నీటి చెలమ అంటే
నాకు చాలా ఇష్టం
గుండ్లకమ్మ ఒడ్డున
చిన్నప్పుడు అమ్మతో మంచినీటి కోసం
వెళ్ళడం చాలా ఆనందంగా ఉండేది.
చలమలో పాత నీరు అంతా
అలా అలా ఒడుపుగా తోడేసి
గట్టు చుట్టా నుండి ఇసుక
గాలికి చెలమలోకి పడకుండా గట్టుకడుతుంటే
ఆ నేర్పరితనం ఆశ్చర్యంగా ఉండేది
ఆ అందమైన విధమేదో తెలిస్తే
బద్దకంతో మార్చుకోలేని బుద్దులతో
మనుషులలో పేరుకుపోయిన చెడు భావనలు కూడా
బయటకి ఒంపేసి
కొత్త నెత్తురు ఊరేట్టు
నూతన ఆలోచనలు కల్గిన
రక్తాన్ని ఒంటిలో నిండెట్టు చేస్తే
బాగున్ను అనిపించేది
మంచినీటి చలమలో
పాతనీరు తోడేస్తే కొత్తనీరు వచ్చినట్టు
ఆ కిటుకుతో సమాజంలో
ఏనాటినుంచో నిలిచిపోయి
కుళ్ళుకంపుకొట్టే పాతనీరంతా
బయటకి పంపేసి
కొత్త నీరు ఉబికేటట్టు చేస్తాను
*