రాచకురుపు

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఇరవై రెండేళ్ల ప్రాయంలో, అమెరికాలో గాలన్ పెట్రోలు పాతిక సెంట్లు ఉన్న రోజునుంచి అది మూడు డాలర్లుకి పెరిగే రోజులొచ్చేసరికి, నలభై ఐదేళ్ళు పనిచేసి రిటైరైపోయాడు విశ్వం. ముగ్గురు పిల్లల్ని కని, పెంచి ఓ ఇల్లు కొని తీరిగ్గా నడుం వాలుద్దామనుకునేసరికి రిటైర్మెంటు ఎదురుగా వెక్కిరిస్తూంది. పిల్లల్లో ఒకడు డాక్టర్ అవగలిగేడు గానీ మిగతా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పిల్లలందరూ ఏవో ఉద్యోగాల్లో కుదురుకున్నారు వాళ్ళ ఓపికా, కోరికల ప్రకారం. విశ్వం రిటైరయ్యేనాటికి యామినికి ఇంకో ఐదేళ్ళు పనిచేసే జవసత్వాలు ఉన్నా మరో రెండేళ్ళకి ఆవిడా రిటైర్మెంట్ తీసుకుంది, రిటైరైన అందర్లాగానే ఇద్దరూ కలిసి ప్రపంచం చూసిరావడానికి.  ప్రపంచం అంతా కాకపోయినా ఇలా ఓ మూలకీ అలా రెండో మూలకీ తిరిగొచ్చేసరికి మొహం మొత్తింది ప్రయాణాలంటే. అప్పట్నుండీ టి.వి చూసుకోవడం, అప్పుడో సారీ, ఇప్పుడో సారీ దగ్గిర్లో గుడికెళ్ళడం, మరెప్పుడైనా పిల్లల్తో ఫోన్లూ, రాకపోకలూ, హితులూ, స్నేహితులూ హలో అంటే హలో అనుకోవడం; వంకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయల్తో రెగ్యులర్  గా గడిచిపోతున్న జీవితంలో ఒక్కసారి విశ్వానికి ఎప్పుడూ తగలని ఎదురుదెబ్బ తగిలింది. ఓ రాజు రాత్రి లేచి లఘుశంకకి వెళ్ళినప్పుడు రక్తం పడడం గమనించాడు. ఏదో వేడి చేసిందేమో అనుకోవడానికి లేదు జనవరి నెలలో. ఇంతటి చలిలో కూడా రక్తం పడేంత వేడి చేయడం తన వయసుకి అసంభవం కాకపోయినా విశ్వానికి అర్ధంకాలేదు ఎందుకలా అయిందో. తాను తినే శాకాహార భోజనానికి రక్తం పడే అవకాశం లేదే?

అర్ధరాత్రి యామినిని లేపి ఆవిడ బుర్ర తినేయకుండా మర్నాడు చెప్పాడు రక్తం సంగతి. మొదటగా ఆవిడ చేసిన పని డాక్టర్ కొడుక్కి ఫోన్ చేయడం.

బిజీగా ఉన్న కొడుకు ఫోన్ ఎత్తలేదు కానీ మరో గంటలోపున వెనక్కి ఫోన్ చేసాడు. విషయం అంతా విన్నాక చెప్పాడు. “దీన్ని హిమాటూరియా అంటారు. దానికి కారణాలు అనేకం. ఇన్ ఫెక్షన్ కావొచ్చు, బ్లేడర్, కిడ్నీలలో రాళ్లవల్ల కావొచ్చు. ప్రోస్టేట్ గ్రంధి వల్ల కూడా కావొచ్చు,” కేన్సర్ అనే పదం నోట్లోంచి రాకుండా జాగ్రత్తపడుతూ.

యామిని ఫోన్ చేతికిస్తే వేరే గదిలోకి ఫోన్ తీసుకెళ్ళి విశ్వం అడిగాడు, “ఒరే దీని మూలాన నాకు యూరిన్ బ్లాక్ అవుతుందా, దానికో గొట్టం, ఓ బ్యాగూ తగిలిస్తే దాన్ని నేను జీవితాంతం మోస్తూ తీసుకెళ్ళాలా?”

తండ్రి గొంతుకలో ఆదుర్దా గమనించి చెప్పాడు, “డాడ్, మరీ అంత కంగారు పడకండి. ఉత్తి ఇన్ ఫెక్షన్ అవ్వొచ్చు. చిన్న మందుతో పోతుంది. డాక్టర్ దగ్గిరకి అంటే యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళండి వెంఠనే.”

ఫోన్ పెట్టేసేముందు విశ్వం “ఇది కేన్సర్ అవొచ్చా?” అనే ప్రశ్నకి డాక్టర్ కొడుకు సమాధానం చెప్పకుండా, “ముందు యూరాలజిస్టుని కలవండి, తర్వాత చూద్దాం” అన్నాడు.

ఫోన్ పెట్టేసిన విశ్వం కొడుకు డాక్టర్ సురేష్ ఆలోచనలు పరిపరి విధాలా పోయేయి. తనకి తెల్సినంతలో విశ్వం తల్లి బ్రెస్ట్ కేన్సర్ పోయింది. ఆవిడ రోజుల్లో ఇంతమంది డాక్టర్లూ లేరు, ఇన్ని మందులూ లేవు. పోయే రోజుకి రెండు మూడు నెలలముందు మాత్రం ఆవిడకి తెలిసింది కేన్సర్ అని. ఏవో ఆయుర్వేదం మందులూ, తాయెత్తులూ కట్టారు గానీ అప్పటికే పూర్తిగా ఆలస్యమైంది. ఆవిడ పోయేనాటికి కేన్సర్ మెటాస్టసైజ్ అయ్యి అంగాంగాలకీ పాకిపోయి ఉండొచ్చు. ఆ పరిస్థితిల్లో ఎవరేం చేయగలరు? లింఫ్ నోడ్స్ లోకి చాపకింద నీరులా పాకిపోయే కేన్సర్ ని ఆ మృత్యుంజయుడైనా బాగుచేయగలడా? ఏవో కొన్ని చోట్ల నోడ్స్ ని సర్జరీతో తీసేసినా అది పాకుతూనే ఉంటుంది…” తల విదిల్చి ఆలోచనలు తప్పించడానికి రెసెప్షనిస్టు తో చెప్పి ఆఫీసులోంచి బయటకొచ్చి మెల్లిగా రోడ్డుమీద నడవడం సాగించాడు. ఎవరో ఒక్కసారి షాక్ లాగా కుదిపినట్టూ ఓ ఆలోచన బుర్రలో చొరబడింది, “తన తండ్రి విశ్వం వేసిన ప్రశ్నే తన పేషెంట్ వేసి ఉంటే ఏమి సమాధానం చెప్పి ఉండేవాడు? అసలు ఏది చెప్పాలో, చెప్పకూడదో నిర్ణయించుకోవడం ఎలా? పేషెంట్ తో అబద్ధం ఆడకూడదు సరే మరి నిజం చెప్తే పేషెంట్ తట్టుకోగలడా?” ఎటూ తేల్చుకోలేక కాసేపు అలా తిరిగి మళ్ళీ ఆఫీసులోకి వచ్చి పేషెంట్లని చూడ్డం మొదలుపెట్టాడు.

