కావ్య వ్యామోహం వచనానికి శాపం!

కాళిదాస మహా కవి ‘మాళవికాగ్నిమిత్రం’ ఆధారంగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నవల, ‘మాళవిక’ ఆవిష్కరణ సంద ర్భంగా వారి ఆప్త మిత్రులు, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు “ఛాయ” సంస్థ కోసం ప్రత్యేకంగా జరిపిన సంభాషణలని రెండు భాగాలుగా మీ కందిస్తున్నాం.

 

 1. మీరు విశ్వనాథ నుంచి ఈ నాటి వరకు అర్థ శతాబ్ది తెలుగు సాహిత్య పరిణామాన్ని చూశారు. కవిత్వంలో, వచనంలో ఈ కాలంలో మీరు అనుకునే మూడు ముఖ్యమైన మార్పులు ఏమిటి?

జ: వెంటనే గుర్తుకు వచ్చేవి :

ఒకటి : గ్రాంధిక భాషా  పధ్ధతి నుంచి రచయితలు క్రమంగా శక్తిమంత మైన వ్యావహారిక వచనం వైపు ప్రయాణించడం. ఇందుకు యిద్దరు వచన శైలీ నిర్మాతల్ని ఉదహరిస్తాను. ఒకరు – చలం. రెండోవారు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.

రెండు: కవిత్వంలో పద్య పాదాల సంఖ్య భావాన్ని బట్టి పెంచటం, తగ్గించటం.

మూడు: మహా కావ్య రచనా వ్యామోహం వెనకబట్టి – ఖండ కావ్య ప్రక్రియ, గేయ రచనా గౌరవం పెరగడం!

 1. భావకవులు అనేక మంది అనేక భాషా పండితులు. వారంతా స్వాతంత్రోద్యమంలో, హరిజనోధ్యమంతో పాటు బ్రహ్మ సామాజికులు కూడా అయి, తద్వారా సమకాలీన సామాజిక జీవితంతో, పరివర్తనతో సంబంధం ఉన్నవారు. వారి అధ్యయన విస్తృతి, సామాజిక ధృక్పధం వారి కవిత్వంలో కనిపించదంటే ఏమంటారు మీరు?

జ: నా ఉద్దేశ్యం – మీరు మొదటి తరం ఆధునిక రచయితలను గురించి ప్రస్తావించారు.  స్వాతంత్రోద్యమం, బ్రహ్మ సమాజ ఉద్యమం, మానవోద్యమం, కాల్పనికోద్యమం, సంస్కరణోద్యమం కూడా కల్పండి.  సాహిత్య పరులలో అప్పట్లో ఏ కొడాలి ఆంజనేయులు, శివశంకర శాస్త్రి వంటి బహు కొద్ది మంది నేరుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉండవచ్చు.  కానీ, అలనాటి తొలి తరం కవులు చాలా మందికి ఉద్యమ దృష్టి కంటే కాల్పనిక ఆవేశమే ప్రధానంగా ఉన్నట్లు తోస్తుంది.  ఆంధ్రోద్యమ కవిత్వం చెప్పినా, ప్రణయ కవిత్వం చెప్పినా, అలనాటి మహా నాయకుల్ని కీర్తిస్తూ రాసినా – దాదాపు అందరూ కవిత్వ “కల్పన”, స్మృతి పూర్వక చారిత్రక అభినందనల దగ్గరే ఆగిపోయారు.  కార్య కర్తల గా ఉద్యమాలలో కవిత్వం పేరిట గీతాలు, పద్యాలు రాసిన వారు కవులు కాలేక పోయారు.  కేవలం ఉద్యమ ఆవేశం వెళ్లబోసిన వారు అయ్యారు.  ఈ తేడాను మీరు విశ్వనాధ, రాయప్రోలు వంటి వారి ఉద్యమ కవిత్వాన్ని, గరిమెళ్ళ సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ వంటి వారి కవిత్వాన్ని పోల్చి చూస్తే బాగా గ్రహించగలరు.  ఇది హృదయ ధర్మాలలో తేడా – వారి అధ్యయనం వేరు, కాల్పనిక సామర్ధ్యం వేరు.

