ఏడుపో, ఎతుకులాటో, యాతనో…!

screenshot_20161214-073853వాకిండ్లే వారగియ్యని  పల్లెల్నిర్సి మూసిన వాకిండ్లను తెర్సని టవున్లకు వలసొచ్చిన మట్టిమనుసులకు నాలుగ్గోడల మధ్యన బతుకు శానా ఇరుగ్గా అనిపిచ్చాది. అణువణువూ తెల్సిన ఊర్లో నుంచి అంగుళం గూడా తెలీని నగరంలోకి అడుగుపెట్టగానే మనసంతా అదోరకం ఎడారితనం ఆవహిచ్చాది. బెరీన ఆన్నుంచి తప్పిచ్చుకోని యాడికైనా పారిపోవాలనిపిచ్చాది. అట్లా ఆ ఇరుకుతనంలో నుంచి, ఆ ఉక్కిరిబిక్కిరి తనంలో నుంచి రోంతట్లా తలుపు తెర్సి సాగే సల్లని పల్లె ప్రయాణం ‘సగిలేటి కథల’ సంపుటి.

ఈ కథల్లోకి తవ్వుకుంటా పొతే ఒక్కోసాట ఒక్కో తడి తగులుతాంటాది.  అది ఏడుపో, ఎతుకలాటో, యాతనో, యాపమాను మీద ప్రేమో, సరసమో, చెతురో, ఆకలో, అమ్మతనమో ఏదో ఒకటి. కత కోనేటి ఊటై దప్పిక తీరుచ్చాది. ఏటిగట్ట్టై సేదతీరుచ్చాది. అట్లని అది ఎప్పుడూ సంబరమే గానక్కర్ల్యా. అప్పుడప్పుడు సన్నాసపకోళ్ళ తీరని ఆకలి కోరికల్ని మనకు రుచి సూపిచ్చి కళ్ళనిండా కన్నీళ్లను కుమ్మరిచ్చి పోతాది.( కురాక్కు సచ్చోటోన్నా…)

శాన్నాల్లకు అమ్మలేని ఊర్లో అడుగుపెట్టినప్పుడు , అప్పటికే మనసులో పూడ్చలేని అగాధం ఒకటుంటాది. ఆ ఎలితిలో ఊరు ఇదివరకు మాదిరి ఉండదు. మన మనసులోనే ఒక తెరప ఉంటే అవతల ఏదీ కూడా నిండుగా కాన్రాదు. ఏదో పేగుతెగి ఒక ఖాళీతనం మనలో సుడుల్దిరుగుతాంటాది. “ బస్టాండు దాట్తానే ఒక పెద్ద వొనుం ఉంటది. దాన్నిండా సెట్లుంటాయి. ఆ వనం సుట్టు సూచ్చి తెరపలు కనపద్తాంది. …రోడ్డుమీదికి కొమ్మలు సాపుకోని ఉన్నే శింతశెట్టు శేతులు కాళ్ళు పడిపోయిన మాదిరి కొమ్మలు తెగిపోయి దీనంగా సూచ్చాన్నెట్టు కనిపిచ్చ. “ రాతగాడు ఎదుటి ప్రాణిలో దూరిపోయి తనలో తొలిచే ఖాళీ తనాన్ని బూర్సుకునే ప్రయత్నమన్న మాట. ఆయప్ప ఆన్నే ఆగిపోడు. అట్లా ఇంగా శానా లోతుకు తవ్వుకుంటాడు.  ” దానితట్టు తేరిపార జూచ్చా “నన్ను గుడ్తు పట్నావా? ఎప్పుడూ నీ ఒళ్ళో ఆడుకుంటాంటి. మా యమ్మకాడ ఆడుకుంటాన్నట్టు. శింతశిగురు, పూత, పిల్ల శింతకాయలు, దోర శింతకాయలు, బొట్లు అన్నీ తెంపుకుని తింటాన్న గూడా ఏమి అనకపోతాండే(టివి)” మాయమ్మ మాదిరే. ఆయన్ని మతికొచ్చి ఉరుకుతాపోయి చెట్టును గట్టిగా కర్సుకోని ఎడుజామనుకుంటి, తమాయించుకోని అట్టనే నర్సుకుంటాపోతి.( ఎట్లపాయనో మాయమ్మ….)
 పదాలు ఇంత తడిగా కూడా ఉంటాయా  అనిపిచ్చాది. సెట్టును పట్టుకోని ఏర్సడమేంది పిచ్చిగాకపొతే, అనిపిచ్చాది. కానీ మనసులో ఉబికొచ్చే కన్నీటి ఊటను ఆ క్షణంలో బయటికి పారియ్యడానికి ఒక కాలవ గావాల. ఒక జీవం గావాల. చెహోవ్ కథ ‘బాధ’లో కొడుకు సచ్చిపోయినపుట్టుడు మనసులోని బాధను ఎల్లగక్కడానికి  జట్కా బండతను మనిసి దొరక్క ఆఖరికి తన గుర్రాన్ని పట్టుకుని ఏర్సడం గుర్తుకొచ్చాది. బాధ లోపల కాల్చేసేటప్పుడు ఎదురుగా ఉండేది మనిషే గానక్కర్ల్యా మండిపోడానికి. అది మానైనా పర్వాలేదు. మూగ జీవమైనా పర్వాలేదు.
kathana
 “మాయమ్మ  వెళ్ళి పోయినంక నా మనసు ఎట్ట శీకటయిందో అట్ట శీకటయింది. నేను హైదరాబాదు బస్సెక్కితే బస్సు గిద్దలూరు దావంబడి లైట్లు శీకటిని శీల్చుకుంటా పోతనాయి. లైట్ల ఎనక బస్సు, బస్సులో నేను, నా ఎనక శీకటి..ఆ శీకట్లో ఎనిక్కెనిక్కి పోతాన్నె మా ఊరు..”.
 పోలీసు స్టేషన్ కాడ యాపమాను కొట్టేసేటప్పుడు, ఆయప్ప గుండె రంపపు కోతకు గురైపోతాది. అధికారానికి తిరగబడి తగరారు పల్లేక మనసు మోనంగా ఎడుచ్చాది. మనసులోని ఆ అలజడే కండ్లపై తడిపొరై తచ్చాడతాది .

