తెలుగు కథ-2016: మీరేమంటారు?!

 

రో కథా సంవత్సరం ముగిసింది. ఏడాది కి ఒక్కో వార పత్రిక అచ్చు లోనైనా, ఆన్ లో నైనా దాదాపు 50 కు పైగా కథలు ప్రచురిస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వార్త, నవ్య వీక్లీ, స్వాతి వీక్లీ, పాలపిట్ట, చినుకు, ఆంధ్రప్రదేశ్, సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, సుజనరంజని,మధురవాణి ఇంకా మాకు తెలియని, గుర్తు రాని పత్రికలు ( వెబ్ లేదా అచ్చు). ఏడాదికి ఎలా లెక్కేసుకున్నా దాదాపు మూడు వందల యాభైకి   పైగా తెలుగు కథలు ప్రచురితమవుతున్నాయి. ఎంత కథా ప్రియులైనా అన్నీ కథలు చదవటం సాధ్యం కాదు. అన్నీ మంచి కథలే అచ్చయి ఉండాలనుకోవటం అత్యాశే. కథా సంకలనాలు వేసే వారికి ప్రతి ఏడాది అగ్ని పరీక్షే. చాలా సార్లు పేరున్న రచయితల కథలకు వచ్చిన గుర్తింపు కొత్త గా కథలు రాసేవాళ్ళకు రాకపోవచ్చు. ఆ పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగవుతూ వస్తోంది. కథా సంకలనాల్లో కొత్త కథకులకు స్థానం లభిస్తోంది. కథా విమర్శ మీద కాలమ్స్ వస్తున్నాయి. మాకు నచ్చిన కథ , నచ్చని కథ అంటూ వ్యాసాలూ వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగు కథ తీరూ తెన్నూలు అర్థం కావటం లేదు అంత సులభంగా.

2016 లో మీరు చదివిన కథల నుండి (అవి ఎన్ని అయినా సరే) మీకు నచ్చిన కథ ఏమిటి? ఎందుకు నచ్చింది అంటే కొంత ఆలోచనలో పడతారు ఎవరైనా. మాకు అందుబాటు లో ఉన్న కథకులు, విమర్శకులు, పాఠకులను గత సంవత్సరం వచ్చిన కథల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాము.  మా ప్రశ్నలు కానీ, ఈ సమాధానాలు కానీ, అభిప్రాయలు కానీ సంపూర్ణం కాదని మాకు తెలుసు. నచ్చిన కథ ఏమిటి అని అడగటం కొంత ఇబ్బంది కరం చాలా మందికి. పేరు లేకుండా, పేరు చెప్పకుండా కథల మీద అభిప్రాయం చెప్తామన్నారు కొందరు.

ఒక కథ చదివి, దాని మీద ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు చాలా మంది, కారణాలు ఏమైనా. కొన్ని కథలు, కొందరి కథలు విపరీతమైన చర్చలకు గురవుతుంటే, కొన్ని కథలు అసలు ఎలాంటి సద్విమర్శ కు నోచుకోకుండా అజ్ఞాతం లోకి వెళ్ళిపోతున్నాయి. రచయితలు ముఖ్యంగా తోటి రచయితల కథలను ఒక్క చూపుతో విసిరేస్తున్నారు అన్న ఆరోపణ బలంగా ఉంది. ఒక కథ బాగుంటే, లేదా బాగోలేకపోతే, రచయిత పేరు తోనో, స్నేహంతోనో, శత్రుత్వం తోనో కాకుండా కథ ను కథగా విశ్లేషించటం , లేదా అభిప్రాయాన్ని చెప్పటం అనేదిపూర్తిగా కనుమరుగై పోతోంది. . ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే ‘సారంగ’ అతి మామూలు ప్రశ్నలు కొన్నింటిని  అడుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా రాయొచ్చు.  ఒక ఆరోగ్యకరమైన చర్చ కు “ సారంగ” ఆహ్వానం పలుకుతోంది. మీదే ఆలస్యం!

