అస్తిత్వానికి ఇంకో కోణం!

                  pothuri          

అస్తిత్వం.

ఆ మాట అందరికీ వర్తించటం ధర్మం.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రాసేసుకున్నారుగా మీగురించే – ఇప్పుడక్కర్లేదులే అనటం అన్యాయం. చలనశీలమైన చరిత్ర లో కొత్త మనుషులు, వాళ్ళ సంగతులు- ఆ తర్వాత వాటిని తలచుకోవాలనుకునేవాళ్ళు – ఉంటూనే ఉంటారు.

90 లకి ముందర తెలుగు లో మనకు  ఆత్మాశ్రయ వచనం తక్కువ. ‘ అమరావతి కథలు ‘అమరావతి ని ఆశ్రయించుకున్నాయి గాని, ప్రత్యేకమైన మనుషులని కాదు. ‘ పసలపూడి కథలు ‘ దీ ఆ దారే. అది క్షేత్ర సాహిత్యం.

‘ పచ్చనాకు సాక్షి గా ‘ చదివి అందరం ఉలిక్కి పడ్డాం. నవ్వాం, ఏడ్చాం, జాలి పడ్డాం, కోపం తెచ్చుకున్నాం. ఆ తర్వాతి ‘ దర్గా మిట్ట కథలు ‘ – మరింకొంత ‘ సౌమ్యంగా ‘ అనిపిస్తాయి. అవీ బావున్నాయి . అంతకు ముందో ఆ తర్వాతో వచ్చిన ‘ మల్లె మొగ్గల గొడుగు ‘ . కథ ని మించి ఇతిహాసపు స్థాయి కి వెళ్ళబోయిన ‘ అంటరాని వసంతం ‘ ….

దర్గా మిట్ట కథలు  comfort zone  లో ఉండటం ఎక్కువనీ, పురాస్మృతులను romanticize  చేస్తున్నారనీ వచ్చిన విమర్శ కూడా నాకు తెలుసు. కావచ్చు. వేదన తోనో ఆగ్రహం తోనో మాత్రమే కాదు, ఇష్టం గానూ ముచ్చట తోనూ  కూడా  ఎవరి జ్ఞాపకాలను వారు రాసుకోవటం లో  తప్పు ఉందా ? ‘ ఎక్కువ కష్టాలను ‘ అనుభవించి ఉండకపోవటం అనర్హత అవుతుందా ? ” ఊహూ. నువ్వు అలా అనుకుని రాస్తున్నావు గాని జరిగింది అది కాదు, మాకు తెలుసు ” – అనేందుకూ వీలు లేదు. ఎన్నయినా దృక్కోణాలు ఉండవచ్చు –  ఉట్టిగా జ్ఞాపకాలనే పట్టుకుని ఎవరైనా తీర్మానాలు చేయబోతే అప్పుడు పేచీ పెట్టచ్చునేమో. నాకు తెలిసి , ఇటువంటి వాటి లక్ష్యమూ లక్షణమూ record  చేసి పెట్టటమే . తెలిసినదే రాస్తే దానిది సాధికారమైన  పరిమళం.

    సమగ్రమైన , విస్తృతమైన అధ్యయనం, తప్పని సరి గా పనిచేస్తుండవలసిన సహానుభూతి – ఇంకా చాలా కావాలి తీర్మానించటానికి.

ఈ  వర్గానికి మేము చెందుతాము, మా తీరూ తెన్నూ ఇదీ  అని రాసుకునే ధైర్యాన్ని కొద్దిగానైనా తెచ్చి ఇచ్చినవారు శ్రీ రమణ గారు. ‘ మిథునం ‘ పూర్తి గానూ, ‘ బంగారు మురుగు ‘ చాలా మేరకూ బ్రాహ్మణుల కథలు. ఇంకొక మంచి కథ ‘ ధనలక్ష్మి ‘ కూడా బ్రాహ్మణ, వైశ్య  వర్ణాల ప్రసక్తి లేకుండా సాగదు. భారత దేశం లో అప్పుడూ ఇప్పుడూ కూడా కులం ఉంది. ప్రతి కులం లోనూ రకరకాల ఆర్థిక స్థాయిలూ బౌద్ధిక పరిణతులూ ఉన్నా – సామాన్య ధర్మాలు గా కొన్ని గొప్పలు, కొన్ని తప్పులు , కొన్ని నడతలు, కొన్ని మమతలు .

