ప్లీజ్ సేవ్ తెలుగు!

 

“తెలుగు దేశం పార్టీకి ఆ పేరెలా వచ్చింది..?”

“పాఠశాల విద్యలో తెలుగును తొలగించింది, అందుకే ఆపేరు వచ్చింది..!”

*   *   *

“అర్థం పర్థం లేదు.. అనుటకు వొక ఉదాహరణను యిమ్ము..?”

“తెలుగు దేశం పార్టీ’ పాలనలో తెలుగు లేదు, అది వొక దేశమూ కాదు! ‘తెలుగుదేశం’ అనుట అర్థం పర్థం లేనిది!”

*   *   *

“తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని చెప్పి, తెలుగును తొలగించడమేమిటి..?”

“ఒకప్పుడు తెలుగు వుండేది అని చెప్పుకోవడం వల్లనే కదా.. అది ప్రాచీన భాష అవుతుంది..?!”

                                          *   *   *

“తెలుగు బాషను తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వాన్ని యేమని డిమాండ్ చేయాలి..?”

“ముఖ్యమంత్రి మొదలు.. తెలుగుదేశం ప్రభుత్వనేతలూ నాయకులు కూడా యిక తెలుగులో మాట్లాడరాదు..!”

                                      *   *   *

“గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో- ‘తెలుగుజాతి తమ గౌరవం, తెలుగుజాతి పూర్వ వైభవం, నాలుగొందల యేళ్ళు పాలించిన శాతవాహనులు, యిరవై మూడవరాజు శాతకర్ణి’- అని చరిత్ర చెప్పిన చంద్రబాబు తెలుగును చరిత్రలో యెందుకు కలిపేసారో అస్సలు అర్థం కావడంలేదు..!?”

“ఇందులో అర్థం కాకపోవడానికి యేముంది?, బాలక్రిష్ణ తెలుగులో చెప్పిన డైలాగులు వినలేక.. యేకంగా తెలుగు భాషనే రద్దుచేసి అందరికీ రక్షణ కల్పించారు..!”

                                      *   *   *

“పాతనోట్లు చెల్లవంటే భరించాం కదా?, పాత తెలుగుభాష చెల్లదంటే యెందుకు భరించలేరు..?”

“అయితే.. పాతనోట్ల స్థానంలో కొత్త నోట్లు పెట్టినట్టు, పాత తెలుగు స్థానంలో కొత్త భాష ప్రవేశపెడతారా..?”

                                      *   *   *

“తెలుగు భాషని తొలగించడం అన్యాయం..!”

“ఇంగ్లీషు మీడియంలో మీ పిల్లల్ని చదివిస్తూ తెలుగు భాష వుండాలనడం మరీ అన్యాయం..!”

                                      *   *   *

“తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..”

“సాంగ్ యీజ్ వెరీ గుడ్.. బట్ వాటీజ్ ది మీనింగ్ అఫ్ తెలుగూ మమ్మీ..?”

                                         *   *   *

“తెలుగు యీజ్ ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్!”

“చూశారా?, తెలుగుని కూడా యింగ్లీషులో మెచ్చుకున్నారు.. అందుకే తెలుగు గొప్పతనం తెలుసుకోవాలన్నా యింగ్లీషే అవసరం..!”

                                      *   *   *

“అసలుకే లేదు అంటే కొసరు పెట్టమన్నాడట..!”

“తెలుగే తీసేస్తుంటే.. మాండలికం సొగసే వేరు అన్నాడట..!”

                                      *   *   *

“దేశ భాషలందు తెలుగు లెస్స..!”

“తెలుగు రాష్ట్రంలోనూ తెలుగు లెస్సే..!”

                                      *   *   *

“మా అబ్బాయికీ అమ్మాయికీ యిద్దరికీ తెలుగు అస్సలు రాదు..!”

“మా పిల్లలకీ రాదు, అందులో మునిపటిలా మనగొప్పలేదట, ప్రభుత్వమే తెలుగు పీకేసిందని మన మాటకెవరూ వెయిటివ్వడం లేదు..!”

