నేనొచ్చేశాన్లే మళ్ళీ…

1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు –

2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత

కోపమొచ్చేసే గడియారపు బుడి బుడి నడక

వొంటి మీద మెత్తగా గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో

అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.

6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ…

*

 

మీ స్మృతిలో మో …

 

(ఇంకో మో అంటూ వుండరు..ఇంకో  ‘బతికిన క్షణ”మూ వుండదు. ఇంకో “చితి-చింత” కూడా వుండదు. అసలు వొక మనిషి ఎప్పుడూ ఇంకో మనిషిని replace గానీ, displace గానీ చేయడం అంటూ వుండదు. అందుకే, వొక మనిషి- అందునా  ఆ మనిషి తనదైన వాక్యాల అడుగుల్ని వెతుక్కున్న మనిషి వెళ్ళిపోయినప్పుడు భరించలేని నిశ్శబ్దం వెంట పడ్తుంది మనల్ని! మో- ఈ జనవరి అయిదున పుట్టారన్నదే నాకు గుర్తుంది. ఆయన వెళ్ళిపోయిన రోజు ఇంకా నా మనసులో సరిగా రిజిస్టర్ కావడం లేదు. మీలో చాలా మందికి అంతే అయి వుండాలి. మీలో చాలా మందికి మో తెలుసు, కవితంలోనూ, వ్యక్తిగతంగానూ, ఉత్తరాల్లోనూ..అలాంటివి మాకు రాయండి. వొక అరుదైన అద్భుతమైన కవిని తలచుకుందాం..)

మీ మాటలు

 1. Rajasekhar Chandram says:

  నిన్న సాయంత్రం విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ‘ మో ‘ జ్ఞాపకాలతో

  https://www.facebook.com/rajasekhar.gudibandi/posts/743454342485712

  https://www.facebook.com/babu.gogineni.9

 2. Suparna mahi says:

  …సందేహమే లేదు… ఇంకో ‘మో’ ఎప్పటికీ రారు, ఆ వరుసలో ఆ కుర్చీ ఎప్పటికీ ఖాళీనే… 🌼

 3. అఫ్సర్ గారూ
  బ్రిలియంట్

 4. మనసుకూడా మాట్లాడలేనంటున్నది.నిర్వచించలేని అనుభూతి !అద్భుతం !

 5. రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
  మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

  అద్భుతం. “అశ్రువొక్కటి కోటిలోకాల బరువు”- ఎవరన్నారో గుర్తు లేదు గాని, అలాంటిదే మీ ఈ వాక్యాల బరువు; మా అనుభూతి లోకాలను తేల్చి వేసే తేలికైన బరువు. అభినందనలు.

 6. కె.కె. రామయ్య says:

  ” దూరం నించి మిత్రుడి మరణ వార్త… ఆ తరవాత నేనూ చీకటీ ” మీ సంవేదన కదలించివేసింది అఫ్సర్ గారు.

  ‘మో’ గారి నివాళి పుస్తకం “నమో” తీసుకొచ్చిన విజయవాడ ఖాదర్ మొయినుద్దీన్ గారి వద్ద ‘మో’ గారి ఉత్తరప్రత్యుత్తరాలు కొన్ని ఉండి ఉండాలి. అలాగే ‘మో’ గారికి అత్యంత ఇష్టుడు త్రిపుర గారి ఉత్తరాలు ఒకటి ఆరా కూడా.

  ‘మో’ గారి కొన్ని రచనలను అద్భుతంగా విశ్లేషిస్తూ అక్షరీకరించిన నరేష్ నున్నా గారు, కాశీభట్ల వేణుగోపాల్ గార్ల తలపోతలను కూడా సారంగ లో చూడాలని ఆశిస్తూ

మీ మాటలు

*