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

 

మీ మాటలు

 1. sailajamithra says:

  మంచి కధలు ఉన్నాయి .. స్వలాభాపేక్ష లేకుండా వెదకండి..
  కధ ఏమైపోతోంది ? మంచి కధలు కనిపించడం లేదు అంటే మనం చాలా గొప్పవాళ్ళం అయిపోయామని భావించే సమాజం లో మనం ఉన్నాం. అలాగే ఫలానా వారి కధ బావుంది అని ఎవరైనా పదవి బలం ఉన్నవారో లేక పరిచయ బలం ఉన్నవారో ఒక్క మాట అంటే చాలు వాటిని భుజాన మోస్తూ తిరిగే జీవితాల మధ్య మనము తిరిగేస్తున్నాం. ఒకరు చప్పట్లు కొడితే తప్ప మరొకరు అందుకొని తత్వం లో బతికేస్తున్నాం. కథ అంటే ” గాలివాన ” లేక దిద్దుబాటు అని మెదడులో ఫిక్స్ చేసుకుని వాటిని గురించి మాట్లాడితేనే మనం గొప్ప ఉపన్యాసకులు అయిపోతాము అనుకోని చెప్పిన కథల్నే చెప్పుతూ, పొగిడిన రాతల్నే పొగుడుకుంటూ ఎవరి కథను పొగిడితే వారికి భవిష్యత్ లో ఉపయోగం ఉంటుందో అని నిత్యం ఆలోచిస్తూ, వారి కధల్లో ఏమి లేకున్నా ఏదో ఉండే ఉంటుందని ఉహించి, ఉన్నట్లు కల్పించి , పొగుడుతూ ఆత్మే లేని శరీరాలతో నడిచేస్తున్నాం. కొన్నాళ్ల కిందట మొదటి వచ్చిన ఒక కథ (పేరు చెప్పడం లేదు. అన్యధా భావించకండి )చదివితే నాకు నిజంగా మనం ఎందుకు రాస్తున్నాం ? అనే ఆలోచన వచ్చింది. ఒకరికి భర్త లేరు. మరొక అతనికి భార్య లేదు . ఇద్దరు అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎదురెదురుగా ఉన్నందు వాళ్ళ మరింతగా కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ సదరు వ్యక్తి ఆమె కు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. మీకు తోడు లేరు. నాకు లేరు. మనం కలిసి జీవిస్తే తప్పేముంది అని. కాని ఆమె ఒప్పుకోదు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని, తాను అతనిలో స్నేహితుడిని మాత్రమే చూశానని అంటుంది. అంతవరకు చాలా బావుంది. కధకు ముగింపు ప్రాణం కదా. ఆమె ఎలా ముగించిందో అని నాకు మరింత ఆసక్తి కలిగింది. ఆ మరుసటి రోజు ఆమె ఎదురుగా ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళుతుంది ఏదో ఇవ్వడానికి . ఇంట్లో అతను గిన్నెలు తోముకుంటూ ఉంటాడు. అది గమనించిన ఆమె సాయంత్రం మీతో మాట్లాడాలి అని పిలిచి పెళ్ళికి సరేనని ఒప్పుకుంటుంది . ఇదీ కథ . ఆ రచన మొదటి బహుమతి కి ఎలా అర్హం అయిందో నాకు అర్థం కావడం లేదు. అలాగని కధలన్నీ సమాజాన్ని ఉద్దరించవు. కథ వీలైతే మనలోని ఆవేదనని తగ్గించాలి . లేదా ఎదుటి వారిలోని ఆలోచనకు బలాన్ని ఇవ్వాలి. రెండూ లేకుంటే సమాజానికి ఉపయోగపడే సందేశం అయినా ఉంది తీరాలి. కేవలం ఆ వ్యక్తి ఎంత పలుకుబడి ఉన్నవాడో గమనించి వారిలో ఉన్న లేశమాత్రపు సాహిత్యాన్ని మహా సాహిత్యంగా పొగుడుతూ ఉండటం ద్వారా అదే వారు మహా కథకులు గా చలామణీ అయిపోతున్నాం. బండారి అనే అతను అతి సాధారణ వ్యక్తి . కనీసం చెప్పులు కూడా వేసుకొని తిరగటం నేను చూడలేదు. అతనితో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అతని కథ ఒకటి చదివాను. పేరు ‘కుక్క’ . ఒక కుక్క తన పిల్లలతో రోడ్డు మధ్యలో పడుకుంటుంది . అందరు దానికేసి చూస్తూ ఇదేంటి రోడ్డు మధ్యలో పడుకుంది ? ఏ వాహనమైన తగిలితే చచ్చిపోతాయి అనుకుంటూ , కుక్క కదా దానికి బుర్ర ఉంటుందా అనుకుంటూ ఎవరికీ వారు తప్పుకుని పోతుంటారు. అందరు ఒకేలా ఉండరు కదా వారిలోనే ఒకతను వచ్చి దాని పిల్లల్ని మెల్లగా ఒక అట్టమీదికి ఎత్తి , ఒక వారగా పడుకోబెట్టి వెళతాడు . వెంటనే వచ్చిన ఆ కుక్క ఆలా వారగా పెట్టిన అతన్ని చూసి గట్టిగ అరిచి, కాస్త దూరం తరిమి మళ్ళీ వచ్చి తన పిల్లల్ని రోడ్డు మధ్యలోనే పడుకో బెట్టి తాను కూడా వాటిని దగ్గరకు తీసుకుని పడుకుంటుంది. అందరు ఇదేంటి పక్కన పెట్టిన వాడిపై అరిచి మళ్ళీ మధ్యలో పడుకోపెట్టుకుంది ? అని ఆశ్చర్యపోయారు. మనకెందుకు ఏదైనా చేస్తే మెడబడి కరిచేస్తుంది అని మళ్ళీ తప్పుకు పోవడం జరిగింది. సరిగ్గా ఒక గంట తర్వాత భూకంపం వచ్చింది. బిల్డింగ్స్ అన్నీ నేల కూలాయి. ఏంటో ప్రాణ నష్టం జరిగింది. హాహా కారాల మధ్య జన సందోహం విల విల లాడుతోంది. ఒక్క క్షణం లో జీవితాలన్నీ చెల్లా చెదురయ్యాయి. కానీ కుక్క మాత్రం తన పిల్లలతో హాయిగా ఉంది . ఇదీ కధ. కధకు కావాల్సిన ముగింపు ఇచ్చారు. ఇది మంచి కథ కాదా? ఎందుకు గుర్తింపుకు రాలేదో ఆలోచించాలి . అలాగే ఆకెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచన ” అక్షింతలు ” మంచి కధ ” మనిషి జీవితానికి ఏది ఎలా ఉపయోగించాలో తెలిపిన ఉదాత్తమైన కధ . కనుక మంచి కధలు ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే మనం ఒక్క చోటే ఆగిపోయాం . అలా కాకుండా లాభాపేక్ష లేకుండా వెదికితే మంచి కధలు దొరుకుతాయి. రచించిన వారి పేర్లు చూడకుండా రచనల్ని పరిశీలిస్తే మంచి కధలు దొరుకుతాయి అనేదే నా వాదన . వేదన కూడా ..
  శైలజామిత్ర

