ఆ ఎంట్రీ ఒక మెరుపు, కొత్త మలుపు!

krishnudu

 

ట్టమైన పొగమంచు. చలి చర్మాన్ని పదునుగా పలకరిస్తోంది. కాళ్ల క్రింద రహదారిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. వాహనాల లైట్లే వాహనాలకు దారి చూపుతున్నాయి. ప్రయాణం చాలా దుర్భరంగా ఉంది. కనపడేవన్నీ నిజాలు కావు కాని కనపడాల్సినవన్నీ కనపడకపోతే.. మనిషిని మనిషి పోల్చుకోవడం కష్టం. కాని మనిషే సమీపించకపోతే.. బతుకు పొగమంచులో ప్రయాణం కన్నా నిస్సహంగా ఉంది. బతుకులోకి ఒక చలి ప్రవేశించింది. జీవితాన్నీ, శరీరాన్ని కొంకర్లు చుట్టేస్తున్నది. అప్రయత్నంగా మనిషి తనకు తాను కుంచించుకుపోతున్నాడు.

ఎదుటి మనిషిని కరచాలనం చేయకుండా పలకరించలేమా? కరచాలనం ద్వారా రక్తస్పర్శ పరిచయం చేయని వాడు దూరం నుంచి మన రక్తాన్ని ఎలా వేడెక్కించగలడు? మనిషిని మనిషి, మనిషిని నినాదాలు, మనిషిని దుర్మార్గాలు, దారుణాలు, మనిషిని హత్యలు, ఊచకోతలు వేడెక్కించడం మానేసి చాల రోజులైంది. ఊపిరి పీల్చి విడుస్తుంటేనే మన  వేడి మనకు తగలడం లేదు. ఇక రోడ్లపై, అడవుల్లో, గుట్టల్లో గుట్టలుగుట్టలుగా పడిఉన్న శవాలు ఎలా వేడెక్కిస్తాయి? కన్ను వేడెక్కితేనే చెలమ ఊరుతుంది.

ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. తెలుగు సాహిత్యానికి తిరుగుబాటు కొత్తది కాదు. ప్రశ్నలు కొత్తవి కావు. సామాజిక సంస్కరణల కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రగతి శీల కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం, ఫెమినిస్టు కవిత్వం, దళిత అస్తిత్వ వాద కవిత్వం. ఒక కవిత్వానికి ఎన్ని శాఖలు? కవిత్వం చెట్టు కాదు శాఖలుగా విస్తరించడానికి?  కవిత్వం కాలం కత్తిపై నుంచి కారుతున్న రుధిరధార. రక్తానికి శాఖలు లేవు.

అందుకే ఒకానొక రాజు దాదాపు ముప్పైఏళ్ల క్రితం నేను పనిచేస్తున్న పత్రికా కార్యాలయానికి  పుంఖానుపుంఖాలుగా వస్తున్న కవిత్వ సంపుటాల్లో ఒక పుస్తకం తడమగానే నా రక్తాన్ని స్పృశించినట్లయింది.   దాని పేరే ‘రక్తస్పర్శ’.

raktasparsa

పేరును చూస్తే ఏ అడవుల్లోంచో  పసిరిక వాసన వచ్చినట్లు లేదు. విరసం ప్రచురణ కానే కాదు. రవళి ప్రచురణ అని పెట్టుకున్నా దాన్ని అచ్చువేయించింది ఒక పప్పుమిల్లు యజమాని. పడేద్దామా అనిపించింది ఒక్కక్షణం.  కాని ఆ పుస్తకంలోని అక్షరాలు నా కళ్లనూ, శరీరాన్నీ ఎంతవేగంగా లాగాయంటే నేను పుటల మధ్య బందీ అయ్యానన్న విషయం నాకే తెలియలేదు.  మొదటి కవితే నన్ను జీవితపు దుర్బర నరకం నుంచి మృత్యుసౌందర్యంలోకి లాక్కుపోయింది. అది అఫ్సర్ రాసిన ‘అంతిమ స్పర్శ’.

‘మెత్తటి గోధుమరంగు నేలపై పవళించి, నీ తలపై పచ్చిక ఎగురుతుండగా నిశ్శబ్దాన్ని ఆలకించే నీకు నిన్నా లేదు, రేపూ లేదు. కాలాన్ని మరిచి, జీవితాన్నిక్షమించి, శాంతిలో విలీనమయ్యే మృత్యువు అందంగానే ఉండి ఉంటుంది.. అని రాశాడు అస్కార్ వైల్డ్.

afsar3

‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది- విశాలాకాశంగా వికసిస్తావో అశ్రుపూరిత మేఘంగా విహరిస్తావో, కాలంకురులపై మీటుకుంటూ వెళ్తావో  నీ ఇష్టం.. ‘అన్నాడు అఫ్సర్. ‘అశాంత నేత్ర జలపాతాల్లోంచి, ఇరుక్కుంటూ, ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకుని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయిన నీకు చదువుతూ చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్లిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు?’

