ది లాస్ట్ బ్రాహ్మిణ్: ఒక దళారీ పశ్చాత్తాపం!

last

 

నిజాయితీగా మాట్లాడాలంటే నిర్భీతి ఉండాలి అని అంటారు. నిర్భీతి అనే క్వాలిటీ నిజాయితీగా మాట్లాడ్డానికి పూర్వగామిగా ( precursor) గా ఉండడం ఏమిటి ? మనకు ఏవన్నా నష్టం అంటే అది కూడా తీవ్రమైన నష్టం భౌతికంగానో, ఆర్థికంగానో లేదా మన అభిలాషకు, ఆశలకు  (  aspirations   ) విఘాతం కలుగుతుందనుకున్నప్పుడో భీతి ఉండాలి. అలాంటప్పుడు  నిజాయితీగా మాట్లాడాలంటే వెనకా ముందు ఆలోచించుకోవాలి. ఐతే కొల్పోడానికి ఏమీ లేని తనం ఉన్నప్పుడు, కోల్పోడానికి సిధ్ధపడ్డప్పుడు, కోలుపోతను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడ్డానికి భీతి ఎందుకు ?  పైగా మనమొక తప్పులో భాగమై నప్పుడు, ఆ తప్పు డొంక తిరుగుడుగా, సూచనప్రాయంగా, నీళ్ళు నములుతూ కాక నిజాయితీగా ఉన్నదున్నట్టుగా ఒప్పుకోవాలంటే (ఏమీ కోల్పోలేని తనం వలన కలిగే )  నిర్భీతి తో పాటు పాశ్చాత్తాపం కూడా ఉండాలి.  ఆ పాశ్చాత్తాపం ‘ అయ్యిందేదో అయ్యింది ..ఇక పద ‘ అన్నట్టు గాక  Descriptive  గా ఉంటే అందులో నిజాయితీ బలంగా ఉంటుంది.

‘ దళారీ పశ్చాత్తాపం ‘ అనే పుస్తకం విడుదల అయ్యాక ప్రపంచ బేంకు రాజకీయాలు చాలా దుమారమే లేపేసాయి. అంత వరకు ఈ రాజకీయాలు ఎవరికీ తెలియదని కాదు. ఐతే ఒక  insider  పబ్లిక్ గా నోరు విప్పి జరిగింది చెప్పడం తో , కేవలం విశ్లేషణ, గమనికల మీద ఆధారపడ్డ ప్రతి సామ్రాజ్య వ్యతిరేక వాదికి కాన్ ఫిడెన్స్ బల పడ్డది. ప్రతి సంస్థాగతమైన అన్యాయాల పట్ల ఒక ఖచ్చితమైన కంక్లూజన్ కు రావాలాంటే, శతృ స్థావరం నుండి ఒక్క వేగువైనా కావాల్సి వస్తుంది మనకు. శతృవు గురించి అంచనాకు రావడం ఒక ఎత్తైతే , వేగు సమాచారం ఒక బలమైన   conviction  ను నింపుతుంది. అది జరిగే యుద్ధం లో   predictability  ని తెస్తుంది. ‘ నిన్ను నీవు అర్థం చేసుకునే ముందు శతృవును అర్థం చేసుకో ‘ అనే మావో నినాదం సంపూర్తి అర్థాన్ని అప్పుడు సంతరించుకుంటుంది.

ఇంత ఉపోద్ఘాతం ఒక పుస్తక పరిచయానికి ఎందుకు అవసరమౌతుందో తెలుసుకోవాలంటే – అది ‘ ది లాస్ట్ బ్రాహ్మిణ్ ‘ కున్న ప్రత్యేకమైన ఫార్మాట్ ను గుర్తించడమే. ఇది ఆత్మకథ ఫార్మాట్ లో ఒక సనాతన బ్రాహ్మణుడి కుంచిత వ్యవహారాలను నిజాయితీగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం. అది కూడా అది ఒక సనాతన బ్రాహ్మణ వంశం లో పుట్టి కుటుంబ బంధాలపై ఉండే ప్రేమ చంపుకోలేక  కుటుంబ వ్యవహారాలపై ద్వేషం కలిగి ఉండే ఒక వ్యక్తి ఆ పుస్తక రచయిత  కావడం ఈ ఫార్మాట్ ప్రధాన లక్షణం.

నాకు ఈ  insider view  అవసరం ముఖ్యంగా అఫ్సర్ ‘ చంకీ పూల కథ ‘ రాసినప్పుడు తోచింది. అగ్ర కుల మేధావులు మార్క్సిస్టులమని చెప్పుకునే వాళ్ళు మైనారిటీ వాదాన్ని, సెక్యులరిస్ట్ ఫైట్ ను  ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య పోటీ కింద కుదించేసి మాట్లాడ్డం చూడ్డానికి అందంగా articulate  చేయడం , సాధారణ పాఠకులు డ్రైవ్ అయిపోవడం చూసి అనిపించింది ‘ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నిమ్న వర్గాల గురించి ఏమని ఊహించుకుంటూ ఉంటారో కదా ? ‘ అని. ‘ వీళ్ళు అగత్యం లేని పరిస్థితుల్లో నిమ్న వర్గాలను కూడ గట్టుకుని ఎలా పబ్బం గడపాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా ? ‘ అని. ‘ వీళ్ళ మాటలు ఆలోచనలు విన్న వాళ్ళెవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగున్ను కదా ? ‘ అని. నలుగురు అబ్బాయిలు గుమి కూడి ఒక అమ్మాయి గురించో , లేదా ఇక ఏదో సెక్సిస్ట్ టాపిక్ గురించో ఏం మాట్లాడుకుంటారో ఊహించి వారి గురించి అంచనాకు రావడం ఒక పద్దతి. ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి స్వయాన విని వారి గురించి ఒక అంచనాకు రావడం ఒక పద్దతి.