                                        *   *   *

“తెలుగు తొలగింపు మీద రామోజీరావు యేమంటారు..?”

“మండలి బుద్ద ప్రసాద్ యింటర్వ్యూ మళ్ళీ వేస్తారు. ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచిక తీసుకొస్తారు. ఇంకా ఈనాడులో సంపాదకీయమూ రాస్తారనుకుంటా..!”

                                      *   *   *

“తెలుగు భాషలో యాభయ్యారు అక్షరాలు. తెలుగు లిపి గుండ్రంగా వుంటుంది. అందంగా వుంటుంది. మన జాతీయాలూ.. నుడికారాలూ.. సామెతలూ.. పొడుపు కథలూ.. పల్లె పదాలూ.. మాండలిక మందహాసాలూ..”

“అవున్లెండి బతకని బిడ్డ బారెడు.. అనేది కూడా తెలుగు సామెతే!”

                                      *   *   *

“వాడు తెలుగుకు భాషకు వీరాభిమాని. అంతెందుకూ తెలుగే మాట్లాడుతాడు.. తెలుగులోనే రాస్తాడు..!”

“ఏం?, పాపం చదువుకోలేదా..?”

                                      *   *   *

“నోబెల్ తెచ్చిన తెలుగు వారికి వందకోట్లు..!”

“నోబుల్ మాట దేవుడెరుగు.. తెలుగు ఎత్తేయడం వల్ల యింగ్లీషు మీడియం పాఠశాలలకు మరో వందకోట్ల ఆదాయం..!”

                                      *   *   *

 -బమ్మిడి జగదీశ్వరరావు

మీ మాటలు

  1. syamasundar says:

    పూర్తిగా తెలుగులో చెపితే అర్ధము కాదని రచయితగారు “ప్లీజ్ సేవ్ తెలుగు” అని టైటిల్ పెట్టారు అనుకుంటా వ్యాసము యదార్ధస్థితికి దర్పణము. నేతిబీరకాయలో నెయ్యి ఎంతో ప్రస్తుత తెలుగు దేశములో తెలుగు అంతే పూర్తిగా తెలుగు సక్రమముగా మాట్లాడటము చదవటము వ్రాయటం వచ్చినాక ఏ భాష అయినా నేర్చుకోవచ్చు తెలుగులో పరిపూర్ణత సంపాదించాకే పి వి.నరసింహ రావు గారు మిగిలిన భాషలపై పట్టు సాధించారు అందువల్ల ముందు మాతృభాష నేర్చుకోవటం చాలా అవసరము విద్యకు సంబంధించిన కమిటీలలో కొఠారి కమిషన్ ముఖ్యమైనది ఆ నివేదికలో ప్రాధమిక విద్యను మాతృ భాషలోనే నేర్పాలి అని చెప్పారు కానీ ఇంగ్లిష్ మోజులో నర్సరీ అని రకరకాల పేర్లతో విద్యావ్యాపారాన్ని ప్రోత్సాహించే పెద్దలు తెలుగును సమూలంగా నాశనము చేస్తూ తెలుగును నిజంగానే ప్రాచీన భాష చేస్తున్నారు. అంబడిపూడి శ్యామసుందర రావు.

  2. THIRUPALU says:

    అంటే ! తెలుగున కూడా ప్రపంచ బ్యాంక్ కు అమ్మేసారా!

  3. ప్లీజ్ సేవ్ టెల్గూ – అనాలేమో కదండీ ?!

    “తీపి తీపి తెలుగు – ఇది తేట తేట తెలుగు” బదులు “పాత పాత తెలుగు – అది పోయె పోయె తెలుగు” అని పాడుకునే రోజులు వచ్చేస్తున్నాయన్నమాట! బాగు – బహు బాగు!

  4. మధ్యలో బాల కృష్ణ ఎం చేసాడు, ఈ మధ్య ఇదో ఫాషన్ అయిపొయింది ,

మీ మాటలు

*