‘చో’ ఆగిపోయింది!

cho-ramaswamy

1976లో ‘బంగారు పతకం’ అనే సినిమా చూశాను. అది తమిళం నుంచి తెలుగుకు డబ్ చేసిన సినిమా. శివాజీ గణేశన్, కె. ఆర్ . విజయ హీరో, హీరోయిన్లు. చాలా సీరియస్ సినిమా. అయినా ఆ సినిమాను మూడుసార్లు చూశాను. కారణం, అందులో చో రామస్వామి సెటైర్లు. ఆ సెటైర్లు కానీ, అందులో ఆయన పాత్రకానీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ సినిమా కోసం నెట్ లో చూస్తే దొరకలేదు. అదే సినిమాను 1981లో ‘కొండవీటి సింహం’పేరుతో ఎన్టీఆర్, శ్రీదేవిలతో తెలుగులో రీమేక్ చేసినట్టు మాత్రం చూశాను. ఆ సినిమా నేను చూడలేదు.

‘బంగారు పతకం’ లో చో రామస్వామి పోలీస్ కానిస్టేబుల్ గా నటించినట్టు లీలగా జ్ఞాపకం. అతనికి ఒక కొడుకు. తండ్రి-కొడుకుల సంభాషణలో గొప్ప రాజకీయ వ్యంగ్యోక్తులు పేలుతూ హాలంతా నవ్వులు పండిస్తాయి. లీలగానే  గుర్తున్న ఒక సెటైర్ ప్రకారం, కొడుకు చదువురాని బడుద్ధాయి. “అయితే ఇంకేం! రాజకీయనాయకుడి వవుతావు” అని తండ్రి ఊరడింపు.

మనిషికి పుట్టుకతో కొన్ని ఆనువంశిక లక్షణాలు సంక్రమించవచ్చు. కానీ ఐడియాలజీతో సహా అతని ఆలోచనాసరళిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది అతను పుట్టి పెరిగిన భౌతికవాతావరణమే. అంటే ఆలోచనారీతి, వాటిని వ్యక్తీకరించే పద్ధతితో సహా అన్నీ కండిషండే తప్ప సర్వస్వతంత్రాలు కావు. చో రామస్వామి ఒక ఉదాహరణ.

దక్షిణాదిన ఇంగ్లీష్ వారు తమ స్థావరంగా మార్చుకుని అభివృద్ధి చేసిన తొలి నగరం మద్రాసు కావడం, ఆ విధంగా ఇంగ్లీష్ ప్రభావాలకు బ్రిటిష్ పాలన తొలిరోజుల్లోనే అది లోను కావడం, ఆ ప్రభావాలను సామాజికంగా, సాంస్కృతికంగా అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులు వెంటనే అంది పుచ్చుకోవడం, మద్రాసు తనదైన విలక్షణమైన సంకీర్ణ నాగరికతను తెచ్చుకోవడం, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో భాగంగా అక్కడి స్థానిక, బ్రాహ్మణేతర వర్గాలు క్రమంగా జాగృతమై బ్రాహ్మణీయతను సవాలు చేస్తూ భిన్నశక్తిగా మారడం, అది బ్రాహ్మణవ్యతిరేక ద్రవిడ ఉద్యమంగా బలపడడం, దానికి ప్రతిక్రియగా బ్రాహ్మణీయ శక్తులు పోలరైజై  ఉనికి పోరాటానికి దిగడం…

ఇంతటి ‘నలుగు’ పిండినుంచి వినాయకుడిలా రూపం దిద్దుకున్నవాడే చో రామస్వామి! ఈ నేపథ్యం లేకపోతే మనకు తెలిసిన ఇప్పటి రూపంలో చో ఉండడు!

తెలుగు ప్రాంతాలలోని బుద్ధిజీవుల్లోంచి  చో రామస్వామి లాంటి ఓ కేరక్టర్ ఎందుకు పుట్టలేదన్న కుతూహలకరమైన ప్రశ్ననుంచి ఈ నేపథ్యాన్ని తడమాల్సివచ్చింది. తెలుగు ప్రాంతాలలో ఆంధ్ర,రాయలసీమలకు వస్తే ఇక్కడి వాళ్ళకు తమిళులకు ఉన్నట్టు మద్రాసు లాంటి ఒక స్వతంత్ర రాజధాని నగరం లేదు. రాంభట్లగారి సూత్రీకరణనే పరిగణనలోకి తీసుకుంటే, సొంత నగరం లేని జనాలకు గుర్తించదగిన సొంత నాగరికత ముద్ర ఉండదు. అలాగే మద్రాసీలకు ఉన్నంత ఇంగ్లీష్ ప్రభావమూ వీళ్ళ మీద లేదు. తెలంగాణకు హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా దాని స్వభావం వేరు. తెలంగాణలో, ఆ సంబంధంతో కొంతవరకు ఆంధ్రలో వామపక్ష ఉద్యమాల ప్రభావం ఉంది. అదంతా చాలా సీరియస్ వ్యవహారం. అక్కడ వ్యంగ్యానికి, హాస్యానికి చోటు తక్కువ. తమిళనాడు కొస్తే అక్కడ బ్రాహ్మణీయ వ్యతిరేక ద్రావిడ ఉద్యమం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభావాలే తప్ప వామపక్షఉద్యమ ప్రభావాలు చాలా తక్కువ.