* * * * * * * * *

విశ్వానికి యూరాలజిస్టు దగ్గిర అపాయింట్ మెంట్ దొరకడానికి మరో మూడు రోజులు పట్టింది. అప్పటికి ఓ సాంపిల్ లేబ్ కి తీసుకెళ్ళడంతో యూరాలజిస్టు రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పేడు, “ముందీ మందు ట్రై చేయండి. తర్వాత ఓ ఎం.ఆర్. ఐ, ఓ సి.టి స్కాన్ తీయించండి. అన్నట్టు మీరు గతంలో ఎప్పుడైనా పి.ఎస్.ఏ టెస్టు చేయించుకున్నారా? వాటి తాలూకు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? కాలనోస్కోపీ చేయించారా ఈ మధ్య?”

యామిని చెప్పింది సమాధానం, “పి.ఎస్.ఏ టెస్ట్ చేయించి రెండేళ్ళవుతోంది. అప్పట్లో మామూలుగానే ఉందన్నారు ఈయన డాక్టర్. కాలనోస్కోపీ తీయించి అయిదేళ్ళు అవుతోంది.”

“అయితే మరో సారి చేయించండి. ప్రోస్టేట్ సంబంధించినది అయితే చిన్న వాపు అయినా, ఇన్ ఫెక్షన్ అయినా కావొచ్చు.”

“ఇది కేన్సర్ కావొచ్చా?” విశ్వం అడిగేడు మొహం పాలిపోతుంటే.

కాసేపు సాలోచనగా చూసి యూరాలజిస్ట్ అడిగేడు, “మీ వంశంలో ఎవరికైనా కేన్సర్ ఉందా?”

“మా అమ్మగారు బ్రెస్ట్ కేన్సర్ తో పోయారు దాదాపు ముఫ్ఫై ఏళ్ల క్రితం. మరెవరికీ లేదు.”

తల పంకించేడు యూరాలజిస్టు, “సరే అయితే, ఇది కేన్సరా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది ఈ టెస్టులన్నీ చేసాక. అప్పటిదాకా ఏమీ నిర్ధారించలేం. మందు వాడి చూడండి, ఏమైనా గుణం కనిపించవచ్చు.”

మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాతి వారంలో అన్ని స్కాన్ లూ తీయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిగా చూసుకోవాల్సింది ఇన్స్యూరెన్స్. డాక్టర్ రోగ నిర్ధారణ ఇంకా చేయలేదు కనక ఈ స్కాన్ లన్నింటికీ చాలా మటుక్కి ఇన్స్యూరెన్స్ ఇచ్చింది డబ్బులు. అయినా సరే విశ్వం జేబులోంచి మరో అయిదారు వేల డాలర్లు పడ్డాయి కో-పే అనే పేరుతోటీ, కో- ఇన్స్యూరెన్స్ అనే పేరుతోటీను. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రజల బాగు కోసమా వాటి బిజినెస్సు బాగు పడ్డానికా? ఏదైనా ప్రశ్నలడిగితే “అరే, మీరు కట్టిన ప్రీమియం డబ్బులకీ మేము ఇచ్చిన ట్రీట్ మెంటు డబ్బులకీ ఓ సారి పోలిక చూసుకోండి” అనే దెప్పడం ఎప్పుడూ ఉన్నదే.

స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చి మరోసారి యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళవల్సి వచ్చేసరికి విశ్వానికి మందు గుణం ఇస్తున్నట్టు కనిపించింది. రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. ఈ సారి యూరాలజిస్ట్ దగ్గిరకెళ్ళేసరికి కొడుకు సురేష్ కూడా వచ్చేడు.

రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పాడు యూరాలజిస్ట్, “పి. ఎస్. ఏ టెస్టులో 7.5 అని వచ్చింది. మందు వాడుతున్నారు కదా ఏదైనా గుణం కనిపించిందా?”

సురేష్ తండ్రికేసి చూస్తే విశ్వం చెప్పాడు సమాధానం “రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. మరో కొన్ని రోజులు వాడమంటారా?”

“వాడి చూడండి. మీ స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. వాటిలో మీ ప్రోస్టేట్ వాచినట్టు ఉంది. దానికి బయాప్సీ చేస్తే తెలియవచ్చు. కానీ ఒక్కోసారి మందులతో కూడా తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు. బయాప్సీ చేస్తే మరిన్ని తెలుస్తాయి.”

యూరాలజిస్టు చెప్తున్నది విశ్వం విన్నాడో లేదో కానీ “డాక్టర్, అర్జెంట్ గా బాత్రూం కి వెళ్ళాలనిపిస్తోంది. ఈ లోపుల మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారా?”

“వెళ్ళిరండి, ఏం ఫర్వా లేదు”

విశ్వం లేస్తుంటే డాక్టర్ అన్నాడు యామినితో, “మీరు కూడా వెళ్ళండి ఆయనికి తోడుగా”

వాళ్ళటు వెళ్ళగానే సురేష్ అడిగాడు యూరాలజిస్టుని, “స్కాన్ లలో కేన్సర్లాగా ఏదైనా కనబడిందా?”

“క్రిస్ట్ మస్ లైట్స్”

“అంటే?”

“మీ నాన్నగారికి కేన్సర్ లాంటి కణితి ప్రతీ అవయవంలోనూ ఉన్నట్టు రేడియాలజిస్ట్ రాసారు.” స్కాన్ లో కేన్సర్ కణితిలు క్రిస్ట్ మస్ లైట్లలాగా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.”

“మై గాడ్”

యూరాలజిస్ట్ ఏమి చెప్పాలో తెలియక తల పంకించాడు.

మరో కొద్ది క్షణాలు ఆగి సురేష్ నోరు ఎండిపోతూండగా అడిగేడు, “సర్జరీతో తీసేయవచ్చు కదా?”

“అది నేను చెప్పలేను. ఇప్పుడు మీకు చెప్పేదొక్కటే. అర్జెంట్ గా ఆంకాలజిస్ట్ ని కలవండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది.”

కాసేపటికి వచ్చిన విశ్వాన్నీ తల్లినీ తీసుకుని ఇంటికొచ్చాడు సురేష్. ఆ పై వారంలో ఆంకాలజిస్ట్ ని కలిసాక మరిన్ని టెస్టులూ, ప్రోస్టేట్ బయాప్సీ చూసి చెప్పేడు ఆంకాలజిస్ట్, “మీ నాన్నగారికి మూడో స్టేజ్ కేన్సర్. ఇది ప్రస్తుతానికి లివర్ లో, కిడ్నీలలో, ప్రోస్టేట్ లో ఉందని గుర్తించాం. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి ఉంటుందని నా అనుమానం. పెద్ద, చిన్న పేగుల్లోకి వెళ్ళిందా అనేదానికి ఇంకా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది.

