ఉత్తమ నటనకు చిరునామా – ఓం పురీ

  

ఓం పురీ  వెళ్ళిపోయాడు.

66 ఏళ్ల వయసుకే కొంపమునిగిపోయినట్టు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుండెపోటు… ఒంటరిగా తన అపార్ట్ మెంట్ లో మరణం.

ఓం పురీ నటనలో ఊసరవెల్లి లాంటివాడు.

అనంత్ వేలంకర్ గా (అర్థ సత్య)… ఉన్నాడు.  హరి మండల్ (ఆరోహణ్) గా అబూ మియా గా (మిర్చ్ మసాలా) ఉన్నాడు. అహుజా గా (జానే భీదో యారో) ఉన్నాడు. దుఖీ గా (సద్గతి), భిక్కూ గా(ఆక్రోశ్) ఉన్నాడు. దుర్యోధనుడు, రాజరాజ చోళుడు ఇంకా ఎందరెందరో చారిత్రక పురుషులు (భారత్ ఎక్ ఖోజ్) గా ఉన్నాడు.  నాథూ (తమస్ టీవీ ఫిల్మ్) గా ఉన్నాడు. ఇంకెన్నో సినిమాల్లో ఎందరెందరుగానో ఉండిపోయాడు.   ‘భారత్ ఎక్ ఖోజ్’ లో తన నిండైనగొంతుతో అతనిచ్చిన కామెంటరీ మరపురానిది.

ఎందరెందరి వ్యక్తిత్వాలలోనో తనని తాను లీనం చేసుకుని, ఆ కష్టాలూ అనుభవాలూ తనవి చేసేసుకుని సినిమాల్లో ఆవిష్కరించాడు. ‘Method Acting’ నుంచి తరచి చూశాడు.  Method Actors నటించరు. పాత్రలోకి ప్రవేశం చేసి, ఆటుపోట్లన్నీ అనుభవిస్తారని సాధారణంగా అనుకునే మాట.

“ముంబైకీ ఫిల్మ్ ఫీల్డ్ కు తనను బలవంతం చేసి రప్పించినందుకు  నాకే ఆ క్రెడిట్ ఇచ్చాడు. అది నాకు బాగానే ఉందిగానీ నిజానికి తనని ఎవరూ తీసుకు రావక్కర్లేదు. స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాలా లో పని చేస్తూ ఉండిపోయినా సరే, సినిమాలు అతన్ని వెదుక్కుంటూ వచ్చేవి” – నసీరుద్దీన్ షా.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు షా కొంచెం అల్లరిగా ఉంటూ నటనను తేలిగ్గా తీసుకునేవాడట. శ్రద్ధగా నేర్చుకోవటం మీదే దృష్టిపెట్టే ఓం పురీ ని చూస్తుంటే తమాషాగా ఉండేదట.  ఒకసారి అక్కడ ‘కబుకీ’ నాటకం వేస్తున్నారని తెలిసి తానూ అందులో వేద్దామని ఉత్సాహపడ్డాడట. కానీ తనకు అవకాశం రాలేదు. ‘ఇబరాగి’ అనే ఆ కబుకీ ప్లే లో జపాన్ యోధుడిగా ఓం పురీని చూశాక  అతని మీద ఉన్న ఈర్ష్య పోయి, ఆరాధించే స్థాయికి వచ్చానని చెప్తాడు. స్కూల్ ఆఫ్ డ్రామాలో వేసిన తన నాటకాలు ఏవీ ‘ఇబరాగి’ లో ‘ఓం’ చేసిన అభినయానికి కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాయని ‘షా’ తన ఆత్మకథ ‘And Then One Day – A Memoir లో  చెప్తాడు.

ఓం పురీ బిడియస్తుడు.

Method Actors, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అందరి జీవితాలూ జీవిస్తూ, వాటిని తట్టుకుంటూ బయటపడాలంటే తప్పనిసరిగా కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందేమో.  కానీ అతని కుటుంబజీవితం సరిగ్గా లేదు.