ఈ వేగులు అందించే సమాచారం లో మన అంచనాలు, విశ్లేషణకు లోతు వెడల్పును పెంచుతాయి.

“ఇలాంటి అభిప్రాయాలు మా నాన్న గారి నుంచి విన్నప్పుడల్లా ఆయన పట్ల నాకున్న వ్యతిరేకత మరింత ప్రబలమ్య్యేది.  శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రాతినిధ్యం వహించే సనాతన ధర్మం అంటే నాకు అరికాళ్ళ కింద మంటలు లేచేవి. మనిషిని మనిషిని విడదీసే ఈ కులాలు నిర్మూలింపబడాలని మానవులందరూ సమానంగ ఉండాలని నేను భగవంతుడిని మూగగా రోదించేవాడిని. మా నాన్న గారిని సనాతన ధర్మం నుండి బయట పడేయమని భగవంతుడిని ఒక సారి కోరుకున్నాను కూడా ” అని మధ్యలో ఒక చోట రచయిత చెప్తాడు. ఈ పుస్తకం మొత్తానికి ఇది భూమిక.  రచయిత తండ్రి తీవ్ర అనారోగ్యం తో, మరణానికి చేరువలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు,  తండ్రి కి కళ్లనీళ్ళ ప్రయంతం సపర్యలు చేసుకుంటూనే , ఆయన  psyche  పట్ల చంపుకోలేని ద్వేషానికి పుస్తక రూపం ఇస్తూ ఉండే  ఒక సంఘర్షణ వాతావరణం ఉండింది.

నాతో చాలా మంది అంటూ ఉంటారు ” బ్రాహ్మణులుగా పుట్టామండి…ఐతే మా చేతులో ఉందా ఏంటి ? మమ్మల్ని ఏ మాట మాట్లాడినా అలా వంకరగా విశ్లేషించడం ఏవన్నా భావ్యమా ? ” అని. పుట్టడం మన చేతులో లేదు. కాబట్టి మాకు మిగతా ఛాందస బ్రాహ్మణుల నుండి, బ్రాహ్మణ వాదులనుండి   exemption  కావాలి అని.  ఈ వాదనలో ఒక సౌకర్యం ఉంది. ఈ ఆత్మ విమర్శలో ‘ ఈ తప్పేదో జరగడం బానే ఉందే ‘ అన్నట్టు ఉంటుంది తీరు. కులం పుట్టుకకు సంబంధించిన అంశం కాదు, అది నిర్దుష్ట  సాంఘిక ఆర్థిక చట్రం కు సంబంధించింది అనే నిర్ధారణ జరిగాక ఈ లిబరల్ వాదనలు ఊపందుకున్నాయి. ‘ అసలు బ్రాహ్మణుడు అని నీకు ఇంకా ఎందుకు గుర్తు ఉంది ? ‘ అని అడిగితే ఏం తెలుస్తుంది ? భర్తనో భార్యనో బ్రాహ్మణ్ అయి ఉంటారు, ఇంట్లో సనాతన అచారాలు అలా కొనసాగుతూ ఉంటాయి, ప్రతి హిందూ పండక్కి ఇంట్లో సందడి ఉంటుంది, అడపా దడపా ఆఫీసుల్లో లిబరల్ బ్రాహ్మిణ్ అవ్వడం వల్ల అసలు సిసలు బ్రాహ్మిణ్ స్థాయిలో గౌరవం లేకున్నా ఉన్నత కులం వాడికుండె సగటు గౌరవం తక్కువ కాకుండా దొరుకుతుంటుంది, బంధువులు , మేధావులు చుట్టూ బ్రాహ్మణులే ఉండి బ్రాహ్మణ సందోహం ఆనందదాయకంగా లేకపోయినా తమ స్థాయిని గుర్తు చేసుకునే నిమిత్తం వరకైనా అలా ఉంటుంది.  ఇదంతా సోషల్ కేపిటల్ వెన్నంటి ఉంటుంది. ఆ మాత్రం దానికి ‘ నన్ను  exempt  చేయండి ‘ అని వాదించి , కొత్త తరహా బ్రాహ్మణ హక్కుల కోసం వాదించడం ఎందుకు ? ‘ సరేనండి…ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు ? పుట్టుకను మార్చలేము కదా ‘ అని వితండ వాదం చేసినప్పుడు నేనంటాను ‘ కులం తెలిస్తే తలలు తెగిపడతాయి అనే రోజు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతారా మీరు ? ‘ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత. రోహిత్ వేముల మరణానికి కారణమైన డాక్యుమెంటరీ ‘ ముజఫర్ నగర్ బాకీ హై ‘ ఫిల్మ్ మేకర్ బ్రాహ్మణుడు. ఒక ఇంటర్వ్యూ లో ” నేను బ్రాహ్మణ కులం లో ఉన్నా కాబట్టి నెను ప్లాన్ చేయని నేను ఊహించని అవకాశాలు నా చుట్టు ఉన్నాయి. కాబట్టి నేను సినిమా తీయగలిగాను. కులం అనేది లేకపోతే ఇంత కంటే ఇంకా బాగు తీయగలిగే వారు వచ్చే వారేమో ”  అన్నాడు. బ్రాహ్మణుడు కుల నిర్మూలన ఉద్యమం లో చేరుతున్నప్పుడు ఖరాఖండిగా జనాలకే కాదు, తనకు తాను చెప్పుకోవాల్సిన నిజం ఇది. డీ బ్రాహ్మినైజ్ కావడం లో మొదటి మెట్టు తనకున్న  Brahmin privileges  ను గుర్తించడం. ఇవేవీ లేనట్టు తెలీనట్టు నటించడం, లేదా తనకు మాత్రం అవి సంబంధం లేనట్టు మొహం పెట్టి మిగతా బ్రాహ్మణులను తిట్టడం గమనించలేని మూర్ఖమైన స్థాయిలో దళితులు, ఆదివాసీలు ముస్లిములు ఈనాడు లేరు.