విశ్వం మొహం పాలిపోయింది. ఆ తర్వాత సురేష్, అంకాలజిస్ట్ మాట్లాడుకున్న మెడికల్ పదాలు విశ్వానికి, యామినికీ అక్కడక్కడా అర్ధమయ్యాయి కానీ ఇంకా గజిబిజిగా ఉంది. తానింకా చాలా కాలం బతుకుతాడనీ మరో డాక్టర్ దగ్గిరకో, మరో హాస్పిటల్ కో వెళ్తే బాగుండొచ్చనీ లేకపోతే హోమియోపతీయో, ఆయుర్వేదమో పనిచేస్తుందనీ పేషంట్ ఎప్పుడూ డాక్టర్ కన్నా పాజిటివ్ గా ఉంటాడా?

ఇంటికొస్తూంటే విశ్వం కారులో కళ్ళుమూసుకున్నాడు. మందు ప్రభావమో మరొకటో గానీ నిద్ర పట్టినట్టుంది. యామిని దార్లో సురేష్ ని అడిగింది, ” సురేష్, అంకాలజిస్ట్ చాలా సార్లు మెటాస్టసైజ్ అనే మాట అన్నారు. అంటే ఏమిట్రా?”

కొరడా దెబ్బ మొహం మీద ఛెళ్ళున తగిలిన భావన. డ్రైవ్ చేస్తోన్న కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క లేన్ లోకి వెళ్ళబోతూంటే అక్కడొచ్చే కారు అదే పనిగా హార్న్ కొట్టడంతో సురేష్ తెలివి తెచ్చుకుని సరిగ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి మళ్ళీ అడిగింది, “మెటాస్టసైజ్ అనేది కేన్సర్ కి సంబంధించినదేనా?”

“ఇంటికెళ్ళాక చెపుతానమ్మా, ఇప్పుడు డ్రైవ్ చేయాలి. ఇప్పుడే పక్క లేన్ లోకి వెళ్ళిపోబోయాను చూసావా?”

* * * * * * * * *

రాత్రి విశ్వం పడుకున్నాక ఆలోచనలు బుర్ర తినేస్తూంటే మనసు మరల్చడానికి టి.వి చూస్తూ కూర్చున్నాడు సురేష్. యామిని వంటపని పూర్తయ్యాక వచ్చి కూర్చున్నప్పుడు చిన్న గొంతుకతో చెప్పాడు “మెటాస్టసైజ్ అంటే కేన్సర్ వేరే అంగాలకి పాకుతోందని అర్ధం. ఎంతవరకూ ఎన్ని చోట్లకి పాకింది అనేది పూర్తిగా టెస్టులు చేస్తే గానీ చెప్పరు. కానీ మందులూ కీమో థెరపీ వాడి చూడొచ్చు.” మాట్లాడుతూంటే తన గొంతులో తనకీ, అమ్మకీ నమ్మశక్యంగా ఏమీ చెప్పలోకపోతున్నాడనే ధ్వని గమించాడు సురేష్. లోపల మాత్రం మూడో స్టేజ్ కేన్సర్ అంటే తండ్రి మహా అయితే మరో రెండేళ్ళు బతుకుతాడేమో అనిపించింది.

ఓ వారం అక్కడే ఉండి తండ్రిని కీమో థెరపీకి, అమ్మని వీటన్నింటినీ చూడడానికి కుదుర్చిపెట్టాక ఇంటికి బయల్దేరాడు. ఇవి అలా జరుగుతూండగానే రోజులు పరుగెడుతూ ధేంక్స్ గివింగ్ దగ్గిరకొచ్చింది. శెలవులకి పిల్లలందరూ కుటుంబాలతో ఓ చోట చేరారు తల్లినీ తండ్రినీ చూడ్డ్డానికి.

తల్లీ తండ్రీ పడుకున్నారనుకున్నాక సురేష్ మిగతా అందరితో చర్చించేడు తండ్రికొచ్చిన కేన్సర్ విషయం. అంతకు ముందు ఫోన్ లో విన్నదే అయినా ఇప్పుడు తండ్రిని చూసేసరికి తెలుస్తూన్న విషయం – ఆయనింకెంతో కాలం బతకడు. నిర్జీవమైన కళ్ళూ, కీమో థెరపీ వల్ల ఊడిపోయే జుట్టూ, బయాప్సీల వల్ల నిరంతరం పడే నెప్పీ, వాటికి మందులూ ఇవన్నీ ఓ ప్రహసనం. ఎంత మనసు వేరే దానిమీద పెడదామన్నా నిరంతరం మనసుల్లో కదిలే ఒకే ఒక పదం  “కే-న్స-ర్.” మనిషి జీవితాన్ని అత్యల్పంగా చేసి తోలుబొమ్మలాగా నిరంతరం ఆడించే ఒకే ఒక వదుల్చుకోలేని దారుణమైన జాడ్యం. అదృష్టవంతులైన వాళ్ళలో రిమిషన్ ఉండొచ్చేమో కానీ నూటికెంతమంది రిమిషన్ కి నోచుకునేది? అయినా ఈ వయసులో తండ్రికి రిమిషన్ వచ్చేనా? అందరికన్నా ఎక్కువ కంగారు పడినది మొదటి సంతానం అయిన కూతురు. సురేష్ ఇంతకుముందు డాక్టర్లతో మాట్లాడాడు కనక కాస్త కుదురుగానే ఉన్నాడు. మూడో సంతానం వినీత్ కి ఏమి చేయాలో తెలియక అలాగే స్తబ్దుగా కూర్చున్నాడు. మొదటగా నోరు విప్పినది వాడే. “సురేష్, ఇప్పుడు నాన్నకి వచ్చిన కేన్సర్ కి అన్ని టెస్టులూ చేయించి, అంతమందికి చూపించాలి కదా మరి ఆయన ఇస్యూరెన్సూ, మెడికేర్ ఇవన్నీ కవర్ చేస్తాయా?”

“కొన్ని చేస్తాయి, కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు. చివరిదాకా ఈ పోరాటం కేన్సర్ మీదా, ఇన్స్యూరెన్స్ కంపెనీల మీదాను.”

“మరి ఇన్స్యూరెన్స్ కవర్ చేయకపోతే ఎలా?”

“జేబులోంచి పెట్టుకోవాలి. కొంత నేను సర్దగలను. అందరూ తలో చేయి వేస్తే సులభం.”

వెంఠనే కూతురు అంది, “నేను ఒక్క సెంటు కూడా సర్దలేను. పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉద్యోగం మానేసి రెండు నెలలైంది; మరో రెండేళ్ళు ఆగి మరో ఉద్యోగం చూడాలి. మా ఆయన్ని అడిగితే మహా అయితే ఐదువేలు సర్దొచ్చు.”

చివరి కొడుకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పావుగంట గడిచాక సురేష్ అడిగాడు వినీత్ ని, “ఏరా, నువ్వు ఎంత డబ్బులు సర్దగలవు?”

“మహా అయితే పదో, పదిహేనో.”

“మీరిచ్చే ఇరవై, కేన్సర్ ట్రీట్ మెంటుకి ఈ మూలకి? కనీసం యాభై సర్దుతారేమో అనుకున్నాను.”

