ఆ హేమంత ఋతు గానం వినిపిస్తోందా?!

konni sephalikalu

 

మార్గశీర్ష మాసం, అందులోంచి కొన్ని రోజులు గడవగానే పుట్టుకొచ్చిన ధనుర్మాసం. ఇప్పటికీ ఆకాశవాణి తెలుగు కేంద్రం వాళ్ళు గోదాదేవి పాశురాల రూపంలో శ్రీరంగనాధునికి చేసుకున్న విన్నపాలను ప్రతీ ఉదయం వినిపిస్తూనే ఉన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేట తెలుగు మాటల్లో.  ఈ ఉదయం కళ్ళు తెరిచే లోపే రేడియోలోంచి ఆ పాట  మంద్ర మధురంగా చెవులకేకాక శరీరమంతటికీ వినిపించింది.

“చీకాకు పడకు, చిడుముడి పడకూ ! నీ కరుణవినా నాకేమున్నది చెప్పూ” అంటూ మొదలయిన గీతం. కృష్ణుడి మీద ఎందుకు గోదకి అంత పిచ్చి ?! ఒక్క గోదాదేవి కేనా ?

హై స్కూల్ రోజుల్లోనే జయదేవుడు పరిచయమయ్యాడు “యాహి మాధవ, యాహీ కేశవా, మావద కైతవ వాదం” అంటూ అష్టపదుల రూపంలో.  కృష్ణుడు కితవుడే, మోసగాడే. ఓ మాధవా! మోసపు మాటలు లేదా దొంగ మాటలు చెప్పకు అంటుంది రాధ.  ఇలా దొంగమాటల మోసకారిని ప్రేమించి ఆ రాధ ఎందుకు ఎప్పుడూ ‘విరహం’ లోనే వేగుతుంది.  జయదేవుడి గీత గోవిందం నిండా ఈ ‘విరహం’ అన్న పదమే పలుమార్లు వినిపిస్తూ ఉంటుంది. కృష్ణుడితో  ఉన్నదంతా విరహమే. చెప్పిన సమయానికి రాడు, ఎన్నడూ.

“కధిత సమయేపి హరి అహహ న యయౌ వనం, మమ విఫలం ఇదం అమల రూపమపి  యౌవనం” అంటూ గోల పెడుతుంది.  చెప్పిన సమయానికి వనానికి రాలేదు. ఈ అమల సుందరమయిన రూపమూ, యవ్వనమూ కుడా విఫలమయిపోయాయి అని వాపోతుంది. “యదను గమనాయ నిశి  గహన మపి  శీలితుం, తేన మమ హృదయం ఇదం అసమశర కీలితం” అనీ గొడవ పెడుతుంది.  వస్తానని చెప్పిన ఆ సమయం ఏదీ-? అర్ధ రాత్రి.  ఎవడి కోసమయితే ఎంత కష్టమయినా చిమ్మ చీకట్లలో, (నిశి అన్న మాట వాడేడు కవి.)  వెతుక్కుంటూ పోయేనో వాడి వల్లే నా హృదయాన్ని ఇపుడు మన్మధుడు తూట్లు పొడుస్తున్నాడు.  అనీ ఘోష పెడుతుంది.  ఇలాంటి వాక్య నిర్మాణ ప్రయోగం జయ దేవుడి లాంటి సంస్కృత కవుల నించే  ఇప్పటి సినిమా రచయితల దాకా వచ్చింది (ఎవడు కొడితే… ) ఇలా ఇప్పుడు వేధించి, విరహించి, చంపే కృష్ణుడంటే రాధకు ఎందుకంత ఇష్టం ?!

