జ్ఞానానికి అడ్డుగోడ

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-7

 

sudrarsanamధర్మారావు ఊహాప్రపంచంలో అప్రత్యక్షానికి, అతీతజ్ఞానానికి, అవ్యక్తానికే ప్రముఖస్థానం. నేత్రాల కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకే ప్రాధాన్యం. అతని సిద్ధాంతాలు, సూత్రీకరణలు అన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే, ఎంతసేపూ ప్రత్యక్షం నుంచీ, వాస్తవికత నుంచీ దూర దూరంగా పయనించడమే.

ఒక చోట మడికి, పరిశుభ్రతకు మధ్య తేడాను ఇలా చెప్పుకొస్తాడు:

“పరిశుభ్రముగా నుండవలయును గాని, మడిలో ఏమున్నదనును. పరిశుభ్రముగా నుండుటలో మాత్రమేమున్నది?…ఏనాది వారు, కొందరు నీచజాతివారు అసహ్యమైన దేహములతో గుడ్డలతో తినుట లేదా? వారనాగరకులు, బుద్ధిమాలినవారు, నేను నాగరకుడను, నాకు పరిశుభ్రముగా నుండవలయు ననును. పరిశుభ్రముగా నుండుట నాగరకత యైనచో భోజనము చేయువేళ మడిబట్ట యని, దానితో నింకెవరిని తాకనని నియముగా నుండుట మరియు నాగరకత యేమో! మురికి యుండుట లేకపోవుటలలోని తారతమ్యము ప్రత్యక్షము; శుభ్రమైన వస్త్రమునకు, మడిబట్టకును గల తారతమ్య మప్రత్యక్షము. నీవు దేవుడున్నాడందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతునిచేత నూహింపబడునదియే మతము. అదియే దివ్యము. అది నీ సామాన్యజ్ఞానమును దాటి యుండును. సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము.”

ఇంకోచోట రచయిత ఇలా అంటాడు:

“అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనబడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.”

ఈ మాటలు సాహిత్య సందర్భానికి వర్తించేటట్టు ఉన్నా, రచయిత తాత్వికతకూ సమానంగా వర్తిస్తాయి.

ఏనాది వారు, అలాంటి ‘నీచజాతివారు’ ‘అసహ్యమైన దేహాలతో గుడ్డల’తో తినడానికి కారణమైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ధర్మారావుకు అక్కర్లేదు. ఆ పరిస్థితులు మారితే వారూ పరిశుభ్రతకు మళ్ళవచ్చునన్న ఊహ అతనికి లేదు. ఆ ఊహ కలగడానికి అతనిలో పరిణామస్పృహే లేదు. ఆ స్పృహ ఉండడం అతని సిద్ధాంతాలకు భంగకరం కూడా. కనుక అతని దృష్టిలో తను విశ్వసించే చాతుర్వర్ణ్యవ్యవస్థలానే, నీచజాతులన్నవి కూడా ఒక స్థిరసత్యం. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవలసిందే. ఎందుకంటే, కొన్ని ‘నీచజాతులు’ ఉండడంలోనే వర్ణవ్యవస్థ ఉనికి కూడా ఉంటుంది. అవి పరస్పర ఆధారితాలు.  ఈ ‘నీచజాతు’ల విషయాన్ని పట్టించుకోని ధర్మారావు, పరిశుభ్రత గురించి వాదించే ‘నాగరకుల’తో పోటీపడి, మడిబట్ట కట్టుకోవడం అంతకంటే నాగరకం అంటాడు. ఆపైన శుభ్రతకు, మడికి తారతమ్యం అప్రత్యక్షం, అంటే కంటికి కనిపించదంటాడు. మడితోపాటు అప్రత్యక్షాలైన దేవుణ్ణీ, మతాన్నీ కూడా తీసుకొచ్చి అవి దివ్యాలంటాడు. మతం కేవలం బుద్ధిమంతుని ఊహకు మాత్రమే అందుతుందని, సామాన్యజ్ఞానాన్ని దాటి ఉంటుందనీ అంటాడు. ఇలాంటి సద్విషయాలను ఆచరించకపోతే నీకే నష్టమని బెదిరిస్తాడు.

