ఇంకా పుట్టని శిశువు

 

Art: Satya Sufi

Art: Satya Sufi

 

వేనవేల పూల పరిమళాలతో

అడవి ఆహ్వానించింది నన్ను.

వనదేవతల్లా నా నరాల్లో కూడ

పలుకుతున్నాయి సెలయేళ్ల

గలగలల హాసాలు.

నా యవ్వనమంతా ఈ అరణ్యాలకే ఇచ్చాను

నా హృదయమా, ఈ అనాథల వేదనలకే ఇచ్చాను.

గజ్జెలు లేని కాళ్లతో కొండల మీద

పరుగులెత్తిన నా బాల్యం

నా పాదాలకింకా వేలాడుతోంది.

కాలుజారి నగరపు మురికికాలువలో పడిపోయిన

ప్రేమరహిత కౌమారం నా తలలోనే ఉంది.

నేనొక నవయువతిలా లేచినిలిచింది

ఈ ఆదివాసి ప్రజల కనుపాపలలోనే.

వాళ్లే నా పాఠశాల.

నా భాష తిరుగుబాటు

నా అక్షరాలు స.మ.న్యా.యం.తో మొదలవుతాయి.

ఆకులమధ్య గాలి ఉసురుసురన్నట్టు

వాళ్ల వేదనామయ చెవుల్లో

నేను స్వేచ్ఛా రహస్యాన్ని గుసగుసలాడాను

ప్రతిగా వాళ్లు నాకు

ప్రేమ నిండిన ఉప్పుచేపలు తినిపించారు

 

జ్వరపడి మగతలో ఉన్నప్పుడు

నేను తిరిగి నా బడికే వెళ్లేదాన్ని

ఓ తోకజడవేసుకుని

చేతి గాజులు పగిలినట్టు గలగలలాడుతూ

నేస్తాలతో ముచ్చట్లాడుతూ.

అప్పుడప్పుడు కొండగోగుల పొద

చాటునుంచి తొంగిచూసే కుర్రవాడు

అప్పుడప్పుడు గుర్తుకొచ్చే తల్లిదండ్రులూ ఇల్లూ

నా కలల నిండా మెరుపుతీగల కాంతి నిండేది

అప్పుడే గాలిలో తుపాకిమందు వాసన తగిలింది

అది బూట్ల కరుకు ధ్వనుల్లో మణగిపోయింది

సగం మెలకువలో పీడకలేమోననుకున్నాను

కాని నా ఛాతీ ఎగజిమ్మిన నెత్తురు, ఎర్రగులాబీ అయింది.

 

ఇప్పుడిక నేను భవిష్యత్తు మార్గాలలో

అవిశ్రాంత స్ఫూర్తినై తిరుగాడుతున్నాను

న్యాయమెప్పుడూ చట్టానికి ముందే నడుస్తుందని

నేను నా ప్రజలకు చెప్పదలిచాను

మీరే సమస్తం అని చెప్పదలిచాను

అది మీరు గుర్తించిన క్షణాన

సింహాసనాలు కదిలిపోతాయని చెప్పదలిచాను

అప్పుడిక మనం హింసను వాడనక్కరలేదని

చెప్పదలిచాను

చాల ఆలస్యమయిపోయింది

 

ఎడారి మీద చింది

ఎండిన నెత్తుటి చారికల్లోంచి

నేనింకా పుట్టవలసే ఉంది

నేను నాలుగో అజితను

అపరాజితను.

 

మొదటి అజిత, అజిత కేశకంబలి. క్రీపూ ఆరోశతాబ్దికి చెందిన బౌతిక వాద తత్వవేత్త. రెండో అజిత, 1970ల కేరళలోని మావోయిస్టు విప్లవకారిణి. మూడో అజిత, 2016 నవంబర్ లో కేరళలో నీలంబూరు అడవిలో బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యకు గురై ఈ కవితలో మాట్లాడుతున్న అజిత. నాలుగో అజిత, ఇంకా పుట్టని అజిత, భవిష్యత్ అహింసా విప్లవానికి నాయకత్వం వహించే అజిత.