వ్యంగ్యం, హాస్యం, ఝటితి చమత్కారం(రిపార్టీ) చోకు ఆనువంశికంగానో, వ్యక్తిగతంగానో సంక్రమించి ఉండచ్చు. కానీ వాటిని తారస్థాయికి పెంచి రాజకీయవస్తువుకు వాటిని మేళవించి జనరంజకం చేయడానికి చో కు నిస్సందేహంగా తను పుట్టిన పెరిగిన భౌతికవాతావరణమే తోడ్పడింది. మద్రాసు ముందే నగరం కావడంవల్ల అక్కడ విద్యావంత మధ్యతరగతి పెద్ద సంఖ్యలో ఏర్పడింది. వారిలోంచి ఆవురావురుమనే పాఠకులు పెరిగారు, పత్రికలు పెరిగాయి. సినిమాతో సమానంగా థియేటర్ నూ కాపాడుకుంటూనే వచ్చారు. ఆ విధంగా చో  రంగప్రవేశం చేసి విజృంభించడానికి అవసరమైన పూర్వరంగమూ, ఆయన బహుముఖీన ప్రతిభావ్యుత్పత్తులకు స్పందించి ఆస్వాదించగలిగిన పాఠకులు, ప్రేక్షకులు ముందే ఏర్పడ్డారు. ఇక జరిగింది… చరిత్ర.

చో బహుముఖీనత తెలుగు ప్రమాణాలతో చూస్తే విస్మయం కలిగిస్తుంది. ఆయన లా చదువుకున్నాడు. ఓ పెద్ద కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఇంకోవైపు తుగ్లక్ పత్రిక ద్వారా జర్నలిస్టుగా అవతారమెత్తాడు. ఆపైన నాటకాలు రాశాడు, వేశాడు. 200 కు పైగా సినిమాల్లో నటించాడు. అది కూడా ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, ఎం ఆర్ రాధా, జయలలిత, నగేష్, రజనీకాంత్, కమల్ హాసన్, మనోరమ, సచ్చు లాంటి హేమాహేమీలతో. మొదట్లో తన రాజకీయ వ్యంగ్యాస్త్రాలను ద్రవిడపార్టీమీదా, వామపక్ష భావజాలం మీదా ఎక్కుపెట్టాడు. అవి ముఖ్యంగా ద్రవిడ నేతలకు తగలవలసిన చోటే తగిలి తహ తహ పుట్టించడం ప్రారంభించాయి. ఆయనపై రకరకాల రూపాల్లో ప్రతి దాడికీ సిద్ధమయ్యారు. డెబ్బై దశకంలో ఆయన తీసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా ఆడే థియేటర్లపై కూడా దాడులు జరిగాయి. అయినా నిర్భీతికి చిరునామాగా చో నిలబడ్డాడు. కారణం మరేం లేదు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాన్ని  ప్రతిఘటించడం ద్వారా రాటుదేలిన బ్రాహ్మణీయవర్గాల మద్దతు ఆయనకు ఉంది. తన పత్రికకు, తన రాతలకు, నాటకాలకు ఆ వర్గాల వెన్ను దన్ను, ప్రోత్సాహం ఆయనకు ఉన్నాయి. అదీగాక నిన్నమొన్నటి వరకు మధ్యతరగతి విద్యావంతవర్గానికి సొంత రాజకీయ అభివ్యక్తికి బలమైన వాహకం లేదు. దాంతో అది యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్ ధోరణిని జీర్ణించుకుంది. ఇది కూడా చో కు కలసివచ్చి ఆయన రాజకీయవ్యంగ్యానికి మరింత పదును పెట్టింది. తుగ్లక్ లాంటి పత్రికకు 90 వేలకు పైగా సర్క్యులేషన్ ఉండేదంటే చో కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

ఎమర్జెన్సీ దరిమిలా ఆయన గురి కాంగ్రెస్ వైపు తిరిగింది. తుగ్లక్ పత్రిక ద్వారా ఆయన సాగించిన ఎమర్జెన్సీ వ్యతిరేకపోరాటం మరో అధ్యాయం. ఎల్టీటీయీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలోనూ అంతటి నిర్భీతినే ఆయన చాటుకున్నాడు. అధికారబలం, అంగబలం, రాజకీయబలం లేకపోయినప్పటికీ అవన్నీ ఉన్న ఉద్దండ శక్తులకు ఎదురు నిలిచి నిలదొక్కుకోవడంలో చో తో పోల్చదగిన వ్యక్తి సుబ్రమణ్యంస్వామి. వీరు తమిళనాడులోని ప్రత్యేక పరిస్థితులనుంచి ప్రాణం పోసుకున్న వ్యక్తులు.