 2. ari sitaramayya says:

  మీ ప్రశ్నలన్నింటికీ కాకపోయినా, చివరి ప్రశ్నకు సమాధానం రాస్తాను. మన కథలను ఇతర భాషల కథలతో పోల్చడం అంత సులభం కాదు, ఎందుకంటే సాహిత్యం ఎంతోకొంతవరకు దేశ పరిస్థితులను ప్రతిఫలిస్తుంది. కనీసం ఆ అభిప్రాయం నేను చాలా కాలంగా వింటూ ఉన్నాను. తెలుగు కథల్లో ఎక్కువ భాగం సమకాలీన సమస్యల మీద ఉంటాయి. నిన్న జరిగిన ఎదో ఒక సంఘటనమీద తను ఎటువైపు ఉన్నాడో చెప్పడానికి రచయిత కథ రాస్తాడు. ఈ కథల్లో పాత్రలు రచయిత చెప్పినట్లు ఉద్దేశించినట్లు ప్రవర్తిస్తాయి. నిజ జీవితాల్లో ఉండే క్లిష్టత ఈ పాత్రల్లో కనబడదు. ఇన్ని లోపాలున్నా నాకు అమెరికా కథలకంటే తెలుగు కథలే ఇష్టం. కారణం ఇక్కడ కనబడని వినబడని నియంత్రణ ఉండటం. అమెరికా పదిహేను సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్ లో యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధం మీద ఏదైనా మంచికథ వచ్చిందా? పది సంవత్సరాలకు పైగా ఇరాక్ లో జరిపిన యుద్ధం గురించి ఏదైనా మంచి కథ వచ్చిందా? ఎవ్వరు రాయలేదా? లేక వాటిని ప్రచురించేవారు లేరా? తెలుగులో అయితే ఎన్నో కథలు వచ్చేవి.