అసలు జయదేవుడే రాధ.  మన గజల్ కవుల్లా జయదేవుడి ప్రతి అష్టపదిలోను చివర అతని పేరు రాసుకుంటాడు. “జయదేవ భణిత మిదం”, “జయదేవ కవి రాజ రాజే” అంటూ.  కాని గీతాలన్నింటా అతనే నిండిపోయాడు.  రాధ పలవరింతలూ, పులకింతలూ అతనివే. ‘యా రమితా వనమాలినా’ ఎవరైతే వనమాలితో ఆనందోన్మాదంలో ఉందో ఆమె సజల జలద సముదాయాలను చూసి  పూర్వంలా తపించడం లేదు అని రాస్తాడు.  “సజల జలద సముదయ రుచిరేణ దహతినసా మనసిజ విశిఖేన “  ఆ రాధ నల్ల మబ్బులు చూసి మన్మధ బాణాల చేత కాల్చబడడం లేదు . ‘న దహతి’  అన్న మాట తెలుగు చెయ్యడం కష్టం.  అతను చెంత ఉంటె ఇక ఏవీ బాధించ లేవు.  ప్రపంచమే తెలియదు.  ఎందుకు జయదేవుడికి మాత్రం ఇంత “లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరాల్లాంటి” పదాల అల్లికలతో ఇన్ని గేయాలు గుండెలోంచి ప్రవహించాయి.  ఆ ‘కందర్ప జ్వరమేదో’ అతనికీ రాధకు లాగే ఒళ్లెరగకుండా కాసింది.  అప్పటికీ ఇప్పటికీ కూడా జయదేవుడిని వింటే అలాంటి జ్వరాన్ని మనమూ ఎంతో కొంత అనుభవించక తప్పదు’ అయితే ఈ కృష్ణుడు నిజంగా దొంగ కృష్ణుడే.

tiru1

పాపం పోతనగారి రుక్మిణి కూడా ఇలాంటి ఎదురు చూపుల సందేహంలోనే పడింది. “ఘనుడా భూసురుడేగెనో”… “విని కృష్ణుండిది తప్పుగా తలచునో, విచ్చేయునో,…. నా భాగ్య మెట్లున్నదో అంటూ,” ఎందుకు వీళ్ళందరూ ఇతని కోసం ఇలా అలమటించేరు – ? అతనిలోని ఆ ఆకర్షణ ఏమిటి ? ఎందుకలా పిచ్చిగా ఆరాధించాలనిపిస్తుంది ?

ఆ అసలు కృష్ణుడు నాకు భారతంలో దొరికాడు.  నిగ్రహమూ ప్రేమా కలగలిసిన కృష్ణుడు అతను.  ఓపిక పట్టడం తెలిసిన వాడు. అదను కోసం ఎదురు చూడడంలో ఏమరుపాటు లేనివాడు.  అలాంటి కృష్ణుడిని తప్ప మరెవరిని ప్రేమిస్తాం అనిపించేలా,పై ప్రశ్నలకి జవాబులా.

అరణ్యవాసం తర్వాత అజ్ఞాత వాసం చివర, సంధికి వెళ్లబోయే ముందు కృష్ణుడు ఒక్కొక్కరి అభిప్రాయమూ అడుగుతాడు.  పాండవులు అయిదుగురూ చెప్పేక ద్రౌపది దగ్గరకొచ్చి ఆమెను అడగ్గానే ఆమె ఆ సమయం  కోసమే చూస్తున్నట్లు పులిలా గర్జిస్తుంది.  ఇంచుమించు అయిదుగురు భర్తల్నీ మాటలతో చీల్చి చెండాడుతుంది.  ఇక మాట్లాడి మాట్లాడి అలిసిపోయి తన అవమానం తల్చుకుని భోరుమని ఏడుస్తుంది.  అంత వరకు కృష్ణుడు పెదవి విప్పడు.  మౌనంగా వింటాడు.  చివరకు “ఎలుగు రాలు పడ నేడ్చిన యాజ్ఞసేనిన్ కృపాయత్త చిత్తుండయి నారాయణుండురార్చి” అని రాస్తారు తిక్కన గారు.  గొంతుకు ఆర్చుకుపోయేలా ఏడ్చేదాకా మాట్లాడకుండా, చెప్పినదంతా విని అప్పుడు మాట్లాడుతాడు.అలా ఆమె బాధ అంతా బయటకు పోవాలి . “మ్రుచ్చిర నేల ఏ గలుగ ముద్దియ” అని మొదలు పెడతాడు. ‘ఏ గలుగ’ అంటే ‘నేను ఉండగా’ అని.  ఇది చిన్నమాటగా కనిపిస్తున్న చాలా పెద్ద మాట.  ఓ అమాయకురాలా! నేను ఉండగా నువ్వు ఎందుకు ఇలా అలజడి చెందుతావు అని.  ప్రతి మనిషీ, ముఖ్యంగా స్త్రీలు ఇలా అనే వాళ్ళ కోసం తమకు తెలీకుండానే ఎదురు చూస్తారు.  అన్ని వేళలా అలాంటి తోడు ఉంటే  ఇంకేం కావాలి ? అలాంటి వాళ్ళని పిచ్చిగా ప్రేమించకుండా ఉండగలమా ?