ఈ ఆత్మ కథ లాంటి సాంఘిక ఇతివృత్తం కలిగిన పుస్తకం లో ఒక సనాతన బ్రాహ్మణ తండ్రి తన మొదటి కొడుకు హిందువుగా మారడం ( సనాతన ధర్మం ప్రచారాన్ని  కోరుకోదు. ఇతర వర్ణస్తులను సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకోమని కోరుకోదు ) ఇంకో కొడుకు ( రచయిత ) నాస్తికుడిగా మారడం, తన వంశానికి ఇక తనే చివరి బ్రాహ్మణుడిగా గుర్తించి చివరి క్షణాల్లో కూడా అదే మనోవ్యధలోనే బతుకుతాడు.

ఈ పుస్తకం ఒక సోషియాలజీ సబ్జెక్ట్ లాంటి పుస్తకం. సనాతన వర్ణశ్రమ ధర్మం లో బతికే ఒక బ్రాహ్మణ తెగ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా జీవిస్తుంది అని తెలియజేసే పుస్తకం. ఇస్లాం అని ప్రస్తావిస్తూ ఖురాన్ ఉంటుంది, క్రీస్తు బిడ్డలు అని ప్రస్తావిస్తూ బైబిల్ ఉంటుంది కాని హిందువు అని ప్రస్తావిస్తూ ఒక్క వేదం లేకపోయినా హిందువులు ఆ వేదాలను, ఆయా గ్రం థాలను నెత్తినేసుకుని తిరగడం భలే విచిత్రం. మొదటగా బ్రాహ్మిణిజం మాత్రమే మతం. అది ప్రజలను వర్ణాలుగా విడదీసింది. శ్రీ రామ కళ్యాణం బ్రాహ్మణుల ఆచారం. శివుడు, కృష్ణుడు వీళ్లందరూ బ్రాహ్మణుల ఇంటిలో మాత్రమే పరిమితం కావాల్సిన దేవుళ్ళు.  Temple system   బ్రాహ్మిణిజం ఈ సమాజం తో terms కుదిరించుకుని ఏర్పరుచుకున్న ఒక రాజీ. పూజారి వృత్తే కాని, బ్రాహ్మణుడి ప్రవృత్తి కాదు. ఈ విషయాలు తెలీక  ప్రతి హిందు ఛాందస వాది , అఖండ భారతం అని ఊగిపోతాడు. మన దేశం లో హిందుత్వం అన్న మతమే లేదు. ఉంటే అది బ్రాహ్మణీయ హిందుత్వం మాత్రమే. బ్రాహ్మణిజం అన్ని కులాల ప్రజలకు దేవాలయ వ్యవస్థ ద్వారా చేరాక, ఆయా వర్ణాశ్రమ ధర్మాలకు లోబడి ఉన్నా ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిని అనుకరించే పద్దతి మొదలయ్యింది. దళితుల్లో క్షవరం చేసే దళితులు వేరుగా ఉంటారు. వాళ్ళు దళితుల్లో దళితులకు  అధములు. సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సిన వ్రతం. ఐతే ప్రతి ఒక్కరూ చేస్తారు. పౌరోహిత్యం లో వైదిక పౌరోహిత్యం వేరు. పౌరాణిక పౌరోహిత్యం వేరు. సనాతన ధర్మం లో ‘ ఘర్ వాప్సీ’ లేదు. ఎందుకంటే అది హిందుత్వాన్ని నమ్మదు కాబట్టి. ( బ్రాహ్మణీయ హిందుత్వానికి సంఖ్యా బలం అవసరం ఎందుకయ్యింది అన్నది ఈ వ్యాసానికి వెలుపలి అంశం. ప్రస్తుతానికి వదిలేద్దాం )  దానికి శూద్రుడైనా ఇతర మతస్థులైనా ఒకటే. ఘర్ వాప్సీ చేసి ప్రయోజనం లేదు. బ్రాహ్మిణిజం అనే మతం ఒక వర్గం లోనే ఉండాల్సిన మతం . ప్రచారప్రధానం అయ్యాక అది బ్రాహ్మణీయ హిందూత్వం అయ్యింది. మనుస్మృతి  మన జీవన విధానం లో భాగమయ్యింది. ‘ వర్ణ ధర్మాన్ని అతిక్రమించడం అంటే తక్కిన వర్ణాల్లోకి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రవేశపెట్టడం అన్న మాట ‘ అంటూ , రచయిత ఇలా  అంటాడు ‘ మనుస్మృతి తగలబెట్తడం , భావొద్వేగాలను ప్రతిబింబిస్తుందే తప్ప , మనుస్మృతి సారాంశాన్ని మన జీవితాల నుండి వెళ్ళగొట్తలేదు ” ఇప్పుడు ప్రతి హిందువు ఒక బ్రాహ్మణుడిగా మారడం జరుగుతుంది. బ్రాహ్మణుల్లో వంటా వార్పు చేసే స్త్రీలు, ముట్టు బారిన పడే వీరు శూద్రులతో సమానంగా చూడబడతారు. బ్రాహ్మణ స్త్రీ లు ద్విజులు కాదు. వీరికి ఉపనయనం జరగదు. వేద మంత్రాలు చదివే అధికారం ఆ స్త్రీ లకు లేదు.  బ్రాహ్మణుల్లో స్త్రీలు సాధారణంగా వీణ ఎక్కువ నేర్చుకుంటారు. సనాతన ధర్మ వ్యవస్థలొ బయటి ప్రపంచం తో మగ వాళ్ల కన్న కాస్తో కూస్తో ఎక్కువ  interaction  పెంపొందించుకునే వాళ్ళు స్త్రీలే. ఈ పుస్తకం లో రచయిత తన తల్లి పరిస్థితి గురించి ఎంత మనోవ్యధ చెందుతాడో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. బ్రాహ్మణులు వాడే తిట్లు వేరు. ‘ సప్త కట్ల వెధవ ‘ ‘ లబోడి శంఖం ‘ లాంటి తిట్లు కనబడతాయి.

