విశ్వనాథ నుంచి మిచెల్ దాకా…

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-9

*

దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషలు వగైరాలలో భిన్నత్వం ఉంటుంది, నిజమే. కానీ ఏకత్వమూ ఉంటుంది. ఎంచి చూస్తే ఏకత్వమే ఎక్కువ ఉంటుందేమో కూడా.  కొందరు కేవలం భిన్నత్వాన్నే చూడడం, కొందరు ఏకత్వాన్ని కూడా చూడగలగడం వారి దృష్టి భేదాన్ని మాత్రమే సూచిస్తుంది. సగం నిండిన గ్లాసు ఉదాహరణతో చెప్పుకుంటే, కొందరికి నిండిన అర్థభాగం కనిపిస్తే, మరికొందరికి ఖాళీగా ఉన్న అర్థభాగం కనిపిస్తుంది.  వేయిపడగల రచయిత ఫ్రాక్ పశ్చిమ సాహిత్యాలలోనూ సంస్కృతీ, ఆచార వ్యవహారాలలోనూ, మనుషుల ప్రవర్తనలోనూ అంతటా భిన్నత్వమే చూస్తాడు. అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అన్న తారతమ్య దృష్టిని ప్రదర్శిస్తాడు.  అది ఒక్కోసారి హాస్యాస్పదంగా కూడా పరిణమిస్తుంది. ఉదాహరణకు, ఒక విషాద ఘటనను ప్రస్తావించి దానిపై పాశ్చాత్యులైతే “బ్యూటిఫుల్ బ్యూటిఫుల్” అని స్పందిస్తారని ఒకచోట ఎద్దేవా చేస్తాడు. అది జాతులు, వారి మనః ప్రవృత్తులు, భాషలు, వ్యక్తీకరణల మధ్య తేడాగా సూత్రీకరిస్తాడు.

నిజానికి ఒక విషాదఘటనపై పాశ్చాత్యులందరి స్పందనా ఆ మాటలోనే వ్యక్తమవుతుందని చెప్పడం శ్రుతిమించిన సాధారణీకరణే. అదీగాక ఒక సృజనాత్మక వ్యక్తీకరణపై, అందులోని వస్తువుతో సంబంధం లేకుండా అలాంటి స్పందన, మన దగ్గర సహా సార్వత్రికంగా కనిపిస్తుంది. ఒకవిధంగా వేయిపడగల రచయిత చేసిన సాధారణీకరణ రససిద్ధాంతానికే వ్యతిరిక్తం. శోక, బీభత్స, వీరరసాదులు వస్తువుగా ఉన్న కావ్య, నాటక, చలనచిత్రాలను మనం పనిగట్టుకుని చదివి, దర్శించి అనుభవిస్తున్నామంటే కారణం, వాటి వెనుక ఉన్న సృజనాత్మక ప్రతిభా వ్యుత్పత్తులు కలిగించే ముగ్ధత్వమే. ఆ ముగ్ధత్వాన్ని ఎవరైనా సరే రచయిత ఎద్దేవా చేసిన మాటలో కాకపోతే, తత్తుల్యమైన మాటల్లోనే వ్యక్తీకరిస్తారు.

భిన్నత్వాన్ని మాత్రమే చూసే దృష్టి మహాకవులను, పండితులను కూడా ఇలాంటి అతార్కిక, అసంబద్ధ నిర్ధారణలవైపు నడిపిస్తుంది. కేవలం భిన్నత్వాన్ని, అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అనే తారతమ్య వివేచననే కొలమానాలుగా తీసుకున్నప్పుడు ఆయా దేశాలు, భాషల వారు ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు ఆనందించవలసిందే తప్ప ఇంకొకరివి ఆనందించే అవకాశం ఉండదు. కానీ అలా జరగడం లేదు. పాశ్చాత్య సాహిత్యం వైపు మనం ఆకర్షితులైనట్టే ప్రాచ్య సాహిత్యం వైపు వారూ ఆకర్షితులు కావడం సార్వజనిక వాస్తవం.  భిన్నత్వాన్ని కేవలం ‘వారు వేరు, మేము వేరు’ అని విడగొట్టడానికి కాక, పరస్పరపూరకానికి అవకాశమిచ్చే జాగాగా అర్థం చేసుకున్నప్పుడు దృష్టి మారుతుంది. అప్పుడు దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాల వెనుక ఏకత్వాన్ని దర్శించే వీలు కలుగుతుంది. ప్రత్యేకించి సాహిత్యం ప్రతిఫలించే మానవ అనుభవం నిండా ఏకత్వమే ఉంటుంది.