ఊరికే అనడం కాదు.  తను ఆమె కోరుకున్న విధంగా సాధించబోయే కార్యం గురించి కూడా చెప్తాడు.  నువ్వు భయ పడినట్లుగా కౌరవులతో సంధి జరగదు.  యుద్దమే జరుగుతుంది.  ఈ ధర్మరాజే పంపగా వృకోదరుడు, వివ్వచ్చుడు (నిర్విరామంగా బాణాలు వేయగల అర్జనుడు) తోడురాగా శత్రునాశనం చేసి తిరిగి వస్తాను అలాంటి ‘నేను’ ఉండగా అని చెప్పిన కృష్ణుడు ద్రౌపదికి ఒక్క దానికే చెప్పలేదనిపిస్తుంది.  ఎవరు అతని ముందు తమ దుఃఖమంతా చెప్పుకుని ఏడ్చినా అదంతా శ్రద్ధగా విని ‘ఎందుకీ దుఖం నేనుండగా’ అని అంటూ ఉంటాడనిపిస్తుంది.టాగూర్ లా అతను మన కూడా ఉన్నాడని నమ్మగలగాలే గాని .

దీన్ని ముక్కు తిమ్మన పట్టుకున్నాడు.  పారిజాత పువ్వుకోసం సత్యభామ ఇలాగే ఏడుస్తుంది.  పువ్వు వల్ల  జరిగిన అవమానానికి కూడా. ఆ అవమాన భారం ఆమె గుండెల మీంచి దిగే దాకా ఆమె మాటలూ చేతలూ సహిస్తాడు ఆ మాయదారి కృష్ణుడు.  అంతా అయ్యాక ఆమె వడలిని మొహం మీద కొంగు కప్పుకుని కోకిల కంఠంతో ఏడ్చింది. అప్పుడు మాట్లాడేడు. “ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక ఇంత వంత నీ కేల లతాంత మాత్రమునకే గలుగ” అంటూ. ఏడ్చి ఏడ్చి మొహం వడిలిపోయింది. ఆభరణాలు లేవు. మాసిన చీర. కాని ఆమె నొక్కుల జుట్టు మాత్రం లలితమయిన ఇంద్ర నీల మణుల మెరుపుతో ఉందట.  అలాంటి అందమయిన కేశ రాశితో వెలుగుతున్నదానా ! నేనుండగా ఒక్క పువ్వు కోసం ఇంత వంత నీకెందుకు ? అని.  ఇక్కడ కూడా మళ్ళీ కృష్ణుడు అదే అన్నాడు ‘నేనుండగా’ అని . అదే భరోసా.  తిక్కన గారి కృష్ణుణ్ణి నంది తిమ్మన బాగా అర్ధం చేసుకున్నాడు.

ఇక్కడ కూడా ఊరికే ‘నేనుండగా ఇంత బాధ ఎందుకు ?” అనడం లేదు.  ఆ  బాధ ఎలా పోగొడతాడో చెప్తున్నాడు. “అనికిన్ బలసూదనుడెత్తి వచ్చినన్… ఇట తెచ్చెద నిచ్చెద పారిజాతమున్” “సాక్షాత్తు ఇంద్రుడే యుద్ధానికొస్తాడు.  ఎందుకంటే ఆ చెట్టు ‘నందనం’ అనే అతని తోట లోది.  అయినా ఇక్కడికి తెచ్చేస్తాను.  మన పెరట్లో ఎక్కడ నాటాలో ఆ చోటు చూసిపెట్టుకో” అంటాడు. చేస్తాడు కూడా.