ఇలా సోషియలాజికల్ స్టడీ తో పాటు , ఒక బ్రాహ్మణుడిగా ఇంకో బ్రాహ్మణుడి రచనులు ఎలా అంతర్లీనంగా  connect  అవుతాయో కూడా రచయిత వివరిస్తాడు. ” బ్రాహ్మణ స్త్రీ లను చలం లేచి పొమ్మన్నాడని సనాతనస్తులు కాని హిందూ పాఠకులు పొరబడ్డారు. కానీ చలానికి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ లకు అంత ధైర్య సాహసాలు గానీ అవకాశాలు గానీ లేవని స్పష్టంగా తెలుసు. అందువలన సనాతన ధర్మ పీటాలకు అభ్యంతరం లేని ముస్లిం మతస్థులను తన రచనల్లో రహస్యంగా అభ్యర్థిబ్చాడు. ” ” చలం తన రచనల్లో వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ఊహ కూడా చేయలేదు. తన రచనల్లో వివాహాన్ని అరికట్టడం ద్వారా జాతి సాంకర్యాన్ని వర్ణ సాంకర్యాన్ని నివారించ బూని నాడు ” ఇలా చలం గురించి  బ్రాహ్మణ కోణం లో చూస్తునే విమర్శిస్తాడు. ఈ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనే కన్నా , ఇందులో ఎన్నో తరాల నుండి జరుగుతున్న బ్రాహ్మణ మేధో అవినీతిని బట్టి మొత్తానికి కొట్టివేసే వాదనగా కూడా అనిపించదు. అలాగే ” శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా లోని భాషంతా బ్రాహ్మణుల అద్వైత పరమాత్మ తత్వానికి – శంకరాచార్య వేదాంతానికి పూర్తిగా సంబంధించినదే . విశ్వానాథ సత్యనారయణ , కవితా ఓ కవితా చదివి శ్రీ శ్రీని తెగ కౌగిలించెసుకున్నట్టు చెప్తాడు. ‘ అది పురోగమనంగా కనిపించినా దాని ఆత్మ సనాతనమే . అది ఆ కవిత గొప్ప తనం’  అని అంటాడు రచయిత. అంతే కాకుండా గురజాడను విమర్శిస్తూ ఇలా అంటాడు ‘ సత్య సంధుడైన సౌజన్యారావు పంతుల్ని వైదిక బ్రాహ్మణుడిగానూ, లిటిగెంటు క్లయింటు రామప్పంతుల్ని వియోగి గాను గురజాడ చిత్రించాడు. వైదికులు సహజంగానే  వియోగులను అపహాస్యం చేస్తుంటారు. అంతెకాని గురజాడ ప్రత్యేకంగా బ్రాహ్మణులను విమర్శించింది లెదు ‘ అని కట్టే విరిచి నట్టుగా చెప్తాడు. ‘గురజాడ పూర్ణమ్మని వృద్ధుడికి యిచ్చి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. తన కుమార్తెకు సైతం బాల్య వివాహమే చేసాడు.’ అని మనకు విశదీకరిస్తాడు. అలా చె ప్తూ బ్రాహ్మణ కవులు రచయితల పట్ల ఇలా ముగిస్తాడు. ” మొత్తానికి బ్రాహ్మలకు సరిపడేదేదో కమ్యూనిజం లో ఉంది . అదేదో యెంతో కాలానికి కాని నాకు తెలీలేదు ”

అంతే కాక చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి. మఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఆది శంకరాచార్యుడు హిందువా బ్రాహ్మణుడా ? హిందుత్వం పై బుద్దిజం ప్రభావం , పదకొండవ పన్నెండవ శతాబ్దం లో దేవాలయాల పై దాడి దోపిడీ గురించి, చరిత్ర లో గుడికి ప్రాధాన్యత ఎంత ఉంది లాంటి విషయాలు కూడ మనం చూడవచ్చు.

రచయిత కుల నిర్మూలన పై ఆశవహంగా ఇలా  theorise  చేస్తాడు. ” పార్లమెంటును హేళన చేసే వాడు పార్లమెంటును ఏమీ చేయలేదు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నంగా పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారత దేశం లో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే. బ్రాహ్మణులు వస్తు జాలం కన్నా కష్టమైన భావ జాలాన్ని ఉత్పత్తి చేశారు. దాని మన్నిక చాలా కాలం ఉంటుంది. అది తిట్లతోనూ హేళనతోనూ నిర్మూలన కాదు. దీనిని ఎదుర్కోవాలాంటే చరిత్ర తెలియాలి. చరిత్ర చలన సూత్రాలు తెలియాలి. మానవ పరిణామం తెలియాలి. సంస్కృతి తెలియాలి. భావజాలం ఉత్పత్తి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి ”

