మన “ఆధునికత” వొట్టి డొల్ల!

painting: Rafi Haque

painting: Rafi Haque

 

సాంస్కృతిక సామ్రాజ్యవాదం తృతీయ ప్రపంచదేశాలప్రజల మానసిక దౌర్భల్యాలనూ, ముఖ్యంగా అణగారిన ప్రజల్లో తమ “వెనుకబాటుతనం”, “సాంప్రదాయకత” పట్ల ఉన్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని వారికి ఒక రకమైన “వేగాన్నీ”, భావ ప్రకటనా స్వేఛ్ఛనీ ఇస్తున్నట్లుగా ఫోజు కొట్టి , వారి పాత కుటుంబ సామాజిక సంబంధాలను విచ్చిన్నం చేస్తుంది. తన కొత్త సంబంధాలను ప్రవేశ పెడ్తుంది. సంప్రదాయ వాదులనే ముద్రను చూసుకొని భయపడే తృతీయ ప్రపంచ దేశాల ప్రజల పట్ల , ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదం “స్వేచ్చగా అభిప్రాయాలు వెలిబుచ్చడం” పేరిట నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. మార్కెట్ అనే వొకే వొక్క ఆధునిక దైవం వుందని, దానికి అడ్డుగా వచ్చే సాంప్రదాయిక సంబంధాలన్నీ నాశనం చేయాలని సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఉపదేశిస్తోంది ( జేమ్స్ పెట్రాస్).

యింకా సాంస్కృతిక సామ్రాజ్యవాదం “ఆధునికత” అనే భాహ్య చిహ్నాలను ఆరాధించేలా చేస్తుంది. స్వతంత్ర వ్యక్తిత్వం పేరిట వ్యక్తివాదం పేరిట సామాజిక సంబంధాలపై దాడి చేస్తుంది అంటాడు జేమ్స్ పెట్రాస్. ప్రజలను వారి సాంస్కృతిక మూలాలనుంచీ, ఒకరికొకరు  యిచ్చిపుచ్చుకొనే సంప్రదాయాల నుంచీ తొలగించి ఆ స్థానంలో మీడీయా సృష్టించిన కృత్రిమ అవసరాలను ప్రవేశపెడ్తోంది అంటాడు. యిందుకు ఉదాహరణగా తమ వాతావరణానికి అనుకూలంగా వుండే,  వదులుగా, హాయిగా వుండే సంప్రదాయ దుస్తులను త్యజించి, తమకు తగని టైట్ బ్లూ జీన్ ఫ్యాంట్లు ధరించాలనీ, పెట్టుబడిదారీ మార్కెట్ డిమాండ్లకు తలవంచాలనీ, తృతీయ ప్రపంచ దేశాల ప్రజలను ప్రోత్సహించడమే కాదు,  నిర్బంధిస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

జేమ్స్ పెట్రాస్ పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాదం గురించి మాట్లాడడానికి చాలా సంవత్సరాల ముందే బ్రిటీష్ పరిపాలనా కాలంలోనే సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శని ఎక్కుపెట్టిన తెలుగు మేధావి విశ్వనాథ సత్యనారాయణ. భాష, వ్యవసాయం, కళలు, వొకటేమిటీ, అన్ని రంగాల్నీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం కబళించి వేయడాన్ని భారతీయ గ్రామీణ వ్యవస్థ నేపథ్యంలో చిత్రించారు విశ్వనాథ. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టుగానే, సంప్రదాయవాది, వెనుకబడినవాడు, ఫ్యూడల్ అనే వొక్క మాటతో ఆయన్ని నిరాకరించేవారు కమ్యునిస్టులు. వారి దగ్గర ఆధునికత అనే అస్త్రం వుంది.

ముఖ్యంగా భారత దేశంలో ఆధునికత అంటే వలసవాద ఆధునికతే.  యీ వలసవాదాన్నే సూర్యోదయంగా భావించారు కెవిఆర్ లాంటి కమ్యునిస్టు మేధావులు. వలసవాదాన్ని సర్వాత్మనా సమర్ధించిన గురజాడ, కందుకూరి వీరేశలింగంపంతులు వైతాళికులుగా అవతరించడంతో ఆధునికతకి రాజముద్ర పడింది. ఆధునికతని సందేహించడమే పాపమై పోయింది.

మన “ఆధునికత” తెచ్చిపెట్టుకున్నదీ, వలసవాదం వల్ల దిగుమతి ఐనదీ కావడం వల్ల కావచ్చు- దానిలో లోతు తక్కువ. మనకి  బెట్రాండ్ రసెల్ వంటి వైవిధ్యభరతమైన ఆలోచనలు కల మేధావులు లేరు. తీవ్ర వలసవాద ప్రభావం వల్ల కావచ్చు. మావోలా స్వదేశీ తత్వాన్ని జీర్ణించుకున్న మేధావులు బలంగా ముందుకు రాలేదు. ఫలితం ఆధునికత కాదు. వలసవాద లక్షణం కల ఆధునికత.  దేశీయమైన ప్రతీదాన్నీ,  స్థానికమైన ప్రతీదాన్నీ వెనుకబాటుగా చిత్రిస్తూ,  మేధావిలా కాదు, రౌడీలా,  పోలీసులా ముందుకొచ్చింది.  చైనాలో మావో పురాణకథల్ని ఉటంకిస్తాడు. మన పురాణాల్ని  ప్రస్తావిస్తే ఎక్కడ తిరోగమనంగా భావిస్తారోనని కొడవటిగంటి వాపోయారు.

దీని వల్ల జరిగిన పొరపాటు యేమిటంటే భారతీయ గతాన్ని పూర్తిగా నిరాకరించడం, లేక గతాన్ని పూర్తిగా కీర్తించడం అనే రెండు విధానాలు ముందుకొచ్చాయి.మొదటి పద్ధతి అగ్రెసివ్, రెండవది స్వీయ రక్షణాత్మకం (డిఫెన్సివ్). మొదటిది లెప్ట్, రెండవది రైటు. అందువల్ల విశ్వనాథ సత్యనారాయణ, బెంగుళూరు నాగరత్నమ్మ లాంటి వారిని తిరస్కరించడమో, పూజించడమో జరిగింది గానీ, వారి సామాజిక ప్రాధాన్యాన్ని గుర్తించడం జరగలేదు. వారి సామాజిక పాత్ర తిరోగమనశీలమైనదిగా నిరాకరించబడింది. లేక వారిని విగ్రహాలుగా  మార్చి  పూజించడం జరిగింది. ఈ రెండు పాత్రలూ వారి పాత్రని మరుగు పరిచేవే.

కందుకూరి వీరేశలింగంపంతులుని వైతాళికుడిగా కీర్తించే కమ్యునిస్టులు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన బెంగుళూరు నాగరత్నమ్మ పోరాటశీలతని ఎలా అర్థం చేసుకోవాలో విచారణ జరపనే లేదు. కెవిఆర్ అనే కమ్యునిస్టు మేధావి మగవాళ్ళని మించి పచ్చిగా శృంగారం రాసిందని నిందించిన ముద్దుపళని, “రాధికా స్వాంత”నాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడింది బెంగుళూరు నాగరత్నమ్మ. సిగ్గు అనేది ఆడవాళ్ళకు మాత్రమే ఉండవలసిన నీతా అని సవాలు విసిరింది. ముద్దుపళని శృంగారం రాసిందంటూ గోల చేసిన వీరేశలింగం అంతకంటే పచ్చి వర్ణనలున్న పుస్తకాలను మద్రాసు యూనివర్సిటీకి పాఠ్యపుస్తకాలుగా సిఫారసు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించింది. “రాధికా సాంత్వ”నాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అసభ్యమని నిషేధించింది. యీ నిషేధం వెనుకా,  అసలు మొత్తంగా దేవదాసీ వ్యవస్థే రద్దు చేయాలన్న ప్రయత్నం వెనుకా వీరేశలింగం ఉన్నారు. కానీ బెంగుళూరు నాగరత్నమ్మ దేవదాసీ వ్యవస్థని సమర్ధించారు. వ్యభిచారం మీద ఆందోళన పేరుతో కళలతో ముడిపడ్డ వ్యవస్థని రద్దు చేయడం తగదని పేర్కొన్నారు. “యీ రకంగా మొత్తం జాతిని నిషేధించాలనుకోవడం వెర్రితలలు వేసిన ప్రెంచి విప్లవం లాంటి” దని నాగరత్నమ్మ,  “ఆధునికత” సాంప్రదాయ సామాజిక సంబంధాల మీద చేస్తున్న ఏకపక్ష దాడిని వ్యతిరేకించారు. విశ్వనాథ దేవదాసీ పాత్రని సహానుభూతితో చిత్రించారు వేయిపడగలులో.  దేవదాసీ నృత్యాలు, భరతనాట్యం పేరుతో అగ్రవర్ణికరించబడ్డాయి చివరికి. బ్రిటీషువారు భారతీయ శృంగార గ్రంథాలను, జాతి చైతన్యాన్ని ప్రోది చేసే రచనలను కూడా నిషేధించారు. దానిలో భాగంగా విశ్వనాథ రాసిన ఆంధ్ర ప్రశస్తిని నిషేధించారు.