3.మన ఆధ్యాత్మిక సాంప్రదాయం, రవీంద్రుడి మిస్టిసిసమ్ ప్రభావంతో భావకవులు తలమునకలయినారా? వారంతా శాంతినికేతనాన్ని తిరుపతిగా భావించారు కదా?

జ: మన ఆధ్యాత్మిక సాంప్రదాయమంటే : దాని మూలం ఉపనిషత్తులు.  బ్రహ్మ సామాజికులకు ప్రామాణికత వాటి మీదనే.  రవీంద్రుడు బ్రహ్మ సామాజికుడే కదా! అయితే నా కర్ధమైనంతలో రాయప్రోలు, అబ్బూరి,మల్లవరపు విశ్వేశ్వర రావు మాత్రమే నేరుగా శాంతినికేతనం నుంచి వచ్చిన వారు. వేంకట పార్వతీశ కవులు, కృష్ణ శాస్త్రి, చలం వంటి వాళ్ళు రవీంద్రుడి సాహిత్య మార్గాన్ని (అంటే కాల్పనిక వైభవాన్ని) మోహించిన వాళ్ళు.  అందువల్ల నేరుగా మన ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కారు.  రవీంద్రుడు సూఫీ సంప్రదాయం, కొంత బెంగాలీ స్థానికత నుంచి తెచ్చిన జానపద వాసన గల కాల్పనికత, దైవానికి సంబంధించిన ‘నైరూప్య ’ భావన, కలిపితొరిపిన టాగోరియన్ కాల్పనిక రీతి నుంచి ప్రేరణ పొందిన వారు మన భావ కవులు.

4. భావకవుల్ని ఉతికారేసిన ‘నేటి కాలపు కవిత్వం’ అనార్ద్ర విమర్శ!

జ: ‘నేటి కాలపు కవిత్వం’ అంటూ అక్కిరాజు ఉమాకాంతం గారు చేసిన విమర్శ మొత్తం ‘పూర్వ పక్ష సిద్ధాంత’ ప్రతిపాదన పధ్ధతిలో చేసిన కరుకైన పండిత విమర్శ.  ఆయన ప్రధానంగా ఆక్షేపించిన విషయాలు రెండు. ఒకటి : కవిత్వం పేరిట అస్పష్టత. రెండవది : పాండిత్య లోపం. ఇంకా చెప్పాలంటే అది కృష్ణ శాస్త్రి గారి కాల్పనిక ధోరణి మీద విమర్శ. నిజమే – అనార్ధ్ర విమర్సే.  ఆయన విమర్సే నిజమై ఉంటే, కాల్పనిక సౌకుమార్యాన్ని కొత్త పద బంధాలతో తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన కృష్ణ శాస్త్రి బతికి బట్ట కట్ట కూడదు. అలా జరగ లేదే! నానాటికీ ఆయన కాల్పనిక వైభవం కవిత్వాభిమానుల్ని సమ్మోహ పరిచింది.

5. విశ్వనాధ క్రియేటివిటీకి క్లాసికల్ పరిమితులున్నాయని పిస్తుంది. ‘కల్పవృక్షం’ అట్లా ఉంచి, ఆయన ఖండ కావ్యాలలో ఆ లక్షణాలున్నాయా? భావకవుల ‘ఆధునీకత’ ఆయన కవిత్వంలో ఉన్నదా? వస్తువు కాదు, అభివ్యక్తి విషయంలో?

జ: తప్పకుండా.  విశ్వనాధ వ్యక్తిత్వంలో కవిగా క్లాసిసిసమ్, కాల్పనికత రెండూ కలగలిసిపోయిన స్రోతస్సులు. భావ కవుల ఆధునీకత ఆయన “గిరి కుమారుని ప్రేమ గీతాల”లోనూ, “కిన్నెరసాని” గీతాలలోనూ ప్రముఖంగా కనిపిస్తుంది.  ఆయన లోని క్లాసిసిసమ్ వైభవం ‘శృంగార వీధి’ పద్య ఖండికలలోనూ, తెలుగు ఋతువుల పద్యాలలోనూ- కడకు రామాయణ కల్ప వృక్షం కొన్ని ఘట్టాలలోనూ అద్భుతంగా కనిపిస్తుంది.  మరీ తొలి నాటి కవితల సంపుటి “భ్రష్టయోగి” చూడండి.  కాల్పనిక కవిగా ఆయన మనస్సు ఎంత లలిత సుందరమో తప్పక తెలుస్తుంది.

