తూరుపు గాలులు ( పెద్ద కథ – మొదటి భాగం )

 

1

వి వర్షావాసపు తొలిరోజులు. ఎక్కడోవర్షించి, తేలిపోయివచ్చిన దూదిమేఘాలు ఆకాశమార్గాన పరుగులు పెడుతున్నాయి. ఉండీఉడిగీ చిరుజల్లులూ, వెంబడే ఉక్కపోత; అంతేగాని భారీవర్షాలింకా మొదలుకాలేదు. సాయింత్రంపూట సముద్రంమీదనుండి చల్లనిగాలివీచినప్పుడే కాస్తంత ఉపశమనం. భద్రపాలుడు ఆమధ్యాహ్నంపూట విహారప్రాంగణంలోని మర్రిచెట్టునీడలో, రాతిగట్టుమీద కూర్చొని, కుడిచేతిని నుదిటిపైన ఆనించి,  కళ్ళుచిట్లించి లోయలోకి చూస్తున్నాడు. చాకలివాళ్ళు లోయలో ఎండలకిచిక్కి సన్నబడిన వాగులోనే బట్టలుతుకుతున్నారు. వర్షాలుపడ్డాక ఆ చిన్నారివాగే పంపానదిగామారి పరవళ్ళు తొక్కుతుంది. చాకళ్ళు బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. ఎక్కడ్నించో మొగనెమళ్ళు ఆత్రుతగా, సుదీర్ఘంగా పిలుస్తున్నాయి; ఆడనెమళ్ళు మాత్రం బెట్టుచేస్తూ, అప్పుడప్పుడు క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నవి. ఉన్నట్టుండి చాకలివాళ్ళ వెంటవచ్చే కుక్కలన్నీ కలసికట్టుగా మొరగనారంభించాయి; ఆ వెంటనే బెదిరినట్టుగా చాకళ్ళ గాడిదలు గుంపుగా ఓండ్రపెట్టాయి.

భిక్షాటనకని వెళ్ళిన భిక్షువులబృందం ఇంకా తిరిగిరాలేదు. వాళ్లు తెచ్చిపెడితే తినాలి. ఈ మధ్యంతా ఇదే తంతు. ఆరోగ్యం బాగోలేక విహారంవిడిచి వెళ్ళలేకపోతున్నాడు. దృష్టి బాగామందగించింది. శృంగవృక్షం గ్రామంలోనే వాళ్ళకి కావలసినంత భిక్ష దొరికిపోతుంది. మధ్యమధ్యలో ఎవరోఒకరువచ్చి పళ్ళు, ఫలాలు ఇచ్చిపోతుంటారు. గ్రామపెద్దలూ, ఒకటిరెండు కుటుంబాలవాళ్ళు, సంవత్సరానికొకటి రెండుసార్లువచ్చి చీవారాలు (భిక్షువులు ధరించే కాషాయి వస్త్రాలు) ఇస్తూంటారు. అందుచేత తిండికీ, బట్టకీ ఇబ్బందిలేదు.  భద్రపాలునివద్దకు వైద్యంకోసం గ్రామస్థులు వస్తూంటారు. అతనిచ్చే వేర్లు, ఆకుపసర్లు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. వైద్యుడిగా అతడికి మంచిపేరే ఉంది.

భద్రపాలుడికి చావంటే భయంలేదు గాని ‘ఇంకా ఏమేమి చూడాలో’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. దీపాంకరుడికి విహారబాధ్యతలు అప్పగించి వెళ్ళిపోగలిగితే బాగుండునని అతనికి తరచూఅనిపిస్తోంది. దీపాంకరుడు ఎప్పటికైనా తిరిగిరాకపోతాడా అనేఆశ అతనిలో ఇంకామిగిలిఉంది. ఇప్పటికే నాలుగేళ్ళు గడిచిపోయాయి. భద్రపాలుడే పట్టుబట్టి అతడినీ, అతడి శిష్యుడినీ  నాలందా మహావిహారానికి పంపించాడు. మూడేళ్ళల్లో తిరిగి రావాల్సింది.  ఏమైపోయాడో? ఇక్కడ విహారం పరిస్థితి చూస్తే ఏడాదికేడాది దిగజారుతున్నది.

ఈ ఏడాది వర్షావాసానికి పన్నెండుమంది భిక్షువులు మాత్రమే విహారానికి చేరారు. వాళ్ళంతా ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్ళే.  మరో పదిమందైనా రావాలి. వస్తారో లేదో; ప్రతీ ఏడూ ఇలాగే ఎదురుచూడడం. విహారంచేరే భిక్షువుల సంఖ్య తగ్గిపోతోంది. ఏ అడవిజంతువు వాళ్ళని కబళించిందో  లేక జబ్బుపడి ఏ మార్గమధ్యాన మరణించారో? దీపాంకరుడి విషయంలోనూ అలాంటి ఉపద్రవమేదైనా జరిగిందా? అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజ్యాల్లో ఏమి జరుగుతోందో? వచ్చేపోయే వాళ్లులేక ఏ సంగతీ తెలియరావడం లేదు. కళింగపట్నం, కోరంగిరేవుల మీదుగా వస్తూపోయే సింహళ భిక్షువులుకూడా ఈమధ్య ఇటుగా రావడంలేదు.

భద్రపాలుడు యువకుడుగా ఉన్నప్పుడు వర్షావాసాల్లో వందలకొద్దీ భిక్షువులతో కళకళలాడిన విహారం ఇప్పుడు పూర్తిగా  బోసిపోయింది. చుట్టుపక్కల మూడు కొండలకి విస్తరించిఉన్న విహారపుగుహల్లో ఇదొక్కటే వాడుకలో మిగిలింది. ఒకటి పూర్తిగా పాడుబడి గబ్బిలాలనిలయంగా మారిపోయింది. శిల్పులు అసంపూర్ణంగా వదిలిపెట్టిన మూడోగుహలోని స్తూపానికి గతపదేళ్లుగా శివలింగం రూపంలో పూజలూ, జంతుబలులూ జరుగుతున్నాయి. అక్కడ శివరాత్రినాడు జాతరకూడా జరుగుతుంది; ఆరోజున చుట్టుపక్కల గ్రామస్థులు చాలామంది జాతరకని వస్తారుగాని, విహారం జోలికిరారు. ఎప్పుడైనా భిక్షువులు ఎదురుపడితే సాధువులని భావించి భక్తిగా దండంపెడతారు; ఆపాటి గౌరవంఉంది. దగ్గరలో ఉన్న నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి భిక్షాటనకి వెళ్ళినా ఆ పూటకి సరిపడా భిక్ష దొరికిపోతుంది. ఉండే భిక్షువులే పది, పన్నెండుమంది. కొత్త భిక్షువులు వచ్చిచేరడం ఎప్పుడో ఆగిపోయింది. దీపాంకరుడి తరవాత ఒకరో, ఇద్దరో.