ఆధునిక క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథంతో భారతీయ సామాజిక అంశాల్ని తిరస్కరించారు. అంతేకాదు. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టు తమ వునికి, సమాజం మొత్తంగా వెనుకబాటుతనంతో నిండి వున్నాయని, ఆ స్థానాన్ని వలసవాద భావాలతో భర్తీ చేయాలనీ భావించారు. అందుకే ముద్దుపళని శృంగార కావ్యాలని వ్యతిరేకించిన వీరేశలింగం పాశ్చాత్య శృంగార కథల్ని అనువదించి ముద్రించడానికీ, వాటిని పాఠ్యగ్రంథాలుగా సిఫార్సు చేయడానికీ వెనుకాడలేదు. అందువల్ల సెక్స్ అపవిత్రం అనికాదు, భారతీయ సెక్స్ అనాగరీకం, వెనుకబాటుతనం అనే న్యూనతా భావం ఆధునికుల్ని వెంటాడింది. యీ దృష్టితోనే దయానంద సరస్వతి ( ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు) శ్రీకృష్ణుని శృంగార లీలలతో కూడిన భాగవత పురాణన్ని నిషేధించాలన్నాడు. యీ విధంగా స్థానిక సంప్రదాయాలూ, సామాజిక సంబంధాలూ, విశ్వాసాలూ, పాశ్చాత్య వలసవాద సాపేక్షికంగా నిరాకరింపబడ్డాయి. మార్కిస్టు మేధావులు యిదే పని చేసారు. ఎందుకంటే మార్క్స్ కూడా భారతీయ విశ్వాసాలూ, పూజా విధానాలూ, మనిషిని పశువుని పూజించే  పశు స్థాయికి దగజార్చేవిగా వున్నాయని విమర్శించాడు. సాంస్కృతికంగా ఉన్నతులైన పాశ్చాత్యుల పరిపాలన వల్ల భారతీయులు ఉద్ధరించబడ్తారని అంటాడు. అంటే మతం మత్తుమందు అనే మాట నిజమే కానీ కల్లు కన్న సారా గొప్పది. సారా కన్నా  విస్కీ గొప్పది. యీ సాపేక్షికత -పాశ్చాత్య వలసవాద సాపేక్షికత,  లెప్టునీ రైటునీ వెంటాడింది.

అందుకే హిందూత్వ వలసవాద సిద్ధాంతకర్త సావర్కర్ అన్ని రకాల ఆచారాల్నీ, సంప్రదాయాల్నీ తిరస్కరించాడు. భార్యకు కర్మకాండ జరపలేదు. తనకు కూడా కర్మకాండ జరపవద్దని వీలునామా రాసాడు. గుళ్ళూగోఫురాలూ తిరగవద్దన్నాడు. గోపూజని పరిహసించాడు. పాశ్చాత్య ఫాసిస్టు జాతీయ వాదం నుంచీ స్పూర్తిని పొందాడు. ఆర్యసమాజమైనా, బ్రహ్మసమాజమైనా యిలా పాశ్చాత్యం నుంచీ స్పూర్తిని పొంది ఏకేశ్వరోపాసన, వొకే గ్రంథం లాంటి ప్రొటెస్టెంట్ భావనలని పుణికి పుచ్చుకోవడానికి ప్రయత్నించాయి.

మనం తీవ్రంగా వలసవాద దాస్యంలో కూరుకపోవడం వల్ల చరిత్రని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారింది. నిజానికి కొన్ని ప్రాంతాలకి, కొన్ని కుటుంబాలకి పరిమితమైన సతీసహగమనం వలసవాద ప్రమేయం వల్ల మితిమీరిపోయిందని వెండీడోనేగర్ రాసారు (హిందూస్- ఏన్ ఆల్టర్నేటీవ్ హిస్టరీ). భారతీయుడు ఎవరైనా యిలా రాయగలడా? రాస్తే అతడు వెనుకబాటుదనంలోకీ సంప్రదాయంలోకీ కూరుకపోయినట్లుగా చిత్రించబడ్తాడు. అలాగే మనుస్మృతికి మితిమీరిన ప్రాధాన్యం వలసవాదుల కాలంలోనే వొచ్చిందని ఆమె రాసారు. మనుస్మృతిని చేతిలో పుచ్చుకున్న మొట్టమొదటి పాశ్చాత్య అనువాదకుడు విలియం జోన్స్ విగ్రహం ఇంగ్లండులోని ప్రముఖ చర్చి ముందు వుందని ఆమె రాసారు. అంతేకానీ అలాంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా కానరాదని ఆవిడ రాసారు. గ్రామీణ జీవితంలో మతగ్రంథం ప్రమేయం లేకపోవడాన్ని విశ్వనాథ, శార్వరీ నుంచీ శార్వరీ దాకా అనే నవలలో చిత్రించారు. అంటే అక్కడ మౌఖికమే ప్రధానం అన్న మాట.

ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే లెప్టుకు కానీ రైటుకు కానీ స్థానిక సంప్రదాయ సంస్కృతులతో ఏమాత్రమూ సంబంధం లేదు.

నిజానికి హిందూత్వని, ఆరెస్సెస్ లాంటి సంస్థల్నీ పోషించిన వాళ్ళు మహారాష్ట్రకు చెందిన చిత్పవన్ భ్రాహ్మణులు. నిజానికి శివాజీ ఆస్థానంలో ఉన్న సంప్రదాయ బ్రాహ్మణులు దేశస్థ భ్రాహ్మణులే. శివాజీ గురువులు సమర్ధ రామదాసు దేశస్థ బ్రాహ్మణుడే. చిత్పవన్ బ్రాహ్మణులు 17వ శతాబ్ధంలో హఠాత్తుగా వెలుగులోకి వచ్చారు. వీరు లౌకికులు. సంప్రదాయంతో వీరికి సంబంధం లేదు. వీరు సైన్యంలో పనిచేసారు. రాజకీయాల్లో ఆరితేరారు. పీష్వాలు వీరే. శృంగేరీ పీఠంపై దాడి చేసి దోపిడీ చేసిన బ్రాహ్మణుడు చిత్పవన బ్రాహ్మణుడే. ఆయన పేరు పీష్వా పరుశరామ భావూ. అప్పుడు శృంగేరీ మఠానికి రక్షణ కల్పించినదీ, తిరిగి సంపదనిచ్చినదీ టిప్పుసుల్తాన్. అందుకే 23వ శ్రుంగేరీ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి టిప్పుసుల్తాన్‍కి వ్యతిరేకంగా బ్రిటీష్ వారు రాసిన చరిత్రని ఖండించారు.

అలా శంకరాచార్యులు స్థాపించిన శృంగేరీ మఠంపై దాడి చేసిన చరిత్ర కలిగిన వారే చిత్‍పవన బ్రాహ్మణులు. అందుకే హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ కుల నిర్మూలనని  సమర్ధించాడు. అంబేద్కర్ మహద్ పోరాటానికి మద్దతు పలికాడు( అంబేద్కర్, సావర్కర్ ల జీవిత చరిత్రలు రెండూ రాసిన ధనుంజయ కీర్ ఈ విషయం రాసారు) సావర్కర్ దృష్టి విశాల హిందూ ఐక్య సంఘటన మాత్రమే. అది పూర్తి రాజకీయ పరమైనది.

1927లో సావర్కర్ సంగీతఉష్రాఫ్ అనే నాటకం రాసాడు. అదే ఏడాది ప్రదర్శన జరిగింది. అంటరానితనం, అగ్రకులాల హిందువులలో ఉన్న దౌష్ట్యం, దీని ఫలితంగా హిందూ కులాలు ఇస్లాం మతానికి మార్పు చెందడం, బ్రాహ్మణీయ హైందవంలో ఉన్న పరిమితులు, భారత దేశంలో ముస్లీంల అజెండా- యివన్నీ యీ నాటకంలో చర్చించిన అంశాలు. ఐతే యీ నాటకంలో ముస్లీంలని హిందూ స్త్రీలని అపహరించుక వెళ్ళే దుర్మార్గులుగా చిత్రించాడు (హిందూత్వ- జ్యోతిర్మయశర్మ)

దీనిలోసావర్కర్  మతమార్పిడికి హిందూమతంలోని కులవివక్ష, లోపాలే కారణమని పేర్కొనడం విశేషం. అంబేద్కర్ కూడా అలాగే భావించాడు.  కానీ యిద్దరూ ముస్లీంలు ప్రమాదకరమైనవాళ్ళే, దాడి చేసే దుందుడుకు స్వాభావం కలవాళ్ళేని వ్యాఖ్యానించారు. గురజాడ మతము- విమతము అనే కథలో ముస్లీముల బలవతపు మార్పిడుల  గురించి రాశాడు.

ఆధునిక విద్య ( ఇంగ్లీషు విద్య) నేర్చిన వాళ్ళూ, అన్ని రకాల సంస్కర్తలూ, ముస్లీంలని ప్రమాదంగా భావించారు.అదే సమయంలో ఇంగ్లీషు వాళ్ళని ఉద్ధారకులుగా భావించారు. వందేమాతరం గేయరచయిత బకించద్ర చటర్జి ముస్లీం దౌష్ట్యం నుండీ భారతీయులని యింగ్లీష్ వాళ్ళు కాపాడారన్నాడు ( ఆనందమఠం).