6. విశ్వనాధ వాడుక భాష తుఫాన్నుంచి ఎట్లా తప్పించు కున్నాడు?

జ: విశ్వనాధ   వాడుక భాష తుఫాన్నుంచి తప్పించుకోలేదు.  ఆయన గ్రాంధికంగా రాసిన దంతా, గ్రాంధికపు ముసుగులో దాగిన ఆయన సొంత వ్యావహారికమే!  (బలమైన పానుగంటి వారి గ్రాంధికమూ ఇంతే) క్రియా పదాలు, పదాంతాలు గ్రాంధికపు తొడుగు తొడుక్కున్నా, భాష హృదయం మాత్రం వ్యావహారికపు కాకువు తోడిదే.  అందుకే జీవవంతంగా ఉంటుంది.  విశ్వనాధ, తెలుగు వచన రచయితలలో అరుదైన శైలీ నిర్మాత.

 1. శ్రీశ్రీ లౌక్యుడు. నారాయణబాబు అంత కాదు. లౌక్యం లేకపోవడం వలనా, లేదా నారాయణబాబుని కమ్యూనిష్ట్ల పల్లకీ ఎక్కించక పోవటం వలనా? ఎందువలన ఆయనకి గుర్తింపు లేదు? ఆయన కవిత్వంలో గొప్ప’ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉంది కదా.

: శ్రీశ్రీకీ  , నారాయణ బాబుకీ  పోలికబెట్టటం సరికాదు.  శ్రీశ్రీ లో ఉన్న రూప స్పష్టత, భావ స్పష్టత నారాయణ బాబులో లేవు.  క్లుప్తత గుణమే; కాదనం -. అయితే అది నారాయణ బాబులో అస్పష్టతకు కొంత వరకు హేతువైంది.  శ్రీశ్రీ లో ఉండే భాషా  నైశిత్యం సాటిలేనిది.  అంతటి స్థితి నారాయణ బాబుకి లేదు.  ‘రుధిర జ్యోతి’ సంపుటి చదవండి. భావ సైధిల్యం జాస్తి, ఆయన ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఏదో కన్ఫ్యూసన్ ఉంది.  నా వరకు చాలా తక్కువ కవితలు మనసును తాకాయి.  శ్రీశ్రీ కవిత్వ పాండిత్యం ఘాఢమైనది.  నారాయణ బాబుకి అంత లేదు.  కమ్యూనిష్ట్ లు శ్రీశ్రీ ని పల్లకీ ఎక్కించటానికి కారణం వాళ్ళ చారిత్రక అవసరం.  శ్రీశ్రీ లౌక్యం కాదు.

 1. భావ కవిత్వానికి పీహెచ్ డీలు, పొగడ్తలు, తిట్లు మినహా సరైన విమర్శ లేదనిపిస్తుంది.

జ: భావ కవిత్వం మీద సరైన విమర్శ లేక పోవడానికి కారణాలున్నాయి.  కృష్ణ శాస్త్రి ప్రణయ కవిత్వం పుణ్యమాని అటు సంప్రదాయ కవి పండితుల నుంచి, ఇటు ఆధునిక సామ్యవాద నైష్ఠికుల నుంచి మొట్టి కాయలు, తిట్లు, వెటకారాలు పుష్కలంగా దక్కాయి.  మీరు నన్ను తిట్టకపోతే  ఒక మాట చెపుతా.  మన తెలుగు వాళ్ళకి తొందరగా  ఎక్కువ భావుకత్వ ప్రధానమైన కవిత్వం అర్ధం కాదు.  తెలిసినా, తెలియక పోయినా ఆధ్యాత్మిక చాపల్యం ఎక్కువ.  వాస్తవికత పేరిట వార్తా కధనాలు తొందరగా మనసు కెక్కుతాయి.  అదీ బలహీనత.  కవిత్వ మూలాలూ, ప్రేరణల పట్ల హృదయ ధర్మ లోపం ఉంటే, విశ్లేషణ కి, విమర్శకి తావేదీ?  నేనెరిగినంతలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి  గారు ఎంచదగిన విమర్శ చేశారు.  చాలా తక్కువే అయినా, విశ్వనాధ, శ్రీశ్రీ చాలా మంచి వ్యాసాలు రాశారు.  ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనే పుస్తకం రాసిన నిశిత విమర్శకులు, వెల్చేరు నారాయణ రావుగారు భావ కవిత్వం గురించి చేసిన విమర్శ నా ఉద్దేశ్యం పాక్షికమైనదనే.

