డీహ్యూమనైజెషన్

Art: Satya Sufi

Art: Satya Sufi

 

 

‘కాసేపట్లో సంచలన ప్రకటన చేయనున్న మోడీ. వాచ్ మన్ కీ బాత్’ వాట్సప్ సందేశం. అప్పటికే ఆలస్యమైంది. హడావిడిగా టీవీ పెట్టేసరికి బ్రే కింగులకే బ్రేకింగ్ లాంటి న్యూస్. వెయ్యి, ఐదొందల నోట్లు చెల్లవంటూ ప్రకటన. టీవీ సౌండ్ విని వంటింట్లోంచి ఆమె కూడా వచ్చింది. లైన్ల వెంట ఇద్దరి కళ్లూ పరిగెడుతున్నాయి.

‘బ్యాంకుల్లో మార్చుకోవచ్చన్నాడుగా ఫరవాలేదు. బోలెడంత టైం కూడా ఇచ్చాడు’

‘మొన్ననే సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ హడావిడి.. ఇంతలోనే ఇదేంటి? యూపీ ఎన్నికలకు ఇంకా టైముందనుకుంటగా..

అయినా, నా దగ్గర ముప్పయ్యో, నలభయ్యో వున్నాయ్ అంతే’

‘ఫరవాలేదు, నా దగ్గర ఓ ఎనభై వరకూ వుంటాయి. ఈ నెల చాలామందికిచ్చేశాం కాబట్టి ఫరవాలేదు. ఎవరికైనా ఇవ్వడానికి తెచ్చినవి మీ దగ్గర వుంటే..’

‘వున్నాయి, కరెంట్ బిల్లు, స్కూలు ఫీజు కట్టడానికి, ఖర్చులకని డ్రా చేసినవి’

‘ఎన్నుంటాయి’

‘ఇరవై అయిదో, ముప్పయ్యో’

‘అన్ని వేలే’

‘మరి, ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే చార్జీలంటున్నారని.. ఒకేసారి డ్రా చేసుకొచ్చా. అయినా, అకౌంట్ లో వేసుకోవచ్చుగా..’

‘రేపా పని చూడండి, లేదంటే అన్నీ వేస్ట్ అయిపోతాయి’

‘నాల్రోజులవుతోంది, అవి డిపాజిట్ చేశారా’

‘లేదు, ఎక్కడ చూసినా బోలెడంతమంది జనం. బ్యాంకుల దగ్గరే కాదు, ఏటీఎంల దగ్గర కూడా భారీగా వున్నాయ్ లైన్లు. వచ్చిన డబ్బు వచ్చినట్టే అయిపోతోంది. పదిమందైనా తీసుకుంటున్నారో.. లేదో.. అయినా, అంత టైమిచ్చినా అందరికీ ఈ హడావిడేంటో’

‘బావుంది అందరూ మీలా నిమ్మకు నీరెత్తినట్టుంటారా? ఎవరి జాగ్రత్త వారిది’

‘సరేలే, రేపో, ఎల్లుండో డిపాజిట్ చేసి, ఓ నాలుగు వేలు ఎక్సేంజ్ చేసుకొస్తా. మన డబ్బులు ఎక్కడికి పోతాయ్.

అది సరేకానీ, మన సంగతేంటి?’

‘ఏం సంగతి?’

‘అదే..’

‘ఊ.. దానికేం లోటుండ కూడదు. పిల్లలు పడుకోవాలిగా’

‘వాళ్లు పడుకుని చాలా సేపయ్యింది’

‘సరే.. పదండి..

‘అపోజిషన్ వాళ్లు ఎందుకు గొడవ చేయట్లేదు. ఏదో బందూ అదీ అంటున్నారుగానీ, అంత సీరియస్ గా ఏమీ వున్నట్టు లేరు. పెద్దలంద రికీ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసి వుంటుంది. లేకపోతే ఈపాటికి అంతా గగ్గోలు పెట్టేవారు కాదా?’

‘ఇప్పుడా గొడవంతా ఎందుకు? ముందు మూడ్ లోకి వస్తే..’

