాదాపు ఇదే సమయంలో అప్పటికే పట్టణ ప్రాంతాల్లోని బీసీలు మొదటిసారిగా టీచర్‌, క్లర్క్‌ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిండ్రు. అట్లాగే ఉత్తర తెంగాణలోని రైల్వే ట్రాక్‌ వెంబడి ఉన్న పట్టణాల నుంచి సింగరేణికి వలసలు పెరిగినయి. ఈ కాలంలోనే అలిశెట్టి ప్రభాకర్‌ తండ్రి చినరాజం టీచర్‌గా పనిచేసేవాడు. ఆయన అలిశెట్టికి 15 ఏండ్ల వయస్సున్నప్పుడు చనిపోయిండు. అప్పటి నుంచి అన్నీ తానే అయి తల్లి లక్ష్మి పెంచింది. నిజానికి అప్పటికీ ఇప్పటికీ జగిత్యాలో పద్మశాలీలది పెద్ద జనాభా. ఎక్కువ మందికి బీడీల్జేసుడే వృత్తి. ఈ దశలో తాను పుట్టినప్పటినుంచి ఉన్న జగిత్యాల పట్టణానికి చుట్టు పక్కల గ్రామల నుంచి వలసొచ్చిన వెలమ దొరలు, వాళ్ళ కొడుకుల దబాయింపు, అజమాయిషీని, ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక ప్రతిఘటించేవాడు. వాళ్ళ విచ్చలవిడితనం కూడా అలిశెట్టిని ప్రశ్నించేలా చేసింది. పిట్టపిల్ల కాయమైనా భౌతికంగా దాడిచేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అందుకే అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో ఇలా సాగుతుంది.

‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు

ఊరంతా పాలేర్లే

వాళ్ళే

ఊరినించి తరిమికొడితే

నీ బ్రతుకంతా పల్లేర్లే’’

అని దొరలను హెచ్చరించిండు. అలాగే నిరుద్యోగం గురించి..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు’’ అన్నడు. కవిత్వంలో రాజకీయాన్ని చీల్చి చెండాడిండు. తెలుగులో ఇంత పదునుగా రాజకీయ`కవిత్వం అల్లినవాళ్ళు అరుదు.

‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ

అవకాశవాది ‘రూలుకర్రా’

‘ఆరణాల కూలీ’

‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’

వరుసగా ఎవరెవరు ముఖ్యమంత్రులైనా

ఇరవైనాలుగ్గంటలు కుట్ర ఇంకొకడ్ని ప్రమాణ స్వీకారం

చేయించినా-

అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని అంజయ్య, చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల ముసుగుల్ని తొలగించిండు. వాళ్ళ ఆరాచకాల్ని చిత్రికగట్టిండు.

జగిత్యాలో ఉన్న సమయంలో అలిశెట్టి కవితలు రాయడం, పోస్టు చెయ్యడమే పనిగా పెట్టుకున్నడు. తాను అనుభవించిన పేదరికం, దగ్గర నుండి చూసిన అణగారిన వర్గాల వెతలే అక్షరాలుగా తెలుగు నేలంతా అలికిండు. ఆ పంట నుంచి ఒక్కసారైనా బువ్వ తినని కవులు లేరంటే అతిశయోక్తి కాదు. తన కవిత్వంలో మహిళల పట్ల ప్రేమ, ఆర్తిని కలగలిపిండు. కైగట్టిండు. దళిత, ముస్లిం, చేనేత, గౌడ బతుకుల వెతలను రాసిండు. రైతు, కార్మికుడు, విద్యార్థి, ఇలా అందరి గురించీ రాసిండు. నిత్య చైతన్యంతో ఎదిగి వచ్చిన ఒక తరానికి తన రాజకీయ కవిత్వాన్ని సమాజాన్ని శస్త్ర చికిత్స చేసేందుకు ఇన్స్‌ట్రుమెంట్సుగా ఇచ్చిండు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఛిధ్రమౌతున్న సమాజాన్ని, అడుగంటుతున్న మానవీయ విలువల్ని హృదయంతో చూసిండు. రక్తంతో రాసిండు. అందుకే కవిత్వమంటే ఏమిటో తాను 1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం  ‘ఎర్రపావురాలు’ లో

‘‘నా గుప్పిట్లో

మండుతున్నా

ఎన్నో గుండెలు …

ఒక్కొక్కదాన్లో

దూరి,  వాటిని చీరి ,

రక్తాశ్రువులు ఏరి

పరిశీలిస్తాను నేను’’ అన్నాడు. ‘’వర్తమానానికి భావితవ్యానికీ నడుమ // ప్రగతి వంతెన కట్టాలని అనుక్షణం// పరితపిస్తున్నాను అని రాసిండు .

