తూర్పు వాకిటి పశ్చిమం!

 

addtext_com_mte1njizode3mzg

కాలిఫోర్నియాలోని ఓ నగరంలో,ఉద్యోగస్తులు అనిత, మోహన్ లు.

ఉన్న ఒక్కగానొక్క కూతురు సింధుకి జ్వరం వొస్తే,ఎవరు శలవు పెట్టి చూసుకోవాలి ? అనే మీమాంశలు తప్ప,

పెద్ద చీకూ, చింతా లేని సంసారం!

అమెరికన్ లలో అమెరికన్లు గా,ఇండియన్స్ తో ఇండియన్లుగాకలిసిపోయే నైజం వారిది.

ఈ అంతర్జాతీయ సమాజంలో ఉండే అనేక సాంస్కృతిక భేధాలని, విభిన్న ఆచారాలని ఆకళింపు చేసుకోవడమే కాకుండా, నలుగురిలో  ఆ మర్యాదలను పాటించే వారి తీరు ముచ్చటేస్తుంది కూడా!

నిజానికి, ఈ  స్నేహశీల ధోరణే లేదా సరదానే వాళ్ళ కెరీర్ కి మంచి బాటలు వేస్తోందని, స్నేహితులు అంటుంటారు.

అలా అన్న వాళ్లతో,

అదంతా, బతుకుతెరువు నేర్పించిందని,

ప్రవాస జీవితంతో సమతుల్యత కోసమనీ….

ఇంటికొచ్చేసరికి మాత్రం,

సాధారణ తెలుగు దంపతులమే అంటుంటారు.

అలాంటి వీరికి,ఈ మధ్య,

పాశ్చాత్య నీడలు తమ కూతురి ఆలోచనలని పెడ త్రోవ పట్టిస్తాయేమో అనే ఆందోళన మొదలైంది!

అమెరికాలో ఉండే తల్లిదండ్రులకి ఇదేం కొత్త భయం కానప్పటికీ,
ఉన్నట్టుండి,

అదీ ఎనిమిదేళ్ళ కూతురి విషయంలో రావటానికి కారణం,

ఓ వారం క్రితం,

“నువ్వు చెప్పేవన్నీ కధలు, కల్పితాలు,!” ,

తల్లి తో నిష్టూరంగా అంది సింధు.

స్కూలు అయిపోగానే, తన స్నేహితురాలు సేజ్  ఇంటికి వెళ్లి, ఓ గంట ఆడుకుని వస్తానందవాళ.   వాళ్ల అమ్మ  డెబ్బీ కూడా ప్లే డేట్ కావాలని సేజ్ అడుగుతోందని ఇ మెయిల్ చేసింది.

తన మాటలకి రియాక్షన్ ఏమిటా అని సింధు కళ్ళు విప్పార్చుకుని చూస్తుంటే,

ఆ కధలు, కల్పితాలు ఏమిటని అడిగింది అనిత.

“నేను నీకు దేవుడిస్తే పుట్టలేదు,  నాకు నిజం తెలిసి పోయింది”,  అన్న కూతురిని,

“హాయిగా ఆడుకోకుండా, ఎవరు ఎలా పుట్టారనే సోదితోనే పొద్దుపుచ్చారా? అసలు, ఇలాంటివి తప్పితే వేరే ధ్యాసే ఉండదా? సేజ్ వాళ్ల అమ్మ అయినా ఈ పనికిమాలిన మాటలేంటని ఆపలేదా?”

మందలించకుండా ఉండలేకపోయింది అనిత.

చిన్నబుచ్చుకుని,

“ఆడుకునేప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు,  ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటారు,  స్ప్రింగ్ సీజన్ లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారని  మా టీచర్ కూడా చెప్పింది. నీకో విషయం చెప్పనా?, సేజ్ వాళ్ల అమ్మ నీలా విసుక్కోదు , డెలివరీలు ఎలా జరుగుతాయో చూపించే టివి చానల్ చూసినా సేజ్ ని ఏమీ అనదు, మేం స్నాక్ తినేప్పుడు డెబ్బీ కూడా మాట్లాడింది, తనకి చాలా విషయాలు తెలుస”ని నొక్కి చెప్పింది సింధు.