‘వస్తా.. మీకెప్పుడూ ఒకటే గొడవ. కొంచెం లావైనట్టు అనిపిస్తు న్నానా? ఈ నైటీయే అలా వుందంటారా?’

‘చక్కనమ్మ చిక్కనా అందమే అని ఎవడో తెలివితక్కువ వాడు అనుంటాడు. లావైనా అందమేనని వాడికి తెలిసుండదు. నువ్వా నీవియా వదిలేసి లారెయల్ లాంటివేవైనా వాడచ్చొగా.. బావుంటుంది’.

‘వాడాలి.. ఫేషియల్ కూడా చేయించుకోవాలి. ఎప్పటికప్పుడే వాయిదా పడుతోందనుకుంటుంటే.. ఇప్పుడీ నోట్ల గొడవొకటి. వాళ్ల దగ్గర కార్డుందో లేదో.. కనుక్కోవాలి.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేనాఫీసుకెళ్లాక అమ్మ ఫోన్ చేసింది. నాన్న ఇచ్చినవాటిలోంచి మిగిలించుకున్నవి ఇరవై రెండు వేలున్నాయట. అందులో పదిహేడు వేలు మార్చాలట. పన్నెండో ఏమో వేలూ, మిగిలినవి ఐదొందళ్లూ..’

‘మళ్లీ నీ నోట్ల గొడవ మొదలెట్టావా? ఇలాయితే, మూడే మొస్తుంది. నా మొహం..’

‘సారీ, సారీ.. ఇక ఆ ఊసెత్తను లెండి. కాపురం మొదలెట్టి ఇరవై ఏళ్లు అవుతోంది. ఇంకా, మూడులూ.. నాలుగులూ అంటే ఎలా?’

‘ఉయ్యాలైనా.. జంపాలైనా..’

‘మధ్యలో ఇదొకటి. ఇంత రాత్రి ఫోన్లేమిటి?’

‘సార్.. పడుకున్నారా? నేను..’

‘లేదు సార్.. చెప్పండి’

‘మన కాలనీ చివర్లో పెద్ద కిరాణా కొట్టుంది కదా. దాని వెనుకున్న ఏటీఎమ్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడే లోడ్ చేయడానికి క్యాష్ వాళ్లు వచ్చారు.’

‘ఇప్పుడా.. సరే, అలాగే’

‘అలాగే కాదు, అప్పుడే మన వాళ్లంతా వచ్చేసి లైన్ కట్టేస్తున్నారు. తొందరగా రండి లేదంటే డబ్బులైపోతాయ్’

‘సరే.. సరే..’

‘..గారని, ఆయన. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తున్నారట. రమ్మంటున్నాడు’

‘మరి తొందరగా వెళ్లండి. ఓ రెండు వేలు వస్తే.. ఖర్చులకు పనుకొస్తాయి. ఇప్పటికే ఆటో వాడి దగ్గర్నించి అందరికీ అరువు పెడుతున్నా’.

‘సరేలే.. ముందు..’

‘కానివ్వండి మహానుభావా.. మీకు ఏ పని ముందో ఏది వెనుకో కూడా తెలీదు. చిన్నపిల్లాడిలా..’

‘..తృప్తిగా లేదు’

‘ఎందుకుంటుంది.. ప్రతిసారీ ఒకేలా వుంటుందా యేం? పోయి రండి ఏటీఎంకి. రేపెప్పుడో తీరుబాటుగా ఎంజాయ్ చేయొచ్చు. నేనక్కడికీ పోనూ, మీరూ ఎక్కడికీ పోరు. వెళ్లేప్పుడు స్వెట్టర్ గానీ, షాల్ గానీ తీసుకువెళ్లండి. టేబుల్ మీద అరటి పళ్లుంటాయి. రెండు తీసుకు వెళ్లండి. ఆయనకోటిచ్చి, మీరొకటి తినొచ్చు’.

‘వచ్చారా.. ఇప్పుడా రావడం. ఎంతసేపైంది నేను ఫోన్ చేసి. చూడండి లైన్ ఎలా పెరిగిపోయిందో. ఇంకా క్యాష్ లోడ్ చేస్తున్నారు కదాని సిగరెట్ వెలిగించుకొచ్చేసరికి.. అప్పుడే పదిమంది చేరారు. ఏం చేస్తాం వాళ్ల వెనకే నిలబడ్డా.