 1. పూర్వపు తెలుగు కవులు తెలుగుని చంపి సంస్కృతాన్ని బతికించారా, లేదా తెలుగుని, కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారా?

జ: పూర్వ కవులు తెలుగుని చంపి, సంస్కృతాన్ని బతికించారని, తెలుగు కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారని, – ఆరోపించే రెండభిప్రాయాలూ తప్పే. ఆ రెండు భాషల స్వభావాలు, ఆయా సాహిత్య స్వభావాలూ తెలియని వాళ్ళనే మాట.

ఎందుకో చెపుతాను.  చారిత్రకంగా ఒక స్వభావంగా తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఎక్కువ.  దక్షిణాది భాషలలో మళయాళం మీద కూడా ఎక్కువ.  అదలా ఉంచండి. వ్యాకరణం, ఛందస్సు, అలంకారం అనేవి సాహిత్య శాస్త్రం, సాధకుడికి ఉద్దేశించిన రచనా పరికరాలు మాత్రమే.  ప్రాచీన కవులలో  ప్రముఖులెవరూ వీటిని అర్ధ రహితంగా వాడ లేదు.  పద్య రచనలో గొప్ప శిల్ప నిర్మాణానికే వాడారు.  తెలుగు కవిత్వం తమాషా ఏమిటంటే నూరింట తొంభై మంది సంప్రదాయ కవులు వాళ్ళంతట వాళ్ళు ప్రేరణ కలిగి కావ్యాలు రాసిన వాళ్ళు కారు.  కృతి భర్తగారిని వెతుక్కుని, వారి ఇష్టం మేరకు, వారి అభిరుచులకు కిత కితలు పెట్టడానికి రాసినవే.  సభల్లో పండితుల మెప్పు కోసమో, తమ పాండిత్య ప్రగల్భాలు చాటడం ధ్యేయంగా రాసినావీ ఉన్నాయి.  వెయ్యేళ్ళ సంప్రదాయ పద్య కావ్యాలలో కసరత్తులతో ముగిసిపోయినవి  మనకు ప్రమాణాలు కానక్కరలేదు.  మీరు పేర్కొన్న రెండు ఫిర్యాదులూ నిజమైన  సంప్రదాయ సత్కవుల్ని బాధించవు.

 1. ఎకరాల కొద్దీ కావ్య విమర్శ, వ్యాఖ్యానాలు రాశారు కదా, త్యాగరాజ కీర్తనలకు ఆ స్థాయిలో విమర్శ, వ్యాఖ్యానం ఉన్నాయా?

జ: త్యాగరాజ స్వామి కీర్తనలను గురించి కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి వివరణాత్మక వ్యాఖ్య  చాలా ప్రసిద్ధం.  క్షేత్రయ్య పద సాహిత్యం గురించి విస్సా అప్పారావు గారి వివరణలూ, సారంగపాణి పద  వైశిష్ట్యం గురించి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు, అన్నమయ్య పద సాహిత్యం గురించి వేటూరి ఆనంద మూర్తి, ముట్నూరి సంగమేశం ప్రబృతులు ఎన్న దగిన విమర్శలు ప్రచురించారు.  ప్రముఖ సంగీత విద్వాంసులు త్యాగరాజ కీర్తన సర్వస్వం పేరిట ఎంచదగిన విశ్లేషణలు చేశారు.