ఒప్పుకోవటం లో సిగ్గు పడేదేముంది ? చెప్పుకోవటం లో అతిశయమేముంది ?

 అవును, నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయనే – 90 ల తర్వాత ఈ కథలు వచ్చాయి, అలాగే అనుకుందాం.

వ్యక్తిగతం గా నాకొక నేపథ్యం ఉంది. దానికీ కథ లోకి రావాలనే ఉబలాటం ఉంది.

 ‘ ఇల్లేరమ్మ కథలు ‘ – దాన్ని కొంత దగ్గరగా చూపించాయి . ప్రత్యేకించి ప్రస్తావించేందుకు రచయిత్రి వెనుకాడారేమోననిపిస్తుంది గాని,  అవి ఉద్యోగాలు చేసే మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు. మరి ముఖ్యం గా, పల్లెటూళ్ళని ముందు వదిలిపెట్టిన బ్రాహ్మణ శాఖ అయిన నియోగుల ఇంటి కథలు.

 ఆ తర్వాత వచ్చిన ‘ పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు ‘ – ఆవిడే చెప్పినట్లు ‘ పఠం ‘ కట్టిన బ్రాహ్మణ కథలు.[ వాక్యం లో రెండో భాగం ఆవిడ ది కాదు ]   పల్లెటూళ్ళవీ పట్నాలవీ – నా సొంత జిల్లా కథలు. నాకు తెలిసిన మనుషులే ఉన్న కథలు. Larger than life అనిపించే వాళ్ళవి.

 అసలు ఆ పేరు ఆ పుస్తకానికి పూర్తిగా తగదు. అందులో హాస్యం కానిది చాలా ఉంది.  హాస్యం మీద అఖండమైన గౌరవం  నాకు , అది కాదు ప్రశ్న. అవి ‘ హృద్యమైన ‘ కథలు. Feel good  అనే మాట కు తెలుగు ఏదో నాకు తెలియదు, ఇవి ఖచ్చితం గా అవే. ఈ feeling good  అనేది ముడుచుకు కూర్చోవటం కాదండీ, ‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ .  వీటిలో మనుషులకి చాదస్తాలు, వెర్రి బాగుల తనాలు , పిచ్చి పట్టుదలలు – ఉన్నాయి. ఇంకొకడికి తిండి పెట్టటాలూ అందుకు వాళ్ళు  చిన్నబుచ్చుకోకుండా నెపాలు కల్పించటాలూ, పెద్దవాళ్ళు లెమ్మని, ఇబ్బంది అవుతున్నా చూసీ చూడనట్లుండటాలూ , ఆ పని మనదో కాదో ఎంచకుండా చేసుకుపోవటాలూ – ఇవీ ఉన్నాయి. తృప్తి గా బతకటం ఉంది. శాంతం గా ఊరుకోవటం ఉంది.  అంతా అనుకునేట్లు వియ్యాల వాళ్ళకి మధ్యలో ద్వేషాలూ పగలూ కాదు –  గౌరవాలూ మర్యాదలూ – దాదాపు గా మనస్ఫూర్తిగానే – ఉన్నాయి. ఈ కథల కొత్త ముద్రణ లో ‘ జ్ఞాపకాల జావళి ‘ అనే సీరీస్ ని కలపటం లో చాలా ఔచిత్యం ఉంది.