“…”

సమాధానం లేకపోవడం చూసి కూర్చున్న సురేష్ లేచి చెప్పాడు గోడకేసి తిరిగి ఎవరికో చెప్తున్నట్టూ, “నేను ఇంటిమీద రెండో అప్పు తీసుకుని ఈ కేన్సర్ పని పట్టాలి అయితే; కని పెంచిన నాన్నకి ఇలా అయిందని తెల్సినా మీరిద్దరూ ఇలా అన్నారంటే …”

ఈ మాటలన్నీ నిద్రపోకుండా పై గదిలోంచి పడుకున్నాడనుకున్న విశ్వం, యామినీ విన్నారని పిల్లలకి తెలియలేదు.

* * * * * * * * *

శెలవులు అయిపోయాక ఇంటికెళ్ళబోయే ముందు అందర్నీ కూచోపెట్టి చెప్పాడు విశ్వం, “నాకు డభ్భై దాటుతున్నాయి. ఈ వయసులో వచ్చే రోగాలు మందులకి తగ్గడం కష్టం. ఈ కేన్సర్ మందులతో, కీమోథెరపీతో నా వళ్ళు హూనం అవుతోంది. నాకిప్పటికి అర్ధమైనదేమిటంటే, నేను మూడో స్టేజ్ లో ఉన్నాను. ఇక్కడ్నుంచి ఆంకాలజిస్టూ, యూరాలజిస్టూ మిగతా డాక్టర్లూ ఎంత నన్ను నమ్మించడానికి  ప్రయత్నం చేస్తున్నా ఇది వన్ వే ట్రాఫిక్కే. ఎందుకంటే కేన్సర్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిందని చెప్పారు. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిన కేన్సర్ తగ్గడం దాదాపు అసంభవం. ఈ కేన్సర్ పాకిన ఒక్కో అవవయం తీసేసి నన్ను మరో రెండేళ్ళు బతికించవచ్చేమో. అప్పుడు నేను జీవఛ్ఛవాన్నే కదా? దీనిమీద ఖర్చులు చూడబోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగా తయారౌతున్నై. ఇలా ఒక్కో స్టేజ్ దాటుకుంటూ చావడం కంటే అన్ని ట్రీట్ మెంట్లూ మానేసి మూడు నాలుగు నెలల్లో పోవడమే మంచిది. ఇప్పుడు అద్దంలో నా మొహం చూసుకోవడానికీ నాకే భయం వేస్తోంది. దీనికి డబ్బులు తగలేయడం శుద్ధ దండుగ. యామినితో చెప్పాను కూడా. నేను పోయాక లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి. అవి యామినికి సరిపోతాయి సోషల్ సెక్యూరిటీ డబ్బులతోటి. అందువల్ల మీరందరూ కంగారు పడి డబ్బులు వేస్ట్ చేయకండి. అందరం ఎప్పుడో ఒకసారి పోవాల్సినవాళ్ళమే. ఇప్పుడు నాదీ వంతు.”

సురేష్ చెప్పేడు వెంఠనే, “అలాక్కాదు, మీకు కేన్సర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా ఈ కేన్సర్ ని ధైర్యం గా ఎదుర్కోవాలి గానీ అలా డీలా పడిపోకూడాదు. నాకు తెల్సున్న కొంతమంది డాక్టర్లు ఉన్నారు. నేను కనుక్కుంటా. డబ్బులదేవుంది; కుక్కని కొడితే రాల్తాయి. అప్పు తీసుకున్నా తర్వాత కట్టేయవచ్చు.”

విశ్వం కళ్ళలో కాస్త మెరుపు కనిపించింది. అది కొడుకు తనని బాగా చూసుకుంటున్నాడనా లేకపోతే కేన్సర్ నిజంగా తగ్గిపోయి తన ఆరోగ్యం బాగై పోతుందనా?

వెంఠనే అందరూ ఏక కంఠంతో అన్నారు, “అవునవును కేన్సర్ కి అలా లొంగిపోకూడదు. పోరాడవల్సిందే.”

అంతా విన్న విశ్వానికి ఇంక తప్పలేదు. సురేష్ తనకున్న ఇంటిమీద హోం ఇంప్రూవ్ మెంట్ లోన్ తీసుకోడానికీ, కేన్సర్ మీద పోరాటానికీ నిశ్చయం అయిపోయింది. విశ్వం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

* * * * * * * * *

మూణ్ణెల్లు గడిచాయి. సురేష్ తీసుకున్న అప్పు అలా పెరుగుతోందే కానీ విశ్వానికేమీ తేడా కనిపించినట్టు లేదు. దీనికితోడు అటూ ఇటూ రాకపోకలవల్ల సురేష్ ప్రాక్టీస్ కుంటుబడడం, రాబడి తగ్గడం మొదలైంది. చాప కింద నీరులా కేన్సర్ అలా పెరుగుతూనే ఉంది. కొంతమందికి కేన్సర్ ఖర్చులు మొదట్లో ఎక్కువగా ఉన్నా అవి మెల్లిగా తగ్గిపోతాయి కేన్సర్ తగ్గే కొద్దీ. వీళ్ళు మొదటి జాతి అదృష్టవంతులు అనుకోకుండానో, తెలిసో తమకి కేన్సర్ వచ్చినట్టు అతి చిన్న స్టేజ్ లో పట్టుకున్న వాళ్ళు. వీళ్ళు మరో ఇరవై ఏళ్ళదాకా బతకొచ్చు రోగం తిరగబెట్టకపోతే. తిరగబెడితే వీరి అదృష్టం తీరిపోయి రెండో కోవలోకి వస్తారు. ఈ రెండో కోవలో మొదట ఖర్చులు తడిసిమోపెడయ్యాక, కేన్సర్ మెల్లిగా తగ్గినట్టు అనిపించేసరికి ఖర్చులు తగ్గుతూ వస్తాయి. కానీ కొంతకాలాని కేన్సర్ మళ్ళీ వంటిమీదకి పాకడం మొదలుతుంది అప్పుడు ఖర్చులు పుంజుకుంటాయి. ఆ పుంజుకోవడం ఆకాశమే హద్దా అన్నట్టూ ఉండడంతో పేషంట్ కీ, అతనికి తెల్సిన చుట్టాలకీ స్నేహితులకీ అందరికీ అదో మానసిక పోరాటం. మొదటి అదృష్టవంతులకి ఖర్చు ఎక్కువగా మొదలై రోజులు గడిచే కొద్దీ టేపర్ అవుతాయి. రెండో దురదృష్టవంతులకి టేపర్ అయినట్టు కనిపించి ఖర్చు యు అక్షరం ఆకారంలో పడగ చాస్తుంది. ఎప్పుడైతే ఆ కోడె తాచు పడగ విప్పడం  మొదలైందో అప్పుడే ఆశలన్నీ వదులుకోవటం మొదలౌతుంది. కానీ మానవ జీవితంలో ఆశకీ కోరికకీ అంతులేదు కదా? పడగ నీడన ఏదీ మొలవదని తెలిసీ, ఆ ట్రీట్ మెంటు మింగలేకా, కక్కలేకా కొనసాగించాల్సిన పరిస్థితి.