కుక్కలు ఎందుకు మొరిగాయో భద్రపాలుడికి బోధపడింది. ఒక సాధువులగుంపు విహారంవైపుగా వస్తున్నది. పది మంది ఉంటారేమో. ఏదో తత్వం పాడుకుంటూ సునాయాసంగా కొండెక్కుతున్నారు. వాళ్ళ పాట అస్పష్టంగా వినబడుతున్నది. ఎప్పుడైనా ఒకరిద్దరు సాధువులువచ్చి, ఒకటిరెండు రాత్రుళ్ళు తలదాచుకొని వెళ్లిపోవడం చూశాడుగాని ఇంతమంది గుంపుగా ఎప్పుడూ రాలేదు. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సాధువులు మర్రిచెట్టుని సమీపిస్తూనే భద్రపాలుడికి నమస్కరించి మంచినీళ్ళడిగారు. గుహలకి దారితీసే రాతిమెట్లకి ఒకవైపున పేర్చిఉన్న కుండలకేసి చూపించాడు. నీళ్ళుతాగి, మర్రిచెట్టుకింద కూర్చున్నారు. సాధువుల్లోని పెద్దాయన అన్నాడు:

“స్వామీ, మేమంతా కాశీనుండి వస్తున్నాం; రామేశ్వరం వెళుతున్నాం. కాశీలో మాకీయన తటస్థపడ్డాడు. ఉజ్జయని మీదుగాకాకుండా తూర్పుగాంగుల రాజ్యంలోంచి, కళింగదేశం మీదుగా తీరంవెంబడి వెళ్తున్నాంఅనంటే మాతోబాటు వస్తానన్నాడు. గోదావరి సమీపంలోని పంపానదీతీరానఉన్న బౌద్ధవిహారానికి వెళ్ళాలన్నాడు; సరే, రమ్మన్నాం. దారిలోఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, మజిలీలుచేస్తూ వచ్చేసరికి ఏడాది దాటింది. కాశీలో కలసినప్పుడే మీవాడు చాలా  ముభావంగా ఉన్నాడు.  మహానదిదాటి కళింగదేశం చేరేనాటికి బొత్తిగా మాట్లాడడం మానేశాడు. ఆరోగ్యం బాగోలేదు; మతికూడా చలించినట్టుంది”.

భద్రపాలుడికి నెమ్మదిగా అర్థంఅయింది. సాధువులందర్నీ మార్చిమార్చిచూడగా, గొంతుక్కూర్చొని నేలమీద వేలితో గీతలుగీస్తున్న యువకుడు దీపాంకరుడు అయిఉండవచ్చని ఊహించాడు. మిగతా సాధువుల్లాగే గెడ్డం, మీసాలు, జడలుకట్టిన జుత్తు. భద్రపాలుడి గొంతుక ఎండిపోయింది. అతి కష్టంమీద అతనిగొంతు పెగిలింది.

“అవును, ఇతను దీపాంకరుడు. నాలందామహావిహారానికి పంపించాం. ఎప్పుడొస్తాడాఅని ఎదురుచూస్తున్నాం”.

“మీరు వినలేదా? తురుష్కులదాడితో నాలందా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వందలమంది భిక్షువుల్ని వెంటతరిమి ఊచకోత కోశారు. మిగిలినవాళ్ళు తలోదిక్కూ పారిపోయారు. కాశీలో కలిసినప్పుడు మీవాడిని అడిగితే వివరాలేవీ చెప్పలేకపోయాడుగాని, ఆప్రాంతాల్లో అందరికీ తెలుసు. మేం కాశీలో బయిల్దేరేనాటికి తురుష్కులు తగులబెట్టిన తాళపత్రగ్రంధాలు మూడునెలలపాటు మండుతూనే ఉన్నాయని అంతా అనుకుంటున్నారు”.

చాలాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు. రివ్వుమని నీటిమీది గాలి వీచసాగింది – రాబోయే వర్షానికి సూచనగా. నల్లనిమేఘాలు కమ్ముకొచ్చాయి. మర్రిచెట్టు చిటారుకొమ్మలు, ఊడలు ఊగసాగాయి. భూమిలోంచి, కొండరాళ్ళలోంచి  వేడి, పైన రొజ్జగాలి. టపాటపా పెద్ద చినుకులు పడనారంభించాయి. చీకటవుతున్న ఆకాశాన్ని చీలుస్తూ మెరుపుతీగె వెలిగింది; దగ్గరలోనే ఎక్కడో పిడుగు పడింది; కొండలనడుమ ప్రతిధ్వనిస్తూ ఉరుము.

“మేమింక బయిల్దేరాలి…. వర్షాల్లో గోదావరి దాటడం కష్టం” అన్నాడు సాధువుల పెద్ద. సాధువులంతా లేచినిలబడ్డారు.

“దీపాంకరుడివెంట అతని శిష్యుడు ఒకడు ఉండాలే?” అతి కష్టం మీద అన్నాడు, భద్రపాలుడు.

“అవును. కళింగదేశంలో ప్రవేశించిన కొద్దిరోజులకే జ్వరంసోకి ప్రాణంవిడిచాడు. మా సాధువులిద్దరుకూడా పోయారు. అప్పటినుండి ఈయన ప్రవర్తన మరింత దిగజారింది”.

