నాలుగు కాలాలు నిలిచే కథ రాలేదు — అనిల్ ఎస్. రాయల్

 1. 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు?

అభిప్రాయాలు చెప్పేముందో విషయం స్పష్టం చేయాలి. తెలుగులో ఏటేటా వెయ్యికి పైగా కథలు వెలువడతాయని ఓ అంచనా. వాటిలో – 2016లో వచ్చిన కథల్లో – నేనొక వంద చదివి ఉంటానేమో. మిగిలిన వాటిలో మంచివి, గొప్పవి ఉన్నా వాటి ప్రస్తావన నేనిక్కడ తెచ్చే అవకాశం లేదు.

2016లో అమరావతి, ఆత్మహత్య, అసహనం మొదలైన సీజనల్ అంశాల మీద కొన్ని కథలొచ్చాయి. అన్నిట్లోనూ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అస్థిత్వవాదాల కథలూ ఎప్పట్లానే చాలా వచ్చాయి. నాలుక్కాలాలు నిలబడేవి వీటిలోనూ దాదాపు లేవు. నాకిష్టమైన సైన్స్ ఫిక్షన్ విభాగంలో మధు చిత్తర్వుగారు రాసినవి రెండు (వాటిలో ఒకటి తర్జుమా కథ) కనబడ్డాయి. ఇక సస్పెన్స్, హారర్, క్రైమ్, డిటెక్టివ్, హాస్యం మొదలైన విభాగాలు అన్నీ కలిపినా ఐదారు కథలకన్నా లేవు. చరిత్ర నేపధ్యంలో ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ అనే కథొకటి కనబడింది. మొత్తమ్మీద ఈ ఏడాది వస్తుపరంగా పెద్దగా వైవిధ్యం కనిపించలేదు.

ఇక శిల్పం. వస్తువుతో సంబంధం లేకుండా – పూర్తిగా చదివించగలిగే కథలన్నీ శిల్ప పరంగా నాణ్యమైనవే అనుకుంటే, అలాంటివి నాకు వేళ్లమీద లెక్కబెట్టేటన్ని మాత్రమే తగిలాయి. ఏం చెప్పాలనేదాని మీద పెట్టే శ్రద్ధ ఎలా చెప్పాలనేదానిమీద పెట్టకపోయే అలవాటు ఈ ఏడాదీ కొనసాగింది. ‘Well crafted story’ అనగలిగేది – నేను చదివినవాటిలో – ఒకే ఒకటి తగిలింది.

 1. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా –

ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి కథ ‘నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ’ ఈ ఏడాది చదివిన కథల్లో నాకు బాగా నచ్చినది. ఇందాక ‘well crafted story’ అన్నాను కదా. ఇదే అది. షరీఫ్ వేంపల్లి ‘దారి తప్పిన కల’ కూడా నచ్చింది.

ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు’ కొలకలూరి ఇనాక్ ‘తల లేనోడు’ని గుర్తుకు తెచ్చింది. మంచి కథ. ఇదే రచయిత మరో కథ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ తెలిసిన విషయాలే చెప్పినా పూర్తిగా చదివించింది.

ఇంకా – మెహర్ ‘ఒరాంగుటాన్’, మధు పెమ్మరాజు ‘బౌండరీ దాటిన బాలు’, వెంకట్ సిద్దారెడ్డి ‘కస్తూరి నీడలు’, మన్నె ఏలియా ‘శ్రీమంతుడు’ కూడా బాగున్నాయనిపించిన కథలు. జూపాక సుభద్ర ‘కంపనపడ్డ కాళ్లు’ రొటీన్ కథాంశమే అయినా ఫర్వాలేదనిపించింది.

పైవన్నీ నచ్చిన కథలు అనుకుంటే, తక్కినవన్నీ నచ్చలేదన్నట్లు. వాటి గురించి ప్రత్యేకించి ప్రస్తావించటం అనవసరం.

 1. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు?