మరో మూడు వారాలు పోయాక అంకాలజిస్ట్ విశ్వానికి చెప్పాడు, ” ఈమధ్య ఒక ఎక్స్ పెరిమెంటల్ మందు మా దగ్గిరకి వచ్చింది. అది కంపెనీలు ఇంకా టెస్ట్ చేస్తున్నారు. మీకున్న లక్షణాలవల్ల ఈ రీసెర్చ్ కి సరిపోతారు. ట్రై చేస్తారా?”

“ఇది మీరు కవర్ చేస్తారా లేకపోతే ఇన్స్యూరన్స్ ని అడగాలా?” అప్పటికీ పూర్తిగా జవసత్వాలు పోయిన విశ్వం అడిగాడు, కనీసం ఆర్ధికంగానైనా దెబ్బతినకుండా ఉండడానికి.

“మందు పూర్తిగా మేము కవర్ చేస్తాం. కానీ హాస్పిటల్ లో ఉండడానికీ డాక్టర్లకీ అలా కొంత చొప్పున ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.”

“ఆ ఖర్చు ఎంతవరకూ ఉండొచ్చు?”

“చెప్పలేమండి. మందు పనిచేస్తే తక్కువకాలం హాస్పిటల్లో ఉండడం. చేయకపోతే ఎక్కువ రోజులుండడం. ఏ ఒక్కరి కేసూ ఒక్కలా ఉండదు కదా?”

“సరే అయితే నేను ఇన్స్యూరెన్స్ కి ఫోన్ చేసి కనుక్కుని చెప్తాను.”

“అలాగే, మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు.”

* * * * * * * * *

ఇంటికొచ్చిన యామిని ఓ గంటపాటు ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఫోన్ మీద కుస్తీ పట్టాక వాళ్ళు చెప్పారు, “మీ డిటైల్స్ అన్నీ రాసుకున్నాము. ఎక్స్ పెరిమెంటల్ అన్నారు కనక అది మా మేనేజర్ ని అడిగి మీకు ఉత్తరం రాయాలి. దానికి మూడు నుంచి అయిదు రోజులు పడుతుంది….”

“మరి ఇది కేన్సర్ కదా, వెంఠనే ట్రీట్ మెంట్ మొదలు పెడితే గుణం కనిపించవచ్చు. అంతకన్నా ముందు చెప్పలేరా?”

“… అసాధ్యం. ఈ కేన్సర్ కేసులన్నీ ఒక్కొక్కటీ ఒకో టైపు. దేనికదే విడివిడిగా చూస్తాం. మాకున్న రూల్స్ ప్రకారం ఇలాంటివి అప్పుడప్పుడూ తొందరగానే ఆమోదించినా ఫోన్ మీద ఆమోదించరు. కానీ మీకు మరీ అంతగా కావాలంటే మరోసారి మంగళవారం ఫోన్ చేయండి.”

ఇన్స్యూరెన్స్ ఎలాగా ఒప్పుకుంటారనుకునీ, తర్వాత వారితో మాట్లాడొచ్చుఅనుకునీ యామిని విశ్వాన్ని ఎక్స్ పెరిమెంటల్ మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ డాక్టర్ ఆఫీసుకి చెప్పేసింది. ఆ వారం నుంచే మందు వాడడం మొదలైపోయింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా త్వరలోనే తలనెప్పిగా తయారవబోతోందని ఇద్దరికీ తెలియలేదు. బేంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి మంచిదా బేంకుకి మంచిదా? బేంకులు బిజినెస్సు చేసుకుంటాయి గానీ మనగురించి నిజంగా పట్టించుకున్నదెప్పుడు? అలాగే ఇస్యూరెన్స్ కంపెనీలూను.

* * * * * * * * *

ఆ పై వారంలో సోమవారం విశ్వం బాత్రూంలో పడి ఉంటే కొంచెం లేటుగా లేచిన యామిని కంగారుగా వెళ్ళి చూసింది. బాత్రూం నేలంతా రక్తం; నోట్లోంచి వచ్చిందే అని తెలుస్తోంది. ఓ 911 ఫోన్ కాల్ తర్వాత ఆఘమేఘాల మీద విశ్వం ఎమర్జన్సీలో ఎడ్మిట్ చేయబడ్డాడు. తర్వాత విషయాలు అన్నీ అందరి కేన్సర్ పేషంట్లకీ తెలిసొచ్చినట్టే విశ్వానికీ, యామినికీ కూడా పూర్తిగా తెలిసొచ్చాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలన్, ఇలా కేన్సర్ లేని అవయవం లేదు విశ్వానికి. మరో పెద్ద న్యూస్ ఏమిటంటే ఇప్పుడు కేన్సర్ అయిదో స్టేజ్ లో ఉంది. విశ్వాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి డాక్టర్ ఒప్పుకునేసరికి మరో మూడ్రోజులు పట్టింది. ఈ కంగార్లో హాస్పిటల్లో మంచం మీద తెలివి లేకుండా పడి ఉన్న విశ్వాన్ని చూసుకుంటూ మంగళవారం ఇన్స్యూరెన్స్ ఫోన్ చేయమన్నారన్న సంగతి యామినికి ఏ మాత్రం గుర్తు రాలేదు.

ఇంటికెళ్ళేసరికి ఇన్స్యూరెన్స్ దగ్గిర్నించొచ్చిన ఉత్తరం రడీగా ఉంది, “మీరు మాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు మా మానేజర్ చూసారు. మీరు చెప్పిన మందులూ అవీ ఇంకా ఎక్స్ పెరిమెంటల్ అన్నారు. అవి పనిచేస్తాయో లేదో ఝూడీగా తెలియదు. మందులు మీ డాక్టర్ ఆఫీసు కానీ మందుల కంపెనీలు కానీ ఇచ్చినా మిగతా ఖర్చులన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఇంతా చేస్తే ఈ మందు ఎఫ్. డి. ఏ అప్రూవ్ చేసినట్టు లేదు. అందువల్ల మేము ఈ ఖర్చులు భరిండానికి ఒప్పుకోము. మీకు ఈ విషయంలో మేము ఏమీ సహాయం చేయలేము. మీకు కలిగిన పరిస్థితికి మేము విచారిస్తున్నాము.”

విశ్వాన్నీ ఎలాగా మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ చెప్పేసారు కనుక ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా, ఇంక వెనక్కి చూసుకోకుండా కొడుకు సలహా తో మందు కంటిన్యూ చేయడానికి నిశ్చయం అయిపోయింది. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు ముందూ వెనకా చూసుకోవడం అనవసరం. ఇన్ని రోజుల్లోనూ అమ్మాయీ, రెండో కొడుకూ అప్పుడప్పుడూ వచ్చి చూస్తున్నా, ఫోనులు చేస్తున్నా డాక్టరైన సురేష్ దగ్గిర ఉన్నాడని ఏదో భరోసా కాబోలు, వాళ్ళిద్దరికీ అంత పట్టలేదు తండ్రి గురించి. ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఒకేలాగ ఉండాలని ఎక్కడుంది?