లోకం ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానాన్ని అనుసరించి నడుస్తుంది. అలాగని అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం లేదనీ అనాల్సిన అవసరం లేదు. అది వ్యక్తుల స్థాయిలో అనుభూతమయ్యే జ్ఞానం కావచ్చు. కానీ సాముదాయిక స్థాయిలో ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానానికే ప్రాధాన్యం.  ఈ జ్ఞానరంగాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, ఉపయోగకరంగా మలచుకుంటూ ఉన్నప్పుడే  ప్రపంచం అందరికీ సమానంగా వాసయోగ్యం అవుతుంది. ఎంత అసామాన్యజ్ఞానాన్నైనా సామాన్యీకరించి అధికసంఖ్యాకులకు అందుబాటులోకి తేకపోతే దానివల్ల లోకానికి ఉపయోగం ఉండదు.  ఒక పోలిక చెప్పుకుంటే, ఒకప్పుడు మహర్షులు దివ్యదృష్టితో ఎక్కడ ఏం జరుగుతోందో దర్శించేవారంటారు. అది నిజమో, కాదో మనకు తెలియదు. ఒకవేళ నిజమే అనుకున్నా ఆ దివ్యదృష్టి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. అదే శాస్త్రవిజ్ఞానానికి వస్తే, టెలివిజన్ రూపంలో అలా చూడగల అవకాశాన్ని అది సాముదాయికం చేసింది. ఇలా అప్రత్యక్ష అతీతజ్ఞానాన్ని సామాన్యీకరించి సాముదాయకం చేయాలన్న దృష్టి ధర్మారావులో కనిపించదు. శాస్త్రవిజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య విరోధాన్ని ఊహించుకుని శాస్త్రవిజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే గొప్పదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఇలా అంటాడు:

“సర్వశాస్త్రములు ఆదిహేతువును కాదు, తద్వికారములను గూర్చియే యుపన్యసించును. ఈ యీ పదార్థములయందీ ధర్మమున్నదని యుపన్యసించును గాని యా ధర్మమేల యున్నదో శాస్త్రము చెప్పలేదు. ఆకాశమునం దా నైల్య మేల కనిపించుచున్నది? వాయువో, జ్యోతిస్సో యేదో యొకానొక తరంగసమితి ప్రసరించుటవలన ఈ నీలవర్ణ మేర్పడుచున్నది. దానిని శాస్త్రజ్ఞులైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరి. దానికే ‘రామన్ గారి సిద్ధాంతమ’ని పేరు వచ్చినది. ఆ రీతిగా అట్టి తరంగప్రసారమువలన ఆ నీలవర్ణ మేల ఏర్పడవలయు నన్న ప్రశ్న కా మహానుభావు డేమి చెప్పును? అట్టి తరంగ ప్రసరణ మా నైర్మల్యమునకు హేతువనునది ధర్మము. ఆ శాస్త్రజ్ఞుడా ధర్మమును చూచెను. ఆయన చూడక ముందా ధర్మమున్నది. ఆ ధర్మము నిత్యమైనది. తన్నిత్యతా జ్ఞానముండుట కాస్తిక్యమని పేరు. చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము; యీ సర్వము తద్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి.

…ఆ ధర్మము శాస్త్రజ్ఞులు చెప్పిననే కానీ యితరులు విశ్వసించరట! ఆ శాస్త్రజ్ఞులనైనను, అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకొనవలయునట! వారును పదార్థవిజ్ఞానశాస్త్రవిషయోపన్యాసము లొప్పుకొందురట. ఆధ్యాత్మికవిజ్ఞానశాస్త్ర విషయములందు సందేహమేనట! భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమ నున్న మహాసముద్ర మెవ డుల్లంఘించగలడు?”

ఇలా అన్న ధర్మారావు,  మిగతా వానరవీరులెవరూ చేయలేని సముద్రోల్లంఘనను ఆంజనేయుడు ఒక్కడే చేయడాన్ని ఉదహరిస్తాడు. ఆంజనేయుడి సముద్రోల్లంఘనను మిగతావారు విశ్వసించారు కనుక సరిపోయింది కానీ, విశ్వసించకపోతే అతని బతుకేమయ్యేదంటాడు. ప్రతిదీ అందరి అనుభవంలోకి రావలసిందే నంటే, ఐన్ స్టీన్, రామన్, బోసు మొదలైనవారు చెప్పినవన్నీ అందరి అనుభవంలోకి వస్తున్నాయా, అయినా విశ్వసించడం లేదా అని ప్రశ్నిస్తాడు. “ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును…ఒకడు తర్కముచే చూచిన దొకడు విశ్వాసముచేత చూచును”: ఇదీ అంతిమంగా అతని నిర్ధారణ.

