నిజ జీవిత చెరసాలల్లో…

art: satya sufi

art: satya sufi

నీడలతో క్రీడిస్తూ
నిజంతో సహజీవిస్తున్నాననుకొని
భ్రమల సాలెగూటిలో
బంధాల ఆశలల్లుతూ ఎడతెగక.
తలుపుకవతల ఏవో పిలుపులు..
నన్నేనని నమ్మి
ఆత్రంగా పరిగెడతా గదికడ్డంగా.
వీధి గుమ్మం ముందర తచ్చాడుతున్న
నిరూపమైన దేహపు అలికిడి,
స్పృశించే విఫలయత్నంలో తడబడి,
శూన్యపు సౌధాలలో
నీ పిలుపుల ప్రకంపనలలు
అలసిన నా శరీర కంపనలతో కలిసి,
అభావపు చిరునవ్వై..
పొడి పెదవులపై నిర్జీవంగా.
దేహపు సడి వెచ్చగా చేతికంటదు.
మాటల తడి చెమ్మగా గుండెకు చిక్కదు
ఆలోచనా స్వేఛ్ఛాలోకపు ఆకారాలతో
నిజ జీవిత చెరసాలల్లో సంభాషిస్తూ,
వసారాలో,కిటికీ మూలల్లో
పడక గదిలో, నీళ్ళగదిలో..
వెతుకులాటలు.
చిరుచినుకుల సవ్వళ్ళకు
విప్పారి విరబూసే మరిన్ని మనసుల ఉనికికై
రెపరెపల బ్రతుకులాటలు.
ఇల్లంతా ఒంటరితనపు వాసన
దండాలపై వేలాడుతున్న ఏకాకితనపు వస్తాలు
ఎండిన పూలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతూ
వేదాంతం విరజిమ్ముతుంటే
చివుక్కుమన్న మనసుతో
చిన్నబుచ్చుకున్న మోము.
పూబాలల సౌరభాల్ని ఒడిసిపట్టి
గుదిగుచ్చిన దారపుపోగు.
నల్లని కనుపాపల్లో విఛ్ఛిల్లిన ఆపేక్షకెరటం.
చెమ్మగిలిన కనుల గడపదాటి
చెప్పరాని గుబుళ్ళ దోవన
అడియాసలైన నిన్నటి ఆశల పరావర్తనం.
దారిపోడవునా తోడొస్తున్న
తెలియని సాన్నిహిత్యపు స్పర్శ.
నామకరణం చెయ్యను
ఎవరివి నీవనీ అడగను.
ఎందాకా వచ్చినా నవ్వుతూ నేస్తం కడతాను.
గమనమే గమ్యం.
ఆసాంతం కలిసొస్తావనే చిగురాశే..
సుదూరపయనానికి మనసైన ఇంధనం.
*

మీ మాటలు

  1. Sridhar Bollepalli says:

    కొంచెం ప్రేమనో, ప్రేమరాహిత్యాన్నో వ్యక్తం చేయగానే.. అది ‘స్వీయదైహికవాంఛల అభివ్యక్తిగా’ చూడబడడం వల్ల చాలా మంచి కవిత్వాన్ని కోల్పోతున్నాం మనం. బహుశా “నిజజీవిత చెరసాలల్లో..” లాంటి ధైర్యంతో కూడిన ప్రయత్నం ఆ దిశగా జరపాల్సిన కృషిని ముందుకు తీసుకెళ్తుందని నా ఆశ. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష అవసరం అన్న ఎరుక కలిగివుండడం, భావమూ భాషా ఒకదానినొకటి తేలికపరుచుకోకుండా పరస్పరం పరిపుష్టం చేసుకోవడం కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. “సారంగ”లాంటి మంచి వేదికపై మంచి కవిత్వాన్ని వినిపించిన అరుణగారికి అభినందనలతో… శ్రీధర్

  2. D. Subrahmanyam says:

    మంచి కవిత అరుణా . అంభినందనలు

  3. Aruna.Gogulamanda says:

    సత్యాసూఫీ ఆర్ట్ తో కలిసి కవిత అందం ఇనుమడించింది. తాంక్యూ వెరీ మచ్ సత్యా..

  4. బోల్డు ఎక్స్ ప్రెషన్. నామకరణం అనే మాటకు బదులు మరోటి తోస్తే పెట్టిచూడండి. ఇంకా బావుంటది.

  5. “నామకరణం చెయ్యను
    ఎవరివి నీవనీ అడగను.
    ఎందాకా వచ్చినా నవ్వుతూ నేస్తం కడతాను.
    గమనమే గమ్యం.”

    ఈ లైన్లు చాలా నచ్చాయండి నాకు – అభినందనలు.

  6. Kiran Babu Rapaka says:

    Exceptional Expression.
    Ensuring to Encourage.
    Elegance at its enormous rage.
    Elevation is inevitable.
    Elements elobrated Effectively.

  7. ఆత్మని ఆశ్రయించిన కవిత కాబట్టి అనుభూతి ప్రధానం …

Leave a Reply to Aruna.Gogulamanda Cancel reply

*