MythiliScaled

  రేడియో మోగుతుంటే కూర్చుని వినకపోతే అది నొచ్చుకుంటుంది . కరెంట్ పెట్టించుకుంటే షాక్ కొడితేనో …కట్టుకున్న మొగుణ్ణి కర్ర తో ఎట్లా కొడుతుంది అమ్మమ్మ ? టేప్ రికార్డర్ ని చూసి ‘ జాగర్త, అది వింటుంది ‘ అని భయపడతారు . అదొక అమాయకపు కాలం.

చెన్నా పట్నం నుంచి వస్తున్నాం కదాని వియ్యపురాలికి ఇంగిలీషు కూరలు తెచ్చిపెడతాడు వియ్యంకుడు. మా మామ గారు అటువంటి వారు. మా అమ్మకీ ఆయనకీ మంచి rapport  ఉండేది. ప్రాణాంతకమైన వ్యాధి తో మా నాన్న గారు హాస్పిటల్ లో చేరినప్పుడు – రెండు నెలల పాటు మామ గారే ఆయనని కనిపెట్టుకు ఉండిపోయారు.  చూసేవాళ్ళు తండ్రీ కొడుకులనో అన్నదమ్ములనో అనుకునేవారు.

ఉంటారు అటువంటి మనుషులు – చూశాము .

  భుక్తి గడవని వితంతువు చేత అట్ల దుకాణం పెట్టిస్తారు తాతగారు. ఆయన తో మొదలెట్టి ఆఖర్న అమ్మమ్మ కీ అవి నోరు ఊరిస్తాయి. ఏ పనీ రాని సీతా రావమ్మ కి ఊరికే తింటున్నాననిపించకుండా గుళ్ళో పాటలు పాడే పని ఇస్తారు. అదీ రాదు ఆవిడకి. ” వసుదేవాత్మజ రామా , కైలాసవాసా శ్రీహరీ ”- అదీ ధోరణి. ఆ పాటలు వినలేక దేవుడు పారిపోయి ఉంటాడనుకుంటారు, వరుణ యాగం చేసినా వానలు పడవు. అన్నమూ నీళ్ళూ మానేసి ఆవిడ పాడుతూ కూర్చుంటే రాత్రి పది గంటలు దాటాక వర్షం కురుస్తుంది. ఎందుకైతేనేమీ, ‘ పిచ్చి దాని పరువు దక్కింది ‘ . అవును – ఎవరికి మటుకు పరువు ఉండదు ? సీతారావమ్మకి  అక్క  భ్రమరాంబ గారు. నీళ్ళు తెచ్చి పోసి బతుకుతుంది, ఇబ్బందొచ్చినా చుట్టాలొచ్చినా చేసాయం చేసి పెడుతుంది. మిగిలిపోయినవి ఇస్తే తీసుకోదు, పాత చీర ఇస్తే సున్నితం గా వద్దంటుంది. మర్యాద గా భోజనం చేయమంటే చేస్తుంది, కొత్త చీర ఇస్తే నోరారా దీవిస్తుంది. ఎవరి ఋణానా పడకుండా దాటిపోతుంది.

   అల్లుళ్ళ మీద పెత్తనం చేసే మామ గారుంటారు ఇందులో. వాళ్ళకి ఇష్టమైన సినిమా ని కాదని తాను మెచ్చిన దానికి టికెట్ లు కొని కూర్చోబెట్టి మరీ వస్తాడు. చండశాసనుడు. ఆయనకి అన్నం వడ్డిస్తుంటే వంటావిడకి వణుకు పుడుతుంది – కాని చేతికి ఎముక లేని మనిషి. తన వాళ్ళూ కానివాళ్ళూ అని చూసుకోని మనిషి. ఈ అన్ని  లక్షణాలనూ

సంపూర్ణం గా మా మాతామహులు పూండ్ల రామమూర్తి రావు గారి లో చూశాను – ఆయన ఎంచి పెట్టే  ‘ లవకుశ ‘ వంటి సినిమాల తో సహా. ఆడ పెళ్ళి వాళ్ళ పనులనీ నెత్తి మీదేసుకుని చేయించే తాత గారి కథ ‘ మగ పెళ్ళివారమండీ ‘ చాలా మంచి కథ. అటువంటి తాత గారు నాకూ ఉండటం ఒకటే కారణం కాదు.