“నేను నీకు నిజం చెప్పలేదని ఎలా  అనుకుంటున్నావు ? నిజానికి,  మీ అమ్మమ్మ అంటే మా అమ్మ కూడా నాకిదే చెప్పింది. తను ఎన్నో దేవుళ్ళకి  మొక్కితే నేను పుట్టానని, ఓ బిడ్డని ప్రసాదించమని నా ఇష్ట దైవాన్ని వేడుకుంటే,  నువ్వు పుట్టావు . ఇప్పుడు నేను కూడా అమ్మమ్మతో నువ్వు నాకు నిజం చెప్పలేదని అనాలా? ఇక్కడి నీ స్నేహితులు చెపుతుంటారుగా ఆకాశం నుంచి కిందకి రాలుతున్న నక్షత్రాన్ని కోరిక కోరితే జరుగుతుందని, ఇదీ అలాంటిదే అనుకోరాదా?” అనే  అనిత పాయింటుకు

ఏ మాత్రం తగ్గకుండా,

సేజ్ వాళ్ల అమ్మ అలాంటివేమీ తను నమ్మనంది. కొంతమంది నమ్మే వాళ్లు అలా చెప్పినా,   రుజువు చెయలేరని నమ్మకంగా చెప్పిందనే  సమాధానం సింధు నుంచి వొచ్చింది.

సేజ్ వాళ్ల అమ్మని ఇలాంటివి అడగాలనే అలోచన ఎందుకు వొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా,

“స్కూల్ లో ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటుండగా, నేను నీకు దేవుడిస్తే పుట్టానని చెప్పగానే, చాలా మంది నమ్మలేదు! అలాంటివన్నీ కిండర్ గార్టెన్ పిల్లలు  చెప్పే కధలు,  మెక్ బిలీవ్ స్టోరీస్ (Make believe)  అని నీకు ఇంకా తెలీదా? అన్నారు. నాకు ఏడుపొచ్చింది. అప్పుడు సేజ్ నన్ను చాలా సేపు ఓదార్చడమే కాకుండా, మా మామ్  హాస్పటల్లో  నర్సుగా పనిచేస్తుంది, డెలివరీలకి సహాయం చెయ్యడమే తన పని. తనకు ఇలాంటివన్నీ బాగా తెలుసనటం వల్ల, వాళ్ళింటికెళ్ళినపుడు,  డెబ్బీ ఏం చెపుతుందో తెలుసుకోవాలనిపించి” అడిగానన్నది .

స్నేహితుల ముందు కూతురు చిన్నబోవటం అనితకి చివుక్కుమనిపించినా,  సంభాళించుకుని,

అమెరికాలోని  చాలా మంది పేరెంట్స్ ప్రపంచం నాలుగు మూలల నుంచి వొచ్చిన వాళ్లవడం వల్ల అందరూ ఒకేలా చెప్పరని, పెరిగిన వాతావరణం,  ఏర్పరుచుకున్న భావాల ప్రభావంతో పిల్లలకు సమాచారాన్నిస్తారనే వివరణ ఇస్తే,

సింధు తన  ధోరణిలో,

ఈ పాయింట్ లో అది సరి కాదంది.

ఏ జాతి కుక్క పిల్ల అయినా, అమెరికాలో ఎలా పుడుతుందో, ఇండియాలోనూ అలాగే పుడుతుంది, మనుషులూ అంతే కాబట్టి, అనిత చెప్పింది తప్పు దారి పట్టించడమే అంది.
“నేను పెద్దవుతున్నానని నువ్వు పదే పదే అంటావు కానీ, you really don’t mean it?!”

అనే వాదనకి దిగింది,

“అసలిలాగే నేను ఎందుకు పుట్టాను? ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను అని ఎన్ని సార్లు అడిగినా నువ్వు అర్ధం అయ్యేట్టు చెప్పనే లేదు, అదే డెబ్బీ అయితే,

ప్రపంచంలోని ఏ ప్రదేశంలో ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలు కావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని కంటారని, అందుకే నేను మన ఇంట్లో పుట్టానని, నా రూపురేఖలు మీ ఇద్దరి నుంచి, మీ ఇద్దరి కుటుంబాల నుంచీ వొచ్చాయనీ చెప్పింది…and it makes sense!”  అంది.

