ఎందుకే నీకింత తొందరా?

art: satya sufi

art: satya sufi

~

‘you lie there
like an etherised poem
silencing the smile of our world
and shocking the throb of our hearts’…

కానీ అనుక్షణం మృత్యువును శాసిస్తూ
నిర్భయంగా వెలిగిన నీ పాట
ఇంకా జ్వలిస్తూనే వుంది.

గాయాల్నీ, గేయాల్నీ
అశృవునూ, ఆనందాన్నీ
ఒంటరితనం లోనే పొదువుకుంటూ
కలనేతగా కవితలైన నీ మాటలు
ఇంకా మలి పొద్దు మంచులా
తడుపుతూనే వున్నాయి.

పిండారీల దోపిడీ వ్యవస్థల గురించీ
పిచ్చుకల అంతర్ధానం గురించీ
కవితై పలకరించాల్సిన అవసరం గురించీ
నీవు చెప్పిన మాటలన్నీ
‘ప్రూఫ్రాక్’ పాటై నీ లోటును చూపే
గాయాలై పలకరిస్తూనే వున్నాయి.

అను నిత్యం
స్నేహమై ప్రేమగా పిలిచి
ఆప్యాయతను వర్షించిన నీ గొంతుక
కృష్ణశాస్త్రి పాటై
కురుస్తూనే వుంది.

మన బోదలేర్, మార్క్వెజ్, అఖ్మతొవా
వాస్కోపోపాలు
నీ తలపుల్ని తెప్పిస్తూనే వున్నారు.

మళ్ళీ రెండ్రోజుల్లో కలుస్తానని చెప్పి వెళ్ళిన నీ నవ్వు ,
మృత్యువును తర్జనితో నిలిపిన
నీ పరిహాసం,
‘మరణానంతరం సైతం కవితై శాసిస్తాన’న్న
నీ మాటలు,
వుల్కలై, వుత్పాతాలై, సముద్రాలై, సంఘర్షణలై
నీ ఆత్మీయ స్పర్శా సుమ స్వప్నాలై
నిశ్శబ్దంగా వినిపిస్తూనే వున్నై.

కానీ కల కన్న వడిగా
ఆ ‘బుగ్గ మీసాల పత్తేదారు’ తో
‘ఒకే’ జనన మరణాల మధ్య
కలవై కదిలిపోయిన నిజానివి కదా నీవు!
నీ జ్ఞాపకమెప్పటికీ
ఓ సర్రియలిస్ట్ కవిత!

రఘూ, వంటరి పాటవై
మరలి పోయిన
మితృడా, ప్రతి డిసెంబర్ పూలూ
నీ పాటలే ఆలపిస్తాయి.

(కవి, మితృడు గుడిహాళం రఘునాథం గుర్తుగా)

– విజయ్ కోగంటి

మీ మాటలు

  1. చాలా ఆద్రతతో నిండి న స్నేహ కవితాంజలి .

  2. రాత్రి ౮.౩౦ దాటాక ప్రారంభించి కాలం తెలీనీకుండా ఆత్మీయంగా , ఆర్ద్రంగా , ఎన్నో సార్లు నిష్కర్షగా సంభాషించిన గుడిహాళంని మరోసారి మనో యవనిక ముందు నిలిపినందుకు నిన్ను అభినందించాలి , తమ్ముడూ . అయినా నా పిచ్చి గానీ, “దివిజ కవి వారు గుండియల్ దిగ్గురనగా” అన్న ఆయనకీ, ఇతనికి మహాభినిష్క్రమణం లో, ఆ ఆత్మవిశ్వాసంలో తేడా ఏముంది ? అతను తనని మరవనిస్తాడా! మరోసారి నీకు అభినందనలు

  3. గిరిజామనోహర్ says:

    “గుడిహాళం”అనగానే గుర్తొచ్చేది కవిత్వం,పాండిత్యపరిమళం మాత్రమే కాదు .. ప్రపంచింపలేని స్నేహమధురిమ ..ఆత్మీయ పు పలకరింపులు .. ఇద్దరి సహోద్యోగజీవితం ,వీటన్నింటినీ మించి తన స్వచ్ఛమైన హృదయపరిమళం … ఇన్ని జ్ఞాపకాల్ని మళ్ళీ ముసురుకునేట్టుచేసిన మీ కవిత మరువలేనిది … కృతజ్ఞతలు ..

    • విజయ్ కోగంటి says:

      ఆలస్యంగా ప్రతిస్పందించినందుకు క్షమించండి. ధన్యవాదాలు.

Leave a Reply to P.vijayalakshmi Pandit Cancel reply

*