ముస్లీంలని దుర్మార్గులుగా చూపడంఅనేది బ్రిటీష్ పాలనకి, వలస ఆధునికతకి వొక సమ్మతిని కూర్చడంలో భాగంగా మారింది. అదే సమయంలో హిందూ అనైక్యతే ముస్లీంల విజయానికి కారణంగా వర్ణించబడింది. కనుక హిందువుల సంస్కృతి కూడా లోపభూయిష్టమైనదే. కులం దాని ప్రధాన లోపం. కనుక కులాలనీ, కులసంస్కృతులనీ నిర్మూలించి హిందూజాతీయవాదాన్ని నిర్మించాలి. కులం పునాదులపై  జాతిని నిర్మించలేమని అంటాడు అంబేద్కర్. సావర్కర్ అంగీకరిస్తాడు. అందుకోసం హిందూ ఐక్యత అవసరం. ఈ ఐక్యతలో ముస్లీం వ్యతిరేకత విడదీయరాని భాగం అని సావర్కర్ దృక్పథం.

వలస వాదం ఆధునికతపై లెఫ్టిస్టులకీ,  రైటీస్టులకీ యిద్దరికీ వ్యతిరేకత లేదు. ముఖ్యంగా సాంస్కృతిక వలసవాదంపై విమర్శ లేదు. అందుకే శ్రీశ్రీ  “దేశచరిత్ర” కవితలో ఇంగ్లీషు నియంతల పేర్లు వుండవు. ఎందుకంటే యింగ్లిషు వాళ్ళ రాక దైవప్రేరితమని బకించంద్ర చటర్జి, వీరేశలింగం లాంటి  వాళ్ళు భావించారు. మార్క్స్ చారిత్రక అనివార్యతగా,  చారిత్రక పురోగతిగా భావించాడు. ముస్లీం పరిపాలన యథాతథవాదంగా నిర్వచించబడింది.

వలసవాదంపై,  సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శ లెఫ్టిస్టు రైటిస్టు బృందాల నుండీ రాలేదు. సంప్రదాయ విద్యావంతుల నుండీ వచ్చింది. ముఖ్యంగా వలసవాదం తీసుకొని వచ్చిన సాంస్కృతిక సామాజిక మార్పుపై విమర్శ.

 

భాషని గురించే తీసుకోండి. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ప్రముఖ ఆఫ్రికన్ రచయిత గుగి “డీకలోనైజింగ్ మైండ్ ” అనే గ్రంథం రాసాడు. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తెలుగునాట ప్రధానంగా విమర్శించింది కవికోకిల జాషువా. ముక్కుతిమ్మన, తిక్కన లాంటి తెలుగు ప్రబంధకవులతో భైరన్, మిల్టన్, గోల్డ్ స్మిత్ లాంటి ఆంగ్లరచయితలు ఏమాత్రం పోటీపడలేరు. స్వకీయులైన కవులు నాటుగా భావించబడ్తున్నారు.  ఆంగ్ల భాషాకవులు నీటుగా భావించబడుతున్నారు అని ఆయన బాధపడతాడు. జాషువా ఆత్మకథలో( గబ్బిలం ) ఇంగ్లీషు భాషాధిపత్యం వల్ల తనకి గుర్తింపులేకుండా పోతోందని బాధపడ్తాడు. ఆధునిక కవులలో అందరికీ స్థానమిచ్చిన ముద్దుకృష్ణ,  “వైతాళికు”లలో జాషువా లేడు. అంటే వారి దృష్టిలో ఆయన వైతాళికుడు కాదు. ఆయనకి  ఆంగ్ల విద్యా సంపర్కము లేదు. పైగా సంస్కృతం, ఆంధ్రభాషలనభ్యసించి పద్యకవిత్వాన్ని అభ్యసించాడు. కాళిదాసు రాసిన మేఘసందేశాన్ని విలోమీకరించి “గబ్బిలం”  రాశాడు. ఆయన తిరుగుబాటులోనూ  సంప్రదాయకతని విడనాడలేదు. వలసవాదాన్ని యింగ్లీషుభాషా సాహిత్యాలని ప్రమాణంగా భావించిన గురజాడని సమకాలీన కవులందరూ ప్రస్తుతించారు.కానీ జాషువాని మాటమాత్రంగానైనా స్మరించకపోవడం విశేషం. చివరకి జాషువాని చెళ్ళపిళ్ళ వంటి సంప్రదాయ కవులే అభిమానించి గౌరవించారు.

ప్రతీ భాషా తనదైన ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటుందని చెళ్ళపిళ్ళ వెంకటకవుల శిష్యుడు విశ్వనాథసత్యనారాయణ భావించాడూ అంటే భాష నశించడం అంటే జాతి నశించడమన్న మాట. అందువల్ల యింగ్లీషుకీ తెలుగుకీ గల తేడాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు విశ్వనాథ. యింగ్లీషు భాష వల్ల తెలుగుకి రాబోయే ముప్పుని గుర్తిస్తాడు. వొక కథ ద్వారా యీ సత్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు. వొక విషాధ వృత్తాంతాన్ని చెప్పినా ఇంగ్లీషులో బ్యూటీపుల్, బ్యూటిపుల్ అంటారు. అదే తెలుగులో ” అయ్యో పాపం ” అంటారని వివరిస్తాడు (వేయిపడగలు ). దేవుడు అనే మాటకి కూడా యింగ్లీషు వాళ్ళ అర్థం వేరు, మన అర్థం వేరు అని వ్యాఖ్యానిస్తాడు. భాషతో మత సంస్కృతులు విడదీయరానివి. స్థానికత కూడా భాషలోనే వ్యక్తమవుతుంది.

ఇలా వలస భాష వల్ల, వలస సంస్కృతి వల్ల తెలుగు భాషకీ, సంస్కృతికీ వచ్చిన ముప్పుని గుర్తించిన వాళ్ళలో శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి  కనపడ్తారు. విశ్వనాథ యింగ్లీషు చదివారు కానీ శ్రీపాద, జాషువాలాగానే యింగ్లీషు విద్య లేనివాడు. శ్రీపాద, విశ్వనాథ యిద్దరూ కూడా సుదీర్ఘ ముస్లీం పాలనలో కాదు, యింగ్లీషు పాలనలోనే సంస్కృతికి  ముప్పు వచ్చిందని భావించారు( అనుభవాలూ-ఙ్ఞాపకాలూ , మ్రోయు తుమ్మెద )

యీ సాంప్రదాయక మేధావుల్లో కనపడని లక్షణం జాతివిద్వేషం. చారిత్రకంగా వొక  పరాయి జాతి మనలని అణచి వేసిందన్న భావన వీరిలో మచ్చుకైనా కానరాదు. “వేయి పడగ”లలో ధర్మారావు కొడుకు శాస్త్రి, తాను హస్సవలీ నుంచీ రామకథని తెలుసుకున్నాను అంటాడు. వాడు కబీరు, నేను రామదాసుని అనికూడా అంటాడు. గుడిలో దేవదాసి నాట్యానికి సంగీతాన్ని సమకూర్చేవాని పేరు కబీరే ( కంచి పరమాచార్య తన ఆశ్రమంలోని ముస్లీం వాయిద్యకారుల పాండిత్యం గురించి వొక చోట ప్రస్తావించారు).  హిందుస్థానీ భక్తి సంగీతంలో ముస్లీం  మతస్థుల పాత్రని గురించి విశ్వనాథ “మ్రోయు తుమ్మెద”లో స్పష్టం చేశారు. మ్రోయు తుమ్మెదలో తెలుగువాడైన “తుమ్మెద” హిందుస్థానీ సంగీతంలో పాండిత్యాన్ని సంపాదిస్తాడు. నీవు పాడే పద్ధతి తురక పద్ధతిలో ఉందని వొక హిందుస్థానీ పండితుడు ఆక్షేపించినపుడు ముస్లీంలు లేకుండా హిందూస్థానీ ఉందా అని అడుగుతాడు తుమ్మెద.

 

సంగీతంతోనూ, భక్తితోనూ, గుడితోనూ ముస్లీంలకు గల అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తాడు విశ్వనాథ.  హిందుస్థానీ సంగీతంలో చాలామంది మతరీత్యా ముస్లీంలైనా దుర్గ, కృష్ణుడు, మొదలైన అనేక దేవతలని కొలుస్తారని అంటాడు విశ్వనాథ. మతాంతరీకరణ పట్ల వుద్వేగాన్ని విశ్వనాథ అనుభూతి చెందడు. అంతర్వాహిణిలా సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని ఆయన భావన. అందుకే “తెఱచిరాజు”నవలలో నాయకుడు అనేక మతాలని స్వీకరించినా, అతనిలో  సనాతన ధర్మం జ్వలిస్తున్నట్లుగా చూపుతాడు. వలసవాదం తీసుకొని వచ్చిన విధ్వంసాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. అందుకే తెలంగాణా గురించి రాసినా  ముస్లీంపాలన, ఉర్దూ విద్యల గురించి వ్యతిరేకంగా మాట్లడడు. ముస్లీం దాడుల వల్ల సంస్కృతికీ, ధర్మానికీ యేదో నష్టం జరిగిపోయిందన్న ఆవేశమూ కనపడదు. పైగా మన లోపాల వల్లే సంస్కృతికి ముప్పు అని ఆయన భావనలా కనిపిస్తుంది.