ఊర్లల్లో కొన్ని ‘గొప్ప’మాన్లుంటాయి . నిజంగా సెప్పాలంటే ఆ మాన్లను ఎవరు నాటింటారో, అయి ఎన్ని తరాల కిందటియో కూడా తెల్సుండదు. ఒక్కసారిగా ఆ మాన్లే గనకా కాన్రాకపోతే ఆడ శూన్యం సుడులు తిరుగుతాది. అంతా బోడిగుండు మాదిరి బోసిపోయినట్లుంటాది. కడుపులో తెడ్డు పెట్టి గెలికినట్లుంటాది. కూలిపోయిన ఆ మానుకింద పిల్లప్పుడు ఆడుకున్న్య గోలిగుండ్లాటలు, ఎండాకాలం సల్లని నీడను పరిసే ఆ మాను కొమ్మలు అన్నీ మతికోచ్చాయి.

 “తల్లిలాంటి సెట్టును నరుకుతాంటే ఇదేమన్యాయం అనడిగితే లోపలేశిరి( పోలీస్టేషన్ లో ). …బస్టాండుకు పోతా యాపసెట్టు తట్టు జూచ్చి. తుంటలు తుంటలు నరికి టేషన్ పక్కకు కువ్వ పోసిండ్రు. సెట్టు మొదలు తిట్టు జూచ్చి. ఎదిగి శేతికొచ్చిన కొడుకు సచ్చిపోతే రాగాలుదీసి ఏడుచ్చాన్న తల్లి మాదిరి అగుపిచ్చింది. కడుపులో ఎవురికీ సెప్పుకోలేని బాధ. …”( యాపశెట్టు).  ఇట్లా శానా దిగులు మోడాలు మనకు ఈ బుక్కులో ఎదురైతాయి. మన కండ్లల్ల ఇన్నిగనం కన్నీటి సినుకుల్ను రాల్చి పోతాయి. మనిషి కోసరం ఒక మనిషి పడే యంపర్లాట. ఇదో తవ్వులాట.
 ఊరంటే ఆడ ఒక్క మనిసే ఉండడు. మనిసితో పాటు ఎద్దులు ఎనుములు, కుక్కలు కోళ్ళు , సెట్లు శ్యామలు, వాగులు వంకలు, ఏర్లు బావులు ఇట్లా ఇయ్యన్నీ రోంతరోంతగా పెనేసుకొని ఉంటాయి. ఇయ్యన్నీ తడికెలో దబ్బలు గదా ఉన్నెట్లు ఒకదానికొకటి ఇడదీయరాకుండా అల్లుకోనుంటాయి. ఆ అమరికే ఊరైతాది. “ ఇట్టా చెతురు మాట్లాడుకుంతూమ్డగానే ఏరుదాటి మెయిన్ రోడ్డెక్కితిమి రోడ్డు మింద నుంచి మా ఊర్ని జూచ్చే నిద్దరపోడానికి ముందు తూగుతాన్న సిన్నపిల్లోని మాదిరున్నెది(సిన్నిగాడి సికారి ) . అది ఊరంటే.
“(ఊర్లో) బస్సు దిగుతానే తిర్నాల్లో దావ  తప్పోయి తల్లిని కనుక్కున్నా పిల్లోని మాదిరి అనిపిచ్చ ఎంకటేసుకు. ఊర్లో తెలిసిన వాళ్ళందరూ పలకరిచ్చాంటిరి. ఇంటిదావనర్సుకుంటా పోతాంటే ఊళ్ళో చెట్లు, పండ్లు, అంగళ్లు అన్ని నవ్వుతా పలకరిచ్చాన్నట్లుండె.” ( బతకలేక బాయిలోపడ్తే…) . ఆఖరుకు అట్లాంటి ఊర్లోనే బతుకు బండి వాటుపడి “తనకు సొర్గం సూపిచ్చాదన్న బూమిలోనే సొర్గస్తుడయిపోయిన” ఎంకటేసును తల్సుకుంటే కండ్లు సెమ్మగిలుతాయి.
నీళ్ళు ల్యాక, పనీబాటా ల్యాక బేకారుగా తిరిగే పిల్లోల్లు కూడా ఈ కథల్లో కనిపిచ్చారు. రాయలసీమలో పిల్సకుండానే పలికే కరువులు, ఎండిపోయిన సెరువులు, కడాకి “అమ్మకు కొత్త కోక కొనిపిచ్చే…” తాపత్రయంలో బతుకు బుగ్గిపాలు గావడం( నెత్తుటి మరకలు ), దిక్కులేని సుబ్బులు సచ్చిపోతే , బతికుండగా జరిగినయన్నీ మర్సిపోయి ఊర్లో తలా ఓ సెయ్యేసి  “…యాడ జేచ్చే ఏముందిలేండ్రా మంచి కులంలోనే పుట్టినట్లుంది. కాకపొతే కడుపాత్రం కోసరం ఇట్టయ్యింది గానీ, ఏ ఆడకూతురైనా ఇట్టాటి బతుకు బతకాలనుకుంటదా!” ( ఇంకుడు బతుకులు ) ఇట్లా ఈ కథలన్నీ మామూలోల్ల కథలే.
మట్టి మనుషుల కథలు సెప్పుకోవాలంటే భాషలో ఆ మట్టిమనుషుల మాట్లాడే యాసుండాల. పదాలకు షోకులు నేర్పకుండా సాదాసీదాగా , కట్టిర్సి పొయ్లో పెట్నేట్లుండాల. జానపద శైలి ఉండాల. రాయలసీమ యాసలో ఈ కథలు సదువుతాంటే “పొగలు వచ్చాన్న సంగటిని చేత్తో అట్టట్ట అదిమి తుంటలు తుంచి గోవాక్కారంలో పొల్లిచ్చి నోట్లో పెట్టుకుని( ఎంటిక )” మింగినట్లుంటాది. కారం కారంగా బలే కమ్మగుంటాది.
ఇప్పుడు రాయలసీమ తన ఉనికిని సాటుకోవాలంటే ఇట్లాంటి కథలు ఇంగా శానా రావాల. కరువు పేరిట ఎండి ఎడారై పోయిన పెన్నేటి గట్టు అసలు గుట్టు ఇప్పడానికి సీమ భాషలో, సీమ యాసలో, సీమ యాతనను పట్టి నిలిపే మరెన్నో కథలు రావాలి.
***