దీపాంకరుడిని తీసుకొచ్చి అప్పజెప్పినందుకుగాను కృతజ్ఞత తెలియపరచాలని భద్రపాలుడికి చాలా అనిపించింది కాని నోరుపెగల్లేదు. వర్షం పెద్దదయ్యేలాగా ఉంది, కాసేపు ఆగమందామా అనుకున్నాడు. ఏదోఒకటి అనేలోగా సాధువులు వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. కొండదిగుతూ, చదునుగా ఉన్నచోటున ఆగి, మళ్ళీ తత్వం అందుకున్నారు; గుండ్రగా తిరుగుతూ, నవ్వుకుంటూ, తడిసిముద్దవుతూ, చప్పట్లుచరుస్తూ, తన్మయత్వంతో పాడుతున్నారు.

నీటిబొట్టువు, నీటిబొట్టువు

నింగినుండీ నేలరాలిన – నీటిబొట్టువు – నీటిబొట్టువు

ఒకటి రాలెను కొండమీదా

ఒకటి కురిసెను వాగులోనా  – నీటిబొట్టువు, ….

ఒకటి చేరెను రాజు ఇంటా

ఒకటి పోయెను పేద వెంటా – నీటిబొట్టువు, ….

ఒకటి మిగిలెను చేనులోనా

ఒకటి ఉన్నది అడవి నడుమా – నీటిబొట్టువు, ….

ఒకటి ఇంకీ నేలచేరెను

ఒకటి దప్పికతీర్చి పోయెను – నీటిబొట్టువు, …..

చెరువులోనా, నూతిలోనా

చేదలోనా, కుండలోనా  – నీటిబొట్టువు, …..

వాగులోనా, వరదలోనా

పొలంలోనా, పుట్టలోనా  – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు రాలిపడెనో?

ఏది ముందుగ ఆవిరగునో? – నీటిబొట్టువు,…

చివరికన్నీ గంగచేరును

కడలి కడుపున కలసిపోవును – నీటిబొట్టువు, ….

మేఘమందున మంచినీరే

కమండలమున మంచినీరే – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు ఎక్కడున్నది?

ఏది ఎప్పుడు ఎచటచేరును? – నీటిబొట్టువు, ….

ఎవరుముందో, ఎవరు వెనకో?

నీవు ఎవరో, నేను ఎవరో? – నీటిబొట్టువు, ….

అన్నిదిక్కుల ఉన్నదొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

చివరికదియే నిలిచి వెలుగును

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

విశ్వనాథుని రూపమొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె

దూరంగా కూర్చున్న దీపాంకరుడుకూడా పరధ్యానంగా వంతకలుపుతూ అదేతత్వం పాడుతున్నాడు. సర్వసంగ పరిత్యాగి, గొప్పజ్ఞాని అయిన  భద్రపాలుడి కనులవెంట ఏకధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అతని మొహంలో ఏ భావనాలేదు; అతని గంభీరదుఃఖానికీ, నిశ్శబ్దరోదనకూ కారణం ఇదీ అనిచెప్పడం కష్టం. దీపాంరుడు గురువుగారివంక కాస్తంత ఆశ్చర్యంగా చూసి, లేచివచ్చి పక్కనే కూర్చున్నాడు. వర్షం పెద్దదైంది. దీపాంకరుడి చెయ్యిపట్టుకొని నెమ్మదిగా లేచాడు భద్రపాలుడు. ఇద్దరూ గుహలోపలికి నడిచారు.

***


వర్షాకాలమంతాకూడా విహారంలోని భిక్షువులమధ్య ఒకేచర్చాంశం. శాశ్వతంగా నిలిచిపోతుందనుకున్న నాలందా మహావిహారంలో అంతటి ఘోరం ఎలాజరిగింది? ఎవరీ తురుష్కులు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి మరీ చంపారు? వాళ్ళకేంకావాలి? ఇంకా ఏంజరగబోతోంది? తన తరువాత వెయ్యిసంవత్సరాల్లో బౌద్ధం అది పుట్టిన గడ్డనుండి నిష్క్రమిస్తుందని తథాగతుడు స్వయంగా అన్నాడంటారు; అదే నిజమవుతోందా?   నాలందా మళ్ళీ ఎప్పటికైనా నిలదొక్కుకుంటుందా?…..ఇవే ప్రశ్నల్ని మళ్ళీమళ్ళీ వేసుకుంటూ అదేపనిగా చర్చించుకోవడమేగాని ఎవరికీ సమాధానాలు తట్టడంలేదు. సాధువులనోట భద్రపాలుడు విన్నసమాచారం తప్ప మరేవివరాలు తెలియలేదు. దీపాంకరుడు ఏమీ చెప్పడు. అతన్ని ప్రశ్నలతో వేధించవద్దని భద్రపాలుడి ఆదేశం. భిక్షువులకు ఎటూ తోచడంలేదు. వాళ్ళ గుండెలనిండా అపారమైన దిగులు.  ముఖ్యంగా భిక్షువుల మూకుమ్మడి హత్యల్ని, గ్రంధాలయాల్ని తగులబెట్టడాన్ని తట్టుకోలేకపోయారు.

దీపాంకరుడి పరిస్థితి మెరుగుకావడానికి చాలాకాలమే పట్టింది. భద్రపాలుడి వైద్యం, సాటి  భిక్షువుల శుశ్రూష అతన్ని కోలుకొనేలా చేశాయి. ఇప్పుడు స్వయంగా భిక్షాటనకు వెళ్తున్నాడు. అయినా చాలాతక్కువగా మాట్లాడుతాడు. నాలందాలో ఏమైందని ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు.  అతడూ ఆ విషయాలు ఎత్తుకోలేదు. భద్రపాలుడు అతడిచేత ముఖాముఖీ మాట్లాడించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ వర్షావాసం నిరాశ, నిస్పృహల నడుమ ముగియవచ్చింది.