‘ఇది చూశారా, మా బావమరిది. వాళ్లింటి దగ్గర బ్యాంక్ లో మొన్న ఐదొందల నోట్లు ఎక్సేంజ్ చేసుకుని రెండు వేల నోటు తీసు కున్నాడట. సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇదిలా సెల్ఫీలు తీసుకో డానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదట. రెండు వేలుకు చిల్లరిచ్చే వాడేడి. ఈ కలరూ అదీ కూడా చూశారూ, పిల్లలు ఆడుకునే బ్యాంక్ గేమ్ లోని నోటులా వుంది’.

‘అదేంటి.. గొడవ. హలో.. మాష్టారూ.. ఏమైంది?’

‘ఏమో, ఏడెమినిదిమందికి క్యాష్ వచ్చినట్టుంది. తర్వాత నుంచి డబ్బులు రావడంలేదట. అసలు కారణమేంటో ఎవరికి తెలుసు. సాఫ్ట్ వేర్ ప్రాబ్లమో, ఏమో’

Kadha-Saranga-2-300x268

‘ఏమైంది, డబ్బులొచ్చాయా?’

‘అంటే.. నా ముందు వరకూ వచ్చాయి. ఇంతలో..’

‘మీ వల్ల ఏ పనీ కాదు, ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లుంటే..’

‘ఆయనకీ దొరకలేదు’

‘దొందూ దొందేనన్నమాట. ఖర్మ.. పోయి పడుకోండి… తృప్తిగా’

కిడ్డీ బ్యాంకులు ఓపెన్ చేసిందామె.

‘మన పిల్లలు బాగానే దాచారు. ఈ కాయిన్స్ అన్నీ కలిపితే నాలుగువేలైనా వుంటాయి. ఇవన్నీ నేను లెక్కబెట్టా.. పద్దెమిదొందలు న్నాయి. మిగిలినవి మీరు లెక్కబెట్టి చూడండి. నోట్లు ఇచ్చేట్టయితే ఏ షాపువాడికో ఇచ్చి తీసుకురండి. లేదంటే, ఓ కవర్ లో ఈ చిల్లర పోసు కుని పోతా. ఆటోవాడికీ, కూరలవాడికీ కూడా చిల్లరే ఇస్తా’.

‘అంత చిల్లరేం మోసుకుపోతావులే. నోట్లు తీసుకొస్తా’.

ఇంతలో అమ్మ వచ్చింది.

‘అయితే, ఆఖరుకు పిల్లల డబ్బులకి రెక్కలొచ్చాయన్నమాట’

‘ఆఁ లేకపోతే చిల్లరెక్కడ దొరుకుతోంది గనుక. పిల్లలకేమైనా సంపాదన ఏడిసిందా? మీ అబ్బాయో, నేనో ఇచ్చినవేగా ఇవన్నీ..’

‘అన్నట్టు చెప్పడం మరిచిపోయారా, ఇక్కడ దింపినప్పుడు నీ తమ్ముడు ఓ వెయ్యి చేతిలో పెట్టాడు. ఏమైనా కోనుక్కో అమ్మా అని. ఆ మధ్యెప్పుడో ఓ అయిదొందలు మార్చి యాపిల్స్ కొనుక్కున్నా. ఇంకో అయిదొందల నోటుండిపోయింది. నీవాటితోపాటు ఇది కూడా మార్చి పెడుదూ’.

‘ఇవాళ అసలు కుదరదు. ఆఫీసులో బిజీ. ప్రతి వాడూ ఏటీఎమ్ కు వెళ్లాలనీ, బ్యాంకుకు వెళ్లాలనీ తిరుగుతున్నారు. ఎక్కడ పని అక్కడే వుంటోంది. ఇక నేను కూడా తిరుగుతూ కూర్చుంటే.. రేపు మొహం వాచేట్లు చివాట్లు తినాలి’.

