… అంటే అనురాగమే కదా !

satya

Art: Satya Sufi

.
(Come Down, O Maid -Tennyson )

~
దిగిరా ఓ  రమణీ !
మంచు మలల వ్రజ భూములలో
ఏ అచల శోభ లున్నవని,
దూర గిరుల దారులలో
ఏ ప్రణయ గమ్యమున్నదని
తారాడేవు తరుణీ
పర్వత శ్రేణుల మీద !
చెట్లపై చిట్లిన కిరణాల మీద జారుతూ
సాగిపోకు సుమా స్వర్గ ధామాల కేసి.
నక్షత్ర దీప్తుల సుఖాసనానికి స్వస్తి పలికి
దిగిరా, దిగువ భూములకు;
హరిత లోయ అంటే అనురాగమే కదా !

నీవు వెదికే అతను
మరో ముంగిలి ముందు తాచ్చాడుతూనో
ఆనందాల సంపదలో తులతూగుతూనో
మధుర పానీయం మీద పొంగెత్తిన మత్తులా
రంగేళి రాజాగా మారిపోయి ఉండొచ్చు,
మధుకేళీ వలపు తోపుల తోవలలో
జిత్తుల మారి నక్కలా  మాటేసి  ఉండొచ్చు.

అతనికి
నీ మృత్యుసదృశ హిమగిరుల
రజత శృంగాల ఏటవాలు దారులలో
నీతో కలిసి నడవడం నచ్చక పోవచ్చు,
అతను నీకు చిక్కక పోవచ్చు.
కూలుతున్న ఆ హిమ సమూహాలలో
అతన్ని అన్వేషించడం మానేసి
దిగిరా ఈ లోయలోకి
గిరి ఝరిపై నడయాడే హిమ శకలంలా.
ఆ శిఖరాలలో రొద చేస్తున్నరాబందులను,
గాలిలో కలిసి వ్యర్థమౌతున్న జీవన ధ్యేయాలలా
కొండ చరియలకు వేలాడుతున్న తుషార హారాలను
అక్కడే వదిలేసి దిగిరా , ఓ తరుణీ !

నిన్ను తాకేందుకు
నింగి నంటుతున్నది జనపథాల
నిప్పు గూటి ధూమ స్తంభం,
నీకోసం
ఆబాలగోపాలం అర్రులు చాస్తున్నది,
వేణువు మధు గీతికలు ఆలపిస్తున్నది,
శాద్వలాలలో
వేల సలిల స్రవంతులు చెంగలిస్తున్నవి,
అనాది వృక్ష తతిలో గువ్వల కల కూజితం
అసంఖ్యాక మధుకరాల అతులిత ఝంకారం
మర్మర మధుర నాదమై నినదిస్తున్నది.

దిగిరా ఓ గిరిబాలా!
హరిత లోయ పిలుస్తున్నది.
*

మీ మాటలు

  1. Vaadhoolasa says:

    టెన్నిసన్ కవిత్వానికి తెలుగు వన్నెలద్ది,మాతృకను మించిన తర్జుమా చేసిన రామస్వామి గారికి అభినందనలు.కవి హృదయమే అనువదింప బడిందన్నట్లున్నది కవిత.పదాల ఎంపిక ఎప్పటిలాగే ప్రత్యేకం.స్నిగ్ధ సాంద్ర కవిత.

మీ మాటలు

*