ఒక విషాద ప్రదోష  రూపకం!

“చెమటచుక్క నేల రాలకుండా డబ్బులె ట్టొస్తయ్యిరా?”

నమ్ముకొన్న సేద్యం చట్టుబండలై చేసిన అప్పులు మెడకు గుదిబండలై వుమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై తమవాటా పొలం తెగనమ్ముకొని బతుకు తెరువు కోసం పల్లె నుంచి పట్నానికి వలస వచ్చి కొత్త వంచనల వూబిలో కూరుకుపోయిన నిస్సహాయురాలైన వొక  స్త్రీ సంధించిన ప్రశ్న యిది.

సాహిత్యంలో  వాస్తవికత , సామాజిక వాస్తవికత వంటి పదాలు మన నోళ్ళలో బాగా నలిగిన పదాలే అయినప్పటికీ వాటిని లోతుగా అర్థం చేసుకొన్న రచయితల సంఖ్యతక్కువ. చాలామంది సమాజంలో చోటుచేసుకొన్న మార్పుల్ని యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారు. సమాజంలో భిన్నసమూహాల మధ్య యేర్పడుతోన్న/మృగ్యమౌతోన్న మానవసంబధాల్నిశాసించే శక్తుల్ని , సమాజ చలన సూత్రాల్ని కొద్దిమంది రచయితలు మాత్రమే సాహిత్యంలో ఆవిష్కరించగల్గుతున్నారు. తమచుట్టూ వేగంగా చోటుచేసుకొనే మార్పుకి కారణాలు తెలుసుకొనే లోపు దిగ్భ్రమకు గురిచేసే మరో మార్పు సంభవిస్తోంది. ఆ దిగ్భ్రమ నుంచి బయటపడవేసి మార్గదర్శనం చేయించగల సమ్యగ్ దృక్పథాలకు రచయితలు ఆమడ దూరంలో నిల్చుంటున్నారు. ఒక దృక్పథం కల్గి వుండటమే  సాహిత్యనేరం అన్న ఆధునికోత్తరవాదాలకు  లోబడి రచయితలు గందరగోళానికి గురౌతున్నారు. దృక్పథరాహిత్యాన్ని స్వేచ్ఛగా భ్రమింపజేయడంలో ఈ వాదాలు కొంత మేరకు సఫలమయ్యాయి. అటువంటి సందర్భంలో ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్ధుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి.

ఇన్నాళ్ళూ తానూ నమ్మిన భావజాలాన్ని కవితద్వారా కథద్వారా మనతో పంచుకొన్న మంచికంటి యిదిగో యీ నవలతో రంగమ్మ వేసిన ప్రశ్నగా మనముందు నిలబడ్డాడు. ప్రశ్న చిన్నదే. సమాధానం అంత తేలికయిందేమీ కాదు. అదొక ‘చిదంబర రహస్యం’. రాత్రులకు రాత్రులే కోట్లకు పడగలెత్తే కార్పోరేట్ బడా బాబులకే తెలుసు ( అది అంబానీలు కావొచ్చు; జిందాళ్ళు కావొచ్చు; నిమ్మగడ్డ , రామోజీలు కావొచ్చు ). వీళ్ళే పాలకవర్గ రాజకీయాల్ని శాసిస్తున్నారు. క్విడ్ ప్రో కో లకు వూపిరిపోస్తున్నారు. దేశసంపదని సొంతం చేసుకొని బయటకు తరలిస్తున్నారు. బయట నుంచి  తెచ్చిన రుణాల్ని వుదారంగా పంచుకొంటున్నారు.