‘అయినా, అందరికీ రెండు వేల కంటే ఎక్కువ ఎక్సేంజ్ చేయడం లేదు. నువ్వే కాస్త ఓపిక చేసుకో.. అది ఆఫీసుకు వెళ్లేప్పుడు బ్యాంక్ దగ్గర దింపేస్తుంది. నీ దగ్గర ఒకటే వుందన్నావుగా, ఆమె దగ్గర నుంచి ఇంకో మూడు నోట్లు తీసుకో. ఎంత లేటైనా టూ, త్రీ అవర్స్ కంటే ఎక్కవ పట్టదు. భోజనం టైముకు ఇంటికి వచ్చేయొచ్చు. కాస్త లేటైనా నువ్వేం హైరాన పడకు. ఏదో పనుందని ఆమె సాయంత్రం పెందరాలే వస్తోంది. రాత్రికి వంట సంగతి చూసుకుంటుంది. సరేనా..’.

పెద్దావిడ లైన్ లో నుంచుంది. మాటలు కలిశాయి. ఎవరో చెబుతున్నారు.

‘అసలు మన వాడిది హనుమంతుడి అంశ అటండీ. ఆయన ఎలాగైనా ఒక్కడే లంక దహనం చేసుకుని చక్కగా తిరిగొచ్చేశాడో, ఈయన కూడా దగ్గరుండి మన సైనికులను ఆ దేశం మీదకు పంపి.. ఆ పళంగా అక్కడున్న వెధవలందరినీ చంపిచేసి.. మన వాళ్ల మీద ఈగ కూడా వాలకుండా దేశంలోకి వచ్చేసేలా చేశాడట’.

‘టీవీలో ఎవరో పెద్దాయన చెబుతుంటే నేను కూడా విన్నాలెండి’.

వీరిలా మాటల్లో ఉండగానే హడావిడి మొదలైంది.

‘రెండు వేల నోటుకు చిల్లర దొరకడం లేదు. ఐదొందల నోట్లు వచ్చాయని టీవీల్లో చెబుతున్నా ఎందుకివ్వడం లేదం’టూ గొడవ. కమీషన్ల బ్యాంకువాళ్లు కక్కుర్తి పడుతున్నారని అరుపులు. పోలీసులు కూడా వచ్చారు. కర్రలకు పని చెప్పారు.

‘ఏమో అనుకున్నాం కానండి.. మొత్తానికి మొండిఘటం అని నిరూపించుకున్నారు మీ అమ్మగారు. నేనొచ్చే సరికి విజయగర్వంతో రెండు వేల నోటు పట్టుకునొచ్చారు. బ్యాంకు దగ్గర చాలా గొడవైందట. బాగా తోసుకున్నారట. ఈవిడ కిందపడితే.. అక్కడి వాళ్లు గబుక్కున లేపి నిలబెట్టారట. ‘లేకపోతే, ఈపాటికీ నన్ను పీచుపీచుగా తొక్కేసుందురే’ అన్నారు. ఆయాసంగా వుందంటే సరేని, కాసేపు నడుం వాల్చమన్నా’.

‘రాత్రికి దొండకాయ కూర చేస్తున్నా. మార్కెట్లో చూశారా? కూరల ధరలన్నీ భలే తగ్గిపోయాయి. కొనేవాడే లేడు. ఇంతకుముందు ఏరుకోడానికి కూడా ఖాళీ వుండేది కాదు. ఇవాళైతే ప్రశాంతంగా వుంది. కుళ్లిపోతాయనుకున్నారో ఏమో చవగ్గా అమ్మేస్తున్నారు’

‘దొండకాయ కూరైతే మేం తినం. ఎప్పుడూ దొండకాయీ, వంకేయేనా? ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా’ -పిల్లల గోల.

‘వెరైటీగా అంటే ఏముంటుందర్రా.. టీవీల్లోనూ, యూట్యూబ్ ల్లోనూ చూసినవన్నీ చేయమంటే నా వల్ల కాదు’

‘రాత్రికి దొండకాయ కూర తినాలంటే ఓ షరతు.. ఇప్పుడు పానీపూరీ తిననియ్యాలి’.