అది అశ్వయుజ పౌర్ణమి. వర్షావాసపు అంతాన్ని సూచించే పవరన ఉపోసత (సంస్కృతంలో ప్రవరణ ఉపవాసథ) నాడు పాటించే పతిమోక్ఖా (సం. ప్రతిమోక్షా) దినం. వర్షావాస సహవాసంలో భిక్షువులు ఎప్పుడైనా త్రిపీటిక విధించే నియమాలను  అతిక్రమించినా, తోటిభిక్షువులపట్ల దురుసుగా, కరకుగా ప్రవర్తించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకొనే రోజు. ఆ కార్యక్రమం ముగిసిన మర్నాడే సమీపగ్రామాల ప్రజలు ఇక త్వరలోనే ప్రయాణం కట్టబోయే భిక్షువులకు వీడ్కోలుచెప్పడానికి విహారానికివస్తారు. చీవారాలను బహూకరిస్తారు; ఆశీర్వాదాలను కోరుకుంటారు.

ఆనాటి ప్రతిమోక్షాసమావేశానికి ఉదయాన్నే భిక్షువులందరూ ముందుగానేవచ్చి మహాస్తూపానికెదురుగా కూర్చున్నారు. భద్రపాలుడు లోనికివచ్చి అందర్నీ పరిశీలనగా చూశాడు. పట్టుమని పాతికమందికూడా లేరు. వర్షావాస ప్రతిమోక్షాదినాన ఇంతచిన్న భిక్షువులగుంపుని చూడడం అతనికిదే ప్రధమం. చివరివరుసలో దీపాంకరుడు కూర్చొని ఉన్నాడు. భిక్షువులందరిలాగే శిరోముండనం చేయించుకొని, కాషాయిరంగు చీవారాలను ధరించిఉన్నాడు. ముందువరసలోకి వచ్చికూర్చోమని భద్రపాలుడు అతనికి సైగచేశాడు. దీపాంకరుడి వద్దనుండి ఎలాంటి స్పందనా లేదు.  అతని వెర్రిచూపు పోయింది గాని, మౌనం అలాగే ఉంది.

భద్రపాలుడు పాళీ భాషలో త్రిపీటికానియమాలను పైకి బిగ్గరగా చదువుతున్నాడు. ఒక్కో నిత్తనీ (నిష్ఠనీ లేదా నియమాన్ని) పూర్తిగా వినిపింపజేశాక  –

“మీలో ఎవరైనా దీన్ని అతిక్రమించారా?” అని అడుగుతున్నాడు. ఎవరూ స్పందించకపోతే,

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఈ నిష్టని అతిక్రమించలేదని భావిస్తున్నాను” అని ప్రకటించి ముందుకి సాగుతున్నాడు.

నిష్టా నియమాల ప్రకటన పూర్తయింది. చివరి ప్రశ్నను సమావేశం ముందుంచాడు భద్రపాలుడు.

“ఎవరైనా, ఏ విషయంలోనైనా పశ్చాతాపం ప్రకటించదలుచుకున్నారా?”

భిక్షువుల నుండి మళ్ళీ నిశ్శబ్దం.

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఏ నియమాన్నీ అతిక్రమించలేదనీ, ఈ వర్షావాసంలో ఒకరిపట్ల ఒకరు దురుసుగాగాని,  కఠినంగాగాని వ్యవరించలేదని భావిస్తూ ఈ ప్రతిమోక్షాసమావేశాన్ని ముగిస్తున్నాను” అన్నాడు భద్రపాలుడు.

సరిగ్గా అప్పుడే దీపాంకరుడు ఏదో అన్నాడు. భద్రపాలుడికి వినిపించలేదు.

“ఏమంటున్నాడు?” అని దీపాంకరుడికి సమీపంగా కూర్చున్న భిక్షువులను అడిగాడు.

అంతటా కలవరం. భద్రపాలుడు చెయ్యపైకెత్తి సభికులను నిశ్శబ్దంగాఉండమని సౌంజ్ఞచేశాడు; సద్దుమణిగింది. దీపాంకరుని పక్కనే కూర్చున్న యువభిక్షువు అన్నాడు:

“నాలందాలో ఉండగా – పాళీభాషని బోధించే ఆచార్యుని మరణానికి తానే కారకుడినని అంటున్నాడు”

“ఎందుకని అలా అనుకుంటున్నావు? వివరంగా చెప్పు” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడు మాట్లాడ్డం మర్చిపోయిన వాడిలా నెమ్మదిగా, కూడబలుక్కుంటూ జవాబిచ్చాడు:

“ఆ సాయింత్రం……తురుష్కుల బృందం ఒకటి వెంటాడుతూంటే…..నడవలేకపోతున్న ఆచార్యులవారిని ఇక మొయ్యలేక…..ఒక చెట్టుకింద వదిలేశాం…..ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఏదోవిధంగాదాటి అవతలిఒడ్డున ఉన్నగ్రామంలో తలదాచుకున్నాం ఆ రాత్రికి…..  మర్నాడు ఉదయం, ధైర్యంచేసుకొని, గ్రామస్థులను వెంటబెట్టుకొని వెళ్లి చూస్తే ఆయన తలనరికేసి ఉంది…. ఏదోలా మాతోబాటు నదిదాటించి ఉంటే  బతికేవారు…..”

“మీలో ఎవరో కొందరు ఆయనకి తోడుగా ఉండవలసింది కదా?” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడి మాటల్లో వేగంపుంజుకుంది. “మేంకూడా అదేఅన్నాం, భాదంతా. ఆచార్యులవారు అంగీకరించలేదు.

‘మీరెంతమంది తోడున్నా వాళ్ళను నిలువరించలేరు. మనం సైనికులంకాము. మనవద్ద ఆయుధాలులేవు. నాఒక్కడికోసం మీరందరూ ప్రాణాలు వదులుకోవడంలో  అర్థంలేదు. మీరు ముందుకి వెళ్ళండి. నాకోసం ఆగవద్దు. ఇప్పటికే నా మూలంగా తొందరగా ముందుకి సాగలేకపోతున్నారు. మీరంతా చిన్నవాళ్ళు; మీరే రేప్పొద్దున్న బౌద్ధాన్ని కాపాడాలి. నాబోటి ముసలాడు పోయినా సంఘానికి జరిగే నష్టం ఏమీ లేదు. అంతా బాగుంటే మళ్ళీ కలుసుకుందాం… మీరు నాకోసం ఆగవద్దు. ఇది నా ఆదేశం’ అన్నారు”.