 

* * * * * * * * *

ఫోన్ మీద తల్లి చెప్పినవన్నీ విన్నాక సురేష్ తండ్రి దగ్గిరకి బయల్దేరాడు. ఈ సారి అంతా ఖాయం అయినట్టే. అయిదో స్టేజ్ లోంచి కేన్సర్ పేషెంట్ ని బాగుచేసి మామూలుగా చేయడం భగవంతుడిక్కుడా సాధ్యం కాకపోవచ్చు. బయల్దేరేముందు రోడ్డుమీద అలా నడుస్తూంటే అదే బ్లాకులో ఉంటున్న డేవిడ్ కనిపించాడు. డేవిడ్ ఏదో బిజినెస్ చేస్తూంటాడు. వాళ్ళావిడకి కూడా కేన్సర్ అని తెలుసు కానీ ఎప్పుడూ దాని గురించి మాట్లాడ లేదు. తన తండ్రికి కేన్సర్ వచ్చినప్పటునుండీ అసలు ఈ మధ్య ఎవరినీ కలవడం కానీ చూడ్డం కానీ కుదరనే లేదు. ఈ సారి డేవిడ్ పలకరించాడు, “హలో డాక్టర్ ఎలా ఉన్నారు?”

“ఏదో, అలాగే ఉంది. మీరో?”

“ఏం బాగు లెండి జీవితంలో ఢక్కా మొక్కీలు తప్పడం లేదు. మా ఆవిడ జెన్నీకి కేన్సర్ అని తెలుసు కదా? తనకి ఇంక తగ్గదనీ ట్రీట్ మెంట్ వద్దనీ చెప్పేసింది. ఈ కేన్సర్ డాక్టర్లు ఏదో చేస్తామన్నారు కానీ, ఒక్కో అవయవం తీసేసి జీవితాన్ని ముందుకి లాగుదామని చూస్తారు. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? అలా బతకడం కంటే పోవడమే మంచిదని జెన్నీ వాదన. కొన్ని రోజులు ఈ డాక్టర్ల చుట్టూ తిరిగే సరికి నాక్కూడా అదే నిజం అనిపించింది. మూడు వారాల క్రితం జెన్నీని ఫ్లోరిడా తీసుకెళ్ళాను ఆఖరుసారిగా వెకేషన్ పేరుమీద. అక్కడే హాస్పిటల్లో పోయింది. పోనీ లెండి అంత నొప్పితో, నరకం అనుభవించడం కన్నా అదే మంచిది. జెన్నీని బతికించుకోవడం బాగానే ఉండుండేది కానీ ఇలా అవయవాలు ఒక్కోటి తీసేసాక ఏమిటి బతికి ప్రయోజనం? రొమ్ము కేన్సర్ వచ్చాక సర్జరీ చేయించుకున్న మహిళలు మానసికంగా నరకం అనుభవిస్తారని ఎక్కడో చదివాను. అస్తమానూ నా స్వార్ధం చూస్కోవడం ఎలా? పోనీ లెండి, చివరికి ఎలగైతేనేం అయాం హేపీ ఫర్ హర్.”

సురేష్ చెప్పిన సారీ విని సురేష్ తండ్రికి కూడా కేన్సర్ అని విన్నాక మెకానికల్ గా ఓ సారీ చెప్పేసి ముందుకి సాగిపోయేడు డేవిడ్. వీళ్ళెంత ఈజీ మనుషులు? స్వంత భార్య పోయినందుకు మనసు ఎంత కష్టపెట్టుకున్నాడో పెద్దగా తెలియదు కానీ జెన్నీ చివరి రోజుల్లో కోరుకున్నట్టూ చేసి అయాం హేపీ ఫర్ హర్ అనగలిగేడు. మరి తానో? బుర్ర విదిల్చి చిన్నగా గొణుక్కుంటూ ముందుకి నడిచేడు.

* * * * * * * * *

తండ్రిని చూడ్డానికొచ్చిన సురేష్ కి చూడగానే మైన విషయం – తన తండ్రి మరో రెండు వారాలు బతికితే గొప్పే. సురేష్ వచ్చిన మూడో రోజు విశ్వానికి తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో చేయగలిగింది అంతా చేసాక ఎమర్జన్సీ డాక్టర్ చెప్పాడు బయటకొచ్చి, “రక్తంలో తయారైన క్లాట్ ఊపిరితిత్తుల్లోకి ఒకటీ, బ్రైన్ లోకి ఒకటి వెళ్ళాయి. మేము టి.పీ.ఏ మందు ఇచ్చినా ఏమీ గుణం కనిపించలేదు. ఈ క్లాట్ కేన్సర్ మందుల వల్ల వచ్చిందా, మరోదాని వల్లా అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడు హెమొరేజ్ వల్ల వళ్ళు తెలియదు ఆయనకి. కానీ మరి తెలివి వస్తే మీతో మాట్లాడ్డం కానీ, మామూలుగా జీవించడం కానీ అసంభవం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచితే మరో కొన్ని రోజులు బతకొచ్చు. బతికినా ఎవర్నీ గుర్తుపట్టడం గానీ మాట్లాడ్డం కానీ జరగదు అని మా మెడికల్ టీం అభిప్రాయం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచమంటారా, తీసేయమంటారా?”

కడుపులో ముఫ్ఫై అంగుళాల కత్తి వెన్నెముకకి అంటుకునేలా గుచ్చి ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగితే ఏమిటి సమాధానం? సురేష్ వెంఠనే చెప్పేడు, “ఓ పది నిముషాలు ఆలోచించుకోవచ్చా?”

“తప్పకుండా” ఎమర్జన్సీ రూం డాక్టర్ లోపలకి నడిచేడు.

యామిని అక్కడే కుర్చీలో నిశ్చేతనంగా కూలబడింది. తల్లిని వదిలేసి బాత్రూంలో దూరేడు కన్నీళ్ళు కనపడకుండా ఉండడానికి. చిన్నప్పుడు సరిగ్గా అన్నం తినకుండా ఇల్లంతా పరిగెడుతూంటే తనని కూర్చోపెట్టి కధలు చెప్తూ ఒక్కొక్క చెంచాతో అన్నం తినిపించిన తండ్రికి ఫీడింగ్ ట్యూబ్ ఉంచమని చెప్పాలా? తీసేయమని చెప్పాలా? నాన్నా, ఇలా సిమ్మింగ్ క్లాస్, అదిగో బేస్ బాల్ ప్రాక్టీస్, ఇక్కడ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పోరుతుంటే ఎక్కడకి పడితే అక్కడకి తీసుకెళ్ళిన తండ్రిని ఏంచేయాలి? తాను హిందువు కనక ఆ ధర్మం ప్రకారం ఫీడింగ్ ట్యూబ్ తీసేయడం మంచిదా? ఉంచడం మంచిదా? మోరల్ గా అయితే ఏం చేయాలి? తనదొక్కడిదీ కాదు నిర్ణయం. అయినా తల్లిని ఇప్పుడు ఏమని అడగాలి? అమ్మా ట్యూబ్ తీసేయమని చెపుదామా అని చెప్పాలా? లేకపోతే ఉంచుదాం, అప్పుడు తండ్రి బతికితే నువ్వు క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయన్ని చూసుకో అని చెప్పాలా? ఇప్పటికే ఈ కేన్సర్ వల్ల తల్లి చితికిపోయింది మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగానూ….. బుర్ర తినేసే ప్రశ్నలన్నీ ఒకదానిమీద ఒకటి సమ్మెట దెబ్బల్లా తగులుకుంతూంటే తల బద్దలౌతోంది. ఒక్కసారి చణ్ణీళ్లతో మొహం కడుక్కున్నాడు. కొంత తెరిపి పడ్డాక బయటకొచ్చాడు అయిదు నిముషాలకి.