‘ పీత మీద కూతుని పాత పాదే ‘ పండు గాడి కథ అక్షరాలా గొప్ప కథ.బాగా  అలవాటయిపోయిన ఆ చిన్న వెధవ ని ఎక్కడికో వెంటబెట్టుకు పోదామనుకుంటే,  ‘ నేను లాను బాబూ. నాతు బోలెదన్ని పనులున్నాయమ్మా. నేనూ మా అమ్మ ఈ లాత్తిలి మీ బావిలో దూతి తచ్చిపోవాలి ‘ అంటాడు వాడు. అది నిజమే అని రాబట్టుకున్న ఈ కుటుంబం పెద్ద , పండుగాడి నాన్న కి ఊడిన ఉద్యోగాన్ని ఇంకోచోట వేయించి పెడతాడు. చిన్నదే ఉద్యోగం- చాలు, బతికేందుకు. పైకి చదువుతూంటే మా ఇంటి పెద్ద కంట తడి పెట్టిన కథ ఇది మాకు. 1992 లో అన్యాయం గా ప్రభుత్వ ఆసుపత్రి

పని లోంచి తీసేసినవాడికి  సొంత డబ్బు నలభై వేలు [ఆ. లంచమే ] ఖర్చుపెట్టి , జిల్లా కోర్ట్ లో కేసు వేయించి

తణుకు నుంచి ఏలూరు పదిసార్లు తిరిగి,   ఊడిన ఉద్యో గాన్ని మళ్ళీ వేయించిన  Deputy civil surgeon, మా నాన్న గారు గుర్తొచ్చారు.

గుర్తు చేసుకోనివ్వండి.

 వారానికి రెండు రోజులే పల్లెటూరికి వచ్చే తపాలా బంట్రోతు . ఆ వేళకి అంతా అక్కడికి చేరి వచ్చిన ఉత్తరాలన్నీ ముందే చదివేస్తుంటారు.

మా గుంటూరి బ్రాహ్మణేతర  మాండలికాన్ని ఈ ‘ రంగడు వస్తాడు ‘ [ ” ఎండన పడొస్తాడు, అన్నం తిననివ్వండి ముందు ” ]  లో ప్రయత్నించారు రచయిత్రి.

” సోమయ్య బావకి,

బావుండావా ? మా చెల్లి పిల్లలు బావుండారా ? బావా మా కోడలికి ఈ మధ్యన వొళ్ళు బాగాలేదు. …….

                   లక్ష్ముడు వ్రాలు ” [ ఈ ఉత్తరమూ వియ్యంకుడు రాసినదే ]

చెల్లెలికి పెళ్ళి సంబంధమని కబురు, సీతాపతి మేష్టారికి. ” నా మొహం నాకేం తెలుసు ? నాన్నే ఉంటే…” అని కళ్ళ నీళ్ళ పర్యంతమవుతాడు.

” ఉంటే బాగానే ఉండేది. లేనంత మాత్రాన ఏదీ అగదు. నాన్న లేకపోతేనేం బాబాయి ఉన్నాడు, చెట్టంత మేనమామ ఉన్నాడు…..అంతా సానుకూలం అయితే పెళ్ళే చెయ్యలేకపోతావా ? నువ్వు ఊళ్ళో ఉన్నావుగానీ అడవి లో లేవు కదా. మేమంతా లేమట్రా ? ” అని గదమాయించే తాతగారికి అందరూ అవునవునని వంత .