పోయిన శతాబ్ది చివరి దశకంలో మొదలైన వుదార ఆర్ధిక విధానం వుత్పత్తితో సంబంధంలేని ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసింది. గ్లోబలీకరణ పేరుతొ దేశ సార్వభౌమత్వాన్ని వశపర్చుకొన్న సామ్రాజ్యవాదానికి జాతీయ బూర్జువా దళారిగా రూపొందింది. సాంప్రదాయిక పెట్టుబడీదారి వ్యవస్థ స్థానే ‘సేవారంగం’ బహుముఖాలతో ముందుకొచ్చింది.  దోపిడి రూపం మారింది. వ్యవసాయ – పారిశ్రామిక కార్మికుల ప్రత్యక్ష శ్రమతో సంబంధంలేని బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్,   షేర్ మా ర్కెట్  వంటి రంగాలే ప్రధాన ఆర్ధిక వ్యవస్థ అని మేధావుల్ని సైతం భ్రమ పెట్టే స్థాయికి దేశీయ పెట్టుబడిదారులు దిగజారారు. వారికి తాబేదార్లైన పాలకులు అంతర్జాతీయ మార్కెట్ కి తలుపులు బార్లా తెరిచారు.ఇదే అదనుగా బహుళ జాతి కంపెనీలు దేశంలోని వుత్పత్తి – వుపాధి రంగాల్ని హస్తగతం చేసుకొన్నాయి. దీని ప్రభావం కేవలం నగరాలకూ పారిశ్రామికోత్పత్తులకూ పరిమితం కాలేదు. పల్లెల్లోకి సైతం పెట్టుబడులు ప్రవేశించాయి. విత్తనాలు, యెరువులు , పురుగు మందులు … అన్నీ యమ్మెన్సీల అధీనంలోనే వుండటంవల్ల వ్యవసాయం పెనుముప్పుని  యెదుర్కొంటుంది.  రైతుకు  సేద్యం బరువైంది.  వ్యవసాయ భూములు వ్యాపారపు సరుకయ్యాయి. భూమి పైనా  లోపలా వున్న ప్రకృతి సంపద పరాధీనమైంది. ఈ వ్యవహారామంతటికీ ముద్దుపేరు అభివృద్ధి. పాలకుల అవినీతి అభివృద్ధి ముసుగు తొడుక్కొంది. సమాజలోని అన్ని రంగాలనీ నాశనం చేసే ఈ విపత్తుని యెదిరించి నిలవరించి పోరాడే శక్తులకు నాయకత్వం వహించాల్సిన కార్మిక వర్గం ట్రేడ్ యూనియనిజానికి పరిమితమైంది. సమస్త అస్తిత్వాల్నీ కోల్పోతున్న బడుగు జీవులు బతికే హాక్కు కోసం చేసే పోరాటాలు పాశవికమైన అణచివేతకు గురవుతున్నాయి.

ఇదంతా వొక విషాద ప్రదోష రూపకం. ఈ విధ్వంసాల చీకటిని చూసి దృశ్యమానం చేయడానికి ముందువరసలో నిలబడ్డ రచయితల్లో మంచికంటి వొకడు. ఈ నవల్లో రంగమ్మ ముఖత: లేవనెత్తిన వొక్క ప్రశ్న ద్వారా రచయిత  దేశంలో పకడ్బందీగా అమలవుతోన్న వ్యవస్థీ కృత దౌష్ట్యం లోతుల్లోకి దృష్టి సారించేలా చేస్తున్నాడు. తన ప్రాంత ప్రజల మధ్య వుంటూ తన పల్లె మూలాల్ని కాపాడుకొంటూ జీవితాల్ని అతలాకుతలం చేస్తోన్న ఆధునిక ఆర్ధిక దోపిడీల స్వభావాన్ని బహిర్గతం చేయడానికి అతను సాహిత్యాన్ని వొక సాధనంగా యెన్నుకొన్నాడు.

ఒంగోలు పల్లె పట్టులు  మంచికంటి సాహిత్య – సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు. విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ , తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం , అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు , బతుకులు బుగ్గై కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం , కొత్త జీవనోపాధుల్లో , పరిసరాల్లో యిమిడే నేర్పు లేక వారనుభవించే మానసిక వేదన , పట్టణారణ్యంలో దారితప్పి క్రూరమృగాల బారిన పడే నిస్సహాయత – వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న కన్న స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్తవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు , విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోంచే చూడాలి. ప్రపచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు , ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది.