అరిపిరాలలోని శిథిల శివాలయము గురించి విశ్వనాథ యిలా వ్యాఖ్యానిస్తాడు.

“ముసల్మానులు ఆ దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక అపప్రధ యేమో. వీరే తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో ….” ( మ్రోయు తుమ్మెద ).

నిరాదరణ భావం, అభిమానంలేకపోవడం వల్లనే సంస్కృతికి వినాశనం జరుగుతుంది. కానీ బలవంతపు మతమార్పిడులు, దాడుల వల్ల కాదు.    వలసవాదం ఈ నిరాదరణ భావాన్ని పెంచుతోంది. అదే సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

హిందుస్థానీ సంగీత విద్వాంసుల గురించి మాట్లాడుతూ, బ్రాహ్మణులే రాజాశ్రయం కోసం ముస్లీంలుగా మారారని అంటాడు ( హిందూత్వవాది, సావర్కర్ లా వర్ణ వివక్ష ప్రసక్తి తీసుకరాడు, మతాంతరీకరణ సందర్భంలో ). అలా మతాంతరీకరణం పొందిన వారు అంతరాంతరాలలో స్థానిక దేవీ దేవతల భక్తులే. హిందుస్థానీ సంగీతంలో భక్తి,  కర్ణాట సంగీతంలో అధ్వైతం ప్రధానమంటాడు. హిందూస్థానీలో “భక్తి” ప్రధానం కావడానికి ఇస్లాం కారణామా అన్నది నా ప్రశ్న అనుకోండి.

జాషువా కూడా ఫిరదౌసీ,ముంతాజు మహలు లాంటి ముస్లీం జీవితాలని ఉదాత్తంగా చిత్రించే రచనలు చేసారు. విశ్వానాథలో, జాషువాలో, శ్రీపాదలో జాతి విద్వేషపు చాయలు కనపడవు. దానికి కారణం చారిత్రక నిర్లిప్తతే.

భారతదేశానికి చరిత్ర లేకపోవడం గురించి ఆధునికులు అందరూ బెంగపెట్టుకున్నారు. చరిత్ర అనేభావనలో స్పష్టమైన కాల విభజన, కాలానికి ఆది అంతాలు, పురోగతి అనే భావాలు వున్నాయి. కాలాన్ని స్వయం చలనంలో వున్నదిగా, అనంతమైనదిగా చూశారు ప్రాచీనులు. కానీ చరిత్ర రచనతో పాటూ చరిత్ర పురుషులూ, చారిత్రక శత్రువులూ పుట్టుకొచ్చారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు, “చరిత్ర బేలెన్స్ చేయబడింది” , అని వి. ఎన్. నైపాల్ ప్రకటించాడు. ఇలా చరిత్రని బేలెన్స్ చేయడం, చారిత్రక ప్రతీకారం లాంటి డైనమిక్ ఆలోచనలు మొదలయ్యాయి.

శ్రీపాద, జాషువాలకి భిన్నంగా యింగ్లీషు చదువు చదివినప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ “చరిత్ర”ని నిరాకరించారు. పురాణాన్నీ, వాస్తవాన్నీ ఏకం చేసి పౌరాణిక వాస్తవికతని కల్పించారు.దీనికే విసుగుచెంది ఆర్.ఎస్ సుదర్శనం పురాణం, నవల వేరువేరు అని హెచ్చరించారు.

చరిత్ర గమనమనే దృక్పథాన్ని పక్కనపెట్టడంతో చరిత్ర భావనవల్ల వచ్చే టెన్షన్ విశ్వనాథకి లేకుండా పోయింది. అదే ధర్మారావులోని నిర్లిప్తత.

గురజాడ, సావర్కర్ లాంటివాళ్ళలోవున్న మతపర ఉద్వేగం లేకపోవడానికి యీ నిర్లప్తతే కారణం. లెఫ్ట్, రైట్ వర్గాలకి చరిత్రే చోదకశక్తి.   విశ్వనాథ సనాతనత్వంలో “ఉదాసీనో మహాబలః”. ఉదాసీనంగా ఉండేవాడే బలవంతుడు. అందుకే “వూరకే ప్రహించుటకు ప్రవహించడం” అనేది ధర్మారావు స్థితిగా వర్ణించబడింది( వేయిపడగలు).

అందువల్లనే హిందూమతాన్ని క్రైస్తవవిద్యార్థులు అవమానించినపుడూ ధర్మారావు ఉద్వేగానికి గురికాడు. విద్యార్థుల సమ్మెలో పాల్గోడు. సమ్మెని కొనసాగింఛవద్దని సలహా యిస్తాడు.ఇది స్వార్థంగా ఎస్కేపిజంగా కనపడింది ఆర్.ఎస్ సుదర్శనం గారికి. నిజానికి ధర్మారావులో ఎక్కువశాతం యీ నిర్లిప్తతా భావమే రాజ్యం చేస్తుంది ధార్మికవిషయాల్లో. ఇతర మతాల్ని ఢీకొనడం కనపడదు. క్రీస్తు గొప్పా, హరిశ్చంద్రుడు గొప్పా, విగ్రహారాధన వ్యతిరేకత లాంటి విషయాల్లో ప్రత్యక్షంగా యితరమతాల వారితో ఘర్షణకు దిగడు. తన అభిప్రాయం క్లుప్తంగా చెప్పి వూరుకుంటాడు

మొత్తం విశ్వనాథ స్వభావంలోనే యీ ఘర్షణ స్వభావం కనపడదు. కారణం అంతర్గతంగానే ధర్మానికి హాని జరుగుతుందనే భావన. బ్రాహ్మణుల పతనం వల్లే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి అంటాడు (వేయిపడగలు).  అంతర్గత శత్రువుల వల్లనే ప్రమాదం ఎక్కువ. పసరికని అమ్మకానికి పెట్టిన వాడు అంతర్గత శత్రువే. అందుకే ఆర్య సమాజం లాంటి ఆధునిక సంస్థల్ని కూడా విమర్శిస్తాడు. హైదరాబాదులోని కళాశాలలో హిందూ ముస్లీంలకి వేరువేరు ప్రార్థనా గదుల్ని ఏర్పాటు చేయడాన్ని విమర్శిస్తాడు విశ్వానాథ. ప్రార్థన అనే ఆచారం సనాతన ధర్మంలోలేదు అని ఆయన భావన. అలాగే ఆధునిక బాబా కల్ట్ లాంటి “కేషబ్జీ”నివ్యతిరేకిస్తాడు.ఇలా ఇతరుల్ని అనుకరిస్తూ తన ఉనికినే మరచిపోవడమే అసలు ప్రమాదం. అందుకే సంగీతంపై ముస్లీం ప్రభావాన్ని అంగీకరిస్తూనే స్వతంత్రమార్గంలో పయనిస్తే తాన్‍సేన్ గౌడీ లాగే ఆంధ్రీ అనేకొత్త మార్గం ఏర్పడేదని ’తుమ్మెద”తండ్రి అంటాడు ( మ్రోయు తుమ్మెద ).

విమర్శకులు ఆర్ ఎస్ సుదర్శనంగారిది చరిత్ర దృష్టి. అందుకే మార్పు ముఖ్యం అని భావిస్తారు. ఆమార్పు చారిత్రకోద్వేగంతో వుంటుంది. ఆధునిక అసమానత్వ పరిభాషలో వుంటుంది. యీ అసమానత్వ పరిభాష సమానత్వంలా భాషిస్తుంది. వ్యక్తివాదం అనేది చాలా ముఖ్యం. వ్యక్తిమార్పు, వ్యక్తి అభివృద్ధి,  వ్యక్తి పురోగతి, అనేవి యీదృష్టిలో ప్రదానమైనవి. నిర్లిప్తత పనికిరానిది. చర్య ప్రధానం. సుదర్శనం గారి దృష్టిలో ధర్మారావు ఏమిచేయాలి?  విద్యార్థులతో కలసి క్రైస్తవులని కళాశాల నుంచీ నెట్టి వెయ్యాలి. హిందూత్వవాదుల దృక్పథం అదే. యిప్పుడు నడుస్తున్న చరిత్ర అదే.

యిటువంటి దుందుడుకు దృక్పథాన్ని అమలు చేయడానికి ఆధునిక మర్యాదస్తుల పరిభాష అవసరం.

“భారతరాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేకత ద్వారాహరిజనులలో జాత్యాభిమానము పొటమరించి పాదుకొనిపోవడం జరిగింది. తద్వారా దేశంలో అహంకారమునకు వృద్ధియే గానీ క్షయము మాత్రం జరగలేదనే సంగతి స్పష్టమే”(సాహిత్యంలో దృక్పథాలు- ఆర్.ఎస్ సుదర్శనం ).

దళితుల్లో అహంకారంపెరిగిపోతోంది. దానికి కారణంప్రభుత్వంప్రసాదించిన ప్రత్యేకత.1968కిముందే సుదర్శనం గారు వ్యక్తం చేసిన భయం యిది. దళితులది పోరాడి సాధించుకున్న హక్కుకాదు. దయాధర్మ భిక్షంగా ప్రభుత్వం కల్పించిన ప్రత్యేకత. యిప్పుడు యూనివర్సిటిల్లో అగ్రవర్ణాల వాదం యిదే. దళితులకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి? ప్రతిభకి విలువలేకుండా పోవడానికి , నిమ్నకులాలకి తలపొగరు పెరగడానికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడమే కారణమంటారు హిందూవాదులు. దళితుల చైతన్యాన్ని జాత్యాభిమానం కులతత్వంగా, అహంకారంగా తలపొగరుగా చిత్రీకరిస్తారు.