శంకరమంచి సత్యం గారు గుర్తు రాలేదా ?

ఇటువంటి theme నే మరొక సంపుటం’ పూర్వి ‘  లోని ‘ సుఖాంతం ‘ , ‘ పుణ్యాత్మురాలు ‘ కథల్లోనూ రాస్తారు.

గాజుల బత్తుడు విడిపోయి బతుకుతూన్న అన్నా చెల్లెళ్ళ మధ్యన వార్తలు మోస్తుంటాడు. ఇద్దరూ ముసలివాళ్ళే, దక్షత చేజారిన వాళ్ళే. విషయం తెలిసి తక్కినవారు సరిచేస్తారు. ఇక్కడా కంట తడి. నిజమే, చాలా చోట్ల ఉంటుంది. అది శోకం కాదు , బాధ్యత.

అప్పటి రోజుల్లో ప్రతి ఇంటా  ఉండిన బ్రాహ్మణ విధవ లు రెండు కథల్లో వస్తారు. అందరినీ పిల్ల విజయలక్ష్మి  గారు సినిమా కి తీసుకుపోయే కథ మహా సరదా గా ఉంటుంది. ఆవిడ ముద్ర కనిపించేది మరొకదాని లో- ‘సభల  సంరంభం ‘

 నెహ్రూ పోయాక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ కాంగ్రెస్ సభలకి గుంటూరు వస్తుంది. కొత్త గా తండ్రి పోయిన ఆడపిల్ల అని, ఆవిడని ఇంటికి పిలిచి తీపి తో భోజనం పెట్టి చీరె పెట్టాలంటారు ఈ ముసలమ్మలు – కబురు అందిందనేవరకూ ఊరుకోరు. ” ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం వాళ్ళకీ బాధలూ బరువులూ ఉంటాయి. మనం పిలవటం మర్యాద. అంత వీలు కాకపోతే ఆవిడే రాదు. అంతే గానీ అసలు పిలవకుండా ఎట్లా ? ” –

చెప్పండి, నవ్వొక్కటేనా వస్తోంది మీకు ?

పనిమనిషి కి తను అధ్యక్షు రాలిగా ఉన్న మహిళామండలి లో ఉద్యోగం వేయిస్తుంది అమ్మమ్మ. ఆమె ఆ తర్వాత ఈవిడ పనిని నిర్లక్ష్యం చేస్తోందని ఉడుక్కుని పీకేయమని బీడీవో కి ఉత్తరం రాయిస్తుంది. అంతలోకే చల్లబడిపోయి, ” పాపం, వద్దులే .ఉద్యోగం ఊడగొట్టి ఆ పాపం మూట కట్టుకోటం ఎందుకు ” అని ఆ ఉత్తరాన్ని వెనక్కి పట్టుకొచ్చెయ్యమంటుంది. డెబ్భై దాటిన  మా అమ్మకి  ఇట్లాగే పిచ్చి కోపమొస్తుంటుంది, ఇట్లాగే తగ్గిపోతుంటుంది.

 లేనివారి  ఇంటి పెళ్ళికి హడావిడిగా  అరిసెలు డబ్బాలకెత్తే ఇల్లాళ్ళు, గొప్పింటి  స్నేహితురాలికి ,ఇంట్లోవాళ్ళు కొని ఇవ్వరని,  పుణుకులు కొనిపెట్టేందుకు కనకాంబరాలు పెంచి అమ్మిన బీద పిల్లలు – ఇక్కడ ఉన్నారు. ఉండేవారు.

