మజిలీ మాత్రమే!

afsar1

 

విత్వం వొక గమ్యం కాదు,

అదెప్పుడూ వొక మజిలీ మాత్రమే.

అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. దీన్ని ఎవరూ ఏ ఆనకట్టా వేసి బంధించలేరు. బంధించిన చోట కవిత్వం నిలవ నీరైపొతుంది. కట్టుగొయ్యలూ కృత్రిమమైన కట్టుబాట్లూ ఆకవిత్వాన్ని మాత్రమే రాయించగలవు. ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం. ఇక్కడే వుంటానన్న సుస్థిర భావన అకవిత్వం. ఇక్కడే వుండిపోలేనన్న అస్థిరమైన వలస జీవనం కవిత్వం.

afsar4

-ఇవన్నీ కవిత్వానికి నిర్వచనాలు కాకపోవచ్చు. ఇవి నా నమ్మకాలు మాత్రమే. ఇవి మూఢ నమ్మకాలైనా నాకు ఇష్టమే. ఎవరి ఇష్టానిష్టాల కోసమో కవిత్వం రాయడం నాకు కష్టం కాబట్టి.

కవిత్వ ప్రయాణం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. నాకు మాత్రం నా ప్రతి కవితా వొక కొత్త ప్రయాణమే. ప్రాణాన్ని పొదిగే వాక్యాలు విఫలమైన నా కోర్కెలు.  ఆ వాక్యాలు ఆదిమ గోడ మీద అస్పష్టమైన చిత్రాలే ఇప్పటికీ!

afsar2కవిత్వ ప్రయాణం ఇప్పటికిప్పుడో రేపో మాపో అంతమయ్యేదీ కాదు. దేవుడు మరణించాడని చెప్పిన  వాళ్ళు కూడా కవిత్వం మరణిస్తుందని మాత్రం చెప్పలేరు. పుస్తకాలు మ్యూజియంలో తప్ప ఇంకెక్కడా కనిపించవని నమ్మబలుకుతున్న కాలంలోనూ కవిత్వం బతుకుతుంది. కవిత్వం అంటే నల్లగా మారిన కాయితం కాదు కాబట్టి-

కవిత్వం అచ్చులోంచి పుట్టిన మూస కాదు. లిఖిత లిపి కాదు. గుండెలోంచి గొంతులోంచి పొంగుకొచ్చే శబ్దానికి శైశవ రూపం. ఎన్ని కరువుకాలాలు వెంటాడినా, ప్రకృతి ఆకుపచ్చదనాన్ని మరచిపోయినా ఆకాశం నీలిమని రాల్చుకున్నా గాలి ఊపిరాడక వురేసుకున్నా …నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది. నేలని వెతుక్కుంటూ ఇంకో నేల వున్న చోటికే వలస పోతుంది. అందుకే స్థలరాహిత్యంలో మాత్రం అది బతకదు.

కవిత్వం విశ్వజనీనం సార్వకాలీనం అనే భ్రమలు బద్దలైన కాలంలోకి మనం వచ్చాం. సర్వ కాల సర్వావస్థల్లోనూ వుపయోగవస్తువు కాగలిగిన కవిత్వాన్ని బాగా శంకించాలి. ఈ కాలాన్ని కాదని అతీతరేఖల మీద సాహంకారంగా సంచరించే అక్షరాల్ని వొదులుకోవడమే ఇప్పటి కవిత్వ జీవలక్షణం. ఎప్పటికీ ఎవరూ వదిలించుకోలేని వర్తమానం కవిత్వ ప్రాణం. సమకాలీన స్థల కాలాల్లోకీ…ముఖ్యంగా తన కాలంలో వొదగలేని కవిత్వం ఇప్పుడు బొత్తిగా అనవసరం. ఆ మాటకొస్తే కవి తన స్థలకాలాల్ని అన్వేషించడానికే రాస్తాడని నాకు అనిపిస్తుంది.

జీవితం అంటే నలుపూ తెలుపూ కాదనీ, ఇతరేతర రంగు తేడాలూ వున్నాయని, వ్యవస్థ అంటే వున్న వాళ్ళూ లేని వాళ్ళే కాదనీ ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలున్నాయని ఇప్పుడేమీ నేను కొత్తగా చెప్పడం లేదు. ఈ నిర్దిష్టత అర్ధమైన తరవాత ఇప్పటి దాకా మనం రాస్తున్నదల్లా అమూర్త కవిత్వమే అన్న నిజం తెలిసింది. జీవితం వ్యాఖ్యానాలలో లేదనీ, క్రూరమైన వాస్తవికతలో ఉందనీ అర్థమైంది. ఆ మేలుకొలుపులోంచి వచ్చిన రెండు తరాలని చూస్తూ వాళ్ళ అంతరంగాల అలజడిని వెతకడానికి భాష చాలక రోదించిన క్షణంలో ఈ పాటలన్నీ పాడుకున్నాను. ఇందులో నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొక మూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట మానసాన్ని.