యామిని, దగ్గిరకొచ్చిన కొడుకుని తలెత్తి  చూసింది. ఓ క్షణం ఆగి చెప్పింది, “మీ నాన్న ఇష్టం మొదట్నుండీ తెలుస్తూనే ఉంది. ట్రీట్ మెంట్ వద్దని చెప్పినా మనమే కొనసాగించాం. ఇంక ఈ దశలో ఏ మాత్రం ఉపయోగం లేదని డాక్టర్లు చెప్తున్నారు కదా, ట్యూబ్ తీసేయడమే మంచిది.”

తాను ట్యూబ్ తీసేయమంటే తల్లి ఏమంటుందో, అసలెలా చెప్పాలా అనుకుంటున్న సురేష్ కి తలమీదనుంచి పెద్ద బరువు దింపేసినట్టు అయింది. తల్లికేసి కాసేపు చూసి తన చేతిని అమ్మ చేయి మీద వేసి “అలాగే” అన్నాడు.

* * * * * * * * *

ఆ తర్వాత జరగవల్సినవన్నీ జరిగిపోయాయి. అమ్మాయీ, రెండో కొడుకూ వచ్చాక శరీరాన్ని దహనానికి అప్పగించడానికీ, అస్థికలూ అవి తీసుకుని ఇండియా వెళ్ళి గంగలో కలపడానికీ నిశ్చయించుకున్నాక ఎవరి పనుల్లోకి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచం ఒక్క మనిషికోసం ఆగదు కదా?

మరో రెండు రోజులు పోయాక అక్కనీ, తమ్ముణ్ణీ ఇంట్లో వదిలి యామినితో అస్థికలు తీసుకురావడానికి బయల్దేరాడు సురేష్. ఫ్యూనరల్ హోం లో వాటికోసం చూస్తూంటే ఎక్కడలేని నీరసం, నిస్సత్తువా ఆవరించాయి. వెనక్కి తిరిగి ఓ సారి చూసుకుంటే తనకి కొండచిలువలా తాడి ఎత్తున వికట్టహాసం చేస్తూ పెరిగిన అప్పు. ఇంత ఖర్చు పెట్టినా తన తండ్రి పడ్డ నిరంతర నరకం తప్పలేదు. ఏనాడూ తనని ఏదీ అడగని తండ్రి చివర్లో కూడా తమ శ్రేయోభిలాషే. తానెలాగా పోతాననీ దానికోసం ఇంత డబ్బు వేస్టు చేయొద్దనీ అడిగితే తానేమన్నాడు? తనకి తల్లీ తండ్రి తప్ప మరెవరూ బంధువులు లేరనీ, ఆయనపోతే తాము ఏకాకి అయిపోతారనీ తెలిసి తండ్రిని బతించుకోవడానికి – మిగతా ఇద్దరికీ పట్టకపోయినా – అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఇదంతా చూస్తే తానో పూర్తి స్వార్ధపరుడు. డేవిడ్ చెప్పినట్టూ తాను కూడా నిస్వార్ధంగా తండ్రిని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్తే చివరకి మనశ్శాంతితో హాయిగా పోయి ఉండేవాడా? ఇదంతా తన స్వార్ధం వల్లేనా? తలెత్త లేక అలా నేల చూపులు చూస్తూంటే పక్కనే ఉన్న తల్లి చేయి తన భుజం మీద పడటం గమనించాడు. ఒక్కసారి శోకం ముంచుకొచ్చింది. చటుక్కున బాత్రూములోకి దూరి వెక్కి వెక్కి ఏడిచాడు హృదయం పగిలేలా.

ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టాడా, ఖర్చుపెట్టిన డబ్బులకి ఎంత ఫలితం ఉందా అనేమాట పక్కన పెడితే, డాక్టరై ఉండీ ఏం సాధించాడు తాను? ఇన్నాళ్లూ తాను పోరిన పోరాటం శుద్ధ దండుగ. ఎంత నిబ్బరంగా ఉండి కేన్సర్ తో పోరాడి విజయం పొందుదామనుకున్నా, ఆఖరికి ఆ రాచకురుపే గెల్చింది. తమ పోరాటం ఆషామాషీ రోగంతో కాదు. నిరంతరం అనేక లక్షలమంది చేస్తున్నదే. తన తండ్రి బతుకుతాడా పోతాడా అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీలకి గానీ, ప్రతి రోజూ ఇటువంటి కేసులని చూసే హాస్పిటళ్లకి గానీ పట్టలేదు. వాళ్ల ఉద్యోగాలు వాళ్ళు చేసారు. ఫలానా ఎక్స్ పెరిమెంటల్ మందు పనిచేస్తే అది పనిచేసినట్టు కేన్సర్ మీద ఓ పేపర్ రాసుకునేవారేమో. అయినా వాళ్ల తప్పేం ఉంది ఇందులో? తన తండ్రి అనగా ఎంత? ఈ జన సముద్రంలో ఆయన కూడా ఓ నీటి బొట్టు…. మనసు మరల్చుకోవడానికి ఓ సారి తండ్రి చదివే భగవద్గీతలో శ్లోకం గుర్తు తెచ్చుకున్నాడు సురేష్, “జాతస్య హిధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్యచ, తస్మాద పరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి”

విశ్వం అస్థికలూ, చితాభస్మం ఉన్న డబ్బా పట్టుకుని ఫ్యూనరల్ హోం నుంచి తల్లి యామినితో వెనక్కి వస్తూంటే సురేష్ మదిలో ఎందుకో ఒక్కసారి మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ పాఠం చెప్తూ అన్న మాట గుర్తొచ్చింది “కేన్సర్ అనేదో రాచకురుపు. అది మనిషి జీవితాన్నే కాదు, మనసులనీ, మనుషుల మనఃస్తత్వాన్నీ, మన మధ్య బాంధవ్యాలనీ మన బేంక్ ఎకౌంట్లనీ, ముందు రాబోయే రోజులనీ అన్నింటినీ పూర్తిగా మార్చి వేయగల అసాధారణ శతృవు. కేన్సర్ వచ్చిన మనిషి ఒకేసారి ఛస్తాడు, కానీ ఆ తర్వాత పేషంట్ తాలూకు చావు దెబ్బ తగిలిన మృతశేషులు అంటే సర్వైవర్స్, ప్రతీ రోజూ ఛస్తూనే ఉంటారు చాలా కాలం వరకూ.”