అమ్మ కడుపులోకి బేబీస్ ఎలా వెళతారని అడిగినపుడు,

“Sperm and eggలు అమ్మ శరీరంలో కలుసుకుని బేబీని తయారుచేస్తాయని డెబ్బీ చెప్పిందంటూ, అమ్మమ్మకు తెలియక పోవడం వల్లే నీకిది తెలియలేదా?! అందుకే నువ్వు నాకు చెప్పలేక పోయావా ? “అని ఆరా తీసింది.

ఇంకా ఏం చెప్పాలో అనితకి తట్టక మునుపే ….

“By the way, ఇదంతా జరగటానికి కొన్ని స్పెషల్ ఫీలింగ్స్ అవసరం! “
గొంతు తక్కువ చేసి, రహస్యంగా…
“ఆడుకొనేటప్పుడు సేజ్ చెవిలో చెప్పింది. వాటి గురించి అందరిలోనూ మాట్లాడటం పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు కనుక, మనం వాళ్ళ భావాలను గౌరవించాలంద”ని కూడా అంటూ

తల్లి వంక చూస్తూ, అవునన్నట్టు తల ఊపింది.

సింధు చెపుతున్న ఒక్కో మాటకి,

డెబ్బీ మీద పట్టరాని కోపం వొచ్చింది అనితకి.

హాస్పటళ్ళలో  పని చేసే వాళ్లకి ఏవి గుట్టుగా ఉంచాల్సినవనే జ్ఞానం ఉండదు, ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉందా?!
ఇదే ధోరణిలో సాగితే,
ముందు ముందు ఇంకా ఎన్ని వినాలో…
అనుకుంటూ,

ఒక్క సెకను కూడా ఇక ఈ మాటలు భరించలేనట్టు,

“ సరే సరే ! టైమున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ముఖం కడుక్కుని రా! ఏదైనా తిని, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టు మెదలుపెట్టు. వారంలో ఇచ్చెయ్యాల”ని పురమాయిస్తే,

“ I know ! “

అసంతృప్తినంతా  గొంతులో పలికిస్తూ తన గదిలోకి వెళ్లింది సింధు.

అ నిరసన,

తమ మధ్య దూరానికి కొలమానంలా వినిపించింది అనితకి.

ఇదంతా,

మోహన్ తో చెపితే,

మొదట,  “సీరియస్లీ….” అన్నాడు,

అంతా విని,

మరీ మూడో క్లాసుకే ఇన్ని ఆరాలు, ఇంత పోగెయ్యటమా ? అని గుండెలు బాదుకున్నాడు,

ఎంత తండ్రినయినా,  చిన్నపిల్లతో ఇవన్నీ నేను మాట్లాడటం బాగుండదు, నువ్వే దగ్గర కూచోపెట్టుకుని, ఇలాంటి మాటలు మాట్లాడటం, వివరాలు తెలుసుకోవడం మంచి పిల్లల లక్షణం కాదని తెలియచెప్పాలన్నాడు.

“ఇది మంచి పిల్లల లక్షణం కాదు అంటే, వినే కాలమా?! మనం ఒకటి చెపితే, తను పది ప్రశ్నలు వెయ్యగలదు,  స్కూళ్లలో,  పిల్లలు నలుగురూ నాలుగు రకాలుగా ఉంటారు! పది రకాలుగా చెప్పుకుంటారు, అసలు పిల్లలకి తెలీకుండా ఉంచాల్సినవేవీ మిగలట్లేదేమో ?!, ఈ ధోరణి ఎటు పోనుందో… “

అనిత దిగాలు పడిపోతే,

ఆ బెంగ తనకీ కలుగుతోందంటూ, ఈ వయసులోనే సరైన మార్గంలో పెట్టాలన్నాడు మోహన్,

ఇలా మొదలైన తమ ఆందోళనని, ముందుగా,

ఇండియాలో ఉన్న పెద్దవాళ్లతో టూకీగా అంటే,

చిన్నపిల్లల్ని ఏమార్చి, దృష్టి మరల్చాలి కానీ, ఇలా బెంబేలు పడకూడదన్నారు.