 1. అవధాన కవులలో శిఖరాయమానులైన తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటి? ఎండు గడ్డిలాంటి అవధాన పద్యాలు కాక, వారి సారస్వత సేవల ప్రత్యేకత?

జ: అవధానాలనేవి సాహిత్య ప్రదర్శనలు.  శ్రోతలకు వినోదం, ఉత్కంఠ కలిగించటం ప్రధాన్నోద్దేశ్యం.  తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటంటే వారికి పూర్వం అరుదుగా మిగిలిన ప్రక్రియని వారు రాజుల దివాణాలలోకి, సభా ప్రాంగణాలలోకి తెచ్చి – అసాధారణమైన ధారణా శక్తి, పద్య రచనా ధార కలిగిన వారు కావడంచేత రకరకాల ప్రాపంచిక, నిత్య కృత్యాలు ఇతి వృత్తాలుగా ఆశువుగా పద్యాలు చెప్పి – వేల కొద్దీ శ్రోతల్ని ఆశ్చర్య చకితుల్ని చేశారు.  సాధారణంగా అవధాన పద్యాలలో చమత్కారాలు, ఛాలెంజ్ లే ఉంటాయి.  మెజారిటీ శ్రోతల్ని మెప్పించటమే ధ్యేయం.  తిరుపతి వేంకట కవులకు అవధానాల పరిమితులు బాగా తెల్సు.  వాటిని వాడుకుంటూ – మరో పక్క సమర్ధమైన కావ్య, నాటక రచనలూ చేశారు.  కావ్యాలలో బుద్ధ చరిత్ర ప్రశస్తం.  పాణి గ్రహీత, శ్రవణానందం, సరదా సరదా చిన్న కావ్యాలు.  ‘శతావధాన సారం’, ‘నానా రాజ సందర్శనం’ సంపుటాలలో వారి పద్య రచనా ధార, పాండిత్యం, ఝటితి స్పూర్తి పుష్కలంగా కనిపిస్తాయి.  చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి ‘కథలు – గాధలు’ వ్యాస సంపుటాలు ఒక విధంగా ఆంధ్ర దేశపు సంస్కృతి, సాహిత్య, సభ్యతలకు నిధులని నా యెరుక.

 1. వివాదాస్పదమైన వ్యక్తిగత జీవితం వల్లనా, ఆయన సాహిత్యం వల్లనా చలం ఎందుకు గొప్ప వాడయ్యాడంటారు?

జ: మొట్ట మొదట గ్రహించ వలసిన సత్యం: చలానికి సాహిత్యం, జీవితం వేర్వరు కాదు.  ఈ విషయం ఆయన వ్రాసుకున్న ఆత్మకథ (చలం) చదివితే తెలుస్తుంది.  చలం సామాజిక పరిశీలన, అధ్యయనం వంటి గంభీరమైన మాటలతో పుట్టిన రచయిత కాడు. ఇంట్యూటివ్ రైటర్. మైదానం, దైవమిచ్చిన భార్య, అరుణ, జీవితాదర్శం, బ్రాహ్మణీకం, వివాహం – అనే ఆరు నవలలు – మ్యూజింగ్సు, ప్రేమ లేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ, ఆనందం, విషాదం – ఆరు వ్యాసాలంటారో, ఆత్మ ఘోషలంటారో ఆ పుస్తకాలు చలం ఆలోచనా సర్వస్వాలు.  ఆయన ఆలోచనా విధానమే ఆ కాలంలో ఆయన్ని విలక్షణ వ్యక్తిగా, రచయితగా నిలబెట్టింది.

 1. అసలు తెలుగు వాళ్ళకి సాహిత్యం, ఇతర లలిత కళల విషయంలో మీడియోక్రిటి అంటే ఎందుకంత ఇష్టం?