చాలాసేపు సభలో నిశ్శబ్దం. చివరికి భద్రపాలుడు ఇలా అన్నాడు:

“ఆచార్యులవారు అన్నదే సహేతుకంగా ఉన్నది. అటువంటి విపత్కర పరిస్థితుల్లోకూడా ఆయన తన తార్కికదృష్టిని మరలించక, తనప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం మానుకొని మిమ్మల్ని బతికించాడు. బౌద్ధానికి సేవచెయ్యమని కోరుకున్నాడు. ఈ విధంగా అతను బౌద్ధధర్మాన్ని నిలబెట్టాడు. తథాగతుని మార్గాన్ని అనుసరించాడు”.

“అదే….అదే మోయలేని భారం. ఏం చెయ్యాలి? ఏమీ తోచడం లేదు భాదంతా”.

“అంటే?”

“అటువంటి ఉత్తముడైన ఆచార్యుడి త్యాగానికి అర్హునిగా నిలవాలంటే నేనేం చెయ్యాలి? ఆయన దయవల్లనే ఈరోజున జీవించి ఉన్నాను. ఇకమీదట నా జీవితపరమార్థం ఏమిటి? అదే తెలియడంలేదు”

మొదటిసారిగా దీపాంకరుడి వ్యధ భద్రపాలుడికి పూర్తిగా అవగతమైంది.

“రేపటి ప్రత్యేక సమావేశంలో ఈ విషయం చర్చిద్దాం. ప్రస్తుతానికి ఈ సమావేశాన్ని ముగిద్దాం” అన్నాడు. దీపాంకరుడు నాలందా విషయమై నోరువిప్పినందుకు భద్రపాలుడి మనసు రవ్వంత తేలికపడింది.

***

బౌద్ధానికి పెద్దపీటవేసిన మహానుభావులు దేవానాంప్రియఅశోకుడూ లేడు; కనిష్కచక్రవర్తీ లేడు; హర్షవర్ధనుడూ లేడు. ముందుముందు అటువంటి అనుకూలురైన సామ్రాజ్యాధిపతులు అధికారంలోకివచ్చే సూచనలూ లేవు. ప్రజల్లోకూడా బౌద్ధానికి ఆదరణ అంతంతమాత్రంగానే ఉన్నది. పాలకులు, పండితుల దగ్గరనుండి సామాన్యప్రజలదాకా ప్రతి ఒక్కరూ శైవ, వైష్ణవ శత్రుశిబిరాలుగా చీలిపోయి, వీధినపడి కొట్లాడుకుంటున్నారు. ఆపైన కొత్తగా ఈ తురుష్కుల దాడి; నాలందా విధ్వంసం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడమెలా? ఇదీ ప్రత్యేకసమావేశపు ప్రధానచర్చాంశం. భద్రపాలుడితోబాటు మరో ఆరుగురు అనుభవజ్ఞులైన భిక్షువులతోకూడిన సమావేశం. వాళ్ళల్లో దీపాంకరుడు కూడా ఉన్నాడు.

నిజానికి ఇప్పుడంటే నాలందా ఒక అంశంగా చర్చలో చోటుచేసుకున్నదిగాని, ధర్మాన్ని ఎలాకాపాడుకోవాలి? ఎలా విస్తరింపజెయ్యాలి? అనేప్రశ్నలు ప్రతీసారీ ప్రత్యేకసమావేశాల్లో చర్చకువచ్చేవే. అయితే ఇంతకుముందెన్నడూలేని విధంగా – నిస్పృహతోకూడిన ఆందోళన, ఏదోఒకటి తొందరగా అమలుచెయ్యాలనే ఆదుర్దా, ఏం చెయ్యాలో తెలీని సందిగ్ధత – ఇవన్నీ ఆనాటి సమావేశంలో వ్యక్తమయ్యాయి.

రాజులూ, మహారాజులూ బౌద్ధానికి అనుకూలురుగా మారితేతప్ప గతవైభవాన్ని పునరుద్ధరించడం అసాధ్యం అనే వాదనే నేడుకూడా ప్రధానంగా వినిపించింది. అది ఎలాసాధ్యం అనేప్రశ్నకు మాత్రం అందరికీ అంగీకారమైన సమాధానం లభించలేదు. కాకతీయరాజైన ప్రతాపరుద్రుడు జైనమతాన్ని పాటించి, పోషిస్తున్నాడు. అటు కన్నడదేశంలోకూడా ఒకమేరకు జైనానికి ప్రజల్లోనూ, పాలకుల్లోనూకూడా ఆదరణఉన్నది. మరి బౌద్ధం విషయానికి వస్తే ఆమాత్రపు ఆదరణకూడా దుర్లభంగా ఉన్నది…..ఇలా నడిచింది చర్చ. చాలాసేపు మౌనంగా వింటూవచ్చిన దీపాంకరుడు గొంతుసవరించుకున్నాడు. అందరూ అతనికేసితిరిగారు – ఏం చెప్పబోతున్నాడా అని.

“నేను సాధువులతో బాటుగా తిరుగుప్రయాణంచేస్తూ గమనించాను. మొదట గాంగుల రాజైన అనంతవర్మ చోడగాంగు, ఆతరువాత ఓడ్ర రాజైన అనంగ భీమదేవుడు పూరీలో జగన్నాథస్వామి దేవాలయాన్ని నిర్మించి దానికొక ప్రాధాన్యతని కల్పించారు. అయితే జగన్నాథుడిమూలరూపం, మారుమూల ప్రాంతంలో కొండవాళ్ళు కొలుచుకొనే దేవతది. అలాగే మిగతాచోట్లకూడా కొత్తగా సామ్రాజ్యాలను స్థాపిస్తూన్న రాజులు స్థానికదేవుళ్లకు, కులదేవతలకు పెద్దపెద్ద దేవాలయాలు నిర్మించి ప్రాముఖ్యత ఏర్పరుస్తున్నారు. ఆయా దేవుళ్ళని స్వంతం చేసుకుంటున్నారు. వాళ్ళే తమ రాజవంశాలని కాపాడుతారని  నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. అంతేగాని బౌద్ధం వైపు దృష్టిసారించడం లేదు”.