ఇక్కడి పోకడలపై అవగాహన లేక వాళ్ళు అంత తేలిగ్గా సమాధానమిచ్చారని అనిత, మోహన్ లు  భావించారు.

తరువాత,

అనిత స్నేహితురాలు సుగుణ కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు.

అమ్మాయిలని ఇండియాలో పెంచడమే “ఉత్తమం” అనుకుంటూ, వాళ్లు హైదరాబాద్ కి వెళ్ళిపోయి నాలుగేళ్ళవుతోంది.

మనం ఇవన్నీ తెలుసుకుని పెరిగామా?

పరమ రోత అంతా మన సినిమాల్లోనూ, టీవీ ప్రోగ్రాముల్లోనూ అగుపించడం గుర్తుకుతెచ్చుకుని, సుగుణ తరచూ వేసే ఈ ప్రశ్నతోనూ ఏకీభవించలేకపోయారు.

‘ఫ్యామిలీ లైఫ్’ గురించి స్కూల్లో తెలుసుకొచ్చిన మా అబ్బాయి, ఇలాంటిదేదో ఇంట్లో జరుగుతుందని నాకు తెలియకుండా ఎలా మేనేజ్ చేసారని అడిగాడంటూ వాపోయిన పూర్ణిమ, అనందరావులు కూడా వాళ్ళ కళ్ల ముందు కదలాడారు.

ఏషియన్స్, ఇండియన్స్ ఎక్కువగా ఉన్న స్కూళ్లలో అయితే ఈ ధ్యాస తగ్గి చదువులో పోటీ పెరుగుతుందంటూ, ఉన్న పళాన, వాళ్ళు బే ఏరియాకి (కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ,  దాని చుట్టుపక్కల ప్రాంతాలు) వెళ్ళిపోయిన తీరు తల్చుకుని,

మనం కూడా ఆ పని చేద్దామని అనిత అంటే,

అన్నీ సెట్ అయి ఉన్న చోటి నుంచి, ఉన్నపళాన కొత్త ప్రదేశానికి వెళ్లడం సాధ్యం కాదంటూ,  అక్కడికి వెళ్ళినా గ్యారంటీ ఉంటుందనిపించడం లేదన్నాడు మోహన్.

‘మన’ వాళ్ల కెవరికయినా ఫోన్ చేసి సలహా అడుగుదామనుకుని,

తెలిసిన నలుగురిలో, కూతురిని ఎందుకు బయట పడెయ్యాలని మనసు మార్చుకుంది అనిత.

మరేం చెయ్యాలి??

తమ కమ్యూనిటీలోనే ఉంటూ, సింధు చదివే స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసే మిషెల్ ఆపద్భాందవిలా అనిపించింది. పైగా తను ప్రొఫెషనల్ కూడా!

హాస్పటల్లో పనిచెయ్యడమే కాకుండా, స్కూల్లో పిల్లలకి “ఫ్యామిలీ లైఫ్ “ (లేదా లైంగిక విజ్నానం) పాఠాలు చెపుతుంది.

ఇరువురూ, తరచూ ఈవినింగ్ వాక్ లో కలుస్తూనే ఉంటారు. రెండేళ్ళుగా స్నేహం !

ఈ మాటే మోహన్ తో అంటే, మాట్లాడి చూడమన్నాడు.

ఓ రోజు,

పార్కులో కనిపించిన మిషెల్ తో,

పలకరింపులయిన తరువాత,

మీ సహాయం కావాలి అంటూ తన గోడు వెళ్లబోసుకుంది.

మా కల్చర్ లో ఇలాంటి వివరాలని పిల్లల నుంచి చాలా గోప్యంగా ఉంచుతాం.  తెలిసీ తెలియక నలుగురిలో మాట్లాడితే బాగుండదని, తగిన వయస్సు వొచ్చినపుడు వాళ్ళే తెలుసుకుంటారని, ఏకాగ్రత లోపిస్తుందని, ఇలా రకరకాల కారణాలని చెప్పుకుపోతున్న అనితతో,

ఇలాంటివి పెద్దవాళ్లు చెపితేనే పిల్లలకి తెలుస్తాయని అనుకోలేమంది మిషెల్.

