సానుకూలం

 

వినాలని ఎదురుచూసే వెదురు కోసం

వేణునాదమవుతుంది గాలి కూడా

కమ్మని కబురులతో తెమ్మెర సమీపిస్తే

తబ్బిబ్బై తలూపుతుంది పూలతీగైనా

నిశ్చలమై తటాకం నిరీక్షిస్తే

తూనీగ కూడా చిత్రాలు రచిస్తుంది

అడ్డంకులెదురైనా ఆగిపోక

తనకోసం పరుగెత్తి వచ్చిన సెలయేటికి

అవనత వదనయై ఆకుపూజ చేస్తుంది అడివమ్మ

చినుకులుగా ప్రేమను చిందించే మేఘం కోసం

అగరు ధూపమైపోతుంది అవని సమస్తం

తన కోసం నింగి నుంచి

నేలకు జారిన వానజల్లు

తాకీ తాకగానే

తటాకం తనువెల్లా పూలవనం!

స్పందించే హృదయానికి

ఎటు చూసినా సౌందర్యమే

ఎరుకంటూ ఉంటే

లోకమంతా సానుకూలమే!

*

మీ మాటలు

 1. సి నైస్.. చాలా చాలా బావుంది నాగలక్ష్మి గారు

 2. పుల్లారెడ్డి says:

  మీ కవితలోనివన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అందుకే అంతా సానుకూలం. చాలాబాగా వర్నించారు.

  • వారణాసి నాగలక్ష్మి says:

   అవునండి, ప్రకృతిలో అంతా ఒకదానికొకటి ముడిపడే ఉంటుంది కదా. స్పందించినందుకు మీకు కృతజ్ఞతలు!

 3. చాలా బావుంది కవిత . సున్నితంగా ఉంటూనే ప్రకృతి లోని ఏకసూత్రతని చక్కగా వెల్లడించింది . అభినందనలు నాగలక్ష్మీ

 4. శ్రీరాం says:

  స్పందించే హ్రహ్రుదయానికి ఎటు చూసినా
  సౌందర్యమే !! ఎంత బాగుందీ వాక్యం.
  అభినందనలు. ఇంకాస్త బిగుతుగా చెప్పగలరు మీరు. శుభాకాంక్షలు.

  • వారణాసి నాగలక్ష్మి says:

   ‘ఇంకాస్త బిగుతుగా చెప్పగలరు మీరు’ మీ సూచనకు ధన్యవాదాలు :)

   • N V Vijaya Lakshmi says:

    చాలా బావుంది నాగలక్ష్మి !
    వానచినుకలంటే యెంత ఇష్టమో కదా నీకు!
    ‘వానచినుకులు ‘ పుస్తకంలోని కవితల్లాగే ఇదికూడా చదవటానికి యెంతో హాయిగా, ఆహ్లాదకరంగా వుంది

 5. టి .వెంకటేష్ says:

  నేలకు జారిన వానజల్లు…
  తాకితాకగానే
  తటాకం తనువెల్లా పూలవనం.
  పరిమళపు వాక్యలు…

మీ మాటలు

*