జర్నలిస్ట్ నందితా ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. నందిత ఓంపురి జీవితకథను రాసింది. తనగురించి ఏవేవో రాసేసిందని బాధపడిపోయాడు. అవసరం లేదు. నసీరుద్దీన్ షా లాగా బతుకు పుస్తకాన్ని తెరిచిపెట్టి, తనను చూసి తాను హాయిగా నవ్వుకోనూ వచ్చు. నవ్వుకోలేదు. బాధపడి పోయాడు. నందితతో విడిపోయి మూడేళ్ళయింది.

ఓం పురీ ధైర్యస్తుడు.

స్ఫోటకం మచ్చలతో పీలగా ఉన్న తను,  చెయ్యీ కాలూ సరిగ్గా ఎలా కదపాలో తెలియకపోయినా మంచి రూపాలే పెట్టుబడిగా సినిమాల్లోకి దిగిన హీరోల పక్కన బతకగలనని అనుకోవటానికి ఎంత ధైర్యం ఉండాలి!  ఎన్. ఎస్. డీ లో మంచి పేరు తెచ్చుకున్నా,  మధ్యమ స్థాయిలో ఉన్న చక్కటి స్వరం ఉన్నా, రూపం కారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇతనికి నటన విభాగంలో చేరటం కష్టమైంది. గిరీష్ కర్నాడ్ జోక్యంతో సీట్ వచ్చింది.  ఇంతగా నటన ఊపిరైపోయిన ఈ పంజాబీ కుర్రాడికి రెండు ప్రిమియర్ ఫిల్మ్ స్కూల్స్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చుట్టివస్తే గానీ నటనలు నేర్చే దాహం తీరలేదు. నేర్చిన నటనకు సార్ధకతను ఇవ్వటానికి అదృష్టంకొద్దీ  సమాంతర సినిమా అనే మంచి చోటు దొరికింది.  ఆ సినిమాలవి అసలే కుదించుకున్న బడ్జెట్ లు. ఏవో కొంచెం డబ్బులు పారేసి (ఇది ఓం పురీ చెప్పిన మాటే)  తనను ఆ సినిమాల్లో వేయమంటే వేసి, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా బతుకుతున్నాడో లెక్క చెయ్యకుండా గడిపిన కాలంలో మెచ్చుకోళ్ళూ అవార్డులే ముందుకు నడిపించాయి.  హాలీవుడ్ లో అడుగుపెట్టాకే  సంపాదన బాగా పెరిగింది.

ఓం పురీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే శక్తి తనకు అబ్బురంగా అనిపించేవని అంటాడు మిత్రుడు నసీరుద్దీన్ షా. స్మితా షబానాల లాగే నసీర్ ఓం పురీల పేర్లు విడదీయలేనివి. నటనలో స్పర్ధతో పాటు ఆకలినీ ఆనందాలనూ కలిసి పంచుకున్న మిత్రులు ఇద్దరూ.

 

ఓం పురీ  ఒక అనంత్ వేలంకర్ 

హిందీ సినిమాలో అప్పట్లో Angry Youngman మూసనొక దాన్ని చేసి సలీం జావేద్ లు అమితాబ్ బచ్చన్ కు తొడిగారు. కానీ అసలైన Angry Youngman ఎలా ఉంటాడో ఎలాంటి పరిస్థితుల్లో తయారౌతాడో మొదటిసారి చూపించాడు గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’లో. జనం బాగా చూసిన సినిమా అది.  అనంత్ వేలంకర్ ఒక పోలీస్ కొడుకు. పీలగా బలహీనంగా ఉన్న అతని తల్లిని బలిష్టంగా ఉన్న తండ్రి కొడుతుంటాడు. కొడుకును కూడా పోలీస్ ఫోర్స్ లో చేరమని బలవంతం చేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనంత్ తండ్రి లాగ తను జీవితంలో ఎప్పుడూ ఎవరిమీదా జులుం ప్రదర్శించకూడదని అనుకుంటాడు. అందులో చేరిన ప్రతి ఒక్కరినీ ముందు మొరటుగా మార్చిపడేసే పోలీస్ డిపార్ట్మెంట్ బలం ముందు అనంత్ ఎంతపాటి వాడు?

 

“చక్రవ్యూహంలోకి అడుగు పెట్టకముందు నేనెవరిని?ఎలా ఉండేవాడిని?

గుర్తేలేదు.