కొత్తో పాతో తెలీదు కానీ – ఉణుదుర్తి సుధాకర్, ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి మరియు వెంకట్ సిద్ధారెడ్డి నుండి భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు. సరైన కథాంశాలు ఎంచుకుంటే సాంత్వన చీమలమర్రి కూడా మంచి కథలు రాయగలుగుతుంది.

 1. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?

మీరడిగిన మార్పుల్ని ఏదో ఓ స్థాయిలో స్పృశించే కథలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ ఏడాదీ అంతే. వాటిలో ఎన్ని పాఠకుల్ని స్పృశించగలుగుతున్నాయి అనేది ప్రశ్న. వాటిలో ఎన్ని మరో ఏడాది తర్వాతా గుర్తుంటాయి అనేది ఇంకా పెద్ద ప్రశ్న. సమాధానాలు అంత సంతోషకరంగా లేవు.

నా వరకూ నేను అస్థిత్వవాదాలు, సీజనల్ టాపిక్స్, మొదలైన ‘అజెండా’ కథలే కాకుండా ఇతర విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో కథలెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. ఆ మార్పు ఈ ఏడాదీ కనపడలేదు.

 1. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

తెలుగునాట వెలువడే అచ్చు పత్రికలు చదివే అవకాశం నాకు లేదు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్నవే నేను చదవగలిగేది. ఆంధ్రజ్యోతి, సాక్షి, సారంగ – ఇవి మూడూ తరచూ చదువుతాను. వాటిలో వచ్చేవన్నీ మంచి కథలనలేను కానీ , ఉన్నంతలో ఈ పత్రికల్లో కథల స్థాయి మెరుగ్గా ఉంటుందని నా అభిప్రాయం. కినిగె పత్రిక – మూతపడక ముందు – కొన్ని మంచి కథలు ప్రచురించింది. ఇతర పత్రికల్లోనూ అడపాదడపా మంచి కథలొస్తుంటాయి. అవి ఎవరన్నా రికమెండ్ చేసి లంకెలు పంపిస్తే చదువుతుంటాను.

 1. కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

తెలుగులో నిఖార్సైన విమర్శకులు కరువైపోయినట్లుగా ఉంది. కథకులే విమర్శకుల అవతారాలు ఎత్తటంతో పరస్పర ప్రయోజనాలు అడ్డొచ్చి ఎలాంటి కథకైనా పొగడ్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని వదిలేస్తే, విమర్శల పరిస్థితి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుంది. గొప్ప కథలుంటేనే గొప్ప విమర్శలొస్తాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్నట్లే ఈ ఏడాది కూడా – ముఖ్యంగా ‘వాగు స్వాతంత్రం’ ఎక్కువైన వెబ్ పత్రికల్లో – కథల మీద చర్చలకన్నా రచ్చలు ఎక్కువగా జరిగాయి. ఏదైనా నచ్చటం, నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్. కానీ ఓ కథ బాగోలేదనిపిస్తే ఏం బాగోలేదో చెప్పాలి. అది విమర్శ. ఇంకెలా రాస్తే బాగుండేదో కూడా చెబితే అది సద్విమర్శ. వెబ్ కథా చర్చల్లో వ్యాఖ్యాతల మధ్య యుద్ధాలు ఎక్కువగానూ, అసలు సిసలు విమర్శలు అరుదుగానూ కనిపించాయి.

 1. కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

సంకలనాల్లో ఉన్నవన్నీ గొప్ప కథలు కాకపోయినా, మరీ చెత్త కథలయితే ఉండవు. ఏటేటా వేల సంఖ్యలో కథలొస్తున్నప్పుడు అన్నీ చదవటం ఎంతటి వీర కథాభిమాని తరమూ కాదు. ఏడాదిలో వచ్చిన కథలన్నిట్నీ వడకట్టి ఓ పదో పదిహేనో మంచివిగా ఎంచి కూర్చిన సంకలనంలో అన్నీ కాకపోయినా అధికం పాఠకులకి నచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా పాఠకులకి ఈ సంకలనాలు చాలా సమయం ఆదా చేస్తున్నాయి అనుకోవచ్చు. ఓ పత్రికలో అచ్చైన కథ జీవిత కాలం ఒక వారమో నెల రోజులో అనుకుంటే, సంకలనాలు పది కాలాలు పదిలంగా దాచుకునేవి కాబట్టి వాటిలో ఉన్న కథల జీవితం చిరకాలం. అలా – సంకలనాలు పాఠకులకే కాక కథకులకీ మేలు చేస్తున్నాయి.