ఆధునికులకీ, హిందూవాదులకీ వివక్షని కొనసాగించేందుకు వొక తటస్థ భాష అవసరం. అందులో కులం, వర్ణం లాంటి పదాలు కనపడకూడదు. యిలాంటి మేధావులు వివక్షాపూరితమైన సెక్యులర్ భాషని ఏర్పరచారు. అర్థిక సమానత్వ, ప్రతిభ, పోటీ, ఉమ్మడి సివిల్ కోడ్ లాంటి పదాలు సెక్యులర్ పదాలే. కానీ అవి సృష్టించే వివక్ష సూక్ష్మమైనదేకాక తీవ్రమైనది.

కానీ విశ్వనాథసత్యనారాయణ జాషువాపై వివక్షతో కూడిన వ్యాఖ్యానంచేసేడంటారు. ఆయన రచనల్లో కొన్ని చోట్ల వర్ణవివక్ష బహిరంగంగానే కనబడ్తుంది “ఒక్క క్రైస్తవకవి  ఉదిత మాధుర్య రస్కోతటంబగు శబ్ధమూది పలుకు” ,అనిజాషువని అతని మత అస్తిత్వంతో సహా గుర్తిస్తూ కీర్తించే ఉదారత్వం విశ్వనాథలో కనపడ్తుంది. ఈ విషయాన్ని బయటకు తెచ్చింది ప్రముఖ దళితకవి ఆచార్య యెండ్లూరి సుధాకర్.

శ్రీశ్రీ జాషువాని ద్వితీయ స్థాయి కవి అని అంటే మిగిలిన కమ్యునిష్టులు జాషువాని స్మరించనే లేదు. ఆర్ ఎస్ సుదర్శనం కూడా  మాలపల్లి గురించి మాట్లాడారు కానీ ఆ పల్లెలోని మహాకవి గురించి మాటాడలేదు. ఎందుకంటే దృష్టి సూక్ష్మవివక్షా భావంతో నిండినది. సంప్రదాయవాదుల్లో వివక్ష కేవలం సైద్ధాంతికమైనదిమాత్రమే. ఆధునికుల్లో అది రాజకీయ పరమైనది.

సంప్రదాయ సమాజాల్లో కులాలు కులసంస్కృతులు చాలా బహుళత్వంతో వైవిధ్యంతో కూడుకొనిఉండేవి. సాంకర్యం కూడా సాధ్యమయ్యేది. కానీబ్రిటీష్ ఆధునికత హిందూ అస్తిత్వాన్ని వర్గ కుల అస్తిత్వాలుగా స్థిరీకరించింది. లిఖిత పూర్వకం చేసింది. జనాభా గణన అదే పద్ధతిలో చేయడం కూడా యీ స్థిరీకరణకి కారణమైంది.

అందువల్లే విశ్వనాథ నవలలో కులాల గురించిన వర్ణనలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వేయిపడగలలో రామేశ్వరశాస్త్రి నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్ళి చేసుకుంటాడు. అనులోమ విలోమవివాహాల పేరుతో యిటువంటి వివాహాలని శాస్త్రాలు సమర్ధించాయి. అంతేకాదు, నాలుగవశతాబ్ధానికి చెందిన మీమాంస భాష్యకారుడు శబరుడు నాలుగు వర్ణాల స్త్రీలని వివాహం చేసుకున్నట్టుగా కథ ఉంది.  దీని ఆధారంగా విశ్వనాథ ఈ కల్పన చేసి ఉండవచ్చు. “మ్రోయుతుమ్మెద”లో బ్రాహ్మణ బాలుడిని పద్మశాలీ దంపతులు పెంచుతారు. కానీ బ్రాహ్మణుడిలాగే విడిగా పెంచుతారు. కానీ అతడు పెద్దయ్యాక పెంచిన తల్లితండ్రుల మీదప్రేమతో పద్మశాలీ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు. ఐనప్పటికీ శంకరాచార్యులు అతనిలో బ్రాహ్మణత్వం నిలచి ఉందని తీర్మానిస్తాడు. దాంతో ఉపనయనం చేసుకొని దేవీదీక్ష వహిస్తాడు. అతడే నవలా నాయకుడు “తుమ్మెద”.

ఇటువంటి విశ్వనాథ వర్ణనల్ని చూసి ఆర్ ఎస్ సుదర్శనం సందేహంలో పడిపోతారు. “వర్ణాంతర వివాహాలు నేటి వర్ణ విబేధ సమస్యకు పరిష్కారం సూచిస్తున్నాయంటారా? ఆ పరిష్కారం ఎంతమదికి నచ్చుతుంది ?” అని ప్రశ్నిస్తారు ఆర్ ఎస్ సుదర్శనం. విశ్వనాథని మార్పుకి అంగీకరించని చాందసుడిగా చిత్రించిన సుదర్శనం గారి ప్రశ్నలు యివి. కారణం ఏమిటంటే సంప్రదాయఙ్ఞుల కన్నా ఆధునికులు మూస దృష్టి కలవారు. ఆధునికత వైవిధ్యాన్ని వైరుధ్యంగా నిరాకరిస్తుంది.

యీ ఆధునిక దృష్టే భోగానికీ, యోగానికీ, శృంగారానికీ, అధ్వైత తత్వానికీ మధ్య విభజన రేఖలు గీస్తుంది. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లిలో మానసిక దైహిక బేధంలేని శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని చాటుతాడు. అక్కడ ఉన్నవని మెచ్చుకొన్న సుదర్శనం వేయిపడగలు నవలలోని రామేశ్వరశాస్తిని భోగే కానీ యోగి కాదని సులభంగా సూత్రీకరించేస్తారు. వలస ఆధునికత ఐహికానికీ, పారలౌకికానికీ మధ్య విభజన తెచ్చింది. శ్రీకృష్ణుడు దేవుడు కనుక ఆయన శృంగారం పవిత్రం. కానీ రామేశ్వర శాస్త్రి మనిషి అనేది సుదర్శనం అభిప్రాయం కావొచ్చు. యీ విభజన నుంచీ జనించిన ప్యూరిటన్ దృక్పథమే బలపడి హుస్సేన్ గీసిన దేవతల నగ్న చిత్రాలపై దాడికి హిందూవాదులని పురికొల్పింది.

వ్యక్తికీ వ్యవస్థకీ మధ్య కూడా విభజనరేఖ గీసి వ్యక్తిధర్మమే సనాతన ధర్మమని సూత్రీకరించడంతో ఆర్ ఎస్ సుదర్శనంగారి వక్రవలస ఆధునికదృష్టి పరిపూర్ణమౌతుంది. వ్యక్తి ధర్మం అనే పదం కానీ తత్వంకానీ భారతీయతత్వశాస్త్రంలో మచ్చుకైనా కానరావు. విశ్వమంతా భగవంతుని స్వరూపమైతే, జీవుడు భగవంతుని యొక్క సూక్ష్మరూపం ( పంచీకరణం-శంకరాచార్య). యిక్కడ వ్యక్తికీ, విశ్వానికీ ; ప్రకృతికీ, మనిషికీ సూక్ష్మ స్థూలానికీ మధ్య ఎడతెగని వైరుధ్యం లేదు. అది ఆధునికత సృష్టించింది.

అందుకే ప్రకృతితో  మనిషికి గల బంధాన్ని ’పసరిక” పాత్ర ద్వారా నిరూపిస్తారు విశ్వనాథ. మెట్టపొలాలు అంతరించి అన్నీ మాగాణులు కావడంవల్ల,  వ్యవసాయంలో తీవ్రమార్పుల వల్ల, ఆధునిక నాగరికత వల్ల జీవవైవిధ్యం నశించిపోవడంగురించి  చాలాముందుగా హెచ్చరించింది విశ్వనాథవారే. యీపని యితరులెవరూ యెందుకు చేయలేకపోయారు. కార్యాకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మితిమీరిన “రిడక్షనిజం” చోటుచేసుకోవడమే దానికి కారణం. ఆధునికత, సాంకేతికత, తీసుకవస్తున్న ప్రత్యక్ష సౌకర్యాలనీ, భోగాలనీ చూడగలిగారే కానీ పర్యవసానాలని గురించి ఆలోచించలేదు. అలా ఆలోచించడం చారిత్రకపురోగతి, కాల గమనాలని అడ్డుకోవడంగా భావించబడింది.

 

యిది నేటి ట్రంపు,మోడీ లాంటివాళ్ళప్రాగ్మాటీక్ దృక్పథానికి దారితీసింది. పర్యావరణ చట్టాలనీ, పర్యావరణ అనుకూల చర్యలనీ పూర్తిగా నిలిపివేసి అధిక ఉత్పత్తి లాభాలే పరమార్ధంగా భావించబడ్తోంది. యిటువంటి దృక్పథానికి ఏనాడో ఎదురీదాడు విశ్వనాథ. మార్క్సు, అంబేద్కర్‌లలోని మానవ కేంద్రకదృష్టీ పర్యావరణ సంక్షోభానికి కారణమౌతుందని అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే భావించాడు. సకలజీవులలోనూ  ప్రాణం, ఆత్మ వున్నాయనే భారతీయ సనాతన దృక్పథాన్ని  విశ్వనాథ నొక్కిచెప్పారువేయిపడగలలో.