‘కుదరదు.. ఇప్పుడు పారీపూరీలు, చాట్ లు తిని, రాత్రికి ఆకలేదని చేసిందంతా నాకు తలంటుతారు’

పిల్లలు కదా, వినలేదు. ఆమె సరే అంది.

‘కాకపోతే.. ఓ పని చేయండి. పానీ పూరీ బదులు సబ్ వేగానీ, పిజ్జాగానీ తెప్పించుకోండి. దొండకాయ కూర పొద్దన్న చేస్తా. ఇప్పటికి మేం పెద్దవాళ్లం ఏదో పచ్చడేసుకుని తింటాం’

‘అదేంటి.. ఇరవైకో, ముప్పయ్ కో అయిపోయేదానికి, ఏకంగా వందలు తగలేస్తున్నావ్’

‘నేనేం చేసినా మీకు తగలేసినట్టే వుంటుంది. వున్న చిల్లర కాస్తా, పానీపూరీ వాడి మొహాన కొడితే.. రేపేదైనా అవసరమొస్తే ఏం చేస్తారు’

‘ఓహో, సబ్ వే, పిజ్జాలు ఫ్రీగా వస్తాయన్నమాట. చిల్లర అవసరం లేకుండా’

‘మీ మట్టిబుర్రకు ఏదీ వెలిగి చావదు. వాటికైతే ఆన్ లైన్ లోనో, పేటీయంలోనో గీకొచ్చు. వందలు వందలు చిల్లర తెచ్చివ్వక్కర్లేదు’.

‘హోం డెలివరీ తెప్పించుకుంటూ కార్డెలా గీకుతావ్’

‘మీరు కాస్త ఆపుతారా, ఏదో పొరపాటున అన్నా. గీకకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తాం లేదంటే పేటీయమ్ లో ట్రాన్సఫర్ చేస్తాం.

‘మీరు నా మాటలకు ఈకలు పీకడం మాని, వెళ్లి ఏదో ఒకటి కొని.. ఆ రెండు వేలు మార్చుకురండి’.

‘ఏవండీ ఎక్కడున్నారు? చిల్లరలేకపోతే పీడా పోయే. తొందరగా ఇంటికి రండి. ఇక్కడ కొంపలంటుకున్నాయ్’

కొంపలంటుకోవడం వెనుక విషయమేంటో చెల్లెలికి చెప్పింది. సిటీలోనే వుండే చెల్లెలు ఉబర్ కట్టుకుని వాలింది. గంటన్నరకి ఈసురో మంటూ ఆయనొచ్చాడు.

‘చిల్లర కోసం అక్కడక్కడా తిరిగే సరికి పెట్రోల్ అయిపోయింది. బంక్ వాడు కూడా పోయించుకుంటే రెండు వేలకీ పోయించుకోవా ల్సిందే, చిల్లర లేదన్నాడు. నా బండిలో రెండు వేల పెట్రోల్ ఎక్కడ పడుతుంది. క్రెడిట్ పని చేయలేదు. డెబిట్ కార్డు గీకితే.. నెట్ వర్క్ లు బిజీ కదా, ఓటీపీ రాదు. చివరకెలాగో పని కానిచ్చేసరికి ఈ టైమ్ అయింది’.

‘ఇప్పుడు మిమ్మల్ని ఆ వివరాలన్నీ ఎవరడిగారు. తొందరగా ఇటు రండి. మీ అమ్మగారికి ఏం బాగున్నట్టు లేదు. ఓసారి డాక్టర్ కు ఫోన్ చేయండి’.

‘ఏమైంది’

‘ముందు ఫోన్ చేయమన్నానా’

‘ఇందాక చపాతీలు చేసుకుని, మీ అమ్మగారికి ఇష్టం కదాని చింతకాయ పచ్చడిలో పోపు పెట్టి.. వేసుకుని వెళ్లా. అత్తయ్యగారు టిఫిన్ అంటే.. ఓ ఉలుకూ లేదూ, పలుకూ లేదు. నాకెందుకో భయమేసి దానికి ఫోన్ చేశా. ఇద్దరం పిలిచాం, కానీ, పెద్దావిడలో కదలికే లేదు’

డాక్టర్ వచ్చాడు

‘మధ్యాహ్నం అంతా బ్యాంక్ దగ్గర లైన్ లో నిలబడింది. ఇంటికొచ్చినప్పుడు బానే వుందట. కాస్త ఆయాసం వస్తోందని పడుకుంది. తీరా సాయంత్రం చూసే సరికి..