దీపాంకరుడు చర్చలో పాల్గొంటున్నందుకు సంతోషిస్తూ భద్రపాలుడు అడిగాడు:

“అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి?”

“రాజులూ, రాజ్యాలూ శాశ్వతంగా ఉండిపోవు. మన దృష్టిని రాజ్యాధిపతులపైన కాకుండా సామాన్యప్రజలపైనే పెట్టాలి. సమాజపుకిందిపొరలను బౌద్ధధర్మంవైపు ఆకర్షితులను చెయ్యాలి. పైగా బౌద్ధంఅనేది, జ్ఞానమార్గంలో పయనించే తార్కికులకు, మేధావులకు, పండితులకు పరిమితమైన ధర్మమేగాని, సామాన్యులకు అందుబాటులో ఉండదనే భావన ఒకటి ప్రచారంలో ఉన్నది. ఒకవైపు తాత్విక అన్వేషణలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్యప్రజానీకాన్ని హేతుబద్ధమైన ధర్మపథంవైపు నడిపించాలి. ఇదే మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన ప్రయత్నం. ఫలితాలు మనకు ఇవాళ కనిపించకపోవచ్చు. ఎప్పుడో ఒకరోజున పామరులనుకొనేవాళ్ళే పెద్దసంఖ్యలో బౌద్ధధర్మపు విశిష్టతని గుర్తిస్తారు. అప్పుడే బౌద్ధం నిలబడుతుంది. అది ఎప్పుడు, ఎలా జరుగుతుందని అడిగితే నా వద్ద సమాధానంలేదు”.

“బాగాచెప్పావు. అజ్ఞానపుటంధకారాన్ని శాశ్వతంగా దూరంచేసేది బౌద్ధధర్మమే. ఇవాళ్టి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు. రాజపోషకుల ప్రాపకంకోసం దేబిరించడం మానుకొని ప్రజానీకాన్ని ధర్మపథంవైపు నడిపించే ప్రయత్నాలు కొనసాగించాలి. నాలందాలో పోగొట్టుకున్నగ్రంధాలని తిరిగిసేకరించాలి. ఇవేమనపై కాలం విధించిన కర్తవ్యాలు. దీపాంకరుడి ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాను”. అన్నాడు భద్రపాలుడు. పెద్దలందరూకూడా తమ ఆమోదం తెలియజేసారు. ఆనాటి ప్రత్యేక సమావేశం ముగిసింది.

ఒక చర్చాంశంమాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అరబ్బులూ, పారశీకుల్లాగే తురుష్కులు ఆచరించే ధర్మంకూడా మహమ్మదీయమేఅని అందరికీ తెలుసు. అరబ్బు, పారశీకదేశాల ఓడవర్తకుల రాకపోకలు, వారితో లావాదేవీలు అప్రాంతాల్లో అనాదిగా జరుగుతూనేవస్తూన్నవి. వాళ్లెప్పుడూకూడా ఈ తురుష్కుల్లా ప్రవర్తించిందిలేదు.  “ఎవరీ క్రూర మహమ్మదీయులు? నాలందాపైన ఎందుకు దాడిచేశారు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి చంపారు?” అన్న ప్రశ్నలకు మాత్రం ఆనాడు సమాధానం లభించలేదు.

***

కొండల్లో చిన్నగా చలి మొదలైంది; ఉదయాన్నా, సాయింత్రంపూటా విహారాన్ని పొగమంచు ఆవహిస్తున్నది; ఇండ్ల పైకప్పులనుండి నీలిరంగు పొగ కానవస్తున్నది. భద్రపాలుడూ, మరోఇద్దరు వృద్ధభిక్షువులూ, ఇద్దరు అంతేవాసులూ విహారంలో మిగిలారు. మిగతావాళ్ళంతా దేశాటనకు వెళ్ళిపోయారు. విహారనిర్వహణాబాధ్యత పూర్తిగా దీపాంకరుడిపైనే పడింది.  చీకటితోనేలేచి పంపానదీ తీరానికిపోయి స్నానంచేసి, నీళ్ళు పైకిమోసుకురావడం, విహారాన్నిఊడ్చి శుభ్రంచెయ్యడం,  భిక్షాటనకు పోయిరావడం వీటితో మొదలుపెట్టి అధ్యయనం, చర్చలు నిర్వహించడం, స్థానికులకు ఉపదేశాలు ఏర్పాటుచెయ్యడం వరకూ అన్నీ అతడే చేస్తున్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా నాలందాలో రెండేళ్ళపాటు అత్యుత్సాహంగా గడిపినదినాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.  ఆ రెండేళ్ళలోనే ఎంతమందితో సావాసం చేశాడు? ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నాడు? అతనిప్పుడు ద్వైత, అద్వైత సిద్ధాంతాల గురించి, వాటి మధ్యగల తేడాలగురించి వివరణ ఇవ్వగలడు; నాగార్జునిబోధనలకు, ఆదిశంకరాచార్యుని ప్రవచనాలకు మధ్యగల సారూప్యాల్ని, అంతరాన్ని విశ్లేషించి చర్చించగలడు. పాళీగ్రంధాలను సునాయాసంగా పఠించి భాష్యం చెప్పగలడు. అయితే కొత్తగా ప్రోదిపడిన ఈ జ్ఞానభండారం విహారానికి తిరిగివచ్చాక అతనికి అక్కరకు రాలేదు – భద్రపాలునితో జరిపిన ఒకటీఅరా సంభాషణలను మినహాయిస్తే. అతనికి జ్ఞానాన్వేషణకు నూతనద్వారాలను తెరిచి, అనేక విషయాలపట్ల కనువిప్పు కలిగించిన ఆ మహత్తరమైనకాలం ఆకస్మికంగా అంతంకావడం, మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం అతనికి ఒక వైఫల్యంలాగా, ఎదురుదెబ్బలాగా  అనిపించసాగాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అతని అసంతృప్తి మరింత తీవ్రం అవుతోందితప్ప మారినపరిస్థితుల్ని ఆమోదించగల సంయమనం ఏర్పడడం లేదు.