visanaa

దీనినిబట్టి ఏమర్థమవుతోంది? శాస్త్రవిజ్ఞానంతో సహా అన్ని రకాల జ్ఞానాలకూ ఆఖరి మెట్టు ఆధ్యాత్మికజ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమంటే, అప్రత్యక్షం, అవ్యక్తం, అతీతం! అది ఏ కొందరికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాని అసంఖ్యాకులు ఏం చేయాలంటే, తమకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన ఆ కొద్దిమందినీ నమ్మాలి! ఏ కొందరి అనుభవంలోకో వచ్చే ఆధ్యాత్మికజ్ఞానాన్ని అన్ని జ్ఞానాలకూ ఆఖరి మెట్టుగా నిలబెట్టి, ఆపైన తర్కాన్ని, ప్రశ్నల్ని నిషేధించి విశ్వాసాన్ని స్థాపించడమంటే ఏమిటి? జ్ఞానాన్వేషణకు హద్దులు గీయడమే! నువ్వెంతైనా జ్ఞానాన్వేషణ చేయి, అది అంతిమంగా విశ్వాసం దగ్గర ఆగిపోవాలి!

జ్ఞానంలోనూ ధర్మారావులో విభజన దృష్టే. శాస్త్రజ్ఞానమే అయినా, ఆధ్యాత్మికజ్ఞానమైనా జ్ఞానం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన సరళరేఖలాంటిదే. కానీ ధర్మారావు శాస్త్ర, ఆధ్యాత్మికజ్ఞానాలను పరస్పర సమాంతరాలుగా ఊహించుకుంటాడు. రెండింటి మధ్యా పోటీ పెడతాడు. ధర్మారావు చెప్పే ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా శాస్త్రవిజ్ఞానం పరీక్షకు పెడుతుంది తప్ప మొండిగా నిరాకరించదు. దేనినైనా మొండిగా నిరాకరించేది శాస్త్రవిజ్ఞానమే కాదు. కాకపోతే, ఏ జ్ఞానమైనా నిరూపణకు అందాలని చెబుతుంది. ఇందుకు భిన్నంగా  ఆధ్యాత్మికజ్ఞానం విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.  ఎప్పుడైతే విశ్వాసం అనే అడ్డుగోడను కట్టేశారో, ఆ తర్వాత ఇక జ్ఞాన విస్తరణా ఉండదు, వికాసమూ ఉండదు. ధర్మారావు ఊహల పర్యవసానం అలా ఉంటుంది.

శాస్త్రవిజ్ఞానం నిరూపణ మీద ఆధారపడుతుందన్న అవగాహన ధర్మారావులో లేదు. అందులోకి కూడా విశ్వాసాన్ని తీసుకొచ్చి, ‘శాస్త్రజ్ఞులు చెబితే కానీ నమ్మరట’ అని ఎత్తిపొడుస్తాడు. వాస్తవం ఏమిటంటే, ఐన్ స్టీన్, బోస్, రామన్ లాంటి శాస్త్రజ్ఞులు చెప్పారు కనుకే ఎవరూ గుడ్డిగా నమ్మడం లేదు. వారి సిద్ధాంతాలు, సూత్రాలు తాము అర్థం చేసుకోగలిగిన, నమ్మగలిగిన భౌతికప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నిరూపణకు అందుతున్న మేరకు నమ్ముతారు. అధ్యయనమూ, ప్రయోగమూ, నిరూపణా అనేవి శాస్త్రవిజ్ఞానరంగంలో నిరంతరం సాగుతూనే ఉంటాయి.

మనుషులను విశిష్టులుగా, సామాన్యులుగా విభజించే ప్రయత్నంలో రచయిత పశుపక్ష్యాదులను కూడా విభజిస్తాడు. అనసూయ(చిన్న అరుంధతి తల్లి, ధర్మారావు అత్త), ధర్మారావుల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అన:…యాథార్థ్య మతీతజ్ఞాన విషయము గాని యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెలు మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మా: ధర్మము కూడ నట్టిదే. అదియు మనసునకే తెలియును. మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యులీయరు.