పూర్వి సంపుటం లోని బాలరాజు కథ నాకు చాలా ఇష్టం. విజయవంతం గా హోటల్ లు నడిపే ఒకాయన పూర్వాశ్రమం లో గల్ఫ్ వెళతాడు, ప్లంబర్ ఉద్యోగానికి. అక్కడి వాళ్ళకి కావలసింది వంటవాడు . పొరబాటు జరిగిందని

తిప్పి పంపించేస్తే చేసి వెళ్ళిన అప్పులు ఎట్లా తీరతాయి ? అక్కడి ఆఫీసర్ పూనుకుని, అతనికి వంట నేర్పి నిలబెడతాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ వెళతాడు హోటల్ యజమాని. పూర్తిగా మతిమరుపు [ Alzheimer’s ? ]  వచ్చేసి ఉంటుంది , కాని ఆఖరికి గుర్తు పడతాడు- ” నువ్వు రాజప్పడివి కదుట్రా ! వంట నేర్చుకున్నావా మరి ? ” – ఇతను సంబరం గా ఏడుస్తాడు.

” అన్నీ అంత సులువు గా అయిపోతాయా ఏమిటి ? అసలు అలా జరిగే వీలెక్కడుంటుంది ? ”  – అని ఒక రచయిత్రి నన్ను ప్రశ్నించారు.

సులువే. జరుగుతాయి. చాలా సార్లు.

పెద్ద మనసు ఉంటే.

అంటే ఏమిటంటే నేను చెప్పలేను.

*

 

మీ మాటలు

 1. mani vadlamani says:

  చక్కటి విశ్లేషణ మైధిలి మీరన్నట్లు ఎవరి అస్తిత్వం వాళ్లదే! ఆవిడ ఙ్ఞాపకాల జావళి అద్భుతం/ ఆవిడ హాస్యమే కాదు కరుణ రసం కూడా అదే quotient

  లో రాస్తారు

  yevari asthitwam vallede . aavida ki rating iste aavida oka star writer avvida ni daggarga chudatam kalvatam maaku yeppudu o andamaina anubhooti.

 2. Varanasi Nagalakshmi says:

  చక్కని సమీక్ష. నా భావాలే మీ కలం ప్రకటించినట్టనిపించింది. నా అనుభవానికి రానిది జరిగే అవకాశం లేదని వాదిస్తారు కొందరు. బావికన్నా పెద్ద జలాశయం లేదని వాదించిన మండూకంలా. వితంతు పునర్వివాహం గురించి ‘ఎదురొచ్చిన ఆమని కథ’ రాస్తే అంత తేలిగ్గా జరిగే అవకాశం లేదన్నారు. పిల్లలున్న ఒంటరులిద్దరు అత్యంత సరళంగా పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు మా కళ్లెదురుగా! నవ్వుతూ బతికే వాళ్లకి కష్టాలుండవని కాదు కదా. వాళ్ళకి కష్టాలని నవ్వుతూ ఎదుర్కోవడం తెలుసనీ, ప్రేమతో స్పందించడం తెలుసనీ, జీవితాన్ని నిరాడంబరం, సరళం చేసుకోవడం తెలుసనీ చాలా మందికి తెలియదు.

  • నవ్వుతూ బతికే వాళ్లకి కష్టాలుండవని కాదు కదా. వాళ్ళకి కష్టాలని నవ్వుతూ ఎదుర్కోవడం తెలుసనీ, ప్రేమతో స్పందించడం తెలుసనీ, జీవితాన్ని నిరాడంబరం, సరళం చేసుకోవడం తెలుసనీ చాలా మందికి తెలియదు.
   Nagalakshmi garu, this is wonderful.