 1. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

నాకొచ్చిన ఇతర భాష ఆంగ్లం మాత్రమే. ఆ భాషలో- అడపాదడపా చదివే పాత క్లాసిక్ కథలు వదిలేస్తే – వర్తమాన కథలకన్నా సైన్స్, హిస్టరీ అంశాల్లో వచ్చే నాన్ ఫిక్షన్ రచనలు ఎక్కువగా చదువుతాను. కాబట్టి ప్రస్తుతం వస్తోన్న ఆంగ్ల కథల గురించి పెద్దగా తెలీదు. అందుచేత వాటితో తెలుగు కథల్ని పోల్చలేను. అయితే మన కథల్లో వైవిధ్యం తక్కువ అని మాత్రం చెప్పగలను.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ సంగతి చెబుతాను. ఈ మధ్య కథాభిమాని, విమర్శకుడు, సంకలనకర్త ఐన ఒక ప్రముఖునితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా “తెలుగు కథల్లో వైవిధ్యం తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?” అనే ప్రశ్న వచ్చింది. దానికాయన సమాధానం:

“అమెరికన్లవి, ఆంగ్లేయులవి కడుపు నిండిన జీవితాలు. అందువల్ల వాళ్లు సాహిత్యంలో ఆకలిమంటల్నే కాకుండా అన్ని రకాల అంశాలనీ స్పృశించగలిగే వెసులుబాటు ఉంది. మన భారతీయ సమాజం – ముఖ్యంగా తెలుగు సమాజం – ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇక్కడ సమస్యలెక్కువ. కాబట్టి ఎక్కువ కథలు వాటి చుట్టూనే తిరుగుతుంటాయి”.

నాకా సమాధానం సంతృప్తికరంగా అనిపించలేదు. 1945 – 1989 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితుల్లో అంతులేని అణచివేతకి, అశాంతికి నిలయంగా మారిన పోలండ్ దేశం నుండి, మన తెలుగుతో పోలిస్తే సగం మంది మాత్రమే మాట్లాడే పోలిష్ భాషలో, అరవయ్యేళ్ల క్రితమే ప్రపంచ సైన్స్ ఫిక్షన్ సాహిత్యమ్మీద బలమైన ముద్ర వేసిన Stanislaw Lem వంటి మహా రచయిత రాగలిగినప్పుడు – చుట్టూ ఉన్న సమస్యల కారణంగా ఇతర విభాగాలపైకి కథకుల దృష్టి పోవటం లేదు అనేది సహేతుకమైన కారణం అని నేను ఒప్పుకోలేను.

—-అనిల్ రాయల్ , కథకుడు

మీ మాటలు

 1. గొరుసు says:

  అనిల్ గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను – కాబట్టి మళ్ళీ నా అభిప్రాయం విడిగా రాసి పంపక్కరలేదు :)

 2. కె.కె. రామయ్య says:

  వాకిలి, సారంగ అంతర్జాల పత్రికల్లో వచ్చిన, ఓ సాధారణ పాఠకుడిగా నాకు గుర్తున్న, ఈ క్రింది కధలను కూడా .. నాలుగు కాలాలు నిలిచే కథల జాబితా కింద పరీశీలించమని అనిల్ రాయల్ గారికి, సీనియర్ కదా రచయత గొరుసన్నకు ( గొరుసు జగదీశ్వర రెడ్డి ) గార్లకు విన్నపం :

  1) కృతి – మండువ రాధ
  http://vaakili.com/patrika/?p=౯౮౪౯

  2) మంట – పూడూరి రాజిరెడ్డి
  http://vaakili.com/patrika/?p=౯౫౩౧

  3) “సోల్ సర్కస్” ( చిత్వాన్ ) ~ వెంకట్ సిద్దారెడ్డి ( 2015 June లోనిది కాబోలు )