అంతరించి పోతున్న జానపద కళలు, కల్లుని కబళిస్తున్న సారా, గ్రామాల్నిమింగేస్తున్న ధనస్వామ్యం ఆధునికత విశ్వరూపాన్ని వేయిపడగలులో చూపారు విశ్వనాథ. గోరటి వెంకన్నరాసిన “పల్లె కన్నీరు పెడుతుందో ’’ పాటకి పూర్వ రూపం “వేయిపడగలు”. ఆనవలలోని నిజాయితీ యేమిటంటే – బ్రాహ్మణుడినే ప్రధాన పాత్ర చేసి తన అస్తిత్వాన్ని మరుగుపరుచుకోకుండా సూటిగా ముందుకు రావడం.

ఆధునిక భ్రాహ్మణుడి  అనుసరిస్తూ ఆధునిక శూద్రుడు అవతరించాడు. వారిద్దరికీ వలస ఆధునిక దృక్పథంలో సంస్కృతి కనపడ్తుంది. సంప్రదాయం కనపడ్తుంది. నిజానికి సంస్కృతి సంప్రదాయాలు రూపాంతరం చెంది తమ మౌళిక భావనల్ని కోల్పోయాయన్న వాస్తవాన్నిమరుగు పరుస్తారు. తద్వారా ఆధునికతకి తిరుగులేని సమ్మతినికలుగ జేస్తారు.

సామ్రాజ్యవాదం భారతదేశంలో హిందూత్వరూపం సంతరించుకోవడానికి సుదీర్ఘ వలసచరిత్ర వుంది. అది అన్ని కులాల్లోకి చొచ్చుకపోవడానికి మేధావుల కృషి ఉంది. జర్మనిలో యాంటీ సెమిటిజాన్ని రూపొందించింది సంప్రదాయవాదులు కాదు. ప్రగతిశీలురు, సంస్కర్తలు అనుకున్నవాళ్ళే దానికి బీజాలు వేశారు.హెగెల్, మార్టిన్ లూథర్, గొథేలాంటి మేధావులు యాంటీసెమిటిజానికి బలం చేకూర్చారు( రైజ్ అండ్ ఫాలాఫ్ థర్డ్ రీక్- విలియం.ఎల్. షీరర్). యూదు పురుషుల్ని జర్మన్ స్త్రీలు వరించరాదని లవ్ జిహాద్ లాంటి సిద్ధాంతాల్ని ప్రవచించాడు గోథే. యీ విషయాన్ని హిట్లర్ స్వయంగా తన ఆత్మ కథలో స్మరించుకున్నాడు. మత సంస్కర్త మార్టిన్ లూథర్ యూధు వ్యతిరేకి, రైతు వ్యతిరేకి.  ప్రొటెస్టింటిజం ఆధునికతకి బీజం వేసింది మరి. ఫాసిస్టులకి సిద్ధాంతాలేమీ ఉండవు. ఆధునికత యొక్క విషమ పరిణామమే ఫాసిజం. భారతదేశంలోనైనా సంస్కర్తలూ, ప్రగతిశీలులే ఫాసిస్టు భాషని రూపొందించారు. యీ విషయం ఖాదర్ మొహిద్ధీన్ “పుట్టుమచ్చ” కవితద్వారా స్పష్టమైంది.

సాంస్కృతిక సాంకర్యంలేని స్వచ్చమైన గతాన్ని విశ్వనాథ స్థాపించలేదు. మ్లేచ్చ సంపర్కాన్ని కప్పిపుచ్చలేదు. పైగా దానివల్ల సంస్కృతి విచ్చిన్నమైపోయిందని ఆయన ఏనాడూ ప్రతిపాదించలేదు.

“తాన్‍సేన్ చనిపోయినాడు. ఆయనకి యిద్దరు కుమారులు కలరు. ఒకడు తురుష్కుడు, మరొకడు హిందువు. ఆయనకొక తురుష్క స్త్రీ భార్యగా కలదు. ఆమెయందలి సంతానము విలాస్ ఖాన్, పేరు హిందువు పేరే కానీ చివర ఖాన్ అనికలదు. తాన్‍సేన్ బ్రాహ్మణ  స్త్రీ యందలి సంతానము సూర్యసేనుడు. తాన్‍సేన్ యొక్క శవము తనదియనగా తనదియని వీరిర్వురూ వివదించుకొనిరి. ఈ వివాదము ఎవరు తీర్చవలెను?”

 

” తాన్‍సేన్ భ్రాహ్మణుడో, ముసల్మానో మాకు తెలియదు. ఆయన మహా గాయకుడు. మీరిద్దరూ సంగీతమును పాడుడు. శవములేచి సెభాషనవలయును. ఎవనిపాటకు తాన్‍సేన్ యొక్క శవము సెభాష్ అని మెచ్చుకొనునో శవము వానికిత్తుము”అనిరి. సూర్యసేనుడు పాడెను. శవము కదలలేదు. అప్పుడు విలాస్ ఖాన్ “తోడి” రాగము పాడెను. పాడునది “భైరవి”,  రాగము “తోడి”. ఇది చాలా కష్టమైన రాగము. నాటి నుండీ యీ రాగమునకు “విలాస్ ఖాన్ తోడీ రాగము”యన్న పేరు వచ్చెను. తాన్‍సేన్ శవము లేచి కూర్చుండి చేయి యాడించి వీడే నాకొడుకు యన్నదట (మోయు తుమ్మెద).

శవం నిజంగా లేస్తుందా, ఎవరు వారసుడో నిర్ధారిస్తుందా, యిది అసంబద్ధం అనికొందరు నాతో అన్నారు.ఆధునిక సంబద్ధత కంటే, యిటువంటి జానపద పౌరాణిక కథలే  సత్యాన్ని వెలుగులా ప్రసరిస్తాయి. భారతీయ సంగీత సాహిత్యాల్లో,  సంస్కృతిలో ముస్లీంల పాత్ర విడదీయరానిది. ముస్లీంలతో కలసినడచిన కాలాన్ని మరుగుపరచడానికి కానీ, దానిని దుర్మార్గమైనదిగా చిత్రీకరించడానికి గానీ విశ్వనాథ ప్రయత్నించలేదు అనేదిప్రధాన విషయం.

భారతీయ చరిత్ర చాలా విచిత్రమైనది. బాబ్రీ మసీదు విధ్వంసం చేయాలన్న మూకల్నీ, అధ్వానీ రథయాత్రనీ వ్యతిరేకించిన లాల్ దాస్ రామజన్మభూమి పూజారి. ఫలితంగా  ఆనాటి  అతిశూద్ర హిందూముఖ్యమంత్రి ఆయనను పూజారి పదవినుండీ తొలగించాడు. ఆయన్ని చంపేసారు. బాబ్రీమసీదుని కూల్చేసారు. బాబ్రీస్థలం కోసం హిందూవాదులతో పోటీపడ్డ దళితవాది ఉదిత్ రాజ్,  అది బుద్ధిస్టుల స్థలం అని అన్నారు. బౌద్ధారామాల్ని కూల్చి మసీదు కట్టారని కోర్టుకెక్కాడు. ఆ ఉద్యమంలో అంబేద్కర్ భార్య సవితా అంబేద్కర్ మద్ధతు పలికారు. తర్వాత ఉదిత్ రాజ్ బిజెపిలో చేరాడనుకోండి.

హిందూత్వం అన్నా,బౌద్ధం అన్నా, మరేమన్నా ఆధునికులందరిదీ వొకటే దృష్టీ. ముస్లీం పరిపాలనా కాలం చెడ్డది అని చెప్పడం ద్వారా వలస ఆధునికతకి సమ్మతిని సమకూర్చడం.  అందువల్ల లెఫ్ట్, రైట్, దళిత వాదం- అందరి దృక్పథాలూ వొకే రకమైన చారిత్రక దృష్టిలో ఏకమైతాయి. అవి వలస ఆధునికతకి, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి మద్ధతునిస్తాయి.

యిటువంటి దృష్టిని ఎదుర్కొన్న వారు చరిత్రకీ, కాలానికీ ఎదురీదిన వారే.   జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టూ యీ ఎదురీతని వెనుకబాటుతనంగా, సంప్రదాయవాదంగా ముద్రించడం సులభం. తద్వారా సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని బలపరచడమే జరుగుతుంది చివరికి.

*

మీ మాటలు

 1. నరహరి says:

  టిప్పు సుల్తాన్ గురించి నిజాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ లో చూడవచ్చు.
  RELIGIOUS INTOLERANCE OF TIPU SULTAN
  http://voiceofdharma.org/books/tipu/ch02.హెటం

  టిప్పు సుల్తాన్ లాంటి పరమ కర్కోటక మత దురహంకారి, దురాక్రమణదారుడిలో, హంతకుడిలో మహా మానవతావాదిని చూసిన జ్ఞానులను చదివినప్పుడు అబూబకర్ అల్ బగ్దాదీకి థింక్ ట్యాంక్ ఎవరో ఇప్పటికి అర్థమయింది. మాదే అసలైన ఇస్లాం అని ఐసిస్ కూడా అంటోంది.