మొన్నా మధ్య కిండర్ గార్టెన్ చదువుతున్న పిల్లాడు ఒకడు, తను చూసిన “ పెప్పా పిగ్ “ కార్టూన్ ఎపిసోడ్ లొ మామీ (Mommy) పిగ్ ఎలా డెలివరీ అయిందో, తన క్లాస్మేట్ తో చెపుతుంటే విన్నానంటూ, అవగాహన పెరుగుతున్న కొద్దీ,  పిల్లలు తమ శరీరాల నుంచి వొచ్చే సిగ్నల్స్ తో పాటు, గమనించిన లేదా తెలుసుకున్న ఒక క్లూ నించి, ఇంకో క్లూ కి కనెక్ట్ చేసుకుంటూ పోతారని వివరించింది.

వాస్తవానికి, తను  పాఠాలు మొదలుపెట్టేనాటికే, పిల్లలలో చాలా మందికి లైంగిక విషయాల పట్ల అంతోఇంతో అవగాహన ఉంటోందని, కాకపోతే వాళ్లకున్న అపోహలు పోగొట్టి, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు చెప్పడం, ముఖ్యంగా శరీరం మీద పూర్తి అవగాహన కలిగించడమే తన లాంటి వాళ్ల పని అన్న మిషెల్ మాటల్ని అందుకుంటూ,

“మా లాంటి పేరెంట్స్ గురించి చెప్పాలంటే, వేరే సబ్జక్టులలో వాళ్ళు ఎంత లోతు ప్రశ్నలు వేస్తే అంత సంబర పడతాం! ఇంకా చెప్పాలంటే,  సెకండ్ గ్రేడ్ కూడా కాకుండానే వాళ్లని రొబోటిక్స్ క్లాస్ లో పెట్టాలని ఉబలాటపడుతుంటాం, వాళ్ళు ప్రపంచంలోని విఙానాన్ని అంతా  అవపోసన పట్టేయ్యాలని కలలు కంటాం కానీ, వాళ్ళ శరీరం మీద, పుట్టుక మీద వొచ్చే ప్రశ్నలు ప్రాధమికమైనా ఎందుకో తడబడతాం. బహుశా, వయసొచ్చినా కూడా  మేం పేరెంట్స్ తో మాట్లాడనివి, ఇప్పుడే ఈ పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీకేమో అనిపిస్తోంది” అంది.

అనిత మాటలని ఓపికగా విన్న మిషెల్,

కాలంతో పాటు పోక తప్పదంటూ, సింధు చిన్న పిల్ల కాబట్టి,  తను విన్నది మార్చకుండా చెప్పిందని తన అంచనా అని,  సాధ్యమయినంత వరకు తన సందేహాలు తీర్చి, నమ్మకాన్ని పెంచుకోవడమే ఉత్తమమనీ, సింధు వైపు నుంచి చూస్తే ఇదో భధ్రమైన మార్గమని సలహా ఇచ్చింది.

“ఈ అమెరికాలో,  ప్రతిదీ భూతద్దంలో చూడటం ఆలవాటు, అన్ని వివరాలు పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది?  చేసే అల్లరి పనులన్నీ హార్మోన్ల పేరు మీద నెట్టేసే టీనేజ్ పిల్లల ధోరణి వింటున్నప్పుడు, ఎక్కువగా తెలిసిపోయి ఈ పైత్యం అంతా ప్రదర్సిస్తున్నారు అనిపిస్తుంది. మీరు మరోలా అనుకోవద్దు, మరో రెండు సంవత్సరాలలో  సింధుని మీ క్లాసుకి పంపాలంటే,  ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉందన్న” అనితతో,