డాక్టర్ కు ఆయన వివరించాడు. డాక్టర్ కు అర్థమయ్యింది. పెద్దావిడ వెళ్లిపోయిందని తేల్చేశాడు.

ఆడవాళ్లిద్దరిలోనూ దు:ఖం పెల్లుబికింది. బిగ్గరగానే ఏడ్చారు. అంతలోనే పక్క ఫ్లాట్లవారికి వినపడకుండా సర్దుకున్నారు. మెయిన్ డోర్ దగ్గరగా వేసి పెద్దావిడని గదిలోంచి హాలులోకి మార్చారు. కావాల్సిన వాళ్లందరికీ ఫోన్ లు వెళుతున్నాయ్.

‘ఏదో హార్టేటాక్ అని చెప్పండి. అంతేగానీ, బ్యాంక్ దగ్గర నిలబడిం దనీ, కిందపడిందనీ అందరికీ చెప్పకండి. ఆర్చేవాళ్లు, తీర్చేవాళ్లు లేరు గానీ.. ప్రతి ఒక్కళ్లూ నన్నాడిపోసుకుంటారు.

‘మీకే చెబుతున్నా.. అర్థమయ్యిందా’

అయ్యిందన్నట్టు ఆయన తలూపాడు. పెద్దల ఏడుపు చూసి కాసేపు ఏడ్చిన పిల్లలు గప్ చిప్ గా బెడ్ రూంలో దూరారు. బంధు వుల పరామర్శలకు సమాధానాలు చెబుతూ ఆయన సోఫాలోనే ఒరిగాడు.

‘ఏమే.. పడుకున్నావా?’

‘లేదు, ఆవిడని అక్కడ పెట్టుకుని ఎలా నిద్ర పడుతుంది. పాపం ఆవిడని పంపకుండా వుంటే బావుండేది. ఇంకో నాలుగేళ్లు హాయిగా గడిపేసేది’

‘పాపం సంగతి అలా వుంచు. నీ దగ్గర బంగారం ఏపాటి వుంది’

‘నీకు తెలియని బంగారం నా దగ్గర ఏముందే’

‘లేదులేగానీ, ఇప్పుడు బంగారం మీద కన్నేసారట. అరకేజీ కంటే ఎక్కువుంటే రశీదులవీ చూపించి, టాక్కులు కట్టాలిట’

‘మన దగ్గర అంతెందుకుంటుందే’

‘ఎంతుందో ఎప్పుడు చూశాం. ధన త్రయోదశినీ, ధంతేరాస్ అనీ, దీపావళనీ, శ్రావణ శుక్రవారం అనీ, ఇంకేదో అనీ.. అంత పిసరో, ఇంత పిసరో కొంటూనే వుంటాంగా… మనకీ ఆడపిల్లలున్నారు కాబట్టి’

‘అవుననుకో అంతా కలుపుకుంటే ఎంతవుతుందే, మహా అయితే..’

‘అన్నీ పక్కనబెట్టు. ఇప్పుడున్నది రేపెప్పుడైనా మళ్లీ కొనుక్కోమా? వాళ్లెప్పుడొచ్చి అడుగుతారో లెక్కలు.. ఎవరు చూడొచ్చారు. తక్కెడులూ, తాళ్లు పట్టుకొచ్చి అంతుంది, ఇంతుంది.. కక్కమంటే ఏం చేస్తాం.

‘నువ్వేమో వెర్రిబాగుల దానివి.. బావగారేం పట్టనట్టే వుంటారు. అన్నానని అనుకోకు. ఇప్పుడో అవకాశం వచ్చింది కదాని..’

‘ఏంటది?’