ఎవరీ కవి? అన్ని పాతదనాల్నీ ఊడ్చేసి పాత కోట బురుజుల సందుల గుండా వెచ్చటి స్వచ్చమైన కిరణంలా ప్రవేశించిన ఈ కవి ఎవరు? చదవగానే అనిపించింది తెలుగు కవిత్వంలో మరో కొత్త గొంతుక ప్రవేశించిందని. ఇది యాంత్రికతను చేధించడం కాదు. ఇది స్తబ్దతను భగ్నం చేయడం కాదు.  నాటి రోజులు పిడికిలి బిగిస్తున్న చేతులే జోహార్లు అర్పిస్తున్న రోజులు, నినాదాలు చేసిన గొంతులే విషాద గీతికలు ఆలపిస్తున్న  కాలమది.  ఒక ప్రజాకళాకారుడి నెత్తుటి జోలె విస్తరిస్తున్నసమయం అది, గజ్జెల కాళ్లు గుండెలపై నర్తిస్తున్న ఘట్టం అది. ఆ సమయంలో  ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్వచ్చమైన గాలి రెపరెప నన్ను తాకింది.  అవును మనం ప్రశ్శల ఉక్కబోతలో నే చిక్కుకున్నప్పుడు ఇటువంటి రెపరెపలు అవసరం.

రక్తస్పర్శ రాసిన ముగ్గురు కవులు అఫ్సర్, ప్రసేన్, సీతారామ్. ఇందులోని 59 కవితల్లో 27 అఫ్సరే రాశాడు. 22 ప్రసేన్ రాస్తే సీతారాం రాసింది పది కవితలు మాత్రమే. ముగ్గురూ ఒకే రకం కవులు కాదు. ప్రసేన్, సీతారాంలపై మినీకవితలు, దిగంబర కవితల ప్రభావం ఉన్నది. అఫ్సర్ అప్రభావితంగా  రాయడం మొదలుపెట్టిన కవి. అప్రభావితంగా ఎవడూ రాయడు అంటాడు ఒక మేధావి. చదివిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ లూ, ప్రతి ఘటనా స్వరాలు ఎక్కడకు పోతాయి? కాని చుట్టూ ఉన్న నిబిడ నిశ్చల నీరవ నిర్విరాణ నీలాకాశం మధ్య కొండకొనపై కూర్చుని ఉన్నట్లుండి గొంతులోంచి అప్రయత్నంగా ప్రకృతిని మైమరిపించే గొల్లవాడి గొంతులోంచి వెలువడిన కొత్త రాగమే అఫ్సర్ కవిత్వం. ఆ రాగం మూలాల్ని వెతకడం అతడి పని కాదు. అతడే ఒక దృశ్యమై, దృశ్యమే అతడై కేన్వాస్ నిండా పరుచుకున్న కవిత్వమది.

అవును శూన్యానికీ శూన్యానికీ మధ్య ప్రపంచాన్ని పరుచుకుని అంతర్వలయాల్లో విహరించే పక్షి అతడు.   నేలరాలిన వీరుడి పరాజయ హస్తాలు, ఆ ఒట్టి చేతులు తెగిపడ్డ ద్వారాల్లా అఫ్సర్ ని నిలదీస్తాయి. అంతర్ధానమైన చివరి చిర్నవ్వు అతడిని పలకరిస్తుంది. నిజం నీడలా వెంటాడుతుంది, నేలకొరిగిన ఏ సూర్యుడిలోంచి స్రవించిందో ఈ రక్తం అని వెతుకుంటాడు. రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా సైగల్ విషాదగీతం సజీవ వేదనాస్రవంతిగా ప్రవహిస్తుంది. వేయి వసంతాలను అరచేతుల్లో పట్టి బంధించేందుకు ఒక్క జ్ఞాపకం తన్లాడుతుంటాడు. అరణ్యాలు కాలుతున్న గుండెల్లో సజీవంగా సమాధి అవుతున్న స్వప్నాల్ని తలుచుకుంటాడు. రాత్రిలోంచి చీకటిలా, చీకటిలోంచి కలలా, కలలోంచి జ్ఞాపకంలా నడిచిపోతుంటే అతడి నీత అతడిని తృణీకరిస్తుంది. భావానికీ, అక్షరానికీ దూరం అపారమా?