దానిలోకి వెళ్ళేకగానీ దానికీ నాకూ ప్రాణం తీసేంత దగ్గరితనం ఉందని తెలియనేలేదు.

ఈ చక్రవ్యూహంలోంచి బయటపడితేనే నేను విముక్తుడినౌతాను.

అయితేమాత్రం? చక్రవ్యూహ రచనలో ఏం తేడా వస్తుంది గనుక?”

ఇదీ అనంత్ వేలంకర్ అస్తిత్వ వేదన.

ఓం పురీ అనంత్ వేలంకర్నీ అతని వేదననూ తనమీదికి ఆవాహన చేసుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో, టీవీ ఫిల్మ్స్ లో, వేరే దేశాల సినిమాలూ టీవీలలో నటించి మెప్పించాడు. నాటక రంగాన్ని ఎంతో ప్రేమించాడు. తెలుగులో కూడా ‘అంకురం’ సినిమాలో అతను వేసిన ‘సత్యం’ రోల్ చాలామందికి గుర్తుండే వుంటుంది.  ఏ పాత్రలో వేసినా అది ఏ ప్రాంతానికి సంబంధించినదైనా ఏ భాషా చిత్రమైనా, అక్కడి సాంస్కృతిక నేపధ్యానికి అనుగుణంగా అన్నీ కూలంకషంగా తెలుసుకుని నటించేవాడు.  పోచంపల్లి నేతపనివాళ్ళ మీద శ్యాంబెనెగల్ తీసిన ‘సుస్మన్’ లో నేతగాడుగా ఆవిర్భవించాడు. అప్పట్లో నేతపని నేర్చేసుకుని మరీ నటించాడు. అవన్నీ ఒకెత్తు. ‘అర్థసత్య’ ఒకెత్తు. చిన్నపాత్ర వేసినా ప్రధానపాత్రలో కనిపించినా, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నటించాడు.

తానెంతో ప్రేమించిన నటనతో కలిసి చివరిదాకా నడిచాడు కానీ అర్థాంతరంగా జీవితనాటకం నుంచి నిష్క్రమించాడు ఓం పురీ.

–ల.లి.త.

 

 

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’ సినిమాలోని అనంత్ వేలంకర్ పాత్రలో జీవించిన ఓం పురీ ప్రేక్షకులకి కలకాలం గుర్తుంది పోతారు. అలాగే ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ తీసిన హిందీ సినిమా ‘మాలామాల్ వీక్లీ’ లో హాస్య రసాన్ని అద్భుతంగా పండించారు ఓం పురీ. రిచర్డ్ అటెన్‌బరో “గాంధీ” సినిమాలో నాలుగు నిముషాల నిడివి కూడా లేని ‘నహారి’ పాత్రలోనూ ఓం పురీ తళుక్కుమని మెరుస్తాడు.

    ఉత్తమ వ్యాసాలకు చిరునామా అయినా లలిత గారికి ధన్యవాదాలు. ( గౌతమ్ ఘోష్ … ‘మా భూమి’, గద్దర్, బండెన్క బండిగట్టి పాట … అంటూ మరోసారి నస పెట్టొచ్చో లేదో )

    • Lalitha P says:

      థాంక్ యు. మీరన్నట్టు హాస్యాన్ని అనాయాసంగా వెదజల్లాడు ఓం పురీ. మాభూమి, బండెన్క ఒక చాలా ముఖ్యమైన డాక్యుమెంటరీ లాంటి సినిమా. కానీ సరిగ్గా దొరకక రాయలేకపోతున్నా. కొన్ని అప్పటి ముఖ్యమైన సినిమాల ప్రింట్స్ సరిగ్గా దొరకవు.

  2. Vvlakshmidevi@gmail.com i says:

    లలితగారూ
    ఓం పురి వెళ్లిపోయిన బెంగ కొంత తీర్చారు.
    మీ వ్యాసకళారూపాలు నా దాహాన్ని తగ్గిస్తున్నాయి
    థాంక్యూ

  3. మీ

  4. మీ వ్యాసం చాల బావుంది. ఆక్రోశ సినిమాలో ఓంపురి ఆక్షన్ మరపురానిది.

Leave a Reply to Mohan Cancel reply

*