అభిమానవంతులయిన ఆడవాళ్ళకు వస్తువులు కాదు కావలసినది.  తమ అవమానాల బాధల గాధలు ఓర్పుతో, శ్రద్ధగా వినే పురుషులు కావాలి.  అంతా విన్నాక నేనుండగా నీకెందుకీ బాధ అని ఎవరు చెప్తారో వారే ప్రియతములు.  అందుకే అలాంటి వారిని గురించి “సా విరహే తవ దీనా” అని జయదేవుడు రాస్తాడు.  ఆమె నీ విరహంలో ఉంది కృష్ణా,  అని ఎనిమిది చరణాల నిండా నిండి పోయేలా పాడతాడు. “వ్యాళ నిలయ మిళనేన గరళ మివ కలయతి మలయ సమీరం” అంటాడు.  మలయ పర్వతం మీద ఉన్న గంధపు చెట్లకి పాములు చుట్టుకుని ఉంటాయి.  వాటి గరళం ఆ గాలిలో కలిసినట్టుగా ఆమె మలయ సమీరానికి ఖేద పడుతోంది.  ఇదంతా నీ విరహం వల్లనే అని జయదేవుడు రాస్తే కృష్ణుడంటే ఏమిటో తెలియపోతే ఆమె వ్యధ గానీ, ఆ కవిత్వం గాని ఏం అర్ధమవుతాయి.

చాలా పై స్థాయి ఎగ్జిక్యుటివ్ లాగ కృష్ణుడు ‘సమయానికి తగు మాటలాడును, మాటలాడకుండును’అన్నట్టు ఉంటాడు.  పోలిక బావులేదు గానీ మన కళ్ళ ముందు ఉండే  ఉపమానం అదే కదా ?శిశుపాల వధ దగ్గర సరే  చివరి దాకా మాట్లాడడు.అది అందరికీ తెలిసిన కథే. అంతకు ముందే  ద్రౌపదీ స్వయంవరానికి బ్రాహ్మణ వేషాల్లో వచ్చిన పాండవులను చాలా ముందుగా గుర్తుపట్టినవాడు కృష్ణుడొక్కడే.  వీళ్ళు ఈ వేషాల్లో నివురు కప్పిన అగ్నికణాల్లా ఉన్నారనుకుంటాడు.  పక్కనే ఉన్న అన్న బలరాముడితో కూడా అనడు. కృష్ణుడు భగవదవతారం అన్న మాట పక్కన పెడదాం.  చనిపోయిన అయిదుగురు ఆప్తులు ఒక్కసారిగా బతికి ఉండి  కనిపిస్తే ఎవరితోనూ పైకి అనకుండా ఉండడం ఎంత కష్టం.  కానీ అది పైకి మాట్లాడే సందర్భం కాదు.  మాట్లాడితే రసాభాస అవుతుంది.  స్వయంవరం పూర్తయ్యాక అక్కడొక యుద్ధం జరిగే పరిస్థితిలో బలరాముణ్ణి ఆపడానికి అప్పుడు నోరు విప్పి చెప్తాడు.  ఒక్కసారిగా అంతా తెలిసి కూడా ఆ సందర్భంలో అలా మౌనంగా కూర్చున్న కృష్ణుడి నిగ్రహం చూస్తే, దాని వెనక ఉన్న పాండవుల మీది ప్రేమ చూస్తే మనకి కృష్ణుడు ఎంత ఆరాధ్యుడవుతాడు!!

tiru2

చివరి గా ఎస్ .ఎల్.భైరప్ప అనే ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత తన పర్వ నవల లో కృష్ణుడి విజయ రహస్యానికి చెందిన ఒక సంఘటన ను ఎంతో వివరంగా రాస్తాడు .అది చెప్పేది కాదు.చదివి తీరవలసిందే. జరాసంధుడి బాధలు పడలేక, వాడిని జయించ లేకా కృష్ణుడు యాదవులందరినీ తీసుకుని రాజ్యం వదిలి పారిపోతాడు .అంతమందిని రక్షించడం కోసం పారిపోవడం అవమానం అనుకోడు. ఎక్కడో సముద్ర తీరాన ద్వారకానగరం కట్టుకుని దాక్కుంటారు. హాయిగా ఉన్నారు గనక అందరూ పాత ఓటమి తాలూకు అవమానం మరచిపోయారు .కానీ కృష్ణుడు మరచిపోడు.ఓర్పు గా ఉండి అదను కోసం వేచి ఉంటాడు .తగిన సమయం రావడానికి చాలా కాలం పడుతుంది అప్పటిదాకా వ్యూహ రచన చెస్తూ ఉంటాడు .చివరకు జరాసంధుడి వధ మనకు తెలిసినదే . భైరప్ప గారు ఈ అధ్యాయమంతా సవివరంగంగా రాసి కృష్ణుణ్ణి ప్రేమించకుండా ఉండడం సాధ్యం కాదని తేల్చేసారు .