అసంతృప్తితో అల్లాడడం బౌద్ధభిక్షువైన తనకుతగదని దీపాంకరుడికి తెలుసు. గురువుగారైన భద్రపాలుడితో చర్చిద్దామనుకుంటూనే అలక్ష్యం చేస్తూవస్తున్నాడు. అందుకు కారణం ఒకటే. తన సమస్యని వివరించగలడుగానీ పరిష్కారం చర్చించేందుకు అతనివద్ద ఏ ఆలోచనాలేదు. అటువంటప్పుడు వయోభారంతోబాటుగా నాలందా విధ్వంసంకారణంగా కుంగిపోతున్న భద్రపాలుడిని వేధించడం ఇష్టంలేక ఊరుకున్నాడు.

చలికాలం కూడా అలాగే గడిచిపోయింది. వసంతఋతువు సమీపించింది. మామిడిపువ్వు వాసన, కోయిలల పలకరింపులు లోయల్ని ఆవరించాయి. అదేకాలంలో దీపాంకరుడికి ఊహించనివిధంగా ఒకఆధారం దొరికింది; అంధకారంలో ఆశాకిరణం వికసించింది. నాలందాలో బయల్దేరి ఉజ్జయని, ధాన్యకటకం (అమరావతి) మీదుగా ప్రయాణించి కళింగపట్నంరేవుకి వెళ్తూన్న ఇద్దరు సింహళభిక్షువుల ఆగమనంతో అతనిలో ఉత్సాహం పెల్లుబికింది. వారిలో పెద్దవాడు ఆచార్య శాంతిదేవుడు రెండోది అతని శిష్యుడైన గుణసేనుడు. వాళ్ళిద్దరూ సింహళద్వీపంలోని పొలోన్నరువ నగరమందున్న ఉత్తరారామం (గల్ విహార) నుండి వచ్చారు. ఇంకో విశేషమేమంటే వాళ్ళిద్దరూకూడా నాలందాలో దీపాంకరుడి సహాధ్యాయులే; బాగా పరిచయస్థులుకూడా. కళింగపట్నం మీదుగా తిరిగి తమదేశానికి పోదల్చుకున్న  ఆ భిక్షువులిద్దరినీ కొన్నాళ్లపాటు విహారంలో గడపమని దీపాంకరుడేకాక భద్రపాలుడుకూడా అభ్యర్ధించాడు. వారిసాంగత్యంమూలంగా దీపాంకరుడిలో వెల్లివిరుస్తున్న ఉత్సాహాన్ని గమనించిన భద్రపాలుడు వారిమజిలీ మరికొన్నాళ్ళు కొనసాగాలని కోరుకున్నాడు. అందుకు ఆ భిక్షువులు సంతోషంగా అంగీకరించారు.

వారితో పాళీ, సంస్కృత భాషల్లో జరిపిన సంభాషణల్లో నాలందావిధ్వంసం గురించి మరికొన్నివివరాలు తెలిసాయి. మూడు ప్రధాన గ్రంధాలయాలు తగులబెట్టబడినమాట వాస్తవమే. వందలకొద్దీ భిక్షువులను వధించడంకూడా నిజమే.  మరో దారుణం ఏమిటంటే – ఉద్దానపుర, విక్రమశిల, జగద్దల, సోమపుర మహావిహారాలపైనకూడా తురుష్కులు దాడులుచేసి సర్వనాశనం చేశారనే దుర్వార్త తెలియవచ్చింది.  ఇద్దరుసింహళ భిక్షువులలోనూ పెద్దవాడూ, ఎల్లప్పుడూ గంభీరంగాఉండే ఆచార్యుడూ అయిన శాంతిదేవుడు ఇలా అన్నాడు:

“విహారాలపైనా, దేవాలయాలపైనా దాడులుచేసి, అందినదంతా దోచుకోడంతో సరిపుచ్చుకొనే వారుకాదు ఈ తురుష్కులు. వీళ్ళకు ప్రభువైన మహమ్మద్ గోరీ అనే తురుష్కుడు తనకు సంతానంలేకపోవడంతో అతడు జయించిన రాజ్యాలను తన బానిసలకు అప్పగించాడు. ఉత్తరదేశం యావత్తూ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. నాలందా, తదితర విహారాలనూ, దేవాలయాలనూ ధ్వంసం చేసిందీ, కొల్లగొట్టిందీ అటువంటి బానిస సుల్తాన్లలో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ అనేవాడు. అందుచేత ఈ తురుష్కులు అక్రమించుకోవడానికీ, శాశ్వతంగా ఇక్కడేఉండి పరిపాలించడానికీ వచ్చారు తప్ప పూర్వం రోజుల్లోలా దాడులుచేసి, దోచుకొని పారిపోవడానికి కాదు. ఉత్తరభారతంలో వీరి ఆధిపత్యం స్థిరపడ్డాక దాడులు, ఆక్రమణలు దక్షిణదేశానికి కూడా విస్తరించకపోవు”.

శ్రద్ధగా వింటూన్న భద్రపాలుడు, దీపాంకరుడు హుతాశులైయ్యారు. భద్రపాలుడు నెమ్మదిగా అన్నాడు: “అయితే తథాగతుని గడ్డమీద బౌద్ధం నిలదొక్కుకొనే ఆశ ఇప్పట్లో ఇకలేనట్టే”.

శాంతిదేవుడు మౌనంగా ఉండిపోయాడు. దీపాంకరుడికి ఒకఆలోచన తోచింది.

“పోనీ ఈ తురుష్కుల్నే బౌద్ధానికి సానుభూతిపరులుగా మార్చగలిగితే…..?” అన్నాడు.