ఎక్కువమంది చెప్పలేని, మనసుకు మాత్రమే తెలిసే యాథార్థ్యం అనే అతీత జ్ఞానంతో కానీ, ఏనుగుల గొప్పతనంతో కానీ అసంఖ్యాకులకు పనేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. సమస్య ఏమిటంటే, రచయిత నొక్కి చెప్పే అప్రత్యక్ష, అతీత జ్ఞానం కేవలం జ్ఞానస్థాయిలోనే ఉండిపోదు. బౌద్ధికజీవితంపైనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయజీవితంపై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకికమైన అన్ని రంగాలలోనూ విశిష్టత, సామాన్యత అనే తారతమ్యాలు ఏర్పడతాయి. విశిష్టత, సామాన్యతా సూత్రాన్ని రాజకీయ పరిపాలనారంగాలకు అన్వయిస్తే అది వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అనుశాసనం మాత్రమే చెల్లుబాటు అయ్యే రాచరికం అవుతుంది. అధికసంఖ్యాకుల ఆమోదం మీద సాగే ప్రజాస్వామ్యం దానికి పూర్తి భిన్నం.

రాచరికవ్యవస్థతో సంపూర్ణ తాదాత్మ్యాన్ని చాటుకున్న వేయిపడగల రచయిత, అధికసంఖ్యాకుల ఆమోదానుసారం నడిచే ప్రజాస్వామ్యాన్ని తృణీకరించిన సందర్భాలు అనేకచోట్ల కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమంటే వైవిధ్యాన్ని నిరాకరించడమే. ఆయన కసలు ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావమే అర్థం కాలేదు. “రాజును నా వంటి వాడే యని వీతిలో నిలుచుండి యనుము. ఏమగును? ఉరికి జానెడు బెత్తుడులో నుందువు” అని ధర్మారావు ఒకచోట అంటాడు.  ప్రజాస్వామ్యంలో ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిస్సంకోచంగా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులు. మంత్రులు వారి ప్రతినిధులు, సేవకులు మాత్రమే. రాచరికంలో ప్రభునింద తప్పైతే ప్రజాస్వామ్యంలో ప్రజానింద తప్పవుతుంది. రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రకారం సామాన్యులు, అసామాన్యుడి ముందు తమ అల్పత్వాన్ని అంగీకరించి అతని ఆధిపత్యానికి తలవంచాలి. అతడు ఏం చెబితే అది నమ్మాలి. ఈ నమ్మడం అనేది కేవలం అలౌకిక విషయాలకు మాత్రమే కాక, అన్ని లౌకిక విషయాలకూ వర్తిస్తుంది. సామాజికంగానే కాక సృష్టి సహజంగా కూడా మనుషుల సామర్ధ్యాలలో, ఆలోచనాసరళిలో, జీవన విధానాలలో, ఆహారపు అలవాట్లలో, విశ్వాస, అవిశ్వాసాలలో వైవిధ్యం ఉంటుంది. కానీ విశిష్టత- సామాన్యత అన్న విభజన సూత్రం ఆ వైవిధ్యాన్ని గుర్తించదు. తనదైన మూసలోకి అందరూ రావలసిందే నని శాసిస్తుంది. రానివాళ్లపై హింసను ప్రయోగిస్తుంది. గోరక్షణ పేరుతో గుజరాత్ లోని ఉనాలో దళితుల వీపులపై లాఠీల స్వైరవిహారం ఒకానొక ఉదాహరణ. విశ్వాసి కానివాడికి, ప్రశ్నించేవాడికి ఈ స్కీములో చోటు ఉండదు. అవిశ్వాసి నోరు ఎత్తడానికి వీలులేదు. నోరెత్తితే అతని జీవితం నరకమవుతుంది. భౌతికంగానే గల్లంతు అవుతుంది. అలనాటి చార్వాకుడి నుంచి, ఇటీవలి కల్బుర్గి, ధభోల్కర్ ల వరకు ఇందుకు అనేక ఉదాహరణలు.

ప్రజాస్వామ్యం రాచరికానికి పూర్తిగా తలకిందుల రూపం. ఇందులో అధికసంఖ్యాకుల మాటకే చెల్లుబాటు. అధికసంఖ్యాకులు ఆమోదించిన రాజ్యాంగం ప్రకారమే ఇందులో పరిపాలన సాగాలి తప్ప కొందరు రుద్దే విశ్వాసం ప్రకారం, కొందరి మనసులో ఉన్న ఊహల ప్రకారం; అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం ప్రకారం పరిపాలన సాగదు. జ్ఞానాన్ని అందరికీ అందనంత ఎత్తుకి తీసుకువెళ్లడం విశిష్టుల పాలనలో పద్ధతి. జ్ఞానాన్ని జనానికి అందే ఎత్తుకి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో అనుసరించవలసిన పద్ధతి. ప్రజాస్వామ్యం ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ ప్రశ్నించదు. సాముదాయిక ప్రయోజనాలనే ఉమ్మడి ప్రాతిపదికపై అది పనిచేస్తుంది. సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించనంతవరకు అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛనూ అడ్డుకోదు.

అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రజాజీవితంలోకి తీసుకొచ్చినప్పుడు జరిగే నష్టం బహుముఖంగా ఉంటుంది. అది పరిపాలనారంగంలో పారదర్శకతను హరిస్తుంది. భావోద్వేగ అంశాలను నినాదాల రూపంలో ముందుకు తెస్తుంది. పాలకుల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టించి వారిని దైవసమానులుగానే కాదు,  దైవాలుగా, మెసయ్యాలుగా మారుస్తుంది.  రకరకాల వైరుధ్యాలపై తెర కప్పి జనంలో అయోమయాన్ని సృష్టిస్తుంది. జనం నమ్మకాలను, బలహీనతలను, భావోద్వేగాలను అధికారానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటుంది.  ఆ ప్రయత్నంలో జనాన్ని బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హింసకు పాల్పడుతుంది.

పైన ఉదహరించిన  “సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము”  అన్న ధర్మారావు మాటలో ఉన్నది బెదిరింపు, బ్లాక్ మెయిలే. అప్రత్యక్ష, అతీత జ్ఞానాల పేరుతో విశ్వాసాన్నిజనం మీద రుద్దడంలోనే మాయలూ, మోసాలూ అడుగుపెడతాయి. ‘వేయిపడగ’ల కంటే చాలా ముందే వెలువడిన గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో సారాయి దుకాణం వెనక తోటలో బైరాగి, మునసబు సోమినాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రాందాసు, హెడ్ కానిస్టేబుల మధ్య జరిగే సంభాషణ ఇందుకు చక్కని నమూనా:

మునసబు: గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందు కడుగుతారు?

బైరాగి: మేం చేశే స్వర్ణం మేవే వాడుక చేస్తే తల పగిలిపోతుంది.

హెడ్: అవి వేరే రహస్యాలు. వూరుకొండి మావా! గురోజీ! హరిద్వారంలో చలి లావు గాబోలు?

బైరాగి: నరులక్కద్దు. మాబోటి సిద్ధులకు చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి?

హెడ్: ఆహా! అదృష్టవంటే సిద్ధుల్దే అదృష్టం.

మునసబు: గురూ, హరిద్దోరం నుంచి యెప్పుడు బైలెళ్ళారు?

బైరాగి: రెండు రోజులయింది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన పోతూవుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద ఆరునిలువుల లోతున మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని ప్రచ్ఛన్నంగా పోదావనుకుంటే యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు.

దుకాణదారు: చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ!…

మునసబు: సుక్కేసేవోళ్లని మా బాగా పోలుస్తావు! మా వూరమ్మోరు జగజ్జనని! మా చల్లని తల్లి.

ధర్మారావు చెప్పే అప్రత్యక్షాన్ని ప్రత్యక్షీకరిస్తే ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. తన నీడను చూసి తనే భయపడినట్టుగా, అప్రత్యక్షజ్ఞానాన్ని సృష్టించినవాడే దానిని నమ్మవలసీ, భయపడవలసీవస్తుంది. ‘కన్యాశుల్కం’ నుంచే ఇంకో సన్నివేశం. బ్రహ్మరాక్షసిని సీసాలో బంధించానంటూ పూజారి గవరయ్య, అతని తోడుదొంగ అసిరిగాడు లుబ్ధావధాన్లుతో ఒక ఆట ఆడుకుంటారు:

లుబ్ధావధాన్లు: బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు. మీ యింట్లో పెట్టించండి.

గవరయ్య: మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలు వచ్చి మళ్ళీ మీ యింట్లోనే వుంటాయి.

లుబ్ధా: అయితే సీసా భూస్థాపితం చెయ్యండి.

గవ: భూస్థాపితం మజాకా అనుకున్నారా యేవిటీ? భూస్తాపితం చెయ్యడానికి ఎంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి.

లుభ్దా: నా యిల్లు గుల్ల చెయ్యాలి.

(సశేషం)

మీ మాటలు

*