జ: మీడియోక్రిటి అంటే ఇష్టం కాదు;  అది స్వభావం.  చెరువు ఒడ్డున కూర్చుని, చిల్ల పెంకు ముక్కని నీటి మీదకు విసిరితే అది లోతుకి మునగకుండా, తేలుకుంటూ పరిగెడుతుంది.  మీడియోక్రిటి ఆ బాపతుది.  ప్రతీ జాతికి ఒక స్వభావం ఉంటుంది.  వల్గారిటీని హాస్యంగా భావించటం, పోర్నో తరహా స్త్రీపురుషుల కదలికల్ని శృంగారంగా భావించటం, సంగీతంలో శాస్త్రీయమైన మెలకువల్ని, మెలోడీని గ్రహించలేక పోవడం, చిత్ర లేఖనం, శిల్పం, నృత్యం వంటి కళల పట్ల బొత్తిగా దృష్టి లేక పోవడం, తెలియని విషయాల పట్ల తెల్సినట్లు మాట్లాడడం, నిత్యం పాక్టీసు చేసేస్తే ఏదైనా సాధించగలమనే అజ్ఞానపు టెక్కు, ప్రతీ విషయం మీద జడ్జిమెంట్ ఇచ్చే ఉత్సాహం – ఈ లక్షణాలు మీడియోకృటీ పునాదులు.  ఇదే తెలుగు వాళ్ళలో మెజారిటీ మనుషుల జీవ లక్షణం.

 1. ఆధునిక తెలుగు సాహిత్యానికి సరియైన విమర్శ లేదనిపిస్తోంది. వామ పక్ష విమర్శ చాలా పాక్షికమైంది. మీరు ఒప్పుకుంటారా?

జ: వెల్చేరు నారాయణ రావు గారి ఫిర్యాదు ఇదే.  ప్రాచీన సాహిత్యం విషయంలో సాంకేతికంగా విమర్శకు పనికి వచ్చే సాధనాల మీద ఆలంకారీకులు గొప్ప చర్చను లేపారు.  ఈ చర్చలు సుమారుగా శతాబ్దాల పాటు వివిధ మేధావులు సవిస్తారంగా నడిపారు.  అన్ని ప్రక్రియలతో సహా ఆధునిక సాహిత్యం అవతరించి గట్టిగా నూటయాభై యేళ్ళు కాలేదు.  ముఖ్యంగా వచన సాహిత్యం విషయంలో చాలా మంది తమ ఇష్టానిష్టాల ప్రాతిపదిక మీద మాట్లాడారు కాని, objective literary perspective కనపడదు.  మార్క్సిష్టు లకి (ప్రాచీన ఆలంకారీకులకు లాగే) కొన్ని కొలతలున్నాయి.  ఆ కొలతలకు ఆగక పోతే, తిరస్కరిస్తారు.   ప్రాచీన భారతీయాలంకారీకులూ ఇదే పని చేశారు.  శాస్త్రం, నియమాలు యేర్పరచి, క్రియేటివిటీకి గల విస్తారావకాశాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు.  అది వ్యాకరణం కావచ్చు, ఛందస్సు కావచ్చు, అలంకారం కావచ్చు, తాత్విక ధృక్పధం కావచ్చు.  ప్రామాణికత్వం నిర్ణయించే వారికి గొప్ప హృదయ ధర్మం ఉండడం అరుదు.  సారాంశం : తెలుగులో ప్రామాణికమైన ఆధునిక విమర్శ చాలా విరళం అయిపోవడానికి కారణం గాఢమైన అధ్యయన లోపం.

 1. పూర్వపు తెలుగు కవులు వస్తువు కోసం సంస్కృత సాహిత్యాన్ని ఆశ్రయించారు – వారంతా గొప్ప సంస్కృత పండితులు. మరి సంస్కృతంలో ఉన్న వచన సాహిత్యం గాని, భాసుడి వంటి నాటక రచయితలు గాని వారికి ప్రేరణ కాలేదు. ప్రభంధాలు రచించినట్టుగా వచనం, నాటకం జోలికి పోలేదు.  కారణం ఏమయి ఉంటుంది?  అసలు సంస్కృత సాహిత్యం లోని సృజనాత్మక వైవిధ్యం ప్రభంధ కవుల్ని ఎందుకు ఆకర్షించ లేదు?