  4) బ్లాక్ ఇంక్ ~ సాంత్వన చీమలమర్రి

  5) అమ్మ కడుపు చల్లగా ~ ఆర్.దమయంతి

  6) కలలో మనుషులు ~ అల్లం వంశీ
  “మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”

  త్రిపుర గారి అల్లుడైన శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు చాలా తక్కువగా రాసే రచయత. కినిగె పత్రికలో “ఇద్దరు మావయ్యల కధ” ( http://patrika.kinige.com/?p=5708 ) అనే ఓ అద్భుతమైన కధ రాశారు.

 3. అనిల్ గారు చివరలో ఒక మంచి వాదనకు అవకాశంఇచ్చ్చారు . ఎందుకు తెలుగు కధల్లో వైవిద్యం
  తక్కువ అని . మరి దీని మీద ఇక్కడ కథకులు ఏమి కామెంట్ చేస్తారో అని క్యూరియస్ గా ఉంది .
  నిజానికి ఇది చర్చ జరగాల్సిన విషయమే . ఓటమి , గెలుపు అనేది లేదు కానీ ఒక్క సారి అందరు
  ఆలోచనలో తప్పక పడుతారు . ఇది రాబోయే కధలకు మేలు చేస్తుంది

 4. Madhu Chittarvu says:

  సారంగ లో వచ్చ్చిన నేను రాసిన “జాలం” అనే కథ స్మార్ట్ సిటీ లు ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ మీద మన ఆంధ్ర రాజధాని ప్రాంతం లో భవిష్యతు లో జరిగినట్లు రాసిన సై ఫి కథ .సారంగ లో నే వఛ్చిన “నక్షత్ర భరిణ” అనే కథ మరొక గ్రహం లో జరిగినట్లు రాసినది.ఆ గ్రహానికి ఆరు సూర్యుళ్లు ఉంటారు కాబట్టి రాత్రి నక్షత్రాలు ఉండవు .సూర్యుళ్లు ఒకేసారి గ్రహణానికి గురి అయినప్పుడు మాత్రం చీకటీ నక్షత్రాలు వస్తాయి .అది తెలియని మత వాదులు అది దైవ శాపం అని ప్రళయం అని భావిస్తూ నమ్మని వాళ్ళని హింసకి గురి చేస్తుంటారు.ఈ ఐడియా నైట్ ఫాల్ అనే ఐజాక్ అసిమోవ్ 1945 లో రాసిన కథ నుంచి తీసుకున్నది కానీ నా కథ దానికి అనువాదం కాదు. నా కథ లోని విషయం వేరు .అయినా ఆకథ స్ఫూర్తి గా పేర్కోవడం నా బాధ్యతఅని కథ క్రింద ఇవ్వడం జరిగింది..నా కథ లు గుర్తించినందుకు అనిల్ ఎస్ రాయల్ గారికి కృతజ్ఞతల తో ఈ వివరణలు ఇస్తున్నాను .2016 లో వచ్చ్చిన అనేక కథలలో కొన్నే నేను చదివాను కాబట్టి విమర్శ చేయడం భావ్యం కాదు అని ఆ ప్రయత్నం చేయడం లేదు.

  • మధు గారు,

   ‘నక్షత్ర భరిణ’ తర్జుమా కథగా పేర్కొన్నందుకు క్షంతవ్యుడిని. మీ వివరణకి ధన్యవాదాలు.

 5. పైన యం.యస్.కె.కృష్ణ జ్యోతి వ్రాసిన కథ లింక్. ఈ కథ అరుగు అనే అంతర్జాల పత్రికలో ప్రచురితం అయ్యింది. కానీ ఆ పత్రిక స్వల్ప కాలంలో ఆగి పోయింది. అయినా మంచి కథ తనను తాను బ్రతికించుకుంటుంది అనడానికి ఉదాహరణ పై ప్రశంస. ఈ కథను kahaniya .com లో చదవవచ్చు

మీ మాటలు

*