మలయాళ మూలం నుంచి ఇంగ్లిష్ అనువాదం: కె సచ్చిదానందన్, ఇంగ్లిష్ నుంచి తెలుగు: ఎన్ వేణుగోపాల్

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  కదిలించి ఆలోచింప చేసే సచ్చిదానంద గారి ఈ కవితను అంతే గొప్పగా వేణు తెలుగులోకి తీసుకొచ్చేడు. మీరే సమస్తం అని చెప్పదలిచాను

  అది మీరు గుర్తించిన క్షణాన

  సింహాసనాలు కదిలిపోతాయని చెప్పదలిచాను

  అప్పుడిక మనం హింసను వాడనక్కరలేదని

  చెప్పదలిచాను

  చాల ఆలస్యమయిపోయింది – నిజమే మన సామాన్య ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి మిత్రులు ఈ సంగతి అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఎడారి మీద చింది

  ఎండిన నెత్తుటి చారికల్లోంచి

  నేనింకా పుట్టవలసే ఉంది

  నేను నాలుగో అజితను

  అపరాజితను. – నైజమవుతుంది.

 2. Aruna.Gogulamanda says:

  సాటిలేని వ్యక్తీకరణ..తిరుగులేని అనువాద పటిమ..వెరసి..మనసును కదిలించే రచన..

 3. Balasudhakarmouli says:

  చాలా ఆలస్యం అయిపోయింది…. ఈ వాక్యం కవితని మగ్నతలోకి తీసుకు పోయింది. సచ్చిదానందన గొప్పగా రాశారు.

 4. దేశరాజు says:

  చాలా బావుంది

 5. కె.కె. రామయ్య says:

  ” న్యాయమెప్పుడూ చట్టానికి ముందే నడుస్తుందని
  నేను నా ప్రజలకు చెప్పదలిచాను ” ~ కె.సచ్చిదానందన్

  2016 నవంబర్ లో కేరళలోని నీలంబూరు అడవిలో బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యకు గురైన మావోయిస్టు కావేరి అలియాస్ అజిత… కు నివాళిగా ప్రముఖ మళయాళీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.సచ్చిదానందన్ గారు రాసిన కవిత Janikkathaval (The Unborn) ను అనువదించిన ఎన్. వేణుగోపాల్ గారికి నెనర్లు.

 6. అనువాదం లా లేదు. అచ్వమైన తెలుగు కవితా! హృదయాన్ని ద్రవించి వేసె దృశ్యాలు. అద్భుతం!

 7. palamanerubalaji says:

  బావుంది సర్.అనువాదాలే కాకుండా మీ కవిత్వం కూడా రాయాలని మనవి.-పలమనేరు బాలాజీ

 8. Kcube varma says:

  Joharlu comrade Ajita.. sachidanandan gari vakyaalalo tanu marinta arunimanu addukuni hrudayaalaku cheruvaindi.

 9. కె.కె. రామయ్య says:

  “జోహార్లు కామ్రేడ్ అజిత!… సచ్చిదానందన్ గారి వాక్యాలలో తను మరింత అరుణిమను అద్దుకుని హృదయాలకు చేరువైంది. ” ~ కెక్యూబ్ వర్మ ( ఇలా తెలుగు లిపిలో ఉంటె చదువరులకు మరింత సౌకర్యంగా ఉంటుందని సార్ )

 10. Narayanaswamy says:

  chaala Baagundi Venu kavita – kanneeru teppinchindi – com Ajita ku kanneeti joharlu

 11. Aranya Krishna says:

  బాగుంది అనువాదం.

 12. N Venugopal says:

  డి సుబ్రహ్మణ్యం,
  అరుణ గోగులమంద,
  బాల సుధాకర్ మౌళి,
  దేశరాజు,
  కె కె రామయ్య,
  తిరుపాలు,
  పలమనేరు బాలాజీ,
  కె క్యూబ్ వర్మ,

  అందరికీ ధన్యవాదాలు. కవితలోని బలమంతా మూలానిదే. అజిత తో పరిచయం, స్నేహం, అజిత హత్య కలిగించిన దుఃఖం, సచ్చిదానందన్ కవిత్వంతో గాఢమైన అనుబంధం (నిజానికి నేను 1980 లో మొట్టమొదట ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి కవితానువాదాలు ప్రారంభించింది ఆయన కవిత ‘ఔను స్వేచ్చే సమస్య’ తోనే) వల్ల ఇది అనువాదం చేయడం నా బాధ్యత అనుకున్నాను. నచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.