2005 లో అనుకొంటా –  తానా నవలల పోటీకి ‘గబ్బ గీము’ పేరుతొ వచ్చిన యీ నవలని నేను తొలిసారి చదివా. ముందుగా నన్ను కట్టిపడేసింది అందులోని భాష. తర్వాత నవలా నిర్వహణకి రచయిత యెన్నుకొన్నశిల్పం. బహుమతికి అర్హమైన  నవలని యెంపిక చేయడంలో బాధ్యులుగా అంపశయ్య నవీన్ కీ నాకూ మధ్య యీ నవలలోని భాషా శిల్పాలపైనే ప్రధానమైన చర్చ జరిగినట్టు జ్ఞాపకం( ఆ తర్వాత ‘చీకటి వలయాలు’ పేరుతొ యీ నవల చతురలో ప్రచురితమైంది).  ఒంగోలు – కర్నూలు రోడ్డు మీద పట్టణవిస్తరణలో కల్సిపోయిన పల్లె కాని పల్లె పేర్నమిట్టలో పాక హోటలు నడుపుకొనే రంగమ్మ అనే గ్రామీణస్త్రీ జీవితాన్ని బొమ్మకట్టించే క్రమంలో మూడుతరాల సామాజిక చరిత్రని రికార్డు చేయడం మంచికంటి ఈ నవల రాయడంలో ప్రధానలక్ష్యం కావొచ్చు; కానీ ఆ చరిత్ర అంత కష్టభూయిష్టంగానూ దు:ఖభాజనంగానూ వుండటానికి కారణాలేంటని అంతస్సూత్రంగా ప్రశ్నించడం నవల అంతటా  కనిపిస్తుంది. పుట్టినింట మెట్టినింట రంగమ్మ అనుభవించిన సుఖదు:ఖాల  వెనక – ఆమె జీవితాన్ని ఆ విధంగా నడిపించిన దృశ్యాదృశ్య శక్తుల అన్వేషణవైపు ఆలోచించేలా చేయడం మరో ఎత్తుగడగా అనిపించించింది.

రంగమ్మ పుట్టినింటి కంటే మెట్టినిల్లు అన్నివిధాలా మెరుగైందే. కానీ పల్లెల్లో ఎన్నో కుటుంబాల్లగానే ఆమె వుమ్మడికుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. అయితే పచ్చికుండలా ఆ కుటుంబం అలా విచ్చిపోడానికి నిర్దిష్టమైన భౌతిక కారణాలున్నాయి. రొయ్యలచెరువులు ‘కమ్మని వొరి పండే పొలాల్ని నాశనం చేసాయి’. పచ్చని కాపురాల్ని కూలదోశాయి.  ఇంటిపట్టునుండి చిన్నదో చితకదో వుద్యోగం చేస్తూ వున్నకమతం చూసుకోనేవాళ్ళు – గ్రానైట్ తవ్వకల్లోకి దిగారు. ఆహార ధాన్యాల పంటలు తగ్గి పొగాకు పత్తి వంటి వ్యాపార పంటలు వ్యవసాయంలో పెట్టుబడుల్ని విపరీతంగా పెంచేశాయి. నకిలీ విత్తనాలూ పురుగుమందులూ కల్తీ యెరువులూ యేదీ రైతు చేతిలో లేకుండా పోయింది.ఆఖరికి నేలలో వేయాల్సిన పంటని కూడా యెవరో యెక్కడనుంచో తెలియకుండానే నిర్దేశిస్తారు. పండిన పంటకి సరైన ధర వుండదు.ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం జూదమయ్యకా – నడ్డి విరిగిన రైతులకు పురుగు మందులు చావుకే వుపయోగపడతాయి. చేసిన అప్పులు పీకలమీదకొచ్చి అయినకాడికి పొలాలమ్ముకొని రైతు రోజువారీ కూలీగా మారతాడు. రంగమ్మ కుటుంబంలో జరిగిన ఈ హింస సమాజం అంతటా చోటుచేసుకొన్నదే.