 2. rani siva sankara sarma says:

  శృంగేరీ పీఠంపై దాడి చేసి దోపిడీ చేసిన బ్రాహ్మణుడు చిత్పవన బ్రాహ్మణుడే. ఆయన పేరు పీష్వా పరుశరామ భావూ. అప్పుడు శృంగేరీ మఠానికి రక్షణ కల్పించినదీ, తిరిగి సంపదనిచ్చినదీ టిప్పుసుల్తాన్. అందుకే 23వ శ్రుంగేరీ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి టిప్పుసుల్తాన్‍కి వ్యతిరేకంగా బ్రిటీష్ వారు రాసిన చరిత్రని ఖండించారు.

  • Srinvas uruputuri says:

   “అలా శంకరాచార్యులు స్థాపించిన శృంగేరీ మఠంపై దాడి చేసిన చరిత్ర కలిగిన వారే చిత్‍పవన బ్రాహ్మణులు. అందుకే హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ కుల నిర్మూలనని సమర్ధించాడు.”

   పై రెండు వాక్యాలకు సంబంధం ఏమిటో చప్పున తట్టలేదు. పైకెళ్ళి మళ్ళీ చదివితే “వీరు లౌకికులు. సంప్రదాయంతో వీరికి సంబంధం లేదు.” అన్న వాక్యం కనబడి “అందుకే” అన్న మాటకు “సంప్రదాయంతో సంబంధం లేనందున” అని అర్థం చేసుకున్నాను. కరెక్టేనా?

   అలా అన్వయించుకున్నా, మీరు చెప్పాలనుకున్నది కరెక్టు కాదేమో అనిపించింది. కాస్త వెదికి చూస్తే పీష్వాలకీ, శృంగేరి స్వాములకీ మంచి సంబంధాలున్న దాఖలాలు ఒకటి రెండైనా కనిపించాయి – నాసిక్ వద్ద శృంగేరి మఠం వారి శాఖను ఒకటి ఏర్పరచేందుకు పీష్వాలు భూమినిచ్చిన వైనం, జగద్గురువులను తరచుగా పుణే నగరానికి ఆహ్వానించి రాజ మర్యాదలు చేసిన విషయం…(http://www.sringeri.net/branches/maharashtra/nasik).

   శృంగేరిపై జరిగిన దాడి గురించి దొరికిన ఈ వ్యాసం ప్రకారం – The Sringeri episode was neither a policy nor a battle plan for the Marathas. It was carried out by those predatory troops and lamaans (a caste dealing with grain) who do not take part in an actual battle.

   దళితుల పట్ల సానుభూతీ – కుల నిర్మూలన పట్ల విమర్శా రెండూ మీలో సహవాసం ఎలా చేస్తాయా అని నాకు ఆశ్చర్యం.

   • rani siva sankara sarma says:

    శ్రీనివాస్ గారూ
    శృగేరి మఠం వారి మఠ చరిత్ర నుంచి నేను దాడి సమాచారాన్ని సేకరించాను. దీన్ని యింతకు ముందు నేను రాసిన ది లాస్ట్ బ్రహ్మిణ్ గ్రంధలో ప్రచురించాను కూడా. ఆసమాచారం యిది.
    క్రీస్తు శకం 1770 లోవికృతి వర్ష భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రీ సచ్చిదానంద భారతీ స్వామి వారు శ్రీ శృఎంగేరి మఠాధి పత్యాన్ని స్వీకరించారు.అయన 44 సంవత్సరములు క్రీస్తు శకం 1814 వరకు మఠ పరిపాలన కొనసాగించారు.క్రీస్తు శకం 1790 -92 లో మూడవ మైసూరు యుద్ధం జరుగుతున్నపుడు మహారాష్ట్ర సర్దారు పరశు రామ భావు మైసూరు రాజ్యభాగమైన భేద నూరు మీదికి దండెత్తి వచ్చాడు.అతని సేనాని పటవర్ధనుడు శ్రీ శృఎంగేరి మఠ సంపత్తిని దోచుకున్నాడు.శారద మందిరంలోని ఆభరణాలను అపహరించాడు.అరవై లక్షలరూపాయల నష్టం సంభవించింది.ఆసంఘర్షణలో పూజారులు మొదలగు వారిని హింసించారు.
    అది తెలిసి టిప్పు సుల్తాన్ సచ్చిదానంద భారతీ స్వామికి వుత్తరం రాస్తూ -‘గురువునకు అపకారం చేసిన వ్యక్తి నశించిపోవును. అతని కుటుంబము నశించును.’ అని రాసి మందిరం మరమ్మత్తులకు ,విగ్రహ సంప్రోక్షణాదులకు ధనమును పంపాడు.శత చండీ సహస్ర చండి జపహోమాదులను కూడా ఆచార్యుల ద్వారమున చేయించాడు.
    యింకా మఠ చరిత్రలో టిప్పు సుల్తాన్ భక్తిప్రపత్తులని తెలియజేసే విషయం మరొకటి ఉంది. ఆచార్య స్వామి దూరదేశం వెళ్లి చాలా కాలం గడిచి పొతే, టిప్పుసుల్తాన్ ధనమును , భృత్యులను, వాహనముల ను పంపితిరిగిరావలసినదని ప్రార్థించాడు .యిది మఠ చరిత్ర లోని విషయం.
    స్వయంగా శంకరాచార్యులు స్థాపించిన శృ గేరి మఠం వారు యిచ్చిన దాడి సమాచారాన్ని మనం ప్రమాణం గాభావించవచ్చు. అందువల్లనే కావచ్చు ; టిప్పు సుల్తాన్ మతోన్మాది అంటూ ,ముస్లింలకు పరమత ద్వేషం ఎక్కువ అంటూ చేసిన వ్యాఖ్యలని బ్రిటిష్ ప్రభువుల వక్రీకరణగా తేల్చేసారు శ్రీశ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారు .
    రాజకీయ కారణాలవల్ల ఒకసారి దానాలు చెయ్యడం, మరోసారి అవసరమైతే దాడి చెయ్యడం పీష్వాల పరమ రాజకీయ లౌకిక దృష్టిని తెలియజేస్తుంది. అటువంటి కమ్యూనిటీ నుంచి సకల ఆచార ధార్మిక విషయాలని తిరస్కరిస్తూ పాశ్చాత్య ఫాసిస్టు జాతీయతని భారతీయుల నెత్తి మీద రుద్దే సావర్కర్ జన్మిమ్చడం యాదృచ్చికం కాదు. అందువల్లనే విశ్వనాధ వారు కూడా స్వధర్మాభిమానం లేని వాళ్ళ వల్లే ఎక్కువ నష్టం సంభవిస్తుందని భావించారు.

 3. తుమ్మూరి రాంమోహన్ రావు says:

  చాలా రోజులకు ఒక సంతులనాత్మక,సంయమనశీల వ్యాసం చదివిన తృప్తి కలిగింది.”మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్ మె బైర్ రఖ్ నా “అన్నట్లు మానవతా విలువలకు కులమతాలకు అడ్డు కావనే విషయం ద్యోతకం అయ్యేలా విశ్వనాథ వివరణలను ఉటంకించడం బాగుంది.ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్ వలె పాశ్చాత్త్యసంస్కృతి మత్తులో మనదైన సంస్కృతిని చిన్న చూపు చూచిన వారే గొప్పవారుగా ఎలా ప్రశంసించబడ్డారో బాగా తెలియజెప్పారు.విశ్వనాథ నవలల్లో నన్ను బాగా ఆకట్టుకున్న నవల మ్రోయుతుమ్మెద.దానికి ఒక కారణం కథాస్థలం నా జన్మభూమి కావచ్చు.అది నవలను
  చదవడానికి ప్రేరణ కలిగించడం మట్టుకే.అందులోని కథానాయకుడు తుమ్మెదను( నారాయణరావును) ప్రత్యక్షంగా చూచి
  నప్పుడు కలిగిన అనుభూతికి పదాలు చాలవు.అది ఇక్కడ అప్రస్తుతమైనా అనివార్య స్మరణ.కవిసామ్రాట్ భావనా విరాడ్రూపం అందులో కనిపిస్తుంది.అది పక్కకు పెడితే అనేక విషయాలను కూలంకషంగా చర్చించి ప్రస్తుత ఆలోచనా ధోరణుల వైపరీత్యాలను నిష్కర్షగా చర్చించారు.ఎంతో రాయాలన్న తపన కలిగే విధంగా రాసినందులకు అభినందనలు.

 4. rani siva sankara sarma says:

  నారాయణ రావు గారిని ప్రత్యక్షంగా చూసిన అదృష్ట వంతులు మీరు రామ్ మోహన్ రావు గారూ. మ్రోయుతుమ్మెద నవల ద్వారా ప్రత్యక్షరం గా మేమూ చూడగలిగాము

 5. ‘మ్రోయు తుమ్మెద’ చదవాలని అనిపిస్తోందండీ. ‘వేయిపడగలు’ చిన్నప్పుడు చదివినప్పుడు పసరికే నా హీరో. ఆ మార్మికత ఎంతగా చుట్టేసేదో… నిజమే. సంస్కృతితో పాటు పర్యావరణ సంస్కృతిగురించి కూడా రాసినవాళ్ళు అతి తక్కువేనేమో!