చరిత్రలోకి వెళ్ళి చూస్తే, భిన్నత్వం మనుషుల్ని విడగొట్టి ఘర్షణకూ, యుద్ధాలకూ దారి తీయించిన అనుభవాలు ఉన్నట్టే;  ప్రపంచంలోని భిన్న భిన్న సమాజాలు, వ్యక్తులు మానవ అనుభవంలోని ఏకత్వాన్ని దర్శిస్తూ; భిన్నత్వాన్ని పరస్పర పూరకమైన ఒక అవకాశంగా చూస్తూ ఒకరికొకరు దగ్గరై పరస్పరం వికాసం చెందిన అనుభవాలూ ఉన్నాయి. విశ్వనాథ వంటి గొప్ప సృజనశీలి, సాహిత్యమర్మజ్ఞుని దృక్పథాన్ని భిన్నత్వం విశ్వరూపంలో కమ్మేసి ఆయన చేత అతార్కికమైన, సంకుచితమైన నిర్ధారణలు చేయించిందంటే కారణం; నాటి చారిత్రక, సామాజిక నేపథ్యం. వలసపాలనలో ఆత్మన్యూనతలో మగ్గుతున్న జాతి ఆ న్యూనతా భావననే ఆధిక్యంగా మలచుకోడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఇదొక తాత్కాలిక భావోద్రేకమే తప్ప స్థిరసత్యం కాలేదు. గురజాడ మీదుగా ప్రారంభమయిన ఆత్మవిమర్శ విశ్వనాథ దగ్గరికి వచ్చేసరికి ఆత్మోత్కర్షగా ఎందుకు పరిణమించిందో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యకాలంలోని పరిణామాలలోకి తొంగి చూడవలసి ఉంటుంది.

దానిని అలా ఉంచితే…

‘వేయిపడగల’ గురించి రాస్తూ అందులోని ధర్మారావు పాత్రను విశ్లేషిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన రచనలు రెండు: మొదటిది, త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’. రెండోది, మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’.

‘అసమర్థుని జీవయాత్ర’లో వ్యక్తమైన గోపీచంద్ తాత్విక సంఘర్షణను ఆర్. ఎస్. సుదర్శనం ‘సాహిత్యంలో దృక్పథాలు’లో తనదైన కోణంలో విశ్లేషించారు కానీ అందులోని సీతారామారావుకు, ‘వేయిపడగలు’ లోని ధర్మారావుకు ఉన్న పోలికలను, తేడాలను ఎందుకో ప్రస్తావించలేదు. ఈ ఇద్దరి మీదా తండ్రి ప్రభావం ఉంది. అయితే, వల్లమాలిన అహం, ఆభిజాత్యం నిండిన తండ్రి ప్రభావం నుంచి బయటపడి; సరళత, సామాన్యత నిండిన తల్లివైపు పయనించలేకపోయిన సీతారామారావు, జీవితాన్ని ప్రశ్నల ముళ్లడొంకగా మార్చుకుని చివరికి ఉన్మత్తావస్థకు చేరుకుంటాడు. ఆ దశలో రామయ్యతాత అతనికి జీవితం గురించి బోధిస్తాడు కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందనుకున్న సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు.