ఈ పుస్తకం లో అక్కడక్కడా బ్రాహ్మణ జాఢ్యం చాయలు కూడా లేకపోలేదు. వీరేశ లింగం సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేశాడు అని ( సనాతన ధర్మమే ద్రోహం , దానికి తిరిగి ద్రోహం చేయడం ఏంటి ? ) , దీక్షితులు గారికి చందుడిలో మచ్చలా నల్లమందు అలవాటు ( అంటే ఆయన గారు  చంద్రుడు లాంటి వాడు అన్న మాట ) అంటాడు. ఐతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలి. ఇంత నిజాయితీగా రాస్తూ ఇలాంటి వాక్యాలు ఎందుకు దొర్లించాడు అని. రాణీ శివశంకర శర్మ గందరగోలవాది. ఆయన హిందూత్వాన్ని, కులాన్ని ఎంత నిరసిస్తాడొ, క్రైస్తవ్యాన్ని అంత నిరసిస్తాడు. హిందుత్వానికి వచ్చినా ఆ ప్రచార కాంక్ష సామ్రాజ్యవాద క్రైస్తవ కాంక్షగా చూస్తాడు. ఐతే వర్గ లక్షణం లేని మతం ఎలా ఉంటుందొ మనకు సరి అయిన వాదన దొరకదు. చాలా ఎలాబొరేట్ గా ఒక్కో పాయింట్ తీసుకుని ఆయన క్రైస్తవ్యానికి, హిందూత్వానికి పోలిక చూపిస్తూ రాస్తూ వస్తాడు. ముస్లిం మతస్తులు ఇక్కడ బతికి ఇక్కడే ఉండడానికి వచ్చారు. క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి రాలేదు. కేవలం దోచుకోడానికి వచ్చారు లాంటి కంక్లూజన్స్ కనిపిస్తాయి ఈ పుస్తకం లో.  ఇందులో కుటిలత్వం ఏమీ లేదు. కేవలం గందరగోళం. కొంచెం పిడివాద మూర్ఖత్వం తప్ప.

ఇలాంటి పాజిటివ్స్ నెగటివ్స్ తో చదవాల్సిన ఈ పుస్తకం సౌదా అరుణ తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఏ పుస్తక శాలలో కూడా దొరకదు. కేవలం సౌదాను ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేస్తే తప్ప దొరకదు. ప్రచురణ కర్తలు రివ్యూలపై అనాసక్తి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుస్తకం ఫార్మాట్ ఇందులో ఉన్న అంశాలు ఎంతగానో ఆకర్శించడం వలన తప్పక షేర్ చేసుకోదలచి రాయాల్సి వచ్చింది ( మితృడు సౌదాకు తప్పని సరి సారంగ పత్రికా ముఖంగా క్షమాపణలు. పాఠకుడికి రివ్యూ చేసే హక్కు నేను ఉపయోగించుకుంటున్నాను )

Note  : ఈ రివ్యూలొ చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు దొర్లాయి. అయితే సంస్కృత పర్యాయ పదాలు వాడ్డం చాత కాక అవి అలాగే ఉంచడం జరిగింది. వ్యాసకర్త వద్ద మరింత స్పష్టత కోరదల్చుకుంటే   pvvkumar@yahoo.co.uk  వద్ద గాని, ఫేస్ బుక్  ID – P V Vijay Kumar  వద్ద కూడ కాంటాక్ట్ చేయవచ్చు. 

*

 

 

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    శ్రీ రాణి శివశంకర శర్మ గారి ” ది లాస్ట్ బ్రాహ్మిణ్ ” పుస్తకం కోసం సౌదాగారిని సంప్రదించాలంటే వారి వివరాలు : ఫోను నంబర్ : 9247150243. ఇమెయిల్ : saudaaruna@gmail.com

    ” This Book is only for Intelectuals; not for general public consumption. That is why we are not keeping the copies in all Book Shops ” అని వివరణ ఇచ్చారు సౌదా అరుణ గారు.

    “ది లాస్ట్ బ్రాహ్మిణ్” పుస్తకాన్ని విశ్లేషించిన పి. విక్టర్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు.

    • బుక్ రేట్ ఎక్కువగా ఉంది కొంచం పాటకులకు అందుబాటులో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

    • పి. మారుతి says:

      “డిస్ కాపీ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటలెక్తువల్ల్స్” ఇది దారుణమైన అభిప్రాయం.

  2. Bollojubaba says:

    Great analysis Vijay gaaru. Your review is an intellectual analysis of the subject sir. Thank you. It’s a great book . Worth reading.

  3. హారతి వాగీశన్ says:

    విజయకుమార్ గారికి మప్పితాలు. కొంత అరుదైన పుస్తకం మీద చర్చ కు అవకాశం కలిపించినరు.