  విశ్వనాథ ముసల్మాన్ను ముసల్మాన్ అనీ క్రిస్టియన్ను క్రిస్టియన్ అనీ సహజంగా రాస్తూపోయేవాడు కదా జాషువాను క్రిస్టియన్ అనటంలో విపరీతం ఏముంది? ఇక్కడ మన ఆధునికవాదాన్ని ఆయనకు అప్లై చేయటంతప్ప? ఆయన మతం ఐడెంటిటీతో సహా మనుషుల ఔన్నత్యాలను గుర్తించే మనిషే కదా?

  నాకో డౌట్. ఆధునికత ప్రభావంతో ఎవరి సంస్కృతిని వాళ్ళే ధ్వంసం చేసుకుంటారన్నదానితో మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ దాడుల ప్రభావం అంతో కొంతో ఉండదా? కొన్ని రకాల సంస్కృతులు దాడులతో సమూలంగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదంటారా? ముఖ్యంగా యజిదీ లాంటి జాతుల మొత్తానికే ముప్పు వచ్చింది కదా ఇసిస్ దాడులతో! ఆఫ్ఘన్ తెగల భవిష్యత్ ఏమిటి? బమియాన్ బుద్ధ విగ్రహాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి కదా? క్రిస్టియన్ మార్పిడులు, దాడులతో మూల జాతులు అమెరికాలో నశించాయి నిజమే. మధ్యయుగాలు దాటాక క్రిస్టియన్ మతం చేసిన దాడి నాజూకుదైతే ముసల్మాన్ పధ్ధతి ఇప్పటికీ మొరటుగా అనిపిస్తుంది. ఇసిస్ తరహా ఉగ్రవాదాన్ని మీరెలా నిర్వచిస్తారు? అది అణగదొక్కబడిన జాతి చేస్తున్న పోరాటం కాదుగదా!

  ఔరంగజేబ్ కాలంలో హిందుస్తానీ సంగీతం పూర్తిగా పడుకుంది. పాడటం మానేసిన సంగీతకారులకి పెన్షన్ ఇస్తాననేవాడట. ఆ కాలంలో వాళ్ళు ఏవో పుస్తకాలు మాత్రం రాసుకునేవారట. ఇదీ సమాధి చేసిన సంస్కృతిలోంచి మళ్ళీ మొక్కలు మొలిపించటం అంటే.. వాళ్ళకప్పుడు ఇంకేమీ తెలీదు గనక పుస్తకాలు రాశారు. ఇప్పుడైతే బతకటం కోసం మరో పని పట్టుకుంటారు. చేనేత ఆర్టిస్టుల పిల్లలు పొలంలో కూలీకి వెళ్లినట్టు…

  ఆదివాసీలకి ఇంకా కొన్నాళ్ళు సంస్కృతికోసం పోరాడే జవం, జీవం ఎక్కడో కొంచెం మిగిలుంది. కానీ ఎన్నోో అసహనాలూ వ్యక్తివాదాల మధ్య నిజమైన అంతర్జాతీయ మానవుడు, ఎదో ఓ చిహ్నంగా తప్పించి మిగలని తన సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఘనీభవిస్తున్న ఇన్నిమతాలమధ్య ఎలా బ్రతకాలన్నది అర్థంకాకుండా పోతోంది. కేవలం ఉదాసీనో మహాబలః అనుకుంటే సరిపోతుందా ఇప్పుడు? అందుకే అందరూ ఎసెన్షియల్ ఆయిల్స్ లేకుండా ఉత్తి మసాజులు తెగ చేసేస్తున్నారు.

  అయితే పూజలూ లేకపోతే నేలమట్టం చేసెయ్యటాలూ అందరూ చేస్తున్న రోజుల్లో మంచి వ్యాసం.. అభినందనలు..

  • rani siva sankara sarma says:

   లలిత గారూ
   నేను ప్రధానంగా ఆధునిక దృష్టిలో ని పరిమితి గురించి రాసాను. మానవ ఆలోచనలోనూ, అతని జ్ఞానంలోనూ ఆధిపత్యం విడదీయరాని భాగంగా మారిపోయింది.అన్ని మతాలూ, సిద్దాంతాలూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఇతర సంస్కృతుల పై దాడికి తెగబడినవే. శ్రీలంకలో బౌద్ధం సంగతి ఏమిటి? తమిళుల భాష సంస్కృతులని నిర్ములించలేదా? బర్మాలో? పౌరహక్కుల నాయకులు కన్నబిరాన్ మీఅహింసాసిద్దాంతం ఏమైందంటే – బౌద్ధులకు పరిమితమని కుండ బద్దలు కొట్టారు శ్రీలంక బౌద్ధభిక్షువులు.అందువల్లనే అన్ని మతాలని నిర్ములించాలంటారు కొందరు రెడ్ లు .మరి స్టాలిన్ సంగతి? మావో సంగతి?
   అందువల్ల మనం సాపేక్షంగానే దేని గురించైనా మాట్లాడగలం. స్థలకాల సాపేక్షం గానే విశ్లేషించగలం. నేడు ముస్లింలు ఇస్లాం సామ్రాజ్య వాద విష క్రీడలో నిస్సహాయులైన పావులు.
   వర్తమానంలోనూ , చరిత్రలోను సాంస్కృతిక దాడులు అనేవి అనేకరకాలు. సంస్కృతి కూడా ఏకశిలా సదృశంకాదు. మన సంస్కృతి అనే మూసని ఊహించుకొని దాని మీద దాడి ఏదో జరిగిందని ఒకే మాటలో చెప్పెయ్యడం కుదరదు. మనం అనే పదానికే అర్థాలు మారుతూ వచ్చాయి.
   ఆధునిక దృష్టి లోని పరిమితులని, దాని వల్ల ఏర్పడే విద్వేష వాతావరణాన్ని స్పష్టం చేశాను. దాని హేతుబద్ధత నేతిబీరకాయ చందం అని స్పష్టం చేశాను.అందువల్ల అది ఎన్నుకొనే దుందుడుకు పరిష్కారాలు లోపభూయిష్టమైనవని చెప్పదలుచుకొన్నాను.
   జాషువాని క్రైస్తవ కవి అని మత అస్తిత్వాన్ని గుర్తిస్తూనే , మెచ్చుకోడంలో విశ్వనాధ నిజాయితీనే నేను చూసాను.

   • నరహరి says:

    ఇస్లాం ఉగ్రవాదాన్ని, దురాగతాలని సమర్థించడానికి విశ్వనాథను, శృంగేరీ మఠాన్ని వాడుకున్న తీరు అమిత హేయం.

    **నేడు ముస్లింలు ఇస్లాం సామ్రాజ్య వాద విష క్రీడలో నిస్సహాయులైన పావులు.**
    ముస్లింలు అందరూ సమానమే. ఐసిస్, అల్ ఖైదా, జైషే మహ్మద్; తాలిబాన్, సౌదీ అరేబియా సలాఫీ, అల్ షబాబ్, సిమి, తెహ్రీక్ ఎ తాలిబాన్, లష్యర్ ఇ ఒమర్; తెహ్రీక్ ఇ జఫ్రియా, ఇత్యాది మహా శాంతియుత, అమిత నిస్సహాయ ముస్లింలను నమర్థిస్తున్న, ఎంతో విజ్ఞత వున్న పై వ్యాఖ్యను చదివి దిమ్మెరపోయి, స్తంభీభూతులైపోయిన సారంగ పాఠకులకు ఒక మనవి.
    దయచేసి, ఈ పరిశీలనలను కూడా చదివండి. టిప్పు తనే స్వయంగా వ్రాసుకున్న 2000 లేఖలలో అతడి మతోన్మాదాన్ని కూడా చూడండి.

    William Kirkpatrick, “Selected Letters of Tipu Sultan”, 1811

    ఇస్లాం అంటే శాంతికి చిహ్నమైతే, దాని ధర్మశాస్త్రంతోని సింహభాగమంతా ఎందుకని విద్వేష, అమానుష, దౌర్జన్య యుద్ధాలలోనే మునిగిపోతుంది? – సుల్తాన్ షహీన్

    If Islam Means Peace, Why Is Much Of Its Theology Soaked In Hatred, Humiliation, Offensive War?
    By Sultan Shahin, New Age Islam
    http://www.newageislam.com/ijtihad,-rethinking-islam/sultan-shahin,-new-age-islam/if-islam-means-peace,-why-is-much-of-its-theology-soaked-in-hatred,-humiliation,-offensive-war?/d/108826

 6. మంచి పరిశీలన
  ….

 7. rani siva sankara sarma says:

  నేను శృగేరి శంకరాచార్య చంద్ర శేఖర భారతీ స్వామి, విశ్వనాధ సత్యనారారాయణ గారు, గుర్రం జాషువ వంటి పెద్దల మాటలనే ప్రమాణంగా తీసుకొని మాట్లాడుతాను అని సవినయంగా విన్నవించుకొనుచున్నాను. యితరులు కూడా ఆవిధంగానే తమ విశ్లేషణను కొన సాగిస్తే సంతోషిస్తానని తమ ఘనమునకు విజ్ఞాపన చేయుచున్నాను.
  ఇట్లు
  బుధ జన విధేయుడు
  రాణి శివ శంకర శర్మ

మీ మాటలు

*