ఓడిపోయిన జీవితాన్ని గెలవాలనే పట్టుదలతో పట్టణానికి ‘వలస’ పోయి – అక్కడ దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుంది. ‘ఉండూళ్ళో పస్తులుండా నలుగురు మనోళ్ళ మధ్యన ఉండామన్న ధైర్యమన్నా ఉండేది. ఈడ చచ్చేమా బతికేమా అని విచారించేవాళ్ళు కూడా లేకపోతిరి.’   పట్టణ జీవితంలోని సంక్లిష్టతని అర్థం చేసుకొనే లోపే అన్ని విధాలా పతనం కావడం సంభవిస్తుంది.

శ్రమతో సంబంధంలేని డబ్బు చలనం పట్టణంలో ఎక్కువ. విపణి సంస్కృతి , యీజీ మనీ వెంపర్లాట , అవసరంలేని ఆడంబరాలు , కొత్త వ్యసనాలు – వెరసి  నాగరికత మనిషిని పణ్య వస్తువుని చేస్తుంది. అన్ని విలువల్నీ మింగేస్తుంది. అప్పులూ  వడ్డీలపై వడ్డీలు రోజువారీ వడ్డీలూ చిట్టీలూ మైక్రో ఫైనాన్స్ లూ షేర్ బ్యాంక్ లూ పొదుపు సంఘాలూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ పుట్టింటి పట్టుచీరా – మా ఇంటికిరా చెల్లీ స్కీం లూ గోల్డ్ గేట్లూ పీర్ లెస్ లూ బాండ్ లూ – ఇదంతా వొక విషవలయం( ఒక్క ఒంగోల్లోనే 500 ఫైనాన్స్ కంపెనీలు వున్నట్లు నవల్లోనే ఒక చోట రచయిత పేర్కొంటాడు ) .  వలపన్నే వేటగాళ్ళ దోపిడీ బహుముఖాలుగా సాగుతుంది. ఒకప్పుడు  ‘ ఫైనాన్సోళ్ళ దెబ్బకి మొగోళ్ళు  ఉరిబెట్టుకున్నట్టు ఇప్పుడు ఆడయ్యి కూడా రాలి ’ పోవడం నిత్య విషాదం. ఇది కొత్త పరిణామం. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీలే యెక్కువ బలయ్యారు. రంగమ్మలా పల్లెనొదిలి వచ్చిన స్త్రీలందరిదీ వొకే హృదయవిదారమైన కథ. రమణమ్మ ,జయమ్మ, శేషమ్మ , పద్మ , సామ్రాజ్యం , సుశీల , నాగమ్మా – అందరూ తెలిసో తెలియకో పోగొట్టుకొన్నదాన్ని పొందాలనే ‘కసి’ తో అన్నివిధాలా వోడిపోయినవాళ్ళే. ఇంటా బయటా స్త్రీలు ‘వొళ్లిరగ దీసుకొని రూపాయి సంపాదించడానికి కష్టపడుతుంటే’ ‘కాలు కదపకుండా కడుపు నిండాలన్నట్టు’ మగవాళ్ళు నిర్వ్యాపారులై దుర్వ్యసనాలకు బానిసలై అనారోగ్యాల పాలై మృత్యుశకటాలవుతున్నారు .

మంచికంటి వర్ణించిన యీ చీకటి జీవితం కేవలం రంగమ్మది మాత్రమే కాదు. ‘ఒక బెట్ట ప్రాంతంనుంచి’ వచ్చిన రచయితగా అతను దీన్ని సాహిత్యీకరించినప్పటికీ – యిది  వొక్క ఒంగోలుకే పరిమితమైన చరిత్రా కాదు. దేశంలో యే మూలకెళ్ళినా యిదే పరిస్థితి.