    ది లాస్ట్ బ్రాహ్మిన్ కొంత అరుదుగా వొచ్చే సాహిత్యం . ఆత్మ కథ గా ఉంటూ నే అనేక సామాజిక అంశాలను ముట్టుకున్న రచన అది. పుట్టుక పునాది గా ఉన్నతత్వాన్ని(నీచత్వాన్ని) స్థిరీకరించే విలువతో ఉండే జీవితపు దుర్భరత్వం అక్కడ వర్ణించబడింది . ఆ విలువల తో ఉండే జీవితం సనాతనమైనా, వినూతనమైన సమస్య సమస్యనే . వర్ణాలను పవిత్రీకరించి, వ్యక్తి గుణం (స్వభావం అర్థం లో ) సమర్థతల, నేర్పులతో సంబంధం లేకుండా సదరు వ్యక్తి పుట్టుకనే ప్రధానంగా సామజిక ఆర్థిక హోదా కు కారణం అని బలం గా నమ్మించే వ్యవస్థను మన ప్రస్తుత వాదనా సౌలభ్యం కోసం బ్రాహ్మణత్వం (నేను కుల బ్రాహ్మణత్వం అంటే బాగు అనుకుంటాను లేక వర్ణ ఆధిపత్య విభజన చట్రం లేక వర్ణ వ్యవస్థ అని అనవచ్చు). చివరి బ్రహ్మాడి సనాతనత్వం అది ( సనాతన ,బ్రాహ్మణ అన్న మాటలకు ఉండే వేరే అర్థాలు వేరే సందర్భం లో మాట్లాడుకోవచ్చు) . ప్రచార యావ ఉన్నా లేకున్నా తమను తాము సనాతన వైదిక మార్గ గాములుగా భావించుకున్న(ముఖ్యంగా దానిలోని మగవారు) వారు తాము ప్రత్యెక బృందం గా ,ఉన్నత మైన వారిగా భావించుకున్నారు . ఇక్కడ ఒక్క విషయం గమనిచాలి వేదం నేర్చుకున్న ప్రతి ఒక్కడూ అగ్రహారాలు సంపాదించలేదు,యజ్ఞాలు చేస్తూ బతకలేదు . కేవలం వేదాభ్యాసం మాత్రమే తెలిసన వారికి జడత్వం ఉంటుదనీ , బుద్ధిజనిత మైన జాడ్యం ఉన్మాదం ( పెద్దన మనుచరిత్రలో ) ఉంటుందనీ అనడం ఉన్నది . సనాతన వైదిక బ్రాహ్మణ జీవితం తనను తానూ మొత్తం సమాజానికి కేంద్రబిందువు అని ప్రచారం చేసుకున్నది అని మాత్రం అనలేము.

    ఇట్లా కాక హిందుత్వ వాదం బ్రాహ్మణ కుల విలువలను సార్వత్రికం చేయ బూనుతుంది/ పూనింది . ఇది ఆరకంగా దేశీయ జీవన బహుళత ను రద్దు పరుచ బూనుతుంది .ఇది గుడి వ్యవస్థ కంటే కూడా కాంప్లెక్ వ్యవహారం .గుడి వ్యవస్థ కేవలం కుల బ్రాహ్మన ఆధిపత్యం కోసమే కాక ఇతర ఆధిపత్య కులాల ఆధిపత్యాల స్తిరీకరణకు కారణం అవుతుంది . హిదూత్వ వాదం బ్రాహ్మణ కుల విలువలను “జాతీయ అఖండ విలువ” గా మార్చ చూస్తుంది . శర్మ గారు జీవిత చిత్రణ చేసిన సనాతన బ్రాహ్మన జీవితం ఇటువంటి ప్రచారానికి పూనుకోదు . అది తనను తానూ పవిత్రం అని నమ్ముతుంది . అట్లా దడి కట్టుకుంటుంది . బ్రాహ్మణ సంస్కర్తలు ఈ దడికట్టు జీవన పద్దతిని వలస పాలన సందర్భంలో సంస్కరించుకోవాలని ప్రయత్నం చేసినారు . చలం మాట్లాడిన స్త్రీ స్వేచ్ఛ కూడా ఈ పరిధి దాటలేదు అంటారు శర్మగారు .

    ఇట్లా చూసినప్పుడు శర్మ గారు ప్రచార ప్రధాన హిందుత్వం తో పోలిస్తే వాళ్ళ తండ్రి జీవించిన సనాతన జీవితం నయం అనే భావన తో ఉన్నారా? అనిపిస్తుంది . కానీ వాస్తవం అది కాదు .పుట్టుక పునాదిగా ఉచ్చ నీచాలను సమర్థించే భావజాల సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పడం తో ఆయన ఒక లోతైన వాస్తవాన్ని ముందుకు తెచ్చాడు అనిపిస్తుంది . అదే ది లాస్ట్ బ్రహ్మిన్ లో కీలకం అనిపిస్తుంది. అందువలన లాస్ట్ బ్రాహ్మణ పుస్తకం సనాతన దడికట్టు వర్ణ వ్యవస్థను సమర్థించే కేమోఫ్లాజ్ అనలేము .