  • ari sitaramayya says:

   ఆ చివరి వాక్యం వివరంగా లేదనిపించి మళ్ళా రాస్తున్నాను. నా అభిప్రాయం: తెలుగు ప్రాంతంలో ఇలాంటివి జరిగితే వాటిమీద ఎన్నో కథలు వచ్చి ఉండేవి అని.

 3. మల్లీశ్వరి says:

  ఆరి సీతారామయ్య గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత తిట్లు శాపనార్ధాలు లేని, విపరీతమైన పొగడ్త లేని ఆబ్జెక్టివ్ తెలుగు విమర్శ ని చదివాను.మీ పాయింట్ ఆలోచించింప జేసింది

 4. Sai Brahmanandam Gorti says:

  సీతారామయ్య గారూ: అమెరికా చేసిన యుద్ధాల మీద చాలా కథలు వచ్చాయి. మీ దృష్టికి రాలేదేమో నాకు తెలియదు. నేను చదివాను. Fire and Forget: Short Stories from the Long War – By Phil Klay పుస్తకానికి అవార్డులు కూడా వచ్చాయి.

  • సీతారామయ్య గారి వ్యాఖ్య తెలుగులో రాసే ఇండో- అమెరికన్ రచయితల గురించి. ఇంగ్లీష్ కథల గురించి కాదనుకుంటా.

   అప్రస్తుత ప్రసంగమే అయినా, ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య వచ్చిన మీ కథ ఆ నాటి చెలిమి ఒక కల గురించి ఒక ప్రశ్న.. ఆ కథకి మూలమైన (నిజానికి అనుకరణ ) వంశీ గారి “ఆనాటి వానచినుకులు” కథను మీరు అక్కడ ప్రస్తావించకపోడానికి కారణమేంటి?
   – జ్యోతి

   • Gorti Brahmanandam says:

    జ్యోతి గారూ: జవాబు చెప్పాలంటారు. ఆ కథ వెనుక ఇంకా పెద్ద కథ ఉంది. వంశీ గారి కథ “ఆనాటి వాన చినుకులు” కి ప్రేరణ వేమూరి సత్యనారాయణ గారు. ఆయన ఒకప్పటి జ్యోతి మాసపత్రిక సంపాదకులు. ఆయన చెప్పిన ఒక సంఘటన ఆధారంగా వంశీ కథ రాశారు. అదే మకుటంతో ఆయన నలుగురైదుగురు రచయితలతో “ఆనాటి వాన చినుకులు” కథలో ఇమిడేలా కథలు రాయించారు. ఒకప్పటి గూడు రిక్షాల వెనుక రాసే వాటి గురించి నాతొ ప్రస్తావిస్తూ నన్నూ ఆ మకుటం మీద కథ రాయమని అడిగారు. నేనూ కోనసీమలో పుట్టి పెరిగాను. అలాంటివి చూసాను. ఆయన మాటకి సరే అన్నాను. అలా నా “అలనాటి చెలిమి ఒక కల” కథ పుట్టింది. త్వరలో “అలనాటి వాన చినుకులు” పుస్తకం ఇంకొంతమంది కథలతో రాబోతొంది. నేను వంశీ గారి కథ ప్రేరణతో రాయలేదు.

    సీతారామయ్య గారి వ్యాఖ్య స్పష్టంగా లేదు, అయన వివరణ ఇచ్చినప్పటికీ.

మీ మాటలు

*