స్కూల్ లో “ఫ్యామిలీ లైఫ్” తప్పని సరిగా తీసుకోవాల్సిన సబ్జక్టు కాదని, పైగా సిలబస్ ప్రకారం నాలుగైదు ఏళ్ళు చెపుతామని,  ఇండియన్సే కాదు, ఈ క్లాస్  వొద్దనుకునే తల్లిదంఢ్రులు,  చాలా మందే ఉంటారని చెప్తూ,  శరీరాల్లో మార్పులు వొచ్చేటప్పుడు పిల్లల్లో ఆందోళన అధికంగా ఉంటుందని,  అందుకే దాదాపు ఐదో తరగతికే ఈ పాఠాలు మొదలుపెడతారంది.  ఒక టీచరుగా, పిల్లలు ఏదైనా ప్రశ్న వేసినపుడు లేదా వేయగలిగినపుడు, దానికి సమాధానాన్ని తెలుసుకోవడానికి వారు సిద్దంగా ఉన్నట్టు భావిస్తానంది మిషెల్.

ముఖ్యంగా కాలిఫోర్నియాలో, టీనేజ్ పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు మెడికల్ రికార్డులు కూడా చూడలేనటువంటి చట్టాలు వున్న ఈ రోజుల్లో,  శరీరం మీద అవగాహన ఉండటం వాళ్లకి  ఎంతో అవసరమని వివరిస్తూ, తోటి పిల్లల వొత్తిడి ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో, సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన పిల్లలకి ఉంది అనే భరోసా తల్లిదండ్రులకి చాలా మనశ్శాంతి నిస్తుందనే  కోణంతో పాటు, టీనేజ్ లో  ప్రగ్నన్సీకి  అవగాహన లేకపోవడమే సగం కారణమనేది తన అభిప్రాయంగా చెప్పింది.

ఆమె అభిప్రాయాల్ని శ్రద్దగా విని,
అఖరి మాటగా,
మళ్ళీ ఇలాంటి  ప్రశ్నలడిగితే, ఐదో తరగతిలో మీ టీచర్లే నీ ప్రశ్నలకి సమాధానాలిస్తారని సింధుతో చెపుతానంది   అనిత.

దానికి సమాధానంగా,

పిల్లల సంఘర్షణలకి తొలి వేదిక చాలా వరకు ఇల్లే అవుతుందంటూ,  గమనించి, అర్ధం చేసుకుంటే చాలా సమస్యలు అక్కడే తీరిపోతాయని, తోటి మనిషికి, వారి భావాలకి ఇవ్వాల్సిన విలువ, అలాగే ఇతరుల నుంచి తాము ఎటువంటి ప్రమాణాలు ఆశించాలి అనేది  పిల్లలు చాలా భాగం ఇంటి నుంచే నేర్చుకుంటారంది మిషెల్.

సమయం మించిపోవడంతో, కృతజ్నతలు చెప్పి, శలవు తీసుకుంది అనిత .

‌రెండు వారాల తరువాత,

ఓ రోజు, స్కూలు నుంచి వొస్తూనే, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అమెజాన్ మెయిల్ కవర్ చూసి, ఏం ఆర్డర్ చేసావని అడిగింది సింధు.

మనిద్దరి కోసం పుస్తకాలు, నువ్వొచ్చిన తరువాత ఓపెన్ చేద్దామని ఆగానంది అనిత.

“మనిద్దరికీ పుస్తకాలా?! “

తల్లి వంక విచిత్రంగా చూసింది సింధు.

కూతురిని దగ్గరికి తీసుకుని,

“ఇంత కాలం నీతో అనలేదు కానీ,

నీ వయసులో ఉన్నప్పుడు నాక్కూడా బోలెడన్ని సందేహాలు వొచ్చేవి. కానీ వాటిలో సగం ప్రశ్నలు ఎవర్ని అడగాలో, అసలు అడగచ్చో లేదో కూడా తెలిసేది కాదు.  అమ్మానాన్నల్ని అడిగి, వాళ్ళు చెప్పిన వాటిని మాతో పంచుకున్న స్నేహితులూ తారసపడలేదు.  దాంతో తోటి పిల్లల మధ్య అదో పెద్ద సమస్య కాలేదు,

ఒకటి మాత్రం ఒప్పుకుంటాను, తెలియని విషయాలు చాలా ఉండేవి! మీ నాన్న కూడా ఇదే మాట అన్నాడు!