‘వారసత్వంగా వచ్చినదానికి లెక్క చెప్పక్కర్లేదన్నారు. కాకపోతే వారసత్వంగా వచ్చిందని సాక్ష్యాలు కావాలి, అంతే’

‘అయితే..‘

‘ఏమీ లేదు.. మరోలా అనుకోకు, నీ దగ్గర వున్న పెద్ద నెక్లెస్, పదో పెళ్లిరోజుకు కొనుక్కున్నావ్ చూడు.. రాళ్ల గాజులు అవీ, ఇంకా ఒకటో రెండో గొలుసులు మీ అత్తగారి మెడలో కాసేపు అలా పెట్టి..

‘అలా భయపడి చస్తావేమే? నీ నగలు పెట్టగానే మీ అత్తగారు లేచి కూర్చుని, పట్టుకుపోతుందేమోనని భయమా?’

‘ఆయనేమంటారో అని..‘

‘ఏమీ అనరు, కావాలంటే నేను కూడా చెబుతాలే బావగారికి. ఆ నగలు వేసి ఆయన దగ్గరున్న సెల్ ఫోన్ తో ఫొటోలు తీసి జాగ్రత్త పెట్టమను. ఫొటోలు తీసిన వెంటనే నీ నగలు తీసి బీరువాలో పెట్టుకుందువుగాని. తెల్లారితే మళ్లీ అందరూ వచ్చేస్తారు’

‘ఆయనతో ఓ మాట అని చూస్తా..’

‘ఏమీ వద్దు, ముందు నీ నగలు బయటకు తియ్యి. కామ్ గా వెళ్లి గాజుల తొడుగు, నెక్లెస్ లూ అవీ అలా పెడితే చాలు. తర్వాత మీ ఆయన్నొచ్చి పనికానియ్య మందాం’

అనుకున్నంత పనీ చేశారిద్దరూ.

ఆయనొచ్చి అమ్మ వైపు చూశాడు.

ఆమె మృతదేహంలా లేదు, మహలక్ష్మిలా ఉంది.

*

మీ మాటలు

 1. మొత్తానికి ఈ డీహ్యూమనైజెషన్ కి మూడ్ వచ్చిందన్నమాట! “ఖర్మ.. పోయి పడుకోండి… తృప్తిగా”
  చి న

 2. డి హుమెనైజేషన్ – బాగుంది.

 3. D. Subrahmanyam says:

  చాలా బాగా రాసారు. నిజమే ఘనత వహించిన ప్రధానమంత్రి గారి అర్ధం లేని ఈ యోచన జనాన్ని ఎంత ఇబ్బంది పెడుతోందో బాగా చిత్రీకరించారు ఈ కధలో. భార్యతో శృంగానికి కూడా మోడీ గారు ఎలా అడ్డుపడుతున్నారో సరళం గ బాగా చెప్పారు. అలాగే తల్లి మరణం నుంచి కూడా బంగారం కోణం తీసుకువచ్చి ముగించిన పద్ధతి బావుంది. మంచి కదా దేశరాజు గారూ. అభినందనలు

 4. కె.కె. రామయ్య says:

  పెద్ద నోట్ల రద్దు వల్ల మధ్య, ఎగువ మధ్య తరగతి జీవితాల్లో కలిగిన ఇబ్బందులను డీహ్యూమనైజెషన్ గా రాసిన దేశరాజు గారికి అభినందనలు.

  బీదా బిక్కీ, గుడిసెవాసులు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, పొట్టచేత్తో పట్టుకుని నగరాలకు వెళ్లిన వలస కూలీలు, గ్రామీణప్రాంత సన్నకారు రైతులు, రైతు కూలీలు, లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ( టీ ఎస్టేట్ లు, కార్పెట్, గార్మెంట్ ఇండస్ట్రీలు ) ఈ దేశ సామాన్య మానవుడు పడుతున్నఇబ్బందులను … కాదు కాదు కడగండ్లను …. గురించి బమ్మిడి జగదీశ్వర రావు (బజరా) గారో, సీనియర్ కధా రచయిత గొరుసన్నో ( గజఈతరాలు కథ గొరుసు జగదీశ్వ రెడ్డి గారు ) మన మనసులు కకావికలం అయ్యేలా రాయగలండి; ఎప్పుడు రాస్తారో తెలీదు కానీ.