లౌకికంగా చూసినప్పుడు ధర్మారావు కూడా సీతారామారావులానే నిష్క్రియుడే. సీతారామారావులా భిన్న రూపంలో శ్రేష్టతా-సామాన్యతల వివేచనలో గడిపినవాడే. మళ్ళీ భిన్నరూపంలోనే అతనిలోనూ సీతారామారావులో ఉన్నట్టు ఆత్మోత్కర్ష, లోకవిమర్శ, లోకనింద ఉన్నాయి.  తేడా అల్లా, సీతారామారావు శ్రేష్టత్వం నుంచి సామాన్యతవైపు పయనించడానికి కనీసం విఫలయత్నమైనా చేశాడు కానీ; ధర్మారావు శ్రేష్టత్వపు ఊహల్లోనే ఆగిపోయాడు.  చివరివరకూ అసామాన్యుడైన తండ్రి ప్రభావంలోనే ఉండిపోయాడు. అలాగే బాహ్యజగత్తుకు, ఆంతరిక జగత్తుకు మధ్య సామరస్యాన్ని కల్పించుకోడంలో సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర సంఘర్షణ ధర్మారావులో లేదు. ఇద్దరి మధ్యా ఇంకో ముఖ్యమైన తేడా, జీవితం గురించి బోధించడానికి సీతారామారావుకు ఒక రామయ్యతాత ఉన్నాడు. కానీ ధర్మారావు విషయానికి వస్తే, రామయ్యతాత, సీతారామారావులు అతనిలోనే ఉన్నారు. తనే లోకానికి గురువు కనుక ఇంకొకరికి బోధకు అతను చెవి యొగ్గే ప్రశ్నే లేదు.

మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కానీ; అసలు ధర్మారావుకు సమాధానంగానే గోపీచంద్ సీతారామారావును సృష్టించాడా అన్న సందేహం కలుగుతుంది. ఈ కోణంలో ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారా అన్నది కుతూహలజనకమైన మరో అకడమిక్ ప్రశ్న.

విచిత్రం అనిపించవచ్చు కానీ,  ‘వేయిపడగలు’తో పోల్చి చూడాలన్న గాఢమైన కుతూహలం కలిగించే మరో నవల ‘గాన్ విత్ ద విండ్’. రెంటి మధ్యా తేడాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలిపే పోలికలూ ఉన్నాయి. ముందుగా తేడాల విషయానికి వస్తే, అతి పెద్ద తేడా ఆ ఇద్దరు నవలాకర్తల మధ్యే ఉంది. విశ్వనాథ(1895-1976) కన్నా మార్గరెట్ మిచెల్(1900-1949)వయసులోనూ, ఆయుఃప్రమాణంలోనే కాదు; సాహిత్యసృష్టిలోనూ, బహుముఖీన పాండిత్యంలోనూ కూడా చిన్నదే. ఆమె కౌమార వయసులో రెండు నవలలు రాసినా పరిమాణంలోనే కాక, ప్రసిద్ధిలోనూ చెప్పుకోవలసిన నవల గాన్ విత్ ద విండ్ ఒక్కటే.  ‘అట్లాంటా జర్నల్’లో జర్నలిస్టుగా పనిచేసిన మిచెల్ 1926 లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చీలమండకు తగిలిన గాయంతో ఇంటికే పరిమితమై అమెరికా అంతర్యుద్ధ(1861-1865) నేపథ్యంతో నవల రాయడం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసింది. గాన్ విత్ ద విండ్ నేషనల్ బుక్ అవార్డు, పులిట్జర్ అవార్డు పొందడంతోపాటు చలనచిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. మిచెల్ తన 49 వ ఏట, 1949 ఆగస్టు 11న అట్లాంటాలో భర్తతో కలసి ‘ఏ కాంటర్బరీ టేల్’ సినిమాకు వెళ్ళి వస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొనడంతో చనిపోయింది.

అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అమెరికా అంతర్యుద్ధానికి మూల కారణం బానిసత్వ సమస్య. యూనియన్ ప్రభుత్వం బానిసత్వాన్ని రద్దు చేయడానికి సంకల్పించింది. బానిసల శ్రమ మీద పత్తి వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేసి భారీ ఎత్తున కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏడు దక్షిణాది రాష్ట్రాలు(ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాలు కలసి పదకొండు అయ్యాయి) బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘కాన్ఫెడరేట్’ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధానికి దిగాయి. 1861నుంచి దాదాపు అయిదేళ్లపాటు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల నుంచి 7లక్షల 50 వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. రెండు ప్రపంచయుద్ధాలలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మౌలిక నిర్మాణాలు అన్నీ దాదాపు ఈ యుద్ధంలో ధ్వంసమయ్యాయి. చివరికి యూనియన్ సేనలే గెలుపొందాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ చర్యలూ వెంటనే మొదలయ్యాయి. అంతర్యుద్ధంతో మిచెల్ కు ఉన్న ఆత్మీయ సంబంధం, అందులో ఆమె తాత పాల్గొనడం. ఆ యుద్ధం గురించిన కథనాలను ఆ కాలానికి చెందిన అమ్మమ్మలు, నాయనమ్మల ద్వారా ఆమె చిన్నప్పటినుంచీ వింటూ వచ్చింది. వాటికి తనదైన కాల్పనికతను, దృక్పథాన్ని, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ జోడిస్తూ వెయ్యి పేజీలను మించిన, గొప్ప ఐతిహాసిక స్థాయి గల నవలగా మలచింది.

బానిసత్వపు పునాదుల మీద లేచిన ఒక కులీన తరహా సమాజమూ, అందులోని యువతీ యువకుల కాల్పనిక మోహాలు, వ్యామోహాలు, ప్రణయావేశాలూ, విందు వినోదాలూ, విలాసాలూ, శౌర్యోత్సాహాలూ, డాంబికాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆభిజాత్యాలు, వైభవోపేతమైన తమ జీవితం శాశ్వతమూ, స్థిరమూ అన్న భ్రమలతోసహా—అన్నీ తమ కళ్ళముందే- కేవలం నాలుగైదేళ్ళ స్వల్పవ్యవధిలో– కుప్ప కూలిపోవడాన్ని గాన్ విత్ ద విండ్ ఉద్వేగభరితంగా రూపుకట్టింది. ఆ పతనం వ్యక్తులలో కలిగించిన మానసిక, భౌతిక కల్లోలాన్ని; యుద్ధం వాళ్ళ జీవితాలలో తెచ్చిపెట్టిన అనూహ్యమైన మార్పులను అనితరసాధ్యమనిపించే రీతిలో ఆవిష్కరించింది. యుద్ధానికి ముందూ-తర్వాతా ఇతివృత్తంగా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఎన్నదగిన రచనల్లో గాన్ విత్ ద విండ్ నిస్సందేహంగా ఒకటి. గాన్ విత్ ద విండ్ లాంటి యుద్ధరచన ప్రత్యేకించి భారతీయ సమాజానికి విలక్షణమైన, వినూత్నమైన ఎరుకను, అనుభవాన్నీ కలిగిస్తుంది. ఎందుకంటే, మహాభారతం తర్వాత ఒక యుద్ధం తాలూకు పూర్వాపర పరిణామాలను, పరిస్థితులను అతి పెద్ద కేన్వాస్ పై  ఐతిహాసిక ప్రమాణంలో చిత్రించిన రచన మరొకటి మనకు లేదు.

మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం. కానీ  సందర్భం కాదు కనుక దానిని అలా ఉంచితే, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ దాదాపు ఏక కాలంలో వెలువడిన రచనలు. మిచెల్ తన నవలను 1926లో రాయడం ప్రారంభించగా 1936లో అది ప్రచురితమైంది. విశ్వనాథ వేయిపడగలను 1934లో 29 రోజులలో చెప్పారు. అంటే, అప్పటికి గాన్ విత్ ద విండ్ ప్రచురితం కాలేదు. వేయిపడగలు 1937-38లలో ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడిన తర్వాత 1939లో పుస్తకరూపంలో ప్రథమముద్రణ పొందింది.