    విజయకుమార్ గారు అంటున్నట్టు బ్రాహ్మణ కులం లో పుట్టినా వర్ణ ఆధిపత్యాన్ని నిరాకరిస్తున్న వారిమని చెప్పే వారు కూడా తమ ప్రస్తుత అస్తిత్వం వల్ల తమకు ఉన్న వెసులుబాట్ల పట్ల ఎరుక గలిగి ఉండటం అవుసరం . అటువంటి తమకు లేవు అని చెప్పడం సత్య దూరం . అసలు ఆ ప్రివిలేజ్ ను వాడుకుంటూ తమ మాట వినే సాటి కులస్తులతో వర్ణ ఆధిపత్యం తెచ్చిన ,కొనసాగిస్తున్న దుర్మార్గాన్ని గురించి మాట్లాడటం అవుసరం . ఇది కుల బ్రాహ్మణ జీవితం ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మారాలి అనే ఉపయోగితా వాద (ముసుగు ఆదిపత్య వాద) సంస్కరణ వాదం కంటే వేరు వ్యవహారం .
    హిందుత్వ వాదులు ( బ్రాహ్మణీయ హిందుత్వ వాదులు అనే అవుసరం లేదు అని నా అభిప్రాయం ) తెచ్చిన ముస్లిం వ్యతిరేకత ( తరువాతి క్రైస్తవ వ్యతిరేకత ) ముఖ్యంగా పెట్టుబడి దారీ క్రైస్తవం నుండి నేర్చుకున్నవే అంటారు శర్మ గారు . ఇస్లామూ క్రైస్తవమూ ‘వర్ణ ‘ వ్యవస్థ వాల్ల పీడితులకు ఊరటను ఇచ్చి ఉండిన మాట నిజమే. కానీ ఆ ఊరట నివ్వడం ఆయా మతాల ప్రధాన అజెండా ఏమీ కాదు. ఒక కట్టుదిట్టమైన ఏకత్వం తద్వారా నియంత్రణ ఆధిపత్యం నెరపడం అనేవి ఒక కచ్చిత ప్రవర్తనా నియమావళి ని రూపొందించే మతాల అంతస్సారం మతాలూ( సంప్రదాయాలు ) మారడం ఈదేశంలో కొత్తేమీ కాదు ఊరట కోసం కొందరు,అవకాశాల కోసం కొందరు, ఆ రెంటి కలయిక తో కొందరు ఇట్లా మారిన వారు ఉన్నారు మతం మారడానికి ఒకే ఒక కారణం ఉంటుంది అనడం నిజం కాదు అన్పిస్తుంది. హిదుత్వ వాదులు ఆరకమైన క్రైస్తవ ప్రోతెస్తేంట్ చర్చి నమూనా ను మేలు రకమైన నమూనా అను కున్నారు . ఇస్లాం లోని ఏకత పట్ల హిదుత్వ వాదులకు లో లోపల ఒక వైర భక్తి లాంటి ఉంటుది . అయితే వారికి ఇస్లాం వెనుక బాటు మతం అది వారికి శత్రుమతం . వెబర్ వంటి పండితులు మెచ్చుకున్న కాపిటలిస్ట్ ప్రోటేస్టెంట్ ఎథిక్ వారి నమూనా. ఆరకంగా వైవిధ్య సంప్రదాయ ధారలను రద్దు పరుచబూనే ఓక అఖండ వాద సంప్రదాయం అది. ఆరకంగా హిదుత్వ ను ప్రచ్చన్న క్రైస్తవం అంటారు ఆ పుస్తకం లో శర్మగారు.

    విజయ కుమార్ గారు ‘అవుట్ సైడర్’ గా శర్మ గారి తండ్రి వంటి ప్రతి సనాతన బ్రాహ్మన (పురుషుడిని )ని ఒక అమానవీయ వక్రత ( ఇన్హ్యూమన్ అబ్బెరేషన్ ) గా చూస్తున్నారు .అది పూర్తి వాస్తవం కాక పోవచ్చు .ఇక సత్యనారాయణ వ్రతం విషయానికి వస్తే అది గ్రామశ్రిత పురోహిత వర్గం తమ బేస్ ను అన్ని వర్నాలలోకి విస్తరించుకునే వ్యవహారం అనిపిస్తుంది . అది బ్రాహ్మలు మాత్రమే చేసుకునే వ్రతం అనేది నిజం కాదు .ఏది ఎమైనా కొంత ఓపికతో ,చారిత్రక ,సామాజిక ద్రుష్టి తో చదవవలిసిన పుస్తకం లాస్ట్ బ్రాహ్మిన్ అన్నది వాస్తవం ,అది బ్రాహ్మణ కీర్తి గాధ అని అనడం సరికాదు

    విజయ కుమార్ గారు మంచి విశ్లేషణ చేసినరు. కొంతమంది చదువరులైనా పుస్తకం చదువుతారనీ .వినికిడి పాండిత్యం బారినుండి , సులభీకృత ఆరోపణ ల నుండి కొచం దూరం జరుగుతారాని ఆశిద్దము

    • RATNAKAR CHERUKU says:

      “విజయ కుమార్ గారు ‘అవుట్ సైడర్’ గా శర్మ గారి తండ్రి వంటి ప్రతి సనాతన బ్రాహ్మన (పురుషుడిని )ని ఒక అమానవీయ వక్రత ( ఇన్హ్యూమన్ అబ్బెరేషన్ ) గా చూస్తున్నారు .అది పూర్తి వాస్తవం కాక పోవచ్చు” .

      నిజమేనండీ. బ్రాహ్మల్లో కూడా మహానుభావులు వున్నారు.

  4. నరహరి says:

    కోనసీమ అగ్రహారాల్లోని వైదిక బ్రాహ్మణ్యము లేదా శంకర మఠాలు అక్కడ పుట్టినవారే చివరి బ్రాహ్మణ చిహ్నమని, అవే దేశంలోని బ్రాహ్మిణిజానికి పూర్తి ప్రాతినిధ్యం వహించాయని, రామానుజ, శైవ, కాశ్మీరీ శైవ, మధ్వ ఇత్యాది తాత్త్విక ధారలన్నీ లేనేలేవని, వాటి ప్రస్తావన అవసరమే లేదని, అవన్నీ కూడా ఈ కులవ్యవస్థకి కొమ్ముకాసాయని, వాటిని పూర్తిగా పట్టించుకోనవసరంలేదని, దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రాష్ట్రాలలో వున్న వేలాది బ్రాహ్మణశాఖలన్నీ కూడా గంపగుత్తగా తాత్త్వికపరంగా ఆధిపత్యాన్ని, దోపిడీని చేసిన పాకలవర్గాలకు దళారీలుగా కొనసాగాయని, ఇప్పుడు ఆ దళారీలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాయని సామాన్యీకరించి, సాధారణీకరించి చెప్పడం వినికిడి పాండిత్యమే అవుతుందేమో? ఇంత గొప్పగా విషయాన్ని సులభీకరణ చేయడం, ఆరోపణలు చేయడం నుండి ముందుగా దూరం జరగాల్సింది ఎవరు?