ఈ మధ్య,  ఇద్దరం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు అర్ధం అయిందేమిటంటే,  నీకు ఎదురయ్యే ప్రశ్నలకి, నువ్వు పెరుగుతున్న పరిసరాలకి,

మా చిన్నతనానికి,

మధ్య చాలా అంతరం ఉందని, దానిపై మాకు ఇంకా పూర్తి అవగాహన లేదని.

మీరందరూ ఎవరికి ఏం తెలుసు అని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు చూశావా అది మాకు చాలా కొత్త, అందుకే మా సమాధానాలు నీకు సరిపోవడం లేదు!

ఇక మేం చెయ్యాల్సిందల్లా,  నీ వేగాన్నిఅందుకోవడమే!

బాగా అలోచించి, అమ్మాయిల కోసం రాసిన అమెరికన్  గర్ల్ సిరీస్ బుక్స్ కొన్ని, అలాగే  నీ లాంటి పిల్లలు ఇక ముందు అడిగే ప్రశ్నల కోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు కొన్నాను. కొన్ని ఇద్దరం కలిసి చదువుదాం, మిగతావి నేను చదువుతాను, ముందు ముందు నీకేమయినా సందేహాలొస్తే వివరంగా మాట్లాడుకుందామని, అవసరమైతే నాన్న కూడా సాయం చేస్తాన్నాడ”ని చెప్పింది.

నమ్మలేనట్టుగా చూసి,

ఇంతలోనే తేరుకుని,

అమ్మకి ఆనందంగా హగ్ ఇచ్చిన సింధు,

కొన్నిటి గురించి, బయటి వాళ్లని అడగటం చాలా కష్టం అంటూ మనసులో మాట చెప్పింది.

సింధు చేయి తన చేతిలోకి తీసుకుంటూ అనిత ఇచ్చిన భరోసా,

“ I know ! “

ఎస్. హిమబిందు

 

 

మీ మాటలు

 1. Asalu we story enduku rasaro nakaithe emi artham kavatle..rachayithala sontha jeevithallonchi puttinda idi ani pistondi..pity…

 2. నరహరి says:

  ఇప్పటి పాశ్చాత్య, ప్రాచ్య సమాజాల నూతన యవ్వనారంభంలో వున్న ఆడపిల్లల తల్లిదండ్రులు తమ తరాల అంతరాలని మరచి, తమకంటే మెరుగైన జీవితాన్ని తమ పిల్లలకి అందించాలంటే ఈ కథలోచెప్పినట్లు తెరలు తొలగించుకుని సంభాషించడం ఎంతో అవసరం. తమ శరీరం, తమ ప్రవర్తన గరించి పిల్లలే కాదు తల్లిదండ్రులే తెలుసుకోవలసిన విషయాలెన్నో. అవి తమ చిన్నతనంలో తెలిస్తే ఇంతకన్నా మెరుగ్గా బ్రతికేవాళ్ళమని తల్లిదండ్రులకి అవగాహన వుండడం ముఖ్యం.

  “సమ్మర్ హిల్” ఎ.ఎస్.నీల్ ని రచయిత్రి చదివేవుంటారని ఆశిస్తాను.

  • ధన్యవాదాలు నరహరి గారు, “సమ్మర్ హిల్” ఎ.ఎస్.నీల్ పుస్తకం నేనింకా చదవలేదు. ఇక చదువుతాను. మంచి పుస్తకం గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు.

 3. చందు తులసి says:

  అవును మన పిల్లలకీ అన్నీ ఇవ్వాలని ఆరాటపడే మనం… కొన్ని విషయాలు అసలు పట్టించుకోము. వాళ్ల సందేహాలు మనం కాక ఇంకెవరు తీరుస్తారు.. బావుంది.

  చదివించేలా రాశారు మేడమ్. మరిన్ని మంచి కథలు రాయాలి.

  • ధన్యవాదాలు చందు తులసి గారు.