మార్పు వొక్కసారిగా రాలేదు గానీ 90 ల నుంచి మార్పు త్వరితమైంది. ఆర్ధిక సంస్కరణల అమలు వేగవంతం అయ్యాకా సామాన్యుడు కన్స్యూమరిజం శ్లేష్మంలో ఈగగా మారాడు. విలాసాల్ని  అవసరాలుగా భ్రమింపజేయడంలో మార్కెట్ శక్తులు విజయం సాధించాయి. దేశం పెద్ద సరుకుల సంతయింది. లేని అవసరాల్ని సృష్టించడం – వాటిని తీర్చుకోడానికి ‘రుణ సదుపాయం’ కల్పించడం – దీంతో దేశపౌరుడు వొక వస్తువ్యామోహం వూబిలోకి కూరుకుపోయాడు. ఉన్నది తినడం కాకుండా అప్పు చేసైనా లేనిది కొని అనుభవించడం మధ్యతరగతి జీవిత విధానమైంది. బ్యాంకింగ్ రంగంలోకి డెబిట్ కార్డ్ కన్నా ముందు క్రెడిట్ కార్డ్ ని వినియోగంలోకి తేవడం వెనక పెద్ద మార్కెట్ కుట్ర వుంది. ప్రభుత్వ నూతన విధానాల అండతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలూ చిట్ ఫండ్ లూ వడ్డీ వ్యాపారాలూ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వెంటబడి అప్పులిచ్చేదీ – ‘ బళ్ళేసుకుని ఊళ్ళమీదబడి వొడ్డీలకు వొడ్డీలు వొడ్డీలకు వొడ్డీలు కట్టి బెదిరిచ్చి వొసూలు చేసుకొనేది.’   పల్లె పట్నం తేడా లేకుండా ‘ కూలికి విషం తాగే  మనుషులు’ తయారయ్యారు. మనుషులు అన్ని విలువలకీ దూరమయ్యారు.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్ని  సూక్ష్మదృష్టితో విశ్లేషించడం – గడిచిన కాలంతో పోల్చడం నవల పొడవునా కనిపిస్తుంది.నవల్లో రంగమ్మ ఆలోచనలు గతానికీ – వర్తమానానికీ మధ్య ఆసులో కండెలా తిరుగుతూ వుంటాయి. కావలి – ఒంగోలు మధ్య బొగ్గు బస్సులు నడిచిన రోజుల దగ్గర్నుంచీ – యివ్వాళ కాలేజీ ఆడపిల్లల్ని మోసం చేసి బ్లూ ఫిల్ముల చిత్రీకరణ దశ వరకూ దాదాపు 60 , 70 యేళ్ళ పల్లెల – పట్నాల సామాజిక చరిత్రని రికార్డు చేయడానికి రచయిత యెన్నుకొన్న శిల్పం అపూర్వం కాదు గానీ గత – వర్తమానాల కలనేతలో కథాగమనాన్ని కుంటూ పడనీకుండా , వస్త్వైక్యత దెబ్బతినకుండా నవలని నిర్వహించడం బహుధా ప్రశంసనీయం.

వర్తమాన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడే రంగమ్మ ప్రతి సందర్భంలోనూ గతాన్ని నెమరేసుకొంటుంది – యిప్పటి పరిస్థితుల్నీ మనుషుల్నీ వెనకటి రోజుల్తో మనుషుల్తో బేరీజు వేసుకొంటుంది. గత – వర్తమానాల మధ్య చేసే యీ ప్రయాణంలో సామాజిక – ఆర్ధిక విషయాలే గాక సాంస్కృతిక అంశాలు కూడా అలవోకగా వచ్చి చేరాయి. అది రంగమ్మ బాల్య జ్ఞాపకం సింగరాయకొండ తిరణాల కావొచ్చు ; ఆమె పెద్దమనిషయినప్పటి సమర్త బంతి కావొచ్చు ; వూరంతా వొకటై సంబరంగా జరిపిన పెళ్ళి కావచ్చు – అప్పటికీ యిప్పటికీ సంస్కృతిలో వచ్చిన మార్పులు అద్భుతంగా ఆవిష్కారమయ్యాయి. ఈ టెక్నిక్ ద్వారా నవల ప్రకాశం జిల్లా స్థానీయ సామాజిక చరిత్రతోబాటు సాంస్కృతిక చరిత్రను నిర్వచించుకోడానికి సైతం చక్కగా దోహదపడుతుంది.