  5. నరహరి గారు చెప్పింది నిజం. యింకా ఇతర శాఖల బ్రాహ్మల నుంచి కూడా ఆత్మకథలు రావలసిఉంది. అప్పుడే మరింత సమగ్ర చిత్రం లభిస్తుంది.దానికి యిది నాందీవాచకం గా పనికొస్తుంది.

  6. ‘ది లాస్ట్ బ్రాహ్మణ్’ విమర్శ కాదుగాని, వ్యవస్థ స్యరూప స్వభావాలు అర్థం అయిన వారు దీన్ని నమ్మగలరా? ఇక్కడ ‘బ్రాహ్మణ’ అనే ఒక కులం అంత మైందా, వ్యక్తి గా ఒక బ్రాహ్మణుడు అంతమైందా, లేక వ్యవస్థ గా బ్రాహ్మణ త్వం అంత మైందా? ఏది అంతమైంది?
    మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణత్వాన్ని వేరు వేరు గా చూడాలా? నాకైతే కొద్ది తేడాతో అన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. అన్నీ ఒక తాను లే ముక్కలే కాదా?
    వ్యవస్థ అమూల్యమైన మార్పు రాకుండా బ్రాహ్మణులు తమ పూర్వ వైభవాన్ని కొంత కోల్పోయారేమో గాని, బ్రాహ్మణత్వ వ్యవస్థ మాత్రం కోల్పో లేదు. కోల్పోదు. స్వరూపాన్ని కొంత మార్చు కొన్నదేమో గాని దాని స్వభావాన్ను కోల్పో లేదు. అంత వరకు ‘ దిలాస్ట్ బ్రాహ్మణ్’ తప్పడు అవగాహనను కల్పిస్తున్నట్టే గాదా? అవును అనే అనుకుంటాను.

  7. లాస్ట్ బ్రాహ్మిణ్ పుస్తకం ఆధునికకాలంలో పూర్వం కంటే బ్రాహ్మణిజం బాగా విస్తరించిందని ,బలపడిందని స్పష్టం చేస్తోంది. అదే హిందుత్వ.

  8. ఈ వ్యాసం, పైన వున్న వ్యాఖ్యల వల్ల నాకొక కొత్త విషయం తెలిసింది – intellect-based-book-sales వున్నాయని.

    నాకు కొన్ని సందేహాలు – ఇవి ఈ వ్యాస రచయితనో, అసలు The Last Brahmin పుస్తక రచయితనో ధిక్కారంగా అడిగినవో, హేళన చేయడానికి ప్రశ్నించినవో కావు – thinking loud టైపు అన్నమాట . ఒక వేలు అవతలివారివైపు చూపిస్తే మూడు వేళ్లు నావైపే వుంటాయన్న ఎరుకలో వుండేదాన్ని.

    1) పుస్తకం కొనడానికి intellect ని ఎలా కొలుస్తారు? ఎలా నిర్ణయిస్తారు? పుస్తకం కొనాలనివుంది అని e-mail ఇవ్వడమో, ఫోన్ చేయడమో చేస్తే intellectual అయినట్టా?

    2) “ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత.”

    పైన చెప్పిన ఆ పుస్తక రచయిత తన పేర్లోని మొదటి , చివరి భాగాలు త్యజించి వుంటే ఆ వాక్యాలు ఇంకొంచెం authentic గా అనిపించేవేమో!?

    I have more questions, but I refrain from asking – because sometimes these discussions lead to personal-space-intrusion. I don’t want to cause any inconvenience to the author (article / book ).

    • Victor Vijay Kumar says:

      I completely endorse ur second point. My statement wud have more authenticity if he has shun away his surname

  9. కె.కె. రామయ్య says:

    TS లలిత గారు,

    1) ‘ది లాస్ట్ బ్రాహ్మణ్’ పుస్తకం అందరు పాఠకులకి అర్ధం కాదేమో, నచ్చదేమో అనే అర్థంలోనే సౌదా అరుణ గారు అలా అన్నారు. ఈ పుస్తకం కొనడం పాఠకుల intellect కి కొలమానం అని అహంకరించి అనలేదు. అరకొరగా రాసిన నా వాక్యాలు అలాంటి తప్పు అర్ధాన్ని ఇస్తున్నట్లున్నాయి, మన్నించవలసినది.

    2) ” పుస్తక రచయిత (రాణి శివశంకర శర్మ) తన పేర్లోని మొదటి, చివరి భాగాలు త్యజించి వుంటే ” … ఎంతో ఆర్తితో, ఆవేదనతో పుస్తకం రాసిన తనను ఇలా అడగటం భావ్యం కాదేమో.

    • RATNAKAR CHERUKU says:

      రామయ్య గారు. కరెక్టుగా చెప్పారు. బుక్ ఎగ్జిబిషన్లో సౌదా గారి స్టాల్ కి వెళ్ళినప్పుడు తను నేను సెలెక్ట్ చేసిన కొన్ని పుస్తకాలు చూసి తనే ఈపుస్తకం తీసుకొమ్మని చెప్పారు. ఇంటెల్లెక్చువల్ కంటే అభిరుచి అనేది సరైన పదం కావచ్చును.

    • కె.కె. రామయ్య గారు!
      1) వివరణకి ధన్యవాదాలు. మన్నింపు ఎందుకులెండి – పెద్దమాట :)
      2) ఒప్పుకుంటాను – I sort of crossed my own rule to comment. I shouldn’t have said so.

  10. మొత్తం ఆపేరే అభ్యంతర కరం.

మీ మాటలు

*