జ: దీని గురించి మా నాన్నగారు, హనుమఛ్ఛాస్త్రి గారు ఒక కారణం చెపుతూ ఉండేవారు.  ముఖ్యంగా నాటకాల విషయం: సంస్కృత నాటకాలలో కచ్చితంగా పాత్రోచిత భాషను పాటించారు.  నాటక కథలో వచ్చే వివిధ పాత్రలలో ఏ తరహా పాత్రకి సంస్కృతం వాడాలి? ప్రాకృతం వాడాలి? అనే నియమాలున్నాయి.  భరతుడు పదిహేడు రకాల ప్రాకృతాల్ని నిర్దేశించాడు.  తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాల జోలికి పోతే పండిత కవులకి వ్యావహారిక భాష మింగుడు పడలేదు.  వాళ్ళకి ఆ విషయం ఇష్టం లేదు.  గ్రామ్యం అని లోకువ.   అందుకేంచేసారూ? నాటక కథని తీసుకుని పద్య కావ్యాలు రాయడానికే ఇష్ట పడ్డారు.  చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి , వడ్డాది సుబ్బారాయ కవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీరేశలింగం వంటి వాళ్ళు అనువాదాలు చేసినా, సొంతంగా రాసినా (పానుగంటి వారితో సహా) గ్రాంధికంలోనే చేశారు.  సంస్కృతంలో శ్లోకాల మాదిరే తెలుగు నాటకాలు, సంస్కృత నాటకాల పంపిణీ మీదనే నడిపించారు.  ఒక్క వేదం వేంకటరాయ శాస్త్రి గారు మాత్రం (గురజాడకు ముందు) తమ ప్రతాప రుద్రీయం నాటకంలో ప్రశస్తమైన పాత్రోచిత భాషగా – తొలిసారి – వ్యావహారిక భాష వాడారు.  వచన రచనలుగా సంస్కృతంలో ప్రసిద్ధమైన దశ కుమార చరిత్ర, విక్రమాంక దేవ చరిత్ర, హర్ష చరిత్ర, కాదంబరి, కృష్ణ చరిత్ర వంటి వాటిని అనువదించినప్పుడు సైతం సరళ గ్రాంధికాన్నే అనుసరించారు.  అన్నిటికంటే ముఖ్యం….ప్రాచీన కాలం నుంచీ కూడా సమకాలీన జన జీవితం సాహిత్య సృజనకు పనికి వస్తుందనే స్పృహే తెలుగు రచయితలకు లేదు.  సంస్కృత రచయితలు ఈ విషయంలో చాలా మెరుగు.  ప్రహసనాలు, భాణ సాహిత్యంలో నాటి సామాజిక విషయాల్ని దుమ్ము దులిపారు.  మన వాళ్ళు “కావ్య రచన ఘనమైందనే” వ్యామోహంలో ఇరుక్కుని ఉండి పోవడం వల్ల తెలుగులో శక్తి వంతమైన వచన సాహిత్యం వృద్ధి కాలేదు.

                                                                           …… to be continued

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. వృద్ధుల కళ్యాణరామారావు says:

  అత్యద్భుతమైన ఇంటర్వ్యూ. స్పష్టమైన సమాధానాలు. 9, 13 ప్రశ్నలకు చక్కని వివరణ. శ్రీశ్రీ కి నారాయణబాబు కీ ఉండే తేడా చక్కగా చెప్పేరు.

 2. rani siva sankara sarma says:

  అక్కిరాజు ఉమాకాంతం గారు సహృదయులు కాదు అని ఒక్క మాటలో కొట్టెయ్యలేము. ఆయన భావకవిత్వాన్ని మాత్రమే కాదు మొత్తం తెలుగు సాహిత్యాన్ని సందేహించారు. దానిలో తాత్విక గాఢత లేదు అన్నారు. ఉదాహరణకి తిక్కన భగవద్గితని అనువదించకపోవడం గురించి మాట్లాడుతూ , వంకలు చెప్పడాన్ని ఒప్పుకోరు ఉమాకాంతం.
  నిజానికి ఉమాకాంతం విమర్శ భావకవిత్వానికి పరిమితం కాదు. ఆధునికత పేరుతో వస్తున్న ధోరణులని ఆయన సందేహించాడు. కాళిదాసాదుల భావుకత కంటే, ఆధునికులైన భావకవులు సాధించిందేమిటి అని నిలదీశారు. అందుకు ఉదాహరణలు చూపారు కూడా. ఐతే ఎంకి పాటలని గొప్ప కవిత్వం గా గుర్తించారు అనే విషయాన్నీ మరిచిపోకూడదు. చెళ్ళపిళ్ళ వారు కూడా ఎంకి పాటలని చిన్నచూపు చూసారు. కానీ ఉమాకాంతంగారు ఆకాశానికి ఎత్తేశారు . దీనివల్ల తెలిసేదేమిటంటే స్థానికతకు ఆయన పట్టం కట్టాడనిపిస్తుంది. అనుకరణ ని వ్యతిరేకించారు. అది సంస్కృతమైనా యింగ్లీషు అయినా కూడా. తెలుగు సాహిత్యం స్వతంత్ర ప్రతిభని చూపాలని ఆయన భావించారు. దానిలో భాగమే ఎంకి పాటలని మెచ్చుకోవడం.అంతే కాదు పల్నాటి వీర చరిత్రపై పరిశోధన గ్రంధం రాయడం కూడా సం స్కృత పురాణాల కంటే స్థానిక తెలుగు సంస్కృతుల పట్ల ఆయనకు గల మక్కువని తెలియజేస్తుంది.
  ఉమాకాంతం గారి స్వతంత్ర ఆలోచన విధానం ఆయన తాత్విక ఆలోచనల్లో కూడా ప్రతిబింబిస్తుంది.సనాతన ధర్మం సన్యాస ఆశ్రమాన్ని గుర్తించలేదు అని రాసారు. అందుకు రామాయణాన్ని , శంకర విజయాన్ని ఉదాహరణగా చూపారు అక్కిరాజు ఉమాకాంతం.
  అందువల్ల అక్కిరాజు ఉమాకాంతం గారి గురించి పునరాలోచించాలి .

  • కల్లూరి భాస్కరం says:

   మంచి ఇంటర్వ్యూ. సాంప్రదాయిక, ఆధునిక సాహిత్యాలు రెంటినీ మథించిన అపురూప సాహిత్యవేత్తలలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఒకరు. ఉభయకవులతోనూ ఆయనకు గల పరిచయాలూ విస్తృతమైనవి. వారినోట ఆ ముచ్చట్లు వినే అవకాశం నాకు అనేకసార్లు లభించింది. వాటికి పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది. పతంజలిశాస్త్రిగారి ప్రశ్నలూ అంత లోతుగానూ ఉన్నాయి. అభినందనలు.
   అక్కిరాజు ఉమాకాంతం గారి గురించి రాణీ శివశంకరశర్మగారి వ్యాఖ్యా ఆలోచినీయం. ఆయన అన్నట్టు అక్కిరాజు వారి గురించి పునర్మూల్యాంకనం జరగవలసిందే.

 3. తెలుగులో సాహిత్య విమర్శ మీదా, విమర్శకుల మీదా శ్రీకాంత శర్మగారి అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. అలాగే
  ‘మీడియోక్రిటీ’ మీద కూడా ఆయన చెప్పినది బావుంది.

 4. Vinnakota Phaneendra says:

  వంగ నాట రవీంద్రులు, తెలుగు నాట భావ కవులు కూడా ఆంగ్ల కవుల ప్రేరణ తో చేసిన రచనలే అధికమని మనం గ్రహించాలి. ఇదే విషయాన్ని విశ్వనాథ వేయిపడగల్లో ఏకిపారేశారు గదా. స్థానికత, దేశీయత వంటి వాటి కోసం, సంస్కృతాంధ్రాలే అనువైనవని చెప్పి సూత్రీకరణ. శ్రీపాద మరీ తీవ్రవాది. శ్రీకాంత శర్మ గారికున్న ప్రతిభ, విషయవైశాల్యము చేత వారి మాటలు ప్రామాణికమే. రెండవ భాగం గురించి ఎదురుచూస్తున్నాను.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

*