ఈ స్థానీయ సామాజిక – ఆర్ధిక – సాంస్కృతిక  చర్రిత్రని మనకందిచడానికి మంచికంటి అక్కడి సమాజంలోకి , ప్రజా సమూహంలోకి మనల్ని చెయ్యి పట్టి లాక్కుపోతాడు. అందుకతను స్థానీయభాషని మాధ్యమం చేసుకొన్నాడు.ఈ ప్రాంతపు జనుల జీవద్భాష యింతకు మునుపు సాహిత్యంలోకి యింతగా యెక్కిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతపు భాషే కాదు – ప్రామాణిక భాష ఆధిపత్యం కింద నలిగి ప్రజల సాంస్కృతిక భాషలు దశాబ్దాలుగా సాహిత్యంలో స్థానం పొందలేకపోయాయి. ఇదొక చారిత్రిక విషాదం. రెండున్నర జిల్లాల భాషా ఆధిపత్యం గురించి తెలంగాణా రాయలసీమ సాహిత్యకారుల ఆందోళన ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కారణంగా వెలికి వచ్చింది గానీ అదే సమయంలో ఆ రెండున్నర జిల్లాల్లోనే అట్టడుగు వర్గాల భాష కూడా సాహిత్యంలో నిరాదరణకే గురైందన్నది గమనించాల్సిన విషయం . తెలంగాణా రాయలసీమా ఉత్తరాంధ్రాల నుంచి రచయితలు  తమ సొంత భాషల్లో గొంతు విప్పుకొన్న కాలంలో కోస్తా ప్రజల సాంస్కృతిక భాషని పలికించడంలో అక్కడి రచయితల గొంతులు మూగవోయాయి . ప్రజల నోటి భాషని యాసతో సహా మాగోఖలేలా శిష్ట సాహిత్యంలోకి వొంపిన వాళ్ళు ఇటీవలి కాలంలో కరువయ్యారు ( కొలకలూరి ఇనాక్ , కళ్యాణ రావు , పాపినేని  లాంటి వొకరిద్దరు యిందుకు కొంతమేరకు మినహాయింపు) . అందువల్ల జరిగిన అనర్థం అంతా యింతా కాదు. భిన్న ప్రజా సమూహాల భాషలకు ప్రామాణిక భాష దూరమైపోయింది. బడిపలుకులు – పలుకుబడులు వేరయిపోయాయి. ఆ కారణంగానే ప్రజల భాష ద్వారా వ్యక్తమయ్యే సాంస్కృతిక వైవిధ్యం కూడా మరుగున పడిపోయింది. అన్ని ప్రాంతాల – వర్గాల భాషల్ని తనలో కలుపుకొని  ఎదగాల్సిన ప్రామాణిక భాష – అందుకు విరుద్ధంగా కుదించుకుపోయింది. ప్రజా వుద్యమాలతో సంబంధం వున్న రచయితలు యీ లోటుని పూడ్చడానికి పూనుకొన్నారు. గ్రామీణ ప్రజా సంబధాలు కాపాడుకొన్న రచయితలు మాత్రమే ఆ యా స్థానీయ భాషల సొబగుల్ని సృజనాత్మక సాహిత్యం ద్వారా తక్కిన ప్రాంతాలకు అందించగలిగారు.