 3. మైథిలి గారు! ఇది మంచివారి గురించి రాసిన చాలా మంచి కథలని పరిచయం చేసిన బహు మంచి సమీక్ష. మీకు బోల్డన్ని ధన్యవాదాలు.
  ఇక్కడ నాకు తెలిసిన చాలా మంది మంచి వారి జీవితాల్లోంచి ఒక మంచి చిన్న సంఘటన.
  వూరి చివర గూడెం నుంచి చదువుకోవడానికి వచ్చే పాలేరు కుర్రాడు – చెప్పే ప్రైవేటుకి డబ్బులియ్యలేడని తెలిసి కూడా తెలివైనవాడు ఎలాగైనా పైకి రావాలని తన కొడుకుతో సమానంగా చదువు చెప్పిన మాస్టారు – అందరినీ నెల జీతం అడిగేవేళ వాడినీ అడక్కపోతే చిన్నబుచ్చుకుంటాడని – వాడినీ జీతం అడిగి – మా నాన్న ఇవ్వలేదండీ – అని చెప్తే – ఇవ్వకపోవడం ఏమిట్రా – నీ చొక్కా పై జేబులో వుంది, నువ్వు ఇవ్వడం మర్చిపోతే నన్నే అడిగి తీసుకోమన్నాడు – అంటూ ఆ జేబులో చెయ్యి పెట్టేవేళ కనిపించకుండా వేళ్ల మధ్య రూపాయిలు తనవే కనపడకుండా దాచి ఆ జేబు లోంచి తీసినట్లు తీసి ఆ కుర్రాణ్ణి కృతజ్ఞతా భారం నుంచి తప్పించిన మాస్టారు నాకు తెలుసు.

  ఇది చెప్తే నమ్మరు – కానీ ఆ మాస్టారు ఆ పిల్లాడిని గడపకవతల మాత్రం కూర్చోపెట్టారంటే మాత్రం “అవును – అవును – అంతే చేసుంటాడు – ఎంతైనా ఆ “కులం” కదా” అనేస్తారు – ఏకవచన ప్రయోగంతో.

  • ‘ ఎక్కువ కష్టాలను ‘ అనుభవించి ఉండకపోవటం అనర్హత అవుతుందా ?

   అస్తిత్వం. ఆ మాట అందరికీ వర్తించటం ధర్మం.

   These two lines enough. Chaala baga raasaru mythili garu.

  • Lalitha garu, idi ati chinna manchi katha. Well said.

 4. yaddanapudi kameswari says:

  చక్కగా సమీక్షించారు మైథిలి గారు. అభినందనలు.పొత్తూరు విజయలక్ష్మి గారికి కూడా నా అభినందనలు.

 5. c v Mohan rao says:

  Mythili Gari sameeksha adbhutam. Edo uha lokamlo viharinche kathalu kakunda mana jeevithalaki daggaraga unde kathalu rasi daniki kontha hasyam jodinchi patakulni akartukontunna prati rachayita dhanyulu. Saranga yajamanyalaku dhanyavadamulu

 6. Jalandhara says:

  .నిజం మైథిలి.ఆవిడ అంటే అందరికీ అభిమానం ప్రేమ.మీ సమీక్షలో ఆ పుస్తకం వెంటనే చదవాలి అనిపిస్తోంది.తెప్పించుకుని చదువుతాను.

 7. రామ్ ప్రసాద్ says:

  అద్భుతం గా రాశారు మైథిలి గారు !!

  నిర్వచనోత్తర పారాయణం !!

 8. Nageswara Rao Dandibhotla says:

  సమీక్ష చాలా బాగుంది మైథిలి గారూ!! నిజంగా మీరన్నట్లు ‘అస్తిత్వం’ అనే మాట అందరికీ వర్తించడం లేదు!

 9. Suresh Venkat says:

  చక్కని సమీక్ష … చాలా చాలా బాగుందండి

 10. prabhakar Rao ch v says:

  Sameeksha baagundhi

 11. Mythili Abbaraju says:

  మణి వడ్లమాని గారికి, వారణాసి నాగలక్ష్మి గారికి మనఃపూర్వకమైన ధన్యవాదాలు.
  నన్ను గమనించటం మానని అరుణ పప్పు గారికి ఆశీర్వచనాలు.
  టి.ఎస్. లలిత గారు చెప్పిన కథ , ఆఖర్న ఇచ్చిన విరుపు – చాలా బావున్నాయి.
  యద్దనపూడి కామేశ్వరి గారికి, సి.వి.మోహన రావు గారికి, జలంధర గారికి, దండిభొట్ల నాగేశ్వర రావు గారికి, సి.హెచ్ . వి. ప్రభాకర్ రావు గారికి, సురేష్ వెంకట్ కి – చాలా కృతజ్ఞతలు.
  రాం ప్రసాద్ గారి పదబంధం ‘ నిర్వచనోత్తర పారాయణం ‘ ఎంతో సంతోషాన్నిచ్చింది.
  ఈ వ్యాసానికి నా శీర్షిక ‘ సుఖినోభవంతు – సర్వేజనా ‘ అని. కొత్త శీర్షిక మరింత సూటిగా ఉంది, నిజమే.
  ఈ వ్యాసం కలిగించిన అన్ని ప్రకంపనలూ వచ్చిన అన్ని ప్రతిధ్వనులూ ఇక్కడే మాటల్లోకి రాలేదు , కాని , ఎక్కువే ఉన్నాయి. నా దృష్టినీ అభ్యర్థననూ పరిశీలించిన, పరిశీలించబోగల – మిత్రులందరికీ ఋణపడి ఉంటాను.
  ఈ వ్యాసం ద్వారా నేనొక బాధ్యతను తీర్చుకున్నాను.
  నమస్కారం.

 12. కె.కె. రామయ్య says:

  టి. ఎస్. లలిత గారు!

  డా. మైథిలి గారి వాళ్ళ నాన్న గారిలా; మీరు చెప్పిన పాలేరు కుర్రాడుకి తన కొడుకుతో సమానంగా చదువు చెప్పిన మాస్టారు గారిలా పెద్ద మనసు ఉన్న వాళ్ళ గురించి నాదో అసందర్భ ప్రస్తావన.

  నిరుపేద దళిత కుటుంబ నేపధ్యంలోంచి వచ్చి భారత రాష్ట్రపతి పదవిని అలంకరించే స్థాయికి ఎదిగిన శ్రీ కె ఆర్ నారాయణ్ గారి గురించి కూడా ఇలాంటిదే ఒకటి. ఎవరో ఇచ్చిన బట్టలు వేసుకుని తన చదువుకు ఆర్ధిక సాయాన్ని అభ్యర్ధించటానికి ట్రాంవాన్కూర్ మహారాజా వారి సంస్థానానికి వెళితే … ఒక దళితుడు ఇలా సిల్కు చొక్కాతో తనవద్దకు వస్తాడా అని కోపగించుకుని ఆర్ధిక సాయం నిరాకరించిన దివాన్ గారు ఒకరైతే … తన స్థోమతకు మించినదైనా భోజనం, బట్టలు, చదువుకు కావాల్సిన చిన్న చిన్న ఆర్ధిక సాయం చేసి కె ఆర్ నారాయణ్ ఆదుకున్న పేద బ్ర్రాహ్మణ ఉపాధ్యాయుడు మరో పక్క.

  దళితులకు రిజర్వేషన్స్ స్కాలర్ షిప్పులు లేని ఆ గడ్డురోజుల్లో నిరుపేద నారాయణ్ తాను ఎదుర్కొన్న పేదరికం, వివక్షత, చేదు అనుభవాల గురించి కాక తనకు సాయం చేసి ఆదుకున్న వారి పట్ల తన కృతజ్ఞతను మాత్రమే ప్రకటించే వారు ( జర్నలిస్టుగా పనిచేసిన కాలంలో గాంధీజీని ఇంటర్వ్యూ చేసిన నారాయణ్ ).

  కుల, వర్గాల అస్తిత్వం కంటే ఉన్నతమైనది మానవత్వ అస్తిత్వం అని అనోచ్చొ లేదో తెలియదు నాకు.

  ధన్యవాదాలు.

మీ మాటలు

*