  పెద్ద నోట్ల రద్దు, నల్ల ధనం, అవినీతి నివారణ లాంటి ఉన్నతమైన ఆశయాల, ప్రభుత్వ పధకాల ” కొల్లేటరల్ డామేజి ” సామాన్య ప్రజలకు ఎక్కువగా తగలకుండా చూసుకోవాల్సిన బాద్యత నేతలది, ఫ్రభుత్వానిదీ ను.

 5. మాంఛి contemporary satire ! చప్పట్లు !

 6. ముగింపు అద్దిరింది… దేశరాజుగారూ.
  క్యూలో నిలబడి రెండువేలు నోటు సాధించిన ధీర వనిత అమర్ రహే.

 7. palamanerubalaji says:

  కొత్త కథ.బావుంది.దేశరాజు గారికి అభినందనలు-పలమనేరు బాలాజీ

 8. బాగుంది. సరదాగా ఉంది.నిజంగానే ఈ డిమోనిటైజేషన్ డిహ్యూమనైజేషన్ కి దారితీస్తుదేమో భయంగానే ఉంది.

 9. ఇంతకు ముందు రాసిన వ్యాఖ్య కనిపించట్లేదు. మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.

  మాంఛి contemporary satire ! – చప్పట్లు!!

 10. చొప్ప.వీరభధ్రప్ప says:

  ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాల్లో ఏం జరిగిందో కళ్ళకు కట్టారు.కొత్త రకంగావుంది .

 11. వ్యవస్థని వ్యతిరేకించే రచనలకి కలిగే స్పందన మరొకతీరులో రాదెందుకో ?
  కిరసనాయిలుకి,పంచదారకు,బియ్యానికి,గోధుమలకి,గోధుమ ఉత్పత్తులకు,టెలిఫోను కనెక్షనుకు,కారుకి,స్కూటరుకి రైలు టికెట్లకు ట్రెజరీలో చలానుకట్టడానికి ఫించేను డబ్బులుకి నిన్నటి తరం కట్టిన వరుసలు పడిన పాటల ముందర ఇవాళ్టి కష్టాలు సుఖాలు మరిగి కలిగిన సినిమాకష్టాలనిపించుకొంటే నా ఆలోచన తప్పైతే వరుసలలో ఉన్నవారు మన్నించాలి(నేను మీలో ఒకరినే అని గుర్తించాలి)
  వరుసల్లో ఉన్న మనందరం దేశమంతా ఒక్కసారిగా అవినీతి నల్లధనం గూర్చి మాట్లడే అవకాశం వచ్చినందుకు ఆనందించడం తప్పుకాదేమో
  ఇన్నాళ్లు ఇంట్లో పాముందని తెలిసి బతుకుతున్న మనం ఇంట పెద్ద పామని దాని కోరలు పీకడం ఇంత పెద్ద పని ఇంతకన్నా పెద్ద మార్గాలు వెతకాలేమో అని నిర్మాణాత్మక ఆలోచనలు రచనలు చేయడం మంచిదేమో ఆలోచించడం విజ్ఞులందరి బాధ్యతేమో కాస్త ఆలోచించ ప్రార్ధన

 12. బాగుంది రవి!
  ఒక సీరియస్ విషయాన్ని తేలిక చేశారేమో.
  ఇంతకీ ఒక ప్రహసనం ముగిసింది కాదు దేశంలో.
  మోదీయ ధనికులు తమ ఈ పగటి దోపిడీ సొమ్మును లెక్కబెట్టుకుంటూ ఉంటారు చీకటి గుహల్లో కూర్చుని.

 13. *ప్రహసం ముగిసింది కదూ దేశంలో

 14. పెద్ద నోట్ల రద్దు వల్ల మధ్య, ఎగువ మధ్య తరగతి జీవితాల్లో కలిగిన ఇబ్బందులను డీహ్యూమనైజెషన్ గా రాసిన దేశరాజు గారికి అభినందనలు.

మీ మాటలు

*