సాహిత్య భాషలో యేర్పడ్డ యీ ఖాళీని పూరించడానికి చొరవ చూపినవాళ్ళలో మంచికంటికి ప్రత్యేక స్థానం వుంది. కాట్రగడ్డ దయానంద్ , మంచికంటి లాంటి రచయితలు తమ కథల్లో వాడిన ప్రకాశం జిల్లా తూర్పు ప్రాంతపు ప్రజల భాష  తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసింది. మంచికంటి యీ నవల్లో వుపయోగించిన భాష భాషా అస్తిత్వాల గురించి నాలో చాలా కాలంగా గూడు కట్టుకొని వున్న ఆలోచనల్ని మీతో పంచుకొనేలా చేసింది.

మంచికంటి భాష అక్కడి ప్రజల వ్యావసాయిక సంస్కృతిలోని మట్టి పరిమళాన్ని మోసుకొచ్చిన కమ్మ తెమ్మెరలా వుంది. స్వచ్ఛమైన ఆ పరిమళాన్ని గుండె నిండా పీల్చుకొనే అవకాశం యెంతో కాలం కోల్పోయాం గదా అని నవల చదివిన ప్రతిసారీ అనిపించించింది. తన భాషలోని యాసనీ వ్యక్తీకరణ రీతుల్నీ అక్షరీకరించడంలో కూడా మంచికంటి  యెంతో నేర్పు చూపాడు. రచయిత ప్రజల పక్షాన నిలబడ్డాడనడానికి అతని భాష కూడా ప్రమాణమే.

బతుకులో అనునిత్యం సంఘర్షించే ప్రజల ధిక్కారస్వరమే వాళ్ళ భాషలో వినిపిస్తుంది. అది మండే భాస్వరంలా వుంటుంది. తన చుట్టూ వున్న సమాజంలో నిప్పుల మీద నడుస్తూ మొండిగా జీవిస్తోన్న మనుషుల ఆ ధిక్కారస్వరాన్ని గట్టిగా పట్టుకొన్న మంచికంటి దాన్ని సాహిత్య రూపంలోకి తర్జుమా చేసి మనకందిస్తున్నాడు. తాను పుట్టి పెరిగిన నేల రుణం యీ విధంగా తీర్చుకొంటున్నాడు. చల్లారిన సంసారాలూ ఛిద్రమైన బతుకులూ బలవంతపు పడుపు వృత్తులూ డబ్బు ప్రధానమై చిట్లిపోయిన మానవ సంబంధాలూ మార్కెట్ మాయాజాలంలో మాయమపోతున్న మనిషితనం … సమాజం క్రూరంగా దుర్భరంగా తయారయినప్పుడు , ‘విలువిద్యగాళ్ళుసైతం నేల నాలుగు చెరగులా వేయికాళ్ళతో విస్తరించి ఉన్న స్వార్థ భూతం ప్రలోభాలకు లోనైపోతున్నప్పుడు నిజంగా ఒక మనిషి వైపు ఒక   సామాన్యుడి వైపు కదా నిలబడి కల కనాల్సింది’ యే సాహిత్యకారుడైనా! అలా విశ్వసించినందువల్లే మంచికంటి తన నవల్లో బాధితుల పక్షాన వాళ్ళ కడగళ్ళ జీవిత అస్తిత్వాల్ని రూపు కట్టించగలిగాడు. కుటుంబ నిర్వహణలో అనునిత్యం స్త్రీలు శారీరికంగా మానసికంగా  యెదుర్కొంటున్న దుర్భర హింసని గొప్ప ఆర్తితో చిత్రించగలిగాడు. రచయిత ఆర్తి మన గుండెలోకి కూడా పరివ్యాప్తమౌతుంది. ఆ స్త్రీల ఆవేదనలో మనం కూడా  మగ్నమౌతాం.