భాగవత కృష్ణుడు ప్రేమికుడు . జయదేవుడు ఆ కృష్ణుడి నే తెచ్చుకున్నాడు .”యది హరి స్మరణే సరసం మనో, యది విలాస కలాసు కుతూహలం ,మధుర కోమల కాంత పదావలీం ,శృణు తదా జయదేవ సరస్వతీం”.అని ముందే చెప్పుకున్నాడు.హరిస్మరణనీ ,విలాసకళనీ మధుర, కోమల, సుందర పదాలో కలిపి అందిస్తున్నాను . ఈ మధువు తాగండి అన్నాడు. ఇక భారత కృష్ణుడు బహుముఖీన చతురుడు,అసామాన్య మానవుడు

ఇతడే ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు .పన్నెండు నెలల లోనూ నేను ఈ మార్గశిరమాసాన్ని అన్నాడు.దీని తాత్వికార్ధం పెద్దలూ చెప్పాలి .నేను భావుకతార్ధం చెప్తాను .ఈ నెలలో వచ్చే చలికాలం మనుషులకు శరీర స్పృహను, తద్వారా త్వగింద్రియ స్పర్శను సున్నితం చేస్తుంది. అలా సన్నిహితం కూడా చేస్తుంది.ప్రేమికుడైన కృష్ణుడు ఈ నెలంతా వారిని ఆవహించి , విరహితం చెయ్యకుండా అత్యంత సన్నిహితమే చేస్తాడు .

ఇలా జయ దేవ కృష్ణుడు ,భారత కృష్ణుడు కలగలిసి చేసే హేమంత ఋతు గానం ప్రతీసారీ నిత్య నూతనమే,వినగలిగితే.

*

 

 

మీ మాటలు

 1. Mythili Abbaraju says:

  అద్భుతమండీ !

 2. varalakshmi says:

  సర్ హేమంత రుతు వర్ణన 10 వ తరగతిలో చదువుకొన్నాము అది ఉంటే పోస్ట్ చెయ్యండి. మా శ్రీవారు అది పాలకురికి సోమనాథ రచన అన్నారు కానీ అంతర్జాలం లో వెదికినా దొరక లేదు .

 3. sailajakallakuri says:

  బాగుందండీ ! హేమంతపు చిరు చలిని వేడిమి వెతుక్కునే చలిగా కాక విరహం తలచుకునే కాలం అని నేనెప్పుడూ నన్ను నేను నిందించుకుంటాను . ఓహో ఇదంతా కృష్ణ మాయ అన్నమాట . మహిలో శ్రీకృష్ణుడంత ప్రేమికుడు లభించడు సుమండీ … జయదేవ’గీతాలతో విరహం ,తిక్కన – తిమ్మన గార్ల బలమైన భరోసాల పట్టిక చెప్పి మమ్మల్ని గోదాకధలో వలె ఊరించి మురిపించారు . ఇందులో కృష్ణ తత్త్వం భక్తులకు . … ప్రేమికుడు ఎలావుండాలో అన్న స్త్రీ ఆంతర్యం పురుషలందరికీ తెలిస్తే హేమంతం వెల్లివిరిసినట్టే. ధన్యవాదాలతో …

 4. దేవరకొండ says:

  కృష్ణార్ణవం నుండి ఓ బిందెడు ఉదకాన్ని ఒడుపుగా తెచ్చి ఈ హేమంత శీతల మాసంలో మా దోసిళ్ళలో పోసిన వీరలక్ష్మీ దేవి గార్కి ధన్యవాదాలు! కృష్ణ ప్రియులకు చలి కూడా చెప్పలేని హాయినిస్తుంది!