మీ మాటలు

 1. పలమనేరు బాలాజీ says:

  పుస్తకం ఒక్కోసారి పుస్తకాన్ని మించిన విలువతో వుంటుంది.అక్షర ఖనిజాలు శ్వాస లాంటి యాసతో మరింత పదునెక్కి మరింత విలువను సంపాదించుకుంటాయి.మంచి పరిచయం.శ్రీకాంత్ గారూ…

 2. పుస్తకం వెంటనే చదవాలనిపించేలా వుంది మీ రివ్యూ. థాంక్స్ శ్రీకాంత్ గారు

 3. Very good review Sreekanth. Hoping to read the book soon.

 4. కె.కె. రామయ్య says:

  బాతిక్ పెయింటింగ్స్ కు స్టేట్ అవార్డు పొందిన కళాకారుడు; గోరెటి వెంకన్న గారు లాంటి వారు మెచ్చిన జానపద గీతాల పాటగాడు; సీమ భాషలో, సీమ యాసలో, సీమ యాతనను చూపెట్టి ( నామిన అన్న, తిరుపతి జ్యోతి పేపర్ ఆర్ ఎం ఉమా ల మెప్పు పొందిన ) ‘బుడ్డగిత్త రంకి’ కధ కథకుడు; కడప ప్రాంతంలోని మారుమూల పల్లెటూరు దేవమాస పల్లెకు చెందిన పుట్టా పెంచల్దాస్ ను ఆదరాభిమానంతో చూసుకుంటున్న … శ్రీకాంత్ కి … ‘సగిలేటి కథల’ సంపుటి పరిచయం ఉబికొచ్చే ఊటలాంటి భాషతో రాసిన శ్రీకాంత్ కి వొందనాలు.

 5. కె.కె. రామయ్య says:

  మమదా! మా హెచ్చార్కె గారమ్మాయి మమత గారూ!! Hoping to read the book soon … కాదు. శ్రీకాంత్ రాసిన అద్భుతమైన ఈ రివ్యూని, ‘సగిలేటి కథల’ సంపుటిని ముందు మా సారుకే చూపెట్టాల. వీలుంటే పుట్టా పెంచల్దాస్ రాసిన, కినిగె పత్రికలో వచ్చిన ‘బుడ్డగిత్త రంకి’ కథను కూడా హెచ్చార్కె గారికి చూపెట్టాల.

మీ మాటలు

*