రెండింటి మధ్యా ప్రధానమైన పోలిక— ఒకానొక కులీన, శ్రేష్ట, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం. మిచెల్ చిత్రించిన సమాజం, వేయిపడగలు చిత్రించిన వర్ణసమాజంతో పోలిక ఉన్నదే. వేయిపడగల వర్ణ సమాజంలో అట్టడుగున శ్రామికవర్ణం(గోపన్న) ఉన్నట్టే గాన్ విత్ ద విండ్ లో బానిసల రూపంలో శ్రామికవర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు. పొలంలో పనిచేసే బానిసల కంటే గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు. యజమాని-సేవక సంబంధాల చట్రంలోనే మళ్ళీ యజమానులకూ, గృహ బానిసలకు మధ్య ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. యజమానుల్లానే బానిసలు కూడా వ్యవస్థతో తాదాత్మ్యం చెందుతారు. వేయిపడగలలో చిత్రితమైన యజమాని-సేవక సంబంధాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. సాంప్రదాయిక సమాజాలుగా కట్టుబాట్లు, ఆచారాలు, స్త్రీ-పురుష వివక్ష మొదలైన అంశాలలో కూడా రెండింటి మధ్యా పోలికలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిచెల్ చిత్రించిన సమాజంలో  కొంతవరకు హైందవ సాంప్రదాయిక సమాజ ప్రతిబింబాన్ని చూడచ్చు. సామాజికంగా వస్తున్న మార్పులు విశిష్ట జీవితాన్ని, విశిష్ట వ్యక్తులను కబళించడాన్నే కాదు; అందరినీ అవి సామాన్యత అనే ప్రవాహంలో ఎలా ముంచి తేల్చుతున్నాయో కూడా రెండు రచనలూ చిత్రిస్తాయి. లోతైన సంస్కారం, అనుభూతి గాఢత లేని వారు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావడాన్నీ; అవి ఉన్నవాళ్ళు అట్టడుగుకు జారిపోవడాన్ని రెండు రచనలూ రూపుగడతాయి. అలాగే, వేయిపడగలు దళితోద్ధరణ గురించి, దళితులు స్వతంత్రించడం గురించి చెబితే; గాన్ విత్ ద విండ్ బానిసల ఉద్ధరణ గురించి, వారు స్వతంత్రించడం గురించి చెబుతుంది.

ఈ పోలికల మధ్యే కీలకమైన తేడాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచ్య, పాశ్చాత్య జీవన తాత్వికతలకు చెందినవనుకుంటే, కొన్ని ఇరు రచయితల దృక్పథ భేదానికి చెందినవి. గాన్ విత్ విండ్ కు వేయిపడగలకు ఉన్నంత బరువైన భావజాలవారసత్వం కానీ, అందుకు సంబంధించిన ఘర్షణ కానీ లేవు.  వేయిపడగలలో లౌకిక-అలౌకిక జగత్తులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. గాన్ విత్ ద విండ్ లో అలాంటిది లేదు. అది కేవలం పాత నీటిని కొట్టేసి కొత్త నీరు చేరుతున్న లౌకికమైన ఒకే ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే, గాన్ విత్ ద విండ్ కు ఉన్న అంతర్యుద్ధ నేపథ్యం వేయిపడగలకు లేదు. అందులో ఉన్నది భావజాల ఘర్షణే తప్ప భౌతిక ఘర్షణ కాదు.

ఈ ఇద్దరు రచయితల దృక్పథ భేదాన్ని తరచి చూస్తే తేలే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాహిత్య సృష్టిలోనూ, ధిషణలోనూ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాలేని మిచెల్ ఆయన కన్నా ఎక్కువ పరిణతిని చాటుకుందా అనిపిస్తుంది.

దాని గురించి తర్వాత…

*

 

మీ మాటలు

 1. గొరుసు says:

  భాస్కరం గారికి నమస్తే. మీ వ్యాసం బాగుంది. ధన్యవాదాలు .
  నేను “వేయి పడగలు ” చదవలేదు గనక ఆ నవల “గాన్ విత్ ద విండ్ ” కి పోలిక అవునో , కాదో నాకు తెలియదు కానీ “గాన్ విత్ ద విండ్ ” కి శ్రీదేవి గారి “కాలాతీత వ్యక్తులు ” నవలలోని పాత్రలకే చాలా దగ్గరి పోలికలు కనిపించాయి నాకు. అందులో ‘స్కార్లెట్ ‘ ఇందులో ‘ఇందిర’ ; అందులో ‘రెడ్ బట్లర్ ‘ ఇందులో కృష్ణ మూర్తి ; అందులో ‘మిలేని ‘ ఇందులో ‘కల్యాణి’ ; అందులో ‘యాష్ లీ ‘ ఇందులో ‘ప్రకాశం ‘ – “గాన్ విత్ ద విండ్ ” నవల చదవకుండా శ్రీదేవి గారు “కాలాతీత వ్యక్తులు ” రాశారంటే నమ్మలేను – మీరేమంటారు :)