పేదరికం, ఆకలితో సహవాసం చేయడాన్ని అలవాటు చేసుకున్నడు. నిరుద్యోగం, నగర జీవితం గురించి రాసిండు. మెజారిటీ ప్రజల బాధలూ గాధలే తన కవిత్వానికి ముడి సరుకని చెప్పుకున్నడు. ‘గొర్రె మందతో నడిచేకంటే.. చీమల బారులో చేరితే మేలు’ అనే సోయున్నవాడు. ‘కవిత్వం, జీవితం’ రెండూ వేర్వేరు కావని కవమనమల్లినవాడు. భావజాల వ్యాప్తికన్నా బాధితుల గుండె చప్పుడు వినిపించడానికే ఎక్కువ ఇష్టపడ్డడు. ఆఖరి వరకూ ఆత్మాభిమానంతో ఉన్నడు. అందుకే

‘‘చితికి…చితికి…చివరికి

పత్రిక పారితోషికమే జీవనాధారంగా

స్వీకరిస్తున్న నేపథ్యంలో

హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు

చెప్పుకోనివ్వండీ’’

అని రాసిండు.  సామాజిక స్పృహ ఉన్నవాడు కాబట్టే

‘‘గడ్డ కట్టిన కారంచేడు నెత్తుటి మడుగులో

అగ్రవర్ణాల అహంకారపు గొడ్డళ్ళు మునిగి

ఉపరితలమ్మీద

ఆరుగురి  హరిజనుల శిరస్సులు మొలిచి

హాహాకారాలు చేస్తుంటాయ్‌’’ అన్నడు.

అలిశెట్టి ప్రభాకర్‌ అర్దాంతరంగా ప్రయాణం ముగించినా… ఆయన వేసిన దార్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఈ దారుల్లో కొంతమంది ‘టేక్‌ డైవర్షన్‌’ అని కొత్తగా బోర్డులు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నవారూ ఉన్నరు. నిజానికి ఆయన గ్రామాల నుంచి నగరానికి దారులు వేసిండు. అక్షరాల్లో ‘సిటీ లైఫ్‌’ని చిత్రించిండు. అన్యాయం ఎక్కడ కనబడ్డా అక్షరాలనే గొడ్డళ్ళుగా చేసిండు. ఇవ్వాళ ఆయన్ని, ఆయన రచనల్ని ఆలింగనం చేసుకునే  సంస్థలు బాధ్యులూ ఎన్నడూ అలిశెట్టి కుటుంబం గురించి ఆలోచించలేదు. 1993లోనే కొంతమంది తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ మిత్రులం ఆనాటి తెలుగు యూనివర్సిటీ వీసీ సి.నారాయణరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి అలిశెట్టి అర్ధాంగి భాగ్యకు అటెండర్‌ ఉద్యోగమైనా ఇప్పించాం. ఇన్నేండ్లూ కంటెజెన్సీగానే కొనసాగుతున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి, ఉండేందుకు ఇంత నీడ కల్పించాల్సిన అవసరమున్నది.

 

 

మీ మాటలు

  1. Praasadamurty says:

    Really a great poet. Both telugu govts should celebrate his birthday

  2. కందికొండ says:

    సంగిశెట్టి అన్న గారికి ధన్యవాదాలు అలిశెట్టి గురించి గొప్ప వ్యాసం రాశారు అలిశెట్టిది చాలా శక్తివంతమైన కవిత్వంకాని… అలిశెట్టి కి రావలసిన గుర్తింపు రాలేదు అందుకు కారణం తను సబ్బండ కులంలో పుట్టడం ఓ కారణం తెలంగాణ వాడు కావడం మరో కారణం కావచ్చు శ్రీశ్రీ కవిత్వానికి అలిశెట్టి కవిత్వం ఏమాత్రం తక్కువ కాదు… కొంచెం ఎక్కువే అనడంలో అతిశయోక్తి లేదు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి అలిశెట్టి సతీమణి bhagyalaxmi అక్క ను ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఉంది , ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తించకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది

  3. కందికొండ says:

    మరణం నా చివరి చరణం కాదు
    మౌనం నా చితాభస్మం కాదు
    మనోహరాకాశంలో విలపించే చంద్రభింభం
    నా అశ్రుఖణం కాదు
    నిర్విరామంగా నిత్యనూతనంగా
    కాలం అంచున చిగురించే నెత్తుటి ఉహను నేను
    కలల ఉపరితలమ్మిద కదలాడే కాంతి పుంజం నేను
    కన్నీళ్ల కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను
    అగ్ని పద్యం నేను దగ్ద గీతం నేను అక్షర క్షిపణి నేను
    ఆయుదాలుగా ర్రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను
    అడవి నేను కడలి నేను
    ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
    అజ్ఞాతంగా అంతర్లీనంగా
    మట్టిపోరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను
    శుస్కీంచిన పల్లెనుంచి శిథిలమైన బతుకునుంచి
    శూలమైన చూపునుంచి
    పరాదినమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన
    మంటల జెండాల జాతర నేను మందు పాతర నేను
    లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి
    నేను
    సంపదల సమతుల్యం కోసం
    దోపిడీ వటవృక్షాన్ని నేల కూల్చే సైనికుల సారథ్యం నేను
    చరిత్ర పుటపై చెక్కిన చెక్కు చెదరని సత్యం నేను
    హింసకు ప్రతి హింసవు నేను
    హిట్లర్ హిరణ్య కశుపుల ద్వంసం నేను
    ఈ దీర్ఘ కాలిక యుద్ధ వ్యూహంలో
    పిడితుడే నా అస్త్రం అన్వస్తరం
    శత్రువు నా పాధ ధూళి……

    అని ప్రకటించిన అలిశెట్టి ప్రభాకర్ ఈ ఒక్క కవిత చాలు తన కవిత్వం తాకత్ ఏంటో చెప్పడానినకి జోహార్ అలిశెట్టి….

  4. కూకట్ల తిరుపతి says:

    అలిశెట్టిని గురించిన సంగిశెట్టి వ్యాసం బాగుంది

మీ మాటలు

*