 13. N Venugopal says:

  నారాయణస్వామి,
  అరణ్యకృష్ణ

  కృతజ్ఞతలు.

 14. rani siva sankara sarma says:

  యింత మంచి కవితని యింత ఒరిజినల్గా తెలుగు పాఠకులకి అందించినందుకు కృతజ్ఞతలు.

 15. నరహరి says:

  వేణుగోపాల్ గారూ!
  ముందుగా నా వివరణ – ఈ ఎన్ కౌంటర్ ని నేనేమీ సమర్ధించడంలేదు.

  ఇదే ఎన్ కౌంటర్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగితే మానవ హక్కులు, వామపక్ష మేధావుల, సిక్యులర్ తత్త్వవేత్తలు స్పందన ఇంకో రకంగా వుండేది కదా? మరి, ఇప్పుడు టి.వి. ఛానెల్స్ వారితో సహా వాళ్ళెవరూ ఎందుకు మాట్లాడడంలేదు?

  ఎన్‌కౌంటర్ తర్వాత కేరళ విద్యుత్ శాఖా మంత్రి ఎం.ఎం.మణి మీడియాతో మాట్లాడుతూ, ‘అమాయక ప్రజలను చంపుతున్న మావోలు కమ్యూనిస్టులెలా అవుతారు? సామాన్యుల నుంచి డబ్బు వసూలుచేసే వారెలా పోరాటయోధులవుతారు?’- అని ప్రశ్నించారు. మణి కమ్యూనిస్టు పార్టీ నేత, పేదల పక్షపాతి, చాలాకాలంగా ప్రజాజీవితంలో ఉన్నవాడు. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు కేరళలో ప్రతిధ్వనిస్తోంది. ‘మావోయిస్టు పార్టీ కూడా రాజ్యాధికారం కావాలంటున్నది. మిగతా పార్టీలకు, మావోయిస్టు పార్టీకి వ్యత్యాసం కనిపించడం లేదు’ అని నీలాంబర్ అటవీ ప్రాంతంలో గిరిజన యువకులు ఇపుడు ప్రశ్నిస్తున్నారు. పినరయి విజయన్ పోలీసులను సంపూర్ణంగా సమర్థించారు

  మరి, భారతదేశ వామఫక్షాలు కూడా బి.జె.పి. కి తీసీపోవా?

 16. N Venugopal says:

  రాణి శివశంకర శర్మ గారు,
  నరహరి గారు,

  కృతజ్ఞతలు.

  నరహరి గారు,
  చాలా వివరమైన చర్చ జరపాలి. కానీ మీ రెండో పారా లోని ధ్వని మీరు చర్చ కోసం రాసినట్టు అనిపించడం లేదు. ముఖ్యంగా “సిక్యులర్” అనే వెటకారపు పద ప్రయోగం ఎవరిదో మీకు తెలియనిది కాదు.

  నిజానికి మిగిలిన రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్ల మీద ఎంత స్పందన వచ్చిందో నీలంబూర్ ఎన్ కౌంటర్ మీద కూడా అంతే స్పందన వచ్చింది.

  పార్లమెంటరీ వామపక్షాలు కూడా అదే తానులో ముక్కలు. అక్కడ కూచున్న రాజకీయ నాయకుడు ఎవరు, ఆ రాజకీయ పార్టీ పట్టుకున్న జెండా రంగు ఏమిటి అనే దానితో నిమిత్తం లేకుండా వర్గ ప్రయోజనాలు ప్రభుత్వ, పాలక విధానాలను శాసిస్తాయి. పేర్లలో కమ్యూనిస్టు మార్క్సిస్టు అనే మాటలు ఉన్నంతమాత్రాన అది ఆ వర్గ ప్రయోజనాలు కాపాడే పాలన కాకుండా పోదు. ఆ వర్గ ప్రయోజనాలు కాపాడకపోతే ఈ పార్లమెంటరీ విధానంలో అధికారానికి వచ్చే అవకాశమే లేదు.

మీ మాటలు

*