విషాదవదనుడైన శాంతిదేవుడు అన్నాడు, “అది అసాధ్యం. వాళ్లకు అర్థమయ్యేభాష సంగ్రామఘోష మాత్రమే; వాళ్ళకు తెలిసిందల్లా ఆయుధాలు, రణరంగం, దోపిడీ, ఊచకోత. అంతటి తథాగతుడుకూడా ఒకేఒక్క అంగుళీమాలుడిని సంస్కరించగలిగాడు. తురుష్కులదాకా ఎందుకు? కోసలరాజైన విరూధకుడు శాక్య గణరాజ్యాన్ని నాశనంచేసి, మొత్తం తథాగతుడి వంశీకులందర్నీ ఏనుగులతో కుమ్మించి మట్టుపెట్టినప్పుడు అతడు ఆ దుర్వార్తవిని మౌనంగా ఉండిపోయాడుతప్ప ఏమీ చెయ్యలేకపోయాడని మనకు తెలుసు”.

దీపాంకరుడు ఉండబట్టలేక, “తథాగతునికి తెలుసు; ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది” అనేశాడు, అస్వభావికమైన ఆవేశంతో.

శాంతిదేవుడు పరమశాంతంగా – “అవును. ఎప్పటికైనా….. ఇప్పుడు మాత్రం కాదు” అన్నాడు.

భద్రపాలుడు జోక్యంచేసుకున్నాడు. “ఇప్పుడు మనబోటి వాళ్ళం ఏంచేయాలి? దీనిమీద మొన్నటి ప్రతిమోక్షాసమావేశంలో పెద్దచర్చే జరిగింది. కాలచక్రదీక్ష పాటించి బౌద్ధులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సరైన సమయంకోసం ఎదురుచూడాలా? ఎన్ని తరాలని ఎదురుచూస్తాం? అంతవరకూ మన ధర్మాన్ని, సంఘాన్ని, గ్రంధాలని, విహారాలనీ ఎవరు కాపాడుతారు? బోధనలని ఎవరు కొనసాగిస్తారు? దీపాంకరుడు మొన్న ఒక ప్రతిపాదన చేశాడు – రాజుల్నీ, చక్రవర్తుల్నీ సంస్కరించే ప్రయత్నం మానుకొని సామాన్యప్రజలమీదే దృష్టిపెట్టాలనీ, వాళ్ళే రేప్పొద్దున్న బౌద్ధాన్నినిలబెట్టగలరనన్నీ. ఇవాళ్టిచర్చ తరవాత దీపాంకరుడు చెప్పింది చాలా సబబుగా ఉందని మరీమరీ అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యం అనేదే ప్రశ్న”.

“నేనొక సూచన చేయదలచాను, భాదంతే” అన్నాడు శాంతిదేవుడు భద్రపాలుడిని ఉద్దేశించి.

“చెప్పండి, ఆచార్యా”

“దీపాంకరుడు మంచి ఆలోచన చేశాడు. అతని శ్రద్ధాసక్తుల్ని, నియమనిష్టల్ని నాలందాలో ఉండగానే – నేనేకాదు – చాలామంది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్నికాపాడి నిలబెట్టగలిగినవాళ్ళల్లో దీపాంకరుడు ఒకడు. అతను కోరుకుంటూన్నట్టుగా సామాన్యప్రజానీకపు నిత్యజీవనంలో బౌద్ధంఅనేది మీప్రాంతాల్లో ఎప్పుడూ ఒక భాగంగా లేదు. అదే మాదేశంలో అయితే బౌద్ధధర్మమే సర్వవ్యాపితంగా ప్రకాశిస్తున్నది; తరతరాలుగా మా ప్రజల దైనందిన జీవనంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. దీపాంకరుడుగనక మాదేశం వస్తే అతను కలలుకంటూన్న భవిష్యత్తుని కళ్ళారాచూడగలడు. అంతేకాదు, మీరిక్కడ అనుసరిస్తూన్న థేరవాదబౌద్ధానికి మాదేశంలో రాజవంశపోషణ, సమర్థన ఉన్నాయి. అందుచేత నేను కోరేదేమంటే దీపాంకరుడిని మాతోబాటు పొలోన్నరువలోని ఉత్తరారామానికి పంపించండి. అక్కడ రెండు, మూడేళ్ళు ఉన్నట్టయితే అక్కడి పద్ధతులను, ఆచరణను స్వయంగా పరిశీలిస్తాడు; తెలుసుకుంటాడు. అంతేకాదు, నాలందాలో మధ్యలో ఆగిపోయిన అధ్యయనాన్ని కొనసాగిస్తూనే మావిహారంలో అధ్యాపకునిగా పనిచేస్తాడు. నాలందాస్థాయిలో సింహళదేశంలోకూడా ఒక బోధనాకేంద్రాన్ని నిర్మించాలనేది మా ప్రభువుల ఆశయం. నన్ను నాలందా పంపిందికూడా అక్కడి పద్ధతులను అధ్యయనం చేయడానికే. ఇప్పుడది ధ్వంసం అయిపోయింది గనక మరింత శ్రద్ధగా, పట్టుదలగా, త్వరితగతిన అటువంటి కేంద్రాల్ని నిర్మించుకోవాలి”.

ఆచార్యశాంతిదేవుని సూచనపై చాలాసేపే చర్చజరిగింది. భద్రపాలుడు కొంత అయిష్టంగానూ, దీపాంకరుడు చాలా ఉత్సాహంగానూ ఆసూచనకు అంగీకరించారు. దీపాంకరుడిని వెంటబెట్టుకొని ఇద్దరుసింహళభిక్షువులూ కళింగపట్నం సమీపంలోని శాలివాటిక విహారంలో కొన్నాళ్లపాటు బసచెయ్యడానికీ, సింహళదేశానికి బయలుదేరే మొట్టమొదటి ఓడనుఎక్కి సముద్రప్రయాణం చెయ్యడానికీ నిర్ణయం తీసుకున్నారు.

 

(రెండో భాగం -వచ్చే వారం )

—ఉణుదుర్తి సుధాకర్

 

మీ మాటలు

  1. సుధాకర్ గారూ,
    చాలా చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు రావటం లేదు, చాలా అద్భుతంగా ఉంది, మీరు ఇంకా చాలా రాయాలి, రాస్తారని ఆసిస్టూ …,

మీ మాటలు

*