సుబ్బులమ్మ – రంగమ్మ – సుధారాణి,సుజాత – మూడు తరాల్లో స్త్రీలు తమ చేతుల్లో లేనిదాన్ని దేన్నో పట్టుకోవాలనే ప్రయత్నం చేసారు. కానీ జీవితం అందినట్టే అంది వారి చేజారి పోయింది. సుబ్బులమ్మ గతం, రంగమ్మ వర్తమానం , సుధారాణి,సుజాతల భవిష్యత్తు అంతా అంధకార బంధురమే. అందుకే నవలంతా తీవ్రమైన దు:ఖం పరచుకొని వుంటుంది. అయితే అడుగడుగునా యెన్ని యెదురుదెబ్బలు తగిలినా రంగమ్మ గుండె దిటవు కోల్పోదు. నైరాశ్యానికి గురికాలేదు( నిలవ నీడ కోసం లైంగిక దోపిడీకి గురైంది , భర్త దేశాలు పట్టి పోయాడు , కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ వుంటాడు , ముక్కుపచ్చలారని వయస్సులోనే కూతుళ్ళు పురుషుల వంచనా ప్రపంచంలో అభద్రతా అంచుల మీద స్వారీ చేస్తుంటారు ). ఆమె పోరాటానికి అంతం లేదనే నవల ముగింపు చెబుతుంది. నిజానికి కథ పూర్తి  కాలేదు – మళ్ళీ మొదలైంది.

‘ఒక పక్క రైతుల చావులు , ఒక పక్క ఎన్ కౌంటర్లంటూ నక్సలైట్ల చావులు , మరో పక్క ఘోరంగా ఆడ కూతుర్లను చేర్చి శవాలుగా మార్చడాలు’   – వీటన్నిటి మధ్య ‘ తలగుడ్డలు రోడ్డెక్కినయి. పొలంలో ఉండాల్సిన తలగుడ్డల్ని గవర్నమెంటు రోడ్డెక్కేలా  చేసింది’. పల్లె నుంచి వలసపోకుంటే  రంగమ్మ భర్తతోపాటు తలగుడ్డలతో కల్సి నడిచేదేమో! ఎప్పటికైనా రంగమ్మయినా మనమయినా కలవాల్సిన సమూహం అదే. అటువంటి సామూహిక ప్రతిఘటన మాత్రమే రంగమ్మ లాంటి స్ర్తీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు నడవడానికీ , అన్ని చావుల పరిష్కారానికీ తోవ చూపుతుందనీ చిమ్మచీకటిలో వెలుగు రేకల్ని ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం. ఈ నవల చదవడం ద్వారా నాకా నమ్మకాన్నికల్గించినందుకు మంచికంటికి అభినందనలు.

ఒంగోలు పక్కన పేర్నమిట్ట బాట పట్టే ముందు వొక్క మాట –

చీకటికి భయపడేవాళ్ళెవరూ చీకటిని గెలవలేరు. సెలవ్.

మీ మాటలు

  1. ప్రసాద్ చరసాల says:

    ఇప్పటికిప్పుడూ చదవాలనే కాంక్ష రగిల్చారు.

    ఎక్కడ దొరుకునో ఈ పుస్తకం!

  2. THIRUPALU says:

    ‘గబ్బగీమి’ – కఠిక చీకటి చాన్నాల్ల తరవాత విన్నాము ఈ మాటను. మంచి కంటి గారి కధలు చదివాను కాని నవల గురించి వినడం ఇదే మొదటిసారి.
    అద్బత విష్లేషణ.

  3. చాలా రోజుల క్రితం (జీవితాల్లో ఇంత విషాదాల గురించి అప్పుడే తెలుసుకొంటున్న కాలంలో) ఈ నవల చదివాను. ఎయిడ్స్ వ్యాధి ప్రకాశం జిల్లాను కబళిస్తున్న కాలం ఇది. ఎందుకో చాలా భయపెట్టింది ఈ నవల. పన్ను పుచ్చిపోతే రాయితో కొట్టి బయటకు లాగేసే వాస్తవికతకు అప్పట్లో నేను చలించిపోయాను. ప్రభాకర్ గారు, చాలా బాగా రాశారు.

Leave a Reply to THIRUPALU Cancel reply

*