   “వాళ్ల సందేహాలు మనం కాక ఇంకెవరు తీరుస్తారు.. ?” ఎంత నిజం !
   వేరే ఎవరైనా తీరిస్తే ? అనేది ఆందోళనకారమే …
   కద్దలు రాయడానికి కొత్త అనే చెప్పాలి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు!

 4. Mahendra Kumar says:

  ఒక మాతృ మూర్తి సంవేదన ,సంఘర్షణ చాలా సహజంగా చిత్రీకరించిన రచయిత్రికి అభినందనలు . ప్రాయికంగా పిల్లలు కుతూహలం కలవారు ,వారి సందేహాలు నివృత్తి చేయకపోతే curiosity ఇంకా పెరుగుతుంది మిషెల్ పాత్ర సరిగ్గా వివరించినట్టే , తీవ్రమైన నేటి సమాచార విప్లవంలో పిల్లకు శారీరక మార్పులపట్ల సరిఅయిన అవగాహన కల్పించడానికి పేరెంట్స్ సమకాలీనంగా ఆలోచించాల్సిందే .

  • ధన్యవాదాలు మహేంద్రకుమార్ గారు.

   మీరు చెప్పినట్టు “పేరెంట్స్ సమకాలీనంగా ఆలోచించాల్సిందే ” అనేదే సమాధానంగా నాకనిపించింది.

 5. ​సుందరం​ says:

  >>”ఈ మధ్య, ఇద్దరం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు అర్ధం అయిందేమిటంటే, నీకు ఎదురయ్యే ప్రశ్నలకి, నువ్వు పెరుగుతున్న పరిసరాలకి,

  మా చిన్నతనానికి,

  మధ్య చాలా అంతరం ఉందని, దానిపై మాకు ఇంకా పూర్తి అవగాహన లేదని.

  మీరందరూ ఎవరికి ఏం తెలుసు అని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు చూశావా అది మాకు చాలా కొత్త, అందుకే మా సమాధానాలు నీకు సరిపోవడం లేదు!

  ఇక మేం చెయ్యాల్సిందల్లా, నీ వేగాన్నిఅందుకోవడమే!”<<

  దీన్నే మనం "అట్నుంచి నరుక్కు రావడం" అంటాము. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కేవలం "మన" వైపునుండే కాకుండా అవతలివైపు నుండి కూడా ఆ సమస్యని అర్థం చేసుకుంటే తప్పకుండా ఇలాంటి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. దీన్ని 'కథ' అనే కన్నా ఒక సున్నితమైన సమస్యకు సులభమార్గం చూపిన విధానం అనుకోవచ్చు. రచయిత/త్రి కి ధన్యవాదములు.

  ​సుందరం​

  • ధన్యవాదాలు సుందరం గారు.

   మీ పరిశీలన చాలా బాగుందండీ,

 6. తరాల అంతరాల సంఘర్షణల అవగాహన ను పెంచే వాస్తవిక సందర్భాన్ని చాలా బాగా
  అక్షరీకరించారు హిమబిందుగారు ..అమెరికాలోని తెలుగు తల్లి తండ్రులు టీనేజ్ పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సున్నిత మైన సమస్య . అనిత బుక్స్ తెంపించుకొని ఈ తరం పిల్లల తల్లి గా మారే ప్రయత్నం … చాలా మంచి సందేశాత్మక ముగింపు .

  • మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు P.విజయలక్ష్మిపండిట్ గారు. ఈ అంశానికి సంబందించి, గత పదిహేను ఏళ్లుగా నేను గమనించిన వాటిని, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా అని రాసే ప్రయత్నం చేశాను.

 7. ఎనిమిదేళ్ల పాప కోసం అమ్మ కొత్త పుస్తకాలు తెప్పించుకుని చదువుకోబోవడం మంచి మార్పు.
  కథ బావుందండి – అభినందనలు.

  • Himabindu says:

   మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు లలిత గారు .

 8. sravanthi says:

  చాలా బావుందండి …కామెంట్స్ చదువుతూ ఉంటె ఒక కొత్త పుస్తకం తెలిసింది కూడాను :)

మీ మాటలు

*