కళ్ళలో నీళ్ళు చిమ్ముతూంటే పక్క సీట్లో కూర్చున్న తల్లికి కనబడకుండా వాటిని అదిమిపెట్టి కాలు బలంగా ఏక్సిలెరేటర్ మీద నొక్కాడు. ఏక్యురా కారు కీచుమంటూ ఇంటివేపు దూసుకుపోయింది.

* * * * * * * * *

 

మీ మాటలు

 1. కథ బాగుంది. కాని కొత్తదనం ఏమీ లేదనే చెప్పాలి. కథకులు ఐతే అలా జరుగవచ్చు అనో‌ అలాజరిగితే పరిణామాలూ ఏమీటీ అనో ఒకవిధమైన దార్శనికదృక్కోణంలో వ్రాయటం‌ ఒక విధం ఐతే ఇలా జరుగుతోంది అని వాస్తవికతాచిత్రీకరణద్వారా ప్రపంచానికి అద్దం‌ పట్టటం‌ మరొక విధం. ఇది రెండవకోవకు చెందిన కథ. కథలో వైద్యపరిభాషను సరిగానే ఉపయోగించారు – ఇది బాగుంది. కొంతకొంత మానసికవిశ్లేషణ కనిపిస్తున్నంతవరకూ బాగుంది. కథలన్నీ సందేశాత్మకంగా ఉండాలన్న చాదస్తపు నియమం ఏమీ లేదు కాబట్టి రచయిత తనుగా ప్రత్యేకించి చెప్పినది ఏమీలేకపోయినా కొంతవరకూ ముగింపులోని డాక్టరు పాత్ర ఆలోచనల్లో తనమాటలుగానే చెప్పారని అనుకోవచ్చును.అసలు రాచపుండు అన్నపేరు రావటానికి కారణం దాని వైద్యానికయ్యే ఖర్చుని కేవలం మహారాజులే భరించగలరన్న అభిప్రాయం కారణం కావచ్చును – అది కనిపించిన చోట ఒకప్రాణాన్ని తీసుకొనిపోవటంతో పాటు చెప్పరానంత విధ్వంసం సృష్టిస్తుంది కదా. చివరగా కథకు ఒకప్రయోజనం ఉండాలన్న ఆలోచనతో చూస్తే ఈకథకు కూడా ఒక ప్రయోజనం ఉంది. అది పెద్దరోగాలు కనిపించినచోట ఎంతగా రోగితో‌పాటు రోగి సన్నిహితులల్లో ఎంత అలజడిని ఎన్ని విధాలుగా కలిగిస్తుందో అన్నది ప్రదర్శనాపూర్వకంగా ఈకథద్వారా యువతరాలకు తెలియజేయటం. అలా చేయటం వలన కాన్సర్ వంటి తీవ్రమైన వాటిపై సమాజం చేసే పోరాటంలో యువత మరింత అవగాహనతో ఉండేందుకు దోహదపడటం. ssమంచికథ చివరికి.

  • మంచి కథా – కథకు తగ్గ తాడిగడప శ్యామలరావు గారి విశ్లేషణ – రెండూ చాలా బావున్నాయి :)

 2. D. Subrahmanyam says:

  బావుంది

 3. మనుషులు రోగానికంటే ఎక్కువగా వైద్యానికయ్యే ఖర్చుకు భయపడాలి 😔
  యూరోపియన్ కంట్రీస్ లో పరిస్థితి కాస్త మెరుగని విన్నా. నిజమెంతో మరి.

 4. Bagundi , visleshana chala bagundi

 5. ari sitaramayya says:

  కథ బాగుంది.
  మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అంటే ఇదేదో మార్కిస్టు గొడవ అనుకుంటారేమో. కానీ నిజానికి మానవ సంబంధాలు పూర్తిగా కాకపోయినా అధిక భాగం ఆర్ధిక సంబంధాలే. డబ్బుకు సంబంధించిన ఆలోచన పూర్తిగా తీసేసి చూస్తే మిగిలేవి మాత్రమే ప్రేమ సంబంధాలు.
  పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులమీద బిడ్డలకు బాధ్యత ఉన్నది అనుకోవడం ఒక పవిత్రమైన ఆలోచనగా భావిస్తారు చాలామంది. కానీ, పిల్లలను కనడం పెంచడం అది ఒక బిజినెస్ పెట్టుబడి లాంటిది. ఒక్కోసారి బిడ్డలు సహాయం చెయ్యగల స్థితిలో లేక పోవచ్చు. అప్పుడు వారికి ప్రేమ ఉన్నట్లా,లేనట్లా?
  ఇండియాలో చాలా మందికి అమెరికా మీద పెద్ద గౌరవం ఉంది. ఇక్కడ జరిగేవి అన్నీ ఒక పధ్ధతి ప్రకారం జరుగుతాయనీ, అనుసరించ దగినవి అనీ అనుకుంటారు. చికిత్స విషయంలో ఈ దేశం పాటించే కొన్ని పద్ధతులు కిరాతకమైనవని చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తూ ఇక్కడి పద్ధతులను ఇంతకంటే కిరాతకంగా అక్కడ పాటిస్తున్నారు.
  ఆలోచించదగిన విషయాలు చాలా ఉన్నాయి కథలో. శర్మ గారికి అభినందనలు.

 6. సుందరం says:

  రాచకురుపు….ఓ కోలుకోలేని “కుదుపు”

  చాలా కాలంగా ఎదురుచూస్తున్న అచ్చమైన తెలుగు డయస్పోరా కథ చదివిన అనుభూతి కలిగింది. కథకులు ఎక్కడ ఉన్నా కథ లన్నీమాత్రం సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతూంటాయి ( శ్రీ వంగూరిచిట్టెన్ రాజు గారు, ఫణి డొక్కా గారు లాంటి “హాస్య” రచయితల కథలు మినహాయింపు :) ). కొడుకు ఒక డాక్టర్ అయ్యుండీ ఇటు తన వృత్తి ధర్మాన్నీ అటు సహజమైన మానవ సంబంధ విలువలనీ పాటించడంలో పడే తపన, సంఘర్షణ చాలా హృద్యంగా వ్రాసారు.రచయిత తన మాటల్లా కాకుండా కొడుకు పాత్రను, చివరివరకూ డాక్టర్ గానే ఉండగలిగేలా చేసి కథను మరింత రక్తి కట్టించారు. అవును ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చాలా మంది కథే కాబట్టి కొత్తదనం కోసం మనం వెతుక్కోనక్కరలేదు, కానీ కథనం చాలా బాగుంది. చివరకి నివసించే ప్రదేశం ఏదైనా మనుషులంతా ఒకేలా ఆలోచిస్తారని, మానవ సంబంధాలు-ఆర్ధికసంబంధాలు అని వేరు చేసి చూడలేమని చెప్పిన ఈ కథ, మీ కథ ల “స్థాయి” ఏంటో చూపించే మరో మెచ్చుతునక.
  శ్రీ శర్మ గారికి ధన్యవాదాలతో

  సుందరం

మీ మాటలు

*