సందేహాల మధ్య చుట్టుకుపోయి అతడి అంతరంగం తెరలు దింపుకుంటుంది. రాత్రి అంచుమీద కన్నీటి ఖడ్గం కోస్తూ పోతుంది. చీకటి గుండెల్ని కెలుకుతుంది. చెట్టు గుండెల్లోంచి గొంతువిప్పే పక్షిలా అతడిలో ఏదో అలజడి.

prasen

ప్రసేనైతే పూర్తిగా బహిర్ముఖుడు. రోడ్డుపై  రౌడీ చేతుల్లోంకి ఖాకీ జేబుల్లోకి మారిన రూపాయిని, బండివాడు విసిరేసిన ఇడ్లీముక్కను పసికడతాడు. అంతే కాదు ఉన్నట్లుండి అతడికి రోడ్డు మరోలా కనపడుతుంది.  నగర కన్యనాభిని ముద్దాడి నితంబమునల్లుకుని వలీ అవళిని నిమిరి పయోధరాలను బంధించి నయగారాలు గారాలు పోయే ఓణీ – ఈ రోడ్డు అంటాడు. ప్రసేన్ పరిచయమూ, అపరిచయమూ అతడి కవిత్వంలో దాక్కోవు. అతడి మెదడు వ్యబిఛారిలా మనసుతోనే లేచిపోతుంది. పల్లెలన్నీ ఇథియోపియాలే అనే ప్రసేన్ నిశ్భబ్దంలో జీవించాలనుకుంటాడు. కాని భయంకరంగా వినిపిస్తున్న గుండెస్పందనను తప్పించుకోలేడు.

ఇక సీతారాం ఒక నిరీక్షకుడు.  తెగిన జ్ఞాపకాల మధ్య ఎవరికోసమో నిరీక్షిస్తాడు. రాత్రిపూట ఒంటరిగా ఉండే గోడనూ, ఎప్పుడూ మేల్కొనే ఉండే అడవినీ, క్షణం ముందు వెళ్లిపోయిన అజ్ఞాత పథికుడినీ, చిట్లిన గేయాల్నీ, తెగిన గొంతుకల్నీ, తెగిన అక్షరాల్నీ ఆగిన పద్యాల్నీ స్మరిస్తుంటాడు.స్వర్ణ దేవాలయంపై  రాబందుగా ఎగురుతున్న పావురాల్నీ, దండకారణ్యాన్ని తూర్పార బట్టే తూటాల్నీ, కార్బైడ్ రాత్రుల గాలికేకల్నీ తలచుకుని గుండెకు గర్భస్రావం చేసుకుంటాడు. చిత్రాలకు కన్నీటి రంగులు అద్దుతుంటాడు.  అకస్మాత్తుగా  అన్నిటినీ వదిలి ఆకాశాన్నంటిన స్వప్న పర్వతాలవైపు ఆగకుండా పోవాలనుకుంటాడు.

రక్త స్పర్శలో కొత్త భావాల్నీ, కొత్త ప్రతీకల్నీ ముగ్గురు కవులు పలికించినప్పటికీ ముగ్గురిదీ ఒకే దారి కాదు. కాలం ముగ్గుర్నీ వేర్వేరు దారుల్లోకి, వేర్వేరు స్థాయిల్లోకి తీసుకువెళ్లింది. కాని తెలుగు కవిత్వం తిరిగిన రకరకాల మలుపుల్లో ఒక ముఖ్యమైన మలుపు రక్తస్పర్శ. దిగంబర కవిత్వం తర్వాత ప్రస్ఫుటంగా కనిపించిన మలుపు ఇది. రాను రానూ, ఈ మలుపు విస్తృతమై రహదారిగా మారిందనడం, కవిత్వం ఈ రహదారిలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందనడం అతిశయోక్తి కాదు. అది నీ నెత్తురును ఎప్పుడూ స్పృశిస్తుంటుంది.

 

*

 

మీ మాటలు

  1. జి.గిరిజామనోహరబాబు says:

    రక్తస్పర్శ చేతకి వచ్చిన రోజుల్లో నేను ఉద్యోగరీత్యా ఖమ్మంలో ఉండటం యాదృచ్ఛికం ,అయినా ఆధునిక కవిత్వం విస్తృతంగా పలవరిస్తున్న రోజుల్లో పుష్కలమైన అనుభూతిని అందించిన కవితాసంకలనాన్ని అందుకోవడం అదొక అనిర్వచనీయమైన ఆనందం.. పైగా అప్పటికే సీతారాం తో కొంతపరిచయం , అఫ్సర్ వాళ్ళ నాన్న కౌముది గారితో మైత్రి వంటి అంశాల నేపథ్యం , తిలక్ కవిత్వపు మైమరపు రక్తస్పర్శ అంతరంగ ఆవిష్కరణ మంచి స్ఫూర్తినిచ్చింది .. మీరు చేసిన కవితాత్మక వ్యాఖ్యానం స్మృతిపరిమళాన్ని అందించింది ..థాంక్స్ ..

మీ మాటలు

*