వ్యక్తిగా కొంతవరకు చో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించినట్టే కనిపిస్తాడు. మంచి ఎక్కడున్నా ఎంచి చూపడంలో, చెడును నిర్దాక్షిణ్యంగా ఖండించడంలో ఆయనకు స్వ, పర భేదాలు లేవని పేరు. జయలలిత కుటుంబంతో ఆయనకు ముందునుంచీ పరిచయం. ఆయన నాటకాలలో జయలలిత నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా కలసి నటించారు. అయినా జయలలిత పాలన అవినీతి భూయిష్టంగా కనిపించినప్పుడు ఆమెను బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు; ఆమెకు వ్యతిరేకంగా తన బద్ధ విరోధి అయిన కరుణానిధి, తమిళ మానిల కాంగ్రెస్ ల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. వ్యక్తిగతమైన ఈ నిష్పాక్షిక వైఖరే ఆయనను అన్ని పార్టీలవారికి దగ్గర చేసినట్టు కనిపిస్తుంది. జయలలితే కాదు; ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ సహా ఎందరో ఆయన సలహాను ఆపేక్షించేవారని అంటారు. ఆయనను రాజగురువుగా ప్రధాని మోడీ చేసిన అభివర్ణనను పూర్తిగా అతిశయోక్తి అనలేం.

చో ఆర్ ఎస్ ఎస్ వైపు, హిందుత్వ భావజాలం వైపు ఒరగడం, వాజ్ పేయి హయాంలో రాజ్యసభ సభ్యత్వం పొందడం వగైరాలను ఆయన పుట్టి పెరిగిన తమిళనాడు పరిస్థితుల నేపథ్యం నుంచి వేరు చేసి చూడలేం. మొత్తం మీద చెప్పాలంటే ఆయన జీవితం, ఆయన పత్రిక, నాటకాలు యాభై ఏళ్ళకు పైబడిన మన ప్రజాస్వామిక రాజకీయ వైఖరులకు నిలువెత్తు ప్రతిఫలనాలు.

                                                                                                           -భాస్కరం కల్లూరి

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  తుగ్లక్ పత్రిక, నాటకాలు, యాభై ఏళ్ళకు పైబడిన రాజకీయ జీవితం, తమిళనాట రాజగురువు, వ్యంగ్యం, హాస్యం, ఝటితి చమత్కారం కలగసిన, బహుముఖీన “చో” రామస్వామి గారి గురించి సందర్భోచితమైన వ్యాసాన్ని రాసిన కల్లూరి భాస్కరం గారికి ధన్యవాదాలు.

  తెలుగు ప్రాంతాలలోని బుద్ధిజీవుల్లోంచి చో రామస్వామి లాంటి ఓ కేరక్టర్ ఎందుకు పుట్టలేదన్న కుతూహలకరమైన ప్రశ్న …
  కు సమాధానం తెలుగునాట ప్రభవించి ప్రజ్వరిల్లిన ప్రగతిశీల, వామపక్ష రచయితలను, వామపక్షఉద్యమ నాయకులను గురించి చెప్పుకోవటానికి కుదరదా?

  “చో” గారితో పోల్చలేమనుకుంటా కానీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలుగుసినిమా, రక్త కన్నీరు నాటకాల నాగభూషణం గారు కూడా ఈ సందర్భంగా స్మరణనీళులే.

  చో తో పోల్చదగిన వ్యక్తి సుబ్రమణ్యంస్వామి …. నిజమే, కానీ ( హార్వర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ ) డా. సుబ్రమణ్యంస్వామి గారిలా “చో” రామస్వామి గారు ఎక్సేంట్రిక్ అనే అపవాదుకు గురికాలేదేమో.

 2. సుందరం says:

  “ఘనమైన ” గణనీయ నివాళి. రెండువైపులా అతివాదమున్న సమాజంలో ఒంటరి గా నెగ్గుకు రావడం అంత సులభతరం కాదు.

 3. సుందరం says:

  “ఘనమైన” గణనీయ నివాళి. రెండు వైపులా అతివాదమున్న సమాజంలో ఒంటరి గా కనీసం రాజకీయంగా నైనా ” నిష్పాక్షికంగా ” ఉండి అంతకాలం అందరికీ నచ్చుబాటు అయ్యేలా నెగ్గుకురావడం అంత సులభతరం కాదు.

 4. యర్రమిల్లి దత్ says:

  ఘనమైన నివాళి…ఒక అద్భుత మైన వ్యక్తిత్వాన్ని గురించి సునిశిత విశ్లేషణ..సరైన నివాళి….

 5. SIVARAM GUDIPUDI says:

  చక్కటి వ్యాసం. చొ రామస్వామి గారు నిస్సందేహంగా గొప్ప వ్యక్తి .దార్శనికుడు.మనకు అటువంటి వ్యక్తి ఈ మధ్య కాలం లో లేరనే చెప్పాలి. కారణం వెతకడం కన్నా ఉన్నవారిని పరిరక్షించుకుంటే అదే పదివేలు.

మీ మాటలు

*