 5. chinaveerabhadrudu says:

  చక్కటి అల్లిక. నమ్మదగ్గ వివరణ. సుమనోహర చిత్రణ.

 6. nanduri raja gopal says:

  ఎంత భావుక తన్మయత ….. మీ శీర్షిక హృదయాన్ని , బుద్ధిని ఏక కాలంలో శుద్ధి చేస్తాయి . అభినందనలు మరియు ధన్యవాదాలును…

 7. నరహరి says:

  ‘‘ఇక మాట్లాడి మాట్లాడి అలిసిపోయి తన అవమానం తల్చుకుని భోరుమని ఏడుస్తుంది. అంత వరకు కృష్ణుడు పెదవి విప్పడు. మౌనంగా వింటాడు. చివరకు “ఎలుగు రాలు పడ నేడ్చిన యాజ్ఞసేనిన్ కృపాయత్త చిత్తుండయి నారాయణుండురార్చి” అని రాస్తారు తిక్కన గారు. గొంతుకు ఆర్చుకుపోయేలా ఏడ్చేదాకా మాట్లాడకుండా, చెప్పినదంతా విని అప్పుడు మాట్లాడుతాడు.అలా ఆమె బాధ అంతా బయటకు పోవాలి .‘‘

  ఇదే మెళకువను భగవద్గీతోపదేశం ప్రారంభంలో కూడా కృష్ణుడు పాటిస్తాడు, పార్థుని ఆవేదనం, అజ్ఞానం అంతా బయటకి వచ్చిన పిదప మాత్రమే ఓ యాభైై, అరవై శ్లోకాల పిదప 2 అధ్యాయం 11 శ్లోకంలో ఉపదేశం మొదలుపెడతాడు. మధ్యలో దాదాపుగా నోరెత్తడు.

  మీరు మూల సంస్కృత భారత అనువాదం యథాతథంగా ఏ పదమూ కూడా తొలగించకుండా వున్నది ఎక్కడైనా లభిస్తే చదవవలసినదిగా మనవి. ఇప్పటికే చదివివుంటే సంతోషం.

  • Vvlakshmidevi@gmail.com i says:

   అవునండి. అతని పద్ధతే అది. Spoken skill అంటున్నారే ఇప్పుడు. మనకి అలా కూడా ఆయన ఆదర్శం. థాంక్యూ

 8. వారణాసి నాగలక్ష్మి says:

  వీరలక్ష్మి గారు, మీ వ్యాసం ఆద్యంతమూ మనోహరం!

 9. దేవులపల్లి వారన్నట్లు – కాలు చల్లదనాలో కనలు తీయదనాలో – ఆ కృష్ణుని పిల్లనగ్రోవి పిలుపులో.
  మీ వ్యాసం ఆ “నేటి రేయి” ని గుర్తుచేసింది. ధన్యవాదాలు.

 10. కృష్ణ ప్రేమ ను నింపుకున్న హేమంత ఋతు విరహ గానాన్ని పలికించి వీనుల విందుగా విన్పించారు .
  బాగుంది వీరలక్ష్మి గారు

 11. కె.కె. రామయ్య says:

  కృష్ణా.. ఏల స్వామీ దయమాలీ.. రేయి కన్నా నల్లనైన ఈ దీనురాలిని ఎగతాళి అని నీలాసుందరి విలపిస్తే
  కనులకు తోచేది కాదు సోయగము, మనసులో పూచేటి మధురిమ గానీ –
  నీ చెలులు చూసేది నీ బాహ్య మూర్తి, నేను వలచేది నా నీలలో దీప్తి
  అనేది కూడా కృష్ణ ప్రేమ తత్వమే కాబోలు కాకినాడ అక్కయ్య గారు. ధన్యవాదాలు.
  ( చెల్లెలి కాపురం సినిమాలో దేవులపల్లి వారి గీతం నుండి )

  • Vvlakshmidevi@gmail.com i says:

   రామయ్యగారూ
   శేఫాలికలు ఆఘ్రాణిస్తున్నారనమాట. ధన్యవాదాలు

మీ మాటలు

*