 2. కల్లూరి భాస్కరం says:

  గొరుసుగారూ…ధన్యవాదాలు. మీరన్నట్టు ‘కాలాతీతవ్యక్తులు’ పై గాన్ విత్ ద విండ్ ప్రభావం ఉండవచ్చు. ఆ నవల చదివి చాలా కాలమైంది కనుక వెంటనే నా అభిప్రాయం చెప్పలేకపోతున్నాను. మరోసారి చదవాలి.

 3. నేను కాలాతీత వ్యక్తులు చదవలేదు కానీ, చలం మైదానం నవలకి గాన్ విత్ ది విండ్ కి పోలికలు వున్నాయి. రాజేశ్వరి బ్రాహ్మణ సంప్రదాయాల్ని పుటుక్కున తెంచేసుకొని ఇతర జాతివ్యక్తితో ధిక్కరించి వెళ్లిపోవడం, మావయ్యతో హిందూ బ్రాహ్మణ సంప్రదాయాలని ధిక్కరిస్తూ మాట్లాడడం , మావయ్య పొందే వ్యధ వీటన్నిటిలో గాన్ విత్ ది విండ్ ధ్వనిస్తుంది.రాజేశ్వరికి అమీర్ కిగల సంబంధంలో కొంత బానిసత్వ ధ్వని ఉంది. అమీర్ రాజేశ్వరిని కొడతాడు తిడతాడు. ఆమెని శాసిస్తాడు .యజమాని బానిసల మధ్య కూడా ప్రేమపూర్వక సంబంధాలు గాన్ విత్ ది విండ్ లో కనిపిస్తాయి. సమాజం అంతా బ్రాహ్మణులతో సహా అందరూ బానిసత్వ భావజాలం లో యజమాని సేవక సంబంధంలో కూరుకుపోయారని రచయిత ధ్వని కావచ్చు. ఎరిక్ ఫ్రామ్ చెప్పిన ఆమోద పూర్వక ఫాసిజాన్ని యిది సూచిస్తోంది. సైకాలజిస్టులు చెప్పే శాడిజం, మసోచిజం వంటివి బానిసత్వ పర్యవసానాలు కదా. తేడాలు ఉన్నప్పటికీ గాఢమైన పోలికలు వున్నాయి.

 4. కల్లూరి భాస్కరం గారి మాట నిజం. వేయిపడగలు నవల ప్రభావంతోనే గోపిచంద్ ‘అసమర్థుని జీవిత యాత్ర’ రాసారు. ‘ వేయిపడగలు’ ప్రభావం వల్ల హేతువాదం పరిమిమితులని గోపీచంద్ గుర్తించారు. ఆధ్యాత్మిక అన్వేషణ వైపు మళ్లారు. తండ్రి రామస్వామి చౌదరి గారి ప్రభావం నుంచి బయటపడ్డారు. యీసంగతులే అసమర్థుని జీవితయాత్ర నవలలో చిత్రించారు [ఆర్ . ఎస్. సుదర్శనం గారి’ సాహిత్యంలో దృక్పధాలు’ చూడండి.]

 5. ప్రసాద్ చరసాల says:

  “మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం.”

  దయతో ఆ పనికూడా చేయండి. మీ వ్యాసాల ద్వారా కొగ్రొత్త లోతులు, దృక్పథాలూ తెలుస్తున్నాయి.

 6. కల్లూరి భాస్కరం says:

  థాంక్స్ ప్రసాద్ గారూ…పెండింగ్ లో ఉన్నవి పూర్తి చేసుకుంటూ ఎప్పటికైనా ఆ పని చేస్తాను.

మీ మాటలు

*