నిన్నటి కన్నా ఎక్కువగా భయపెడ్తున్నా ఇవాళ్టినే ప్రేమిస్తున్నా. ఇవాళ్టి కన్నా అస్థిరంగా కనబడుతున్నా రేపటినే కళ్ళలోకి నిలుపుకొంటున్న అనేక సమూహాల అస్తిత్వ వేదనని నేను.

afsar5

afsar3

నిన్నటి నించి ఇవాళలోకీ, ఇవాళ్టి లోంచి రేపటిలోకీ వలసపోతున్న జీవన యాతన నేను. అందుకే, నా వాక్యాల్లోని ఏక వచనం నేను కాదు, అనేకం! నేను ఇప్పుడు ద్వీపం కాదు, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న లాంతరు అనుక్షణిక వెలుగు.

ఈ చిన్ని వెలుగులోనే దారి వెతుక్కోవాలి. కాస్త చోటిమ్మని నేలని అడగాలి. ఆగకుండా సాగిపోయే కాలం నించి అర అర క్షణాలుగా బతుకు క్షణాల్ని అప్పడగాలి.

అప్పో సప్పో చేసి ఆగిపోకుండా నడవాలి, నడుస్తూనే వుండాలి.

నేలని నమ్ముకున్న వాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. వలస పాదాలక్కూడా అదే దారి. నేల అంతమయ్యే చోట అవి తెగిపోతాయి, దారిలానే!

తెలియని దారిలో వొంటరిగా వెళ్తున్నప్పుడు భయంతో అరుస్తాం. ఏవేవో మాటలు పాటలుగా పాడుకుంటాం. మొండి ధైర్యంతో కాళ్ళని నేలకేసి కొడతాం. అలా నడవని నేలకూ, నడిపించే కాళ్ళకూ, దగ్గిరే దగ్గిరే అనిపించే ఆకాశానికీ మధ్య వెతుకులాట ఇదంతా.

దీనికో గమ్యం మాత్రం లేదు, అదొక్కటీ అడక్కండి!

 

(12 డిసెంబర్ 2000)

డిసెంబర్ ఇరవై హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం సందర్భంగా  మళ్ళీ…

telugu-award

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    గుండెలోంచి గొంతులోంచి పొంగుకొచ్చే శబ్దానికి శైశవ రూపం. ఎన్ని కరువుకాలాలు వెంటాడినా, ప్రకృతి ఆకుపచ్చదనాన్ని మరచిపోయినా ఆకాశం నీలిమని రాల్చుకున్నా గాలి ఊపిరాడక వురేసుకున్నా …నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది.

  2. D. Subrahmanyam says:

    “నిన్నటి నించి ఇవాళలోకీ, ఇవాళ్టి లోంచి రేపటిలోకీ వలసపోతున్న జీవన యాతన నేను. అందుకే, నా వాక్యాల్లోని ఏక వచనం నేను కాదు, అనేకం! నేను ఇప్పుడు ద్వీపం కాదు, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న లాంతరు అనుక్షణిక వెలుగు” చాలా బాగా చెప్పారు అఫ్సర్ గారూ. నిజమే నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది.

  3. కె.కె. రామయ్య says:

    ” అనేక సమూహాల అస్తిత్వ వేదనని నేను ” అన్న కవి అఫ్సర్ గారికి నెనర్లు

  4. msk krishna jyothi says:

    గ్రేట్ సర్. మీకు అవార్డు వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు.

  5. Bollojubaba says:

    Great words sir

  6. కె.కె. రామయ్య says:

    తన ఖమ్మం సాహితీ మిత్రులు అఫ్సర్, ప్రసేన్, సీతారాం గార్ల కవితల సంకలనం రక్తస్పర్శ, అఫ్సర్ గారి వలస, ఇవాళ, ఊరిచివర కవితల పుస్తకాల ప్రసక్తి, కవిత్వం ఒక మజిలీ మాత్రమే అని సారంగలో వచ్చిన ఈ వ్యాసం గురించి వారి మిత్రుడు ( హైకూ కవితల మాంత్రికుడు ) శ్రీ గాలి నాసర రెడ్డి గారి చెవినవేస్తే విని సంతోషించారు. అఫ్సర్ గారికి తన అభినందనలను తెలియజెయ్యమన్నారు.

  7. స్థలరాహిత్యంలో మాత్రం అది బతకదు

  8. Abbinandhanallu,,Afsargaru,namesty!

  9. రాఘవ says:

    ఏంటబ్బా ఈయన…ఇలా లోలోపలికి చొచ్చుకొచ్చి అలా ఉండిపోతాడు !

  10. గుండె ఇలాగా కూడా స్పందిస్తుందా అన్నట్టు ఏమి హృదయ స్పందన! ఏమి అమృత వాక్యాలు!

Leave a Reply to Padmapv Cancel reply

*